నేను తోలు మల్లయ్య కొడుకుని…

 

– కృష్ణ జ్యోతి

 

krishnajyothiఆదివారం పెద్దకూర పండగా, నాటుసారా ఏడుకా గడిచిపోయాక సోమారం చెప్పుల దుకానం కాడ కూచోడం బలే కష్టమనిపిస్తది మారయ్యకి. కానీ తప్పదు. మళ్లీ వారమంతా అందరి కడుపు నిండి, మళ్ళా వారం చివర కాసింత సరదా కావాలంటే వారమంతా ఈడ కూచోని ఎదురు చూడాలి్సందే. దుకానమంటే ఏమంత కాదుగానీ, నేలమీద రెండు గోనెలు, సుత్తీ, అరా, పెద్దసూదీ, దారం, అతికిచ్చే బంక ఇంకా నాలుగు జతల పాత చెప్పులు! ఓ చిన్న టార్పాలిన్ షెడ్డు. అదీ వానా కాలం గాబట్టి. ఓ మనిషి పట్టేంత చోట్లో ఎదురు కర్రలతో షెడ్డు ఏశాడు. చలికాలం ఆకాశం కిందనే. ఎండకి మాత్రం ఓ గొడుగేసుకుని నల్లని గొడుగు కింద మండతా వుంటాడు. అలవాటై పోయింది.

నలభై ఏళ్లుగా ఇక్కడనే కూచుని వున్నాడు. రామారావు ముక్యమంత్రి కాకముందు, అయిన తరవాత ఊరికొచ్చినపుడు ఈ దారంటే ఊరేగింపు చేశాడు. అంత లావు రామారావుని జనం బుర్రలోంచి మరిపిచ్చేసిన ఈ మారాజేవరా అని చంద్రబాబుని ఎగిరెగిరి చూసి ఆశ్చర్యపోయాడు. అయితే రాజన్న మటుకు తక్కువా?! పంచెగట్టి చేతులూపుకుంటాపోతావుంటే జనాలు ఎంత ఇదైపోయారు. చూస్తానే వున్నాడు…అందర్నీ…. ఇక్కడే కూచుని. ముందుకీ పక్కకీ జరగలేదు గాని రోడ్డు ఎడల్పు చేసేప్పుడు కాసింత ఎనక్కి పోవలిసొచ్చింది!

సినిమా హాలు సెంటరు కాడ రాత్రి చానా పొద్దు దాకా జనాలు తిరగతానే వుంటారు. పెళ్లి గాక ముందు రేత్తిరిపూట సినిమా యిడిసిపెట్టేదాకా ఆడనే కాసుకుని ఉండేవాడు. రేత్తిరి సినిమాకి వచ్చే జనం పొయ్యే జనం…. ఇద్దరి ముగ్గురి చెప్పులన్నా తెగిపోయేయి. అయితే ఆ రోజుల్లో ఇప్పట్లా పతోళ్ళూ జోళ్ళు ఏసేవాళ్ళు గాదు.

ఆ సమయాన జోడు తెగితే మంచి గిరాకి. ఏళ గానీ ఏళ గాబట్టి తనకి ఓ రూపాయి ఎక్కువ వసూలు! ఆ వసూలైన డబ్బులు దాపెట్టి ఆదివారం జల్సా చేసేవాడు. పెళ్లైన తరవాత పొద్దు గుంకక ముందరే ఇంటికి పోవలిసొచ్చేది. సందకాడ ఉజ్జోగం మానేశాడు. అయినా ఇదివరకులా ఇప్పుడు తెగేదాకా చెప్పులు ఏసేవారు ఏడున్నారు. ఒక్కో మడిసికి నాలుగేసి రకాలాయె. పొద్దున లేస్తే వాకింగ్ కి ఒకటి, ఇంట్లో ఒకటి, ఆఫీసుకొకటి, ఆటలకొకటి, బజారుకి పోతే ఇంకొకటి. తిండికి లేనోడు తిండికి ఏడుస్తుంటే జరిగినోడు ఇట్ట…

అసలు జనాలు సినిమాలకి నడస్తా రావడం మానేశారు. తొక్కుడు రిక్షాలు పోయి ఆటోలు, సైకిళ్ళు పోయి మోటారు బళ్ళు, రకరకాల గుడ్డలు, ఇంకా … గుడ్డ రంగునిబట్టి జోళ్ళు!…. జోళ్ళు నలక్క ముందే పడేత్తన్నారు. ఇంక తెగేది ఎక్కడ? తనకి పని దొరికేదెక్కడ? పక్క సందులో సాయి బాబా గుడికాడ రకరకాల కొత్త జోళ్ళు వుంటాయి. ఆటిల్లో నాలుగు మనమే తెగబెరికేసి ఆడనే దుకానవెట్టి మళ్ళా కుట్టేస్తే బావున్ను! కానీ తనకట్టా చెయ్యను సేతగాదు. ఇప్పుడుగాదు, ఎప్పుడూ తప్పుడు పనులు జేసి డబ్బులు సంపాయించాలని చూళ్ళేదు. బిడ్డల చిన్నతనంలో ఇంటికాడ మంది తక్కువ, పనెక్కువ. ఇప్పుడు మంది పెరిగారు గాని పని రాన్రాను తగ్గిపోయింది. తనకొచ్చే సొమ్ముతో ఇల్లు గడవక, పెళ్ళాం పాలేనికి దగ్గర్లో టీచరమ్మకాడ పనికిజేరింది. మరి దానికి బైట రోజుకూలి పనికి పోయే ఓపిక లేదు, అలవాటు లేదు.

 

***

దుకాణం సర్దతానే తలెత్తి చూశాడు. ప్రతిరోజూ చూస్తాడు. ఎదురుగా కిళ్ళి షాపులో షబానా వుంటది. పెళ్లి కాకండానే ముసిల్ది అయిపొయ్యింది. ముసుగుల్లో వుండాలి్సన పిల్ల బజార్లో కూచుని వుండటానో, తల్లీ తండ్రికి తాహతు లేకనో ఆ పిల్లకి ‘నికా’ కాలేదు. షాపుకి మొగోళ్ళు సిగ్రేట్లకని, వక్కపొడికనీ ఒక్కోసారి కాలక్షేపనికనీ వస్తానే వుంటారు. షబానా ఎవ్వరివంకా తలెత్తి చూడదు. అందరితోను కోపంగా వున్నట్టు మాట్టాడుతుంది. కానీ తనవంక ఇష్టంగా చూసేది. తన మొహాన్నీ, బుజాలని, మొత్తం కండల్ని కళ్ళతో తడిమేది.

ఎప్పుడైనా ఒళ్ళు తేడాజేసి రెండ్రోజులు షాపు తెరవకపోయినా, ఆలిసంగా తీసినా కంగారు కళ్ళతో పలకరించేది. తను తలెత్తి చూడకుండానే షబానా తన్ని చూస్తందని కనిబెట్టగలడు. తనక్కూడా షబానా మీద మోజుండేది.

ఓ కాలంనాడు దయిర్నం చేసి మాట్టాడి లేవదీసుకుపోవాలనుకున్నాడు. కానీ ఇద్దరూ మంచం పొత్తు లేని జాతులై పోయా. పైగా అంగడి ఏవైపోద్దో అని గాబరా పడ్డాడు. ఈ రోజున పెళ్లీ పెటాకులు లేకండా దిగాలుగా వాడిపోయిన షబానాని చూస్తే జాతిని తీసుకెళ్ళి నూతిలో పారేసి నా ‘సూపరు మారికేట్టు’ ఎత్తి ఏ సందులో పారిస్తే పని జరక్కుండా పోయేదా!? దీనికోసరం ఆ పిల్లని ఉసురు పెట్టానా అని మనేద కలుగుద్ది. మేనమావ కూతురు రవనని మనువాడినా చానా మాట్లు రేత్తిరిల్లు తన పక్కన ఒత్తిగిల్లిన పిల్ల రవనలా కాకుండా షబానాలా కనబడేది!

అల్లంత దూరాన జగ్గయ్య పంతులూ, తనూ కనబడ్డాడు. ఇద్దరూ ఒకే కాలాన్ని పుట్టినోళ్ళు. ఇంటికాడ చొక్కా ఏసుకోడు, బజారోస్తే నీలం గళ్ళ చొక్కా ఏస్తాడు. మడిసి పచ్చగా తన నల్లటి సేతులతో తాకితే మాసిపోతా అనేలా వుంటాడు. కానీ తనంత గట్టిగా లేడు. మెడ కాడా, చెంపలకాడా జారిపోయింది. పంతులు తనూ ఒకే బడిలో పలకబట్టారు. తన సదువు నాలుగుతో ముగిస్తే పంతులు చానా దూరం పొయ్యాడు. పోతం పొయ్యాడుగాని ఎప్పుడూ అత్తెసరే. ఆడాడ లెక్కలు రాసి బతకతన్నాడు. వున్నా లేక పోయినా చొక్కా నలగనీడు. మడిసి చానా వుషారు. అయితే చాదస్తం బాపడు. లేకపోతే ఉళ్ళో ఎన్ని దుకానాలొచ్చాయి!? తన దగ్గరే చెప్పు తయారు చేబిచ్చుకుంటాడు. ఎంత అడిగినా బేరం ఆడకుండా ఇచ్చేస్తాడు. తనుగూడ ఎప్పుడూ పంతులినుండి ఎక్కువ గుంజాలని చూళ్ళేదు.

“ఆ, మారయ్యా మన బాటా కంపెనీ కొత్త మోడల్స్ తియ్యి. జోళ్ళు మార్చేద్దాం” జగ్గయ్య తన పరాచికానికి తనే యిరగబడి నవ్వుతా పక్కనే బల్లమీద కూలబడ్డాడు.

“ రా పంతులా, నీ కోసరం గాక ఎవురికోసరం ఈడ కూసుండి వున్నా?! అట్నే కుట్టేద్దాం., రేపొద్దుటికి.” తన పాత సావాస గాడినీ, కస్టమర్నీ చూసి మారయ్య మనసు కుశాలైపోయింది.

Kadha-Saranga-2-300x268

***

తోలు పని చేయడం గమ్మత్తనిపించినపుడు, బడి మానేసి పన్లో జేరతన్న సంగతి ఇంటికాడ కాకండా జగ్గయ్యతోనే చెప్పాడు. జగ్గయ్య బడి మానోద్దని బతిమలాడాడు. గోటింబిల్లా, గోలికాయలు, బచ్చాలు, ఇంకా అట్టాంటి చానా ఆటలు మారయ్య కాడనే జగ్గయ్య రహస్యంగా నేరిచాడు. అట్టాంటి గురువుని తన్ని వొదిలి పోతాడంటే జగ్గయ్యకి దిగులైపోయింది. కానీ మారయ్య ఇనిపిచ్చుకోల.

“రేపటినించీ బడికి రానంటే రానంతే” అన్నాడు.

సరేలే అని ఆ రోజంతా ఇద్దరూ ఆశతీరా ఆడుకున్నారు మాపటేళకి ఇంటిదారి బోతన్నారు. జగ్గయ్య ఇల్లు బజారు వెంబడే. మారయ్య గుడిసె మాత్తరం బజారు దాటి సివరాకర్న ఎక్కడో. ఆటకి అలిసి ఇద్దరికీ బలే దాహమైపోయింది.

“దాహంగా వుందిరా” అన్నాడు మారయ్య గస పెడతా.

జగ్గయ్య చప్పున ఇంట్లోకి పోయి లోటానిండా నీళ్ళు తెచ్చాడు. అంతట్లోకి యీదిలోంచి పెద్ద పంతులు – జగ్గడి నాన్న గుమ్మంలోకొచ్చాడు. మారయ్య సాయ ఎగాదిగా చూశాడు.

“ఎవరబ్బాయివిరా” అనుమానం!

“తోలు మల్లయ్య కొడుకుని” పాలెంలో మారయ్య నాన్నని అందరూ అట్టానే పిలుస్తారు. అట్టా పిలవడం మారయ్యకి భలే గొప్పగా అనిపిస్తాది.

“ దాహానికి నీళ్ళు తాగితే తాగావుగానీ, ఆ చెంబు ఇహ ఇంటికి పట్టుకుపో. మళ్ళా మాఅబ్బాయితో తిరగవాక” జగ్గన్ని బుజం పట్టుకుని ఈడ్చుకుపోతా చెప్పాడు.

మారయ్యకి ఆ చెంబు బలే నచ్చింది. ఉత్తికినే వచ్చింది పైగా. ఇంట్లో వున్న సత్తు సొట్టల చెంబు మాదిరిగాగాకండా ఇది తళ తళగా వుంటం మూలాన మొగం గూడ సూస్కోవచ్చు.

“యాడిదిరో చెంబు” పుల్లమ్మ కొడుకునీ, చెంబుని మార్చి మార్చి చూస్తా అడిగింది.

“జగ్గయ్య నాన్న పెద్ద పంతులిచ్చాడు. ఆడ నీళ్ళు తాగినా. ఎమ్మటే సెంబిచ్చేశారు” గర్వంగా గడ్డమెత్తి చెప్పాడు.

“నిన్ను తిట్టి కొట్టారా?” అంది అమ్మ గాబరాగా.

“లేదే! ఎందుకూ?” అమ్మ నేను ఆళ్ళకి తెలీకండా చెంబు తెచ్చాననుకుంటందనుకుంటా.

“ఏరే వాళ్ళైతే సంపినంత పని సేద్దురు. పెద్ద పంతులు దేవుడే. బిడ్దో, నీళ్ళ కోసరం అట్టా పెద్దోళ్ళ కొంపలమీద పడమాక. కడగొట్టోళ్ళం. ఆళ్ళని కళ్ళతో జూసిందే మనకి గొప్ప. అంతగా దప్పికైతే దోసిట్లో పోబిచ్చుకుని తాగు” అమ్మ జాగర్త చెప్పింది.

ఈ రోజుకీ ఆ చెంబుతోనే నీళ్ళు తాగుతాడు. ఆ చెంబు తన పుట్టుకని ఎగతాళి చేసేదని చానా కాలానికి గాని బుర్రకెక్కలేదు. పని తగ్గి కాళీ పెరుగుతున్న రోజుల్లో, పక్కనే వున్న ఇంకో పాలెం లోకి సున్నం పనికిబోయాడు. దండెం మీద తువ్వాలుకి కడిగిన చేతులు తుడిస్తే ఆ ఇంటి ఆడది నారాయణమ్మ తువ్వాలు ఎత్తకపొమ్మంది! అమ్మ జెప్పిన సంగతి గ్యాపకం వొచ్చింది. తను కడగొట్టు మడుసుల్లో కడగొట్టు. చర్చి కాడ కంచం పొత్తు సూబెట్టేవోళ్ళు ఇంటికాడ తేడా సూబెట్టేశారు.

బడి మానేసి తోలుపనికి జేరేప్పటికి తను చిన్నోడే. మొదట్లో ఆ వాసనకి వాంతి చేసుకున్నాడు. కొన్నాళ్ళకి అలవాటైంది. కానీ ఆ పని ఎన్నాళ్ళో సాగలేదు.

“తోలు పనీ ఇడిసి పెట్టేసేయ్ రా, అది ఒంటిని లోపట్నించి తినేస్తాది. పేనం వున్నప్పుడు మెరిసే తోళ్ళు పేనం పోయినాక కరిసేస్తాయి. నా రోగం తోలు నుంచే పుట్టిందే” సచ్చేముందు అయ్య మాట ఇన్న తరవాత తోలంటే బెదురు పుట్టింది. దాన్ని ఇడిసి పెట్టేశాడు. సినిమా హాలు కాడ దుకానం పెట్టాడు. జోళ్ళు బాగుచేసేది, తయారు చేసేది నేర్చుకున్నాడు. కొత్తగా పని జేసేప్పుడు పనిలో ఒళ్ళు దగ్గరుండాల! లేపోతే సేతులు సిల్లులే.

 

***

unnamed“పిల్లకాయలెట్టున్నారు పంతులా?”మారయ్య ఆరా తీశాడు. జగ్గయ్య మోహంలో కులాసా మాయమై దిగులొచ్చింది.

“ఆ ఏముంది మారయ్యా. పూజలు చేసే దానికి పనికి రాని పంతుళ్ళు. ఉజ్జోగాలు సంపాయించలేని మొద్దోళ్ళు. పెద్దోడు హైదరాబాద్ వెళ్ళాడు. చిన్నోడు ఇంకా ఏపని చెయ్యాలో తెలుసుకోక తిరుగుతా వున్నాడు”

“కానీయ్ లే పంతులా. ఏదో పనికి పోనీ”

“మాబోటోళ్ళని మీవోళ్ళు నేలకి తోక్కేసిన పాపం మీరిట్టా అనుబగిస్తన్నారేమో పంతులా” పరాచికంగా నవ్వతా అనేశాడు మారయ్య. జగ్గయ్య నోరారా నవ్వాడు.

“ఓ కాలం నాడు మేం గొడ్లు కాసుకుంటూ, గొడ్డుమాంసం తింటూ బతికామంట. తరవాత రాజుల్నీ, రాజ్యాల్నీ ఏలాం. ఈ రోజు నువ్వు తోలు కోసుకుంటా, గొడ్డుమాంసం తింటా బతకతన్నావు. రేపు నువ్వూ రాజ్యం ఏలతావులే” పంతులు భరోసా ఇచ్చాడు.

“నే రాజ్జానికి వొచ్చేలోగా ఇల్లు గడవాలిగా. మనవడికి వొళ్ళు ఎచ్చబడింది. మందు ఏపిచ్చాలి. రెండొందలప్పియి్య పంతులా” మారయ్యకి అవసరం గుర్తుకొచ్చింది.

పంతులు జాగర్తగా రెండు నోట్లు తీసి మారయ్య చేతిలో పెట్టాడు. మారయ్య డబ్బుని బొడ్లో దోపాడు.

“ఇంతకీ రాజ్యం చేతికొచ్చాక ఏం జేస్తావు మారయ్యా?” జగ్గయ్య నవ్వుతా అన్నాడు.

“నాకైతే ఆటిగురించి ఆలోశన లేదు. రాజ్జాలు ఏలేది ఒకరో ఇద్దరో. తీరా కురిచీలు ఎక్కాక మడుసుల్లో మారుపొచ్చేసుద్ది. నాకు దరమం కావాలి. నా పని గూడా అన్ని పనుల్లోకి సమానం కావాలి. అంటే సూది మందేసే బాబుతో నాకూ సమానంగా డబ్బుఇయ్యాలి. నాకే గాదు…. అన్ని పనులకీ అటు ఇటుగా ఒకే రేటువుండాలి. ఇగ అన్ని కులాలోల్లకి పని దొరకాలి! అప్పుడు ఎక్కువా తక్కువా తేడా ఏడుంటది?”

“ఓర్నీ అసాధ్యం గూలా! నువ్వూ సూదిమందిచ్చే డాక్టరూ ఒకటే?” పంతులు నమ్మలేనట్లు మొకం పెట్టి నవ్వాడు.

పొగాకు నముల్తున్న మారయ్య జవాబు చెప్పేదానికి తుపుక్కున ఉమ్మేశాడు. ఇంతట్లోకి గందరగోళంగా గోస ఇనపడింది. మంది జేరి రాలి చేస్తన్నారు. మారయ్య పెద్దకొడుకు కొండయ్య ముందర్నే నడస్తావున్నాడు.

ఆడు మందిలో లేకపోతే అనుకోవాల, ఉండకుండా ఎట్టా? మరి తన కొడుకు నాయకుడుగదా! కొండయ్యకి అన్ని కులాల్లో సావాసగాళ్ళున్నారు. ఎవురూ ఆడికి నీళ్ళు తాగిన చెంబిచ్చేసేదానికి, దోసిట్లో నీళ్ళు పోసేదానికి దయిర్నం చెయ్యరు. ఆడు పులిలాటోడు. ఆడికన్ని తెలుసు. కానీ ఇంకా సంపాదన్లోకి రాలేక పోతన్నాడు.

కొండయ్య ర్యాలి వదిలి నాన్న కాడి కొచ్చాడు.

“నువ్వు గూడా రాగూడదా నానా?”

“నువ్వు పోరా నాకు దుకానం వుంది”

“ఎప్పుడూ వుండే దుకానమేగా. ఆడ పారేసి రాగూడదా” కొడుకు ఆదుర్దా

“ఎందుకురా ఈ తంతు ఇయ్యాల?”

“ఉజ్జోగాల్లో న్యాయం జరిగేదానికి”

“ఎన్ని ఉజ్జోగాలున్నాయిరా?”

“ఎన్నైనాగానీ, పెద్ద పెద్ద ఉజ్జోగాల్లో మనోళ్ళు పోవాలి”

“నే రాలేను. నువ్వు పోరా” మారయ్య ఉన్న చోటునుంచి కదిలేదానికి ఇష్టపడలేదు. కొండయ్య కోపంగా సిరాగ్గా చూసి ఎల్లిపోయాడు.

రెండో కొడుకు బుద్ది పుట్టినపుడు ఆటోఏస్తాడు. తన కొడుకేంది, తనకి తెలిసిన కమ్మరోల్ల కొడుకులు, కుమ్మరోల్ల కొడుకులు, వొడ్డి పిల్లకాయలు ఆటోలు తోల్తానే వున్నారు. అంతకి మించి వాళ్ళకేం పని అగపడలా.

రాలీనే చూత్తా ఏం మాట్లాడకుండా కూర్చోనున్న పంతుల్ని చూస్తా “పాత రోజులే నయ్యం పంతులా. పని దండిగా దొరికేది. ఇయ్యాల జనాలెక్కువ. పనులు లేవు. పని వున్నోడికి పనిమీదనే వుంటది. లేనోడికి కోపంగా సిరాగ్గా వుంటది. పెద్ద పెద్ద కుర్చీల్లో వున్నోళ్ళు పిల్లోళ్ళకి పని చూపించలేక ఆళ్ళు రోడ్లట్టుకు తిరగతా ఆక్రోసిస్తా వుంటే నిమ్మళంగా వుంటారు. ఈ పిలకాయల్లో చురుకంతా ఎవురికీ పనికి రాకండా పోతంది. దీన్ని వాడుకోను లోకానికి చాతగావడంలేదు” అన్నాడు మారయ్య.

పంతులు ఏమీ మాట్లాడకుండా “వెళ్ళొస్తా మారయ్యా” అంటా ఇంటేపుకి నడిచాడు.

పంతులు తనని ‘అరే ఒరే’ అని బమగా పిలస్తాడు. కానీ తనట్టా పిలవలేడు. తను ఏ పనైనా జేసుకు బతగ్గలడు. కానీ పంతులట్ట బతకలేడు. తమకిద్దరికీ ఒకళ్ళ మీంద ఒకళ్ళకి అబిమానం వుంది గానీ ఒకళ్ళింటికి ఒకళ్ళు పోరు. కొండయ్య మాత్రం ఎవురింటికైనా పోగలడు. పెద్ద పెద్ద సంగతులు మాట్టాడగలడు. కానీ అదేందో మరి ఆడు గూడా సంతోషంగా లేడు.

 

***

నిట్టూరుస్తా చెప్పులు బాగు చేసుకోవడంలో పడ్డ మారయ్యకి ఇంటికి పోవలసిన తొందర గురుతొచ్చింది.

కూతురొచ్చింది. ముగ్గురు బిడ్డల తల్లి. అల్లుడు మరీ తట్టుకోలేనంత దెబ్బలు గొడితే వచ్చేసుద్ది. అల్లుడు అదో రకం. ఆడికి ఎప్పుడు తిక్కరేగినా పెళ్ళాం లోకువగా దొరుకుద్ది కదాని దాన్ని చావ బాత్తాడు. తిక్క రేగడానికి కారణాలు కూడా అక్కర్లేదు. ముద్ద మింగేప్పుడు పొలమారినా సాలు.

అమ్మమ్మ గ్యాపకంగా కూతురికి ఎంకటలచ్చిమని పేరెట్టాడు. పెళ్లి తరవాత అల్లుడు దాన్ని ఎలిజిబెతని మారిచాడు. అంతకు ముందు మాతమ్మ గుడి కాడ దన్నమెట్టే కూతురు ఇప్పుడు మరియమ్మ గుడికాడ గూడా నమస్కారం బెట్టుకుపోద్ది. అంతే! పేరు మారినా, కొలిచే దేవుళ్లు మారినా ఆ పిల్లకి పట్టదు.

“అన్నీ ఒగటేలే అయ్యా, తిని తీరిగ్గా కూచ్చునే వాడికి తగూలన్ని” కాచి వడబోసినట్టు చెప్పేసుద్ది.

అయితే రవనకి గానీ తనకి గానీ కొత్త పేరు నోరు తిరగలా. బిడ్డ అలవాటు చేసేసుకుంది. అడదిగదా, మొగోడు చెప్పినదానికి అలవాటు పడాల. కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!

పంతులికి కూటికి ఇబ్బందే. చెప్పుకోడు. తనకి రేపటి రోజు ఎలా తెల్లారుద్దో తెలీని పరిస్థితి. కొడుక్కి తెలివి వుంది గానీ ఉజ్జోగం లేదు. షబానాకి ఇంకా మొగుడు దొరకడు. తన కూతురికి మొగుడు బారినుండి ఎలా బైట పడాలో తెలీదు. ఏదో మందపాటి గోడ అడ్డం బడతంది… ఈ బతుకులన్నిటి మద్దెన.

 

 

***

unnamedపెళ్ళామిచ్చిన టీ నీళ్ళు తాగి కింద గుడ్డేసుకోని పడుకున్నాడు మారయ్య. తలలో ఆలోచనలు దోమల్లాగా గిర్రున తిరగతన్నాయి.

ఏడోకలాసు కంటే ఎక్కువ ఎనిమిదో తొమ్మిదో చదువుతున్న ఎలిజిబెత్ కూతురుని పిలిచి అడిగాడు

“అమ్మీ, గట్టి ఉక్కు పోసి మందపాటి గోడ కట్టారనుకో… దాన్నెట్టా బద్దలు కొట్టేదీ!?”

“కింద బాగా వేడి పెట్టు తాతా కరిగిపోద్ది. అయితే వేడి చానా ఎక్కువ పెట్టాలి తాతో!”

కాసేపటికే బయట మబ్బు గమ్మి వాన పడతా వుంది. ఇంటి ఆడది బొగ్గుల కుంపటి రాజేసి పిలకాయల కోసరం మొక్కజొన్న కంకులు కాలస్తంది. కొండయ్య కుడా ఇంటి కాడనే వున్నాడు. అంతా చలికి వణికి పోతా వున్నారు. చేతులు ఎచ్చబెట్టుకోడం కోసరం కుంపటి కాడజేరి చేతులు జాపారు!

“ఎంతేడి పెడితే గోడ కరిగిద్దో ఇంత చలిలో!” పైకే అనుకుంటా మారయ్య గూడా లేచి వాళ్ళ పక్కకి జేరాడు

సెగ ఎచ్చగా నరాల్లోకి పాకింది.

 

********

artwork: Srujan Raj

 

మీ మాటలు

 1. చెప్ప్పులు కుట్టే మారయ్య చెప్పిన బంగారం లాంటి ఆర్ధిక సూత్రం మన పాలకులకు తెలిస్తే బావుంటుంది. మంచి మెరుపుతో, ప్రేమతో నిండిన కధ.

 2. చాలా బాగా రాశారు కృష్ణ జ్యోతి. ఇప్పుడున్న అంతరాలు కరగాలంటే సమశీతలం చాలదు. అంతకంటే ఎక్కువ వేడి కావాలి. చులాగ్గా విషయాన్ని చెప్పారు. ప్రామిసింగ్ రైటర్ మీరు.

 3. sreenivasarao sunkara says:

  మంచి కధ చదివాను.

 4. mohan.ravipati says:

  కథ చాలా బాగా రాశారు, పేదరికపు అసలు నిజాన్ని సరిగ్గా తెలియచేశారు

 5. థాంక్స్ ఫర్ అ గుడ్ స్టొరీ.

 6. కథ బానే వుంది. వేడి పెడితే గోడ కరిగి పోతుందని రచయిత్రి అనడంలో పూర్తి అర్ధ వివరణ చెప్పండి . రచయిత్రి చాలా మైక్రో లెవెల్ శాంపిల్ తీసుకున్నారు.

 7. మరన్ని కథలు రాయాలి కృష్ణా, బెస్ట్ విషెస్

 8. బ్రెయిన్ డెడ్ says:

  ఈ మధ్య కాలంలో ఇంత డిటైల్డ్ గా అన్ని కోణాల్లో అలోచించి , ప్రతి లైన్ పంచ్ లైన్ గా రాసిన కథ చదవలేదు . చాలా గొప్పగా ఉంది . ఎన్నివాక్యాలో అరె ఇదెంత బాగుంది అంటే ఇదెంత బాగుంది మళ్ళీ మళ్ళీ చదివించాయి . మీ కథల్లో ఎప్పటికి నిలిచిపోయే వర్క్ ఇది . కుడోస్

 9. చందు - తులసి says:

  బాగుంది. దళితునికీ, బ్రాహ్మణునికి స్నేహం, అందులోనూ ఇద్దరి పరిస్థితికీ పెద్ద తేడాలేకపోవడం…
  కింది స్థాయికి వెళ్లి అంతరాలు చర్చించడం బాగుంది. ముఖ్యంగా వాక్యం చదివించేలా ఉంది.

 10. “అమ్మీ, గట్టి ఉక్కు పోసి మందపాటి గోడ కట్టారనుకో… దాన్నెట్టా బద్దలు కొట్టేదీ!?”

  “కింద బాగా వేడి పెట్టు తాతా కరిగిపోద్ది. అయితే వేడి చానా ఎక్కువ పెట్టాలి తాతో!”—-అంత వేడి రగిలే రోజు కోసం ఎదురు చూద్దాం.

 11. అడదిగదా, మొగోడు చెప్పినదానికి అలవాటు పడాల. కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!

 12. msk krishnajyothi says:

  అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వేడి పెడితే గోడ కరగడం అంటే మనలోని
  జడత్వాన్ని వదిలించుకోవాలని-దానికోసం అవసరమైన మార్గాలను అన్వేషించాలి. ఇక్కడ గోడ భౌతికం కానట్టే, వేడి కుడా భౌతికం కాదు – సమాజాన్ని గొప్పగా తీర్చి దిద్దుకోవాలనే తృష్ణ ఒక వేడి-దానిని ఒకరినుంచి ఒకరం అందిపుచ్చుకుని మన మానసిక వైశాల్యాలను పెంచుకోవాలని …నా ఆలోచన.

 13. Aranya Krishna says:

  ఈ కథని అనేక కోణాలనుండి ఇష్టపడుతున్నాను. కథాంశం, ఫ్లాష్ బాక్ నుండి వర్తమానం లోకి పలుమార్లు వెళ్ళివచ్చినా విసుగనిపించని కథనం, పాత్రల చిత్రణ, పాత్రల మధ్య సహజ సంభాషణ, సామాజిక పరిస్తితులు, పరిణామాల్ని ప్రతిబింబించే జీవన వాతావరణ వర్ణన..ఇలా ఎన్నోరకాలుగా విలువలున్న కథ ఇది. ఒక వ్యక్తి స్థాయిలోని జీవితానుభవం నుండి సంకేతమాత్ర తిరుగుబాటుని ధ్వనించే కథ. వర్గాన్ని, వర్ణాన్ని అవగాహన చేసుకుంటూ సమన్వయం చేయటానికి ప్రయత్నించిన కథ. ఎక్కడా ఎటువంటి దాపరికం, మొహమాటం లేకుండా బహుముఖీయనమైన జీవన కర్కశత్వాన్ని పూర్తిస్థాయిలో పట్టుకున్న కథ. గడ్డకట్టిన వ్యవస్థని, వ్యక్తుల్ని వేడిచేసి కరిగించాలన్న ఆలోచనని బలంగా కలగచేయగల కథ. చదివిన చాలా సేపు ఒక అభిప్రాయం కాక అనుభూతిని మిగల్చగల సత్తా వున్న కథ.

 14. buchi reddy gangula says:

  మంచి కథ madam– అన్ని కోణాలు కనిపించేలా రాశారు

  70 ఏళ్ళ స్వాతంత్రం లో — మారింది అంటూ ఏమి లే దు — రొండు తెలుగు రాష్ట్రాల ను
  రాజులు పాలిస్తున్నారు —-అది మన ప్రజా సామ్యం ???

  అ నేతల కు యి బతుకులు అర్థం కావు ——– మారయ్య గారి చెప్పిన మాటలు — యీ
  దోపిడీ నేతలు పాటిస్తే చాలు — ఎన్ని కథలు — గేయాలు రాసినా — మార్పు
  రాదూ —రాబోదు
  ————————————–బుచ్చి రెడ్డి గంగుల

 15. శేషు says:

  కథ నిండా నువ్వు కనబడుతున్నావు. తోటి మనుషులతో సునాయాసంగా నువ్వు చేసుకునే సర్దుబాటు, వందలమండితో కూడిన సమూహాలను ధిక్కరిస్తూ (ఒక్కోసారి ఓడిపోయినా విచారించకుండా ) నువ్వు లేవనెత్తే వాదనలు, పోరాటం-సమస్యని కిందినుండి సంస్కరించుకోవాలనే నీ దృక్పధం – అన్నీ కనబడుతున్నాయి. చేదులో కూడా ఇలా కొంత జీవన మాధుర్యం ఉంటుందని – సానుకూల దృక్పధంతో వ్రాసినందుకు అభినందనలు. i am proud of u కృష్ణ!
  .

 16. Delhi (Devarakonda) Subrahmanyam says:

  చాల బాగా రాసారు క్రిష్ణజ్యోతి గారూ అభినందనలు.

 17. vs prakash says:

  రచయిత్రి తనకి ప్రత్యక్షంగా తెలిసిన జీవితం గురించి రాసిన ఓ అరుదైన, మరపురాని, మంచి కథ. కృష్ణ జ్యోతికి అభినందనలు. దళితుల్లో దళితులుగా బతుకీడుస్తున్న మాదిగ వారి జీవన చిత్రాలు ఇంకా రావాలి. అలాగే వారి ఉపకులాల బతుకుల గురించి కూడా.

 18. అపర్ణ says:

  ఆద్యంతమూ ఆపకుండా చదివించారు. ఎటువంతో జడ్జిమెంట్లు లేకుండా చాల హృద్యంగా నేరేట్ చేసారు. నిజమే చాలా చాలా వేడి కావాలి. ఒక సమస్యకాదు..ఇన్ని సమస్యలున్నప్పుడు. కథ బావుందండీ..

 19. Sathyavathi says:

  చాల బాగా వ్రాసారు మీరు ఇంకా వ్రాస్తూ వుండాలి

 20. samar reddy says:

  మంచి షార్ట్ స్టొరీ చదివాను… కృష్ణ జ్యోతి గారు మీకు ధన్యవాదాలు.

 21. విజయ సారధి జీడిగుంట says:

  చాలా బాగుంది … రెండు మూడు సార్లు ఏక ధాటి గా చదివినా.. తనివి తీరలేదు… అద్భుతం కృష్ణ జ్యోతి గారు… సమాజం లోని భిన్న కోణాలను విభిన్నం గా తాకిన తీరు నాకు చాలా బాగా నచ్చింది.

 22. jayachandra akuthota says:

  కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!….ఈ ఒక్క మాట తో సమాజం లోని నిమ్న వర్గాల్లో కూడా ఆడవాళ్ళ దుస్థితిని చాల బాగా చెప్పారు ….

 23. Bixapathi says:

  One word. Excellent.

 24. “అన్నీ ఒగటేలే అయ్యా, తిని తీరిగ్గా కూచ్చునే వాడికి తగూలన్ని”-నేటి సమాజానికి ఈ విష్యం అర్ధం చేసుకోవలసిన అవసరం చాలా వుంది. మంచి కధ.

 25. కథ సందేశాత్మకంగా, నిష్పక్షపాతంగా వుంది

 26. rajani patibandla says:

  కులం వర్గం లింగం అన్ని వేదనల మూడు పాయల అల్లిక బాగా కుదిరింది ఈ జ్యోతి సెగ గోడని కరిగించు గాక…..

 27. నాకు తెలిసిన వాటిలోకేల్ల గొప్ప కథ ఇది

 28. N Venugopal says:

  కృష్ణజ్యోతి గారూ,

  చాల చాల బాగుందండీ.

  హృదయానికీ బుద్ధికీ తాకే కథ.

  కృతజ్ఞతలు. అభినందనలు…

 29. Jayashree Naidu says:

  సుతి మెత్తగా చురుకు కరుకు గా సమాజపు వైరుధ్యాన్ని చూపించారు
  బాగుంది కృష్ణ జ్యోతి గారు

 30. Mohan vamseedhar says:

  కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!.. Point blank bailed it.

  • Mohan vamseedhar says:

   కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే!.. Point blank nailed it.

 31. కథ బావుంది జ్యోతి గారు. చాలా సమస్యలపై చర్చపెట్టారు.
  ‘చర్చి కాడ కంచం పొత్తు సూబెట్టేవోళ్ళు ఇంటికాడ తేడా సూబెట్టేశారు’ దీనికి కొంత విస్తరణ ఉంటే బావుండేదేమో.

 32. వనజ తాతినేని says:

  ఆపకుండా చదివించారు . ఆలోచనాత్మకంగా ఉంది . కడగొట్టోళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే! చాలా బాగా చెప్పారు .

 33. Thirupalu says:

  రెండు తరాల సామాజిక క్రమ పరిణామాన్ని చాలా బాగా చెప్పారు. యూస్ అండ్ త్రో కల్చర్ణి సూచాయిగా వర్ణించారు. చాలా మంచి కధ. అన్నీ కొనాలని కళ్ళకు కట్టించారు.

 34. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఈ రోజులో కూడా అంటరానితనం కనిపిస్తుంది .ఇంగ్లీష్ మాట్లాడే మేధావులు veg ఓన్లీ అని బోర్డు పెడితే సగం chaduvukuni వున్నవాళ్ళు మేము మీ caste వాళ్ళకి అద్దెకి ఇవ్వం అని చెబుతున్నారు ..చదువుకున్న..మనలో inject అయిన ఈ ఇన్హుమన్ థాట్స్ maranatha varaku inclusive డెవలప్మెంట్ జరగదు….ఇండియా డెవలప్మెంట్ జరగదు..

 35. Bhanumurthy Rao Varanasi says:

  కథ ఆద్యంతము అద్బుతంగా ఉంది . ఏదో cinema చూసినట్లు , పాత్రలు సజీవంగా కనిపిస్తున్నాయి . మాదిగ వారి జీవితాల్లో చెప్పుకోతగ్గ మార్పు ఏమి రాలేదు . కవులు , రచయితలు ఎన్ని కవిత్వాలు రాసినా , కథలు రాసినా రాజకీయ నాయకుల్లో , సమాజంలో మార్పు రావాలి . మంచి కథను అందించి నందుకు రచయితకు ధన్య వాదాలు .

 36. Hanumantha Rao N says:

  చాల బాగా రాసారు. అభినందనలు.

 37. Dr nukathoti ravikumar says:

  Essential story

 38. chaithanya says:

  గొప్ప కధ..చాల గొప్ప కధ.. ఇంతకంటే మాటలు దొరకట్ల..

 39. కథ రాజుకునేలా ఉంది. ఎవరిని కదిలిస్తుందది…నోట్ల కట్టలతో నిజాలకు సమాధులు కడుతున్న వాళ్ళనా, స్వప్రయోజనాల కోసం అన్నింటిని సహించడం అలవాటు చేసుకున్న వాళ్ళనా? వేడి చల్లారిన నెత్తుటిలో అక్షరాల చితుకులు వేస్తే ప్రయోజనం ఉందంటారా? మీ ప్రయత్నానికి జోహార్లు.

 40. balasudhakarmouli says:

  కథ గొప్పగా వుంది. ఈ కోణంలో వస్తున్న కథల్లో కొత్త కదలికను టచ్ చేసారు. చివరి నుంచి ఎనిమిదవ పారాగ్రాఫ్ కథ మూలమనిపించింది. మారయ్య ఆలోచనల్లో జరిగిన గొప్ప మార్పు కొరకు కదలిక.. కథని గొప్ప స్థాయికి తీసుకెళ్లాయనుకొంటున్నాను.

మీ మాటలు

*