‘ఆమె మెచ్చినదే అందం’

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నల దమయంతు లిద్దరు మనఃప్రభవానలబాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసరనిశల్ విలసన్నవనందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులం
దలిరుల శయ్యలన్ సలిలధారల చందనచారుచర్చలన్

మహాభారతం, అరణ్యపర్వం, ద్వితీయాశ్వాసంలో ఉన్న ఈ ప్రసిద్ధపద్యం నల దమయంతులనే ప్రేమికుల విరహతాపం గురించి చెబుతోంది. ఆ తాపాన్ని ఉపశమింపచేసుకోడానికి వారు శీతలోపచారాలను ఆశ్రయించడం గురించి చెబుతోంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు; ‘మా మాదిరిగా భూమిని, రాజ్యాన్ని, బంధువులను విడిచిపెట్టి అడవులపాలై జంతువులతో కలసి జీవిస్తూ కష్టాలు పడిన నరులు ఇంకెవరైనా ఉన్నారా’ అని బృహదశ్వుడు అనే మునిని ధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆ ముని నలదమయంతుల కథ చెబుతాడు.

నలుడు నిషధదేశపు రాకుమారుడు, దమయంతి విదర్భరాజు కూతురు.
నాకు ఎందుకో మహాభారతంలో నలదమయంతుల కథ విలక్షణంగా కనిపిస్తుంది. కారణం మరేం లేదు…అంతవరకు కొన్ని రకాల స్త్రీ-పురుష సంబంధాలు, వివాహసంబంధాలు కనిపిస్తాయి. నలదమయంతుల కథ దగ్గరికి వచ్చేసరికి అది భిన్నమైన కథగా అనిపిస్తుంది. అందులోనే స్త్రీ-పురుష సంబంధాలలో మొదటిసారిగా మనసు, ప్రేమ, విరహం మొదలైన సుకుమారభావనలు అడుగుపెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందున్న కథలకు, ఈ కథకు ఉన్న తేడాను వీలైనంత క్లుప్తంగా చూద్దాం.
ఆదిపర్వం, ప్రథమాశ్వాసంలో ఉన్న రురుడు-ప్రమద్వరుల కథ, వివాహం నిశ్చయమైన ఒక జంట గురించి చెబుతుంది. ఆవిధంగా వారిద్దరి మధ్య వివాహానికి ముందే అనురాగం ఏర్పడడానికి అవకాశం ఉంది కానీ, దానిని ప్రేమకథగా చెప్పలేం. ప్రమద్వర పాముకాటువల్ల మరణించగా తన ఆయుర్దాయంలో సగం ఆమెకు ధారపోసి రురుడు ఆమెను బతికించుకుంటాడు. ఆ తర్వాత వారి వివాహం జరుగుతుంది.

ఆ తర్వాత చెప్పుకోవలసింది యయాతి-దేవయాని; యయాతి-శర్మిష్టల త్రికోణ సంబంధకథ. రాచకూతురు అయిన శర్మిష్టపై అసూయతో, ఆమె కన్నా తను ఆధిక్యతను పొందాలనే కోరికతో దేవయాని యయాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కనుక వారిద్దరిదీ ప్రేమ సంబంధమని చెప్పడానికి లేదు. పైగా యయాతి శర్మిష్టమీదే తప్ప దేవయానిపై మనసు పడినట్టు కనిపించడు. శుక్రుడిపట్ల భయంతోనో, గౌరవంతోనో అతను దేవయానిని పెళ్లాడినట్టు కనిపిస్తాడు. కనుక అది ఒకవిధంగా నిర్బంధవివాహం.

nala

తొలిచూపులోనే అతనిని ఆకర్షించింది శర్మిష్ట. అయితే ఆ ఆకర్షణకు కారణం ఆమె అందమే కానీ, అందులో ప్రేమగా చెప్పదగిన మానసికకోణం ఏమీ లేదు. ఇంకా విశేషమేమిటంటే, యయాతితో తన సంబంధంలో మొదట చొరవ తీసుకున్నది శర్మిష్టే. అందుకు కూడా అసలు కారణం, దేవయానికి పట్టిన అదృష్టం తనకు పట్టలేదన్న చింతే. భర్త లేకపోవడంతో ఇంత యవ్వనమూ వృథా కావలసిందేనా అన్న విచారంతోపాటు; దేవయాని భర్తను, సంతానాన్ని పొందినట్టు తను పొందలేకపోయానే అన్న బాధా ఆమెలో ఉంది. పైగా యయాతికి, తనకు మధ్య ఉన్నది దాసి-యజమాని సంబంధమని ఆమె గుర్తుచేస్తుంది. అంటే, వారిది ప్రేయసి-ప్రియుల సంబంధం, భార్యా-భర్తల సంబంధం కాదు సరికదా; సమానుల మధ్య సంబంధం కూడా కాదన్నమాట. ఆపైన ఆమె ఋతుకాలోచితాన్ని ప్రసాదించమని అడుగుతుంది. ఇలా ఏ కోణంలో చూసినా వారిది శారీరక సంబంధమే తప్ప ప్రేయసీ, ప్రియుల మధ్య తప్పనిసరిగా ఉండవలసిన మానసికబంధం కాదు.

శకుంతలా-దుష్యంతుల కథకు వస్తే, అది పైకి ప్రేమకథలా కనిపించే మాట నిజమే కానీ, అది గాంధర్వవివాహం అనే చట్రంలో జరిగిన కథ. పైగా అది ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే మానసిక బంధాన్ని కాకుండా ప్రధానంగా భార్య-భర్త-సంతానం మధ్య ఉండే ధార్మిక సంబంధాన్ని, గృహస్థధర్మాన్ని వేదప్రమాణంతో నొక్కి చెబుతుంది. ఆ తర్వాత వచ్చే గంగ-శంతనుడు, సత్యవతి-శంతనుల కథల్లో ప్రేమ, మనసు కాక పురుషుడిలోని కాముకత్వానిదే పై చేయి అవుతుంది. ఇక గాంధారి-ధృతరాష్ట్రులది, కుంతి,మాద్రి-పాండురాజులది పెద్దలు నిర్ణయించిన వివాహసంబంధం. వీటికి భిన్నంగా అంబ-సాల్వులది ప్రేమకథగా కనిపిస్తుంది. కానీ అది నలదమయంతుల కథలా పూర్తిస్థాయిలో చిత్రించిన కథ కాదు.

ఆ తర్వాత వచ్చేది హిడింబా-భీముల సంబంధం. ఇది పై కథలకు భిన్నంగానూ, శర్మిష్ట-యయాతి కథకు దగ్గరగానూ కనిపిస్తుంది. ఎలాగంటే, హిడింబా-భీముల కథలో కూడా చొరవ హిడింబదే. అసలు ప్రకృతి రీత్యా చూసినా స్త్రీ-పురుష సంబంధాలలో చొరవ తీసుకునేది స్త్రీయే నంటూ రాంభట్లగారు ‘జనకథ’లో ఇలా రాస్తారు:

జంతువుల్లో మగ జంతువు ఉదాసీన, ఆడజంతువు క్రియాశీల. ఆడజంతువు సమ్మతించనిదే మగజంతువు దాని దరిదాపులకు కూడా చేరజాలదు. ఆమె కటాక్షం కోసం మగజంతువులు పుట్టుకతో సౌందర్యాన్ని సంతరించుకుంటున్నాయి. అయితే మగ జంతువు ఈడేరేదాకా ఆ సహజసౌందర్యం పొటమరించదు. అది ప్రకృతి పెట్టిన ఆన.
మనిషికి కూడా సహజసౌందర్యం ఉంటుంది. ప్రకృతి పెట్టిన ఆన ప్రకారం అది యౌవనారంభంలో వ్యక్తమవుతుంది. జంతువుల్లా పురుషుడు కూడా ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల. ఈ సత్యాన్ని ప్రపంచంలో ఒక్క సాంఖ్యతత్వం మాత్రమే చెప్పింది. మన పురాణాల్లో రాజులు తమ కూతుళ్లకు స్వయంవరం చాటిస్తారు. ఈ స్వయంవరాన్నే డార్విన్ “నేచురల్ సెలెక్షన్” అన్నాడు. ‘వధూ’ అంటే స్త్రీ సామాన్యవాచకం. ‘వరః’ అంటే కోరదగ్గవాడు. ఈ మాటల్ని బట్టే పురుషుడు ఉదాసీనుడని తేలుతుంది.

అదే పుస్తకంలో ఇంకో చోట ఆయన ఇలా అంటారు:

జంతుప్రపంచాన పోతులు సహజాలంకారాలను సంతరించుకుని పుడతాయి. అందులో సింహం, చీంబోతు, పొట్టేలు, వృషభం –వాటి దర్పమే వేరు. ఋతుకాలాన పెంటి జంతువుల చుట్టూ ఈ పోతుజంతువులు చేరి ప్రదర్శనలు ఇస్తూ ఉంటాయి. ఎన్ని జంతువు లెంత ప్రదర్శనలు చేసినా పెంటి జంతువు అందులో బక్కపోతునే వరిస్తుంది. దాన్నే నేచురల్ సెలెక్షన్ అన్నాడు డార్విన్. అదే స్వయంవరం. వరణం దక్కని పోతులు పరస్పరం పోట్లాడుకుంటాయి.

జంతుప్రపంచం దాటివచ్చిన జనప్రపంచం కూడా అంతే. ‘ఆడది మెచ్చినదే అందం. మొగాడి కన్ను మసక’ అంటుంది మధురవాణి. ఆమె నోట ఈ మాట పలికించిన అప్పారావుగారు ఎంత గొప్ప శాస్త్రవేత్తో! వరమాల దక్కని పురుషులు కూడా జంతువుల్లానే పోట్లాడుకునే వారంటాయి మన పురాణాలు. ఈ స్వయంవరణ రహస్యం నేటికీ పరమ రహస్యంగానే ఉంది.

పురుషుడు ఉదాసీనుడు, స్త్రీ క్రియాశీల అన్న సూత్రీకరణకు యయాతి-శర్మిష్టల సంబంధం అతికినట్టు సరిపోతుంది. అలాగే భీమ-హిడింబల సంబంధం కూడా.
వారణావతంలో లక్క ఇంటి దహనం నుంచి పాండవులు తప్పించుకున్న తర్వాత ; హిడింబుడు అనే రాక్షసుడు, అతని చెల్లెలు హిడింబ ఉండే అరణ్యానికి చేరుకుంటారు. భీముని చూడగానే హిడింబకు అతనిపై కోరిక కలుగుతుంది. హిడింబునికి, భీమునికి జరిగిన యుద్ధంలో హిడింబుడు మరణించిన తర్వాత కుంతి, పాండవులు అక్కడినుంచి బయలుదేరతారు. వారితో హిడింబ కూడా బయలుదేరుతుంది. భీముడు అందుకు అడ్డు చెబుతాడు. అప్పుడు ధర్మరాజు జోక్యం చేసుకుని ఆమెను కూడా రానివ్వమంటాడు.
ఆ తర్వాత కుంతిని హిడింబ ఏకాంతంగా కలసుకుని ‘మన్మథ వాంఛ అన్ని ప్రాణులలోనూ సాధారణమే అయినా స్త్రీలలో అది మరింత విశేషంగా ఉంటుంది. భీమునిపై కోరికతో చుట్టాలను, చెలులను విడిచిపెట్టి వచ్చాను. మీరు నా ఇష్టాన్ని కాదంటే ఆత్మహత్య చేసుకుంటా’నని అంటుంది. నా దగ్గర ఎన్నో మహిమలు ఉన్నాయని కూడా చెబుతుంది. కుంతికి ఆమె మీద ఇష్టం కలుగుతుంది. తన మాటను, అన్న ధర్మరాజు మాటను మన్నించి ఆమెను చేపట్టమని కుంతి భీమునికి చెబుతుంది. ఇందువల్ల నీకు పుత్రసంతానం కలుగుతుందని, నీ తండ్రి పాండురాజు కూడా సంతోషిస్తాడని అంటుంది. భీముడు ఒప్పుకుంటాడు. అయితే పుత్రసంతానం కలిగే వరకే మా ఇద్దరి సంబంధం అని షరతు పెడతాడు. ‘నువ్వు శుచిగా ఉంటూ ఉత్తమ స్త్రీ గుణాలతో భీముడికి ప్రీతి కలిగేలా నడచుకో. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి. రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండం’డని హిడింబకు కుంతి చెప్పింది.

సరే, ఇందులో చొరవ హిడింబదే నన్న సంగతి అర్థమవుతూనే ఉంది. పైగా భీమునిపై ఆమెకు కలిగిన కోరిక శారీరకమైనదేనని ఆమె మాటలు వెల్లడిస్తున్నాయి. కుంతి దగ్గర పచ్చిగా ఆ సంగతి బయటపెట్టింది కూడా. కనుక, ప్రేమ, మనసు అనే నాజూకు భావనలకు అక్కడ అవకాశం లేదు. అలాగే, ఈ మొత్తం ఘట్టంలో వారిద్దరి మధ్య వివాహం అనే మాటే రాలేదు. రాకపోగా, నీకు కొడుకు కలుగుతాడు, పాండురాజు కూడా సంతోషిస్తాడని కుంతి భీమునితో అంటోంది. అంటే, ఇక్కడ వివాహవిధి కన్నా సంతానం పొందడమే ప్రధానంగా కనిపిస్తోంది. పగలు మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా విహరించండి, రాత్రుళ్ళు మాత్రం మా దగ్గర ఉండండని హిడింబకు కుంతి చెప్పడం కూడా, అది సాధారణ దాంపత్య సంబంధానికి భిన్నమైన సంబంధంగా ధ్వనింపజేస్తోంది. పుత్రుడు కలిగేవరకే మా సంబంధం అని భీముడు అనడం, అది అవసరార్ధం కల్పించుకున్న తాత్కాలిక సంబంధమేనని స్పష్టంగా చెబుతోంది. హిడింబ ఆటవిక స్త్రీ అనుకుంటే, భీముడికి, ఆమెకు కలిగినది అసమసంబంధం కనుక ఈ చిత్రీకరణ దానికి అనుగుణంగానే ఉంది. సంతానం కోసం ఆటవిక స్త్రీలతో సంబంధం పెట్టుకుని, సంతానం కలగగానే వారిని విడిచిపెట్టిన ఉదంతాలు మహాభారతంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇది నేటికీ గిరిజన, గిరిజనేతరుల మధ్య జరుగుతున్నదే. చరిత్ర అవిచ్చిన్నతకు ఇదొక ఉదాహరణ.

హిడింబ-భీముల సంబంధం తర్వాత చెప్పుకోవలసింది ద్రౌపది-పాండవుల సంబంధం. అందులో కూడా ప్రేమ అనీ, మానసికమైనదనీ చెప్పదగిన బంధమేమీ లేదు. అది కూడా ప్రధానంగా రాజకీయ అవసరార్ధం జరిగిందిగానే కనిపిస్తుంది. ద్రౌపదిని వెంటబెట్టుకుని అర్జునుడు, భీముడు ఇంటికి వచ్చి, భిక్ష తెచ్చామని తల్లితో అన్నప్పుడు, దానిని అయిదుగురూ పంచుకోండని తల్లి అన్నప్పుడు, ‘ఆమెను చూడగానే పాండవులు అయిదుగురూ మన్మథ బాణాలకు గురయ్యారు’ అంటాడు కవి. ఆ మాట ప్రధానంగా శరీరకవాంఛనే సూచిస్తోంది.

కాకపోతే, రాచకూతురుగా, తండ్రిచాటు బిడ్డగా ద్రౌపదికి, ఆటవిక స్త్రీగా హిడింబకు ఒక స్పష్టమైన తేడా ఉంది. భీముడితో సంబంధంలో హిడింబ చొరవ తీసుకుంటే; పాండవులతో సంబంధంలో ద్రౌపది, తండ్రి ఎలా వంచితే అలా వంగే మైనపు ముద్ద, మౌనమూర్తి అయింది. తను స్వయంవరంలో అర్జునుని వరించినా, అత నొక్కడికే భార్య అయ్యే హక్కును ఆమె పొందలేక పోయింది. ఆవిధంగా అది ఉత్తుత్తి స్వయంవరమే అయింది.

ఆ తర్వాత వచ్చేదే నలదమయంతుల కథ. పైన చెప్పుకున్నట్టు, ప్రేమ, మనసు, విరహం వంటి దినుసులతో ఈ కథ; పై కథలకు భిన్నంగా, దాదాపు ఆధునిక ప్రేమ కథలకు దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, కనీసం ఉన్నత కుటుంబాలకు పరిమితమై చెప్పుకున్నా ప్రేమ, పెళ్లి అనేవి కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు చెందినవే తప్ప రాజకీయ అవసరం కోసమో, మరొక అవసరం కోసమో పెద్దలు మెడ వంచి రుద్దేవి కావని చెబుతున్నట్టు ఉంటుంది. ఇలా ఈ కథలను ఒక క్రమంలో పేర్చుకుని చూసినప్పుడు మహాభారతం స్త్రీ-పురుష సంబంధాల పరిణామక్రమాన్ని కూడా చెబుతోందా అనిపిస్తుంది.

దమయంతి విదర్భరాజు కూతురు అన్నప్పుడు, అది నేటి మహారాష్ట్రలోని విదర్భనే సూచిస్తోందనుకుంటే, బహుశా ఇది దక్షిణ భారతం దిశగా భౌగోళిక విస్తరణ క్రమాన్నీ వెల్లడిస్తూ ఉండచ్చు. దానికి తగినట్టే స్త్రీపురుష సంబంధాలు మొరటుతనం నుంచి నాజూకును సంతరించుకుంటూ ఉండచ్చు.

మరింత విపులమైన పరిశీలన చేయవలసిన ఆ అంశాన్ని అలా ఉంచితే, నలదమయంతుల కథలో చెప్పుకోవలసిన విశేషాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి తర్వాత….

-కల్లూరి భాస్కరం

మీ మాటలు

  1. బహుశా సంతానోత్పత్తితో పురుషుడి కంటే స్త్రీకి మరింత ఎక్కువ సంబంధం ఉండటం వల్ల స్త్రీ క్రియాశీల అయిందేమో! ఈ క్రియాశీలత్వానికి బోలెడన్ని సంకెళ్ళు తగులుకున్నాయి తరువాతి కాలంలో. సాంఖ్య తత్వాన్ని ప్రస్తావించారు. కొంచెం వివరిస్తే బాగుడేది. నిజమే నలదమయంతుల refined ప్రేమ, భారతం కామకథలకు భిన్నమైనదే అనిపిస్తోంది. అలాగే మీ ఏకలవ్యుడి పరిశీలన అమోఘం. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి శిష్యరికం కోసం ఆరాటపడటం, మైదాన రాజుల మధ్యలో తన అపూర్వవిద్యకు ఓ హోదా తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఏమో అనే అనుమానం వస్తోంది నాకు. ఈ సోషల్ ఇంజనీరింగ్ కు ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారా?

    రాంభట్ల కృష్ణమూర్తిగారిని చదవాలనిపిస్తోంది. ఆయన పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయేమో కాస్త చెప్పగలరా?

  2. కల్లూరి భాస్కరం says:

    ధన్యవాదాలు లలితగారూ…

    నేను కూడా సాంఖ్యాన్నిలోతుగా చదవలేదు. రాంభట్లగారి పుస్తకం నుంచే సాంఖ్య తత్వం గురించి క్లుప్తంగా…

    1. *మనదేశంలో అతి ప్రాచీనమైన దర్శనం సాంఖ్యం. ఈ దర్శనం వ్యవసాయసమాజం నుంచి ఉద్భవించింది. ఈ దర్శన కర్త కపిల అనే స్త్రీ. తర్వాత కపిల మహర్షి అనే పేరుతో ఈ దర్శనకర్తను పురుషుడిగా మార్చారు.

    *మార్పులు చేర్పులతో దీని మూలరూపం పోయింది. మహావిద్వాంసుల దగ్గరనుంచి మామూలు మనుషుల వరకు జనానికి తెలిసినది ఈ దర్శనం ఒక్కటే.

    *పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు పదార్థానికి నాలుగుదశలు చెబుతారు. సాంఖ్యం ఈ దశలను పంచభూతాలు అంది. అయిదవది ఆకాశం. కాలానికి ఆకాశా(స్పేస్)నికి భేదం లేదని చెప్పింది. ఐన్ స్టీన్ చెప్పింది కూడా అదే.

    *సాంఖ్యుల భూతం నుంచే పూర్వకాలపు భూతవాదం, ఆధునిక భౌతికవాదం పుట్టాయి.

    *సాంఖ్యదర్శనంలో 24 తత్వాలు ఉన్నాయి. సాంఖ్య వ్యతిరేకులు వాటిపైన ఆత్మను ప్రతిష్టించి దానికి సేశ్వర(ఈశ్వరునితో కూడిన) సాంఖ్యం అని పేరుపెట్టారు. ఆత్మ లేని దానిని నిరీశ్వర సాంఖ్యం అన్నారు.

    *సాంఖ్య దర్శనం ప్రకారం ప్రకృతి ఒక్కటే, పురుషులు పలువురు. ప్రకృతి క్రియాశీల, పురుషుడు ఉదాసీనుడు.

    2. చరిత్రపొడవునా జరుగుతూ వచ్చింది సోషల్ ఇంజనీరింగే. దానికి లెక్కలేనన్ని ఆధారాలు. కొన్ని నా వ్యాసాలలో ప్రస్తావనకు వచ్చాయేమో కూడా. నా సర్పయాగ వ్యాసాలలో కృష్ణుని సోషల్ ఇంజనీరింగ్ గురించి ప్రత్యేకంగా కూడా ప్రస్తావించాను.

    3. రాంభట్ల గారి పుస్తకాలు: 1. జనకథ. దీనిని విశాలాంధ్రవారు ప్రచురించారు. ఇప్పుడు మార్కెట్ లో లేదు. 2. వేదభూమి. దీనిని తెలుగు గోష్టి వారు ప్రచురించారు. అందుబాటులో ఉన్నట్టులేదు. నా దగ్గర ఉన్న పుస్తకం పోతే, సుందరయ్య లైబ్రరీలో ఉన్న పుస్తకానికి జిరాక్స్ తీసుకున్నాను. 3. వేల్పుల కథ. విశాలాంధ్ర వారు ప్రచురించారు. అందుబాటులో లేదు. నా కాపీ పోయింది. 4. సొంత కథ. ఆయన స్వీయ చరిత్ర. గోవిందరాజుల చక్రధర్ తన సంస్థ తరపున ప్రచురించారు.

  3. Rambhatla gari books ippudu dorakaka povadam telugu jati duradrushtam. Ever aina mahanubhavulu copyright clearance teesukoni web lo free gano Leda paid download gano pedithe eetaraniki mariyu bhavitaralaku manchi chesinavaroutaru.

    • కల్లూరి భాస్కరం says:

      నిజమే మోహన్ గారూ…రాంభట్లగారి పుస్తకాలు దొరకకపోవడం తెలుగువారి దురదృష్టమే. నా దురదృష్టం చూడండి. ఆయన స్వయంగా నాకు ఇచ్చిన పుస్తకాలు కూడా పరహస్తగతం అయ్యాయి. ఆ పుస్తకాల కోసమే విశాలాంధ్ర సంపాదకవర్గంలో ఉన్న ఏటుకూరి ప్రసాద్ గారిని కలిశాను. ఆయన కూడా అవి అందుబాటులో లేవని చెప్పడమే కాక, ప్రచురణకు సిద్ధం చేసిన ‘చండాలురు ఎవరు?’ అనే రాంభట్లగారి అముద్రిత గ్రంథాన్ని ఇచ్చి దాని జిరాక్స్ తీసుకునే అవకాశం ఇచ్చారు. కొంత వివాదాస్పదం అనిపించిన ఆ పుస్తకం ప్రచురిస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం చెప్పండని అడిగారు. రాంభట్లగారు

      • కల్లూరి భాస్కరం says:

        రాంభట్లగారు ఉపయోగించిన పదాల అనుక్రమణికను వివరణాత్మకంగా రూపొందించాలని ఉందని కూడా అంటే తప్పకుండా ఆ పని చేయమని ఏటుకూరి ప్రసాద్ గారు ప్రోత్సహించారు. పుస్తకప్రచురణ, పదాల అనుక్రమణిక అలాగే ఉండిపోయాయి. నేను ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు రాంభట్లగారి చేత రాయించిన ఒక కాలమ్ కూడా ఆముద్రితంగానే ఉంది. తప్పకుండా ఆయన పుస్తకాలు పునర్ముద్రణ చెందుతాయని ఆశిద్దాం.

మీ మాటలు

*