డేవిడ్‌

art: satya sufi

art: satya sufi

ఒం‌టె చర్మం మొద్దుగా ఉంటది. దానిలోకి సూది దింపి దారాలతో పూలు కుట్టిన, ఎంబోజింగ్‌ ‌పనితనంతో ఉన్న పర్సులని చూత్తా బజారులు తిరుగుతున్నా. హంపీకి యాత్రికురాలిగా రావటం మొదలుపెట్టి ఇరవై ఏళ్లవుతుంది. ఇదేంటి అంటే అంతకు ముందు నా ఊరు ఇదే. ఉద్యోగం బాధ్యతలతో సొంత ఊరికి యాత్రికురాలిని అయిపోయా. ఇంకొక్క రోజులో ముప్పై తొమ్మిదేళ్లు నిండి నలభైలోకి అడుగుపెడతా. ఊరి పొలిమేరల బంధం చాలా గొప్పది .నలభైలు అంటే నాకు మామూలుగానే ఉంది. చెంపల సందుల్లో నించీ దొంగ చూపుల తెల్లవెంట్రుకలు, కొద్దిగా ముందుకొస్తున్న బెల్లీ అన్నీ కలిపి ‘ఏజ్‌ ‌గీవ్స్ ‌గ్రేస్‌’ అన్నట్టుగా ఉంది.

‘వర్కవుట్స్ ‌చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మొదలుపెడితే ఇంకా ఇరవై ఏళ్లు యాక్టివ్‌గా ఉంటావు’ 21 సం.ల కొడుకు సలహా.
‘నేను ఇరవై ఒకటి కాదు ముప్పై తొమ్మిది. నాకేం లో వేస్ట్ ‌జీన్స్‌లు వేసుకుని తిరగాలని లేదు’.

‘మా నువ్వు మారిషస్‌ ‌వెళ్లినపుడు ‘స్పెగెట్టీ’ టాప్‌తో ఉన్న ఫొటో సెల్‌ఫోన్‌కి స్క్రీన్‌ ‌మీద పెట్టాను. మా లెక్చరర్‌ ఎవరు నీ గాల్‌‌ఫ్రెండా, చాలా బాగుంది, ఇట్లా పెట్టుకు తిరగాల్సిన అవసరం ఉందా’ అని క్లాస్‌ ‌పీకాడు.
‘నన్ను ఈ భూమి మీదకి తెచ్చిన గాళ్‌, ‌మా అమ్మ ‘వన్‌ ఇన్‌ ‌మిలియన్‌’ అన్నాను

నేను నవ్వుకుంటా వాడి మాటల్ని మురిపెంగా వింటా, వీడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు అనుకుంటా. బ్యాగుల్ని చూస్తన్నా. కొన్ని లేత రంగులు, ముదురు రంగులు కావాలంటే ఆవనూనెతో రుద్ది రంగు మార్చి ఇస్తన్నారు. ఒక గవ్వల యాంక్లెట్‌ (‌కాలి పట్టీలాంటిది) కొని నా కాలికి తొడిగాడు.

‘మా నువ్వు చాలా బాగుంటావు, ముప్పై ఏళ్లా అన్నట్టుగా, నా ఫ్రెండ్స్ అం‌తా మీ అక్కా అని అడుగుతారు. ఒకసారి నా ఫ్రెండ్‌ ‌పుట్టినరోజుకి ఐవరీ అండ్‌ ‌గ్రే కలర్‌ ‌పట్టుచీర కట్టుకుంటే, విప్పి వేరే చీర కట్టుకునే వరకూ ఏడ్చాను. గుర్తుందా అందులో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం నీలాంటి అమ్మాయి నాకు తోడు దొరకాలి’.

ఎందుకో వాడ్ని చూశాను, కొత్తగా ఉన్నాడు, కళ్లల్లో ఏదో కాంతి, నా రక్తం కదా, రూపం నాదే, నేను పంచిన మాంసం, మొత్తం మీద నా ఎక్స్‌టెన్షన్‌. ఈరోజు వాడి కళ్లు ఏదో మెరుపుని మోస్తా ఉన్నట్టుగా,… పరిశీలించటం ఆపి…
ఏంటి ఇవ్వాళ ఓ.. అని పొగుడుతున్నావు.. నీ మీద నాకేదో అనుమానం, కొత్తగా నీకు అమ్మ కనపడిందంటే.. ఈ అబ్బాయిలందరూ అమ్మలని కావాలనుకోవటం మానేసి ,అమ్మాయిలని, పెళ్లాలని కోరుకోవాలి, ఒక పాత్రతోనే తృప్తిపడాలి. ఇవ్వాళ, రేపు అమ్మాయిలు అన్ని పాత్రలూ పోషిస్తా కాలం వేస్ట్ ‌చేసుకోరు.

Kadha-Saranga-2-300x268
ఏదో దొరికి పోయినట్టుగా మొఖం పెట్టి..
‘నీకొకటి చెప్పాలి. నువ్వు నో చెప్పవని ఒకడుగు ముందుకి వేశాను. నీ పుట్టిన రోజుకి చిన్న సర్‌‌ప్రైజ్‌. ‌నా బ్యాచ్‌మేట్‌ ఐరిష్‌ అమ్మాయి తన పేరు ‘వీనస్‌’ ‌తనని పిలిచాను. తను నాకు క్లోజ్‌. ‌ముందే చెబుదాం అని అనుకున్నాను. కానీ…’
దగ్గరగా జరిగి వాడి బుగ్గమీద ముద్దు పెట్టుకున్నా. నా ఎనక నించీ ఎవరినో రమ్మని చేతులు ఊపాడు. ఎదురుగా ఉండే కొట్టులో టిబెటియన్‌ ‌మ్యాజిక్‌ ‌బౌల్‌ని కర్రతో తిప్పతా సంగీతం వినేదల్లా వదిలేసి వచ్చింది.

‘వీనస్‌’ అన్నాడు.
నవ్వుతా ‘హౌ ఆర్‌ ‌యు’ అన్నా.
రెండు చేతులూ ఎత్తి ‘నమామాస్తే ఆంటీ’ అంది.

ఆ అమ్మాయిని చూస్తే వీడికన్నా రెండంగుళాల ఎత్తు, రాజస్థానీ  కుచ్చుల లంగా, పైన పొడుగు చేతుల పొట్టి టాప్‌, అడ్డంగా యాలాడే బ్యాగ్‌, ‌మెడని పట్టి జారుతున్న రంగుపూసల దండ, పైకి క్లిప్‌ ‌చేసిన రాగి జుట్టు, నవ్వినప్పుడు అందంగా షైన్ అవుతున్న ఐవరీ కలర్‌ ‌పళ్లు, పిల్లి కళ్లు, భలే క్యాచీ లుక్స్, ‌మొత్తానికి చాలా క్యూట్‌ అనుకున్నా.

‘ఈ తెల్లది నీకెక్కడ దొరికిందిరా’
‘మా ప్లీజ్‌ ‌తనకి తెలుగు వచ్చు.. ముందు బ్యాగులు చూడు’

రకరకాల బ్యాగులు, ట్యాజిల్స్ ‌హ్యాంగ్‌ ‌చేసి సెల్ఫ్ ‌ప్రెస్‌డ్‌, ‌హ్యాండ్‌ ఎం‌బ్రాయిడరీ, కచ్‌ ‌వర్క్, అద్దాలవీ, గవ్వలవీ, పూసలు, ఏది ఏరుకోవాలో తెలియట్లా. చూస్తా చూస్తా ఒక మూల ఆగిపోయాను. అదేనా.. ఇది అదేనా.. ఆ వస్తువు అక్కడ, ఇన్ని సంవత్సరాల తరవాత చూసినా చటుక్కున గుర్తుపట్టాను. కాదు.. లేదు.. ఒంటిని విడివిడిగా నరికి పేళ్లుగా చీల్చినా, ప్రతిభాగం దాన్ని గుర్తు పట్టుద్ది. నాలో సన్నని వణుకు. ఇది తను మాత్రమే చెయ్యకలదు. అతని చేతిలో తోలు కొబ్బరాకులాగా, తడిపిన నారలాగా, కుప్పలో నించీ తీసిన జమ్ములాగా మారుద్ది. ఆ విషయం నాకు బాగా తెలుసు. నా ప్రమేయం లేకుండా చేతులు అపురూపంగా తడుముతున్నయ్యి. దాన్ని నా ఒళ్లోకి తీసుకున్నా. ప్రపంచంలోనే చాలా అరుదైన తక్కువగా చేసే ఒక రకమైన తోలు పనితనం. అది తెలిసిన కొద్దిమందిలో అతనూ ఒకడు. ఆ వస్తువు బుల్లెట్‌ ‌సీటు కవర్‌. ‌రేటు లక్షా యాభై వేలు అని ఉంది.

ప్రతి రెండు సంవత్సరాలకీ ఒకసారి ఐదు తెస్తాడు. గోవా కస్టమర్లు మూడు కొనుక్కుని వెళతారు. ఒకటి ఇక్కడ రాజకీయ నాయకుడి కొడుకు కొంటాడు. ఒక్కటే మిగిలింది. కావాలంటే లక్షా ఇరవైకి ఇచ్చేస్తా అని షాపతను చెప్పుకు పోతా ఉన్నాడు.
‘డేవిడ్‌ ఇక్కడికి ఎపుడొచ్చాడు’ అని బలవంతాన అడిగాను.

‘ఓ.. మీకు తెలుసా.. సంవత్సరంన్నర పైనే అయి ఉండొచ్చు. మీకెలా పరిచయం, చాలా పేరున్న కుటుంబం అంట. మౌన ఋషిలాగ ఉంటాడు. ఇక్కడికి గాల్‌ ‌ఫ్రెండ్స్‌తో గానీ, దారిలో పరిచయం అయిన టూరిస్టులనయినా తెచ్చుకుంటారు, కానీ తను మాత్రం ఒక్కడుగా వస్తాడు. ఇక్కడ ప్రతి రాయీ, ప్రతి శిల్పం, ప్రతి శిధిలం, ప్రతి గోపురం నా ప్రియురాలే, తుళ్లిపడే తుంగభద్ర పరవళ్లలో, నేను చూసే ప్రతి జంట ఆనందంలో, ఈ హంపీ మొత్తం తనే, ఇక్కడ పాదం పెడితే తనతో కలసి ఉన్నట్టే… అందుకే క్రమం తప్పకుండా వస్తాను అంటాడు.

అక్కడ ఉన్న కుర్చీలో ఇడిచిన బట్టల కుప్పలా కూలపడ్డా. చాలా నీరసంగా అనిపించి నీళ్లు కావాలని అడిగా.
‘మా .. అమ్మా.. ఏంటి ఇట్టా అయిపోయావు. పొద్దున్నించీ ఏమన్నా తిన్నావా.. వీనూ.. గెట్‌మి ఒన్‌ ‌టెండర్‌ ‌కోకోనట్‌, ‌యాపిల్‌ ‌పై.. గెటిట్‌ ‌ఫ్రం ద బేకరీ.. ఫాస్ట్…’

‘‌వద్దు నాన్నా ఆకలి లేదు’.
‘కొంచెం తిను, మాట్లాడకు, అని మొత్తం తినిపిచ్చి, లేత కొబ్బరి నీళ్లు తాగినాక తేరుకున్నా’.
ఇంత జరిగినా ఆ లెదర్‌ ‌కవర్‌ని మాత్రం చేతిలోనే గాజుబొమ్మని పట్టినంత భద్రంగా పట్టుకున్నా.
‘రామ్మా.. ఎలదాం.. రేపు కొనుక్కుందాం’ అని లేపాడు.
‘డేవిడ్‌ ‌వస్తే మీ రిఫరెన్స్ ఏమయినా చెబితే గుర్తు పడతాడా’ కొట్టతను.
‘థాంక్స్.. ‌నథింగ్‌’ అని బలవంతాన సీటుకవరు వదిలి బయటకొచ్చాను.

‘అక్కా చెల్లెళ్లు గుండు (అదొక ప్రదేశం) దగ్గరకి తీసుకెళ్లు నాన్నా’
‘వాడూ, ఆ అమ్మాయి మొకమొకాలు చూసుకుని అక్కడికి తీసుకెళ్లారు. గుట్టెక్కి రాతికాళ్ల మంటపం దాటి, గుండుని గుర్తుపట్టి నిలబడ్డా. దాన్ని ఆనుకుని  ఒరిగినట్టుగా రహస్యంగా ఉండే గుర్రం మొకం బండ. ముందుకి వంగి బండమీద పడుకున్నట్టుగా చూస్తేగాని అక్కడ ఏం ఉందో కనపడదు.

— — —
స్వేచ్ఛగా పరచుకుని విప్పారిన టేకుపూత రంగుకి, కుంకపు రంగు అంచులంగా దానిమీద కుంకపు రంగు జాకెట్టు, తలంటుకుని నీటి చుక్కల కారతన్న రొండు జడలు శనివారం స్కూలు డ్రస్సు ఉండదు. కిలోమీటరు దూరం ఉండే బడికి, అల్యూమినియం పుస్తకాల పెట్టెతో నడుస్తున్నాను. అసలే ఆలస్యం, ఛీ.. ఛీ.. బడినించీ వచ్చినాక తలంటొచ్చు కదా. ఈ అమ్మమ్మ ఒకటి. టింగూ, టింగూ అని రొప్పుకుంటా గెట్టు (గట్లు)కి అడ్డంపడి బడి దారి పట్టాను.

‘హలోవ్‌.. ‌బేబీ వేరీజ్‌ ‌తుంగభద్రా రిసార్టస్..’
‘‌తలెత్తి చూస్తే ఒక విదేశీ కుటుంబం, భార్య, భర్త, ఇద్దరు మొగ పిల్లలు. ఈళ్లు అడిగిన అడ్రస్సు చేతితో చూపిచ్చి బై చెప్పా. సాయంత్రం బడినించీ వచ్చేటప్పటికి మామిడి చెట్టు కింద ఉన్న రెండు హట్స్‌లో వాళ్లు దిగారు. ఒక దాంట్లో ఆ జంట, రొండో దాంట్లో పిల్లలు. వాళ్లు బ్రిటిషు వాళ్లని రెండు నెలలుంటారని తెలిసింది.

స్నానం అయినాక పొద్దున ఆదరాబాదరా ఏసిన జడలు ఇప్పి చిక్కుతీసి ఒక జడ ఏసి మల్లెపూలు మరవం దండ తలలోకి ఎక్కిచ్చి, చేతిని జున్ను గిన్నె ఇచ్చింది అమ్మమ్మ. మామిడి కొమ్మకి కట్టిన ఉయ్యాలలో ఊగుతా జున్ను లాగిస్తున్నా. కాసేపటికి గుడిసెలో నించీ కొట్టుకుంటా అన్నదమ్ములు బయటకొచ్చారు. అన్న వాళ్ల తమ్ముడితో..

‘పగలంతా నీతో ఆడలేను. ఈత కొట్టు, కోళ్లు, గేదెల్ని కాస్తా ఆడుకో, రాళ్లెక్కు.. ఇంకా.. ఇదిగో ఈ పిల్లని పరిచయం చేస్తాను ఇద్దరూ ఆడుకోండి.
హాయ్‌ ‌వీడు నా  చిన్న తమ్ముడు. సెలవలకి ఇండియా వచ్చాం. ఇక్కడ బాగుంది. మీరు వీడితో ఆడుకోవచ్చు. మంచివాడు. సారీ అన్నీ నేనే చెబుతున్నాను. మీ పేరు’
‘సిరి’
‘వాటార్యూ’
‘సిక్స్ ‌గ్రేడ్‌’
‘‌వెల్‌కమ్‌ ‌టు టీన్స్, ‌సెక్సీ వెల్‌కమ్‌, ‌సాయంత్రాలు, శని, ఆదివారాలు కలసి ఆడుకోండి. మీరు చాలా షేర్‌ ‌చేసుకోవచ్చు. కాళీ ఉంటే నేను కూడా జాయిన్‌ అవుతా. నాకు వేరే పనులు ఉన్నయి. బై.

‘తను నాకన్నా చిన్నది. నీకేం పనులు, అద్దెబుల్లెట్‌ ‌మీద ఎవరో ఒక అమ్మాయితో తిరగటమా’.
‘కాదు, అయినా ఆ విషయాలు నీకు అనవసరం’ అని కదిలాడు.
పరుగెత్తుతా వాళ్ల అన్న ఎనకాల పడ్డాడు. నన్ను ఏదో చేత్తాడు అనుకుని పిల్లల కోడి మీదపడి పీకబోయింది. దెబ్బతో వచ్చి నా ఎనకాల చేరాడు. నవ్వుకుంటా.

‘తింటావా’
‘ఏంటది’
‘కంట్రీ ఛీజ్‌’
‌మాట్లాడుకుంటా కోళ్లమ్మటపడి, కోళ్లని కప్పెట్టి, గూటికి నాపరాయి అడ్డంపెట్టి, చేతులు కడుక్కునేటప్పటికి, చీకటి పడింది. చదువూ, రాతా లేదా అని అమ్మమ్మ కేకలు.
‘రేపు బడి అయినాక నాలుగింటికి కలుద్దాం’.
‘నీ జడ బాగుంది. యు లుక్స్ ‌స్వీట్‌’ ‌బై.

‘నాలుగింటికి కలిశాం. పగలంతా వాళ్లమ్మతో టెంపుల్స్ ‌తిరిగానని డ్రాయింగ్స్ ‌వేస్తుంటే చూశానని చెప్పాడు. రోజూ కలిసే వాళ్లం. నీ ముక్కెందుకు అంత పొడుగ్గా చివర వంకరగా ఉంది. ఇక నించీ నువ్వు ‘పారెట్‌’ ‌నీ తలెందుకు అట్టా ఎర్రగా ఉంది. నువ్వు ‘రాగి చెంబు’ అంటే పడి పడినవ్వాడు. నాకు చాలా సమస్యలు ఉన్నయ్యి. అయ్యి నీతో చెప్పుకోవాలి. అని అలా రోజూ ఇద్దరం కలసి తిరగటం, ఆటలు, గోల.

మా ఇద్దరివీ మరీ అంత చైల్డిష్‌ (‌పిల్లల) ఆటలేం కాదు. టీనేజ్‌కీ, యంగ్‌స్టర్స్‌గా మారే మధ్య దశ ఆటలనుకుంటా. అవి ఆటలా చేష్టలా తెలియదు. తేనెకళ్లు, సన్న ముక్కు, రాగి జుట్టు ఉన్న పద్నాలుగేళ్ల పిల్లాడు, ఏదో ఒక పని చేత్తా ప్రతిదాన్ని పరిశీలనగా చూస్తా, నవ్వినపుడు ముక్కూ, పెదవులు కదిలించటం, చాలా దగ్గరగా నిలబడి మాట్లాడటం, ఇది ఏంటోగా ఉండేది. మరి నా తరగతి అబ్బాయిలతో ఇట్లా అనిపిచ్చలా. నాకన్నా పెద్ద ఆనంద్‌ ‌వాడితో కూడా చాలా క్లోజ్‌, అమ్మా వాళ్లు ఊరెళితే నేను, అన్నయ్య, వాడూ అందరం ఒకే దగ్గిర పొడుకున్నా ఏమీ తేడాలేదు. కానీ వీడు మాత్రం తేడాగాడు. వీడిని చూత్తే నా కళ్లు నవ్వుతయ్యి. ఎందుకు? ఏమో చెత్తగాడు. మొత్తానికి నచ్చుతాడు.

గేదల్ని తోలుకుని పాలేరు నదికి ఎలతంటే వచ్చా. ఎనకాల తోకలాగా వీడూ తయారు. ఈడితో పెద్ద గేదని తోమిచ్చా. కబుర్లు చెప్పుకుంటా లోతుకి ఎల్లాం.

‘సిరీ ఈత కొడదామా’
ఈదుకుంటా దూరం వచ్చాం. ఒక దగ్గిర ఆగి నా శిల్కు లంగాని గొడుగులాగా చేసి ఆడతన్నా.
‘పారెట్‌ ఐ ‌వాంటు ఆస్క్ ‌సమ్‌థింగ్‌’ (‌నిన్నొకటి అడగాలి)
‘ఏంటది’?
‘విల్‌ ‌యు బి మై గాళ్‌’ (‌నా అమ్మాయిగా ఉంటావా?)
‘అదేంటో అర్థం  కాలేదా? అయ్యిందా, ఎంతో మంది విదేశీ జంటల్ని చూశాం. నాదాకా వస్తే ఏంటో ఒకలాంటి.. ఏం చెప్పాలో తెలియలా’.
‘సరే అంటే చెయ్యి పట్టుకుని ఇద్దరం ఈదుదాం’ అని చెయ్యి చాచాడు. ఆ చేతిని అందుకుని ఈదాం.
దగ్గరగా జరిగి ‘యు ఆర్‌ ‌మై గాళ్‌’.

‌చూపులు, మాటలు, నవ్వులు, పక్క పక్కన కూచ్చోటం, చేతులు పట్టుకోటం, ఇలా ఉండేవి మా చేస్టలు. తన దగ్గరున్న డబ్బులతో లంబాడీలు కుట్టిన గవ్వల నడుం పట్టీ కొని నా నడుముకి చుట్టాడు.

‘డబ్బులు ఎక్కడియ్యి, మీ అమ్మ ఇచ్చిందా’

‘కాదు. మేం పని చేసుకుని పాకెట్‌ ‌మనీ సంపాదిస్తాం. నేను రోజూ రొండు గెంటలు లెదర్‌ ‌కటింగ్‌కి వెలతా’.
రోజూ బడిదాకా దించటం, తిరిగి తీసుకురాటం, బలే సరదాగా ఉండేది. ఒకసారి ఎక్కువ కుచ్చులున్న పట్టులంగా వేసుకున్నా. స్టిచ్‌డ్‌ ‌దిస్‌ ‌విత్‌ ‌లాంగ్‌ ‌క్లాత్‌, అం‌డర్‌ ‌దిస్‌ ‌యు వేర్‌ ‌లంగరీ’ నవ్వొచ్చింది తన అనుమానానికి, ఎందుకో సిగ్గుపడ్డాను కూడా.
‘షటప్‌ ఇట్టాంటియ్యా నువ్వు అడిగేది’ ఆరోజంతా బిడియంగా అనిపిచ్చింది.

‘వై షై , ఇట్స్ ‌మై డౌట్‌, ఐ ‌హావ్‌ ‌టు ఆస్క్’
‌కబుర్లు బాగా చెప్పేవాడు.
హిల్‌ఫోర్ట్ ‌టెరిల్‌ (‌లండన్‌) ‌ప్రాంతంలో వాళ్ల స్పెన్సర్‌ ‌ఫ్యామిలీ బంగళా గురించి, తన స్కూలు, ఆల్గేసిటీ (నాచుతో కప్పి ఉండటం), తన ఆటలు, చిన్నప్పటి నుంచి ఇండియా రాటం వలన ఇండియా అంటే ఇష్టం, మరీ ఎక్కువగా చలికాలంలో ఇక్కడ బాగుంటదని, ఇక్కడికి రావటం కోసం సంవత్సరం అంతా సెలవలు తీసుకోకుండా వాళ్ల అమ్మా, నాన్న పనిచేస్తారని, రొండు నెలలు వాళ్ల అమ్మ గోపురాలు, ప్రహరీల నమూనాలని స్కెచ్‌లుగా మార్చి  వాటిని రీసెర్చ్ ‌చేస్తుందని చెప్పాడు. ఇంకా పదహారేళ్ల వరకే అమ్మా నాన్నా పోషిస్తారని, తరవాత సంపాదనా తోడూ సొంతగా ఎతుక్కోవాలనీ, డేటింగ్‌ ‌చెయ్యకపోతే తప్పుగా చూస్తారు. అక్కడ నాకు ఎవరూ నచ్చలేదు. లక్కీని…. ఇక్కడ నువ్వు నచ్చావు. స్వీట్‌ ‌గాళ్‌ అన్నాడు. నేను చెట్టుమీద చిలకల్ని చూస్తన్నా. ఏదో ఆలోచిస్తా వింటన్నా.
‘ప్యారెట్‌, ఆర్‌ ‌యు ఓకే, యు ఆర్‌ ‌నాట్‌ ‌కేరింగ్‌, ‌నాట్‌ ‌లిజనింగ్‌ ‌మి. (నువ్వు నా మాటల్ని నన్నూ లెక్కలేకుండా తీసుకున్నావ్‌)’ అని అలిగి ఎల్లిపోయాడు.

‘ఏయ్‌ ‌చెంబూ, డేవీ, డేవిడ్‌ ‌వెయిట్‌’.. ఆగలేదు.
తిక్క సచ్చినోడు, ఎక్కడికి పోతాడు ఆడే తిరిగొత్తాడని ఊరుకున్నా. మరుసటి రోజు ఆదివారం, మధ్యానం దాకా చూశా. రాలా. వాడి గుడిసెలోకి చూత్తే వాళ్ల అన్నతో లూడో (గేమ్‌) ఆడతన్నాడు. వాళ్ల అన్న నన్ను చూసి నవ్వి,,
‘యు బోత్‌ ‌ఫాట్‌ ‌యస్టర్‌డే’ (నిన్న కొట్టుకు చచ్చారా)

‘డేవీ సారీ, దా’
‘ఆటలో పావులు చెరిపేసి బయటకొచ్చి నా చెయ్యి పట్టుకుని, వాళ్ల అన్నకి ‘బై’ కూడా చెప్పకుండా పరుగో పరుగు’
‘మిస్‌ ‌యు సిరీ’
‘మిస్‌ ‌యు డేవిడ్‌’
‘‌నో కాల్‌ ‌మి చెంబు, ఐ విల్‌ ‌కాల్‌ ‌యు ప్యారెట్‌’
‌తుంగభద్ర ఒడ్డున పల్లంలో నాలుగు అంకెలా ఉన్న మలుపు దగ్గర రొండు బండల చాటున మా కబుర్లు. అక్కడ కూచ్చున్నాం.
‘నిన్న రాత్తిరి నాకు నిద్రలేదు. నీ వలన మా అన్న నిద్ర కూడా చెడగొట్టాను’

‘నువ్వు మీ అన్న దగ్గర పొడుకున్నావా’
‘అవును మరి నువ్వు’
‘మా అమ్మ దగ్గర’
‘దెన్‌ ‌విత్‌ ‌హూమ్‌ ‌యువర్‌ ‌డాడ్‌ ‌విల్‌ ‌స్లీప్‌ (‌మరి మీ నాన్న ఎవరితో పొడుకుంటాడు)
నాకేం చెప్పాలో తెలియలా. అమ్మకానీ, అమ్మమ్మ కానీ పక్కన లేకుండా నిదర ఎట్టా పట్టుద్ది. భయం కదా, ఈ విషయాలు మాట్లాడకూడదని అమ్మమ్మ చెప్పింది. అడిగితే మొట్టికాయలేసి చచ్చేటట్టు తిట్టుద్ది.

తినటం, చెట్లు ఎక్కటం, రాళ్లు, తుంగభద్ర, హంపీ శిధిలాలతో పాటు ఈ పిల్లాడు అంటే కూడా ఇష్టం. ఎప్పుడూ తల దువ్వుకోడు. ఆ రాగిరంగు జుట్టు అట్టా పెంచి సంవత్సరానికి ఒకసారి గుండు కొట్టిచ్చుకునే వాడు. అమ్మమ్మ తన భాషలో..
‘ఆ తలకి నూని తగలబెట్టు కోడే,’ అనేది.

‘నో నుప్పు ఐ డోంట్‌ ‌వాంట్‌’ అనేవాడు. అందరం నవ్వుకునే వాళ్లం.
రోడ్డు మీద గణేశుడిది చిన్న రాతి శిల్పం దొరికితే తెచ్చి వేపచెట్టు కిందపెట్టి రోజూ దణ్నం పెట్టుకునే దాన్ని. తను కూడా ఎలిఫెంట్‌ ‌గాడ్‌ అని దణ్నం పెట్టుకునే వాడు.

మా పిన్ని కూతురు వచ్చింది. ఎప్పుడూ మాట్లాడతానే ఉండేది. చాలా గొప్పగా మాది పెద్ద ఇల్లు. నాన్నమ్మ, తాతయ్య, బాబాయిలు, పెదనాన్నలు కలిసి నలభై మందిమి ఉంటాం. జాయింట్‌ ‌ఫ్యామిలీ తెలుసా అని వాడి మెదడు తినటం మొదలుపెట్టింది.
‘హౌ మెనీ బాత్‌రూమ్స్ ‌ఫర్‌ ‌ఫార్టీ మెంబర్స్…’
‘ఓన్లీ వన్‌’ అం‌ది.
‘ఓఓ.. మైగాడ్‌ ‌హౌకెన్‌ ‌యు లివ్‌ ‌దేర్‌’
ఇది ఏం చెప్పాలో తెలియక నోరు తెరచుకుని బిగదీసుకుని నిలబడింది.

‘ఎక్స్‌క్యూజ్‌మి వి నీడ్‌ ‌ప్రైవసీ’ అని నా చెయ్యి పట్టుకుని ఈడ్చుకుపోయాడు.
‘ఈడు చెంబుగాడు కాదు పిచ్చిక గూడుగాడు. ఒరేయ్‌ ఎప్పుడో ఏ నుప్పు పుల్లో అంటుకుని గడ్డివామిలాగా ఆ తల తగలబడుద్ది’ అని తిట్టుకుంది. ఎప్పుడు సెలవులకి వచ్చినా ఎల్లే ముందు రొండు రోజులు కూచ్చుని జడకి తోలు బ్యాండ్లు, పర్సు, రిటన్‌ అ‌డ్రస్‌ ఉన్న ఇంటర్నేషనల్‌ ‌లెటర్స్ ఇచ్చి వెళ్లేవాడు’.

‘లండన్‌లో నీ గురించి మాత్రమే ఆలోచిస్తాను సిరీ’ అని ప్రతిసారీ చెప్పేవాడు.
ఎప్పుడు ఉత్తరాలు రాసినా ‘టు మై గాళ్‌తో మొదలయ్యి, మిస్‌ ‌యు తో ముగిసేది.


డేవిడ్‌ – ‌సిరి 1986
డేవిడ్‌ – ‌సిరి 1988
డేవిడ్‌ – ‌సిరి 1990
డేవిడ్‌ – ‌సిరి 1992
డేవిడ్‌ – ? 1994 ‌నుంచీ ఒక్కడి పేరే చెక్కి ఉంది. సిరి కింద క్వచ్చన్‌ ‌మార్క్ ఉం‌ది. అక్కా చెల్లెళ్ల గుండుని తడుముతా ఎర్రపడిన ముక్కూ, వణకే గుండెతో చూశా. పోయిన ఏడాది కూడా వచ్చాడన మాట. పేర్లని ఆప్యాయంగా తడమాలి అనిపించింది. పిల్లలు చూస్తే బాగోదని ఊరుకున్నా.

వాళ్లని పిలిచి ‘ఈరోజు నాకు సన్‌సెట్‌ (‌పొద్దువాలటం) చూడాలని ఉంది. మీరు ఎల్లిపోండి. ఏడింటికి వస్తాను’.
‘నో మా.. నిన్ను ఒంటరిగా వదలను. ఎంతసేపు అయినా ఉండు. మేం కొంచెం దూరంగా కూచుని కబుర్లు చెప్పుకుంటాం’
చుట్టూరా కొండలు, పగిలిన సిధిలాలు, విరిగిన మంటపాలు, వీటి అన్నిటినీ చుట్టి గొంతుకకి పట్టిన కంఠి (హారం) లాగా పెనుగొండకి వెళ్లేదారి. కొండల మధ్యలోనించీ నేలలోకి తనని కుక్కుకుంటున్న సూర్యుడు. అప్పుడు అదే యవ్వనంలో డేవిడ్‌ ‌సాహచర్యం.
మైఖేల్‌ ఏం‌జిలో అంత అందంగా ఉండని మనిషి, ప్రపంచంలోనే అందమైన• డేవిడ్‌ ‌శిల్పాన్ని మలిచాడు. ఓ మత పెద్ద ఇంత అందంగా ఎలా చెక్కావు అంటే ‘అందులో డేవిడ్‌ ‌కాని దాన్నంతా తీసేశాను’ అన్నాడంట. ఎప్పుడూ నీడలా ఉండే నా జీవితపు విషాదం వెనకాల గోరింట పంట లాగా పెదాల మీద నవ్వు పూస్తంది అంటే ‘డేవీ’నే కారణం. తను చెక్కిన శిల్పం నేను. వికారాలన్నిటినీ విరగొట్టి కొత్త సౌందర్యంతో నన్ను మలిచాడు. నా జీవితపు మైఖెల్‌ ఏం‌జిలో అతను. చాలా అరుదైన కోహినూర్‌ ‌లాంటి చెలికాడు. పోగొట్టుకున్న నెమలి సింహాసనం లాంటి జ్ఞాపకం అతను.


ఈసారి సెలవల్లో వాళ్ల అన్న రాలేదు. హైస్కూల్‌ అయిపోయిందని (10+2) ఇప్పుడు ఇక కాలేజ్‌కి వెళ్లాలి. ఈసారి ఆరు నెలల సెలవులున్నయ్యి. స్వీటీ మనం చాలా హ్యాపీగా గడపొచ్చు అని బుగ్గకి బుగ్గ ఆనించాడు. వాక్‌మెన్‌, ‌పాటల క్యాసెట్స్ ‌తెచ్చాడు. మొట్టమొదటిసారిగా ‘హెవీమెటల్‌’ ‌పాటల్ని పరిచయం చేశాడు. సంగీతం అంటే ఇలా కూడా ఉంటదా అనుకున్నా. ఊరి మొత్తంలో వాక్‌మెన్‌ ‌నా దగ్గరే ఉండేది, పైగా ఒక అబ్బాయి ఇచ్చింది. ఇక మనం రచ్చా, రావిడిఅన్నట్టుగా గేదలకి కుక్కలకి, మేకలకి, మొక్కలకి ఇనిపిచ్చే దాన్ని. ఒక కొత్త వింత సంగీత పరికరం చేసి ఇనిపించాడు. బ్రహ్మజెముడు కాడల గుజ్జు తీసేసి ఆ పొడుగుదాంట్లో బద్దీలు దూర్చి బూరలుగా చేసి ఊదటం. వాకిలి నిండా బ్రహ్మజెముడు ముళ్లు ఏసినందుకు అమ్మమ్మ చీపురు తీసుకుని ఎమ్మటపడింది. అమ్మమ్మ తిడతంటే వాటిని రిపీట్‌ ‌చేసేవాడు.

సచ్చినాడా – సఛినాడా, జిమ్మదియ్య – జమదియ, మొదులారా – ముదులారా, జులపాల పోలిగా – జలపాల పోలిగా ఇట్టా. నాకు లెక్కలంటే బయ్యం. రోజూ సాయంత్రం నాకు ప్రయివేటు లెక్కలు నేర్చుకోవాలంటే బూరల సంగీతం నేర్పాలి.
పౌర్ణమి రోజుల్లో అదర్‌సైడ్‌ (‌తుంగభద్రకి అవతల) వెళదాం అనేవాడు. శని, ఆదివారాలు అరగోలి (చిన్నపడవ) ఏసుకుని నది దాటేవాళ్లం. వీడి సావాసం వల్ల అమ్మ, అమ్మల దగ్గిర పడుకోటం మానేసి వంటరిగానే పడుకోటం అలవాటయ్యింది. వెన్నెలలో సిధిలాలని చూత్తా, కబుర్లు, నడక, నీళ్లలో చందమామని చెదరకొట్టటం, తన బడి కబుర్లు, అమ్మాయిల, అబ్బాయిల ముద్దులు, బ్రిటిష్‌ ఇం‌గ్లిష్‌ ఎం‌దుకు అమెరికన్‌, ‌యూరోపియన్‌ ఇం‌గ్లీషుకన్నా గొప్పదో, వాళ్ల యాసలో తేడాలు, ఎక్కిరింతలు.. ఇలా సంగీతం కుక్కునపల్లి (లంబాడీల) సంతకెళ్లేది..

ఓ వెన్నెల రాత్రి తన మాటల్ని గాలికి ఊగుతున్న నందివర్ధనం పువ్వులాగా ఇంటన్నప్పుడు…
‘కెన్‌ ఐ ‌కిస్‌ ‌యు’
ఏం చెప్పాలో అర్ధం కాలేదు. చేతులతో మొకాన్ని దగ్గరగా తీసుకుని తన పెదవులతో పెదవుల్ని కలిపేసుకుని, ఆ చర్యకి మాయమైపోయిన నేల, ఏరూ, ఊరూ, నేనూ.. ఇంకా చెప్పాలంటే, తోలు పొరల్ని చీల్చుకు వచ్చే రోమాల మొనల్లాగా, ఏదో, ఏదో గమ్మత్తుగా మత్తుగా.. ఎమ్మటే గందరగోళంగా.. బండమీద చచ్చుపడిపోయా. తన భుజంమీద వాలిపోయా. తేరుకుని
‘ముద్దెందుకు పెట్టావు’

‘మా అమ్మా,  నాన్నా కిస్‌ ‌చేసుకుంటారు కాబట్టి’
‘కానీ మా వాళ్లు ముద్దు కాదు కదా, పక్క పక్కన కూచోటం కూడా చూళ్లేదు’
‘నీకో విషయం తెలుసా మా దేశంలో ముద్దు చాలా మామూలు. హైస్కూల్‌ ‌నించీ మొదలు పెడతారు. లెటర్స్ ‌కూడా రాసుకుంటారు. నువ్వు రాసే సుద్దపప్పు లెటర్స్ ‌చూసి మా ఫ్రెండ్స్ ‌నువ్వు నాకు స్పెషల్‌ ‌ఫ్రెండ్‌ ‌కాదు. ఉత్త ఫ్రెండ్‌ అని అనుకుంటన్నారు. ఈసారి నీకు ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్‌ ‌చెయ్యటం, గ్రీటింగ్స్ ‌రాయటం నేర్పుతా’
‘నీకు గ్రీటింగ్స్, ‌పోస్ట్‌కార్డస్ ‌పంపాలని నాకూ ఉంది. కానీ దానికోసం ఇంట్లో వాళ్లని డబ్బులు అడగటం ఇష్టం లేదు. వి వాంట్‌ ‌టు డు సమ్‌థింగ్‌’

‘‌దెన్‌ ‌హూ ఈజ్‌ ‌స్టాపింగ్‌  ‌యు’ (ఎవరన్నా వద్దన్నారా)
మరుసటి రోజు నా వ్యాపారం చెప్పాను.
‘గో హెడ్‌’ అన్నాడు.

‘రోజూ సాయంత్రం బాదం పాలు, రాగి అంబలి అమ్మేదాన్ని. అమ్మమ్మ చెయ్యటం నేను అమ్మటం. యాభై రూపాయిలు దాకా ఒక్కసారి మిగిలేది. సాఫ్ట్‌గా మాట్లాడటం, థాంక్స్ ‌చెప్పటం, వాళ్లని మాటల్లో పెట్టే విధానం అన్నీ నేర్పాడు. ఓసారి మాట్లాడుతూ రాత్రి ఒంటి గంట అయ్యింది. ఆవలింతలు వచ్చాయి. ‘సరే నిద్దరొస్తాంది, బొజ్జోవాలి ఎదాం’ అన్నా.

‘చిన్న పిల్లలా కిడ్‌లా మాట్లాడొద్దు. చిలకపలుకులు వద్దు, బేస్‌ ‌వాయిస్‌, ‌లంగా, ఓణీ, పొడుగు జడ, ట్రై టు బి లైక్‌ ‌దట్‌. ‌కొన్నిసార్లు హస్కీ టాక్‌.. ‌నువ్వు అలా ఉంటే బాగుంటావు. పద వెలదాం’

కాలిగజ్జెలు తీసి చప్పుడు కాకుండా వచ్చి పడుకున్నాను. పొద్దునే ఊరిలో జాతర. నగలు, పట్టు లంగా, చిట్టి చేమంతులు, జాగర్తగా తీసుకెళ్లి తీసుకురా అని పాలేరుకి అమ్మమ్మ ఆర్డర్‌. ‌కెమెరా, లాల్చీ, పైజామాతో చెంబు రెడీ.

‘పారెట్‌ ‌యు లుక్స్ ‌గాడెస్‌ ‌పర్వతీ (పార్వతి). అయామ్‌ ‌లక్కీ’ (పార్వతిలా ఉన్నావు)
‘నీ మూడో కన్ను ఎక్కడ దాచావు’ అన్నా.
‘థాంక్యూ. నాకు ఇండియాలో స్పెషల్‌ ‌గాళ్‌ ఉం‌ది అంటే నా ఫ్రెండ్స్ ‌నమ్మటల్లేదు. నీకోసం బడిలో స్పెషల్‌ ‌సబ్జెక్ట్‌గా ఫొటోగ్రఫి నేర్చుకున్నాను. నీ ఫొటోస్‌ ‌వాళ్లకి చూపిచ్చి నోళ్లు మూయిస్తా. రోజంతా ఐదారు రీళ్లు ఫొటోలుగా తీశాడు. అటుగా ఎల్లే ఫారినర్స్‌ని ఆపి నన్ను ఎత్తుకుని పొడుగు జడని మెడచుట్టూ తిప్పుకుని, మా నల్ల మాళీ గేద మీద, ఉప్పు మూటలాగా, ఫొటోలే ఫొటోలు. చాలా ఎత్తుగా ఉన్న తను నాకు బలమైన ఆసరా అనిపించాడు.


దసరా సెలవల్లో వచ్చిన ఇరిటేషన్‌ ‌పేరు పెద్ద మనిషవ్వటం. అమ్మతో పోట్టాడి మరీ తాటాకుల మీద కూచ్చోపెట్టింది అమ్మమ్మ. మట్టి మూకుట్టో పప్పు, నెయ్యి, కొబ్బరి బెల్లం నువ్వుల చిమ్మిడి తొక్కటం, ఇవేమీ చెంబుకి అర్ధం కాలా. ఆనంద్‌ (‌ఫ్రెండ్‌) ‌చెబితే పడి పడి నవ్వాడు. అమ్మమ్మ దగ్గిరగా వచ్చిన వాడ్ని చూసి కళ్లు ఉరిమి దూరంగా సావమను అంది.

‘గో డేవీ, యు ఆర్‌ ‌నాట్‌ ‌సపోజ్‌ ‌టు సిట్‌ ‌హియర్‌, ఐ ‌యామ్‌ ‌మెచూర్డ్’
‘‌వాట్‌ ఎబౌట్‌ ఆల్‌ ‌దీజ్‌ ‌డేస్‌’ అని నవ్వి.
సిరీ డాల్‌, ‌మై ప్యారెట్‌, ఐ ‌విల్‌ ఎక్స్‌ప్లెయిన్‌ ‌యు’
ఒక పుస్తకం తెచ్చాడు. అది యవ్వనంలో అడుగుపెట్టే వాళ్లు శారీరక మార్పులకి సంబంధించింది. పెద్దమనిషి అవ్వటం సాధారణ చర్య అది రక్తం కాదు, టిష్యూ అని ఉంది. ఆ విషయం బొమ్మలతో సహా చూపిచ్చి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కడుపులో బిడ్డకి అదే ఆహారం అని చెప్పాడు. దీన్ని నెలనెలా ఎట్టా భరిచ్చాలి. డేవిని వదిలి అమ్మని పిలిచా.

‘అమ్మా ఈ ఇరిటేషన్‌ ‌వద్దమ్మా. అది నెలనెలా ఒకేసారి బయటికి వచ్చే మిషన్‌ ఉం‌టే బాగుణ్ణు. ఈ నెప్పి కూడా వద్దు అని ఏడ్చా. తను కూడా ఒకప్పుడి ఇలాంటి ప్రశ్నలు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా బయటికి వచ్చింది కదా. కళ్లని నీటి కాలువలతో నింపుకుని ఇవన్నీ నేచర్‌ ‌కాల్స్. ఏ ‌వయసులో రావలసినయ్యి ఆ వయసులో వస్తయ్యి అని ఓదార్చింది.

డేవీని అడిగాను ‘నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు, ఈ పుస్తకాలు ఎక్కడివి?’
‘మా బడిలో ఇస్తారు. ఇయ్యన్నీ పెయింటింగ్‌లు, ఫొటోలు, సినిమాల ద్వారా చూస్తాం. యు ఆర్‌ ‌గ్రోన్‌ అప్‌. ఇయ్యన్ని నువ్వు కూడా తెలుసుకోవాలి. శరీరం, దాని నిర్మాణ రహస్యాలు అందరూ చదువుకోవాలి’.

‘ఆ వయసుకి నాకు వాడికన్నా తెలివయిన వాడు ప్రపంచంలో ఉండడు అనిపించింది’.
‘సిరీ నీకు తెలుసా ఓసారి మా అన్న అమ్మ దగ్గరికొచ్చి నేను వర్జినిటీ పోగొట్టుకున్నానని చెప్పాడు’.
‘మరుసటి రోజు నేను కూడా మా అన్నతో వర్జిన్‌ ‌కాదు అన్నాను’
ఆశ్చర్యపోయి,
‘నువ్వు చిన్నోడివి, ఒంటరివి, గాళ్‌ ‌ఫ్రెండ్‌ ‌లేదు అదెలా సాధ్యం’
‘రాత్రి మంచం పయిన నా పురుష అవయవం నించీ పడిన ద్రవాన్ని చూపిచ్చాను’

‘అప్పుడు అది వేస్ట్ ‌జెల్‌’ అని చెప్పాడు. ఎవ్వరికీ మొదట్లో అంతా తెలియదు. అంతా గందరగోళంగా ఉండేది. అందరూ కలసి చెబితే, ఇప్పుడు నేను నీకు చెప్పగలుగుతున్నాను.
ఎన్నో చర్యలు ముఖ్యంగా రొండో తరం శారీరక మార్పులు, జుట్టు, చర్మం, టి జోన్‌ ‌శుభ్రత మా మధ్య వచ్చేవి. ఇయ్యన్నీ నాకు ఏ టీచరూ, పెద్దలూ చెప్పలేదు. లండన్‌ ‌నించీ కండోమ్‌ ‌తెచ్చి చాలా రహస్యంగా చూపిచ్చాడు.

ఒకసారి ఉండబట్టలేక అడిగాను. ‘ఆ.. అనుభవం ఎలా ఉంటుంది’ అని.
‘నాకూ తెలియదు. ప్రాక్టికల్‌గా చెయ్యలా, కానీ ఎక్కడో చదివాను’
‘అదే చెప్పు’.
‘బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉంటది అని’. కాసేపాగి నా వైపుకి తిరిగి.
‘ఐ వాంట్‌ ‌టు లూజ్‌ ‌మై వర్జినిటీ విత్‌ ‌యు ఓన్లీ’ అని ఎల్లిపోయాడు.
అప్పుడప్పుడే కలిగే ఊహలు, కోరికలు, బిడియం, మధురమైన దిగులుతో ఉండేయి. సెలవలు అయిపోవచ్చినయ్యి. రేపు తను వెళతాడు అనగా మా బండల మీద కూచ్చున్నాం. నీళ్లు నిండిన కళ్లతో…
‘వెళ్లొద్దు డేవీ’
‘కాలేజ్‌ ఉం‌ది. మళ్లీ వచ్చేస్తాకదా’

‘నాకో అనుమానం, నా కోసం ప్రామిస్‌ ‌చేశావు కదా. అదే నీ వర్జినిటీ ఎవరితోనైనా పోగొట్టుకుంటే నాకు తెలవదు కదా’
‘చాలా ఆశ్చర్యంగా, కొంచెం కోపంగా గట్టిగా నన్ను పట్టుకుని, ఏ దేశంలోనైనా ఆడపిల్లకి అనుమానం ముందే ఉంటదంటే నమ్మలేదు. నేను ‘సిరీ’బోయ్‌ని. బిలీవ్‌ ‌మి. సిరి కాని అమ్మాయి నాది కాదు’.


నేను తనకి బాగానే ఇంగ్లీషులో ఉత్తరాలు రాసేదాన్ని. వాళ్ల నాన్నకి చెందిన కస్టమ్‌మేడ్‌ ‌బైక్‌ ‌షాప్‌లో సీటు కవర్లు కుట్టటం, వాటి పైన తోలు డిజైన్లు చెయ్యటం నేర్చుకుంటున్నానని, తను చేసిన వాటి బ్రాండ్‌ ‌నేమ్‌ ‘‌సిడాడ్‌’ అం‌టే సిరీ డేవిడ్‌ అనీ, తన అన్న ఇంట్లో ఉండటం లేదని గాళ్‌ ‌ఫ్రెండ్‌తో వేరే ఉంటున్నాడని, తన స్కిల్స్‌కీ, హ్యాండ్‌ ‌వర్క్‌కీ గుడ్‌ ‌మనీ వస్తుందనీ, చాలా గిఫ్ట్‌లు కొనగలను, నీ బిజినెస్‌లో కొత్త ప్రయోగాలు చెయ్యి. అమ్మమ్మ కొత్త తిట్లు క్రియేట్‌ ‌చేస్తుందా, క్యాథీ, ధోరా (ఫ్రెండ్స్)‌ని, మీ పిన్ని కూతురినీ అడిగానని చెప్పు. ఎలిఫెంట్‌ ‌గాడ్‌ ‌బొమ్మ కొని రోజూ పూజ చేస్తున్నా’.

సిరీ నీ కోసం బ్యూటిఫుల్‌ ‌లింగరీ (లో దుస్తులు) తీసుకున్నాను.
మిస్‌ ‌యు
బై ప్యారెట్‌, (‌చిలుకమ్మ)
ఆల్వేస్‌ ‌యువర్స్
‌డేవిడ్‌ ‌స్పెన్సర్‌.  ….. …

ఈసారి డేవీని చూస్తే నాకు చాలా బిడియం, భయంగా అనిపించింది. వాయిస్‌ ‌గంభీరంగా అయిపోయింది. ఇంట్లో ఎవరో బంధువులు రాటం వలన చాలా ఆలస్యంగా సీక్రెట్‌ ‌ప్లేస్‌కి వెళ్లాను. చాలా కోపంగా ఉన్నాడు. తనతో గడపనందుకు కాదు. జుట్టు చివర్ల, కనుబొమ్మలూ కత్తిరించినందుకు. నా మోపెడ్‌ ‌సీటుకి లెదర్‌ ‌కవర్‌, ‌హ్యాండ్‌ ‌బ్యాగ్‌, ‌మినీ లెదర్‌ ‌స్కర్ట్, ‌జడ కోసం రకరకాల తోలు బ్యాండ్లు చేసుకొచ్చాడు. ఇంట్లో వాళ్లు తన పనితనానికి మురిసిపోయారు. అమ్మమ్మ చేసిన పప్పు, ఆవకాయ, నెయ్యి, రోటి పచ్చళ్లు, రొప్పుతా తినేవాడు.

అమావాస్య రోజు ఇంట్లో చెప్పి డార్క్ ‌డే పార్టీకి ఎల్లాం. అది ‘సిజరీ’ బాబా  గుహలో, పీటర్‌ ‌శాక్సాఫోన్‌, ‌మురళి తబలా, డేవీ బూరల సంగీతం, నా డాన్సూ, ఆనంద్‌ ‌జానపదాలు, ఫైర్‌, ‌నెగడు, తిండీ అంతా అయ్యేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. పొద్దున్నే ఎల్లొచ్చులే అని బండల మీద వాలాము. డేవీని ఆనుకుని మొదటిసారి, చాలా దగ్గిరగా పడుకోడం, వీపు నిమురుతా ‘స్లీప్‌ ‌మై ఏంజల్‌’ అం‌టా దగ్గరకి జరిగాం. కానీ కాసేపటికి ఇద్దరి పరిస్ధితీ చాలా ఇబ్బంది. ఇలా కాదు, ఇంకేదో కావాలి, ఈరోజు డేవీ తీసుకున్న ముద్దు తేడాగా ఉంది. తనే తేరుకుని, నేను మీ ఫ్యామిలీకి, మీ పద్ధతులకీ రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్లు ఎస్‌ ‌చెప్పేదాకా ఎదురుచూస్తాను. శారీరకంగా పెళ్లికి ముందు కలవటం మీ పద్ధతి కాదు, అని దూరంగా ఎల్లి పది నిమిషాల తరవాత వచ్చాడు.

‘ఎక్కడికి వెల్లావు? ఈ పది నిమిషాలూ ఏం చేశావు?’
‘నిన్ను ఊహించుకుని రిలీవ్‌ అయ్యాను’
‘అంటే’
‘మాస్టర్‌ ‌బేట్‌ ‌చేసుకున్నా. క్రిటికల్‌ ‌కండిషన్స్‌లో సెక్స్ ‌వీలుకానప్పుడు ఇలా చేసుకోవచ్చని నేర్చుకున్నా’.
‘అందరు అబ్బాయిలూ అలానే చేస్తారా మీ దేశంలో’
‘ఏమో, కాదనుకుంటా, కొందరు నా ఫ్రెండ్స్ ‌నా వయసుకే సెక్స్ ‌చేస్తారు’
‘అలా చేస్తే ఎలా ఉంటది’

‘ఇవన్నీ నా సొంత అనుభవాలు, సెన్సెస్‌ ‌హాయిగా, ఇరిటేషన్‌ ‌నించీ విముక్తి, అయినా ప్యారెట్‌ ‌మన పెళ్లి అయ్యే వరకూ నిన్ను నేను ఏమీ చెయ్యను. మీ ఇంట్లో ఒప్పిచ్చి నిన్ను నాతో తీసుకుని ఎలతా’

‘నేను రాను, నువ్వే ఇక్కడ ఉండు, చుట్టాలు, స్నేహితులు, తుంగభద్ర, పడవలు, గేదలు నేనెక్కడా ఉండలేను’
‘నేనున్నాను కదా. నీకు అన్నీ నేనే కదా. నా లైఫ్‌ ‌పార్టనర్‌ అయ్యేదీ నువ్వే కదా. చదువు అయ్యేదాకా వెయిట్‌ ‌చెయ్యి చాలు. ప్రతీ సంవత్సరం నిన్ను ఇక్కడికి తీసుకొస్తా’.

అట్లతద్దె రోజు చీర కట్టుకుని ఉయ్యాల ఊగుతున్నా. ఊపే వాళ్లని పక్కకి జరగమని ఉయ్యాల ఎక్కి ఎదురు ఊపు అందుకున్నాడు. ఆనంద్‌ ‌మిగతా ఫ్రెండ్స్, ‌కేకలు, ఈలలు. మా పిన్ని కూతురు దిగు నేను ఊగాలి అని దించింది. దాన్ని యువర్‌ ‌బొంద, యువర్‌ ‌దెవసం అని తిట్టాడు. నా చెవిలో ‘నువ్వు ఇలాంటి సెక్సీ డ్రస్‌ ‌వేసుకుంటే (చీర) నా వర్జినిటీ పోగొట్టుకోవటం అసలు పోస్ట్‌పోన్‌ ‌చేసుకోలేను’

టీనేజ్‌లో నా అందాన్ని పొగుడుతా, కొంత నేర్పుతా. ఆకాశంలో వెలుగు ఆశల పల్లకిలో ఊరేగించే వాడు. ఎంతయినా నేను మెచ్చిన వాడు కదా. ఎతికి, ఎతికి ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చాడు. ‘అది ‘యూజెస్‌ ఆఫ్‌ ‌నీమ్‌ ‌ట్రీ’, ఇంటి చుట్టూ ఉన్న యాప చెట్లతో ఇన్ని ఉపయోగాలా అని నోరు తెరుచుకుని చదివా. కాలివేళ్లకి మధ్యలో దూది ఉంచి గోళ్లరంగు వేసేవాడు. తల్లిదండ్రుల స్ధానాన్ని లాగేసుకున్నాడు. అభద్రత, భయంతో కలిసిన ఈ వయసునీ, శారీరక మార్పుల్నీ, తన వలన, తన స్నేహంతో తేలికగా ఎదుర్కొన్నా. ఎన్నో రాత్రుల ఉద్రేకం వచ్చేది.

ఒకసారి ఇద్దరం కలిసి చూద్దాం అని అడిగా..
చాలా ఆశ్చర్యపోయి ‘సిరీ ఇట్స్ ‌నాట్‌ ‌మ్యా•రాఫ్‌ ‌రిలీఫ్‌, ‌మ్యాటరాఫ్‌ ‌లైఫ్‌ ‌టైం సెన్సిటివ్‌ ‌ఫీలింగ్స్, ‌నీ మీద పడి బ్యాడ్‌ ‌బాయ్‌లాగా మిగలను. మనకి మన పెద్ద వాళ్లు ఉన్నారు’
మాకు ఒకళ్లంటే ఒకళ్లకి ఇష్టం అని తెలిసి నా ఫ్రెండ్‌ ‌కమ్‌ ‌సీనియర్‌ ఆనంద్‌ ఎప్పుడూ మాకు ముందు చదువు కంప్లీట్‌ ‌చెయ్యండి అని సలహా ఇచ్చేవాడు.
‘సిరీ నీ జీవితం ఈ తెల్లాడితో తెల్లారాలని రాసి ఉంది’ అనేవాడు.


కాలం యవ్వనంలో వచ్చే శారీరక మార్పుల్లా మారిపోయింది. కాలేజ్‌లో చేరా. అమ్మకి ఆరోగ్యం బాగుండక హాస్పిటల్స్ ‌చుట్టూ తిరిగితే లివర్‌ ‌సిరోసిస్‌ ‌నెలల మనిషి అన్నారు. తన ఆరోగ్యం గురించి అర్ధం అయ్యి నా పెళ్లి చూడాలని అడిగింది. దగ్గర బంధువుతో పెళ్లి మాటలు, హడావిడిగా జరిగాయి. తను నాకన్నా పదేళ్లు పెద్ద. బొంబాయిలో ఉద్యోగం, అమ్మమ్మ దగ్గరకి వెళ్లు డేవిడ్‌ ‌విషయం చెప్పి నాకీ పెళ్లి ఇష్టం లేదని ఏడ్చాను. అమ్మమ్మ ఇలా అంది.

‘సిరి తల్లీ మా అందరికీ ప్రేమలు లేవా, హృదయాలు, ప్రియుడు, తలపులూ, స్పర్శలూ, తొలిముద్దులూ అందరికీ ఉంటయ్యి. మేం వాళ్లని పెళ్లి చేసుకోకలిగామా. కనీసం వాళ్లు ఎదురయితే మాట్లాడ కలుగుతున్నామా? అలా అని ఇప్పుడు ఉన్న భర్తలతో ఆనందంగా లేమా, జీవితాన్ని తేలిక చేసుకోవటం, వచ్చిన జీవితాన్ని, మనపాలిట పడ్డ మనిషిని మనతో కలుపుకోవటమే బతుకంటే. డేవిడ్‌ ‌గురించీ, నీ గురించీ, మీ ఇద్దరి దగ్గరతనం నాకు తెలుసు. యవ్వనంలో ఆమాత్రం ఆనందం, జీవితాన్ని అందంగా చూపిచ్చే ఓ స్నేహితుడు అవసరమో, అయినా మనం, మన అలవాట్లు, పద్ధతులూ వేరు. నిన్ను అరచి గీపెట్టి నా అంత దూరం ఇచ్చి పెళ్లి చెయ్యరు. అదే అలవాటవుతుంది. అన్నీ కాలమే నేర్పుద్ది. అమ్మకోసం ఈ పెళ్లి ఒప్పుకో. ఇంతకన్నా ఏం చెప్పలేను’.

డేవిడ్‌ని ఏం చెయ్యాలో, ఎక్కడ పారబొయ్యాలో అర్ధం కాలేదు. నన్ను నేనెక్కడ దాచుకోవాలో అంతకన్నా అర్ధంకాలా. ఈ జ్ఞాపకాలని ఏ ఊడని కొక్కాలకి తగిలించాలి. కాసేపటికి తేరుకున్నా. ఫొటోలు, ఉత్తరాలు, బ్యాగులు, గవ్వల ఆభరణాలు, గ్రీటింగ్‌ ‌కార్డులు, వాక్‌మెన్‌, ‌క్యాసెట్‌లు అన్నీ రంగం పెట్టెలో వేసి తాళం వేశా.

అబద్ధం ఆడటం ఇష్టంలేక తనకి విషయం అంతా ఉత్తరం రాసి శుభలేఖని పోస్ట్ ‌చేశా. పడని అలమరా తలుపులు మూసినట్టుగా అతి కష్టంమ్మీద ఆ జ్ఞాపకాల అరని మూసేశా.

కానీ ఆనంద్‌ ‌మాత్రం తన కళ్లతో డేవీ వెదికే కొండ కోనల్నీ, తుంగభద్రనీ ఇనిపించేవాడు.
‘ఆమె నా కోసం హంపీగా మారింది. నిరంతరంగా పారే తుంగభద్రే ఆమె. నేను నదిలో పాదంపెడితే తను నన్ను చుట్టుకున్నట్టుగా ఉంటంది’ ఇలా సాగేది అతని విరహపు బాధ.

పెళ్లి తరవాత బొంబాయి జీవితం, హడావిడి పరుగులు, బుల్లి పొట్ట. అమ్మ దూరం అయినాక బుల్లి బొజ్జతో కబుర్లు, పసికందుగా బయటకొచ్చిన అమ్మ. బాబుతో పాటుగా పేరు పక్కన పెరిగిన డిగ్రీలు.

ఫ్యాక్టరీ ఫ్లోర్‌ ‌పైనించీ పడిన ప్రమాదంలో మళ్లీ ఒకసారి తోడుని దూరం చేసిన కాలం. అదే ఫ్యాక్టరీలో అతని ఉద్యోగం, పెద్దమ్మ తోడుగా పెరిగిన కొడుకు మనిషిగా ఎదిగి గాళ్‌ ‌ఫ్రెండ్‌ని పరిచయం చెయ్యటం, కాలం రాగాలనీ కొత్త కొత్తగా పాడుద్ది. వాడికీ ఫారినర్‌ ‌తోడుగా దొరకటం ఏ రాగమో. మళ్లీ ఆ బుల్లెట్‌ ‌సీటు కవరు నా పాత పాటని తిరగతోడి పాడింది.

ఆనంద్‌, ‌ఫ్రెండ్స్, ‌మా కజిన్‌ అం‌దరూ రేపటి నా పుట్టినరోజుకి వచ్చారు. తింటా, మాట్లాడతా గడిపాము. డేవీ గురింఇ అడుగుదాం అని నోటిదాకా వచ్చింది. తను నా నించీ వేరుకాదు అనిపించింది.

గోధుమ రంగుకి నిండు మట్టిరంగు అంచున్న పట్టుచీర మెడలో నవాబుల ముత్యాల హారం, లూజుగా గాలికి వదిలిన జుట్టుతో నా పుట్టిన రోజుకి తయారయ్యాను. రాత్రి పదకొండుకి వీనస్‌ ‌నా కొడుకూ ఇద్దరూ పడవ ఎక్కిచ్చారు. బంగ్లా శరణార్ధి రవీంద్ర సంగీతం పాడుతా తెడ్డు వేస్తున్నాడు. డిసెంబర్‌ ‌చలి. కవర్‌లోనించీ తెల్లటి షాల్‌ ‌తీసి కప్పింది వీనస్‌.  ఇద్దరూ చెరోసారి కెమెరాతో ఫొటోలు దిగారు. ఆ పిల్లని దగ్గరకి తీసుకున్నా. ‘లవ్‌ ‌యు మామ్‌’ అం‌ది.

చావులోనూ, వేదనలోనూ నవ్వులు పూయించి ఆశలు కల్పించే వాళ్లు పిల్లలే కదా’.
పడవ దిగి ముత్యాల బజారు చేరేటప్పటికి ఆనంద్‌ ఎదురొచ్చాడు. అంతా ముందే చేరుకున్నారు. మంచు పొగలో అర్ధరాత్రి నా కోసం ఎదురు చూస్తన్నారు. చాలు, ఈ నలుగురూ చాలు, నేను అదృష్టవంతురాల్ని అనుకున్నా.

ఓ రాతి బల్లమీద కేక్‌ ఒక క్యాండిల్‌ ‌వీనస్‌ ‌వెలిగించి నా చేతికి చాకు ఇచ్చింది.
‘మమ్మీ మిగతా కాలం మొత్తం హ్యాపీగా ఉండటానికి ఈ కేక్‌ ‌కట్‌చెయ్యి అన్నాడు’.
ఆ వెలుగులో కేక్‌ ‌చూశా. నిజమా అని మళ్లీ మళ్లీ చూశా.
హ్యాపీ బర్త్‌డే టు సిరీ.
డేవిడ్‌ ‌స్పెన్సర్‌ అని.

సన్నటి వణుకు మొదలయ్యింది. తల ఎత్తి చూస్తే పొడుగుకాళ్ల మంటపం నించీ ఓ నీడ వచ్చింది. ఆ నీడ చేతులు నన్ను చుట్టుకున్నయ్యి.

దగ్గరగా వచ్చిన నా కొడుకు ‘ఆనంద్‌ ‌మావయ్య, చెప్పాడు. పర్మిషన్‌ ‌లేకుండా రంగం పెట్టి తెరిచి తనని కాంటాక్ట్ ‌చేసి కలిశాను. నువ్వు మనస్పూర్తిగా నవ్వటం చూడాలని ఉందిమా. మాకన్నా ఇప్పుడు నీకే తోడు అవసరం. అందుకే నా గిఫ్ట్ ‌డేవీ అంకుల్‌’.
‌డేవీ వైపు చూశా.

నా చెవిలో గుసగుసగా
‘నౌ ఐయామ్‌ ‌రెడీ టు లూజ్‌ ‌మై వర్జినిటీ’ అన్నాడు.

అది అర్ధం అయిన ఆనంద్‌,
‌నవ్వుతా ఉన్నాడు.

*

మీ మాటలు

 1. ప్రసాద్ చరసాల says:

  విహారానికి వచ్చే తెల్లబ్బాయితో ఓ తెలుగమ్మాయి ప్రేమలో పడటం, అదీ టీనేజీ వరకు కొనసాగడం అనేది నమ్మబుద్ది అయ్యేలా లేకున్నా కథనం దాన్ని నిజం చేస్తున్నంత శక్తిమంతంగా వుంది.

 2. నాకు నచ్చలేదు , వర్జినిటీ గురించి అంత పొడుగూ బాగాలేదు , మొగుడు పోయిన తర్వాత ఇంకో మొగుడి కోసం ఈదురుచూడడం వరకూ ఓకే , కానీ అంట మాత్రాన చిన్ననాటి ఫ్రెండ్ గురించి అంత ఇంటెన్సిటీ ఉండదు మామూలుగా , ఫైనల్లీ ఐ డోంట్ లైక్ ఇట్

 3. వర్ణన చాలా బాగుంది. కథ ఇంతకు ముందే చదివినట్టు ఉంది, పరిసరాలు , మనుషులు మారారు . కాకపోతే ప్రతీ ఒక్కరికి ఆ “అనుభవం” ఉండాలన్నా అమ్మమ్మ మాటలు నాలో గిల్టీ ని తగ్గించాయి , నేను నా ex ని పెళ్లి చేసుకోలేదని చాలా గిల్టీ గా ఉండేవాడిని .

 4. అజిత్ కుమార్ says:

  హిందూ సంస్కృతిని క్రైస్తవ సంస్కృతిని కలిపే ఈ కధలో విదేశీ సంస్కృతి చాలా గొప్పదని చూపినట్లుగా ఉంది. ఐరోపా ఖండము లోని సంస్కృతికి ప్రపంచ ప్రజలంతా ఆకర్షించబడుతున్న నేటి క్రమాన్ని చక్కగా వివరించారు.

 5. Naresh Nunna says:

  ఆకాశంలా ఆవరించిన అనుభవంలో అరూప్యమైన మబ్బు తునకల వంటివి కదా జ్ఞాపకాలు. ఎగుడుదిగుడు అంతరంగంలో ఒకే జ్ఞాపకంగా కుదురుకున్న అనేకానేక సంఘటనల, సన్నివేశాల సమాహార బిందుసందోహాన్ని కలిపి గీసే contour line వంటి కథ ఎలా ఉంటుంది? మబ్బుపింజకి జరీ అంచులా మెరిసే కిరణపు అనాకృతిని పోలి ఉంటుందే తప్ప నిర్దిష్టంగా ఉండదు, ఉండాల్సిన అగత్యం లేదు. కానీ, అడ్డూఅదుపూ లేని, మొదలు- తుది ఉండనక్కర్లేని అటువంటి అపురూపమైన వంకర్ల పరివృత్తంగా కొనసాగుతున్న రచనని చప్పున ఒద్దికైన సరళరేఖగా వొంచిన తొట్రుబాటుకి, తొందరపాటుకీ తాజా ఉదాహరణ మన్నం సింధుమాధురి ‘డేవిడ్’!
  ఆకతాయి అంగలతో టీనేజీ లోగిళ్ళు దాటుతున్నప్పుడు తోడైన చెంబుగాడు, యవ్వనారంభంలో వయసుపొదల మాటున ఎన్నో దైహిక రహస్యాలు దారికాసిన వైనాన్ని గుర్తుచేశాడు. నిజానికి ఆ గుట్టుమట్లన్నీ విప్పి చెప్పేంత ఆరితేరిన ఆగడీడు కాడు, చెబుతున్నట్టే తెలుసుకున్న ఆరిందగాడు. తుంగభద్ర ఒడ్డున, హంపీ ఒడిలో చెట్టూ చేమా గుట్టా పుట్టా…. అన్నింటినీ తమ తూరుపూ- పడమరలంత దూరాల్ని రద్దు చేసేకుకొని మరీ ఆటాపాటా చేసుకున్న చిన్నారి నేస్తులు, ఆపై ఈడొచ్చిన పిల్ల ప్రేమికుల ఈ కథని ఒక సారాంశంగా రెండుమూడు వాక్యాల్లోకి కుదించుకొని చెప్పుకుంటే ఏముంటుంది విశేషం? కేవలం story for story sake గా, బండ్లకెత్తబడుతున్న అనేకానేక కథలకి మరో చేర్పు వంటి కథే అయినట్టైతే: నూనూగు ప్రాయల అమలిన ప్రణయం- విలనై విడదీసే విధి- చివర్లో శుభం కార్డుకు ముందు పునస్సమాగమం- అని మూడు ముక్కల్లో తేల్చేయొచ్చు! అలాంటప్పుడు దీనికి కథానాయకుడు లక్కవరప్పాడు, లేదా లక్నో, కాదంటే ఇలా లండన్- ఎక్కడి వాడైతేనేం? కానీ, చిన్నదో… పెద్దదో – అదనుకొక అనుభవంగా, దిగంతాలే హద్దులుగా చెలరేగిపోయిన, విశృంఖల వాక్యాలుగా వెదజల్లుకుపోయిన కథనం కదా – ‘డేవిడ్’ అనే ఈ కథకి ప్రాణం… ప్రణవం! ఐతే, మొదట్లోనే ఆరోపించినట్టు- స్ఖలిత బ్రహ్మచారి డేవిడ్ virginityకి సంప్రదాయక మురిపెంతో నాయిక ఎసరుపెట్టడం ద్వారా ఉన్నట్టుండి కథ ఒక ఒద్దికైన సాదాసీదా ముగింపుకి చేరుకొని చదువరిని కుదేసింది. ఆత్మగతమైన ‘memoir’ని depersonalize చేసి ‘కథ’గా విశ్వజనీనం చేయడం, అన్యానుభవాన్ని కూడా సహానుభూతితో ‘స్మృతిరచన’గా సొంతం చేసుకొవడం- అనే రెండు భిన్నమైన genresకి ఒక మేలైన సంయోగంగా నడిచిన ఈ రచనని చిట్టచివర్లో రచయిత్రి తేల్చేశారన్నదే నా ప్రధాన అభియోగం.
  (అసలు నా అభియోగంతోనే సమ్మతి లేనప్పుడు, ఇక ముందు నేను చేయబోయే వాదనలు పట్టించుకోనక్కర్లేదు, ఈ వాక్యాన్ని దాటి బహుశా చదివే శ్రమ తీసుకో పన్లేదు)
  ** ** **
  ఆదిమధ్యాంతరాలతో ఒక ఎత్తుగడలాగా, పతాక ఘట్టం ఒక పకడ్బందీ స్కెచ్ మాదిరిగా కథ ఉండవల్సిన పన్లేదని నవతరం కథకుల రచనలు ప్రపంచ కథా సాహిత్యవీధుల్లో భాషాతీతంగా ఎప్పటినుంచో చాటి చెబుతున్న విషయం రచయిత్రి సింధు మాధురికి తెలియకే తన కథని ఒక సుఖాంత సీమలకి నడిపించారా? ప్రశ్నలా కనిపించే ముందు వాక్యానికి అవునో… కాదో రచయితకి బదులుగా- అభియోగాలు మోపి, ప్రశ్నలు సంధించిన నేనే వివరణ ఇవ్వడం హాస్యాస్పదం, అసంబద్ధం కావొచ్చు. నేనిక్కడ ఇవ్వబోయే వివరణ కథ తాలూకూ వాచకపు హద్దులు మీరి, text కు మాత్రమే పరిమితం అయ్యే (అవ్వడానికి మాత్రమే తయారుగా ఉన్న) పాఠకుడి హక్కుని కాలరాయడం వంటిది; పాఠకుడి కట్టెదురున ఉన్న వాచకాన్ని దాటి పిల్లిమొగ్గలేసి, పాఠాంతరమైన మరేవో అసందర్భ అంశాల్ని అతని ముందుకు లాకొచ్చి ప్రదర్శించే దాష్టికంలాంటిది. ఇదంతా తెలిసి కూడా, ‘డేవిడ్’ అనే రచనకి సంబంధించిన వాచకానికి పరిమితం కాకుండా, ‘రచయిత – సింధుమాధురి (అక్షరంతో మాత్రమే)తో నాకు పరిచయం ఉంద’న్న సంజాయిషీ వంటి సాకులే పునాదిగా నా ఈ వాదన అనే మట్టిగోడని నిలబెట్టదల్చుకున్నాను.
  ** ** **
  ‘నేను, నా మూలతత్త్వం, కథల్లో బయటపడితే నేనేదో బట్టబయలైపోతానన్న సంకోచం ఉండేది నిన్న మొన్నటిదాకా. అంచేత కథల్లో సన్నివేశాలకు, పాత్రలకు రవంత దూరంగా వుండడానికి ప్రయత్నించేవాణ్ణి, వాటితో నాకెంత గాఢమైన బంధం వున్నా…’ అన్నారు పాలగుమ్మి, త్రిపుర కథలకు 35 ఏళ్ల క్రితం రాసిన ముందుమాటలో. ‘బైటపడిపోతామేమో అన్న భయం’ ఒక్క పాలగుమ్మినే కాదు, మొత్తం ఆధునిక తెలుగు సాహితీకారులందరినీ పట్టిపీడించింది. ఇంకా ఆశ్చర్యమేమంటే, సాహిత్యం- జీవితం అనేది అసలు ద్వంద్వమే కాదని తన యావజ్జీవితాన్ని రుజువుగా నిలిపి చూపిన చలం గారి తర్వాత యుగం యావత్తూ ఆ భయానికే బద్ధులై ఉండటం.
  ఇంతలో ఆధునికోత్తర యుగంలో ఒక విచిత్రం జరిగింది. విశ్వరచనలకీ, మహాకథనాలకీ సెలవంటూ, Jean-François Lyotard అనే సాహితీవేత్త ‘petits récits’ (meta-narrative) – అంటే స్వకీయమైన, స్థానికమైన, దుర్బలమైన కథనాలకు స్వాగతద్వారాలు తెరిచి, ప్రపంచానికి, ముఖ్యంగా మూడో ప్రపంచానికి ప్రాధాన్యత పెంచాడు. Lyotardని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆవాహన చేసుకొని తెలుగులో నామిని సుబ్రమణ్య నాయుడు వంటి రచయితలు గొప్ప సాహిత్యాన్ని కల్పించారు. అంతకు ముందటి తరాన్ని పీడించిన ‘బైటపడిపోతామేమో అన్న భయాన్ని’ మొదలంటా పెకలించి పడేసి, తామే హీరోలైన తమ రచనల్లో సన్నివేశాలకి, సందర్భాలకి, పాత్రలకీ కాస్తంత దూరంగా వుండడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ తరహా రచయితల తరం ఫోకస్ చేసిన అంశం ‘పేదరికం’. ప్రతిభావంతంగా చెప్పినా, తమ తమ మాండలికాల్లో చెప్పినా, చాప్లిన్ హాస్యంలా నవ్వించి గిల్లినట్టు చెప్పినా – తమ nostalgiaలో ప్రాధానంగా రాజ్యమేలింది ‘పేదరికమే’నని చిత్రించారు. వారి వారి కుల, ఉపకుల, మత, ప్రాంత, సామాజిక సాంస్కృతిక నేపథ్యాల భిన్నత్వం ఆ రచనల్లో కదలాడినా, స్థూలంగా చూస్తే అన్నీ మూసపోసినట్టై, ఆ లేమికి చెమర్చకపోతే, లేదా ఆ బీదతనాన్ని చూసి బిక్కపోకపోతే ఎక్కడ అగ్ర కుల.. మత దురహంకారమని ముద్రలేస్తారోనని భయంతో చదువరులు మూకుమ్మడిగా సంఘీభావాలు ప్రకటించేలా తయారయ్యాయి. దాంతో, అప్పటికే ఇబ్బడిముబ్బడిగా కీర్తి వచ్చిపడిపోతుండటంతో, చేయి మెలితిరిగిన రచయితలు కూడా తమని తామే అనుకరించుకునే దుస్థితికి చేరి, meta-narratives చిత్రణలో మీదుమిక్కిలి monotonyకి కారణమయ్యారు.
  అదే స్వకీయ, స్థానికీయ కథనాల ఆధునికోత్తర వాతావరణం ఇచ్చిన దన్నుతో వచ్చినట్టే కనబడిన సింధుమాధురి తాలూకూ ప్రపంచం మానసికంగా, భౌతికంగా భౌగోళికంగా కూడా పెద్దది కావడమే విశేషంగా, ఆమె ప్రత్యేకత గానూ గుర్తించాలి. అంటే, పైన చెప్పిన, monotonous మంద నుంచి వేరై uniqueగా నిలిచిన సింధు మాధురి అనే ఈ రచయిత్రి దేశదేశాలూ తిరిగారా? తన కథలన్నీ ఆమె స్వానుభవాలా? – వంటి వ్యక్తిగతమైన ప్రశ్నలకి అనేకానేక ఆమె పాఠకుల్లో ఒకడిగా నాకూ సమాధానాలు తెలియవు. ఒకవేళ తెలిసిన వారెవరి వకాల్తా అయినా, పాఠకులుగా మనం వినవల్సిన అగత్యం లేదు. కానీ, గతంలో ప్రచురించబడిన కథల ఆధారంగా hypothesis వంటి కొన్ని తీర్మానాలు చేసుకోవడం ఏమంత పెద్ద పాఠాంతర దోషం కాదనుకుంటాను.
  అటువంటి hypothesis ఆధారంగానే, డేవిడ్ కథలో నీరసపడిన ఉపసంహారానికి కారణాలు ఊహిస్తున్నాను: ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో నాలుగేళ్ల క్రితం ‘కలాపి ‘ అనే కథ రాశారు సింధు మాధురి. ఐదారు పెళ్లిళ్లు చేసుకున్న ఓ polyandrous స్నేహితురాలి జీవితచిత్రాన్ని కథగా ప్రతిభావంతంగా చిత్రించారామె ఆ కథలో. అది ఆ తర్వాత వివాదాలకు దారితీయడం వేరే వ్యవహారం. కానీ, అంతకు ముందే, ఆ కథ ప్రచురించినప్పుడు దాని illustration గా protagonist రూపాన్ని నేరేటర్ సింధు మాధురి (ఫొటో ఆధారంగా ) పోలికలతో portrait గా గీశాడు ఆంధ్రజ్యోతి (మగ) ఆర్టిస్టు. ‘కలాపి’ అనే ప్రొతాగనిస్టుకి సింధు మాధురి అనే రచయిత బొమ్మ వేయడం తెలియకో, పొరబాటునో, యథాలాపంగానో జరిగింది కాదు. అటువంటి బరితెగింపుల కథానాయికగా రచయిత్రినే చేయడం వెనక సగటు మగవాడికి ఉండే photo morphing syndrome వంటిదే పనిచేసింది. ఇటీవల వచ్చిన ‘పింక్’ సినిమా పరిభాషలో చెప్పాలంటే, మగవాళ్ల రూల్ బుక్కులో అటువంటి లైంగికాంశాలు రాసే ఆడవాళ్లు ‘కొంచెం లూజు’, ఈజీగానే ‘పడతారు’!
  రచన అంటేనే- అనలవేదిక ముందు అస్రనైవేద్యం; సింధు మాధురిలా లోనుంచి పెకలించుకు వచ్చే అనుభవాలను అక్షరబద్ధం చేసే రచయితల విషయంలో అయితే మరీనూ. జ్వాలా సౌందర్యాన్ని గాఢంగా కోరి, ఆ కాంతిలో ఐచ్ఛికంగా కాలి, దీపం సెమ్మ నీడలో రెక్కలు రాలిపడినా ఉపశమించని ఉసిళ్ళ మోహావేశం వంటి అనలాక్షరాపేక్ష ఉన్న ఇటువంటి రచయితలకు, అందులో ఆడవారైన పాపానికి రకరకాల రూపాల్లో, వేషాల్లో వేధింపులు ప్రతిఫలంగా ఎదురౌతుంటే ఏమవుతుంది? అక్షరానికి దాపరికం అవసరపడుతుంది, ముసుగుల పనిబడుతుంది, చివరికి సత్యాన్వేషణకి హిపోక్రసీ అడ్డుపడుతుంది.
  ‘… బాగా బేక్‌ అయిన కేక్‌లోకి నైఫ్‌ ‌దింపినట్టుగా ఉండే అనుభవాన్ని ఇద్దరం కలిసి చూద్దామ’ని బరితెగించి అడిగిన నెరజాణ సొంత కథే ఇది అనిపిస్తే అంటగట్టబడే vulnerabilities అన్నింటికీ వెరసి, కథతో తగుమాత్రం దూరాలు పాటించడానికే, బహుశా సింధు మాధురి ‘డేవిడ్’ కథకి నప్పనిదే అయినా, ఒక నాటకీయమైన ముగింపు ఇచ్చారని నా ఊహ. ప్రాచీన, అర్వాచీన తెలుగు సాహిత్యంలో(భారతీయ, ప్రపంచ సాహిత్యంల్లో కూడా కావొచ్చు) వినిపిస్తున్న స్త్రీ స్వరాలు- అయితే పురుషులవీ, లేకుంటే, యుగాల పురుషాధిక్య దౌర్జన్యం మీద reactionary గా పుట్టుకొచ్చిన ‘పెడసరి’ ‘గయ్యాళి’ స్త్రీవాదులవీనూ. ఎక్కడైనా అరుదుగా ఇప్పుడిప్పుడే సహజంగా వికసిస్తున్న, వినిపిస్తున్న గొంతుకల్ని కూడా నొక్కేసే దౌర్జన్యం పలు రూపాల్లో కొనసాగితే మిగిలేవి ముసుగులు, ముసురులే.

మీ మాటలు

*