బిస్కెట్

 

 

Padmaja-నాగ పద్మజ

~

(ఇది నాగపద్మజ తొలి కథ. ఆమె   గుంటూరు లో ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. )

*

“నేను కొత్త కొత్త మెథొడ్స్ నేర్చుకుని పిల్లలకు ఇంకా బాగా చెప్పాలి అని ఈ కోర్స్ లో చేరాను ” చెప్పి తన సీట్ లో కూర్చుంది మాధవి.

“నాది గవర్నమెంట్ జాబ్ , బి ఎడ్ కంప్లీట్ అయితే ఎస్ జీ టీ గా ప్రొమోషన్ వస్తుంది హై స్కూల్ కి టీచ్ చెయ్యచ్చు.. అందుకే జాయిన్ అయ్యాను “, అన్నది స్వాతి

” నేను ఇదివరకు జర్నలిస్ట్ ని, డిల్లీ లో ఉరుకుల పరుగుల జీవితం తో అలిసిపోయి, పిల్లలతో అసోసియేట్ అవుదామని రెండేళ్ళ క్రితం ఈ జనారణ్యానికి దూరంగా వున్న ఒక బోర్డింగ్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా చేరాను.   జర్నలిజం  స్కిల్స్  తో  మాత్రమే అయితే క్లాసు రూమ్ లో పిల్లలకు న్యాయం చెయ్యలేనేమో అనిపించింది. అందుకే ఈ ఫార్మల్ ట్రైనింగ్ ఆప్ట్ చేశాను ” ఇంగ్లిష్ లో చెప్పింది దేవిక నాయర్.

” మాది మిషనరీ స్కూల్, బి ఎడ్ చేస్తే ప్రాస్పెక్ట్స్  బాగుంటాయని సిస్టర్ సలహా ఇచ్చారు.. అందుకని ..” సిన్సియర్గా చెప్పింది సూసన్.

” నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, ఇలాంటి ఒక మంచి ప్రొఫెషనల్ ట్రైనింగ్ వల్ల నా స్టూడెంట్స్ కి ఎంతో లాభం ఉంటుందని అనిపించింది, నేను కూడా ఇంకా స్మార్ట్ గా పని చేయగలుగుతాను..” లోకల్ స్కూల్ లో సైన్సు చెప్పే నందన.

…..

వివిధ జిల్లాల నించి డిస్టెన్స్ కోర్స్ క్లాసెస్ కోసం అక్కడ జమయిన ముప్పై మంది ఇన్-సర్వీస్ టీచర్ లు తమని తాము పరిచయం చేసుకున్నారు.

” వెరీ గుడ్, మీ అందరి ఆశయాలు వింటుంటే నాకు గర్వంగా వుంది…  ముప్పై వేలు పడేస్తే డిగ్రీ చేతికోచ్చే ఈ కాలం లో మీరంతా ఇంత కఠినమయిన ఎంట్రన్స్ పరీక్ష నెగ్గి ఎంతెంతో దూరాల నించి వచ్చి మా డిస్టెన్స్ కోర్స్ లో జాయిన్ అవడం చిన్న విషయంగా నేను అనుకోవడం లేదు …  ఇక మనం కోర్స్ గురించీ, వచ్చే రెండు వారాల వర్క్ షాప్ గురించీ వివరంగా తెలుసుకుందాం ..” ఫాకల్టీ చెప్పుకుపోయింది.

*   *   *

లంచ్ టైం. అందరూ కబుర్లూ కూరలూ పంచుకుంటూ భోజనం చేస్తున్నారు. మాధవి ఫోన్ రింగయింది.

” చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే .. నేను అప్పుడే చెప్పాను ..టార్గెట్స్ ఫినిష్ చేసుకుని వెకేషన్ కి వెళ్ళమని… ” ఫోన్ లో సరాసరి విజయవాడకే వినపెడేటట్టుగా అరుస్తోంది మాధవి.

“.. సర్లే చూస్తాలే” ఫోన్ పెట్టేసి తలెత్తే సరికి అంతా తననే చూస్తున్నారు .

“ఎనీ థింగ్ సీరియస్?” దేవిక అడిగింది.

“ఏం లేదు. నా ఫ్రెండ్, నాతో పాటే పని చేస్తుంది హిందీ చెప్తుంది ప్రైమరీ పిల్లలకు. టార్గెట్స్ మీట్ అవలేదట .. నా దగ్గరేమయినా కాంటాక్ట్స్ వుంటే చెప్పమంటోoది.  అది కాదు నా బాధ … కావలిస్తే డబ్బులిస్తానంటోంది” ఆవేశంగా వివరించింది మాధవి.

“టార్గెట్సా? ఏం టార్గెట్స్??”

“అదేనండి, ఈ ఇయర్ మాకు పది అడ్మిషన్స్ టార్గెట్ పెట్టారు, ఇలాంటి సమస్య వస్తుందనే నేను మార్చ్ నుంచే ఒక్క నిముషం కూడా వేస్ట్ చెయ్యకుండా ఎక్కే గడపా దిగే గడపా అని చూడకుండా కష్టపడ్డాను. సరిగ్గా నిన్నటితో నా పది అడ్మిషన్స్ పూర్తి చూసుకుని ఇవ్వాళ ఇలా  రాగలిగాను. కష్టపడకుండానే అన్నీ కావాలంటారు”

“మీరు దేని గురించి మాట్లాడుతున్నారో కొంచం చెప్తారా?” అసహనంగా అడిగింది దేవికా నాయర్.

అంతా అనుమానంగా దేవిక వైపు చూసారు. ఈవిడ నటిస్తోందా లేక నిజంగానే అర్ధం కాలేదా?

“ప్రతి టీచర్ కి కొన్ని అడ్మిషన్స్ తీసుకురావాలి అన్న ఒక టార్గెట్ వుంటుంది ఇక్కడ… ” సుసాన్ వివరించబోయింది

“తీసుకురాలేకపోతే .. ”  గాభరాగా అడ్డుపడింది దేవిక.

” ఉద్యోగం ఊష్టింగే ” కక్షగా అంది మాధవి.

“కొన్ని స్కూళ్ళలో మూడు నెలలు జీతం ఇవ్వరు… పొమ్మనక పొగ పెట్టడం అన్నమాట” నందన పూరించింది.

“ఆc .. టీచర్లా సేల్స్ గరల్సా !!”

“ఈ రెండు నెలలు మాకు  తప్పదు”

“మీ స్కూల్ లో పిల్లలెంత మంది ?” దేవికకి ఇంకా మింగుడు పడలేదు

“ఒక పదహైదు వందల మంది వుంటారు”

“మై గుడ్నెస్! అంత మంది వుంటే మరి మీకీ తిప్పలెందుకు?”

“వెళ్ళే వాళ్ళు కూడా వుంటారు కదా దేవికా!”

“ఎందుకుంటారు ?”

“అవతల వేరే స్కూళ్ళు కూడా ఇలాగే కాంపైన్ చేస్తుంటారు కదా మేడం, వాళ్ళూ ఎదో బిస్కెట్ వేస్తారు కదా”

“మీరిక్కడ పది మందితో మాట్లాడుతుంటే అక్కడ మీ పది మందిని వేరే వాళ్ళు బుట్టలో వేస్తుంటారన్న మాట ..  ”

“అంతే కదా..”

“ఈ మాత్రం దానికి ఇటు మీరు అటు వాళ్ళూ రోడ్ల మీద పడటం దేనికి” దేవిక కన్విన్స్ కాలేదు

“మీరు చెప్పేది మరీ బాగుంది.. అట్లా వదిలేస్తే స్కూల్ ఖాళీ అవుతుంది కొన్నాళ్ళకి. ”

“ఎందుకవుతుంది .. ఇదే యత్నం  చదువు చెప్పడం లో పెడితే వాళ్ళే వుంటారు. అసలు మీరీ గొడవ లో పడి పిల్లల చదువు మీద ఎంత మాత్రం దృష్టి పెట్టగలుగుతారు .. ఈ రకంగా మీకు టీచింగ్ స్కిల్స్ కంటే మార్కెటింగ్ స్కిల్సే ఎక్కువ అవసరంలా కనిపిస్తోంది”

“మేమేదో ఇదంతా ఇష్ట పడి చేస్తున్నట్టు మీరనుకుంటున్నట్లుందే.. మేనేజ్ మెంట్ చెప్పినట్లు చెయ్యడమే మా పని” మాధవి నిష్టూరపడింది.

“కాంటీన్ లో కాఫీ దొరుకుతుందేమో చూద్దాం వస్తారా”, చర్చ వేడెక్కుతుండంతో నందన దేవికని మరల్చింది.

*  * *

ఇద్దరూ లంచ్ బాగ్స్ కట్టిపెట్టి కాంటీన్ కి బయలుదేరారు. సంభాషణ ఇంగ్లిష్ లో సాగింది.

దేవిక తన అనుమానం బయట పెట్టింది. “మాధవి చెప్పేది నిజమే నంటారా ?”

“మాధవి చెప్పింది కేవలం సముద్రం లో నీటి బొట్టంతే, ఇంకా చాలా వుంది. మీకు మా రాష్ట్రం సంగతీ ఈ జిల్లాల సంగతీ బొత్తిగా తెలియక ఆశ్చర్య పోతున్నారు కాని ఈ విషయం ఇక్కడ చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు. అందునా ఇవి పేరు మోసిన చదువుల నిలయాలు. మార్కెటింగ్ ఎబిలిటీ వున్న వాళ్ళనే టీచర్స్ గా తీసుకుంటారు ఇక్కడ స్కూల్స్ లో. దాని వల్ల  పిల్లల చదువు దెబ్బతిన్నా పెద్దగా పట్టిచ్చుకోరు, ఎందుకంటే పిల్లల రిపోర్ట్ కార్డ్స్ మీద అందంగా మార్కులూ గ్రేడ్లూ చూపించడం చేతిలో పని. పేరెంట్స్ నించి సమస్య రాకుండా అట్నించి కమ్ముకొస్తారన్న మాట. పైగా సిలబస్ అంతా అయినట్లు చూపడం కోసం పిల్లలతో పుంఖాను పుంఖాలుగా నోట్సులు రాయిస్తారు.”

” నాకంతా అయోమయంగా వుంది, ఇలాంటి మోసాన్ని తల్లిదండ్రులు ఎలా సహిస్తున్నారు?”

*   *    *

” మీకీ టార్గెట్ల బాధలుండవు కదా” దేవిక స్వాతి తో అంది టీ బ్రేక్లో .

“మా బాధలు వేరు. మిడ్-డే మీల్ తో సహా నాదే బాధ్యత. మా హెడ్ మాస్టర్ స్కూల్ కి వచ్చేదే తక్కువ.  వచ్చినా ఫుల్ లోడ్ లో వస్తాడు.”

“ఊర్లో ఎవరూ కంప్లెయిన్ చెయ్యరా ?”

” వార్నింగ్ లు ఇచ్చారు, కాకపోతే రిటన్  కంప్లయంట్ ఇచ్చి వాడి “పొట్ట కొట్టటం” ఎందుకులే అని ఊరుకున్నారు”

“ఎంత మంది మీ బడిలో ?”

“ఇరవయ్ ఆరు మంది, అయిదో తరగతి వరకే” చెప్పింది స్వాతి.

“పిల్లలు తక్కువే, అయినా వేరు వేరు క్లాసుల్లో వుంటారు కదా, సిలబస్ ఎట్లా పూర్తి చేస్తారు?” జర్నలిస్ట్ బుద్ధి పోనిచ్చుకోలేదు దేవిక.

“సిలబసా పత్తికట్టా, 3R’s నేర్పిస్తాం, రీడింగ్ రైటింగ్ ఇంకా అరిత్మెటిక్. అన్ని ప్రశ్నలు మీరే అడుగుతున్నారు. మీ బోర్డింగ్ స్కూల్ సంగతేంటి.”

” హ హ.. ప్రశ్నించడం అలవాటయి పోయింది. ప్రొఫెషనల్ హజార్డ్. ”

*  *  *

నందన ఇంటికి వెళ్తూ ఆలోచిస్తోంది, స్వాతీ దేవిక ల సంభాషణ గురించి. అప్పుడప్పుడు తన బడికి వచ్చే జోనాథన్ సర్ గుర్తుకు వచ్చాడు. ఆయన పల్లెటూరిలో గవర్నమెంట్ స్కూల్ లో టీచర్.  వాళ్ళ బడిలో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించడానికి మా దగ్గర కొత్త పద్ధతులేమయినా వుంటాయేమో అని చర్చించడానికి వస్తుంటాడు. వచ్చినప్పుడు తను ట్రైనింగ్ వర్క్ షాప్ లో నేర్చుకున్న కొత్త విషయాలు కూడా మాతో పంచుకుని వెళ్తుంటాడు. తనని వాళ్ళ బడికి ఒకసారి రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు కూడా, కుదరనే లేదు. వెళ్ళాలి, ఆ పిల్లలెలా వున్నారో చూసి రావాలి. ఏమో.. ఒక ఆలోచన కూడా వుంది.

తన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేరిపిస్తే ఎట్లా వుంటుంది. నిజంగా చిన్న పిల్లలకు కావాల్సినవి 3R’s..ఇంకా బోలెడు స్వేచ్ఛ. లైఫ్ స్కిల్స్ లైఫ్ నించి నేర్చుకోవాలి గాని తను పని చేసే బడిలో మాదిరిగా క్లాసు రూమ్ లో చెప్పగలమా? కానీ ఇక్కడ నా పిల్లలకు స్వాతి లాంటి, జోనాథన్ సర్ టీచర్ దొరకుతారా? ఒకవేళ దొరికినా ఈ కాంపిటీటివ్ ప్రపంచం లో నెగ్గడానికి ఆ చదువు సరిపోతుందా?

స్కూళ్ళ పరిస్థితి ఇలా వుంటే మరి నేటి చురుకయిన యవత అంతా ఎక్కడి నించి వస్తున్నట్టు? వీళ్ళు చదువుకుని పైకోస్తున్నవారా లేక ఈ చదువుల్ని తట్టుకుని, వ్యవస్థని జయించి నిలుస్తున్నవారా?  బిస్కెట్ కోసం పెరిగెత్తి పరమాన్నం కోల్పోతున్నదెవరు?

మీ మాటలు

 1. సాయి పద్మ says:

  గుడ్ అండ్ సటిల్ స్టొరీ.. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో , నిజం రాయటం అంత ధైర్యం మరొకటి లేదు.. రాస్తూ ఉండండి.. కంగ్రాచ్యులేషన్స్ పద్మజ గారూ

 2. చందు తులసి says:

  బీ ఈడీ చేస్తే ఎస్జీటీగా ప్రొమోషన్ వస్తుందా..!!
  ………
  రేపటి తరం గురించి మీ ఆవేదన అర్థమయేలా చెప్పారు. బాగుంది.

 3. Bhanani Phani says:

  మంచి అంశాన్ని ఎన్నుకున్నారు …అభినందనలు

 4. దేవరకొండ says:

  Good attempt to ventilate the burning issue . ప్రపంచ బ్యాంకు ఆకాసమంత అప్పులివ్వడానికి తొత్తు ప్రభుత్వాలు అవి చేసి చూపాలి, ఇవి చేసి చూపాలి అని ఏవేవో norms అడుగుతాయి. అందులో అక్షరాస్యత కూడా చచ్చింది కాబోలు, ప్రభుత్వాధినేత కలెక్టర్లనీ, కలెక్టర్లు మేస్టర్లనీ అమ్మనా బూతులు పబ్లిగ్గానే తిట్టడం వల్ల సదరు సర్కారు స్కూళ్ళల్లో కూడా మరో రకం టార్గెట్లుంటాయి (ట). 100% హాజరు, 100% పాస్ వంటివి. పిల్లలు బడికి రాకపోతే మేస్టారెళ్లి అడిగితే ‘పన్లోకెళ్లాడు’ అని సమాధానం. పిల్లలు రాకపోయినా అటేన్దేన్సూ, పరీక్షలు రాయకపోయినా పాస్ % సాధించడం అని కూడా అంతర్జాతీయ అప్పులు తీసుకునే రాష్ట్రాలలోని సామాన్య జనం చెప్పుకుంటుంటారు. అదేదో పాత సినీమాలో జగ్గయ్య సరోజ చేత డాన్సు చేయించినట్లు అన్ని అమామ్బాపతు పన్లకీ మేస్టర్లనే వాడి, ఈలాంటి బిస్కెట్లు సర్కారీ స్కూళ్ళలో వుండవనుకోవడానికి ఆలోచించాలి. కనుక పాలక కుటుంబాల్లోని పిల్లలను సర్కారీ బడుల్లో చదివిస్తేనే సమస్య కొంత కొలిక్కి వచ్చే అవకాసం వుంది. ఈ కథతో ఆలోచింప చేసిన రచయిత్రికి అభినందనలు. ఇంకా ఎన్నో ఇలాంటివి రాయాలి.

 5. Chandana says:

  Thought provoking పద్దూ.. కీప్ writing.. కాసింత తెలుగు కాసింత వెలుగు — నీ కలం కదులుతూనే ఉండాలని ఆశిస్తూ…

 6. Srinivasrao says:

  Madam, nice concept. I wish your next writings should be more impressive than this. After completion of B.Ed that person would eligible for school assistant post not for S.G.T. please check this once.

  • padmaja says:

   పొరపాటే. సరి దిద్దినందుకు శ్రీనివాస రావు గారికి థాంక్స్.

 7. THIRUPALU says:

  కధకు ‘బిస్కెట్’ అనే టైటిల్ చాల బాగుందండి. ప్రపంచ బ్యాంక్ పుణ్యమంటు ఇప్పుడు ఎక్కడకెల్లినా బిస్కెట్లే ! బిస్కెట్లు లేని స్తలం ఈ చరాచర జగత్తులో – ముఖ్యంగా మనదేశంలో ( అంటే ఇండియా) ఎక్కడికెళ్ళినా బిస్కెట్ల మయం. బిస్కెట్లు సాధారణమే అనే కాడికి వచ్చిందిప్పుడు. బిస్కెట్ల రాజ్యములో సమానత్వం సంభావన కోరుకునే వారు ఉందట మంటే మాటాలా! ఆలోచనలు మారుతున్నాయి. పులిచంపిన లేడినెత్తురు కాదు ఇవాళ కావలిసింది. పులి ఎన్ని లేళ్ళను తినగలదు అని.

 8. Sailaja says:

  Very నైస్ పద్దు అండ్

 9. ప్రగతి says:

  మంచి కథ! నెరేషన్ కూడా చాలా బాగుంది .

 10. Dr.Rafi says:

  కాంటెంపరరీ ఇష్యూ ని బాగా ప్రెసెంట్ చేసారు పద్మజ గారు.

 11. padmaja says:

  మొదటి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న సహృదయులకు ధన్యవాదాలు.

 12. B. KRISHNA KUMARI says:

  దేవరకొండ గారూ!

  ప్రైవేటు స్కూల్స్ గురించి నాగ పద్మజ గారు బాగానే చెప్పారు. కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆశ పెట్టుకోబోతోంటే, మీ పరిజ్ఞానంతో నీళ్ళు చల్లారు. మామూలు వాళ్లకి. పిల్లల్ని ఆల్టర్నేట్ స్కూల్స్ కి (రిషి వాలీ, అరబిందో, విద్యారణ్య నాకు తెలిసినవి) పంపే అంత స్థోమత, వెసులుబాటు ఉండవు కదా!

  నాగ పద్మజ గారూ!

  మంచి రంగాన్ని ఎంచుకున్నారు. బాగుంది. మీ కథలో పాత్ర వందన ఆలోచనను సమర్థించవచ్చు అనుకుంట. ఎందుకంటే, జనాలు ఆ విషయాల గురించి (విద్యా రంగం గురించి) ఆలోచిస్తున్నారు. ‘… ఉపాధ్యాయులు కెరీర్ సుఖాలకు, యూనియన్ రాజకీయాలకు అలవాటు పడి తాము గురుబ్రహ్మలమన్న మాట విస్మరించటం వంటి కారణాలు ఈ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి…’ అని టంకశాల అశోక్ రాసారు. (ఇంటర్ ఫలితాలు మలుపు కావాలి. – నమస్తే తెలంగాణా) మిగిలిన కారణాలను కూడా ఆయన బాగా వివరించారు. కొందరు అయినా మారతారేమో.

  కరీంనగర్ జిల్లాలో, ఒక గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఊర్లో వాళ్ళను పిలిచి మీటింగ్ పెట్టి ఫీడ్ బ్యాక్ అడిగారు. ఇంక ఎక్కడెక్కడ ఏమి మంచి పనులు జరుగుతున్నాయో తెలీదు కదా. తెలిసిన వాటి వల్ల, గవర్నమెంట్ స్కూల్స్ గురించి కొంచెం ‘హోప్స్’ పెట్టుకోవచ్చేమో అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్.

 13. రామకృష్ణ says:

  మెుదటి ప్రయత్నం లోనే మంచి అంశాన్ని ఎన్నుకొన్నారు.అభినందనలు. పద్మజ గారు సంధించిన ప్రశ్న(“స్కూళ్ళ పరిస్థితి ఇలా వుంటే మరి నేటి చురుకయిన యవత అంతా ఎక్కడి నించి వస్తున్నట్టు?”) గురించి చర్చిస్తే( సమాదానము చెప్పగలిగతే )మంచిదని నా అభిప్రాయము.

 14. దేవరకొండ says:

  మనమంతా బతికే వున్నాం కదా, బానే వున్నాం కదా, ఈ పర్యావరణం గురించి, కాలుష్యం గురించి ఈ చర్చలు, ‘గోలలు’, ఉద్యమాలు ఏమిటీ అన్నట్లుగా వుంది మీ ప్రశ్న రామకృష్ణ గారు! చెడ్డను తట్టుకొని నిలబడటానికి మంచి కూడా శతధా ప్రయత్నిస్తూనే వుంటుంది. చురుకైన యువత వస్తారు. అలా రావడం వెనుక వున్న వర్తక ‘ధర్మాల’ గురించి ఈ కథ, చర్చ! దీన్ని ఎంతైనా చర్చించుకోవచ్చు. కాని, స్ఫూర్తిని గ్రహించడానికి ఇది చాలని నా అభిప్రాయం.

 15. దేవరకొండ says:

  చిన్న సవరణ. ఈ ప్రశ్న రామకృష్ణ గారిది కాదు, రచయిత్రిదే! ఈ ప్రశ్న అనడానికి బదులు మీ ప్రశ్న అని రావడం వల్ల అలా వచ్చింది. గమనించగలరు.

 16. 100% truth . యీ వ్యవస్థ లో
  Bhagundhi Katha madam
  =========
  బుచ్చి రెడ్డి గంగుల

 17. శ్రీనివాసుడు says:

  డా. జి. లచ్చయ్యగారు నేటి ఆంధ్రభూమిలో మన చదువుల గురించి వ్రాసిన మహత్తరమైన వ్యాసం ’’సారంలేని చదువులు‘‘ లోని కొన్ని అంశాలు.
  *****************************************************
  మూసపోసిన ఉపాధ్యాయ శిక్షణ, చైతన్యాన్ని, క్రియాశీలతను, ఆలోచనను రేకెత్తించని పాఠ్యాంశాల రూపకల్పన, ఉన్న పాఠ్యాంశాల్ని కూడా విశే్లషించి, వివరించి, విడమరచి చెప్పలేని అత్యధికశాతం ఉపాధ్యాయగణం తరగతి గదిని ఏలినంతకాలం, విద్యాస్థాయి అంతకన్నా భిన్నంగా ఉండదు. జ్ఞానమే సర్వస్వమని, ఇదే ఉద్యోగాన్నో, విదేశీయానాన్నో, లేదా రాజకీయ అధికారాన్నో కలిగిస్తుందనే తప్పుడు భావన వ్యక్తులకే కాదు,మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం. విద్య ఒక సామాజిక అవసరానికి, జరగాల్సిన వ్యక్తిగత, వ్యవస్థీకృత మార్పులకై దోహద పడాలనే ఆలోచనకు భిన్నంగా, కేవలం ఉద్యోగ సాధనకు, డబ్బులు పోగు చేసుకోవడానికి మాత్రమే జ్ఞాన సముపార్జన అనేది ఓ తప్పుడు త త్వం. ఇదే వాస్తవమనే ధోరణిని వ్యాపారం చేసుకునే విద్యావేత్తలు కల్గించగా, పాఠశాలలు వీటినే ప్రచారం చేస్తున్నాయి.
  పుస్తకాల్లోని పేజీలవారీ సమాచారాన్ని జ్ఞప్తికి ఉంచుకోవడం తప్ప, ప్రయోగపూర్వకంగా, ఆచరణాత్మకంగా అవి ఎంతమేరకు వాస్తవమో పట్టించుకోం. ‘పళ్లను శుభ్రంగా తోమాలి, నిండుగ స్నానం చేయాలి, ఉతికి న బట్టలు తొడగాలి, గ్లాసెడు పాలు తాగా లి, చక్కగ బడికి రావాలి..’ ఎంత అందమైన వాక్యాలో? ఇవేవీ పాటించే పరిస్థితిలేని విద్యార్థులు సమాధానాల్ని మాత్రం రాస్తే విద్యార్థికి బాగా తెలివితేటలున్నట్లుగా భావిస్తున్న విధానం మనది. ధర్మం, నిజాయితి, విలువలు..తరగతి గదిలో బోధించే కథలకే పరిమితం గాని, ఇంట్లో తల్లిదండ్రుల్లో, అటు ఉపాధ్యాయుల్లో ఎంతమేరకు ఉండా లో చర్చనే జరగదు. ఇక పాలకుల్లో, బ్యూరోకాట్రలో, అధికారుల్లో, ఈ గుణాలు (99శాతంలో) వెతగడమే ఓ ప్రయాస. అయినా వీటిని ప్రచించేది ఈ వర్గమే. ఈ బోధనల్ని జీర్ణించుకున్న విద్యార్ధులెవరైనా నిజ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తే ముందుగా అడ్డుకునేది మొత్తంగా పై వర్గాలే.

 18. దేవరకొండ says:

  “దేవరకొండ గారూ!
  ప్రైవేటు స్కూల్స్ గురించి నాగ పద్మజ గారు బాగానే చెప్పారు. కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ మీద ఆశ పెట్టుకోబోతోంటే, మీ పరిజ్ఞానంతో నీళ్ళు చల్లారు.” అని కృష్ణకుమారి గారు పైన అన్నారు. కనుక శ్రీనివాసుడు గారు, మరి కొన్ని గడ్డు వాస్తవాలతో మరో బకెట్ తెచ్చారు మీరు!

 19. శ్రీనివాసుడు says:

  జూన్ 18 న జపాన్లో ’’రైలుబడి‘‘ ని ప్రారంభించిన ‘‘సొసాకు కొబయాషి’’ జన్మదినాన్ని పురస్కరించుకుని
  నేటి ఆంధ్రభూమిలో డా. జి. లచ్చయ్య వ్రాసిన వ్యాసం, ‘‘ప్రభుత్వ బడుల పయనమెటు?’’
  ******************************************************
  ** ఇవన్నీ నిజమయితే కొత్తగా కాంట్రాక్టర్లకోసం కట్టే రెసిడెన్షియల్ పాఠశాలలు కెజిబివిలు ప్రభుత్వ రంగంలో మిగలగా, ఇప్పుడున్న పాఠశాలలన్నీ ప్రైవేటు రంగంలో నడుపుకోవడానికై కిరాయిలకు ఇవ్వబడుతాయి. కేరళలో ఒకప్పుడు జరిగినట్టుగా స్థానిక ప్రభుత్వ అధికారుల దగ్గర ఉపాధ్యాయులంతా హాజరవుతూ సంక్షేమ పథకాల, సర్వే పనుల ఆజమాయిషిని చేయాల్సి వస్తోంది. కొందరికి ఇది ఇష్టంగా ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉచిత విద్య, అందుబాటులో విద్య, అన్ని వర్గాల పిల్లలు ఒకే గొడుగు కింద విద్యను పొందే అవకాశం సమాజం మొత్తంగా కోల్పోతుంది. ఇప్పటికే ఆర్థిక స్థోమతను బట్టి, వర్గాలను బట్టి, కులాల్ని బట్టి మతాల్ని బట్టి రూపుదిద్దుకున్న పాఠశాల వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతున్నది. పాలకులు ప్రవచించే వసుదైక వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుంటుందో తెలియదు.**
  రోజురోజుకు రోగగ్రస్తంగా మారుతున్న విద్యారంగం సేవా దృక్పథానికి తెరను దింపి, దోపిడి తెరను ఎత్తడం ప్రజాస్వామ్యానికే తీరని నష్టం. ప్రభుత్వం విద్యనందించే బాధ్యతనుంచి తప్పుకుంటూ ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తుంటే చేష్టలుడిగి, చూడడం ఉపాధ్యాయుల తప్పిదమే. ఉపాధ్యాయుల్లో గూడుకట్టిన జడత్వాన్ని వదలుకుంటే, ఆర్‌టిసి కార్మికుల్లా కదిలితే విధిగా ప్రభుత్వ విద్యారంగం కాపాడబడుతుంది. ఇప్పటికే వైద్యం ప్రైవేటు కోరల్లో ఇరుక్కుంది. ప్రభుత్వ రంగసంస్థలు బేజారవుతున్నాయి. ప్రభుత్వ రంగ సేవలన్నీ అవుట్ సోర్సింగ్‌కు అప్పజెప్పబడ్డాయి. ప్రతీ పనికి వందల రూపాయల సేవాపన్నుతోపాటు, లంచాల్ని చెల్లిస్తున్నాం. బ్యాంకులు, ఇన్సూరెన్స్ రంగాలు, చివరికి పోస్ట్ఫాసు సేవలు పే అండ్ యూజ్‌గా మారిపోయాయి. ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ తప్ప అంతా ప్రైవేటు అవుతే, ప్రజాస్వామ్యానికి అర్థాలు వెతకాల్సిందే.**

మీ మాటలు

*