అర్జున, అశోకుల మీదుగా అమెరికా దాకా…

భీష్ముడు:  ధర్మరాజా, విను. ఒకే ఇంటికి చెందిన జనాలు ఉన్నారు. వాళ్ళలో ధనార్జన చేసేవారు, కార్యనిపుణులు, ఆయుధోపజీవులు, ఇంకా రకరకాల పనులు చేసేవారూ ఉన్నారు. వారే గణాలు. రాజు వాళ్ళతో కలసిమెలసి ఉంటూ వాళ్ళ నడకను కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళను సంతోషపెడుతూ వలలో వేసుకోవాలి.

గణజనాలలో ఓరిమి ఉండదు. బుద్ధిలో, ప్రతాపంలో అవతలివాళ్లు ఎంత గొప్పవాళ్ళైనా సరే, లెక్క చేయరు. వారిలో ఎవడైనాసరే, ఇంకొకడితో శత్రుత్వం వహించగలడు. దాంతో వాళ్ళ మధ్య చీలికలు వస్తాయి. అప్పుడు శత్రురాజులు వాళ్ళలో కొంతమందిని తమవైపు తిప్పుకుంటారు. అది రాజ్య మూలాన్ని తొలిచేస్తుంది. కనుక రాజు ముందే జాగ్రత్తపడాలి. వాళ్ళను మాటనేర్పుతో వశం చేసుకోవాలి. గణముఖ్యులను ఆదరిస్తూ వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. గణజనాలలో ఐకమత్యం చెదిరిపోతే రాజ్యం నాశనమవుతుంది. గణజనాలు ఒక్కమాట మీద ఉంటేనే రాజుకు సిరీ, సంపదా.  కనుక గణపద్ధతులను గమనించుకుంటూ మెలగాలి,

                      -తిక్కన     

(శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, తృతీయాశ్వాసం)

***

కురుక్షేత్రంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు గణజనాల గురించి ధర్మరాజును పైవిధంగా హెచ్చరిస్తాడు. దాని నేపథ్యం ఏమిటంటే…

సాముదాయిక అధికారంలో ఉండే గణవ్యవస్థ అప్పటికే శిథిలమవుతోంది. ఏకవ్యక్తి అధికారానికి క్రమంగా దారి ఇస్తోంది. కానీ ఆ పరివర్తన అనుకున్నంత తేలిక కాదు. వ్యవస్థ శిథిలమైనంత వేగంగా వ్యక్తుల జీవనవిధానం శిథిలం కాదు. గణజనాలు తమవైన ప్రత్యేక పరిస్థితులకు అలవాటుపడ్డారు. వారిలో ప్రతి ఒకడూ స్వతంత్రుడు. గణంలోని ప్రతి ఒకడితోనూ సమానుడు. ఎవరో ఒకరి అధికారానికి తలవంచడం వాళ్ళకు తెలియదు. దానికితోడు, గణమనస్తత్వంలో పగ, ప్రతీకారదాహం అనేవి అతి సహజంగా కలసిపోయి ఉంటాయి. వారిలో శత్రువుపై పగ దీర్చుకోవడం కేవలం   క్షణికోద్రేక చర్య కాదు. ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఒక మతవిధిగా, ఒక కర్తవ్యంగా, కాలపరిమితితో సంబంధం లేకుండా అమలు జరిగే ప్రక్రియ.

దీనికితోడు వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఆయుధోపజీవులు.

bhismaarrowbed

గణవ్యవస్థా, గణజనాలూ అనగానే ప్రపంచమంతా మొట్టమొదటగా తలచుకుని మొక్కవలసిన పండితుడు, లూయీ హెన్రీ మోర్గాన్. ఆయన రాసిన Ancient Society  పురామానవ చరిత్రకారులకు ఓ బైబిలూ, ఓ భగవద్గీతా. అది గణజీవనసూత్రాలను దండగుచ్చిన వ్యాకరణం. మోర్గాన్ కు మహాభారతంతో పరిచయం ఉందని చెప్పలేం. తన పుస్తకంలో ఆయన మహాభారతాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. అయినాసరే, ఆయన సూత్రీకరణలకు మహాభారతంలోనే ఎన్నో ఉదాహరణలు దొరకుతాయి. ఆసక్తిగొలిపే ఆ విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేయక తప్పడం లేదు.

గణజనాలు ఒక ‘సమస్య’ అని భీష్ముడికి తెలుసు. ఆయననుంచి మూడో తరానికి చెందిన ధర్మరాజుకు తెలుసు. అందులోనూ అర్జునుడికి మరింత అనుభవపూర్వకంగా తెలుసు. ధర్మరాజునుంచి రెండో తరానికి చెందిన జనమేయజయునికి తెలుసు. అక్కడినుంచి ఒకింత చరిత్ర కాలంలోకి వస్తే కోసల, మగధ రాజులకు తెలుసు.  అలెగ్జాండర్ కీ, మౌర్యరాజు అశోకుడికీ, గుప్తరాజులకూ తెలుసు. ఆ తర్వాతి రాజులకు బహుశా తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే, మహాభారతకాలంలో ప్రారంభమైన గణజనాల ఊచకోత గుప్తరాజులతో ఒక కొలిక్కి వచ్చింది. గణసమాజమూ, సంస్కృతుల జ్ఞాపకాలు మనదేశంలో ఏ మేరకు మాసిపోయాయంటే; మన ప్రాచీన సారస్వతంలోనూ, ధర్మశాస్త్రాలలోనూ ఉన్న గణసమాజలక్షణాలనూ, వాటి అవశేషాలనూ కవులూ, ఇతర బుద్ధిజీవులూ పోల్చుకోలేనంతగా!  నన్నయభారతం నుంచే ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు.

ఆధునిక కాలానికి వస్తే, మోర్గాన్ వెలుగులోనే మనం మళ్ళీ గణసమాజం తీరుతెన్నుల గురించి సాధికారంగా తెలుసుకోగలుగుతున్నాం.

మహాభారతకాలం నుంచి చరిత్రకాలం మీదుగా మనం నేటికాలానికి వచ్చి ఒకసారి మనదేశపు పశ్చిమవాయవ్యాలవైపు వెడదాం. నేటి పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ సరిహద్దులలో కొన్ని గిరిజనప్రాంతాలున్నాయి. అప్ఘానిస్తాన్ వర్తమానం మన గతం అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆధునిక కాలంలో తన ప్రాంతంలోని ఆయుధోపజీవుల స్వైరవిహారం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనే ఒక ఫక్తూన్ నాయకుడిని తీవ్రంగా కలతపెట్టిందనీ, గాంధీ అహింసావాదానికి ప్రభావితుడైన గఫార్ ఖాన్ తన జాతీయులను హింసామార్గం నుంచి తప్పించడానికి కృషి చేశాడని కూడా చెప్పుకున్నాం.

అప్ఘానిస్తాన్ ను ఆనుకుని ఉన్న వాయవ్య సరిహద్దు రాష్ట్రం (నేటి పాకిస్తాన్ వాయవ్య ప్రాంతాన్ని బ్రిటిష్ రోజుల్లో అలా పిలిచేవారు)లోని గిరిజనుల జీవనవిధానం పట్ల గాంధీకి ఎంతో ఆసక్తి ఉండేదని ఆయన జీవితచరిత్ర చదివితే అర్థమవుతుంది. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు పఠాన్ల హింసా పార్శ్వం ఆయనకు స్వయంగా అనుభవంలోకి వచ్చింది కూడా. మీర్ ఆలమ్ అనే ఒక పఠాన్ ఓ వివాద సందర్భంలో గాంధీ మీద దాడి చేశాడు. గాంధీ కొన్ని రోజులు ఆసుపత్రిలో గడపవలసివచ్చింది. గఫార్ ఖాన్ తనను మొదటిసారి కలసినప్పుడే ఇద్దరూ సరిహద్దు రాష్ట్రంలోని గిరిజనుల గురించి ఎంతో ఇష్టంగా మాట్లాడుకున్నారు. కాబూల్ వరకూ వెళ్ళి, సరిహద్దులకు అతీతంగా జీవించే గిరిజనులతో కలసిపోయి గడుపుతూ వారి మనస్తత్వాన్ని అర్థంచేసుకోవాలని ఉందని అప్పుడే గాంధీ గఫార్ ఖాన్ తో అన్నారట. ఆయన మూడుసార్లు సరిహద్దు రాష్ట్రానికి వెళ్ళి గఫార్ ఖాన్ ఆతిథ్యం అందుకున్నారు. తరచు స్థిరజనావాసాలపై దాడులు చేస్తూ హిందూ, సిక్కు అల్పసంఖ్యాకవర్గాలకు సమస్యగా మారిన గిరిజనులను సంస్కరించాలన్న కోరిక ఆయనకు ఉండేది.

కోశాంబి

కోశాంబి

మహాభారతం, కోశాంబీల పరిచయంతో ఆయుధోపజీవులను పరిశీలిస్తున్న నాకు గఫార్ ఖాన్, ఫక్తూన్ తెగల గురించిన వివరాలు; సరిహద్దురాష్ట్రంలోని గిరిజన తెగలపై గాంధీ ఆసక్తి  ప్రత్యేక కుతూహలం కలిగించడం సహజమే.  గాంధీ ఆసక్తికి కారణం, భారతదేశ ప్రధానజీవనస్రవంతి లోంచి ఆయుధోపజీవనం అదృశ్యమైపోవడమే నని నాకు అనిపిస్తుంది.

మహాభారతంతో మొదలుపెట్టి, చరిత్రకాలం మీదుగా అప్ఘాన్ పరిణామాలను అర్థం చేసుకుంటున్న నన్ను,  ఓరోజు ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రముఖ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు, రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు ఆకర్షించాయి. పాక్-అప్ఘాన్ సరిహద్దుప్రాంతాలలో అమెరికా, దాని మిత్రదేశాల సైనికచర్యను ఆయన ప్రస్తావిస్తూ “అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం వందేళ్లు పోరాడినా ఆ ప్రాంతాలపై ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే, అక్కడ ఉన్న పదిలక్షలమందిలో ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడు. ప్రతి ఒకడి చేతిలోనూ ఆయుధం ఉంటుంది. కనుక సైనికమార్గంలో వాళ్ళను లొంగదీసుకోవడం అసాధ్యం. అమెరికా మరో ఓటమినే మూటకట్టుకుంటుంది” అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మాటలు నా అవగాహనను ధ్రువీకరిస్తున్నాయి.

అంటే, మహాభారతకాలంతో ప్రారంభించి గుప్తరాజుల వరకూ పైన ఇచ్చిన జాబితా, అక్కడితో పూర్తి కావడం లేదన్నమాట. అందులోకి నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ, మధ్యలో కొంతకాలం అప్ఘానిస్తాన్ లో చేతులు కాల్చుకుని తప్పుకున్న నాటి సోవియట్ యూనియన్, తాజాగా అమెరికా; దాని మిత్రదేశాలు చేరుతున్నాయన్న మాట. అయితే, ఆయుధోపజీవులతో అర్జునుడు, అశోకుడు తలపడడం; భౌగోళిక హద్దులను దాటుకుని నాటి బ్రిటిష్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్, అట్లాంటిక్ ను దాటివచ్చి అమెరికా తలపడడం ఒక లాంటివే కాకపోవచ్చు. తెగలు, దేశాల స్వయంనిర్ణయాధికారంలో జోక్యం చేసుకునే అగ్రరాజ్య దురహంకారంగానో, ప్రపంచశాంతి స్థాపన యత్నంగానో ఎవరి కోణం లోంచి వారు చెప్పుకోవచ్చు. ఆ చర్చను అలా ఉంచి, ఈ సందర్భంలో నన్ను ఆశ్చర్యపరిచేది, చరిత్ర అవిచ్ఛిన్నత!

భారతదేశం వెలుపలికి వెళ్ళి చెప్పుకుంటే, క్రూసేడ్ల పేరుతో చరిత్రకెక్కిన మతయుద్ధాల కొనసాగింపుగా కూడా ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్తాన్ లలో పాశ్చాత్య దేశాల జోక్యాన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజున  ‘సంస్కృతుల మధ్య యుద్ధం’గా దీనిని చిత్రిస్తున్నా, అది మతయుద్ధాలకు ముసుగు వేసే ప్రయత్నమే. ఈ కోణంలో చూసినప్పుడూ ఇది చరిత్ర అవిచ్చిన్నతకు సాక్ష్యమే. ఒక్క మాటలో చెప్పాలంటే, తమవైన అజెండాతో క్రీస్తుశకంలోకి అడుగుపెట్టిన శక్తులు, క్రీస్తు పూర్వ దశలోనే ఇప్పటికీ ఉన్న సమాజాలను క్రీస్తుశకంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సమాజాలలో భారతీయ సమాజమూ ఉంది. ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది ప్రస్తుతానికి శేషప్రశ్న. అదే కనుక ఫలిస్తే అప్పుడు ఏర్పడే ఏకరూప ప్రపంచపు ఉక్కుపాదాల కింద ఎంత వైవిధ్యం, ఎన్ని అస్తిత్వ కాంక్షలు, ఎంత సంస్కృతి, ఎంత చరిత్ర అణగారిపోతాయో ఊహించుకోవలసిందే. అలాగని ఈ సమాజాలను క్రీస్తు పూర్వ దశలోనే ఉంచాలా అని అడిగినా వెంటనే సమాధానం తోచదు. చెప్పొచ్చేదేమిటంటే, చారిత్రక ఘర్షణలు కాలాల హద్దులను అధిగమిస్తాయి. వర్తమానానికి మాత్రమే మన చూపుల్ని కుదించుకుంటే చరిత్ర అవిచ్చిన్నత ఎప్పటికీ అర్థం కాదు.

పైన ఉటంకించిన భీష్ముడి మాటల్ని స్మరించుకుంటూ వర్తమానంలోకి వద్దాం. పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ ల మధ్య ఉన్న గిరిజనప్రాంతాలు అర్థ-స్వయంపాలితాలు. వాటిని Federally Administered Tribal Areas (FATA) అంటారు. వీటిలో ఏడు గిరిజన జిల్లాలు, ఆరు సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. Frontier Crimes Regulations (FCR) అనే ప్రత్యేక నిబంధనల ద్వారా ఇవి నేరుగా పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయి. తెగల ముఖ్యు(nobles)లకు వీటిలో పలుకుబడి ఉంటుంది. మూడు ఆంగ్లో-అప్ఘాన్ యుద్ధాలతో తల బొప్పి కట్టిన బ్రిటిష్ ప్రభుత్వం తన అవసరాలకు కలసివచ్చే షరతుపై ఈ తెగల ముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చింది. ఇప్పటికీ ఇదే ఏర్పాటు కొనసాగుతోంది.

ఈ వివరాలలో, చరిత్రకందని కాలానికి చెందిన భీష్ముని మాటల ప్రతిధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఎంతటి వాళ్ళనూ లెక్క చేయని గణజనాలను మంచి మాటలతో మచ్చిక చేసుకోవాలని భీష్ముడు అనడంలో ఉద్దేశం, వాళ్లపై కత్తి కడితే ప్రయోజనం లేదనే.  అప్ఘాన్లతో మూఢు యుద్ధాలు చేసిన నాటి బ్రిటిష్ ప్రభుత్వమూ,  నిన్నటి సోవియట్ యూనియన్, నేడు అమెరికా నేర్చుకున్న గణపాఠం కూడా అదే.  తన అవసరాలకు కలసివచ్చే షరతుపై గణముఖ్యులకు కొన్ని పాలనాధికారాలు ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం రాజీ పడడం, గణముఖ్యులను ఆదరించి వారితో పనులు చేయించుకోవాలన్న భీష్ముని సూచనకు అనుగుణమే.

ఇంకా విశేషం ఏమిటంటే, పైన చెప్పుకున్న FATA లాంటి ఏర్పాట్లే మన పురాణ ఇతిహాస కాలం లోనూ ఉండడం! ఉదాహరణకు, ‘పౌరజానపద పరిషత్తు’. ఆనాటికి రాజు సర్వస్వతంత్రుడు కాడు. కొన్ని అధికారాలను పౌర జానపదులతో పంచుకునేవాడు. రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్న దశరథుడు పౌరజానపదపరిషత్తును సమావేశపరచి అనుమతి కోరాడు. పౌర జానపదులలో మ్లేచ్చులు, ఆర్యులు, వనశైలాంతవాసులు; అంటే అడవుల్లోనూ, కొండల్లోనూ ఉండేవాళ్లు కూడా ఉన్నారు. మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి పట్టం కట్టాలనుకుని పౌరజానపదపరిషత్తును సంప్రతించినప్పుడు, పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్నకొడుక్కి పట్టం ఎలా కడతావని పౌర జానపదులు ప్రశ్నించారు. అప్పుడు యయాతి వారిని సమాధానపరచి అనుమతి తీసుకున్నాడు. భీష్ముడు పేర్కొన్న గణముఖ్యులను వాల్మీకి గణవల్లభులన్నాడు.

పైన Frontier Crimes Regulations అనే ప్రత్యేక నిబంధనల ద్వారా గిరిజన ప్రాంతాలు పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం కింద ఉంటాయని చెప్పుకున్నాం. అంటే ఒకానొకప్పుడు రాజుతో సమాన ప్రతిపత్తినీ, రాచ మర్యాదలనూ అందుకున్న గిరిజనులు రాజ్యం పట్టు బిగుసుకుంటున్న కొద్దీ నేరస్థ జాతులుగా, నేరశక్తులుగా ముద్రపడుతూ వచ్చారన్నమాట. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మన పురాచరిత్రలోనూ, చరిత్రలోనూ కూడా  కొల్లలు.

ఖాండవ వన దహనం ద్వారా అర్జునుడు నాగులనే ఆదివాసీ తెగతో తెచ్చుకున్న శత్రుత్వం గురించీ, ఆ తెగవారు దానికి ప్రతీకారం తీర్చుకోడానికి చేసిన ప్రయత్నాల గురించీ, చివరికి అవి అర్జునుడి మనవడైన పరీక్షిత్తు కాలంలో ఫలించడం గురించీ, దానిపై ప్రతీకారంగా పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు నాగులను ఊచకోత కోయడం గురించీ 21 వ్యాసాలలో ఇప్పటికే వేరొక చోట చర్చించాను. కనుక అందులోకి ఇప్పుడు వెళ్ళకుండా; కోసల, మగధ రాజుల కాలంలోనూ, ఆ తర్వాతా జరిగిన విషయాలకు పరిమితమవుతాను.

దానికంటే ముందు ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్  అపకీర్తిని మూటగట్టుకున్న ఒకానొక చర్య గురించి  చెప్పుకోవాలి….

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

మీ మాటలు

  1. <<>>

    ఆ వ్యాసాలకు లింకులు ఇవ్వగలరా?

    • కల్లూరి భాస్కరం says:

      ఆ వ్యాసాలు ‘సూర్య’ దినపత్రికలో ఆదివారం ఎడిట్ పేజ్ లో (ఫిబ్రవరి 10, 2013 నుంచి)వచ్చాయి. బహుశా ఇంటర్నెట్ ఎడిషన్లో ఉండచ్చు.

  2. సార్.. మీ వ్యాసాల కోసం ప్రతి వారం పడిగాపులు కాస్తూ ఉంటాను. అంతా చదివాకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అలాగే, మీరు చెబుతున్న / చెప్పిన విషయాలకన్నా వాయిదాలు వేస్తున్నవి బోల్డు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు చెబుతారా అని ఎదురుచూస్తూ…
    W/Regards – Saikiran

    • కల్లూరి భాస్కరం says:

      ఈ వ్యాసాలు మీకు ఆసక్తిని కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సాయికిరణ్ గారూ…నిజానికి నా ఆసక్తినే మీలాంటి పాఠకులతో పంచుకుంటున్నాను. మీరన్నట్టు చెబుతున్న/చెప్పిన విషయాలకన్నా వాయిదా వేస్తున్నవే ఎక్కువ. కానీ ఈ format కారణంగా తప్పడం లేదు. బాకీలు తీర్చడానికే ప్రయత్నిస్తాను.

  3. ఎన్ వేణుగోపాల్ says:

    భాస్కరం గారూ,

    డిటో డిటో గా చాలా బాగుంది. ముప్పై ఏళ్లుగా కోశాంబి ఆరాధకుడిగా ఉన్నందువల్ల, సరిగ్గా మీ వ్యాసాలు చదువుతున్న సమయాన ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనువాదం పనిలో ఉన్నందువల్ల మీ వ్యాసాలు ఇంకా రుచిగా ఉన్నాయి….

    • కల్లూరి భాస్కరం says:

      వేణుగోపాల్ గారూ… మరోసారి చాలా థాంక్స్. నేనూ సరిగ్గా ముప్పై ఏళ్లుగా కోశాంబి ఆరాధకుణ్ణి. పురాచరిత్రలోకి నాకు కిటికీ తెరచింది కోశాంబీయే. మీరు ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని అనువాదం చేస్తుండడం నాకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. మీకు హృదయపూర్వక అభినందనలు.

  4. chintalapudivenkateswarlu says:

    భాస్కరంగారు
    మీరు ఉదహరించిన గణ వ్యవస్థను గురించి చదువుతుంటీ నా స్మ్రుతి పథం లో మన గణపతి కనిపించాడు. ఆనాడు గణాల పాలకులను గణపతులనేవారేమో! ఎపని తలపెట్టినా ముందు ఆయా గణపతుల్ని సంతృప్తి పరచి పని మొదలుపెట్టే వారేమో! అలా మొదలుపెట్టకపోతే ఆయా కార్యాలకు విఘ్నాలు కలిగించేవారేమో! అందుకే వారిని విఘ్నపతులని కూడా అని ఉంటారు. ఆకాలంలో ఆర్య తెగలకు శత్రువులైన గణపతులు తరువాతి కాలంలో ప్రజాభిష్ఠమ్ మేరకు ఆర్య దేవతలలో చేర్చి ఉంటారు. చంపిన వాడిని తిరిగి బ్రతికించినట్లుగా ఏనుగు తలను చేర్చి ఉంటారు.
    మీ వ్యాసాలు మంచి ఆలోచానాత్మకంగా ఉంటున్నాయి. మధ్యలో వాయిదాలు పెరిగినకొద్దీ పాఠకుల బుద్ధికి పరీక్ష పెరుగుతున్నట్లీ! విశేష అంశాలతో అలరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు చింతలపూడి వెంకటేశ్వర్లు గారూ… పురా మానవ చరిత్రకారులు కూడా గణపతిని గణాలకు పతి గానే చెబుతారు. గణపతి లానే వ్రాతపతి అనే మాట కూడా ఉంది. కొన్ని గణాలు కలిస్తే వ్రాతం అవుతుంది. గణపతి, వ్రాతపతి గురించి చాలా విశేషాలు ఉన్నాయి.

  5. మీ వ్యాసం చాల బాగుంది… అండ్ informative gaa vundi
    ధన్యవాదములు
    MSK

  6. అవును సార్ , చరిత్ర అవిచ్చిన్నతను తెలుసుకొనే కొద్దీ వర్తమాన సమస్యలు గతంతో ఎలా ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్ధం అవుతుంది. చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్ .

    • కల్లూరి భాస్కరం says:

      అవును సీతారాం రెడ్డిగారూ, మీరన్నది నిజం. ధన్యవాదాలు

  7. కల్లూరి భాస్కరం says:

    అరిపిరాల గారూ, మీకు చాలా థాంక్స్, సూర్యలో నా వ్యాసాల లింకులు ఇచ్చినందుకు. ఎలా ఇవ్వాలో తెలియక నేను ఇవ్వలేకపోయాను.

మీ మాటలు

*