గాజు కొండ మీద

MythiliScaled

అనగనగా ఒక గాజు కొండ. దాని మీద బంగారపు కోట. కోట ముంగిట్లో ఒక ఆపిల్ చెట్టు. దానికి బంగారు రంగులో  ఆపిల్ పళ్ళు కాసేవి.   కోట లోపల ఒక  వెండి గది. దాని గోడలకి ఆనించి పెద్ద పెద్ద భోషాణాలు, వాటినిండా  వెలలేని వజ్ర వైఢూర్యాలు. అలాంటి గదులు కోటలో చాలా ఉన్నాయిగాని ఈ గదిలో మాత్రం ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా చాలా అందంగా ఉండేది. నేలమాళిగలనిండా బంగారు కాసులు రాసులు పోసి ఉండేవి. ఒక మాంత్రికుడు ఆమె తండ్రిమీద కోపంతో రాజకుమారిని అక్కడ బంధించి ఉంచాడు. గాజు కొండ పైకి ఎక్కి ఆపిల్  పండు ఒకటి కోసి పట్టుకెళితేనేగాని  కోట తలుపులు తెరుచుకోవని అతను శపించాడు. కోటలోకి ప్రవేశించి రాజకుమారిని పెళ్ళాడి ఆ సంపదనంతా సంపాదించుకోవాలని ఎందరో వీరులు ప్రయత్నించారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎంత గట్టి పట్టు ఉన్న నాడాలని గుర్రాల కాలి గిట్టలకి తొడిగినా అవి  పైదాకా ఎక్కలేకపోయేవి. నున్నటి గాజుమీద వెనక్కి  జారిపోయి లోతైన లోయలో పడిపోతూ ఉండేవి. ఒక్క వీరుడు కూడా బతికి తిరిగి రాలేదు.

కిటికీ దగ్గరే కూర్చుని ఉండే రాజకుమారికి ఇదంతా కనిపించేది. ఎవరైనా కొత్తగా కొండ ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆమెకి విడుదలవుతానని ఆశ పుట్టేది. ఆ వీరులకీ ఆమెని చూస్తే ఉత్సాహం వచ్చేది. అయితే ఏమీ లాభం లేకపోయింది. అలా ఏడు సంవత్సరాలు ఆమె అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఏడేళ్ళ తర్వాత ఇక ఆమె బయటికి రాలేదు, ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి.

ఇంకొక మూడు రోజులలో ఏడేళ్ళూ పూర్తి అవుతాయనగా ఆ రోజున బంగారు కవచమూ శిరస్త్రాణమూ ధరించిన ఒక యువకుడు కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. అతని గుర్రం బలంగా, చురుకుగా ఉంది. జారిపోకుండా ఉండేందుకు దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నాడాలు తొడిగారు. సగం దూరం ఎక్కింది కానీ మరి చేతకాలేదు. అయితే జారకుండా జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఆగింది. రెండో రోజు ఇంకా తొందరగా , నేర్పుగా ఇంచుమించు పైదాకా వెళ్ళింది. నాలుగు అడుగులు వేస్తే గుర్రం మీది యువకుడికి ఆపిల్ పళ్ళు అందేలా ఉన్నాయి. సరిగ్గా అప్పుడు ఎక్కడినుంచో భయంకరమైన రాబందు  ఒకటి ఎగిరి వచ్చింది. అది ఏనుగంత పెద్దగా ఉంది. రెక్కలతో చటుక్కున గుర్రం కళ్ళ మీద కొట్టింది. బాధతో గట్టిగా సకిలించి గుర్రం, ముందు కాళ్ళ మీద పైకి లేచింది. అంతే ! వెనకకాళ్ళకి పట్టు జారిపోయింది. గుర్రమూ దాని మీది యువకుడూ ఇద్దరూ గాజు మీద జారిపోయి లోయలోకి పడిపోయారు. చూస్తూ ఉన్న రాజకుమారి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎలాగూ తనకి విముక్తి లేదు, తనకోసం ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నందుకు ఆమెకి దుఃఖం ఆగలేదు.

glass mountain 1

ఆఖరి రోజున ఒక కుర్రవాడు వచ్చాడు. హుషారుగా సరదాగా ఉన్నాడు. చిన్నపిల్లవాడికిలాగా మొహం లేతగా ఉంది , కానీ బాగా పొడుగ్గా దృఢంగా ఉన్నాడు. అంతమందీ  ఏమీచే యలేకపోయారనీ చచ్చిపోయారనీ అతనికి తెలుసు. అయినా ధైర్యంగా తనవంతు ప్రయత్నం చేద్దామనే అనుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో కమ్మరి చేత కాలివేళ్ళకీ చేతివేళ్ళకీ ఇనప గోళ్ళు తయారు చేయించుకున్నాడు. వాటిని తగిలించుకుని చాలా కొండలు ఎక్కి సాధన చేశాడు. అవన్నీ నిట్టనిలువుగా ఉన్న కొండలు, ఎక్కడా పట్టు దొరకనివి. గాజువి అయితే కావు, ఇటువంటి కొండ ఇదొక్కటే.

అతను ఎక్కటం మొదలుపెట్టాడు. ఓపికగా కాస్త కాస్తగా పైకి వెళుతున్నాడు. చూస్తుండగానే పొద్దుకుంకింది. బాగా అలిసిపోయాడు. దాహంతో గొంతు ఎండిపోతూ ఉంది. కాళ్ళకి ఇనపగోళ్ళు గుచ్చుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. చేతులతో మాత్రమే పాకగలుగుతున్నాడు. కొండ మీది ఆపిల్ చెట్టు కనబడుతుందేమోనని పైకి చూశాడు. కనిపించలేదు. కిందికి చూశాడు, అగాథమైన లోయ. తన కంటే ముందు వచ్చినవారంతా అందులోకే పడిపోయారని అతనికి తట్టింది, భయం వేసింది. చేతి గోళ్ళ పట్టు మాత్రం వదిలిపెట్టలేదు. మెల్లిగా చీకటి పడింది. బడలిక వల్ల అలాగే అక్కడే  నిద్రపోయాడు.glass mountain 2

 

అంతకుముందు రోజు యువకుడి గుర్రాన్ని కిందపడేసిన రాబందు అటువైపుగా వచ్చింది. అది మామూలు రాబందు  కాదు , పిశాచపక్షి. ఎవరూ చివరివరకూ రాకుండా  దాన్ని మాంత్రికుడే ఏర్పాటు చేశాడు. రోజూ రాత్రి వేళల్లో అది కొండ చుట్టూ చక్కర్లు కొడుతూ కాపలా కాస్తుంటుంది. ఈ నిద్రపోయే కుర్రవాడిని చూసి చచ్చిపోయాడని అనుకుంది. తినేందుకు దగ్గరికి వచ్చి ముక్కుతో పొడిచింది. అతనికి మెలకువ వచ్చింది, వస్తూనే ఒక ఉపాయం తట్టింది. రాబందు పొడుస్తున్న చోట విపరీతమైన నొప్పిగా ఉన్నా ఓర్చుకున్నాడు. దాని రెండుకాళ్ళూ గట్టిగా పట్టుకున్నాడు. అది బెదిరి పైకి ఎగిరింది. దానితోపాటు అతనూ గాలిలోకి లేచాడు. కొండ పైకంటా ఎగిరి గాలిలో గుండ్రంగా తిరుగుతోంది. అతను కళ్ళు తెరిచి చూస్తే కిందన బంగారుకోట పెద్ద దీపంలాగా కనిపిస్తోంది. రాబందు ఎగరటం లో ఒకసారి ఆపిల్ చెట్టుకి దగ్గరగా వచ్చింది. అతను తటాలున కిందికి దూకాడు. దూకబోయేముందు ఇనపగోళ్ళతో దాన్ని బలంగా కొట్టాడు. అది వికృతంగా అరుస్తూ లోయలోకి పడిపోయింది. కుర్రవాడు ఆపిల్ చెట్టు కొమ్మల్లోకి పడ్డాడు. పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. ఆకలేసి రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. చేతులకి ఆ రసం అంటిన చోట గాయాలు మాయమైపోయాయి. ఇంకొక పండుకోసి ఒంటిమీద దెబ్బలు తగిలినచోటల్లా రుద్దుకున్నాడు. అన్నీ నయమైపోయాయి. బోలెడంత శక్తి వచ్చింది. మరికొన్ని పళ్ళు కోసి చేత్తో పట్టుకుని కోట దగ్గరికి వెళ్ళాడు.

glass mountain 3

 

కోట గడప  దగ్గర ఒక డ్రాగన్ పహరా కాస్తోంది. ఆపిల్ ని దానిమీదికి విసరగానే అది మాయమైంది. తలుపులు తెరుచుకున్నాయి. రంగురంగుల  పూల మొక్కలు, పళ్ళ చెట్ల మధ్యలోంచి రాజకుమారి నడిచివచ్చింది. ఆమె వెంట తల్లి, తండ్రి, పరివారం- అంతా ఉన్నారు. వాళ్ళందరికీ అప్పుడే శాపం తీరింది.ఆ కొండ మీదే వాళ్ళ రాజ్యం- చాలా పెద్దది.  చేతిలో ఉన్న పూలమాలని కుర్రవాడి మెడలో వేసింది. అతనికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. రాజకుమారి ఎంత అందమైనదో అంత మంచిది కూడా. ఆమెతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.

 

మరుసటి  రోజు  వాళ్ళిద్దరూ తోటలో తిరుగుతుండగా గాజు కొండ కింద పెద్ద కలకలం వినబడింది. ఆ రాజ్యం లో వానకోయిలలు అన్ని చోట్లకీ ఎగిరి వెళ్ళి వచ్చి  వార్తలు చెబుతూ ఉంటాయి. కుర్రవాడు ఈల వేసి ఒక వానకోయిలని పిలిచి సంగతి ఏమిటో కనుక్కురమ్మన్నాడు.

 

అది వచ్చి చెప్పింది- ” రాబందు లోయలోకి పడినప్పుడు దాని రక్తపు చుక్కలు చనిపోయిన వీరులందరిమీదా పడ్డాయి. వాళ్ళు వాళ్ళ గుర్రాలతో సహా ఒక్కొక్కరే బతికి లేస్తున్నారు. ఆశ్చర్యంగా, ఆనందంగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరుతున్నారు. అదీ ఆ హడావిడి . ”

                                                                                               [  పోలండ్ జానపద కథ]

                                                                         సేకరణ- Hermann Kletke, Andrew Lang

 

 

మీ మాటలు

  1. గాజు కొండ మహల్ వర్ణన ఆపిల్స్ అన్నీ అద్భుతాలే.చాల బావుంది.

  2. Beautiful story, narrated in an elegant style. Week after week you are serving a feast of excellent stories, thank you Mythili Abbaraju garu!

  3. ప్రతివారం అందమైన కథలను సొగసైన శైలిలో అందిస్తున్నందుకు ధన్యవాదాలు మైథిలి అబ్బరాజు గారూ.
    ఈ కథ కొత్తగా ఉంది. ఇంతవరకు వినలేదు దీనిని!

    • Mythili Abbaraju says:

      ధన్యవాదాలండి . నేనూ చదవని కథలనే వెతుకుతున్నాను :)

  4. గాజు కొండ , రాజ కుమారి స్థితి, వీరుల ప్రయత్నం కళ్ళకు కట్టినట్టు రెప్పవేయకుండా చదివేసాము చివరి వరకూ !! బిగ్ అప్లాజ్ ఫర్ – ‘ ముగింపు ‘ , వీరులందరూ వారి గుర్రాలతో సహా తిరిగి బ్రతకడం ‘ చాలా చాలా హాయిగా అనిపించింది మా !! మీ మరో కధ వచ్చే వరకూ పిల్లలతో ఈ పరిమళం పంచుకుంటూ గడిపేస్తాం మైథిలీ Mam .

  5. harikrishna says:

    nice story, wonderful narration..

మీ మాటలు

*