రాయడం ఎవరి కోసం? దేని కోసం?!

 

A work of art is regarded, not as an ephemeral event, but as an action with far-reaching consequences. Born of reality, it acts back upon reality. Young people will argue a whole night long over a poem. – Ernst Fischer (The Necessity of Art)

 

“ఈ ఎండని నాకు వెండిలా మండించాలని వుంది; ఈ వెన్నెల్ని మంచినీటితో కడగాలని వుంది; ఈ గాలికి ప్రాణంపోసి పరిగెత్తించాలని వుంది; ఈ కొమ్మల్ని కెరటాల్లా లేపించాలని వుంది. ఆ నీడల్ని చెలరేగిపించాలని వుంది; ఈ సంద్రాన్ని ఉడుకులెత్తించాలని వుంది; ఈ నదులన్నీ నయాగరా జలాలు కావాలని వుంది.

బ్రహ్మజెముడు దొంకల్ని దుంపనాశనం చెయ్యవలిసి వుంది; అక్షర ఆజ్ఞానాన్ని తన్ని తోసివేయవలిసి వుంది. పాలకుల బందూకుల ప్రాణాల్ని జనసేన తీయలవలసి వుంది.

అవును, నాకు రాయాలని వుంది.”

— ఇది నాకు అత్యంత ఇష్టమైన రావి శాస్త్రి గారు ‘నాకు రాయాలని’ అన్న వ్యాసంలోది. ( రావిశాస్త్రీయం, పే. 49-50)
మనం రాసింది ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో చూసుకు రాయమని హెచ్చరించిన మహా రచయిత.

 

ఇప్పుడు రచయితల బాధ్యత లేదా బాధ్యతారాహిత్యం గురించి చర్చ నడుస్తున్నది. కవులైనా, రచయితలైనా ఏం చెయ్యాలి? నమ్మినదాని గురించి రాస్తారు. నమ్మిన దాని గురించి మాత్రమే రాయాలి. చెడుకు ఉపయోగపడనిది రాయాలి. కానీ ఇప్పటి చర్చ నేపథ్యంలో అనిపించింది, రచయితగా ఏమైనా తప్పు చేశానా అని. అనుకుని, చదువుతున్నాను  నాకు అత్యంత ఇష్టమైన రావిశాస్త్రి, కొ.కు, చెరబండరాజు వంటి రచయితల రచనల్ని (వీటికోసం వెతకక్కర్లేదు – నా చేతికి అందే దూరంలోనే నా టేబుల్ పై వుంటాయి.) మళ్ళీ ఓసారి. వాళ్ళ రచనలు, జీవితమూ రచయితలకు ఓ ప్రియాంబిల్. ఓ మేనిఫెస్టో.

రచన దానంతట అదే సామాజిక చర్య అంటాడు కొకు. సమాజంలో అసహాయులుగా వున్న వారిలో చైతన్యమూ, బెదిరి వున్నవాళ్లకు ధైర్యమూ, వ్యక్తిత్వం కోల్పోయిన వాళ్ళకు వ్యక్తిత్వమూ ఇవ్వటం కన్న రచయిత చేయగల ఉత్తమమైన పని లేదంటాడు.

గత శతాబ్దపు చివరి దశాబ్దంలో తెలుగు సమాజంలోని విధ్వంసం, అణచివేత, చీకటిలో ప్రజలు చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కున్నారు. నా కథారచనకు అది నేపథ్యం. కొత్త శతాబ్దం మొదలవుతూనే జరిగిన పౌరహక్కుల నాయకుడు పురుషోత్తం పాశవిక హత్య నన్ను తీవ్రంగా కలవరపరిచింది. ఎలాటి వనరులూ, మద్దతూ లేని ప్రజల హక్కుల కోసం నిస్వార్ధంగా పోరాడుతున్న ఓ మంచి మనిషిని రాజ్యం నడిరోడ్డు మీద హత్య చేసింది. ఆ హత్య, ఎందరిలో వలెనే, నాలో క్రోధం రగిల్చింది. నాకు బాగా తెలిసిన కుటుంబం కాబట్టి, స్వేచ్ఛని ఎత్తుకుని ఆడించేను కాబట్టి, జ్యోతక్క నాకు తెలుసు కాబట్టి నన్ను ఆరోజులు మరింత కల్లోల పరిచాయి.

ఇంత దుర్మార్గం ఎలా సాధ్యం? ఇన్ని దశాబ్దాల, ఇన్ని శతాబ్దాల పోరాటాల, అధ్యయనాల తర్వాత సమాజం తయారుచేసుకుంటున్న గొప్ప మనుషుల్ని ఎందుకింత దుర్మార్గంగా అంతమొందిస్తున్నారు?

ఆ హత్యకు ఎవరు ఎలా స్పందిస్తారు? హక్కుల సామాన్య ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, జర్నలిస్టులు, ఆటోవాళ్లు, ఆర్టీసీ కార్మికులు, డాక్టర్లు, లాయర్లు — వాళ్ళ వాళ్ళ అవగాహనమేర, చేయగలిగే కార్యరంగం బట్టి స్పందిస్తారు. పురుషోత్తం ఏయే విలువలకోసం నిలబడ్డాడో ఆ విలువల్ని వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రతిఫలించే ప్రయత్నం చేస్తాడు. తమ జీవితాల్లోకి తనెలా పరిష్కారాల్ని తీసుకొచ్చాడో మాట్లాడతారు.

మరి రాయగలిగే వాళ్ళు ఏం చేస్తారు? వాటి గురించి రాస్తారు. లేదా మాట్లాడతారు. లేదా రాసి పాడతారు.

నేను రాసేను, ”ఒక జననం గురించి….” అన్న కధ.

gabrielGarciaMarquez1981-Eva-Rubinstein

ఏం రాస్తారు ఎవరైనా? ఎలా రాస్తారు ఎవరైనా? అది అవగాహన మీద, రాయగలిగే శక్తి మీద ఆధారపడి వుంటుంది. అనుకోకుండా ఆ అస్థిర, క్రోధపు, కల్లోలపు రోజుల్లో అనుకోకుండా నేను మార్క్వెజ్ ‘వందేళ్ల ఒంటరితనం’ చదువుతున్నాను. అందులోని ఓ వాక్యం నన్ను కుదిపేసింది. ఓ పాత్ర అంటుంది, “I will kill you again,” అని.

నామీద ఒక్కసారి వంద పిడుగులు పడ్డట్టు, ఒక్కసారి ఓ విస్పోటనంలో చిక్కుకున్నట్టు, ఓ గొప్ప దాహంలో అనంతంగా చిక్కుకున్నట్టు అనిపించింది నాకు. I will kill you again అని అంటున్నాడంటే వాళ్లెవరో మళ్ళీ మళ్ళీ పుడుతున్నారని, వాళ్లెవరో మళ్ళీ మళ్ళీ చంపబడుతున్నారని అనిపించింది. మనలో వాళ్ళని కొంచెం వదిలేసి వెళ్తున్నారని, ఆ వ్యధ మనలో మళ్ళీ మళ్ళీ రగులుతున్నదని.  ఆ విలువలు మనలో ఎంతో కొంత మిగిల్చి పోయారని.

మరి నేను ఆ తీరని దుఖ్ఖాన్ని, ఆ మోయలేని భారాన్ని, ఆ విడువని క్రోధాన్ని, ఆ అసహనాన్ని ఎలా ప్రకటించాలి? రాయకుండా ఉండలేని తనంతోనే కదా. ఎవరైనా రాసేది. మనలోంచి దుర్మార్గంగా విసిరివేయబడ్డ మనిషి గురించి, మనలోపల అనంతంగా విత్తుకుంటున్న ఆ మనిషి జ్ఞాపకం గురించి రాయకుండా వుండగలరా ఎవరైనా?

అప్పుడు రాసేను నేను, ఆ కధ. అది నా రెండో కధ.
“నేను, నేను,” అని రాసుకోవడం ఇప్పటిదాకా నేను చేయలేదు. కానీ, ప్రస్తుత చర్చ సందర్భంలో ‘ఎందుకు రాసేను’ అని గురూ గారు రావిశాస్త్రిగారు రాసింది చదువుతుంటే అనిపించింది – నేను రాసింది ఏ మంచికి ఉపకారం చేసిందా లేదా అపకారం చేసిందా, అని. మనస్సాక్షికి మించిన విమర్శకులు ఎవరుంటారు?

అవును మరి నేను ఆ కధ రాసేను. ఎవరికి ఎలా అర్ధం అయిందో, అవుతుందో నాకు తెలీదు. అప్పటి నా మానసిక పరిస్థితి ఏంటంటే, ఆ క్రోధాన్ని ప్రకటించడం. అప్పటికది నా రెండో కధ మాత్రమే అయినందువల్ల ఇంకోలా రాయలేకపోకపోయి కూడా కావచ్చు.  చదివిన వాళ్ళల్లో అది ఎలాటి ఊహలు కలిగిస్తుందో రచయితకు కొంత ఊహ వుంటుందేమో కానీ, పూర్తిగా తెలిసే అవకాశం లేదు.

“లోకంలో మంచీ చెడ్డా అనేవి వుంటూ వస్తున్నాయి. వాటి మధ్య నిత్యం పోరాటం జరుగూతూనే వుంటుంది. ఆ పోరాటపు స్థాయి ఒకప్పుడు ఉన్నంత తీవ్రంగా ఇంకొకప్పుడు వుండకపోవచ్చు. కానీ మంచి చెడ్డల మధ్య నిత్యం సంఘర్షణ జరుగుతూనే వుంటుందని నేను అనుకుంటాను. ప్రతి రచయిత కూడా, రెండు, మూడు లేక ఎన్నో కొన్ని మజిలీలు చేసి చివరికి ఈ మంచి చెడ్డల క్రాస్ రోడ్స్ కి వస్తారనీ రాక తప్పదనీ నేను నమ్ముతాను. అప్పుడు అతను పాఠకుడికి తను ఏ మార్గం చూపించాలో నిశ్చయం చేసుకుంటాడు. ఆ దారంట వెళ్ళమని అందరికీ చెప్తాడు.” – రావిశాస్త్రి (1965) (రావిశాస్త్రీయం, పే. 48-49)

ఆప్తులనుకున్న వాళ్ళు, ఇష్టమైన నాయకులు సహజంగానో, అసహజంగానో మరణించినపుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ రాయడం అనాదిగా వస్తున్న ఓ అలవాటు. వాళ్ళు మనకోసం చేసిన త్యాగమూ, పోరాటమూ గుర్తు చేసుకోవడం ఓ మానవీయమైన విలువ. మా వూరికి దగ్గరలో వున్న సవర జాతికి చెందిన ఆదివాసులైతే ఆ మరణాన్ని గోడమీద బొమ్మగా వేసుకుని గుర్తు పెట్టుకునే వాళ్ళు.

‘ఒక జననం గురించి…’ రాసిన చాలా ఏళ్ళకు ‘పూల గుర్తులు’ అని ఓ కధ రాసేను. అది మళ్ళీ కొందరి అమరత్వం గురించి. చనిపోయిన వాళ్ళ గుర్తుగా పూల మొక్కలు నాటే ఓ వృధ్ధుడి గురించి. అమరులైన వాళ్ళు, మనల్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఓ పూవుగా, ఓ వాసనగా ఎలా మిగిలిపోతారో, మనం ఎలా గుర్తుంచుకుంటామో చెప్పిన కధ.

ఎవరో రచయిత తన నవలని సినిమా తీయడానికి ఒప్పుకోలేదని చదివేను. ఆమె (లేదా ఆయన?) చెప్పిన కారణమేంటంటే, “నా నవల చదివిన వేలమంది వేలారకాలుగా ఊహించుకుని appreciate చేస్తారు. సినిమా తీస్తే దర్శకుడికి అర్ధం అయిన వెర్షనే వస్తుంది,” అని.

ఆ కధ చదివి అఫ్సర్ pustakam.netలో (2009) ప్రతిస్పందన రాసేడు. అది తన ఆప్తుల మరణాల్ని ఎలా గుర్తు చేసాయో. (link — http://pustakam.net/?p=1564) ఓసారి ఓ రచన చేస్తే అది బతికిన రోజుల్లో ఎవరికి అర్ధం అయిన ప్లేన్ లో వాళ్ళకి అర్ధం అవుతుంది. కొందరికైతే nonsense అనిపించవచ్చు. Some others might have thought that it should have been told better. ఇంకొందరికి ఎవ్వరెవ్వరి మరణాలు గుర్తొచ్చి వ్యాకుల పడవచ్చు. The writer will have no control whatsoever on the text once he penned it. ఓసారి రాశాసేక, ఇక ఆ రచనతో రచయితకు సంబంధం వుండదంటారు రావిశాస్త్రి గారు.

జీవిత పరిణామం ప్రజా పోరాటం మీద ఆధారపడి వున్నది. ఆ పోరాటంలో ప్రజలచేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవ సాహిత్యమంటాడు కొకు.

కవులే గానీ, రచయితలే గానీ వాళ్ళ కార్యరంగం రచన. రాయాలి. రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంతగా రాయకపోతే రాయకూడని వాళ్ళు రాయకూడనంతగా రాస్తారని ఎవరో అన్నారు. కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని రాయగలిగే వాళ్ళు రాయకుండా వుండరు. రాస్తారు.

ravisastry

“ఈ ఎండకి పసలేదు. ఆరీ ఆరని గాయం చాలా వుంది. ఈ వెన్నెల వెలివెలి బూడిదలా వుంది. ఈ గాలంతా బిగిసిపోయి చచ్చింది. ఈ నీడలన్నీ కొరడబారిపోయాయి. ఈ సముద్రమంతా చల్లారిపోయింది. ప్రభువులంతా ఏడు రంగుల నీడల్లో మునిగితేలి మురుస్తున్నారు. పచ్చినెత్తుర్ని పరమాన్నం వండుకొండుంటున్నారు……అవును నాకు రాయాలనే వుంది. నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది; కూలి కులాలన్నీ ఏకం కావాలని వుంది. జ్ఞానదీపం వెలగాలి. మబ్బులన్నీ తొలగాలి. మంచిగంధం తీయాలి.” ( రావిశాస్త్రీయం.)

అవును, అందుకే నాకూ రాయాలని వుంది. వాటిగురించి రాయాలని వుంది.  వాటి గురించి మాత్రమే రాయాలని వుంది. షరతుల్లేని, శశబిషలు లేని, సందేహాల్లేని, నిరుత్సాహం లేని రచనలు చేయాలని వుంది. ఎలాటి వనరులూ లేని, శక్తులూ లేని  ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకోసం రాయాలని వున్నది. వాళ్ళ కధలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఉక్కపోతల జీవితాలు, వాళ్ళ పోరాటాలు – వాటి గురించి మాత్రమే రాయాలని వున్నది.

–వాళ్ళకోసం మాత్రమే రాయాలని వున్నది.

*

మీ మాటలు

 1. Dr. Rajendra Prasad Chimata. says:

  కవులే గానీ, రచయితలే గానీ వాళ్ళ కార్యరంగం రచన. రాయాలి. రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంతగా రాయకపోతే రాయకూడని వాళ్ళు రాయకూడనంతగా రాస్తారని ఎవరో అన్నారు. కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని రాయగలిగే వాళ్ళు రాయకుండా వుండరు. రాస్తారు.
  రాయాలి
  కానీ రాసే టెక్నిక్ చదివించేటట్టుగా ఉండాలి

  • kurmanath says:

   There’s no second opinion on this. Form is also an important component in conveying the message. But subjective elements are at play too.

 2. Delhi (Devarakonda) Subrahmanyam says:

  ఎంత బాగా రాసారండీ కూర్మనాధ్ గారు. ఇందులో మీరు రెండు మంచి విషయాలు తెలిపారు. 1. కవులే గానీ, రచయితలే గానీ వాళ్ళ కార్యరంగం రచన. రాయాలి. రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంతగా రాయకపోతే రాయకూడని వాళ్ళు రాయకూడనంతగా రాస్తారని ఎవరో అన్నారు. కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని రాయగలిగే వాళ్ళు రాయకుండా వుండరు. రాస్తారు..2. కవులే గానీ, రచయితలే గానీ వాళ్ళ కార్యరంగం రచన. రాయాలి. రాయాల్సిన వాళ్ళు రాయాల్సినంతగా రాయకపోతే రాయకూడని వాళ్ళు రాయకూడనంతగా రాస్తారని ఎవరో అన్నారు. కాబట్టి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని రాయగలిగే వాళ్ళు రాయకుండా వుండరు. రాస్తారు.. రావి శాస్త్రి గారు , కోకు గారిని ఉదాహరిస్తూ చాల మంచి సంగతులు చెప్పినందుకు మీకు అభినందనలు తేలుతున్నాను.

 3. వ్యాసం చాలా బాగుంది సర్

 4. రచయిత ఎవరి కోసం రాయాలో, ఎందుకోసం రాయాలో, అసలు రచయిత ఎవరివైపు ఉండాలో మరోసారి గుర్తు చేయడం ఆనందంగా ఉంది అన్నయ్యా.

 5. “షరతుల్లేని, శశబిషలు లేని, సందేహాల్లేని, నిరుత్సాహం లేని రచనలు చేయాలని వుంది. ఎలాటి వనరులూ లేని, శక్తులూ లేని ప్రజలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకోసం రాయాలని వున్నది. వాళ్ళ కధలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఉక్కపోతల జీవితాలు, వాళ్ళ పోరాటాలు – వాటి గురించి మాత్రమే రాయాలని వున్నది.
  వాళ్ళకోసం మాత్రమే రాయాలని వున్నది.”
  కూర్మనాథ్ … మీరు చెప్పిన అక్షరాలనే తిరిగి వల్లిస్తున్నాను. రాయలేని నాలాంటి వారిని చిన్నగా గిల్లినట్టు కూడా ఉంది మీ రచన – రాయక తప్పదేమో సుమీ :)

  *

 6. మరి రాయగలిగే వాళ్ళు ఏం చేస్తారు? వాటి గురించి రాస్తారు. లేదా మాట్లాడతారు. లేదా రాసి పాడతారు.
  సినిమా తీస్తే దర్శకుడికి అర్ధం అయిన వెర్షనే వస్తుంది, నిజమే!
  అలా కాదనుకుని ఇవ్వని రచయితలను ఎరుగుదును నేను.
  గొరుసు అన్న “గిల్లడం” కుఉడా నిజమే !

 7. kurmanath says:

  అయ్యో, గిల్లడం ఏమీ లేదండీ.
  అయితే, గొరుసు రాయడం లేదన్న నా కంప్లైంట్ ఇప్పటిది కాదు. అది, వేరే విషయం.

 8. చందు - తులసి says:

  మీలాంటి హేమాహేమీలంతా మళ్ళెప్పుడు రాస్తారా…అని, కలాలు ఝుళిపిస్తారా అని మాలాంటి పాఠకులమంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం.

 9. విలాసాగరం రవీందర్ says:

  మంచి వ్యాసం

 10. బావుంది

 11. ఎ కె ప్రభాకర్ says:

  రాయడం కూడా యుద్ధమే. తప్పకుండా చేద్దాం . చెయ్యక పోవడం నేరం. చెయ్యడమే నేరమైతే అదీ చేద్దాం .

 12. Thirupalu says:

  “ఈ ఎండకి పసలేదు. ఆరీ ఆరని గాయం చాలా వుంది. ఈ వెన్నెల వెలివెలి బూడిదలా వుంది. ఈ గాలంతా బిగిసిపోయి చచ్చింది. ఈ నీడలన్నీ కొరడబారిపోయాయి. ఈ సముద్రమంతా చల్లారిపోయింది. ప్రభువులంతా ఏడు రంగుల నీడల్లో మునిగితేలి మురుస్తున్నారు. పచ్చినెత్తుర్ని పరమాన్నం వండుకొండుంటున్నారు……అవును నాకు రాయాలనే వుంది. నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది; కూలి కులాలన్నీ ఏకం కావాలని వుంది. జ్ఞానదీపం వెలగాలి. మబ్బులన్నీ తొలగాలి. మంచిగంధం తీయాలి.” రావిశాస్త్రీ గారి ఈ మాటలు రచయితలందరికి పంచి పెడి తే బాగుంటుంది. వారి చర్మం ఒక సారి గిల్లి నట్లుంది వ్యాసం.

 13. ఆరి సీతారామయ్య says:

  కూర్మానాథ్ గారూ,
  నేను మీ కథలు చదివానో లేదో గుర్తులేదు. అందువల్ల నా మాటలు మీ కథల గురించి కాదు. వ్యక్తిగత విమర్శ అసలే కాదు. మీరు అలా స్వీకరిస్తే సంతోషిస్తాను.
  మీరు మీ కథల గురించి రాయలేదు. కథల నేపథ్యం గురించి రాశారు. మీది మంచి మనసు. పురుషోత్తం హత్యకు స్పందించి రాశారు. అలాగే కొందరు శ్రామికుల వైపూ, కొందరు స్త్రీల వైపూ, కొందరు తెలంగాణా వైపూ, కొందరు దళితుల వైపూ, మరి కొందరు మరో వైపూ, మంచి వైపు ఉన్నామనే ఉద్దేశంతోనే రాస్తారు.
  ప్రస్తుతం తెలుగులో పరమ చెత్త కథలు రావటానికి కారణం వాటి నేపథ్యాలు కాదు. నేపథ్యం మంచిదయితే రాసినవన్నీ గొప్ప కథలు అనుకోవటం. ఉదాహరణకు తెలంగాణా ఉద్యమం గురించిన ఒక చెత్త కథను విమర్శిస్తే దాన్ని కథా విమర్శగా స్వీకరించే సంస్కారం మనకు లేదు. అది వెంటనే తెలంగాణా ఉద్యమవ్యతిరేకతగా ప్రతివిమర్శకు గురౌతుంది. అది ఒక్క తెలంగాణా కథలకే కాదు, అన్ని కథలకూ వర్తిస్తుంది. నేను మంచి వైపు ఉన్నాను కాబట్టి నా కథను విమర్సించేవాడెవడైనా నా కథను కాదు, నా ఉద్దేశాన్నీ, నా అస్తిత్వాన్నీ విమర్శిస్తున్నాడు అనే స్థాయిలో ఉన్నాడు తెలుగు రచయిత ఇప్పుడు. ఈ దరిద్రం నుంచి బయటపడకపోతే తెలుగు కథ బాగుపడే ఆవకాశం లేదు.

  కథ బాగుపడాలంటే మీరు రాశారే, “అవును మరి నేను ఆ కధ రాసేను. ఎవరికి ఎలా అర్ధం అయిందో, అవుతుందో నాకు తెలీదు. అప్పటి నా మానసిక పరిస్థితి ఏంటంటే, ఆ క్రోధాన్ని ప్రకటించడం. అప్పటికది నా రెండో కధ మాత్రమే అయినందువల్ల ఇంకోలా రాయలేకపోకపోయి కూడా కావచ్చు. చదివిన వాళ్ళల్లో అది ఎలాటి ఊహలు కలిగిస్తుందో రచయితకు కొంత ఊహ వుంటుందేమో కానీ, పూర్తిగా తెలిసే అవకాశం లేదు,” ఇలాంటి విషయాల గురించి చర్చ జరగాలి. తన క్రోధాన్ని రచయిత పాఠకులకు చేర్చ గలిగాడా? పాత్రలు చీమూ నెత్తురూ ఉన్న నమ్మదగిన మనుషుల్లాగా ఉన్నారా లేక అట్ట బొమ్మల్లాగా ఉన్నారా? సన్నివేశాల్లో వాస్తవికత ఉందా లేక ఉపన్యాసాలు చెప్పించటానికి తయారు చేసిన కృత్రిమ సందర్భాల్లా ఉన్నాయా?
  ఇలాంటి విషయాల మీద చర్చ జరగాలి, విమర్శ స్వీకరించే సంస్కారం అలవడాలి. అంతేగాని నేను మంచి వైపు ఉన్నాను, నేను రాసిందంతా గొప్ప సాహిత్యం అనుకుంటూ కూర్చుంటే తెలుగు కథకు మంచిరోజులు రావు.

 14. kurmanath says:

  సీతారామయ్య గారూ,
  మీరు చెప్పిన అంశాలపై తప్పకుండా చర్చ జరగాల్సిందే.
  కానీ, ఇందులో రెండు అంశాలున్నాయి. ఇక్కడ నేను — నేను మంచి వైపు వున్నా కాబట్టి నేను రాసింది మీకు తప్పకుండా నచ్చి తీరాలి అన్న అర్ధంలో రాయలేదు. అలా అర్ధం అయి వుంటే తప్పు నాదే. కానీ, ఈ వ్యాసం రాయడం వెనుక నేపథ్యం అది కాదు. సాయుధ పోరాట రాజకీయాల్ని బలపరిచే కవులు, రచయితలూ తప్పకుండా సాయుధ పోరాటంలో పాల్గోవాలి అన్న వాదనకు స్పందనగా రాసేను ఇది.
  రచయితలకు, ముఖ్యంగా విరసం రచయితలకు, రావిశాస్త్రి, కొకు, చెరబండరాజు వంటి మహా రచయితలు వేసిన తోవ అనుసరణీయమని రాసేను. అంతే కానీ, నా రచనలని తప్పనిసరిగా మీరు మెచ్చుకోవాలని అన్న అర్ధంలో కాదు.
  రెండో అంశం ఏంటంటే, రచనలు తప్పకుండా చదివించేవిగా వుండాలి. వుంటే బాగుంటుంది. ఉంటేనే మనం నిజాయితీగా చెప్పాలనుకున్నది ఎక్కువమందికి వెళ్తుంది. కానీ, ఫాం దానికదే ఓ ఉత్కృష్టమైన పదార్ధం కాదు. ఆ స్కెళ్ళ తోనే రచనల్ని కొలవడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం. సారం లేకుండా రూపం ఎంత గొప్పగా వున్నా ప్రయోజనం ఏ మాత్రం వుండదు. కొకు మాటల్లోనే, తోమిన ఇత్తడి పాత్రల్లా వుండడం వాళ్ళ ఏమి ఉపయోగం? నా వరకు నాకు, వస్తువే కొలమానం. రూపం ఒకటో రెండో పాళ్ళు తక్కువైనా నేను మార్జిన్ ఇచ్చి చదువుతాను. వాళ్ళు ఏయే జీవిత కల్లోలాలను చూసి, లేదా అనుభవించి రాసారో కదా అన్న మార్జిన్ ఇస్తాను. వాళ్ళు యుద్దాల మధ్యనుంచి వచ్చి ఆ యుద్దాలలోని హింసని మనకి చెప్పదలచుకున్నారో, ఎంత జీవన పోరాటం చేసి రాయగలిగే దశకు వచ్చి చెప్తున్నారని కూడా ఆలోచించాలి. గొప్ప సారాన్ని పట్టుకున్న వాళ్ళ పరిశీలనకు మార్జిన్ ఇస్తాను.
  ఒక వేళ సారం మంచిదై వుంటే, రూపం అంతగా బాగాలేదని అనిపిస్తే చెప్పే పద్ధతుల్లో చెప్పొచ్చు. వాళ్ళ నిజాయితీతో కూడిన శ్రమని, వాళ్ళ పరిమితుల్ని అర్ధం చేసుకోవాలి. నిజాయితీగా చెప్పే విమర్శలు తప్పనిసరిగా తీసుకుంటారు రచయితలు.

  • సీతారామయ్య గారి కోణమూ, దానిని సరైన దిశలో అర్ధం చేసుకుని మీరు అందించిన వివరణా, రెండూ చాలా సంస్కరవంతంగానూ, ఉపయుక్తం గానూ ఉన్నాయి కూర్మనాథ్ గారూ! మీరన్నవిషయానికి సరిపోయేటటు వంటి కొకు ఆర్గుమెంట్ ఒకటి నాకు గుర్తు వస్తోంది. సందర్భశుద్ధి గా ఉంది కనక దానిని కోట్ చేస్తున్నాను. ‘బ్లాక్ మార్కెట్’ కథలో పద్మనాభ శాస్త్రి సిద్ధాంతం ఇలా ఉంటుంది. . ప్రత్యెక ప్రతిభ కన్నా” ఒక ఉద్యమానికీ, ఒక పోకదకూ ఎక్కువ విలువ ఉందిట. ఒకే సారి పదిమంది ప్రతిభావంతులైన కవులు దేశం లో ఉండి కవిత్వం రాసినా వారి వుమ్మడి సాహిత్యం లో ఒక ఆశయము ఒక ధోరణి లేక తలా ఒక దారీ ఐనదానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఒక సాహిత్య ఉద్యమం ఉన్న చోట ఒక గొప్ప కవి కూడా లేక పోయినా ఆ ఉద్యమం లో తయారైన సాహిత్యం సాంఘిక ప్రయోజనం కలిగిందట”.
   సారం లేకుండా రూపం ఎంత గొప్పగా వున్నా ప్రయోజనం ఏ మాత్రం వుండదు అని మీరన్న మాట ముమ్మాటికీ నిజం.

   దీనికి ప్రతి గా సీతారామయ్య గారి వాదాన్ని కూడా పరిగణన లోకి తీసుకుని నేను ఇలా సమన్వయం చెయ్యొచ్చు అనుకుంటున్నాను. ఒక ఉద్యమం ప్రజాశ్రేయస్సు కై జరుగుతున్నప్పుడు డానికి దోహదపడే రచనలు అప్పటి సాంఘిక ప్రయోజనం దృష్ట్యా అవసరమే. ప్రజాహితం కోసం ప్రతి ఒక్క రచయితా ‘తన శక్తి మేరకు’ స్పందించాల్సిందే. ఐతే ఆ రచనలు కాలానికి నిలుస్తాయో లేదో అది రచయిత స్వంత ప్రతిభ మీద ఆధారపడి ఉంటంది. సీతారామయ్య గారన్నట్టు ‘అట్ట ముక్కలవంటి పాత్రలతో కదాసంవిధానం నడిపిన కథలు, ప్రజాహితం కోరినవైనప్పటికీ కలకాలం గుర్తుండిపోయే కథలు గా మనలేక పోవచ్చు.

   • క్సమించండి, పైన నా comment లో దొర్లిన అచ్చుతప్పులకు నా సవరణ.

    * సంస్కార వంతం
    * పోకడ
    * ఆధారపడి ఉంటుంది

 15. Bhanumurthy says:

  అయ్యా , రాసినా రాయక పోయినా , రాసే వాళ్ళు రాయక పోయినా , రాయని వాళ్ళు రాసినా , చదివే వాళ్ళు చదివిన వాళ్ళవే చదువుతారు . అంతే గాని చదవని వాళ్ళని చదవ మన్నా చదవరు . ఇంతకి చదవడం ఎంత మందికి అలవాటు ఉన్నది ఈ రోజుల్లో ! నేను పని చేసిన ఆఫీసుల్లో , నూటికి 90 శాతం కవిత్వమంటే ఏమిటో తెలియదు . కథలు అంటే సినిమా కథలు తప్ప వేరే తెలియదు . పని లేని వాడే కవిత్వాలు రాసేవాడు అన్న అపహాస్యం గూడా ఉంది . పొతే కవులే కవులు రాసింది చదవ గలరు .

 16. సార్

  మీ వ్యాసం బాగుంది. కాని దేశంలో ఇంత జరుగుతున్నా సాహిత్య అకాడమి అవార్డులు వెనక్కి ఇవ్వని వారి గురించి కూడా మీరు రాయాలి. దానికి కావలసిన నైతిక అర్హత కూడా మీకే వుంది. కాత్యాయని విద్మహే కేతు విశ్వనాథ రెడ్డి రాచపాలెం సలీం వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు… మీరైతే దీనిని సిగ్గుచేటు వ్యవహారంగా చూసి నిలదీయ గలరు. ఇది సిగ్గుమాలిన పని కాదంటారా విరసం దీని మీద ఉద్యమించి ఎందుకు అందరి అవార్డ్లు వెనక్కి ఇప్పించడం లేదు ఇలాటివి మీరు నిలదీయాలి

 17. kurmanath says:

  2) సీతారామయ్యగారూ,
  పొద్దున్న పిల్లలతో పిక్నిక్ కి వెళ్ళే హడావిడిలో ఓ ముఖ్యమైన పాయింట్ చెప్పడం కుదరలేదు. అది నేను రాసిన వ్యాసంలోనే చెప్పి వుండాల్సింది. కానీ, అప్పటికి తట్టలేదు.
  మీకే కాదు, ఈ వ్యాసం చదవిన వాళ్ళన్దరికోసం ఈ వివరణ.
  — పురుషోత్తం దారుణ హత్యపై నా క్రోధాన్ని ప్రకటించగలిగేను కాని నేను పురుషోత్తం ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకోలేను. పురుషోత్తం లాగ మారిపోలేను. కానీ, అలా అని పురుషోత్తం ఏ విలువలకోసం నిలబడ్డాడో చెప్పకుండా వుండడం, తలుచుకోకుండా వుండడం నేను చెయ్యలేను. నా క్రోధాన్ని ప్రకటించకుండా ఉండలేను. అలా రాయడం రచయితగా నా బాధ్యత అయినందువల్లనే కాదు, రాయకుండా ఉండలేని తనం కూడా. నేను పురుషోత్తంగా మారలేను కాబట్టి, ఆయన గురించి నేను రాయరాదు అని ఆంక్షలు పెట్టడం సరికాదు అని.
  ఇది చెప్పడం నా ఉద్దేశం.
  I was not angling for your positive appreciation for my stories.

 18. Ramana Yadavalli says:

  ఆయా వ్యక్తులు ఆయా సందర్భాల బట్టి ఇన్‌స్పైర్ అవుతుంటారు. ఉదాహరణకి – కుల్బుర్గి హత్య కొందరికి దుఃఖం, ఇంకొందరికి ఉత్సాహం కలిగిస్తుంది. వారి రచనలూ తదనుగుణంగా వుంటాయి. వారికి రాసే ప్రావీణ్యంలో ఎక్కువ తక్కువలు వుడొచ్చు గానీ – విషయ స్పష్టత మాత్రం వుంటుంది.

  ‘ఎవరి కోసం రాయాలి? ఎందుకు రాయాలి? ఎలా రాయాలి?’ ఈ ప్రశ్నలు చాలా కష్టమైనవి. ఈ ప్రశ్నలకి సమాధానాలు – రావిశాస్త్రి రచనల్లో అడుగడుగునా కనిపిస్తుంటయ్. తెలుగు సాహిత్యానికి రావిశాస్త్రి ఇచ్చిన రోడ్‌మేప్ చాలా విలువైనది.

  రచయితలకి కావల్సింది నిఖార్సైన నిజాయితీ. సాహిత్యరంగంలో ఇప్పుడు తరుముకొస్తున్న పరిణామాలు రచయితల నిజాయితీకి పరీక్ష పెడుతున్నయ్. శాలువాలు కప్పించుకోడమే ఒక సాహిత్య తంతుగా మార్చేసిన ఎకాడెమీ ఎవార్డుల రచయితల నిగ్గు తేలబోతుంది.

 19. ఎందుకు రాయాలి? ఎలా రాయాలి? అనే మౌలికమైన చర్చ కూర్మనాథ్ గారూ, సీతారామయ్యగారూ సాగిస్తున్నట్టు కనిపించింది. అకాడమీ అవార్డుల తిరస్కరణ అనేది – సమస్యలో ఒక చిన్న అంశం మాత్రమే…దాని మీద చర్చ కూడా జరగాలిసిందే కానీ డానికి ఈ వ్యాసం వేదిక కాదేమో RVK గారూ, RAMANA గారూ …ఆలోచించండి.

  • Ramana Yadavalli says:

   అవును, మీరన్నట్లు ఈ వ్యాసం అందుకు వేదిక కాదు.

   నిన్నట్నుండీ బుర్రంతా ఈ ఆలోచనతో వేడెక్కిన కారణాన – అసంకల్పితంగా అలా రాసేశాను. అదీ సంగతి!

   • మీ సహృదయానికి ధన్యవాదాలు రమణ గారూ….

 20. ఆరి సీతారామయ్య says:

  కూర్మానాథ్ గారూ,
  నా మాటలు సహృదయంతో స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు.
  ‘నేను రాయరాదు అని ఆంక్షలు పెట్టడం సరికాదు’ అన్నారు మీరు. ఈ విషయం మీద జరుగుతున్న చర్చ గురించి నాకు తెలియదు. కాని, సందర్భం ఏదైనా అసలు రచయిత ఏమి రాయాలో రాయకూడదో మరొకరు నిర్ణయించడం అదొక దౌర్భాగ్యం.

  “ఫాం దానికదే ఓ ఉత్కృష్టమైన పదార్ధం కాదు. ఆ స్కెళ్ళ తోనే రచనల్ని కొలవడం కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం. సారం లేకుండా రూపం ఎంత గొప్పగా వున్నా ప్రయోజనం ఏ మాత్రం వుండదు.” మనం ఇలా మాట్లాడటానికి అలవాటు పడ్డాం.
  ‘సారం లేకుండా రూపం’ అంటే అసలు ఏంటి అర్థం? నాకు ఇష్టమైన వస్తువు అయితే సారం ఉన్నట్లు, కాకపోతే లేనట్లా? ‘ఉద్యమాల’ గురించీ, ‘అస్తిత్వాల’ గురించీ రాస్తేనే సారం ఉన్నట్లా? ఇక్కడ కూడా నామాటలను వ్యక్తిగత విమర్శగా తీసుకోవద్దని మనవి. నిజ జీవితాలలో రాయటానికి ఎన్నో విషయాలు, ఎన్నో రకాల పాత్రలు ఉన్నాయి. వాటిలో సారం లేదా? ఆ జీవితాలు సారం లేని రూపాలేనా? ఏదో ఒక రాజకీయ ప్రయోజనానికి పనికొస్తేనే అది సారవంతమైన కథ అయినట్లా? తెలుగు సాహిత్యం ఇలా తయారుకావటానికి ముఖ్య కారణాల్లో ఇదొకటని నా అభిప్రాయం.
  “ఉద్యమ ప్రయోజనం’ వైపు నుంచి చూసినా, పాత్రల్లో సన్నివేశాల్లో నిజాయితే లేకుండా రాసేవి పాఠకుడిని కదిలించలేవు. చదివేవాడికి కోపమో, సంతోషమో, క్రోధమో కథ చదివినప్పుడు లోపలినుంచి పుట్టుకు రావాలి గాని, నీకు కోపం రావాలి, క్రోధం రావాలి అని ఏదో ఒక పాత్ర చేత ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పించినందువల్ల పాఠకుడికి బోర్ కొట్టడం తప్ప మరేమీ జరగదు.
  కారా గారి యజ్ఞంలో వివరణలూ ఉపన్యాసాలూ లేవు. ఈ నాటి ‘ఉద్యమప్రియులు’ బాగా రాయలేరని కాదు. రాయగలరు. కాని అంత ఓపిక ఉండాలి కదా? బాగా రాయాలని రాస్తూ కూర్చుంటే ఉద్యమం ఆలస్యం అవుతుందేమోనని భయం.

  • సీతారామయ్య గారూ! మీ ప్రశ్నను నేను పైన ఉదహరించాను, శ్రమ అనుకోక ఒక్కసారి చూసి మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషిస్తాను

  • Thirupalu says:

   సీతారామయ్యగారూ,
   /‘సారం లేకుండా రూపం’ అంటే అసలు ఏంటి అర్థం? నాకు ఇష్టమైన వస్తువు అయితే సారం ఉన్నట్లు, కాకపోతే
   లేనట్లా? ‘ఉద్యమాల’ గురించీ, ‘అస్తిత్వాల’ గురించీ రాస్తేనే సారం ఉన్నట్లా? /
   మీరు ఈ మాట చాలా రోజులుగా అంటు ఉండటం చూస్తున్నాను. అందు వల్ల ఒక చిన్న వివరణ. రూపం సారం సంగతి ఇటివలీ కాలానిది కాదు. తెలుగు నాట కొత్త రాజకీయ ఉద్యమాలు తల ఎత్తి కొత్తలో లేక ఆ తారు వాతో రచయితలూ కుడా రూపం వైపు కొందరు సారం వైపు కొందరు చీలి పోయారు. చీలి పోవటమే కాక కవితోధ్యమాలు కుడా చేశారు. అలా ఏర్పడ్డవే ‘ కవి సేన మ్యానిపెస్ట్’ వంటి సమస్థలు. మీ విమర్శ కొత్తది కాదు. ఏది ఇష్టమో ఆ రచయితా లేక ఆ చదివే పాఠకుడు నిర్ణయించు కుంటారు. రాసే వాళ్ళంతా తమకు నచ్చిందే రాయమనో చదివే వాళ్ళంతా తమకు నచ్చిందే చెప్పమనో ఎవర్ని ఎవరు ఆదే సించలేరు కదా? సారం కావాలను కుండే వారు మాత్రం రూపం సారం రెండు కలిసే కోరుకుంటారు. ఎందు కంటే వారి ఉద్దేశం లో భవిశ్యుత్ ఎలా ఉంటే బాగా ఉంటుmdani నిర్ణయించు కొని ఆ దిశను పట్టి పోతున్నారుగనుక వారికి అదే స్తిరమైనది . దాని చుట్టే – వస్తువు- తిరగాలని కోరుకుంటారు. – అంటె తాత్వికంగా ఒక నిర్ణయమై పోయుమ్టుంది గనుక.
   మీరు అనుకున్నట్లు ఏ తాత్వికత లేకుండా రచనలు ఉండవు- ఆయా రచయితలకు తెలిసిన తెలియక పోయినా. విమర్శకులు వారిని పలానా అని ముద్ర వేయకుండా ఉండరు. ఎందుకు అంటె జీవిత వాస్తవికత ఏదో కోణంలో చూడ బడుతుంది కనుక. ఆ కోణమే వారి దార్శినికత. ఎవరు దేన్ని ఎంచు కుంటా రంటారనే దాన్ని బట్టి లేక వారు ప్రభావితమైన దాన్ని బట్టి.

 21. kurmanath says:

  “నాకు ఇష్టమైన వస్తువు అయితే సారం ఉన్నట్లు, కాకపోతే లేనట్లా? ‘ఉద్యమాల’ గురించీ, ‘అస్తిత్వాల’ గురించీ రాస్తేనే సారం ఉన్నట్లా? ఇక్కడ కూడా నామాటలను వ్యక్తిగత విమర్శగా తీసుకోవద్దని మనవి. నిజ జీవితాలలో రాయటానికి ఎన్నో విషయాలు, ఎన్నో రకాల పాత్రలు ఉన్నాయి. వాటిలో సారం లేదా? ఆ జీవితాలు సారం లేని రూపాలేనా? ఏదో ఒక రాజకీయ ప్రయోజనానికి పనికొస్తేనే అది సారవంతమైన కథ అయినట్లా? తెలుగు సాహిత్యం ఇలా తయారుకావటానికి ముఖ్య కారణాల్లో ఇదొకటని నా అభిప్రాయం.”

  సీతారామయ్య గారూ,
  1) మీరు ఎందుకో అకారణంగా ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. సారం గురించి నేను ఒక ప్లేన్ లో అన్నాను. నేనెప్పుడు అన్నాను, సారమంటే ఉద్యమ వస్తువని? సారం అంటే సారమే, జీవిత సారమే. జీవిత సారం వెయ్యికళలుగా (రకాలుగా), వేల ముఖాలతో వుంటుంది. సారమంటే వీటన్నిటికి చెందిన సారమని అర్ధం. That’s given. కానీ, అంతా జీవితం కాదు. యండమూరి వీరేంద్రనాథ్ కూడా జీవితం గురించే రాస్తాడు. వేదగిరి రాంబాబు కూడా జీవితం గురించే రాస్తాడు. కానీ ఆ రచనలు నాకు వెగటు పుట్టిస్తాయి.
  2) ఉద్యమ కధలే సారమని, అస్తిత్వ కథలే సారమని నేనెక్కడ అన్నాను? ఎప్పుడు అన్నాను? ఎందుకు అంటాను?
  నేను అన్న సారం అంటే — కుటుంబ రావుగారు రాసింది జీవితం గురించే. జీవితం గురించి మాత్రమే. రావిశాస్త్రి, శ్రీపాద, శారద, పతంజలి, కారా, అల్లం రాజయ్య, వి చంద్రశేఖర రావు, మల్లాది, సౌదా, ఆర్ ఎం ఉమా మహేశ్వర రావు, శ్రీరమణ (బంగారు మురుగు), చాసో, గొరుసు, బజరా, సువర్ణముఖి, సతీష్ చందర్, ఓల్గా, మల్లీశ్వరి చిన్నయ్య, సత్యవతి, తుమ్మేటి — వంటి వారు రాసింది. ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’లో వచ్చిన లాటి కధలు.
  ఇది సారమనుకుని నేను నా వ్యాసాన్ని రాసేను. అలా కాకుండా వుంటే, స్పష్టంగా రాసి ఉండేవాడిని — ఉద్యమ వస్తువే వస్తువని.
  3) యండమూరి, చందు సోంబాబు, పరుచూరి బ్రదర్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ — వీళ్ళు రాసిన జీవిత సారాల గురించి కాదు నేను మాట్లాడింది. లేకపోతే, ఊసుపోక స్వాతి పత్రికల్లో వచ్చే సాధారణ కధలగురించి కాదు (ఎప్పుడైనా మంచి కధలు ఉండవచ్చు. అది వేరే సంగతి).

  4) మీరు మీ ప్రిజుడిసెస్ ని వదిలించుకుని ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. అప్పుడు ప్రపంచం కొంచెం కొత్తగా కనిపిస్తుంది. నేనను కోవడం, పెద్దలు ఇలాటి ప్రిజుడిసెస్ ని వదిలించుకోకుండా ఆలోచించడం వల్లనే తెలుగు కధా appreciation స్థాయి ఇలా వుందని నా అభిప్రాయం.
  5) “కారా గారి యజ్ఞంలో వివరణలూ ఉపన్యాసాలూ లేవు. ఈ నాటి ‘ఉద్యమప్రియులు’ బాగా రాయలేరని కాదు. రాయగలరు. కాని అంత ఓపిక ఉండాలి కదా? బాగా రాయాలని రాస్తూ కూర్చుంటే ఉద్యమం ఆలస్యం అవుతుందేమోనని భయం”
  — ఇది ద్వేష పూరితమైన కామెంట్ కాబట్టి దీనికి వివరణ ఇవ్వను. ఇత్తడి చెంబుల్ని, కంచు గ్లాసుల్ని తయారుచేస్తూ వుండండి, బాగా మెరుస్తూ కనిపిస్తాయి.

  • ఆరి సీతారామయ్య says:

   కూర్మానాథ్ గారూ,
   ఇదంతా నా తప్పే. మీ వ్యాఖ్యలో ఎలాంటి అపార్థం లేదు.
   నేను ఇంకొంచెం వివరంగా రాయాల్సింది. నేను రాసిన మాటలు ప్రత్యేకంగా మీ వ్యాసం గురించి కాదు.
   తెలుగులో సాధారణంగా ప్రస్తుతం వస్తున్న కథల గురించి నా అభిప్రాయం చెప్పాను.
   అంతే. దీనివల్ల కలిగిన అపార్థాలకు బాధ్యత పూర్తిగా నాదే.

  • ఆరి సీతారామయ్య says:

   కూర్మానాథ్ గారూ,
   ఇక్కడ వాతావరణం కొంచెం చల్లబడింతర్వాత రాయవచ్చునని కొంచెం ఆగి మళ్ళా రాస్తున్నాను. మీ వ్యాసం ఉద్దేశం వేరు. అది తెలియక నేను చర్చను పక్కదారి పట్టించినట్లున్నాను. క్షమించగలరు.
   అయినా మీ జవాబులో చాలామంది మంచి రచయితల పేర్లు రాశారు. మీ అంత విస్తృతంగా నేను చదవలేదు. కానీ చదివినంతలో వీరందరూ నాకూ ఇష్టమైన రచయితలే. అందరు వీరిలాగే రాస్తే కథ గురించి విచారించనవసరం లేదు.
   “బాగా రాయాలని రాస్తూ కూర్చుంటే ఉద్యమం ఆలస్యం అవుతుందేమోనని భయం” — ఇది ద్వేష పూరితమైన కామెంట్ కాబట్టి దీనికి వివరణ ఇవ్వను.” ఇది ద్వేష పూరితం అని మీరు ఎందుకనుకున్నారో. నేను అడపాదడపా పత్రికల్లో చదివే కథలు ఎక్కువ భాగం నీతులూ పాఠాలూ చెప్పే కథలే. సమశ్యలకు పరిష్కారాలు చూపించే కథలే. ఇంకొంచెం ఓర్పు ఉంటే, అవే కథలు ఇంకొంచెం సహజమైన పాత్రలతో సహజమైన సన్నివేశాలతో రాయవచ్చని నా గట్టినమ్మకం. అది ఆశేగాని, ద్వేషం అయితే కాదు.

   “అనురాధ, షాహీదా, చిన్నయ్య, పాణి, మిడ్కో — వీళ్ళు రాసిన కధలు మీరు చదివేరా, సీతారామయ్య గారూ? మిడ్కో రాసిన కధలు మీ దృష్టికి వచ్చాయా? రావు.” ఈ మధ్యే అనూరాధగారి ఏది నేరం చదవటం మొదలుపెట్టాను. మొదటి కథ ఒక పారో కథ నాకు చాలా నచ్చింది. ఎక్కడా ఉపన్యాసాలు లేవు. పాత్రలు సహజంగా ఉన్నాయ్. భాష కూడా బాగుంది. సులభంగా చదివించింది కథ. మిగతా కథలు కూడా చదువుతాను.

   ఇక “ఇత్తడి చెంబుల్ని, కంచు గ్లాసుల్ని తయారుచేస్తూ వుండండి, బాగా మెరుస్తూ కనిపిస్తాయి.” ఇది మీరు ఏ ఉద్దేశంతో అన్నా, నేను దీన్ని ఆశీస్సు గానే తీసుకుంటాను. థాంక్స్.

 22. kurmanath says:

  నా ఆఖరి వ్యాఖ్య కొంచెం తీవ్రంగా వుందనిపించింది. కానీ, ఎడిట్ చేసుకునే సౌకర్యం లేదు కాబట్టి, దాన్ని ఇలా అంటున్నాను.
  కారా మాస్టారు గొప్ప కధకుడు. నాకు వ్యక్తిగతంగా ఆరాధ్యుడు. ఆయన కూడా విప్లవ కధకుడే. అనురాధ, షాహీదా, చిన్నయ్య, పాణి, మిడ్కో — వీళ్ళు రాసిన కధలు మీరు చదివేరా, సీతారామయ్య గారూ? మిడ్కో రాసిన కధలు మీ దృష్టికి వచ్చాయా? రావు.
  ఉద్యమం ఆలస్యమవడం కాదు, ఉద్యమంలో వుండే, యుధ్ధం మధ్యలో వుండే రాస్తున్నది. అనురాధ రాసిన కధలు చదవండి. మీరూహించని జీవితం గురించి కధలు రాసింది. కొంచెం చదవండి. చదివి మాట్లాడండి.
  అనవసరమైన అసహనాల వల్ల ప్రయోజనం వుండదు. అలాటి అసహానాల వల్లనే తెలుగు కధా విమర్శ ఇలా మిగిలిపోయింది.

 23. ఆరి సీతారామయ్య says:

  కల్యాణి గారూ, మీ వ్యాఖ్యను ఇదివరకు చూడనందుకు క్షమాపణలు.

  “‘బ్లాక్ మార్కెట్’ కథలో పద్మనాభ శాస్త్రి సిద్ధాంతం ఇలా ఉంటుంది. . ప్రత్యెక ప్రతిభ కన్నా” ఒక ఉద్యమానికీ, ఒక పోకదకూ ఎక్కువ విలువ ఉందిట. ఒకే సారి పదిమంది ప్రతిభావంతులైన కవులు దేశం లో ఉండి కవిత్వం రాసినా వారి వుమ్మడి సాహిత్యం లో ఒక ఆశయము ఒక ధోరణి లేక తలా ఒక దారీ ఐనదానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఒక సాహిత్య ఉద్యమం ఉన్న చోట ఒక గొప్ప కవి కూడా లేక పోయినా ఆ ఉద్యమం లో తయారైన సాహిత్యం సాంఘిక ప్రయోజనం కలిగిందట”.
  సారం లేకుండా రూపం ఎంత గొప్పగా వున్నా ప్రయోజనం ఏ మాత్రం వుండదు అని మీరన్న మాట ముమ్మాటికీ నిజం.”

  మీకు నా అభిప్రాయం నచ్చకపోవచ్చు. పైన ఉదహరించిన అభిప్రాయం బ్లాక్ మార్కెట్ అనే కథలో పద్మనాభ శాస్త్రి అనే ఒక పాత్రది అని మీరే చెప్పారు. కానీ, దాని గురించి రాస్తూ “కొకు ఆర్గుమెంట్ ఒకటి నాకు గుర్తు వస్తోంది” అని మీరే అన్నారు. అంటే అది మీకు పద్మనాభ శాస్త్రి పాత్ర ద్వారా కోకు చెప్పిన అభిప్రాయంగా తోచింది అనే కదా? అంటే తన అభిప్రాయాలను బహిర్గతం చెయ్యటానికి కొకు పద్మనాభశాస్త్రి పాత్రను వాడుకున్నారు. నా అభిప్రాయంలో ఓపిక ఉన్న రచయిత ఆ అభిప్రాయం పాఠకుడికి తోచేలా చెయ్యగలగాలి. మొపాసా, చెఖోవ్, తుర్గెనేవ్ లాంటివారు కొన్ని వందల కథలు రాశారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కడైనా ఇలా వ్యక్తం చేసినట్లు మీకు తోచిందా?
  కూర్మానాథ్ గారు, “రాయకుండా ఉండలేని తనం,” అని రాశారే, ఆ కారణమే అందరి చేతా రాయిస్తుంది. ఆ ఉండలేని తనానికి ఎవరికి వారే సాక్షి. నిజాయితీ ఉన్న రచయితకి తన అంతర్మథనమే సాక్షి. సంఘ ప్రయోజనానికి కట్టుబడి రాసేవారికి ఏదో ఒకరోజు ఆత్మ సాక్షికీ, సంఘప్రయోజనానికీ భేదం రాక తప్పదు. “సాయుధ పోరాట రాజకీయాల్ని బలపరిచే కవులు, రచయితలూ తప్పకుండా సాయుధ పోరాటంలో పాల్గోవాలి అన్న వాదనకు స్పందనగా రాసేను ఇది” అన్నారు కూర్మానాథ్ గారు. అంటే ఇక్కడ అలాంటి సందర్భం ఒకటి తలెత్తింది అనే కదా? రచన వ్యక్తిగత మైనది. రాయకుండా ఉండలేనితనం వ్యక్తిగతం. సంఘం చెప్తే కలిగే అనుభూతి కాదు. అందరి మేలు కోసం పది మంది కలిసి చేసే పనులూ, చెయ్యగల పనులూ చాలా ఉన్నాయి. సృజనాత్మక అలాంటి సమిష్టి వ్యవసాయం కాదు.
  ఇది మీ అభిప్రాయాలకు భిన్నంగా ఉండవచ్చు. క్షమించగలరు.

 24. సీతారామయ్యగారూ, కొకు గురించిన నా ఉదాహరణ లో ఒక చిన్న సవరణ, కొకు ఇచ్చిన ఆర్గుమెంట్ అంటే నా ఉద్దేశం, కొకు ది అని నా ఉద్దేశం కాదు, ఆ కాలం లో ప్రచలితమై ఉన్న ఒక ఆలోచనను ఆయన రికార్డు చేసినట్టు మాత్రమే చెప్పారు, దానిని ఎవరైనా అంగీకరించవచ్చు, కాదనవచ్చు అనే వీలు తోనే రాసారు, అందుకు సాక్ష్యం ఆ పద్మనాభశాస్త్రి సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ… షేక్ స్పియరు ఏ సాహిత్యోద్యమం వాడు? కాళిదాసు మాటేమిటి ?అని వేరొక పాత్ర చేత అనిపిస్తారు కొకు.
  నా అదే కామెంట్ లో నేను సమన్వయం గురించి టూకీ గా చెప్పిన విషయాన్ని వివరిస్తే ఇలా చెప్పొచ్చు. మీరనే ఉత్తమ సాంకేతిక విలువలూ, జీవితాన్ని లోతుగా అర్ధం చేసుకునే ప్రయత్నమూ, ఏ ‘ఇజాలికీ’ గుడ్డిగా కట్టుబడక తన స్వంత వివేచన తో జీవితసత్యాలను ఆవిష్కరించే తపనా ఉన్న రచనలు – సంఘప్రయోజనమూ, దానితో పాటూ సాహిత్య ప్రయోజనమూ రెండూ నేరవేరుస్తాయని- అవే కాలానికి నిలుస్తాయనీ నా భావం.
  “నిజాయితీ ఉన్న రచయితకి తన అంతర్మథనమే సాక్షి. సంఘ ప్రయోజనానికి కట్టుబడి రాసేవారికి ఏదో ఒకరోజు ఆత్మ సాక్షికీ, సంఘప్రయోజనానికీ భేదం రాక తప్పదు” అని మీరే అర్ధం లో అన్నారో నాకు అర్ధం కాలేదు. నిరంతరం అంతర్మధనం చేసుకునే రచయితలు సంఘ విమర్శకు గురికావడం నేను చూస్తూనే ఉన్నాను. కాని సంఘప్రయోజనానికీ అత్మసాక్షికీ భేదం ఏ పరిస్థితి లో రావచ్చో నేనూహించలేకుండా ఉన్నాను.

 25. Sivalakshmi says:

  ఇన్ని దశాబ్దాల, ఇన్ని శతాబ్దాల పోరాటాల, అధ్యయనాల తర్వాత సమాజం తయారుచేసుకుంటున్న గొప్ప మనుషుల్ని ఎందుకింత దుర్మార్గంగా అంతమొందిస్తున్నారు?
  సమాజం తయారుచేసుకుంటున్న గొప్ప మనుషులని ఎంత బాగా రాశావు కూర్మనాథ్? నిజంగా ఇప్పుడు మనం చూస్తున్న దుర్మర్గమైన లోకంలో నుంచే పురుషోత్తం, బాలాగోపాల్ గార్ల లాంటి కొందరు అద్భుతమైన మనుషుల్ని కూడా ఈ సమాజమే తయారు చేసుకుంటోంది.పురుషోత్తం గారనగానే చాలా విషయాలు గుర్తొచ్చాయి.ఇంటి పక్కనున్న కిరాణా కొట్టుకొచ్చిన మనిషిని ఎంత కిరాతకంగా నడిరోడ్డు మీద నరికేశారు? అదే నడిరోడ్డు మీద ఒకవైపు అంతులేని దు@ఖాన్నీ, షాక్ నీ భరిస్తూనే జ్యోతి ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా నిలదీసింది? నువ్వు క్రోధావేశాలంటే గుర్తొస్తుంది, అప్పుడే మా చైతన్య మహిళా సంఘం వారొక మీటింగ్ పెట్టి పురుషోత్తంగారి పుస్తకాన్ని(వ్యాస సంకలనం) ఆవిష్కరించమన్నారు.నాకు గొంతు కోపంతో, దు@ఖంతోపూడుకుపోయింది. మాట రాలేదు.ఇంతకీ నేను ముఖ్యంగా నువ్వుఎత్తుకుని ఆడించిన “స్వేచ్చ” పాప గురించి చెప్పాలనుకున్నాను.తనప్పుడు చాలా చిన్న పిల్ల.జ్యోతీ,మేమందరం ఏడుస్తుంటే తను చాలా నిబ్బరంగా చూస్తూ కూచుంది.పలకరిస్తే”ఏడవకూడదని నాకు నాన్న చెఫ్ఫాడు” అని చెప్పింది.అంటే భవిష్యత్తులో తనకేదైనా కావచ్చునని పురుషోత్తంగారు ముందే చిన్నారి పాపని కూడా సమాజం కోసం సిద్ధం చేశారన్నమాట!ఇంతకంటే అద్భుతంగా సమాజం కోసం ఎవరు ఆరాట పడతారు?
  నువ్వన్నట్లు షహీదా,మిడ్కో,అనూరాధ,చిన్నయ్య,పాణి మొదలైన వారి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలి.ఈ మధ్యనే వచ్చిన షహీదా “జాజిపూల పరిమళం”, అనూరాధ “ఏది నేరం?” అందరూ చదివి చర్చిస్తే బాగుంటుంది.ముఖ్యంగా అనూరాధ జైలుకథల్లోని పాత్రలన్నీ సమాజంలోని నిజ జీవితాలనుంచి వచ్చినవే! కల్పిత కథలు కావు.అవి చదివితే పాఠకులు వాటితో మమేకమవుతారు.ఆలోచిస్తారు!

 26. Savveen.Ch says:

  కూర్మనాథ్‌గారు, ఆరి సీతారామయ్యగారు మాట్లాడుతున్నది పూర్తిగా ఫాలో అయ్యే ప్రయత్నం చేశాను. ఇద్దరూ మాట్లాడుతున్నదాంట్లో అర్థం ఉంది. అయితే ఇంత తీవ్రంగా కూర్మనాథ్‌గారు ఎందుకు రియాక్ట్ అవుత్నునారో అర్థం కావడం లేదు. పెద్దగా అరిచినంత మాత్రాన ఎదుటివారి వాదన వీగిపోయేలా చేయలేరు. కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే కవి అని, అల్పజీవికి కాళ్లూ చేతులూ కాగలిగినవాడే కథకుడు అనీ… ఇలా అంటూ అంటూ ఫామ్‌నీ ఫామ్ అవసరాన్ని తెలుగు నేల మీద భ్రష్టు పట్టించారు చాలామంది. అలాంటి కవి, అలాంటి కథకుడు ఉండవలసిందే. అయితే అతడు మాత్రమే కవి, అతడు మాత్రమే కథకుడు కాదని ఆరి సీతారామయ్యగారి అభిప్రాయమని నా మట్టిబుర్రకు నేను బోధ పరుచుకుంటున్నాను. అలాంటివారి గురించే రాస్తాను అలాంటి వారి కోసమే రాస్తాను అంటే రాసుకోవచ్చు. ఎవరూ వద్దనరు. అలాంటి వారినే జేబులో వేసుకుని తిరుగుతాను అనంటే ఇబ్బంది వస్తుంది. సొట్టలు పడ్డ పాత్రలు, బెజ్జాలు పడ్డ చెంబులు కూడా పాత్రలూ చెంబులే అవుతాయి. కాని తళతళగా మెరిసే లోపాలు లేని అవసరానికి ఉపయోగపడే ఎందుకు తయారయ్యాయో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చే పాత్రల గురించి ఆరి గారు మాట్లాడుతున్నారు. ఆకలి కేకలు ఆర్తనాదాలు ‘చివరికి మిగిలేవి’లో లేకపోవచ్చు. అంతమాత్రాన బుచ్చిబాబుగారు రచయిత కాకుండా పోరు. చివరకి మిగిలేది మంచి రచన కాకుండా పోదు. శారద రచనల్లో ఆ కథాంశాలు కనిపించవచ్చు. అంతమాత్రాన అవి మాత్రమే మంచి రచనలు అనుకోలేము. ఇరు పక్షాలూ ఉండవలసిందే. అయితే ఇరు పక్షాలూ కూడా ‘కథను కథగా రాయడం’ గురించి ఆరిగారు మాట్లాడుతున్నారనుకుంటాను.

  అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి వీరి రచనలు అంటే గౌరవం లేనిది ఎవరికి? అదే సమయంలో వాటిలోని పఠనీయత శిల్పం గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. ఆరిగారు యజ్ఞం గురించి ప్రస్తావించారుగాని ఆ కథను సాధారణ పాఠకుడు కాదుకదా ఒక స్థాయి పాఠకుడు కూడా ఆసాంతం సులువుగా చదవలేడు. అది అటువంటి శిల్పంలో లేదు. కూర్మనాథ్ గారి వాదనను ఎక్స్‌టెండ్ చేస్తే ‘గుడిసెల్లో ఉంటూ గుడిసెల్లో పడుకుంటూ పచ్చడి మెతుకులు తినే రచయితనే రచయితగా గౌరవిస్తాను’ అనే వరకూ వెళుతుంది. అప్పుడిక చక్కటి ఉద్యోగాలు చేసుకుంటూ, ఇళ్లు కొనుక్కుని, కారు కొనుక్కుని, బంధువులను అమెరికాలో సెటిల్ చేసి, సర్‌ప్లస్ డబ్బుతో దేశాలు పర్యటిస్తూ, ఫేస్‌బుక్‌లో వాలిడ్ అభ్యంతరాలు ప్రకటిస్తూ, సమయం దొరికినప్పుడు కథలు రాస్తూ ఎదుటివాళ్లు ఏం రాయాలో ఎలా రాయాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కనిపించే కొంతమంది రచయితలు అసలు రచయితలే కాకుండా పోయే ప్రమాదం ఉంది. అలా అని వారిని రచయితలు కాదంటామా? మిడ్కో రాసిన కథలే కాదు కూర్మనాథ్ రాసిన కథలు కూడా ఆరిగారు చదవలేదు. అంతమాత్రాన కూర్మనాథ్‌ను రచయిత కాదనగలమా? ఆరిగారు వేసిన పుస్తకాలు అమెరికాలో ఏ ఒకరిద్దరో తప్ప ఇక్కడ ఎవరూ చూడక
  పోయి వుండవచ్చు. మరి వారిని లిస్ట్ నుంచి పరిహరిం చగలమా

  తా.క: ఒక చిన్నారి మంచుతో ఆడుకోవాలనుకుంటాడు. అది విని తండ్రి ఆ చిన్నారిని కులు, మనాలి తీసుకువెళతాడు. ఇది కథగా రాస్తే అథమం. అది విని తండ్రి ఆ పిల్లవాణ్ణి ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న స్నో వరల్డ్‌కు తీసుకువెళ్లాడు. అది రాస్తే మధ్యమం. అది విని తండ్రి చట్టి మీద ఉన్న వెన్నపూసను తీసి మంచు అంటే ఇదేరా వెర్రి నాగన్నా అని ఇస్తే ఆ పిల్లవాడు కాసేపు ఆడుకుని నోట్లో పెట్టుకుని ఆకలి తీర్చుకుంటాడు. ఇది రాస్తే వరిష్టం. కూర్మనాథ్‌గారూ అంతేనా?

 27. “కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే కవి అని, అల్పజీవికి కాళ్లూ చేతులూ కాగలిగినవాడే కథకుడు అనీ… ఇలా అంటూ అంటూ ఫామ్‌నీ ఫామ్ అవసరాన్ని తెలుగు నేల మీద భ్రష్టు పట్టించారు చాలామంది. అలాంటి కవి, అలాంటి కథకుడు ఉండవలసిందే. అయితే అతడు మాత్రమే కవి, అతడు మాత్రమే కథకుడు కాదని ఆరి సీతారామయ్యగారి అభిప్రాయమని నా మట్టిబుర్రకు నేను బోధ పరుచుకుంటున్నాను. ”
  ఇది ఎక్కడి అన్యాయం?
  తెలుగు కథ తీరుతెన్నులు, వస్తువు-సారం — ఇది కాదు నేను రాసిన వ్యాసానికి లక్ష్యం. ఈ వ్యాసంలోకి సీతారామయ్య గారు వేరే చర్చని తీసుకువచ్చారు. సరే, నా అభిప్రాయం నేను చెప్తే, ఆయన వేరే కాంటెక్స్ట్ లో అంటున్నా అన్నారు. అని, మళ్ళీ “సారం లేకుండా రూపం’ అంటే అసలు ఏంటి అర్థం? నాకు ఇష్టమైన వస్తువు అయితే సారం ఉన్నట్లు, కాకపోతే లేనట్లా? ‘ఉద్యమాల’ గురించీ, ‘అస్తిత్వాల’ గురించీ రాస్తేనే సారం ఉన్నట్లా? ” అన్నారు.
  అప్పుడు, మళ్ళీ నా అభిప్రాయం చెప్పెను. కష్ట జీవిగురించే రాయమని నేనెప్పుడు అన్నాను? నేనే మళ్ళీ వివరణ ఇచ్చాను. జీవితం వేల రకాలుగా ప్రతిఫలిస్తుంది, వాటిని ప్రతిఫలించేవి అన్నీ జీవిత సారమే అని. అయితే, యండమూరి, చందు సోంబాబులు చిత్రీకరించిన జీవిత సారం జీవిత సారం కాదని. అంటే, అలాటి డొల్ల రచనలు తప్ప మిగిలినవన్నీ appreciate చెయ్యదగ్గ రచనలనీ అన్నాను.
  ఇక సాహిత్యం దానికదే సబ్జెక్టివ్. నాకు త్రిపుర కధలు, చంద్రశేఖర రావు కధలు, మార్క్వెజ్, ఓక్రి — కధలు ఇష్టం. డాలీ బొమ్మలు ఇష్టం. నాకిష్టం అని చెప్పగలనే గానీ, అవి మాత్రమె కథలు అంటే ఎలా? సార్వజనీనంగా అందరికీ నచ్చే కధలు ఎవ్వరూ రాయలేరు. అందరికీ నచ్చే బొమ్మలు ఎవ్వరూ గియ్యలేరు. నాకెంతో ఇష్టమైన త్రిపుర కధల్ని, చాసో కధల్ని మా ఫ్రెండ్ ఒకడు అసలు కధలే కాదని కొట్టి పడేస్తాడు. భిన్న రుచులు.
  మీకు నచ్చే కథలు మీకు నచ్చుతాయి. నాకు ఏ కధలు నచ్చుతాయో నేను చెప్పేను. అది సాహిత్యాభిమానిగా నా చాయిస్. నాకు అవే పాత్రలు, కన్నాలు, చిరుగులూ వున్నా, కాంతి విహీనంగా వున్నా సరే. అలాగే వుండాలని నేను అనలేదు. అలా వుంటే నాకు ఇష్టమని చెప్తున్నాను.
  నా కధలు ఆయన చదవక పోయినా, నేను ఆయన కధలు చదవక పోయినా (అవి నేను చదివేను. కొన్ని నచ్చేయి అది వేరే సంగతి) ఎవరికీ ఏ నష్టమూ లేదు. కానీ ఆ కధలు చదవకుండా (ఉద్యమ కధలు) ఎలా వున్నాయో తీర్పులు ఇవ్వడం అన్యాయం.
  మిడ్కో కధలు, షహీదా కధలు, అనురాధ కధలు, చిన్నయ్య కధలు చదవకపోతే కూడా తప్పేమీ కాదు. దోషమేమీ కాదు. కానీ చదవకుండా ఉద్యమం ఆగిపోతుందనే భయంతో, ఆదుర్దాతో తొందరతో కధలు రాసేస్తున్నారని (మీరు కాదు, సీతారామయ్యగారు) అనడం తప్పు.
  PS : మీకు నా ప్రతిస్పందన కోపంతో వున్నదని అనిపించడం కూడా సబ్జెక్టివ్ స్పందనే. దర్మాగ్రహమని నేనంటాను.

 28. మీరు చివర్లో చెప్పిన ఉదాహారణ నాకు అర్ధం కాలేదు. కాబట్టి ఆఖరి కధ గొప్పదని నేను అంటానని మీరు అనడం figmentation of your imagination . ఒక్కో వస్తువుకూ ఒక్కో రూపం వుంటుంది. నేపథ్యమూ, చదువూ, సంస్కారమూ, ప్రాపంచిక దృక్పథమూ, సహ్రుదయమూ, సమర్ధతా — ఇన్ని అంశాలు ఆధారపడివుంటాయి (అని నా బుర్రకు తోచిన అభిప్రాయం) ఓ రచన వెనకా, దాన్ని చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించడం వెనుకా. ఏ ఇద్దరికీ ఒకే రకంగా అర్ధం అవదు.
  కాబట్టి మీకు నచ్చే రచనలు మీకు నచ్చుతాయి. అవి ఖచ్చితంగా నాకు నచ్చాలని ఏమీ లేదు. ఎన్నో లేయర్లలో బతుకుతున్నాం మనం.

 29. చందు - తులసి says:

  కూర్మనాథ్ గారు….మంచి అంశాన్ని చర్చకు పెట్టినందుకు కృతఙ్ఞతలు….
  ఇక పెద్దలు సీతారామయ్య గారు, కల్యాణి గారు చర్చను మరింత లోతుకు తీసుకెళ్లి…. అర్ధవంతం చేశారు.
  ఇక తెలుగు దేశంలో రాజకీయాలు జాస్తి. మంచిదే. అవి అన్ని రంగాల మాదిరే….కథకూ వ్యాపించాయివ్యాపించాయి. ఇదీ మంచిదే..
  రాజకీయాలు పలు రకములు.. అట్టడుగు జనం కడుపు నిండా ఇంత బువ్వ తినాలని కోరుకునే రాజకీయాలు…..ఓ రకము. ఆ బువ్వతో కూడా వ్యాపారం చేసుకోవాలనే రాజకీయాలు ఇంకో రకము….
  వ్యక్తిగా ఎవరి ఇష్టం వారిది. కానీ అవతలి వ్యక్తికి కూడా నాలాంటి అభిప్రాయమే ఉండాలనుకోవడం దగ్గరే సమస్య….
  సరిగ్గా కథలు కూడా అంతే…ఎవరు నచ్చిన కోణంలో వారు రాస్తారు.
  మా కిష్టమైన కోణంలోనే కథలు రాయాలనుకోవడం అత్యాశ.
  మంచి చర్చ పెట్టిన కూర్మనాథ్ గారికి మరొక్క సారి అభినందనలు.

  • సీతారామయ్య గారినే ఉద్దేశించి రాసినా మిగిలిన వారు కూడా చదివి వారి అభిప్రాయాలను చెప్తారనే ఆశ తోనే రాసాను, చదివినందుకూ, అవి మీకు అర్ధవంతమని అనిపించినందుకూ సంతోషం చందు- తులసి గారూ.

 30. అజిత్ కుమార్ says:

  అధ్యక్షా…ఇది వ్యాసము ఎలాగౌతుంది…వ్యాసమునకు ఉండవలసిన లక్షణాలు ఉన్నట్టులేవే…నాకైతే ఇది ఓ వీధి తగాదాలో ఓ పాత్రధారి సంజాయిషీ లాగా ఉంది.

 31. From a Balagopal interview…………

  http://4.bp.blogspot.com/_K31WGNFjAbE/StMPzJMu5xI/AAAAAAAAAVM/Ofede4B4VdY/s1600-h/12+Balagopal+vyasam+2.jpg

  శిల్పం గురించి మాట్లాడితే వస్తువు మీద నుండి దృష్టి తొలగిపోతుందనే కృత్రిమమైన భయం నుండి బయటపడగలిగితే, సాహిత్యానికి ‘సాహిత్యం’ లక్షణం ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదనే విషయం స్పష్టమే. సాహిత్యానికీ జర్నలిజానికీ తేడా శిల్పమే. సాహిత్యాన్ని శిల్పమే రూపొందిస్తుంది. Form is constitutive of literature అని అడార్నో అంటాడు. అతను వర్గపోరాటం మీద అచంచల విశ్వాసం ఉన్న మార్క్సిస్టే మళ్లీ.
  ………………………..
  ‘ఆధునికతను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావు’ కన్యాశుల్కం హీరోగా ఆధునికతను నిజాయితీగా ఆహ్వానించిన వ్యక్తిని ఎంచుకోలేదు. విరసం వంటి సాహిత్య సిద్ధాంతకారుల మాటాలు విని ఉంటే ఆ పని చేసి ఉండేవాడు. అప్పుడు కన్యాశుల్కాన్ని ఈ రోజు ఎవరూ చదివేవారు కాదు.
  ………………………..
  సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.

 32. చందు తులసి says:

  @ pk గారూ..

  సాహిత్యానికి ‘సాహిత్యం’ లక్షణం ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదనే విషయం స్పష్టమే.
  – కానీ ఆ సాహిత్యంలో ….ఒక రచనకు ప్రత్యేక గుర్తింపు వచ్చేది వస్తువు వల్లనే అన్నది కూడా వాస్తవం.
  మంచి వస్తువు లేకుండా ఎంత అద్భుత శిల్పం ఉన్నా ప్రయోజనం ఉండదు.
  ఎంత మంచి వస్తువు ఉన్నా…చెప్పిన తీరు బాగోక పోతే ఆకట్టుకోదు..
  విత్తు ముందు… చెట్టు ముందా లాగా అంతు తేలని ప్రశ్న.

  ఇక సాహిత్యం పరిధి…కచ్చితంగా ఉద్యమం కన్నా విస్తృతమైనదే….
  కానీ సాహిత్యాన్ని బలోపేతం చేసింది ఆయా కాలాల్లో వచ్చిన ఉద్యమ సాహిత్యమే…

  ఉద్యమం అంటే కేవలం ఎర్ర జెండాలు పట్టుకుని చేసింది మాత్రమే కాదు. ఏ జెండా పట్టుకోకుండా చేసిన ఉద్యమాలూ ఉంటాయి.
  ఒక్క మాటలో చెప్పాలంటే….మనిషి మేలు కోరే సాహిత్యం శిల్పం బాగా లేకున్నా ఫరవాలేదు అనిపించుకోవచ్చు…..కానీ మనిషి వినాశనాన్ని కోరుకునే సాహిత్యం ఎంత గొప్ప శిల్పం ఉన్నా మెప్పు పొందదు.
  కాబట్టి శిల్పమూ వస్తువుని ఆశ్రయించాల్సిందే…

 33. well said , చందు తులసి గారు.
  pk , మీరు కొంచెం specific గా చెప్తారా? అంటే,
  “‘ఆధునికతను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావు’ కన్యాశుల్కం హీరోగా ఆధునికతను నిజాయితీగా ఆహ్వానించిన వ్యక్తిని ఎంచుకోలేదు. విరసం వంటి సాహిత్య సిద్ధాంతకారుల మాటాలు విని ఉంటే ఆ పని చేసి ఉండేవాడు. అప్పుడు కన్యాశుల్కాన్ని ఈ రోజు ఎవరూ చదివేవారు కాదు.” — ఈ వాఖ్యాని సపోర్ట్ చేసే ఉదాహరణలు చూపించండి.
  గత పదిహేనేళ్ళలో (పదిహేను ఎందుకంటే, అప్పటినుంచి నేను విరసంలో వున్నాను కాబట్టి) ఏయే విరసం సభులు ఏయే సందర్భాలలో వస్తువే పదిలమని, శిల్పం అక్కర్లేదని, జర్నలిజం లాటి రిపోర్టులు కధలుగా నమ్మాలని ఎప్పుడన్నారో వివరంగా చెప్పండి. అలా అని ఎవరైనా అంటే వాళ్ళతో మాట్లాడి అలా ఎందుకు అన్నారో తెలుసుకుని చెప్తాను.
  అంతకు ముందు అన్న సందర్భాలున్నా కూడా చూపించండి, మాలాటి వాళ్లకు తెలుసుకునే అవకాశం వుంటుంది.
  గత ఏడెనిమిది ఏళ్లుగా కధల గురించి ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని కొత్త పాత రచయితలతో కధారచన గురించి చర్చించుకుంటున్నాం.
  పడికట్టు విమర్శలు పక్కన పెట్టి, ఖచ్చితమైన ఉదాహరణలు చూపించి మాట్లాడండి. చర్చకు ప్రయోజనం వుంటుంది.
  2) “సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.”
  — ఉద్యమం గొప్పదా, సాహిత్యం గొప్పదా అన్నది పూర్తిగా వేరే చర్చ. జీవితం బ్రహ్మపదార్ధం కాదు. ప్రజా ఉద్యమాలకు జీవితమంత విస్తృతి వుంది. అందులో ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్న అంశంతో కాదు చూడాల్సింది. ఆ ఉద్యమాల్లో ఉండదగ్గ ప్రజలందరి జీవితాల్ని కూడా ప్రజా ఉద్యమాలు ప్రభావితం చేస్తాయి. లేదా చేద్దామన్న లక్ష్యంతో పనిచేస్తుంటాయి. ఆ ఉద్యమాలని అభిమానించే, ఇష్టపడే రచయితలు అలాటి ప్రజలందరి జీవితాల గురించి రాస్తారు.
  జీవితమే ఉద్యమం, ఉద్యమమే జీవితంగా వున్నప్రాంతాలున్నాయి. దేశాలున్నాయి. పాలస్తీనా, కాశ్మీర్ లాటి ప్రాంతాలే దీనికి ఉదాహరణ. ప్రజలకు జీవితం వేరు ఉద్యమం వేరు వుండదు. సాహిత్యం అక్కడ ఉద్యమం, అక్కడ జీవితం వేర్వేరు కాదు.
  ఊసుపోక రాసే రచనలు కుప్పలు తెప్పలుగా వస్తున్నది. అది జీవితమూ కాదు, సాహిత్యమూ కాదు.

  ps : మీ అసలు పేరుతో మీ అభిప్రాయాలు రాస్తే చర్చకు కొంత సౌలభ్యం పెరుగుతుంది. లేదూ, రూపంతో పని ఏముంది, మీ కామెంట్ లోని వస్తువే ముఖ్యమని అనుకోమంటారా? సరే.

 34. Hi Kurmanath, I don’t have a horse in this race. నేను కోట్ చేసినవి నా మాటలు కాదు, బాలగోపాల్ గారివి. మీ ప్రస్తుత చర్చకు సంబంధించిన అంశాలు ఉన్నాయని ఆ ఇంటర్వ్యూ లింక్ ఇక్కడ ఇచ్చానంతే. మీరు ఆ లింక్ నొక్కి చదవనట్టుంది. చదవండి, మీరు నాకు పెట్టిన కామెంట్లో ప్రస్తావించిన అంశాల మీద ఆయన వివరణలు కూడా ఉన్నాయి. అవి నాకైతే పడికట్టు విమర్శల్లా అనిపించలేదు, ఉద్యమాలతో దగ్గరగా పని చేసిన మనిషిగా ఆయన పరిశీలనలోకి వచ్చిన అంశాలేమో అనిపించాయి. ఆయన జీవితం ఆఖర్లో ఆయన దృక్పథం చేరుకున్న పర్యవసానాల్లా ఉన్నాయి. మార్క్సిస్టులు సాహిత్యం పట్ల వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకీ సాహిత్యానికీ ఉన్న ఉండాల్సిన సంబంధాన్ని ఎలా పలచన చేసిందన్నది చర్చిస్తూ ఆయన తన ‘రూపం – సారం, సాహిత్యం పై బాలగోపాల్’ అన్న పుస్తకంలో ‘మనిషి, చరిత్ర, మార్క్సిజం’, ‘ఖాళీలు పూరించడమే సాహిత్యం పని’ లాంటి వ్యాసాల్లో కూడా రాశారు.

 35. kurmanath says:

  ఆ ఇంటర్వ్యూని అప్పుడే చదివేను.
  ఆ అభిప్రాయాలతో మీకు ఏకీభావం వుండి కోట్ చేసారా, లేక చేసారా?
  ఏకీభావం వుంటే నేను రైజ్ చేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇక బాలగోపాల్ తీర్పు ఇచ్చేసాక, మాట్లాదేదేమీ ఉండకుండా పోదు. ప్రజా ఉద్యమాలు, సంస్థలు విమర్సలనుంచి నేర్చుకుంటాయి. ప్రయత్నం చేసి, అధ్యయనం చేసి టూల్స్ ని అభివృద్ది చేసుకుంటాయి. నేర్చుకోడం, ముందడుగు వెయ్యడం, కరెక్ట్ చేసుకోడం ఇది ఏదో ఒక్క రోజుతో అయిపోయే విషయాలు కావు. ప్రతిరోజూ జరగాల్సినవి.
  కధల గురించి ప్రత్యెక సమావేశాలు పెట్టుకుని వస్తువుల్నీ, శిల్పాన్నీ అభివృద్ది చేసుకునే క్రమం ఒకటి ఉంది.
  15 సంవత్సరాల క్రితం ఆయన పెట్టిన విమర్శని ఇప్పుడు గుర్తు చెయ్యడం ఆ విమర్శ ఇప్పటికీ వర్తిస్తుందని గుర్తుచేసినట్టు. In itself it is a horse , though in కగ్నితో.
  అప్పటి సంగతి నాకు తెలీక పోవడం వల్ల నేను మాట్లాడలేను. అప్పటి నుంచి విప్లవ సాహిత్యం నుంచి గొప్ప కధలు వచ్చాయి. మొత్తం మారిపోయిందని నేను అనను కానీ చాల నిజాయితీతో కూడిన ప్రయత్నం సభ్యుల నుంచి, సంస్థనుంచి జరుగుతోంది.

 36. (పేరాలు విడదీసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ముందు కామెంట్ డిలీట్ చేయవచ్చు.)
  .
  బాలగోపాల్ ఇంటర్వ్యూలోని అభిప్రాయాలతో నాకు పూర్తి సమ్మతి లేదు. అది నాకు ఆపాదింపబడే అవకాశం ఉన్నందునే నా పేరు ఇచ్చుకోలేదు. ఐతే నాకు ఆ అభిప్రాయాల పై ఉన్న అభ్యంతరాలు మరో లెవెల్లోవి. (బాలగోపాల్ సాహిత్యాన్ని ట్రెండ్స్ గా మాత్రమే ఆకళింపు చేసుకున్నారు. మార్క్సిస్టు దృక్పథం నుంచి విశాలమై ఎగ్జిస్టెన్షియలిజాన్నీ, పోస్ట్ మోడర్నిజాన్నీ అర్థం చేసుకుని అన్వయించే ప్రయత్నం చేశారు. కానీ నేను సాహిత్యాన్ని అలా చూడలేను. హోమర్ నుంచి జాయ్స్ దాకా జెన్యూన్ సాహిత్యాన్ని కలిపే దారం ఒకటే ఉందని నమ్ముతాను. అదేంటో చెప్పగలిగేంత జ్ఞానం నాకు లేదు, నేను కోరుకోను.)
  .
  బాలగోపాల్ కూడా మొదట్లో మార్క్సిజమే మానవ జీవితాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకునే దృక్పథాన్ని ఇస్తుందనీ, సాహిత్యం దాన్ని అందుకుని ఉద్యమానికి అనుబంధంగా పని చేయాలనీ అనుకున్నా, మలిదశలో ఆయన అభిప్రాయాలు మారినట్టున్నాయి. (నా దృష్టిలో పరిణతి చెందాయి.)
  .
  ఉద్యమాలు తమ స్వభావానికీ, లక్ష్యాలకూ తగ్గట్టే మనిషి జీవితాన్ని మెటీరియల్ దృక్కోణం నుంచి చూస్తాయి. కానీ సాహిత్యం మనిషి జీవితాన్ని భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మిక కోణాల్నుంచీ పట్టించుకుంటుంది. అతని ఏకాకి ఉద్వేగాల్నీ, అంతరంగిక ఆనందాల్నీ దుఃఖాల్నీ, అనుభవాన్ని పునర్మించగలిగే జ్ఞాపకాల్నీ, కోల్పోయిన ప్రపంచాల పట్ల బెంగల్నీ, వైయక్తిక వైకల్యాల్నీ, విలువల వక్కాణింపుల్నీ, ముక్కుపట్టి గుంజే వాంఛల్నీ, గుంపుతో రాపిడి వల్ల పుట్టే నైతిక ఒత్తిడుల్నీ, ఉనికి అర్థ సంశయాల్నీ… ఇంకా ఎన్నింటినో పట్టించుకుంటుంది. వర్గ దృక్పథానికి అతీతంగా దాన్ని సమీక్షిస్తుంది. ఒక్కోసారి విడుదల భావమే కేవల లక్ష్యంగా వ్యక్తమవుతుంది. సాహిత్యానికి కావాల్సింది మొత్తం మానవ స్థితి (human condition) కాగా, ఉద్యమాలకి కావాల్సింది చరిత్రనీ, రాజ్యభవితవ్యాన్నీ నిర్దేశించేటువంటి మనుషుల్లోని వర్గపరమైన పార్శ్వాలు మాత్రమే. ఇలాంటి సులభమైన చూపు ఉండటం మూలంగానే బహుశా ఉద్యమాల్లో మనుషులు, ముఖ్యంగా మార్క్సిస్టులు, జీవితం తాలూకు తలాతోకా అంత సులభంగా అర్థమైపోయినట్టు మాట్లాడతారు. ఈ విషయకంగానే బాలగోపాల్ ఇలా అంటున్నారు – “జీవిత మూలాలకు సంబంధించిన సత్యాన్వేషణ ఇంకా బాకీ ఉందని మన దగ్గర మార్క్సిస్టులు అనుకోవడం లేదు. అది ప్రాథమికంగా ముగిసిందనీ దాని ఆచరించడం, అన్వయించడం, మెరుగులు దిద్దడం మాత్రమే మిగిలివుందనీ అనుకుంటున్నారు”. పై కామెంటులో కూర్మానాథ్ కూడా తేల్చేశారు కదా, “జీవితం బ్రహ్మపదార్థం కాద”ని. జీవితాన్ని అంత తేలికైన టెర్మ్స్ లో అర్థం చేసుకోబట్టే “ప్రజా ఉద్యమాలకు జీవితమంత విస్తృతి ఉందని” తేలిగ్గా తీర్మానించేయగలిగారు. వాననీటి చెలమలో నీరు తాగుతున్న పిట్టకి అందులో ఆకాశం కనిపిస్తుంది. ఆ చెలమకి ఆకాశమంత విస్తృతీ ఉందని అది అనుకుంటే అనుకోవచ్చు. ఇక దాంతో వాదించేదేమీ ఉండదు. మనిషి జీవితంలోని వ్యక్తిగత శూన్యాల్ని పట్టించుకోని అభ్యుదయవాదుల ఈ సులభమైన ధీమాకు వ్యతిరేకంగానే దాస్తవిస్కీ తన ‘నోట్స్ ఫ్రం ద అండర్‌గ్రౌండ్’ లాంటి నవలల్లో అవేమిటో ఎత్తి చూపిస్తూ రాశాడు.
  .
  ఇక్కడ ఉద్యమం గొప్పదా సాహిత్యం గొప్పదా అన్నది కాదు మనం మాట్లాడుకుంటోంది. మానవ జీవితంలో సాహిత్యం పట్టించుకునే అన్ని పార్శ్వాల్లో ఒక పార్శ్వం (భౌతిక పార్శ్వం) తో మాత్రమే ఉద్యమాలకు అవసరం ఉంది. సాహిత్యాన్ని వారు అందుకే వాడుకున్నారు, వాడుకుంటారు కూడా. కాదనేవాళ్ళు ఎవరూ లేరు. కానీ సాహిత్యానికి ఉన్న మిగతా బహుముఖ పార్శ్వాలన్నీ అనవసరమనీ, అవి “ఊసుపోక” రాసుకునే రాతలనీ తీర్మానించడంతోనే వస్తుంది అసలు సమస్య. “ప్రజలచేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం” లాంటి ఏకపక్ష నిస్సందేహ ప్రతిపాదనలు గమ్మత్తుగా ఉంటాయి. సాహిత్యాన్ని అలా కూడా వాడుకుంటే వాడుకోండి. కానీ అదే “నిజమైన” సాహిత్యమంటే అది మీ అభిప్రాయం మాత్రమే అనాల్సి వస్తుంది. అసలు సమూహాల్ని నీరుగార్చే ఈ సబ్జెక్టివ్ ప్రపంచాల్ని ఒప్పుకోరు కాబట్టే మార్క్సిస్టు రచయితలు ఇలా బల్లగుద్దినట్టు స్వీపింగ్ జెనరలైజేషన్లని విసిరిపారేయగలరనుకుంటాను. జీవితం అన్ని మూలల్నీ పట్టించుకునే రచయిత ప్రయాణం ఎప్పుడూ సంశయాల దారుల్లోనే. అతనికి జీవితం బ్రహ్మపదార్థమే మరి.
  .
  ఇప్పటికీ ఇంకా రూపం, వస్తువుల్ని ద్వంద్వాలుగా చేసి మాట్లాడటం మన తెలుగులో తప్ప ఇంకెక్కడా జరుగుతున్నట్టు లేదు. సాహిత్యానికి రూపం వేరు, వస్తువు వేరూ ఉండవు. అలాగే వస్తువుల్లో మంచి చెడూ ఉండవు. అవి రిలెటివ్ వాల్యూసే.
  .
  ఇప్పుడు మీరంటున్నారుగా – నిజంగా విరసం వాళ్ళు సమావేశాలవీ కూడా పెట్టుకుని కథా రచన గురించి చర్చలు చేస్తున్నారని. సంతోషంగా ఉంది. ఈ విరసం 2.0 నుంచి వచ్చే రచనల కోసం ఎదురుచూస్తాను.

  • చివరికి ఇది భౌతిక వాదమా భావ వాదమా అన్న తాత్విక అంశానికి దారి తీసింది. చైతన్యం నుండి పద్దర్ధం పుట్టింద లేక పదార్ధం చైతన్యాన్ని కలగ జేసిందా అన్న ప్రశ్న వేసుకుంటే సరైన జవాబు వచ్చేది. లేక పోతే ఇధీ వాగాడంబరంగానే కనిపిస్తుంది.- అంటే భావ వాదానికే దారితీసింది.

   • పొరబాటు. పదార్థం వల్లనే చైతన్యం నిలబడుతుందనీ, లేదూ చైతన్యం వల్లనే పదార్థం కనబడుతుందనీ… ఈ మీమాంసలు తత్త్వశాస్త్ర పరిధికి చెందినవి. సాహిత్యానికి నిమిత్తం ఉన్నదానితో. అంతేతప్ప ఆ ఉన్నదంతా ఎక్కడ్నుంచి వచ్చిందీ, ఎలా వచ్చిందీ, దాని దినుసులేమిటీ, వాటిలో ఏది సత్యం అన్నది దానికి అక్కర్లేదు.
    .
    పైన మీరు వాగాడంబర భావవాదం అన్నదంతా అటు భావవాదులు ఇటు భౌతికవాదులూ ఒప్పుకోవలసిందే. రెండిటిలో ఏది సత్యం అన్న విషయంలో ఇద్దరికీ పేచీలుండవచ్చు గానీ, మనిషి బతికి ఉన్నంతవరకూ భావం, భౌతికం రెండూ ఒకదాన్నొకటి అంటిపెట్టుకుని ఉంటాయన్నది ఇద్దరూ అంగీకరించేదే.
    .
    కానీ పాపం మార్క్సిస్టులకు ఈ పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపు పూర్తి అన్వయానికి అడ్డం వచ్చేది మనిషికి ఉండే ఈ చైతన్యమే (కాన్షస్నెస్). పైన ఇచ్చిన బాలగోపాల్ ఇంటర్వ్యూలోనే ఆయన ఇలా అంటున్నారు: “చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు. ఇతర జంతువులు ఒక జంతు జాతిగా తమకు ఉండే జన్యు లక్షణాలననుసరించి బతుకుతాయి.”
    .
    అంటే అలా జంతువుల్లా జన్యులక్షణాలను అనుసరించి బతకని మనిషి చైతన్యం మార్క్సిస్టుల సిద్ధాంత అన్వయానికి ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే ఈ చైతన్యం వాళ్ళ సిద్ధాంత పరిధికి అతీతమైన, అందని ఖాళీల్ని కలగజేస్తుంది (దాన్ని పూరించడానికే సాహిత్యం అని బాలగోపాల్ అంటారు). అందుకు వాళ్ళ దృష్టిలో చైతన్యం ఓ ‘శాపం’. మనిషి కూడా జంతువుల్లా ఆదిమ చైతన్యం కలిగినవాడైతే అప్పుడు మార్క్సిజపు అప్లికేషన్ సులభతరమవుతుంది. బహుశా అందుకే కాబోలు మార్క్సిస్టులు మాట్లాడితే ఆదర్శ సమాజానికి ఉపమానంగా చీమల్నీ వాటి పుట్టల్నీ ఎంచుకుంటారు.
    .
    అలాగే… భావ భౌతికాల ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు నచ్చే ఓ Bergson మాట:
    .
    “Consciousness depends upon the brain, and falls with it; but so does a coat fall with the nail on which it hangs, — which does not prove that the coat is an ‘epiphenomenon,’ an ornamental ectoplasm of the nail.”

   • Thirupalu says:

    //బాలగోపాల్ కూడా మొదట్లో మార్క్సిజమే మానవ జీవితాన్ని సాకల్యంగా ఆకళింపు చేసుకునే దృక్పథాన్ని ఇస్తుందనీ, సాహిత్యం దాన్ని అందుకుని ఉద్యమానికి అనుబంధంగా పని చేయాలనీ అనుకున్నా, మలిదశలో ఆయన అభిప్రాయాలు మారినట్టున్నాయి. (నా దృష్టిలో పరిణతి చెందాయి.)//
    … అంటే బాలగోపాల్ గారు మొదట్లో మార్క్సిస్టు అయి తరువాత కొత్త తాత్వికతను ప్రతి పాదిమ్చాడని అర్ధమా ? భావ వాది గా మారి పోయాడని అర్ధమా ? పరిణితి అనేది ఏ విధంగా? ఎం. ఎన్. రాయ్ కూడా అలాంటి మేదావే. అలా అనుకో వచ్చా?
    //అంటే అలా జంతువుల్లా జన్యులక్షణాలను అనుసరించి బతకని మనిషి చైతన్యం మార్క్సిస్టుల సిద్ధాంత అన్వయానికి ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే ఈ చైతన్యం వాళ్ళ సిద్ధాంత పరిధికి అతీతమైన, అందని ఖాళీల్ని కలగజేస్తుంది (దాన్ని పూరించడానికే సాహిత్యం అని బాలగోపాల్ అంటారు). అందుకు వాళ్ళ దృష్టిలో చైతన్యం ఓ ‘శాపం’. మనిషి కూడా జంతువుల్లా ఆదిమ చైతన్యం కలిగినవాడైతే అప్పుడు మార్క్సిజపు అప్లికేషన్ సులభతరమవుతుంది.//
    జంతువులకు జంతు లక్షణాలు లాగే మనిషికి సామాజిక క్రమాను గతమైన – సాంస్కృతికంగా- చైతన్యం ఏర్పడుతుంది. ఈ చైతన్యాన్నే ఆయన “చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు” అన్నది.

 37. కూర్మనాథ్ గారి అర్థవంతమైన వ్యాసం వెనుక ఎంతో కృషి ఉంది. దానిపై వచ్చిన స్పందనలు ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. వారందరికీ అభినందనలు. ఒక రచనకు పాఠకులు ఎంతో అవసరమే ఐనా, పాఠకులకోసం భావుకతతో కూడిన స్పందన కూడా రచనకు దారి తీస్తుందన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్వాభిప్రాయం. అలాంటి రచనల్ని పాఠకులు కూడా శాసించలేరు. ఎవరికోసమో కాక తనకోసం పాడే ఆమనికి అభిమానుల్లా, వాటికీ పాఠకులుంటారు. ఐతే ఏ రచనకైనా ఒక్క నియమం తప్పనిసరి. నేరుగా వ్యక్తిగత ద్వేషాల్నీ, వర్గవిభజననీ ప్రోత్సహించకూడదు. అందుకు దారితీసే వేదన, ఆవేదన, విశ్లేషణ ఉండొచ్చు. ‘మనకి నచ్చినట్లు మనం రాస్తాం. వాళ్లకు నచ్చితే పాఠకులు వాళ్లని బ్రతికించుకుంటారు’ అని 1979-80లో కాబోలు కొ.కు మాకు వ్రాసిన ఓ ఉత్తరంలో వ్రాశారు. పాఠకులకోసం వ్రాసేదానికంటే, పాఠకుల్ని సంపాదించుకునేదే మెరుగైన రచన అన్న భావం రచయితలకు అవసరమని మేమనుకుంటున్నాం.

 38. మీ రచనలంటే ఎంతో ఇష్టం వసుంధర గారూ, సాహితీవైద్యం లాటి శీర్షికలలో వచ్చిన మీ అభిప్రాయాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇలా సారంగ లో మీ comment చూసి సంతోషం కలిగింది.
  “ఐతే ఏ రచనకైనా ఒక్క నియమం తప్పనిసరి. నేరుగా వ్యక్తిగత ద్వేషాల్నీ, వర్గవిభజననీ ప్రోత్సహించకూడదు.” అని మీరన్న వాక్యం లో, ‘వ్యక్తిగత ద్వేషం’ వరకూ అర్ధమైంది, వర్గ విభజన గురించిన మీ ఉద్దేశం కొంచెం వివరిస్తారా?

 39. Thirupalu garu,

  ​బాలగోపాల్​ భావవాదిగా మారిపోయారు అని నేననలేదు. అసలు ఈ భావ – భౌతికాల ప్రస్తావన ఎందుకు వస్తోంది సాహిత్యం విషయంలో? “గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్” రాయటానికి డికెన్సుకూ, “డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్విచ్” రాయటానికి టాల్‌స్టాయి కీ, “మెటమార్ఫసిస్” రాయటానికి కాఫ్కాకు తాము భావ-భౌతిక వాదాల్లో ఎటువున్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆ రచనలు ఆస్వాదించే పాఠకులకైనా అవి తేలాల్సిన అవసరం ఉందా? సాహిత్యాన్ని సైద్ధాంతికంగా పరామర్శించే, సైద్ధాంతిక చట్రంలోనే సాహిత్యాన్ని సృజించదలిచే మార్క్సిస్టులకు ఆ అవసరం ఉంటుందేమో. పిడి భౌతికవాదం వల్ల వాళ్ళు తమ ఆవరణలోనికి రానిచ్చే ప్రతీదాన్ని ఇలా భావ-భౌతికాల మెటల్ డిటెక్టర్లతో చెక్ చేసి అంచనా కట్టాల్సిన అగత్యం ఉంటుందేమో — మీరు నా కామెంటు ని భావవాదం వైపున్నదని చప్పున అంచనా కట్టినట్టు. కానీ సాహిత్యం విషయంలో ఆ కొలమానం అవసరం లేదు. కాకపోతే, మార్క్సిస్టు దృక్పథం నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి సహజంగానే బాలగోపాల్ కి కూడా ఇది తప్పలేదు.
  .
  ఇక మీ కామెంట్లో పై అప్రస్తుతాన్ని పక్కనపెట్టి, బాలగోపాల్ విషయంలో నేను పరిణతి అని దేని గురించి అన్నానో చెప్తాను. ​తొంభైల తర్వాత ​​​సాహిత్యం పట్ల ​బాలగోపాల్ అభిప్రాయాలు మారాయని ఆయన రచనల వల్ల తెలుస్తుంది. అప్పటి మన మార్క్సిస్టుల అవగాహన సాహిత్యపు పూర్తి సారాన్ని అందుకోలేకపోతోందని ఆయన​ గమనించారు.​ జీవితాన్ని సాకల్యంగా ఇముడ్చుకోగలిగే సాహిత్యంతో మార్క్సిజం తన సంబంధాన్ని విస్తృతం చేసుకోవాలంటే భౌతికవాద చట్రాన్ని కొంత వదులు చేసుకోవాలనీ, అప్పటిదాకా సైద్ధాంతిక​ ప్రతిబంధకాల​ వల్ల అది ఏ మానవ అస్తిత్వ కోణాల్ని పట్టించుకోలేదో వాటినీ పరిగణనలోనికి తీసుకోక తప్పదనీ ఆయన భావించారు. ఈ సంసిద్ధతనే నేను ఆయనలో పరిణతీ అని అన్నాను. అంతమాత్రాన ఆయన భావవాది అయ్యారని అనటం లేదు. భౌతికవాద పరిధిని కాస్త సడలిస్తూ​, తోటి మార్క్సిస్టుల్లో​ సాహిత్యం​ పట్ల సైద్ధాంతిక అవగాహనను విశాలం చేయటానికి ప్రయత్నించారు. నేను​ ఈ క్రింద ఇస్తోన్న పేరాలు ఆయన ‘రూపం సారం’ పుస్తకం నుంచి తీసుకున్నవే. వీటిని నేను అంగీకరిస్తున్నానని కాదు. ఆయనలో మార్పుని ఉదహరించటానికి తీసుకున్నాను:—
  .
  “కాల్పనిక సాహిత్యం ‘వాస్తవికతా’ నియమాలేవీ పాటించనవసరం లేదనీ, పాటించనంత మాత్రాన అది భావవాద సాహిత్యం అయిపోదనీ, నిజానికి అత్యంత ప్రగతిశీల స్వభావం గల సందేశాన్ని ‘అవాస్తవిక’ ఊహాశిల్పం ద్వారా ఇవ్వవచ్చుననీ ఇతర భాషల సాహిత్యం చదివితే అర్థం అవుతుంది. ఉదాహరణకు అర్థరహితంగా అనిపించే కథనశైలి ద్వారా ఆధునిక జీవితంలో అర్థరాహిత్యాన్ని బలంగా చూపించే రచనలు కాఫ్కా కాలం నుండి యూరప్ సాహిత్యంలో చాలా వచ్చాయి. కానీ ఆధునిక జీవితం అర్థరహితమా అని అడగవచ్చు. దానిని అర్థరహితంగా చూపించడం పోరాటాల నుండి పక్క దోవ పట్టించే తప్పుడు చైతన్యం అని విమర్శించవచ్చు. ఈ తార్కిక అభ్యంతరంతోనే మార్క్సిస్టులు అధివాస్తవిక సాహిత్య శిల్పాన్ని తిరస్కరించారు. దానిని సామ్రాజ్యవాద పతన సంస్కృతి నుండి పుట్టిన పెటీ బూర్జువా నైరాశ్యవాదం అన్నారు. ఇప్పటికీ ‘రియలిజం’ పరిధి దాటిపోయే శిల్ప సంబంధమైన ప్రయోగాలను అనుమానంగా చూసే అలవాటు పోలేదు. ప్రతీ ఆలోచనా రీతికీ ఒక వర్గమూలాన్ని వెతికే వైఖరే చాలా యాంత్రికమైనది. జీవితంలో అర్థం కానిది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది.” – మరణానంతర ఊహ, 1994
  .
  పేరును బట్టే ఈ వ్యాసం దేని గురించో తెలుస్తోందనుకుంటాను. భౌతికవాది అయిన బాలగోపాల్ కూడా భౌతికవాదం అంగీకరించని మరణానంతర స్థితి కి వెళ్లి ఊహలు చేసే వెసులుబాటు సాహిత్యపరంగా సబబేనని సమర్థించేందుకు పాట్లు పడతారు ఓ వ్యాసంలో. ఇది భావవాదం వైపు మొగ్గు కాదు, సాహిత్యపు విశ్వరూపంతో మరుగుజ్జు మార్క్సిజానికి పొత్తు కలిపే ప్రయాస అంతే. ఇదే వ్యాసం నుంచి ​మరో కొటేషన్​ చూడండి. ఇక్కడ డయలెక్టికల్ మెటీరియలిజానికి అందని మనిషిలోని మూలల్ని మార్క్సిజం పట్టించుకోక పోవటం గురించి చెప్తున్నారు:—
  .
  “మనిషికి ఉన్న వివిధమైన మానసిక అవసరాలు, స్థితులు, వైపరీత్యాలు పాలక భావజాలానికి మనుషుల ఆలోచనలను ఆక్రమించుకునే అవకాశం కల్పిస్తున్నాయని గుర్తిస్తున్నామంటే ఆ మానసిక స్థితులనూ అవసరాలనూ ‘కండెమ్’ చేస్తున్నామని కాదు. అవి మన అస్తిత్వంలో భాగం. మన కాళ్లూ చేతులూ ఎట్లాగో అవీ అట్లాగే. వాటి ఫలితంగా మన జీవితం అమానుషంగా తయారు కాకుండా వాటి అభివ్యక్తిని మానవీయంగా మలచుకోవడం ఒకటే మనం చేయగల పని. ఆ అవసరాన్ని మార్క్సిజం ఇప్పటివరకు గుర్తించలేదు. దీని గురించి కొంత ఆలోచించింది మార్క్సిస్టుల చేత పెటీ బూర్జువా సోషలిస్టులుగా తిరస్కరించబడిన ఎరిక్ ఫ్రాం, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి వారే.” – మరణానంతర ఊహ, 1994
  .
  అసలు మనుషుల మానసిక అవసరాల్ని సైద్ధాంతికంగా ‘కండెమ్’ చేయాలనే ఈ ఆలోచన వెనుక నుంచి తగుల్తోన్న ఉక్కపోత పట్ల నా అసహనాన్ని కాసేపు పక్కన పెడ్తాను. ఈయన మార్క్సిజం తరపు నుంచి ఈపాటి మినహాయింపైనా ఇవ్వటం కాసింత పరిణతే అని అనుకుంటున్నాను. చారిత్రక భౌతికవాద సిద్ధాంతంలోని పరిమితుల గురించి ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అన్న వ్యాసంలో ఇలా రాస్తారు:—
  .
  “సోవియట్ రష్యా, చైనా తదితర దేశాలలో వచ్చిన రాజకీయ మార్పులకు పాక్షికమైన జవాబులు చెప్పి ఊరుకోకుండా సంక్షోభాన్ని సంక్షోభంగా స్వీకరించి చర్చిస్తే మార్క్సిస్టు అవగాహనలో ఉన్న కొన్ని ఖాళీలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వీటిలో ప్రధానమయినవి మానవ ప్రవృత్తికీ సమసమాజ ఆదర్శానికీ మధ్యనున్న జవాబు దొరకని ప్రశ్నలు. మనిషిని చరిత్ర నిర్మాతగా మార్క్సిజం గుర్తించింది గానీ ఆ చరిత్రకూ దాని నిర్మాతకూ మధ్య నున్న సంబంధాన్ని వివరంగా ప్రతిపాదించలేదు. దానిలోని ఎగుడుదిగుళ్ళను గుర్తించలేదు. ఆ సంబంధం ‘గతితార్కికం’ అని ముందు జాగ్రత్తగా ప్రకటించి ఊరుకుంది. మనిషికీ బయటి ప్రపంచానికీ మధ్యనున్న ఏ సంబంధమయితే ప్రపంచవ్యాప్తంగా గొప్ప కాల్పనిక సాహిత్య వస్తువుకు మూలంగా ఉంటూ ఉందో ఆ సంబంధానికి చారిత్రక భౌతికవాద సిద్ధాంతంలో స్పష్టమయిన చోటు లేదు. […] మానవ ప్రవృత్తి అనేది ఆలోచించకుండా కొట్టి పారేయగల విషయం కాదు. భావవాద ఆలోచన నుంచి పుట్టిన భ్రమ కాదు. […] సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పు వచ్చినప్పుడు దానికి తగినట్టు మానవ ప్రవృత్తి కూడా మారిపోతుందని భావించి ఆ ప్రవృత్తి గురించి ఆలోచించనవసరం లేదని చారిత్రక భౌతిక సిద్ధాంతం ఇప్పటిదాకా చెప్తూ ఉంది. మార్క్సిస్టులందరికీ కాకున్నా కనీసం మార్క్సిస్టు సాహిత్యకారులకు ఇది నిజం కాదని తెలియదంటే నమ్మడం కష్టం.” – చరిత్ర, మనిషి, మార్క్సిజం, 1993
  .
  అయినప్పటికీ బాలగోపాల్ సాహిత్యాన్ని సకల పార్శ్వాలతోనూ అర్థం చేసుకుని ఆలింగనం చేసుకోగలిగారని నేను అనుకోను (సైద్ధాంతిక పరిమితుల వల్ల). కానీ మన లోకల్ బ్రాండు మార్క్సిస్టులు చాలామంది కంటే ఆ దారిలో ముందుకు రాగలిగారని చెప్తాను. తన సంశయాత్మ గొంతుని సైద్ధాంతిక పిడిబాకుతో కోసేయకుండా సజీవంగా తనతో నిలుపుకున్నందుకు అభినందిస్తాను.
  .
  ఇక మీ కామెంట్లో రెండో భాగం – బాలగోపాల్ మాటల్లోని ‘చైతన్యం’ అన్న పదాన్ని “చిత్తు – చిత్తం – కాన్షస్నెస్” అన్న అర్థాల్లో గాక, మీరు “కొత్త అవగాహన” అన్న అర్థంలో తీసుకున్నట్టయితే మీరు ​అక్కడి విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన చైతన్యం అన్న పదాన్ని తాత్త్వికార్థంలోనే వాడినట్టు​ నాకు స్పష్టంగానే తెలుస్తోంది.​

 40. Thirupalu says:

  //“గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్” రాయటానికి డికెన్సుకూ, “డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్విచ్” రాయటానికి టాల్‌స్టాయి కీ, “మెటమార్ఫసిస్” రాయటానికి కాఫ్కాకు తాము భావ-భౌతిక వాదాల్లో ఎటువున్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆ రచనలు ఆస్వాదించే పాఠకులకైనా అవి తేలాల్సిన అవసరం ఉందా? //
  ఉందా లేదా అని కాదు. ‘జీవిత వాస్తవికత ‘ అనేది ఉన్నది ఉన్నట్టు వర్ణించడం సిద్ధ హస్తులైన వారు ఉంటారు కానీ, కార్య కారణ సంబందాలో తెలుసు కోవాలంటే మాత్రం మార్క్సిస్టు తాత్వికత ఉండాలి . లేక పోతే మానవ కష్టాల నుండి బయట పడే మార్గం సులభతరం కాదు. మార్క్స్ కు పూర్వమ్ కూడా మంచి మానవత్వం గల ఆలోచనా పరులు ఉన్నారు. వారు కూడా కష్ట జీవుల కష్టాలను చూసి చాలించి పోయారు. అయితే వారు ఏమీ చేయలేక పోయారు. వాళ్ళని ఉటొపినియిశ్టులు అంటారు.

  //ఇక మీ కామెంట్లో రెండో భాగం – బాలగోపాల్ మాటల్లోని ‘చైతన్యం’ అన్న పదాన్ని “చిత్తు – చిత్తం – కాన్షస్నెస్” అన్న అర్థాల్లో గాక, మీరు “కొత్త అవగాహన” అన్న అర్థంలో తీసుకున్నట్టయితే మీరు ​అక్కడి విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఆయన చైతన్యం అన్న పదాన్ని తాత్త్వికార్థంలోనే వాడినట్టు​ నాకు స్పష్టంగానే తెలుస్తోంది.​//

  “చిత్తు – చిత్తం – కాన్షస్నెస్” అన్న అర్థాల్లో ఉంటేనే అది భావ వాదం. మరిక మాట్లాడాటానికి ఏముంటుంది?
  సాహిత్యాని కి ఏ తాత్విక పునాదులు లేకుండా ఉండవు. ముఖ్యంగా మార్క్సిస్ట్ సాహిత్యాన్ని మార్క్సిష్ట్ సాహిత్యం తోనే విమర్శించాలి లేక పోతే సరైన జవాబులు రావు.
  స్పందిమ్చినందుకు ధన్య వాదాలు.

 41. మార్క్సిజం తాలూకు ఆలోచనా వ్యవస్థలు చాలావరకూ మార్క్సిజపు గోడల మధ్యనే చెల్లుతాయి. బయట నిలబడి మాట్లాడేవాళ్ళకు అది లోపలికి వచ్చి మాట్లాడమని మాత్రమే చెప్పగలుగుతుంది. కార్యకారణ సంబంధం గురించి మార్క్సిజపు నిర్వచనం కూడా అంతే. అది కార్యకారణ సంబంధాల్ని భౌతిక కోణం నుంచి మాత్రమే అర్థం చేసుకుంటుంది. కానీ అవి ఎప్పుడూ మనుషుల వర్గ తారతమ్యాల మీదనే ఆధారపడి ఉండవు. పైన బాలగోపాల్ అన్నట్టు “ప్రతీ ఆలోచనా రీతికీ ఒక వర్గమూలాన్ని వెతికే వైఖరే చాలా యాంత్రికమైనది. జీవితంలో అర్థం కానిది ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుంది.” వర్గ దృక్పథానికి అర్థం కాని అట్లాంటి ఖాళీల్లోకి పోయి వెతగ్గలిగేది సాహిత్యం. నేనో పాత బ్లాగు పోస్టులో ఇలా రాశాను:—
  .
  “మార్క్సిజం మనిషి జీవితాన్నంతా పరిధిలోకి తీసుకున్న సిద్ధాంతం కాదు. అతని సంఘజీవనాన్ని మాత్రమే పరిధిగా ఎంచుకున్న సిద్ధాంతం. (మార్క్సిజాన్ని తత్త్వశాస్త్ర శాఖగా పరిగణించేవారు ఈ సంగతే మర్చిపోతారు.) మనుషుల మధ్య పరస్పరం ఆహార వనరుల సమాన పంపిణీ, ఆర్థిక వనరుల సమాన పంపిణీ… యిలా దాని దృష్టి అంతా మనిషి జీవితంలోని భౌతికపార్శ్వం వైపే! అది వీధిలోకొచ్చి పరస్పరం లావాదేవీలు నడిపే మనుషుల ప్రశ్నలకే జవాబులిస్తుంది గానీ, ఏకాంతంలో వున్న మనిషి మనసు ఎదుర్కొనే ప్రశ్నలకు జవాబులివ్వలేదు.”
  http://loveforletters.blogspot.in/2011/03/blog-post_23.html
  .
  సాహిత్యం అలాంటి మూలల్లోకి వెళ్ళి ఆ ప్రశ్నల్ని అడ్రస్ చేయగలదు. కాబట్టి సాహిత్యానికి మార్క్సిజం కాదు, మార్క్సిజానికే సాహిత్యం అవసరం చాలా ఉంది. అది మార్క్సిజమూ గ్రహించింది కూడా. అందుకే కదా, మార్క్సిస్టు విమర్శ పుట్టింది. ఇంకోటేమిటంటే – మార్క్సిజం నిజంగా ఎక్కడన్నా ఏమైనా చేయగలిగినాక మాత్రమే దాన్ని ఊటోపియాల కేటగిరీ నుంచి బైటకు తెద్దాం.
  .
  సాహిత్యానికి తాత్త్విక పునాదులు ఉండవని నేను అనలేదు. భౌతిక – భావవాదాల తత్త్వమీమాంస దానికి అనవసరం అన్నాను. రచయిత తాలూకు తాత్త్వికత అతని సృజన ప్రపంచాల్లోంచి పారదర్శకంగా వ్యక్తమవుతూనే ఉంటుంది. అది భౌతిక – భావవాదాల మధ్య స్పష్టమైన విభజనను ఆవశ్యకం అనుకోదు.
  .
  భావవాదం అనగానే మీకు మరిక మాట్లాడటానికి ఏమీ కనపడకపోయినా ఒక డైలాగ్ మొదలుపెట్టినందుకు థాంక్స్.

 42. //మార్క్సిజం తాలూకు ఆలోచనా వ్యవస్థలు చాలావరకూ మార్క్సిజపు గోడల మధ్యనే చెల్లుతాయి. //
  అవును. మార్క్సిస్ట్ అవగాహన లేక పొతే వేసుకున్న ప్రశ్నలకు తప్పుడు జవాబులే వస్తాయి. మార్క్సిస్టులు ఉత్పత్తి పంపనీకి మాత్రమే పరిమిత మౌతారనే మీ అవగాహాన ఏ తాత్విక దృక్పడానికి చెందినది. మార్క్సిజం మానవ జీవితములోని సకల రంగాలకు విస్తరించి మానవ జీవితములో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతుంది. కొత్త సమస్యలు వచ్చినా తన విశ్లేషణతో పరిసకరిస్తుమ్ది. సామాజిక జీవిత ప్రభావమే మానవ జీవిత వాస్తావికిత అని అది గుర్తిస్తుంది. సామాజిక జీవిత పలితంగా వచ్చేవే జీవన రంగాలలో ప్రతిపలిస్తుమ్టాయి. ఆ నిజం గుర్తించ లేని గుడ్డి వారు (పెట్టుబడి దారి కళ్ళతో చూసే వారు) దానిమీ దాని మీద బురద చల్లుతానే ఉంటారు. సాహిత్యం దానికి మినాహాయింపు ఏమి కాదు. మరీ ఇటివలీ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వచ్చిన విప్లవాలు దాని పరిధి విస్తృతం చేశాయి. లేక పోతే నూట ఏబై సమత్సారాలకు పైగా ప్రపంచ మొత్తం మీద చర్చకు గురి అయి ఉండేది కాదు. దాని మీద వచ్చే విమర్శలను పూర్వ పక్షం చేస్తూ ముందుకు పోతుంది.

 43. If you are craving for one last word, I will be happy to give it to you.. but that doesn’t necessarily make it a final word.
  .
  ఇలా ఎవరి సోది వాళ్ళు పార్లల్ గా మాట్లాడుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం లేదు. ముఖ్యంగా మీ మాటల్లో కాంట్రడిక్షన్లని మీరు గుర్తించటం లేనప్పుడు. ఒక పక్క మార్క్సిజం “సగలరంగాలకూ విస్తరించి మానవజీవితంలో ప్రతి సమస్యనూ పరిష్కరిస్తుంది” అంటూనే, మరోపక్క “సామాజిక రంగం తాలూకు ప్రభావం మాత్రమే మానవ జీవిత వాస్తవికత అని గుర్తిస్తుంది” అంటున్నారు. మరి అక్కడే దాని పరిమితి ఏంటో తెలిసిపోతుంది కదా? నేను పైనంతా చెప్తున్నది ఏమంటే, సామాజిక రంగం మాత్రమే మానవజీవిత వాస్తవికత కాదూ, మనిషి వైయక్తిక ప్రపంచాన్ని అన్నిసార్లూ సామాజికమే నిర్దేశించదూ అని. ఈ మాటొస్తే చాలు దానిపై భావవాదం అనో, ఇప్పుడు ఇంకా పేలవంగా “గుడ్డి పెట్టుబడిదారీ” దృక్పథం అనో లేబెల్స్ వేయటానికి మీరు చాలా ఉత్సాహపడుతున్నారు. ఆల్రెడి మట్టిగొట్టుకుపోయిందాని మీద బురదచల్లే సరదా ఎవరికీ లేదు. నేను మార్క్సిజం గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది సాహిత్యం గురించి. సాహిత్యం సామాజిక వైయక్తిక ప్రపంచాలన్నింటినీ పట్టించుకుంటుందీ (మీరూ ఒప్పుకునేదే), వైయక్తిక ప్రపంచాలు మార్క్సిజం పరిధి కాదు కాబట్టి (మీరంటున్న మాటే) సాహిత్యాన్ని మార్క్సిస్టులు వారి అవసరాలకు తగ్గట్టు వాడుకుంటే వాడుకోవచ్చు, అంతేతప్ప తమ సిద్ధాంతపు పరిమితుల్ని దాని మీద అప్లయి చేయటం వల్ల జరిగే మంచేమీ లేదూ అని. మీ టైపు వాదనలన్నీ ముందే ఊహించిన బాలగోపాల్ మాటలపై మీ స్పందన ఏమీ ఉన్నట్టు లేదు. ఇప్పుడు వైయక్తికాన్ని పట్టించుకునే సాహిత్యాన్ని మీరు ‘పెట్టుబడిదారీ’ అంటున్నారే, అలాగే ఆయన కాఫ్కా రచనల్లాంటి వాటిని మార్క్సిస్టులు పెటీ బూర్జువా సాహిత్యంగా తీసిపారేస్తారని ఊహించి దానిపై స్పందించాడు. ఆయన ఊహించిన మూసల్లోకి మీరు ఇంత చక్కగా కుదురకోవడం చూస్తే నాకు సరదాగా ఉంది.

మీ మాటలు

*