మనలోపలి మరో ప్రపంచం..కోడూరి కవిత!

జయశ్రీ నాయుడు

 

jayaజ్ఞాపకాలనీ, ప్రస్తుత నగర జీవితపు అలుపెరుగని ఆరాటాన్నీ సమాంతర చాయలుగా చిత్రించిన దృశ్య కవిత కోడూరి విజయకుమార్ – అపుడపుడు… (ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటి నుంచి). మనసులో మనం మోస్తూ వుండే మరో ప్రపంచపు ప్రతీక ఈ కవిత. ఆ మరో ప్రపంచమే లౌక్యపు లోకంలో కఠినత్వపు నాగరిక చాయల్లో జీవిస్తున్నా మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం. 

కవిత మొదటి పంక్తుల్లోనే రెండు విభేదాత్మక ప్రపంచాలు మనముందు నిలుస్తాయి – ఒకటి నగర జీవితం మరొకటి కవి నిరంతరంగా తన అంతరంగంలో ప్రేమగా తడుముకునే తన వూరి ఆనుపానులు. అయితే ఇక్కడ కవి వర్తమానం లో నుండి గతాన్ని వర్నించుకుంటూ మళ్ళీ తిరిగి వర్తమానం లోకి వస్తూ ఒక వృత్తాన్ని పూరిస్తాడు. ఆ దృశ్యాన్ని చిత్రించుకోవడానికి ఒక కుంచే సరిపడా రంగులూ మన మనసుకు అందించి నిష్క్రమిస్తాడు. భవిష్యత్తుని అసలేమాత్రమూ స్పృశించకుండా అసంపూర్తి కవితా చిత్రాన్ని అందించడం లోనే జీవితపు సత్యం ఆవిష్కృతమవుతుందేమో..

కవిత మొదలయ్యేది  ఇలా …

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే 

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

ఉక్కు కౌగిలి అన్న పదంలోనే నగర జీవితపు కఠినత్వం ఆవిష్కృతమవుతుంది. నువ్వు అంటూ చదువరిని సంబోధిస్తూ మొదలైన కవిత, కవి తనని మనల్నీ కలిపి మాట్లాడుకుంటున్న ఏకత్వానికి ప్రతీకగా తీసుకోవొచ్చు. ప్రతి చదువరీ తన అంతరాత్మలో తెలియకనే తనకు ఇష్టమైన ప్రదేశాల్లోకి తొంగి చూసుకోవడం మొదలుపెడతాడు.

బాల్యపు దినాలను దాచుకున్న తన ఊరి నేలా, దాహం తీర్చిన చేదబావీ , అప్పటి ఇరికిరుగు మూడుగదుల ఇల్లూ, ఇప్పటికీ కవికి జ్ఞాపకాలుగా అపురూపమే.   వెనువెంటనే, హెచ్చరికగా అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవచ్చునేమో అన్న ఆవేదనా రేఖని జతచేస్తాడు.

తన ఊరికి వెళ్ళినపుడు కళ్ళముందు కదలాడె జ్ఞాపకాలన్నీ అతని మనోఫలకానివి. వర్తమానంలో మాత్రం కుచించుకుపోయిన తన బడి ఆటస్థలం, తన లెక్కల మాస్టారి లెక్ఖ ఈ లోకంలో ముగిసిందన్న స్నేహితుడి కబురూ ఒకేసారి స్ఫురణకు వస్తాయి.

OkaRatriMarokaRatri600

మరో చోట, అదే కవితలో, బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన తన వూరి డబ్బారేకుల టకీసు, ఇప్పుడా చోటుని ఆక్రమించిన మల్టీప్లెక్ష్ అడుగున నవ్వుకుంటోందన్న విషయం విషాదాన్ని వినోదంగా మేళవించిన తీరు ఇది. అప్పట్లో “సినిమాకెళ్ళడం ఒక పండగ కదా… “అంటాడు కవి. టీవీలూ, ఇంటర్నెట్లూ లేని కాలం లో బాల్యం గడిపిన తరానికి మాత్రమే తెలిసిన అనుభూతి అది. తన యవ్వన దినాల పరుగులనీ తిరుగుళ్ళనీ దాచిన నేలపై తిరిగి రావడానికే తన మనసు అక్కడికి పరుగులు తీస్తుందన్న రహస్యాన్ని ఆత్మీయంగా వెల్లడించుకుంటాడు.

అవే ఈ మహానగరంలో బ్రతకడనికి అవసరమైన మణిమాణిక్యాలు. కవికి తన ఊరిపైని వ్యామోహాన్ని ప్రశ్నించే నగజీవులెందరికి ఈ విషయం అర్థం అవుతుంది???

నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది.

 

పూర్తి కవిత ఇక్కడ…

 

 అపుడపుడూ… 

కవి: కోడూరి విజయకుమార్

 “ఒక రాత్రి మరొక రాత్రి” కవితసంపుటి నుంచి

 

దేహాత్మలను ఉక్కిరిబిక్కిరి చేసే

ఈ మహానగర ఉక్కుకౌగిలి నుండి బయటపడి

అపుడపుడూ అలా నీ వూళ్ళో వాలిపోవాలి

***

నీ బాల్య దినాల నడకలనీ,

నీ నవయవ్వన దినాల పరుగులనీ

నీ బలాదూరు తిరుగుళ్ళనీ

అట్లా పదిలంగా దాచిపెట్టిన

నీ వూరి నేల పైన తిరిగి రావాలి

ఒకప్పుడు మూడు ఇరికిరుగు గదుల్లో

నీ కుటుంబమంతా తలదాచుకున్న ఆ ఇల్లు

ఎంతో మంది దాహం తీర్చిన ఆ పెద్ద చేదబావి

అవేవీ ఇప్పుడా వీధిలో లేకపోవొచ్చు

కానీ నీవు వెళ్ళినపుడు

ఆ రేగుపళ్ళ చెట్టు కింద పిల్లల కేరింతలు

నీవు దారాలు కట్టి ఎగరేసిన తూనీగలు

వెన్నెల్లో దాగుడుమూతల ఆటలు

లిప్తపాటు నీ ముందు అన్నీ కదలాడతాయి

గొప్ప ఆశ్చర్యంగా వుంటుంది నీకు

ఒకప్పుడు అతి పెద్దగా వుండిన నీ బడి ఆటస్థలం

ఇపుడింత చిన్నదిగా వుందేమిటి అని…

నీ తరగతి గది గోడ పలకరిస్తుంది

లెక్క తప్పు చేసావని ఇక్కడే కదా నిన్ను

లెక్కల సారు గోడకుర్చీ వేయించింది

క్రితం సంవత్సరం ఆయన పోయారని

మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు

ఒకప్పటి డబ్బారేకుల టాకీసుని కూల్చివేసి

ఊరి మధ్యలో వెలిసిన మల్టీప్లెక్స్

కళ్ళనీ చెవులనీ మాయ చేసే రంగుల చిత్రాలు

బెంచీలపై పడుకుని సినిమాలు చూసిన

ఆరోజులు గుర్తుకొస్తాయి నీకు

అప్పుడు సినిమాకి వెళ్ళడమొక పండుగ కదా

మల్టీప్లెక్స్ అడుగున పడివున్న నీ

డబ్బరేకుల టాకీసు నవ్వుకుంటుంది

ఆ వీధి మలుపు దాటేక ఎనిమిదో యింట్లోనే కదా

ఒకనాటి నీ ఏంజిల్ వుండేది

తను కనిపించినా వినిపించినా

ఒక దూది పింజమై తేలిపోయేవాడివి

గుర్తుందా… ఏంజిల్ పెళ్ళైన రోజు రాత్రంతా

వూరి రోడ్లపైన నీవు పిచ్చివాడిలా తిరగడం

వీధి మలుపులో తను ఎదురుపడుతుందేమో అని

ఒక క్షణం భ్రమించి నవ్వుకుంటావు

*     *     *

పెద్దగా పరిచయం లేని ఎవరో అడుగుతారు –

చాలా తరుచుగా వూరికి వెళ్ళొస్తావేమని?

ఈ మహానగరంలో బతకడానికి అవసరమైన

కొన్ని మణిమాణిక్యాలని తెచ్చుకునేందుకు

అని అతడికి చెప్పాలనుకుంటావు

మరి, అతడికి అర్థం అవుతుందంటావా?

*

మీ మాటలు

 1. Mythili abbaraju says:

  ఆర్ద్రంగా చేసిన పరిచయం చదివాక కవిత , మరింకాస్త ఆప్తంగా అనిపించింది.

  • Jayashree Naidu says:

   :)
   మీ ఆప్యాయత లాగే మాటల్లో అభినందనలూ.
   థాంక్యూ మైథిలి గారూ

 2. జయ చాల చక్కని పరిచయ విశ్లేషణ నీ భాష శైలి ఆర్ద్రంగా ఉన్నాయమ్మా రాస్తూ ఉండు …ప్రేమతో జగతి

  • Jayashree Naidu says:

   మొదటి నుండీ భుజం తట్టి నువ్విది చెయ్యగలవు అని ప్రోత్సహించే సహృదయపు జగతి నీది. యూ ఆర్ ది ఎంజిల్ ఫర్ అజ్ ఆల్
   థాంక్యూ జగతీ

 3. కోడూరి విజయకుమార్ says:

  జయశ్రీ గారు …..పత్రికలకు పంపించకుండా, పుస్తకం అచ్చుకు ఇచ్చే చివరి అంకంలో చేర్చిన కవిత ఇది. అసలు ఎవరైనా ఈ కవితని స్వీకరిస్తారా అని ఆ సమయంలో మనసు ఏ మూలనో వున్న చిన్న అనుమానం మీ ఈ చక్కటి వ్యాసంతో తీరిపోయింది. విశ్లేషణ ఎంత చక్కగా చేసారంటే, నేను ఈ కవిత రాసే సమయంలో వున్న ఒక మానసిక స్థితిలోకి మీరు కూడా చేరిపోయి రాసారా అన్నంత బాగా … ! చక్కటి వ్యాసానికి అభినందనలు … ఈ వ్యాసానికి నా కవితని ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు !

  • Jayashree Naidu says:

   నమస్తే విజయ్ గారు

   మీ పుస్తకం లోని ఒక్కొక్క కవితతో ఒక్కో ఆంతరంగిక దృశ్యాన్ని అక్షరాలుగా ఆవిష్కరించారు . ఈ పుస్తకం నాకు డిసెంబర్ నెలలోనే చేతికి వొచ్చినా స్థిమితం గా చదవ వలసిన పుస్తకంగా భావించి ఇలా వేసవి సెలవల్లో చదవడం జరిగింది. ఒక్కో కవితా ఒక మానసిక జగత్తు, కొన్ని దృశ్య కవితలు, కొన్ని జీవిత ఘటనలకు అక్షర తర్జుమాలు, మొత్తంగా అదొక తాత్వికత, పాజిటివ్ పొయెట్రీ అని పేరు పెట్టుకున్నాను నేను. మీ కవిత అర్థం చేసుకోవడం లో మీ ఆలోచనలని అందుకోగలిగినందుకు ఆనందం. మీ స్పందన కు మరింత ఆనందం. థాంక్యూ విజయ్ గారు.

 4. renuka ayola says:

  కోడూరి విజయ కుమార్ గారి అభిప్రాయం తో ఏకిభవిస్తున్నాను ఒక పుస్తకాన్ని ,కవిత్వాన్ని పరిచయం చేయాలంటే క విత రాసే సమయంలో వున్న ఒక మానసిక స్థితిలోకి వెళ్ళగలగాలి నువ్వు సాధించావు జయ చక్కని పరిచయ విశ్లేషణ ,ఇంక ఎన్నో పుస్తకాలని పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నాను

  కోడూరి విజయ కుమార్ గారి అభిప్రాయం తో ఏకిభవిస్తున్నాను ఒక పుస్తకాన్ని ,కవిత్వాన్ని పరిచయం చేయాలంటే క విత రాసే సమయంలో వున్న ఒక మానసిక స్థితిలోకి వెళ్ళగలగాలి నువ్వు సాధించావు జయ చక్కని పరిచయ విశ్లేషణ ,ఇంక ఎన్నో పుస్తకాలని పరిచయం చెయ్యాలని కోరుకుంటున్నాను

  • Jayashree Naidu says:

   మిత్రుల ప్రోత్సాహానికి మించిన మెడిసిన్ ఉంటుందా…. కాన్ఫిడెన్స్ ని అమాంతం పెంచిన నీ వ్యాఖ్యకు ధన్యోస్మి రేణుకా :)
   పుస్తకం మొత్తం చదివాక పూర్తి సమీక్ష అన్నది కవితలకు వర్తించదు అనిపించింది. ఒక్కో కవితా కవి లోని ఒక్కో అంతరంగ తరంగానికి ప్రతీక కదా… ఈ కవితలో విజయ్ గారు ఉపయోగించిన దృశ్య వైరుధ్యం బాగా నచ్చింది. అది మీ అందరికీ నచ్చడం ఇంకా బాగుంది.

 5. నిశీధి says:

  కవిత ఎంత టచీ గా ఉందో అంతే లెవలో మీ అర్టికల్ కూడ చదివించింది .నిజానికి విజయ్ గారి కవితని మీ కళ్ళతో చూడటమూ బాగుంది కుడోస్

  • Jayashree Naidu says:

   Nisheedhi garu..

   విజయ్ కుమార్ గారి కవితలన్నీ మాస్టర్ పీస్ లే…
   కుదిరితే ఆ బుక్ తప్పక చదవండీ.
   నేను రాసింది నచ్చినందుకు ధన్యవాదాలు.

 6. knvmvarma says:

  బతకటానికి అవసరమైన మాణిక్యాలని వెతుక్కొఅవాలి ….మంచి కవిత …చక్కటి విస్లెఅశణ ….ఇరువురికీ ధన్యవాదాలు

  • Jayashree Naidu says:

   వర్మ గారు
   మీ సహృదయ వ్యాఖ్యకు కు ధన్యవాదాలండీ..

 7. నగరపు ఉక్కుకౌగిలినుంచి విడిపడి
  పైరగాలి వీస్తున్నప్పుడు పొలం గట్టుమీదుగా నడిచెల్లినట్లు.
  టాబ్లాయిడ్ శీర్షికలా కవిత్వాన్ని కూడా ఒ కంటితో చూసి మర్చిపోయే రోజుల్లో
  పాఠకుల కోణంలో పదిలంగా చేసిన పరిచయం
  కవికే కాదు కవిత్వానికే ఒక భరోసా….
  థాంక్యూ జయశ్రీ గారూ మీరిలా రాస్తుండాలి..

  • Jayashree Naidu says:

   థాంక్యూ కట్టా గారు..
   కట్టగట్టినట్టుగా అందరం మిమ్మల్ని శ్రీనివాస్ గారు అని పిలవడం మరిచి పోయేలా ఉందీ :)
   ఇలా ఈ వెబ్ పేజీ లో మీ వ్యాఖ్య ని చూడటం బాగుంది. ధన్యవాదాలండీ..

 8. nandiraju raadhaakRshNa says:

  నిజం. అది నగరజీవనంలో ఒక జ్ఞాప-కాలనీ.
  రెండు ప్రపంచాలు: ఒకటి – జీవితం, రెండు – అంతరంగం. ఈ రెంటిదీ ఒకే వృత్తం.
  నీ తరగతి గది గోడ పలకరిస్తుంది;
  తం సంవత్సరం ఆయన పోయారని
  మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు…
  “మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం.”
  “నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది”. —
  ఈ మీ పదాలు కలకండ పలుకులు. — కవితా పరిచయ వాక్యాలు హృదయంలో పరుచుకున్నాయి సువిశాలంగా!

  • Jayashree Naidu says:

   రాధాకృష్ణ గారు నమస్తే..
   జ్ఞాప – కాలనీ… బాగుందీ పదప్రయోగం. కవిత ని హత్తుకునేలా రాసిన కవి హ్రదయం ఇందరి అభిమానం పొందడం ఇంకా బాగుంది.
   మీ స్పందనకు ధన్యవాదాలండీ

 9. నందిరాజు రాధాకృష్ణ says:

  __()__ నిజం. అది నగరజీవనంలో ఒక జ్ఞాప-కాలనీ. రెండు ప్రపంచాలు: ఒకటి – జీవితం, రెండు – అంతరంగం. ఈ రెంటిదీ ఒకే వృత్తం.
  నీ తరగతి గది గోడ పలకరిస్తుంది;
  క్రితం సంవత్సరం ఆయన పోయారని
  మిత్రుడిచ్చిన సమాచారం గుర్తుకొస్తుంది నీకు…
  “మనలో మానవత్వపు గుబాళింపులు జీవింపజేసే అంతర్గత అమృతత్వం.”
  “నగర జీవనం, నాగరికతా ఊళ్ళను కూడా అబగా కబళించేస్తున్నాయన్న నిజాన్ని ఆర్ద్రత మేళవింపుతో చదువరి కి పంచిన కవిత ఇది”. —
  ఈ మీ పదాలు కలకండ పలుకులు. — కవితా పరిచయ వాక్యాలు హృదయంలో పరుచుకున్నాయి సువిశాలంగా!

 10. Wilson Sudhakar Thullimalli says:

  ఇంతకు ముందు ఈ కవిత చదవలేదు. జయశ్రీ గారు పరిచయం చేసిన తర్వాత ఈ కవితలోని గొప్పతనం తెలిసింది.చూడానికి చాలా అమాయకంగా కనిపించే జయశ్రీగారు ఎంత గొప్పగా ఈ కవితను, కవిని కళ్ళముందు ఆవిష్కరింజేశారు? పరిచయ వాక్యాలు ఆవిడ హృదయంతో టైప్ చేసినట్లున్నారు. “బతకటానికి అవసరమైన మాణిక్యాలని వెదికితెచ్చుకోవాలి” అనడంతో కవి గొప్ప ఫినిషింగ్ టచ్ నిచ్చారు. జయశ్రీగారికి, కవి కోడూరిగారికి కంగ్రాట్స్.

 11. వాసుదేవ్ says:

  “భవిష్యత్తుని అసలేమాత్రమూ స్పృశించకుండా అసంపూర్తి కవితా చిత్రాన్ని అందించడం లోనే జీవితపు సత్యం ఆవిష్కృతమవుతుందేమో..” ఇలా మొదలైన మీ విశ్లేషణ చివరికంటా చదివించింది. విజయ్‌‌కుమార్ నాకు కొత్త కాకపోయినా మీ వ్యాసంలో మీ వాక్యంలో మరొ కొత్తదనమేదో, కొత్త కోణమేదో స్పృశించినట్టయింది…అతని కవితని మొత్తంగా అక్కడ ఉదహరించటమూ బావుంది. ఐతే మరోకొన్ని కవితలని, పూర్తిగా కాకపోయినా కొన్ని వాక్యాలనైనా ఉదహరిస్తూ కవిలోని వైవిధ్యాన్నీ ఇంకా వివరంగా చెప్పుంటే బావుండేదని అనడం నా అత్యాశేనేమో…మంచి వ్యాసం క్లుప్తంగా, అందంగా ఉంది. అభినందనలు జయాజీ

  • Jayashree Naidu says:

   దేవ్ జీ…
   చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్యని చూసాను… సారి ఫర్ దీస్ లేట్ రెస్పాన్స్… మీ విశ్లెశణాత్మక వ్యాఖ్యకు ధన్యవాదాలు . మకుటాయమానంగా భావించదగ్గ కవితల్ని తీస్కుని విశ్లేశ్ంచాలని అనుకున్నాను. ఆ ఆలోచనలో భాగమే ఈ వ్యాసం. ఆ కవితా పుస్తక సమీక్షల్లో చాలా మంది ఆల్రెడీ ఆ విధంగా సమీక్షించేశారు. నేనిలా వీక్షించాను కవితని… :)

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*