రంగు రెక్కల వర్ణ పిశాచం

 

Art: Rajasekhar Chandram

Art: Rajasekhar Chandram

 

 

మీరెప్పుడైనా పిశాచాన్ని చూశారా…?

భయపడకండి… !!

పిశాచమంటే తెల్లని చీర అందంగా  కట్టుకొని….తెలుగు సినిమా పాటలు పాడే పిశాచం కాదు. కనపడకుండానే జనాన్ని మింగే పిశాచం. రంగు రంగుల పిశాచం. రక్త వర్ణ పిశాచం. ఈ పిశాచం గురించి మొదట నాకూ తెలీదు. నా చుట్టూ ఆవహించి ఉన్నా.. నేను గుర్తించని పిశాచాన్ని ఫకీర్ కనిపెట్టి నాకు చూపించాడు. మీకూ చూపిస్తాను.
***
ఆరోజు నాకు బాగా గుర్తు…..
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం”  ఎవరో మంత్రాలు జపిస్తున్నారు. మేడ మీద పడుకొన్న నేను మెల్లగా కళ్లు తెరిచి ఆకాశం వైపు చూశాను.

రైతు పొద్దంతా దున్ని చదును చేసిన దుక్కిలా ఆకాశం ఎర్రమన్ను పూసుకుంది. లోకమంతా మోదుగుపూల వనంలా మెరుస్తోంది. తొలి పొద్దు చూసేందుకే  నేను రోజూ డాబాపైన పడుకుంటాను. ఆ పొడిచే పొద్దులా నేనూ కొత్తగా పుడతాను.
“దర్మశోణం…కర్మాసిహం…రిందమేయం…నందవోనం…” అంటూ పక్కనే మా తమ్ముని
కూతురు  లావుగా ఉన్న పుస్తకంలో చూసి ఏవో మంత్రాలు బట్టీ పడుతోంది.
” ఏం పాఠం రా తల్లీ అదీ. నేనెప్పుడూ విన్నట్లు లేదు” ఆరా తీశాను.

“మా స్కూల్లో ఈ పుస్తకంలోని మంత్రాలు కంఠస్తం చేసే పోటీలు పెడుతున్నారు పెదనాన్న….. గెలిచిన వాళ్లను హైదరాబాద్ కు తీసుకుపోతారట. అక్కడ కూడా గెలిస్తే ఢిల్లీకి తీసుకుపోతారట. అందుకే పొద్దున్నే లేచి బట్టీపడుతున్నా.” ఆశగా చెబుతోంది.
“స్కూల్లో పాఠాలు చెప్పకుండా ఇప్పుడు మంత్రాలు చెబుతున్నారా…?” అనుకుంటూ మెట్లు దిగి కిందికొచ్చాను.
” అన్నా సర్పంచ్ ఫోన్ చేసిండు పంచాయతీ ఆఫీసు దగ్గర గొడవ అవుతోందట..”
అంటూ తమ్ముడు ఫోన్ ఇచ్చాడు. “వస్తున్నా” అని ఫోన్ పెట్టేసిన.
మాది చాలా మారుమూల  గ్రామం. చుట్టు పట్టు పెద్ద ఊర్లు కూడా లేకపోవడంతో మండల కేంద్రం చేశారు. మా తాతల కాలం నుంచి ఊళ్లో మా కుటుంబానిదే పెత్తనం. మా నాయిన పోయిన కాన్నుంచి ఇంటితో పాటూ ఊరి బాధ్యత నా మీద పడింది. నానా కులాలు, మతాలు ఉన్నా అంతా కలిసి మెలిసి బతుకుతున్నాం.గబగబ ముఖం కడుక్కోని పంచాయతీ ఆఫీసు దగ్గరకు వచ్చిన. అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉన్నరు.
“మా గుడి దగ్గర మీ పుస్తకాలు పంచుడేంది?…నాలుగు తన్నండి..బుద్ధి వస్తుంది.” అంటూ జనం గోలగోలగా అరుస్తున్నారు.
సర్పంచ్ తో పాటూ ఐదారుమంది ఊరి పెద్దలు అక్కడ కూర్చొని ఉన్నారు. సర్పంచ్ నన్ను చూడంగనే “నమస్తే అన్నా” అంటూ ఎదురొచ్చాడు.

అక్కడున్న వేప చెట్టుకు ఇద్దరు ఆడమనుషుల్ని తాళ్లతో కట్టేశారు. ఇరవై ఏళ్లలోపు అమ్మాయి, ఇంకో నడి వయసు ఆడామె. కొందరు ఆడోళ్లు వాళ్ల జుట్టుపట్టి లాగుతున్నారు. పిడిగుద్దులు గుద్దుతున్నరు. బెదిరిపోయిన వాళ్లిద్దరూ “కొట్టొద్దు” అని దండం పెడుతున్నారు.

మాఊళ్లో ఏటా జాతర జరుగుతుంది. కానీ ఇట్లాంటి గొడవ ఎప్పుడూ  కాలే.

‘మాకేం తెలవదు నాయనా..నీ కాళ్లు మొక్కుతా.  రోజు ఐదొందలు కూలీ ఇస్తమంటే ఈ పుస్తకాలు పంచుతున్నం. ఇది నా బిడ్డ. కాలేజీల చదువుతున్నది. పొట్ట తిప్పలకు చేస్తున్నం తప్పితే ఇయ్యేం పుస్తకాలో, ఏందో మాకు తెల్వదు” ఏడుస్తోంది  పెద్దామె.
“వీళ్లను ఏం చేద్దాం…? కేసు పెట్టమంటరా..?” ఎస్సై అడిగిండు .

వాళ్లను చూస్తేనే అర్థమైతోంది. వాళ్లేదో బతుకుతెరువుకోసం చేస్తున్నరని. వాళ్లమీద ఏమని కేసు పెడతాం..!? వద్దని చెప్పిన.

” ఏమ్మా బతకటానికి ఇదే పని చేయాలా. మీ మతం పుస్తకాలు ఇంకెక్కడైనా పంచుకోండి. ఇలాంటి జాతరలు, గుళ్ల దగ్గర కాదు. చదువుకునే బిడ్డ భవిష్యత్తు నాశనం కావొద్దని వదిలేస్తున్నం..పో” అని పంపిచాను.
ఎవని బతుకు వాడు బతకొచ్చు కదా..? ఒకరి గుడి దగ్గరకు వేరేవాళ్లు వచ్చుడెందుకు..? ఈ పుస్తకాలు పంచుడెందుకు.?
ఇప్పుడు చెప్పండి. మీకు పిశాచం కనిపించిందా..? రంగు రంగుల పిశాచం కనిపించిందా..? లేదా…?
మనకు తెలీకుండానే మనల్ని ఆవహిస్తున్న పిశాచం…రంగు రంగుల పిశాచం….రక్త వర్ణ పిశాచం. నాకు ఫకీర్ చూపించాడు. అవునూ,  ఫకీర్ ఎవరో మీకు తెలీదు కదా…?
ఫకీర్ ది మావూరు కాదు. ఎక్కడో చైనా-కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న ఊరు. అక్కన్నుంచి శాలువాలు, చద్దర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతరు. హైదరాబాద్ దాకా సరుకు రైలులో తీసుకొచ్చి, అక్కడ ఓ గది కిరాయి తీసుకుని గోడౌన్ లాగా పెట్టుకుంటరు.

హైదరాబాద్ లో కొంతమంది పుట్ పాత్ మీద అమ్మితే… ఇంకొందరు ఊర్లు తిరిగి అమ్ముతరు. ఫకీర్ మా సరుకుతో మా ఊరుకు వచ్చి  మా ఇంట్లోనే సరుకు దింపుతడు.
***
అప్పుడు నాకు పదేళ్లు. బజారులో పాటలు వినిపిస్తుంటే పిల్లలతో పాటే నేను కూడా పరిగెత్తాను. ఏదో సినిమా ప్రచారం చేసే రిక్షా అనుకున్నాను. కానీ అది దుప్పట్లు, శాలువలు అమ్మే బండి. ఆ బండి మీద ఓ ముసలాయన, నా ఈడు పిలగాడు ఉన్నారు. ఆ చప్పుడుకు చాలా మంది బండి చుట్టూ మూగారు.

రంగు రంగుల రగ్గులు.

వాటి మీద అందమైన బొమ్మలు –

ఆ చద్దర్లు, శాలువలు ఆరుద్ర పురుగుల్లా… అందంగా, మెత్తగా ఉన్నాయి. అంత సుతి మెత్తని చెద్దర్లు నేనెప్పుడూ చూడలేదు. పట్టుకుంటేనే జారిపోతాయేమో అనిపిస్తూ…. పసిపాపల్లా ఉన్న వాటిని వొకసారి పట్టుకుంటే వదల్లేము.

మా బజారోళ్లు చాలా మంది వాటిని తీసుకు పోయారు కానీ మళ్లీ వెనక్కు రాలేదు.
రెండు రగ్గులు తీసుకున్న వాళ్లు ఒక్క రగ్గుకే డబ్బులు తెచ్చారు. ఇక్కడి భాష తెలీని వాళ్లు కావడంతో మోసం చేద్దాం అనుకున్నరు.
“యా అల్లా… ఇంత దోఖా చేస్తరా.? ఎక్కడో కాశ్మీర్ నుంచి బతికేటందుకు వచ్చినం. మాది పొట్టకొట్టొద్దు.” అంటూ పెద్దాయన బతిమాలుకుంటున్నాడు.  ఈ గొడవకు  పెద్దాయనతో ఉన్న పిల్లగాడు గట్టిగా ఏడుస్తున్నాడు.
ఇంతలో ఊరి పెద్ద మా నాయనకు సంగతి తెలిసి అక్కడకి వచ్చిండు.
జరిగిదంతా చెప్పి ఆ పెద్దాయన భోరుమన్నాడు.

మా నాయన అక్కడున్నవాళ్లని గద్దించాడు. “ఏదో పొట్టతిప్పలకోసం  దూరదేశం నుంచి వచ్చిన మనిషిని మోసం చేస్తారా..? మర్యాదగా డబ్బులు ఇచ్చారా సరే. లేదా పోలీసుల్ని పిలుస్తాను” అనడంతో జనం భయపడి డబ్బులిచ్చారు.
డబ్బులన్నీ లెక్క సరిపోయాక వాళ్లని మా ఇంటికి తీసుకొచ్చాడు నాయన.  అమ్మతో చెప్పి అన్నం పెట్టించాడు. “మీకేం భయం లేదు. మీరు ఎప్పడైనా ఇటువైపు వస్తే మా ఇంట్లోనే ఉండండి .” అని  భరోసా ఇచ్చాడు.
‘నా పేరు సులేమాన్’…నా కొడుకు పేరు ఫకీర్’ అంటూ వాళ్ల వివరాలు చెప్పాడు పెద్దాయన.
ఫకీర్ తల్లి …అతని చిన్న వయసులోనే చనిపోయిందట. అప్పటినుంచీ తనతోనే వ్యాపారానికి తీసుకొస్తున్నాడట.
మరి పిల్లవాన్ని చదివించరా అంటే…” ఎంత చదివినా ఏదో ఓ పని చేయాల్సిందే కదా సాబ్..అందుకే  వ్యాపారం ఎలా చేయాలో నేర్పుతున్నాను” అన్నాడు సులేమాన్.
ఫకీర్ దీ,  నాదీ ఒకటే ఈడు కావడంతో  మంచి జంటగాల్లమయ్యాం. ఫకీర్ మెల్లగా తెలుగు నేర్చుకున్నాడు. ఫకీర్ బడికి
పోకున్నా లెక్కలు బాగా చేసేవాడు. మా నాయన కూడా ఫకీర్ తెలివికి ఆశ్చర్యపోయేవాడు. ఫకీర్ ఒక్కో సారి నాతో స్కూలుకు వచ్చేవాడు.

మా స్కూల్లో అప్పుడు ఉర్దూ మీడియం  ఉండేది. ఫకీర్ ఉర్దూ రాత  చూసి పంతుళ్లు మెచ్చుకునే వారు. ముఖ్యంగా అతడు పాడే పాటలంటే మా సార్లకి చాలా ఇష్టం.

ఫకీర్ ఎప్పుడో ఓ సారి మా స్కూలుకు వస్తే  పిల్లలకు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం ఫకీర్ పాటలు వినిపించేందుకు పిల్లలందరినీ ఒకదగ్గర కూర్చోపెట్టేవారు. పాఠాలు వినే బాధ తప్పినందుకు పిల్లలు సంతోషించేవారు.
” దునియాకే ఏ ముసాఫిర్…..మంజిల్ తేరీ కబర్ హై….” ఫకీర్ గొంతెత్తి పాడితే పిల్లలంతా పక్షుల్లాగా ఆలకించేవారు. అర్ధం తెలీకున్నా పిల్లలంతా ఆ పాటలు పాడుకునే వారు.

పాట భావం తెలియకున్నా…ఏదో భావన ఆవహించేది. వొక మత్తులాగ. వొక మాయలాగా…

అతను నాకు ఉర్దూ నేర్పాడు. నాకంటే వేగంగా తెలుగు నేర్చుకున్నాడు.

బడిలోనే కాదు… బయట కూడా ఫకీర్ చాలా హుషారుగా ఉండేవాడు.

ఆదివారం వాగుల్లో ఈతలు కొట్టేవాళ్లం. చేపలు పట్టేవాళ్లం. నేను ఒక్క చేపను పట్టేందుకే నానా తంటాలు పడేవాన్ని. ఫకీర్ నీళ్లల్లో చేతులు పెడితే చాలు,  చేపలే పరిగెత్తుకొచ్చేవో …అతడే ఒడుపుగా పట్టుకునేవాడో కానీ చాలా చేపలు
పట్టేవాడు. కొన్ని చేపల్ని  అక్కడే కాల్చి తినేవాళ్లం. ఇంకొన్ని  ఇంటికి తెచ్చేవాళ్లం. అమ్మ వాటితో కమ్మగా పులుసు చేసేది.

Kadha-Saranga-2-300x268

నాయనకు నేనంటే ఎంత ఇష్టమో ఫకీర్ అన్నా అంతే ఇష్టం. అలా అతను  మా ఇంట్లో మనిషయ్యాడు. మా ఇంట్లోనే కాదు. ఊరు ఊరంతా ఫకీర్ మాయలో పడిపోయారు. ఊరందరికీ  ఫకీర్ చుట్టమే. ఇక పీర్ల పండగ వచ్చిదంటే చాలు. ఫకీర్ కు చెప్పలేని సంబరం.  పెద్ద పీరును ఎత్తుకుని.. “అస్సైదులా” అంటూ ఎగిరేవాడు. రాత్రిపూట నిప్పుల గుండంల ఉరికేటోడు.

ఫకీర్ మా దగ్గర ఉన్న నెల రోజులూ పండగలాగా ఉండేది.
తెచ్చిన సరుకు అంతా అమ్ముడు పోగానే వాళ్లు వాళ్ల ఊరు కాశ్మీరు వెళ్లిపోయేవాళ్లు.  ఫకీర్ పోతుంటే చెప్పలేని బాధ. తను మళ్లీ వచ్చేది సంవత్సరం తర్వాతే. ఆ సంవత్సరం మొత్తం అతని కోసం ఎదురుచూసే వాళ్లం.
ఏళ్లు గడిచాయి. చూస్తుండగానే మా జీవితాలు  మారిపోయాయి. ఫకీర్ వాళ్ల నాన్న సులేమాన్ కాలం చేశాక వ్యాపార బాధ్యతలు ఫకీర్ మీద పడ్డాయి.
పగలంతా వ్యాపారం… రాత్రికి ఇంటికి రావడం.  రాత్రి అయిందంటే చాలు… ఫకీర్ ఖవ్వాళి కోసం జనం మా ఇంటి ముందు కూచునే వాళ్లు.

అతను అమ్మే చద్దర్లు, శాలువాల్లాగనే అతని గొంతు కూడా మెత్తగా, కమ్మగా ఉండేది.
” దమాదమ్ మస్త్ కలందర్…దమాదమ్ మస్త్ కలందర్ ….” ఫకీర్ ఖవ్వాలికి జనం పూనకం వచ్చినట్లు ఊగిపోయేవారు.
ఫకీర్ నాకు ఉర్దూ  నేర్పాడు కదా. అతని పాటల్లోని భావాలు  నాకు బాగా అర్థమయ్యేవి.
” నాదేహం…నా సర్వం నీదే….ఓ దేవుడా,  ప్రియుడా నన్ను పవిత్రంగా ఉంచు……”

ఎంత గొప్ప భావన…!?
దేవున్ని ప్రేమిస్తున్నావా…? అవును,  ప్రతిక్షణం అతన్నే ప్రేమిస్తున్నాను.
సైతాన్ను ద్వేషిస్తున్నావా…లేదు,

నాకు అంత తీరిక లేదు…!

ప్రతీ గీతంలో అంతులేని తాత్విక భావనలు. అట్ల ఒక పాట తర్వాత ఇంకో పాట.
చుట్టూ కమ్ముకున్న చీకట్లను చీలుస్తూ అతని గీతాలు కొత్త వెలుగునిచ్చేవి.
తెల్లవారుతున్న సంగతి సైతం జనం మరిచిపోయేవాళ్లు.
గుడి గంటల సవ్వడిలో మేలుకొలుపు…నమాజ్ లోని గుండెతడి….చర్చి ప్రార్థనలో క్షమాగుణం… అన్నీ  ఫకీర్ గొంతులో వినిపించేవి.

ఫకీర్ రాముని గుడి దగ్గరా భజన చేసేవాడు.

” రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై…..రామ్ సబ్ మే హై”  ( రాముుడు అన్నింటా…ఉన్నాడు,
అణువణువూ రాముడే నిండి ఉన్నాడు. ) అంటూ పాడేవాడు. భక్తులతో కలిసి ఊగిపోయేవాడు.

అతని పాటకు మతం లేదు. ప్రేమ మాత్రమే ఉంది.
ఫకీర్ నీకీ పాటలన్నీ ఎవరు నేర్పారు..? అంటే

” ఇవన్నీ సూఫీ గీతాలు. భూమ్మీద ఎక్కడైనా రాత్రంటే చంద్రుడు, చుక్కల వెలుగులే. కానీ మా కాశ్మీరంలో రాత్రి ఖవ్వాలీ వెలుగులతో నిండిపోతుంది. మా కాశ్మీర్ లో ఉన్నది ఇస్లామే…కానీ అది సూఫీ. అది ఒక్క మతం కాదు. సర్వమత సారం.
మేము దేవుడిని పూజించం. ప్రేమిస్తాం.

అతని కోసం విరహ వేదనలో తపించిపోయే ప్రేమికుల్లా… పిచ్చిగా.

దేవుడు-నేను,  నేను-దేవుడు…ఇద్దరూ ఒక్కటై పోతాం.

అతడంటే భయం కాదు, ప్రేమ ఉండాలి. ఆరాధించాలి. అతనిలో లీనమై పోవాలి.”  ఫకీర్ చెప్పే మాటలు నాకు దేవున్ని మరింత చేరువ చేసేవి.

“ భాయ్….మతం ఐనా భక్తి ఐనా… భార్యభర్తల మధ్య గుట్టుగా జరిగే కాపురం లాగా ఉండాలి. భార్యతో చేసే కాపురం పదిమందికి  చెప్పుకోం కదా… అలాగే భక్తి కూడా,  దేవునికి మనకూ మధ్య రహస్యంగా ఉండాలి.” అనేవాడు.

ఫకీర్ మా ఊరు విడిచి వెళ్లినా మమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. అక్కడ కాసే
ఆపిల్ పళ్లను మాకు పంపేవాడు.  కాశ్మీర్ లో దొరికే ప్రత్యేకమైన క్రికెట్ బ్యాట్లు తెచ్చి పిల్లలకు క్రికెట్ నేర్పించాడు.

మా ఇంటిని వాళ్లనే కాదు ఊరంతటినీ తన కుటుంబం చేసుకున్నాడు ఫకీర్. మా కన్నా మిన్నగా మా ఊరిని ప్రేమించాడు. మా అందరికీ ప్రేమ అంటే ఏమిటో చూపించాడు. మా ఊరిలోని పిల్లా పాపలే కాదు…చెట్టూ -చేమ, రాయి-రప్పా అణువణువూ ఫకీర్ ని ప్రేమిస్తుంది.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి.
***
ఎప్పటిలాగే పోయిన ఏడాది కూడా ఓ రోజు మా ఊరు వచ్చాడు ఫకీర్. సరుకుతో కాదు. మాసిపోయిన గడ్డంతో. పిచ్చోడిలా ఉన్నాడు. వస్తూనే “ఐపోయింది. అంతా అయిపోయింది భాయ్” అంటూ భోరుమన్నాడు.
పోయినేడాది వ్యాపారం చేసుకుని అక్కడకి పోయేలోపు జరగరాని ఘోరం జరిగిపోయిందిట.
అక్కడ కాపలాగా ఉన్న వొక దళంలోని దుర్మార్గులు కొందరు… ఫకీర్ కూతురును దారుణంగా అత్యాచారం చేసి చంపారట. ఒక్కడు కాదు ఇద్దరు కాదు…పశువుల్లా పదిమంది పైనే…భార్య, చిన్న కొడుకును అందరి ముందే కాల్చిచంపారుట. తనతో పాటే వ్యాపారానికి వచ్చిన  పెద్ద కొడుకు మాత్రం బతికిపోయాడు.

సర్వం కోల్పోయిన ఫకీర్ ఎటు పోవాలో తోచక కొడుకుని తీసుకుని మా ఊరు వచ్చాడు.
తలచుకుంటేనే ఒళ్లు జలదరించే దారుణం.
పదేపదే ఆ దారుణం గుర్తుకు రావడంతో ఫకీర్ చాలా కాలం పాటూ కోలుకోలేక పోయాడు.
ఫకీర్ పరిస్థితే అలా ఉంటే  కొడుకు రియాజ్ సంగతి చెప్పేదేముంది. .?

తిండి లేదు…నీళ్లు లేవు. గంటలు గంటలు ఆకాశంలోకి చూస్తూ ఉండేవాళ్లు. ఫకీర్ కైతే పిచ్చోడికి మల్లే మరింత గడ్డం పెరిగింది. మా ఊరి చెరువు గట్ల దగ్గర ఒంటరిగా పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. మామూలు మనిషి కావడానికి చాలా కాలం పట్టింది.
చాలా రోజుల తర్వాత ఓ రోజు తన ఊరు వెళతానని అన్నాడు.

“ ఇంకా అక్కడ ఏముందని వెళతావు నీ కొడుకు రియాజ్  నువ్వు ఇక్కడే ఏదైనా వ్యాపారం పెట్టుకుని మాతో పాటే కలిసి ఉండమని ” బతిమాలాను.

సరేనన్న ఫకీర్ కాశ్మీర్ వెళ్లి సరుకు తెచ్చుకుంటానని వెళ్లాడు.
అలా నా మాట మీద గౌరవం తోనో…..మా ఊరి మీద ప్రేమ తోనో మొత్తానికి ఫకీర్ కొడుకుతో మా ఊరు వచ్చాడు. నాతో సహా ఊరంతా సంతోషించింది. ఇంతకాలం మా ఊరికి అతిథిగా వచ్చే ఫకీర్ ఇప్పుడు మా ఊరివాడయ్యాడు.
ఫకీర్ ను మా ఇంట్లోనే ఉండమని చెప్పినా ఒప్పుకోలేదు. వ్యాపారం చేసి కూడబెట్టిన డబ్బు నా చేతిలో పెట్టాడు. ఊళ్లోనే ఎక్కడన్నా ఓ చిన్న ఇల్లు చూసి పెట్టమని చెప్పాడు. తెచ్చిన సరకుతో ఫకీర్ ఒక ఊరు….కొడుకు రియాజ్ మరో ఊరు వెళ్లి చద్దర్లు అమ్మి సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవాళ్లు.
ఫకీర్ వచ్చి చాలారోజులైనా ఇంకా ఖవ్వాలీ పెట్టలేదని  ఊరి జనం అడుగుతున్నారు. రేపో మాపో వీలు చూసుకొని తప్పకుండా ఖవ్వాలీ పెడతానని హామీ ఇచ్చాను.
ఫకీర్ ఖవ్వాలీ కోసం జనమంతా ఎదురుచూస్తున్నారు.
***
‘ సాబ్ మీరే న్యాయం చెయ్యాల’  అనుకుంట ఇంట్లెకు వచ్చిండు పీర్ సాబ్.
‘ ఏమైంది పీర్ సాబ్. ఏం సంగతి..? ఎడ్ల వ్యాపారం ఎలా ఉంది..? ‘  అని అడిగిన.
” ఏం చెప్పమంటవ్ సాబ్. నిన్న మొన్న ఊళ్లే తిరిగి నాలుగు ఎడ్లు, రెండు ముసలి బర్లు కొన్న… కానీ వాటిని అమ్మకూడదు అంటూ  గొడవ చేస్తున్నరు. జర మీరె న్యాయం చెప్పాలే.”  బతిమాలిండు పీర్ సాబ్.
మాఊరిలో దూదేకులోళ్లు చాలా మంది ఉన్నరు.  వాళ్లు రైతుల దగ్గర వ్యవసాయానికి పనికిరానివో, ముసలివో ఎద్దులు, ఆవులు కొని పట్నంల అమ్ముతరు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతోంది  కాదు. వాళ్ల తాతల కాలం నుంచీ అదే పని చేస్తున్నరు.
‘ఆపింది ఎవరు.?’ అని అడిగిన.
ఇంకెవలు సాబ్ మీ కొడుకు వెంకట్… కొంతమంది పోరగాళ్లను తెచ్చి ” ఎద్దులు, ఆవులు ఇప్పటి నుంచి అమ్మొద్దు,కొనొద్దు. దూదేకులోళ్లని ఎద్దుల బేరం మానెయ్యమని బెదిరిస్తున్నడు. తాతల కాలం నుంచి ఇదే బతకు తెరువుగా బతుకుతున్నం. ఇప్పుడు ఒక్కసారిగా మానెయ్యమంటే ఎట్ట సాబ్.” ప్రాధేయపడుతున్నడు.

“ నేను మాట్లాడుత గనీ నువ్ పో ” అని పీర్ సాబ్ ను పంపిన.
నాకు ఒక్కడే కొడుకు. పట్నంల ఇంజనీరింగ్ చదువుతున్నడు. చదువు సంగతి
ఏమోగానీ రాజకీయాలు మాత్రం బాగా నేర్చుకున్నడు. దేవుని పేరుతోని
రాజకీయాలు….!
” ఏరా వెంకట్…దూదేకులోళ్లని పశువులు కొనొద్దని బెదిరించినవట నిజమేనా…?”  కోపంగా అడిగాను మా వాణ్ని.
“అవును నాయన. జంతువుల్ని చంపడం పాపం కద నాయిన.”
“ మరి మనం కోళ్లను, గొర్రెల్ని చంపితే పాపం కాదా. మనం చేస్తే పుణ్యం,వాళ్లు చేస్తే పాపమా…? వాళ్లు వాటిని కోపంతోనో, పగతోనో చంపడం లేదు. తినడం కోసం కోసుకుంటున్నరు.

జంతువులను చంపకూడదు  అన్న మీ వాదం గొప్పదే కానీ…జంతువును చంపకుండా బతికే స్థాయికి మనిషి ఇంకా ఎదగలేదు. ఒకలిద్దరు ఎదిగి ఉండొచ్చు. జనమంతా ఆ స్థాయికి చేరినప్పుడు ఒకడు నిషేధించాల్సిన
పనిలేదు. ఎవడికి వాడే మానేస్తాడు. నీ బలవంతం ఎందుకు…? ”

నా ప్రశ్నకు బదులు చెప్పలేదు. కోపంతో గబగబ అక్కన్నుంచి వెళ్లిపోయిండు.
***
chandram2“ మీ కాశ్మీర్ లో చాలా మందికి ఎందుకు మన దేశమంటే ప్రేమ లేదు.? ఎందుకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తారు. పబ్లిక్ గా పాకిస్తాన్ జండాలు పట్టుకుని ఊరేగుతారు” మా వాడు వెంకట్,  ఫకీర్ కొడుకు రియాజ్ తో వాదనకు దిగాడు.
నేను , ఫకీర్ ఆసక్తిగా గమనిస్తున్నాం.
” అందరూ ఒకలాగా ఉండరు కదా….ఒక్కో మనిషి ఒక్కోలాగా ఆలోచిస్తడు భాయ్.’
రియాజ్ బదులిచ్చిండు.
” మా సైన్యం లేకుంటే….మిమ్మల్లి పాకిస్తాన్ ఎప్పుడో ఆక్రమించేసి ఉండేది. కాదంటారా.?”
” అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు. పేపర్లో, టీవీల్లో వచ్చేదంతా నిజం కాదు.”
“ఏది నిజం కాదు. మా కాశ్మీరీ పండిట్లను బలవంతంగా తరిమేశారు. అది నిజం కాదా. వాళ్లు బిచ్చగాళ్లలా ఢిల్లీ వీధుల్లో ఇబ్బందులు పడేది నిజం కాదా. హిందువులు కాబట్టే కదా వాళ్లని తరిమేశారు”..ఆవేశంగా అడిగాడు మావాడు.
“ హిందువుల మీద మాకు ఎప్పుడూ కోపం లేదు భాయ్.  ప్రతీ సంవత్సరం వేలాది మంది హిందువులు అమర్ నాథ్ యాత్రకు వస్తున్నారు కదా. వాళ్లు మా నేలమీద అడుగు పెట్టిన దగ్గరనుంచీ డోలీల్లో  మోసుకెళ్లడం, గుర్రాలపైన తీసుకెళ్లడం, దేవుడ్ని దర్శనం చేయించడం … ప్రతీ పని ముస్లింలే చేస్తారు తెలుసా భయ్యా.? ”
“ మీ కోసం కోట్లు ఖర్చు చేసి సెక్యూరిటీ ఇస్తున్నాం. ఐనా మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు..? ”
“ సెక్యూరిటీ అంటే ఏది భయ్యా. మా ఆడవాళ్లను అందరి ముందే బలవంతం చేసి పాడు
చేయడం…యువకుల్ని పిట్టల్లా కాల్చేయడం… ఆఖరుకు స్కూలుకెళ్లే పిల్లల్ని కూడా  రాక్షసంగా…” మాట రాక భోరుమన్నాడు రియాజ్.
మావాడికి ఏం చెప్పాలో తోచక చూస్తూ ఉండిపోయాడు.
” రియాజ్ భేటా ఏమీ అనుకోకు. వాడికి నీ మీద కోపం లేదు. మా దగ్గర జనం అనుకునేదే నీతో అన్నాడు ” అంటూ రియాజ్ ను దగ్గరకు తీసుకున్నాను. ఆవేశంలో రియాజ్ ఏదో అన్నాడు కానీ…తర్వాత వాడు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. వెళ్లి పడుకోమని చెప్పాను.

నేను ఫకీర్ డాబాపైకి వచ్చాము.
” ఫకీర్ మావాడి మాటలకు బాధపడుతున్నావా..”
” లేదు భయ్యా. ఆ ప్రశ్నలు మీ వాడివే  కాదు. మిగతా దేశమంతా మమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలని తెలుసు. భయ్యా.., ఇప్పుడంటే కాశ్మీర్ పేరు చెపితే ఉగ్రవాదం….మతం అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు మాది ఈ దునియా మొత్తం మీద అత్యంత సుందర ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఓ సారి కాశ్మీర్ కు  వచ్చాడట. అందమైన పర్వతాలు…సరస్సులు, అంతకన్నా అందమైన మనుషుల్ని చూసి పులకించి పోయాడట. స్వర్గం అనేది ఉంటే అది కచ్చితంగా కాశ్మీరే  అన్నాడట.

ఒకప్పుడు హిందూ, ముసల్మాన్ రెండూ విడదీయలేనంతగా అల్లుకుపోయిన పోయిన సంస్కృతి మాది. కాశ్మీర్ లో ముస్లింలు-హిందువులే కాదు, బౌద్ధ మతస్తులు చాలామంది ఉన్నారు. సిక్కులూ ఉన్నారు. చాలా మందికి తెలీని సంగతి ఏమంటే యూదు మతస్తులు కూడా ఉన్నారు. అసలు మతమంటేనే తెలియని గిరిజనులూ ఉన్నారు. ఆకాశంలో ఇంధ్రధనస్సులా  అందంగా  మేమంతా కలిసిపోయాం.   అటువంటి మా  ప్రాంతం…. కొన్ని రాజకీయ సైతాన్ ల వల్ల  రావణకాష్టంగా మారింది.

మాతో సంబంధం లేకుండానే…మా ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ లేకుండానే మా నసీబ్ మార్చేశారు. మా జిందగీ  మా చేతుల్లో లేకుండా చేశారు. ”
” ఐతే ఫకీర్ దీనికి పరిష్కారం లేదంటావా…? ”
”  ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది భాయ్ సాబ్….”
” ఉంటే ఎందుకు పరిష్కారం కావడం లేదు…!!?”
”  భాయ్ సాబ్. నిజంగా నిద్రపోయే వాన్ని లేపొచ్చు. మెలకువతో ఉన్న వాన్ని లేపొచ్చు. కానీ నిద్ర నటించే వాన్ని ఎప్పటికీ నిద్రలేపలేం కదా…!?” విషాదం, వైరాగ్యం కలిసిన ఒకలాంటి నవ్వు నవ్వుతూ అన్నాడు ఫకీర్.
నాకర్థమైంది. అంతా అర్థమైంది.  ” నిద్ర నటించేవాన్ని లేపలేం కదా..?”
రాత్రంతా ఆ మాటలే చెవుల్లో వినిపిస్తున్నాయి. కళ్లు మూసినా తెరిచినా ఫకీర్ నవ్వే కనిపిస్తోంది.
***

నేను నిదుర లేవకముందే  ఫకీర్, రియాజ్ చద్దర్లు అమ్మేటందుకు పోయిన్రు.
పేపర్ చదువుతుంటే సెల్ ఫోన్ మోగింది. ” భయ్యా…ఎక్కడున్నావ్. అర్జంటుగా పోలీస్ స్టేషన్ కొస్తావా..”  గాభారాగా అడిగాడు ఫకీర్.
” ఏమైంది భాయ్…” కంగారుగా అడిగాను. ” రియాజ్, రియాజ్ ను పోలీసులు పట్టుకున్నరు.” ఫోన్ లో చెప్పలేక పోతున్నాడు ఫకీరు.  సరే నేను వెంటనే వస్తున్నా అని చెప్పి బండి తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లాను.
ఫకీర్ నాకు పరిచయమై ముప్పై ఏళ్లపైనే అయింది. కానీ ఎప్పుడు పోలీసు స్టేషన్ తో పని పడలేదు. ఏమై ఉంటుంది..? బహుశా లైసన్స్  లేదని పోలీసులు పట్టుకుని ఉంటారా..? ఆలోచల్లోనే స్టేషన్ దగ్గరకు చేరుకున్నాను.

అక్కడంతా గుంపులు గుంపులుగా జనం. ఐదారు ఛానళ్ల రిపోర్టర్లు కెమెరాల ముందు ఏదో చెబుతున్నారు. గబగబా లోపలకి వెళ్లాను.

అక్కడ దూరంగా ఫకీర్ చేతులు కట్టుకుని దీనంగా నిలబడి ఉన్నాడు.  నన్ను చూడగానే ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా కావలించుకుని “భాయ్ “అని ఏడ్చిండు.
‘వీళ్లు మీకు తెలుసా సాబ్”  ఎస్సై ఆశ్చర్యంగా అడిగిండు. చాలా కాలం నుంచి పరిచయమేనని చెప్పిన.
” ఈ ఏరియాల టెర్రరిస్టులు తిరుగుతున్నరని మాకు ఇంటలిజెన్స్ రిపోర్టు ఉంది. అందుకే  నిఘా పెట్టినం. ఈ కుర్రాడు అనుమానస్పదంగా తిరుగుతుంటే ఎవరో కంప్లైట్ చేసిన్రు. కాశ్మీర్ అంటున్నాడు.  అందుకే అనుమానం వచ్చి అరెస్టు
చేసినమన్నా”డు ఎస్సై.
లోకల్ ఎమ్మెల్యే తోని ఫోన్ చేయించి మొత్తానికి ఫకీర్ ను, రియాజ్ ను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటరాగేషన్ల దెబ్బలు బాగా కొట్టినట్టున్నారు..
రియాజ్ నడవలేక పోతున్నాడు.
కొడుకు వంటిమీద దెబ్బలు చూసి….ఇంటికొచ్చిన తర్వాత కూడా ఫకీర్ ఏడుస్తనే ఉన్నడు. రాత్రికి పెట్టాలనుకున్న ఖవ్వాలీ కూడా జరగలేదు.
” భాయ్.. ” మెల్లగా పిలిచాడు ఫకీర్.

ఎన్నడూ లేనిది ఫకీర్ కళ్లల్లో మొదటిసారి భయం చూశాను.
” భాయ్ నేను కాశ్మీర్  వెళ్లిపోతాను”  అన్నడు.

”  అదేంది భాయ్..ఇపుడేమైందని.నేను చూసుకుంటాను. కదా…?’
” . మేం ఇక్కడ ఉండలేము భాయ్. తెల్లవారక ముందే బస్ లో హైదరాబాద్ వెళ్లిపోతాము ”  కరాఖండిగా చెప్పాడు ఫకీర్.
***

టైం తెల్లవారు ఝాము నాలుగవుతోంది. ఫకీర్ గబగబ కొడుకుని లేపాడు. నేను ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి చేతిలో పెట్టాను. ‘వద్దు భాయ్. ఛార్జీలకు మాత్రం చాలు’ అని ఓ రెండు నోట్లు తీసుకుని మిగిలిన డబ్బు మళ్లీ నా చేతుల్లోనే పెట్టాడు.

ఆ చీకట్లోనే కిలోమీటర్ దూరంలో ఉన్న బస్టాపు దాకా నడిచి వచ్చాం.
” ఫకీర్ భాయ్ ఇంకో సారి ఆలోచించు.  పోక తప్పదా”  అన్నాను.
”  లేదు భాయ్….ఇక్కడ జరిగిన దానికి భయపడి పోవడం లేదు. మేం గొడవల్లోనే పుట్టాం. గొడవల్లోనే పెరిగాం. అక్కడ బతికే దారిలేక ఇలా దేశాలు తిరుగుతూ బతుకుతాం. అక్కడ మాకు అందమైన ప్రకృతి ఉంది. కానీ ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. మీ ఊరు నాకెందుకు ఇష్టమో తెలుసా.  మీ ఊరు మొదటిసారి వచ్చినప్పుడు వింతగా చూశాను. ఎందుకంటే ఇక్కడ మతం లేదు. పీర్ల పండగను అందరం కలిసి చేసుకున్నం. రాముని పండగకు భజనలు చేసినం. క్రిస్మస్ కు ప్రార్థనలు చేసినం. కులం, మతం అన్నీ మర్చిపోయి…. ఖాళీ మనుషుల్లాగా బతికినం.  అందుకే మీ ఊరు నా ఊరు కన్నా బాగా నచ్చింది.  కానీ ఇప్పుడు ఈ ఊరుకు మతం సైతాన్ పట్టింది.

మతం పేరు చెప్పి చేసే రాజకీయం సైతాన్ లాంటిది భాయి. ఒకసారి పట్టిందంటే చంపేదాకా వదలదు. మతం-రాజకీయం కలిసి చేసే మారణహోమం ఎంత విధ్వంసంగా ఉంటుందో మేం కళ్లారా చూశాం. అది ఇప్పుడు మీదాకా
పాకింది. జాగ్రత్త భాయ్. ”
ఫకీర్ మాటలు నాకు మా ఊరిని కొత్తగా చూపిస్తున్నయి. ఇంతకాలం ఈ ఊరిలోనే ఉంటూ నేను గ్రహించని నిజం అతను రెండు రోజుల్లోనే గ్రహించాడు.
బస్సు వచ్చింది. ఫకీర్, రియాజ్ ఎక్కారు. బస్సు దుమ్ము లేపుకుంటూ కదిలిపోయింది.

మెల్లగా మా ఊరి వైపు నడిచాను.
“ఊరు మారిపోయింది భాయ్. మతం పిశాచి ఆవహిస్తోంది…..జాగ్రత్త భాయ్..”అంటూ
ఫకీర్ చేసిన హెచ్చరిక మళ్లీ మళ్లీ గుర్తుకువస్తోంది.
జాతరలో మత ప్రచారాలు…
పిల్లలచేత మత గ్రంథాలు బట్టీ పట్టించడం…
మేం చెప్పిందే తినాలని భయపెట్టడం…
పరాయి మతస్తుడైన ఫకీర్ కొడుకును ఉగ్రవాదిగా అనుమానించడం…
ఇవన్నీ ఊరికే జరిగినవి కావని ఫకీర్ చెప్పాక అర్థమవుతోంది.
పూర్తిగా తెల్లవార వచ్చింది.
దూరంగా కొండల మధ్యనుంచి రకరకాల వర్ణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ రంగులు
పూసుకున్న భూతాల్లా పైకి లేస్తున్నాయి.

రక్తం లాంటి వర్ణం ఆకాశమంతటా పరచుకుంది.

ఎప్పడూ అందంగా కనిపించే ఆ పొద్దు ఇవాళ ఎందుకో వికృతంగా కనిపిస్తోంది. అప్పటి వరకూ ప్రశాంతంగా మా ఊరిలాగే ఉన్న ఆకాశాన్ని….ఆ రంగు భూతం అల్లకల్లోలం చేసింది. భయంకర బ్రహ్మ రాక్షసి చేసుకున్న రక్తపు వాంతిలాగా ఉంది ఆ రంగు. లోకమంతటినీ కబళిస్తూ…రాకాసిలా చీలికల నాలుకలు చాచుకొంటూ వస్తోంది.

విధ్వంసం…వర్ణ విధ్వంసం, ఆవాహనం వర్ణవాహనం……

మొదటి సారిగా ఆ వర్ణాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టింది.  ఆ రంగు ఇప్పుడు మా ఊరివైపు వెళుతోంది.

ఆ రంగుల సైతాన్  నుంచి మా ఊరిని కాపాడుకోవాలి.

పరిగెత్తుతున్నాను…..పరిగెత్తుతున్నాను.

 

*

మీ మాటలు

 1. చాలా బాగా వచ్చింది కథ … మార్కెట్ , మతం రెండు గ్రామ భారతాన్ని చుట్టుముట్టాయి

 2. నరహరి says:

  కథలో పరిపూర్ణత లోపించింది. వర్ణ పిశాచంతోబాటు ఇంకా గ్రామీణ భారతాన్ని పశ్చిమాన్నుండి వచ్చిన ఆకుపచ్చ పిశాచం, తెల్ల పిశాచం కూడా పీడిస్తున్నాయి. నీలి పిల్ల పిశాచం అండదండలతో పశ్చిమాన్నుంచి వచ్చిన ఆ ఆకుపచ్చ పిశాచం, కన్వర్షన్ తెల్ల పిశాచాలు కూడా గ్రామీణ భారతాన్ని చుట్టుముట్టడం బహుశా వర్ణాంధత్వంతో వున్న ఏకపక్ష పిశాచాలకు కనిపించలేదేమో!

  • చందు తులసి says:

   మీ స్పందనకు ధన్యవాదాలు నరహరి గారు.
   మీరన్నది నిజం. జనానికి నష్టం చేసేదేదైనా పిశాచమే. అన్ని పిశాచాల పీడ వదిలిపోవాల్సిందే.

 3. చాలా బాగుంది.
  మత పిశాచం చాప కింద నీరులా సమాజమంతటా ఎలా విస్తరిస్తోందో అద్భుతంగా చిత్రించారు.
  అతిపెద్ద సమస్యను కొండను అద్దంలో చూపించినంత అలవోకగా, సమగ్రంగా విశ్లేషించారు.
  అభినందనలు.
  ‘రంగు రెక్కల వర్ణ పిశాచం’ అన్న టైటిల్ మాత్రం కొంత కఠినంగా వుందనిపించింది.

  • చందు తులసి says:

   థాంక్యూ సార్ మీ స్పందనకు ధన్యవాదాలు.
   కథ పేరు గురించి చాలానే ఆలోచించాను సార్.
   మీరన్నది నిజమే.

 4. మనుషులంతా ఒక తెల్లని వెలుగు రాసిగా సమూహంగా , అంతర్లీనంగా ఉన్న సప్తవర్ణాలనే దైవ ,మతపరమైన నమ్మకాలను ప్రక్కనపెట్టి హాయిగా జీవిస్తున్న ప్రజల జీవితాల్లొ మత రాజకీయాలు ,మత మార్పిడులు అతి ప్రమాదకరంగా తయారయి జీవితాలను చిత్రవద చెస్తున్నాయి .
  ఇప్పటి పరిస్తితిని కండ్లకు కడితూంది ఈ
  కథనం .

 5. చందు తులసి గారూ! మళ్ళీ ఒక మంచి కథ ను అందించారు. …మతం‌,దేవుడూ అంటే భయం,భక్తి కాదు ప్రేమ ఉండాలి … బాగ నచ్చింది.

  • చందు తులసి says:

   జెజ్జాల గారూ కథ నచ్చినందుకూ స్పందించినందుకూ థాంక్యూ

 6. చదివాను

 7. జ్వలిత says:

  వర్ఱ పిశాచం కథ నేటిశ పరిస్థతులకు అద్దంపట్టింది.
  మనిషి ప్రేమించడం మరిచి పోయి ద్వేషించడానికి కారణాఆలను వెతుక్కుంటున్నాడు. మతం, కులం, రాజకీయం ఇవన్నీ స్వార్దం కప్పుకున్న ముసుగులు.

 8. మన్నె ఏలియా says:

  చందు ! కథ చాల బాగుంది. ప్రస్తుతం మతం పేరిట జరుగుతున్న హింసను అద్బుతంగా కథగా మలచడం లో సఫలిక్రుతులయ్యారు. గ్రామాలలో మతం కులం అనే తేడా ఉండేదికాదు . అందరు వరుసలు పెట్టి పిల్చుకునేవారు .ఇప్పటికి చాల ఊర్లల్లో బందువుల్లగానే పలకరించుకుంటారు.
  ఈ మధ్యా విషసంస్కృతి పడగ విప్పుతుంది .మతం మనుషుల్ని కల్పడానికే గాని విడదీయడానికి కాదన్న సత్యం అందరం గ్రహించాలి . దీనివల్ల ఎవరికీ శాంతి వుండదు .సౌఖ్యం వుండదు .ఎంతకాలం మతం పేరిటా కులం పేరిటా తన్నుకు చావడం .ది పర్పస్ అఫ్ ది లైఫ్ ఈజ్ సీకింగ్ హప్పినెస్స్.
  ఎన్నున్నా శాంతి సమాదానం లేకపోతె ఆ జీవితానికి అర్థమేమిలేదు . మనిషి కి విచక్షణ నశించిననాడు విద్వంశమే రాజ్యమేలుతుంది . మానవత్వం వర్దిల్లాలి . హిందూ దేశ్ కే నివాసి సబి జన్ ఏక్ హై.

  • చందు తులసి says:

   అవును సోదరా..మానవత్వం వర్ధిల్లాలి.
   స్పందనకు థాంక్యూ

 9. కధ చాలా బాగుందండి !
  చుట్టూ జరుగుతున్న మార్పులని గమనించి, వాటి పుట్టుకని, నిర్దేశాన్ని, లక్ష్యాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం అందరిదీ !

  • చందు తులసి says:

   అవును మేడమ్ ..మార్పుకు మూలమెక్కడుందో తెలుసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది. స్పందనకు ధన్యవాదాలు.

 10. బాగుంది , మనుషుల బాధలని రాశారు , మూల కారణాలు వదిలేశారేమో అని అనిపిస్తుంది .

  • చందు తులసి says:

   థాంక్యూ వెంకీ గారు. నా అవగాహన మేరకు ప్రయత్నించాను సార్.

 11. చందు తులసి గారు,
  దేశాన్ని ఆవహించి న వర్ణ పిశాచాన్ని బాగా వర్ణించారు.
  వచ్చన వస్తున్న మార్పులను బాగానే ఎత్తి చూపారు. జనరేషన్ లొ విషపు నీడలు నింపు కొని మత రాజ కీయం ఆవహించిన యువత పోకడ… అన్నీ బాగానే ఉన్నాయి.
  అభినందనలు.

  • చందు తులసి says:

   తిరుపాలు గారూ. మీ అభిమానానికి ధన్యవాదాలు సార్. నా కథలు చదివి వివరంగా స్పందిస్తున్న మీకు ధన్యవాదాలు

 12. ప్రగతి says:

  చాలా మంచి కథ. గ్రామ సీమల్లో ప్రశాంతతను పాడు చేస్తున్న మత పిశాచం గురించి బాగా చెప్పారు.

 13. “ఆ రంగుల సైతాన్ నుంచి మా ఊరిని కాపాడుకోవాలి.”

  తప్పకుండా కాపాడుకోవాలని – మీ ఊరినే కాదు – ఎక్కడ ఆ రంగుల సైతాన్ ఉంటే – అక్కడ కాపాడుకోవాలి.

  మీ కథ చాలా బావుంది.

  • చందు తులసి says:

   అవును లలిత గారూ…. ఏ ఊరైనా సైతాన్ బారినుండి కాపాడాల్సిందే.
   మీ స్పందనకు ధన్యవాదాలు

 14. గుడ్ స్టోరీ.ఇలాంటివి రాయడానికి మంచి విజన్ ఎక్సపోజర్ ఉండాలి , అవి పుష్కలంగా ఉన్నవాడు చందు.ఒక ఇంటర్నేషనల్ స్థాయి రచయిత ఓపెన్ నెస్ ఈ కథలో ఉంది. కామెంట్స్ డిఫెరెంట్ గా వస్తాయి.సబ్జెక్టు యే అలాంటిది. ఇదో అక్షర యుద్ధం. ముసుగు లేకుండా మానవతా పక్షం నిలవాలి. చందు ఐ అప్రిసియేట్ యువర్ డేర్ నెస్ ..సాగిపో ..

  • చందు తులసి says:

   నర్సన్ సార్…… మీ స్పందనకు, ప్రోత్సాహానికి థాంక్యూ సర్.

మీ మాటలు

*