మూతపడ్డ వ్యాపారం

ఆంగ్ల మూలం: సోమర్సెట్ మామ్
అనువాదం:     ఎలనాగ

 

సోమర్సెట్ మామ్ పరిచయం

 

సోమర్సెట్ మామ్ (1874 – 1965) ఇంగ్లండ్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధ నాటక, నవలా, కథా రచయిత. అతనికి పది సంవత్సరాల వయసు వచ్చేసరికే తలిదండ్రులిద్దరూ చనిపోవడంతో, పెదనాన్న దగ్గర పెరిగాడు. మామ్ మెడికల్ డాక్టరు. 1897 లో మామ్ రాసిన మొదటి రచన – లిజా ఆఫ్ లాంబెత్ అనే నవల – ఎంత విపరీతంగా అమ్ముడు పోయిందంటే, దాంతో ఆయన తన వైద్యవృత్తిని వదిలి పూర్తిస్థాయి రచయితగా స్థిరపడిపోయాడు.

మామ్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రెడ్ క్రాస్ సంస్థలో పని చేసి, తర్వాత బ్రిటిష్ గూఢచారి విభాగంలో చేరాడు. అప్పుడతడు స్విట్జర్లాండ్, రష్యాలలో పని చేశాడు. ఇండియాలోనే కాక, మలయా (మలేషియా) వంటి దక్షిణప్రాచ్య దేశాలలో పర్యటించి, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను కథలుగా, నవలలుగా మలిచాడు. భారత దేశానికి వచ్చినప్పుడు అక్కడి తత్వవేత్తలు చెప్పిందాని గురించీ, తాను విన్న వీణావాద్య కచేరీ గురించీ, చూసిన ఫకీర్ల విన్యాసాల గురించీ ద సమింగ్ అప్ అన్న పుస్తకంలో మనం చదవవచ్చు.

తనపట్ల నిర్లక్ష్యాన్ని చూపిన పెదనాన్న కారణంగా, ఇంకా స్కూలు అనుభవాల మూలంగా మామ్ జీవితపు మొదటి భాగంలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి. అతనికి నత్తి వచ్చింది.

మామ్ రాసిన నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ (1915) అత్యంత పేరెన్నిక గన్నది. Theodore Dreiser అనే ప్రసిద్ధ అమెరికన్ విమర్శకుడు ఆ నవలను బేథోవెన్ సింఫనీతో పోల్చాడు. 1907 లో మామ్ వి నాలుగు నాటకాలు ఒకే సమయంలో లండన్ లోని నాటక ప్రదర్శనశాలల్లో ఆడినప్పుడు Punch పత్రిక ఒక కార్టూన్ ను ప్రచురించింది. అందులో మామ్ నాటకపు పోస్టర్ను చూసి షేక్స్పియర్ ఆందోళనతో గోళ్లు కొరుక్కుంటున్నట్టుగా చిత్రించబడిందట!

మామ్ దాదాపు 30 నవలలు, 25 నాటకాలు రాయడమే కాక ఎన్నో కథాసంకలనాలు, ఇతర రకాల రచనలు చేశాడు. నవలల్లో ఆఫ్ హ్యూమన్ బాండేజ్ కాక, ద మూన్ అండ్ సిక్స్ పెన్స్, ద పెయింటెడ్ వేల్, ద రేజర్స్ ఎడ్జ్, కేక్స్ అండ్ ఏల్, క్రిస్మస్ హాలిడే మొదలైనవి చెప్పుకోతగినవి. ఆయన రాసిన కథల్లో రెయిన్, ద ఏలియెన్ కార్న్, ద వెసెల్ ఆఫ్ ర్యాత్, మిస్టర్ నో ఆల్, ఫూట్ ప్రింట్స్ ఇన్ ద జంగిల్, లార్డ్ మౌండ్రాగో, గిగోలో అండ్ గిగోలెట్ మొదలైనవి ప్రసిద్ధమైనవి.

***

 

 

నేను వివరించకుండా ఉండలేని ఈ సంఘటనలు ఏ ఆనందమయ దేశంలో జరిగాయో ఆ దేశం పేరును చెప్పేలా నన్ను ఏదీ చెయ్యజాలదు. కాని అది అమెరికా ఖండంలోని ఒక స్వతంత్ర దేశం అన్న విషయాన్ని చెబితే ఏ హానీ ఉండదని తెలుసు నాకు. ఈ రకంగా చెప్పడంలో సరిపోయినంత అస్పష్టత వుంది కనుక, దీంతో ఏ విధమైన రాజకీయ సమస్యా తలెత్తే ఇబ్బంది వుండదు. ఆ దేశ అధ్యక్షుడు ఒక అందమైన స్త్రీ మీద కన్నేశాడు.

ఆ అధ్యక్షులవారి రాజధాని సూర్యకాంతి పుష్కలంగా ప్రసరించే ఒక విశాలమైన నగరం. అక్కడ ఒక దుకాణాల సముదాయం వుంది. ఒక చక్కని చర్చి భవనమూ కొన్ని పురాతన స్పానిష్ గృహాలూ కూడా ఉన్నాయి. మనసుల్ని రంజింపజేసే గుణం ఉన్న ఒక యువకుడు మిషిగన్ నుంచి ఆ నగరానికి వచ్చి అదే స్త్రీ మీద మనసు పారేసుకున్నాడు. ఆ అధ్యక్షుడు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తన ప్రేమను ఆమెకు వెల్లడించాడు. ఆమె కూడా అతని పట్ల తన ప్రేమను వ్యక్తపరచటంతో సంతుష్టుడయ్యాడు. కాని ఆ యువకునికి ఒక భార్య, ఆ స్త్రీకి ఒక భర్త అవసరం కావటమన్నది తాను ఆమెను పొందటానికి అడ్డంకిగా మారిందని తెలుసుకుని మానసిక క్షోభకు గురయ్యాడు. పెళ్లి చేసుకోవాలనే స్త్రీసహజమైన కోర్కె ఉన్నదామెకు.

అది అతనికి అసమంజసం అనిపించినా ఒక అందమైన స్త్రీ తనను కోరుకున్నప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయే అమాయకుడు కాదతడు. ఆమెకు పెళ్లి అయ్యేందుకు అనువైన పరిస్థితులు నెలకొనేలా చేస్తానని ఆ అధ్యక్షుడు వాగ్దానం చేశాడు. అతడు తన ఆస్థానంలోని న్యాయకోవిదులను పిలిపించి విషయాన్ని వాళ్ల ముందుంచాడు. తన దేశంలోని వివాహచట్టాలు చాలా పాతబడిపోవటం వల్ల అవి ఎంతమాత్రం సవ్యంగా లేవని తాను యెప్పట్నుంచో అనుకుంటున్నట్టూ, దేశం అభివృద్ధిపథంలో పయనించాలంటే  ఆ చట్టాలలో సమూలమైన మార్పుల్ని తేవాలని తాను భావిస్తున్నట్టూ తెలిపాడు వాళ్లకు. ఆ న్యాయకోవిదులు అధ్యక్షులవారి నుండి సెలవు తీసుకుని పోయి, ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని రోజులకే ఒక విడాకుల చట్టాన్ని తయారు చేసుకుని తెచ్చారు. దాన్ని రూపొందించేటప్పుడు అది అధ్యక్షునికి నచ్చేట్టు ఉండేలా జాగ్రత్త పడ్డారు వాళ్లు. కాని నేను చెబుతున్న దేశం ఎంతో నాగరికత, ప్రజాస్వామ్యం ఉన్నది కావడమే కాక గొప్ప ప్రతిష్ఠ ఉన్నది కావటంవల్ల, అక్కడ ఏం చెయ్యాలన్నా చాలా జాగ్రత్తగా, చట్టబద్ధంగా చేయాలి. అక్కడ దేశాధ్యక్షునిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తికి ఎంత గొప్ప గౌరవం ఉన్నా కొన్ని సూత్రాలను పాటించకుండా అతడు ఏ చట్టాన్నీ ప్రవేశపెట్టలేడు – ఆ చట్టం తనకోసం చేసుకున్నదైనా! కాబట్టి ఆ పనికి కొంత కాలం పట్టింది.

కొత్త విడాకుల చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది కాలంలోనే ఆ దేశంలో విప్లవం మొదలైంది. దురదృష్టవశాత్తు ఆ దేశాధ్యక్షుణ్ని రాజధానిలోని ప్రధాన కూడలిలో చర్చి ముందర ఒక స్తంభానికి ఉరి తీశారు. హృదయాలను రంజింపజేసే యువకుడు ఆదరాబాదరాగా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు. కాని ఆ చట్టం అట్లాగే ఉండిపోయింది. దాని నిబంధనలు సరళంగా ఉన్నాయి. ముప్ఫై రోజులపాటు భార్యాభర్తలిద్దరు కలిసి బతికింతర్వాత వంద డాలర్లకు సమానమైన బంగారాన్ని ఇస్తే భర్త కాని భార్య కాని తన జీవిత భాగస్వామికి విడాకులివ్వవచ్చు – అదీ ఏ రకమైన సమాచారాన్నీ ముందుగా ఇవ్వకుండానే. ఉదాహరణకు ఒక భార్య తాను తన ముసలి తల్లితో ఓ నెల రోజులపాటు ఉండబోతున్నట్టు భర్తతో చెప్పి వెళ్లిపోవచ్చు. తర్వాత ఒకరోజు ఉదయాన అల్పాహారం తర్వాత భర్త తనకు వచ్చి ఉత్తరాలను చూసుకుంటున్నప్పుడు తాను విడాకులిచ్చి వేరే పురుషుణ్ని పెళ్లి చేసుకున్నట్టు భార్య రాసిన ఉత్తరం అతనికి కనపడవచ్చు.

ఈ సంతోషకర వార్త స్వల్పకాలం లోనే అంతటా వ్యాపించింది. న్యూయార్క్ నుండి మరీ ఎక్కువ దూరంలో లేనటువంటి ఒక దేశ రాజధానిలో సమశీతోష్ణ వాతావరణంతో పాటు మరీ అంత ఇబ్బందికరం కాని వసతి సౌకర్యం ఉన్నదనీ, అక్కడ స్త్రీలు తమకు చిరాకును కలిగించే వివాహబంధం నుండి తక్కువ సమయంలో తక్కువ డబ్బు ఖర్చుతో విముక్తిని పొందవచ్చుననీ తెలిసిపోయింది ప్రజలకు. భర్తకు తెలియకుండానే అటువంటి తతంగాన్ని నడుపుకోగలగడం అన్నది కేసు నడుస్తున్నప్పుడు మనసుకు క్షోభను కలిగించే వాదప్రతివాదాల నుండి తప్పించుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఒక ప్రతిపాదనకు వ్యతిరేకంగా పురుషుడు ఎంతగానైనా వాదించవచ్చును కాని, చివరకు ఆ వాదాన్ని వదిలి తోకాడిస్తాడని ప్రతి స్త్రీకీ తెలుసు. తనకొక రోల్స్ రాయిస్ కారు కావాలని భార్య అడిగితే భర్త తనదగ్గర అంత డబ్బు లేదనవచ్చు. కాని ముందు చెప్పకుండా ఆమె ఆ కారును కొన్నదనుకోండి. అప్పుడతడు పిల్లిలాగా చెక్కుమీద సంతకం పెట్టి ఇస్తాడు. అందువల్ల కొద్ది కాలంలోనే  అందమైన స్త్రీలు పెద్ద సంఖ్యలో ఆ నగరానికి తరలి వచ్చారు.

వ్యాపార వ్యవహారాలతో అలసిపోయిన స్త్రీలు, ఫ్యాషన్ ప్రపంచంలో వెలిగిపోయిన స్త్రీలు, ఖుషీయే జీవన విధానం అయిన స్త్రీలు, ఏ పనీపాటా లేక రికామీగా ఉండే స్త్రీలు – ఇటువంటి వాళ్లంతా న్యూయార్క్, షికాగో, సాన్ ఫ్రాన్సిస్కో, జార్జియా, డకోటా మొదలైన అన్ని రాష్ట్రాలనుండి వచ్చారు. దాంతో ఆ నగరానికి వచ్చే ఓడల్లో వసతి బొటాబొటిగా మాత్రమే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక ఓడలో ప్రత్యేకమైన గది కావాలంటే ఆరు నెలలు ముందుగానే రిజర్వు చేసుకోవాలి. ఆ నగరం అలా సంపదతో వర్ధిల్లిపోయింది. కొద్ది కాలంలోనే అక్కడి న్యాయవాదులకు గిరాకీ బాగా పెరిగి, ప్రతి లాయరూ ఫోర్డ్ కారును కొనుక్కోగలిగే స్థాయికి చేరుకున్నాడు. గ్రాండ్ హోటలుకు యజమాని అయిన డాన్ ఆగస్టో ఎంతో ఖర్చు పెట్టి అదనంగా చాలా బాత్ రూములను కట్టించాడు. అయితే అలా చేసినందుకు అతడు విచారించలేదు. ఎందుకంటే ఎంతో లాభం వచ్చిందతనికి. పూర్వ దేశాధ్యక్షుణ్ని ఉరి తీసిన స్తంభం ముందునుండి పోయిన ప్రతిసారీ అతడు హుషారుగా దానికి వందనం చేశాడు.

ఒకసారి “అతడు మహానుభావుడు. ఏదో ఒకరోజు అతనికోసం శిలావిగ్రహాన్ని కట్టించి నిలబెడతారు” అన్నాడు డాన్ ఆగస్టో.

సౌకర్యవంతమైన, సమంజసమైన ఆ చట్టం ద్వారా కేవలం స్త్రీలే  లాభపడ్డారని చెప్పాను నేను. కాని అమెరికాలో పవిత్ర వివాహబంధం అనే జంజాటం నుండి విముక్తిని కోరుకునేవారు స్త్రీలు మాత్రమేననీ, పురుషులు కాదనీ సూచిస్తాయి నా మాటలు. అయితే నా ఉద్దేశం అది కాదని నా నమ్మకం. ఆ దేశానికి ఎక్కువగా స్త్రీలే ప్రయాణించినప్పటికీ అట్లా ఆరు వారాల పాటు సొంత ఊరు వదిలి వెళ్లటం (పోవడానికీ రావడానికీ ప్రయాణం కోసం ఒక్కొక్క వారం, ఆ దేశవాసిగా గుర్తింపు కోసం నాలుగు వారాలు) ఆడవాళ్లకే సులభం కావటమే అందుకు కారణం అంటాను నేను. మగవాళ్లకైతే అంత కాలం పాటు తమ వ్యవహారాలన్నిటినీ వదిలేసి పోవటం కష్టం కదా. వేసవి సెలవుల్లో అక్కడికి పోవచ్చునన్నది నిజమే కాని, ఆ వేడిమి కలిగించే బాధను అనుభవించాల్సి వస్తుంది. పైగా అక్కడ గోల్ఫ్ మైదానాలు లేవు. ఒక నెల పాటు గోల్ఫ్ ఆడే అవకాశాన్ని వదులుకునే బదులు, భార్యకు విడాకులివ్వకపోవటం వైపే ఎక్కువ మంది పురుషులు మొగ్గు చూపుతారని మనం అనుకోవచ్చు. గ్రాండ్ హోటల్లో ఇద్దరుముగ్గురు మగవాళ్లు నెలరోజుల పాటు మకాం వేశారన్నది నిజమే. కాని వాళ్లు వ్యాపార పరమైన పని మీద వచ్చారట. అసలు కారణం అంత స్పష్టంగా బోధపడటం లేదు. వాళ్ల వ్యాపకాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే నా ఊహ ప్రకారం వాళ్లు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఏకకాలంలో అటు మజా చేసే స్వాతంత్ర్యాన్నీ, ఇటు వ్యాపారంలో లాభాన్నీ పొందారనిపిస్తుంది.

ఈ గొడవనట్లా వుంచుదాం. అసలు వాస్తవమేమంటే, గ్రాండ్ హోటల్లో చాలా వరకు ఆడవాళ్లే బస చేశారు. లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత వాళ్లు వరండాలో కమాను ఆకారంలో ఉన్న పైకప్పుల కింద చిన్న చతురస్రాకారపు బల్లల చుట్టూ కూచుని షాంపేన్ తాగుతూ తమ వైవాహిక ఇబ్బందుల గురించి చర్చించుకుంటూ సమయాన్ని ఆనందంగా గడిపారు. డాన్ ఆగస్టోకు మిలిటరీ అధికారులు, న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, వర్తకులు, స్థానిక యువకులు – వీళ్లందరి ద్వారా బోలెడంత వ్యాపారం జరిగి, పిచ్చిగా లాభాలు వచ్చాయి. ఎందుకంటే, తన హోటల్లో బస చేసిన అందమైన స్త్రీలను చూడటం కోసం వీళ్ళందరూ వచ్చేవారు. కాని పూర్తిగా సవ్యమైనది ఈ ప్రపంచంలో ఎప్పుడూ దొరకదు కదా! ప్రతిదాంట్లో ఏదో ఒక అపసవ్యత వుంటుంది. భర్తలను వదిలించుకోవాలనుకునే ఆ స్త్రీలు చాలా మట్టుకు ఆందోళనగా ఉండేవారు. వాళ్ల వైపునుండి ఆలోచించినప్పుడు మరి అది సమంజసమే.

వాళ్లను సంతోషపెట్టడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన ఆ చిన్న నగరంలో ఎన్నో మంచి అంశాలున్నా వినోదకర ప్రదేశాలు మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ వున్న ఒకేఒక్క సినిమా టాకీసులో ఆడే చిత్రాలు చాలా కాలం క్రితం హాలీవుడ్ లో వెలువడినవై ఉంటాయి. పగటి వేళల్లో ఆ స్త్రీలు తమ లాయర్లతో మంతనాలు జరుపవచ్చు, గోళ్ళకు పాలిష్ వేసుకోవచ్చు, కొంచెం షాపింగు కూడా చేసుకోవచ్చు. కాని సాయంత్రాలను గడపటం దుర్భరంగా ఉంటుంది. నిబంధనలో వున్న నెల రోజుల బస అన్నది ఎక్కువ అని చాలా మంది ఫిర్యాదు చేశారు. సహనం కొరవడిన ఒకరిద్దరైతే ఆ వ్యవధిని నలభై ఎనిమిది గంటలకు కుదించి చట్టంలో బలాన్నీ ఉత్సాహాన్నీ కొంచెం పెంచవచ్చును కదా అని తమ లాయర్లను అడిగారు. డాన్ ఆగస్టో శక్తియుక్తులున్న మనిషి. ఆయన ఈ విషయంలో స్ఫూర్తిని పొంది, మారింబా అనే వాద్యాన్ని వాయించే గ్వాటెమాలా దేశపు కళాకారుల బృందాన్ని తన హోటల్లో నియమించాడు. ఆ సంగీతం ఎట్లా ఉంటుందంటే, దానికన్న ఎక్కువగా కాళ్లలో చలనాన్నీ ఆపుకోలేనంత ఉత్సాహాన్నీ కలింగించేది ప్రపంచంలో మరొకటి వుండదు.

హాల్లో ఉన్న ప్రతి ఒక్కడూ దాన్ని వినగానే వెంటనే నిలబడి డాన్సు చేయడం మొదలెట్టాడు. ఆ ఇరవై ఐదుగురు స్త్రీలు డాన్సు చేయాలనుకున్నప్పుడు, తమతో పాటు ఆ హోటల్లో బస చేసిన కేవలం ముగ్గురు పురుషులు మాత్రమే సరిపోరన్నది స్పష్టం కాబట్టి, సైనికాధికారులూ స్థానిక యువకులూ వచ్చి ఆ డాన్సులో చేరుతారు. అప్పుడు వాళ్ల నల్లని కళ్లు ఆనందంతో మెరుస్తాయి. గంటలూ రోజులూ ఎంత వేగంగా గడిచాయంటే, అప్పుడే నెల రోజుల వ్యవధి ముగిసిందా అని ఆశ్చర్యం కలిగింది వాళ్లకు. ఒకావిడైతే వెళ్లిపోయేటప్పుడు తనకు మరికొన్ని రోజులపాటు ఆ హోటల్లో ఉండాలనిపించిందని చెప్పింది. డాన్ ఆగస్టో ముఖం ఆనందంతో, విజయగర్వంతో వెలిగిపోయింది. తన కస్టమర్లు సంతోషంగా ఉండటం అతనికి ఇష్టం. తాను చెల్లించిన డబ్బుకన్న రెండు రెట్లు ఎక్కువ విలువ చేసింది మారింబా బ్యాండు – అనుకున్నాడతడు. డాన్ ఆగస్టో పొదుపరి కనుక, రాత్రి పది కాగానే తన హోటల్లోని మెట్లమీదా, వరండాల్లో లైట్లను కట్టేయించాడు. దాంతో సైనికాధికారులూ, స్థానిక యువకులూ మాట్లాడే ఆంగ్లభాష అద్భుతంగా మెరుగైపోయింది.

పెళ్లివారి బ్యాండు మేళంలాగా అంతా సజావుగా సంతోషంగా గడిచిపోయింది. ఈ వాక్యంలోని మొదటి పదాలు ఎంత అరిగిపోయినవైనా వాటిని ఉపయోగించాలనే కోరికను ఆపుకోవటం కష్టం కనుక, వాటిని వాడుతాను నేను. అంతా బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో ఒకరోజు మేడం కొరాలీ అనే ఆవిడ తాను భరించిన దుర్భర పరిస్థితి ఇక చాలు అనే నిర్ణయానికి వచ్చింది. ఆమె డ్రెస్ తొడుక్కుని, తన స్నేహితురాలైన కార్మెన్సిటాను కలవటం కోసం వెళ్లింది. తాను యెందుకు వచ్చిందో మేడం కొరాలీ కొన్ని పదాల్లో బిగ్గరగా చెప్పగానే కార్మెన్సిటా ఒక పనిమనిషిని పిలిచి, లా గోర్డా అనే మరో ఆవిడను ఉన్నపళంగా తీసుకురమ్మని పురమాయించింది. ఒక ముఖ్యమైన విషయాన్ని లా గోర్డాతో చర్చించాలని అనుకున్నారు వాళ్లిద్దరు.

భారీ శరీరంతో పాటు పుష్కలంగా మీసాలను కలిగివున్న లా గోర్డా వచ్చి వాళ్లతో చేరింది. ఆ ముగ్గురు మలాగా అనే మద్యాన్ని తాగుతూ గంభీరమైన చర్చలను జరిపారు. తద్వారా ఏర్పడ్డ పరిణామమేమంటే, తాము మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరుతూ వాళ్లు దేశాధ్యక్షునికి ఒక ఉత్తరం రాశారు. భారీ శరీరం కలిగిన కొత్త అధ్యక్షుని వయస్సు ముప్ఫై ఏళ్లకన్న కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అతడు ఒక అమెరికన్ షిప్పింగ్ కంపెనీలో సామాన్లను మోసేవాడిగా పని చేశాడు. తన మనసులోని ఉద్దేశాన్ని నొక్కి చెప్పాలనుకున్నప్పుడల్లా అతడు తన వాగ్ధాటినీ, తుపాకీనీ ప్రభావవంతంగా ఉపయోగిస్తూ ప్రస్తుత ఉన్నత హోదాకు చేరుకున్నాడు. తన కింది అధికారి ఒకతను ఆ ఉత్తరాన్ని తన ముందుంచినప్పుడు అతడు నవ్వి, “ఈ ముగ్గురు వృద్ధ స్త్రీలకు నా నుండి ఏం కావాలట?” అన్నాడు.

కాని అతడు మంచీ మర్యాదా ఉన్న మనిషే కాక, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తను కూడా ప్రజల్లో ఒకడు అనీ, ప్రజలను సంరక్షించడం కోసమే తను ప్రజల చేత ఎన్నుకోబడ్డాడనీ అతడు మరచిపోలేదు. పైగా అతడు తన యవ్వనదశలో మేడం కొరాలీ దగ్గర చిన్నచిన్న పనులమీద బయట తిరిగే ఉద్యోగం చేశాడు. ఆ ముగ్గురు స్త్రీలను తాను మరుసటి రోజు ఉదయం పది గంటలకు కలుస్తానని తన సెక్రెటరీకి చెప్పాడు దేశాధ్యక్షుడు. వాళ్లు సరైన సమయానికి అధ్యక్ష భవనాన్ని చేరుకున్నారు. అక్కడి ఉద్యోగి ఒకతను వాళ్లను వెంట తీసుకుని దివ్యమైన మెట్లదారి మీదుగా సందర్శకుల హాలు వైపు నడిచి, అక్కడికి చేరుకోగానే తలుపును చిన్నగా తట్టాడు.

ఇనుప కమ్మీలున్న లావుపాటి లోహపు ద్వారం తెరుచుకుని, అనుమానపు చూపులున్న ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ అధ్యక్షుడు మునుపటి అధ్యక్షునిలాగా ప్రాణాంతక దుష్ట పరిస్థితిని ఎదుర్కోదల్చుకో లేదు కనుక, వచ్చిన సందర్శకులు ఎంతటి వారైనా సరే జాగ్రత్త పడకుండా వాళ్ల ముందుకు రాకూడదనే నియమం పెట్టుకున్నాడు. వాళ్లను తీసుకువచ్చిన ఉద్యోగి ఆ ముగ్గురు స్త్రీల పేర్లను చెప్పగానే అసలైన లోపలి తలుపు తెరుచుకుంది. కాని లోపలికి వెళ్లే తోవ కొంచెం ఇరుకుగా వుంది. వాళ్లు లోపలికి పోయారు. ఆ హాలులో హుందాతనం, దర్జా కనిపించాయి. అక్కడ చిన్నచిన్న టేబుళ్ల దగ్గర పొట్టిచేతుల చొక్కాలనూ, ప్యాంటు వెనుక జేబులో పిస్తోళ్లనూ కలిగిన సెక్రెటరీలు తీరిక లేకుండా టైపింగ్ చేస్తున్నారు. భారీ తుపాకులతో, బులెట్లతో ఒకరిద్దరు యువకులు సోఫా మీద కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు. అధ్యక్షుడు కూడా పొట్టి చేతుల కోటు తొడుక్కున్నాడు. బెల్టులో ఒక పిస్తోలు వుంది. తన రెండు బొటనవేళ్లను కోటు జేబుల్లోకి దూర్చి నిలుచున్నాడు. అతడు పొడుగ్గా బలిష్ఠంగానే కాక, హుందాగా కూడా కనిపించాడు.

“ఏం కావాలి? దేనికోసం వచ్చారు మీరు?” అని అడిగాడతడు. అతని తెల్లని దంతాలు తళతళ మెరుస్తుంటే, “ఎంత దివ్యంగా కనిపిస్తున్నారు డాన్ మాన్యుయెల్ గారూ! చక్కని దేహపుష్ఠి వున్న పురుషుని లాగా ఉన్నారు మీరు” అన్నది లా గోర్డా.

అతడు వాళ్లకు హాండ్ షేక్ ఇచ్చాడు. అతని సిబ్బంది తాము చేస్తున్న శ్రమపూరితమైన పనిని ఆపి వెనక్కి ఒరిగి, ఆ ముగ్గురు స్త్రీల వైపు స్నేహపూర్వకంగా చేతులు ఊపారు. నిజానికి వాళ్లందరు ఒకరికొకరు పాత మిత్రులే. అందుకే వాళ్ల స్వాగతం పైకి కొంచెం మామూలుగా కనిపించినా అందులో సుహృద్భావం ఉంది. ఆ ముగ్గురు స్త్రీలు ఆ నగరంలోని ముఖ్యమైన వేశ్యాగృహాలకు యజమానురాళ్లు అని నేనిక్కడ చెప్పాల్సి వుంది. వినేవాళ్లు నిస్సందేహంగా నన్ను అపార్థం చేసుకోని విధంగా జాగరూకత నిండిన వివేకంతో ఈ విషయాన్ని చెప్పగలను నేను. అయినా మీరేమైనా అనదల్చుకుంటే నిస్సంకోచంగా అనవచ్చు. లా గోర్డా, కార్మెన్సిటా స్పెయిన్ దేశపు మూలాలున్న స్త్రీలు. వాళ్లు తమ తలలమీద నల్లని శాలువాలను కప్పుకుని, అందమైన నల్లని దుస్తుల్లో వున్నారు. కాని మేడమ్ కొరాలి ప్రెంచ్ స్త్రీ. ఆమె తన తలమీద ఒక హ్యాట్ ను పెట్టుకుంది. వాళ్లు ముగ్గురూ నడి వయస్సులో ఉన్నారు. వాళ్ల ప్రవర్తనలో వినయం కనపడుతోంది.

అధ్యక్షుడు వాళ్లను కూచోమన్నాడు. ఆ తర్వాత వాళ్లకు మదీరా అనే మద్యాన్నీ, సిగరెట్లనూ ఇవ్వబోయాడు. కాని ఆ వాళ్లు వాటిని తీసుకోలేదు.

“మీ ఔదార్యానికి కృతజ్ఞతలు మాన్యుయెల్ గారూ! కాని మేము సొంత వ్యాపారపు పని మీద వచ్చాము కనుక వాటిని స్వీకరించలేము” అన్నది మేడమ్ కొరాలీ.

“సరే. అయితే నేను మీకెలాంటి సహాయం చెయ్యగలను?”

లా గోర్డా, కార్మెన్సిటా మేడమ్ కొరాలీ వైపు చూశారు. మేడమ్ కొరాలీ వాళ్లిద్దరి వైపు చూసింది. ఆ యిద్దరు స్త్రీలు అంగీకారాన్ని సూచిస్తూ తలలు ఊపడంతో, తనే మాట్లాడాలని వాళ్లు ఆశిస్తున్నారని గ్రహించి ఇలా అన్నది మేడమ్ కొరాలీ.

“డాన్ మాన్యుయెల్ గారూ! అసలు సంగతేమిటంటే, మేం ముగ్గురం ఎన్నో సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాము. ఈ దీర్ఘకాల వ్యవధిలో మా పరువుకు మచ్చ తెచ్చే పని ఒక్కటి కూడా చెయ్యలేదు మేము. మేము నడుపుతున్న వేశ్యాగృహాలంత పేరెన్నిక గన్న గృహాలు మొత్తం అమెరికా ఖండంలో మరెక్కడా లేవు. అవి ఈ అందమైన నగరానికి గర్వకారణాలుగా నిలుస్తాయి. అంతెందుకు? నేను నిర్వహిస్తున్న వేశ్యాగృహానికి హంగుల్ని సమకూర్చడం కోసం గత సంవత్సరమే ఐదు వందల డాలర్లను ఖర్చు పెట్టి అధునాతనమైన అద్దాలను అమర్చాను. మేమెప్పుడూ మర్యాదగానే, గౌరవప్రదంగానే ఉన్నాము. ప్రతి సంవత్సరం పన్నులను సకాలంలో కట్టాము. ఇన్నేళ్లు మేమెంతో శ్రమ పడ్డాక దాని ఫలాలను మా నుండి లాక్కోవడం బాధాకరంగా వుంది. ఇంత కాలంగా మేము నిజాయితీతో, వ్యాపారం పట్ల విచక్షణాత్మకమైన ధ్యాసతో కృషి చేశాక మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అన్యాయమని చెప్పడానికి నేను సందేహించను”

అధ్యక్షుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు.

“కాని నా ప్రియమైన కొరాలీ! నువ్వు దేనిగురించి మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు నాకు. చట్టానికి వ్యతిరేకంగా కాని లేక నా కన్నుగప్పి కాని మీ డబ్బును ఎవరైనా గుంజుకున్నారా?”

అతడు ఒక అనుమానం నిండిన చూపును తన సెక్రెటరీల వైపు విసిరాడు. వాళ్లు తమకేమీ తెలియదన్నట్టు అమాయకంగా కనిపించే ప్రయత్నం చేశారు. వాస్తవంలో వాళ్లు అమాయకులే అయినా తమ ముఖాల్లోని ఇబ్బందిని దాచలేకపోయారు.

“మేము కొత్త చట్టం గురించి మాట్లాడుతున్నాము. మేము సర్వనాశనం కాబోతున్నాము”

“ఏంటీ? సర్వనాశనమా?”

“కొత్త విడాకుల చట్టం అమలులో ఉన్నంత వరకు మేము మా వ్యాపారాలను చేసుకోలేం. మేము నిర్వహిస్తున్న అద్భుతమైన వేశ్యాగృహాలను మూసుకోవాల్సి వస్తుంది”

తర్వాత మేడమ్ కొరాలీ తమ ఇబ్బందిని ఎంత నిర్మొహమాటంగా వివరించిందంటే, ఆమె అన్న మాటలను నేను కొద్దిగా మార్చి చెబుతున్నాను. ఆమె వెళ్లబోసుకున్న గోడు సారాంశమేమంటే, పరాయి ప్రాంతాల నుండి అందమైన స్త్రీలు ఆ నగరానికి రావటంతో, హుందాతనం నిండిన తమ మూడు బంగళాలు పూర్తిగా దిక్కుమాలినవి ఐపోయాయి. వాటిమీద తాము ముగ్గురూ అన్ని పన్నుల్ని సక్రమంగా కడుతున్నా కూడా, నాగరికతను అవలంబించే యువకులు తమ సాయంత్రాలను గ్రాండ్ హోటల్లో గడపటం వైపే మొగ్గు చూపుతున్నారు. డబ్బు చెల్లిస్తే మాత్రమే వేశ్యాగృహాల్లో లభించే సరసమైన వినోదం ఆ హోటల్లో ఉచితంగా దొరుకుతోంది.

“హోటలువాళ్లను మనం నిందించలేం” అన్నాడు అధ్యక్షుడు.

“నేనేం వాళ్లను నిందించటం లేదు. కాని ఆ స్త్రీలను తప్పు పడుతున్నాను. ఇక్కడికి వచ్చి మా పొట్టలమీద కొట్టే హక్కు వాళ్లకు లేదు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరు ప్రజల్లోని ఒక మనిషే తప్ప రాచరికంలో ఉన్నవారు కారు. ఈ దుష్ట వ్యాపారస్థుల చేత మేం తరిమి కొట్టబడితే మీ దేశం దాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తుంది? వాళ్లు చేస్తున్నదాంట్లో న్యాయం ఉందా? నిజాయితీ వుందా?”

“కాని నేనేం చేయగలను? హోటల్లో బస చేసిన ఆ అందమైన స్త్రీలను ముప్ఫై రోజుల పాటు గదుల్లో బంధించి వుంచలేను కదా. ఈ విదేశీ స్త్రీలకు మర్యాద లేకుంటే దానికి నేనెలా బాధ్యుడినవుతాను?”

“బీద స్త్రీలు ఆ విధంగా చేయటం వేరు. ఎందుకంటే పాపం వాళ్లకు వేరే మార్గం వుండదు. కాని వీళ్లు అట్లా చేయటమన్నది సమంజసమెలా అవుతుందో నాకర్థం కాదు”

“ఈ చట్టం చెడ్డది, క్రూరమైనది” అన్నది కార్మెన్సిటా. అధ్యక్షడు ఒక్కసారిగా లేచినిలబడి తన రెండు చేతులను పక్కలకు చాపి, ఇలా అన్నాడు. “ఈ దేశానికి సంపదనూ శాంతినీ తెచ్చిన ఆ చట్టాన్ని నిషేధించాలని అడగకండి. ప్రజలచేత ఎన్నుకోబడ్డ నేను ప్రజల్లో ఒకణ్ని. నా మాతృదేశపు ఐశ్వర్యం నా హృదయానికి చాలా దగ్గరగా వుండే విషయం. విడాకుల చట్టం మన దేశపు ముఖ్య పరిశ్రమ. చచ్చినా దాన్ని నేను నిషేధించను”

“ఓరి దేవుడా! ఆఖరుకు ఇట్లాంటి గతి దాపురించింది. నా ఇద్దరు కూతుళ్లు న్యూ ఆర్లియెన్స్ లోని కాన్వెంటులో చదువుతున్నారు. అయ్యో భగవంతుడా! ఈ వ్యాపారం చాలావరకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేదే. అయినా నా ఇద్దరు కూతుళ్లు చక్కగా పెళ్లిళ్లు చేసుకుంటారనీ, నేను ఈ పనిని మానుకునే సమయం వచ్చినప్పుడు వాళ్లు దీన్ని నడిపే బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకుంటారనీ ఆశ పడుతూ ఎప్పుడూ నన్ను నేను సముదాయించుకున్నాను. ఈ వ్యాపారమే లేకపోతే న్యూ ఆర్లియెన్స్ వంటి మహానగరంలోని కాన్వెంటులో వాళ్లను అంత సులభంగా ఉంచగలనా?” అన్నది కార్మెన్సిటా.

“మరి నా సంగతి? నా బంగళాను మూసేసుకుంటే నా కొడుకును హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎవరు చదివిస్తారు?” అని అడిగింది లా గోర్డా.

“నేను మాత్రం దీన్ని ఖాతరు చేయను. ఫ్రాన్స్ కు వెళ్లిపోతాను. నా తల్లికి ఇప్పుడు ఎనభై ఏడు సంవత్సరాల వయసుంది. ఆమె ఇంకా ఎంతో కాలం బతకదు. తన అవసానదశలో నేనామె పక్కన వుంటే ఆమెకు ఊరటా మనశ్శాంతీ దొరుకుతాయి. కాని ఈ అన్యాయం నన్నెంతగానో బాధ పెడుతోంది. అయ్యా, మాన్యుయెల్ గారూ! తమరు కూడా ఎన్నో సాయంత్రాలను నా బంగళాలో ఆనందంగా గడిపారు. మీరు మాతో ఇలా వ్యవహరిస్తుంటే మా మనసులు గాయపడుతున్నాయి. ఒకప్పుడు నా దగ్గర చిన్నచిన్న పనులను నిర్వహించే ఉద్యోగం చేసి, నా బంగళాలోకి దేశాధ్యక్షుని హోదాలో గౌరవ అతిథిగా వచ్చినప్పుడు అది మీ జీవితంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సందర్భం అని మీరు స్వయంగా నాతో అనలేదా?” అన్నది మేడమ్ కొరాలీ

“అది వాస్తవం కాదని అనటం లేదు. నేనెప్పుడూ నిజాయితీగానే వ్యవహరిస్తాను” అని డాన్ మాన్యుయెల్ ఆ హాలులో అటూయిటూ నడుస్తూ, అలవాటుగా మధ్యమధ్య తన బుజాలను పైకి లేపాడు. దీర్ఘాలోచనలో మునిగిన అతడు “నేను ప్రజల మనిషిని. ప్రజలచేత ఎన్నుకోబడినవాడిని. ఇక్కడ వాస్తవమేమిటంటే, ఈ స్త్రీలు విశ్రాంతి తీసుకోకుండా పని చేశారు” అని తన సెక్రెటరీలతో నాటక ఫక్కీలో మళ్లీ ఇలా అన్నాడు. “నా పరిపాలన మీద ఇదొక మచ్చ. నైపుణ్యం లేని విదేశీయులు నిరంతరం నిజాయితీతో కృషి చేసే ఇక్కడి మనుషుల పొట్టలను కొట్టడం నా సిద్ధాంతానికి విరుద్ధం. ఈ స్త్రీలు నన్ను ఆశ్రయించి నానుండి రక్షణను కోరటం సరైనదే. ఈ వ్యవహారం ఇంకా ఇలా కొనసాగటాన్ని నేను అనుమతించను”

అతని మాటలు నిశితంగా ప్రభావవంతంగా ఉన్నాయి కాని, వాటిని విన్నవాళ్లందరికి కేవలం ఆ మాటల వల్ల ఏం లాభం చేకూరదని తెలుసు. మేడమ్ కొరాలీ కొట్టొచ్చినట్టుగా పెద్దగా వుండే తన ముక్కు మీద పౌడరును అద్దుకుని, తన పర్స్ లోని చిన్న అద్దంలో ఒకసారి చూసుకుంది.

“మానవ నైజం ఎట్లా వుంటుందో తెలుసు నాకు. ఆ అందమైన విదేశీ స్త్రీల పని ఐపోయే రోజు వస్తుంది” అన్నదామె.

“మనం ఒక గోల్ఫ్ మైదానాన్ని తయారు చేయవచ్చు. కాని అది కేవలం పగటి వేళల్లో మాత్రమే జనాన్ని ఆకర్షిస్తుందనేది వాస్తవం” అన్నాడొక సెక్రెటరీ.

“కులకడానికి వాళ్లకు మగాళ్లు అవసరమైతే వాళ్లే తమతో పాటు తెచ్చుకోవచ్చు కదా?” అన్నది లా గోర్డా.

“భగవంతుడా” అని అరిచి, కొంత సేపు కదలక మెదలక నిల్చున్నాడు అధ్యక్షుడు. తర్వాత “దీనికో పరిష్కారం వుంది” అన్నాడు. అంతర్వివేచనా, వివేకమూ లేకుండానే అతడు అంతటి ఉన్నత స్థానాన్ని చేరుకోలేదు. ఆయన ఉల్లాసంతో నవ్వి ఇలా అన్నాడు. “చట్టాన్ని మార్చేద్దాం. ఇకముందు పురుషులు మునుపటి లాగానే ఏ ఆటంకం లేకుండా వస్తారు. కాని, స్త్రీలు మాత్రం భర్తలతోనే రావాలి, లేదా హామీ పత్రాన్ని ఇవ్వాలి”. వెంటనే తన సెక్రెటటరీల చూపుల్లో నిరాశను గమనించి, “అయితే భర్త అనే పదాన్ని అత్యంత విస్తృతార్థంలో చూడాలని ఇమిగ్రేషన్ అధికారులకు మనం ఆదేశాలను ఇస్తాము” అని వాళ్ల వైపు చేయి ఊపాడు అధ్యక్షుడు.

“భలేగా వుంది. ఆ విధంగా ఆ స్త్రీలతో పాటు మగవాళ్లెవరైనా వస్తే ఇతర పురుషులెవరూ మధ్యలో జోక్యం చేసుకునే అవకాశముండదు కనుక, మా కస్టమర్లు మేము నడుపుతున్న వేశ్యాగృహాలకే తిరిగి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. డాన్ మాన్యుయెల్ గారూ, మీరొక అద్భుతమైన వ్యక్తి అంటాన్నేను. ఏదో వొక రోజున ప్రజలు మీ శిలావిగ్రహాన్ని తప్పక ప్రతిష్ఠిస్తారు” అన్నది మేడమ్ కొరాలీ.

చాలా సార్లు చిన్నచిన్న ఉపాయాలే పెద్దపెద్ద కష్టాలనుండి మనను గట్టెక్కిస్తాయి. డాన్ మాన్యుయెల్ సూచించిన విధంగా చట్టం మార్చబడింది. పుష్కలమైన సూర్యరశ్మినీ, వైశాల్యాన్నీ కలిగిన ఆ స్వతంత్ర దేశం సంపదతో తులతూగటం వల్ల, మేడమ్ కొరాలీ తను ఆశించినట్టుగా తన వ్యాపారాన్ని కొనసాగించి బాగా లాభాలను గడించింది. కార్మెన్సిటా కూతుళ్ళిద్దరూ న్యూ ఆర్లియన్స్ నగరంలో ఖరీదైన విద్యను పూర్తి చేశారు. లా గోర్డా కొడుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మంచి మార్కులతో పట్టభద్రుడయ్యాడు.

 

 

 

***