కథ కళారూపమే, కానీ…!

 

artwork: Srujan

artwork: Srujan

దగ్గుమాటి పద్మాకర్
~

daggumatiతెలుగు రచయితలు పాఠకుల స్థాయిని తక్కువచేసి చూడడం ద్వారా తక్కువస్థాయిరచనలు వస్తున్నాయని ఒక ఆరోపణా; సమాజాన్నో, వ్యక్తులనొ మార్చాలన్న తపన వల్ల  కథ కళారూపమన్న విషయం మరుగున పడిపోతున్నదన్న ఆరోపణ మరొకటి గతవారం అమెరికానుంచి వచ్చిన కన్నెగంటి చంద్రగారు చేశారు. ఈరెండు ఆరోపణలు చేసిన కన్నెగంటి చంద్ర గారు కానీ, ఇతర అమెరికా నుంచి సాహితీవ్యాసంగం నిర్వహించే మిత్రులు గానీ ఒక విషయం అర్ధం చేసుకోవాలి.

వారు ఏదైనా ఒక కథను లేదా పదికథలను విమర్శకు స్వీకరించి ఎంత తీవ్రంగా అయినా విమర్శించ వచ్చు! అలాకాకుండా ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.సాహిత్య కళారంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడేతమజీవనం, సంస్కృతి, సాహిత్యం, భాష వంటి అంశాల మీద  ఆంధ్రుల దృక్పథాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించి నిలదీశారు అన్నది గమనించాలి. అందుకని ఇక్కడి తెలుగుసమాజం, రచయితలు, సామాజిక నేపథ్యం గురించి అమెరికా మిత్రులకు రెండు మాటలు చెప్పాలనిపిస్తుంది.

సాధారణంగా ఒక రచయిత దాదాపు నాలుగైదు కథలు రాస్తేగాని కొన్ని కథాంగాలు,నైపుణ్యాలపై స్పష్టత రాదు. కొందరికి ఈసంఖ్య పది కథలుబ్కూడా కావచ్చు.సమాజంలో రచయితల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కొత్తవారి కథలు అనేకం వస్తూఉంటాయి. అనేక పత్రికలు, అనేక కారణాలవల్ల ఈతరహా కథలని ప్రచురిస్తాయి. అలాంటి కథలు సమాజంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమాజంలోని పేదరికమో,అన్యాయాలో, అస్తవ్యస్త పరిస్తితులో, ఇతర అపసవ్యతలో…. తనని కలిచి వేయడంవల్ల సాధారణంగా ఎవరైనా రచనలు ప్రారంభిస్తారు. అది యవ్వనప్రాయంలోనిసామాజిక సంక్షోభానికి ప్రతీక. అంతెందుకు…. ఎంతగొప్ప రచయితలు అయినా తనమొదటి రచనలు చూసి అప్పటి అవగాహనా రాహిత్యంపై కాస్త సిగ్గుపడతారు. తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే! అదొక పరిణామ క్రమానికి సంబంధించిన విషయం.

ఎక్కువగా అలాంటి కథలుకనిపిస్తున్నాయంటే దాని అర్ధం కొత్త రచయితల సంఖ్య పెరుగుతుందని కూడాఅర్ధం చేసుకోవచ్చు. ఏరచయిత అయినా ప్రారంభంలో తాను  పనిగట్టుకుని ఈ సమాజానికి ఏదైనా చెప్పాలనే ఆకాంక్షతోనే రాయడం ప్రారంభిస్తాడనేది వాస్తవం. ఇది రచయితల వ్యక్తిగత కోణం.

ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి. ( ఈతరహా విమర్శ మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం అనే ఆత్మ విమర్శ కూడా చేసుకోలేనంతగా వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.) అమెరికా జీవన విధానం క్రమబద్దంగా, సాఫీగా జరిగిపోయే విధంగా ఏర్పాటు చేసుకోబడిన ఒక ఆధునికదేశం. అక్కడి జీవన విధానానికి అలవాటైనా కారణంగానో, అక్కడ అందుబాటులోవున్న వివిధ భాషల సాహిత్యాన్ని చదువుతున్న కారణంగా అక్కడి మిత్రులుతెలుగు సాహిత్య సమాజంలోని కథలని చూసి పెదవి విరుస్తున్నారు!

ఇదెలావుంటుందంటే, తండ్రిని షేవింగ్ చేసుకోవడం చూసిన పిల్లవాడు తానుకూడాఅనుకరిస్తూ గడ్డం చేసుకోవాలని ఉబలాట పడడంలా ఉంటుంది! కానీ గడ్డం రావాలి కదా! వర్ధమాన దేశాలకీ, భారత దేశానికీ మధ్యన టెక్నాలజీ కారణంగా సాధారణ సమాచారమార్పిడి క్షణాల్లో జరుగుతుంది.  కానీ అందులో లక్షవంతు భాగం కూడా ఇక్కడ సామాజిక మార్పులు ముందుకు పోవడం లేదు. ఇక్కడ సామాజిక పరిపాలన అంతా మోసాలతో కుట్రలతో జరుగుతుంది. (అక్కడ జరుగుతాయా లేదా అన్నది అసందర్భం) అస్సలు జవాబుతారీ తనం లేని పరిపాలన ఈనేలపై సాగుతుంది. ఈ కారణంగా రచయితల  కళ్ళముందు సగటు జనాభా అట్టడుగు జీవితాలు తప్ప మరొక వస్తువు కనపడనిస్తితి.

మరో పక్కన వేల కోట్ల దోపిడీని పథకాల పేరుతో, ప్రజా ప్రయోజనాల పేరుతోవరల్డ్ బ్యాంక్ మేధావుల సూచనలు ఎత్తుగడలతో ‘కడుపునెప్పితో ఆసుపత్రికిపోతే  దొంగతనంగా కిడ్నీ తొలగించినట్టు’ దేశ వనరులని అమ్మేస్తున్నారు. మహాశయులారా! ఇక్కడి సమస్యలకి స్పందించే తెలుగు ప్రాంతంలోని రచయితలు తమకుతోచిన వస్తువులతో తమ స్థాయిలో రచనలు చేస్తు ప్రజా సమస్యలని, ఆకాంక్షలనీ వెలుగులోకి తేవడం వారి బాధ్యతగా గుర్తిస్తున్నారు.

మీడియాని సైతం పాలకులు కొనేసిన నేపథ్యంలో వారి అక్రమాలకు బలవుతున్న ప్రజల సమస్యలవైపుకనీస ప్రత్యామ్నాయంగా ఉండడం రచయితలు తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు. ఇంతగాటెక్నాలజీ డెవలప్ అయినా కనీసం చెక్పోస్టుల అవినీతిని దశాబ్దాలుగాప్రభుత్వాలు ఆపడం లేదు! అంతా కుమ్మక్కు! పదిమంది గొంతెత్తబట్టే బాక్సైట్గనుల జీవోపై ప్రభుత్వం వెన్నక్కి తగ్గింది. ఎవరు ఎలా గొంతెత్తారు అనేది అనవసరం.

రాగయుక్తంగా పాడలేనంత మాత్రాన తల్లి పాడేది లాలిపాట కాకుండా పోదు! బిడ్డ ఏడుపుకు ఎలాగోలా పాడడం తల్లికి ఒక అనివార్యత అని గుర్తించమని మనవి! పైన చెప్పినదంతా తెలుగు ప్రాంతపు సామాజిక నేపథ్యం. ఇకపోతే;వస్తువులోగానీ, శైలిలో గానీ, రచనా నైపుణ్యం గానీ సాహిత్యంపై సమాజంపై వారివారి దృక్పథాన్ని అభిరుచినీ బట్టి రచయితలు తమని తాము మెరుగు పరుచుకునేప్రయత్నం చేస్తారు.  ఆక్రమంలోనే  కొందరినుంచి మనం  అప్పుడప్పుడు గర్వంగాచెప్పుకోగలిగే మంచి కథలూ కొన్ని వస్తున్నాయి. అక్కడ నుండి రాస్తున్నకథకులు అక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకున్నట్టే; ఇక్కడి కథకులుఇక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకుంటారు! పేదరికం వస్తువైనప్పుడు ఆ కథలు త్రీస్టార్ హోటల్ కస్టమర్లకు బిచ్చగాళ్ళలా కనిపించి చిరాకుపరుస్తున్నాయేమో గమనించాలి!   అది త్రీస్టార్ హోటల్ కావడం వల్ల చిరాకుమాత్రమే! అదే గుడిముందు అయితే అంత చిరాకు ఉండక పోవచ్చు!

ఇలాంటి రచనలవల్ల  కళకి ఏదో అన్యాయం జరుగుతుందన్న పేరుతో విమర్శించే అమెరికా మిత్రులు ఇందుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలనీ ఇక్కడ అవసరమైన రచయితలకు అందించేరీతిలో సాహిత్య పాఠశాలలు నిరంతరం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తే తెలుగుసమాజానికి మేలుచేసిన వారు అవుతారు.

*

మీ మాటలు

 1. కన్నెగంటి అనసూయ says:

  కష్టాలను మాత్రమే ప్రస్తావించే కథలు కథలు కానప్పుడు మరేవి కథలో చెప్పాల్సిన అవసరం ఉందని గమనించినట్లు లేరు. దోపిడి అనేది ఎవరు చేస్తున్నా దోచుకోబడే వాళ్ళ కథలు ఎప్పుడూ వ్యధలే..వ్యధలూ, బాధలూ, కష్టాలు, కడగళ్ళు ఈ సమయంలో ఇలా ఉండేవని ఒకప్పటి రచనలను బట్టే కదా నేటి బాధల తీవ్రతను పోల్చగలిగేది. సమాజంలో ఒక పార్శ్వాన్ని మాత్రమే చూసి వ్యాఖ్యానం చేయటం ఎంత వరకూ సబబు? జీవితం అనేక కోణాల మేళవింపు కదా..

 2. అమెరికా లో జీవన విధానం అలవాటు పడ్డ అమెరికా మిత్రుల కోసమేనా ఈ వ్యాసం? కథ వ్రాయడం అనేది కళ . మీరు చెప్పినట్లు ఏ రచయితే అయినా తనకి తెలిసిన సమస్యను కథ ద్వారా చెప్తారు. అవి సందేశాత్మక కథలు అయితే మనుషుల లోని మార్పు కి ఉపయోగపడతాయి కూడా !! కానీ ఈ నేపధ్యం లో కొన్ని సార్లు కథా వస్తువు ని, రచయిత తన ఆత్మ సంతృప్తి కోసం తనకి కావాల్సిన విధం గా మరలుస్తున్నారు. లేకపోతే వారికి నచ్చని అంశాల్ని విలన్ పాత్రల రూపం లో నీచం గా చూపిస్తున్నారు. అవి నిజంగా సామజిక సమస్యలు చూపిస్తున్నాయా లేదా ఎవరినయినా కించపరచడానికి వ్రాసారా అని తెలిసి పోతోంది. నాణేనికి ఒక వైపే చూపిస్తున్నారు అన్న విషయం నా లాంటి సామాన్య పాఠకుల కే అర్ధం అయిపోతోంది. ముందు తరాల వారు ఈ కథలని చదివితే ఈ నాటి సామజిక సమస్యలు ఏ విధం గా అర్ధం అవుతాయో ఇంక చెప్పనే అక్కర్లేదు. అమెరికా తెలుగు వారు వారికి ఉన్న అతి తక్కువ సమయం లో ఇప్పటికే తెలుగు కి చాలా సేవ చేస్తున్నారు. ఏ సంఘాలు ఏ సేవలు చేస్తున్నారో చెప్పుకుంటూ పెద్ద వ్యాసం తయారవుతుంది. భారత దేశం లో ఎవరికి ఏ సమస్య వచ్చినా , ఏ NGO కైనా ముందు వెనుకా ఆలోచించుకోకుండా కాస్తో కూస్తో దానం చేసే ఈ అమెరికా మిత్రుల ను ఇలా విమర్శించడం ఏమాత్రం పద్ధ తిగా లేదు. ఈ అమెరికా మిత్రులు అమెరికా లోని మైనారిటీ వారు అన్న సంగతి రచయిత గ్రహిస్తే బావుంటుంది

 3. ari sitaramayya says:

  “అలాకాకుండా ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.”

  నిర్దేశించడం కొంచెం పెద్ద మాటేమో. విమర్శించడం నిర్దేశించడం కాదు, ఆక్షేపణీయం అంతకంటే కాదు. అమెరికా అమలాపురం అని గిరులు గీసే ప్రయత్నం కాకుండా మంచి కథలు ఎలా వస్తాయని ఆలోచిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి. పైగా కథా వస్తువును నిర్దేశించడం అని ఎందుకంటున్నారు? ఈ వస్తువును పట్టుకుని వేలాడటం మానేస్తేగాని కథలు బాగుపడవు.

  “తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే!” సీనియర్లు బాగా రాస్తారు, కొత్తగా రాసేవారు అంత బాగా రాయటం లేదు అనే అభిప్రాయంతో నేను ఎకీభవించలేను. ఈ పత్రికలోనే చందు తులసి, చైతన్య గార్లు రాసిన కథలు చూడండి.

  నేర్పు లోపించడం కంటే ఓర్పు లేకపోవటమే ఉడికీఉడకని కథలు రావడానికి కారణమని నా అభిప్రాయం. ఇక మెచూరిటీ అంటారా. విమర్శను స్వీకరించదానికి మెచూరిటీ కాదు, సహనం కావాలి. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే సంస్కారం కావాలి. అది ప్రస్తుతం చాలా అరుదైన వస్తువు.

 4. Vijaya Karra says:

  పద్మాకర్ గారు! మంచి పాయింట్స్ చెప్పారు. ఈ విషయం పైన విభిన్న చర్చలు చూస్తూనే వున్నాం. మీరన్న పాఠశాలలే కాక పైన అనసూయ గారు అన్నట్లు ఇవిగోండి ఇలాంటి కథలు అంటూ ఉదాహరణ చూపిస్తూ చర్చలు చేస్తే ఉపయోగం అనుకుంటాను. ఇలా రాయకూడదు… అలా రాయకూడదూ అనే వాళ్ళు ఎలాంటివి ఎలా రాస్తే కథలుగా నిలిచాయో చెపితే బావుంటుంది కదా! :)
  వాకిలిలో నారాయణ స్వామీ గారు ఇదే టాపిక్ పైన రెండు విభిన్న కథలతో మంచి గెస్ట్ ఎడిటోరియల్ రాసారు. మన రమణమూర్తి గారు, నారాయణ స్వామీ గారు కలిసి అలా ఉదాహరణలతో ఓ శీర్షిక నిర్వహిస్తే మరింత బావుంటుంది కదా! అనిల్ రాయల్ గారు ప్రారంభించిన కథన కుతూహలం కూడా ఇందుకు అనుకూలంగానే వుంది.

 5. చందు - తులసి says:

  పద్మాకర్ గారూ….మీ ఆలోచన లేదా వాదాన్ని …ఊరికే ఆఫ్ లైన్ లో కాకుండా, ఇలా మంచి వేదిక మీద చర్చకు పెట్టి మంచిపని చేశారు.
  ఇలా చర్చోపచర్చల ద్వారా …..తెలుగు కథకు మంచి జరగాలని కోరుకుందాం.
  మీరు కోరినట్లే అమెరికా మిత్రులు ఇక్కడి కథకులకు ఉపయోగపడే సమాచారం ఇస్తే బాగు.
  ఎవరేం చెప్పినా తెలుగు కథ మెరుగు పడాలనేదే అందరి ఆకాంక్ష.

 6. కవిత్వంలో కానీయండి కథల్లో కానీయండి, గొప్ప వస్తువును/ఇతివృత్తాన్ని తీసుకుని మామూలుగా రాయటం కంటె, అంత గొప్పది కానిదాన్నితీసుకుని గొప్పగా రాయటమే గొప్ప అని కవులూ రచయితలూ నమ్మినప్పుడే కళాత్మకత నిండిన గొప్ప సాహిత్యం సృజించబడుతుందని నా నమ్మకం. గొప్ప విషయాన్ని తీసుకుని గొప్పగా రాయడం మరింత గొప్ప. ‘విధానానికి’ ‘విషయం’కన్న ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోయినా, కనీసం విషయానికున్నంత ప్రాధాన్యాన్నైనా ఇవ్వకూడదా దానికి?

  • చందు - తులసి says:

   ఎలనాగ గారూ..ఇవ్వకూడదని కాదు. కానీ విధానం తక్కువైనంత మాత్రాన…విషయం లేదన కూడదు కదా..

 7. ari sitaramayya says:

  కామెంట్లలో స్పేసింగ్ పోవటం వాళ్ళ అర్థాలు మారిపోతాయని ఇప్పుడే గమనించాను.

  “తమలోపాలు తాము గమనించుకునే మెచ్యూరిటీ రానంతవరకు వారి రచన వారికి ముద్దే!” సీనియర్లు బాగా రాస్తారు, కొత్తగా రాసేవారు అంత బాగా రాయటం లేదు అనే అభిప్రాయంతో నేను ఎకీభవించలేను. ఈ పత్రికలోనే చందు తులసి, చైతన్య గార్లు రాసిన కథలు చూడండి.”

  ఇక్కడ మరో పారాగ్రాఫ్ మొదలు. స్పేసింగ్ పోవటం వల్ల మంచి కథలుగా ఉదహరించిన పై ఇద్దరు రచయితల కథలు కింద పారాగ్రాఫ్ లోని ఉడికీ ఉడకని కథలని అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.

  “నేర్పు లోపించడం కంటే ఓర్పు లేకపోవటమే ఉడికీఉడకని కథలు రావడానికి కారణమని నా అభిప్రాయం. ఇక మెచూరిటీ అంటారా. విమర్శను స్వీకరించదానికి మెచూరిటీ కాదు, సహనం కావాలి. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే సంస్కారం కావాలి. అది ప్రస్తుతం చాలా అరుదైన వస్తువు.”

 8. Chandrika says:

  కన్నెగంటి చంద్ర గారు చెప్పినది నిన్న చదివాను. అదేమీ ఆరోపణ లాగా అన్పించలేదు. చర్చ లాగా అన్పించింది. ఆ చర్చ కి సంబంధించిన లింక్ ఏదన్నా పెడితే బావుండేది వ్యాసం తో పాటుగా. చర్చ లో మీ వాదన ఏంటో చెప్పాలి కానీ మీరు ఇలా అమెరికా మిత్రులని ఆరోపిస్తున్నారా, ఆక్షేపిస్తున్నారా అన్నట్లు వ్యాసం వ్రాస్తే ఎలా ? ‘ఈతెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం’ అన్న మాట మీ immaturity ని చూపిస్తోంది. తెలుగు కథలు అసలు ఎంత మంది చదువుతున్నారు ఆంధ్ర లో కానీ తెలంగాణా లో కానీ ? వారి పిల్లలు తెలుగు మాట్లాడితేనే నామోషి పడి పోతుంటారు. ఇంక కథలు చదువుతారా ?
  యువతరం చదువుతున్నారా అసలు? కథలను చదివే వారు తెలుగు సమాజానికి దూరమైన వారే ఉంటారు. ఒక విమర్శ ని ఆరోపణ గా కాక విమర్శ గా తీసుకుంటే ఏ చర్చ అయినా ముందుకు సాగుతుంది. ‘అక్కడ నుండి రాస్తున్నకథకులు అక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకున్నట్టే; ఇక్కడి కథకులుఇక్కడి సమాజం నుంచి వస్తువును తీసుకుంటారు’ – అమెరికా లో ఉండేవారికి అక్కడ బాధలు తెలియకపోవచ్చు. అమెరికా లో వారి కోసం కథలు వ్రాయక్కర్లేదు. సమాజం లో జరిగే విషయాలే కథ వస్తువు గా తీసుకున్నా, పాఠకుడు అమెరికా లో ఉన్నా, ఆంధ్ర లో ఉన్నా కథ వారిని ఆలోచింపచేసేలా ఉండాలి. ఉదాహరణ కి సారంగ పత్రిక లోనే చైతన్య గారు వ్రాసిన ‘నామాలు’, చందు-తులసి గారు వ్రాసిన ‘బుక్కెడు బువ్వ’ కథలు తీసుకుంటే వ్రాసిన శైలి చాలా బావుంది. కథను చివరి వరకు చదివించేలా చేసింది ఆ శైలి. రెండు కథలలోను కొంచం కల్పితం కన్పించింది. ముగింపు రచయితలు తమకి కావాల్సిన విధం గా మరల్చారని అర్ధం అయిపొయింది. మనకి కసి కోపం వస్తే అవతల వాడ్ని లాగించి రెండు కొట్టాలి అన్పిస్తుంది. ఆ మనస్తత్వాన్ని వారి కథల లో చూపించారు. అది సమాజానికి ఏమి సందేశం ఇచ్చినట్లు? నేను దాదాపు పదేళ్ళ క్రిందట అనుకుంటాను. కథ పేరు ‘సక్కినాలు’ నో మరి కథా వస్తువు ‘సక్కినాలు’ నో గుర్తు లేదు. కోటి రూపాయలు కట్నం ఇస్తూ పెళ్లి చేస్తూ సక్కినాల పిండి కొట్టిన పనివారికి భత్యం ఇవ్వటం లో కాపీనం చూపించే యజమానురాలు కథ. మనం ఇలాంటి వారిని రోజు చూస్తూనే ఉంటాము. తెలియకుండా ప్రతి ఒక్కరం చేసే పనే అది. ఏదన్నా వస్తువు కొన్నపుడు బేరం చేద్దాం అన్న ఆలోచనని చంపేసిన కథ.

 9. Delhi (Devarakonda) Subrahmanyam says:

  మంచి విమర్సామతక విశ్లేషణ. అభినందనలు

 10. పద్మాకర్ గారు:

  ఈ వ్యాసం వేరెక్కడో నేను కూడా పాల్గొన్న చిన్నపాటి చర్చకి కొనసాగింపులా అనిపించి, ఈ వ్యాఖ్య చేస్తున్నాను.

  >> “ఈ తెలుగు సమాజానికి దూరంగా వుంటూ కళ పేరుతోనో, ఉత్తమ కథలపై మమకారంతమకే ఉన్న భావనతోనో ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం”

  కథా వస్తువునెవరూ నిర్దేశించటం లేదు. ‘కథలన్నీ ఫలానా విధంగానే ఉంటే ఎలా?’ అనటానికీ ‘కథలేవీ ఫలానా విధంగా ఉండకూడదు’ అనటానికీ చాలా తేడా ఉంది. మూస చట్రాన్ని ఛేదించమనటం కూడా తప్పేనా?

  >> “సాహిత్య కళారంగాల్లో సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవిభాజ్యంగా ఉన్నప్పుడే తమ జీవనం, సంస్కృతి, సాహిత్యం, భాష వంటి అంశాల మీద ఆంధ్రుల దృక్పథాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించి నిలదీశారు అన్నది గమనించాలి”

  ఇది దారుణమైన నింద. మొన్నటిదాకా ఆంధ్రుల వంతు. ఇప్పుడు అమెరికా ప్రవాసీయుల వంతొచ్చిందా? ఇదో తంతులా ఉంది.

  >> “సాధారణంగా ఒక రచయిత దాదాపు నాలుగైదు కథలు రాస్తేగాని కొన్ని కథాంగాలు,నైపుణ్యాలపై స్పష్టత రాదు”

  వందల్లో రాసినా ఓనమాలు రానివాళ్లున్నారు; ఒకటే రాసినా వంద కథల పెట్టుగా నిలిచినవి రాసినోళ్లూ ఉన్నారు. కాబట్టి ఈ నైపుణ్యం అనే పదార్ధాన్ని రాశినిబట్టి కొలవలేం.

  >> “ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి. ఈతరహా విమర్శ మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం అనే ఆత్మ విమర్శ కూడా చేసుకోలేనంతగా వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు”

  అమెరికా మిత్రుల ఓవర్ కాన్ఫిడెన్స్ పై మీకున్న కాన్ఫిడెన్స్ చూస్తే ముచ్చటేస్తోంది! ‘ఈ తరహా విమర్శ’ తెలుగునేలపై నుండి రచనలు చేస్తున్నవారి నుండీ వస్తోంది. బహుశా అక్కడి రణగొణ ధ్వనుల మధ్యలో వాళ్ల గొంతుకలంత గట్టిగా వినిపించటం లేదేమో.

  >> “అమెరికా జీవన విధానం క్రమబద్దంగా, సాఫీగా జరిగిపోయే విధంగా ఏర్పాటు చేసుకోబడిన ఒక ఆధునికదేశం”

  అమెరికా జీవనం మీద మీకు ఏ మాత్రం అవగాహన లేదనేది ఈ వ్యాఖ్యతో తెలిసిపోయింది. పీత కష్టాలు పీతవి. ఆధునిక దేశంలో సమస్యలుండవా? ఇక్కడ చెట్లకి తేరగా కాస్తున్న డబ్బులు కోసుకు తింటూ కాలక్షేపానికి కథలెలా ఉండాలో ఉచిత సలహాలిస్తున్నామని మీ అభిప్రాయంలా ఉంది.

  వ్యాసంలో మీరు వెలిబుచ్చిన మిగతా అభిప్రాయాలపై నేను వ్యాఖ్యానించను. కథ వస్తువు ఏమిటనేది కథకుడి ఇష్టం. సామాజిక సమస్యలపై కథా మాధ్యమం ద్వారా పోరాటం చేయొద్దని మీరు పదే పదే ప్రస్తావిస్తున్న ‘అమెరికా సాహితీ మిత్రులు’ ఎవరూ అనటం లేదు. ‘వస్తువొక్కటే కథకి ప్రధానం కాదు. కాస్త కథన విధానం మీదా శ్రద్ధ పెట్టండి’ అని మాత్రమే వాళ్లంటున్నారు.

  చివరగా. దయచేసి ‘అమెరికా రచయితలు’ వంటి ప్రయోగాలు ఆపండి. ఇప్పటికే తెలుగు సాహితీ సమాజంలో ఉన్న చీలికలు చాలు. కొత్తగా ఇంకోటి అవసరం లేదు.

 11. Chandra Kanneganti says:

  (Trying again. Admin may please delete the previous comments)

  >ఇక్కడి కథావస్తువును నిర్దేశించడం ఆక్షేపణీయం.

  తేలిగ్గా ఖండించడానికి అనువుగా అర్థం చేసుకున్నారనిపిస్తుంది :-) నేన్నదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. కథావస్తువు కొన్ని విషయాలకే పరిమితమవుతున్నదనీ, దాన్ని విస్తృతపర్చుకోవలసిన అవసరమున్నదనీ కదా నేనంటున్నది!

  > సమాజంలోని పేదరికమో,అన్యాయాలో, అస్తవ్యస్త పరిస్తితులో, ఇతర అపసవ్యతలో…. తనని కలిచి వేయడంవల్ల సాధారణంగా ఎవరైనా రచనలు ప్రారంభిస్తారు.

  దానికి ఇంకొన్ని కోణాలు ఉన్నాయి. ఎలాంటి కథలు పత్రికల్లో పడతాయి, ఎలాంటి వాటిని పాఠకులు మెచ్చుకుంటారు వంటివి కూడా పని చేస్తాయి. ఇవి రాయడం తేలిక కావడం కూడా ఒక కారణం కావచ్చు. వీరి స్పందన కథారచన వైపే ఎందుకు మళ్ళుతుందన్నది ఇంకో ప్రశ్న. రచనలకే ఎందుకు పరిమితమవుతుందన్నది మరొకటి.

  >ఇకపోతే సామాజిక కోణంలో కథల్లోని నీతి, లేదా సందేశం అనే వాటిని చూద్దాం. ఈ సమస్యపై కంప్లయింట్స్ ఎక్కువగా అమెరికా మిత్రుల నుండే వస్తున్నాయి.

  లేదు, అక్కడి మిత్రుల నుంచీ ఇదే మాట వినిపిస్తుంది. అక్కడ జీవనసమస్యలు ఎక్కువగా ఉన్నాయి, నిజమే. అందువల్ల అవి కథల్లో ఎక్కువగా కనపడతాయి, సరే. దానికి అవే నీతులూ, సందేశాలూ అవసరం లేదు కదా!

  > ఇక్కడి సమస్యలకి స్పందించే తెలుగు ప్రాంతంలోని రచయితలు తమకుతోచిన వస్తువులతో తమ స్థాయిలో రచనలు చేస్తు ప్రజా సమస్యలని, ఆకాంక్షలనీ వెలుగులోకి తేవడం వారి బాధ్యతగా గుర్తిస్తున్నారు.

  మంచిదే. కానీ ఆ దారి చాలా inefficient. కథలు చదివే వాళ్ల సంఖ్యను వార్తాపత్రికలు చదివే వాళ్ల తోనూ, ఆ సంఖ్యను టీవీ చూసేవారి సంఖ్యతోటీ పోల్చి చూడండి.

  >ఇంతగాటెక్నాలజీ డెవలప్ అయినా కనీసం చెక్పోస్టుల అవినీతిని దశాబ్దాలుగాప్రభుత్వాలు ఆపడం లేదు! అంతా కుమ్మక్కు! పదిమంది గొంతెత్తబట్టే బాక్సైట్గనుల జీవోపై ప్రభుత్వం వెన్నక్కి తగ్గింది. ఎవరు ఎలా గొంతెత్తారు అనేది అనవసరం.

  బాక్సైట్ గనుల మీద కథలు వచ్చి గొంతులు లేచాయా? చెక్ పోస్ట్ అవినీతి మీద ఇంకో వంద కథలు రాసినా అదే ప్రభుత్వం అవార్డు కూడా ఇస్తుందేమో కానీ దాన్ని నివారించే పనులేమీ చేయదు. దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి.

  >పేదరికం వస్తువైనప్పుడు ఆ కథలు త్రీస్టార్ హోటల్ కస్టమర్లకు బిచ్చగాళ్ళలా కనిపించి చిరాకుపరుస్తున్నాయేమో గమనించాలి!

  ఆ సందేహం అక్కరలేదు. చిరాకు పడుతున్నది కొత్తదనం లేని పేదరికపు కథల మీద కానీ, పేదవాళ్ల మీద కాదన్నది గుర్తించండి. కథ బాలేదంటే ఆ సమస్య పట్ల అవగాహనా, వాటి బారిన పడినవారిపట్ల సానుభూతీ లేదన్న నిర్ణయానికి వచ్చేయడం తరచుగా కనిపిస్తున్న ఒక దౌర్భాగ్యం.

  >ఇలాంటి రచనలవల్ల కళకి ఏదో అన్యాయం జరుగుతుందన్న పేరుతో విమర్శించే అమెరికా మిత్రులు ఇందుకు అవసరమైన అన్నిరకాల నైపుణ్యాలనీ ఇక్కడ అవసరమైన రచయితలకు అందించేరీతిలో సాహిత్య పాఠశాలలు నిరంతరం జరిగేలా సహాయ సహకారాలు అందిస్తే తెలుగుసమాజానికి మేలుచేసిన వారు అవుతారు.

  ఈ కథల వల్ల కళకు అన్యాయం జరుగుతుందని కాదు, కథల్లో కళ ఉండడం లేదని. మన రచయితల నైపుణ్యానికి కొదవ ఉందనుకోను. కొంచెం తలెత్తి చూస్తే చాలు.

 12. వృద్ధుల కల్యాణ రామారావు says:

  పద్మాకర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అమెరికాలో వుండే చాలా మందికి ఆ సమాజం, తెలుగు సమాజం కూడా అర్ధం కావు. కరుడుగట్టిన కమ్యూనిస్టులు కూడా అమెరికా వెళ్లి కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోవడం నాకు తెలుసు. మార్క్సిజం అర్ధం కాకుండా వివిధ సమాజాలలో ఘర్షణలు కాని, ఆ ఘర్షణలకు కారణాలు కానీ అర్ధం కావు. ఏ మంచి కధలో ఐనా కొన్ని విలువల మధ్య ఘర్షణ, ఆ ఘర్షణకి కారణాలు, రచయిత ఏ విలువల వైపు ఉన్నాడో సూచితమవ్వాలి. లేకపోతే నీరసమయిన కథ వస్తుంది. అమెరికాలో తెలుగు మార్కిస్టులు చాలా కొద్దిమందే ఉన్నారు.

 13. అజిత్ కుమార్ says:

  కథలు వ్రాసేవారూ, కథలు చదవాలని ఆశపడేవారూ కమ్యూనిష్టులు కారు.

 14. Dr.Pasunoori Ravinder says:

  ద‌గ్గుమాటిగారి ఆవేద‌న అర్థ‌వంత‌మైంది. అమెరికాలోని సాహిత్య క‌ళాజీవులు అర్థం చేసుకుంటే మంచిది. ప్ర‌తీసారీ ఇంగ్లీషు క‌థ‌తోటో, ఇంకో భాషా క‌థాతోటో తెలుగ క‌థ‌ను పోల్చి పెద‌వి విర‌చ‌డం కొంతమందికి ఫ్యాష‌నై పోయింది.
  -ప‌సునూరి

మీ మాటలు

*