లోగుట్టు పతంజలికి తెలుసు!

    సి.ఎ ప్రసాదు   

 

11083897_732861206835128_3509838977011454215_nఫుస్తకాలను  ప్రేమించండి- ఆవి మీ జీవితాలను సుఖమయం చేస్తాయి. భయంకర బాధల ఉప్పెనలో వుపశమనం అందిస్తాయి. – గోర్కీ.

ఫుస్తకాలను, మనుషులను, జీవితాన్ని ప్రేమించిన వ్యక్తి  పతంజలి. పత్రికా సంపాదకుడిగా, కధకుడిగా, కాలమిస్ట్ గా, నవలా రచయితగా, వైద్యునిగా, అనేక వైవిధ్యాలతో ఆయన జీవన విధానాన్ని మనం అర్ధం చేసుకోగలిగితే స్పష్టమైన పతంజలి “చూపు” మనకు తెలుస్తుంది. కేవలం హాస్యం కోసం పతంజలి రచనలు చదివితే ఆ చూపు మనకర్ధం కాదు., సమాజంలో తనకు నచ్చని చాలా అంశాలపైన, ఉండకూడని ఆలోచనల పైన,  చెడుపైన, రాజ్య విధానాలపైనా నిర్మొహమాటంగా తన అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేయడానికి పతంజలి ఎన్నుకున్న ఓ అద్భుతమైన పద్ధతే “వ్యంగ్య రచన”. సాహిత్యానికి, జీవితానికీ ఓ అర్ధం, ప్రయోజనం ఉండాలనేదే పతంజలి దృక్పధం/చూపు అని చెప్పాలి.

తన ప్రతి రచనలోనూ మామూలు జనం పక్కన, వాళ్ళ అమాయకత్వం పక్కనే, వాళ్ళ చేతకాని తనం పక్కనే పతంజలి నిలబడ్డాడుగానీ, పాలక వర్గాల కొమ్ము కాసిన పతంజలిని మనం చూడలేం. మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా మనం చెప్పుకుంటోన్న శాసన వ్యవస్ఠ , న్యాయ వ్యవస్ఠ, పోలిస్ వ్యవస్ఠ, పత్రికా/మీడియా వ్యవస్థల రంగాల్లో జరిగే అన్యాయాలను ఏమాత్రం సందేహించకుండా విమర్శించడం మనకు అర్ధంకావాలి. అదే పతంజలి నైజం, అదే పతంజలి చూపు. అన్ని రచనలనూ “చూడటం” ఇప్పుడు కుదరదు కాబట్టి ప్రస్తుతం నేను “పిలక తిరుగుడు పువ్వు” అనే నవలిక, అందులో రచయితగా, సామాజిక శాస్త్రకారుడిగా పతంజలిని చూసే ప్రయత్నం చేస్తాను…

అనగనగా ఈ భూప్రపంచంలో ఉన్న అనేకానేక గ్రామాల్లో ఆలమండ గ్రామమొకటి.  ఆలమండ గ్రామంలోని రాజుల్లో ఒకరికి భూమి బల్లపరుపుగా వుందనే అభిప్రాయం నచ్చింది. ఆ వూళ్ళోని వెలమలకు భూమి బల్లపరుపుగా లేదనీ, గుండ్రంగానే వుందనీ నమ్మారు.  సరే – ఈ గొడవ మామూలుగానే పెద్దదై కోర్టు వారి దగ్గరికి వెళ్లింది. మేజిస్ట్రేటు తన తీర్పులో “మన జ్ఞానానికి సార్ధకత లేదు.  మన విశ్వాసాల పైన మనకు నమ్మకం లేదు.  మన విలువల పైన మనకు గౌరవం లేదు. మన దేవుళ్ళ పైన మనకు భక్తి లేదు.  మన నాస్తికత్వం పైన మనకు విశ్వాసం లేదు.  మన మీద గానీ, తోటి వాళ్ళ మీద గానీ మనకు మమకారం  లేదు. మన ప్రజాస్వామ్యం పైన మనకు అవగాహన కానీ గురి గానీ లేదు. మన జ్ఞానానికీ – విశ్వాసానికీ పొంతన లేదు.  విశ్వాసానికీ – ఆచరణకూ పొందిక లేదు..భూమి బల్ల పరుపుగా వున్నప్పుడే ఇలాంటి జీవితం కనపడుతుంది” అని వ్యాఖ్యలు చేస్తూ ఆ కేసును కొట్టేస్తాడు.

ఈ మేజిస్ట్రేట్ గాడికి పిలక తిరుగుడు జాస్తిగా వుంది.  అందుకనే ఇలాంటి తీర్పు చెప్పాడు.  పోలీసోళ్ళు పెట్టిన కేసు కొట్టేశాడు కాబట్టి ఈ మేజిస్ట్రేట్ కు బుద్ధి చెప్పి ఆ పిలకతిరుగుడుతనం తగ్గించాలని ఆ ప్రాంతంలోని డిఎస్పీ దొరగారికి అనిపిస్తుంది.  ఆ తర్వాత జరిగిన ప్రహసనమే పిలక తిరుగుడు పువ్వు నవలిక. మేజిస్ట్రేట్ చెప్పిన తీర్పు ఆధారంగా ఆయన బుర్రతిరుగుడుతనం తగ్గించాలని ఆ పోలిస్ దొర డిఎస్పీ, సిఐ కలిసి ఓ ప్రణాళిక ప్రకారం పేపరోళ్ళనీ, ఆవూళ్ళోని పెద్దోళ్ళనీ కూచొబెట్టుకుని పేపర్లల్లో వార్తలు రాయిస్తారు. ఓ పత్రికా రిపోర్టర్ కూ ఆలమండ వూళ్ళోని పెదరాజుగోరికీ జరిగిన మాటలు ఓసారి చూడండి….

రిపోర్టర్: మీరుగాని పాతిక రూపాయలిచ్చారనుకోండి. ఇంత పిసరు సింగల్ కాలం వార్త ఏస్తానండి. హండ్రెడ్ రూపీసైతే బెత్తెడు వార్తండీ. మరో యాభై ఇస్తే మీ ఫోటో కూడా పంపిస్తానండీ. వార్తతో పాటు అది పడితే పడొచ్చండీ నేపోతే నేదండీ.” ఆ తర్వాత పెదరాజుకూ రిపోర్టరుకూ మధ్య ఒ చిన్నసైజు వాదన జరుగుతుంది.

patanjali choopu

మా దగ్గర నుంచి సంగతులు తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు కాబట్టి మేం నీకెందుకు డబ్బులియ్యాలి అని పెదరాజు ప్రశ్న. అప్పుడు పత్రిక రిపోర్టర్ జవాబు చాలా గొప్పగా, గమ్మత్తుగ్గా, మన భ్రమలను పోగొట్టేదిగా వుంటుంది.  “మీరు చెప్పాలన్నా, మేం రాయాలన్నా మీరే మాకు డబ్బులియ్యాల. అట్లానే మీరు చెప్పిందే మేం రాయం. మేం మాకు బోధపడినట్లు రాస్తాం.  పేపర్ లో సబ్ ఎడిటర్లు అది చదివి ఆళ్ళకి అర్దమైంది రాస్తారు.  ఆపైన చీప్ సబ్బులుంటారు, ఆళ్ళు దాన్ని చదివి తమకు అర్ధమైనట్లు దిద్ది పంపిస్తారు. ఆపైన కంపోజింగోళ్ళు ఆళ్ళకెలాగ బోధపడితే అలాగా కంపోజింగ్ చేస్తారు.  అబ్బో, శానా తతంగం వుందండి” అని రిపోర్టర్ కుండ పగలేసినట్లు చెప్పి మనకున్న భ్రమల్ని చాలా పోగొట్టటమే పతంజలి దృక్పథం, చూపు అని చెప్పాల్నా?

ప్లీడర్ల గురించి మట్లాడుతూ ముత్యాలనాయుడుతో ఇలా అనిపించటం “ప్లీడర్ని తెమ్మంటే పీక్కుతినేవోడ్ని తెచ్చినారు. ఆడి మొగం చూస్తే దుమ్ములగొండి నాగుంది, మాట చూస్తే జలగవోటం. ఆడొచ్చింతర్వాత మూడే మూడు ముక్కలు మాటాడినాడు.  డబ్బులియ్యి అని తప్పించి ఆ పీడర్నంజికొడుకు మరేటి అన్లేదు” అని యింకా చెప్పిన వాటిని చదువుతేనే మజాగుంటది. లోకంలో జరిగే వాటిని మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటమే పతంజలి భాష్యం అని అనుకుందామా? ఈ రకమైన రచనా విధానంలో పతంజలి స్పూర్తి రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారే.

ఆ మేజిస్ట్రేటు కోర్టుకు సిఐ వాళ్ళు కేసు తర్వాత కేసు తీసుకువచ్చి ఆయనకు చెమటలు పట్టిస్తారు. కోర్టు ధిక్కార నేరం అని, దేశద్రోహం అని, దేశాన్ని విభజించటానికి ఆలమందలోని జనం వీధి వీధినా కుట్రలు చేస్తున్నారనే పోలీసుల కేసులు చూసి, ఆ కేసులన్నింటిలో సాక్షిగా తన పేరును గమనించిన మేజిస్ట్రేట్ గంగాధరం, పోలీస్ మాయల్ని అర్ధం చేసుకున్నవాడై, ఈ కుట్ర కేసులన్నీ తన్ని అల్లరి చేయడం కోసమేననీ, పోలీసుల కంట్రోల్లో వుంచుకోవడమే వాళ్ళ ఆలోచన అనీ తెలుసుకుంటాడు. ఇంతలో ఆ కేస్ సెషన్స్ జడ్జీగారి దగ్గరికి వస్తుంది. ఆయన మేజిస్ట్రేట్ ని బోనులో నిలబెట్టి వార్నింగ్ ఇస్తాడు.  “ఒక వేళ మనం చూడాల్సొస్తే కేస్ వివరాలు చూడాలి, పోలీసోళ్ళ అభియోగాలు చూడాలి., సాక్ష్యాలు చూడాలి. వినాలి – అంతేగానీ అవన్నీ వదిలేసి, నీ పరిధులు దాటి జీవితం వైపు ఎందుకు చూశావు? జనం యెలా వున్నారో, భూమి యెలాగుందో నీకెందుకు? భూమిని జనాన్ని యెలా వున్నా పోలీసోళ్ళు సరిజేయగలరు, ఇంకెప్పుడైనా ఇట్టా పిచ్చి పిచ్చిగా పరిధులు దాటి ప్రవర్తిస్తే జాగ్రత్త.” అని చెప్పిన జడ్జీ గోరి మాటలిన్న పోలీస్ బాసులు ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టు వారికి విన్నవించుకుంటారు. “కేసులు పరిష్కరించు – జీవితాలను పరిష్కరించే బాధ్యత మనది కాదు” అని జడ్జీతో చెప్పించిన పతంజలి భావం అర్ధం చేసుకోవడమే పతంజలి చూపు.

అడుగడునా సమాజాన్నీ, జనాలనీ, పోలీసులనీ, పత్రికలనీ, పత్రికా విలేఖరులనీ, ఇంకా మరెన్నో రంగాల్లోని వైవిధ్యాలను అర్ధం చేసుకోవడానికి సాహిత్యం అనే అంకుశాన్నీ, చూపును వుపయోగించుకున్నవాడు పతంజలి. సమాజంలో జరుగుతోన్న అనేక అన్యాయాలకు మూల కారణాలు వెతుక్కునేటపుడు “తెలియనితనం, అజ్ఞానం, దాని వలన వచ్చే అహంకారాలే” నిజమైన కారణాలని గ్రహించిన ఈ సమాజ చిత్రకారుడు పతంజలి తనదైన శైలిలో విడమరచి చెప్పటమే – పతంజలి చూపు.

ఎదుటి వాళ్ళ తెలీనితనాన్ని ఆసరా చేసుకుని ప్లీడర్లు, పోలీసులు, పేపరోళ్ళు, మేజిస్ట్రేట్లు, జడ్జీలు ఎలాటి మాటలాడగలరో, ఆటలాడగలరో తన రచనల్లో కొంచెం వ్యంగ్యంగా, కొంచెం గిల్లినట్లుగా , ఇంకొంచెం గిచ్చినట్లుగా తన చదువరులకు చూపించడం పతంజలి మార్క్ చూపు అనుకుందామా? జీవితం స్వేచ్చగా వుండాలనీ, సాహిత్యానికి ఎలాటి చట్రాలూ వుండకూడదనీ తపించిన పతంజలి తన ప్రతి రచనలోనూ ప్రజల వైపునే నిలబడి అసాంఘీక శక్తులతో, ఏలుతోన్నవాళ్ళతో పోట్లాడాడు. (రచనల సాయంతో) నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా, పదునుగా సాగే పతంజలి రచనలు మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి.  ప్రశ్నించడం నేర్పిస్తాయి.  సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. పరుగెత్తించడమే కాకుండా ఎదురుగా జరిగే అన్యాయాల క్రమాలు చూడలేక మనం నిలువునా దహించుకు పోయేలా చేయటమే పతంజలి రచనల లక్షణం. వ్యక్తిగా కూడా పతంజలి చాలా స్పష్టమైన అభిప్రాయాలతో, నిక్కచ్చిగా జీవించారు. అందుకే పతంజలి తెలుగు సాహితీలోకంలో మిగిలిన వారికన్నా ప్రత్యేకం అని నా నమ్మకం.

*