‘శంఖంలో పోసినవన్నీ తీర్ధమై పోయాయనట్టు’ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.
యాదృచ్చికమే కావచ్చు నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలు ప్రవేశ పెడుతున్న రోజులు, , సింగరేణిలో నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కాలం ఒక్కసారే జరిగాయి. ఒకే ఆలోచన గల కొంతమందిమి కలిసి సింగరేణిలో ప్రవేశపెడుతున్న నూతన ఆర్ధిక విధానాలపై, ప్రవేటీకరణలపై పిట్ మీటింగ్ పెట్టినప్పుడు, నేటి స్థితిని ఊహించలేని కార్మికులు ఆశ్చర్యంగా, వింతగా విన్నారు. ప్రవేటీకరణ వల్ల సంభవించే పరిణామాలను చెప్పినప్పుడు ‘ వీళ్ళు ఇంతే, రెటమతం’ అని కొట్టిపారేశారు.
తర్వాత, తర్వాత పరిస్థితి విషమిస్తుండగా కార్మికులు చేసిన ప్రతి పోరాటంలో ప్రైవేటీకరణ ప్రధాన ‘అంశం’గా రూపు దాల్చింది. అప్పటి నుంచి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణ ప్రవేశ పెట్టడం మూలంగా కార్మికుల సంఖ్య ‘సగానికి’ చేరుకున్న దశలో కూడా ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలున్నాయి, పోరాటాలు నడుస్తున్నాయి.
ఈ దశలో‘ హక్కుదార్లు’ కథ !
కథ ఉద్ధేశమల్లా సింగరేణి కంపెనీలో వచ్చిన లాభాల్లో మొత్తంలో కాదు, పర్మినెంట్ కార్మికులకు కేటాయించిన కేవలం 23% లో ఎవరి వాటా ఎంత అని, పంచుకోవాల్సిన వాళ్ళు ఎవరెవరూ అని చర్చకు పెట్టింది. అవుట్ సోర్సుడు కార్మికులకు వాటా వుందని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి ?
అసలు ఈ చర్చ సమంజసమేనా ?
ఈ కృత్రిమ సమస్య సృష్టికి దారులెన్ని, ఎక్కడి నుంచి ఎటునుంచి చూడాలి. ఇంకా మిగిలిన 77 % లాభాల మాట ఎక్కడ దాక్కుంది. వాటిని ఎవరెవరు ఏ, ఏ రూపాల్లో అనుభవిస్తున్నారు ? కేవలం 23% లాభాలవరకు మాత్రమే చర్చకు పెట్టి, వాటాదారులు ఎంత మందో తేల్చగలమా ?
అది కూడా పర్మినెంట్ కార్మికులకు చట్టపరంగా కలిగిన అవకాశాల మేరకు వనగూడిన వనరుల్లో ఇది ఒకటి. ఆ హక్కు వాటాలోకి కథలోని మానవీయకోణంతో చేరాల్సిన వాటాదారులు మరి కొంతమంది వున్నారు. 1) అవుట్ సోర్సుడు కార్మికులు, 2) ఎక్కడినుంచైనా బొగ్గు రవాణా చేస్తే ఆ రోడ్డు పొడుగూత వుండే దుమ్ము, ధూళితో ఇబ్బందు పాలౌతున్న గ్రామా ప్రజలు . 3) ఓపెన్ కాస్ట్ వల్ల నీటి జల ఇంకిపోయి పంటలు పండక నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్న రైతు. 4) భవిష్యత్తులో ఇంకా అనేకమంది కార్మికులకు చెందిన 23% లాభాల వాటాధనంలో భాగస్వాముఅవుతారు అనడం, లేక భవిష్యత్తులో మరెందరో ఈ గేటు ముందు తమ హక్కుల కోసం వచ్చి నిలబడతారేమో అనడం సమంజసమేనా ?
అవును ! కథలో చేప్పినట్టు అవుట్‌సోర్పుడు కార్మికులు కష్టపడుతున్నారు, ఫలితం దగ్గర నష్టపోతున్నారు వాస్తవమే. పోరాటం చేయాల్సింది ఎవరి మీద ? పర్మినెంట్ కార్మికులకు, అవుట్ సోర్సుడు కార్మికులకు మధ్య వైషమ్యాలను సృష్టించి సమస్య స్వరూపాన్ని మార్చిన కథ ….
యాజమాన్య స్వరంతో చెప్పబడిన కథ !
ఉదాహరణకు-
‘‘వాళ్ళలో ఏమి మార్పు వచ్చింది ?’’ (ఇక్కడ వాళ్ళు అంటే కార్మికులు) అడిగింది ప్రతిభ.
‘‘నీడ్స్ హైరార్కీ లో ఓ స్టెప్ పైకెళ్ళారు. చెప్పాలంటే ఇదివరకు ఆఫీసర్ల మానసిక స్థితికి ఇప్పుడు వాళ్ళు వచ్చారని నా కనిపిస్తుంది . ఇంకా చెప్పాలంటే టేబుల్‌కు ఆపోజిట్ సైడులో ఉండాల్సినవాళ్ళు రెండోవైపుకు వెళ్ళిపోయారు. ఒకప్పుడు మేనేజ్‌మెంట్ పని చేయించేది అనుకుంటే కార్మికులు పని చేసేవారు. కొద్ది మినహాయింపుతో ఇప్పుడు సంస్థ ఉద్యోగులంతా పని చేయించేవాళ్ళయ్యారు. అవుట్ సోర్సుడ్ కార్మికులు పని చేస్తున్నారు. మీరు గమనించే వుంటారు, ఎలెక్టయిన యూనియన్ నాయకులు ఆల్ మోస్ట్ ఒక డైరెక్టర్ హోదానే అనుభవిస్తున్నారు. ఎస్. యూ.వీ ల్లో తిరుగుతూ, ఒక ప్రజా ప్రతినిధికో, పెద్ద కాంట్రాక్టరుకో తీసిపోనట్టు ఆకారం, డ్రెసింగ్, బాడీ లాంగ్వేజ్ తో, అనుచర గణంతో కన్పిస్తున్నారు.’’
ఇదండీ అసలు కథ .
అంటే సింగరేణీ కంపెనీలో కార్మికులు, యాజమాన్యం(అధికారులు) కలసి పని చెప్పి, అవుట్ సోర్సుడు కార్మికులతో పని చేయిస్తున్నారు. వీళ్ళు పనిచేయడం మూలంగానే కంపెనీ లాభాల్లో వుంది . అవుట్ సోర్సుడు కార్మికుల నోరు కొట్టి పర్మినెంట్ కార్మికులు మాత్రమే వచ్చిన లాభాలన్నీ దండుకుంటున్నారనే గదా –
ఇట్లా ఎక్కడైనా, ఏ పబ్లిక్ సెక్టార్‌లోనైనా జరిగిందా ? జరుగుతుందా ? ఆశ్చర్యకరం.
కథలోని సారమంతా కంపెనీలోని కార్మికులు పని చేయడంలేదు. దర్నాలాంటి సమయాల్లో కూడా కంపెనీ అధికారులను, ఆఫీసు గేట్లు మూసి లోనికి పోనీయకుండా చేసినప్పటికీ చెట్ల కిందనే కూర్చొని తమ వెంటవున్న ల్యాప్‌టాపుల్తో ఆఫీసు పనిగంటలు నష్టపోకుండా ఆఫీసు పని బయటినుంచే చేస్తున్నారు. గనుల్లో అవుట్ సోర్సుడు కార్మికులు పని చేస్తున్నారు. అందుకే కంపెనీ గత పదేళ్ళుగా లాభాల్లోవుంది. ఆ లాభాలను పర్మినెంట్ కార్మికులు అన్యాయంగా పొందుతున్నారు. న్యాయంగా రావాల్సిన వాళ్ళకు వాటా ధనంలో భాగం ఇవ్వటం లేదు. అని కధలో చాలా వివరంగా వుంది.
చూడండి ఒక పాత్రతో ఎంత స్పష్టంగా అనిపిస్తారో….
‘‘ఆ….అవును..కిందపడ్డ చిక్కుడు గింజను సైతం పంచుకు తింటాం అంటారు. మీరు చాలా ఆశ పడుతున్నారే !’’ అంది ప్రతిభ. ఈ మాటల్లోని వ్యంగ్యం ఎవరికైనా అర్దమౌతుంది. ఇట్లా కథలోని ప్రతి అంశాన్ని చూస్తే అనేకం కన్పిస్తాయి. స్పష్టంగా చెప్పాలంటే యాజమాన్య దృష్టి కనిపిస్తుది.
‘‘ హక్కుదార్లు’’ కథ రాసిన రఘువంశీ రచనలో బాగా చేయి తిరిగినవారవడం, తన రచనా శైలీ, నైపుణ్యంతో చాలా విషయాలు గోప్యంగా చేప్పారు. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లు పనికిరావు, అంటే సింగరేణి, ఆర్.టి.సి తదితరాలు వల్ల అభివృధ్ధి వుండదు, నష్టాలు చవి చూట్టమే తప్ప మరోటి కాదు, ప్రత్యామ్నాయంగా ప్రైవేటీకరణే శరణ్యం. ప్రైవేటు కాంట్రాక్టర్ల చేతుల్లో దేశం సుభిక్షంగా వుంటుంది, అభివృద్ధి కాబడుతుందని చెప్పకనే చెప్పారు.
ఈ దేశానికి అంబానీ, బిర్లా అభివృద్ధి గొడుగు నీడ క్రింద మనుగడే రక్షణ కల్గిస్తుందనే అభిప్రాయానికి రావచ్చు.
ఇకపోతే-
నలుగురు కంపెనీ అధికారులు(కార్మికులకు పని చెప్పగలిగే అధికారం వున్న ఏ నలుగురైనా) కల్సి వున్నప్పుడు, కార్మికుల్ని ఉద్ధేశించి మాట్లాడుకునే ధోరణి ఇలానే ఉంటుంది. వారి పట్ల అధికారుల పరిభాష అనొచ్చునేమో !? అభిప్రాయాలు కూడా –
యాజమాన్య దృష్ఠితో ఆలోచించినప్పుడు, కార్మికులందరూ ఇలానే కన్పిస్తారు. పూర్తిగా ఏకపక్షంగా, యాజమాన్య దృష్టితో రాసిన కథ. ప్రైవేటీకరణని, కాంట్రాక్టీకరణని భుజాన మోసి రాసిన కథలానే వుంది.
ఈ కథ గురించి ఎ.కె. ప్రభాకర్ గారు ‘ సారంగ’వెబ్ మ్యాగ్‌జైన్‘ లో చెప్పినట్టు కార్మిక నాయకులు వర్గసృహ కోల్పోయారని, వాళ్ళ వర్గాల స్వభావమే మారిపోయిందని రచయిత రవిప్రసాద్ ముఖతః చెప్పిన మాటల్లో నిజం బాధించినప్పటికి అతని విమర్శనాత్మకత దృష్టిని కాదనలేం.’’ అని సరి పెట్టుకుందామా ?
అట్లా సరిపెట్టుకోవాలన్నా రచయిత విమర్శనాత్మకత దృష్టి కథలో ఎక్కడా కన్పించదు. పూర్తిగా ఒన్‌సైడ్ వకాల్తా పుచ్చుకొని రాసిన కథ మాత్రమే. ఈ కథ ఇట్లా రాయడానికి బాహ్య కారణాలు వేరేవి అనేకం ఉండవచ్చు.
ఏ.కె. ప్రభాకర్‌గారు కథ మీద అభిప్రాయం రాస్తూ, ఓ చిన్న కథను ఉదహరించారు. సింగరేణిలాంటి పబ్లిక్ సెక్టార్‌ను తుడిచేసుకుంటూపోతే, ప్రైవేట్ కంపెనీల్లో కొద్ధిమంది కార్మికులతో ‘ వెట్టి’ చాకిరీ చేయించుకుంటూ, అధిక ఉత్పత్తి చేసుకుంటూ పోతే….., 125 కోట్ల జనాభావున్న మనలాంటి దేశంలో పైన ఉదహరించిన కథలాంటి ‘కథా వస్తువుకు’’ కొదువ వుండదు. మూడుపూవులు… ఆరుకాయలే .
–
తాజా కామెంట్లు