ముందడుగు ఇది…

suneeta2

అక్టోబర్ 19న నేను పనిచేసే అన్వేషి సంస్థ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సభ్యురాలు జకియా సోమన్ని వారు మూడు తలాక్ లకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారోద్యమం గురించి మాట్లాడమని ఆహ్వానించింది. ఇది ఆ విషయం పైన గత మూడు నెలల్లో సంస్థ పెట్టిన మూడవ చర్చ. అంతకు నెల క్రితం ముంబై కి చెందిన ప్రముఖ లీగల్ ఆక్టివిస్ట్ ఫ్లేవియా ఆగ్నెస్ కూడా అన్వేషి కి వచ్చి ఈ విషయంపై తన అభిప్రాయాలని చర్చకి పెట్టారు. ఆవిడ బి ఎం ఎం ఏ చేస్తున్న ప్రచారోద్యమం అనవసరమని, ఇది హిందూత్వ వాదులకి ఉపయోగ పడుతుందని బలంగా వాదించారు.

మామూలుగా 20  మంది మించకుండా హాజరయ్యే ఇటువంటి చర్చలకు జకియా మాట్లాడే రోజు సమయానికి ముందే హాలు నిండేటంత అంతకు ముందు ఎప్పుడూ రాని ముస్లిం స్త్రీలు హాజరయ్యారు. ఆమె అహ్మదాబాద్ లో తన నేపధ్యం, తన అమ్మమ్మ ఇల్లు ఎన్ని సార్లు మత కలహాల్లో దగ్ధ మయింది, తన వైవాహిక జీవితంలో పడిన హింస, గుజరాత్ మారణ కాండతో తానెలా ముస్లిం కమ్యూనిటీ కోసం పని చెయ్యటం ప్రారంభించారో చెప్పారు. తాను గుజరాత్ ఊచ కోత బాధితులకి సహాయం చేసే పనిలో నిమగ్నమయిన తరువాతే తనని తాను ఒక ముస్లిం గా భావించుకోవటం ప్రారంభించానని చెప్పారు. ఆ అవగాహన తన జీవితాన్ని మార్చిందని కూడా చెప్పారు.

ఇదంతా చెప్పిన తరువాత తాము చేపట్టిన ప్రచారోద్యమం గురించి, తాము షరియత్ పరిధిలో, ఖురాన్లో చెప్పినట్లు మాత్రమే భర్తలు భార్యలకు తలాక్ ఇచ్చే విధంగా ముస్లిం కుటుంబ చట్టాలని మార్చాలని, వాటిని క్రోడీకరించమని అడిగామని చెప్పారు. దీనికి తమ వద్దకి వచ్చిన అనేక మంది బాధిత ముస్లిం స్త్రీల జీవిత పోరాటాలే కారణమని కూడా చెప్పారు. నల్ల జాతి ఇస్లామిక్ స్త్రీవాది అయిన అమీనా వదూద్ నుండి, షరియత్ పరిధిలో ముస్లిం స్త్రీలు తమ హక్కులు సాధించుకోవాలనే  ముసావా అనే అంతర్జాతీయ ఇస్లామిక్ మానవ హక్కుల నెట్ వర్క్ నుండి తాము స్ఫూర్తి పొందామని చెప్పారు.

అయితే హాజరయిన ముస్లిం స్త్రీలు జకియా మాట్లాడటం ప్రారంభమైన దగ్గరినుండి ప్రతి నిముషం ఆమెని అడ్డుకున్నారు. ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించారు. ఆవిడకి ఖురాన్ లో, హదీస్ లో ఏమి తెలుసో ప్రశ్నించారు. ఆవిడ హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్నందు వల్ల ముస్లిం కాదని, ముస్లిం లకి ప్రతినిధిగా ఉండటానికి అర్హత కోల్పోయిందని వాదించారు. కొంత మంది మూడు తలాక్ లనేవి కేవలం ముస్లింల వ్యతిరేక ప్రచారం మాత్రమే నని, తాము ఎక్కడా వినలేదని, చూడలేదని అన్నారు. ముస్లిం స్త్రీలకి సరయిన చదువు ఉంటే ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారని వాదించారు. జమాత్ ఏ ఇస్లాం లో పని చేసిన ఖలీదా పర్వీన్, ముస్లిం స్త్రీలకి పేదరికం, చదువు లేకపోవటం, పితృస్వామ్యం వల్ల సమస్యలు ఉన్నాయని అయితే వీటిని కమ్యూనిటీ లోపలే చర్చించుకోవాలని, కోర్టుకి, ప్రభుత్వం దగ్గరికి వెళ్లి చట్టాల్లో మార్పుల కోసం అడగటం అనవసరమని అన్నప్పుదు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తరువాత అందరూ బయటికి వెళ్లి పది నిమిషాల పాటు జకియా సోమన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి వెళ్లిపోయారు. వీరందరూ ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ అనే సంస్థకి చెందిన వారని తరువాత తెలిసింది. మర్నాడు సాయంత్రం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ కార్యాలయం దారుస్సలాం లో జరిపిన సభలో కొంత మంది ముస్లిం స్త్రీల దుర్భర పరిస్థితుల గురించి ప్రసంగిస్తే మరి కొంత మంది జకియా సోమన్  పైన ఇదే రకమైన విమర్శలు గుప్పించారు. ఆమెకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని ప్రశంశించారు. తాము గనక ఉండి ఉంటే ఆమెకి తస్లీమా నస్రీన్ కి పట్టించిన గతే పట్టించి వుండే వారమని కూడా కొందరు అన్నారని వినవచ్చింది. ఇటువంటి వారిని పిలిచిన వారిది కూడా తప్పే నని అభిప్రాయ పడ్డారు మరి కొంత మంది.

అన్వేషి సంస్థ స్త్రీలకి సంబంధించిన కుటుంబ చట్టాలు, వాటిలో మార్పుల గురించి గత ముప్ఫయి ఏళ్ల లో అనేక చర్చలు నిర్వహించింది. 1990 ల మధ్యలో షాబానో వివాదం తరువాత వుమ్మడి పౌర స్మ్రితి వుండాలని అనేక స్త్రీల సంస్థలు వాదించి, దాని నమూనాలు తయారు చేసిన సమయంలో రెండేళ్ల పాటు చట్టం, చట్ట సవరణల గురించి సామూహిక అధ్యయనం జరిపి, వుమ్మడి పౌర స్మ్రితి గురించి మాట్లాడే ముందు కుటుంబ చట్టాల విభిన్నత గురించి తగినంత అవగాహన వుండాలని, స్త్రీలకు న్యాయమంటే ఏకరూప ఉమ్మడి చట్టం అవసరం లేదని, వివిధ చట్టాలలో సంస్కరణలు చేసే విధంగా కృషి చెయ్యాలని వాదించి, ముంబై కి చెందిన మజ్లీస్ తో కలిసి స్త్రీవాద సంస్థ లన్నింటికీ ఒక అప్పీల్ ని పంపించింది – వుమ్మడి పౌర స్మ్రితి ముస్లింలని టార్గెట్ చెయ్యటానికి హిందూత్వ వాదులు వాడుకుంటున్నారు కాబట్టి, దాని గురించి మాట్లాడటానికి ఇది సమయం కాదని, స్త్రీ వాద సంస్థలు ఈ ప్రయత్నం మాను కోవాలని అడిగింది. గత ఇరవై ఏళ్లలో అఖిల భారత ప్రజాస్వామిక స్త్రీల సంస్థ తో సహా అందరూ స్త్రీలకి న్యాయం కోసం ఉమ్మడి పౌర స్మృతి  మార్గం కాదని, ఆయా కుటుంబ చట్టాలలో తగిన మార్పులు చేసుకోవాలనే ప్రజాస్వామిక అవగాహనకి వచ్చారు.

suneeta1ఇదంతా వర్ణించటం ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ కి చెందిన స్త్రీలని విలన్లు గా, జకియా సోమన్ని హీరోయిన్ గా చూపించటానికి లేదా అన్వేషి సంస్థ గొప్పతనం చెప్పుకోవటానికి కాదు. నా ఉద్దేశంలో జకియా సోమన్ పట్ల అక్కడ వ్యక్తమైన వ్యతిరేకత – భారతీయ ముస్లిం సమాజాల్లో కుటుంబ చట్టాల గురించిన చర్చ మెజారిటీ హిందూత్వ వాద నీడలో జరగటం వల్ల జరుగుతున్న దుష్ఫరిణామాలకి ఒక చిహ్నం తప్ప మరేమీ కాదు. ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ మరియు భారతీయ ముస్లిం మహిళా అందోళన్ రెండూ కూడా 1990 ల తరువాత, ఇంకా చెప్పాలంటే 2002 లో గుజరాత్ ఊచ కోత తరువాత పుట్టినవే. రెండూ కూడా బలంగా ఇస్లాం తమకు కావలిసిన హక్కులు, అధికారాలు ఇస్తాయని నమ్ముతాయి. ఇది కేవలం ఈ రెండు సంస్థల, సంఘటనల అవగాహనే కాదు. హైద్రాబాదు లో పని చేసే అనేక చిన్న ముస్లిం స్త్రీల సంస్థలు, తమ స్త్రీలకి సరయిన చదువు – ముఖ్యం గా ఇస్లాం గురించి – ఉంటే తమ హక్కులు తామే సాధించుకోగలరని, కుటుంబ సమస్యలని పరిష్కరించు కోగలరని, హింసకు వ్యతిరేకంగా పోరాడగలరని భావిస్తాయి.

అయితే ఏది సరయిన ఇస్లామిక్ అవగాహన, షరియత్ అంటే ఏమిటి, ముస్లిం పర్సనల్ చట్టాలంటే ఏమిటి, ఏ ఏ హక్కులు, అధికారాలు స్త్రీలకి వున్నాయి, అవి ఎవరి ఆధ్వర్యంలో సాధించుకోవాలి, ఎలా సాధించుకోవాల్సిన పద్ధతులపై మాత్రం తీవ్ర బేధాభిప్రాయాలు వున్నాయి. ఇస్లాం మత చట్టాలు మత విశ్వాసాలలో భాగమైనవి కాబట్టి అవి అచంచలమైనవి అని ముస్లిం గర్ల్స్ అసోసియేషన్ వారు వాదిస్తే, వాటిని చారిత్రిక సందర్భం బట్టి అర్ధం చేసుకోవాలని బిఎంఎంఎ భావిస్తుంది. ముస్లిం పర్సనల్ చట్టాలు షరియత్ నుండే పుట్టాయి కాబట్టి వాటిని ఎవరూ మార్చలేరని, మార్చ కూడదని ఎంజిఎ వాదిస్తే, అవి షరియత్ స్ఫూర్తి తో రూపొందింన భారత దేశ రాజ్యాంగ చట్టాలని, మారుతూనే వస్తున్నాయని, కాబట్టి వాటిని మార్చుకోవచ్చని బిఎంఎంఎ అంటుంది. పితృస్వామ్యం వల్ల ముస్లిం స్త్రీలు తమకి రావాల్సిన అధికారాలు సాధించుకోలేక పోతున్నారని ఖలీదా పర్వీన్ మరియు జకియా సోమన్ ఇద్దరూ అంగీకరించినప్పటికీ, ఖలీదా తమ సమాజంలోనే పోరాడి సాధించుకోవాలని భావిస్తే జకియా ప్రభుత్వ సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు.

స్త్రీలు ముస్లిం సమాజంలో ఉంటూ పోరాడాలి అనే భావన సాంప్రదాయక ధోరణిగా అనిపించి నప్పటికీ ప్రజాస్వామ్యం కరువైన లౌకికత చేసే చేటు గురించి 1985 తరువాత కలిగిన అవగాహన లో ఇది కొత్త రాజకీయ అర్ధం సంతరించుకుంది. ఈ విషయాన్ని చర్చించిన పార్థ ఛటర్జీ వంటి రాజకీయ సిద్ధాంత కర్త మైనారిటీ సమాజంలో స్త్రీల పోరాటం గురించి చర్చిస్తూ ముస్లిం స్త్రీలు ఒక పక్క తమ సమాజాలని బయటి సమాజ దాడి నుండి రక్షించుకుంటూ ఇంకో పక్క తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందని అన్నారు. గత ముప్ఫయి ఏళ్ల ముస్లిం స్త్రీల పోరాటాలని అర్ధం చేసుకోవటానికి ఈ చట్రం చాలా ఉపయోగ పడుతుంది. ఈ ప్రక్రియలో స్త్రీలు కూడా తమ సమాజ ప్రతినిధులుగా ఎదుగుతున్నారు, అంగీకరించ బడుతున్నారు. ముస్లిం స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడే స్థాయికి చేరుకోక ముందే తమ సమాజాలలో – విద్య లేక ఆరోగ్యం గురించి – లేదా సమాజాలపై దాడులు – హిందూత్వ దాడులు, పోలీసుల దాడుల గురించి – అనేక సంవత్సరాలు పని చేసి వుంటారు. ఉదాహరణకి భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ గుజరాత్లో ఊచకోతకు గురయిన ముస్లిం ల కోసం పని చెయ్యటమే కాక, ఆ తరువాత కుటుంబ సమస్యల పరిష్కారం కోసం షరియత్ అదాలత్ లని స్థాపించారు. అలాగే వివాహ సమయంలో భార్యా భర్తలిద్దరూ సంతకం చెయ్యాల్సిన నిఖానామా లో స్త్రీల హక్కులు కూడా స్పష్టం గా పొందుపరచి వాటిని ప్రచారం చేసి అనేక పెళ్లిళ్లలో వాటిని వాడుకునేలా కృషి చేశారు. ఈ ప్రక్రియలో సమాజం మొత్తం, పురుషులతో సహా, వారిని కొంత మేరకు తమ ప్రతినిధులుగా ఒప్పుకుంటుంది.  తమిళ నాడు లో షరీఫా ఖానం తో సహా అనేక మంది ముస్లిం స్త్రీలు నడిపే తమిళ్ నాడు ముస్లిం స్త్రీల జమాత్ దీనికి మంచి ఉదాహరణ. ఇది పుదుకోట్టై లోని పేద ముస్లిం స్త్రీలు కుటుంబ సమస్యలని ఖురాన్ పరిధిలో పరిష్కరించు కుంటూ దురాచారాలకు వ్యతిరేకంగా సామూహికంగా పనిచేస్తున్న క్రమంలో ఏర్పడింది. మొదట్లో పురుష జమాత్ లు వ్యతిరేకించినా క్రమేణా వాళ్ళే కుటుంబ సమస్యల కేసుల్ని వీరికి పంపించటం మొదలు పెట్టారు.

హిందూత్వ వాదులు ముస్లిం సమాజాలలో జరిగే పోరాటాలని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోనంత వరకూ ఈ విషయాలపై పోరాడే స్త్రీలని ఆయా సమాజాలు కష్టం గా నైనా అంగీకరిస్తాయని గత ఇరవయి ఐదేళ్ల ముస్లిం సమాజాల చరిత్ర మనకి అర్ధం చేయిస్తోంది. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన పట్ల హైద్రాబాదుతో సహా కొన్ని చోట్ల వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత దీని నుండే పుడుతోంది. వారు నరేంద్ర మోడీ వద్దకి వివాహ చట్టాల మార్పు కోసం వెళ్ళటం అనేది కొందరికి కోపం తెప్పిస్తే, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అన్నది మరి కొందరి బాధ. ‘దీనితో భారతీయ జనతా పార్టీకి జుట్టు అందించినట్లు కాలేదా? ముస్లిం సమాజాల పట్ల వ్యక్తమయ్యే అనేక అపోహలని – పురుషులు ఒకరి కన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు భార్యలకు తలాక్ ఇచ్చేస్తారు, అసలు వుమ్మడి పౌర స్మ్రితి రావడమే దీనికి పరిష్కారం – బల పరిచినట్లు అవుతోంది కదా?’ అనేవి వారికి వస్తున్న విమర్శ. ‘అయితే మరి తమతో మాటైనా చెప్పకుండా భర్తలు తమకి తలాక్ నామా పంపిస్తున్నారని మా దగ్గరకి వస్తున్న ముస్లిం స్త్రీల సంగతేమిటి? ముస్లిం స్త్రీలు తమ వివాహ చట్టాల్లో మార్పుల కోసం ఎంత కాలం ఆగాలి? కాంగ్రెస్ వున్నప్పుడు చెయ్యదు, బిజెపిని అడగ కూడదు, సమాజ పెద్దలుగా అంగీకరించబడిన ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆ బాధ్యత ఎందుకు తీసుకోదు?’ అని బి ఎం ఎం ఏ వేస్తున్న అన్న ప్రశ్నలు ముస్లిం సమాజాల్లో, బయటా కావాల్సినంత చర్చని లేవదీస్తున్నాయి. అంతే కాక ‘ముస్లిం స్త్రీలు తమ సమాజంలో ఉంటూ తమ హక్కుల కోసం పోరాడాలి’ అన్న సూత్రీకరణకి  ‘ముస్లిం వివాహ చట్టాలలో షరియత్ ననుసరించి తగిన మార్పులు చెయ్యాలి’ అనే అర్ధాన్నిచ్చి కొత్త సవాలు విసురుతున్నాయి.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ మూడు తలాక్ లకి వ్యతిరేకంగా జరుపుతున్న ప్రచారోద్యమం, సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు మళ్ళా తలెత్తిన ఉమ్మడి పౌర స్మ్రితి గురించిన అనవసర చర్చలో తేలిపోవచ్చు. వారి సర్వేలలో అసమగ్రత, వారి సభ్యత్వం లో లోపాలు, వారికి చట్టాల గురించిన అవగాహనా లేమి పరిశీలన లో ముందుకి రావచ్చు. ముస్లిం సమాజాలపై యుసిసి పేరుతో జరిగే దాడిని తిప్పి కొట్టటంలో భాగంగా మనలో కొంతమందికి వీరిని వ్యతిరేకించాల్సి కూడా రావచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ నే ఈ వివాదాన్ని పక్కన పడెయ్యచ్చు. కానీ తమ సమాజంలో ఎప్పటి నుండో నలుగుతున్న సమస్యని అందరి దృష్టికి తెచ్చి తమ పెద్దలతో సహా అందరూ చర్చించేలా చేసారని మాత్రం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సుప్రీమ్ కోర్టు తీర్పులకన్నా ఇటువంటి చర్చలే సామాజిక మార్పు కి దారి తీస్తాయి. ఇది ముస్లిం సమాజాల అంతర్గత మార్పులకి, ముస్లిం స్త్రీలు తమ సమాజ ప్రతినిధులుగా ఎదిగే ప్రక్రియకి చిహ్నం. దీనిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్న హిందూత్వ వాదుల అవకాశ వాదమే ముస్లిం సమాజాలని ఆత్మ రక్షణ లోనికి నెట్టి ముస్లిం స్త్రీల గొంతుని పైకి రాకుండా, మార్పుకి అవకాశమివ్వకుండా చేస్తోంది.

 

References

 

Voice of the voiceless (Status of Muslim Women Part II) Report prepared by Syeda Hameed in 1999 for National Commission for Women: http://ncw.nic.in/pdfReports/vov-part-2.pdf

Faizan Mustafa ‘The debate on triple talaq must be based on proper research and data’,  http://thewire.in/77923/muslim-personal-law-reforms-bmma-studies/

 

Anveshi Law Committee “Is gender justice only a legal issue?: Political stakes in UCC debate’, Economic and Political Weekly, Vol. 32, No.9- 10,

http://www.epw.in/journal/1997/9-10/perspectives/gender-justice-only-legal-issue.html

 

A.Suneetha “Muslim women and marriage laws: the debate on the model nickhanama”, Economic and Political Weekly, No.43, 2012

http://www.epw.in/journal/2012/43/review-womens-studies-review-issues/muslim-women-and-marriage-laws.html

A.Suneetha “ Between haquq and taleem: Muslim women’s activism in contemporary Hyderabad”, Economic and Political Weekly, No. 34. 2012 http://www.epw.in/journal/2012/34/special-articles/between-haquq-and-taaleem.html

 

 

 

 

 

 

సెప్టెంబర్ 17: “పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది…”

నాలుగేళ్ళ క్రిందట మలి దశ తెలంగాణా ఉద్యమం మొదలయిన తరువాత తెలుగు జాతీయతా భావన యొక్క పతనం వేగవంతమయింది. తెలంగాణా వాదులు తెలుగు రాష్ట్ర ఆవిర్భావం, విశాలాంధ్ర ఏర్పాటు క్రమంతో పాటు, హైదరాబాదు రాజ్యం భారత యూనియన్ లో కలిసిన విధానం పై కూడా చర్చ కూడా మొదలయింది. సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా జరుపుకోవాలా అనే చర్చలో భాగంగా నిజాము రాజ్య స్వభావం, జాతీయవాద దృక్కోణంలో/కమ్యునిస్టు దృక్కోణంలో హైదరాబాదు చరిత్ర, విశాలాంధ్ర ఏర్పాటులో కమ్యునిస్టు పార్టి పాత్ర ను విమర్శనాత్మకంగా చూడటం మొదలయ్యి ఈ రోజుని విలీనంగా, విమోచనగా, విద్రోహంగా చూడాలా అనే ఆరోగ్యకరమయిన చర్చ ముందుకొచ్చింది.

ఆరోగ్యకరం ఎందుకంటే చరిత్ర (ఏమి జరిగింది) అన్నది చరిత్రకారుల దృక్కోణాల నుండి విడతీసి చూడలేము; కొత్త అవసరాల, చర్చల, దృక్కోణాల వెలుగులో చరిత్రను మళ్ళా, మళ్ళా, చూడవలసిన అవసరం వస్తుంది అన్న అంశం దీనివల్ల ముందుకొచ్చింది. ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో భాగంగా ఆ సమయం గురించి వివిధ వర్గాల, కులాల, మతాలకు చెందిన స్త్రీల అనుభవాలను, జ్ఞాపకాలను చర్చించే ప్రయత్నం చెస్తాను. ఈ వ్యాసం ద్వారా ఇంతకు ముందు ‘జ్ఞాపకాలకీ రాజకీయాలున్నాయ్’ వ్యాసం లో ప్రస్తావించిన చర్చను కొంత ముందుకి తీసుకువెళ్లటం కూడా నా వుద్దేశం.    
ఈ వ్యాసంలో రజాకార్ల గురించి, హైదరాబాదు రాజ్య విలీనం గురించి ప్రస్తుతమున్న ‘కామన్ సెన్స్’ను స్పృశించే ప్రయత్నం చెస్తాను. ప్రజా బాహుళ్యంలో ఈ గుంపు గురించి, సమయం గురించి వున్న’జ్ఞాపకాలు’, ‘నమ్మకాలు’, ‘అనుభవాలు’ కాల క్రమేణా ప్రజా సంస్కృతి (పాపులర్ కల్చర్) లో ఒక రకమయిన ‘కామన్ సెన్స్’ గా రూపుదిద్దుకున్నాయి. కామన్ సెన్స్ అంటే ‘రోజువారి జీవితంలో అనుభవాల నుండి పొందే లోకజ్ఞానం’ కాదని,  క్లిఫర్డ్ గీర్త్జ్ (కామన్ సెన్స్ అస్ కల్చరల్ సిస్టం – లోకల్ నోలేడ్జ్ 1983) అంటారు. దీనిలో కొంత నిజం, కొంత భావజాలం, కొంత అనుభవం, కొంత వ్యాఖ్యానం, కొంత గుర్తు, మరి కొంత సమాజం ఒప్పుకునేది – అన్నీ కలిసి పోయు వుంటాయి అనీ, అన్ని రకాల సంస్థాగత జ్ఞానాలను విశ్లేషించినట్లే కామన్ సెన్స్ ను కూడా విశ్లేషించాలని అయన అంటారు.
Dsc_1203_0
రజాకార్లు, హైదరాబాదు రాజ్యం భారత యునియన్ లో కలిసిన విధానం గురించి చరిత్ర రాసిన తీరు లోనే కాక, కామన్ సెన్స్ లో కూడా ‘కమ్యూనల్’ గా నిక్షిప్తమయ్యాయి: హైదరాబాదు ఒక ముస్లిం రాజ్యం. హిందువులందరూ పీడితులూ, సేవకులూ; ముస్లిములేమో భూస్వాములూ, కులీన వర్గమూ, పీడించేవారు. ముస్లిం రాజు పాలనలో ముస్లిములందరూ ముస్లిములు కాని వారిని నీచంగా చూసినట్లూ; ఉస్మాన్ అలీ ఖాన్ తన పాలనలో స్వతంత్రత కాంక్షించే హిందువులను అణిచివేసి నట్లు గానూ;  భారత దేశం ఆవిర్భావం తరువాత, హైదరాబాదు రాజ్య హిందూ ప్రజలందరూ (వర్గాల, కులాల కతీతంగా) దానిలో విలీనం కావటానికి తహ తహ లాడితే, రజాకర్లనే మత చాందస వాదులు ముస్లిముల ఆధిక్యత కాపాడటానికి హిందువులని క్రూర అణచివేతకు గురిచేసారనీ; అందువల్లే భారత మిలిటరీ వచ్చి హిందువులని కాపాడి, తప్పులు చేసిన ముస్లిముల్ని శిక్షించిందనీ ఈ కమ్యూనల్ కధనం. ముఖ్యంగా హిందూ స్త్రీలను  రజాకార్లు హింసించారని అనేక కధనాలూ, కధలూ విరివిగా చెప్పాయి.
ఇటువంటి కామన్ సెన్స్ ను చెదర గొట్టటం, రూపు మార్చటం ప్రస్తుత తెలంగాణా ఉద్యమ సందర్భంలో చాలా అవసరం. తెలంగాణా వీరత్వం, గొప్పతనం రజాకర్లను ఎదుర్కోవటం, నిజామును ఎదిరించటం తో ముడి పడుతున్న ఈ చారిత్రిక సందర్భంలో ఇటువంటి  కామన్ సెన్స్ ను చెదరగొట్టటం మరింత అవసరం. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు హిందుత్వ వాదంలో ఇమడని దళితులకూ, ఇతర బహుజన  కులాలకూ, ఈ కామన్ సెన్స్ ప్రభావాన్ని రోజూ చవిచూసే ముస్లిములకూ, అన్ని వర్గాలకు చెందిన స్త్రీలకూ కూడా చాలా అవసరమవుతుంది. ఎందుకంటే, ఈ కామన్ సెన్స్ లో స్త్రీలు అలలు, బలహీనులు, కమ్యూనిటి ఆస్తులు గా మాత్రమె వుంటారు. తమకు తాముగా, తామంతట తాముగా అలోచించుకోలేని, బ్రతకలేని, అస్తిత్వ రహితులు.
నా వంతు నేను ఈ కామన్ సెన్స్ ని సామాన్య స్త్రీల అనుభవాలు, జ్ఞాపకాల సహాయంతో విశ్లేషించి, చెదరగొట్టే ప్రయత్నం చేస్తాను. ఆయా అనుభవాలన్నీ 1997-99 ల మధ్య నా డాక్టరల్ పరిశోధన కోసం హైదరాబాదు లోనూ, వరంగల్ లోనూ వివిధ వర్గాల, కులాల, మతాల స్త్రీలతో జరిపిన సంభాషణ లలో భాగంగా డాక్యుమెంట్ చెసినవి. నా పరిశోధన ఉద్దేశం 1930-50 ల మధ్య పుట్టిన స్త్రీలు కుటుంబ పరంగా అనుభవించిన హింస, బాధల గురించి అర్ధం చెసుకోవటం. అయితే తమ తమ జీవితాల గురించి చెప్పే సందర్భంలో అనేక మంది, 1944-50 ల మధ్య  రజాకార్లు, పోలీసు యాక్షన్ ల వల్ల తాము ఎదుర్కున్న  ఇబ్బందులు, తమ కుటుంబాల లో వచ్చిన వొడిదుడుకుల గురించి కూడా చెప్పారు. ఆ విషయాలు నా పరిశోధనకు కీలకం కాదు కాబట్టి నేనప్పుడు వాటిని గురించి పెద్దగా ఆలోచించలేదు. అంతే కాక అప్పటికి ఇటువంటి చర్చ కూడా లేదు. గత నాలుగేళ్లలో జరుగుతున్న చర్చ నేపధ్యంలో వాటిని మళ్ళా చూసి రాయాల్సిన అవసరం వుందనిపించింది.
ఈ స్త్రీలందరూ ఏ రకమయిన ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు. తమ జీవితంలో ఏమయినా ఇబ్బంది కలిగితే, తాము చూసింది, అనుభవించింది గుర్తు తెచ్చుకుని చెప్పారు తప్ప, ఎవరూ రాజకీయ విశ్లేషనలకు సిద్ధపడలేదు. అయితే, ఆయా జ్ఞాపకాల్లో రాజకీయాలు తప్పకుండా వున్నాయి.  ఈ వ్యాసంలో ఈ జ్ఞాపకాలు ఎటువంటివి, ఏ భావజాలంతో కూడుకున్నవి, ఎందుకలా చెప్పి వుంటారు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ విశ్లేషణ మరిన్ని ప్రశ్నలతో, అసంపూర్తిగా వుంటుంది. అడగాల్సిన ప్రశ్నలు అప్పుడు అడిగుంటే బహుశా వాళ్ళు చెప్పి వుండే వారేమో. అప్పటికే ఆ స్త్రీలందరూ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావటంతో, ఇప్పుడు వారిని మళ్ళా పలకరించే అవకాశం చాలా తక్కువ.
t4
గాలి మోటర్లు వచ్చినయి, బాంబు లేసినయ్యి:
వరంగల్ జిల్లా తెలంగాణా సాయుధ పోరాటం ఉద్ధృతంగా జరిగిన జిల్లాల్లో ఒకటి. వరంగల్ పట్టణం ఆనుకుని వున్నఖిలా వరంగల్ గ్రామంలో స్త్రీలతో మాట్లాడేటప్పుడు, చాలా మంది స్త్రీలు ఆ సమయంలో అక్కడే ఉన్నామని చెప్పారు. వారందరూ అత్యంత భయపడిన సమయం గా వర్ణించారు. అయితే, కింద వారు చెప్పింది చూస్తే, వారు భయపడింది – రజాకార్ల గురించా, నిజాం పోలీసుల గురించా, సెప్టెంబర్ 17 తరువాత వచ్చిన భారత సైన్యం గురించా, లేదా అప్పుడు జరిగిన దోపిడీల గురించా అన్న సందేహాలు రాక మానవు.
శాంతమ్మ అనే మాదిగ వ్యవసాయ కార్మికురాలు, తనొక రోజు బావులు తవ్వే పని చేస్తుంటే ‘వాల్లచ్సిన్రు’ అని చెప్పారు. “రగతాలు తీస్తరంట, రజాకార్లు. అందరూ బావుల్నించి దిగిపొయిన్రు. నేనొక్కతినే వున్న. పిలిసిన్రు. పిలిస్తే, ‘మేము చీకటి పడే దాక కష్టం చేసుకుంటే గాని తిండి వుండదయ్య’ అని సెప్పిన. పొమ్మన్నరు. ఉరికొచ్చిన. ఒక పిల్లగాన్నిపట్టుకున్నరు. వయసోడే. సాన రక్తం తీసిన్రట. బాంబులు పడినయ్యి”
తాము తమ అన్న కుటుంబం వుండే గీసుకొండపల్లికి  వెళ్దామని బయల్దేరితే, దార్లో వారి కుటుంబమే ఎదురొచ్చిందని, ఎందుకొస్తున్నారంటే, “అక్కడ సానమందున్నారు బావా, గుట్టకింద జివజివ మంటున్నరు. తుపాకులన్నీ పెట్టి” అన్నాడని, అందరు కలిసి మళ్ళా ఖిలా వరంగల్ కే వచ్చామని చెప్పారు. “ఏం కాదులే, తలుపులు పెట్టి పందాం” అని ఇక్కడే ఉన్నామని చెప్పారు. మరి వచ్చింది పోలీసులా, రజకార్లా? తెలియదు. రక్తాలు తాగే వారని ఆమె ఎక్కడ విన్నది? గుట్టకింద వున్నది రజాకార్లా, సంఘం మనుషులా?మరి రజాకార్లు రక్తాలు తాగే వారయితే, ఆవిడని ఎందుకు ఏమీ చెయ్యకుండా వదిలేసారు? వయసతన్ని మాత్రమే ఎందుకు పట్టుకున్నారు, అతను సంఘం మనిషనా? బాంబులు ఎవరేసారు? అన్న ప్రశ్నలు ఆవిడకి, నాకూ కూడా తట్టలేదు.
ఈరమ్మ అనే ఒక ఒక తెలగ వ్యవసాయ కార్మికురాలు రజాకార్లప్పుడు ఏమయింది అని అడిగితే, “ఈ వూరికేం కాలేదింక. ఇక్కడనే వున్నాం. పని నడుపుతాన్నం. మరి పంచేయందే కడుపులో ఎట్లా? దెంగ్కపొతె.. మేం పోలె. ఇక్కడోల్లెవరు పోలె. తురకోల్లు పోయిన్రు. అప్పుడా రజాకార్లప్పుడు వీధి మోటార్లు తిరిగి బాంబు లేసినయ్యి. ఆ పైకెళ్ళి తిరిగి డామ్మ, డామ్మ, డీమ్మ, డూమ్మ అయ్యేసిన్రు..” అని చెప్పారు.
వాళ్ళు ఎక్కడికీ పారిపోలేదనీ, పన్లు చేసుకునే వారికి పారిపోయే అవకాశం రాలేదనీ అంటూ, “తురకోల్లొస్తుంటే గజ గజ వణికినాం.. ఇగ పదిరవైమందొస్తున్రు.. మగోల్లెవ్వరు లేరు, పన్లకి పోయిన్రు. మేవు నల్గురాడాల్లం ఉన్నం. మా అత్తుంది. ఆమె వింది. వత్తాన్రు, వత్తాన్రు అనే వరకు రానే వచ్చిన్రు, చమ్మకు చమ్మున. ఇల్లు కొంచెమే వున్నదప్పుదు.. ఇగ మా అత్త, మా యారాల్ని, నన్ను లోపలికి తోసి  గొల్లిం పెట్టింది. ఒక పెద్ద యారాలు, పిల్లని తీస్కుని వచ్చే లోపల, ఆల్లు అరుగెక్కనె ఎక్కిన్రు. ఎక్కంగనే మా యారలంది కదా. ‘మా వాల్లెవ్వర్లేరు’. అంటనే అరుగెక్కిన్రు, చూసిన్రు, ఇగ పొయిన్రు రజాకార్లు. మల్ల రాలే. ఇగ దోప్కాలయినాయి. ఇగ మనకెంత? దోప్కాలచ్సినయ్యంటే అది పాపకారి సొమ్ము”. ఎవరు ఎవరిని దోచుకున్నారంటే, ‘ఏమో, రజాకార్లప్పుడయినాయి. పేట, గీటంతా దోచుకున్నారు”
నిజాము పోలీసులు వచ్చారా, లేక రజాకార్లు వచ్చారా అని అప్పుడు అడిగుంటే బాగుండేది. ఆవిడ దృష్టిలో తురకోల్లకి, రజాకార్లకి, నిజాము పోలీసులకి పెద్ద ఫరక్ లెదు. అంతే కాదు, గాలి మోటార్లు – విమానాలు – భారత సైన్యంతో వచ్చినా, ఆవిడ జ్ఞాపకంలో అవి రజాకార్లతోనే ముడిపెట్టి వున్నాయి. ఎందుకు? ఇంకా చిత్రంగా, ముస్లిములపై దాడులు జరిగినట్లు చెప్తున్నా, అవి కూడా రజాకార్లకే ముడిపెట్టి ఎందుకు చెప్పినట్లు?
ఖిలా వరంగల్ లోనే పోశమ్మ అనే ఎరుకల ఆవిడ మాటల్లో కూడా ఇదే వ్యక్తమయింది. ఆవిడ తామందరూ అడవి లోకి పారిపోయి, తోటలో వుండి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఊర్లోకి వచ్చామని చెప్పారు. ఇద్దరు పిల్లలు పుట్టటమంటే, కనీసం రెండు, మూడేళ్ళ వ్యవధి. ఆ సమయమంతా రాజాకార్లే వున్నారని ఆమె అభిప్రాయం. పోనీ గుర్తు లేదా అంటే, వయసు 90 పై పడినా, ఆవిడకి తన పిల్లలు, పారిపోయిన వూర్లు, తిరిగొచ్చిన సమయం అన్నీ గుర్తున్నాయి.
రజాకార్లు క్రియాశీలకంగా నిజాం అధికారాన్ని కాపాడటానికి పనిచేసింది 1947-1948 మధ్య కొన్ని నెలలు. ముఖ్యంగా వాళ్ళు నిజాం పోలీసులతో కలిసి, భూస్వామ్య దొరల ఆధిపత్యం కాపాడటానికి, కమ్యునిస్టు సంఘాల కార్యకర్తలని ఎదుర్కోవటానికి గ్రామాల్లో వున్నారు. వాళ్ళు కొన్ని నెలలుంటే, ఆ తరువాత వచ్చిన భారత సైన్యం కొన్ని సంవత్సరాల పాటు వుందని అందరికి తెలుసు. ఉస్మాన్ అలీ ఖాన్ ని దింపటం, సాయుధ పోరాటాన్ని అణచటం అన్న రెండు ఉద్దేశాలతో ఆపరేషన్ పోలో జరిగిందని;  తెలంగాణలో, ఆంధ్రాలో సాయుధ పోరాటం జరిగే జిల్లాల్లో దేశంలోనే పెద్ద మిలిటరీ క్యాంపులు నడిపారనీ, అనేకమందిని చంపారనీ, దోచుకున్నారనీ, అత్యాచారాలు చేశారనీ కమ్యునిస్టు చరిత్రకారులు మనకి చెప్పారు.
‘రక్తాలు తాగే’ రజాకార్లకు, భారత సైన్యానికి, ముస్లిములపై దాడులను, జరిగిన దోపిడీలను సామాన్య ప్రజలు కలిపేసి చూసారని పైన స్త్రీలు చెప్పిన తీరు బట్టి అర్ధం చెసుకోవచ్చా? రాజకీయ ఉద్యమాలతో సంబంధం లేని సామాన్య స్త్రీలుగా వారందరికీ రజాకార్ల ఉదంతం లో తాము, కుటుంబం, బంధువులు పడిన బాధ గుర్తుంది; ఎవరు ఎవరి తరపున పోరాడారు, ఎవరి రాజ్యం పొయ్యి, ఎవరి రాజ్యం వచ్చింది అన్న విషయాలు పట్ట లేదు. ఒక్కళ్ళు కూడా పోలీసు యాక్షన్ అన్న మాట కూడా అనలేదు. అలాగే స్వాతంత్ర్యం, విమోచన వంటి మాటలు కూడా చెప్పలెదు. వాళ్ళందరికీ ఆ సమయం అల్లర్లు, అశాంతి, గందరగోళ సమయం. ‘మాటలతో భయపెట్టిన’ సైన్యానికి, వచ్చి క్రూరత్వానికి ఒడిగట్టిన మరో సైన్యానికి మధ్య తేడాలుంటాయని గుర్తించే అవసరం లేకపోవటం వల్ల రజాకారు పేరుతోటే అందర్నీ, అన్నింటినీ – ‘రక్తాలు తీయటం, గాలి మోటార్లు రావటం, దోప్కాలవ్వటం, తురకోల్లు పోవటం’ – గుర్తుపెట్టుకున్నారా? ప్రజా సంస్కృతిలో కూడా ఆ సమయాన్ని, అప్పటి భయానక అనుభవాలని ‘వారి’ పేరుతోనే ‘జ్ఞాపకం’ పెట్టుకోవటం దీనికి దోహదం చేసిందా? 
పగలు రజాకార్లొచ్చేది, రాత్రి వాల్లొచ్చెది:
భారత సైన్యం, నిజాం పోలీసులు, రజాకార్లు మధ్య తేడా గుర్తించని స్త్రీల జ్ఞాపకాలు ఒకలా వుంటే, ఈ సమయం గురించి పెద్దగా ఎవరూ చర్చించని అనుభవాన్ని చవిచూసిన ఇంకొకావిడ ఘోష ఇంకోలా వుంది. ఇక్కడ రజాకార్లు, మహారాష్ట్ర నుండి వచ్చిన హైదరాబాదు స్వాతంత్ర సమర యోధులతో కలిసి కన్పిస్తారు.  ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన ప్రకటనకు స్పందించి గుంటూరులో తమకున్న రెండెకరాల పొలం అమ్ముకుని నిజామాబాద్ జిల్లాలో బోధన్ దగ్గర పదెకరాలు కొనుక్కుని స్థిరపడ్డ క్రిస్టియన్ కమ్మావిడ ఇనాసమ్మ చెప్పిన విషయాలు ఈ గందరగోళాన్ని వివరిస్తాయి. 1998 లో ఆవిడ రెండు మూడు సార్లు విడమరిచి  చెప్పినా నేను అర్ధం చేసుకోలేక పోయిన విషయాలు ఆవిడ ఇంటర్వ్యూ మళ్ళా చదివితే ఇప్పుడు బోధపడుతున్నాయి. ఎందుకంటే, భారత సైన్యం బ్రిటిషు వారు వెళ్ళిపోయిన తరువాత భారత దేశంలో కలవటానికి సందేహించిన హైదరాబాదు వంటి స్వతంత్ర రాజ్యాల పట్ల వ్యవహరించిన తీరు గురించి కాప్టెన్ పాండురంగా రెడ్డి వంటి వారు ఈ మధ్యనే కొంతమంది రాస్తున్నారు. భారత సైన్యాలు, రజాకార్ల వంటి పనులే హైదరాబాదు సరిహద్దుల్లో చేసాయని; రజాకార్లలో ముస్లిములు మాత్రమె లేరనీ, హిందువులు కూడా ఉన్నారనీ చెప్తున్నారు. హైదరాబాదు రాజ్య సరిహద్దుల్లో నివసించిన ఈవిడ మాటలు ఈ విషయాలకే  అద్దం పడతాయి.
“మేమొచ్చిన ఐదు సంవత్సరాలకి ఇక్కడ రజాకార్ల మూమెంట్ వచ్చింది. నెహ్రూకి చాలా లెటర్లు రాసాం. అయినా ఆయన ఏమీ చర్యలు తీసుకోలేదు. శాంతం, శాంతం అన్నడు. పటేలు మట్టుకు ఆయనికి చెప్పకుండా ఆర్డర్ ఇచ్చెసాడు… మావి ఇరవయి ఎనిమిది కుటుంబాలు… అందరూ కలిసి రజాకార్లు మన వూరికి రాకుండా చేసుకుందా మనుకున్నాము. పగులొస్తే ‘మాకు నాలుగు బస్తాల బియ్యం కావాలా’ అంటే మనం మన దగ్గరున్న వడ్లు తీసుకుపోయి మరకిచ్చి వాళ్ళకిచ్చి రావాల. ఈ రాజాకార్లని పెట్టుకుని మహారాష్ట్ర వోళ్ళు వచ్చేవారు దొంగతనాలు చెయ్యటానికి, రాత్రిళ్లు. మన దగ్గర పెద్ద డబ్బులేం ఉండేవి కాదు కదా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు పొలం మీద పెట్టటం తప్ప, వాళ్ళు దోచుకోవటానికి! ఇహ మాకు నాగలి మొద్దులు కావాలా అంటే పది మొద్దులు కొట్టుకు పోయి వాల్ల్లకేసి రావాల, తురకోళ్ళకి. అట్లా దౌర్జన్యంగా తీస్కునే వాళ్ళు గాని, మా ఊల్లో దొంగతనాలయ్యి ఎక్కువ జరగనియ్యలెదు. చుట్టూ కాపలా, రాత్రంతా కాపలా. ఐదు నెలలు కాసామమ్మాయ్ కాపలా, రాత్రంతా. ఏడు గంటల కల్లా అన్నాలయ్యీ తినేసి, ఆ పెద్ద పెద్దయ్యి వుంటాయి కదా, ఇత్తడివి అవి గుంటల్లో పెట్టి కప్పెట్టాం. పొద్దున్నే మళ్ళీ చీకటి తోటే లేచి ఆ గాదెలన్నీ బయటికి తీసేది, వంటలు చెసుకునెది… మాకు పారిపోటానికి వీల్లేకపోయింది”
ఇదంతా చాలామంది ఆంధ్రా వాళ్ళు, తెలంగాణలో గ్రామీణులు చెప్పే సంగతులే. భారత ప్రభుత్వం ఆర్ధిక బ్లాకేడ్ విధించటం వల్ల అనేక వస్తువులకి కటకటగా వుండేది ఆ రోజుల్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా వుండేది. ఈవిడ బంధువులు చాలా మంది ఆంధ్రాలో తమ తమ ఊర్లకి పారిపోయారు. నిజామాబాదు దూరమవ్వటంతో వీరి కుటుంబం వూరు వదిలి వెళ్ళలేదు. వారు వెళదామనుకున్నా కుదరలెదు. ఆవిడ భర్త నిజాం పోలీసుల దృష్టిలో వుండేవారు. ఎందుకు?
“ఈయన లీడరు..  ఏమయినా అయితే పదిమందిని వేసుకుని పొయ్యేది..  ఒక రోజు ఈయన్ని కొట్టారు పోలీసులు. అరెస్టు చెయ్యటానికి వారంటు తీసారు. ఆరుగురు పోలీసులు, ఒక సబ్ ఇన్స్పెక్టర్  ఇంటికొచ్చారు…మా పెద్దోళ్ళoదరూ ప్రార్ధనలు చెయ్యటం మొదలెట్టారు.. చివరికి చాయ్ తాగి వారంటు వెనక్కి తీసుకుని వెళ్లిపొయ్యారు”. అంత భయపెట్టే నిజాం పోలీసులు వారంటు వెనక్కి తీసుకొని ఎందుకెళ్ళిపోయారు అన్న ప్రశ్న ఆవిడకి రాలేదు. తన భర్తను పోలీసులు అరెస్టు చెయ్యటానికి కూడా ఆవిడ వేరే రకంగా కారణాలు వెతుక్కుంది, “అప్పుడందరూ ‘ఆళ్ళే’ కదా.. ఇప్పుడు స్వతంత్రం వచ్చె వరకు  కలెక్టరు, పెద్ద పెద్ద పోస్టులన్నీ ‘ఆళ్ళ’కే ఇచ్చారు కద. మనోళ్ళకి ఇయ్యలేదు కదా. ఆ నవాబు తురకోళ్ళకే ఎస్.ఐ పోస్టులిచ్చేవాడు. తతిమ్మా వాళ్ళందరూ ఇక్కడెవరు డెవలప్ కాలేదు కదా ఇక్కడ. అన్నీ ముస్లింలకే ఇచ్చేవాళ్ళు.. ఇహ మనం పోయి చెప్పుకోవటానికి ఎవర్లేరు. ఎవరున్నారు?”
మీ వూర్లో రజాకార్లుండేవాళ్ళా అంటే ఆవిడ ఇచ్చిన సమాధానం అత్యంత ఆశ్చర్యకరమయింది,
“మా వూర్లో అయితే, అస్సలు ముస్లిములే లెరు. ఒక్క ఫామిలీనే వుండేవాళ్ళు. కూలికీ, నాలికీ వచ్చే వోళ్ళే. … చిల్లర కులాల వాళ్ళు వుంటారు కదా, వాళ్లకి నెలకి ముప్పై రూపాయలు, ఒక మిలటరీ డ్రెస్సు, ఒక తుపాకి ఇవన్నీ ఇచ్చి వాళ్ళు వాళ్ళందర్నీ పెట్టుకున్నారు. ముస్లింలు ఎంతమందున్నారు లేకపోతె? హిందువుల్ని చేర్చుకున్నారు. ఏ కులమయినా గానీ ‘నేను రజాకార్లలో చేరతానం’ టే చాలు ఆళ్ళ పేర్లు రాసుకుని ఆళ్ల కో డ్రెస్సు, తుపాకి, కత్తి ఇచ్చేవాళ్ళు. అన్ని కులాల వాళ్ళు చేరిపొయెవాళ్లు,  ముప్పై రూపాయల జీతమిస్తారని. … ఆ రోజు రేడియోలో రజాకార్లందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోండి అని చెప్పారు. ఇక చూడు ఎక్కడ గుంట వుంటే అక్కడ ఏభై మంది ఆ డ్రెస్సులు, కత్తులు, తుపాకులు అయన్నీ పారేసేది”
ఆవిడ రాత్రి పూట దోపిడీకి ‘వాళ్ళు’ వచ్చారంటే, నేను ‘వాళ్ళు’ కూడా రజాకార్లే అనుకున్నాను విన్నప్పుడు. కానీ ఆవిడ చెప్పింది వేరు. కాంగ్రెసు, ఇతర హిందూ సంస్థలూ దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, హైదరాబాదు ‘విమోచన’ కోసం,  సైన్యం సహకారంతో నడిపిన కాంపులలో తయారయిన ‘యోధుల’ గురించి ఆవిడ మొత్తుకున్నది. ఆవిడ వాల్లెవ్వరో పేరు పెట్టి చెప్పలేకపోయారు. నేను కూడా ‘వాళ్ళ’ని హైదరాబాదు ‘స్వాతంత్ర సమర యోధులు’ లేదా విముక్తి కోసం పోరాడిన వారని గుర్తుపట్టలేక పొయాను. మొహమ్మద్ హైదర్ ‘అక్టోబరు కూ’ పుస్తకం (2012, రోలి బుక్స్) లో భారత దేశం ఏర్పాటు చేసిన ‘బార్డర్ కెంపులు’ గురించి చదివేదాకా. హైదరాబాదు రాజ్య చరిత్ర లో నిజాం రాజ్యాన్ని ‘విముక్తి’ చెయ్యటానికి ‘సర్వ శక్తులనూ’ ధారపోసిన యోధులుగా ఎవరినయితే వర్ణిస్తారో వారే వీరని ఇప్పుడు అర్ధమయింది. ఎందుకంటే, ఆవిడ స్పష్టంగా ఐదు నెలల పాటే ఈ కాపలా,  అనిశ్చితి, మహారాష్ట్ర దోపిడీల వున్నాయని చెప్పింది. ఇంతకీ ఆ ‘యోధులు’ చేసిందేమిటి?
 “వాళ్ళ పేరు పెట్టుకుని, మహారాష్ట్ర, నాందేడ్ వాళ్ళు ఎక్కువ దోపిడీ కొచ్చే వాళ్ళు. ఇక్కడ చిన్న చిన్న ఊళ్ళల్లో పటేళ్లకి బాగా బంగార ముంటుంది కదా.. వాళ్ళు తవ్వి పెట్టుకోవటమది. అది వీళ్ళు దోచుకుపోయ్యేవాళ్ళు.. ఈ రజాకార్లదేముంది? వస్తారు మాకిది కావాల, అది కావాల అంటే అది ఇయ్యాల.. మాకు నెయ్యి కావాలంటే అవి సప్లై చెయ్యాల.. కానీ వీళ్ళు బద్దెయ్యని తెసుసా.. ఆయన్ని కొట్టి నలభై ఐదు రూపాయలు తీస్కున్నారు.. హరి నారాయణని కొట్టారు, చాలా మందిని కొట్టారు”.
imagestel
స్వాతంత్ర సమరయోధులని మనం పుస్తకాల్లో రాసుకున్న వాళ్ళు చేసిన ఘనకార్యాలివి. నిజాము రాజ్యాన్ని అంతర్గతంగా అస్థిర పరిచి భారత సైన్యం కోసం సామాన్య ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కల్పించటంలో జరిగిన గెరిల్లా యుద్దం తీరిది. ఈ యుద్ధాన్ని ఆఖరి విమోచన పోరాటంగా హైదరాబాదు చరిత్రలో రాసుకోవటం జరిగింది. ఇవేవీ పట్టక పోయినా అప్పటి పరిస్థితిని చవిచూసిన సామాన్య స్త్రీ గా తనకే తెలియని చరిత్రని ఆవిడ ఈ విధంగా నాకు వర్ణించింది. నిజాం తరపున రజాకార్లు వున్నారని, ఆ బందిపోట్లు రజాకార్లని ఎదుర్కో వటానికి వచ్చారని తెలుసుకానీ,  ఆవిడకి (నాకు కూడా) వీళ్ళు ఎవరి తరపున పనిచేస్తున్నారో తెలియదు. ఇది రెండు రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధమనీ, ఆ యుద్ధంలో కొత్తగా ఏర్పడిన భారత దేశం గెరిల్లా పద్ధతిలో హైదరాబాదు రాజ్యాన్ని అస్థిర పరచటానికి ఈ దోపిడీలని ప్రోత్సహించిందనీ, ఆ యుద్ధంలో తాను కూడా పావునని ఆవిడకి, అందరి లాగే, అర్ధం కాలెదు. ఆవిడ కూడా చాలా సార్లు, ఆ పరిస్థితి నంతా ‘రజాకార్లు’ అన్న పదంతో ముడిపెట్టేసింది. అయితే చూసిన, అనుభవించిన విషయాల గురించి ఆవిడ చెప్పింది ఇప్పుడు చదివితే, ఆ సందిగ్ధ సమయపు రాజకీయాల నేపధ్యంలో అర్ధం చేసుకుంటే ఒకరి స్వాతంత్ర యోధులు, మరొకరికి దోపిడీ దారులు, దొంగలు అవుతారు కాబోలు అన్న అనుమానం తప్పకుండా వస్తుంది.
ఎవరో వచ్చి రక్షిస్తారని చాలా ఎదురు చూసినా, ఆవిడ పోలీసాక్షన్ తరువాత ముస్లిముల పరిస్థితి చూసి చాలా జాలి పడింది. చెడ్డ పనులు చేసిన ‘ముస్లిం’లని లైన్లల్లో నిలబెట్టి సైన్యం ఆయా గ్రామస్తులకి కర్రలిచ్చి కొట్టిచ్చారని చెప్పింది. తాను జాలిపడటం చూసి కొంత మంది ముస్లింలు ఆశ్చర్య పోయారంది.
“నాందేడ్ అవతల చాలా మందిని చంపారు. చాల మంది బోధన్ వచ్చారు. షుగర్ ఫాక్టరీ వుంది కదా, ఉద్యోగాలు దొరుకుతాయి కదా (అందుకని)… మాకు బోధన్ లో చేపలు అమ్మేవోళ్ళు, ఎండు చేపలు అమ్మేవోళ్ళు (చెప్పిందేంటంటే)  ‘నేను అరవై మందికి జీతాలిచ్చే వాణ్ణమ్మా. నాకు మిల్లుండేది. ఇప్పుడు నేను, నా భార్యా చేపలమ్ముకుని బతుకుతున్నాం అని చెప్పాడు. తాళాలమ్ముకునే అతను కూడా అదే చెప్పాడు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి పారిపోయి వచ్చారు. బోధన్ లో అప్పుడు ముస్లింలు తక్కువ. ఇప్పుడు సగం మంది వాళ్ళే. అక్కన్నుంచి పారిపోయి వచ్చి నోళ్లే. తల్లికి పిల్ల లేదు, పిల్లకి తల్లి లెదు. ఏద్దొరికితే అది”
వలస రైతు కుటుంబానికి చెందిన స్త్రీగా, ప్రాణాలతో పాటు, తమ ఉనికి ఏమయిపోతుందనే ప్రశ్న కూడా ఆవిడకి వచ్చింది. అయితే, ఆవిడ స్థానిక రాజకీయాలతో సంబంధం లేకపోవటం వల్ల, ప్రభావితం కాకపోవటం వల్ల హిందూ-ముస్లిముల సంబంధాలని కొంతలో కొంత పక్షపాతం లేకుండా అర్ధం చేసుకోవటానికి కూడా ప్రయత్నించింది. తన కుటుంబం, తానూ కూడా పెద్దగా నిజాం పోలీసుల వల్ల బాధ పడక పోవటం కూడా ఆవిడకి ఈ తటస్థత ను ఏర్పరిచి ఉండొచ్చు. స్వాతంత్ర్యమంటే, ‘మనోళ్ళు’ అధికారంలోకి రావటం అని ఆవిడ అర్ధం చేసుకుంది. మనోళ్ళు అంటే, ఆంధ్రా వాళ్ళా? హిందువులా? తాను హిందూ మతస్తురాలు కాకపోయినా ‘హిందువులు రాజ్యాధికారం లోకి రావటాన్ని’ మనోళ్ళు అనుకోవటానికి కారణమేమిటని నేనప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగుంటే బాగుండనిపిస్తోంది.
ఉస్మాన్ అలీ పాషా చనిపోయాడు, మా ఆయన నౌకరి పోయింది
పాత బస్తీ లో ముస్లిం స్త్రీలతో మాట్లాడినప్పుడు నేను అడక్కుండానే వాళ్ళు చెప్పిన విషయాలివి. అప్పట్లో కోవా సంస్థ లో పనిచేసే నూర్జహాన్ గారు నాకు వీరిని పరిచయం చెసారు. నా పరిశోధన గురించి వివరిస్తే వారు కుటుంబం గురించి మాట్లాడతారు అని నేననుకున్నాను, కానీ వారు ‘కుటుంబం, హింస, బాధలు’ వంటి మాటలు నా నోటి నుండి వినంగానే యాక్షన్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. యాక్షన్ తో వారి జీవితాలు అతలాకుతలమయ్యాయి, చితికిపొయాయి, పూర్తిగా రూపు మార్చుకున్నాయి, అన్నది వారు చెప్పిన మాటల సారాంశం. పది మంది స్త్రీలతో మాట్లాడితే, వారిలో ఐదుగురు యాక్షన్ గురించి మొదలు పెట్టి తమ జీవితాల గురించి మాట్లాడారు. తెలంగాణా గ్రామీణ ప్రాంత స్త్రీలతో మాట్లాడేటప్పుడు రజాకార్ల గురించి వారిని అడిగితే గానీ చెప్పలేదు. పోలీసు యాక్షన్ గురించి పైన వర్ణించిన ఆవిడ తప్ప వేరే వాళ్ళందరూ రజాకార్ల గురించి, తమ తమ ధైర్యం గురించి చెప్పుకున్నారు తప్ప, యాక్షన్ గురించి చెప్పలెదు. పాత బస్తీ స్త్రీలకి మాత్రం యాక్షన్ వారి జీవితాల్లోనే అతి పెద్ద ఉపద్రవం. వారి జీవితాలని అతి దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసిన ఉపద్రవం.
“బీదర్ జిల్లా కళ్యాణి లో వుండేవాళ్ళం మేము. మా నాన్న వూరి నవాబు దగ్గర వాచ్మన్ గా పని చెసె వాడు. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. అత్త గారింట్లోనే పెద్దమనిషి అయ్యాను. నా భర్త కూడా వూరి అమీన్ ఇంట్లో నౌకర్ గా పని చెసెవాదు. ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అప్పుడు మొదలయింది పోలీసు యాక్షన్. నా భర్త, మామ, మరిది అందరూ మరణించారు. ఎవరు ఎవర్ని చంపారో ఎవరికి తెలుసు? హిందూ మిలిటరీ వచ్చింది. జొన్న చేలల్లో దాక్కున్న వాళ్ళని కూడా వెతికి చంపారు. చాలా మంది పారిపొయారు. ఏమీ మిగల్లెదు – తినటానికి, కట్టుకోవటానికి, వుంటానికి. మాకు ఎనిమిది మామిడి చెట్లు ఉండేవి. అక్కడి హిందువులు లాగేసుకున్నారు. ఇక్కడికి పారిపోయి వచ్చాం. మక్కా మసీదులో ఉంటూ, పని కోసం వెతుక్కున్నాం. పాన్, బీడీ చేసే పని దొరికింది” – అయేషా బీ

“మాది బీదరు గ్రామం. మేము దర్జీలం. మేము బట్టలు కుడితే, ధాన్యం, పప్పు, పాలు, కూరలు ఇచ్చేవాళ్ళు, పైసలకి బదులు. పోలీసు యాక్షన్లో నాకు తొమ్మిదేళ్ళ పిల్లాడు, ఏడేళ్ళ పాప వున్నారు. పటేలింట్లో దాక్కున్నాం. మాకేం కానీయలె ఆయన. మా చిన్న మామ (మా భర్త బాబాయి) జొన్న చేలలో దాక్కుంటే ఆయన్ని తీసుకెళ్ళి పొయ్యారు. మళ్ళా ఎప్పడూ కనిపించలేదాయన. రైల్లో ఎక్కి ఇక్కడికొచ్చి బహదూర్ యార్ దేవ్డిలో ఉన్నాం. తరువాత నాకు చాలా మంది పిల్లలు పుట్టి చనిపొయ్యారు” – అమీనా బీ
“మాది హైదరాబాదే. ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లయింది. మా ఆయన హోం గార్డ్ గా చేస్తుండె. ఉస్మాన్ అలీ పాషా పోయిండు. మా ఆయన నౌకరి పోయింది. రిక్షా తొక్కిండు” – గౌసియ బేగం
“మాది బీదర్లో పేద వ్యవసాయ కార్మిక కుటుంబం. నన్ను మేనమామ కొడుక్కి ఇచ్చి పెళ్లి చెసారు. ఈ లోపల యాక్షన్ అయింది. హిందువులు మా వాళ్ళని చాల మందిని చంపేశారు –  మా తాత, చిన్న తాత, మామ చనిపొయారు. మా ఆయన కూడా చచ్చిపోయడనుకున్నాం. ఆయన హైదరాబాదు పారిపోయి వచ్చాడని మా దూరపు చుట్టం చెప్పాడు చాల రోజుల తర్వాత. అప్పుడు అందరం ఇక్కడికొచ్చి కలిసాం” – జరీనా బేగం
“మాది బీదర్ జిల్లా కల్యాణి. పేద కుటుంబం. పొలాల్లో పని చేసే వాళ్ళం. పోలీసు యాక్షన్ అప్పుడు ఏమైందో నాకు అంతా గుర్తుంది. ఎక్కడికి పారిపోయామో, ఏ ఊర్లల్లో దాక్కున్నామో అంతా.. మా మామ రసమ్ (తాంబూలాలు) అవుతుండే. కాల్పులు మొదలయినయ్. అన్ని ముస్లిముల ఇళ్ళని దోచుకున్నరు. ఆర్మీ వచ్చుండే. మేమందరం పారిపోయినం. మా ఇళ్ళల్లో ఏమి మిగల్లేదు. నాకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో ఏమీ తెలియదు. ఈ దోపిడీ, పారి పోవటం ఇదే గుర్తుంది” – చాంద్ బీ
హైదరాబాదు ఒక బహు భాషా రాజ్యం గా బ్రిటిషు వారి కనుసన్నల్లో నడుస్తూ ఉండింది. అంతర్జాతీయ రాజకీయాల్లో టర్కీ పతనం తర్వాత, బ్రిటిషు వారికి ‘హైదరబాదు రాజ్యం’ తాము ముస్లింలకు, ఇస్లాంకు వ్యతిరేకం కాదని చెప్పుకోవటానికి, కీలకంగా పరిణమించింది. ఆ సమయంలో పెరిగిన పరపతిని నిజాం సుస్థిర పరచుకుందామనుకున్నాడు కానీ ఆయనకి సాధ్య పడలేదు. జాతీయతా భావన వేళ్ళూనుకోని ఈ రాజ్యంలో మత సంస్కరణ పేరుతో వచ్చిన ఆర్య సమాజ ప్రభావం ఎక్కువగా ఉండింది. బ్రిటిషు ఇండియాలో జాతీయోద్యమ ప్రభావం పెరిగే కొద్దీ, ఇక్కడ కూడా ఆ ప్రభావం వచ్చింది కానీ వేరే రూపంలో వచ్చింది. అది 1930 లల్లో ఒక రూపు తీసుకుంది. ‘మత సంస్కరణ’ వెనక్కి పోయి, కాంగ్రెసు, ఇతర శక్తులు – ఉదారవాద ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని, సంస్కరణ లనూ సాధించుకోవటం కోసం ప్రజలను సమీకరించటానికి – మత పరమయిన భేదాలను వాడుకోవటం మొదలు పెట్టాయి. ‘తురక రాజుని’ ఎలాగయినా సింహాసనం దించాలని హిందూ సంస్థలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలంటే ‘రాజు’ ని ఎలాగయినా ప్రజలకి బాధ్యుడిని చెయ్యాలనే రాష్ట్ర కాంగ్రెసు ఈ ప్రయత్నంలో కలిసి పనిచెసాయి అని మార్గ్రిట్ పెర్నౌ (పాసింగ్ అఫ్ పాట్రి మోనియలిజం: పాలిటిక్స్ అండ్ పొలిటికల్ కల్చర్ ఇన్ హైదరాబాద్, మనోహర్ పబ్లికేషన్స్, 2000 ), లూసిఎన్ బెనిచౌ (ఫ్రం అటానమి తో ఇంటిగ్రేషన్, పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ 1938-1948, ఓరియంట్ లాంగ్మన్ 2000) అనే చరిత్రకారులు రాసారు. ఈ ప్రయత్నాలను ఎట్లాగయినా తిప్పి కొట్టాలని, హైదరాబాదు రాజ్య స్వతంత్రతను కాపాడాలని ఖాసిం రజ్వి రజాకార్ల ద్వారా ప్రయత్నించాడు. అందువల్లే, కుల మత విభేదాలు లేకుండా ఎవరి నయినా చేర్చుకున్నాడు ఆ సైన్యంలో. అయితే మత విభేదాల భూమికపై పనిచేస్తున్న ఉదార వాద హిందూ రాజకీయాలను 1947 తరువాత భారత ప్రభుత్వం (హైదరాబాదు రాజ్యాన్ని కలుపుకోవాలనే ప్రయత్నంలో) సమర్ధించింది. హైదరాబాదు రాజ్యానికి చుట్టూరా కాంపులు పెట్టి హైదరాబాదు ను అస్థిర పరచటానికి అవసరమయిన ఆయుధాలు, డబ్బు, ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళూ, భారత సైన్యం కలిసి సెప్టెంబర్ 17 తరువాత ఓడిపోయిన హైదరాబాదు రాజ్యంలో సాధారణ ముస్లింలపై చేసిన ప్రతీకార మారణ కాండకి నిదర్శనమే పాత బస్తి ముస్లిం స్త్రీల జీవిత అనుభవాలు.
పాత బస్తి స్త్రీలలో ఎవ్వరూ కూడా పెద్ద కుటుంబాలకి చెందినవారు కాదు. పటేళ్ళూ కాదు, పఠాన్లు కాదు, భూస్వాములూ కాదు. కొలువు వుండిన వాళ్ళు కూడా అతి తక్కువ స్థాయిలో ‘నౌకరి’ చేసుకుంటున్న కుటుంబాలకి చెందిన స్త్రీలు. వ్యవసాయపు పనులో, వేరే పనులో చేసుకుని పొట్టపోసుకునే శాంతమ్మ, నరసమ్మ, పోశమ్మ వంటి వాళ్ళే వీరందరూ కూడా. తరువాతి కాలంలో వీరి ఆర్ధిక, సామాజిక  స్థితి మరింత దిగజారింది. రెండు, మూడు తరాల వరకూ కూడా ఎవరూ కోలుకోలేదు. వీరి కుటుంబాల్లో ఎవ్వరూ డిగ్రీ చదివిన వారు గానీ, ఒక గవర్నమెంటు వుద్యోగం చేస్తున్న వారు గానీ లేరు. ఇంటర్వ్యూలు చేస్తున్న సమయంలో నాకు వారి బాధను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక వేరే విషయాలకు సంభాషణ మల్లించేసాను. ఇప్పటికి కూడా వీరి అనుభవాలని అర్ధం చేసుకోటానికి నాకు/మనకి ఏ సాధనాలూ లేవని, అసాధ్యమనే నాకు అనిపిస్తోంది. హైదరాబాదుకి వలస వచ్చిన స్త్రీలు వూరు, బంధువులు, కుటుంబం పోగొట్టుకుని దేశం కాని దేశంలో వచ్చీ రాని పని వెతుక్కుని ఎట్లా బ్రతికారు? అసలు తమనెందుకు బాధించారు అన్న విషయం కూడా అర్ధం చేసుకునే అవకాశం వారికి వచ్సిందా? వారి బాధను గురించి ఎవరూ అడక్క పోవటం వల్లనేనా, నేను కుటుంబం గురించి అడగ్గానే పోలీసు యాక్షన్ గురించి చెప్పారు? బాధ చెప్పుకునే అవకాశం కూడా లేకపోవటం దారుణం కదా? అసలు వారి బాధను పట్టుకునే భాష ఉందా మనకు? భాష కూడా ఇక్కడ ఈ స్త్రీలని వదిలెసిందేమో అనిపిస్తుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచుకుని, కన్నడ, తెలుగు, మరాఠీ వాళ్ళందరం ఎవరి భాషలో వాళ్ళు, వారి ఘోష, చరిత్ర, అనుభవాలు రాసుకోగలుగుతున్నాం. మరి  వీళ్ళు ఏ భాషా సంస్కృతిలో తమ బాధను వ్యక్తం చేసుకోగలరు?
1944-50 ల మధ్య జరిగిన విషయాల గురించి పైన చెప్పిన ప్రజా బాహుళ్యాని కున్న ‘కామన్ సెన్స్’ లో వీరి అనుభవాలకి, జీవితాలకి వున్నస్థానమేమిటి? ఇది ‘అనివార్యం’ అని లేదా ‘రజాకార్ల/ముస్లిం పోలీసు/ముస్లిం దొరల ఆధిపత్యానికి’ తగిన ప్రతీకారమే అని అందామా మనం కూడా? ఈ కామన్ సెన్స్ వివరణ సరయిందేనా? వీరు ముస్లింలే కానీ, పీడించేవారు కాదు. నిజాం అధికారం క్రింద ఉన్నవారే కానీ అధికారంలో భాగస్వాములు కాదు. మరి వీరిపై హింస ఎందుకు జరిగినట్లు? అంతే కాదు, ఇన్నాళ్ళకి కూడా, వారి బాధకు ‘మన’ భాషలో, కామన్ సెన్స్ లో గుర్తింపు ఎందుకు రాలేదు? వారిని కనీసం ‘బాధితులుగా’ ఎందుకు గుర్తించలేదు మనం? రజాకార్ల బాధితులు, నిజాం పోలీసుల బాధితులు, దొరల బాధితులకూ వున్న చోటు ఈ బాధితుల కెందుకు లేదు? మన కామన్ సెన్స్ ను ఏ విధంగా రూపు మారిస్తే వీరు తమ బాధను గురించి కనీసం చెప్పుకోగలుగుతారు?
ముస్లింలను నిజాము, రజాకార్ల వారసులుగా చూడొద్దని అనేకమంది ముస్లింవాదులు చెప్తూ వస్తున్నారు. దీన్నానుకుని వున్నఇంకొన్ని అంశాలను కూడా మనం పునరాలోచించు కోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోంది నాకు. 1944-50 సమయంలో జరిగిన అన్ని రకాల అలజడిని, హింసని, గందరగోళాన్ని’రజాకార్ల’కి అంటగడుతున్నామేమో అన్న ప్రశ్న మొదటిగా వెసుకోవాలి. ఆ సమయంలో భారత ప్రభుత్వం, కాంగ్రెసు పార్టి, కమ్యునిస్టు పార్టి, నిజాము ప్రభుత్వాల మధ్య – ఒకరి స్వాతంత్ర యోధులు మరొకరికి దోపిడీ దారులు. అప్పుడు సామాన్య ప్రజల జీవితాల్లో ఏర్పడిన గందరగోళానికి, జరిగిన అలజడిలో ఎవరి బాధ్యత ఎంతుందో కూడా ఆలోచించుకోవాలేమో. కేవలం విలీనం, విమోచన అని సెప్టెంబర్ 17 ను వర్ణించేటప్పుడు ఎవరి దృక్కోణం నుండి అన్న విషయం కూడా తప్పకుండా చర్చించాలి. ఈ రాజ్య విమోచన ముస్లిముల ప్రాణాల ఫణంగా జరిగినప్పుడు, అది బీదర్లో, వేరే చోటా జరిగిందని, తమకు సంబంధం లేదని తెలంగాణా వాదులు తప్పించుకునే అవకాశం లేదు. అప్పట్లో బీదర్, నాందేడ్, గుల్బర్గా ప్రాంతాల్లో నివశించిన ముస్లింలు సెప్టెంబర్ 17 తరువాత ఇప్పటి తెలంగాణ  జిల్లాలలోకి పారిపోయి వచ్చి తెలంగాణలో అంతర్ భాగమయి పోయిన తరువాత, వారి భయంకర అనుభవాలని, ఎదుర్కున్న హింసని తెలంగాణా చరిత్రకారులు గాని, తెలంగాణా వాదులు గాని ఎట్లా కొట్టిపడేయగలరు?
సెప్టెంబర్ 17 వస్తోందంటే చాలు ప్రతి తెలుగు వార్తా పత్రిక ఒక ‘రజాకార్’ దుర్మార్గాన్ని, ఒక నిజాం పోలీసుల కధనీ ప్రచురిస్తుంది. తెలంగాణా ప్రజలను, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, విలీనాన్ని సమర్ధించి తమ దేశ భక్తిని చాటుకున్నందుకు ‘జాతీయ గుర్తింపు’ నిచ్చి పొగుడుతుంది. పైన చర్చించిన స్త్రీల జ్ఞాపకాలు, అనుభవాలు ఈ జాతీయతా మూసలో ఇమడవే మరి! రజాకార్ల దౌర్జన్యాలు, నిజాం పోలీసుల అరాచకాలతో పాటు, విమోచన యోధుల దోపిడీలు, భారత సైన్యం దుర్మార్గాలు కూడా స్మరించుకోవాలి మనం. సాయుధ పోరాటం హైదరాబాదు విమోచన కోసం, ఆ రాజ్యాన్ని భారత దేశంలో కలపటానికీ రాలేదని, ప్రధానంగా దున్నే వారికి భూమి కోసం, ‘హిందూ’ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిందనీ గుర్తు చేసుకోవాలి. ఆలోచనా పరులైన తెలంగాణా వాదులు పదే పదే చెప్తున్నట్లు, ఈ ప్రాతం అనేక చరిత్రల చౌరస్తాలో ఉండింది, ఉంటూ వచ్చింది. ఇది జాతీయ వాద చరిత్రలోనో, హిందుత్వ వాద చరిత్రలోనో, వామ పక్ష చరిత్రలోనో వొదిగేది కాదు, ఏకోన్ముఖంగా వివరించగలిగేదీ కాదు. 1944-50 ల మధ్య సమయపు రాజకీయాలను కూడా బహు ముఖంగా, పలు కోణాల నుండి మాత్రమె చూడగలం. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించి, కొత్త చరిత్రలను రాసుకోబోతున్న తరుణంలో ఇటువంటి అవగాహన అలవరచుకోవటం బహుశా మరింత అవసరం. 
 
ఎ. సునీత

ఎ. సునీత

– సునీత అచ్యుత