ఈ ఇరానీ సినిమా ఒక కొత్త రుతువు!

 

-భవాని ఫణి

~

 

సినిమాల్లో అయినా , నిజ జీవితంలో అయినా నాటకీయత అనే అంశానికి ఆకర్షణ ఎక్కువ . ఒక చిన్న కుతూహలం ఒక్కోసారి ఎక్కడివరకైనా మనల్ని నడిపించి తీసుకెళ్తుంది. లోపలున్న బహుమతి ఏమిటో తెలీనప్పుడు గిఫ్ట్ ప్యాక్ ని ముక్కలు ముక్కలుగా చించైనా వెంటనే తెలుసుకోవాలనుకునే పసిపిల్లవాడి ఆత్రం, ఎంత ఎదిగినా అతన్ని వదిలిపెట్టదు. మూసిఉన్న పిడికిలి తెరిచి చూసేవరకు మనశ్శాంతిగా ఉండనివ్వదు. అపరాధ పరిశోధనకి చెందిన కథల్లో, చలన చిత్రాల్లో ఇటువంటి పధ్ధతిని ఎక్కువగా అవలంబించినా, వాటిలో నాటకీయత పాళ్లు ఎక్కువ కావడం వలన, మనకి కలిగే కుతుహలంలో కొంత కృత్రిమత్వం ఉంటుంది  అదే ఒకవేళ  సాధ్యతరమని అనిపించే సహజమైన అంశాలతో నాటకీయతని సృష్టించగలిగితే, అది కలిగించే కుతూహలం అంతా ఇంతా కాదు . ఆ పట్టుని అంత బాగా పట్టుకున్న దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ మాత్రమే అని చెబితే అది అబద్ధం కాకపోవచ్చు.  నలభై మూడు సంవత్సరాల ఈ ఇరానియన్ దర్శకుడు,తన నేర్పరితనంతో అద్భుతమైన చలన చిత్రాలకి ప్రాణం పోసాడు .

అన్నీ మనం రోజూ చేసే పనులే, చూసే విషయాలే కదా అనిపిస్తాయి. కానీ కథలో అతను ఎక్కడ ఎలా ఎప్పుడు మెలిక పెడతాడో మాత్రం అర్థం కాదు. కథ అల్లడంలోని ఆ నేర్పరితనం మనల్ని తన్మయత్వానికి గురి చేస్తుంది. ఏ సైన్స్ ఫిక్షన్లు గానీ , సైకలాజికల్ థ్రిల్లర్స్ గానీ , మర్డర్ మిస్టరీలు గానీ కలిగించనంతటి ఆసక్తిని అతని సినిమాలు కలిగిస్తాయి. అంతే సహజమైన ముగింపుతో సంతృప్తి పరుస్తాయి. ఎక్కడా ఏ సందర్భంలోను విసుగు కలగనివ్వనంత బిగువుగా కథ అల్లబడి ఉంటుంది.  ఆ కథనాన్ని ఆస్వాదించడం తెలిస్తే దర్శకుడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేం .
అంతేకాక ఫర్హాదీ చిత్రాలలో పాత్రల్ని మంచి చెడుల ఆధారంగా విడగొట్టడం వీలు కాదు. , పెరిగిన సమాజం, పరిస్థితుల ప్రభావం వంటివి మనిషి స్వభావాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అవగతం చేసే విధంగా పాత్రల చిత్రీకరణ ఉంటుంది. ఈ విధమైన పధ్ధతి వల్ల ప్రేక్షకుడు కేవలం ఏదో ఒక పాత్రకే ఆకర్షితుడు కాకుండా, అందరి వైపునుండీ అలోచించి వారి వారి ప్రవర్తనలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.
అతని చలన చిత్రాల్లో అతి ముఖ్యంగా చెప్పుకోవలసినవి మూడు చిత్రాలు. మొదటి స్థానంలో ఇరాన్ చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి ఆస్కార్ ని సంపాదించి పెట్టిన  ” ఎ సెపరేషన్(A Separation) ఉంటుంది. చిక్కగా గుచ్చబడిన దండలో దారం ఎక్కడుందో తెలీనట్టుగానే అసలు విషయాన్ని అతను ఎక్కడ దాచిపెట్టాడో చాలా సేపటి వరకు తెలీదు. దాంతోపాటుగా ప్రేమ, జాలి, అహంకారం, అపరాధ భావం వంటి మనిషిలోని సహజలక్షణాలు అంతర్లీనంగా అవసరమైనంత మేరకు తమ తమ పాత్రల్ని పోషిస్తూ ఒక నిండైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.  ఈ సినిమా చూసిన తర్వాత కథ ఎవరికీ చెప్పాలనిపించదు. ఎవరికి వారే చూసి ఆ ఆనందాన్ని అనుభవిస్తే బాగుండునని అనిపిస్తుంది . అయినా చెప్పక తప్పదనుకుంటే ఇలా చెప్పడం మంచిది .
నాడెర్ , సిమిన్ భార్యా భర్తలు . వాళ్లిద్దరూ విడిపోవడం కోసం కోర్ట్ లో వాదించుకోవడంతో కథ ప్రారంభమవుతుంది . భార్య ఇరాన్ లోని కఠిన పరిస్థితుల మధ్య తమ పాప పెరగడం ఇష్టం లేక విదేశాలకి వెళ్లడం కోసం పట్టుపడితే, నాడెర్ మాత్రం, అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని వదిలి రావడానికి ఇష్టపడకపోవడంతో పంతం మొదలై ఇద్దరూ విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకపోవడంతో సిమిన్ పంతం కొద్దీ విడిగా వెళ్లిపోతుంది.  వారి కుమార్తె పదకొండేళ్ల తెర్మెహ్ మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోతుంది. ముసలివాడైపోయి, ఆల్జీమర్ కారణంగా ఏదీ గుర్తుడని స్థితిలో ఉన్న తన తండ్రి కోసం నాడెర్ ఒక స్త్రీని నియమిస్తాడు. ఆమె పేరు రజియా. ఐదారేళ్ల వయసున్న పాపని వెంట బెట్టుకుని రెండు ట్రైన్లు మారి నాడెర్ ఇంటికి వస్తూ ఉంటుంది రజియా. పైగా ఆమె గర్భవతి కూడా. ఇంట్లో పనీ, ముసలాయన్ని సంబాళించడం ఆమెకి చాలా కష్టమైపోతుంది.
నాడెర్ ఆఫీసు నించి వచ్చేవరకు ముసలాయన్ని కనిపెట్టుకుని ఉండటం రజియా చెయ్యవలసిన ముఖ్యమైన పని . కానీ ఒకసారి తొందరగా ఇంటికి వచ్చిన నాడెర్ కి ఇల్లు తాళం వేసి కనబడుతుంది . డూప్లికేట్ కీ తో లోపలి వెళ్లి చూస్తే కింద పడిపోయి ఉన్న తండ్రి కనిపిస్తాడు. పైగా అతను మంచానికి కట్టేసి ఉంటాడు. తండ్రి బ్రతికి ఉన్నాడో లేదో అర్థం కానంత ఉద్వేగంలో నాడెర్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. ఆ కోపంలో, అప్పుడే బయటి నించి వచ్చిన రజియాని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు. తర్వాత ఆమెకి అబార్షన్ అయిందని తెలుస్తుంది . అందుకు నాడెర్ కారణమని రజియా భర్త కోర్ట్ లో కేస్ వేస్తాడు . ఇంతకీ అసలు జరిగింది ఏమిటి? భార్యా భర్తలు మళ్ళీ కలుసుకున్నారా అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా మలవబడిన కథ ఇది. నటీనటుల నటన కథకి జీవాన్ని సమకూర్చింది.  సమాజపు స్థితిగతులనే ఈ చలన చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలబెట్టగలగడం కూడా పెద్ద విశేషం.
ఇక రెండోది ‘ఎబౌట్ ఎలీ (About Elly)’.  చిత్రం పేరు సూచిస్తునట్టుగానే కథ ‘ఎలీ’ అనే అమ్మాయి గురించి. ఆమె ఒక కిండర్ గార్డెన్ స్కూల్ టీచర్. ఆమె స్కూల్ లో చదివే ఒక విద్యార్థిని తల్లి సెపిదే, ఆమెని తమ స్నేహితుల కుటుంబాలతో పాటుగా పిక్నిక్ కి తీసుకుని వెళ్తుంది. జర్మనీ నించి వచ్చిన ఒక స్నేహితుడికి ఎలీని చూపించి , అతనికి నచ్చితే వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యాలన్నది సెపిదే ఆలోచన . కానీ అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం, ఎలీ గురించి వారిలో ఎన్నో సందేహలని రేకెత్తిస్తుంది. ఒక్కో పాత్రా దాచిపెట్టిన చిన్న చిన్న విషయాల్ని మెల్లగా అన్ ఫోల్డ్ చేస్తూ చూపడం వల్ల ఆద్యంతం ఒక విధమైన ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ సినిమా కూడా కథ తెలుసుకోకుండా చూస్తేనే బాగుంటుంది.  .
ఇక మూడోది ‘ది పాస్ట్ (The Past)’. ఈ కథ ఫ్రాన్స్ లో జరుగుతుంది. భర్త నుండి విడాకులు తీసుకుని, మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఇద్దరు పిల్లల తల్లి మేరీ కథ ఇది. ఆమె వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి భార్య కోమాలో ఉంటుంది . మేరీ కుమార్తెకి వారి వివాహం ఇష్టం ఉండదు. అతి సాధారణమైన కథాంశంలా అనిపించినప్పటికీ ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న రహస్యాలు ఉంటాయి . కథని పొరలు పొరలుగా తవ్వుకుంటూ వెళ్తూ, ఎక్కడో ఓ ఊహకందని మలుపు దగ్గర నిలబెట్టగల దర్శకుడి నైపుణ్యత ఈ సినిమాకి కూడా మనల్ని కట్టి పడేస్తుంది.
కానీ A Separation , About Elly లతో పోలిస్తే The Past కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ చలన చిత్రంలో  ఫర్హాదీ, సస్పెన్స్ కంటే మానవ సంబంధాల స్వరూప స్వభావాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాడు. సహజమైన ఆవేశకావేశాలు, అపార్థాలు మనిషి విచక్షణా జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి. ఆ సమయంలో అవి మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి . ఆ ఒక్క క్షణం కొద్దిపాటి సంయమనాన్ని పాటించే ప్రయత్నం చెయ్యగలిగితే ఏమానవ సంబంధమైనా అంత తొందరగా ఒడిదుడుకులకి లోనుకాదు అన్నది ఈ చిత్రం చెప్పదలుచుకున్న ప్రధానమైన అంశాలలో ఒకటి. అయినా ఫర్హాదీ చిత్రాలు మనిషి స్వభావాన్ని నిర్దేశించవు. కేవలం అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాయి. చేయిస్తాయి .
కథ చెప్పే విధానం ఒక్కటే కాదు. చిత్రీకరణలోనూ, సినిమాటోగ్రఫీలోనూ, నటీనటుల ఎంపికలోనూ కనిపించే వైవిధ్యతలు అతని చలన చిత్రాల్ని అరుదైన వజ్రాల మాదిరిగా మెరిపిస్తాయి .ఎక్కడా  నేపధ్య సంగీతమే  వినిపించదు. కేవలం మాటలూ, అవసరమైన శబ్దాలూ మాత్రమే వాడి, అతను సహజత్వాన్ని కనబరచడమే కాదు వినిపించేలా కూడా చేస్తాడు.
చివరగా చెప్పేదేమిటంటే అస్ఘర్ ఫర్హాదీ సినిమాలు చూడని సినీప్రియులు, కొన్ని ఋతువుల్ని అనుభవించనట్టే.  కొన్ని దారుల్ని కనుగొననట్టే. కొంత ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే.
*

మీ మాటలు

 1. మంచి సినిమాల పరిచయం రాసారు. బాగుంది.

 2. మహి says:

  చాలా చక్కని పరిశీలనాత్మక విశ్లేషణ…
  థాంక్యూ మా…

 3. నైస్ ఎనాలిసిస్

 4. vijaya Karra says:

  ఇంకొన్ని కొత్త దారులు కనుగొనడానికి – మరికొంత ఆనందం పెంచుకోవడానికి – చూడాలి నేనింక – థాంక్స్ !

  • Bhavani Phani says:

   ధన్యవాదాలు విజయ గారు , తప్పక చూడండి.

 5. Krishna Veni Chari says:

  మంచి సమీక్ష. వెంటనే సినిమా చూసెయ్యాలన్నంత చక్కగా ఉంది.

 6. Bhavani Phani says:

  రియల్లీ హాపీ కృష్ణ వేణి గారు , చూడండి, మీకు తప్పక నచ్చుతుంది

 7. తిలక్ బొమ్మరాజు says:

  చాలా మంచి విశ్లేషణ రాసారు భవాని ఫణి గారు.ప్రతి చిత్రాన్నీ చక్కగా విశ్లేషించారు .అభినందనలు.

 8. Bhavani Phani says:

  చాలా సంతోషం తిలక్ గారు , ధన్యవాదాలు

మీ మాటలు

*