పెద్రో పారమొ-9

pedro1-1

వాళ్ళు అతని ఇంటి తలుపుల మీద బాదారు కానీ బదులు లేదు. ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తడుతూ అందరినీ లేపుతూండడం అతను విన్నాడు. ఫుల్గోర్ – అడుగుల చప్పుడు విని గుర్తుపట్టగలడు – పెద్ద తలుపు వైపు తిరిగి వడిగా నడవబోతూ మళ్ళీ తలుపు తట్టడానికా అన్నట్టు ఆగాడు. కానీ తిరిగి పరుగు తీశాడు.

గొంతులు. నెమ్మదిగా ఈడుస్తున్నట్టు అడుగుల చప్పుడు, బరువైనదేదో మోస్తున్నట్టు.

పోలిక పట్టలేని శబ్దాలు.

తన తండ్రి చావు గుర్తొచ్చిందతనికి. ఇట్లాగే ఒక వేకువజామున. కానీ తలుపు తెరిచి ఉంది. బూడిద రంగు ఆకాశం లోపలికి జొరబడటం కనిపించింది. దుఖాన్ని దిగమింగుకుంటూ ఒక స్త్రీ వాకిలిని ఆనుకుని ఉంది. అతను మర్చిపోయిన, ఎన్నెన్నో సార్లు మర్చిపోయిన తల్లి అతనికి చెపుతూంది ‘నీ తండ్రిని చంపేశారు,’ వెక్కిళ్ళు మాత్రమే ఒకటిగా పట్టుకుని ఉన్న చిట్లిన గొంతు వణుకుతూండగా.

ఆ జ్ఞాపకం తిరిగి గుర్తుచేసుకోవడం అతనికి ఇష్టం ఉండదు. అది ఇంకా చాలా వాటిని వెంట పెట్టుకుని వస్తుంది. నిండా నింపిన బస్తా పిగిలితే గింజలు కారిపోకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్టు. అతన తండ్రి చావుతో పాటు చాలా చావులు తోడయ్యాయి. ప్రతి చావులో ఒక పగిలిన మొహపు బొమ్మ – ఒక కన్ను చితికీ, ఇంకో కన్ను ప్రతీకారేచ్ఛతో చూస్తూ. తర్వాత ఇంకో జ్ఞాపకం, ఆ తర్వాత ఇంకోటీ, జ్ఞాపకాల్లోంచి ఆ చావుని చెరిపేస్తూ. ఇక దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎవరూ లేరు.

“ఇక్కడ పడుకోబెట్టండి. అహఁ అట్లా కాదు. తల అటు తిప్పి పెట్టు. నిన్నే! దేనికోసం చూస్తున్నావు?”

అంతా లోగొంతుకల్లోనే.

“డాన్ పేద్రో ఎక్కడ?”

“నిద్ర పోతున్నాడు. ఆయన్ని లేపకు. సద్దు చేయకండి”

కానీ అతను నిలువెత్తున అక్కడ నిలుచుని ఉన్నాడు. ఒక పెద్ద మూటని గోనెపట్టాల్లో చుట్టి ప్రేతవస్త్రంలా చుట్టూ గడ్డితో కప్పడానికి వాళ్ళు శ్రమపడటాన్ని చూస్తూ.

“ఎవరది?” అడిగాడతను.

ఫుల్గోర్ సెడానో ముందుకొచ్చి చెప్పాడు “అది మిగెల్ డాన్ పేద్రో!”

“వాడిని ఏం చేశారు వాళ్ళు?” అరిచాడు.

‘వాళ్లు అతన్ని చంపారు,’ అని అంటారని ఎదురు చూశాడు. లోపల ఆగ్రహం సుళ్ళు తిరుగుతూ పగగా గడ్డకట్టడం అతనికి తెలుస్తూంది. కానీ ఫుల్గోర్ మెత్తటి గొంతుతో చెప్పాడు. “ఎవరూ అతన్ని ఏమీ చేయలేదు. తనంత తనే చనిపోయాడు.”

నూనె దీపాలు రాత్రిని వెలిగిస్తున్నాయి.

“అతని గుర్రం చంపిందతన్ని!” ఎవరో అడక్కుండానే చెప్పారు.

అతన్ని అతని మంచం మీద పడుకోబెట్టారు పరుపు తిరగేసి. ఇంటికి మోసుకురావడానికి కట్టిన కట్లన్నీ ఊడదీసారు. చేతులు ఛాతీ మీదుగా కట్టి, మొహాన నల్ల గుడ్డ కప్పారు. “ఉన్నదాని కంటే పెద్దగా కనిపిస్తున్నాడు,” తనలో తాను అనుకున్నాడు ఫుల్గోర్.

పేద్రో పారమొ అలాగే నిలబడిపోయాడు. ఎక్కడో ఉండి పోయినట్టు అతని మొహాన ఏ భావమూ లేదు. అతని స్పృహకు అందని దూరంలో ఆలోచనలు వేగంగా పరుగెత్తాయి రూపు దాల్చకుండానే తెగిపడి పోతూ. చివరికి అన్నాడు “బదులు చెల్లించడం మొదలుపెట్టాను. ఎంత తొందరగా మొదలు పెడితే అంత తొందరగా అయిపోతుంది.”

అతనికి విచారమేదీ కలగలేదు.

అందరికీ వినపడేలా ఆడవాళ్ల ఏడుపులకు మించి గొంతెత్తి వరండాలో చేరిన వాళ్లకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడినప్పుడు అతనికి ఊపిరీ మాటలూ కరువు కాలేదు. తర్వాత వినిపించిన ఒకే శబ్దం మిగెల్ కపిల రంగు గుర్రపు పాదాలదే.

ఫుల్గోర్ సెడానోని ఆజ్ఞాపిస్తూ అన్నాడు ” రేపు ఎవరినన్నా పిలిపించి ఆ పశువు పని పూర్తి చేయి. ఆ బాధనుంచి దానికి విముక్తి కలిగించు.”

“అలాగే డాన్ పేద్రో! నేను అర్థం చేసుకోగలను, పాపం అది చాలా బాధపడుతున్నట్టుంది.”

“నేనూ అదే అనుకుంటున్నాను ఫుల్గోర్. నువు వెళ్ళేఫ్ఫుడు ఆ ఆడవాళ్లను ఆ ఏడుపులాపమని చెప్పు. పోగొట్టుకుంది నేనయితే వాళ్లు ఎక్కువ గొడవ చేస్తున్నారు. ఇదే వాళ్ళకు జరిగితే అంత చేటు ఏడవడానికి ముందుకు రారు.”

సంవత్సరాల తర్వాత ఫాదర్ రెంటెరియా తన గట్టి పక్క తనని నిద్రపోనివ్వక బయటికి తరిమిన రాత్రి గుర్తు చేసుకుంటాడు. అది మిగెల్ పారమొ చనిపోయిన రాత్రి.

అతనా రాత్రి కోమలా వొంటరి వీధుల్లో నడిచాడు. అతని అడుగుల చప్పుడుకు చెత్త కుప్పల్లో మూతి పెట్టి వెతుక్కుంటున్న కుక్కలు ఉలిక్కిపడి చూశాయి. నది దాకా నడిచాడు. అక్కడే నిలబడి స్వర్గాలనుంచి తెగిపడి రాలిన నక్షత్రాలు నీళ్ళ నిశ్శబ్దపు సుడుల్లో పరావర్తనం చెందడం చూశాడు. కొన్ని గంటలపాటు నది నల్లటి నీళ్ళలో కలిసిపోతున్న తన ఆలోచనలతో సతమతమయ్యాడు.

ఇదంతా ఆ పేద్రో పారమొ అనే నీచుడు తనంత తాను పైకి రావడంతోటే మొదలయ్యిందనుకున్నాడు. పిచ్చిగడ్డి లాగా పాకి పెరిగిపోయాడు. అన్నిట్లోకీ విషాదమేమిటంటే తను అందుకు తోడ్పడటం. “నేను పాపం చేశాను ఫాదర్! నిన్న పేద్రో పారమొతో పడుకున్నాను.” “పాపం చేశాను ఫాదర్! పేద్రో పారమొ బిడ్డను మోస్తున్నాను.” “నా కూతుర్ని పేద్రో పారమొకి అప్పచెప్పాను ఫాదర్!” ఎప్పుడన్నా వొచ్చి కొన్ని పాపాలనయినా కన్ ఫెస్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ అతనెప్పుడూ రాలేదు. తన దౌష్ట్యాన్ని కొడుకు ద్వారా ఇంకా విస్తరింపజేశాడు. తను గుర్తించింది.. ఎందుకో ఆ దేవుడికే తెలియాలి. తనకు తెల్సిందల్లా ఆ సాధనాన్ని అతని చేతుల్లోనే పెట్టడం.

అతనికి స్పష్టంగా గుర్తుంది కొన్ని గంటల బిడ్డని తనే పేద్రో పారమొ దగ్గరికి తీసుకు వెళ్ళడం.

“డాన్ పేద్రో! ఈ బిడ్డకి జన్మనిచ్చి తల్లి చనిపోయింది. ఈ బిడ్డ నీకొడుకే అని చెప్పింది. ఇడుగో!”

పేద్రో పారమొ కన్నార్పలేదు. మామూలుగా చెప్పాడు ” మీరే ఉంచుకోకపోయారా? ప్రీస్ట్ ని చేయండి.”

“ఈ బిడ్డ వొంట్లో పారే నెత్తురెవరిదో తెలిసీ ఆ బాధ్యత నేను స్వీకరించలేను.”

“వాడిది చెడ్డ నెత్తురేనని నిజంగా అనుకుంటున్నారా? ”

“నిజంగానే అనుకుంటున్నాను డాన్ పేద్రో!”

“నువు తప్పని నిరూపిస్తాను. వాణ్ణి నా దగ్గరే వదిలేయి. వాడిని చూసుకోవడానికి ఎవరో ఒకరిని చూస్తాను.”

“నా మనసులో ఉన్నదీ అదే. ఇక్కడుంటే కనీసం వీడికి తినడానికయినా ఉంటుంది.”

చిన్నగా ఉన్నా ఆ పసివాడు రక్తపింజేరిలా కదులుతూ ఉన్నాడు.

“డమియానా! నువ్వు చూసుకోవలసినదొకటుంది చూడు ఇక్కడ. వీడు నాకొడుకు.”

తర్వాత ఒక సీసా బిరడా తీశాడు.

“ఇది చనిపోయిన తల్లికీ, నీకూ!”

“బిడ్డకి కూడానా?”

“వాడికి కూడా, ఏం?”

అతను ఇంకో గ్లాసు నింపాడు. ఇద్దరూ బిడ్డ భవిష్యత్తుకోసం తాగారు.

అది అట్లా అయింది.

బళ్ళు మెదియా లూనా వైపు శబ్దాలు చేసుకుంటూ వస్తున్నాయి. ఫాదర్ రెంటెరియా వంగి నది వొడ్డున ఉన్నరెల్లు పొదల వెనక నక్కాడు.

“దేన్నుంచి దాక్కుంటున్నావు?” తనను తనే అడుక్కున్నాడు.

“సెలవు ఫాదర్!” అతనికి వినిపించింది.

పైకి లేచి బదులిచ్చాడు. “సెలవు. దేవుడు నిన్ను దయచూచుగాక!”

ఊళ్ళోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా ఆరిపోయాయి. నది కాంతివంతమైన రంగులతో వెలుగుతూంది.

“ఏంజెలస్ గంట (ఒక ప్రార్థనా సమయాన్ని సూచించేది) మోగిందా ఫాదర్?” బళ్ళు నడిపేవాళ్ళలో ఒకరడిగారు.

“ఆ సమయం దాటి చాలా సేపయింది,” అని బదులిచ్చాడు. తిరిగి వాళ్లకు ఎదురు దిక్కులో నడవసాగాడు ఆపినా ఆగకూడదని నిర్ణయించుకుని.

“ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు ఫాదర్?”

“ఎవరింట్లో చనిపోయారు ఫాదర్?”

“కోంట్లాలో ఎవరన్నా చనిపోయారా ఫాదర్?”

“నేనే. ఆ చనిపోయింది ఎవరో కాదు నేనే,” అని బదులిద్దామనుకున్నాడు. కానీ నవ్వి ఊరుకున్నాడు.

చివరి ఇళ్ళూ వెనకపడగానే వేగంగా నడిచాడు.

అతను తిరిగొచ్చేసరికి బాగా పొద్దెక్కింది.

“ఎక్కడికెళ్ళావు బాబాయ్?” ఆనా అడిగింది. చాలామంది ఆడవాళ్ళు నీకోసం చూస్తూ ఉన్నారు. వాళ్లు కన్ ఫెస్ చేయాలనుకుంటున్నారు. రేపు మొదటి శుక్రవారం కదా!”

“వాళ్ళను తిరిగి సాయంత్రం రమ్మని చెప్పు.”

హాల్ లో బల్ల మీద ఒక క్షణం నిశ్శబ్దంగా కూచున్నాడు అలసట బరువుకు.

“ఈ గాలి ఎంత చల్లగా ఉంది ఆనా!”

“చాలా వేడిగా ఉంది బాబాయ్!”

“నాకనిపించడం లేదు.”

అతను అసలు ఆలోచించకూడదనుకున్నది తను కోంట్లాకు వెళ్ళి అక్కడ తోటి ప్రీస్ట్ తో కన్ ఫెస్ చేసిన సంగతి. ఎంత బతిమలాడినా ప్రక్షాళన మాత్రం తిరస్కరించాడు అతడు.

“నువు పేరెత్తడానికి కూడా ఇష్టపడని మనిషి నీ చర్చిని నాశనం చేశాడు. నువు చూస్తూ కూచున్నావు. ఇప్పుడు నీనుంచి ఏం ఆశించగలను ఫాదర్? దేవుడి శక్తిని ఎలా వాడుకున్నావు? నువు మంచి మనిషివనే అనుకుంటాను, అందుకు నిన్ను గౌరవిస్తాను కూడా. కానీ మంచితనమే సరిపోదు. పాపం మంచిది కాదు. పాపనాశనం కోసం గట్టిగా నిర్దాక్షిణ్యంగా నిలబడగలగాలి. మీ చర్చికి వచ్చేవాళ్ళంతా విశ్వాసులే అనుకుంటాను. కానీ వాళ్ల నమ్మకాన్ని నువే నిలబెట్టుకోలేకపోయావు. వాళ్లు భయంతోటో, మౌఢ్యంతోటో నమ్ముతారు. నీ కటిక దరిద్రం సంగతి నాకు తెలుసు. గంటలకొద్దీ నీ విధుల్ని నువు నిర్వర్తించడమూ నాకు బాగా తెలుసు. బహిష్కార శిక్ష విధించినట్టు మనల్ని ఈ పాడుబడ్డ ఊళ్ళకి పంపారు. ఇక్కడ మన పని ఎంత కష్టమో నాకూ వ్యక్తిగతంగా తెలుసు. కానీ అదే నీకు ఈ విషయం చెప్పే హక్కునూ ఇస్తూంది. మన ఆత్మలకి బదులుగా బెత్తెమిచ్చే ఏ కొద్దిమందికోసమో కాదు మనం సేవ చేయవలసింది. నీ ఆత్మ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు నీకంటే మెరుగ్గా ఉన్నవాళ్లకంటే మెరుగ్గా అయే అవకాశమెక్కడుంది? లేదు ఫాదర్! నిన్ను ప్రక్షాళన చేయడానికి నా చేతులంత పరిశుభ్రంగా లేవు. నువు ఇంకెక్కడికన్నా వెళ్లాలి దాని కోసం.”

“నువ్వనేదేమిటి? కన్ ఫెస్ చేయడానికి ఇంకెక్కడికన్నా వెళ్లమంటావా?”

“అవును. వెళ్లాలి. నువ్వే పాపంలో కూరుకు పోయినప్పుడు ఇతరులను శుద్ధి చేయడమెలా కొనసాగిస్తావు?”

“వాళ్ళు నన్ను మినిస్ట్రీ నుంచి తొలగిస్తేనో?”

“అదే నీకు తగినదేమో! ఆ తీర్పు వాళ్ళే చేస్తారు.”

“కొంచెం.. తాత్కాలికంగానయినా.. అంటే.. నేను అంత్యక్రియలు చేయవలసి ఉంది, ప్రార్థన సమ్మవేశాలు నిర్వహించాలి. మా వూళ్ళో ఎంత మంది చనిపోతున్నారో ఫాదర్!”

“నేస్తం, ఆ దేవుణ్ణే చనిపోయినవాళ్లపై తీర్పులు చెప్పనీ!”

“అయితే ప్రక్షాళితం చేయవన్నమాట!”

కోంట్లా ఫాదర్ లేదని చెప్పాడు.

తర్వాత వాళ్ళిద్దరూ చర్చి వరండాలో అజాలియా నీడల్లోని జపమందిరం గుండా నడిచారు. ద్రాక్షపళ్ళు పండుతూ ఉన్న ఆర్బర్ కింద కూచున్నారు.

“అన్నీ చేదే ఫాదర్!” ఫాదర్ రెంటెరియా ఏం అడగబోతున్నాడో ఊహించాడు. “దేవుడి దయ వల్ల అన్నీ పండే నేల మీదే బతుకుతున్నాము. కానీ పెరిగే ప్రతిదీ చేదే. అదే మన శాపం.”

“నువ్వు చెప్పేది నిజమే ఫాదర్! కోమలాలో ద్రాక్ష పెంచుదామని చూశాను. పిందె నిలవలేదు. జామ పళ్ళూ, నారింజలే. అవీ చేదు జామలూ, చేదు నారింజలూ. తియ్యటి పండు రుచే మర్చిపోయాను. సెమినరీలో మనం తిన్న చైనా జామ పళ్ళు గుర్తున్నాయా? ఆ పీచ్ పళ్ళు? తాకగానే తోలు ఊడొచ్చే ఆ కమలా పళ్ళు? విత్తనాలు ఇక్కడికి తీసుకు వచ్చాను. కాసినే, చిన్న సంచిలో. తర్వాత అక్కడే వదిలేసి ఉంటే బాగుండేదోమోననిపించింది. ఇక్కడికి తీసుకువచ్చింది చంపడానికేగా!’

“నిజమే ఫాదర్! ఈ కోమలా నేల మంచిదనే అంటారు వాళ్ళూ. కానీ ఆ నేలంతా ఒక్కడి చేతిలోనే ఉండటం అన్యాయం. ఇంకా పేద్రో పారమోయే కద వాటి యజమాని?”

“అది దైవేఛ్ఛ.”

“దానికీ దైవేఛ్ఛకీ ఏమన్నా సంబంధం ఉందంటే నమ్మలేను. నువ్వూ నమ్మవు కదా ఫాదర్? నమ్ముతావా?”

“కొన్ని సార్లు అనుమానం వచ్చింది, కానీ కోమలాలో అందరూ అదే నమ్ముతారు.”

“వాళ్లలో నువ్వూ ఒకడివా?”

“నేను వినమ్రంగా తలదించుకోవడానికి సిద్ధపడిన మనిషిని. ఇంకా అలాగే ఉండాలని అనిపిస్తుంది.”

తర్వాత వాళ్లిద్దరూ సెలవు తీసుకుంటున్నప్పుడు ఫాదర్ రెంటెరియా ప్రీస్ట్ చేతుల్ని పట్టుకుని ముద్దాడాడు. ఇప్పుడు ఇంటికి వచ్చాక, వాస్తవంలోకి తిరిగి వచ్చాక కోంట్లాలో ఆ ఉదయం గురింఛి అతనికి తలుచుకోబుద్ధి కావడం లేదు.

అతను బల్ల మీది నుంచి లేచి వాకిలి వేపు నడిచాడు.

“ఎక్కడికి వెళుతున్నావు బాబాయ్?”

అతని కూతురు ఆనా, బతుకునుంచిరక్షణ కోసం అతని నీడ కావాలన్నట్టు ఎప్పుడూ అతని పక్కనే.

“కాసేపు నడిచొద్దామని బయటికి వెళుతున్నా. కాస్త తిక్కగా ఉన్నట్టుంది”

“వొంట్లో బాలేదా?”

“బాలేకపోవడం కాదమ్మా! చెడ్డగా. అవును, నేను చెడ్డ వాణ్ణి.”

అతను మెదియా లూనా దాకా నడిచివెళ్ళి డాన్ పేద్రోకి ఓదార్పు మాటలు చెప్పాడు. మళ్ళీ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలను తిప్పి కొడుతూ చెప్పిన సాకులను విన్నాడు. బదులుగా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఏమనుకున్నా ఏం లాభం? భోజనానికి లేవమన్నప్పుడు మాత్రం కుదరదన్నాడు.

“నాకు వీలు కాదు డాన్ పేద్రో. తొందరగా చర్చికి వెళ్ళాలి. కన్ ఫెషన్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.”

అతను ఇంటికి నడిచి వచ్చి తర్వాత సాయంత్రమయేటప్పటికి సరాసరి చర్చికి వెళ్ళాడు. అట్లాగే ఆ మురికీ, దైన్యమూ కమ్ముకున్న దేహంతోటే. కన్ ఫెషన్స్ వినడానికి కూర్చున్నాడు.

లైనులో మొదట ఉన్నది చర్చి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూసే పాత డొరోతియా.

ఆల్కహాల్ వాసన వేసిందతనికి.

“ఏమిటిది? ఇప్పుడు తాగడం కూడా మొదలుపెట్టావా? ఎన్నాళ్ళనుంచి?”

“మిగెల్ దినానికి కి వెళ్ళాను ఫాదర్. కొంచెం ఎక్కువయినట్టుంది. తాగడానికి బోలెడంత ఇచ్చేసరికి చివరికి నేను బఫూన్ నయ్యాను.”

“నువు ఎప్పుడూ చేసేదదేగా డొరోతియా!”

“కానీ ఇప్పుడు నేను నా మోయలేని పాపాలతో వచ్చాను.”

చాలా సందర్భాలలో ఆమెకి చెప్పాడు. ” కన్ ఫెస్ చేయాలనుకోకు డొరోతియా. నా సమయం వ్యర్థం చేస్తావు. నువు కావాలనుకున్నా పాపం చేయలేవు. అది మిగతా వాళ్లకు వదిలేయి.”

“ఇప్పుడు పాపం చేశాను ఫాదర్! నిజంగా!”

“చెప్పు.”

“ఇప్పుడిక అతనికి కలిగే కీడు ఏమీ లేదు కనుక చెపుతున్నాను. ఆ చనిపోయినవాడికి అమ్మాయిలని తార్చింది నేనే. మిగెల్ పారమోకి.”

ఆలొచించడానికి వ్యవధి కావాలన్నట్టు స్తబ్ధుడయాడు. పొగమంచులోంచి బయట పడుతున్నట్టు అలవాటు చొప్పున అడిగాడు “ఎన్నాళ్ల నుంచి?”.

“చిన్నప్పట్నుంచీ. అతనికి మీజిల్స్ వచ్చినప్పటి నుంచీ.”

“ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు డొరోతియా.”

“మిగెల్ కి అమ్మాయిలని ఏర్పాటు చేసింది నేనే.”

“నువు తీసుకు వెళ్ళేదానివా అతని దగ్గరకు?”

“కొన్నిసార్లు నేను తీసు వెళ్ళేదాన్ని. కొన్ని సార్లు ఏర్పాట్లు మాత్రం చేసేదాన్ని. కొంతమందితో మాత్రం అతనికి సరైన దారి చూపించి ఊరుకునేదాన్ని. అదే, వాళ్ళెప్పుడు వొంటరిగా ఉండేదీ, అదాటున వాళ్ళనెప్పుడు పట్టుకోవచ్చో..”

“చాల మందినా?”

అడగాలనుకోలేదు కానీ అలవాటు చొప్పున వచ్చేసిందా ప్రశ్న.

“లెక్కలేనంత మంది. చాలా చాలా మంది.”

“నిన్నేం చేయమంటావో చెప్పు డొరోతియా! నువ్వే తీర్పు చెప్పు. నిన్ను నువు క్షమించుకోగలవా?”

“క్షమించుకోలేను ఫాదర్! అందుకే ఇక్కడికి వచ్చింది.”

“చనిపోయాక స్వర్గానికి పంపమని నన్నెన్ని సార్లు అడిగావు? నీకు నీకొడుకు అక్కడ కనపడతాడని ఆశ ఉండేది, కదా డొరోతియా? ఇప్పుడు నువు స్వర్గానికి వెళ్ళలేవు. ఆ దేవుడు నిన్ను క్షమించు గాక!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“సరే, ఆ దైవం పేరిట నిన్ను క్షమిస్తున్నాను. ఇక వెళ్ళు.”

“నాకు ప్రాయశ్చిత్తం ఏదీ ఇవ్వవా?”

“నీకు ఆ అవసరం లేదు డొరోతియా!”

“ధన్యవాదాలు ఫాదర్!”

“దేవుడు తోడుగా వెళ్ళు!”

ఆ గది కిటికీ మీద చప్పుడు చేశాడు తర్వాత ఆమెని రమ్మన్న సూచనగా. “నేను పాపం చేశాను,” మాటలు వింటుండగా అతని తల ఇక నిలబడలేనట్టు ముందుకు వాలింది. తర్వాత తలతిప్పుడు, గందరగోళం, జిడ్డు నీళ్ళలో ఉన్నట్టు జారిపోవడం, తిరుగుతూ ఉన్న దీపాలూ. బద్దలయి ముక్కలుగా చెదిరిపోయి ముగుస్తున్న దినకాంతీ. నాలుకపైన నెత్తుటి రుచీ. “నేను పాపం చేశాను,” బిగ్గరగా, మళ్ళీ మళ్ళీ వినవస్తూంది. “ఇప్పటికీ, ఎప్పటికీ”,”ఇప్పటికీ, ఎప్పటికీ” “ఇప్పటికీ..”

“ఊరుకో అమ్మా,” అన్నాడు. “చివరిసారిగా ఎప్పుడు కన్ ఫెస్ చేశావు?”

“రెండురోజుల క్రితం ఫాదర్!”

ఇంతలోనే మళ్ళీ వచ్చింది. దురదృష్టం అతన్ని చుట్టుముట్టినట్టనిపించింది. ఏం చేస్తున్నావిక్కడ, తనని తనే అడుక్కున్నాడు. విశ్రాంతి తీసుకో. పో. నువు బాగా అలసిపోయావు.

కన్ ఫెషన్ గది నుంచి బయటికి వచ్చి సరాసరి పాత సామాన్ల గదివైపు వెళ్ళాడు. ఎదురుచూస్తున్నవాళ్ల వంక కూడా చూడకుండా చెప్పాడు “మీలో పాపం చేయలేదనుకున్న వాళ్ళంతా రేపు పవిత్ర ప్రార్థన సమావేశానికి రండి.”

అతను వెళుతుంటే వెనక నుంచి గుసగుసలు వినిపించాయి.