“చివరకు మిగిలేది” దేనికోసం?!

buchibabu‘‘చివరకు మిగిలేది’’ నవలకూ, ఆ నవలా రచయిత బుచ్చిబాబుకు, తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రముఖ స్థానం ఉంది. అప్పటికి తెలుగు నవలలలో విశాలమైన ప్రాతిపదికపై ‘‘మానవ జీవితం’’ పట్ల తాత్విక దృక్పథాన్ని ప్రతిపాదించే ప్రయత్నాలు జరిగాయి. అయితే వైయక్తిక జీవితానికి, ఆయా తాత్విక దృక్పథాలకు గల పరస్పరత (interaction) ‘‘చివరకు మిగిలేది’’ నవల. ఆధునిక జీవితానికి తప్పనిసరి అయిన పాశ్చాత్య తాత్విక దర్శనాలను బాగా పరిశీలించిన మేధావి బుచ్చిబాబు.

ఈ నవల కుండే చారిత్రక ప్రాధాన్యతను ఆర్‌.ఎస్‌.సుదర్శనం ఇలా చెప్పారు. ‘‘తెలుగులో మనో వైజ్ఞానిక నవల అవతరించడంతో ‘‘కాల్పనికత’’ బద్దలైంది. ఈ విధంగా చూస్తే ‘‘చివరకు మిగిలేది’’ తెలుగు సాహితీ పురోగతిలో ఒక మైలురాయి. భావనాత్మక ప్రేమ, ఆదర్శాలూ, జీవిత సత్యం, ముందు, దివ్వటీలు సూర్యుడి ముందు కాంతి విహీనమైనట్లు నిరుపయోగం కావటాన్ని చిత్రిస్తుందీ నవల’’. భావనాత్మక దృక్పథాన్ని నిజజీవితం ముందు పరీక్షకు పెట్టడం ఈ నవల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఈ నవలలో వ్యక్తి దయానిధి. అతని మానసిక పరిణామం ఈ నవల. అతని జీవితంలో కదలిక కంటే వలయాల వలననే ప్రాముఖ్యం కలుగుతుంది. ఆ ఆలోచనా వలయాల గుణాన్ని, విలువలను బట్టే సంఘటనలు ఎన్నుకోబడతాయన్నా ఆశ్చర్యం లేదు. అయితే అది కృతకంగా గాక సహజంగా ఉండడం వలన నవల విజయవంతం అయి జీవితంపై ఒక దృక్పథాన్ని కలిగించాలనే రచయిత ప్రయోజనం నెరవేరింది.

2

డాస్టోవిస్కీ నవల సాధారణతలను కాకుండా ప్రత్యేకత (peculiarities) లను చర్చించాలని అన్నాడు. ఇందులో ఉద్దేశ్యం సామాన్య జీవిత దృక్పథాలను వైయక్తిక జీవితాలకు అంటే ప్రత్యేక వ్యక్తి జీవితాలకు అన్వయించడం కావచ్చు.

‘‘చివరకు మిగిలేది’’ నవలలో దయానిధి ప్రత్యేకయిన వ్యక్తిత్వం కలవాడు. అతను అనుభూతిపరంగానూ, ఉద్వేగ స్థాయిలోనూ కాల్పనికమైన ఆలోచనలు కలవాడు. దయానిధి కాల్పనికత సాంప్రదాయక కాల్పనికత కంటే భిన్నంగా ఉండదు. అంటే స్ర్తీ పురుష సంబంధాలకు చెందిన కాల్పనిక ధోరణి జీవితంలో ప్రధానాంశం కావడం. అయితే దయానిధిలో ఈ కాల్పనికత కాల్పనికమైన వాదులాటకు సెంటిమెంటల్‌ కాన్‌ఫ్లిక్ట్‌కు దారితీయదు. కాల్పనికతకూ, నిజజీవిత గమనానికి మధ్య ఏర్పడే ఘర్షణ రచనా లక్ష్యం అనడంతో ఈ నవల ‘‘మైలురాయి’’ అయింది.

ఈ కాల్పనికత కారణంగానూ, మిగిలిన అంశాల వల్ల దయానిధిలో స్ర్తీల పట్ల అమితమైన కుతూహలం జనిస్తుంది. స్ర్తీలందరూ కేవలం తాము స్ర్తీలయినంత మాత్రాన్నే అతన్ని మానసికంగా స్పృశించి అతన్లో ఆలోచనలు లేపుతారు (కాత్యాయిని, రోజీ ఇందుకు మినహాయింపు) అయితే స్త్రీల పట్ల అతని దృక్పథం వాళ్ళ ‘‘అమ్మ’’ వల్ల ప్రభావితం అవుతుంది. ఇది మౌలికంగా సాంప్రదాయిక కాల్పనికత కంటే భిన్నంగా పరిణమిస్తుంది.

దయానిధి కాల్పనికతలో సంఘ నియమాల పట్ల మౌలికమైన పట్టింపు లేదు. నిజానికి సంఘం, దాని నియమాలు, పరిమితలకు అతని మానసిక పరిధిలో మొదట మొదట స్థానమే లేదు. అయితే తర్వాత తర్వాత ‘‘అమ్మ’’, తన ఊహలో ఎంతో ఉన్నతమైన ‘‘అమ్మ’’ను సంఘం తిరస్కారభావంతో చూడడం గుర్తించిన దగ్గిర్నుంచీ అతనికి సంఘంతో ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ ఘర్షణ అంతస్సంఘర్షణగా రూపొందడంతో సమస్య జటిలమవుతుంది. ఎందుకంటే ముందు చెప్పినట్లుగా అతనికి సంఘ నియమాల పట్ల మౌలికంగా పట్టింపు లేదు. అతనికి సంఘంతో నిమిత్తం ఉంది.

‘‘ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధానపరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు’’

అతని రచయితే నవల మొదటి పేరాలోనే చెప్తాడు. అంతేకాదు. దయానిధికి సంఘంతో ఘర్షణ నిజానికి ‘‘అమ్మ’’ ద్వారానే మొదలవుతుంది.

దయానిధికీ అమ్మకూ ఉండే అనుబంధం మామూలు మాతృప్రేమకంటే విశిష్టమైనది. అతని ప్రకారం ఆమె ఒక్కతే అతన్ని అర్థం చేసుకున్నది. దయానిధి మరో సందర్భంలో చెప్పేట్లుగా ప్రతి మనిషి కొందరి దగ్గిర దాపరికం లేకుండా తనను తాను చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఆ విధంగా కూడా ‘‘అమ్మ’’ దయానిధికి ఆప్తురాలు.

‘‘ఇంతవరకు అతనికి వేరేవునికి లేదు – ప్రతి చిన్న విషయానికీ తల్లి మీద ఆధారపడ్డారు. ఈ సంఘం ఒక సమ్రుదమయితే, అతను నిలబడేటందుకు అమ్మ ఒక లంగరు. ఇప్పుడు ఆ లంగరు లేదు; ఏదో శక్తి అతన్ని వదలిపోయింది; అతన్ని ప్రపంచానికి బంధించిన గొలుసులో గొళ్ళెం వూడింది.’’

అద్దంలో ‘‘అతన్ని చూస్తే అతనికే నవ్వొచ్చింది. అకస్మాత్తుగా అమ్మను చూసినట్లనిపించింది. తనలోంచి తల్లి తొంగి చూస్తున్నట్లు – తనలో ఎవరో వుండి అతన్ని జీవింప చేస్తున్నట్లు. నిజంగా తల్లి చావలేదు. అతనిలో ఉండిపోయింది.’’

అతన్ని జీవితాంతం వెంటాడిన విషయం ‘‘తల్లి తనలోంచి తొంగి చూడ్డం.’’ ఏ సంఘానికీ తనకూ లంగరుగా తల్లిని భావించాడో తర్వాత ఆ ‘‘అమ్మే’’ పరోక్షంగా సంఘానికీ తనకూ మధ్య ఘర్షణకు కారణం అవుతుంది. సంఘానికీ, తనకూ మధ్య నిలిచన అద్దం తల్లి. ఆ అద్దంలోంచీ తప్ప సంఘాన్ని చూడలేకపోవడం వల్లనే దయానిధి తర్వాత అంతగా సంఘానికి దూరంగా జరుగుతూ వచ్చాడు. సంఘం కూడా ఈ అంశాన్ని reciprocate  చేస్తుంది. దయానిధిని వాళ్ళ ‘అమ్మ’ అద్దంలోంచీ తప్ప చూడలేదు. అయితే ‘‘అమ్మ’’ ప్రభావం దయానిధి దృక్పథంపై పరోక్షంగా ఉంటుంది. సంఘం వైపు నుంచీ అది తప్ప మరో ప్రభావం లేనంత ప్రత్యక్షంగా ఉంటుంది.

అందుకే దయానిధి మిగిలిన జీవితాంశాలలో సంఘానికి స్థానం చాలా తక్కువ ఉంటుంది. అతని మానసిక ఆవరణోకి అతని వృత్తి చాలా కొద్దిగా ప్రవేశిస్తుంది. శ్యామలతో అతనికి పరిచయం వృత్తిపరంగానే కలిగినా, ఆ సంపర్కం ఆమె ప్రత్యేకతలకే పరిమితమవుతుంది. అనుశీలనలో మానసిక విశ్లేషణ (దయానిధికి చాలా ఇష్టమైన పని) ప్రధానం అవడం వలన, ఆ అనుశీలన మరి కొంచెం సాగి ఉంటే దయానిధికి తన వృత్తిలో సార్థక్యం కనిపించి అతని జీవితం మరో మార్గం పట్టేదేమో! వృత్తిపరంగా అతనికి పరిచయమయే మరో వ్యఇక్త కృష్ణమూర్తి. కృష్ణమూర్తి వ్యక్తిత్వం కానీ, అతని పరిచయం కానీ దయానిధిలో ‘‘మెడిసిన్‌’’ పట్ల ఆసక్తి కలిగించేవి కావు.

అయితే దయానిధి ప్రయత్నం చెయ్యలేదని చెప్పలేం. అతని జీవితంలో చాలా సుఖంగా గడిచిన రాయలసీమ అనుభవాలకు మూలం అతని వృత్తి. అయితే ఆ అనుభవాల్లో అతనికి దొరికిన వజ్రం అతన్ని మళ్ళీ సంఘంతో ఘర్షణకు ప్రోద్బల కారకమవుతుంది. అతను వ్యక్తిగా సంఘం దృష్టిని ఆకర్షించడానికి తోడ్పడుతుంది. అప్పటివరకూ సంఘం పట్టించుకోని అతని వైయక్తిక జీవితం పట్ల సంఘానికి ఆసక్తి కలుగుతుంది. (ఈ వజ్రం దొరకడాన్ని అదృష్టవశాత్తూ అనడం నాకు నచ్చదు. ఎందుకంటే అతని జీవితంలో ప్రశాంతమయిన భాగం వజ్రంతో నాశనమవుతుంది).

అలాగే ఆనాటి సాంఘిక సమస్యలు – స్వాతంత్యోద్యమం, విశాలాంధ్ర ఉద్యమం – దయానిధిని పెద్దగా ప్రభావితం చెయ్యవు. అయితే సాంఘిక పరిస్థితులు వైయక్తిక జీవితాలపై ప్రధానం చూపడం తప్పనిసరి. అదే దయానిధి విషయంలో జరిగినా ఆయా ఉద్యమాలు వాటి స్వీయ ఆకృతిలో Issues గా అతని మానసిక పరిధిలోకి పెద్దగా ప్రవేశించవు.

అలాగే మతం కూడా అతన్ని ప్రభావితం చెయ్యదు. తాత్విక దృష్టికి సంబంధించి అతనికి కొన్ని అభిప్రాయాలు ఉన్నా అవి ‘‘మతం’’తో సంబంధంలేనివి. ‘‘అమ్మ’’ మరణశయ్య మీద ఉన్నప్పుడు తప్ప అతనిలో దేవుడి ప్రసక్తి రాదు. ఆ ప్రార్థన కూడా ఎక్కువ భాగం ఫంక్షనల్‌ తప్ప అతనిలో మరో కోణం కాదు. అలాగే జీవితాలపై ఆర్థిక స్థితిగతుల ప్రభావం కూడా అతని సమస్యలో భాగం కాదు. అయితే బద్ధికంగా అతను ఆర్థిక ప్రాతిపదికను అంగీకరించాడు. ఈ విషయం గని త్రవ్వకపు పనివాళ్ళ గురించి అతను అనంతాచారితో చర్చించేపుడు తప్ప ఇంకెక్కడా తెలియదు కూడా. మరీ దర్రిదంలోకి దిగజారినప్పుడు తప్ప ఆ విషయం అతని జీవితంలో భాగం కాలేదు.

chivaraku_migiledi-300x450

అందువలన దయానిధి ప్రధానమైన సమస్య అతని కాల్పనికతకూ, అందులో ఔన్నత్యానికి చిహ్నమైన ‘‘అమ్మ’’కూ, అమ్మ పట్ల సంఘం దృష్టికీ, అతని సంఘ నిమిత్తానికి మధ్య ఘర్షణకు పరిమితమైంది.

నిజానికి దయానిధి ద్వారా తప్ప మనకు అతని తల్లి గురించి ఎక్కువగా తెలియదు. ఆమె ‘‘ప్రవర్తన’’లో సంఘ నియమాలకు సరిపోని అంశం ఉన్న సంగతి తెలుస్తుంది. అది నిజమో, పుకారో మనకు తెలియదు. (దయానిధికి ఎందరో స్త్రీలతో  ‘‘సంబంధం’’ ఉన్నట్లు సంఘం చిత్రిస్తుంది. దాని నిజానిజాలు మనకు తెలుస్తాయి. అలాగే అతని తల్లి కూడా కావచ్చు.)

అయితే ఈ విషయంలో దయానిధికి మాత్రం అనుమానం లేదు. తల్లి సంఘ నియమాలకు వ్యతిరేకంగా నడిచి ‘‘అపచారం’’ వంటిదేదో చేసిందని అతను విశ్వసిస్తాడు. అందుకే అతను ఎప్పుడు ‘‘క్షమించడం’’గా తప్ప ‘‘అంగీకరించడం’’గా ఆలోచించడు. ఆ విశ్వాసం అతనికి అమ్మ పట్ల ఉండే ప్రేమాస్పదమయిన ఆకృతిలో ఇమడదు. ఈ రెంటి మధ్య ఘర్షణ అతని జీవితంలో ప్రశ్న అవుతుంది. అందుకే హామ్లెట్‌తో పోలిక. హామ్లెట్‌లానే అతను కూడా మొదట్లో తల్లి  ప్రవర్తనను గర్హించకపోయినా తల్లి సాంఘిక నియమాలకు లోబడి ఉండగలిగితే బావుంటుందని అనుకుంటాడు.

‘‘ఇంట్లో గొడవలన్నీ తను (అమ్మ) తెచ్చిపెట్టుకున్నవే. వయస్సు మళ్ళింది – హాయిగా పేచీ లేకుండా సంసారం చక్కబెట్టుకోరాదూ? త్రండి సంపాదిస్తున్నాడు. పెద్దకోడలు కాపురానికి వచ్చింది – ఇప్పుడైనా తన జీవితాన్ని ఒక మార్గంలో పడేసుకుని వొడిదుడుకులు లేకుండా నడుపుకోరాదూ?’’ – అని సాధారణ సంఘంలోని వ్యక్తిగా ఆలోచిస్తాడు. (ఇక్కడ ఏసుల కాపరి కుర్రాడు పాడేపాట ‘‘స్థిరమైన నడవడి’’ కావడం గమనార్హం) అంటే దయానిధి సంఘాన్ని ఎక్కువ గౌరవిస్తాడని కాదుకానీ అతనికి సంఘం పట్ల అట్టే పట్టింపులేదు అప్పటికి. అయితే పై ఆలోచనే అమ్మను దూషించే గోవిందరావు ప్రసక్తి వచ్చేసరికి ఇట్టే మారిపోతుంది. సంఘ వ్యతిరిక్తత మొదలవుతుంది. అలాగ ప్రతిసారీ అతనికి సంఘర్షణ ‘‘అమ్మ’’ గురించే. ఆ ఘర్షణ అతన్లో అంత స్సంఘర్షణగా పెనుభూతమవుతుంది. ఆ ఘర్షణలో అతను సంఘ నియమాలను అయిష్టంగా ఎదిరించే రెచెతగా తయారవుతాడు. అయితే అతని రెబెలియన్‌ బాహాటంగా ఉండదు. ఎప్పటికప్పుడు సంఘాన్ని ఓడించాలని కాకుండా సంఘంతో Detached సహజీవనం కోరుకుంటాడు.

అందుకే తన సమస్యను హామ్లెట్‌కు అన్వయించి, హామ్లెట్‌కే కాదు, షేక్స్పియర్‌కు కూడా అన్వయిస్తూ రాసుకున్న వ్యాసంలో

‘‘తల్లితండ్రుల పాపాలు పిల్లల్ని వెంటాడినప్పుడు వారేం చెయ్యాలి అన్న దానికి షేక్స్పియర్‌ సమాధానం ఇవ్వలేకపోయాడు. వారిని క్షమించి, ప్రేమించనున్నాడా? నీతి లేదనడం లేదు. ప్రాచీనశక్తులు, మానవత్వం – వీటికి నీతితో నిమిత్తం లేదు. ఈ గోళంపై మానవుడి బతుకు క్షణికం, అశాశ్వతం. నీతి పేరిట, కఠిన శిక్ష, కన్నీరు, జుట్టు పీక్కోడం ఎందుకో?’’ అని రాస్తాడు.

హామ్లెట్‌ సమస్యను పోల్చుకోవడం ద్వారా దయానిధి సమస్య ఇంకొంచెం విశదం చేసుకోవచ్చు. హామ్లెట్‌కు అతని తల్లి ‘‘అపచారం’’పై సానుభూతి లేకపోగా అతను ఆ అపచారాన్ని గర్హిస్తాడు. పైగా త్రండి హత్య, ఆ హత్యలో తల్లి పాత్ర సమస్యను మరింత జటిలం చేస్తుంది. అయితే అతని క్రియ ఆలస్యం కావడానికి కారణాలుగా అమ్మ పట్ల ప్రేమ, ఆ ‘‘అపచారం’’ అమ్మదనడంతో ఆ విషయాన్ని సాధ్యమయినంత వరకూ నమ్మకపోవడానికి ప్రయత్నించటం కారణాలు కావచ్చునని కొందరు విమర్శకుల అభిప్రాయం. అక్కడ సంఘం అమ్మను దూషించే ప్రసక్తి లేదు. పైగా చాలా భాగం ఆవిడ వైపు ఉంటుంది, కొంత నిజం తెలియక, కొంత సాంఘిక నియమావళిలో బేధం వలన, ఆమె సాంఘిక స్థాయి వలన. ఆ సమస్య పూర్తిగా హామ్లెట్‌లోని రెండు భాగాల మధ్య ఘర్షణ.

దయానిధికి అలాకాదు. అతనికి తల్లి ప్రవర్తన ‘‘అపచారమా’’ కాదా అని ఆలోచించేంత పట్టింపులేదు. కానీ సంఘంతో ఘర్షణ అయిష్టం కాబట్టి ఆ ‘‘అపచారం’’ అమ్మ చేయకపోతే బావుండును అనుకుంటాడు. ఇందుకు ఉదాహరణగా చివరిలో అంటే వజ్రం దొరికి, ఆ సంపదతో ఇల్లు కట్టుకుని ఒక రకంగా ప్రశాంత జీవితం గడుపుతున్నప్పుడు- ‘‘దయానిధి మండువాలో కూర్చున్నాడు ‘అమ్మ’ వ్రిగహం కేసి చేస్తూ. స్ర్తీ జాతిపై అతని నమ్మకం పోయినందుకు ‘అమ్మ’ కారణం అనుకున్నాడు. క్షణం ‘‘అపచారం’’ చేస్తే వారి సంతతి ఇల్లాగైపోతుందని తెలుసుకోగలిగితే, ఏ స్ర్తీయేనా అపచారం చేస్తుందా? ‘‘అమ్మ’’ స్ర్తీత్వానికొక చిహ్నం – ఆ చిహ్నం వొక నల్లటి తెరగా తన దృష్టిని మరుగు పరుస్తుంది. ఆ తెర ఎక్స్‌రే లాంటిది. బైట రక్తం, మాంసం, మెదడు, ఊహ, ఆదర్శం, జ్ఞానం గల స్ర్తీలున్నా, లోపల్నించీ ఇతనికి కనబడేది అస్థిపంజరమే. అతనిక అనుభవాలను ఆత్మవంచన లేకుండా తరచి చూచుకుంటే, స్ర్తీలను ఆదర్శ వ్యక్తులుగా పరిగణించేటందుకు తగిన ఆధారాలు లేవు. ఏది యదార్థం? తన ఎక్స్‌రే దృష్టా? బైట మాంసం, రక్తం, మనుషులా?’’- అన్న ఆలోచన.

అమ్మను దూషించే సంఘాన్ని అంగీకరించలేడు. అలా అని సంఘంతో నిమిత్తం వదలుకోలేడు. అమ్మ ఔన్నత్యాన్ని తగ్గించుకోలేడు. ఇందుకు కారణం సంఘ నియమాలపట్ల అతనికి పెద్దగా నమ్మకం, అపనమ్మకం రెండూ లేవు. రెండూ వున్నాయి. ఈ విషయం ఆధునిక జీవితానికి దగ్గిర విషయమే. అయితే అప్పటికి సంఘం గొంతు చించుకోవడం మానదు. అందుకే కొంచెం సేపు ‘‘అమ్మ’’ ‘‘సరిగా’’ వుండి వుంటే బాగుండుననీ, మరింకోసారి సంఘానికెందుకింత గోల అని ఆలోచిస్తాడు. ఈ పరిస్థితి, ఏమీ చెయ్యలేని పరిస్థితి. అతన్ని మామూలుగా ఉండనివ్వదు. దీన్ని ప్రేమరాహిత్యంగా భావించడం జరిగింది. దయానిధిని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు – అమృతం, జగన్నాధం, కోమలి, నారయ్య, అనంతాచారి మొదలైనవాళ్ళు. వీళ్ళలో అమృతంతో మ్రాతమే అతను తన మానసికాందోళనలను కొంత పరిధి వరకూ పంచుకోగలడు. అయితే ‘‘అమ్మ’’ విషయంలో అమృతానికి అతనికీ వ్యతిరేక అభిప్రాయాలు లేవు. సంఘం గురించి మనకెందుకులే బావా అంటుందేమో అమృతం. అమృతం ఈ విషయాన్ని కదల్చినా అతనికి జవాబిచ్చే మనస్తత్వం లేదు. ఈ పరిస్థితి అతన్ని మామూలుగా ఉండనివ్వదు. అసలే Introvert అయిన అతనిచేత విచ్రితంగా ప్రవర్తింప చేస్తుంది.  తనలోకి తను ముడుచుకు పోయేట్లు చేస్తుంది. అతని సంపద కానీ, వృత్తికానీ, ఈ విషయంలో Solace ఇవ్వలేవు. పూర్తిగా సంబంధం లేని వాళ్ళు కూడా అతన్ని దూషిస్తూంటే వాళ్ళను అడగడు. పైపెచ్చు తన అంతఃక్రోధంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి సంఘానికి మరింత దూరమవుతాడు. ఇందుకు ‘‘అమ్మ’’ అపచారం అతనిలో సెక్స్‌ పట్ల కలిగించిన Inhibitions ఏ స్త్రీతోనూ అతనికి శారీరిక సంబంధం లేకుండా చేస్తుంది. సంఘాన్ని అంగీకరించలేక వదలుకోలేకపోతాడు. ఈ ప్రవర్తనను శ్రీ ఆర్‌.ఎస్‌.సుదర్శనం గారు ‘‘న్యూరాసిస్‌’’గా పేర్కొన్నారు. ఇందులో భాగమే సంఘంతో పరోక్షంగా పోట్లాట. అయితే ఈ పోట్లాటకు కారణం ఉద్వేగం,Inhibitions అనడంతో అది Submissive గా ఉంటుంది. ఉల్లంఘిస్తున్న నియమాలతో మేలికంగా వ్యతిరిక్తత లేకపోవడం వల్ల మరో ప్రత్యామ్నాయ జీవన విధానం కోసం ప్రయత్నం, నమ్మకం ఉండవు.

ఈ ఘర్షణలో ఇంకోరిసాయం, స్నేహం ఉండవు, సాయం కోరినా దొరకదని అతని అభిప్రాయం కావచ్చు. పైగా అతను Introvert అవడం కూడా కారణం.

ఈ అంశంతో సంబంధంలేని సంఘం రాయలసీమలో కనపడుతుంది. అమృతంతో సంఘటనతో సెక్స్‌పట్ల మరింత చక్కటి అవగాహన ఏర్పడుతుంది. ఆ సంఘంలో అనంతాచారితో సుఖమైన స్నేహం ఏర్పడుతుంది. సంఘం పట్ల, ఇతరుల పట్ల ఏహ్యత ఏర్పడుతుంది. చివరికి అక్కడ కూడా మిగిలిన సాంఘిక అంశాలకు ఏర్పడే ప్రాముఖ్యత వల్ల అతని పట్ల జనం విముఖతనేర్పరచుకొంటారు. వాళ్ళలో ‘‘అమ్మ’’ అతని ‘‘ప్రవర్తన’’ చర్చనీయాంశాలు అవుతాయి. దాన్తో సంఘాన్ని నేరుగా ఎదుర్కొనక తప్పనిసరి అవుతుంది.

అప్పటికి అతను జీవితంలో చాలా అనుభవం గడించాడు. ఎందర్నో చూసి ఉన్నాడు. అతనికి జరిగిన వివాహం వల్ల దాంపత్యం, సహ జీవనం ఏమీ లేకుండా భార్య నికృష్టంగా చనిపోతుంది. అతని ‘‘శత్రువులు’’ చాలా మంది పోతారు. కొత్త శత్రువులు చేరతారు. ‘‘మిత్రులు’’ దూరమేతారు. ఆ స్థితిలో అతను మొదటసారిగా ‘‘సంఘం’’తో మాట్లాడతాడు. అంటే తనతో సంబంధం అట్టే లేని వ్యక్తులు తన గురించి, ‘‘అమ్మ’’ గురించి ప్రస్తావించడం విని వాళ్ళను Confront చేస్తాడు. అక్కడ కూడా అతని మనస్తత్వానికి తగినట్లే కోపం కంటే నిస్సహాయత, Submission కనిపిస్తాయి.

అన్ని  విషయాలు వాళ్ళకు కావల్సినట్లుగా చేస్తానని చివర్లో ‘‘ఎవరో మా అమ్మ విషయం ఎత్తారు మీలో. నేనేం చెయ్యను? – మా అమ్మ చచ్చిపోయింది – చచ్చినవాళ్ళను నేనేం చెయ్యను’ ఒక్కసారి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. కంఠం పగిలిపోయింది. ఆపుగోలేక, నిధి బిగ్గరగా ఏడుస్తూ’’ చచ్చిపోయింది’’ అనుకుంటూ పిచ్చివాడిలా నడిచివొచ్చేశాడు. దూరంగా ఎవరో ముక్కు చీదుకుని నిట్టూర్చారు.

ఆచారి గారింట్లో దీపం మసగ్గా కనపడుతోంది. అంతా చీకటి. ఇంక అతనికి ఏడుపు రావడం లేదు. కన్నీరంతా ఎండిపోయింది. స్మశానంలో భూతాలతో ప్రసంగం చేసివచ్చిన తర్వాత, యింక గుండెల మీద భయం తాండవించలేదు- బరువుని సముద్రం మింగేసి, తుంపరల్ని మొహాన కొట్టింది – ఆ బరువు, సముద్రంలోని ఉప్పునంతా పీల్చేసింది- కన్నీరింక వుప్పగా ఉండదు’’.

అంతటితో అతనికి సమాధానం దొరికింది. సంఘంతో సంభాషణతో సంఘం పట్ల భయం పోయింది. అతని హృదయంలో Self pity స్థానంలో ఔదార్యం చోటు చేసుకుంది.

3

‘‘చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికి అర్థమేమై వుంటుంది? మానవుడు ఈ ప్రశ్నని వేసే అవసరం రావడమే జీవితానికేదో అర్థం వుందనుకోవడానికి తార్కాణం. అర్థం లేదని ఇతరులు ఋజువు చేకుంటే, సృష్టి అంత భయంకరంగా ఉండకపోవచ్చు. సృష్టికి ఇతరులు కల్గించిన అర్థాలను మనం అంగీకరించలేము; మనం కనుక్కుని, ఎముకలలో జీర్ణించుకున్న అర్థాలని ఇతరులకి చెప్పలేం. ఇతరులతో సంపర్కం వదలుకొని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యదార్థం అని నమ్మి సమాధాన పరచుకోవడం, సంఘంతో నిమిత్తం ఉన్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీనపునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరికి మిగిలేదేమిటి? అన్న వాక్యాలతో మొదలయ్యే ఈ నవల

‘‘కావల గట్టున ఇప్పటిలా ఏకాంతంగా గడ్డిలో పడుకుని, అతను వేసుకున్న ప్రశ్న ‘జీవితానికి అర్థం ఏమిటి?’ ఈనాడూ అదే ప్రశ్న చివరికి మిగిలింది, – దాని సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేందుకు తను చేసినయత్నాల – జ్ఞాపకాలు – తనతో తాను సమాధానపడడం – అది మిగిలింది.’’ అని ముగుస్తుంది.

ఈ సమాధాన పడడం ఎలాంటిది? దయానిధికి తన జీవితంలో ఏం అర్థం కనిపించింది? ఆ అర్థాన్ని సరళంగా చెప్పుకోవచ్చా?

రచయిత ఆ ముఖంలో జీవితం పట్ల ఒక దృక్పథం కల్పించడం ఈ నవల ధ్యేయంగా పేర్కొన్నాడు. ఆ దృక్పథం ఎలాంటిది?

చివర్లో దయానిధి ఆలోచనలలో ఈ ప్రశ్నలకు సమాధానం కనపడుతుంది.

‘‘కోమలీ నాకు మనుషులన్నా, సంఘం అన్నా ఇంతవరకూ భయంగా ఉండేది. ఇవాళతో ఆ భయం పోయింది!

… ఏం జరిగిందేమిటి?

– నేను వెలుగుని చూశాను- శ్మశానంలో.

– అవేం మాట్లండీ – నాకు భయం పుడతావుంది.

నమ్ముతావా! – మానవ హృదయంలో ద్వేషం ఎందుకుంటుందో కనుక్కున్నాను.

… ఎందుకో చెప్పండి?

… తనకేం కావాలో తెలీనప్పుడు, మానవుడు ద్వేషిస్తాడు.

అంటే?

ఏం కావాలో తెలిస్తే; ఆ వొస్తువుని ప్రేమించి, దాన్ని పొందటం కోసం యత్నిస్తాడు. అది తెలీనప్పుడు హృదయంలో మిగిలేది ద్వేషం.

… కొందరికి ఏమీ అక్కర్లేదనుకోండి, వారి మాటేమిటి?

అక్కర్లేదని తెలుసుకున్నా ద్వేషం ఉండదు.

 

‘‘రెండు కొండల మధ్య నడచి నడచి అవతలకు చేరుకున్నారు – అవతలంటూలేని అవతల నడిచి నడిచి, నడిచినడిచి నడిచి నడిచి – మళ్ళా అక్కడికే చేరుకోవడమా? అంతేనా విశాల ప్రపంచం! అదేనా అనంత జగత్తు! ఇదా ఎడతెగని జీవిత రహస్యం!’’

‘‘సంఘాన్ని మార్చలేడు; మనుషుల్ని మార్చలేడు, మారిస్తే బాధ, పగ, యుద్ధం. తనతో తను సమాధానపడాలి, అది యీనాటికి సాధించాడు. ఒక ప్రశాంతత, పవిత్రతమైన మహత్తర ఆనందం అతనిలో వుద్భవించింది…. పిచ్చి ప్రపంచాన్ని దూరంగా వుంచే ఔదార్యం. మతాన్ని, దైవాన్ని, మనుషుల్ని తోసేసి సంతృప్తి చెందే, ఆథ్యాత్మిక దృష్టి తనలో కడసారి యదార్థం.

‘‘తనున తాను పరిపూర్ణంగా చూశాడు. ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనలో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించొచ్చు.’’

‘‘ఈ జీవితానికర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం; బాధలేవు, కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం వుంటాయి.’’

‘‘మానవుడికి కావల్సింది మతాలు, దేవుళ్ళూ మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు; మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు.’’

వీటన్నిటితో పాటు గుర్తించుకోవలసింది డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి చిన్న కథ అందులో సారాంశం ‘‘కన్నీరు కార్చిన వారికే వజ్రాలు.’’

ఈ మాటల్లోంచి ఎవరు తీసుకొనే అర్థమయినా చాలా పరిమితంగా వుంటుంది. అంతేకాదు. ఆ అర్థం వ్యక్తిగతంగా మారుతా వుంటుంది. అందుకు మన దృక్పథాలు, ఆలోచనలు కారణాలవుతాయి. అంటే మనం మళ్ళీ మొదటికే రావచ్చు.

 

కానీ, కొన్ని సామాన్యంగా అంగీకరించవలసినవిగా ఈ ముగింపులో తోచినవి చెప్పడమే క్రింది ప్రయత్నం.

జీవితం గడపడమే జీవితాన్ని సమన్వయ పరచుకోవడం (చివరకు మిగిలింది సమాధానం కాదు. సమాధానం తెల్సుకునేందుకు తను చేసిన యత్నాలు – జ్ఞాపకాలు) సంఘాన్ని మనం అంగీకరించడం అనేది మన స్వేచ్ఛకు భంగకరం కానవసరం లేదు. వ్యక్తి జీవితంపైన వ్యక్తి అభిప్రాయం, సంఘం అభిప్రాయం ఒక్కటి కానంత మాత్రం చేత వ్యక్తికి సంఘంతో ఘర్షణ అవసరం లేదు. అయితే ఈ రెండు అభిప్రాయాలూ పరస్పర విరుద్ధం అన్న భ్రమ మనలను బంధించే నిజమైన అంశం. ఈ బంధం వల్ల సంఘాన్ని జయించడానికో లేదా సంఘానికి పూర్తిగా లొంగిపోవడానికో మనం ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో మనం అభాసుపాలవుతాం. నిజంగా విరుదమైన భావాలు మనవే. వాటిలో ఒకదానికి మనం దగ్గిరగా ఉన్నాం అని గుర్తించడంతో సంఘం శత్రువు కాకుండాపోతుంది. అందువల్ల సంఘాన్ని సహించడం కుదురుతుంది. అప్పుడు జీవిత గమనానికి స్వేచ్ఛ. (తనను తాను పరిపూర్ణంగా చూశాడు! ఎంత చిత్రం! ఎంత దగా? ఎంత భ్రమ? తనతో తాను సమాధానపడి, తన్ను తాను స్వీకరించి, కౌగలించుకుని ఏకమయ్యాడు. ఇప్పుడు ప్రపంచాన్ని అంగీకరించవచ్చు.) అవసరమయితే పట్టించుకోకపోవడం కూడా సహించడమే. (పిచ్చి ప్రపంచాన్ని దూరంగా ఉంటే ఔదార్యం…. ‘మానవుడికి (తనకు కాదు) కావల్సింది మతాలు, దేవుళ్ళు మ్రొక్కుబళ్ళు, రాజకీయాలూ కావు. (ఇవన్నీ బాహ్యమైన సంఘం. శత్రు సంఘం తనలోదే. అది మన గురించిన ద్వైదీభావం) మానవుడికి కావల్సింది, దయ – కొంచెం ఐనా చాలు)

దయ, ఔదార్యం, సహనం ఇవి లభించవలసినవి కావు. మనం ఇవ్వవలసినవి. ఇది మనకు జీవితంలో ఒకే సారాంశాన్ని, ఒక చెప్పుకో గలిగిన విజయాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ విజయం గుప్తమైనది. నిజమైనది (Real). దానికి బాహ్యమైన చిహ్నం మన జీవితమే. మనం ‘‘జీవించా’’ మన స్పృహ నిజమైన స్వేచ్ఛ. (ఈ జీవితానికి అర్థం ఎందుకుండాలో! అర్థం లేదనే తలంపులో నిరుత్సాహం, బాధలేవు. కొత్త బలం, వికాసం, ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం ఉంటాయి.)

అదీ ఈ నవల జీవితంపై కలిగించే దృక్పథంగా నాకనిపిస్తుంది.

 

4

‘‘దయానిధి’’ కథానాయకుడిగా అల్లబడిన నవల ఇది. కథానాయకుడి ప్రాముఖ్యత ‘‘చింతామణి’’ పత్రిక పెట్టిన ‘వచన ప్రబంధ’ పోటీ నియమావళిలో ఒకటి, అయినంత పాతదే అయినా ఈ నవలలో ఆ ప్రాముఖ్యత ‘గుణం’ మారింది.

అయితే మిగిలిన పాత్రలు కేవలం ‘‘సృష్టింప’’ బడినవి కావు. ఆయా పాత్రల వ్యక్తిత్వం, ప్రత్యేకత వాటికుంది. ముఖ్యమైన భాగాలకు అవసరమైనట్లుగా మాత్రమే చిత్రించబడినా ప్రతీకలు మాత్రమే అయినా వాటిలో జీవం వుంది.

దయానిధి ‘అమ్మ’లోని ‘చెడుగు’కు కోమలి ప్రతీక అవుతుంది. అందుకే దయానిధి కోమలి గురించి చేసే ఊహలన్నీ అత్యధిక కాల్పనికతతో నిండి ఉంటాయి. ఆ ‘చెడుగు’ పట్ల దయానిధి కుండే అయిష్టతనూ, ఆ అయిష్టతను జయించడానికి అతను తనలో చేసుకునే ఊహాగానాల కల్పనికతనూ కోమలితో అతని సంబంధాలలో చూడవచ్చు. నిజానికి కోమలి కూడా సంఘ బాహ్యమయిన వ్యక్తియే. అయితే దయానిధిలా ఆమెలో ద్వైదీభావం లేదు. తన జీవితాన్ని గురించి చక్కని అవగాహన ఏర్పరచుకుంటుంది. సెక్స్‌ లేని జీవితాన్ని ‘‘బైరాగి’’ జీవితంగా చూడ్డమే కాదు. ‘సెక్స్‌’ను అత్యున్నతమైన ప్రేమకు ప్రకటనగా కూడా భావించగలుగుతుంది (లేకుంటే నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో ఎలా తెలుస్తుంది?’) మొదట్లో ఆమె సహజమైన సంకోచాన్ని (Inhibition) ‘‘ఫ్రిజిడిటీ’’ అని బాధపడ్డ దయానిధి చివర్లో ఆమె రెచ్చగొట్టినా శాంతంగా, ఉద్రేకం లేకుండా సమాధానపరచడం అతని పరిణితికి నిదర్శనం. చివర్లో ఆమె దయానిధికి విడదీయరాని సన్నిహతురాలు కావడం దయానిధి సాధించిన సమన్వయానికి ప్రతీక. ఆమె నిజంగా అతన్ని ప్రేమించింది. అయితే ఆమె పట్ల అతనికి ఉన్న భావం ఆ ప్రేమ పూర్తి ఫలాన్ని అతనికి అందనివ్వలేదు.

దయానిధి అమ్మలోని సమర్థనీయమైన ‘‘మాతృ’’ భావనకు ప్రతీక అమృతం. ఆమెతో దయానిధి ఏర్పరచుకొనే చనవు అతనికి ‘‘అమ్మ’’లోని ‘‘మంచి’’ పట్ల పాక్షికతను తెలుపుతుంది. ఆమె తనకేం కావాలో తెలుసుకున్న పరిపూర్ణ వ్యక్తిత్వం కలది. జీవితంలో సమన్వయం సాధించిన వ్యక్తి దయానిధికి ఒకేసారి సెక్స్‌ అనుభవం ఆమె ప్రోద్బలంతో ఆమెతోనే కలగడం గమనార్హం. ఇది ఫ్రాయిడియన్‌ ఈడిపస్‌ కాంప్లెక్స్‌ ప్రభావితం కావచ్చు. ఆమెకు దయానిధిపై నిర్వచించలేని ప్రేమ, ఆప్యాయత, దయ. దయానిధికి చివర్లో కలిగే స్పృహ (మానవుడికి కావల్సింది, దయ, కొంచెమైనా చాలు) ఆమె వ్యక్తిత్వంలో భాగంగా కనిపిస్తుంది. ఆమె పట్ల కూడా దయానిధి కల్పించుకున్న ‘‘కాల్పనికమైన ఊహ’’కు ఆమె నుంచి ప్రోత్సాహం లభించదు, ఆమె Down to Earth, ప్రవర్తన వలన. అందువల్ల ఆమె ప్రేమను పూర్తిగా పొందలేకపోయాడు దయానిధి.

అమృతం, కోమలి కాక మిగిలిన పాత్రల్లో జీవితాన్ని నాశనం చేసుకునే సుశీల, కృష్ణమూర్తిల దగ్గిర నుంచీ స్నేహంతో జీవితాన్ని నింపుకోగల అనంతాచారి, రాజమ్మల వరకూ ఉన్నారు. ఒక్కొక్కరి మనస్తత్వ అనుశీలన నిజంగా గొప్ప అనుభవం. అయితే తెలిసిన కారణాల వల్ల ఆయా పాత్రలలోని ముఖ్యాంశాలుగా నాకు తోచినవి మాత్రం పేర్కొంటాను.

దయానిధికి ఎదురయ్యే స్త్రీ పాత్రలన్నిటికీ స్ర్తీలలోని ఒక ప్రత్యేక లక్షణం ప్రధానంగా ఆపాదించబడుతుంది. ఇందిర వివాహం ద్వారా ఏర్పడ్డ సంకెల అయితే చప్పుడు చెయ్యని సంకెల. సుశీల స్ర్తీ సహజమైన ఆహానికి ప్రతీక. అయితే సుశీలకెదురైన దయనీయమైన ముగింపు ఆలోచన కలిగిస్తుంది. నాగుమణి స్ర్తీలోని కేవలం శృంగార స్ర్తీత్వం అయితే శ్యామల ప్రస్తుత సమాజంలో స్త్రీని ఆవరించే లేదా స్త్రీలో వృద్ధి చెందడానికి అవకాశం ఉండే సౌందర్య రాహిత్యానికి ప్రతిరూపం. శ్యామల పంజరాన్ని తనతో తీసుకెళ్ళడం గమనార్హం. ఇందిర మరణం దయానిధికిచ్చిన Releif,నాగుమణితో బండిలో అనుభవాలు దయానిధి జీవితంలో వారికి గల ప్రాతలను తెలుపుతాయి. స్త్రీ కనపడగానే అన్నిటితో కూడిన స్త్రీత్వాన్ని తప్ప చూడలేకపోయిన దయానిధి కాత్యాయనిని చూడడంలో ప్రత్యేకత కనపరుస్తాడు. ఇది అతని పరిణితికి సూచన. ఇందిరను కూడా కాల్పనికంగా ఊహించే ప్రయత్నం (ఉంగరం ఇచ్చేప్పుడు) జరిగినా అది వివహానికి అత్యవసరమైన సెక్స్‌పట్ల దయానిధికి ఉండే సంకోచం ((Inhibition)తో దెబ్బతింటుంది.

దయానిధి జీవితంలో స్త్రీ  ప్రాతలకున్న ప్రభావం సంఘ ప్రతినిధులుగా తప్ప పురుష ప్రాతల కుండదు. సంఘంతో దయానిధి Interactionను పురుష ప్రాతలు చెప్తాయి. తనకు ప్రాప్తించిన వాటికి నవ్వుకొని ఇతరులకు ప్రాప్తించిన వాటికి బాధపడే నారయ్య నవ్వే శక్తిని అంటే జీవించే శక్తిని కోల్పోడు. జీవితం పట్ల గర్హనీయమైన ప్రాక్టికాలిటీ గలవాడు ‘‘రాజభూషణం’’. అయితే జీవితాన్ని మంచకి ప్రయోజనకరంగా మలచుకోగల స్నేహశీలి అనంతాచారి. ఇల్లు కాలిపోతే దయానిధి తనను కారణంగా చెప్పుకుంటున్నప్పుడు ‘‘ఆయన లేకపోవడం వల్ల ఇలా జరిగింది’’ అనే రాజమ్మ ప్రత్యేకత స్ర్తీత్వంలోని స్నేహం. సెక్స్‌ను అమిత తేలిగ్గా తీసుకుని జీవితాన్ని నిర్వీర్యం చేసుకునే వాడు కృష్ణమూర్తి. స్ర్తీలను సాధికారంగా మాత్రమే అభిమానించగల ప్రకాశరావు ప్రతి దానికీ బాహ్యమైన అర్థాలను చెప్పుకుని సంతృప్తి పడే కూర్మయ్య బృందం. వీళ్ళందరికీ విభిన్నంగా సంపూర్ణమైన జీవంతో ‘‘నేను నేనుగా ఉండే అవసరం పుస్తకాల్లో మనుషులకి తప్ప మామూలు లైఫ్‌లో మనుషులకి రాదు. వొస్తే వాళ్ళు ఛస్తారు.’’ అందుకే హృదయద్వారం బుల్‌ మూసి చిల్లు పడ్డవోడవలె’’ కాదు. ‘‘తల్లిపాలు తాగిన పాపవలె’’ బ్రతికే జగన్నాధం నిలుస్తారు.

ఈ వ్యాసాన్ని దయానిధి గురించి జగన్నాధం మాటలతో ముగిస్తాను.

“The wealth of kindness, Dayanidhi;

He, the boatman, made a childishness,

of loving humanity, with kindness killed

with having passion, chilled-

ఎంత గొప్పగా చెప్పాడో.

*