Archives for June 2013

కనసలూ నీనె – మనసలూ నీనె!

“యే…జీవన్ హై..ఇస్ జీవన్ కా”, “రజనీగంధా ఫూల్ తుమ్హారే…”, “జానేమన్, జానేమన్, తేరే దో నయన్”, “తుమ్ కో దేఖా..తొ యే ఖయాల్ ఆయా”, “ఎ తేరా ఘర్..ఎ మేరా ఘర్” లాంటి హిందీ పాటలు విన్నప్పుడల్లా, నాకు వాటన్నిటిలో ఒక కామన్ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది. చక్కటి “మధ్యతరగతి మెలోడీ!” ఉన్న వర్గీకరణలతోటే తికమకగా ఉంటే, మళ్ళీ ఇదొకటేమిటనుకుంటున్నారా? అంత కంటే అతికే పదబంధం నాకు దొరకలేదు మరి. కళ్ళు మూసుకొని కనక ఈ పాటలు వింటుంటే, అందమైన మెలోడీ తో పాటు ఎవరో మధ్యతరగతి ప్రేయసీప్రియులు పాటలాడుకొనేటటువంటి దృశ్యాలు కళ్ళ ముందు కదలాడతాయి!

అసలీ కన్నడ శీర్షికేమిటీ, హిందీ పాటల గోలేమిటి, దేని గురించి ఈ వ్యాసం, అని అనుకుంటున్నారు కదూ? అక్కడికే వస్తున్నా. ఈ పాటలన్నీ కూడా డెభ్భైల్లో వచ్చినవే. తెలుగులో కూడా, ఈ తరహాలో, పాటలు అదే సమయంలో వచ్చాయా అని చూసుకుంటే, కొన్ని అద్భుతమైన మెలోడీలు తగిలాయి. వాటిల్లో చాలా వాటికి స్వరకర్తలు రాజన్-నాగేంద్ర సోదరద్వయమే! వారి “మధ్యతరగతి మెలోడీ” పాటల గురించే ఈ సారి కమామీషంతా.

 

rajan

 

మీకు వికీని గూగ్లించే శ్రమ లేకుండా, వారి పూర్వాపరాల గురించి టూకీగా చెప్పేసుకుంటే, తర్వాత వారి స్వరధారల్లో తడిసి ఆటలాడేసుకోవచ్చు. చిన్నప్పుడే, కర్ణాటక రాష్ట్రంలో సంగీత కాలేజిలో విద్యనభ్యసించిన  ఈ ఇరువురు సోదరులూ, 1953 లో కన్నడ సినిమా రంగంలోనూ,  1960 లో తెలుగు సినిమా రంగంలోనూ, జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల ద్వారా రంగప్రవేశం చేశారు. కన్నడ సినిమా రంగంలో అగ్రతారలైనటువంటి రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సినిమాలకి సంగీతాన్ని అందిస్తూ ఆ రంగంలో బిజీగా ఉన్న వీరికి, తెలుగులో అడపాదడపా తప్ప ఎక్కువగా అవకాశాలు రాలేదు. 1975 లో కన్నడ సినిమా “ಎರಡು ಕನಸು” తెలుగు రీమేక్ “పూజ” ద్వారా వీరి పునఃప్రవేశం జరిగింది. ఆ తర్వాత జరిగినది, “హిస్టరీ” అని చెప్పేసి సులువుగా తప్పుకొనే అవకాశం లేదిక్కడ. కలకాలం గుర్తుండి పోయే మేలోడీలు అందించిన వీళ్ళు, ఆ తరువాత సంగీతం అందించిన తెలుగు చిత్రాల సంఖ్య ఇరవైకి మించదు!

 

“పూజ” చిత్రం నుంచే  “పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను..తియ్యరా తలుపులనూ రామా..” అంటూ మృదుమధురంగా వాణీజయరాం గళంనించి జాలువారిన ఈ గీతాన్ని, ఇప్పటికీ ఎంతో మంది గాయకురాళ్లు పాటల పోటీలలో పాడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. “ఎన్నెన్నో జన్మల బంధం..నీది నాది”, ఎవరగ్రీన్ పాట. దాదాపు ఒక పదిహేడేళ్ళ తరవాత హిందీలో, ఆనంద్ మిలింద్, ఎక్కువ మొహమాట పడకుండా, అదే ట్యూన్ ని, “జాన్ సే ప్యారా” అనే సినిమాలో మక్కీకి మక్కీ దించేశారు. మూడు భాషలలోనూ యీ సతతహరిత పాటని ఇక్కడ చూడచ్చు!

 

కన్నడ: http://www.youtube.com/watch?v=TwKVyj9hf7k

తెలుగు: http://www.youtube.com/watch?v=GfCnYnXhyIw

హిందీ: http://www.youtube.com/watch?v=knPnX5G3PAU

 

1977: తెలుగు సినీ రంగం ఎన్నో మలుపులు తిరిగిన సంవత్సరం. అడవిరాముడు తో అన్నగారు తన మాస్ ఇమేజ్ ని సోషల్ సినిమాలలో సుస్థాపితం చేసుకుంటే, వేటూరి ఒక ప్రభంజనం లా చెలరేగి, “ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ…”, “అమ్మ తోడు, అబ్బ తోడు, నీ తోడు, నా తోడు…” లాంటి లిరిక్స్ తో, ఒక కొత్త మాస్ తెలుగు పాటకి శ్రీకారం చుడితే, తన లేత గళంతో అప్పటికే అందరినీ అలరిస్తున్న బాలూ, తన స్వరవైవిధ్యంతో అన్ని వర్గాల శ్రోతల గుండెల్లో తిష్ఠ వేసుకున్న సంవత్సరం. అదే సంవత్సరంలో నవతా వారు నిర్మించిన “పంతులమ్మ” చిత్రం లోని పాటలు, అటు సాహిత్యపరం గానూ, ఇటు సంగీత పరంగానూ అనేక ప్రశంశలందుకున్నాయి.

 

రాజన్-నాగేంద్రలకు ఉత్తమ సంగీత దర్శకులుగా నంది పురస్కారం తో పాటు, వేటూరి “మానస వీణా….” మధుగీతానికి కూడా ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అందించాయి ఈ సినిమా పాటలు. యాధృచ్చికమో, సాంగత్య బలమో తెలియదు కానీ, రాజన్-నాగేంద్రలు స్వరపరచిన మెలోడీలకి, వేటూరి పేర్చిన మాటలతో మరపురాని మధురగీతాల్లా రూపు దిద్దుకొని, ఒకరినొకరు మరింత ప్రకాశింపజేసేందుకు పూనుకున్నారా అనిపించక తప్పదు.

“ఎరిగిన వారికి ఎదలో ఉన్నాదు..

ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు…

శబరీ ఎంగిలి గంగ తానమాడిన పేరు…

హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు..

మనసెరిగిన వాడు మా దేవుడు .. శ్రీ రాముడు

మధుర మధుర తర శుభ నాముడు … గుణ ధాముడు “

 

త్యాగయ్య తరవాత రామభక్తిని అంత అందంగా, అంత సరళంగా వర్ణించటం, వేటూరి వారికే సాధ్యమేమో అనిపిస్తుంది ఈ పాట వింటుంటే. ఎప్పటిలా కన్నడ పాటనుండి కాకుండా, నేరుగా తెలుగు పాటకే బాణీ కట్టారనుకుంటా, అద్భుత:!

 

“ఏ రాగమో ఏమో మన అనురాగం..వలపు వసంతాన హృదయ పరాగం..

ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాల దశదిశంతాల సుమ సుగంధాల…భ్రమరనాదాల కుసుమించు నీ అందమే

విరిసింది అరవిందమై..కురిసింది మకరందమై..

 

మానసవీణా మధుగీతం…మన సంసారం సంగీతం”

 

మన సంసారాలలో ఉన్న సంగీతసారాన్ని ఇంత అందంగా ఆవిష్కరించిన వేటూరి, రాజన్-నాగేంద్రలకు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవలసిందే!

 

http://www.youtube.com/watch?v=5HPwgaRoV8w

 

ఇక్కడ మన గాన గాంధర్వుడి గురించి కూడా కొంత చెప్పుకోవాలి. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” లాంటి మంచి మెలోడీ పాటలు అప్పటికే ఒకటీ అరా పాడి ఉన్నా, ఇంకా తన ప్రతిభకు తగ్గ గుర్తింపు అతడికి దక్కలేదు. రాజన్-నాగేంద్రలు కట్టిన బాణీలతో పాడిన బాలూ పాటలకు అవార్డులు రాకపోయినా, చిరకాలం మన మదిలో నిలచిపోయే మంచి మెలోడీ పాటలుగా మాత్రం అతడి ఖాతాలో జమైపోయాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని, బాలూ పాడిన అన్ని వేల పాటలలో, మంచి మెలోడీ పాటలు, గబుక్కున గుర్తుకొచ్చేవాటిల్లో చాలా వరకూ డెభ్భైల్లో వచ్చినవే. బాలూ-వేటూరి-రాజన్-నాగేంద్ర కాంబో పాటలు, ఈ కోవలో కొచ్చేవే.

 

“సిరిమల్లె నీవే, విరిజల్లు కావే, వరదల్లె రావే, వలపంటే నీవే, ఎన్నెల్లు తేవే, ఎద మీటి పోవే…”

ఇది మొదట కన్నడలో కట్టిన బాణీనే. కన్నడలో య.స్.జానకి పాడిన పాటని తెలుగులో బాలూ చేత పాడించటం ఒక విశేషం. అప్పటికి, అనుభవంలో చిన్నవాడైనా, బాలూ అంత చక్కగానూ తెలుగులో పాడారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=R58a5Ht4-Ok

తెలుగు: http://www.youtube.com/watch?v=RxF-jon6LNg

 

“మల్లెలు పూసే, వెన్నెల కాసే, ఈ రేయి సాక్షిగా” – ఇంకొక “మధ్యతరగతి మెలోడీ”, కన్నడ, తెలుగు భాషలలో బాలునే పాడారు.

 

“మల్లె తీగ వాడి పోగా, మరల పూలు పూయునా?” – ఈ పాటని కన్నడలో పి.బి.శ్రీనివాస్ పాడితే, తెలుగులో బాలునే. పెద్దాయనకి క్షమాపణలతో, నాకు బాలూ వర్షన్ ఈ రెంటిలోను బాగుందనిపిస్తుంది.

 

“వీణ వేణువైన మధురిమ కన్నావా…” హిందోళంలో ఇంత మెలోడీ ఉన్న డ్యూయెట్ దీని తరవాత మరొకటి రాలేదేమో! కన్నడలో మొదట వచ్చిన ఈ పాట, తరువాత తెలుగులోనూ, తమిళంలో కూడా వచ్చి, అందరినీ డోలలూగించింది. ఇంత హాయిగా సాగిపోయే ఈ మెలోడీని ఇప్పటికి కూడా, మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంతలా స్వరపరిచారు ఈ సంగీత ద్వయం! డ్యూయెట్ గా సాగే ఈ పాట తమిళం లో మాత్రం సోలోగా జానకి గారి చేతే పాడించారు.

 

కన్నడ: http://www.youtube.com/watch?v=qyDb7bag9YI

తెలుగు: http://www.youtube.com/watch?v=QebPpYEBJ-w

తమిళం: http://www.youtube.com/watch?v=hd5NfjYfD1Y

ఆ తరువాత వచ్చిన “నాగమల్లివో…తీగ మల్లివో” అనే మరో అందమైన మెలోడీతో ఎనభైల్లోకి అడుగు పెట్టారు రాజన్-నాగేంద్రలు. “ఆకాశం నీ హద్దు రా…అవకాశం వదలద్దురా” అంటూ బీట్ పాట ఇచ్చినా, అందులో కూడా, తమ బ్రాండు మెలోడీని జొప్పించి, తమ ముద్ర మాత్రం మిస్ అవ్వకుండా చూసుకున్నారు వీరు.

వరుసగా ఇన్ని పాటల గురించి చెప్పుకున్నాం కదా అని, ఆ సినిమాలు వెళ్ళ మీద లెక్కెట్టుకుంటే, ఒక్క చెయ్యి సరిపోతుంది. పూజ, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, నాగమల్లి, ఇంతే!

 

అంత తక్కువగా అవకాశాలు లభించినా వీరి పాటలు ఇలా గుర్తుండి పోవటానికి కారణం, అది వారి పాటల్లో స్వరస్వరానా ఇంకిపోయున్న మెలోడీనే. అలా అని, వీరు అన్నీ గుర్తుండిపోయే పాటలే చేసారని కాదు. వీరు వందకు పైబడి కన్నడ చిత్రాలకి సంగీతాన్ని సమకూర్చారు. కానీ మన తెలుగు సినిమాల వద్దకు వచ్చేసరికి, వారి వంద చిత్రాల సంగీత సారాన్ని ఈ అరడజను చిత్రాలలో పొందుపరిచి ఇచ్చేశారని అనిపిస్తుంది! వీటికి తోడు, వేటూరి వారి సినీప్రస్థానప్రారంభం, బాలూ పతాకస్థాయిని చేర్కొనే దిశలో ఉండటం కూడా వారి పాటలను అజరామరంగా ఉండటానికి దోహద పడ్డాయనిపిస్తుంది.

 

ఎనభైలలో కూడా వీరు జంధ్యాల వారికీ, మరి కొద్ది దర్శకుల సినిమాలకీ సంగీతాన్ని అందించారు. “నాలుగు స్తంభాలాట” చిత్రం లోని ఈ సెన్సేషనల్ పాట రెండు సార్లు తెలుగులో రావటమే కాకుండా, హిందీలో కూడా ఒక పదేళ్ళ తరవాత స్వేచ్ఛగా వాడుకున్నారు. “బయలు దారి” అనే 1978 లో విడుదలైన కన్నడ చిత్రానికి కట్టిన ఈ బాణీ, “కనసలూ నీనె…మనసులూ నీనె” అనే పల్లవితో మొదలవుతుంది. దీని తెలుగు అనువాదం “కలలో నీవె..మనసులో నీవే” అని. ఐదేళ్ళ తరవాత 1982 లో,  జంధ్యాల గారి చిత్రం “నాలుగు స్థంభాలాట”కి, వేటూరి ఆ బాణీ విని వ్రాసిన పాట ఇది!

 

“చినుకులా రాలి

నదులుగా సాగి

వరదలై పోయి

కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ

నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరచి పోబోకుమా మమత నీవే సుమా!”

 

ఈ పాట వింటున్నప్పుడల్లా ఎదో ఒక ప్రవాహంలో కొట్టుకు పోతున్నటువంటి అనుభూతి కలుగుతుంది నాకు. ఆ పాట ఎంత “ఎవరగ్రీన్” అంటే, దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత అదే లిరిక్స్ తో “అహ నా పెళ్ళంట” అనే సినిమాకి రఘు కుంచె దానిని రీమిక్స్ చేసి మన కందించారు. హిందీలో మెలోడీ కింగ్స్ నదీం-శ్రావణ్ లు కూడా ఇదే బాణీని యధాతధంగా “ఐసి దీవానగీ…దేఖి నహీ కహీ” అని వాడుకున్నారు.

కన్నడ: http://www.youtube.com/watch?v=y1ntRcP_et4

తెలుగు: http://www.youtube.com/watch?v=2Tw7v5R2700

హిందీ: http://www.youtube.com/watch?v=m-vIYe_KY34

తెలుగు2: http://www.youtube.com/watch?v=_wbYsNwR4IU

 

ఈ సంగీత సోదరుల్లో చిన్నవాడైన నాగేంద్రగారు 2000 సంవత్సరంలో పరమపదించారు. వారి పాటలు మాత్రం మరెన్నో తరాల నోళ్ళలో నానుతూ ఉంటాయన్నది మాత్రం చాలా ఈజీ ప్రెడిక్షన్! కన్నడ సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకులుగా తమ పేరును సుస్థిరపరుచుకున్న వీరు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పైన చిత్రీకరించిన “గంధద గుడి” అనే చిత్రం లోని ఈ టైటిల్ సాంగ్ ను గుర్తుకుచేసుకుంటూ ముగిస్తున్నాను.

 

http://www.youtube.com/watch?v=d4vqbRonJgU

 

 

 

 

భారతీయ భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథ రెడ్డి

ketu

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయస్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతువిశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (సిపిఐఎల్‌)గా పేరొందిన ఈ మండలి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో వున్న భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది. మండలి సభ్యునిగా తెలుగు భాష తరఫున ఎంపికైన కేతు విశ్వనాథరెడ్డి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా జాతీయస్థాయిలో సుప్రసిద్ధులు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగుతారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సిఐపిఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జ్ఞానపీఠ్‌, సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు మాత్రమే ఈ మండలిలో సభ్యులుగా నియమితులవుతారు.

మెలకువలోనూ వెంటాడే కల ‘లెనిన్ ప్లేస్’!

aparna
ఏదో మంచి పుస్తకం అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను  కానీ ఇంతలా ఉంటుందనుకోలేదు. ఇది పుస్తకమా…?!! మొదటి  మూడు పేజీలూ చదివాక, ఆ అక్షరాల ధాటికి దిమ్మెరిపోయాను. ఉధృతంలా  సాగే  ఆ  వాక్యాల్లొ ఉన్న పదును, వాడి, ఆవేశం, సెన్సిటివిటీ నన్నింకా  దిగ్భ్రాంతికి గురి చేస్తూనే ఉన్నాయి. 
 
ఈ పుస్తకంలో నన్నంతగా  ఉద్రేకపరిచిన విషయం ఏంటి? కథావస్తువా..,కథనమా..,శైలా…, మరేదైనానా? బహుశా..ఈ కథల్లోని ఆత్మేమో.. ఆత్మ కన్నా ఆత్మలు అనే అనాలనిపిస్తుంది. చాలా కథలు చదువుతున్నపుడు నా గుండె దడదడలాడడం, నా రక్తం వేగంగా ప్రవహించటం  తెలుస్తుంది. కథ ముగించి పుస్తకాన్ని మూసిన కాసేపూ ఇంకా ఆ పాత్రలు, మెలకువ వచ్చాక కూడా వెంటాడే క్రితం రాత్రి కలల్లా నాలొనే  మెదలుతూ, కథల్లొ వారు అనుభవించిన వ్యథనూ,  పోరాటాన్నీ గుర్తుచేస్తునే ఉన్నాయి. కథలు, కథలలో  ఉద్యమాలు, ఉద్యమాల్లొ పాల్గొనే  వ్యక్తులూ..వారి నేపథ్యాలూ..వ్యక్తిత్వ, వ్యక్తిగత పోరాటాలూ..బాక్వార్డ్ లెర్నింగ్లా, అలా నన్ను తీసుకెళ్ళిపొయాయి.
‘లెనిన్ ప్లేస్’ కి ముందు ‘నల్ల మిరియం చెట్టు’ను చదివి రచయిత ఎంత బాగా రాసారో  అని అడ్మైర్  చెసాను. కానీ లెనిన్ ప్లేస్ చదివాక ‘నల్ల మిరియం చెట్టు’   అంతగా ఒప్పించలేదు నన్ను.అంతేగాక రచయిత మీద కోపం కూడా  వచ్చింది..ఇంత బాగా రాయగలిగినప్పుడు, నల్ల మిరియం చెట్టు ఇంకా బాగారాసుండొచ్చుగదా అని.
ఈ పుస్తకం లొ ఒకటి, రెండు కథలకు తప్పించి, మిగిలినవాటికి  సుఖాంతం లేదు. ఎక్కువగా  విప్లవానికి మొదలుగానో, కొనసాగింపు గానో ముగించారు. బహుశ విప్లవమే సుఖాంతం అనుకున్నారేమో ..మాలతి, మోహన సుందరం, శంకరం, పార్వతి  పాత్రలు  పదేపదే ఈ కథలలో  రకరకలుగా  ప్రవర్తిస్తుంటాయి.
లెనిన్ ప్లేస్ అనే టైటిల్ ఈ పుస్తకానికి పెట్టి ఈ కథకి సరైన గౌరవాన్నిచ్చారనిపిస్తుంది. ఈ కథ అంతా సొవియట్ కూలిపొయినందుకు క్షోభను అనుభవిస్తున్న లెఫ్టిస్టులది. కథలలో పదీపదిహేను పాత్రలున్నా సంధ్యా, రాజశేఖరాల జీవితం గురించే ఎక్కువగా ఉంది. బహుశా కమ్యూనిజం  కూలిపోతే  ఎక్కువగా నష్టపోయే వారి గురించిన చిన్న ఉదాహరణ అయ్యుండొచ్చు. అంతేగాక, వారు జీవితంలోఎంత చేదును అనుభవించి ఈ మార్గాన్ని నమ్ముకున్నారో తెలిపే ప్రయత్నంగావొచ్చు. ఇందులో రాఘవరావు పాత్ర చిన్నదైనా,  ఆ రోజు క్లాసులో తనకెదురైన అనుభవం  చెప్పినప్పుడు, అతని బాధని తరచి చూస్తే రేపటి మీద యువతకుండే నిరాశా, ఎద్దేవా మారుతున్న పోకడలు ఇలా  ఎన్నో విషయాలు బోధపడుతున్ననిపిస్తాయి. ఒక్కో నేపథ్యం నుంచి వచ్చిన వీరు సొవియెట్ కు వీడ్కోలు వందనాలిస్తూ బాధల్ని కలబొసుకుంటున్నా, మిత్ర సముదాయంలో అందరికీ ఒకటే ప్రశ్న. తమలో రగిలిన మంటని తన ఆలోచనలతో, రచనలతో మరింత రాజేసిన తమ మిత్రుడు –  మోహన సుందరం ఎక్కడా? అని.
‘ఇన్సెస్ట్’ గురించి చివరలొ ప్రస్తావిస్తూ శంకరం జీవితం లో చెసిన సెటైరికల్  జర్ని ‘ ఎక్కడికి పొతావీ రాత్రి.’ ‘చిట్టచివరి రేడియో నాటకం’- తీవ్రమైన ఈ కథలో నాలుగు పాత్రలూ, వారి జీవిత గాధలూ, తెగిన కలలూ, ఛిధ్రమైన బ్రతుకులూ, శకలాల్లా మిగిలిన దేహాలతో, బలమైన వ్యక్తిత్వాలూ…;’ వెలుగు ఎక్కడ సోనియా,’ ‘మోహనా! ఓ మోహనా!’ ఒకేలా  ఉన్నట్టనిపించినా రెండూ వేరువేరు కథలు.
‘మోహనా! ఓ మోహనా!’ ఒక ప్రత్యేక నవలికగా ప్రచురించవలసింది. ఇందులో మోహనసుందరం పాత్ర  దాదాపు ఎంతోకొంత  పేరుమోసిన చాలామంది దళితనాయకులను మనోగతానికి అతిదగ్గరగా ఉంది. చదువుకున్న దళితుల ఆలోచనలలో కాంప్లెక్సిటీని, ఇంత  బాగా ఎలా అర్ధం చేసుకున్నారబ్బా!  అని ఆశ్చర్యపోతూ చదివాను. మోహనసుందరం  గురించి అతని జీవితగాధ(ఒకటి మేధావుల కోసం, ఒకటి సామాన్య జనం కోసం అతనే రాసుకుంటున్నది) ద్వారా కొంత తెలిసినా, ఎక్కువ గా, కేశవదాసు డైరీ లో   అసలు మోహనసుందరం  గురించీ మాలతి గురుంచీ అతని అభిప్రాయాల వలనా , మోహనసుందరం నిత్యం అనుభవించే వేదన వలనా ఎక్కువ తెలుస్తుంది . ఈ కథలో మోహనసుందరాన్ని ఎంతగా ద్వేషిస్తామో అంతగా జాలిపడతాము కూడా.
ఈ పుస్తకం లోని కథలలో ఇంకొన్ని విశేషాలు- పాత్రల పేర్లూ, లేక స్వభావాలూ రిపీట్ అవడం. ‘చిట్టచివరి రేడియో నాటకం’ లో మాధవీ, ‘లెనిన్ ప్లేస్’ లో సంధ్యా ఇంచుమించు  ఒకేలా మాట్లాడినట్లనిపిస్తే,  ‘ఎక్కడున్నావు సోనియా’ లో రాజశేఖరానికీ, ‘లెనిన్ ప్లేస్’లో రాజశేఖరానికీ చాలా  పోలికలుండడం, ఇక  చిట్టచివరి రేడియో నాటకం లో శివయ్యా, మృతులభాష లో శివయ్యా ఒకరే! ‘మోహనా! ఓ మోహనా ‘ లో మోహనసుందరం  ఎక్స్ టెన్షన్ ‘నల్ల మిరియం చెట్టు’ ప్రతినాయకుడు రాజశేఖరం అని ఆ నవలను చదివినవారికి తెలిసిపోతుంది. ఇలాంటివే ఇంకొన్ని. కథలన్నీ రచయత సొంత అనుభవాలే అనడానికి ఇంతకన్నా నిదర్శనం  ఏముంటుంది?
రచయిత మేధావితనాన్ని చూపడానికి పై కథల్లొ ఒక్కటి చదివినా చాలు.  మన ఆలొచనాశక్తి విస్తరింపజేసుకొనేందుకు మాత్రం  అన్ని కథలూ తప్పక చదవాలి. పైన ప్రస్తావించినవిగాక ఇందులో ఇంకొన్ని మామూలు కథలు ఉన్నా శైలి కోసం  చదవవలసిందే. పుస్తకానికి ఇంకో  ప్లస్ పాయింట్- ముందు మాటలూ, అనవసరమైన ఎండొర్స్మెంట్లు లేవు, ఎలా ఉందో పాఠకులే నిర్ణయించుకోవాలి. ఈ పుస్తకం అనుకోకుండా నా దగ్గర చేరింది. ఒక మంచి రచన తో పాటు  చివరలో ‘నేపధ్యం’  ద్వారా ఒక గొప్ప రచయతను కూడా పరిచయం  చేసింది.
ఇప్పుడు నా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ఆక్షన్- రచయతను ఒకసారి కలిసి మాట్లాడాలి. :)
అపర్ణ తోట
(నోట్: లెనిన్స్ ప్లేస్ పుస్తకం ముఖ చిత్రం కానీ, రచయిత ఫోటో కానీ అందుబాటు లోకి  రాకపోవటం తో వ్యాసకర్త ఫోటో మాత్రమే వాడుతున్నామని గమనించగలరు.)

 

ముస్లిం అస్తిత్వవాదం వైపు ఖదీర్ ‘న్యూ బాంబే టైలర్స్’

dani

 దాదాపు పధ్నాలుగేళ్ల క్రితం ‘దర్గామిట్ట’ కథలతో ఖదీర్‌ బాబు సాహిత్యరంగ ప్రవేశం చేశాడు. గడిచిన పన్నెండేళ్ళ కాలంలో రాసిన మరో  పన్నెండు కథల్ని  ‘న్యూబాంబే టైలర్స్‌’ శీర్షికతో ఇప్పుడు మరో  సంకలనం తెచ్చాడు.

నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ ముస్లిం పిలగాడి అల్లరి, చిల్లరి, గడుసు, గడుగ్గాయి యవ్వారం దర్గామిట్ట కతలు. వాటిల్లో, అక్కడక్కడ చూచాయిగా కొన్ని పోకడలు   వున్నప్పటికీ,  దర్గామిట్ట కతల లక్ష్యం ముస్లిం అస్తిత్వవాదం కాదు. ఒకవిధంగా అవి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు’పచ్చనాకు సాక్షి’కి ‘మతాంతీకరణ’ కతలు అనంటే ఖదీర్‌ బాబుకు కూడా అభ్యంతరం వుండకపోవచ్చు. నామిని తనకు గురువని ఖదీరే స్వయంగానూ, వినయంగానూ ప్రకటించుకున్న సందర్భాలున్నాయి.

 

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

ఖదీర్- నామిని ఒక తలకోన జ్ఞాపకం!

‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి కతే వేరు. కథా వస్తువు, కథాంశం,  కథనం, శిల్పం, టెక్నిక్‌, మానవ సంఘర్షణ అలా ఏవిధంగా చూసినా’న్యూబాంబే టైలర్స్‌’ లోని కథలు ‘దర్గామిట్ట కథల’కన్నా ఒక తరం ముందుంటాయి. దర్గామిట్ట కథల్లాగ కేవలం తెలుగు-ముస్లిం సమాజపు సాంస్కృతిక వాతావరణాన్ని పరిచయం చేయడంతోనే ఇవి సంతృప్తి చెందవు. ముస్లిం అస్తిత్వవాదం వైపు అడుగులేస్తాయి. అంతేకాదు, ‘కింద నేల ఉంది’ కథలో హిందూ ఆణగారిన కులాలు, స్త్రీల, అస్థిత్వవాద ఛాయలు కూడా  కనిపిస్తాయి. సంకలనంలో చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’కు  వచ్చే సమయానికి రచయిత తన ఐడెంటిటీని మరింత బాహాటంగా ప్రకటిస్తాడు. తన కథనశిల్ప నైపుణ్యాన్ని మరింత సమర్ధంగా ప్రదర్శిస్తాడు.

విభిన్న మతసమూహాల మధ్య సాంస్కృతిక వైవిధ్యం వుంటుందిగానీ,  సాంస్కృతిక విబేధం వుండదు. హిందువు గుడికి వెళితే ముస్లింలకు వచ్చే ఇబ్బందిగానీ, ముస్లింలు నమాజు చేసుకుంటే హిందువులకు కలిగే అభ్యంతరంగానీ, తనంతటతానుగా, ఏవిూవుండదు. అయితే, రాజకీయార్ధిక  అంశాలు ప్రవేశించాక, పోటీ పెరిగి, సమూహాల ఉనికే సమస్యగా మారుతుంది. అప్పుడు, రాజకీయార్ధిక విబేధాలన్నీ సాంస్కృతిక విబేధాలనే భ్రమను కల్పిస్తాయి. అలాంటి సందర్భాల్లో  రెండు సమూహాలూ, ప్రాణప్రదమైన, రాజకీయార్ధిక  అంశాల్ని పక్కన పెట్టి, బొట్టు, బుర్ఖా, లుంగి, పంచె వంటివాటి గురించి అసంబధ్ధంగా  తలపడుతుంటాయి.

భారత సాంస్కృతికరంగాన్ని, మరీ ముఖ్యంగా, భారతముస్లింల సాంస్కృతిక వికాసాన్ని, 1992కు ముందు, ఆ తరువాత అని విడగొట్టి,అధ్యయనం చేయాల్సి వుంటుంది.        ఎందుకంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, భారత సమాజంలోని రెండు ప్రధాన ప్రజాసమూహాలని సాంస్కృతిక పునాది విూద విడగొట్టాలనే కుట్రతో కొందరు బాబ్రీమస్జిద్‌ ను కూల్చివేసింది ఆ సంవత్సరమే!

‘జవిూన్‌’ కథలో కసాబ్‌  గల్లీ, మాలపాళెం గొడవ కూడా అలాంటిదే. కొట్లాటల్లో సత్తా కోసం కొందరు గాడిద పాలు తాగేవారని ఖదీర్‌ రాశాడుగానీ. నిజానికి వాళ్లకు ఆ అవసరంలేదు!. ఎందుకంటే, రాజకీయ గాడిదలే అలాంటి పనులు చేస్తాయి!!. కనుక, వాళ్ళు ప్రత్యేకంగా గాడిద పాలు తాగాల్సిన పనిలేదు.

బాబ్రీమస్జిద్‌ – రామ్‌ మందిర్‌ వివాదంలో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు పక్షాన కేసు వేసిన, మొహమ్మద్‌ హాషిమ్‌ అన్సారీ, దిగంబర్‌ అఖార నిర్వాహకుడు రామచంద్ర పరమహంస దాస్‌, నిజజీవితంలో, ‘జవిూన్‌’ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్య లాంటివాళ్ళే. మసీదులో నమాజ్‌ జరగడంలేదనే బెంగతో ఒకరు,రామమందిరంలో దీపంపెట్టే దిక్కు కూడా లేకపోయిందనే ఆవేదనతో మరొకరు  1961లో ఫైజాబాద్‌ కోర్టులో కేసు వేశారు.

అన్సారీ, పరమహంస ఇద్దరూ, భక్తులు. మంచి స్నేహితులు. వాజ్యం  నడుస్తున్న కాలంలోనూ ఒకరినొకరు కలవకుండా ఒక్కరోజు కూడా వుండేవారుకాదు. రోజూ సాయంత్రం పూట పరమహంస ఇంటి దగ్గర కలిసి పేకాడుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. వాయిదావున్న రోజుల్లో ఇద్దరూ కలిసి ఒకే సైకిల్‌ పై కోర్టుకు వెళ్ళొచ్చేవాళ్ళు.  వయసులో పరమహంస పెద్ద, అన్సారీ చిన్న. పరమహంసని వెనక క్యారియర్‌ పై కూర్చోబెట్టుకుని  అన్సారీ సైకిల్‌ తొక్కేవాడు. కోర్టు ఫీజులకు డబ్బులు సరిపోకపోతే ఒకరికొకరు సర్దుకునేవాళ్ళు. కేసు కాగితాలు మర్చిపోతే, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు ఒకరి కొకరు జావిూను ఇచ్చుకునేవాళ్ళు. చివరకు ఒక సందర్భంలో (బహుశ ఎమెర్జెన్సీ  రోజులు కావచ్చు)  ఇద్దరూ ఒకే జైల్లో ఒకే సెల్లో  వున్నారు. (బహుశ, ఆ సెల్లోనే, ఎవరి దిక్కుకు వాళ్ళు తిరిగి, నమాజ్‌, పూజలు జరుపుకునివుంటారు.)  వయసు మళ్ళి పరమహంస చనిపోయాక,  నిర్మోహీ అఖారా అధ్యక్షుడయిన మహంత్  భాస్కర దాస్‌ తో కూడా అన్సారీ అదే స్నేహబంధాన్ని కొనసాగించాడు.

బాబ్రీమసీదు వివాదంలో, హిందూ-ముస్లిం స్నేహబంధం మీద ఇప్పటికీ నమ్మకం కుదరనివాళ్ళు వుండొచ్చు. వాళ్లు గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి“V Hashim Ansari — A Long Wait’   అని కొట్టి నివృత్తి చేసుకోవచ్చు. అప్పట్లో, ’ద హిందూ’, ’ఫ్రంట్ లైన్’ పత్రికల్లో కూడా అన్సారీ, పరమహంసల మిత్రబంధంపై చాలా వార్తలొచ్చాయి.

అన్సారీ,  ఓ ఇంటర్వ్యూలో, అప్పుడు వాతావరణం ఏమాత్రం చెడిపోలేదు”  (“కోయీ మహోల్ నహీ బిగడా తబ్”)   అన్నాడు. అప్పుడు ….  అంటే, మత ప్రాతిపదికపై జనాన్ని చీలిస్తేనేగానీ, తమకు అధికారం దక్కదని సంఘ్‌ పరివారం భావించడానికి ముందు;  రాజకీయాల్లోనికి భారతీయ జనతా అనే ఒక పార్టి పుట్టక ముందు; లాల్‌ కిషన్‌ అద్వానీ అనే ఒక రాజకీయ నాయకుడు అశ్వమేధ యాగాలుచేసి, యాగాశ్వాన్ని దేశం విూదికి సవాలుగా వదలడానికి ముందు అని అర్ధం. ఖదీర్  జవిూన్‌ కథలో అయితే, బ్రహ్మయ్య కొడుకు రవణ ”తెల్లారిలేచి, యింతెత్తు బొట్టుపెట్టుకుని, యింతెత్తు కర్రపట్టుకుని” పోవడం మొదలెట్టక ముందు (పేజీ 38) అని అర్ధం. మతతత్వ రాజకీయ నాయకులు భక్తినీ, స్నేహాన్నీ కూడా ఇంతగా కలుషితం చేసేస్తారని వాస్తవ జీవితంలో అన్సారీ, పరమహంసలకు తెలీదు. ఖదీర్‌ కథలో హుస్సేన్‌, బ్రహ్మయ్యలకూ తెలీదు.

ఖాళీ స్థలాన్ని చూస్తే చాలా మందికి ఖాళీ స్థలమే కనిపిస్తుంది. కానీ, ఓ తాపీ మేస్త్రికి అందులో ఒక అందమైన ఇల్లు కనిపిస్తుంది. ‘ద థింగ్‌ ఇన్‌ ఇట్‌ సెల్ఫ్‌’!. దక్షణ దిక్కున మొదలెట్టి, నైరుతీ మూలన ఎత్తుపెంచి, ఆగ్నేయాన మంటపెట్టి, వాయువ్యాన్ని గాలికి వదిలి, ఈశాన్య మూలన పల్లంచేసి,నిర్మాణాన్ని ముగించడం ఎట్లాగో తోస్తుంది. ఇసక, కంకర, సిమెంటు, ఇటుకలు, లావుకడ్డీలు, సన్న కడ్డీలు, బైండింగ్‌ వైరు ఏవి ఎంతెంత కావాలో టకటకా బుర్రలోకి వచ్చేస్తాయి. కథా శిల్పంలో, ఖదీర్‌ అలాంటి ఓ మంచి తాపీమేస్త్రి. కథా నమూనా (పారాడిజిమ్‌)  తనకు బాగా తెలుసు. పైగా అతనికి ఈ వాస్తు గొడవ లేదు. నిర్మాణం కచ్చితంగా  తెలుసు గాబట్టి, కథను ఏ మూల మొదలెట్టినా, అనుకున్న రూపంలో దాన్ని సమర్పించవచ్చనే, రచయిత, ధీమా  ప్రతి కథలోనూ కనిపిస్తుంది.

కథకు మానవ సంఘర్షణే ప్రాణం. దాన్ని ఏ నమునాలో చెప్పాలన్నది రెండో అంశం. ఈ రెండు పనులు పూర్తి అయ్యాక, కథకు కండ పుష్టిని అందించడానికి, సజీవంగా మార్చడానికి, ఆయా పాత్రల గురించీ, వాటి వృత్తుల గురించి, అవి తిరుగాడిన పర్యావరణాన్ని గురించి, రచయితలు, వాస్తవ జీవితంలో విస్తృతంగా పరిశోధన సాగించాలి.

కొంతమంది రచయితలు ఈ క్రమాన్ని తలకిందులుగా చేస్తుంటారు. వాస్తవ జీవితంలో దొరికిన కొన్ని పాత్రల్ని  తీసుకొచ్చి, అక్షరాల్లో పొదిగితే దానికదే కథ అయిపోతుందనుకుంటారు. చాలాచాలా అరుదుగా మాత్రమే అలా కుదరవచ్చు! ఎందుకంటే,  వాస్తవ జీవిత పాత్రలకు ఒక పరిమితి వుంటుంది.  ఒక దశలో అందరికీ ఎంతో ఉత్తేజాన్నిచ్చిన వ్యక్తులు కూడా ఆ తరువాతి కాలంలో చచ్చుబడి పోతుంటారు. నాలుగున్నర దశాబ్దాలుగా, భారత రాజకీయాల్లో ప్రత్యామ్నాయ స్రవంతిగా కొనసాగుతున్న నక్సల్‌ బరీ ఉద్యమానికి ‘తొలి హీరో’ జంగల్‌ సంథాల్‌ జీవిత చరమాంకం ఏమిటీ? అందువల్ల, వాస్తవ జీవితం నుండి దేన్నీ స్వీకరించాలో, ఏ మోతాదులో స్వీకరించాలో, దేన్ని వదిలెయ్యాలో, దేన్ని సవరించాలో, దేన్ని కల్పన చేయాలో రచయితలకు కచ్చితంగా తెలియాలి.  అలాంటి సృజనాత్మక సాహిత్య విచక్షణా జ్ఞానంలో ఖదీర్‌ సిధ్ధహస్తుడు.

పాత్రల పర్యావరణాన్ని గురించి ఖదీర్‌ పరిశోధన ఎంత విస్తృతంగా సాగుతుందంటే, అతను చిత్రించే కల్పిత పాత్రలు సహితం నిజజీవిత పాత్రలేనేమో అని భ్రమను కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో పీరూభాయి మద్రాసు వెళ్ళి, హార్బర్లో బిల్లులు లేకుండా రెండు సింగర్‌ మిషిన్లు కొంటాడు. మూర్‌ మార్కెట్‌ అంతా  తిరిగి కత్తేర్లు, స్కేళ్ళు, టేపులు కొంటాడు. (పేజీ-9) ఇలాంటి సూక్ష్మ వివరాలు కథని దాదాపు వాస్తవ  జీవితంగా మార్చేస్తాయి.

ఖదీర్‌ పరిశోధన ఫలితాలు, ఆయా వృత్తుల వారికి, వాస్తవ జీవితంతంలో ఒక కొత్త అర్ధాన్నీ, ఉత్తేజాన్ని కల్పిస్తాయి. ‘న్యూబాంబే టైలర్స్‌’  కథలో, ”గుడ్డలు కుట్టడమంటే, కొలతల్నిబట్టి కుట్టడంకాదు. మనిషినిబట్టి కుట్టడం” (పేజీ-11) అంటాడు పీరూభాయి. ఉత్పత్తిరంగంలో,  మాస్‌ కస్టోమైజేషన్‌ కు,ఇండివిడ్యువల్‌  కస్టోమెరైజేషన్‌ కు ఎప్పుడూ ఒక ఘర్షణ వుంటుంది. ఒకటి సాధారణమైనది. మరొకటి ప్రత్యేకమైనది. పీరూభాయి మాటల ద్వారా  సాంప్రదాయ దర్జీ వృత్తికారులకు ఒక ఉత్తేజకర నినాదాన్ని ఇస్తాడు ఖదీర్‌!

సృజనాత్మక రచయితల సమర్ధత అక్షరాల్లో వుండదు; అక్షరాలు మాయమైపోవడంలో వుంటుంది. కథ చదవడం  మొదలెట్టిన కొద్దిసేపటికే,పేజీల్లోంచి అక్షరాలు మాయమైపోవాలి.    పాఠకుల వ్యక్తిగత అనుభవం మేరకు, ఊహాశక్తి మేరకు, ఆ కాగితాల్లోంచి, కొన్ని పాత్రలు పుట్టుకొచ్చి, ఒక కొత్త పర్యావరణంలోనికి పాఠకుల్ని తమవెంట లాక్కుపోవాలి. చదువుతున్నారో, చూస్తున్నారో తెలీని ఒక  చిత్తభ్రమకు పాఠకుల్ని లోనుచేయాలి. రచనల్లో మనం చూస్తున్నది సజీవ వ్యక్తుల్ని అనుకున్నప్పుడే పాఠకులు పాత్రల ఉద్వేగాల్లో లీనమైపోయి, ఆనందించడమో, బాధపడ్దమో, నవ్వడమో,ఏడ్వడమో చేస్తారు.  సాహిత్య ఆస్వాదన అనేది రచయిత, పాఠకులు , పాత్రలు ముగ్గురూ  కలిసిచేసే జుగల్‌ బందీ! కొంచెం శాస్త్రబధ్ధంగా చెప్పుకోవాల్సివస్తే,  ‘గతితార్కిక సంబంధం’ అనుకోవచ్చు! అయితే, పాఠకులకు అలాంటి ఉద్వేగానికి గురిచేయగల దినుసుల్ని, ప్రణాళికాబధ్ధంగా,అందించగల సమర్ధత రచయితలకు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది.

కొన్ని కథలు చదువుతున్నప్పుడు ఆద్యంతం అక్షరాలే కనిపిస్తుంటాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడలేదని అర్ధం. మరి కొన్ని కథలు చదువుతున్నప్పుడు, అక్కడక్కడైనా, అక్షరాలు మానవావతారం ఎత్తి మనల్ని ఒక ఉద్వేగానికి గురిచేస్తాయి. అంటే, ఉద్వేగాన్ని కల్పించగల దినుసులు వాటిల్లో పడ్డాయని అర్ధం. ఇలాంటి అనుభూతి ‘న్యూబాంబే టైలర్స్‌’ కథల్లో తరచుగా కలుగుతుంది.

పాఠకుల్లో భావోద్వేగాల్ని మేల్కొలిపే అనేకానేక దినుసుల గురించి ఖదీర్‌ కు బాగా తెలుసు. వాటిని అతను సమయానుకూలంగా వాడడమేగాక,అత్యంత ఆధునిక పధ్ధతుల్లో వాడుతాడు. ‘కింద నేల వుంది’ కథలో ”దార” అని ఒకే ఒక పదంతో ఒక పేరా వుంటుంది. (పేజీ – 60). అంటే ”కాస్సేపు వర్షాన్ని ఆస్వాదించి రండి” అంటూ పాఠకులకు ఒక రిలీఫ్‌ ఇస్తాడు రచయిత! అలాగే, కొన్ని చోట్ల పాఠకులు  నవ్వుకోడానికీ,  ఏడ్వడానికీ కొంత జాగా వుంచుతాడు.  దీని అర్ధం ఇతరుల రచనల్లో, ఇలాంటి సందర్భాలు ఉండవనికాదు. దాన్ని ఒక విధానంగా, ఒక శైలిగా అలవర్చుకున్నాడు ఖదీర్.

సృజనాత్మక సాహిత్యంలో మరో విశేషం వుంటుంది. రచయిత ఒక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే, ఆ ఉత్తేజంతో, పాఠకులు దానికి తమ సృజనాత్మకతను కూడా జోడించి, రచయిత కూడా ఊహించని కొత్త భావోద్వేగాలకు గురవుతారు. ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది.  తెర విూద హీరో, హీరోయిన్లే కనిపిస్తే  ప్రేక్షకులు సినిమాలో లీనంకారు. నిజజీవితంలో తమకు తెలిసిన పాత్రలు మదిలో మెదలాలి. రచనల్లో అలాంటి చిన్న కొక్కేన్నీ  రచయిత పెడుతూ వుండాలి.

రెడీమేడ్‌ అపెరల్‌  ఫ్యాక్టరీలు వచ్చి, ఊర్లోని సాంప్రదాయ దర్జీలందర్ని, బకాసురుడిలా వరసపెట్టి మింగేశాక, పీరూభాయి వంతు వస్తుంది. ఆరోజు ….. ”తెల్లారి అజాన్‌  వినిపించడంతోనే తాళాలు తీసుకుని రైల్వే రోడ్డుకు వచ్చాడు. తలెత్తి బాంబే టైలర్స్‌ బోర్డు చూసుకున్నాడు. షాపు తెరచి ఒకసారి మిషన్లనీ, బల్లనీ చూసుకున్నాడు.  బయట కుర్చీ వేసుకుని బుగ్గ కింద పాన్‌ అదిమి పెట్టి ఆ చల్లటి గాలిలో మౌనంగా కూర్చున్నాడు. పదకొండు గంటలకు వచ్చాడు కొడుకు” అంటాడు రచయిత.

ఈ సన్నివేశంలో,  దాదాపు ఐదు గంటలపాటూ పీరూభాయి ఒంటరిగా దుకాణంలో కూర్చున్నాడు అని  గమనించిన పాఠకులు తప్పనిసరిగా ఒక ఉద్వేగానికి గురవుతారు. ఇన్నాళ్ళూ  జీవనభృతినీ, జీవితాన్నీ, గౌరవాన్నీ, వ్యక్తిత్వాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఉనికినీ ఇచ్చిన ఆ కత్తెర, ఆ బల్ల,  ఆ కుట్టుమిషన్లను వదిలేయాల్సి వచ్చినపుడు పీరూభాయి విలపించకుండా వుండగలడా?జీవితకాలం తన కుడిచేతికి కొనసాగింపుగా మసిలిన ఆ కత్తెరని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకుని వుంటాడు?  ఆ కుట్టుమిషన్ని ఎన్నిసార్లు ఆలింగనం చేసుకునివుంటాడూ? ఆ బల్ల ఒడిలో తలపెట్టి ఎంతసేపు ఏడ్చి వుంటాడూ?.

మనుషులు ప్రకృతితో మాట్లాడడం  జానపద సాహిత్యంలో కనిపిస్తుంది. ఈరోజుల్లో ఎవరైనా, చెట్లు, జంతువులు, రాళ్ళు, యంత్రాలతో మాట్లాడుతుంటే వాళ్ళను మన వైద్యనిపుణులు మానసికరోగులు అంటారు. మాట్లాడడానికి సాటి మనిషి దొరకనపుడు మనుషులు నిజంగానే యంత్రాలతో ముచ్చటించుకుంటారు. అది యంత్రయుగపు విషాదం మాత్రమే కాదు; కొందరికి అనివార్యమైన నిట్టూర్పు కూడా!

ఆ ఐదు గంటల్లో పీరూభాయి అవేదన గురించి  పాఠకుల్లో కలిగే ఉద్వేగాల్ని కాగితం విూద పెడితే  ‘దర్జీవిలాపం’ అని ఒక ఖండకావ్యం అవుతుంది. ఇది రచయిత రాసిందికాదు. పాఠకులు తమ సృజనాత్మకతతో కొనసాగించింది. ఇలాంటి కొనసాగింపులు ఎంత విస్తృతంగా జరిగితే, ఆ రచన అంతగా సార్ధకం అయినట్టు.  నిపుణులైన రచయితలు తాము సృజనాత్మకంగా రాయడమేగాక, పాఠకుల్లోని సృజనాత్మకతను కూడా మేల్కొల్పగలుగుతారు. ఖదీర్‌ కూడా అలాంటి కోవలోకే వస్తాడు.

క్రిష్టోఫర్ నోలన్ సినిమా ’ఇన్సెప్షన్’ (2010) చూసినప్పుడు ఒక విస్మయ అనుభవం కలుగుతుంది. ఒకే సమయంలో, ఒకే పాత్రలు, మూడు భిన్నమైన ప్రదేశాల్లో, మూడు భిన్నమైన చలన వేగాలతో ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి కథన ఎత్తుగడ మనకు  మహాభారత రచనలో, పిండ రూపంలో,  కనిపిస్తుంది. జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెపుతున్న కథను, వేరే కాలంలో వేరే చోట, శౌనకాది మహా మునులకు సూతుడు చెపుతుంటాడు. భీష్మపర్వం మొదలయ్యాక ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర యుధ్ధ విశేషాలు చెపుతుంటాడు. అంటే, ఒకేసారి మూడుచోట్ల, మూడు కాలాల్లో ’కథ చెప్పడం’ కొనసాగుతూవుంటుంది. పోతనామాత్యుని భాగవతంలో గజేంద్రమోక్షం సన్నివేశంలో ఒక్కొక్క పద్యానికీ సంఘటన స్థలం మారిపోతుంటుంది. ఒక పద్యం భూలోకంలో గజేంద్రుని దీనావస్తను వివరిస్తుంటే, ఆ వెంటనే మరో పద్యం వైకుంఠంలో విష్ణమూర్తి కదలివస్తున్న తీరును వివరిస్తుంటుంది,  1980వ దశకం చివర్లో, క్వెంటిన్ టారంటినో ప్రవేశం తరువాత, హాలివుడ్ సినిమాల్లో ఆధునిక నాన్-లీనియర్ కథనాలు ఊపందుకున్నాయి. ఆడియో-విజువల్ మీడియాలో కొత్తగా వస్తున్న అనేక ఆధునిక టెక్నిక్కుల్ని ప్రింట్ మీడియాకు వర్తింపచేయడానికి ఖదీర్ గట్టిగా కృషిచేస్తున్నాడు. తద్వార కథాంశాలతోపాటూ, కథన శైలిలో కూడా  కొత్తదనాన్ని తీసుకురావడం అతనికి సాధ్యం అవుతోంది. అందుకు ’గెట్ పబ్లిష్డ్’  కథ మంచి ఉదాహరణ.

ఒక జటిలమైన కథాంశాన్ని, గాడితప్పకుండా  చెప్పడం అంత సులభంకాదు. ఇందులో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు టూ లోని మసీద్‌ సెంటర్‌ లో మొదలైన కథ, చార్మినార్‌ చుడీ బజార్‌, లుంబినీపార్క్‌ గోకుల్‌ ఛాట్‌ పేలుళ్ళు, ముస్లిం యువకులపై తప్పుడు కేసులు, ఢిల్లీ జామియానగర్‌ షూట్‌ అవుట్‌,  సిడ్నీలో డాక్టర్‌ హనీఫ్‌, బెంగళూరులో హనీఫ్‌ భార్య, గుల్బర్గా గొడవలు, సమాచారశాఖామంత్రి నష్టపరిహార ప్రకటన, పోలీసు చిత్రహింసలు వగయిరాల చుట్టూ తిరుగుతుంది. పైగా, ఒకే సమయంలో కథ రెండు మూడు చోట్ల జరుగుతూ వుంటుంది. మరీ ఇంత పెద్ద కాన్వాస్‌ తీసుకున్నప్పుడు రచయితగానీ, పాఠకులుగానీ గందరగోళపడే ప్రమాదం వుంటుంది. కానీ అలా జరక్కుండా  చాలా సమర్ధంగా ముగింపుకు తీసుకుపోతాడు ఖదీర్‌. డ్రైవర్‌ నయాబ్‌, ఫకీర్‌  ఫాతిమా, వాళ్లబ్బాయి ముష్టాక్‌ పాత్రలు కథ ముగిశాక కూడా పాఠకుల్ని వెంటాడుతాయి. అవి నిజజీవిత పాత్రలన్నట్టుగా సాగుతుంది ఖదీర్‌ శిల్పనైపుణ్యం. అతని పరిశోధనా విస్తృతి అలాంటిది.

ఇల్లు తగలబడిపోతుంటే ఫొటో కాలిపోయిందని ఏడ్చేవాళ్లను చూస్తే వింతగా వుంటుంది. ఘోర విపత్తులో చిక్కుకున్నప్పుడు నిస్సహాయులూ, దిక్కులేనివాళ్ళు  అలా నిస్పృహతో వింతగానే ప్రవర్తిస్తారు. ప్రధాన సమస్య నుండి బయట పడే మార్గాలు తెలీనపుడు, తెలిసినా సాధించలేమని తెలిసినపుడు, వాళ్ళే ఓ చిన్న సమస్యను వెతుక్కుని వెక్కివెక్కి ఏడుస్తారు. తనను టెర్రరిస్టని అనుమానించి, అవమానించి, ఎత్తుకుపోతున్న పోలీసుల్ని ఏవిూచేయలేని, ఏవిూ అనలేని  డ్రైవర్‌ నయాబ్‌, అత్తరు సీసాకోసం పెనుగులాడే సన్నివేశం నిస్సహాయుల  నిస్పృహ ప్రవర్తనకు  మంచి ఉదాహరణ.

ఆర్ధిక విధానాల్లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వచ్చాక ముందుగా నాశనం అయిపోయింది చేతివృత్తి కార్మికులు. అభివృధ్ధి పేరిట సాగిన విధ్వంసం వెయ్యి ప్రకృతి వైపరిత్యాలకన్నా భయానకమైనది.  మార్కెట్‌ పై విదేశీ సంస్థల దాడులకు వ్యతిరేకంగా చేతివృత్తి కార్మికులు చేసే పోరాటాలకు,సూత్రప్రాయంగా అయితే,  దేశీయ (జాతీయ) పెట్టుబడిదారులు  నాయకత్వం వహించాలి. కానీ అలా జరగడంలేదు. కనీసం, అత్యధిక సందర్భాల్లో అలా జరగడంలేదు. దేశీయ పెట్టుబడిదారులు దళారీ పెట్టుబడీదారులుగా మారిపోయి విదేశీ సంస్థలకు స్థానిక ప్రతినిధులుగా మారిపోతున్నారు.

ఈ అభివృధ్ధి వైపరీత్యాలపై  చేతివృత్తి కార్మికులు, ఇతర ప్రజాసమూహాలతో కలిసి ఎలాంటి పోరాటాన్ని చేయాలి? పీరూభాయి వంటివాళ్ల సంక్షోభాలకు పరిష్కారం ఏమిటీ? వంటి సందేహాలకు జవాబు కోసం ఆర్‌. ఎస్‌. రావ్‌ నో, జాన్‌ మిర్డాల్‌ నో ఆశ్రయించాల్సి వుంటుంది. ”భారత దేశపు ఖనిజ సంపదని దోచుకుపోవడానికి  సామ్రాజ్యవాదులు కుట్ర చేశారు. దీన్ని అడ్డుకోడానికి అడవిలో యుధ్ధం మొదలైంది. ఈ యుధ్ధంలో విూరు ఎటువైపు?”అని ప్రశ్నించాడు జాన్‌ మిర్డాల్‌; ఇటీవల హైదరాబాద్‌ వచ్చినపుడు.

ఉగ్రవాదానికి మతంలేదు. లేదా, ఉగ్రవాదులులేని మతంలేదు. నిజానికి, కొందరు నిస్పృహతో చేసే ఒంటరి చర్యలేతప్పా,  ఏ మతసమాజంలోనూ ఉగ్రవాదానికి ఎన్నడూ ఆమోదాంశంలేదు.     బలహీనదేశాల్లో సహజ వనరుల దోపిడీకీ, సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక దళారులకూ, విశాల ప్రజానీకానికీ, తీవ్రవాదానికీ, ఉగ్రవాదానికీ, మతతత్వానికీ మధ్యనున్న సంబంధాన్ని వివరించే రచనలు విస్తృతంగా రావల్సిన అవసరం ఈనాడు ఎంతో వుంది.

చట్టసభల సభ్యులు, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ, విూడియా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్పే సాహసం ఇప్పడు ఎవరికీలేదు.  ఈ నాలుగు వ్యవస్థలు కలిసి కార్పొరేట్‌ సంస్థల్ని నడుపుతున్నాయన్నది నేటి నిజం.  ఈ మాట విూద అభ్యంతరం ఉన్న  వాళ్ళు, దీన్ని తిరగేసి కూడా చెప్పుకోవచ్చు.   కార్పొరేట్‌ సంస్థలే  ఈ నాలుగు వ్యవస్థల్ని నడుపుతున్నాయి అనుకోవచ్చు!

హంతకులకన్నా ఆర్ధిక నేరస్తులు దేశానికి ప్రమాదకారులని ఇటీవల ఓబుళాపురం మైనింగ్‌ లీజు  కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్‌ హైకోర్టులో వాదనలు జరిగాయి.  ఒక కోటి నలభై లక్షల టన్నుల ఇనప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించేసి, 4,310 కోట్ల రూపాయల దేశసంపదని దోచేసిన కేసు ఇది. ఒప్పందంలో, కేవలం ‘క్యాప్టీవ్‌’ అనే ఒకేఒక్క పదాన్ని తొలగించివేయడంతో, ఇంతటి అక్రమం అంతా బాజాప్తగా రాజమార్గంలోనే సాగిందంటే  మన ప్రభువులు ఎంత తెలివి విూరిపోయారో తెలుసుకోవచ్చు. దేశభద్రతకు ముప్పుగా, ప్రధానమంత్రి తరచుగా హెచ్చరించే సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదాలకన్నా ఇది పెద్ద ముప్పుగా కనిపించకపోతే, మన మెదళ్ళు మొద్దుబారిపోయాయని  భావించవచ్చు. ఇదీ  ఈనాడు మన దేశానికివాటిల్లిన ప్రధాన ముప్పు; ప్రజాసంపదని, దేశసంపదని ప్రైవేటుపరం చేయడం.  దేశాన్ని విదేశాలకు చట్టబధ్ధంగా అమ్మేయడం!   ఇంతటి పెద్ద వ్యవహారాన్ని పక్కనపెట్టి, ఎక్కడో ఏదో ఒక పేలుళ్ల కేసులో పదిమంది ముస్లింలని అరెస్టు చేసినట్టు వార్తలొస్తే, ”ప్రభుత్వం పనిచేస్తోంది. మన భద్రతకు ముప్పులేదని” అనుకుని, ధీమాగా నిద్రపోవడం మనకు అలవాటయిపోయింది.! మనకు అలాంటి ధీమాను తరచుగా కలిగించడానికి ప్రభువులు మరికొందరు అమాయకుల్ని కూడా అరెస్టు చేస్తూవుంటారు.  గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో అయితే, ఎన్‌ కౌంటర్లు కూడా చేస్తుంటారు!

‘న్యూబాంబే టైలర్స్‌’లో, ఛిద్రమై పోతున్న ముస్లింల జీవితాల్ని సృజించడంతో మొదలైన కథా సంకలనం,  చివరి కథ ‘గెట్‌ పబ్లిష్డ్‌’లో,  టెర్రరిస్టుల నెపంతో అమాయక ముస్లింలను వేధిస్తున్న తీరును సృజించడంతో ముగుస్తుంది.  సమస్యను సృజించడమే ఇప్పటికి ఖదీర్‌ లక్ష్యం కావచ్చు.  సమస్యకు పరిష్కారం చూపడం కుదరనప్పుడు, కథకు ఒక అందమైన మలుపు ఇచ్చి ముగించడం మేలు అనే సూత్రం ఒకటుంది.  ఆ సూత్రాన్ని, ఖదీర్‌ సమర్ధంగా వాడుతుంటాడు. బహుశ ఈ కారణంవల్లనే అతని కథల్లో ముక్తాయింపులు, చివరి వాక్యాలు చిన్నగానూ, అందగానూ, శక్తివంతంగానూ వుంటాయి.

రష్యన్‌ మహారచయిత మాక్సిం గోర్కి తన జీవిత అభ్యాసాన్ని  ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’ (మై అప్రెంటిస్‌ షిప్‌), ‘నా విశ్వవిద్యాలయాలు’ అంటూ మూడు భాగాలుగా రాశాడు. ఖదీర్‌ బాబు ‘దర్గామిట్ట కతలు’ రచయితగా ఖదీర్‌ బాల్యం అనుకుంటే, ‘న్యూబాంబే టైలర్స్‌’ కథా సంపుటి అతని స్నాతకోత్సవంగా భావించవచ్చు. భవిష్యత్తులో ఖదీర్‌ కలం వెంట స్నాతకోత్తర రచనలు కూడా రావాలని  ఆశిద్దాం.

 

(15 ఫిబ్రవరి 2012న పుస్తకావిష్కరణ సభలో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం)

 

 

వీలునామా- 6 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(గత వారం తరువాయి)

స్నేహ హస్తం

 జేన్, ఎల్సీలు వాళ్ళు వుంటున్న భవంతిని వదిలిపెట్టాల్సిన రోజు దగ్గరికి రానే వచ్చింది. తనకి ఆస్పత్రిలో మేట్రన్ వుద్యోగం కూడా దొరకలేదని తెలిసి జేన్ కృంగి పోయింది. రెన్నీ గారే ఈ విషయాన్ని వుత్తరంలో తెలియపర్చారు. ఆ వుద్యోగం ఒక విధవరాలికిచ్చినట్టు వుంది ఆ  వుత్తరంలో.

ఆస్పత్రి డైరెక్టర్లు జేన్ దరఖాస్తునెంతో శ్రధ్ధగా పరిశీలించిన మీదట, ఆమె చిన్న వయసు దృష్ట్యా ఆమె ఈ వుద్యోగ భాధ్యతలు నెరవేర్చలేదని అభిప్రాయపడ్డారట. దురదృష్టవాశాత్తూ తనకి తెలిసి ఇంకెక్కడా ఖాళీలు లేవని కూడా రాశారు రెన్నీ.

ఎల్సీ మాత్రం ఆ వార్త వినగానే ఎగిరి గంతేసింది.

“పోతే పోయింది, పాడు వుద్యోగం. కష్టమో, నష్టమో, మనిద్దరం కలిసే వుందాం జేన్! వుంటే తిందాం, లేదా పస్తులుందాం. అంతే కానీ, నన్నొదిలి నువ్వు ఒంటరిగా ఆ ఆస్పత్రిలో జన్మంతా పని చేయలని తలుచుకుంటే నాకెంత దిగులేసిందో తెలుసా?”, అక్క మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది.

వుద్యోగం లేక రేపెలా అన్న దిగులు ముంచేసినా, తానొంటరిగా వుండాక్కర్లేదన్న నిజం జేన్ ని కూడా సంతోషపెట్టింది. ఈ విషయం గురించే ఇద్దరూ మాట్లాడుతూ వుండగా, పెగ్గీ వాకర్ వచ్చి తన కోసం ఎదురుచూస్తుందని చెప్పాడు నౌకరు.

వాళ్ళ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చి ఇచ్చే పెగ్గీ వాకర్ ఆ వూళ్ళో అందరికీ తెలుసు.  ఆవిడ ముందు ఈ వూళ్ళోనే వుంటూ, ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చింది. మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, తన అక్క చెల్లెళ్ళపిల్లలూ అందరితో వాళ్ళ ఇల్లు మహా సందడిగా వుంటుంది. ముసలి వాడైన ఆమె తండ్రికీ, అంత మంది పిల్లలకూ ఆమె సంపాదనే ఆధారం.

చాలా పిసినారిదని వూళ్ళో వాళ్ళు ఆమె గురించి అనుకొనే మాట. ఆస్ట్రేలియా వెళ్ళోచ్చిన సంపాదనతో బోలెడంత ఆస్తి పాస్తులు సంపాదించినా, నిరుపేదరాలిలాగే బ్రతుకుతుంది, అలాగే కష్టపడుతుంది, దేనికోసమో మరి. అయితే, బట్టలు మాత్రం బహు చక్కగా శుభ్రం చేసి ఇస్త్రీలు చేసి తెస్తుంది. ఆమె నిజాయితీ, నిక్కచ్చితనమూ వూరంతా తెలిసిన విషయమే కావడం వల్ల, చాలా వరకు అందరూ బట్టలు ఆమెకే వేస్తారు.

“పెగ్గీ! ఇహ ఇదే ఆఖరు నీకు బట్టలు వేయడ, పై వారం నించి మా బట్టలు మేమే ఉతుక్కోని ఇస్త్రీ చేసుకోవాలి.”

“అయ్యో! అదేం మాట అమ్మాయి గారూ. అంతలోకే ఈ ఇంటి కొత్త యజమాని ఇక్కడ కాపురం వుండడానికి వచ్చేస్తారా? మీరు నిజంగా ఈ ఇల్లూ , ఊరూ వదిలి వెళ్ళిపోతారా?”

“అవును పెగ్గీ! గురువారం మేమీ ఇల్లు ఖాళీ చేయాలి.”

“ఎక్కడికి వెళ్తారు అమ్మాయిగారూ?”

“నాకు తెలిస్తేగా నీకు చెప్పెటానికి!”

“అదేంటండీ అమ్మాయిగారూ అలాగంటారూ! నిజంగా మీకూ, చెల్లాయిగారికీ తలదాచుకోవడానికింత నీడ లేదా?”

“ఇప్పటికైతే లేదు!”

“హ్మ్మ్మ్! అన్నట్టు మేమూ  ఈ వూరొదిలి పోతున్నాం తొందర్లోనే. ఎడిన్ బరో కి.”

“ఏమిటీ? నువ్వు వూరు వొదిలి పోతున్నావా? ఎందుకూ? నీకిక్కడ జరుగుబాటు బానే వుంది కదా?” ఆశ్చర్యంగా అడిగింది జేన్.

“ఆ మాటా నిజమేననుకోండి. అయితే మా టాం ఎడిన్ బరో లో ఇంజినీరింగు చదువుతానని ఒకటే గోల పేడుతున్నాడు. వాణ్ణి ఒంటరిగా పంపటం నాకేమో ఇష్టం లేదు.  మా నాన్న సరేనన్నాడు, పిల్లలంతా ఎగిరి గంతేసారు. అందరమూ అందుకే తట్టా బుట్టా సర్ది ఎడిన్ బరో వెళ్ళిపోదామని అనుకున్నాము.    ఆస్ట్రేలియా నించి ఇక్కడకొచ్చి లాండ్రీ దుకాణం తెరవగానే వూళ్ళో వుండే లాండ్రీ దుకాణం వాళ్ళు కొంచెం చిరాకు పడ్డారులెండి.ఇప్పుడు ఎడిన్ బరో లో అయితే ఎవరి ని బాధ పెడుతున్నానో తెలియను కూడా తెలియదు. అప్పుడే అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు కూడా మాట్లాడుకున్నాను. ”

“పెగ్గీ, నీకున్న ఆత్మ విశ్వాసం నాకుండి వుంటే ఎంత బాగుండేది. మావయ్య ఎంతో ఖర్చు పెట్టి చదివించాడు, కానీ ఏం ప్రయోజనం? ఆ చదువుతో నాకెలాటి వుద్యోగమూ దొరకటం లేదు.  అసలు మా ఇద్దరి పొట్టలూ ఎలా పోషించుకోవాలో కూడ అర్థం కాకుండా వుంది.”

“ఏం మాటలండీ అవి!  మీ  పొట్ట పోసుకోవడమే అయితే మీరు చేసుకోగలరు.   చెల్లాయి గార్ని కూడా చూసుకోవాలి. దాంతో మీరు బెంగ పడుతున్నట్టున్నారు. మా చెల్లి తన పిల్లల భారం నా మీద వేసి చచ్చి పోయినప్పుడు నేనూ భయపడ్డాను. ఎలా వీళ్ళందర్నీ సాకటమా అని.  అప్పట్లో నా రాబడి ఏడు పౌండ్లు మాత్రమే.   కానీ, చూస్తూ చూస్తూ మన వాళ్ళని పస్తు పడుకోబెట్టలేం కదా. అందుకే ధైర్యం చేసి ఆ బాధ్యత తల కెత్తుకున్నాను. ఏదో ఆ దేవుడి దయవల్ల పరవాలేదు. వాళ్ళ చదువులైపోతే ఎలాగో వాళ్ళని మెల్బోర్న్ పంపే ఏర్పాటు చేస్తాను. అక్కడ ఇక్కడ కంటే కొంచెం బాగుంటుంది.”

“అవునా పెగ్గీ? అక్కడ బాగుంటుందా?”

“ఫరవాలేదు. అక్కడుండే కష్టాలు అక్కడున్నాయనుకోండి.  అయినా, మాలాటి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఎక్కడైతే నేం లెండి!  తరవాతెప్పుడైనా దాని గురించి చెప్తాను. అన్నట్టు, అమ్మాయి గారూ, మీరు తప్పనుకోకుంటే ఒక మాట చెప్తాను.  మీరు ఎడినబరోలో ఎక్కడుండాలో తెలియదంటున్నారు కాదా? నేను అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక గదిలో  మీరూ చెల్లాయి గారూ వచ్చి వుండొచ్చు.  ఒక ఉద్యోగం దొరికి మీరు నిలదొక్కున్నాక వేరే ఇంటికెళ్ళొచ్చు. ” జంకుగా అంది పెగ్గీ.

“అద్దె కట్టడానికి డబ్బు లేదు పెగ్గీ!”

“అయ్యొయ్యో! అద్దె మాటెందుకు లెండి. మీరు నాకొక్క సాయం చేస్తే అదే పదివేలు.  మా ఇంట్లో ఆడపిల్లలకి కాస్త కుట్టు పని నేర్పించి, నా లాండ్రీ బిల్లులు కొంచెం రాసి పెట్టండి,  వీలైతే. ఆ రెండు పనులూ అసలు నాకు చేత కావడంలేదు.  దాంతో మనం అద్దె గురించి మాట్లాడుకునే అవసరం వుండదు.”

“పెగ్గీ!  తప్పకుండా చేసి పెడతాను. నాకు కాలు నిలదొక్కుకునే అవకాశం వస్తూంటే కాదంటానా?   అయితే పెగ్గీ, ఎడిన్ బరోలో నేనూ, ఎల్సీ, ఇద్దరమూ ఇరవై నాలుగు పౌండ్లతో బ్రతకగలమంటావా?”

“మా లాటి వాళ్ళం ఎలాగో బ్రతికేస్తామమ్మా! పాపం, మీకే…”

“ఫరవాలేదులే.  మీరంతా ఎలా వుంటే మేమూ అలాగే వుంటాము. ”

“అంతే లెండి. ముందు మనం దైవం మీద భారం వేస్తే, అంతా ఆయనే చూసుకొంటాడు.”

“నిజంగా భగనవంతుడు నిన్ను కష్టాల నించి తప్పించాడా పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“భగవంతుడు కష్టాలు తప్పిస్తాడో లేదో నాఖంతగా తెలియదు కానీ, ఆ కష్టాలని తట్టుకునేందుకు శక్తిని ఇస్తాడమ్మాయిగారూ!  ధైర్యమూ, ఆశా కూడా ఇస్తాడు. క్షమించండి, ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడి మిమ్మల్ని నొప్పించానా?”

“ఇందులో నొచ్చుకోవడానికేముంది పెగ్గీ? నువ్వన్నట్టు ధైర్యమూ శక్తీ వుండాలేకానీ, తీర్చుకోలేని సమస్య వుండదు.  ఇరవై నాలుగు పౌండ్లతో జీవితాన్ని ప్రారంభించటానికి నాకేమీ అభ్యంతరం లేదు.”

“మీ బట్టలూ, పుస్తకాలూ అన్నీ తెచ్చుకోండి. యేడాది దాకా బట్టలు కొనే పని వుండదు.”

” అవును. అంతే కాదు, మా గదుల్లో వున్న సామానంతా మాదే నన్నాడు మావయ్య. అవసరమైనంత వరకు వుంచుకోని, మిగతా సామాను అమ్మి వేస్తాను. ”

” ఇంతకీ మీరు ఎడిన్ బరో ఎప్పుడు బయల్దేరుతున్నారు”

“బుధవారం, ఫ్రాన్సిస్ వస్తాడు. అతనికి ఇల్లప్పగించి మేము బయల్దేరాలనుకుంటున్నాం.”

“సరే, అయితే అందరమూ కలిసి గురువారం బయల్దేరదామా?”

“అలాగేనండి. మీరు వూరి వాళ్ళకి చేసిన వుపకారాలగురించీ, సహాయాల గురించీ అందరూ చెప్పుకుంటున్నారు. కొత్త అయ్యగారు కూడా  మీలాగే ఈ ఇంట్లో సంతోషంగా వుంటే అంతే చాలు. నే వస్తా అమ్మాయి గారు.”

 

***

(సశేషం)

ఛానెల్ 24/7 -13 వ భాగం

sujatha photo

( గత వారం తరువాయి )

ఎంత ఏడ్చినా ఇదే జీవితం, తను ఎంచుకొన్న రంగుల స్వప్నం. డైరెక్టర్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, మేనేజర్, హెల్పర్ ఎవరైనా ఒకటే.. మగవాళ్లే.. అవకాశం దొరికితే ఎంజాయ్ చేద్దామనుకొనేవాళ్లే. ప్రేమలకు, ఆప్యాయతలకు, నమ్మకాలకు … శ్రీజ ఏడుస్తూనే వుంది.

“సారీ..సారీ..” అన్నాడు పూర్ణ లోగొంతుకలో.

ఎవ్వళ్లూ మాట్లాడలేదు.

“సరే పొండి. శ్రీజా కళ్లు తుడుచుకో అమ్మా” అన్నాడు ఎం.డి.

శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి ఒకళ్ల చెయి ఒకళ్లు పట్టుకొని బయటకు వచ్చేశారు. బయటికి రాగానే నవ్వు మొహం పెట్టింది పి.ఏ.

“బాగా భోంచేశారా?” అన్నది నవ్వుతూ.

ఇప్పుడు నవ్వారు ఇద్దరూ మనస్ఫూర్తిగా.

“ఏరా” అన్నాడు ప్రేమతో శ్రీధర్.

వెనకనుంచి అరిచి చెప్పింది సరిత.

“శ్రీధర్‌గారూ,  మీకోసం అనంతాచార్యులుగారు మీ క్యాబిన్‌లో వెయిట్ చేస్తున్నారు. మీరు రమ్మన్నారట కదా”

శ్రీధర్, శ్రీకాంత్ వైపు చూసి గట్టిగా నవ్వాడు.

“ఏరా. చారిగారు నీ జాతకం మార్చేస్తానన్నారా?” అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్.

“నాది కాదురా. నీ బుద్ధి మార్చాలని రమ్మన్నా” అన్నాడు శ్రీధర్.

ఇద్దరూ ఫస్ట్‌ఫ్లోర్‌లోకి వచ్చారు. శ్రీధర్ కాబిన్‌లో కళ్ళు మూసుకొని కూర్చుని వున్నాడు అనంతాచారి.

“నమస్కారం శ్రీధర్‌గారూ, నా జాతకం ఎప్పుడు చూస్తారు?” అన్నాడు.

శ్రీకాంత్, శ్రీధర్ ఇద్దరూ కూర్చున్నారు.

“కాఫీ తాగుతారా?” అన్నాడు శ్రీధర్.

బాయ్‌ని కాఫీ తెమ్మన్నాడు శ్రీకాంత్.

“సర్. చారీగారూ బావున్నారా?”

“ఏం బాగు శ్రీధర్‌గారూ. ఎండిగారు దయదల్చినా మీరు కళ్లు తెరవలేదు” అన్నాడు చారి.

శ్రీధర్‌కి ఎండిగారి తల పగలకొట్టాలన్న కోరిక చాలా బలంగా కలిగింది.

ఈ చారిని తనపైకి తోలటమేమిటి..? చారికి జాతకం స్లాట్ ఫ్రీగా కావాలి. అందులో గ్రహబలం, జాతకాలు లైవ్‌లో చెపుతానంటాడు. ఉదయం ఐదునుంచి ఆరు వరకూ. ఎండిగారికి ఆ స్లాట్ ఫ్రీగా ఇవ్వటం ఇష్టం లేదు. చారిని డబ్బు అడగటం ఇష్టం లేదు. చారికార్పొరేట్  స్వామీజీ. ఫేమస్ పర్సనాలిటీ. ఇటు రాజకీయరంగం, సినిమా రంగం, వ్యాపారం అన్నింటిలోనూ ఆయన పరిచయాలు ఎక్కువే. ప్రతివాళ్లకీ ఆయనే ముహూర్తం పెట్టాలి. సినిమావాళ్లను లైవ్‌లోకి తెస్తాను. మీకు రేటింగ్ వస్తుంది అంటాడాయన. ఎవ్వళ్లు స్పాన్సర్ చేసినా ఆ డబ్బంతా తనే వుంచుకోవాలని చారి ప్లాన్. అందులో సగమైనా తనకో, చానల్‌కో రావాలని ఎండి ప్లాను. ఇద్దరు  మధ్యలో తనతొ[ ఆడుకుంటున్నారు.

“మీకోసం ఉంగరాలు తెచ్చాను చూడండి. ఇది పూర్తిగా రాయితో మలిచారు. ఇవి హృషికేష్ నుంచి రెండే వచ్చాయి. ఒకటి మీ ఆవిడకు, ఒకటి మీకు” అన్నాడు అవి చేతికిస్తూ.

“ఇంకోటి.. కిందటిసారి మనసు బావుండలేదు. ఇవ్వాళ మీతో మాట్లాడలేనన్నారు కదా. అలా మనసు బావుండటం లేదంటున్నారని… అందుకే మీకోసం త్రివేణీ సంగమంలోని మట్టి తెప్పించాను. ఇది మీ దగ్గర వుంచుకోండి. అన్ని టెన్షన్లు పోతాయి” అంటూ ఒక ప్లాస్టిక్ సంచిలో గుప్పెడూ మట్టి  శ్రీధర్ ముందు ఉంచాడు.

“ఆ ఉంగరం వేలికి పెట్టుకోండి. హెడ్డయిపోతారు” అన్నాడు చారి.

“అంటే ఎండిగారిని పంపేస్తున్నారా మీరిద్దరూ” అన్నాడు వెంటనే నవ్వుతూ శ్రీకాంత్.

చారి ఉలిక్కిపడ్డాడు. చిరాగ్గా శ్రీకాంత్ వైపు మొహం చిట్లించి చూశాడు.

“అది కాదండి నా ఉద్ధేశ్యం. ఈయన మంచి స్థాయిలోకి వెళతారు అని”

శ్రీకాంత్ కొంటెతనానికి శ్రీధర్‌కు ఆపుకోలేనంత నవ్వొచ్చింది.

ఇంకా నయం మట్టి గురించి ఏం వాగలేదు  నయం అనుకొన్నాడు. అతని ఆశ నిరాశే అయింది.

శ్రీధర్ మట్టి సంచి  చేత్తో పట్టుకొని అటూఇటూ తిప్పి చూశాడు.

“ఈ మట్టితో టెన్షన్లు పోతాయా?” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“నేను హామీ ఇస్తా. ఇది మూడు నదుల్లోంచి సాగరంలో ఆ పాయలు కలిసిన చోటు నుంచి తీసిన మట్టి. కాళ్లనొప్పులు, టెన్షన్లూ, చెప్పా పెట్టకుండా పారిపోతాయి.”

“ఏరా.. మరి నాలుగు బళ్లమట్టి తెప్పించి నేనో హాస్పిటల్ ఓపెన్ చేయనా? దిక్కుమాలిన తిట్లనుంచి తప్పించుకోవచ్చు. ప్రతివాడు ఉద్యోగం మానేయమనేవాడే. ఏమంటారు?” అన్నాడు చారి వైపు తిరిగి.

చారి పిడుగు పడ్డట్టు అయిపోయాడు.

ఇతను ఖాయంగా ఎగతాళి చేస్తున్నాడు.. కిం కర్తవ్యం”

అతన్ని, శ్రీధర్‌ని తిప్పి తిప్పి చూసి నవ్వాడు చారి.

వచ్చేటప్పుడు టైము, లగ్నం సరిచూసుకునే ఛానల్‌లోకి అడుగుపెట్టాడు తను. మరి ఈ దుష్టగ్రహం శ్రీకాంత్ ఎలా తగిలాడో అర్ధం కాలేదాయనకు.

“మా శ్రీకాంత్ చేయి చూడండి” అన్నాడు శ్రీధర్ నవ్వుతూ.

“మీ పుట్టిన టైమ్ ఖచ్చితంగా కావాలండీ” అన్నాడు చారి.

“మా అమ్మనడగాలి” అన్నాడూ శ్రీకాంత్.

అమ్మ గుర్తొచ్చింది శ్రీకాంత్‌కి.

“నాన్నా బంగారం. నీకోసం ఎన్ని పూజలు చేశానురా. మన పొలంలో నాగేంద్రుడి పుట్ట వుందా? ఆ పుట్ట చుట్టూ  ప్రదక్షిణలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు  చేసేదాన్ని. నేను పుట్ట తడిపి పూజ చేసి ప్రదక్షిణాలు చేసేవేళకు ఆ దూరంగా ఒక నెమలి పురివిప్పి ఆడుతుండేదిరా నాన్నా.. ఈ పొద్దుటి పొద్దుటే నెమలి ఆడేవేళకు మన పొలం గట్టుపై గుడిసె వేసుకొన్న సన్నాయి తాత సన్నాయి ఊదేవాడురా. ఆ పాట, నెమలాట, పుట్టలోని సామి దయ నువ్వు పుట్టేవురా శ్రీకాంత్. నీకందుకే పాటలొచ్చు. ఇన్ని మాటలొచ్చు. దేవుడి దయతో పుట్టావు నాన్న. నీకు దేవుడంత మంచి మనసుందిరా. నా తండ్రి పెద్దాడై పెళ్లి చేసుకొని బిడ్డల్ని కనేదాకా నేను కష్టపడగలనురా” అనే తల్లి తనను తడిమిన గరుకు చేతులు గుర్తొచ్చాయి.

పొలం పని చేసి చేసి గరుకు చేసిన చేతులు, కాయకష్టంతో నల్లరూపు పడ్డ మొహం, తన యూనివర్సిటీ చదువు అయ్యేలోపున అర్ధాంతరంగా వెళ్లిపోయిన ఆమె రూపం కళ్లముందు కదలాడింది శ్రీకాంత్‌కి. ఉన్న ఎకరం పొలం గట్టునే పాకలో ఇప్పటికీ కాపురం వుండే తండ్రి గుర్తొచ్చాడు. సన్నాయి తాత మనవరాలు చేసిపెట్టే జొన్నరొట్టె, కారం పచ్చడి ఇష్టంగా తినే తండ్రి తలపుకొచ్చాడు. తనని చూడగానే అమ్మా పాప, అన్నాయికి ఇంకో రొట్టే ఇస్తావా? అన్న తండ్రి గొంతు, ఆ పాప అనిపించుకొన్న పాతికేళ్ల మీనాక్షి మొహం కదలాడింది. అన్నాయికి రొట్టెలెందుకు పెదనాన్నా, నేనింటికి తీసుకుపోతా. ఆడ ఏం తిన్నాడొ ఏమో. నేను మంచిగా వండి పెడతా అంటున్న మీనాక్షిని తను అందరి అమ్మాయిల మొహాల్లో చూడగలడు. మాట్లాడితే ఏడుపులు ఏడ్చి విసిగించే శ్రీజలో తనకు మీనాక్షి కనిపించదా?”

ఊరికి దగ్గరగా వున్న పొలం, పొలం చివర్లో రెండు నిట్టాడి గుడిసెలు, రెండు కాపురాలు.  ఒకదాంట్లో తండ్రి, ఇంకోదాన్లో సన్నాయి తాత కుటుంబం. ఊర్లో ఏ పెళ్లి పేరంటం జరిగినా, సన్నాయి తాత గ్రూపు మేళం. ఆయన కూతురు కూతురు మీనాక్షి. తల్లి పోయాక తాత కుటుంబమే తనకూ, నాన్నకు బంధువులు. సెలవుల్లో ఆ అమ్మాయి చేతి వంట తినే ప్రాణి తను. ఆ అమ్మాయి ఒక్కోసారి తల్లిలాగ, చెల్లెలాగా, తన చిన్న చిన్న బహుమతులకు సంబరపడే పాపలాగా కనిపిస్తూ వుంటుంది. సాయంత్రంవేళ, ఉదయంవేళ పాక బయట మంచంపైన పడుకొంటే సన్నాయితాత పాత, చుట్టూ జొన్నచేల పచ్చదనం, మీనాక్షి కబుర్లు, నాన్న ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఈ కాంక్రీట్ జంగిల్‌లో ఎలా వస్తాయి. తను అటుపోతే ఉద్యోగం ప్రాబ్లం, వాళ్లు ఇటు వస్తే వాళ్ల స్వేచ్చ పోతుంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?” అన్నాడు చారి.

“నా పుట్టినతేదీ రికార్డు చేసేంత చదువు లేదు మా అమ్మానాన్నకి. అటు ఇటూగా ఉదయం ఐదు ఆరూ మధ్య అంటూ వుంటుంది అమ్మ” అన్నాడు శ్రీకాంత్.

“వాడి జాతకం వాడే రాసుకుంటాడు. మనతో పన్లేదు శ్రీకాంత్‌కి” అన్నాడు శ్రీధర్.

“ఏంటండీ అలా గన్నారు? సార్‌కు నేను చెప్పకూడదా జాతకం?” అన్నాడు ముఖం మాడ్చుకున్న చారి శ్రీధర్‌ని చూస్తూ..

“అయ్యో అదేం లేదండీ” అన్నాడు శ్రీధర్.

“చారిగారూ సరదాగా అన్నాను. ఇవ్వాళ మీరు మా అమ్మని గుర్తుకు తెచ్చారు. ఏదో ఒక కోరిక కోరుకోండి  తీర్చేస్తాను” అన్నాడు శ్రీకాంత్.

అతని నవ్వు మొహం చూసి చారి నవ్వేడు.

“నా ఉదయం స్లాట్ గురించి సెటిల్ చేయండి. నేను ఎంత పాపులరో మీకు తెలుసు. చిన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా నన్ను కన్సల్ట్ చేయకుండా వుండరు.” అన్నాడు బ్యాగ్‌లోంచి ఆల్బం తీస్తూ.

“అబ్బే అవన్నీ ఇప్పుడు చూసే టైం లేదు. మీ కోరిక ఇదిగో ఈ శ్రీధర్ మనసుపెట్టి తీర్చాలని  మీ దేవుడ్ని నేనూ ప్రార్ధిస్తా” అన్నాడు శ్రీకాంత్.

“అంటే మీకు దేవుడు లేదా?” అన్నాడు చారి.

“అంటే నా దేవుడికంటే మీ దేవుడికి మీరు క్లోజ్ కదా. రోజూ పూజలు చేస్తూ వుంటారు. ఆయన ఇప్పటికే మెత్తబడి వుంటారు. నేనూ ఇంకో నాలుగు దణ్ణాలు పెట్టి మీ గురించి చెప్పుకొంటాను. అప్పుడు శ్రీధర్ మనసు మెత్తబడి మీ ప్రోగ్రాం ఓకే అయిపోతుంది” అన్నాడు.

చారి మొహం వికసించింది.

“శ్రీధర్‌గారూ మీరు ఓకే అనండి చాలు” అన్నాడు.

శ్రీధర్ కోపంగా చూశాడు శ్రీకాంత్ వైపు.

తను వప్పుకుంటే అయిపోతుందా? ఈ హాఫెనవర్ కమర్షియల్స్ సంగతి సెటిల్ చేయకుండా ఎండి వప్పుకుంటాడా? ఈ ప్రోగ్రాం జనం చూస్తారు. జాతకం, రేపేం జరుగుతుందో ఇవ్వాళే తెలుసుకోవాలనే ఆశ, మనకి ఎప్పుడూ మంచే జరగాలని ఎవరేనా చెప్పాలి లేదా ఆ చెప్పేవాటిలో మనకి నచ్చనివి తీసేసుకుని నచ్చేవే జరగాలంటే సిద్ధాంతిగారి సాయంతో పూజలు హోమాలు జరిపిస్తే సలక్షణంగా బతుకు గడిచిపోతుందనే కాన్సెప్ట్ ఎప్పుడూ వర్కవుట్ అవుతుంది.

దేవుళ్లకి దణ్ణాలు పెడితే, హోమాలు చేయిస్తే , తాయత్తులు కట్టుకుంటే, గ్రహపూజలు చేయిస్తే, గడిపే ప్రతి నిముషంలో మంచి ఘడియని ఒడిసిపట్టుకొని ఆ ఘడియలో తమకు అనుకూలమైన పనులు, లాభం వచ్చే పనులు మొదలుపెట్టి కోట్లు సంపాదించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అంతెత్తున కూర్చోవాలని ఆశపడే మనుష్యులు ఉన్నంతకాలం చారికి ఢోకా లేదు.

 (సశేషం)

 

 

 

మృగతృష్ణ

200px-Ranthambore_Tigerసరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు బందిపూర్ టైగర్ రిసర్వుకు చేరుకున్నాం.

కాటేజ్ తీసుకోవడానికి రిసెప్షన్ కు వస్తే — “ఇదిగో చూడండి.  భోజనాలు త్వరగా ముగించుకొని మళ్ళీ ఇక్కడికి 3.30కి చేరుకుంటే, టీ, కాఫీలు తీసుకుని 4.00 గంటలకు బయల్దెరుతాం. 6.30కి సఫారీ పూర్తవుతుంది.  స్నాక్స్ తీసుకున్న తర్వాత స్లైడ్ షో మొదలవుతుంది.  8.00 గంటలకి డిన్నర్,” అంటూ గుక్కతిప్పుకోకుండా చెప్తున్నాడు రిసెప్షనిస్ట్.

గబగబా కాటేజ్ కు వెళ్ళి, సామానంతా పడేసి భోజనాలకెళ్లి వచ్చేసరికి 3.00 గంటలయ్యింది.  అటు నడుంవాల్చామో లేదో మూడున్నర కావస్తుంది.  కెమెరాలు, బైనాకులర్లు వగైరా సర్దుకుని పరుగో పరుగు. మా గ్రూప్ లో ఆరునుంచి, అరవై వరకూ వయసు వాళ్లు ఉన్నా ఉత్సాహంలో ఎవ్వరూ ఒకరికొకరు తీసిపోలేదు.

ఓపన్ టాప్ జీప్ లో పులివేటకు బయల్దేరాం.  దారిలో రకరకాల జింకలు, లేళ్ళు, దుప్పులు, ఆడ నెమళ్ళు, మగ నెమళ్ళు, అడవి పందులు, అడవి కోళ్ళు, ఏనుగులు, అనేక పక్షి జాతులు, నిరంతరంగా కనిపిస్తున్నాయి. కెమెరాలో బంధించే వాళ్ళు శక్తివంతమైన కెమెరాల్తో, మూవీ తీసుకునేవాళ్ళు రకరకాల మూవీ కెమెరాల్తో, బైనాకులర్లతో చూసేవాళ్ళు వివిధ సైజుల్లో ఉన్న బైనాకులర్లతో, కళ్ళతో చూసేవాళ్ళు సహజమైన ఆనందంతో పరవశించిపోతున్నారు.  ఇన్ని జంతువులు, పక్షి జాతులు కనిపిస్తున్నా అందరి చూపులూ కనిపించని పులిపైనే.

ఎంత వెతికినా దాని జాడైనా కనిపించదే! అంతులేని దాహం.  జంతువులు డిస్టర్బ్ కాకూడదని, సఫారీ సమయంలో మాట్లాడకూడదనే నిబంధనవల్ల ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు.  అలాగే కెమెరాలు ఫ్లాష్ కాకూడదు.   సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉంచాలి.  ప్రతి ఒక్కరూ పులి తమకే కనిపించాలని రహస్యంగా అనుకుంటున్నారు.  మా గ్రూప్ లోని డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు, మిగతా గ్రూప్ ల డ్రైవర్, ఫోటోగ్రాఫర్ లకు ప్రకటించని పోటీ.  అయినా పులులు మాత్రం అందరి కళ్ళు కప్పి యధేచ్ఛగా తిరుగుతున్నాయి.

చీకటి పడబోతుంది.  అయినా వీళ్ళ పట్టుదల సడలడం లేదు.  అక్కడక్కడా, ముఖ్యంగా నీటి మడుగుల దగ్గర మరింత వెతుకులాట.  మీకు కనిపించిందా అంటే, మీకు కనిపించిందా అని ఒకరినొకరు డ్రైవర్లు, ఫోటోగ్రాఫర్లు పలకరించుకుంటున్నారేగానీ, తమకు కనిపించకపోయినా పరవాలేదు, మరెవ్వరికీ కనిపించకూడదనే దుర్బుద్ధి అందరిలో.

ఎడతెగని వేట.  చీకట్లు కమ్ముకొస్తున్నాయి.  అయినా స్పష్టమైన మృగతృష్ణ. తీరని దాహం.  “ఈ రోజుకు మిమ్మల్ని వదిలేస్తున్నా.  రేపు రండి.  చూసుకుందాం“ అని పులి సవాలు చేస్తున్నట్లనిపించింది.  పులివేట మరుసటిరోజుకు వాయిదా.

డిన్నర్ తర్వాత ప్రకటన: “రేప్పొద్దున 5.30 కు wakeup call. 6.00 గంటలకు కాఫీ, టీలు.  6.30 కు సఫారీ.“  రెండో రోజు. సరిగ్గా 5.30కే అందర్నీ తట్టి లేపారు.  కాలకృత్యాలు త్వరగా ముగించుకుని 6.00 గంటలకు రిసెప్షన్ వద్ద హాజరయ్యాం అందరం.  కాఫీ, టీల తర్వాత మృగయావినోదానికీ అంతా రెడీ.  ఉదయకాంతి ఇచ్చే అదనపు శక్తితో.  పట్టువీడని నూతనోత్సాహంతో.  ఎలాగైనా పులి ఫోటో నా screen saver  కావాలనే విక్రమార్కుని పట్టుదల.

మళ్ళీ అదే జీప్ లు, అదే గ్రూప్ లు, అదే డ్రైవర్ – ఫోటోగ్రాఫర్ జంటలు.  మా గ్రూప్ ఫోటోగ్రాఫర్ ను నేనడిగాను “మీరు పులిని చూచి ఇప్పటికెన్నిరోజులైంది“ అని.  సూటిగా సమాధానం చెప్పకుండా, మరో గ్రూప్ లోని ఫోటోగ్రాఫర్ ను చూపించి “అతనికి రెండ్రోజుల క్రితం కనిపించింది, నోటీస్ బోర్డులో అతను తీసిన ఫోటో కూడ ఉంది“ అన్నాడు.  ఆకాశంలో నిన్నటి రాత్రి చీకట్లను చీల్చుకుంటూ కొత్త వెలుగు సూర్యుడు.

కొత్త ఆశలు మాలో చిగురించాయి. దాదాపు అవే తోవలు.  అవే తావులు.  జంతువులు.  పక్షి జాతులు. పులుల జాడలు మాత్రం మృగ్యం.  ఇది పట్టుదలకు, కార్యదీక్షకు అగ్నిపరీక్ష.  రెండు గంటల బలపరీక్ష తర్వాత వట్టిచేతుల్తో ఎలా వెళ్ళడం!  ఇంతలో మట్టిలో పులి నడిచి వెళ్ళిన గుర్తులు. మళ్ళీ కొత్త ఆశలు.

కొంతదూరం తర్వాత అడుగులు మాయం.  వెంటాడే మృగతృష్ణ.  ఓడిపోయి యుద్ధంనుండి నిష్క్రమిస్తున్న యోధుల్లా మానవ బృందాలు.  వెళ్ళిపోయేముందు మళ్ళీ ప్రకటన.  స్విచ్ ఆఫ్ చేసుకున్న మొబైల్ ఫోన్లను ఆన్ చేసుకోవచ్చునని.  అందరి ఫోన్లలో ఒకటే SMS  వచ్చి ఉంది పులిరాజు వద్దనుంచి:

 

It’s time up for now.

Next time better luck!

 

అ … అంటే చందమామ

 ibrahim

ఇంపైన యాస.. సొంపైన వాక్యం.. అది మాధుర్యమైన స్వరం అక్కం పేట ఇబ్రహీం ప్రత్యేకత. రాసింది తక్కువ కథలే అయినా తన స్థానం సమకాలీన సాహిత్యంలో పదిలం. బడుగు, బలహీన వర్గాల పక్షాన మాట్లాడే ఇబ్రహీం జూన్‌ 1, 1975లో పుట్టారు. మొదటి కథ ‘చిన్ని’ ఆంధ్రజ్యోతి వీక్లీలో 2007లో అచ్చయ్యింది. ఇప్పటి వరకు ఏడు కథలు రాశారు. ‘జీవసమాధి’, ‘కాలానికి ఎదురీదేవాడు’ కథలు ఇతని ప్రతిభకు మచ్చుతునకలు. కడపజిల్లా నర్సాపురం సొంత ప్రాంతం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.

—వేంపల్లె షరీఫ్

 

*

వేళ్ళ సందున చురుక్కుమండంతో ఉలిక్కిపడి బీడీముక్కను విదిలించేశాడు మస్తాన్. గోడమీద అతుక్కుపోయున్న చూపును వెనక్కి లాక్కొని కాలిన చోట తడుముకున్నాడు.

అంతసేపూ మనసు లాగేసుకొని ఏవో ప్రశ్నలూ… అనుమానాలూ… రేకెత్తించి ఆలోచనా ప్రవాహంలో ఈడ్చుకొనిపోయిన బొమ్మ, ఏమీ ఎరగనట్లు మౌనముద్రలోకి జారుకుంది. చూపు మళ్లీ దాని మీదికే మల్లుతుంటే బరువుగా లేచి నిల్చున్నాడు. జారిపోతున్న పంచెముడి బిగించుకుంటూ తలెత్తి పైకి చూశాడు.

వర్షం మళ్లీ వంగేటట్లుంది.!

మదపుటేనుగుల్లాంటి మేఘాల గుంపు ఈశాన్యమూలంగా ఆకాశంలోకి ఎగబడతాంది.

ఏదో గొణుక్కుంటూ లోపలికి నడిచాడు.

ఆట! మంచి రసపట్టులో నడుస్తోంది లోపల. పరిసరాల్ని మరిచి లీనమై ఆడుతున్నాడు అన్వర్.

ముడిపడ్డ కనుబొమ్మలు. మునిపల్ల మధ్య పెదవి బిగింపులు.. అతని వాలకం ఏదో భరోసానిస్తోంటే వెళ్లి ముందు కూర్చున్నచోటే గోడకానుకొని గొంతుక్కూర్చున్నాడు.

మనసింకా బయటే… గోడమీది బొమ్మ దగ్గరే వుండిపోయింది.

ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే! బడివైపుగా వచ్చిన ప్రతిసారీ కళ్లబడేదే!

అప్పుడే జువ్విన పెన్సిల్ కొసలపై అటొక కాలు, ఇటొక కాలు వేసుకొని కేరింతలు కొడుతున్న పిల్లలు.. వాళ్ల చేతుల్లో ఇమిడి మేమే మీ నేస్తాలం అంటున్న పలకా, పుస్తకాలూ…

బొమ్మలో ఏం మార్పు లేదు. భావంలోనే.. ఇన్నాళ్ళూ పసిగట్టలేకపోయిన వ్యంగ్యం… బొమ్మకింద “అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి” అని చక్కెర పలుకుల్లాగా రుచించిన మాటల్లో ఇప్ప్పుడేదో చేదు తొంగి చూస్తూ…

వాటిని ఆలోచనల్లోంచి తప్పించే ప్రయత్నం చేస్తూ దృష్టి ఆట మీదికి పోనిచ్చాడు.

ఆట అప్పుడే ముగిసినట్లుంది. గెలిచిన వారి ఉద్రేకం, ఓడినవాళ్ల కాంతాలం మాటల  శకలాలై గదంతా ఎగిసింది.

వచ్చిన సొమ్మును హుషారుగా జేబులోకి దొబ్బుకుంటున్నాడు అన్వర్. అతని ముఖంలోని వెలుగు కాసింత మస్తాన్ మొఖాన ప్రతిఫలించి పోతున్న ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఒక అర్ధింపు అప్రయత్నంగా గొంతు పెకలించుకుంది.

“భయ్యా!…”

అది చెవిసోకిందొ లేదో అన్వర్ నవ్వు మొఖాన చేదు చరచరా  పాకింది. ” తాల్రా గబ్బు నాయాలా.. లెక్కలతో పోదెంకొని నేను సచ్చాంతే..” బుస కొట్టినట్టే కసిరాడు.

చిన్నబోయి తనలో తను ముడుచుకుపోయాడు మస్తాన్.

రెండు గంటల్నుంచి ఓపిగ్గా కనిపెట్టుకోనున్నాడు. “ఒక్కాట కానీ.. ఈ ఒక్కాట కానీ.. ” అనే కొద్దీ సహనం తెచ్చుకుంటున్నాడు.

ఇంకా ఎంతసేపు తొక్కాలో అర్ధం కాలేదు.

ఇంటికాడ మున్నా తొక్కులాడ్తా ఉన్నాడేమో?

తన్ను వెతుకులాడ్తూ వీధులమ్మట తిరుగుతున్నాడేమో!

“బేగీన రా నాయనా! లేటు చేయగాకు. నువ్వొచ్చేటప్పటికి నేను రెడీ అయి ఉంటా” వచ్చేటప్పుడు వాడు చేసిన హెచ్చరిక మాటిమాటికి వినబడుతుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాడు.

అప్పుడే  వారం రోజులైంది వాడు బడికి దూరమై.

ఈ వారం రోజులు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. అందరి ముందు తన్ను తాను జోలెలా చాచుకున్నాడు. ఒక్కనీక్కూడా కనికరం కలగలేదు.

తను విఫలం అయ్యేకొద్దీ మున్నాలో భయం పేరుకుంటూ పోయింది. పోడుగా, ఏడుపుగా గొంతుదాటుకొచ్చింది.

అది తన చేతగానితనాన్ని ఎండగడుతుంటే, వాడు కూడా తనలాగే కూలోనిగా మారే దృశ్యం కళ్లలో కదలాడుతుంటే.. గుండెల మీద రేక్కంప ఈడ్చినట్లు విలవిలలాడిపోయాడు.

ఆర్రోజులు.. పోరాడి, ఓడి, అలుపొచ్చాక.. నిన్నటి సాయంత్రానికి ఆ కస్మూరు మస్తాన్‌వలి అన్వర్ రూపంలో ఎదురుపడ్డాడు. తన గోడంతా ఆలోచించి అభయమిచ్చాడు. ఆ అభయాన్ని తను కొడుకులోకి చొప్పించాడు. “రేపు బడికి పంపడం ఖాయం” అంటూ నమ్మబలికాడు.

తెల్లవారేటప్పటికి అంతా తలకిందులైంది.

తను పోయేటప్పటికి అన్వర్ ఇంట్లో లేదు. కలనబండ బాయికాడ, పిచ్చయ్య బంకు దగ్గర, గౌరమ్మ అరుగు మీద, అక్కడా, ఇక్కడా వెతుకులాడి ఎక్కడుండేది కనుక్కొని తీరా వచ్చేసరికి… ఆలస్యమైపోయింది.

తనకిస్తానన్న డబ్బులో చాలా భాగం అప్పటికే ఆటలో జారిపోయింది. పోయిన సొమ్ము తిరిగి రావడం, ఆడేది మానుకొని అన్వర్ దాన్ని తన చేతుల్లో పోయడం .. దింపుడు కల్లం ఆశను తలపిస్తాంది.

బీడీ ముట్టించుకుని పొగతో పాటు ఆశను కూడా పీలుస్తూ కూర్చున్నాడు మస్తాన్.

ఆట కోలాహలంగా సాగుతోంది. ఆడేవాళ్లు.. పైనుండి హుషారు చేసేవాళ్లు.. అరుపులు, అదిలింపులతో గది పొంగి పొర్లుతోంది. చుట్టూ ఆవరించిన బీడీల  పొగ బైటి వాతావరణంలోని మేఘాలు లోపలికి జొరబడిన భ్రాంతి కలిగిస్తోంది.

ఏడాది కింద మూతబడ్డ పాఠశాల ఊళ్లోని పోరంబోకులకు జూదశాలగా మారింది.

అక్షరాల గలగలలు పోటెత్తిన చోట ఆటిన్ రాణి,  డైమండ్ రాజాల కేళి.. గోడలపై మసకబారిన గుణింతాక్షరాలపై ఎవరో బొగ్గుతో గీసిన తాజా చిత్రం! మనుషులు బట్టల్తో దాచుకునే వాటిని బటబయలు చేసిన కళాపిపాస….. పగిలిన తలుపులు, విరిగిన కిటికీలు, పెచ్చులూడుతున్న కప్పు.. అచ్చు తన మనసులాగే బావురుమంటోన్న బడి…

దాని శిథిల రూపంలో, జవజీవాలతో తొణికిసలాడిన రోజులు దృశ్యాలై కదలాడుతుంటే, జూదగాళ్ల స్థానంలో బడిపిల్లల కోలాహలం కళ్లకు కడుతుంటే, మస్తాన్ లోలోపల బాధ రాజుకుంటోంది. తన కొడుకుతోపాటు ఊళ్లోని పిల్లలందర్నీ రెక్కల కింద పొదువుకున్న తెల్లకోడిలాంటి బడి ఏ తెగులు కాటుకో విగతజీవిగా మారిన చిత్రం కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది.

లావు లావు చినుకుల్తో ఒక్కసారిగా వర్షం మొదలైంది.

ఉప్పువాగు కెగువున బరకల్లో  మెరుపువాగు ఆకాశం నుంచి భూమికి జరజరా పాకింది. చెవులు బద్దలు కొడుతూ ఉరుము శబ్దం ఊరిమీదికురికింది.

ఇంటికాడ మున్నా ఒక్కడే ఉన్నాడు. ఉరుములు, మెరుపులకు భయపడతాడేమో. చినుకు రాలగానే లొడలొడకారే ఇంట్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటున్నాడేమో.

పోదామనుకుంటూ లేచాడు. పోలేకపోయాడు.

ఉత్తచేతుల్తో పోయి వానికి ముఖం చూపించలేదు. వాడు పోగేసుకున్న నమ్మకాన్ని తన చేతుల్తో చెదరగొట్టలేదు.

ఆలస్యమైనా సరే! డబ్బులు ఇప్పించుకొనే వెళ్లాలి. రేపైనా వాడిని బడికి పంపించి తీరాలి.

ఇప్పుడు పోతే ఎంతో కొంత మినుకుమినుకు మంటున్న అవకాశాన్ని జారవిడుచుకున్నట్టే. లేచిన చోటే కూర్చుండిపోయాడు.

వర్షం ఉగ్రరూపం దాలుస్తోంది. ఆత ఉధృతంగా సాగుతోంది.

 ***

 నీటి దారాలు ఆకాశం నుంచి తెగిపడుతున్నట్లు వర్షం కురుస్తోంది. ఈదురుగాలి తోలినప్పుడల్లా దారాలు తుంపర్లుగా తెగి దూరంగా పడ్తుంటే, ఇంకా మూతలు పడని వాకిళ్లలోంచి తొంగి చూస్తోన్న దీపాల గుడ్డి వెలుగు బయటి చీకట్ల చిక్కదనంలోకి జొరబడలేకపోతోంది.

తల్లి పచ్చడి దంచుతోంటే రోటి దగ్గరే దీపం ముందు పుస్తకం తిరగేస్తున్నాడు మున్నా. కాని చిన్న బుర్రలో ఆశాభంగపు అలజడి ఇంకా రేగుతూనే వుంది.

తండ్రి డబ్బు సంపదించడం గురించే కాదు తన బెంగ. సంపాదించేలోగా ఎన్ని లెసన్స్ మిస్ అవుతాడో! ఎంత వర్క్ ఫ్రెండ్స్ దగ్గర కాపీ చేసుకోవాలో! మ్యాథ్స్ టీచర్ డివిజన్‌లో వర్కింగ్ ప్రాబ్లమ్స్ చెప్తానంది. అవి కూడా మిస్సయ్యాడు.

రెండవ తరగతి దాకా తెలుగులో చదివినందువల్ల ఇంగ్లీషులో తను కొంచెం వీక్. క్లాస్‌లో చెప్పేది వినకుంటే తర్వాత బుక్స్‌లో చదువుకున్నా పెద్దగా అర్ధం కాదు. ఇవన్నీ ఎలాగోలా మేనేజ్ చేసుకున్నా అసలైన పనిష్మెంట్ ఇంకొకటుంది.

ప్రతి టీచర్ తన్ను క్లాస్‌లో నిలబెట్టడం. ఎందుకు ఆబ్సెంట్ అయ్యావంటూ దండించడం. అందరిముందు తను తప్పు చేసినట్టు తలవంచుకోవడం

నులి మంచంలో మునగదీసుక్కూచ్చోని  కొడుకు మనసు చదివే ప్రయత్నం చేస్తున్నాడు మస్తాన్.

చదువుకోవడమంటే ఎంత ఆరాటం వాడికి.

ఎప్పుడన్నా పనిబడి ఒక్కపూట బడి  మానుకోమంటే చాలు దిగులు ముఖం పెట్టుకుంటాడు. హోంవర్క్ చేసుకునేటప్పుడు  చూడాలి. ఒక్కో లెక్క సాధించే కొద్దీ వాని కళ్లలో కాంతి పుంజాలు మెరవడం.

పుస్తకాల బరువు కింద నలిగిపోయే బాల్యపు రూపురేఖలు వాని ముఖాన ఎప్పుడూ కానరాలేదు. నేర్చుకోవడంలోనే ఏదో సంతోషాన్ని సాధిస్తున్నట్లు సాధకుడి దరహాసం వాడి పెదవుల మీద.

అదంతా వాని ఘనతేం కాదు. వాన్నలా తీర్చిదిద్దిన చిన్నప్ప సార్ ఘనత. ఆ సార్ కథలల్లుతాడు. కథలంత కమ్మగా పాఠాలు చెప్తాడు. ఆటతో పాటతో చదువునొక క్రీడగా మలుస్తాడు. ఆయన ఉన్నన్నాళ్లూ వాని గురించే పలవరించెటోడు.

“మస్తానూ! నీ ఇంట ఐన్‌స్టీన్ పుట్టిండబ్బా. నువ్వు పస్తులున్నా పరవాలేదు. వాన్ని మాత్రం బాగా చదివియ్యి. వాడు నీకు పేరు తేవడం ఖాయం” అనేవాడు.

అటువంటి వాన్ని చదివించుకోలేకపోతే… తన్ను తాను శపించుకున్నట్లే!

ఏం చేయాలి? ఏ బాయిలో దూకాలి?

సైదమ్మ ఊరిబిండి నూరడం పూర్తయింది. రోటి కాన్నుండి లేస్తూ

“ఇంగ రాండి. బువ్వ తిందురు గానీ” పిలిచింది.

“కాసేపుండీ.. కరెంటు రానీలే… “అనాసక్తిగా కదిలాడు మస్తాన్.

” ఈ మొబ్బున కూడా కరెంటొస్తదని.. రారాదూ.. “తొందర చేసింది.

అయిష్టంగా పళ్లెమ్ముందు కూచ్చున్నాడు. తిని లేచేసరికి అరచెతుల్ని నెత్తి మీద గొడుగులా కప్పుకొని వసారాలోకి అడుగులేస్తూ ఎవరో…

చేతులు దించి తల ఎత్తేసరికి .. ఆశ్చర్యం! డేవిద్!

“అరరే.. నువ్వా? .. ఎప్పుడొచ్చినవ్.. రా… రా….” ఆశ్చర్యంగా, ఆనందంగా ఆహ్వానించాడు.

పొద్దున్నే వచ్చినాడంట ఒంగోలునుంచి.

ఏదో పనిబడినట్లుంది. లేకుంటే ఇలా మధ్యలో రాడు.

“ఏమిటంటే..” ఇబ్బందిగా చూశాడు. “ఏమీ లేదంటూ” నీళ్లు నమిలాడు. బువ్వ తినమన్నా తినలేదు. బలవంతం చేస్తే..

“ఎన్నో తరగతోయ్ వీడు.. బలే శెర్దగా సదువుకుంటాండే” అంటూ మాట మార్చాడు.

“ఐదో తరగతన్నా! ఇంగ్లీసు మీడియం” కొడుకును పొగడ్డంతో సైదమ్మ  ఉషారుగా జవాబిచ్చింది. అంతలోనే ముఖం చిన్నది చేసుకొని.

“వాడు మాత్రం బాగానే సదువుకుంటాండన్నా.. మేమే వాణ్ని సదివియ్యలేక కిందా మీదా పడ్తాండం” అంటూ బాధపడింది.

“నిరుడు ఇంట్లో అందరికీ చికన్ గున్యా జరాలొచ్చి మనిసికి వెయ్యి రూపాయలు కర్సైనై మామా. జరం తగ్గినా నొప్పులు మటుకు చాన్నాళ్లదాకా వదల్ల్యా. పనులకు పోలేక వాని ఫీజు  కట్టలేకపోయిన” ఒక్క కొడుకును చదివించుకోలేని చేతగానితనానికి సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా అన్నాడు మస్తాన్.

“ఇన్ని అగసాట్లు ఎందుకోయ్ మనూర్లోనే బడిపెట్టుకొని?” ఏదో అనుమానం పొడసూపుతుంటే నివృత్తికోసం ఆడిగాడు డేవిడ్.

“ఇంగేడ బడి.. ఎప్పుడో మూతబడిపోయుంటే”

“మూతబడిపోయిందా!?” డేవిడ్ గొంతులో ఆశ్చర్యం, బాధ మిళీతమయ్యాయి. ప్రాధమిక విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్న  ఎంజెవోలో పని చేస్తున్నాడు తను. వృత్తిరీత్యా ఎన్నో ఊళ్లు తిరిగాడు. ఎన్నో స్కూళ్లు మూతబడ్డం చూశాడు.

అన్నిచోట్లా చదువులనుండి గెంటేయబడుతోన్న బీదపిల్లలు. పరిస్థితి ఇంత త్వరగా తనూరిదాకా వ్యాపిస్తోందని ఊహించలేకపోయాడు.

“ఎట్ట మూత పన్నెదోయ్?” కారణం తన ఊహకందనిది. కాకపోయిన ఏదో కుతూహలం అతనిచేత అడిగించింది.

“ఇంతకు ముందు చిన్నప్ప సార్ ఉన్నెప్పుడూ బాగానే వున్నెది మామా. ఆ సార్ బదిలీ అయినాక బదులుగా వచ్చిన  సారు అంత శెర్దగా పట్టించ్చుకోల్యా. దానికి తోడు పోరుమామిల్లలో ఇంగ్లీషి మీడియం స్కూళ్లు ఎక్కువైపోయి మనూరి దాకా వస్తా  ఉండై. ఉన్నోల్ల పిల్లోల్లు పోలోమని పోతే, మనలాంటోల్ల పిల్లలు మిగిలిండ్రు. వీళ్లు  తక్కువ మంది ఉండారని స్కూల్‌నే ఎత్తేసిండ్రు.”

ఊళ్లే వేరు… స్కూళ్ల కథ మాత్రం ఒకటే!

ఏదో ఒక కారణంతో చిక్కిపోవటం. తర్వాత చచ్చిపోవటం. ఈ దుస్థితి కారణాలెన్నో.

మస్తాన్‌లాగా అందరికీ స్పష్టంగా కనించేది ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యం… చీటీలు, ఎల్లైసీలు, షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ దందాలు.. అనేకానేక సొంతపనుల్లో మునిగి తేలే టీచర్లు బడికి ఎగనామం పెట్టి పిల్లల జీవితాల్ను పాడు చేస్తుంటే తలిదండ్రులకి బాధ కల్గుతోంది. అటువంటి టీచర్ల పట్ల అసహ్యం పెరుగుతోంది. ఆ అసహ్యపు పొరల్లోంచి మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని వీక్షించి వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతున్నారు.

ఫలితం. పిల్లలు ప్రైవేటు స్కూళ్లవైపు తరలిపోతున్నారు. తల్లిదండ్రుల చూపు ఉపాధ్యాయుల్ని దాటి ముందుకు పోవడం లేదు. ఉపాధ్యాయ్లు ‘బడిదొంగ’లవుతోంటే పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నట్లు? అధికార్లను అదిలించాల్సిన పైవాళ్లు ఎందుకు నిద్రపోతున్నట్లు?నష్టపోతున్నది తమ పిల్లలు కాదు గనుకనా?

ఒక గది, ఒకరిద్దరు టీచర్లు, ఐదు తరగతులతో దశాబ్దాల తరబడి పేదపిల్లల చదువులు ఎంత చిందర వందరగా తయారవుతున్నాయో వాళ్లెప్పుడైనా గమనించారా? గతి లేనోళ్లకు అంతమాత్రం చాల్లే అని సరిపెడుతున్నారా?

కనీస అవసరాల గురించి, నాణ్యమైన విద్య గురించి అడిగినప్పుడల్లా డబ్బుల్లేవంటూ బీదముఖం పెడతారు.

వీళ్ల బీదరికపు నటనలోంచి  కుట్రపూరిత నిర్లక్ష్యంలోంచి   ప్రైవేటు బళ్లకు జీవం పోశారు. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ పాసులిప్పించి ‘బడిదొంగల’ బాధితుల్ని ఈ బళ్లవైపు దారి చూపారు.

ఇపుడూ ప్రైవేటు గాలికి ఇంగ్లీషు దుమారం తోడైతే, మస్తాన్ చెప్పినట్లు ‘గతి’ ఉన్నోల్లంతా పోలోమని  పోతుంటే, ఏ పాపం ఎరుగనట్లు తప్పంతా టీచర్ల నెత్తికి చుడుతున్నారు. వాళ్లు సంపాదించుకున్న అపఖ్యతి చాటున వీళ్ల కుతంత్రాల్ని తెలివిగా దాచుకుంటున్నారు.

వందలాది పర్యవేక్షనాధికారుల పోస్టుల్ని ఖాళీగా వుంచి పాఠశాలల గొంతుల్ని అదృశ్యహస్తంతో పిసికేస్తూ, బయటికి మాత్రం బ్రతికించే ప్రయత్నం చేస్తున్నట్లు క్లిప్, క్లాంప్స్, లెప్.. అంటూ రకరకాల ప్రోగ్రాంలను అమలు చేస్తున్నారు. అంకితభావం కలిగిన టీచర్లను సైతం నివేదికలు తయారుచేసే గుమాస్తాలుగా మారుస్తున్నారు.

ఇంత ఎదురుగాలిలో కూడా చాలామంది ఉపాధ్యాయులు ‘బడి దీపాలు’ ఆరిపోకుండా శక్తులన్నీ ఒడ్డుతున్నారు. తల్లిదండ్రుల ఆసరాతో దీపాల చుట్టూ అరచేతుల రక్షణ వలయాల్ని నిర్మిస్తున్నారు.

అయినా ఒక్కో దీపం ఆరిపోతూనే వుంది.

ఆఖరుకు అన్ని దీపాలు ఆరిపోయి కారు మబ్బులు కమ్ముకుంటాయేమో!

ఆ చీకటి ‘మున్నా’లాంటి నెలవంకల్ని ఎన్నింటిని మింగేయనుందో?

“ఏందన్నా మా వాని కత విని నీగ్గూడా దిగులు పత్తుకున్నెదే?” సైదమ్మ మాటతో ఆలోచనలోంచి బైట పడ్డాడు డేవిడ్..

“ఈ కథ నీ కొడుకు ఒక్కడిది గాదమ్మా.. ఇట్టాటి పిల్లలు ఇంగా చాలామందే ఉండారు” అన్నాడు.

నిజమేననిపించింది సైదమ్మకు.

బడి మూతబడిపోతూ తొమ్మిది మంది పిల్లలను వీధిపాలు చేసింది. వాళ్లలో ప్రైవేటు స్కూళ్ళలో చేరింది మగపిల్లలే! ఆడపిల్లలు చంటిపిల్లల్ని చంకనేసుకొని వీధులెంబడి తిరుగుతున్నారు. మగపిల్లలు కూడా కొన్నాళ్ళయాక ఫీజులు కట్టలేక బడి మాని చేల వెంబడి, చెట్ల వెంబడి తయారయ్యారు..

రెక్కల కష్టంతో బ్రతికేవాళ్లకు లెక్కలతో కొనే చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.

మస్తాన్ వెల్లబోసుకున్న బాధకు, తను వెల్లబోసుకోలేక ఇబ్బందిగా ఫీలవుతున్న బాధకు మూలం ఒకచోటే తేలాక తన రాకను గురించి గొంతు విప్పాడు.

వినేటప్పటికి మస్తాన్ మనసు మరింత బరువెక్కింది. డేవిడ్ వెళ్ళిపోయాక పడుకుంటే రెప్పల వాకిళ్ళు మూతబడలేదు.

ఒక కంట బడిచెట్టు మీంచి చెదరగొట్టబడ్డ బాల్యపు పక్షులు.. మరోకంట బడి గోడ మీది భ్రమలు పుట్టించే బొమ్మ!

విద్య మా హక్కంటూ నినదిస్తున్న బొమ్మ!

 ***

 ఉప్పు వాగు దాటి జేడెల మీదుగా జిరంగిలా దూసుకుపోతోంది ఆటో. ఆటోలో తండ్రి ఒళ్ళో కూచ్చున్న మున్నా మనసు తూనీగలా తేలితేలి పోతోంది.

దారి పక్క పైర్లు, జేడెల ఎగుడు దిగుళ్ల మీదుగా కదిలిపోతున్న జంగిడి గొడ్లు, రోడ్డును కమ్మేసి ఆటోకు అడ్డం పడుతున్న గొర్లమందలు.. రోజు కంటే అందంగా, కళగా కన్పిస్తున్నాయ్. జరుగుతున్నదంతా కలగా, నిజంగా, కలలాంటి కమ్మటి నిజంగా అన్పిస్తోంది.

బువ్వతిని ఇంట్లోనే పండుకోమని ఎంత బంగపోయినా వినకుండా రాత్రే వెళ్ళిపోయిన డేవిడ్ మామ పొద్దుపొడిచే టప్పటికల్లా తనకోసమే తిరిగి వచ్చాడు.

నాయన ఇంట్ళో లేడూ. దుగ్గిరెడ్డి వాళ్ల గొడ్ల కొట్టం కప్పుతాంటే బోద ఎగేస్తున్నాడు. వెళ్లి పిలుచుకొనొచ్చాడు.

పైజేబులోంచి ఐదువందల కాగితాలు తెచ్చి చేతిలో పెట్టాడు మామ. ” ఈ రెండువేలు తీసుకొనిపోయి పిల్లోని ఫీజు కట్టోయ్. నేను మళ్లా క్రిస్‌మస్ పండకొచ్చినప్పుడు తీసుకుంటాలే” అన్నాడు.

నాయన కళ్లనిండా నీళ్లొచ్చినై.

మామ అన్నంతపని చేసినట్లుంది. ఈ రెండువేలు ఆ డబ్బులోంచి సర్దినట్లుంది. ఊరికే అంటున్నాడు గానీ మామ పండక్కి రాడేమో! వస్తే ఎక్కడుండాలని మధనపడతాడేమో?

ఆటొ నరసాపురం దాటి పోరుమామిల్ల వైపు మలుపు తిరిగింది. వర్షం తెరిపి నివ్వడంతో వరినాట్ల సందడి మొదలైంది. రోడ్డు కిరువైపులా గిలక తోలే వాళ్లు, గట్లు చెక్కేవాళ్లు, అద్దం లాగా సిద్ధమైపోయిన మళ్లలో నాట్లు వేసేవాళ్లూ…

తెలుగ్గంగ నీళ్లు వచ్చినప్పటినుండి అంతో ఇంతో భూ ఆధారకమున్నోళ్లు నిబ్బరంగా ఉంటున్నారు. వర్షాలు పడకపోయినా బ్రహ్మం సాగర్ నుంచి నీళ్లు ఇవ్వడంతో పైర్లు పెట్టుకొని ధీమాగా ఉంటున్నారు.

తనకు సెంటు భూమి లేదు. ఏ ఆధారకమూ లేదు.

మున్నాగాన్ని బాగా చదివిచ్చుకుంటే వాడే తనకు ఆధారం అవుతాడు.

ఎలాగైనా వాన్ని చదివిచ్చుకోవాలి. తన అశక్తత మూలంగా  ఇంకెప్పుడూ బడికి దూరం కాకుండా జాగ్రత్త పడాలి.

కుటుంబ పరిస్థితులకు, కొడుకు చదువుకు మధ్య అగడ్తను పూడ్చడం కోసం ఒక్కో ఆలోచన్ను గులకరాయిలా దొర్లిస్తోంది మస్తాన్ మనసు.

రాత్రి డేవిడ్ అన్న మాతలు మనసులో మెదిలినై.

“మూడోవానికి మెడికల్లో సీటు రాలేదోయ్. డిగ్రీలో చేరమంటే వినడు. లాంగ్‌టర్ము కోచింగ్ తీసుకుంటాడంట. డబ్బులేవన్నాను. అలిగి బువ్వ తినడం మానుకున్నెడు. వాని బాధ సూల్ల్యాక, ఇల్లమ్మి పోదామని వచ్చినా.”

నెలజీతగాడైన డేవిడ్ చదువుల పెట్టుబడికి తాల్లేక ఇల్లమ్ముకున్నాడు. తన దగ్గరేముంది అమ్ముకోవడానికి.

అనవసరంగా లేనిపోని భ్రమలు పెంచుకుంటున్నాడేమో, చిన్న మొలకను చేతబట్టుకొని చెట్టంతటి నీడ కోసం కలలు కంటున్నాడేమో, మొలకను మానులా మలచడానికి అవసరమైన ఆర్ధిక పోషకాలు తన మట్టి బతుకును ఎంత  పిండుకున్నా దొరకవేమో.

జారిపోతున్న నమ్మకాన్ని చిక్కబట్టుకునే ప్రయత్నం చేశాడు. గుండెలనిండా ధైర్యాన్ని ఎగబీల్చాడు.

ఆటో పోరుమామిళ్ల చేరింది.

బస్టాండు దగ్గర దిగి బద్వేలు రోడ్డులో కాసేపు నడిచేశరికి ఠీవిగా ఎదురుపడింది. విస్‌డమ్ ఇంగ్లీషు మీడియం స్కూల్.

జైలు గోడలాంటి ప్రహరి, కోట గుమ్మంలాంటి గేటు. ఖాకీ యూనిఫాంలో పోలీసును తలపించే వాచ్‌మెన్. సగటు తల్లిదండ్రుల్ని బెదరగొట్టడానికి సరిపడా గాంభీర్యం నిండిన వాతావరణం.

స్కూల్ టైం అవుతోంది.

తండ్రుల వెంట స్కూటర్లమీదొచ్చి దిగుతున్న టౌను పిల్లలు. కుక్కేసి తరలించుకొచ్చిన వ్యానులోంచి పుట్ట పగిలిన చీమల్లా బైటపడుతున్న పల్లెటూరి పిల్లలు.

శుక్రవారం రోజుకి ప్రత్యేకమైన వైటండ్ వైట్ యూనిఫాంలో క్లాసుల్లోకి కదులుతున్న దేవదూతల్లా ఏదో శాపభారాన్ని పుస్తకాల రూపేణా మోస్తు వంగిపోయి.. ఇంద్రధనుస్సులా…

ఆ పిల్లలు, తండ్రులు, వాళ్ల ఒంటిని అంటిపెట్టుకున్న పట్టణ నాగరికతలు, వాళ్ల కోసమే అన్నట్లుగా పెట్టుబడిదారీ తళుకుల నద్దుకున్న స్కూలు పరిసరాలు.. తమ స్థితిగతులకు పొత్తు కలవని ప్రదేశంలో మసలడానికి ఇబ్బంది పడుతూ, న్యూనతతో చితికి పోతూ హెడ్ మాస్టర్ గదిలోకి అడుగుపెట్టాడు మస్తాన్.

అలికిడికి చదువుతున్న ఇంగ్లీషు డైలీలోంచి చివాల్న తలెత్తాడు హెడ్‌మాస్టర్.

వాకిట నిలబడి అనుమతి తీసుకుని వినయంగా లోపలికి అడుగుపెట్టాల్సిన ఆచారం ఒకటి భగ్నమవటంతో అతడి నుదట అసహనం ముడతలు పడింది.

గుడ్డిమైల పది తెలుపుదనాన్ని పూర్తిగా పోగొట్టుకున్న యూనిఫాం, మెలిచుట్టుకొని పోయి వత్తిలాగా వేలాడుతున్న టై, చినిగిపోయి వేళ్లను బైటికి చూపెడుతున్న బూట్లు.. బీదరికాన్ని పోతపోసినట్లు కొడుకు.?

ఎన్నడూ ఇస్త్రీ ముఖం ఎరుగక పైకి ముడుచుకుపోయి కురచగా కనిపిస్తున్న అడ్డపంచె, కూరిపెట్టిన సంచిలోంచి అలాగే వేసుకొని రావడం వల్ల నిండ సొక్కిళ్లు బారిన చొక్కా.. ముతక బతుకుకు అద్దం పడుతూ తండ్రి…!

ఎదుట నిలబడ్డ ప్రాణుల అల్పత్వాన్ని అంచనా వేసేసరికి హెడ్‌మాస్టర్ అసహనంలో ముడతల సంఖ్య పెరిగింది.

వాళ్ల నమస్కారాలకు స్పందించకుండా ఏంటన్నట్లు ఈసడింపుగా చూశాడు.

“ఫీజు కట్టలేదని వారం నుంచి మా వాన్ని బళ్లోకి రానియ్యడం లేదు సార్. స్నేహితుడొకాయన సాయం జేసి ఉంటే కట్టి పోదామని వచ్చిన” చేతులు నలుపుకుంటూ చెప్పాడు మస్తాన్.

అతని మాటల్ని పట్టించుకోనట్లు కొడుకు వైపు చూశాడు.

“వాట్స్ యువర్ నేం? విచ్ క్లాస్?” అంటొ గరగరలాడాడు.

“షేక్ మునార్  భాషా, ఫిఫ్త్ క్లాస్, బి. సెక్షన్”

కీబోర్డుని టకటకలాడించి,మానిటర్ మీద వివరాలు చూసి కళ్లు పెద్దవి చేశాడు. తండ్రీ కొడుకుల్ని ఎగాదిగా చూస్తూ .. ‘ఎంత తీస్కొచ్చావ్?’ అన్నాడు.

ఆఫీసులో కట్టేసి రసీదు తీసుకురా అన్నాడు.

తెచ్చి చూపిస్తే, దాన్ని తనకే ఇచ్చేస్తూ.

“ఇదేందో తెలుసా? నిరుటీ ఫీజుకు రసీదు. మరి ఈ సంవత్సరపు ఫీజు ఎప్పుడు కడతావ్? వచ్చే ఏడాదా?” వెటకారంగా అన్నాడు.

“లేదు సార్! పదిరోజుల్లో అదిగూడ తెచ్చి కడ్తా సర్” భయం భయంగా అన్నాడు మస్తాన్.

“నో.. నో… ” మళ్లీ కంప్యూటర్ వైపు తిరిగాడు.

మౌస్‌ని అటు ఇటు జరిపి క్లిక్ చేసి మానిటర్ వైపు చూపించాడు.

“స్కూలు జరిగిన రెండు నెలల్లో మూడు వారాలు ఆబ్సెంట్లు! ఫీజు అడిగినప్పుడల్లా ఎలా గుడ్లు తేలేస్తున్నావో చూడు. ఇటువంటి కేసుల్ని వి కాంట్ బేర్..” తల అడ్డంగా ఆడించాడు.

అటెండర్ని పిలిచి ఈ అబ్బాయి రికార్డు షీటు ప్రిపేర్ చేయించమంటూ ఆర్డరేశాడు.

జరుగుతున్నదేమిటో అర్ధం అయ్యేసరికి కడుపులో జలదరించి ఆ ప్రకంపనలు మస్తాన్ ఒళ్ళంతా  పరుగులెత్తినై. శక్తంతా తోడేసినట్లు శరీరం తేలికగా అయిపోయింది. గుండె లోపలెక్కడో పియో పియో మంటోంది.

ఇటువంటి సన్నివేశాన్ని తను ఊహించలేదు.

చల్లబడుతున్న ఒంటిని స్వాధీనం లోకి తెచ్చుకుంటూ…

“నా కొడుకును అన్యాయం చేయకు సార్. నీకు పున్నెముంటది. బీదోన్ని రవంత కళ్ల జూడు సార్” రెండు చేతులెత్తి దండం పెట్టాడు.

అతని గోడుకి హెడ్‌మాస్టర్‌కి చీమైనా కుట్టలేదు.

ఫీజు ఒక్కటే కాదు వీళ్లతో సమస్య.

వీళ్ల అవతారం.. చినిగిన బూట్ళు , చింపిరి జుట్లు..

వీళ్లు క్యాంపస్‌లో తిరుగుతుంటే స్కూల్ ఇమేజ్ డామేజ్ అవుతోంది. వీళ్లందరినీ తరిమేసి కొత్త వాళ్లను చేర్చుకోకపోతే ఇమేజ్‌తో పాటు ఇన్‌కం కూడా డామేజ్ అయ్యేట్టుంది.

రికార్డుషీటు ప్రిపేర్ అయ్యి టేబుల్ మీదికి వచ్చింది.

దాంట్లో సంతకం బరికేసి సీట్లోంచి లేచాడు.

“బీదోన్ని అంటున్నావు గదా! నీ స్తోమతకు తగినట్లు ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేరుచుకో ఇక్కడ చదువు కొనడానికి నీ శక్తి చాలదు.”

బయటికి వెళిపోతూ కళ్లతోనే అటెండర్ కేదో చెప్పాడు.

“సార్.. సార్. సార్… నీ దండః పెడ్తా సార్”

“బీదోని బతుకు పాడు చెయగాకు సార్. రొండురోజుల్లో ఫీజు మొత్తం కడ్తా సార్” హెడ్‌మాస్టర్ వెంటబడ్డాడు మస్తాన్.

అటెండర్ మెరుపులాగా కదిలాడు. రెట్ట పట్టుకొని రికార్డుషీటు చేతిలొ పెట్టాడు.

“నువ్వెంత మొత్తుకున్నా ఆయన వినడు. నీ యట్టాటి బీదోళ్లు రోజుకు డజన్ మందిని బైటికి పంపిస్తుండాడు.. పో.. పోయి లక్షణంగా గవర్నమెంట్ బళ్ళో  చేర్పిచ్చుకో పో”.

బయటికి దారి చూపించాడు. కదలకుంటే తోసెయ్యడానికి వెనుకాడనట్లు కరుగ్గా చూశాడు.

ప్రాణం భగ్గుమంది.

అమాయకంగా నమ్మి వచ్చిన గొర్రెను కసాయి కత్తేదో కుత్తుక కోసిన బాధ.

ఇన్నిరోజులుగా కొడుకు కోసం తను పడ్డ ఆరాటం.. ఆఖరు నిముషంలో దేవుడిలాగా అడ్డుపడిన డేవిడ్ ఔదార్యం.. అంతా  మట్టిపాలైపోయింది.

అటెండరు కూడా తన బతుక్కి  గవర్నమెంటు బడి చాలని తీర్మానిస్తున్నాడు.

ఆ బడి ఊపిరాగిపోయి నిర్జీవంగా పడి వుంది. బలుపెక్కిన ఈ బడి బతికుండగానే తన్ను చంపేసింది.

చెమ్మగిల్లిన కళ్లతో కొడుకు ముఖంలోకి చూశాడు. చందమామకు మసి పూసినట్టు చిన్నబోయి వుంది.

చెయ్యందుకొని మౌనంగా బైటికి నడిచాడు.

రోడ్డు మీది గతుకులన్నీ వర్షపు నీటితో నిండి వుండై.

ఎర్రనీళ్లలో నిరాశగా కాళ్ళీడుస్తూ, మాటిమాటికి వెనక్కి తిరిగి స్కూలువైపు చూస్తూ ముందుకు నడస్తన్న కొడుకు.

మనసెక్కడో, మనిషెక్కడో ఐనట్లుగా అడుగెక్కడ పడేదీ స్పృహ లేకుండా నడుస్తన్న తండ్రి..

స్కూలు దారిలోంచి మెయిన్ రోడ్డూ ఎక్కబోతుంటే, తండ్రి చేతిలోంచి కొడుకు చెయి జారిపోతూ “భడక్”మన్న పెద్ద శబ్దం.

అదిరిపడి స్పృహలోకొచ్చి చూసేసరికి నడుములోతు గుంతలో దిగబడిపోయున్న కొడుకు!

ఏ టేలిఫోన్ వాళ్ళో దారికడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన కాలువ పరధ్యానంగా నడిచేవాళ్ల కోసం నోరు తెరుచుకోనుంది.

చొక్కా,నిక్కర్ల మీదుగా చిక్కగా జారుతున్న అడుసునీరు, బ్యాగులోకి దూరి పుస్తకాల్ని ఖరాబు చేసి మూలల గుండా లొడలొడ కారుతున్న వర్షపు నీరు.

ముక్కూ, మూతికి బొట్లు బొట్లుగా బురదంటి వికారంగా తయారైన బిడ్డరూపం.

కడుపులో దేవినట్టై, గుండెల్ని పిండినట్లై, కళ్లలోంచి వొలుకుతున్న దుఖాఁశ్రువయ్యాడు మస్తాన్.

తమ భంగపాటుకు ఎవరో “ఫక్కు”మంటూన్న భ్రాంతి! దిగ్గున తలెత్తేసరికి..

అదే బొమ్మ! బడి గోడ మీది బొమ్మ!

రోడ్డు కవతల బిల్డింగ్‌పై ఇంతెత్తు హోర్డింగ్ మీద.

పెన్సిల్ మీద పిల్లలు దగాపడ్డ తమను చూసి నింగినంటేలా నవ్వుతున్నట్లనిపించింది.

మొనదేలిన పెన్సిల్ బరిసెలా దూసుకొచ్చి గుండెల్లో దిగుతున్నట్లుంది. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలన్న మాటలు “కొందరే చదవాలి.. కొందరే ఎదగాల”న్న వికృతార్ధాన్ని వెక్కిరిస్తున్నాయి.

భవిష్యత్ స్వప్నం ఒకటి బురదలో ఒలికిన బాధ! అందుకోబోయిన అక్షరం అడుసులోకి తొక్కేసిన బాధ!!

 

 

అంత నిజాన్నీ ఇవ్వకు

swatikumari

 నేనడిగే ప్రశ్నలన్నిటినీ వినకు. అనుమానాల వంకతో బుకాయించే వీల్లేకుండా చేసే సమాధానాలు నీకు తెలిసినా చెప్పకు. ’నేనంటే నీకు అయిష్టం కదా? లోకంతో మననిలా కట్టిపడిసేది ఇంకా మిగిలున్న మన పాత్రల నటన మాత్రమే కదా?’  అని మాట తూలిన ఆ ఉన్మాద సమయాల్లో; ఇన్ని యుగాల బట్టీ ఎవరెవరో ఎవరెవర్నో అడక్కుండానే వదిలేసి వెళ్ళిపోయిన ప్రశ్నలన్నిట్నీ, ఒకవేళ అడిగానే అనుకో! విననట్టు ఉండిపో, ’అవున’ని నీకు ఎంత నిక్కచ్చిగా తెలిసినా సరే చెప్పావంటే నామీద ఒట్టే!

అవును భయమే, అడక్కముందే అన్ని నిజాల్నీ ఇచ్చేసేవాళ్లంటే! కాస్త వెలుతురు కావాలంటే ఆకాశాన్ని ఉదారంగా మన దోసిట్లోకి విసిరేసేవాళ్లంటే. అందుకే కాబోలు “నేను పక్షి కోసం ఎదురు చూస్తున్న పంజరాన్ని” అన్న కాఫ్కా గొంతుక వినబడుతూనే ’నాకిదంతా ఇవ్వొద్ద’నే పెనుగులాట త్రిపుర కవిత్వంలో మెలితిరిగింది. “అతను మిగతా అందరివాళ్లలాగే ఉంటాడు/కాకపోతే అతని కళ్ళు ఒక రకంగా చూస్తుంటాయ్/అంతకంటే మరేం లేదు.” అని సర్ది చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంలా ఉంటాయి త్రిపుర కాఫ్కా కవితలు. “నీకో నిర్ణీతమైన వస్తువు కావాలనుకుంటే నువ్వో ఖచ్చితమైన మనిషివవ్వాలి. నువ్వా మనిషిగా తయారయ్యాక  నీకా వస్తువెలానూ అవసరం ఉండదు.” అన్న జెన్ తాత్వికతలోని శున్యార్ధపు నిశ్శబ్ధమూ; ఆలోచిస్తుండటమూ, ఆలోచిస్తున్నట్టూ నటించడమూ ఒకటేననే కవి ఆరితేరినతనమూ ఉన్న కవితొకటి ఇక్కడ;

ఓ కాఫ్కా బర్నింగ్ థీం

 

పళ్లమధ్య ఓ సిగరెట్టుంచుకుని

ఓ మోస్తరుగా అలసిన నీ మనస్సు తలుపుల్ని అరమూసి

నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి

నీ దహన సంస్కారాన్ని ఇప్పుడు జాగ్రత్తగా చూస్తున్నావ్

 

చుట్టూ లోపలా చేరిన తొక్కూ తొటారం అంతటికీ

నిప్పంటించి మంటపెట్టి

ఖాళీ గదిలో వున్న నువ్వు

ఒక విసుగు అంచు నవ్వు సగం నవ్వి

ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని

ఒక పొగ వలయంగా గాలిలోకి వదిలేశావ్

 

ఆ మంటలో కాలుతూ అంతా నువ్వే

పొగలోంచి సగం మాడిన ఎగిరే కాగితపు ముక్కల్లాగా

నీ అస్థిరత్వపు తునకల్లాగా

ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా

 

కాని నువ్వు వాటికి నిజంగా నువ్వు కాని లాగా

నువ్వు అందరికీనూ ఎవరికేనానూ అనేలాగా

 

చచ్చిపోయిన కాఫ్కా అద్దెగది లోని

యిటుకల్ని వీధిలోకి

ఒకటీ ఒకటీ విసిరి

వేలం వేసి అమ్మినట్లుగా

అంతా అస్థిరంగా ఖాళీగా వేడిగా

దిశలేని ఎగురుడుగా

ఒక మంటగా.

—–**——

tripura

వ్యాఖ్యానం

శ్రద్ధగా చదువుతున్న పుస్తకాన్ని అకారణంగా పక్కన పెట్టేసి అన్నాళ్ళూ కుర్చీలకి పట్టిన దుమ్మునంతా దులిపేసి, అద్దాలమీది మరకలు తుడిచేశాక ఇక పుస్తకమూ, ఆలోచనా అనవసరం అనిపించే సందర్భాలుంటాయి. ఇక చెయ్యవలసింది దులపడమూ, శుభ్రం చెయ్యడమూ, సిద్ధం చేసుకోవడమూ తప్ప చదవడానికేం లేదని అప్పటికప్పుడే తేలిపోయే సమయాలొస్తాయి. అప్పుడు మనసు తలుపుల్ని సగం తెరిచేసరికి ముంచుకొచ్చిన అలసటో, మిగతా సగాన్ని తెరవనియ్యకుండా ఆజన్మాంతమూ పడ్డ అవస్థో తేలకుండానే, అప్పటిదాకా ఉంటున్న దేహపుగదిలోని “నాలుగు గోడల్నీ ఓసారి ఖాళీ కళ్లతో చూసి” ఒక నిష్క్రమణకు సన్నాహం మొదలౌతుంది.

కూడబెట్టటమూ, పోగుచెయ్యడమూ తలచుకుని అప్పటిదాకా గర్వంతో నవ్వుకున్న నవ్వు కాస్తా విసుగు స్వరంలో అంతమౌతుంది. తెలుసుకున్నవీ, నేర్చుకున్నట్టు నటించినవీ అన్నీ పేరుకుపోయి అస్తిత్వ రాహిత్యాన్ని దాదాపు అసాధ్యం చేస్తుంటాయి. తేలిగ్గా నవ్వుతూ, నడుస్తూ ఖాళీ చేతులూపుకుంటూ వెళ్ళిపోవాలంటే ఇన్నాళ్ళూ అవిరామంగా మేట వేసుకున్నదాన్నంతా, వెలుగుతున్న సిగరెట్టు మొనతో నిర్మోహంగా అంటించేసి “ఏకాంతపు కారణం స్పష్టంగా తెలియని నిరాశని/ఒక పొగ వలయంగా గాలిలోకి”  వదిలేయక తప్పదప్పుడు.

నిలకడలేనిదీ, నిలవలేనిదీ అంతా కరిగిపోయాక, బరువులేనివన్నీ గాలివాటున తేలిపోయాక, ఉలిపిరి కాగితాల్ని ఊదారంగు మంట మసిచేసి వదిలాక మిగిలిపోయే అక్షరాలు, ఊహలు ఎవెర్నుండి ఎవరిపైకో “ఓ సీతాకోక చిలుక హఠాత్ చపలత్వపు ఎగురుళ్ళులా” వెళ్ళి వాలిపోతాయి. ఆ ముగిసిపోయిన అస్థిరత్వం ముక్కలుగా, నీలోపల గతించిన  నీలాటి మరికొందరుగా, మరికొందరిలో ఇంకా మిగిలిపోయిన నీ ఆనవాళ్ళుగా, నువ్వొకప్పుడు ఉండి వదిలిపోయిన మరకగా, ఎప్పటికీ లోకంనుండి తుడిచెయ్యలేని చరిత్ర గుర్తుగా మిగలక తప్పదు.

వీలునామాల్లో చేరని విలువలేని వస్తువులు, ప్రచురించడానికి ఇష్టపడని డైరీలూ మాత్రమే వదిలేసి, మౌనంగా రాసుకోవడం తప్ప మరేం చేతగానితనానికి క్షమాపణలు కూడా చెప్పకుండా, నిర్లక్ష్యంగా తెల్లవారు ఝాము నిద్రలోంచి నడుచుకుంటూ నిశ్శబ్ధంగా వెళ్ళిపోతాడు రచయిత. రేపటి తరాల్లో ఎవరికో ఇతను వదిలెళ్ళిన తలరాతలు ఆ ఖాళీ గదిలో అదృశ్యంగా “దిశలేని ఎగురుడుగా/ఒక మంటగా” కదులుతుంటాయి.

——*—–

 

చిత్రం: అన్వర్

తాత ముత్తాత పేరేమిటి?!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

తాత ముత్తాత పేరేమిటి?!

మీ తాత ముత్తాత పేరేమిటి?!

మీ వంశవృక్షం గురించి మీకు ఎంత తెలుసో పరీక్షించడం కోసం ఈ ప్రశ్న వేశానని దయచేసి అపార్థం చేసుకోకండి. మా తాత ముత్తాత(అంటే మా తాతగారి ముత్తాత అన్నమాట) పేరు నాకు తెలియదని చెప్పడానికే ఇలా ప్రారంభించాను. నాలానే ఈ దేశంలో చాలామందికి తాత ముత్తాత పేరు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను. తన పుట్టినతేదీ ఏమిటో చెప్పలేని వాళ్ళు కూడా ఈ దేశంలో చాలామందే ఉన్నారు. బహుశా మీకు కూడా అలాంటివారు తారసపడే ఉంటారు.

మా తాత ముత్తాత పేరు నాకు తెలియదన్న వాస్తవం గుర్తొస్తే  సిగ్గుతో చితికి పోతూ ఉంటాను.  ఈ దేశం వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఉన్న ఒక గొప్ప దేశమనీ; ఈ సంపదకు నేను వారసుడిననే భావన  ఆ క్షణాలలో ఒక పెద్ద మిథ్యగా నాకు అనిపిస్తుంది. ఈ దేశం నాకు ఏదీ కానట్టు, వేళ్ళు తెగిపోయిన ఒక చెట్టులా నేను శూన్యంలో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. తాత ముత్తాత పేరు (అంటే కనీసం అయిదు తరాలు) కూడా తెలియని వాళ్ళం  ఈ దేశం నాదని ఎలా గర్విస్తామో, వేల సంవత్సరాల ఈ దేశ గతంపై హక్కు ఎలా చాటుకుంటామో నాకు అర్థం కాదు.

ఈ నేల అనే చెట్టుతో మన బతుకులనే తీగలు గాఢంగా అల్లుకున్నాయనడానికి తాత ముత్తాత పేరు తెలియడం ఒక సాక్ష్యం అని నేను భావిస్తాను.

అదృష్టం కొద్దీ మనకు మన తాత పేరు, ముత్తాత పేరు తల్లిదండ్రుల ద్వారా తెలుస్తాయి. ఆపైన తద్దినం తంతు వారి పేర్లను విధిగా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. అయితే, మన తాత ముత్తాత ఎవరో అదీ చెప్పదు. తద్దినంలో మనం ముగ్గురికే పిండప్రదానం చేస్తాం. తండ్రి-తాత-ముత్తాత. అలాగే, తల్లి-నాయనమ్మ-ముత్త నాయనమ్మ. తండ్రిని వసురూపంలో, తాతను రుద్ర రూపంలో, ముత్తాతను ఆదిత్యరూపంలో తద్దినం మంత్రాలు పేర్కొంటాయి. పద్ధతిగా తద్దినాలు పెట్టని  కులాలలో, కుటుంబాలలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటే తప్ప తాత ముత్తాతల పేర్లు కూడా గుర్తుండే అవకాశం లేదు.

మా తాతగారి గురించి నాకు కొంత తెలుసు. అది కూడా స్పష్టాస్పష్టంగా. ఆయన మంచి రంగులో ఉండేవాడట. మేము వైదికులమైనా మాకు కరణీకం ఉండేది. మా తాతగారు హాస్యప్రియుడు. కొంటె కోణంగి అనేవారు. ఇంటిముందు ప్రత్యేకంగా నిర్మించిన కచేరీ సావిట్లో కూర్చుని వీధిలో వచ్చి పోయేవారిని ఆట పట్టిస్తూ, వాళ్ళకీ వీళ్ళకీ ముడులు పెడుతూ ఉండేవాడట. ఆయన రసికత గురించి కూడా చాలా కథలున్నాయి. ఆయన చనిపోయేనాటికి మా నాన్నగారి వయసు పన్నెండేళ్లే.  ఎప్పుడైనా వాళ్ళ నాన్న గురించి ఆయన గొప్పగా చెప్పడం ప్రారంభిస్తే మా అమ్మ అడ్డు తగిలి ఆయన రసికపురాణం గుంభనంగా విప్పుతూ ఉండేది. ఆయన  వడ్డిగూడెం ‘పరిచయాలు’ ప్రస్తావనకు వస్తుండేవి. మా తాతగారు మా పక్క ఊళ్ళో ఒకామెచేత  ‘సంతానవ్రతం’ చేయిస్తే ఆమెకు సంతానం కలిగిన సంగతిని నర్మగర్భంగా చెప్పి మా అమ్మ ఆట పట్టిస్తూ ఉండేది. నాన్నగారు ముసి ముసి నవ్వులతోనే చికాకు ప్రదర్శిస్తూ సంభాషణకు తెరదించేవారు.

విశేషమేమిటంటే, చిన్నప్పుడు ఏమీ అర్థంకాని వయసునుంఛీ అమ్మ నోట వింటూ వచ్చిన ఆ పేరుగల మనిషిని పెద్దయ్యాక నేను చూసే అవకాశం కలగడం! ఏదో పని మీద ఆ ఊరికి వెళ్లినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాను. తొంభై ఏళ్ళు దాటిన వయసులో ఆమె మంచం మీద ఉంది. నేను ఫలానా అని చెప్పేసరికి ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు  తళుక్కుమంది. నా చెయ్యి అందుకుని మంచం మీద తన పక్కన కూర్చొబెట్టుకుంది. కన్నీళ్ళు పెట్టుకుంటూ మా నాన్న గురింఛీ, బాబయ్యల గురించీ పేరు పేరునా అడిగింది. ఏ నాటి జ్ఞాపకాలు కన్నీళ్ళ రూపంలో అలా ఉబికి వచ్చాయోనని ఆ దృశ్యం గుర్తొచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది.

భమిడిపాటి కామేశ్వర రావు గారు

భమిడిపాటి కామేశ్వర రావు గారు

మా తాతగారికి  హాస్యప్రవృత్తి  ఎవరి నుంచి సంక్రమించిందో, దాని వెనుక నున్న జన్యుచరిత్ర  ఏమిటో నాకు తెలియదు. ఆ జన్యు లక్షణమే హాస్యబ్రహ్మ బిరుదుతో భమిడిపాటి కామేశ్వరరావు అనే రచయితను సృష్టించిందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. భమిడిపాటి కామేశ్వరరావుగారి తల్లి మన ఇంటి ఆడబడుచు అని నాన్నగారు చెబుతుండేవారు. నా చిన్నప్పుడు భమిడిపాటి కామేశ్వరరావుగారి భార్యకూ మా నాన్నగారికి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవని జ్ఞాపకం. మా నాన్నగారు ఆకివీడు(పశ్చిమ గోదావరి జిల్లా)వెళ్లినప్పుడు ఆమెను చూసి వస్తూ ఉండేవారు. కామేశ్వరరావు గారి కొడుకు, ప్రసిద్ధ నాటక, సినీ రచయిత రాధాకృష్ణ.  మా నాన్న, బాబయ్య ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెడితే నెత్తిన పెట్టుకునేవాడు. ఆయనకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉండేది. జాతకచక్రాలు వేసి ఇచ్చేవాడు. ఆయనకు మా కుటుంబంతో వియ్యమందాలని ఉండేది. కానీ ఎందుకో అది సాధ్యపడలేదు.

మళ్ళీ రాధాకృష్ణగారికీ హాస్యవారసత్వం ఉంది. ఆయన రాసిన ‘కీర్తిశేషులు’ నాటకంలో కవిగారి అన్న, తాగుబోతు అయిన మురారికీ; గంప శంకరయ్య అనే పాత్రకూ మధ్య జరిగిన ఒక సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే హాస్యగుళిక. గంప శంకరయ్య కవికి సన్మానం చేస్తానంటూ వస్తాడు. మక్కికి మక్కి కాకపోయినా ఆ సంభాషణ మొత్తంమీద ఇలా సాగుతుంది:

మురారి: ఓహో, అలాగా! అయితే, మీది సన్మానాల వ్యాపారం అన్నమాట?

గంప శంకరయ్య: భలేవారండీ. నాకు పొలం పుట్రా గొడ్డు గోదే ఉన్నాయండీ!

మురారి: అయితే ఇంకేం, బాగా లాభాలు గడించారన్నమాట!

ఇక మా ముత్తాతగారి గురించి ఒకే ఒక్క విషయం తప్ప ఇంకేమీ తెలియదు. మా అమ్మగారి తండ్రి కూడా మా ఇంటి మరో ఆడబడుచు కొడుకు. వారిది నిడదవోలు దగ్గర పురుషోత్తపల్లి. ఇంటిపేరు ఈమనివారు. మా అమ్మ తండ్రి కడుపులో ఉన్నప్పుడు మా ముత్తాతగారు పురిటిమంచం నెత్తిన పెట్టుకుని పొద్దుటే చీకటితోనే మా ఊరు ప్రక్కిలంకలో బయలుదేరి గోదావరి గట్టు వెంబడే కొవ్వూరు, వాడపల్లి, మద్దూరు మీదుగా మధ్యాహ్నానికి పురుషోత్తపల్లి చేరుకున్నారట. దాదాపు నలభై కిలోమీటర్ల దూరం.  ఆయన మోసుకెళ్లింది నిజానికి పురిటి మంచం కాదు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థా వారసత్వం. గణవ్యవస్థలో  స్త్రీ పోషణ, బాగోగుల బాధ్యత భర్తది కాదు; పుట్టింటిది, అంటే అన్నదమ్ములది.

బహుశా తన నాయనమ్మ నుంచి మా అమ్మకీ హాస్యజన్యువు సంక్రమించినట్టుంది. ఆమెలోనూ హాస్యధోరణి ఉండేది. మొత్తంమీద మా ఇంట్లో ఆడా, మగా అందరికీ హాస్యం జీవలక్షణంగా మారింది.

మా ముత్తాతనుంచి ఇంకా వెనక్కి వెడితే అంతా శూన్యం. ఎవరి గురించీ ఏమీ తెలియదు. ఎంత చరిత్ర, ఎన్ని విశేషాలు, ఎన్ని ఆకర్షణీయ వ్యక్తిత్వాలు కాలగర్భంలో సమాధి అయిపోయాయో తెలియదు. తాత, ముత్తాతల గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. ఇలా నా వంశ చరిత్రాశూన్యత నిలువునా వెక్కిరిస్తూ నాలో ఒక శూన్యాన్ని నింపిన ఘడియల్లో ఈ దేశం గురించీ, ఈ దేశ వారసత్వం గురించీ చెప్పే గొప్ప గొప్ప మాటలన్నీ నాకు అబద్ధాలుగా ధ్వనిస్తాయి. అఘాయిత్యాలుగా తోస్తాయి.

రెండు తరాల చరిత్ర కూడా తెలియని మన చారిత్రకదారిద్ర్యం అలా ఉండగా, ఒక ఆఫ్రో-అమెరికన్ రచయిత కొన్ని ప్రత్యేకపరిస్థితులలో తన వంశమూలాలు వెతుక్కుంటూ వెళ్ళి ఒక అత్యద్భుత గ్రంథాన్ని రచించాడు. అతని పేరు ఎలెక్స్ హేలీ. ఆ పుస్తకం పేరు ‘రూట్స్’. తెలుగులో సహవాసి అనువాదంతో ‘ఏడు తరాలు’ పేరుతో వెలువడిన ఆ రచన పాఠకులకు సుపరిచితమే. తెలిసిన రచనే అయినా దాని గురించి నేను ప్రస్తావించడానికి నా అధ్యయన సంబంధమైన ప్రత్యేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత.

 – కల్లూరి భాస్కరం

 

తెలుగు వాడి నవ్వు నరం…

mullapudi budugu

(రమణ గారు కన్ను మూసినప్పుడు..)

 

తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది.

తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.

మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల “నోటు” మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.
ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు…అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి

మాటలు…బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం.
వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

(25 ఫిబ్రవరి 2011, ‘ఆవకాయ’ నించి..)

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు …

ramana

 

ముళ్ళపూడి వెంకట రమణ అనే మహానుభావుడితో నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేసి, రెండు, మూడు సార్లు  ధైర్యంగా ఎదురుపడి నమస్కారం కూడా పెట్టి, వీలుంటే ఆయన చెయ్యి ముట్టేసుకుని పవిత్రం అయిపోయి .అక్కడితో ఆగిపోకుండా ఆయనకీ, తమకీ ఎంతో అవినాభావ సంబందం ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేసుకుంటూనే, కొందరు అమెరికా “ప్రముఖ ప్రబుద్దులు” నేను కూడా అలాగే నా పాప్యులారిటీ పెంచుకోవడం కోసం ఆయన పేరుని “cash” చేసుకుంటున్నాను అనుకునే ప్రమాదం పొంచి ఉంది అని నాకు తెలుసు. అటువంటి వారితో నేను “అమెరికోతి కొమ్మచ్చి” ఆడదలచుకో లేదు. అయినా ఆయన 81 వ జన్మదిన సందర్బంగా ముళ్ళపూడి గారిని తల్చుకుని, ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందిద్దామనీ, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుందామనీ ఈ చిన్న వ్యాసం లో నా అతి చిన్న ప్రయత్నం.  

Bapu & Ramana releasing my book

కొంచెం సిగ్గుగానే ఉన్నా… ముందుగా ఇటీవల జరిగిన…జరగని ఒక సంగతి చెప్పుకోవాలి.

క్రిందటి మార్చ్, 2013 లో నేను ఇండియా వెళ్ళినప్పుడు, తాడేపల్లి గూడెం లో ఒక కాలేజ్ వారు కొన్ని అమెరికా వ్యాపార రహస్యాలను లో MBA విద్యార్ధులకి బోధించమని కోరగా నేను కాకినాడ నుంచి మా మేనల్లుడు అద్దంకి సుబ్బారావు తో కారులో అక్కడికి బయలు దేరాను.

నాకు ముందు తెలియదు కానీ, మేము ఒక ఊరు చేరగానే “మామయ్యా, ఇదే ధవళేశ్వరం, అదిగో అక్కడే కాటన్ దొర..” అని ఏదో అనబోతూ ఉంటే “ఆపు, కారు, ఆపు” అనేసి “ముళ్ళపూడి గారి మేడ దగ్గరకి పోనియ్ “ అన్నాను నెర్వస్ గా. ఒకే క్షణంలో అంత ఆనందము, అంత విచారము నాకు నా జన్మలో ఎప్పుడూ కలగ లేదు. “ముళ్ళపూడి రమణ గారు పుట్టిన పుణ్య క్షేత్రం ధవళేశ్వరం చూడగలిగాను.”  అని ఆనందం అయితే, “అయ్యో, కాస్త ముందు ఈ సంగతి తెలిస్తే ‘గోదావరి పక్కన గురువు గారి మేడ’ ఉందో లేదో వివరాలు కనుక్కుని కనీసం ఆ ప్రాంగణం లో అడుగు పెట్టి ధన్యుణ్ణి అయ్యే వాడిని కదా..అపురూపమైన అవకాశాన్ని అందుకోలేక పోయాను కదా” అని ఎంతో విచారించాను.

అన్నింటి కన్నా విచారం అక్కడ ఉన్న కాస్త సమయంలో ముళ్ళపూడి గారి ఇంటి గురించి ఎవరిని అడిగినా వారు వెర్రి మొహాలు పెట్టడం, కాటన్ దొర గురించి అడిగితే “అదిగో ఆ విగ్రహం దగ్గర ఫోటో దిగండి” అని సలహా ఇచ్చివ వారే!

“అలాంటివన్నీ ముందు వెబ్ లో చూసుకు రావాలి మామయ్యా, లోకల్ వాళ్లకి ఎవడికి కావాలీ?” అన్నాడు మా మేనల్లుడు. తెలుగు వారి సంస్కృతి నేల మీద వెల వెల బోతున్నా, వెబ్ లో వెలుగులు చిమ్ముతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలీ?

Mullapudi

ఇక ముళ్ళపూడి గారితో నా మొదటి పరోక్ష పరిచయం మా బావ గారు నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా జరిగింది. మా బావ గారు, బాపు-రమణలు  మద్రాసు లో కేసరి హై స్కూల్ లో చిన్నప్పుడు  సహాధ్యాయులు. ఇప్పుదు హైదరాబాద్ లో ఆయన సీనియర్ అడ్వొకేట్. నేను వ్రాసిన నా మొదటి నాటకాన్ని (బామ్మాయణం అను సీతా కల్యాణం”) మా బావ గారు చదివి, 1970 ప్రాంతాలలో “ఇలాంటి సరదా డ్రామాలంటే బాపు-రమణ లకి ఇష్టం. ఇది వాళ్లకి పంపించి అభిప్రాయం అడుగుదాం” అని అనుకుని, నాతో చెప్పకుండానే ఆ నాటకాన్ని మద్రాసు పంపించారుట. ఈ విషయం చాలా సంవత్సరాల తరువాత రమణ గారు ఏదో మాటల సందర్భంలో చెప్పారు.  “కన్నప్ప” గారి కేసులో రమణ గారు మా బావ గారిని లీగల్ సలహాకి సంప్రదించారు అని విన్నాను. అప్పటికే అంతా అయిపోయింది.

ఆ తరువాత అనేక సందర్భాలలో ముళ్ళపూడి గారితో నా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలు గానే మహదానందంగా సాగింది. అందులో పరాకాష్టగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు”  (డిశంబర్ 31, 2006- జనవరి 1, 2007,  హైదరాబాద్) లో బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి…అంటే రమణ గారి కథ కి బాపు బొమ్మ గీసి ప్రచురించబడి అప్పటికి అరవై సంవత్సరాలు నిండాయి. సన్మానాలకీ, సత్కారాలకీ ఎప్పుడూ దూరంగా ఉండే వాళ్ళిద్దరూ మొట్ట మొదటి సారిగా సతీ సమేతంగా మా సత్కార సభకి వచ్చి, రెండు రోజులూ పూర్తిగా సభలలో పాల్గొని నా మీద వ్యక్తిగతంగా ఎంతో అభిమానం చూపించారు. విశేషం ఏమిటంటే, ఇప్పటికీ ఏ టీవీ వారైనా బాపు -రమణ ల మీద  ఏ సందర్భంలో టీవీ క్లిప్స్ చూపించినా, ఆ ఇద్దరి వెనకాల back drop  ఎప్పుడూ ఆ నాటి మహా సభలదే ఉంటుంది.

ఆ సభలో వంగూరి ఫౌండేషన్ ముళ్ళపూడి గారికి “జీవన సాఫల్య పురస్కారం” అంద చేశాం. ఆ మహా సభలు పూర్తి అయ్యాక నాలుగు రోజులలో నాకే ఆయన ఐదు వేల రూపాయల చెక్కు పంపించారు. నేను ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి “ఎందుకు సార్ “ అని భోరుమని ఏడవగానే ఆయన నన్ను బుజ్జగించి “అది కాదు నాయనా…దేనికైనా ఓ పద్ధతి ఉండాలి కదా..మీ సభలకి నేను, మా ఆవిడా వచ్చినప్పుడు మా అబ్బాయి ప్రతీ రోజు మా హోటల్ కి వచ్చి మాతో బాటు భోజనం చేసాడు. వాడు నీ గెస్ట్ కాదుగా..వాడి తిండి ఖర్చు నాదేగా ..అందుకూ ఆ చెక్కు. తక్కువైతే చెప్పు. ఇంకోటి పంపిస్తాను.”  అన్నారు.అదీ ఆయన పద్ధతి.

అంతకు ముందే నా మొట్టమొదటి కథల సంపుటి “అమెరికామెడీ కథలు” అనే పుస్తకాన్ని ప్రచురిస్తే బావుంటుంది కదా అనే ఊహ నాకు కలిగినప్పుడు  తక్షణం మూడు “కోతి కొమ్మచ్చులు” నా మనసులో మెదిలాయి. మొదటిది ఆ పుస్తకం బాపు-రమణలకి అంకితం ఇవ్వాలి.  రెండోది వారి చేత ‘ముందు మాట” వ్రాయించుకోవాలి. ఇహ మూడోది బాపు గారి చేత ముఖ చిత్రం వేయించుకోవాలి. వెనువెంటనే బాపు గారిని యధాప్రకారం భయ భక్తులతో ఫోన్ చేసాను. యధాప్రకారం అభిమానంగా ఆప్యాయంగా, క్లుప్తంగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. “అంకితం” విషయం వినగానే  “వెంకట్రావ్ ఇక్కడే ఉన్నారు అడిగి చెప్తాను.” అని చెప్తాను అన్నారు. ఇక ముందు మాట . ముఖ చిత్రం గురించి కూడా వినగానే ముళ్ళపూడి గారే స్వయంగా ఫోన్ అందుకుని “అంకితానికెంతా, ముందు మాటకెంతా, ముఖ చిత్రాని కెంతా …ఒక్క అంకితానికెంతా, ముందుమాట కెంతా   ..ఏమైనా కన్సెషన్ ఉందా…” అని చమత్కరిస్తూ… హాయిగా అన్నింటికీ ఒప్పేసుకున్నారు.

నేను ఎప్పుడు మద్రాసు వెళ్ళినా రమణ గారిని చూడడం తప్పని సరి. ఆఖరి సారిగా రమణ గారు మనల్ని ఈ భూప్రపంచంలో వదిలేసి తను స్వర్గానికి వెళ్ళిపోడానికి కొన్ని నెలల ముందు నేనూ, గొల్లపూడి గారూ వారింటికి వెళ్ళి, ఆయన తోటీ, బాపు గారి తోటీ గంటల తరబడి సరదాగా సీరియస్ విషయాలు, సీరియస్ గా సరదా విషయాలు అనేకం మాట్లాడుకున్నాం.

అలాంటి మధుర క్షణాలు కొన్ని చాలు … ఎవరికీ అందని పై, పై కొమ్మలకి ఎగిరి పోయి నాకు నేనే ఆనందించడానికి..

 

(రమణగారి రేఖాచిత్రం: అన్వర్ )

 

‘జ్ఞాపకాలే మైమరుపు’

  హైదరాబాద్ లామకాన్ లో శుక్రవారం సాయంత్రం   ముళ్ళపూడి వెంకట రమణ 82 వ పుట్టిన రోజు Kinige , కథ గ్రూప్ ల సంయుక్త నిర్వహణలో జరుగుతోంది. ఈ సందర్భంగా రమణగారి స్మరణ వ్యాసాలు ఈ వారం ప్రత్యేకం . 

ఎవరైనా శాస్త్రీయ సంగీతంలో కృషి చేస్తూ వుంటే, బాలమురళి కృష్ణలాగా పాడాలనుకుంటారు. దాదాపు ప్రతి కార్టూనిస్టు బాపూగారిలా బొమ్మలు వేద్దామనుకుంటాడు. క్రికెట్ ఆడే ప్రతి కుర్రాడూ తను కూడా తెండూల్కర్ లాగా అడాలనుకుంటాడు. అదేరకంగా కథలు వ్రాసే నాబోటి వాళ్ళు రమణగారిలా వ్రాయలనుకుంటారు. ముఖ్యంగా హాస్య కథలు వ్రాసేవాళ్ళు. కనీసం ఒక్క కథయినా ఆయన బాణిలో వ్రాస్తే, వ్రాశారని ఎవరైనా అంటే, ఇక వారి జన్మ తరించినట్టే!        

నేనూ చేశాను ఆ పని. గోపాలం, భామ అనే పేర్లు పెట్టి భార్యాభర్తల మధ్య జరిగే తీయటి చేదు నిజాల్ని హాస్యం రంగరించి మూడు కథలు వ్రాశాను. శయనేషు రంభ, కార్యేషు దాసి, కరణేషు మంత్రి అని. ఆంధ్రభూమి వారపత్రికలో ఆ కథలు ప్రచురింపబడ్డాయి. కొంతమంది పాఠకులు రమణగారి శైలిలో వున్నాయి అంటే, ఎవరూ చూడకుండా ఎగిరి గంతేసినట్టు కూడా గుర్తు. ఈ మధ్యనే యువ జంట సీత, సీతాపతిలతో భోజ్యేషు మాత కూడా వ్రాస్తే స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. ఇదెందుకు వ్రాశానంటే కథా రచయితల మీద రమణగారి ప్రభావం ఎంత వుందో చెబుదామని. మరి అది ప్రభావమా, కాపీనా అనే వాళ్ళు కూడా వున్నారు. ఇక్కడ నేను కానీ, ఇంకొకరు కానీ అయన కథలని కాపీ కొట్టటం లేదు. ఆయన రచనా శైలిని మాత్రమే. ఇలా భుజాలు తడుముకునే నాలాటి వాళ్ళ గురించి కూడా రమణగారు అన్నారు, కాపీ రైటు అంటే కాపీ కొట్టటం రైటు అని!

రమణగారి రచనల గురించి ఇక్కడ చెప్పటం, హనుమంతుడి ముందు గుప్పికంతులు వేసినట్టే! అందుకే ఆయన రచనల మధుర స్మృతులు మీకే వదిలేస్తున్నాను.

పంథొమ్మిది వందల అరవై – డెభైలలో అనుకుంటాను, రమణగారు గవర్నమెంటాలిటీ అనే కథ వ్రాశారు. ఆయన వ్రాసిన కథలు, పుస్తకాలూ అప్పటికే జీర్ణించుకుని ఆయనకి వీరాభిమానిగా మారిపోయిన నాకు, ఆ కథ ఎంతో నచ్చింది. అదీకాక ఆంధ్రప్రదేశపు ప్రభుత్వంలో రెండేళ్లు ఉద్యోగం వెలగబెట్టి, ఇక బెట్ట లేక, ఆ లంచాల అరాచకాన్ని భరించలేక, తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరాను. అమెరికా వచ్చాక ఆ ఆంధ్రప్రదేశ ప్రభుత్వంలోని నా చేదు  అనుభవాల్ని కాస్త హాస్యం, వ్యంగ్యం రంగరించి, గవర్నమెంటాలిటీ కథలు అని పధ్నాలుగు కథలు వ్రాస్తే, రచన మాసపత్రికలో శాయిగారు శీర్షికగా ఒక సంవత్సరం పైన ప్రచురించారు. ఎంతో మంది మిత్రులూ అభిమానులూ ఆ కథలు నచ్చాయనీ, పుస్తక రూపంలో తెమ్మని అడిగారు. రమణగారి చేత  ముందు మాట వ్రాయించుకొని, ఆ పుస్తకాన్ని ప్రచురించాలని ఆశ పడ్డాను. ఆయనకి వ్రాతప్రతి పంపించి, ముందు మాట వ్రాయగలరా అని అడిగితే, గలను అన్నారు, టీవీ భాగవతం సీరియల్ వ్రాస్తూ ఎంతో బిజీగా వుంటూ కూడాను. మళ్ళీ ఇంకోసారి సంతోషంతో ఎగిరి గంతులు వేయాల్సి వచ్చింది.

అంత బిజీగా వున్నా రమణగారు ముందుమాట అద్భుతంగా వ్రాశారు. నా కథలు పధ్నాలుగూ త్రాసులో ఒక పక్కన పెట్టి, ఆయన వ్రాసిన రెండు పేజీలు ఇంకో పక్కన పెడితే, తులసిదళంలా అదే బరువు తూగుతుంది.

“అసలు ఈ గవర్నమెంటాలిటీలూ, ఈ అవినీతి భాగోతాలూ మన వేదాలలోనే వున్నాయిష. వేదాలేమిటి, వాటిని పల్కించిన పురుషోత్తముడు సాక్షాత్ శ్రీమహావిష్ణువువారి వైకుంఠద్వారంలోనే ఆరంభామయాయిష! కలియుగంలో ఇదేమీ గొప్పకాదు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత బాలరూప ఋషులను, ద్వార పాలకులు జయవిజయులు గడప దగ్గరే, మద అహంకారాల కొద్దీ పో పొమ్మని అవమానించారు. దానితో వాళ్ళు కోపగించి, మామూళ్ళు ఇచ్చే బదులు, వాళ్లకి మామూలయిన శాపం ఇచ్చారు. విష్ణుమూర్తి పరుగున వచ్చి, తప్పు తన సేవకులదయినా వైకేరియన్ లయబిలిటీ సూత్రం ప్రకారం, బాధ్యత యజమానిగా తనదేనని చెప్పి, ఋషులని సముదాయించాడు. ఆయన ఆశ్రిత పక్షపాతం అంతటిది. దరిమిలాను ఏడు జన్మల కాలం భక్తులుగా, మంచివాళ్ళుగా బ్రతుకుతూ స్వామికి దూరంగా వుండలేమనీ, రాక్షసులుగా పాపాలూ పాడు పనులూ చేసి మూడు జన్మల్లోనే వెనక్కొచ్చేస్తామనీ వాళ్ళు వేడుకుంటే, వాళ్ళ ‘ఇది’కి పొంగిపోయిన స్వామివారు ‘సరే! అలాగే కానీయండి’ అన్నారు. దానివల్ల ఆ సేవకులు రాక్షసులై పుట్టి ముల్లోకాలనూ నానా హింసా పెట్టారు. సేవకులపై స్వామి కరుణ అమాయకులపై హింసకు అలా దారి తీసింది. తప్పు చేసినా తన వాళ్ళని కాపాడటం అనే గవర్నమెంటాలిటీ కూడా ఆ కాలంలోనే వుండేదష మరి!”

“మొత్తం మీద ఒక్క నిజాన్ని అందరూ గుర్తించటం శ్రేయస్కరమని తోస్తుంది. లంచం తీసుకునేవాడిది తప్పు అయితే, ఇచ్చేవాడిది తప్పుముప్పావు.. నిజానికి వీళ్ళందరూ కలిసి నడిస్తే, లంచం తీసుకునే వాళ్లందరూ చితికిపోతారు. కానీ వీళ్ళు, మనవాళ్ళు – కలవరు కదా! ఐకమత్యం లేదు గదా! అది లేకనే కదా గవర్నమెంటు. దానివల్లనే కదా గవర్నమెంటాలిటీ!” అన్నారాయన.

 satyam1

తర్వాత చాల రోజులకి ఇండియా వెళ్లాను. బెంగుళూరులో పని పూర్తిచేసుకుని, మద్రాసు మీదుగా గుంటూరుకి బయల్దేరాను. కాస్తో కూస్తో ముఖాముఖి పరిచయం వుంది కనుకా, వారి భక్తుడిని కనుకా, కొంచెం చనువు తీసుకుని ముందుగానే బాపు-రమణగార్లకు ఫోన్ చేశాను. వీలయితే మద్రాసులో దిగి ఒక మధ్యాహ్నం మీతో గడపాలని వుంది, మీకు ఫరవాలేదా అని అడిగాను. ఫరవా లేదంటే లేదన్నారు బాపుగారు. అయ్యో తప్పకుండా రండి అన్నారు రమణగారు. మా ఇల్లు ఎక్కడ అంటే ఆటో అతనికి తెలీదు, మాముట్టి ఇంటికి ఎదురుగా అని చెప్పండి ఏ ఇబ్బందీ లేకుండా తీసుకువస్తాడు అన్నారు బాపుగారు.

ఆయన చెప్పినట్టుగానే, మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి మాముట్టి ఇంటికి పోనిమ్మన్నాను. ఆటో అంకుల్ (ఇప్పుడు ఇండియాలో ఆటోవాడు అనకూడదు) నావేపు ఒక మలయాళం చూపు విసిరి, మెరీనా బీచ్ మీదుగా మాముట్టి ఇంటికి తీసుకు వెళ్లాడు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు పన్నెండు గంటలయింది. ఆ ఎండలో, తెల్లటి చొక్కా లుంగీ వేసుకుని, ఇంటి ముందర ఎండలో నుంచొని వున్నారు రమణగారు. నన్ను చూడగానే, నవ్వుతూ “అమ్మయ్య! వచ్చేశారా, రండి” అంటూ ఆహ్వానించారు.

నేనూ చేతులు జోడించి “నమస్కారం, గురువుగారు. ఎండలో నుంచున్నారేమిటి సార్!” అన్నాను.

“ఏం లేదు. మీకు ఈ రోడ్లు కొత్త కదా.. కనుక్కోవటం కష్టమేమోనని.. “ అన్నారాయన.

“అదేమిటి సార్! అమెరికానించీ ఇక్కడికి వచ్చినవాడిని, స్టేషన్నించి మీ ఇంటికి రాలేనా.. పెద్దవారు ఎండలో నిలబడ్డారు..” అన్నాను నొచ్చుకుంటూ.

ఆయన నవ్వి, భుజం మీద చేయి వేసి “పదండి!” అని ఇంట్లోకి తీసుకు వెళ్లారు.

బాపూగారికి కూడా నమస్కారం చేశాను. రమణగారు బాసింపట్టు వేసుకుని కుర్చీలో కూర్చుంటే, బాపుగారు బాసింపట్టు వేసుకుని నేలమీద కూర్చున్నారు. నేనూ బాపుగారికి ఎదురుగా బాసింపట్టు వేసుకోకుండా, వజ్రాసనం వేసుకుని నేల మీదే కూర్చున్నాను.

ఆ మధ్యాహ్నం నేను ఏనాటికీ మరువలేని రోజు. సాహిత్యం, సంగీతం, సినిమాలు… ఎన్నో విషయాలు.  బాపు-రమణగార్లతో మాట్లాడటమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. నేనూ ఎన్నో పుస్తకాలు చదివాను కనుక, తెలుగు సాహిత్యం అంటే  నాకు ప్రాణం కనుక, ప్రతి నిమిషం ఒక అనుభూతిని మిగిల్చింది. మందహాసాల నించీ అట్టహాసాల దాకా పడీ పడీ నవ్వించిన రోజు. భలే మంచి రోజు! పసందైన రోజు!!

“గోదావరి కథలు చదివారా?” అని అడిగారు రమణగారు. లేదన్నాను.

“అదేమిటి. మీరు తప్పకుండా చదవాలి. ఉండండి నా కాపీ ఇస్తాను” అని అది తెచ్చి ఇచ్చారు.

“అయ్యో! ఇది మీ పుస్తకం. మీరు వుంచుకోండి. నేను విశాలాంధ్రలో కొనుక్కుంటాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు. తీసుకోండి” అన్నారాయన.

“పోనీ, చదివి పోస్టులో తిరిగి పంపిస్తాను” అన్నాను.

“లేదు, అచ్చంగా వుంచుకోండి” అన్నారు నవ్వుతూ.

అంతేకాదు, ఆయనకి నా గవర్నమెంటాలిటీ కథలు బాగా గుర్తున్నాయి.

“అందులోని మీ సరస్వతీ నమస్తూభ్యం కథ నాకు బాగా నచ్చింది. అలాటి విషయం మీదే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు చదువులా చావులా అని ఒక పుస్తకం వ్రాశారు. మీకు బాగా  నచ్చుతుంది. నా దగ్గర ఒక కాపీ వుంది. తీసుకోండి” అని, వద్దన్నా వినకుండా అది కూడా తెచ్చి ఇచ్చారు.

తర్వాత వారితోపాటే అక్కడ భోజనాలు. భాగ్యవతిగారు, శ్రీదేవిగారు దగ్గర వుండి ఎంతో అప్యాయంగా,

ఆత్మీయంగా అన్నీ అడిగి, అడిగి వడ్డించారు.

భోజనాలయాక మళ్ళీ రమణగారు కుర్చీలో, బాపుగారు నేల మీదా బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. “ఇక వెడతాను సార్! ట్రైనుకి సమయమయింది. వెళ్ళేముందు మీ పాదాలకి దణ్ణం పెట్టి వెడతాను. కాళ్ళు

చాపండి” అన్నాను, ఆ బాసింపట్టు లోపల భద్రంగా దాచుకున్న పాదాలను  చూస్తూ.

“మీరు అమెరికా వాళ్ళు, షేక్ హ్యాండ్ ఇవ్వండి చాలు” అన్నారు రమణగారు.

“నేను అమెరికాలో వుంటున్నా, భారతీయుడినే సార్! కాళ్ళు చాపరూ..” అన్నాను.

ఆయన కాళ్ళు క్రిందికి దించారు. పాదాభివందనం చేశాను.

“బాపుగారూ, మీరూ కాళ్ళు చాపండి” అడిగాను.

“నేను నా కాళ్ళు ఇవ్వనుగాక ఇవ్వనుగాక ఇవ్వను” అన్నారు బాపుగారు కాళ్ళు ఇంకా ముడుచుకుంటూ.

“అదేమిటి సార్! నాకు తృప్తిగా వుంటుంది.. మీరు కాళ్ళు చాపేదాకా నేను వెళ్ళను. తూర్పు వెళ్ళే రైలు తప్పిపోతుంది. ప్లీజ్..” అన్నాను.

ఆయన పాదాలు ముందుకి పెట్టారు. నేను పాదాలకి నమస్కరించాను.

రమణగారు చెప్పులు వేసుకుంటూ, “రండి మా కారులో వెడదాం” అన్నారు.

“వద్దండీ ఈ ఎండలో మీరెందుకు.. నేను ఆటో తీసుకు వెడతాను” అన్నాను.

“ఏం ఫరవాలేదు.. పదండి” అన్నారు రమణగారు.

వాద ప్రతివాదాలయాక, న్యాయవాది బాపుగారు “పోనీ వెంకట్రావ్ రాడులెండి. మా డ్రైవర్ మిమ్మల్ని దించి వస్తాడు” అన్నారు జడ్జిమెంట్ ఇస్తూ.

కారులో స్టేషనుకి వెడుతుంటే, నా కెందుకో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. బాపు రమణలు వారివారి రంగాల్లో ఎంతో గొప్పవాళ్ళు. చిత్రకళారంగంలోనూ, సినిమారంగంలోనూ, సాహిత్యంలోనూ తిరుగులేని మనుష్యులు. ప్రప్రంచ ప్రఖ్యాత ప్రముఖులు. వయసులో నాకన్నా ఎంతో పెద్దవారు. మరి నేనో.. రమణగారి బుడుగు భాషలో చిన్నవాడిని, ఎంతో చితకవాడిని. అసలు నేను వాళ్లకి ఏమవుతాను? స్వంత ఇంటి మనిషిలా నా మీద ఇంత ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎందుకు చూపించాలి? రమణగారు మిట్ట మధాహ్నం మండుటెండలో అలా నుంచొని ఎదురు చూస్తున్నారే, ఎందుకు? దానికి ఒక్క మాటలో ఒక్కటే సమాధానం. అది వారి సంస్కారం. అక్కడ నేను.. నేను కాకుండా ఇంకెవరైనా వున్నప్పుడు కూడా, బాపు రమణగార్లు అలాగే గౌరవమిస్తారు. ఆ గౌరవం నాకు దక్కింది కానీ, వాళ్ళు ఇచ్చిన గౌరవం నిజంగా వారి సంస్కారానికి! వారి సహ్రుదయతకి!

తర్వాత ఏడేళ్ళకి, 2007లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ వారి ప్రప్రధమ ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు జరిగింది. అక్కడ బాపు రమణల స్నేహానికి షష్ఠిపూర్తి ఘనంగా జరిపారు మిత్రులు వంగూరి చిట్టెన్ రాజు. బాపు రమణగార్లని పరిచయం చేస్తూ, ఒక వ్యాసం వ్రాసి చదవమంటే, వెంటనే ఒప్పేసుకుని నా ప్రాణం పెట్టి చక్కటి వ్యాసం వ్రాసి, వారిని పరిచయం చేశాను. ఆ రోజే నా ఎన్నారై కబుర్లు ఒకటి, మరోటి పుస్తకాలు బాపు రమణగార్లు ఆవిష్కరించారు.

అంతకన్నా నాకు జీవితంలో కావలసిందేముంది!

రమణగారి రచనల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. సరదాగా వ్రాస్తూనే, హఠాత్తుగా సాంఘిక, రాజకీయ, మానవతావాదంతో చెంప చెళ్లుమనేలా కొట్టి మరిచిపోకుండా చేసే రచనా చాతుర్యం.

మచ్చుకి కొన్ని: (అంటే అరడజను)

“నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో”

“సిఫార్సులతో కాపురాలు చక్కబడవు”

“సత్యాన్వేషికి సమాధానమేమిటని ఒక గణిత శాస్త్రజ్ఞుడిని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ వన్ అంటాడు”

“పగటి కల అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. మనసులో పేరుకుపోయిన దురాశలనీ నిరాశలనీ, అందీ అందని ఆశలుగా పరిమార్సివేసే మందు. మితంగా సేవిస్తే, గుండెకూ, కండకూ పుష్టినిచ్చే దివ్యౌషధం”

“టైము అనగా కాలము. చాల విలువైనది. బజార్లో మనం మిరపకాయలు కొనగలం. చింతపండు కొనగలం. ఇడ్లీలు, కిడ్నీలు కొనగలం. గొడుగులు, గోంగూర కొనగలం. బాల్చీలు, లాల్చీలు కొనగలం. కానీ కాలాన్ని మాత్రం కొనలేం. కాలాన్ని వృధా చేయటం క్షమించరాని నేరం”

“వారానికి అర్ధ రూపాయి ఇస్తే, రోజూ హోటల్ భోజనపు ఎంగిలాకులన్నీ నువ్వొచ్చే వరకు వుంచి, నువ్వు రాగానే పడేస్తా!”

ఇలాటివి చదువుతుంటే, శ్రీశ్రీలా ఆకలేసి కేకలే వెయ్యఖ్కర్లేదు, రమణగారిలా ఆకలేసినప్పుడు జోకులేసి కూడా చెప్పొచ్చు అనిపిస్తుంది.

దటీజ్ రమణ!

వెంకట రమణ!!

ముళ్ళపూడి వెంకట రమణ!!!

మీరు ఎక్కడికీ వెళ్ళలేదు సార్!

ఇక్కడే సజీవంగా వున్నారు!

మీ రచనల్లో!

తెలుగు సాహిత్యంలో!

మా హృదయాల్లో!

0                           0                           0

 

ఎక్కడికో ఈ నడక!

poornima
ఆలోచనా దారాల వెంట
ఒక్కో పోగు లెక్కేస్తూ
నడుస్తున్నాను….
నడుస్తున్నాను
నిజానికి నాది నడకేనా?
ఎక్కడికో ఈ నడక
ఎడతెరిపిలేని ఆలోచనల నడక
అలా అనంతంలో నేనో
నాలో అనంతమో
ఏమో…చిక్కీ చిక్కని
చిదంబర రహస్యo
అదేదో తెలుసుకోవాలని
ఆశతో ఇంకో రెండడుగులు
ఈ ఆలోచనా సుడులు
నిరంతరం నాలో సంచరిస్తూ
అప్పుడప్పుడు నేను వాటిల్లో సంచలిస్తూ
కదిలే కెరటాలపై కలలధారలు
ఎప్పటికప్పుడు కొత్త నీరుని ఆస్వాదిస్తూ…
నేనే ఒక జాగృత స్వప్నాన్నో
స్వప్నకాల లిప్తావస్థకు సమాధానరూపాన్నో
స్వప్నంతో సంచరిస్తున్నానో
స్వప్నంలోనే చరిస్తున్నానో
ఎంత నడిచినా
అంతూ పొంతూ లేని నడక
నిజానికిది నడకేనా?
అక్కడిక్కడే తిరుగాడే చక్రభ్రమణమా?
చంచలమైన ఆలోచనల
అచంచల గమనమా ఇది!?
అలుపెరుగని ఆత్మశోధనల
ఆగని అంతర్మధనమా ఇది!?
ఏమో..
ఏదో ఒక దరి చేరితే కానీ తెలియదు
నడక ఆగితేకానీ  నిర్ణయం కాదు
నిర్ధారణకొస్తే కానీ నడక ఆగదు…

మాట పడాలనుకుంటా

393764_176060322482234_16821319_n
మాట పడాలనుకుంటా. మనసున్న మనుషుల్తో. మానవత్వపు కొరడాల్తో.
నిబద్ధత నిప్పుల్తో.
జారుతున్నప్పుడల్లా. జాలంలో చిక్కుకుంటున్నప్పుడల్లా. చీకటి
చీల్చుతున్నప్పుడల్లా. దారి తప్పుతున్నప్పుడల్లా.
ఉండాలొక పెద్దమనిషి, గల్లా పట్టుకోడానికి. గదమాయించడానికి. చెంపలున్నది
ముద్దులు పెట్టడానికి మాత్రమే కాదని చెప్పడానికి.
నీ చావు నిచ్చావుగాను అని శపించడానికి.
అదృష్టంకొద్దీ తుడిపెయ్యడానికి రబ్బర్లుంటాయి. డస్టర్లూ. రిమూవ్
ఆప్షన్లూ.
తప్పుదిద్దుకుని బయల్దేరుతా. తెల్లమొహంతో. కొన్ని తేట పదాల్తో.

మంచి కథల ‘దాలప్ప తీర్థం’

విశాఖలో దాలప్ప తీర్థం ఆవిష్కరణ సభ...

విశాఖలో దాలప్ప తీర్థం ఆవిష్కరణ సభ…

చింతకింద శ్రీనివాస రావు “దాలప్ప తీర్థం”లోని అన్ని కధలూ.. ఆకట్టుకోనేవే, వాన తీర్పు, రాజుగారి రాయల్ ఎంఫీల్ద్ , చల్దన్నం చోరీ ( దొరలేప్పుడూ దొంగతనాలు చేయర్రా.. చేస్తే గీస్తే కాంట్రాక్టులు చేస్తారు..లేకపోతే రాజకీయాల్లో చేరతారు .. అని గీతోపదేశం చేసే సుగ్గు వరాలు కధ ) చెరుకు పెనం (ఎన్ని వరదల్లోనైనా మనుషుల్ని చెరుకు పెనం వేసి దాటించీ, జీవితాన్ని దాటలేక పోయిన భూషణం కధ) , దిగువస్థాయి బ్రాహ్మర్ల దారిద్ర్యపు కధ ( చిదిమిన మిఠాయి) మహా మహా మడికట్టుకొనే ఇల్లాళ్ళ కంటే మడిగా ఆవకాయకి సాయం చేసే హుస్సేను మావ కధ ( పిండి మిల్లు), భయంకర రోగాలని జలగలతో నయం చేసి , పట్నంలో జలగ డాక్టర్ల చేతికి చిక్కిన ఆరేమ్పీ కధ (జలగల డాక్టరు ) – ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ .. ఎంచదగ్గ మంచి కధే ..!!

దాలప్ప తీర్ధం…కథల సంపుటి లో ఒక కధ పేరు .. మన ఇళ్ళల్లో మురుగు, మన మల మూత్రాలు ఎత్తే వాళ్ళ గురించి చాలా మంది కధకులు చాలానే కధలు రాసేరు. కానీ .. ఈ కధ వేరు అనిపించింది నాకు. ఒక మురుగు ఎత్తేవాడి పేర తీర్ధం వెలవటానికి దారి తీసిన పరిస్థితులు చాలా సరళంగా , కళింగాంధ్ర మాండలికం లో చెప్పుకొని వెళ్ళారు. చాలా మంచి కధల్లాగే .. అనవసరమైన హంగామా ఏమీ లేకుండా .. !!

http://kinige.com/kbook.php?id=1824&name=Dalappa+Teertham

–          సాయి పద్మ

ఒక మాదిగ ఎగరేసిన బతుకు జెండా : “మా నాయిన బాలయ్య”

  (వై.బి.సత్యనారాయణ రాసిన My Father Balayya పుస్తకానికి సత్యవతి గారి తెలుగు అనువాదం “మా నాయన బాలయ్య” ఆవిష్కరణ సందర్భంగా ….

ఆ పుస్తకానికి    ఎస్ .ఆర్.శంకరన్ రాసిన ముందు మాట)

ఆవిష్కరణ : 22 జూన్ 2013
వేదిక: బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్
సమయం: సాయంత్రం 5:30

 

 ఎస్ .ఆర్.శంకరన్

ఎస్ .ఆర్.శంకరన్

సమాజపు అట్టడుగునుంచీ బయల్దేరి ఉన్నత స్థాయికి చేరుకోడానికి ఒక తెలంగాణా దళిత మాదిగ కుటుంబం చేసిన పోరాటాన్ని విశదంగా కళ్లముందుకు తెచ్చిన జీవిత చరిత్ర ఇది. ఆర్థిక సామాజిక ఆంక్షలనూ, అడ్డంకులనూ వీరోచితంగా ఎదుర్కొని విజయంసాధించిన యెలుకటి కుటుంబ చరిత్ర ఇది.  దాదాపు రెండు శతాబ్దాలపాటు , మూడు తరాల జీవితకాలంలో సమాజంలో వచ్చిన మార్పుల్నీ ఇంకా రాకుండా వుండిపోయిన మార్పులనూ కూడా ఈ పుస్తకం  మన కళ్ళముందుంచుతుంది.ఇది కేవలం ఒక కుటుంబ చరిత్రేకాదు. వివిధ ప్రాంతాల్లొ వివిధ నేపథ్యాలలొ, విభిన్న పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాలపాటు మాదిగ కులస్థుల అనుభవాలనుకూడా వర్ణించిన సామాజిక చరిత్ర ఇది.

“ మా నాయిన బాలయ్య” అస్పృశ్యుల జీవితాలలోని వివిధ దశలచిత్రణ,  సమాజం విధించిన అనుల్లంఘనీయమైన ఆంక్షలమధ్య , జీవితం కొనసాగిస్తున్న వారి సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు, వారిలో వారికున్న పరస్పర అవగాహనా ,సంబంధబాంధవ్యాలూ , జీవన విధానాలూ, వృత్తులూ , ఆశలూ , అడియాశలూ పోరాటాలూ రాజీలూ, ఔన్నత్యాలూ లోపాలూ  మొదలైన అనేక విషయాలను తడిమిన రచన ఇది…అణిచివేతే ధ్యేయంగా నిర్మితమైన ,నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థలో అప్పటి , భూస్వామ్య సమాజంలో  అనేక వివక్షలనూ, అవమానాలనూ అవహేళనలనూ ఎదుర్కుంటూ అస్పృశ్యులుగా పరగణింపబడిన ఒక సామాజిక వర్గం చేసిన అలుపులేని పోరాట చరిత్ర ఇది. అస్పృశ్యతలోని అమానవీయత, కులవ్యవస్థలోని  కౄరత్వం, వాటిని నిస్సహాయంగా జీర్ణించుకుని అంతర్గతంచేసుకోవడం ఆనాటి పరిస్థితి. అయితే అప్పడుకూడా కొంతమంది ఇతర కులస్థులు,ముఖ్యంగా ఉపాధ్యాయులు చూపిన  సహానుభూతి సహకార వాత్సల్యాలను  కూడా రచయిత  ప్రస్తావించారు.

Ma father balaiah cover

నేను ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ (IAS) సర్వీస్ లో ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నప్పుడు నిరుపేదల మధ్య ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల ,తెగలవారి మధ్య పనిచేసే అదృష్టం కలిగింది. చట్టపరంగా నిషేధింపబడినప్పటికీ అస్పృశ్యత ఎంత పాశవికంగా ఇంకా  అమలవుతున్నదో  కళ్ళారా చూశాను. ఒక దళిత స్త్రీ ఒక చెరువుగట్టున బిందె పెట్టకుని, చెరువునుంచీ నీళ్ళు ముంచిపోసే వాళ్లకోసం నిరీక్షిస్తూ కూచున్న దృశ్యం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆమె దళిత మహిళ కనుక చెరువులోనించీ నీళ్ళు ముంచుకోరాదు. వాళ్ళ తక్కువతనాన్ని సూచించడానికి వాళ్లపేర్ల చివర ఎంత అవమానకరమైన పదాలు చేరుస్తారో చూసి, విని నేను అవాక్కయ్యాను. వెట్టిచాకిరి లో వున్న వారి పై జరిగే దోపిడీని ప్రత్యక్షంగా చూశాను. భూస్వాములనుంచీ చిన్నచిన్న మొత్తాల్లో అప్పుతీసుకుని అది తీర్చలేక తరాలుగా వెట్టిచేస్తున్నవారిని చూశాను తెలంగాణాలో ’దొర’లని పిలవబడే పెద్ద భూస్వాముల సమక్షంలోవున్నప్పుడు వాళ్లమొహాల్లో కనపడే భయాన్నీ, ,అదితెలియచెప్పే అణిచివేత స్వభావాన్నీ కూడా చూశాను. “నీ బాంచెన్ కాలు మొక్కుత”అనేది అస్పృశ్యులు భూస్వాములకు చేయవలసిన తప్పనిసరి అభివాదం. యెలుకటి కటుంబ చరిత్ర తో పాటు  అస్పృశ్యులు అనుభవించిన క్షోభా , నిరవధిక  అవమానమూ కూడా చిత్రించారు రచయత.

ఈ రచన నాకు మరింత చేరువగా తోచడానికి మరొక కారణం కూడా వుంది. నా బాల్యంలో నేను కూడా రైల్వే కాలనీల్లో నివసించాను. ఇందులో వర్ణించబడిన రైల్వే కాలనీల్లో, వర్ణవివక్ష అసలే లేదనను కానీ కాస్త సడలించబడడాన్ని నేనుకూడా చూశాను. గ్యాంగ్ మెన్ ,పాయింట్స్ మెన్.షంటర్స్ వంటివారిని చిన్నప్పుడు దగ్గరగా పరిశీలించాను. వీళ్ళంతా దాదాపు తక్కువ కులాలనబడే కులాలనించీనూ, స్టేషన్ మాస్టర్లూ రైల్వే గార్డులూ  అగ్రకులాలనబడే కులాలనుంచీనూ  వుండేవాళ్ళు వ్యక్తిగతంగానూ,అధికారపరంగానూ . వాళ్ళ పరస్పరసంబంధాలు ఎట్లావుండేవో కూడా గమనించాను. ప్లాట్ ఫామ్ మీద ఒకరు ఆకుపచ్చజెండా ఊపుతూ నిలబడగా  , అక్కడ ఆగకుండా దూసుకుపోయే రైళ్లను చూసి ఆశ్చర్యపోయేవాడిని అప్పుడప్పుడూ.  ఆరోజుల్లో ఆగివున్న ఇంజెన్లనుంచీ నీళ్ళు పట్టుకుపోయ స్త్రీలను కూడాచూశాను.  రైల్వే ఉద్యోగుల పిల్లలు టికెట్ లేకుండా ప్రయాణించడంకూడా “చట్టసమ్మతంగా”నే వుండేది అప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ కూడా తమ ఉద్యోగులకోసం రైల్వే చౌకగా సరుకులు సరఫరా చేసేది. గ్రామాల్లో భూస్వాములకింద వుండే జీవితానికీ ఇక్కడ జీవితానికీ కల తేడా చూపించడానకి రచయిత ఈ వివరాలన్నీచెప్పారు. తక్కిన సమాజని కన్న రైల్వే  ఒక భిన్న ప్రపంచం సృష్టించింది వాళ్లకోసం.. అంటారు రచయిత. రచయత తండ్రి బాలయ్యకు రైల్వే అవతలి ప్రపంచం తెలియదు.అందుకని ఆయన  ధ్యేయం తనపిల్లలను చదివించి రైల్వేలో ఆఫీసర్లను చెయ్యడమే!

బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలోనూ , ఓడరేవుల్లోనూ,రైలు మార్గాలలోనూ గనులలోనూ మిల్లులలోనూ కొత్త ఉద్యోగాలను సృష్టించింది.  ఇవి అస్పృశ్యులకు కొత్త అవకాశాలయినాయి..ఈ ఉద్యోగాలు అగ్రవర్ణాలనబడేవారికి నచ్చకపోవడం కూడా వీరికి దక్కడానికి ఒకకారణం. ఎందుకంటే ఈ పన్లు ప్రమాద భరితమైనవి. కష్టసాధ్యమైనవికూడా. అంతకంటే  మైలపడతామన్న భయంకూడా! బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా  మహు అనే స్టేషన్లో  ఒక సైనిక కుటుంబంలో జన్మించాడని చెప్పుకోడం ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటాను. రమాబాయ్ అంబేడ్కర్ కూడా అటువంటి కుటుంబంలోనే జన్మించారు.

రచయిత చెప్పినట్లు గ్రామాలలోని భూస్వామ్య అణచివేతలనుంచీ దళితులకువిముక్తి కలిగించే కొత్త ద్వారాలు తెరిచింది రైల్వేశాఖ.. .ఆ పన్లు కష్టమైనవైనా, ప్రమాదభరితమైనవైనా తక్కువ స్థాయికి చెందినవైనాగాని ! అట్లా వాళ్ళు రైల్వే లో ప్రవేశించారు. రైల్వే క్వార్టర్స్ లో తక్కిన కులాలవారి పక్కన నివసించడం ఒక కొత్త అనుభవం.తమను అంటరాని వాళ్ళుగా చూసి వేరుపెట్టి న గ్రామాలనుంచీ విముక్తి కలిగింది.వీళ్లకు బొగ్గుగనులలో కూడా ఇటువంటి పనులు లభించాయి.

నర్సయ్య జీవితం ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామంలో ప్రారంభమైంది. ఒకసారి హైదరాబాద్ నిజామ్ వంగపల్లి మీదనుంచీ పోతూండగా నర్సయ్య తండ్రి (ఆయన పేరుకూడా నర్సయ్యే) ఆయనకు దూడచర్మం తో  కుట్టిన మృదువైన చెప్పులజత బహూకరించాడు. అవి చూసి ఆయన ఎంతో ముచ్చటపడి అప్పటికప్పుడు నర్సయ్యకి యాభై ఎకరాల పొలం ఈనామ్ గా ప్రకటించాడు. ఆయన ఈ పుస్తక రచయితకు ముత్తాత. అయితే సాక్షాత్తూ నిజామ్ ఇచ్చినా సరే అతను ఆ పొలాన్ని అనుభవించడానికి వీల్లేదు ,అప్పటి దొరల అధికారం అటువంటిది.ఆపొలం అంతా లాక్కుని రెండెకరాలు మాత్రం నర్సయ్యకిచ్చాడు దొర,. అట్లా చేసినందుకు నర్సయ్యకు బాధగానీ కోపంగానీ కలుగకపోగా దొర కోపానికీ దెబ్బలకీ బలికానందుకు సంతోషించాడు అటువంటి పరస్థితులు ఇంకా కొన్ని గ్రామాలలో వున్నాయి ..షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వం భూమి ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకుని సాగుచేసుకోనివ్వవు స్థానిక రాజకీయాలు.

రచయిత ఒక గ్రామ నిర్మాణం ఎలావుంటుందో ఈ విధంగా వర్ణిస్తారు

“అప్పటికీ ఇప్పటికీ భారతదేశంలోని గ్రామాల నిర్మాణంలో పెద్ద మార్పు ఏమీ లేదు. గ్రామాలన్నీ దాదాపు మనువు సూత్రీకరించినట్టే నిర్మింపబడి వుంటాయి. గ్రామం వూరుగా(సవర్ణులకు), వాడగా(అవర్ణులకు) చీలి వుంటుంది మధ్యనొక సరిహద్దో లేకపోతే అవసరమైనంత ఖాళీ స్థలమో వుంటుంది.

అవర్ణులు లేక అస్పృశ్యులు అని పిలవబడే వారి మీదనించీ వచ్చే  కలుషిత గాలి  తమమీద వీయకుండా గ్రామంలోని వివిధ కులాల  గృహ నిర్మాణం వుంటుంది..అంటే గాలి బ్రాహ్మణుల ఇళ్లమీదనుంచి ఇతర కులాల ఇళ్లమీదకు వీచే విధంగా గ్రామంలో వివిధ కులాల ఇళ్ళు వుంటాయి. సాధారణంగా గాలి పశ్చిమంనుంచీ తూర్పుకు వీస్తుంది కనుక, ముందు పశ్చిమంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి. అస్పృశ్యుల ఇళ్ళు తూర్పున వుంటాయి. గ్రామంలో ప్రధాన వీధులన్నీ పశ్చిమంలో వుంటాయి .నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థ తూర్పునించీ మొదలౌతుంది…శూద్రులు,వైశ్యులు,క్షత్రియులు ,బ్రాహ్మణులు ,అట్లా ….ఉత్పత్తి రంగంలో వుండే శూద్ర వర్ణాలన్నీ ఒక చోట గుంపుగా వుంటాయి. ఆఖరున గ్రామ ముఖ ద్వారంలో బ్రాహ్మణుల ఇళ్ళుంటాయి.”

ఈ వాక్యాలు డాక్టర్ అంబేడ్కర్ మాటల్ని తలపింపచేస్తాయి.ఆయన కూడా భారతదేశంలోని గ్రామాల నిర్మాణాన్ని తీవ్రంగా విమర్శించారు.భారతీయ గ్రామాలను అత్యంత భావుకతతో వర్ణించడాన్ని అంబేడ్కర్ ఖండించారు

“ భారతీయ గ్రామాలు గణతంత్రం రాజ్యం అనే భావాన్ని అభావం చెయ్యడంలా వుంటాయి.అవి నిజంగా గణతంత్ర రాజ్యాలే అయితే అవి సవర్ణులకోసం సవర్ణలచేత పాలింపబడే గణతంత్రాలు . అవర్ణులకు అక్కడే హక్కులూ లేవు.వాళ్ళ సేవచెయ్యడానికీ నిరీక్షించడానికీ, అణిగివుండడానకీ మాత్రమే వున్నారు .అక్కడ స్వేచ్ఛకి తావులేదు.సమానత్వానికి తావులేదు.సహోదరత్వానికి తావులేదు”

అన్ని సామాజిక ,మతపరమైన వ్యతిరేకతల మధ్య యెలుకటి కుటుంబంలోకి విద్య ప్రవేశించింది. కొన్ని శతాబ్దాలుగా,ఆ సామాజిక వర్గానికీ   ఆ కుటుంబానికీ  అందకుండా వుంచిన విద్యా సంపదకు విత్తు నాటింది ఒక ముస్లిమ్ ఉపాధ్యాయుడు .ఆ తొలి గురువైన.ఆలీ సాహెబ్ కు  యెలుకటి కుటుంబంలో భవిషత్తు తరాలన్నీ ఋణపడి వుంటాయని రచయిత ఎంతో గౌరవభావంతోనూ కృతజ్ఞతతోనూ చెప్పినప్పుడు మన మనసు ఆర్థ్రత తో నిండిపోతుంది.

తనకొడుకును గ్రామంలో వెట్టి చాకిరి నుంచీ రక్షించాలనుకున్నాడు నర్సయ్య. అగ్రకులస్థుల నిరంతర వేధింపులు భరించలేక అతను తన పూర్వీకులగ్రామాన్ని వదిలి రావడం నర్సయ్యనే కాక తరువాతి తరాలను కూడా బంధవిముక్తులను చేసింది. ఆత్మగౌరవమూ కృషీ  మనుషులకు శక్తినీ ఆత్మవిశ్వాసాన్నీ గుర్తంపునీ ఇస్తాయనేది బాలయ్య నమ్మకం. ఆనమ్మకమే తన బిడ్దలను విద్యావంతులను  చెయ్యాలనే  జీవిత ధ్యేయాన్ని కలుగచేసింది నగరానికి వలస రావడం రైల్వేలో నౌకరి సంపాదించడం . భూస్వాముల ఆగడాలకు దూరంగా కొంత అజ్ఞాతంగా వుండడానికి కూడా దోహదం  చేసింది. అయితే కుల వ్యవస్థా, దానితో వచ్చిన అవమానమూ దళితులను అన్నిచోట్లా వెంటాడుతూనే వుంటాయని ఈ జీవిత కథ చెబుతుంది. విద్యాలయాల్లోనూ ఇళ్ళు అద్దెకు తీసుకునేటప్పుడూ ఒక్కొక్కసారి కులందాచిపెట్టుకునే అవసరాన్ని కూడా పరిస్థితులు కల్పిస్తాయి. సామాజంలో మార్పుకు విద్యకీలకమైన పాత్ర పోషిస్తుందనీ ,అది ఒక ఆయుధంవలె పని చేస్తుందనీ ఈ పుస్తకం నొక్కి చెబుతుంది. చదువుకునే క్రమంలో కొన్ని సామాజిక బృందాలలో ప్రత్యేకమైన  చైతన్యం వికసిస్తుందనీ,ఆ సామర్థ్యం విద్యకున్నదని కూడా చెబుతుంది..చదువు కేవలం జీవిక కోసమే కాదనీ దళితుల విముక్తికి అదొక శక్తివంతమైన సాధనం అనీ ,వారిపట్ల అమలయ్యే అన్యాయానికీ అవమానానికీ విరుద్ధంగా పోరాడే శక్తి ఇస్తుందనీ అంబేడ్కర్ కూడా చెప్పి వున్నాడు.

జీవితంలోని అనేక అంశాలలో వచ్చిన మార్పులనూ పరిణామాలనూ కూడా ఈ రచనలో చూడవచ్చు. యెలుకటి కటుంబానికి చెందిన మూడుతరాల వ్యక్తులు రైల్వేలో పనిచేశారు. దశాబ్దాలుగా రైల్వేలో వచ్చిన పరిణామాలకు వారు ప్రత్యక్ష  సాక్షులు. గర్జిస్తూ వచ్చే ఆవిరి ఇంజన్లనుంచీ నిశ్శబ్దంగా వచ్చే ఎలెక్ట్రికల్ ఇంజన్లవరకూ, మనుషులు ఇచ్చే సిగ్నల్స్ నుంచీ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ వరకూ ,టెలిగ్రాఫిక్ సందేశాలనుంచీ కంఫ్యూటర్ ప్రోగ్రామింగ్ వరకూ చూశారు.అట్లాగే యెలుకటి కుటుంబపు జీవన విధానంలోనూ ఆహారపు అలవాట్లలోన వచ్చిన పరిణామాలుకూడా చూడొచ్చు.వంటకు మట్టికుండలు పిడతల నంచీ అల్యూమినియం పాత్రలలోకి ,జొన్న రొట్టెనుంచీ గోధుమ చపాతీలోకి ,ఉమ్మడికుటుంబంనుంచీ వ్యష్టి కుటుంబాలలోకి నిరక్షరాశ్యతనుంచీ  ఉత్తమ శ్రేణి సంస్థలలో ఉన్నత విద్యలోకి..,విదేశాలలో సదస్సులలో పాల్గొనడానికి..

కిరోసిన్ లాంతరు మసక వెలుగులో చదువుకుని మెట్రిక్యులేషన్ తరువాత , రైల్వేలో మామూలు సిగ్నలర్ గా ఉద్యోగం ప్రారంభించి ,మళ్ళీ చదువుకుని  ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన డాక్టర్ అబ్బసాయిలకు ఈ పుస్తకం ఒక ప్రశంస.

ఈ అద్భుతమైన రచనలో కేవలం వర్తమాన పరిస్థితుల ను గురించిన వివరణతోపాటు అన్ని అడ్డంకులనూ ప్రతికూలతలనూ ఎదుర్కునే   శక్తిసామర్థ్యాలు మనుషులలో  స్వాభావికంగా వుంటాయని కూడా అర్థం  చేసుకుంటాం.ఇటువంటి కథనాలు ఆయాసమాజాలలోని ఇతరులనుకూడా ప్రభావితంచేస్తాయి. సామాజిక ఆర్థిక ప్రతిబంధకాలను తొలిగించుకోడానికి విద్యను ఎట్లా ఉపయోగించుకోవాలో అర్థంచేయిస్తాయి. సామాజపు నిచ్చెన మెట్లు అధిరోహించడం సాధ్యమేననే ఆశను ఉద్దీపింపజేస్తాయి.

హక్కులకోసం పోరాడుతున్న దళితులనుద్దేశిస్తూ 1947 ఆగస్టులో డాక్తర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగాన్ని ఉదహరిస్తూ ఈ ముందుమాట ముగిస్తాను

“  నేనిచ్చే సందేశం ఇదే… పోరాడాలి, మరింతగా పోరాడాలి..త్యాగాలు చెయ్యాలి, మరన్ని త్యాగాలు చెయ్యాలి. బాధనూ త్యాగాలనూ లెక్కచెయ్యకండా పోరాడడమే వారికి విముక్తినిస్తుంది. తప్ప మరేదీ ఇవ్వదు

దళితులంతా   ఉన్నతి సాధించడంకోసం   ఒక ఉమ్మడి ఆకాంక్ష ను అభివృద్ధి చేసుకోవాలి.తమ ఆశయానికున్న పవిత్రతను విశ్వసించి దాన్ని సాధించాలనే సమష్టి నిర్ణయం తీసుకోవాలి ఈ కార్యం చాలాగొప్పది.దాని లక్ష్యము చాలా ఉదాత్తమైనది..కనుక అస్పృశ్యులంతా కలిసి ఇట్లా ప్రార్థించండి” తాము ఎవరిమధ్యనైతే జన్మించారో వారి ఉన్నతికోసం పనిచెయ్యడమనే తమ కర్తవ్యాన్ని నిర్వహించేవారు ధన్యులు.బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎవరు తమ కాలాన్నీ, శారీరక ఆత్మిక శక్తుల్ని ధారపోస్తారో వారు ధన్యులు ..మంచి జరిగినా,.చెడు ప్రాప్తించనా, ,సూర్యకిరణాలు ప్రసరించినా తుఫానులు విరుచుకుపడినా గౌరవం దక్కినా , అవమానాల పాలైనా, ,అస్పృశ్యులు తిరిగి తమ మనిషితనాన్ని పొందేవరకూ పోరాటం ఆపేదిలేదనే  ధృడ నిశ్చయంతో వున్నవారు ధన్యులు”

 

అక్టోబర్ 2011                                                                                                                                                                                                                     ఎస్ .ఆర్.శంకరన్

తెలుగు అనువాదం      పి సత్యవతి ( డాక్టర్  వై.బి.సత్యనారాయణగారి సహకారంతో)

 

 

 

వీలునామా – 5 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సాయంకాలం విందు

 కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రమవుతూండగా ఫ్రాన్సిస్, జేన్ కలిసి రెన్నీ ఇంటికి చేరుకున్నారు. అక్కడందరూ తనని విచిత్రమైన కుతూహలం తో చూస్తారన్న సంగతి తెలిసినా, జేన్ కాసేపు పదిమందితో సరదాగా గడపాలని నిశ్చయించుకొంది.

విందన్న పేరేకానీ, ఎక్కువమంది ఆహూతులున్నట్టు లేదు. ఆడవాళ్ళైతే అసలు తను తప్ప ఇంకెవరూ రాలేదు. రెన్నీ భార్యా, కూతురు మాత్రం వచ్చి పలకరించారు. అనుకోకుండా ధనవంతుడవడంతో ఫ్రాన్సిస్ ని ఈమధ్య అందరూ ఏదో ఒక వంకన భోజనానికి ఆహ్వానించేవారే. అందరూ అతని తెలివితేటలనీ, అభిరుచులనీ కొనియాడేవారే!

రెన్నీ గారమ్మాయి, ఎలీజాకి పంతొమ్మిదేళ్ళు. అమాయకంగా వున్నా సాహిత్యంతో బాగా పరిచయం వున్నట్టు మాట్లాడింది. విధి వైపరీత్యంతో డబ్బంతా పోగొట్టుకున్న ఫ్రాన్సిస్ దూరపు బంధువు ఎలా వుంటుందోనన్న కుతూహలం పట్టలేకుండా వుంది. ఒక వీలునామా కోసం నిజంగా ఫ్రాన్సిస్ ఆ అక్క చెల్లెళ్ళలల్లో ఎవరినీ పెళ్ళాడకుండా వుంటాడా? మొదలైన ప్రశ్నలు ఆమె లేత మనసుని తినేస్తున్నాయి. జేన్ గురించి చెప్పమని తండ్రిని వేధించింది కానీ, రెన్నీ ఏమీ చెప్పలేదు. చాలా తెలివైనది, చాలా విచిత్రమైన అభిప్రాయాలున్న వ్యక్తి అని మాత్రమే చెప్పాడు.

ఆ రోజు విందులో జేన్ కి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన పబ్లిషరూ, ఎడినబరో కి చెందిన ఒక వకీలూ, ఒక పెద్ద వ్యాపారవేత్తా, ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళూ వచ్చారు.

“హ్మ్మ్మ్!! చాలా మామూలుగా వుందీవిడ, కనీసం ఇరవై యేడేళ్ళయినా వుంటాయేమో!” అనుకుని తృప్తిగా నిట్టూర్చింది ఎలీజా జేన్ ని చూడగానే.

“చూడడానికి మామూలుగానే వున్నా, ఏదో ప్రత్యేకత వుందీమెలో,” అనుకున్నారు అక్కడున్న మగవాళ్ళంతా. కథల్లో వుండే ఆడవాళ్ళలా, నాజూగ్గా, అమాయకంగా కాకుండా, ఆరోగ్యంగా, తెలివితేటలూ, లోకఙ్ఞానమూ వుట్టిపడే స్త్రీ మొహాన్ని అంత దగ్గరగా చూడడం ఆ వర్గంలోని మగవాళ్ళకి కొంచెం అరుదే మరి.

నిజానికి ఆరోజు ఆమె ఆత్మ విశ్వాసం దారుణంగా దెబ్బ తిని వుంది. నిరాశా నిస్పృహలతో కృంగి పోతుంది. మనుషుల మీదా వ్యవస్థ మిదా నమ్మకం సడలుతున్నట్టనిపిస్తోందామెకి. కానీ, మొహంలో అదేమీ కనబడకుండా, చిరునవ్వుతో అందరినీ హుందాగా పలకరించింది. ఆమె ప్రవర్తన చూసి రెన్నీ ఆశ్చర్యపోయాడు కూడా!

అతను ఉదయం చూసిన జెన్నీ కోపంగా ఆవేశంగా వుంది. ఇప్పుడు సౌమ్యంగా, తేటపడ్డ మొహంతో, నెమ్మదిగా వుంది. ఎలీజా పియానో మీద వాయించిన పాటను ఓపికగా, శ్రధ్ధతో విన్నది. మిగతా వారి మాటలనూ కుతూహలంతో విన్నది. పబ్లిషరు ప్రజల అభిరుచిని గూర్చి చెప్తూన్నాడు.

“మాల్కం! ఇప్పుడు రచనలతో డబ్బు సంపాదించాలంటే మతాన్ని ఎలాగో అలా కథలో జొప్పించాలి. విలన్లందరినీ హేతువాదులుగా, నాస్తికులుగా మార్చు. కథానాయికని నానా కష్టాలూ పెట్టు. ఆమెకొక ప్రేమికుణ్ణివ్వు. ఇద్దరూ క్రిస్టియన్ మతం పుచ్చుకోని భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగానే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టు రాయి. ఆ పుస్తకం వేలల్లో అమ్ముడుపోకపోతే అప్పుడు నన్నడుగు! డికెన్సూ, థాకరే కంటే నీకెక్కువ పేరు రాకపోతే చూస్కో!”

“నీ మాటలకేమొచ్చెలే గానీ, మా చెల్లెలు, ఆన్, అదేదో పుస్తకం కొనమని ప్రాణాలు తోడుతుంది. అది అయిదు ప్రచురణలయిపోయిందట, నిజమేనా?”

“అవును! ఇప్పుడే ఆరో ప్రచురణ కూడా వేస్తున్నాం! నిజానికి ఆ పుస్తకం ఏమీ బాగుండదు, తెల్సా? అందులోనూ, ఆ అమెరికన్లు మాట్లాడే భాషా, అయ్య బాబోయ్! ఏం చెప్పమంటావు?”

“నిజంగా అమెరికన్లు ఆ పుస్తకాల్లో వున్నంత చెత్త భాష వాడతారంటావా? ఇహ అలాంటి భాష మాట్లాడే అమెరికన్లతో బ్రతకడం ఎలా వుంటుందో! ఊహకే అందదు కదూ? అందుకే నేనెప్పుడు ఇంగ్లీషు వాళ్ళ పుస్తకాలే చదువుతాను!”

ఎలీజా వచ్చి జెన్నీ పక్కన కూర్చుంది.

“మాల్కం కి సాహిత్యంతో చాలా పరిచయం వుంది తెల్సా? ఆయన పత్రికల్లో కూడ బాగా రాస్తారు.”

“చాలా చాలా ధన్యవాదాలు మిస్ రెన్నీ! వింటున్నారా పబ్లిషర్ గారూ! జేన్, ఈ పబ్లిషర్లకి రచయితలంటే ఎంత లోకువ తెలుసా? ఈ దరిద్రుడికి నేను కిందటి వారం పత్రికలో రాసిన వ్యాసం నచ్చలేదట. ”

“లేదు లేదు మాల్కం! నాకే కాదు నాన్న గారికి కూడా చాలా నచ్చింది. పడీ పడీ నవ్వారు!”

“వినవయ్యా పబ్లిషరూ! నీకు నచ్చనివి చాలా మందికి నచ్చుతాయి, తెలుసుకో మరి!”

“నీ హ్యూమరు చాలా ఫాషనబుల్ మాల్కం! కానీ, కొంచెం అతిగా అనిపిస్తుంది నాకు. ఈ మధ్య అసలు విషయం వదిలేసి ఎక్కడెక్కడివో కొటేషన్లు రాయడం, కథకి అవసరం లేని విషయాలని జొప్పించడం కూడా చేస్తున్నారు రచయితలు. పాతకాలం ఆవూ, తాడి చెట్టు వ్యాసాల్ల్లాగా…”

వాళ్ళ సంబాషణొదిలేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, జేన్, ఎలీజా!

“జేన్! నాకు రచయితలూ, పబ్లిషర్లతో మాట్లాడడమంటే భలే సరదా! అందులో మాల్కం వున్నాడు చూడు, జీనియస్! అయితే చాలా కరుగ్గా విమర్శిస్తాడనుకో!”

“నువ్వూ రాస్తావా ఎలీజా?” అడిగింది జేన్.

“ఆ, ఏదో కొంచెం కొంచెం. నాకు వచనం కంటే కవిత్వం ఇష్టం. ఏ పత్రికకీ పంపలేదనుకో. మా స్నేహితులకిస్తా చదవమని, అంతే. కొన్ని ఆడవాళ్ళ పత్రికల్లో ‘ఎల్లా’ అనే పేరుతో ఒకటి రెండు కవితలు పడ్డాయనుకో! ‘ఎల్లా’ పేరు బాగుంది కదూ?”

“అది సరే కానీ, కవితలు పత్రికల్లో వేసుకుంటే డబ్బొస్తుందా?”

“నువ్వు భలే డబ్బు మనిషిలాగున్నావే! అందుకే నువ్వు వ్యాపారం చేస్తే బాగుంటుందన్నారు నాన్న. కవితలు పత్రికలో వేసుకుంటే డబ్బేమీ రాదు, కానీ నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు.”

“అదృష్టవంతురాలివి. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు.” నిట్టూర్చింది జేన్. పబ్లిషరు వైపు తిరిగింది.

“మీరు కొత్త కొత్త నవలలేకాక కవితల పుస్తకాలూ వేస్తారా?”

“అమ్మో! ఈ ఎడిన్ బరో లో కవితల పుస్తకమా? కొంచెం కష్టమమ్మాయ్! పాత కవితలే మళ్ళీ మళ్ళీ వేస్తాం.”

“అవును మరి, లేకపోతే కాపీరైటు చెల్లింపులకి డబ్బు ఖర్చు కదా!” వేళాకోళం చేసాడు మాల్కం.

ఇంతలో శ్రీమతి రెన్నీగారొచ్చి జేన్ ని ఒక పాటేదైనా పాడమన్నారు. తనకి సంగీతం బొత్తిగా రాదని చెప్పింది జేన్. రెన్నీ గారి మిగతా చిన్నపిల్లలొచ్చి తల్లిని చుట్టు ముట్టారు.

జేన్ మొహమాటంగా వాళ్ళ చదువులూ, ట్యూషన్ మాస్టార్ల గురించీ వాకబు చేసింది.

“ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ట్యూషన్లూ చెప్పుకోవడానికి వీలవుతుందో! ఇంగ్లీషూ, లెక్కలూ బాగా చెప్పగలను!” సాలోచనగా అంది జేన్.

“ట్యూషన్లా? చిన్న పిల్లవి, నీ వల్లేం అవుతుంది చెప్పు? నా మాట విని ఎవరైనా పెద్ద వాళ్ళింట్లో ఆడపిల్లలకి చదువు చెప్పే గవర్నెస్ గా చేరిపో! మీ చెల్లాయిని కూడా అలా ఏదో ఒక ఇంట్లో చేరి పొమ్మను. ఇల్లు అద్దెకు తీసుకోవడమూ, నెలనెలా అద్దెకోసం తడుముకోవడమూ, ఎందుకొచ్చిన బాదరబందీ? లేదా ఏదైనా స్కూల్లో టీచరుగా చేరిపో! నీకు సంగీతం వచ్చా? రాకపోతే నేర్చుకోవచ్చు.”

“ఇప్పుడు నాకు సంగీతమెందుకులెండి. అసలు మా చెల్లాయిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికీ వెళ్ళాలని లేదు. అయినా చూద్దాం, ఏమవుతుందో!”

“ఇవాళ పొద్దున్న రెన్నీ గారితో పిచ్చాసుపత్రి మేట్రన్ ఉద్యోగం గురించి మాట్లాడావట గదా? నన్నడిగితే అన్నిటికంటే అదే మంచిది. ఆలస్యం చేయకుండా నీ దరఖాస్తు పంపించేయి. జీతం తక్కువేననుకో. కానీ ఇహ వేరే దారి లేనప్పుడేం చేస్తాం!”

“అవును, నేనూ అదే అనుకుంటున్నాను.”

“రెన్నీ నీ కా ఉద్యోగం వచ్చేలా చేయగలరు. నువు చాలా తెలివైన దానివని అన్నారు నాతో.”

“తెలివితేటలే కాదు, నాకు ధైర్యమూ ఎక్కువే!”

“అన్నట్టు, ఎడిన్ బరో లో ఎక్కడ వుంటున్నావు?”

“ఈ వూళ్ళో నాకెవరూ తెలియదు. డబ్బు కూడా లేదు. అందుకే మా మావయ్య కొడుకు ఫ్రాన్సిస్ ఇంట్లోనే వుంటున్నాను.”

“ఏమిటీ? పెళ్ళి కాని ఆ బ్రహ్మచారి ఇంట్లో, వేరే తోడు లేకుండా వుంటున్నావా? నలుగురూ వింటే ఏమనుకుంటారు? ఏం పని చేసావు జేన్!”

బెదిరిపోయింది జేన్.

“ఏమోనండి! నాకేమీ తోచలేదు. ఎక్కడో వుండడమెందుకూ, మా ఇంట్లోనే వుండు అన్నాడు ఫ్రాన్సిస్. డబ్బు కలిసొస్తుందని ఒప్పుకున్నాను. మా వూరి మిస్ థాంసన్ ని సలహా అడిగాను కూడా! ఆవిడా పర్వాలేదంది!”

“మీ వూళ్ళో వుండే మిస్ థాంసనా? సరిపోయింది! అడక్కడక్క ఆవిడనే అడిగావా? ఆవిడదంతా ఉలిపికట్టె తీరు.”

“ఆవిడ ఎలాటిదైతే యేం లెండి! మమ్మల్ని చూసి జాలిపడకుండా ధైర్యం చెప్పింది  ఆవిడొక్కర్తే.”

“సరే, పోనీలే! అయిందేదో అయింది. ఇవాళ్టినుంచీ నువ్విక్కడ మాతో నే వుండు. మా అమ్మాయి ఎలీజా గదిలో సర్దుకోవచ్చు నాలుగురోజులు. ఇవాళ నువ్వు ఒంటరిగా ఫ్రాన్సిస్ ఇంట్లో గడిపావంటే లోకం కోడై కూస్తుంది!”

జేన్ ఒక్క క్షణం ఆలోచించింది.

“మీ సూచనకి ధన్యవాదాలు. నామీద ఏవైనా అపవాదులు రేగాల్సి వుంటే అవీ పాటికే పుట్టి వుంటాయి. ఇవాళ నేను కొంచెం సేపు ఒంటరిగా ఆలోచించుకోవాలి. రేపెలాగూ నేనీ వురునించి వెళ్ళేపోతాను.”

“రేపాదివారం. ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి, నువ్వనుకున్నట్టే ఇవాళ ఫ్రాన్సిస్ ఇంట్లో వుండి, రేపు పొద్దున్నే ఇక్కడకొచ్చేయి. ఏదో ఒక వంకన ఎల్లుండి వరకూ ఇక్కడే వుండి అప్పుడు వెళ్దువుగాని.”

“అలాగే, శ్రీమతి రెన్నీ గారూ! మీరు నాపైన చూపించిన శ్రధ్ధా, కరుణా ఎప్పటికీ మరచిపోను. ఇవాళ రాత్రి మాత్రం ఒంటరిగా వుండాలని వుంది నాకు. మీరన్నట్టు రేపు ఇక్కడకే వచ్చి వుంటాను. మరి ఇక మేం బయల్దేరతాం!”

అందరికీ చెప్పి ఫ్రాన్సిస్, జేన్ లిద్దరూ ఇంటినించి బయటపడ్డారు.

“ఎలా అనిపించింది జేన్ నీకు వాళ్ళ ఇల్లూ, కంపెనీ? నాకసలు నిన్ను కనిపెట్టి వుండడానికే వీలవలేదు. అసలే కొత్త చోటు , ఏమైనా ఇబ్బంది పడ్డావా?”

“ఇబ్బందేమీ లేదు కానీ, చాలా అలసటగా వుంది. ఇప్పుడిక్కడ ఎల్సీ వుంది వుంటే ఎంత బాగుండేది. నేను మా ఇంటికెళ్ళిపోతా ఫ్రాన్సిస్!”

“అప్పుడేనా? ఇంకొద్ది రోజులుండు. నీ ఉద్యోగం కోసం ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం.”

“ఏమీ లాభం లేదు ఫ్రాన్సిస్! ఆ మేట్రన్ ఉద్యోగానికి ఒక దరఖాస్తు పడేసి నేను ఇంటికెళ్ళిపోతాను. నాకిక ఉద్యోగాల మీద ఆశ పోయింది. పిచ్చాసుపత్రి లో రోగులు బయటి ప్రపంచంలో వాళ్ళకంటే మూర్ఖంగా, కౄరంగా వుండరు కదా!”

“చూద్దాం! సోమవారం కూడా ఆలోచించి, మంగళవారానికి పంపుదాములే. నువ్వు అధైర్య పడకు.”

ఫ్రాన్సిస్ గొంతులో వినిపించిన ఆప్యాయతా, ఆశలతో కొంచెం తేరుకుంది జేన్. ఆయినా ఆ రాత్రి కూర్చుని మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు రాసుకుంది.

ఆ రాత్రి మొదటిసారి మావయ్యని తిట్టుకుంది జేన్! అంతకుముందు ఆయన చూపించిన ఆప్యాయతా, చెప్పించిన చదువూ, అన్నీ గొప్ప అబధ్ధాలుగా అనిపించాయామెకి. అన్నిటికంటే, చెల్లెల్ని ఒంటరిగా ఒదిలి, తనూ దిక్కూ మొక్కూ లేని అనాథలా ఆ ఆస్పత్రిలో పడి వుండాల్సొస్తుందేమో అన్న ఆలోచన చాలా కలవరపెట్టిందామెని.

 ***

 మర్నాడు రెన్నీ కుటుంబంతో కలిసి చర్చి కెళ్ళారు ఫ్రాన్సిస్, జేన్. చర్చి లో ఫాదరు చేసిన బోధన ఒక్క ముక్క కూడా మనసులోకెక్కలేదు జేన్ కి. ఆమె మనసంతా ఆస్పత్రి చూట్టూ, అక్కడ తను చేయబోయే వుద్యోగం చూట్టూ తిరుగుతుంది.

ఆ తర్వాత రెన్నీ గారి ఇంట్లో సంభాషణంతా చర్చిల చుట్టూ, మతం చుట్టూ, మత బోధనల చుట్టూ తిరిగింది. జేన్ కి అవంతా ఎక్కువగా తెలియకపోవడం మూలాన, పెద్దగా పాల్గొనలేకపోయింది.

శ్రీమతి రెన్నీ ఆ రోజు జేన్ ని అక్కడే వుండిపొమ్మంది. జెన్నీ నిరాసక్తంగా ఒప్పుకుంది. ఫ్రాన్సిస్ వెంటనే జెన్నీని తాను ఎప్పుడూ వెళ్ళే చర్చి ఒక్కసారి చూపించి తీసుకొస్తానని అన్నాడు. మాట్లాడకుండా అతన్ని అనుసరించింది జేన్. అసలామెకి చర్చి మీదా, మతం మీదా పెద్ద నమ్మకమే లేదు. ఏదో అతని మాట తోసేయలేక వెళ్ళింది.

కానీ, ఆ రోజు మొదటిసారి ఆమె దేవుణ్ణి తనకు సహాయం చేయమని నిస్సహాయంగా అడిగింది. బయటికొస్తూ, నిస్సహాయ స్థితిలో మనిషి దేవుడి వైపు చూస్తాడు కాబోలు అనుకుంది.

రెన్నీ ఇంటికెళ్తూ దారిలో,

“ఫ్రాన్సిస్, నువ్వన్నట్టు రేపింకొక్కసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా ఉద్యోగం దొరకకపోతే ఆస్పత్రికి నా దరఖాస్తు పంపుతాను. దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది,” అంది.

సోమవారం మళ్ళీ జేన్ ఎడిన్ బరోలో తనకు తెలిసిన మరికొన్ని ఆఫీసులు చుట్టబెట్తింది. శనివారం లాగే, ఆ రోజూ ఆమెకి ఎక్కడా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించలేదు. ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు పోస్టులో వేసి ఎడిన్ బరో వదిలింది జేన్.

 ***

 ఇంటికెళ్ళి జేన్ ఎల్సీతో తన ఎడిన్ బరో ప్రయాణమూ, ఉద్యోగాలకోసం వేటా, ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తూ, అన్నీ వివరంగా చెప్పింది. ఒకవేళ ఉద్యోగం వస్తే, జేన్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడపాలో తలచుకొని ఎల్సీ హడలిపోయింది.

“వొద్దు జేన్! నూవ్వా ఉద్యోగానికెళ్ళొద్దు. నేను ఎలాగైనా మనిద్దరికీ పొట్టపోసుకునే ఉపాయాలు వెతుకుతాను. నువ్వు మాత్రం ఒంటరిగా యేళ్ళ తరబడి ఆ ఉద్యోగంలో మగ్గి పోవడం నాకిష్టం లేదు!” ఎల్సీ వాపోయింది.

***

ఛానెల్ 24/7- 12 వ భాగం

sujatha photo

   (కిందటి వారం తరువాయి)

బెహరా బాధితుల్లో నాగమ్మ బైట్ గుర్తొచ్చింది శ్రీధర్‌కు. ఎలా బతికుంది, ఏం బతుకు, ఏం జీవితం, అయ్యా నాకు ఒకే కొడుకు, ఆడు చదువుకోవాలని ఇరవైవేలు అప్పు తీసుకొన్నా.  పద్నాలుగుసార్లు మిత్తి కట్టినా. నాకు జబ్బు చేసి కూలికి వెళ్లలేకపోయినా. నా మొగుణ్ణి మేకలు కాయమని  జీతానికి పెట్టినా, ఆడికిచ్చే సంవత్సరం జీతం రెండునెల్లకోసారి తీసుకొని వడ్డీ కట్టినా, రెండోపాలి నా కొడుక్కి జీతం కట్టే రోజుకి ఈ ఇరవైవేలు బాకీ తీరి మళ్లీ తీసుకోవచ్చు. పిల్లాడి చదువు అయిపోతుంది అనుకొంటే పిల్లాడి చదువాగిపోయింది. మిత్తి కట్టనందుకు నన్ను తన్ని జైల్లో పెట్టించారు. నా కొడుకు భయపడి ఇంట్లోంచి పారిపోయిండు. నా మగడు పురుగుమందు తాగి సచ్చిపోయిండు. నేనిట్టయినా. నా కొడుకు ఏడకిపోయిండో,  నేనీ ఇరవైవేలు అప్పు ఎలా తీర్చాల్నో .. ఇదీ ఏడుపు.

ఇరవైవేలకు ప్రాణం పోయింది. చదువుకొనే పదిహేడేండ్లవాడు ఊరువదిలి పరారైనాడు. నాగమ్మ ఇల్లు, సామాను జప్తు చేశారు. ఆమె రోడ్డున పడి కూర్చుని వుంది. ఇలాంటి బతుకులు, ఇప్పుడామెకు మళ్లీ అప్పిస్తానంటే సంతోషంగా తీసుకొంటుంది. అసలు రూపాయి ఎక్కడుంది. వాళ్ల చేతిలోకి ఎలా వస్తుంది.?  ఈ బతుకులపైన వ్యాపారం చేస్తూ బెహరా విమానాల్లోనే తిరుగుతాడు. విమానాశ్రయాల్లో వీఇపిలతో కలిసి కనిపిస్తాడు. కమలలాంటి వాళ్లకు బిజినెస్ ఇస్తాడు. నాయుడుకు పర్సంటేజ్ ఇస్తాడు. రవళిలాంటి అందమైన భార్యకు చానల్ ఇస్తాడు. ఏమైనా చేస్తాడు. కానీ నాగమ్మ, బెహరా ఇద్దరూ మనుషులే. ఒక్కలాగే పుట్టారు. నాగమ్మ చీకటి వెంట. బెహరా వెలుగుల వెంట వున్నారు. నాగమ్మను తలుచుకొంటే నీతి నియమం, దయ, దాక్షిణ్యం, మనిషితనం పక్కన పెట్టి కెరీర్ గ్రాఫే చూసుకోవాలనిపించింది శ్రీధర్‌కు.

“ఏమిటాలోచిస్తున్నావ్…?”

“కమల వాళ్లని మీరు కలుద్దురుగానీ, లంచ్ ఇక్కడకు చెబితే సరిపోతుంది” అన్నాడు శ్రీధర్.
“బావుంది” అన్నాడు ఎండి.

***

కెమేరామెన్ పూర్ణ వెయిట్ చేస్తున్నాడు. అతన్ని శ్రీకాంత్ కొట్టాడు. యూనిట్ అంతా షూటింగ్ కాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చారు. శ్రీజ కూడా వుంది. లోపలికి పంపమంటారా…? ఇంటర్‌కంలో చెప్పింది పి.ఎ.

“ఎందుకు కొట్టాడట. లోపలికి రమ్మను” అన్నాడూ చిరాగ్గా ఎం.డి.

పూర్ణ లోపలికి వచ్చాడు. అతని వెనకాలే శ్రీజ వచ్చింది. కెమేరా అసిస్టెంట్ డోర్ దగ్గర నిలబడ్డాడు.

“కూర్చో” అన్నాడు ఎం.డి.

పూర్ణ కూర్చున్నాడు. అతని మొహం ఎర్రగా వుంది.

“చాలా కష్టం సర్ శ్రీకాంత్ సర్‌తో. చాలా ఎగ్రసివ్‌గా ఆలోచించకుండా బిహేవ్ చేస్తాడు. మేం చాలా ఓర్చుకున్నాం సర్. ఈ రోజు షూటింగ్‌కు బయలుదేరాం.
శ్రీజగారు లేటయ్యారని ఆమెను కోపంతో అరిచాడు. చాలా అప్‌సెట్ అవుతున్నాం సర్. చిన్న జోక్ వేశాను సర్. అప్పటిదాకా నవ్వుతూనే ఉన్నాడు సర్. చెంపపైన లాగిపెట్టి కొట్టాడు. తలుచుకొంటే నేనూ చేయి చేసుకోగలను సర్.”

“ఏం జోకేశాడు” అన్నాడు శ్రీజతో.

ఆమె మొహం దించుకొంది.

“సరిగా వినపడలేదు. ఏదో నాపైనే అయి వుంటుంది సర్”

“వినపడకపోవటానికి అదేమన్నా ప్యాలెస్సా, కార్లో పక్కనే కూర్చున్నా వినబడలేదా.”

“నన్ను ముందు సీట్లోనే కూర్చోమంటాడు సర్ శ్రీకాంత్” అన్నది శ్రీజ ఉన్నట్లుండి.

శ్రీకాంత్ తనను ముందు సీట్లో ఎందుకు కూర్చోమంటాడో అర్ధం అయింది ఆమెకు. ముఖం ఎర్రగా పెట్టుకొంది.

ఒక్క క్షణం కూడా అతనికి తనకు పడదు. ఎప్పుడూ ఆయన్ని వెనకాల శాపనార్ధాలు పెడుతూనే వుంటుంది అందరి ముందు. అతను లేనప్పుడు అతన్ని అనుకరించి నవ్విస్తూ వుంటుంది. కార్లో ఏ డైరెక్టరయినా వేన్‌లో తనతో కలిసి కెమేరామెన్‌తో కలిసి వెనక సీట్లో కూర్చుంటారు. మేకప్ అతను డ్రెస్ తీసుకొని వెనకాల కూర్చుంటాడు. కెమేరామెనో ఎవరో ముందు సీటు ఆక్యుపై చేస్తారు. శ్రెకాంత్ ఒక్కడే తనను ముందు సీట్లో కూర్చోమంటాడు. సరిగ్గా చెప్పడు. కసుర్తాడు. ఆ మేకప్ ఏమిటంటాడు. ఆ డ్రెస్ అలా వుండాలా అంటాడు. చిరాగ్గా వుంటుంది అతన్ని చూస్తే, మొదటిసారి తనకు తెలియనిది ఏదో జరిగినట్టు అనిపించింది శ్రీజకు. ఇప్పటివరకు పూర్ణని కొట్టడం తనకు నచ్చలేదు. కారణం ఎవ్వళ్ళూ మాట్లాడలేదు. కొట్టడం గురించి అరుచుకున్నారు. సగం దూరం వెళ్లాక ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొని వచ్చేశారు.

“శ్రీకాంత్‌ని రమ్మను. శ్రీధర్‌ని కూడా..” ఇంటర్‌కంలో పి.ఎ.కి చెప్పాడు ఎం.డి.

నిముషంలో శ్రీధర్ వచ్చాడు. తాపీగా శ్రీకాంత్ వెనకాలే వచ్చాడు. అప్పటిదాకా శ్రీకాంత్ ప్రవర్తన ఎంత అరాచకంగా వుంటుందో చెపుతూనే వున్నాడు పూర్ణ.

“శ్రీధర్, శ్రీకాంత్‌ని పంపిచ్చేద్దాం. ఇలాంటి బిహేవియర్ కష్టం.” అన్నాడు కోపంగా.

శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు.

“సర్. ఏం జరిగింది”

“అతన్నే అడుగు” అన్నాడు ఎం.డి.

ఏంట్రా అంటూనే సర్దుకొని ఏం జరిగింది శ్రీకాంత్ అన్నాడు.

“పొరపాటే సర్. కోపం వచ్చి కొట్టాను” అన్నాడు శ్రీకాంత్.

“చూశారా.. చూశారా పొరపాటేమిటి సర్. నన్ను ఇన్‌సల్ట్ చేసినట్టే కదా సర్” అంటూ గోలపెట్టాడు పూర్ణ.

“ఎందుకు కొట్టారు. కొట్టడం ఏమిటండీ” అన్నాడు కోపంగా శ్రీధర్.

ఈరోజు శ్రీకాంత్ ఉద్యోగం ఊడిపోయింది అనిపించిందతనికి..

“చిన్న జోక్ సర్” అంటూనే ఆగిపోయాడు పూర్ణ. హటాత్తుగా అతనికి తట్టింది.

తను వేసిన జోక్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు శ్రీకాంత్. తలతిప్పి శ్రీజ వైపు చూశాడు. ఆమె కళ్లెత్తి శ్రీకాంత్ వైపు చూస్తోంది. తన జోక్ తనకే నచ్చనట్లు అనిపించింది పూర్ణకు.
ఆ అమ్మాయి కాస్త పొట్టిగా, తెల్లగా, బొద్దుగా వుంటుంది. తన పక్కన కూర్చోమని తనే ఇన్వైట్ చేశాడు. హాయిగా వచ్చి కూర్చొంది. శ్రీకాంత్ వస్తూనే ఆమెను ముందుకెళ్లమన్నాడు. జుట్టు గాలికి ఎగురుతూ వుంది. ఏసి లేదు కనక గ్లాస్ డోర్ ఓపన్ చేస్తారు. జుట్టు చెదిరిపోతుంది ముందు సీట్లోకి వెళ్లను అంది. నోరు మూసుకుని ఫ్రంట్ సీట్‌లో కూర్చో అన్నాడు. నీలంరంగు చీరె, డిజైనర్ బ్లౌజ్ వేసుకొంది. బ్లౌస్ వెనకవైపుగా రౌండ్‌షేప్‌లో కట్ చేసి, పైనో ముడి వేసింది. వీపంతా తెల్లగా కనిపిస్తోంది. ఎంతో టెంప్టింగా వుంది ఆ అమ్మాయిని చూస్తే. అటు కూర్చోండి సర్ అన్నాడు తను. నువ్వు వెనక్కురా అని ముందు సీట్లో కూర్చుని అసిస్టెంట్‌కి చెప్పి శ్రీజను గదిమాడు శ్రీకాంత్. అమె విసుక్కుంటూ దిగింది. పక్కనే వచ్చి కూర్చున్న శీకాంత్‌తో మస్తు మజా మిస్ అయ్యాం సర్. ఆ పోరికి లేని కష్టం మీకెందుకు అన్నాడతను. సరిగ్గా ఈ మాటలే అన్నాడతను. ఆ నిముషానికి నోటికొచ్చిన పదం ఒకటి వాడాడు కూడా. ఓ నిముషం తప్పు చేశాననిపించింది పూర్ణకు.

“అదేనయ్యా ఎందుకు కొట్టావు. కారణం సరైందయితేనే, లేకపోతే వెళ్లిపో. నిముష, నిముషం నీతో న్యూసెన్స్‌గా వుంది” అన్నాడు ఎం.డి.

“కారణం చెప్పండి స్రీకాంత్” అన్నాడు శ్రీధర్.

“పూర్ణ ఊరికే సతాయించాడు సర్. లేటయిందని. శ్రీజతో ప్రతిరోజూ ఇదే ప్రాబ్లం. కోపం వచ్చింది” అన్నాడు. అంతే గానీ పూర్ణ వేసిన జోక్, బూతు మాట గురించి చెప్పలేదు.

అతని మొహంలో ఎలాంటి చిరాకు లేదు. ఎం.డి మోగిన పోన్ చూసుకొంటున్నాడు.

శ్రీకాంత్ మొహం చూసి చిరాకు ముంచుకొచ్చింది శ్రీధర్‌కు. వీడీ జన్మకు మారడు అనుకొన్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ల బాధ ఇతనిదే.

“ఏమంటావు?”  ఎండి మొదటికొచ్చాడు.

శ్రీధర్‌వైపు, పూర్ణవైపు చూశాడు. పూర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పా పం శ్రీజ గురించి తనేం మాట్లాడాడో చెపితే శ్రీజకి ఎంత అవమానం. ఈ విషయం ఈయనకి తెలిస్తే ముందు నన్నెళ్లి పొమ్మంటాడు..

“అదే ఏమైంది..” మళ్లీ గద్దించాడు ఎండి.

“యూనిట్‌ని సరైన టైంకి హ్యాండిల్ చేయకపోవటం నా ఇనెఫిషిన్న్సీ అన్నాడు సర్. నాకు ప్రొడ్యూసర్ లక్షణాలు ఏవీ లేవన్నాడు” అన్నాడు శ్రీకాంత్.
ఎండీకి నవ్వొచ్చింది.

“అయితే కొట్టేస్తావా?” అన్నాడు.

“ఆయనకి ఊరికే కోపం వస్తుంది సర్” అన్నాడు పూర్ణ. అతని గొంతులో కోపం లేదు. అనవసరంగా ఇష్యూ చేశాననిపించింది. భయం వేసింది. శ్రీజ గురించి తను వాగిన వాగుడు ఇప్పుడు ఎండికి చెబితే తనకు మరి ఫ్యూచర్ లేదు అందరి ముందు పరువూ లేదు.

“అయితే ఏంటంటావయ్యా, పూర్ణ కంప్లయింట్ చేస్తున్నాడు. శ్రీజ ఏడుస్తూ కూర్చుంది. ఆఫీస్ ఎట్మాస్ఫియర్ డిస్టర్బ్ అవుతోంది నీ వల్ల. నీలాంటివాళ్లు ఒకళ్లున్న చాలు. ఆఫీస్ కిష్కింధలాగా అయిపోయినట్లే. ఇట్ ఈజ్ వెరీ బాడ్. కొట్టుకోవటం ఏమిటయ్యా.. నీతోటివాడు. కొలీగ్, నీకెంత కోపం వచ్చినా కొట్టడమేమిటి అసహ్యంగా”

“కొట్టాలనుకోలేదు. ఏదో చిరాగ్గా ఉన్నాను. నా వల్లనే ప్రోగ్రామ్స్ లేటయిందంటాడు. కేమ్స్ తీసుకొని గంట సేపటినుంచి ఎండలో నిలబడ్డాం. మీరు రాలేదు. ఫోన్ చేయలేదు. మా ఇంచార్జ్ వచ్చేయమన్నాడు అంటాడు. నన్ను లేట్ మాస్టర్ అంటే..”

తలపట్టుకొన్నాడు ఎండి.

“తంతావటయ్యా. తన్ను అందరినీ, పెద్ద రౌడీలాగా ఉన్నావే” అన్నాడు చిరాగ్గా.

శ్రీకాంత్‌పైన ఎవరికీ కోపం రాదు. ఎంతోమంచి రైటర్. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా మొత్తం తనకే ఆ కష్టం వచ్చిందనుకుంటాడు. ఆడపిల్లలు యాంకర్లు అతని నీడలో ఉన్నట్లుంటారు.
ఎండీకి హఠాత్తుగా ఏదో స్ఫురించింది. పూర్ణ మిస్ బిహేవ్ చేసి వుంటాడనిపించింది.

“ఏం చేద్దాం?” అన్నాడు పూర్ణతో.

పూర్ణ కంగారుపడ్డాడు.

“శ్రీధర్ చూడవయ్యా.. ఇతన్ని కొట్టాడు. ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొనేంత ఇష్యూ అయింది. ఇతన్ని మనం భరించాలా?”

“పూర్ణా.. జరిగింది లెటర్ రాసివ్వు. శ్రీకాంత్‌ పైన యాక్షన్ తీసుకొందాం”

శ్రీధర్, శ్రీకాంత్ ఇద్దరూ మాట్లాడలేదు.

పూర్ణ నోరు పెగుల్చుకొన్నాడు.

“సర్ నాదే తప్పు ఆర్. దీన్ని వదిలేద్దాం సర్.” అన్నాడు.

అందరికీ అర్ధమయ్యీ అర్ధం కాకుండా వుంది. నిశ్శబ్దంలోంచి శ్రీజ వెక్కిళ్ళు పెద్దగా వినిపించాయి అందరికీ. చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆ అమ్మాయి. ఒకసారి మొహం పైన లైట్లు పడ్డాక చానళ్ళలో తళుక్కున మెరిశాక ఇంకో జీవితం ఏ యాంకరూ ఊహించదు. టీవీపైన మమకారంతో ఎలాంటి హింసకైనా  ఓర్చుకుంటారు. ఉదయం వేసుకొన్న మేకప్‌తో చర్మం మండిపోతున్నా ఎండలో నిలబడి సాయంత్రం వరకూ షూటింగ్ చేస్తారు. ఎండలు మండిపోతున్నా ఫాన్ వేస్తే ఆ రెపరెపల శబ్దం కెమేరా రికార్డర్లో వస్తాయని దిగ చెమటలతో కుకరీ ప్రోగ్రాం చేస్తూ, నవ్వుతూ వండిన వంట నవ్వుతూ రుచి చూస్తూ నవ్వుతూ పేలుతూ నటిస్తూ వుంటుంది తను.

ప్రతిరోజూ ఒక కొత్త డిజైనర్ డ్రెస్, అందమైన నగలు, వెనక్కాల హెయిర్ డ్రస్సర్, మేకప్ మేన్‌ల గారాబం, షూటింగ్ స్పాట్‌లో గౌరవం, స్క్రీన్ పైన కనిపించే అందం, లక్షలమందికి తను తెలుస్తానన్న గర్వం, వాటికోసం తనలాంటి అమ్మాయిల పరుగులు, తమ  ఆశల చుట్టూ ఇంకోళ్ళ వ్యాపారపు ఆశలు, తమ అందం, వాక్చాతుర్యం చుట్టూ కమర్షియల్ ప్రోగ్రాంలు,  ప్రతిరోజూ రాత్రి పది నుంచి పదకొండు గంటల వరకూ చేసే ప్రోగ్రాం ఏమిటి? ఫోన్ కొట్టండి కాష్ పట్టండి, ఏంటా ప్రోగ్రాం. అందమైన డ్రెస్, రంగురంగుల విగ్‌లు.. గంటసేపు ఎడతెరిపిలేని కబుర్లతో ప్రేక్షకులపై ఆశలవల విసిరేయటం, స్క్రీన్‌పై ఎవరో పాపులర్ యాక్టర్,  కనీకనిపించనట్లుగా కనిపిస్తాడు. అతనెవరో కనుక్కోమంటూ, కనుక్కుంటే ఐదువేలు గిఫ్టంటూ, ఒకసారి ఎవరైనా ఫోన్ చెసి ఇరుక్కున్నారంటే అరవై, డెబ్బై రూపాయలు ఫోన్ కాల్స్ రూపంలో చానల్ లాగేస్తుంటుంది. ప్రోగ్రాం అయ్యేసరికి కార్యక్రమం  చేయడానికి అయ్యే ఖర్చుకంటే ఎన్నో ఎక్కువ రెట్లు ప్రేక్షకుల దగ్గరనుంచి లాగేస్తుంటారు. అందులోంచి ఐదువేలు గిఫ్ట్ ఇవ్వటం ఏం కష్టం. ఆ ప్రోగ్రాం అయ్యేసరికి పదకొండు దాటిపోతుంది ఆవేళకి. తనతోపాటు ఆఫీస్ కార్లో రావటానికి ఎంతోమందికి ఆశ. ఎక్కడో బిర్యానీ తిందామా అంటారు. కబుర్లలో పెడతారు. తను తేలిగ్గా దొరకాలని ఎంతమంది కలలు.. తను మాత్రం తక్కువదా? నవ్వుతూనే వుంటుంది. కాస్సేపు నవ్వుతూ మాట్లాడితే అలా పడుంటారని, వేరే ప్రోగ్రామ్స్‌కి తననే అడుగుతారని ఆశ. ఇవన్నీ చూస్తూ ఎండితో కవిత్వాన్ని వినిపిస్తూ, చుట్టుపక్కల చానల్‌లలో, సినిమాల్లో చాన్స్ దొరికితే బావుంటుందని సినిమా ప్రొడ్యూసర్‌లతో,  ప్రతివాళ్లతో ఫోన్‌లో చాటింగ్‌లూ, నవ్వులూ… తన విలువ తను ఇలా గుర్తించింది.

శ్రీకాంత్ ఇంకో రకంగా గుర్తించాడు. ఎప్పుడూ ఎవ్వరినీ ముట్టుకోనివ్వడు. యాంకర్ అయినా డిగ్నిఫైడ్‌గా ఉండాలి. అది ఉద్యోగంలా చూడాలి. కంటిచూపుతో శాసిస్తాడు. తనని ముందుసీట్లో కూర్చోమంటూ, ఎవళ్లనీ తన పక్కన కూర్చో నివ్వకుండా చేసే తత్వం మొదటిసారి అర్ధమయ్యిందామెకు. తననే కాదు తనతోటి యాంకర్లతో సొంత చెల్లెళ్లలాగే మాట్లాడతాడు. పూర్ణ తనపైనే జోక్ వేసి వుంటాడు. దాన్ని భరించలేక ఈయన కొట్టాడు. కొట్టేముందు ఎలాంటి ఆలోచనా లేదు. తనకేం జరుగుతుందో, శ్రీజ వల్ల తనకేం ఒరిగింది, ఆఫీస్, తన ఉద్యోగం ఇవేం లేవు. తన చెవుల్లో ఒక ఆడపిల్ల గురించిన చౌకబారు మాటలు.

శ్రీజ కన్నీళ్లలో ఈ దుఃఖం అంతా జారుతుంది.

(సశేషం)

 

నాట్స్ సంబరాలలో సాహిత్య సందడి

LITERARY flyer - Finalజూలై 4-6 తేదీలలో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి మూడవ అమెరికా సంబరాలలో భాగంగా జరగనున్న సాహీతీ కార్యక్రమాల సమాహాలిక “నాట్స్ సాహిత్య సౌరభం” విశేషాలను తెలుసుకోవడానికి నిర్వాహకులు అనంత్ మల్లవరపు గారితో ముఖాముఖి.

అనంత మల్లవరపు

అనంత మల్లవరపు

Qఅనంత్ గారు, నమస్కారం.  ముందుగా “నాట్స్ సాహిత్య సౌరభం” నిర్వహణ కమిటీ కి శుభాకాంక్షలు. ఈ “నాట్స్ సాహిత్య సౌరభం” కార్యక్రమాలను వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగు గారికి అంకితం ఇవ్వడం లో మీ సంకల్పం గురించి చెబుతారా?

ఈ సంవత్సరం మనం గిడుగు గారి 150 వ జయంతి జరుపు కుంటున్నాము. ఇది కేవలం కాకతాళీయం అయినప్పటికీ, సాహిత్యం సామాన్య ప్రజానీకంలోకి చొచ్చుకుపోవటానికి, ఆనాటి ఛాందస గ్రాంధిక భాషావాదులను ఎదిరించి గిడుగు వారు నడిపిన వ్యవహారిక భాషా ఉద్యమం మరిన్ని రచనలు వాడుక భాషలో రావటానికి దోహదం చేసింది. వాటి ఫలాలనే మనం నేడు అనుభవిస్తున్నాం. నాట్స్ సంబరాలలో భాగంగా మేము జరుపుతున్న సాహిత్య కార్యక్రమాలలో గిడుగు గారికి నివాళి అర్పించడం మా భాధ్యతగా భావిస్తున్నాం.

  1. Qనాట్స్ సాహిత్య సౌరభం లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసారు? చాటి వివరాలు అందిస్తారా?

మా సాహిత్య సౌరభంలో వైవిద్యభరితమైన కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైనవి  సమకాలీన భాష మీద చర్చా కార్యక్రమం, సంగీత నవ అవధానం,మా బాణి – మీ వాణి,ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ తో ముఖా ముఖి, పుష్పాంజలి, స్వీయ కవితా విన్యాసం మొదలైనవి.

Qసాధారణంగా అమెరికా లో అవధానం అంటే చాలా మందికి ఆసక్తి, ప్రతి మహాసభల లోను అవధాన ప్రక్రియ ఒక  ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. ఈ సంబరాలలో అవధాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?

సంగీత నవ అవధానం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ సృష్టికర్త శ్రీ మీగడ రామలింగ స్వామి గారు నిర్వహిస్తారు. పాట, కీర్తన, గజల్ ని మిగతావారు కూడా ఆదరించినా తెలుగువారు పతాకస్థాయికి తీసుకెళ్ళిన కళాస్వరూపం పద్యం. అలాంటి పద్యాన్ని తెలుగు వారికి అందిస్తున్న అరుదైన కళాకారుల్లో ఒకరు మీగడరామలింగస్వామి గారు. ఈనాడు పద్యాల మాధుర్యాన్ని ప్రధానంగా అవధానాలు చేసే కవుల ద్వారా మనంవింటున్నాం. ఐతే పద్యం సొగసు పూర్తిగా కనిపించేది సంగీత పరిజ్ఞానం ఉన్న గాయకుడు గొంతెత్తిపాడినప్పుడు. సంగీతాన్ని దృష్టిలో పెట్టుకొని రామలింగస్వామి గారు ప్రవేశపెట్టిన ప్రక్రియ సంగీత నవ అవధానం. ‘నవ’ అంటే తొమ్మిది లేక కొత్త. ఏడుగురు ప్రాశ్నికులు(పృచ్ఛకులు), సంధాత, అవధాని కలిస్తే తొమ్మిది. వీరందరూ కలిసి నవ్యంగా చేసే అవధానం నవావధానం. పురాణం, ప్రబంధం, శతకం, నాటకం, అవధానం, ఆధునికం, శ్లోకం అనేవి ప్రాశ్నికుల అంశాలు. ఈ అంశాలలో ప్రాశ్నికులు అడిగిన పద్యాలు అడిగిన రాగంలో అవధాని ఆశువుగా ఆలాపించి ప్రేక్షకులని ఆనందింప జేస్తారు. మీగడ రామలింగస్వామి గారు సంగీత పరిజ్ఞానం అపారంగా కల ప్రముఖ రంగస్థల నటులు. పాండవోద్యోగవిజయాలు, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్ర, అశ్వథ్థామ, గుణనిధి వంటి అనేక నాటకాలలో ప్రముఖపాత్రధారులు. ఎన్నో పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు రచించారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పరిశీలించి విశ్లేషణాత్మక వ్యాసాలు ప్రచురించారు. పద్యంలో ఉన్న మాధుర్యాన్ని మీకందించాలని మేము చేసే ఈ ప్రయత్నాన్ని రసహృదయులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

Qఅవధానం లాగే మరో ఆసక్తి కరమైన అంశం సిని సాహిత్యం – ఈ విభాగం లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు?

చలనచిత్ర సాహిత్యంలో భాగంగా “మా బాణి – మీ వాణి” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాము. ఇందులో ప్రముఖ సినిమా కవులు చంద్రబోసు గారు, రసరాజు గారు, వడ్డేపల్లి కృష్ణ గారు, సిరాశ్రీ గారు పాలుపంచు కుంటారు. వారందరికీ తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఇంతకుముందు వచ్చిన మధురమైన పాటల బాణీలు, తెలుగులో అనువాదం కానివి వారికి ముందు రోజు అందచేస్తే, వారు మరుసటి రోజు కార్యక్రమంలో ఆ బాణీలకు పాటలు రాస్తారు. వీటిని మధుర గాయకులు రాము ఆలాపిస్తారు. ఇందులో ప్రేక్షకులు కూడా పాలుపంచుకునే అవకాశం ఉంది.

Qమీ కార్యక్రమాల వివరాలు చూస్తే, చాలా వరకు కొన్ని కొత్త అంశాలు వాటికి తగ్గట్టు గా కొత్త తరం అతిధులు.  ఈ విషయం లో ఏమైనా ప్రత్యేకత పాటించారా?

తప్పకుండా! ఈనాడు కార్టూనిస్ట్ “ఇదీసంగతి” ఫేమ్ శ్రీధర్ గారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా ఆహ్వానిస్తున్నాం. ఆయన గురించి తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో! ఆయనతో ముఖాముఖి, తెలుగు కార్టూన్ల మీద ప్రత్యేక ప్రసంగం ఉంటాయి. సాహిత్యరంగంలో ప్రతిభావంతులైన ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ గారు ఈ కార్యక్రమాలలో మరో ముఖ్య అతిధిగా పాలుపంచుకుంటున్నారు.  అదేవిధంగా ఈతరం గీతరచయితలలో పంచదార బొమ్మ లాంటి మంచి పాటలను అందిస్తున్న సినీ గేయ రచయిత, గాయకుడు చంద్రబోస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

Qచివరిగా, ఈ నాట్స్ సాహిత్య సౌరభం – కార్యక్రమ నిర్వహణ ద్వారా మీరు ఇవ్వాలనుకుంటున్న సందేశం ఏమిటి? చూడాలనుకున్న మార్పు ఏమిటి?

తెలుగు భాష, తెలుగు సాహిత్యం అనేవి ఏ కొందరి మేధావుల సొత్తు కాదు. అది అందని ద్రాక్ష కాదు. అది తెలుగు మాతృభాషగా ఉన్నవారందరూ ఆస్వాదించేది. తెలుగు భాష మాట్లాడే వారందరూ తెలుగు సాహిత్యాన్ని చదవాలనీ, తద్వారా మానసిక సంతృప్తే కాకుండా, సామాజిక స్పృహ కూడా పెంపొందుతుందనేది నా నిచ్చితాభిప్రాయం. కాబట్టి సాహిత్య సభలని అందరూ ఆనందించాలని నేను కోరుకుంటాను. ఈ సందర్భముగా సాహిత్య మిత్రులకు, తెలుగు భాషాభిమానులకు నాట్స్ సాహిత్య కార్యక్రమాలకి రావలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను.

 ఇంటర్వ్యూ: షేక్ నసీం

స్వాతి వాళ్ళ అమ్మ

క్రొత్తగా పెళ్లి చేసుకుని  విదేశానికి వచ్చి  బయటకి  కదలకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సివచ్చినందుకు  విసుగ్గా ఉంది  స్వాతికి.   అనుకోకుండా  ఒక ఆహ్వానం అందింది. ఆటవిడుపుగా ఆ కార్యక్రమానికి  హాజరైంది. అక్కడ అనేకమంది తెలుగు వారిని చూసి సంతోష పడింది. అందరినీ పరిచయం చేసుకుంది.  అంతా తెలుగు వారే కావడంతో అది  ఆంధ్రదేశంలో ఒక  ఊరులాగా తోచింది.
అదొక కమ్యూనిటీ హాలు.   ఆ రోజు అక్కడ ఒక కార్యక్రమం జరగబోతోంది. ప్రత్యేకించి స్త్రీలకి సంబంధించిన కార్యక్రమం. పరాయిభావనలో మూలాలు గుర్తుకు రావడం మూలంగానేమో దేశంలో జరిగే ప్రతి చిన్నవిషయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి  అలవాటు పడిపోయిన వారికి అదొక అవకాశమే!

వారానికి అయిదు రోజులు యంత్రాలలా పనిచేసి ఆటవిడుపు కోసం వెతుక్కుని నలుగురూ కలిసే సందర్భం  కోసం ఎదురు చూస్తున్న  వారికి కందుకూరి జయంతి గుర్తుకు వచ్చింది.  స్త్రీల పునర్వివాహాలు జరిపించడానికి విశేషంగా కృషి చేసిన విధం గుర్తుకు వచ్చింది.   వెంటనే  ఒక కార్యక్రమం వారి ఆలోచనలలో రూపుదాల్చింది. నాటి కాలానికి నేటి కాలానికి వచ్చిన మార్పులు గమనిస్తూ పునర్వివాహాల  వల్ల  కలిగే మంచీచెడుల పరిణామం గురించి ఒక చర్చా కార్యక్రమం నిర్వహించదలిచారు.

‘ఒంటరి స్రీలు – పునర్వివాహం అనే అంశంపై  ఎవరైనా మాట్లాడవచ్చు  వారి వారి అనుభవాలని చెప్పవచ్చు’ అని ప్రకటించారు. రోజంతా అదే విషయం పై కార్యక్రమం జరుగుతుంది  కాబట్టి చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

స్వాతి కార్యక్రమాన్ని ఆసక్తిగా  చూస్తూ ఉంది.
కొందరు చక్కటి తెలుగులోనూ, మరి కొందరు ఇంగ్లీష్  లోను వారి అనుభవాలనీ, అభిప్రాయాలనీ చెబుతున్నారు.  చాలా మంది పునర్వివాహం చేసుకోవడం  చాలా మంచి ఉద్దేశ్యం అనీ, ఒంటరి జీవితాలకి తోడూ-ప్రేమా దొరుకుతాయని, మనిషి ఆనందంగా బ్రతకడానికి వివాహం చాలా అవసరం అని చెపుతున్నారు. వారి వారి మాటలు వింటున్న స్వాతికి  కోపం ముంచుకొస్తోంది.
ప్రక్కనే ఉన్న భర్త అనిల్ స్వాతి చేయి పట్టుకుని వారిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ భర్త మాటని లక్ష్య పెట్టకుండా లేచి గబా గబా నిర్వాహకుల దగ్గరికి వెళ్లి  తనకీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని కోరింది.  నిర్వాహకులు ఆమె పేరుని నమోదు చేసుకుని వరుస క్రమంలో ఉంచారు.
” స్వాతీ .. ఏం  మాట్లాడ దల్చుకున్నావ్ ? ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నావా ? అలాంటి బుద్ది  తక్కువ ఆలోచన మానుకో ! మన గురించి మనమే చాటింపు వేసుకోవడం అవసరమా ? ” అన్నాడు అనిల్. “మన అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటే తప్పేమిటి?   ఆ అనుభవం ఇతరులకి మంచి చేయవచ్చు కదా! ” అంది స్వాతి.
“ఇక్కడ ఉన్నంత మాత్రాన స్వేచ్ఛ గా ఎవరికీ తోచింది వారు చేసేయవచ్చు అనుకోకు. మనకి అక్కడ ఉన్నట్లే ఇక్కడ వారిలో కూడా చాలా విషయాలలో మూర్ఖత్వం ఉంది. పై పైకి అందరూ నాగరికులే, చదువుకున్న వారే, సంస్కారం ఉన్నవారే, కాని మన జీవితాలలో ఉన్న చిన్న లోపం కనిపెట్టినా చెవులు కొరుక్కుంటారు. వెలివేసినట్టు చూస్తారు.   ఎవరికీ కూడా  మనం అనుకున్నంత విశాల హృదయం ఉండదు. ముందు ‘అయ్యో ! అలాగా!’అని సానుభూతి చూపించి మన వెనుక మళ్ళీ తాటాకులు కడతారు. ఇతరులు మన గురించి తక్కువగా చూడటం, హీనంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.  నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తావని నేను అనుకోను. ఇకపై నీ ఇష్టం.”అని  చెప్పాడు అనిల్.
స్వాతి మౌనంగా ఉండి పోయింది. “అక్కడొక ఫ్రెండ్ విష్ చేస్తున్నాడు. వెళ్ళి వస్తాను. నువ్వు వస్తావా? “అని అడిగాడు.
“నేను రాను మీరు వెళ్లి రండి” ముభావంగా చెప్పింది. కార్యక్రమంలో పాల్గొనడానికి  తన వంతు వచ్చేటప్పటికి  స్వాతి లేచి వెళ్ళింది.  వెళ్ళేటప్పుడు భర్త వైపు చూడను కూడా చూడలేదు. చూస్తే మరొక సారి చూపులతో అయినా తనని హెచ్చరిస్తాడని.  స్వాతి వేదికపైకి వెళ్లి మైక్ తీసుకుని గొంతు విప్పింది.  ఒకసారి బలంగా గుండెల నిండా గాలి పీల్చుకుని వదిలింది.
“నేను నా అనుభవాన్ని చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది” అని – అందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. నిర్వాకుల అనుమతి లభిండంతో  స్వాతి చెప్పడం మొదలెట్టింది.
“నా పేరు స్వాతి. నాకు నా  తల్లి అంటే చాలా ఇష్టం. అందరికి అమ్మ అంటే ఇష్టమే, కానీ నాకు  మరీ ఇష్టం. నేను  పుట్టి నాలుగు నెలలైనా కాక ముందే నాన్న చనిపోయాడు. భర్త పోయిన బాధని, తనలో ఉబికే  దుఃఖాన్ని తనలోనే దాచేసుకుని బిడ్డే ప్రపంచం అన్నట్లు  బతికింది. అత్తమామలకి, కన్నవాళ్ళకి మధ్య తలలో నాలుకలా మెలుగుతూనే ఆగి పొయిన  చదువు కొనసాగించి  లెక్చరర్ అయింది  అమ్మ.
సన్నిహితులు ఎవరైనా  ‘ఎన్నాళ్ళు ఇలా మోడులా ఉంటావమ్మా ! స్వాతిని చూసుకోవడానికి మేమంతా లేమూ ! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో’ అని  చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పేవారు.
” స్వాతి కి నాన్న ఎలా ఉంటారో తెలియదు.  నేను  పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయి తనకి అమ్మని దూరం చేయమంటారా?  అప్పుడు నేను అమ్మని కాను మర బొమ్మని అవుతాను. నా బిడ్డ తోడిదే నాకు లోకం. అమ్మని అనిపించుకొవడమే  నాకు గొప్ప కానుక. మరిక ఏ కానుకలూ వద్దు ” అని సున్నితంగా తిరస్కరించేది.
నాన్న గురించి అమ్మ చెప్పేటప్పుడు  చూడాలి ఆమె ముఖం. నవ్వుతో మెరిసిపోయేది.  నాన్న నాకు స్వాతి అని పేరు పెట్టడం వెనుక కూడా ఒక విశేషం ఉందట. స్వాతి సినిమా వచ్చినప్పుడు నేను పుట్టానట. స్వాతి సినిమా నచ్చి నాకు స్వాతి అని పేరు పెట్టారని అమ్మ చెపుతుంటే విని స్వాతి సినిమాని ఎన్నిసార్లు చూసి ఉంటానో !  సినిమా చూసిన ప్రతి సారీ మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేయాలి అనిపించేది.  మా నాన్నకి తను చనిపోతానని ముందే తెలుసేమో!  అందుకే నాకు ఈ పేరు పెట్టారేమో! అని తెగ ఆలోచనలు ముంచుకొచ్చేవి. అమ్మని ఆ మాటే అడిగితే   చప్పున పెదవులపై చూపుడు వేలుంచి ‘తప్పు అలా మాట్లాడ కూడదు.  ఎవరు ఎప్పుడు చనిపొతారో ఎవరికీ తెలియదు. చనిపోయేలోగా మంచి పనులు చేయాలని అనుకోవాలి’ అని చెప్పేది.
మరి నీకు పెళ్లి చేయడం మంచి పనే కదా !  నాకు నాన్న కావాలనుకోవడం మంచి పనే కదా అని అమ్మని విసిగించేదాన్ని. నేను, అమ్మ నాయనమ్మ  వాళ్ళింట్లో ఉండేవాళ్ళం. నాయనమ్మ, తాతయ్య అమ్మని కూతురులా చూసేవాళ్ళు. మా ఇంటి ప్రక్కనే రాజేశ్వరి టీచర్ ఉండేవారు. ఆమె భర్త కూడా టీచర్.  కానీ ప్రమోషన్ పై ఆ ఊరి స్కూల్ కి హెడ్మాస్టర్ అయ్యారు.  ఆయన పేరు మోహన కృష్ణ. పేరుకు తగ్గట్టు మోహనంగా ఉండేవారు. ఎప్పుడూ నలగని ఖద్దరు సిల్క్ దుస్తులతో పాటు నలగని నవ్వు, కళ్ళకి  నల్లద్దాల చలువ కళ్ళ జోడుతో  చాలా హుషారుగా కనిపించేవారు.  స్కూల్లో పిల్లలకి ఆయనంటే ఎంత భయమో అంత ఇష్టం కూడా.  భార్యభార్తలిద్దరూ  ఒకే స్కూల్ లో పని చేసేవారు. రాజేశ్వరి టీచర్ మాత్రం లావుగా, నల్లగా ఎత్తు పళ్ళుతో ఉండటమే కాదు ఎప్పుడు దిగులు ముఖంతో కనబడేది.  స్కూల్,  వంట ఇల్లు తప్ప ఆమెకి మరో ప్రపంచం ఉండేది కాదు.
రాజేశ్వరి టీచర్ కి  ఇద్దరు  మగ పిల్లలు.  వాళ్ళు ఇద్దరూ కూడా మా ఊరి హై  స్కూల్ లోనే  చదువుకుంటూ ఉండేవారు. అమ్మ రేడియో వింటూ, పుస్తకాలు చదువుతూ, నాతో ఆడుకుంటూ, నన్ను చదివిస్తూ ఉండేది.  నేనేమో మోహన కృష్ణ మాస్టారు వంక అదేపనిగా చూస్తూ ఉండేదాన్ని.  మా నాన్న ఉంటే అచ్చు ఇలానే ఉండేవారేమో అనుకునే దాన్ని.  మోహన కృష్ణ అంకులేమో  మా అమ్మ వంక దొంగ చూపులు చూస్తూ ఉండేవాడు. ఆ వయసులో అలా ఎందుకు చూస్తున్నాడో అర్ధం కాకపోయినా కూడా ఆ చూపులలో  ఏదో తప్పు ఉందని నాకు తెలిసిపోయేది.
మోహన కృష్ణ మాస్టారి చూపులని గమనించిన అమ్మ బయటకే వచ్చేది కాదు.  నేను సెవెంత్ క్లాస్ కి వచ్చేటప్పటికి తాతయ్య చనిపోయారు. అమ్మకి మా ఊరి నుండి  వేరే చోటకి బదిలీ  అయింది మాతో పాటు నానమ్మ, నానమ్మ వాళ్ళ అమ్మ జేజమ్మ కూడా మాతో వచ్చేసారు.  అలా  ఏడెనిమిది ఏళ్ళు మేము మా ఊరి వైపుకి  రాకుండానే గడిపేశాము.
నేను ఇంజినీరింగ్ చదువుతూ ఉండగా మా జేజమ్మ  చనిపోయింది.  ఆమె అంత్యక్రియల కోసం   మళ్ళీ మా ఊరు రావాల్సి వచ్చింది. నా చిన్నప్పటిలా ఆరాధనగా కాకపోయినా ఆసక్తిగా మోహన కృష్ణ మాస్టారు వంక చూస్తూ ఉండి  పోయాను.  వాళ్ళు మా ఇంటి ప్రక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు. వారి అబ్బాయిలు  ఇద్దరూ  విదేశాలలో స్థిర పడ్డారని, పెళ్ళిళ్ళు కూడా అయిపొయ్యాయని చెప్పారు.  మేము ఒక నెల రోజులు ఉండి తిరిగి అమ్మ వర్క్ చేస్తున్న ఊరికి వచ్చేశాము.
కొన్ని నెలలకి మోహన కృష్ణ మాస్టారు భార్య ఉరి వేసుకుని చనిపోయింది అని నానమ్మ చెప్పింది.  ఎందుకు అంటే ఏమో తెలియదు అని చెప్పింది.  అప్పుడు నాలో ఎక్కడో అణచి ఉంచిన   ఊహలు  మళ్ళీ నిద్ర లేచాయి. నానమ్మ ప్రక్కన చేరి ‘నానమ్మా!  నాకు నాన్న కావాలి’  అని చెప్పాను.
ఇరవై రెండేళ్ళ పిల్ల నాన్న కావాలి అంటే అర్ధం చేసుకోకుండా ఉంటుందా?
‘నీకు నాన్న కావాలని మీ అమ్మకి ఎప్పుడో చెప్పాము తనే వద్దని భీష్మించుకుని కూర్చుంది . తను కావాలంటే నేను వద్దంటానా? మీ అమ్మని ఒప్పించు. అయినా ఈ వయసులో ఎక్కడని మీ నాన్న కోసం వెతుకుతావు వెర్రి మొహం నువ్వూనూ!’  అని చీవాట్లు పెట్టింది.
‘ఎక్కడో వెతకక్కరలేదు. మన ఇంటి ప్రక్కన మోహన కృష్ణ మాస్టారు అమ్మకి తగిన జోడు’  అని చెప్పాను.   నానమ్మ ఆశ్చర్యంగా చూసి  ‘అతనా! అతనైతే పర్వాలేదు.  వ్యక్తి కూడా మంచి వాడే ననుకుంటాను.  పాపం ఎందుకో ఆ రాజేశ్వరి టీచర్ ఆ వయసులో అలా ఉరేసుకుని చనిపోయింది ” అంది.
నాయనమ్మ దగ్గర ఆమోదం లభించడంతో  నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం  కలిగింది.  ఇక అమ్మ దగ్గర నా ఆలోచనలని కార్య రూపంలో పెట్టడానికి ప్రయత్నించాను.  అమ్మ
ససేమిరా ఒప్పుకోలేదు. నేను అలిగాను. తిండి తినకుండా బెట్టు చేసాను. ఆఖరి అస్త్రంగా ‘నాకు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలి.  నాకు ఆ లోటు లేకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి.  నాకు నాన్న కావాలి’ అని చెప్పాను.
నాన్న లేకపోడం వల్ల  ఆస్తుల వాటాల విషయంలో, అయినవాళ్ళ వైఖరిలతో విసిగి పోయిన అమ్మ  బంధులంటే విముఖత పెంచుకుంది.  అమ్మకి  నా పెళ్లి విషయంలో బంధువుల  అండ దండ వీసమెత్తు అయినా  తీసుకోవడం ఇష్టం లేకపోయింది. పదే  పదే అదే విషయాన్ని నేను అడగడం,  నానమ్మ కూడా నాకు వత్తాసు పలకడం చూసి ఆలోచనలో పడింది.   అమ్మ ఆలోచనలని గ్రహించి నేను కార్యాచరణలోకి దిగాను.
మోహన కృష్ణ మాస్టారుతో మాట్లాడి ఆయనని ఒప్పించాను. ఆయన సులభంగానే ఒప్పుకోవడంతో పాటు వెంటనే కొడుకులిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడాడు. వాళ్ళు కూడా సుముఖంగానే ఉన్నారు అని చెప్పారు  రెండు నెలలలో పెళ్ళికి తేదీని నిర్ణయించాము.  అమ్మ పెళ్లి రంగ రంగ వైభవంగా చేయాలని అనుకున్నాను. కానీ అమ్మ సున్నితంగా తిరస్కరించి  గుడిలో సింపుల్ గా దండలు మార్చుకుంటే సరిపోతుందని,   అలాగే తనకి ఇష్టమని కూడా  చెప్పింది.  పెళ్ళికి రెండు మూడు రోజుల ముందు మోహన కృష్ణ మాస్టారు పిల్లలు ఇద్దరూ వచ్చారు. నేను వాళ్ళని అన్నయ్యా అంటూ సంతోషంగా పిలిచాను.  వాళ్ళూ  చెల్లెమ్మా..  అంటూ  ఆప్యాయంగానే ఉన్నారు   అన్నయ్యలగా నాకు ఒక వడ్డాణంని బహుకరించారు. అమ్మకి కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు  అమ్మ నాన్నల  పెళ్లి అయిన తర్వాత ఒక పది రోజులు వరకు ఉన్నారు. మా ఇల్లంతా సందడి సందడిగా ఉంది.   ఆనందానికి అవధులు లేకుండా  అంతా నేనై తిరిగాను. మోహన కృష్ణ గారిని  ‘నాన్నా- నాన్నా’  అంటూ వదలకుండా తిరిగాను.
అన్నయ్య లిద్దరూ అమ్మని ‘ఆంటీ’ అంటూ పిలిచారు. అమ్మకి అది కష్టంగా అనిపించింది ‘అదేమిటి బాబూ! స్వాతి నాన్న గారూ అని పిలుస్తుంది మీరు కూడా  నన్ను అమ్మా అని పిలవచ్చు కదా!’  అని అడిగింది.
‘ సారీ అంటీ ! స్వాతికి అంటే వాళ్ళ నాన్న ఎవరో తెలియదు కనుక అలా తేలికగా పిలవగలుగుతుంది.  మాకు మా అమ్మ అంటే ఏమిటో తెలుసు. ఆమె ప్రేమ తెలుసు, అట్లాగే  ఆమె కష్టాలు తెలుసు. మా కోసం మా అమ్మ పెదవి విప్పకుండా ఎన్ని బాధలు భరించిందో మాకు తెలుసు’ అని అన్నారు.  అమ్మే కాదు ఆ మాటలు వింటున్న నేను కూడా స్థాణువులా నిలబడి పోయాను.
అన్నయ్యలు ఇద్దరూ వాళ్ళ అమ్మ కష్టాలు అంటూ చెపుతున్నారు అంటే మోహన కృష్ణ మాస్టారు మంచి వ్యక్తి కాదా! – అనేక అనుమానాలు మొదలయ్యాయి. అన్నయ్యలిద్దరూ తిరిగి వెళుతూ నా పెళ్లి బాధ్యత  అంతా వాళ్ళే చూసుకుంటాము అనీ,  నాన్న రిటైర్  అయిన తర్వాత  వచ్చే డబ్బు కాని ఆయన పెన్షన్ డబ్బు  కానీ ఏవి తమకి ఇవ్వనవసరం లేదనీ, అన్నీ మాకే చెందుతాయననీ  చెప్పి వెళ్ళారు.
రోజులు గడుస్తున్న కొద్దీ చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి.  నాన్న అట్టే మంచాడు కాదని భార్యని   అనాకారి అని నిత్యం వేధించుకు తినేవాడని,  ఏ వంట చేసినా నచ్చ లేదని పేర్లు పెట్టేవాడని,  స్త్రీ లోలత్వం ఉందని అర్ధమయి పోయింది. నాకు చచ్చేంత దిగులు ముంచుకు వచ్చింది.  హాయిగా పువ్వులా బ్రతుకుతున్న అమ్మని తీసుకు వచ్చి వ్యసన పరుడికి   జత చేసానేమో అని దిగులు కలిగింది.
అమ్మ ఏమి చెప్పేది కాదు. ‘నాన్న మంచి వాడేనా అమ్మా!’ అని అడిగేదాన్ని. ‘మంచివాడు అనేగా బలవంత పెట్టావ్’  అని నవ్వేది.  ఆ నవ్వులో నాకు అనేక అర్ధాలు కనిపించేవి.   ఒక సంవత్సర కాలంలోనే నాన్న  రిటైర్మెంట్.   ఆ ఫంక్షన్  కి వెళ్ళాము. అక్కడ అందరూ  మోహన కృష్ణ మాస్టారు భార్య చాలా అందంగా ఉంది కదూ అని మెచ్చుకుంటూనే  కాసేపటి తర్వాత  గుసగుసలాడుకుంటున్నారు. వీరిద్దరికీ అదివరకే పరిచయం ఉంది అంట. ఇద్దరి ఇళ్ళూ  ప్రక్కనే కదా! వీళ్ళ గ్రంధసాంగం తెలిసే  రాజేశ్వరి టీచర్ ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పుకుంటారంట’ అనే మాటలు నా చెవిన పడ్డాయి. నాకు దు:ఖం ముంచుకు వచ్చింది. ఉన్నత చదువులు చదువుకుని గురువుల  స్థానంలో ఉన్న వీరు కూడా  ఎంత నీచంగా ఆలోచించగలరో ! అనుకున్నాను. నిజాలు ఏవిటో తెలియ కుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు  అనిపించింది,  అసహ్యం వేసింది. నాన్నని  ‘అన్నయ్య వాళ్ళ అమ్మ ఎందుకు చనిపోయింది’ అని  అడిగేశాను .
ఆయన నవ్వుతూ  ‘ఆమెకి అందంగా లేనని ఇన్ఫీరియారిటీ  కాంప్లెక్స్.  వంట  చేయడం సరిగ్గా రాదు. ఇతరులతో  స్నేహాన్ని  అర్ధం చేసుకునేదే  కాదు.  నాపై అనుమానం ఎక్కువ. అందుకే అలా చేసింది’  అని చెప్పారు. నాన్న రిటర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో అమ్మ పేరు మీద  ఉన్న స్థలంలో ఇల్లు కట్టారు. నాన్నతో పాటు నాన్న వాళ్ళ అమ్మ, నాన్నమ్మ నేను. నాన్న, అమ్మ అందరం కలసి ఉండేవాళ్ళం . నానమ్మలిద్దరూ బాగా కలసి పోయారు. వారితో  ఏ ఇబ్బంది ఉండేది కాదు.  ఉదయాన్నే నేను,  అమ్మ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే నాన్న ఇంట్లో ఉండేవారు. నాన్నతో పరిచయం ఉన్నఅనేక మంది టీచర్స్ మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవారు.  అమ్మ వచ్చేసరికి వంట ఇల్లు అంతా  కాఫీలు తయారుచేసుకుని, టిఫిన్స్ తయారుచేసుకుని  తిని వంట వస్తువులు అన్నీ  అడ్డదిడ్డంగా  వాడి పడేసే వారు. డైనింగ్  టేబుల్ పైన తిన్న కంచాలు అలాగే పడి ఉండేవి.  ఎక్కడ పడితే అక్కడ కూర్చుని ప్లేయింగ్ కార్డ్స్ ఆడటం లాంటివి  అన్నీ కనబడుతూ  ఉండేవి. అదేమిటి అని అడిగితే  సరదాగా ఫ్రెండ్స్ మి  కూర్చుని ఆడుకుంటున్నాం అనేవారు నాన్న.
ఆయన చేసే రకరకాల విన్యాసాలని నాకు కనబడకుండా చేయడానికి అమ్మ నాకు మేడపై గది కేటాయించింది . నాన్నమ్మలిద్దరూ ఓ మూల  గదిలో ఉండేవారు. ఒక రోజు నేను నా గదిలో నుండి బయటకి  వచ్చి క్రిందికి చూశాను.  నాన్న తను తినే అన్నం పళ్ళెం ని అమ్మ ముఖం పై విసిరి కొట్టాడు. అన్నం అంతా చెల్లాచెదురు అయిపొయింది  పళ్ళెం విసరడం వల్ల అమ్మ కంటి పైభాగంలో దెబ్బ తగిలి వెంటనే బొప్పి కట్టి పోయింది.
‘నీకు ఎంత దైర్యం ఉంటే  ఉదయం వండిన కూర వేసి  నాకు అన్నం పెడతావు.  సిగ్గు లేదా? మొగుడుకి వేడి వేడిగా చేసి వడ్డించాలని తెలియదా!?’  అంటున్నాడు.
అమ్మ సంజాయిషీగా  ‘ఈ రోజు రావడం ఆలస్యం అయింది. తలనొప్పిగా కూడా ఉంది. అందుకనే ఈ పూట కూరలు  చేయలేకపోయాను’ అని చెపుతోంది .
‘నువ్వు మాత్రమే ఉద్యోగం  చేస్తున్నావా?  రాజేశ్వరి కూడా ఉద్యోగం చేసేది. అయినా నాకు ఏనాడూ  లోటు చేసేది కాదు. ఎలా చేసినా ఏది పడేసినా తిని ఊరుకుంటాడు లే అని అనుకుంటున్నావేమో’ అంటూ  ఇంకా ఏదేదో మాట్లాడబోయి నన్ను చూసి ఆగి పోయాడు.
ఆ రాత్రి అమ్మని పట్టుకుని నేను ఏడ్చేసాను.  అమ్మ మౌనంగా కన్నీరు కార్చింది.
అమ్మ ప్రతి రోజూ  కాలేజ్ కి వెళ్ళాలంటే రాను పోను నూటముఫై  కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.  కనీసం ఇంటి దగ్గర నుండి రెండు గంటల ముందు బయలు దేరితే తప్ప సమయానికి చేరుకోలేదు. తెల్లవారుఝామునే  లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుని నాన్నకి అన్నీ హాట్ ప్యాక్ లలో సర్ది  అమ్మ బయటకి వెళ్ళాలి. అమ్మ ఒక్కటే ఒంటరిగా బయటకి వెళ్ళకూడదు. ఆయనతోనే బయటకి వెళ్ళాలి. జనన మరణ పెండ్లి విందు వినోద కార్యక్రామాలు అన్నిటికి ఆయనతో ఠంచనుగా వెళ్లి తీరాలి. అక్కడ అందరికి అమ్మని గర్వంగా చూపాలి. అమ్మ వెళ్ళడం కుదరదంటే, ఆ రోజు ఇంట్లో మరో యుద్ధం జరిగేది.
ఇవన్నీ చూస్తూ బాధ పడుతున్న నన్ను ఎక్కువకాలం అక్కడ ఉంచడం అమ్మకి ఇష్టం లేక పోయింది. అన్నయ్యలతో చెప్పి ఫారిన్ సంబంధం చూసి నిశ్చయం చేసి పెళ్లి జరిపించారు. నాకు ఎలాంటి  భర్త వస్తాడు అనే దానికన్నా అమ్మ జీవితం ఎలా గడుస్తుందో అనే నాకు దిగులుగా ఉండేది. నేను అమ్మకి పెళ్లి చేయాలనుకోవడమే చాలా పొరబాటు పని అనిపించింది. హాయిగా ఉన్న అమ్మ బ్రతుకుని  కష్టాల పాలు చేసినట్లు అయ్యింది.
స్త్రీ కి పునర్వివాహం అనేది అందరికీ  సంతోషాన్ని ఇవ్వదు.  అసలు సంతోషాన్నే ఇవ్వదు అంటాను నేను. మొదటి వివాహం విఫలమై రెండో వివాహం చేసుకుంటే వాడితో ఎందుకు తేడాలు వచ్చాయి?  వాడు నాలా ఉండేవాడు కాదా?  వాడు నీకు నచ్చలేదా? అనో,  లేదా వాడిని ఎందుకు వదిలేశావు? ఎవరినైనా ఉంచుకున్నావా? అనో,  మొదటి  పెళ్ళైన ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి  పెళ్లి అయ్యింది,  ఇన్నాళ్ళు మడి  కట్టుకునే ఉన్నావా?  అనో అవమానకర ప్రశ్నలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.  మళ్ళీ  ఎందుకు పెళ్లి చేసుకున్నామా ? అని పశ్చాత్తాప పడుతూ   పెనం మీద నుండి పొయ్యిలోకి పడేసినట్లుగా తమ పరిస్థితి అయింది అని అనుకునే వాళ్ళు తక్కువ ఏమీ కాదు.
అమ్మ తన బాధలు అన్నింటిని కాకపోయినా కొన్ని అయినా నాతో చెప్పుకుంటుంది. ఆమెకి నేను తప్ప ఎవరున్నారు? ఎవరితో నైనా పంచుకున్నా పలుచన అయిపోతాము అంటుంది . అందరి  దృష్టిలో మోహనకృష్ణ  మంచివాడు.  అమ్మకి జీవితం ఇచ్చాడు. ఇల్లు కట్టాడు  నాకు బోలెడు నగలు చేయించారు. పెళ్లి చేశాడు అని చెప్పుకుంటారు తప్ప.  ఆయన కొడుకులు కూడా ఆయన బాధ్యతని తెలివిగా అమ్మ పై వేసి తప్పుకున్నారు అని అర్ధం కావడం కష్టం.  జీవితం లో అవసరాల కోసమే పెళ్లి అనుకునే వారే ఎక్కువ. ఇలాంటి పెళ్ళిళ్ళలో
ఏ మాత్రం ప్రేమకి, అనుబంధానికి తావే ఉండదు.  అందుకు ఉదాహరణ మా అమ్మ వివాహమే.
మగవాడికి  ఏ వయసులో అయినా వంట వండి  పెట్టడానికి, ఇంటి  అవసరాలు చూడటానికి,  ఇంకా శారీరక అవసరాలు తీర్చుకోవడానికి స్త్రీ అవసరం కావాలి. అందుకు పెళ్ళి అనే అందమైన ముసుగు వేస్తారు.   పురుష అహంకారాన్ని ప్రదర్శిస్తారు. అలాగే ఒంటరి తనంతో బ్రతుకున్న స్త్రీలు ఆర్ధిక అవసరాల కోసమో, అండ కోసమో తోడు కోరుకుంటారన్నమాటే కానీ వారికి ఏ మాత్రం ప్రేమానురాగాలు లభింపక పోగా ఎన్నో అవమానాలు, అనుమానాలు ఎదుర్కోవాల్సి  వస్తుంది. ఆ వివాహాన్ని తెగతెంపులు చేసుకునే ధైర్యం రాదు. ఒకవేళ అలా తెగింపు నిర్ణయం తీసుకున్నా  మరొకసారి  విఫలమైన వివాహంతో సగం చచ్చి ఉన్న వారిని  చుట్టుప్రక్కల వారు వారి మాటలతో పూర్తిగా చంపేస్తారు.  స్త్రీ జీవితం అడుగడుగునా వేదనాభరితమే!  అలాగే అంతకు ముందు వివాహం వల్ల పిల్లలు ఉంటే స్త్రీకి  అనేక సర్దుబాట్లు ఉండాలి. ముందు వివాహం వల్ల కల్గిన  బిడ్డలని  పూర్తిగా  వదులుకోవాలి. పురుషుడికి ఉండే పిల్లలకి  అలాంటి ఒప్పందాలు ఉండవు .  ఎంత బాగా చూసుకున్నా సవతి తల్లి అనే ముద్ర  ఉండనే ఉంటుంది. ఒక్కో వివాహంలో భర్త మొదటి పిల్లలకి   రెండో భార్యగా వచ్చిన ఆమె పై సదభిప్రాయమే ఉండదు.  కనీస గౌరవానికి అనర్హురాలన్నట్లు చూస్తారు.  ఇలాంటివి అన్నీ ఉన్న చోట పునర్వివాహం విజయవంతం కావడం  కష్టం అని నా అభిప్రాయం. మళ్ళీ మా అమ్మకి మునపటి జీవితం తిరిగి రాదు.  ఇవ్వాలంటే కష్టం కూడా.  సంవత్సరానికి ఆర్నెల్లు అయినా మా అమ్మని నాదగ్గరకి పిలిపించుకుని ఆమెకి విశ్రాంతి ఇవ్వడం తప్ప మరో దారి కనబడటం లేదు.   అలా అమ్మని పిలిపించుకుందామన్నా అతను  తయారవుతాడు”  అంది అతనిని   నాన్న అనడానికి కూడా ఇష్టం లేనట్టుగా.
“ఇది  నా ఇంట్లో జరిగిన విషయం . ప్రపంచానికి ఏమి తెలియకుండా  అమ్మ గుంభనంగా  దాస్తుంది కాబట్టి ఆమె జీవితం హాయిగానే సాగి పోతుంది అనుకుంటారు.  చాలా మంది జీవితాల్లో కూడా ఇలాంటి  సమస్యలు ఉంటాయి.  మళ్ళీ జరిగిన పెళ్లి విఫలం అయితే తమలోనే లోపం ఉందని అనుకుంటారని స్త్రీలు అన్నీ భరిస్తారు.  మగవారు సాధిస్తారు.  అది వారికి పుట్టుకతో వచ్చిన హక్కుఅనుకుంటారు.   స్త్రీకి  ప్రేమ, తోడు-నీడ కావాలనుకునే తపన కూడా ఉంటుంది. కానీ అవన్నీ  గుర్తించని స్థితిలో ఇరుకు మనస్తత్వాల మధ్య బతుకు వెళ్ళదీయాలనుకోవడం  నరకం కదా !   ఇప్పుడు చెప్పండి పునర్వివాహాలు మంచివేనంటారా?  ఎంతమంది  నిజమైన తోడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటారంటారు ” అని అడిగింది స్వాతి.
సమాధానంగా  అప్పటివరకు నిశ్శబ్దంగా  ఉన్న హాలంతా  చప్పట్లతో దద్దరిల్లింది
ఆ చప్పట్ల  మధ్యలోనే  “నాలా  ఎవరూ  కూడా ఎవరినైనా  పునర్వివాహం చేసుకోమని బలవంతం చేయకండి.  పెళ్లి అనే బంధంలోకి బలవంతంగా నెట్టకండి. స్వేచ్ఛగా  వారికి నచ్చిన విధంగా వారి బ్రతుకుని వారి చేత బ్రతకనివ్వండి. మీరు అలా ఎవరినైనా బలవంతం  చేయాల్సి వస్తే , అలా చేసేముందు “స్వాతి వాళ్ళ అమ్మ” ని గుర్తుకు తెచ్చుకోండి. తర్వాత నిర్ణయం తీసుకోండి ” అని ముగించి ధన్యవాదములు చెప్పి క్రిందికి దిగి వస్తూ ఉంటే తల్లి  గుర్తుకు  వచ్చింది్ స్వాతికి.  ఆమె పడే అవస్థ  కళ్ళ ముందు మెదిలింది. కన్నీళ్లు ముంచుకొచ్చాయి  బాధ గొంతులో తారట్లాడుతుండగా చేతి రుమాలు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ  వచ్చి తను అంత  క్రితం కూర్చున్న కుర్చీలో కూర్చుంది స్వాతి.

వనజ వనమాలి  (వనజ తాతినేని)

వెన్నెముక

  (మన ప్రపంచం మనకు బాగా అర్థంకావాలంటే ఇతర ప్రపంచాల ఆనవాళ్ళు తెలియాలి కనీసం! ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  ఇతర భాషలలో అద్భుతమయిన కవిత్వం వస్తోంది. ఆ కవిత్వ పరిచయ వేదిక  ఈ – ‘అనునాదం’. మిగిలిన భారతీయ భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషల నించి అనువాద కవిత్వానికి మా ఆహ్వానం. మీ అనువాద కవితలు – మూల కవి క్లుప్త పరిచయం, చిత్రంతో – ‘సారంగ’కు పంపండి. )
*
ఈ వారం అనువాద కవిత: మరాఠీ కవి కుసుమాగ్రజ్ ‘వెన్నెముక’
kusumagraj

 

కొంతమంది కవిత్వం మాత్రమే రాస్తారు, ఇంకా కొంతమంది ఆ కవిత్వమే జీవితంగా బతికేస్తారు. అలాంటి జీవితాల్లో కవిత్వమూ, వ్యక్తిత్వమూ కలిసిపోయి- రెండీటి మధ్య ఎల్లలు చెరిగిపోతాయి. రాసిన వాక్యాల నీడలో నడిచిన పథికుడు ఆయన. కడదాకా స్వేచ్చనే ఊపిరిగా,సిద్ధాంతంగా బతికిన పోరాటజీవి  1912 లో పూనాలో పుట్టిన కుసుమాగ్రజ్ 1999లో నాసిక్ లో కన్నుమూసారు. “నాసిక్ అనగానే నాకు కుసుమాగ్రజ్. ఆయన వాక్యాల్లో కలలు కంటాను నేను, ఆ కలవరింతల్లో నిద్రపోతాను నేను.  ఆయన కవిత్వంలో మేలుకుంటాను నేను” అన్నారు గుల్జార్ నాసిక్ వెళ్ళినప్పుడు!

*

 

“మాస్టారూ, గుర్తు పట్టారా నన్ను?”

వర్షంలో తడుస్తూ వచ్చారెవరో.
తడిసి ముద్దైన బట్టలు, కారుతున్న చూరులా జుట్టూ
క్షణం కూర్చున్నాడు మౌనంగా.. పైకి చూసి నవ్వాడు
“అనుకోని అతిథిలా గంగమ్మ తల్లొచ్చింది
నాలుగు రోజులుండి వెళ్ళింది
పుట్టింటికొచ్చిన ఆడపడుచులా
నాలుగ్గోడల మధ్యా బొంగరంలా తిరిగింది
వొట్టి చేతుల్తో ఎలా వెళుతుంది?
పొయ్యార్పేసి, గోడలు తలుపులతో సహా
ఉన్నవీ లేనివీ అన్నీ పట్టుకెళ్ళింది
భార్యా నేనూ మిగిలాం ఇంట్లో
పోతూ పోతూ, ప్రసాదంలాగ
రెప్పల కింద నాలుగు నీటి చుక్కలుంచిపోయింది
మా ఆవిడకీ నాకూ వాదనలు
మట్టి ఎత్తిపోసి గోడని ఎలాగో నిలబెట్టి వచ్చానిలాగ”
జేబు మీదకెళ్ళిన నా చేతిని చూసి నవ్వాడతను మళ్ళీ
“అబ్బెబ్బే… డబ్బుకోసం కాదు మాస్టారూ..
వొంటరిగా అనిపిస్తుంటే వచ్చానంతే
ఇల్లు కూలింది గానీ వెన్నెముక విరగలేదింకాను
ఒక్కసారి వెన్ను మీద చెయ్యేసి నిమురుతారని,
“పోరాడవోయ్” అని ధైర్యం చెప్తారని… అంతే!
——————————-
మరాఠీ: కుసుమాగ్రజ్
హిందీ: గుల్జార్
తెలుగు: సత్యభామ పప్పు

తిరోగమన పాఠం ‘ఉత్తమ కథ’ లక్షణమా?

 

 కథకి పెద్ద పీట వేయాలన్నది సారంగ వార పత్రిక లక్ష్యాల్లో ఒకటి. అందులో భాగంగానే ప్రతి వారం కథకి సంబంధించిన   ఏదో ఒక శీర్షిక వుండాలన్నది సారంగ ప్రయత్నం. ఇప్పటికే చిరపరిచితమయిన ఉమా మహేశ్వర రావు శీర్షిక ‘కథా సమయం’తో పాటు మరో కొత్త కథా శీర్షిక ఈ వారం నించి మొదలవుతుంది.

 ‘చిత్ర’ కలం పేరుతో కథాభిమానులకు పరిచితమయిన వీవీయస్ రామారావు గారు ఈ నెల నించి ‘కథాచిత్రం’ శీర్షిక ద్వారా ‘సారంగ’ పాఠకులను పలకరించబోతున్నారు. కథని ఒక లోతయిన ఆలోచనా ప్రక్రియగా చూడడం ఆయన విమర్శ మార్గం. ఒక కథ చదివాక పాఠకుడిలో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తవచ్చు అన్న ఆలోచనతో కథని భిన్న కోణాల నుంచి చూసుకునే దృష్టి రచయితలకు ఏర్పాడాల్సిన అవసరం వుందని చిత్ర అంటారు.

*

2003 ఇండియా టుడే మార్చి 18 – 25 సంచికలో చోరగుడి జాన్‌సన్‌గారు ‘మట్టి పక్షులు’ అనే కథ రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తమ కథగా ఎన్నికైంది. రచయిత దీన్ని కథ అన్నారు కాబట్టి సంపాదకులు సరే అన్నారు కాబట్టి అలాగే కానిద్దాం. వాళ్లని అక్కడే వదిలేద్దాం.

దీంట్లో పాత్రలు రెండు. ఇద్దరూ దళితులే “అంజయ్య పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయాడు. తల్లి ఊర్లో రైతుల ఇళ్లల్లో చాకిరీ చేసి కొడుకుని పెంచింది.” అంజయ్య టీచరయ్యాడు. మరో టీచరమ్మని పెళ్లాడాడు. ఇద్దరు కొడుకుల్నీ, కూతుర్నీ ఇంజనీర్లని చేసేడు. పెద్ద కొడుక్కి మంచి వుద్యోగం రాలేదనీ, మరీ లో పే ఆఫర్ చేస్తున్నారనీ “దిగుల్తో, ఆలోచనల్లో వున్నాడు. చలికాలం అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో అతనికి డానియెల్ కలుస్తాడు. సిగరెట్లు కాలుస్తూ పెద్ద వుపన్యాసం యిస్తాడు. చివరికి అంజయ్యకు మనసులో అనిపించింది. “తన కుటుంబంలో మరొక తరం తన వృత్తిలోనే ఉండి  ఉండాల్సిందని”

అదండీ విషయం. అంతా చదివేక అజ్ఞానానికి హద్దు లేదనిపిస్తే మన తప్పు కాదు. వెనక్కి వెనక్కి పరిగెట్టమని  చెప్పే ఈ కథ వుత్తమకధ కావడానికి కారణాలు  వెతికి తీరాలి.

ఇంతకీ అంజయ్య బాధేమిటి? ఎందుకు? ఈ ఆలోచనలు? ఏమిటి దుఃఖం  అని చూస్తే కొడుక్కి పెద్ద జీతంతో గొప్ప వుద్యోగం- ముతగ్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకుని అజమాయిషీ చేసే అవకాశం రాలేదని. వ్యవస్థా యంత్రాంగంలో చోటు దక్కలేదని.. సరే ఆశ తప్పు కాదు. ఆలోచన సరిగ్గా వుండాలి. కథ మొదట్లోనే పోరాట క్షేత్రంలో అసమానతలు వున్నాయా?” అని ఆలోచించిన అంజయ్య “ఎక్కడో ఏదో మతలబుంది. పట్టుకోవడానికి ప్రయత్నించాలి”  అన్న అంజయ్య, మనలో ఆసక్తి రేకెత్తించిన, అంజయ్య చివరికిలా దిగజారిపోవడానికి డానియెల్ వుపదేశమే కారణం అయితే గురువుగార్ని పుఠం పెట్టవలసిందే. ఈ డానియెల్ అనే వ్యక్తిదంతా అజ్ఞాన ప్రదర్శన. అచారిత్రకం, అవాస్తవం. తిరోగామి  ఆలోచనావిధానం. ఇతను ఈ దోపిడీ వ్యవస్థకి నమ్మిన బంటు. జీతం బత్తెం లేని నౌకరు.

చరిత్ర చూస్తే అరవై డెబ్బైలనాటికి మన దేశంలో భూస్వామ్య వ్యవస్థకి కీళ్లు కదిలిపోయాయి. పెట్టుబడిదారీ ఈడేరింది. ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. కులవ్యవస్థకి, కులవివక్షకి అవి జోడయ్యాయి. మరోవైపున అవే పెట్టుబడిదారీ విస్తరణకు అడ్డంకయ్యాయి. ఆ సమయంలో అంబేద్కర్ ధర్మమా అని రిజర్వేషన్లు ఒక చిన్న మార్గం కావడంతో కొద్దిమంది చదువు సాయంతో ఒక స్థాయికి చేరుకున్నారు. భద్ర జీవితానికి, అజమాయిషీకి అలవాటు పడ్డ వీళ్లు క్రమంగా ప్రభువులకీ, వారి అవసరాలకీ, ఆలోచనలకీ దాసులుగా మారేరు.(మాంచెస్టర్ సిండ్రోం) ప్రభువుని మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తారు. ఇది సూత్రం ఇది చరిత్ర. ప్రతి సమూహం నుంచీ కొంతమంది విధేయుల్ని తయారుచేసుకోడం వ్యవస్థ కొనసాగింపుకి  అవసరమే. ట్రేడ్ యూనియన్లు, దళితులు, స్త్రీలు, మైనారిటీలు ఇలా విడగొట్టి తాయిలాలిచ్చి తన వాళ్లుగా చేసుకోడం వ్యాపారసూత్రం. అందుకే డానియల్ పదే పదే దళితుల్ని తప్పు పడతాడు. ఎద్దేవా చేస్తాడు. దళితులు వగైరాలో చేసే కనీసపు పోరాటాలు కూడా ఆయన్ని బెంబేలెత్తిస్తాయి. మధ్యతరగతిగా మారిన మిధ్యామేధావులు కులాంతరీకరణ చెందే క్రమంలో వర్గాంతరీకరణ చెందారు. చర్చిల్లో కూడా రకరకాల వివక్షల్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. డానియల్ తన శబ్దాతిసార ప్రకోపంలో ఏమన్నాడో చూద్దాం.
“చదువయిపోయిన ఏడాదికే నీకు గవర్నమెంటు వుద్యోగం దొరకటం నీకున్న అర్హతని బట్టి వచ్చిందే కానీ అది ఏ ఒక్కరి ఆయాచిత ధర్మం కాదు” అనడం పరిపూర్ణమైన అబద్ధం.
డానియల్‌కి తన షావుకారు సిఫార్సు వల్ల వుద్యోగం వచ్చింది. అలా సిఫార్సులు లేని అసంఖ్యాక దళితులు మట్టిలోనే మిగిలేరు.

ఇతర కులాల  స్తోమత కలిగినవాళ్లతో “మనం పోల్చుకోవటం మొదటి తప్పు” అని అంతరాల్నీ, కులవివక్షనీ మహాగట్టిగా బలపరుస్తాడు. ఈ పేరా అంతా చదువుతుంటే మనకి విశ్వనాధవారు గుర్తొస్తారు. ఇద్దరి భావాల్లోనూ, తత్వంలోనూ ఏ మాత్రం తేడా కనబడదు. ఆయనది సంస్కృతవేదం. డానియల్‌ది ఇంగ్లీషువేదం.

“మంచిని సవ్య దృక్పధంతో చూడలేకపోవడం రెండో తప్పు” అని తప్పంతా దళితుల పైకి, బలహీనులపైకి నెట్టేసి, వ్యవస్థ అంతా మంచిదని ప్రకటిస్తారు ఈ విస్సన్నగారు!!
“ఏమి సృష్టించుకుంటావు అనేది నీ నైపుణ్యానికి సంబంధించిన విషయం” అని మేనేజ్‌మెంట్ గురూ పాత్రలోకి దూరి గంభీరమైన ప్రకటన చేస్తారు. చరిత్ర పట్ల, సూత్రాల పట్ల అత్యంత కనీసపు అవగాహన లేని  వాగాడంబరం. ఏ నైపుణ్యం వుందని, అంజయ్య పేపర్లో చూసి కాపీ కొట్టి పరీక్షలు పాసైన దుర్గాప్రసాద్ ఇంజనీరింగు కాలేజీకి యజమాని అయ్యాడు?ఇంజనీరు కావాలనుకున్న అంజయ్య ఆలోచనలు అడివూళ్లో అలా అయ్యవారుగా తెల్లవారేయి” అని రచయిత స్పష్టంగా రాశాడే! భాష భావాల రూపం అనుకుంటే “సృష్టి” “నైపుణ్యం” ఎవరి భావాలివి? ఎవరికి పనికొస్తాయి??

మధ్యలో మంచి హాస్యమూ వుంది. “దేశానికి స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన వేలాది కుటుంబాలు స్వాతంత్ర్యం వచ్చాక సహజంగానే తొలి పంక్తిలో అధికార విందుకు సిద్ధమయ్యాయి” అయ్యా! అదీ సంగతి! 2003లో చిన్న పిల్లాడైనా నమ్ముతాడా ఈ విషయం? బొబ్బిలి, భోపాల్, తిరుచ్చి వగైరా జమిందార్లు త్యాగాలు చేసేరు. వాళ్ల పొలాలు పండించి కుప్పలు పోసిన దళితులు ద్రోహులుగా మిగిలేరు! దగాకోరు మాటలు , మోసకారి వుపన్యాసాలు! ఎందుకంటున్నాడు అలా? వినండి.. వాళ్ల క్లెయింని నువ్వూ, నేనూ కాదనగలమా? అంతిమ ఫలాల దగ్గర నా వాటాకు ఇన్ని రావాలీ అంటే నీకు ఇవ్వడానికి ఎవడూ ఒప్పుకోడు” అని స్పష్టం చేశాడు. రిజర్వేషన్లు అడగొద్దని మహోపదేశం చేస్తున్నాడు. అదంతా తప్పని తేల్చేసేడు. బూట్లు తుడిచిన బ్రాహ్మణ పిల్లల్ని మించిపోయేడు. అక్కడితో ఆగుతాడా? “గాంధీజీలో మనకు కావల్సిన మంచిని తీసుకోవడానికి మనకు అభ్యంతరం ఎందుకు వుండాలి?” అని దళితుల్ని గుడ్లు వురిమాడు.

అబ్బా!! సరే! పైగా మన ఏకవాక్య ఎజెండా రాజ్యాధికారం” అంటూ ఏకంగా అంబేద్కర్‌నే తప్పు పట్టే స్థాయికి ఎదిగిపోయేడు (దళితులకి రాజ్యాధికారం అన్నది అంబేద్కర్ వాక్యం) ఇంకా అంటాడు ” ఏ అద్భుతమో  జరిగి నిజంగానే మన దోసిళ్లలోకి వచ్చి పడితే అది చేజారిపోకుండా పట్టుకోగలిగిన బాహుబలం మనకుందా?” అని దళితుల్ని కించపరుస్తూనే ప్రభువుల పంచన చేరమని ప్రబోధిస్తాడు. నిరంతరం శ్రమ చేసిన బాహువుల్లో బలం లేకుండా ఎందు కుందని మాత్రం ఆలోచించడు.
“ఉన్న ఊళ్లో వునికి ప్రశ్నార్ధకమైతే దానికి అడివి జవాబు ఎలా అవుతుంది? మన మానవ వనరు అంతా యాంటీ ఎస్టాబ్లిష్‌మెంటు దృక్పధం అలవర్చుకుంటూ పోతే సవ్య దిశలో యోచించడానికి మనకి మిగిలే  సమూహాలేవి? అన్న డానియల్ ప్రభు వర్గాల ప్రధాన ప్రచారక పదవికి ఎంతైనా అర్హుడే. ముస్లీంలంతా టెర్రరిస్టులు. దళితులు నక్సలైట్లు. ఆహా! ఏమి జ్ఞానం!!!

దళితుల్ని నిందిస్తున్న డానియల్ కారణాలు వెదకడు. ప్రభుత్వంతో ప్రజలు ఘర్షణ పడుతున్నారంటే వాళ్లు కోపంగా వున్నారని. బాధల్లో వున్నారని అర్ధం. ప్రభుత్వాలతో ప్రజలు పడే ఘర్షణే చరిత్ర. ఆక్రమంలో ఎవరు ఎటు వున్నారనేది చాలా ముఖ్యం అవుతుంది. డానియల్ వఱడు కాదు. వీర బొబ్బిలీ కాదు. అదొక డాన్ జువాన్. మేకల మందలో తోడేలు. “గ్రామీణ  కూలీలు విశాల భూభాగాలకు తరలిపోతే అది వారి ప్రతిఘటనా శక్తిని తగ్గిస్తుంది. పట్టణాల్లో కేంద్రీకరించబడ్డ కూలీలకు పోరాట శక్తి పెరుగుతుంది”అని మహాశయుడు అన్నాడు. మరి గ్రామాల్లోనే వుండిపొమ్మని దళితులకి బోధించడం అంటే వ్యవస్థ కొనసాగింపుకి కొమ్ము కాయడమే. దళితులకీ, కూలీలకీ డానియల్ ఇస్తున్న సందేశం ఏమిటి? మట్టిని కాల్చి ఇటుకలమ్ముకొమ్మనీ, తేనేపెట్టెలు పెట్టి అమ్ముకొమ్మనీ, పాలు పెరుగు అమ్ముకోమనీ, ఆకుకూరలు ఆమ్ముకొమ్మనీ.

ఓహో డానియల్ మహర్షీ! మనువుని మించిన మహాగురువు. వేదాన్ని మించిన మహామేధ! పొలాలన్నీ కంపెనీల చేతుల్లో వుంటే ఎవరి పొలాల్లో మట్టి తీసి ఎక్కడ కాల్చాలి? ఏ చెట్లకి తేనె పెట్టెలు పెట్టాలి? గేదెల్ని ఎక్కడ మేపాలి? ఆకుకూరలు ఏ రైతుల పొలాల్లో పండించాలి? “ఎంట్రప్రెన్యూర్”  ప్రావీణ్యత ఎలా చూపించాలి? చిల్లర వర్తకంలో చొరబడుతున్న లక్షల కోట్ల డాలర్‌ల విదేశీ పెట్టుబడికి పోటీగా వీళ్లని నిలబెట్టడం ఎందుకు? వరద వుదృతిలో పిల్ల చేపలూ, పిత్తపరిగెలూ కొట్టుకుపోతాయి. పెట్టుబడిదారీ పెరిగే కొద్దీ చిన్నచిన్నవైపోయిన కమతాలు గుత్తపెట్టుబడి  పుట్టుకతో కార్పోరేట్ భూఖండాలుగా మారిపోయిన విషయాన్ని ఎంగెల్స్, లెనిన్‌లు పదెపదే ప్రస్తావించారు.మన వర్తమానం మరోసారి అది రుజువు   చేసింది.
రాసుకుంటూ పోతే ప్రతి వాక్యాన్ని ఖండఖండాలు చేయాలి. మీ సమయం వృధా. విషయానికొస్తే నిరుద్యోగం పెరిగిపోవడం ఒక చారిత్రక విషాదం. ఇంజనీర్లకే కాదు కూలీల్లోనూ భయంకరంగా పెరిగింది. కారణం పెట్టుబడిదారీ విధానం కొంతకాలం ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో స్టేట్ కాపిటలిజం నడిచి వ్యక్తి పెట్టుబడిని పెంచింది. అంజయ్యలూ, డానియల్‌లూ తయారయ్యేరు. ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్ తారకమంత్రమైంది. ఈ క్రమంలో అత్యధికంగా నష్టపోతున్నది దళితులు, ఆదివాసీలు, ఇతర బలహీనవర్గాలు. దీన్ని “ప్రభుత్వ పాత్ర అయిపోయింది” అని డానియల్ సమర్ధించడం ప్రజల్ని తప్పుదోవ  పట్టించడమే.

2003లో వుపన్యాసమిస్తూ దళితుల్ని, ఇంకా గ్రామాల్లోనే వుండమని చెప్పడం అచారిత్రకం. ప్రజావ్యతిరేకం. ఆర్ధిక సూత్రాలకు పొసగని ఆలోచన ఇది.

ఒక రంగంలో వచ్చిన పెట్టుబడిదారీ విధానం అన్ని రంగాలకీ వ్యాపిస్తుందనీ, గ్రామీణ పరిశ్రమలు కనుమరుగౌతాయని, మిగిలిన ఒకటీ రెండూ కూడా అమానుషమైన పరిస్థితుల్లో స్త్రీలూ, చిన్న పిల్లలూ లాంటి చవక శ్రమపై ఆధారపడి హీనమైన దోపిడీ చేసి చివరగా వూపిరాడక చస్తాయని మహాశయుడు స్పష్టం చేశాడు.

సరే ఆయనతో డానియల్‌కి పేచీ వుండొచ్చు.

సోషల్ మేష్టారుగా పాతికేళ్లు పైన పని చేసి భూపోరాటాలకి సానుభూతి చూపించిన వుపాద్యాయ సంఘం నాయకులైన అంజయ్య, కనీసం ప్లానింగ్ కమీషన్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ నమూనా సర్వేలు రాసినవి గానీ, టన్నులకొద్దీ వచ్చిన ప్రభుత్వపు రిపోర్టులు కానీ కనీసం తిరగేసి వుంటే గ్రామాల్లోనే వుండిపోవాలన్న ఆలోచనకి రాడు. ఇంతకీ డానియల్ ఒక్కడే కాదు. అంజయ్యా దొంగే.
“జిల్లా నాయకత్వ పదవి రాగానే జిల్లా కేంద్రానికి దగ్గరగా బదిలీ” చేయించుకుని రిలాక్స్ అయినవాడు ఏం సేవలు చేసి వుంటాడో ఊహించడం కష్టం కాదు.

 (కవర్ పెయింటింగ్ : ఎస్వీ రామశాస్త్రి ) 

ఇవాళ ఏమి రాయాలి, ఎలా రాయాలి?

varalakshmi

(ఈ వ్యాసం వరలక్ష్మి గారు విరసం కథా రచయితల వర్క్ షాప్ కోసం రాసారు. కాని, ఇందులో ప్రస్తావించిన అంశాలు వర్తమాన కథకు అవసరమని భావించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాము. ఇందుకు అనుమతించిన ‘అరుణ తార ‘పత్రిక సంపాదక వర్గానికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు)

ఒక చీమ రోజూ ఆఫీసుకు పోయేది. ఆడుతూ పాడుతూ పని చేసేది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది. సిఈవో సింహం చీమను చూసి సంతోషించేవాడు. ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు. చీమ దానంతటది పనిచేస్తేనే ఇంత బాగా చేస్తోందే, దీని పైన ఒక మంచి సూపర్‌వైజర్‌ను పెడితే ఇంకెంత బాగా పనిచేస్తుందో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్‌వైజర్‌గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని టైమ్‌ షీట్‌లు, అటెండెన్స్‌లు ప్రవేశపెట్టింది. వీటిన్నిటినీ చూసుకోడానికి ఒక సాలీడు సెక్రెటరీని అది నియమించుకుంది. సింహంగారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఉత్పత్తి ఎంత పెరిగింది, పనివిధానానికి సంబంధించిన రిపోర్టులు వగైరా అడిగారు. ఇవన్నీ చేయడానికి బొద్దింక కంప్యూటర్‌ను, ప్రింటర్‌ను  తెప్పించుకుని, వాటిని ఆపరేట్‌ చేయడానికి ఈగను నియమించింది. మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలైంది. అది చేసే పనికితోడు పైఅధికార్లతో మీటింగులు, ఎప్పటికప్పుడు అందేయాల్సిన రిపోర్టులు దాని నెత్తిమీదికొచ్చి పడ్డాయి. ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజరు, వీళ్ళ హోదాకు తగినట్లు ఆఫీసుకు కొత్త హంగులు, ఆర్భాటాలు తయారైనాయి. క్రమంగా చీమకే కాదు ఆఫీసులో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండాపోయింది. ఉత్పత్తి పడిపోయింది. సీఈవో సింహంగారు ఈ సమస్యను పరిష్కరించే పని కన్సల్టెంట్‌ గుడ్లగూబకు అప్పగించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుడ్లగూబగారు ఆఫీసు స్థితిగతుల్ని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తెల్చారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్‌ పెట్టుకుని కొంతకాలంగా పనిపట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న చీమను పనిలోనుండి తొలగించాలని తీర్మానం చేశాయి.

ఇదొక ఈజిప్టు కథ. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట. గత ఆరేడేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న విరసం కథావర్క్‌షాపుల్లో వర్తమాన విప్లవ కథ గురించిన లోతైన సమాలోచనలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండుమూడు వర్క్‌షాపుల్లో ఏం రాయాలి, ఎలా రాయాలి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. వర్తమాన సమాజాన్ని, సంక్షోభంలో కూరుకపోతున్న జీవితాన్ని, అందులోంచి నిర్మాణాత్మకంగానూ, స్పాంటేనియస్‌గానూ పెల్లుబుకుతున్న పోరాటాలను ఎలా కథలుగా మలచవలసి ఉన్నది? వీటన్నిటినీ చిత్రించవలసిన దృక్పథం, ఈ సంక్షోభాలను, పోరాటాలను పట్టివ్వగల శిల్పం ఈ సమావేశాల్లో ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నది.  సమాజంలో మార్పులు వేగవంతమవుతున్న కొద్దీ వాటిని పట్టుకోడానికి సాహిత్యంలో ఎప్పుటికప్పుడు కొత్త పరికరాల తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పరికరాల్ని చాకచక్యంగా వాడాల్సి ఉంటుంది. ప్రొద్దుటూరు కథావర్క్‌షాపులో (సెప్టెంబర్‌ 8,9- 2012) ఈ చర్చ జరుగుతుండగా  అల్లం రాజయ్య పైన చెప్పిన  చీమ కథను పరిచయం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అసంబద్ధతను, దుర్మార్గాన్ని చాలా అలవోకగా, అద్భుతంగా ఆవిష్కరించిన కథ అని చెప్పారు.  అలాంటి మరో అద్భుతమైన శిల్పంతో మార్క్వెజ్‌ రాసిన డెంటిస్ట్‌ అనే కథను  కూర్మనాథ్‌  పరిచయం చేశారు.

944430_182879141874436_2064579889_n

మన కథలో మార్పుకు సంబంధించిన అంశం కీలకంగా ఉండాలి. అట్లాగే మారుతున్న సామాజిక పరిస్థితుల్ని చిత్రీకరిస్తున్న క్రమంలో సాహిత్యం కొత్త కొత్త వ్యక్తీరణల్ని తీసుకొని రావాలి. జీవన స్థితిగతులు మారినట్టే సాహిత్యంలో కాలానికి తగిన ఎక్స్‌ప్రెషన్‌ తీసుకోవాలి. ఈ మధ్య గాన్‌ విత్‌ ద విండ్‌ తెలుగులో చదివుతున్నప్పుడు మార్పుకు సంబంధించిన అద్భుతమైన వ్యక్తీకరణ అందులో కనపడింది. అట్లాంటాలో జరిగిన అనేక సంఘర్షణలు భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజానికి మార్పులు కనిపిస్తాయి.  తెలంగాణ సాంస్కృతిక వ్యక్తీకరణను పోలినవి అందులో చాలా ఉన్నాయి. మాలాంటి వాళ్ళం స్కార్లెట్‌తో, బట్లర్‌తో (గాన్‌ విత్‌ ద విండ్‌ నవలలో పాత్రలు) పోల్చుకోవలసిందే. ఇక్కడా అనేక కోటలు కరిగిపోయాయి. పరిణామాలు చాలా జరుగుతున్నాయి…అంటూ అల్లం రాజయ్య ప్రారంభించిన చర్చలో గ్రామీణ సమాజం నుండి ప్రపంచ రాజకీయాల వరకూ అనేక ఆసక్తికరమైన విషయాలను హాజరైనవాళ్లు ప్రస్తావించి విశ్లేషించారు.

సమాజంలో ఒక ఘటన జరిగేలోపే ఇంకో ఘటన జరిగిపోతూ ఉంది. ఇంత డైనమిక్‌గా సమాజం మారుతూ వస్తున్నప్పుడు ఏ కథ రాయాలి? ఏ ఇతివృత్తం రాయాలి? వ్యక్తం కాని విషయాలను ఎట్లా వ్యక్తం చేయాలి? అనే సమస్యలు సీరియస్‌ రచయితల ముందు ఉన్నాయి. మన సాహిత్యంలో ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించి చాలా ఇబ్బందులున్నాయి. శిల్పపరంగా చాలా నేర్చుకోవాల్సే ఉంది. లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో మంచి ప్రయోగాలున్నాయి. మనం ఇక్కడ చేయవలసిన ప్రయోగాలు ఏమిటి? విప్లవ దృక్పథంతో ఎలా ఆ వస్తువులన్నింటిని అర్థం చేసుకోడానికి ఎలా విస్తరించాల్సి ఉంది? అనే దిశగా ప్రొద్దుటూరు వర్క్‌షాపులో మొదటి రోజంతా చర్చ జరిగింది. ఈ విషయంలో వర్క్‌షాపులన్నిటిలో ప్రతిసారీ జరుగుతున్న చర్చ ఈసారి మరింత ముందుకు తీసికెళ్లగలిగామని అందరికీ అనిపించింది.

ఈ చర్చ కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా విప్లవ కథా రచనలో చాలా వరకు వ్యక్తమవుతూనే ఉంది. నిజానికి విరసం 1980ల నుంచి నిర్వహిస్తున్న కథా వర్క్‌షాపులన్నీ ఈ కోణంలో  చాలా మంచి ఫలితాలను ఇస్తూనే వచ్చాయి. ప్రతి థలోనూ ఆ సామాజిక, ఉద్యమ సన్నివేశానికి అనుగుణంగా విప్లవ కథను తీర్చిదిద్దడానికి దోహదపడుతున్నాయి. దృక్పథం, శిల్పం వగైరాల్లో మెళకువలు అందిస్తున్నాయి.  ఇంతే ముఖ్యమైన విషయం మరొకటి ఏమంటే- విప్లవ కథా రచనలోకి మూడు నాలుగు తరాల రచయితలను ఈ వర్క్‌షాపులే తీసుకొని వచ్చాయి. విరసం సభ్యులతోపాటు ఈనాడు సుప్రసిద్ధ కథకులుగా గుర్తింపు పొందిన మార్క్సిస్టు రచయితల్లో చాలా మంది విరసం వర్క్‌షాపుల్లో పాల్గొన్నవాళ్లే. నిర్దిష్టంగా విరసంలో ఈ తరం  కథా రచయితలందరూ చాలా వరకు ఈ సమావేశాల్లో మెళకువలు నేర్చుకున్నవారే. వర్క్‌షాపులే కథలకులను తయారు చేయకపోవచ్చుగాని,  రచన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లను  మేలైన కథకులుగా తీర్చిదిద్దడంలో ఈ వర్క్‌షాపులు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. సీనియర్‌ కథకులనుంచి ఔత్సాహిక రచయిత దాకా.. విరసం సభ్యులు, సోదర రచయితలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో  కథా పఠనం జరిగాక  ఆ నిర్దిష్ట కథ విశ్లేషణేగాక,  సాధారణస్థాయిలో కథా సాహిత్యంలో రావలసిన మార్పుల దాకా విస్తరిస్తాయి. ఇవి  ఆ తర్వాత కథలు రాయడానికి  ఉపయోగపడుతున్నాయి.

ఆరేడేళ్ళుగా ఈ సమావేశాల్లో వర్తమానంలో  ఏం రాయాలి, ఎలా రాయాలి అని జరుగుతున్న చర్చ  అనుత్పాదకంగా మిగిలిపోలేదు.  కొత్త కథకుల్ని తయారుచేయడమే కాక, ఈ చర్చల సారాంశం  ప్రయోగాల్లో, దృక్పథ స్పష్టతలో వ్యక్తమవుతోంది. దీనికి ప్రొద్దుటూరు, మిర్యాలగూడ (మార్చి 9,10- 2013) వర్క్‌షాపుల్లో వచ్చిన వైవిధ్యభరితమైన కథలే ఉదాహరణ. ఈ రెండు సమావేశాల్లో చదివిన ప్రతి కథ దానికదే ప్రత్యేకమైనదీ, అవసరమైనదీ అయినా ఇక్కడ కొన్నిటి గురించే ప్రస్తావిస్తాను. ఇక్కడ చదివి, చర్చించి సవరించిన కథల్లో కొన్ని ఇప్పటికే అచ్చయ్యాయి కూడా. అందు వల్ల వర్తమాన కథ కోసం జరుగుతున్న ప్రయత్నానికి ఉదాహరణగా కొన్ని వివరాలు రాస్తాను.

ఒకే ఇతివృత్తం మీద రెండు కథలు (దోషులు, రాజుగారి పులిస్వారీ) తీసుకొచ్చారు కూర్మనాథ్‌. సత్యం ఐటి కంపెనీ పేకమేడలు కుప్పకూలడం కేంద్రంగా తీసుకొని రాసిన కథలు ఇవి. ఫైనాన్స్‌ వ్యవహారాలు రాసే జర్నలిస్టులు అబద్ధాలపై, భ్రమలపై ఆధారపడి రాయడం గురించి, కార్పొరేట్‌ శక్తులు, రాజకీయ వ్యవస్థ, మీడియా కలగలసిపోయి పత్రికా వ్యవస్థను భ్రష్టుపట్టించడం మొదటి కథలో కనపడుతుంది. రెండోది ఫైనాన్స్‌ కాపిటల్‌ వలయంలో పడి పులిస్వారీ చేస్తున్న వ్యాపారవేత్త గురించిన కథ. నిజానికి రెండూ వేరువేరు కథలు. ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా భిన్నకోణాల్లో వ్యక్తీకరించే ప్రయత్నం చేయడం అరుదైన విషయమే.

ఒక కార్పొరేటు కంపెనీ అట్టహాసంగా జరిపిన తెలుగు మహాసభలను, గ్రామంలో జరిగే తిరుణాలను పోలుస్తూ రుక్మిణి రాసిన కంపెనీ తిరుణాల కథలో చివరికి తెలుగుభాషను, సంస్కృతిని ఉద్ధరిస్తున్నామని చాటుకుని, రచయితల, భాషాపండితుల చేత ప్రశంశలందుకున్న కంపెనీ ప్రాణాంతక రసాయనాలను వదిలి ప్రజల ఎదుట ద్రోహిగా నిలబడుతుంది. భాషాసంస్కృతులు పుస్తకాల కందే మామూలు విషయాలు కావని, అవి ప్రజల జీవనంతో పెనవేసుకున్నవన్న సత్యాన్ని విస్మరించి, పైపై ఆర్భాటాలకు లొంగిపోయే సాహిత్యకారులను చూసి రచయిత్రి ఈ కథ రాశారు. సమకాలీన సాహిత్యరంగానికి, కార్పొరేట్‌ శక్తులకు ఉన్న సంబంధాన్ని చాటే తాజా ఇతివృత్తం ఇది. రుక్మిణి  మిర్యాలగూడ వర్గషాపుకు మరో భిన్నకథాంశంతో వచ్చారు. ఒకప్పుడు విప్లవ విద్యార్థి ఉద్యమ రాజకీయాలతో ప్రభావితమైన తెలుగుసమాజం చాలా మార్పుల గుండా ప్రయాణం చేసింది. ఒక తరం గడిచాక, ప్రపంచ మార్కెట్‌కు మన సమాజం ప్రయోగశాల అయ్యాక విలువలూ, ఆదర్శాలూ మారిపోయాయని తల్లిదండ్రులు విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ఆదర్శాలను పిల్లలకు అందించలేకపోయామని, లోపం ఎక్కడో జరిగిందని వాళ్లు తర్కించుకోవలసి వచ్చింది.  తల్లిదండ్రుల సామాజిక ఆచరణలోనే ఉన్న లోపం, కుటుంబం లోపల ఉన్న పరిమితులు, బైటి ప్రభావాలు.. ఏవి ఏ స్థాయిలో  పిల్లలను ప్రభావితం చేస్తున్నాయో ఆలోచింపజేస్తూ సాగిన కథ ఇది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవాళ్లలో  ముఖ్యంగా మధ్యవయస్కులు ఈ కథతో మమేకయ్యారు.

విజయలక్ష్మి ప్రొద్దుటూరు సమావేశంలో నెల్లూరుజిల్లాలోని ఒక పల్లెటూరులో వీథి అరుగుమీద కూర్చున్న పెద్దాయన కేంద్రంగా నడిపిన కథను ప్రొద్దుటూరులో చదివారు. నిజానికి ఈ కథలో ఆయన చుట్టూ గ్రామీణ సమాజమంతా  పరిభ్రమిస్తుంటుంది. కుటుంబ సమస్యలు, గిట్టుబాటుకాని పంటలు, పట్నంలో చదువులు, పల్లె జీవితంలో సంక్లిష్టమైన కదలికల్ని గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ సాగిన ప్రయోగాత్మక కథ. హాస్యం,  ఎత్తిపొడుపులు, సామెతలు గ్రామీణ పలుకుబళ్లు నిండుగా ఉన్న కథ ఇది.

కథా ప్రక్రియలోకి తాజాగా ప్రవేశించిన పావని అంతే తాజా వ్యక్తీకరణతో పట్టణ మధ్యతరగతి విద్యార్థుల సరదా సరదా సంభాషణలతో రాసిన కథ కొన్ని రంగులూ.. ఒక కల. రాజకీయాలు, ఉద్యమాలూ, స్నేహాలూ, ప్రేమలూ, ఆదర్శాలూ ఇప్పటి తరంలో ఎట్లా వ్యక్తమవుతున్నాయో ఈనాటి భాషలో, సంస్కృతిలో వ్యక్తం చేసిన కథ ఇది.  ఈ తరంలో ఎంత పరిణతిగల మనుషులు ఉన్నారో కూడా ఆశావహంగా ఈ కథ నడిచింది. మిర్యాలగూడాలో ఇంకొన్ని మంచి కథలు వచ్చినా పావని చదివిన కథ విన్నాక అందరూ చాలా తాజాగా  ఫీలయ్యారు. ఇవాల్టి జీవితంలో ఎంత సంక్లిష్టత ఉన్నా ఆశారేఖ కూడా అందులో ఉందని చాటే కథ ఇది.

వస్తువ్యామోహం వల్ల ఈ తరం పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో సుభాషిణి ఒక కథ వినిపించారు. పిల్లలను మన ఆదర్శాల ప్రకారం పెంచాలనుకున్నా వాస్తవానికి వాళ్లను రూపొందిస్తున్న వ్యవస్థ ఒకటి ఉందని, ఈ తరహా పౌరులు లేకుండా అది బతకలేదనే లోతైన అర్థం పలికే కథ ఇది. సరిగ్గా ఈ సమస్యనే వి. ప్రతిమ చదువుల వైపు నుంచి డీల్‌ చేశారు. పిల్లలకు కనీసం తమ పేరుకు ఉన్న అర్థం ఏమిటో కూడా తెలుసుకునే వీలు లేని విధంగా  ఈ చదువులు తయారైపోయాయనే సున్నితమైన విమర్శ ప్రకటించే కథను చదివారు. సుభాషిణి, ప్రతిమ కథలు ఈ స్థితికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? అనే ఆశతో ముగుస్తాయి.

ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రగతిశీల కథకులు దీని మీద ఎలాంటి కథలు రాయాల్సి ఉంటుంది? అనే చర్చ జరిగే క్రమంలో పాణి దండకారణ్య కథలను  క్లుప్లంగా ఇలా పరిచయం చేశారు.

తెలుగుసాహిత్యంలో ఇప్పుడొస్తున్న కథల గురించి, రావాలసిన కథల గురించి చర్చింవలసింది చాలనే ఉంది. అయితే మన పక్కనే   ప్రధాన స్రవంతి పత్రికలుగాని, తెలుగుసాహిత్య సమాజంగాని పట్టించుకోని కథలు కూడా ఉన్నాయి అవి దండకారణ్యం నుంచి వస్తున్నాయి. వాటిలో అద్భుతమైన ప్రయోగాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగైదేళ్ళుగా యుద్ధం, ఉత్పత్తి, నిర్మాణం మధ్య అల్లకల్లోలంగా  ఉన్న దండకారణ్యం నుండి నూతన సమాజాన్ని, నూతన మానవుడ్ని ఆవిష్కరిస్తున్న కథలు వస్తున్నాయి. ఇక్కడ మన జీవితంలో సంక్లిష్టమైన సమస్యలు ఆవరించి ఉన్నాయి.   పరిష్కారం తెలీని  సందిగ్ధత,  స్టాగ్నేషన్‌ ఆవరించి ఉన్నది. ఇక్కడ నడుస్తున్న పోరాటాలు ఈ స్థితి మీద ఒక ఆచరణాత్మక విమర్శ పెడుతున్నా, పరిష్కారాలు ఇలా ఉంటాయని చెబుతున్నా.. మొత్తం మీద ఒక సందిగ్ధ స్థితి ఉన్న మాట వాస్తవమే. అయితే దండకారణ్య కథల్లో ప్రతి కథకూ ఒక పరిష్కారం ఉంటుంది. దీనిని మామూలు సాహిత్యకారులు అంగీకరించకపోవచ్చు. ఇది మూస వ్యవహారమని ఈసడించుకోవచ్చు. కానీ దండకారణ్యంలో జరుగుతున్న పోరాటం, నిర్మాణం ప్రతి సమస్యతో ఆచరణాత్మకంగా  ఎదుర్కొంటున్నాయి.  ఈ క్రమంలో చైతన్యవంతులవుతున్న ఆదివాసులు దానికి ఒక పరిష్కారాన్ని కూడా  వెతుక్కుంటున్నారు. ఈ క్రమం అక్కడి కథా వస్తువులో, దృక్పథంలో, శిల్పంలో  కనిపిస్తుంది.  ఈ కథల్ని  ఎక్కువగా మహిళలు రాయడం కూడా ఒక ప్రత్యేకత. ఆదివాసీ తెగలు  పితృస్వామ్యాన్ని, రాజ్యహింసను ఎదుర్కొంటూ యుద్ధంలోనూ, ఉత్పత్తిలోనూ, నూతన సమాజ నిర్మాణంలోనూ పాల్గొంటున్నాయి. ఇది ఒక సామాజిక రాజకీయ పరివర్తనా క్రమం.  అందువల్ల అరుణతార ఈ తరహా రాజకీయ కథలకు వేదికవుతున్నది. వీటికి విస్తృత ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది… అంటూ చాలా వైవిధ్యమైన వస్తువులు, శిల్ప పద్ధతులు ఉన్న ఆరు కథల్ని తీసుకొని పరిచయం చేశారు.  సల్వాజుడుం, ఉద్యమం నేర్పుతున్న ప్రత్యమ్నాయ చదువులు, విలువలు,  యుద్ధం, రాజ్యనిర్బంధం, జైలుజీవితం, వీటన్నిటి  నేపథ్యంలో మానవసంబంధాలను తీర్చిదిద్దుతున్న వర్గపోరాటం గురించి ఆ కథలు ఎలా చిత్రించిందీ విశ్లేషించారు.  (కొన్ని దండకారణ్య కథలతో  త్వరలో విరసం సంకలనం తేబోతున్నది)

మిర్యాలగూడా సమావేశంలో స్కైబాబ  తెలంగాణ ఉద్యమ సమయ సందర్భాల్లో రాసిన కథ చదివారు.  తన ఊరికి దూరంగా, గతంలో తానున్న స్థితికి దూరంగా ఉన్నత స్థాయి జీవితం గడుపుతున్న వ్యక్తి వైపు నుంచి కథ నడుస్తుంది. అతడికి ఇప్పటికీ గ్రామంలో ఆనాటిలాగే బతుకుతున్న మిత్రుడితో స్నేహం కొనసాగుతూ ఉంటుంది. తన జీవన విధానంపట్ల అసంతృప్తితో ఆ మిత్రుడ్ని కలవడానికి గ్రామానికి వెళ్తాడు. అక్కడ కనిపించే వాస్తవికత అతడిని సంక్షోభంలో పడేస్తుంది. అక్కడ మిత్రుడి కొడుకు గ్రామాల్లో చేస్తున్న కార్యకలాపాలను తెలుసుకున్నాక అంత వరకు తాననకున్న జీవన ప్రమాణాల విచికిత్సకు గురవుతాడు. వర్తమాన పరిణామాల్లోని వాస్తవికతను ఈ కథ ప్రతిబింబించిందనే కోణంలో చర్చ జరిగింది. తెలంగాణ గ్రామ వాతావరణం, భాష కథలో బాగా కనిపించింది. అయితే మిత్రుడి కొడుకు ఎంచుకున్న మార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయా? మొత్తంగా ఇలాంటి పరిణామాలకు ఒక ఆశావహమైన ముగింపుఎలా ఉంటుంది? అనే దిశగా చర్చ సాగింది.

కథా వస్తువుకోసం అన్వేషిస్తున్న రచయితకు ఊరి నుండి కాసిన్ని పండ్లు తెచ్చుకుని అమ్ముకునేందుకు జాగా కోసం వెతుకుతున్న మనిషి కనపడతాడు. అతను జాగాకోసం ఎన్నెన్ని తిప్పలు పడతాడో, ఎన్ని శక్తులతో ఘర్షణ పడతాడో అసక్తికరంగా ఫాలో అయిచూస్తుంటాడు. రచయితకు కథా వస్తువు దొరుకుతుంది కాని ఆ మనిషికి జాగా మాత్రం దొరకదు. రియల్‌ ఎస్టేట్‌, భారీ నిర్మాణాల వల్ల ఒక వైపు విస్తరిస్తున్నట్లు కనిపించే నగరాలు నిజానికి ఎంతగా కుంచించుకుపోతున్నదీ, సామాన్యుడికి నిలబడటానికి కాసింత నీడ కూడా ఎట్లా కరువైపోతున్నదీ మిర్యాలగూడా సమావేశంలో ఉదయమిత్ర  ‘జాగా’ అనే కథ చదివారు. అలాంటిదే మరో కొత్త ఇతివృత్తంతో చిన్న కథ చదివారు. బహుశా అన్ని ప్రాంతాల్లో నదుల్లో, వంకల్లో జరుగుతున్న ఇసుక దొంగతనం గురించి రాసిన కథ ఇది. ఇసుక మాఫియా తక్షణ సమస్యగానేగాక, దీర్ఘకాలంలో పర్యావరణ సమస్యగా కూడా ఎట్లా మారబోతోందో వాస్తవికతా శిల్పంలో ఈ కథ చిత్రించింది. ఒక రకంగా గ్రామస్థాయి నుంచి లుంపెన్‌ సెక్షన్‌ ఇసుక రవాణాతో ఎలా తయారవుతున్నదీ, పట్టణీకరణ నేపథ్యాన్ని కూడా ఇది చిత్రించింది.

పాణి రాసిన రాజకుమారుడు.. కార్పేటమ్మ అనే కథ ప్రత్యేకమైన శిల్పంలో సాగింది. వ్యంగ్యం, ఫాంటసీ, వాస్తవికతలతో మూడు విభాగాలుగా గనుల రాజకీయార్థిక మూలాలను తడిమిన కథ ఇది. తాజా ఇతివృత్తంతో, కొత్త శిల్పంలో సాగింది.

ముస్లిం జీవిత నేపథ్యంలో పితృస్వామ్య ఆధిక్యాన్ని ధైర్యంగా ఎదిరించిన మహిళ గురించి మహమూద్‌ ప్రొద్దుటూరులో ఒక కథ వినిపించారు. ఈ తరహా కథల్లో వర్క్‌షాపులకు వచ్చిన కథల్లో ఇది అందరినీ ఆకట్టుకుంది. ఈ సమస్య ముస్లిం కుటుంబాల్లో ఎలా ఉండేదీ ఇది చిత్రించింది. అక్కడే బాసిత్‌ మబ్బులు తొలిగిన ఆకాశం అనే కథ చదివారు. ఇది కూడా మారుతున్న మానవ సంబంధాల్లోకి, విలువల్లోకి అందం, రంగు అనేవి కూడా ఎట్లా ప్రవేశించిందీ చెప్తూ వీటన్నిటికంటే జీవన విలువలపట్ల మనిషి అంతిమంగా మొగ్గు చూపుతాడనే కోణంలో ఈ కథ సాగింది. పైకి చాలా చిన్న ఇతివృత్తాలుగా కనిపించినా సామాజిక నేపథ్యంపట్ల రచయితలకు దృష్టి ఉంటే వీటినే ఎంత లోతుల్లోంచి వివరించవచ్చో ఈ కథలు నిరూపిస్తాయి.

ఇంతకూ ఇటీవల సమాజంలో మన కంటికి కనిపిస్తూ, అనుభవంలో భాగమవుతూ, జ్ఞానానికి అర్థమవుతూ ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి? కథకులు వీటిలో ఎన్నిటి గురించి ఎంత శ్రద్ధగా, సరైన దృక్పథంతో రాస్తున్నారు? అసలు కథల్లోకి రాకుండా ఉండిపోయిన పరిణామాలు ఏమిటి? అనే దిశగా ప్రొద్దుటూరులో వెంకటకృష్ణ ఒక ఆసక్తికరమైన పరిశీలనాత్మక ప్రసంగం చేశారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వ్యవస్థ ప్రజలను తనలో భాగం చేసుకోడానికి ఎన్ని రూపాల్లో, ఎన్ని పథకాలతో ప్రయత్నిస్తోందో చెప్పి, అవి అక్కడి జీవితాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషించారు. అయితే వీటి గురించి మన కథకులకు అంతగా పట్టలేదనే చెప్పాలి. కొన్ని మార్పులు కథా వస్తువులుగా స్వీకరించినా అంత బలంగా కథలు రాలేదనే చెప్పాలి.. అని విశ్లేషించారు. అట్లాగే విప్లవ కథకులు ఏ రకమైన వస్తువులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నదీ ఎత్తి చూపి, అంతగా పట్టించుకోని ఇతివృత్తాల గురించి  గుర్తు చేశారు. ప్రత్యేకంగా విప్లవోద్యమం మీద విమర్శనాత్మక వైఖరితో విరసం సభ్యులు ఎందుకు రాయకూడదు? అని ప్రశ్నిస్తూ.. ఇటీవలి విప్లవ కథలోని వైవిధ్యాన్ని స్థూలంగా అంచనా వేశారు.

వెంకటకృష్ణ వేసిన ప్రశ్నపై కూర్మనాథ్‌ స్పందిస్తూ.. విప్లవోద్యమం మీద ఎవరికైనా విమర్శనాత్మక అభిప్రాయాలే ఉండవచ్చు. అయితే నేను మాత్రం అవి కథల్లో  రాయను. వాటి గురించి నేను చర్చించే పద్ధతి వేరేగా ఉంటుంది. అవి కథల్లోకి తేవాలని అనుకోను. అసలు  దానితో కలిసి నడవకుండా, దాని మార్పులేమిటో సన్నిహితంగా తెలుసుకోకుండా విమర్శనాత్మకంగా రాయడం ఎలా సాధ్యమవుతుంది? అన్నారు.

ఇదంతా ఈ రెండు సమావేశాల్లోని కొన్ని కథల గురించే. అన్నిటి గురించీ ఇలాంటి విశ్లేషణలే ఇవ్వవచ్చు. మొత్తం మీద ఈ రెండు సమావేశాల్లో వర్తమాన జీవితాన్ని.. దాని మొత్తంలో భాగంగా, దాని సంక్లిష్ట సారాంశంలో భాగంగా ఎలా కథలు రాయాలి? అనే చర్చ ప్రధానం. కొత్త పరికరాలతో, కొత్త శిల్ప పద్ధతులతో గాఢంగా విప్లవ కథను ఎలా అభివృద్ధి చేయాలనేదే వర్క్‌షాపుల ఇతివృత్తం. మారుతున్న సమాజాన్ని.. మారుతున్న విప్లవోద్యమాన్ని, ప్రజాపోరాటాలను దృష్టిలో పెట్టుకొని కథ అభివృద్ధి చెందాల్సి ఉంది. పరివర్తనాథలో ఉన్న మొత్తం సమాజాన్ని ప్రతిబింబించడం, అందులోని మార్పు క్రమాలను చిత్రించడం ఇవాళ్లి విప్లవ కథలకుల లక్ష్యం. ఆ దిశగా సాగడానికి ఈ సమావేశాలు స్ఫూర్తిని ఇస్తున్నాయి.

ఎర్ర అట్ట డైరీలు

తెల్లటి వెన్నెల. చల్లటి గాలి. చాలా రోజుల తర్వాత నాకెందుకో అలా బయట తిరిగొస్తే బాగుండుననిపించింది. అనుకున్నదే తడవుగా బయల్దేరి మా ఇల్లు దాటి అలా వీధి చివరికి వెళ్ళానో లేదో కాస్త దూరంగా కనిపించాడు వాడు. ముందు వాడేనా కాదా అని అనుమానం కలిగింది. రోడ్డు పక్కగా వున్న చెట్టు నీడలో చీకటి చూసుకోని అక్కడే నిలబడి చూశాను. వాడు ఇంకొంచెం ముందుకు రాగానే నిర్థారణ అయిపోయింది. వాడే..!! చారిగాడు..!!

చటుక్కున వెనక్కి తిరిగి గబగబ అడుగులు వేసుకుంటూ దాదాపు పరుగెత్తినంత పని చేశాను. చల్లగాలి ఎటుపోయిందో తెలియదు. వెన్నల తెల్లగా పరుచుకోని నా ఉనికిని వాడికి ఎక్కడ చూపిస్తుందో అని భయంగా వుంది. వాడు నన్ను చూడలేదనే అనుకున్నాను. చూస్తే తప్పకుండా కేకేసేవాడు కదా!

ఇంట్లోకి దూరి తలుపులు వేసేసి సోఫాలో కూలబడ్డాను.

“ఏమైంది? ఏదో ఈవినింగ్ వాక్ అంటూ వెళ్ళారుగా?” అడిగింది రాధిక. నా నుంచి ఏ సమాధానం రాకపోవటంతో మళ్ళీ తనే అంది – “శకునం బాలేదా ఏమిటి?” నవ్వుతూ అంటూనే వంటింటిలోకి వెళ్ళిపోయింది.

“దాదాపు అలాంటిదే” అన్నాను నేను నెమ్మదిగా. నా కళ్ళ ముందు వాడే కనపడుతున్నాడు. ఆ చారిగాడు..!!

అయినా ఈ వేళప్పుడు ఇటెందుకు వస్తున్నాడు? కొంపదీసి నన్ను కలవడానికి ఇక్కడికే వస్తున్నాడేమో? ఆ ఆలోచన రావటమేమిటి బయట గేటు చప్పుడైంది. అనుమానమే లేదు వాడే అయ్యింటాడనుకున్నాను.

“ఇదిగో రాధా.. ఆ చారిగాడు వస్తున్నట్లున్నాడుగానీ… నేను ఇంట్లో లేనని చెప్పు..” సోఫాలోంచి దూకి పడగ్గదిలోకి వెళ్తూ అరిచాను.

“చారిగారా? ఆయనొస్తే మీరు లేరని..??” ఏదో అడగబోయింది కానీ మధ్యలోనే ఆపేశాను నేను.

“అబ్బా.. అనవసరపు ప్రశ్నలన్నీ అడక్కు… నేను చెప్పినట్లు చెప్పు.. అంతే” అంటూ పడగ్గదిలోకి అడుగుపెట్టాను. మరుక్షణం కాలింగ్ బెల్ మోగింది.

రాధిక వెళ్ళి తలుపు తీయటం – “మీరా.. బాగున్నారా? ఆయన లేరండీ..” అంటూ చెప్పడం వినపడుతూనే వుంది. పడగ్గది తలుపు దగ్గరే నిలబడి వచ్చిన వాళ్ళు ఎవరో వినాలని ప్రయత్నం చేస్తున్నాను.

“అలాగా.. సరేలేమ్మా.. ఫోన్ చేస్తుంటే ఎత్తటంలేదు.. సరే ఒకసారి కలిసిపోదామని వచ్చాను..” వాడే.. ఆ చారిగాడి గొంతే అది.

“ఆఫీసులో పని ఎక్కువైందండీ… ఫోన్ మాట్లాడే తీరికెక్కడిదీ?” చెప్పింది రాధిక.

’ఫర్వాలేదు బాగానే కవర్ చేసింది’ అనుకున్నాను. ఆ తరువాత ఏ మాటలూ వినపడలేదు. వాడు వున్నట్లా వెళ్ళిపోయినట్లా? ఒక వేళ చొరవగా వచ్చి లోపల కూర్చోనుంటే? నేను వచ్చేదాకా వుంటానని అని అక్కడే తిష్ట వేసి వుంటే? చెవులు కిక్కరించి వుంటున్నాను.

“డాడీ..!!” పిలుపు వినిపించి అదిరిపడ్డాను. అప్పటిదాకా మంచం మీద పడుకోని వున్న బంటిగాడు కాలింగ్ బల్ చప్పుడుకి లేచునట్లున్నాడు. నేను తలుపు దగ్గర చాటుగా నిలబడి ఏం చేస్తున్నానో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు.

“ఏం చేస్తున్నావు డాడీ..” అంటూ అడగబోయాడు.

“ఇష్షూ.. ఇష్ష్..” అంటూ అమాంతం మంచం మీదకి దూకు వాడి నోరు మూసేశాను. విషయం అర్థంకాక వాడి భయం భయంగా నా వైపు చూశాడు.

పడగ్గది తలుపు తెరుచుకుంది. ఎదురుగా రాధిక. బంటి మీద దాదాపు పడిపోయి వాడి నోరు నొక్కేస్తున్న నన్ను విచిత్రంగా చూసింది. నేను ఇంకా విచిత్రంగా నవ్వుతూ వుండిపోయాను.

“ఏమిటిది? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు గానీ.. ఇంక చాలించి రండి” అంటూ హాల్లోకి నడిచింది. బంటిని వదిలిపెట్టి భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పి, వాణ్ణి మళ్ళీ పడుకోపెట్టి నేనూ హాల్లోకి వచ్చాను.

“ఏమిటి సంగతి?” అన్నట్టు కళెగరేసింది రాధిక. ఏమీ లేదన్నట్టు తలాడించి కూర్చున్నాను. అంత సులభంగా వదిలిపెడుతుందా రాధిక?

“మీ ఫ్రెండ్ గానీ ఇన్సూరెన్స్ ఏజంట్ అయ్యడా?” అంది

“అబ్బే.. లేదు లేదు…”

“అయితే మల్టీలెవల్ చెయిన్ మార్కెటింగ్ లాంటివి ఏమైనా..”

“ఊహూ..”

“మరెందుకు ఆయనొస్తే దాక్కున్నారు?”

గట్టిగా నిట్టూర్చాను. రాధికతో నిజం చెప్పాలనిపించింది. మొదలుపెట్టాను.

 ***

చారి అని పిల్చుకునే ఆచారిగాడు నాకు మంచి స్నేహితుడే. చిన్నప్పటి క్లాస్ మేట్. తర్వాత నేను వైజాగుకి చదువుకోడానికి వెళ్ళిపోయాను. ఆ తరువాత చాలా కాలానికి మళ్ళీ గుంటూరు వచ్చి స్థిరపడ్డాము. అనుకోకుండా ఒకరోజు సాయంత్రం శంకర్ విలాస్ సెంటర్ దగ్గర కనిపించాడు. వాడే గుర్తుపట్టాడు. వాడి గుండు, వాలకం చూస్తి గుర్తుపట్టడం కాస్త కష్టమే అయ్యింది. పలకరింపులు అవీ అయ్యాక “నెల క్రితం నాన్నగారు పోయార్రా” అంటూ తల తడుముకున్నాడు.

“అరెరే.. సారీ.. తెలుగు మాష్టారు కదూ ఆయన..?” అడిగాను గుర్తుతెచ్చుకోని.

“అవును.. తెలుగు సంస్కృతం చెప్పేవారు. పదేళ్ళనుంచి అది కూడా మానేసి జాతకాలు అవీ చెప్పడం మొదలుపెట్టాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాస్టర్ గా కన్నా జ్యోతిష్యుడిగానే బాగా సంపాదించాడు. డబ్బు.. పేరు కూడా” అన్నాడు.

“అలాగా? ఆయన జాతకాలు అవీ చెప్తారని నాకెప్పుడూ చెప్పలేదే..” అన్నాను నేను. నాక్కూడా జాతకాలు వెయ్యడం చూడటం తెలుసు. ప్రావీణ్యం లేదు కానీ ప్రవేశం అయితే వుంది.

ఆ తరువత పిచ్చాపాటి మాట్లాడుకోని, అక్కడి దగ్గర్లోనే బ్రాడీపేటలో వున్న వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. ఇంటి బయట “ఓంశ్రీ జోతిష్యాలయం, దైవజ్ఞ: హయగ్రీవాచారి” అని  బోర్డు వుంది. నెల క్రితం మనిషి పోయిన దుఖం ఇంకా ఆ ఇంటిని అంటిపెట్టుకోని వున్నట్లు కనపడుతోంది. ఇంట్లోకి వెళ్ళగానే వాడి భార్య వచ్చి మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళింది. చారి వెళ్ళి వాళ్ళమ్మని వెంటబెట్టుకొచ్చాడు.

“వీడు గుర్తున్నాడా అమ్మా? సుందరం.. పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయి” అంటూ గుర్తు చేశాడు. ఆమె నీరసంగా చూసింది.

“బాగున్నావా?” అంది.

“బాగున్నానండీ” అన్నాను. కొంత నిశబ్దం తరువాత – “నాకు ఇప్పుడే తెలిసిందీ..” అన్నాను ఊరడింపుగా. అంతే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. నాకు ఏం చెయ్యాలో తెలియక ఇబ్బందిగా కదిలాను.

“ఊర్కొ అమ్మా… ఊర్కో..” అంటూ వాడు ఆమెను లోపలికి పంపించాడు. తిరిగి వచ్చి –

“పదరా.. నాన్న రూములో కూర్చోని మాట్లాడుకుందాం” అన్నాడు. ఇద్దరం ముందు వైపు వున్న గదిలోకి వెళ్ళాం.

వాళ్ళ నాన్నగారు అక్కడే జాతకాలు అవీ చెప్పేవాళ్ళని అర్థం అయ్యింది. లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా కనపడేటట్లు ఒక కుర్చీ, దాని ముందు ఒక టేబుల్. ఆ టేబుల్ మీద ఏవో పుస్తకాలు, కాగితాలు, దేవుడి బొమ్మలు వున్నాయి. ఒక మూలగా చిన్న మందిరం అందులో ఇరుకిరుగ్గా చాలామంది దేవుళ్ళు. ఒక గొడకి మొత్తం పుస్తకాల రాకు, అందులో రకరకాల పుస్తకాలు.

ఇద్దరం ఆ గదిలో చాలాసేపు కూర్చోని పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. వాడు ఎక్కువసేపు వాళ్ళ నాన్న గురించే తల్చుకోని బాధపడ్డాడు.

“చాలా పుస్తకాలు వున్నాయిరా..” అన్నాను నేను అటు చూస్తూ.

“అన్నీ లైబ్రరీకి ఇచ్చేయమని చెప్పాడాయన.. రేపో ఎల్లుండో వచ్చి తీసుకెళ్తారు..” అన్నాడు.

“అరెరే.. ముందే తెలిసి వుంటే నేనే తీసుకునేవాణ్ణి..” అని వెంటనే అన్నాను కానీ, అన్ని పుస్తకాలు నా ఇంట్లో పట్టవన్న సంగతి అన్న తరువాతే గుర్తుకొచ్చింది.

“వాళ్ళకు చెప్పేశాను కదా.. అయినా నీకు ఏమన్నా కావాలంటే తీసుకో…” అన్నాడు.

వాడు అన్నదే తడవుగా ఆ పుస్తకాల దగ్గరగా వెళ్ళి ఎగాదిగా చూశాను. చాలా వరకు జోతిషంకి సంబంధించినవి, వాస్తు సంబంధిచినవీ ఉన్నాయి.  ఓ ఇరవై దాకా ఆంగ్ల పుస్తకాలు, ఓ పది ఆత్మకథలు, అరడజను దాకా కథల పుస్తకాలు.. అంతే. వాటన్నింటి మధ్యలో మూడు ఎర్ర అట్ట డైరీలు కనిపించాయి. అవి తీసి చూశాను.

అన్నీ చేతిరాతలో రాసున్నాయి. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తే అవి హయగ్రీవాచారి గారు రాసినట్లు అర్థం అయ్యింది. చాలా వరకు ఆయన దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకున్న వారి వివరాలు వున్నాయి. ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఆయన దగ్గరకు జాతకం చెప్పించుకునేందుకు వస్తే నలభై ఏళ్ళకు తీవ్ర అనారోగ్యం వచ్చే అవకాశం వుందని తెలుసుకోని, దానికి తగ్గట్టుగా డబ్బులు ఇప్పటి నుంచే ఎలా ముదుపు చెయ్యాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటిది తీసుకోని జాగ్రత్తపడాలి ఇలాంటి విషయాలు వాళ్ళకు చెప్పినట్లు రాసి వున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే అన్నింటిలో ఇదే తరహా వివరాలు వున్నాయి. ఒక జాతకం ద్వారా ఒక మనిషి ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసి ఆ జాతకునికి ఏ సమయంలో ఎంత మొత్తంలో డబ్బు అవసరం అవుతుందో లెక్కలు గట్టి, ఆ రోజుకి సరిపోయేలా డబ్బు సమకూర్చుకునేందుకు సూచనలు వున్నాయి. జోతిష్యశాస్త్రానికి, ఆర్థికశాస్త్రానికి లంకె పెట్టాడా మహానుభావుడు.

సమకాలీన కథ లో బలమైన స్వరం సత్యప్రసాద్
  aripiralaనెల్లూరులో పుట్టి గుంటూరులో పెరిగిన అరిపిరాల సత్యప్రసాద్ ఇప్పుడు తెలుగు కథా లోకంలో కనిపిస్తున్న సరికొత్త సంతకం.  విభిన్న శైలి, సరికొత్త కథన పద్ధతి ఉన్న రచయిత అరిపిరాల. ఇంగ్లీష్ చదువు చదివి, కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న కూడా సాహిత్యంమీద అభిరుచితో మంచి రచనలు చేస్తున్నారు. తొలికథ “రిక్షావాడు” 1993 లో  ప్రచురితమైంది. ఇంతవరకు 60 కథలు రాసారు. చాలా అనువాదాలు చేసారు. వివిధ పోటీల్లో ఈయన కథలకు బహుమతులు లభించాయి. త్వరలో “ఊహాచిత్రం” పేరుతో కథల సంపుటి వెలువరించనున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు.–వేంపల్లె షరీఫ్

నేను ఇలా చూస్తుండాగానే చారి మిగిలిన డైరీలను చూశాడు.

“నాన్న ఇలా రాసి పెట్టుకున్నాడని మాక్కూడా తెలియదురా..” అంటూ ఆ అక్షరాలను అపురూపంగా తడిమాడు. “అమ్మకి చూపిస్తా”నని లోపలికి పరిగెత్తాడు.

కాస్సేపటికి లోపలినుంచి మళ్ళీ గట్టిగా ఏడుపు వినపడింది. ఆ తరువాత మరికొంత సేపటికి వాడు తిరిగి వచ్చాడు. ఈ సారి వాడు కూడా ఏడ్చినట్లు వాడు కళ్ళు చెబుతున్నాయి.

“చాలా విలువైన సమాచారం వుందిరా ఈ పుస్తకాలలో.. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క పదిరోజులు నాకిస్తావా? నేను అవసరమైనవి అన్నీ రాసుకోని మళ్ళీ ఇచ్చేస్తాను?” అడుగాను నేను కాస్త మొహమాటపడుతూనే.

“భలేవాడివే.. దానికింత అడగాలా? నీకు ఉపయోగపడుతాయంటే తప్పకుండా తీసుకెళ్ళు” అన్నాడు వాడు.

“పదిరోజుల్లో ఖచ్చితంగా తెచ్చిస్తా” అంటూ భరోసా ఇచ్చాను వచ్చేముందు.

“సర్లేరా” అన్నాడు వాడు.

అంతవరకు అంతా బాగానే వుంది. ఆ తరువాతే అసలు సమస్య వచ్చిపడింది. పదిరోజులు కాదు కదా నెల రోజులైనా ఆ పుస్తకాలను తెరిచే అవకాశమే రాలేదు నాకు. ఆ తరువాత ఇల్లు మారాము. మారిన కొత్తింట్లో సామాన్లు సర్దుకోవటం వగైరా పనులతో అదో హడావిడి. ఈ హడావిడిలో పడి ఆ పుస్తకాల సంగతే మర్చిపోయాను. నా పుస్తకాలు సర్దుకునేటప్పుడు కూడా ఆ పుస్తకాలు లేవన్న సంగతి గమనించలేదు.

ఇక ఆ తరువాత ఇంకేముంది.. కంగారు మొదలైంది. మొత్తం వెతికాను. ఇంట్లో ప్రతిమూలా చూశాను. ఎక్కడా కనపడలేదు.

పుస్తకాలు కనపడటం లేదని నిర్థారణకి వచ్చాక కంగారు స్థానే భయం మొదలైంది. చారి ఏమంటాడో అన్న భయం. చనిపోయిన తండ్రి తాలూకు జ్ఞాపకాలు కనపడకుండా పోయాయంటే చారి వూరుకుంటాడా? అన్న భయం. దాంతో భయం కాస్తా పశ్చాత్తాపంగా మారింది.

వాడు నా అజాగ్రత్తని తిట్టచ్చు, కోప్పడచ్చు, గొడవ పడచ్చు. మాధ్య ఇప్పటిదాకా వున్న స్నేహమే లేకుండా పోవచ్చు. ఈ ఆలోచనలతో సతమతమైపోయాను. రెండ్రోజులు తిండి సయించలేదు. వాడిని కలిసేందుకు ధైర్యం కలగలేదు. ఇక అప్పటి నుంచి వాడుంటే బ్రాడీపేట వైపు వెళ్ళడం మేనేశాను. వాడి ఫోన్ ఎత్తడం మానేశాను. ఎలాగైనా సరే వాడికి కనపడకూడదన్న ప్రయత్నం మొదలుపెట్టాను. తప్పించుకు తిరుగుతున్నాను.

***

“ఇదీ జరిగింది” చెప్పాను రాధికతో.

“బాగానే వుంది.. పుస్తకాలు పోయాయి నిజమే.. అలాగని ఎంతకాలం ఇలా తప్పించుకు తిరుగుతారు?” అంది.

“ఏం చెయ్యమంటావు చెప్పు… గిల్టీ ఫీలింగ్.. అసలు నేను వాడింటికి ఎందు వెళ్ళాల్సిరావాలి? పెద్ద చదివేవాడిలాగా ఆ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి? సరిగ్గా అవే కనపడకుండా ఎందుకు పోవాలి?” తల పట్టుకోని అన్నాను.

“మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నట్టున్నారు..” అని ఊరుకుంది రాధిక.

ఆమెకి ఏం అర్థం అవుతుంది నా బాధ? పుస్తకాలంటే నాకు ప్రాణం. ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా ప్రాణం గిలగిల లాడుతుంది. అలాంటిది చారిగాడు అడాగ్గానే “దానికేం తీసుకోరా” అన్నాడు. ఎంత నమ్మకంగా ఇచ్చాడు? వాడు అంత నమ్మకంతో ఇచ్చినప్పుడు వాటి జాగ్రత్తగా చూసుకోని, భద్రంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపైన లేదూ? అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకాలు పోయాయంటే అది తప్పే కదా!

సరే నా సంగతి పక్కన పెట్టండి. వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి సేకరించి రాసుకున్న విషయాలు. చారిగాడికి అపురూపంగా మిగిలిన జ్ఞాపకాలు. అవి నేను వాడికి కాకుండా చేశానంటే వాడెంత బాధపడతాడు? నాతో వున్న స్నేహం కారణంగా ఏమో అనకపోవచ్చుగాక. కానీ నన్ను పురుగును చూసినట్టు చూస్తే భరించగలనా? చారిగాడి అమ్మ.. ఆమె ఏమంటుందో? “జాగ్రత్తగా వుండాల్సింది బాబూ..” అని ఒక్క మాట అంటే చాలదూ. తప్పు చేసిన ముద్దాయిలాగా ఆమె ముందు నిలబడగలనా?

పోనీ అవన్నీ పక్కనపెట్టండి. నాకు నేను సర్ది చెప్పుకుంటాను. మా స్నేహాన్ని అడ్డంపెట్టుకుంటే ఆ చారిగాడు నన్ను క్షమిస్తాడనే అనుకుందాం. కానీ ఆ సమాచారం. ఏళ్ళ తరబడి ఎన్నో పుస్తకాలు మధించి ఆయన తయారు చేసుకున్న నోట్సు. బహుశా ఒక పుస్తకంగా వేయాలని ఆయన ఆలోచన అయ్యింటుంది. అలాంటి విలువైన సమాచారం పోగొట్టానే..! దానికైనా బాధ్యత వహించద్దూ..! ఇవన్నీ రాధికకి చెప్పినా అర్థం కావు.

ఏదో పాపం చేసినవాడిలా బాధపడ్డాను. ఏదో శాపం తగిలినవాడిలా నిరాశపడ్డాను. చారిని తల్చుకుంటేనే ఖంగారు, భయం, బాధ… ముఖ్యంగా పశ్చాత్తాపం. అది అనుభవించాలే కానీ మాటల్లో చెప్పలేని భావన. ఎవరో చొక్కాపట్టుకోని నా చెంపలు రెండూ ఎడాపెడా వాయించేస్తున్నట్టు, నన్ను అతలాకుతలం చేసేసిన బాధ. అలాగే కొంతకాలం గడిచింది.

అన్ని రోజులు మనం అనుకున్నట్టు వుండవుగా! వారం పది రోజుల తరువాత ఓ రోజు ఉదయం పూట అనుకోని పరిస్థితిలో వాడికి దొరికిపోయాను. కూరగాయల మార్కెట్ లో కావాల్సినవి కొనుక్కోని బయటికి వచ్చి రోడ్డు పక్కనే వున్న షాపులో అల్లం టీ చెప్పాను. ఇంతలో నా భుజం మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి తిప్పాడు వాడు.

“మొత్తానికి దొరికావురా..” అన్నాడు.

హతోస్మి. వాడే.. చారిగాడు. ఎవరికైతే నా ముఖం కనిపించకూడదని తప్పించుకోని తిరుగుతున్నానో వాడి దగ్గర తప్పించుకోలేని విధంగా దొరికిపోయాను. వాడి వైపు చూశాను. వాడి ముఖం స్థానంలో పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఎర్ర అట్ట డైరీలు.. గిర గిరా తిరుగుతూ కనిపిస్తున్నాయి.

ఉన్నట్టుండి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోతే? అనిపించింది. మళ్ళీ బాగుండదని వూరుకున్నాను. అసలా అవకాశం లేకుండా అడ్డంగా నిలబడ్డాడు వాడు.

“ఏమైపోయావురా ఇంత కాలం? ఒక ఫోన్ లేదు, మాటలేదు? నేను చేస్తే పలకవు, వస్తే ఇంట్లో వుండవు..” వాడిపాటికి వాడు ఏదో అడుగుతున్నాడు. నా దగ్గర సమాధానం లేదు. వాడు అడగబొయే ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. నా మనసు చుట్టూ కందిరీగల్లా ఎర్ర అట్ట డైరీలే ముసురుకున్నాయి.

“ఏంట్రా ఏమడిగినా మాట్లాడవు?” అన్నాడు వాడు.

ఏం మాట్లాడగలను? కులాసాలు అయిపోయాక వాడు ఎలాగూ అడగక మానడు. నాకు చెప్పకా తప్పదు. తప్పు చేసిన తరువాత చెప్పుకోడనికి భయమెందుకు అనుకున్నాను. గట్టిగా ఊపిరినీ, ధైర్యాన్ని పీల్చుకోని నోరు విప్పాను.

“అరేయ్ చారి.. నన్ను నువ్వు క్షమించాలిరా..” అన్నాను.

“అదేంట్రా? అలాగంటావు?” ఆశ్చర్యపోయాడు వాడు.

“నేను ఒక తప్పు చేశానురా… మీ నాన్నగారి పుస్తకాలు ఎక్కడో పోగొట్టాను… పూర్తిగా నా అజాగ్రత్తే కారణం… దీనికి నువ్వు ఏ శిక్ష వేసినా సరే… నాకు తెలుసు అవి నీకు ఎంత ముఖ్యమైనవో..” ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాను.

“రేయ్.. ఏంట్రా.. ఏ పుస్తకాల సంగతి నువు చెప్పేది?” అన్నాడు వాడు. నేను తలెత్తి ఆశ్చర్యంగా చూశాను.

“అదేంట్రా.. మీ నాన్నగారు రాసి పెట్టుకున్నవి.. ఎర్ర అట్ట డైరీలు.. నాకు ఇచ్చావు కదా?”

“ఓహ్.. అవా… నాకసలు గుర్తే లేదు… సరే పోతే పొయ్యాయిలే…” అని వాడంటుంటే నాకు ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది.

“అదేంటి చారీ అలాగంటావు… ఎంత విలువైన సమాచారం వుందో తెలుసా అందులో..”

“ఏమోరా.. నాకు ఆ జాతకాలు అవీ అర్థం కావు.. ఇంక ఆయన రాసుకున్నవి నాకేం వుపయోగపడతాయి..”

“చాలా దారుణంగా మాట్లాడుతున్నావు… కనీసం మీ నాన్న చేతి రాత కోసమైనా అవి విలువైనవి అనిపించలేదా..”

“చేతిరాత… ఎందుకూ.. వున్నాయిగా ఆయనగారు స్వయంగా రాసుకున్న దస్తావేజులు, వీలునామా… ఛస్తున్నాం వాటి సంగతులు తేలక… అన్నట్టు వీలునామా అంటే జ్ఞాపకం వచ్చింది… నీకు తెలిసిన మంచి లాయర్ వుంటే చెప్పరా.. అసలు అందుకే నేను నీ కోసం వెతుకుతున్నాను…” వాడేదో చెప్తూనే వున్నాడు, నేను మాత్రం వినడం మానేశాను.

అలాగే నిలబడిపోయాను. అన్ని రోజులు పడ్డ ఆదుర్దా మొత్తాన్ని ఆవేదన లాంటిదేదో కమ్మేసినట్లైంది.

వాడు నా కోసం ఫోన్లు చేసింది, ఇంటికి వచ్చింది వాళ్ళ నాన్న సమపార్జించిన జ్ఞానమనే ఆస్థి కోసం కాదా….?? అంతేలే చలం ఇల్లు పాడుబడితే ఎవరికి పట్టింది? గాంధీ వస్తువులు వేలంపాటలు వేస్తే ఏ వారసుడికి నొప్పి పుట్టింది? ఆస్థికి వారసులు వేరే, అత్మకి వారసులు వేరే..!!

“ఏరా ఏమంటావ్?” కదిలించాడు వాడు.

“మళ్ళీ కలుస్తారా” అని ఆటో ఎక్కేశాను.

ఆ తరువాత మరో మూడు రోజులకి అనుకోకుండా బంటిగాడి బొమ్మల బాక్స్ లో ఎర్ర అట్ట డైరీలు కనపడ్డా, ఆ విషయం చారికి చెప్పలేదు. వాడు అడగనూ లేదు. అయితే ఇప్పటి కూడా వాణ్ణి కలవకుండా వుండటానికే ప్రయత్నిస్తున్నాను.

అంతా భీకర యుద్ధాల సారాంశమే కదా..!

rajayya-150x150

నాన్నా వంశీ,

బాగున్నావా? నేను అమెరికా వచ్చి అప్పుడే నెల కావస్తోంది. సమస్త దైనందిన వ్యవహారిక ముసుగులన్ని వొదిలిపెట్టి జీరో దగ్గర మొదలుపెట్టినట్టుగా ఉంది. అప్పుడెప్పుడో అల్లకల్లోలంగా తిరుగుతున్నప్పుడూ రష్యా కుప్ప కూలిందని,  చైనా దిక్కు మారిందని, అదేదో మన స్వంత వ్యవహారమన్నంత దిగులుగా తిరుగుతున్నప్పుడు, ఇంద్రగంటి కిరణ్మయి సీపెల్‌లో ఒక బెంగాలీ సినిమా చూయించారు. అది రికరింగు  ఫ్రమ్ జీరో.. నక్సల్బరీ ఉద్యమంలొ జాదవపూర్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్రిక్త, ఉద్విగ్న రాజకీయాలలో తిరుగుతూ అరెస్టయి.. పదేండ్ల తరువాత విడుదలై, కలకత్తాలో, తనకు రాజకీయాలు నేర్పిన ఉపాధ్యాయుడి ఇంట్లో మళ్లీ జీవించడం ఆరంభించడం, మళ్లీ పనిలోకి, ప్రజల్లోకి, సూర్యరశ్మిలోకి వెళ్లడం ఆ సినిమా…

నాకు ఈలాంటి విచిత్ర భారీ జీవితంలో అంతఃచేతనంలో ఉన్న అనేక విషయాలు పోటెత్తుతున్నాయి. గుడిమెట్టు కింది చిన్న పల్లెటూరు, గుట్ట మీది నుండి పారుతూ వచ్చిన బూరుగు వాగు – గుడిసెలు – పశువులు, పక్షులు , పంటలు… ప్రతి చిన్న విషయము పోటెత్తుతున్నాయి. మొన్న మే 19నాడు ఇక్కడ సముద్ర తీర ప్రాంత సాహిత్యాభిమానులు ‘వీక్షణం’ అనే సమావేశానికి గొల్లపూడి మారుతీరావుగారితో పాటు నన్ను పిలిచారు.

ఎన్నో రకాల అద్భుత అతీంద్ర శక్తులు, చదువులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు వీళ్లు. సముద్రాలు దాటి, దేశాలు దాటి, నిత్యము నిరంతరం అప్రమత్తతతో వేగవంతమైన జీవితం జీవిస్తున్నవాళ్లు వీళ్లు. వీళ్ల మధ్యలో ఎక్కడో మారుమూల  పల్లెటూల్లో పుట్టిన నేను, బెరుకుగా వెళ్లాను. నా నలభై యేళ్ల దండ్లాట, వెతుకులాట, మనుషులకోసం పరితపించడం, అమానవీయ ప్రపంచంలో తలపడటం గురించి అస్తుబిస్తుగా మాట్లాడాను. వాళ్లకేమర్ధమయ్యిందో తెలియదు. నిత్యమూ  నిరతరం అస్థిర అస్తవ్యస్త సంక్షోభం. జీవితం గడిపే రైతాంగం, ప్రపంచీకరణ మాయలో,  ఉప్పెనలో కొట్టుకపోతున్న, పట్టుకోల్పోతున్న కోరు పారిశ్రామిక కార్మికులు. ప్రకృతివనరులు, నీరు , నేల, ఖనిజాలు తవ్వుకపోతూ, నిలువ నీడలేక అనివార్యంగా యుద్ధరంగంలో నిలబడ్డ మన దేశ ఆదివాసులు, వీళ్లందరి గురించి ప్రపంచానికి ఆ లోలోపల తడిని చెప్పడానికి ఆ తడిని, ఆర్తిని, వీరోచిత తిరుగుబాటును చెప్పడానికి నాకు భాష సరిపోలేదు. అయినా ఇంత పకడ్బందీగా ప్రోగ్రాం చేయబడిన దేశంలో కూడా మనుషులకు లోలోపల దారితెన్నూ కానని తడి ఉన్నది. ఈ మహేంద్ర జాలంలో కూడ వీళ్లందరు నిత్యము, నిరంతరం మనిషి కోసం వెతుకుతున్నట్టుగా అనిపించింది.

గొల్లపూడి మారుతీరావుగారు – జీవితంలోని వెలుగునీడల మర్మమెరిగినవారు.వారు గత కొంత కాలంగా హెచ్ ఎమ్. టీవీ వాళ్ల కోసం వందేళ్ళ తెలుగు కథ చేస్తున్నారు. తెలుగు కథ పరిణామం గురించి బాగా మాట్లాడారు. తెలుగు నాటకం గురించి … ఒక జాతి ఆత్మను, గుండెకాయను కాపాడుకోవాల్సిన ప్రజల ప్రభుత్వాల బాధ్యత గురించి ప్రశ్నించారు.   ప్రపంచ సాహిత్యంలోని మనిషి కోసం వెతికే కథల గురించి అద్భుతమైన కంఠస్వరంలో విన్పించారు. చెహోవ్ నిద్ర లేని పిల్ల కథ. తను సాకుతున్న పిల్లవాడి గొంతు నొక్కడం. మనసు వికలమయ్యింది. ఈ కథ 1980లో ఒక సమావేశంలో రావిశాస్త్రిగారు చెప్పారు. అప్పటినుండి ఆ కథ నన్ను వెంటాడుతూనే ఉన్నది. కవితలు, ముచ్చెట్లు, అక్కడికి వచ్చినవాళ్లంతా తమలోలోపలికి.. సమావేశకర్త కె.గీతగారు మా మిత్రురాలు ప్రముఖ రచయిత్రి కె.వరలక్ష్మిగారి కూతురు. కథకురాలు. కవయిత్రి.. ఒక చిన్న సూర్యకిరణాన్ని తన చేతులతో ఇక్కడ విత్తుతున్నారు.

ఎక్కడినుండో మరెక్కడికో వచ్చాను. చాలామంది గురించి రాయాలి. చురుకైన నిజామాబాదు అబ్బాయి గురించి. సి.నారాయణరెడ్డిగారి బంధువు అబ్బాయి. తను ఏదో చేయాలనే తపనతో బుచ్చిబాబన్నట్లు మండుతున్న కాగడాల్లాగే తిరిగే ఈ మనుషుల గురించి శక్తి చాలదు. తెలిసింది కొద్దిగా.. ముఖ్యంగా కుమారపల్లి హన్మకొండ సోమయ్యగారి గురించి..

ఒక ఆదివారం స్ఫూర్తి, చందూ, శ్రీధర్ కలిసి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళాం. ఏడో  వింతలో ఒకటైన గోల్డెన్ బ్రిడ్జ్ అదివరకే చూశాను. ఈ భయంకర బంగారు నగరం గురించి లోలోపల అధో జగత్ సహోదరులు  పడే యాతన  గురించి, నేను ఒక చైనా నవల చదివాను. శుభ్రమైన, ఎత్తైన, మహాద్భుతమైన, దృఢమైన మహా సాధనాలు చూస్తుంటే.. నాలోలోపల తగలబడిపోయిన బాగ్దాదు నగరం, ఆరని కుంపటి ఆఫ్ఘనిస్తాన్, నిత్యము, నిరంతరం యుద్ధరంగంగా అతలాకుతల మవుతున్న ప్రపంచం. బస్తర్ దండకారణ్యం మానవులు తమ శ్రమతో నిర్మించుకున్న సమస్త నాగరికత తుడిచి పెట్టుకుపోయి, వ్యాపార విధ్వంసం. లోలోపల కదిలింది. వీధుల్లో ఆ దేశాల  నమూనాల్లాగా అనాధలు, ఇల్లు  లేని విధం కడుపులో దేవినట్లయింది…

110621-Civil_War_art-AP248502718257_620x350

ఆసియా మ్యూజియంకు వెళ్లాం. అబ్బో… చైనా, వియత్నాం, కొరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాలాంటి దేశాల  అపురూపమైన, విలువైన రాతి, లోహ యుగ నమూనాల నుండి ఇప్పటి పెయింటింగ్స్ దాకా.. ఒక అపురూపమైన యుద్ధ,బీభత్స, మహా పరిణామ క్రమం కళ్లముందు మెదిలింది. ఎక్కువగా చైనీయులు కన్పించారు. భౌద్ధానికి సంబంధించి వివిధ కాలాలకు సంబంధించిన దేవతలు, పురాతన శిల్పాలు, వస్త్రాలు, కర్ర శిల్పాలు వందలు, వేలున్నాయి. అప్పటినుండి ఇప్పటిదాకా మానవుని అన్వేషణ, వెతుకులాట.. చరిత్ర సమస్తం భీకర యుద్ధాల సారాంశమే కదా.. అయితే చైనా విప్లవానికి సంబంధించినవేవీ లేకపోవడం ఈ మ్యూజియం విశేషం. అరువై యేళ్లకు నేనిక్కడ తిరుగుతున్నా స్ఫూర్తి తను పుట్టిన దగ్గరినుండే తిరుగుతోంది. తిరిగి తిరిగి ఇల్లు చేరుకున్నాము.

నేనిప్పుడున్నది కాలిఫోర్నియాలోని  సన్నివేలు. ఇక్కడ గూగుల్, యాహూ లాంటి అనేక సాఫ్టువేరు కంపెనీలున్నాయి … తమిళ, తెలుగు, గుజరాతీ, పంజాబీ వాళ్లు ఎక్కువగా కన్పిస్తున్నారు. ఇందులో కూడా తెలంగాణా వాళ్లు తక్కువే. మొత్తంగా ఇంత దూరం ఇన్ని రకాల సాహసాలు చేసి రాగలగడం కింది కులాలకు సాధ్యం కాదు.

మెదడు, చేతులు ఖాళీ.. గోనెడు జొన్నలు చాలని చేను దగ్గర మూడు నెలలు రికామిగా కావలి కాసే ఆదివాసి గోండు దాదా లాగా ఉన్నది మానసిక స్థితి.

ఉరుకులు పరుగులు.. పోటీ.. ఒత్తిడి కత్తి అంచుమీద అతి చాకచక్యంగా, నైపుణ్యంగా బతికే ప్రపంచంలోని అత్యంత ఆధునికమైన, అధికారికమైన,.. అందులో బే ఏరియాలో… సుడిగాలిలా ప్రపంచవ్యాపితంగా వ్యాపించి అల్లకల్లోలం చేస్తున్న గ్లోబలైజేషన్ మార్కెటు ఉన్మత్త అంతరంగంలో ఇదిగో ఇట్లా నేను ఖాళీగా.. భిన్నంగా…

ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడల్లా.. నేను  1993 వేసవికాలంలో అహోబిలం కొండమీద చూసిన మొలకు చిన్న తుండు గుడ్డ, చేతిలో చిన్న కట్టె.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అదిలాబాదు కొలిమిలో తయారుచేసిన ఉక్కు చాకులాంటి శరీరం. నేరేడు రంగు, విచిత్రమైన, లొంగని కళ్ళు కల ఆ పిల్లవాడు గుర్తొస్తాడు. అతను మాకు కొండ మీదికి దారి చూపిన గైడు. అతనికి యిస్తామన్న అయిదు రూపాయలు. మార్గమధ్యంలో అతను మెరుపు వేగంతో పట్టుకున్న ఉడుము.. నేనతనికి పదిరూపాయలిస్తే తీసుకోలేదు. అయిదే కావాలన్నాడు. అతను దేనికీ లొంగకుండా.. బహుశా నా విషాద, వైఫల్యాలలో నాకిప్పటికీ అతను గైడే.

బహుశా  ఈ భూగోళాన్ని ఫుట్‌బాల్‌లా ఆడగల ధీరుడతను.. ఏ ప్రోగ్రాములకు అందనంత ఎత్తైనవాడు. ఏ వస్తువుకు, ఆస్తికి లొంగనంత ధీరోదాత్తుడతను. ఈ ప్రపంచం మన కలల ప్రపంచం. సకల విధ్వంసాల నుండి కాపాడుదాం..

మేం భూస్వామిక ఊపిరి సలుపని ప్రపంచం నుండి వచ్చిన వాళ్లం. ఆ అమానవీయ పరిస్థితులలో తలపడి పెనుగులాడి  మార్చడానికి తాపత్రయపడ్డవాళ్లం. ఈ క్రమంలో మన ప్రాంతంలో నా సహచరులు ఈ మాట రాస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండిపోయి అక్షరాలు అలుక్కుపోతున్నాయి. సహచరులు, కొడుకులు, కూతుళ్లు ఆహుతయ్యారు. అయినా కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి కలలు కంటున్నారు. మళ్లీ ఇరువై సంవత్సరాల తరువాత ప్రపంచీకరణ  నేపధ్యంలో ప్రగాఢమైన విషాదకరమైన అయినా వీరోచితమైన మా సామూహిక అనుభవాన్ని నాన్నా వంశీ!  నీతో పంచుకుంటున్నాను . అంటే ఈ లేఖ నీవొక్కనికే కాదు. రాసేది నీ పెదనాన్న మాత్రమే కాదు. తండ్రులు కొడుకులతో మాట్లాడే మాట యిది.

బహుశా కరెంటు వైర్ల మధ్య, తుమ్మ ముళ్ల మధ్య రాత్రి పగలు వొంటరిగా నిరంతరం శ్రమ పడుతూ కూడా కూనిరాగం తీస్తూ, అద్భుతమైన పాటలు, కథలు రాసిన మీ నాన్న, పెట్టుబడి  యంత్రాంగం, వేగవంతమైన జీవితంలో మన వూళ్ల గురించి పలవరించే ముళ్ళ దారిలో కాక..

నా కాలం పోయింది . మీ కాలంతో మీతో పంచుకోవడం..

ఇట్లు ..

పెదనాన్న..

చరిత్రే అన్నిటినీ మించిన ఉత్కంఠభరితమైన కథ!

“నాకు కథ అంటే చాలా ఇష్ట”మని అన్నాననుకోండి, “కథ అంటే ఎవరికి ఇష్టం కా”దని మీరు వెంటనే అనచ్చు. నిజమే, కథ అంటే ఇష్టపడని వారు ఉండరు. కనుక, చిన్నపాటి ఆత్మకథకు ఉపక్రమణికగానే ఈ వాక్యాన్ని తీసుకోవాలి. అలాగని దీనిని ఆత్మకథగానూ  తీసుకోవద్దని మనవి.

కథ అంటే నాకు ఎంత ఇష్టమంటే, నన్నయభట్టు తనతో రాజరాజనరేంద్రుడు అన్నట్టుగా చెప్పిన ఈ పద్యం నాకు తరచు గుర్తొస్తుంటుంది.:
ఇవి యేనున్ సతతంబు కరం బిష్టంబులై యుండు బా
యవు భూదేవుకులాభితర్పణ మహీయఃప్రీతియున్ భారత
శ్రవణాసక్తియు బార్వతీపతి పదాబ్జ ధ్యాన పూజామహో
త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్

అయిదు విషయాలు నాకు చాలా ఇష్టమైనవంటూ, రాజరాజనరేంద్రుడు అవేమిటో చెప్పాడు. వివాదాస్పదమైన మొదటి దానినీ, మరో మూడింటినీ అలా ఉంచితే ఆయన తనకు ఇష్టమైన వాటిలో భారతశ్రవణాసక్తి ఒకటన్నాడు. నాకెందుకో ఆ మాటను నన్నయ యథాలాపంగా ఉపయోగించి ఉండడనిపిస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లో infatuation, passion, obsession;  తెలుగులో తమకం , మోహం(నిజానికి తెలుగు మాటలేవీ నాకు సంతృప్తి కలిగించలేదు)వగైరా మాటలతో  చెప్పుకునే వల్లమాలిన ఆసక్తి భారతకథపై రాజరాజనరేంద్రుడికి నిజంగానే ఉండేదేమో ననిపిస్తుంది. కథ అనగానే మనిషిలో సహజంగా ఉండే చెవికోసుకునే గుణాన్నే ఆ మాట సూచిస్తోందేమో.

కథ నాకు ఇష్టమన్నానా… అందులోనూ అపరాధపరిశోధక కథలన్నా, కొసమెరుపు కథలన్నా, మానవస్వభావంలోని వైచిత్రిని ఆశ్చర్యస్ఫోరకంగా చిత్రించే కథలన్నా మరీ ఇష్టం. కథ అంటే అంత ఇష్టపడే నేను ఎన్ని కథలు రాశానని మీకు  సందేహం కలగచ్చు. పట్టుమని పది కూడా ఉన్నట్టు లేవు. నేను లెక్క పెట్టలేదు. అసందర్భం అనుకోకపోతే చిన్న ముచ్చట. గోదావరిగట్టునే ఉన్న మా ఊళ్ళో ఓ రోజున, రోజంతా నాకు ఎంతో ఇష్టమైన మపాసా కథలు చదువుతూ క్రమంగా ఒకవిధమైన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఒక ఆహ్లాదకరమైన అస్థిమితం నన్ను ఆవరించింది. సాయంత్రమయ్యేసరికి అది తార స్థాయికి వెళ్లింది. క్షణం కూడా ఇంట్లో ఉండలేననిపించింది. పుస్తకం పక్కన పెట్టి సైకిలు మీద గోదావరి గట్టు మీదికి బయలుదేరాను. ఒక గమ్యం అంటూ లేకుండా యాంత్రికంగా సైకిలు తొక్కుతూ కొంత దూరం వెళ్లిపోయాను. అప్పుడు నాకో కథ స్ఫురించింది. కొన్ని రోజులు మనసులో నానిన తర్వాత దానిని కాగితం మీద పెట్టాను. అప్పుడే ఆంధ్ర సచిత్రవార పత్రిక దీపావళి కథల పోటీ ప్రకటించింది. నా కథను పోస్ట్ చేయడానికి వెడుతుంటే ఒక మిత్రుడు నాతో వచ్చాడు. కవరు మీద స్టాంపులు అంటిస్తూ, “ఈ కథకు బహుమతి వస్తుంది” అన్నాను. వచ్చింది. ఆ కథ పేరు ‘దూరం’. ఇది జరిగింది ఎనభైదశకం ప్రారంభంలో.  చిన్న వివరణ: ఆ కథ మపాసా కథలు వేటికీ కాపీ కాదు.
ఆ తర్వాత మరో అనుభవం ఎదురై ఉండకపోతే బహుశా నేను కథారచనకు ‘దూరం’ అయేవాణ్ణి కాదేమో ననిపించినా, ఆ మాట కచ్చితంగా చెప్పలేను. ఇప్పుడాలోచిస్తే అందువల్ల నాలో ఎలాంటి విచారమూ లేదు. ఎందుకంటే, కల్పన కన్నా అద్భుతమైన కథాప్రపంచంలోకి ఆ అనుభవం నన్ను తీసుకెళ్లింది. ఓరోజు హైదరాబాద్, చిక్కడపల్లి కేంద్రగ్రంథాలయంలో పుస్తకాలు గాలిస్తుంటే డీ.డీ. కోశాంబి రాసిన Myth and Reality కనిపించింది. అందులో కొన్ని పురాణాసంబంధమైన రేఖాచిత్రాలు, చరిత్ర సంబంధమైన ఫోటోలు ఉన్నాయి. చదువుతూ ఉండిపోయాను. ‘చకచ్చకిత’ స్థితి అంటారే, అలాంటి స్థితిలోకి జారిపోయాను. ఆశ్చర్యం, ఉద్విగ్నత లాంటి అనేకానేక అనుభూతులు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. పురాణకథకూ, వాస్తవికతకూ; మరీ ముఖ్యంగా పురాణకథకూ, చరిత్రకూ మధ్య అడ్డుగీతలు చెరిగిపోతూ కళ్ళముందు ఒక అద్భుత స్వాప్నిక ప్రపంచం ఆవిష్కృతం కావడం ప్రారంభించింది. అంతవరకు కల్పనగా కనిపించిన పురాణపాత్రలు రక్తమాంసాలు నిండిన మన లాంటి వాస్తవిక వ్యక్తుల్లా కనిపించ సాగాయి. అనేక నమ్మకాలు, స్థిరాభిప్రాయాలు కూకటివేళ్ళతో కూలి పోవడం ప్రారంభించాయి.

కొన్ని రోజులపాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. నడుస్తున్నా గాలిలో తేలిపోతున్న అనుభవం. నిజానికి ఇప్పటికి కూడా నేను మామూలు మనిషినయ్యానని చెప్పలేను. కోశాంబిని మొదట చదివినప్పుడు కలిగిన మానసికస్థితిలోనే ఇప్పటికీ ఉన్నాను. ఇది జరిగింది కూడా ఎనభై దశకం ప్రారంభంలో.
బహుశా ఒక ప్రత్యేక కారణం వల్ల కోశాంబి నాలో ఇంత సంచలనం కలిగించాడని నేను అనుకుంటాను(నా ఊహ తప్పైనా కావచ్చు. కోశాంబిని చదివిన అందరిలోనూ ఇదే సంచలనం కలిగి ఉండచ్చు). ఆ కారణం ఏమిటంటే, పురాణం మా ఇంటి విద్య. నేను పురాణ, రామాయణ, మహాభారతకథల మధ్య పెరిగాను. మా నాన్నగారు అష్టాదశపురాణాలను తెలుగులోకి అనువాదం చేసిన కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. సంస్కృత, ఆంధ్రాలలో కవిత్వం చెప్పినవారు. దేవీ నవరాత్రులలో రామాయణ ప్రవచనం చేసేవారు. ముఖ్యంగా పురాణాలపై పరిశోధన చేసినవారు.  నేను ఒకవిధంగా మా నాన్నగారికి ఆధునికరూపాన్ని. మా పినతండ్రి వీరభద్రశాస్త్రిగారు పౌరాణికులుగా ప్రసిద్ధులు. భాగవతంలో నిష్ణాతులు.
కోశాంబిని  నా పురాణ, ఇతిహాసపరిజ్ఞానానికి అన్వయించుకోవడం, నాకుగా నేను సరికొత్త అన్వయాలను వెలికి తీయడం ఎనభై దశకంలోనే ప్రారంభించాను. నాకూ, మా నాన్నగారికీ మధ్య సంభాషణ జరుగుతూ ఉండేది. ఆయన సాంప్రదాయిక పరిజ్ఞానంతో నా ఆధునిక అవగాహనను బేరీజు వేసుకోడానికి ప్రయత్నించేవాడిని.

[box  title=”‘పురా’గమనం – కల్లూరి భాస్కరం కొత్త కాలమ్” color=”#333333″] Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5) మనకు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటుంటాం;  కానీ అదేమిటో, ఇప్పుడే స్వయంభువులుగా పుట్టినట్టు వర్తమానంలో గిరి గీసుకుని బతికేస్తూ ఉంటామంటారు భాస్కరం కల్లూరి. ఆయన అభిప్రాయంలో మన కథలు, కావ్యాలు, అవి చిత్రించే వస్తువు లేదా సమస్యలు చాలావరకు వర్తమానం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. మన రాజకీయాలూ అంతే. అయిదొందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్న అమెరికన్లు తమ చరిత్రను అత్యద్భుతంగా చూపించుకుంటుంటే, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నా చరిత్రశూన్యుల్లా కాలం దొర్లించే ప్రత్యేకత మనదేనేమో నంటారాయన.

“ఒక్కసారి గతమనే గవాక్షం తెరవండి, మీ ముందు మీకు తెలియని అద్భుతప్రపంచం పరచుకుంటుంది. కాలం వెంబడి నడచివచ్చిన మన అడుగుజాడలు అందులో కనిపిస్తాయి. మన నమ్మకాలను, నిశ్చితాభిప్రాయాలను తలకిందులు చేసి షాకిచ్చే గుప్తసత్యాలు ఎన్నో బహిర్గతమవుతాయి. పురాణకథలు కొత్త రూపం తీసుకుంటాయి. గణం నుంచి జనంగా మారిన మన వైనాన్ని పూసగుచ్చినట్టు చెబుతా” యని ఆయన అంటారు.

చరిత్ర సంపద ఉన్నా లేమిని అనుభవించే మన విలక్షణతను గుర్తు చేస్తూ, చరిత్ర అట్టడుగున పడి కాన్పించని కథలను, విశేషాలను తడుముతూ వ్యక్తిగతస్పర్శతో భాస్కరం కల్లూరి ప్రారంభిస్తున్న కాలమ్ ఇది!  [/box] ఓ రోజు నేనో సందేహాన్ని వ్యక్తం చేశాను.
“తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం అంటారు కదా, చిన్న కొడుక్కి రాజ్యం అప్పగించిన ఉదాహరణలూ కనిపిస్తున్నాయి కదా?”
నాన్నగారు సాలోచనగా నా వైపు చూశారు.
“మహాభారతంలో యయాతి తన చిన్నకొడుకు పూరునికి రాజ్యం ఇచ్చాడు. ప్రతీపుడు పెద్దకొడుకు దేవాపిని కాకుండా చిన్నకొడుకు శంతనుని రాజును చేశాడు. కారణం ఏదైనా శంతనుని పెద్ద కొడుకు భీష్మునికి బదులు చిన్నకొడుకు విచిత్రవీర్యుడు రాజయ్యాడు. కురుపాండవులలో పెద్ద అయిన ధర్మరాజుకు, చిన్న అయిన దుర్యోధనుడికి మధ్య రాజ్యాధికారవివాదం ఏకంగా కురుక్షేత్రయుద్ధానికే దారితీసింది. పెద్దకొడుకైన రామునికి బదులు తన కొడుకు భరతుని రాజును చేయమని కైక దశరథుని అడగడం, రాముడి కథను మహాకావ్యంగా మలుపుతిప్పింది.” అన్నాను.
“ధర్మశాస్త్రాల ప్రకారం తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం. చిన్న కొడుకు రాజైతే దానిని మినహాయింపుగానే చూడాలి తప్ప సార్వత్రిక నియమంగా చూడకూడదు” అని నాన్నగారు అన్నారు.
“చిన్నకొడుకు రాజైన ఘటనలు ఉన్నప్పుడూ, కొడుకుల మధ్య అధికారవివాదం ఘర్షణ సృష్టించినప్పుడూ వాటిని మినహాయింపులుగా ఎందుకు చూడాలి? సార్వత్రిక నియమంగా ఎందుకు చూడకూడదు?” అన్నాను.
నాన్నగారికి ఆ ప్రశ్న అర్థవంతంగానే కనిపించినట్టుంది. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి, తర్వాత అన్నారు:
“వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘మహాభారతతత్త్వకథనం’ ఒకసారి చూడు. అందులో నీ సందేహానికి సమాధానం దొరకచ్చు”.
అందులో కచ్చితంగా సమాధానం దొరకదని నాకు అనిపించింది. సంప్రదాయపండితులకు అలాంటి సందేహం కలిగే అవకాశం లేదని నా నమ్మకం.  నాన్నగారితో ఆ మాట అనకుండా అప్పటికి మౌనం వహించాను.

rajasthani_phad_painting_pb40

కొన్ని రోజుల తర్వాత చిక్కడపల్లి గ్రంథాలయంలోనే రొమీలా థాపర్ రచించిన పుస్తకం ఒకటి కనిపించింది. అందులో మహాభారత వంశానుక్రమణిక(Genealogy of Mahabharata) గురించి ఆమె చర్చించింది. ఒక చోట నా కళ్ళు ఆశ్చర్యానందాలతో మెరిసిపోయాయి. మాతృస్వామ్యంలో చిన్న కొడుకుదే పెత్తనం అని ఆమె రాసింది.
మరోసారి అసందర్భం అనుకోకపోతే, మా నాన్నగారి గురించి మరికొంత చెప్పాలి. ఆయనలో ఒక కవీ, పౌరాణికుడు, పండితుడే కాక; కవి పండిత పౌరాణికులలో చాలా అరుదుగా కనిపించే పరిశోధకుడు, జిజ్ఞాసి ఉన్నారు. అంతకన్నా ఆశ్చర్యంగా సాంప్రదాయిక పాఠానికి సరికొత్త అన్వయాలను గుడ్డిగా నిషేధించని ఆలోచనావైశాల్యం ఆయనలో ఉండేది. కొత్త విషయం, కొత్త అన్వయం తన దృష్టికి వచ్చినప్పుడు ఆశ్చర్యాద్భుతాలను ప్రకటించే ఒక పసితనం ఉండేది. నా దగ్గర ఉన్న తెలుగు పుస్తకాలను చదివి “ఇది పూర్తిగా చదివాను. అద్భుతం, ఆశ్చర్యకరం” అని లోపలి పుట మీద రాసి సంతకం పెట్టేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక అట్లాస్ ఉండేది. పురాణాలలో చెప్పిన ద్వీపాలను అందులో గుర్తించడానికి  ప్రయత్నించేవారు. సరిగ్గా మన నేలకిందే అమెరికా ఉందనే వారు.

సగరచక్రవర్తి కొడుకులు అరవై వేలమంది తండ్రి యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ భూమిని తవ్వి కపిలారణ్యానికి వెళ్ళిన కథ పురాణాలలో ఉంది. ఆ కపిలారణ్యమే కాలిఫోర్నియా అని నాన్నగారు అనేవారు. పితృదేవతలు చంద్రమండలంలో ఉంటారని చెప్పేవారు. తద్దినం రోజున పిండ ప్రదానరూపంలో పితృదేవతలకు పెట్టే ఆహారాన్ని సారంగా మార్చి కొన్ని కిరణాలు వారికి అందిస్తాయనేవారు. ఇవన్నీ నిరూపణకు అందేవి కాకపోవచ్చు. కానీ తన విశ్వాసాల పరిధిలో వాటికి అర్థం చెప్పడానికి ప్రయత్నించేవారు. ఆయన సంస్కృత కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన కొవ్వూరు(పశ్చిమ గోదావరి జిల్లా)లో గంధం రామారావు అనే అడ్వకేట్ ఉండేవారు. నాన్నగారి ప్రవచనాలకు, ప్రసంగాలకు ఆయన తప్పనిసరిగా హాజరయ్యేవారు. చివరిలో ఆయనను కలసి, “ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం చెప్పకుండా ఉండరు కదా!” అని అభినందించి వెళ్ళేవారు.
నా ‘జన్యులక్షణా’న్ని ఈపాటికి మీరు పోల్చుకుని ఉంటారు.
మళ్ళీ కథ దగ్గరికి వద్దాం. అపరాధపరిశోధక కథ నాకు ఇష్టమని చెప్పాను. కాలగమనంలో మన పురాణకథలు, ఇతిహాసాలు, పురాచరిత్ర, చరిత్రా అపరాధపరిశోధక కథలుగా మారిపోయాయి. కాలమనే హంతకుడు అసలు అర్థాన్ని, లేదా వాస్తవికతకు దగ్గరగా ఉండే అర్థాన్ని హత్య చేశాడు. అయితే కొన్ని క్లూలు విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ క్లూలలోనే ఉంది అసలు కథ అంతా. వాటి వెంబడే వెడితే అద్భుతావహమైన నూతన కథా ప్రపంచంలోకి అడుగుపెడతాం. నేటి కథలను తిరగరాసే కొత్త కథలు అనేకం అక్కడ దొరుకుతాయి. నా ఉద్దేశంలో చరిత్ర, కథను మించిన ఉత్కంఠభరితమైన కథ!
అయితే, ఒక గమనిక: చరిత్ర అనే కథలో అద్భుతత్వాన్ని దర్శించాలంటే, భారతశ్రవణంపై రాజరాజనరేంద్రుడికి ఉన్నంత infatuation చరిత్రపై ఉండాలి. అలాగే ఒక హెచ్చరిక: ఈ infatuation కు తగిన మూల్యం చెల్లించుకోవాలి. అంటే, మీరు మ్యూజియంలోని పురావస్తువుగా మారిపోవాలి!

-భాస్కరం కల్లూరి

నింగీ, నేలా

 PrasunaRavindran

నా ఎదురుగానే ఉంటావ్
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం
అడ్డు మేఘాలు కరిగిపోడానికి
నా స్పర్శే కాదు
నీ వేడి నిట్టూర్పులు కూడా
చాలటం లేదు
ప్రవహించే ఏ నదయినా
ఒక్క క్షణం ఆగి
నా పాట కూడా వింటుందని
ఆశగా చూస్తూంటాను
ఇన్నేసి పక్షుల గుంపుల్లో ఒక్కటయినా
తన రెక్కల నీడ పడుతుందని
నిష్ఫల స్వప్నాలు కంటూంటాను.
నీకోసం
రంగుల ముఖాల్ని తొడుక్కుంటూ
నీ మనసుకి అద్దంలా మారిపోతూ
అమృతాన్ని వర్షిస్తూ
నేనూ  …
నాతో మాట్లాడాలని
సుడులు తిరుగుతూ
పచ్చటి సైగలు చేస్తూ
పూలను విసురుతూ
గాలిపైటనాడిస్తూ
అనేక సంకేతాల పక్షులనెగరేస్తూ
నువ్వూ …
పరస్పరం ప్రేమించుకోని క్షణముండదు
అయినా
నీకూ నాకూ మధ్య
కొన్ని జన్మల దూరం ….

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

 

varma.

ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది

రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని

మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును

చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను

దీపపు సెమ్మెకింద అంటిన నూనె జిడ్డును

సున్నితంగా తొలగిస్తూ సమాధిని శుభ్రం చేయాలనుంది

 

నిద్రిస్తున్న యోధుడి గాయంలోంచి చిగురిస్తున్న మోదుగు పూల

మృధు స్పర్శ లోలోకి పాకుతూ గుండెలయను పెంచుతూ

నరాలలో రక్తకణ కాసారాన్ని ఉడుకెత్తిస్తూంది

 

గాయకుడెవరో ఇక్కడ గొంతు తెగిపడినట్టుంది

ఒక పాట చెవిలో వినిపిస్తూ నాభినుండి

దిక్కులు పిక్కటిల్లే నినాదమవుతూంది

 

అక్షరాలను అస్త్రాలుగా పదునెక్కించిన వారెవరో

పుటల మద్య నిప్పులు చెరుగుతూ దాగినట్టుంది

నెత్తురంటిన అక్షరాల పూత వేలి చివర మెరుస్తూంది

 

ఆరుగాలం ఆకాశం వైపు చూస్తూ మట్టితో యుద్ధం చేస్తూ

ప్రేమిస్తూ తన నెత్తురినే ఎరువుగా మొలకెత్తిన

మట్టి మనిషెవరో విశ్రాంతి తీసుకున్నట్టుంది

చేతులకింత మట్టి తడి అంటుతూంది

 

ఎదనిండా తడి ఆరని జ్నాపకాలేవో రంగుల చిత్రంగా

నేసిన ప్రేమికుడెవరో భగ్న హృదయంతో అరమోడ్పు

కనులతో అవిరామంగా ధ్యానిస్తున్నట్టుంది

చేతులకిన్ని అద్దం పెంకులు గుచ్చుకున్నట్టుంది

 

లోలోన అలికిడి చేయకుండా పై మూత తెరవకుండా

మదినిండా గంధపు పరిమళమెదో

శ్వాస నిశ్వాసల మధ్య కమ్ముకుంటూ

సమాధి చుట్టూ చిగురించిన లేలేత పచ్చదనంతో

పూరేకుల తడితనమేదో స్పర్శిస్తూ

లోలోపల దాగిన కాంతిపుంజమేదో చేతి వేళ్ళగుండా

దేహమంతా ప్రవహిస్తూ నాలో దాగిన నైరాశ్యాన్ని

నిరామయాన్ని నిర్వేదాన్ని పారదోలుతూంది

 

సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు…

 

 

 

16న అనంతపురంలో ‘జ్ఞానసింధు’ సర్దేశాయి తిరుమలరావు గ్రంథావిష్కరణ!

Sardesai Cover Page front

స్పందన” అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో “జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకావిష్కరణ.

తేదీ: 16, జూన్ 2013, ఆదివారం
సమయం: ఉదయం  10:20
వేదిక: ఎన్.జి.వో. హోం, అనంతపురం

‘ఇలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదు’ అని మహాత్మాగాంధి గురించి వ్యాఖ్యానిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నాడు. సర్దేశాయి తిరుమలరావు గారి గురించి తెలుసుకుంటుంటే కూడా మనసులోఇదే ఆలోచన మెదలుతుంది. నిజంగా, ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద ముఖ్యంగా, మన ఆంధ్రప్రదేశ్‌లో, ఇంకా ముఖ్యంగా ‘రాయలసీమలో’జీవించాడన్న ఆలోచన ఎంతో అద్భుతం అనిపిస్తుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఓ సముద్రం లాంటివాడు.

సర్దేశాయి తిరుమలరావుగారు సప్తసముద్రాల సమ్మిశ్రమ మహాసముద్రంలాంటివాడు.అలాంటి మహాసముద్రాన్ని ఆయన చేసిన కొన్ని రచనల ఆధారంగా సముద్రాన్ని నీటిచుక్కలో చూపించే ప్రయత్నం చేసినట్టు చేస్తున్నాము. మా ప్రయత్నం అసంపూర్ణం, అసమగ్రం. ఆ మహోన్నత వ్యక్తిత్వ విశ్వరూపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించలేదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అటు సాహిత్య ప్రపంచంలోనూ,ఇటు వైజ్ఞానిక ప్రపంచంలోనూ, ఇటు సామాజిక చరిత్రలోనూ మఱుగున పడిన ఒక మహాత్ముడికి ఈ పుస్తకం పరిచయ పుస్తకం లాంటిది మాత్రమే. ఆ మహోన్నత వ్యక్తిత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము సమర్పిస్తున్న ‘అంజలి’ లాంటిది మాత్రమే. ఇలాంటి అత్యున్నత వ్యక్తులకాలవాలం మన భూమి అని ఇలాంటి మహాద్భుతమైన వ్యక్తిత్వాలకు వారసులం మనమని భావితరాలకు తెలియజేయాలన్న మా ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకం.

మా ఈ ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకుని స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. ఇందులో దోషాలు, లోపాలకు మేమే బాధ్యులం. అయితే మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి మహనీయులు జీవించారు. తమ మేధతో విశిష్టమైన వ్యక్తిత్వంతో సమాజాన్ని సుసంపన్నం చేశారు. కాని వారు వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విస్మరింపబడ్డారు. అలాంటి మట్టిలో కలిసిన మణులను వెలికితీసి భావితరాలకోసం సమాజానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. తన పూర్వీకులను గౌరవించలేని
సమాజానికీ, తన గతాన్ని విస్మరించిన సమాజానికీ భవిష్యత్తు లేదంటారు. అలాంటి ఘోరమైన అంధకారాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం మన బాధ్యత. ఆ
బాధ్యత నిర్వహించాలనే మా ప్రయత్నంలో భాగం ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరికైన సర్దేశాయి తిరుమలరావు గారిపై ఆసక్తి కలిగినా, తమ
ప్రాంతంలో విస్మృతిలో పడిన మాణిక్యాలను ప్రపంచానికి ప్రదర్శించాలన్న తపన కలిగినా మా ప్రయత్నం విజయవంతమని భావిస్తాం.

జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకంలోని ప్రకాశకుల మనవి ఇది.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో (విశాలాంధ్ర, నవోదయ, తెలుగు బుక్ హౌస్, ప్రజాశక్తి, దిశపుస్తక కేంద్రం, సాహిత్యభారతి వగైరా) దొరుకుతుంది. ఆన్‌లైన్ లో కినిగె.కాం ద్వారా పొందవచ్చు. http://kinige.com/kbook.php?id=1813)

గమనిక:

మీ మీ  ప్రాంతాలలో జరగబోతున్న సాహిత్య సభల గురించి వారం రోజుల ముందు మాకు పంపండి. ఇక్కడ ప్రచురిస్తాం.