నది మింగేసిన కోసల

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

పసనేది రోజు రోజుకీ రాజ్యం పట్ల నిరాసక్తు డవుతున్నాడు. నిర్లిప్తు డవుతున్నాడు. బౌద్ధ సన్యాసులతో ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతున్నాడు. దానధర్మాలు చేస్తున్నాడు. మిగతా సమయాన్ని తన ఏకాంత మందిరంలో, తనలో తాను గడుపుతున్నాడు.

అతని మీద బుద్ధుని ప్రభావమే కాక, బుద్ధుని ప్రభావం ఉన్న వాసభ ఖత్తియ ప్రభావం కూడా పడుతోంది.  ఆమె దాసి కూతురనీ, తనను మోసగించి ఆమెను కట్టబెట్టారనే కోపం అతని మనసులో ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. ఆమె సౌశీల్యం, వ్యక్తిత్వం ఆమె వైపు అతన్ని సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. ఆమె కేవలం శరీర సుఖాన్నీ, కొడుకునీ ఇచ్చిన అర్థాంగిగా అతనికి కనిపించడం లేదు. తనను సేద తీర్చే చలవపందిరిలా, కంటి వెలుగులా, ఆత్మబంధువులా కనిపిస్తోంది. ఆమె నాగ జాతీయుల ఆడబడుచు. బుద్ధుడికి నాగజాతీయులపై విశేష గౌరవాభిమానాలు ఎందుకున్నాయో ఆమెను చూస్తే పసనేదికి అర్థమవుతోంది.

ఇంతటి ఉత్తమురాలి రక్తం పంచుకున్న కొడుకు అంత కర్కోటకుడు ఎలా అయ్యాడో  నని ఒక్కోసారి పసనేదికి  ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆ వెంటనే అతనికే సమాధానం స్ఫురిస్తూ ఉంటుంది. అతను తన రక్తం కూడా పంచుకుని పుట్టాడు. తనలోని కర్కోటకాంశ అతనికి సంక్రమించడంలో ఆశ్చర్యం ఏముంది?

ఈ ఊహ రాగానే పసనేదికి తన గుండెను ఏదో కర్కశహస్తం మెలి తిప్పేసినట్టు అయిపోతుంది. విషాదంతో, పశ్చాత్తాపంతో అతని తల పాతాళం లోకి దిగబడిపోతున్నట్టు అనిపిస్తుంది…

రాజ్యవ్యవహారాలను విదూదభుడు పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తండ్రి పేరుకు మాత్రమే రాజు. అతను కూర్చునే సింహాసనం, అరుదైన సందర్భాలలో తప్ప మిగిలిన సమయాలలో ఖాళీగానే ఉంటోంది.  విదూదభుడు రాజుగా తండ్రి ఉనికిని దాదాపు గుర్తించడం మానేశాడు.

పసనేదిపై పిడుగుపాటులాంటి మరో పరిణామం. వాసభ ఖత్తియ అనారోగ్యంతో మంచం పట్టింది. కొన్ని రోజులే నని రాజవైద్యులు చెప్పేశారు. ఇప్పుడు పసనేది భార్య పక్కనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు.

ఓ రోజు, తన కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.  ‘ఏమిటి నీ చివరి కోరిక?’ అని అడిగాడు. ఆమె భర్తవైపు జాలిగా, ప్రేమగా, తృప్తిగా చూసింది. అంతలోనే ఆమె ముఖం విషణ్ణమై పోయింది. ‘గౌతముని చూడాలని ఉంది…’ అంటూ భర్తవైపు చూసింది. ఆ కళ్ళల్లో క్షణకాలంపాటు ఆశ తళుక్కుమంది. అంతలోనే అది అత్యాశ అని తనకే అనిపించింది.  ఉబికి వచ్చే కన్నీళ్లను భర్త కంట పడకుండా దాచుకునే ప్రయత్నంలో చివాలున ముఖం పక్కకు తిప్పేసుకుంది.

పసనేది  ఉలికిపడి తన చేతిలో ఉన్న ఆమె చేతిని అప్రయత్నంగా వదిలేశాడు. భార్య కోరిక తీర్చలేని తన అశక్తత అతని ముందు భూతంలా కనిపించింది.  తనలో రాజునన్న అహం లేశమాత్రం మిగిలినా, దానిని ఇనప చేతులతో అణచిపారేసింది.  ఈమెను గౌతముడి దగ్గరకు ఎలా తీసుకువెళ్లడం?! ఎక్కడున్నాడు గౌతముడు? శ్రావస్తికి పదిరోజుల ప్రయాణదూరంలో ఉన్నట్టు నిన్ననే తెలిసింది. భగవంతుడు కరుణించి ఈమె ఆయుర్దాయాన్ని పదిరోజులు పొడిగిస్తాడనే అనుకున్నా, ఈమె ప్రయాణం చేసే స్థితిలో ఉందా?! ఎంత ఉన్నా ప్రకృతీ, కాలాల ముందు మనిషి ఎంత అల్పుడో అతనికి ఆక్షణంలో అర్థమయింది.

‘తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. నీ కళ్ళు నావిగా చేసుకుని నేను వెళ్ళి గౌతముని దర్శిస్తాను’ అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు అతని గొంతు దుఃఖంతో పూడిపోయింది.

ఆ రోజు రాత్రే వాసభ ఖత్తియ కన్నుమూసింది. పసనేది ఏకాంతాన్ని భర్తీ చేసే చివరి బంధం తెగిపోయింది. అతనిప్పుడు పూర్తిగా ఏకాకి అయిపోయాడు.

***

తెగలలో అస్తిత్వ సంక్షోభం తారస్థాయికి చేరింది…

అదే సమయంలో ఒక ప్రచారమూ పుంజుకోవడం ప్రారంభమైంది…  ఒక మహావీరుడు వస్తున్నాడు, తమను ఆదుకోబోతున్నాడు, తమలో వెనకటి ఆత్మగౌరవాన్నీ, ప్రాణాలకు తెగించి పోరాడే పటిమనూ మళ్ళీ రంగరించబోతున్నాడు, తెగలకు పునర్జన్మ ప్రసాదించబోతున్నాడు!

మొదట్లో తెగల గుండెల్లో సుడులు తిరుగుతున్న ఆశలూ, ఆకాంక్షలే ఆ ప్రచార రూపంలో వ్యక్తమైనా, త్వరలోనే అది నిజమనిపించే ఆనవాళ్లూ కనిపించసాగాయి. కోసల, మగధ సైనికుల దౌర్జన్యానికి ప్రతిఘటన ఎదురవుతోంది. హఠాత్తుగా ఒక ముసుగు దళం ప్రత్యక్షమై సైనికులతో తలపడి తరిమి కొడుతోంది. మరోవైపు తెగలలోని యువకులను సంఘటితం చేసి ప్రతిఘటనకు సిద్ధం చేసే పనీ రహస్యంగా జరుగుతోంది. తెగలలో క్రమంగా ఒక నూతనోత్సాహం, ఆత్మ విశ్వాసం అడుగుపెడుతున్నాయి. అంతకంటే, ఆశ్చర్యంగా ‘మల్లబంధుల మన మధ్యకు వచ్చాడు, మేము అతన్ని చూశా’మనే వదంతి కూడా వ్యాపిస్తూ వచ్చింది.

***

King_Pasenadi_of_Kosala

పసనేదిని దీర్ఘచరాయణుడు ఈ మధ్య తరచు కలవడం లేదు. కలవాల్సిన అవసరం కూడా రావడం లేదు. దీర్ఘచరాయణుడు తనను రోజూ కలసుకోవాలనీ, తనతో రాజ్యవ్యవహారాలు చర్చించాలనే ఇచ్ఛ పసనేదిలో కూడా కనిపించడం లేదు. విదూదభుడు అన్నీ తన చేతుల్లోకి తీసుకున్నాడు. దానిని పసనేది నూటికి నూరుపాళ్లూ ఆమోదించినట్టే కనిపిస్తున్నాడు.

వాసభ ఖత్తియ మరణించినప్పుడూ, ఆమె అంత్యక్రియలప్పుడూ దీర్ఘచరాయణుడు పసనేదిని చూశాడు. అది జరిగి కూడా నెలరోజులు దాటింది. ఇప్పుడు హఠాత్తుగా పసనేది తనకు కబురు చేసేసరికి ఎందుకు అయుంటుందా అనుకుంటూ వెళ్ళి కలిశాడు. పసనేది ముక్తసరిగా విషయం చెప్పాడు. తనెంతకాలం బతుకుతాడో తెలియదు. గౌతముని దర్శించుకోవాలని ఉంది. వాసభ ఖత్తియకు కూడా మాట ఇచ్చాడు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయాలి!

దీర్ఘచరాయణుడు విన్నాడు. అతని హృదయంలో ఒక ఆనంద ఝరి ఒక్కసారి నిశ్శబ్దంగా ఉవ్వెత్తున ఎగసి పడింది. ఏవేవో ఆలోచనలు అంతే వడిగా అతన్ని ముసురుకున్నాయి. అంతలోనే, తన మనోసంచలనం ముఖంలో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు.

‘రాజ్యం నీ చేతుల్లో పెడుతున్నాను, విదూదభుడు ఎలాంటి సాహసమూ చేయకుండా చూడు’ అని పసనేది చెప్పలేదు. చెప్పకపోవడంలోనే చెప్పడం ఉందేమో తెలియదు. సరే నని చెప్పి దీర్ఘచరాయణుడు సెలవు తీసుకున్నాడు.

***

ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ, కొండంత భారంనుంచి బయటపడినప్పుడు కలిగే ఒకవిధమైన ఉల్లాసాన్ని పొందుతూ  దీర్ఘచరాయణుడు తన నివాసానికి వెళ్ళాడు…

తన ఆనందాన్ని దగ్గరివాళ్లతో పంచుకుందామనుకున్నా అతనికి ఆ అవకాశం లేదు. అతను పెళ్లి చేసుకోలేదు. మేనమామ కొడుకు మల్ల విక్రముడు కూడా దగ్గర లేడు. అతను తండ్రికి తగ్గ వీరుడే. కానీ ఎందుకో పసనేది అతనిని రాజ్యానికి వాడుకోవాలనుకోలేదు. విదూదభుడికి అప్పగించాలనీ అనుకోలేదు. అలాగని అతని మీద ఆదరభావం లేకా కాదు. అతన్ని సొంత కొడుకులానే చూశాడు. దాంతోపాటు స్వేచ్ఛా ఇచ్చేశాడు. కోసల, మగధలకు వ్యతిరేకంగా తెగలను సంఘటితం చేసే లక్ష్యంతో  మల్లవిక్రముడు అజ్ఞాతజీవితంలోకి వెళ్లిపోయాడు. తన తండ్రి మల్లబంధుల ఉనికిని ప్రచారంలో ఉంచింది అతనే.

తన నివాసంలో అడుగుపెట్టిన దీర్ఘచరాయణుడు ఆ క్షణంలో పరిచారకులకు వింతగా, కొత్తగా కనిపించాడు. అతని ముఖంలో ఎన్నడూ చూడని ప్రసన్నత, ఉల్లాసం కనిపిస్తున్నాయి. అతని ప్రవర్తన వాళ్ళకు ఎప్పుడూ అంతుబట్టనిదే. బయట నలుగురిలో ఉన్నప్పుడు అంత శాంతుడు, అంత సౌమ్యుడు, అంత మృదుభాషి ఇంకొకరు లేరు అన్నట్టు ఉంటాడు. ఎప్పుడూ నవ్వుముఖంతో ఉంటాడు. రాజ్యక్షేమానికే అంకితమైనట్టు ఉంటాడు. ఇంతకుముందు పసనేదికైనా, ఇప్పుడు విదూదభుడికైనా అతని మీద ఎనలేని గురి.

కానీ, ఏకాంతంగా ఉన్నప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తాడు. దగ్గరకు వెళ్లడానికీ, పలకరించడానికే తాము భయపడిపోతూ ఉంటారు. బాహ్య, అంతర్ ప్రవర్తనలో తనలో వచ్చే మార్పు అతనికీ తెలుసు. ఒక్కోసారి అది తనకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి తను గంభీరుడైపోతాడు. దీర్ఘాలోచనలో పడిపోతాడు. కసి, కార్పణ్యం, కోపంతో కళ్ళు జేవురిస్తాయి. అయితే, తనలో ఈ వైరుధ్యం ఎప్పుడు ప్రవేశించిందో, ఎందుకు ప్రవేశించిందో అతనికి తెలుసు…

అది, మేనమామ మల్లబంధుల ‘అదృశ్యం’ అయినప్పటినుంచీ!

చాలా ఏళ్ళు గడచిపోయాయి. అప్పటినుంచీ తన గుండెల్లో  రహస్యంగా అగ్నిగుండాన్ని మోస్తున్నాడు. మేనమామ గుర్తొచ్చినప్పుడల్లా అతని రక్తం మరిగిపోతుంది. పగ, ప్రతీకారేచ్చ వేయి నాల్కలతో బుస కొడతాయి. అవి పసనేది మీద…మొత్తం కోసల రాజ్యం మీద…

మేనమామ అదృశ్యం కాలేదు! పసనేది అతన్ని గుట్టు చప్పుడు కాకుండా చంపించాడు. మల్లిక మరణంతో జీవితం మీద విరక్తి చెంది ఏ అడవులో పట్టి పోయాడని తనే ప్రచారం చేయించాడు. అత్త మరణం మేనమామను కుంగదీసిన మాట నిజమే. కానీ కొడుకును, తనను చూసుకుని ఆయన ఓదార్పు పొందుతున్నాడు. అటువంటి మనిషి తమ ఇద్దరినీ ఒంటరివాళ్లను చేసి హఠాత్తుగా అదృశ్యమయ్యాడనడం అప్పుడే తనకు నమ్మశక్యంగా అనిపించలేదు.  అతన్ని పసనేది చంపించిన విషయం కొన్ని మాసాలకే తెలిసింది. ఆ కుట్రలో పాల్గొన్న మనిషే తనకు స్వయంగా ఈ విషయం చెప్పాడు. అతను మల్ల తెగతో బంధుత్వం ఉన్నవాడు. అదీగాక ఒక వీరుని అన్యాయంగా కుట్ర చేసి చంపామన్న పశ్చాత్తాపం అతన్ని ఆ తర్వాత దహిస్తూ వచ్చింది. ఓ రోజున తనను కలసి, ఎవరికీ చెప్పనని తన చేత ఒట్టు వేయించుకుని ఈ సంగతి చెప్పాడు.

***

పసనేది ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. అతనికి అత్యంత విశ్వాసపాత్రులు, అతనికోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే సిబ్బంది అతనితో బయలుదేరారు. వారిలో ఒక వృద్ధ పరిచారిక కూడా ఉంది.

పసనేది గౌతముని దర్శించుకున్నాడు. ఆయన సన్నిధిలో వారం రోజులు గడిపాడు. ఎన్నడూ లేనంత శాంతి అతన్ని ఆవరించింది. అన్ని బంధాలూ పుటుక్కున తెగిపోయినట్టు అనిపించి, మనసు దూదిపింజలా అయిపోయింది.  తన అస్తిత్వం మొత్తాన్ని ఇప్పుడు ఇద్దరే ఆక్రమించుకున్నారు. గౌతముడు, తన దివంగత అర్థాంగి వాసభ ఖత్తియ! తన అస్తిత్వం ఇలా కుదించుకుపోవడంలోనే అతనికి పూర్ణత్వం అనుభూతమవుతోంది. ఇప్పుడు ఎలాంటి విచారమూ లేదు.

తిరుగు ప్రయాణమై కొంత దూరం వచ్చాక పిడుగుపాటు లాంటి వార్త…గౌతముడు సిద్ధిపొందాడు!

మరోవైపు కోసలనుంచి మరో సంచలన వార్త…విదూదభుడు తనే రాజునని ప్రకటించి సింహాసనాన్ని అధిష్టించాడు! అది తండ్రి సమ్మతితోనే జరిగినట్టు కూడా ప్రకటించాడు. అందుకు సాక్ష్యంగా దీర్ఘచరాయణుడు తన దగ్గర ఉన్న రాజముద్రను అతనికి అందించాడు.

పసనేదిలో ఆ వార్త ఎలాంటి విపరీత సంచలనమూ కలిగించలేదు. పైగా తృప్తి కలిగించింది. రాజ్యబంధం కూడా తెగిపోయింది అనుకున్నాడు. అంతకంటే ఎక్కువ తృప్తిని కలిగించినది, దీర్ఘచరాయణుడు రాజముద్రను విదూదభుడికి అందించడం! తన మేనమామ మల్లబంధులను తను చంపించిన సంగతి అతనికి తెలిసి ఉంటుంది. అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుని ఉంటాడు. మంచి పని చేశాడు. అయితే, తను చేసిన పాపానికి అది చిన్న పరిహారం మాత్రమే.

ప్రయాణమధ్యంలో ఉన్న పసనేది తక్షణ కర్తవ్యం గురించి యోచించాడు. తనిప్పుడు శ్రావస్తికి వెళ్ళి ఏంచేయాలి? వెడితే తనను కొడుకు బతకనివ్వడు. అయినా తనకు ప్రాణభయం లేదు. ఆ బంధం కూడా ఎంతో కాలం ఉండదు. తన ఈడువాడే అయిన గౌతముడు కన్నుమూశాడు. తనూ ఏ క్షణంలోనైనా రాలిపోవచ్చు. ఆ రాలిపోవడం ఎక్కడైతేనేం?  శ్రావస్తికి వెళ్ళి కొడుక్కి పితృహత్యాపాపం కూడా కట్టబెట్టడం దేనికి?

తన వెంట ఉన్న సిబ్బందిని చూశాడు. వాళ్ళు తనకు ఎంతో విశ్వాసపాత్రంగా ఉంటూ వచ్చినవాళ్లు. పిల్లా, పాపా,  చూడవలసిన జీవితం ఎంతో ఉన్నవాళ్ళు. వాళ్ళకు తను అంతిమ న్యాయం చేయాలి. వాళ్లను శ్రావస్తికి పంపేయాలి.

తన నిర్ణయాన్ని వాళ్ళకు చెప్పాడు. వాళ్ళు వ్యతిరేకించారు. ఇది నా ఆదేశం అనేసరికి తలవంచారు. వృద్ధ పరిచారిక మాత్రం ససేమిరా అంది. చావైనా, బతుకైనా మీతోనే నని భీష్మించింది.

సిబ్బంది కంటతడితో సెలవు తీసుకున్నారు. పసనేది, పరిచారికా మిగిలారు.  ఇప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి గౌతముడి దగ్గరకు వెడదామన్నా గౌతముడు లేడు.  అంతలో, మగధరాజధాని రాజగృహ తమున్నచోటికి రెండు రోజుల ప్రయాణ దూరమన్న సంగతి గుర్తొచ్చింది. అక్కడ తన తోబుట్టువు ఉంది. చూసి ఎంతకాలమైందో! కడసారి ఆమెను ఒకసారి చూడచ్చు. అలాగే, అజాతశత్రుకు గౌతముని సందేశాన్నీ అందించవచ్చు.

***

పసనేది, పరిచారిక రాజగృహ చేరుకునేసరికి అర్థరాత్రి దాటింది. ఇద్దరూ బాగా అలసిపోయారు. పసనేది మరీనూ. తీరా వెళ్ళేసరికి మూసి వేసిన కోట తలుపులు వారిని వెక్కిరించాయి. తెల్లారే వరకూ చలిలో చీకటిలో ఆకలి దాహాలతో గడపక తప్పదు. కానీ అప్పటికే పసనేదిలో సత్తువ క్షీణించిపోయింది. అలసట అతని మీద ప్రభావం చూపుతోంది. దగ్గు, ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అతని తలను తన ఒడిలో పెట్టుకుని వృద్ధపరిచారిక చేసిన ఉపచారం వల్ల ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఆమె ఒడిలోనే పసనేది తుది శ్వాస విడిచాడు.

పొద్దుటే కోట తలుపులు తెరచిన భటులకు పసనేది మృతదేహామూ, పక్కనే రోదిస్తున్న పరిచారికా కనిపించారు. పరిచారిక వల్ల అతను అజాతశత్రుకు మేనమామ అని తెలుసుకున్న భటులలో కొందరు హుటాహుటిన వెళ్ళి ఆ విషయం అతనికి చెప్పారు. మిగిలినవాళ్లు పసనేది మృతదేహాన్ని కోట లోపలికి చేర్చారు. అజాతశత్రు, తల్లి పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు.

అజాతశత్రు రాజలాంఛనాలతో పసనేదికి అంత్యక్రియలు జరిపించాడు.

***

కొన్ని మాసాలు గడిచాయి.

విదూదభుడికి పట్టపగ్గాలు లేవు. రాజ్యవిస్తరణ యత్నంలో పడ్డాడు. దీర్ఘచరాయణుడు అతన్ని ప్రోత్సహిస్తున్నాడు. అందులో అతని ప్రణాళిక అతనికి ఉంది. పసనేదిని తప్పించడం ద్వారా అతని పగ సగమే తీరింది. కోసల రాజ్యాన్ని పూర్తిగా తుడిచిపెడితేనే తన పగ పూర్తిగా చల్లారుతుంది.

విదూదభుడు దండయాత్రకు బయలుదేరాడు. రాప్తీ నదీతీరంలో దండు విడిసింది. అర్థరాత్రి అతనూ, సైన్యమూ తమ గుడారాలలో గాఢనిద్రలో ఉన్నారు. ఆ నదికి తరచు మెరపు వరదలు సంభవిస్తూ ఉంటాయి. ఆ సంగతి దీర్ఘచరాయణుడికి తెలుసు. విదూదభుడికి తెలియదు. దీర్ఘచరాయణుడు ఆ విషయం అతనికి చెప్పలేదు. ఆ రోజు మెరుపు వరద సంభవించి గుడారాలను ముంచెత్తింది. జరుగుతున్నది ఏమిటో తెలుసుకునేలోపలే విదూదభుని, సైన్యాన్ని నది మింగేసింది.

నిజానికి నది మొత్తం కోసలరాజ్యాన్నే తుడిచిపెట్టింది. మల్లబంధులను చంపినందుకూ, శాక్యులను ఊచకోత కోసినందుకూ ప్రకృతి విధించిన శిక్షగా దానిని చెప్పుకున్నారు.  రాజూ, సైన్యమూ కూడా లేని కోసలను అజాతశత్రు అవలీలగా ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా కోసల చరిత్రలోనే అదృశ్యమైపోయింది…

ఇప్పటినుంచీ కోసల-మగధ పేర్లలో ఒక్క మగధ పేరే వినిపించబోతోంది. మగధ ఒక మహాసామ్రాజ్యంగా అవతరించబోతోంది. అటు గాంధారం నుంచి ఇటు దక్షిణభారతం వరకూ తన ఛత్రచ్చాయలోకి తెచ్చుకోబోతోంది. భారతదేశాన్ని చరిత్రకాలంలో ప్రతిష్టించబోతోంది. నందులు, చంద్రగుప్తుడు, అలెగ్జాండర్, మౌర్యసామ్రాజ్యం, అశోకుడు వగైరా పేర్లు మరిన్ని ఆనవాళ్లతో భారతీయులకు పరిచయం కాబోతున్నాయి. ఒకప్పుడు మగధకు సమవుజ్జీ అనిపించుకున్న కోసల చరిత్ర వాకిటిలోకి రాకుండానే, చరిత్రపూర్వగర్భంలోనే కన్నుమూసింది. రామాయణ రాజ్యాంగానే జన పరిచితిలో మిగిలింది.

తెగలు ఆ తర్వాతా మిగిలాయి. మగధ పాలకులకు చికాకు తెచ్చిపెడుతూనే ఉన్నాయి. కాకపోతే అవి తమ గతవైభవానికి వెలిసిపోయిన నీడలు మాత్రమే. వాటి పోరాట పటిమ అజ్ఞాత పోరాటాలకు, గెరిల్లా యుద్ధాలకూ పరిమితమైంది.

దీర్ఘచరాయణుడు ఏం సాధించాడన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అతను వ్యక్తిగత పగ, ప్రతీకారాలను మాత్రమే తీర్చుకోగలిగాడు. తెగలను ఏ విధంగానూ ఉద్ధరించలేకపోయాడు. ఒక సర్వంసహాధిపత్యశక్తికి పరోక్షంగా దారి ఇచ్చాడు. మల్లవిక్రముడూ అంతే. కాకపోతే, వేలు, లక్షల సంఖ్యలో తన గెరిల్లా వారసులను ఇచ్చాడు. అతని వారసుల పోరాటం నేటికీ నడుస్తున్న చరిత్ర.

                                                  (అయిపోయింది)

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

మీ మాటలు

  1. యిలా ఆపితే ఎలాగు ?
    ఇంకా రాయాలి మీరు.

    • kalluri bhaskaram says:

      సారీ మోహన్ గారూ, మీకు అలా అనిపించిందా? కథ మాత్రమే అయిపోయింది. కాలమ్ కాదు

  2. మంజరి.లక్ష్మి says:

    “ఒకప్పుడు మగధకు సమవుజ్జీ అనిపించుకున్న కోసల చరిత్ర వాకిటిలోకి రాకుండానే, చరిత్రపూర్వగర్భంలోనే కన్నుమూసింది. రామాయణ రాజ్యాంగానే జన పరిచితిలో మిగిలింది. ” విదూధబుడి పూర్వుడే రాముడా?

    • kalluri bhaskaram says:

      “విదూదభుడి పూర్వుడే రాముడా?”…అని కాదు. కోసల ఒక చారిత్రిక వాస్తవం అనే సంగతి మరుగున పడిపోయి రామాయణ రాజ్యంగా అంటే పౌరాణిక విషయంగా మిగిలిపోయిందని అర్థం.

మీ మాటలు

*