మీ జాతి ఏది?! అని అడగొచ్చా!?!

సుధా శ్రీనాథ్ 

~

సుధా శ్రీనాథ్

సుధా శ్రీనాథ్

అది అక్టోబర్‌లోని మొదటి ఆదివారం కాబట్టి మా తెలుగు క్లాస్‌లో కబుర్లు మహాత్మా గాంధీజీ గురించి మొదలు పెట్టారు టీచర్. ఎప్పటిలా కొద్దిగా రాతలు, చదువులు అయిన తర్వాతనే మొదలయ్యాయి ఈ కబుర్లు. అది తెలుగు క్లాస్ అయినా కూడా ఈ కబుర్లెప్పుడూ తెలుగు ఇంగ్లిష్ కలిపిన తెంగ్లిష్లో ఉండేవి. పిల్లలకు మనలాగే అక్టోబర్ అంటే గాంధీ తాత గుర్తు రావాలని టీచర్ ఉద్దేశమట. అక్టోబర్ రెండున గాంధీ జయంతి అని గుర్తు చేసి అందరికీ స్వీట్స్ పంచారు టీచర్. అంతలో తలుపు తట్టి లోనికొచ్చారు డాక్టర్ షా. వారి వెనకాలే వచ్చారు వారి క్లాస్ విద్యార్థుల్లోని ఐదుగురు అమేరికాంధ్ర యువతీ యువకులు. ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ తజ్ఞుడైన డా. షా గారు కోవెల్లో ప్రతి ఆదివారం యువతకు మరియు వారి తల్లిదండ్రులకూ కలిపి భగవద్గీత క్లాస్ నడిపేవారు. వారి క్లాస్లో భారతీయులతో పాటు అమేరికన్లు కూడా ఉండేవారు. ఆయనతో వచ్చిన ఆ యువ విద్యార్థులకు మా క్లాస్లోని విద్యార్థులతో కలిసి మా కబుర్లలో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని కోరారు డాక్టర్ షా. ఇదే మొదటి సారి ఆయనిలా కోరడం. పిల్లలు తమలా అమేరికాలో పుట్టి పెరుగుతున్న యువత నుంచి విషయాలు తెల్సుకోవడం సులభమవుతుందని ఈ ప్రయత్నమని నవ్వారు డాక్టర్ షా గారు.

ఆ ఐదుగురు క్లాసుకు తమ పరిచయం తెలిపారు. వాళ్ళందరూ పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న హైస్కూల్ విద్యార్థులు. పిల్లల గమనం అందులో ఒకబ్బాయి వివేక్ చేతిలోనున్న మూడు కోతుల బొమ్మ పైనే ఉండింది. వివేక్ తాను తెచ్చిన మూడు కోతుల బొమ్మని పిల్లలకు చూపెట్టి ఇది గాంధీజీకి ప్రియమైన సిద్ధాంతమని తెలిపాడు.

“I know what is meant by these 3 wise monkeys. `see no evil, hear no evil, speak no evil’  చెబుతున్న చిన్నారి కళ్ళలో తనకిది తెలుసనే మెరుపు కనబడింది.

“దాన్నే తెలుగులో చెప్పాలంటే ‘చెడును చూడకూడదు; చెడును వినిపించుకోకూడదు; చెడును పలకకూడదు’ అని అర్థం.” పిల్లలు హైస్కూల్ అమ్మాయి వినీత అనువాదం వింటూ తలూపారు.

చెడుని పలకకూడదంటే అది మన కన్‌ట్రోల్లో ఉంటుంది. అయితే చెడును చూడ కూడదు, చెడు వినకూడంటే అది మన కన్‌ట్రోల్లో ఉండదు కదూ అని పిల్లలు ప్రశ్నించారు. అదీ నిజమే, మన చుట్టూ చెడు జరుగుతుంటే అదే కదా మన కళ్ళకు కనిపించేది. ఎవరైనా చెడ్డది మాట్లాడితే చెడు మనకి వినిపిస్తుంది. అంటే చెడు జరిగేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? చెడ్డ మాటలు వినిపిస్తే తక్షణమే చెవులు మూసుకోవాలా? పిల్లల్నుంచి ప్రశ్నలు ఒకటి తర్వాతొకటి రావడానికి మొదలయ్యాయి.

“కాదు. కాదు. మనం చెడ్డ సహవాసంలో ఉంటే కదా చెడుని వినడం, చెడుని చూడడమూనూ. మనం మంచి స్నేహితులతో ఉన్నామంటే అలాంటి సందర్భమే రాదు” తక్షణమే వివరించి చెప్పింది ఇంకో హైస్కూల్ అమ్మాయి లాస్య. “మనమేం చూస్తామో, ఏం వింటామో అదే కదా మన మాటల్లో కూడా ఉంటుంది. అందుకే మంచినే చూస్తూ, మంచినే వింటుంటే మనం మంచినే మాట్లాడుతాం. మంచితనమే మన మనసులోనూ, మన నడతలోనూ ఉంటుంది.” లాస్య మాటలను టీచర్ కొనసాగించారు.

“Gandhiji used this very principle by turning a blind eye and deaf ear to the colonial atrocities of the British. But he silently fought against the injustice in a peaceful nonviolent way until we got freedom.” ఇంకో హైస్కూల్ అబ్బాయి వివరణ గాంధీజీని స్వాతంత్ర్య యోధుడిగా పిల్లల ముందుకు తెచ్చి అతని మనోబలానికి తిరుగు లేదని నిరూపించేలాగుండింది.

గాంధీజీ ప్రపంచానికే అహింసా తత్వాన్ని చాటారని, మార్టిన్ లూతర్ కింగ్ జూనియర్ కూడా దాన్నే పాటించారని లాస్య అనగానే పిల్లలు మార్టిన్ లూతర్ కింగ్ గురించి తమకు తెల్సిన విషయాలు వల్లించసాగారు. అమేరికాలో చదువుతున్నారు కాబట్టి వర్ణబేధాలు నిర్మూలించేందుకని మార్టిన్ లూతర్ కింగ్ పోరాటం గురించి స్కూల్లో చదవడం వల్ల వాళ్ళందరికీ తెలుసు. మార్టిన్ లూతర్ కింగ్ గాంధీజీగారి శాంతియుత స్వతంత్ర పోరాటాన్నే ఆదర్శంగా పెట్టుకొని తమ పోరాటాన్ని కొనసాగించారని లాస్య పిల్లల మనసుకు నాటేలా చెప్పిందింకో సారి.

సమానత కోసం ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర పోరాటం  జరుగుతూనే ఉంటుందన్నాడో చిన్నారి. చేసే పనిని బట్టి వర్గీకరణానికి ఇప్పుడు అర్థం లేకపోయినా ఇండియాలో జాతి పద్ధతులు ఇంకా ఉన్నాయి. జాతుల బట్టి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. రాజకీయంలో కూడా జాతుల ప్రభావం చాలా ఉంటుందని ఆ విషయాలను చర్చించారు హైస్కూల్ పిల్లలు. చిన్న పిల్లలకు అదంత నచ్చ లేదు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి. గాంధీజీ అన్ని మతాలు, కులాలు ఒకటేనని చాటి ‘జాతిపిత’ గా జనాదరణ పొందారని తెలుపుతూ ఆ చర్చను త్వరగా ముగించేశారు.

“ఇండియాలో హిందువుల్లో ఒక్కటే కాదు, సంగీతంలో కూడా జాతులున్నాయి. అంటే శాస్త్రీయ సంగీతంలో తాళాల్లో కూడా జాతులున్నాయి.” వేసవి సెలవుల్లో తను తాతగారి ఊరెళ్ళినప్పుడు అక్కడ కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకొంటానని చెప్పింది పాప నవ్వులతో. తాళాల్లో లఘువు అనే అంశం ఉంది. లఘువులో ఉన్న అక్షర కాలాన్ని బట్టి తాళ విభజనలుంటాయి. ౩ అక్షరాల లఘువున్న తాళం త్రిశ్ర జాతి తాళమంటారు. అలాగే తాళంలో 4,5,7,9 అక్షరాల లఘువుంటే అది క్రమంగా చతురశ్ర, ఖండ, మిశ్ర మరియు సంకీర్ణ జాతి తాళమనాలి.

మన జాతిగోడల నుంచి దూరంగా అమేరికాలో పుట్టి పెరుగుతున్న మన పిల్లలకు జాతి విషయాలు బహుశః విచిత్రమనిపిస్తాయి. ‘జ’ అంటే పుట్టుక; పుట్టుక నుంచి వచ్చేది జాతి అన్న టీచర్ మాటకు తక్షణమే వచ్చింది ప్రశ్న. మన సంగీతంలో ఎందుకు జాతి అనే పేరుతో విభజన అని. ఏం చెప్పాలో తోచక నవ్వేశారావిడ.

“My mom uses jaati even for plants and animals. It’s just like we use the word family. For example, we say both lemon and orange belong to the same family of citrus fruits. She would say ‘అవి రెండూ ఒకే జాతి ఫ్రూట్స్’ అని.” పిల్లల నవ్వులెక్కువయ్యాయి.

“A cat and a tiger are from the same family according to the classification rules in biology. The classification is done depending on the similarity in certain key characteristics. But in everyday language, jaati is used interchangeably to mean a community or species. ” హైస్కూల్ విద్యార్థి పిల్లలకు అర్థమయ్యేలా స్కూల్లో నేర్చుకొనే వర్గీకరణ విధానం మరియు దైనందిన భాషలో వాడే విధానం వేరేగా ఉంటుందని వివరించాడు.

జాతుల గురించి పిల్లలకు వివరించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే జాతి విధానాల్ని ఒప్పుకోలేం, తప్పుకోలేం లాంటి స్థితిలో ఉన్న మనం తర్కబద్ధమైన వివరణ ఇచ్చేదెలా? మీ చుట్టుపక్కల నివసించే వాళ్ళ జాతి ఏదో మీకు తెలుస్తుందట ఇండియాలో, అదెలా సాధ్యమని అడిగారు మా విదేశీ ప్రొఫెసరొకాయన. కొన్ని సముదాయాల్లో జాతి పేరు కూడా పేర్లో ఒక భాగమై వాడబడుతుందని విని ఆశ్చర్యపడ్డారు. మీ దేశంలో మీ జాతి ఏది అని ఒకరినొకరు అడగొచ్చా అని కూడా అడిగారింకొకరు. అది వారి వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం చేసినట్టు కాదా అనడిగారు. మీది జాత్యాతీత దేశం కాబట్టి చట్టం ప్రకారం అందరూ సమానులు కదూ అని మా అమేరికన్ స్నేహితులడిగితే ఏమనాలో, ఎలా బదులివ్వాలో తెలియలేదు. కొన్ని ప్రశ్నలకు మౌనమే సరియైన బదులిస్తుంది. వివేక్ బోర్డ్ పైన ఏదో రాయడం చూసి నా ఆలోచనల నుంచి బయటికొచ్చాను.

బోర్డ్ పైన గాంధీజీని రాసి తనకిష్టమైన వారి మాటలను ఉల్లేఖించాడు వివేక్. అతి సులభంగా రెండే రెండు గీతల్లో రాసినట్టున్న ఆ గాంధీజీ బొమ్మ అందరికీ భలే నచ్చింది. అందరూ దాన్ని చూసి తమ నోట్‌బుక్లో అలాగే రాసుకొన్నారు.

హైస్కూల్ విద్యార్థి విజయ్ పిల్లలతో

జన్మనా జాయతే శూద్రః  కర్మణా ద్విజ ఉచ్యతే |

వేదపాఠాత్ భవేత్ విప్రః బ్రహ్మజ్ఞానేతి బ్రాహ్మణః ||

శ్లోకాన్ని చెప్పించి పుట్టుకవల్ల మనుషుల్ని విభజించకూడదని వాళ్ళు చేసే పనుల వల్ల ప్రతియొక్కరూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవచ్చనేది దీని అభిప్రాయమని విడదీసి చెప్పాడు. “At birth all is equal. But by their deeds they differ. We all have the same opportunity to become great. Anyone can become the highest class individual by doing the right things in life. ” తెలుగులో చెప్పినదాన్ని ఇంగ్లిష్‌లో కూడా చెప్పారు.

హిందువుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాల్గు వర్గాలుండేవి. ఈ శ్లోకం ప్రకారం పుట్టుకతో అందరూ శూద్రులే. వారు చేసే కర్మల వల్ల, వారి పఠనం మరియు సాధనల వల్ల బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రాహ్మణులవుతారని తెలిపారు టీచర్. మంచి నడవడికతో ఉంటూ, మంచి పనులు చేసి, సాధనతో మంచి జ్ఞానాన్ని పొంది శ్రేష్ఠులుగా జీవితాన్ని రూపొందించుకోవచ్చని దీని అర్థమన్నారు. బ్రహ్మ జ్ఞానమంటే ఏమన్న పిల్లల ప్రశ్నకు బ్రహ్మ జ్ఞానమంటే ఉన్నతమైనదని, దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిజాయితీతో ప్రయత్నించాలన్నారు. పరిసరా;అను పరిశుభ్రంగా ఉంచుకొని, పరిశుద్ధ మనస్సుతో సాగే బ్రతుకే పరిపూర్ణ జీవితమనవచ్చు. గాంధీజి బోధించినదీ, పాటించినదీ అదే. అందుకే ఆయన మహాత్ముడనిపించుకొన్నారు. అందర్నీ, అన్నిటినీ సమానంగా గౌరవించినప్పుడు అది క్రమేణా సాధ్యమవుతుందన్నారు టీచర్.

“అవును. మా తాతయ్య దీన్నే ఇంకోలా చెప్పారు. HEART and EARTH are anagrams. So, we have to care for the EARTH just like we care for HEART for good health. We become global citizens by respecting everything and everyone on the globe.” చిన్నారి చెప్పగా పిల్లలకది చాలా నచ్చినట్టనిపించింది. పిల్లలకలాగే. తమ తోటి పిల్లల మాటలు, మనస్సు త్వరగా అర్థమవుతాయి. అదీ గాక HEART and EARTH are anagrams అన్నది వాళ్ళకు అతిసులభంగా గుర్తుంటుంది.

ఆ రోజు హైస్కూల్ విద్యార్థులే టీచర్లలాగ పిల్లల జతలో చర్చల్లో పాల్గొనడం కొత్తగా అనిపించినా ఒక మంచి అనుభవాన్నిచ్చింది. ఏ విధమైన తయారీ లేకుండానే కబుర్లు బాగా జరిపారని డాక్టర్ షా గారు ప్రతియొక్కర్నీ పేరు పేరునా అభినందించారు. గాంధీజీ అలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత అంటూ, అది గాంధీజీకి పరమప్రియమైనదంటూ ఆ ఐదుగురు విద్యార్థులకు డా. షా గారు భగవద్గీత పుస్తకాలను ఇచ్చి గౌరవించారు కూడా.

దేశం వేరైనా, భాషలు వేరైనా మనుషుల భావనలొక్కటే. అన్ని చోట్లా అన్ని రకాల మనుషులుంటారు; విభజనలూ ఉంటాయి. ఎందరెట్లాంటి వాళ్ళనే శాతం కొంచెం మారుతుందంతే. మనం మంచి భావనలతో, మంచి పనులతో, ఈ విభజనలకు అంటీ అంటన్నట్టు ఉంటూ, ఆదర్శనీయమైన జీవితం ఎలా గడపాలని భగవద్గీతలో మీరందరు చదివి తెల్సుకోవాలి వాట్ని పాటించి మహాత్ములు కావాలన్న డాక్టర్ షా గారి మాటలతో ముగిసిందా క్లాస్.

*

 

 

 

 

 

9/11, నా నైల్ కటర్!

 

సుధా శ్రీనాథ్ 

 

sudhaమా ఊరి వైపు కొన్ని సముదాయాల్లో ఏడూ పదకొండనే expression ఎక్కువగా వాడుకలో ఉంది. కర్నాటక సరిహద్దుల్లో ఉన్నాం కాబట్టి ఇది అక్కడ్నుంచి అనువాదమై వచ్చిందనుకొంటా. నిరుపయుక్తం లేక సర్వనాశనమనే అర్థంతో దీన్ని వాడుతారు.

పాండవుల ఏడు అక్షౌహిణుల సైన్యం మరియు కౌరవుల పదకొండు అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్ర యుద్ధంలో పూర్తిగా నాశనమై పోయాయి; దానికి తోడు కురు వంశంలోని తమ బంధువర్గమంతా చంపబడిందని యుద్ధంలో గెల్చిన పాండవులకు ఏ విధమైన సంతోషమూ కల్గలేదనేది సూచిస్తూ మొదలయ్యిందట ఈ వాడుక. ఈ ఏడూ పదకొండనే వాడుక తెలుగువాళ్ళందరికీ తెలుసో, తెలీదో నాకు తెలీదు. అయితే నైన్ ఇలెవన్ లేక నైన్ ఒన్ ఒన్ అన్నామా తక్షణమే దాని అర్థం అమేరికాలో ఉన్న తెలుగువాళ్ళకే కాదు, అమేరికాలో ఉన్న ప్రతియొక్కరికీ తెలుసు. ఎందుకంటే అది అమేరికన్ ఎమర్జెన్సి హెల్ప్ లైన్. ఏదే విధమైన కష్టాలకి, ఏ సమయాల్లోనైనా కానీ మనం ఫోన్‌లో 911 నొక్కి, వారికి తెలిపామంటే మనకి సహాయం ఆఘమేఘాల మీద వచ్చేస్తుంది. అమేరికాలోని ఈ సహాయవాణి వ్యవస్థ మరియు సమయానికి సూక్త సహాయం అందించే వారి చాకచక్యతల ట్రైనింగ్ ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేదని నా అనేక విదేశీ స్నేహితులు చెప్పగా తెల్సింది.

2001 తర్వాత 911 (నైన్ ఇలెవన్) అంటే ఇంకో అర్థం కూడా మొదలయ్యింది. ఇప్పుడు నైన్ ఇలెవన్ అన్నామా తక్షణమే అమేరికన్స్ అందరికీ గుర్తొచ్చేది సెప్టెంబర్ పదకొండు, 2001. అమేరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నట్టి, ప్రపంచంలో అప్పటికి అత్యధిక ఎత్తున్న కట్టడాలైన world trade centerకి చేరిన రెండు టవర్స్ నేలగూలిన దినమది. అది భూకంపంవల్ల గానీ లేక కట్టడానికి చవక సామగ్రి వాడినందువల్ల గానీ లేక చవక పనితనం వల్ల గానీ కాలేదు. కొందరు ఉగ్రవాదులు/దుష్కర్ములు అమేరికా దేశపు విమానాలనే అపహరించి వాటినే ఆత్మహత్యాబాంబులుగా వాడి ఆ రెండు బృహత్ కట్టడాలను ధ్వంసం చేశారారోజు.  ఆ కరాళ కృత్యం వేలకొద్దీ అమాయకులను బలి తీసుకొని వట్టి అమేరికా దేశవాసుల్నొక్కటే కాదు మొత్తం ప్రపంచాన్నే భయ భీతులై వణికేట్టు చేసింది. మొత్తం నాలుగు నగరాల్లో ఒకే సారి విమానాలనుపయోగించి ఇట్లాంటి దాడులు చేసిన రోజది. తక్షణమే అమేరికా రక్షణ కార్యాలయం భద్రతాస్థాయిని పెంచి, ప్రజాభద్రతను ఒక పెద్ద సవాలుగా తీసుకొని, అప్రమత్తంగా ఉండి దేశప్రజల భద్రతకు ముప్పు రాకుండా కాపాడేందుకని నిర్విరామంగా కృషి చేసింది. మేమప్పుడు అమేరికా దేశపు టెక్సస్‌లో ఉన్న డాలస్ నగరంలో నివసించే వాళ్ళం.

నేను ప్రతి సాయంత్రం మా పాపను ఇంటి ప్రక్కనే ఉన్న వాగు దగ్గర కానీ లేక పోతే swimming pool వైపుకు కానీ ఆటాడేందుకు తీసుకెళ్ళేదాన్ని. మా ఇల్లు DFW airport నుంచి సుమారు పది మైళ్ళ దూరంలో ఉండింది. మా ఇంటి చుట్టుపక్కల నిలబడితే ఆకాశం నుండి రన్‍వేకు దిగేటటువంటి విమానాలు మరియు రన్‍వే నుండి ఆకాశానికెగిరే విమానాలు కూడా చక్కగా కనిపించేవి. డాలస్ ప్రపంచంలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. రోజుకు సుమారు ఏడు వేలు విమానాల రాకపోకలను నిర్వహించే సామర్థ్యంతో సకల ఆధునిక సౌకర్యాలతో కూడిన సమర్పకమైన వ్యవస్థ ఉన్నట్టి విమానాశ్రయమది. వీటిలో నాగరికుల స్వదేశీప్రయాణానికని అంటే అమేరికాలోని అన్ని ముఖ్య పట్టణాలకు వెళ్ళి వచ్చే విమానాలు కొన్నయితే, అంతర్రాష్ట్రీయ దూరాలు క్రమించే విమానాలు మరి కొన్ని. వీటితో పాటు సరుకుల్ని రవాణా చేసే విమానాలూ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజు ఏ సమయంలోనైన ఆకాశానికి ఎగిరే విమానాలు మరియు ఆకాశం నుండి దిగే విమానాలు కనపడ్డం సర్వసాధారణం.  నేను పాపకు కూడికలు, తీసివేతలు నేర్పేందుకు కొన్ని సార్లు చుట్టూ ఉన్న పువ్వులు, మొగ్గులూ వాడితే కొన్ని సార్లు ఆకాశంలో ఏరుతూ, దిగుతూ ఉన్న విమానాలను కూడా వాడేదాన్ని. పాపకు విమానాలతో లెక్కలు చేయడం భలే ముచ్చటగా ఉండేది.

అయితే ఆ రోజు సాయంత్రం ఆకాశంలో ఒక్క విమానమూ కనపడ లేదు. అక్కడొక్కటే కాదు, పూర్తి అమేరికా దేశపు ఆకాశంలోనే ఎక్కడా విమానాలుండలేదు. ఎందుకంటే ప్రజల సురక్షతా అంగంగా ఆ రోజు అమేరికా దేశపు ఆకాశ వీధుల్లో ఎగురుతున్న అన్నీ విమానాలూ భూస్పర్షం చేయాలని అమేరికా ప్రభుత్వం ఆదేశించింది. విమానాల కోసం ఆకాశంలో వెదుకుతున్న మా పాపకు దాని గురించి ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తోచలేదు. తన ప్రశ్నలకు బదులివ్వడం కష్టమై చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏదో కారణం చెప్పి త్వరగా ఇంటికి తీసుకొచ్చేశాను.

ఆ రోజు జరిగిన ఘటనను ఒక హెచ్చరికా గంటగా భావించి అమేరికన్ ప్రభుత్వం దేశపు భద్రతా వ్యవస్థల్లో చాలా మార్పులు, చేర్పులూ చేసింది. దేశ ప్రజల సురక్షత కోసమనే ఒక కొత్త ప్రభుత్వ శాఖను అస్తిత్వానికి తెచ్చి, సార్వజనిక ప్రదేశాల్లో అనేక కొత్త విధానాల ద్వారా రకరకాల తనిఖీలు ప్రవేశ పెట్టి మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని చోట్లయితే విదేశీయుల్లాగ కనబడే అందర్నీ అనుమానాస్పదంగా చూడటం, వారి పట్ల మళ్ళీ విపరీతంగా తనిఖీ చేయడం కూడా జరిగింది.

అన్యాయాన్నీ, అక్రమాల్నీ, అత్యాచారాల్నీ అరికట్టడానికి ఐకమత్యం అత్యవసరమన్న విషయం ఆ సమయంలో అమేరికన్స్ నిరూపించారు. ప్రభుత్వమిచ్చిన అన్ని ఆదేశాలనూ అక్షరాలా పాటించాలనే పట్టుదల మేం చూసిన ప్రతియొక్కరిలోనూ ఉట్టిపడుతూండేది. దేశప్రేమంటే ఇలా ఉండాలి అనిపించేది. చిన్న పిల్లల మనసుల్లో ఈ వార్తల వల్ల భయం గూడు కట్టుకోకూడదని ప్రథమ మహిళగా ఉన్న శ్రీమతి లారా బుష్ ఎలెమెంటరి స్కూల్ పిల్లలకు ప్రత్యేకంగా ఒక లేఖ పంపారు. జరిగిన దానికి చింతిస్తున్నామని, ఈ సమయంలో ఏ విధమైన భయము, సంశయాలు మనసులో ఉంచుకోకుండా ఒకరికొకరు స్నేహ సౌహార్దతలతో ఉంటూ, మంచి మనుషులుగా మెలగాలని మరియు మనసులో ఏ ఆతంకాలూ వద్దని రాసిన ఆ ఉత్తరం పాప స్కూల్‌నుంచి తెచ్చింది. అది చదివి పరమాశ్చర్యమయ్యింది. అతి సున్నితమైన పిల్లల మనసుకు, వారి భావాలకు ఇచ్చిన ప్రాముఖ్యతను చూసి ఏదో ఒక పవిత్ర కార్యాన్ని ప్రత్యక్షంగా చూసిన కృతార్థ సాక్షీ భావన మాదయ్యిందంటే అతిశయోక్తి కాదు. ఊరన్నాక పెంట కుప్ప ఉండే ఉంటుందన్నట్టు తప్పుడు అభిప్రాయాల మూలంగా ఒకటి రెండు విద్వేషకారి ఘటనలు అక్కడక్కడ జరిగాయి, అయితే మంచికి పోల్చితే అవి చాలా తక్కువ.

ఆ ఉగ్రవాదుల దుష్కృత్యం వల్ల ఎచ్చెత్తుకొన్న ప్రభుత్వం నాగరికుల సురక్షత కోసం నాగరిక మరియు వాణిజ్య విమానయానంలోనైతే నాటకీయ మార్పులను తెచ్చింది. ప్రయాణికులను మరియు వారి చేతిసంచులను లోహపు యంత్రాల ద్వారా చూసిన తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా కూడా తనిఖీ చేసి ఆయుధంగా వాడేందుకు సాధ్యం కావచ్చనుకొనే అన్ని వస్తువులనూ అడ్డుకొంది. ఈ తనిఖీలు రోజు రోజుకూ ఎక్కువవుతూనే పోయాయి. విమానంలోని కాక్‍పిట్ సురక్షత కోసం ప్రత్యేక భద్రతావ్యవస్థల్ని చేకూర్చారు. ప్రయాణికుల చలనవలనాల్ని గమనించి పరీక్షించేందుకని సరికొత్త తంత్రజ్ఞానంతో ఉన్న యంత్రాలు, వ్యక్తిగత పరీక్షలు, ఎక్కువ నియమాలూ కూడా వచ్చి అదనంగా రెండు గంటల సమయం వీటికని కేటాయించాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో విమానయానమంటేనే భయము, చిరాకూ ఎక్కువయ్యాయి.

జాకెట్, శూస్ విప్పి X-ray detector ద్వారా తనిఖీ చేయడం కూడా మొదలయ్యింది. పదునుగా ఉన్న చాకు, కత్తెరలాంటివి విమానం లోనికి తీసుకెళ్ళేందుకు నిషేధింపబడ్డాయి. ఏయే రీతిన ఉగ్రవాదులు దుష్కృత్యాలకు తలపెట్టొచ్చని వివిధ కోణాల్నుంచి ఆలోచించి అటువంటి వాటిని అడ్డుకొనేందుకు ఆయారీతుల్లో సురక్షతాక్రమాల్ని అన్ని ప్రదేశాల్లోనూ జారీ చేశారు. విమానంలో ప్రయాణికుల ద్రవ్య పదార్థాల నిషేధమూ ఆ పట్టికలో చేరింది. అనుమానం వస్తే భద్రతాధికార్లు ప్రయాణికులను రెండ్రెండు సార్లు తనిఖీ చేయడం కూడా జరుగుతూండేది. ఇవన్నీ ఒక్కో సారి ఆక్రోశం కల్గ జేసి, వివాదాలు సృష్టించి, గొడవలైన ప్రసంగాలు కూడా జరిగాయి. అయితే ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి మన మంచికే అనే వాదమే ఆఖరుకు గెలిచేది. సురక్షత జీవితంలో ఒక ప్రముఖమైన అంగం.  అది లేక పోతే జీవితంలో శాంతి సమాధానాలుండవు. అందుకే, ఇరు రాజకీయ పక్షాలు ఒక్కుమ్మడిగా ఏకీభవించి దేశభద్రతనే మూల మంత్రంగా భావించి ఆ దిశకు సమాన భాగస్వాములై కృషి చేశాయి.  రోజుకొక కొత్త తనిఖీ విధానం జారీ అయి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా కూడా ఆఫీసర్లకు తాము చేపట్టిన వృత్తి పరంగా ఉన్న నిబద్ధత అభినందనార్హం. మొత్తానికి అందరూ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలను పాటించడం వల్ల మళ్ళీ అట్లాంటి అహితకర ఘటనలు దేశంలో జరగకుండేట్టు చూసుకొని ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడింది.

ఇంతగా పీఠిక ఎందుకు వేశానంటే నాదైన ఒక చిన్ని విశేషానుభవాన్ని మీతో పంచుకోవాలని. మేం ప్రతి సంవత్సరం ఏప్రిల్ – మే నెలల్లో భారత దేశానికి ప్రయాణం పెట్టుకొనే వాళ్ళం. అప్పుడిక్కడ పిల్లలకు బడి సెలవు కాబట్టి మా పాప కజిన్స్‌తో బాగా ఆటాడేందుకు అవకాశం దొరికేది. ఆ సంవత్సరమూ ఎప్పటిలా మేం సెలవులకని ఊరికి బయలుదేరాం. విమానాశ్రయంలో ప్రయాణికుల సురక్షత కోసం నేపథ్యంలో ఎన్నో రకాల కొత్త ప్రకటనలు చేస్తున్నారు. యథా ప్రకారం మా సూట్‍కేసులను ఎక్స్ రే కళ్ళతో చూసిన తర్వాత వాటిని తెరచి కూలంకుశంగా పరీక్షా దృష్టితో తనిఖీ చేశారు.

 తర్వాత మా హ్యాండ్‌బ్యాగుల్ని X-ray detector మూలకంగా పంపినప్పుడు మా ఆయన శేవింగ్ సెట్నుంచి కత్తెర తీసి, దాన్ని విమానంలోకి తీసుకెళ్ళేట్టులేదన్నారు. నా బ్యాగ్లో కూడా ఏదో పదునైన వస్తువు ఉందని వెదికి తుదకు బయటికి తీశారు ఒక చిన్ని నైల్‍కటర్ని. దాంట్లో ఒక చిన్ని చాకు ఉన్నందువల్ల విమానంలోనికి నైల్‍కటర్ తీసుకెళ్ళేందుకు అనుమతి లేదని అక్కడి భద్రతాధికారి నాకు తెలిపారు. అది మా నాన్నగారు నాకు చిన్నప్పుడు కొనిపెట్టిన ఒక చిన్ని నైల్‍కటర్. అది బాగా పదునుగా ఉండి, గోర్లను చాలా బాగా కత్తరించేది. అందుకని దాన్ని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకొనొచ్చాను. అది నా బ్యాగ్‌లో కూర్చొని నా జతలో నేను వెళ్ళిన పాఠశాలకు, కాలేజికి కూడా వచ్చింది.  నేను మానసగంగోత్రిలో చదివినప్పుడు మరియు టాటా ఇన్‍స్టిట్యూట్‍లో చదివేటప్పుడు కూడా నాతోనే ఉండింది.

నేను ఎక్కడికెళ్తే నాతో అక్కడికొచ్చి సహాయపడిన నా నేస్తమది. అందుకే నాతో అమేరికాకొచ్చింది, ఇప్పుడు కూడా నాతో ఉంది నా జీవన సంగాతిలాగ. దాంట్లో ఉన్న చిన్ని చాకు నాకు ఎన్నో చోట్ల యాపిల్ మరియు జామ పండ్లు తరిగేందుక్కూడా ఉపయోగపడింది. అది నాతో ఎన్నో విమానయానాలు కూడా చేసింది. మొత్తానికి అది నాకు అచ్చుమెచ్చైన నైల్‍కటర్. అది నాతో ఉన్న సుమారు ఇరవై ఏళ్ళలో నా స్నేహితులెందరో కూడా దాన్ని వాడి మెచ్చుకొన్నారు. ఆఖరుకు నా ఈ నేస్తానికి విదాయం చెప్పాల్సిన సమయమొచ్చిందని బాధయ్యింది. మా ఆయనేమో తన కత్తెరని అక్కడే పడేశారు. వేరే దారి లేక, నా నైల్‍కటర్ని కూడా అక్కడే పడేయాలి కదాని దాన్ని ఆ భద్రతాధికారి నుండి తీసుకొని నా పిడికిట్లో ఉంచుకొని ఒక క్షణం భావుకురాలినై కళ్ళు మూసుకొని మనసులోనే దానికి వీడ్కోలు చెప్పి మళ్ళీ అతనికిచ్చేశాను.

అతి సామాన్యమైన చిన్ని నైల్‌కటర్ అని అతననుకొన్నాడేమోనని అసలు విషయం అతనితో చెప్పాను. మా కళ్ళ ముందే ఇలాంటి నిషేధింప బడ్డ లోహపు వస్తువులను ఒక ప్రత్యేకమైన చెత్త బుట్టలో వేయడం చూశాను. అందులోని స్టీల్ వస్తువులన్నీ మిరమిర మెరుస్తున్నాయి. మా ఆయన కొత్త కత్తెర కూడా అందులోనే వేయబడింది. ఆ బుట్టలో చిన్ని చిన్ని నైల్‌కటర్స్, ప్లక్కర్స్, కత్తెరలు ఉండటం చూసి దీనిక్కూడా అదే గతి పడుతుందనుకొన్నాను. ప్రయాణికుల రక్షణ కోసం అన్ని నియమాల్ని పాటించేలా చూడటం మా కర్తవ్యం కాబట్టి మీ మనసుకు నొప్పి కల్గిస్తున్న మమ్మల్ని క్షమించండంటూ ‘సారీ’ చెప్పాడతను. అమేరికన్లకు మనకంటే మంచి మాటకారితనముందని నా అభిప్రాయం. వారి శిక్షణ పద్ధతులు చిన్నప్పుడే అందరికీ మంచి సంవహనా కౌశల్యాన్ని సహజంగా పెంపొందేట్టు చేస్తాయని మా పాప స్కూల్లో ఉన్నప్పుడు గమనించాను. ఎన్నో సన్నివేశాల్లో వారి మాటలు ఇష్టమైనప్పుడు నాకు సుమతి శతకంలోని పద్యం

ఎప్పటికెయ్యది ప్రస్తుత

మప్పటికా మాటలాడి అన్యుల మనముల్

నొప్పించక తా నొవ్వక

తప్పించుకు తిరుగు వాడే ధన్యుడు సుమతీ|

గుర్తొచ్చేది. ఇప్పుడు కూడా అతను నాకు ఎంత చక్కగా చెప్పారంటే ఇట్లాంటి సందర్భంలో ఒక చిన్ని నైల్‍కటర్ కోసం నేనంతగా బాధపడకూడదని నన్ను నేనే సమాధానపరచుకొన్నాను.

మేమెక్కాల్సిన విమానానికని ఉన్న ద్వారం వద్ద సెక్యూరిటి లౌంజ్‌లోకెళ్ళి కూర్చొని సుమారు అర్ధ గంట సమయం అయ్యుంటుంది. నా నైల్‍కటర్ తీసుకొన్న సెక్యూరిటి ఆఫీసర్ పరుగులతో వచ్చి నా చేయి లాగి అరచేతిలో ఏదో పెట్టారు. అతడి కళ్ళలో ఆనందం! అతని ముఖంపై ఏదో సాధించానన్న సంతోషం! అతడు నా చేతిలో ఉంచింది నా నైల్‍కటర్ ఉన్న ఒక చిన్ని పాలిథిన్ బ్యాగ్!

“We do respect your feelings for your family, M’am. I explained to my boss that this was a gift from your dad which you have treasured for 2 decades. He allowed me to remove the knife from this and return it to you.” అన్నారు. నేనడక్కపోయినా నా చిన్ని నైల్‍కటర్ మళ్ళీ నాకు దక్కేలా చేసిన ఆ ఆఫీసర్ మానవీయతకు అంజలీహస్తంతో థ్యాంక్స్ చెప్పాను. “namaste M’am! Have a nice trip home! ” నవ్వుతూ వెళ్ళిపోయాడతను. జరిగింది జీర్ణించుకోవడానికి నాకు కొన్ని నిమిషాలు పట్టింది.

నాకూ ఆ సెక్యూరిటీ ఆఫీసర్‌కూ ఏ విధమైన పరిచయమూ లేదు. రోజూ అతను చూస్తున్న వందలాది భారతీయ ప్రయాణికుల్లో నేనూ ఒక సామాన్య ప్రయాణికురాలినంతే. ప్రతి చిన్న విషయాన్నీ సూక్ష్మాతిసూక్షంగా గమనించి సందేహించే ఈ పరిస్థితుల్లో అతను నా చిన్ని నైల్‌కటర్ కోసం అదనంగా శ్రమ పడటం ఆశ్చర్యాన్నిచ్చింది. తన బాస్‌తో అనుమతి కోసం ప్రయత్నించి, ఒప్పించి, దాంట్లో ఉన్న చాకును తీయించి, దాన్ని నాకు తెచ్చిచ్చేలా చేసిన ఆ ప్రేరణా శక్తి అతనికి ఎక్కడ్నుంచి వచ్చిందా అని ఆలోచించాను. బహుశః అతను తల్లిదండ్రులపై ప్రేమాదరాలు కల్గియున్న వ్యక్తియై ఉండాలి. లేదా, అతని మనస్సులో మన దేశంపైనున్న గౌరవం అతనితో ఈ పని చేయించి ఉండాలి. కారణం ఏదైనా, నా భారతీయతపై అభిమానమున్న నాకు ఆ రోజు కొమ్ములొచ్చేదొక్కటే తక్కువ.

దాదాపు ఒక శతాబ్ధం మునుపు సెప్టెంబర్ పదకొండవ తేదీన శికాగో నగరంలో భారతీయ మౌల్యాలను ప్రపంచానికే ఎలుగెత్తి చాటిన స్వామి వివేకానందుడి వివేక వాణి నా చెవుల్లో మారుమ్రోగి, ప్రేక్షకుల కరతాడన ధ్వనులు నా చుట్టూ ప్రతిధ్వనించాయి. స్వామి వివేకానందుడే కళ్ళముందు మెదిలినట్టయ్యింది. ఆ మహా చేతనానికి చేతులెత్తి దండం పెట్టాను. దేశభాషలు వేరైనా, వేషభూషణాలు వేరైనా కౌటుంబిక మౌల్యాల పట్ల మనుషుల భావనలొక్కటే అనిపించినా నా భారతీయత పట్ల గర్వ పడ్డాను. నేను మళ్ళీ ఎన్నో సార్లు అదే airport మూలంగా ప్రయాణం చేశాను. అతను మళ్ళీ ఎప్పుడూ కనపడలేదు; అంత పెద్ద airportలో ఒక సారి చూసిన వాళ్ళనే మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా చూసే అవకాశం తక్కువే. ఇది జరిగి పద్నాలుగేళ్ళయినా ఆ రోజు, ఆ అనుభవం నా మనస్సులో అచ్చొత్తినట్టు నిల్చి పోయింది.

మా నాన్నగారిప్పుడు లేక పోయినా ఆ నైల్‍కటర్ నాతో ఉంది. అందులో ఇప్పుడు చాకుది ఒక చిన్ని తునక ఉందంతే. అంటే దాంట్లో ఉన్న చాకుని కట్ చేసి నాకిచ్చారన్న మాట. చాకు లేకపోయినా, నైల్‌కటర్ మాత్రం తన సేవలను యథాప్రకారం కొనసాగిస్తోంది. మా మాటల్లో దానికిప్పుడు వివేకానంద నైల్‌కటర్ అని నామకరణం కూడా అయ్యింది.

*

 

 

“చేత” కాదు..”కాలు” కాదు!

 

సుధా శ్రీనాథ్ 

sudha “నాన్న ఈ రోజు గుడికి కాలి నడకన వస్తారంట.  Even though the weather is so very good to take a long walk, మళ్ళీ అంత దూరం నడిచేందుకు నాకు మనసు లేదు; మన చేత కాదు కూడా. మనమిద్దరం కార్లో వెళ్దాం. క్లాస్‍కు లేట్ కాకూడదు. ఇవ్వాళ మీకు భగవద్గీత స్పర్ధలున్నాయి కదూ.” మనసులోని మాటను పాపతో చెప్పాను.

అమేరికాకు వచ్చిన తర్వాత మేం నడవడమే తగ్గి పోయింది. స్కూల్ కాలేజీలకెళ్ళాలన్నా కారెక్కాలి. కొత్తిమేర కూర తీసుకు రావాలన్నా కారెక్కాలి. ఏం కొనాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా కారెక్కాలి. నడుచుకొనెళ్ళి కలవాలంటే దగ్గర్లో ఎవ్వరూ లేరు, నడుచుకొనెళ్ళి చేసుకొచ్చే పనులయితే అస్సల్లేవు. అందుకని ఒక ఆదివారం రోజు DFW Hindu temple కు కాలి నడకనే వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు శ్రీనాథ్ గారు. తెల్లవార్నే లేచి, త్వరగా తయారై, తిండి తిని ముందుగానే బయలుదేరారు పది గంటలకు మొదలయ్యే క్లాస్‌కని. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నా కూడా ఇదే మొదటి సారి ఆయనిలా కాలి నడకన బయలుదేరడం. అప్పుడు మేం అర్వింగ్‍లోని Las Colinas లో ఉన్నాం. ఇంటి నుంచి గుడికి సుమారు పది మైళ్ళ దూరం. మేమిద్దరం కార్లో వేళ్ళేటప్పుడు దారి పొడుగునా నాన్న కోసం వెదుకుతూనే వచ్చింది పాప. MacArthur రోడ్డు ప్రక్కన ఆయన కనపడగానే తనకు ఎనలేని సంతోషం. “అమ్మా! మనం కూడా నాన్న జతలో ఇక్కడ్నుంచి నడుద్దామా?” నాన్నని చూస్తున్నట్టే చటుక్కున దూసుకొచ్చింది ప్రశ్న వెనక సీట్లో కూర్చొన్న పాపనుంచి. అమేరికాలో పిల్లల సురక్షతా దృష్టితో పన్నెండేళ్ళ వయసు లేక 135 cms ఎత్తు వచ్చేంత వరకు పిల్లలు కార్లో ముందు సీట్లో కూర్చొని ప్రయాణించేట్టు లేదు. సురక్షతా నియమాల్ని అందరూ పాటిస్తారు. నియమాల్ని ఉల్లంఘిస్తే పెనాల్టీస్ చాలా ఎక్కువ.

“నా చేత కాదు పాపడూ అంత దూరం నడిచేందుకు. అదీగాక కారిక్కడెక్కడో పార్క్ చేసి వేళ్తే మళ్ళీ ఇక్కడిదాకా నడిచి రావాలి, లేక పోతే ఎవరి కార్లోనైనా ఇక్కడి వరకూ రావాలి. ఎందుకవన్నీ లేని పోని కష్టాలు.” తనని disappoint చేసినా పర్వాలేదని అద్దంలో తనని చూస్తూ నిజం చెప్పాను. పాపలో సహకరించే గుణం చాలా ఉండింది. ఒక క్షణం తన కళ్ళలో నిరాశ కనపడి మాయమైంది.

“నడిచేది కాళ్ళతో కదూ అమ్మా? నువ్వెందుకు ‘చేత కాదు’ చేతకాదని అంటావు? ‘నా కాళ్ళక్కాదు’ అని అంటే తప్పా?” మొదలయ్యాయి బేతాళ ప్రశ్నలు.

“అవునమ్ములూ. నువ్వన్న మాట నిజమే. అయితే నాకు సాధ్యం కాదు అనే అర్థంతో మేమలా వాడుతాం. నా వల్ల కాదని కూడా అంటారనుకో. కొన్ని expressions వాడుక వల్ల dictionary meaning కంటే పూర్తిగా వేరే అర్థాన్నిస్తాయి. అది రోజూ తెలుగు మాట్లాడటం వల్ల రాను రాను నీకే తెలుస్తుంది. ఇది can’t అనే అర్థంతో వాడుతాం.”

ఆహా! అందుకే కాబోలు ఏదైనా తినేందుకెక్కువనిపిస్తే కూడా నా చేతకాదంటారు కదూ అని ఇంకో ఉదాహరణమిచ్చింది తనే.

ఆ రోజు భగవద్గీత శ్లోకాల స్పర్ధలో క్లాస్‌లోని పిల్లలందరూ పాల్గొన్నారు. పిల్లలు భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేసుకొని స్పష్టమైన ఉచ్ఛారణతో పలకడం విని, ఆ రోజు జడ్జిగా వచ్చిన చిన్మయానికేతన్ స్వామీజీ పరమానందంతో ప్రశంసించారు. తక్కువ సమయంలో ఇరవై శ్లోకాల్ని కంఠస్థం చేయడం పిల్లల ఆసక్తి మరియు ఏకాగ్రతలను తెలుపుతుందన్నారు. ఏకాగ్రత లేనివారికి ఇంత బాగా నేర్చుకోవడం చేతకాదని టీచర్ చెప్పగా విని పాప నా వైపు చూసింది. ఇక్కడ కూడా ‘చేతకాదు’ అనే వాడారనే అర్థం ఆ చిలిపి కళ్ళలో.

తర్వాత భోజనాలప్పుడొచ్చింది ఇంకో ప్రశ్న. ఇంగ్లిష్‌లో ‘నంచుకుని’ అనేందుకేమనాలి అని. అది పూర్తిగా భారతీయ పదమని దాన్ని అనువాదం చేయడం నా చేత కాదని నవ్వాను. పెరుగన్నానికి గోంగూర లేక ఆవకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలా నంచుకోవడం తనకిష్టమనే విషయం తన అమేరికన్ స్నేహితులకు చెప్పాలని పాప ఆరాటం. ‘Pickles add special taste to yogurt rice. I like it.’ అని అనాలంతే. మనం రోజూ వాడే కొన్ని తెలుగు పదాలను ఇంగ్లిష్‌లోకి మార్చేందుకు సాధ్యం కాదన్న మాట అనింది పాప. అవును. ఏ భాషే కానీ ఆ భాషను వాడే ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేలాగుంటుంది. మన వాడుకలను సూచించే పదాలు మన భాషలో ఉంటాయంతే. మనలా రొట్టెకు కూర నంచుకోవడం మరియు పెరుగన్నానికి ఆవగాయ నంచుకొని తినడంలాంటి పద్ధతులు బహుశః వేరెక్కడా ఉన్నట్టు లేవు. విదేశీ భాషల్లో దాన్ని సూచించే పదం లేనప్పుడు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అమేరికాలో ఉన్నందువల్ల పిల్లలు తెలుగు వినడం తక్కువ, మాట్లాడటం ఇంకా తక్కువ. మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు వాళ్ళకు అడుగడుగునా అడ్డంకుల్లా చిన్ని చిన్ని సంశయాలు తలెత్తుతూనే ఉంటాయి. అవి ప్రశ్నలై బయటికొస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సరియైన బదులిచ్చేందుకు మనం మన వంతు ప్రయత్నం చేయలేదంటే వారి ఆసక్తికది వెనుకబాటు. వాళ్ళెక్కువగా వినే భాష English కాబట్టి తెలుగు పదాల్ని, వాక్యాల్ని ఇంగ్లిష్ పదాలతో, వాక్యాలతో పోల్చి చూసి, ఎక్కడెక్కడ పొందిక లేదనిపిస్తుందో అక్కడ కుతూహలంతో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఆ ప్రశ్నలకు వాళ్ళకర్థమయ్యేటట్టు బదులిచ్చే తెలివి కానీ, ఓపిక గానీ నాకుండలేదు. అయితే పిల్లలకు మన భాష నేర్పేందుకని క్లాస్ మొదలయ్యాక తొలి దశలోనే వాళ్ళ సంశయాలను పరిహరించాలనే ఉద్దేశంతో అవి రెండింటినీ ప్రజ్ఞాపూర్వకంగా కొద్ది కొద్దిగా నేర్చుకోవాల్సి వచ్చింది.

buduguపిల్లలు మనూర్లో పెరిగితే అవంతట అవే తెలిసే పదాలు, వాడుకలూ కూడా ఇక్కడ తగినంత పరిశ్రమ వేసి నేర్చుకోవాలి. బహుశః అమేరికాంధ్ర తల్లిదండ్రులందరూ దీన్ని గమనించి ఉంటారు. అమేరికాంధ్రుల పిల్లల ప్రశ్నల styleఏ వేరేనని చెప్పక్కర్లేదు. ఈ పిల్లలు గమనించినంత సూక్ష్మాతిసూక్ష్మాలు ఆ వయసులో నేను గమనించలేదనేది నూటికి నూరు పాళ్ళు సత్యం. ఒక్కోసారి వీళ్ళ ముందు మనం చాలా మొరటనిపిస్తుంది కూడా. To tell you the truth, it added a new interesting dimension to my thinking. అన్ని అనుభవాలకూ అక్షర రూపమిచ్చేందుకు నా చేత కాదు. అయితే పిల్లల ప్రశ్నల నా అనుభవాల చిన్ని అవలోకనం ఇక్కడుంది. వీటిలో కొన్నైనా అమేరికాంధ్రులందరికి తమ పిల్లలకు తెలుగు నేర్పేటప్పుడు స్వంత అనుభవానికి వచ్చి వుంటాయి.

ఏవేవో ప్రశ్నలకు బదులిచ్చే ఓపిక లేనప్పుడొక సారి మా పాపతో ప్రశ్నలతో విసిగించద్దు పొమ్మంటే “పొమ్మని అనొద్దమ్మా.” అని ఏడ్చింది. తనొక్కతే ఎక్కడికో వెళ్ళి పోవాలేమోననుకొని భయపడిందేమో. దగ్గరకి తీసుకొని “ఎక్కడికీ వెళ్ళాల్సిన పని లేదు పాపడూ. నాకిప్పుడు వేరే పనులున్నాయి. నీ ప్రశ్నలతో విసిగించకు అని అంతే. It just means don’t bother me right now.” అని వివరించి ఓదార్చాల్సి వచ్చింది. తనకప్పుడింకా మూడేళ్ళ వయస్సు. అమ్మానాన్నలు తప్ప వేరే బంధువర్గాన్నే చూడకుండా అందర్నుంచి దూరంగా పెరిగేటప్పుడు పిల్లల మనసులో కూడా ఒంటరితనం ఆవరిస్తుందేమో. పిల్లలు చాలా సున్నిత మనస్కులై భావుకులవుతారేమోనని అనిపించింది. ఏవేవో తప్పుగా ఊహించుకొని బాధపడతారని కూడా అనిపించింది.

“నువ్వెప్పుడూ అంతే. ఎక్కడ చదివిన పుస్తకాలు అక్కడే వదిలేస్తావు. వాటిని shelfలో ఉంచడం మర్చి పోతావు.” అని కోప్పడినప్పుడు “ఎప్పుడూ కాదమ్మా. Sometimes I forget, sorry!” అని మొహం చిన్నబుచ్చుకొన్న పాపను చూసి “ఎప్పుడూ అంటే always అని dictionary meaning ఉన్నా కూడా మేం వాడేది most of the times అనే అర్థంతో. మాకు ఓపికల్లేనప్పుడు అది sometimes  అనే అర్థం కూడా ఇస్తుంది.” వివరించి చెప్పాను. అయితే ఎందుకిలా చిన్ని విషయాలను మళ్ళీ నకారాత్మకంగా పెద్దవి చేస్తున్నానా అని అనిపించింది.  నేను మాట్లాడే తీరు మార్చుకోవాలని కూడా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ఇట్లాంటి సందర్భంలో ‘ఎప్పుడూ’ అని వాడరు. సందర్భోచితమైన ‘చాలా సార్లు’ అని అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలే కానీ గోరంతను కొండంత చేయడమెందుకా అని కూడా అనిపించింది.

ఎవరిదో అసహనీయమైన వైఖరి వల్ల బాధ పడి “వాళ్ళంతే. మారే రకం కాదులే. కుక్క తోక ఎన్నటికీ వంకరే.” అన్న నాన్న మాటలు విని “నాన్నా! That is too strong a statement. They might change for the better later sometime.” అనింది పాప. నాలుగైదేళ్ళ వయసులో, విషయాలేమీ తెలీక పోయినా పెద్ద ఆరిందాలా మాట్లాడిందనిపించినా కూడా, అవును కదా మనమింత కఠినంగా ఎవరి గురించి ఆలోచించినా తప్పనుకొన్నానే గానీ ఆయన మాటల్ని పాప ముందు సమర్థించుకోవాలని అస్సలనిపించలేదు. అందుకే అన్నారు ‘పాపలు మంచికి రూపాలు’ అని. పిల్లల మనసులో మానవీయత, ప్రామాణికత మున్నగు విలువలు నూటికి నూరు పాళ్ళు అర్థవంతగా వెలసి ఉంటాయి. వారి స్వచ్ఛ భావాలను కాపాడగల్గితే ఎంత బాగుణ్ణనిపించింది. ఒక్కోసారి మనకు తెల్సిన జీవన మౌల్యాలే చిన్ని పాపల మాటలై వారి నోటి నుంచి వచ్చి మమ్మల్ని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి.

ఈ తరం పిల్లలు మన ప్రతి మాటనూ గమనిస్తూ ఉంటారు. భాష నేర్చుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉన్న పిల్లలు మనం ఒకటి తెలిపితే చాలు, పది నేర్చుకోంటారనేది అతిశయోక్తి కాదు. మన తప్పులు మనం తిద్దుకొంటూ సాగితే అవి వాళ్ళ తప్పులై కొనసాగే అవకాశముండదు.

buduguమా స్నేహితుడింట్లో వాళ్ళబ్బాయి కిరణ్ “మా నాన్నగారు పేర్లు గుర్తురానప్పుడు తన పేరు అదేదో ఉంది లేక వాళ్ళ ఊరి పేరు అదేదో ఉంది అంటారు. ఏదో ఉంటుందనేది అందరికీ తెల్సు కదా. వారి పేరు గుర్తు రావడం లేదనో లేక మర్చి పోయిందనో ఒప్పుకోవచ్చుగా” అంటూ నవ్వాడు. ఎందుకంటే ఇంగ్లిష్‌లోనైతే గుర్తురాని సందర్భంలో నేరుగా గుర్తులేదని చెప్పడమే వాడుక. చెప్పే తీరు ఒక్కో భాషలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుందంతే కానీ తప్పర్థం చేసుకోకూడదని వివరించి చెప్పారు కోవెల్లోని తెలుగు క్లాస్ టీచర్.

కిరణ్ చాలా మాటకారి. అందర్నీ ఆకట్టుకొనే శక్తి తన ముద్దు మాటలకుంది. తనకేదైనా అర్థం కానప్పుడు చిరునవ్వులతో ప్రశ్నిస్తాడు. “మేం హైదరాబాద్‌కెళ్ళినప్పుడు దారిలో ఒకర్ని directions అడిగితే ముందుకెళ్ళి leftక్కొట్టి rightక్కొట్టాలన్నారు. ఇక్కడ కొట్టడం అనెందుకొచ్చింది?” కిరణ్ ప్రశ్నకు పెద్దాయన బదులిచ్చారు. బహుశః ఎద్దుల బండిని కావల్సిన దిక్కుకు మరల్చాలంటే ఎద్దులకు కొరడాతో ఓ చిన్ని దెబ్బ కొట్టేవారు. అందువల్ల కొట్టడం అంటే బండి నడపడమనే అర్థంలో వాడుకలో వచ్చియుంటుంది. ఇప్పుడు మోటార్ వాహనాలక్కూడా అదే పదం వాడటం కొనసాగిందన్నారు.

మెట్లు దిగేటప్పుడు జారి పడి తన కాలికి మూగదెబ్బ తగిలిందన్నారు పెద్దావిడొకరు. అంటే కంటికి కనపడేలాంటి గాయం కాదు కాబట్టి దాన్ని మూగదెబ్బ అంటామన్నారు. పిల్లలకు ఒకటే నవ్వు. దెబ్బవల్ల కల్గిన గాయం కనపడలేదని దాన్ని గుడ్డి దెబ్బనాలా లేక గాయం నోరు విప్పలేదని మూగ దెబ్బనాలా అనే వాదాలతో సాగాయి మాటలు. మొత్తానికి పిల్లల మనసుల్లో మన భాషపై మూగప్రేమ మొదలై తెలుగుదనం వైపు ఆసక్తి వస్తూందనడానికి ఇది నిలువుటద్దమన్నారు టీచర్.

తెలుగుగడ్డ నుంచి దూరంగా ఉన్నందువల్ల భాష పట్ల పిల్లల మనసులో చెలరేగే గందరగోళాల్ని నివారించేందుకు పెద్దల ప్రతిభా పాటవాల సహాయం అత్యవసరమనే సత్యం ప్రతి నిత్యమూ కళ్ళ ముందుకొస్తూనే ఉంటుంది. అంతే కాదు, మన భాషాసంస్కృతిని, సంగీత సాహిత్యాలనీ ముందు తరాలకు అందించాలంటే మనం చెప్పే విధానాల్లో, మన ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు తెలుగు చదివి, విని ఆనందించేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ పెద్దాయన చేసిన ఉపదేశం గుర్తొచ్చింది.

“జీవితమున్నదే మన నవ్వులు, ప్రీతి, తపన, ప్రామాణికత, మానవీయత, మన సంస్కృతి, మన కలలు, ఆశయాలు అన్నీ మన వాళ్ళతో పంచుకోవడానికి మరియు దానివల్ల ఆహ్లాదకరమైన సుదీర్ఘ సంబంధాలను పెంచుకోవడానికి. స్వస్థ కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు. అందుకే ప్రవాస భారతీయులు కూడా తమ భాషని, భాషాప్రేమని తమ పిల్లలతో పంచుకొని పెంచుకోవడానికని ఆరాటపడతారు. తమ భావనల్ని, కలల్ని తమ పిల్లలకు తెలిపే ప్రయత్నాల్లో భాష నేర్పడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏ విషయం గురించి కానీ ఆలోచించి, అనుభవించి తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి ఉపయోగపడే అమూల్య సాధనమే భాష. అమ్మ భాష మన జీవితంతో ముడిపడియున్న ఒక విడదీయరాని భాగం.”

ఈ నెలాఖర్లో మన తెలుగు దినోత్సవం వస్తూంది. తెలుగు భాష మనది; నిండుగ వెలుగు భాష మనది అని మళ్ళీ మళ్ళీ పాడే సమయమిది. సమస్త తెలుగు బాంధవులకు తెలుగు దినోత్సవపు శుభాకాంక్షలు!

*

థ్యాంక్యూ చీతా!

సుధా శ్రీనాథ్

 

sudhaతెల్లవారుతున్నట్టే అమ్మనుంచి ఫోనొచ్చింది. మధ్యరాత్రి అమేరికా చేరుతున్నట్టే ఫోన్ చేసి అమ్మకు తెలిపాను కదా, నేను క్షేమంగా చేరానని అనుకొంటూనే ఫోనెత్తాను. “పాపడూ! రాత్రి బాగా నిద్రపట్టిందా? మాకిక్కడ రాత్రవుతూంటే నీకక్కడ పగలవుతూంది కదూ? అమేరికాలో హోటెల్లో ఉన్నావుగా, అక్కడ నీకు టీ దొరుకుతుందా?” మొదలయ్యాయి అమ్మ ప్రశ్నలు. నేను ఏకైకసంతానమయినందువల్ల అమ్మకు నేనే ప్రపంచం. నేనూర్లో లేనప్పుడు రోజుకు రెండు సార్లైనా నాతో మాట్లాడ్డం కుదరక పోతే బెంగ పెట్టుకొని ఏడుస్తుంది అమ్మ. ఇదే మొదటి సారి విదేశంలోఉన్నానని అమ్మ మామూలు కంటే ఎక్కువ బెంగ పడ్తూందేమో.

“అన్నీ దొరుకుతాయి అమ్మా! నువ్వేమీ బెంగ పడొద్దు.” అంటున్నట్టే అమ్మ “పాపడూ! నువ్వు నా కోసం అక్కడ్నుంచి ఓ ట్యాబ్లెట్ తీసుకు రాగలవా?” అనడిగితే కలో నిజమో తెలీక“ఏమన్నావమ్మా?” అని అమ్మను మళ్ళీ మళ్ళీ అడిగి తెల్సుకొన్నాను. ఎప్పుడూ నా నుంచీ ఏమీ కోరని అమ్మ తన కోసం ఈ రోజు ట్యాబ్లెట్ కొని తెమ్మంటుంటే నా చెవులను నేనే నమ్మ లేకపోయాను. బి.ఎస్సి. దాకా ప్రతి క్లాస్లోనూ టాపర్‌గా వున్నట్టి అమ్మ పెళ్ళయిన తర్వాత పూర్తిగా మారాల్సి వచ్చిందట. పద్ధతులు, సంప్రదాయాల పేరుతో అమ్మకు అన్ని రకాల పనులు అప్పజెప్పారుఅత్తగారూ తోడికోడళ్ళు. అందర్లో చిన్నదైన అమ్మపై ఆడపడుచులు కూడా అధికారం చెలాయిస్తారు. అత్తగారింట్లో ఆడపిల్లల చదువులకు ఏ మాత్రమూ విలువ లేదని తెల్సి, ఇంట్లో మిగతా ఆడవాళ్ళమాదిరి ఇంటి పని, వంట పని, పూజలు, వ్రతాలే తన జీవితం చేసుకొనిందమ్మ. రాజీ చేసుకోవడమే జీవితం అంటుందమ్మ. ఇప్పుడు ఆడపడుచులు పెళ్ళిళ్ళయి, తోడికోడళ్ళు అందరూ విడి విడిగాజీవిస్తున్నా కూడా అత్తగారింటి పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తుంది. బహుశః భయం వల్లనేమో! అమ్మ మళ్ళీ ఒక తరం వెనకటి వాళ్ళలా ఆలోచించేదనిపించేది. నేనెప్పుడూ అమ్మతోకంప్యూటర్ల గురించిగానీ, ట్యాబ్లెట్ గురించిగానీ మాట్లాడిన జ్ఞాపకం లేదు. అమ్మకు ఉన్నట్టుండి ట్యాబ్లెట్ వాడటం నేర్చుకోవాలన్న ఆసక్తి ఎలా పుట్టిందా అని ఆశ్చర్యపడ్డాను.

“అదేంటమ్మా? ఉన్నట్టుండి ట్యాబ్లెట్ కావాలంటున్నావు? ఎప్పుడూ నన్నేమీ అడగని నువ్వు ట్యాబ్లెట్ తీసుకురమ్మని అడుగుతుంటే నమ్మలేక పోతున్నాను.” నా ఆశ్చర్యం నా గొంతులోనేఅమ్మకు తెల్సిపోయి ఉంటుంది. అసలు విషయం అప్పుడు తెల్సింది. బెంగళూర్లో ఉంటున్న అమ్మ వాళ్ళ చిన్నాన్న చెప్పారట అమేరికా నుంచి ఒక మంచి ట్యాబ్లెట్ తెప్పించుకొమ్మని,  అది చాలాఉపయోగపడుతుందని! తల్లిదండ్రులు పోయిన తర్వాత అమ్మకు ఈ చిన్నాన్నే తల్లిలా, తండ్రిలా పలకరించడం, పండగలకు రమ్మని ఆహ్వానించడం నాకు తెల్సు. తను కెమిస్ట్రి ప్రొఫెసర్‌గా పని చేసిపదేళ్ళ క్రితమే నివృత్తి పొంది, తమ కూతురితో ఉంటున్నారు. నేనతన్ని చిన్ని తాతయ్యా అని పిలిచేదాన్ని. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే తను రోజూ తెల్లవారుతున్నట్టే కనీసం ఐదు మైళ్ళదూరం పరుగెత్తుతారు. తన పరుగులు యువకుల పరుగుల కంటేనూ చురుగ్గా ఉండి నాకైతే చీతాని గుర్తు తెస్తాయి. కాబట్టి నేను చిన్ని తాతయ్యను అభినందించి షార్ట్‌గా చీతా అని కూడాపిలుస్తుంటాను.

అలా పిలవ కూడదని అమ్మ నాపై కోప్పడింది. అయితే తను “ఏంటోయ్! నన్ను మళ్ళీ చీతాతో పోలుస్తున్నావు” అని నవ్వారంతే. ఆ నవ్వులో సగర్వ సంతోషం కూడా ఉండింది.అమ్మకీ చిన్నాన్నంటే భలే ఇష్టం. చిన్నాన్న ఏం చెప్పినా తన మంచికేననే భావం అమ్మలో. అందుకే నేనెన్ని రోజులుగా కంప్యూటర్ వాడే విధానం నేర్పుతానన్నా అవన్నీ తనకెందుకనినేర్చుకొనేందుకు అస్సలు ఒప్పుకోని అమ్మ, ట్యాబ్లెట్ వల్ల చాలా ఉపయోగమవుతుందని చిన్నాన్న చెప్పగా ఒప్పుకొన్నట్టుంది. నా స్నేహితుల్లో ఒకరు కూడా తన కోసం ఒక ట్యాబ్లెట్ వీలైతేతెమ్మన్నారు. అయితే అందరూ అమ్మ తర్వాతే కదా! ఈ రోజుల్లో తాంత్రిక జ్ఞానం ఎన్నో విధాలుగా ఎంతగానో తోడ్పడుతుందని వివరిస్తూ పలు విధాల ప్రయత్నించినా కూడా అమ్మెందుకో నాకంప్యూటర్ వైపుక్కూడా రాలేదు.

అట్లాంటిది ఇప్పుడు చీతా సలహా వల్ల అమ్మ ఒప్పుకొనిందంటే, అంత కంటే భాగ్యమా అనుకొన్నాను. అమ్మ కోసమని ట్యాబ్లెట్ కొనేందుకు సంతోషంతో ఎగిరిగంతేశాను. వాళ్ళ చిన్నాన్న మాటను గౌరవించి, ఆయన చెప్పిన కంపెనీదే కొంటే అమ్మకు సంతోషమవుతుందని దాని గురించి అమ్మనడిగాను. ఇంజినీయర్ని కాబట్టి నాకు తెల్సినంతగా చీతాకుతెల్సుండదనే భావం మనసులో కదిలింది. అయితే ఏ మాడెల్ అయితేనేం? ఏ కంపెనీదైతేనేం? శుభస్య శీఘ్రం. అమ్మ దాన్ని వాడటం నేర్చుకొంటే, నేనెక్కడున్నా ఒకరినొకరు చూస్తూ రోజూమాట్లాడవచ్చు, ఈమేల్స్ రాసుకోవచ్చు, ఫోటోస్ చూసుకోవచ్చు. అది ముఖ్యం కదూ అనుకొన్నాను. ఒక్కొక్కటిగా అన్ని టూల్స్ వాడేందుకు అలవాటు చేసుకోవచ్చు. సంస్కృతం, సంగీతం,సాహిత్యం మున్నగు వాటిలో ఆసక్తి ఉన్న అమ్మకు ఇంట్లోనే ఒక లైబ్రరి దొరికినట్టవుతుంది.

తనకిష్టమైన ఎన్నో విషయాల గురించి ఒక క్లిక్కులో తెల్సుకోవచ్చు. కోరుకొన్న సంగీతంవినిపించుకోవచ్చు. తనక్కావల్సిన పుస్తకాలను ఇ-షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు. Technology nullifies distance! టెక్నాలజీని మనకు సహాయకారిగా మల్చుకొంటే జీవితం స్వర్గసమానమనిపించింది. అప్పుడు నేనింట్లో లేనని అమ్మకు ఒంటరితనమనిపించదు. నాపై ప్రాణాలు పెట్టుకొన్న అమ్మ మనసుకు ఇబ్బంది పెడ్తున్నానన్న బాధ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడునాకుండదు. ఆలోచనలు ఒక్కుమ్మడిగా దూసుకొచ్చాయి. మనోవేగాన్ని మించిన వేగం లేదు కదూ.

“కంపెనీ పేరు కూడా కావాలా? ట్యాబ్లెట్ పేరు సరిగ్గా తెల్సుకొని చెప్తాను. చిన్నాన్న నిన్ననే కాశీ యాత్రకు బయలుదేరారు. వస్తున్నట్టే అడిగి చెప్తాలే. నువ్వింకా ఒక నెల్రోజులు అక్కడే ఉంటావుగా.”అనింది అమ్మ ఫోన్ పెడ్తూ.

నాతో తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ ఉప్మా మిక్స్‌ను నీళ్ళతో కలిపి రైస్ కుక్కర్లో ఉంచి స్నానానికెళ్ళాను. నేను తయారయ్యేంతలో ఉప్మా కూడా తయారుగా ఉండింది. గబగబా ఉప్మా తినేసి, ట్యాక్సీలో మాఆఫీస్‌కెళ్ళేటప్పటికి తొమ్మిది దాటింది. కొందరప్పుడే ఫోన్లో మాట్లాడ్డం వల్ల బాగా పరిచయమున్నవాళ్ళే. మిగతా వాళ్ళను మా మ్యానేజర్ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు. చిరునవ్వుల స్వాగతాలతోఆ రోజు అక్కడ నా పని మొదలయ్యింది. అమ్మ ఫోన్ వల్ల శుభారంభమైన ఆ రోజు నాకు అతి ఉల్లాసంగా, ఆనందంగా గడిచింది. అమ్మతో నా అనుభవాలన్నీ ఇంటర్నెట్ ద్వారా పంచుకొంటున్నట్టుఊహించుకొంటూ ఆనందపడ్డాను. సంతోషంతో ఊగిపోయాను. స్వర్గానికి ఈ ట్యాబ్లెట్టే మెట్టనిపించింది. నా ఇన్నాళ్ళ కలలు నిజం చేస్తున్న చీతాకు మనసులోనే జోహార్లర్పించాను.

అమేరికాలో ఉన్నన్నాళ్ళూ అమ్మ రోజూ ఫోన్లో మాట్లాడింది. పూట పూటకూ సరిగ్గా భోజనాలు చేయాలని, ఎండలెక్కువ కాబట్టి పండ్లు, నీళ్ళు ఎక్కువగా తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలనే వైపుకేసాగాయి మా కబుర్లు. తను ట్యాబ్లెట్ గురించి మళ్ళీ గుర్తు చేయక పోయినా, నా మనసులో దాని గురించి ఆలోచనలు పీట వేసుకొని కూర్చొన్నాయి. నేను మాల్స్‌లో కొద్దిగా విండో షాపింగ్ చేశానుట్యాబ్లెట్ కోసమని.

ఆన్ లైన్లో కూడా వెదికాను మంచి ట్యాబ్లెట్ కొనాలని. మూడు వారాల సమయం గడిచింది. నేనొచ్చిన ఆఫీస్ పని అద్భుతంగా ముగించి అందరి అభినందనలతో వీడ్కోలుతీసుకొన్నాను. ఇక ట్యాబ్లెట్ కొనే విషయంలో జాప్యం చేయకూడదనుకొని దాని గురించి అమ్మనడిగితే చిన్నాన్నింకా యాత్రల నుంచి రాలేదని తెల్సింది. చివరి వారమంతా ట్రావెలింగ్‌లో ఊర్లుతిరుగుతుంటాను కదాని అమ్మకు చెప్పకుండా నేనే ఒక మంచి ట్యాబ్లెట్ కొన్నాను అమ్మ కోసమని. ఇది ఖచ్చితంగా చీతా సూచించే దాని కన్నా మెండే అయివుంటుందన్న గట్టి నమ్మకంతోనే అదికొన్నాను. మూడు వారాల పాటు టెక్సస్ ఎండలననుభవించిన తర్వాత ఫ్లారిడా బీచుల్లో తిరగడం సర్గతుల్యంగా ఉండింది నాకు.  కెనడి స్పేస్ సెంటర్లోకెళ్ళడం చంద్రలోకానికే అడుగు పెట్టినంతసంతోషాన్నిచ్చింది. న్యూయార్క్‌లోని లిబర్టి స్టాచ్యూ చూస్తే మన లుంబిని స్టాచ్యూ గుర్తొచ్చి హోమ్ సిక్నెస్ ఎక్కువయ్యింది.

క్యాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ దగ్గరుండగా అమ్మనుంచి ఫోనొచ్చింది. “చిన్నాన్న యాత్రలు ముగించుకొని వచ్చారోయ్. నాక్కావల్సిన ట్యాబ్లెట్ పేరు మూవ్ ఫ్రీ అని. నీకు వీలైతే అది తీసుకొని రా.నా కాళ్ళ నొప్పులు దాని వల్ల బాగా తక్కువవుతాయంట.” అమ్మ మాటలు విని గొంతులో వెలక్కాయ పడ్డట్టయి, అవాక్కయ్యాను. అంటే అమ్మ ఇన్ని రోజులూ ట్యాబ్లెట్ అన్నది మాత్రల కోసమా!అమ్మ మాటని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం నా తెలివి తక్కువ పని అనిపించింది. అయితే ఈ కంప్యూటర్ల యుగంలో అమ్మకు ట్యాబ్లెట్‌కున్న ఇంకో అర్థం తెలియజెప్పని నా ఇంజనీయర్ పదవికేసిగ్గనిపించింది. నా చదువుల గురించి, కంప్యూటర్ల గురించి అమ్మకు చెప్పేందుకు ఒకటి రెండు సార్లు ప్రయత్నించానంతే. అయితే అమ్మ మొహంలోని నిరాశ, నిస్పృహ, నిరాసక్తి నా ప్రయత్నాలనుమానుకోజేసేవి. అమ్మ స్నేహితుల్లో కూడా ఎవరూ కొత్త విషయాలను తెల్సుకొనే ఆసక్తి లేనివారనిపించేది. తప్పు నాలో కూడా ఉంది. అనుకొన్నది సాధించక ముందే నా ప్రయత్నాల నుంచివిరమించడం నా తప్పే కదా.

అమ్మ ఎక్కువగా మాట్లాడక పోయినా, తను కీళ్ళ నొప్పితో బాధపడటం నాకు తెల్సు. అయితే అమ్మ ట్యాబ్లెట్ అన్నప్పుడు ఒక్క సారైనా అది కీళ్ళ నొప్పికి మాత్ర అయివుండొచ్చనే అనుమానంనాకు ఆవ గింజంతైనా రాలేదు. అది నా మూర్ఖతనమంతే! దానికి ఎవర్ని దూషించి ఏం లాభం! నేను మళ్ళీ అంతగా కలలు కనడం నా తప్పేమో. అయితే మనసులోనే నా తక్షణ కర్తవ్యం గురించిఆలోచించి, తీర్మానించుకొన్నాను.

మరుసటి రోజే అమ్మ చెప్పిన ఆ మాత్రలు కొన్నాను. అమ్మకని కొన్న ట్యాబ్లెట్ వేరే ఎవరికీ ఇవ్వాలనిపించలేదు. నేను కన్న కలలు నిజం చేసుకోవాలంటే నాప్రయత్నాలు మానకూడదనుకొన్నాను. ఈ సారి ఊరెళ్ళినప్పుడు అమ్మకు ఇంటర్నెట్ వాడే విధానం నేర్పించి తీరాలనే పట్టుదలతో ఇంటికి చేరాను రెండూ ట్యాబ్లెట్స్ తీసుకొని. రెంటినీ అమ్మ చేతిలోఉంచుతూ అసలు విషయం చెప్పాను. ఆ నెల్రోజులూ నేను అమ్మ గురించి కన్న కలల్ని, తడబడుతూ, వివరిస్తుంటే నా కళ్ళలో విషాదం నిండుకొంది. అమ్మకు నా తపన అర్థమయ్యుండాలి. నన్నుదగ్గరికి తీసుకొని నొసటిపై ముద్దుపెట్టిందమ్మ. తన చేతిలో నేనుంచిన ట్యాబ్లెట్టుక్కూడా ముద్దు పెట్టింది.

అమ్మ కోసం నేను ఆశతో కొని తెచ్చిన మొదటి కానుక అది. అమ్మ నన్ను నిరాశ పర్చలేదు.పిల్లల సంతోషం కోసం అమ్మలు ఏమైనా చేయగలరు. అమ్మ కోసమని నేను తెచ్చిన ట్యాబ్లెట్ అమ్మలోని కాలేజ్ స్టూడెంట్‌ను మేల్కొలిపిందేమో. అమ్మలోని చదువుల ఆసక్తిని తట్టి లేపింది. ట్యాబ్లెట్వాడటం చీతా వేగంతో నేర్చుకొనిందమ్మ. ఇంట్లోనే లైబ్రరి ఉన్నట్టుగా ఉందోయ్ అనిందమ్మ. మొత్తానికి ఈ ట్యాబ్లెట్ ఒక కొత్త ప్రపంచాన్నే అమ్మ కళ్ళ ముందుంచి, నాకు మూవ్ ఫ్రీస్వాతంత్ర్యాన్నిచ్చింది. అమ్మతో ఈమేల్ ద్వారా మరియు ఫేస్ బుక్, వాట్సాప్ల ద్వారా రోజూ అన్ని విషయాలు పంచుకోవడం వల్ల నేను ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మతోనే ఉన్నట్టుగా ఉంది.

అమ్మఇంటర్నెట్ ద్వారా తన చిన్నన్నాటి స్నేహితులను, టీచర్లను ఎందర్నో కలిసింది. ఇంటర్నెట్ ద్వారా రోజూ కొత్త విషయాలు తెల్సుకొంటూ ఇది అర చేతిలో వైకుంఠం చూపిస్తుంది పాపడూ అంటూమురిసిపోయింది అమ్మ. ఇవన్నీ కనిపెట్టిన వారు ధన్యులంటూ ‘ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!’ అని పాడిందమ్మ. ముభావంగా మూడు ముక్కలు మాట్లాడే అమ్మ ఇప్పుడుగలగలా మాట్లాడుతుంది. అంతే కాదు, ఇంటర్నెట్ ద్వారా సంస్కృతం నేర్చుకొని సంస్కృతంలో ఓపన్ యూనివర్సీటీలో ఎం.ఎ. చేస్తూందమ్మ! మన పూర్వజుల భాషైన సంస్కృతం నేర్చుకొనివేదోపనిషత్తులను చదివి ఆనందించాలనే అమ్మ కల నిజమవుతూంది.

చీతా చెప్పిన కీళ్ళ నొప్పి ట్యాబ్లెట్లో నాన్వెజిటేరియన్ అంశాలున్నాయని వాటిని శుద్ధ శాకాహారియైన అమ్మ వాడనేలేదు. అవి వాడదగిన తన స్నేహితులకెవరికో ఇచ్చేసింది. ఆ మూవ్ ఫ్రీ ట్యాబ్లెట్వాళ్ళ కీళ్ళ నొప్పి పోగొట్టిందో లేదో తెలీదు. అయితే ఈ ట్యాబ్లెట్ తెచ్చిన సరికొత్త చదువుల సంతోషాలతో అమ్మ కీళ్ళ నొప్పి వచ్చినట్టే మాయమయ్యింది! వీటన్నిటి క్రెడిట్ నూటికి నూరు పాళ్ళుచీతాకే అంటే అమ్మా వాళ్ళ చిన్నాన్నకే చెందాలి. ఎందుకంటే వీటికంతటికీ మూల కారణం చీతా ఇచ్చిన ట్యాబ్లెట్ సలహాయే!

థ్యాంక్యూ చీతా!

*

‘ఫాదర్స్’ డే ఫన్ విత్ దినేశన్!

సుధా శ్రీనాథ్ 

 

sudhaఆ రోజు ఫాదర్స్’ డే. స్నేహితులందరూ పిల్లలతో మా ఇంట్లో సమావేశమయ్యారు. ఆ రోజు పిల్లలు తమ అమ్మ సహాయంతో తమ నాన్నకిష్టమైన వంటకాలను చేసి తీసుకొచ్చారు. ప్రతి ఇంటి నుంచివాళ్ళ నాన్న ఫేవరేట్స్ మా డైనింగ్ హాల్ చేరాయి. నేనైతే పిల్లలతో pronunciation కబుర్లకని కూడా ఎదురు చూస్తున్నాను.

అందరం మదర్స్ డే సర్ప్రైజ్‌ని గుర్తుచేసుకొన్నాం. తెలుగులో నాన్నని ‘అప్ప’, ‘అబ్బ’, ‘అయ్య’ అని కూడా అంటాం. కొరియన్స్ కూడా నాన్నని ‘అప్పా’ అని పిలుస్తారట. మొత్తానికి ఈ సారి మదర్స్డే, ఫాదర్స్ డే రెండ్రోజులూ కొరియన్స్‌ని గుర్తు చేసుకొన్నామని అందరికీ నవ్వొచ్చింది. అయితే అమ్మ, అప్ప అనే రెండు తెలుగు పదాలు అదే అర్థంతో వాడే ఇంకో దేశముందనేది అందరికీఅత్యాశ్చర్యాన్నిచ్చిన మాట అక్షరాలా నిజం.

పిల్లల్ని ఆత్మీయంగా సంబోధించడానికి ‘చిట్టి తండ్రీ, చిన్ని నాన్నా’ అంటారని, అమ్మ తనని చాలా సార్లు ముద్దుగా అలా పిలుస్తుందని చెప్పిన ఓ చిన్నారి మాటకు నాన్నల నుంచి ఒకటే చప్పట్లు.ఇంకా బాగుందనేందుకు కొన్ని సందర్భాల్లో ‘దాని అప్ప(అబ్బ)లాగుంది’ అనే వాడుక ఉందనే మాటకి నాన్నల మొహాలు నవ్వులతో నిజంగా వెలిగిపోయాయి. ‘అప్ప’ అనే పదాన్ని పెద్దలకుగౌరవసూచకంగా కూడా వాడుతాం. శ్రీ కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో మహామంత్రియైన తిమ్మరసుని తండ్రిలా గౌరవించి ‘అప్పాజి’ అని అత్మీయంగా సంబోధించేవారట. అవునవును, కొన్నిసముదాయాల్లో నాన్నని ‘అప్పాజి’ అనే పిలుస్తారన్నారు బెంగళూరినుంచి వచ్చిన వారొకరు.

ఆ రోజు పగ్గాలు పూర్తిగా పిల్లల చేతుల్లోనే. పిల్లలు తమకు నాన్నే ఫస్ట్ హీరోనని మళ్ళీ మళ్ళీ చెబుతూ నాన్నకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. అమ్మలు, నాన్నలు కూడా తమ నాన్నను తల్చుకొనిగౌరవాభిమానలందించేలా చేశారు. ఎండెక్కువగా ఉన్నందున ఔట్ డోర్ గేమ్స్ బదులు ఇంట్లోనే నాన్నలకని చిన్ని చిన్ని ఆటలు, బహుమానాలు కూడా ఏర్పాటు చేశారు. “The pioneers in any field are called Fathers in that field. For example: many of you know about Darwin and Mendel. Charles Darwin is known as the father of Evolution theory and Gregore Mendel is for genetics.  Madison is called the father of American constitution. In India, Ambedkar is the father of Indian constitution. Mahatma Gandhi is called the father of the nation.” చిన్నారి మాటలు వింటున్నట్టే ఫాదర్ ఆఫ్ దినేశన్ అంటూ ఒక జోక్ గుర్తుచేశారొకరు.

దినేశన్, గణేశన్ అని అన్నదమ్ములుండేవారు. దినేశన్‌కు తమ్ముడు గణేశన్ అంటే భలే ఇష్టం. ఒక రోజు స్కూల్‍నుంచి వచ్చిన దినేశన్ చాలా డల్‌గా ఉన్నాడు. ఎందుకని వాళ్ళ నాన్న అడిగితే“నాన్నా, నేను నీ కొడుకు కాదా? గణేశన్ నా తమ్ముడు కాదా?” అనడుగుతూ ఏడ్చాడు. ఉన్నట్టుండి నీకీ అనుమానమెందుకన్న నాన్న ప్రశ్నకు అసలు విషయం బయట పడింది. గాంధీజి ఈస్ దిఫాదర్ ఆఫ్ ది నేశన్ అని స్కూల్లో చెప్పారట! జోక్ విన్న నాన్నలకే కాదు, అమ్మలకూ, పిల్లలకూ అందరికీ ఒకటే నవ్వులు. నవ్వులతో, ఆనందంతో నాన్నలందరికీ విందు వడ్డనలతో భోజనాలుమొదలయ్యాయి. వారికి నచ్చిన వంటకాలు నాన్నల విందుకు ఘన స్వాగతం పలికాయి.

భోంచేస్తూ అముదగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి విషయం అందర్నీ భావుకుల్ని చేసింది. వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిననాడే వాళ్ళమ్మకు వంటింటినుంచి విడుదల అన్నారట. దాన్ని అక్షరాలాపాటిస్తున్నారట. ప్రతి రోజూ ప్రతి వంటకం తామే చేస్తూ వాళ్ళమ్మకిష్టమైన హాబీస్ కొనసాగించేందుకు పూర్తిగా సహకారమిస్తున్నారట. “మా ఆయన కూడా నాకన్ని విధాలా సహకరిస్తూ మా నాన్ననిగుర్తుతెస్తారు” భర్త పట్ల తమ అభిమానం వెల్లడించారు అముదగారు.

అక్కడున్న ప్రతి నాన్న కూడా అమ్మకు ప్రతి రోజూ ఇంటి పనుల్లో సహాయం, సహకారమిస్తున్నవారేనని పిల్లలందరూనాన్నలను అభినందించారు. అమ్మ ఇంట్లో లేనప్పుడు తను అమ్మా! అని పిలిస్తే నాన్న పలుకుతారని, తనకి అమ్మానాన్నలు రెండు కళ్ళలాగని పలికిందో పాపడు. అవును కదా, రెండు కళ్ళలోఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు; కాకూడదు కూడా. మొత్తానికా రోజు నాన్నలను అభినందనలతో ముంచెత్తారు పిల్లలు. కుటుంబ వ్యవస్థకు అమ్మ నాన్నలిద్దరూ ఆధార స్థంబాలు. బాధ్యతలుతెల్సిన అమ్మా నాన్నలున్న కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు.

bapu

అందరివీ భోజనాలయ్యాయి. వెనకటి వారం సగానికి వదిలేసిన మా pronunciation కబుర్లను కొన సాగించే సమయమది. అంతకు మునుపే నేను మేం మాట్లాడే ఇంగ్లిష్ గురించి పిల్లలతోచర్చించిన విషయం కొందరికి తెల్సి, మన తప్పుల గురించి పిల్లల్ని అడగడం నా తెలివితక్కువ పని అన్నారు.  పిల్లలికపైన మనల్ని ఆడిపోసుకొంటారని బెంగ పడ్డారు. ఇలాంటి ప్రయత్నాలుమానేయమని కొందరు నాకు ఫోన్ చేసి చెప్పారు కూడా. అలాంటి బెంగ అక్కర్లేదని, మనం వట్టినే ఏవేవో ఊహించుకొని దిగులు పడకూడదనే నా అభిప్రాయానికి కొద్దిగా సహకారం దొరికింది. ఈనేపథ్యంలో నేనెదురు చూస్తున్న కబుర్ల సమయం వచ్చేసింది.

అందరం ఒకే చోట కూర్చొన్నాం కబుర్లకని. అచ్చులు, హల్లుల తప్పులతో మొదలెట్టారు పిల్లలు. ‘ఎల్లో’ అనేందుకు ‘యెల్లో’ అంటారన్నారు కొందరు. ‘వోట్’ అనేందుకు ‘ఓట్’ అనడం ‘యెస్’అనేందుకు ‘ఎస్’, ‘ఎండ్’ అనేందుకు ‘యెండ్’ అనడం ఎక్కువగా గమనించిన తప్పులన్నారు ఇంకొందరు. మిగతా పిల్లలు వీరితో సమ్మతిస్తూ తలూపడం కనబడింది.

ఎక్కడైతే z అక్షరం ఉంటుందో అక్కడ j వేసి ఆ పదాలను ఎక్కువగా తప్పు పలుకుతారని, జీరొ, జూ అనే తప్పుల్ని ఉదహరించారు. ఆ ధ్వని తెలుగులో లేనందువల్ల దాన్ని రాసి దిద్దేందుకు వీలుకాదని పిల్లలే తెలిపినప్పుడు విచిత్రమనిపించింది కొందరికి. అదే రీతి x ఉన్న పదాల్లో కూడా అవుతుందని తెలిసింది. ఈ కబుర్లు వద్దని వారించినవారు కూడా పొందికగా ఒదిగిపోయి అభినందించడంవల్ల పిల్లల మాటలు ఊపందుకొన్నాయి. నేను పిల్లలు చెప్పిన ప్రతిదాన్నీ రాసుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే మన తప్పులు మనక్కనపడవు కదూ.

“అండర్‌స్టాండింగ్ అనేందుకు అండ్రస్టాండింగ్ అని, మాడర్న్ అనేందుకు మాడ్రన్ అని అంటారు. కంసిడరేషన్ అనేందుకు కంసిడ్రేషన్ అంటారు. డి మరియు ఆర్ మధ్యలోని అక్షరంమాయమైపోతుంది, ఎందుకో” అంటూ రాగం తీశాడు బాలుడొకడు. Similarly, the vowel between `t’ and ‘r’ disappears  అంటూ ప్యాట్రన్, మ్యాట్రు అన్నాడింకో చిన్నారి.  Also, the vowel between `t’ and ‘l’ disappears  ఇంట్లిజెంటు, మెంట్లు అంటారని బుంగ మూతి పెట్టిందో చిన్నారి.  కారణమేం చెప్పాలో తోచక నవ్వేసి, వాటిని కూడా రాసుకొన్నాను ఆ తప్పులు నామాటల్లో లేకపోయినా కూడా. ఎగైన్‌స్ట్ అనేందుకు మాలో చాలా మంది ఎగెనెస్ట్ అంటామని ఒకావిడ చెబితే విని పిల్లలు చిరునవ్వులు చిందించారు.

“కొందరు what, where, why తప్పుగా pronounce చేస్తారు. వాటినెలా కరెక్ట్ చేయాలో తెలీదు.” చిన్నారియొక్కతె చెప్పవచ్చో, చెప్పకూడదో అనే భావంతో చెప్పింది. ఇండియన్స్ చాలా మందిwicket బదులు vicket అంటారని గుర్తుచేశాడింకో అబ్బాయి. నాకు పాప చెప్పిన v మరియు w ల వల్ల నేను చేసేటటువంటి మిస్టేక్స్ గుర్తొచ్చి పాప వైపు చూశాను. అది కూడా భారతీయ భాషల్లోరాయడం కష్టం. అందుకే wicket కాస్త vicket అని భారతీకరించారని పాపే కారణమిచ్చింది. ఓహో! నేనా తీరున ఆలోచించి ఉండలేదు. సమస్యకు మూల కారణమేమని కూడా పిల్లలేఆలోచిస్తున్నారని గర్వమనిపించింది.

budugu

కొందరు భారతీయులు చాలా వేగంగా మాట్లాడుతారు; దాని వల్ల అక్కడక్కడ అక్షరాలను మింగేస్తారని ఒకరు, కొన్ని చోట్ల లేని ‘అ’కారాన్ని చేర్చి పలుకుతారని ఇంకొకరి ఫిర్యాదు. ఫిల్మ్, ఫార్మ్అనాల్సినప్పుడు ఫిలమ్, ఫారమ్ అంటారనేది వారి వాదం. మనలో చాలా మంది eyes మరియు ice రెంటినీ ఒకే విధంగా ఐస్ అంటారని మరొకరి ఆక్షేపణ. అంత వరకూ మౌనంగావినిపించుకొంటున్న గౌరవ్ మాట్లాడ్డానికని చేయెత్తాడు. గౌరవ్ పుట్టింది, పెరిగింది అమేరికాలోనే. గౌరవ్ తల్లిదండ్రులు తమ పెళ్ళికి మునుపే అమేరికాలో సెటిలై ఉన్న వారట.

“I don’t care much about how foreigners pronounce English. We can always understand it from the context. As a native speaker I feel that English is a crazy language as far as the pronunciation goes. For example, if ‘s’ comes between two vowels then it has a ‘z’ sound. There are too many such rules and too many exceptions which complicate the learning. I love Indian languages because they are phonetic. I love Telugu. Take any letter in Telugu. There is only one way to pronounce it no matter where it comes.” అప్పుడే హైస్కూల్ ముగించి కాలేజికెళ్ళెబోతున్న గౌరవ్ మాటలు, చెప్పిన తీరూ అందరి మొహాలపై సకారణ మందహాసాన్ని తెచ్చాయి.తాము తెలుగువంటి సుసంబద్ధ, తార్కిక భాషికులమనే గర్వం పిల్లల కళ్ళలో తొంగి చూసింది.

ఆ రోజు తల్లిదండ్రులు శ్రోతృలై పిల్లలే ఎక్కువగా మాట్లాడారు. పిల్లలకు తెలియని తెలుగు గురించి మేం చెప్పేలాగా పిల్లలు తాము గమనించిన, తమకు తెలిసిన విషయాలను మాతో పంచుకోవడానికి ఉత్సుకులై కనపడ్డారు. ఇన్ని రోజులు మనస్సులో ఉంచుకొన్న భావాలను బయటికి చెప్పుకొనేందుకు పిల్లలకు ఆరోజొక మంచి అవకాశాన్నిచ్చింది. పిల్లల్లో ఇంత సూక్ష్మంగా గమనించగలిగేసామర్థ్యముంటుందా అని అమ్మానాన్నలు ఆశ్చర్యపడేలా చేసిందా రోజు. ఎవరూ ఏదీ రాసుకొని తీసుకు రాలేదు. ఏది జ్ఞాపకమొస్తే దాన్ని, ఒక్కొక్కరూ తాము విన్న తప్పు ఉచ్ఛారణలనుతెల్పుతూ తమ భావనలను వెలిబుచ్చేందుకొక వేదికయ్యిందా రోజు.

కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళ సలహాలు, సూచనలకు ప్రాధాన్యతనివ్వకుండా వాళ్ళకి తాము నచ్చమనే అపోహలో ఉంటారు. మీరు మీ చిన్నప్పుడు తెలుగు నేర్చినరీతి వేరు; పిల్లలిక్కడ నేర్చిన రీతి వేరు. మీరు ఫోనెటిక్స్ రూల్స్ ఫాలో చేయరన్న మాత్రానికి పిల్లలకు మీరిష్టం లేదని కాదు. మాట కన్నా మనస్సు ముఖ్యం. మనస్సులోని భావనలు ముఖ్యం.మనకు సాధ్యమయినంత ఉచ్ఛారణలను మార్చుకొనేందుకు ప్రయత్నించవచ్చని నేనన్నాను. పిల్లలందరూ నాతో ఏకీభవించారు. మేం తెలుగు తప్పుగా మాట్లాడితే మీకు మా పైన ప్రేమ ఎలా తగ్గదోఅలాగే ఇది కూడా అన్న ఒక చిన్నారి సమన్వయత అందరికీ ఆనందాన్నిచ్చింది.

ఈ చర్చ వల్ల నాతో పాటు అక్కడున్న అందరికీ సహాయమయ్యింది. అంతే కాదు అమేరికాంధ్ర పిల్లలకు అమ్మభాషపై అవగాహన, మమకారం రెండూ పెరిగాయి. ఉచ్ఛారణల్లో సందిగ్ధమయమైన,ధ్వన్యాత్మకం కానటువంటి ఇంగ్లిష్ నేర్చుకొన్న ఆ పిల్లలకు ధ్వన్యాత్మకమైన తెలుగు భాష సుసంపన్నమనిపించింది. భలే సంతోషమయ్యింది. It was, indeed, a win-win discussion.థ్యాంక్యూ వెరి మచ్ చిట్టి తండ్రులూ, చిన్ని నాన్నలూ!

*

హూన్ హూలై

 సుధా శ్రీనాథ్

 

sudha“We have our own pronunciation rules to follow, ma’m.” హోర్హె స్పెల్లింగ్ ఎందుకు j-o-r-g-e అనడిగినప్పుడు తన స్ప్యానిష్ పేరుకు ఇంగ్లిష్ సమానార్థకం జార్జ్ అన్నారు. మరింక మీభాషలో జె, జి అక్షరాలెందుకున్నాయని నేను ఎద్దేవా చేస్తే నాకది వివరించిన సన్నివేశమది. పేర్లు నిర్ధిష్ట నామవాచకాలు కాబట్టి ఏ భాషలోని పేరును ఆ భాషలోలాగానే ఉచ్ఛరించాలి. అందరం తననిహోర్హె అనే పిలిచే వాళ్ళం. కొలోంబియా నుంచి వచ్చిన హోర్హె గారు నాతో పాటు మా ప్రొఫెసర్ దగ్గరే Ph.D., ప్రోగ్రాంలో ఉండేవారు.

“While reading English I have a problem because we use the same script as English. By mistake, I read it as Spanish. My pronunciation is almost always wrong, especially with names having j or g. Whenever I call Jairam’s name, it is invariably hairam. He thinks I’m saying ‘hi’ to him.” తను చెప్పుకొస్తుంటేపాపమనిపించి, జాలేసింది. అతని క్లాస్లో జగన్ అనే ఇండియన్ అబ్బాయి ఉన్నాడట. దాన్నయితే స్పెల్లింగ్ చూడకుండా గుర్తుంచుకోవడం అలవాటు చేసుకోవాల్సి వచ్చిందట. నాతో ప్రత్యేకంగా తనఇండియన్ స్నేహితుల గురించి మాట్లాడారు. నా పేరును అమేరికన్స్ ‘సూడ్‌హ’ అన్నా హోర్హె గారు మాత్రం చక్కగా ‘సుధా’ అని స్పష్టంగా పలికేవారు; ఎందుకంటే వారికి ‘డి’ అక్షరాన్ని ‘దె’ అనేవిధంగా ఉచ్ఛరించాలనేదే స్ప్యానిష్ నియమం!

ఆ రోజు pronunciation గురించి మొదలైన మా మాటలు వారి దేశం గురించి మరియు మన దేశం గురించి ముందుకు సాగాయి. అతను మన మాన్సూన్ గురించి అడిగితే హూన్ మరియు హూలైనెలల్లో మనకి వర్షాలని చెబితే నవ్వాపుకోలేక పోయారు.

ఇంటికొచ్చి పాపతో స్ప్యానిష్ ఉచ్ఛారణల గురించి చెప్పగా తన క్లాస్మేట్ ఒక మెక్సికన్ అబ్బాయి తన పేరు Jorge అని రాసినా కూడా అందరితో తన పేరు జార్జ్ అనే అంటాడని తెలిసింది. అందరూతనని జార్జ్ అనే పిలుస్తారట కూడా. అమేరికాలో పుట్టిన విదేశీయుల పిల్లలు చిన్నప్పటి నుంచే అమేరికనైస్ అవుతారు కదూ! చైనీస్ కూడా తమ పిల్లలకు అమేరికన్ ఫస్ట్ నేమ్ ఉంచడం ఎక్కువగావాడుకలో ఉందని కూడా పాప చెప్పింది. చిన్ని పాపలక్కూడా ఇంత గ్రహణ శక్తి ఉంటుందని ఆశ్చర్య పడుతున్న నాకు తను పోలిక చేసి చెప్పిన ఇంకో విషయం మళ్ళీ చకితురాల్ని చేసింది. తన క్లాస్లోజార్జ్ అని ఇంకో అమేరికన్ అబ్బాయి కూడా ఉన్నాడట. తన స్పెల్లింగ్ George అని రాస్తాడట. పాపకు కోవెల్లో సుస్మిత, సుష్మిత అని ఇద్దరు స్నేహితులున్నారు. వారిద్దరి పేర్ల లాగే ఇవి కూడా ఒకేపదానికున్న వేర్వేరే స్పెల్లింగ్స్ అనుకొనిందట. పిల్లల్లో ఇంత తార్కిక శక్తి దైవదత్తంగా ఉంటుందన్న మాట. అందుకే పిల్లలు స్పాంజి లాగా అని, ఎక్కడుంటే అక్కడి విషయాలను సులభంగా గ్రహిస్తారనినిపుణులు చెబుతుంటారు. పాప క్లాస్ ఒక చిన్ని ప్రపంచంలా ఉన్నందువల్ల తనకి ఈ విషయాలన్నీ తెలిశాయి. ఆ రోజు పాప దువ్వెన నా చేతికిస్తూ “అమ్మా, ఈ రోజు రెండు హడలు వేస్తావా?”అనడిగింది. ఏంటే హడ అంటున్నావంటే స్ప్యానిష్‌లో అడిగానంటూ నవ్వింది పాపడు! ఆ సారి సమ్మర్ క్యాంప్‌లో కొద్ది కొద్దిగా స్ప్యానిష్ నేర్చుకొనింది కూడా.

పాపకు పబ్లిక్ లైబ్రరీలంటే చాలా ఇష్టం. తన ఫిఫ్త్ గ్రాడ్యుయేషన్ నాకు బాగా గుర్తుంది. ఆ సారి టెక్సస్ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రోజూ నూట పది డిగ్రీలతో ఒకటే ఉక్క పోత. తట్టుకోవడమేకష్టమనిపించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మే నెలలో పూర్తిగా ఇండియాలో ఉండి పాప కజిన్స్‌తో ఆడుకొనేందుకు అవకాశం ఉండేలా చూసుకొనేవాళ్ళం. ఆ సారి తన ఎలెమెంటరి గ్రాడ్యుయేషన్ముగించుకొని వెళ్ళాలనుకొన్నాం. గ్రాడ్యుఏషన్ రోజు గవర్నర్ చేతుల మీదిగా పాప ప్రెసిడెంట్స్ మెడల్ అందుకొంటూంటే మా ఇద్దరి కళ్ళలో ఆనంద భాష్పాలు. పబ్లిక్ లైబ్రరీల్లోని సమ్మర్ రీడింగ్ ప్రోగ్రాంద్వారా మొదలైన పుస్తకాల పిచ్చి పాపను సంవత్సరం పొడుగునా చదివేలా చేసి మంచి భాషా సామర్థ్యాన్నిచ్చింది. తన ఇంగ్లిష్ భాషా ప్రబుద్ధతను చూసి పాపకు ఫిఫ్త్ గ్రేడ్లో ఉన్నప్పుడు రెండవ తరగతిపిల్లలకు పాఠాలు బోధించే అవకాశం దొరికింది. ప్రతి మంగళ, గురువారాల్లో తనకి బోధనా విధానాలు తన టీచర్స్ నేర్పితే, సోమ, బుధ, శుక్రవారాల్లో తను రెండవ తరగతి పిల్లలకు పాఠాలు ఒక గంటసేపు బోధించేది. తన పాఠాలను నేర్చుకోవాల్సిన సమయాన్ని ఇతరుల కోసం వినియోగించినందుకు తన స్వచ్ఛంద సేవలను గుర్తించి తనకు ప్రెసిడెంట్స్ మెడల్ ఇచ్చి గౌరవించారని తెల్సింది.

పాప తన స్కూల్లోని సెకండ్ గ్రేడర్స్‌కే కాదు, నాక్కూడా టీచరే. ఎందుకంటే తను చెప్పగా నేను నా ఉచ్ఛారణలను తిద్దుకొనగలిగాను. ఆరేళ్ళ వయసులోనే ఇంగ్లిష్ ఉచ్ఛారణలను సులభంగాఅర్థమయ్యేట్టు నాకు ఒక్క మాటలోనే బోధించింది నా చిట్టి పాపడు.

“అమ్మా, నువ్వు ఇంగ్లిష్‌లో మాట్లాడేటప్పుడు కొన్ని ధ్వనులు మిక్సప్ అవుతాయి. Perhaps, you were not taught English phonetically. That’s why you people pronounce ‘eyes’ and ‘ice’ the same way. I have seen most of your friends also mix up some sounds. ‘e’ నుంచి మొదలైనప్పుడు దాన్ని ఆ, ఇ, ఈ  లేక ఎ అని, అంటే అచ్చు లాగ pronounceచేయాలి. ‘y’ మొదలైనప్పుడు దాన్ని య, యా, యి, యీ, … లాగా, అంటే హల్లులాగా pronounce చేయాలి. నువ్వు ఈస్ట్ అనేందుకు యీస్ట్ అంటావు.” అని పాప చెబుతుంటే నా చెవుల్ని నేనేనమ్మలేక పోయాను. ఇన్ని సంవత్సరాలు నేను వెళ్ళిన ఏ స్కూలూ, కాలేజూ నేర్పని phonetics  పాఠాలు నా చిన్ని తల్లి నాకు అర్థమయ్యేలా చెప్పిస్తుంటే కోవెల్లో టీచర్స్ మాతృభాషను నేర్పి,దాన్నుంచి తను నాకు ఇంగ్లిష్ ఉచ్ఛారణలు నేర్పేందుక్కూడా సహాయమయ్యిందని గర్వ పడ్డాను. మనసులోనే అక్కడి టీచర్స్‌కు ధన్యవాదాలర్పించాను కూడా. అంతే కాదు తను నాకు ‘v’  మరియు‘w’ ల ఉచ్ఛారణల్లోని వ్యత్యాసాన్ని కూడా చెప్పి నేర్పింది. నేను why అనేందుకు vy అంటానట! నా ఆరేళ్ళ పాపలో టీచర్ని చూశానారోజు! ‘v’ ని పలికేటప్పుడు క్రింది పెదవి పైని పళ్ళకు తాకాలంట, ‘w’ కైతే అలా తాకకూడదంట! అబ్బబ్బో! ఈ రూల్స్ గురించి నాకెవ్వరూ ఎక్కడా నేర్పి ఉండలేదు. ఒక వైపు పాపకున్న అవగాహన గురించి సంతోషం; ఇంకో వైపు ఇక పైన నా తప్పుల్ని తిద్దుకోవాలేఅనే బాధ. ఎందుకంటే పాత తప్పుల్ని, ఏండ్ల కొద్దీ అలవాటైన తప్పుల్ని తిద్దుకోవడం సులభం కాదు. ఈ పాడు రూల్స్ నన్ను చంపేస్తాయనిపించింది. నా కళ్ళల్లో నీళ్ళు చూసి పాప తప్పర్థంచేసుకోకూడదని నేను కొంచెం యమోషనల్ అయ్యానని తెలిపాను. అరెరె! ఎమోషనల్ అనాల్సింది కదాని నవ్వాను.  నేను యమోషనల్ అన్నప్పుడంతా యమ తమాషాగా అనిపించిందేమో.

సంస్కృతం నుండి పుట్టిన మన భారతీయ భాషల్లో ఉచ్ఛారణకు సమస్యలు అసల్లేవు. మన అక్షరాలు ధ్వన్యాత్మకమైనవి కాబట్టి ఏ అక్షరం ఎక్కడొచ్చినా దాన్ని పలికే తీరు ఒకటే. ఇంగ్లిష్, స్ప్యానిష్,ఫ్రెంచ్ భాషల్లోలాగా ఒకే అక్షరానికి దాని రెండు పక్కల ఉన్న అక్షరాల్ని బట్టి వేర్వేరే ధ్వనుల్లేవు. రావు.

నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ అమేరికన్లకు నేను ఈస్ట్ లేక వెస్ట్ అని చెప్పినప్పుడు ఎందుకర్థం కాలేదన్నది నాకప్పుడు తెల్సింది. నేను ఈస్ట్ అనడానికి యీస్ట్ అన్నప్పుడు వాళ్ళకు మనం బ్రెడ్చేసేటప్పుడు వేసే యీస్ట్ గుర్తొచ్చి, వెస్ట్ అన్నప్పుడు మనం డ్రెస్ పైన వేసుకొనే పైఅంగిలాంటిది గుర్తొచ్చి నవ్వులపాలయ్యను కాబోలు. అలాగే yearని earని అదులుబదులుగా ఉచ్ఛరిస్తే అర్థాలుతారుమారవడం వల్ల అది విన్నవారు నవ్వక ఇంకేం చేయగలరు. అందుకే కాబోలు నేను ఈ చెవిన విని ఆ చెవిన వదిలెయ్యద్దండని హితవచనం పలికినప్పుడు మన అమేరికన్ భారతీయ యువతముసి ముసి నవ్వింది. మన తెలుగులో కొన్ని మాటల సమయ సందర్భాల్లో, సంధి సమాసాల్లో కొన్ని సార్లు అచ్చులు హల్లులవుతాయని నన్ను నేను నాలో సమర్థించుకొన్నా కూడా నవ్వాపుకోలేకపోయాను. ఎందుకంటే నా ఈ సమర్థన నా అన్ని తప్పులకూ అన్వయించదు. మొత్తానికి నాలాంటి వాళ్ళ తప్పు ఉచ్ఛారణల వల్ల అందరికీ ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ బాగానే దొరుకుతూందని ఆ రోజుతెలిసింది. ఈ నేపథ్యంలో నువ్వికపైన ఉచ్ఛారణల పట్ల జాగ్రత్త వహించాలనే యమర్జెన్సి నిబంధన, కాదు కాదు, ఎమర్జెన్సి నిబంధన నా నాలుకకు వేశాను. అంతే కాదు, తప్పులు తెల్సుకొనేందుకుశత ప్రయత్నాలు మొదలెట్టాను.

ఆ శనివారం సాయంత్రం స్నేహితుల ఇంట్లో విందుకని వెళ్ళాం. అక్కడ పాప తన తోటి పిల్లలతో ఆడుకొంటున్నప్పుడు నేను కూడా ఆ పిల్లల గుంపులోకి దూరాను. వాళ్ళకి నా ఉచ్ఛారణాసమస్యనుతెలిపి భారతీయులు ఇంగ్లిష్‌లో సాధారణంగా చేసేటటువంటి ఉచ్ఛారణా వ్యత్యాసాలను ఎవరైనా గమనించారా అనడిగితే పిల్లలందరి ముఖాల్లో చిరునవ్వుల సిరిమల్లెలు పూసినట్టయింది.

“ఊర్లో మా తాతయ్య ఓపన్ అనేందుకు వోపన్ అంటారు” చిన్నారియొక్కడు భారతదేశంలో ఉన్న తన తాతగారి ఉచ్ఛారణ గురించి చెబితే హమ్మయ్య! నేను దాన్ని సరిగ్గానే పలుకుతాననిసంతోషపడ్డాను. కాకతాళీయంగా అతనాడిన మాటకు పొందికగా నేను మాట్లాడ్డానికి ప్రయత్నించాను. “నువు మంచి opening sentence ఇచ్చావు.” నా ప్రశంసాపూర్వక సంతోషం వెల్లడయ్యింది.

“రౌట్ అనేందుకు రూట్ అంటారు” ముందుకు దారి చూపింది జ్యోత్స్న. అమేరికాలో route ను రౌట్ అంటారని నేనూ గమనించాను. అయితే మనది బ్రిటిష్ రీతిలో కదూ అన్నాను.

“ఫిల్ అనేందుకు ఫీల్ అంటారు, ఫుల్ అనేందుకు ఫూల్ అంటారు.” హ్రస్వాన్ని దీర్ఘం చేస్తారని రాగం తీసిందొక చిన్నారి. ఔను! ఇంటికొచ్చిన అతిథిని ఏం తీసుకొంటారని అడిగినప్పుడొక సారి “ఏంవద్దండి! ఐ ఆమ్ ఫూల్ ( I’m fool.)” అన్నారు పొట్ట ముట్టుకొంటూ. పుణ్యానికి  I’m a fool అనలేదు! అది గుర్తుకొచ్చి పగలబడి నవ్వాను. పిల్లలతో ఈ చర్చ భలే ఆనందాన్నిచ్చింది.నేనడుగుతున్నట్టే వారు చెప్పేందుకు ఉవ్విళ్ళూరుతున్న వైనం చూస్తే ఇలాంటివి ఇంకా బోలెడున్నాయనిపించింది. ఇంకా తెల్సుకోవాలనే మనసున్నా కూడా దీనికంత యమ అర్జెన్సి (ఎమర్జెన్సికాదు) లేదులే అనుకొంటూ నా కుతూహలాన్ని అణచి వేసేందుకు ప్రయత్నించాను. వచ్చే వారానికి మా ఇంట్లో ఫాదర్స్ డే పార్టీకొస్తూ ఇలాంటివి మిగతావి గుర్తు చేసుకొని రమ్మంటూ నా కోరిక వారికితెలియజేశాను.

మిగతా తప్పులు తెల్సుకొనేందుకు ఎలాగూ వాయిదా కోరాను కాబట్టి ఫాదర్స్ డే నాటికి ఇప్పుడు తెలిసిన వాటిని తిద్దుకొనే తీవ్ర ప్రయత్నాలు చేయాలనే పట్టుదలతో ఇంటి దారి పట్టాను. వచ్చేవారాంత్యమే ఫాదర్స్ డే. ఆ వేడుకలతో పాటు ఫాదర్స్ డే ఫన్ మీ అందరితో తప్పకుండా పంచుకోగలను. నాన్నలందరికీ నా హృత్పూర్వక శుభాకాంక్షలు. అమ్మ తర్వాత అమ్మ ఆప్యాయతని, నాన్నఆత్మ స్థైర్యాన్ని ధారబోసిన మా నాన్నే నాకు పెద్ద హీరో.   Happy Fathers’ Day (in advance)!.

*

 

అమ్మల దినం కమ్మని కావ్యం

సుధా శ్రీనాథ్

sudha“అమ్మా! కొరియన్ భాషలో కూడా అమ్మని ‘అమ్మా’ అనే అంటారట!” పాప స్కూల్నుంచి వస్తున్నట్టేచెప్పింది. తన క్లాస్‍లో ఉన్న కొరియన్ అమ్మాయి చెప్పగా వాళ్ళు కూడా మనలా కన్న తల్లిని‘అమ్మా’ అనే పిలుస్తారని అ రోజే తెల్సిందట. ఆ రోజు శుక్రవారం. ఇంక రెండ్రోజులకే మదర్స్ డే.అందుకే స్కూల్లో మదర్స్ డే గురించే ఎక్కువ మాటలు నడుస్తుంటాయి. ఆ మాటల్లో ఈ విషయంతెలిసి పాపకు చాలా ఆశ్చర్యమయ్యిందట. నాక్కూడా చాలా ఆశ్చర్యమయ్యింది. చిన్న పిల్లలతో ఆర్ట్క్లాస్‌లో అమ్మలకని మదర్స్ డే కార్డ్ చేయించేటప్పుడు పిల్లల మాటల్లో బయట పడిన విషయమిది.కొత్త విషయలేం తెల్సినా ఆ రోజే నాకు చెప్పే అలవాటు పాపకు. పాప నా కోసం చేస్తున్న మదర్స్ డేకార్డ్ గురించి కూడా చెప్పింది. నా ఇటాలియన్ స్నేహితురాలు అమ్మను ‘మమ్మా’ అనిపిల్చినప్పుడు అది అమ్మా అనే మాదిరే ఉందనుకొని సంతోషించాను నేను. అయితే అచ్చ తెలుగుపదమనుకొన్న అమ్మ అనే పదాన్ని అదే అర్థంతో వాడే ఇంకో దేశముందన్న విషయం తెలిసిమహదానందమయ్యింది.

 నిజం చెప్పాలంటే నాకు ఈ అమ్మల దినం గురించి తెల్సింది అమేరికాకొచ్చిన తర్వాతే. మొదట్లోతమాషాగా అనిపించినా నా స్నేహితుల్లోని అమ్మలందరినీ అభినందిస్తానా రోజు. అమ్మాయికి అమ్మపట్టం దొరికేది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన రోజే. అందువల్ల మొదటి శిశువు పుట్టిన రోజే అమ్మపుట్టిన రోజు. అందుకే పాప పుట్టిన రోజే నాకు మదర్స్ డే అనేదాన్ని. ఈ సారైతే అది సరిగ్గా పాపపుట్టిన రోజే రావడం మళ్ళీ విశేషం.

 ఆ రోజు కోవెల్లో మా తేనె తెలుగు క్లాసులో కూడా అమ్మల దినం గురించే మాటలు. జన్మనిచ్చినావిడేజనని, అమ్మ అని టీచర్ అంటున్నట్టే “In seahorses, the male seahorse delivers the babies. So, father is the mother.” చిన్నారి నితిన్ తుంటరి నవ్వులతో అపరూపమైన ఈసత్యాన్ని తెలియజేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడమే కాదు, వారి ప్రశంసలకుపాత్రుడయ్యాడు. అమ్మ నాన్నలిద్దరూ ప్రేమ స్వరూపులే అనేందుకిదొక చక్కటి ఉదాహరణమనిటీచరిచ్చిన బదులు తన సమయస్ఫూర్తిని చూపింది.

ప్రతియొక్కరూ లేచి నిలబడి అమ్మ గురించి తమ భావాలను వెల్లడించ సాగారు. చిన్న పిల్లలు తమబాల భాషలో అమ్మ తమకిష్టమైనవి వండి పెడుతుందని కృతజ్ఞతలను తెలిపితే, ఇంచు మించుపదేళ్ళ వయస్సున్న వారు కొందరు అమ్మ తమ కోసం చేసే ఎన్నో పనులను లిస్ట్ చేస్తూధన్యవాదాలు తెలిపారు.

అమ్మ ప్రతి రోజూ అందరికన్న ముందే లేచి అందరికీ అన్నీ సమయానికి సరిగ్గా సమకూర్చేందుకుకృషి చేస్తుందని ప్రతియొక్కరూ గుర్తు చేసి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసారు. “While she tells she isn’t working, she is the one who works seven days a week.” అమ్మ గురించి ఓపాప చెప్పిన ఈ మాట అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. అమ్మ పనులకు ఆదివారం కూడా సెలవుదొరకదు. అయితే ఇంత చిన్ని పాపలే అంతగా ఆలోచిస్తున్నారనేది విశేషం.

తమ తప్పులు తిద్దేటప్పుడు కసిరినా కూడా అమ్మ అన్ని వేళల్లోనూ సహాయం చేస్తుందన్నారుకొందరు పిల్లలు. కొందరు తమ కృషికి తగ్గ ప్రతిఫలం దొరకనప్పుడు తమకు సహానుభూతి చూపించితమ మనోబలాన్ని పెంచే పని కూడా అమ్మ చేసిందని చెప్పారు. పిల్లల్ని మంచి నాగరికులుగాతీర్చిదిద్ది సమాజానికి సమర్పించే పుణ్య కార్యంలో అమ్మల పాత్ర అతి ముఖ్యం. అదేంసామాన్యమైన పని కాదు. దాని కోసం ప్రతి దినం, ప్రతి క్షణం, శ్రమించే అమ్మలకు అందరూఅంజలీబద్ధులై నమస్కరించారు.

యా దెవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

సకల జీవరాసుల్లోనూ మాతృ రూపంలో ఉండి మాతృ భావనలను పెంపొందించే జగన్మాతకి నమస్సుమాంజలి. ఇంకో అమ్మని సిద్దం చేసే శక్తి అమ్మకే ఉంది. తన అమ్మాయిలకు పిల్లల్ని సహృదయ నాగరికుల్లా తీర్చిదిద్దడానికి కావలిసిన మౌల్యాలను, కౌశల్యాలను, సహనాశక్తిని కూడా దారబోసి పెంచగలిగింది అమ్మొక్కతే.

‘అమ్మా’ అనే రెండక్షరాల మంత్రం అన్ని సమయాల్లోనూ శక్తినిచ్చే మంత్రం. ఏదైనా నొప్పి పెట్టినప్పుడు పలికే పదం ‘అమ్మా’ అని. వింతలు విడ్డూరాలు చూసినప్పుడు ‘అమ్మా’ అంటాం. ఆకలైతే ‘అమ్మా’ అంటాం. కష్ట సుఖాల్లో హాయినిచ్చే మంత్రమే అమ్మ. అమ్మ అనే బంధం అత్యమూల్యమని, అమ్మ అంటే ఆప్యాయతకు మరో రూపమని, తల్లిని మించిన దైవం లేదని అందరూ ఏకగ్రీవంగా అనుమోదించారు. కొందరు ఊర్లో ఉన్న అమ్మను తల్చుకొని కంట తడి పెడ్తే ఇంకొందరు పోగొట్టుకొన్న అమ్మను తల్చుకొని అశ్రుతర్పణమిచ్చారు. ఆ రోజు అందర్నీ నిజంగా భావుకుల్ని చేసింది.

అతి సులభంగా రాయగలిగే తల్లీ పాపల చిత్రాన్ని బోర్డ్‍పై రాసిందో చిన్నారి. అమ్మో! ‘అ’ అక్షరాన్ని మూడు ముక్కలు చేసి రాసినట్టు కనపడే ఆ చిత్రం అచ్చం అమ్మ ఒడిలో పడుకొన్న పాపలా అగుపడింది. ఇంకో చిన్నారి బోర్డ్‌పైన ‘MOM’ రాసి, దాన్ని తల క్రిందులుగా చూస్తే ‘WOW’ అని చెబుతూ వాళ్ళమ్మను కౌగలించుకొంది. రెండూ అందరికీ ఎంత నచ్చాయంటే అందరం రెంటినీ నోట్ బుక్‌లో రాసుకొన్నాం.

అడగందే అమ్మైనా పెట్టదనే సామెతని గుర్తుచేశారొకరు. “That’s not a nice thing to say.”అంటూ తనకి అదస్సలిష్టం కాలేదంటూ అమ్మ వైపు చూసి బుంగమూతి పెట్టాడో చిన్నారి. “అమ్మ అని ఇంగ్లిష్‌లో రాసినప్పుడు a.m.m.a. is a palindrome because it reads the same from both sides. అమ్మ అనే పదమే చాలా స్పెషల్.” అంటూ తాను కనిపెట్టిన సత్యాన్ని సంతోషంతో చెప్పుకొనిందో చిన్ని పాపడు. Necessity is the mother of invention అని మదర్ పదం ఉన్నటువంటి ఇంగ్లిష్ ఉక్తిని చెప్పింది ఇంకో చిన్నారి. తల్లిని మించిన దైవం లేదన్నారింకొకరు.మొత్తానికి అందరి మాటలూ అమ్మ గురించే.

తెలుగు మాట్లాడే మనమందరం తెలుగు తల్లి పిల్లలం. ఆ తల్లి ఆశీర్వాదం మనకెప్పుడూ ఉంటుందన్నారు టీచర్ క్లాస్ ముగిస్తూ. తక్షణమే సప్తస్వరాల్లాగ ఏడు మంది పిల్లలు లేచి నిలబడి ఇంకో పది నిమిషాలు అందరూ అక్కడే ఉండాలని మనవి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రంగు దుస్తుల్లో,వేర్వేరే రంగులు కాబట్టి ఆ ఏడుగురు ఇంద్రధనుస్సులా కనపడ్డారు.  వరుసగా నిలబడి ఏంజెల్స్‌లాగ చిరునవ్వులు చిందిస్తూ ‘అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా’ అంటూ అత్యంత మధురంగా పాడ సాగారు! అమ్మలు తమ చిన్నారుల కోసం చేసినట్టు ఈ చిన్నారులేడుగురు కలిసి అమ్మలందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. పాప ఈ మిగతా ఆరుగురితో కలిసి ఇదెప్పుడు నేర్చుకొనిందా అని ఆశ్చర్యపడ్డం నా వంతయ్యింది. అమేరికాంధ్ర పిల్లల్లా కాదు, అచ్చ తెలుగు పిల్లల్లా స్పష్టంగా వారు పాడిన ఆ పాట అందర్నీ తన్మయులై వినేట్టు చేసింది.

అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా

అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా

అమ్మ అన్న పదం సుస్వరాల వేదం

అమ్మ అన్న పదం సదా ప్రణవ నాదం

అమ్మ అన్న పదం సృష్టికి మూలాధారం

అమ్మ అన్న పదం సమదృష్టికి కొలమానం

పాట ముగుస్తున్నట్టే ఒకటే చప్పట్లు! పూర్వ సిద్ధత లేకుండా ఇంత మంచిగా పాడటం అసాధ్యం.పిల్లలీ పాటను ఎక్కడ, ఎప్పుడు నేర్చుకొన్నారనేదే అందరి ప్రశ్న. యూ ట్యూబ్లో గీతా మాధురి విడియోల ద్వారా తాము ఒక్కొక్కరే తమ ఇంట్లో మళ్ళీ మళ్ళీ వినిపించుకొని ఎవ్వరి సహాయమూ లేకుండానే నేర్చుకొన్నారట. ఒక్కే ఒక సారి కూడా జతగూడి పాడక పోయినా పర్ఫెక్ట్‌గా సింక్రొనైజ్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. మాకెవ్వరికీ పిల్లల ఈ ప్లాన్ గురించి మచ్చుకైనా అనుమానం రాలేదు. అంటే అంత బాగా రహస్యం కాపాడుకొచ్చారన్నమాట.

అమ్మను గురించి అమ్మ భాషలోనే ఒక పాటని యూట్యూబ్లో వెదుక్కొని, నేర్చుకొని, పాడి అమ్మను సంతోషపరచాలనే ఆ చిన్నారుల అంతరంగ భావనకు అమ్మలందరం అమితానందంతో ఊగిపోయాం.ఆ పది నిమిషాలను సక్రమంగా వినియోగించుకొని దీనికో అనుబంధం కూడా ప్లాన్ చేశారు పిల్లలు.అమ్మల దినోత్సవానికని ఆ రోజు కోవెల్లో స్వయంసేవకులు విశేషంగా తయారు చేసిన మహా ప్రసాదాన్ని తామే పట్టుకొచ్చి అమ్మలకు అమ్మ ప్రేమతో వడ్డించినారు. పిల్లలందరి ముఖాల్లో తాము కన్న కల సాకారమైన సంతోషం ఉట్టి పడుతోంది. అది కృషి చేసి లక్ష్యం సాధించిన సంతోషం. వారి మొహాలు సంతోషంతో మెరుస్తూ వుంటే ఒక్కొక్కరూ ఆణి ముత్యంలా అగుపించారు. అభం శుభం ఎరుగని చిన్నారులు ఎంతగా ఎదిగారనిపించింది. ఆ చిన్నారుల ప్రేమ అందరి కళ్ళలో ఆనంద బాష్పాలను తెచ్చింది.

Mother Nature is taken for granted. As a result, we are facing global warming. For a healthy, happy living we need to protect Mother Nature. మనమందరం ప్రకృతి మాత బిడ్డలం. ఈ మధ్య భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమై పోతున్నాయి. తల్లిని ఆదరించినట్టే మనం ప్రకృతిని, పరిసరాలను ఆదరించాలి. అంటే పర్యావరణ రక్షణ కూడా మన నిత్య జీవితాల్లో ఒక ముఖ్య భాగం చేసుకోవాలన్నారు ఒక పెద్దావిడ. ఆ దిశలో మేమేం చేయగలమనే పిల్లల ప్రశ్నకు ఆవిడే బదులిచ్చారు. ముఖ్యంగా మూడు సూత్రాలను పిల్లలందరూ పాటించగలరని. ఒకటి: నీళ్ళు వృథా చేయకూడదు. రెండు: ఆహారం వృథా చేయకూడదు. మూడు: ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఈ మూడింటిని పాటిస్తామని పిల్లలావిడకు మాటివ్వడం అమ్మలకే కాదు అందరికీ సంతోషాన్నిచ్చింది.

ఇటీవలి పదేళ్ళలో ఇండియాలో కూడా అమ్మల దినోత్సవం జరుపుకోవడం జనప్రియమవుతూందనేది ఒక శుభ సూచన. Taken for granted అనే భావన ఎవరికీ రాకూడదనే ప్రయత్నాలలో ఇదో ముందడుగు. అమ్మల సేవలు ప్రత్యేకంగా ఆదరింపబడి, పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్వస్థ కుటుంబం కోసమని తను చేసే త్యాగాలు గుర్తింపబడి గౌరవింపబడుతున్నాయి. ఏడాదికొక రోజు అమ్మకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రతి రోజూ తను మనందరి కోసం చేసే పనుల్లో పాలు పంచుకోవడమే పెద్ద గౌరవమన్నారు ఇంకో పెద్దాయన. దానికి అంగీకరించి తలూపనివారు లేరు. అందరికీ ఆ రోజు మాతృభూమియైన తెలుగుగడ్డపై ఉన్నట్టనిపించింది. అమ్మలకు తమ అమ్మతో ఉన్న అనుభూతినిచ్చి, చాలా హాయనిపించి, ఈ వేడుక ఒక కమ్మని కావ్యంలా మదిలో మెదులుతూనే ఉంది.

ఒక్క మాటకి నాలుగు అర్థాలా? అమ్మో!!

సుధా శ్రీనాథ్ 

 

sudha“April rains bring May flowers!  అనుకొంటూ ఖుషీ పడాలంతే. లేక పోతే ఈ నెల పూర్తి వర్షాలు, బురదలతో రాజీలు తప్పవు కదూ?” 

 “ఔను, మళ్ళీ సాయంత్రం ఉగాది కార్యక్రమం రిహర్సల్‍కని పిల్లల్ని తీసుకెళ్ళాలి ఈ వర్షంలో.  ఇంట్లో కూర్చొని బయటి వర్షం చూస్తూ సంతోషించగలనే కానీ వర్షంలో డ్రైవ్చేయాలంటే నాకస్సలు ఇష్టం కాదు. చాలా కష్టమనిపిస్తుంది కూడా. అదీ ఈ టెక్సస్‌లో వర్షాలంటే కుండపోతలే. అందుకే కాబోలు వాటిని ఇక్కడి వాళ్ళు వానలనరు; thunder storms అని అంటారు. ఈ సారి తెలుగు సంఘం ఉగాది కార్యక్రమం కోసం పిల్లలు ‘వాన వాన వల్లప్ప’ అంటూ వాన గురించి డాన్స్ నేర్చుకొంటున్నారు.”  మాట్లాడుతూ తేనెతెలుగు క్లాస్‌లోనికొచ్చారు కొందరు పోషకులు పిల్లలతో. చుట్టూ ఉన్న రంగు రంగుల పూల చెట్లు ఈదురు గాలితో కూడిన వర్షం వల్ల సగానికి సగం పూలు రాలిపోయి బాధలోఉన్నట్టు కనపడుతున్నాయి. ఇవే చెట్లు వాన వెలసి ఎండ పడుతున్నట్టే కళ కళలాడుతాయి. ఎండ, వాన రెండూ ఉంటేనే నిండు జీవితం.

శాంతి మంత్ర పఠనం, ఒక నిమిషం పాటు ధ్యానం తర్వాత పిల్లలు తెలుగు పదాలు రాయడం, చదవడం మొదలయ్యింది. హోంవర్క్ విషయాలు కూడా మధ్యలో మాట్లాడుతూ,హోంవర్క్ చేసుకొచ్చిన పిల్లల్ని అభినందించారు టీచర్. అది కబుర్లు మొదలు పెట్టే సమయం. అంతలోనే ‘టిక్ టిక్’ తలుపు తట్టి లోపలికడుగు పెట్టారు పట్టు చీరతో, ముడిలోమల్లెపూల ఘమ ఘమలతో కొత్త పెళ్ళి కూతురిలా అగు పడుతున్న కల్పనగారు.  “ఈ రోజు మా పెళ్ళి రోజండి. ఈ రోజుకి మా పెళ్ళయి సరిగ్గా కాలు శతమానం అయింది.అందుకే యజ్ఞశాలలో విశేషంగా శ్రీనివాస కల్యాణం కార్యక్రమం ఉంచుకొన్నాం. మీరందరూ పాఠాలు ముగించుకొని పిల్లలందరితో నేరుగా అక్కడికొచ్చేయండి.  ప్రసాదంతో పాటుపెళ్ళి విందు కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి.” అచ్చతెలుగులో అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు.

“ఓహో! అదీ విశేషం! No wonder, you are looking like a beautiful bride today. Many happy returns of this special day! మీ కుటుంబ జీవితం ఎల్లప్పుడూఆనందంగా కొనసాగాలి” టీచర్‌తో పాటు పోషకులు కూడా కల్పనగారికి శుభాశయాలను తెలిపారు. అందరి మొహాల్లోనూ సంతోషం పొంగి పొర్లింది. క్లాస్ ముగించుకొని అందరూతప్పకుండా వచ్చి విందారగించాలని మళ్ళీ చెబుతూ సెలవు తీసుకొన్నారావిడ.

“ఆంటీ, కాలు శతమానం అంటే ఏంటి?” కల్పన గారు వెళ్తున్నట్టే ఓ చిన్ని బాబు నుంచి టీచర్ వైపుకు దూసుకొచ్చిందీ ప్రశ్న. పిల్లలందరూ మా క్లాసులో టీచర్ని ఆంటీ అనిపిలవడమే అలవాటు.

“శతమానం అంటే నూరు సంవత్సరాలు. శతాబ్ధమన్నా కూడా అదే అర్థం. కాలు శతమానమంటే ఇరవై అయిదేళ్ళు. Today is the 25th anniversary of their marriage. So, they are celebrating the silver jubilee of their wedding with special prayers.” టీచర్ ఇచ్చిన వివరణ వల్ల తనకి సమాధానమైనట్టు కనపడ లేదు.

“కాలు means leg కదూ?” తనకర్థం కానిది అడిగి తెలుసుకోవాలనే పట్టుదల కనిపించిందతని కళ్ళలో. పిల్లల ఇట్లాంటి ప్రశ్నలే మా కబుర్లకు జీవనాడి.

“అవును. అలాగే కాలు అంటే నాలుగింట ఒక భాగం, one fourth అనే అర్థం కూడా ఉంది.” ఓహో! ఇక్కడ కాలు పదాన్ని ఆ అర్థంతో వాడారన్న మాట. అర్థమయ్యిందన్నట్టుబాబు చిరునవ్వే చెప్పింది. పిల్లల మొహంలో చిరునవ్వుల సిరిమల్లెల ముగ్ధ సంతోషం చూడ బలు సొగసు.

‘కాలు’ పదం గుట్టు చప్పుడు లేకుండా మా కబుర్లలోనికి కాలు పెట్టినట్టయింది. ఈ రోజు కాలు గురించే కబుర్లన్నారు టీచర్. మా తేనె తెలుగు క్లాస్ పిల్లలతో పాటు తల్లిదండ్రులూఈ కబుర్లలో పాల్గొనేవారే. అందరూ తమ తమ అనుభవాలను, ఆలోచనలను పరస్పరం పంచుకొనేందుకు ఇదొక చక్కటి వేదిక. పిల్లలకు తెలుగు భాష నేర్పేందుకు తాము కూడాతోడ్పడాలనేదే అందరి ఆశయం. పెద్దలు వీలయినంత తెలుగులోనే చెప్పినా మధ్యలో ఎంతైనా ఇంగ్లిష్ చేర్చేందుకు అవకాశం ఉండేది. అందువల్ల పిల్లలు కూడా తెంగ్లిష్‌లో తమకితోచింది చెప్పేందుకు ముందుకొచ్చేవారు. కాలు పదం గురించి మా కబుర్లు ముందుకు నడవసాగాయి.

“For socks మా తాతయ్య కాల్సంచిలంటారు. ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా నవ్వాను. ఇప్పుడు విని అలవాటయ్యింది.” ముసి ముసి నవ్వులాపుకొంటూ చెప్పిందో చిన్నారి. తనకళ్ళలో కూడా ఇంకా నవ్వుండింది.

“అవును, ‘కాలు’ అంటే పాదమనే అర్థం కూడా ఉంది. Depending on the context, one has to choose its meaning.”

“అంటే కాలు అనే పదానికి leg, foot, one fourth and to burn అని నాలుగర్థాలా?” అన్నింటినీ రాసుకొంటూ అడిగాడొకబ్బాయి. అతను నిశితంగా ఆలోచించి అడిగినట్టుచెప్పిన ఆ విషయం టీచర్‌కు ఆనందాన్నిచ్చింది. లిస్ట్‌కి తాను చెప్పని ఇంకో అర్థాన్ని కూడా చేర్చింది కాలోచితమని అభినందించారతన్ని. పిల్లలు తమ తోటి పిల్లలు చెప్పినదాన్నిచాలా బాగా గుర్తుంచుకొంటారు. కాబట్టి పిల్లలేదైనా కొత్త విషయం తామై చెప్పినప్పుడు టీచర్‌కు ఎనలేని ఆనందం. పిల్లల విషయ పరిజ్ఞానం పెరిగేందుకిది అతి సులభమైన దారి.

“వర్షంలో తడుస్తానంటూ షూస్ విప్పి వెళ్ళాడు. కాలు జారి పడ్డాడు కూడా. బురదని కడుక్కొని వచ్చేందుకు ఆలస్యమయింది.” క్షమించండంటూ కొడుకు విజయ్‌తో వచ్చారువాళ్ళమ్మ.

“బురదలో కాలు పెడితే కాలికి బురదే కదా అంటుకొంటుంది. అందుకే ‘బురదలో కాలు పెట్టినట్టు’ అనే ఉక్తి వాడుకలో ఉంది.” అన్నారొకాయన. చెడ్డ సహవాసం వల్ల చెడ్డఅభ్యాసలవుతాయని చెప్పాల్సినప్పుడు దాన్ని వాడుతారని కూడా తెలిపారు.

“ఆ వయస్సులో మనం కూడా వానలో, నీళ్ళలో మన్ను, బురద అని చూడకుండా బాగా ఆటాడేవాళ్ళం కదూ? నేనైతే పేపర్ పడవల్ని చేసి వాన నీళ్ళలో వదిలి వాటి వెనకాలేపరుగెత్తేదాన్ని. ఇప్పుడు వర్షాకాలంలో నీళ్ళు, బురద అని ఒకటే ఆక్షేపిస్తాం. సిమెంటు కాలుదారిలో మాత్రమే నడుస్తాం. By the way,  కాలుదారి లేక కాలిదారి అంటే footpath or side walk అని అర్థం. దాన్ని కాలిబాట అని కూడా అంటారు.”

‘అడుసు తొక్కనేల, కాలు కడగనేల’ అని కూడా ఒక సామెతుందని గుర్తు చేశారింకొకరు. కాలు పదమున్న ఉక్తులు, సామెతలూ ఏవైనా గుర్తు చేసుకోవాలంటూ ఆలోచించి ‘అందితేజుట్టు అందక పోతే కాలు’, ‘పప్పులో కాలేయడం’ మరియు ‘కాలు గాలిన పిల్లిలా’ అనే వాటిని గురించి కూడ పిల్లలకు వివరించి చెప్పారొక పెద్దాయన.

ఉగాది తర్వాత ఇదే మొదటి క్లాస్ కాబట్టి టీచర్ అందరికీ మరో సారి కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలిపారు. “ఈ కొత్త సంవత్సరంలో మీ కార్యాలన్నింటిలోనూ విజయందొరకాలి. May you all put your best foot forward in this New year.”

“కొత్త ఇంటికెళ్ళినప్పుడు శుభమస్తు అని మొదలు కుడి కాలుంచి లోనికెళ్తారు కదూ. అదే best foot అనాలా? కుడి కాలుకెందుకంత ప్రాముఖ్యత?”

“కొత్త కోడలొచ్చినప్పుడు కూడా అలాగే. ఆరతులెత్తి ముందు కుడికాలే లోపలుంచి రమ్మంటారెందుకూ?”

పిల్లలకీ సందర్భాలను వివరించాలనుకొన్నారు టీచర్. “Right is right.” చిన్నారియొక్కతె తక్షణమే చేసిన సందర్భోచిత  pun అడ్డొచ్చినా అది అందరికీ నచ్చింది.

“అయితే ఒక విషయం నాకు నచ్చదు. కోడలు కుడి కాలు ముందు మోపి ఇంట్లోకడుగు పెట్టిన తర్వాత, అంటే ఇంటికి కోడలొచ్చిన తర్వాత ఇంట్లో ఎవరికైనా, ఏదైనా చెడు జరిగితేకోడలింటికొచ్చిన సమయం, తన కాల్గుణమని తనపై నింద మోపుతారు. అది సరి కాదు. కోడలొచ్చిన తర్వాత తనకి సంబంధించని సమస్యలకు కూడా తనని బాధ్యురాలు చేసిదూషించడం తప్పు.” అందరూ అవునవునన్నారు.

“మంచి జరిగితే కాల్గుణమంటూ పొగిడేది కూడా ఉంది. But why associate the two? As it is she is adjusting to her new life in a new place.” అందరూ ఒప్పాల్సినమాటే అది.

“I told my mom that I have got some seeds for seedless grapes. She asked me to plant them in our backyard.” నందన్ అల్లరి నవ్వులతో చెప్పసాగాడు.“I pretended to plant them and shouted ‘అమ్మా! నాగు పాము! నా కాలిపైకొచ్చింది’ అని.  అమ్మ కంగారు పడి పరుగెత్తుకొచ్చిన తర్వాతే తెలిసింది ఏప్రిల్ ఫూల్అయ్యానని.  While ‘seeds for seedless’ was my way of fooling her, the other part was dad’s plan because there are no cobras in the USA.” తను,నాన్న కలిసి అమ్మను ఫూల్ చేశామని చిన్ని నందన్‌కు ఒకటే సంతోషం. నందన్ మాటల వల్ల గంభీరంగా నడుస్తున్న కొత్త కోడళ్ళ విషయం నుంచి హాస్యం వైపుకు తిరిగాయి మాకబుర్లు. వాతావరణాన్ని కొద్దిగా తేలిక చేశాయి నందన్ నవ్వులు.

“ఈ రోజు ప్రొద్దున మా అబ్బాయి నా చెప్పులు తొడుక్కొన్నాడు. వాడి కాళ్ళకు నా చెప్పులు చాలా పెద్దవి లెండి. అయితే చిన్న పిల్లలకి అదో సరదా కదూ. మా వైపు ఒక పద్ధతివాడుకలో ఉంది. ఎప్పుడయితే తండ్రి చెప్పులు కొడుకు కాళ్ళకు సరి పోతాయో, అప్పటి నుంచి తండ్రి కొడుకుని స్నేహితుడిలా చూడాలని. అంటే కొడుకు అభిప్రాయాలను కూడాసమానంగా గౌరవించాలని.” నందన్ నాన్నగారు చెప్పిన ఈ విషయం అందరికీ కొత్తగా అనిపించింది. అయితే సారాంశం భలే నచ్చింది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నసంప్రదాయాలు కూడా మనకు అంతగా తెలిసుండవు కదూ!

“కొత్త సంవత్సరంలోనికి కాలు పెట్టాం. Happy New Year to you all!” టీచర్ క్లాస్ ముగిస్తూ ఇంకోసారి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

“మనం కొత్త సంవత్సరంలోనికి కాలు పెట్టామా లేక కొత్త సంవత్సరం మన జీవితంలోనికి కాలు పెట్టిందా?” టీచర్‌ని ఎద్దేవా చేశారొకరు. “మీ కాలు లాగే ప్రయత్నమంతేనండి”తక్షణమే నవ్వేశారు.“కాలు లాగడం is the same thing as pulling someone’s leg.” వివరణ విని అందరికీ నవ్వులు.

“కీళ్ళ నొప్పి వల్ల నేను కాళ్ళు లాగి నడిచేదాన్ని. అమేరికాకొచ్చిన తర్వాత నడవడమే తక్కువైపోయింది. ఎక్కడికెళ్ళాలన్నా కారెక్కాలి. అందుకే కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి మాలాంటివాళ్ళకి.” అంటూ వాపోయారొక పెద్దావిడ. రోజూ సాయంత్రం ఇంటి దగ్గరున్న పార్క్‌లో నడవడం వల్ల నొప్పులు తక్కువవుతున్నాయని కూడా చెప్పారు. వ్యాయామమే అన్నిఆరోగ్య సూత్రాలలోనూ ప్రముఖమైన అంశం కదూ.

 ఈదురు గాలితో కూడిన జోరు వర్షం తగ్గినా కూడా ఇంకా సన్న చినుకులతో వాన పడుతూనే ఉండింది. అందరూ వివాహ భోజనానికని యజ్ఞశాల వైపుకు బయలుదేరాం. అక్కడస్నేహితులందరూ కల్సి పాడుతున్న ‘వివాహ భోజనంబు’ పాట మాయాబజారులోని ఘటోద్గజుడు విందారగించడం గుర్తుకు తెచ్చి మా విందుకు చక్కటి సంభ్రమాన్ని చేకూర్చింది.

*

 

మేమూ మా తెంగ్లిష్ ఉగాది!

 సుధా శ్రీనాథ్ 

sudha“అమ్మా! నీకో విషయం తెలుసా? క్యాతి హు చెప్పింది వాళ్ళకూ మనలా లూనార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలవుతుందట. రేపట్నుంచి వాళ్ళకి  New Year తెలుసా!” ఆరేళ్ళ పాపకారెక్కుతున్నట్టే తనకారోజు తెలిసిన కొత్త విషయాన్ని చెప్పింది. రెండవ తరగతిలో ఉన్న చైనీస్ అమ్మాయి క్యాతి నా కూతురికి సహపాఠి. పాప కళ్ళలో ఉన్న మెరుపు చూసి క్యాతి తమ కొత్తసంవత్సరపు వేడుకల ఉత్సాహాన్ని మా పాపకూ రుద్దిందనిపించింది. ఈ రోజంతా చైనీస్ పండగ గురించే తన మాటలు అనుకొన్నాను.

 

పాప రోజూ ప్రొద్దున ఏడున్నరకు స్కూల్‍కు నాన్న జతలో వెళ్ళేది. పాపని స్కూల్లో దింపి తను వెళ్తే, మధ్యాహ్నం మూడున్నరకు తనని స్కూల్ నుంచి ఇంటికి నేను తీసుకొచ్చేదాన్ని. నా కారుదగ్గరికొస్తున్నట్టే పాప టీచర్‍కు, అక్కడున్న స్నేహితులకూ టాటా బై బై చెప్పి నవ్వులతో కారెక్కేది. కారెక్కుతున్నట్టే తాము ఆ రోజు స్కూల్లో ఏమేం చేశామన్నది వివరంగా చెప్పేందుకు మొదలుపెట్టేది. తన స్నేహితుల్లో ఎవరు ఏమేం మాట్లాడారని, టీచర్ ఏమన్నారని, టీచర్ ప్రిన్సిపల్ రూమ్‍కెళ్ళినప్పుడు ఎవర్ని క్లాస్ లీడర్ చేశారని, ఆ రోజు ఎవరెవరు స్కూల్‍కు రాలేదని, ఒకటా, రెండా,అన్ని విషయాలూ చెప్పేది. లంచ్ టైంలో తన పక్కన ఎవరు కూర్చొన్నారని, ఆ రోజు వాళ్ళ స్కూల్ క్యాంటీన్‍లో ఏమేం చేశారని, ఎందరు పిల్లలు లంచ్ పార వేశారని, తను లంచ్‌కని ఇంటి నుంచితీసుకెళ్ళింది ఖాళి చేశాననో, చేయలేదనో, ఆటవిడుపుల టైమ్‍లో ఏ ఏ ఆటలు ఆడిందని, ఏదైనా ఆడలేదంటే ఎందుకు ఆడలేదని ఇలాగే ప్రతియొక్కటీ పూసగ్రుచ్చినట్టుగా చెప్పేది.

 

పాప క్లాస్ ఒక చిన్ని ప్రపంచంలాగుంటుంది. ఇద్దరు కొరియన్స్, ఇద్దరు చైనీస్, ముగ్గురు ఇండియన్స్, ఒక రష్యన్, ఒక జాపనీస్, శ్రీలంకన్ ఒకబ్బాయి, ఒక పాకిస్తానీ అమ్మాయి, మిగతా అమేరికన్లుఉన్నారు. పాకిస్తానీ అమ్మాయితో మరియు ఒక జాపనీస్ అమ్మాయితో పాపకు భలే స్నేహం. నాకు యూనివర్సిటీలో కొన్ని అంతర్రాష్ట్రీయ స్నేహాలు దొరికితే పాపకు రెండో తరగతిలోనే నాకంటేఎక్కువ దేశాల వారితో స్నేహం కుదిరింది. అందరూ అక్కడ మాట్లాడేది ఇంగ్లిష్‍లోనే అయినా తమ కుటుంబం గురించి చిన్ని చిన్ని విషయాలను తమ బాల భాషలోనే ఒకరికొకరు తెలుపుతుంటారు.కొరియన్ అమ్మాయిలయితే ఈ చిన్ని వయసులోనే చక్కగా సంగీతాభ్యాసంలో ఉన్నారట. చైనీస్ పిల్లలు ఆదివారాల్లో తమ మాతృభాషను నేర్చుకొంటున్నారట. క్యాతి ఇంట్లో చైనా నుంచి వచ్చినఅవ్వా తాతా ఉన్నారట. వాళ్ళకు ఇంగ్లిష్ అస్సలు రాదు కాబట్టి ఇంట్లో తమ భాషలోనే మాట్లాడుతారట. రోజూ కారెక్కుతున్నట్టే మొదలయ్యే పాప మాటలు వినేందుకు నేను కూడాఎదురుచూసేదాన్ని. ప్రతి రోజూ తన మాటలు నన్ను మళ్ళీ చిన్న పిల్లల లోకవిహారానికి తీసుకెళ్ళేవి. అదొక international చిన్నారుల colourful లోకం.

 

మనం ఉగాది రోజు పైరు పచ్చకి, సమృద్ధికి సంకేతమని వాకిలికి మామిడాకుల తోరణాలు కట్టి, కొత్త బట్టలో లేక పట్టు బట్టలో వేసుకొని పూజలూ, ప్రార్థనలూ, విందులూ చేస్తాం. చైనీస్ తమ నూతనసంవత్సరాదికని వాకిలి, కిటికీలను ఎరుపు రంగు కాయితాలతో అలంకరిస్తారట. విశేషమేంటంటే ఆ రోజు అందరు ఎర్ర రంగు దుస్తులనే ధరించే సంప్రదాయం ఉందంట. ఎరుపు రంగు దుష్ట శక్తులనుపారద్రోలి అందరికీ శుభం చేకూరుస్తుందనే నమ్మకం వాళ్ళది. ఎరుపు రంగు సత్యం, సంతోషం మరియు నిజాయితీని సూచిస్తుందట.

 

పాడ్యమికి ముందు రోజు అంటే అమావాస్య సాయంత్రం పెద్దలకీ, దేవతలకీ గౌరవం సమర్పించి కుటుంబ సభ్యులందరు జతలో కూర్చొని విందారగిస్తారట. కొత్త సంవత్సరానికని స్పెషల్ కేక్ చేసిదాన్ని బంధు మిత్రులందరికీ పంచి తింటారట.  పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఎరుపు రంగు కవర్లో డబ్బుంచి గిఫ్ట్ ఇవ్వడం కూడా కొన్ని కుటుంబాలలో చేస్తారంట. మొత్తానికి ఎరుపు రంగుకు చాలాప్రాధాన్యతనిస్తారట. ఇన్ని విషయాలు పాప చెప్తుండగా చాలా ఆశ్చర్యంగా విన్నాను. అంతకు ముందు నాకీ విషయాలు తెలిసుండలేదు.

 

మన ఉగాదికి సరిగ్గా రెండు నెలల ముందు చైనీస్ కొత్త సంవత్సరం మొదలవుతుంది. అంటే మన ప్రకారం మాఘ శుద్ధ పాడ్యమి రోజు. వాళ్ళక్కూడా మనలాగ అధిక మాసాల రకంలెక్కాచారాలున్నాయట. ఇవి నేను నా చైనీస్ మిత్రుల నుండి తర్వాత సంగ్రహించిన విషయాలు. చైనీస్ నూతన వర్షారంభమైన తర్వాత సరిగ్గా రెండు మాసాలకు మన తెలుగువాళ్ళకు చాంద్రమానఉగాది అన్న మాట. ఇది తెలుగువాళ్ళమే కాకుండా కర్నాటక మరియు మహారాష్ట్రాల్లో కూడా ఆచరించే కొత్త సంవత్సరపు పండుగ. కర్నాటకలో యుగాది అంటారు మరియు మహారాష్ట్రంలోగుడిపాడ్వ అని అంటారు.

 

మనం వసంతాగమనాన్ని చైత్ర మాసంలో వసంత నవరాత్రులనే పేరుతో ఆచరించి సంభ్రమాలు జరుపుకొంటే చీనీయులు వారి నూతన సంవత్సర ఆరంభం స్ప్రింగ్ ఫెస్టివల్ అంటూ అమావాస్య నుంచిపౌర్ణమి దాకా వేడుకలు జరుపుకొంటారు. మనలో కూడా కొన్ని సముదాయాల్లో చైత్ర పౌర్ణమిని వసంత పౌర్ణమియని విశేషంగా కవిగోష్టులు, నృత్యాల వేడుకలతో జరుపుకొంటారు.

 

ఇన్ని విషయాలు ఉగాది వేడుకల రోజు మా తేనె తెలుగు క్లాసులో పిల్లలకు తెలిపినప్పుడు అందరి ముఖాల్లో వసంతోత్సవం వెల్లి విరిసింది. దేశం వేరైనా, భాషలు వేరైనా మనుష్యులంతా ఒక్కటేఅనిపిస్తుంది కదూ అనిందో చిన్నారి. అవునన్నట్టు పిల్లలూ, పెద్దలూ కూడా తలలూపారు. ప్రపంచంలోని వేర్వేరే దేశాల్లో ఏ విధంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారో తెల్సుకోవడంబావుంటుందన్నారు కొందరు. అవునవునన్నారు అందరు.

 

తెలుగెంత ఎక్కువగా వింటే మాట్లాడ్డం అంత సులభమవుతుందనే ఉద్దేశ్యం మా క్లాసుది. అందుకే మా క్లాసులో ప్రాథమిక పాఠశాల విధంగా కాకుండా కొద్దిగా రాత, చదువు అయిన తర్వాత ఏదైనాఒక విషయం పైన కబుర్లెక్కువగా ఉండేవి. అందులో పిల్లలు మరియు పిల్లల్ని క్లాస్‌కు తీసుకొచ్చిన పెద్దలు తెలుగు ఇంగ్లిష్ కలిపిన తెంగ్లిష్‌లో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చుతూ పాల్గొనేవారు. ఆరోజు చర్చా విషయం ఉగాది.

 

ఉగాది రోజు మనకు షడ్రుచుల మిశ్రణమైన ఉగాది పచ్చడి తినడం ఎంత ముఖ్యమో అలాగే కర్నాటకలో ‘బేవు బెల్ల’ అనే పేరుతో వేప పూవు బెల్లం కలిపి ప్రసాదంలా స్వీకరించడం అంతే ముఖ్యం.అలాగే ప్రతి సముదాయంలోనూ అట్లాంటిదే ఏదో ఒకటి జీవితమంటే తియ్యటి అనుభూతులే కాదు, ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అయినా అన్నిటినీ ధైర్యంగా స్వీకరించి, ఎదురించి ముందుకుసాగడమే జీవితం అనే సందేశాన్నిచ్చేవుంటాయి. మామిడికాయి, కొత్తగా వచ్చిన చింతపండు, బెల్లం, వేప పూలు, మిరపకాయలు, ఉప్పు వేసి చేసే మన ఉగాది పచ్చడి కూడా అదేసందేశాన్నిస్తుందని పిల్లలకు తెలిపాను. ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు ఇదే అర్థానిచ్చే ఒక శ్లోకం కూడా పఠిస్తారని గుర్తుచేశారొకరు.

 

“ఉగాది పండగ గురించి ఏదైనా కథ ఉందా?” అడిగిందో చిన్నారి. మాటలు మళ్ళీ గంభీరమైతే పెద్దలకేమో పర్వాలేదు, అయితే పిల్లలకి ఒకటే బోర్ కొడ్తుంది. ప్రతి పండగ గురించి ఏవైనా పురాణకథలుంటే క్లాసులో చెప్పడం అలవాటు. పిల్లలకు కథలంటే భలే ఇష్టం. అందులోనూ ఆ రోజు మా చర్చకు సరిపడేదుంటే మరీ బాగుంటుంది. శ్రీ మహావిష్ణువు ఇంక తొమ్మిది రోజులకు రాముడైభూలోకంలో అవతరిస్తున్నాడని ఆకాశవాణి అయిన రోజని చెబుతారు. అది విన్న జనం పరమానంద భరితులై రామావతారణతో కొత్త యుగమే ప్రారంభమని యుగాది అనే పేరిట పండగ చేయడంమొదలయ్యిందంట. అంతే కాదు, నవమి రోజు రాముడు పుట్టేంత వరకూ తొమ్మిది రోజులు వసంత నవరాత్రులని పండగ వేడుకలు కొనసాగాయట అని చెప్పాను.

 

“నవ అంటే కొత్త అని కూడా అర్థం కదూ.” దసరా పండగలో చెప్పిన మాట గుర్తుందన్న ఓ బాబు మాటకు అందరి నుంచి అభినందనాపూర్వక చప్పట్లు. టీచర్లకు మరియు తల్లిదండ్రులకైతే బాబుమాట విని సగర్వ సంతోషం.

 

యుగాది అనే బదులు మనం ఉగాది అని అంటామెందుకని అడిగారు పిల్లలు. యుగాది పదమే రూపాంతం చెంది ఉగాది అయిందంతేనన్నాను.

 

“For red colour ఎరుప్ అనాలా? ఎరుపు అనాలా? ఎందుకంటే తెలుగులో కారు, వ్యాను, ఫోను, ఫ్యాను అంటారుగా. అందుకే అడిగాను” చిన్నారి ప్రశ్నతో పాటు ఇచ్చిన సంజాయిషీ విని చాలామంది నవ్వాపుకోలేక పోయారు. అమేరికాలో పెరిగే పిల్లలే అంత. తెలిసింది అనుమతి తీసుకొని చటుక్కున చెప్పేస్తారు. తెలియనిది మొహమాటం లేకుండా అడుగుతారు. తప్పయితే సారీఅనేస్తారు. పిల్లల్లోని ఈ గుణం నాకు చాలా నచ్చింది. వాళ్ళకి స్కూల్లో please, thank you అనేవి మ్యాజిక్ పదాలని బాగా నూరి పోస్తారు.

 

ఇంగ్లిష్ పదాలకు ప్రథమా విభక్తి ప్రత్యయమైన ‘వు’ చేర్చి తెలుగీకరిస్తాం. అయితే ఎరుపు తెలుగు పదమేనని నవ్వుతూ చెప్పాను. తనూ కిల కిలా నవ్వేసింది.

 

విద్యుచ్ఛక్తితో నడిచే మొట్టమొదటి రెండు రెక్కల విద్యుత్ విసనకర్రను కనిపెట్టిన షుయ్లర్ వ్హీలర్‌ది మాతృ భాష ఇంగ్లిష్ కాబట్టి దానికి ఫ్యాన్ అనే పేరే ఖాయమయ్యింది. ఇంగ్లిష్‌లో విసనకర్రకూ ఫ్యాన్అంటారు. విద్యుచ్ఛక్తితో నడిచే విసనకర్రను కూడా ఫ్యాన్ అంటారు. కొన్ని విదేశీ పదాల్ని తెలుగుకు రూపాంతరం చేసేటప్పుడు కూడా ప్రథమా విభక్తి ప్రత్యయం చేర్చడం వాడుకలోకొచ్చింది. అందుకేఫ్యాన్ కాస్తా ఫ్యాను అయ్యింది. మనమేదైనా అందరికీ ఉపయోగకరమైన కొత్త వస్తువును కనిపెట్టినప్పుడు ఆ వస్తువు మన భాషలోనే ప్రచారమవుతుంది. పదాల ప్రచారం కావాలి అంటే పదాలజతలో పదార్థాలు కానీ పద్ధతులు కానీ ఉండి తీరాలి. మనవాళ్ళు కనిపెట్టిన వస్తువులకు మన భాషలోనే పేర్లు పెట్టొచ్చు. ఎవరు కొత్తవి కనిపెట్టారో వారు పెట్టిన వారి భాషలోని పేర్లే ఆయావస్తువులకు ప్రపంచాద్యంతం నిల్చి పోతాయని పెద్దాయనొకరు స్పష్టం చేశారు. ఆయన తేల్చి చెప్పిన ఈ నిజం గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందనిపించింది.

 

“అవునవును. యోగ మరియు మంత్ర అనే పదాలు మన దేశం నుంచి వచ్చిన పదాలే కదూ” అన్నారొకావిడ. అందరికీ కొత్త సంవత్సరంలో సరికొత్త సంతోషాలు సమకూరాలని కోరుతూ ఆవిడ తనుఇంట్లో చేసుకొచ్చిన ఉగాది పచ్చడిని అందరికీ పంచారు. క్లాస్ ముగిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ కోవెల్లో పంచాంగ శ్రవణానికని బయలు దేరాం. పిల్లలూ మాతో గలగలామాట్లాడుతూ కల్సినందువల్ల కోవెల కళకళలాడింది.