తోటివారిని

 

మన తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా

గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా
అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా మనం తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయ స్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

-బివివి ప్రసాద్

bvv

మీ మాటలు

  1. karlapalem hanumantha ra0 says:

    బివివి ప్రసాద్ సార్ నేటి కవితను పునీతం చేసేస్తున్నారు. బాగుంది అని ఒక్క మాట ముక్తుసరిగా చెబితే సరిపోతుందా! వీరి కవితను చదివినప్పుడల్లా నా అంతరంగం స్పందనకు చాలని భావ అగాధమై పోతుంది.ఎప్పటిలా ఇప్పుడూనూ!

  2. చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రసాద్ గారు. కవిత చాలా బావుంది.

  3. ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
    గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
    ఎవరి కథ చూసినా ఏముంటుంది
    అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా …

    అంతరంగాన్ని ఇంతకన్నా ఎవరు చెప్పగలరు, చూపగలరు ?

  4. తడుముకుంటూనే ఉంటాము చేతకాని నిట్టూర్పులతో
    నిశ్చలమైన మనస్సులో ఒకరిపై ఒకరికి నమ్మకం ద్రుడమైతే ..మరికాస్త కోమలంగా,లోతుగా,సూటిగా చూడగలము. అద్భుతమైన కవిత..చాలా బావుంది ప్రసాద్ గారూ.

  5. ఎవరిని లోపలికంటా తడిమి చూసినా ఏముంటుంది…..

    చూడలేమా ? ఒకరిలోకొకరం మరికాస్త suutigaa
    నమ్మకంగా ,మరికాస్త ,లోతుగా…….

    అసలు ఇంత బాగా ఎలా చెప్తారండి?
    _/|\_

Leave a Reply to padmaja yalamanchili Cancel reply

*