పుస్తకాల అలల మీద ఎగసిపడింది కృష్ణమ్మ!

10888496_10204845333720483_5903717139337843051_n

బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా –

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది…అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ….అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.

కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి…

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

(ఆంద్ర భూమి “మెరుపు” పేజీ నుంచి…)

మీ మాటలు

  1. చివర్లోని వాక్యాలు చాలా బాగున్నాయ్..

  2. మా మనసులో చెప్పారండీ, రచయిత ఎవరో కానీ. :). బెజవాడ అంటే పుస్తకాలే. ఒక్కసారిగా అలంకార్ సెంటర్లో పచార్లు చేసి వచ్చినట్టైంది. మోడర్న్ కేఫ్ కాఫీ వాసనలు బెంగళూరు దాకా వచ్చాయి. భలే వ్యాసం. థాంక్యూ.

    *తృష్ణగారూ-Share చేసి చదివించినందుకు థాంక్యూ :)

  3. భవాని says:

    రెండు సార్లు ఈ పుస్తకాల పండగకి హృదయాన్ని జోడించి నమస్కరించే భాగ్యం నాకూ దక్కింది . రెండైదుల కొసరు కవిత పురుకోస కొసలా అక్కడ కట్టి ఉన్న జ్ఞాపకాల్ని పట్టి ఊపింది. ధన్యవాదాలు .

  4. Mythili abbaraju says:

    నా విజయవాడ , నా పుస్తకాలు…వంద ఉత్సవాలు, వేయి దీపాలు.

  5. ఒక్కసారి నా పూల తోటకి నువ్వు రావా?
    చక్కనైన నా గులాబులకి నీ చక్కదనాన్ని
    చూపాలి, మల్లెలకి నీ ఒంటి సువాసన
    చూపించాలి, వాటి పొగరణచాలి
    నీ లేత గులాబిరంగు సొగసుకి గులాబీలు
    గులాము లై పోవాలి, సంపెంగలు నీ నాసిక
    చూసి గుబాళించాలి, మంచులో తడిసి మురిసే
    చక్కని పారిజాతాలు నీ సోయగాన్ని స్వాగతించాలి
    లేత మావి చిగురు, తానే కోయిల గొంతు కంత
    వింత సొంపు అంటుంది, అది తినని నీ గొంతు
    విని తలొంచి మామిడిపళ్ల నీ కందివ్వాలి
    పూలు అందాలన్ని తామ వే ననుకుని
    పొంగి పోతుంటాయి అవి నిను చూసి మురిసి
    నీ కొప్పు నలంకరించనీమని వేడి, చేరి, మురియాలి
    నీవు శచీ దేవివై వచ్చి, ఓ నా అందాల ప్రేయసి,
    నా పూదోటని ‘నందన వనం’ చేసి,
    ఇంద్రపదవి, స్వర్గాధిపత్యం నా కందీయవా?

    Inspired by Readers Digest bit: – a man’s letter to his Lady Love “Please come to my Garden I want my Roses to see you”
    G B Sastry,
    101,Asian Homes,
    13th Main,5th Cross,
    Kodihalli,
    Bangalore 560008
    Karnataka.
    Mob. 9035014046.

మీ మాటలు

*