జీవితంపై ప్రేమను పెంచే జయకాంతన్

 

 

– సి.ఎస్. రాంబాబు

~

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో సాహిత్య సభలే కాకుండా ప్రతి ఆదివారం ఒక సాహిత్య సమావేశాన్ని జరుపుకునే ఒక సత్సాంప్రదాయం ఒకటి మొదలయింది. అదొక శుభ పరిణామం. గత పదకొండు నెలలుగా ‘ఛాయ’ సంస్థ ప్రతినెలా మొదటి ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలు కొత్త తరహాలో ఉంటూ కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి. అంటే అతిశయోక్తి కాదేమో ! సమావేశానికి వారెంచుకునే అంశాలే దానికో ప్రాతిపదికను కల్పిస్తున్నాయి.

ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ స్టడీ సర్కిల్ లో తమిళ రచయిత ‘జయకాంతన్’ కధలపై సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఎవరు సమర్ధులు అంటే జయకాంతన్ గారితో సన్నిహిత సంబంధం కలిగిన సాహితీవేత్త మధురాంతకం నరేంద్రని మించిన ఛాయిస్ మరొకరుండరేమో ! ఎప్పటిలాగే సమావేశానికి సబంధించి ఒక చక్కటి పోస్టర్ ని డిజైన్ చేయించారు ‘ఛాయ’ సంస్థ వారు. చర్చనీయాంశమెంత ఆసక్తిగా ఉందో చూడండి … నేనేం చేయను చెప్పండి … మరికొన్ని విశేషాలు’

కధను సీరియస్ గా తీసుకునే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో జయకాంతన్ ను ఏదో ఒక రకంగా వంట పట్టించుకున్నవారే. ఇతర భాషలలో కూడా ఎంతో గౌరవాన్ని పొందిన రచయిత జయకాంతన్.

జయకాంతన్ గారి కధలను తొలిసారిగా తెలుగులో అనువదించిన వ్యక్తి మా నాన్న మధురాంతకం రాజారాం అంటూ తమ ప్రసంగాన్ని మొదలుపెట్టారు మధురాంతకం నరేంద్ర. 1975 ప్రాంతంలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆ పనిని మా నాన్న కప్పగించారు. అప్పటికే వారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఒక విధంగా జయకాంతన్ అనువాదానికి అంత తొందరగా లొంగని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా నాన్న అనువదించారు. మా నాన్న తొలి అనువాదకుడయితే నేను తెలుగులో జయకాంతన్ రచనల తొలి పాఠకుడిని. అప్పటికి నా వయస్సు పద్దెనిమిదేళ్ళు. ఆ పద్దెనిమిదేళ్ళ నవ యువకుడిని ఉత్కంఠంతో మరో ప్రపంచంలోకి లాక్కుపోయిన కధలివి.

ఒక విధంగా నాకు బాల్య స్మృతి వారి రచనలు చదవటం.

200 కధలు, 40 నవలలు, 4 సాహిత్య వ్యాసాల సంకలనాలతో జయకాంతన్ సాటి రచయితలందరూ అసూయపడేంతగా రాసిన వ్యక్తి. 1932వ సంవత్సరంలో కడలూర్ లో పుట్టిన జయకాంతన్ ని ఒక సందర్భంలో కలుసుకోవడం జరిగింది. ఈ ఒక్క మాట మీకు చెప్పి వారి కధలను కొన్ని మీకు పరిచయం చేస్తాను.

జయకాంతన్ గారి నవలలు కొన్నింటిని సినిమాలుగా చేయటం జరిగింది. అలాంటి ఒక నవల ‘ఒరు నడిగ్తే నాడిగం పాకులాం’. ఇది సినిమాగా వచ్చిన వారి నవల. ఐదు నిముషాల నిడివి వున్న ఒక దృశ్యం చూడగానే నవలే చదువుదామనిపించింది. ఆ నవలను ఒక మిత్రుడు అనువాదం చేశాడు. తెలుగులో దాని పేరు “కళ్యాణి వెడ్స్ దివాకరం”. వారి నవలకు వారు పెట్టిన పేరును తెలుగులో చెప్పాలంటే ‘ఒక నటి నాటకం చూస్తోంది’ ఎంత బావుందో చూడండి.

ఆ అనువాద మిత్రునితో కలసి నేను కూడా మద్రాసు (చెన్నై) వెళ్లి జయకాంతన్ గారిని కలవడం జరిగింది. మా ప్రయత్నం వారిని ఇంటర్వ్యూ చేయాలని. వారిదో మధ్యతరగతి ఇల్లు. పైన ఒక చిన్న పాక వేసుకుని వున్నారు వారు. ఆయన అక్కడే కూర్చుని రాసే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్డు పక్కన టీ కొట్టులా వుంది వారిల్లు. దేన్నీ దాచుకోవడం వారి జీవితంలో లేదు. మాడు గంటల సేపు వారితో గడిపాం.

వారితో అలా అంత సేపు మాట్లాడిన తర్వాత వారి కథల మీద గౌరవం పెరిగింది. గళ్ళ చొక్కా, లుంగీ ఇదీ వారి డ్రెస్ కోడ్. అరమరికలు లేకుండా మాతో ఎన్నో విషయాలు మాట్లాడాడాయన. మాతో మాట్లాడినంత సేపూ మీసాన్ని తిప్పుతూనే ఉన్నాడాయన. మీసమున్న కధా వీరుడనిపించాడు నాకు.

నాలుగు నెలల క్రితం కృష్ణమోహన్ గారు, అనిల్ బత్తుల గారు ఫోన్ చేసి మీరు ‘ఛాయ’ సంస్థలో జయకాంతన్ గారి గురించి మాట్లాడాలి అన్నప్పుడు మళ్ళీ రీ-రీడింగ్  చెయ్యగలిగే అవకాశం వచ్చిందని ఆనందపడ్డాను. వారి కధల్ని చదువుకోవటమంటే మనల్ని మనం చదువుకోవటమే. ఆయనొక సార్వజనీన రచయిత. ఈ పుస్తకంలో 16 కధలున్నాయి. అన్నీ మోడరన్ ఉపనిషత్తు కధల్లా వుంటాయి.

ఇలా జయకాంతన్ కధల గురించి వారితో పరిచయం గురించి కొన్ని పరిచయ వాక్యాలు మాట్లాడి మధురాంతకం నరేంద్ర వారి ప్రసంగాన్ని రెండు భాగాలుగా కొనసాగించారు. మొదటి భాగంలో వారు కధలని విశ్లేషిస్తూ వెళ్లారు. ఆ తర్వాతి భాగం జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ లేదా పరిశీలనలతో సాగింది. ఒక స్రష్ట చూసిన ప్రపంచం తెలియాలంటే జయకాంతన్ పుస్తకాలు చదవాలంటారు నరేంద్ర.

వారు విశ్లేషించిన కధలలో మొదటిది ‘గురుపీఠం’. ఒక సత్రంలో ఒక బిక్షగాడు. పశుప్రాయుడు. నిత్యం ఎవరు ఏది పెడతారా అని ఆశగా చూసేవాడు. పాచిపోయిన ఆహారం తప్పితే మరొకటి తెలియని వాడు. నిత్యం పుసులు గట్టిన కళ్ళతో వుండే వాడికి ఒకరోజొక ఆకారం నమస్కారం చేస్తుంది. మీరేనా గురువంటుంది. అలా ఆ ఆకారం నేను మీ శిష్యుడిని అని ఈ బిచ్చగాడు ఏది చెప్పినా దాన్నో అధ్బుతంగా భావిస్తూ ఉంటాడు. బిచ్కగాడు ఆకాశంకేసి చూస్తూ వుంటే ఆకాశం శూన్యమని ఎంతబాగా సెలవిచ్చారంటాడు. పాచిపోయిన ఆహారం తినేవాడికి పులిహోర, దద్దోజనం పట్టుకొస్తాడు. క్రమంగా గురువు ఖ్యాతిని పెంచుతాడు. ఎవరు ఎవరికి శిష్యుడు అన్న అనుమానం ఈ బిచ్చగాడికి వస్తుంది. గురుస్థానంలో కూర్చొన్న బిచ్చగాడికి ఒకరోజున శిష్యుడు కనిపించటం మానేస్తాడు. గురు స్థానంలో తనని కూర్చోపెట్టిన ఆ శిష్యుడి పేరేమిటో తెలియదు. వాడి కోసం వెతుకుతూ ఉంటాడు.

ఇలా గురుపీఠం కోసం మనం ఎలా సిద్ధంగా చెబుతాడు జయకాంతన్.

అగ్నిప్రవేశం : సీత పేరు తీసుకురాకుండా ఆధునిక స్త్రీ రోజూ చేసే అగ్నిప్రవేశం గురించి చెబుతాడు జయకాంతన్. ఒక విధంగా చెప్పాలంటే జయకాంతన్ వన్నీ నవలికల్లాంటి కధలు. ఒక స్త్రీ బస్సు కోసం ఎదురుచూస్తోంది. భోరున వర్షం. సడన్ గా ఒక కారొచ్చి ఆగుతుంది. ఒక అపరిచితుడు ఆమెను కారులో తీసుకువెళతాడు. ఆ కారంటే ఆమెకు ఎంతో ఆకర్షణ కలుగుతుంది. అక్కడేం జరుగుతుందో జయకాంతన్ స్పష్టంగా చెప్పడు. కానీ జరగకూడనిదేదో జరిగిందని మనకు అర్ధమవుతుంది. ఆ వ్యక్తే ఆమెను ఇంటికి దూరంగా దింపేసి వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకోగానే తల్లి మీద పడి ఏడుస్తుంది. తల్లి ఏమీ మాట్లాడకుండా బాత్రూంకు తీసుకెళ్ళి నాలుగు బకెట్ల నీరు కూతురిపై కుమ్మరిస్తుంది. నీకేం జరగలేదంటుంది.

జయకాంతన్ గొప్పదనం ఎక్కడుంటుందంటే ఒక కధలో చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, తెలిసే చెప్పకుండా దాచిన విషయాలుంటాయి, సార్వజనీన విషయాలుంటాయి అన్న భావన మనకు స్ఫురింపచేస్తాడు. ఈ కధలో నయాసంపన్న వర్గం పై మనకున్న మోజును పరిచయం చేస్తాడు.

ఎవరి ఆంతర్యం వారిదే : ఈ కధలో ఒక ప్రొఫెసర్, ఆయన భార్య పల్లెటూరిలో తాతా, నాయనమ్మల దగ్గర పెరిగే వారబ్బాయి మనకు తారసపడతారు. పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు ఆ కొడుకు. తండ్రి ఎవరో ఒక స్త్రీతో తిరగడం చూస్తాడు. కొంత నిఘా పెట్టి రెడ్ హాండెడ్ గా పట్టుకుంటాడు. నువ్వు చేసేది తప్పని తండ్రికి హితబోధ చేస్తాడు. విషయాన్ని తల్లికి చెబుతాడు. అప్పుడా తల్లి మీ నాన్న జీవితం మీ నాన్నది, నా జీవితం నాది, ఎవరి ఆంతర్యం వాళ్ళది, నువ్విక్కడినుంచి వెళ్లిపో అంటుంది. సంప్రదాయం, విలువలు గురించి చెప్పబోయిన ఆ కుర్రవాడు ఒక ఉత్తరం రాసి వెళ్లిపోతాడు.

భార్యా, భర్త ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఆయన సిగ్గుగా నవ్వుతాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు వారి ఆంతరంగిక విషయాలు అంటాడు జయకాంతన్. ఇలా ఒక చిన్న ముగింపు వాక్యంతో మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు జయకాంతన్.

ఆత్మదర్శనం : 70 – 80 ఏళ్ల సాంప్రదాయ బ్రాహ్మణ తండ్రి ఒకరోజు ఇంట్లోంచి మాయమయిపోతాడు. సరే తండ్రి కోసం కొడుకు వెతకటం మొదలు పెడతాడు. ఈలోగా తండ్రొక ఉత్తరం రాస్తాడు నువ్వు చెప్పే మంత్రాలకు అర్ధం నీకు తెలుసా అని మా గురువు గారు బజారులో నన్ను నిలదీశాడు అని. అవమానం ఫీలయి జంధ్యం తీసేసి ఆ ముసలాయన వెళ్లిపోతాడు. ఇది మన చేత జయకాంతన్ చేయించే ‘ఆత్మ దర్శనం’

పొరపాట్లు నేరాలు కావు : నాగరాజు అనే ధనవంతుడి దగ్గర కేథరిన్ అనే స్టెనో పనిచేస్తూ వుంటుంది. నాగరాజు ఇంట్లోనే కన్నయ్య అనే మిత్రుడు ఉంటూ ఉంటాడు. కేథరిన్ చనువును అపార్ధం చేసుకుంటాడు నాగరాజు. ఆ ఆమ్మాయి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని క్షమించమంటాడు. మీలో మా నాన్నను చూసుకున్నాను అంటుందా అమ్మాయి. ఈలోగా కన్నయ్య ఒక ఐదువందల రూపాయలు కొట్టేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తిరిగొచ్చేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి నేనెందుకు ఈ పని చేశానో తెలీదు, క్షమించు అంటాడు. స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ అయిన ఆ ధనవంతుడు ‘క్షమింపబడిన వాళ్లే క్షమిస్తారు’ అని అన్నాడని కధను ముగిస్తాడు జయకాంతన్. ఇలా ముగింపు వాక్యంతో కధను నిలబెడతాడు జయకాంతన్.

మూతబడిన ఇల్లు : తను ఏం చూసినా కధగా మలచగలిగే శక్తి జయకాంతన్ ది. ఒక ఆల్కెమీ ఏదో ఆయనకు తెలుసు. ఒక పాత ఖైదీ శిక్ష అనుభవించిన అనంతరం ఒక ఇల్లు కొనుక్కుంటాడు కానీ ఎవరూ అతన్ని ఆదరించరు. ఒక నాలుగేళ్ల పిల్ల మాత్రం అతనితో కబుర్లు చెబుతూ ఉంటుంది. ఆ పిల్లకి అతను చాక్లెట్లు అవి కొనిపెడుతూ ఉంటాడు. చివరికి అతను ఈ నిరాదరణ భరించలేక అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఆ ఇంట్లోకి తొంగి చూస్తూ వుంటుంది అని జయకాంతన్ కధని ముగిస్తాడు.

మౌనం ఒక భాష : ఇదో చదివితీరవలసిన కధ. అరవై ఏళ్ల వయసులో గర్భం దాల్చుతుందో స్త్రీ. పిల్లలకి పిల్లలు వచ్చే ఈ వయసులో ఈ ఖర్మేమిటి అని బాధపడుతూ వుంటుంది. అప్పుడు కొడుకు తల్లిని ఇంట్లో ఉన్న పనసచెట్టు దగ్గరకు తీసుకు వెళతాడు. పనస చెట్టు మొదళ్ళ దగ్గర కూడా కాయలు కాస్తుంది అని ఓదారుస్తాడు. నువ్వు సిగ్గుపడాల్సిన విషయం కాదమ్మా అంటాడు.

కొత్త చెప్పులు కరుస్తాయి : అతనికి కొత్త భార్య వచ్చింది. కానీ ఆ భార్య అనుకూలంగా లేదు. పెళ్ళయి ఆర్నెల్లు కాలేదు పెడముఖంగా ఉంటుంది. అతను వెళ్ళిపోతే హాయిగా ఫీలవుతూ ఉంటుంది. అతనది అవమానంగా భావిస్తాడు. పాత స్నేహితురాలు గుర్తుకు వస్తుంది. పెళ్ళికి ముందు ఆ స్నేహితురాలుతో కాలం కలిసి ఉంటాడు పెళ్లి మీద ప్రేమ పుట్టిస్తుందావిడ. మళ్ళీ ఆవిడని చూద్దామని వెళతాడు. తన గోడు చెప్పుకుంటాడు. నీ భార్యకు సంసారానికి అనుభవం లేదు నాకనుభవం వుంది అంటుంది. కొత్త చెప్పులు కరుస్తాయని పాత చెప్పులే వేసుకుంటామా అంటుంది. ఆవిడ వంక చూసి అతను భోరుమని ఏడుస్తాడు. ఎందుకు ఏడ్చాడో ఆలోచించమంటాడు జయకాంతన్. మానసిక సంఘర్షణలను ఒక్క మాటలో రాస్తాడు జయకాంతన్ అంటాడు నరేంద్ర.

ఇలా కధలను విశ్లేషించి జయకాంతన్ కధలకు సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ ఆ రోజు సభలో సభికుల ముందుంచారు. కొన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

జయకాంతన్ తనదయిన శైలిలో traditional పధ్ధతిలో కధలు చెబుతాడు. వారి కధలలో విశ్వాసాలుండవు. చిన్న విషయాన్ని కూడా పెంచుతూ రాయటం ఆయనకలవాటు. ఆయనో ప్రొఫెషనల్ రైటర్. కధని నవలగా, నవల నుంచి మరో నవలను సునాయాసంగా మలిచేవాడు.

ఎక్కడ దృశ్యమానం చేయాలో తెలిసినవాడు. కధలో కధ చెప్పే వ్యక్తి tone మాత్రమే విన్పిస్తాడు. అయితే 60, 70 దశకాలలో రాసినవి కాబట్టి నిడివి ఎక్కువే ఉంటుంది. అలంకారాలేవీ లేకుండా లిరికల్ గా కధలు రాస్తాడు జయకాంతన్. కధలోని ముగింపుతో ఒక effect సాధించడం ఒక్క జయకాంతన్ కే సాధ్యం.

హృదయాన్ని, మేధస్సును సమన్వయపరుస్తూ రాయటంలో జయకాంతన్ సిద్ధహస్తుడు. ఆయన కధలన్నింటిలో మనిషే కేంద్రకం. అణగారిన జీవితాలు, జీవితాల్లో వుండే చీకటి కోణాలపై టార్చి లైట్ లా కధను ఫోకస్ చేయటం ఆయన ప్రత్యేకత. ఈ రోజుకీ చెన్నై రైల్వే స్టేషన్ లోనూ, బస్ స్టాండుల్లోనూ ఆయన పాత్రలు సజీవ సాక్ష్యాలుగా మనకు సాక్షాత్కరిస్తాయి.

కధలను స్టోరీస్ ఆఫ్ ఐడియాస్, స్టోరీస్ ఆఫ్ ఆర్ట్ పద్ధతిలో చెబుతారు. జయకాంతన్ ది రెండవ పద్ధతి. ఒక ఆదర్శాన్ని తీసుకుని దానికి పాత్రలు తయారుచేసి కధలు రాయటం ఆయనకి అలవాటు.

అయితే ఆయన కధలలో కొంచెం కృత్రిమత్వం ఉందేమో అని ఇప్పుడు తోస్తోంది. స్టోరీస్ ఆఫ్ ఐడియాస్ పద్ధతిలో రాసేవారిలో ఆ సమస్య ఉంటుంది. కొన్నిచోట్ల పునరుక్తులు కూడా ఉంటాయి.

ఐతే జయకాంతన్ వ్యక్తిత్వ ముద్ర ఆయన కధల్లోని ముగింపులో ఉంటుంది. ఆ కధల్లో ఒక నిశబ్ధం ఉంటుంది. అది కధల వైశాల్యాన్ని మరింత విస్తృత పరుస్తుంది. రెండోసారి ఈ కధలను చదివినప్పుడు జయకాంతన్ మరింత స్పష్టాస్పష్టంగా అర్ధమయ్యాడు. ఆయన కధలు పెద్దవి అవడం వలన అనువాదాలలో వుండే క్లుప్తత ఒకోసారి ఆత్మను మింగేసింది. ఓహెన్రీ కూడా అలాంటి దురదృషవంతుడే.

విస్తృతంగా రాసినప్పుడు తనను తానే imitate చేసుకునే దుస్థితి ఎప్పుడూ ఆయనకు ఎదురవ్వలేదు. ఒక structural unity ఎప్పుడూ ఆయన రచనలో కనిపిస్తుంది. ఐతే అన్వయములేని పెద్ద పెద్ద వాక్యాలు జయకాంతన్ రాస్తారన్న అభిప్రాయం ఒకటుంది. అందువలన అనువాదానికి అంత తొందరగా లొంగడాయన.

*