విరిగిన రెక్కలు

Art: Satya Sufi

Art: Satya Sufi

 

(ఖలీల్ జిబ్రాన్ “బ్రోకెన్ వింగ్స్” ముందు మాట )

ప్రేమ తన మాంత్రిక కిరణాలతో నా కళ్ళు తెరిపించి నా ఆత్మను తొలిసారిగా చురుకైన తన వేళ్ళతో స్పర్శి౦చినప్పుడు, సెల్మా కారమీ తన సౌందర్యంతో తొలి సారి నా ఆత్మను మేల్కొలిపినప్పుడు, ఉదయాలు స్వప్నాలుగా, రాత్రులు వివాహాలుగా గడిచే  ఉన్నతమైన ఆప్యాయతల నందనవనం లోకి నన్ను తీసుకువెళ్ళినపుడు నా వయసు పద్దెనిమిది.

సెల్మా కారమీ తన సౌందర్యమే ఉదాహరణగా సౌందర్యాన్ని ఆరాధించటం నాకు నేర్పి౦ది. తన ఆప్యాయతతో ప్రేమ రహస్యాన్ని తెలియపరచి౦ది,నిజ జీవిత కవిత్వాన్ని తొలి సారి నాకు పాడి వినిపి౦చినది ఆమెనే.

ప్రతి యువకుడూ తన తొలి ప్రేమను గుర్తు౦చుకు౦టాడు, ఆ విచిత్ర సమయాన్ని మళ్ళీ మళ్ళీ పట్టి తెచ్చుకు౦దుకు, ఆ నిగూఢత వల్ల పొ౦దిన చేదు అనుభవిస్తున్నప్పటికీ, ఆ జ్ఞాపకాల వల్ల గాఢమైన భావాలు మార్పుచె౦ది అతన్ని ఆనందపరుస్తాయి.

ప్రతి యువకుడి జీవనంలో ఒక సెల్మా ఉ౦టు౦ది, హటాత్తుగా జీవిత వసంతం లో  ప్రత్యక్షమై అతని ఏకాంతాన్ని ఆనందభరిత  క్షణాలుగా మార్చి అతని నిశ్శబ్దపు రాత్రులను సంగీత భరితం చేస్తు౦ది.

khalil1

నేను ఆలోచనలలో , యోచనలో గాఢ౦గా మునిగిపోయి ప్రకృతి స్వభావాన్ని, పుస్తకాలు , మాట గ్రంధాల సందేశాలను అర్ధం చేసుకునే ప్రయాసలో ఉ౦డగా, సెల్మా పెదవులు ప్రేమను నా చెవుల్లో గుసగుసలాడటం విన్నాను. సెల్మా నా ఎదురుగా ఒక వెలుగు స్తంభం లా ని౦చుని ఉ౦డట౦ చూసాక స్వర్గంలో ఆడం మాదిరిగా నా జీవితం ఒక అపస్మారకత అయి౦ది.

ఆమె నా హృదయపు ఈవ్ గా మారి దాన్ని రహస్యాలతో అద్భుతాలతో ని౦పి జీవితం అర్ధం నాకు అర్ధంఅయేలా  చేసి౦ది.

మొట్టమొదటి ఈవ్ ఆడం ను స్వర్గం ను౦ది తనంత తానూ కదలివచ్చేలా చేస్తే సెల్మా తన ప్రేమ, మాధుర్యాలతో నన్ను నా ఇష్టపూర్వకంగా స్వచ్చమైన ప్రేమ, సుకృతాల స్వర్గం లోకి కదలివచ్చేలా చేసి౦ది. కాని మొదటి మనిషికి ఏ౦ జరిగి౦దో నాకూ అదే జరిగి౦ది. ఏ తీవ్రమైన కరవాలం ఆడం ను స్వర్గం ను౦డి తరిమి కొట్టి౦దో అలాటిదే, నిషేధి౦పబడిన చెట్టు ఫలాన్ని రుచి చూడకు౦డానే ఎలాటి విధానాలూ ఉల్ల౦ఘి౦చకు౦డానే తన మెరుస్తున్న అంచుతో నన్ను నాప్రేమ స్వర్గం ను౦డి దూరంగా లాగి౦ది.

ఈ రోజున చాలా సంవత్సరాలు గడిచిపోయాక, ఆ సుందరమైన స్వప్నం లో బాధాకరమైన జ్ఞాపకాలు నాచుట్టూ కనిపి౦చని రెక్కల్లా కొట్టుకోడం , తప్ప నాకేమీ మిగలకపోయాక, నా హృద౦తరాళాలను  విషాదంతో ని౦పి నాకళ్ళలో నీరు తెస్తూ,మరణించిన నా ప్రియురాలు అందమైన సెల్మాను గుర్తు౦చుకు౦దుకు నా ముక్కలైన హృదయం, సైప్రస్ చెట్టు అలుముకున్న సమాధి తప్ప ఏమీ మిగల్లేదు. ఆ సమాధీ, ఈ హృదయమూ మాత్రమే సెల్మా సాక్షాలుగా మిగిలాయి.

సమాధిని చుట్టుముట్టి కాపలా కాస్తున్న నిశ్శబ్దం శవ పేఠిక అస్పష్టత లోని భగవంతుడి రహస్యాన్ని విప్పి చెప్పదు. ఆ శరీరపు మూల ద్రవ్యాలు పీల్చుకున్న వేళ్ళున్న ఆ చెట్టుకొమ్మల కదలికలు  ఆ సమాధి మార్మికాల గుట్టు విప్పవు. కాని వదన్లౌన్న నా హృదయపు నిట్టూర్పులు సజీవులందరికీ ప్రేమ, సౌ౦దర్య౦, మృత్యువు ప్రదర్శి౦చిన నాటకాన్ని తెలియజేస్తాయి.

బీరట్ నగరంలో  విస్తరి౦చి ఉన్న నా యౌవన కాలపు మిత్రులారా, మీర్రు ఆ పైన చెట్టుపక్కనున్న స్మశానం ము౦దును౦డి వెళ్ళేప్పుడు , నిశ్శబ్దంగా దానిలోకి వెళ్లి మరణించిన వారి నిద్ర చెదిరిపోకుండా మెత్తని అడుగులతో నెమ్మదిగా నడచివెళ్ళి, సెల్మా సమాధి పక్కన ఆగి ఆమె శవాన్ని దాచుకున్న నేలను పలకరి౦చ౦డి.ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో  నాపేరు చెప్పుకుని మీలో మీరు “ ఇక్కడ, సముద్రాల కావల ప్రేమ ఖైదీగా నివసిస్తున్న గిబ్రాన్ ఆశలన్నీ  పూడ్చిపెట్టారు. ఇక్కడే ఆటను తన ఆనందాన్ని పోగొట్టుకున్నది. కన్నీళ్లు ఖాళీ చేసుకున్నది, చిరునవ్వులు మరచిపోయినదీ” అనుకో౦డి.

సైప్రస్ చ్ట్లతో బాటు ఆ సమాధి పక్కనే గిబ్రాన్ విచారమూ పెరుగుతో౦ది. ప్రతి రాత్రీ,విషాదంగా , విచారిస్తూ సెల్మా నిష్క్రమణకు రోదిస్తున్న కొమ్మలతో చేరి  ఆ సమాధిపైన అతని ఆత్మసెల్మా జ్ఞాపకాలతో రెపరెపలాడుతు౦ది.

నిన్న ఆమె జీవితం పెదవులపై ఒక అందమైన రాగం , ఈ రోజున భూమి గర్భాన ఒక నిశ్శబ్ద రహస్యం.

ఓ నా యౌవనకాలపు మిత్రులారా , మీకు నా విన్నపం ఇది

మీ హృదయాలు ప్రేమించిన కన్యల పేరున

వదిలేసిన నా ప్రియురాలి సమాధిపైన

ఒక పూల సరం ఉంచండి

సెల్మా సమాధిపై మీరు౦చిన సుమాలు

వాడిపోయిన గులాబీ ఆకులపై

ఉదయపు కళ్ళను౦డి రాలుతున్న మ౦చు బి౦దువులు.

*

 

 

 

స్త్రీ వాదిని కానంటూనే ……కాదు కాదంటూనే..

sasi1

“ డార్క్ హోల్డ్స్ నో టెర్రర్ “ – చాలా అప్రయత్నంగా మరే పుస్తకమూ లేదు కదా ఏదో ఒకటి అన్న ధోరణిలో చదవడం మొదలు పెట్టాను.

మొదటి రెండు పేజీలు  చదివేసరికే నన్నిలా గాలం వేసి లాగేసింది ఆమె రచనా సంవిధానం.

ఆ ఆసక్తి తోనే వెళ్లి బెంగుళూర్ లో జయనగర్ లో ఆవిడను ఒకసారి చూసి వచ్చి చాలా కాలమే అయింది.

అద్దం లాటి ఇల్లే కాదు అద్దంలాటి ఆలోచన వ్యక్తీకరణ ఆవిడ సొంతం.

రచన వృత్తిలా ఉదయం నుండి సాయంకాలం వరకు ఫోన్ కాల్ కూడా తీసుకోకుండా రాస్తారని విని ఆశ్చర్యపోయాను. ఒక నవల కోసం దాదాపు 1500 పేజీలు  రాసి ఎడిట్ చేసుకుని ౩౦౦ పేజీల్లోకి కుదిస్తారని విన్నాక తెలిసి వచ్చింది ఆవిడ రచనలో చిక్కదనం రహస్యం.

చదువుకున్న మధ్య తరగతి మహిళల సంఘర్షణ , నగర జీవనం, అస్తిత్వ పోరాటం ఆమె ఆయుధాలు.

ఈ దశాబ్దం లోనూ చదువుకుని వివిధ రంగాలలో రాణిస్తున్న మారని మధ్య తరగతి స్త్రీ మనస్తత్వం చిత్రణ ఒక విధంగా రచయిత్రిని స్త్రీ వాద రచయిత్రిగా చిత్రీకరిస్తాయి. కాని ఎంత అభ్యుదయం సాధించినా ఇంకా భారతదేశ సమాజం అణువణువునా విస్తరి౦చిపోయిన పురుషాధిక్యత స్త్రీ నుండి ఏవిధమైన విధేయత ఆశిస్తొ౦ది, ఎలా చిన్నచూపు చూస్తోంది ఈ శతాబ్దంలోనూ మిగిలిపోయిన ఆనవాళ్ళు ఆమె నవలలు.

సాంప్రదాయకంగా సౌమ్యత ,విధేయత పుణికి పుచ్చుకుని ఇంట్లోని మగవారి అదుపాజ్ఞలలో ఉండాలనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.వేష భాషల్లో మార్పు వచ్చినా ఆలోచనా విధానంలో ప్రవర్తనలో ఇంకా అనుకున్నంత అభ్యుదయం రాలేదేమో నన్న వాస్తవం ఆవిడ నవలల్లో తొంగి చూస్తూ వుంటుంది.

అలాటి నవలలోకి రచయిత్రికి అతి ప్రియమయిన నవల ఇప్పుడు ఒకసారి చూద్దామా !

sasi2

“ డార్క్ హోల్డ్స్ నో టేర్రర్స్” లో కధానాయిక సారు ఒక అసాధారణ మధ్యతరగతి మహిళ, సంతృప్తి నివ్వని వివాహం.చిన్నతనంలో ఎదురైన గొప్ప అవమానం, నిర్లక్ష్యం, పెళ్లి అయినా పెద్దగా మారని స్థితి.తల్లిదండ్రులకున్న

పక్షపాతం కొడుకు కావాలన్న బలీయమైన కోరిక, ఆడపిల్లకు మగ బిడ్డకు మధ్య చూపే వివక్ష ,పెళ్లి తరువాత భర్త కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల సామాజిక జనాల ప్రవర్తన వల్ల శాడిస్ట్ గా మారిన భర్త , అతని ఆత్మా న్యూనత , ఆ అసహాయత , విసుగు అదంతా మను ఆమె పైన రాక్షసంగా పైశాచికంగా దాంపత్య జీవనంలో స్పష్టం గా చూపడంలో వైవిధ్యం స్పష్టత కనబరిచారు.

తల్లీ బిడ్డల మధ్య అదీ కూతురికీ తల్లికీ మధ్య సఖ్యత లేకపోవడం ముఖ్య మైన విషయం గా, తల్లి ప్రవర్తన వల్ల సారూ కూడా తల్లిపట్ల ఆమెకు సంబంధి౦చిన విషయాలైన ఆచార వ్యవహారాల పట్ల విముఖత పెంచుకోడం, ఎదుగుతున్న సమయం లో సారూ అనుభవాలు స్త్రీ త్వాన్ని ఏవగి౦చుకునేలా చేస్తాయి.

నవలంతా తల్లితో ఆమెకు గల విముఖత చుట్టూనే అల్లబడి౦ది.తల్లికి అయిష్టమనే ఆమె మెడిసిన్ చదవడం , కాని కులంలో పెళ్లి చేసుకోడం జరుగుతాయి.

కధానాయిక ముఖ్య పాత్రగా మిగతా మగ పాత్రలు నాయిక చుట్టూ పరిభ్రమిస్తాయి. భర్తలో పురుషాధిక్య భావన అహంకారం కనబడితే , తండ్రిలో వాత్సల్యం ప్రేమ విశాలమైన భావాలు పెంపొందుతాయి. మిత్రులు మాత్రం సానుభూతి పరులు. మొత్తానికి మగ పాత్రలన్నీ నాయిక వ్యక్తిత్వాన్ని ,ఉనికిని స్పష్టంగా చూపడానికి సహకరిస్తాయి.

పురుషాధిక్య సమాజంలో , ముఖ్యంగా సంప్రదాయబద్ధమైన పరిసరాల్లోఉక్కిరిబిక్కిరయిపోయే భారతస్త్రీ జీవనాన్ని ఆమె దౌర్భాగ్యాన్నీ సచిత్రంగా చిత్రీకరించారు రచయిత్రి.ఆమె స్త్రీ పాత్రలు వారి వారి భయాలు, ఆశలు, ఆశయాలు, నిస్పృహల్లో ఊయలూగుతారు. వారికి వారి బలాలూ తెలుసు బలహీనతలూ తలుసు.

అయినా పురుషాధిక్య ప్రపంచంలో తృణీకరణ కు గురవుతారు.

మధ్యతరగతి స్త్రీ జీవనాన్ని సున్నితంగా వాస్తవంగా ఆవిష్కరించిన నవలలు ఆమెవి.

 

 -స్వాతి శ్రీపాద

swathi

ఎటు ?

స్వాతీ శ్రీపాద

స్వాతీ శ్రీపాద

నాలో నేను ఇంకిపోతూ

నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ

నా చుట్టూ గిరిగీసుకున్న వలయంలో

ఎన్ని సముచ్చయాలు

ఎక్కడెక్కడో పరిచ్చేదాలు

నిట్టనిలువునా ఒరుసుకుంటూ పారే నదీ నదాలు

 

సంకోచ వ్యాకోచాల మధ్య కుదిస్తూ విస్తరిస్తూ

కాస్సేపు నీలిని౦గి పరచుకున్న సముద్రాన్నవుతాను

అంతలోనే నూతి నీళ్ళలో మోహ౦ చూసుకునే చిన్నబోయిన

గోరంత నెలపొడుపు జాబిలినవుతాను

 

దిగంతాలు తాకే రెక్కలతో ఒక్కోసారి ఆల్బెట్రాస్ పక్షినవుతాను

 అంతలో

నీళ్ళ లో కరిగిపోయే తెలి మబ్బు నీడనూ అవుతాను

 

2.

రోజుకి ఎన్ని రూపాలు మార్చుకు౦టూనో

ఊహకందని లోకాల మధ్య విహరిస్తూ ఉంటాను

అయితే నేలమీద రెండడుగులు వేసేందుకు

పంచ ప్రాణాలూ అరచేత పెట్టుకు

పలుమార్లు తత్తరపడుతూ తప్పటడుగులే వేస్తాను

అడుగు అడుగునా మొలుచుకు వస్తున్నసూదిమొనల మీద

రక్తపు టేరులు మరిగించే లేతగాయపు చిరునామా నవుతాను

3.

ఇక్కడ ఊహలకూ, పులకింతలకూ కూడా వెలకడతారట

మనసులకూ ,ప్రేమలకూ కాలం చెల్లి

సంపాదనలనూ , అవసరాలనూ అందలాలు ఎక్కించాక

కొలమానాల విలువలు మిల్లీ కొలతలకు పడిపోయాక

కలిసినంత సమయం పట్టని విడిపోడాలు

దిక్కులనూ మూలలనూ ముక్కలు చేసి

ఎక్కడ పంచుకు౦టాయి

పగిలిపోయిన గాజు అనుభూతులు

4.

నాలో నేను ఒక సుడి గు౦డాన్నై

నాలోకి నన్ను  లాగేసుకు౦దుకు

నేను నేనుగా ప్రకటి౦చు కోవాలని

అక్షరాలూ నాలుగు పోగేసుకు౦దామని

ఇలా నీటి చెలమల్లోకి

కన్నీటి పాయల్లోకి ….

– స్వాతీ శ్రీపాద

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

హోరు

ఇంటికి దగ్గరలో ఎలాటి సముద్రమూ లేదు, పోనీ అలాగని ఏ చిటాకమో చివరికి నీళ్ళగుంట అయినా లేదు. అయినా నాపిచ్చి గాని మూసీ మీదే ఆక్రమణలూ అద్దాల మేడలూ వచ్చాక ఇంకా నదులూ చెరువులూ ఎక్కడ? అయితేనేం ఈ సముద్రపు హోరు ఎక్కడిది? కొంచెం ఇలా ఏకాంతం వాలితే చాలు చెవులు దిబ్బళ్ళు వేసేట్టు ఈ హోరు…

నేనూ సమత చిన్నప్పుడు సముద్రం పక్కన బీచ్ లొ గంటలు గంటలు గడిపినా ఇలా ఎప్పుడూ అనిపించలేదు. అవును అప్పట్లో మద్రాస్ బీచ్ కి దగ్గరలో ఉన్న చిన్న ఇంట్లో పక్కపక్క పోర్షన్స్ లోనే ఉండే వారం ఇద్దరమూ . ఇంట్లో అమ్మ , నేను ,ఇద్దరు తమ్ముళ్ళు …నాన్న. నాన్నకు టీ నగర్ లో ఇరవై నాలుగ్గంటలూ కిటకిటలాడే బట్టల దుకాణం.

పొద్దున్న పూజా పునస్కారాలు భోజనం చేసి షాప్ కి వెళ్తే మళ్ళీ ఆయన తిరిగి వచ్చేది అర్ధరాత్రి పన్నెండు దాటాకే ,అందుకే మా చదువులు , మంచి చెడులన్నీ అమ్మే చూసుకునేది.

పక్కింట్లో ఉండేది సమత ,వాళ్ళమ్మ దేవిక ఇద్దరే . వాళ్ళ నాన్న గురించి ఎవరూ ఎప్పుడూ అడగలేదు , కాని దేవకీ గారు మాత్రం  మొహాన రకరకాల బొట్లు రోజుకొ రకం అలంకరించుకునే వారు.  ఆవిడ ఏదో ఆఫీస్ లో పెద్ద అఫీసరని చెప్పుకునే వారు.వాళ్ళ నాన్న మాత్రం ఎదో తప్పుచేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడని అనేవారు.  కాని ఒక్కరోజూ సమత కాని, వాళ్ళమ్మ గాని అయన ఊసే ఎత్తే వారు కాదు.

ఒకే కాంపౌండ్  లో ఉన్న రెండు ఇళ్ళు కొన్నప్పుడు; ఇద్దరికీ పెద్ద అభ్యంతరం అనిపించలేదు. కష్ట సుఖాల్లో , పండుగ పబ్బాల్లో కలిసి మెలిసి ఉండే వారం.

వాళ్ళింట్లో తల్లీ కూతుళ్లిద్దరూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడే వారు. దేవకీ గారే మంచి కాన్వెంట్ లో చదువుకున్నారట. అసలు సమత తండ్రి గురించి ఎవరికీ తెలియదు. పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కూడా కాదు. దేవకీ గారు కొత్త కొత్త ఫాషన్లు వదిలిపెట్టకుండా అనుకరిస్తూ ఎప్పుడు చూసినా ఉత్సాహానికి మారుపేరులా ఉండే వారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఒక నిశ్చలమైన నదిలా ఎంతో అందంగా మనోజ్ఞంగా అనిపించేవారు.

సమత మా ఇంట్లో అందరితోటీ చాలా బాగా కలిసిపోయింది. మాఇంట్లో అమ్మ చేసే మల్లెపూల లాంటి ఇడ్లీలు, క్రిస్పీ దోశలు  ఎంతో ఇష్టంగా తినేది. అమ్మకూడా ఇంట్లో అమ్మాయి లాగానే చూసేది. ఏ పండగ వచ్చినా మాతో పాటు సమతకూ రకరకాల డ్రెస్ లు కొనేది. ఏ జాతరకో, పుణ్యక్షేత్రానికో వెళ్ళినా పూసలో, గాజులో కొనకపోతే అనుకోవాలి.

“ఎంతైనా ఆడపిల్ల ఉండే కళే వేరు “ అనేది.

“ పోనీ మించిపోయిందేమిటి , మరోసారి ..”అంటూ ఏడిపించేవాడు నాన్న.

నాకేమో దేవకీ ఆంటీ సాండ్ విచ్ లు , టోస్ట్ లు లాటివి బావుండేవి. చిన్నప్పుడు ఒకసారి  నా పుట్టిన రోజుకి  ఆవిడ కొనిచ్చిన పూలపూల చొక్కా ఎంత ఇష్టమో — అమ్మ చెప్పేది , రోజూ అదే వేసుకునే వాడినట … ఉతకాలి మొర్రో అన్నా వినకుండా … చివరికి అది దాచిపెడితే గాని వేరే షర్ట్ ఏదీ వేసుకోలేదట.

పిల్లలకి ఏ ఇల్లు ఎవరిదని పెద్ద తేడా కూడా తెలిసేది కాదు. అమ్మ ఇంటికి సుదూరంగా మరో రాష్ట్రం లో ఉన్నా పద్ధతులన్నీ తూచా  తప్పకుండా పాటించేది. ఆషాడ మాసంలో బోనాల పండుగ , బతుకమ్మ పేర్చడాలు,కృష్ణాష్టమి…పెద్దలకు బియ్యాలు ఇవ్వడం    వాటిన్నింటికీ దేవకీ గారు , సమత మాతోపాటే ఉండే వారు .అల్లాగే దేవకీ గారు వరలక్ష్మీ వ్రతం, అట్ల తద్దె , సంక్రాంతి పెద్ద గొప్పగా చేసినప్పుడు మేమందరం అక్కడే ఉండే వారం.

పేరుకి రెండు ఇళ్ళయినా ఎప్పుడు  ఎవరు ఎవరింట్లో ఉంటారో ఎప్పుడూ తెలిసేది కాదు.

చిన్నప్పుడు ఇద్దరం కలిసే చదువుకునే వాళ్ళం, ఒకరికొకరం సాయపడే వాళ్ళం. సమతకు లెఖ్ఖలు రావని నేను సాయం చేస్తే, తను నాకు ఇంగ్లీష్ హోమ వర్క్ చేసి పెట్టేది.

తొమ్మిదో తరగతిలో అనుకుంటా ఒకసారి సాయంత్రం ఆరున్నర దాటాక నా ఇంగ్లీష్ హోం వర్క్ కోసం వాళ్ళింటికి వెళ్లాను ఎప్పటిలా , తలుపు ఓరగా వేసుంది. కాస్త జడిపిద్దామని శబ్దం కాకుండా తలుపు తీసి లోపలకు అడుగు పెట్టె లోపలే దేవకీ గారి స్వరం వినబడింది,

“ నువ్వలా మాటిమాటికీ వాళ్ళింటికి వెళ్ళడం ఏంబాగాలేదు, ఇది వరకులా చిన్నపిల్లవు కాదు, అయినా వాళ్ళింట్లో అమ్మాయిలు ఉంటే అదో దారి అందరూ అబ్బాయిలే . ”

“ అమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు.నిన్నటి దాకా లేని తేడా ఇప్పుడెందుకు వస్తోంది, ” సమత గట్టిగానే అడిగింది.

“ ఆడపిల్లలు నిన్నటి దాకా ఉన్నట్టు ఇవాళ ఉన్నారా? నిన్నటిదాకా ఉన్నట్టు నువ్వున్నావా? ఉద్యోగం చేసినంత మాత్రాన ఇష్టారాజ్యంగా వదిలేయ్యనా? అమ్మగా నా బాధ్యతా నాది. నీ హద్దుల్లో నువ్వు ఉండటం మంచిది. పెరిగిన పిల్లవు,” నిశ్శబ్దంగా వెనక్కు వచ్చేశాను.

ఈ దెబ్బకు సమత నాతో మాట్లాడదనుకునాను కాని మర్నాడు సాయంత్రమే స్కూల్ అయాక ఇద్దరం బీచ్ కి వెళ్లి దూరంగా రాళ్ళమీద కూచున్నాం.

“చిన్నప్పటినుండి కలసిపెరిగాం , అప్పుడు లేని హద్దులు ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పు? ఏదేమైనా కానీ నిన్ను చూడందే,మాట్లాడందే నేను ఉండలేను, ” ఖచ్చితంగా చెప్పింది.

అవును అంతకు ముందు బహిరంగంగా అందరిముందూ కలిసి తిరిగే వాళ్ళం , ఇప్పుడు పెద్దలకు తెలియకుండా.

సమత కాలేజీ చదువుకు వచ్చేసరికి నాన్నకు కూడా ఏదో పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చి మద్రాస్ నుండి హైదరాబాద్ మారిపోయాం . అదేం చిత్రమో సరిగ్గా మేము మారే సమయానికి దేవకీ గారికి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది.

ఇద్దరి ఇళ్ళూ కలిపి రియల్ ఎస్టేట్ వాడికి పెద్ద లాభానికే ఇచ్చేశారు.

హైదరాబాద్ లొ మంచి లొకేషన్ లొ ఇద్దరికీ పక్కపక్కనే ఇళ్ళు చూశాడు నాన్న.

కాలేజి చదువులకు వచ్చాక ఒకరికొకరం పెద్దగా సాయపడలేకపోయినా రోజుకోసారైనా కలిసి జరిగేవి జరుగు తున్నవి ఒకరికొకరం చెప్పుకుని చర్చించుకునే వాళ్ళం .

చివరికి ఇద్దరం  డాక్టర్లమైతే కష్టమని ,ఇల్లు వాకిలీ ఎవరు చూడాలని నేను మెడిసిన్ కి వెళ్తే తను ఫాషన్ డిజైనింగ్ లొ చేరింది.

మనకు ఇద్దరు పిల్లలు చాలు ఒకరిని మెడిసిన్ మరొకరిని ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నాము. మేము సెకండియర్ లో ఉండగా చిన్నగా మొదలయ్యాయి ఈ కొత్త గోడలు.

ఎప్పుడో 69 లో అణిగిపోయిన ప్రాంతీయత రాజకీయ లబ్ది కోసం మళ్ళీ తెర మీది కొచ్చింది.

గొడవలు గొడవలుగా ఉంది. ఎప్పుడు కాలేజీలు మూసేస్తారో ,ఎవరు ప్రాణ త్యాగం అంటారో తెలియడం లేదు. సమత కాస్త ఉదాసీనంగా మారిపోయింది.

“ ఈ రాజకీయాలు మనకెందుకు చెప్పు, మనం పరిచయం అయిన రోజున ఉన్నాయా ఇవి, మనం ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమనుకున్న రోజున ఉన్నాయా?”

ఎన్నో మార్లు నచ్చజెప్పాను. “ అవును రవీ , అసలు నువ్వు లేకుండా నేను జీవితాన్నే ఆలోచించలేను. అదేమిటో విడివిడిగా చూస్తే అదివేరు ఇదివేరు అనిపిస్తుంది. కాని అడుగడుగునా ఆచారాలు, పద్ధతులు , ఆనవాయితీలు మళ్ళీ ప్రాంతాల పైనే ఆధారపడి ఉన్నాయి. అంతెందుకు , కూరల్లో పులుసూ బెల్లం వేసుకుంటామని ఆంటీ యే మొదట నవ్వేవారు. అల్లాగే మీరు అన్నిట్లో ఇంత అల్లం వెల్లుల్లి ముద్దా పారేస్తారని మా వాళ్లకు ఈసడింపు. ఏం అర్థం కావటం లేదు రవీ ” అనేది.

ఈ రెండేళ్ళుగా మా రెండిళ్ళ మధ్య కాస్త స్నేహ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. ఎవరిల్లు ఎవరి సరదాలు వాళ్ళవిగా ఉంది. బహుశా మా ఇంట్లోనూ  మార్పు అనేది చల్లగా ఏ మూల నుండో దూరి ఉంటుంది.

ఒకరినొకరు పిలుచుకోడం తగ్గిపోయింది. కూరలు వంటలు ఇచ్చిపుచ్చుకోడాలు తగ్గిపోయాయి. అమ్మకు మా ప్రాంతం అనే గర్వం కాస్త వచ్చింది.

“ఇంకెంత ఇవ్వాలో రేపో తేలిపోతుంది. ఎగబడి వచ్చిన నా బిడ్డలంతా తోకముడుసుకొని పోవాలె “అనేది, రెండుమూడు సార్లు నేనే విన్నాను.

“వెర్రినామొహాలు అంతా  నవాబుల చేతుల్లో పెట్టి కూచ్చున్నారు,ఇప్పుడు నాలుగక్షరాలు నేర్చే సరికి పనికిరాకపోతున్నాము” దేవకీ గారు రుసరుసలాడేది.

నాకు నవ్వొచ్చేది.

ఈ నేల ఈ గాలి ప్రతి వ్యక్తీ వాళ్ళ అబ్బ సొత్తు  అయినట్టు దెబ్బలాడుకోడం… మొన్నమొన్నటి వరకు వాళ్ళూ, మేమూ పరాయి రాష్ట్రంలోనే గా ఉన్నాము. అక్కడి వాళ్ళు మమ్మల్నిలా వేరుగా చూడలేదే. మా పనేదో మేం చేసుకున్నాం, కలిసోచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాం.

మరి పుట్టి పెరిగిన చెన్నై మా స్వంత రాష్ట్రమైతే ఇది ఇద్దరికీ వేరే రాష్ట్రమేగా?

ఎక్కడి నుండి పుట్టుకు వస్తోంది ఈ స్వార్ధం నాదనే స్వార్ధం , నేల నాది గాలి నాది ఆకాశం నాదనే స్వార్ధం? వీటికి నేనేం చేశాను? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడిక్కడికి వచ్చి మా తాతల నేల నాదనడం?

ఎక్కడికక్కడ ఇలా గోడలు కట్టుకుంటూ పొతే చివరికి ఎవరి చుట్టూ వారికి ఒకగోడ , ఎవరి చుట్టూ వారికి ఒక సముద్రం , దాని హోరు మిగులుతాయేమో!

అమెరికా వెళ్ళినా అంతరిక్షాని కెళ్ళినా ఇక్కడి హక్కులు మాత్రం భద్రంగా  పదిల పరచుకునే తీరతారా ? నా మాతృభూమికి నేనేం చెయ్యగలనన్నది ఆలోచించాలి గాని ..

ఇవెక్కడైనా పోనీ నా సంగతీ, సమత సంగతీ తేలాలి.

ఖచ్చితంగా ఈ జీవిత సగభాగం సమత తప్ప మరొకరు కాలేరు.

భగవంతుడా ఈ హోరునుండి  ఎలా బయట పడాలి?

సమతను కలుసుకుని మూడు రోజులైంది. ఉహు తను కనిపించకపోతేనే తోచదు.

సాయంత్రం సమతను కలిసే వరకూ ఆ హోరు అలాగే కొనసాగింది.

చీకటి పడ్డాక కూడా చాలా సేపు బిర్లా మందిర్ మెట్లమీద అలా కూర్చుండి పోయాం నిశ్శబ్దంగా.

ఎప్పటికో ఏదో చెబ్దామని తలెత్తాను .సరిగ్గా అదే ఉద్దేశ్యంతో సమత నావైపు చూసింది.

ఇద్దరమూ మాట్లాడలేదు.

మళ్ళీ కాస్సేపటికి కాస్త స్థైర్యం కూడగట్టుకుని పెదవి కదిపాను.

“సమతా ఈ ప్రాంతీయ విభజన ఇవ్వాళా జరగవచ్చు, మరో పదేళ్లకు జరగవచ్చు, జరక్కపోనూ వచ్చు. మనం మాత్రం చిన్నప్పటినుండీ పెంచుకున్న ప్రేమ వృక్షం ఇప్పుడిలా ఎవరికోసమో నరికేసుకోము. కాని నీకూ నాకూ సంబంధించినంతవరకే కాదు రేపటి మన బిడ్డల తరానికీ ఈ హోరు , ఈ ఏకాంతపు పోరు వద్దు సమతా. మనబిడ్డలు ఎక్కడి వారవుతారు? ఆలోచించు సమతా ఏ ప్రాంతమయినా మన ఇద్దరిదీ నువ్వు వేరు నేను వేరు కానప్పుడు , నాకు సంబందించిన వన్నీ నీవి, అలాగే నీకు చెందిన వన్నీ నావికూడా. ఏమంటావు”

సమత మాట్లాడలేదు. సుదూరంగా కనిపిస్తున్న బుద్ధ విగ్రహాన్ని చూస్తోంది.

నా మనసులో హోరు మాత్రం చిత్రంగా మాయమయింది.

“రా సమతా , వెళ్దాం చాలా రాత్రయింది” లేచి చెయ్యందించాను.

***

swathi –స్వాతి శ్రీపాద