చెరువు – చింతచెట్టు

 

 

-స్వాతి కుమారి బండ్లమూడి

~

 

మరి- బాగా ఎండల్లో, నడి వేసవిలో ఎండిపోయిన చెరువులో సాయంత్రాలు పిల్లలంతా చేరి ఈలేస్తే అంటుకునే ఆట, చప్పట్లు కొట్టి పరిగెత్తే ఆట ఆడుకుంటారు కదా, ఇంట్లో తిడతారనే భయమున్న పిల్లొకత్తి పీచుపీచుగా మసక రాగానే తొందరగా ఇంటికి బయల్దేరుతుంది కదా, దాదాపు ఆ వేళప్పుడే వచ్చాడు వాడు. దుబ్బు గడ్దం, ఒత్తు జుట్టు, మురికి బట్టలూ, ఆ అవతారమూ; ఏ దిక్కునుండి, ఏ వూరి నుంచి వచ్చాడో ఎవరూ చూడలేదు. పాతగుడ్దతో కట్టిన మూటొకటి చంకన పెట్టుకుని ఆడుకునే పిల్లల మధ్యకి ఈలలేసుకుంటూ చప్పట్లు కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. మట్టిదిబ్బ మీద మూట విసిరేసి “రండ్రా! నన్నంటుకోండి చూద్దాం” అని వాళ్ల మధ్య వడగాలిలా అటూ ఇటూ గెంతాడు. “అమ్మో! పిచ్చోడు” అని గట్టుమీదకి పారిపోయారు వాళ్ళు. “పోరా పిచ్చెదవా” అనరిచాడు ఒక పెద్ద పిల్లాడు కాస్త ధైర్యంగా. “ఓయ్, ఉరేయ్… నా పేరెవడు చెప్పాడ్రా నీకు? బలే, బలే” అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు, బయమేసేలా కాదు నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు, కితకితలు పెడితే మెలికలు తిరిగినట్టు వంకర్లు పోతూ ఇహ్హిహ్హి అని. నవ్వితే వాడి కళ్ళ పక్కన వదులుగా ఉన్న చర్మం గీతలుగా ముడతలు  పడుతుంది. “మళ్లీ రేపు రండి. రారూ? హిహి” అనుకుంటూ తలకింద మూట వొత్తుగా పెట్టుకుని కాలిమీద వేసుకున్న కాలు ఊపుతూ ఆ ఎండిన చెరువులో పైకి చూస్తూ పడుకున్నాడు. పిల్లలు బెదిరిపోయి ఎటు వాళ్లటు ఇళ్లకెళ్ళిపోయారు.

అది మొదలు వాడా చెరువుని వదల్లేదు. మిట్టమధ్యాహ్నం రాళ్ళు రాజుకునే ఎండప్పుడు మాత్రం చెరువొడ్డున చింతచెట్టు కిందకి చేరేవాడు. ఎవర్నీ ఏమీ అనడు, పొమ్మంటే పోడు, తిడితే నవ్వుతాడు, గట్టిగా బెదిరించి పొమ్మని కర్ర చూపిస్తే ఇంకా పెద్దగా నవ్వుతాడు. మెల్లగా పిల్లలు అలవాటు పడిపోయారు, నాల్రోజులకి వాళ్ల ఆటల్లో చేర్చుకున్నారు కూడా. పిచ్చోడిది చువ్వలాంటి ఒళ్ళు, చురుకైన నడక, తూనిగలాగా ఎటైనా దూరిపోయి పరిగెడతాడు కానీ చచ్చినా అంటుకోడానికి చిక్కడు. జట్టులుగా ఆడేటప్పుడు వాణ్ణి తమలో చేర్చుకోడానికి రెండు జట్ల పిల్లలూ పోటీ పడేవాళ్ళు. పిల్లలకిష్టంగా ఉన్నాడు కదాని పెద్దాళ్ళు కూడా వాణ్ణేం అనలేదు. ఆ చెట్టుకింద వాడే పడుంటాడులెమ్మని వదిలేశారు.

పిల్లలు లేనంతసేపూ వాడేం చెయ్యడు, అట్లా ఖాళీగా చెరువులోనో చెట్టు కిందో తిరుగుతూనో పడుకునో ఉంటాడు. చింతచెట్టు పక్కన పసుపురాయికి ఎవరైనా బొట్టుపెట్టి ఒక కొబ్బరిముక్కో, అరటి పండో అక్కడ పెట్టెళ్తే తింటాడు. పిల్లలు  ఆటలకొచ్చినప్పుడు అటుకులో, మరమరాలో తెచ్చిస్తే ఆకుల్లో పొట్లాం కట్టుకుని రాత్రికి దాచుకుంటాడు. “పిచ్చోడా! ఏం తిని బతుకుతావురా? పనిస్తా చేస్తావా” అని ఎవరైనా జాలిగా అడిగితే “పోరా! పనికిమాలినోడా, పని చెప్తే తంతా, తంతే నవ్వుతా” అని మళ్లీ కితకితలుగా నవ్వుతాడు.  రాత్రైతే మాత్రం హుషారుగా గొంతెత్తి పాడుకుంటాడు చాలాసేపు. ఏమాటకామాట, వాడిగొంతు భలే సన్నగా, కాస్త ఆడగొంతులా మెత్తగా ఉంటుంది. వినసొంపుగా ఉంటుంది కానీ ఆ పదాలకి అర్థం పాడూ ఏముండదు. ఏ మాట గుర్తొస్తే, ఎదురుగా ఏది కనిపిస్తే ఆ పేర్లన్నీ కలిపేసి, ఒక్కోసారి మధ్యలో ఆపి “ఊహుహు,  రాళ్ళురప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.”అని కళ్ళు మూసుకుని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగంనిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లూ, వేపచెట్లూ ఊగినప్పుడు అర్దరాత్రి వాడి పాటలు కూడా.

***

Art: Rafi Haque

Art: Rafi Haque

ఆ ఏడాది మొదటి వానొచ్చింది. చెరువునొదిలి పిచ్చోడు అచ్చంగా చింతచెట్టు కిందే ఉంటున్నాడు. మళ్ళీ వానొచ్చింది. చెరువు నిండింది. బిందెలతో, కావిళ్లతో చెరువు నీళ్లకి వచ్చే జనంతో బాగా పొద్దుపోతుంది. వాన వెలిసిన ఒక రాత్రి వాడు ఎప్పటికన్నా ఎక్కువ సరదాగా రాత్రంతా పాడుకుని ఆగి ఆగి నవ్వుకుని ఎప్పటికో నిద్రపోయాడు.

అప్పటికింకా తెల్లారలేదు. ఎక్కడా ఏ చప్పుడూ లేదు. ఆ పొద్దుటి చీకటిలో పిచ్చోడెందుకో చప్పున లేచి చూశాడు. అనుకోకుండానే వాడి పాతబట్టల మూటని గట్టిగా గుండెకి అదుముకున్నాడు. ఎవరదీ అని కర్రపుల్ల తీసీ అటూ ఇటూ గాల్లో ఆడించాడు. కర్రకి మెత్తగా ఏదో తగిలింది. “బ్బా…” అనొక ఆడ గొంతుతో పాటు గజ్జెల చప్పుడూ గబగబా దూరమయ్యింది. అట్లా పోయేటప్పుడు వెళ్తున్న మనిషి బిందెలోంచి నీళ్ళు ఒలికిపోయి వాడు తడిసిపోయాడు. పిచ్చోడు నవ్వాడు. “బిందె వాన, గజ్జెల వాన” అని మళ్లీ మళ్ళీ అనుకుని మూట తలకింద సర్దుకుని మళ్ళీ పడుకున్నాడు.

రోజూ తెల్లారకముందే ఇదే వరస. ఎట్లానో నిద్రాపుకుని ఒకరోజు పట్టుకున్నాడు. “ఎవరే నువ్వు? నీ పేరేంటే?” అన్నాడు. ఆ పిల్ల భయంగా చూసింది. ఎంతడిగినా ఏం చెప్పదు. అది మూగదని తెలిసింది వాడికి. దానికో పేరు కూడా ఏం లేదు. ఐనా మూగదానికి పేరెందుకని ఎవరూ దానికి పేరు పెట్టలేదు. బిందెలో నీళ్ళు వాడి మొహం మీద చల్లి నవ్వేసి పోయింది. ఎవరూ లేవకముందే నీళ్లకోసమో, నీళ్లవంకనో కానీ వచ్చేదా పిల్ల. కాసేపు అక్కడ కూర్చునేది. వాడూ సరిగ్గా ఆ వేళకి ముందే లేచేవాడు. చాలా మాటలు చెప్పేవాడు. కొన్నిసార్లు ఏదైనా పాడేవాడు. ఆ పిల్ల చద్దన్నం తెచ్చి పెడితే పొద్దెక్కాక తినడానికి దాచుకునేవాడు. ఒక్కోసారెందుకో ఇద్దరూ కలిసి బాగా నవ్వుకునేవాళ్ళు, ఒకళ్ల మీదొకళ్ళు నీళ్లు చల్లుకునే వాళ్ళు. రాత్రి పూట చెట్లకింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్లలా మూగదానా అని పిలవటానికి వాడికి మనసు రాలేదు. “నువ్వు మంజులవి కదూ? “ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్లలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.

ఒక్కోసారి మంజుల వాడి మూటని చూపించి అదేంటని సైగ చేసేది. వాడిక్కోపమొచ్చి కర్రపుల్ల తీసుకు విసిరేసేవాడు. నొప్పుట్టి ఏడ్చి వెళ్ళిపోయేది. అలా అలిగితే ఓ రెండ్రోజులు వాడికి కనపడకుండా ఎటునుంచో చెరువుకి వచ్చి వెళ్ళిపోయేది. కానీ ఉండబట్టలేక మళ్ళీ వచ్చేది. అట్లా అలిగి మళ్ళీ వచ్చినప్పుడల్లా పసుపురాయి దగ్గర పళ్ళు, పొట్లాల్లో అటుకులు చీమలు పట్టి ఉండేవి. కళ్లనీళ్ళు పెట్టుకునేది, వాడి భుజం మీద తట్టి నిద్రలేపేది. వాడు “కొట్టన్లే, రాకుండా ఉండకే మంజులా, ఆకలెయ్యట్లేదు” అని నవ్వేవాడు.

తెల్లారుతుంటే బిందెత్తుకుని బయల్దేరేది. ఒక్కోసారి చెయ్యి పట్టుకు ఆపేసేవాడు. “ఇంటికెందుకూ? ఉండిక్కడే” అనడుగుతాడు. ఇంట్లో తాత ఉన్నాడని, తాతకెవరూ లేరని , లేచి నడవలేడని సైగ చేసి చెప్తుంది. “సరే! ఫో, ఛీ, పనికిమాలినదానా, ఫో, మళ్లీ ఇటొచ్చావా కొడతా” అని చెయ్యొదిలేవాడు. అటూఇటూ తిరిగే జనాల్ని చూసి అది గబగబా వెనక్కి తిరక్కుండా వెళ్లిపోయేది. అలా వెళ్ళేప్పుడు కాలిపట్టీలు భలే గలగలమనేవి.

ఎన్నిసార్లో అట్లా. ఇంకెప్పుడూ రావద్దనడం, రాకపోతే కడుపు మాడ్చుకు పడుకోవడం, మళ్ళీ అదొచ్చాకా “ఏమనను, కొట్టను. తాత దగ్గరికే పో, నాతో ఉండొద్దులే, ఏడవకు. చద్దన్నం తినేదాకా ఉండిపో” అని బతిమాలడమూ. వాళ్లకదంతా ఒక ఆటలాగా, అలవాటులాగా అయింది.

ఒకరోజు పిచ్చోడికి హుషారెక్కువైంది. పెంకితనం ముదిరింది. ఎప్పట్లాగే వెళ్లొద్దని చెయ్యి పట్టుకు ఆపాడు. మంజుల ఆగలేదు, చెయ్యి విదిల్చుకుంది. వాడికి పంతం వచ్చింది. బిందె లాక్కుని నీళ్లన్ని దాని మీద కుమ్మరించాడు. దానికెందుకో చాలా ఎడుపొచ్చింది. కోపమొచ్చింది. వాడేమో ఏం చేసినా నవ్వుతాడాయె, వీణ్ణెట్లా ఎడిపించాలా అని అటూ ఇటూ చూసింది. వాడి మూట కనపడింది. గబుక్కున ఆ మూట తీసుకు అటూ ఇటూ పరిగెత్తింది. వాడసలే పరుగులో చురుకుకదా వెంటపడ్దాడు, మీదపడి కలబడ్డాడు. మూట ఊడిపోయింది. అందులోని వస్తువులన్నీ కింద పడిపోయాయి; కొన్ని రంగుల మట్టి గాజులు, ఒక పాత చీర, ఒక పూసల దండా, ఇంకా అట్లాంటివే ఏవో. మంజుల ఏం మాట్లాడలేదు. ఏమడగలేదు. నిదానంగా మళ్లీ    చెరువుకెళ్ళి నీళ్ళు ముంచుకుని వెళ్ళిపోయింది. పిచ్చోడూ ఏం మాట్లాడలేదు. ఏం తెలీనట్టు అలా చింతచెట్టుకింద అటు పక్కకి తిరిగి పడుకున్నాడు. చెదిరిపోయిన సామానంతా అలాగే వదిలేశాడు.

గొడవైతే కొన్నిరోజులు రాదుగా ఆ పిల్ల, కానీ ఈసారి వచ్చింది. తెల్లారేదాకా నీళ్లకోసం ఆగలేదు. ఆ రాత్రే, చీకట్లో తడుముకుంటూ చెట్టు వెతుక్కుంటూ వచ్చింది. వాడెప్పట్లాగే నవ్వుకుంటూ, పదాలు మార్చి మార్చి పాడుకుంటూ, చెట్టు మాను మీద దరువేసుకుంటూ ఉన్నాడు. “ఓ మంజులోయ్! దా దా, ఈ పూట బాగా తిన్నా, చుశావా? చీమలకి పస్తే” అని పెద్దగా నవ్వాడు. మళ్ళీ కాస్త ఆగాడు. “ఇదిగో చెప్తున్నా! ఎందుకొచ్చావో వచ్చావు. ఈ పూట వెళ్లావా, ఇక అంతే” అని అరిచాడు. అది కాసేపేం అనలేదు. తర్వాత సైగ చేసింది మణికట్టు చూపించి మెడ చూపించీ, చిరిగిన మూట చూపించీ.. అవన్నీ ఎవరివని అడిగింది. “ఎవరేంటే? పనికిమాలినదానా? ఈ ఊరికి రాకముందు ఎన్ని ఊర్లు తిరాగాను. నీకెందుకే మూగదానా?” అని మళ్ళీ జోరుగా పాటందుకున్నాడు. ఆ పిల్ల వెళ్ళిపోడానికి లేచింది. “ఇదిగో! చెప్పాను. ఈపూట వెళ్లావా! ఇక..” వాడి మాట పూర్తికాలేదు, వాడి రెండు చెంపలమీదా బలం కొద్దీ చాచికొట్టింది. చీకట్లో తడుముకోకుండానే పరిగెత్తి ఇంటికెళ్ళిపోయింది.

ఆ రాత్రి తెల్లారాక నీళ్ళకెళ్ళిన వాళ్ళెవరికీ చింతచెట్టు కింద పిచ్చోడు కనపడలేదు. మూగది నిద్రలేచి చూసుకుంటే దాని  కాలిపట్టీలు కూడా కనపడలేదు. అసలు సంగతేంటంటే- కొట్టినా తిట్టినా ఎప్పుడూ నవ్వే పిచ్చోడు ఆ రాత్రంతా ఎక్కెక్కి ఏడ్చాడనీ, ఆ తర్వాతెప్పుడు నీళ్లకెళ్ళినా మూగది ఒక బిందెడు నీళ్ళు పసుపురాయి మీద కుమ్మరించి పోతుందనీ చింతచెట్టుకీ చెరువుకీ తప్ప ఇంకెవరికీ తెలీదు.

-*-

అంతా అనుకున్నట్టే 

 

అంతా అనుకున్నట్టే

(ఉపశీర్షికతోసహా)

 

-స్వాతి కుమారి బండ్లమూడి 

~

 

ఇంతాచేసి మనక్కావల్సింది కొన్ని వాక్యాలేగా?

రాసుకుంటావా చెప్తాను?

 

నిప్పు కన్నుల నీవు- నగ్నమైన చూపుల అగ్నికీలవు

గాలి కౌగిళ్ళ నీవు- దగ్ధమైన రాత్రుల భగ్నకాంక్షవు

వెన్ ఐ కిస్ యూ, ఐ డోంట్ జస్ట్ కిస్ యూ!

– మధ్యలో ఎక్కడో “ఉప్పులేని తరగల సాగరానివి”, “పడగ విప్పు పెదవుల ప్రాప్త క్షణానివి”, “పచ్చబొట్టు స్పర్శల పరవశానివి” ఇట్లాంటివి చేర్చుకోవచ్చు. అసలు మాట విను “you are just another pair of legs” అని మాత్రం హన్నన్నా… రాసేస్తావా ఏంటి కొంపతీసి?

చుట్టుతా ఉన్నది శూన్యం అసలే కాదు. రాలటానికీ పూయటానికీ మధ్య దుఃఖానికి వ్యవధి లేదు. రాత్రుళ్ళు గదిలో జ్ఞాపకాలు పచార్లు చేస్తున్నాయని, నిద్రంతా నీటిపాలౌతుందనీ అదే అదే సూడో రొమాంటిక్ లాఫింగ్  స్టఫ్- ప్లీజ్… ఇకపై వద్దు. హృదయం మధుపాత్ర కాదు, కనీసం డిస్పోసబుల్ టీకప్ కుడా కాదు. పింగాణీ ప్లేటో, పులిస్తరాకో తేల్చుకోవాల్సినంత సీనేం లేదు. నేను హిపోక్రాట్ ని కావచ్చు కానీ మానిప్యులేటర్ ని కాదు. నేను పిచ్చికుక్కని కావచ్చు కానీ కోడిపెట్టని కానందుకు క్షమించొచ్చు.

నీ సంగతంటావా? నాటకం నడిచేటప్పుడు నువ్వు తెర బయట చెమ్కీ దండవి కావచ్చు, వేషగాడి మొహంమీద చెమటకి కారిపోయే రంగువో, హార్మనీ పెట్టె మీది క్రీచుమన్న మొరటు చప్పుడువో.. ఏం ఎందుక్కాకూడదు?

అన్నంముద్దకై ఆత్మలు నశించు నేలమీద వెన్నెల గురించీ, వర్షానందాల గురించీ వీరేమి వదరుచున్నారు?

సుఖతల్ప శయన మధ్యమున- విషాదమనీ, వేదన అనీ ఎంచేత ప్రేలుచున్నారు?

సరస్వత్తోడు- ఉభయకుశలోపరి.

 

P.S- తోవ తప్పించే పన్లు మాత్రం ఆల్కెమిస్ట్ గాడు మహా తొందరపడి చేసి పెడతాడు.

 

ఈకలు రాలుతున్నాయి

అబ్బా నిద్ర పట్టేసింది.

 

ఇంకా చెబుతూనే ఉన్నావా? ఇన్నిరాత్రులుగా నా చెవిలో గుసగుసగా చెబుతున్న అవే మాటలు. రేపు మాట్లాడుకుందాం ఇక పడుకోవూ! ఊహూ, అస్సల్లేపను. భయమేస్తే ఏడుపొస్తే కూడా. నిద్రలో ఉలిక్కిపడి లేస్తానేమో అని ఎన్నేళ్ళు ఇలా మేల్కొని, మేల్కొని ఉండటం కోసం మాట్లాడుతూ ఉంటావ్, అవే అవే మాటల్ని? ఇదేగా చెబుతున్నావు ఇవ్వాళ కూడా-

1384107_10153291089355363_299593426_n

“బుజ్జి పిట్ట గూట్లోకి దూరి గడ్డి పరకలు అడ్డం పెట్టుకుంది. అన్నీ భ్రమలే దానికి, ఎప్పుడూ ఒకేలాంటివి, దాన్ని ఎవరో పిలుస్తున్నట్టు, కొన్నాళ్లకి అలవాటు పడింది. కొమ్మల్లో చప్పుడైనా అది తన లోపలి అలికిడి అనే నమ్ముతుంది. వర్షం వెలిసిన పూట కూడా తలుపు తియ్యడం మానేసింది. ఏమయిందో తెలీదు చెట్టు కాలిపోయిందో రోజు. నిప్పు ఉప్పెనలా కమ్ముకొస్తే కూడా తలుపు తియ్యడం ఎలానో, తను కాలిపోకుండా ఎందుకుండాలో తెలీలేదు పాపం. అప్పుడందట- రోజూ ఇదే కల నాకు. నిద్రపట్టేస్తుందిలే మళ్ళీ అని”

 

ఇదే కథని ఎన్నాళ్ళు చెబుతావింకా? పోనీ కొత్తగా ఏమైనా చెప్పు. పిట్ట సంగతి మర్చిపో. ఏదోటి చెప్పు, చెరువులో నీరంతా కలువపూలుగా మారేలోపు రాలేకపోయావనో, వచ్చేలోగా ఋతువు మారిపోయిందనో, దారిలో అడ్డంగా అడవి నిద్రపోయి లేవకపోతే మోకాళ్లకి అడ్డుపడి ఆగిపోయావనో. ఇవేం కాదా? దార్లో కనపడ్ద ప్రతీ గూడు దగ్గరా ఏదో వెర్రిఆశతో ఆగుతూ జారిపడ్డ ఒక్కో గడ్డిపరకనీ ఏరుకుంటూ వచ్చావా!

 

చూడు! రాత్రిని తొనలుగా వలిచి చెరిసగం చేసుకోవడం వీలు కాదు. తెల్లారితే నిన్ను చూసే తీరికా ఉండదు. రోజంతా గుట్టలెక్కుతూ గడపాలి. నీకు రూపం లేదు నిజమే, ఐనా భుజాన మొయ్యలేను. అప్పట్లాగా రెక్కలు చాచలేకనే అడిగావు నన్ను. నువ్వు పిట్టగా ఉన్నరోజుల్లో ఐతే, అప్పుడే నా దగ్గరకొచ్చి ఉంటే హాయిగా కలిసి ఎగిరేవాళ్లం కదూ! ఇప్పుడేం చెయ్యగలను. బలం చాలదు ఆజన్మాంతం వెంటాడే నీ దుఃఖపు బరువుని మోసుకు తిరగడానికి. బుజ్జిపిట్టా! వెళ్ళిపో ఎటైనా…

-స్వాతి కుమారి బండ్లమూడి

Artwork: Mandira Bhaduri

తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా…!

1swatikumari-226x300నువ్వు ఒక మాట అంటావు, అది భలే బాగుంటుంది/మాట మీద కాసేపు నడుస్తావు ప్రత్యేకించి పనేం లేక – అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా అన్న చాలా మాటల్లోంచి బాగున్న మాటలని ఒకచోట పోగుచేస్తే, ఆ బాగున్న ఒక్కోమాట మీదా కాసేపు అదే పనిగా నిలిచిపోతే, అలా నిలిచి వెనక్కూ, ముందుకూ నడుస్తూ ఆ మాట తుదీమొదలూ తేల్చుకునేందుకు మొండికేస్తే; బహుశా, ఆ మొండి ప్రయత్నమే కవిత్వమౌతుంది కాబోలు. అలా నడుస్తూ, తిరుగుతూ ఎప్పటికో “ఏది బయల్దేరిన చోటు ద్రిమ్మరికి? అన్న అనుమానమొచ్చి సమాధానపరచుకునే ప్రయత్నమేమో కూడా కవిత్వం అనిపిస్తుంది హెచ్చార్కే గారి కవితలు చదువుతూ విస్మయంతో దారితప్పినప్పుడు.

హెచ్చార్కే గారి ఇటీవలి కవితల్లో తరచుగా ఆత్మాశ్రయ శూన్యం, బహుముఖాలైన ఏకాత్మ తిరిగి ఒకటిగా మూలాన్ని చేరుకునే ప్రయత్నం  కనిపిస్తున్నాయి. “నువ్వెప్పుడూ ఒక్కడివే /నీకు నివాస యోగ్యం నువ్వే, “ఎన్ని నేనులు కలిస్తే ఒకడు ఒకడవుతాడు? వంటి పంక్తులు చూసినప్పుడు ఈ కవితలు- ఏమీ లేకపోవడం గురించి కాదు, ఏమీ లేకపోవడం కూడా లేకపోవడం గురించి అనిపిస్తుంది. ఆ రాశిలోనిదే ఒక ఊహ ఇక్కడ;

నీటి ఊహ

రచన : హెచ్చార్కె

ఒక్కడివి వంతెన మీద
ఎవరూ రాని వెన్నెల వేళ
ఆ చివర అంటూ ఏమీ లేనట్టు అనంతంగా ఇనుప స్తంభాలు
స్తంభాల మీద ఆకాశంలో ఊగుతున్నట్లున్న అర్థ వలయాలు

ఒక ఊహ
నీరై ప్రవహిస్తుంది. జ్ఞాపకాన్ని దాటి ఆవలికి దూకే ప్రయత్నంలో
తన మీంచి తాను పొర్లుతుంది. గోధుమ రంగు కుక్కపిల్లల ఆట.

నీరు కాదు ఊహ
కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు
కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు
ఏమీ లేదనడమంటే పూర్తిగా అర్థమయ్యేదేదీ లేదని. ఏం, లేకపోతేనేం,
చెయ్యి ఉంది, కాలు ఉంది, దూరం ఉంది, భయం ఉంది, కోరికలున్నాయి;
ఆగమని కాదు; అపేసేంత దిగులొద్దని, ఆదమరిచేంత సంతోషం వద్దని

ఒక్కడివే వంతెన మీద
నీ కోసం నువ్వు ఎదురు చూస్తూ
రావలసి వున్న నిన్ను ఆడపిల్లను చేసి అందమైన అమ్మాయి పేరు పెట్టి
ఆమె కాదనడానికి వీల్లేని ప్రేమకు రాయాల్సి వున్న పాటకు రాగం కట్టుకుని
పాడాలనుకుని

ఎప్పటికీ రాని నీ చేతికి పులి నోట్లో విసరాల్సిన ఖడ్గమొకటి సంధించి
నీ నుంచి నీకు తగిన సమాచారం అందాక చివరి యద్ధానికి వ్యూహ రచన
చేద్దామని; ఇది కాకుంటే ఇంకొకటి, లేదా మరొకటి చేద్దామని
స్తంభాలలో, అర్థవలయాలలో, నీళ్లలో నువ్వొక స్తంభమై, వలయమై, నీరై


——————————————————————————————————————-

  నీటి అద్దంలో వెన్నెల ఊహ, వెన్నెల నదిలో నీటినీడల నిరీహగా ఈ కవిత మొదలెట్టగానే ఒక స్పష్టమైన దృశ్యం సాక్షాత్కరించింది. ఆద్యంతాలు తోచని నిలువెత్తు ఏకాకితనం, ఎదురుచూడ్దం మర్చిపోయిన ఇనుపస్తంభాల వంతెనపై నిల్చుని కనపడుతుంది. నది తలెత్తి చూసినప్పుడు తనలో కదిలే నీడలకు ఆకాశంలో కదలని జాడలు బింబాలవుతాయి. అందుకే అర్ధవలయాలు ఊగుతున్నట్టుగా ఉంటాయి.

ఊహలకి నిలకడ తెలీదు. నీటిలాగా నిరంతర ప్రవాహమే వాటి స్వభావం. ప్రవహిస్తూ, తన దారిలో దాటుతున్న ప్రతీదాన్నీ కలుపుకుంటూ, కలుపుకున్న ప్రతిసారీ గమనానికి లొంగని కొన్ని జ్ఞాపకాల్ని దాటే ప్రయత్నంలో,  తన చుట్టూ తాను సుడులుగా, తనపైనుంచి  తాను ఆవలికి దూకటానికి మరింతబలాన్ని తనలోంచే బయటికి తెచ్చుకునే నీటిలాంటి ఊహలు, ఆటల్లాంటి ఊహలు, కలల వేటలాంటి ఊహలు. ఈ స్వభావాన్నే కవితలో ఇలా చెబుతారు- ఒక ఊహ నీరై ప్రవహిస్తుంది. జ్ఞాపకాన్ని దాటి ఆవలికి దూకే ప్రయత్నంలోతన మీంచి తాను పొర్లుతుంది. గోధుమ రంగు కుక్కపిల్లల ఆట.” గోధుమరంగు కుక్కపిల్లలు పొర్లుతున్న దృశ్యం అంతకుముందున్న పదాల్ని ఉన్నఫళాన చిత్రాలుగా రూపుకడుతుంది. జ్ఞాపకాలు పొర్లే అమూర్త భావనని కళ్ల ద్వారా అర్థం చేసుకోవడాన్ని అలవాటు చేస్తుంది.

కేవలం ఊహించడంలో ఏముంది? ఆశలు దొర్లి కిందపడకుండా ఒక అడ్డు, గుట్టలుగా పోగుపడే నిరంతర నిజజీవిత వాక్యాల మధ్య కాస్త తెరిపి. ఈ భావాన్నే ఇలా అంటారు “కలల పాపాయి పడిపోకుండా పక్కల్లో అమ్మ సర్దిన పొత్తిలి మడతలు/కొన్ని విరామ చిహ్నాలు; అంతే, ఏమీ లేదు.” చుట్టుతా వస్తుసంచయం, కోలాహలం; తన నిలువెల్లా తన శరీరమే ఆక్రమించి శూన్యం కేవలం ఒక భావనగా మిగుల్తుంది. ఏమీ లేకపోవడమనే బరువుని దింపుకోడానికి మరేచోటూ దొరకదు. అసలు లేకపోవడమంటే ఏమీ లేదని కాదు- ఉండక తప్పనివి, ఉండాలని అనుకోనివీ, ఉన్నా నిజమవ్వనివి కొన్ని భయాలు, సందేహాలూ, కోరికలూ ఉన్నాయనే, అవి ఉండటం వల్లే మరేమీ లేకుండా చేస్తున్నాయనే! అందుకే హెచ్చరించవలసి వస్తుంది- “ఆగమని కాదు; అపేసేంత దిగులొద్దని, ఆదమరిచేంత సంతోషం వద్దని” అంటూ…

ఎదురుచూస్తుంటాడు మనిషి తానే మరొకరైన ఒక ఆకారం కోసం, తనని సంపూర్ణం చేసే ఏదో అస్తిత్వం బయటినుంచి వచ్చి కలవడం కోసం. ఆశనిరాశల మధ్య వంతెనపైన, అనంతంగా కనపడే వాస్తవపు ఇనపస్తంభాల ఆవల, ఏముందో తెలీని చోటుని దాటుకుని మరో ప్రకృతిగా తనని చేరే ఆహ్లాదం కోసం. ఎప్పుడుందో తెలీని, బహుశా ఎప్పటికీ ఉండబోని ఒక జీవన సాఫల్య సమాగమం కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయాన్ని కోల్పోయే ఏ ఒక్క అవకాశమూ తలెత్తకుండా జాగ్రత్త పడుతూ ఆమె కాదనడానికి వీల్లేని ప్రేమకు రాయాల్సి వున్న పాటకు రాగం కట్టుకుని పాడాలనుకుని”  లెక్ఖించకూడనన్ని అలాపనలు సాధన చేస్తుంటాడు.

ఎదురుచూడ్దమే కాదు, సర్వసన్నద్ధంగా ఉంటాడు తనతో తనకి రాబోయే యుద్ధాలకోసం. ఏవో ఊహించలేని సంఘర్షణల్లో గెలవడానికి ఎత్తుగడలో భాగంగా ఆలోచనల్ని, ముందస్తు జాగ్రత్తనీ ఆయుధాలుగా చేత పట్టుకుని తయారుగా ఉంటాడు ఎప్పటికీ రాని నీ చేతికి పులి నోట్లో విసరాల్సిన ఖడ్గమొకటి సంధించి”. తానే నీరుగా తిరిగి తిరిగి మొదటికే చేరే ప్రవాహంలా, తుదీ మొదలూ లేని వృత్తంలా, చివరికి తనకి తానొక ఊహగా, తన అస్తిత్వానికి శూన్యానువాదంగా, లోపలి ఖాళీని వంతెనలు, స్తంభాలు, వలయాలుగా దర్శించుకుంటూ ఉంటాడు.

—-*—-