Archives for October 2013

అలసట లేని కొన్ని అలల స్వగతం!

Palaka-Pencil Cover (2)

పూడూరి రాజిరెడ్డి సాహిత్యపు దారిలో తనదైన ప్రకాశాన్ని ముద్రిస్తూ సహస్ర తేజంగా వెలగాలి అని ముందుకు వెళుతున్న ఒక సంతకం .

 ఈ పుస్తకం ”పలక -పెన్సిల్ ”ముందు మాటలో కృతజ్ఞతలు చెపుతూ  ”నా అక్షరం చూడగానే బై లైన్ వైపు చూడగలిగే   ఆత్మీయులు ”అన్నారు .  బహుశా నేను ఈ కోవలో ఉండవచ్చు . ఎండలో వెళుతున్న వారికి అక్కడక్కడా ఇంగ్లీష్ పొడ కనపడుతున్నా తన చల్లని ,చక్కని తెలుగు వచనం తో సేద తీర్చే  మర్రిచెట్టులాగా  కనపడతారు ‘ఈయన’ నాకు.

కొత్తగా మా బడి  ఐదో తరగతిలో చేరిన పిల్లలు మిగిలిన వాళ్ళతో కలవకుండా తమ  జ్ఞాపకాలు, వస్తువులు  ఒక పెట్టెలో పెట్టుకొని బిడియంగా ఎవరినీ తాకకుండా ఎలా  కూర్చుంటారో ….. తన బంధాలు, ఊరి జ్ఞాపకాలు, చదివిన పుస్తకాల దుమ్ము,  చివరికి ఆశ్చర్యార్ధాకాలు, అరసున్నాలతో సహా తన పెట్టెలో దాచుకొని, బరువైనా దించని ఒక అమాయకపు ప్రేమతో, రెటమతంతో ఆ పిల్లలులాగే కనిపిస్తారు ఈ రచయిత కూడా .

”ఏమున్నాయి అందులో ?”

”పూలు, ఆకులు, పుస్తకాల నుండి సేకరించిన దుమ్ము ”

”అదీ కారణం….. బరువుకి కారణం దుమ్మే”  విదిలించమని చెప్పిన అపరిచితుడితో ….

”బరువైతే బిడ్డను చంక మార్చుకుంటాము కాని, వదిలేసి చక్కగా పోతామా?” (పెన్ను విభాగం లోనిది బరువు ) తన సేకరించుకున్న జ్ఞానం పై ” కన్నతల్లి కంటి కోలుకులో ముత్యమై  తన బిడ్డపై మెరిసిన ప్రేమలా ”కనిపిస్తుంది .

రెండో వైపు  ”నా ఆలోచనలలోనే నాకు సుఖం ఉందని ఎందుకు అనుకోరు ” అంటూనే అనిజ మనుషుల్లో ఆప్యాయతని వెతుక్కుంటూ ”జీవితం ముగిస్తేనే కాని సరైన దారి ఏమిటో తెలియదు కదా …. ముగిసాక చెప్పడానికి ఏముంది ?” అని తన ప్రశ్నలకు తానే సమాధానం దొరకని తాత్వికునిలా నిలబడినపుడు …..

(పెన్ను విభాగం, సరైన తోవ)

కనపడని అమ్మ ప్రేమకోసం  దిండులో గుబులుగా మొహం పెట్టి కన్నీళ్ళ కలల్లో  వెతుక్కుంటూ, అమ్మానాన్నలను వదిలిపెట్టి మరీ ఇంతగా చదువుతున్న చదువు అవసరం  ఏమిటి? అని మదనపడే హాస్ట ల్ పిల్లవాడు గుర్తుకు వస్తాడు

దీనిలోని విషయానికి వస్తే దినపత్రిక తోటలో తిరుగాడే పక్షిగా ఈయన వ్రాసిన ‘ఆర్టికల్స్ పూలు’ దారిలో అక్కడక్కడా తగిలినా దాని పేరు ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించలేదు . ఒక్క సారి ఆ పూల పరిమళం ”పదాలు – పెదాలు” గా గుప్పుమన్నప్పుడు అరె ‘ఇలాంటి పూలు’ ఇంకా చూసామే! అని వెనక్కి తిరిగి అవలోకిస్తే వీటన్నిటి వెనుక గల సిరా వర్ణం ”పూడూరి రాజిరెడ్డి ”గారిది అని తెలిసింది . అన్నిటికి లేని ప్రత్యేక  పరిమళం ఈ పదాలు పెదాలికి ఎక్కడిది అనే నా ప్రశ్నకు ఈయన ముందుమాటలో సమాధానం దొరికింది . ”అవన్నీ నేను ఇష్టంతో వ్రాసినప్పటికి అవి వ్రాయడానికి ఏదో కారణమో, సందర్భమో ఉన్నాయి . అలా కాకుండా ఏ అవసరం, కారణంతో పని లేకుండా కేవలం వ్రాయడం కోసం వ్రాసిన ఖండికలు ఈ పదాలు – పెదాలు ”

అదీ సంగతి హృదయవనంలో ప్రకృతికి పరవశించి తమకు తామే విరిసిన స్వచ్చమైన అడివి పూలు ఇవి . అందుకే అంత పరిమళం. సాహిత్య ప్రియుల హృదయాలు కట్టేసెంత పరిమళం . తాత్వికులు ఆగి ఏమి ఉందా అని చూసేంత  ఏదో ….. ఏదో ఏమిటి ?ఆ ఫీలింగ్ కి పేరు లేదా అంటే …. కొన్నిటికి ఉండవు . కావాలంటే దీనిలోని ”నేనేమిటి ?” చదవండి.  మీరు కూడా ఒప్పుకుంటారు తెలుగు బాషలో పదాల కొరత ఉందని …. ఇలాటి వర్ధమాన రచయితలు రావాలి అని .”

అలా నా సాహిత్య ప్రయాణంలో చదివిన ఈయన ఆర్టికల్స్ దీనిలో  ఉన్నప్పటికీ చిరు అలల పై సాయంసంధ్య వేళ సేద తీర్చేతెప్ప ప్రయాణం లాంటి ఈయన అక్షర ప్రయాణం వీటికి  ‘రీరీడింగ్’ అర్హతను మనకు తెలీకుండానే కల్పిస్తుంది .

పుస్తకం గూర్చి ఇంకో మూడు మాటలు .

జీవితం ఎలా అయితే ఉభయ సంధ్యలతో  మధ్యందిన బాలుడ్ని కలుపుకొని ఒక వలయం గా మారిపోతుందో ….. బాల్యాన్ని, యవ్వనాన్ని, ఇప్పటి పెద్దరికాన్ని కలుపుతూ చేసిన తన సాహిత్య ప్రయాణాన్ని బలపం, పెన్సిల్, పెన్ను అనే ‘మూడు’ విభాగాలుగా చేసి ఈనాడులో, సాక్షిలో జర్నలిస్ట్ గా తాను వ్రాసిన ఆర్టికల్స్ తో పాటు …. ‘నేనేమిటి ‘? అనే ఒక భావాల డైరీని (దీనికి ఏ పేరు పెట్టాలో తోచక చాలా సేపు కీ బోర్డ్ మీద వేళ్ళు ఆపే ఉంచాను. ఈ పేరుతో కూడా నాకు తృప్తి లేదు . కాకుంటే నా వ్రాతలు ఏదో ఒక పేరులో ఎందుకు ఉంచాలి …. వాటి కధ వాటిదే అని వ్రాసిన రచయిత మాటలే కొంత ఓదార్పు) కూడా ఇందులో కలిపారు . కాకుంటే మూడు పేజీ లు తిప్పగానే చూసిన ‘ నలుగురు చిన్న పిల్లల ఫోటో ‘ దాని కింద వ్రాసిన మాటలు మనసులో టన్నుల బరువును పెట్టేసి చదవడమే ఆపేసింది.  ఒక అన్నకి తన తమ్ముడి పై ఆ తమ్ముడికి కూడా తెలీని పెద్దరికంతో కూడిన ప్రేమ ఉంటుంది. ఎంత అంటే తాను హీరో కావాలి అని చెప్పుకొని తమ్ముడిని సైకిల్ పై తీసుకొని వెళ్ళేంత , తాను హీరో కావాలి అని మాత్రమే వాడికి చలి తగలకుండా తన నీలపు అంగీని వానలో కప్పాను అని చెప్పేంత ….. అలాంటి తమ్ముడు  తిరిగి రాని  లోకాలకి వెళ్ళినపుడు అక్షరాల వానలో తన దుఃఖాన్ని తుడుచుకోవడం తప్ప రచయిత ఏమి చేయగలడు .

బలపంలో తన చిన్నప్పటి ముచ్చట్లు, ఊరితో గల అనుబంధాలు, హాస్టల్ ప్రయాణాలు, చదువుల బరువులు చర్చిస్తూ మెల్లిగా మనలను కూడా కాలేజ్ జీవితపు పెన్సిల్ ప్రయాణానికి లాక్కోస్తారు .  ఆ వయసు మాయలో వెతుక్కున్న ప్రేమని, కలం స్నేహాలని, ఆవేశాలని అశ్లీలం లేకుండా ముచ్చటైన తన వచనంతో ఎంతో మంది ఆ అనుభవాలను ఓన్ చేసుకునేలా ”పెన్సిల్” విభాగం లో కనపరిచి …… వామనుడు అంతై ఇంతై అని పెరిగినట్లు తనలోని ప్రశ్నలని నేల విడిచి సాము చేసే ఆలోచన రూపాలుగా మార్చి అక్షర మధనం చేస్తూ తాత్విక భావాలను మనలో కూడా ప్రవేశ పెట్టి మనం కూడా మన అస్తిత్వపు లోతుల్లోకి తొంగిచూసుకోనేలా ‘పెన్ను’ లో  మంత్రిస్తాడు . ఇంతా వ్రాసి ”నేను ఈ జీవితం లో స్వేచ్ఛగా బ్రతుకలేను. ఇలా కాలి బూడిద కావాల్సిందే ”అంటూనే పుస్తక ప్రియుల ర్యాక్ లో బందీ అయిపోతాడు .

అఫ్సర్ గారి మాటల్లో  ”రాజి రెడ్డి వచనం ఆకు మీద నీటి బిందువు జారుతున్నంత మెత్తగా ,చలికాలపు బవిరి గడ్డాన్ని కోస్తూ మొండి బ్లేడు రాల్చిన నెత్తుటి గీరలా ”

భగవంతం గారి మాటల్లో  ”వీరిది ప్రత్యేకమైనమైన అభివ్యక్తి ”

ఇక’ నా’ మాటల్లో

విసుగుచెంధక విరుచుకు పడే ఈయన ఆలోచనల అలలు దాటి చూస్తే సుదూర తీరాలలో నింగితో కలిసి కనిపిస్తూ తనలోకి లాక్కొనిపోయి మన అస్థిత్వాన్నే ప్రశ్నార్ధకం చేసే సముద్ర నీలపు శక్తి వీరి వచనం .

”ఒక మగవాడి డైరీ ”అని పెట్టడంలో ఔచిత్యం నాకు కనిపించలేదు . డైరీ అంటే క్రమం లేని రాతలు అని చెప్పొచ్చు అని రచయిత చెప్పినా ఈ మాట వ్రాయకపోతే బాగుండును అనిపించింది . చక్కటి రచయిత అక్షరాలకు ఆసరాగా నిలిచి పుస్తకాన్ని పందిరిపై అల్లించి నీడలో  సేద తీర్చిన  ”సారంగా పబ్లికేషన్స్ ” వారి మంచి అభిరుచి అభినందనీయం

ముగింపుకు ముందు ఇంకో ఆలోచన ఈయన ”రియాల్టీ చెక్ ”కింద వ్రాసిన ”అనిజ మనుషులు’ ‘దీనిలో చేర్చడం రాబోతున్న ”రియాల్టీ చెక్” బుక్ కి సంకేతమా అని ఒక సందేహం . నిజం అయితే బాగుండును అనే ఆశ . జరగాలి అనే ఆకాంక్ష . ఎందుకంటే ఒక్క అడుగు వేసేవరకే ప్రయాణం లో గుంజాటన. అడుగు పడిన తరువాత ఒక పుస్తకం నుండి ఇంకో పుస్తకానికి సాహిత్య పుటలలో తన పుటను ఏర్పరుచుకుంటూ ముందుకు సాగడమే రచయిత చేయగలిగింది .

 

***

 

పుస్తకాలు నవోదయ , విశాలాంధ్ర తో సహా  రాష్ట్రం లోని ఆన్నీ ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తాయి.

 

హైదరాబాద్ లోని నవోదయ బుక్ హౌస్ వారి అడ్రెస్ :

Navodaya Book House

Opposite Arya Samaj Mandir,

Near Kachiguda crossroads, Hyderabad 500027

Phone No: 040 24652387

 

ఒక్కో పుస్తకం వెల రూ. 75 /- మాత్రమే.

-వాయుగుండ్ల శశికళ

sasi

సంస్కారం

vanaja vanamali 

వనజా తాతినేని (వనజా వనమాలి)  బ్లాగర్ గా అందరికీ సుపరిచితమే. బ్లాగ్ మొదలెట్టాక ఇది ఆమె వ్రాసిన  50 వ కథ.  తన  చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నుండే ఆమె  కథా వస్తువుని ఎన్నుకుంటారు  .  కథ ని వ్రాయడంలోను ,  పాఠకులని మెప్పించడంలోను తానూ  ఎంతవరకు కృతకృత్యురాలినయ్యానో వారే చెప్పాలి  అంటారు ఆమె.

  ***

ప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న  చెమటని  తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కగా విశ్రాంతిగా వాలి  రాలి పడిన పూల నుండి పరిమళాలను ఆస్వాదిస్తూ  అలవాటుగా పేపర్ కోసం కళ్ళు వెతికాయి

రోజూ అదే సమయానికి సరళ ఒక మంచి నీళ్ళ బాటిల్,ఆ రోజు దినపత్రికలని తీసుకొచ్చిచ్చి అక్కడ పెట్టి ఉంచేది . ఇంకొక పావుగంట తర్వాత సువాసలు వెదజల్లే కాఫీ  కప్పుతో పాటు పోటీగా  “అమ్మ ”  దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల  పరిమళం కలగలిపి  తన నాసికా రంధ్రాలను తాకుతూ  హాయిగా అనిపించేవి.

ఈ రోజు పావు గంట దాటినా కాఫీ కాదు కదా మంచినీళ్ళు కూడా బయటకి రాలేదు ..

“సరళా ” అని పిలుస్తూ లోపలకి వెళ్లాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు . ఇంకా నిద్ర లేవలేదా ఏమిటీ? తనకి అనారోగ్యం ఏమి లేదు కదా ! అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లి చూసాను . అక్కడ బెడ్ ఖాళీగా ఉంది .

“అమ్మా.” . అంటూ పిలుస్తూ  క్రిందకి  వచ్చాను .అమ్మ కనబడలేదు.

అంతలో అనిరుద్ద్  .. వాడి రూం లో నుండి బయటకి వచ్చి .. “నాన్నా! అమ్మా,నానమ్మ ఇద్దరూ రఘు  అంకుల్ వాళ్ళింటికి వెళ్ళారు రఘు అంకుల్ వాళ్ళ అమ్మ అదే తులసమ్మ మామ్మ చనిపోయారంట . మీరు రాగానే చెప్పమన్నారు వెంటనే అక్కడికి రమ్మన్నారు ”  అని చెప్పాడు.

“అరే ! ఎప్పుడు జరిగింది .. ? ఎవరు చెప్పారు ..విషయం  కన్ఫర్మ్ గా నీకు తెలుసా అనిరుద్ద్ ” .అని అడిగాను

“మీరు అలా  వాకింగ్ కి వెళ్ళగానే కాల్ వచ్చింది . తులసమ్మ  మామ్మ ని చూసుకునే హోం నర్స్ కాల్ చేసారు అమ్మ, నానమ్మ వెంటనే వెళ్ళారు . మీరు మొబైల్ తీసుకువెళ్ళలేదు కదా .. మీకు ఎలా చెప్పాలో తెలియలేదు”  అని చెప్పాడు .

“సరే నేను ఇప్పుడే వెళతాను”  అంటూ  ..నా మొబైల్ తీసుకుని సరళ కి కాల్ చేసాను .

“సరళా .. నేను విన్న విషయం నిజమేనా “?.. ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను .

“అవునండీ .. మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూసారు .. ఆవిడ చనిపోయారు .అంది  నేను రఘు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను . ఇంకా వాళ్ళ దగ్గర  బంధువులందరికీ  చెప్పాను మీరు త్వరగా రండి ” అంది .

నేను త్వర త్వరగా  డ్రస్ మార్చుకుని రఘు  కి ISD  కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెపుతున్నాడు “నేను సండే  కి  కాని రాలేను .. కృష్ణా ! మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను  అక్కడ ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి ప్లీజ్ .. ” గొంతులో దుఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు .

 

“రఘు .ఆ  విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా ! అన్నీ చూసుకునేందుకు  నేను ఉన్నానుగా నువ్వేమి వర్రీ అవకు.   ముందు టికెట్స్ సంగతి చూసుకో .. మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను .”. అని చెపుతూ .. లోపలకి వచ్చాను అప్పటికే .. మా కాలనీ వాసులు కొందరు  వచ్చి ఉన్నారు. సరళ ..పొన్స్ చేస్తూ బిజీ గా కనిపించింది .

మంచం మీదే ప్రాణం పోయింది ..ఇంకా అలా మంచం మీదే ఉంచారే ! కొందరి ప్రశ్న . .. “బాక్స్ కోసం ఫోన్ చేసాము అయిదు నిమిషాలలో బాక్స్ వస్తుంది .. బాక్స్ లో మార్చుతాం కదా .అని అలాగే ఉంచేసామండీ ” ..సరళ  చెపుతుంది.

ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రింద పరచి దానిపై ఒక దుప్పటి పరచి ఇంకో ఇద్దరి సాయం తో  తులసమ్మ పిన్ని బౌతికకాయం ని  చాప పై పడుకోబెట్టాను . ఆమె ప్రక్కనే నేలమీద చతికిల బడి కూర్చున్నాను . చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది . నా కళ్ళల్లో కన్నీరు జల జలా రాలింది . ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి జీవితమంతా బాధ పడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో .అన్నట్టుగా  ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది.  గట్టిగా నోరు విప్పి మాట్లాడటం అందరకి తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని .

రఘు వాళ్ళ నాన్న నాకే కాదు రఘుకి కూడా  అంత బాగా తెలియదు రఘుకి మూడేళ్ళు న్నప్పుడు చనిపోయాడు అంతకు ముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట  రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం  బాగా జ్ఞాపకం ఉంది .

“నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ ముదనష్టపుది తాళి , బొట్టు గాజులు తీసేసి విధవ ముండ లాగా తయారయింది. పూజ పునస్కారం ఏమిలేకుండా  కొంపని కిరస్తానీ కొంప జేసింది. సిరింటదు  కాని సీద్రం అబ్బుద్ది అని  పెద్దలు ఊరికే అనలేదు . ఈ దేష్ట మొహం చూస్తూ ఉండలేకనే  నా కొడుకు  చచ్చాడు ” అని తిడుతూ ఉండేది.

పుట్టెడు అప్పులు, అత్తా మామలు, ఆదరణ లేని పుట్టిల్లు. పొలం అంతా  అప్పుల వాళ్ళు కట్టుకు పోగా నాలుగెకరాల మెట్ట  చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీదింది. గొడ్ల  కాడి పని,  నీళ్ళు తోడే పని, చేలో పని ఆ పని ఈ పని మధ్య   ఒళ్ళు   అరగ దీసుకుని కట్టేలా బండబారి పోయి ఉండేది.

రఘు వాళ్ళిల్లు  చెరువు  కట్ట ప్రక్కనే  మంచి నీళ్ళ బావిని ఆనుకుని ఉండేది . ఊరందరికీ మంచి నీళ్ళ బావి అదే అవడంతో .అందరికి తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది  ఎవరు మాట్లాడినా క్లుప్తంగా నాలుగు మాటలు మాట్లాడేది ఎక్కువ సమయం బైబిల్  చదువుకుంటూ, ప్రార్ధన చేసుకుంటూ కనబడేది   .

మా ఊరి  బడి, గుడి, లైబ్రరీ , కోపరేటివ్ బాంక్ అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు  అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు  మనసులో మాట  పంచుకుంటూ  పదిహేనేళ్ళ పాటు  ఇద్దరం కలిసే చదువుకున్నాం.  రఘు నాతొ పాటు మా ఇంట్లో చొరవగా తిరగడం వల్ల  మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి .. “మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం ? వాళ్ళింట్లో దేవుడు గూడు ఉంది మనం అలా దేవుడు గూడు పెట్టుకుందాం పూజ చేసుకుందాం” అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు .

నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం  చెపుతుందా అని ఆసక్తిగా చూసేవాడిని

“వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు . మన  దేవుడికి అలాంటి పూజలు చెయ్యవసరం లేదు ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్దిస్తే చాలు ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే . ఆయనే అన్నీ చూసుకుంటాడు” అని చెప్పీది

“అమ్మా.. మనం కమ్మ వాళ్ళమే కదా ! “అడిగేవాడు రఘు.

“అవును ” అనేది

“అయితే కమ్మ వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామీ, రాముడు,కృష్ణుడు ,శివుడు ఇలాంటి దేవుళ్ళు  ఉన్నారు  కదా! మన  వాళ్ళందరూ శివాలయం కి, రామాలయం కి వెళుతుంటే .. నువ్వు  ఈ బైబిల్,  కనబడని దేవుడు మన దేవుడు అంటావేమిటి ? నాయనమ్మ తాతయ్య కూడా రామా కృష్ణా అంటున్నారు .. నువ్వే  ఏసయ్యే దేవుడంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటన్నావు ! నాకు నువ్వు నచ్చలేదు ..నన్ను అంటుకోబాకు “.అని దూరంగా పారిపోయేవాడు . తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించేది వాడు ఇంకా దూరంగా పారిపోతూ .. “నువ్వు నాకు అమ్మ వే  అయితే, మనం  కమ్మాళ్ళం  అయితే .. ఊరి చివర వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్ధించడం ఆపేయి.. ” అని  కోపంగా చెప్పేవాడు . వాడి కోపంలో ద్వేషం ఉండేది .. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో .. క్రమం తప్పకుండా  ప్రతి రోజూ గుళ్ళోకి వెళ్ళేవాడు . దేవుడుకి దణ్ణం పెట్టుకునేవాడు .

“ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ .. పిల్లడు మాత్రం గుడికి వస్తున్నాడు .. ఏ నీరు ఆ నీరేమ్మటే  పారతాయి కాని ఏరే నీళ్ళు కలుస్తాయా ఏమిటీ ?” అనే వారు కొందరు .

ఏడవ  తరగతి చదువుతున్నపుడు  రఘు కి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది  మా వూరి చివర సుదర్శనం మాస్టారు ఉండేవారు . ఆయన స్కూల్ మాస్టర్. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకి వెళుతూ ఉండేవాడు యేసు క్రీస్తు గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు . రఘు ఆయన్నీ విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని దేవుళ్ళని వదిలేసి యేసు క్రీస్తే ప్రభువని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునే వాడు . ఆయన కూతురు భర్త పాస్టర్ గా పనిచేసేవాడు . సువార్త సభలు పెట్టి .. మైకులు పెట్టి వారమేసి  రోజులపాటు ప్రార్ధనలు ,బైబిలు వాక్యాలు , కొత్తగా మతంలోకి చేరిన వారి అనుభవాలు వినిపించే వారు . మా వూరు చిన్నది అవడం వల్ల ఆ  సభలు మా చెవుల్లో రొద  పెడుతున్నట్లు ఉండేవి . ఆ సభలు కూడా .. సంక్రాంతి పడక్కి ముందు పెట్టేవాళ్ళు . వెంకటేశ్వర స్వామీ గుళ్ళో వచ్చే సుప్రభాతం, తిరుప్పావై వినబడకుండా .. కర్ణ కఠోరంగా  ఆ పాటలు వినాల్సి రావడం రఘు కే  కాదు మా వూర్లో చాలా మందికి అసహనంగా ఉండేది  ఈ ఊరుని భ్రష్టు  పట్టిస్తున్నారు ఈ పాస్టర్ ని ఈ వూరు నుండి వెల్ల గొట్టాలి అనుకున్నారు కూడా . వాళ్ళు అనుకున్న కొద్దీ ఆ ఫాస్టర్ ఊర్లో నిట్టాడిలా పాతుకు పోయాడు

ఆ పాస్టర్ .. పేద పిల్లలందరిని చేరదీసి  వాళ్ళు పనులకి వెళ్ళకుండా బడికి వెళ్లి చదువుకుంటే నెలకి ఒకొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమీ కాదు మూడు బస్తాల ధాన్యం  ధర .. ఆ డబ్బు మీద ఆశ తో . మా వూర్లో ఊరిచివర వాడలో వాళ్ళే కాదు మా వాళ్ళ   పిల్లల పేర్లు కూడా వ్రాయించారు . వాళ్ళందరి పేర్ల మీద బాంక్ అకౌంట్ తెరిపించి  ప్రతి నెలా వారి  అకౌంట్  లోకే  డబ్బులు జమ అయ్యే  ఏర్పాటు చేసాడు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇప్పిస్తున్నాడు కాబట్టి ఆయన “దేవుడంటి ” వారు అయిపోయారు . ఆయన స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో “రఘు ” కూడా ఉన్నాడు . రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది

Kadha-Saranga-2-300x268

” పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే .. వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను ..  అంత  డబ్బు  ఎక్కడ నుండి వస్తుంది  పంట పండితే పండే ..లేక  పొతే లేయే ! పాడి గొడ్డు మీదే సంసారం నడవాలంటే  ఎట్టా జరుగుద్ది ” తులసమ్మ పిన్ని  మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి  మరో మాట మాటాడటానికి అవకాశం ఉండేది కాదు  .

సంవత్సరానికి రెండు సార్లయినా రఘు కి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది . సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చేవారు . వారే మా వూర్లో పిల్లలందరికీ ఆర్ధిక సాయం చేస్తున్నవాళ్లని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు . వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరు పరచి వారికి పరిచయం చేసేవారు . అలా పరిచయం చేయడానికి “రఘు ” ని కూడా రమ్మనేవారు . ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంతబతిమలాడినా వెళ్ళేవాడు కాదు . విదేశీ అతిధులు వచ్చిన ప్రతిసారి రఘుకి ఆరోగ్యం బాగోలేదనో .. బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి  బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు .

తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చి కి వెళ్ళడం మొదలెట్టింది . రఘు వాళ్ళ నాయనమ్మ,తాతయ్య .మేము  బ్రతికుండగానే ఇంటావంటా లేని పనులు చేయడం చూస్తున్నాం . మనమేమిటి, మన కులమేమిటి ,మన సంప్రదాయం ఏమిటీ ? ఫలానా వాళ్ళ కోడలు వూరి చివర వాడల్లోకి వెళూతుందంటే ఎంత పరువు తక్కువ ..?

రఘు .. మీ అమ్మ అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పరా ..  అని రఘుని  సతాయించే వారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం . అని పంతం పట్టుకుని కూర్చున్నారు .

“అమ్మా ! నాయనమ్మ ,తాతయ్య ఏమంటున్నారో .. విన్నావు కదా ! నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు .. గట్టిగా ఆదేశించాడు .

రఘు  అంత  గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్ని ని మందలించారు  తులసమ్మా !బిడ్డ నీ అంత అయ్యాడు వాడికి ఇష్టం లేదని చెపుతున్నాడుగా ..  ముసలివాళ్ళు ఇంటావంటా లేని  పనులని ఏడుస్తున్నారు, వాళ్లకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు ?  ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ?మానేయకూడదు .. ఆ ప్రార్ధనేదో ఇంట్లో చేసుకోరాదు .. అని మందలించారు

ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని .. ఇక ఆ తర్వాత వూరి చివర వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు

పదవతరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయోలా కాలేజీలో చేరాము . ఆ కాలేజీలో చేరడం కూడా రఘు కి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు “ఈ కులం, మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకున్నవే ! నీకిష్టం లేకపోతే  ఆ మతం గురించి ఆలోచించకు నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో .. మతాలకి సంబంధం లేని విషయం చదువు , అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు స్కాలర్ షిప్ లు వస్తాయి ,నువ్వు బాగా చదువుకోవాలంటే నీకున్న వ్యతిరేకత అంతా  మార్చుకుని ఆ కాలేజీలో చేరు ” అని హితోపదేశం చేసాక .. అయిష్టంగానే నాతొ పాటు ఆ కాలేజీ లో చేరాడు.

ఫాస్టర్ గారు  స్కాలర్ షిప్లు ఏర్పాటు చేయడం వల్ల   మాతో పాటు మావూరి బీదబిక్కి పిల్లలు కూడా  ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు  నిర్వహించడం వల్ల  తులసమ్మ పిన్ని లాగా చాలా మంది వారి బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్ధం అయింది . మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు

baby_deer_with_mother_doe

పట్నంలో చదివేటప్పుడు రఘు కి డబ్బు  పంపడం కోసం  అవస్థ పడేది.  పంటలకి పెట్టుబడి పెట్టి  సరిగా  పంట చేతికందక,ముసలి వాళ్ళ ఇద్దరి రోగాలకి , చనిపోతే ఇద్దరి కర్మ కాండ లకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది .

చేసిన అప్పుకి ఉన్న పొలమంతా  అమ్మితే  గాని బాకీ తీరదని  లేక్కలేసుకున్నాడు రఘు .

“పూర్వికులు ఇచ్చిన ఆస్తి ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా..? నేను చదువు మానేసి ..ఎదొ ఒక ఉద్యోగంలో చేరతాను “అన్నాడు .

“ఈ నాలుగు నెలలు ఆగు ..ఎదొ ఒకటి ఆలోచిద్దాం . ముందు నీ చదువు పూర్తి చేయి” అంటూ ఆంజనేయులు మాస్టారు చెప్పారు .

ఒక నెలయ్యేసరికి ..  తులసమ్మ పిన్ని  రఘుకి ఒక ఉత్తరం వ్రాసింది ఇల్లు, ఇంటి స్థలం అమ్మేసానని ఆ డబ్బుతో అప్పులనీ తీర్చేసానని.. పొలం అమ్మనవసరం లేదని .. ఇక ఏ దిగులు లేకుండా రఘు ని బాగా చదువుకోమని ..  తానూ  ఇంటికి అవతల ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని .. ఇక ఇబ్బందులు ఏమి లేవని … అందులో సారాంశం .

మా ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు  అంత ఎక్కువ  రేటుకి ఎలా అమ్ముడయిందన్నసందేహం వచ్చింది    . ఇంతకీ ఎవరు కొన్నారొ.. ఆ ఇంటిని . అనుకున్నాం. కానీ మళ్ళీ  ఉత్తరాలలో ఆ సంగతి  గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు

మేము సంక్రాంతి సెలవలకి ఊరు వెళ్ళేటప్పటికి  రఘు  వాళ్ళింటి రూపు రేఖలే మారిపోయాయి.రోడ్డు మీదకి కనిపించే  ఇంటి చుట్టూ వెదురుబద్దలతో అల్లిన దడుల స్థానంలో    .. నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు .. ఇంటి మొత్తం కి చక్కగా రంగులు వేసారు . మిగిలిన ఖాళీ స్థలంలో రెండు మూడు రెల్లుగడ్డి తో కప్పిన చుట్టిళ్ళు  కనబడినాయి . ఇంట్లో నుండి బయటకి రావడానికి చక్కగా నాపరాళ్ళ దారి వేసారు .. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు .. ఆ తలుపు ప్రక్కనే గోడమీద రంగులతో రాసి ఉన్న అక్షరాలూ చూడగానే రఘు ముఖం నల్లబడి పోయింది .. అక్కడ ” ఏసు  సువార్త మందిరం ” అని ఉంది

చెరువు కట్ట మీదగా గడ్డివాములు వేసే స్థలం లోకి వెళ్ళాడు .  అక్కడొక ఒంటి నిట్టాడి పాక వేసి ఉంది .  రఘుని చూడలేదు  గొడ్ల  పాకలో పనిచేకుంటుంది తులసమ్మ పిన్ని.  ఆమె ముందుకు వెళ్లి .. చేతిలో బట్టల బేగ్  ని ఆమె ముందు విసిరి కొట్టి ..  “ఈ ఇల్లు నిన్ను ఎవరు అమ్మమన్నారు ? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా ! అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు  అమ్మడానికి నీకేమి అధికారం ఉంది కొనడానికి వాళ్ళకేమి అధికారం ఉంది .. వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మను ” .. అని విరుచుకు పడ్డాడు .

ఇంట్లో  పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా గుడి అరుగులమీద కూర్చున్నాడు .

“రఘు మా ఇంటికి వెళదాం .రారా “… అని బతిమలాడి మా ఇంటికి తీసుకు వచ్చాను . సాయంత్రం వాడి చుట్టూ  ఊళ్ళో  వాళ్ళు చేరి తలా ఒక మాట అనడం మొదలెట్టారు .

” అదివరకి ఊరి చివర చర్చి ఉండేది మీ అమ్మ ఇప్పుడు  వాళ్లకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చి ని తీసుకొచ్చి ఊరంతటిని సంకరం చేసి వదిలిపెట్టింది   ఎలాగైనా ఆడ మనిషి – ఆడ పెత్తనం అనిపిచ్చుకుంది . అమ్మేటప్పుడు  కనీసం నీకు ఒక మాటైనా చెప్పిందా ..? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా  అంటే అదీ…  లేదు.  బాకీలాల్లకి డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది నాలుగెకరాలు పొలం ధర పాతిక సెంటు స్థలం ఉన్న పాత ఇంటికి వచ్చిందని .   డబ్బంటే ఎంత ఆశ ఉన్నా..  ఊరిని ఇట్టా ..  సంకరం చేసి పెడతారా?  మీ అమ్మకి తోడూ ఆ ఆంజనేయులు  మాస్టారొకడు  ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో .. మనకి ఎందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పొతే మనం చిల్లికాణీ  అయినా సాయం చేసామా..? అంటూ  మీ తరపున  తరపున వకాల్తా  పుచ్చుకున్నాడు . అది మీ తాత ముత్తాతలు  సంపాయించిన ఆస్తి .. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు .పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు ..  వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు”  అని నూరిపోసారు .

 

ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు . అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై  ఆలోచిస్తూ పడుకున్నాడు , నేను వాడి ప్రక్కనే ఇంకో మంచం పై పడుకుని వాడేం  మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను .  బాగా పొద్దు పోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది ఎన్నడు ఒకరింటికి పోనీ పిన్ని  మా ఇంటికి వచ్చేసరికి అందరికి ఆశ్చర్యమయితే  వేయలేదు కాని కొడుకు కోసం వెదుక్కుంటూ వచ్చిన  తల్లి మనసు అర్ధమై .జాలి కల్గింది .

అమ్మ తులసమ్మ పిన్నిని కూర్చోమని ముక్కాలి పీట వేసింది . పిన్ని ఆ పీటని తెచ్చుకుని రఘు మంచం ప్రక్కనే వేసుకుని కూర్చుంది .

“బాబూ ..  రఘూ కోపం వచ్చిందా ? “అంటూ వాడి తలమీద చేయివేసి నిమరబోయింది ..వాడు  విసురుగా ఆ చేయిని తోసేసి ..   “నన్ను అంటుకోబాకు,  అసలు నాకు నువ్వు అమ్మవే కాదు “. అంటూ దిగ్గున లేచి నించున్నాడు  తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్ళు

“తప్పు .రఘు ..  అమ్మని అలా అనవచ్చా .?”  అమ్మ కోప్పడింది

“నేను ఏమి చేసాను .. యశోదమ్మా ..  ! వాడట్టా  మండి  పడతా ఉండాడు . నెత్తి గింజ నేల  రాలిన్నాటి నుండి  ఏష్టపు  బతుకు అయిపొయింది . ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను . ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా  అర్ధం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు ”

“నేను బైబిల్ చదవడం ఇష్టం లేదన్నాడు .. ఆ బైబిల్ ని  నేను ఎందుకు చదువుతున్నాను , యేసు ని ఎందుకు కొలుస్తున్నాను అని మీకెవరికైనా అర్ధం అయిందా? పెల్లైయిన ఏడాది లోపే మా ఆయనకీ పెద్ద జబ్బు చేసింది .. బతకడం కష్టం అని చెప్పారు . ఎన్ని హాస్పటల్ కి తిప్పినాం . ఒళ్ళు ,ఇల్లు రెండు గుల్లయి పోయాయి ఆయన అట్టా  ఉండగానే వీడికి పిట్స్ మొదలయ్యాయి ..  ఆయనకీ చూస్తే అట్టా , బతుకాతాడో లేదో నమ్మకం లేదు బిడ్డకి చూస్తే ఇట్టా .. నేను ఏంచేయాలో తోచలేదు ..  ఎన్ని మొక్కులు మొక్కాను .. ఎన్ని పూజలు చేసాను  ఈ రాళ్ళలో ఉన్న దేవుడే మైనా   మా ఆయన రోగం తగ్గించ గల్గారా ?  మా ఇంటి ప్రక్క టీచర్ చెప్పింది .. ప్రభువుని  నమ్ముకో ..  ఆయన రోగం నయం చేస్తాడని  ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసు ని నమ్ముకున్నాను   రఘుకి ఫిట్స్ రావడం తగ్గి పోయింది , వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు . నా ప్రార్ధనలు  ఫలించాయనుకున్నాను . పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి  మతం మారాలి .. హిందువుల ఆనవాళ్ళు ఏవి ఉండ కూడదని అంటే బొట్టు, గాజులు  అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను.  అప్పటి నుండి నమ్మినదానిని విడవకుండా పాటిస్తున్నాను . అది తప్పా ?  ఎన్నెన్నో మాటలన్నారు మొగుడు చావక ముందే అన్నీ తీసేసింది అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు.   బతికున్నన్నాళ్ళు మా అత్తా మామ తిట్టి పోశారు . బొట్టు పెట్టుకొని, తాళి కట్టుకోని వాళ్ళ మొగుళ్ళు చాలా మంది బ్రతికే ఉన్నారు, మరి వాళ్ళని చూపిచ్చి నేను అడగవచ్చు గా .. ?  ప్రార్ధన కెళితే నా చేతి కూడు తినని శపథం చేసారు ముసలాళ్ళని  బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను . ఈడు వేలెడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు . నా దారిన నేనే పోతన్నా గాని ఎవరినయినా ..  బైబిల్ చదవండి ,ప్రార్ధన చేయండి అని నేను బలవంతం చేసానా?

మీ అందరూ నమ్మే  దేవుడు మీకు రాళ్ళల్లో,పాముల్లో ,పశువుల్లో కనబడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో,

ప్రార్ధన లో  ఉన్నాడని పిస్తుంది . మీరు గుడికి వెళ్లినట్టు నేను చర్చి కి వెళితే అభ్యంతరం పెట్టారు  ఇదేట్టా న్యాయం అనిపిచ్చుద్దో .. మీరెవరైనా చెప్పండి”?  .సూటిగా తాకుతున్నాయి ప్రశ్నలు

వింటున్న ఎవరిమీ మాట్లాడలేదు .  పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగంది

“నిండా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నాను నాలుగెకరాలు పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని  ఇల్లు అమ్మాను  దానికి తప్పు పడతా ఉండారు  ఏ మనూర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా ? పీర్ల పండక్కి పీర్లు ఊరేగింపులో మీరందరూ ఎదురెల్లి నీళ్ళు  పోసి మొక్కట్లేదా ? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం కాదా!? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా ? నన్నెందుకు తప్పు పడతా ఉండారు ? ”

వింటున్న మాకు ఒక్కోమాట గునపంలా గుచ్చుతున్నట్టు ఉంది  . రఘు ఏమి మాట్లాడలేదు

నా వైపుకి చూస్తూ .. “కృష్ణా నీకు తెలియదా .. రఘు అంటే నాకెంత ప్రాణమో ! వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు  రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చా . ఇప్పుడు ఈడే  నన్ను అసహ్యించుకుంటూ  నన్ను వేలేసినట్లు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి .. నేను ఎందుకు బతకాలి ? ”

ఏడుస్తూ . ముక్కాలి పీట పై నుండి లేచి నిలబడింది  .

ఆ మాటలు విన్న నాకు కన్నీరొచ్చింది.  అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది .రఘు వాళ్ళమ్మని అర్ధం చేసుకోవడం లేదని   నాకు వాడిపై కోపం వచ్చింది .

అమ్మ కూడా అదే మాట అంది . ” రఘు మీ అమ్మని నువ్వే అర్ధం చేసుకోవాలి ఏ దేవుడైతే ఏమైంది ? .  ఆమెకి  కాకర కాయ నచ్చినట్టు ఆ దేవుడు, ఆ మతం  నచ్చింది నీకు గుమ్మడి కాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది .. ఏ మతమయితే ఏముందిలే .. అందరి రక్తం ఒకటే రంగయినట్లు అందరు దేవుళ్ళు ఒకటే ! అసలు కన్నతల్లి  ప్రత్యక్ష దైవం  అంటారు కదా !  . మీ అమ్మని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు ,  కష్ట పెట్టే  పనులు చేయకూడదు “.. అని సుద్దులు చెప్పింది .

“తులసమ్మా ! ఏడవబాకు నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్న పిల్లాడు , వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడలా కోపంగా ఉన్నాడు గాని వాడికి నీ పై ప్రేమ ఎందుకుండదు” .. అని అంటూ

“కృష్ణా ,నువ్వు రఘు ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు “.. .. అని చెప్పింది .

తులసమ్మ  పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే  ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు,నేను బయలుదేరాం .

ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది . వాళ్ళమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు .కాని ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది

 

తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది మేము హాస్టల్లో ఉంది  డిగ్రీ  చదువు పూర్తీ చేసాము . తర్వాత ఇద్దరికీ గుంటూరు మెడికల్ కాలేజ్ లో సీట్లు వచ్చాయి . చదువు పూర్త వుతూ ఉండగానే  రఘు కి పెళ్లి అయిపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని వియ్యాలవారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది . అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాని చూసుకుని ఆమె పరమత ఆచరణ కంత  ప్రాముఖ్యత నివ్వడం మరచిపోయారు . హైదరాబాద్  లో ఉద్యోగం చేస్తూ  తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు . కానీ తులసమ్మ పిన్ని పల్లెలోనే ఉండటానికి  ఇష్ట పడేది. రఘు  సొంత వూర్లో ఇల్లు కట్టడానికి  రామాలయం ప్రక్కనే కొంత స్థలంని  ఉన్న ఉన్న ధర కన్నా కన్నా ఎక్కువ ధర  పెట్టి  కొని   ఆ స్థలంలో  ఇల్లు కడతాను.. ఆ ఇంట్లో ఉండమని అన్నాడు . ఆమె ఆ గుడి ప్రక్కనే ఉండానికి ఇష్టపడలేదు

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు . తనతోపాటు తల్లిని తీసుకువెళతానని అంటే అందుకు ఆమె ఇష్టపడలేదు . “ఎక్కడున్నా .. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే  చాలు నేనీ వూరు వదిలి రానని చెప్పింది .   నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో  ,వీలయితే రెండుసార్లు వచ్చి   ఆ  సమయానికి తులసమ్మ పిన్ని ని అక్కడికి రప్పించుకుని అందరూ కలసి ఆనందంగా గడిపి వెళ్ళడం ..చేయసాగాడు. వెళ్ళేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్ షిప్ లు ఏర్పాటు చేసి వెళ్ళేవాడు

నాలుగేళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బ తింది.  అప్పుడు వచ్చి ఒక నెల రోజులు ఉండి  ఆమెకి స్వయంగా సేవలు చేసాడు . ఇక సొంత వూర్లో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకి సాయంగా ఉంచి వెళ్ళాడు అవసరం అయినప్పుడు సాయంగా  కొడుకు కాని కొడుకుని నేను ఎలాగు ఉన్నాను కాబట్టి రఘు కి ఎలాంటి దిగులు లేకుండా ఉంది . అమ్మ నాదగ్గరే ఉండటం తో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది

తన పనులు తానూ చేసుకుంటూ అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న చర్చి కూడా వెళ్లి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం  సూచనలు ఇవ్వకుండానే తనువూ చాలించింది. .. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ .. మౌనంగా ఉన్న నన్ను ..

సరళ తట్టి పిలుస్తుంది .. “ఏమండీ  .రఘు  అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి ”

ఏమిటన్నట్లు ఆయన వైపు చూసాను .. “ఆమె శవం ని  బాక్స్ లోకి మార్చి ఇదిగో ఈ దండలు వేయండి .. తలవైపు దీపం పెట్టండి . అలా అంత సేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు “.. చెపుతున్నారు .

దీపం .. పెట్టటమా ? అడిగాను ఆశ్చర్యంగా . అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ కృష్ణా .. ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటె మనకెందుకు ? ఇప్పుడు ఆమె రఘు  తల్లి మాత్రమే! ! ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపడమే విధి . పైగా అలా చేయకపోతే కృష్ణ కి కీడు జరుగుతుంది . అది మాత్రం ఆమె కోరుకుంటుందా ? అడుగుతున్నాడాయన .  .

నేను ఆలోచిస్తూ  ఉన్నాను  బుర్ర పాదరసంలా  పనిచేసింది వెంటనే ఇలా అన్నాను . “రఘు  రావడానికి  ఎంత  లేదన్నా  ఇంకా రెండు రోజులు పడుతుంది  కాబట్టి .. బాడీని ఇక్కడ బాక్స్ లో  ఉంచడం కంటే మార్చురీ లో ఉంచడం నయం” .. అన్నాను .

నన్ను సమ ర్దిస్తూ మరి కొందరూ అలాగే చేయడం మంచిదని అన్నారు . అమ్మయ్య ..ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్ కి పోన్ చేసాను. ఒకటిన్నర రోజు తర్వాత  భార్య పిల్లలతో సహా రఘు  వచ్చాడు . ఎయిర్ పోర్ట్ కి ఎదురెళ్ళి నేనే ఇంటికి  తీసుకువచ్చాను. మేము  ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్ లో పిన్ని బౌతిక కాయం ని ఇంటికి తీసుకు వచ్చారు.రఘు తల్లి శవం ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు . పిల్లలు ఒకసారి ఆమె దగ్గరికి వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు . భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని  చెప్పాడు రఘు  .

రఘు  మామగారు స్మశాన వాటిక వాళ్లకి ఫోన్ చేసి దహన క్రియలు గురించి  మాట్లాడుతున్నారు.

నేను నిర్ఘాంతపోయాను . తల దగ్గర  దీపం పెట్టబోతున్న  రఘు  భార్యని  “కాసేపు ఆగమ్మా” .. అని వారించి  వాడిని  ప్రక్కకి తీసుకువెళ్ళాను  .

“ఏంటిరా ఇది “.. అడిగాను

“ఏముంది అన్నీ మాములేగా “అన్నాడు వాడు

“రఘు ..  నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ని వ్యతిరేకిస్తూనే ఉన్నావు . ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు . ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమి నచ్చలేదు ” అన్నాను .

“నచ్చడా నికి ఏముంది రా కృష్ణా ! ఇప్పడు నేను ఏమి చేసినా  అమ్మకి తెలుస్తుందా ఏమిటీ ! అమ్మ పుట్టుకతో క్రిష్టియన్ ఏమి కాదుగా ! హిందువుగానే పుట్టింది హిందువుగానే ఆమెని కడసాగనంపడంలో ఎవరికీ అభ్యంతరం ఉంటుంది . మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి ” .అన్నాడు

మరి నువ్వు మధ్యలోనే వచ్చావుగా ..నువ్వు పోవాలిగా ? అన్నాను కోపంగా .” వాట్ “. అన్నాడు  ఆశ్చర్యగా అర్ధం కానట్లు

“నేను అంటున్నది అదే! నువ్వు ఆమె పుట్టినప్పటినుంచి ఆమెతో ఉండలేదుగా . ఆమెని ఇప్పుడు వదిలేయి” అన్నాను .

“ఎలా వదిలేస్తాను . అమ్మ ఉన్నప్పుడు ఆమెని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను  ఆమె కి అంతిమ సంస్కారం  చేసి ఆమె ఋణం  తీర్చుకోవాలి కదా !” అన్నాడు

“మనుషులని ప్రేమించడానికన్నా ముందు వారిని  గౌరవించడం నేర్చుకోవాలి . మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా ? అదే ఆమె అభిప్రాయాలని  గౌరవించావా ? ఆమె ఇష్టపడే బైబిల్ ని ఆమె ప్రార్ధనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు.  మతం, , ఆచారం  ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవరికీ ఇష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనడానికి ఎవరికీ అధికారం లేదు. వ్యక్తి స్వేచ్చకి భంగం కల్గించమని ఏ రాజ్యాంగంలోను చెప్పబడలేదు. మన హిందూ ధర్మం  అసలు చెప్పలేదు.  ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు  ఉండొచ్చు. కానీ ఆమె అవలంభించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక . అమ్మ ఈ  దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందట . వారు వచ్చి నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు.  ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించడం అంటే ఆమెని మనం గౌరవించడమే కదా!  అది మన విధి కదా !  ఆలోచించు”  అన్నాను

” ఏమైందండీ !  అంత సీరియస్ గా చర్చించు కుంటున్నారు  .. అవతల జరగాల్సిన విషయం చూడకుండా ..” అంటూ దగ్గరికి వచ్చింది  సరళ .

“తల్లీకొడుకుల మధ్య కూడా ఈ మత  విశ్వాసాలు ఎంతటి  అగాధం సృష్టిస్తాయో అర్ధం అవుతుంటే  చాలా బాధగా ఉంది సరళా .”అన్నాను

“ఏమంటున్నారు రఘు అన్నయ్య  శవపేటిక ,ప్రార్ధన, బరియల్ గ్రౌండ్ కి వద్దంటున్నారా ?”

అవునని తలూపాను .  రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే  సిద్దం చేస్తున్నారు  పూల దండల బుట్టలు, చావు మేళం,  టపాసులు   అన్నీ వచ్చి చేరుతున్నాయి

రఘు పది నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకి రావడం లేదు .

“సరళా .. నేను వెళుతున్నాను .. ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ, నువ్వు వచ్చేయండి ” అని అంటూ బయటకి వస్తున్నాను .

“అయ్యో ! అదేమిటండి . మనకి నచ్చలేదని వెళ్ళి పోతామా ? ఇన్నేళ్ళు   ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు . ఆ కార్యక్రమం ఏదో అయినాక మనమందరం  కలిసే వెళ్ళిపోదాం . తర్వాత మీ మిత్రుడు,  మీరు ఎలా ఉండదల్చుకున్నారో అలాగే  ఉండండి ” అంటూ చేయి పట్టుకుని ఆపబోయింది .

“మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేనివాడిని  నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను . డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని   మరో మత మూడుడుగా   చూడలేకపోతున్నాను.అది డైజెస్ట్ చేసుకోవడం నావల్ల కావడంలేదు అందుకే వెళుతున్నాను “. తల విదుల్చుకుంటూ   గుమ్మం దాటి బయటకి రాబోతుండగా ..  .

“కృష్ణా .. ఎక్కడికి రా వెళుతున్నావ్ ..? అమ్మ అంతిమ సంస్కారం కి శవపేటిక  .సిద్దం చేయించకుండా .. ?. ” అంటూ వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు.

తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ  సంస్కారం రఘుని సంస్కార వంతుడిగా మార్చిందనుకుంటే నాకు  చాలా సంతోషమేసింది

వాడి చెయ్యి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకి వచ్చాను . ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు  కనిపించింది నాకు.

 .***

–వనజ తాతినేని

పుస్తకాల్లో చెదలు…

M_Id_223298_Books_eaten_by_termites_at_Government_Divisional_Library_at_Vishrambaug_wada 

నా పుస్తకాలలోకి చెద పురుగులు ప్రవేశించాయి.

దాదాపు నలభై సంవత్సరాలుగా కూడబెట్టుకుంటున్న పుస్తకాలు.

ఎన్నెన్నో జ్ఞాపకాలూ ఉద్వేగాలూ అనుభవాలూ కన్నీరూ నెత్తురూ కలగలిసిన పుస్తకాలు.

చదివి ఇస్తామని తీసుకుపోయి తిరిగి ఇవ్వని మిత్రులతో తగాదాలు తెచ్చిన పుస్తకాలు. దూరం పెంచిన పుస్తకాలు.

మిత్రులనైతే పుస్తకాలు తిరిగి ఇమ్మని వేధించాను. ఇవ్వకపోతే గొడవపడ్డాను. శత్రువులను చేసుకున్నాను. వందలాది పుస్తకాలు పోగొట్టుకున్నాను. నిజమైన ఆసక్తితో తీసుకుపోయి చదివి, నమ్మకంగా తిరిగి ఇచ్చేవాళ్లతో కూడ ఆ అనుభవంతో కటువుగా మాట్లాడాను. చదివి ఇస్తామని చెప్పి తీసుకుపోయి తిరిగి ఇవ్వనివాళ్లమీద, పరిశోధకులమని చెప్పి పుస్తకాలు ఎత్తుకు పోయినవాళ్ల మీద చాల కోపం తెచ్చుకున్నాను.

పాపం, ఈ చెదల ముందర వాళ్లెంత నయం! పుస్తకాన్ని ఎక్కడో ఒకచోట మిగిల్చారు. నాదగ్గర లేకపోయినా ఆ పుస్తకం ఎక్కడో ఒక అలమరలో భద్రంగానే ఉంది.

మరి ఈ చెదపురుగులను ఏం చేయగలను? లెక్కలేనన్ని పుస్తకాలను నుసిగా, మట్టికుప్పగా, కన్నీటిముద్దగా  మార్చేసిన, ఖండఖండాలుగా విమర్శించి అదృశ్యం చేసిన చెదపురుగులను ఏం చేయగలను? మహావిశ్వమంత పుస్తకాన్ని మటుమాయం చేసిన ఇసుకరేణువంత సన్నని క్రిమిని ఏమనగలను?

నాలుగు ఊళ్లూ, డజను అద్దె ఇళ్లూ, డజన్ల కొద్ది మిత్రులూ వడపోయగా మిగిలిన పుస్తకాలు సొంత ఇంట్లో గోడలకే  షెల్ఫులు పోయించుకుని పెట్టుకున్నాను. ఒక్కవరస పెట్టుకోగలిగితే బాగుండునని ఎంత అనుకున్నా మూడు నాలుగువందల అడుగుల పొడవైన పుస్తకాలు రెండు వరుసలూ మూడు వరుసలూ పెట్టుకోక తప్పలేదు. గోడలకు ఆనుకుని ఉండే వెనుక వరుసలలో ఏ రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయో తెలియని స్థితిని చేజేతులా తెచ్చిపెట్టుకున్నాను. గోడలలో చెమ్మ పెరిగి చెదలు పుట్టాయి. నాలుగువేల రకాల చెదపురుగులున్నాయట, ఒకరకం చెదపురుగు రోజుకు ఇరవై, ముప్పైవేల గుడ్లు కూడ పెడుతుందట. అలా క్షణక్షణాభివృద్ధి అయ్యే చెదల ప్రధాన ఆహారం సెల్యులోజ్ కుప్పలు కుప్పలుగా పుస్తకాల రూపంలో ఆ గోడల పక్కనే ఉంటే వాటికింకేం కావాలి?

అలా పుస్తకాల మీద ఆహార ఆసక్తితోనో అకడమిక్ ఆసక్తితోనో చెద పురుగులు పుస్తకాలలోకి తొంగిచూశాయి. ఒక్కొక్క పేజీనీ, వాక్యాన్నీ, అక్షరాన్నీ కూడ విమర్శించడం మొదలుపెట్టాయి. కొన్ని నెలల కింద ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే చెద పురుగులు అప్పటికే నాలుగైదు పుస్తకాలను సంపూర్ణంగా చదివేసి తమ నిశిత విమర్శతో తుత్తునియలు చేశాయని బయటపడింది.

నాకు దుఃఖం మొదలయింది గాని అది ఇంగ్లిషు నవలల సెక్షన్ కావడంతో సరే పోనీలే అనుకున్నాను. చెదలు వచ్చే అవకాశం ఉన్నదని నేను అమాయకంగా నమ్మిన రెండు మూడు సెక్షన్లు తీసి అటకెక్కించాను.

చెదలు దావానలంలా వ్యాపిస్తాయని విని ఉన్నాను గనుక వెంటనే ఒక పురుగుల మందుల దుకాణానికి వెళ్లి చెదల మందు అడిగితే కాలకూట విషంలా కనబడే డబ్బా ఒకటి కొనిపించారు. దానితోపాటు ఒక స్ప్ర్రే కూడ కొనిపించారు. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి ఆ విషం డబ్బా విప్పి స్ప్రేలోకి దాన్ని ఒంపబోతే ఒకటి రెండు చుక్కలకే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంటినిండా భరించలేని వాసన వ్యాపించింది. చెదలే మేలు అనుకుని డబ్బా మూతపెట్టి పైన పడేశాను.

కాని రాత్రీ పగలూ కళ్లముందర చెదలే చెదలు. ఓరోజు మళ్లీ ఇంట్లో ఎవరూ లేకుండా చూసి చెదల మందుల ప్రకటనలు వెతికి పట్టుకుని ఫోన్ చేస్తే పాముల నర్సయ్య లాగ చెదల బాబూరావు ఆపద్బాంధవుడిలా వచ్చాడు. ఒకటి రెండు గంటలలో అయిపోతుందనుకున్న పని ఏడెనిమిది గంటలు పట్టింది.

చెద పురుగులు పుస్తకాలు చదవడమూ విమర్శించి ఖండఖండాలుగా మార్చడమూ మాత్రమే కాదు ప్లైవుడ్ చట్రాలలోకి ప్రవేశించి చెక్కపని కూడ మొదలుపెట్టాయి. కన్నీళ్లే మిగిలాయి గాని పుస్తకాలు మిగలలేదు. చెదల మందు ఘాటు వాసనకు కాదు, పుస్తకాలు పోయినందుకు కళ్ల వెంట ధారాపాతంగా దుఃఖం. అంత దుఃఖంలోనూ ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెదపురుగులు అన్ని సెక్షన్ల పుస్తకాల మీద అంతో ఇంతో చేయి (నోరు కావచ్చు) చేసుకున్నాయి గాని, అన్నిటి కన్న పెద్దదయిన తెలుగు కవిత్వం సెక్షన్ వైపు మాత్రం చూడనైనా చూడలేదు!!

reading1

సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణాలూ ఫొటో కాపీయింగ్ సౌకర్యాలూ స్కానింగూ డిజిటలైజేషనూ వచ్చిన తర్వాత, అన్నిటికన్న మిన్నగా మరొకరి దగ్గర ఆ పుస్తకం ఉంటే తస్కరణ సౌకర్యమూ ఉన్నాక పుస్తకాలు పోతే ఏడవనక్కర లేదని అనిపిస్తుందేమో.

పుస్తకం మళ్లీ సంపాదించవచ్చు గాని ఆ పుస్తకంతో కలిసి ఉన్న అనుబంధాలను తిరిగి ఎట్లా సంపాదించగలం?

ఒక్కొక్క పుస్తకం వెనుక, వెనుక మాత్రమేకాదు అట్టమీదా, అట్టవెనుకా, లోపల పేజిపేజికీ ఒక్కొక్క గాథ ఉంటుంది. ఆ అచ్చు పంక్తుల కింద మనం గీసుకున్న గీతలు ఉంటాయి. ఆ పంక్తుల పక్కన అంచులలో మనం చేసిన వ్యాఖ్యలుంటాయి. కొత్త పుస్తకం దొరుకుతుంది గాని ఆ గాథలన్నీ ఎక్కడ దొరుకుతాయి?

ముప్పై ఏళ్ల కింద, ఇరవై ఏళ్లకింద, పదేళ్ల కింద ఏదో ఒక ఊళ్లో ఏదో ఒక దుకాణంలో ఏదో ఒక బుక్ ఫెయిర్ లో ఆ పుస్తకం కొని పేజీలు తిప్పి వాసన చూసి, మొదటి పేజీలో చేసిన సంతకపు ఆ తొలియవ్వన, గరుకు అక్షరాల ఉత్సాహ సంభ్రమాలు మళ్లీ ఎక్కడ ఎట్లా దొరుకుతాయి?

పుస్తకం పోవడమంటే పుస్తకం మాత్రమే పోవడం కాదు. ఒక పుస్తకం వెనుక ఉన్న అనేక జ్ఞాపకాలు పోవడం. పుస్తకాల ఫొటో కాపీలు సంపాదించవచ్చు గాని ఆ జ్ఞాపకాలను ఎట్లా సంపాదించగలం?

నిజంగానే నాదగ్గర ఉన్న వేల పుస్తకాలలో ప్రతి ఒక్కటీ నాలో ఒక జ్ఞాపకాన్ని ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్క పుస్తకంతోనూ నాకొక ప్రత్యేక అనుబంధం ఉంది. అది కొన్ని చోటు, అది కొనడానికి పడిన తపన, అది కానుకగా ఇచ్చిన మిత్రుల జ్ఞాపకం, అది చదువుతున్నప్పుడు, దాని మీద మాట్లాడినప్పుడు అనుభవించిన ఉద్వేగాలు….ఎన్నెన్ని!

ఎప్పుడో 1981లో మొదటిసారి మద్రాసు వెళ్లినప్పుడు మూర్ మార్కెట్ లోకి వెళ్లి ఒక పూటంతా గడిపి కొన్న సెకండ్ హాండ్ పుస్తకాలు, అందులో ముఖ్యంగా ‘ఏపియార్ కు అభిమానంతో మహీధర’ అని రామమోహనరావు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన ‘మృత్యువు నీడల్లో…’ ఇప్పుడెక్కడ దొరుకుతుంది? ఆ ఏపీయార్ ‘ఆదర్శజీవులు’ అనువాదం చేసిన అట్లూరి పిచ్చేశ్వరరావు గారు కావచ్చునని ఊహించి పొందిన ఉద్వేగాన్నీ ఆనందాన్నీ ఇప్పుడెట్లా తిరిగి తెచ్చుకోగలను? ఆ మద్రాసు లేదు, చెన్నై అయిపోయింది. ఆ మూర్ మార్కెట్ లేదు, దాన్ని తగలబెట్టి రియల్ ఎస్టేట్ చేసి సెకండ్ హాండ్ పుస్తకాలకు కట్టించి ఇచ్చిన అగ్గిపెట్టెల్లాంటి కొట్లలో ‘అచటి బహుజన రక్త చిహ్నముల యందు నాది ఇదని గుర్తేమిసామి’?’

అలాగే 1982 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ రోడ్లమీద కొన్న వందల సెకండ్ హాండ్ పుస్తకాల జ్ఞాపకాలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మొదటి రోజుల్లో ప్రతి ఆదివారమూ ఎవరో ఒకరికి ప్రేమతో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ సంతకం చేసి ఇచ్చిన పుస్తకాలు దొరికేవి. ముల్క్ రాజ్ ఆనంద్ ఎవరికో సంతకం చేసి ఇచ్చిన అపాలజీ ఫర్ హీరోయిజం దొరికింది. 1983 మధ్యలో కోటీ ఫుట్ పాత్ ల మీద హఠాత్తుగా వేలాది కమ్యూనిస్టు పుస్తకాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో 1940లలో అచ్చయిన తొలి కమ్యూనిస్టు పుస్తకాలు, 1950లలో, 60లలో ప్రపంచ ప్రధాన నగరాలన్నిట్లోనూ కొన్న పుస్తకాలు, ప్రతి పుస్తకం మీద ఎం కె సేన్ అని సంతకం, ఒక తేదీ, ఆ ఊరి పేరుతో సహా దొరికేవి. మొహిత్ సేన్ పుస్తకాలవి.

అంతకు పది, పదిహేను సంవత్సరాల ముందునుంచే జీవితం పుస్తకాల మధ్య, కాగితాల మధ్య గడుస్తోంది. కాని ఎమర్జెన్సీలో, ఇంటర్మీడియెట్ లో నాకన్న చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పి సంపాదించుకుంటున్న నాలుగు రాళ్లతో పుస్తకాలు కొనడం మొదలయింది. వరంగల్ విశాలాంధ్రలో అలా కొన్న పుస్తకాలు, అందులోనూ సోవియట్ పుస్తకాలు ఇప్పుడు చెదలు తినేస్తే ఆ పుస్తకాలూ రావు, ఆ జ్ఞాపకాలూ రావు. ఆ తర్వాత సాహిత్యలోకంలోకి ప్రవేశించాక ఎంతోమంది కవిమిత్రులు, రచయితలు కానుకగా ఇచ్చిన తమ పుస్తకాలు, ఆవిష్కరణ సభల్లో మాట్లాడడం కోసం ఇచ్చిన పుస్తకాలు, ఆ పుస్తకాలలో నేను రాసుకున్న మార్జినల్ నోట్స్… చెద పురుగుల మీద ఎంత కోపం వచ్చినా, సర్పయాగాన్ని మించిన చెదల యాగం చేసినా, ఆ పుస్తకాలైతే తిరిగి రావు గదా…

  ఎన్ వేణుగోపాల్

venu

అనిపిస్తోంది…మనిషి ఉనికి మనిషితోనే లేదని…!

manishi -uniki
కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనిషి.
+++

చాలా ఏళ్ల క్రితం వదిలేసిన కెమెరాను మళ్లీ పట్టుకున్నాక మనిషి రహస్యం ‘మనిషి’ మాత్రమే కాదన్న విషయం అవగతమవుతూ ఉన్నది. మనిషితోసహా పరిసర ప్రపంచం పట్ల తెలియకుండానే ఒక అవగాహన ఏదో మెల్లగా కలుగుతూ ఉన్నది.  ఎలాగంటే తీస్తున్నది మనిషి ఛాయనే. కానీ ఆ ఛాయ అన్నది మనిషిదే కాదన్నవిషయం బోధపడుతూ ఉన్నది.కెమెరా కన్నులతో చూడగా ‘మనిషిని చూస్తున్నాననే’ అనుకున్నాను. కానీ అతడు పెరుగుతున్నాడు. అతడి ఆవరణా పెరుగుతున్నది. మీదు మిక్కిలి, అతడున్న ఆవరణ పట్ల స్పృహా కలుగుతున్నది. కానీ రచయితగా దర్శించినప్పటిలా కాకుండా- కెమెరాతో చూసినప్పుడు ఆ మనిషి ఫొటో నేను ఇదివరకు గమనించినట్టు రాలేదు. రావడం లేదు. అదొక ఆశ్చర్యం!

అంటే నేను భావించినట్లు కాకుండా-ఉన్నది ఉన్నట్టుగా- ఆ మనిషిని సరిగ్గా చూపించే మాధ్యమంతో పనిచేస్తున్నాను అన్న గ్రహింపు కూడా వచ్చింది, క్రమక్రమంగా. ఇది నిజం. ఒక మనిషి మనకు బాగా పరిచితుడే అనుకుంటాం. కానీ అతడిని లేదా ఆమెను ఫొటో తీసినప్పుడు ఆ మనిషిలోని అనేకానేక మార్పులు, ఛాయలు కనిపిస్తయ్. అంతకు ముందు మనం చూడలేనివి, బహుశా చూడ నిరాకరించినవీ కనిపించడమూ అగుపించి, ఆశ్చర్య చకితులం అవుతాం. మీరు చూస్తున్నదృశ్యం అలాంటివాటిల్లో ఒకటి.

+++

ఆమెను నేను ఎరుగుదును. పార్సీగుట్ట దాటి పద్మానగర్ చేరుకున్నాక ఆ స్కూలు చప్టా దగ్గర ఉంటుంది.   కానీ ఒకానొక ఉదయం ఆమెను ఫొటో తీశాక నేను వెనక్కి వెనక్కి జరిగాను. ముందు ఆమెను  చూశాను. తర్వాత ఆమె మౌనంగా ఏకాంతంలో ఒకానొక నిర్లిప్త ధ్యానంలో, వైరాగ్యంలో ఉన్న సంగతి కెమెరాలో గ్రహించి వెనక్కి జరిగాను. తర్వాత్తర్వాత ఆమె  చట్టూ ఉన్న ఆవరణ అంతా కూడా గ్రహించడం మొదలెట్టి ఆమెను ఇదిగో ఇలా అర్థం చేసుకున్నాను, ఫొటో ద్వారా.
ఒక వ్యధార్థ బాధిత హృదయం తాలూకు ఖండిక ఇలా చిత్రీకరించిన పిదపే తెలిసింది, ఆమె వీధి మనిషి అని. ఆమెతో పాటూ ఒక శునకమూ అనీ. ఇంకా చాలానూ…అప్పటినుంచీ ఆ ఫోటో నాకు నేర్పిన అనభవంతో ఆమెను నేన గమనించడం మొదలెట్టాను. గమనిస్తూ ఉన్నాను, కెమెరాతో….
+++

తీసిన ఫొటోలు చూస్తూ ఉండగా, నేను మామూలుగా చూసన దానికీ చిత్రీకరించి చూసిన దానికి ఆశ్చర్యంతో పాటు ఒక సహానుభూతిని ఫీలయ్యాను. నా బాధ్యతను గుర్తెరిగినట్టు అనుభవాన్ని పొందాను. ఇదే విశేషం అనుకుంటే మరో విశేషం, ఆ మనిషితో పాటు చుట్టుముట్టున్న విషయాలన్నీ  black humor లాగానూ, స్పష్టంగానో అస్పష్టంగానో నమోదయ్యాయి. ఇంకా ఇంకా ఫొటోలు తీసుకుంటూ పోతుంటే, ఇంకా ఇంకా… విషయాలు అనుభవ గ్రాహ్యం కావడం మొదలైంది. ఇది ఎలా ఉన్నదీ అంటే, రచనా వ్యాసంగంలో కంటే ఈ వెలుతురు రచనలో, కెమెరా ప్రపంచం కారణంగా, ప్రస్ఫుటంగా నా వరకు నాకే అర్థమవుతూ ఉన్నది. ఇదొక తారతమ్యం. ఇదొక ఆశ్చర్యం! ఒక experience…అలాగే సత్యం తాలూకు ఒక experiment అని కూడా అనిపిస్తూ ఉన్నది.+++

ఈ ఫొటో అనేకాదు, ఎట్లా అంటే ఒక మనిషిని లాంగ్ షాట్లో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి తీరు వేరు. బస్టు సైజులో ఫొటో తీస్తూ ఉన్నప్పుడు ఆ మనిషి వేరు. ఆ మనిషి ఏదైనా పనిలో -అంటే యాక్షన్లో ఉన్నప్పుడు అతడు అగుపించే విధానం మరీ వేరు. ఇక అతడు నలుగురిలో ఉన్నప్పుడు మరీ భిన్నం. పదుగురిలో ఉన్నప్పుడు వేరు. అప్పుడు తన అస్తిత్వం ఒక్కటే ప్రాధాన్యం వహించని కారణంగా- బృందంలో ఒకడిగా, ఒక్కోసారి ‘గుంపులో గోవిందయ్య’గా అతడి వ్యక్తిత్వం అప్రధానం కావడమూ జరిగి అతడు వేరుగా అగుపించసాగాడు.

ఒక మనిషిని జూమ్ చేయడమూ, క్లోజపులో చూపడమూ కాకుండా లాంగ్ షాట్లో, వైడాంగిల్లో తీయడమూ చేస్తూ ఉండగా ఆ మనిషి తాలూకు మనిషితత్వం విడివడుతూ అంతకు ముందు పరిచయమైన మనిషి కాకుండా సరికొత్త మనిషి ఆవిష్కారం అవడమూ మెలమెల్లగా అర్థమైనది.

అంటే మరోలా చెబితే, అతడు లేదా ఆమె స్థానం మనకు తెలిసిందే అనుకుంటాం. కానీ కాదు. కెమెరా తన స్థలమూ కాలమూ విశ్వమూ సరిగ్గా పట్టిస్తుంది. ఆ కెమెరా ఆమెను భిన్న కోణాల్లో నమోదు చేయడమూ జరుగుతున్నది. కావున మనిషిని చూడటంలో కన్నుకు ఉన్న పరిధి కెమెరా కన్ను దాటింది, దాటి చూపుతున్నదనీ కూడా. ఈ  గ్రహింపు వల్ల  మనిషి చిత్రం బహుళం అని, సామాజికమూ అని అవగతం అవుతూ ఉన్నది.

+++

మరీ చిత్రం ఏమిటంటే-  ఆ మనిషి మామూలుగా కనిపించడానికీ తలపై కొంగు చుట్టుకుని ఆగుపించడానికీ తేడా విపరీతంగానూ ఉన్నది. ఇంకోసారి దగ్గరగా తీసినప్పుడు, ఆ మనిషి పెదవులు ముడుచుకుని ఇచ్చిన ఫోజుకు పెదవులు తెరచి ఉండగా తీసిన ఫొటొకూ జీవన వ్యాకరణంలోనే పెద్ద తేడా కనిపించింది.

ఒక రకంగా- పెదవులు ముడిచినప్పుడు అతడు అతడుగా లేదా ఆమె ఆమెగా అంటే ఒక నామవాచకంగా, ఒక ప్రత్యేక అస్తిత్తంలో ఫ్రీజ్ అయిన మానవుడిగా ఉండటం గమనించాను. కాగా,  పండ్లు కనిపిస్తూ ఉండగా తీసిన ఫొటోలో అతడు సహజంగా అగుపించి, ఒక క్రియలాగా తోచడమూ మొదలైంది. అది ఆ మనిషికి తెలియకుండా జరిగే చర్యలాగూ ఉన్నది. ఇంకా,  ప్రత్యేకంగా ఒకరిని ఒక స్థలంలో అమర్చి, తగిన వెలుగు నీడల్లో అందంగా, విశిష్టంగా ఫొటో తీసుకోవడం ఉందే అది ఒక విశేషణంగా తోచింది. మొత్తంగా, మనిషి ఒక్కడే – అక్షరమాలలోని పదం మామూలే. కానీ అతడితో కర్తకర్మక్రియలన్నీ మారిపోతూ ఉన్నవి, అక్షరం- పదం -వాక్యమైనప్పుడు. అయితే ఇదంతా తనతో కాకుండా తనతోటి పరిసర ప్రపంచంలో ఆ మనిషి మార్పు నాకు అవగతం అవుతూ ఉన్నది.

+++

ఇదంతా ఒకెత్తయితే నేను సూటిగా చెప్పదలచుకున్న విషయం,  ఈ మనిషి కేవలం సాహిత్య వస్తువుగా ఉన్నప్పుడు చీమూ నెత్తురూ రక్తమాంసాలు మూలుగు ఆత్మా ఉన్న వాడుగా, అనుభవాల సెలయేరుగా, ముందు చెప్పినట్టు ఒక చెట్టులా ఉన్నాడు. ఉన్నది. గతంలో నేను అలా ఆవిష్కరించాను కూడా. ఇది పరిమితమే అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎందుకంటే, ఛాయాచిత్రలేఖనానికి వస్తే ఆ మనిషి ఒక ఉమ్మడి అంశంగా, పంచభూతాల్లో ఒకరిగా ప్రతిబింబించసాగాడం నాకే ఆశ్చర్యంగానూ ఉన్నది. చూడగా చూడగా తనకంటూ ఒక ప్రపంచం, అతడికో ఆమెకో ఒక ప్రపంచం అన్నది లేదు. విశ్వంలో మపిషి ఉన్నాడనే అనిపిస్తున్నది.

దాని విస్తీర్ణం ఛాయాచిత్రలేఖనంలో కొంచెం కొంచెం అగుపిస్తూ ఉన్నదన్న నమ్మకమూ కలుగుతున్నది.

దాన్నే ఇలా చెబితే, మనిషి ఫొటోగ్రఫి కారణంగా ప్రకృతిలో భాగంగా, ఒక ఎండుటాకుగా లేదా ఒక వికసిస్తున్న ఫలంగా సమైక్యంగా కనిపిస్తూ ఉన్నాడనిపిస్తూ ఉన్నది.  వేరు వేరు చ్ఛాయలు. కానీ అవన్నీ తనవే కావనీ తెలుస్తున్నది.

+++

చివరగా, మనిషి పంచభూతాల్లో ఒకడిగా, నేలా నింగితో, నీరూ నిప్పు గాలితో ప్రాణిగా ఉన్నాడు. వీటన్నిటి ప్రయోజనంగా, సంక్షిప్తమై ప్రత్యేక అస్తిత్వంగా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అందుకే అతడిని చూస్తే, తన స్థిరమైన లక్షణాన్ని గమనిస్తే మట్టిలా పరిమళంలా ఉంటాడు. ఆ సజల నేత్రాలను చూస్తే అది నీరు… ఆవేశకావేశాలతో ఎగిరిపడే అతడి హృదయం నిప్పు… ఆహ్లాదంతో తేలియాడినప్పుడు గాలి…. తన ఊహా ప్రపంచం, కల్పానమయ జగత్తును చూస్తే అది ఆకాశమో స్వర్గమో అనిపించసాగింది. ఒక్కోసారి ఇవన్నీ కాకుండా  దిక్కుతోచని స్థితిలో ముడుచుకుని ఉన్నప్పుడు, తన పట్ల తనకే అనాసక్తి కలిగినప్పుడు, ఒక గడ్డిపరకలానూ ఉన్నాడు. అదీ ఒక అస్తిత్వం అన్న సంగతీ తెలుస్తూ ఉన్నది.

తీయగా తీయగా అనిపిస్తూ ఉన్నది ఇదే…మనిషి ఉనికి మనిషితోనే లేదని!

~కందుకూరి రమేష్ బాబు

ramesh

వీలునామా – 19 వ భాగం

శారద

శారద

 

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీనిర్ణయం 

 బ్రాండన్ అసలు ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్ళాడే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియానించి ఇంగ్లండు వచ్చాడు. ఒక ఆరు నెలలు రకరకాల అమ్మాయిలని కలిసి, మాట్లాడాడు. డాక్టరు ఫిలిప్స్ గారమ్మాయ్యి హేరియట్ అతనికి కొంచెం నచ్చినట్టే అనిపించింది. కానీ ఎందుకో ఆమెని పెళ్ళాడేంత నచ్చలేదు. ఆ ఆలోచనల్లో ఉండగానే అతను ఎల్సీ మెల్విల్ ని రెన్నీ గారింట విందులో కలిసాడు.

అప్పట్నించీ అతనికి ఆమె ధ్యాసే మనసంతా నిండిపోయింది. ఆమె సౌమ్యమైన రూపమూ, చదువూ, సంస్కారమూ, సన్నటి స్కాటిష్ యాసతో కూడిన మాటలూ, అన్నీ అతని మనసుని పట్టి లాగినాయి. ఆమె నిస్సహాయత అతని మనసుని కరగించి వేస్తే, ఆ పరిస్థితులలో ఆమె చూపించిన ధైర్యం అతనికి అబ్బురమనిపించింది.

ఇప్పుడు ఎల్సీని చూస్తుంటే కొంచెం చిక్కి, కళా కాంతులు తగ్గినట్టున్నా, తను మొదటి రోజు చూసినట్టే వుంది. ఆమెని తను పెళ్ళాడతాడు! తన స్నేహంలో, సంరక్షణలో ఆమె ఆరోగ్యం పుంజుకుంటుంది. ఆ కవితల పుస్తకం కూడా తను అచ్చేయిస్తాడు. ఒక పుస్తకాన్ని తమ హాల్లో టేబిల్ మీద అందరికీ కనబడేలా వుంచుతాడు కూడ! స్నేహితుల్లో, బంధువుల్లో అందరిలో తన హోద చకచకా పెరిగిపోతుంది!  చదువుకున్నదీ, కవితలు రాసేదీ, డబ్బున్న కుటుంబానికి చెందిందీ అయిన భార్య వుండడం ఎంత గర్వ కారణం.

ఇప్పుడు డబ్బు లేక కుట్టు పనికెళ్తూండొచ్చు. అయితే మాత్రం? నిజానికి అదీ గర్వపడాల్సిన విషయమే కదా? ఇలాటి ఆలోచనలన్నీ బ్రాండన్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాతు. అతని మనసు అతని కుటుంబ సభ్యులకర్థవకపోయి వుండొచ్చు కాక! పెగ్గీ త్వరగానే కనిపెట్టేసింది.

ఎలాగైనా ఎల్సీని ఈ పెళ్ళికొప్పించాలి అనుకుందామె. వెంటనే తాతగారితో మాటల్లో యథాలాపంగా అన్నట్టు బ్రాండన్ మంచితనం గురించీ, దయా గుణాలగురించీ చెప్పింది.

***

veelunama11

డాక్టరు గారింటికి ప్రయాణమయ్యారు ఎల్సీ, బ్రాండన్. రైలులో ఒంటరిగా ఆమెతో ప్రయాణం చేసే అవకాశం దొరికినందుకు పొంగిపోయాడు బ్రాండన్. ఈ ఏకాంతంలోనే ఆమెకి తన మనసులో మాట చెప్పాలనుకున్నాడు. ఎలాగో తత్తరపడుతూనే ధైర్యంగా ఆమె అంటే తనకున్న ఇష్టాన్నీ మాటల్లో తెలియజేసాడు.

ఎల్సీ మొహం పాలిపోయింది.

“అయ్యో! అలా అనకండి. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడంలేదు,” మొహం చేతుల్లో కప్పేసుకుంది.

“అదేమిటి మిస్ ఎల్సీ? అలా అంటున్నారెందుకు? మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది. అక్కడ నేనొక మంచి ఇల్లు కూడా కట్టించుకున్నాను. పెగ్గీ అక్కణ్ణించి వచ్చేసింతర్వాత ఇల్లంతా బాగు చేయించాను. మీకక్కడ అంతా హాయిగా గడిచిపోతుంది. మీ కవితల పుస్తకం కూడా అచ్చేయించాలని ఆశపడుతున్నా..”

“కవితల పుస్తకమా?” అయోమయంగా అడిగింది ఎల్సీ.

“అవును! మీర్రాసిన కవితలన్నీ చదివాను. చాలా బాగున్నాయి. అవన్నీ పుస్తకంగా అచ్చేయిస్తాను. మా వూళ్ళో అందరూ మిమ్మల్నీ, మీ తెలివితేటల్నీ చూసి మెచ్చుకుంటారు. నేనైతే గర్వంతో పొంగిపోతానేమో! కాదనకండి.”

నిట్టూర్చింది ఎల్సీ. ఆత్రంగా ఆమె వైపు చూస్తున్నాడు బ్రాండన్.

“మీరు పొరబడుతున్నారు బ్రాండన్. నేను మీరనుకున్నంత తెలివైన దాన్ని కాను. ఆ కవితలన్నీ ఉత్త చెత్త రాతలు. వాటిల్లో వస్తువూ బాలేదు, శిల్పం అంతకంటే బాలేదు. ఇలా బట్టలు కుట్టుకోవడానికి మాత్రమే నాకు అర్హత వుంది.”

“అని మీరనుకుంటున్నారు. కానీ నా అభిప్రాయం వేరు. ఇలా దిగజారి బట్టలకొట్లో పని చేయాల్సిన స్త్రీకాదు మీరు.”

“మన కడుపు మనం నింపుకోవడం లో దిగజారడం ఏముందిలెండి.”

“ఒప్పుకుంటాను. అయినా మీరు ఇలా బట్టలు కుట్టుకుంటూ మీ పొట్ట పోసుకోవడం అన్న విషయం నన్ను చాలా బాధిస్తుంది. ఈ సంగతి తెలిసిన నాటినుంచీ నాకు కంటి నిండా నిద్దర కూడా పట్టలేదు. నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో వుండనీయను.”

“నన్ను చూసి జాలిపడుతున్నారా? అది నన్నెంత నొప్పిస్తుందో మీకు తెలుసా?”

“జాలి కాదు! మీమ్మల్ని ప్రేమిస్తున్నాను.” ధైర్యంగా అన్నాడు బ్రాండన్.

“మీ ప్రేమ జాలిలోంచి పుట్టింది. నా మీద మీరు జాలి పడటం మానేసిన మరుక్షణం మీ ప్రేమా చచ్చిపోతుంది. వద్దు బ్రాండన్. నేను మిమ్మల్ని పెళ్ళాడలేను. నన్ను క్షమించండి.”

ఆమె గొంతులో వున్న నిరాశా నిస్పృహలు పసిగట్టి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. ఆమె చెప్పే మాటలు అబధ్ధాలనిపించడంలేదు. అంటే, ఆమె మనసులో ఇంకెవరైనా వున్నారేమో! లేకపోతే, హాయిగా ఏ బాదరబందీలూ లేని జీవితాన్ని తనిస్తానని చెప్తున్నా, దర్జీ పని చేస్తూ బ్రతకడమే బాగుండడం ఏమిటి? ఇందులో ఏదో తిరకాసుంది.

ఎప్పుడూ ఆమె మొహంలో వుండే దిగులూ, చిక్కి శల్యమైపోతూ వుండడం, ఆమె నిట్టూర్పులూ, అన్నిటికంటే ఆమె కవిత్వం రాయడం, అన్నీ చూస్తే అలాగే అనిపిస్తుంది. బాగున్న రోజుల్లో ఎవరో నీచుడు ఆమెని ప్రేమలోకి దింపి వుంటాడు. ఇప్పుడు ఆమె డబ్బంతా పోగానే మొహం చాటేసి వుంటాడు. ఎంతటి నీచుడు. బ్రాండన్ మనసులో ఆమె పట్ల ప్రేమ సంగతేమోకానీ, జాలి మాత్రం ఇంకా పెరిగిపోయింది.

సౌకర్యవంతమైన జీవితాన్నీ, ప్రేమనీ పంచి ఇస్తానని ఒకవైపు తను చెప్తూంటే ఎప్పడిదో పుచ్చిపోయిన ప్రేమనీ, ఆ ప్రేమికుణ్ణీ తల్చుకుని బాధ పడుతూనే వుంటానంటే, అది ఆమె ఖర్మ! తనేం చేయలేడు, అనుకున్నాడతను. ఆ సంగతి రెట్టించి అడగడం కూడా అమర్యాదగా అనిపించింది. ముభావంగా వుండిపోయాడు.

ఆమె పెళ్ళికి ఒప్పుకోని వుంటే అతని మనసులో ఆమె పట్ల మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ పదింతలయేది. నిజంగానే ఆమెని సూఖపెట్టడానికి పగలూ రాత్రీ కష్టపడి వుండేవాడు. ఆమె కాదనడంతో ఆ మిణుకు మిణుకు మంటూ వున్న ప్రేమ ఆరిపోయింది. కనీసం తను అందించాలనుకున్న ప్రేమకి ధన్యవాదాలు కూడా చెప్పలేదామె. ఎందుకో తల దించుకుని మౌనంగా వుండిపోయింది. పక్క స్టేషనులో ఇంకొంతమంది ఆ పెట్టెలోకెక్కడంతో ఆ ఇబ్బందికరమైన మౌనానికి తెర పడింది.

ఎల్సీ మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఆమెకీ మౌనం దుర్భరంగా వుంది. అయినా ఏం మాట్లాడాలో తోచలేదు. అతను ఇంతకు ముందు పెగ్గీని కూడా ఇలాగే పెళ్ళాడమని అడిగాడు. పెగ్గీ నిరాకరించింది. ఆయన కనబడ్డ ప్రతీ ఆడదాన్నీ ప్రేమించేవాడల్లే వుందే!

నిజం చెప్పాలంటే ఆతని లాంటి కష్టజీవిని పెగ్గీలాంటి స్త్రీయే సుఖపెట్టగలదు. తనలాటి దుర్బలురాలు కాదు. తన ఆరోగ్యమూ బాగుండలేదు. అతనితో సమానంగా శారీరక కష్టమూ చేయలేదు. కాలనీలో ఒంటరితనంతో పోరాడుతున్న అతనికి ప్రేమనూ, స్నేహాన్నీ ఇవ్వలేదు. తనని పెళ్ళాడడం వల్ల అతనికేమాత్రమూ సుఖం వుండదు సరి కదా, తనని కని పెట్టుకోని వుండడం అతనికి అదనపు భారం. అతను తన మీద పడుతున్న జాలిని ఉపయోగించుకొని అతని పైన తన బరువును మోపడం ఏం న్యాయం? ఇలా సాగుతోన్న ఆమె ఆలోచనల గురించి తెలిస్తే బ్రాండన్ ఎంత ఆశ్చర్య పడి వుండేవాడో!

రైలు గమ్యం చేరుకుంది. ఇద్దరూ కిందికి దిగారు. డాక్టరు ఫిలిప్స్ గారి పల్లెటూరికి గుర్రపు బగ్గీ మాట్లాడుకుని ఎక్కారు. చలికి కొయ్యబారిపోయినట్టున్న ఆమె చేతులు పట్టుకుని ఆమెని బండేక్కించాడు బ్రాండన్. మరింతగా ముడుచుకుపోయిన ఆమెని చూసి,

“మిస్ ఎల్సీ, నను చూసి భయపడుతున్నారల్లే వుందే! ఈ విషయం నేనింకో నరమానవుడికి తెలియనివ్వను. నేను మాట్లాడితే మీకు ఇబ్బందిగా వుందంటే అసలు మీతో మాట్లాడనే మాట్లాడను. చెప్పండి, నిజంగా నేను మీతో మాట్లాడడం మీకిష్టం లేదా?” ఆశగా అడిగాడు.

“అవును! మీరింక నాతో మాట్లాడడమూ, నాతో స్నేహం చేయడమూ మానేస్తే మంచిది. నన్ను నమ్మండి! నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది మీకు.”

“మీరు కాదన్నాక ఇహ ఎంత మంచి అమ్మాయి కనబడి ఏం లాభం లెండి. అయినా మీరు నన్ను దూరంగా వుండమంటే అలాగే వుంటాను.”

***

వాళ్ళు ఇల్లు చేరేసరికి జేన్ పిల్లలకి చదువు చెప్తోంది. ఆ రోజూ లిల్లీ కూడా పిల్లలతోపాటే కూర్చోని వుంది చదువుకుంటూ.

ఎల్సీని నఖశిఖ పర్యంతమూ పరికించి చూసింది లిల్లీ. మొహం బానే వుంది కానీ, కళ్ళు బాగా అలిసిపోయినట్టున్నాయి. బాగా పాలిపోయి కూడా వుంది. కాస్త కండ పడితే కాని మనుషుల్లోకి లెక్కకి రాదు, మరీ స్తంభం లాగుంది, అనుకుంది.

ఫిలిప్స్ చెల్లెళ్ళు కూడా ఎల్సీ కంటే జేన్ బాగుంటుందని తీర్మానించేసారు. ఫిలిప్స్ మాత్రం ఎల్సీ అనారోగ్యం వల్ల అలా అనిపిస్తుంది కానీ, మంచి అందగత్తె అని చెప్పాడు ఆడవాళ్ళందరితో. డాక్టరు ఫిలిప్స్ గారు ముందా దగ్గు సంగతేమిటో తేల్చెయ్యాలన్నారు. అందరూ ఆమె పట్ల చూపించిన ఆప్యాయత చూసి ఎల్సీ కొంచెం సర్దుకుంది.

చెల్లెలి మొహం చూస్తూనే జేన్ ఆమె మనసెందుకో అలజడి గా వుందని పసి కట్టింది. అయితే అదంతా అనారోగ్యం వల్లనే ననీ, డాక్టరు గారి వైద్యం తో ఎల్సీ మళ్ళీ ఎప్పట్లాగే అవుతుందనీ తనకి తనే సర్ది చెప్పుకుంది.

ఆ రాత్రి ఇద్దరూ ఒంటరిగా వున్నప్పుడు ఎల్సీ అక్కతో బ్రాండన్ ప్రతిపాదన గురించి అంతా చెప్పింది. జేన్ మౌనాన్ని చూసి భయపడింది ఎల్సీ.

“జేన్! నా మీద కోపంగా వుందా? తప్పు చేసాననుకుంటున్నావా? నాకతని మీద ఏ కోశానా ప్రేమలేదు. అలాటప్పుడు అతన్ని పెళ్ళాడడం అతన్ని మోసం చేయడమే అవుతంది కదా? ” ప్రాధేయపడింది ఎల్సీ.

“పిచ్చిదానా! నీమీద కోపం ఎందుకే? నువ్వేం తప్పు చేసావని?” శాంతంగా అంది జేన్.

“అది కాదు జేన్! ఒంటరితనమూ, పేదరికమూ నన్నెంత బాధపెడుతున్నాయో, ఎంత దుర్భరంగా వుందో నీకు తెలీదు. ఆ పరిస్థితులకి బెదిరిపోయి అతన్ని పెళ్ళాడొచ్చు. కానీ, ఎప్పటికైనా అతనికి నిజం తెలియకపోదు. అతని మీద ఇష్టం తో కాక కేవలం పరిస్థితుల వల్ల అతన్ని పెళ్ళాడానని తెలిస్తే అతను ఎంత బాధ పడతాడు?”

“ఇప్పుడు నీకతనంటే పెద్ద ఇష్టం లేకపోవచ్చు ఎల్సీ! ఇంకొన్ని రోజులయుంటే నీకతని మీద ఇష్టం పుట్టేదేమో. ఇలాటి ఇష్టాయిష్టాలు ఒక్క క్షణంలో పుట్టేవి కాదు. నువ్వతన్ని కొంచెం వ్యవధి అడిగివుంటే అయిపోయేది.”

“కానీ, జేన్, నీకు గుర్తుందా? అతను పెగ్గీనీ పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు. ”

జేన్ ఏమీ మాట్లాడలేదు.

“చెప్పు జేన్! చాలా మొరటుతనంగా అతన్ని బాధ పెట్టానా? కనీసం ఎందుకు వద్దన్నానో కూడా చెప్పలేదు. నేనేం పరపాటు చేయలేదు కదూ?” ఆవేదనగా అడిగింది అక్కని.

“ఎల్సీ! పొరపాటో కాదో ఎవరం చెప్పగలం? నిజమే, నీకు బ్రాండన్ కనబడ్డ ప్రతీ ఆడదాని దగ్గరా పెళ్ళి ప్రస్తావన తెస్తాడనీ, అతను నీకు తగడనీ అనిపించొచ్చు. అయితే, మనకి ఎవరు నచ్చుతారన్నది కాదు ప్రశ్న, మనం ఎవరికైనా నచ్చుతామా అన్నది సమస్య. మళ్ళీ నిన్నిలాంటి మనిషి ముందుకొచ్చి పెళ్ళాడకపోవచ్చు! ఇప్పుడు ఆలోచించి ఏమీ లాభం లేదనుకో, అయినా చెప్తున్నాను. అతను చాలా మంచి వాడనీ మనకు తెలుసు. అతను మనకెన్నో రకాలుగా సాయపడ్డాడు కాబట్టి మనమంటే ఏమూలో అభిమానం వుండే వుండాలి. ఎప్పుడో కొన్నేళ్ళ కింద పెగ్గీని పెళ్ళాడమని అడిగే వుండవచ్చు. అయితే ఏం? చిన్నతనంలో, ఆస్ట్రేలియా లాటి కాలనీలో ఒంటరిగా బ్రతికే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మనమెలా ఊహించగలం? పెగ్గీ కాదన్నా, ఇప్పటికీ పెగ్గీ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాడు. లండన్ లో కూడా అతను ఫిలిప్స్ ఇంటికొచ్చినప్పుడు చూసాను. నాకు అతను చాలా మంచివాడనిపించింది. ఇప్పుడు మనమున్న పరిస్థితి కంటే అతనితో బ్రతుకే నీకెంతో బాగుండేదేమో. ఆలోచించు.”

“వద్దు జేన్! ఎంతో కష్టపడి నేనా పిరికితనాన్ని వదిలించుకున్నాను. ఈ కష్టాలకి భయపడి, ఏమాత్రం ప్రేమలేకుండా, అతనికి నేనసలు తగనని తెలిసీ పెళ్ళాడగలనా? నాకు బాగా తెలుసు జేన్. అతను నన్ను చూసి జాలి పడుతున్నాడు. అసలు ఒక మనిషి నన్ను ప్రేమించే పరిస్థితిలో వున్నానా నేను? నా అవతారం చూడు! నా వాలకం చూడు! ఏముందని నన్నెవరైనా ప్రేమిస్తారు? అసలు జేన్, నాకా దర్జీ కొట్లో ఎంత దుర్భరంగా, ఎంత అవమానంగా వుందో తెలుసా? అవమానం నా పనిని తలచుకోని కాదు. ఊరికే అనవసరంగా నా మీద జాలి ఒలకపోస్తూ ఏదో ఒక వంకన నన్ను చూడడానికొచ్చే మన ఊరివాళ్ళ వల్ల. నిన్ను చూస్తే ఎవరికీ జాలనిపించదు జేన్. ధైర్యంగా తలెత్తుకోని నడవగలవనిపిస్తుంది. నన్ను చూస్తేనే ఎక్కళ్ళేని జాలీ ముంచుకొస్తుంది మనుషులకి. నాకది ఎంత చిరాగ్గా వుంటుందో చెప్పలేను. ఇప్పుడితనూ నన్ను చూసి జాలిపడే పెళ్ళాడతానన్నాడు. అది నాకెంత అవమానంగా వుంటుందో అర్థం చేసుకోరెవరూ. ”

ఆమె ఆవేశాన్ని చూసి జేన్ నవ్వింది.

“ఎంత అమాయకురాలివి ఎల్సీ! నువ్వు చక్కటి మంచి అమ్మాయివి. తళ తళ లాడే నీ నీలి రంగు కళ్ళూ, సౌమ్యంగా ఆహ్లాదంగా వినిపించే నీ గొంతూ, చదువూ సంస్కారమూ అన్నీ వున్నాయి నీకు. నిన్ను ఎవరూ ప్రేమించకపోవడం ఏమిటి? అసలు ఇంత ఆత్మ విశ్వాసం లోపిస్తుందెందుకు నీలో? బ్రాండన్ కి నీమీదున్నది జాలి కాదు, గౌరవం. కష్టాల్లో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎవరి సాయం కోసమో ఎదురు చూడకుండా దర్జీ కొట్లో పనికి కుదురుకున్నావన్న గౌరవం. నాకైతే ఏ కోశానా అతనికి నీమీదున్నది జాలి మాత్రమే అనిపించడం లేదు.”

“పోనీలే జేన్!  పెళ్ళయింతరవాత నేనంత గొప్ప స్త్రీనేమీ కానని తెలిసి నిరాశ పడడం కంటే ఇప్పుడు కొంచెం బాధ పడడమే మంచిది. అదలా వుంచు జేన్. నాకు నా ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళనగా వుంది. ఎడిన్ బరో చలికి బాగా దగ్గు ముదిరింది. ఏదైనే ఊపిరి తిత్తుల్లో జబ్బేమో! నేను పెళ్ళి వద్దనడానికి అది కూడా ఒక కారణం. ఈ ఊపిరి తిత్తుల్లో జబ్బుతో నేను చచ్చిపోతే…”

“ఎల్సీ! ఏంటా మాటలు? నీకే జబ్బు లేదు. రేపే డాక్టరు గారిని నిన్ను మొత్తం పరీక్ష చేయమంటాను. ఆయన చేతిలో ఏ జబ్బైనా ఇట్టే నయమైపోతూంది తెల్సా? చాలా అనుభవమూ, తెలివి తేటలూ వున్న మనిషాయన. నీకేం భయం లేదు. నువ్విక్కడికి వచ్చి మంచి పని చేసావు.”

“జేన్! నువ్విక్కడ వీళ్ళింట్లో హాయిగా వున్నావు కదూ? అందరూ నిన్ను చాలా ఇష్టపడుతున్నారు. జీతం బాగానే ఇస్తున్నారా లేదా?”

“అవును ఎల్సీ! ఈ ఉద్యోగం మనకు భగవంతుడే ఇచ్చాడు. నీకెందుకు! నీకూ అన్నీ నేను సరి చేస్తాగా? హాయిగా ఇక్కడున్న నాలుగు రోజులూ విశ్రాంతి తీసుకో!”

ఆ రాత్రి ఎల్సీ నిద్ర పోయినా జేన్ కి చాలా సేపు నిద్ర పట్టలేదు. ఎల్సీ బ్రాండన్ తో పెళ్ళికొప్పుకోని వుంటే ఎంత బాగుండేది. ఆమె భవిష్యత్తు స్థిర పడేది. ఆమె లాటి అమాయకురాలు బ్రాండన్ రక్షణలో ఎంతైనా సుఖపడివుండేది.  డాక్టరు గారి చికిత్సలో ఎల్సీ కోలుకోగానే బ్రాండన్ మళ్ళీ ఎల్సీతో మాట్లాడితే బాగుండు! ఆలోచనల్లోనే నిద్ర పోయింది జేన్.

***

(సశేషం)

భార్య, దాసి, కొడుకు….

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు,    శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

 

నీవును బ్రహ్మచారివి, వినీతుడ, వేనును కన్యకన్; మహీ

దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్

భావజశక్తి నైనయది; పన్నుగ నన్ను పరిగ్రహింపు సం

జీవిని తోడ శుక్రు దయ; చేయుము నాకు ప్రియంబు నావుడున్

                                                             -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

బ్రాహ్మణకులానికి వన్నె తెచ్చేవాడా, సూర్య తేజస్సు కలిగినవాడా, ఓ కచుడా! నువ్వు బ్రహ్మచారివి, వినయశీలుడివి; నేను కన్యను. మన్మథమహిమతో మనిద్దరికీ ముందే పెళ్లైపోయింది. శుక్రుని దయతో సంజీవినితో సహా నన్ను స్వీకరించు, నాకు ప్రియం కలిగించు…

దేవయాని కచునితో ఈ మాటలు అంటుంది.

***

కచుని చూసి కానీ అన్నం ముట్టనని మంకుపట్టు పట్టి అదేపనిగా ఏడుస్తున్న కూతురిని చూసి శుక్రుడు కరిగిపోయాడు. యోగదృష్టితో చూసేసరికి భూమి మీద ఎక్కడా కచుడు కనిపించలేదు. చివరికి తను సేవించిన సురలో బూడిద రూపంలో కచుడు ఉన్నట్టు కనుగొన్నాడు. సురాపానం ఎంత చేటు తెచ్చిందనుకున్నాడు. ఇక నుంచి మద్యపానం ఎవరు చేసినా పాపపు పనుల మీద ఆసక్తితో పతితులైపోతారని శపించాడు. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుని సంజీవినీ విద్యతో బతికించాడు. అప్పుడు కచుడు, ‘మీ అనుగ్రహం వల్ల దేహాన్నీ, ప్రాణాన్నీ, బలాన్నీ పొందాను. మీ కడుపులోంచి బయటపడే మార్గాన్ని కూడా ఉపదేశించం’ డని శుక్రుని కోరాడు.

శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. నా కడుపును భేదించుకుని కానీ ఇతడు బయటకు రాలేడు, అప్పుడు నా ప్రాణాలు పోతాయి, నేను తిరిగి జీవించాలంటే ఇతనికి సంజీవినిని ఉపదేశించడమే మార్గమనుకున్నాడు. సంజీవినిని ఉపదేశించాడు. తూర్పుకొండ గుహా ముఖం నుంచి ఉదయించిన పూర్ణచంద్రుడిలా కచుడు శుక్రుని కడుపులోంచి బయటకువచ్చాడు. శుక్రుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కచుడు అతనికి సంజీవినితో ప్రాణం పోశాడు.

కచుని పాత్రను రాజకీయకోణం నుంచి అన్వయించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతడు రెండు ఉద్దేశాలతో శుక్రుని ఆశ్రయించి ఉండచ్చు. మొదటిది, శత్రురహస్యాలను సంగ్రహించడం. రెండోది, శుక్రుని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం. శుక్రునికి రాజనీతి కోవిదుడన్న పేరుంది. శుక్రనీతి ప్రసిద్ధం. అయితే, శుక్రుడు శత్రువుల గురువు. కనుక కచునికి అతని ఆశ్రయం లభించడం అంత సులభం కాదు. ఎంతో యుక్తిని కనబరఛాలి. శత్రువర్గానికి చెందిన కచుని  శిష్యునిగా స్వీకరించడం కూడా శుక్రునికి అలాంటిదే. ఆవిధంగా, కచుని యుక్తికీ; శుక్రుని  జాగ్రత్తకూ ఇక్కడ పోటీ. ఆ పోటీలో  కచుడు నెగ్గాడు. శుక్రుని కడుపులో ఉండి మృతసంజీవినిని ఉపదేశం పొందడం, ఆ తర్వాత శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రావడం, శుక్రుని నుంచి తను నేర్చుకున్న విద్యతోనే తిరిగి అతనికి ప్రాణదానం చేయడం కచుని పైచేయిని చాటతాయి.

దీనినే గురు-శిష్య సంప్రదాయం నుంచి చెప్పుకుంటే, కచుడు గురువును మించిన, లేదా గురువుతో సమానుడైన శిష్యు డయ్యాడు. గురువు మృతుడైనా అతని విద్య శిష్య, ప్రశిష్యుల ద్వారా సంజీవినిగా మారి అతని కీర్తి కాయాన్ని బతికిస్తూనే ఉంటుందన్న ధ్వని కూడా ఇందులో ఉండచ్చు. కచుడు వామనుడి పాత్రను గుర్తుకు తెస్తాడు. వామనుడు కూడా ఇలాగే యుక్తిపరుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల మాత్రం అడిగి చివరికి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. గణనిర్బంధాలనుంచి బయటపడి నూతన సామాజిక వ్యవస్థకు వేగుచుక్కగా మారిన బ్రాహ్మణులు, ఇతర సామాజికవర్గాలతో పోల్చితే బుద్ధి కుశలతను పెంచుకుంటున్న సంగతిని ఈ రెండు పాత్రలూ ప్రకటిస్తూ ఉండచ్చు.

అదలా ఉంచితే, మృతసంజీవిని పేరిట చనిపోయినవారిని బతికించే విద్య ఏదో  ఉండేదని భావించనవసరం లేదు. అది, కచునిలోని యుక్తిపరుని పైకెత్తడానికి ఉద్దేశించిన ఒక చక్కని పౌరాణిక కల్పన కావచ్చు.

కచుడు శుక్రుని ఇంట అడుగు పెట్టే ముందే వ్యూహరచన జరిగినట్టు పౌరాణికుడు చెప్పనే చెప్పాడు. తను శుక్రుని ఒక్కడినే మెప్పిస్తే చాలదని కచునికి తెలుసు. శుక్రుని అతి పెద్ద బలహీనత అయిన అతని కూతురు దేవయాని మనసునూ గెలుచుకుని, ఆమెను తండ్రిపై ఒడుపుగా ప్రయోగించాలి. అలా రెండు వైపులనుంచీ కచుడు నరుక్కు వచ్చాడు. అతడు కరడుగట్టిన ప్రయోజనవాదిగానూ, శత్రుస్థావరంలోకి అవలీలగా అడుగుపెట్టి, రహస్యాలను కొల్లగొట్టి అజేయంగా తిరిగి రాగలిగిన సుశిక్షితుడైన గూఢచారిలానూ కనిపిస్తాడు. ఏ బలహీనతలకూ లొంగని లక్ష్యశుద్ధి అతనిది. దేవయాని తనపట్ల మనసు పడేలా అద్భుతంగా నటించాడు. తండ్రిని ప్రభావితం చేసి, రాక్షసుల బారినుంచి తనను కాపాడే కవచంలా ఆమెను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఆకర్షణ వలయంలో తను  చిక్కుకోకుండానూ జాగ్రత్త పడ్డాడు. దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి లేనే లేదు.

ఇందుకు భిన్నంగా దేవయాని కచుని మాయలో పడిపోయింది. శుక్రుడు కూతురి మీద మమకారానికి తలవంచాడు. కచుడు వచ్చిన పని చక్కబెట్టుకుని విజయగర్వంతో స్వస్థలానికి తిరుగు ప్రయణమయ్యాడు. అప్పుడు దేవయాని అతనితో అన్న మాటలే, పై పద్యం.

కచునిలా దేవయాని కూడా తెలివైనదే, గడుసుదే; అయితే ఆ తెలివి అతితెలివి అంచులు తాకుతూ ఉంటుంది. ఆ పైన ఆ తెలివిని కచునిపై మోహం మబ్బులా కమ్మేసింది. ఎక్కడ కాదంటాడో నన్న శంకతో, సంజీవినితోపాటు నన్ను కూడా స్వీకరించు అంటూ, సంజీవినిని కట్నంగా ఎర వేసింది. అది కూడా,  ‘శుక్రుని దయతో’ అనడంలో, తను తండ్రి చాటు బిడ్డననీ, అయితే తండ్రి ఈ పెళ్ళికి కాదనడనీ, ఆయనను ఒప్పించే బాధ్యత తనదనే ధ్వని ఉంది. అంత తెలివిగా మాట్లాడే దేవయాని ఎక్కడ తప్పటడుగు వేసిందంటే, ఒక కచ్చితమైన రాజకీయలక్ష్యంతో వచ్చిన కచుని ఇంగితాన్ని అర్థంచేసుకోలేకపోవడంలో! వ్యక్తిగత ప్రేమకూ, కనికరానికీ తావులేని అతని విశాల రాజకీయ వ్యూహంతో, ఆమె వ్యక్తిగత ఆకాంక్ష పోటీ పడి, ఓడిపోయింది. దేవయాని నిలువునా మోసపోయింది.

ఆమె మాటలు కచునికి ఎంతో విషాదాన్నీ, నొప్పినీ కలిగించాయట. లోకమంతా తప్పు పట్టే మాటలు మాట్లాడడం నీకు తగునా అన్నాడు. నా మనసులో నీకున్నది సోదరి స్థానమే ననేశాడు. ఆ తర్వాత, అంతకంటే ముఖ్యమైన ఒక సత్యాన్ని ప్రస్తావించాడు. గురువులకు శిష్యులు పుత్రులే, ఇదే లోకధర్మం, గురుపుత్రి వైన నువ్వు దీనిని గమనించకుండా మాట్లాడా వన్నాడు. దాంతో హతాశురాలై ఆగ్రహించిన దేవయాని నా కోరికను నువ్వు కాదన్నావు కనుక నీకు సంజీవిని పనిచేయకుండు గాక అని శాపమిచ్చింది. అప్పుడు కచుడు, సంజీవిని నాకు పని చేయకపోయినా నా నుంచి ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది; నువ్వు ధర్మవిరుద్ధమైన ప్రతిపాదన చేశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోడని ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు.

kacha and devayani

నువ్వు నాకు సోదరివని కచుడు ఇప్పుడు దేవయానితో అన్నా, అంతకాలమూ  ఆమెతో సోదరభావనతో  మెలగలేదని స్పష్టమే. అంటే, తన లక్ష్యానికి ఆమెను పరికరంగా వాడుకుంటూ ఆమెలో లేనిపోని ఆశలు కలిగించాడు. కనుక, గురువులకు శిష్యులు పుత్రులన్న ధర్మం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందో మనకు తెలియదు. ఏమైనా, తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే తప్ప దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఎలాగూ లేదు కనుక అతన్ని పక్కన పెడితే; ఆ పెళ్లి విషయంలో, కథ చెబుతున్న పౌరాణికునికీ, బహుశా శుక్రుడికీ కూడా నిజంగానే అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే, తప్పించుకునే ఉద్దేశంతోనే చెప్పినా, కచుడు నిజం చెప్పాడు. గురువులకు శిష్యులు పుత్రులే! అదేదో ఆలంకారికం (figurative) గా అన్న మాట కాదు, శాస్త్రనిర్ధారణ!

కచ, దేవయానుల పెళ్లి ధర్మబద్ధమా కాదా అనేది నిర్ణయించడంలో వారిద్దరినీ, శుక్రునీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడ పౌరాణికుడే స్వయంగా రంగప్రవేశం చేశాడు. వారిద్దరిదీ సోదర-సోదరీ సంబంధమేనని చెప్పడంపై పౌరాణికునికి ఎంత పట్టింపు అంటే, కేవలం ఆ మాట అని అతడు ఊరుకోలేదు. దానికో సన్నివేశాన్ని సృష్టించాడు. కచుడు శుక్రుని కడుపులో పునర్జన్మ ఎత్తి, ఏకంగా అతని కడుపునే చీల్చుకుంటూ బయటకు వచ్చినట్టు చెప్పాడు. కచుడు శుక్రుని పుత్రుడే తప్ప మరొకటి కాదని మరింత నొక్కి చెప్పడమే ఆ కల్పనలో ఉద్దేశం. ఇలా పౌరాణికుని కోణం నుంచి చూస్తే, గురు-శిష్య సంబంధం తండ్రీ-కొడుకుల సంబంధమేనని చెప్పడానికే అతనీ మొత్తం కథను నిర్మించినట్టు కనిపిస్తుంది.

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు, శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

ఇంకా విశేషమేమిటంటే, పుత్రుడు, శిష్యుడు, దాసులు, చివరికి పశువుల వరసలోనే భార్యను కూడా చెప్పారు. ‘రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా’ అనే వాక్యం ప్రసిద్ధం.  పశువులు, భార్య, కొడుకు రుణానుబంధంగా సంక్రమిస్తారనే వేదాంతార్థంలో ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. రుణం తీసుకునేటప్పుడు తాకట్టు పెట్టడానికి వీరు పనికొస్తారనే ఈ వాక్యానికి అసలు అర్థమని రాంభట్ల అంటుండేవారు. వీరందరూ యజమానికి ఆస్తే. ఇల్లాలు అనే మాటలోని ‘ఆలు’ కు పనివారు, బానిస అని కూడా అర్థం ఉందని రాంభట్ల అంటారు. వ్యవసాయ భూముల్ని పొందిన గణజనాలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం పనులకు సాయపడే చేతివృత్తులవారు కలసి ఆ భూములకు దగ్గరగా నిర్మించుకున్న గ్రామాలను ‘ఆల’ అనే వారు. ఇప్పటికీ అనేక తెలుగు ఊళ్ళ పేరు చివర ఆల అనే మాట కనిపిస్తుంది(పరిటాల, దోర్నాల వగైరా). పశువులను కూడా ఆలమంద లంటారు. భర్తకు తనను చరణదాసిగా భార్య చెప్పుకోవడం నిన్నమొన్నటివరకూ ఉంది. దాసుల్లో కూడా క్రీత దాసులు, గర్భదాసులు అని రెండు రకాలు. క్రీతదాసులు అంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్న దాసులు. గర్భదాసులు అంటే పుట్టించిన దాసులు. వీరినే గృహదాసులు అని కూడా అనేవారు. యుద్ధాల్లో దొరికిన స్త్రీలనుంచి యజమానులు ఈ గృహదాసుల్ని పుట్టించేవారు. ఇంట పుట్టిన పశువులానే వీరు కూడా మచ్చికగా ఉంటారని యాజమానుల నమ్మకం. గర్భదాసుల్ని పుట్టించడం బానిసవ్యవస్థ ఉన్న ప్రతిచోటా ఉండేది. అంతేకాదు, బానిసలకు పుట్టిన సంతానం కూడా యజమాని ఆస్తే. వారు ఆ సంతానాన్ని ఇంకో యజమానికి అమ్మేసేవారు.

రూట్స్ నవలలో కుంటా కింటే యజమాని మాసా వేలర్; కుంటాకీ, బెల్ కీ పుట్టిన కిజ్జీని మాసా లీ అనే మరో బానిస యజమానికి నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తాడు. తల్లిదండ్రులకు కూతుర్ని శాశ్వతంగా దూరం చేసే ఆ ఘట్టం హృదయవిదారకంగా ఉండి, ఎంతటి కరకు గుండెలనైనా కదిలించివేస్తుంది.  కిజ్జీని మాసా లీ బలాత్కారంగా  అనుభవించిన ఫలితంగా ఆమెకు కొడుకు పుడతాడు.  అంటే, అతడు గర్భదాసుడన్నమాట.  మాసా లీ కి ఆ అబ్బాయి తన రక్తం పంచుకుని పుట్టినవాడని తెలిసినా అతన్ని బానిసగానే చూస్తూ ఊడిగం చేయించుకుంటాడు.

dasaradhi-rangacharya-rachanalu-chillara-devullu-400x400-imadg3749yfdfexh

రక్తసంబంధాలనూ; ప్రేమ, కరుణ, కడుపుతీపి, వాత్సల్యం వంటి మానవీయ సహజాతాలనూ కాలరాసే బానిసత్వపు కర్కశరూపాన్ని మన దాశరథి రంగాచార్యగారు కూడా ‘చిల్లర దేవుళ్ళు’ నవలలో కళ్ళకు కట్టిస్తారు. అందులో రామారెడ్డి అనే దొరకు మంజరి అధికారిక సంతానమైతే, వనజ అడబాపకు కలిగిన సంతానం. అంటే, గర్భదాసి. రామారెడ్డి మంజరినే తన కూతురుగా భావిస్తాడు. ఆమె మీదే ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వనజను అడబాపగానే ఉంచుతూ గడీకి వచ్చిన అతిథులకు అప్పగిస్తూ ఉంటాడు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాలలో; ఇటీవలి అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు. అందుకు భౌగోళిక కారణాలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని కొశాంబీ తదితరులు అంటారు. అయితే, మన దేశంలో దాస, దాసీ వ్యవస్థ ఉంది. పుట్టింటి అరణంగానో, విజేతలైన రాజులకు కప్పంగానో, కానుకగానో; పండిత సత్కారంగానో దాస,దాసీలను ఇవ్వడం మన పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇలాంటి దాస,దాసీలు కలిగిన గృహ ఆర్థికవ్యవస్థ మన దేశంలో ఎలా అవతరించి అభివృద్ధి చెందిందో రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో ఆసక్తికరంగా వివరించారు. గృహ ఆర్థికవ్యవస్థలోని యజమానికీ, బానిసల యజమానికీ పోలికలు ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; ‘భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా’ అని అతనికి గుర్తుచేయబోతోంది.

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

కథా చిలుక ఇంక చేతికి చిక్కనే లేదు!

 dasari1

నాకు కథంటే ఏమిటో  తెలుసు. కథలు ఎలా రాయాలో తెలుసు.

కానీ నాకు కథలు అల్లడం రాదు. యాభైకి పైగా కథలు రాసాను గానీ కథగట్టడం చేతగాలేదు. అందులొ ఒకటీ రెండూ కథలైఉండొచ్చుగాని అది కేవలం యాధృచ్ఛికం.

నాకు 110 మీటర్ల హర్డిల్ రేసు ఎలా పరిగెత్తాలో తెలుసు. ఆ రేసు లో గెలవడమూ జరిగింది- ’72 నుంచి ’74 దాకా…కాలేజీ ఆటల్లో. ఇది యాదృచ్ఛికం కాదు.

‘కథాకథనం’ లో కాళీపట్నంగారు, ” రాసే వాళ్ళలో డెభ్భై శాతం మందికి  కథ అంటే ఏంటో తెలీదు. తెలిసిన ముప్ఫైమందిలో ఇరవైమందికి కథ అల్లే ఒడుపు తెలీదు”.అంటారు. అదిగో ఆ ఇరవై శాతం మందిలో వాడిని నేను.

***

1972.

ఇంజినీరింగు మూడో సంవత్సరం.

కాకినాడ కాలేజి వార్షిక క్రీడలు….మీటర్ల హర్డిల్ రేసు.

అంతాకలిసి ఆరుమందిమి బారుతీరి ఉన్నాం.మిగిలిన అందరూ నాకన్న పొడవు. పెద్ద. శక్తిమంతులు. వేగవంతులు.

అయినా  నేను గెలిచాను. అందులోనూ ఉసైన్ బోల్ట్ కు మించిన లీడ్ తో.ఒక్కటే కారణం.

నాకు హర్డిల్సు ఎలా దాటాలో తెలుసు. ఎడమకాలు తన్నిపెట్టి కుడికాలు మీదుగా హర్డిల్స్ పైకెగరడం. ఎడమకాలును మడిచి ఒక సరళమైన అర్థవృత్తాకారంలో హర్డిల్ మీదుగా తీసుకు వెళ్ళడం, కుడికాలు భూమిని తాకీతాకగానే ఆ ఎడమ కాలును  తడబాటు లేకుండా ఇంకా ముందు సాగనివ్వడం- ఇది నాకు తెలుసు. అంచేత శృతి ఉన్న పాటలా సాగింది నా రేసు. మిగిలిన శక్తిమంతులంతా ఒకో హర్డిల్ దాకా రావడం, ఎలాగోలా దాని మీదనుంచి దూకడం, తడబడి నిలదొక్కుకుని ముందుకుసాగడం – పదిశృతుల్లో సాగిన పాట.

నాకెలా తెలిసిందీ ఒడుపూ? నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. పోటీలకు ఓ నెల ముందు పీ.ఆర్ కాలెజిలో ట్రైనింగ్ కాంప్ నడిపితే ఓ రెండురోజులు వెళ్ళాను. రేసు ఎలా పరిగెత్తాలో తెలిసింది. తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టే ఒడుపూ సమకూరింది.

***

కథలు రాయాలంటే ఏదో ప్రేరణ ఉండాలి. డబ్బూ, పేరూ ప్రేరణ అయిన వారి గురించి నేను మాట్లాడలేను. వారికి నా శుభాకాంక్షలు.

పరిసరాలను చూసి స్పందించి, అవి మనలో కలిగించిన అలోచనలనూ, అనుభూతులనూ, అవేదనలనూ అందరితో పంచుకోవాలనుకునే వారికోసమే  ఈ నాలుగు మాటలూ. ఆ ఆలోచనలూ, అనుభవాలను  కథలుగా చెప్పాలనుకొనేవారికి ఈ వ్యాసం.

ఇలాంటి స్పందనలు నాకు కలిగి నేను కథలు  రాసాను. మొదటి కథ 1978 లో దేవీప్రియ గారి ప్రజాతంత్ర లో వచ్చింది. ఆ సంతోషంలో మరో  నాలుగైదు రాసాను. ఎందుకో సంతృప్తి కలగలేదు. ఉప్పు లేదు.ఇతివృత్తం ఉంది. సన్నివేశాలు ఉన్నాయి. సంభాషణలున్నాయి.పాత్రలున్నాయి. వర్ణనలున్నాయి. భాషా, వాతావరణం, శైలీ అన్నీ ఉన్నాయి. అయినా ఉప్పు లేదు అనిపించింది. అదృష్టవశాత్తూ ఒక కథక మిత్రుడు అవి చదివాడు. “మీరు కథలుగాదు, వ్యాసాలు రాయండి”. అన్నాడు. తాటాకు మంట కోపం వచ్చింది. కానీ ఏదో  సత్యం చెప్పాడనిపించింది. కానీ ఆ సత్యమేంటో స్పష్టమవలేదు. అతనికీ తెలియదు. కానీ కథలు కట్టడం కట్టిపెట్టడం నాకూ, దేశానికీ క్షేమకరం  అనిపించింది.

మళ్ళా  దాదాపు  పదిహేనేళ్ళ తర్వాత  ఒక సంగతి పదిమందికీ చెప్పకుండా ఉందలేని సంధర్భంలో పడ్డాను.  రాయకుండా ఉండాలేని స్థితి. ‘నాకు తెలిసిన మాధవుడు ‘ బాణీ లో ‘బ్రతక నేర్వని వాడు ‘ గురించి రాసాను. సహృదయ మిత్రులు వాకాటి దాన్ని కథాప్రభ లో ప్రచురించారు. నేను గౌరవించే కథకులో పదిమంది, ‘బావుందోయ్ ‘    అని భుజం తట్టారు.

SAM_9938

ఓ రెండేళ్ళ పాటు అదే ఊపు. పది కథలు…అందులో ‘శేఫాలిక ‘ లాంటి అప్రయత్నంగా పుట్టిన కథలూ ఉన్నయి. అన్నీ అచ్చయ్యాయి..రచన, ఆహ్వానం, సుప్రభాతం..అయిన మళ్ళా అదే మధన. ఉప్పు లేదు అన్న స్పృహ, అసంతృప్తి. అసహనం…అందులోంచి ఒక జ్ఞానం.

సమాజం గురించీ, మనుషుల గురించీ కథల రాస్తున్నప్పుడు, ఆ  సమాజం గురించీ, కథలు రాయడం  గురించీ ప్రాధమిక శాస్త్రీయ అవగాహన అవసరమన్న జ్ఞానోదయం జరిగింది.

కొంచం తడుములాడగా సమాజపుటవగాహనకు సొషియాలజి అధ్యయనం మంచిమార్గమని తెలిసింది. ఇంటర్మిడియట్ పుస్తకాల్తో మొదలుపెట్టాను. అక్కడ మొదలైన ప్రయత్నం ఓ పదేళ్ళ తరవాత ఎం.ఫిల్ దగ్గర ముగిసింది.  ఓనమాలు తెలిసాయి.’ కామన్ సెన్సు, స్పందించే హృదయము  మాత్రమే సమాజపు గతిని అర్థంచేసికొవడానికి పనికి రావు’ అన్న నా  భావం నిజమని తెలిసింది.

కథ అంటే ఏమిటో తెలుసుకోవడం మాత్రం భగీరథ ప్రయత్నం అయింది.

ఇంగీషులోనూ, తెలుగులోనూ పుస్తకాలు వెదికాను. దొరికాయి.

సహ కథకులతోను, సీనియర్ రచయితలతోనూ చర్చించాను- వాళ్ళకు విసుగు పుట్టేదాకా!

కానీ కంచికి వెళ్ళిపోయే కథల చిదంబర రహస్యం తెలియలేదు. చాలా పుస్తకాలు మాయగారడీ వాళ్ళ దొంగ మోళీలుగా పరి.మరికొన్ని పరిణమించాయి. మరి కొన్ని కొండను తవ్వితే ఎలుక తోక  దొరికిన చందం.  కథామాంత్రికుడి ప్రాణాలు దాగి ఉన్న చిలుక ఉండే చెట్టుతొర్రదాకా చేరుకోగలిగానని కొన్నిసార్లనిపించినా, – చిలుక చేతికి చిక్కనే లేదు!

***

 

అదిగో  అలాంటిదే ‘ఎడిసన్ ‘ సమయం లో కాళీపట్నం గారి ‘కథకథనం’. చాలా చిన్న పుస్తకం, దొరికింది.

రసవిద్య నేర్పే తాళ పత్రగ్రంధం దొరికితే వేమన కూడా అంత సంబరపడిఉండడు.

ఒకటికి పదిసార్లు చదివాను.

వార్తకూ, వార్తాకథకూ, వ్యాసానికీ, కథకూ మధ్యనున్న అతిసూక్ష్మమైన తేడా బోధపడింది.

వస్తువు, ఇతివృత్తం, సన్నివేశం, సంఘటనా, శిల్పం, శైలి – వీటి గురించి అవగాహన కుదిరింది. వస్తువుకూ ఇతివృత్తానికీ, సన్నివేశానికీ సంఘటనకూ, , శిల్పానికీ శైలికీ మధ్యనున్న తేడాలు తెలిసాయి.

అలాగే కథలో భాషా, వర్ణనలూ, పాత్రలూ, సంభాషణలూ ఎలా ఉపయోగించాలో తెలిసింది.

కథకు ఎలా పేరు పెట్టాలో, ఆరంభించాలో, ముగించాలో – ఇవన్నీ చిన్నపిల్లాడిని ఒళ్ళో కూర్చొపెట్టుకుని గోరుముద్దలు తినిపించినంత ప్రేమగా చెప్పుకొచ్చారు కాళీపట్నం.

ఇవన్నీ తెలుసుకున్న కొత్త ఉత్సాహం తో మనసులో పేరుకుపోయి ‘రాయి, రాయి ‘ అని వేధిస్తున్న వస్తువులలో నలభై, యాభై కథలు రాసాను – ఓ దశాబ్ద సమయంలో. కానీ షరమామూలే! ఉప్పు సమస్య. వాటిలో కొన్ని నిజంగా కథలే.సందేహం లేదు. రస సృష్టి కూడా జరిగిందన్న మాటా నిజమే,  కానీ అది యాదృచ్ఛికం! కథను అల్లే కట్టే నేర్పూ, కథను పండించే ఒడుపూ నాకు వంటబట్టలేదన్నది వాస్తవం!! సరే, మోళీ కట్టేసి ఉప్పుదగ్గరికి వస్తాను.

***

రెండు చేతులూ, రెండు కాళ్ళూ, ఒక తల, రెండు చెవులూ, రెండు కళ్ళూ ఒక ముక్కూ, బొట్టూ/మీసం- ఇది ఏ చిన్నపిల్లాడైనా గీయగల మనిషి బొమ్మ. ప్రయత్నిస్తే ఇదే బాణీలో పులిబొమ్మా, గుఱ్ఱం బొమ్మా, ఏనుగు బొమ్మ కూడా గీయవచ్చు. అలాగే వార్తను మించిన, కథను మించిన, వ్యాసాన్ని మించిన రచన ఎవరైనా చెయ్యవచ్చు.

కానీ ఆ బొమ్మను చిత్రం చేయడం ఎలా? రచనను కథ చేయడం ఎలా?

కీలకం ప్రాణ ప్రతిష్టలో ఉంది. కౌర్యం, హుందాతనం పులి మొహంలో కనిపించాలి. దయా, కరుణా మదర్ తెరిసా లో కనిపించాలి.  ఆక్రోశం, ఆక్రందన బడుగు జీవుల బొమ్మల్లో ప్రతిబింబించాలి. మేధస్సుని దాటి మనసుని పట్టుకు ఊపే విశేషం ఏదో కథలో పాఠకుడికి కనిపించాలి. అప్పుడవి చిత్రాలవుతాయి.కథలవుతాయి. ఆ శక్తి అలవడినపుడు అసలు రేఖలతో కూడా పని ఉండకపోవచ్చు. ఆకృతుల అవసరమూ ఉండకపోవచ్చు.కథాచట్రమే అవసరమవక పోవచ్చు. గుయోర్నికాలూ, వాంగ్మూలాలూ వస్తాయపుడు. సూటిగా గుండెను తడతాయి.

‘ఇంకా ఎంతకాలం ఈ అరిగిపోయిన సిద్ధాంతాలు ? ఎందుకా దిమ్మిసాగొట్టిన రహదారులూ ? మా స్పందనలు వేరు, మా అనుభవాలు వేరు . మేం కొత్తరకంగా రాస్తాం . నియమాలు పట్టించుకోం….. ‘ అనవచ్చు కొందరు నవతరం కథకులు.

నిజమే. నియమాలూ , సిద్ధాంతాలు కాలానుగుణంగా మార్చుకుంటూ వెల్లాలి. అవసరమైతే బద్దలుగొట్టాలి  కూడాను ! కాని ముందు అవి ఏమిటో తెలియాలి కదా… ‘ఓహ్ ! ఇదేనా కవిత్వం. ఇలా అయితే నేనూ రాయగలను, ‘ అని కథలో ఓ పిల్లాడంటే శ్రీ శ్రీ సంతోష పడటం వెనక ‘కవిత,ఓ కవిత…. ‘ పునాది ఉందన్నమాట మరిచిపోకూడదు. కథారహస్యాలు, కథల ప్రాణం ఎక్కడుందో ఆ వివరము తెలియక పోతే చిన్నపిల్లల బొమ్మలొస్తాయి, గుయర్నికాలు కాదు !

అన్నట్టు, నేను కావాలనే ‘వస్తువు, ఇతివృత్తం….’ఈ పాఠాలు చెప్పటం లెదు. కాళీపట్నం ఇప్పటికే చలాచక్కగా  ‘కథాకథనం’ లో చెప్పారు.  అది ఒకటికి పదిసార్లు చదవమనీ పాతా కొత్త కథకులందరికీ నా విన్నపం.

కథకులందరూ కొడవటిగంటిలూ , త్రిపురలూ కాగలరని నేనూ ఆశపడను. కానీ కథామూలాలు,లక్షణాలూ క్షుణ్ణంగా తెలుసుకుంటే నోటికి పదిమంది కథకులైనా తమ తమ కథల్లో ‘ ప్రాణ ప్రతిష్ట ‘ చెయ్యగలరని నా నమ్మకం.

 -దాసరి అమరేంద్ర

సాహిత్యం నన్నే కాదు ప్రపంచాన్నే ఓదారుస్తుంది:షాజహానా

shajahanaతెలుగు కవిత్వంలో షాజహానా ఒక సంచలన కెరటం. ముస్లిం మహిళల జీవితాల్ని మొదటిసారిగా కవితకెక్కించి అంతర్జాతీయ కీర్తిని అందుకున్న తొలి తెలుగు కవయిత్రి. తండ్రి దిలావర్ గారు స్వయంగా అభ్యుదయ రచయిత. ఆ వారసత్వపు వెలుగు ఆమెపై ప్రసరించినా, ఇప్పుడు తను రాస్తున్న తరహా కవిత్వానికి సంబంధించి , తను స్వయంగా ప్రతి అక్షరమూ దిద్దుకొని వొక కొత్త ఒరవడికి నాంది పలికే దారిలోకి నిస్సంకోచంగా  సాగిపోవడం ఆమెని విశిష్ట కవిగా నిలబెట్టాయి. 2005లో  ‘నఖాబ్’ ముస్లీం స్త్రీ కవిత్వంగా ఆమె కవిత్వం వెలువడినప్పటి నించీ ఆమె ప్రస్తావన లేకుండా సమకాలీన కవిత్వం లేదు. 2006లో  సహచరుడు స్కైబాబతో కలిసి ‘అలావా’ ముస్లీం సంస్కృతి కవిత్వం సంపాదకత్వం వహించారు.  తిరిగి 2009లో స్కైబాబతో  ‘చాంద్‌తార’  – మినీ కవిత్వం వెలువరించారు.  2012లో ‘దర్ది’ కవిత్వ సంపుటి ప్రచురించారు. 10 కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. అవి ఇంకా పుస్తకాలుగా రావలసి వుంది. పి.హెచ్.డి గ్రంధం ‘తెలుగులో ముస్లీంవాద సాహిత్యం’ పుస్తకంగా రాబోతున్నది.   రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నారు.   భారత ప్రభుత్వం తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ (జర్మనీ)కి వెళ్ళారు. మాస్కో బుక్‌ఫేర్ (రష్యా)  కవితా పఠనం చేసారు.

 

మీ బాల్యం, కుటుంబం, చదువు గురించి చెప్పండి.

-నా చిన్నపుడు మా నాన్న ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్లయి ఊర్లు మారుతుండడంతో ఎప్పటికప్పుడు మిత్రురాళ్లను కోల్పోయి ఒక్కదాన్నే ఎక్కువగా గడిపేదాన్ని. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. న్యూస్‌ పేపర్‌లలో నాకిష్టమైనవి చదువుతూ ఉండేదాన్ని. చదువు మామూలుగానే చదివేదాన్ని. తెలుగులో, సైన్స్‌లో మాత్రం ఎక్కువ మార్కులు వచ్చేయి. అవి రెండు నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. లెక్కలన్నా ఇంగ్లీషన్నా కష్టంగా అనిపించేది. మా నాన్న దిలావర్‌. తెలుగులో ప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు. తెలుగు లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. అమ్మ యాకూబ్బి. అక్క షంషాద్‌ బేగం. అన్న అక్బర్‌. నా సహచరుడు స్కైబాబ. అతను ప్రసిద్ధ కవి, కథకుడు.

Dardee

మీ సాహిత్య రంగ ప్రవేశం ఎప్పుడు, ఎలా జరిగింది?

– సాహిత్య రంగంలోకి చిన్నపుడే ప్రవేశించాను. ఏడవ తరగతిలో ఉండగా కవితలు రాశాను. అవి చాలా రోజుల వరకు ఎవరికీ చూపించలేదు. తరువాత మా ఆపా (అక్కయ్య) చూసి మా అబ్బా (నాన్న)కి చూపించింది. అబ్బా వాటిని బావున్నాయి అని మెచ్చుకున్నారు. నా మొదటి కవిత ‘ఎర’. తరువాత చాలా రాశాను. స్కూల్‌ మ్యాగజైన్‌లో అచ్చయ్యాయి. పదవ తరగతిలో ఉండగా అనాధ అనే కవితను భారతి (ప్రముఖ సాహిత్య మాస పత్రిక)కి పంపించాను. సెలక్టయ్యింది.. కానీ అది అచ్చుకాకుండానే భారతి మూతపడింది. దాంతో నేను కొన్నాళ్లు మౌనంగానే ఉన్నాను. 1997 నుంచి ముస్లిం స్త్రీల గురించి రాసిన కవితలే నా అసలైన అస్తిత్వంగా భావిస్తున్నాను.

మీ రచనల నేపథ్యం ఏమిటి?

– నా రచనల నేపథ్యం సమాజంలో ఉన్న అసమానతలు. ముస్లిం స్త్రీల పట్ల పురుషులు చూపించే అసమానతలు.. ముస్లింల పట్ల హిందూత్వవాదులు చూపించే అసమానతలు.. పేద రాజ్యాల పట్ల అగ్రరాజ్యాలు చూపించే అసమానతలు,  కులం పేర, మతం పేర స్త్రీల మీద కొనసాగుతున్న అణచివేత, వివక్ష.

ముస్లిం రచయిత్రులకు, అన్య రచయిత్రులకు ఉన్న తేడా ఏమిటి?

– ముస్లిం స్త్రీలు ముస్లిం స్త్రీల గురించి రాస్తున్నారు. ఇతర స్త్రీల గురించి కూడా రాస్తున్నారు.  ముస్లిమేతర స్త్రీవాదులు ముస్లిం స్త్రీల గురించి రాసింది తక్కువ. అయితే వారు ఎదుర్కొంటున్న అణచివేతల కన్నా ముస్లిం స్త్రీలు హిందూత్వవాదుల నుంచి, బ్రాహ్మణీయవాదుల నుంచి అదనపు అణచివేతను ఎదుర్కొంటున్నారు.

డాక్టరేటు పట్టా అందుకుంటూ షాజహానా

డాక్టరేటు పట్టా అందుకుంటూ షాజహానా

మీ రచనల నేపథ్యంలో తెలుగు స్త్రీవాద సాహిత్యాన్ని మీరెలా వ్యాఖ్యానిస్తారు? మీ నఖాబ్‌ అచ్చు అయినప్పుడు స్త్రీవాద, ఇతర విమర్శకులు ఎలా స్పందించారు?

– నేను స్త్రీవాద రచనల నుంచి కూడా ఇన్‌స్పైర్‌ అయ్యాను. కాకపోతే నఖాబ్‌ పబ్లిష్‌ అయినపుడు కొందరు స్త్రీవాద విమర్శకులు జీర్ణం చేసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కవితల్లో ఉండే ఉర్దూ మాటల్ని విమర్శించారు. మిగిలిన విమర్శకులు మంచిగానే స్పందించారు. బురఖా, తలాక్‌లు కాక చాలా వాటి గురించి నఖాబ్‌లో రాశాను. కాని విమర్శకులు ప్రధానంగా వాటినే చూశారు.

తెలుగులో స్త్రీ సాహిత్యం, పురుష సాహిత్యం అంటూ విడివిడిగా చూసే పద్ధతి ఉందా? ఉన్నట్టైతే అది అవసరమా?

– తెలుగులో స్త్రీ సాహిత్యం పురుష సాహిత్యం అంటూ ఏదీలేదు.. స్త్రీవాద సాహిత్యం పురుషవాద సాహిత్యం ఉన్నాయి. స్త్రీలు బాధిత వర్గం కాబట్టి స్త్రీల సాహిత్యానికి ప్రాముఖ్యత నివ్వడం అవసరం.

ముస్లిం స్త్రీవాదానికి, ముస్లిమేతర స్త్రీవాదానికి తేడాలేమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మీరెలా విశ్లేషిస్తారు?

– ముస్లిం స్త్రీలు తమ మతంలోని లోపాలను గురించి రాశారు. ముస్లిమేతర స్త్రీవాదులు మతం ప్రాతిపదికన ఎక్కువగా రాయలేదు. వారు పితృస్వామ్యం గురించి మాత్రమే రాశారు. దానికి మూలమైన బ్రాహ్మణిజం గురించి రాయడం లేదు. ముస్లిం స్త్రీలు తమ సాహిత్యాన్ని స్త్రీవాదం అనడాన్ని ఒప్పుకోవడం లేదు. స్త్రీవాద స్థాయిలో ముస్లిం స్త్రీల గురించి రాసే పరిస్థితి ప్రస్తుతం లేదని మా భావన.

హిందూ ముస్లింల నడుమ అనుమానాలెందుకు పుడుతున్నాయి? దీనికి కారకులెవరు?

– హిందూ ముస్లింలు నిజానికి కలిసిమెలిసి ఉంటారు.. రాజకీయాల వలనే గొడవలు వస్తున్నాయి. ఇరు వర్గాలకు కూడా తమ మూలాలు, చరిత్ర, సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం వల్లనే ఈ గ్యాప్‌ పెరుగుతోంది.

వర్తమాన హిందూ ముస్లిం రచయిత్రుల బాధ్యతలేమిటి?

– మతాల గురించి కులాల గురించిన అవగాహన తమ వర్గాల ప్రజలకు కలిగించడం, అపోహలు, అనుమానాలు తొలగించడం, అసమానతల గురించిన రచనలు చేయడం.

ముస్లిం రచయిత్రిగా మీరు ఎదురించిన సమస్యలేమైనా ఉన్నాయా?

– ముస్లిం రచయిత్రిగా నేను రాసిన రచనల్లో తలాక్‌, బురఖా, దూదేకుల స్త్రీల సమస్యలున్నాయి. వాటి పట్ల వ్యతిరేకత వచ్చింది.

సాహిత్య రచనలో మహిళా భాష అనేదుందా…దాని స్వరూపమేమిటి?

– ఉంటుంది కదా. వారి సమస్యలు ప్రత్యేకమైనవి అయినప్పుడు ప్రత్యేకమైన భాషలోనే అవి వ్యక్తీకరించబడతాయి. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలు, కొత్త డిక్షన్‌ మనం చూడొచ్చు.

రాష్ట్ర విభజన అవసరమా? ఇందులో రాజకీయమెంత? ప్రజల బాగోగులెంత?

– రాష్ట్ర విభజన అత్యవసరం. సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అణగారిపోయారు. ఇప్పటికైనా వారికి స్వయం పాలన, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలి. రాజకీయ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ప్రజల బాగోగులు క్రమంగా బలపడతాయి. మళ్లీ అందులోనూ ఆధిపత్య కులాల అధికారం పట్ల పోరాటం కొనసాగాల్సి ఉంది.

మీ కవితల్లో, కథల్లోలాగే తక్కిన ముస్లిం రచయితల రచనల్లోనూ ఉర్దూ పదాలెక్కువ కనబడతాయి. ఎందుకు? దీనివల్ల ప్రయోజనాలేమిటి? ఇది భాషా ఐడెంటిటీ కోసమా?

– కథల్లో, కవితల్లో ఉర్దూ పదాలు ప్రవేశపెట్టడం ముస్లిం వాద సాహిత్యం ప్రత్యేకత. దీనివలన తెలుగు మాట్లాడే ముస్లింలకి తెలుగు భాష కూడా దగ్గరవుతుంది. తెలుగువారికి ఉర్దూ పదాలు దగ్గరవుతాయి. తెలుగు, ఉర్దూ కలగలుపు సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుంది. ఉర్దూ ఒక భారతీయ భాష అనే స్పృహను ముస్లింవాదులు గుర్తుచేస్తున్నారు. చాలామంది ముస్లిం రచయితలు ఇంట్లో ఉర్దూ మాట్లాడతారు. కాని వారికి ఉర్దూ లిపి రాదు. కాబట్టి తెలుగులోనే ఉర్దూ పదాల ప్రయోగం చేసి తెలుగు భాషకు అదనపు శోభను తెచ్చిపెట్టారు.

మీ నఖాబ్‌ కవితలు చదివిన ముస్లింలు, తదితరులు ఎలా రియాక్ట్‌ అయ్యారు?

– నఖాబ్‌ చదివిన వారు హిందువులు చాలా బాగా స్పందించారు. ముస్లింలు చాలా మంది వ్యతిరేకించారు. తెలుగు ముస్లిం రచయితలు, కవులు ఆదరించారు.

తలాఖ్‌ వరమా శాపమా? ఆంధ్రలో తలాఖ్‌ తీసుకున్న మహిళల స్థితిగతులెలా ఉన్నాయి?

– తలాఖ్‌ చాలా సందర్భాలలో స్త్రీలకు శాపమే. అకారణంగా తలాఖ్‌కి గురైన స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిలో ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. పురుషులకు అదొక వరమైంది. దాన్ని వాడుకొని రెండో పెళ్లికి వారు తయారవుతున్నారు.

షాజహానా కవిత్వ సంపుటి 'నఖాబ్'

షాజహానా కవిత్వ సంపుటి ‘నఖాబ్’

విద్యాధికత స్త్రీలను రక్షిస్తుందా?

– విద్యాధికత స్త్రీలను రక్షిస్తుంది… చాలా వరకు. ముస్లింలు చదువు లేక వెనుకబడిపోయారు. ముఖ్యంగా ముస్లిం స్త్రీల వెనుకబాటుతనానికి చదువు లేకపోవడం ఒక కారణం. చదువుకొని భార్యాభర్త ఉద్యోగాలు చేస్తేగాని ఈ రోజుల్లో బతకలేము. అలాంటిది ఒక పురుషుడే సంపాదిస్తే ఇల్లంతా గడవడం కష్టం. చదువుల వల్ల ఉద్యోగాలు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్త్రీలు తమ హక్కులు తెలుసుకొని తమను వంచించే పురుషులతో పోరాడే నైతిక స్థైర్యాన్ని చదువు వారికి అందించే అవకాశముంది.

సాహిత్యం మిమ్మల్ని ఎలా ఓదారుస్తుంది?

– సాహిత్యం నన్నే కాదు ప్రపంచాన్నే ఓదారుస్తుంది. నా చుట్టూ ఉన్న సమస్యలకు సాహిత్యంలోనే సమాధానాలు దొరికేవి. సాహిత్యమే నన్ను నిలబెట్టింది. ప్రపంచం తెలిసి వచ్చింది. మనసులో బాధగా ఉన్నప్పుడు పుస్తకాలే తోడు.

నేటి తెలుగు కవిత్వంపై మీ అభిప్రాయం?

– శతాబ్దాలు కొనసాగిన బ్రాహ్మణీయ సాహిత్యం తర్వాత కొన్ని థాబ్దాలుగా దళితులు, స్త్రీలు, ముస్లింలు, బీసీలు సాహిత్యంలోకి వచ్చారు. వారి కవిత్వంతో నేడు తెలుగు సాహిత్యం సారవంతమైంది. బలమైన కవిత్వం, కథలు స్త్రీ, దళిత, ముస్లింవాదాల నుంచి వచ్చాయి.

మీ కవితలు ఏ ఏ భాషల్లోకి అనువదించబడ్డాయి?

– నా కవితలు ఇంగ్లీష్‌, జర్మనీ, హిందీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి.

పూర్వం ముస్లిం రచయితల రచనల్లో ఉర్దూ పదాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పటివారి రచనల్లో ఎక్కువ. దీనికేమైనా కారణాలున్నాయా?

-ఇప్పటి వారి రచనలు ఎవరి గురించి వారే రాస్తున్న క్రమంలో స్వంత అస్తిత్వాల గురించి రాసే క్రమంలో స్వంత భాషను ఉపయోగిస్తున్నారు. అందు వలన ఉర్దూ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చెరబండరాజు, గద్దర్‌, వంగపండులా పాటలు రాసేవారున్నారా?

– పాటలు రాసేవారు తక్కువ. నిసార్‌ అనే ఒక వాగ్గేయకారుడు రాస్తూ పాడుతూ ఉన్నారు. పాటల పుస్తకం వేశారు.

మీరు గజళ్లు ఎందుకు రాయలేదు? మీ తరంలో ఎవరైనా రాస్తున్నారా?

– గజల్‌ ప్రక్రియ ఉర్దూ భాషలోనే బాగా పలుకుతుంది. మా తరానికి ఉర్దూ రాదు కాబట్టి మేమెవరమూ గజల్‌ రాసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో దేశంలోనే పేరుపొందిన ఉర్దూ  కవులు ఉన్నారు. వారు ఎంతో రాసివున్నారు.

 

                                                                                                                ఇంటర్వ్యూ: స.రఘునాథ

 

 

 

సముద్రపు హోరుకి సరిగమల తోడు…మన్నాడే!

Manna-dey

“కడలిలెఒళవుం… కరళిలెమోహవుం.. అడజ్నుకిల్లొమనె అడజ్నుకిల్లా.. మానసమైనవరుం.. మధురం…”  అన్న మళయాళం పాట విన్నాను.

అబ్బ.. సముద్రపు హోరులో మెత్తగా సుతిమెత్తగా కలిసిపోయి ఆ స్వరం ఎవరిది? మన్నాడేది కాక?!

ఇరవై రెండుసార్లు ఆ సినిమా  ‘చెమ్మీన్’ చూశాను. సిల్వర్ స్క్రీన్ మీద చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లాంటిది ఆ సినిమా. దర్శకుడు రామూ కరియత్. సంగీత దర్శకుడు సలీల్ చౌధరి. నటీనటులు సత్యన్ , మధు, షీలా.. ఓహ్.. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఓ బెంగాలీ క్లాసికల్ సింగర్ ఓ మళయాళ చిత్రంలో పాడటమా? అసలెందుకు పాడించాల్సి వచ్చింది? ఎందుకూ? ఆ పాట ‘మన్నాడే’ మాత్రమే పాడగలడు. విన్న ‘చెవులకి’ ఆ సముద్రపు హోరుని తనొక్కడే వినిపించగలడు.

యస్. ఎస్.ఎల్.సి చదివేటప్పుడు మా ఇంట్లో రేడియో లేదు. హోటల్ రామారావు ముందర్నించి నడుస్తూ వుంటే రోజూ ఏదో ఓ సమయంలో ఓ పాట వినిపించేది. అతను హిందీ పాటలే ఎక్కువ వినేవాడు. ‘వివిధ్ భారతి’.. ఆ పాటకి అర్ధం అప్పుడు నాకు తెలీదు. కానీ .. గుండెకి గాయమై ఒక్కో రక్తపు బొట్టు కారుతుంటే, భగ్న హృదయానికి ఎలాంటి ‘తీయని’ బాధ వుంటుందో ఆ బాధ నా మనసుకి అర్ధమయ్యేది. అది నవరంగ్‌లోని పాట.
“తూ చుపీ హై కహా.. మై తడప్తా యహా” అన్న (నువ్వెక్కడ దాక్కున్నావూ.. నేనిక్కడ తపిస్తూ వున్నాను) గీతం అది. ఆలపించేది నేనే అనిపించేది. ఎన్ని పాటలూ? ఎందరో గాయకులున్నారు. గుండెలోతుల్లోంచి ‘విషాదాన్ని’ వెలికి తీసిన ముఖేష్, పాటకే సొబగులు అద్దే రఫీ..

మలయమారుతంలా తాకే తలత్, ఉత్సాహంతో వెర్రిగంతులు వేయించే కిషోర్.. ఎందరో మహానుభావులు… మరి ఆకాశంలోకి ‘స్వరాన్ని’ రాకెట్‌లా పంపే మహేంద్రకపూర్?  అవును. అందరూ మహానుభావులే…. కానీ… మన్నాడే వేరు.. మనిషికి బట్టలు తొడిగినట్టు పాటకి ‘శరీరాన్ని’ తొడుగుతాడు.

‘ధర్తి కహే పుకార్ కే’ (దో భీగా జమీన్)  పాట వింటుంటే మనమూ తుళ్లిపోతాం.
‘మౌసం బీతాజాయ్’ అంటూ.. ‘తూ ప్యార్ కా సగర్  హై.. తెరీ ఇక్ భూంద్ సే ప్యాసే హమ్’ అని మన్నాభాయ్ పాడుతుంటే కళ్లవెంట విషాదమో, ఆవేదనో కాని అశృవుల్ని రాలుస్తూ ‘ధ్యానం’ లో మునిగిపోతాం.. ఏమంటాడూ..?  నీవో ప్రేమసముద్రానివి.. ఒక్క చుక్క ప్రేమ చాలు మా దాహం తీరడానికి..’ అంటాడు. (సినిమా – సీమ, రచన – శైలేంద్ర). ‘ఇధర్ ఝూమ్ కె గాయె జిందగి.. ఉదర్ హై మౌత్ ఖడి ‘ అన్న లైను వినగానే తటాల్న మేలుకుంటాం. అవును.. ‘జీవితం ఇక్కడ చిందులేస్తుంటే, అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని సిద్ధంగా వుంది..’ ఎప్పుడు తనలో మనని కలుపుకుంటుందా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న వేసిందెవరూ?  ‘మనకి మనమేనా?’  అన్నంత మాయలో ముంచుతుంది మన్నాడే స్వరం.

వెన్నెల రాత్రుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ పాడుకునేవాడ్ని. ‘ఏ రాత్ భీగి భీగి..’ అంటూ. ‘చాంద్’ ఉండక్కర్లా… చీకటైనా విరహవేదనే.. ‘ఠండీ హవా!’ గుండెను తాకుతోంది మిత్రమా…!

‘సుర్ నా సజే.. క్యా గావూ మై.. సుర్ కే బినా జీవన్ సూనా..’ (శృతి చేయలేనివాడ్ని.. ఏమని పాడను? శృతి లేని జీవితం.. స్వరం లేని జీవితం శూన్యం కాదా?) దేన్ని సృశించాలి? దేన్ని ‘స్వరిం’చాలి? జీవితాన్నేగా..!

‘కోరి చునరియా ఆత్ మా  మోరీ.. మైల్ హై మాయాజాల్ .. ఓ దునియా మేరే బాబుల్ కా ఘర్.. ఏ దునియా ససురాల్’ తెల్లని వస్త్రం లాంటిది నా ఆత్మ.. యీ మాయాలోకం ‘మైల’ (మరకలతో) నిండి వున్నది. ఆ లోకం నా పుట్టిల్లు.. యీ లోకం అత్తవారిల్లు.. అయ్యో… యీ ‘మరక’ పడ్డ వస్త్రంతో నా ‘తండ్రి’కి మొహం ఎలా చూపించనూ? అని రెండు లోకాల్ని ఒకేసారి చూపించే మన్నా మన మద్యలో లేరా? వెళ్లిపోయారా ఆలోకానికి.. మాయ నిండిన యీలోకాన్ని వొదిలి?

‘లాగా  చునరీ మే దాగ్. చుపావు కైసే’ పాట ‘రానివాడు’ గాయకుడిగా అనర్హుడు. ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా, ‘పాటలపోటీ’ అంటూ జరిగితే మాత్రం యీ పాట ఎవరో ఒకరు పాడాల్సిందే. లేకపోతే అది ‘సంగీత కార్యక్రమం’ ఎందుకవుతుంది? తేనెపట్టులోంచి వరసగా తేనెచుక్కలు రాలినట్లు మన గుండెల మీద వాలుతాయి ఆ స్వరాలు.. అదీ.. మన్నా మేజిక్ అంటే.. అందరూ క్లాసికల్, సెమి క్లసికల్ సాంగ్స్ పాడగలరు. కానీ, మన్నాడే ‘స్టైల్’ వేరు. అత్యంత సహజంగా పాడతారు. గొంతు ‘పాట’ మొదలెట్టినప్పుడు ఎంత ‘ఫ్రెష్’గా వుంటుందో, చిట్టచివరి లైన్ కూడా అంతే ఫ్రెష్‌గా వుంటుంది. అదీ పాటలోని ‘ఎమోషన్స్’ని వెదజల్లుతూ..  బంగారానికి సువాసన అబ్బితే ఎలా ఉంటుందో తెలీదు గానీ, మన్నాడే ‘స్వరం’లో ఆయన పాడిన ప్రతీ పాటకీ ఓ ‘చిరునామా’  దొరుకుతుంది.

‘ఏ కజ్‌రారీ  చంచల్ అఖియా.. హోట్ గులాబీ..’ అని రాజ్‌కుమార్ అభినయిస్తుంటే పరవశించని హృదయం ఉన్నదా?  ‘ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయలియా’ పాటలో.. ఆ ‘పరవశం’ నింపింది మన్నాడే కాక మరెవరూ? నిజంగా మన్నాడే ‘జాదూ’ చేశారు.

‘కస్మే వాదే ప్యార్ వఫా.. సబ్ బాతే హై బాతోన్ కా క్యా?’ ఉప్‌కార్ సినిమాలో కళ్యాణ్‌జీ సంగీత నిర్దేశికత్వంలో ‘ఇందీవర్’ రాసిన యీ పాటని ‘మనసు’లోనే ‘ఆహ్వానించని మనిషి’ ఉండడు.

తేరీ సూరత్ మేరీ ఆంఖే’ సినిమాలో S.D.బర్మన్‌గారు శైలేంద్ర రాసిన ఓ అద్భుతమైన పాటని మన్నాడే చేత పాడించారు.

‘పూచోన కైసే మైనే రైన్ బితాయీ.. ఇక్ పల్ జైసే  ఇక్ యుగ్ బీతా.. యుగ్ బీతే మోహె నీంద్ నా ఆయే..’ శైలేంద్రగారి ‘భోజ్‌పురీ’ మెరుపులు చాలా సహజంగా మన్నాడే గొంతులో ఒదిగిపోయాయి. ముఖ్యంగా .. మోహే.. మోరా .. అనేవి. భాషకి అతీతుడేగా గాయకుడంటే! (స్నేహితులారా.. ఒక్కొక్క పాటనీ పూర్తిగా హిందీలో రాసి, తెలుగులో స్వేచ్చానువాదం  చేసి ‘వినిపించాలని’ వుంది. అంత పిచ్చెక్కుతోంది మన్నాడే పాటల్ని తలుచుకుని).

1965లో టాప్ 2nd  సాంగ్‌గా ‘బినాకా గీత్‌మాలా’లో వచ్చింది మన్నాడే పాడిన ‘ఆవో ట్విస్ట్ కరే’ పాట. మన్నాడే ఆ పాట పాడింది మెహ్‌మూద్ కోసం. సినిమా భూత్ బంగ్లా. సంగీతం ఆర్.డి.బర్మన్. రాసింది హస్రత్ జైపూరీ. పాయింట్లు 277. ఆయన ‘క్లాసికల్’ మాత్రమే కాదు ‘వెస్ట్రన్’ తోటీ ‘మేజిక్’ చెయ్యగలరని నిరూపించిన పాట అది. అదే సంవత్సరం రఫీ & మన్నాడే కలిసి పాడిన ‘ఏ దో దీవానే దిల్ కే చలే హై దేఖో మిల్ కే (జోహార్ మెహ్మూద్ ఇన్ గోవా.. సంగీతం-కళ్యాన్‌జీ- ఆనంద్‌జీ.. రచన కువర్ జలాలా బాదీ) 177 పాయింట్లతో 12వ పాటగా నిలిచింది. (మొత్తం 1965లో టాప్ 15 సాంగ్స్ లిస్ట్)

కాబూలీవాలా సినిమాలో ‘ఏ మేరే ప్యారే వతన్’ పాటని ఏ భారతీయుడైనా మర్చిపోతాడా? (సంగీతం సలీల్ చౌధరీ. రచన ప్రేమ్ ధవన్) అలాగే మరోపాట.. “పాడవోయి భారతీయుడా” అని శ్రీ శ్రీగారు రాసిన చిరస్మరణీయమైన పాట… హిందీలో సినిమా పేరు నాస్తిక్ (మన హైద్రాబాదీ ‘అజిత్’ హీరో. రాసింది ప్రదీప్.. సంగీతం సి.రామచంద్ర. ఆ పాట.. “దేఖ్ తేరే సంసార్‌కి  హాలత్ క్యా హోగయీ భగవాన్… కిత్‌నా బదల్ గయా ఇన్సాన్.” అనే పాట. ‘జానే అంజానే’ సినిమాలో శంకర్ జైకిషన్ స్వరపరచగా SH బిహారీ రాసిన “చమ్.. చమ్.. బాజేరే పాయలియా..!’  అనే పాట. అది గుండె చప్పుడుతో సహచర్యం చేస్తుంది. గుండెలో నాట్యం  చేయిస్తుంది. సీత ఔర్ గీతాలో ( ఆర్.డి. బర్మన్ – ఆనంద్ బక్షీ) ‘అభీ తో హాత్ మే జామ్ హై..’  పాటని ఎన్నిసార్లు ‘విస్కీ’తో ఆస్వాదించానో..

భయ్యా.. “దునియా బనానేవాలే.. క్యా తేరే మన్ మే”(శంకర్ జైకిషన్.. హస్రత్ జైపూరీ. సినిమా జిద్దీ) పాటలు వినకపోతే ‘కాహెకో దునియా బనాయీ? అని ఎలా ప్రశ్నించగలం? ‘బాత్ ఏక్ రాత్ కీ’లో ‘వో కిస్‌నే చిల్‌మన్ సే మారా… నజారా ముఝె.. ‘ (శంకర్ జైకిషన్.  మజ్రూహ్ రచన) అని మన్నాడే పాడుతుంటే పిచ్చెక్కదూ?

సోదరులారా.. సోదరీమణులారా.. క్షమించాలి. నా కళ్లు ‘నీలాల్ని’ వర్షిస్తున్నాయి. ఏడుపు తన్నుకొస్తుంది.

‘ఆజా సనమ్ మధుర్ చాంద్‌నీ మే హమ్..’   (శంకర్ జైకిషన్,  హస్రత్, చోరి చోరి సినిమా) ‘తుఝే సూరజ్ కహూ యా చందా (ఏక్ ఫూల్ దో మాలీ , కవి –  ప్రేమ్ ధవన్ రచన), కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే’ (మదన్‌మోహన్, రాజేంద్ర కృష్ణ. దేఖ్ కబీరా రోయా సినిమా), ‘శ్యామ్  ఢలే జమూన కినారే’ (తెలుగులో యమునా తీరమునా, సంధ్యా సమయమున…. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆనంద్ బక్షీ. పుష్పాంజలి సినిమా),’తుఝ్ బిన్ జీవన్, కైసే జీవన్(బావర్చీ సినిమా, మదన్‌మోహన్, కైఫీ ఆజ్మి), చునరీ సంభాల్ గోరీ.. ఉడీ చలీ జాయిరే (ఆర్.డి, మజ్రూహ్, బహారోన్ కి సప్నే సినిమా), మస్తీ భరా హై సమా…!’  (పర్వరిష్ సినిమా, హస్రత్ రచన, ఎన్.దత్తా) ‘తూ హై మేరా ప్రేమ్ దేవతా’ (ఓ.పి నయ్యర్, కమర్ జలాలాబాదీ, కల్పన సినిమా).

ఎన్ని పాటలు ఉదహరించను? భగవాన్. ఆయన మమ్మల్ని అలరించారు. పాటలతో మురిపించారు. నీలో మళ్లీ కలిసి పోవడానికి పుట్టింటికి అంటే నీ దగ్గరికి చేరిపోయారు. పోన్లే.. ” ఏ భాయ్ .. జరా దేఖ్ కే చలో’ అని మాకు జాగ్రత్తలు చెప్పే వెళ్లారుగా. జీవన వేదాంతం బోధించే వెళ్లారుగా.. ‘ కోయి బాత్ నహీ. ఫిర్ మిలేంగే’..

ఒకమాట చెప్పక తప్పదు. “వాలు జడ – తోలు బెల్టు ” అనే సినిమా జరిగేటప్పుడు ‘విజయబాపినీడు’గారు నన్ను “భువనచంద్రగారూ.. మీకు హిందీ అన్నా, హిందీ సాహిత్యమన్నా,  సినిమాలన్నా పిచ్చి కదా. మీకు నచ్చిన సీను, పాట చెప్పండి!” అంటే శ్రీ 420లోని సీను- దానిలో వచ్చే ‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా హై, ప్యార్ సె ఫిర్ క్యో డర్‌తా హై దిల్’ అనే పాటని పాడి వినిపించా. ఆయన అదే పాటని (తెలుగులో రాస్తే) ఆ సినిమాలో పెడదామన్నారు. నేను ఒప్పుకోలేదు. రాయలేక కాదు. కానీ, అంత గొప్ప పాట గౌరవాన్ని యధాతథంగా నిలుపుదామని) చివరికి విజయబాపినీడుగారు నా మాటని గౌరవించి బాలూ+చిత్రలతో ‘తననా’లలో ఆ పాట పాడించారు. ‘No Lyric’ ఇదే నేను మన్నాడే బ్రతికుండగా ఆయనకిచ్చిన గౌరవం. ఆ గౌరవం భద్రంగా నా గుండెల్లో (మీ గుండెల్లోనూ) జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ‘మన్నా’ మన గాయకుడు. మధురగాయకుడు.  శెలవు దాదా!

ఇందులో మన్నాడే జీవిత విశేషాలు ‘ఒక్కటి’ కూడా రాయలేదు. ఎందుకు రాయాలి? ఎవరికి తెలీదని?

పోనీ వచ్చే ఏడాది ఆయన్ని స్మరించుకుంటూ ఎన్నెన్నో ‘విశేషాలు’ రాస్తాను. సరేనా.. అయ్యా .. యీ వ్యాసంలో ఉదహరించినవి చాలా తక్కువ పాటలు మాత్రమే. అంత సూర్యుడిని అద్దంలో చూపించాను.

అంతే

మీ భువనచంద్ర..

అరచేతిలో తెల్లకాగితం

renuka

ఉత్తరం చేతివేళ్ళమధ్యలో

మెత్తని అడుగులతో  ఊపిరివేడిని మొసుకొచ్చి విప్పి చూడమని అడుగుతోంది

అలసిపో్యిన కనుల నలుపుచారలు దాటిన బిందువులు

అక్షరాలని తడిచేసి చెదురుమదురు చేసాయి

ఆశ్రమ పాకలో చీకటినిర్మించుకున్నప్పుడు

సవ్వడిలేని నిద్ర ధ్యాననిమగ్నతలో ఒరిగిపోయినప్పుడు

చీకటితో రాజీ కుదుర్చుకున్న చంద్రుడి వెలుగు మసకబారగానే

ఉత్తరం సన్నని వెలుగు వెచ్చదనంతో  చేతివేళ్లనుతాకి

పాటలోని పల్లవి శృతి మంద్రంలోకి దింపి

నర్మదా నదీ తీరాల వెంట పాలరాయి కొండలలో  ఊగే తెప్ప సవ్వడి

నిశ్శబ్ధంలో నింగికి చుక్కలు

Damerla-Rama-Rao

వేలయోజనాల దూరాన్ని దగ్గరచేసి చమ్కీలు కుట్టీ

పగటివెలుగు దాకదాచి లేఖలోకి ఒదగలేక

జారపోయిన అక్షరాలు

మెల్లగా అడుగుతున్నాయి

సందేశాన్ని వంపుతూ పదిలాన్ని ప్రశ్నిస్తూ

తప్పిపోయిందనుకున్న పరిచయం ముఖాన్ని వెదికింది

ముగింపులేకుండా ఏదో అడుగుతూనే వుంది

జాబు రాద్దమని కూర్చున్నానేగాని ఏది చిరునామ

ఊహలో ఊపిరిరెక్కలతో ఇక్కడికి చేరుకుంది

జ్జాపకాల రెల్లుపొదల్లొ చిక్కుకుపోయింది

అయినా అరిచేతులో నలుగుతున్న

తెల్లకాగితం మీద   రాస్తూన్నాను

పెరటి  తలుపు అడ్డగడియా తీసి

నూతిపళ్ళేం గట్టు మీదకూర్చుని…

రేణుక అయోల  

పాటల సముద్రం

akella

1

తీరం పరుపు

అలలు తలగడ

వెన్నెల దుప్పటి

ఒడ్డున పడుకుని

పదాల రేణువులతో చెలిమి చేస్తూ

2

పురా వేదనల్నీ

అసమ్మతి ఆత్మనీ

ఉపశమించడానికి

పాట తప్ప మార్గమేముంది?

3

బధ్ధకపు మబ్బులు కదలవు

బాగా  రాత్రయాకా

పడవలూ పక్షులూ

రెప్పలాడించని మదిలో

నేనింకా రాయని

లక్షల పాటలు బారులు తీరుతూ

Inner Child

4

సముద్రపు అనేక భంగిమల్ని

ఉదయాస్తమయాల రహస్య నిష్క్ర్రమణాల్నీ

జీవితపు అనంత సౌందర్యాల్నీ

అందరితో పంచుకుంటూ

నే చివరి దాకా

పాటల సముద్రం

పక్కనే నడుస్తూ

ఆకెళ్ళ రవిప్రకాష్

చీకటి దారి నడకలో…

విజయ్ కుమార్ ఎస్వీకె

విజయ్ కుమార్ ఎస్వీకె

జేబులో
కొన్ని
వెలుతురులు-

***

కలలో
నడకలా
దారంతా చీకటి-

గాఢత
నిండిన గాలీ
భయపెడ్తూ
చెవులు
కొరికేస్తూ-

నిశ్శబ్దంలో
మరో
నిశ్శభ్దాన్ని
మోస్తూ-

సాగే
కాళ్ళూ
ఆగేంత
కలవరం-

దూరం
తగ్గకా
దగ్గర
దగ్గరవకా-

గతం
ముందు బతుకూ
ఖాళీ మెదడులో
మూలన మెరిసీ
కనులు చిట్లీ
శవం మోస్తున్న
భావన-

***

జేబులో
కొన్ని
వెలుతురులు:

చీకటితో
పోరాటం
చేసీ చేసీ
వోడిపోయ్-

వెలుతురు
నడకా
క్రమంగా

చీకటై-

flower-22170-76253

ఇంకో కవిత:

కొన్ని వాన చినుకుల ముద్దు

 

వాన చినుకు
మట్టి వాసన
ఊపిరి పోసుకున్న
నేను-

దారంతా
కమ్ముకున్న మేఘం
మా యింటికి-

ఆనందించే
పెదవులు
కనుల్లో
తడి-

ఒక బొట్టు
నేల రాలిన
బంగారం-

ఆకాశం వంక
మొఖం
చినుకుల ముద్దు-
చినుకు తడి
నాలోకి
నేను చినుకులతో పాటూ
నేలలోకి-

-విజయ్ కుమార్ ఎస్వీకే

అలల చేతివేళ్లతో..

sudhakar

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
ఆకాశం చిన్నబోతుంది
ఆకాశాన్ని అల్లి
లోకం మీద పరిచిన సృజనకారుడెవరో..

ఆకాశమొక పిట్టగూడు

ఏ పురాతన ఆదిమజాతి
మానవుడో
శరీరమ్మీద ఆచ్ఛాదన లేని దశలో
ఆకాశాన్ని వస్త్రంగా నేసి ధరించి ఉంటాడు
పచ్చని చెట్లు
శరీరమ్మీద మొలిచిన తర్వాత
ఆకాశాన్ని..
లోకమ్మీదకు విసిరేసుంటాడు

sky2

అలలా కదులుతున్న ఆ చేతివేళ్ల
నైపుణ్యం ముందు..
సూరీడు చిన్నబోతాడు
ఆ చేతివేళ్ల కిరణ సముదాయం-
ఎన్నెన్ని పద్మవ్యూహాల చిక్కుదారులను ఛేదించి
బయటపడే మార్గానికై అన్వేషిస్తుందో..

ఆ అలల చేతి చూపుడు వ్రేణి
కొనగోటిపై
ఎక్కడ నుంచో వచ్చి వాలిన
పేరు తెలియని పక్షి
రెక్కలల్లార్చుతూ కనిపిస్తుంటుంది
పక్షి కన్నుల్లో ఏకాగ్రత
అతని సొంతం
కళ్లు ‘చిగుర్ల’ను పొదుగుతాయి
అన్వేషణే పరమావధిగా భావించే
ఆ చేతివేళ్లు
వృక్షాలౌతాయి

ఆ చేతివేళ్ల వృక్ష సముచ్ఛయాలపై చిగుర్చిన
చిగురుకళ్లకు –
ఒక్కో గూడు ఒక్కో దేశంగా
ఒక్కో దేశం ఒక్కో అరణ్యంగా
కనిపిస్తుంది

దేశ దేశాల గూళ్లనూ
గూళ్లలో ఆకాశాలనూ నేసిన
ఆ చేతివేళ్లు
తన గూటిపై పరుచుకున్న చిరుగుల ఆకాశాన్ని
సరిచేసుకోవాలంటే..

ఇంకెన్నెన్ని ఉదయాలను కలగనాలో..

– బాల సుధాకర్ మౌళి

వీలునామా -18వ భాగం

శారద

శారద

కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఎల్సీ పరిస్థితి

ఎల్సీ గురించి జేన్ ఆందోళనపడడంలో విపరీతమేమీ లేదు. నిజానికి జేన్ ఊహించినదానికన్న ఎక్కువగానే ఎల్సీ మానసిక శారీరక ఆరోగ్యాలు దిగజారుతున్నాయి. ధైర్యంగా శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనికి వెళ్తోంది కానీ అక్క తోడు లేని ఆమెని ఒంటరితనం లోపల్నించి తినేస్తూంది.

జేన్ కి కూడా చెల్లెలు లేకపోవడం తో కొంచెం ఒంటరిగా అనిపించిన మాటా నిజమే, కానీ ఫిలిప్స్ ఇంట్లో పిల్లలతో, లిల్లీతో, అప్పుడప్పుడూ వచ్చే బ్రాండన్ తో ఆమెకి బాగా పొద్దు గడిచేది. పైగా అక్కడ ఆస్ట్రేలియానించి ఇంటికి తిరిగొచ్చే స్నేహితులతో ఫిలిప్స్ ఇల్లు చాలా సందడిగా వుండేది. వాళ్ళందర్నీ గమనించడం, వాళ్ళ మాటల్ని విని అర్థం చేసుకోవడం, ఆస్ట్రేలియాలో జీవితాన్ని గురించి తెలుసుకోవడం జేన్ కి భలే కాలక్షేపంగా వుండడంతో చెల్లెలి మీద బెంగ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. జేన్ ఈ సంభాషణల గురించి ఉత్తరాల్లో రాసేది. తనకి అలాటి తెలివైన స్నేహితులు లేనందుకూ, తను రాసే ఉత్తరాలు చాలా నిరాసక్తంగా వున్నందుకూ ఎల్సీ ఎంతో బాధపడేది.

ఇంటికి వచ్చి ఎంత అలసిపోయినా లౌరీ పిల్లలకి అక్క అలవాటు చేసిన క్రమశిక్షణ మరచిపోనివ్వలేదు ఎల్సీ. వాళ్ళని రాత్రి పూట అక్కలాగే కూర్చోబెట్టి చదివించడం, వాళ్ళ పుస్తకాలవీ సరిదిద్దడం చేసేది. కానీ టాం అడిగే చిక్కు ప్రశ్నలకి ఆమె దగ్గర సమాధానాలుండేవి కావు. ఆమె కవిత్వమూ మొత్తానికి మూలపడింది. ఎంత ప్రయత్నించినా ఒక్క పంక్తి కూడా రాయలేకపోయింది చాలా రోజులు.

అక్కతో కలిసి నడిచినప్పుడు ఆహ్లాదంగా, సరదాగా అనిపించిన నడక ఇప్పుడు దుర్భరంగా అనిపిస్తూంది. పొద్దున్నే పెగ్గీ ఇంటినుంచి డూన్ గారి కొట్టుకి నడిచే దారిలో వుండే చిన్న చిన్న ఇళ్ళూ, వాటికి అన్నిటికీ ఒకేలా వుండే రంగులూ, ద్వారాలూ, కిటికీలూ అన్నీ తనని చూసి ఎగతాళి చేస్తూన్నట్టనిపించేవామెకు. స్వతహాగా ఆమె అక్కలా శారీరకంగా, మానసికంగా దృఢమైన మనిషి కాదు. దానికి తోడు ఎడిన్ బరో లో వీచే చల్లటి గాలులూ, ఏదో ఆదరాబాదరాగా తినే తిండీ, కృంగిపోతున్న మనస్సూ అన్నీ ఆమె ఆరోగ్యం మీద దాడి చేసాయి. రోజురోజుకీ ఆమె మొహం మరింతగా పాలిపోతూ, ఆకలి మందగిస్తూ, దగ్గుతో సతమతమవసాగింది.

అయితే ఎంతో ఆత్మాభిమానం కలది కావడంతో కూర్చుని పెగ్గీ సంపాదన తినలేక దర్జీ కోట్లో కష్టపడేది. శ్రీమతి డూన్ కొద్ది రోజుల్లోనే ఎల్సీకిచ్చే జీతాన్ని పెంచింది. ఎల్సీకి సహాయం చేసే ఉద్దేశ్యమేనో మరింకేమిటో కానీ, రెన్నీ గారమ్మాయి ఎలీజా తల్లిని బలవంతం చేసి డూన్ కొట్లోనే తమ బట్టలు కుట్టించుకునేది. ఆమెతో బాటు లారా విల్సన్ కూడా వచ్చి స్వయంగా ఎల్సీ తోటే తమ బట్టలు కుట్టించుకున్నారు. వాళ్ళ ఊరి నుంచీ చాలా మంది స్త్రీలు కేవలం ఎల్సీని చూడడానికి డూన్ దుకాణానికొచ్చి తమ బట్టలు కుట్టించుకోవడం మొదలు పెట్టారు. పెరిగిన అమ్మకాలు చూసి డూన్ సంతోషించినా, వెనకటి పరిచయస్తులను ఇలాటి దిగజారిన పరిస్థితులలో చూడడం ఎల్సీకి ప్రాణాంతకంగా వుండేది.

అలాటి రోజుల్లో ఒకరోజు-

veelunama11

ఎలీజా రెన్నీ, లారా విల్సన్ ఇద్దరూ దుకాణానికొచ్చి బట్టలు చూడడం మొదలుపెట్టారు. ఇద్దరూ చాలా సంతోషంగా వెలిగిపోతున్న మొహాలతో హడావిడిగా అనిపించారు. లారా ఫాషన్ పత్రికలు తెరిచి తనకి కావాల్సిన డిజైన్లు ఎన్నిక చేసుకుంటూంటే ఎలీజా ఎల్సీ పక్కకొచ్చి చేరింది. మెల్లిగా గుసగుసగా-

“ఎల్సీ ! అంతా నిశ్చయమైపోయినట్లే! లారాకీ, విలియం డాల్జెల్ కీ పెళ్ళి కుదిరిపోయింది. అదేనోయ్, మీ వూళ్ళో మీ స్నేహితుడూ, మీ అక్కయ్యని ఇష్టపడ్డాడూ, విలియం డాల్జెల్!  ఆ, అతనితోనే! పెళ్ళి కుదిరిపోయింది.  పెళ్ళి బట్టలు కుట్టించడానికి ఇక్కడికే వొస్తుంది చూడు! నన్నడిగితే డూన్ నీకెంతో ఋణ పడి వుండాలి. నువ్వు లేకపోతే మేమసలు ఇలాంటి దుకాణాలవైపే  రాము. అయినా, భలే పెళ్ళిలే! మీ అక్కయ్యకంటే ఎందులో గొప్పని ఈ లారా ని ఆ డాల్జెల్ పెళ్ళాడుతున్నాడో ఆ దేవుడికే ఎరుక! అంతా డబ్బు మహిమ! ఏం చేస్తాం. అయినా లారా డబ్బూ ఆస్తీ అంతా తన పేరునే వుండేలా చూసుకుంటుంది. నాన్నారేకదా ఆమె ఆస్తికి ట్రస్టీ. అంతా పకడ్బందీగా ఏర్పాటు చేయించుకుంది. చూడ్డానికలా వుంది గానీ, మహా గడుసుది. పద్దెనిమిదేళ్ళకే పెళ్ళి కూతుర్నవుతున్నానని మహా మురిసిపోతూందిలే! అయినా డబ్బు కొరకు కాకపోతే దాన్ని పెళ్ళాడేదెవరు! వెధవ నోరూ, అదీనూ! విలియం మాత్రం ఏమన్నా తక్కువ వాడా? ఎంత బాగుంటేనేం, నక్క వినయాలూ వాడూ! నాకైతే విలియం మొహానికి అంటించుకునే ఆ నవ్వూ, అతని అతి వినయాలూ చూస్తూంటే ఒళ్ళు మండుతుంది. తొందరగా ఈ పెళ్ళి అయిపోతే బాగుండు బాబూ! నాకు వీళ్ళ బోరు తప్పుతుంది. ఆ, ఆ, వస్తూన్నా లారా! నచ్చిన డిజైన్లన్నీ చూసుకున్నావా?”

“ఎలీజా! ఇంత ఖరీదైన పెళ్ళి బట్టలు కుట్టడం నావల్లేమవుతుంది?  మీరు మేడం డిఫో దగ్గరకెళ్ళడం మంచిదేమో!” ఎల్సీ మృదువుగా అంది.

“ఏమో బాబూ ! లారాకి నువ్వు ఎన్నిక చేసే రంగులు బాగా నచ్చుతాయట. నాకూ ఆ డిఫో ఎన్నికలకంటే నీ అభిరుచే నచ్చుతుంది!” గారంగా అంది ఎలీజా రెన్నీ.

“అదేమో కానీ, ఇప్పుడు నాకిక్కడ తీరిక లేనంత పని వుంది. పెళ్ళి బట్టలు డిజైను చేసి కుట్టేంత తీరిక లేదు ఎలీజా! అదిగో చూడు, ఎవరో వస్తున్నారు. నేను మీతో తర్వాత మాట్లాడతాను. అసలు మీరు డిఫో దగ్గరకెళ్ళడం మంచిది.”  అక్కణ్ణించి లేచి వెళ్తూ అంది ఎల్సీ. ఆమెకెందుకో లారా విల్సన్ ని చూస్తే ఒళ్ళంతా కారం రాసుకున్నంత మంటగా వుంది. అప్పుడే తలుపు తెరుచుకుని ఒక పెద్దవిడ ఒక పదమూడేళ్ళ అమ్మాయితో లోనకొస్తూంది. వాళ్ళని చూసి ఎల్సీ కంటే ముందు ఎలీజా రెన్నీ లేచి వాళ్ళ ముందుకొచ్చింది.

“అరే! మిస్ థాంసన్! బాగున్నారా? మీ వూర్నించి ఎడిన్ బరో ఎప్పుడొచ్చారు? మా అమ్మ మిమ్మల్ని బాగా తలచుకుంటూంది. తప్పక మా ఇంటికి రావాలి. వూళ్ళో అంతా ఎలా వున్నారు?” చనువుగా ఆవిడని అడిగింది.

“హలో మిస్ రెన్నీ! బాగున్నారా? కొద్ది రోజులు ఎడిన్ బరో లో వుంటాను. తప్పక ఇంటికొచ్చి అమ్మని కలుస్తాను,” మర్యాద పూర్వకంగా అంది మిస్ థాంసన్.

“ఈ అమ్మాయెవరు? మీ మేనకోడలా?”

“అవును ఎలీజా! దీని పేరు గ్రేస్. బాగా చదువుతుంది. వచ్చే వారం ఏదో స్నేహితురాలి పార్టీ వుందిట. దానికోసం ఒక మంచి గౌను కుట్టిద్దామని ఇలా వచ్చాం.”

“అవునా? ఇక్కడ బట్టలు కుట్టరు. ఇక్కడ రంగులూ బట్టలూ ఎన్నిక చేస్తారు. పక్క గదిలో కుట్టించుకోవచ్చు,” ఎలీజా సలహా ఇచ్చింది.

“అలాగా! అయితే నాకూ కొంచెం ఒక టోపీ, షాలూ కావాలి. అవన్నీ ఎన్నిక చేసుకుని గౌను కుట్టించటడానికి తిసికెళ్తా,” అని ఎల్సీ వైపు తిరిగింది మిస్ థాంసన్.

“అన్నట్టు మీరు చిన్న మెల్విల్ అమ్మాయి కదూ? ఆ మధ్య మీ అక్కయ్య జేన్ నన్ను కలవడానికొచ్చింది. ”

“అవునండీ!”

“అదీ సంగతి! ఎక్కడో చూసిన మొహం లాగుందే అనుకున్నాను. మీరిద్దరూ ఇంచుమించు ఒకేలాగున్నారు. మీ అక్కయ్య ఆస్ట్రేలియన్ల ఇంట్లో గవర్నెసు గా చేరిందట కదా? మంచి పని చేసింది. ఆమెని అందరూ మెచ్చుకుంటూంటే భలే సంతోషం వేసిందనుకో! మరి నీ సంగతేంటి? నువ్విక్కడ పని చేస్తున్నావల్లే వుందే! సంతోషం. చిన్నదో పెద్దదో, మనకంటూ ఒక వృత్తి వుండడం మంచిది.”

నవ్వింది ఎల్సీ.

“అది సరే కానీ, నాకు ఒక టోపీ, ఒక షాలూ కొంచెం తయారు చేసి పెడతావా? నాకింతకు ముందు తయారు చేసిన ఆవిడ బలే కొత్త ఫాషన్లతో చేసేది కానీ, ఆ టోపీ నా తల మీద నిలవనే నిలవదు. ఇహ ఎందుకా ఫాషను? కాల్చనా?”

మళ్ళీ నవ్వేసింది ఎల్సీ.

“అలాగే చేస్తాలెండి. మా పెగ్గీ కి చేసినట్టు చేసిస్తా, కొంచెం ఫాషన్ గా ,కొంచెం సౌకర్యంగా వుండేటట్టు చేస్తా, సరేనా?”

“నాకు ఫాషన్ కంటే సౌకర్యం ఎక్కువ ఇష్టం! అది సరే! నువ్వు పెగ్గీ ఇంట్లోనే వుంటున్నావా? తిండి సరిగ్గా తినడంలేదా? ఇంత చిక్కిపోయవ్!”

“పెగ్గీ చాలా మంచిదండీ! అక్కడ నాకేమీ కష్టం లేదు. ఈ మధ్య కొంచెం ఒంట్లో నలతగా వుంది, అంతే. అదే కాకుండా నాకు జేన్ మీద బెంగ ఎక్కువయింది. అన్నట్టు ఫిలిప్స్ గారి సతీమణి నన్ను వాళ్ళింట్లో కొన్ని వారాలు ఉండేలా రమ్మని ఆహ్వానించారు. ఒక సారలా వెళ్ళొస్తే నా ఆరోగ్యం సర్దుకుంటుంది.” ఎల్సీ ధైర్యంగా అంది.

“అది మంచి ఆలోచన. అన్నట్టు మీ బావ, ఫ్రాన్సిస్, ఎస్టేటులో చాలా మార్పులు చేస్తున్నాడు.”

“అవునా? మార్పులతో అందరూ అంగీకరిస్తున్నారా?”

“అందరి సంగతేమోకానీ, నావరకు నాకైతే, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగుండలే. పాలేర్లకు చిన్న చిన్న ఇళ్ళివ్వడం మంచి ఆలోచనే, కానీ, వాళ్ళకి స్వంతంగా భూములు కూడా ఇచ్చేయాలా? అయితే, నేనూ మా పొలంలో పని చేసే పాలేర్లకోసం చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నాను.”

“అది సరే కానీ, మిస్ థాంసన్, మీ ఊళ్ళోకి ఒక కొత్త పెళ్ళికూతురు రాబోతున్నట్టు మీకు తెల్సా? అమ్మ మీతో మాట్లాడాలనుకున్నది దాని గురించే, ” మధ్యలో అందుకుంది ఎలీజా రెన్నీ.

“అదేనండీ! లారా విల్సన్ విలియాం డాల్జెల్ ని పెళ్ళాడబోతున్నట్టు మీకింకా తెలియదా?” తనే పొడిగించింది.

“ఓ! అలాగా? వచ్చి మీ అమ్మని కలుస్తాలే. అలాగే ఒకసారి పెగ్గీ వాకర్ ని కూడా చూడాలి,” అంటూ మిస్ థాంసన్ మేన కోడలికి గౌను కొలతలు చెప్పడం కోసం పక్క గదిలోకెళ్ళింది.

లారా పెళ్ళి దగ్గరకొచ్చేసరికి తాను ఈ కొట్టులో కుట్టు పని మానేయగలిగితే బాగుండు అనుకుంది ఎల్సీ. ఆ సాయంత్రం పని ముగించుకొని ఇల్లు చేరేటప్పటికి బ్రాండన్ వచ్చి పెగ్గీతోనూ, తాతగారు థామస్ లౌరీ తోనూ కబుర్లు చెప్తూ కూర్చొని వున్నాడు.

డాక్టరు ఫిలిప్స్ గారు ఎల్సీకి డెర్బీ షైర్ రావడానికి వీలవుతుందేమోనని కనుక్కోమన్నారట. అక్కడ ఒక వారం పది రోజులు చిన్న ఫిలిప్ కుటుంబమూ, జేన్ అందరితో గడిపి, అందరూ కలిసి లండన్ వెళ్ళాలన్న ఆలోచనలో వున్నారు.

అంత తొందరగా అక్కను చూడగలగటం ఎల్సీకి ఎంతగానో నచ్చింది. తనకోసం అంత శ్రమ తీసుకొని ఎడిన్ బరో వచ్చినందుకు బ్రాండన్ కి పదేపదే ధన్యవాదాలు చెప్పింది ఎల్సీ.

(సశేషం)

ఆదర్శ మిలియనీర్

ఆస్కార్ వైల్డ్

ఆస్కార్ వైల్డ్

 

సంపద లేకుంటే మనిషి ఎంత ఆకర్షణీయంగాఉన్నా ఉపయోగం లేదు. కొత్తది, ఇష్టమైనది అనుభవించగలగడం డబ్బున్నవాళ్ళ ప్రత్యేకతగాని నిరుద్యోగుల నిత్యకృత్యం కాదు. డబ్బులేనివాళ్ళెప్పుడూ నిస్సారంగాజీవిస్తూ ఏది అందుబాటులోఉంటే దాన్ని అనుభవించడం నేర్చుకోవలసిందే. మనిషి మనోహరంగా కనిపించడంకంటే, స్థిరమైన ఆదాయంవచ్చే ఉద్యోగం కలిగి ఉండడం మేలు. ఈ ఆధునిక సత్యాలేవీ హ్యూయీ ఎర్స్కిన్ కి వంటబట్టలేదు. పాపం హ్యూయీ!  తెలివితేటల విషయంలో, ఏ మాటకి ఆ మాటే ఒప్పుకోవాలి, అతనంత చెప్పుకోదగ్గవాడేం కాడు.

అతని జీవితకాలంలో ఒక సరసమైన మాట, కనీసం విరసమైనదికూడా చెప్పి ఎరగడు. అయితేనేం, చూడడానికి బహుచక్కగా ఉంటాడు… గోధుమరంగు ఉంగరాలజుత్తూ, చక్కనికళ్ళూ, తీర్చినట్టున్న ముఖంతో. అతనికి మగవాళ్ళలో ఎంత పేరుందో, ఆడవాళ్లలోనూ అంత ప్రఖ్యాతి ఉంది, అతనికి అన్ని ప్రావీణ్యతలూ ఉన్నాయి… ఒక్క డబ్బు సంపాదించగల నేర్పు తప్ప. వాళ్ళ నాన్న అతనికి వారసత్వంగా మిగిల్చినవి… తను ఆశ్వికదళంలో పనిచేసినప్పటి కత్తీ, “A History of Peninsular War” 15 సంపుటాలూ. హ్యూయీ మొదటిదాన్ని తన అద్దంముందు వేలాడదీశాడు, రెండోవి పుస్తకాలబీరువాలో Ruff’s Guide కీ, Bailey’s Magazine కీ మధ్య (ఈ రెండూ గుర్రపు పందాలకు సంబంధించినవి) దాచి, అతని ముసలి మేనత్త ఏర్పాటుచేసిన సాలుకి రెండువందల పౌండ్ల జీవన భృతితో కాలక్షేపం చేస్తున్నాడు.

అతను చెయ్యని ప్రయత్నం లేదు.  ఆరునెలలపాటు స్టాక్ ఎక్స్ఛేంజిలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కూడా; అయినా, బుల్స్ కీ బేర్స్ కీ మధ్య పాపం సీతాకోకచిలుకకి పనేమిటి? అంతకంటే ఎక్కువకాలమే టీ వ్యాపారంలో వేలుపెట్టేడు, కానీ ‘పెకో’ తోటీ ‘సూచాంగ్’ తోటీ విసిగెత్తిపోయాడు. తర్వాత అతను ‘డ్రై షెరీ’ అమ్మడానికి ప్రయత్నించేడు. అదీ ఫలితం లేకపోయింది; షెరీ మరీమందకొడిగా సాగింది. చివరికి అతను ఏదీ కాకుండాపోయాడు… ఎందుకూ కొరగాని, ఏ వ్యాపకమూ లేని, ఆహ్లాదకరమైన అందమైన యువకుడిగా మిగిలిపోయాడు.

ఇది చాలనట్టు, అతను ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన పిల్ల పేరు లారామెర్టన్ … ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అతని నిగ్రహాన్నీ, జీర్ణక్రియనీ పోగోట్టుకుని, అందులో ఏదీ తిరిగిపొందలేకపోయిన ఒక రిటైర్డ్ కల్నల్ కూతురు. లారాకి అతనంటే ఆరాధన, అతనామె పాదాలనుసైతం ముద్దుపెట్టుకుందికి సిద్ధం. లండనులో అత్యంత సుందరమైనజంటగా గుర్తించబడ్డారు గాని, వాళ్ళిద్దరి దగ్గరా తంతే దమ్మిడీ లేదు.  కల్నల్ కి హ్యూయీ అంటే ఇష్టమే గాని అతని దగ్గర  పెళ్ళి ఊసు మాత్రం ఎత్తకూడదు.

“కుర్రాడా, నీ దగ్గర పదివేలపౌండ్లు చేకూరినపుడు కనిపించు. అప్పుడు పెళ్ళిమాట ఆలోచిద్దాం,” అని అంటూండేవాడు ఈ విషయం వచ్చినప్పుడల్లా. ఆ రోజు హ్యూయీ ముఖం విచారంగా వేలాడేసుకుని, మళ్ళీ లారా దగ్గరకే చేరేవాడు ఉపశమనం కోసం.

ఓ రోజు, హ్యూయీ మెర్టన్స్ నివసిస్తున్న హాలండ్ పార్కుకి వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో అతని ఆప్తమిత్రుడు ఏలన్ ట్రెవర్ దగ్గరకి వెళ్ళేడు. అతనొక చిత్రకారుడు.  ఈ రోజుల్లో చిత్రకారుడు కాకుండా ఎవడూ ఉండలేడనుకొండి. అదివేరే సంగతి. అయితే అతను కళాకారుడు కూడా. కళాకారులు మాత్రం చాలా అరుదు. మనిషి చూడ్డానికి మహా చిత్రంగా, మొరటుగా, ముడతలు పడిన ముఖం, ఎర్రని చింపిరిగడ్డంతో కనిపిస్తాడు. కానీ, ఒకసారి కుంచె పట్టుకున్నాడా, అతనిలో ఒక మహాకళాకారుడు కనిపిస్తాడు. అతని బొమ్మలంటే ప్రజలు ఎగబడి కొనుక్కుంటారు. అతనికి మొదటగా హ్యూయీ అంటే ఇష్టం కలగడానికి కేవలం అతని రూపమే కారణం అని చెప్పక తప్పదు. తరచుగా అతను, “ఒక చిత్రకారుడు ఎటువంటి వాళ్లతో స్నేహం చెయ్యాలంటే సహజమైన అందంతో, జీవకళతో ఉట్టిపడే వాళ్ళూ, కళాత్మక దృష్టితో చూసినపుడు ఆహ్లాదం కలిగించే వాళ్ళూ, మేధోపరమైన చర్చలకు పనికొచ్చేవాళ్ళూ,” అని అంటుండేవాడు. అయితే హ్యూయీగురించి బాగా తెలుసుకున్నకొద్దీ, అతనిలో తొణికిసలాడే ఉత్సాహానికీ, దేన్నీ లక్ష్యపెట్టని స్వభావానికీ కూడా ఇష్టపడి, అతను ఎప్పుడు పడితే అప్పుడు అతని చిత్రశాలలోకి రావడానికి  అనుమతి ఇచ్చేడు.

2

హ్యూయీ లోపలికి వచ్చే వేళకి ట్రెవర్ ఒక నిలువెత్తు బిచ్చగాడి అద్భుతమైన చిత్రానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. ఆ బిచ్చగాడే స్వయంగా చిత్రశాలకి ఒకమూల ఎత్తైన ఒక అరుగుమీద కూచున్నాడు. ఆ వ్యక్తి … బాగా చిక్కిపోయి, నలిపేసిన కాగితంలా ముఖంమీద ముడుతలతో, జాలిగొలిపే ఒక ముసలివగ్గు.  అతని భుజాలమీద బాగా మరకలుపడి చిరుగులైన ఒక ముతక గోధుమరంగు దుప్పటీ ఉంది; అతని కాలికి తొడుక్కున్న దుక్కబూట్లు అతుకులుబొతుకులుతో ఉన్నాయి; ఒక చేత్తో నాటుకర్ర పట్టుకుని దానిమీద ఆనుకుని, రెండో చేత్తో చివికిపోయిన ఒక టోపీ పట్టుకుని ఉన్నాడు అడుక్కుందికి.

“ఎంత అద్భుతమైన మోడల్!” అని గుసగుసలాడేడు హ్యూయీ మిత్రుడితో చేతులుకలిపి అభినందిస్తూ.

“అద్భుతమైన మోడలా?” అనిగట్టిగా అరిచేడు ట్రెవర్; వెంటనే సంబాళించుకుని, “అవును, అవును, ఒప్పుకోక తప్పదు. ఇలాంటి బిచ్చగాళ్ళు మనకి రోజూ తగలరు. నిజానికి ఇతనొక అద్భుతమైన ఆవిష్కరణ. మరుగుపడ్డ మాణిక్యం. ఒక జీవం ఉట్టిపడే వెలాక్జెజ్! నా అదృష్టం. ఇదే రెంబ్రాంట్ అయితే ఇతనితో ఎంత గొప్ప కళాఖండాన్ని తీర్చి దిద్దుండేవాడో!

“ఫాపం ముసలాడు!” అని నిట్టుర్చాడు హ్యూయీ, “ఎంత దయనీయంగా కనిపిస్తున్నాడు!  కానీ, మీలాంటి చిత్రకారులకి అతనొక నిధి అనుకుంటాను,” అన్నాడు మళ్ళీ.

“సందేహం లేదు,” అన్నాడు ట్రెవర్. “అయినా, నువ్వు బిచ్చగాడు ఆనందంగా కనిపించాలని అనుకోవు, అవునా?” అని అడిగేడు.

“ఇంతకీ, ఈ మోడల్ కి ఇలా కూచున్నందుకు ఎంత కిడుతుందేమిటి?” కుతూహలంగా అడిగేడు హ్యూయీ, దీవాన్ మీద అనుకూలమైన జాగా చూసుకుని కూర్చుంటూ.

“గంటకి ఒక షిల్లింగు.”

“ఏలన్, మరి నీ చిత్రానికి ఎంత దొరుకుతుంది?”

“ఓహ్! దీనికా? దీనికయితే రెండువేలు!”

‘పౌండ్లా?”

“కాదు. గినీస్1. చిత్రకారులకీ, కవులకీ, డాక్టర్లకీ ఇచ్చేది గినీలలో.”

“అలా అయితే, నా ఉద్దేశ్యంలో ఈ మోడల్ కి కూడా అందులో కొంతభాగం దక్కాలి,” అన్నాడు హ్యూయీ నవ్వుతూ; “పాపం, వాళ్ళుకూడా మీ అంత కష్టపడుతున్నారు.”

“అలాంటి పిచ్చి మాటలు మాటాడకు. చూడు! ఒక్కణ్ణీ ఈ ఈజెల్ పక్కన రోజల్లా నిలబడి ఇలా రంగుపులమడం ఎంత కష్టమో! హ్యూయీ! నీలాంటి వాళ్ళు అలా మాటాడడం బాగానే ఉంటుంది కానీ, ఒకోసారి, కళ కూడా శరీరశ్రమ అంత గౌరవాన్ని2 సంతరించుకునే సందర్భాలు ఉంటాయని నీకు చెప్పక తప్పదు. కనుక నువ్వు పిచ్చిపిచ్చిగా మాటాడకు; నేను పనిలో నిమగ్నమై ఉన్నాను. హాయిగా సిగరెట్టు తాక్కుంటూ, బుద్ధిగా మాటాడకుండా కూచో!”

wilde

3

కొంతసేపు గడిచేక, ఒక సేవకుడు ప్రవేశించి చిత్రాలకి పటంకట్టేవాడు అతనితో మాటాడడానికి వచ్చేడని ట్రెవర్ తో చెప్పేడు.

“హ్యూయీ, పారిపోకు, ఇప్పుడే క్షణంలో వచ్చేస్తా,” అని బయటకి వెళ్ళేడు ట్రెవర్.

ట్రెవర్ అలా బయటకి వెళ్ళడం గమనించి, ఆ ముసలి బిచ్చగాడు తన వెనక ఉన్న కర్రబెంచీమీద కాసేపు విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నాడు ట్రెవర్ తిరిగి వచ్చేదాకా.  అతను ఎంత దిక్కుమాలిన, దౌర్భాగ్యస్థితిలో కనిపించేడంటే, హ్యూయీ జాలిపడకుండా ఉండలేక, అతనిజేబులో ఏమైనా కాసులున్నాయేమోనని తణుము కున్నాడు. అతనికి ఒక సావరిన్ (పౌండ్) మరికొన్ని చిల్లర పెన్నీలూ దొరికేయి.  “పాపం, నిర్భాగ్యుడు,” అని మనసులో  అనుకుని, ” నాకంటే అతనికే వీటి అవసరం ఎక్కువ, కానీ, ఇవి లేకపోవడమంటే, పదిహేను రోజులపాటు వాహనయోగం లేనట్టే,”  అని మనసులో అనుకుని, స్టూడియోలో ఆ చివరకి నడిచి బిచ్చగాడి చేతిలో ఉంచాడు.

ఆ బిచ్చగాడు ఒక్కసారి గతుక్కుమన్నాడు. కనీ కనపడని చిరునవ్వొకటి అతని వడలిన పెదాలమీద దొర్లింది. హ్యూయీకి ఎన్నో ధన్యవాదాలు చెప్పేడు.

ట్రెవర్ వచ్చినతర్వాత హ్యూయీ శలవుతీసుకున్నాడు, తను చేసిన పనికి కొంచెం సిగ్గుపడుతూనే.  ఆ రోజంతా లారాతో గడిపి, అతని ఔదార్యానికి ఆమెతో నాలుగు తిట్లుతిని, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేడు.

ఆ రోజు రాత్రి 11 గంటల వేళ ‘పేలెట్ క్లబ్’ లోకి నడుచుకుంటూ వెళ్ళేడు హ్యూయీ. అక్కడ ట్రెవర్ ఒక్కడూ సోడాకలుపుకుని వైన్ తాగుతూ, సిగరెట్టుకాల్చుకుంటూ కనిపించేడు.

హ్యూయీ సిగరెట్టు ముట్టించుకుంటూ, ” ఏలన్, మొత్తానికి నీ చిత్రం పూర్తయినట్టేనా?” అని అడిగేడు.

“పూర్తిచెయ్యడమేమిటోయ్, పటంకట్టించడం కూడా పూర్తయింది!” అన్నాడు ట్రెవర్. అని, “ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, నువ్వొక ఘన విజయం సాధించేవు. ఆ ముసలి బిచ్చగాడు ఇపుడు నువ్వంటే పడి ఛస్తున్నాడు.  నువ్వెవరో, నువ్వెక్కడుంటావో,  నీ ఆదాయం ఎంతో,  నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో… అన్నీ చెప్పవలసి వచ్చింది అతనికి”.

“ఓహ్హో ఏలన్!” అని అరిచినంత పనిచేసేడు హ్యూయీ, “నేనింటికి వెళ్ళే వేళకి నాకోసం ఎదురుచూస్తుంటాడేమో! నువ్వు ఊరికే హాస్యం ఆడుతున్నావు, అవునా? పాపం ముసిలాడు.  నాకు చేతనయితే ఏదైనా సహాయం చేస్తే బాగుణ్నని అనిపిస్తోంది. ఒక మనిషి అంత దుర్భరమైనస్థితిలో ఉండడం ఊహించడానికే భయమేస్తోంది.  మా ఇంట్లో పాత బట్టలు గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. అతను వాటిని తీసుకుంటాడంటావా? పాపం అతని బట్టలు పీలికలు పీలికలు అయిపోయి ఉన్నాయి.”

4

“అయితేనేం? వాటిలోనే అతను చూడానికి అద్భుతంగా ఉంటాడు,” అన్నాడు ట్రెవర్.  “అదే అతను ఒక మంచి పొడవాటి కోటు వేసుకుని ఉండి ఉంటే, ఎవరెంత డబ్బుముట్టచెబుతానన్నా ఛస్తే అతని బొమ్మగీసి ఉండేవాడిని కాదు. నువ్వు పీలికలు అంటున్నవి, నా కంటికి మనోహరంగా కనిపిస్తాయి. నీకు ఏది పేదరికంగా కనిపిస్తుందో, అదినాకు చిత్రరమణీయంగా కనిపిస్తుంది. అయినప్పటికీ, నువ్వు బట్టలు ఇద్దామనుకుంటున్నావన్న విషయం అతనికి చెప్తాను.”

“ఏలన్,” హ్యూయీ ముఖం చాలా గంభీరంగా పెట్టి, ” ఎంతైనా మీ చిత్రకారులు హృదయంలేని మనుషులు,” అన్నాడు.

“ఒక కళాకారుడి హృదయం అతని మెదడులో ఉంటుంది,” అన్నాడు ట్రెవర్; అదిగాక, మాపని ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు చిత్రించడం తప్ప, మాకు తెలిసినరీతిలో దాన్ని సంస్కరించడం కాదు. ఎవడిపని వాడు చేసుకోవాలి.  అది సరేగాని, లారా ఎలా ఉంది?  ఆ ముసలి మోడల్ కి ఆమెగురించి తెలుసుకోవాలని ఉంది.”

“అంటే, ఆమె విషయాలుకూడా అతనితో చెప్పేసేవా?” అడిగేడు హ్యూయీ.

“ఆహా! అన్నీ చెప్పేసాను … అతనికి పట్టువదలని కల్నల్ గురించీ, అందమైన లారా గురించీ, పదివేల పౌండ్ల షరతుగురించీ …అన్నీ తెలుసు.”

కోపంతో జేవురించిన ముఖంతో, హ్యూయీ, “ఆ ముసిలి బిచ్చగాడికి నా వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్పావు?” అని గట్టిగా కేకలేసేడు.

“ఓరి పిచ్చి కుర్రాడా,” అని చిరునవ్వు నవ్వుతూ మొదలెట్టేడు ట్రెవర్, “నువ్వు అంటున్న ఆ బిచ్చగాడు యూరోపులో అత్యంత భాగ్యవంతుల్లో ఒకడు. రేపు లండన్ ని అమ్మకానికి పెడితే అతనిఖాతాలో పెద్ద తరుగేమీలేకుండా కొనెయ్యగలడు. అతనికి ప్రతి దేశ రాజధానిలోనూ ఒక ఇల్లు ఉంది. అతను బంగారుపళ్ళెంలో తింటాడు. తలుచుకుంటే రష్యా యుద్ధానికి వెళ్ళకుండా ఆపగలడు…”

“నువ్వు చెబుతున్నదేమిటి?” ఆశ్చర్యంతో అడిగేడు హ్యూయీ.

“అవును. నే చెప్పొచ్చేదేమిటంటే,” మళ్ళీ అందుకున్నాడు ట్రెవర్, “నువ్వు ఇవాళ చిత్రశాలలో చూసింది బేరన్ హాజ్బెర్గ్ ని. అతను నాకు చాలా మంచి మిత్రుడు. నా చిత్రాలన్నిటినీ, వాటిని పోలినవాటినీ కొంటుంటాడు. నెల్లాళ్ళక్రిందట అతన్ని ఒక బిచ్చగాడిగా చిత్రించమని నాకు బయానాకూడా ఇచ్చాడు. అంతకంటే ఏమిటి కావాలి? ఆ మిలియనీర్ కి అదో వెర్రి. నిజం చెప్పొద్దూ, చిరుగుపాతల దుస్తుల్లో బిచ్చగాడుగా చాలా గొప్పగా కనిపించాడు. నిజానికి ఆ చిరుగుపాతలు అతనివి కావు, నావి. ఆ పాతసూటు నేనే స్పెయిన్ లో కొన్నాను.”

“బేరన్ హాజ్బెర్గా!” తలపట్టుకుని నిశ్చేష్టుడై పక్కనున్న చేతికుర్చీలో కూలబడుతూ, “ఎంతపని జరిగిపోయింది. బిచ్చగాడనుకుని అతని చేతిలో నేనో సావరిన్ కూడా పెట్టేను,” అన్నాడు హ్యూయీ.

5

“ఏమిటి? అతని చేతిలో ఒక సావరిన్ పెట్టేవా?” అని ఆశ్చర్యంగా అడిగి, వెంటనే పగలబడి నవ్వడం ప్రారంభించేడు. “నాయనా, మరి దాన్ని తిరిగి కానవు. ఆ డబ్బులుకి నీళ్ళధారే.”

“నువ్వు నాకు ముందే చెప్పాల్సింది, ఏలన్,” అని అతనిమీద విసుక్కుంటూ, “నన్నలా ఒక  తెలివిమాలిన వాడిగా చెయ్యకుండా ఉండవలసింది,” అన్నాడు హ్యూయీ.

“సరే, కథ ఏమిటంటే, హ్యూయీ,” అంటూ చెప్పనారంభించేడు, “నువ్విలా విచ్చలవిడిగా ఎవడికిపడితేవాడికి నిర్లక్ష్యంగా డబ్బులు దానం చేస్తావని అసలు ఊహించలేదు. నువ్వు ఒక అందమైన మోడల్ ని ముద్దుపెట్టుకుంటే అర్థం చేసుకోగలను; కానీ, నువ్విలా ఒక అందవిహీనమైన బిచ్చగాడికి ఒక సావరిన్ ఇవ్వడమేమిటి? లేదు, నేనసలు ఊహించలేదు. అదిగాక, నిజానికి ఇవేళ ఎవరొచ్చినా నేనింట్లో ఉన్నట్టు చెప్పొద్దని చెప్పాను. తీరా నువ్వొచ్చిన తర్వాత హాజ్బెర్గ్ తనని పరిచయం చేస్తే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలీదు. నువ్వు చూసేవుకదా… అతని వొంటినిండా బట్టలుకూడా లేవు.”

“నన్నెంత చవటకింద అతను జమకట్టేసి ఉంటాడో!” అన్నాడు హ్యూయీ విచారంగా.

“అదేం లేదు. నువ్వెళ్ళిన దగ్గరనుండీ పట్టలేనంత హుషారుగా ఉన్నాడు. తనలో తనే నవ్వుకుంటూ ముడుతలుపడ్డ అతని చేతులు రెండిటినీ పదేపదే రాపిడి చేసుకోడం  ప్రారంభించేడు. నీ గురించి ఎందుకు అతను అంత ఇదిగా తెలుసుకోదలుచుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అర్థం అయింది. హ్యూయీ, నువ్విచ్చిన ఆ సావరిన్ ని నీకు బదులు అతను మదుపు పెడతాడు. ప్రతి ఆరు నెల్లకీ వడ్డీ చెల్లిస్తాడు. రాత్రి డిన్నర్ తర్వాత దానిగురించి అద్భుతమైన కథ చెబుతాడు.”

“నేనో దురదృష్టవంతుణ్ణి,” అంటూ గొణుక్కున్నాడు హ్యూయీ, “ఇప్పుడు ఇంటికెళ్ళి పడుక్కోడం ఉత్తమమైన పనిలా కనిపిస్తోంది. ఏలన్, కనీసం ఈ విషయం ఇంకెవరికీ చెప్పకు. పదిమందిలో నా ముఖం చూపించలేను.”

“అవేం పిచ్చిమాటలు హ్యూయీ! నువ్వుచేసిన పని నీలోని పరోపకారబుద్ధికి ఒక మంచి ఉదాహరణ. అలా వెళ్ళిపోకు. ఇదిగో మరో సిగరెట్టు తీసుకో. లారా గురించి నీ మనసుతీరా ఎంతసేపు చెప్పినా వింటాను.”

కానీ, హ్యూయీ మాత్రం వెనుతిరగలేదు… ట్రెవర్ ని పగలబడి నవ్వుకోమని వదిలేసి, విచారంతో ఇంటిముఖం పట్టేడు.

మర్నాడు ఉదయం ఫలహారం చేసే వేళకి అతని సేవకుడు ఒక కార్డు తీసుకువచ్చి వచ్చి ఇచ్చేడు. దాని మీద ఇలా రాసి ఉంది: గుస్తావ్ నాడిన్… బేరన్ హాజ్బెర్గ్  సేవలో.”

6

“బహుశా క్షమాపణలు చెప్పడానికి పంపించి ఉంటాడు,” అని హ్యూయీ తనలో తాను అనుకున్నాడు; సేవకుడితో వచ్చినతన్ని లోపలకి ప్రవేశపెట్టమని చెప్పేడు.

వయసు పైబడ్డ ఒక పెద్దమనిషి బంగారురంగు కళ్ళజోడూ, నెరిసినతలతో గదిలోకి ప్రవేశించాడు. “శ్రీ ఎర్స్కిన్ గారి తోనేనా నాకు మాటాడే మహద్భాగ్యం దక్కుతున్నది?” అని వినమ్రంగా అడిగేడు. ఉచ్ఛారణ స్పష్టంగా అతను  ఫ్రెంచివాడని  తెలుస్తోంది,

హ్యూయీ కూడా గౌరవసూచకంగా  తలవంచి అభివాదం చేశాడు.

“నేను బేరన్ హాజ్బెర్గ్ పంపగా వచ్చేను.  బేరన్…” అని వచ్చినవ్యక్తి చెప్పబోతుండగా మధ్యలో అందుకుని,

“సర్, మిమ్మల్ని నా తరఫున బేరన్ కి క్షమాపణలు తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను,” అని తడబడుతూ చెప్పేడు హ్యూయీ.

“బేరన్,” అని ఆ వృద్ధుడు నవ్వుతూ మళ్ళీ అందుకున్నాడు, “నన్ను మీకీ ఉత్తరం అందజేయవలసిందిగా ఆదేశించారు,” అంటూ ఒక సీలువేసిన కవరు హ్యూయీకి అందించేడు.

దాని మీద ఇలా రాసి ఉంది: “హ్యూయీ ఎర్స్కిన్ – లారా మెర్టన్ దంపతులకు పెళ్ళికానుక … ఒక ముసలి బిచ్చగాడిదగ్గరనుండి.”

అందులో పదివేల పౌండ్లకు ఒక చెక్కు ఉంది.

లారా, హ్యూయీ  దంపతులయ్యేక మరుచటిరోజు ఉదయం సుప్రభాత విందులో బేరన్ ప్రసంగించేడు కూడా.

“మిలియనీర్ మోడల్స్ చాలా అరుదు, సందేహం లేదు,” కానీ, దేవుడిమీద ఒట్టేసి చెప్పగలను… మోడల్ మిలియనీర్ లు అంతకంటే అరుదు.” అని వ్యాఖ్యానించేడు ఏలన్.

***

Notes:

  1. గినీ పౌండ్ కంటే ఒక షిల్లింగు ఎక్కువ.
  2. అంటే కూలికిట్టకపోవడం.

మూలం: ఆస్కార్ వైల్డ్

murthy gaaruఅనువాదం: నౌడూరి మూర్తి

ఓ త్రికోణ ప్రణయ కథ

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

వాడి మయూఖముల్ గలుగువా డపరాంబుధి గ్రుంకె, ధేనువుల్

నేడిట వచ్చె నేకతమ, నిష్ఠమెయిన్ భవ దగ్నిహోత్రముల్

పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును పోయె, గచుండు నేనియున్

రాడు, వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో!            

                                                            -నన్నయ

 (శ్రీ మదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

వాడి కిరణాలు కలిగిన సూర్యుడు పశ్చిమసముద్రంలో మునిగాడు. గోవులు ఒంటిగా ఇంటికి చేరాయి. నిష్ఠతో నీ అగ్నిహోత్రాలు వేల్చబడ్డాయి. పొద్దు కూడా పోయింది. అయినా కచుడింకా రాలేదు. అడవిలో మృగాలు, రాక్షసులు, పాములవల్ల అతనికి హాని కలిగిందో, ఏమో!

రాక్షసుల గురువు శుక్రాచార్యునితో అతని కూతురు దేవయాని ఈ మాటలు అంటుంది…

                 ***

kachadevyani (1024x742)

క్షమించాలి, నా ప్రణాళిక మరోసారి దారి తప్పుతోంది. నిజానికి నేనిప్పుడు కోసల, మగధరాజుల కాలానికి వెళ్ళాలి. కానీ కిందటి వ్యాసంలో, గణనిర్బంధాల నుంచి బయటపడడం గురించిన ప్రస్తావన వచ్చింది. క్షత్రియుల కన్నా ముందు బ్రాహ్మణులు గణ నిర్బంధాలనుంచి బయటపడ్డారని కూడా అన్నాను. అనుకోకుండా జరిగిన ఈ ప్రస్తావన, నాకు ఎంతో ఇష్టమైన కథలలో ఒకటైన యయాతి-దేవయాని-శర్మిష్టల కథవైపు నా మనసును అయస్కాంతంలా గుంజేసింది. ఫలితమే ఈ ప్రణాళికాభంగం.

ఇదో త్రికోణ ప్రణయ కథ. పై ముగ్గురిలోనూ శర్మిష్ట పాత్ర నన్ను విశేషంగా ఆకర్షిస్తుంది, ఆ పేరుతో సహా! శర్మిష్ట గురించి తలపోసేటప్పుడు నాకు తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని నిగమశర్మ గుర్తొస్తాడు. అయితే, ఆ పోలిక కేవలం మితభాషిత్వం దగ్గర మాత్రమే. నిగమశర్మ అంత కాకపోయినా శర్మిష్ట కూడా మితభాషిగానే రూపుగడుతుంది. తెనాలి రామకృష్ణుడు నిగమశర్మ చెడు తిరుగుళ్ళ గురించీ,  చుక్క తెగి పడినట్టు అతనో రోజున ఇంటికి వచ్చినప్పుడు అతని అక్క (ఆమె నిగమశర్మ అక్క, అంతే… పేరు లేదు) అతని శరీరానికీ, బుద్ధికీ కూడా ‘తలంటడం’ గురించీ, అంతా విని ఆ ప్రబుద్ధుడు అక్కగారి ముక్కెరతో సహా ఇంట్లోని నగా నట్రా మూటగట్టుకుని ఉడాయించడం గురించీ, కాపుకోడల్ని లేవదీసుకుపోవడం గురించీ ఓ ఇంటింటి కథలా ఎంతో సహజంగా హాస్యస్ఫోరకంగా చిత్రించుకుంటూ వెడతాడు తప్ప, నిగమశర్మ నోట ఒక్క మాట కూడా పలికించడు. కాపు కోడలి తర్వాత ఇంకో ‘కడజాతి’ స్త్రీతో కాపురం చేసి పిల్లల్ని కన్న నిగమశర్మ, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తలచుకుని శోకిస్తూ మొదటిసారి నోరువిప్పుతాడు. ఆ పద్యం కూడా నాకు ఇష్టం:

ఎల్లరు నెల్లచో ధనములిచ్చి మృగాక్షుల గొండ్రు గాని యో

పల్లవపాణి యే బరమపావనవంశము నిచ్చికొంటి నీ

నల్లని రూపు నిక్కమని నమ్మి! ధ్రువంబది గాక నేడు వి      

ద్యుల్లతికాధికాభినయ ధూర్వహమౌట నెరుంగ నింతయున్

విశేషమేమిటంటే, కవి ఈ పద్యంలో కరుణ, హాస్యాలను రెండింటినీ మేళవిస్తాడు. అంతా డబ్బిచ్చి అందమైన స్త్రీలను కొనుక్కుంటారు కానీ నేను నా పరమపావనమైన బ్రాహ్మణవంశాన్ని వెలగా చెల్లించి నిన్ను కొనుక్కున్నానని నిగమశర్మ అంటాడు. ఇందులో కులాతిశయం ఉన్నమాట నిజమే కానీ, నిగమశర్మకు ఆమెపై ఉన్న గాఢమైన అనురక్తీ, ఆమె మృతి కలిగించే దుఃఖతీవ్రతా ఆ కులాతిశయాన్ని కప్పేస్తున్నాయి. ఇక ‘నీ నల్లని రూపు నిజమని నమ్మాను తప్ప మెరుపు తీగ అవుతుందని తెలుసుకోలేకపోయా’ ననడంలో కవిత్వమూ + వికటత్వమూ రెండూ ఉన్నట్టున్నాయి.

నిగమశర్మతో శర్మిష్టను పోల్చడంలోని అనౌచిత్యం ఇప్పటికీ నా మనసును పీకుతూనే ఉంది. ఆ పోలిక కేవలం మితభాషిత్వంలో మాత్రమే సుమా అని మరోసారి సంజాయిషీ ఇచ్చుకుంటున్నాను.

శర్మిష్ట మితభాషిత్వం నిగమశర్మ మితభాషిత్వం లాంటిది కాదు. అది సమాజం, ఇంకాస్త వివరంగా చెప్పాలంటే పితృస్వామ్య సమాజం ఆమెపై రుద్దిన మితభాషిత్వం. నిజానికి పితృస్వామ్యసమాజంలో స్త్రీ అతిభాషిత్వమూ, మితభాషిత్వమూ రెండూ ఒకలాంటివే. ఆమె మాటకీ మౌనానికీ ఒకే విలువ ఉంటుంది. రేకు డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. విలువ మారదు. పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాష లేకుండా చేసింది. పితృస్వామ్యంలో స్త్రీ పురుషుడి భాష మాట్లాడుతుంది, పురుషుడిలా ఆలోచిస్తుంది, పురుషుడి హృదయంతో స్పందిస్తుంది.

ఈ మాటలు అంటున్నప్పుడు, నాకు ఎంతో ఇష్టుడైన ఒక కథకుడూ, ఆయన రాసిన ఒక కథా గుర్తుకొస్తున్నా(రు-యి). ఆ కథకుడు, చెఖోవ్…ఆ కథ పేరు, The Lady.

పురుషస్వామ్యంలో స్త్రీకి సొంత గొంతు లేదు, సొంత సమస్యలు లేవు; ఆమె పురుషుడి గొంతునూ, పురుషుడి సమస్యలనూ వినిపించే సౌండ్ బాక్స్ మాత్రమే నన్న సత్యాన్ని ఇంత గొప్పగా చెప్పిన మరో రచన ప్రపంచసాహిత్యంలో  ఉందని నేను అనుకోను. నా ప్రపంచసాహిత్య పరిచయం ఏమంత గొప్పది కాదనుకుంటే, కనీసం వేళ్ళ మీద లెక్కించదగిన అలాంటి రచనల్లో ఇదొకటి అంటాను. ఆ కథ ఇదీ:

భార్యా, భర్త… భర్త ఒక నాటకశాలను నడుపుతూ ఉంటాడు. రోజూ సక్రమంగా నాటకశాల నిండితేనే అతనికి ఆదాయం. కానీ నాటకాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. నాటకశాల నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. భర్త తన సమస్యలను భార్య దగ్గర వెళ్లబోసుకుంటాడు. జనంలో కళాభిరుచి తగ్గిపోతోందని బాధపడతాడు. భర్త ఆవేదనలో భార్య పాలు పంచుకుంటుంది. అవును నిజమే, జనంలో ఎంతసేపూ సంపాదన యావే తప్ప; ఓ నాటకం, ఓ వినోదం అంటూ ఏమీ లేకుండా పోయాయనుకుంటుంది. భర్త వినిపించే సమస్యలనే పరిచయస్తుల దగ్గర తనూ వల్లిస్తూ  ఉంటుంది.

అలా ఉండగా, కొంతకాలానికి భర్త చనిపోతాడు. ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అతడు ఓ కిరాణాకొట్టు యజమాని.  కొట్టు నిర్వహణలో ఆమె భర్తకు సాయపడుతూ ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉండే సమస్యలు ఆ వ్యాపారంలోనూ ఉన్నాయి. భర్త వాటిని ఏకరువు పెడుతుంటే, అవును కదా అనుకుంటూ సానుభూతి చూపిస్తుంది. తను కూడా పూర్తిగా కొట్టుకే అంకితమైపోతుంది. పరిచయస్తులెవరైనా కొట్టుకు వచ్చినప్పుడు యథావిధిగా భర్త సమస్యలనే వాళ్ళతో పంచుకుంటూ ఉంటుంది. ‘ఏమమ్మా, ఎంతసేపూ కొట్టును పట్టుకుని వేళ్లాడడమేనా?  ఓ వినోదమూ, వేడుకా ఉండద్దా? ఏ నాటకానికైనా వెళ్లచ్చు కదా!’ అని ఎవరైనా అంటే, ‘నాటకాలకు వెళ్ళేలానే ఉంది నా పరిస్థితి… మీకేం మీరేమైనా చెబుతారు. కొట్టు నడపడం మాటలు కాదు. ఎన్ని సమస్యలో!’ అంటుంది.

రెండో భర్త కూడా చనిపోతాడు. ఆమె మరో పెళ్లి చేసుకోదు. తోడుంటారని ఓ యువజంటకు తన ఇంట్లో వాటా అద్దెకిస్తుంది. వాళ్ళకొక కొడుకు. ఇక ఆమెకు ఆ అబ్బాయే లోకం అయిపోతాడు. నీళ్ళు పోయడం, అన్నం తినిపించడం, దుస్తులు వేయడం, స్కూల్లో దింపడం వగైరాలన్నీ ఆమే చేస్తుంది.  ఆ అబ్బాయి సమస్యలన్నీ ఆమె సమస్యలే అయిపోతాయి. ఆ కుర్రాడు బండెడు పుస్తకాలు మోసుకెళ్ళడం చూసి ఆమె కడుపు తరుక్కుపోతుంది. ‘స్కూలు వాళ్ళకు బుద్ధి లేదు, పసివాడి చేత ఇన్ని పుస్తకాలు మోయిస్తారా?!’ అనుకుంటుంది. కనిపించినవాళ్లు అందరితోనూ అంటుంది.

కథ అయిపోతుంది… జ్ఞాపకం మీద ఆధారపడి రాసిన ఈ కథాసంగ్రహంలో కొన్ని వివరాలు లోపిస్తే లోపించవచ్చు.

ప్రస్తుతానికి వస్తే, యయాతి-దేవయాని-శర్మిష్టల కథలో దేవయాని చాలా ఎక్కువగా మాట్లాడుతుంది, సాధికారంగా కూడా మాట్లాడుతుంది. శర్మిష్ట చాలా తక్కువగా మాట్లాడుతుంది. వారిరువురి సామాజిక నేపథ్యాలలోనూ, సామాజిక దశలలోనూ ఉన్న తేడాయే అందుకు కారణం. బ్రాహ్మణులు అప్పటికి గణనిర్బంధాలనుంచి బయటపడ్డారు. తమ గణం వెలుపల ఎవరికైనా వారు పురోహితులు కావడం, ఎవరినుంచైనా దక్షిణలు తీసుకోవడం ఇందుకు సూచన అని కోశాంబీ అంటాడు. అలాగే, వృత్తి జీవనులుగా బ్రాహ్మణులకు సంచారజీవనమూ ఎక్కువ. ఆవిధంగా వారు నాలుగు ప్రదేశాలు చూస్తారు, ఎక్కువ లోకజ్ఞానాన్ని పొందుతారు. దేవయాని బ్రాహ్మణకన్య కనుక శర్మిష్టతో పోల్చితే ఆమెకు స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, తెలివి ఎక్కువ. అవి కలిగించే ఆత్మవిశ్వాసం, అహంకారాల పాలు కూడా ఎక్కువే. శర్మిష్ట అలా కాదు, ఆమె రాచకన్య, తండ్రి చాటు బిడ్డ, గణం కట్టుబాట్లకు బందీ, అవసరమైతే తండ్రి రాజకీయ ప్రయోజనాలకు పావుగా మారక తప్పదు. నగరంలో పుట్టి పెరిగి, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయికీ, పల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయికీ ఉన్న తేడా లాంటిదే దేవయానికీ, శర్మిష్టకీ ఉన్న తేడా.

కథలోకి వెడుతున్న కొద్దీ ఈ వ్యత్యాసాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి.

శుక్రుడు దైత్యదానవ గణాలకు ఆచార్యుడిగా ఉన్నాడు. అతని దగ్గర మృతసంజీవిని అనే విద్య ఉంది. దేవతలతో జరిగే యుద్ధంలో చనిపోతున్న రాక్షసులను ఆ విద్యతో అతను బతికిస్తున్నాడు. దాంతో దేవతల పక్షంలో చావులూ, ఓటమీ సంభవిస్తున్నాయి. దేవతలు బృహస్పతి కొడుకైన కచుని దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎలాగైనా శుక్రుని  మెప్పించి మృతసంజీవినీ విద్యను సాధించాలని కోరారు. శుక్రునికి, కూతురైన దేవయానిపై మమకారం ఎక్కువ, నువ్వు ఆమె మనసు గెలుచుకుంటే నీ పని తేలికవుతుందని కూడా చెప్పారు. కచుడు అంగీకరించి శుక్రుని దగ్గరకు వెళ్ళాడు. శుక్రుడు అతనిని శిష్యునిగా స్వీకరించడమేకాక, అతనికి ఆతిథ్యం ఇవ్వడం స్వయంగా బృహస్పతికి ఆతిథ్యం ఇవ్వడమే ననుకుని సంతోషించాడు. శత్రువైనాసరే, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనాటి మర్యాద.

శిష్యులు గురువుగారి గోవులను కాచడంతో సహా ఇంటిపనులు చక్కబెట్టడం ఆనాటి గురు-శిష్య సంబంధంలో భాగం. కచుడు ఇంటి పనులు చేస్తూ అటు శుక్రునీ; పువ్వులూ, ఫలాలూ తెస్తూ ఇటు దేవయానినీ మెప్పిస్తూ వచ్చాడు.  కచుడు తమ విరోధులైన దేవతల గురువు బృహస్పతికి కొడుకు కనుక, అతడు ఇలా శుక్రుని ఇంట్లో పాగా వేయడంలో  రాజకీయమైన కుట్రను రాక్షసులు పసిగట్టడం సహజమే. ఓ రోజు కచుడు గోవులను తోలుకుని అడవికి వెళ్లినప్పుడు రాక్షసులు అతన్ని చంపేసి, మృతదేహాన్ని ఓ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోయారు. కచుడు వెంట లేకుండా గోవులు ఒంటిగా ఇంటికి చేరుకోవడం చూసి, దేవయాని కీడు శంకించింది. అప్పుడు తండ్రితో అన్న మాటలే పై పద్యం.

శుక్రుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని మృతసంజీవినీ విద్యను కచుని వద్దకు పంపించి అతన్ని బతికించాడు. కచుడు ఇంటికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. మరోసారి రాక్షసులు అడవిలో కచుణ్ణి పట్టుకుని చంపేసారు. ఈసారి అతన్ని బతికించే అవకాశం ఇవ్వకూడదనుకుని మృతదేహాన్ని కాల్చి బూడిద చేసి, దానిని సురలో కలిపి శుక్రునికి ఇచ్చారు. శుక్రుడు ఆ సురను తాగేశాడు.

కచుడు ఇంటికి రాకపోయేసరికి రాక్షసులే అతన్ని చంపేసి ఉంటారని దేవయాని ఊహించింది. శోకించడం ప్రారంభించింది. అప్పుడు శుక్రుడు, ‘రాక్షసులు అతని మీద పగబట్టారు. ఎలాగైనా అతన్ని చంపేస్తారు. అతనికి ఉత్తమలోకాలు కలుగుతాయి. ఎందుకు దుఃఖించడం?’ అన్నాడు.  ఆ మాటకు దేవయాని తండ్రిపై తాచులా లేచింది. ‘మహానుభావా, నువ్వూ ధర్మం తెలిసినవాడివే కదా; ఎంతో బుద్ధిశాలి అయిన అంగిరసుని మనవడు, నీకు ఆశ్రితుడు, నీ శిష్యుడు, బృహస్పతికి కొడుకు, అందగాడు, బ్రహ్మచారి అయిన కచుణ్ణి రాక్షసులు అన్యాయంగా చంపేస్తే, నేను దుఃఖించకుండా ఎలా ఉంటాను? అతను నా కంట పడితే తప్ప నేను అన్నం తిన’ నని, ఎత్తిపొడుపూ, ఏడుపూ, మొండితనమూ దట్టిస్తూ తండ్రిపై మాటల మేకులు చెక్కింది.

ఇక్కడ తండ్రీ, కూతుళ్ల మధ్య అనుభవంలోనూ, పరిణతిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని పౌరాణికుడు అద్భుతంగా సూచిస్తాడు. కచుని మరణానికి దేవయాని భావోద్వేగంతో స్పందిస్తే; శుక్రుడు రాజకీయ వివేకంతో స్పందిస్తాడు. కచుణ్ణి రాక్షసులు బతకనివ్వరని అతను అప్పటికే గ్రహించాడు. అది రాజకీయంలో భాగం. దాని వెనుక రాక్షసరాజు వృషపర్వుని ఆదేశం తప్పనిసరిగా ఉంటుంది. ఒక హద్దును మించి తను అందులో జోక్యం చేసుకోలేడు. చేసుకోకూడదు కూడా. చేసుకుంటే తన స్థానం ప్రమాదంలో పడడం అలా ఉంచి, నీతి కూడా కాదు. రాక్షసుల గురువుగా వారి రాజకీయ వ్యూహాలకు, ప్రయోజనాలకు తను కలసి రావలసిందే. మరి కచుని శిష్యునిగా ఎలా స్వీకరించాడన్న ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ముందే చెప్పుకున్నాం. శత్రువైనా సరే, దేనినైనా కోరి, అతిథిగా వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదరించడం వ్యక్తిగత స్థాయిలో అనుసరించవలసిన ధర్మమూ, మర్యాదా. అతిథి మర్యాద గురించి ఆ కాలంలో ఉన్న పట్టింపును సూచించే కథలు చాలా ఉన్నాయి. అలాగే, కచునిపై తన కూతురు మనసు పడుతోందనీ శుక్రునికి తెలుసు. అయితే, అది ధర్మబద్ధం కాదనో, లేక పొసగదనో భావన అతనికి ఉన్నట్టు కథాగమనం సూచిస్తుంది.

అయితే, శుక్రునిలో కూతురిపై  ఉన్న మమకారం వీటన్నిటినీ మించినది. అది అతనిలోని రాజకీయ వివేకంతో పోటీపడుతోంది. ఎట్టకేలకు మెత్తబడ్డాడు…

 

 

 

 

 

శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టిన అనుభూతి!

drushya drushyam
ఫొటోగ్రఫి అన్నది ఒక వాహ్యాళి కావచ్చు. ఒక విహారయాత్ర కావచ్చు. వీధి భాగవతమూ కావచ్చును. ఎపుడైనా అది దైవ దర్శనమూ అయి వుండవచ్చు. ఇది అలాంటి ఘడియలో తీసిన ఒకానొక లిప్త. భగవంతుడికీ భక్తుడికీ మధ్య గోచరమైన ప్రసాదం. చెదిరిన కన్నయి,  కొవ్వొత్తి క్రీనీడల్లో రెపరెపలాడే దయామయమైన వెలుగునీడై దృశ్యమానమైన ఒక ఛాయఖండిక..

ఆలయంలో ఇదొక స్థితి-స్థాపకత. ఇక్కడి ఛాయాచిత్రణం ఒక ప్రత్యేక నాదం. హృదయంతరాలల్లో ఏదో ఒక శుభ్రజ్యో్త్న నడయాడిన క్షణాలను ఒడిసి పట్టినప్పటి అదృష్టం. ఓం ప్రథమం అనదగ్గ వినిర్మల, అలౌకిక చ్ఛాయ కు ఆధారమైన బీజాక్షరాలు వినిపించినప్పటి తన్మయత్వం. ఇక్కడ అరుదెంచిన మానవుడు మరెక్కడా ఇంత వినయ విధేయతలతో కానరాని స్థితికి పారవశ్యం. అందుకే ఇదొక దర్శనం. మానవుడి ప్రయత్నమంతా నిమిత్తమైన అరుదైన బతికిన క్షణాలు- ప్రణామములు.

+++

“మతమే రాజ్యమేలుతూ ఉన్నప్పడు ఆధ్యాత్మిక స్రవంతి ఎక్కడ కానవస్తుంది లే’ అనుకుంటాం. కానీ, “గోవిందా…గోవిందా’ స్మరణల మధ్య మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకపరి లయతప్పి మళ్లీ స్థిరపడి సజావుగా సాగే అపురూప లోగిలి ఒకటి ఉన్నదని, మనసు నిమ్మళించిన వైనము…

ఇక్కడికి మనిషి కలివిడిగా వచ్చినప్పటికీ మళ్లీ ఏకాకి అయి, ఒంటరి ముద్రలో తన హృదయమే తాను వింటున్నప్పటి, వినడమూ మరచి దైవంలో లీనమైతున్పప్పటి, లీల గోచరమైనప్పడు సందేహాలు తెల్లబోయినప్పటి చిత్రములెన్నో…

కులమూ మతమూ లింగమూ… అలాగే, రాజూ పేదా అన్న స్థాయి భేదాలులేని  ప్రపంచం ఒకటి, కొన్నిలిప్తలే కావచ్చును, ఒకానొక బహిరంగ ఉద్యమమై గోచరించడం, ఒకరి వెనుక ఒకరు,ఒకే ఒక క్రమంలో, ఒక ‘మార్చ్’ అయి, ఒకే నిష్ఠతో నడవడం, మళ్లీ అంతా ఒకే చోట ఆగిపోయి దర్శనం చేసుకోవడం, ఇదంతా అవలీలగా కెమెరా కన్ను  దర్శించడం…ఓ గొప్ప అనుభవం.

+++

తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక సాయంత్రం ఇదే పని…
సుమారు ఒక వేయిమందిని అయినా చూసి ఉంటాను. “చూడటం’ అని ఎందుకు అనడం అంటే మామూలుగా చూస్తే కంటికి కనిపించనిది, కెమెరా గుండా భక్తులను, వాళ్లు లీనమయ్యే తీరుతెన్నులను, వ్యూ ఫైండర్ నుంచి చూడటం అంటే నిజంగా అదీ చూపు. అది మార్పు కాదు, ప్రతిబింబం కాదు, కేవలం గాజు. అటూ ఇటూ కన్నూ, చూపు ప్రసారమయ్యే కేవలం దర్శనం, దివ్య దర్శనం.

అది లౌకికం కాదు, అలౌకికమే.  అదొక ఆశ్చర్యం, ఆనందం. an exposure.
కెమెరా కంటితో పొందిన బ్రహ్మానందం. development. కండ్లు తెరవడం అంటామే! కెమెరాతో తేరుకోవడం!

+++

చేతులు జోడించి ఒకరు, కన్నార్పకుండా మరొకరు.
కంట కన్నీరొలికి ఒకరు. ఆనందభాష్పాలతో మరొకరు.
కరుణ, ప్రేమ, భయవిహ్హలత….అంతేనా? కుతూహలం, ఆనందం, తృప్తినూ.
తల తిప్పుకున్నవారూ ఉన్నారు, దైవాన్ని చూడలేక!
లీనమైన వాళ్లూ ఉన్నారు, మళ్లీ జీవన సమరాన్ని ఈదలేక!

గంపెడు పిల్లలున్న తల్లీ ఒక్కత్తే…అష్టదరిద్రం అనుభవిస్తున్న మధ్య వయస్కుడూ… ఒక్కడే… అంతా సమూహంలో ఏకాంత ప్రపంచం. దంపతులు దంపతులూ కాదు. భర్త భర్తా కాదు. దగ్గరితనం అంతా దైవంపైనే. అతడే బిడ్డా, తండ్రీ! అంగీకారం కుదిరేదాకా మనిషి లోవెలుపలా ఒక పెనుగులాట. తర్వాత శాంతి, ప్రేమ…
లీనమయ్యారా ఇక  భక్తుడికి భగవంతుడికీ మద్య ఒకే ఒక ఆత్మానుగత వారధి….వర్దిల్లే దయాపారావతం…లీలామృతం.

చిత్రమేమిటంటే అందరూ అపరిచితులే. అంతా ఒక మరుపు. దర్శనం సమయంలో మైమరుపు. అదే అపూర్వం. విశ్వాసమే బలమై అంతా మోకరిల్లడమే. దైవం చెంత అందరూ మానవులైన వాళ్లే… కంటి ముందు కెమెరా వెలిగించి చూస్తే అందరూ భక్తులైన వాళ్లే.

వాహనంలో వేంకటేశ్వరస్వామి నిదానంగా ఊరేగుతూ ఉంటే ఆదర్శాలు లేవు. ఆశయాలు లేవు. విశాలత్వం లేదు, సంకుచితత్వమూ లేదు. అంతా ఒకే ప్రపంచం. తారతమ్యంలేని ప్రాపంచికత్వం. ఒక్కొక్కరూ హారతి కర్పూరంలా దహనమైతున్న వాళ్లే.

అదేం విశేషమో గానీ, అది మహత్యమే! మనిషి దైవం చెంత నిమిత్తమయ్యే మహా ఛాయాచిత్ర లేఖనం అది!

capture చేస్తున్నది మనిషినా దైవాన్నా మెలమెల్లగా అర్థమవుతున్నది!

ధన్యుణ్ని, ఒక ఘడియకైనా!
ఏ గడియలూ లేని కెమెరా కారణంగా!

 ~ కందుకూరి రమేష్ బాబు

నయ్ చోడేంగే !

“నయ్ చోడేంగే నయ్ చోడేంగే

హైద్రాబాద్ నయ్ చోడేంగే

నయ్ చోడేంగే నయ్ చోడేంగే

హైద్రాబాద్ నయ్ చోడేంగే ”

తుంగభద్రా నది గట్టున నినాదాలు దద్దరిల్లిపోతున్నాయి. చేతులు ‘లేదు లేదు’ అన్నట్లుగా వూపుతూ వుద్రేకంతో వూగిపోతున్నారు యువకులు. అదొక పెద్ద గుంపు. అందరూ ఎంతో ఆందోళనతో వున్నట్లు వాళ్ళను చూస్తే తెలుస్తుంది. మామూలుగా అయితే ఎంతో టిప్‌టాప్‌గా తిరిగే యువకులు ఏదో పోగొట్టుకున్నట్లు, మాసిన బట్టలతో, మాసిన గడ్డాలతో దిగులుగా, వుక్రోషంగా, ఆగ్రహంగా చెప్పలేనంత దుఃఖంగా కన్పిస్తున్నారు. నిజానికి వాళ్ళు యేం పోగొట్టుకున్నారో వాళ్లకు తెలిసినట్లు లేదు. వాళ్ల చేతుల్లో ఒక పెద్ద బ్యానర్. జై సమైక్యాంధ్ర అని రాసి ఒక మూల అర్ధనగ్నంగా వున్న పొట్టిశ్రీరాముల్ని ముద్రించింది.

ఆ గుంపులోంచి పదహైదు – ఇరవై మంది బిలబిలమంటూ నదిలోకి దిగి బాగా లోఫలివరకూ భుజాలు మునిగేవరకూ వెళ్ళారు. నినాదాలు చేస్తూనే వున్నారు. ఒకరిద్దర్ని  ప్రవాహం తోసేసింది. పక్కనవాళ్లు పట్టుకున్నారు. “జాగ్రత్త జాగ్రత్త.. మరీ లోపలికి వెళ్ళొందండి” గట్టు మీద నుంచి అరుపులు.  “మునిగితే  మునిగితిమిలే. రాష్ట్రమే మునిగిపాయ. మా ప్రాణాలెంతగానీ, యిట్లన్నా తెలుస్తుందిలే జనాలకి, ముఖ్యంగా తెలంగాణావాళ్లకి” అంటున్నారు నీళ్లలోని వాళ్ళు.

“నయ్ చోడేంగే నయ్ చోడేంగే;  హైద్రాబాద్ నయ్ చోడేంగే

జిందాబాద్ జిందాబాద్; సమైక్యాంధ్ర జిందాబాద్ ”

నినాదాలు ఆగడం లేదు. నాలుగైదు టీవీ కెమెరాలు దీన్నంతా చిత్రీకరిస్తున్నాయి. పది పదహైదు నిమిషాల తర్వాత టీవీల వాళ్లు వెళ్లిపోయారు. నీళ్ళలోకి దిగిన నిరసనకారులు చాలాసేపు అదే నినాదాలు, అంతే పట్టుదలగా అరచి అరచి గొంతులు బొంగురుపోతున్నాయి. గట్టుమీద వున్నవాళ్ళూ యిక చాలు రమ్మంటున్నారు.

ఇదంతా గమనిస్తున్న ఒకతను ఆ గుంపుకు లీడర్‌గా కన్పిస్తున్నతని దగ్గరకు పోయి  “యిదంతా ఏందన్నా…?” అనడిగాడు. చుట్టూ చేరినవారందరూ అతన్ని పిచ్చోణ్ణి చూసినట్లు చూసారు.

“ఇరవైరోజులాయ జరగవట్టి. సమైక్యాంధ్ర వుద్యమం యేందన్నా అంటావ్. యీ లోకంలో వున్నావా లేదా…?” గద్దించాడు లీడర్.

“అవునన్నా.. మరి యిదేందన్నా నీళ్ళలోకి దిగినారు. యీ నీళ్ళు  యాడికి పోతాయన్నా..?”

ఎవడో వీడు పూర్తి పిచ్చోడు మాదిరి వున్నాడే. సమైక్యాంధ్రను అర్ధం చేయిస్తామంటే నీళ్లు యెక్కడీకి పోతాయని అడుగుతున్నాడు అనుకొని,  “ఏమయ్యా!  యిది తుంగభద్ర, యీ నీళ్లు నేరుగా కృష్ణానదిలో కలుస్తాయి. అవి శ్రీశైలం డ్యాంలో పడతాయి..”

“శ్రీశైలం డ్యాం నుంచి యాడికి పోతాయన్నా..?”

“ఓర్ని అది కూడా తెలీదా? ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌లో పడి, అక్కడ్నుంచీ కాలవల్లో పడి పొల్లాల్లోకి పోయి పంటలు పండిస్తాయి.”

“ఎవురి పంటలన్నా?”

“ఎవరి పంటలా? రైతులవిరా. మన సమైక్యాంధ్ర రైతులవిరా…”

” ఆ రైతుల్లో రాయలసీమోళ్ళు ఎవరన్నా వుండారాన్నా?”

“రాయలసీమోళ్ళా.. మన పొలాలు ఆడెందుకుంటాయిరా.. మన పొలాలు యీడ కదా వుండేది..”

“మల్లా… మన పొలాలు యీడుంటే, నీళ్ళు యీడ్నించీనే పోతావుంటే మన నీళ్ళు మన పొలాలకి పెట్టుకోకుండా నీళ్ళెందుకు వదుల్తుండారన్నా..  నయ్ చోడేంగే నయ్ చోడేంగే కృష్ణాజలాలు నయ్ చోడేంగే అనాలకదన్నా. యాడోవుండే హైద్రాబాద్‌ను నయ్ చోడేంగే నయ్ చోడేంగే అంటుండారే? మల్లా యీడుండే నీళ్లను మాత్రమే హమ్ కైసే చోడేంగే అన్నా…”

గుంపుకూ, లీడర్‌కూ ఒక్కసారిగా అయోమయంగా అన్పించింది.”మనది ఒకటి పోగొట్టుకొని, మనది కానిదాన్ని వెతుకుతున్నామన్నా. సమైక్రాంధ్రలో పడి రాయలసీమను మరిచిపోయినామన్నా…”

“నిజమా..?” అన్పించింది వాళ్లకు.

venkatakrishnaజి. వెంకటకృష్ణ

నేను కథ ఇలా రాస్తాను..!

daggumati

1986 లో ‘దేవుడు’ పేరుతో తొలి కథ రాశారు దగ్గుమాటి పద్మాకర్.  అప్పటినుంచి ఇప్పటి వరకు 15 కథలు రాశారు.  పుస్తకం రాలేదు. 2 సార్లు ప్రధమ బహుమతులు వచ్చాయి. పరిధులు-ప్రమేయాలు, s/o అమ్మ, పతనం కాని మనిషి, యూ టర్న్, ఈస్తటిక్ స్పేస్, సెవెన్త్ సెన్స్ (చివరికథ 2010) కథలు చాలా మందికి నచ్చాయి.

పద్మాకర్ కథ ‘యూ టర్న్’ గురించి   జాన్సన్ చోరగుడి గారు (చినుకు, డీసెంబరు 2007) యిలా అన్నారు…

కొందరు కథకులు వర్తమానంలో వుంటూనే, భవిష్యత్తుని ఒడిసి పట్టుకుని దాన్ని వెనక్కి తెచ్చి దానికి గతాన్ని చూపించి వర్తమానం కోసం భవిష్యత్తు యేమి చేయాలో కర్తవ్యబోధ చేస్తారు. యునెస్కో, ప్లానింగ్ కమీషన్ వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థలు  చేయాల్సిన విధాన రూపకల్పనని దగ్గుమాటి పద్మాకర్ ఒక కథ ద్వారా చూపే సాహసం చేశాడు. అతడు మన తెలుగు కథకుడు కావడం మన అదృష్టం.

పద్మాకర్ కథ రాసే విధానం ఆయన మాటల్లోనే వినండి:

*

సీనియర్లకి చెప్పగలిగేంత వాడిని కాదుగాని, కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళకి నాకు తెలిసిన నా అనుభవాలు మూడు నాలుగు ముక్కలు చెబుతాను, కేవలం నా గురించే… అంతకు ముందుగా నాదృష్టిలో ‘కథ’ గురించి రెండు ముక్కలు చెబుతాను…

*    *    *

 

రచయితలకెంత ఆశ ఉన్నాకూడా కథలు ఎప్పుడు తక్షణమే యే సమస్యలనీ పరిష్కరించవనేది ఒక నిజం.

తమని తాము గమనించుకుంటూ జీవించేవారిలో మాత్రమే ఒక మంచికథ తగిన సమయంలో తన ప్రభావాన్ని చూపుతుంది.

సహజంగా మనకి ఎదురయ్యేవారిలో…  జీవన గమనం లో సరయిన నడక రాని వాళ్ళు, నడుస్తూ నడుస్తూ దారి తప్పినవాళ్ళు,  సమస్యల రద్దీలో ఇరుక్కుని దారి కనిపించనివాళ్ళు, ధగద్ధాయమైన వెలుగుల మధ్యకూడా కళ్ళ ముందు చీకటి కమ్మినవాళ్ళు, అన్నీ సమకూరినా సంతోషం రుచి తెలియనివాళ్ళు, ఇతరులకు సహాయ పడాలని ఉన్నా మనుషులపై నమ్మకంపోయి పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వేసేవాళ్ళు, ఇకపోతే కుటుంబ సమస్యల్లోంచి బయటపడలేని వాళ్ళూ,  ఇలా రకరకాల సమస్యలున్న ప్రజలు మన కళ్ళముందు కదులుతూ ఉంటారు. అయితే నావరకు నేను ఇలాటి ప్రజల దైనందిన సమస్యలకి సంబందించిన ఇతివృత్తాలను కాకుండా… దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా అపరిష్కృతంగా వున్న కొన్ని సమస్యలపై తార్కికంగా ఒక సూచన అందించగలిగేలా  వున్న ఇతివృత్తాలను ఇష్టపడతాను.

నేను కథ రాయాలనుకున్న తరవాత ముందుగా ఆ కథని చదివే వాళ్ళని గుర్తు చేసుకుంటాను.  నా గత అనుభవాలు తీసుకుంటే, కథ అచ్చయిన తర్వాత, హోటల్ సర్వర్ల నుండి, మెకానిక్కులు, గృహిణులు, సైకియాట్రిస్టుల వరకు రకరకాల వాళ్ళు ఫోన్ లు చేశారు. కాబట్టి, కథని చదవబోయే పాఠకులందరి రసాస్వాదక సామర్ధ్యాన్ని ఒక రచయితగా గౌరవించాలి అని నిర్ణయించుకుంటాను.

పాఠకులు నా కథ చదవాలనుకుని పేజీలు తెరిచినపుడు, విస్తరాకు ముందర కూర్చున్న అతిధుల్లా కనిపిస్తారు నాకు. అప్పుడొక ఇల్లాలు పొయ్యిదగ్గర వంట దినుసులతో పడే జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. మనమొక ఇంటిలో ఆతిధ్యం స్వీకరించి, ఆ సాధారణ ఇల్లాలిని మెచ్చుకుంటే తనకెంత తృప్తో తెలిసిందే కదా. సరిగ్గా అలాంటి తృప్తినే పాఠకుల నుండి ఎదురు చూస్తాను.

కథ రాయమంటూ ఏ అర్ధ రాత్రో అపరాత్రో నాలో అప్పటికే రాజుకుంటున్న ఒక ఆలోచన ప్రవేశిస్తుంది. ఇక మాపాప ఖాళీనోట్సు ఒకటి తీసుకుని  రాయడం ప్రారంభిస్తాను. అప్పుడిక అలోచనల వేగంతో చేయి పోటీపడలేక గెలుక్కుంటూ పోతాను. ఎంతగా అంటే ఒక్కోసారి నారాత నాకే అర్ధంకాదు కొన్నిచోట్ల! ఐతే మొత్తానికి ఒక సిట్టింగ్ లోనే పాత్రలూ, సంఘటనలూ, ప్రధాన డైలాగులు పూర్తి అయిపోతాయి. ఆ అర్ధరాత్రి ఒక ‘అస్తిపంజరం ‘ అలా సిద్దం అవుతుంది.  ఇక మళ్ళీ దానిజోలికి కొద్ది రోజులపాటు  వెళ్ళలేను.(నిజానికి నెలలు, ఇది నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే). ఇక అలమారలో దాచిపెట్టిన ఆ ‘అస్తిపంజరం’ నన్ను చాలారోజులపాటు పలకరిస్తూ ఉంటుంది, ఎప్పుడు జీవం పోస్తావంటూ!

జీవం పోయడం నాపని కాదని, నేను ఒక రూపాన్ని మాత్రమే ఇవ్వగలనని, జీవం అనేది అన్ని అక్షరాలమద్య తగు బంధం ఏర్పడినప్పుడు అదొక అసంకల్పిత ప్రతీకార చర్యలా పుడుతుందని చెప్పినా వినదు. సరే ఏదోవొకటి చెయ్యమంటుంది. అప్పుడు కాస్త ఏకాంతాన్ని వెతుక్కుని మళ్ళీకూర్చుంటాను.

ఇక అప్పుడు నా రఫ్ స్క్రిప్టును ముందేసుకుని చదువుతాను. కొంత కాలం గడిచినందువల్ల కథకి ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో అప్పుడు ఈజీగాతెలుస్తుంది. A*, B*, Z* , @ , § , # వంటి కొండ గుర్తులు పెట్టి మధ్య ఖాళీల్లో ఇరికించాల్సిన మేటర్ ని వేరేపేజీల్లో రాసుకుంటాను. ఇదంతా అస్థి గారికి కండరనిర్మాణం అనుకోవచ్చు. ఆనాటి నాశక్తి లేదా ఓపిక అంతటితో సమాప్తం అయిపోతుంది.

ఇక మళ్ళి ఇంకో రోజు కూర్చుని, స్క్రిప్టంతా కంటిన్యుటీ ఉందోలేదో చూస్తాను. కచ్చితంగా ఉండదు. అప్పుడు వరసగా అన్ని వాక్యాలు  చిన్నప్పుడు హిందీ,ఇంగ్లీషు సైలెంట్ గా ఎలా బట్టీపట్టానో అలా   అయిదారు సార్లు చదువుతూ కంటిన్యుటీ చెక్ చేసి తప్పులు సవరిస్తూ పోతాను. కంటిన్యుటీ లేని దగ్గర పాఠకులు కచ్చితంగా దాటవేస్తారు. అంటే భోజనంలో 2 ముద్దలు కలుపుకుని పక్కకు నెట్టినట్టు. ఇప్పుడు అస్థిగారికి  నరాలు, రక్త నాళాలు కూడా  సిద్దమయినట్టే. తర్వాత మీకు తెలిసిందే. నాకు నీరసం వచ్చేస్తుంది. పక్కన పెట్టేస్తాను. ఆయితే, ఇప్పుడు మాత్రం ఈ దశలో కథ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. కాస్త సంతోషం కూడా  వేస్తుంది.

ఇప్పుడిక చివరి సమావేశం.

ఆలోచనకి పెద్దగా పని వుండదు గాని అయితే జాగ్రత్తగా ఉంటాను.

1] కథ కంటిన్యుటీని చెక్ చేయడానికి ముందుగా వేగంగా చదువుతాను.

2] పాత్రలు తమ ప్రవర్తనలో సందర్భానికి, వయసుకి, జ్ఞానానికి తగిన పదాలు లేని చోట మార్పు చేస్తాను. ఉదా: కోపంతో, ఆవేశంతో, రగిలిపోతూ, భగ్గుమంటూ… ఇలాంటి  పదాల్లో సన్నివేశానికి తగినది మారుస్తాను.

3] ఇక పోతే అన్ని కొటేషన్ల తర్వాత ఉన్న ముగింపులు సరిచేస్తాను. (ఆమె అన్నది/ ఆమె నవ్వుతూ అన్నది/ ఆమె అతన్ని చూస్తూ అన్నది)

4] ఇక అచ్చు తప్పులు, గుర్తులు సరిచేసుకుంటాను.

5] ప్రారంభం వేటగాడి ఉచ్చులా, ముగింపు కూరలో ఉప్పులా సరిగ్గా అమరాయో లేదో చూస్తాను.

6] సాధారణంగా కథకి తగ్గ పేరు ఈ దశవరకు తోచదు నాకు. కాన్సంట్రేషన్ అంతా కథపై ఉండటం వల్లకావొచ్చు. ఇప్పుడు పుస్తకం పక్కన పెట్టి, లేచి టీ తాగాలని బయలుదేరతాను. పెద్దగా ఆలోచించకుండానే 1 లేదా 2 పేర్లు గుర్తొస్తాయి. సాధరణంగా మొదటిదే ఫైనల్ అవుతుంటుంది నాకు.

7] తర్వాత టైపింగ్ అయ్యాక  చూస్తుంటే, ఆప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంటుంది.

 

–దగ్గుమాటి పద్మాకర్ 

తెలుగు సాహిత్యం వేరు, తెలంగాణా సాహిత్యం వేరు!

ashok1సమకాలీన తెలుగు కథాలోకంలో ఇప్పుడు బాగా పరిచితమయిన పేరు పెద్దింటి అశోక్ కుమార్. కథ రాసినా, నవల రాసినా అశోక్ ముద్ర వొకటి ఉంటుందని ఇప్పటి పాఠకులు అతి తేలికగా గుర్తు పట్టగల శైలిని సాధించిన రచయిత అశోక్. తెలంగాణ మాండలికం వాడుతూనే తెలంగాణా కథని సరిహద్దులు దాటించిన రచయిత. ఇతర ప్రాంతాలలో కూడా తన కథలకు అభిమానుల్ని సంపాదించుకున్న వచనశిల్పి అశోక్ తో భానుకిరణ్ కేశరాజు కొన్ని సంభాషణలు:
Qజాతీయ కథా సదస్సు కు ఎంపికయిన సందర్బంగా అభినందనలు. దీనికి మీ స్పందన?
 నా “జిగిరి “నవల పంజాబ్ లోకి అనువాదమయింది.దీనికి చాల స్పందన వచ్చింది. పంజాబ్ అనువాద సాహిత్యం లో అది ఒక గొప్ప నవలగా నిలిచి పోయింది.పరోక్షంగా పంజాబ్ సాహిత్య కారులతో పరిచయమయ్యింది. వాళ్ళు ప్రతియేటా జాతీయ  స్తాయిలో కథకుల  సదస్సు నిర్వహిస్తారు.గత సంవత్సరం కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పుడు వీలుకానందున వెళ్ళలేక పోయినాను. తెలంగాణా సాహిత్యం అన్నా, తెలంగాణా ఉద్యమం అన్నా వాళ్ళు బాగా ఇష్టపడతారు. జిగిరి నవల తో తెలంగాణా నవల మొట్టమొదటి సారిగా పంజాబ్ సాహిత్యం లోకి వెళ్ళింది. దీనికి వచ్చిన స్పందనతో తెలంగాణా సాహిత్యం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో అని ఆ కథ సదస్సు లో ఒక తెలంగాణా రచయిత తో మాట్లాడిద్దాం  అనే పట్టుదలతో నన్ను ఆహ్వానించారు.తెలుగు సాహిత్యం నుంచి ఒకటి, రెండు కథలు అనువాదమయినాయి కాని విస్తృతంగా వెళ్ళలేదు. నవల మాత్రం ఇదే మొదలుగా అనువాదమయింది.ఇంకా చెప్పాలంటే తెలంగాణా నుండి కథ గాని నవలగాని ఇదే మొదటిది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు కథలు అంటే  సీమాంద్ర కథలనే అనుకున్నారు. సీమాంధ్ర కథల్లో బలముండదు. తెలంగాణా కథల్లో జీవితం ఉంటుంది  భాష ప్రాంతం ప్రజలు వేరయినా జీవితాల్లో ఉండే సంక్షోబం  ఒకటే అని నా జిగిరి నవల నిరూపించింది. వాళ్ళ సాహిత్యం లో స్పృశించని , వాళ్ళ ఊహకు కూడా రాని అంశం ఈ కథాంశం. దీనితో నన్ను ఆహ్వానించడం  జరిగింది.
Qతెలంగాణా ఉద్యమ సాహిత్యం. తెలంగాణా ప్రజా జీవితం సంస్కృతి మీద వచ్చిన సాహిత్యం, తెలుగు సాహిత్యం దీనిపై మీ వివరణ?
నా కథ సంకలనాల మీద చర్చ వచ్చినప్పుడు ఇవి తెలుగు కథలకు భిన్నంగా ఉన్నాయి అని వాళ్ళ స్పందన చూసి  తెలుగు వేరు, తెలంగాణా సాహిత్యం వేరు, ఇక్కడి జీవితం వేరు, ఇక్కడి సంస్కృతి వేరు ,భాష వేరు, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షత చేత తెలంగాణా జీవితాలు బయటికి రాలేదు,అని వివరించాను. ఇంకో విషయం ఏమిటంటే తెలంగాణా లో సాహిత్యమే లేదు తెలంగాణా సాహిత్యం  అంటే పోరాట సాహిత్యమే , తెలంగాణా కథ అంటే ఉద్యమ కథే అని ప్రచారం కూడా జరిగింది. తెలుగు వేరు తెలంగాణా వేరు, తెలంగాణా లో ఒక ప్రత్యెక జీవితం ఉంది తెలంగాణా సంస్కృతీ ఉంది  అని కేంద్ర సాహిత్య అకాడమీ సభల్లో కూడా చెప్పడం జరిగింది.తెలంగాణా సాహిత్యం అనేది ఉర్దూ మరియి నిజాం పాలనతో ప్రభావితమయింది.తెలుగు సాహిత్యం మీద  ఆంగ్ల మరియి బెంగాలి తదితర భాషల సాహిత్య ప్రభావం ఉంది. తెలంగాణా సాహిత్యం ఉర్దూ సాహిత్యం తో ప్రభావితంయ్యింది. కాబట్టి ఇక్కడ కథ, కవిత్వం నిలకడ గా ఉంది , భూమి మీద  ఉంది. వాస్తవ జీవితాల్ని ప్రతిబింబించింది. ఆంద్ర ప్రాంతం లో  శిల్పం శైలి మీద ఆధారపడి  కథలుగా నిలిచినాయి. కాని తెలంగాణా లో వస్తువు ప్రధానంగా కథలు నిలిచినయి.ఇదే విషయం వేరే రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.ఇక్కడి భాష,జీవితం ,  అలవాట్లు, సంస్కృతి వేరు.కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యక ప్రాంతం గా గుర్తించాలి, ప్రత్ర్యేక రాష్ట్రంగా గుర్తించాలి .ఇక్కడి భాషా సాహిత్యాలకు ప్రత్యెక హోదా కల్పించాలి.
Qతెలంగాణా మాండలికం లో రాసిన మీ రచనలు వేరే భాష లోకి అనువాదమయినప్పుడు మూలం లోని తెలంగాణా  ప్రాంత జీవితం ,భాష, పలుకుబడి.,యాస లోని ఆ సొగసు  కనపడదు కదా? మూలం లోని సహజత్వం అనువాదం లో ఆస్వాదించగలమా?
నిజమే మీరన్నట్లు మూల భాషలో ని తడి , ఉత్కంటత అనువాదం లో కనపడదు.అనువాదకుడు భాషా పండితుడు అయి  ఉండి తెలంగాణా భాష మీద  పట్టు ఉన్నవాడయితే  అనువాదానికి న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు నేను రాసిన “తెగారం” అనే కథ శివ సత్తుల జీవితం మీద రాసింది ఆంగ్లం లోకి అనువాదమయింది.  వాళ్ళు  వాడే పదాలు ఆంగ్లం లోకి అనువాదం చేయలేక పొయ్యారు. అదే విదంగా “మాయిముంత” కథను హిందీ లోకి అనువాదం చేసి, అనువాదం లో మూలం లో ఉన్న తడి రాలేదు ,ఈ కథకు అన్యాయం చేయలేమని ఆ కాగితాలని చిమ్పేశారు..ఆంగ్లం లోకి కూడా ఆ depth ఆ tone అనువాదం లో చూపించలేక పోతున్నాం ఈ కథకు అన్యాయం చెయ్యలేం ,అనువాదం చెయ్యలేం అని అన్నారు. జిగిరి ని ఆంగ్లం లో తెలుగు లో చదివిన మిత్రులు  ఈ ఆంగ్లానువాదం ఎందుకు పనికిరాదు అన్నారు.చిత్రమేంటంటే హిందీ అనువాదం లో కూడా తెలుగులో ఉన్న తడి లేదు కానీ హిందీ నుంచి ఆ తర్వాత పదకొండు భాషల్లోకి అనువాదమయింది.రెండు భాషల మీద పట్టు ఉన్నట్లయితే అనువాదానికి న్యాయం జరుగుతుంది.
పెద్దింటి అశోక్ కుమార్

పెద్దింటి అశోక్ కుమార్

Qబాల్యం, విద్యాబ్యాసం :
నేను 8 వ తరగతి వరకే చదువుకున్న  తర్వాత బంజేసిన. మిగతా చదువంతా ప్రైవేట్ గానే కొన సాగింది. మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. 80 లో పెద్ద కరువొచ్చింది. మా బాపు అప్పుడు గల్ఫ్ పోయిండు.ఇక్కడ అప్పులు ఎట్లా తెర్పాలో తెలియక గల్ఫ్ పోయిండు. నా చదువు బంజేసి వ్యవసాయం ఎడ్లు జూసు కొనుడు మొదలుపెట్టిన.ఓ సంవత్సరం దాక మా బాపు జాడ తెల్వదు ఎం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నడో తెలియదు.  అప్పుడు మేం పడ్డ ఆ సంఘర్షణ  తర్వాత వలస కథలుగా రాయడం జరిగింది. పదో తరగతి ప్రైవేట్ గానే రాసి పాస్ అయిన. మా బాపు మళ్ళీ రెండో సారి గల్ఫ్ పోయిండు, కాని ఈ సారి ఓ స్తిరమయిన  కంపెనీ లో జేరి మంచిగానే ఉండే. అప్పుడు నన్ను చదివించాలని అనుకోని చదువుకొమ్మని ఉత్తరం రాసిండు. దగ్గర కాలేజ్ లేదు మనమేం చదువుతంలె అని ఊరుకున్న. 82 ల గంబీరావు పేట లో కొత్త కాలేజ్ పడితే దాంట్ల చేరిన. చేరిన రోజు పొతే మళ్ళీ ఎక్సామ్ రాసిన రోజే పోయిన.ఎందుకంటీ చిన్నపటినుంచి నాకు నాటకాల మీద ఇష్టం ఉండేది. మా ఇంట్లోనే ఈ నాటకాల రిహాల్సల్స్ జరుగుతుండేవి. ఈ నేపథ్యం లో నుంచి తర్వాత మా ఊరి బాగోతం అనే కథలు రాసిన.
Q మీరు రచయిత గా ఎదగడానికి ప్రేరేపించిన అంశాల గురించి చెప్పండి
మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు  అప్పటికప్పుడు పాటలు రాసుడు, పద్యాలు రాసుడు, ఉన్నయి మంచిగా లేక పొతే కొత్త పదాలు రాసుడు ఇలా నాలో క్రియేటివిటీ అప్పటినుంచే మొదలయ్యింది.ఏదన్న పాట సరిగ్గా కుదరక పొతే దాన్ని మార్చి మళ్ళీ రాసేది. అదే విదంగా సిద్ధిపేట లో డిగ్రీ అయ్యేదాకా కొనసాగింది. నాటకాల కొరకు తిరిగే వాళ్ళం. నాకు రావణాసురిడి వేషం వెయ్యాలనే కోరిక ఉండేది. నా పర్సనాలిటీ ఏమో దానికి సరిపోదు. అది ఎప్పటికీ కోరిక గానే మిగిలిపోయింది. ఆ తర్వాత 90 నుండి 96 వరకు ఊరికి దూరంగా ఉన్న. 96 తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఊరికి పోయిన.  ఊరికి పోయిన తర్వాత ఊళ్ళో వచ్చిన మార్పులు నాకు స్పష్టంగా కనిపించినయి.అంతకు ముందు ఊరు మంచిగా  ఉండే. రెండు చెరువులు ఉండె. వాగు ఉంటుండే , ఊరినిండా పశువులు ఉంటుండే.ఇవన్నే ఒక్కటి లేకుండా పోయినాయి. విద్వంసం బాగా జరిగింది. ఊళ్ళ ఉన్నోళ్ళందరూ గల్ఫ్ కి పొయినారు.ఇంటికో ఏజెంట్ అయ్యిండు, ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ లో ఉండె వాళ్ళ బాదలు, ఇక్కడ ఉండె వాళ్ళ కుటుంబాల , స్త్రీల, పిల్లల బాధలు నన్ను కదిలించినాయి , వాకిళ్ళు అన్నీ    మొరం దేలినాయి, ఇండ్లకు తాళాలు పడ్డాయి కుల వృత్తులు పోయినాయి  కుమ్మరోడు, కమ్మరోడు లేదు అందరు పోయిండ్రు.ఇవన్నీ చూసి బాగా కదిలిపోయిన , ఎట్లుడే ఊరు ఎట్లయి పోయింది  అనే ఆలోచన మనసులో మెదిలి తట్టుకోలేక వెంటనే కథలు రాయడం మొదలుపెట్టిన . అప్పటికి నేను సాహిత్యం ఏమీ చదువుకోలేదు. ఎ కథా సాహిత్యం చదువుకోకుండానే రాయడం మొదలుపెట్టిన. సాహిత్యం చదువుతే రాసేవాన్ని కాదేమో.నేను కథలు రాసే నాటికి కేవలం వ్యాపార సాహిత్యం మాత్రమె ఉండేది. అట్లా ఏమీ చదువకుండానే మొదటి కథ రాసిన.అప్పుడు చదవక పోవడమనేది మైనస్ అనుకున్న కానీ అదే నాకు ప్లస్ అయ్యింది.ఆ సాహిత్యం చదివితే ఇన్ని కథలు రాసే వాణ్ని కాదేమో. ,
Q మీ మొట్టమొదటి రచన, ఆ రచనా నేపథ్యం  ఆ తదుపరి మీ రచనా జీవితానికి ప్రేరణ గురించి చెప్పండి?
నా మొట్ట  మొదటి కథ ఆశ నిరాశ  ఆశ అని 99 లో రాసిన. అది ఒక రైతు జీవితం  పంట వేయడం అది ఎండి పోవడం, మళ్ళీ వేయడం అది మళ్ళీ ఎండి పోవడం . రైతుకు భూమి కి ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు. మున్గనీ , చావనీ చావనన్న చస్తాడు కానీ భూమిని వదిలి పెట్టడు.పంట పండినప్పుడు ఆశ ఉంటది, ఎందినప్పుడు నిరాశ ఉంటది. ఆ ఆశ నిరాశ ఆశ ల మధ్య కొట్టు మిట్టడుతాడు  తప్ప భూమిని వదిలిపెట్టుకోడు.అటువంటి రైతు కథ ని ” ఆశ నిరాశ ఆశ” అని 99 లో రాసిన. ఆ తర్వాత చుట్టూ చూస్తె గల్ఫ్ బాదితులు చాల మంది కన్పించిన్రు. గల్ఫ్ వాళ్ళ బాగుపడ్డ జీవితాలు  ఉన్నాయి , కొంత మంది నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మా కుటుంబం ఒకటి.ఆ బాధల  నేపథ్యం లోనుంచి సమగ్రంగా వలస కథలని 12 కథలు వివిధ కోణాల్లో నుంచి అంటే భార్య కోణంలో నుంచి, భర్త కోణం లోనుంచి, ఏజెంట్ కోణం లోనుంచి, ఇలా విస్త్త్రుతంగా రాసిన.
గల్ఫ్ వలస  జీవితం మీద 2001 లో ఎడారి మంటలు అనే నవల కూడా రాసిన. పోయిన తర్వాత ఏమి జరుగుతది , వచ్చిన తర్వాత ఏమి జరుగుతది , వలస ఎట్లా చిచ్చు పెదతది  అని రాసిన .తర్వాత , రాస్తూ పోతున్న కొద్ది అవగాహన ఏర్పడి, సమాంతరంగా సాహిత్యం చదువుకోడం జరిగింది.మన విస్తృతి పెరిగింది. ప్రపంచీకరణ జరిగి కుల వృత్తులు ఎట్లా పోయినయి, వ్యవసాయం లో వచ్చిన సంక్షోబాలు, తర్వాత మానవ జీవితాల్లో  ఉన్న సంక్లిష్టత, ఇవన్నీ కథలుగా రాయడం జరిగింది.ఆ క్రమలో అయిదు నవలలు కూడా రాయడం జరిగింది.వీనిలో మూడు చతుర లో రెండు ఆటా పోటీలలో రావడం జరిగింది. నేను ఎంచుకున్న మార్గం ఏమిటంటే పోటీ లకు పంపడం. బహుమతుల కొరకు కాదు, పోటీ లలో సెలెక్ట్ అయిన కథలు కాని నవలలు కాని ఎక్కువ మంది చదివే అవకాశము ఉంటుంది అని పోటీలకుపంపెవాన్ని. పల్లె జీవితాలని వలస జీవితాలని దగ్గర్నించి గమనించడం అవి కథలుగా మలచడం నేను చేసిన పని. విద్వంసం  చూసి తట్టుకున్నవాడు క్షేమంగా నిలబడతాడు, తట్టుకోలేని వాడు పిచ్చి వాడు అన్న అయితాడు, లేదా రచయిత అన్న యితడు , నేను ఆ విద్వంసం  చూసి తట్టుకోలేక రచయతగా మారిన కథలుగా రాస్తూ నా బరువు దించుకుంటున్న .
అశోక్ తో  భాను కిరణ్

అశోక్ తో భాను కిరణ్

Qమీ రచనలన్నీ తెలంగాణా మాండలికం , తెలంగాణా పల్లెల నేపథ్యంలో సాగుతాయి దీనికి ప్రత్యెక కారణాలు ఏమయినా ఉన్నాయా?
ప్రాంతీయ సాహిత్యం లో రావి శాస్త్రి నుంచి మొదలు పెట్టి  కారా నుంచి , ఇలా నెరుడాదాక , గూగీ దాక ఎవడి భాషలో వాడు ఎ ప్రాంత జీవితాన్ని  ఆ  భాషలో బలంగా చెప్పినప్పుడు మాత్రమె దానికి ఒక స్తానికత వస్తుంది.ఈ రోజు తెలంగాణా జీవితాన్ని తెలంగాణా లో  కాకుండా మామూలు తెలుగు లో చెపితే పేలవంగా ఉంటది.అంత depth రాదు.  పాత్రలు ఇక్కడివి, జీవితం ఇక్కడిది అయినప్పుడు భాష ఇక్కడిది కాకపొతే  అక్కడిదయితే పాయసం లో ఉండల్లా ఉంటాయి .ప్రాంతీయ ముద్ర లేని ఎ సాహిత్యం కూడా గొప్ప సాహిత్యం కాదు. గూగీ కూడా నేను నా భాష లోనే రాసుకుంట మీకు కావాలంటే ఇంగ్లీషు లోకి అనువాదం చేసుకోండి అన్నాడు.ఎందుకంటే మన భాషలో మనల్ని express చెయ్యొచ్చు. మాయిముంత కథను ఆ భాషలో రాయకుండా ఎ భాషలో రాసిన కానీ అంత అందం రాదు. నా ఉద్దేశం లో జీవితం, వస్తువు ఎంత ప్రధానమో దానికి భాష కూడా అంతే ప్రధానం.భాష అనేది కథల్లో , జీవితంలో ఒక బాగం.
Qఈ నాటి రచయితలు తమ రచనల్ని మాండలికం లో చేయాలన్న అత్యుత్చాహాన్ని కనబరుస్తూ పాఠకుడికి  దూరమవుతున్నారని అంపశయ్య  నవీన్ గారు అన్నారు, తెలంగాణా మాండలికం లో రచనలు చేస్తున్న మీరు దీని గురించి ఏమంటారు?
 నవీన్ గారు అన్న దాన్లో వాస్తవం లేదు. మీకు భాష రానంత మాత్రాన, భాష మీద ప్రేమ లేనంత మాత్రాన రచయితలూ అందరు అట్లా రాయాలనుకోవడం తప్పు. ఒక సాహిత్య కారుడికి , ఒక పాఠకుడికి  భాష అనేది ఎంతమాత్రం అవరోధం కాదు.  రావిశాస్త్రి కథలని, కారా యజ్ఞాన్ని , అల్లం రాజయ్య  కథలని ఈరోజు ఆంద్ర ప్రదేశ్ అంతట చదివారు. కథలో బలముంటే , తడి ఉంటె, depth ఉంటె దాన్ని ఏదీ ఆపలేదు.గూగ్గీ సాహిత్యాన్ని ఏది ఆపగలిగింది, ఒకానొక తెగ భాషలో రాస్తే ఈరోజు ప్రపంచమంతా ఆ సాహిత్యాన్ని చదువుతుంది.గురుజాడ కన్యాశుల్కలో విజయ నగరం  మాండలికం లేదా, రావిశాస్త్రి, కార రచనల్లో శ్రీకాకుళం మాండలికం లేదా. వాటిని  మనం ప్రక్కన పెట్టలేదు కదా. రచయితలకు  భాషా సంకెళ్ళు వేయొద్దు. కథ అనేది భాద ని కలగ జేస్తది , తన్లాటని కలగ జేస్తది, ఆలోచిమ్పజేస్తది , కాబట్టి కథ మీద ప్రేమ ఉన్న వారికి భాష ఒక అవరోధం కాదు. రచయితలూ ఆత్మ గౌరవంతో రాసుకుంటున్నారు అనుకోవాలి  తప్ప పాఠకులకి  దూరమవుతున్నారని అనుకోకూడదు.
Qకథ , నవల మీకు నచ్చింది ఏ ప్రక్రియ?
 రెండూ నాకు నచ్చిన ప్రక్రియలే. ఎందుకంటీ నేను ఎంచుకున్న వస్తువు విస్తృతి ని బట్టి అది కథ గా రాయాలా, నవలగా రాయాలా అనేది నిర్ణయించుకుంట. కథలో స్కోప్ తక్కువుంటుంది, నవలలో స్కోప్ ఎక్కువుంటుంది. కథ అనేది అంగూర పండ్లు తిన్నట్టు, నవల అనేది నారికేళ పాకం.కథ రాయడానికున్న వెసులుబాటు అంటే సమయం, నిడివి , చిన్న సబ్జెక్ట్ ని బట్టి కథలు ఎక్కువగా వస్తున్నాయి. నేను కూడా ఎక్కువగా కథల వైపు మొగ్గు చూపించడం జరిగింది. రెండూ నాకు సమానమే. ఒక మంచి సబ్జెక్ట్  ఉంటె తప్పకుంట నవల రాస్తాను. ఉదాహరణకు జిగిరి మొదట ఒక కథగా రాసుకున్న, కాని అది కథలో ఇమడలేదు, అది నవల అంత విస్తృతి కలది కాబట్టి  నవల గా రాసిన.
ashok2
Q2006 ఆటా నవలల పోటీలో ప్రథమ బహుమతి సాదించి అనేక భాషల్లోకి అనువాదమయిన  జిగిరి నవలా నేపథ్యం గురించి చెప్పండి?
జిగిరి నేపద్యం అది విచిత్రంగా జరిగింది. నేను బండలింగాపూర్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు మా బడిలో ఒక పెద్ద విశాలమయిన  స్తలం  ఉండేది. దాన్ని అందరూ వాడుకునే వాళ్ళు. ఊళ్లకు ఎవ్వరు వలస వచ్చినా , కళ్లాల  కి కూలీలు, కోతులోల్లు, పిట్టలోల్లు వచ్చినా, సాధనాసూర్లు అందరూ అక్కడికి రావాల్సిందే. కోతులోల్లు వస్తే నేను “రెండు కోతులు” అని ఒక కథ, సాదత్ కాండ్లు వస్తే వాళ్ళ మీద “ఘోస” అనే కథ రాసిన.ఓ సారి గుడ్దేలుగులాయన వచ్చిండు. ఎవ్వరు వచ్చిన ఓ 15 రోజులు ఉంది పోయేవాళ్ళు. ఈయన రెండే రోజులు ఉండి  పోయిండు. ఎలా  పోతాడని నాకు అనుమానం వచ్చింది కాని రెండు రోజుల తర్వాత అతను  మళ్ళీ కాన పడ్డప్పుడు  గుడ్డేలుగు లేకుండా ఒక్కడే కన్పించిండు. అడుగుదామనుకుంటే బయపడి పోయిండు, నాకు అనుమానం వచ్చి సబ్జెక్ట్ ని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ పోయే క్రమంలో నాకు వన్య ప్రాణి సంరక్షణ, గుడ్డేలుగు కనపడితే పోలీసులు పట్టుకుంటారని, వాటిని జు లో వదిలిపెట్టాలని కొన్ని అంశాలు తెల్సినాయి. నిజామాబాద్ జిల్లా దగ్గర అంబారీపేట్ వద్ద గుడ్డేలుగుల కుటుంబాలు ఉన్నాయంటే అక్కడికి పోయిన, అప్పుడు నాకు ఈ వాస్తవాలు , వాళ్ళ కుటుంబాల్లో ఎంత సంక్షోబం ఉంటది అని అనేక విషయాలు తెల్సినాయి. గుడ్డేలుగు ఒక క్రూర మృగం, దాన్ని మనిషి తీసుక వచ్చి సాదుకుంటాడు. అప్పుడు దానికి మనిషి లక్షణాలు నేర్చుకుంటది.కాని మనిషనే వాడు గుడ్డేలుగు తో సావాసం చేసి వీడు పశువులా ప్రవర్తించి దాన్ని వదిలి పెట్టుకోవటానికి సిద్దపడ్డాడు. మనిషి మృగం గా మారితే , మృగం మనిషిగా మారటం ఈ నవలా నేపథ్యం. దీన్ని నవలగా పంపితే ఒకటి రెండు పత్రికలూ దీన్ని తిరస్కరించినాయి. అప్పుడు ఆట నవలల పోటీ కి పంపితే వాళ్ళు ప్రదమ బహుమతి పొందిన నవలగా ఎంపిక జేయడం జరిగింది. ఆట కబురు అనే పుస్తకం లో ప్రచురితమయిన ఈ నవలను చూసి జె.ఎల్.రెడ్డి గారు చూసి హిందీ లోకి అనువాదం చేసారు.ఆ తర్వాత ఈ నవల 11 భాషల్లోకి అనువాదం జరిగింది.
Q మీరు రాసిన జిగిరి నవల పై బడుగు జీవుల బాధలని చిత్రించిందనే అబద్దపు ముద్ర వేయబడిన నవల అని విమర్శ వచ్చింది దీనికి మీరేమంటారు?

 

 ఒక నవల రాసిన తర్వాత అది మనది కాదు. జిగిరి మీద చాల విమర్శలు వచ్చాయి. మంచి నవల అని కొందరు, కాదని కొందరు అన్నారు. అడివి నుంచి దాన్ని తీసుక వచ్చినపుడు దాన్ని బ్రతుకు దెరువు కు తీసుకు వచ్చినా కాని తర్వాత దాంతో ఉన్న అటాచ్మెంట్ ని కాదనలేం కదా.కానీ తరాల మధ్య అంతరం మారింది. కొడుకు చూసే కోణం వేరు, తండ్రి చూసే కోణం వేరు.కొడుకు దాన్ని ఒక వ్యాపార వస్తువు గానే చూసిండు. తండ్రి అలా కాదు. అది వీళ్ళ జీవితాన్ని , జీవితంలో సంక్షోభాన్ని ప్రతిబింబించింది కాబట్టి అది బడుగు జీవుల నవల అయ్యింది. కాని దాన్ని బడుగు జీవుల నవల అని ఎవ్వరు అన్నారో నాకు తెలీదు. నెగెటివ్ గా వచ్చిన వ్యాసం ఇది ఒక్కటే, నేను దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్న.
Q“మాయి ముంత” కథ ఓ బర్రె గురించి అయినా ఆ కథలో స్త్రీ హృదయం , పశువు ను కూడా ఒక బిడ్డలా చూసిన ఒక తల్లి పడే ఆరాటం వేదన ఎంతో హృద్యంగా చిత్రించారు. ఈ కథా నేపద్యం వివరిస్తారా?
మాయి ముంత, ఏడిండ్ల పిల్లి కూన , అనగనగా ఓ కోడి పెట్ట, ఈ మూడు కథలు మాత్రుత్వంలో మూడు కోణాలను చిత్రించిన కథలు. బర్రె బాద వేరు, పిల్లి బాద వేరు, కోడి బాధ వేరు. కోడి పిల్లలకి 50 రోజులు అన్నీ  నేర్పి వదిలి పెడతడి. పిల్లి తన పిల్లల్ని ఏడు ఇళ్లు  తిప్పుతది, ఎక్కడయితే సెక్కురిటీ ఉండదో వెంబడే పిల్లల్ని వేరే ఇంట్లోకి మారుస్తుంది. ఇట్లా ఏడు ఇండ్లు మారుస్తుంది. అది ఏడు ఇండ్లలో ఎంత వేదన అనుభవిస్తది అనేది కథాశం .మాయి ముంత ఒక బర్రె పడే ప్రసవ వేదన. నేను ప్రత్యక్షంగా   ఒక బర్రెకి పురుడు పోసిన, బర్రె కాని, పిల్లి కాని, ఏది కాని ఒక స్త్రీ పడే వేదన ఎంత ఉంటుంది అన్నది కథాంశాలు , ప్రక్రుతి ఎంత విచిత్రమయింది. ప్రసవం కాగానే బిడ్డ పట్ల బర్రె ప్రవర్తన దానికి ఎవ్వరు చెప్పిన్రు. చాల విచిత్రమయిన విషయం . మాతృత్వం మధురం అంటాం కాని అందులో ఒక స్త్రీ పడే హింస ఎంత ఉన్నది అని ఆలోచించాల్సిన విషయం. దీనికి గర్భం చేసిన దున్నపోతు ఎక్కడ పండు కుంటదో కాని ఇక్కడ ఈ బర్రె పడే వేదన హింసే మాయి ముంత కథ. మీకు జాతీయ సాహిత్యం లో ఇటువంటి కథ ఎక్కడా రాలేదు.
Q మిమ్మల్ని ప్రభావితం చేసిన రచనలు , రచయితల గురించి చెబుతారా?
 మీకు ముందే తెలియజేసినట్లు నేను ఈ రచనలో చదవలేదు. నన్ను ప్రభావితం చేసిన అంశం మా ఊరే. ఊరు, ఊరి జీవితం, స్మక్షోభాలు సంక్లిష్టతలు నన్ను ప్రభావితం జేసాయి తర్వాత కూడా నేను ఎవ్వరి ప్రభావాలకూ లోను కాలేదు.రచయితా  గా చాలా దూరం వచ్చిన తర్వాత నే నేను మిగతా సాహిత్యం చలం ,సాహిత్యం చదవడం జరిగింది. ఇష్టం వేరు ప్రభావితం కావడం వేరు.
Qమీ రచనల్లో మీకు ఇష్టమయిన రచయితలు  ఎవ్వరు  ?
 అల్లం రాజయ్య , తుమ్మేటి రఘోత్తం  రెడ్డి, చలం సాహిత్యం, కారా రావి శాస్త్రి సాహిత్యం నాకు ఇష్టమయినవి.
Qరచయితగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

మార్పులకి అనుగుణంగా నన్ను నేను అప్డేట్ చేసుకొని ఈ సంక్షోబాన్ని, సంక్లిష్టత ను తెలంగాణా భాషలో కథలుగా రాయడం.

ఇంటర్వ్యూ : భానుకిరణ్ కేశరాజు

తమవి కాకుండా పోయిన శరీరాలు,మనసులు చెప్పిన కథ ఇది!

ప్రఖ్యాత తమిళ రచయిత్రి సల్మా వ్రాసిన ఒక అద్భుతమైన నవల చదివానీ మధ్య.

ఆ నవల చదివిన అనుభవం ఎవరితోనూ పంచుకోకుండా వుండడం అసాధ్యమనిపించింది. కుటుంబాలలో స్త్రీల ఆశ నిరాశలు అనుభవాలు ఆనందాలు దుఃఖాలు కళ్ళముందు పరిచే అచ్చమైన  స్త్రీల నవల ఇది . సల్మా ఎక్కువగా కవిత్వమే వ్రాసింది. స్త్రీల లైంగికత్వం గురించీ వారి శరీరాల గురించీ నిస్సంకోచంగా వ్రాసింది.ఆమెవి అశ్లీల రచనలన్న ఆరోపణలనీ బెదిరింపుల్నీధైర్యంగా ఎదుర్కుంది  .  “అర్థరాత్రి కథలు” అని అర్థం వచ్చే ఈ తమిళ నవల ను “అవర్ పాస్ట్ మిడ్ నైట్” పేరుతో లక్ష్మీ హామ్ స్ట్రామ్ ఇంగ్లిష్  లోకి అనువదించగా జుబాన్  సంస్థ ప్రచురించింది. 478 పేజీల పెద్ద నవల ..

salma-hindu

“స్త్రీల అసమానత్వం చర్చనీయంగా వున్న ఈ పరిస్థితిలో, స్త్రీ శరీరంలో జీవిస్తూ స్త్రీవాదిగా ఆలోచించకుండా ఎట్లా?” అంటుంది మీనా అలెక్జాండర్ అనే స్త్రీవాద కవి. అట్లాగే సల్మా కూడా పనిగట్టుకుని స్త్రీవాద కవిత్వమూ నవలా వ్రాయకపోయినా ఆమె రచనల్లో తప్పనిసరిగా స్త్రీవాదమే వుంటుంది.

ఒక తమిళ గ్రామంలో కొన్ని ముస్లిమ్ కుటుంబాలలోని స్త్రీల కథ ఇది..ఇందులోని అయిదారు కుటుంబాలకూ దగ్గర బంధుత్వం వుంది.స్త్రీల మధ్య స్నేహం వుంది.ఒకరి జీవితాలనుగురించి వారి వ్యక్తిగత వివరాల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం మరొకరికి వుంది .ఒకరిపట్ల ఒకరికి ప్రేమ వుంది ,అసూయ వుంది. సానుభూతికూడా వుంది.

ఏడో తరగతి చదివే రబియా పాత్రతో ఈ నవల  ప్రారంభం అవుతుంది.ప్రపంచంపట్ల ప్రేమతో రెక్కలు విప్పుకుంటున్న ఊహలతో,సున్నిత మనస్కురాలైన చిన్నారి రబియా!!  .ఆమె స్నేహితురాలు.మదీనా!.ఇద్దరిమద్యా రహస్యాలు లేవు .ఒకరికోసం ఒకరు అన్నట్లుంటారు.అహమ్మద్ కూడా వాళ్ళ జట్టే. ఒకరోజు స్నేహితులతో కలిసి సినిమా చూసొచ్చి తల్లి చేతిలో బాగా దెబ్బలు తింటుంది రబియా. తల్లి జోహ్రా రబియాను మంచి ఆడపిల్లగా తీర్చిదిద్దే క్రమంలో వుంటుంది. రబియా తండ్రి కరీం, పెత్తండ్రి ఖాదర్ లది ఉమ్మడి కుటుంబం .అన్నతమ్ములు తోడికోడళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా వుంటారు.రబియా పెద్దమ్మ రహీమా సంప్రదాయాలపట్ల కాస్త సడలింపు చూపించి తన కూతుర్ని పట్నంలోతన తండ్రి దగ్గర వుంచి హైస్కూల్ చదువు పూర్తి చేయిస్తుంది గ్రామంలో అది సాధ్యం కాదు.ఎందుకంటే ఈడొచ్చిన ఆడపిల్లలు ఇల్లుదాటరాదు.పరాయి పురుషుల కళ్ళపడరాదు.స్నానం చేసేటప్పుడు కూడా తమశరీరాలను తాము నగ్నంగా చూసుకోరాదు.సెక్స్ గురించి మాట్లాడరాదుఇటువంటి ఆంక్షలన్నీ ఆ గ్రామంలో వున్నాయి.

హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన వహీదాకు వివాహం తలపెట్టాడు తండ్రి.ఆమె ఇంకా చిన్నపిల్ల అప్పుడే పెళ్ళి వద్దని తల్లి చెప్పినా వినడు.వహీదాకు తనకు కాబోయే భర్త గురించి కొన్ని కోరికలున్నాయి.అతను సినిమాల్లో హీరోలా తన మీద ప్రేమ చూపించాలని తనను అభిమానించాలని అట్లా చిన్న చిన్న కోరికలున్నాయి. ఎప్పుడూ సినిమాపాటలు కూనిరాగాలు తీస్తూ వుంటుంది. వహీదా  హైస్కూల్ల్లో చదివినా మంచి కట్టడిలో పెరిగింది మతాచారాలు సంప్రదాయాలు శుచీ శుభ్రాలు అన్నీ తల్లి ఆమెకు తెలియచెప్పింది . రబియా తండ్రి కరీంకి భార్య జోహ్రా అంటే లెక్కలేదు. భోజనం చేసేటప్పుడు కూడా అతను ఏం లోపం వచ్చినా గట్టిగా అరుస్తాడు ఆమెను గడగడలాడిస్తాడు. అతనికి  వాళ్ల ఎస్టేట్ లో పనిచేసే మరుయాయి అనే ఆవిడతో సంబంధంవుంది.ఆ విషయం ఇంట్లోవాళ్ళకే కాక వూరందరికీ కూడా తెలుసు.మగవాళ్లకి అట్లా సంబంధాలుండడం సహజం అనుకుంటారు. మరుయాయి ఇంట్లోనూ తోటలోనూ కష్టపడి పనిచేస్తూ కరీం నే తన భర్తగా భావిస్తూ విశ్వాసంగా వుంటుంది.తను హిందూ అయినా బొట్టు పెట్టుకోదు.ముస్లిమ్ లా వుంటుంది. ఆమెకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేయిస్తాడు కరీం. కరీంభార్య జోహ్రా ఆమెను పనిమనిషిగా సహిస్తూ వుంటుంది. కరీం అన్న ఖాదర్ కి భార్య రహీమా అంటే అభిమానం .ఆమె మాటకు విలువ ఇస్తాడు.కానీ కూతురు పెళ్ళి విషయంలో మాత్రం ఏకపక్షనిర్ణయం తీసుకుంటాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం తన సోదరి కొడుకు సికందర్ తో వివాహం ఖాయం చేస్తాడు.అతడు వహీదా కన్న పదిహేనేళ్ళు పెడ్దవాడు. ఖాదర్ కరీం సోదరులకు పచారీ కొట్టు వుంది.భూములూ తోటలూ వున్నాయి. కారుకూడావుంది.

వీళ్ళుకాక వీళ్ళ బంధువుల కుటుంబాలు మరి మూడు వున్నాయి ఆ వూళ్ళో. రబియా స్నేహితురాలు మదీనా కుటుంబం.మదీనా తండ్రి సింగపూర్ లో  వ్యాపారం చేస్తూ చనిపోయాడు. ఆమె తల్లి  సైనా, ,అక్క ఫరీదాకాక మరొ ఇద్దరు మానసిక వైకల్యంతోపుట్టిన అక్కలు వుంటారు అన్న సులేమాన్ సింగపూర్ లో వుంటాడు.వదిన ముంతాజ్ ఇక్కడే వుంటుంది.

మరోకుటుంబం సారా ది.ఆవిడ  భర్త కూడా సింగపూర్ లో వుంటాడు. వృద్ధుడైనా,జబ్బు చేసినా స్వదేశానికి రమ్మంటే తిరిగిరాడు.ఆమె కూతురు షరీఫా భర్త పెళ్లయిన కొత్తలోనే దుబాయ్ లో ప్రమాదంలో చనిపోయాడు,అప్పుడు గర్భవతిగా వున్న షరీఫా భర్త తమ్ముడిని పెళ్ళి చేసుకోడానికి నిరాకరిస్తుంది.కూతుర్ని చూసుకుంటూ బ్రతుకుతానంటుంది.ఆమెకొక అక్క వుంటుంది.ఆమెకు శారీరక పెరుగుదల లేదు,పెద్దమనిషి కాలేదు.మరో తమ్ముడు కూడా వుంటాడు చిన్నవాడు.

మరొక కుటుంబం నఫీజాది.ఆమెకు ఇద్దరు మగపిల్లలు.అందులో అహమ్మద్ అనే పిల్లవాడు రబియాకు స్నేహితుడు.అతనంటే రబియాకు ప్రేమ .పెద్దైనాక అతన్ని పెళ్ళిచేసుకోవాలనుకుంటుంది. నఫీజాకూ ఆమె భర్తకూ వయస్సులో చాలా తేడావుంది. తమ సమవయస్కుడైనా అజీజ్ తో ఆమెకు స్నేహం వుంది.అది చాలామందికి తెలుసు.

ఈ కుటుంబాలలో మగవాళ్ళు డబ్బు సంపాదనకోసం విదేశాలు వెళ్ళారు.కుటుంబాలు మాత్రం ఇక్కడే వున్నాయి.వివాహం చేసుకున్న యువకులు కూడా ఒంటరిగానే దుబాయ్ సింగపూర్ సిలోన్ వెడతారు .ఏడాదికో రెండేళ్ళకో ఇంటికి వస్తారు. అప్పుడు భార్యలు గర్భం దాల్చి వంశాన్ని వృద్ధిచెయ్యాలని ఆ కుటుంభాలు ఆశిస్తాయి.అంతవరకూ వాళ్ళ భార్యలు అత్తింట్లో వుంటారు. అత్త మామల అదుపాజ్ఞలలో వుంటారు.

ఈ కుటుంబాల మధ్య చుట్టరికం వుంది. ఒకరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న కుతూహలం ఇంకొకకరికి వుంది.జోహ్రా రహీమాలకు తప్ప మిగతా స్త్రీలందరికీ  ఊసుపోక కబుర్లెక్కువ.ఇందులో ఎవరి బాధలు వారికున్నాయి.అయినా ఇతరుల  వ్యక్తిగత విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ.  అందులో నఫీజా ,ముంతాజ్ లకు మరీ ఎక్కువ. వాళ్ళిద్దరూ అన్ని విషయాల గురించి సంకోచమనేది లేకుండా మాట్లాడతారు.బార్యా భర్తల అంతరంగిక విషయాలను గురించి కూడా బాహాటంగా చర్చిస్తారు.

hourpastmidnight

తన ఆడబడుచు సబియా సంగతి రహీమాకు తెలుసు.కూతురు అక్కడ సుఖపడదని కూడా తెలుసు.కానీ భర్త ఆమె ను సంప్రదించకుండానే నిఖా నిర్ణయించేశాడు.. రహీమా ముందు బాధ పడినా సర్దుకుంటుంది. సింగపూర్ లో సికందర్ కి ఆడవాళ్లతో సంబంధాలున్నాయని కూడా కొందరు చెప్పారు. “అయినా మగవాడన్నాక ఇన్నేళ్ళు పెళ్ళికాకుండా వుంటే సంబంధాలుండడం ఒక వింతా ఏం?” అంటాడు కరీం. ఒక పక్క రంజాన్ పండగ సన్నాహాలు మరొక పక్క వహీదా పెళ్ళి సన్నాహాలు జరుగుతూ వుంటాయి. వహీదాకి సికిందర్ మేనత్త కొడుకే అయినప్పటికీ అతనినెప్పుడూ ఆమె చూడలేదు ,మాట్లాడలేదు. ఎటువంటి మనస్తత్వమో తెలియదు. పెళ్ళి అట్టహాసంగా జరిగిపోయింది. సబియా.నోరు మంచిది కాదు.కొడుకు పెళ్ళికి తమ్ముళ్ళు ఎంత ముట్టచెప్పినా అసంతృప్తే .ఇంకా ఇంకా లాంఛనాలు తేలేదని కోడల్ని దెప్పుతూ వుంటుంది.వహీదా మామ సయ్యద్ కొడుకు పెళ్లికోసం సిలోన్ నించీ వచ్చాడు.అక్కడ జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి రేడియోలో విని మళ్ళీ వెళ్ళడమా మానడమా అని ఆలోచిస్తున్నాడు.

వహీదా అత్త సబియా వుండే వూళ్ళోనే జోహ్రా తల్లి అమీనా వుంటుంది. జోహ్రా చెల్లెలు ఫిర్ దౌస్ పెళ్ళయిన వెంటనే భర్తని వదిలేసి వచ్చింది. ఆ పిన్ని అంటే రబియాకు చాలా ఇష్టం కానీ ఆమె సంగతి ఇంట్లో ఎత్తవద్దంటుంది జోహ్రా.ఫిర్ దౌస్ కి వయసులో పెద్దవాడైన ,డబ్బున్న  ఒక అనాకారితో   పెళ్ళి కుదిర్చినది కరీం. ఎందుకంటే మామ చనిపోయాక అత్త అమీనా దగ్గర కట్నకానుకలు భారీగా ఇచ్చే టంత డబ్బులేదు. ఆ కుటుంబానికి మగదిక్కు తనాన్ని భుజాన వేసుకుని తన మీద భారం పడకుండా ఆ సంబంధం కుదిర్చాడు. భర్త ఎట్లా వున్నా సర్దుకుని కాపురం చేసుకోవలసిన ధర్మం స్త్రీలది అని అతనే కాదు మొత్తం సమాజం అంతా అంటుంది.ఆఖరికి అక్క జోహ్రా తల్లి అమీనా కూడా!!..కానీ ఫీర్దౌస్ అతన్ని మొదటి సారి చూసిన క్షణాన్నే అసహ్యించుకుంటుంది .అతనితో కాపురం తన వల్ల కాదని పుట్టింటికి తిరిగి వచ్చింది.అదొక మచ్చ ఆ కుటుంబానికి.ఎప్పుడైతే అత్తవారింటినుంచీ వచ్చిందో ఇంక ఆమె గుమ్మం దాటకూడదు.అలంకరించుకోకూడదు. ఆ పిల్ల ఏతప్పూ చెయ్యకుండా చూడాల్సిన గురుతరభాధ్యత తల్లి మీద వుంటుంది. అయితే ఆ సమాజంలో స్త్రీలకు మళ్ళీ పెళ్ళి చేసుకునే హక్కు వున్నది కనుక ఏదోఒక సంబంధం తెచ్చి పెళ్ళిచేసి భారం తీర్చుకోవాలని చూస్తూవుంటుంది అమీనా.రెండో పెళ్ళివాళ్లని పిల్లలున్న వాళ్లని ఫిర్దౌస్ తిరస్కరిస్తూ వుంటుంది.ఆమె అందగత్తె.వయస్సు తెచ్చే కోరికలున్నాయి.కానీ సమాజందృష్టిలో కుటుంబానికి మచ్చ తెచ్చింది. చెల్లెలికి ఇలాంటి స్థితి రావడానికి తన భర్తే కారణం అని తెలిసీ ఏమీ అనలేని అశక్తురాలు జోహ్రా. అమీనా వుంటున్న ఇల్లు పెద్దది.ఆ ఇల్లు ఆమె భర్త ఇస్మాయిల్ మనసు పడి కట్టుకున్నది.ఊళ్ళో ఎవరిల్లూ లేనంత అందంగా కట్టుకున్నది.ఇప్పుడతను చనిపోయాక రెండో కూతురు తిరిగి వచ్చాక అమీనా ఇంట్లో ఒక భాగం శివ అనే టీచర్ కి అద్దెకిచ్చింది.అతను ఫిర్ దౌస్ కి రోజూ కనపడుతూ వుంటాడు. ఆమె అతని మీద మనసు పడుతుంది. ఇద్దరూ దగ్గరౌతారు. అది తప్పని ఫిర్ దౌస్ కి తెలుసు.కానీ ఆమె ఆ అనుభవాన్ని ప్రేమించింది.ఆనందించింది. అమీనా ఇల్లు సబియా ఇంటికి ఎదురే ..

వహీదా పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వచ్చింది. మొదటిరాత్రే అతని స్వభావం అర్థమైంది ఆమెకి. పెళ్ళయే వరకూ సెక్స్ గురించి మాట్లాడనివ్వకుండా . తమశరీరాలను గురించి తెలుసుకోనివ్వకుండా నాలుగు గోడలమధ్య బందీలుగా వున్న ఆడపిల్లలకు, పెళ్ళయిన మొదటి రాత్రే బంధువులంతా చేరి భర్తకి సహకరించమని హితబోధ చేస్తారు. పదిహేను పదహారేళ్లకే పెళ్ళళ్ళవుతాయి.చిన్న పిల్ల అనికూడా చూడకుండా సికందర్ జరిపిన మోటు శృంగారానికి .పొత్తికడుపులో నొప్పితో లుంగలు చుట్టుకు పోతుంది వహీదా.. మొదట్లో అంతే అని ఆమె మామగారు వెకిలిగా మట్లాడతాడు.అత్త పెడసరం మాటలు, మామగారి ఆకలిచూపులు వెకిలి మాటలు భార్యంటే సెక్స్ అని తప్ప ఇంకే మృదువైన భావమూ లేని సికందర్  వహీదా కి నాలుగురోజుల్లోనే నరకం చూపిస్తారు.అసలు సికందర్  కి కూడా వహీదాని చేసుకోడం ఇష్టంలేదు.చిన్నపిల్ల అని.అతనికి ఎదురింటి ఫిర్ దౌస్ మీద ఇష్టం.కానీ అమీనాదగ్గర డబ్బు లేదని అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇవ్వలేదనీ సబియా ఒప్పుకోదు. మళ్ళి ఇప్పుడు ఫిర్దౌస్ భర్తని వదిలి వచ్చాక కూడా ఆమెని పెళ్లిచేసుకుంటానంటాడు.కానీ తల్లి అసలు ఒప్పుకోదు. అతనికి కూడా ఇది బలవంతపు పెళ్ళే!

ఒక రోజు రాత్రి ఎంతకీ నిద్ర పట్టక బాల్కనీలో నిలబడుతుంది వహీదా. ఆ అమ్మాయి చిన్నప్పటినించీ సమాజం చెప్పే  మంచిచెడులను వింటూ పెరిగింది.తప్పొప్పులను గురించీ సమాజం చేసే వ్యాఖ్యానాలు వింటూ పెరిగింది. బాల్కనీలో నిలబడ్డ వహీదాకి అప్పుడే ఎదురింట్లో నుంచీ ఫిర్ దౌస్ శివ ఇంటి వైపు వెడుతూ కనపడుతుంది. కోపంతో మండిపడుతూ మెట్లుదిగి ఎదురింటికి వెళ్ళి ఫిర్ దౌస్ నీ శివనీ “తప్పుచేస్తూండ”గా పట్టుకుని దులిపేస్తుంది,.అపుడే ఫిర్ దౌస్ సహనం కోల్పోయి వహీదా  తల్లి నీ పిన తండ్రినీ గురించీ ఒక మాట అంటుంది. వహీదా వెనక్కి వచ్చేస్తుంది.కానీ ఆమె చేసిన తొందరపాటు పని ఎంతకి దారితీస్తుందో ఊహించలేదు. వహీదాకీ ఫిర్ దౌస్ కీ జరిగిన సంభాషణంతా విన్న అమీనా కూతురు చేసిన పనిని క్షమించదు.ఎలుకలమందు తెచ్చి “మనిద్దర్లో ఎవరో ఒకరం చనిపోవాలి.చెప్పు,నువ్వా ,నేనా?” అంటుంది. జీవన కాంక్ష తో తల్లి పాదాలు పట్టుకుని వేడుకుంటుంది ఫిర్దౌస్ తనకు బ్రతకాలని వుందని. కానీ ఆమే చనిపోక తప్పలేదు.

ఆచారం ప్రకారం అత్తవారింటికి వచ్చిన నలభై రోజుల తరువాత పుట్టింటికి వెళ్ళి ఒడినింపుకు రావాలి.ఆడపిల్లలు పుట్టింటికి బయలు దేరిన వహీదా తన నగలన్నీ సర్దుకుని ఇంక జన్మలో అత్తగారింటికి రావొద్దనుకుంటుంది. సబియా శుభ్రంలేనితనం .మామగారు సయ్యద్ వెకిలి మాటలు ఆకలి చూపులు సికందర్ నిర్లక్ష్యం ఆమెకక్కడ నరకాన్ని చూపించాయి. ఫిర్దౌస్ మరణం అమీనాని అపరాధభావంతో కృంగదీసి ఆరోగ్యం మీద దెబ్బతీసింది,తల్లిని చూసుకోడానికి వచ్చిన జోహ్రాకు ఫిర్దౌస్ మరణానికి కారణాలు ,వహీదా మాటలు అన్నీ తెలిసాయి. గతంలో ఎప్పుడో తన భర్త రహీమాతో చేసిన తప్పు గురించి తెలిసింది.ఆమె రహీమాని ద్వేషించడం ప్రారంభించింది.ఉమ్మడి కుటుంబం వేరుపడాల్సిందే నని పట్టుపట్టింది.అ ఇంటిని విభజిస్తూ గోడ కట్టడం మొదలౌతుంది.

మదీనా అన్న సులేమాన్ సింగపూర్ నుంచీ వచ్చాడు.చెల్లెలు ఫరీదాకు పెళ్ళి చెయ్యాలి. భార్య ముంతాజ్ ను గర్భవతిని చెయ్యాలి అని రెండు ముఖ్యమైన పనులు పెట్ట్టుకుని వచ్చాడు. మదీనా ఇల్లు రబియా ఇంటికి ఎదురే .వాళ్ళ వాకిట్లో కారు ఆగినపుడల్లా డ్రయివర్ ముత్తు ను చూసి నవ్వుతూ వుంటుంది ఫరీదా. ఆ సంగతి ఆమె వదిన ముంతాజ్ కి తెలుసు.సులేమాన్ స్వభావం ఎరిగిన ముంతాజ్ అతనికి చెప్పదు.తప్పొప్పుల విషయంలో మతాచారాల విషయంలో చాలా కఠినంగా వుంటాడు సులేమాన్. కరీం ఇంట్లో పని చేసే ఫాతిమా ఒక హిందువుతో వెళ్ళిపోయిందని మసీదులో పెద్ద చర్చ లేవదీసి ఫాతిమా తల్లిని వెలివేయిస్తాడు. ఆ వూళ్ళో ముస్లిమ్ స్తీలెవరూ సినిమాకి వెళ్ళకూడదని ఆంక్ష పెట్టిస్తాడు. ఇంకా పెద్ద మనిషి కాకపోయిన మదీనాని బయట తిరగనివ్వడు. కరీం డ్రయివర్ ముత్తును ఉద్యోగంలోనుంచీ తీయించేస్తాడు..అతని స్నేహితుడు అరవై ఏళ్ళ అబ్దుల్ల స్వదేశానికొచ్చినప్పుడల్లా ఒక చిన్న పిల్లని పెళ్ళి చేసుకోడాన్ని ఊరంతా తప్పు పడితే అతను మాత్రం షారియత్ ప్రకారం మగవాళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని సమర్థిస్తాడు. ఒక “కాఫిర్” తో వెళ్ళిపోయిన ఫాతిమా లారీ కిందపడి చనిపోయిందని వార్త తెలిసి అందరికీ చాలా సంతోషంగా చెబుతాడు.తగిన శిక్ష పడిందని ఆనందిస్తాడు.తనకి గర్బం రాకపోతే అతను మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడని ముంతాజ్ దిగులు పడుతుంది.ఆమె అనుకున్నది నిజంఅవుతుంది. డాక్టర్ ఆమెకు పిల్లలు పుట్టరని చెప్పడంతో ఆమె పట్ల సులేమాన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది.ముంతాజ్ ప్రవర్తన కూడా   వింతగా మారుతుంది.ఆమెను ఫిర్దౌస్ దెయ్యమై ఆవహించిందని చెప్పి పుట్టింటికి పంపేస్తారు.సారా కూతురు షరీఫాతో సులేమాన్ కి పెళ్ళి నిశ్చయం చేస్తుంది సైనా. షరీఫాకి పెళ్ళి ఇష్టంలేదు,చనిపోయిన భర్త ని తలుచుకుంటూ కూతుర్ని పెంచుకుంటూ వుండాలని అనుకుంటూంది కానీ తల్లి షరీఫా పెళ్ళికి ఒప్పుకోకపోతే చనిపోతానని బెదిరించి ఒప్పిస్తుంది.ఫాతిమా లారీకింద పడిందని సంతోషంగా చెప్పిన సులేమాన్ ని ఎలా పెళ్ళి చేసుకోవాలి? కానీ తప్పదు.పనిలో పనిగా తన చెల్లెలు ఫరీదా పెళ్ళి అజీజ్ తో నిశ్చయిస్తాడు. బీదవాడైన అజీజ్ ను తనతో వెంట సింగపూర్ తీసుకుపోయి అక్కడ కుదురకునేల చేస్తాడు.ఫరీదాకూ గానీ షరీఫాకు గానీ పెళ్ళయినా ఒకటే! కాకపోయినా ఒకటే .కానీ భర్త వున్న స్త్రీలకుండే గౌరవం వేరు. అజీజ్ వెళ్ళిపోతున్నందుకు నఫీజా బాధపడుతుంది

వహీదా పుట్టింటికి వచ్చినప్పటినుంచీ ఆమెకి నెలసరి వచ్చిందా లేదా అనేదే అక్కడిఆడవాళ్ల చర్చ. వహీదాకి పెళ్ళికాగానే గర్భం వస్తే ఇంక సికందర్ ని నిశ్చింతగా సింగపూర్ పంపేస్తుంది సబియా. ఇంటివాళ్లకీ బయటివాళ్లకీ అందరికీ వహీదా నెలసరి పైనే ఆసక్తి.కానీ వహీదాకి మాత్రం గర్భం రాకూడదని గట్టి కోరిక.తను ఇంక అత్తవారింటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాక సికందర్ గర్భాన్ని ఎందుకు మొయ్యాలి?అనుకుంటుంది.

మదీనా పెద్దమనిషి అయింది.ఆపిల్ల రబియా అంత అమాయకురాలు కాదు. లోకంపోకడ తెలుసు.తల్లి ఆమెను స్కూల్ మాన్పించినా బాధ పడదు. అదంతా సహజం అనుకుంటుంది. మదీనా తో పాటే రబియానుకూడా స్కూల్ మాన్పిస్తుంది జోహ్రా.ఇంకా పెద్దది కాకపోయినా! .ఆమెతోపాటు స్కూల్ కు జతగా నడిచి వెళ్ళే ముస్లిమ్ పిల్లలు లేరనీ ఒంటరిగా పంపననీ చెప్పేస్తుంది. రబియా స్నేహితుడు అహమ్మద్ మేనమామ దగ్గరుండి చదువుకోడానికి వేరే వూరు వెళ్ళిపోతాడు. అక్క వహీదా దగ్గరకు కూడా ఎక్కువ పోనివ్వదు తల్లి రబియాని. ఒంటరిగా గదిలో ముడుచుకుని పడుకుంటుంది రబియా.. అన్నతమ్ముల ఇళ్ళ మధ్య గోడ పూర్తవుతుంది.  వహీదా నెల తప్పానని తెలుసుకుని కుప్పకూలిపోతుంది.తనింక అత్తవారింటికి పోక తప్పదు.ఆమెభవిష్యత్తు తేలిపోయింది.

రంజాన్ నెలలోఅరిసెల పిండి కొట్టుకోడం, గోరింటాకు పెట్టుకోడం, ఉపవాసాలుండడం, వహీదా పెళ్ళికి నగలూ బట్టలూ కొనడం వంటి వేడుకలతో మొదలైన ఈ నవల ముగిసేసరికి పాఠకుల మనసు నిండా విషాదం ముసురుకుంటుంది.

ఇందులో నలుగురు యువతులు; .తనను ఎంతో ప్రేమించిన భర్తతో కొద్దిరోజులే కలిసి వున్న షరీఫా భర్త దుబాయ లో ప్రమాదంలో మరణించడంతో. అతని గుర్తుగా వున్న కూతురికోసం మళ్ళీ  పెళ్ళి వద్దనుకుంటే తల్లి ఆమెను బెదిరించి బలవంతంగా ఇష్టంలేని వ్యక్తితో పెళ్ళికి వొప్పిస్తుంది .భర్త విదేశాలలో వుంటే ఒంటరిగా సంసారం ఈదుకొస్తోంది ఆ తల్లి. ఆమెకు శారీరక పెరుగుదల లేని మరొక కూతురు.చిన్నవాడైన కొడుకు.  ఒకవేళ విదేశంలోనే భర్త మరణిస్తే ఇంటిని ఆదుకునే మగదిక్కు కావాలి..సులేమాన్ ఎవరో కాదు తన అన్నకొడుకే! అందుకే షరీఫాను బలవంత పెట్టి సులేమాన్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది.మొన్నటివరకూ తమతో కలిసి మెలిసి వుండిన ముంతాజ్ కి అది ద్రోహం అయినా కూడా.

మరొక యువతి ఫరీదా.మదీనా అక్క…సులేమాన్ చెల్లెలు. వయస్సొచ్చిన పిల్ల తల్లి గుండెలమీద కుంపటే కాక. అన్. ఆమెకి సరయిన సంబంధాలు రావడం లేదు .అందుకే  ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న అజీజ్ తో పెళ్ళి కుదిర్చేసి తనతో సింగపూర్ తీసుకెళ్లడానికి నిర్ణయించాడు. పెళ్ళి ఒకమొక్కుబడి. ఒక భద్రత తరువాత మళ్ళీ ఎప్పుడో అతనొచ్చేదాకా ఒంటరి జీవితమే, ఫరీదాకైనా, షరీఫాకైనా ,వహీదాకైనా.. !

సులేమాన్ భార్య ముంతాజ్.పిల్లలు పుట్టని నేరానికి,దయ్యం పట్టిందదన్న ఆరోపణమీద  పుట్టింటికి తరిమివేయబడింది.పుట్టింట్లో మళ్ళీ ఆమెకు నాలుగుగోడలే..మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్ప!

వహీదా ధనవంతుడైన తండ్రికి .చదువూ తెలివీ అందం పొందికా అన్నీ వున్న ఒక్కగానొక్క కూతురు.అయినా ఆమె జీవితంపై ఆమెకెలాంటి హక్కూ లేదు. ఆమె శరీరంపైనా ఆమె ఆకాంక్షలపైన ..హక్కులేదు.

కరీం ఇంట్లో పనిచేసే ఫాతిమా! పెళ్లయిన కొద్దిరోజులే ఆమె భర్త ఆమె దగ్గర వున్నాడు.తరువాత మాయమైపోయాడు.ఎక్కడో ఎవరితోనో వుంటున్నాడని ఫాతిమాకు తెలిసింది.ఆమె అతనికోసం వెళ్లలేదు .కొడుకుని పెంచుకుంటూ తల్లి దగ్గరే వుండిపోయింది. ఒకరోజు కొడుకుని కూడా వదిలేసి తను కావాలునుకున్న వాడితో వెళ్ళిపోయింది.ఆమె చేసిన పనిని సమాజమంతా గర్హించింది.  ఆమె చేసిన పని వల్ల ఊళ్ళో స్త్రీలెవరూ సినిమాకు పోగూడదని శాసించింది మసీదు. ఆమె తల్లిని వెలిపెట్టింది.ఆ తల్లి మంచం పట్టింది ఫాతిమా.కొడుకుని రహీమా చేరదీసింది.ఫాతిమా లారీ ప్రమాదంలో చనిపోయినప్పుడు ఒక కాఫిర్ తో వెళ్ళిపోయినందుకు తగిన శాస్తి అయిందని సులేమాన్ లాంటివాళ్ళు సంతోషించారు.కానీ ఊరి స్త్రీలే ఆమె కోసం ప్రార్థించారు .

పెళ్ళిళ్లు కుదర్చడంలో బంధుత్వాలు ఆస్తిపాస్తులు,కుటుంబ పరువు మర్యాదలు. లెక్కలోకి వస్తాయి.కానీ ఈడూ జోడూ ఆడపిల్ల మనసూ శరీరం లెక్కలోకి రావు మూగ జీవుల  నిశ్శబ్ద రోదన లోలోపల అణగారిపోతూనే వుంటుంది.  పదమూడేళ్ళకే నాలుగుగోడల మధ్య బందీ అయిన రబియా జీవితం ఎట్లా వుండబోతుందో? ఆ పిల్లనలా ఇంటికి పరిమితం చేసి బుద్ధిమంతురాలైన ఆడపిల్లగా తయారుచేయడానికి జోహ్రా కారణాలు జోహ్రాకున్నాయి. జోహ్రాపిన్ని మైమూన్ పెళ్ళి అయిన కొద్దిరోజులకే భర్తని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చెయ్యాలనుకుంటూ వుండగానే ఆమె గర్బవతి అని తెలిసింది.తల్లీ అక్కా కలిసి ఒక నాటుమంత్రసానిచేత గర్భంతీయించగా ,మైమూన్ చనిపోయింది.భర్తని విడిచిపెట్టి వచ్చి కుటుంబానికి మచ్చతెచ్చినజోహ్రా చెల్లెలు ఫిర్దౌస్  బలవంతంగా చనిపోయింది.జనాలు తమ కుటుంబం గురించి చెప్పుకుంటున్నారు.మరి రబియా ఎలా తయారవుతుందో అని జోహ్రాభయం .అందుకని అంతులేని కట్టడి ఆ పిల్లకి.

ముక్కుపచ్చలారని పిల్లలకి పెద్దమనుషులు అయీ కాగానే వయో బేధాలు అందచందాలు మనస్తత్వాలు ఏమీ చూడకుందా పెళ్ళిళ్ళు కుదురుస్తారు. మొగుడు ఎలాటివాడైనా తట్టుకుని బ్రతకమని శాసిస్తారు. భర్తని వదిలి వచ్చిన స్త్రీ కానీ ,వితంతువైన స్త్రీ కానీ ఎన్నో ఆంక్షలకు లోబడి బ్రతుకు సాగించాలి.గుమ్మందాటి బయటకు రాకూడదు.అలంకరించుకోకూడదు.వాళ్లమీద నిత్యమూ కాపలాయే. .మతాచారాలూ ఆ పేరుమీద పురుషుల అదుపాజ్ఞలూ భరిస్తూ బ్రతుకుతున్న  స్త్రీలు కూడా మళ్ళీ తాము ఆ అవధులు మీరకుండా బ్రతుకున్నామా లేదా అని వార్ని వాళ్ళు సరిచూసుకుంటూ కాపలా కాచుకుంటూ వుంటారు. స్త్రీల జీవన పరమావధి వివాహం. ఆ వివాహ నిర్ణయంలో వాళ్ల ప్రమేయం ఏమీ లేదు.వాళ్ల శరీరాల మీద కోరికలమీద వాళ్లకి అధికారం లేదు .ఇది ఏ ఒక్క సమాజపు స్త్రీల కథ మాత్రమే కాదు,అన్ని సమాజాలలోనూ జరుగుతూన్న కథే కొంత ప్రత్యక్షంగా,కొంత కనిపించకుండా.

ఈ నవలలో ఆ సమాజంలో పండగలు ఆచారాలు చావులూ పెళ్ళీళ్ళు అన్నీ ఎంతో విశదంగా వర్ణించింది సల్మా.తానొక ప్రేక్షకురాలిగా వుంటుందేకానీ వ్యాఖ్యానాలు చెయ్యదు .

ఈ రోజు సల్మా ఒక ప్రఖ్యాత రచయిత్రి కావడం,  అంతర్జాతీయ కీర్తి పొందడం, విదేశాల్లో సెమినార్లకి హాజరవడం, ఆమెపై ఒక బ్రిటిష్ డాక్యుమెంటరీ నిర్మాత సినిమా తియ్యడం ఇవన్నీ చాలా సులభంగా జరిగిన విషయాలేమీ కావు.

“నా కప్పుడు పన్నెండేళ్ళు.తొమ్మిదో క్లాసు చదువుతున్నాను.ఆరోజు శనివారం మాకు స్కూల్ లేదు.మేం నలుగురు స్నేహితురాళ్లం లైబ్రరీలో కూచుని చదువుకుంటున్నాం.దగ్గర్లోనే వున్న ఒక సినిమాహాల్లో మాటినీ ఆడుతోండి.ఇంట్లో అడిగితే సినిమాకి పంపించడం జరిగేపని కాదు.పైగా మా గ్రామంలో ఎప్పుడో కానీ మాటనీలు వెయ్యరు .రాత్రిపూట సినిమాకి వెళ్లడం అసంభవం. చీకటిపడ్డాక ఆడపిల్లలు బయటికి పోకూడదు.మేం ఇంట్లో చెప్పకుండా సినిమాకి పోవాలనుకున్నాం…మేంలైబ్రరీలో వున్నాం అని ఇంట్లో అనుకుంటారు అని బయల్దేరాం అసలు ఆ హాల్లో ఆడే సినిమా ఏమిటో కూడా మాకుతెలియదు.ఆత్రంకొద్దీ వెళ్ళి హాల్లో కూచున్నాక అది శృంగార భరితమైన మలయాళీ సినిమా అని తేలింది.బయటికి వచ్చేద్దామా అంటే తలుపులు మూసేసారు.కొన్ని దృశ్యాలు వచ్చినప్పుడల్లా మేం చేతుల్లో మొహం దాచుకుని ఎట్లాగో బయటపడ్డాం.ఇంటికి వెళ్ళేసరికి అదే హాల్లో సినిమాకి వచ్చిన మా అన్న మా అమ్మకి చెప్పేశాడు. ఆవిడ నన్ను బాగా కొట్టి స్కూల్ మాన్పించేసింది.అప్పటినించీ  పెళ్ళయేవరకూ తొమ్మిదేళ్ళు నాలుగుగోడల మధ్య బందీ అయిపోయాను.జీవితంలో అతి ముఖ్యమైన ఆ వయసులో ఒంటరిగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా స్నేహితులు లేకుండా గడపడం ఎంత దుర్భరమో కదా?” ఇది సల్మా స్వీయానుభవం.

ఆ తరువాత చాలా ఏళ్ళు ఇటు పుట్టింట్లో అటు భర్త ఇంట్లో ఆమె నాలుగుగోడలమధ్య బందీ . స్త్రీలకి తెలివి తేటలుండకూడదు.వాళ్ళు ప్రశ్నించరాదు.కానీ వీటన్నిటినీ సల్మా ప్రశ్నించింది.అమ్మ ఇంట్లో బంధిస్తే స్కూల్ మాన్పిస్తే ఆమె ఊర్కే కూర్చోలేదు. బాగా పుస్తకాలు చదివింది.కవితలు వ్రాసి రహస్యంగా పత్రికలకు పంపించింది. తనలోని కోపాన్నీ ఆవేశాన్నీ బహిర్గతం చెయ్యడానికి ఒక వాహిక దొరికింది. ఆమె చదువుకోవాలనుకున్నది, బుర్ఖా వేసుకోవద్దనుకున్నది .తన అసలు పేరు రుఖయ్యా.సల్మా కలం పేరు.రజతి అనే పేరుతో కూడా వ్రాసింది.తను వ్రాస్తున్నట్లు తెలియకూడదు, నిశితమైన పదునైన ఆమె కవితలు పత్రికలలో వచ్చాయి.వివాహమయ్యాక ఆమె రచనల్ని భర్త ఏమాత్రమూ ప్రోత్సహించలేదు.అయితే సల్మా తల్లే సల్మా రచనల్ని పత్రికలకి పంపేది.రహస్యంగా పుస్తకావిష్కరణకూడా ఏర్పాటు చేసింది, తరువాత ఆమె తమ ఊరి పంచాయతీ బోర్డు అధ్యక్షురాలైంది స్త్రీలకు రిజర్వ్ అయిన ఆ వూరి పంచాయితీకి ఈమెను నిలబెట్టింది ఆమె భర్తే .2006 లో డిఎంకె తరఫున శాసనసభకు పోటీ చేసి ఓడిపోయింది.తరువాతి సంవత్సరం తమిళనాడు సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కి అధ్యక్షురాలైంది.

ఈ నవలలో చిన్నారి రబియా కూడా సల్మాలా పోరాడి గెలవాలని కోరుకున్నాను.

                 sathyavati   -పి.సత్యవతి

 

 

అలుపు లేని ‘జీవనసమరం’ ముగిసింది!

bharadwaja

జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత శ్రీ రావూరి భర ద్వాజ  ఇక లేరు అన్న వార్త వినంగానే – గుండె ఉసూరుమంది.
ప్రఖ్యాత కథా,  నవలా రచయిత, బాల సాహిత్యోధ్ధారకుడు , రేడియో, స్టేజ్  నాటక రచయిత,  విశిష్ట విమర్శకులు.. ఇవన్నీ ఇప్పుడు మనం  వింటున్న బిరుదులు – ఆయన పేరు చివర!
కానీ, ఇవేవీ లేనప్పుడు..
తనకి ఈ సమాజం ఇచ్చిన బిరుదులు, తనని పేరు తో కాకుండా  పిలిచిన పిలుపులు అన్నీ తనకు బాగా గుర్తే అనే వారు  భరద్వాజ.
తనని-  అవమానించిన మనుషులే తన రచనలో పాత్రలు, తను -ఎదుర్కొన్న  అమానుష సంఘటనలే –  సన్నివేశాలు, తన జీవితానుభవాలే – రచనా సంపుటాలు. కష్టాల కన్నీల్లన్నీ అక్షరాలు గా మారాయి కామోసు!
నిజమే.
అందుకే వారి రచనలు జీవ జలాలు. జీవన సారాలు గా మిగిలిపోయాయి.
రచయిత గానే కాదు, వ్యక్తి గా కూడా అయన ఒక మహర్షి లానే జీవించారు. ‘తనని పనికిరావు ఫొమన్న  వారికే  తిరిగి సాయం చేసారు.  మనుషుల మీద తనకె లాటి  ధిక్కారాలు, ప్రతీకారాలూ లేవనే వారు. ఏ మనిషైనా దిగజారడానికి కారణం అవసరం అని నమ్మే ఈ సమాజ పరిశొధనాత్మకుని మాటలు శిలా శాసనాలు గా నిలిచి పోతాయనడం లో సందేహం లేదు.
తన శతృవు కైనా సాయం చేయడం  ఆదర్శం గా భావించే   ఈ రచయిత, కేవలం మాటల మనిషి మాత్రమే కాదు. చేతల చైతన్య మూర్తి కూడా! ‘సాయం పొందిన వ్యక్తి కళ్లల్లో కనిపించే ఆనంద తరంగం కంటే మించి పొందే అవార్డ్ ఏదీ వుండదని, దీనికి మించిన తృప్తి మరేదీ ఇవ్వదని   విశ్వసించే ఒక విశ్వ మానవ ప్రేమికుదు, శాంతి దూత –  భౌతికం గా మాత్రమే మనకు   లేరు.
కానీ ఆయన రచనలు ఇక్కడ మనల్ని నిత్యం పలకరిస్తూ వుంటాయి. మనిషి గా ఆలోచించమంటాయి.   ఆయన చదివింది 7 వ తరగతే అయినా, వారి రచనలు మాత్రం పరిశోధనాత్మకాంశాలు కావడం గొప్ప విశేషం.
విద్య –  వివేకం కన్నా గొప్పది కాదు.
మనిషి కి కొలమానం విజ్ఞానం కాదు. సంస్కారం.
మనిషిని మనిషి తెలుసుకోవడం కన్నా మరో విశిష్ట గ్రంధమే దీ లేదు అని నిరూపించేందుకు నిలువెత్తు నిర్వచనం గా నిలిచిపోతారు రావూరి.
పుట్టింది   కుగ్రామమే ఐనా, ఇప్పుడు సాహితీ ప్రపంచ పుటం లో వీరి స్థానం హిమాలయమంత!
చిన్నతనం లో –
తిండి లేకుండా చెరువులో నీళ్ళు తాగి బ్రతికానని చెప్పుకునే రావూరి చివరి శ్వాస వరకు కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్నే  గడిపారు.

తెలుగు సాహితీ రంగానికి ఎనలేని కృషి సలిపి, అక్షరాలను  సంజీవిని  ఔషధ వృక్షాలుగా మార్చి,  తెలుగు నవలకు పట్టం కట్టించి,  ప్రతిష్టా కరమైన  జ్ఞాన పీఠ అవార్డ్ ని పొంది ..
అలసి సొలసి ఆయన విశ్రమించారేమో కానీ..
మనకు మాత్రం   విరామం వుండదు. ఆయన్ని స్మరించుకోవడంలో.
ఆయన చిరంజీవి గా వర్ధిల్లుతూనే వుంటారు.
తలచుకున్నప్పుడల్లా కన్నీరౌతూ గుర్తొస్తూనే వుంటారు.

ఆర్. దమయంతి

***

అసంతృప్తి కావాలి

నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది” అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

“నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?” అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
“అసంతృప్తి” అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
“ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముందుకు  నడిపిస్తుంది అసంతృప్తి” అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.

రావూరి భరద్వాజ జ్నాపకాలతో……

– రాధాకృష్ణ

***

 జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం

ఆయనతో అంతగా పరిచయం లేదు. పరిచయమంతా ఆయన రచనలతోనే.

రేడియోలో మొట్ట మొదటిసారి 1985లో నా గొంతు, నా కవిత్వం వినిపించింది ఆయనే. దిగ్గజాల మధ్యలో యువకవిగా నన్ను నిలబెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన కథల సదస్సుకు ఆయనతో పాటు రైలు ప్రయాణం…కాకినాడలో రెండు రోజుల కబుర్ల పారాయణం…! అది మామూలు ప్రయాణమూ కాదు…అవి మామూలు కబుర్లూ కాదు. జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం.
ఈ మధ్యనే ఆయన జ్ఞానపీఠం అందుకున్నారు. కలవాలి కలవాలి అనుకుంటూనే కలవలేక పోయాను. ఇప్పుడు కలవాలన్నా…
ఆయన భౌతికంగా ఇక లేరు.

రావూరి భరద్వాజ గారూ…! జోహార్…జోహార్…

– చైతన్య ప్రసాద్

***

గమనిక:

వొక రచయిత కన్ను మూసాక మిగిలేది ఏమిటి? అతను మన కళ్ళు తెరిపించిన కొన్ని రచనలూ, కొన్ని జ్ఞాపకాలూ..

రావూరి భరద్వాజ గారి గురించి, వారి రచనలతో, వారితో మీకున్న జ్ఞాపకాల గురించి ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంచుకోండి. ఈ వ్యాఖ్యల పరిధి సరిపోదు అనుకుంటే editor@saarangabooks.com కి పంపండి. ప్రచురిస్తాం.

 

స్నేహనామా

“అయితే  యూరోప్ లో అంతా ఫ్రీ లైఫ్ అన్నమాట!” ఆశ్చర్యంగా అడిగింది పక్క ఫ్లాట్ మిత్రురాలు సురేఖ.     “ ఒకరకంగా అలాగే అనుకోవాలి రేఖా! ఇరవయ్యేళ్లొచ్చేవరకే తల్లిదండ్రుల బాధ్యత,  తర్వాత తమ కాళ్ళ మీద తాము బతకాల్సిందే, వేరుగా ఉండాల్సిందే! మన దేశం లో లా కాదు.      ఇక్కడ కొంతమంది పిల్లలు ఎంత వయసొచ్చినా తల్లి తండ్రుల మీద ఆధార పడతారు.    మరికొంతమంది ఉద్యోగం వచ్చేవరకు తల్లిదండ్రుల్ని పీక్కుతినడం,   ఆ పైన ఆస్తుల కోసం పీల్చుకు తినడం కూడా మనం చూస్తూ ఉంటాం.   కానీ  అక్కడ  ఆడపిల్లైనా, మగపిల్లాడైనా  ఇరవై దాటగానే  ఏదో ఉద్యోగం  చూసుకొని  వేరే ఇంట్లో ఉండాల్సిందే!” అంది ఈ మధ్యే  ప్రాజెక్ట్ పని మీద బల్గేరియా వెళ్లొచ్చిన  ప్రొఫెసర్  నీహారిక.

“ మరి పెళ్ళి మాటో?” కుతూహలంగా అడిగింది సురేఖ.  “ ఆ, అక్కడికే  వస్తున్నా.    మన ఇండియా లో లా  పెద్దవాళ్ళు కుదిర్చి, కట్నాలు మాట్లాడి ,లగ్నాలు  పెట్టి   పెళ్లిళ్లు చేయడాలేమీ ఉండవు.    పిల్లలే  తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు. కాదు కాదు,  సహజీవనం సాగిస్తారు ”  “అంటే  పెళ్ళి చేసుకోరా?”   విస్తుపోయింది సురేఖ.  “ చేసుకోరు.    పెళ్ళనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.    పెళ్ళి తంతు  వాళ్ళ  సంస్కృతి లో అంత ప్రధానమైన అంశం కాదు రేఖా!  సహజీవనం.    దీన్నే రిలేషన్ షిప్  అంటారు వాళ్ళు.    అది చాలా సీరియస్ మాటర్.    ఏదో ఇవాళ చూసి, రేపు నచ్చి,ఎల్లుండి కాపరం పెట్టి , వారం లో వదిలేసి వేరే వాళ్ళ వెంటబడ్డం కాదు.    చాలా రోజులు పరిశీలించి , ఒకళ్లకొకళ్ళు  నప్పుతారు అనుకుంటేనే పెద్దవాళ్లతో చర్చించి  నిర్ణయానికి వస్తారు.    ఒక్కసారి రిలేషన్ షిప్ లోకొచ్చాక  చాలా కమిటెడ్ గా ఉంటారు , మన వివాహబంధం లాగే! కొన్నిసార్లు  కంఫర్టబుల్ గా లేదనిపిస్తే   స్నేహంగానే విడిపోతారు.  ఈ కల్సిఉండడం అన్న కాన్సెప్ట్  మనకి విడ్డూరంగా అన్పిస్తుంది కానీ వాళ్లకిది తరతరాలుగా వస్తున్న ఆచారం అనుకోవచ్చు.” అంది నీహారిక ఆరెంజ్ జ్యూస్ సురేఖకి అందిస్తూ.

“అవునులెండి  మనలో కూడా  లక్షణం గా  మంత్రాల సాక్షిగా  చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్ని  పెటాకులు కావడం లేదు? బంధం పట్ల గౌరవం, భాగస్వామి పట్ల  ప్రేమ, నమ్మకం ఉండాలి కానీ పెళ్లి దేముంది లెండి!”   తేల్చేస్తూ పెదవి విరిచింది సురేఖ.    “నిజమే రేఖా! యూరోప్ సంస్కృతి  కాస్త తేడాగా ఉన్నట్టనిపించినా వాళ్ళనించి  మనం నేర్చుకోవాల్సినవి కూడా ఉన్నాయి తెల్సా? ముఖ్యం గా కష్టపడి పనిచేయడం, ఎవరి మీదా ఆధారపడకపోవడం ,  సాటివారికి సాయం చేయడం, గౌరవించడం ….  ఇలా! పిల్లలకి కూడా ఇవే అలవాటు చేస్తారు.”   అంటూ కితాబిచ్చింది నీహారిక.

“అవునుగాని నీహారిక గారూ!  మీ అమ్మాయి శ్రీజ చదువు  వచ్చే సంవత్సరం తో అయిపోతుందనుకుంటా.    సంబంధాలు చూడ్డం మొదలెట్టారా?  విదేశీ సంస్కృతి మోజులో కొట్టుకుపోతున్నారు మనవాళ్ళసలే!”   ఆసక్తిగా అడిగింది సురేఖ గ్లాస్ బల్ల మీద పెడుతూ.    ఫ్రిజ్ లోంచి  మల్లెపూలు, అల్మైరా నించి దారబ్బండి  తెస్తూ “ అమ్మో నాకూ అదే భయం రేఖా.    నీలాగా మగపిల్లలా  ఏమైనా?   ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ఉపన్యాసాలిచ్చినా మన సంస్కృతిని ఎలా వదులుకుంటాం?  శ్రీజకి సంబంధాలు వెతికే  ప్రయత్నంలో ఉన్నాం.”   అంది నీహారిక.     “అయినా మీ ఫ్రెండ్ డాక్టర్ శ్వేత గారబ్బాయి నవీన్  ఉన్నాడుగా, ఇంక వేరే సంబంధం ఎందుకు?” అంది ఏదో గుర్తొచ్చినట్లు రేఖ.    “చిన్నప్పటినించీ  ఫ్రెండ్స్ మే గాని పిల్లనివ్వాలని అనుకోవడం లేదు.    తనకి  శ్రీజ ని కోడలిగా చేసుకోవాలని ఉందని నాకూ చూచాయగా తెల్సు.    అయినా…”.     “ఏం? నవీన్ అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు, పైగా మంచి ఉద్యోగం లో ఉన్నాడు.    బాదరబందీలేమీ  లేవు.    ఇంకేంటి?”  ఆశ్చర్యంగా అడిగింది.

“ఏమీ  కాదు.    జాతకాల పట్టింపు లేదు, కట్నం సమస్యా లేదు అదృష్టవశాత్తూ! శ్వేత ఆశించే రకమూ కాదు.    వాళ్ళాయన ఉత్తముడు.    నవీన్ బంగారుకొండ.”    “ అన్నీ మీరే చెప్తున్నారు.      మరింకేంటి  అభ్యంతరం?  ఓహో పిల్లలకిష్టం లేదా కొంపదీసి?”  అనుమానం గా అడిగింది.    “ అదేం లేదు.    శ్రీజ మాకే వదిలేసింది పెళ్లి విషయం, నవీన్ కూడా శ్వేత చెప్పినట్లే వింటాడు.    తానే అంది ఒకసారి ఏదో మాటల్లో.     నాకెలా చెప్పాలో తెలియడం లేదు “ అంది మాల కట్టడం పూర్తి చేసి.    “పర్లేదు ఎలా చెప్పినా అర్ధమవుతుంది, చెప్పండి ముందు” అంది రేఖ మల్లె చెండు జడ లో తురుముకుంటూ.    “మా పిల్లలు ఆట కెళ్లారు ఇంకో గంటగ్గాని  రారు, మా ఆయనేమో క్యాంప్ కెళ్లారు.    సో నేను ఫ్రీ! మీ వారు, శ్రీజ శిరిడీ నించి రేపు కదా వచ్చేది.    కాబట్టి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా అడిగేవాళ్లు లేరు.   ” అంటున్న రేఖ మాటలకి అడ్డు తగులుతూ “తల్లీ, రేపు క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి, నన్నొదిలిపెట్టు, తర్వాతెప్పుడైనా చెప్తాలే “ అంది నవ్వుతూ నీహారిక.   “నో వే , నాకిప్పుడే తెలియాలి, తెలియాలి”  అంది సినీ ఫక్కీలో రేఖ.

“అయితే విను.    మా అమ్మ, మేనత్త బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నించి.    ఆ స్నేహం తోనే మా అత్త తన  అన్నతో అంటే మా నాన్నగారితో అమ్మకి పెళ్లయ్యేలా చేసింది.    కానీ ఆశ్చర్యం ఏంటంటే  ఏ స్నేహం శాశ్వతం కావాలని  మా అమ్మ ఆశపడి  పెళ్లి చేసుకుందో ఆ స్నేహితురాలు తర్వాత పూర్తిగా మారిపోయింది.    ఆడపడుచు గా రూపాంతరం చెంది మిగిలిన అక్కలతో, తల్లితో కలిసి అమ్మ ని సాధించడం మొదలెట్టింది.    అదేంటో చదువుకొని   ఉద్యోగాలు చేసేవారే  గాని ముగ్గురత్తలు పెళ్లిళ్లు చేసుకోలేదు.    దాంతో ఎప్పుడూ ఇంట్లో కళకళ్ళాడుతూ తిరిగే అమ్మని సూటిపోటి మాటలనడం,  అన్నిటికి వంకలు పెట్టడం.     అమ్మమ్మ వాళ్ళని కూడా ఆడిపోసుకోవడం .     దీంతో అమ్మ మనసు బాగా గాయపడింది.    ఫ్రెండ్ అన్నని చేసుకుంటే  తమ మధ్య అనుబంధం మరింత బలపడుతుందని నమ్మిన అమ్మకి ఇది ఎదురుచూడని దెబ్బ.    కొన్నాళ్ళకి నాన్న ట్రాన్స్ఫర్ రీత్యా మేము వేరే ఊరు వెళ్ళిపోయాము.   అత్తలూ, నాన్నమ్మ కలిసి ఉండేవారు.    ఎప్పుడైనా సెలవులకి వెళ్తే నన్ను, తమ్ముడిని  బానే చూసేవారు కానీ  అమ్మంటే పడేది కాదు.   ఆశ్చర్యమేంటంటే మా అమ్మ ఎప్పుడు వెనకాల కూడా అత్తల్ని తిట్టడం గాని, ద్వేషించడం  గాని చేయలేదు.    తనకి తోబుట్టువులు లేకపోవడంతో నాన్న కుటుంబం లో ఆ లోటు తీర్చుకోవచ్చని ఆశ పడింది, కానీ అది అడియాసే అయింది.     నాన్నకి కోపమొచ్చేది అత్తల ప్రవర్తనకి.     అమ్మ వాళ్లకేమన్నా ఇవ్వమని చెప్తే నాన్న తిట్టేసేవారు అమ్మని…., “వాళ్ళు నిన్ను అకారణంగా ఆడిపోసుకుంటున్నా బుద్ధి లేకుండా ఇంకా వాళ్ళని బాగా చూసుకోవాలి, ఆడపడుచులు సింగినాదం అంటా వేంటి?” అని.    మా అమ్మ ఎప్పుడూ బాధ పడేది.      స్నేహితురాలి అన్నని చేసుకోవడం వల్ల  మంచి భర్త అయితే దొరికాడు గాని ఒక ఆప్తమిత్రురాల్ని పోగొట్టుకున్నాను అని.    ఇంకెవరినో చేసుకొని ఉంటే  తన ఫ్రెండ్ తనకి శత్రువయ్యేది కాదుగా.    ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా అత్త తోనే షేర్ చేసుకొనే అమ్మ  తర్వాత కాలం లో అత్త తిరస్కారాన్ని తట్టుకోలేకపోయింది.

అమ్మ మాకు తన చిన్నప్పటి సంగతులు చెప్పిందంటే మూడొంతులు అత్త ముచ్చట్లే ఉండేవి.    నువ్వు నమ్మవు తెల్సా?  మా నాన్న కంటే ఎక్కువగా అమ్మ దగ్గరే అత్త గురించి విన్నానేమో? తను ఎంత అందంగా ఉండేదో? క్లాసులో ఎంత చలాకీ గా ఉండేదో? ఎంత బాగా చదివేదో?  అన్నీ  వర్ణించి చెప్పేది మా అమ్మ.    అంత అడ్మిరేషన్ అత్తంటే తనకి.    కానీ ఎప్పుడూ  అత్త మాతో అమ్మ గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు.   ఎన్నోసార్లు అడగాలనుకొనేదాన్ని నీకు మా అమ్మంటే ఎందుకు పడదు? అని , కానీ అంత చనువు లేదు మా మధ్య.     సో, మా అమ్మ, అత్తల  మాటర్ చూశాక ఫ్రెండ్షిప్ పదికాలాలు నిలవాలంటే అది బంధుత్వం గా మారకూడదు అని  తెల్సుకున్నాను రేఖా!  అందుకే  నా శ్వేత ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలనే స్వార్ధం తోనే నా కూతురి సుఖాన్ని కూడా పక్కన పెట్టి ఈ పెళ్లి వద్దనుకుంటున్నాను.    శ్రీజకి ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందో లేదో కానీ శ్వేత కంటే మంచి ఫ్రెండ్ నాకీ జన్మ లో దొరకదు.    మా అమ్మ చివరి రోజుల్లో కూడా  తన ఫ్రెండ్ గురించే కన్నీరు పెట్టుకోవడం నేనింకా మర్చిపోలేదు.    నేను…. నేను….. మా అమ్మలా అవదల్చుకోలేదు.    అసలు….” దుఖంతో  నీహారిక మాట పూర్తిచేయలేకపోయింది.

“అంతా మీ అత్త లాగే ఉంటారా? మీ అమ్మగారిలా కూడా ఉండొచ్చని ఎందుకనుకోవు?” మాటలకి ఉలిక్కిపడి చూశారిద్దరూ.    ఎప్పుడొచ్చిందో శ్వేత డైనింగ్ హాల్ గుమ్మం దగ్గర నిలబడి ఉంది.    “ఏయ్ శ్వేతా రా రా ! ఏంటీ అకాల ఆగమనం?”  సంతోషంగా ఆహ్వానించింది నీహారిక.  “ నీ ఉపన్యాసమంతా విన్నానే నీహా!   నాకంతా అర్ధమైంది.    నేను పని మీద బైటకి వెళ్తూ దార్లో నిన్ను చూసిపోదామని  ఇలా రావడం మంచిదయ్యింది.    నీ మనసులో ఏముందో తెలుసుకోగలిగాను.”    అంది నిష్ఠూరంగా.    “ అది కాదే “ అంటూ ఏదో చెప్పబోతున్న నీహారిక తో “ నే వెళ్తాను మేడమ్! మా పిల్లలు వచ్చేసి  ఉంటారు.   ” “వస్తానండి” అని శ్వేత తో కూడా  చెప్పి బైటకి నడిచింది సురేఖ.    ఆమె వెళ్ళాక  నీహారిక వైపు తిరిగి  “నవీన్ కి శ్రీజ ని  అడగాలని ఎప్పటినించో నేను, మీ అన్నయ్య గారు అనుకుంటున్నాం.    ఇంకా అది చదువుకుంటోంది కదా, తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే, నీహా కూతురే గా, పరాయివాళ్ళా ఏమన్నానా? అనుకున్నా… .  ” శ్వేత మాట పూర్తి కాకుండానే  “అంతా అర్ధమయ్యాక కూడా మళ్ళీ ఎందుకే  మొదటికొస్తావ్? నాకంటూ ఆత్మీయురాలివి, ఆప్తురాలివి నువ్వే! ఏదైనా నీతోనే కదే నేను షేర్ చేసుకుంటాను!  నాకు తెల్సు నవీన్ కంటే ఉత్తముడు నాకు అల్లుడు గా రాడు.    అలాగే నీ అంత మంచి  అత్తగారు శ్రీజకి  ఖచ్చితంగా దొరకదు.   కానీ నేను చాలా స్వార్ధపరురాల్నే శ్వేతా! కూతురి  పెళ్లి కోసం స్నేహాన్ని పణం గా పెట్టలేను.   ” కళ్ళు తుడుచుకుంది నీహారిక.

“ ఆపుతావా  తల్లీ నీ దండకం? ఎప్పుడో మీ అమ్మ, అత్తల మధ్య స్నేహం దెబ్బతిందని ఇప్పుడు మనం వియ్యంకులం కాకూడదని శపధం చేస్తావేంటీ? అప్పుడంటే మీ నాన్నగారిది  మధ్యతరగతి  కుటుంబమవడం, అత్తలు అవివాహితలుగా ఉండిపోవడం తో అన్నావదినలు  పిల్లలతో హాయిగా సంసారం చేసుకోవడం…    వాళ్ళకి మీ అమ్మగారి మీద కసిని, ద్వేషాన్ని రగిల్చాయి.    వాళ్ళకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మంచి సంబంధాలొచ్చినా, మీ నాన్నమ్మ ఎంతగా చెప్పినా ఒప్పుకోలేదని చెప్పావు… నాకు గుర్తుంది.    తను సెలక్ట్ చేసిన అమ్మాయే అయినా, తన ఫ్రెండే అయినా, తన కళ్ల ముందు పెళ్లి చేసుకొని కళకళ్ళాడుతూ తిరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మీ అమ్మగార్ని ఏదో రకంగా సాధించి రాక్షసానందం పొందుంటారు.    అందుకే వాళ్ళ స్నేహం దెబ్బతింది.    ఇక మన విషయానికొస్తే  పెళ్లయ్యాక పిల్లలు మన దగ్గర ఉండమన్నా  ఉండరు.     అంతా ఫారిన్  మయం కదా! మనమూ ఉద్యోగస్తులమాయే! వాళ్ళకి అవసరమైతే మనల్ని రమ్మంటారు.    అతిధుల్లా వెళ్ళి చూసి , సాయం చేసి రావడమే.    వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళ పెంపకాలు, చదువులు, బాధ్యతలు.     ఇలా తమదైన లోకం లో తాముంటారు.    మనం మాత్రం ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము.    ఇంతోటి దానికి మన స్నేహాన్నిమర్చిపోయి గొడవలు పడుతూ ఎందుకుంటామే?అయినా దేనికి గొడవలు? అన్నిట్లో మనం సమానమే.    మన మధ్య ఏ దాపరికాలు,అసూయలు లేవు.   పోనీ “స్నేహనామా” రాసుకుందామా?”ఆవేశం గా అడిగింది శ్వేత.

“ అంటే?” అర్ధం కాలేదు నీహారికకి.    “ అదేనే వీలునామా లాగా! మనం వియ్యంకులమైనా ఎప్పటికీ మంచి మిత్రులుగానే ఉంటామనీ, మన స్నేహానికి ఏ  హాని కలగనివ్వబోమని, స్నేహబంధాన్ని జీవితాంతం గౌరవిస్తామనీ, ఒక వేళ పిల్లల మధ్య పొరపొచ్చాలొచ్చినా  మనం దెబ్బలాడుకోకుండా  సామరస్యంగా పరిష్కరిస్తామనీ  పేపర్ మీద రాసుకుందాం.    ఈ స్నేహనామా నీకు ఓకే నా నీహా?” ప్రేమగా, అనునయoగా  చెప్తున్న శ్వేతని ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది  నీహారిక.

“చాలే, నీ లాటి ఉత్తమురాలు నా ఫ్రెండ్ అయినందుకు నాకు  చాలా గర్వంగా ఉందే! ఏ స్నేహనామాలూ అక్కర్లేదు.    నా ఫ్రెండ్ ఎప్పటికీ నాతో ఉంటుందంటే  ఇంతకంటే ఏం కావాలి? నేను, నా కూతురు కూడా అదృష్టవంతులమే శ్వేతా!” ఆనందబాష్పాలతో అంది నీహారిక.

**  **  **

ఆచార్య పి. కె.  జయలక్ష్మి 

Unfinished Painting

DRUSHYA DRUSHYAM PHOTO

ఆది అంతమూ లేని జీవనాడి ఒకోసారి ‘చిత్ర’మై ఘనీభవించి, మళ్లీ కాలవాహికలో దొర్లుతూనే ఉంటుంది, అక్షరమై………….

*
ఒకానొక ఉదయం మధ్నాహ్నమైంది.

ఒక చిత్రకారుడి ఇంటిలోకి ప్రవేశించగానే అక్కడ అనుకున్నదేమీ లేదు. శాంతి లేదు. స్వప్నమూ కానరాలేదు. సమాధిలో ఉంది జీవితం. లేదంటే ఒకానొక పురాతన ఆవాసంలో సరికొత్తదేమీ లేనంత నిర్లిప్తత తాండవిస్తున్నది. ఆయనింకా లేవనూ లేదు. ఇల్లంతా నిర్విరామ నిశ్శబ్దపు అలికిడికి ఉల్లాసం హరించుకుపోగా విసుగు పెరుగుతున్నది. పావుగంట తర్వాత మెత్తటి అడుగులతో, ఒకానొక అందమైన ఒడిషా పల్లెపడచు లయాత్మక ప్రవేశం.

చిత్రం. ఆమె చిత్రకారిణి కాదు. కాదుగానీ అప్పటిదాకా లేని కళ ఏదో అకస్మాత్తుగా తెచ్చింది. ప్రేమగా పాలు, బిస్కట్లు ఇచ్చింది. ఎక్కడి వస్తువులు అక్కడే గప్‌చుప్‌గా ఉండగా, పేరుకున్న దుమ్ము మాత్రమే చిర్నవ్వులు చిందిస్తుండగా ఆమె నిదానంగా నడుం వంచి ఊడ్చింది. అప్పుడు అక్కడ సోఫాలోంచి లేచి నిలబడటం.. ఆ పరిసరాలు ఊడ్చినాక కూచోవడం, ఎవరింట్లోనైనా అంతే అన్నంత మామూలు తర్వాత ఆమె అదృశ్యమై అతడు ప్రత్యక్షమయ్యాడు, నిద్రకళ్లతో…

చిత్రాతిచిత్రం. అతడు కన్ను తెరిచి మూయగానే, ఒక్కపరి వేల పక్షుల రెక్కల చప్పుడు, కువకువలు మళ్లీ సద్దుమణిగిన సవ్వడి అతడి విశ్వసనీయమైన కరచాలనంతో…

మళ్లీ వెళ్లిపోతున్నాడు ఆ ఇల్లేమో ఒక నిర్వ్యాపారమై ఒక బద్దకించిన స్త్రీలా బరువైన కురులతో, నిండు చనులతో మెల్లగా మళ్లీ వైరాగ్య మండపంలా మారపోతుండగా మళ్లీ ఆ ఇల్లు బావురుమన్నది.

మళ్లీ పనిమనిషి కనిపించగానే మళ్లీ ఆ ఇల్లు ఉయ్యాలలా ఊగుతోంది. మెల్లగా శిశువు ఏడ్పు పసిప్రాయం ఎక్కడా దరిదాపుల్లో లేదు. తల్లీ కానరాలేదు. అంతా అలికిడిలేని విరాగమే.

‘ఇక్కడికి కాదు, స్టూడియోకి వెళ్లాల్సింది’  ఆ పనిమనిషి ఓదార్పు వచనం.

‘తెలియక వచ్చాను’  నా జవాబు.

అరగంట తర్వాత మళ్లీ ఆయన వచ్చాడు. ఈసారి చెట్టు కదులుతున్నట్టు వడివడిగా ఆలీవ్ గ్రీన్ దుస్తులతో తయారై వచ్చి సడెన్‌గా జీపు స్టార్ట్ చేసి నన్ను కూచోబెట్టుకుని వెళ్లసాగాడు.

పావుగంటలో స్టూడియో. అక్కడకు చేరుకుంటూనే ఆయన ఇంట్లోంచి వీధిలోకి ప్రవేశించినంత ఆత్రంగా, ఆనందంగా దిగాడు. చకచకా మెట్లెక్కసాగాడు. ఉత్సాహంగా కనిపించసాగాడు. ఇక స్టూడియో. అందులోకి ప్రవేశించగానే అతడి గొంతు మార్దవమైంది. మాటలు కలిపాడు. ఊట బావి గుర్తుకు వచ్చింది. దప్పిక తీర్చే తీయటి నీళ్ల జలజల క్రమక్రమంగా దోసిలి పట్టాను. కానీ తీరదే దాహం?

అతడు, తన చిత్రాలు, పుస్తకాలు, చిత్రకళతో పాటు తాను సేకరించే విసన కర్రలు, మన రుమాలు కాదు, దొరటోపీలు-హ్యాట్స్-వాటి కలెక్షన్-అలాగే తన స్టాఫ్, మూడు నాలుగు అంతస్థుల్లో తాను గీసిన చిత్రాలు, రూపొందించిన మ్యూరల్స్, కొన్ని శిల్పాలూ, కవితా చరణాలూ, వీటన్నిటి గురించి చెప్పగా క్షణాలు గడిచిపోతున్నాయ్. నా మనసంతా ఇంటిమీదే. అక్కడ ఆ స్త్రీ బాగున్నది. ప్రేమగా, శాంతంగా, కళలా…

కానీ ఇతడు మాటలు మాటలు.. వాటితో ఇతడు. ఉక్కిరిబిక్కిరవుతూ నేను, నా చూపులు. ఒక్క పరి నా కన్నులు అసంపూర్ణమైన ఈ చిత్రంపై పడ్డాయి. అప్పటిదాకా సుషుప్తిలో జోగుతున్న నా త్రినేత్రం టక్కున మేలుకున్నది. ఇదిగో, ఇక్కడే కన్నులు, నా కెమెరా కన్నూ ‘ఫినిష్’ – ఒక్కటైంది, క్లిక్ మని!

ఎందుకనో, ఏమిటో, ఎంతగానో అంతదాకా ఏదీ ఫొటో తీయబుద్దవలేదు. కానీ, దీంతో ప్రారంభం. ఇక ఎన్ని ఫొటోలో!

బహుశా ఇదీ అతడు. ఈ చిత్రమే అతడు. అతడెవరో తెలిపే చిత్రమే ఇది.

ఇల్లూ వాకిలీ స్టూడియో ఇవేవీ కాదు, కాన్వాసు. అదే అతడి వినువీధి, వాహ్యాళి. అదే అతడి చిత్తరువు.

అది దేహమా ఆత్మా, ఆడదా మగాడా అన్నది కాదు. ఆడమ్ అండ్ ఈవ్ తిన్న ఆపిల్ పండంత హృదయమే అతడిది. కానీ, తనది అసాధారణమైన శాక్తేయం. స్థలమూ, కాలమూ లేని పురాగానమో ఆధునికానంతర పునర్నివాసమో గానీ కాన్వాసుపై అతడు స్త్రీపురుషుడు. వట్టి మనిషి. సంయుక్తం కాని వ్యక్తిత్వం. పూర్ణం కానీ కాయం. తృప్తినివ్వని గాయం.

అతడి చిత్తమూ చిత్రమే అన్నట్టు అక్కడ ఆయన.

క్షణాలు, నిహిషాలు, ఘడియలూ దాటి ఒక పూటంతా వెచ్చించిన తర్వాత, అటు తర్వాత రెండేళ్లకు మళ్లీ ఈ బొమ్మ, తిలక్ అన్నట్టు, ‘చిమ్మ చీకటి కరేల్మని కదిలింది’, ఇలా…

బహుశా, అసంపూర్ణమే సంపూర్ణం.
ఇంకా ఎన్నో ఉన్నా ఇదే సంపూర్ణం, అసంపూర్ణం.

ప్రసిద్ధ చిత్రకారులు జతిన్‌దాస్‌కు, ముఖ్యంగా మీతో పంచుకుంటున్న తన ‘Unfinished paintingకు ధన్యవాదాలు.

~కందుకూరి రమేష్ బాబు

కలలకే కలవరింతలు,రాగాలకే పులకింతలు!

Ramesh+Naidu+1292932446

“మురళీధరుడైన రాముడు, కోదండధరుడైన కృష్ణుడు, చక్రధరుడైన శివుడు, చంద్రధరుడైన విష్ణువు, బుధ్ధుడి సౌందర్య లహరి, ఆదిశంకరుడి ధర్మపథం, ఈక్వేటర్ లో హిమాలయాలు, ఉత్తర ధృవంలో హిందూ మహాసముద్రం – ఇవి కలుసుకొనే తీరాలు. కలలకే స్వప్నాలు – ఒక్క ముక్కలో చెప్పాలంటే అదృశ్యాలు, అసాధ్యాలు, కల్పనా బలం కొ్ద్దీ తలపెట్టే అఘాయిత్యాలు.

అయినా ఇవి సాధ్యాలే. కల్పనలు కూడా సత్యాలే. అటువంటి అభూతకల్పన అక్షరసత్యంగా మారిన అపురూప సంఘటన పేరే రమేష్ నాయుడు. ”

ఇవి రమేష్ నాయుడు  గురించి, వేటూరి తను రచించిన ” కొమ్మకొమ్మకో సన్నాయి ” పుస్తకంలో రాసిన పరిచయవాక్యాలు. ఇంతకు మించిన అతిశయోక్తులతో రమేష్ నాయుడు గారిని పొగడటం అసాధ్యమేనేమో!

వేటూరి తన పుస్తకంలో ఎవ్వరికీ ఇవ్వనంత గౌరవం రమేష్ గారికి ఇస్తూ రెండు అధ్యాయాలు ఆయనకి కేటాయించారు. కానీ నాకు మాత్రం, రమేష్ నాయుడు, అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే కవి, డా.సి.నారాయణ రెడ్డి గారే.

రమేష్ నాయుడు యాభైల్లో, అరవైల్లో అడపా దడపా తెలుగు సినిమాలకి సంగీతం సమకూర్చినా, డెభ్భై రెండులో, “అమ్మ మాట”, “తాతా మనవడు” చిత్రాలకి సంగీతం అందించటం ద్వారా పునఃప్రవేశం చేశారు.

“అమ్మ మాట” లో, “మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు” అని సినారె మొదలెడితే, “లగ్గమెప్పుడ్రా మావా అంటే మాఘ మాసం  ఎళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే” అంటూ రమేష్ గారు పూర్తి చేసారని భోగట్టా. యల్.ఆర్. ఈశ్వరి గొంతులో ఈ ‘ఐటం సాంగు’ గత నలభై ఏళ్లుగా ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంది. ఈ బాణీని, ఈ పాటలోని కొన్ని పంక్తులనీ యధాతధంగా ‘దేవదాసు’ (2005) లో మళ్ళీ వాడుకున్నారు.

రమేష్ నాయుడు అనంగానే, సి.నా.రె గుర్తుకు రావటానికి ఈ పాట కారణం అనుకొనేరు. వారివురి కలయిక దీనితో ప్రారంభమైనా, ఆ తరువాత వీరు మన తెలుగు సినీ కవిత్వంలో కలకాలం గుర్తుండిపోయే సాహితీ సృష్టి జరిపారు.

“జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకీ

వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణీ

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా”

అంటూ ఒప్పెనలా పొంగుతున్న మోహావేశాన్ని ఒక ప్రియుడు తన నాయిక కోసం వ్యక్తపరచినా

“ఏ ఫలమాశించి మత్త కోకిల ఎలుగెత్తి పాడును
ఏ వెల ఆశించి పూసే పువ్వు తావి విరజిమ్మును
అవధిలేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం

లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను”

అంటూ ఒక కళాపిపాసి లలితకళలకు నివాళులర్పించినా

“సరళ తరళ నీహార యవనికల .. మెరిసే సూర్య కళికా

మృదుల మృదుల నవ పవన వీచికల … కదిలే మదన లతికా

నీ లలిత చరణ పల్లవ చుంబనమున  పులకించును వసుధ జయసుధా…
ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో .. ప్రణయ భావనకు ప్రథమ మూర్తివో

ప్రణయ గగనమున ప్రథమ రేఖవో … రేఖవో శశిరేఖవో సుధవో జయసుధవో”

అంటూ తన ప్రేయసికి తాను చెప్పేది అర్థం అవుతోందా లేదా అన్న ధ్యాస లేకుండా ఓ ప్రియుడు తన చెలిని వర్ణించినా,

ఆ ఘనత, కవి గారితో పాటు రమేష్ నాయుడు గారికి కూడా చెందుతుంది. అంత చిక్కని సాహిత్యం పది మందికీ చేరిందీ అంటే, రాసిన ఆ క్లిష్ఠతరమైన పంక్తులకు ఒక సులువైన బాణీ కట్టటం నుంచీ, వాయిద్యపు హోరు ఆ పదధ్వనులను కప్పేయకుండా చూసుకోవటం, దానికి తోడు, శాస్త్రీయ సంగీత రాగాలలోనే నిబద్ధతతో స్వరపరచటం వరకూ, రమేష్ నాయుడు చూపించిన అసమాన ప్రతిభే కారణం.

అదే సి.నా.రె కవిత్వం, “ఆడవే మయూరి” పాటలో ఆ కట్టిన బాణీ (‘మామ’కి క్షమాపణలతో) వల్లనో, లేక ఆది పాడిన విధానం వల్లనో, అంతగా ఆస్వాదించలేమనిపిస్తుంది.

శాస్త్రీయ రాగాలు, వాయిద్యాల మాట వచ్చింది కాబట్టి ఇక్కడ రమేష్ నాయుడి గారి బాల్యకౌమార్యాల గురించి కొంత ప్రస్తావించుకోవాలి. 1933లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జన్మించిన రమేష్ నాయుడు చిన్న వయసు లోనే బొంబాయి కి పారిపోయి అక్కడ ఒక వాయిద్యాలు అమ్మే దుకాణంలో ఎన్నో సంవత్సరాలు పని చేసి, యుక్త వయసులోనే బెంగాలీ, మరాఠీ, హిందీ భాషలలో సినిమాలకి సంగీతాన్ని అందించారు.
ఆ వాయిద్యాల దుకాణంలో పని చేసిన అనుభవం వల్లనే నేమో, వాటిని ఎంతో సంయమనంతో, చాలా పొదుపుగా వాడేవారు, తన పాటల్లో. అలాగే, శాస్త్రీయ సంగీతం ఏ గురువు దగ్గరా నేర్చుకోకపోవటంవల్ల, ఆ రాగాలు వాడినప్పుడు ఎక్కువ ప్రయోగాలు చెయ్యకుండా, ఎంతో నిబద్ధతతో బాణీలు కట్టేవారు.  “ఎక్ తారా” ని ముఖ్య వాయిద్యంగా  ఉపయోగించి, కల్యాణి లో కట్టిన “జోరు మీదున్నావు తుమ్మెదా” పాట అజరామరం.

ఆయనకి కల్యాణి చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటనుకుంటాను. పైన చెప్పుకున్న సినారె పాటల్లో “లలిత కళారాధనలో”, “ప్రణయ కావ్యమున”, ఈ రాగంలో కట్టినవే.

వేటూరితో చేసిన పాటల దగ్గర కొచ్చేసరికి ఒక చిన్న పక్క దోవ పట్టి నా అనుభవం ఒకటి చెప్పుకోవాలి. నాగార్జున సాగర్ లో, ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న రోజులవి. శనివారం రాత్రి టి.వి. లో వచ్చే తెలుగు సినిమా కోసం చాలా మంది వేచి చూసే వాళ్ళం. ఓ శనివారం “సువర్ణ సుందరి” అని సినిమా మొదలయ్యింది. చంద్రమోహన్ హీరో. కలలో ఎవరో సుందరి కనపడుతుంది. హీరో కవిత్వం చెప్పేస్తూ ఉంటాడు. హాలు మొత్తం ఖాళీ! నేను, నా మిత్రుడు ఒక్కడు మాత్రమే మిగిలాం. ఆ వయస్సుకి, ఆ కథా, కవి అయిన ఆ హీరో చెప్పే కవిత్వం అద్భుతంగా అనిపించాయి. ఇద్దరం సినిమా పూర్తయ్యే దాకా అస్సలు కదలలేదు.

ఆ తరువాత ఎన్నో ఏళ్ళకి గానీ  అది హిందీ సినిమా “నవరంగ్” కి రీమేక్, ఆ సినిమాలో మా ఇద్దరినీ కట్టి పడేసిన కవిత్వం వేటూరిదీ, సంగీతం రమేష్ నాయుడిదీ, అని తెలిసిరాలేదు. ఎక్కువగా ప్రాచుర్యం పొందక పోయినా కానీ, ఆ సినిమా పాటలు అలా గుర్తుండి పోయాయి.

“ఇది నా జీవితాలాపనా…ప్రియదేవతాన్వేషణా
ఏమైనదో? ఎట దాగున్నదో! ఎన్నాళ్ళు ఈ వేదనా…?”

“ఊహవో ఊపిరివో..నా జీవన రసమాధురివో

వివర్ణమైన ఆశల ముంగిట..సువర్ణసుందరివో”

“మధువనాంతముల  మరు  వసంతములు  చిరు లతాంతములు వెదజల్లగా

దశ దిశాంతముల జత శకుంతములు గల  మరందములు ఎద జల్లగా”

వేటూరి ముందరే సమకూర్చిన స్టాకు బాణీల్లో పదాలు ఇరికించే కష్టం లేకుండా స్వేచ్చగా తన కలాన్ని కదిపితే ఎలా పాటలు వ్రాయగలరో ఈ సినిమాలోని పాటలే ఒక నిదర్శనం. ఇవి వినదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది లింకులో ఆ పాటలు వినచ్చు.
http://www.allbestsongs.com/telugu_songs/Search-Telugu-Movie-Songs.php?st=suvarna+sundari&sa=Go%21

డెభ్భైల తరవాత వచ్చిన సంగీత దర్శకులలో, కవి పాటను వ్రాసిన తరవాతే బాణీలు కట్టిన సంగీత దర్శకుడు, బహుశా రమేష్ నాయుడు ఒక్కళ్ళేనేమో! వేటూరికి అందువల్లనే రమేష్ నాయుడు అంత ప్రీతిపాత్రుడయ్యాడని నా అనుమానం.

“నవమి నాటి వెన్నెల నేను ..దశమి నాటి జాబిలి నీవు..
కలుసుకున్న ప్రతి రేయి.. కార్తీక పున్నమి రేయి..”

“మెరుపులా మెరిశావు… వలపులా కలిసావు

కనులు మూసి తెరిచేలోగా..నిన్నలలో నిలిచావూ… నిన్నలలో నిలిచావూ”

“సిగ్గూ పూబంతీ యిసిరే సీతా మాలచ్చీ
మొగ్గ సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ”

లాంటి మరవలేని పాటలెన్నో రమేష్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో వచ్చాయి.

రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన మొత్తం తెలుగు సినిమాలు వందకి మించవు. దానికి ఆయన పనిచేసిన విధానం ఒక కారణమేమో. రోజుకి అయిదారు పాటలు అవలీలగా “కొట్టి పారేసే” దిగద్దర్శకులున్నప్పుడు, వాళ్ళు కొట్టిన బాణీలకి అర్థం పర్థం లేకపోయినా, అర్థమేదో ఉన్నట్టుగానే ఉంది, అనిపించేటటువంటి కొత్త కొత్త  పద ప్రయోగాలు చేసి అంతే స్పీడులో పాట రాసి పారేసేందుకు సిద్ధమైన కవికోవుదులున్న వాతావరణంలో, రమేష్ నాయుడు చాదస్తం మనిషే!

రమేష్ నాయుడు బాణీ కట్టాలంటే ఆయనకి ఆ పాట సందర్భం, పాత్రల స్వభావం లాంటి వివరాలే కాకుండా, ఆ పాట పంక్తులు కూడా అతడికి స్పూర్తి నిచ్చేవి లాగా ఉండాలి. ఇన్ని సమకూరితే కానీ ఆయన బాణీ కట్టడానికి కూర్చోనే వాడు కాడట.

ఆయన ఆచారాలకి అలవాటు పడ్డ దర్శకులు మటుకూ ఆయనతోనే తమ సినిమాలకు సంగీతం చేయించేవారు. దాసరి నారాయణరావు గారు, తన తొలి చిత్రం “తాతా మనవడు” సినిమాతో మొదలైన రమేష్ నాయుడి సంగీత సాంగత్యాన్ని, తను నిర్మించిన దాదాపు అన్ని సినిమాలలోనూ కొనసాగించారు.

“అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం..

ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం”

ఈ సినిమాలోని ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పాట. దీని తరువాత వరుసగా “సంసారం సాగరం”, “బంట్రోతు భార్య”, “తూర్పు పడమర”, “రాధమ్మ పెళ్లి”,  “జయసుధ”, “శివరంజని”, “చిల్లరకొట్టు చిట్టెమ్మ”, “సుజాత” వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.

Megha_Sandesham

“మేఘసందేశం” సినిమాతో తో వీరిద్దరూ తమ తమ కేరియర్స్ లోని శిఖరాగ్రాలకి చేరుకొన్నారు. ఇద్దరూ జాతీయ అవార్డులను అందుకొన్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఈ రోజుకి కూడా జాతీయ అవార్డును గెలుచుకొన్న ఏకైక తెలుగు సంగీత దర్శకుడు రమేష్ నాయుడు (మామ, రాజాలకు తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చినా, వారు తెలుగు వారు కారు).

దేవులపల్లి భావకవిత్వ ప్రేరణతో రమేష్ నాయుడు కట్టిన ఈ బాణీ కొన్ని శతాబ్దాలు నిలుస్తుందనటం అతిశయోక్తి కాదు.

“తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల… చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఆకలా దాహమా చింతలా వంతలా… ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడ

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..

ఆకులో ఆకునై, పూవులో పూవునై… కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా”

http://www.youtube.com/watch?v=xBh2z9CWhkM

 

జయదేవుని అష్టపదులు “ప్రియే చారుశీలే”, “రాధికా, కృష్ణా రాధికా”, వేటూరి, “నిన్నటి దాకా శిలనైనా”, “పాడనా వాణి కల్యాణిగా”, ఇక దేవులపల్లి పద్యాలూ, పాటలూ, వెరసి, తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయి, ఈ సినిమా సంగీతం!

రమేష్ నాయుడి చెయ్యి విడువక నడచిన దర్శకులలో దాసరి తరవాత చెప్పుకోవలసిన వారు విజయనిర్మల. వారి కాంబినేషన్ లో కూడా ఎన్నో సినిమాలు, గుర్తుండి పోయే పాటలు.
నాకు అన్నిటి లోకి ఇష్టమైన పాట “మీనా” చిత్రంలోని “శ్రీరామ నామాలు శత కోటి, ఒక్కొక్క పేరూ, బహుతీపి”. ఆ నామాల్లోని తియ్యదనం రామభక్తులకే అనుభవసాధ్యమేమో కానీ, ఆ పాటలోని రమేష్ నాయుడు గారు జొప్పించిన తియ్యదనం, నిస్సందేహంగా అందరూ ఆస్వాదించవచ్చు.  “మల్లె తీగ వంటిది మగువ జీవితం..”, “పెళ్ళంటే నూరేళ్ళ పంట” అదే సినిమాలో  ఆ రోజుల్లో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు.

వీరిరువురి కాంబినేషన్ లో “ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ…” (దేవుడే గెలిచాడు), “అరవైలో ఇరవై వచ్చిందీ..” (భోగిమంటలు), “ఏ ఊరు, ఏ వాడ అందగాడా, మా ఊరు వచ్చావు సందకాడ” (హేమాహేమీలు) లాంటి కొన్ని గుర్తుపెట్టుకోదగ్గ పాటలతో బాటు,  కొన్ని మర్చిపోదగ్గ ఫక్తు కమర్షియల్ బీట్ పాటలూ ఉన్నాయి.

ఆయన ఘన విజయాలతో పాటు కొన్ని అపజయాల గురించి కూడా చెప్పుకోవాలి. విజయనిర్మల, రమేష్ నాయుడు కాంబినేషన్ లో వచ్చిన “స్పెక్టాక్యులర్ ఫైల్యూర్”, “దేవదాసు”. నిజానికి “సుబ్బరామన్-ఘంటసాల-సముద్రాల” పాత దేవదాసు పాటలు మన మనస్సులో ఎంతగానో అల్లుకుపోయిన నేపథ్యంలో, మళ్ళీ ఆ సినిమా రీమేక్ చేయ్యలనుకోవటం, దానికి రమేష్ నాయుడు సంగీతం అందించటం, ఒక పెద్ద దుస్సాహసం.

ఓ “పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో..” పాటని ఎంత “మేఘాల మీద సాగాలి” అనిపించినా అందుకోవటం సాధ్యమా! ఈ సినిమా పాటల పైన ఇంకా అంత కంటే పునరావలోకనం అనవసరం.

విజయనిర్మల తరవాత, జంధ్యాల రమేష్ నాయుడు గారితో కలిసి పనిచేసి మరి కొన్ని ఆణిముత్యాలు అందించారు.

Mudha-Mandharam

“ముద్దుకే ముద్దొచ్చే మందారం ముద్ద మందారం…” అంటూ 1981 లో మొదలైన వీరి సాహచర్యం, రమేష్ నాయడు 1987లో తుది శ్వాస తీసుకొనే వరకూ కొనసాగింది.  “అలివేణీ ఆణిముత్యమా..”, “నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి” పాటలు కూడా వారి తొలి చిత్రం (కాంబినేషన్ లో)  “ముద్దమందారం” లోనివే.

“మల్లెపందిరి” కింద  “ఓ సతీ నా గతీ.. ఓహో నా శ్రీమతీ ఆహా సౌభాగ్యవతీ” అంటూ, “రెండు జళ్ళ సీత” తో  “కొబ్బరి నీళ్ళ జలకాలాడి”, “తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు..” అంటూ “శ్రీవారికి ప్రేమ లేఖ”  వ్రాసి, కొన్ని మధుర జ్ఞాపకాలు మిగిల్చారు.

“మనసా త్రుళ్ళి పడకే..అతిగా ఆశ పడకే

అతడికి నీవు నచ్చావో లేదో..ఆ శుభ ఘడియ వచ్చెనో రాదో

తొందర పడితే అలుసే తెలుసా.. మనసా త్రుళ్ళి పడకే”

పెళ్లి చూపుల తరువాత, రిజల్టు కోసం ఎదురు చూసే ఆ కన్నె మనసుని వేటూరి ఎంత అందంగా వర్ణించారో, అంత సున్నితంగానూ, రమేష్ నాయుడు దానికి బాణీ కట్టారు. పూర్తి తెలుగుదనం ఉట్టి పడే పాట ఇది.
http://www.youtube.com/watch?v=7_YMMsNXNl4

Srivariki Premalekha

 

“మేఘసందేశానికి” తన  సంగీతాన్ని జతచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్న రమేష్ నాయుడు ఆనందభైరవి తో తన స్థానాన్ని అక్కడే పదిలం చేసుకున్నాడు.

అమృతవర్షిణి రాగంలో కట్టిన “చైత్రము కుసుమాంజలి” పాట, నాకు ఆ సినిమా పాటలన్నిటిలోకీ ఇష్టమైన పాట. ఆ పాట సాహిత్యం వేటూరి రాగ జ్ఞానానికి కూడా ఒక ప్రతీక. ఆ రాగంలోని స్వరాలనే పాట సాహిత్యంలో జొప్పించి చక్కటి ప్రయోగం చేశారు.

“పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం..”,  “బ్రహ్మాంజలీ..”, “కొలువైతివా రంగశాయి” లాంటి పాటల సృష్టీ ఈ సినిమాలోనే జరిగింది. కానీ 1983 తెలుగు సినీసంగీతంలో ఒక స్వర్ణ సంవత్సరం. “సాగర సంగమం”, “మేఘసందేశం” కూడా అదే సంవత్సరం లో విడుదల అవ్వటంతో, ఈ సినిమా పాటలకి దక్కాల్సిన అవార్డులు దక్కలేదేమోననిపిస్తుంది.

రమేష్ నాయుడు గారి ఆఖరి సినిమా, “స్వయంకృషి”. ఆ సినిమా విడుదల ఒక్క రోజు ముందు ఆయన దివంగతులయ్యారు. అందులోని ప్రతి పాటా బాగుంటుంది. “పారా హుషార్”, “హల్లో హల్లో డార్లింగ్…” లాంటి సరదా పాటలతో పాటు ““సిన్నీ సిన్నీ కోరికలడగ” వంటి కలకాలం నిలిచిపోయే పాటలూ ఉన్నాయి.

రమేష్ నాయుడు, “కల్యాణి” రాగం చాలా విరివిగా వాడారని ముందర చెప్పుకున్నాం. పైన ప్రస్తావించిన చాలా పాటలు ఈ రాగం లోనివే. అయితే “శివరంజని”లో కూడా చాలా చక్కని పాటలు కట్టారు. “శివరంజనీ, నవరాగిణీ”, అని “తూర్పు పడమర” చిత్రం లో కడితే, “అభినవ తారవో.. నా అభిమాన తారవో” అంటూ “శివరంజని” సినిమాలో ఆ రాగాన్ని వాడారు.

అదే రాగానికి, జేసుదాసు గాత్రం, వేటూరి సాహిత్యం కలిసినప్పుడు, రమేష్ నాయుడు కట్టిన బాణీకి, ఆయనకూ, జేసుదాసుకూ కూడా నేషనల్ అవార్డులొచ్చాయి. ఆ “ఆకాశ దేశాన మెరిసేటి మేఘం” పసుపులేటి రమేష్ నాయుడు నేడు మన మధ్య లేకపోయినా, ఆయన కట్టిన స్వరహారాలు, స్వయంప్రకాశంతో ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి!

http://www.youtube.com/watch?v=59h1_ZDnfcA

వేటూరి పరిచయవాక్యాలతో ప్రారంభించిన ఈ వ్యాసాన్ని,  ఆయన రమేష్ నాయుడుకి నివాళులర్పిస్తూ రాసిన చివరి మాటలతోనే ముగిస్తాను.

“నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దురమయ్యాక నేను ఆయనకు రాసిన పడవ పాటలోని ఈ చరణం ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది.

ఏటి పాప శాపమ్మ ఎగసి.. తాను సూసింది
ఏడి నావోడంటే ఏటిలోన మునిగింది

శాప మునిగిన కాడ శతకోటి సున్నాలు

శాపమైన గుండెలోని సెప్పలేని సుడిగుండాలు

ఏరెల్లిపోతున్నా నీరుండి పోనాది
నీటిమీద రాతరాసి నావెల్లిపోనాది”

 

(కృతజ్ఞతలు: ఉమా ఏలూరి. అడగంగానే, అర్థరాత్రి, “కొమ్మ కొమ్మకో సన్నాయి” పుస్తకం లోని, రమేష్ నాయుడి అధ్యాయాలని, ఓపిగ్గా తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి పంపించినందుకు.)

Siva_336x190_scaled_cropp –యాజి

 

వీలునామా -17 వ భాగం

శారద

శారద

  కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

జేన్ ఉద్యోగ బాధ్యతలు -II

“ఒక పని చేద్దాం. నాలుగైదు రోజులు మీరూ మాతో పాటు వచ్చి ఊరికే కూర్చొండి. మీకు నా పధ్ధతీ, పాఠాలూ నచ్చితే, అలాగే చదువుకుందురుగాని. ” జేన్ సూచించింది.

లిల్లీకి ఈ ఆలోచన నచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులు లిల్లీ కూడా పిల్లలతోపాటు వచ్చి చదువుకునే గదిలో కూర్చుని శ్రధ్ధగా పాఠాలు విన్నది. జేన్ తను చెప్పిన పాఠాన్ని పిల్లల్తో తల్లి ముందర వల్లె వేయించేది. లిల్లీకీ, పిల్లలకీ ఆ పధ్ధతి బాగా నచ్చింది. అందులోనూ జేన్ ఎలాటి విషయాన్నైనా పిల్లల భాషలో, ఆ స్థాయిలోకి దించి చెప్పేసరికి, పిల్లలతోపాటు తల్లికీ ఆ పాఠాలు బాగా వంటపట్టడం మొదలుపెట్టాయి.

ఆ పాఠాలు వినడంతోపాటు, యజమానురాలిగా జేన్ పనిని పర్యవేక్షణ చేస్తున్న భావన కలిగి లిల్లీకి గొప్ప ఆనందం కలిగింది! లిల్లీకి సంగీతం పట్ల వ్యామోహం మాత్రం తగ్గలేదు. కొన్నిరోజులు ఎమిలీ కి సంగీతం నేర్పే గురువుగారి దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించింది కానీ ఆమెకా విద్య కొరుకుడు పడలేదు. ‘అబ్బ! అన్నీ తెలిసిన జేన్ ఈ సంగీతం ఒక్కటే వదిలేయాలా, నా ఖర్మ కాకపోతే!’ అని విసుక్కున్నదామె.

మొత్తమ్మీద జేన్ కి వాళ్ళింట్లో సంతోషంగా, సంతృప్తిగానే రోజులు గడిచిపోతున్నాయి. మొదటిసారి తన జీతం అందుకున్నప్పుడు జేన్ వర్ణాతీతమైన గర్వాన్నీ, సంతోషాన్నీ అనుభవించింది. ఆ క్షణంలో తనకి ఇక కావాలిసిందింకేమీ లేదనిపించింది.

అయితే వెంటనే ఎల్సీ ఎలా వుందో అన్న ఆలోచన వచ్చి మనసు కలుక్కు మంది. క్రమం తప్పకుండా ఎల్సీదగ్గర్నించీ, ఫ్రాన్సిస్ దగ్గర్నించీ, పెగ్గీ దగ్గర్నించీ వుత్తరాలు అందుతూనే వున్నా, ఎల్సీ గురించి ఏదో ఆందోళన జేన్ మనసులో.

శ్రీమతి డూన్ గారి బట్టల కొట్లో,చీకటి గొయ్యారం లాటి గదిలో, కుట్టు పని చేస్తూ ఎల్సీ ఏమంత సంతోషంగా, ఆరోగ్యంగా వున్నట్టు లేదు. వీలైతే ఆ ఉద్యోగం మానేయమనీ, బయట సూర్య రశ్మిలో ఎక్కువ తిరగమనీ ఉత్తరం రాసింది జేన్. ఎడిన్ బరో వదిలి లండన్ తీసుకొస్తే ఎల్సీ ఆరోగ్యం బాగవుతుందేమోనన్న ఆశ వున్నా, తనని తీసుకురాగలుగుతుందా? జేన్ చెల్లెలి మీద పెట్టుకున్న బెంగను బ్రాండన్ గమనించాడు. ఒకరోజు,ఫిలిప్స్ తో,

“స్టాన్లీ! ఎండాకాలం మీ ఇంటికి లిల్లీని పిల్లల్నీ తీసుకుని డెర్బీషైర్ వెళ్దానుకున్నావు కదా? అంతకు ముందొకసారి పిల్లల్ని జేన్ ని తోడిచ్చి ఎడిన్ బరో  పంపరాదూ? పెగ్గీ చాలా అనుకుంది పిల్లలని చూడాలని. అక్కణ్ణించి కావాలంటే నేను పిల్లల్ని డెర్బీషైర్ తీసుకొస్తాను. జేన్ చెల్లెలితోపాటు కొన్నాళ్ళుంటుంది. మీరు డెర్బీషైర్ లో వున్నప్పుడు తను ఇక్కడ లండన్ లో ఎందుకు అనవసరంగా?” అన్నాడు.

“అవుననుకో, కానీ, మేము జేన్ కూడా మాతోపాటు డెర్బీషైర్ వస్తుందనుకుంటున్నాం. అనవసరంగా పిల్లల చదువులు నెల రోజుల పాటు పాడవుతాయి లేకపోతే. కిందటిసారి అక్కడ మరీ అల్లరి ఎక్కువ చేసారు. కాస్త జేన్ వుంటే వాళ్ళని అదుపులో పెట్టగలుగుతుంది,” ఫిలిప్స్ అన్నాడు.

“అవునవును! అందులో స్టాన్లీ చెల్లెళ్ళు మేనకోడళ్ళని కూడా చూడకుండా ఎంత సణిగారో పిల్లల అల్లరిగురించి! “ మూతి మూడు వంకర్లు తిప్పింది లిల్లీ.

“అలాగా? నేనైతే తప్పక మా ఇంటికి ఏష్ఫీల్డ్ వెళ్ళే ముందర ఎడిన్ బరో వెళ్ళి పెగ్గీని చూడాలని నిశ్చయించుకున్నా. అందుకని కావాలంటే జేన్ నీ, పిల్లలనీ దిగబెట్టగలను. కానీ, తననీ మీతో డెర్బీషైర్ తీసికెళ్ళాలని మీరనుకుంటే, నేను వాళ్ళ చెల్లెలికి ఆ సంగతే చెప్తాలే!” అన్నాడు బ్రాండన్.

“మీ చెల్లెలు కుట్టుపనో ఏదో చేస్తుందని చెప్పావు కదా జేన్! పాపం, ఎలా చేస్తుందో ఏమో. తనకీ నీకున్నట్లాంటి ఉద్యోగం దొరికితే బాగుండు. మా ఇంట్లో అయితే జేన్ లేకపోతే క్షణం కూడ గడవదు,” అతిశయంగా అంది లిల్లీ!

“ఊరికే కూర్చుని తినడం కంటే కుట్టు పనైనా పర్వాలేదంటుంది మా చెల్లెలు! పని కంటే, అలా గంటలు గంటలు చిన్న కొట్టులో కూర్చోవడం వల్ల కొంచెం దానికి అనారోగ్యం చేసింది. అంతే! దానికి తోడు నేను పక్కన లేకపోవడం వల్ల ఒంటరితనం. మేమిద్దరమూ చిన్నప్పటినించీ ఒకరినొకరం వదిలి ఎప్పుడూ వుండలేదు.”

“అవునా? పోనీ, ఓ పని చెద్దామా? తననే కొద్ది రోజులు ఇక్కడ వుండడానికి రమ్మందాం. మనం డెర్బీషైర్ నించి తిరిగొచ్చాక అయితే కాస్త తీరుబడిగా కొన్ని రోజులు గడపొచ్చు. ఏమంటావు జేన్?” స్టాన్లీ ఫిలిప్స్ అన్నాడు.

జేన్ చెల్లెలితో స్నేహం చేయడానికి లిల్లీకి ఏమీ అభ్యంతరం కనిపించలేదు. వెంటనే జేన్ తో ఉత్తరం రాయించారు. ఎల్సీ కూడా రావడనికి ఒప్పుకునేసరికి జేన్ మనసు తేలిక పడింది. బ్రాండన్ కూడా తన ప్రయాణాన్ని వాయిదా వేసి ఇంకొన్ని రోజులు లండన్ లో వుండడానికి నిశ్చయించుకొన్నాడు. కొద్ది రోజులైతే చెల్లెల్ని చూడొచ్చన్న ఉత్సాహంతో జేన్ ఫిలిప్స్ కుటుంబంతో కలిసి డెర్బీషైర్, స్టాన్లీ తండ్రి ఇంటికి బయల్దేరింది.

 ***

స్టాన్లీ ఫిలిప్స్ తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. హాయిగా కబుర్లు చెప్తూ ఊరి వారందరితోనూ స్నేహం చేస్తూ, ఆడుతూ పాడుతూ వుండే మనిషి. ఆయనకి భార్య ద్వారా బోలెడంత ఆస్తి సంక్రమించింది. వాళ్ళ సంతానంలో మొదటివడైన స్టాన్లీ ఫిలిప్స్ విక్టోరియా కెళ్ళి బంగారు గనుల్లో బోలెడంత డబ్బు సంపాదించుకున్నాడు. స్టాన్లీ తల్లి మరణించిన తర్వాత పెద్దాయన మళ్ళీ పెళ్ళాడలేదు. ఇద్దరు పెళ్ళికాని కూతుర్లతో, ఆఖరివాడైన చిన్న కొడుకుతో కలిసి ఉళ్ళో వాళ్ళ భవంతిలోనే వుంటున్నాడు. తన ప్రాక్టీసు అందిపుచ్చుకోగలడని చిన్నవాణ్ణీ మెడిసిన్ చదివించారు, కానీ వాడికి అన్నలా ఆస్ట్రేలియాలో నిధులూ నిక్షేపాలు వెతుకుతూ గొర్రెల స్టేషనూ, ఆస్ట్రేలియాలో భూమీ కొనుక్కోవాలన్న ఆశ.

స్టాన్లీ చెల్లెళ్ళిద్దరూ మరీ అంత చిన్న పిల్లలేమీ కాదు. డబ్బూ, చదువూ వల్ల వచ్చే ఆత్మ విశ్వాసమూ, మర్యాదా వాళ్ళల్లో ఉట్టి పడుతూంటాయి. తండ్రి వృత్తి వల్లా, తల్లి ధనం వల్లా, వారిద్దరికీ ఆ ఊళ్ళో గౌరవ మర్యాదలు ఎక్కువ! వాళ్ళకి జీవితం లో తీరని లోటంటూ వుంటే అది వారి అన్నగారు ప్రేమించి పెళ్ళాడిన వదిన, లిల్లీ! తన ప్రేమను గురించీ, లిల్లీ అంద చందాల గురించీ స్టాన్లీ రాసిన ఉత్తరాల వల్ల వాళ్ళు ఊహించుకున్న వ్యక్తి వేరు. ఆమె నిరక్షరాస్యతా, మొరటు ప్రవర్తనా చూసి వాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళకి ఆమెని తమ స్నేహితులకి పరిచయం చేయాలంటేనే గొంతు పట్టేసినట్టయింది.

చెల్లెళ్ళ ప్రవర్తనకి స్టాన్లీ ఎంతగానో నొచ్చుకున్నాడు. అభిమానపడ్డాడు. ఆయన తన చెల్లెళ్ళ చదువులూ, అంద చందాలూ ,తెలివితేటల గురించీ ఎంతో గర్వంగా భార్యతో చెప్పుకొన్నాడు అంతకు ముందు. కానీ వదినగారితో వాళ్ళ ప్రవర్తననీ, వాళ్ళు ఆమెని చేసే వెటకారాలనీ, హేళననీ గ్రహించాడు. వాళ్ళ ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు.

లిల్లీకైతే స్టాన్లీ చెల్లెళ్ళిద్దరినీ తలుచుకుంటేనే కళ్ళళ్ళో నీళ్ళు తిరుగుతాయి. నిజానికి వాళ్ళు స్టాన్లీ చెప్పినంత గొప్ప అందంగా కూడా లేరు. స్టాన్లీ ఇంగలండు వదిలిన పద్నాలుగేళ్ళలో వాళ్ళిద్దరూ పెద్దయిపోయినట్టున్నారు. వాళ్ళ తెలివితేటలేమో ఆమెకి కేవలం భయం గొలిపేవి. వాళ్ళ మంచితనం ఆమెకైతే అనుభవంలోకి రాలేదు. మరి స్టాన్లీకి ఏ కారణం వల్ల చెల్లెళ్ళంటే అంత ప్రేమా గౌరవాలున్నాయో ఆమెకి అర్థం కాలేదు. కనీసం ఒక మొగుణ్ణి కూడా వెతుక్కోలేని వృధ్ధ కన్యలు, పెళ్ళయి పిల్లలని కన్న తనని వెక్కిరించడమేమిటి? అని చిరాకు కూడా వేసేది. స్టాన్లీ చెల్లెళ్ళిద్దరికంటే జేన్ వేయి రెట్లు నయం అనుకుంది లిల్లీ! జేన్ ఎంత తెలివైనదైతే ఏం, తన కింద పని చేసే మనిషే కదా! అలా అనుకుంటే ఆమెకి తన ఆత్మ న్యూననతా భావం అంతా చేత్తో తీసినట్టు మాయమై పోయేది.

చెల్లెళ్ళల్లో వచ్చిన మార్పు చూసి స్టాన్లీకూడా కొంచెం ఆశ్చర్యపోయాడు. అయితే తాను వాళ్ళనొదిలి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరూ ఇరవై ఒకటీ, పదిహేడూ ఏళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు, పద్నాలుగేళ్ళ తర్వాత, వాళ్ళకి వయసు హెచ్చిందీ, మొహంలో లేత దనం తగ్గిందీ, అంద చందాలూ తగ్గాయి, అభిప్రాయాల్లో ఒక రకమైన కరకుదనం వచ్చి చేరింది. అంతే కాదు, వాళ్ళిద్దరూ సంపన్న కుటుంబ స్త్రిలలోకి రూపాంతరం చెందితే, తాను ఆస్ట్రేలియాకి చెందిన మొరటు రైతులోకి రూపాంతరం చెందాడు. ఎంత సర్ది చెప్పుకున్నా, వాళ్ళ హుందాతనమూ, ఆత్మ విశ్వాసమూ తనని చిన్న బుచ్చుతున్నట్టే అనిపిస్తూంది.

అన్నిటికంటే వాళ్ళు తన పిల్లలతో ప్రవర్తించే తీరు స్టాన్లీనెంతో నొప్పించింది. ఆ పిల్లలేదో తమ పరువు తీస్తున్నట్టూ, వాళ్ళని చూసి తామంతా సిగ్గు పడుతున్నట్టూ వుండేది స్టాన్లీ చెల్లెళ్ళిద్దరి ప్రవర్తనా. ప్రపంచంలో ఏ పిల్లలూ ఇంత అల్లరి చేయరనీ, వాళ్ళకి గారాబం ఎక్కువనీ, అసలు వాళ్ళ పెంపకమే సరైనది కాదనీ ఏవేవో వ్యాఖ్యానాలు వస్తూనే వుండేవి.

ఇదంతా వాళ్ళు కిందటిసారి డెర్బీషైర్ వెళ్ళినప్పటి సంగతి. ఈ సారి కాస్త నయం. జేన్ పర్యవేక్షణలో పిల్లలంతా చక్కగా, హుందాగా ప్రవర్తించారు. ఇద్దరు మేనత్తలూ జేన్ క్రమశిక్షణ వల్ల పిల్లల ప్రవర్తనా, చదువు సంధ్యలూ మెరుగు పడ్డాయని ఒప్పుకున్నారు. జేన్ గురించి విన్న వాళ్ళందరూ, ఆమె గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొవాలన్న ఉత్సాహం కాబర్చారు. ముఖ్యంగా పెద్దాయన ఫిలిప్స్. ఆయన పారిస్ లో చదువుకునేటప్పుడు జేన్ మావయ్య, హోగార్త్ గారు పరిచయం అయ్యారట.

ఆ సంగతి తెలిసిన వెంటనే, జేన్ అదంతా ఏ సంవత్సరం లో అయిందో అడిగింది, అప్పటికి ఫ్రాన్సిస్ పుట్టాడో లేదో తెలుసుకుందామని. ఫ్రాన్సిస్ తల్లిని గురించిన వివరాలేమైనా తెలుస్తాయేమోనని ఆ పెద్దయనతో చాలా మాట్లాడింది జేన్. అయితే అప్పటికి హొగార్త్ గారికి ఫ్రాన్సిస్ తల్లి పరిచయం అయినట్టు లేదు. ఈ వివరాలన్నీ ఫ్రాన్సిస్ కి ఉత్తరంలో రాసింది జేన్.

ఈ మధ్య ఎందుకో ఫ్రాన్సిస్ మారుతున్నాడా అనిపించింది జేన్ కి. అతని ఉత్తరాల్లో ఇంతకు ముందున స్నేహమూ ఆప్యాయతా తగ్గుతున్నాయా? అని అనుమాన పడింది. తాను మాత్రం ఎప్పట్లాగే ఉత్తరాలు రాస్తూంది, ప్రతి చిన్న విషయమూ అతనితో పంచుకుంటూంది.

జేన్ కి ఆ యింట్లో అందరికన్నా స్టాన్లీ తండ్రి, డాక్టరు ఫిలిప్స్, తమ్ముడు వివియన్ చాలా నచ్చారు. వివియన్ మంచి చదువూ, డబ్బూ వుండి కూడా ఇంగ్లండు వదిలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలని ఎందుకనుకుంటున్నాడో ఆమెకర్థంకాలేదు. అతనికి విఙ్ఞాన సంబంధమైన విషయాలమీదున్న ఆసక్తీ, అతను చేసే ప్రయోగాలూ జేన్ కెంతో కొత్తగా తొచాయి. తన అక్కలిద్దరి దగ్గర్నించి ఎటువంటి ప్రోత్సాహమూ రాకపోవడంతో అతనికి జేన్ చురుకుదనమూ, తన పని

మీద జేన్ చూపించే ఆసక్తీ చాలా నచ్చాయి.

ఇద్దరక్కలకి ముద్దుల తమ్ముడవదంతో వివియన్ కి ఆ ఇంట్లో గారాబం ఎక్కువే. అయితే వివియన్ కోపిష్టి మనిషి. కోపం వస్తే ఇల్లూ వాకిలీ ఏకం చేసేస్తాడు. అలాటి సమయాల్లో అతన్ని ఒంటరిగా వదిలేయడం మినహా చేయగలిగేదేమీ లేదు.

వివియన్ కి సాంఘిక మర్యాదలూ, సంప్రదాయాల మీద నమ్మకం ఎక్కువ. అన్నగారింట్లో పని చేసే పంతులమ్మని ప్రేమిస్తాడేమోనన్న భయం ఏ మాత్రం అవసరం లేదు. దాంతో అతని అక్కలిద్దరూ అతను జేన్ తో చేస్తున్న స్నేహాన్నీ పెద్ద పట్టించుకోలేదు. నిజంగానే అతను జేన్ వయసులో వున్న స్త్రీ అన్న విషయాన్ని పట్టించుకొన్నట్టుండడు.

జేన్ ఫిలిప్స్ కుటుంబం గురించీ,  వూరి గురించీ ఫ్రాన్సిస్ కీ, ఎల్సీ కి వివరంగా వుత్తరాలు రాసింది. ఆమెకి ఆ కుటుంబాల్లో వున్న స్త్రీల జివితం చాలా విచిత్రంగా, వ్యర్థంగా తోచింది. డబ్బూ ,చేతినిండా తీరుబడీ వున్నా వాళ్ళకి చేయడానికేమీ వున్నట్టు తోచదు. కుటుంబంలోకానీ, ప్రపంచంలో కానీ ముఖ్యమైన పనులూ, ఆసక్తికరమైన పనులూ అన్నీ మగవాళ్ళే చేస్తూంటారు.

అందంగా అలంకరించుకోవడం, పిల్లలని కనడం తప్ప ఆడవాళ్ళకి ఏ వ్యాపకామూ లేకపోవడం, జేన్ కెంతో ఆశ్చర్యంగా అనిపించింది. డాక్టరు గారి ఇంట్లో స్టాన్లీ చెల్లెళ్ళిద్దరికీ అసలే పనీ వుండేది కాదు. ఇంటిక్ కావల్సిన డబ్బు సంపాదించడం మగవారి వంతైతే, ఇంటి లోపలి బాధ్యతలు నమ్మకస్తులైన పనివాళ్ళకుండేది. తమ కంటే ఆర్ధికంగా, సాంఘికంగా తక్కువ స్థాయిలో వున్నవాళ్ళ గురించీ వాళ్ళెప్పుడూ ఆలోచించినట్టు వుండేవాళ్ళు కాదు. ఏదైనా సహాయం ఎవరికైనా చేయవలసి వస్తే, ఏదో నిరాసక్తంగా, బిచ్చం విదిలించినట్టు విదిలించేవారు.

బయట ప్రపంచానికి సంబంధించిన ఏ విషయమైన ఆ సంపన్న స్త్రీలకు పట్టదు. “అదంతా మగవాళ్ళ వ్యవహారం,” అన్న ధోరణే వుండేది. బయటి ప్రపంచానికెంతో స్నేహ శీలురుగా, చదువూ సంస్కారమూ వున్న స్త్రీలుగా కనిపిస్తారు వాళ్ళు. దగ్గర్నించి వాళ్ళను చూసి జేన్ ఏర్పరుచుకున్న అభిప్రాయలివి.  వాళ్ళల్లో చిన్నది హారియట్ ని బ్రాండన్ పెళ్ళాడతాడని ఆశపడ్డారంతా. కానీ, అతనికెందుకో ఆమె నచ్చలేదు.

(సశేషం )

ఆ రోజు ఏం జరిగిందంటే

kasmir11kasmir6

మా వాహనం శ్రీనగర్ నుండి జమ్మూ వయిపుకి హైవే లో జెట్ వేగంతో దూసుకు పోతోంది.    హిమపర్వత సానువుల్లో ఒదిగి వెండి దుప్పటి కప్పుకొని మిలమిలా మెరుస్తూ ఎంతసేపైనా చూడాలనిపించే   మనసును కట్టిపడేసే ఒడుదుడుకుల  పర్వతశ్రేణులు, .. రాతి ద్రోణులు .. వాటిని వెన్నంటి ఉండే ,  హిమానీనదాలు ..స్వచ్చమైన  నీటి పాయాలూ.. ఏర్లు .. సెలయేర్లు, సరస్సులు.. జలపాతాలూ ..ఆకాశాన్ని అందుకోవాలని ఉబలాట పడుతూ ఎదిగి పోతున్న దేవదారు వృక్షాలూ, అక్కడక్కడ దట్టమైన అడవులూ, వృక్షాలు, పచ్చని తివాచీ పరచినట్లు పచ్చికబయళ్ళు .. వాటిపై అక్కడక్కడ గొర్రెలమందలతో తెల్లగా బక్కగా పాల బుగ్గల
పసివాళ్ళు .. అందమైన కాశ్మీరు లోయలో పేదరికాన్ని , వెనుకబాటు తనాన్నితెలియజేస్తూ .. నా ఆలోచనల్లో నేను.  ఎవరికి వారు కాశ్మీరు లోయ అందాలకి పరవశిస్తూ .. ఆ అద్భుత దృశ్యాలని మా మదిలోనూ, కెమెరాల్లో బంధిస్తూ..  ఆప్రాంతాన్ని వదిలి రావాలని లేక పోయినా తప్పదుగా ..అనుకుంటూ

‘కాశ్మీరు కొండల్లో అందాలకి .. కొత్త అందాలిచ్చారు
కాశ్మీరు వాగుల్లో పరుగులకి .. కొత్త అడుగులిచ్చారు ”  మౌన రాగానికి బ్రేక్ వేస్తూ రాగం అందుకుంది మృదుల .

కాశ్మీరు లోయలో .. కన్యాకుమారిలో .. ఓ సందమామ , ఓ సందమామ ‘ పోటీగా సంగీత.  ఆమెకు జత కలుస్తూ మాలిని, కవిత .

‘ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో ..’  మరో పాట అందుకుంది మృదుల

మన  కవులు  ఈ అందాలపై ఎన్ని పాటలు కట్టారు ..!  కవితలు అల్లారు ..!

అమరనాథ యాత్ర, గుర్రాలపై ప్రయాణం, నడవ లేక డోలి ఎక్కినా వైనం, గత వారం రోజులుగా అనుభవించిన అద్భుతమైన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ..అడుగడుగునా కనిపించే సెలయేటి గలగలలు .. జలపాతాల సవ్వడులు .. పక్షుల కిలకిలలు .. ప్రకృతి అందమంతా కుప్ప పోసినట్లుగా .. తడిసి ముద్దాయి పోతూ .. మేం .

“నాకయితే ఇక్కడే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తోంది’ ముందు సీటులో కూర్చొని భూతల స్వర్గం గురించి ఆలోచిస్తోన్న మాధురి.

‘ఆ..  నాకూను.   నేను మనసులో అనుకున్నా . నువ్వు పైకి చెప్పేశావ్  ‘వంత పాడింది కవిత.

‘అబ్బ ఎంత ఆశ.  మనని ఇక్కడ ఉండనిచ్చేది ఎవరట ?’ నవ్వుతూ నేను.

‘ ఉండనిచ్చేది ఏమిటి ఉండాలనిపిస్తే ఉండడమే .’ మాలిని

‘అలా ఇక్కడ ఉండకూడదు.’ నొక్కిచేప్పా

‘అదేంటి? ఎందుకు ఉండకూడదు? మనం భారతీయులం .   ఈ దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు’  తెలిసినట్లుగా మాలిని.

‘ఆ పప్పులేవి ఇక్కడ వుడకవమ్మ ‘ ఉడికిస్తూ నేను

‘ఆ ఎందుకనీ .. ‘ రవిత్రేయిని చేతిలో ఉన్న తమ  జమాఖర్చుల పుస్తకాన్ని మూసి మాలిని  చేతిలో పెడుతూ.

‘ఏం వీసా కావాలా.. ‘ మృదుల గాలికి రివ్వున ఎగురి మొహాన్ని కమ్మేస్తున్నముంగురుల్ని సవరించుకుంటూ.

‘వీసా తీసుకుని అమెరికా లాంటి దేశాల్లో పౌరసత్వం తీసుకొని స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు.  కానీ కాశ్మీరులో  మాత్రం కుదరదు. శ్రీనగర్లో మనం ఉన్నాం చుడండి  అలాంటి బోటు హౌస్ లే గతి మనలాంటి వాళ్లకి  .  ఇక్కడి చట్టాల ప్రకారం కాశ్మీరు ప్రాంతేతరులు ఇక్కడ భూమి కొనలేరట.  బోట్ హౌస్ లో మాత్రం ఉండవచ్చట.’ ఈ యాత్ర కి వచ్చేముందు   వికిపీడియా లో చుసిన విషయం చెప్పా.

kasmir5
‘అవునా! ‘ రవిత్రేయిని  ఆశ్చర్యంగా

‘బోట్ హౌస్ అయితేనేమి..? ఎంచక్కా స్వచ్చమైన నీటిలో తేలియాడుతూ ఊయలలూగే ఇల్లు..  ఆనందించక’  కవిత కంచు కంఠంతో కరచినట్లుగా

‘పర్యాటక లోకాన్ని రా రమ్మని పిలుస్తోన్న సుందర కాశ్మీరంలో ఈ అల్లకల్లోలం ఏంటో .. ‘ తమ రాకకి కొద్దిగా ముందు బారాముల్లా లో జరిగిన అల్లర్లు .. శ్రీనగర్లో కర్ఫ్యూ గుర్తొచ్చిన రవిత్రేయిని .

‘కాశ్మీరులో జరిగే అల్లర్ల గురించి మేం పుట్టినప్పటి నుండి వింటున్నాం. అసలు కారణం ఏమిటి ‘ డ్రైవర్ని అడిగింది మాధురి.

అంతా ఏమి చెబుతాడోనని ఆసక్తిగా అతని కేసి చూస్తూ .. కొద్ది క్షణాలు ఆలోచించి ‘దేశ విభజన సమయంలో కాశ్మీరు సంస్థానం మహారాజ హరిసింగ్ సారధ్యంలో  భారత దేశంలో విలీనం అయింది.  అయితే, అప్పట్లో కాశ్మీరు భూభాగం ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉండేది.  మహారాజ హరిసింగ్ భారత దేశంలో చేరే విధంగా పావులు కదపడం గిట్టని బ్రిటిష్ వారే పాకిస్తాన్ ను కాశ్మీరు దురాక్రమణకు ప్రేరేపించారట మేడం.  అంతేకాదు మేడం,  పాకిస్తాన్ తరపున భారత దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారట.  అలా తెల్లవాళ్ళ సాయంతో 1948లో కాశ్మీరులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొందట. అప్పటినుండే మాకు ప్రశాంతత లేకుండా పోయిందని మా తాతలు అంటుండేవారు మేడం’ మాధురి ప్రశ్నకి జవాబు గా తనకు తెలిసింది చెప్పాడు డ్రైవర్.

‘అగ్గిపెట్టెలో పట్టే చీరలంటే ఏమో అనుకునే దాన్ని .  నిజంగా కాశ్మీరీ సిల్క్ చీరలు నా మనసు దోచేశాయి.’ ఆ  టాపిక్ మారుస్తూ మాలిని.  నిన్నసాయంత్రం శ్రీనగర్ లో చేసిన షాపింగ్  చీరలు, శాలువాలు, వాటిపై ఉన్న
కాశ్మీరీల చేతి పనితనం, స్టోల్స్, గాజులు , కుంకుమ పువ్వు , ఆప్రికాట్స్, మొఘలుల ఉద్యానవనాలు, కోటలు   ఇలా  మాటల గలగలలు ..సాగిపోతూ..  మేం కొన్న గాజులూ, పర్సులు అందుబాటులో ఉన్న  వాటిని ఒకరికొకరం చూపుకొంటూ.. ధరలు.. బేరీజు వేసుకుంటూ..

మేం ప్రయాణిస్తున్న వాహనం  స్లో అయింది.    ఆగింది.  ఎదురుగా వచ్చే వాహనదారులు డ్రైవర్తో ఏదో కశ్మీరీలొ మాట్లాడాడు.  ఆ తర్వాత ఎవరితోనో ఫోనులో మాట్లాడాడు.  ఆ తర్వాత మా వాహనం ప్రధాన రహదారి లో కాకుండా దారి మళ్ళింది.  గ్రామాల్లో ఉండే కచ్చా రోడ్డులో మేం.  ఆ గతుకుల కుదుపులకు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాం.  అసలేం జరుగుతోంది.  శ్రీనగర్ నుంచి జమ్ముకి ఉన్న హైవే లో కాకుండా మేం ఈ రోడ్డులోకి రావడమేమిటి ..?  మాటల్లో పడి  గమనించనే లేదు.  అందరిలో తెలియని ఆందోళన.

‘భయ్యా.. ఏమిటిది ? రహదారి ఉండగా ఈ దారిలో ..? అర్దోక్తిగా హైదరాబాదీ హిందీలో మాలిని.

‘ముందు రెండు చోట్ల హర్తాల్ జరుగుతోందట’  డ్రైవర్ తల ఇసుమంతైనా కదల్చకుండా.. మా వేపు దృష్టి మరల్చకుండా

‘ఎందుకు?’ గాబరాగా సంగీత

‘మొన్న బారాముల్లా దగ్గర జరిగిన కాల్పులలో సాధారణ పౌరులేవరో చనిపోయారట. అందుకు  నిరసనగా’ చెప్పాడు డ్రైవర్. అంతా ఉలిక్కి పడ్డాం.

‘ఇది నిజమేనా .. ‘ మాలిని సందేహం

‘ఏమో.. అసలే మనమంతా ఆడవాళ్ళం  ‘ భయంగా సంగీత

‘ఇతని మాటలు నమ్మదగ్గట్టుగానే ఉంది అతని వాలకం’ మృదుల.

రకరకాల సందేహాలు మా మనస్సులో.  అప్పటివరకూ ఉన్న ఉత్సాహం .. కబుర్ల స్థానే కలవరం..  భయం .  ఏం జరగబోతోంది.. ఉత్కంట . అన్ని వైపులా తేరిపార జూస్తూ .. అప్రమత్తంగా ..
kasmir7
ప్రతికూల పరిస్థితుల్లో, ఉగ్రవాద బూచి ఉందంటూన్న సమయంలో  ఈ ప్రయాణం అవసరమా అంటూ ఇంట్లోవాళ్ళు బయటివాళ్ళు మమ్మల్ని నీరస పర్చచూశారు. భయపెట్టారు.  అయినా అవేవి లక్ష్య పెట్టక రెండునెలల క్రితమే ప్లాన్ చేసుకున్న విధంగా మా యాత్ర సాగించాం. అమరనాథుని దర్శనం చేసుకుని శ్రీనగర్ చేరాం. వైష్ణోదేవిని దర్శించాం.  అంతా అనుకున్న విధంగా సవ్యంగా సాగిందన్న ఆనందంతో ఉన్న మాకు షాక్ కలిగిస్తూ..

పది నిముషాలు కచ్చా రోడ్లో ప్రయాణం తర్వాత ఓ చిన్న గ్రామంలో ప్రవేశించాం.  వీధుల్లో కొద్ది మంది యువకులు తప్ప  ఊళ్లో   ఉండే సందడే లేదు. అకస్మాత్తుగా మా వాహనం ఆగింది.  డ్రైవర్ దిగిపోయాడు. అతడెందుకు ఆపాడో అర్ధం కాక మేం అడిగే లోపే అతను వడివడిగా అడుగులేస్తూ .. కుడి  వేపుగా ఉన్న మసీదు కేసి నడుస్తూ ..

పట్టేసిన కాళ్ళని సాగదీస్తూ మధ్యలో ఉన్న నేను, మృదుల, సంగీత దిగబోయాం. ‘ఎందుకు దిగుతున్నారు .. వద్దు.  అసలీ డ్రైవర్ మనతో ఏమీ చెప్పకుండా వెళ్ళడం ఏమిటి ?’ వారిస్తూ  మాలిని.

మేం దాటి వచ్చిన యువకులు మమ్మల్నే చూస్తూ ఏదో అరుస్తున్నారు .. మాకేం అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని మేం మా వాహనం ఎక్కబోతుండగా,  రోజాలో ఉన్నాడేమో నమాజ్ కోసం  వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న డ్రైవర్ కి ఏం కనిపించిందో  కంగారుగా పెద్ద అరుపు ఎక్కండంటూ. అంతలోనే ఆ యువకుల గుంపు నుంచి ఓ గులక రాయి మా వయిపు దూసుకొచ్చి మాకు అతి సమీపంలో పడింది.

పట్టుకోండి .. తన్నండి .. తరమండి .. రాళ్ళ వర్షం మాకు దగ్గరవుతూ .. పరుగు పరుగున వచ్చిన డ్రైవర్ బండిని ముందుకు ఉరికించాడు.  ఆ అల్లరి మూకని, రాళ్ళనీ తప్పించుకుంటూ సందులు గొందులు తిప్పి ఎలాగయితేనేం ఆ ఊరు దాటించాడు.  ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని మేం.  ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనన్న భయంతో.. మరో ఊరు .. మరో ప్రదేశం అక్కడా వాతావరణం తుఫాను వచ్చేముందు ప్రశాంతతలా .. కర్ఫ్యుని తలపిస్తూ .. మధ్య మధ్యలో మా వాహనం ఆపే BSF జవానులు.

ఏదో జరుగుతోంది.  మా ప్రయాణం ఏ మాత్రం సురక్షితం కాదని తెలుస్తోంది.  ఆపద ముంచుకొస్తోంది .. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి.

‘ క్యా భయ్యా క్యా హువా ‘  రవిత్రేయిని

‘ఏమో .. ఈ బండి జమ్మూ రిజిస్ట్రేషన్ కదా .. మనం ఉన్నది కాశ్మీర్లో .. ముందుకు వెళ్ళడం కష్టమే . ఎక్కడైనా ఆగాల్సిందే . ‘ డ్రైవర్ మధ్య మధ్యలో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడు తమ భాషలో.

‘అదేంటి .. నువ్వు ఈ రాష్ట్రానికి చెందిన  వాడివే కదా ..’ కవిత

రంజాన్ ఉపవాసంలో ఉన్న అతను నమాజ్ చేసుకోవడానికి ఎక్కడా కుదరలేదు. చివరికి కూర్చున్న చోటే నమాజ్ కానిచ్చాడు.  ఓ గ్రామంలో పరిస్థితి చెప్పి తమకి ఆశ్రయం కోరాడు.  ఎవరూ ఒప్పుకోలేదు.  చివరికి  ఓ ఇంటి పెద్ద సరేనన్నాడు.  మా వాహనం రోడ్డు మీద ఉంటే ప్రమాదమని రెండు ఇళ్ళ మధ్య ఉన్న సందులో ఎవరికీ కనపడకుండా పెట్టించాడు.  మా అందరినీ తమ ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రధాన ద్వారం మూసేశాడు. వీళ్ళంతా ముస్లింలు. ఇది ఏ తీవ్రవాదులకో సంబందించిన స్థలం కాదు కదా .. ! మమ్మల్ని ఇక్కడ బంధించారా .. ఏమో .. ఏ పుట్టలో ఏ పామున్నదో .. ఎవరికి  తెలుసు ? అసలు నిజంగా హర్తాల్ జరుగుతోందా .. ఈ డ్రైవర్ మధ్య మధ్య ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు.  తీవ్రవాదులతో కాదు కదా .. ? ఇందాక ఈ ఇంటి యజమాని చెప్పినట్లు మేము దాటి వచ్చిన ఆ గ్రామం పాకిస్తానీ ఉగ్రవాదుల్ని కాల్చివేసిన ప్రదేశమేనా ..? మదిని తొలిచేస్తూ ..

మేం క్షేమంగా ఉన్నామా .. లేక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా .. అనుమానపు చూపులతో మేం.  డ్రైవర్ జమ్ముకి చెందిన ముస్లిం, ఈ ఇల్లు కాశ్మీరీ ముస్లిం వ్యక్తిది. మేమంతా హిందువులం . తప్పదు .. ఇప్పుడు
ఏమనుకొని ఏమీ లాభం లేదు.  ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏది జరిగితే అది జరుగుతుంది అని మమ్మల్ని మేం సన్నద్మము చేసుకుంటూ .. ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతూ .. గుండె దిటవు చేసుకుంటూ ..

‘ఈ ప్రాంతంలో వాళ్లకి హిందువులంటే గిట్టదట ‘  ఏదో గుర్తొచ్చినట్లు మృదుల చెవిలో గొణిగింది సంగీత.

‘చుప్’   కళ్ళతో వారిస్తూ .. మృదుల

భారత్ -పాకిస్తాన్ ల మధ్య జరిగిన మూడు యుద్దాలకు, కాశ్మీరీ లోయలో ఉగ్రవాదానికి మా ఈ విపత్కర పరిస్థితికి మేమే కాదు మాలాంటి ఎందఱో పర్యాటకుల ఇబ్బందులకు   కారణం కాశ్మీరు వివాదమే.  కాశ్మీరు మనదేశంలో అంతర్భాగం అని మనం అనుకుంటున్నాం.  పాక్ లో ఉన్న కాశ్మీరి భూభాగాన్ని  పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం.  మన లాగే  పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ తన దంటున్నారు.  భారత్ లో ఉన్న కాశ్మిరీ భూభాగాన్ని భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. మా ఈ స్థితికి మూలాలను వెతుకుతూ  నా ఆలోచనలు
kasmir9
మా బృంద సభ్యులంతా మనసులో ఏ భయాలున్నా కనిపించనీయకుండా ఆ ఇంటివాళ్ళతో మాట్లాడుతున్నారు.  ఆ ఇంటి పెద్ద అబ్దుల్లా చాల స్నేహంగా ఉన్నాడు.  గలగలా మాట్లాడుతున్నాడు.  లోపలున్న భార్యని, కోడల్ని , కూతుర్ని పిలిచి మా విషయం చెప్పాడు. మేం హైదరాబాద్ నుండి అని చెప్పగానే చాలా ఆశ్చర్యం వారిలో.  అంత  దూరం నుండి చూడడానికి వచ్చారా.. అందులోనూ అంతా ఆడవాళ్ళు అని .  ఇంటి యజమాని తమ్ముడు హైదరాబాదులోనే  మిలిటరీ శిక్షణ తీసుకున్నాడని వచ్చేటప్పుడు చేతి గడియారాలు తెచ్చాడని చెప్పారు. వాళ్ళ మాటల్లో హైదరాబాద్ అంటే అభిమానం కనిపించింది.  అంతా కుర్చోన్నాం.  సుహృద్భావ
వాతావరణంలో సాగుతున్న సంభాషణల మధ్య నిశ్చలంగా ఉన్న బావిలో రాయి వేసి కంపనాలు సృష్టించినట్లు అయింది మా పని మాలిని కొద్దిగా పక్కకు వెళ్లి చేసిన ఫోన్ తో.

మాకు ఎదురైన క్లిష్ట పరిస్థితి, మేం తలదాచుకున్న విధం, మేమున్న ప్రదేశం, ఇంటి యజమాని పేరు అన్నీ వాళ్లయనకు  ఫోన్ చేసి చెప్పింది.  ఎందుకయినా మంచిదని.  ఆ ఇంటి వారి మొహాల్లో మారిన రంగులు. భ్రుకుటి  ముడుస్తూ పెద్దాయన.  మమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తూ .. అసహనంగా కదులుతూ .  ముక్కూ మొహం తెలియని వారికి ఆశ్రయం ఇచ్చి తప్పు చేశామా అన్న భావన వారి కళ్ళలో ప్రతిఫలిస్తూ ..
సహజమే కదా .. వారిని తప్పుపట్టలేం.  అప్పటివరకూ మాకు తెలిసిన హిందీలో మాట్లాడిన  మా మాటలు విన్న వారికి ఒక్క సారిగా తెలుగు వినడం అది వారికి అర్ధం కానిది కావడం, మధ్య మధ్యలో వారి ఉరి పేరు, ఇంటి యజమాని పేరు రావడం అకస్మాత్తుగా వారి అనుమానానికి కారణమయ్యి ఉండొచ్చనిపించింది .  పురుషులు లేకుండా మీరే వచ్చారా అని మమ్మల్ని ఆశ్చర్యంగా, అబ్బురంగా.. ఆరాధనా పూర్వకంగా చుసిన ఆ ఆడ వాళ్ళలో కన్పిస్తున్న భయం ఆందోళన…  ఈ సంకట పరిస్థితినుండి ఎలా బయటికి రావాలి..  తూటాల్లా తాకుతున్న చూపులనుంచి ఎలా తప్పించు కోవాలి

‘హైదరాబాద్ లోను ఇంకా  చాలా ప్రాంతాల్లోనూ ఉర్దూ మాట్లాడతారు.  అదే మీతో మాట్లాడాం.  మా రాష్ట్రం లో మా మాతృభాష తెలుగు. మేం ఇంట్లో మాట్లాడేది తెలుగులోనే.   ఇక్కడ అలజడుల గురించి వార్తల్లో చూస్తే మా వాళ్ళు కంగారు పడతారు కదా అందుకే మేం అంతా క్షేమంగా ఉన్నాం.  మా గురించి ఆందోళన వద్దు. ఓ పెద్ద మనిషి పెద్ద మనసుతో మాకు ఆశ్రయం ఇచ్చారని మాలిని వాళ్ళాయనకి చెప్పింది’ అని చెప్పాను .

అవునన్నట్లుగా తలలూపారు మిగతావాళ్ళు.  మా అందరినీ నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసిన ఆ ఇంటి పెద్ద, ఇతర కుటుంబ సభ్యుల మొఖాల్లో ప్రసన్నత నిదానంగా చోటు చేసుకుంటూ.. హమ్మయ్య వాళ్ళు మామూలయ్యారు అనుకున్నాం.  కాసేపు మాట్లాడిన తర్వాత అత్తా కోడళ్ళు సాయంత్రపు పనిలో నిమగ్నమయ్యారు.

ఆ పెద్దాయన కాశ్మీరీల పేదరికం, పిల్లల చదువు, పాకిస్తానీ ఉగ్రవాదులు స్థానికులను ప్రేరేపించి, డబ్బుల ఎర చూపి అక్కడి  యువతకి శిక్షణ ఇస్తున్నారని,  ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని దాదాపు 50 వేల మంది
ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు.   1990 తర్వాత తీవ్ర వాదం వల్ల హిందువులపై దాడులు పెరగడంతో హిందువులు కాశ్మీరు ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు గుప్పెట పట్టుకుని పోయారని, ఇప్పుడు 5% కూడా హిందువులు లేరనీ అన్నాడు.  ఇప్పుడు తమ గ్రామంలోనూ ఒకే ఒక కాశ్మీరి పండిట్ కుటుంబం ఉందనీ తాము ఎంతో స్నేహంగా ఉంటామని చెప్పాడు.  కాశ్మీర్ భూభాగంలో కొంత ఆక్సాయ్ చిన్ భాగం చైనా అధినంలో ఉందనీ .. పాకిస్తాన్ ఆక్రమణలో ఆజాది కాశ్మీర్ ఉందనీ, ఆ బందులు, హర్తాల్ లు.. కాశ్మీర్ లోయ దద్దరిల్లి పోవడం .. పాలకులు  ప్రజల మనో భావాల్ని పట్టించుకోకపోవడం గురించి చాలా చెప్పాడు.

భారతసైన్యం వేరు, కాశ్మీరు ప్రజలు వేరు అనే స్థాయిలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. భద్రతా బలగాలు మా  పాలిట యమకింకరులుగా తయారయ్యాయి. అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రజల మనోభావాలను పట్టించుకోరు.  మా పాలకులకి ప్రజలని సానుకూలంగా మలుచుకోవడం తెలియదు. ఉత్తర,దక్షిణ కాశ్మీరు జిల్లాల్లో మునుపెన్నడూలేని రీతిలో ప్రజలు భద్రతా బలగాలపై విరుచుకు పడుతున్నారు. మేం  ఉగ్రవాదం మినహా జీవితంలో సుఖం, సంతోషం, సమైక్య జీవనం, విద్య, విజ్ఞాన వినోదాలు వంటి వాటితోపాటు సామాజిక జీవితాన్ని కోల్పోతున్నాం.  రోడ్డుపై వెళ్ళే ఎవరికీ భద్రత లేదు. మా పిల్లల  చదువులు కొండెక్కాయి.  ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. సాయంత్రమైతే భయంగా ఇంట్లోనే ఉండిపోవాలి. అర్థ రాత్రి తలుపులు తట్టేది ఉగ్ర వాదులో, పోలీసులో తెలియదు, ఒకరికోసం ఒకరు వెతుక్కుంటూ వస్తారు. ఇద్దరివల్లా చిత్రహింసలకు మేం గురికావల్సిందే. ఇంకా చెప్పాలంటే కాశ్మీరులో మత కలహాలు లేవు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకే పోరు. ఎప్పుడో ఒకప్పుడు ఈ  మంచుపర్వతాలు బద్దలై, ఆ మంటలు ఎప్పుడు భగ్గున భారత ప్రభుత్వాన్ని చుట్టుముడతాయా ? అని పాకిస్థాన్‌ కాచుకుని కూర్చుంది ఆవేదనతో చెప్పుకోచ్చాడతను.

అక్కడి వ్యవసాయం, పంటలు మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు మినహా మేం మాట్లాడింది తక్కువ.  అబ్దుల్లా ద్వారా కాశ్మీర్ బాహ్య సౌందర్యమే కాదు. ఆ ప్రజల అంత; సౌందర్యమూ  అర్థమయింది. కల్లోల  కాశ్మీర్ ని మరో కోణంలో చూసే అవకాశం కలిగింది .      దాదాపు నాలుగైదు గంటలు ఇట్టే కరిగిపోయాయి. మా అనుమానాలు, భయాలు నీలాకాశంలో ఎగిరిపోతున్న దూది పింజల్లా ఎగిరిపోయాయి.   ఆ ఇంటావిడ ఇచ్చిన కాఫీ మమ్మల్ని తేలిక పరిచింది.   బయటకు చూస్తే చీకటి ముసుగు వేస్తోంది.

ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు.  మా వాళ్ళంతా ఉపవాసంలో ఉంటారు కదా.  ఉపవాసం వదిలేముందు నమాజ్ కి వెళతారు.  ఆ తర్వాత భోజనం వేళ .. ఇప్పుడయితేనే మిమ్మల్ని ఎవరూ  .. పట్టించుకోరు.  ఎలాంటి అవరోధం కల్గించరు  అని చెప్పాడు అప్పుడే వచ్చిన వాళ్ళబ్బాయి ఇంతియాజ్.  దాదాపు మరో రెండున్నర గంటలు  ప్రయాణం చేస్తే కాశ్మీరు లోయ వదిలి జమ్మూ ప్రాంతంలోకి అడుగు పెడతారు అని డ్రైవర్కి జాగ్రత్త గా తీసుకెల్లమని జాగ్రత్తలు జెప్పాడు అబ్దుల్లా. ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపి, నిన్న మేం కొన్న వాటిల్లోంచి గిఫ్ట్ ఇవ్వబోతే వద్దని వారించాడు పెద్దాయన. అయినా వినకుండా మాదగ్గర ఉన్న చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ , గాజులు, పర్సులు ఇచ్చాం.

మా ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చిన విషయం,  హైదరాబాద్‌లో  55 ఏళ్ళ షాహీన్‌ సల్తానా 1980లో మత కల్లోలాల్లో జరిగిన భయంకరమైన హింసని చూసి,  ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోన్న విధం చెప్పాం.

అందరం భాయీ భాయీ గా ఉండాలనే వాదాన్ని ప్రోత్సాహిద్దాం. దేశమంతటా వ్యాపింపజేద్దాం అంటూ మరో మారు ఆ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని, వారి మానవత్వాన్ని అభినందించి బయలుదేరాం .

 

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

  వి. శాంతి ప్రబోధ

 

కిరాయి సేనగా మారిన క్షత్రియ యోధులు

 

కృష్ణుడు: (అభిమన్యుని మరణానికి శోకిస్తున్న అర్జునునితో)  నీకిది తగునా? శూరులంతా పోయేది ఇలాగే కదా? ఎందుకు దుఃఖిస్తున్నావు? సేనలను సమీకరించుకుని ఆయుధమే జీవనంగా చేసుకోవడం వీరధర్మమని నీకు తెలియదా? శత్రువులను చంపి, భూమిపై కీర్తిని నిలిపి నీ కొడుకు ఒంటరిగా స్వర్గాన్ని అందుకోవడం ప్రియమే తప్ప అప్రియ మెలా అవుతుంది?

                                                                                                                         –తిక్కన

(శ్రీ మదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం)

***

ఆయుధోపజీవుల విషయంలో అలెగ్జాండర్ తెచ్చుకున్న అపకీర్తి గురించి రాద్దామనుకునేసరికి, ఆయుధోపజీవులు లేదా ఆయుధోపజీవనం అనే మాటలు మహాభారతంలో అనేకచోట్ల వాడిన సంగతి గుర్తొచ్చింది. నోట్సు తిరగేస్తుంటే, ఆ మాటలు వాడిన రెండు సందర్భాలు అప్పటికప్పుడు కనిపించాయి. పైన చెప్పింది మొదటిది.

రెండోది, కర్ణపర్వం, తృతీయాశ్వాసంలో దుర్యోధనుడు తన సేనను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. శౌర్యమూ, బలమూ కలిగిన మీరంతా యుద్ధభారమంతా ఒక్క కర్ణుని మీదే వదిలేసి, అర్జునుని ఎదుర్కోకపోవడం ఆయుధోపజీవుల పద్ధతేనా అని దుర్యోధనుడు నిష్టుర మాడతాడు.

మహాభారతకాలంనుంచీ, ఇంకా అంతకంటే చాలా ముందునుంచీ ఉన్నఆయుధోపజీవనం; చరిత్రకాలం మీదుగా నేటి కాలం వరకూ నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉండడం ఇక్కడ ప్రధానంగా ఆకర్షించే అంశం. ఆయుధోపజీవనం ఒక  సమస్యగా మారిందని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మహాభారతం ఎలాంటిదో చెప్పే ఒక ప్రసిద్ధ పద్యం ఉంది. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రమనీ, అధ్యాత్మవేత్తలు వేదాంతమనీ, నీతివిచక్షణులు నీతిశాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ, లాక్షణికులు అనేక లక్ష్యాల సమాహారమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహు పురాణాల సముదాయమనీ మహాభారతాన్ని భావిస్తారని ఆ పద్య సారాంశం. వీటన్నిటికీ అదనంగా నేను ఆయుధోపజీవన కోణాన్ని జోడిస్తాను!

మరో అడుగు ముందుకు వేసి ఇంకో మాట కూడా అంటాను…నా ఉద్దేశంలో ఆయుధోపజీవనం సృష్టించిన సమస్యలను, సంక్షోభాలను చిత్రించి చర్చించడమే మహాభారతంలో ఆద్యంతమూ వ్యాపించిన ప్రధానవస్తువు. మహాభారత ప్రారంభమే క్షత్రియులనే ఒక యోధజాతి అంతరించడం గురించీ, క్షత్రియసతులు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ఆ జాతికి ఎలాగో ప్రాణం పోయడం గురించీ చెబుతుంది. అంతేకాదు, క్రమంగా రాజ్యాధికారం క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్లిపోవడం గురించీ చెప్పి ముగుస్తుంది. ఆవిధంగా చూసినప్పుడు, మహాభారతం ఒక జాతి  క్షీణతను చెప్పే విషాదాంత ఇతిహాసం.

ఇలా ఆయుధోపజీవన కోణం నుంచి చేసే మహాభారత పునర్వ్యాఖ్యానం ఒకటి, రెండు వ్యాసాలకు లొంగేది కాదు. కనుక ఆ లోతుల్లోకి ఇప్పుడే వెళ్లకుండా క్లుప్తంగా చెప్పుకుంటే, మహాభారత పాత్రలనేకం ఆయుధోపజీవనాన్ని, అంటే హింసను ఒక సమస్యగా గుర్తిస్తాయి. దానినుంచి బయటపడడానికి పెనుగులాడతాయి. ఆ పెనుగులాటలో అవి ఓటమీ చెందుతాయి. కొన్ని పాత్రలు హింసకు అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా చీలిపోయి చర్చించుకోవడం కనిపిస్తుంది. ఆ చర్చ చాలాచోట్ల హింసా, అహింసావాదాల రూపం తీసుకుంటుంది. పురా కాలంనుంచి చరిత్ర కాలం వైపు సాగుతున్న కొద్దీ  హింసా-అహింసల మధ్య సాగే ఈ అంతర్మథనం ఒక స్పష్టతను తెచ్చుకుంటున్నట్టూ కనిపిస్తుంది. క్రమంగా అది  మహావీరుడు, బుద్ధుడు అనే ఇద్దరు ప్రవక్తలకు; జైన, బౌద్ధాలనే రెండు మతాలకు జన్మనిచ్చింది. అయినాసరే, ఆయుధోజీవనం ఇప్పటికీ ఒక సమస్యగానే ఉందంటే, అజ్ఞాతకాలంలో మొదలైన హింసా-అహింసావాదాల చర్చ నేటికీ అసంపూర్ణంగానే  మిగిలిపోయిందన్నమాట.

Draupadi_s_presented_to_a_parcheesi_game

స్థూలంగా చెప్పుకుంటే; మహాభారతంలో భీముడు, ద్రౌపది, కృష్ణుడు హింసావాదంవైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తారు. చావు ఎప్పటికైనా తప్పదు, చచ్చేలోపల శత్రువుపై పగతీర్చుకోని జన్మ వృథా అనేది భీముని సిద్ధాంతం. ఆ విషయంలో అతనికి ఎలాంటి సందిగ్ధతా లేదు. అలాగే, శత్రువును ఎంత క్రూరంగానైనా చంపడం రాజధర్మమని కృష్ణుని సూత్రీకరణ.  ధర్మరాజుకు అహింస వైపు మొగ్గు ఉన్నా హింసను నివారించలేకపోయిన నిస్సహాయత అతనిది. అర్జునుడి పాత్ర మరింత విలక్షణం. అతను హింస-అహింసల మధ్య సందిగ్ధాన్ని ఎదుర్కొంటాడు. అతనిపై ఇటు ధర్మరాజు ప్రభావమూ, అటు కృష్ణుడి ప్రభావమూ రెండూ ఉంటాయి. తండ్రి, తాతలను, అన్నదమ్ములను ఎలా  చంపనని యుద్ధప్రారంభంలో ప్రశ్నించిన అర్జునుడే; సముచిత హింస అహింసే అవుతుందని ఆ తర్వాత ధర్మరాజుతో వాదిస్తాడు. శత్రువులనుంచి సంపదను గుంజుకుని బంధుమిత్రసహితంగా అనుభవించడమే రాజధర్మమంటాడు. హింస-అహింసల మధ్య సంఘర్షణను ఎదుర్కొన్న మరో పాత్ర అశ్వత్థామ. ‘నేను విప్రకులంలో జన్మించి కూడా దురదృష్టం కొద్దీ రాజోచిత ధర్మాన్ని అనుసరించాను, ఇప్పుడు మధ్యలో విప్రధర్మానికి మళ్ళలేను’ అని ఉపపాండవులను చంపడానికి వెళ్లబోయేముందు కృప, కృతవర్మలతో అంటాడు.

వ్యాస, భీష్మ, ద్రోణులలో కులధర్మం గురించిన పట్టింపు ఎక్కువగా కనిపిస్తుంది. తరాల మధ్య అంతరం కూడా  అందుకు  కారణం కావచ్చు. నువ్విక వానప్రస్థానికి వెడితే మంచిదని ధృతరాష్ట్రునికి వ్యాసుడు సలహా ఇస్తూ, ‘రాజులు యుద్ధంలోనైనా చావాలి, దృఢ సమాధితోనైనా శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే తప్ప, వృద్ధులై రోగంతో మంచం పట్టి చావడం మేలా, ఓ భరతముఖ్యా?’ అంటాడు. ‘భరతముఖ్యా’ అనడంలో ఉద్దేశం, భరతులు ఆయుధోపజీవులు సుమా అని గుర్తుచేయడమే.  భీష్ముడు కూడా అర్జునుడిలానే ఒక దశలో హింస-అహింసల మధ్య సందిగ్ధతను ఎదుర్కొన్నట్టు కనిపిస్తాడు. అయితే, ఇద్దరి సందిగ్ధతా ఒకలాంటివి కావు. భీష్ముడు  హింసపట్ల విసుగు ప్రకటిస్తూనే, రాజుల హింసను కులధర్మంగా నొక్కి చెబుతాడు. ‘పది రోజుల్లో ఉత్తమ క్షత్రియుల నెందరినో వాడి బాణాలతో చంపేశాను. విసుగుపుట్టింది. ఇక ఈ శరీరం విడిచి పెట్టడం మంచి’దని అనుకుంటాడు. ‘పుట్టినప్పటి నుంచీ క్రౌర్యంతో రాజులను చంపడంలోనే నా కాలం గడచిపోయింది, విసుగుపుట్టింది, ఇక నేనీ రాక్షస కృత్యం చేయలే’నని ధర్మరాజుతో అంటాడు. అర్జునుడిలో హింసా వైముఖ్యం వ్యవస్థాగతమైనదైతే, భీష్ముడి వైముఖ్యం వ్యక్తిగతం.  భీష్ముని మాటల్లో హింస పట్ల విచారాన్ని మించి, ఉత్తమ క్షత్రియులు అంతరించిపోతున్నారే నన్న ఆవేదన కనిపిస్తుంది. ఇదే భీష్ముడు అంపశయ్య మీద అంతిమక్షణాలకు ఎదురుచూస్తున్న సమయంలో కూడా ; ‘విప్రులకు అధ్యయనం ఎలాగో, రాజులకు యుద్ధం అలాగ. పాపపరులైనప్పుడు తల్లిదండ్రులను, పుత్రపౌత్రులను, గురువులనైనా సరే; యుద్ధంలో చంపడం ధర్మమే. రాజులకు యుద్ధాన్ని మించిన ఉత్తమధర్మం లే’దని ధర్మరాజుతో అంటాడు. అంతేకాదు, యుద్ధాన్ని యజ్ఞంతో పోల్చుతూ, ‘ఏ యజ్ఞమూ సంగ్రామయజ్ఞానికి సాటిరావు’ అంటాడు.

ఇక ద్రోణుడి విషయానికి వస్తే, అభిమన్యుని వధలో ముఖ్యపాత్ర పోషించిన సైంధవుడు; అర్జునుడు  తనను చంపుతానని చేసిన ప్రతిజ్ఞకు భయపడి ద్రోణాచార్యుని కలసుకున్నప్పుడు, ‘కులధర్మం శిథిలం కాకుండా వెళ్ళి యుద్ధం చేయి’ అని ద్రోణుడు అతనితో అంటాడు. మరి విప్రుడైన ద్రోణుడు కులధర్మం తప్పలేదా అన్న ప్రశ్న రావచ్చు కానీ దానిని వ్యక్తిగత దోషంగానే చూడాలి. తను చేసిన తప్పు పట్ల  స్పృహతోనే అతను సైంధవుడికి ఆ సలహా ఇచ్చి ఉండచ్చు.

ఇంతకీ చరిత్రకందని ఆ కాలంలోనే హింస-అహింసల మధ్య ఇంత అంతర్మథనం, ఇంత చర్చ ఎందుకు సంభవించాయన్నది మరో కీలకమైన ప్రశ్న. దానికి సంక్షిప్తంగా చెప్పుకోదగిన సమాధానం ఏమిటంటే, హింస సామాజిక పురోగమనానికి తీవ్ర ఆటంకంగా మారే పరిస్థితులు ఆనాటికే తోసుకువస్తున్నాయి. రాజకీయార్థిక రూపంలో మౌలికమైన మార్పు వస్తోంది. అన్న పుష్కలత్వాన్ని సాధిస్తూ పెరుగుతున్న జనాభాను ఆదుకుంటున్న అభివృద్ధికర సాధనంగా వ్యవసాయం నానాటికీ బలం పుంజుకుంటోంది. దానికితోడు ఇనుము లభ్యత అటు వ్యవసాయానికి సాయపడుతూనే, విచిత్రంగా ఇటు హింసా విజృంభణకూ దారితీయిస్తోంది. వ్యవసాయవిస్తరణకు గణసమాజమూ, ఆయుధోపజీవనమూ అడ్డంకిగా పరిణమించడమే అందుకు కారణం. చరిత్రకాలానికి వస్తున్న కొద్దీ వ్యవసాయ శక్తులకూ, యథాతథవాదులకూ మధ్య సంఘర్షణ మరింత తీవ్ర రూపం ధరించబోతోంది.

దానిని అలా ఉంచి ప్రస్తుతానికి వచ్చే ముందు, ఒక మాట చెప్పుకోవాలి. భీష్ముడు యుద్ధాన్ని ‘సంగ్రామయజ్ఞం’ అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటి ‘జిహాద్’ లా ధ్వనిస్తుంది!

మహాభారతంలో ఆది నుంచి అంతం వరకూ  వ్యాపించిన క్షత్రియ క్షీణత, అధికారచ్యుతి అనే దారాలను పట్టుకుని నేరుగా అలెగ్జాండర్ దగ్గరికి వద్దాం. మనదేశంలో క్రీ. పూ. నాలుగైదు శతాబ్దాలకు చెందిన సాహిత్యం కానీ, ఇతర పత్రాలుకానీ, స్పష్టమైన తేదీ గల శాసనాలు కానీ ఏవీ లభ్యం కావని కోశాంబీ అంటూనే; కాకపోతే ఈ కాలం మనకు మొదటిసారి ఒక కచ్చితమైన చారిత్రక పరిణామం తాలూకు తేదీని నమోదు చేసి అందించిందని అంటాడు. అదే, పంజాబ్ పై అలెగ్జాండర్ చేసిన దాడి(క్రీ. పూ. 327). నాటి గ్రీకు కథనాలలోంచి ఆనాటి భారతీయ దృశ్యాన్ని చరిత్ర అనే కొత్త కళ్ళద్దాలతో వీక్షించే అవకాశాన్ని ఈ దాడి మనకు ఇచ్చిందని కోశాంబీ అంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పౌరాణిక భారతం అలెగ్జాండర్ రాకతో చారిత్రకదశలోకి అడుగుపెట్టింది.

అప్పటికి పర్షియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ప్రాంతాలను అలెగ్జాండర్ అవలీలగా జయించుకుంటూ వాటిలో చివరిదైన సింధునదీ ప్రాంతం దాకా వచ్చాడు. సింధుకు పశ్చిమంగా ఉన్న ప్రధాన వర్తక నగరం పుష్కరావతి(నేటి పేరు, చరసద్ద) ముప్పై రోజుల ముట్టడితో చేజిక్కింది. ఆ విజయం కలిగించిన ఉత్సాహంతో అలెగ్జాండర్ సింధు నదిని దాటి గాంధార జనపదంలోకి వచ్చాడు. అక్కడ మరో ప్రసిద్ధ వర్తక, సాంస్కృతిక నగరం ఉంది. అదే, తక్షశిల(ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది). తక్షశిల రాజు అంభి యుద్ధం చేయకుండానే లొంగిపోయి, కప్పం చెల్లించుకున్నాడు. అంతేకాదు, ఇద్దరం పంచుకోవడానికి కావలసినంత ఉంది, ఎందుకొచ్చిన యుద్ధమని కూడా ప్రశ్నించాడు. పైగా, ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం నీకు లేనప్పుడు మనం యుద్ధం చేయడంలో అర్థమేముందని కూడా అన్నాడు. తక్షశిల రాజు ఇలా నీళ్ళ ప్రస్తావన చేయడం వెనుక చాలా చారిత్రక వారసత్వం ఉంది. నీళ్ళ కోసమే ఈ ప్రాంతంలో ఋగ్వేదకాలం నుంచీ యుద్ధాలు జరిగాయి. దశరాజ యుద్ధం గురించి ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం.

Alexander_the_Great_Founding_Alexandria

అలెగ్జాండర్ కు ఇక్కడి నుంచి నీళ్ళు మళ్లించుకునే ఉద్దేశం ఎలాగూ లేదు. అయితే, అంభిని అతను విడిచిపెట్టడానికి అదొక్కటే కారణం కాదు. సైనిక ప్రాముఖ్యం లేని వర్తక నగరాలు అన్నిటివిషయంలోనూ అతను అదే విధానాన్ని అనుసరించాడు.

ఆ తర్వాతే అలెగ్జాండర్ కు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. స్వేచ్చా, స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్న గణ నగరాలు ఒకటొకటిగా కుప్పకూలినా,  గణయోధులనుంచి అలెగ్జాండర్ తీవ్ర ప్రతిఘటననే ఎదుర్కోవలసివచ్చింది.  ఉమ్మడి శత్రువును కలసి ఎదుర్కొనే ఐకమత్యం గణయోధులలో లేకపోవచ్చు కానీ, యుద్ధం వాళ్ళకు మంచినీళ్ళ ప్రాయం.

ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యవివరం ఏమిటంటే, ఈ గణయోధులకు ఆనాడు క్షత్రియయోధులు సహకరించారు. వారప్పటికి తమవి కాని నగరాల తరపున కూడా పోరాడే కిరాయిసైనికుల స్థాయికి దిగజారిపోయారు. అలెగ్జాండర్ పాలిట ఈ వృత్తి యోధులే సింహస్వప్నమయ్యారు. ప్లూటార్క్ ఇలా రాస్తాడు:

భారతదేశంలోని ఈ అత్యుత్తమ యోధులు (తక్షశిల సమీపంలోని)కిరాయి సైనికులుగా మారి ఆయా నగరాల రక్షణకు బాధ్యత వహిస్తూ వచ్చారు. ఆ పనిలో సాటిలేని శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ అలెగ్జాండర్ ను ముప్పుతిప్పలు పెట్టారు. ఒక దశలో అలెగ్జాండర్ వీళ్లతో సంధి చేసుకున్నట్టే చేసుకుని; వారు విజయగర్వంతో వెనుదిరిగి వెడుతుంటే వెనకనుంచి  దాడి చేయించి ఊచకోత కోయించాడు. ఈ ఒక్క నమ్మకద్రోహమే అతని యుద్ధ విజయాల కీర్తికి ఒక కళంకంగా మిగిలిపోయింది.

ఈ వృత్తి యోధులను ప్రాణాలతో విడిచిపెడితే, రేపు తీవ్ర ప్రతిఘటన కేంద్రంగా మారతారన్న భయంతోనే అలెగ్జాండర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాడు. ఇలా క్షత్రియులు గణనిర్బంధాలనుంచి బయటపడి కిరాయి సైనికులుగా మారి ఏ నగరరక్షణకైనా సిద్ధపడడం, అప్పటికీ కొన్ని ఋగ్వేద గణాలు మిగిలి ఉన్న ఆ ప్రాంతంలో ఒక నూతన పరిణామమని కోశాంబి అంటాడు. గణనిర్బంధాలనుంచి బయటపడడం కూడా ఒక ఆసక్తికరపరిణామం. నిజానికి గణనిర్బంధాలనుంచి క్షత్రియులకన్నా మొదట బయటపడినది  బ్రాహ్మణులు. అందు గురించిన విశేషాలను మరో సందర్భానికి వాయిదా వేస్తే…

ఒక మల్ల విలుకాడు వేసిన బాణం అలెగ్జాండర్ కాయానికి పెను గాయం చేసిందని గతంలో చెప్పుకున్నాం. అలాగే,  వృత్తి యోధులను నమ్మించి వెన్నుపోటు పొడవడం అతని కీర్తికాయానికి తూట్లు పొడిచింది. అదలా ఉంచితే, మహాభారత కాలంనుంచీ క్షీణతనూ, అధికారచ్యుతినీ ఎదుర్కొంటున్న క్షత్రియులు; అలెగ్జాండర్ కాలానికి వచ్చేసరికి కిరాయి సైనికుల స్థాయికి జారిపోవడంలో ఒక ఆశ్చర్యకరమైన  చారిత్రక అవిచ్చిన్నత కనిపిస్తుంది.  అంతేకాదు, అది మహాభారతకాలాన్ని నేరుగా చరిత్ర కాలంలోకి తీసుకొస్తుంది.

 – కల్లూరి భాస్కరం

 

ఎచటికి పోతావీ రాత్రి?

kondepudi 

ప్రాధమికంగా కవి అయిన ప్రాథమికంగా కవయిత్రి అయినకొండేపూడి నిర్మల కథకురాలిగా కూడా అంతే ప్రసిద్ధం.  వ్యాసం,కాలమ్ లాంటి ఇతర సాహిత్య ప్రక్రియల్లో  కూడా ఆమె కృషి చేస్తున్నారు.వృత్తి పరంగా  ప్రచార, ప్రసార రంగాల్లో విలేకరి గా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల్లో  జండర్ కమ్యూనికేషన్స్ అంశాలకు ట్రెయినింగ్ మాడ్యూల్స్ రాయడం, క్లాసులు తీసుకోవడం చేస్తున్నారు. ఈమె రచనలు తమిళ, ఆంగ్ల , మళయాళ  భాషల్లోకి తర్జుమా అయ్యాయి. నిర్మల కథల సంపుటి ” శత్రు స్పర్స “కు చక్కటి ప్రాచుర్యం లభించింది —వేంపల్లె షరీఫ్

 

***

 

 

nirmala story

 

ఎచటికి పోతావీ రాత్రి?

 

భయం ….

వేలాది కాళ్ళతో తరుముకుంటూ వచ్చి చటుక్కున పీక పట్టుకుని కొరికేస్తున్నట్టు..కొరికిన పీకలోంచి గుండెలోకి, ఇంకా ఆ కిందికి చెయ్యి జొనిపి తల్లిపేగుని కెలికి తెంపేసినట్టు…వొణికిపోతోంది సుందరమ్మ. వొళ్లంతా చెమటతో తడిసిపోయింది. దుప్పటి తీసి గాలి పీల్చుకుందామని వుంది. ….భయం.|

సంచీలో  వున్న సీసా వొంచుకుని నీళ్ళు తాగుదామని వుంది…… భయం….|

కదులుతున్న ఆ  రైలు,  పట్టాల  మీద నడుస్తున్నట్టుగా లేదు. తలకాయ మీంచి నడుస్తున్నట్టుగా వుంది. టటా.. టట్.. టటా..టట్ చప్పుడు కాస్తా పట్టుకోండి..కొట్టండి, నరకండి ..అరుపులుగా మారినట్టు అనిపిస్తోంది. ఉన్నట్టుండి విసురుతున్న రాళ్ళ దెబ్బలు తప్పించుకున్నట్టుగా చేతులతో వొళ్ళు కప్పుకోలేక  కాళ్ళు ఝాడించి పక్కకి తిరిగింది సుందరమ్మ.  ఆ కదలికకి  కిటికీ చీకటిలో తల పాతేసుకున్న  ముకుందరావు ఉలిక్కిపడి భార్య వైపు చూశాడు. గుండు చేయించుకుని మఫ్లరు చుట్టుకున్న అతని మొహం కొత్తగా వుంది . రెండు సీట్లకీ మధ్య వున్న జాగాలో పదిహేడు పధ్నాలుగు ఏళ్ళున్న సుమలత, సరోజలు  పాత దుప్పటి మీద  పడుకుని నిద్రపోతున్నారు. పెద్ద పిల్ల ఒద్దికగానే పక్కకి తిరిగి పడుకున్నది గానీ, చిన్న పిల్ల ఎడాపెడా  రెండు కాళ్ళూ తలో పక్కకి నిగడదన్ని పడుకోడం వల్ల..    తడిసిన తెల్లటి పైజమా, లోన వున్న నీలం రంగు చెడ్డీ కనబడుతున్నాయి.. ఆ పిల్లకి మతి స్థిమితం సరిగా లేదు. చూడ్డానికి బలంగా, పొడుగ్గా, అందంగా కనిపిస్తున్నా, మెదడుకింకా ఆరేళ్ళ పసి ప్రాయమే వుందని డాక్టరు చెఫ్ఫాడు.. కాబట్టి అ తల్లికి రోజూ వున్న వున్న సవాలక్ష పనుల్లో  పిల్ల బట్టలు సర్దడం కూడా ఒకటి.   ఎదుటి సీట్లో భూతద్దాల కళ్ళజోడు ఒకటి ఇటే చూస్తోంది. అసహనం పెరిగిపోయిన ముకుందరావు వొంగి ఆ  పిల్ల భుజంమీద ఒక్కటి వేశాడు. తండ్రి ఎందుకలా కొట్టాడో తెలీని సరోజ తల గోక్కుంటూ ఏడుపు లంకించుకుంది.  ఆ దెబ్బ భూతద్దాలకి కూడా తగిలినట్టయి  మొహం ఇంకోవైపు తిప్పుకున్నాడు.. ఎన్నికల సీజను అవడం వల్ల రైల్లో జనాలు కిక్కిరిసి వున్నారు. టి.టి ని పట్టుకుంటే నలుగురిలో ఇద్దరికైనా  బెర్తులు దొరుకుతాయేమో గానీ,  ప్రస్తుతం ఏ పనిమీదా ముకుందరావు ఎవరి ముందూ నిలబడదల్చుకోలేదు.. అటు ఇటూ చూసి రహస్యంగా భార్య చెవిలో ఏదో చెప్పాడు. దుప్పటి ముసుగు తీసిన సుందరమ్మ గబుక్కున లేచి సూట్కేసులోవున్న కట్టుడు చీర ఒకటి తీసి   ఉమ్మడిగా కూతుళ్ళిద్దరి మీదా కప్పింది. బెర్తులో ఇరికి మళ్ళీ యధాప్రకారం ఏడుపులో మునిగిపోయింది. ఆ ఏడుపు ఏమిటో గాని, చప్పుడు లేకుండా గొతులోనే చిదిమెయ్యడం వల్ల ఒకరకం మూగజంతువు మూలుగులా  వుంది.

రైలు ఏదో స్టేషనులో ఆగింది. ముకుందరావు, సుందరమ్మ ఒకేసారి బిగుసుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళు వున్న పరి్స్థితిలో  రైలు ఆగడం ఇష్టంలేదు. ఎలాగోలా ఎక్కడికో అక్కడికి ఇంటిల్లిపాదినీ మోసుకుపోయి ఈ ప్రపంచానికి దూరంగా విసిరేస్తే చాలని వుంది. కాని ప్రపంచం లేని చోటెక్కడ వుందో అది తెలీడం లేదు. ప్రయాణం మొదలుపెట్టి నాలుగు రోజులవుతోంది. ఏ రైలు ఎంతదూరం వెడుతుందో అక్కడికి టిక్కెట్టు తీసుకోవడం ఆ మూలకి వెళ్ళిపోవడం, ఇదే వారి దినచర్య.

వారం  క్రితంవరకూ వాళ్ళ జీవితాల్లో  ఈ భయం లేదు . ముకుందరావు ధైర్యంగా తలెతుకునే రోడ్లమీదే తిరిగాడు. సుందరమ్మ సందడిగా చుట్టుపక్కల అందరితో మాట్లాడుతూనే వుంది.  కూతుళ్ళిద్దరూ  ఆడుతూ పాడుతూ  స్కూలుకి వెళ్ళి వస్తూనే వున్నారు. పెళ్ళయి దూరంగా కాపురం చేసుకుంటున్న పెద్ద కూతురు అత్తింటిపోరు గురించి అప్పుడప్పుడు  ఫోన్లు చేస్తూనే వుంది. ఒకే ఒక వార్త వాళ్ళ జీవితాన్ని తలక్రిందులు చేసింది. అవాళ ఉన్నట్టుండి  వార్తలమధ్య పట్నలో చదువుతున్న వాళ్ళ పుత్రరత్నం మోహన్ కుమార్  కనిపించాడు. ఆశ్చర్యంతో  అందరూ టీ.వి ముందు మూగిపోయారు. ఏమిటా వార్త..? ఎవరో అమ్మాయివెంట పడుతున్నట్టు, చంపుతానని బెదిరిస్తున్నట్టు వుంది. మీడియా ఎదుటికి ఈడ్చుకెడుతున్న పోలీసుల చేతుల్లో జేబురుమాలు కప్పుకున్న పుత్రరత్నాన్ని దిగ్భ్రాంతితో గుర్తు పట్టారు. వెంటనే పక్కింటి ఆవిడ వచ్చేసింది. ఇదిగో మీవాడేం చేశాడో  విన్నారా?..అంటూ,  ఆ తర్వాత వెనకింటి ఆవిడ, ఆ తర్వాత కాలనీ సెక్రటరీ, అందరూ ఏదో రకంగా రక్తం విరిచేసి వెళ్ళారు..నిట్టనిలువుగా చితి అంటించిన శవంలా పొగ చూరింది ముకుందరావు మొహం.. ఇంటి తలుపులు బిగించేసింది సుందరమ్మ.  కాలేజీకి పరిగెత్తుకు వెళ్ళి ఫోలీసుల కాళ్ళావేళ్ళా పడి, ప్రిన్సిపాల్ కాళ్ళా వేళ్ళా పడి బెయిలు అడుక్కుని కొడుక్కి  నయానా భయానా బుద్ది చెప్పి  వచ్చాడు ముకుందరావు. . దెబ్బల భయం కొద్దీ మోహన్ కొన్నాళ్ళు బానే వున్నా మళ్ళీ ప్రేమ పిశాచి ఆవహించినట్టు ఆ పిల్ల వెంట పడ్డాడు. దేశం నిండా తల్లితండ్రుల్ని ఎదిరించి ఎగిరిపోయిన ప్రేమ సినిమాలే ఆడుతున్నాయి.. అవి తన పిల్లలు చూడకపోతే బావుండనుకున్నాడు. చిన్నపిల్ల సరోజతో బాధలేదు, అదష్టవశాత్తూ దాని బుర్ర ఎదగలేదు. సుమలతా , మోహన్ కుమార్ కవల పిల్లలు. సినిమాల్లో చూపించినంత విడ్డూరంగా అందర్నీ మోసం చేసేటన్ని పోలికలు వాళ్ళ మొహాల్లో గాని స్వభావాల్లో గాని ఎక్కడాలేవు. కొడుకు దూకుడు పిండం, కూతురు నిదానంగా ప్రవహించే  మందాకినిలాంటిది.

సెలవలకోసం ఇంటికొచ్చిన మోహన్ పక్కన జేరి సుందరమ్మ వాపోయింది.  ” ప్రేమ గోల మనకొద్దు  నాన్నా….అమ్మని చెబుతున్నాను విను. అక్క మొహం చూడు. నువ్వు ఈ పని చేసిన దగ్గర్నించి నీ తమ్ముడు పేపర్లోకి ఎక్కాడు చూశావా అని కాల్చుకుతింటున్నారురా. అసలే వాళ్లు రాక్షసులని నీకు తెలుసు. ఇదిగో ఎదుగుతున్న చెల్లెళ్లని చూడ్రా ఒరే, నువ్వు చదువు  మానేసినా ఫరవాలేదు, కూచోపెట్టి పోషించుకుంటాం, అమ్మాయిల వెంటపడద్దు, మా పరువు తియ్యద్దురా. ఇవేం దెబ్బలురా..నిన్ను వాళ్ళింక చంపేస్తారేమోరా….” . కొడుకుని కావలించుకుని చెప్పి చెప్పి బావురుమని ఏడ్చింది సుందరమ్మ. మోహన్ కదల్లేదు, మెదల్లేదు శిలా విగ్రహంలా కూచున్నాడు. రాత్రికి రాత్రి అందర్నీ నిద్దర్లోకి దింపి వెళ్ళిపోయాక గాని వాడు తమకి దూరంగా ఎంత “అమర పేమికుడై” పోయాడో తెలీలేదు .

ఆ వెళ్ళటం వెళ్ళటం వారం క్రితమే కేసు మళ్ళీ ఫైలు అయినట్టు  తెల్సింది. ఫోలీసులు మోహన్ వొళ్లు హూనాహూనం చేశారు. ఒక్కగానొక్క మగబిడ్డ కావడంతో పాలు  వెన్నలతో పెంచుకున్న సుందరమ్మ. వాడికి పట్టిన దుస్థితి చూసి మూర్చపోయింది.. మళ్ళీ బెయిలు తేవడానికి ముకుందరావుకి మొహమే కాదు పలుకుబడి కూడా చాలలేదు. . కడుపుతీపి కొద్దీ సుందరమ్మ దూరపు బంధువుల్లో వున్న లాయర్ల చుట్టు తిరిగి లేదనిపించుకుంది.. జైలు నించి కూడా వాడు సరాసరి ఇంటికి రాలేదు. హాస్టలులో వున్న బట్టలూ అవీ తెచ్చుకుంటానన్నాడు. ముకుందరావు అనుమానిస్తూనే వున్నాడు. కన్నతల్లి అయిన నేరానికి సుందరమ్మ నమ్మింది. అనేక సినిమాల్లో చూపించినట్టుగానే ఆ పిల్లకోసం   మోహన్ కాలేజీకి వెళ్ళాడని వేటకొడవలితో ఆ పిల్ల భుజం నరికాడని తెల్సింది.. దుష్టుడు, కీచకుడూ, అనే పేర్లతో  వాడి బొమ్మ  పేపరులో చూస్తుంటే ఏదయినా మింగి ఇంట్లో అంతా ఒకేసారి చచ్చిపోదామని అనుకున్నారు. చచ్చిఫొవడానికి ధైర్యం చాల్లేదు. ఆత్మహత్య మహా పాతకం అని గుర్తు చేసుకున్నారు. ఆ పని పోలీసులు మాత్రం ఎంతో చాకచక్యంగా చేశారు కుక్కని కాల్చినట్టు కొడుకుని కాల్చి చంపారు. అనవసరంగా ఎదురు తిరిగాడని, ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పుకున్నారు. సానుభూతికి, సహానుభూతికి నోచని దుఖం. వాడ్ని చంపిన రోజు జనం పండగ చేసుకున్నారు. అదేమిటని అడగడానికి లెదు. ఏడవడానికి లేదు. శవాన్ని తెచ్చుకుని పూడ్చిపెట్టడానికి  లేదు.. ఒకే ఒక్క రో్జులో  ఆ కుటుంబానికున్న మానవహక్కులు, ప్రాధమిక హక్కులు అన్నీ.. అన్నీమంట కలిసిపోయాయి. కుటుంబానికి కుటుంబమే  భయంతో ఇంటిచుట్టూ తాళాలు వేసి లోన దాక్కున్నారు. ఆడపిల్లలిద్దర్నీ అసలు బైటికే రానివ్వలేదు. భయం…భయం.. నీడ కనబడితే భయం… వెలుగు పరుచుకుంటే భయం….పరువు భయం, ప్రాణభయం. ప్రజా భయం.. మానభయం…రోజుకి  ఇరవై నాలుగు సార్లు అవే దౄశ్యాలు చూసి చూసి చూసి, ఇంటిల్లిపాదీ గోడకేసి తల బాదుకున్నారు..టి.వి పెట్టె మీద పెద్ద నల్ల దుప్పటి కప్పేసినా సమస్య తీరలేదు, .  వార్తలూ, చర్చలూ పక్కింటి నుంచి వినబడుతున్నాయి.  పట్టుకోండి, నరకండి..చంపండి…కేకలు పెడుతూ ఒకరోజు  జనం ఇల్లు చుట్టుముట్టారు. ఫొలీసులే లేకపోతే నలుగురినీ అందరూ ఎప్పుడో దహనం. చేసేవారే…కొడుకు చేసిన నిర్వాకం ముందు ఇంతకాలమూ వాళ్ళు సంపాయించుకున్న మంచితనం మంటకలిసిపోయింది…. పచారీ దుకాణం వాడు అరువు ఇవ్వడం ఎప్పుడో మానేశాడు.. పాల ప్యాకెట్లూ రావడం లేదు. కరెంట్ కనెక్షను ఎందుకు తీసేశారో తెలీడం లేదు. హింస..పీడన….సొంత ఇంట్లోనే ప్రేతాత్మలాగా రాత్రులు మాత్రమే  సంచరిస్తూ పగలంతా నిశ్సబ్దంగా లోన కూచుని, , చివరికి ఒకానొక జడివానలో, ముసుగులు కప్పుకుని  రైలు ఎక్కేశారు. పారిపోవడానికి వున్న ఒకే ఒక చిన్న ఆర్ధిక వెసులుబాటు ముకుందరావు రైల్వే ఉద్యోగి కావడం, ఎంత దూరం వెళ్ళాలో, ఎన్నాళ్ళు వెళ్ళాలో తెలీదు. నిరంతరం ఒక వాహనంలో దొర్లుకుపోతూ వుండటం ఒక్కటే వాళ్ళకి గత్యంతరంగా వుంది.

రైలు మళ్ళీ ఏదో స్టేషనులో ఆగింది. ప్లాటుఫారం మీంచి చపాతీల వాసన గుప్పుమంటూ వచ్చింది.

“అమ్మా చపాతీ  కావాలి, ” పధ్నాలుగేళ్ళ పిల్ల ముద్దు ముద్దుగా అడిగింది. పెద్ద పిల్లకీ ఆకలేసినట్టుంది. అమ్మ వంక చూసింది. ఆమె దుప్పటిలో కూరుకుపోయి వుంది, నాన్నవంక చూసింది.  కిటికీలోంచి కిందికి దూకేశేలా నేలకేసి చూస్తూ  కూచున్నాడు.  మెల్లిగా లేచి  తన దగ్గరున్న చిన్నపర్సులోంచి అయిదు కాయితం తీసింది. పక్కపెట్టె కిటికీలోంచి తొంగిచూసి, రెండు చపాతీలు కొన్నది. చెల్లికొకటి ఇచ్చి, తను ఒకటి తినడం మొదలు పెట్టింది . ఆకలి వాసనకో ఏమో, వెనక్కి ముకుందరావు కూతురుకేసి చూశాడు. సుమలత  అపరాధిలా గతుక్కుమని, వెంటనే తమాయించుకుని  “చెల్లి అడిగింది నాన్నా”  అంటూ ఒక ముక్క తీసి నాన్నకి అందించింది., . ముకుందరావు తీసుకోలేదు. నువ్వే తిను- అన్నట్టుగా  సైగ చేశాదు.  ఆవురావురుమంటూ దాన్ని  సగానికి మడిచి  నోట్లో పెట్టుకుని ఆప్యాయంగా తినడం మొదలుపెట్టింది. మధ్యాన్నం పన్నెండింటికి వాళ్ళమ్మ ఇచ్చిన పులిహోర తర్వాత ఇదే  తిండి. మనం ఎక్కడి కెడుతున్నాం అనే ప్రశ్న తన భాషలో అడిగి కావలసినన్ని తన్నులు తిని వుంది సరోజ. దాని మొహమంతా జేవురించి వుంది… అదే  ప్రశ్న పెద్ద పిల్ల సుమలత మనసులో కూడా వుంది. అయినా అడగదు. ఆ మాటకొస్తే అమ్మానాన్నలకీ తెలీదని దానికి తెలుసు. . కళ్ళతోనే అన్నీ అర్ధం చేసుకుంటుంది. అందుకే దాన్ని వాళ్ళమ్మా, నాన్నలు బంగారుతల్లీ అంటారు.

సరోజ తన చపాతీ గబగబ తినేసి అక్క ఆకులోకి చూస్తోంది. సుమలత తనవాటాలో  సగం చెల్లికి త్యాగం చేసి , కడుపులో ఖాళీని మచినీళ్ళతో నింపుకుంది. ఎందుకంటే ఆ పిచ్చిది  గొడవ మొదలు పెడితే ఒక పట్టాన వూరుకోదని తెలుసు…రైలు మళ్ళి ఎక్కడో ఆగింది, అయితే అది స్టేషనులా లేదు. దొంగలెవరో గొలుసు లాగి పారిపోవడానికి ఆపినట్టున్నారు. ఆ దొంగలు అదే చోట రోజూ గొలుసు లాగుతారని, రైలు ఆగుతుందని నిశ్చయంగా తెలుసు కామోలు,  లాగుడు బండి లో ఒకడు ఆమ్లెట్లు వేస్తున్నాడు. ముకుందరావు అటే చూస్తున్నాడు. ఒక మనిషి కూచోడానికి సరిపోయేంత పెద్ద పెనమ్మీద గుడ్డు పగలకొట్టి పోశాడు. ఎడంచేత్తో మిర్చి, ఉల్లిముక్కలు చల్లాడు . పెనంతో అట్టుని నాలుగు వైపులా ఎత్తాడు. ఖాళీ అయిన డొల్లని అక్కడున్న  పొదలోకి విసిరాడు. ముకుందరావుకి కొడుకు గుర్తు వచ్చాడు. పోలీసులు తన కొడుకుని కూడా పనికి రాని కోడి గుడ్డు డొల్లని విసిరినట్టు చెట్లలోకి విసిరేశారు కదా…. . అనుకునేసరికి గుండె పగిలిపోయింది. పిల్ల అవకుండానే చిదిమేసిన గుడ్డు వెనకగా కనబడుతున్న మొండిగోడమీద  టెన్తుక్లాసు ప్రేమ సినిమా పోస్టరు ఒకటి సరికొత్తగా అతికించి వుంది.. తప్పుచేశానా..?, పదిహేడేళ్లయినా నిండకుండా బస్తీకి తరిమికొట్టాక ఎన్ని ప్రలోభాలు, మైకాలు, ఎరలు, అరలు..?  నేను వాడి కళ్ళు ఎలాగైనా గాని మూస్తే బావుండేదా..? ఎలా ముయ్యాలి. ఈ హింసకి బీజం ఎక్కడ పడిందని వెతకాలి..? ప్చ్..ఈ  ప్లాట్ ఫారమ్మీద అమ్లెట్ పోసే కుర్రాడిలా తన కొడుకు అవిటివాడయినా గాని  కళ్ళముందుండి బతికిపోయేవాడేమో…భుజమ్మీదున్న తువ్వాలు నోట్ళో కుక్కుకుని ఏడవడం మొదలు పెట్టాడు. భర్త ఏడుపు విని సుందరమ్మ లేచి కిటికీ దగ్గర కూచుంది. ముకుందరావు భార్య లేచిన చోట పడుకుని అటువైపు తిరిగాడు. . ఆకలి తీరిన సరోజ సుమలత వొళ్ళో తల పెట్టుకుని పడుకుంది. సుమలత అమ్మకీ నాన్నకీ దగ్గరగా జరిగింది. ముకుందరావు నిశ్సబ్దంగా కూతురి తలా వీపు నిమురుతున్నాడు. అనుకోకుండా మొన్న కొడుకు చేతిలో తెగిన ఆ పిల్ల భుజం గుర్తొస్తోంది . గుండె పగిలేలా రోదిస్తున్న ఆ పిల్ల తల్లి గుర్తొస్తోంది. ఓదార్చడానికి  చాపిన వందలాది చేతులు గుర్తొస్తున్నాయి. మంత్రి గారి ఓదార్పు గుర్తొస్తోంది. ఇంకో పక్క బుల్లెట్ గాయాలతో చిల్లులు  పడ్డ తన కొడుకు శరీరం కనిపిస్తోంది. ఎందుకిలా జరిగిందని అడగలేని తన నిస్సహాయత గుర్తొస్తోంది. కడుపులో వున్న పుండు పగిలిపోయేటట్టు దుప్పటికింద  కుమిలి పోతున్న సుందరమ్మ కనిపిస్తోంది. తడిసిన దూదిని పిండినట్టు కంటి రెఫ్ఫలు బిగించాడు.. . కంటిలోన ఆడుతున్న బొమ్మలు ఒక్కో బొట్టుగా  జారుతున్నాయి.

రైలు మాత్రం టటా..టట్…టటా..టట్…అనడం లేదు, పట్టుకోండి, కొట్టండి…, చంపండి…అని అరుస్తూ పరిగెడుతోంది.

 

 

– కొండేపూడి నిర్మల

చిత్రం: కాశిరాజు

ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!

kasula

( కవిత్వ విమర్శకుడు కాసుల లింగా రెడ్డి కి సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు ప్రదానం 19 న)

*

ఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు.

వొక పదేళ్ళ క్రితమో, పదిహేనేళ్ళ క్రితమో కవిత్వాన్ని తూచే రాళ్ళు లేవని అనుకునే వాళ్ళం. అసలు ఆ రాళ్ళు అవసరమా అన్న కొత్త ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.  అంతర్జాల మాయాజాలం వల్ల, తక్షణ స్పందనలు శ్రుతి మించిపోయి, కాస్త నిలకడగా వొక మాట అందాం అనే స్పృహ క్రమంగా తగ్గిపోతోంది, ముఖ్యంగా కవిత్వరంగంలో!

వొక కవితని వొకటికి రెండు సార్లు చదివి, కాస్త ఆలోచించి, మాట్లాడదాం అనే ఆలోచనకి విలువ లేకుండా పోతోంది. ఈ స్థితిలో అయితే పొగడ్తలూ కాకపొతే తెగడ్తలూ, మరీ నాసిగా చెప్పాలంటే, ఎదో వొక విధంగా అది పరస్పర పొగడ్తల వొప్పందంగా  మారిపోవడం తప్ప ఇంకో స్థితి కనిపించడం లేదు.

ఇలాంటి స్థితిలో కవిత్వ విమర్శని తన రంగంగా ఎంచుకొని, ఆ రంగంలో తనదైన వొక దారిని ఏర్పరచుకుంటున్న కాసుల లింగా రెడ్డి అరుదయిన కవిత్వ విమర్శకుడిగా కనిపిస్తున్నాడు నాకు.

తను స్వయంగా కవిత్వం రాస్తున్నప్పటికీ, ఇతరుల కవిత్వాన్ని విశ్లేషించడంలో లింగారెడ్డి చూపించే బ్యాలన్స్ అతన్ని మిగిలిన విమర్శకులకు భిన్నంగా నిలబెడ్తుంది.

కవిత్వాన్ని ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదు లింగారెడ్డి. ‘నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నావనే’ మొదటి ప్రశ్నకీ, ‘కవిత్వ విమర్శ ఎందుకు రాస్తున్నావనే’ రెండో ప్రశ్నకీ లింగారెడ్డి దగ్గిర రెండు  వేర్వేరు సమాధానాలు లేవు. ఆ రెండీటికి అతనిచ్చే సమాధానం వొక్కటే. ఆ రెండీటికి మధ్యా వైరుద్ధ్యం చూపించలేకపోవడం లింగారెడ్డిలో వున్న అందమయిన బలహీనతలాంటి బలం!

తన విమర్శ వ్యాసాల పుస్తకం ‘ఇరువాలు’లో లింగారెడ్డి అంటున్నాడు.

“రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనం ఎందుకంటే నాకు ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరఫున నియమించుకున్న లాయర్ నా కవిత్వం.”

రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను అని ఎవరైనా అంటారు కాని, ఆ తరవాతి వాక్యంలో లింగారెడ్డి కనిపిస్తాడు. అతని ముక్కుసూటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. మనలో చాలా సాధారణంగా స్థిరపడి వున్న అభిప్రాయం ఏమిటంటే, వాదన వినిపించేట్టు అయితే వచనమే రాయాలని! కవిత్వాన్ని మనం కేవలం తక్షణ భావోద్వేగ ప్రకటనకే సరిపుచ్చుకుంటూ వచ్చాం కాబట్టి! నిజానికి తక్షణ భావోద్వేగాలలో కూడా వాదనలే వుంటాయి. కాని, అది అంత తేలికగా వొప్పుకోం గాక వొప్పుకోం.

ఉద్వేగాన్ని మించిన విలువ ఇవ్వడం మొదలెడితే కవిత్వం ఏదో ప్రమాదకరమయిన సామగ్రిగా మారిపోతుందన్న ఆందోళన ఈ స్థిరపడి వున్న “కవిత్వ వాదం”లో వినిపిస్తుంది. కాని, అలాంటి ప్రమాదాలతో ఆడుకోవడమే అసలుసిసలు కవిత్వం. అలాంటి ప్రమాదాలని సృష్టించడమే అసలుసిసలు కవిత్వ విమర్శ చేయాల్సిన పని. గత కొద్ది కాలంగా లింగా రెడ్డి కవిత్వ విమర్శకుడిగా చేస్తున్న పని అదే.

lingareddi

లింగారెడ్డి కవిత్వ విమర్శలో అనివార్యంగా రాజకీయ చర్చలు కనిపిస్తాయి. రాజకీయ స్పర్శ లేని సాహిత్యం అతనికి వొంటబట్టదు. అంత మాత్రాన్న ఇతరేతర ధోరణులకు గుడ్డిగా వుండడం అతని లక్షణం కాదు. కవిత్వం అనే పలుకు వుందంటే దాన్ని బంగారంగా కళ్ళకి అద్దుకుంటాడు. ఆ తరవాత అందులో లోతుల్లోకి వెళ్లి, లోపాలూ దోషాలూ నిర్మొహమాటంగా చెప్తాడు. తన కవిత్వ విమర్శ వ్యాసాలకు ‘ఇరువాలు’ అని పేరు పెట్టడంలోనే తన ధోరణి ఏమిటో స్పష్టంగా చెప్పుకున్నాడు లింగారెడ్డి.

ఇరువాలు అంటే రెండు సార్లు.  అది వ్యవసాయ పదం. కవిత్వ వ్యవసాయానికి కూడా అదను చూసి వాడిన పదునైన పదం. నేలని వ్యవసాయ యోగ్యం చేయడంలో – అంటే దున్నడంలో- వుండే రెండు కీలక ప్రక్రియల్ని కవిత్వ విమర్శకి అన్వయిస్తున్నాడు లింగారెడ్డి. నాకు అర్థమైనంత మటుకు అది కవిత్వం చదివే విధానాన్ని అలవాటు చేసే ప్రయత్నంగా చూస్తున్నాను.

ఏ కవితని అయినా రెండు సార్లు చదవడం అనేది ideal. మొదటి సారి చదివినప్పుడు ఆ కవితని అనుభూతిస్తాం. అది అభిరుచిని మొలకెత్తించే ప్రక్రియ. రెండో సరి చదివినప్పుడు అది ఆ అభిరుచిని పెంచే ప్రక్రియ, అంటే- ఆ చదివిన కవితలోని సారాన్ని ఇంకించుకునే ప్రయత్నం. ఈ రెండో దశలో ఎవరికి వాళ్ళు భిన్నమయిన సారాంశాలని గ్రహించవచ్చు. భిన్నమయిన అభిప్రాయాలు ఏర్పడేది కూడా రెండో పఠనంలోనే! ఈ రెండు పఠనాలు ఇప్పటి స్థితిలో అరుదయి పోయాయని నా ఆందోళన. బహుశా, ఈ రెండు పఠనాల మేలు ఎంతటిదో చెప్పడానికే లింగారెడ్డి తన పుస్తకానికి ఈ శీర్షిక పెట్టుకున్నాడని నేను అర్థం చేసుకున్నా.

ఈ పుస్తకంలో లింగారెడ్డి వ్యాసాలు స్వభావ రీత్యా  కొన్ని సమీక్షలు, కొన్ని విమర్శలు. కొన్ని కవిత్వ సంపుటాలూ సంకలనాల మీద రాసినవి. కొన్ని ఇప్పటి ధోరణుల మీద రాసినవి. అసలు ఇతర విమర్శకులు ఎవరూ పట్టించుకోని విలువైన పుస్తకాలూ, కవిత్వ అంశాలని కూడా తీసుకొని, వాటి మీద లోతయిన చర్చ మొదలెట్టడానికి లింగా రెడ్డి ప్రయత్నించాడు. అవి చదివాక- మనం లింగారెడ్డి అభిప్రాయాలతో ఏకీభవిస్తామా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి వొక విమర్శకుడు మనకి తక్షణం కావాలి అనిపిస్తుంది. వర్తమానం చీకట్లో అతను వెలిగిస్తున్న దీపపు కాంతి విలువైందనీ అనిపిస్తుంది. కాని, వొక్క మాట అనకుండా ఉండలేను.

లింగా రెడ్డి తన విమర్శని వొక సైద్ధాంతిక కోణం నించి చేస్తున్నాడన్న విషయాన్ని పూర్తిగా గౌరవిస్తూనే, ఆ విమర్శకి అప్పుడప్పుడూ తను వాడుతున్న పరిభాష ఇంకా కొంచెం సరళం కావాలని అనుకుంటున్నా. కొన్ని సార్లు విపరీతమయిన jargon లింగారెడ్డి చెప్పాలనుకుంటున్న/ మనతో పంచుకోవాలనుకుంటున్న ఆలోచనలకి అడ్డంకి గా మార్తుంది. సైద్ధాంతిక నిబద్ధతకీ, jargon కీ సంబంధం లేదని లింగా రెడ్డి గుర్తించాలి. ఆ గుర్తింపు తోడయితే లింగా రెడ్డి విమర్శ భూమార్గం పట్టి, మనందరి ఆలోచనల్లో కొత్త కాంతిని ప్రవేశ పెడ్తుంది.

అదలా ఉంచితే:

ఇవాళ లింగా రెడ్డి  విమర్శ వ్యాసాల సంపుటి “ఇరువాలు” కి లభిస్తున్న ప్రశంసలూ,  పురస్కారాలూ విమర్శకుడిగా అతను చేస్తున్న పనికి వొక legitimacy ని ఇస్తున్నాయి. అతని మార్గం కొందరికైనా నచ్చుతోందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అది మున్ముందు వొక మార్గంగా ఏర్పడవచ్చన్న సంకేతాన్ని చూపిస్తున్నాయి.

-అఫ్సర్

ఇరువాలు on Kinige: http://kinige.com/kbook.php?id=1501&name=Iruvalu