అపురూపం

Apuroopam
గీస్తున్న గీత చేరవలసిన గమ్యం తాలుకు విసురులో ఏమాత్రం తొట్రుపడినా, నన్ను భారం కమ్ముకుంటుంది, అనేకానేక ఆలోచనల మధ్య తాత్కాలికంగా విషయం మరిచిపోయినా దాని తాలూకు బరువు రోజంతా వెంటాడూతూనే వుంటుంది, ఇది దేని తాలూకు వేదనబ్బా ! అని పని గట్టుకు వెనక్కువెళ్ళి దుఖాన్ని మళ్ళీ తొడిగేస్తాను ఉపశమనం కోసం కుదరని బొమ్మే మళ్ళీ మళ్ళీ కుదర్చడానికి ప్రయత్నం జరుగుతుంది అప్పటికీ కుదరకపోతే చివరకి బొమ్మ ముక్కలు ముక్కలుగా చిరిగి పోవడం.

బొమ్మ పోతుంది కాని అది చేసిన గాయం?

కుదిరిన బొమ్మల తాలూకు అనుభూతులు ఎప్పుడూ గుర్తుకు వుండి చావవెందుకో! అపజయాల్ని మళ్ళీ మళ్ళీ వెతుక్కుని మరొక అపజయంకోసం సిద్దమైనవాడ్ని నా కాలంలోనే కాదు ఏ కాలంలో నైనా అన్వర్ అనే అంటారేమో?

బొమ్మల పట్ల ఎందుకని నీకంత జాగ్రత్త? ఏమిటా అపురూపం? అని ? ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలని
అనుకుంటాను, రోజు ఎన్ని సార్లు ఎంతమందికి థేంక్స్ చెబుతావు, థేంక్స్ చెప్పిపుడు నిజంగా ఆ కృతజ్ఞత హృదయంలోంచి బయలి గొంతులోంచి మెత్తగా ఎదుటి వారిని తాకుతుందా ! థాంక్ యు … ఎంత కరుణ కల్గిన మాట ,బొమ్మలు సాధన చేసినట్టు ధేంక్స్ అనే మాట కృతజ్ఞత నింపుకుని బయటకు రావడానికి ఎన్ని జన్మల సాధన అవసరం! నా ఈ జీవితంలో నా థేంక్స్ నిజంగా ఏ ఒక్కరినైనా తాకగలిగిందా? వెల్తున్నవాడు నా థేంక్స్ కి ఆగి పోయి నా ప్రేమను తాకి మరొక ప్రేమను నవ్వుగా ఇచ్చాడా?

ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలి , ఎందుకంటే ఒక రోజు వస్తుంది ఆ దినం చేతుల్లో కుంచెని ఎత్తేంత బలం మిగలదు, అ దినం చిన్న చుక్క కూడా పెట్టలేని వణుకు వ్రేళ్ళను ఆవరించేస్తుంది, ఆ రోజుకు ముందే గీయవలసినదంతా గీసేయ్యి , అందుకని బొమ్మలు అపురూపం.

ఒక రోజు వస్తుంది నా కాళ్ళకు అప్పుడు అడుగులు వేయడం తెలిసిన రోజు లుండేవి , ఆ నడవాల్సిన దినాల్లో నడుము పడక్కి ఆనించి పెట్టాను అదే సుఖమనుకున్నా కాని ఈ రోజు చిన్న నడక కోసం తపించి పోతున్నా కాని నడవడానికి కాళ్ళేవి? అందులో బలమేది ?
అందుకని నడక అపురూపం.

కార్టూనిస్ట్ శేఖర్ గారు చివరి రోజుల్లో ఒక పైప్ ద్వారా ఆహారం తీసుకునే వారు, ఆయన నాకు పంటి కింద మెత్తగా నలిగే అన్నం మెతుకు శబ్దం వినడానికి ప్రయత్నించమనే పాఠం నేర్పకనే నేర్పారు, అన్నాన్ని నాలిక ద్వారా లోపలికి తీసుకొవడానికి మించిన అదృష్టమేముంది అనిపించింది నాకా సమయంలో. తెలిసీ తెలీక ఒకనాడు విసిరి కొట్టిన అన్నపు పళ్ళెం నన్ను రోజూ భయపెడుతుంది. అందుకని అన్నం అపురూపం.

“ది స్ట్రయిట్ స్టొరీ” అనే సినిమాలోని సన్నివేశం – దాదాపు 80 సంవత్సరాల ‘ఆల్విన్ స్ట్రయిట్’ చుట్టూ చేరిన నవ్వే కుర్రాళ్ళు, తుళ్ళే కుర్రాళ్ళూ , నర నరాన పచ్చీస్ ప్రాయం నింపుకున్నవారు , వారిలో ఒకడు ఆల్విన్ ని అడుగుతాడు వృద్దాప్యం లో అన్నిటికన్నా ఎక్కువ బాధించేది ఏదీ అని, వాడి ఉద్దేశంలో అది కాళ్ళ నొప్పా, కంటి చూపు మందగించడమా లేదా మరొటీ మరొటా అని. దానికి ఆ వృద్దుడి సమాధానం ” నాకు ఒకప్పుడు యవ్వనం ఉండేది అనే విషయం గుర్తు వుండడం”అంటాడు. చూస్తున్న సినిమా పాజ్ చేసి అలా మూగ గా ఐపోలా ! అలా ఒక రోజు మనకూ వస్తుంది , ఆప్పుడు మనకు వేళ్ళు వుండేవి గీయవలసినదంత గీయవలసింది! నడక వుండేది నడవవలసిన దార్లన్ని నడవవలసినది! చేతులు వుండేవి కలిసిన ప్రతి చేతిని అపురూపంగా చేతుల్లొకి తీసుకొవలసినది….క్షమించండి ఒక్క క్షణం ఇది ఆపుతాను నా చెవుల్లొ ఎవరో పాడుతున్నారు “కిసీకి ముస్కురాహటోంపె హో నిసార్ ” అని.

కాబట్టి ఇదంతా గ్రాంటెడ్ కాదు, నా ప్లేట్ లొకి వచ్చే ప్రతి మెతుకు, నా వంటిన తగిలే గాలి, నన్ను స్నేహించే ప్రతి మనిషి, దీవించే ప్రతి దీవెన ………. నాకు తెలుసు బొమ్మ ఏనాటికి నాదాకా వచ్చేది కాదు కాని ఓపికగా సహనంగా సాధన చేస్తే ప్రేమ రావచ్చు , జీవితాంతం నాతో వుండొచ్చు నా తరువాత కూడా నాగురించీ మీలో వుండొచ్చు కాని ప్రేమకు బదులుగా ఇవ్వడానికి నాదగ్గర నాదికాని బొమ్మ వుంది, ఈ రోజు నా అనుకునే ప్రతీదాని వెనుక బొమ్మ వుంది అందుకే బొమ్మ నాకు అపురూపం బొమ్మ నా జాగ్రత్త.

మీ మాటలు

  1. సాయి కిరణ్ says:

    చాలా బాగా చెప్పారు సర్ , ఈ కాలం లో భయపెట్టేది వృద్ధాప్యం ఒక్కటే కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని రోజుల్లో ప్రతీ క్షణం అపురూపమే . కొన్ని నిమిషాల తర్వాత ఇప్పుడు చేస్తున్న పనులు చెయ్యగలమో లేదో తెలీనప్పుడు ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటూ , చెయ్యగల్గిన ప్రతీ పనీ తొందర తొందరగా చేసేసుకుంటూ , చేస్తున్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని ఆస్వాదించడం ఎంతో అవసరమనిపిస్తుంది కదూ .!!

  2. అన్వర్ ,

    మీ బొమ్మే కాదు మాటలు కూడా అపురూపం. చిత్రకారులు భావుకులే గాని చాలా మందిలో దానిని కాగితం మీద పెట్టగల సమర్థత తక్కువ. తన కళపట్ల ప్రేమ, అంతటి అపురూప భావన ఉన్నవాళ్ళే మీరు చెప్పిన ఉదాత్తమైన తాత్త్విక చింతన కలిగి ఉంటారు.
    ఇంత చక్కని మాటలు రాసినందుకు హృదయపూర్వక అభినందనలు

  3. rajesh nagulakonda says:

    చాల గొప్పగా చెప్పారు అన్వర్ గారు. మీ గీతాలు మాటలు అన్ని వరాలే …

  4. karlapalem hanumantha ra0 says:

    ఆర్టిస్టుగా పుట్టటం ఎంత అదృష్టం అనుకుంటుండేవాడిని కళాకారుల జీవితంలోని కళకళలను చూసి. కానీ ఆర్టిస్టుగానే జీవితం చాలించడానికి ఎన్ని విలువైన ఆనందాలను వాళ్ళు నిస్వార్థంగా వదులుకుంటున్నారో! అపురూపమైన ఆలోచనలనౌ అందించిన అన్వర్ భాయ్ కి ధన్యవాదాలు చెబుతున్నాను. వట్టొట్టి ధన్యవాదాలు కావివి. జీవసారంనుంచి వడబోసి చెబుతున్న మాటలు!

  5. kandu kuriramesh babu says:

    పంటి కింద మెత్తగా నలిగే అన్నం మెతుకు శబ్దం వినడానికి ప్రయత్నించమనే పాఠం.
    నిజాం, అన్వర్. ఇదే దృశ్యా దృశ్యం.

  6. తమ అత్యంత విలువైన కాలాన్ని ఈ రచన చదవడానికి వినియోగించినవారికి, స్పందించినవారికి నమస్కారాలు.

  7. A must read for everybody who can read Telugu.
    ఆర్టిస్ట్ మనసు, హృదయం సున్నితం అంటారు. ఆర్టిస్ట్ కి బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతి అనుభూతీ అపురూపమే…
    “అపురూపం” అన్న పదానికి అపురూపమైన భావాల్ని తన పదాల్లో చూపించిన “అన్వర్ గారు” హాట్స్ ఆఫ్ టు యూ!

  8. ఆర్.దమయంతి says:

    ‘ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ ని పెంచుకోవాలి ‘ – చాలా బాగుంది అన్వర్ గారూ, ఈ కోట్.
    ..అంతా చదివాక..నిశ్శబ్దమేసింది!

  9. Vijaya Karra says:

    ఓ మంచి ఆర్టికల్ !

మీ మాటలు

*