గాలిబ్ తో గుఫ్తగూ

saif
గాలిబ్
ఇంకా సముద్రాల్లో ఆటుపోట్లు వస్తున్నాయ్
ఇంకా పువ్వుల చుట్టూ భ్రమరాలు తిరుగుతున్నాయ్
ఆకాశం ఇష్టమొచ్చినప్పుడు రంగులు మార్చుతూనే ఉంది
విత్తనం పగిలితేనే ఇంకా పచ్చని మొక్క పుడుతుంది
గాలిబ్ ,
చీకటి ఇంకా నల్ల  బుర్ఖా వేస్తూనే ఉంది
దానికోసమే మిణుగురులు రోజంతా ఎక్కడో పడుకుంటున్నాయ్.
ఎంత ఎత్తున కట్టుకున్నా కాని
పిల్లగాలి ఇంకా కిటికి రెక్కలతో ఆడుకుంటూనే ఉంది
రాజరికం ఇప్పుడు లేదు కాని
ఇంకా అదే బీదరికం ఉంది .
గాలిబ్
నీ కవితలు ఇంకా దునియా చదువుతూనే ఉంది
ఐనా జిందగీలో జర్గాల్సినదేదో జరిగిపోతూనే ఉంది .
వర్షం వస్తే ప్రతి గోడ తడుస్తూనే ఉంది .
జలుబు కు ఇప్పుడు కూడా ఏదో ఒకటి మందు దొరుకుతూనే ఉంది
గాలిబ్,
నీ గాయాల వారసత్వం కొనసాగుతూనే ఉంది
ఇంకా గులాబి కొమ్మలకు ముళ్ళు పుడుతూనే ఉన్నాయ్ .
ముళ్ళ కంచెల్ని వాటేసుకోని పూల తీగలు బతుకుతూనే ఉన్నాయ్ .
నువ్వు లేవు అంతే ,మనుషులేం మారలేదు
జాబిల్లిలో కూడా  అదే పాత పరివర్తన వస్తూ పోతూ ఉంది .
గాలిబ్ ,
వంటవాడే మొదట రుచి చూస్తున్నాడు
పంటలేసినవాడే కోసేస్తున్నాడు
ధర్మ ప్రచారం బాగానే జరుగుతుంది
గడియారం తన ముళ్ళను తిప్పుతూనే ఉంది
గాలిబ్ ,
ఊరకనే అంతా లభిస్తుంది .
ఊరకనే అంతా పోతుంది .
దీపం చుట్టూ ఇంకా చీకటి ఉంటూనే ఉంది
ఎక్కడినుంచో ఓ కోకిల ఇంకా పాడుతూనే ఉంది
గాలిబ్ ,
అందమైన మధుపాత్రలు ఎన్నో తయారవుతూనే ఉన్నాయ్
ఎన్ని పూలతో కలిపిఉంచినా కాని వాటితోనే
మల్లెలు ఉదయానికి వాడిపోతున్నాయ్
గాలిబ్
ముందు సీట్లు ఖాలీగా ఉన్నా కాని
కొంతమంది ఇంకా వెనక నిలబడే
నీ షాయరి వింటున్నారు  .
నువ్వు వెతుకుతూ వెతుకుతూ పొయినదాన్నే
వెతుకుతున్నారు .
ఇంకా అసలైన సత్యం ఏదో దొరకలేదు .
గాలిబ్ ,
చీకటి వెలుతురులోకి
వెలుతురు చీకటిలో కి మారుతూనే ఉన్నాయ్
ఇంకా ఒకరికి ఒకరు గానే ఉంటున్నారు
శ్వాసలు లేకపోతే దేహాలు చెదలుపట్టిపోతున్నాయి.