తర్జుమా కావాలి: సంగిశెట్టి

 

 

  ఇంటర్వ్యూ : స్కైబాబ 

~

తెలంగాణ  సాహిత్యానికి  చేసిన సేవలకు గుర్తింపుగా సంగిశెట్టి శ్రీనివాస్‌ కి  తెలంగాణ అవతరణ ఉత్సవ పురస్కారం దక్కింది. సంగిశెట్టి 1965లో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలోని రఘునాథ పురంలో పుట్టారు. చిన్నప్పుడే  తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌ వచ్చిన శ్రీనివాస్‌ 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాయూనివర్సిటీ కేంద్రంగా  ఏర్పడి, పనిజేసిన తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ స్థాపకుల్లో ఒకరు. 1991 నవంబర్‌ ఒకటిన ఆర్ట్స్‌ కళాశాలపై ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు వ్యతిరేకంగా పెద్ద నల్లజెండాను ఎగరేశారు సంగిశెట్టి.

తొలి  కవయిత్రి కుప్పాంబికను వెలుగులోకి తెచ్చారు. తొలి తెలుగు కథలు  – భండారు అచ్చమాంబ, ఆవుల  పిచ్చయ్య, సురమౌళి కథా సంపుటాలను వెలువరించారు. మరుగునపడ్డ తొలితరం తెలంగాణ కథల  సూచీ ‘దస్త్రమ్‌’ తీసుకొచ్చారు.  ఆంధ్రా కథకులతో పోలుస్తూ తెలంగాణ కథాచరిత్రను ‘కథాత్మ’ పేరిట వెలువరించారు. ‘తొలినాటి తెలంగాణ కథలు’, తెలుగు  యూనివర్సిటీ ‘నూరేండ్ల తెలుగు కథ’ పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం పరిశోధనలో భాగంగా తెలంగాణ పత్రికారంగ చరిత్ర ‘షబ్నవీస్‌’ని చిత్రికగట్టారు. ‘హైదరాబాద్‌ సిర్ఫ్‌హమారా’ పేరిట పుస్తకాన్ని రాశారు. సురవరం సమగ్ర కవిత్వం, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సురమౌళి కథలు వెలుగులోకి తెచ్చారు. 1969-73 ఉద్యమ కవిత్వానికి, వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర ‘సార్థక జీవనం’కు సహసంపాదకత్వం వహించారు. 30కి పైగా పుస్తకాలను ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ తరపున అచ్చేశారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ, సింగిడి, దస్కత్‌, బహుజన కథకుల కచ్చీరు తరపున అనేక కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అభిమాన విషయాలుగా అనేక పరిశోధనా పత్రాల్ని, వ్యాసాల్ని వెలువరించారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ దళిత చరిత్ర రాసే పనిలో ఉన్నారు.

1. మీరు కవిత్వం రాశారు. ఉద్యమాలు చేశారు. చివరికి సాహిత్య చరిత్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు?

జవాబు: అవును.. 1980-84లో ఆ ప్రాంతంలో చాలా కవిత్వం రాశాను. శ్రీశ్రీని ఇమిటేట్‌ చేస్తూ. ‘స్నిగ్ధశ్రీ’ అనే కలం పేరుతో నేను రాసిన కవితలు పోతుకూచి సాంబశివరావు నడిపిన ‘విశ్వరచన’ పత్రికలో అచ్చయినయి. అందులో శబ్దాల పైనే ఎక్కువగా శ్రద్ధపెట్టిన. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానియంలో జరిగిన కవి సమ్మేళనానికి సీనియర్‌ దాశరథి ముఖ్య అతిథిగా వచ్చి నేను చదివిన కవితను మెచ్చుకోవడం ఓ తీపి జ్ఞాపకం.
ఇక ఉద్యమం – పరిశోధన రెండూ నా విషయంలో విడదీయలేనివి. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడిని. నిజానికి యూనివర్సిటీల్లో ఎన్నికలు నిషేధం విధించిన తర్వాత రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సానుభూతి పరులు స్థాపించారు. ఈ సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఈ దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం (ఇప్పటికీ) బెస్ట్‌ స్టూడెంట్‌కు ‘షోయెబుల్లాఖాన్‌’ స్మారక అవార్డు ఇచ్చేవారు. ఆయనెవరు? అని ప్రొఫెసర్లని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. దాంతో పరిశోధన మొదయ్యింది. మన మూలాలు తెలుసుకోవడం ప్రారంభమయింది.
నేను ఉస్మానియా జర్నలిజంలో ఎంఫిల్‌ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. ‘తెలంగాణాలో తెలుగు పత్రికలు’ అనే అంశంపై పరిశోధన చేసేందుకు నిర్ణయించుకొని అప్పటి మా గురువు ఇప్పటి మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ని సంప్రదిస్తే ఆయన ‘తెలంగాణలో తెలుగు పత్రికలు ఎక్కడివి? పరిశోధన సాగదు’ అని నిరుత్సాహ పరిచిండు. అయినా నేను పట్టుబట్టడంతో ఒప్పుకున్నడు. ఇది 1992నాటి సంగతి. ఇగ అప్పటి నుంచి హైదరాబాద్‌ల ఎక్కడ పాత లైబ్రరీ ఉన్నా వెళ్ళి అక్కడి పాత పత్రికల జిరాక్స్‌ సేకరించడం. పరిశోధనలో భాగంగా అందులోని విషయాలని నోట్‌ చేసుకునే వాణ్ణి. ఇట్లా పత్రికల నుంచి సాహిత్యంలోకి వచ్చాను.
దాదాపు ఇదే కాలంలో ఆంధ్రా ప్రాంత సాహిత్యకారులు మళ్ళొక్కసారి తెలంగాణ తెలుగు కథ అనే అంశంపై అక్కడక్కడా చర్చలు చేశారు. ఇదే కాలంలో కథ సిరీస్‌ ప్రచురణ ప్రారంభమయింది. ఒక వైపు పాత పత్రికలను అధ్యయనం చేస్తూనే అందులో ఉన్న కథను ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నాను. ఇట్లా ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్న కథల లిస్టు ‘దస్త్రమ్‌’ పేరిట 2005లో మెవరించాను. అలాగే అంతకుముందు పరిశోధన సమగ్రంగా ఉండాలనే తపనతో సేకరణకు, రచనకు ఎక్కువ సమయం పట్టింది. ఈ లోపు ఎంఫిల్‌ సబ్మిట్‌ చేయాల్సిన టైమ్‌ కూడా అయిపోయింది. దాంతో ఈ పరిశోధనను ‘షబ్నవీస్‌’ పేరిట ప్రచురించాను. ఇది 2004 నాటి సంగతి.
1995-96 ఆ ప్రాంతంలో ‘ఉదయం’ సహోద్యోగి, తెలుగు యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న కె.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న అన్ని గ్రంథాయాలను వడపోశాము. అనేక మంది వ్యక్తులను కలిశాము. ఇదే సమయంలో ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశాము. దీని ప్రధానోద్దేశము అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కావలసిన ముడి సరుకును అందించి, విస్మరణ, వివక్షకు గురైన విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం. ఇప్పటి వరకు ఈ సంస్థ తరపున పది విలువైన సాహిత్య, చారిత్రక పరిశోధక పుస్తకాలు ప్రచురించాము.
అలాగే తెంగాణ సాంస్కృతిక వేదిక, ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొనడమే గాకుండా ‘సోయి’ పత్రికలో రెగ్యులర్‌ విస్మరణకు గురైన విషయాల్ని చిత్రిక గట్టాను. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తీసుకొచ్చిన ‘మత్తడి’కి కొంత ముడిసరుకునందించాను. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో కొత్త చూపుకు పునాది వేసింది.

2. మీరొక బీసి.. పద్మశాలి. బీసిల గురించి మీరు చేసింది ఏమిటి?

జవాబు: తెలుగు సాహిత్యంలో నా అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న దశలో సుద్దాల హనుమంతుపై జయధీర్‌ తిరుమలరావు రాసిన చిన్న పుస్తకం దొరికింది. ఆ తర్వాత అలిశెట్టి ప్రభాకర్‌, తర్వాతి కాలంలో కథకు బి.ఎస్‌.రాములు, ఆడెపు లక్ష్మీపతి, పి.చంద్‌ ఇట్లా… అవును, మన వాళ్ళు కూడా సాహిత్య రంగంలో ఉన్నారు కదా.. తెలుగు సాహిత్యంలో చేనేత కార్మికుల వెతల్ని, ఛిధ్రమౌతున్న బతుకుల్ని రికార్డు చేసిన కథల్ని త్వరలోనే మిత్రులతో కలిసి సంకనంగా తీసుకు రానున్నాము. నేను నా మూలాలను మరువలేదు. దాంట్లో భాగంగానే 18వ శతాబ్దంలోనే  దార్ల సుందరమ్మ రాసిన ‘భావలింగ శతకం’ను త్వరలో పుస్తకంగా ఆధునిక దృక్కోణంలో ఆమె స్థానాన్ని ఖరారు చేస్తూ తీసుకు వస్తున్నాం.
ఇక బీసీల గురించి మీరు ఏమి చేసిందేమిటని? నిజానికి తెలంగాణ సమాజం మరిచిపోయిన ‘కృష్ణస్వామి ముదిరాజ్‌’ని ముందుగా పరిచయం చేసింది నేను. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న సాహిత్యకారుడు ఆవుల పిచ్చయ్య కథల్ని అచ్చు రూపంలోకి తెచ్చాను. సోయి, తెలంగాణ టైమ్స్‌ పత్రికల్లో చాకలి ఐమ్మ, దొడ్డి కొమురయ్య, హకీం జనర్దానదాస్‌, సంగె లక్ష్మీబాయమ్మ, సరోజిని రేగాని, మల్యా దేవిప్రసాద్‌ యాదవ్‌, మరిపడగ బలరామాచార్య, గూడూరి సీతారామ్‌, డాక్టర్‌ మల్లన్న ఇట్లా కొన్ని వందలమంది బీసీల జీవిత చరిత్రను పాఠకులకు పరిచయం చేసిన. మేము కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని నొక్కి చెప్పిన.
ఫోరం ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌ సంస్థను ఏర్పాటు చేసి బహుజనులకు వివిధ సాహిత్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ పత్రికా ముఖంగా అనేక వ్యాసాలు వెలువరించడమైంది.

3. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించే ఎక్కువ పనిచేశారని బహుజనకారుల విమర్శ… 

–  ఇది కూడా అర్ధసత్యం. నేను నిజానికి ఎక్కువ పనిచేసిందీ, సమాచార సేకరణ కోసం ఎక్కువ కష్టపడ్డదీ దళితుల కోసం. ఎవ్వరికీ తెలియని తొలితరం దళితోద్యమకారుడు ‘వల్తాటి శేషయ్య’ను రంగం మీదికి తీసుకొచ్చాను. 1857-1956 మధ్య కాలంలో వందేండ్లలో తెలంగాణ సమాజంలో దళితుల్లో వచ్చిన మార్పును పుస్తకంగా ప్రచురించాల్సి ఉంది. ఆ పని జరుగుతోంది. భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్‌సుందర్‌, బి.ఎస్‌. వెంకటరావు, సుమిత్రాదేవి, రామారావు, వెం. లక్ష్మయ్య, సదాక్ష్మి, శంకర్‌ దేవ్‌, ‘దళిత పదం’… ఇట్లా అనేక రచనల్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు రావడమయింది. అట్లనే తుర్రెబాజ్‌ఖాన్‌ పోరాటాలను, మహలఖాబాయి చందాను తెలుగు పాఠకులకు పరిచయం చేసింది కూడా నేనే నని గర్వంగా చెబుతున్నాను. 1857 పోరాటం- దాంట్లో ముస్లింల పాత్ర, రజకార్ల నెదిరించిన ముస్లింలు, షోయెబుల్లాఖాన్‌, ఇట్లా అనేక విషయాలపై రాసిన.
నేను ముస్లింల గురించి ఎక్కువగా రాయడానికి కారణం కళాశాలలో ఉద్యోగ సహచరులు. సంగారెడ్డి జూనియర్‌ కాలేజీలో ఉర్దూ మీడియం కూడా ఉండేది. అక్కడ అహ్మదుల్లా ఖురేషి, మహమూద్‌, నజీర్‌ లాంటి మిత్రులతో ఎప్పుడూ బైస్‌ నడిచేది. హైదరాబాద్‌-ముస్లింలకు సంబంధించిన అనేక విషయాలు మా మధ్య చర్చకు వచ్చేవి. మంచి, చెడూ కూడా. కృష్ణస్వామి ముదిరాజ్‌ ‘పిక్టోరియల్‌ హైదరాబాద్‌’,  షీలారాజ్‌ రాసిన ‘మీడివలిజమ్‌ టూ మాడర్నిజం’, రత్నా నాయుడు రాసిన ‘ఓల్డ్‌ సిటీస్‌ న్యూ ప్రిడక్‌మెంట్స్‌’ చదివిన తరవాత ఆలోచనల్లో మార్పు వచ్చింది. నిజాం పట్ల నిష్పాక్షికంగా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయని అర్థమయింది. దావూద్‌ అష్రఫ్‌ పుస్తకాలు కొత్త నిజాం చరిత్రలో కొత్త వెలుగులో నింపాయి. ఇవన్నీ ముస్లిం పట్ల ప్రేమను మరింతగా పెంచాయి.
ఆళ్వారుస్వామి, సురమౌళిలను కేవలం బ్రాహ్మణులుగా చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు అన్యాయం జరుగుతది. వాళ్ళు తమ జీవితకాలంలోనే ‘డీకాస్టిఫై’ అయ్యిండ్రు. అట్లనే సురమౌళి అయితే కులనిర్మూన సంఘమే పెట్టిండు.
రాయసీమ, ఉత్తరాంధ్ర అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఉత్తరాంద్ర వాళ్ళు కూడా వలసాధిపత్యంలో వనరులు కోల్పోయారు. దాంతో పాటు సంస్కృతి, భాష కూడా కొల్లగొట్టబడింది. ముఖ్యంగా తాపీ ధర్మారావు లాంటి సాహిత్యకారులకు తగినంత గుర్తింపు రాలేదు. అట్లా రావాలని నేను మాట్లాడాను. అట్లనే రాయలసీమ తొలి కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావుది బయటపెట్టి వాళ్ళ కథా చరిత్రను ఇంకొంచెం ముందుకు జరిపాను. ఆ తర్వాత పరిశోధనల్లో అది మరింత ముందుకు వెళ్ళింది. ఈ పరిశోధన చేస్తున్న మిత్రులందరికీ అండగా ఉన్నాను. కథా సాహిత్యంపై పరిశోదన చేస్తున్న వారికి మా ‘కవిలె’ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది.

4. ‘సింగిడి’తో అనుబంధం గురించి చెప్పండి…

– తెలంగాణ రచయిత వేదిక నిష్క్రియా పరత్వంలోకి జారిపోయిన సందర్భమే గాకుండా దళిత, బహుజనులకు ఆ సంస్థలో తగిన గౌరవం, గుర్తింపు దక్కక పోవడం, పుస్తకాల ప్రచురణ, పత్రికా నిర్వహణలోనూ సమాజంలో మెజారిటీగా ఉన్న వారిని విస్మరించడం బాదేసింది. దీంతో కొంత మంది ‘లైక్‌మైండెడ్‌’ మిత్రులము కలిసి ఈ ‘సింగిడి’ తెంగాణ రచయితల సంఘాన్ని 2008లో స్థాపించాము. నాతో పాటుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబ, పసునూరి రవీందర్‌, జిలుకర శ్రీనివాస్‌, సిలువేరు హరినాథ్‌, ఏలేశ్వరం నాగభూషణాచార్య తదితరులున్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ఏడుగురం సభ్యులము భిన్న సామాజిక వర్గాకు ప్రాతినిధ్యం వహిస్తూ మా వాదనను వినిపించాం. నిజానికి మొత్తం తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల వాణిని వాళ్ళు ఒక్క దగ్గర విన్నది ఆ ఒక్కసారే అంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీ వాళ్ళు అన్యాయం చేస్తే ‘ఛీ కృష్ణ కమిటీ’ పేరిట వారి భంఢారాన్ని, తప్పుడు నిర్ధారణను తిప్పి కొట్టడం జరిగింది.
1969-73 ఉద్యమ కవిత్వాన్ని, విగ్రహాల కూల్చివేతను సమర్ధిస్తూ వ్యాస సంకలనం ‘బర్మార్‌’ ఇట్లా చాలా పుస్తకాలను ‘సింగిడి’ తరపున వెలువరించాం. సాహిత్యకారులకు అంతవరకు తెలియని ఎన్నో చీకటి కోణాలను ఆవిష్కరించడమైంది.. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలోనే బహుజనులకు తక్షణం ఏం కావాలో వివరిస్తూ ‘సింగిడి ఎజెండా’ పుస్తకంగా వెలువరించాం. రాజకీయాలకు అతీతంగా నిర్భయంగా, నిష్పాక్షికంగా సమాజంలోని మెజారిటీ వర్గాలైన బహుజనుల అభ్యున్నతి కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది.
    5. సాహిత్య చరిత్ర, పరిశోధనల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ?
– ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి ఆంధ్రా సాహితీవేత్తలు సరైన గౌరవం ఇవ్వలేదని వాళ్ళను నిందిస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళని నిందించడం గాకుండా మన చరిత్రను మనం వినిర్మించుకోవాలి. పునాదులతో సహా దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసీ, మహిళా చైతన్యంతో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను నిర్మించుకోవాలి. విస్మరణకు గురైన వ్యక్తులను, సాహిత్యాన్ని ప్రయత్న పూర్వకంగా వెలుగులోకి తేవాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన, ప్రచురణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరముంది.
దున్న ఇద్దాసు, దైదవేము దేవేందరన, సుద్దాల హనుమంతు, ఆళ్వారుస్వామి, సురవరం, మహలఖా యిచాందా, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పొచ్చు. వాళ్ళందరి రచలను పుస్తక రూపంలో సమగ్రంగా రావాలి. అంతేగాకుండా కేవలం పత్రికల్లోనే ఉన్నటువంటి రచనలను కూడా సేకరించి అచ్చువేయాలి. ఈ పనిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదంటే అవి కూడా లుప్తమై పోయే అవకాశముంది. అంతేగాకుండా వివిధ విశ్వవిద్యాయాల్లో వివిధ విభాగాల్లో జరిగే పరిశోధనల్లో సమన్వయం ఉండాలి. తెలుగు విభాగం, చరిత్ర విభాగం ఒకే అంశంపై పరిశోధన చేయకుండా చూడాలి. వీటి మధ్యన సహకారం ఉన్నట్లయితే మరింత మెరుగైన పరిశోధనలు వచ్చే అవకాశముంటుంది. అచ్చుకు యోగ్యమైన పరిశోధన ఫలితాలను ఒక కమిటీ ద్వారా పరీక్షింపజేసి ప్రభుత్వమే అచ్చేయాలి. అప్పుడే ప్రజలకు విషయాలు తెలుస్తాయి.
ప్రభుత్వం చరిత్ర నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రాగద్వేషాలకు అతీతంగా ప్రామాణికమైన తెలంగాణ ప్రజల చరిత్రను రచింపజేయాలి. సాహిత్య కారులు వివిధ ప్రక్రియల్లో వెలువరించే పుస్తకాలకు కేరళ రాష్ట్రం మాదిరిగా వాటిని అచ్చేసేందుకు ఆర్థికంగా అండగా నిలవాలి. తెలంగాణలోని తెలుగు, ఉర్దూ భాషల్లోని క్లాసిక్స్‌ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయించాలి.
పుస్తక ప్రచురణకు, ప్రాచుర్యానికి ప్రభుత్వం, గ్రంథాలయాలు  అండగా ఉండేలా చర్యలు చేపట్టాలి.

*

అట్టడుగు ముస్లిం రచయిత ‘అలీ’

-స్కైబాబ
~
ముస్లింవాద సాహిత్యంలో అట్టడుగు ముస్లింలలోంచి కవిగా రచయితగా తన గొంతుక బలంగా వినిపించినవాడు అలీ. తొలుత ‘పాన్‌మరక’ అలీగా, తరువాత ‘హరేక్‌మాల్‌’ అలీగా పేరుబడ్డ అలీ ‘పాన్‌మరక’ ‘జఖమ్‌’ ‘తమన్నా’ ‘గర్జన’ కవితా సంపుటులు, ‘జఖమ్‌’ కరపత్ర కవిత్వం, ‘హరేక్‌మాల్‌’ కథల సందూఖ్‌ వేశాడు. ఇంకా తన రచనలు వెలువరించే ప్రయత్నంలోనే ఉన్నాడు. అలాంటి అలీ సెల్‌ఫోన్‌ నుంచి మార్చి 6 అర్ధరాత్రి తను చనిపోయినట్లు కాల్‌ వస్తే ఎంతకూ నమ్మబుద్ధి కాలేదు. ‘అయ్యో! ఇంకా అతని జీవితంలోంచి మరిన్ని ముఖ్యమైన రచనలు రావలసి ఉండె కదా అని, ఈ మధ్యనే బిడ్డ షాదీ చేశాడు కదా, ఇంకా పెళ్లి కాని పిల్లలున్నారు కదా అని మనసు పిండేసినంత బాధయ్యింది.
మూడేళ్ల క్రితం హార్ట్‌ ప్రాబ్లమ్‌తో దవాఖానాలో చేరాడు అలీ. గుండె ఆపరేషన్‌ చేయడానికి అతని శరీర స్థితి సహకరించదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఎలాగో అలా నెట్టుకొస్తున్నాడు. మార్చి 6న నల్లగొండలో ఒక ముషాయిరాలో పాల్గొనడానికి పేరు ఇచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి కవిత రాస్తూ కూర్చున్నాడు. 9 ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కష్టమవడంతో దవాఖానాకు తీసుకెళ్లారు. ముషాయిరా నిర్వాహకులు అలీ పేరు పిలవడానికి అతను కనిపించకపోవడంతో అతని సెల్‌కు ఫోన్‌ చేశారు. హార్ట్‌ ఎాక్‌తో అతను చనిపోయాడని విని విస్తుపోయారు!
నల్లగొండ పట్టణంలో పాన్‌డబ్బా నడుపుకుంటున్న అలీని 1986 చివరలో పరిచయం చేసుకుని ఆయన పాన్‌డబ్బా జీవితంపై కవిత కావాలని అడిగాను. పేజీలకు పేజీలు కవిత రాశాడు అలీ. దాన్ని మూడు పేజీలకు కుదించి ‘జల్‌జలా’లో మొదటి కవితగా చేర్చాను. 1998లో వెలువడిన ‘జల్‌జలా’ కవిగా అలీ పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ‘పాన్‌మరక’ పేరుతోనే అతను కవితా సంపుటి వేశాడు. ముస్లింల జీవితంలోని ఒక పాత్రే సాహిత్యకారుడుగా తెలుగు సాహిత్యంలో ఇన్నాళ్లు సంచరిస్తూ రావడం విశేషం. మన దేశంలోని, ముఖ్యంగా తెలంగాణలోని ముస్లిం జీవితాలకు సజీవ సాక్షిగా అలీ జీవితం గడిచింది. తన జీవితమంతా గరీబీనే తోడుగా నడిచిన కవి అలీ. సచార్‌ కమిటీ, మిశ్రా కమీషన్‌ రిపోర్టుల నేపథ్యంలో చూస్తే అలీ భారతీయ ముస్లింల ముఖచిత్రం.
అతని కవితా పాదాల్ని తడిమితే-
‘ప్రతిరోజు ఎంతోమంది నోళ్లు పండిస్తుాంను/ కాని నా బతుకే పండట్లేదు /నేనమ్మిన కింగ్‌సైజ్‌ సిగరెట్టే/ నా గరీబీ బీడీ వైపు చీదరింపుగా చూస్తుంది’ అప్పట్లోనే డిగ్రీ చేసిన అలీ ‘ఫ్రేంలో బంధించబడ్డ నా పట్టా/ బూజు పట్టిన గోడకు/ పాత క్యాలెండర్‌లా వేలాడుతుంది’ అంటూ ‘ఇంటర్వ్యూలకైతే పిలుస్తారు/ తీరా నా పేరు ‘అలీ’ అని తెల్సుకొని చిత్తు కాగితంలా విసిరేస్తే/ ఎండుటాకులా మిగిలిపోయాను’ ‘అలీ గల్లీకొచ్చి చూడు/ సోరుప్పు రాలే గోడలు/ సిమెంటు అతికిన ఉప్పుదేరిన కుండలు/ పగిలిన కవేలీ కప్పులు/ ఇమ్మిచ్చిన అర్రలు/ దిల్‌కే ఉప్పర్‌ థర్మామీటర్‌ రక్కే దేఖో/ ఓ కిత్‌నా దర్ద్‌ బతాయేగా!’ లాంటి ఎన్నో తాత్వికమైన కవితా పాదాలు ‘పాన్‌మరక’ కవితలో చూస్తాం. ఆ కవితను ముగిస్తూ ‘ఈ దేశపు గోడ మీద/ ఉమ్మేసిన పాన్‌ మరకలా/ నేనిలా ……….’ అంటూ ఈ దేశ ముస్లింల దయనీయమైన స్థితిని ప్రతిబింబిస్తాడు.
aliఅచ్చమైన తెలంగాణ కవి
– – – – – – – – – – – –
తెలంగాణ ఉద్యమానికి ఎన్నో కవితలను అలీ అందించాడు. ‘మత్తడి’, ‘పొక్కిలి’ ‘మునుం’ లాంటి కవితా సంకలనాల్లో అతని కవితలున్నాయి. ‘గర్జన’ పేరుతో తెలంగాణ ముస్లింవాద కవితా సంపుటి వెలువరించాడు. ‘మత్తడి’లో, తెలంగాణ ఉర్దూ, తెలుగు ముస్లిం కవితా సంకలనం ‘రజ్మియా’లోని అతని కవిత ‘అస్తర్‌’లో-
‘ఆటోవాలా చల్తే/ క్యా బేటా.. కైసే హై?’/ నా ‘జబాన్‌’ని అనకొండలేయో మింగినయ్‌/ నా పేర్లు మార్చి/ నా ఖాన్‌దాన్‌ మూసీల కలిపినయ్‌’ -అంటూ తెలంగాణలోని ఉర్దూ భాషను ఆంధ్రావారు ఎలా నాశనం చేశారో చెబుతాడు అలీ. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు చేస్తున్న ముస్లింల దీనస్థితిని చెబుతూ ‘పైజామా లాల్చీల కెల్లి/ తొంగి చూస్తున్న/ బొక్కల బొయ్యారం’ను వర్ణిస్తూ ‘హమారా జీనా/ జూతేకే నీచే/ అస్తర్‌ బన్‌గయా’ అంటాడు. ఇతర కవితల్లో- ‘ఈ గులాంగిరీ బతుకులు ఇంకెన్నాళ్లు’ అని నిలదీస్తాడు. ‘కుడిపక్క కృష్ణా కాల్వ ప్రవాహమున్నా/ మాకు ఫ్లోరిన్‌ నీళ్ల భూమి పొరలే దిక్కు’ అంటూ బాధపడుతూ ‘నైజామోడి పైజమా ఏనాడో ఊడింది/ ఇక ఆంధ్రోడి పంచె ఊడగొడదాం రాండ్రి’ అంటాడు. ‘తెలంగాణ సెంటిమెంటు కాదురా/ నా ఆత్మబలం.. నా ఆత్మగౌరవం.. నా జన్మహక్కు’ అని నినదించాడు.
గుజరాత్‌ ముస్లింల ఊచకోతపై కదిలిపోయిన అలీ ‘జఖమ్‌’ పేరుతో నాలుగు కవితలతో కరపత్రం వెలువరించాడు. అందులోని ఒక కవితలో ‘హమ్‌ మర్కే భీ జగాతే హైఁ/ సోయీ హుయీ దునియాఁ కో’ అనడం మొత్తం భారత సమాజాన్నే మేల్కొల్పే తత్వంగా చూడొచ్చు. ఇంకా ‘గుజరాత్రుల్లో నన్ను ఊచకోత కోసి/ అమ్మీజాన్‌ చిత్రపటాన్ని నగ్నంగా నిలిపావు’ అంటాడు.
అతని కవిత్వంలో ‘చెదలు పట్టిన గిర్కల బావి కలలు’ ‘నా కాలివేళ్ల సందుల్లో/ ఇరుక్కున్న మట్టి వాసనల నడుగు/ నేను దళిత వారసున్నేనని మద్దెల మోగిస్తాయ్‌’ ‘దువా ఒక్కటే దవా కాదు’ ‘ధర్నాకైనా హిమ్మత్‌లేని లాల్చి పైజామాలు/ రూమిటోపీలకు బిగించిన హద్దుల సంకెళ్లు/ నా నోట్లోని నాలుకకు కుట్లేస్తున్నాయి’ ‘నీ అంటరాని ఆత్మలకు అత్తరు పూస్తా’ లాంటి ఎన్నో వెంటాడే కవితా పాదాలు చూస్తాం.
Ali_4
ముస్లింవాద కథకుడు.. ‘హరేక్‌మాల్‌’ రచయితగా అలీ
– – – – – – – – – –  – – – – – – – – – – – – – – – – – –
‘వతన్‌’ ముస్లిం కథా సంకలనం వేసే పనిలో 2000 ప్రాంతం నుంచి మళ్లీ అలీ వెంటపడ్డాను. అప్పటికీ అలీ పాన్‌డబ్బా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేస్తే నల్లగొండ పట్టణం రోడ్ల మీద నాలుగు పయ్యల బండి మీద ‘హరేక్‌మాల్‌’ అమ్ముకుంటున్నాడు. ఏ అడ్డా మీద ఉన్నాడో తెలుసుకోవడం, వెళ్లి ఆయనతో బండి పక్కన నిలబడి మాట్లాడ్డం చేసేవాణ్ణి. హృదయ విదారకంగా ఉండేది, అలీ హరేక్‌మాల్‌ దందా! నల్లగొండ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో వారంలో ఒక్కోరోజు ఒక్కో పట్టణంలో అంగడి ఉంటుంది. ఆ అంగళ్లకు అలీ, అతని మిత్రులు హరేక్‌మాల్‌ మూటలు ఎత్తుకొని బస్సుల్లో పడి పొద్దున్నే వెళ్లడం, పొద్దుగూకిందాకా ‘దస్‌ కే చార్‌! దస్‌ కే చార్‌!’ అని అరిచీ అరిచీ మళ్ల మిగిలిన వస్తువులన్నీ మూటకట్టుకొని లాస్ట్‌ బస్‌కి నల్గొండ చేరడం.. ఆ బస్‌లో ఒక్కో ఊరిలో ఒక్కొక్కరు దిగిపోతుంటే ఒంటరిగా తమ గరీబీ గురించి ఆలోచించుకుంటూ రావడం.. అట్లా ఆ కథంతా రాశాడు అలీ.
దారిద్య్రరేఖకి ఇంకా కింద బతుకుతున్న ముస్లింల జీవితాలను పట్టించిన కథ ఈ హరేక్‌మాల్‌. డిగ్రీ చదివి రోజు కూలికి పోలేక హరేక్‌ మాల్‌ అమ్ముకుంటూ తన జీవితాన్ని చర్వణం చేసుకునే ఒక పేద ముస్లిం బతుకును సమగ్రంగా అన్ని కోణాలనుంచి చూపించిన కథ. అన్ని దారులు మూసుకు పోగా బతకలేక చావలేక బతుకుతున్న అనేక మంది ముస్లిం కుటుంబాలకు ప్రతీకగా కనిపిస్తాడు కథానాయకుడు. ముస్లింల చుట్టూ పరుచుకున్న పేదరికపు విషవలయం ఎప్పటికీ నశించేది కాదని, వెతలు ఎప్పటికీ తీరేవి కావని చెప్తూ భూమి గుండ్రంగా సైకిలు చక్రాల్లా ఉన్నదని చెప్తూ తమ జీవితాల్లో ఎప్పటికీ వెలుగులుండవని కథను ముగిస్తాడు రచయిత. ‘వతన్‌’ సంకలనంలో ఆ కథ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.
2006లో ‘హరేక్‌మాల్‌’ కతల సందూఖ్‌ పేరుతో సంపుటి వేశాడు అలీ. కథల సందూక్‌ అనడంలోనే మంచి ప్రయోగం కనపడుతుంది. కథల పెట్టె అని అర్ధం. ‘హరేక్‌మాల్‌’ కథతోపాటు మరో తొమ్మిది కథలు ముస్లింలలోని నిరుపేదల జీవితాలను రికార్డు చేశాయి.
ఆ సంపుటిలోని మిగతా కథల్లో ‘ముసీబత్‌’ కథ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక (2004)లో అచ్చయింది. ఈ కథ తెలుగు సాహిత్యంలో మరో భిన్నమైన పార్శ్వం. ఇందులో- సౌదీకి వలస వెళ్ళే పేద ముస్లింల లాగే అలీ బావ ఫయాజ్‌ సౌదీ వెళ్తాడు. అక్కడ కొన్నాళ్లకు హార్ట్‌ ఎటాకొచ్చి చనిపోతాడు! దోస్తులు ఇక్కడికి ఫోన్‌ చేసి ఫయాజ్‌ భౌతిక కాయాన్ని పంపాలంటే అతని దగ్గర ఉన్న పైసలు పంపలేము! పైసలు పంపించాలంటే బాడీని పంపలేము! అంటారు. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అంతా ఫయాజ్‌ భార్య అభిప్రాయం అడిగారు. ఆమె ఏం చెప్పగలదు! ముగ్గురు ఆడపిల్లలు! పైసలేం మిగుల్చుకోలేదు. ఇల్లు గడవడం.. పెళ్లిళ్లు.. వగైరా ఎలా జరుగుతాయి?! గింజుకుని, నలిగీ, యాతనపడీ చివరికి పైసలు పంపించమనే- అందరి అభిప్రాయంగా చెబుతారు! -ఇంతటి గరీబీని చిత్రించాడు అలీ తన కథల్లో..!
అయితే ఇదే ‘ముసీబత్‌’ కథలో మరో ముఖ్యమైన విషయం రికార్డు చేశాడు అలీ.
ముస్లింల ఆచార వ్యవహారాలు ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఉన్నాయి. దేశదేశాలకు ఇస్లాం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆయా దేశాల సంస్కృతుల్ని తనలోకి ఇముడ్చుకోవడం, ఇస్లామిక్‌ (అరేబియన్‌) సంస్కృతిని ఆయా దేశాలకు వ్యాప్తి చేయడం జరిగింది. జరుగుతున్నది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా ముస్లింల సంస్కృతి ఒకే రకంగా ఉండదని అర్థమవుతుంది. ఆ దిశలోనే మన దేశంలోని మన రాష్ట్రంలోని ముస్లింల సంస్కృతిని చర్చకు తెస్తూ షాజహానా, స్కైబాబ తమ సంపాదకత్వంలో ‘అలావా’ ముస్లిం  సంస్కృతి కవితా సంకలనం వేశారు. అందులోని సంపాదకత్వంలో స్కైబాబ అలీ ‘ముసీబత్‌’ కథను ఉటంకిస్తూ చెప్పిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు-
‘మూడో రోజు జ్యారత్‌. సమాధి దగ్గరికి వెళ్లి పూల చాదర్‌ కప్పి ఫాతెహా లివ్వాలి. ఇక్కడ సమాధి లేదు. చిత్రమైన స్థితి. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. చివరికి ఫయాజ్‌ దోస్తులకు ఫోన్‌ చేసి జర సమాధి దగ్గరికి వెళ్లి పూల దుప్పి కప్పి ఫాతెహా లిచ్చి రమ్మని అభ్యర్ధిస్తారు. ‘ఇక్కడ అవన్నీ ఉండవు. సమాధి చేసి వచ్చారంటే తిరిగి అటు వెళ్లడం ఉండదు!’ అంటారు ఫయాజ్‌ దోస్తులు. పరేశాన్‌!’
ఇట్లా అలీ 2004లోనే దేశీ ముస్లిం సంస్కృతిని చర్చకు పెడుతూ కథ రాయడం గమనార్హం. ఈ  సంస్కృతి గురించి ఇవాళ తీవ్ర సంఘర్షణ జరుగుతుండడం విశేషం.
సహజంగా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే మోసాలను, ప్రపంచంలో పెరిగిపోతున్న మత విద్వేషాలను పట్టి చూపిన కథ ‘కోడిపిల్లలు మూడు’. మూడు కోడిపిల్లలు కొని పెంచబోయిన తన కొడుకు కథ అది. ఒక పిల్లను పిల్లి ఎత్తుకుపోగా, అది చూసి భయపడ్డ మరో కోడిపిల్లకు పక్షవాతమొస్తుంది. దాన్ని పడేయమని తల్లి చెబుతున్నా వినక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు. దాని గురించే బెంగ పెట్టుకుంటాడు. చివరికది చనిపోతుంది. దాన్ని పెంటదిబ్బ మీద పడేయమని చెప్పినా వినకుండా ఇంటి ఆవరణలో ఒక మూల దానిని సమాధి చేస్తాడు. మోసాలు ద్వేషాలు లేని ప్రపంచం ఒకటుందని, అది పిల్లల ప్రపంచమని చెప్తూ తన పిల్లలకు అంతటి జాలి దయ ఉండాన్ని చూసి సంతోషపడతాడు కథానాయకుడు. నేడు సమాజంలో ముస్లింల మీద జరుగుతున్న విష ప్రచారానికి పూర్తిగా భిన్నమైన కోణంలో మనల్ని వెంటాడుతుంది ఈ కథ.
సమాజంలో ఏ ఉపద్రవం జరిగినా చివరికి అది పేదవాళ్ళ కడుపు కొట్టడానికేనని అలీ ‘పాన్‌డబ్బావాలా’ కథలో వివరిస్తాడు. అసలే వ్యాపారం నడవక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, డిగ్రీ పట్టాలు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకుని పాన్‌ డబ్బా నడుపుకుంటున్న చిన్న జీవితాల వ్యధలను చిత్రించిన కథ పాన్‌డబ్బావాలా. పోలీస్‌ వాళ్ళకి లంచాలిచ్చి, అడిగిన వాళ్ళకల్లా అప్పులు పెట్టి జీవితం గడవక నానా బాధలు పడి డబ్బాను నడిపిస్తుంటే ఆఖరికి రోడ్ల వెడల్పు కార్యక్రమంతో ఆ జీవనాధారాన్ని కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో తెలీని నిరుద్యోగుల, బడుగు జీవుల కథ పాన్‌డబ్బావాలా.
ఏ జాతి  ఉన్నత విద్యకు దూరమైపోతుందో, ఆ జాతి అభివృద్ధిపథం వైపు పయనించడం చాలా కష్టమైన విషయమని చెప్పిన కథ ‘నయా ఖదమ్‌ నయీ సోంచ్‌’. ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమని, బాల్యంలోనే వివాహాలు చేయడం మూలాన ముస్లింలు వెనుకబడుతున్నారని కథలో కొత్త ఆలోచనలను రంజాన్‌ పండుగ దినాన పాత్రల ద్వారా వివరిస్తాడు రచయిత. రాజకీయాలలో మతాలు ముఖ్యపాత్ర వహించడాన్ని కూడా విమర్శిస్తాడు. క్రిష్టియన్‌ సంస్థలు విద్యా వ్యాప్తికి పూనుకోవడాన్ని ఉదహరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ వివిధ దేశాలలో ఉన్న ముస్లింల గురించి ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తాడు.
ఇలా హరేక్‌మాల్‌ కథా సంపుటి నేటి ముస్లింల ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. నల్లగొండలో మాట్లాడే తెలంగాణ ఉర్దూ కలగలిసిన మిశ్రమ యాసతో కూడిన భాష ఈ సంపుటిలో కనిపిస్తుంది. కొన్ని కొత్త పదబంధాలు, కొత్త సామెతలు కనిపిస్తాయి. ఇలాంటి వైరుధ్యభరితమైన కథలు అందించిన అలీ ఒక నవల, తన ఆత్మకథ రాసిపెట్టాడని తెలుస్తున్నది. వాటిని అచ్చు వేయవలసిన బాధ్యతను తలకెత్తుకోవలసి ఉంది.

*

అన్‌మోల్‌ రిష్తే

 స్కైబాబ

 

స్కైబాబా

పెళ్ళైన కొత్తల్ల ఒకటె ఉబలాటంగుంటది పెళ్ళాం మొగుళ్ళకు- ఒకల ముచ్చట్లు ఒకలకు చెప్పుకోవాల్నని. దాంతో తమ అలవాట్లన్ని తమ ప్రత్యేకతలుగా చెప్పుకుంటుంటరు. కొందరేమొ ‘గొప్పలు’ చెప్పుకుంటుంటరు. నేను ఫలాన కూరగాయలు తినను.. నాకు ఫలానా మాంసం యమ ఇష్టం.. ఇట్ల మొదలైతె- నాకు ఫలానా తీర్గ ఉండేటోల్లంటె అస్సలు నచ్చరు. ఫలానా మస్త్‌ పసంద్‌- దాంక…
అట్లనె జబీన్‌-మహబూబ్‌లు గుడ తమ పెళ్ళైనంక తమ గొప్పలు చెప్పుకున్నరు. ఆ చెప్పుకునుడు ఏడిదాంక పోయిందంటె- మహబూబ్‌ తానొక పిల్లను ప్రేమించి ఉంటినని ఆ పిల్లను అస్సలు మర్షిపోలేనని ఆ కతంత చెప్పుకొచ్చిండు. అంతేగాంక ఆ తరువాత గుడ ఒక పిల్ల తన ఎంట పడేదని గొప్పగ చెప్పిండు. అట్లా పెళ్ళైనప్పటిసంది తన ప్రేమకతలు చెప్పుకుంటనే వస్తున్నడు మహబూబ్‌. జబీన్‌కు తన ప్రేమకత గూడ ఒకటిరెండుసార్లు నోటిదంక వచ్చింది. గని ఉగ్గబట్టుకుంది. ఒకరోజు మాత్రం మహబూబ్‌ తన తొలి ప్రేమ గురించి మహా గొప్పగ చెప్పుకుంటుంటె.. ఇగ ఉండలేకపొయ్యింది. మహబూబ్‌ జర మనసున్నోడే ఉండు, తన ప్రేమ కత చెప్పుకున్నా ఏమనేటట్లులేడులె అనుకున్నది.. ఎనకాముందాడుకుంటనె తన ప్రేమ కత గుడ చెప్పుకున్నది!
తన కత గొప్పగనే చెప్పుకున్న మహబూబ్‌కు పెళ్ళాం ప్రేమ కత చెపుతుంటే మాత్రం మనసుల్నించి ఉక్రోషం తన్నుకొచ్చింది. బైటబడితె ఆయింత చెప్పకుంటనె యాడాపేస్తదోనని ఊకున్నడు. కొద్దిసేపు ఊఁ గొట్టిండు. ఐటెంక ఊఁగొట్టుడు బందైంది. జబీన్‌ను ఒళ్లోకి గట్టిగ పొదువుకొని పండుకున్నోడల్లా పట్టు ఒదిలిండు. ఇదేం సమజ్‌ చేస్కోకుంటనె తన ప్రేమకతంతా చెప్తున్నది జబీన్‌-
తను, పక్కింటి అమీర్‌ ప్రేమించుకున్నమని- అతను షానా మంచోడుండెనని.. తండ్రి సచ్చిపోవడంతోని ఇప్పట్లో షాదీ చేసుకునుడు కుదరదని చెప్పిండని.. తను షానా ఏడ్షిందని.. కొన్నాళ్ళకు వాళ్ళు వేరే పట్నానికి ఎల్లిపోయిన్రనేది ఆ కత. మహబూబ్‌ మొఖం మాడిపొయి షానాసేపయింది. ఆ చీకట్ల అది గమనించే వీలు లేదు జబీన్‌కు. సప్పుడు చెయ్యకుంట జబీన్‌ను వదిలి అటు మల్లి పండుకుండు మహబూబ్‌. పరేషానయింది జబీన్‌. అంతదంక మైమరచి చెప్పుకుంట వచ్చినదల్లా చెప్పి తప్పు చేసిన్నా ఏందని ఒక్కసారిగ మనసుల గుబులు పడ్డది. మహబూబ్‌ మీద చెయ్యి ఏసి ‘ఏమైంది జీ.. నిద్ర వస్తుందా!’ అనడిగింది. ‘ఊఁ’ కొడితే తన అయిష్టత యాడ బైటపడకుం పోతదనుకున్నడో ఏమో ‘నై’ అని జర ఊటగనె అన్నడు. సమజయింది జబీన్‌కు. వెనుక నుంచి మరింత దగ్గరగా జరిగి ‘కోపమొచ్చిందా?’ అని గోముగ అడుగుకుంట గట్టిగ హత్తుకుంది. ‘అదంతా పాత కత. ఇప్పుడు నువ్వే నా పానం’ అని చెవిలో చెప్పింది. మెదలకుండా జవాబేమి ఇవ్వకుంట పండుకుండు మహబూబ్‌.
అప్పుడనుకుంది జబీన్‌- మొగుడు ఎన్ని ప్రేమకతలు చెప్పినా ఇనాలె గని, పెళ్ళాం తన ప్రేమకత మాత్రం అస్సలు చెప్పకూడదని! మహబూబ్‌ చెప్పిన రెండు ప్రేమకతలకు మనసులో ఎక్కణ్నో మంటగ అనిపించింది కని బహుశా తనగ్గూడా ఒక ప్రేమకత ఉండటంతోని అంతగనం కోపం రాలేదు జబీన్‌కు. చెప్పుకున్నందుకు మనసు జర అల్కగయ్యింది.
గని మహబూబ్‌ అలిగేసరికి మనసుల మల్లో గుబులు మొదలైంది, పుసుక్కున ఇది మనసుల పెట్టుకుని సతాయించడు గదా అని. ఇట్ల సోంచాయించుకుంట మహబూబ్‌ను అట్లనే అల్లుకుని ఉండిపొయింది ఆ రాత్రి. ఇద్దరి మనసుల్ల సుడులు తిరుగబట్టినయ్‌ ఒకరికొకరు చెప్పుకున్న ప్రేమకథలు…!
***
ఏండ్లు గడిషిపొయినయి. ఇద్దరు పిల్లలు పుట్టిన్రు. మహబూబ్‌ మంచోడే. జబీన్‌ను మంచిగనే సూసుకుంటున్నడు. కాని అప్పుడప్పుడు ఇద్దరూ కొట్లాడుకున్నప్పుడల్లా ‘నువ్వు సొక్కమా?’ అంటె ‘నువు సొక్కమా?’ అని ఒకరిమీద ఒకరు అర్సుకునేటోల్లు. మంచిగున్నప్పుడు, యాదొచ్చినప్పుడల్లా ఉండబట్టలేక తన తొలి ప్రేయసి గురించి అదొ ఇదొ చెప్తనె ఉండేటోడు మహబూబ్‌. చెప్పుకుంటున్నప్పుడల్లా ఊఁ కొడుతూనే జబీన్‌ ఏదో లోకంలోకి ఎల్లిపోతుండటం గమనించేటోడు. తనకు గుడ అమీర్‌ గుర్తొస్తున్నడేమోనని సోంచాయించేటోడు. జర మనసుల మంటగ ఉండేది. కాని తమాయించుకునేటోడు. ఒక్కోపాలి మెల్లగ అడిగేటోడు, ‘అమీర్‌ గురించేమన్నా తెలిసిందా! ఎట్లున్నడంట?’ అని.
జబీన్‌ మాత్రం గత అనుభవాన్ని మతిల తలుసుకుని ఏం చెప్పకపొయ్యేది. ‘ఏమో తెలియదు. నేనెప్పుడో మర్షిపొయిన కతను నువ్వెందుకు మల్ల గుర్తు చేసుడు’ అని ఊటగ అని, అక్కడ్నించి తొలిగి పనుల్ల పడిపొయ్యేది.
అట్ల అననైతె అనేదిగని పుట్టింటికి పొయినపుడు మాత్రం అమీర్‌ గురించి ఆరా తియ్యకుంట ఉండలేకపొయ్యేది. యాణ్ణో ఒక తాన బతికే ఉన్నడు లెమ్మని నిమ్మలపడేది.
 ఒకపాలి ఊర్లె చుట్టాలింట్ల పెండ్లికి పొయ్‌న మహబూబ్‌కు తన తొలి ప్రేయసి తారసపడింది. గుండె గుబగుబలాడింది. ఎన్నాల్ల నుంచో కలవాల్ననుకుంటున్న తను కనిపించేసరికి పానం లేసొచ్చినట్లయింది. కాకపోతె ఆమె తీరే జర తేడా గొట్టింది. ఆమెను చూసి మహబూబ్‌ ఎంతైతే అలజడికి గురైండో ఆమెలో మాత్రం అలాంటిదేమి కనిపించలేదు మహబూబ్‌కు. పట్టనట్టే తిరగబట్టింది. మనిషి లావయింది. భారీ చీరలో ఒంటినిండ నగలతోని షానా ఫోజు కొట్టబట్టింది. ఉండబట్టలేక జర సందు చూసుకొని మాట్లాడతానికి కోషిష్‌ చేసిండు మహబూబ్‌- ‘జర పక్కకు రారాదు, కాసేపు మాట్లాడుకుందాం’ అని అడిగిండు. ‘హమ్మో! మా ఆయన చూస్తే ఏమైనా ఉందా.. నేను రాను’ అన్నది. ఊర్లెనే ఉన్న తమ ‘యింటికన్న ఒకసారి వచ్చిపోరాద’ని అడిగిండు. ‘వామ్మో! మా అత్తగారికి తెలిస్తే ఏమన్నా ఉందా.. కుదరదు’ అన్నది. తిక్క లేషింది మహబూబ్‌కు. ఇన్నాళ్ళ సంది ఒక్కపాలి ఎదురుపడితే బాగుండునని అంతగనం గోస పడ్డది గిట్లాంటి దాని కోసమా అని ఒకటే ఫీలయిండు. కని ఏం జేస్తడు, పానం కొట్టుకుంటుండె.. తమాయించుకుని మల్ల సందుచూసుకుని అడిగిండు, ‘ఎట్లున్నవ్‌.. అంతా నిమ్మలమేనా?’ అని. ‘నాకేంది, నేను మస్తున్న.. మా ఆయన నన్ను దేవతలెక్క చూసుకుంటడు. నేను లేకుంట ఐదు నిమిషాలు గుడా ఉండలేడు. ఏది కావాలంటె అది కొనిస్తడు…’ అనుకుంట వాళ్ళాయన గురించే గొప్పలు చెప్పబట్టింది. అంతల ఎవడో పోరగాడొచ్చి వాళ్ళ అత్త పిలుస్తున్నదని చెప్పిండు. ‘హమ్మో! నేను పోతున్నా..’ అనుకుంట గబ్బగబ్బ గున్న ఏనుగులెక్క ఎల్లిపొయింది. అట్లనే జరసేపు మొద్దులెక్క నిలబడ్డడు మహబూబ్‌. అప్పట్నించి ఆ పెండ్లి నుంచి ఎల్లొచ్చిందాంక మల్ల ఎదురుపడనే లేదు ఆమె.
ఇంటికొచ్చేసినంక ఆ రాత్రి తన మనసులో సుడి తిరుగుతున్న బాధనంత జబీన్‌కు చెప్పుకుంట చిన్నపిల్లగాని లెక్క బోరున ఏడ్వబట్టిండు మహబూబ్‌. ఒళ్ళోకి తీసుకొని ఓదార్చింది జబీన్‌. జబీన్‌ గుడ మహబూబ్‌ ఏడ్పుల ఏడ్పు కలిపి తనివితీర ఏడ్చింది, అమీర్‌ గుర్తొచ్చి! జబీన్‌ ఒళ్ళోకి ముడుచుకుని అట్లనే నిద్రపొయిండు మహబూబ్‌. ‘అమీర్‌ గుడా తనను మర్చిపోయి ఉండొచ్చా…’ అని సోంచాయిస్తూ సోంచాయిస్తూ ఎప్పటికో నిద్రపొయింది జబీన్‌.
***
అప్పటిసంది జబీన్‌ మీద మరింత ప్రేమ పెరిగింది మహబూబ్‌కు. ఇంకింత మంచిగ చూసుకోబట్టిండు. ఆమె మంచితనం.. ఆమె అందం మస్తు గొప్పగా కనిపించబట్టినయి.. దాంతో ఆమెను అపురూపంగ చూసుకోవటం.. ఏదున్నా తనకు చెప్పి చెయ్యడం చెయ్యబట్టిండు. ఒకపాలి మాటల్ల అమీర్‌ గురించి ప్రస్తావనొచ్చింది-
‘…యాడున్నడో తెల్సుకో జబీనా… ఒకసారి ఇద్దరం కలిసివద్దాం’ అన్నడు మహబూబ్‌.
కలవరపడ్డది జబీన్‌. నమ్మబుద్ది కాక మహబూబ్‌ దిక్కు సూషింది.
‘నిజంగంటున్న జబీనా! తెల్సుకో.. తప్పేముంది.. పలకరింపుగ కలిసివద్దాం! నాగ్గూడా అతన్నొకపాలి సూడాల్నని ఉంది’ అన్నడు.
కండ్లల్ల నీల్లు చిమ్ముతుండేసరికి ఝట్‌న వంటింట్లకు తప్పుకుంది జబీన్‌.
‘నిజంగనే అంటున్న జబీనా.. తెలుసుకో!’ అన్నడు ఊటగ మహబూబ్‌.
‘సూద్దాంలే జీ!’ అన్నది వంటిట్ల నుంచి, లెక్కచెయ్యనట్లు.
ఎప్పుళ్ళేంది ఇట్లంటున్నడేంది అని జర అనుమానమేసింది జబీన్‌కు. కాని తనకు గూడ మనసుల సూడాల్ననే ఉన్నది. ఆ విషయం ఏ మాత్రం బయటపడనీయలేదు.
నిజానికి- తను అంతగనం చెప్పుకున్న తన ప్రేయసి తనంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం ఎంతకూ అజం కాలేదు మహబూబ్‌కు. దాంతో జబీన్‌ విషయంలో అమీర్‌ ఎట్ల ఫీలయితడో సూడాల్ననే ఉబలాటం ఎక్కువైంది. అందుకనే అమీర్‌ను కలుద్దామని అనబట్టిండు..
మహబూబ్‌ డ్యూటీకి పోంగనే తమ ఊర్లె ఉన్న చెల్లె ముబీన్‌కు ఫోన్‌ చేసింది జబీన్‌. జరసేపు పలకరింపు లయినంక ‘అమీర్‌ వాళ్ళు ఇప్పుడెక్కడ ఉంటున్నరంటరా?’ అనడిగింది.
‘అయ్యో.. నీకు తెలవదా ఆపా! వాళ్ళిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట. అమీర్‌ కారు నడుపుతున్నడంట. గోల్కొండ ఇప్పుడు మీకు దగ్గర్నే కదా!’ అన్నది.
‘అవునా!’ అని ఆశ్చర్యపొయింది జబీన్‌. ఇంకా కొన్ని వివరాలు చెప్పింది ముబీన్‌.
ఇగ అప్పటిసంది మల్ల మహబూబ్‌ ఎప్పుడు అడుగుతడా అని ఎదురుసూడబట్టింది గని తనకు తానైతె ఆ విషయం ఎత్తలే.
కొన్నాల్లకు మల్ల మాటల్ల అడగనే అడిగిండు మహబూబ్‌, ‘అమీర్‌ గురించి తెలుసుకోమంటి గదా!’ అని. అప్పుడు గుడ జర ఎనకాముందాడుకుంటనే- ‘మొన్న ముబీన్‌ చెబుతుండె, వాల్లిప్పుడు గోల్కొండల్నె ఉంటున్నరంట’ అన్నది.
‘అవునా.. మరింకేంది, ఒకరోజు పొయ్యొద్దాం’ అన్నడు మహబూబ్‌.
‘ఎందుకులే జీ! ఐటెంక మీరు ఎప్పుడన్నా ఎత్తిపొడిసినా పొడుస్తరు. ఎందుకొచ్చిన పరేషాని’ అన్నది.
‘ఎహె! అట్లెందుకు జేస్త జబీనా, ఏమనలే! ఒకసారి పొయివద్దాం’ అన్నడు.
‘సరె తీయ్‌.. చెల్లెకు చెప్త అడిగిసూడమని. ఏమంటరో సూద్దాం’ అన్నది.
కొన్నాళ్లకు ముబీన్‌ ఏదొ ఎక్జామ్‌ రాయడానికి హైదరాబాద్‌ వొచ్చింది. మహబూబ్‌ అడగమంటె అమీర్‌ నెంబర్‌ సంపాయించి మాట్లాడింది ముబీన్‌. ఆ ఆదివారం ఎల్లడానికి ఓకే అయింది.
ఆదివారంనాడు పొద్దున అనుకోకుంట హైదరాబాద్‌లనె ఉండే మహబూబ్‌ తమ్ముడు ఒచ్చిండు.. వీళ్ల ప్రోగ్రాం విని పొద్దుగూకాల తన పిల్లలతో సహా తీసుకొస్తనని వీళ్ల పిల్లల్ని తీస్కెల్లిండు. ఇగ పిల్లల గడ్‌బడ్‌ గుడ లేకుండేసరికి తమాషిగ తయారై ముగ్గురు పయనమైన్రు అమీర్‌ వాల్లింటికి.
ముబీన్‌కు ఫోన్‌ల అడ్రస్‌ చెప్పుకుంట రోడ్డు దంక వచ్చి నిలబడ్డడు అమీర్‌. ఇంకొద్దిసేపట్ల ఎదురు పడతడనంగనె జబీన్‌ గుండె ఊటగ కొట్టుకోబట్టింది. ఆటోల నించి అమీర్‌ కనపడంగనె లోకం మర్షినట్లయింది. సంబాళించుకుంది. మహబూబ్‌ ఒకపాలి జబీన్‌ దిక్కు సూషిండు. మహబూబ్‌ తనను గమనిస్తున్నట్లు సమజై అమీర్‌ మీంచి చూపు తిప్పుకుంది. కాని మనసు కల్లోలమైపోయింది. ‘అరె, సందమావ లెక్క ఉండెటోడు వట్టిచేప లెక్క తయారైండేంది’ అని నమ్మలేనట్లుగ ఫీలయింది. అంతదాంక మొఖంల ఎంత దాచుకుందామన్న దాగని కళ మాయమైపొయింది. అతడ్ని చూసిన్నన్న ఖుషి మాయమై దాని తలంల విచారం చోటుచేసుకున్నది. ఈలోపల మల్లొకసారి జబీన్‌ దిక్కు సూషిన మహబూబ్‌కు ఏం సమజ్‌కాలె. రాయిలెక్క కూసున్న జబీన్‌ను ‘జబీనా! ఉత్‌రో’ అంటూ జర కదిలించిండు. చమక్‌ తిన్నట్టు దునియాలోకొచ్చిపడి ఆటో దిగింది జబీన్‌. అప్పటికే దగ్గరకొచ్చిన అమీర్‌ మహబూబ్‌కు సలామ్‌ చేసి చేయి కలిపిండు. ‘వాలేకుం సలామ్‌’ అని చేయి కలుపుకుంట బలవంతంగ నవ్వు మొహం పెట్టిండు మహబూబ్‌. ముందే సలామ్‌ చేసిన ముబీన్‌ ‘కైసే హై అమీర్‌ భాయ్‌?’ అంటూ పలకరించింది. ‘సబ్‌ ఠీక్‌. దువా హై’ అన్నడు.
అమీర్‌కు సలామ్‌ చెప్పుకుంట అట్ల ఒక్క క్షణం కళ్ళెత్తి అతని దిక్కు సూషి కండ్లు దించుకుంది జబీన్‌. తన కండ్లల్ల తడి మెరుపు మహబూబ్‌ కంట్ల పడొద్దని జబీన్‌ కోషిష్‌. ‘వాలేకుమ్‌ సలాం’ చెప్పిండు చేయిలేపుకుంట అమీర్‌, గని గొంతు బైటికి రానేలేదు. సంబాళించుకుని ‘ఆయియే!’ అనుకుంట తమ ఇంటిదిక్కు దారి తీసిండు. అతని ఎనక మహబూబ్‌ ఆ వెనక అక్కచెల్లెళ్ళు నడిషిన్రు. సన్నని గల్లీలకు మల్లిండు అమీర్‌. గొంతు పెగలదేమోనన్న డౌట్‌తోటే ఏం పలకరింపులు లేకుంటనే నడుస్తున్నడు అమీర్‌.
‘కార్‌ చలాతె హై కతెనా ఆప్‌? జాతి? రెంటెండ్‌? (కార్‌ నడుపుతున్నరంట గదా మీరు. సొంతమా? వేరేవాళ్లదా?)’ అడిగిండు మహబూబ్‌.
‘నై.. దూస్‌రోంకి హై! ఓ యహీఁ రహెతే (లేదు.. వేరేవాళ్లది. ఆయన ఇక్కడే ఉంటారు) అన్నడు ఎనక్కి తల తిప్పి అమీర్‌.
‘అచ్ఛా’ అని ‘పంద్రా హజార్‌తోభి మిల్‌తీ తన్‌ఖా? (పదిహేనువేలన్నా దొరుకుతుందా జీతం?)’
‘నై భయ్‌! దస్‌ హజారీచ్‌ మిల్తీ, ఉప్పర్‌ భత్తా మిల్తానా.. (లేదన్నా! పది వేలే ఇస్తరు. పైన బత్తా దొరుకుతది కదా)’
‘అచ్ఛా!’
ఇంతల ఇల్లొచ్చింది. వీల్ల మాటలు వినుకుంట నడుస్తున్నది జబీన్‌. చూపంతా బొక్కలు తేలిన అమీర్‌ మీదనే ఉంది. అతని గొంతుల గుడ గరీబీ మజ్బూరి వింటున్నది జబీన్‌. ఎందుకో.. అస్సలు నమ్మశక్యంగ లేదు జబీన్‌కు. మనిషి గట్టిగ, మాట స్థిరంగ ఉండేది. బహుశా అబ్బాజాన్‌ చనిపోవడంతోటి ఇద్దరు చెల్లెండ్ల షాదీలు.. ఆ అప్పుల భారం కుంగదీసి ఉంటుంది అనుకుంది.
‘ఆయియే!’ అని పర్దా జరిపి లోపలికి పిలుస్తున్నడు అమీర్‌. చెప్పులు బైట ఇడవాల్న లోపల్నా అని మహబూబ్‌ ఎనకాముందాడుతుంటే ‘పర్వా నై.. అందర్‌ ఛోడో’ అంటున్నడు అమీర్‌. బైట మరీ గల్లీలకు తలుపు ఉండేసరికి లోపల్నే తలుపు పక్కకు చెప్పులు ఇడిషిండ్రు ముగ్గురు. కుర్సీలు రెండు వీల్ల కోసమని జరిపి కూసొమన్నడు అమీర్‌. అటుపక్కన గోడకు మసేరి మంచం ఉన్నది. తలుపుకటు పక్కన ఒక పాతబడ్డ పోర్టబుల్‌ టీవీ ఉన్నది. ఇటుదిక్కు ఒక అల్మారి, దాని పక్కన బట్టల దండెం. ఆ దండ్యానికి ముందు కుర్సీల జబీన్‌, అల్మారీ ముందేసిన కుర్సీల మహబూబ్‌, మంచం మీద ముబీన్‌ కూసున్నరు. ఆ చిన్న అర్ర ఔతలి దిక్కున్న తలుపుల్నుంచి లోపలికి పొయిండు అమీర్‌.
అంతల్నె బయటినుంచి పర్దా తోసుకుంట ఒక ఆరేడేళ్ళ పిల్ల, నాలుగేండ్ల పిలగాడు ఉరుకొచ్చిన్రు. ఝట్‌న ఈ ముగ్గురు కొత్తోల్లను సూషి ఆగిపొయిన్రు. తెల్లగ ముద్దుగున్నరు. కని ఇద్దరు గుడ ఎండు చేపల్లెక్కనే ఉన్నరు బక్కగ. ‘అమీర్‌ భాయ్‌ పిల్లలట్టుంది’ అన్నది ముబీన్‌. ‘ఇదర్‌ ఆవో. క్యా నామ్‌ తుమారా?’ అన్నది జబీన్‌ పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంట. పెద్ద పిల్ల కదలి జబీన్‌ దగ్గరకు వస్తూ ‘సమీనా’ అన్నది. ఒళ్ళో కూసొబెట్టుకున్నది జబీన్‌. పిలగాడు మాత్రం పర్దా అంచు నోట్లె పెట్టుకుని అటూఇటూ ఊగుకుంట అట్లనే నిలబడ్డడు. అంతల అటునుంచి అమీర్‌ ఒచ్చి ఎనక ఒచ్చిన తన బేగమ్‌ను ములాఖత్‌ చేసిండు, ‘రుబీనా’ అనుకుంట. రుబీనా అందర్కి సలాం చేసింది. వీళ్ళు ప్రతిసలామ్‌ చేస్కుంట వచ్చి కూసొమన్నరు. ‘పర్వా నై’ అనుకుంట రుబీనా గనుమల్నె నిలబడ్డది. అమీర్‌ ఒచ్చి మంచం మీద అటు చివర కూసున్నడు.
కొద్దిసేపు నల్గొండల తమ ఇండ్లు పక్కపక్కన ఉన్నప్పటి సంగతులు యాది తెచ్చుకుంట మహబూబ్‌కు చెప్తున్నట్టుగ ముచ్చట పెట్టిన్రు ముబీన్‌, అమీర్‌, జబీన్‌లు. మహబూబ్‌ చూస్తలేడనుకున్న క్షణం జబీన్‌ని ఓ రెండుసార్లు మాత్రమె సూషిండు అమీర్‌.. ఇద్దరి కండ్లల్ల ఒక దర్ద్‌.. ఒక ఆరాధనా భావం…
‘గోల్కొండ రావడం ఎట్లయింది?’ అని ముబీన్‌ అమీర్‌ను అడిగింది.
‘కార్‌ ఇక్కడిది దొరికింది. ఓనర్‌ జర మంచోడు. ఇగ నౌకరీకి కొన్నాల్లు ధోకాలేదని గోల్కొండకొచ్చినం’ చెప్పిండు అమీర్‌. రుబీనా ఊరేదని కాసేపు ఆమెను పలకరించిన్రు.
అమీర్‌ మాట్లాడుతున్నప్పుడు అందరితో పాటు అతన్ని చూసుకుంట ఉండిపోతున్నది జబీన్‌. ముఖంపై కళ తప్పింది, బొక్కలు తేలినై, బట్టలు గూడా ఉన్నదాంట్ల మంచియి ఏసుకున్నట్లుంది కని అయిగుడ పాతబడ్డయి. పిల్లల బట్టలు గుడ అంత బాగలెవ్‌..
వాళ్ళ హాలతు అంతమంచిగ లేదని వీళ్ళు ముగ్గురికి సమజయింది. రుబీనా అందంగా ఉందిగని తను గుడ బక్కచిక్కి ఉంది. ఉన్నదాంట్ల జర మంచి చీర కట్టుకున్నట్లుంది. తల మీద కొంగు కప్పుకుని నిలబడ్డది. ఎంత కూసొమన్న కదల్లేదు. వాళ్ళ కొడుకు పర్దా వదిలి తల్లి కాడికి ఉరికి అల్లుకుపొయి నిలబడ్డడు. వాని చుట్టూ చేతులేసి ‘బేటా!’ అని పరిచయం చేసింది.
‘ఇదరావ్‌ బాబా!’ అనుకుంట మహబూబ్‌ మల్ల పిలిషిండు. వాడు రాలె. తల్లి కొంగు నోట్లో పెట్టుకోబోతే వారించి ‘జావ్‌’ అన్నది రుబీనా. వాడు కదల్లే. ఈలోపు సమీనా బైటికురకడంతోటి జబీన్‌ చేయిచాపి వాని రెట్ట పట్టుకుని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకుంట ఒళ్ళో కూసొబెట్టుకుంది.
‘ఏం చదువుతున్రు పిల్లలు?’ అడిగిండు మహబూబ్‌.
‘సమీనా రెండో తరగతి, వాడు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నడు’ చెప్పిండు అమీర్‌, మల్ల తనె, ‘మీ పిల్లలు ఏం చదువుతున్నరు?’ అనడిగిండు.
‘బేటా ఫిఫ్త్‌ క్లాస్‌.. బేటీ థర్డ్‌ క్లాస్‌’ అన్నడు.
టైం రెండు కావడంతోని ‘అన్నం తీస్త’ అని లోపలికి పొయింది రుబీనా. ఎనకనె అమీర్‌ లేషి కాళ్లు చేతులు కడుక్కుందురు లెమ్మన్నడు. ఆడోళ్లిద్దరు లేషి లోపలికి పొయిన్రు. అమీర్‌ ఎనక మహబూబ్‌ కదిలిండు. ఆ అర్ర దాటంగనె చిన్న హమామ్‌. అందుల్నె లెట్రిన్‌ ఉన్నది. దాని ముందు నుంచి లోపలి అర్రలకు దారి ఉంది. లోపలిది వంట అర్ర. అవతలికి కిటికి ఉంది. ఆడోళ్లకు ఆ అర్ర సూపెడుతున్నది రుబీనా.
హమామ్‌లకు పోయి మొఖం కాళ్లు చేతులు కడుక్కొని ఒచ్చిండు మహబూబ్‌. ఆ ఎనక జబీన్‌, ముబీన్‌ గుడ కడుక్కొని ఒచ్చిన్రు. రుబీనా కింద సాప ఏసి దస్తర్‌ఖాన్‌ పరిషింది. చికెన్‌ బిర్యాని, టమాట శేర్వా, పెరుగు చారు తెచ్చి పెట్టింది. కూసొమన్నరు వీళ్లను. సూస్తె మూడు ప్లేట్లే ఉన్నై. ‘మీరు గుడ కూసోరి’ అన్నరు వీల్లు. ‘మేం తర్వాత తింటం. మీరు తినురి’ అన్నడు అమీర్‌. ‘అందరం కల్సి తిందం’ అన్నడు మహబూబ్‌. వాల్లు అస్సలు ఇనలె. సరెనని ఈల్లు ముగ్గురు కూసున్నరు. పిల్లలు ఇటు రాకుంట సూసుకున్నరట్లుంది వాల్లు. పిల్లలు రాలె. ‘మీరు వడ్డించురి’ అని బర్తతో చెప్పి లోపలికి పొయింది రుబీనా. అమీర్‌ ముందుకు రాబోతె మహబూబ్‌ వారించిండు. తాము ఏసుకుంటమని చెప్పి బిర్యాని ఏసుకున్నడు. ముక్కలు షానానే ఉన్నయ్‌. రెండే ఏసుకొని జబీన్‌ దిక్కు బిర్యాని ముష్కాబ్‌ జరిపిండు. ‘ఔర్‌ దాల్లో భాయ్‌!’ అంటున్నడు అమీర్‌. ‘బాద్‌మె దాల్లేంగే’ అన్నడు మహబూబ్‌. జబీన్‌ గూడ రెండు ముక్కలు ఏసుకొని ముష్కాబ్‌ చెల్లె దిక్కు జరిపింది. ముబీన్‌ గుడ అట్లనె చేసింది. అంతల్నె గడపలకు వచ్చిన రుబీనా ‘అరె, వాల్లు సరిగ ఏసుకుంటలేరు, మీరు ఎయ్యిరి’ అన్నది జర ఊటగ. ఇగ వీల్లు వద్దు వద్దంటున్నా అమీర్‌ వంగి బిర్యానిల నుంచి తలా కొన్ని చికెన్‌ ముక్కలు మల్ల ఏషిండు.
బిర్యాని మస్తు మజాగ ఉండటంతోని, ఉండలేక ‘బిర్యాని బహుత్‌ అచ్ఛీ హై.. అచ్ఛా బనాయె’ అన్నడు మహబూబ్‌. ‘హవ్‌! బహుత్‌ మజేదార్‌ హై! ఇత్నా అచ్ఛా బిర్యాని పకానా కాఁ సికే ఆపా?’ అన్నది రుబీనా దిక్కు సూషి ముబీన్‌. రుబీనా నవ్వుకుంట ‘హమారె అమ్మీ కె పాస్‌’ అన్నది.
‘ఇంకా ఏసుకొని తినురి, మీరు షర్మాయిస్తున్నరు’ అని నవ్వుకుంట లేషి లోపలికి పొయిండు అమీర్‌ రుబీనాను లోపలికి రమ్మని సైగ జేస్కుంట. రుబీనా గుడ లోపలికి పొయింది.
‘ముక్కలన్ని మనకే ఏషిన్రు భాయిజాన్‌! వీల్లేం తింటరు?’ అన్నది ముబీన్‌ నవ్వుకుంట.
‘అవును, చేసిన బిర్యాని అంతా మనకే తీసి పెట్టినట్లుంది. పిల్లలు, వీల్లు ఏం తింటరు. మనకు రెండ్రెండు ముక్కలు సాలు కదా.. వాళ్లు రాకముందే ఈ ముక్కలు బిర్యానిల ఏసేద్దామా?’ అన్నడు మహబూబ్‌.
తల ఊపింది జబీన్‌. ఎంటనె మంచి ముక్కలు తీసి ముగ్గురు గుడ జల్ది జల్ది బిర్యానిల ఏషిన్రు. ముబీన్‌ ఎనక్కి ఒకసారి వాల్లు వస్తలేరని సూస్కొని ఆ ముక్కల్ని గంటెతోని కిందికి అని, పైన అన్నం కప్పేసింది.
కాసేపటికి అమీర్‌ ఒచ్చి కుర్సీల కూసున్నడు. వీల్లు ముందు బిర్యాని, ఐటెంక కొద్దికొద్దిగ టమాట షేర్వాతోని తిని పెరుగు ఖట్టా ఏసుకుంటున్నరు. ‘ఇంకొద్దిగ బిర్యాని ఏసుకోన్రి. బిర్యాని ఒడువనె లేదు’ అంటున్నడు అమీర్‌.
‘బస్‌ బస్‌! బహుత్‌ ఖాలియే.. అచ్ఛా బనాయె బిర్యాని.. మస్త్‌ మజా హై’ అనుకుంట లేషిండు మహబూబ్‌..
‘ఆయియే’ అనుకుంట మల్ల లోపలికి దారి తీషిండు అమీర్‌. నీల్ల తొట్టిల జగ్గు ముంచి నీల్లు అందిచ్చిండు. కడుక్కొని లోపలికొచ్చిండు మహబూబ్‌. ఆడోల్లు గుడ కడుక్కొనొచ్చి కూసున్నరు.
రుబీనా ప్లేట్లు తీసుకుంట ‘చాయ్‌ పీతే?’ అని అడిగింది.
‘లేదు, ఇప్పుడేమొద్దు’ అన్నడు మహబూబ్‌. ‘ఆప్‌ భి ఖాలేనా థానా?’ అన్నడు మల్ల.
‘నై, హమ్‌ బాద్‌మె ఖాతె, అందర్‌ బచ్చోంకొ దేతిమ్‌’ అన్నది రుబీనా.
రాయి లెక్క కూసొని ఏందొ సోంచాయిస్తున్న అమీర్‌ను అదొ ఇదొ మాట్లాడిస్తున్నడు మహబూబ్‌. తేరుకొని జవాబ్‌లిస్తున్నడు అమీర్‌. అమీర్‌ను అట్లా చూస్తు ఉండిపొయింది జబీన్‌. అతన్ని చూస్తుంటె మనసంత డోక్కుపోతున్నది జబీన్‌కు. ముబీన్‌ లేషి లోపలికి పొయి రుబీనాతో మాట్లాడుతున్నది. కొద్దిసేపట్కి-
‘ఇగ పోతం’ అని లేషిండు మహబూబ్‌. దాంతొ ఎంటనె లేషింది జబీన్‌. లోపల్నుంచి ముబీన్‌ గుడ ఒచ్చింది. తాము జల్ది ఎల్తె వాల్లు గుడ తింటరనిపించింది ముగ్గురికి.
‘అప్పుడేనా! ఇయాల ఉండురి’ అన్నడు అమీర్‌ లేషి.
‘లేదు, ఎల్లాలె, పని ఉంది’ అన్నడు మహబూబ్‌, అస్సలు కుదరదన్నట్లు.
రెట్టించలేదు అమీర్‌, ‘రుబీనాను పిలుస్త’ అని లోపలికి ఎల్లిండు.
మహబూబ్‌ జల్ది జేబుల్నుంచి పైసలు తీసి ఐదు వందల నోట్లు నాలుగు జబీన్‌ చేతిల పెట్టి ‘రుబీనా చేతిల పెట్టు.. పాపం, షానా పరేషాన్‌ కనబడుతున్నరు’ అన్నడు.
ఇబ్బందిగ అనిపించింది జబీన్‌కు..
రుబీనాను పిలిషి మల్ల ఒచ్చిండు అమీర్‌, ‘ఒస్తున్నది’ అన్నడు.
ఎంటనె లోపల్కి పొయింది జబీన్‌. పిల్లలిద్దరికి అన్నం పెడుతున్నది రుబీనా. జబీన్‌ను చూసి,
‘అయ్యొ! అప్పుడే పోవడమేంది ఆపా! చాయ్‌ గిట్ల తాగి పోదురు ఉండురి’ అన్నది.
ఆమె తనను ‘ఆపా’ అనడంతోని ఆమెకు తమ ప్రేమ గురించి తెలుసని సమజైంది జబీన్‌కు.
‘లేదు, ఎల్తం ఆపా! ఇంటికాడ పిల్లల్ని తీస్కొని మా మర్దివాల్లు ఒస్తరు’ అన్నది తను గుడ ‘ఆపా’ అనే పిలుస్తు.
‘పిల్లల్ని గుడ తీసుకొస్తె మంచిగుండు గదా ఆపా!’ అన్నది రుబీనా.
‘ఇగ ఆల్లు లేకుండె కదా.. అందుకె తేలేదాపా..’ అనుకుంట దగ్గర్కిపొయి చేతిల మడిషి ఉన్న నోట్లు రుబీనా చేతిల పెట్టింది, ‘దేనికన్న పనికొస్తయ్‌, ఉంచురి’ అని ఆత్మీయంగ అనుకుంట.
‘అయ్యొ.. వద్దు.. వద్దాపా! పైసలెందుకు..’ అని తిరిగి ఇచ్చెయ్యబొయింది రుబీనా.
‘ఆపా! రఖియే! పరవానై’ అన్నది రెండు చేతులు పట్టేసి జబీన్‌.
‘అమ్మో.. వద్దాపా! ఆయన కోప్పడతడు. అస్సలొద్దు.. ఆయనకిట్లాంటివి ఇష్టముండవు..’ రుబీనా మొఖంలో నవ్వు మాయమైంది..
జర ఇబ్బందిగ అనిపించినా జబీన్‌ మనసు ఖుష్షయింది. సరే ననుకుంట పైసలు తీసేసుకొని ప్రేమగా అలాయ్‌బలాయ్‌ ఇచ్చింది రుబీనాకు. మల్ల రుబీనా మొఖంల నవ్వు అలుముకుంది.
పైసలు తీసుకోనందుకు జబీన్‌ ఏమన్నా ఫీలయిందేమోనని, ‘మేం గుడ ఒకసారి మీ ఇంటికొస్తంలే ఆపా! ఇక్కడికి దగ్గర్నే అన్నరు గదా!’ అన్నది.
ఏమనాలో తోయలేదు జబీన్‌కు. క్షణాల్ల సోంచాయించింది-
‘లేదు ఆపా! మేం ఇల్లు మారబోతున్నం. ఎటు ఎల్తమో ఏమొ.. మల్ల చెప్తం లే ఆపా..!’ అన్నది, ఇల్లు మారే ఉద్దేశం లేకున్నా!

తెలంగాణా కత 2013 ఆవిష్కరణ 29న!

10583882_10204556357861922_3574023066456842865_n

T katha pamphlet-page-001

కథ గొంతుకని పత్రికలు నొక్కేస్తున్నాయి

 

దోస్తు పలమనేరు బాలాజి, అతని మిత్రులు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ కథకులను చాలామందిని పిలుస్తూనే, కొత్త కథకులు కూడా తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేలా కొన్ని ప్రశ్నలను అందిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ విషయంలో వారిని అభినందించి తీరాల్సిందే.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకునే ఒక స్పేస్‌ను కల్పించినందుకు వారికి షుక్రియా కూడా..
చర్చకోసం వారు వేసిన ప్రశ్నల్లోంచి కొన్నింటికి నా స్పందన ఇది.
పత్రికలు కథా స్వరూపాన్నే కాక, భాషను, సబ్జెక్టును కూడా నిర్దేషిస్తున్నాయి.
1. భాష: నేను ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. మా గల్లీల్లో మాట్లాడేది తెలంగాణ తెలుగు. చదివింది మాత్రం కోస్తాంధ్ర ‘ప్రామాణిక’ భాష. నేను ఏ భాషలో కథ రాయాలి? తెలంగాణలోని తెలుగు-ఉర్దూ కలగలిసిన మా కమ్మని భాషలో కథలు రాస్తుంటే కొందరు ‘కంగాళీ’ భాష అని ఆడిపోసుకుంటున్నారు. మా మీద బలవంతంగా రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోని వాక్య నిర్మాణాలు, పదాలు ఎంత వదిలించుకున్నా వదిలిపోని జిడ్డులాగా మమ్మల్ని హింస పెడుతున్నాయి. అది చూసి కంగాళీ కామెంట్లు చేస్తున్న వారు ప్రత్యక్షంగా కొందరే గాని, పరోక్షంగా ఎందరో.. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఇచ్చిన ఎరుకలోంచి మేం గట్టిగా ప్రతిఘటించగలుగుతున్నాం కాని ఇన్నాళ్లు మా ప్రాంతపు ఎందరో రచయితల్ని కోస్తాంధ్ర భాషాగ్రేసరులు నంజుకుతిన్నారు. అంతేగాక భాష విషయంలో పత్రికలు కథా రచయితల్ని నానా హింస పెడుతున్నాయి. ‘మాండలిక’ పేరుతో కొన్ని ప్రాంతాల కథల్ని పత్రికలు నిరాకరిస్తున్నాయి. దాంతో ఎంతోమంది కథకులు కేవలం కోస్తాంధ్ర ప్రామాణిక భాషలోనే కథలు రాయలేక ఊరకుండిపోతున్నారు. నిజానికి తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ కథకులకు ఆత్మాభిమానం ఎక్కువ.
అందుకే కోస్తాంధ్ర మీడియా నిర్దేశిస్తే వారు గంగిరెద్దుల్లా తలలూపే స్వభావం ఏమాత్రం లేనివారు. దాంతో అలాంటివారు పత్రికలకు కథలే పంపని వాతావరణం మనం చూస్తున్నాం. ఈ విషయంలో కోస్తాంధ్రకు చెందిన అగ్రకులాల రచయితలు మాత్రం హాయిగా రాసుకుని, ఏ ఆటంకం లేకుండా అచ్చేయించుకోగలుగుతున్నారు. అట్లా కడుపు నిండిన కథలు ఎన్నో వస్తున్నాయి. కడుపు మండిన కథలకు మాత్రం తావు లేకుండా పోయింది.
రాసుకుని పుస్తకాలుగా మాత్రమే తీసుకొచ్చే శక్తి ఎంతమందికి ఉంటుంది? అలా చేయలేనివారు రాయడమే మానుకోవడం చూస్తున్నాం.
మా లాంటి వారము ఆ పత్రికలకు కథలు పంపాలంటే మా భాషలో రాసుకున్నది మళ్లీ వారి భాషలోకి అనువదించి పంపాల్సిన దుస్థితి పట్టింది. ఏ కొన్ని పదాలు, వాక్యాలు మావి పడ్డా అవేవో పంటికింద రాళ్లుగా వారు చూసే వాతావరణం గోస పెడుతున్నది. తెలంగాణలో వేముల ఎల్లయ్య, భూతం ముత్యాలు లాంటివారు దళిత కులాల వ్యావహారిక భాషలో రాస్తున్నారు. ఈ మధ్యే జూపాక సుభద్ర, గోగు శ్యామల లాంటివారు తమ మాదిగ స్త్రీల కథల్ని సంపుటాలుగా తీసుకువచ్చారు. వారి కథలేవీ ఈ పత్రికలు ముర్క గూడ చూసే పరిస్థితి లేదు. నేను, పసునూరి రవీందర్‌ లాంటివాళ్లం మా ప్రత్యేక భాషల్లో కథలు రాసుకున్నాక నమస్తే తెలంగాణ పత్రికకైతే అలాగే పంపడం, ఆంధ్రా పత్రికలకు పంపాలనుకుంటే మాత్రం వారి భాషలోకి తిరిగి అనువదించి పంపుతున్నాం. రచయితలు తమ భాషల్లో రాసుకున్న కథల్ని ఉన్నది ఉన్నట్లు వేసే పత్రికలు చాలా అవసరం అని మేం భావిస్తున్నాం.
2. సబ్జెక్టు: పత్రికలు రచయితలు రాయాల్సిన సబ్జెక్టును కూడా నియంత్రిస్తున్నాయి. కుల ప్రస్తావన ఉన్న కథలను చాలా వరకు పత్రికలు అచ్చుకు స్వీకరించడం లేదు. మత ప్రస్తావన ఉన్న ఎన్నో కథలు నిరాకరించబడుతున్నాయి. ముఖ్యంగా యాజమాన్యాల కులం, ప్రాంతం కథల సబ్జెక్టును చెప్పకనే నియంత్రించడం బహిరంగ రహస్యమే. మాదిగ, మాల కథలు, పాకి పని చేసేవారి కథలు, మత ఛాందసం మీద వచ్చే కథలు, హిందూత్వ మీద వచ్చే కథలు అచ్చుకు నిరాకరించబడుతున్నాయి.
3. నిడివి: నిడివి అనేది మరీ సమస్యగా మారింది. పత్రికల్లో రెండు పేజీల కథలు కొన్ని పత్రికలు, మూడు పేజీల కథలు కొన్ని పత్రికలు వేస్తున్నాయి. అచ్చులో చూసుకోవాలంటే ఆ నిడివిలోకి కుదించి రాయాల్సిన అగత్యం రచయితలకు పట్టింది. దాంతో కథకులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కథలు ఎన్నో కత్తిరింపులకు గురయ్యే పరిస్థితి ఉంది. గతంలో రచయితలు రాసిన కథల్ని కళ్లకు అద్దుకుని అచ్చేసుకున్న పరిస్థితి. ఇవాళ కత్తిరింపులతో రచయితల మనసులు చిన్నాభిన్నం చేస్తున్న దుస్థితి.
‘సారంగ’ లాంటి రెండు మూడు వెబ్‌ పత్రికలు మాత్రమే కథల్ని ఉన్నది ఉన్నట్లు అచ్చేస్తూ కొంతవరకు ఈ ఖాళీని పూరిస్తున్నాయి.
వెరసి ఏ హద్దులు గీయకుండా కథల్ని అచ్చేసేందుకు, కథా చర్చలకు ఏ అడ్డూ చెప్పని ఒక పత్రిక అవసరం ఎంతైనా ఉంది. రచయితలే అందుకు ఒక ట్రస్ట్‌గా ఏర్పడి ప్రయత్నిస్తే మంచిదేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న పత్రికలు గానీ, ఇక ముందు వచ్చే పత్రికలు గానీ యాజమాన్యాల ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చే వాతావరణం బలపడిపోయింది.
– స్కైబాబ

ఏ చట్రాల్లోనూ ఒదగని బహుజనత్వం

pasunuru cover 2
రవి కథలు ఊరూ-వాడ వాతావరణంలోంచి నడిచి.. పట్టణ శివారులోంచి పయనించి మహానగరం లోని మైలను కూడా పట్టి చూపిస్తున్నాయి. ఊర్లలోని అంటరానితనం నగరంలో పది తలలు వేయడాన్ని ఈ కథల్లో చూడొచ్చు. కొత్తదారుల్లో నడిచిన ఈ కథలు రవిని ఆధునిక దళిత కథకుడిగా నిలబెడుతున్నాయి.
రవి కవి హృదయుడు. మంచి కథకుడు. గట్టి విమర్శ కుడు. వాగ్గేయకారుడు. యాక్టివిస్టు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఎందుకు రూపుదిద్దుకుంటై?! సామాజిక అవసరం అలా మూవ్‌ చేయిస్తుంది. ఒత్తిడి చేస్తుంది. సొంత సామాజిక వర్గం అణచివేతల అట్టడుగున తొక్కబడి విలవిల్లాడు తుంటే ఒక క్రియేటివ్‌ పర్సన్‌ ఎంతగా తల్లడిల్లిపోతుం టాడు.. ఎంతగా కాలునిలువని స్థితిని అనుభవిస్తుం టాడు! అలాంటి స్థితే మాలాంటివారిని అన్ని ప్రక్రియల్లో రచనలు చేయిస్తుంది. ఒక్కోసారి ఆ రచనలు వాటి సోకాల్డు ప్రామాణికతల్లో ఒదగవు. ఆ ఒదగనితనమే వాటికి మరింత సౌందర్యాన్ని చేకూరుస్తుంది. ఆ ఒదగని తనమే మూస సరిహద్దుల్ని చెరిపేసి, హద్దులు గీస్తున్న వారి చెంప ఛెళ్లు మనిపిస్తుంది. అలా ఏ చట్రాల్లోనూ ఒదగని వీరుడు రవి. సానపట్టుకున్నా కొద్దీ మరింతగా మెరిసే పదును రవి సొంతం.
ఈ కథల వెనుక దాగిన తాత్వికపునాది గురించి కొంత చర్చించాలి. ఆ కోణంలో లోతుల్లోకి దిగితే` ముగిసిపోయిందనుకున్నదేది ముగిసిపోవడం లేదు.. మళ్ళీ మళ్ళీ బిగుసు కుంటున్నది. ఈ బిగింపు మళ్ళీ మొదటికొస్తున్నది. పోరాటం చేస్తున్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తున్నది. దాటి వచ్చినామనుకుంటున్న చైతన్యాన్ని అనుభవిస్తున్నది పై వర్గాలవాళ్ళే ` బ్రాహ్మణీయవాదులే. లేదంటే వాళ్ల కనుసన్నల్లో మెలిగే, వాళ్ల మార్గంలో పయనిస్తున్న ఇతర వర్గాలు మాత్రమే. ఈ దౌర్భాగ్యస్థితికి ఎంతగా కుంగదీసే బల ముంటుందో అనుభవిస్తున్న వాళ్లకు ఎరుక. ఎప్పటికప్పుడు అలాంటి స్థితిని జయిస్తూ వస్తున్న వాళ్లల్లోంచి ఒకడు మా రవి.
మార్గదర్శులు వేసుకొస్తున్న ప్రతి కొత్త దారి కొన్నాళ్లకే పాతబడిపోతుండటం, కొత్త సిద్ధాంతాలు కొద్ది కాలంలోనే గానుగలుగా మారిపోతుండడం.. చుట్టూ వలయాలు వలయాలుగా సరికొత్త చట్రాలు బిగుసు కుంటుండడం.. ఒక్క కష్టం కాదు ` ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ రచనలు కొనసాగించడం ఆధిపత్య వర్గాలకున్నంత సులువు కాదు. వాళ్లు రాస్తే ఆహా ఓహో అనడానికి అండదండలెన్నో ఉన్నాయి. రవిలాంటివాళ్లు రాస్తే అంత ఈజీగా ప్రచారం లభించదు. దళితవాదం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. అప్పుడున్న మద్దతుదారులూ ఇప్పుడు లేరు. ఎప్పటికప్పుడు మళ్లీ మద్దతుదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి అట్టడుగువర్గాలది. బ్రాహ్మణుల నుంచి అప్పర్‌ శూద్ర వరకు వచ్చిన సామాజిక ఎదుగుదల బీసీ, ఎస్సీ, మైనారిటీల వరకు రావాలంటే ఇంకా చాలాకాలం పట్టేలా ఉంది. ఈ లోపు సాహిత్యకారులు, సామాజిక కార్యకర్తల పోరాటం ఎడతెరిపి లేకుండా నడుస్తూ ఉండాల్సిందే. అలాంటి పోరాటం చేయగల శక్తి పుష్కలంగా ఉన్నవాడు రవి.
హిందూత్వ, బ్రాహ్మణీయ భావజాలం పర్సెంటేజీల తేడాలతో ఎటూ చాలా మందిలో ఉంటుంది. దాంతో మనకు సీరియస్‌ అనిపించేవి, వారికి క్యాజువల్‌గా కనిపిస్తుంటాయి. మనకు గాయాలుగా తగిలేవి, వారిని తాకనైనా తాకవు. వారు ప్రోగ్రెసివ్‌ మొఖంతోనే లోలోన మనకు ఎంతో హానికరమైన పనులు చాలా అలవోకగా చేసేస్తుంటారు. మరి మొత్తంగా బ్రాహ్మణిజపు ప్రభావంలో ఉన్న వారికన్నా వీరు తక్కువా ఎక్కువా అంటే తేల్చుకోవడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ మొత్తంగా సమాజం బ్రాహ్మణిజపు ప్రభావంలోనే ఉన్నప్పుడు ఆ కాస్త వెసులుబాటుతో మనల్ని దరిచేరనిచ్చే ఆ కొందరు ఏ మేరకు బహుజనులకు ఉపయోగపడుతుంటారో అంచనా వేసుపౖగా ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది.

ఒక్కో కులం, ఒక్కో మత సమూహానికి కొన్ని ప్రత్యేక సమస్యలున్నాయి. ఒక సమూహం సమాజం పట్ల, రాజ్యంపట్ల తీసుకునే స్టాండ్‌ మరొక సమూహం తీసుకోలేకపోవచ్చు. ఒక సమూహానికి ఉండే దీర్ఘకాలిక లక్ష్యం మరో సమూహానికి ఆ సమయానికి అడ్డంకిగా మారొచ్చు. పైగా పోరాట పంథాలు వేరు కావొచ్చు. ఒకరికి అసలైన శత్రువు మరొకరికి ఇమిడి యేట్‌ శత్రువు కాకపోవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఉద్యమ కార్యాచరణలో పట్టూ విడుపు లుండాలి. అంతిమ లక్ష్యంపట్ల అందరికీ స్పష్టత ఉండాలి. లక్ష్యం సుదూరంగా  ఉన్నప్పుడు తక్షణ ఫలితాల మెట్లనూ ఎక్కుతూ పోవాలి. అలా కాదని కొండపైనే దృష్టి నిలిపి పరుగెడుతుంటే లోయలూ అగాధాలు మనల్ని కబళించవచ్చు.
ఒక మెజారిటీ భావజాలం మనల్ని లోబరుచుకుంటుంది. బాధితస్పృహ ఉన్నవాడికి కనిపించిన గాయం, మెజారిటీ భావజాలానికి లోనవుతున్న అణగారిన జాతివాడికి ` బహుజనుడికి లేకపోవచ్చు. స్పృహ కలిగినవాడు ప్రశ్నించే దాకా వీడు ఆ స్పృహలోకి రాడు. ఒక రకంగా స్పర్శాజ్ఞానం కోల్పోవడంలాంటి ప్రక్రియ అది. అట్లా మన చుట్టూ ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసీలూ, ముస్లింలు, మహిళలూ ఇతర మైనారిటీల నుంచి ఎదిగొచ్చినవారు కూడా మెజారిటీ భావజాలానికి లోనై శత్రు శిబిరంలో చేరిపోతున్నారు. వాళ్లను ముల్లుగర్రతో అదిలించి మలుపుకోవడం పెద్ద శ్రమైపోయింది బహుజన చైతున్యులకు. అది నిరంతరం జరగాల్సిందే. పెద్ద ఎత్తున జరగాల్సిందే.
ఇవేకాక మన మీద మావోయిస్టు, మార్క్సిస్టు ప్రభావాలు ఆవరించి ఉన్నాయి. ఈ ప్రభావాలు ఒక్కోసారి అస్తిత్వ ఉద్యమకారులకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఒక్కో విజయాన్ని అందుకొని ముందుకెళ్లడానికి ఏ మాత్రం అంగీకరించని ఆ ప్రభావాలు మొత్తంగా మన లక్ష్యాన్ని మరింత దూరంగా నెట్టేస్తున్నాయి. నిజానికి ఆ ప్రభావితుల్లోని క్రమశిక్షణ, నిబద్ధత, అధ్యయనశీలత, త్యాగం లాంటి మంచి లక్షణాలను స్వీకరిస్తూనే, వారిలోని వ్యక్తి ఆరాధన, మతంగా మారేతత్వం, మూస ధోరణి, వదలని కుల జాఢ్యంలాంటి చెడును విసర్జించాల్సిన అవసరముంది. ఇలా జరగకుండా అణగారినతనంలోంచి వచ్చే కసి, ఆకలి, పైసాను ` హోదాను చూడనితనం కొందరు అస్తిత్వ ఉద్యమకారులను చాలా తొందరగా లంగదీసు కుంటున్నాయి. వాటికి ఏ కాస్త లంగినట్టు కనిపించినా మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాలు దాడి చేస్తున్నాయి. దాంతో అతలాకుతలమైన అస్తిత్వ భావజాలకుల చరిష్మా మసకబారిపోతున్నది. ఇలా లేకుండా నిక్కచ్చిగా కనిపించే కొంతమంది అస్తిత్వవాదులు మావోయిస్టు, మార్క్సిస్టు భావజాలాల ప్రభావంవల్ల రిజిడ్‌గా బిగదీసుకుపోతున్నారు. తాము చేయలేకపోతున్న పనులు చేస్తున్న వాళ్ల మీద రాళ్లేస్తున్నారు. ప్రతీ పనిలో తప్పులు మాత్రమే వెతికే వీర విప్లవవాదుల్లాగే వీర దళితవాదులు, వీర బహుజనవాదులు తయారవుతున్నారు. వీటన్నింటి గ్రహింపుతో ఈ జాఢ్యాలన్నింటినీ వదులుకొని ముందుకెళ్లినప్పుడే అస్తిత్వ వాదుల చైతన్యం లక్ష్యాన్ని చేరుకునే అవకాశముంది. రవిలో ఈ వెసులుబాటు కనిపిస్తున్నది. ఆ దిశగా రవి తన రచనలో, కార్యాచరణలో కేంద్రబిందువయ్యే అవకాశముందని ఆశపడుతున్నాను.

ఆధిపత్య భావజాలాలే కాక ముఖ్యంగా మీడియా రచయితల్ని నియంత్రిస్తూ వస్తోంది. యాజమాన్యాల కులం, ప్రాంతం కొత్త రచయితల్ని చెప్పకనే నియం త్రిస్తున్నాయి. రవి, నేను రాస్తున్నది తెలంగాణ మధ్యతరగతి భాషే అయినప్పటికీ ఆంధ్రా పత్రికలవారికి అది తెలంగాణ మాండలికంలా కనిపిస్తోంది. ఆ విషయంలో మాకే ఆవేశం ఆగదు. మరి తెలంగాణ మాదిగ భాషలో రచనలు చేస్తున్న వేముల ఎల్లయ్య లాంటి వారు ఎలా తమ ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ వస్తున్నారో తెలియదు. ఈ మధ్య జూపాక సుభద్ర, గోగు శ్యామల కథల సంపుటాలు వచ్చాయి. ఆ కథల్ని వేసుకునే మనసు, ఉద్దేశం ఆంధ్ర పత్రికలకు లేదు. అలాంటి పత్రికలు తెలంగాణ వారికి ఏ మేరకు అవసరం? తెలంగాణ పత్రికలు మరికొన్ని రావలసిన అవసరం  ఉంది. అందులోనూ అట్టడుగు జాతుల నుంచి మీడియా ఎదిగొచ్చిన రోజునే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది.
ఇప్పటిదాకా రవి, నేను చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నాం. ఆంధ్రా పత్రికకు కథ ఇవ్వాలంటే ఒక భాషలో, నమస్తే తెలంగాణ పత్రికకు ఇవ్వాలంటే ఒక భాషలో కథలు రాస్తున్నాం. ఇదొక యాతన. కథ రాయడమే చాలా ఓపికతో కూడుకున్న పని. అలాంటిది మళ్లీ అందులో ఇట్లాంటి ప్రయోగాలు, ప్రయాసలు మరెంతగా మమ్మల్ని పరేశాన్‌ చేస్తున్నాయో చూడండ్రి.
ఇన్నాళ్లు మా మీద రుద్దబడిన కోస్తాంధ్ర ప్రామాణిక (కో.ప్రా) భాష మమ్మల్ని నరక యాతన పెట్టింది. కథా సమయంలో ఉన్నప్పుడు విషయం, భావం, ఫ్లో ఎక్కడ పోతాయోనని స్పీడ్‌గా రాసేస్తుంటాం. అలా రాస్తున్నప్పుడు మాదైన తెలంగాణ భాష రాకుండా కో.ప్రా భాష వచ్చేస్తుంటుంది. ఏదో ఒకటి అని ముందు రాసేసి తర్వాత మళ్లీ మళ్లీ మా భాషలోకి అనువాదం చేసుకోవడం పెద్ద ప్రయాసై పోయింది. నిజానికి మా భాషలోనే ముందుగా రాసుకుంటే వచ్చే వాక్యనిర్మాణం, కో.ప్రా. భాషలో రాసేసినంక రావడం కష్టమే. ఆ ఎరుకతోనూ మా అనువాదాలు కొనసాగుతున్నై. జరిగే నష్టమేమిటంటే, ఒక్కోసారి కో.ప్రా.భాషలోని వాక్యనిర్మాణంలోనే తెలంగాణ భాష వాడడం జరిగిపోతుంటుంది. ఆ ఎరుకలోంచి మా భాషలోనే ముందుగా రాసి అవసరమైనప్పుడు మాత్రమే కో.ప్రా. భాషలోకి మార్చి ఇవ్వడమే సరైందనినిర్ణయించుకున్నాం. ఇలా భాష విషయంలో రవికి, నాకు చాలానే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రామాణిక భాష అవసరం గురించి అందులోనూ బహుజనులకు ఆ భాష విషయంలో వచ్చే ఇబ్బందుల గురించి చర్చ జరగవలసే     ఉంది.
రవి కథా సంపుటి వేసుకోవాలనుకున్నంక మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో మొత్తంగా కథలను తన భాషలోకి మార్చుకోవాల్సిందేనని నిర్ణయించాం. ఆ పనిలో ఇంకా ఎక్కువ కష్టం పడాల్సివచ్చింది రవి. మరెంతో సమయం వెచ్చించాల్సి వచ్చింది. కథ అచ్చయింది అచ్చయినట్టే వెయ్యాలి కాని మళ్లీ మార్చుకోవడమేమిటి అని కొందరు దోస్తులు అన్నప్పటికీ మా కొత్తతరం క్రియేటివ్‌ రైటర్స్‌ జెన్యూనిటీ మీకు అర్థం కాదులే అని మేమనుకున్నాం.
మా యీ సంఘర్షణల్లోంచి ‘తెలంగాణ బహుజన కథకుల కచ్చీరు’ అని రెండు రోజుల సదస్సు పెట్టుకొని అనేక చర్చలు, గొడవలు పడ్డాం. కొమురం భీం నేలకొరిగిన జోడేఘాట్‌లో రెండో సమావేశం నిర్వహించుకొని తాలూ, గట్టీ, అగ్రవర్ణ ప్రామాణికతల ఆధిపత్యాలను చర్చించుకున్నాం. అలా బహుజన కొత్త తొవ్వలు వెతుక్కున్నాం. ఇంకా ఆ దారిలోనే మరింత గట్టి పడటానికి తాలును బహుజన చాటలతో చెరుగుతున్నాం. అగ్రవర్ణ విమర్శకులు మా కథలను శైలీ, శిల్పాల కళ్లద్దాల లోంచి మాత్రమే చూసే ప్రయత్నం చేయబోతే అవన్నీ కుదరవని చెప్పకనే చెబుతూ వస్తున్నాం. మా ప్రత్యేక రాతలే మాకు శైలీ,శిల్పాలను ఏర్పరచగలవనే ఆత్మవిశ్వాసం మాకుంది.
ఆ మధ్య ‘ఇప్పపూలు’ ‘గిరిజన సంచార తెగల కథలు’ పేర ఒక సంకలనం వచ్చింది. అందులో ఓ నలుగురు తప్ప మిగితా వారంతా గిరిజనేతరులే. ‘వతన్‌’ముస్లిం కథా సంకలనం లాగా, ‘నల్లపొద్దు’ దళిత రచయిత్రుల సంకలనం లాగా అచ్చంగా ఆ జాతుల రచనల తొలి సంకలనాలు రావాలి. కాని ఇతర రచయితలతో తొలి సంకనాలు వేయడం వల్ల వారి మూసలో విషయం, జీవితం, ప్రతీకలు రికార్డు చేయబడతాయి. వారి మూసలోకే ఆయా సమూహాల కొత్త రచయితల్ని డ్రైవ్‌ చేసినట్లవుతుంది. వారి వారి ప్రత్యేక శైలిలో వ్యక్తీకరణలో వారి జీవితంలోని ప్రతీకలతో, ద్ణుఖంతో, పరిష్కార మార్గాలతో రచనలు రావాలి. కాని ఆధిపత్య వర్గాల, భావజాలాల వారు నడిపిస్తే నడిచే రచనలు తీవ్ర నష్టం చేస్తాయి. ఈ జ్ఞానం బహుజన రచయితలకు అత్యంత అవసరం. ఇతర రచయితలు వేసేవి సంఫీుభావ సంకలనాలు అవుతాయి. వాటి అవసరమూ చాలా ఉంది. అయితే ఈ స్పష్టత మాత్రం ఉండాల్సిందే.
విమర్శకులంటే అధ్యయనశీలురై మాత్రమే ఉండాలనే ఒక గుడ్డి నమ్మిక మన మధ్య సంచరిస్తున్నది. తెలుగు సాహిత్యంలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదువుకున్నవారే గట్టి విమర్శకులని భావించే వాతావరణమున్నది. వీరు కొన్ని తప్పుడు సూత్రీకరణలు చేస్తూ అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని అవమానపరుస్తున్నారు. ఇది సరైంది కాదు. కాళ్లకింది నేలను వదిలి పరాయి నేల నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం మా మీద రుద్దాలనే విమర్శకుల ధోరణి మా రచనలకు ఆటంకంగా తయారయింది. ఇందుకు బెస్ట్‌ ఎగ్జాంపులే టెక్నిక్‌ అనే గొడవ. చెత్త విషయాన్నైనా కొత్త టెక్నిక్‌తో చెబితే చాలు, ఆహా ఓహో అంటున్నారు సంకలనకర్తలు, అగ్రవర్ణ ఆధిపత్య వర్గాల విమర్శకులు. వెనుకబడేయబడ్డ జీవితంలోంచి కళ్ళు ధారలు కట్టి రచనలు వచ్చినా వీరి కరడుగట్టిన మనసులు కరగవు. అలాగని టెక్నిక్‌ని పూర్తిగా పక్కన పెట్టమని అనడం లేదు. అంతస్సూత్రాన్ని పట్టుకునే విమర్శకుల్ని లెక్కచేయని వాతావరణం ఇంకా మన మధ్య ఉంది. అందుకే బహుజనులు తమ బతుకుల్లోని కొత్త టెక్నిక్స్‌ని పట్టి ఇవ్వాలి. వాటికోసం తమ జీవనాన్ని జల్లెడ పట్టాలి.
నిజానికి కేవలం అధ్యయనంలోంచి కాక జీవితంలోంచి వచ్చే రచనలు స్వచ్ఛంగా సహజంగా ఉంటున్నాయి. మనసు మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. ఒక అంతర్‌ జ్వలనాన్ని రేపుతున్నాయి. వీటిలో ఎన్నో ప్రత్యేకతలు, సోకాల్డు నాగరిక సమాజానికి ఆశ్చర్యం కలిగించే వ్యక్తీకరణలు ఉంటున్నాయి. బహుజన కథకుల్ని ఆవరించి ఉన్న సోకాల్డు ప్రామాణిక వాతావరణం కొందరిని అసలు రచనలే చేయకుండా చేస్తున్నది. చేసిన రచనలను సోకాల్డ్‌ సంకలనకర్తలు పట్టించుకోనట్లు నటించడంతో ఎందరో రచయితలుగా హత్య చేయబడ్డారు. భాష విషయంలో, వ్యక్తీకరణ విషయంలో, కథా వస్తువు విషయంలో ఆధిపత్య భావజాల విమర్శకులు, సంకలనకర్తల ప్రభావాల్ని ఛేదించుకొని రాయాలంటే పురిటినొప్పులు పడాల్సి వస్తున్నది. వారు ఎప్పటికప్పుడు బహుజన రచయితల్ని కంట్రోల్‌ చేస్తున్నారు. వారి మెప్పుకోసం తంటాలు పడడంలో బహుజనతనం మాయమవుతున్నది. ఆ ఎరుక ఉన్న రచయితలుగా మేమిప్పుడు ఆ ప్రభావాలు మా మీద పడకుండా, మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ ప్రయత్నంలో మా మధ్య ఎన్ని సంఘర్షణలో.. ఎన్ని సందిగ్ధాలో…ఎన్నెన్ని చర్చలో.
ఈ కోణాలన్నింటిలోంచి ఆలోచించినప్పుడు రవి కథల్లో ఈ కొత్త పార్శ్వాలు చూడొచ్చు. రవి ముందు ముందు మరిన్ని మంచి కథల్ని, నవలల్ని అందిస్తాడన్న నమ్మకంతో.. అందుకు ఇంకా ఇంకా శ్రమిస్తాడన్న భరోసాతో… రవికి అలాయి బలాయి. గుండెకు గుండెను కలిపే అలాయి బలాయి.

-స్కైబాబ

(ఈ ఆదివారం విడుదల కానున్న డా.పసునూరి రవీందర్‌ కథా సంపుటి ‘‘అవుటాఫ్‌ కవరేజ్‌ ఏరియా’’కు రాసిన ముందుమాట)

అంటు

‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే.. జర నువ్వు సమ్జాయించి చెప్పు.. వచ్చి ఆ పిల్లను తీస్కెల్లిపొమ్మను అన్నా!’ అన్నడు రాజు మా ఊరి నుంచి.
సెల్‌ఫోన్ ఆగకుంట మల్ల మల్ల మోగుతుండేతలికి రోడ్డు పక్కన బండి ఆపి ఫోనెత్తి ఉంటి. అతని మాటలు విని కాసేపు ఏం మాట్లాడలేక పొయ్‌న. కొద్దిసేపట్ల సంభాలించుకొని, ‘అది కాదు రాజు, ఎప్పుడు జరిగిందిది? ఇప్పుడెక్కడ ఉన్నరు? మన ఊర్లో వాళ్లకు తెలిసిందా?’ అన్నా పరేశాన్‌గ.
‘రాత్రి ఒచ్చిన్రటన్నా. లేడీస్ హాస్టల్లో పిల్ల నుంచిన్రంట. పిలగాడు బాయ్స్ హాస్టల్ల ఉండు. ఊర్లె ఇంక తెలియదన్నా..’
‘పిలగాడు ఏం చేస్తడు?’

‘సదువుకుంటుండన్నా! వాళ్ల నాయన లేడు. వాళ్లమ్మ, వాడే ఉంటరు. షానా బీదోల్లన్నా. నేనే ఆనికి సదువుకు పైసలిస్తున్న. ఆడి సదువు ఖరాబైతదన్నా. మీ మామలు గుడ ఊకోరు. కొట్లాటలైతయ్.. వచ్చి పిల్లను తీస్కపొమ్మనన్నా..’

నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఏం చెప్పాల్నో ఏం చెయ్యాల్నొ సమజ్ కాలె. సుతరాయించుకొని ‘రాజు! నేను రోడ్డు మీదున్న, జరసేపాగి ఫోన్ చేస్త’ అన్న. ‘సరె అన్న, మీ మామలకు ఎవరికన్నా చెప్పన్నా, మల్ల ఫోన్ చెయ్యి’ అని కట్ చేసిండు రాజు.

ఫోన్ జేబుల పెట్టుకొని బండి స్టార్ట్ చేసి ఇంటి దిక్కు పోనిస్తున్న. షానా గజిబిజిగ అనిపిస్తున్నది. మనసంత ఏదొ అయిపొయినట్లున్నది. ఇంటికి పొయి కుర్సీల కూలబడ్డ. ఏమైంది అన్నది మా ఆమె.

‘మా నడిపి మామ బిడ్డ రేష్మ, ఎవరో మాదిగ పిలగానితోటి సిటీ కొచ్చేసిందంట!’ అన్న.

‘అవునా.. ఎవరు చెప్పిన్రు?’ అన్నది పరేశాన్‌గ మా ఆమె.
విషయమంత చెప్పిన. కొద్దిసేపు ఆమెతో చర్చించిన. రాజుకు ఫోన్ చేసిన.

‘…పిల్ల, పిలగాడు ఒకర్నొకరు బలంగ ఇష్టపడుతున్నరా.. ఏమంటున్నరు రాజు?’

‘నేను వాళ్లతోని మాట్లాడలేదన్న. వాళ్ల వయసుకు ఇప్పుడేడ సమజైతదన్నా? పిలగాడు చెప్తె ఇంటడన్న. మీ మామలకు చెప్తె ఆల్లే వచ్చి పిల్లను ఎట్లన్న ఒప్పిచ్చుకొని తీస్కపోతరు’ అన్నడు రాజు.

‘…మా మామోల్లకు నువ్వే ఫోన్ చెయ్ రాజు. నాకు చెప్పిందే వాళ్లకు చెప్పు. వొచ్చి పిల్లను తీస్కపొమ్మని నేనెట్ల చెప్త? లవ్ మ్యారేజ్‌లను నేను సపోర్ట్ చేస్త గదా.. నాది గుడ లవ్ మ్యారేజేనాయె!’ అన్న.

‘అట్ల కాదే.. మీ మామలు వాన్ని బతకనియ్యరన్నా.. వాళ్ల బిడ్డ మాదిగోల్ల పిలగానితోని లేషిపొయిందన్న పేరొస్తె ఊకుంటరా అన్నా?! పిలగాని వాల్లమ్మ బయపడి రాత్రే ఎటో ఎల్లిపొయిందంట! నువ్వే ఎవర్తోనన్న మీ మామోల్లకు చెప్పిస్తె ఆల్లే వొచ్చి ఎట్లన్న జేసి తోల్కపోతరు..’

‘నువ్వు చెప్తె ఏమైతది రాజు!’ అన్న ఓపిగ్గ.

‘నేను చెప్పలేనన్నా.. అసలు ఈ విషయం నాకు తెల్సని, నేను చెప్పిన్నని గుడ ఆల్లకు చెప్పొద్దన్నా.. మల్ల నాకు పరేశానైతది..’ అన్నడు రాజు.

‘..సరె, నేను ట్రై చేస్త.. నువ్వు పిల్ల, పిలగాని సంగతి తెల్సుకో.. మల్ల ఫోన్ చేస్త’ అని ఫోన్ పెట్టేసిన.

‘ఏందంట?’ మా ఆమె.

సంగతి చెప్పిన. కాలుగాలిన పిల్లిలెక్క అటు ఇటు తిరుగుతున్న. ఏం తోస్తలేదు నాకు. కొద్దిసేపు నా వాలకం జూసి.. ‘ఇట్ల కుర్సీల కూసొ నువ్వు.. నిమ్మలంగ ఏం జెయ్యాల్నొ ఆలోచించు..’ అన్నది మా ఆమె.

కూసున్న. ఒక్కసారిగ ఎన్నో ఆలోచనలు నా మీద దాడిచెయ్యబట్టినయ్..

ఈ విషయం తెలిస్తె మా మామ తట్టుకోగలుగుతడా? బి.పి, షుగర్ ఉండె.. పెద్ద పిల్ల మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో చిన్న పిల్ల ఉండె. ఇగ మిగతా ఇద్దరు మామల పరిస్థితి ఎట్లుంటదో.. ఎట్ల చెప్తం ఆల్లకు. అసలు ఆల్లకు చెప్పకుంటనె, ఈ పిల్లతోటి ఒక్కసారి మాట్లాడి సూస్తె బాగుండు. ఏం చెయ్యాలె…

మల్ల రాజుకు ఫోన్ చేసిన, ‘రాజు! యూనివర్సిటీల ఎవరు ఈల్లకు తోడున్నరు? ఆల్లతోటి ఒకసారి నేను మాట్లాడాలె’ అన్న.

‘లెనిన్, భరత్‌లు ఈల్లతోటి మాట్లాడుతున్నరన్న. వాళ్లతోటి నువ్వొకసారి మాట్లాడు..’ అన్నడు.
ముందుగాల భరత్‌కు ఫోన్ చేసిన.

‘హలో అన్నా! ఏం సంగతే?’ అన్నడు భరత్.

‘భరత్! మీ మాదిగోల్ల పిలగానితోటి వొచ్చిన పిల్ల కాస మా మామ బిడ్డనే’ అన్న.

‘అవునా అన్నా..! సొంతం మావ నా?!’ అన్నడు.

‘అవునే.. నేను చిన్నప్పుడు ఆల్లకాడనె పెరిగిన. ఏంది వాల్ల సంగతి?
‘రాత్రి ఒచ్చిన్రంటన్న.. వాళ్లు ఆగెటట్టు లేరు..!’
‘కాదన్న.. పిలగాడు ఎమ్మెస్సీ ఫస్టియరే సదువుతున్నడంట గదా.. ఎనకా ముందు ఏం లేదంట. ఈ పిల్ల గుడ కాలేజ్ బంద్ జేసె. మరెట్ల బతుకుతరే?!’ అన్న.
‘మేం అన్ని రకాలుగ చెప్పి జూసినమన్నా. పిల్లే ఇంటలేదన్న. ‘మీవల్ల అయితె పెండ్లి చెయ్‌రి. లేదంటే ఎల్లిపోతం’ అంటున్నదే. మమ్మల్నె నమ్ముతలేదె పిల్ల’ అన్నడు భరత్.
‘మరి పిలగానికి గుడ అంతే ఇష్టం ఉన్నదా భరత్?’ అన్న.
‘ఏమో అన్న! ఆడు భయపడుతున్నడు’ భరత్.
‘మరేం చెయ్యబోతున్నరు మీరు?’
‘మాదేముందన్నా.. అన్ని విధాల చెప్పి సూషినం. ఇగ ఆల్ల ఇష్టం’ అన్నడు.
‘నేను మల్ల మాట్లాడత’ అని పెట్టేసిన.
అప్పటికె రాజువి 4 మిస్‌డ్ కాల్స్ ఉన్నై.
ఏం చేస్తె బాగుంటదో సమజైతలేదు నాకు.
కొద్దిసేపు పక్క మీద పండుకుండిపొయ్‌న.. మల్ల ఆలోచనలు ముసురుకున్నయ్.
మా ముగ్గురు మామలకు ఒక తమ్ముని లెక్క వాల్ల దగ్గర్నె పెరిగినోన్ని నేను. కాని ఆల్ల లోకం వేరు. నా చైతన్యం వేరు. ఈ విషయాన్ని నేను చూసే తీరు వేరు. వాల్లు తీసుకునే తీరు వేరు. వాల్లు నిజంగనె ఊర్లె ఇజ్జత్ పొయ్‌నట్లు ఫీలయితరు. అందరికున్నట్లే మాదిగోల్లంటె వీల్లక్కూడ చిన్నచూపు మామూలె. తమ బిడ్డ ‘మాదిగోడితో లేషిపొయిందట’ అన్న మాట వాల్లు తట్టుకునే విషయమేం కాదు. మరి వాల్లను ఎట్ల సమ్‌జాయించాలె? ఎట్ల అర్దం చేయించాలె.. మొదలు విషయం చెప్పుడెట్ల..??
అసలు పరిస్తితేందో తెలుసుకుందామని ముందుగాల మా తమ్మునికి ఫోన్ చేసిన. ‘ఏంరా.. ఏంది సంగతులు. ఊర్లె ఏమన్న జరిగిందా? అన్న. ‘ఏం జరగలేదే.. ఏంది విషయం?’ అన్నడాడు.
‘నడిపి మామ బిడ్డ సంగతేంది?’ అన్న.
‘ఏమొ మరి, రాత్ర పదింటప్పుడు మామ నా కాడికొచ్చి జర తోడు రమ్మని తీస్కెళ్లిండే. ‘రేష్మ ఇంటికి రాలేదు. ఏమైందో తెలియద’న్నడు. ఊరి ఎనక రైలు పట్టాలెంట ఆడ్నించి ఈడిదాంక సూషి ఒచ్చినం. పరేశాన్ ఉన్నడు మామ’ అన్నడు.
‘ఆ పిల్ల సురేష్ అనే మాదిగోల్ల పిలగానితోటి సిటీకొచ్చి యూనివర్సిటీల ఉందంట. పెండ్లి చెయ్యమని స్టూడెంట్ లీడర్స్‌ని ఒత్తిడి చేస్తున్నదంటరా..’ అన్న.
‘అవునా…!’ అని పరేశానై, తర్వాత ‘మామ వాళ్లకు చెప్దామా మరి?’ అన్నడాడు సందిగ్ధంగా.
‘చెప్పేద్దాం.. తెలిసి గుడ చెప్పకుంటె బాగుండదు గదా.. నడిపి మామకు డైరెక్టుగ ఈ విషయం చెప్తే తట్టుకోగలుగుతడా?!’ అన్న.
‘మొత్తానికి ఇసొంటిదేదో జరిగి ఉంటదని ఆయనకు తెలిసే ఉన్నట్లున్నదన్న. ఆయన మాటల్ని బట్టి నాకట్ల సమజైంది’ అన్నడాడు.
‘ముందుగాల చిన్నమామకు ఈ విషయం చెప్పు. నడిపి మామ యాడ ఉన్నడో తెలుసుకొని ఆయన కాడికి పొయ్యి జర నిమ్మలంగ విషయం చెప్పమని చెప్పు’ అన్న.
‘సరె’
ఇంతల రాజు ఫోన్..
ఎత్తిన. ‘అన్నా! ఈవినింగే వాళ్ల పెండ్లి చేస్తానికి చూస్తున్నరంటనె.. జల్ది మీ మావోల్లను సిటీకి బయల్దేరి పొమ్మనన్నా’ ఆదుర్దాగా ఉంది రాజు గొంతు.
నాగ్గూడ కొద్దిగ షాకింగా అనిపించింది. ఏం చెయ్యాల్నొ అర్దం గాలె.
‘ఇప్పుడె మా మామోల్లకు చెప్పమని తమ్మునికి చెప్పిన రాజు. వాళ్లేమంటరో సూద్దాం.’
‘సూద్దామంటె ఎట్లన్న. అసలు నువ్వు యూనివర్సిటీ లీడర్స్‌తోటి గట్టిగ మాట్లాడన్నా. తొందరపడి పెండ్లి చెయ్యొద్దని చెప్పన్నా. పిల్ల వాళ్ల నాయనలు ఏమంటరో సూద్దాం, జర ఆగమనన్నా.’
‘అట్ల నేనెట్ల చెప్త రాజు? నువ్వే ఏమన్న చెప్పి ఆపితె ఆపు’ అన్న.
రాజు నారాజై ఫోన్ కట్ చేసిండు. నాగ్గూడ టెన్షన్‌గ అనిపించింది. రేష్మ తొందరపడుతున్నదేమొ.. ఐటెంక ఇబ్బందులు పడతదేమో.. అది ప్రేమ కాకుండా ఆకర్షణే అయితే మాత్రం కష్టమే.. ఏం చెయ్యాల్నో తోచక అటు ఇటు తిరుగుతున్న.
గంటకు- నడిపి మామ ఫోన్. మాట్లాడాలంటె ఎట్లనో అనిపించింది. కని తప్పదు. ఎత్తిన.
‘మామా! సలామలేకుమ్’ అన్న.
‘వాలేకుమ్ సలామ్. ఏం చేద్దాం యూసుఫ్ మరీ?’ అన్నడు.
‘నాక్కూడా ఏం సమజైతలేదు మామా! యూనివర్సిటీ స్టూడెంట్స్ రకరకాలుగ చెప్తున్నరు. ఈ సాయంత్రమే పెళ్లి చేసెయ్యాలని చూస్తున్నరని కూడా అంటున్నరు. మరి ఎట్లంటవ్?’ అన్న.
‘అట్లెట్ల?! మేం ఇప్పుడు బయలుదేరి వస్తం. ఆపమను’ అన్నడు కాస్త కటువుగ.
‘అట్ల మనం చెప్పలేం మామా! రేష్మానే వత్తిడి చేస్తుందని చెప్తున్నరు.’
‘లేదు యూసుఫ్, నేను ఒక్కసారి రేష్మతోని మాట్లాడాలె. దాని మనసుల ఏమున్నదొ నాకు తెల్వాలె గదా.. అంతవరకన్న ఆగాలె కదా..’ అన్నడు.
‘నిజమే కాని.. మనకు ఎట్ల తెలుస్తది మామా! మనకు చెప్పకుంట కూడ చేసెయ్యొచ్చు.’
‘అది కాదు యూసుఫ్, జర నువ్వు పొయ్ రావొచ్చు గదా.. పొయి వాళ్లతోని మాట్లాడితె వింటరేమో’
‘లేదు మామా! నేను వెళ్లలేను. నేను వెళ్లి మీరొచ్చేదాంక పెండ్లి ఆపమన్నా నేను మీ వైపు నుంచి వచ్చినట్లు యూనివర్సిటీ అంతా నన్ను బద్నాం చేస్తరు. నేను అందరికీ తెలుసు కదా..’
‘మరెట్లా! మేం వెళ్లిందాకనన్నా ఆగాలె కదా..’
‘మీరు వస్తున్నరు, వచ్చిందాక ఆగమంటున్నరని చెప్పించమంటె చెప్పిస్త మామా’ అన్న.
‘సరె, అట్లనన్న చెయ్. మేం బయలుదేరుతం’ అన్నడు.
‘సరె మామా!’
మామ గొంతు పలికిన రకరకాల ధ్వనులకు నా మనసు గిలగిలలాడింది. అయ్‌నా ఏం చేయగలను..!
***
antu
ఇదంత అయ్యేసరికి మద్యాహ్నం దాటింది. నేను ఆఫీస్‌కు వెళ్లిపోయిన. రాజు మద్య మద్య హెచ్చరిస్తనె ఉండు. రాజును వాళ్లతోపాటు వెళ్లమని చెప్పిన. సరేనన్నడు. మా నడిపి మామ, వాళ్ల జిగ్రీ దోస్తు శ్రీను, మా చిన్న మామ, మా తమ్ముడు కారు మాట్లాడుకొని బయల్దేరిన్రు. రాజు చివరి నిమిషంలో తాను ఆల్రెడీ బస్‌లో బయలుదేరినట్లు చెప్పిండంట. ఒట్టిదే.. అతను రాడని సమజైపొయింది..
పొద్దుగూకింది..
భరత్‌కు ఫోన్ చేసిన. ‘పరిస్తితేంది భరత్?’ అన్న.
‘ఏముందన్న, వాళ్లకు పెండ్లయిపోయిందే!’ అన్నడు.
నేను పరేశానై, ‘అంటె.. మీరు చేసిన్రా?’ అన్న.
‘వాళ్లే చేసుకున్నరన్న. ఆ పిల్ల మమ్మల్నే నమ్ముతలేదు. మరి మీ నాయ్న వాళ్లు వస్తున్నరంట కదా.. వచ్చిందాంక ఆగమన్నం. దాంతోటి ఆ పిల్ల మరింత పరేశాన్ చేసింది. మీరు చేస్తె చెయ్‌రి. లేకపోతే ఎటన్న వెళ్లిపోతం అన్నది. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర్కి వస్తె మీరేంది ఇట్ల చేస్తున్నరని అరిచింది.. పోరగాన్ని సమ్జాయించబోతె వాన్తోని గుడ ‘నువ్వు గన్క వాళ్ల మాటలు విని ఆగుతనంటె నేను ఇక్కడ్నె ఆత్మహత్య చేసుకుంట’నని గడ్‌బడ్ చేసిందన్న.. ‘అరె, జర ఆగమ్మా.. ఆన్ని గుడ ఆలోచించుకోనీ’ అన్నమన్నా.. ‘ఇద్దరం అనుకున్నంకనే కదా, మావోల్ల నందర్ని వొదిలేసి, ఇంట్ల నుంచి వొచ్చేసిన. మా నాయనలొస్తె పెండ్లి కానిస్తరా? ఇప్పుడు పెండ్లి చెయ్యకపోతె నేన్ సచ్చిపోత’ నని బెదిరించిందన్న’ అన్నడు భరత్.
‘అవునా..! మరి, ఎట్ల చేసిన్రు పెండ్లి?’ అన్న.
‘ఏముందన్న, ఆర్ట్స్ కాలేజ్ పక్కన గుడి ఉంది కదా.. అక్కడ దండలు మార్పిచ్చినమ్. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేస్కుంటరంట’ అన్నడు.
‘సరె గని, భరత్! మా మామలు వస్తున్నరు. మరి వాళ్లతోని మారేజ్ అయినట్లు చెప్పొద్దు. వాళ్లు వెంటనె తట్టుకోలేరు. వాళ్లు ఏమంటరో వినురి’ అన్న.
‘అది కాదే.. ఇప్పుడెందుకు వాళ్లు ఇక్కడికి? ఇప్పుడొద్దని చెప్పన్నా.. రెండ్రోజులాగి రమ్మంటె మంచిది.. కొద్దిగ కోపం తగ్గుతది..’
‘వాళ్లు బయల్దేరిన్రు భరత్! నేను ఆగమంటె ఆగుతరా?’
‘ఇప్పుడొచ్చి ఏం చేస్తరన్న. అనవసరంగ ఆవేశపడ్డరనుకో.. ఇక్కడ పోరగాళ్లు ఊకోరు. బాగుండదన్నా..’
‘నేను చెప్త భరత్, వాళ్లతోని. గొడవ చెయ్యొద్దని. వాళ్లతోని మా తమ్ముడున్నడు. వాడికి కూడా చెప్త. జర ఓపిగ్గా వాళ్లతోని మాట్లాడి పంపించురి.’
ఫోన్ పెట్టేసినంక మా చిన్నమామకు ఫోన్ చేసిన- ‘మామా! అది యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలామంది ఉంటరు కదా.. ఎవరు ఎట్లుంటరో చెప్పలేం. పిల్లలు ఇప్పుడు వాళ్ల హేండోవర్‌లో ఉన్నరు. గొడవ చేసేటట్టు గాని, కోపంగ గాని మాట్లాడితె గడ్‌బడైపోతది..’ అంటూ అన్ని విషయాలు వివరించిన.. మా తమ్మునికి గుడ జాగ్రతలు చెప్పిన.
ఐటెంక- ఆఫీసుల ఉన్ననన్న మాటేగనీ ఇదే మనాది.. ఏం జరుగుతదో ఏమోనని.
8 గం.లకు మల్ల తమ్మునికి ఫోన్ చేసిన.
‘ఇక్కడ అంబేద్కర్ హాస్టల్ కాడికొచ్చినం. నడిపి మామను కార్‌లనే కూసుండబెట్టి మేం ముగ్గురం భరత్ రూంకొచ్చినం. షానాసేపయ్యింది. స్టూడెంట్స్ షానామందే ఉన్నరు. అన్ని విషయాలు మంచిగనె మాట్లాడుతున్నరు.. చిన్నమామ, శ్రీను పిల్లను కలిషిపోతమని షానా రకాలుగ అడిగి సూషిన్రు.. కలవడం కుదరదని వాళ్లు చెప్తున్నరు. నన్ను పక్కకు తీస్కపొయి చెప్పిండు లెనిన్, ‘యూసుఫన్న మామలని ఇంతసేపు సమ్జాయిస్తున్నమే.. లేకుంటె ఇక్కడికి ఇప్పుడు వద్దనే ఖచ్చితంగా చెప్దుము’ అని. వీళ్లేమో ఇంకా కోషిష్ చేస్తనె ఉన్రు.’
‘సరె, బయల్దేరేటప్పుడు ఏ విషయమైంది నాకు చెప్పు. ఇంటికొచ్చి పోరి, మందు తెచ్చి పెడత’ అన్న.
రాత్రి 11కు ఫోన్ చేసిండు తమ్ముడు. ‘భాయ్! నల్గొండ కెల్లిపోతున్నం’ అని.
‘అరె, అదేందిర.. నేను ఇంటికొచ్చి ఎదురుచూస్తున్న కద.. మీల్స్, మందు రెడీ చేసి..’ అన్న.
‘ఇగ ఇప్పటికె లేటయ్యింది, పోదమన్నరు.’
‘అట్లనా.. ఇంతకు ఆఖరికేమయ్యిందిరా?’ అడిగిన.
‘రెండ్రోజులాగి రారి, మాట్లాడుకుందాం.. ఇప్పుడైతె కలవడం కుదరదన్నరు. నడిపి మామ కొద్దిసేపు అట్లెట్ల అని వాదించిండు. వాళ్లు నిమ్మలంగనె మామను సమ్జాయించిన్రు’
‘సరె, జాగ్రత్తగ పోరి’
***
తెల్లారి తమ్ముడు చెప్పిండు, రాత్రి ఊరు చేరుకునేసరికి మూడు దాటిందని. మద్యలో ఆపి మామకు జర మందు పోయించిన్రంట. బాగ ఏడ్చిండంట మామ.
పెద్ద మామ ఏమన్నడంట అని అడిగి తెలుసుకున్న- ఇజ్జత్ తీసిందని, నేనైతె నరికేద్దును అని అరిషిండంట.. నడిపి మామ మా అత్తను బాగ కొట్టిండంట..
ఇటు మా అమ్మ వాళ్లూ, అటు మా అమ్మమ్మ అంతా పరేశాన్ ఉన్రు.. అందరు నాకు ఫోన్ చేసి నన్నేదైన చెయ్యమంటున్నరు..
మద్యాహ్నం మా నడిపి మామ ఫోన్.. ఎట్లన్న చేసి రేష్మాను తనతోటి మాట్లాడించమని స్టూడెంట్ లీడర్స్‌తో మాట్లాడమన్నడు. రేష్మాతో ఒక్కసారి మాట్లాడితె సాలు అంటున్నడు.
‘నువు చెబితె రేష్మ ఇంటదని నీకు నమ్మకముందా మామా?’ అనడిగిన.
‘అడిగైతె సూద్దాం యూసుఫ్. కని.. అది ఇనదు.. మొండిది..! అదేమనుకుంటదో అదే చేస్తది. దాని మనస్తత్వం నాకు తెల్సు.. అయ్‌నా, ఇంతపని చేస్తదని అనుకోలేదు యూసుఫ్. పెద్ద పిల్ల సూస్తె అట్ల ఉండె. ఇప్పుడు ఇదిట్ల చేస్తే చిన్నదాని పెండ్లెట్లయితది చెప్పూ…’ మామ గొంతు పూడుకుపొయింది.
‘మనసు గట్టి చేసుకోవాలె మామా! అయిందేదో అయింది, ఇప్పుడేం చేస్తే బాగుంటదో ఆలోచించాలె’ అన్న.
‘ఏం ఆలోచించాలె చెప్పూ.. ఊర్లె ఇజ్జత్ లేకుంట చేసింది. అప్పుడె ఊర్లె పోరగాళ్ల సూపు మారె.. అది ఇంత పని చేస్తదని కలల గుడ అనుకోలె..’ మామ ఏడుస్తున్నడు.
‘మామా! ఊరుకో మామా..! అన్నీ తెలిసినోడివి, నువ్వే ఇట్ల దైర్యం చెడితె ఎట్ల.. ఊరుకో..’ అంటుంటె నాకు కూడా గొంతు పూడుకుపొయింది.
మామకు దుఃఖం ఆగుతలేదు.. గొంతు పెగుల్త లేదు, ‘నేను మల్ల మాట్లాడత’ అని ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పక్కన పడేసి నేను గుడ కొద్దిసేపు ఏడ్షిన. ఇంతదాంక మామ ఏడ్షిండని విని గుడ ఎరుగను.. ఏం చెయ్యాల్నో తోచక తల్లడమల్లడమైన.
ఆఖరుకి- పొద్దుగూకాల మామకు ఫోన్ చేసిన- ‘మామా! ఒక్కటే మార్గం, మన రేష్మానె వినేటట్లు లేదు కాబట్టి ఆ పిలగాడిని ఒప్పించి ఏదొ ఒక మజీదులో నిఖా చదివించేస్తే, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతరు. మీకు గుడ గౌరవంగ ఉంటది. చిన్న పిల్ల షాదీకి ఇబ్బంది ఉండదు.. సోంచాయించురి’ అన్న.
‘నాతోని గుడ మనోళ్లు ఇదే అంటున్నరు.. మరె అట్ల ఒప్పుకుంటడా పిలగాడు..’ అనుమానంగ అన్నడు మామ.
‘మీకు ఇష్టమేనా? ఇష్టమైతె అడుగుదాం’ అన్న.
‘ఇగ మన పిల్లే ఇననప్పుడు ఏం జేస్తం. గని, మరె మిగతా మామలు ఏమంటరో..’ అన్నడు.
‘మామా! మిగతావాళ్ల అభిప్రాయాలు తర్వాత సంగతి మామా! వాళ్లు రకరకాలుగ చెప్తుంటరు. రేష్మా నీ బిడ్డ! మీరంతా ఎక్కువ టైట్ చేస్తె ఆ పిల్ల ఏమన్న చేసుకుంటె ఏం చేస్తరు? నీ బిడ్డ మీద నీ ప్రేమ వేరు. మిగతా వాళ్ల ప్రేమ వేరు. కాబట్టి నీ నిర్ణయం ముఖ్యం మామా! నీకు ఓకే అయితే అందరు ఊకోక ఏం జేస్తరు?!’ అన్న కొంచెం టోన్ పెంచి.
కొద్దిసేపు సైలెంట్‌గ ఉండిపొయ్‌న మా మామ, ‘సరె, సూద్దాం యూసుఫ్! ముందు నేనొకసారి రేష్మాతోటి మాట్లాడాలె. రేష్మా నాతోని గుడ ఆ పిలగాన్నే చేసుకుంట అంటె ఇగ నువ్వన్నట్లె చేద్దాం’ అన్నడు.
***
మర్నాడు-
మా నడిపి మామ, ఆయన బామ్మర్దులు-దోస్తులు, మా చినమామ యూనివర్సిటీకొచ్చిన్రు. నేను గుడ పొయ్‌న. స్టూడెంట్ లీడర్స్ మా మామోళ్లను అంబేద్కర్ హాస్టల్ వెనక గ్రౌండ్‌లో దూరంగా చెట్టుకింద కూసోబెట్టిన్రు. పిల్ల, పిలగాన్ని హాస్టల్‌లోని ఒక రూంకు రప్పించిన్రు. మా నడిపి మామ ఎక్కడ బరస్ట్ అవుతడోనని, మా చిన్నమామను, నన్ను, శ్రీనును ముందు పిల్సుకపోయి వాళ్లతోటి కలిపిన్రు.
రేష్మ నన్ను, చిన్నమామను సూడంగనె లేషి నిలబడి సలాం చేసింది. సెల్వార్ ఖమీజ్‌లనె ఉన్నది. తన చామన ఛాయ మొఖం గుంజుకుపొయ్ ఉన్నది. కండ్లు పీక్కుపొయ్‌నయ్. పక్కన పిలగాడు లేషి నిలబడ్డడు. బక్కగున్నడు. నలుపే. అతని మొఖం గుడ పీక్కుపొయింది. మేం ఎదురుంగ కుర్సీల్ల కూసున్నం. వాళ్లు మంచం మీద కూసున్నరు. రేష్మ తల వొంచుకొని కుడి కాలి బొటనవేలితోటి నేలను రాస్తున్నది. కాలి ఏళ్లకు మెట్టెలు తొడిగిన్రు. చేతుల నిండా గాజులు. మెడల వెతికిన. పసుపుతాడో, నల్లపూసలో ఉన్నట్లుంది గనీ వోనీతోటి కప్పేసింది…
శ్రీను గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నలు వేసిండు- ‘మీరిట్ల వొచ్చేస్తే మరి మీ వోల్లు ఎట్ల ఊకుంటరనుకున్నరు? ఎన్ని కష్టాలెదురైనా ఎదుర్కుంటరా? ఎప్పటికీ కలిసి ఉంటరా? మద్యల మోజు తీరిపోతె ఏం జేస్తరు?’ అని.
మొత్తానికి ఇద్దరూ షానా గుండె నిబ్బరంతోటే జవాబులిచ్చిన్రు. ఎక్కడా తొట్రుపాటు లేదు. కలిసే బతుకుతం.. కలిసే చస్తం! అన్నరు.
మా చిన్నమామ రేష్మా నుద్దేశించి- ‘మరి, నీ అక్క సూస్తె ఎడ్డిది.. ఆ పిల్ల నిన్ను విడిచి ఉండలేదు కదా.. నువ్వు కనబడక ఒకటె గొడవ చేస్తున్నది, ఏడుస్తున్నది. అట్ల చేస్తదని నీకు తెల్సు కదా!’ అన్నడు. ఆ మాటలకు మాత్రం రేష్మా కండ్ల నిండ నీళ్లు తిరిగినయ్. కండ్లు తుడుసుకున్నది. మల్ల మా మామ- ‘నువ్విట్ల చేస్తె మీ చెల్లె పెండ్లి ఎట్లయితదనుకున్నవ్? ఇగ ఆ పిల్లను ఎవరు చేసుకుంటరు?’ అన్నడు. దానికి వంచిన తల ఎత్తలేదు రేష్మా.
నేను పిలగాన్ని ఉద్దేశించి- ‘రేపు నీకు ఉద్యోగం వచ్చినంక కట్నం గిట్నం బాగొస్తదని ఈ పిల్లను వొదిలెయ్యవని గ్యారంటీ ఏంది?’ అనడిగిన. అట్లేం చెయ్యనన్నడు.
శ్రీను అందుకొని-‘సరె, అయిందేదొ అయింది. మరి మీరు మంచిగుండాలె. మీవాళ్లు గుడ మంచిగుండాలె. వాళ్ల పద్ధతి ప్రకారం పెండ్లి చేసుకుంటె, వాళ్లకు గుడ గౌరవంగ ఉంటది. మీకు గుడ ఏ ఇబ్బంది ఉండదు. అట్ల చేసుకుంటవా పిలగా?’ అడిగిండు.
అప్పటికె ఆ టాపిక్ వాళ్లదాక చేరి ఉండడంతోటి ఆ ప్రశ్నకు రెడీగ ఉన్నట్లె ఆ పిలగాడు ‘పెండ్లి వరకు వాళ్ల ప్రకారం చేసుకుంట’ అన్నడు. మంచిదె అనుకున్న నేను.
‘అయితె ఒక చిన్న పని చెయ్యాల్సొస్తది. మా ఇండ్లల్ల ఒట్టిగ మజీదుల నిఖా చదివించడానికైనా ముస్లిం పేరు పెట్టుకోవాలె. అట్లనె నిఖాకు ముందే సున్తీ చేయించుకోవాల్సి ఉంటది’ అన్నడు మా చిన మామ.
పిలగాడు తకబిక అయ్యిండు ఆ మాటతోని. అతని దోస్తుల దిక్కు, స్టూడెంట్ లీడర్స్‌దిక్కు సూషిండు. ఆలోచించుకొని చెప్పు, బలవంతం ఏమీ లేదని ఎవరో అన్నరు. దాంతోని మేం కాసేపు మాట్లాడుకొని చెప్తం అన్నడు పిలగాని దోస్తు. దాంతో మా మామ, శ్రీను బైటికి నడుస్తుంటె, నేను పిలగాన్ని పక్కకు పిలిషి ‘ఇయాల్రేపు సున్తీ అనేది మామూలు విషయం. ఆరోగ్యానికి మంచిదని, డాక్టర్లు గుడ ఎంతోమందికి సున్తీ చేయించుకొమ్మని సజెస్ట్ చేస్తుంటరు. ఆ విషయంల నువ్వేం భయపడకు’ అని ‘దైర్యం చెప్పి బైటికొచ్చిన.
కొద్దిసేపటికి మల్ల వాళ్లు మమ్మల్ని లోపలికి పిలిషిన్రు. పిలగాడు రెండ్రోజులు టైమ్ కావాలన్నడు, తమ వాళ్లను అర్సుకొని చెప్తనన్నడు. సరె, అట్లనె కానివ్వమని అన్నరు వీళ్లు. బైటికొచ్చినంక నాకొక మీటింగ్ ఉండడంతోని నేను వొచ్చేసిన.
వీళ్లు పొయి మా నడిపి మామకు విషయం చెప్పిన్రంట. ఆయన అయితెమాయె గని పిల్లను నేను గుడ సూషి మాట్లాడత అన్నడంట. దానికి రేష్మ- ‘వొద్దు, నేను మా నాయన ముందు నిలబడలేను. వద్దే వద్దు’ అన్నదంట. అట్లెట్ల అని మా మామ, తానేమీ అననని, పలకరింపుగా చూస్తనని అన్నడంట. వద్దులెమ్మని స్టూడెంట్ లీడర్స్ అంటె వాళ్లతో కాస్త వాదం పెట్టుకున్నడంట. నా బిడ్డను నాకు సూపెట్టకపోతె ఎట్ల అని నిలదీసిండంట. దాంతో వాళ్లు రేష్మాను ఒప్పించి ఇద్దర్ని కలిపిన్రంట. తండ్రిని సూడంగనె కాళ్లమీద పడి బోరున ఏడ్సుకుంట నన్ను మాఫ్ చెయ్యమని వేడుకున్నదంట రేష్మా. రేష్మాను ఎత్తి గుండెలకు హత్తుకొని తాను గుడ ఏడ్షిండంట మామ. ఐటెంక ‘ఆ పిలగాడు రెండ్రోజులు టైమడిగిండు కదా.. నువ్వు మాతోటి వచ్చెయ్యి.. మల్ల రెండ్రోజుల తర్వాత వద్దాం’ అన్నడంట. దానికి రేష్మా, స్టూడెంట్ లీడర్స్ ఎవరూ ఒప్పుకోకపొయ్యేసరికి చేసేదేం లేక వీళ్లు వెనుదిరిగిన్రంట.
***
ఆ వెంటనె రాజు నాకు ఫోన్ చేసిండు- ‘ఏం జరిగిందన్నా..’ అన్నడు. విషయం చెప్పబొయ్‌న. అతను వ్యంగ్యంగా- ‘అంటె వానికి సున్తీ చేయించి వాన్ని ముస్లింగ మారుస్తరా? అంటే రేపు వాన్ని అందరూ తీవ్రవాదిగా సూస్తానికా?’ అన్నడు.
నేను ఆశ్చర్యపోయి- ‘అంటే నీకు ముస్లింలందరూ తీవ్రవాదుల్లెక్క కనిపిస్తున్నరా?’ అడిగిన విసురుగ.
అతను కూడ విసురుగ- ‘వానికి సున్తీ చేయించి వాని ఎస్.సి. రిజర్వేషన్ పోగొట్టాలనుకుంటున్నరా?’ అని మల్లొక బాంబు వేసిండు.
‘అరె, ఏం మాట్లాడుతున్నవ్ రాజు నువ్వు? అంటె వాళ్లను బలవంతంగ విడగొట్టాలనా నీ ఉద్దేశం?!’ అన్న.
‘మీరు అనుకున్నదే చేద్దామనుకుంటున్నరు కదా..! వాని జీవితాన్ని చెడగొడదామనుకుంటున్నరేమో- కానియ్‌రి.. సూద్దాం!’ అని కట్ చేసిండు ఫోన్.
నాకు చికాకేసింది. అతనికి వీళ్ల ప్రేమ వివాహం ఇష్టం లేదని ముందునుంచే అతనిపై ఉన్న డౌటు నిజమైంది. కాని ఇంతగనం వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోలే. అణగారిన కులం నుంచి వొచ్చి లెక్చరర్‌గ పనిచేస్తున్నవాడే ఇట్లంటె ఇగ మామూలు ‘హిందువుల’ సంగతేంది? అనుకున్న.
రెండు రోజులు గడిచినయ్-
రేష్మ రెండు మూడు మాట్లు మా మామకు ఫోన్ చేసి మాట్లాడిందంట- సున్తీ చేయించుకోవడానికి భయపడుతున్నడని ఒకసారి.. అతని దోస్తులు రకరకాలుగా భయపెడుతున్నరని ఒకసారి.. ఎస్.సి. రిజర్వేషన్ పోతదని భయపడుతున్నడని మల్లోసారి.. సున్తీ హైదరాబాద్‌లనే చేయించుకుంటనంటున్నడని మరొకసారి మాట్లాడిందంట. నల్గొండలోనైతే తాము తోడుంటమని మా మామ అన్నడంట. నల్గొండకు వస్తానికి భయపడుతున్నడని అన్నదంట. అయితె హైదరాబాద్‌లనే చేయిద్దాం, ఎప్పుడు చేయించుకుంటడో చెప్పమని మా మామ అన్నడంట.
ఆ తర్వాత నించి ఫోన్‌లు బందైనయంట. భరత్, లెనిన్‌లు గుడా ఫోన్‌లు ఎత్తుత లేరంట!
నాలుగు రోజులు చూసి మా మామ నాకు ఫోన్ చేసి ఏం సంగతో కనుక్కోమన్నడు. ప్రేమ పెళ్ళిళ్లకు రిజర్వేషన్ కూడా సమస్యే అయిందేందా అని జరసేపు సోంచాయించుకుంట ఉండిపొయి, ఇబ్బందిగనే భరత్‌కు ఫోన్ చేసిన.
‘ఏమో అన్న! వాళ్లు మాకు గుడ కాంటాక్టుల లేరే..! ఎటు పొయిన్రో సమజైతలేదు’ అన్నడు.
‘అదేందే! ఏం జరిగిందసలు?’ అనడిగిన.
‘ఆ సున్తీ గురించే వాడు భయపడుతున్నడన్నా..’ అన్నడు.
‘అరె! ఆ పిల్ల ఆ పిలగాని కోసం అందర్ని వొదులుకొని వచ్చినప్పుడు వాడా పిల్ల కోసం ఆ మాత్రం చెయ్యలేడానె? సున్తీ చేసుకున్నంత మాత్రాన ఏమైతది!’ అని అడిగిన నేను.
‘అట్లనె మేం గుడ అడిగినమన్నా.. ఇట్ల ఎటూ తేల్చుకోలేకపోతె కష్టమని, ఏదో ఒకటి చెప్పమని గట్టిగనె అడిగినం.. దాంతోటి వాడిక మమ్మల్ని గుడ కలుస్తలేడే! ఏమైందని తెల్సుకుంటె అసలు వాళ్లిద్దరు ఇక్కడ్నుంచి ఇంకెక్కడికో ఎల్లిపొయిన్రని తెలిసిందే.. యాడికి పొయిన్రో తెలుస్తలేదే..!’ అన్నడు భరత్.
ఎందుకో.. భరత్ మాటలు నమ్మబుద్ధి కాలేదు నాకు.
మా మామకేం చెప్పాల్నో ఎంతకూ సమజ్ కాలేదు.
సోంచాయించుకుంట కుర్సీల కూలబడ్డ-
పిలగాడు అట్లా భయపడడం సహజమే కానీ.. రేష్మ మనసెంత తల్లడిల్లుతుంటదో కదా..! తన దిక్కు నుంచి ఈల్లెవరు ఎందుకు ఆలోచించరు..!?
*
స్కైబాబా

స్కైబాబా

–స్కైబాబ

ఉర్దూ మన భాష, ఉర్దూ సాహిత్యం మన సాహిత్యం!

sky1

ముస్లిం కవులు ఎంత ప్రజాస్వామికంగా, ఎంత లౌకికత్వంతో ఉన్నారో తెలుగు ముస్లింవాద సాహిత్యం ఋజువు చేస్తూ వచ్చింది. అలాగే ఎప్పటికప్పుడు తెలంగాణ సాహిత్య- ఉద్యమకారులు లౌకికత్వ భావనలు విస్మరించకుండా స్పృహలో ఉండేలా  కూడా ముస్లింవాదులు తమ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేస్తూ వచ్చిన ముస్లింవాదుల నుంచి వస్తున్న ప్రత్యేక సంకలనం ఇది. కొన్ని విలువైన ప్రశ్నలూ, అరుదైన కోణాలూ ఇందులో చూడొచ్చు..

తెలంగాణ సాహిత్యం అంటే కేవలం తెలుగు సాహిత్యమే అనుకునే సంకుచిత జ్ఞానంలో మనం ఉన్నాం. కానీ దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందిన ఉర్దూ కవులు, రచయితలు, విమర్శకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమకారులు, సాహిత్యకారులు సైతం ఈ విషయాన్ని, ఉర్దూ ప్రజల ఒక అతిపెద్ద సమూహం తెలంగాణలో భాగమనే స్పృహను విస్మరించడం విచారకరం (ఒకరిద్దరు తప్ప). ఏ ఒక్క తెలంగాణ సాహిత్య సభలోనూ ఉర్దూ సాహిత్యకారులను భాగం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ కారణం చేతనూ, ఆంధ్రావారి ఆధిపత్యం వల్లనూ ఉర్దూ రచయితలు వేరొక లోకంగా బతుకుతున్నారు. దేశంలోనే ప్రసిద్ధి పొందిన తెలంగాణ ఉర్దూ రచయితలకు ఆంధ్రా వలస పాలకులు ఏ మాత్రం గౌరవమిచ్చింది లేదు. నిజాంల కాలంలో భారత ఉపఖండంలోనే ఉర్దూ కవులు, రచయితలకు హైదరాబాద్‌ రాజ్యం ప్రసిద్ధి పొందింది. వారిని ఎంతో ఆదరించింది.

తెలంగాణలో దాదాపు 20 శాతం మంది ముస్లింలు ఉంటారు. అందులో తెలుగు చదువుకున్న ముస్లింలతో పాటు, ఉర్దూ చదువుకున్న ముస్లింలు సగానికి సగం ఉండొచ్చు. ఇప్పటి తెలంగాణ ఉద్యమంలో తెలుగు ముస్లిం కవుల గొంతుక బలంగా వినిపిస్తున్నది. కానీ ఉర్దూ ముస్లిం కవులు ఏమంటున్నారో తెలియదు. వాళ్ల గొంతుకు నిదర్శనమే ఈ సంకలనం. తెలుగులో కవిత్వం రాస్తున్న తెలుగు ముస్లిం కవులు, ఉర్దూలో కవిత్వం రాస్తున్న ఉర్దూ ముస్లిం కవులు కలిసిన తెలంగాణ నినాదం ఈ సంకలనం. తెలంగాణ అంటే తెలుగుతో పాటు ఉర్దూ కూడా అని జ్ఞానపరిచే ఒక నిదర్శనమిది. తెలుగువారి, ఉర్దూవారి కలగలుపు తనానికి ప్రతీక – ఇదే గంగా జమున తెహజీబ్‌!

ఎమ్‌ఐఎమ్‌ లాంటి పార్టీని చూపి ముస్లింలు తెలంగాణకు మద్దతివ్వడం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్న వారికి చెంప పెట్టు ఈ సంకలనం. తెలుగు ముస్లింలతో పాటు ఉర్దూ ముస్లింలు కూడా బలంగా తెలంగాణను కోరుకుంటున్నారనడానికి నిదర్శనం ఈ పుస్తకం.

తెలంగాణ తనానికి ఒక బండ గుర్తు అయిన ఉర్దూ ప్రజల్ని విస్మరించడం తెలంగాణ  ఆత్మను నిర్లక్ష్యం చేయడం లాంటిదే. బిజెపి లాంటి పార్టీల సాంగత్యం వల్ల ముస్లింలతో పాటు ఉర్దూను, ఉర్దూ ప్రజలను, ముస్లిమీయత వల్ల ప్రభావితమైన  తెలంగాణ తనాన్ని తెలంగాణ ఉద్యమకారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ఇది ఎంత మాత్రమూ క్షమించరాని విషయం.

* * *

కిసీ ఖౌమ్‌కో బర్బాద్‌ కర్నా హైతో

పహ్‌లే ఉస్‌ కీ జబాన్‌ ఖీంచ్‌లో… -అన్నట్లుగా తెలంగాణ తెలుగు వారితో పాటు ఇక్కడి ముస్లింల భాషను గుంజుకోవడం, ధ్వంసం చేయడం జరిగింది. ఇంకా ఇంకా జరుగుతున్నది.

ఇవాళ నాలాంటి వారు ఇంట్లో మాట్లాడేది ఉర్దూ. చుట్టూ తెలంగాణ తెలుగు. బడిలో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, మీడియాలో కోస్తాంధ్రా తెలుగు. అలాంటప్పుడు నేను ఏ భాషలో రాయాలి?

అరవై ఏళ్ళ తరువాత చూస్తే మొత్తంగా ఆంధ్రా ప్రాంతపు తెలుగే మనల్ని ఆక్రమించుకున్నది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి సమాంతరంగా తెలంగాణలో ఉర్దూ సాహిత్యమూ కొనసాగుతున్నదనే స్పృహలోనే ఎవరూ లేరు. అతి కొద్దిమంది తెలంగాణ తెలుగువారికి మాత్రమే ఆ విషయం తెలుసు. తెలంగాణలోని ఉర్దూ తనం   గురించి ఎస్‌.సదాశివ, తెలంగాణ జాతిపిత జయశంకర్‌ ఎంతో చెప్పారు. వారితోపాటు బూర్గుల నరసింగరావు, ఎమ్‌.టి.ఖాన్‌, కేశవరావు జాదవ్‌ లాంటి ఎందరో చెప్పే వాస్తవాలు పట్టించుకుంటే ఈ విషయాలు మనకు మరింత బాగా అర్థమవుతాయి.

golconda

ఉర్దూ మీడియం పాఠశాలలన్నీ తెలుగు మీడియం పాఠశాలలుగా మార్చబడినప్పుడు, తెలంగాణ తెలుగువారినే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా నియమించి ఉంటే, వారికి ఇక్కడి పరిస్థితుల మీదా మనుషుల మీదా ప్రేమ ఉండి అర్థం చేసుకుని మసిలేవారు. అలా కాకుండా ఆంధ్ర నుంచి వలస తీసుకురాబడిన తెలుగువారిని నియమించారు. వారి వల్ల ఇక్కడి వారు, ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా అవహేళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్రావారు ఉర్దూ పట్ల, ఉర్దూ కలగలిసిన తెలుగు పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ప్రతి మాటలోనూ తెలంగాణవారిని, ముస్లింలను తక్కువచేసి మాట్లాడుతూ అవమానించారు. ఆత్మన్యూనతలో పడవేశారు. ఈ కారణాన తెలంగాణ తెలుగు భాషకు, ఉర్దూకు ఎక్కువ నష్టం జరిగింది. ఉర్దూ అంతర్థానమయ్యే ప్రమాదం ఏర్పడింది.

ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్‌- ఇరాన్‌, ఇరాక్‌, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. ఈ సంస్కృతికి భిన్నంగా చివరి 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో ఉండిన ఆంధ్రా ప్రాంతంవారు పశ్చిమ దేశాల (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా వగైరా) సామ్రాజ్యవాద సంస్కృతికి అలవాటు పడ్డారు. ఇట్లాంటి రెండు ప్రాంతాలను కలిపి ఉర్దూపై ఆంధ్రా తెలుగును ఆధిపత్య స్థానంలో నిలిపి తెలంగాణపై ఆంధ్రా అధికారం చెలాయించేలా చేయడంతో తెలంగాణ గంగా జమున తెహజీబ్‌ దెబ్బతింటూ కేవలం ఆంధ్రా ఆధిపత్యపు సంస్కృతి తెలంగాణ వారిపై రుద్దబడుతూ వచ్చింది. తెలంగాణ వారు, తెలంగాణ ముస్లింలు భూములు కోల్పోయిన వారిగా, ఆంధ్రా వాళ్లు భూములు ఆక్రమించుకున్న వారుగా తెలంగాణలో- ముఖ్యంగా హైదరాబాద్‌లో, హైదరాబాద్‌ చుట్టూరా కనిపించడం ఒక నిదర్శనం.

ఆంధ్రా వారి డామినేషన్‌తో ముస్లిం కల్చర్‌లోని విభిన్న సాంస్కృతిక విషయాలు వివక్షకు గురవుతూ వచ్చాయి. ఆంధ్రావారికి తెలంగాణ ముస్లింలపై ఏ మాత్రం ప్రేమ లేదు. పైగా చిన్న చూపు. వెకిలిచూపూ. తమ ఆంధ్ర సంస్కృతి నుంచి ప్రతిదాన్నీ చూస్తూ ముస్లిం సంస్కృతుల్ని, అది మిళితమైన తెలంగాణ సంస్కృతిని చులకన చేస్తూ వచ్చారు. తెలంగాణ వారికి సంస్కృతీ సాంప్రదాయాలు, భాష రాదని, తాము వచ్చి అన్నీ నేర్పామని, నేర్పుతున్నామని, నిజమైన సంస్కృతి నేర్పుతున్నామనే అహంభావాన్ని  ప్రదర్శిస్తూ వచ్చారు. ముఖ్యంగా ముస్లిం సంస్కృతి అంటే అదేదో పరాయి సంస్కృతి అన్న ఏహ్యభావం చూపుతూ వచ్చారు.

– స్కైబాబ

(రజ్మియా కి రాసిన ముందు మాట నించి)

sky