పగటి కలలు మనకెందుకు?

 

-నిర్గుణ్‌ ఇబ్రహీమ్‌

~

 

ఇప్పుడు కవిత్వం

ఒక గ్యాంబ్లర్‌ ఎక్స్‌పోజర్‌

 

గుండె అరల్లో జ్ఞాపకాలు చితుకుతున్నప్పుడో

కాలం బతుకుమీద కన్నెర్ర చేసినప్పుడో

కసాయితనం బతుకులమీద కత్తులు దూస్తున్నప్పుడో

పారే నెత్తుటి ఆవిర్లను కబళిస్తున్నప్పుడో

చెమ్మను తడుముకునే అక్షరాలు

సమూహ కదనాళికలో పురుడుపోసుకునే కావ్యం

ఎనకటెప్పుడో

మా తాత ముత్తాతల కాలాన

గుండెలమీద వాలి

గుర్తుల్ని వదిలి ఎగిరినపిట్ట

 

యీయేల అది

కూర్చుకుంటున్న ఒప్పందాలమీద

కూతపెట్టుతున్న పిట్ట

కాలం మీద రెక్కల్ని ఝళిపిస్తూ

ఆర్బాటాల హంగుల్లో

కృత్రిమ రాగాల్ని అల్లుతుంది

 

బతుకు దర్పణమయ్యేది కవిత్వమా?

బతుకుని మాయాదర్పణం చేసేది కవిత్వమా?

సందిగ్దం వీడి

గుండెలు ఆకాశమై కూయాలి!

 

కరెన్సీ కట్టల మాటున

మగ్గుతున్న అక్షరం

పచ్చనో్ట్ల కంపుకొడుతుంటే

రెక్కలొచ్చింది హైడ్రోజన్‌కే కదా అని విస్తరించనిద్దామా?

 

అదేమైనా ఆక్సిజనా?

ప్రాణాలకు పురుడు పోసేందుకు!

 

రూపాయినోట్లు అలుముకుంటున్న అక్షరాలను

కలల వీక్షణంలో విహరించనివ్వకండి!

చెదిరే నిద్రకు అదృశ్యమయ్యే

పగటి కలలు మనకెందుకు?

 

కవిత్వమంటే…

ప్లాస్టిక్‌ పూలగుత్తులు కాదు

 

కవిత్వమంటే…

విరబూసిన పూలపరిమళాలను

మనందరికి పంచే సమీరాలు!

 

కవిత్వమంటే….

శ్రామికుని చెమటలో పురుడుపోసుకున్న

అర్థాకలి పాట!

*

మీ మాటలు

  1. chandolu chandrasekhar says:

    నిర్గున్ ఇబ్రహిం గారు మీ కవిత బావుంది .మా తాత , ముత్తాల కాలాన ,గుండెల మిద వాలి గుర్తులను వదిలిన పిట్ట ‘ మంచి వుహ కవిత్వానికి జీవితమ్ దర్పణం కావాలి , మాయాదర్పణం కాకూడదు .నిజమే శ్రమజీవి అర్దాకలి ఉప్పెనై పిడికిలి ఎత్తిన కవిత కావాలిమీకు మంచి వుహ శక్తి వుంది procced

  2. Suparna mahi says:

    చాల చాలా బావుంది సర్…

  3. SRINIVASU GADDAPATI says:

    వేరి నైస్ పోయెమ్ భయ్యా
    కవిత్వమంటే…

    విరబూసిన పూలపరిమళాలను

    మనందరికి పంచే సమీరాలు!

మీ మాటలు

*