రాత్ & దిన్

Painting: Julia Victor

Painting: Julia Victor

మధు పెమ్మరాజు

madhu_pic“ఇంత అర్ధరాత్రి ఏం చేస్తున్నావు” అని అడిగాడు.
“బస్సు కోసం ఎదురుచూస్తున్నాను” అని ఇబ్బందిగా చెప్పింది.
“నీ అర్ధరాత్రి పచార్లు వారం నుండి చూస్తున్నాను, నిజం చెప్పు” అని సుతిమెత్తగా రెట్టించాడు
వదిలేలా లేడని “రోజూ బస్టాప్ నుండి యూనివర్సిటీని చూస్తుంటాను” అని చెప్పింది.
“యూనివర్సిటీని చూస్తుంటావా… ?” ఆశ్చర్యంగా అడిగాడు
ఎదురుగా ఫ్లాష్ లైట్లు చుట్టుముట్టిన భవనాలని చూపిస్తూ “ఎవరో గొప్ప ఆర్కిటెక్ట్ విశాలమైన ఆలోచనలకి, అందమైన ఊహలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు, సింప్లీ గ్రేట్! ”
“ఇంత అర్ధరాత్రి..ఒంటరిగా….భవనాలని చూస్తున్నావా?” అని అడిగాడు
“అవును….”
“ఎందుకు?”
“నాకు ఆర్కిటెక్చరంటే చాలా ఇష్టం”
“ఎందుకు మంచి ఉద్యోగం వస్తుందనా?”
“అది మాత్రమే కాదు”
“మరి.. ?”
“అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలని డిజైన్ చెయ్యాలని, ప్రపంచం చుట్టి రావాలని… ..ఇలా ఎన్నో ఆశలు..”
“వినడానికి బానే ఉంది కానీ పగటి పూట రావచ్చు కదా?”
“ఒకప్పుడు అలాగే చేసేదాన్ని..”
“మరిప్పుడు….?”
“వెలుగంటే భయం”

student-art-abstract-buildings-h
“నీ మాటలు భలే వింతగా ఉన్నాయి, తెల్లారితే యూనివర్సిటీ ప్రాంగణం విద్యార్థులతో కళ, కళలాడుతుంది, అప్పుడు రా..”
“మీరు ఏ కాలానికి చెందినవారో తెలియదు……“
“ఎందుకు?”
“పగటి పూట వికృతాలు ముసుగు ధరించి తిరుగుతాయి”
“ఈ చీకటి కంటేనా?”
“చీకటి అమాయకమైనది, నలుపు తప్ప వేరే రంగు తెలియదు. తేటగా కనిపించే పగటి నిండా రంగు, రంగుల కపటాలు”
“నువ్వు టీవీ వార్తలు బాగా చూస్తావనుకుంటా?” నవ్వుతూ అన్నాడు.
“చూసే అవకాశం రాలేదు”
“నీ వయసుకింత అపనమ్మకం పనికిరాదు, యూనివర్సిటీలో చేరితే అంతా మంచే జరుగుతుంది”
“అంత నిక్కచ్చిగా ఎలా చెబుతున్నారు?”
“చూడు…అక్కడ బాగా చదివే వారికి తప్ప సీట్ రాదు. అంటే మంచి విద్యార్థులు, మంచి అధ్యాపకులు ఉంటారు”
“మంచి అంటే మనుషులనేగా మీ అర్ధం?”
“అవును అంతా మంచివాళ్ళే… అప్పుడిలా అర్ధరాత్రి, అపరాత్రి నిరీక్షణ అక్కర్లేదు ” అన్నాడు.
బాగ్లోంచి ఒక న్యూస్ పేపర్ తీసి అతనికిచ్చింది, వీధి దీపపు వెలుతురిలో దగ్గరకి తీసుకుని చదివాడు
“ఓ వెరీ గుడ్… మంచి రాంక్ తెచ్చుకున్నావు, మరింకేం.. తప్పక సీట్ వస్తుంది” అన్నాడు.
రెండో పేపర్ అతనికిచ్చి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఎటు చూడాలో తెలీక…

తడుముకుంటూ ‘విద్యార్థిని ఆత్మహత్య’ అనే వార్త చదివాడు, తర్వాత చీకటిలోకి చూసాడు.

*****

మీ మాటలు

 1. వంగూరి చిట్టెన్ రాజు says:

  నిజమైన మంచికథకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకో వచ్చును. ఎంచుకున్న వస్తువు, కథనం, క్లుప్తత, పాఠకుడి ఉహాశక్తిని రెచ్చగొట్టే ముగింపూ తగు పాళ్ళలో ఉన్నాయి. శభాష్.

 2. Vijaya Karra says:

  చాల బావుంది

 3. వెంకట్ కొండపల్లి says:

  తక్కువ పదాలతో అద్భుతంగా వ్రాసారు.

  • వెంకట్ గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

 4. చాలా బాగుంది. క్లుప్తంగా, దట్టంగా.
  చీకటి, వెలుగుల పోలిక మరీ బాగుంది.

  • ప్రసాద్ గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!!

 5. పిన్నమనేని మృత్యుంజయరావు says:

  కథ చాలా చాలా బాగుంది. కొత్తగా వేసిన ఫ్లైఓవర్ పైనుంచి అందంగా అమాయకంగా కనబడే యూనివర్సిటీ భవనాలను చూస్తున్నట్టే ఉంది. ఆ కాంపస్ లోని చెట్ల చాటున దాగిన వికృతాన్నిభరించలేనట్టుగానూ ఉంది.

  • మృత్యుంజయ రావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు!

 6. మధు గారూ,

  క్లుప్తంగా మంచి పంచ్ తో ముగించారు. ఏ కథకైనా ప్రాణం ముగింపే.

  Congratulations.

 7. Vanaja Tatineni says:

  చిక్కని చక్కని కథ . అభినందనలు.

 8. వనజ గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

 9. ఆర్.దమయంతి. says:

  చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది కథంతా.
  అభినందనలు.

 10. G B Sastry says:

  ఒక మొపాసా ఒక మాం కధల స్థాయిని గుర్తు తెచ్చే కదా,కధనం తో కళ్ళల్లో కన్నీళ్ళుతిరిగేలా నేటి విద్యా దేవాలయాల దుస్తితికి అడ్డం పట్టింది
  చెప్పదలచినది క్లుప్తతను పాటిస్తూ మనసుకు హత్తుకునేలా చెప్పారు.
  చదువు సంస్కారం నేర్పని మానవ మృగాలకు దున్నపోతుమీద కురిసిన వానగా మారుతుందేమో ?
  జీ బీ శాస్త్రి
  సంచారవాణి 9035014046

మీ మాటలు

*