పెద్రో పారమొ-13

pedro1-1పొద్దు పొడుపుతో రోజు మొదయింది, తక్కుతూ తారుతూ. భూమి తుప్పు పట్టిన గేర్లు దాదాపుగా వినపడుతున్నాయి. చీకటిని తోసేస్తూ ఈ పురాతన భూప్రకంపనలు.
“రాత్రి పాపాలతో నిండిపోయిందా జస్టినా?”
“అవును సుజానా!”
“నిజంగా నిజమేనా?”
“అయి ఉండాలి సుజానా!”
“జీవితం పాపం కాక మరేమిటి జస్టినా? నీకు వినపడుతుందా? వినపడుతుందా భూమి కిరకిరలాడటం?”
“లేదు సుజానా! నాకేమీ వినపడటం లేదు. నా రాత నీరాతంత గొప్పది కాదు.”
“నీకు భయమేస్తుంది. నేను చెపుతున్నాగా, నాకు వినపడేది నీకు వినపడితే భయంతో నీలుక్కుపోతావు.”
జస్టినా గది శుభ్రం చేయడంలో మునిగిపోయింది. మళ్ళీ మళ్ళీ తడి చెక్కనేలని గుడ్డతో తుడిచింది. పగిలిన వేజ్ నుండి కిందపడిన నీటిని శుభ్రం చేసింది. పూలు ఎత్తింది. పగిలిన ముక్కల్ని తొట్టిలో పడేసింది.
“నీ జీవితంలో ఎన్ని పిట్టల్ని చంపి ఉంటావు జస్టినా?”
“చాలా, సుజానా!”
“ఎప్పుడూ బాధ వేయలేదా?”
“వేసింది సుజానా!”
“ఇంకా చనిపోక దేనికోసం ఎదురుచూస్తున్నావు?”
“చావు కోసం సుజానా!”
“అంతే అయితే, అదే వస్తుంది. ఆదుర్దా పడకు.”
సుజానా శాన్ హువాన్ దిండుకి చేరగిలపడి కూచుంది. అస్థిరమైన ఆమె కళ్ళు ప్రతి మూలా వెతుకుతున్నాయి. ఆమె చేతులు పొట్టమీద రక్షించే కొక్కెంలా ముడిపడి ఉన్నాయి. ఆమె తలపై రెక్కలాడినట్టు ఝుం అంటూ వినిపిస్తూంది. కిర్రుమంటూ బావిలో గిలక. జనాలు లేస్తున్న సందడి.
“నరకంలో నీకు నమ్మకముందా జస్టినా?”
“ఉంది సుజానా, స్వర్గంలో కూడా!”
“నాకు నరకంలోనే నమ్మకముంది,” అంది సుజానా. అని కళ్ళు మూసుకుంది.
జస్టినా వెళ్ళిపోయాక సుజానా మళ్ళీ నిద్రలో మునిగిపోయింది. బయట సూర్యుడు తళతళ మెరుస్తున్నాడు. హాల్లో పేద్రో పారమొ కనిపించాడు జస్టినాకు.
“సెన్యోరా ఎట్లా ఉంది?”
“బాలేదు,” తల దించుకుని బదులిచ్చింది.
“ఏమన్నా కంప్లెయిన్ చేస్తుందా?”
“లేదు సెన్యోర్! ఆమె దేని గురించీ కంప్లెయిన్ చేయదు. కానీ చనిపోయినవాళ్ళు ఎప్పుడూ కంప్లెయిన్ చేయరని చెప్తారు. మనకు సెన్యోరా దక్కలేదంతే.”
“ఫాదర్ రెంటెరియా ఆమెను చూడటానికి వచ్చాడా?”
“ఆమె కన్ ఫెషన్ వినడానికి రాత్రి వచ్చాడు. ఇవాళ ఆమె కమ్యూనియన్ తీసుకుని ఉండవలసింది కానీ ఆమె మీద దయ ఉన్నట్టు లేదు. ఫాదర్ పొద్దున్నే వస్తానన్నాడు కానీ చూడు ఎంత పొద్దెక్కిందో ఇంకా రాలేదు. ఆమె మీద దయ ఉన్నట్టు లేదు.”
“ఎవరి దయ?”
“దేవుడి దయ, సెన్యోర్!”
“తెలివి తక్కువగా మాట్లాడకు జస్టినా!”
“సరే, సెన్యోర్!”
పేద్రో పారమొ తలుపు తెరిచి దాని పక్కనే నిలుచున్నాడు, ఒక కాంతి కిరణాన్ని సుజాన శాన్ హువాన మీద పడనిస్తూ. అతనికి కనిపించింది బాధతో గట్టిగా మూసుకున్నట్టున్న కళ్ళూ, సగం తెరిచిన తడి నోరూ, దుప్పట్లను వెనక్కి నెట్టేస్తూన్న చేతులూ, బయటపడుతున్న ఆమె నగ్నత్వమూ, మెలికలు తిరుగుతూ వంకరలు పోతున్న ఆమె దేహమూ.
తనకూ, మంచానికీ మధ్య ఉన్న కొద్ది దూరాన్నీ ఒక్క ఉదుటున దాటి ఏలికపాములా గిజగిజలాడుతూ మరింత విపరీతంగా కొట్టుకుంటూన్న నగ్నదేహాన్ని కప్పాడు. ఆమె చెవిలో పిలిచాడు “సుజానా!”. మళ్ళీ పిలిచాడు “సుజానా!”
తలుపు తెరుచుకుని ఫాదర్ రెంటెరియా చప్పుడు కాకుండా గదిలోకొచ్చాడు. “నీకు కమ్యూనియన్ ఇవ్వడానికి వచ్చాను తల్లీ!” అన్నాడు.
పేద్రో పారమొ ఆమెను లేపి తలగడలు సర్ది వాటికి చేరగిలపడేట్టు కూచోబెట్టిందాకా ఆగాడు. సుజానా సాన్ హువాన్ సగం నిద్రలోనే నాలుక చాపి ప్రసాదాన్ని మింగింది. తర్వాత “దివ్యమైన రోజు గడిపాం ఫ్లోరెన్సియొ!” అంది. మళ్ళీ ఆ దుప్పట్ల సమాధిలోకి జారిపోయింది.

“ఆ కిటికీ చూడు దోన ఫౌస్టా, ఆ మెదియా లూనాలో ఎప్పుడూ లైట్ వెలుగుతూ ఉండేది!”
“లేదు ఏంజెలెస్! నాకేదీ కనపడలేదు”
“ఎందుకంటే ఇప్పుడది చీకటిగా ఉంది. అంటే ఏదయినా చెడు జరిగిఉంటుందంటావా? మూడేళ్ళ పైగా ఆ కిటికీలో లైట్ రాత్రి తర్వాత రాత్రి వెలుగుతూనే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ గది పేద్రో పారమొ గది అని చెప్తారు. పాపమా పిచ్చావిడకి చీకటంటే భయమట. చూడు ఇప్పుడు లైట్ ఆరిపోయి ఉంది. దుశ్శకునం కాదా?”
“చచ్చిపోయిందేమో! బాగా జబ్బు పడి ఉంది. ఎవరినీ గుర్తు పట్టడంలేదంటున్నారు. తనలో తాను మాట్లాడుకుంటుందట. ఆమెని పెళ్ళి చేసుకోవడం మూలాన పేద్రో పారమొకి తగిన శాస్తే జరిగింది.”
“పాపం పేద్రో పారమొ!”
“లేదు ఫౌస్టా. అతనికి అంతే కావాలి. ఇంకా ఎక్కువే కావాలి”
“చూడు గది ఇంకా చీకటిగా ఉంది.”
“ఆ కిటికీని అట్లా వదిలేసి ఇంటికి పోయి పడుకుందాం పద! మనలాంటి ఇద్దరు ముసలాళ్ళకి ఇట్లా రోడ్ల మీద పడి తిరగడానికి వేళ మీరి పోయింది. ”
చర్చి నుంచి పదకొండింటికి బయటపడ్డ ఆ ముసలి ఆడవాళ్ళు అర్కేడ్ ఆర్చీల కింద మాయమయారు. ప్లాజాని దాటుతూ మెదియాలూనా వైపు వెళుతున్న మనిషి జాడ కనపడింది.
“చూడు దోనా ఫౌస్టా! ఆ వెళుతున్న మనిషి డాక్టర్ వలెన్సియా అంటావా?”
“అతను నాఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేనంత చత్వారం వచ్చింది నాకు. కానీ అట్లాగే ఉన్నాడు.”
“నీకు గుర్తు లేదా, ఆయన ఎప్పుడూ తెల్ల పాంటూ, నల్లకోటూ వేసుకుంటాడు కదా! మెదియాలూనాలో ఏదో చెడు జరుగుతుందని పందెం. చూడు ఏదో అవసరం పడ్డట్టు ఎట్లా వేగంగా నడుస్తున్నాడో!”
“చూస్తుంటే ఏదో ఘోరం జరిగే ఉంటుందనిపిస్తుంది. తొందరగా వెళ్ళి ఫాదర్ రెంటెరియాకి చెప్పాలనిపిస్తుంది. పాపం ఆమె కన్ ఫెషన్ చేయకుండా చచ్చిపోతుందేమో!”
“దేవుడే కాపాడాలి ఏంజెలెస్! ఎంత దుర్భరమైన ఆలోచన! ఈలోకంలో పడ్డ కష్టాలు ఎటూ పడింది. ఇప్పుడు చివరి కర్మలు జరక్కుండా పోయి మళ్ళీ వచ్చే జన్మలోకూడా ఇంకా కష్టాలు పడాలని ఎవరూ కోరుకోరు. పిచ్చివాళ్ళు కన్ ఫెస్ చేయనవసరం లేదనీ, వాళ్ల ఆత్మల్ని పాపం చుట్టుకున్నా వాళ్ళు అమాయకులేననీ చెప్తారనుకో. దేవుడికే తెలియాలి… చూడు కిటికీలో లైట్ వెలుగుతుందిప్పుడు. అంతా బాగానే అయిపోయి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే మనం క్రిస్మస్ కోసం చర్చిని అలంకరించడానికి పడ్డ శ్రమంతా ఏమయ్యేదో ఊహించుకో. డాన్ పేద్రో అంత పెద్దమనిషి కాబట్టి మన వేడుకలన్నీ సర్వనాశనమయ్యేవి.”
“నువ్వెప్పుడూ అతిగా ఆలోచిస్తావు ఫౌస్టా. నువు నేను చేసినట్టు చేయి- అంతా ఆ దేవుడికే వదిలేయి. కన్య మేరీకి అవ మారియా చెప్పు. ఇప్పట్నుంచి తెల్లారిందాకా ఏమీ జరగదనే నా నమ్మకం. అప్పుడు దేవుడి ఆనే జరగనివ్వు. ఎటు తిరిగీ ఆమె ఈ జీవితంలో ఆనందంగా ఉండలేదు.”
“నిజం చెబుతున్నా ఏంజెలెస్! నీ మాటలు నాకుఎప్పుడూ సాంత్వన కలిగిస్తాయి. ఆ మంచి మాటలే మనసులో పెట్టుకుని నిద్రపోగలను. మన నిద్రలో ఆలోచనలు సరాసరి స్వర్గానికే చేరతాయంటారు. నాది కూడా అంత దూరం పోతుందనే నా ఆశ. రేప్పొద్దున కలుద్దాం.”
“సరే రేపు కలుద్దాం ఫౌస్టా.”
ఆ ముసలి ఆడవాళ్ళిద్దరూ వాళ్ళ సగం తెరిసిన తలుపుల్లోంచి ఇళ్ళల్లోకి వెళ్ళారు. రాత్రి నిశ్శబ్దం పల్లె మీద మళ్ళీ పరుచుకుంది.

“నా నోరు మట్టితో నిండి ఉన్నది!”
“అవును ఫాదర్!”
“‘అవును ఫాదర్ ‘ అనకు. నేను చెప్పేదంతా మళ్ళీ చెప్పు.”
“మీరేం చెప్తారు? నన్ను మళ్ళీ కన్ ఫెస్ చేయమంటారా? మళ్ళీ ఎందుకు?”
“ఇది కన్ ఫెషన్ కాదు సుజానా. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను. నిన్ను మృత్యువుకు సిద్ధపర్చడానికి.”
“నేను చనిపోబోతున్నానా?”
“అవును తల్లీ!”
“మరి నా మానానికి నన్ను ప్రశాంతంగా వదిలేయవచ్చుకదా? నాకు విశ్రాంతి కావాలి. నన్ను మెలకువగా ఉంచమని మిమ్మల్నెవరో పంపి ఉండాలి. నిద్ర పూర్తిగా పారిపోయిందాకా నాతో ఉండడానికి. అతన్ని కనుక్కోవడానికి నేనేం చేయగలను? ఏమీ లేదు ఫాదర్! నన్నొంటరిగా వదిలేసి వెళ్ళిపోరాదా?”
“నిన్నొదిలేస్తాను సుజానా. నేను చెప్తున్న మాటలు తిరిగి చెప్తుంటే నెమ్మదిగా నీకు నువ్వే జోలపాడుకున్నట్టు నిద్రలోకి జారిపోతావు. ఒకసారి నిద్రపోయాక నిన్నెవరూ లేపరు. ..నువ్వెప్పటికీ లేవవు.”
“సరే ఫాదర్. మీరు చెప్పినట్లే చేస్తాను.”
తన చేతులు ఆమె భుజాల మీద ఉంచి మంచం అంచున కూచున్న ఫాదర్ రెంటీరియా ఎవరికీ వినపడకుండా ఉండేందుకు ఆమె చెవి దాదాపు తన నోరు తాకుతుండగా ఒక్కోమాటా రహస్యంగా గుసగుసలాడుతూ చెప్పాడు. “నా నోరు మట్టితో నిండి ఉన్నది.” అని ఆగాడు. ఆమె పెదవులు కదులుతున్నాయో లేదోనని చూశాడు. మాట్లాడుతున్నట్టు పెదాలు కదులుతున్నాయి కానీ శబ్దం బయటికి రావడం లేదు:
“నా నోరు నీతో, నీ పెదవులతో నిండి ఉన్నది. గట్టిగా మూసుకుని ఉన్న నీ పెదవులు, నా పెదవులను గట్టిగా అదుముతూ, కొరుకుతూ..”
ఆమె కూడా ఆగింది. తన కంటి చివరి నుంచి ఫాదర్ రెంటెరియా వంక చూసింది. అతనెక్కడో దూరంగా ఉన్నట్టూ, మంచు పేరుకున్న గాజుపలక వెనక ఉన్నట్టూ కనిపించాడు.
మళ్ళీ అతని గొంతు ఆమె చెవిలో వెచ్చగా వినపడింది.
“నురగల ఉమ్మిని మింగితిని. నా గొంతుకడ్డంగా ముడి పడి, నా అంగిటిలో వొరుసుకునునట్లు పురుగులతో లుకలుకలాడుతున్న మట్టి పెళ్ళలని నమిలితిని. నములుతూ కబళించుచున్న నా పళ్ళ వలన చీల్చబడి వంకరలు పోయి నా నోరు విరిగిపడినది. నా ముక్కు మెత్తబడినది. నా కనుగుడ్లు నీరై పోయినవి. నా శిరోజములు ఒక అగ్ని కీలయై మండినవి..”
సుజానా శాన్ హువాన్ అంత నిమ్మళంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి ఆమె ఆలోచనలనూ, తను ఆమెలో ప్రతిక్షేపిస్తున్న దృశ్యాలను నిరాకరించడానికి పెనుగులాడుతున్న ఆమె హృదయాన్నీ తెలుసుకోవాలనిపిస్తూంది. అతను ఆమె కళ్లలోకి చూశాడు. ఆమె కూడా అట్లాగే చూసింది. ఆమె మెలి తిరుగుతున్న పెదవుల చివర ఒక చిన్న నవ్వు మొలకెత్తుతున్నట్టు ఉంది.
“ఇంకా ఉంది. దేవుడు సాక్షాత్కరించిన దృశ్యం. ఆయన అనంత స్వర్గధామపు మెత్తటి కాంతి. సెరాఫిం పాటా, చెరూబిం ఉల్లాసం. శాశ్వత బాధలకు శపించబడ్డ వారికి చివరిసారిగా కనపడి మాయమయ్యే దేవుని నయనాలలో ఆనందం. శాశ్వత బాధకు తోడయ్యే ఈ లోకపు వేదన. ఎముకలోని మజ్జ మండుతున్న బొగ్గయి, మన నరములలో ప్రవహించు రక్తము అగ్ని కీలలై నమ్మజాలని యాతన కలుగజేయును. దేవుని ఆగ్రహము దానిని ఆరనివ్వక విసురుచుండుటవలన ఆ అగ్ని ఎన్నటికీ చల్లారదు.”
“అతడు నాకు తన చేతులలో రక్షణనొసగెను. నాకు ప్రేమనొసంగెను.”
ఆమె చివరి క్షణం కోసం ఎదురు చూస్తూ తన చుట్టూ మూగిన ఆకారాల వంక చూశాడు ఫాదర్ రెంటీరియా. పేద్రో పారమొ చేతులు కట్టుకుని వాకిలి వద్ద ఎదురు చూస్తున్నాడు. అతని పక్కనే డాక్టర్ వాలెన్సియా, ఇంకా కొంతమంది నిలుచుని ఉన్నారు. ఇంకా దూరంగా నీడల్లో ఆడవాళ్ళ చిన్న గుంపు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థనలు చేయడానికి ఆత్రంగా నిలబడి ఉంది.
అతను లేద్దామనుకున్నాడు. మరణిస్తున్న స్త్రీకి పవిత్ర తైలం అంటి “నా పని ముగిసింది,” అని చెప్పటానికి. కానీ లేదు, అతని పని ఇంకా ముగియలేదు. ఆమె ఎంతవరకూ పశ్చాత్తాపపడుతూ ఉందో తెలియకుండా ఆ మరణ సంస్కారాన్ని కొనసాగించలేడు.
అతను ఒక క్షణం సందేహించాడు. బహుశా ఆమెకు పశ్చాత్తాపపడవలసిందేమీ ఉండి ఉండక పోవచ్చు. బహుశా తను క్షమించవలసిందీ ఏమీ లేకపోవచ్చు. మళ్లీ ఆమె మీదికి వంగి, ఆమె భుజాలు కుదుపుతూ లోగొంతుకతో చెప్పాడు.
“నువ్వు దేవుని సన్నిధానానికి వెళుతున్నావు. ఆయన పాపులపై తీర్పు చెప్పడంలో క్రూరుడు.”
ఆమె చెవిలో ఇంకా ఏదో చెప్పబోయాడు కానీ ఆమె తల అడ్డంగా ఊపింది. “వెళ్ళి పో ఫాదర్. నాగురించి హైరానా పడకండి. నాకు ప్రశాంతంగా ఉంది. బాగా నిద్రవస్తున్నట్టుంది.”
నీడలో దాగున్న స్త్రీలలో ఒకరి వెక్కు బయటికి వినవచ్చింది.
సుజానా శాన్ హువాన్ కి ఒక్క క్షణం ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంది. మంచం మీద నిటారుగా కూర్చుని అంది:
“జస్టినా, నీకు ఏడవాలనుంటే ఎక్కడికయినా పో!”
అప్పుడు ఆమెకు తల పొట్టమీదికి వాలినట్లనిపించింది. తల పైకెత్తడానికీ, ఊపిరాడకుండా చేస్తున్న పొట్టను పక్కకు నెట్టడానికీ ప్రయత్నించింది కానీ ప్రతి ప్రయత్నంతో ఆమె ఆ రాత్రి లోకి ఇంకా లోతుగా కూరుకుపోసాగింది.

“నేను.. నేను దోనా సుజానితా చనిపోవడం చూశాను.”
“ఏమంటున్నావు డొరోతియా?”
“నీకిప్పుడు చెప్పిందే!”

తొలి సంజ. గణ గణా మోగుతున్న గంటలు జనాల్ని మేలుకొలుపుతున్నాయి. అది డిసెంబర్ ఎనిమిది ఉదయం. మబ్బుగా ఉన్న ఉదయం. చల్లగా లేదు కానీ మబ్బుగా. ఆ మోగడం పెద్ద గంటతో మొదలయ్యింది. మిగతావీ దానికి జత కలిసాయి. ఫెద్ద ప్రార్థన కోసం గంటలు మోగుతున్నాయనుకున్నారంతా. తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. అన్నీ కాదు; కొన్ని ఇంకా మూసుకునే ఉన్నాయి. బద్ధకస్తులు ఇంకా మంచాల మీదే పడుకుని తెల్లారిందని గంటలు చెప్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ మోగడం మామూలు కన్నా ఎక్కువసేపు సాగింది. పెద్ద చర్చిలో గంటలే కాదు, సాంగ్రె డీ క్రిస్టో, క్రజ్ వర్డె, శాంచువారియో గంటలు కూడా. మధ్యాహ్నమయింది కానీ ఇంకా గంటలు మోగుతూనే ఉన్నాయి. రాత్రి అయింది. పగలూ, రాత్రీ గంటలు మోగుతూనే ఉన్నాయి. అన్నీ, బలంగా, పెద్దగా ఆ మోతలన్నీ గాఢశోకంలో కలిసిపోయేలా. చెప్పేది వినపడక జనాలు పెద్దగా అరవవలసి వస్తూంది. “ఏమయుంటుంది?” వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అడుగుకుంటున్నారు.
మూడు రోజులయ్యేసరికి అందరికీ చెవుడు వచ్చింది. అంతటా నిండిన ఆ ధ్వనులకి మాట్లాడడం అసాధ్యమవుతూంది. కానీ గంటలు మోగుతూనే ఉన్నాయి. కొన్ని పగిలిపోయి ఓటి కుండల్లా డొల్ల మోతలు మోగుతున్నాయి.
“దోనా సుజానా చనిపోయింది.”
“చనిపోయిందా? ఎవరు?”
“సెన్యోర.”
“ఎవరు మీ సెన్యోరానా?”
“పేద్రో పారమొ సెన్యోర.”
ఆ నిరంతర ధ్వనులు విని జనాలు వేరే ఊళ్ల నుంచి రాసాగారు. కోంట్లా నుంచి తీర్థానికొచ్చినట్టు వచ్చారు. ఇంకా దూరాన్నుంచి కూడా. ఎక్కడ్నుంచో ఎవరికి తెలుసు, ఒక సర్కస్ కూడా వచ్చింది ఎగిరే కుర్చీలూ అవీ వేసుకుని. వాయిద్యాల వాళ్ళూ. ముందు ఊరికే అందరిలా చూడ్డానికే వచ్చారు కానీ నెమ్మదిగా అక్కడే స్థిరపడిపోయారు. ప్రదర్శనలూ ఇవ్వడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా అంతా ఒక జాతరలాగా అయిపోయింది. కోమలా నిండా జనాలే, సందడి సందడిగా గొడవ చేస్తూ. పండగలప్పట్లా ఇసకస్తే రాలనట్టున్నారు జనం.
గంటలు మోగడం ఆగింది కానీ జాతర అట్లాగే కొనసాగింది. ఇది విచారించదగ్గ సందర్భం అని ఎవ్వరినీ వొప్పించ వీలుగాకుంది. వాళ్లని పొమ్మనే దారీ లేదు. ఒక వైపు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు.
మెదియా లూనా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉంది. పనివాళ్లు చెప్పులు లేకుండా నడుస్తూ, లోగొంతులతో మాట్లాడుతూ ఉన్నారు. సుజానా సాన్ హువాన్ ని పూడ్చిపెట్టడం అయింది కానీ కోమలాలో ఎక్కువమందికి ఆసంగతే తేలీదు. వాళ్లంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు. కోడిపందేలూ, లాటరీలూ, సంగీతమూ, తాగుబోతుల కేకలూ. ఊళ్ళోని దీపాల కాంతి మెదియాలూనా దాకా కనిపిస్తూంది బూడిదరంగు ఆకాశంలో తేజోవలయంలా. అవి మెదియాలూనాలో విషాదభరితమయిన రోజులు. డాన్ పేద్రో ఎవరోతోనూ మాట్లాడడం లేదు. తన గదే విడిచి రాలేదు. కోమల మీద పగ తీర్చుకుంటానని వొట్టు పెట్టుకున్నాడు.
“నా చేతిలోంచి గింజ జార్చను. కోమలా ఆకలితో మాడి చస్తుంది.”
అదే జరిగింది.
టిల్కేట్ వార్తలు అందిస్తూనే ఉన్నాడు.
“మేమిప్పుడూ కర్రాంజా తో ఉన్నాం.”
“మంచిది.”
“ఇప్పుడు జనరల్ ఓబ్రెగాన్ తో కలిశాం.”
“మంచిది.”
“శాంతి ప్రకటించారు. మమ్మల్ని పంపించేశారు.”
“ఆగు. నీ మనుషుల్ని పంపేయకు. ఇదెన్నాళ్ళో ఉండదు.”
“ఫాదర్ రెంటీరియా కూడా పోరాటంలోకి దిగాడు. మనం అతనికి వ్యతిరేకమా కాదా?”
“ప్రశ్నే లేదు. నువు ప్రభుత్వం తరఫునే!”
“కానీ మేం మామూలు వాళ్లం కాదుగా. వాళ్ళు మమ్మల్ని తిరుగుబాటుదారులుగా లెక్క వేస్తారు.”
“అయితే విశ్రాంతి తీసుకో!”
“మేం ఇప్పుడు ఇంత ఊపు మీద ఉన్నాము కదా!”
“సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయి.”
“నేను వెనక్కి ఆ ముసలి ప్రీస్ట్ దగ్గరికే పోతున్నా. వాళ్ల కేకలు నచ్చాయి. అదీ కాక ఆయనతో వెళితే ముక్తికి ఢోకా లేదు.”
“నువ్వేం చేస్తావో నాకనవసరం.”

పెద్రో పారమొ-12

pedro1-1చీకటి పడగానే వాళ్ళు వచ్చారు. వాళ్ల వద్ద చిన్న తుపాకులు ఉన్నాయి. ఛాతీల మీద అటూ ఇటూ ఏటవాలుగా గుళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇరవై మంది దాకా ఉన్నారు. పేద్రో పారమొ వాళ్లను భోజననానికి ఆహ్వానించాడు. వాళ్ళు నెత్తిమీద టోపీలు తీయకుండానే భోజనాల బల్ల మీద ఏమీ మాట్లాడకుండా కూచున్నారు. చాకొలేట్ తాగుతున్న చప్పుళ్ళూ, మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని టోర్టియాలూ (రొట్టెల్లాంటివి), ఉడకబెట్టిన బీన్సూ తింటున్న చప్పుళ్ళూ మాత్రమే వినవస్తున్నాయి.
పేద్రో పారమొ వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఇవి తనకు తెలిసిన మొహాలు కావు. టిల్కేట్ అక్కడే అతని వెనక నీడలో నిలుచుని ఉన్నాడు.
“అయ్యలారా!” పేద్రో పారమొ అన్నాడు వాళ్ళు తినడం పూర్తయినట్టు గమనించగానే. “ఇంకా ఏం చేయమంటారు మీకోసం?”
“ఇదంతా నీదేనా?” చేయి సాచి తిప్పుతూ చూపిస్తూ అడిగాడు వాళ్ళలో ఒకడు.
కానీ ఇంకొకతను అడ్డుపడ్డాడు.
“ఇక్కడ మాట్లాడేది నేను.”
“సరే, మీకేం కావాలో చెప్పండి.” పేద్రో పారమొ మళ్లీ అన్నాడు.
“చూస్తున్నావుగా, మేం ఆయుధాలు చేపట్టాం.”
“అయితే?”
“అయితే ఏముంది? అంతే. అది చాలదా?”
“ఎందుకు చేస్తున్నారు ఇదంతా?”
“ఎందుకంటే అందరూ అదే పని చేస్తున్నారు కాబట్టి. నీకు తెలియదా? కాసేపు ఆగు, మాకింకా పైనుంచి ఆదేశాలు రావాలి. అప్పుడు చెప్తాము ఎందుకో. ఇప్పటికయితే, మేం ఇక్కడున్నాం. అంతే.”
“ఎందుకో నాకు తెలుసు,” ఇంకొకతను అన్నాడు. “నీకు కావాలంటే చెప్తాను. మేం ప్రభుత్వం మీదా, నీలాంటి వాళ్ల మీదా తిరుగుబాటు చేస్తున్నాం. మిమ్మల్ని భరించడం ఇక మా వల్ల కాదు. ప్రభుత్వంలో ప్రతి ఒకడూ ఒక దొంగవెధవ. నువ్వూ, నీలాంటి వారూ బందిపోటు దొంగలు. ఇక గవర్నర్ గురించి ఏమీ చెప్పను. ఆ చెప్పేదేదో బుల్లెట్ల తోటే చెప్తాం.”
“మీ తిరుగుబాటుకి ఎంత కావాలి?” పేద్రో పారమొ అడిగాడు. “నేను మీకు సాయం చేయగలనేమో!”
“అయ్య చెప్పేది బాగానే ఉంది పెర్సెవెరాన్సియో. నువు ఊరికే నోరు పారేసుకోకు. మనకు కావలసిన సరంజామా సమకూర్చడానికి డబ్బున్న వాడొకడు ఎటూ కావాలి. ఈ అయ్యని మించిన వాళ్ళెవరు దొరుకుతారు? కాసిల్డో, మనకి ఎంత కావాలి?”
“ఇంతని ఏముంది? అయ్య ఎంత ఇవ్వగలిగితే అంత.”
“ఏమిటీ? ఈ మనిషి పస్తులున్నవాడికి కూడా మెతుకు విదల్చడు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కనక అవకాశం వదులుకోకూడదు. వాడి రోత నోట్లో ఉన్న ఆఖరి మెతుకుతో పాటు ఉన్నదంతా ఊడబీక్కోవాలి.”
“నువ్వాగు పెర్సెవెరాన్సియో! అల్లంతో కంటే బెల్లంతోటే ఎక్కువ ఈగలు పట్టుకోవచ్చు. మనం బేరం కుదుర్చుకోవచ్చు. ఎంతో చెప్పు కాసిల్డో!”
“ఉరామరిగా చూస్తే ఇప్పుడు ముందో ఇరవై వేల పేసోలయితే బాగానే ఉంటుంది. మిగతా వాళ్లంతా ఏమంటారు? మనకెటూ సాయం చేయాలనుకుంటున్నాడు కనక మన అయ్య ఇంకాస్త ఎక్కువే ఇస్తాడేమో, మనకేం తెలుసు? కాబట్టి ఒక యాభై వేలు అనుకుందాం. మీకేమనిపిస్తుంది?”
“నేను లక్ష ఇస్తాను మీకు.” పేద్రో పారమొ అన్నాడు. “ఎంతమంది మీరు?”
“మూడొందల మంది దాకా ఉంటాం.”
“సరే. నేను ఇంకో మూడొందలమందిని మీతో పంపుతాను మీ దళం బలపడేందుకు. ఒక వారంలో మీకోసం డబ్బూ, మనుషులూ ఏర్పాటు చేస్తాను. డబ్బులు ఇస్తాను కానీ, మనుషులు మాత్రం అరువుకే. వాళ్ళతో పని అయిపోగానే తిరిగి ఇక్కడికి పంపేయండి. ఒప్పందానికి సమ్మతమేనా?”
“ఇంకా సందేహమా?”
“సరే, ఇంకో వారంలో మళ్ళీ కలుద్దాం అయ్యలారా! మిమ్మల్ని ఇట్లా కలవడం ఆనందంగా ఉంది.”
“సరే,” చివరిగా వెళుతున్నతను అన్నాడు “కానీ గుర్తు పెట్టుకో. మాటతప్పావా, నీ సంగతి తేలుస్తాడు పెర్సెవెరాన్సియో. అంటే, నేనే!”
పేద్రో పారమొ అతనితో కరచాలనం చేసాడు అతను వెళ్లబోతుండగా.

“వాళ్ల నాయకుడెవరనుకుంటున్నావు?” వాళ్ళు వెళ్ళిపోయాక టిల్కేట్ ని అడిగాడు.
“ఆ మధ్యలో ఉన్నతను అనుకుంటాను. అదే, ఆ పెద్ద పొట్టేసుకుని తల కూడా పైకెత్తకుండా ఉన్నాడే, అతనే అనుకుంటున్నాను. నేనంత తొందరగా పొరబడను, డాన్ పేద్రో.”
“ఈసారి పొరబడ్డావు డమసియో. నాయకుడివి నువ్వు. కొంపదీసి ఈ తిరుగుబాటులో భాగం పంచుకోవాలనిలేదా?”
“ఆ విషయం నాకు వెంటనే తట్టలేదు. అందులోనూ కాస్త చిల్లర దొరుకుతుందంటే నాకెంతో ఇష్టం కూడాను.”
“ఈపాటికే నీకు అర్థమయి ఉండాలి కనక నీకు నా సలహా పెద్దగా అవసరం లేదు. నీకు నమ్మకమయిన వాళ్లను మూడొందలమందిని సిద్ధం చేసి వీళ్లతో జతకలువు. వాళ్ళకోసం నేను పంపిస్తానన్న మనుషుల్ని తీసుకొచ్చినట్టు చెప్పు. మిగతాది ఎట్లా చేయాలో నీకు తెలుసు.”
“మరి డబ్బు గురించి ఏం చెప్పను? అది కూడా వాళ్లకు ఇవ్వనా?”
“నీకు మనిషికి పది పేసోల లెక్కన ఇస్తాను. వాళ్ల తక్షణ అవసరాలు తీరడానికి సరిపోయేంత. మిగతాది వాళ్ళకోసం ఇక్కడ దాచానని చెప్పు. ఈ రోజుల్లో అంత సొమ్ము వెంట వేసుకుని తిరగడం మంచిది కాదు. అన్నట్టు ఆ రాతిగేటు దగ్గర కొట్టం ఎట్లా ఉంటుంది నీకు? సరే. అది నీదే, ఈ నిమిషం నుంచీ. కోమలలో మన లాయరు ఉంటాడు, అదే ఆ ముసలి గెరార్డొ ట్రూహీయో. ఈ కాగితం అతని దగ్గరికి తీసుకు వెళ్ళు. అక్కడికక్కడే ఆ స్థలం నీ పేరు మీదకి మార్పిస్తాడు. ఏమంటావు డమసియో?”
“అనేదేముంది డాన్! కొట్టం సంగతి వదిలేసినా ఈ పని ఆనందంగానే చేస్తాను. దీని సంగతి చూట్టానికయినా. నేను నీకు తెలుసు. ఏమయినా నీకు కృతజ్ఞుడిని. నేనిట్లా తిరుగుతూ ఉంటే మా ముసలిదానికి కాస్త పని కలిపించినట్టుంటుంది.”
“కాసిని పశువుల్ని కూడా తీసుకుపో. ఆ కొట్టానికి కాస్త ఆ సందడి కూడా ఉండాలిగా!”
“ఆ పుంజుల్ని కూడా తీసుకుంటే ఫర్వాలేదా?”
“నీకేం కావాలంటే అవి తీసుకుపో. మీ ఆవిడ వాటిని చూసుకుంటుంది. ఇక మన విషయానికి వద్దాం. నా పొలానికి మరీ దూరం ఆ వెళ్లనివ్వకు. ఇంకెవరన్నా వస్తే ఇక్కడ ఇప్పటికే వీళ్ళున్నారని తెలిసేట్టుండాలి. నీకు వీలయినప్పుడో, ఏదన్నా వార్త ఉన్నప్పుడో రా.”
“వస్తాను అయ్యా!”

“ఆమె ఏమంటూ ఉంది హువాన్ ప్రెసియాడో?”
“తన పాదాలను అతని కాళ్ళ మధ్య పెట్టుకునేదాన్నని చెపుతూంది. చల్లటి రాళ్ళలాగా ఉన్న పాదాల్ని బట్టీలో రొట్టె కాల్చినట్టు వెచ్చగా చేసేవాడు. అవి బంగారు రొట్టెలంటూ వాటిని మునిపళ్లతో కొరికేవాడనీ చెప్పింది. ఆమె అతని దగ్గరగా ముడుచుకుని పడుకునేది అతని చర్మం కింద, శూన్యంలో తప్పిపోతూ. తన కండరాలు నాగటి చాళ్లలా విడివడుతూ, మంటతో మొదలై వెచ్చగా, మెల్లగా ఆమె మెత్తటి కండరాలను తోసుకుంటూ లోపలికి, లోలోపలికి ఆమె కేక పెట్టిందాకా. కానీ అతని చావు ఆమెని చాలా చాలా బాధించింది. అదీ ఆమె చెప్పింది.”
“ఎవరి చావని ఆమె ఉద్దేశం?”
“ఆమెకంటే ముందుచనిపోయినవాళ్ళెవరో!”
“కానీ ఎవరయి ఉంటారు?”
“నాకు తెలియదు. ఆమె అనడం అతను ఆలస్యంగా వచ్చిన రాత్రి ఆమెకి గట్టిగా అనిపించిందట అతడు ఆలస్యంగా వేకువజాముకయినా వస్తాడని. ఎందుకంటే ఆమె చల్లటి పాదాలు దేంతోటో చుట్టేసినట్టూ, ఎవరో కప్పి వేడి చేస్తున్నట్టూ అనిపించిందట. ఆమె లేచేసరికి తాను అతనికోసం ఎదురు చూస్తూ చదువుతున్న న్యూస్ పేపర్ ఆమె పాదాలకు చుట్టి ఉందట. అతను చనిపోయిన వార్త వాళ్ళు ఆమెకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె ఆరాత్రి నిద్రకు తాళలేనప్పుడే నేలకు జారిపోయిన పత్రిక ఆమె పాదాల చుట్టూ కప్పబడి ఉంది.
“ఆమెను పూడ్చిపెట్టిన పెట్టె బద్దలయి తెరుచుకున్నట్టుంది. చెక్క కిర్రు మనే చప్పుడు వస్తూంది.”
“అవును నాకూ వినపడుతుంది.”

ఆరాత్రి ఆమెకు మళ్లీ కలలు వచ్చాయి. ఎందుకంత గాఢంగా అన్ని విషయాలనూ గుర్తుంచుకోవడం? అతని చావు మాత్రమే కాక ఎప్పటిదో మృదువయిన సంగీతం?
“ఫ్లోరెన్సియో చనిపోయాడు సెన్యోరా!”
ఎంత భారీ మనిషి! ఎంత పొడవు! అతని గొంతెంత దృఢంగా ఉండేది!. ఎంతో పొడి అయిన నేలంత పొడిగా. అతని దేహాన్ని సరిగ్గా చూడలేకపోయింది. లేక జ్ఞాపకాల్లోంచి చెరిగిపోయిందా? వాళ్ల మధ్య వానేదో పడుతున్నట్టు. అతనేమన్నాడు? ఫ్లోరెన్సియో? ఏ ఫ్లోరెన్సియో? నావాడా? మరయితే అప్పుడు నేనెందుకు ఏడవలేదు నాకన్నీళ్లలో నన్ను ముంచేసుకుని నా వేదననంతా కడిగేసుకునేట్టు? ఓ దేవుడా! నువు నీ స్వర్గలోకంలో లేవు. అతన్ని కాపాడమని నిన్ను కోరాను. అతన్ని జాగ్రత్తగా చూసుకోమని. నిన్నడిగింది అదే. కానీ నీకు పట్టిందల్లా ఆత్మలు. మరి నాకు కావలసింది అతని శరీరం. నగ్నంగా, ప్రేమతో వేడిగా, కోరికతో కాలిపోతూ, నా వణికే రొమ్ముల్నీ, చేతుల్నీ రాస్తూ. అతని దేహాన్నుంచి నా పారదర్శక దేహం వేలాడుతూ. అతని బలం పట్టి విడుస్తున్న కామాతురమైన నా దేహం. అతని పెదవులు కప్పని నాపెదవులతో ఏం చేయను? నా పేద పెదవులేమవుతాయి?
సుజానా శాన్ హువాన్ తన పక్కలో అటూ ఇటూ దొర్లుతూ ఉంటే పేద్రో పారమొ తలుపు దగ్గరే నుంచుని ఆమెనే చూస్తూ ఈ కొత్త కలని సెకన్లలో కొలుస్తున్నాడు. లాంతరులో నూనె తగ్గి మంట రెపరెపలాడి బలహీన పడుతూ ఉంది. తొందర్లోనే అది ఆరిపోతుంది.
ఈ అంతులేని శిక్షింపజేసే కలలు కాకుండా ఏదన్నా నొప్పితో బాధపడుతూ ఉంటే అతను ఉపశమనానికేమయినా చేసుండేవాడు. సుజానా శాన్ హువాన్ నే చూస్తూ ఆమె ప్రతి కదలికనూ గమనిస్తుంటే పేద్రో పారమొకి కలిగిన ఆలోచనలు అవి. ఆమెను చూడడానికి సాయపడుతున్న ఆ పాలిపోయిన వెలుగు లాగా ఆమె బ్రతుకు కూడా హరించుకుపోతే తనేం చేయాలి?
అతను చప్పుడు కాకుండా తలుపు మూసి బయటికి నడిచాడు. బయట చల్లని గాలి. సుజానా శాన్ హువాన్ రూపాన్ని చల్లటి రాత్రి తుడిచేసింది.
వేకువజామున సుజానాకు మెలకువ వచ్చింది. ఆమెకు చెమట్లు పోస్తున్నాయి. పైనున్న బరువయిన దుప్పట్లను నేల మీదికి విసిరేసి దాని వేడి నుంచి తప్పించుకుంది. ఉదయపు చల్లటి గాలి ఆమె నగ్నదేహాన్ని చల్లపరుస్తూ ఉంది. ఆమె నిట్టూర్చి తిరిగి నిద్రలోకి జారుకుంది.
కొన్నిగంటల తర్వాత ఆమె ఫాదర్ రెంటెరియాకు అట్లాగే కనిపించింది. నగ్నంగా నిద్రపోతూ.

“ఇది విన్నారా డాన్ పేద్రో? టిల్కేట్ ని లేపేశారు”
“రాత్రి గొడవేదో వినపడుతూ ఉంది కనక కాల్పులు జరిగినట్టు తెలుసు. కానీ నాకంతవరకే తెలుసు. ఇది నీకెవరు చెప్పారు గెరార్డో?”
“గాయపడ్డవాళ్ళలో కొంతమంది కోమలా చేరుకున్నారు. నా భార్య వాళ్ళకి కట్లు కట్టడానికి సాయపడింది. వాళ్ళు డమసియోతో ఉన్నట్టూ, చాలా మంది చనిపోయారనీ చెప్పారు. విజీస్తాలమని చెప్పుకునే వాళ్ళెవరితోనో గొడవ జరిగినట్టుంది.”
“ఓరి దేవుడా! ముందుముందు అన్నీ పాడురోజులే రాబోతున్నట్టున్నాయి గెరార్డో! నువ్వేం చేయాలనుకుంటున్నావు?”
“నేను వెళ్ళిపోతున్నా డాన్ పేద్రో! సయులాకి. అక్కడ మళ్ళీ మొదలుపెట్టుకోవడమే.”
“మీ లాయర్లకా అవకాశముంది. మిమ్మల్ని చంపనంతవరకూ మీ సొత్తంతా తీసుకుని ఎక్కడికయినా పోవచ్చు.”
“అట్లా అనుకోకండి డాన్ పేద్రో! మా సమస్యలు మాకున్నాయి. అంతేకాక మీలాంటి వాళ్ళను వదిలిపోవడం కష్టంగానే ఉంటుంది. మీ మర్యాదలు మళ్లీ ఎక్కడ దొరుకుతాయి? మన ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుందనుకుంటే కాస్త మనశ్శాంతి. మీ పేపర్లన్నీ ఎక్కడ వదిలేయమంటారు?”
“వదిలేయద్దు. నీతో పాటు తీసుకు వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళినా అక్కడనుంచే నా వ్యవహారాలు చూడడం కుదరదా?”
“నామీద మీరుంచిన నమ్మకానికి చాలా సంతోషంగా ఉంది. నిజంగా. కానీ మీ పనులు చూడడం కుదరదని చెప్పే సాహసం చేస్తున్నాను. కొన్ని అవకతవకలు.. మీకు తప్ప మరొకరికి తెలియకూడని విషయాలున్నాయి. మీ పేపర్లు తప్పుడువాళ్ల చేతుల్లో పడితే వాళ్ళు ఏమయినా చేయొచ్చు. వాటిని మీతో ఉంచుకోవడమే మంచిది.”
“నువు చెప్పింది నిజమే గెరార్డో! వాటిని ఇక్కడే వదిలేయి. వాటిని తగలబెట్టేస్తాను. పేపర్లున్నా లేకపోయినా నా ఆస్తి గురించి నాతో పెట్టుకునేదెవడు?”
“ఎవరూ లేరు డాన్ పేద్రో! నాకా నమ్మకముంది. ఇక నేను వెళతాను.”
“దేవుడు తోడుగా పో గెరార్డో!”
“ఏమన్నారు?”
“దేవుడు నీకు తోడుగా ఉంటాడంటున్నాను.”
గెరార్డో ట్రూహీయో చాలా నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అతను ముసలివాడే కానీ అంత నెమ్మదిగా, ఆగుతూ ఆగుతూ నడవవలసిన అవసరం లేదు. నిజానికి అతనేదన్నా బహుమానం దొరుకుతుందని ఆశించాడు. పైన ఎక్కడున్నాడో డాన్ లూకాస్, అప్పుడతని పనీ, ఇప్పటిదాకా డాన్ పేద్రో పనీ అతనే చూశాడు. డాన్ పేద్రో కొడుకు మిగెల్ పని కూడా. ఏదన్నా గుర్తింపు కోసం ఆశపడ్డాడు. అతను చేసిన సేవలకు బదులుగా కాస్త పెద్ద ఎత్తున. అతని భార్యకు చెప్పాడు వచ్చేముందు “నేను వదిలిపెట్టి పోతున్నానని డాన్ పేద్రోకి చెప్తాను. నాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటాడని నాకు తెలుసు. ఆయనిచ్చే డబ్బుతో సయులాలో స్థిరపడొచ్చు. ఇక మిగతా జీవితం హాయిగా గడిపేయొచ్చు.”
కానీ ఆడవాళ్ళకి ఎప్పుడూ సందేహాలు ఎందుకు వస్తాయి? అసలేమిటి? వాళ్ళకు పైనుంచి ఏదన్నా సమాచారం అందుతుందా? అతని భార్యకు నమ్మకం లేదు అతనికేదన్నా బహుమానం దక్కుతుందని.
“నీ తల నీళ్ళలో మునగకుండా చూసుకోవడానికి నువు కుక్కలా పనిచేయాలి. అతడి నుంచి నీకేమీ రాదు.”
“ఎందుకట్లా అంటున్నావు?”
“నాకు తెలుసు, అంతే!”
వెనకనుంచి పిలుపు వస్తుందేమోనని ఇంకా వాకిలి వైపు నెమ్మదిగా నడుస్తున్నాడు.
“ఓ గెరార్డో! పరధ్యానంలో బుర్ర సరిగ్గా పనిచేయడం లేదు. నువు చేసినదానికి డబ్బుతో బదులు తీర్చుకోలేను. సరే, ఇది తీసుకో. ఏదో కాస్త కృతజ్ఞతగా.”
కానీ ఆ పిలుపు రాలేదు. ముఖద్వారం నుండి బయటకు వచ్చి రాటకు కట్టిన గుర్రాన్ని విప్పాడు. దానిపై ఎక్కి నెమ్మదిగా కోమలా వైపు బయలు దేరాడు కూతవేటు దూరం దాటిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. మెదియా లూనా కనుచూపు మేరలనుంచి దాటిపోయాక అనుకున్నాడు “అప్పు అడగడం ఎంత నీచమైన పని?”

“డాన్ పేద్రో. నాకే ఎందుకో బాగాలేక తిరిగి వచ్చేశాను. నీ పనులు చూడ్డం నాకు సంతోషమే.”
అరగంట క్రితమే వదిలిన డాన్ పేద్రో ఆఫీసులో కూచుని ఉన్నాడు అతను మళ్ళీ.
“నాకేమీ అభ్యంతరం లేదు గెరార్డో. అవిగో పేపర్లు. ఇంకా నువు వదిలిపెట్టిన చోటనే ఉన్నాయి.”
“మరి నా ఖర్చులకి.. నా ఫీజ్లో కొంత అడ్వాన్స్ గా.. కొద్దిగా ఎక్కువ ఏమన్నా ఇస్తే.. మీకు పర్వాలేదనిపిస్తే..”
“అయిదొందలు?”
“ఇంకొంచెం.. చాల కొంచెం ఎక్కువ కుదరదా?”
“వెయ్యి సరిపోతుందా?”
“అయిదు వేలు..”
“అయిదు.. ఏమిటీ? అయిదు వేల పేసోలా? నాదగ్గర అంత లేదు. అందరికంటే నీకే ఎక్కువ తెలిసి ఉండాలి నాకున్నదంతా ఇరుక్కుపోయి ఉన్నదని. నేలా, పశువులూ.. నీకు తెలుసా సంగతి. వేయి తీసుకో. అది సరిపోతుందిలే నీకు.”
ట్రూహీయో కూచుని ఆలోచిస్తున్నాడు. ఛాతీమీదికి తల వాల్చి. పేద్రో డబ్బు లెక్కపెడుతున్న వైపు నుంచి పేసోలు బల్లపై ఠంగుమని పడుతున్న చప్పుడు వినపడుతూంది. తన ఫీజు చెల్లించకుండా ఎప్పుడూ దాటవేసే డాన్ లూకాస్ ను గుర్తు తెచ్చుకున్నాడు. మొదట్లో ఏ మచ్చా లేని డాన్ పేద్రోని. అతని కొడుకు మిగెల్ని కూడా. ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు ఆ పిల్లాడు?
కనీసం పదిహేను సార్లు జైలునుంచి బయటకు రప్పించాడు. ఆ మనిషిని చంపిన కేసొకటి. ఏం పేరు అతనిది? రెంటెరియా. అవును, అదే. శవం చేతిలో తుపాకీ ఉంచారు. తర్వాత దాని గురించి నవ్వేసేవాడు కానీ మిగెలో జడుసుకు చచ్చాడు. ఆ వొక్కసారికే డాన్ పేద్రోకి ఎంత ఖర్చయి ఉండేది చట్టప్రకారం వెళ్ళుంటే. ఇంక ఆ బలాత్కారాల సంగతేమిటి? ఎన్ని సార్లు తన జేబులోంచి డబ్బు తీసి ఆ అమ్మాయిల నోరు మూయించలేదు? “మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు తెల్లటి బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి,” వాళ్ళకు నచ్చచెప్పేవాడు.
“ఇదుగో గెరార్డో, జాగ్రత్తగా చూసుకో. డబ్బు చెట్లకేం కాయదు.”
తన ఆలోచనల్లో ఇంకా మునిగి ఉన్న ట్రూహీయో బదులిచ్చాడు “చనిపోయినవాళ్ళు సమాధుల్లోంచి పైకి లేచి రానట్టే.”

తెల్లారడానికి ఇంకా చాలా సమయముంది. దీర్ఘరాత్రి వలన ఉబ్బిన లావాటి నక్షత్రాలతో ఆకాశం నిండి ఉంది. జాబిలి కొంచెం పైకి లేచి కనపడకుండా పోయింది. అది ఎవరూ చూడని, పట్టించుకోని దిక్కుమాలిన జాబిళ్లలో ఒకటి. అక్కడే కొద్దిసేపు వేలాడింది వక్రంగా, వెన్నెలేమీ కురవకుండా. తర్వాత కొండల వెనక దాక్కోవడానికి పోయింది.
దూరాన్నుంచి చీకటి ముసుగులో ఎడ్ల రంకెలు వినిపిస్తున్నాయి.
“ఆ పశువులు ఎప్పుడూ నిద్రపోవు.” డమియాన సిస్నెరోస్ అంది. “అవి ఎప్పుడూ నిద్రపోవు. అవి సైతాను లాగా ఎప్పుడూ ఏ ఆత్మను తన్నుకు పోదామా అని చూస్తూ ఉంటాయి.”
ఆమె అటు గోడవేపుకు తిరిగి పడుకుంది. అప్పుడే ఆమెకి ఎక్కడో తట్టిన చప్పుడు వినపడింది.
ఆమె ఊపిరి బిగబట్టి కళ్ళు తెరిచింది. మళ్ళీ మూడు సార్లు చిన్నగా తట్టిన శబ్దం వినపడింది ఎవరో గోడమీద కొడుతున్నట్టు. ఆమె పక్కనే కాదు, ఎక్కడో దూరంగా, కానీ అదే గోడ మీద.
“దేవుడే కాపాడాలి. అది శాన్ పస్కూల్ అయి ఉండాలి. మూడు సార్లు తట్టి, తనను నమ్మినవాళ్ళల్లో ఎవరికో సమయమాసన్నమయిందని హెచ్చరిస్తున్నాడు.”
కీళ్లనొప్పులవల్ల చాలా రోజులనుంచీ నొవేనా చేయలేదు కనక ఆమె ఆందోళన చెందలేదు. కానీ భయపడింది. భయాన్ని మించి కుతూహలం.
ఆమె మంచం మీనుండి సద్దు చేయకుండా లేచి కిటికీ నుంచి బయటికి తొంగి చూసింది.
పొలాలు నల్లగా ఉన్నాయి. ఆమెకి ఆ చుట్టుపక్కల అంతా క్షుణ్ణంగా తెలుసు కనక చీకట్లో కూడా పేద్రో పారమొ భారీ శరీరం మార్గరిటా కిటికీలోకి దూకడం కనపడింది.
“ఆ డాన్ పేద్రో..” డమియానా అనుకుంది “అమ్మాయిల వెంట పడడం మానడు గదా! నాకర్థం కానిదేమిటంటే అప్పటికేది తోస్తే అది చేయాలని ఎందుకనుకుంటాడన్నది. నాకు ముందే చెప్పి ఉంటే అయ్యగారికి ఆరాత్రికి తను కావాలని మార్గరిటాకి చెప్పేదాన్ని. అతనికి మంచం వదిలి వెళ్ళాల్సిన శ్రమ తప్పేది.”
ఎడ్లు ఇంకా రంకెలు వేస్తుండగానే ఆమె కిటికీ మూసింది. తన మంచంలో పడుకుని దుప్పటి చెవులదాకా కప్పుకుంది. కుర్ర మార్గరిటానిప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడో ఆలోచిస్తూ పడుకుని ఉండి పోయింది.
కాసేపటికి రాత్రి వేడెక్కినట్టనిపించడంతో లేచి నైట్ గౌనును విప్పేయక తప్పింది కాదు.
“డమియానా!” ఆమెకు వినిపించింది.
ఆమె చిన్నపిల్ల అయిపోయింది.
“తలుపు తెరువు డమియానా!”
ఆమె గుండె ఉరఃపంజరంలో చిన్న కప్పపిల్ల లాగా ఎగిరెగిరి పడుతూంది.
“ఎందుకు అయ్యా?”
“తెరువు డమియానా!”
“బాగా నిద్రలో ఉన్నానయ్యా!”
తర్వాత ఆమెకు డాన్ పేద్రో బయట కారిడార్లో అటూ ఇటూ నడుస్తున్న చప్పుడు వినపడింది. బూట్ల మడాలు టక్కు టక్కుమని గట్టిగా శబ్దం చేస్తున్నాయి, అతని కోపాన్ని తెలియజేస్తూ.
మరుసటి రాత్రి అతనికి మళ్ళీ కోపం రాకుండా ఉండేందుకు ఆమె తలుపు వారగా తెరిచి ఉంచింది. అతని పని సులభమయ్యేందుకు నగ్నంగానే పడుకుంది. కానీ పేద్రో పారమొ మళ్ళీ రాలేదు.
ఇప్పుడు ఆమె మెదియా లూనాలో పనివాళ్లందరికీ మేస్త్రీ. ముసలిదయి నలుగురి గౌరవాన్నీ సంపాదించుకుంది. ఈ రాత్రి ఆమె ఇంకా ఆ రాత్రి గురించే ఆలోచిస్తూ ఉంది – పేద్రో పారమొ “తలుపు తెరువు డమియానా!” అంటూ పిలిచిన రాత్రి.
ఈ గడియలో కుర్ర మార్గరిటా ఎంత సంతోషంగా ఉండి ఉంటుందో అనుకుంటూ నిద్రపోయింది.
తర్వాత ఆమెకు ఎవరో తలుపు తట్టడం వినిపించింది. కానీ ఈసారి పెద్ద తలుపు. ఎవరో తుపాకీ మడమతో దాన్ని పగలకొట్టాలని చూస్తున్నట్టు.
రెండో సారి ఆమె కిటికీ తలుపు తెరిచి బయటికి రాత్రిలోకి చూసింది. పురుగులు దొర్లే నేలపై వాన పడ్డాక ఆవిర్లొస్తున్నట్టనిపిస్తున్నా ఆమెకు ఏమీ కనపడలేదు. ఆమెకు ఏదో పైకి తేలి వస్తున్నట్టనిపించింది – చాలామంది మగవాళ్ళ వేడి. ఆమెకు కప్పల బెకబెకలూ, కీచురాళ్ళ చప్పుడూ వినిపించాయి. వానాకాలంలో ఒక సందడి లేని రాత్రి. మళ్ళీ తలుపు బాదుతున్న చప్పుడు వినిపించింది.
ఒక దీపం వెలుతురు గుంపులోని మనుషుల మొహాల మీద పడింది. అంతలోనే అది ఆరిపోయింది.
“ఇవన్నీ నాకవసరం లేని విషయాలు,” అని డమియానా సిస్నెరోస్ కిటికీ మూసుకుంది.

“నిన్ను చితకతన్నారని విన్నాను డమసియో! అట్లా ఎట్లా జరగనిచ్చావు?”
“నీకు తప్పుడు వార్త అందినట్టుంది అయ్యా! నాకేమీ కాలేదు. నామనుషులెవరూ చచ్చిపోలేదు. నాకింద నా వాళ్ళే ఏడువందలమంది ఉన్నారు. ఆపైన వాళ్ళ వెంట వచ్చిన వాళ్ళు ఇంకొంత మంది. ఏమయిందంటే ఆపాతవాళ్లకు పనేమీ లేక విసుగుపుట్టి బోడిగుళ్ళ వాళ్ళ మీద కాల్పులు మొదలుపెట్టారు. చూడబోతే వాళ్లది పెద్ద సైన్యం. తెలుసుగా, ఆ విజీస్తాలు!”
“ఎక్కడినుంచి వచ్చారు వాళ్ళు?”
“ఉత్తరాన్నుంచి. వచ్చేదారంతా వాళ్ళకు కనపడినదంతా చదును చేసుకుంటూ వస్తున్నారు. మనకి తెలిసినంతవరకూ ఇక్కడిదాకా పంటలన్నీ దోచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు బాగా శక్తివంతులు. అది మాత్రం కాదనలేం.”
“మరి వాళ్లతోటే కలవకపోయావా? మనం గెలిచే పక్షం వైపే ఉండాలని నీకు ముందే చెప్పా గదా!”
“ఆపని ముందే చేశాను.”
“మరి ఇక్కడికెందుకు వచ్చావు?”
“మాకు డబ్బు కావాలయ్యా! మాంసం తప్ప మరేమీ తినక విసుగు పుట్టింది. ఇక అది రుచించడం లేదు. మాకు అరువు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. నువు మాకు కిరాణా సరుకులు కొనిపెడతావన్న ఆశతో వచ్చాం. మేం ఎవరినుంచో దొంగిలించదల్చుకోలేదు. ఇంకాస్త దూరం వెళ్ళినట్టయితే అక్కడివాళ్ళనుంచి కాస్త ‘అప్పు‘ తీసుకునే వాళ్ళమేకానీ ఈ చుట్టుపక్కల అంతా చుట్టాలేనయిపోతిరి. వాళ్ళను దోచుకోవడం బాగోదు. మాకు కావలసింది తిండి కొనడానికి డబ్బు, కాసినయినా మిరపకాయలూ, టోర్టియాలూ కొనుక్కోవడానికి.”
“అయితే నాదగ్గరే నీ డిమాండ్లు మొదలుపెట్టావన్న మాట!”
“ఛ! లేదయ్యా. నేను ఈ కుర్రాళ్ల కోసం అడుగుతున్నా. నాకు మాత్రం ఏమీ అక్కర్లేదు.”
“నీ మనుషులకేం కావాలో నువు చూసుకుంటున్నావంటే అది నీ మంచితనమే కానీ నీకేం కావాలో అది ఇంకెవరినన్నా అడుక్కో. నేను నీకు ముందే డబ్బు ఇచ్చాను. నీకిచ్చిన దాంతో సంతోషపడు. నీకేం సలహా ఇవ్వాలని కాదు కానీ, కోంట్లాకి వెళ్ళాలన్న ఆలోచన రాలేదా? మీరు తిరుగుబాటు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? మూర్ఖులే అడుక్కు తినేది. ఇంటికిపోయి కోళ్లకి మేత వేసుకోకపోయావా మీ ఆవిడతో కలిసి? వెళ్ళి ఏదో పట్టణం దోచుకోండి. నువు నీ తలమీదికి తెచ్చుకుంటున్నావు, మిగతావాళ్ళు వాళ్ళ పని చేయలేరా? కోంట్లా అంతా ధనవంతులే. వాళ్ళు దాచుకున్నదాంట్లో కొంత తీసుకో. లేకపొతే నువ్వేమన్నా వాళ్ళకి పాలిచ్చే దాదివనుకుంటున్నావా వాళ్ల అవసరాలు కనిపెట్టుకోటానికి? లేదు డమసియో. నువ్వేం సరదాకి తిరగడం లేదని తెలిసేట్టు చేయి. కాస్త బెదిరించు, సెంటావోలు అవే వస్తాయి.”
“నువు చెప్పినట్టే చేస్తానయ్యా. నువు మంచి సలహాలిస్తావనే నా నమ్మకం.”
“సరే, అది చేసి చూపించు.”
ఆ మనుషులు స్వారీ చేస్తూ వెళ్ళిపోతుంటే పేద్రో పారమొ చూస్తూ ఉండిపోయాడు. చీకట్లో కనపడకుండా గుర్రాలు దౌడు తీయడం వినిపిస్తూంది. చెమటా, దుమ్మూ; వణుకుతున్న నేలా. మిణుగురుల కాంతి మళ్ళీ మెరుస్తుంటే అందరూ వెళ్ళిపోయినట్టు అర్థమయింది. అతడొక్కడే మిగిలిపోయాడు, లోపల పుచ్చుతూన్న దృఢమైన వృక్షంలా.
అతనికి సుజానా శాన్ హువాన్ తలపుకొచ్చింది. తనతో అంతకు ముందే పడుకున్న యువతి కూడా. చిన్నగా, భయంగా వణుకుతూన్న దేహమూ, ఛాతీలోంచి ఎగిరి బయటపడుతుందేమో అన్నట్టు దడదడమని కొట్టుకుంటున్న గుండే. “చిన్నారి చిలకా,” అన్నాడు ఆమెతో. ఆమెను వాటేసుకున్నాడు ఆమెను సుజానా సాన్ హువాన్ గా మార్చడానికి ప్రయత్నిస్తూ. “ఈ లోకానికి చెందని స్త్రీ!”

పెద్రో పారమొ-10

pedro1-1

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని. తన చేతుల మధ్య నాకోసం ఏర్పరచిన ప్రత్యేకమైన చోటులో.

ఆమె నెమ్మదిగా ఊపిరి తీసే లయ నాకు తెలుస్తూందనుకుంటాను. ఆ అదురుపాటూ, నిట్టూర్పులూ నన్ను నిద్రపుచ్చుతూ.. ఆమె చావు బాధ నాకు తెలుస్తుందనుకుంటాను… కానీ అది నిజం కాదు.

ఆ రోజుల్ని తల్చుకుని నా వొంటరితనాన్ని మర్చిపోవాలనుకుంటూ నేనిక్కడ వెల్లికిలా పడుకుని ఉన్నాను. నేనిక్కడ కొద్ది కాలమే కాదు కదా ఉండేది! నేను మా అమ్మ పక్కలో కూడా కాదు ఉంది, చనిపోయినవాళ్లను ఖననం చేసే నల్లపెట్టె లాంటి పెట్టెలో. నేను చనిపోయాను కనుక.

నేనెక్కడున్నదీ తెలుస్తూంది. కానీ నేనింకా ఆలోచించగలను.

పండుతున్న నిమ్మకాయలని తలుచుకున్నాను. నిర్లక్ష్యానికి గురయి ఎండిపోకముందే ఫెర్న్ మొక్కల కాడల్ని విరగ్గొట్టే ఫిబ్రవరి గాలి తలపుకు వచ్చింది. వరండాని తమ పరిమళంతో నింపిన పండు నిమ్మకాయలు.

ఫిబ్రవరి ఉదయాల్లో కొండల మీద నుంఛి గాలి కిందికి వీస్తుంది. లోయలోకి తోసే వేడి గాలి కోసం ఎదురుచూస్తూ మబ్బులు అక్కడ గుమికూడాయి. ఆకాశం నీలంగా ఉంది. నేల మీదుగా ఊడ్చుకుంటూ దుమ్ము రేపుతూ నారింజ కొమ్మల్ని విసిరి కొడుతూన్న సుడిగాలులపై కాంతి ఆటలాడుతూంది.

పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. గాలికి కొట్టుకు వచ్చిన ఆకులను పొడిచి మళ్లీ కిచకిచమంటున్నాయి. ముళ్ళకంపల్లో ఈకలను జార విడుచుకుని సీతాకోకచిలకల్ని తరిమి మళ్ళీ కిచకిచమంటూన్నాయి. అది ఆ రుతువు.

గాలితో, పిచ్చుకలతో, నీలి కాంతితో నిండిన ఫిబ్రవరి. నాకు గుర్తుంది. అప్పుడే మా అమ్మ చనిపోయింది.

నేను ఏడ్చి ఉండాలి. నేను నెత్తురోడేట్టు నాచేతులు పిండుకుని ఉండాలి. అట్లాగే చేయాలని నువ్వనుకుని ఉంటావు. కానీ నిజానికి అది ఆహ్లాదకరమైన ఉదయం కాదా? తెరిచిన తలుపులోంచి పిల్లగాలి వీస్తుంది ఐవీ నులి తీగలను విదిలిస్తూ. నా కాళ్ల మధ్య వెంట్రుకలు పెరగడం మొదలెట్టాయి, నా రొమ్ముల్ని తాకిన నా చేతులు వేడిగా వణికాయి. పిచ్చుకలు అడుకుంటున్నాయి. కొండవాలున గోధుమ పంట గాలికి ఊగుతూంది. మల్లెల మధ్య ఆడుకునే గాలిని ఆమె ఎప్పటికీ చూడలేదనీ, ఉజ్వలమైన సూర్యకాంతిని చూడకుండా ఆమె కళ్ళు మూసుకున్నాయనీ నాకు దిగులు. కానీ నేనెందుకు ఏడవడం?

నీకు గుర్తుందా జస్టినా? చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ల వంతు వచ్చేవరకూ కూచోవడానికి నడవాలో వరసగా కుర్చీలు వేశావు. అవన్నీ ఖాళీగా ఉన్నాయి. కొవ్వొత్తుల మధ్య మా అమ్మ వొంటరిగా పడుకుని ఉంది. పాలిపోయిన మొహం, మృత్యు శీతలానికి గడ్డకట్టిన ఊదా పెదవుల మధ్యనుంచి కనీకనపడకుండా తెల్లని దంతాలు. కనురెప్పల వెంట్రుకలు నిశ్చలంగా ఉన్నాయి. ఆమె గుండె నిశ్చలంగా ఉంది. నువ్వూ నేనూ ఆమె వినని ప్రార్థనలు ఎడతెగకుండా చేస్తున్నాము. ఆ రాత్రి గాలి రొదలో అవి నీకూ నాకూ కూడా వినపడలేదు. అమ్మ నల్లటి డ్రస్ ను నువు ఇస్త్రీ చేశావు. రొమ్ముల మీద అడ్డంగా ఉంచినప్పుడు తన చేతులు వయసులో ఉన్నట్టుగా కనిపించాలని కాలర్ కీ, చేతుల పట్టెలకీ బాగా గంజి పెట్టావు. అవే రొమ్ములు, నాకు పాలిచ్చినవీ, నా ఊయలయినవీ, నన్ను లాలిస్తూ నిద్ర పుచ్చినప్పడు కొట్టుకులాడినవీ.

ఆమెను చూడటానికి ఎవరూ రాలేదు. నువు వాకిలి దాకా వెళ్ళావు.

“నువు వెళ్లు,” నేను చెప్పాను. “నాకు మనుషులు పొగమంచులోంచి కనిపిస్తున్నారు. వాళ్ళను పొమ్మని చెప్పు. వాళ్ళు గ్రెగోరియన్ ప్రార్థనల కోసం డబ్బుల కోసం వచ్చారా? ఆమె డబ్బులేమీ వదిలిపెట్టి పోలేదు. ఆ సంగతి వాళ్ళకు చెప్పు జస్టినా? వాళ్ళు ఆ ప్రార్థనలు చేయకపోతే అమ్మ పాప విమోచన లోకం లోనే ఉండి పోతుందా? తీర్పు చెప్పటానికి వాళ్ళెవరు జస్టినా? నాకు పిచ్చనుకుంటున్నావా? అనుకో..”

మనం అమ్మను ఖననం చేయడానికి వెళ్ళినదాకా నువు వేసిన కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. తమకు తెలియని శవాన్ని మోస్తూ చెమటలు కక్కుతూ మన బాధ తెలియని కూలి వాళ్ళు వెంట వచ్చారు. తడి ఇసుకను సమాధిలోకి ఎత్తివేసి , తమ పనికి తగిన వోపికతో శవపేటికను నెమ్మదిగా లోపలికి దించారు. అంత శ్రమ తరవాత పిల్లగాలి సేదతీరుస్తూంది. వాళ్ల కళ్ళు ఉదాసీనంగా, ఏమీ పట్టనట్టు ఉన్నాయి. “ఇంత అవుతుంది,” అని చెప్పారు. బజార్లో ఏదో కొంటున్నట్టు నువు వాళ్ళకు డబ్బు ఇచ్చావు. కన్నీటితో తడిసి మెలికలు తిప్పీ తిప్పీ ఉన్న జేబురుమాలు ఒక కొస ఊడదీసి అందులోచి తీసి.

వాళ్ళు వెళ్ళిపోయాక, అమ్మ తలవైపు మోకాళ్ళ మీద కూచుని నేలను ముద్దాడావు. “పద జస్టినా. ఆమె ఇక్కడ లేదు. ఇక్కడ శవం తప్ప మరేదీ లేదు,” అని ఉండక పోతే నువు ఆమె వైపుకు తవ్వుతూ పోయేదానివే.

 

నువ్వేనా మాట్లాడుతూంది డొరోతియా?”

“నేనా? కాసేపు నిద్రపోయాను. ఇంకా భయపడుతున్నావా?”

“ఎవరో మాట్లాడడం వినిపించింది. ఆడ గొంతు. నువ్వేననుకున్నాను.”

“ఆడ గొంతా? నేననుకున్నావా? తనలోతాను మాట్లాడుకునే ఆమె అయి ఉంటుంది. ఆ పెద్ద సమాధిలో ఉండే ఆమె. డోన సుసానీత. మనకు దగ్గరలోనే పూడ్చారు. చెమ్మ తగిలినట్టుంది, నిద్రలో కదులుతూంది.”

“ఎవరామె?”

“పేద్రో పారమొ చివరి భార్య. ఆమె పిచ్చిదని కొందరంటారు. కాదని కొందరంటారు. నిజమేమిటంటే ఆమె బతికి ఉన్నప్పుడు కూడా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేది.”

“చనిపోయి చాలారోజులయి ఉండాలి.”

“అవును. చాలా రోజులయింది. ఏమిటి, ఆమె అంటూన్నదేమిటి?”

“ఏదో వాళ్ళ అమ్మ గురించి.”

“వాళ్ల అమ్మ లేదే!”

“ఏమో, వాళ్ల అమ్మ గురించే మాట్లాడుతూంది.”

“హుఁ. .. ఆమె వచ్చినప్పుడు మాత్రం తనతో వాళ్ల అమ్మ లేదు. ఆగాగు. గుర్తొచ్చింది. వాళ్ల అమ్మ ఇక్కడే పుట్టింది, పెరిగేప్పుడు మాయమయిపోయారు. అవును. అంతే. వాళ్ల అమ్మ క్షయ వ్యాధితో చనిపోయింది. ఆమె వో వింత మనిషి. ఎప్పుడూ జబ్బుతో ఉండేది. ఎవరింటికీ వెళ్ళేది కాదు.”

“అదే ఆమె చెపుతుంది. వాళ్ల అమ్మ చనిపోయినప్పుడు చూడటానికి ఎవరూ రాలేదని.”

“ఏమిటి ఆమె ఉద్దేశం? ఆమె గడపలోకి ఎవరూఅడుగు పెట్టలేదంటే ఆశ్చర్యం లేదు. ఆమె జబ్బు తమకెక్కడ అంటుకుంటుందో అని భయం. ఆ ఇండియన్ ఆమెకేమన్నా తెలుసేమో!”

“దాని గురించీ మాట్లాడుతుందామె.”

“ఈసారి మాటలు వినిపించినప్పుడు నాకు చెప్పు. ఆమె ఏమి చెపుతుందో నాకూ వినాలని ఉంది.”

“వింటున్నావా? ఏదో చెప్పబోతున్నట్టుంది. గుసగుసలు వినిపిస్తున్నాయి.”

“ఉహు, అది ఆమె కాదు. అది ఇంకా దూరంగా, వేరే దిక్కులో. ఆ గొంతు మగది కూడా. చాలా రోజులుగా శవాలుగా ఉన్న వాళ్ళేం చేస్తారంటే కాస్త చెమ్మ చేరేసరికి కదలడం మొదలెడతారు. లేస్తారు.”

“స్వర్గం ఉదారమైనది. దేవుడు నాతో ఉన్నాడా రాత్రి. లేకపోతే ఏమయి ఉండేదో ఎవరికి తెలుసు? ఎందుకంటే నేనొచ్చేసరికే రాత్రయి పోయింది..”

“నీకిప్పుడు బాగా వినిపిస్తుందా?”

“ఊఁ”

“..నా వొంటి నిండా నెత్తురు. లేవడానికి ప్రయత్నించినపుడు నా చేతులు రాళ్ల మధ్య నెత్తుటి చిదపల్లో జారిపోతున్నాయి. అది నా నెత్తురే. బకెట్ల కొద్దీ నెత్తురు. కానీ నేను చనిపోలేదు. ఆ సంగతి నాకు తెలుసు. పేద్రో నన్ను చంపాలనుకోలేదన్నది నాకు తెలుసు. కాస్త భయపెట్టాలనుకున్నాడు. రెండేళ్ల క్రితం ఆ రోజు నేను విల్మాయో లో ఉన్నానేమో కనుక్కుందామనుకున్నాడు. శాన్ క్రిస్తోబాల్ రోజు. పెళ్ళి దగ్గర. ఏ పెళ్ళి? ఏ శాన్ క్రిస్తోబాల్? నా నెత్తుటిలో నేను జారిపడుతూ అతన్ని అదే అడిగాను: ‘ఏ పెళ్ళి డాన్ పేద్రో? లేదు, లేదు డాన్ పేద్రో! నేనక్కడ లేను. ఆ చుట్టుపక్కల ఉన్నానేమో, అదీ కాకతాళీయంగా…’ అతను నిజంగా నన్ను చంపాలనుకోలేదు. నన్ను కుంటివాడిగా వదిలేశాడు – నీకు కనిపిస్తూనే ఉందిగా – బాధపడవలసినదేమిటంటే నా చేయి కూడా పనికిరాకుండా పోయింది. కానీ అతను నన్ను చంపలేదు. అప్పటి నుంచి అంతా నాకు వెర్రి చూపు పడిందంటున్నారు. ఆ భయానికి. కానీ అది నన్ను మగాణ్ణి చేసింది. స్వర్గం ఉదారమయింది. ఆ విషయంలో అనుమానపడకు.”

“ఎవరతను?”

“నాకేం తెలుసు? డజన్ల మందిలో ఒకడు. తన తండ్రిని ఎవరో చంపాక పేద్రో పారమొ ఎంతో మందిని ఊచకోత కోశాడు. దాదాపుగా ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్లనందరినీ చంపేశాడు. డాన్ లూకాస్ కన్యాదానం చేయవలసి ఉంది. నిజానికి అతను ప్రమాదవశాత్తూ చనిపోయాడు. అసలు ఆ పెళ్ళికొడుకు మీద ఎవరికో పగ ఉంది. డాన్ లూకాస్ కి తగిలిన బులెట్ ఎవరు కాల్చిందో తెలియలేదు కనక పేద్రో పారమొ అందరినీ తుడిచిపెట్టేశాడు. అది విల్మయో కొండమీద జరిగింది. అప్పుడేవో ఇళ్ళుండేవి గానీ ఇప్పుడు వాటి ఆనవాలు కూడా దొరకదు… విను, ఇప్పుడు ఆమెలా ఉంది మాట్లాడేది. నీవి పడుచు చెవులు. నువు విను. విని నాకు చెప్పు ఏమంటుందో.”

“నాకేం అర్థం కావడం లేదు. ఆమె మాట్లాడుతున్నట్టు లేదు, మూలుగుతూంది.”

“ఏమని మూలుగుతుంది?”

“నాకేం తెలుసు?”

” దేనిగురించో అయి ఉంటుంది. సరిగా విను. ఊరికే మూలగడానికే ఎవరూ మూలగరు.”

“ఆమె మూలుగుతూ ఉంది. ఊరికే మూలుగుతుంది. పేద్రో పారమొ ఏమన్నా కష్టపెట్టాడేమో ఆమెని!”

“ఆ మాట నమ్మకు. అతడామెని ప్రేమించాడు. ఆమెని ప్రేమించినట్టు అతనింకెవరినీ ప్రేమించలేదని నేను చెప్పగలను. ఆమెను అతని దగ్గరికి తీసుకు వచ్చేసరికే ఆమె బాధలో ఉంది – పిచ్చేనేమో! ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఆమె పోయాక రోజుల తరబడి కుర్చీలో కూలబడి ఆమెను స్మశానానికి తీసుకువెళ్ళిన దారి వైపే చూస్తూ ఉండే వాడు. దేనిపట్లా ఆసక్తి చూపేవాడు కాదు. పొలాలు బీడుపెట్టాడు. పొలం పనిముట్లన్నీ నాశనం చేయించాడు. అతను ఇట్లా చేస్తున్నది డస్సిపోవడం వల్ల అని కొంతమందీ, నిస్పృహ వల్ల అని కొంతమందీ అన్నారు. పనివాళ్లనంతా తరిమేసి ఆ దారి వంకే చూస్తూ కూచునేవాడన్నది మాత్రం నిజం.

“ఆ రోజునుంచీ పొలాలను పట్టించుకున్న నాధుడు లేడు. వదిలేశాడు. ఆ నేలని అట్లా చూస్తుంటే బాధగా ఉండేది. అట్లా వదిలేయగానే మహమ్మారి చుట్టుముట్టింది. చుట్టుపక్కల మైళ్ళకొద్దీ జనాలకి కష్టకాలం దాపురించింది. మగవాళ్ళు అన్నీ సర్దుకుని పనుల కోసం బతుకుతెరువు వెతుక్కుంటూ పోయారు. ఆరోజుల్లో కోమలాలో సెలవు తీసుకుంటూ చెప్పే మాటలు తప్ప మరేవీ వినిపించేవి కావన్న సంగతి నాకు గుర్తుంది. ఒక్కొక్కరినీ వాళ్ల దారివెంట పంపుతున్నప్పుడల్లా ఒక పండగలాగా ఉండేది. వాళ్లంతా మళ్ళీ తిరిగి వద్దామనే ఉద్దేశంతోటే పోయారు. వాళ్ళ సామాన్లమీదా, కుటుంబాలమీదా ఒక కన్నేసి ఉంచమని చెప్పేవారు. తర్వాత కొంతమంది సామాన్లు వదిలేసి కుటుంబాలను మాత్రం పిలిపించుకున్నారు. ఆపైన మా గురించీ, ఊరి గురించీ, వాళ్ల సామాన్ల గురించి కూడా మర్చిపోయారు. వెళ్లడానికి ఏ చోటూ లేక నేను ఇక్కడే ఉండిపోయాను. కొంతమంది పేద్రో పారమొ ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. తను పోయాక తన పొలమూ, ఆస్తులూ వాళ్లకు వదిలేస్తానని మాట ఇచ్చాడు. ఆ ఆశతోటి వాళ్ళు బతుకుతున్నారు. ఏళ్ళు గడిచాయి కానీ అతను బతికే ఉన్నాడు, మెదియా లూనా పొలాల మీదకి చూస్తూ ఉన్న దిష్టిబొమ్మ లాగా.

“అతను చనిపోబోయే కొదిరోజుల ముందే క్రిస్టెరోస్ యుద్ధం వచ్చింది. అతని దగ్గర ఉన్న కొద్ది మంది పనివాళ్లూ సైన్యంలో చేరారు. అప్పుడే నేనూ నిజంగా ఆకలితో నకనకలాడటం మొదలయింది. ఏదీ మునుపటిలా ఇక ఉండలేదు.

“అంతా డాన్ పేద్రో చేసుకున్నదే, తన ఆత్మక్షోభ వలన. కేవలం తన భార్య సుసానీత చనిపోవడం వల్ల. ఇప్పుడు చెప్పు అతను ఆమేని ప్రేమించాడో లేదో?”

 

ఫుల్గోర్ సెడనో చెప్పాడతనికి.

“దొరా! ఊళ్ళోకి తిరిగి ఎవరొచ్చారో తెలుసా?”

“ఎవరు?”

“బార్ట్లోం శాన్ హువాన్!”

“ఎందుకు?”

“నాకూ అదే అనిపించింది. తిరిగి ఎందుకొచ్చాడో?”

“కనుక్కోలేదా?”

“లేదు, ముందు మీకు చెప్పాలనుకున్నాను. ఇంటి గురించేమీ వాకబు చేయలేదు. శరాసరి మీ పాత ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లేదో మీరతనికి అద్దెకిచ్చినట్టు గుర్రం దిగి సూట్ కేసులు లోపలికి మోసుకుపోయాడు. ముందువెనకలాడుతున్నట్టు కనబడ లేదు. ”

“దాని గురించి నువ్వేం చేస్తునావు ఫుల్గోర్? ఏమవుతుందో ఎందుకు కనుక్కోలేదు? అందుకు కాదా నీకు జీతమిస్తుంది?”

“ఈ విషయం తెలిసేసరికి నాకు బుర్ర తిరిగిపోయింది. కనుక్కోవాలంటే రేపు ఎలాగోలా కనుక్కుంటాను.”

“రేపటి సంగతి మర్చిపో! ఆ శాన్ హువాన్ సంగతి నేను చూస్తాను. ఇద్దరూ వచ్చారా?”

“అవును, అతనూ, అతని భార్యా. నీకెట్లా తెలుసు?”

“అతని కూతురు కాదా?”

“ఆమెతో ఉన్న తీరును చూస్తే భార్యలాగే ఉంది.”

“ఇంటికి పోయి పడుకో ఫుల్గోర్!”

“తమ దయ!”

 

నువు తిరిగివస్తావని ముప్పయ్యేళ్ళు ఎదురుచూశాను సుజానా. నాకన్నీ కావాలనుకున్నాను. ఏ ఒక్క భాగమో కాదు, పొందడానికి ఏదయితే ఉందో అదంతా. ఇక కోరుకోవడానికి ఏమీ మిగలనట్టుగా. నాకు తన అవసరం ఉందనీ, వచ్చి మనతో ఉండమనీ మీ నాన్నతో ఎన్నోసార్లు చెప్పాను. మాయ కూడా చేశాను.

నా పనులు చూస్తూ ఉండమన్నాను. అదికాకపోతే ఇంకా ఏదయినా, నిన్ను మళ్ళీ చూసేందుకు వీలుగా. అంతా విని ఏమన్నాడు? “బదుల్లేదు.” నేను పంపిన రాయబారి ఎప్పుడూ చెప్పే మాటే అది. “డాన్ బార్ట్లోం మీ ఉత్తరాలన్నీ చేతికి ఇవ్వగానే చింపేస్తాడు.” కానీ ఆ కుర్రాడి ద్వారా నీకు పెళ్ళయిన సంగతి తెలుసుకున్నాను. కొద్దికాలంలోనే నువు విధవవయ్యావనీ, తిరిగి మీ నాన్నతో ఉండటానికి వెళ్ళిపోయావనీ తెలిసింది.

తర్వాత నిశ్శబ్దం.

ఆ రాయబారి వెళ్ళేవాడు, వచ్చేవాడు. ప్రతిసారీ అదే చెప్పేవాడు ” నాకు వాళ్ళెక్కడా కనపడలేదు డాన్ పేద్రో! మస్కోట వదిలిపెట్టి పోయారనుకుంటున్నారంతా. కొంతమంది ఒకవేపు వెళ్ళారంటే, ఇంకొంతమంది వేరేవైపు వెళ్లారంటున్నారు.”

వాడికి చెప్పాను “ఖర్చులకు వెనుకాడకు. వాళ్ళెక్కడున్నారో కనుక్కో. నేల ఏమీ మింగేయలేదుగా వాళ్ళను!”

ఒక రోజు వచ్చి చెప్పాడు.

“డాన్ బార్ట్లోం శాన్ హువాన్ ఎక్కడ దాక్కునే చోట్లున్నాయో ఆ కొండలన్నీ వెదికాను. చివరికి ఎక్కడో చాలా దూరంగా ఆ ఆండ్రోమెదా గనుల దగ్గర ఒక చెక్క ఇంట్లో దాక్కుని ఉన్నట్టు కనిపెట్టాను.”

వింతగాలులు వీస్తున్నాయప్పుడు. సాయుధ తిరుగుబాటు వార్తలు వినవస్తున్నాయి. పుకార్లు వింటున్నాము. నీ తండ్రినే వెనక్కి ఇక్కడికి తరిమి కొట్టే గాలులవి. తనకోసం కాదనీ, నీ క్షేమంకోసమేననీ ఉత్తరం రాశాడు. నిన్ను తిరిగి నాగరికతలోకి తీసుకు రావాలనుకున్నాడు.

స్వర్గం విడివడి దారి ఇస్తుందనిపించింది. పరుగెత్తుకువచ్చి నిన్ను కలవాలనుకున్నాను. నిన్ను సంతోషంలో ముంచెత్తాలని. ఆ ఆనందం పట్టలేక ఏడ్చేయాలని. ఏడ్చాను సుజానా, ఎట్టకేలకి నువు తిరిగి వచ్చావని తెలిసి.

 

కొన్ని ఊళ్ళకు దురదృష్టపు వాసన ఉంటుంది. అన్నిటిలా పాతగా ఉండే ఆ నిలవ ఉండి మగ్గిపోయిన పలచటి గాలిని ఒక్కసారి పీల్చినా నీకు తెలిసిపోతుంది. అలాంటి ఊళ్ళలో ఇది ఒకటి సుజానా!

“మేము ఇంతకుముందు ఉన్నచోట కనీసం పుట్టడం చూసి ఆనందించేవాళ్లం – ఆ మబ్బులూ, పిట్టలూ, నాచూ. నీకు గుర్తుందా? ఇక్కడ నేలనుంచి పైకి ఉబుకుతున్నట్టుండే ఆ పులిసిపోయిన పసుప్పచ్చ వాసన తప్ప ఇంకేమీ లేదు. ఈ ఊరు శాపగ్రస్త. దురదృష్టంలో మునిగి ఊపిరాడనిదీ ఊరు.

“మనం తిరిగి రావాలన్నది అతని కోరిక. మనకీ ఇల్లు ఇచ్చాడు. మనకు కావలసిందంతా సమకూర్చాడు. కానీ అతనికి మనమేం కృతజ్ఞులంగా ఉండక్కర్లేదు. ఇది మనకు వరమేమీ కాదు. మనకు ఇక్కడ మోక్షమేమీ దొరకదు. నాకు తెలుస్తూంది.

“పేద్రో పారమొకేం కావాలో నీకు తెలుసా? ఇదంతా మనకు ఊరికే ఇస్తున్నాడని నేనేం అనుకోవడం లేదు. ఈ బాకీ తీర్చాలి కనక అతనికోసం చెమటోడ్చి పని చేయడానికి సిద్ధమే. ఆండ్రోమెడాఅ గనుల గురించి వివరాలన్నీ ఇచ్చి దానిమీద సరిగా పనిచేస్తే లాభం కళ్ల చూడవచ్చని వొప్పించాను. అతనేమన్నాడో తెలుసా? ‘నీ గని మీద నాకేం ఆసక్తి లేదు బార్ట్లోం శాన్ హువాన్! నీనుంచి నాకు కావలసింది ఒక్క నీ కూతురే! నువు సాధించినవాటిలో అత్యున్నతమైనది ఆమే!’

“అతనికి నువ్వంటే ప్రేమ సుజానా! మీరిద్దరూ చిన్నప్పుడు ఆడుకునేవారని చెప్పాడు. అతనికి నువ్వు తెలుసట. వయసులో ఉన్నప్పుడు మీరు నదిలో కలిసి ఈతలు కొట్టేవారట. నాకు తెలియదా సంగతి. నాకు తెలిస్తే అప్పుడే నిన్ను చితకబాదే వాడిని.”

“తప్పకుండా తన్ని ఉండే వాడివే!”

“సరిగానే విన్నానా? ‘తప్పకుండా తన్ని ఉండే వాడివే,’ అనా?”

“సరిగ్గానే విన్నావు.”

“అయితే వాడి పక్కలో పడుకోటానికి సిద్ధమేననా!”

“అవును బార్ట్లోం.”

“వాడికి పెళ్ళయిందనీ, లెక్కలేనంత మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయనీ తెలియదా?”

“తెలుసు బార్ట్లోం.”

“ముందు ఆ బార్ట్లోం అనడం ఆపు. నేను నీ కన్న తండ్రిని.”

బార్ట్లోం శాన్ హువాన్ ఒక చనిపోయిన గని పనివాడు. సుజానా శన్ హువాన్ ఆండ్రొమెదా గనుల్లో చనిపోయిన ఒక గని పనివాడి కూతురు. అతనికి స్పష్టంగా కనిపించింది. “చావడానికి అక్కడికి వెళ్ళాలి,” అనుకున్నాడు. తర్వాత చెప్పాడు-

“నువ్వు విధవవే అయినా ఇంకా నీ భర్తతోటే బతుకుతున్నావని చెప్పానతనికి. కనీసం అట్లా ప్రవర్తిస్తున్నావని. అతన్ని ఎట్లా అన్నా నిరుత్సాహపర్చాలని చూశాను కానీ నేను అట్లా మాట్లాడినప్పుడల్లా అతని చూపు పదునెక్కేది. నీ పేరు చెప్పగానే కళ్ళు మూసుకునేవాడు. అతను ఒక నిఖార్సయిన నికృష్టుడన్న విషయంలో నాకే సందేహమూ లేదు. పేద్రో పారమొ అంటే అంతే.”

“మరి నేనెవరిని?”

“నా కూతురువి. నాదానివి. బార్ట్లోం శాన్ హువాన్ కూతురివి. ”

సుజానా శాన్ హువాన్ మనసులో ఏవో ఊహలు రూపు కట్టుకోసాగాయి. ముందు నెమ్మదిగా, మళ్ళీ వెనక్కి తగ్గి, తర్వాత ఒక్కసారిగా దూకేసరికి ఆమె “అది నిజం కాదు. అది నిజం కాదు,” అని మాత్రమే అనగలిగింది.

“ఈ లోకం మనల్ని అన్నివైపులనుంచీ వొత్తిడి పెడుతుంది. మన బూడిదని నేలంతా చిమ్ముతుంది. మన నెత్తుటితో నేలను తడపాలని చూస్తుంది. మనమేం చేశాము! మన ఆత్మలెందుకిలా కుళ్ళిపోయాయి? మనకు కనీసం దైవకటాక్షమయినా దక్కుతుందని మీ అమ్మ ఎప్పుడూ అనేది. కానీ నువు కాదంటున్నావు సుజానా. నేను తండ్రిని కాదని ఎందుకంటున్నావు? నీకేమయినా పిచ్చా?”

“నీకు తెలియదా?”

“నీకు పిచ్చా?”

“నాకు పిచ్చే బార్ట్లోం! నీకు తెలియదా?”

 

నీకు తెలుసుగా ఫుల్గోర్! ఈ భూమి మీద అందరికంటే అందగత్తె ఆమే. ఆమెను ఎప్పటికీ పోగొట్టుకున్నాననే నమ్మాను. మళ్ళీ ఆమెను పోగొట్టుకోలేను. అర్థమవుతుందా ఫుల్గోర్? వాళ్ళ నాన్నను పోయి ఆ గనుల్లోనే వెతుక్కోమని చెప్పు. అక్కడ… ఎవరూ అడుగుపెట్టని ఆ ప్రాంతంలో ఒక ముసలాడు మాయం కావడం పెద్ద కష్టం కాదనే అనుకుంటున్నాను. నువ్వేమంటావు ఫుల్గోర్?”

“కావచ్చు.”

“అట్లా కావడం మనకవసరం. ఆమెకు కుటుంబమేమీ మిగలకూడదు. అవసరంలో ఉన్న వాళ్ళ బాగోగులను చూడడం మన పని. నువ్వు దానికి వొప్పుకోవా ఫుల్గోర్?”

“అదంత కష్టంగా ఏమీ కనిపించడం లేదు.”

“మరి ఆలస్యమెందుకు ఫుల్గోర్? ఆ పని మీద ఉండు.”

“ఆమెకి తెలిస్తే?”

“ఎవరు చెపుతారు? చెప్పు. ఇది తెలిసింది నీకూ నాకూ. మనిద్దరిలో ఆమెకి ఎవరు చెప్తారు?”

“ఎవరూ చెప్పరనుకుంటున్నా.”

“ఈ అనుకోవడాలు వదిలేయి. అది మర్చిపో, అంతా సరిగ్గా జరుగుతుంది. ఆండ్రొమెదా దగ్గర ఎంత పని చేయాలో గుర్తు చేసుకో. ఆ ముసలాడిని ఆపని మీద పంపు. తన ఇష్టం వచ్చినట్టు పోయి రమ్మను. కానీ తన కూతుర్ని అక్కడికి తీసుకు వెళ్ళే ఆలోచన రానీయకు. ఆమె సంగతి మనం చూసుకుందాం. అతని పని గనిలో. కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఇల్లు ఉంది. ఆ సంగతి చెప్పు అతనికి.”

“మీరు పనులు చేసే పద్ధతి చూసే ముచ్చటేస్తుందని మళ్ళీ చెప్పాలనిపిస్తూంది దొరా! మీలో వెనకటి హుషారు తిరిగి వచ్చినట్టుంది.”

పెద్రో పారమొ-7

pedro1-1

పొద్దుటి ఎండకి నా జ్ఞాపకాలు వెలిసిపోతూ ఉన్నాయి.
అప్పుడప్పుడూ మాటల శబ్దాలు విన్నాను. తేడా గమనించాను. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్న మాటలన్నీ నిశ్శబ్దమైనవి. శబ్దమేదీ లేదుగానీ అర్థం తట్టేది. కలలో మాటలు విన్నట్లు నిశ్శబ్దంగా.
“ఎవరయి ఉంటాడు ఇతను?” ఆమె అడుగుతూంది.
“ఎవరికి తెలుసు!” అతను బదులిచ్చాడు.
“ఎందుకొచ్చాడో ఇక్కడికి?”
“ఎవరికి తెలుసు!”
“వాళ్ల నాన్న గురించి ఏదో అన్నట్లు గుర్తు.”
“నేనూ విన్నాను.”
“దారి తప్పాడంటావా? ఒకసారి దారి తప్పామని కొందరు వచ్చారు గుర్తు ఉందా? లాస్ కంఫైనెస్ అనే ఊరి కోసం చూస్తున్నామంటే నీకు తెలియదని చెప్పావు”
“అవును, గుర్తుందిలే. నన్ను పడుకోనియ్! ఇంకా తెల్లవారలేదు.”
“తెల్లారుతూనే ఉంది. నిన్ను లేపాలనే నీతో మాట్లాడుతూంది. తెల్లారకముందే గుర్తు చేయమని అన్నావు, నేను గుర్తు చేస్తున్నాను. లే!”
“నన్నెందుకు లేపుతున్నావు?”
“నాకు తెలియదు. లేపమని నాకు రాత్రి చెప్పావు. ఎందుకో చెప్పలేదు.”
“అదే కారణమయితే నన్ను పడుకోనియ్. రాత్రి అతను వచ్చినప్పుడు ఏమన్నాడో గుర్తుందిగా? తనను నిద్రపోనివ్వమని. అతని నోట్లోంచి వచ్చిందంతా ఆ ముక్కే.”

 

గొంతులు దూరంగా పోతున్నట్టున్నాయి. మాసిపోతూ. ఊపిరి తిరగనివ్వకుండా చేసినట్టు. ఎవరూ ఏమీ అనడం లేదు. అది కల.
కానీ కాసేపయ్యాక అది మళ్ళీ మొదలయింది.
“అతను కదులుతున్నాడు. లేవబోతున్నాడనుకుంటాను. మనల్ని ఇక్కడ చూస్తే ఏవో ప్రశ్నలన్నీ అడుగుతాడు.”
“అతనేం అడుగుతాడు?”
“అతనేదో మాట్లాడాలి గదా! కాదా?”
“అతన్ని వదిలెయ్! బాగా అలసిపోయి ఉండాలి.”
“నువ్వలా అనుకుంటున్నావా?”
“ఇక చాలించు తల్లీ!”
“చూడు, కదులుతున్నాడు. ఎట్లా ఎగిరెగిరి పడుతున్నాడో చూడు. లోపలేదో అతన్ని కుదిపేస్తున్నట్టు. నాకు కూడా అలా అయింది కనక నాకు తెలుసు.”
“నీకేం అయింది?”
“అది.”
“నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు.”
“అతన్ని అట్లా చూసినప్పుడు నువ్వు మొదటిసారి నాకు అది చేసినప్పుడు నాకేమయిందో గుర్తుకు వచ్చింది. అంతకంటే ఏమీ చెప్పలేను . అది నన్నెంత బాధించిందీ, అది చేసినందుకు ఎంత చెడ్డగా అనిపించిందీ..”
“అది అంటే?”
“నువ్వు అట్లా చేయగానే నాకనిపించిందీ, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎట్లా సరిగ్గా చేయనిదీ..”
“మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు పడుకుని నన్ను పడుకోనివ్వు!”
“నువ్వే అడిగావు గుర్తు చేయమని. నేను అదే చేస్తున్నాను. ఓరి దేవుడా, నువ్వు నాకేం చెప్పావో అదే చేస్తున్నాను. లే! నువ్వు లేచే సమయమయింది.”
“నన్నొదిలేయి తల్లీ!”
అతను నిద్రపోయినట్టున్నాడు. ఆమె మెత్తటి గొంతుతో తిడుతూనే ఉంది.
“అదుగో తెల్లగా తెల్లారిపోయింది. ఎంత వెలుతురుగా ఉందో చూడు. ఇక్కడినుంచి అతను కనిపిస్తున్నాడంటే అంత వెలుతురు ఉండబట్టే కదా! కాసేపట్లో ఎర్రగా పొద్దు పైకొస్తుంది. అది నీకు నేను చెప్పనవసరం లేదు. అతనేదో తప్పు చేసి ఉండాలి. మనం లోపలికి రానిచ్చాం. ఈ ఒక్క రాత్రికే అయినా సరే, అతనికి ఆశ్రయమిచ్చాం. ముందుముందు లేనిపోనివి మన తలకు చుట్టుకుంటాయి. చూడు అతనెంత దొర్లుతున్నాడో కుదురుగా పడుకోకుండా. గుండెలమీద పెద్ద బరువు పెట్టుకుని ఉండాలి.”
వెలుతురు ఎక్కువవుతూంది. దినం నీడల్ని పారదోలుతూంది. వాటిని చెరిపేస్తూంది. నిద్రపోతున్న దేహాల వేడితో నేను పడుకున్న గది వెచ్చగా ఉంది. పొద్దుటి ఎండ నా కనురెప్పలపై వాలడం తెలుస్తూంది. నాకు వినిపించింది:
“అతను శపించబడ్డట్టు కొట్టుకుంటున్నాడు. దురాత్ముడి ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయి. లే డోనిస్, అతన్ని చూడు. చూడు అతను ఎట్లా తన్నుకులాడుతూ అటూ ఇటూ దొర్లుతున్నాడో! చొంగ కారుస్తున్నాడు. చాలా మందినే చంపి ఉండాలి. నువ్వు చూడను కూడా చూడడంలేదు.”
“పాపం! పడుకో.. మమ్మల్ని పడుకోనివ్వు.”
“నాకు నిద్ర పట్టకపోతే ఎట్లా పడుకోను?”
‘లేచి పో అయితే. నన్ను సతాయించకుండా ఎక్కడికన్నా పో!”
“పోతా. పోయి నిప్పు రాజేస్తా. పోతూ ఏం పేరో అతన్ని వచ్చి నీ పక్కనే నా చోట్లో పడుకోమంటా.”
‘అదే చెప్పు అతనికి.”
“కాదులే. నాకు భయం.”
“అయితే మమ్మల్ని వదిలేసి నీ పని చూసుకో!”
“పోతున్నా!”
“ఇంకా దేనికి ఆగావు?”
“పోతున్నా.”
ఆమె మంచం మీదినుంచి లేవడం వినిపించింది. ఆమె నగ్న పాదాలు నేలను తాకిన చప్పుడు. నా తల మీదుగా దాటుకుంటూ పోయింది. నేను కళ్ళు తెరిచి మూసుకున్నాను.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పొద్దు బాగా పైకెక్కింది. నా పక్కనే మట్టి కప్పులో కాఫీ ఉంది. తాగడానికి ప్రయత్నించాను. కాసిని గుక్కలు మింగాను.
“మా దగ్గర అదే ఉంది. ఏం చేయను? ప్చ్! కొద్దిగానే ఉంది. అన్నిటికీ కొరతగానే ఉంది. ఎంతో కొరతగా.”
అది ఒక స్త్రీ గొంతు.
“నాగురించి చింతించకండి.” ఆమెకి చెప్పాను. “నాగురించి చింత ఏమీ వద్దు. నాకలవాటే. ఇక్కడి నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి?”
“ఎక్కడికి పోతున్నావు?”
“ఎక్కడికయినా.”
“బోలెడు దారులున్నాయి. ఒకటి కోంట్లాకి వెళుతుంది. ఒకటి అక్కడ్నుంచి వస్తుంది. ఒకటి తిన్నగా కొండల్లోకి పోతుంది. ఆ కనపడేది ఎక్కడికి పోతుందో నాకు తెలియదు.” పడిపోయిన కప్పు స్థానంలో రంధ్రం గుండా పైకి చూపిస్తూ అంది. “ ఇంకొకటి మెదియాలూనా మీదుగా పోతుంది. మరొకటి ఊరంత పొడుగూ పోయేదుంది. అది అన్నిటికంటే పొడవయింది.”
“అయితే నేను అటునుంచే వచ్చి ఉండాలి.”
“ఎటు పోతున్నావు?”
“సయులా వైపు.”
“నా మతి మండ. ఇంకా సయులా అటు వైపనుకున్నాను. అక్కడికి వెళ్ళాలని ఎన్నాళ్లనుంచి అనుకుంటున్నానో. అక్కడ చాలా మంది జనం ఉంటారని చెప్తారు.”
“మిగతా చోట్ల లాగే.”
“మరే! ఇక్కడేమో మేం ఒంటరిగా ఉన్నాము. ఒక్క పురుక్కి కూడా మొహం వాచి ఉన్నాం.”
“మీ ఆయన ఎక్కడికి పోయాడు?”
“మా ఆయన కాదు, అన్న. ఆ సంగతి ఎవరికీ తెలియడం ఇష్టం లేదు తనకి. ఎక్కడికి పోయాడో! దూడేదో ఈ చుట్టుపక్కల తప్పించుకు తిరుగుతుంటే దాని కోసం పోయినట్టున్నాడు. నాకు చెప్పడమయితే ఆ మాటే చెప్పాడు.”
“ఇక్కడ ఎన్నాళ్ళ నుంచీ ఉంటున్నారు?”
“ఎప్పటినుంచో! మేం ఇక్కడే పుట్టాం.”
“అయితే నీకు డలోరిస్ ప్రెసియాడొ తెలిసే ఉండాలే!”
“డోనిస్ కి తెలుసేమో! జనాల గురించి నాకంతగా తెలియదు. బయటికి ఎప్పుడూ వెళ్ళను. శాశ్వతంగా ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. అన్నాళ్ళు కాదులే కానీ, నన్ను తనదాన్ని చేసుకున్నప్పటి నుంచీ. అప్పటినుంచీ ఇక్కడే ఉండిపోయాం. ఎవరయినా చూస్తారని భయం. తను నమ్మడు కానీ నామొహం చూసి ఎవరయినా దడుచుకోరా?” నడిచి వచ్చి ఎండలో నిలుచుంది. “ నా మొహం చూడు.”
అది మామూలు మొహం.

Pedro_Páramo
“ఏం చూడమంటావు?”
“ నా పాపం కనపడటం లేదా? ఊదారంగు మచ్చలు కనపడటం లేదా? అదింకా బయటే. లోపల నేనొక బురద సముద్రాన్ని.”
“ఇక్కడ ఎవరూ లేనప్పుడు ఇక నిన్నెవరు చూస్తారు? ఊరంతా తిరిగాను కానీ ఒక్కరూ కనపడలేదు.”
“కనపడలేదని నువ్వనుకుంటున్నావు కానీ ఇంకా ఇక్కడ కొందరున్నారు. నీకు ఫిలోమెన కనపడలేదా? డరోటియా, మెల్క్విలాడెస్, లేకపోతే ముసలి ప్రెడెన్సియో? ఇంకా సొస్టేనెస్ వాళ్ళంతా బతికే ఉన్నారు కదా! విషయమేమిటంటే వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. పగలంతా ఏం చేస్తారో తెలియదు కానీ, రాత్రుళ్ళు తలుపులు వేసుకుని లోపలే ఉంటారు. ఇక్కడ రాత్రులన్నీ దయ్యాలతోటే నిండి ఉంటాయి. ఆ ఆత్మలన్నీ వీధుల్లో నడిచివెళ్ళడం నువు చూడాలి. చీకటి పడగానే అవన్నీ బయటకు వస్తాయి. ఎవరికీ వాటిని చూడాలని ఉండదు. అవి చాలా ఉంటాయి, మేమా కొద్దిమందిమి. వాళ్ళు పాప ప్రాయశ్చిత్త లోకం నుంచి బయటపడేందుకు ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నించం. అన్ని ప్రార్థనలు మావద్ద లేవు. ఏదో దైవప్రార్థన, తలా నాలుగు మాటలు.అది వాళ్ళకు ఏమూలకి? వాళ్ళ పాపాలపైన మా పాపాలు. బతికి ఉన్నవాళ్ళవెవరమూ దైవకృప కలిగి లేము. సిగ్గుతో నిండిన కళ్ళను ఎత్తి చూడలేము. సిగ్గు సాయపడదు. కనీసం బిషప్ చెప్పిన మాట అదీ. ఆ మధ్య దీవెనలివ్వడానికి వచ్చాడు. నేను వెళ్ళి అన్నీ కన్ ఫెస్ చేశాను.
“’నేను నిన్ను క్షమించలేను,’ అన్నాడు.
“’సిగ్గుతో నా వొళ్ళంతా చితికిపోతూంది.’
“’అది సమాధానం కాదు.’
“’మా ఇద్దరికీ పెళ్ళి చేయండి!’
“’విడివిడిగా బతకండి!’
“నేనతనికి చెప్పడానికి ప్రయత్నించాను. బతుకు మమ్మల్ని కలిపింది. పశువుల్లా తరిమింది. ఒకళ్ళమీదికొకళ్ళని బలవంతాన తోలింది. మేమెంతో వొంటరిగా ఉన్నాము, ఇద్దరమే మిగిలాం. మళ్ళీ ఎట్లాగో ఊళ్ళోకి కొంతమంది వచ్చారు. అతను ఈసారి వచ్చేసరికి దీవెనలివ్వడానికి ఎవరో ఒకరు ఉంటారని చెప్పాను.”
“’ఎవరి దారిన వాళ్ళు పోండి. మార్గాంతరం లేదు.”
“’మరి మేమెలా బతకం?’
“’అందరూ బతికినట్టే.’
“మొహం గంటు పెట్టుకుని కంచరగాడిదనెక్కి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూడకుండా. ఇక్కడేదో శాపగ్రస్త దృశ్యాన్ని వదిలి పోతున్నట్టు. అతను మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే ఈ చోటంతా ఆత్మలు ముసురుకొని ఉన్నాయి. క్షమాపణ దొరకకనే చనిపోయిన నిమ్మళం లేని ఆత్మలగుంపులు. జనాలకి క్షమాపణ ఎటూ దొరకదు, అందులోనూ మా మీద ఆధారపడి ఉన్నప్పుడు. అతను వస్తున్నాడు. వినిపిస్తుందా?”
“అవును. వినపడుతుంది.”
“అది అతనే!”
తలుపు తెరుచుకుంది.
“దూడ దొరికిందా?” అడిగింది.
“తిరిగి రాకూడదని దాని బుర్రకెక్కినట్లుంది. దాని అడుగుజాడలు దొరికాయి. తొందరలోనే ఎక్కడుందీ కనుక్కుంటాను. రాత్రికి పట్టుకుంటాను.”
“మళ్ళీ రాత్రికి ఒంటరిగా వదిలి పోతావా?”
“పోవలసివస్తుందేమో!”
“నావల్ల కాదు. నువు నాతో ఉండాలి. అప్పుడే నాకుహాయిగా ఉంటుంది. రాత్రిపూట.”
“కానీ ఈరాత్రికి దూడ కోసం వెళ్ళాలి.”
“నాకిప్పుడే తెలిసింది.” అడ్డు తగిలాను. “మీరిద్దరూ అన్నా చెల్లెళ్లని.”
“నీకిప్పుడే తెలిసిందా? నాకు చాలాకాలం నుంచీ తెలుసు. అందులో నువు వేలు పెట్టకు. జనాలు మాగురించి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు.”
“నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే ప్రస్తావించాను. అంతే.”
“అర్థం చేసుకునేదేమిటి?”
“ఏం లేదు.” చెప్పాను. “క్షణక్షణానికీ నాకు అర్థమవడం తగ్గుతూ ఉంది.” ఇంకా జతకలిపాను. “ నాకు కావలసిందల్లా నేను బయలుదేరిన చోటుకి తిరిగి వెళ్లటమే. మిగిలిన కాస్త వెలుతురూ పోకముందే బయలుదేరాలి.”
“నువ్వాగటం మంచిది.” అతనన్నాడు. “పొద్దుటి దాకా ఆగు. తొందరగా చీకటి పడుతుంది. ఈ దారుల్లో తప్పిపోతావు. రేపు పొద్దున నీకు సరైన దారి చూపిస్తాను.”
“సరే.”

 

కప్పుకున్న రంధ్రంలోంచి పిట్టల్ని చూస్తున్నాను. సందెవేళ చీకటి దారులు మూసేలోపు గుంపు కట్టి పోతున్నాయి. దినాన్ని తీసుకువెళ్లడానికి వస్తున్న గాలి కొన్ని మబ్బుల్ని అప్పటికే చెదరగొట్టింది.
తర్వాత శుక్రనక్షత్రం బయటికి వచ్చింది. మరి కాసేపటికి చంద్రుడూ.
అతనూ, ఆమే దగ్గరలో లేరు. వరండాలోంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేప్పటికి చీకటి పడిపోయింది. కాబట్టి వాళ్లు వెళ్ళిపోయాక ఏం జరిగిందో వాళ్ళకు తెలిసే అవకాశం లేదు.
ఇదీ జరిగింది:
వీధిలోంచి ఒక స్త్రీ వచ్చింది. పురాతనమైన ఆమె ఎంత సన్నగా ఉన్నదంటే చర్మం బొమికెలకు అతుక్కునిపోయింది. తన పెద్ద కళ్ళతో గది చుట్టూరా కలయజూసింది. ఆమె నన్ను కూడా చూసే ఉండొచ్చు. బహుశా నేను నిదరపోతున్నాననుకుందేమో! సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని కిందనుంచి ట్రంకు పెట్టె బయటికి లాగింది. డాని లోపలంతా వెతికింది. కాసిని దుప్పట్లు చంక కింద పెట్టుకుని నేనెక్కడ నిద్ర లేస్తానో అన్నట్టు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయింది.
ఊపిరి బిగబట్టి, ఆమెవేపుకు కాకుండా ఎటో చూడడానికి ప్రయత్నిస్తూ బిర్రబిగుసుకుని ఉండిపోయాను. చివరికి తల తిప్పడానికి కాస్త ధైర్యం కూడదీసుకుని ఆమె వంక చూశాను.శుక్రతార చంద్రుడితో కలుస్తున్న దిశలో.
“ఇది తాగు” నాకు వినిపించింది.
తల తిప్ప సాహసించలేకపోయాను.
“ఇది తాగు. నీకు మంచే చేస్తుంది. ఇది నారింజ పూల తేనీరు. నువు వణుకుతున్నావు కనుక భయపడుతున్నావని నాకు తెలుసు. ఇది నీ భయాన్ని తగ్గిస్తుంది.”
చేతులు గుర్తు పట్టాను. కళ్ళెత్తి చూశాక మొహాన్నీ గుర్తు పట్టాను.ఆమె వెనక ఉన్న అతను అడిగాడు: ”ఒంట్లో బాగా లేదా?”
“నాకు తెలియదు. మీకెవరూ కనపడని చోట నాకు మనుషులూ, వస్తువులూ కనపడుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి ఒకామె వచ్చింది. ఆమె వెళుతుండగా మీ కళ్ళపడే ఉండాలి.”
“దా!” తన భార్యతో అన్నాడతను “ అతన్ని ఒంటరిగా వదిలేయి. మర్మయోగిలా మాట్లాడుతున్నాడు.”
“అతనికి మంచం ఇద్దాం. చూడు ఎట్లా వణికిపోతున్నాడో. జ్వరం తగిలిందేమో!”
“అతన్ని పట్టించుకోకు. ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి కావాలనే ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటారు. మెదియాలూనా దగ్గర ఒకతను నాకు తెలుసు. దైవాంశ ఉందని చెప్పుకునే వాడు. అతనికి ఆ దైవాంశ చెప్పనిదేమిటంటే అతనెంత అబందరగాడో వాళ్ళ అయ్యగారికి తెలియగానే వాడికి చావు మూడిందని. వాళ్ళు ఒక ఊరినుంచి ఇంకో ఊరికి పోతూ బతుకు గడిపేస్తారు ‘దేవుడు ఏం ఇవ్వదలచాడో కనుక్కోవడానికి’. కానీ అతనికి ఇక్కడ తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. చూడు వణకడమెట్లా ఆపాడో! మన మాటలు వింటున్నాడు.”

కాలం వెనక్కి తిరుగుతున్నట్లుంది. తార మళ్ళీ చంద్రుడి వద్దకు చేరుతూంది. చెదిరిన మేఘాలు. పిట్టల గుంపులు. అప్పుడు అకస్మాత్తుగా మిట్టమధ్యాహ్నపు వెలుతురు.
గోడలపై మధ్యాహ్నపు ఎండ పరావర్తనమవుతూంది. బండరాళ్ల మీద నా అడుగులు చప్పుడు చేస్తున్నాయి. గాడిదలు తోలేవాడు అంటున్నాడు “పైకి చూడు దోనా ఎదువిజస్! నువ్వింకా బతికుంటే.”
అప్పుడొక చీకటి గది. నా పక్కనే గురక పెడుతున్న ఒక స్త్రీ. ఆమె కల కంటున్నట్టో, లేక మెలకువగా ఉండే నిద్రపోతున్నట్లు చప్పుడు చేస్తూనో ఉన్నట్లు ఊపిరి హెచ్చుతగ్గులుగా పీలుస్తూంది. ఎప్పుడూ ఎండలో వేయక ఉచ్చ కంపు కొడుతున్న గోతం సంచులు పరిచిన రెల్లుమీద కప్పి ఏర్పాటు చేసిన పక్క. ఒక మొద్దు మీదో ఊలు చుట్ట మీదో జీను మెత్తని చుట్టి చేసిన దిండు. అది చెమటకంపు కొడుతూ రాయిలా గట్టిగా ఉంది.
నగ్నంగా ఉన్న స్త్రీ కాళ్ళు నా మోకాళ్ళకు తగులుతున్నట్లు తెలుస్తూంది. నామొహం మీద ఆమె ఊపిరి. ఆ రాయి లాంటి దిండును ఊతం చేసుకుని లేచి కూచున్నాను.
“నువు నిద్రపోలేదా?” ఆమె అడిగింది.
“నిద్ర పట్టడం లేదు. పగలంతా పడుకున్నాను. మీ అన్న ఎక్కడ?”
“ఎక్కడికో పోయాడు. ఎక్కడికి వెళతానన్నాడో నువుకూడా విన్నావు కదా? ఈరాత్రికి ఇక రాకపోవచ్చు.”
“అయితే వెళ్ళాడా? నువు వద్దని చెబుతున్నా?”
“అవును. తను ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు. వాళ్లంతా అలాగే చేస్తారు. ‘నేనక్కడికి పోవాలి; ఇటు వెళ్లాలి.’ ఎపుడో చాలా దూరం , తిరిగి రావడం అంత తేలిక కానంత దూరం పోతారు. తను పైకి చెప్పకపోయినా నన్ను నువ్వు చూసుకుంటావని వదిలేసి పోయుంటాడు. తన వీలు తను చూసుకున్నాడు. తప్పిపోయిన దూడ ఒక సాకు. చూస్తూండు. ఇక తిరిగి రాడు.”
“నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గాలి కోసం బయటకు వెళుతున్నాను.” అందామనుకున్నాను. బదులుగా అన్నాను. “కంగారు పడకు. అతను తిరిగి వస్తాడు.”
నేను మంచం దిగేసరికి ఆమె అంది.
“కుంపట్లో బొగ్గుల మీద నీకు కాస్త ఉంచాను. అంత ఎక్కువ లేదు కానీ నువు మరీ పస్తు ఉండకుండా ఉంచుతుంది.”
ఎండు ఆవు మాంసపు ముక్కా, కొన్ని వేడి రొట్టెలూ కనిపించాయి.
“అంతే నాకు దొరికింది,” వేరే గదిలోంచి ఆమె మాటలు నా చెవిన పడ్డాయి. మా అమ్మ చస్తూ వదిలివెళ్ళిన రెండు మంచి దుప్పట్లు మా చెల్లికి ఇచ్చి ఇవి తెచ్చాను. అవి మా మంచం కింద దాచాను. అవి తీసుకు వెళ్ళడానికే వచ్చి ఉంటుంది. డోనిస్ ఎదురుగా నీకు చెప్పదల్చుకోలేదు కానీ నువ్వు చూసింది ఆమెనే. బాగా భయపెట్టినట్టుందిగా!”
ఒక నల్లటి ఆకాశం, నిండా నక్షత్రాలు. చంద్రుడి పక్కనే అన్నిటికంటే పెద్ద నక్షత్రం.

“నామాట వినపడటం లేదా?” లోగొంతుకతో అడిగాను.
ఆమె గొంతు బదులిచ్చింది: ”నువ్వెక్కడ?”
“నేను ఇక్కడ, నీ ఊరిలో, నీ మనుషులతో. నేను కనపడటం లేదా?”
“లేదు కొడుకా, నువు నాకు కనపడటం లేదు.”
అన్నిటినీ ఆవరిస్తూ ఉంది ఆమె గొంతు. ఎక్కడో దూరంలో మాయమవుతూంది.
“నాకు నువు కనపడటం లేదు.”

 

నేను ఆమె నిద్రపోతున్న గదికి తిరిగి వెళ్ళి చెప్పాను.
“నేను ఈ మూలన పడుకుంటాను. ఆ మంచమెటూ రాయంత గట్టిగా ఉంది. ఏమన్నా అయితే నన్ను లేపు.”
“డోనిస్ తిరిగి రాడు.” ఆమె అంది. “తన కళ్ళు చూస్తే తెలిసిపోయింది. ఎవరన్నా వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాడు తప్పించుకుపోవచ్చని. ఇప్పుడు నా బాగోగులు నువ్వే చూడాలి. చూడవా? నన్ను చూసుకోవా? నా పక్కనే పడుకుని నిద్రపో!”
“ నాకిక్కడ బాగానే ఉంది.”
“ ఇక్కడ ఈ మంచంలో ఇంకా బాగుంటుంది. అక్కడ నల్లులు నిన్ను బతికుండగానే పీక్కు తింటాయి.”
నేను లేచి ఆమె పక్కలోకి దూరాను.

(సశేషం)

పెద్రో పారమొ-6

pedro1-1

“ఆమెని అడిగాను, ఒప్పుకుంది. ప్రీస్ట్ అరవై పీసోలు అడిగాడు ముందస్తు పెళ్ళి ప్రకటనలగురించి పట్టించుకోకుండా ఉండేందుకు. వీలయినంత తొందర్లోనే ఇస్తానని చెప్పాను. దైవ పీఠాన్ని బాగు చేయడానికి కావాలన్నాడు. అతని భోజనాల బల్ల కూడా చివరిదశలో ఉందట. కొత్త బల్ల పంపిస్తానని చెప్పాను. నువెప్పుడూ ప్రార్థనకు రావన్నాడు. నువ్వొస్తావని చెప్పాను. మీనాయనమ్మ పోయనప్పట్నుంచీ దశకం చేయలేదన్నాడు. దానిసంగతి వదిలేయమన్నాను. చివరికి ఒప్పుకున్నాడు”
“డలోరిస్ నుంచి అడ్వాన్స్ ఏమన్నా అడగలేదా?”
“లేదయ్య అంత ధైర్యం చేయలేకపోయాను. నిజంగా. ఆమె సంతోషాన్ని చూసి అట్లాంటి పని ఏదీ చేయాలనిపించలేదు.”
“మరీ పసిపిల్లాడిలా ఉన్నావు!”
పసిపిల్లాడని అన్నాడా? నన్ను, యాభై ఏళ్ళ నన్ను పట్టుకుని? అతన్ని చూస్తే ముక్కుపచ్చలారలేదు, నేను కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాను. “ఆమె సంతోషాన్ని చెడగొట్టదలచలేదు.”
“ఎంతయినా నువ్వింకా పిల్లాడివే!”
“నువ్వేమంటే అదేనయ్యా!”
“వచ్చే వారం ఆ ఆల్డ్రెట్ దగ్గరికి వెళ్ళు. అతని కంచెలు సరి చూసుకోమను. మన మెదియా లూనా లోపలికి జరిపాడని చెప్పు.”
“కొలతలన్నీ పొరపాటు లేకుండా బాగానే కొలిచాడు. ఆ సంగతి నేను కచ్చితంగా చెప్పగలను”
“సరే, పొరపాటు చేశాడని చెప్పు. లెక్కల్లో తేడా వచ్చిందను. అవసరమయితే ఆ కంచెలు పీకేయించు.”
“మరి చట్టం?”
“ఏం చట్టం ఫుల్గోర్? ఇకనుంచీ మనమే చట్టం. మెదియా లూనాలో పనిచేసే వాళ్లలో ఎవరన్నా గట్టివాళ్ళున్నారా?”
“ఒకరిద్దరున్నారు.”
“ఆల్డ్రెట్ సంగతి చూడ్డానికి వాళ్లను పంపు. నువ్వొక ఫిర్యాదు రాయి అతను మన నేలను ఆక్రమించుకున్నాడనో లేకపోతే నీ ఇష్టమొచ్చిందేదో. లూకాస్ పారమొ చనిపోయాడని అతనికి గుర్తు చేయి. ఇకనుంచీ వ్యవహారమేదో నాతోనే తేల్చుకోవాలని చెప్పు.”
ఇంకా నీలంగా ఉన్న ఆకాశంలో కొద్ది మబ్బులే ఉన్నాయి. పైనెక్కడో గాలి రేగుతున్నట్లుంది కానీ కింద నిశ్చలంగానూ, వేడిగానూ ఉంది.

అతను మళ్లీ కొరడా పిడితో తట్టాడు. తీయాలని పేద్రో పారమొకి అనిపించిందాకా వేరెవరూ తలుపు తీయరని తెలిసినా తనొచ్చినట్లు తెలియజేయడానికి. తలుపు పైన ఉన్న రెండు ముడులుగా చుట్టిన అలంకారాల్ని చూసి ఆ నల్ల రిబ్బన్లు బావున్నాయనుకున్నాడు, ఒకదానికొకటి.
అప్పుడే తలుపు తెరుచుకుంది. అడుగు లోపలికి పెట్టాడు.
“రా ఫుల్గోర్! ఆ టోర్బియో ఆల్డ్రెట్ సంగతి ముగిసినట్లేనా?”
“ఆ పని అయిపోయిందయ్యా!”
“ఇంక ఫ్రెగోసస్ విషయమొకటి ఉంది. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. నా హనీమూన్ తో తీరికే దొరకడం లేదు.”

“ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. అవి ఈ గోడల వెనకో, కిందపరిచిన బండరాళ్ల కిందో ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరో నీవెనకే ఉన్నట్టూ, నీ అడుగులో అడుగు వేస్తున్నట్టూ ఉంటుంది. మర్మర ధ్వనులు వినిపిస్తాయి. ఇంకా జనాలు నవ్వుతున్నట్టు. అలసిపోయినట్టుగా వినిపించే నవ్వులు. యేళ్ళు అరగదీసిన గొంతులు. అలాంటి శబ్దాలు. కానీ ఆ శబ్దాలన్నీ మాయమయే రోజు వస్తుందనుకుంటాను”
పట్టణం గుండా మేం నడుస్తున్నప్పుడు నాతో డమియాన సిస్నెరోస్ చెప్తూ వస్తున్నదదీ.

“ఒకప్పుడు రాత్రి తరవాత రాత్రి జాతర జరుగుతున్న శబ్దాలు వినిపించేవి. మెదియాలూనా దాకా స్పష్టంగా వినగలిగేదాన్ని. ఆ గోలంతా ఏమిటో చూద్దామని ఇక్కడిదాకా వస్తే నాకు కనిపించేదేమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నదే. ఏమీ లేదు. ఎవరూ లేరు. ఇప్పటిలాగే ఖాళీగా ఉన్న వీధులు.
“తర్వాత ఏమీ వినిపించేది కాదు. నీకు తెలుసుగా సంబరాలు చేసుకునీ చేసుకునీ అలసిపోతాం. అందుకే అది ముగిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు.
“అవును,” డమియానా సిస్నెరోస్ మళ్లీ అంది “ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. నాకిప్పుడు భయం వేయదు. కుక్కల అరుపులు వినిపిస్తాయి, వాటినలా అరవనిస్తాను. బాగా గాలిగా ఉన్న రోజుల్లో చెట్లనుంచి రాలిన ఆకులు కొట్టుకుని వస్తాయి. ఇక్కడ చెట్లు లేవన్న విషయం ఎవరికయినా కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఉండాలి. లేకపోతే ఆకులెక్కడ్నుంచి వస్తాయి?
“అన్నిటికంటే పాడుసంగతి ఏమిటంటే ఎవరో మాట్లాడుతున్నట్టు వినపడతాయి. ఆ గొంతులు ఏ సందుల్లోంచో వస్తున్నట్లు వినపడుతుంది. కానీ ఆ గొంతులు ఎవరివో చెప్పగలిగేంత స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో దినం చేయడం కనిపించింది. దైవ ప్రార్థన చేద్దామని ఆగాను. నేను ప్రార్థిస్తుండగా ఒకామె మిగతా జనాన్నుండి విడివడి నావైపు వచ్చి ‘డమియానా నాకోసం ప్రార్థించు డమియానా!’ అంది.
“ఆమె మొహాన ముసుగు జారి ఆమె మొహం కనపడగానే గుర్తు పట్టాను. ఆమె నా అక్క సిక్స్టినా.
“’నువ్వేం చేస్తున్నావిక్కడ?’ ఆమెనడిగాను.
“అప్పుడామె పరుగెత్తుకుని వెళ్ళి మిగతావాళ్ల వెనక దాక్కుంది.
“నీకు తెలియదేమో, మా అక్క సిక్స్టినా నాకు పన్నెండేళ్ళప్పుడే చనిపోయింది. అందరికంటే పెద్దది. మేము పదహారుమందిమి. నువ్వే లెక్క చూసుకో ఇప్పటికి ఆమె చనిపోయి ఎన్నాళ్లయిందో!. ఇంకా ఈలోకంలోనే తిరుగుతూంది. కాబట్టి నీకు కొత్త ప్రతిధ్వనులు వినపడితే ఏం భయపడకు హువాన్ ప్రెసియాడో!”
“నేను వస్తున్నట్టు నీకు మా అమ్మేనా చెప్పింది?” నేను అడిగాను.
“కాదు. ఇంతకీ మీ అమ్మకి ఏమయింది?”
“ఆమె చనిపోయింది” బదులిచ్చాను.
“చనిపోయిందా? ఎలా?”
“ఏమో నాకు తెలియదు. బహుశా దిగులేమో! ఎప్పుడూ నిట్టూర్పులు విడుస్తూ ఉండేది.”
“అయ్యో! ప్రతి నిట్టూర్పుతోటీ నీ జీవితంలో ఒక్కో బొట్టూ జారిపోతూ ఉంటుంది. అయితే చనిపోయిందన్నమాట!”
“అవును. నీకు తెలుసనుకున్నాను.”
“నాకెట్లా తెలుస్తుంది? ఆమె కబురందక కొన్నేళ్ళయింది.”
“మరి నీకు నా సంగతెలా తెలుసు?”
డమియానా బదులీయలేదు.
“నువు బతికే ఉన్నావా డమియానా? చెప్పు డమియానా?”
అకస్మాత్తుగా ఆ ఖాళీ వీధుల్లో నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. కప్పులు లేని ఇళ్ల కిటికీల్లోంచి ఎత్తుగా పెరిగిన కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి. దాచలేని కప్పు కింద పొడవుతున్న ఇటుక గోడలు.
“డమియానా!” పిలిచాను. ‘డమియానా సిస్నెరోస్!”
ప్రతిధ్వని బదులిచ్చింది “…ఆనా….నెరోస్…ఆన..నెరోస్”

కుక్కలు అరవడం వినిపించింది. నేనే వాటిని లేపినట్టు. ఒకతను వీధి దాటటం చూశాను.
“ఓయ్, నిన్నే” పిలిచాను.
“ఓయ్, నిన్నే” నా గొంతే వెనక్కి వచ్చింది.
పక్క మలుపులోనే మాట్లాడుకుంటున్నట్టు ఇద్దరు ఆడవాళ్ళ మాటలు వినవచ్చాయి.
“చూడు ఇటు ఎవరొస్తున్నారో! అది ఫిలోటియొ అరేచిగా కాదూ?”
“అవును అతనే. అతన్ని గమనించనట్టు నటించు.”
“అంతకంటే మేలు, ఇక్కడినుంచి పోదాం పద! అతను మనవెంట పడితే మనలో ఒకరినుంచి ఏదో ఆశిస్తున్నట్టు. మనలో ఎవరి వెనక పడుతున్నానుకుంటున్నావు?”
“నీ వెనకే అయ్యుండాలి.”
“కాదు, నా లెక్కప్రకారం నీ వెనకే.”
“మనం పారిపోవలసిన పని లేదు. అతనా మలుపు దగ్గరే ఆగిపోయాడు.”
“అయితే మన ఇద్దరిలో ఎవరమూ కాదన్నమాట. చూశావా!”
“కానీ అయి ఉంటే? అప్పుడేమిటి?”
“లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు.”
“కాకపోవడమే మంచిదయింది. డాన్ పేద్రోకి అమ్మాయిలని ఏర్పాటు చేసేది అతనే అంటారంతా. మనం తప్పించుకున్నాము.”
“అవునా? ఆ ముసలాడితో శొంటి నాకు లేకపోవడమే మేలు.”
“మనం ఇక వెళ్ళడం మంచిది.”
“అవును. ఇంటికి పోదాం.”

రాత్రి. అర్థరాత్రి దాటి చాలాసేపయింది. ఇక ఆ గొంతులు:
“ఈ ఏడు మొక్కజొన్న పంట బాగా పండితే నీ అప్పు తీరుస్తాననే చెప్తున్నాను.అది చేతికి అందిరాకపోతే నువు కొనాళ్ళు ఆగవలసిందే!”
“నేనేమీ బలవంతపెట్టడం లేదు. ఎంత ఓపిక పట్టానో నీకు తెలుసు. కానీ అది నీ పొలం కాదు. నీది కాని పొలంలో పని చేస్తున్నావు. మరి నా అప్పు తీర్చడానికి డబ్బెక్కడి నుంచొస్తుంది?”
“అది నా పొలం కాదన్నదెవరు?”
“పేద్రో పారమోకి అమ్మావని విన్నాను.”
“నేను అతని దరిదాపులకి కూడా పోలేదు. అదింకా నా పొలమే.”
“అని నువ్వంటున్నావు. జనాలంతా అది అతనిదంటున్నారు.”
“ఏదీ ఆ మాట నాతో అనమను.”
“చూడు గెలీలియో! మనలో మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత కాదన్నా నా చెల్లి భర్తవి. ఆమెను నువ్వు బాగా చూసుకోవడంలేదని ఎవరూ అనగా నేను వినలేదు. కానీ ఆ పొలం నువ్వు అమ్మలేదని మాత్రం నాకు చెప్పబోకు.”
“ఎందుకు చెప్పను? అది నేను ఎవరికీ అమ్మలేదు.”
“అది పేద్రో పారమోకి చెందుతుంది. ఆ అర్థం వచ్చేటట్లే నాతో అన్నాడు. డాన్ ఫుల్గోర్ వచ్చి నిన్ను కలవలేదా?”
“లేదు.”
“అయితే రేపు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రేపు కాకపోతే త్వరలోనే ఒక రోజెప్పుడో!”
“అయితే మా ఇద్దరిలో ఒకడికి చావు రాసి పెట్టి ఉంది. అతని ఆటలు నా దగ్గర సాగవు.”
“వదిలేసి ప్రశాంతంగా ఉండు బావా! ఎందుకయినా మంచిది.”
“నేనెక్కడికీ పోను, చూస్తూండు. నాగురించి కంగారు పడకు. మా అమ్మ డక్కామొక్కీలు తినిపించే పెంచింది గట్టివాడిగా.”
“సర్లే, రేపు చూద్దాం. ఫెలిసిటాస్ కి రాత్రి భోజనానికి రానని చెప్పు.తర్వాత ‘అతను చనిపోయే ముందు రాత్రి నేను అతనితోనే ఉన్నాను’ అని చెప్పుకునే బాధ తప్పుతుంది.”
“చివరి క్షణంలో మనసు మార్చుకుంటే రా, నీకోసం అట్టేపెడతాం.”
దూరమవుతున్న అడుగుల చప్పుడు కాలి బూట్ల ముళ్లచక్రాల గలగలల్లో కలిసిపోతూ ఉంది.

“రేపు పొద్దున్నే వేకువజామున నాతో వస్తున్నావు చోనా. జట్టునంతా సిద్ధం చేశాను.”
“మరి మానాన్న తట్టుకోలేక చచ్చిపోతే ఏం చెయ్యాలి? ఈ వయసులో.. నామూలాన ఆయనకి ఏమయినా అయితే నేను భరించలేను. ఆయన బాగోగులు చూడవలసినదానిని నేనొక్కదాన్నే కదా? ఇంకెవరున్నారు? ఆయన్నించి లాక్కెళ్ళడానికి ఎందుకంత తొందర నీకు? కొన్నాళ్ళు ఆగు. ఎన్నాళ్ళో బతకడు.”
“పోయిన ఏడూ అదే చెప్పావు. అవకాశం తీసుకోవడం లేదని ఎత్తిపొడిచావు. అప్పుడేమో ఈ పనులన్నిటితో విసిగిపోయి ఉన్నానన్నావు. కంచరగాడిదల్ని కట్టి సిద్ధం చేశాను. నువ్వు నాతో వస్తున్నావా లేదా?”
“నన్ను ఆలోచించుకోనివ్వు.”
“చోనా! నేను నిన్నెంత కోరుకుంటున్నానో నీకు తెలుసు. ఇంక ఆగలేను చోనా! ఏది ఏమయినా నువ్వు నాతో రావలసిందే!”
“నేను ఆలోచించుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన చనిపోయేదాకా మనం ఆగాలి. ఎన్నాళ్ళో పట్టదు. అప్పుడు నేను నీతో వస్తాను. మనం లేచిపోవలసిన అవసరం ఉండదు.”
“అది కూడా చెప్పావు సంవత్సరం క్రితం.”
“అయితే?”
“చోనా, నేను కంచరగాడిదలు బాడిగకి తీసుకోవలసి వచ్చింది. అవి తయారుగా ఉన్నాయి. నీకోసమే ఎదురుచూస్తున్నాయి. ఆయన బతుకు ఆయన్ని బతకనివ్వు. నువు అందగత్తెవి. వయసులో ఉన్నావు. ఏ ముసలమ్మో వచ్చి ఆయన్ని చూసుకుంటుంది. దయగల తల్లులు లోకంలో చాలామందే ఉన్నారు”
“నావల్ల కాదు.”
“అవుతుంది.”
“కాదు. అది నన్నెంత బాధిస్తుందో నీకు తెలుసు. ఆయన నా కన్నతండ్రి.”
“ఇక నేను చెప్పేదేం లేదు. నేను హూలియానా దగ్గరికి పోతున్నాను. తనకి నేనంటే తగని పిచ్చి.”
“సరే. నువు పోవద్దని నేను చెప్పను.”
“అయితే రేపు నా మొహం చూడవా?”
“లేదు. నిన్నెప్పటికీ చూడాలనుకోవడం లేదు.”

శబ్దాలు. గొంతులు. గొణుగుళ్ళు. దూరపు పాట:
లేసు అంచుల రుమాలిచ్చిపోయావా ప్రియతమా
నాకన్నీళ్ళు తుడుకునేందుకు
ఉచ్ఛస్వరాలు. ఆడవాళ్లెవరో పాడుతున్నట్టు.

బళ్ళు కిరకిరలాడుతూ పోవడం చూశాను. నెమ్మదిగా కదులుతున్న ఎడ్లు. చక్రాల కింద నలుగుతున్న రాళ్ళు. నిద్రకి తూగున్నట్టున్న మగాళ్ళు.
… ప్రతి ఉదయమూ ఆ పట్టణం దాటిపోయే బళ్ళ మూలాన వణుకుతుంది. అవి ఉప్పూ, మొక్కజొన్న కండెలూ,పశువుల దాణా వేసుకుని ఎక్కడెక్కడినుంచో వస్తాయి. కిటికీలు దడదడలాడి లోపలి జనాలు లేచేదాకా చక్రాలు కిర్రుమని మూలుగుతుంటాయి. ఆవం తెరిచే సమయం కనక అప్పుడే కాల్చిన రొట్టె వాసన చూడగలవు. హటాత్తుగా ఉరుముతుంది. వాన, వసంతకాలం వచ్చిందేమో! ఆ ఆకస్మికాలకి నువ్వు తొందరలోనే అలవాటు పడతావు కొడుకా!”
వీధుల్లోని నిశ్శబ్డాన్ని చిలుకుతూ ఖాళీ బళ్ళు. రాత్రి చీకటి దారుల్లో కలిసిపోతూ. ఇంకా నీడలు. నీడల ప్రతిధ్వని.
వెళ్ళిపోదామనుకున్నాను. నేను వచ్చినదారి కొండల పైదాకా పోల్చుకోగలుగుతున్నాను. అది కొండల నల్లదనంలో తెరుచుకున్న గాయంలా కనిపిస్తుంది.
అప్పుడెవరో నాభుజాన్ని తాకారు.
“నువ్విక్కడ ఏం చేస్తున్నావు?”
“నేను ..” ఎవరిని చూడడానికొచ్చానో ఆ పేరు చెప్పబోయి ఆగిపోయాను. “ నేను మా నాన్నను చూడటానికి వచ్చాను.”
“లోపలికి రారాదూ?”
“లోపలికి వెళ్ళాను. సగం కప్పు ఇంట్లోకే కూలిపోయి ఉంది. నేలమీదే కప్పు. మిగతా సగంలో అతనూ, ఆమే.
“మీరు చనిపోయారా?”
ఆమె నవ్వింది. అతను తీక్షణంగా చూస్తున్నాడు.
“బాగా తాగినట్టుంది.” అతనన్నాడు.
“భయపడ్డాడులే!” ఆమె అంది.
ఒక నూనె పొయ్యి ఉంది. ఎర్ర మంచం, ఈమె దుస్తులు పడేసిన మోటు కుర్చీ. పుట్టినప్పుడున్నంత నగ్నంగా ఉంది ఆమె. అతను కూడా.
“ఎవరో మా తలుపుకి తలకొట్టుకుంటూ మూలుగుతున్న చప్పుడు వినవచ్చింది. తీసి చూస్తే నువ్వు. ఏమయింది నీకు?”
“చాలా జరిగాయి. నాకయితే నిద్రపోవాలనే కోరిక తప్ప మరేం లేదు.”
“ఆ నిద్రే పోతూ ఉన్నాం.”
“అయితే పడుకుందాం పదండి!”

పెద్రో పారమొ-5

pedro1-1

నువు అదృష్టవంతుడివి నాయనా, చాలా అదృష్టంతుడివి.” ఎదువిజస్ ద్యాడా నాతో చెప్పింది.

అప్పటికే చాలా ఆలస్యమయింది. మూలనున్న దీపం సన్నగిల్లుతూ ఉంది. చివరిగా వణికి ఆరిపోయింది.

ఆమె పైకి లేచినట్టు అనిపించింది. ఇంకో దీపం కోసం వెళుతుందనుకున్నాను. దూరమవుతున్న ఆమె అడుగుల చప్పుడు విన్నాను. ఎదురు చూస్తూ అక్కడే కూచున్నాను.

కొద్ది సేపయ్యాక, ఆమె ఇక తిరిగి రాదని నిర్ధారించుకున్నాక, నేనూ లేచాను. చీకట్లో తడుముకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ నాగదికి చేరాను. నేలమీద పడుకుని నిద్ర కోసం ఎదురుచూశాను.

నిద్ర పడుతూ పోతూ ఉంది.

ఆ మధ్యలోనే ఎప్పుడో ఒక ఏడుపు విన్నాను. సాగదీసి ఏడ్చినట్టుగా ఉంది తాగినవాడి కూతలా. “అయ్యో బతుకా! నాకర్మ ఇట్లా కాలిందే!’

మరీ నా చెవిలోనే వినిపించినట్టుండేసరికి దిగ్గున లేచి కూచున్నాను. అది వీధిలోంచీ కావచ్చు గానీ, నేనిక్కడే విన్నాను ఈ గదిగోడలకు అంటుకుని ఉన్నట్టు. నేను లేచేసరికి చిమటల చప్పుడూ, నిశ్శబ్దపు సణుగుడూ తప్పించి అంతా నిశ్శబ్దంగా ఉంది.

లేదు, ఆ కేక తర్వాత నిశ్శబ్దపు లోతు కొలిచే మార్గమేదీ లేదు. భూమి శూన్యంలో నిలబడిపోయినట్టుంది. ఏ శబ్దమూ లేదు – ఆఖరికి నా ఊపిరీ, నా గుండె కొట్టుకునే చప్పుడు కూడా. అస్తిత్వపు శబ్దమే ఘనీభవించినట్టుగా. దాన్నుంచి బయటపడి కుదుటపడుతుండగానే మళ్ళీ అదే కేక. అది చాలాసేపు వినిపించింది. “నువు నాకు బాకీ ఉన్నావు, ఉరితీయబడ్దవాడికి చివరిమాట వినిపించే హక్కు కంటే అది ఎక్కువ కాకపోయినా!”

అప్పుడు తలుపు భళ్ళున తెరుచుకుంది.

“నువ్వేనా దోన ఎదువుజస్?” పిలిచాను. “ఏమవుతూంది? భయపడ్డావా?”

“నా పేరు ఎడువుజస్ కాదు. నేను డమియానాని. నువ్విక్కడ ఉన్నావని విని చూడటానికి వచ్చాను. మా ఇంటికి వచ్చి పడుకో. అక్కడయితే హాయిగా సేద తీరవచ్చు.”

“డమియానా సిస్నెరోస్? మెదియాలూనాలో ఉండే ఆడవాళ్ళలో ఒకరివికాదూ నువ్వు?”

“అక్కడే ఉంటాను. అందుకే ఇక్కడికి రావడానికి ఇంతసేపు పట్టింది.”

“నేను పుట్టినప్పుడు డమియానా అనే ఆవిడ నా ఆలనా పాలనా చూసిందని మా అమ్మ చెప్పింది. అది నువ్వేనా?”

“అవును. అది నేనే. నువు మొట్టమొదటిసారి కళ్ళు తెరిచినప్పట్నుంచీ నాకు తెలుసు.”

“సంతోషంగా వస్తాను. ఈ గోలలో నాకు నిద్రే పట్టడం లేదు. నువ్వు వినలేదా? ఎవరినో చంపుతున్నట్టు. నీకు వినపడలేదా ఇప్పుడు?”

“ఆ ప్రతిధ్వని ఏదో ఇక్కడే ఇరుక్కుపోయినట్లుంది. చాలా కాలం క్రితం టోర్బిడొ అల్బ్రెట్‌ని ఈ గదిలోనే ఉరి తీశారు. తర్వాత ఈ గదిలోనే వదిలేసి తాళం పెట్టారు. అందుకే అతనికెప్పుడూ శాంతి కలగదు. ఈ గది తాళం చెవి లేకుండానే నువ్వెట్లా లోపలికి వచ్చావో నాకు తెలియదు.”

“దోనా ఎదువిజస్ తెరిచింది. ఈ గదొక్కటే ఖాళీగా ఉందని చెప్పిందామె.”

“ఎదువిజస్ ద్యాడానా?”

‘అవును. ఆమే!”

“పాపం ఎదువిజస్! అంటే ఆమె ఆత్మ దారి తప్పి ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉందన్న మాట!”

 

 

ఫుల్గోర్ సెడనో నామధేయుడనూ, యాభయి ఏళ్ళ అవివాహితుడనూ, వృత్తిరీత్యా వ్యవహర్తనూ, దావా వేయుటలోనూ, కేసులను వాదించుటలోనూ అనుభవజ్ఞుడనూ అయిన నేను నాకివ్వబడిన సర్వహక్కులనూ నియోగించుకునియున్నూ, నా అధికారమును వాడుకొంటున్నూ ఈ క్రింది ఆరోపణలు చేయుచున్నాను….”

టోర్బిడో అల్డ్రెట్ చేసిన అకృత్యాలపై ఫిర్యాదు చేసినప్పుడు అదీ అతను రాసింది. “ అపరాధం సరిహద్దులను తారుమారు చేయడం.”

Pedro-Páramo-de-Juan-Rulfo

 

“నిన్నెవడూ ఏమీ అనలేడు డాన్ ఫుల్గోర్. నీ అంతట నువు నిలబడగలవు. నీవెనక ఉన్న అధికారంతో కాదు, నీ అంతట నువ్వే.”

అతనికి గుర్తుంది. ఫిర్యాదు చేసిన సందర్భంగా తాగుతూ సంబరం చేసుకుంటున్నప్పుడు ఆల్డ్రెట్ అన్న మొదటి మాట అది.

“ ఈ కాగితం నువ్వూ నేనూ నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు డాన్ ఫుల్గోర్. అంతకు మించి ఏం కాదు. అది నీకూ తెలుసు. ఇంకోరకంగా చెప్పాలంటే, నీకు సంబంధించినవరకూ నీ పని నువ్వు చేశావు. నేను మొదట్లో కంగారుపడ్డాను కానీ ఇదంతా చూశాక నవ్వొస్తూంది. సరిహద్దులను తారుమారు చేయడమా? నేనా? అంత బుర్రతక్కువ వెధవ అయితే అతను సిగ్గుతో తలవంచుకోవాలి”

అతనికి గుర్తుంది. వాళ్ళు ఎదువిజస్ ఇంటి దగ్గర ఉన్నారు. అతను ఆమెను అడిగాడు కూడా.

“విజస్! ఆ మూల గది వాడుకోవచ్చా?”

“ఏ గది కావాలంటే అది తీసుకోండి డాన్ ఫుల్గోర్! అవసరమయితే అన్నీ తీసుకోండి. రాత్రంతా ఉంటారా?”

“లేదు, ఒకటి చాలు. మాగురించి ఎదురు చూడక పడుకో. తాళం చెవి మాత్రం ఇవ్వు!”

టోర్బియో ఆల్డ్రెట్ అందుకున్నాడు “సరే, డాన్ ఫుల్గోర్! నేను చెపుతున్నట్టు నీ మగతనాన్ని ఎవడూ శంకించడు. కానీ మీ పెంటముండకొడుకుతోటే నేను విసిగిపోయాను.”

అతనికి గుర్తుంది. తెలివి సక్రమంగా పని చేసినంతవరకూ విన్నమాటల్లో చివరిది అది. తర్వాత పిరికివాడిలా కేకలు వేశాడు “నా వెనక అధికారముందనా అన్నావు? నిజమా?”

 

కొరడా పిడితో పేద్రో పారమొ ఇంటి తలుపు తట్టాడు. రెండువారాలక్రితం మొదటిసారి వచ్చినప్పుడు అట్లాగే చేసినట్టు గుర్తొచ్చింది. ఎదురుచూశాడు, మొదటిసారి చూసినట్లే. మళ్ళీ అప్పుడు చేసినట్టే, తలుపుపైన వేలాడదీసిన నల్లటి ముడులలాంటి అలంకారాలను పరీక్షించి చూశాడు. అయితే మళ్ళీ అప్పటిలా వ్యాఖ్యానించలేదు: “అబ్బో, ఒకదాని మీద ఇంకొకటి వేలాడదీశారే! మొదటిది మాసిపోయింది, రంగు వేసినట్టు కనపడుతున్నా కొత్తది పట్టులా తళతళలాడిపోతుంది.”

 

మొదటిసారి చాలాసేపు ఎదురుచూస్తూ ఇంట్లో ఎవరూ లేరేమో అనుకున్నాడు. చివరికి వెళ్ళిపోదామనుకుంటుండగా పేద్రో పారమొ కనిపించాడు.

“లోపలికి రా నేస్తం!”

అప్పటికి అది రెండోసారి వాళ్ళు కలవడం. మొదటిసారి కలిసిన విషయం అతనికి మాత్రమే తెలుసు, పేద్రో అప్పుడే పుట్టిన పిల్లాడు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు. ఇదే మొదటిసారి అనుకోవచ్చు కూడా. కానీ తనతో సమానంగా చూస్తున్నాడు. ఏం చెప్పాలి? కాలిని కొరడాతో చిన్నగా కొట్టుకుంటూ, పెద్ద అంగలు వేస్తూ ఫుల్గోర్ అతన్ని అనుసరించాడు. ఏది ఏదో తెలిసిన వాడినని అతను త్వరలోనే గ్రహిస్తాడు. అతను తెలుసుకుంటాడు. నేనెందుకు వచ్చానో కూడా.

“కూర్చో ఫుల్గోర్! ఇక్కడ తాపీగా మాట్లాడుకోవచ్చు!”

వాళ్లు గుర్రాల శాలలో ఉన్నారు. పేద్రో పారమొ దాణా వేసే గొట్టం మీద కూచుని ఎదురు చూస్తున్నాడు.

“కూర్చోదలుచుకోలేదా?”

“నిలబడే ఉంటాలే పేద్రో!”

“నీ ఇష్టం. కానీ ‘డాన్’ అనడం మర్చిపోకు!”

ఎవడనుకుంటున్నాడు ఈ కుర్రాడు తన గురించి అలా మాట్లాడడానికి? వాళ్ళ నాన్న డాన్ లూకాస్ పారమొ కూడా అంత ధైర్యం చేయలేదు. మెదియా లూనాలో అడుగు కూడా పెట్టని, వీసమెత్తు పని కూడా చేయని ఈ కుర్రాడు మొట్టమొదటిగా చేస్తున్నది తనో జీతగాడన్నట్లు మాట్లాడడం! ఇంకేం చెప్తాం!

“వ్యవహారం ఎందాక వచ్చింది?”

సెడానోకి ఇదే సందు అనిపించింది. “ఇప్పుడు నావంతు!” అనుకున్నాడు.

“అంత బాలేదు. ఏమీ మిగల్లేదు. మిగిలిన పశువుల్నీ ఒక్కటి కూడా మిగలకుండా అమ్మేశాం.”

పత్రాలన్నీ చూపించడానికి బయటికి తీయసాగాడు. “మనం ఇంతా బాకీ” అని చెప్పబోయేంతలో ఆ కుర్రాడే అడిగాడు.

“మనం ఎవరికి బాకీ ఉన్నాం? ఎంత అనేది నాకు అనవసరం, ఎవరికి అన్నదే ముఖ్యం.”

 

ఫుల్గోర్ పేర్ల జాబితా చివరిదాకా చూసి అన్నాడు. “కట్టడానికి డబ్బు ఎక్కడినుంచీ వచ్చే అవకాశం లేదు. అసలు సమస్య అదీ!”

“ఎందుకని?”

“ఎందుకంటే మీ కుటుంబం అంతా తినేసింది. చిల్లిగవ్వ చెల్లు వేయకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ పోయింది. ఏనాటికయినా కట్టాలి కదా? నేనెప్పుడూ చెప్తూ ఉండేవాడిని ‘ఏదో రోజు ఉన్నదంతా ఊడ్చేస్తారు’ అని. సరిగా అట్లాగే అయింది. సరే, పొలం కొనడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళొకరు నాకు తెలుసు. మంచి ధరే ఇస్తారు. అప్పులన్నీ తీరిపోగా కొంచెం మిగలొచ్చు కూడా. మరీ ఎక్కువ కాదనుకో!”

“ఆ ఒకరూ నువ్వు కాదూ?”

“అట్లా ఎందుకనుకుంటున్నావు?”

“నా నీడనే నేను నమ్మను. రేపు పొద్దున మన వ్యవహారాలన్నీ చక్కపెడదాం. ముందు ఆ ప్రెసియడొస్ ఆడవాళ్ల సంగతి చూద్దాం. అందరికంటే ఎక్కువ వాళ్లకే ఇవ్వాలి అని కదా అన్నావు?”

“అవును. వాళ్ళకే అందరికంటే తక్కువ చెల్లవేసింది. మీ నాన్న జాబితాలో వాళ్ళను చివరన ఉంచాడు. వాళ్లలో ఒక అమ్మాయి మటిడా ఏదో పట్టణానికి వెళ్లిపోయింది. గ్వాడలజరానో, కోలిమానో గుర్తు లేదు. ఆ లోలా, అదే దోనా డలొరిస్ అన్నీ చూసుకుంటుంది, డాన్ ఎన్మెడియో పొలం అదీ. మనం అప్పు తీర్చవలసింది ఆమెకే.”

“అయితే రేపు పొద్దున నువ్వెళ్ళి లోలాని పెళ్లి చేసుకుంటానని చెప్పు.”

“ఆమె నన్నెందుకు చేసుకుంటుంది? ఇంత ముసలాడిని..”

“నీకోసం కాదు, నా కోసం అడుగు. కంటికి కాస్త నదురుగానే ఉంటుంది కదా! నేను ఆమెతో ప్రేమలో పడిపోయానని చెప్పు. ఆమెకి ఇష్టమో కాదో అడుగు. వచ్చే దారిలో ఆగి ఫాదర్ రెంటెరియాని ఏర్పాట్లు చేయమని చెప్పు. ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు జమజేయగలం?”

“ఒక్క ఏగానీ కూడా లేదు డాన్ పేద్రో!”

“సరే, అతనికి ఏదో మాట ఇద్దాం. నా చేతిలో రొక్కం పడగానే అతనికి ఇచ్చేస్తానని చెప్పు. అతను అడ్డు వస్తాడని నేననుకోను. రేపే చేయి ఆ పని. పొద్దున్నే.”

“మరి ఆల్డ్రెట్ సంగతి ఏం చేద్దాం?”

“ఆల్డ్రెట్‌తో మనకి సంబంధమేముంది? నువు ప్రెసిడియో ఆడవాళ్ళు, ఫ్రెగోసోస్, ఇంకా గుజ్మాన్ల గురించే కదా చెప్పావు? ఇప్పుడు ఈ ఆల్డ్రెట్ సంగతేమిటి?”

“సరిహద్దుల గొడవ. అతను చుట్టూ కంచెలు వేస్తూ ఉన్నాడు. చివరి భాగం మనం వేస్తే సరిహద్దుల పని పూర్తి అయిపోతుందంటున్నాడు”

“అదంతా తర్వాత. ఆ కంచెలగురించి ఇప్పుడు ఆలోచించకు. కంచెలూ అవీ ఏవీ ఉండవు. పొలాన్నేమీ భాగాలు వేయడం లేదు. ఆలోచించు ఫుల్గోర్, ఇప్పుడే ఎవరికీ చెప్పకు. ఇప్పుడు మాత్రం  ముందు ఆ లోలాతో కుదుర్చు. కూర్చో రాదా?”

“కూర్చుంటాను డాన్ పేద్రో. దేవుడి మీదొట్టు, నీతో పనిచేయడమంటే పసందుగా ఉండేటట్లుంది.”

“లోలాను దారిలో పెట్టు, నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పు. అది ముఖ్యం. అది నిజమే సెడానో, ఆమెని నిజంగానే ప్రేమిస్తున్నాను. తెలుసా, ఆమె కళ్లు చూసే! నువ్వు పొద్దున్నే తొట్టతొలిగా ఆ పని చేయి. కొన్ని బరువుబాధ్యతలనించి నిన్ను తప్పిస్తాను. ఆ మెదియా లూనాను నాకొదిలేయి.”

 

జిత్తులన్నీ ఈ కుర్రాడు ఎక్కడ నేర్చాడో అనుకున్నాడు ఫుల్గోర్ సెడనో రెండోసారి మెదియాలూనాకి వెళ్ళినప్పుడు. అతను ఏదయినా చేయగలడని అనుకోలేదు నేను. “వాడొట్టి పనికిమాలినవాడు” మా పెద్దాయన డాన్ లూకాస్ అనేవాడు. “పుటకతోటే చవట”. నేనేం వాదించలేకపోయాను. “ఫుల్గోర్, నేను పోయాక వేరే ఉద్యోగం చూసుకో!” “అట్లాగే డాన్ లూకాస్!” “ఫుల్గోర్, ఏదో తిండికయినా సంపాదించుకుని నేను పోయాక తల్లిని చూసుకుంటాడని బడికి పంపుదామని చూశా. అదీ మధ్యలో వదిలేశాడు.” “మీకు రావలసిన కష్టం కాదు డాన్ లూకాస్” “వాడిమీద ఏ ఆశలూ పెట్టుకోకు. ఆఖరికి నా వయసు ఉడిగాక నన్ను చూసుకోబోడు. దేనికీ కొరగాకుండాపోయాడు. అంతే!” “సిగ్గుచేటు డాన్ లూకాస్!”

 

ఇప్పుడు ఇట్లా. మెదియాలూనా మీద అంత ఇష్టమే లేకపోయినట్లయితే మిగెల్ని కలిసేవాడే కాదు. అతన్ని కలవకుండానే వెళ్ళిపోయేవాడు. ఆ నేలంటే తనకి చాలా ప్రేమ: దున్నగా దున్నగా ఏ యేటికాయేడు కొద్దికొద్దిగా పట్టు సడలించుకుంటున్న బంజరు కొండలు.. ప్రేమాస్పదమైన మెదియాలూనా.. ఎమ్మెడియో పొలంలాగా కొత్తగా కలుస్తున్నవీ..”దగ్గరకురా ప్రియతమా”. అతను చూడగలుగుతున్నాడు అప్పటికే జరిగిపోయినట్లు. మరి ఒక స్త్రీ ఏ మాత్రం? “అంతే” అంటూ కొరడాతో కాలిమీద కొట్టుకుంటూ ఆ కొట్టం ప్రధాన ద్వారం దాటాడు.

 

లోరిస్‌ను బుట్టలో వేసుకోవడం తేలికగానే అయిపోయింది. ఆమె కళ్ళు వెలిగి మొహంలో కంగారు కనిపించింది.

“అబ్బ, సిగ్గుగా ఉంది క్షమించండి డాన్ ఫుల్గోర్! డాన్ పేద్రో అసలు నన్ను గమనించాడంటేనే నమ్మలేకపోతున్నాను.”

“నీగురించి ఆలోచిస్తూ నిదరకూడా పోవడం లేదు.”

“ఆయన కావాలంటే ఎవర్నయినా ఎంచుకోవచ్చు. కోమలాలో ఎంతమంది అందగత్తెలు లేరు? ఈ సంగతి తెలిస్తే వాళ్ళేమంటారో!”

“అతను నిన్ను తప్ప వేరెవరి గురించీ తలవడం లేదు. ఒక్క నిన్నే!”

“నాకు దడ పుట్టిస్తున్నావు డాన్ ఫుల్గోర్! కలలోకూడా అనుకోలేదు..”

“అతను ఎక్కువ మాట్లాడే రకం కాదు. చచ్చి ఎక్కడున్నాడో ఆ డాన్ లూకాస్ పారమొ నిజానికి నువ్వు అతనికి తగవనే చెప్పాడు. తండ్రి మీద గౌరవంతో నోరు మెదపలేదు. ఇప్పుడు ఆయన పోయాక అడ్డేముంది? ఇది అతని మొదటి నిర్ణయం – నేనే ఆలస్యం చేశాను పనుల్లో పడి. పెళ్ళి ఎల్లుండి అయితే నీకు ఫర్వాలేదా?”

“అంత తొందరగానా? ఏవీ సిద్ధంగా లేవు. పెళ్ళిబట్టలూ వాటికి సమయం కావాలి. అక్కకి ఉత్తరం రాయాలి. లేదులే ఎవరి చేతనన్నా కబురు పంపిస్తా. కానీ ఏం చేసినా ఏప్రిల్ 8 లోగా తయారు కాలేము. ఇవాళ ఒకటి కదా! అవును, ఎనిమిదికంటే ముందు కుదరదు. ఈ కొద్దిరోజులూ ఆగమని చెప్పు.”

“కుదిరితే ఈ క్షణంలోనే చేసుకుందామని ఉందతనికి. పెళ్ళి డ్రస్సే సమస్య అయితే, అది మేం తీసుకు వస్తాం. చనిపోయిన వాళ్లమ్మ కోరిక ప్రకారం ఆమె పెళ్ళి డ్రస్ నీకే చెందుతుంది. అది వాళ్ల వంశాచారం.”

“అంత సమయం కావాలనడానికి వేరే కారణం కూడా ఉంది. అది ఆడవాళ్ల సమస్య, తెలుసు కదా! అయ్యో, చెప్పడానికి ఇబ్బందిగా ఉంది డాన్ ఫుల్గోర్.నా మొహం రంగులు మారుతూ ఉండి ఉండాలి. ఛీ, ఎట్లా చెప్పాలి? సిగ్గుగా ఉంది.ఇది నా నెలసరి..”

“అయితే ఏమయిందమ్మా! పెళ్ళంటే నీ నెలసరా కాదా అన్న ప్రశ్నే కాదు. అది ఒకళ్లనొకళ్లు ప్రేమించుకోవడం. అదుంటే ఇక ఏదెట్లా అయినా ఫర్వాలేదు.”

“నేనేం చెపుతున్నానో మీకు అర్థమవుతున్నట్లు లేదు డాన్ ఫుల్గోర్!”

“నాకు అర్థమయింది. పెళ్ళి ఎల్లుండే.”

వారం కోసం, ఒక్క వారం కోసం ఆమె చేతులు సాచి బ్రతిమలాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.

డాన్ పేద్రోకి చెప్పడం మర్చిపోకూడదు – దేవుడా ఆ పేద్రో ఎంత చురుకైన వాడు – ఆస్తిని ఉమ్మడి యాజమాన్యం కిందకి మార్చమని జడ్జికి గుర్తు చేయమని అతనికి చెప్పడం మర్చిపోకూడదు. రేపుపొద్దున్నే ఆ సంగతి అతనికి చెప్పడం మర్చిపోకు ఫుల్గోర్!

ఈలోపు డలోరిస్‌ వేడి చేయడానికి నీళ్లు వంటగదికి తీసుకునిపోతూంది. “తొందరగా వచ్చేందుకు నేనేమయినా చేయాలి. ఏం చేసినా మూడు రోజులు ఉంటుంది. ఇంకో మార్గం లేదు. కానీ, ఎంత ఆనందంగా ఉందో! చాలా ఆనందంగా ఉంది. దేవుడా , నీకు కృతజ్ఞతలు ఎలాతెలుపుకోను డాన్ పేద్రోని నాకిచ్చినందుకు!” మళ్ళీ అనుకుంది “ఆ తర్వాత అతనికి నేనంటే మొహం మొత్తినా ఫర్వాలేదు!”

పెద్రో పారమొ-4

pedro1-1
నీటి చుక్కలు నిలకడగా రాతి దోనె మీద పడుతున్నాయి. తేట నీరు రాతిమీదినుంచి తప్పించుకుని కలశంలోకి పడుతున్న చప్పుడును గాలి మోసుకొస్తూంది. అతనికి చప్పుళ్లన్నీ వినిపిస్తున్నాయి. నేలను రాపాడుతున్న పాదాలు, ముందుకూ వెనక్కూ, ముందుకూ వెనక్కూ. విడుపులేకుండా బొట్లు బొట్లుగా జారడం. కలశం నిండి నీరు తడినేలమీదికి పొంగడం.
“లే!” ఎవరో లేపుతున్నారు.
అతనికి ఆ గొంతు వినిపిస్తూంది. గుర్తు పట్టడానికి ప్రయత్నిస్తూనే నిద్రమత్తు బరువుకు మునిగిపోతూ ఉన్నాడు.దుప్పటి వేడిలో కుదురుగా ముణగదీసుకున్నాడు.
“లే!” మళ్ళీ ఎవరో పిలుస్తున్నారు.
ఆ ఎవరో భుజాలు పట్టుకు కుదుపుతున్నారు. అతన్ని లేపి కూచోబెడుతున్నారు. అతను కళ్ళు సగం తెరిచాడు. రాతి మీద నుంచి పొంగుతూ కలశంలోకి పడుతున్న నీటి చప్పుడు అతను మళ్లీ విన్నాడు. అటూ ఇటూ పడుతున్న అడుగుల చప్పుడు. ఇంకా ఏడుపు.
అప్పుడు అతను ఎవరో ఏడవడం విన్నాడు. అతన్ని లేపింది అదే – మెత్తగా ఉన్నా చొచ్చుకునిపొయే ఏడుపు- అంత పదునుగా ఉండబట్టే అతని నిద్ర కంచె దాటుకుని అతని లోలోపలి భయాన్ని తట్టి లేపగలిగింది.
నెమ్మదిగా పక్కమీదినుంచి లేచాడు. ద్వారానికి ఆనించి ఉన్న ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూంది.
“ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అతను అడిగాడు. నేలమీద అడుగు పెట్టగానే తల్లి మొహం గుర్తు పట్టాడు.
“మీ నాన్న చనిపోయాడు.” ఆమె అంది.
అప్పుడు చుట్టలు చుట్టుకున్న ఆమె దుఃఖం ఒక్కసారిగా విప్పుకుంది .తట్టుకోలేక ఆమె గుండ్రం గుండ్రంగా అక్కడక్కడే తిరిగింది. చేతులతో భుజాలు పట్టుకుని ఆ వ్యధిత దేహం తిరగడం ఆపేదాకా.
వాకిలిగుండా ఉదయ సంధ్య కనిపిస్తూంది. పైన చుక్కలేమీ లేవు. ఇంకా రవికిరణాలు సోకని బూడిద రంగు ఆకాశం ఒక్కటే. పొద్దుపొడుపు కంటే పొద్దుగూకడాన్నే సూచిస్తున్నట్టు మసక చీకటి.
బయట వరండాలో అడుగుల చప్పుడు మనుషులు అక్కడికక్కడే గుండ్రంగాతిరుగుతున్నట్టు. మెత్తటి చప్పుడు. లోపల వాకిలికడ్డంగా ఆమె రాబోయే రోజును ఆపేస్తున్నట్టు. ఆమె చేతుల సందుల్లోంచి ఆకాశం ముక్కలూ, పాదాల కిందనుంచి స్రవిస్తున్న వెలుతురు. తడి వెలుతురు, కింద నేలంతా ఆమె కన్నీటి వరద ముంచేసినట్టు. ఆపైన వెక్కిళ్ళ ఏడుపు. మళ్ళీ అదే మెత్తటి కోసుకుపోయే ఏడుపు. ఆమె శరీరాన్ని మెలికలు తిప్పుతున్న బాధ.
“వాళ్ళు మీ నాన్నను చంపేశారు.”
మరి నిన్నో అమ్మా? నిన్నెవరు చంపేశారు?
గాలీ, పొద్దూ ఉన్నాయి, మబ్బులూ ఉన్నాయి. పైపైన నీలాకాశం, ఆపైన పాటలున్నాయేమో, తీయటి గొంతుకలు. ఒక్కమాటలో, ఆశ. మనందరికీ ఆశ,ఉంది, మన బాధలు తీర్చే ఆశ.
“కానీ నీకు కాదు మిగెల్ పారమొ! నీకు క్షమాపణ దొరక్కుండానే చనిపోయావు. దైవకృప నీకెన్నటికీ తెలియదు.”
ఫాదర్ రెంటెరియ మృతజీవుల ప్రార్థన చేస్తూ శవం చుట్టూ తిరిగాడు.తొందరగా ముగించేసి, చర్చి నిండా చేరిన వాళ్లకి చివరి దీవెన అందించకుండానే వెళ్ళిపోయాడు.
“ఫాదర్, మీరు అతన్ని దీవించాలని మా కోరిక.”
“లేదు!” గట్టిగాతలూపుతూ చెప్పాడు. “నేను దీవెన ఇవ్వను. అతను దురాత్ముడు. ప్రభువు రాజ్యం చేరడానికి వీల్లేదు. అందుకు నేను పాల్పడితే ప్రభువు నాపట్ల దయచూపడు.”
మాట్లాడుతూ, చేతులు గట్టిగా కట్టుకున్నాడు వణుకుతున్నట్టు తెలియకుండా ఉండాలని. కుదరలేదు.
ఆ శవం అక్కడున్న వారందరి ఆత్మల మీదా పెద్ద బరువై నిలిచింది. చర్చి మధ్యలో వేదికపైన ఉందది చుట్టూ కొవ్వొత్తులూ, పూలతో. తండ్రి అక్కడే నిల్చున్నాడు, వొంటరిగా, ప్రార్ధన అయ్యేదాకా.
ఫాదర్ రెంటెరియ పేద్రో పారమొ ని దాటుకుని వెళ్ళాడు, అతన్ని తాకకుండా జాగ్రత్తపడుతూ. పరిశుద్ధజలాన్నుంచిన పాత్రను నెమ్మదిగా పైకెత్తి శవపేటిక పైనుంచి కింద దాకా చిలకరించాడు పెదాలనుంచి ప్రార్థనలాంటిదేదో గొణుగుతూ. అతను మోకరిల్లగానే అందరూ మోకరిల్లారు.
“భగవంతుడా, ఈ నీ సేవకుడి మీద దయ చూపు!”
“అతని ఆత్మకు శాంతి కలుగు గాక! తధాస్తు!” అందరి గొంతులూ ఒక్కటై పలికాయి.
మళ్ళీ అతని లోపలి క్రోధం రేగుతూంది. మిగెల్ పారమొ శవాన్ని మోసుకుంటూ అందరూ చర్చి బయటికి వెళుతున్నారు.

pedro_paramo1
పేద్రో పారమొ అతని వద్దకు వచ్చి పక్కనే మోకరిల్లాడు.
“మీరు వాడిని అసహ్యించుకుంటున్నారని తెలుసు ఫాదర్! దానికి కారణమూ ఉందనుకోండి. మీ అన్నని మావాడు చంపాడన్న వదంతి ఉంది. మీ అన్న కూతురిని వాడు చెరిచాడనీ మీరు నమ్ముతున్నారు. ఆపైన వాడు చేసిన అవమానాలూ, ఎవరినీ లెక్కచేయకపోవడమూ. ఆ కారణాలు ఎవరయినా అర్థం చేసుకుంటారు. కానీ అవన్నీ మరచిపొండి ఫాదర్! అతన్ని క్షమించండి, బహుశా దేవుడు క్షమించినట్టుగానే!”
గుప్పెడు బంగారు నాణేలు అక్కడ ఉంచి పైకి లేచాడు. “మీ చర్చికి వీటిని బహుమతిగా తీసుకోండి.”
చర్చి ఖాళీ అయింది అప్పటికి. వాకిలి దగ్గర ఇద్దరు పేద్రో పారమొ కోసం ఎదురు చూస్తున్నారు. అతను వాళ్ళతో కలవగానే అంతా కలిసి అప్పటిదాకా వాళ్ళ కోసం ఆగి ఉన్న శవపేటిక వెంట నడిచారు. మెదియా లూనాకి చెందిన నలుగురు పనివాళ్లు మోస్తున్నారు దాన్ని. ఫాదర్ రెంటెరియ ఆ నాణేలు ఒక్కొక్కటే ఏరుకుని దైవపీఠం వైపు నడిచాడు.
“ఇవి నీవి.” అతను చెప్పాడు. “అతను విముక్తిని కొనుక్కోగలడు. ఇది సరయిన ధర అవునో కాదో నీకే తెలియాలి. నావరకూ, దేవా, నీపాదాల మీద పడి న్యాయమో అన్యాయమో వేడుకుంటాను అందరిలాగే… వాణ్ణి నరకంలో తోసేయి!”
ప్రార్థనామందిరాన్ని మూశాడు.
పాతసామాన్ల గదిలోకి వెళ్ళి ఒక మూలన కూలబడ్డాడు. బాధతో, వ్యధతో కన్నీరు ఇంకిందాకా అక్కడే కూచుని ఏడ్చాడు.
“సరే ప్రభూ, నువ్వే గెలిచావు!”

భోజనాల సమయానికి, ప్రతి రాత్రీ తాగినట్టుగానే వేడి చాకొలేట్ తాగాడు. మనసు నెమ్మదించింది.
“అనీతా, ఇవాళ ఎవరిని పూడ్చారో తెలుసా నీకు?”
“తెలియదు బాబాయ్!”
“మిగెల్ పారమొ గుర్తున్నాడా?”
“ఆఁ”
“వాణ్ణే!”
అనీత తల వేలాడేసింది.
“కచ్చితంగా వాడేననని నీకు నమ్మకమేగా?”
“ఏమో బాబాయ్! అతని మొహం నేను చూడలేదు. ఒక్కసారిగా మీద పడ్డాడు. చీకటి.”
“మరి అది మిగెల్ పారమొ అని నీకెలా తెలుసు?”
“ఎట్లా అంటే అతను చెప్పాడు: ‘అనా నేను మిగెల్ పారమొని. భయపడకు.’ అదీ అతను చెప్పింది.”
“ కానీ వాడే మీ నాన్న చావుకు కారణమని తెలుసు కదూ?”
“తెలుసు బాబాయ్!”
“మరి నువ్వేం చేశావు వాణ్ణి వెళ్లగొట్టడానికి?”
“నేనేమీ చేయలేదు.”
ఇద్దరూ మాట్లాడకుండా ఉండిపోయారు. మర్టిల్ ఆకుల్ని కదుపుతున్న వేడి గాలి చప్పుడు ఇద్దరి చెవులా పడుతూంది.
“అతనందుకే వచ్చానని చెప్పాడు – అందుకు సారీ చెప్పి నన్ను క్షమించమని అడగడానికి. నేను మంచం మీద కదలకుండా పడుకునే కిటికీ తెరిచే ఉందని చెప్పాను. అతను లోపలికి వచ్చాడు. ముందుగా నా చుట్టూ చేతులు వేశాడు, అతను చేసిన తప్పుకు క్షమాపణ అడగడానికి అదే అతని పద్ధతి అన్నట్టు. నేను అతని వంక చూసి చిరునవ్వు నవ్వాను. మనం ఎవరినీ అసహ్యించుకోకూడదని నువు చెప్పింది నాకు బాగా గుర్తుంది. అందుకే, ఆ విషయం అతనికి తెలియడానికే నవ్వాను కానీ ఆ చీకటిలో అది అతనికి కనపడదని వెంటనే తెలియలేదు. అతని శరీరం నామీద పడటం, చీదర పనులు చేయడం మాత్రమే తెలుస్తూంది.”
“నన్ను చంపబోతున్నాడని అనుకున్నాను. అదే గట్టిగా అనుకున్నాను బాబాయ్! ఆ తర్వాత ఆలోచించడం మానేశాను అతను చంపేలోగానే చనిపోదామని. అంత ధైర్యం చేయలేకపోయాడనుకుంటాను.”
“అతను చంపలేదని నేను కళ్ళు తెరిచి పొద్దుటెండ కిటికీలోంచి పడటం చూసినప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేను నిజంగానే చనిపోయాననుకున్నాను.”
“ఏదో రకంగా నీకు కచ్చితంగా తెలిసే ఉండాలి. అతని గొంతు. అతని గొంతు బట్టి గుర్తు పట్టలేదా?’”
“నేనతన్ని అసలు గుర్తు పట్టలేదు. అతని గురించి నాకు తెలిసిందల్లా నాన్నను చంపాడనే. అతన్ని అదివరకెన్నడూ చూడలేదు, ఆ తర్వాతా చూడలేదు. అతని ఎదురుపడగలిగేదాన్నా బాబాయ్?”
“కానీ అతనెవరో నీకు తెలుసు.”
“అవును. అతనేమిటో కూడా. ఇప్పుడు నరకబాధలు అనుభవిస్తుంటాడని కూడా తెలుసు. సెయింట్స్ అందరినీ నా మనసుతో, ఆత్మతో ప్రార్థించాను.”
“అంత నమ్మకం పెట్టుకోకు అమ్మాయ్! అతనికోసం ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో ఎవరికి తెలుసు? నువ్వొక్క దానివే. వేల ప్రార్థనలకు ఎదురుగా ఒక్క ప్రార్థన. అందులోనూ కొన్ని నీ ప్రార్థన కంటే తీవ్రమైనవి, అతని తండ్రి ప్రార్థనలాంటివి.
“ఏమయినా నేను అతన్ని క్షమించేశాను.” అనబోయాడు. కేవలం అనుకున్నాడు. ఛిద్రమయిన ఆ అమ్మాయి ఆత్మను మరింత బాధకు గురి చేయడం ఇష్టం లేకపోయింది. అందుకు బదులు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాడు “ప్రభువైన మన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం ఇంత కీడు చేసిన వాణ్ణి ఈ భూమ్మీదనుంచి తీసుకు పోయినందుకు. తన స్వర్గానికి తీసుకుపోయాడో లేదో మనకెందుకు?”
కోంట్లా రోడ్డును పెద్ద బజారు కలిసేదగ్గర ఒక గుర్రం పరుగులు తీస్తూ ఉంది. దాన్నెవరూ చూడలేదు. అయితే ఊరి బయట దేనికోసమో ఎదురుచూస్తూన్న ఒక స్త్రీ ఆ గుర్రాని చూచాననీ, అది బొక్కబోర్లా దొర్లబోయినట్టు దాని ముంగాళ్లు వంగబడిపోయాయనీ చెప్పింది. అది మిగెల్ పారమొ టేకుమాను రంగు గుర్రం అని గుర్తుపట్టిందామె. అది తన మెడ విరగ్గొట్టుకుంటుందేమోనన్న ఆలోచన ఆమె మనసులో మెదిలింది. తరవాత అది దాని కాళ్లమీద నిలబడి కింద వదిలేసినదాన్నేదో చూసి భయపడుతూ ఉన్నట్టు మెడ మాత్రం వంచి మామూలుగానే పరుగులు తీయడం మొదలుపెట్టింది.
ఖననం జరిగిన రాత్రి శ్మశానాన్నించి అంత దూరమూ నడిచివచ్చి మగవారంతా విశ్రాంతి తీసుంటూ ఉండగా ఈ కథ మెదియాలూనా చేరింది. జనాలు పడుకునేముందు కబుర్లు చెప్పుకునేట్టు వాళ్ళూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “ఈ చావు నన్ను నాలుగు రకాలుగా బాధిస్తూంది.” టెరెన్సియో లుబియానెస్ అన్నాడు “ నా భుజాలింకా తీపులు పుడుతూనే ఉన్నాయి.”
“నావి కూడా!” అన్నాడు అతని అన్న ఉబియాడో. “నా మడమలు అంగుళమన్నా వాచి ఉంటాయి.ఇదేదో పవిత్ర దినంఅయినట్టు ఆ పెద్దాయన మనల్ని బూట్లు వేసుకోమనబట్టే, కదా టోరిబియో?”
“నన్నేం చెప్పమంటావు? ఇంత తొందరగా పైకి పోవడమే నయం!”
ఇంకొన్ని రోజులకు కోంట్లా నుంచి ఇంకో వార్త వచ్చింది. అది ఒక ఎడ్ల బండితో.
“అతని ఆత్మ అక్కడే తిరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఒక స్నేహితురాలి కిటికీ తట్టడం చూశారు. అంతా అతని లాగే ఉంది.”
“కొడుకు అట్లా ఆడోళ్ళ కిటికీలు తడుతూంటే డాన్ పేద్రో వదిలేస్తాడనుకున్నావా? అతనికి తెలిస్తే – ‘సరే నువ్వు చనిపోయావు, నీ సమాధిలో నువ్వుండు. ఇవన్నీ మాకు వదిలేయి.’ అనడూ! అట్లా తిరిగేప్పుడు పట్టుకుంటే సమాధిలోంచి మళ్ళీ లేవకుండా పూడ్చిపెట్టడూ?”
“నువు చెప్పేది నిజమే ఇసయ్యస్. ఆ ముసలాయన దేన్నీ భరించలేడు”
బండి తోలే అతను తన దారిన తను వెళ్ళిపోయాడు “నేను విన్నదే మీకు చెపుతున్నాను” అంటూ.
తారాజువ్వలు. ఆకాశాన్నుండి నిప్పుల వాన కురుస్తున్నట్టు.
“అటు చూడండి.” టెరెన్సియో అరిచాడు “ మనకోసం ఆట మొదలుపెట్టారు చూడండి!”
“మిగెలిటో తిరిగొచ్చాడని సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు.” జీసస్ అన్నాడు. “అపశకునం కాదా అది?”
“ఎవరికి?”
“మీ చెల్లి ఒంటరిగా ఉందేమో, అతను తిరిగి రావాలని కోరుకుంటుందేమో!”
“ఎవరితో మాట్లాడుతున్నావు?”
“నీ తోటే!”
“ఇక పదండి, పొద్దుపోయింది. ఇవాళ్టి తిరుగుడుకి సాలిపోయింది. మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి.”
చీకట్లో నీడల్లా కలిసిపోయారు వాళ్ళు.
తారా జువ్వలు. ఒక్కటొక్కటిగా కోమలాలో దీపాలు ఆరిపోయాయి.
ఇక రాత్రిని అకాశం ఆక్రమించుకుంది.
ఫాదర్ రెంటెరియా నిద్రపట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు.
అది నా తప్పే అనుకున్నాడు. జరిగేదంతా. నా బాగోగులు చూసే వాళ్ళను బాధించాలంటే కలిగే భయం వల్ల. అది నిజమే, నా జీవనాధారానికి వాళ్ళకి రుణపడి ఉన్నాను. పేదవాళ్ళనుంచి చిల్లిగవ్వ రాదు, ప్రార్థనలు పొట్ట నింపవని ఆ పైవాడికీ తెలుసు. ఇప్పటిదా అట్లాగే గడిచింది. దాని పర్యవసానం ఇప్పుడు తెలుస్తూంది. అంతా నా తప్పే. నన్ను ప్రేమించినవారికీ, నాపై నమ్మకముంచి తమ తరఫున దేవుడిని ప్రార్థించమని అడగవచ్చిన వారికీ ద్రోహం చేశాను. నమ్మకం ఏం సాధించింది వాళ్ళకి? స్వర్గమా? వాళ్ల ఆత్మల పారిశుధ్ధ్యమా? వాళ్ళ ఆత్మలను పరిశుద్ధం మాత్రం చేయడమెందుకు చివరి క్షణాల్లో.. వాళ్ల చెల్లి ఎదువిజస్ ను కాపాడమని వచ్చిన మరియా ద్యాడ మొహాన్ని ఎప్పటికీ మరవలేను.
“ఆమె ఎప్పుడూ తోటివాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. వాళ్ళకి తనకున్నదంతా ఇచ్చింది. వాళ్ళకు కొడుకుల్నీ ఇచ్చింది. అందరికీ. పసిపాపలని వాళ్ళ తండ్రుల దగ్గరకు గుర్తుపట్టడానికి తీసుకు వెళ్ళింది. ఎవరూ పట్టించుకోలేదు. ‘అయితే వాళ్ళకి తండ్రినీ నేనే అవుతాను, తల్లివి కమ్మని విధి రాసినా.’ అని చెప్పిందామె వాళ్ళకి. ఆమె మంచితనాన్నీ, ఆదర స్వభావాన్నీ ప్రతివాళ్ళూ వాడుకున్నవారే. ఆమె ఎవరినీ బాధించాలనుకోలేదు, ఎవరితో గొడవా పెట్టుకోదలచలేదు.”

“కానీ ఆమె తన ప్రాణం తనే తీసుకుంది. దైవాజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించింది.”
“అంతకంటే ఏం చేయగలదు? అది కూడా ఆమె మంచితనం వల్లే చేసింది.”
“చివరి గడియలో ఆమె పుణ్యం చాలకపోయింది.” మరియా ద్యాడతో చెప్పాను.
“చివరి క్షణంలో. ముక్తి కోసం అన్ని మంచిపనులూ చేసి అంత పుణ్యమూ మూటగట్టుకుని అంతా ఒక్కసారిగా ఎట్లా పోగొట్టుకుంటుంది?”
“అదంతా ఎక్కడికీ పోదు. ఆమె దుఃఖం వల్ల మరణించింది. ఆ దుఃఖం… దుఃఖం గురించి నువ్వెప్పుడో నాకు చెప్పావు గానీ నాకు గుర్తు రావడం లేదు. ఆమె దుఃఖం వల్ల ఆమె పోయింది. ఆమె రక్తమే గొంతుకడ్డం పడి ఊపిరాడక చనిపోయింది. ఆమె ఎట్లా అగపడేదో ఇంకా కళ్ళకు కట్టినట్టే ఉంది.అంత విషాదగ్రస్తమయిన మొహం నేనెప్పుడూ చూడలేదు.”
“కాస్త ఎక్కువ ప్రార్థనలు చేస్తే ఏమన్నా..”
“మేము చాలా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము ఫాదర్!”
“పోనీ, బహుశా, గ్రెగోరియన్ ప్రార్థనలు. కానీ అవి చేయాలంటే మన వల్ల కాదు. ఇంకా మతాచార్యులని పిలిపించాలి. దానికి ఖర్చవుతుంది.”
నా కళ్ళ ఎదుట, పిల్లలతో పండి పేదదయిన మరియా ద్యాడ మొహం.
“నాదగ్గర చిల్లి గవ్వ లేదు. ఆ సంగతి నీకు తెలియదా ఫాదర్!”
“సరే ఇట్లాగే వదిలేద్దాం. భగవంతుని యందు విశ్వాసాన్ని ఉంచుదాం.”
“సరే ఫాదర్!”
అలా వదులుకోవడంలోనూ ఆమె ఎందుకంత ధైర్యంగా కనిపించింది? సునాయాసంగా ఒకటో అరో మాట – ఒక ఆత్మను కాపాడడానికి వంద అవసరమయితే వంద – చెప్పడంలో, క్షమాభిక్ష ప్రసాదించడంలో తనకి పోయిందేముంది? స్వర్గనరకాల గురించి తనకేం తెలుసు? ఒక పేరులేని ఊళ్ళో ఒక ముసలి మతగురువుకు కూడా స్వర్గానికెవరు అర్హులో తెలుసు. ఆ వరస అంతా తనకి తెలుసు. క్రిస్టియన్ సెయింట్స్ పట్టికలో కేలెండర్లో ప్రతిరోజుకూ ఉండే సెయింట్స్ తో మొదలు పెట్టాడు – సెయింట్ నునిలోన, కన్య,వీర మరణం పొందినది, అనెర్సియో పెద్ద మతాధికారి, సలోమి, విధవ, అలోదీ, నులీన కన్యలు, కోర్డుల, దోనాటొ” అదే వరసలో ఇంకా కిందికి. అతను నిద్రలోకి జారుకోబోతూ లేచి తిన్నగా పక్క మీద కూచున్నాడు. “నిద్ర పట్టడానికి గొర్రెల్ని లెక్క పెడుతున్నట్టు నేను సెయింట్స్ పేర్లు అప్పచెబుతున్నాను.”
అతను బయటికి వెళ్ళి ఆకాశం వంక చూశాడు. చుక్కలు కురుస్తున్నాయి. ఆకాశం ప్రశాంతంగా కనపడక అతను విచారించాడు. రాత్రి దుప్పటి భూమిని కప్పుతున్నట్టు అనిపించింది. “నరక కూపం” ఈ భూమి.

పెద్రో పారమొ-౩

pedro1-1

“.. నేను

చెపుతున్నాయన మెదియా లూనా కొట్టం దగ్గర గుర్రాలను మాలిమి చేసి దారికి తెస్తుండేవాడు. తన పేరు ఇనొసెంసియో ఒజారియో అని చెప్పేవాడు. గుర్రమెక్కితే దానికి అతుక్కుపోతాడంతే. అందరూ చికిలింతగాడనే పిలిచేవాళ్ళు. అతను గుర్రాల్ని లొంగదీసేందుకే పుట్టాడనేవాడు మా పేద్రో. అసలు సంగతేమిటంటే అతని దగ్గర ఇంకో విద్య ఉంది: మంత్రాలేయడం. కలల్ని మంత్రించేవాడు. నిజానికి అతని అసలు పని అదే. మీ అమ్మకూ వేశాడు చాలా మందికి వేసినట్టే. నాక్కూడా. నాకు వొంట్లో బాలేనప్పుడు ఒకసారి వచ్చి ‘నీకు నయం చేయడానికి వచ్చాను ‘ అని చెప్పాడు. దానికర్థం ఏమిటంటే మొదట రుద్దడమూ, మర్దనా చేయడమూ: ముందు నీ వేళ్లకొసలూ, తర్వాత నీ అరిచేతులూ, ఆపైన చేతులూ. నీకు తెలిసేలోగా నీ కాళ్ళ మీద మొదలెడతాడు గట్టిగా రుద్దుతూ. కాసేపట్లో వొళ్ళంతా వేడి పుడుతుంది. అలా రుద్దుతూ తోముతూ దువ్వుతున్నంతసేపూ నీకు నీ జాతకం చెపుతూ ఉంటాడు. మైకంలో పడిపోయి గుడ్లు తిప్పుతూ ఉమ్మి తుంపర్లు చుట్టూ చిందేట్టు ఆవాహన చేస్తూ, శాపనార్థాలు పెడుతూ – చూస్తే ఏ సంచారజాతి మంత్రగాడో అనుకుంటావు. కొన్నిసార్లు చివరికి దిసమొలతో మిగిలిపోతాడు; అట్లా కావాలనే చేశాననేవాడు. కొన్నిసార్లు అతను చెప్పేవి నిజమయ్యేవి. గుప్పెడు రాళ్లు విసిరితే ఒకప్పటికయినా ఏదో ఒకటి తగలకపోదు.
“ఇంతకీ ఏమయిందంటే మీ అమ్మ ఆ రోజు ఈ ఒజారియోని చూడబోయింది. చంద్రుడు సరియైన స్థానంలో లేడు కాబట్టి ఆ రాత్రి ఆమె మగాడితో కలవడం కూడదని అతను చెప్పాడు.
“ఏం చేయాలో తెలియక డలోరిస్ వచ్చి నాకు అంతా చెప్పింది. పేద్రోతో పడుకునే ప్రశ్నే లేదని చెప్పింది. అది అమె శోభనం రాత్రి. నేనేమో ఆ మోసకారి, అబద్ధాలకోరు ఒజారియో మాటలు పట్టించుకోవద్దని నచ్చచెప్పచూశాను.
“ ‘నా వల్లకాదు.’ చెప్పిందామె. ‘నా బదులు నువ్వెళ్లు. అతనికి తెలియదులే!’
“ఆమె కంటే నేను చాలా చిన్నదాన్నే అనుకో! ఆమె అంత రంగు తక్కువా కాదు. అయినా చీకటిలో నీకు ఏం కనిపిస్తుంది?
“‘అది కుదిరేపని కాదు డలోరిస్, నువు వెళ్లక తప్పదు.’
“‘నాకీ ఒక్క సాయం చేయి. నీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాను.’
“ఆ రోజుల్లో మీ అమ్మకు సిగ్గులొలికే చక్కటి కళ్లుండేవి. ఆమెను చూడగానే కొట్టొచ్చినట్టు కనిపించేది ఆమె కళ్లే. అవి నిన్ను పూర్తిగా జయించేయగలవు.
“‘నా బదులు నువ్వెళ్ళు ‘ అని అడుగుతూనే ఉంది.
“అందుకని నేను వెళ్లాను.
“చీకటి కొంత ఊతమిచ్చింది, ఇంకొంత మరొకటి – మీ అమ్మకి తెలియనిది ఏమిటంటే పేద్రో పారమొ అంటే మీ అమ్మకొక్కదానికే కాదు ఇష్టం.
“అతని పక్కలో దూరాను. సంతోషంగా, ఇష్టంగానే. అతన్ని వాటేసుకుని పడుకున్నా. కానీ ఆ సంబరాల బడలికతో ఆ రాత్రంతా గుర్రుపెట్టి పడుకున్నాడు. నా కాళ్ల మధ్య తన కాళ్లు జొనపడం తప్ప ఏం చేయలేదతను.
“పొద్దు పొడిచేలోగానే లేచి డలోరిస్ దగ్గరకు వెళ్ళాను. ఆమెకి చెప్పాను ‘ఇప్పుడు నువ్వెళ్ళు. ఇది మలిరోజు కదా!’
” ‘ఏం చేశాడు నిన్ను?’ ఆమె నన్నడిగింది.
“’నాకింకా తెలియడం లేదు.’ చెప్పాను.
“మరుసటి ఏడు నువ్వు పుట్టావు కానీ మీ అమ్మను నేను కాదు, వెంట్రుక వాసిలో తప్పిపోయావు.
“మీ అమ్మ సిగ్గుపడిందేమో ఈ సంగతి నీకు చెప్పడానికి”
పచ్చటి మైదానాలు. వంపు తిరిగే రేఖల్లా కురుస్తున్న వానతో అలలవుతున్న మధ్యాహ్నం గోధుమ పొలాల్లో గాలి సుడి తిరుగుతుండగా దిగంతం లేస్తూ పడుతూ ఉంటే చూస్తూ. నేల రంగూ, అల్ఫాల్ఫా, రొట్టె వాసనా. తొణికిన తేనెల వాసనొచ్చే ఊరు…
“ఆమెకి పేద్రో పారమొ అంటే ఎప్పుడూ గిట్టేది కాదు. ‘డలోరిటస్! నాకు నాస్తా పెట్టమని వాళ్ళకి చెప్పావా?’ ప్రతి రోజూ తెల్లారకముందే లేచేది మీ అమ్మ. బొగ్గులు రాజేసేది, ఆ వాసనకి పిల్లులు లేచేవి. వెనకే పిల్లుల్నేసుకుని ఇల్లంతా అటూ ఇటూ తిరుగుతూ. ‘దోన డలోరిటస్!’
“ఆ పిలుపు ఎన్ని సార్లు విందో లెక్కలేదు. ‘దోన డలోరిటస్, ఇది ఆరిపోయింది. తీసెయ్!’ ఎన్ని సార్లు! గడ్డుకాలానికి అలవాటు పడి, ఆమె సిగ్గు పడే కళ్లు కుదురుకున్నాయి.
వేసవి వేడిమిలో నారింజ పూత వాసనలు కాక మరేదీ చవి చూడకపోవడం.
“అప్పుడు నిట్టూర్పులు విడవడం మొదలు పెట్టింది.
“’ఆ నిట్టూర్పులెందుకు డలోరిటస్?’
“ఒక మధ్యాహ్నం వాళ్ళతో వెళ్ళాను. పొలం మధ్యలో ఉన్నాం పిట్టలబారును చూస్తూ. రాబందు ఒకటి బద్ధకంగా ఆకాశంలో ముందుకీ వెనక్కీ ఎగురుతుంది.
“’ఎందుకు నిట్టూరుస్తున్నావు డలోరిటస్?’
“’నేనూ రాబందునయితే ఎగిరి మా అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని.’
“’ఇక చాలించు దోన డలోరిటస్! సరే, మీ అక్కని చూస్తావు, ఇప్పుడే. మనమిప్పుడు ఇంటికి వెళదాం, నువు నీ పెట్టెలు సర్దుకో. ఇంక నావల్ల కాదు.’
“మీ అమ్మ వెళ్లిపోయింది. ‘నిన్ను త్వరలో చూస్తాను డాన్ పేద్రో!’
“’గుడ్ బై, డలోరిటస్!’
“ఆమె మళ్ళీ మెదియా లూనాకి తిరిగి రాలేదు. కొన్ని మాసాలయ్యాక పేద్రో పారమొని ఆమె గురించి అడిగాను.
“’ ఆమెకి నాకంటే వాళ్ళక్క అంటేనే ఇష్టం. అక్కడే హాయిగా ఉన్నట్టుంది. అదీ కాక ఆమె అంటేనే విసుగు పుడుతూ ఉండింది. ఆమెని తిరిగి రమ్మనే ఉద్దేశమేదీ లేదు నాకు – నువ్వడగాలనుకున్నది అదేగా?’
“’ఎట్లా గడుస్తుంది వాళ్లకి?’
“’ఆ దేవుణ్ణే చూసుకోనీ!’
..బదులు చెల్లించనీ, కొడుకా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.
“నువ్వు నన్ను చూడడానికి వస్తున్నావని ఆమె నాకు చెప్పిందాకా అంతే. ఆమె సంగతేమీ తెలియలేదు ఆ తర్వాత.
“చాలా జరిగింది ఆ తర్వాత.” ఎదువిజస్ కి చెప్పాను. “కొలీమ లో ఉండేవాళ్లం. మా పెద్దమ్మ హెర్త్రూడిస్ వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చింది కానీ మేము తనకెంత భారమో చెపుతూనే ఉండేది. మా అమ్మనెప్పుడూ అడిగేది ‘మీ ఆయన దగ్గరకెందుకు వెళ్లవు?’
” ‘తీసుకురమ్మని ఎవర్నయినా పంపాడా? నన్ను అడిగిందాకా వెళ్లను. నిన్ను చూడాలని వచ్చాను. నువ్వంటే ప్రేమ కనుక. అందుకు వచ్చాను.’
” ‘అది నాకు తెలుసు. కానీ నువ్వు వెళ్ళే సమయమొచ్చింది. ‘
“’అది నా చేతుల్లోనే ఉంటే….’”
ఎదువిజస్ నా మాటలు వింటుందనుకున్నాను. కానీ ఆమె ఎక్కడి మాటలో ఆలకిస్తున్నట్టు తల వంచి ఉండడం గమనించాను. అప్పుడామె అంది:
“ఇంకెప్పుడు శాంతి కలిగేను నీకు?”

నువు వెళ్లిపోయిన రోజే నాకు తెలుసు మళ్ళీ నువ్వెప్పటికీ కనపడవని. సంధ్య ఆకసాన్ని నెత్తుటితో నింపుతుంటే నీపై ఎరుపు మరకలు పడుతున్నాయి. నువు నవ్వుతున్నావు. నువు వదిలిపోతున్న ఆ ఊరి గురించి నువు తరచుగా అనేదానివి “నీ వల్లే ఇష్టపడ్డాను దీన్ని. మిగతాదంతా చీదర ఇక్కడ-ఇక్కడ పుట్టడం కూడా.” నాకనిపించింది – ఈమె తిరిగి రాదు; ఈమెని ఇక ఎప్పటికీ చూడబోను.
“ఈ వేళలో ఏం చేస్తున్నావిక్కడ? పని చేయడం లేదా?”
” లేదు నానమ్మా! రొహెలియో వాళ్ల చిన్నబ్బాయిని చూడమని చెప్పాడు. వీణ్ణి అటూ ఇటూ నడిపిస్తున్నాను. ఈ పిల్లాడూ, టెలిగ్రాఫూ – రెండు పనులూ చేయలేను. ఆయనేమో ఆ పూల్ రూంలో బీరు తాగుతూ కూచుంటాడు. ఇంతా చేసి మళ్ళీ నాకేమీ ఇవ్వడు.”
“సంపాదించడానిక్కాదు నువ్విక్కడుంది, నేర్చుకోవడానికి. ఒకసారి ఏదయినా నేర్చుకుంటే అప్పుడు ఏమనా డిమాండ్ చేయడానికన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వొక పని నేర్చుకునేవాడివి. ఒక రోజు నువ్వే యజమాని కావచ్చు. కానీ దానికి ఎంతో ఓపిక కావాలి, వినమ్రంగా ఉండాలి. వాళ్లు పిల్లాడిని నడిపించమంటే ఆ పని చేయి. వోపిగా ఉండడం నేర్చుకో!”
“ఇంకెవర్నయినా నేర్చుకోమను నాయనమ్మా వోపిగ్గా ఉండడం! నా వల్ల కాదు.”
“నువ్వూ నీ తలతిక్క ఆలోచనలూ! నీకు ముందు ముందు కష్టాలు తప్పవురా పేద్రో పారమొ!”

“ఇప్పుడు నేను విన్నదేమిటి దోన ఎదువిజస్?”
కలలోంచి మేలుకుంటున్నట్టు తల విదిలించిందామె.
“అది మిగెల్ పారమొ గుర్రం, మెదియా లూనాకి వెళ్ళే దారిలో దవుడు తీస్తూంది.”
“అయితే అక్కడ ఎవరయినా ఉంటున్నారా?”
“లేదు, ఎవరూ ఉండడం లేదు అక్కడ.”
“మరి?”
“అది అతని గుర్రమొక్కటే. వస్తూ పోతూంటుంది. అదీ, మిగెల్ ఎప్పుడూ విడిగా కనపడేవారు కాదు. ఊళ్ళ వెంటబడి తిరుగుతూ ఉంటుంది అతని కోసం చూస్తూ. ఈ వేళకి తిరిగి వస్తుంది. ఆ వెర్రి జీవి పశ్చాత్తాపంతో బతకలేకపోతుందేమో! జంతువులకీ తెలుస్తుంది కాదూ తాము ఏదయినా తప్పు చేస్తే?”
“నాకర్థం కావడం లేదు. గుర్రం చేసే చప్పుళ్ళేవీ వినపడలేదు నాకు.”
“లేదా?”
“లేదు.”
“అయితే నాకు అతీంద్రియ శక్తి ఉండి ఉండాలి. దేవుడిచ్చిన వరం – లేక శాపమో! నాకు తెలిసిందల్లా దాని మూలాన బాధలు పడటమే.”

Pedro_Páramo
కాసేపటి దాకా ఏమీ అనలేదు. మళ్ళీ చెప్పింది:
“అదంతా మిగెల్ పారమొతో మొదలయింది. అతను చనిపోయిన రాత్రి జరిగిందంతా నాకొక్కదానికే తెలుసు. అతని గుర్రం మెదియా లూనా వైపు దవుడు తీస్తున్న చప్పుడు వినపడేసరికి నేను పక్క ఎక్కాను. నాకు ఆశ్చర్యమేసింది, ఎందుకంటే మిగెల్ ఆ వేళకి ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అతనొచ్చేసరికి ఎప్పుడూ వేకువజాము అయ్యేది. ప్రతి రాత్రీ అతను కాస్త దూరంలోనే ఉన్న కోంట్ల వెళ్ళేవాడు తన ప్రేయసి కోసం. తొందరగా వెళ్లి ఆలస్యంగా వచ్చేవాడు. కానీ ఆ రాత్రి అతను తిరిగి రాలేదు..నీకు వినిపిస్తుందా ఇప్పుడు? నీకు వినిపిస్తుందిలే! అది అతని గుర్రం; తిరిగి వస్తుంది.”
“నాకు ఏమీ వినపడటం లేదు.”
“అయితే అది నాకే వినిపిస్తుందేమో! సరే, నేను చెపుతున్నట్టు అతను రాకపోవడం కాదు అసలు కథ. అతని గుర్రం అటు వెళ్ళిందో లేదో ఎవరో నా కిటికీ తట్టడం వినిపించింది. నువ్వే చెప్పు అది నా భ్రమో కాదో! నాకు తెలిసిందల్లా ఎవరా అని చూడడానికి లేచి వెళ్లడమే. అది అతనే. మిగెల్ పారమొ. అతన్ని చూసినందుకు ఆశ్చర్యమేదీ కలగలేదు నాకు. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి రాత్రీ నా ఇంట్లోనే గడిపేవాడు నాతో పడుకుని – అతని నెత్తురు తాగిన ఆ పిల్లని అతను కలిసిందాకా.
” ‘ఏమయింది?’ మిగెల్ పారమొని అడిగాను. ‘ఆ పిల్ల తన్ని తరిమేసిందా నిన్ను?’
“’లేదు, నన్నింకా ప్రేమిస్తూనే ఉంది.’ అతను చెప్పాడు. ‘సమస్య ఏమిటంటే ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. ఆ ఊరికి వెళ్లడానికి దారి దొరకడం లేదు. అంతా పొగో, మంచో ఇంకేదో ఉంది. కోంట్ల ఇక అక్కడ లేదన్నది మాత్రం తెలుస్తుంది నాకు. అదెక్కడ ఉండాలో దాని మీదుగా వెళ్లాను కానీ అది కనపడలేదు. నువు అర్థం చేసుకుంటావని తెలుసు కనక నీకు చెప్పటానికి వచ్చాను. కోమలలో ఇంకెవరికయినా చెప్తే నన్ను పిచ్చాడని అంటారు – ఎప్పటిలానే.’
“’లేదు, పిచ్చి కాదు మిగెల్. నువు చచ్చిపోయి ఉండాలి. గుర్తుందా, ఆ గుర్రం వల్లే నీకు మూడుతుందని అనేవాళ్లంతా. గుర్తు చేసుకో మిగెల్. నువ్వేమన్నా పిచ్చి పని చేశావేమో కానీ, అది కాదు విషయమిప్పుడు..’
“’నేను చేసిందల్లా మా నాన్న కొత్తగా కట్టిన రాతి చుట్టుగోడ దూకించడమే. రోడ్డుమీదికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్లవలసి వస్తుందని ఎల్ కొలొరాడోని దూకమన్నాను. దూకిన గుర్తుంది, తర్వాత స్వారి చేయడం కూడా. కానీ నీకు చెప్పినట్టు అంతా పొగ, పొగ, పొగ.’
“’రేపు పొద్దున మీ నాన్న దిగులుతో ఏమవుతాడో!.’ నేను అతనితో చెప్పాను. ’పాపం! ఇక వెళ్ళు ప్రశాంతంగా సేదదీరు మిగెల్. నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.’
“కిటికీ మూశాను. తెల్లారకముందే మెదియా లూనా నుంచి జీతగాడొకడు వచ్చి చెప్పాడు ‘పెద్దాయన నీకోసం అడుగుతున్నాడు. మిగెల్ చచ్చిపోయాడు. డాన్ పేద్రోకి తోడు కావాలి.’
“’నాకు ముందే తెలుసు.’ అతనికి చెప్పాను. ‘నీకు ఏడవమని చెప్పారా?’
“’అవును, నీకు చెప్పేప్పుడు ఏడవమని డాన్ ఫుల్గోర్ చెప్పాడు.’
“’సరే, నువు డాన్ పేద్రోకి చెప్పు నేనొస్తున్నానని. అతన్ని తీసుకొచ్చి ఎంతసేపయింది?’
“’అరగంట కూడా కావడం లేదు. అతన్ని చూసిన డాక్టర్ చనిపోయి చాలాసేపయిందని చెప్పాడు కానీ కొంచెం ముందయితే బతికి ఉండేవాడేమో! ఎల్ కొలొరాడో ఖాలీ జీనుతో వచ్చి ఎవర్నీ నిద్రపోనీయకుండా ఒకటే కదం తొక్కుతూంటే తెలిసింది మాకు. డాన్ పేద్రో కంటే గుర్రమే ఎక్కువ బాధపడుతుందనిపిస్తుంది, నీకు తెలుసుగా అదీ అతనూ ఒకర్నొకరు ఎంత ప్రేమగా చూసుకునేవారో! అది తినదు, నిద్రపోదు. కల్లం తిరుగుతూ ఉంది. లోలోపల అంతా విరగ్గొట్టి, నమిలేసినట్టు దానికి అనిపిస్తుందేమో!’
“’వెళ్ళేప్పుడు మర్చిపోకుండా తలుపు వేయి.’
“మెదియా లూనా జీతగాడు వెళ్ళిపోయాడు.”
“చచ్చిపోయినవాడి మూలుగు ఎప్పుడయినా విన్నావా?” ఆమె నన్నడిగింది.
“లేదు, ఎదువిజస్.”
“అదృష్టవంతుడివి.”