“ఈ భూమి అమ్మకానికి లేదు”

mamata%e0%b1%a9

మెక్సికో నుంచి వచ్చిన ఉద్యమకారుల ఆజ్టెక్ నృత్య ప్రదర్శన.

 

పడమటికి వాలిపోతున్న వెలుగులో నా కారుతో పోటీ పడుతూ గుట్టలమీద జరజర పాకుతున్న కారు నీడ తప్ప మరే కదలికా లేదు.  తెల్ల సున్నం రాయి గుట్టలూ, కొండల మధ్య చిన్న చిన్న ఊర్లు దూర దూరంగా ఉన్నాయి. పేరుకు పట్టణాలు అనేవి రెండు మూడు వందల మైళ్లకు ఒకటి తగుల్తోంది. మైళ్ల కొద్దీ నా కారు తప్ప ఇంకొక కారు ఆరోడ్డు మీద కనిపించడం లేదు.

ఎంతో సేపు ప్రయాణం చేసిన తరువాత, తప్పు దారిలో వచ్చానేమో అన్న అనుమానం, ఇంకో  రెండు గంటల్లో చీకటి పడ్డాక కొండల మధ్య చీకట్లో కారు పాడయితే ఏం చేయాలనే ఆలోచన ఒకవైపు. సెల్ ఫోన్ కూడా సరిగ్గా పని చెయ్యట్లేదు. ఒక్కోసారి దగ్గరగా, ఒక్కోసారి ఉన్నదో లేదో అన్నట్లూ దూరంనుంచే మురిపిస్తూ మిస్సౌరి నది. గుట్టలు ఎక్కినప్పుడు నీలాకాశంలో సగం చందమామ నేను ఉన్నాన్లే అంటున్నాడు. ఇంత అందంలో తప్పిపోతేనేం అనికూడా అనిపిస్తోంది. హఠాత్తుగా రోడ్డు పక్కన పొలాల్లో, రోడ్డుకు సమాంతరంగా  ఒక మీటరు వెడల్పున చదును చేసిన నేల మీద నీలి రంగు పైపులు కనిపించడం మొదలయ్యింది. నిజానికి ఇవాళ్టికి అవి భూమిలో ఉండాల్సినవి. వాటిగుండా చమురు పారుతూ ఉండాల్సింది.

కాసేపటికి  రోడ్డు పక్కన ఒక చోట మూడు పోలీసు కార్లు కనిపించాయి. చెక్ పోస్టులా ఉంది. ఆ కార్లకు ఎదురుగ్గా ఉన్న రోడ్డు మీదకు కారు పోనిచ్చాను. దూరంగా విసిరేసినట్లున్న ఇళ్లను చూస్తూ ఓ పది నిమిషాలు బీటలువారిన రోడ్ల మీద తిరిగాను. నేను వెతుకుతున్న ప్రదేశం ఈ చుట్టుపక్కల లేదని అర్థమయ్యింది. ఇందాక చూసిన చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్లి మళ్లీ మెయిన్ రోడ్డు ఎక్కాను. ఈరోజుకి నేను వెళ్లాల్సిన చోటు దొరకదేమో అని నిరాశ.

నార్త్ డకోట రాష్ట్రంలో, కానన్ బాల్ అనేది ఒక చిన్న ఊరు. లకోట,  డకోట తెగలకు చెందిన స్టాండిగ్ రాక్ రిజర్వేషన్ భూభాగం చిట్టచివర, ఆకాశమే దిగివచ్చినట్లుండే నీలాల మిస్సౌరి నది పక్కన, కొండల మాటున ముడుచుకుని ఉంటుంది ఈ ఊరు. ఈ ఊరికి కొంచెం ఎగువన మిస్సౌరీ నది అడుగునుంచి డకోట ఆక్సెస్ ఆయిల్  పైప్ లైన్ వేద్దామని సంకల్పించింది  ఎన్ ట్రాన్ పార్ట్నర్స్ (Energy Transfer Partners) అనే కంపెనీ.

నార్త్ డకోట ఉత్తర ప్రాంతంలో వెలికి తీసిన చమురును, రిఫైన్ చేయడానికి సౌత్ డకోట, అయోవా రాష్ట్రాల గుండా  ఇల్లినాయ్ రాష్ట్రానికి తరలించాలని ఈ పైపులైన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యే దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నదుల కిందనుంచి గ్యాస్ లేక చమురు సరఫరా అవుతున్నప్పుడు, ప్రమాదం జరిగి నదుల్లో నీళ్లు కలుషితమయ్యాయి. ఈ పైప్ లైన్ లో కూడా అదే జరిగితే రిజర్వేషన్లోని ప్రజలకే కాక నదీ జలాల మీద ఆధారపడిన మరో పదిలక్షలమందికి తీవ్ర ప్రాణ, ఆర్థిక నష్టం జరిగుతుంది. అందుకే పైప్ లైన్ మిస్సౌరి నది దాటే చోట కొన్ని వందలమంది నేటివ్ అమెరికన్లు కలిసి పైప్ లైన్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు.

ఈ మధ్యే ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్ ఛానెల్స్ ద్వారా ఉద్యమ వార్తలు తెలుస్తున్నా. ఉద్యమకారుల దగ్గరికే వెళ్లి, ఉద్యమ నేపథ్యాన్ని తెలుసుకుందామని, వాళ్లతో ఒకపూట గడుపుదామని బయలు దేరాను.

నార్త్ డకోట రాష్టం లోని క్యానన్ బాల్ దగ్గర ఉద్యమకారుల క్యాంప్ ఉందని మాత్రమే తెలుసుకున్నాను. క్యానన్ బాల్ కు వెళ్లగానే క్యాంప్ కనిపిస్తుందని సౌత్ డకోటలో కొంత మంది చెప్పారు.  క్యానన్ బాల్ నది ఇందాకే దాటేశాను. అంటే ఊరు దగ్గరున్నట్లే. కానీ క్యాంప్ ఎంతకీ కనిపించదే!

ఒక గుట్ట దిగీదిగకముందే, మలుపులో హఠాత్తుగా రోడ్డు పక్కన చిన్న లోయలో డేరాలు, కంచెకు కట్టిన జెండాలు ఎగురుతూ కనిపించాయి.  నా గుండె వేగంగా కొట్టుకుంది. అదే! ఒచేడి షాకోవీ (Oceti Sakowin – Seven Council Fires) క్యాంప్! రోడ్డు దిగి, చిన్న గేటు దగ్గరకి కారు పోనిచ్చాను. తలకు రుమాలు కట్టుకున్న ఒక యువకుడు నా కారు దగ్గరికి వచ్చాడు. నుదుటి మీదకు వచ్చేలా కట్టిన ఆ రుమాలు మీద నన్ను ఇక్కడికి రప్పించిన నినాదం, Water is Life (నీళ్లే ప్రాణం) అని రాసి ఉంది. కారు ఎక్కడ పార్కు చేసుకోవచ్చో చూపించాడు.

కారు పార్కు చేసి, పక్కనే ఉన్న గుట్ట ఎక్కి కాసేపు నిలబడ్డాను. నాకు దగ్గర్లో ఇంకొంత మంది నిలబడ్డారు. అందరూ పలకరింపుగా నవ్వారు, ఎప్పట్నుంచో తెలిసిన స్నేహితుల్లా అనిపించింది. నా చేతిలో కెమెరా చూసి, ‘మీరు జర్నలిస్టా’ అని ఒక యువకుడు అడిగాడు, నల్లగా మెరుస్తున్న పొడవాటి జుట్టును ముఖంమీద పడకుండా ఒకచేత్తో పట్టుకుని.

“లేదు. మీ ఉద్యమానికి మా ఇండియన్ పర్యావరణ ఉద్యమకారుల తరుపున  మద్దతు తెలపడానికి వచ్చాను. ఇంతకీ మీరు ఇక్కడ ఎప్పట్నుంచి ఉంటున్నారు?” అని అడిగాను.

“నేనైతే ఈమధ్యే వచ్చాను. నా స్నేహితులు చాలామంది దాదాపు ఉద్యమం మొదలైనప్పటి నుంచి, అంటే ఏప్రిల్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. చలికాలం మొదలయ్యేలోగా పోరాటం విజయవంతం కావాలని చాలా మందిమి వచ్చాం.”

“ఏ రాష్ట్రం మీది?”

“ఏ రాష్ట్రం  కాదు. ఏ దేశం అని అడగండి. గ్రేట్ సూ నేషన్ మాది. ఓగ్లాల లకోట తెగ.” గర్వంగా అన్నాడతను. ఓగ్లాల లకోట అనేది లకోట తెగలో ఏడు ఉపతెగల్లో ఒకటి. ఇక్కడికి దాదాపు నాలుగు వందల మైళ్ల దూరంలో ఈ ఉపతెగకు కేటాయించిన రిజర్వేషన్ ఉంటుంది.

“అంత దూరం నుంచి వచ్చారా?”

“అదేమంత దూరం? కొంతమంది దక్షిణ అమెరికాలోని పెరు, చిలీ నుంచి  వచ్చారు. కొంతమంది న్యూజీలాండ్  నుంచి కూడా వచ్చారు. మీరు…? ఇండియా నుంచి కదా?”

“ఇండియా నుంచి ఈ దేశానికి వచ్చి చాలా ఏళ్లే అవుతోంది. ఇక్కడికి న్యూ జెర్సీ నుంచి వచ్చాను.”

“మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. మా గురించి ఇండియా ప్రజలకు చెప్తారు కదా?”

“నేనైతే చెప్తాను. వింటారా లేదా అన్నది వాళ్ల ఇష్టం కదా?”

అప్పటి దాకా నవ్వుతూ మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. “వాళ్లు వినాలి. ప్రపంచంలో అందరూ వినాలి. ఎందుకంటే ఇది ఇక్కడున్న వాళ్ల సమస్యనో, నాలుగు వందల మైళ్ల దూరంలో ఉన్న మా సమస్యనో కాదు. పర్యావరణ సంరక్షణ అన్నది భవిష్యత్తు తరాల పట్ల కొంచెమన్నా బాధ్యత ఉందనుకునే వారందరి సమస్య. ”అన్నాడు.

వివరంగా చెప్పమని అడుగుదామని అనుకునేలోగా అతన్నెవరో పిలిచారు. “ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.” అంటూ వెళ్లిపోయాడతను.

కొద్దిసేపు అక్కడే నిలబడి కొన్ని ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించాను. నా ముందు పరుచుకున్న అద్భుత దృశ్యం నా కెమెరా లెన్సుకు పూర్తిగా చిక్కడం లేదు. దూరాన కొండల ముందు రిబ్బనులా వంపులు తిరిగి మిస్సౌరి నదిలో కలవబోయే ఒయాహే సరోవరం(Lake Oahe) చాలా దూరానికీ నీలంగా మెరుస్తూ కనిపిస్తోంది. ఆ సరోవరానికీ నాకూ మధ్య  వందల కొద్దీ గుడారాలు, టీపీలు (త్రిభుజాకారంలో జంతు చర్మంతో సూ తెగ ప్రజలు వేసుకునే గుడారాలు). వాటిమధ్య ఒక మట్టి బాట, బాటకు అటూ ఇటూ వివిధ తెగల జెండాలు ఎగురుతున్నాయి. గుట్ట దిగువన గుర్రాల కోసం కట్టిన కంచె.

గుట్ట దిగి గుడారాల మధ్య నడిచాను. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు. ఒక గుడారం ముందు ఇద్దరు మహిళలు కూర్చుని సూప్ తింటూ కనిపించారు.

“మీతో కూర్చోవచ్చా” మొహమాటం లేకుండా అడిగేశాను.

“తప్పకుండా.”

వాళ్ల పక్కనే నేలమీద కూర్చున్నాను.

“నా పేరు మమత. న్యూ జెర్సీ నుంచి వచ్చాను. మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?”

“నా పేరు సూసన్. నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి, నా స్నేహితురాలు బార్బర,  సౌత్ డకోట నుంచి.” (ఈ పేర్లు వాళ్ల నిజం పేర్లు కాదు.)

“ఎప్పటిదాక ఉంటారు?”

“పైప్ లైన్ నిర్మాణం ఆగిపోయేదాక. ఎంతకాలమైనా సరే. బార్బర రిటైర్డ్ టీచర్. నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చాను.” సూసన్ అన్నది.

“అదేంటి. వెనక్కి వెళ్లినప్పుడు కష్టం కాదూ? అట్లాంటి కష్టమైన నిర్ణయం తీసుకునేంత ముఖ్యమా ఈ ఉద్యమం?”

“ఒక్కోసారి  తప్పదు. దాదాపు 300 నేటివ్ అమెరికన్ తెగలు ఒక సమస్య గురించి పోరాడడానికి కలిసిరావడం సామాన్య విషయం కాదు. ఈ సమస్య కూడా సామాన్యమైనది కాదు కదా? మనుషులు, చెట్లు, జంతువులు, ప్రకృతిలో భాగమని నమ్ముతాం.  పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి  ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం. మేం నిరసన కారులం కాము, ప్రకృతి సంరక్షకులం. మా కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా ఫ్రాకింగ్ జరుగుతోంది. అక్కడ కూడా ఉద్యమాలలో పాల్గొన్నాను. మా గొడవ ఎవరూ పట్టించుకోకుండానే నేను పాల్గొన్న ఉద్యమం సమిసిపోయింది. ఇక్కడ ఉద్యమం కూడా ఈ రిజర్వేషన్లోనే ఒక చిన్న గుంపు మొదలుపెట్టింది. తమతో ఎవరు కలిసినా కలవకపోయినా పోరాడకుండా ఓటమిని అంగీకరించకూడదని అనుకున్నారేమో.”

“ఆ చిన్ని బృందానికి అంత ధైర్యం ఎట్లా వచ్చింది?”

mamata1

అప్పటిదాక ఏమీ మాట్లాడని బార్బరా బదులిచ్చింది, “మీకు కొంచెం మా చరిత్ర చెప్తాను. ఒక నూటాయాభై ఏళ్ల క్రితం నుంచి జరిగిన చరిత్ర చెప్తాను. 1860ల్లో అమెరికా పడమరవైపు ఉన్న మా భూముల్లోకి చొచ్చుకుని వస్తున్న కాలం. అమెరికా సైన్యం చాలా బలమైంది. అయినా చాలా తెగలు ఆ దురాక్రమణను వీరోచితంగా ప్రతిఘటించాయి. నేటివ్ అమెరికన్ తెగలను అణిచివేయాలని ఎన్నో సైనిక దళాలు దేశమంతా దండయాత్రలు మొదలుపెట్టాయి.

1863 వేసవి చివర లకోట, ఇంకొన్ని మిత్ర తెగలు కలిసి మిస్సౌరి నదికి అవతలి వైపున విడిది చేసి చలికాలం కోసం తయారవుతున్నారు. అడవి బర్రెల వేటలు ముగించి, మాంసం ఎండబెట్టడం, టిపిలు వేసుకోవడం, బర్రె చర్మం దుప్పట్లు తయారు చేసి అమ్ముకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మొత్తం విడిదిలో 3000 మంది దాకా ఉన్నారు. అట్లాంటి విడిది దగ్గరకు సైనిక దళాలు వచ్చాయి. ఆ దళాలు యుద్ధానికే వచ్చాయని భావించి, తాము యుద్ధం చేయడానికి గుమిగూడ లేదని, శాంతియుతంగా తమ పని తాము చేసుకుంటున్నామని తెలియజేయడానికి కొంతమంది నాయకులు తెల్లజెండాలు పట్టుకుని సైనిక నాయకుడి దగ్గరకు వెళ్లారు. అట్లా వెళ్లిన నాయకులను సైన్యం బంధించడం దూరన్నుంచి గమనించిన యువకులు  విడిదిలోని ప్రజలను వెంటనే అక్కడ్నుంచి పారిపొమ్మని హెచ్చరించారు.

కానీ సైన్యం విడిదిని చుట్టుముట్టి దాదాపు 400 మందిని ఆరోజు హతమార్చింది. విడిదిలో ఉన్న మగవాళ్లు హఠాత్తుగా వచ్చి పడిన సైన్యాన్ని ఎదిరించకపోయివుంటే, అక్కడ్నుంచి పారిపోలేక ఇంకా ఎన్ని వందలమంది చనిపోయేవారో. ఖాళీ అయిన విడిదిలో చలికాలం కోసం పోగేసిన మాంసాన్ని, రోజువారి సామాగ్రిని, టిపీలను గుట్టలుగా పోగేసి తగలబెట్టింది సైన్యం. అక్కడ్నుంచి పారిపోయి మిస్సౌరి నది దాటి వచ్చిన జనం ఈ ప్రాంతంలో మెల్లగా నిలదొక్కుకున్నారు. సైన్యం నేటివ్ అమెరికన్ తెగలను పూర్తిగా హతమార్చలేకపోయింది. మా వీరులు అడపాదడపా సైన్యంతో తలపడేవారు. చివరికి ఎవరికీ శాంతి లేదని, 1868లో అమెరికా ప్రభుత్వం మా తెగలతో  ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం లకోట, డకోట తెగలకు, ఇంకొన్ని మిత్ర తెగలకు చెందిన ప్రజలకు ఇప్పటి డకోటా రాష్ట్రాల్లో, మిస్సౌరి నదికి పడమర ఉన్న భూభాగాన్ని, మిస్సౌరి నదిని, పవిత్రమైన బ్లాక్ హిల్స్ ను  కేటాయించి “గ్రేట్ సూ నేషన్” అని రిజర్వేషన్ కు పేరు పెట్టింది.

ఈ ప్రాంతమంతా స్వేచ్ఛగా తిరగాడిన ప్రజలకు సరిహద్దులు ఏర్పాటు చేసింది. అయితే  తెగలతో చేసుకున్న ఒప్పందాల మీద అమెరికా ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవంలేదని మాకు రెండేళ్లలోనే తెలిసివచ్చింది. 1870ల్లో బ్లాక్ హిల్స్ పర్వతాల్లో బంగారం బయటపడింది. మాకు కేటాయించిన భూభాగాన్ని ముక్కలు చేసి ఆ పర్వత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది అమెరికా ప్రభుత్వం. ఎదురు చెప్పిన తెగలకు బ్లాక్ హిల్స్ కొంటామని బేరం పెట్టింది. “మనుషులు నడయాడే భూమిని ఎవరూ అమ్మలేరు.” అంటూ ఓగ్లాల లకోట వీరుడు తాషుంక వీట్కొ (Crazy Horse)  అమెరికా ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఆయన, మరో నాయకుడు  తతంక యియోతక (Sitting Bull) కలిసి కొన్ని యుద్ధాలు చేశారు. తతంక యియోతక ఇందాక చెప్పిన హత్యాకాండలో సైన్యంతో పోరాడి చివరికి ప్రాణాలతో బయటపడిన హుంక్పప లకోట తెగ వీరుడు. అయితే, కొన్ని నెలల్లోనే తాషుంక వీట్కోను హత్య చేశారు. తతంక యియోతక అప్పటికే పెద్దవాడు. తాషుంక వీట్కో హత్య తరువాత ఒంటరివాడై, అలసిపోయిన తన అనుచర బృందంతో సహా సైన్యానికి లొంగిపోయాడు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే బ్లాక్ హిల్స్ అమెరికా పరమయ్యాయి. 1980లో మాకు క్షమాపణలు చెప్పి, 102 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది కానీ, మేం ఒప్పుకోలేదు. ఆ డబ్బును అమెరికా ప్రభుత్వం ఒక ట్రస్టులో పెట్టింది. ఈనాటికి అది $1.3 బిలియన్ డాలర్లయింది. ఆ డబ్బు మాకు వద్దు. మా నాయకుడు తాషుంక వీట్కొ అన్న మాట ఎప్పటికీ మరిచిపోం. ఆయన మాటే మా మాట. ఈ భూమి…” కోపంతో, దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో ఆగిపోయింది బార్బర.

“ఈ భూమి అమ్మకానికి లేదు.” మెల్లగా అన్నాను. నాకూ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

కళ్లల్లో నీళ్లతో, చిర్నవ్వుతో చూసింది బార్బర. “ఏ దేశంలో చూసినా, ఏ మూల చూసినా అవే అన్యాయాలు, దుఃఖాలు కదూ?” నిర్లిప్తంగా అన్నది సూసన్.

“అంతే ధైర్యంతో పోరాటాలు… “ అన్నాను.

ఊపిరి పీల్చుకుని మళ్లీ అందుకుంది బార్బర, “అప్పట్లోనే మా ఒక్క గ్రేట్ సూ నేషన్ ను ఆరు రిజర్వేషన్ భూభాగాలలో కుదించారు. ఇప్పటికీ ప్రైవేట్ సంస్థలకు అమ్ముతూ కొంచెం కొంచెంగా మా భూమిని ఆక్రమిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ పక్కన కనిపిస్తొందే ఒహాయే సరస్సు. అది నిజానికి ఒక రిజర్వాయర్.  మిస్సౌరి నదిని దాటి వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరుచుకున్నారు. మెల్లగా వ్యవసాయం, వ్యాపారాలు మొదలు పెట్టారు. చుట్టుపక్కల కొన్ని టౌన్లు ఏర్పడ్డాయి. అయితే 1944లో ఇక్కడ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1948లో నిర్మాణం ప్రారంభమయ్యింది, 1968లో కెన్నెడీ డ్యాము ప్రారంభోత్సవం చేశాడు. తెగ ప్రజలు ఎంత ప్రతిఘటించినా  ఫలితం లేకపోయింది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. కృత్రిమ సరస్సు ఒయాహే కింద కొన్ని టౌన్లు, పంట భూములు, విలువైన మూలికలు దొరికే స్థలాలు మునిగిపోయాయి. ఇప్పుడు మిగిలిన భూమిలో సున్నం ఎక్కువ కలిసి వుంది. పంటలు మునుపటిలా పండవు. అరుదైన మూలికలను పోగొట్టుకున్నారు ప్రజలు.  ‘ఈ రిజర్వేషన్లో ముసలి వాళ్లు ఎక్కువ కనిపించరేమి’ అని అడిగితే.‘పెద్దవాళ్లు గుండెపగిలి చనిపోయారు’ అని అంటారు. నిజంగానే ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు ఈ రిజర్వేషన్ ప్రజలు. ఇప్పుడు ఈ పైప్ లైన్ మరో పెద్ద దెబ్బ.”

“పైప్ లైన్ వేసేముందు ఈ రిజర్వేషన్ ప్రజల అభిప్రాయం కోసం మీటింగులేవీ పెట్టలేదా? ఇంతకీ ఇప్పటి టెక్నాలజీ తయారైన పైపులు సురక్షితమైనవని అంటున్నారు?” నా ప్రశ్నకు నాకే విరక్తితో నవ్వొచ్చింది.

“నిజానికి ఈ పైప్ లైన్ ఇక్కడికి ఎంతో ఎగువన మిస్సౌరి నదిని దాటాలన్నది మొదటి ప్రణాళిక. అప్పుడు వీళ్లను పిలువలేదు. ప్రపంచానికైతే పైపులు సురక్షితమని చెప్తున్నారు కానీ,అవే పైపులు పగిలితే బిస్మార్క్ నగరానికి ప్రమాదమని దారి మళ్లించారు. అంటే వాళ్లకూ వాళ్ల పైపుల మీద నమ్మకాలు లేవు. దారి మళ్లించినప్పుడు తెగ నాయకులతో మంతనాలు జరిగినప్పుడు, ఈ రిజర్వేషన్ చైర్మెన్ డేవ్ ఆర్చెమ్ బాల్ట్ తెగ ప్రజలు ఈ పైప్ లైన్ కు విరుద్ధమని ఖచ్చితంగా చెప్పాడు. అయినా ఈ స్థలాన్ని పైప్ లైన్ కు కేటాయించింది ఆర్మీ కార్ప్స్ ప్రభుత్వ విభాగం. ఒకరోజు పవిత్ర స్థలాలనేమీ పట్టించుకోకుండా బుల్ డోజర్లతో ఆ ప్రదేశాన్నంతా చదును చేసేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన ఉద్యమకారుల మీద వేటకుక్కలతో దాడిచేశారు.”

 

సూసన్ మధ్యలో అందుకుని చెప్పింది,  “ఇంతకీ ఆ దాడి ఎప్పుడు జరిగిందో తెలుసా? సెప్టెంబరు 3న! నూటాయభై మూడు సంవత్సరాల క్రితం అదే రోజున వీళ్ల పూర్వీకుల విడిది మీద దాడి చేసి, పిల్లలని కూడా చూడకుండా, దొరికిన వాళ్లను దొరికినట్లు అతిదగ్గరగా తుపాకులతో కాల్చి దారుణంగా హత్య చేసిన రోజు.”

అవునన్నట్లు తలాడించింది బార్బరా, “నేటివ్ అమెరికన్లను ప్రాణమున్న మనుషులు అనుకోరు, ఇక పవిత్ర స్థలాల గురించి ఏం పట్టించుకుంటారు? ఇంతలా తెగించి పోరాడడానికి అసలు కారణం మిస్సౌరి నది. మంచినీళ్లు తాగడానికి కూడా భయపడే పరిస్థితి. చమురు తాగి బతకలేం కదా? నీళ్లే ప్రాణం కదూ? ఇక తెగించి పోరాడాల్సిందే.”

ఇంతలో కొంత మంది పిల్లలు ఒకరినొకరు తరుముకుంటూ పరిగెత్తుతున్నారు.

“ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. బడి ఎట్లా వీళ్లకు? శని ఆదివారాలు వచ్చి వెళ్తుంటారా?”

సూసన్ సమాధానమిచ్చింది, “లేదు, కొంత మంది చాలా దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఒక బడి కూడా ఏర్పాటైంది. ఒక ఊరిలో ఉండాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చలికాలంలో మంచు తుపాన్లు పెద్ద ఎత్తున చెలరేగుతాయి. ఒక పెద్ద లాడ్జి ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నారు. అందరం కాకుండా వంతులవారిగా వచ్చి వెళ్లాలని అనుకుంటున్నాం. పరమ క్రూరంగా ప్రవర్తిస్తున్న నార్త్ డకోట పోలీసులకంటే, ప్రభుత్వం కంటే క్రూరమైనవి కావు మంచు తుపాన్లు.”

పకపక నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ కాసేపు కూర్చున్నాం.

“ఇంత మంది ఎలా కలిసి కట్టుగా పని చేస్తున్నారు?  ఈ ఉద్యమంలో ఇన్ని నేటివ్ అమెరికన్ తెగలు కలిసిరావడం చూస్తే  ఇంత మంది మద్దతు ఎలా సంపాదించుకోగలిగారు?” అని నా ఆశ్చర్యాన్ని ప్రకటించాను.

“మొదటిది, మేం నిజానికి కలిసికట్టుగా లేం. ఈ చుట్టుపక్కల ఐదు క్యాంపులున్నాయి. ఇక్కడ కూడా సైద్ధాంతికపరమైన అభిప్రాయ భేదాలు వున్నాయి. అయితే, పోలీసులతోనో, సెక్యూరిటీ గార్డులతోనో గొడవలైనప్పుడు, ర్యాలీలో పాల్గొనేటప్పుడు మా నాయకులు ఒకరినొకరు సంప్రదించుకుంటారు. అందరం కలిసే పోరాడుతాం. ఏదో ఒకలా చిన్న చిన్న ఉద్యమాల్లోనో, ర్యాలీలోనో పాల్గొని ఓడిపోయి, ఇక ఏం చెయ్యలేం అనుకున్నప్పుడు ఒక చిన్న గుంపు ప్రభుత్వాన్ని, ఒక మెగా కార్పొరేషన్ను ఎదుర్కుంటోందని తెలిసినప్పుడు మళ్లీ ఆశ పుడుతుంది. ఒక్క చోటైనా ఉద్యమం గెలవదా అని. వేరే ఎన్ని కారణాలున్నా, ఇప్పుడు మన అందరి ముందు ఉన్నది పర్యావరణ సమస్య. కొన్ని రాష్ట్రాల్లో అనావృష్టి, ఎక్కువౌతున్న టొర్నడోలు, హరికేన్లు, మంచు తుపాన్లు, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు. ఈ ప్రకృతి వైపరిత్యాలు ఎప్పుడూ ఉన్నాయి, కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో, ఇంత విధ్వంస పూరితంగా లేవు. భూకంపాలు కూడా ఫ్రాకింగ్, షేల్ గ్యాస్ కోసం తవ్వకాల్లో ఉపయోగించిన కలుషిత నీటిని భూగర్భంలో భద్రపరచడం వల్ల కూడా ఎక్కువయ్యాయి. భూతాపాన్ని అపాలంటే భూగర్భ వనరులను ఇక ఏమాత్రం వెలికి తీయకూడదని ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నా ఇంకా చమురు, బొగ్గు, షేల్ గ్యాస్ వంటి భూగర్భ వనరులను వెలికి తీస్తునే ఉన్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఖర్చవుతున్న 3.5 బిలియన్ డాలర్లు వాయు, సౌర శక్తి లాంటి ప్రాజెక్టులకు పెట్టరు. అందులో ఎక్కువ లాభాలు ఉండవని. భూమే మిగలనప్పుడు లాభాలతో ఏం చేసుకుంటారో. డోనాల్డ్ ట్రంప్ పర్యావరణ విపత్తు మీద నమ్మకంలేదని అంటాడు. ట్రంప్ కు ఐర్లాండ్ దేశంలో, సముద్రం పక్కన ఒక  గోల్ఫ్ కోర్స్ వుంది. ఎలక్షన్ కు కొన్ని రోజుల ముందే, ఆ గోల్ఫ్ కోర్సు చుట్టూ ఎత్తైన గోడ నిర్మించేందుకు ఆ ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. భూతాపం వల్ల సముద్రమట్టం పెరిగి మునిగిపోతుందని కారణం చెప్పాడు. ఎంత ఎత్తు గోడ కట్టాలనుకుంటున్నాడో, భూమి కుంగి పోతే ఏం చేస్తాడో?”

కాసేపు మౌనంగా కూర్చున్నాం. నాకు అక్కడనుంచి కదలాలనిపించలేదు. కానీ, మాముందు నీడలు పొడుగవుతున్నాయి. “ఇక బయల్దేరుతాను. ముందు దారి ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.” అంటూ లేచి  నిలబడ్డాను.

%e0%b0%ae%e0%b0%ae%e0%b0%a4%e0%b1%a8

ఇద్దరూ లేచి నిలబడ్డారు. “అభివృధ్ధి పేరిట ఇంకా ఎంత మందిమి చనిపోవాలి? ఎంతమంది నిర్వాసితులు కావాలి? చావో బతుకో, ఇక పోరాడాల్సిందే. ఇంతవరకూ మనకు ప్రాణ మిచ్చిన భూమి కోసం, నీటి కోసం  పోరాడాలి.”

అక్టోబరు మొదటి వారాంతాన, బార్బరా, సూసన్లతో నేను మాట్లాడిన రోజు వాళ్లకు ప్రశాంతంగా గడిచిన ఆఖరి రోజు. మరుసటి రోజునుంచే ఆందోళనకరమైన వార్తలు వినవస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని ఏ ప్రముఖ న్యూస్ మీడియా పట్టించుకోకపోయినప్పుడు, “డెమాక్రసీ నౌ” అనే వార్తా సంస్థ అధిపతి అయిన ఏమీ గుడ్ మన్ ఉద్యమకారుల మీద దాడిని మొదటిసారి రికార్డు చేసి ప్రపంచం ముందు పెట్టింది. ఏమీ మీద ట్రెస్ పాసింగ్ కేసు పై అరెస్టు వారంట్ ఇచ్చారు. జర్నలిస్టుగా తన విధి నిర్వహణ ప్రకారం వీడియోలు తీశానని కోర్టులో చెప్పుకున్న తరువాతే ఆమెపై కేసు ఎత్తివేశారు. పైపులైను నిర్మాణాన్ని శాంతియుతంగానే అడ్దుకునేందుకు వెళ్లిన వాళ్లమీద పెప్పర్ స్ప్రే, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించారు. ఎన్నో వందలమందిని అరెస్టు చేశారు. రిజర్వేషన్ చైర్మెన్ అయిన డేవ్ ఆర్చెంబల్ట్ ను కూడా అరెస్టు చేశారు.

ఇటీవల, నవంబరు 24 (అమెరికన్ హాలిడే అయిన థాంక్స్ గివింగ్ రోజు) రాత్రి జరిగిన పోరాటంలో ఉద్యమకారుల మీద రబ్బరు బుల్లెట్లతో పాటు, పెప్పర్ స్ప్రే కలిపిన వాటర్ క్యానన్స్ ప్రయోగించారు. ఆ సమయంలో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలు. ఒక పెద్దాయనకు గుండెపోటు వచ్చింది. కొంతమంది అల్పోష్ణస్థితికి గురయ్యారు. ఉద్యమకారులకు వైద్యులూ మద్ధతు ఇస్తూ అక్కడ ఉన్నారు కనుక వెంటనే వైద్య సహాయం అందబట్టి బతికిపోయారు లేకపోతే కొందరు గుండె ఆగి పోయో, శ్వాస ఆడకో మరణించి వుండేవారు. ఒక పోలీసు విసిరిన క్యానిస్టర్ తగిలి ఒక యువతి చెయ్యి ఎముక చిట్లిపోయింది. ఇంత జరిగినా ఉద్యమకారులు తమ పోరాటం ఆపేదిలేదని చెబుతున్నారు.

*

 

 

మీ మాటలు

 1. ‘అమెరికన్ నాగరికత ఒక పెద్ద అబద్ధం’ కుంటాకింటే (ఏడుతరాలు) గుర్తుకు వస్తున్నాయి. ఈ సో కాల్డ్ నాగరికుల వెనుక ఉన్న చీకటిని బయటకు తీసి మాకు చెప్పటం ఎంతో అపురూపం.ఇదే అంశం మీద మాతృకలో నువ్వు అనుసృజిస్తున్న ‘అపరాజిత’ సీరియల్ ను చాలా మంది చదువుతున్నారు.

 2. K.Rajitha says:

  ఇండస్ మార్టిన్ గారు, అభినందనలు..అభివృద్ధి పేరిట విధ్వంసం ,ప్రపంచం మొత్తం మీద అమెరికాలోనే ఎక్కువ జరుగుతున్నా ,మేము అత్యంత eco ఫ్రెండ్లీ అని వేరే దేశాలను దుమ్మెత్తిపోస్తారు..నేటివ్ అమెరికన్స్ ని ఎన్ని రకాలుగా హింసిస్తూన్న వారి పోరాట పటిమ అద్భుతం..Thank you Very much for the informative writeup ..👍👌💐

 3. ప్రసాద్ చరసాల says:

  ఈ నేటివ్ ఇండియన్ల గాధ వింటే ఏ గుండె అయినా కరగక మానదు. వాళ్ళని వారి సొంతనేలమీదే పరాయివారిని చేసిన వైనం కళ్ళముందు కనిపించే కఠోర వాస్తవం.
  మీ కథనం క్యాంపును ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించింది. మధ్యలో కళ్ళలో నీళ్ళతో, పూడుకుపోయిన గొంతుతో చదవడం కష్టమయింది.

  “మనుషులు నడయాడే భూమిని ఎవరూ అమ్మలేరు” — నిజమే కదా! పంచ భూతాలలో ఒక్కో భూతాన్ని ఒడిసిపట్టి అమ్మకానికి పెడుతుంది పెట్టుబడిదారీ వర్గం. మున్ముందు పంచ భూతాలలో ఒక్కటైనా మిగులుతుందా కొనకుండా..అమ్మకుండా..

 4. manjari alkshmi says:

  బాగుంది.

 5. ari sitaramayya says:

  థాంక్స్, మమతా, బాగారాశావమ్మా.
  రాబోయే నాలుగేళ్లలో (ఎనిమిదేళ్లలో) అభివృద్ధి పేరిట ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో!

 6. Amarendra Dasari says:

  Thank u mamathaa…Idi Sahityam paridhi daati badugu jeevita pranganaala mundu pathakulanu niladeesi nilabette rachana

 7. Shanti Prabodha says:

  ప్రపంచంలో ఏమూల కెళ్ళినా ఏమున్నది గర్వకారణం? అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసం తప్ప . చాలా చక్కగా విషయాన్నీ ప్రపంచం ముందు పెట్టారు మమతగారు . అభినందనలు .

 8. “ఏ దేశంలో చూసినా, ఏ మూల చూసినా అవే అన్యాయాలు, దుఃఖాలు .. నిజమే ఎక్కడ ఒకజాతి అభద్రతకు,అణచివేతకు గురి అవుతుందో అక్కడ తిరుగుబాటు…అంతే ధైర్యంతో స్వతంత్ర హక్కులకోసం పోరాటాలు తప్పవు ….చాలా బావుంది. రచయిత్రికి అభినందనలు

 9. మమతా , ఇదే నిజం ప్రపంచం లో ఈ మూల చూసినా అదే జరుగుతుంది ప్రతి మనిషి జీవితం ,ప్రాణం సమానమైన విలువ లేక పోవడం అదే మన ఆదివాసీల విషయంలో కూడా జరుగుతుంది , నిజంగా మనః స్ఫూర్తి అభినందనలు నీకు , అంత దూరం వెళ్లి ఉన్న కొన్ని గంటలు చాలు మనం బతికే ఉన్నామని కొన్ని రోజులు మనకివ్వడానికి ఈ మాటలు ఎంత నిజం ‘ ప్రపంచానికైతే పైపులు సురక్షితమని చెప్తున్నారు కానీ,అవే పైపులు పగిలితే బిస్మార్క్ నగరానికి ప్రమాదమని దారి మళ్లించారు. అంటే వాళ్లకూ వాళ్ల పైపుల మీద నమ్మకాలు లేవు ‘ ఎంత డెప్త్ ఉంది వాళ్ళ వేదనలో, ఈ ఒక్క మాట చాలు ఒక జీవిత కాల పోరాటానికి చాలా విలువైన రైట్ అప్ … కీప్ ఇట్ అప్ టైం కేటాయించినందుకు రైట్ అప్ కి , నీ కంపాషన్ కి త్యాంక్యూ .

 10. రాఘవ says:

  మమత గారూ! – థాంక్యూ! – ఎంత కదిలించేలా రాశారు!

మీ మాటలు

*