కోటిగాడు మద్రాస్ వెళ్ళాడు!

 

ఒకడున్నాడు..

వాడి పేరు కోటి సూర్యకిరణతేజం..

తెలిసిన వాళ్ళు వాడిని ‘ కోటి ‘ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు ఏమీ పిలవకుండా వెళ్ళిపోతుంటారు. గత సంవత్సరంగా వాళ్ళ నాన్న మాత్రం వాడిని పిలిచి తిడుతున్నాడు..తిట్టడానికే పిలుస్తున్నాడు.

మన కోటి గాడు పుట్టి బుధ్ధి రానప్పటినుండి తిరుపతి లోనే ఉన్నాడు. డిగ్రీ పూర్తి చేసి సంవత్సరం అయ్యింది.

తిరుపతి లో కూర్చుని హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు నుంచి ఎవరైన పిలిచి ఉద్యోగాలు ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నాడు. ఇంతవరకు ఒక్క కంపెనీ నుంచి కూడాపిలుపు రాలేదు. అందుకే..ఇప్పటికైన ఒక resume తయారు చేసి అప్లై చేద్దామని నిర్ణయించుకున్నాడు. కోటి వాళ్ళ నాన్న కూడా నిర్ణయించుకున్నాడు – వీడిని మద్రాసుతోలెయ్యాలని..

కోటి గాడు మద్రాసు బస్సెక్కే వారం రోజుల ముందు – వాళ్ళింట్లో –

కోటి, కోటి వాళ్ళ నాన్న, వాళ్ళ బావ హాలులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. కోటి వాళ్ళ అమ్మ, తమ్ముడు కూర్చోకుండా, మాట్లాడకుండా ఉన్నారు.

“నేను ఏ మద్రాసు వెళ్ళను నాన్న…ఇక్కడే ఉండి వెతుక్కుంటా”…మొదలెట్టాడు కోటి.

“ఇక్కడుండి వెతుక్కోవటానికి అదేమైనా తలలో తెల్ల వెంట్రుక అనుకున్నావా?? ఉద్యోగం..అయినా డిగ్రీ లో నువ్వు వెలగబెట్టిన 45% మార్కులకు మన రాష్ట్రపతి తిరుపతికి అంబాసెడర్ కారు పంపించి నిన్ను భారతదేశానికి కలెక్టరు చేస్తాడనుకున్నావా? సంవత్సరమైంది నీ చదువు పూర్తయ్యి..ఒక్క ఇంటర్వ్యు కు పిలుపు రాలేదు, ఆ 45%మారలేదు..” అన్నాడు వాళ్ళ నాన్న.

“ఇంటర్వ్యు, కక్కు వస్తే ఆగవు నాన్న…కాస్త ఓపిక పట్టాలి” అన్నాడు కోటిగాడు సోఫా మీదకు జారబడుతూ..

“పడతాను రా….కాని …నువ్వు ఇంకా ఇంట్లోనే ఉంటే నీ మార్కులు ఏ 43% కో, 42% కో మారే ప్రమాదం ఉంది…” అన్నాడు వాళ్ళ నాన్న..జారబడిన కోటీగాడిని చొక్కాపట్టుకుని పైకి లేపుతూ..

ఇండియా, పాకిస్తాన్ గొడవ తీర్చటానికి మధ్యలో అడుగుపెట్టిన అమెరికా లాగ వీళ్ళిద్దరి మధ్యలోకి కోటి వాళ్ళ బావ దూరి…

“రేయ్ కోటి…నా మాట విని మద్రాసు బయలుదేరు..అక్కడ వంశి వాళ్ళ రూములో దిగిపో. నీకు ఉద్యోగం వచ్చేవరకు అద్దె కట్టనవసరం లేదు…నీకు ఉద్యోగం వచ్చేంతవరకుకరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టనవసరం లేదు….నీకు ఉద్యోగం వచ్చేంతవరకు అసలు ఉద్యోగమే చెయ్యనవసరం లేదు” అన్నాడు.

ఆ చివరి వాక్యం కోటీ గాడిలో నూతనోత్సాహం నింపింది.

మళ్ళీ వాళ్ళ బావే మాట్లాడాడు –

“మీరు కూడా కాస్త ఓపిక పట్టాలి మావయ్యా..ఇప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉద్యోగాలు దొరకటం అంత సులభం కాదు..కంపెనీలు లే ఆఫ్ లు ఎక్కువ చేస్తున్నాయి”అన్నాడు..

సబ్ టైటిల్స్ లేని ఫ్రెంచ్ సినిమా చూస్తున్నట్టు ఏమీ అర్థం కాని ఎక్స్ప్రెషన్ పెట్టాడు కోటి.

విషయం పసిగట్టిన వాళ్ళ నాన్న – “ఎప్పుడన్నా న్యూస్ పేపర్ చదివితే కదరా ఆ మాటలు అర్థం కావటానికి” అన్నాడు.

“నేను రోజూ చదువుతాను పేపర్” అన్నాడు కోటిగాడు… ‘ న్యూస్ ‘ అన్న మాట వాడితే అనవసరమైన రిస్కని.

వెంటనే టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి సోఫా కింద పెట్టి – “సరే అయితే….ఈ రోజు పేపర్ లోని ముఖ్యాంశాలు చెప్పు” అన్నాడు కోటివాళ్ళ నాన్న.

“నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, టాకీ పార్టు పూర్తిచేసుకున్న ‘మనసు-మనసున్నర-రెండు మనసులు ‘ చిత్రం, ‘ఇక నుంచి నా డబ్బింగు నేనే చెప్పుకుంటాను ‘ అనిబెదిరించిన హీరో”…అని ఇంకా కొన్ని ఆణిముత్యాల్లాంటి వార్తలు ప్రజలకు అందించేలోపు కోటి గాడిని వాళ్ళ నాన్న అడ్డుకుని –

“ఆపు….ఇవిరా వీడు రోజూ చదివే వార్తలు..ఇక వీడికి ఉద్యోగం వచ్చినట్టే” అన్నాడు తల పట్టుకుంటూ…

ఇక విషయం తన చేతిలోకి తీసుకోకపోతే వీళ్ళ నాన్న ఏమి చేస్తాడో అని భయమేసి, “నువ్వు ఉండు మావయ్య…నేను మాట్లాడతాను వీడితో..” అని కోటి గాడి వైపు తిరిగి –

“రేయ్ కోటి…ఒక్కసారి మీ నాన్నను చూడు” అన్నాడు..

కోటి గాడు వాళ్ళ నాన్న వైపు తీక్షణంగా చూసి  – “నాన్న తల మీద ఈగ కూర్చునుంది బావా…దాన్ని నువ్వు చంపుతావా, నన్ను చంపమంటావా?” అన్నాడు…

“నోర్ముయ్…నేనన్నది ఆయన పడుతున్న వేదన చూడమని…ఆయన అన్న మాటల్లో తప్పేముంది చెప్పు. పోనీ నీకు సాఫ్టువేరు కంపెనీ లో ఉద్యోగం చెయ్యటం ఇష్టంలేకపోతే వెరే ఏమి చెయ్యలనుకుంటున్నవో చెప్పు…..అసలు డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నావు?” అడిగాడు కోటి వాళ్ళ బావ.

“మూటలు మోసుకుని బతుకుతా” – కోటి గాడి సమాధానం..

“అయితే అసలు సమస్యే లేదు..ఈ మధ్య సాఫ్టువేరు కంపెనీలన్నీ ఇంచుమించు ఇలాంటి పనులే చేయిస్తున్నాయి. నీవు కోరుకున్న పని చెయ్యొచ్చు……వెరేకష్టాలేమయినా ఉంటే ఇప్పుడే చెప్పు ” అన్నాడు వాళ్ళ బావ..

“నేను డబ్బు సంపాదించటం మొదలు పెడితే టాక్సులు కట్టాలంటగా..”

“అవును….నువ్వు సంపాదించిన దానిలో మూడో వంతు కట్టాలి…నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే – సంవత్సరానికి నాలుగు నెలలు నీవు ప్రభుత్వం కోసం పని చేయాలి.. ”

“ఓహ్….అయితే ఆ నాలుగు నెలలు నేను శెలవు పెట్టేస్తా”

“సరే…అలాగే కానీ”

“ఇంకో విషయం – నేను ఇంటర్వ్యువ్ కు ప్రిపేర్ అవ్వటానికి ఒక అపార్టుమెంటు అద్దెకు తీసుకుంటాను “…అన్నాడు కోటి.

అంతసేపు తలమీద చెయ్యి పెట్టుకున్న వాళ్ళ నాన్న లేచి నిలబడి…చేతులు కట్టుకుని –

“అలాగే సార్…కరుణానిధి తో ఇల్లు ఖాళీ చేయిస్తాను…అక్కడ ఉందురుగాని..” అన్నాడు…

వాళ్ళ నాన్న ఏదో తేడాగా మాట్లాడుతున్నాడని అర్థమై…ఏమీ మాట్లాడలేదు కోటిగాడు.

“నోరు మూసుకుని బావ ఫ్రెండ్స్ రూములో ఉండు…వాళ్ళ రూముకు దగ్గరలో ఒక ఆంధ్రా మెస్సు ఉందట…మూడు పూటలా అక్కడే మింగు. జలుబు చేస్తేతుమ్ము..జ్వరమొస్తే చారన్నం తిను. నెలాఖరుకు నీ ఫూడ్ బిల్స్, మెడికల్ బిల్స్ నాకు submit చేస్తే reimburse చేస్తా..” అని తన తీర్పు వినిపించాడు గ్రామ ప్రజలకు.

అంతే ఇక ఎవ్వరూ నోరెత్తలేదు..

కోటి గాడు మద్రాసు వెళ్ళటానికి సిధ్ధమయ్యాడు. వాళ్ళమ్మ వాడి బట్టలు సర్దటం మొదలెట్టింది. వాళ్ళ తమ్ముడు వాడి ప్యాంట్లు ఆల్టర్ చేయించుకోవటం మొదలు పెట్టాడు…

భూమి తన చుట్టూ తను తిరిగింది… కోటిగాడు మద్రాసు బయలుదేరే రోజొచ్చింది!

కోటిని బస్టాండుకు తీసుకెళ్ళటానికి వాళ్ళ బావొచ్చాడు. కోటిగాడికి వాళ్ళ నాన్న డబ్బులిస్తూ “త్వరగా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకో…నీకు ఈ ఏడాది పెళ్ళి చేసేద్దాం అనుకుంటున్నా ” అన్నాడు..

“చూడు నాన్నా..’త్వరగా ఉద్యోగం తెచ్చుకో’ అని చెప్పటం ఉల్లిపాయలు తరగటం లాంటిది..నీ లాంటోడు ఎవడైనా చెయ్యగలడు..ఎవడికి తోచినట్టు వాడు చెయ్యగలడు. కానీ ఉద్యోగం తెచ్చుకోవటం మాంచి గొత్తొంకాయ కూర చేయటం లాంటిది. దానికి నాలాంటి చేయితిరిగిన వాడు కావాలి..” గత వారం రోజులుగా వాళ్ళ నాన్న తో అనాలనుకున్నమాటలు అనేసాడు కోటిగాడు…

ఈ స్పీచ్ కు కోటి వాళ్ళమ్మ, తమ్ముడు చప్పట్లు కొట్టారు..

“చూడరా..వీడి అర్థం పర్థం లేని స్పీచ్ కు ప్రేక్షకులు కూడా ఉన్నారు. వాడు చెప్పిన ఉదాహరణలు చూడు…ఉల్లిపాయలు, వంకాయలు. మద్రాసు వెళ్ళినా ఏ కూరగాయలకొట్లోనో trainee గా చేరతాడు” అన్నాడు కోటి వాళ్ళ నాన్న – తన స్పీచ్ కు ఏకైక ప్రేక్షకుడయిన కోటి వాళ్ళ బావతో..

బయలుదేరేముందు వాళ్ళమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు కోటిగాడు…”ఉద్యోగం రాగానే ఫోను చెయ్యి నాన్నా” అంది వాళ్ళమ్మ. అయితే ఇప్పట్లో ఫోను చేసే అవసరం రాదని అర్థమైపోయింది కోటిగాడికి.

తమ్ముడి వైపు తిరిగి…వాడి తల నిమురుతూ “బాగ చదువుకోరా…నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది ” అన్నాడు..

“నీ ఆశీర్వాదమే కాదు రా…నీ నీలం టీ షర్టు, లెదర్ బెల్టు కూడా ఎప్పుడూ నాతోనే ఉంటాయి..” అన్నాడు కోటి తమ్ముడు..

ఇంట్లో అందరికీ టాటా చెప్పాక బస్టాండుకు బయలుదేరాడు కోటిగాడు…..మద్రాసుకు….ఒక కొత్త ప్రపంచానికి…ఒక కొత్త జీవితానికి…లోపల ఎటువంటి జంతువులున్నయో తెలియని అడవికి…

***

ఈ  మనిషి ఇలా…

nitish

నితీష్ కుమార్ – “ఇదిగో..ఎవరైనా కాస్త కాఫీ తెప్పించి ఆ దేవేగౌడా నోట్లో పోయండయ్యా. ఇక్కడికి వచ్చేముందు చెబుతున్నా వినకుండా పెరుగన్నం తిని, స్వీట్ లస్సీ తాగొచ్చాడు. అందరూ మెక్సికన్ వేవ్ చేసి మన మూకుమ్మడి పవర్ ప్రదర్శిద్దామని ప్రెస్ వాళ్ళని పిలిస్తే..ఈ మనిషి ఇలా గురక పెడితే ఎలా? మెక్సికన్ వేవ్ కుదిరేలా లేదు కాని..ఆ ఇద్దరినీ ఇటొచ్చేయమనండి..మన నలుగురం హైటు ప్రకారం కూర్చుని “జై హింద్” అని ముగించేద్దాం.

*

వీక్లీ రౌండప్

 

– Apple కంపెనీ వాళ్ళు iPhone 6, 6S ఫోన్లు విడుదల చేసారు. ఫోన్ల డబ్బాల మీద వాటి ధరలు చూసి నిమిత్త మాత్రులంతా తప్పుకున్నారు. తాజ్ మహల్ కట్టటానికి పోగు చేసుకున్న డబ్బుతో షాజహాన్ ఆ ఫోను కొని, హౌసింగు లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడట.
– శ్రీలంక తో జరిగిన టెస్టు మ్యాచు లో దురుసుగా ప్రవర్తించినందుకు ఇషాంత్ శర్మ పై ఒక మ్యాచ్ బ్యాన్ విధించారట. పాపం ఇషాంత్ శర్మ అలా ప్రవర్తించటానికి కారణం మాత్రం ఎవ్వరూ అడగలేదు. As per reliable sources, (reliable sources = నా కల్పితం), శుక్రవారమని తలంటు పోసుకున్న ఇషాంత్ శర్మకి, జుట్టు చిక్కులు తీసి, జడ వేయటానికి జనం దొరకలేదు. ఆ కోపం తో లంకా దహనం చేసాడు..CCTV కెమేరాలకు దొరికిపోయాడు.
ishant
– బీహార్ లో ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి నాలుగు దశల్లో ఎలెక్ట్రానిక్ వోటింగు మెషీన్లు ఎవ్వరూ దొంగలించకుండా డిల్లీలో దాచేసి, చివరి దశలో గబగబా వోటింగు నిర్వహిస్తారు.
* *
హైదరాబాదు లో ట్రఫిక్ సిగ్నళ్ళు వినాయక చవితి నాడు ఆకాశం లో ఉన్న చంద్రుడి లాంటివి. పొరబాటున కూడా ఎవ్వరూ తలెత్తి చూడరు. కళ్ళు మూసుకుని బండి తోలి హడావిడిగా ఇల్లు చేరుకోవటమే గోల్.
**
మొన్నీమధ్య ప్రశాంతంగా, డిగ్నిఫైడ్ గా జరిగిన మన రాజ్యసభ వర్షాకాల సమావేశాల చిత్రం
monsoon sessions
*

తప్పదు రా తమ్ముడూ..

 

“హలో…రేయ్ అన్నయ్యా..నేను ఈ ఉద్యోగం చేయలేను. వదిలేస్తాను..”

“సంతోషం..”

“నిజంగా వదిలేస్తాను రా..వెళ్ళి మా యముడితో చెప్పేస్తాను..”

“రేయ్..రేయ్..ఆగు. ఇదేదో “బరువు తగ్గుతాను, ఉదయం త్వరగా లేస్తాను” అని నువ్వు వారానికొకసారి చెప్పే జోక్ అనుకుని అలా అన్నాను.ఇంతకీ ఏమైంది?”

“ఇక్కడ ఆఫీసులో ఉన్నవాళ్ళంతా సిటీ లో పుట్టి పెరిగిన వాళ్ళు రా..నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు..”

“నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు..”

“వాళ్ళు మాట్లాడే విషయాలేవీ నాకు తెలీదు. క్రికెట్ గురించో, తెలుగు సినిమాల గురించో అయితే నేను విజృంభించేవాడిని. అవి వాళ్ళుమాట్లాడిచావరు. నేను రిజైన్ చేసేస్తాను..”

“క్రికెట్, తెలుగు సినిమాల గురించి మాట్లాడే వయసు దాటేసావు రా నువ్వు. ఇక రాజకీయాలు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి.ఇంకొన్నేళ్ళయ్యాక షుగర్, థైరాయిడ్ కి మారిపోవాలి. ఆ తరువాత ఏది మాట్లాడటానికైనా రెడీ గా ఉన్నా..మాటలు వినే మనిషి దొరకడు. సరేలే..ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఇద్దరం డిప్రెషన్ లోకి వెళ్తాం. కాబట్టీ…పిల్ల చేష్టలు మాని, పెద్దవాళ్ళు చర్చించుకునే కష్టాలేమైనా ఉంటే చెప్పు..”

“నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఈ ఊళ్ళో లేరు..”

“ఇదేమైనా పదవ క్లాసు తరువాత ఇంటర్మీడీయేట్ చేరడమనుకున్నావా..ఫ్రెండ్స్ అందరూ కూడబలుక్కుని ఒకే కాలేజ్ లో చేరటానికి? ఇందాకచెప్పాను గా…పిల్ల చేష్టలు ఇక కుదరవు..”

“నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు రా. మిగతా సమయాల్లో మాట్లాడరు కాని, భోంచేసేటప్పుడు మాత్రం బలవంతంగా లాక్కెళ్తారు. క్యాంటీన్ కి వెళ్ళాక..అక్కడ అన్నీ పంచుకుని తినాలంటారు. ఈ రోజు నాకు బాగా ఆకలిగా ఉంటే ఫుల్ మీల్స్ తీసుకున్నాను. నాతో పాటు వచ్చిన మిగతా ఏడుగురు ఏడు రకాలు ఆర్డర్ చేసారు. మొత్తానికి నేను ఏమి తిన్నానో తెలుసా? ఒక ముద్ద పప్పు అన్నం, ఒక పీడ్జా ముక్క, నాలుగుఫ్రెంచ్ ఫ్రైస్, రెండు స్పూన్ లు సూప్, అర అంగుళం నూడుల్ తీగ, దోస తో పాటు ఇచ్చే పల్చని పచ్చడి. ఇప్పుడు చెప్పరా..ఇంకా నన్ను ఉద్యోగం చేయమంటావా?”

“ఇలాంటివి ఏ ఉద్యోగానికెళ్ళినా ఉంటాయి రా. పోనీ ఇది మానేసి ఏం చేద్దామని నీ ఆలోచన?”

cartoon

“పొలం దున్నుకుని బతుకుతా..”

“పొలమా? ఏ పొలం?”

“అదే…పొలం కొని..దున్నుకుంటాను..”

“ఆ పొలం కొనే డబ్బే మన దగ్గర ఉండుంటే..నీ కన్నా ముందు నేనే ఉద్యోగానికి రాజీనామా చేసేవాడిని రా నాయనా..కాబట్టీ..పొలం కొనే డబ్బుపోగయ్యాక..ఆ డబ్బు తో ఇల్లు కొని, మళ్ళీ పొలం కొనటానికి డబ్బు పొగయ్యేదాకా ఉద్యోగం చెయ్…అర్థమయ్యిందా?”

“అయితే అప్పటిదాకా ఈ నరకం అనుభవించాల్సిందే నా?”

“కొన్ని కిటుకులు చెబుతాను..రోజూ పాటించు. మంచి ఇంగ్లీషు సినిమాల పేర్లు చెబుతాను..వాటి గురించి వికిపీడియా లో చదువుకుని కొన్నిపాయింట్లు రాసుకో. చేతన్ భగత్ పుస్తకాలు, ఆ నాగుపాముల పుస్తకాల పేరేంటి గుర్తు రావట్లేదు…అవీ..కొని..వాటి వెనకాల అట్ట మీద ఉన్న నవలసారాంశం చదువు. ఆఫీసుకెళ్ళి గంటకొకసారి నువ్వు బట్టీ పట్టిన సినిమాల పేర్లు చెప్పు..ఆ పుస్తకాలు చదివారా అని అడుగు..నాకు తెలిసి మీ టీంలో వాళ్ళెవరూ ఈ టాపిక్ లు దాటి వెళ్ళరు.”

“ఈ ఉద్యోగం లో కొనసాగాలంటే ఇంత నటించాలా? దీని బదులు నేను యాక్టర్ అయితే నెల తిరిగేలోపు నేషనల్ అవార్డు కొట్టేస్తాను..”

“తప్పదు రా తమ్ముడూ..నేను చెప్పిన మార్గం లో వెళ్ళిపో. కొద్ది రోజుల తరువాత నీకే అర్థమైపోతుంది..మనల్ని మనం మోసం చేసుకుని బ్రతకటం ఎంత సులభమో..విజయోస్తు!”

***

IMG_20150831_205034_1

ఇందాక ఇందిరా పార్కు పక్కనున్న కేఫ్ లో చాయ్ తాగుతూ ఉంటే..రోడ్డుకి అటువైపు ఒక పెద్దాయన గోడకున్న పోస్టర్ చూసి కోపంగా “ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించే వాడే లేడా?” అని అరుస్తూ కనబడ్డాడు. విషయం కనుక్కుందామని అటు వెళ్ళాను. గోడకున్న పోస్టర్ చూసాను. “కుంకుమ భాగ్య – మధ్యతరగతి మగువ మనోభావం” అని రాసుంది. కొత్త డబ్బింగు సీరియల్ అనుకుంటా. ఆ టైటిల్ కి, ఆ క్యాప్షన్ కి అర్థమేంటని ఆ పెద్దాయన ఆవేదన కాబోలు. ఆ పోస్టర్ మళ్ళీ చూసాను. రానున్న 300 ఎపిసోడ్ల కథ అర్థమైపోయింది. ఆయన్ని ఓదార్చటానికి కూడా ప్రయత్నించలేదు. మరో ఇద్దరు వచ్చారు. అందరూ కలిసి ఆ పోస్టర్ చించే లోపు ఫొటో తీసాను. ఇప్పుడు మనం ప్రపంచ యుధ్ధం ఫొటోలు చూసి ఆ సమయంలో జనం అనుభవించిన బాధ గురించి మాట్లాడుకున్నట్టు..ఒక యాభై సంవత్సరాల తరువాత నేను తీసిన ఈ ఫొటోను గురించి చర్చించుకుంటారు.

***

facts-about-mosquito-bites-the-truth-and-myths

“ఆరుబయట..పున్నమి చంద్రుడు..చల్ల గాలి..ఆహా..” అని జీవితాన్ని రొమాంటిసైజ్ చేద్దామనుకుంటుండగా..చేతికి చిక్కకుండా చెవి దగ్గర చేరి “గుయ్య్” అని నస పెడుతున్న దోమ..”ఇంట్లో మస్కిటో రిపెలెంట్ లేదు..దోమల వల్ల రాత్రి నిద్ర పట్టకపోతే ఉదయం ఆలస్యంగా లేస్తావు..ట్రాఫిక్ లో ఇరుక్కుపోతావు..” అని గుర్తు చేసి జుగుప్త్స కలిగించే రియాలిటీ లోకి లాగేసింది.

(మళ్ళీ వచ్చే  గురువారం…)

ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Gouthamఐదవ రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు –

 నేను మూడు, నాలుగు రోజులు గుడారం లోనే ఉండాలని మా సేనాని అన్నాడని నా గుడారం లో నాతో పాటు ఉన్న సైనికుడు చెప్పాడు. అప్పటికీ నేను కోలుకోలేకపోతే నన్ను ఇంటికి పంపించేస్తారని కూడా చెప్పాడట. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి తను వెళ్ళిపోయాడు.

 ఎవరో వచ్చి నాకు తినటానికి తిండి, తాగటానికి నీళ్ళు ఇచ్చి వెళ్తున్నారు కాని, నా మనసంతా రణభూమి దగ్గరే ఉంది. లేచి నిలబడ్డాను. కాలు నొప్పిగా ఉంది. నాలుగు అడుగులు వేసాను. నొప్పి నాలుగింతలు అయ్యింది. అనవసరంగా లేచాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ నాలుగడుగులు వేయాలి. మళ్ళీ నొప్పి భరించాలి. ఎందుకొచ్చిన తలనొప్పని అక్కడే నేల మీద కూర్చున్నాను.

నేనొక సైనికుడిని. ఒక వైపు యుధ్ధం జరుగుతూ ఉంటే ఇలా గుడారం లో ఘడియలు లెక్కపెడుతూ ఉండటం చాలా బాధ కలిగిస్తోంది.

ఏదో చిన్న మూలుగు వినిపిస్తే అటు తిరిగి చూసాను. పక్క గుడారం బయట ఒకడు కింద కూర్చుని ఉన్నాడు. వాడి కాలుకీ కట్టు ఉంది.

“నువ్వూ నాలుగడుగులు వేసావా?” అనడిగాను.

“ఆరు..” అన్నాడు తన కాలు చూసుకుంటూ.

“నిన్న చనిపోయినా బావుండేది. ఇలా కదలకుండా గుడారానికి పరిమితమవ్వటం బాలేదు.” అన్నాను మాట కలపటానికి.

వాడు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత నేనూ నిశ్శబ్దంగా ఉండి పోయాను. ఒక గంట సేపు అలానే కూర్చుని ఉన్నాను.

మా ఇంట్లోవాళ్ళు, మా ఊళ్ళో జనం..ఇప్పుడు ఏమి చేస్తూ ఉంటారో? అసలు వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి ఏమైనా తెలుసా? ఇంతటి మహాయుధ్ధం జరుగుతూ ఉంటే అందరూ ఇక్కడికి ఎందుకు రాలేదు? పక్క గుడారం బయట నేల మీద కూర్చుని ఉన్న వాడు ఎంత సేపటికి లోపలికి వెడతాడు? ఈ రోజు కౌరవులంతా హతమైపోతే రేపు అంతా సర్దుకుని ఇళ్ళకు వెళ్ళిపోవచ్చా? నేను గాయపడినందుకు మా సేనాని నా మీద కోపంగా ఉన్నాడా? ఏ ప్రశ్నకూ సమాధానం తోచట్లేదు.

బాగా దాహంగా ఉంది. కష్టంగా ఉన్నా..పైకి లేచి నిలబడ్డాను. నొప్పి భరిస్తూ నడిచాను. చెంబు లోని నీళ్ళు గొంతు లోకి దిగేసరికి ప్రాణం కాస్త కుదుట పడింది.

సూర్యాస్తమయం అయ్యింది. మా సైనికుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. గుడారం లో నాతో ఉన్న సైనికుడు రాలేదు. పాపం ఏమయ్యిందో ఏమిటో. చాలా పొద్దు పోయాక వచ్చాడు. బానే నడుస్తూ ఉన్నాడు.

“ఇంత ఆలస్యమయ్యింది. ఏమి జరిగింది?” అనడిగాను వాడు లోపలికి రావటంతోటే.

“మన వాళ్ళు చాలా మంది పోయారు ఈ రోజు. భీష్ముల వారిని చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది. కృష్ణుడు ఏదో ఒకటి చేయకపోతే..పాండవులు ఇక ఎక్కువ కాలం పోరాడలేరు. మరోవైపు ద్రోణాచార్యులు సాత్యకి ని ఏ క్షణం లోనైనా చంపేలా ఉన్నారు. భీముడు రక్షించి ఉండకపోతే ఈ రోజు సాత్యకికి కూడా అంత్య క్రియలు జరిగేవి.” అన్నాడు..

నేను మారు మాట లేకుండా వింటూ ఉన్నాను.

“దుర్యోధనుడు పంపిన ఒక పెద్ద సమూహాన్ని అర్జునుడు హతమార్చేసాడు. మాకు కాస్త ధైర్యం వచ్చింది. లేకపోతే రేపు కౌరవులని ఎలా ఎదురుకుని ఉండేవాళ్ళమో ఏమిటో….నీకెలా ఉంది?” అనడిగాడు.

“నేను రేపు వచ్చేస్తాను. మన సేనానితో చెప్పు..” అన్నాను ఉద్వేగంగా

వాడు నా వైపు చూసి…”నువ్వే వెళ్ళి చెప్పి రా. ఆయన గుడారం దాకా నడిచి వెళ్ళి, తిరిగి రా..అప్పుడు చూద్దాం..” అన్నాడు.

ఉదయం జరిగిన నాలుగడుగుల ప్రయాణం గురించి చెప్పాను. తను లోపలికి వచ్చేటప్పుడు పక్క గుడారం బయట కూర్చుని ఉన్న సైనికుడిని లోపల కూర్చోబెట్టి వచ్చాను అని చెప్పాడు. ఇద్దరం నవ్వుకున్నాము. ఆ తరువాత పడుకునేదాకా మా కుటుంబాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము.

మరుసటి రోజు త్వరగా మెలకువొచ్చేసింది. నా కాలిగాయం ఎలా ఉందో చూసుకుని..మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నించాను. నా పక్కనున్న సైనికుడు లేచి, యుధ్ధానికి వెళ్ళిపోయాడు.

మధ్యాహ్నం దాకా ఎలాగోలా గడిపాను. ఆ తరువాత నా వల్లకాలేదు. కాలు నొప్పిగా ఉన్నా లేచి నడుచుకుంటూ గుడారం బయటికొచ్చాను. ఒళ్ళంతా చమట పడుతోంది…ఐనా అలానే నడిచాను. ఒకసారి పక్క గుడారం వైపు నడిచాను. నిన్న బయట కనబడ్డవాడు లోపల పడుకుని ఉన్నాడు. పలకరిద్దామని వెళ్ళాను. నన్ను చూసాడు కాని, ఏమీ మాట్లాడలేదు.

“అలా ఉండకు.. నాకూ ఈ యుధ్ధం ఇష్టం లేదు. నాకూ ఇల్లు గుర్తొస్తోంది. ఇలా దిగులుగా కూర్చుని ఏమి లాభం చెప్పు. ఇలా చూడు..నాకూ గాయమయ్యింది.” అని నా కాలి గాయం చూపించాను.

“పద…ఇద్దరమూ కుంటుకుంటూ అలా తిరిగొద్దాం..” అని నవ్వించటానికి ప్రయత్నించాను..

వాడు తన కాళ్ళు చూపించాడు. పాపం…మూడు చోట్ల బాణాలు దిగాయి. నేను ఒక్క బాణానికే ఇంత కష్టమనుభవిస్తున్నానే..ఇంత బాధ ఎలా ఓర్చుకుంటున్నాడో ఏంటో..

“నాకాలికి బాణం దిగి..నేను కూలబడినప్పుడు…ఒక కౌరవ సైనికుడు నా కళ్ళ ముందు మా తమ్ముడిని కత్తితో పొడిచాడు. వాడిని కాపాడుకుందామని లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎవరో నా కాళ్ళకి మరో రెండు బాణాలు వేసారు. నేను చూస్తూ ఉండగానే మా తమ్ముడు కుప్పకూలిపోయాడు.” అన్నాడు. నాకు నోట మాట రాలేదు. ఏమనాలో, వాడిని ఎలా ఓదార్చాలో తోచలేదు. సాయంత్రం దాకా వాడి పక్కన్నే కూర్చుని ఉన్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. వాడు నిద్రపోతున్నప్పుడు ఏడ్చాను. నా కాలి నొప్పి, నేను మనసులో పడుతున్న సంఘర్షణ చాలా చిన్నవిగా కనబడ్డాయి.

రాత్రికి నా గుడారం లో ఈ రోజు ఏమి జరిగిందో చెప్పాడు నా సహచరుడు. నిన్న భీష్ముల వారు చంపినట్టు ఈరోజు ద్రోణాచార్యులు చంపారట. పాండవ సైన్యం బాగా దెబ్బ తింటోంది.

“పాపం ఆ పక్క గుడారం వాడి తమ్ముడు పోయాడట. ఆ విషయం తెలియకుండా నిన్న వాడి గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాము…పాపం..” అన్నాను..మళ్ళీ ఏడుపొచ్చింది.

రెండు క్షణాలాగి..పక్కగుడారానికి వెళ్ళి పలకరించి వచ్చాడు. పడుకునే ముందు నా గాయం గురించి అడిగాడు.

ఆ తరువాత రెండు రోజులూ పక్క గుడారం లోనే గడిపాను. రోజులో చాలా భాగం పడుకుని ఉండేవాడు. ఒక్కోసారి మాట్లాడేవాడు.

యుధ్ధం లో తొమ్మిదవ రోజు రాత్రి..నన్ను, పక్కగుడారం వాడిని కూర్చోబెట్టి ఆ రోజు విశేషాలు చెప్పాడు నా సహచరుడు. భీష్మ పితామహుడు పాండవ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తాడేమో అనిపించి..కృష్ణ పరమాత్ముడు బరిలోకి దిగాడట.

“భలే” అని అరిచాను నేను.

“కృష్ణుడు ఒక రథచక్రాన్ని చేతిలోకి తీసుకుని భీష్ముడిని హతమార్చటానికి వెళ్ళటం చూసి…ఇక ఈ పూట తో యుధ్ధం అయిపోయింది అనుకున్నాను సోదరా..ఆయన్ని అలాంటి ఉగ్రరూపం లో ఎన్నడూ చూడలేదు. ఆయన తన వైపు రావటం చూసి భీష్ముల వారు తన అస్త్రాలను కింద పెట్టేసారు.” అన్నాడు

నాకు ఆనందం…ఉత్కంఠ..

“అర్జునుడు పరిగెట్టుకుంటూ వచ్చి..’యుధ్ధం లో అస్త్రాలను తాకను ‘ అన్న తన శపథాన్ని కృష్ణుడికి గుర్తు చేసాడు. అర్జునుడు రావటం ఒక్క క్షణం ఆలస్యమయ్యుంటే…”

నాలో ఏదో నూతనోత్సాహం. కాలి గాయం ఎలా ఉందో చూసుకోలేదు. నడుచుకుంటూ మా సేనాని దగ్గరికెళ్ళాను. పాండవుల గుడారాలలో ఏదో ముఖ్యమైన చర్చ జరుగుతోంది..చాలా మంది ఉన్నారు అక్కడ.

మా సేనాని నా వైపు చూసాడు.

“నేను రేపు యుధ్ధానికి సిధ్ధమండి..” అన్నాను. నా కాలు చూపించమన్నాడు. చూపించాను. పరిగెట్టి చూపించమన్నాడు. చూపించాను.

ఇంకా ఏమైనా చెబుతాడేమో అని ఎదురు చూసాను. నన్ను మళ్ళీ చూసి…”రేపు అర్జునుడి రథసారథి గా కృష్ణుడు రావట్లేదు.” అన్నాడు.

ఆ మాట వినగానే తల మీద పెద్ద బండరాయి పడ్డట్టయ్యింది.

“నాకు కాలు నొప్పి ఇంకా తగ్గలేదండి..నేను రేపు రాను..” అనేసాను వెంటనే.

“రేపు ఒక్క రోజు శిఖండి ని రథసారథి గా నియమించమని కృష్ణుడే చెప్పాడు. భీష్ముడిని ఆపటానికి అదొక్కటే మార్గం. మనము భయపడవలసిన పని లేదు. ఆయన మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు. వెళ్ళి విశ్రాంతి తీసుకో.” అన్నాడు మా సేనాని.

“ఐతే నేను రేపు ఉదయమే తయారైపోతాను. నాకు ఏమైనా సూచనలుంటే చెప్పండి.” ఏ తడబాటూ లేకుండా చెప్పాను..

ఆయనని ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. నేనూ నా గుడారానికి తిరిగి వచ్చేసాను.

రేపు పదవ రోజు. ఈ యుధ్ధం గమనాన్ని మార్చే సంఘటన ఏదో జరగబోతోందని బలంగా అనిపిస్తోంది. అది మాకు అనుకూలంగానా, ప్రతికూలంగానా అన్నది తెలియదు. నిద్రొస్తోంది.

*

ఓ కురుక్షేత్ర సైనికుడి డైరీ -2

సిద్ధార్థ గౌతమ్

Goutham

రెండవ రోజు రాత్రి బట్టలు మార్చుకొని పడుకుందామని అనుకుంటుండగా పిలుపు వచ్చింది. మా సేనాని సమూహంలో ఉన్న సైనికులనందరినీ రమ్మన్నట్టున్నారు. అందరూ వరుసగా నిలబడ్డాము. అందరినీ ఆకాశం  వైపు చూడమన్నాడు సేనాని. చందమామ…సగం మూత పెట్టిన కుండ లోపలి పాలలా కనబడుతున్నాడు.

“రేపు సర్వ పాండవ సైన్యం అర్ధ చంద్రాకారం లో నిలబడి పోరాడబోతోంది. మన సమూహం ఎడమ వైపు నుంచి దాడి చేయాలి…” 

అని ఎవరెవరు ఏ  స్థానం లో నిలబడాలో వివరించాడు.

నన్ను  ఎడమవైపు చివర్లో నిలబెట్టాడు.

ఎవరి పక్కన ఎవరు నిలబడాలో గుర్తుంచుకున్నాము.

 కాస్త దూరం లో పాండవ సైన్యం లోని మిగతా సేనానులు తమ తమ సమూహాలకు సూచనలిస్తున్నారు.

మా సేనాని ఆవలించాడు.

 పాపం ఎంత అలసిపోయాడో. మమ్మల్ని వెళ్ళి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పాడు.

నాకు అలసటగా ఉన్నా నిద్ర పట్టలేదు. గుడారం బయటికొచ్చి మళ్ళీ చంద్రుడిని చూసాను.

మేఘాలు కప్పేసాయి.  అర్థ  చంద్రాకరం కన్నా ఈ మేఘాల ఆకారం లోనిలబడితే బావుంటుందనిపించింది.

ఈ కొత్త ఆలోచన రేపు రాత్రి సేనాని తో చెప్పాలి.

చిన్నప్పుడు ఆరుబయట పడుకుని చండ్రుడిని చూస్తూ కబుర్లు చెప్పుకున్న రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు చందమామలో కుందేలుని చూసాము, చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తున్న అమ్మమ్మ ని చూసాము. యుధ్ధం లో శత్రువులని చంపటానికి కూడా చంద్రుడు ఉపయోగపడతాడని ఊహించలేదు. మేఘాల చాటున ఎర్రగా కనబడ్డాడు చంద్రుడు. వెళ్ళిపడుకున్నాను.

మూడవ రోజు –

రాత్రి మాకు ఇచ్చిన సూచనల ప్రకారం అర్ధచంద్రాకారం లో నిలబడ్డాము. కౌరవులు కూడా రాత్రి భోజనాల తరువాత కొత్త వ్యూహాలు వేసుకున్నట్టున్నారు. గత రెండు రోజుల్లా కాకుండా కొత్త ఆకారం లో నిలబడ్డారు. నా వెనకాల ఉన్న సైనికుడు “గరుడాకారం లో దాడి చేయబోతున్నారు..” అన్నాడు.  మాకైతే ఎలా నిలబడాలో ఆకాశం లో ఉన్న చంద్రుడిని చూపించి చెప్పాడు మా సేనాని. మరి కౌరవ సైన్యానికి అంత చీకటి లో ఎగురుతున్న గద్ద లను చూపించి ఎలా  సూచనలిచ్చారో?

అర్జునుడి రథం నా పక్కన వచ్చి ఆగింది. చిన్నగా రెండు అడుగులు వేసి  కృష్ణుడి పాదాలను దూరం నుంచే నమస్కరించుకుని మళ్ళీ నా స్థానానికి  వచ్చాను. కుడి వైపు చూసాను. అటు చివర భీమసేనుడు, మధ్యలో  ధర్మరాజు. కౌరవుల వైపు భీష్మ  పితామహుడు అందరికన్నా ముందు నిలబడి ఉన్నారు. గత రెండు రోజులుగా నేను పోరాడుతున్నకురుసైనికుడు వెనకాల ఎక్కడో ఉన్నాడు. నేను చెయ్యి ఊపాను. వాడు చూడలేదు కాని, వాడి పక్కన నిలబడ్డ మరో సైనికుడు చూసాడు. తనూ చెయ్యి ఊపాడు. తన పక్కనున్న వాడిని పిలవమని సైగ చేసాను. నా తలకి చిన్న రాయి తగిలింది. ఎవరు కొట్టారా అని పక్కకి చూసాను. మా సేనాని…కోపంగా చూసాడు నన్ను.

యుధ్ధ భేరి మోగించే వాడు నా పక్కనే  నిలబడి మోగించాడు. నా చెవులు తూట్లు పడేలా శబ్దం. రెండు క్షణాల పాటు తల తిరిగినట్టు అనిపించింది. కౌరవ సైన్యం మొత్తం మా అర్జునుడి మీదకు రావటం చూసి తేరుకున్నాను. ముందుకురికాను. భయం వల్లనో, కోపం వల్లనో తెలియదు కాని..ఒళ్ళు తెలియకుండా పోరాడాను.

 అర్జునుడి మీదకు వస్తున్న బాణాలు, ఈటెలు ఆపటానికి నా చేతనైనంత ప్రయత్నించాను.

కానీ.. ఆయనకు  సహాయపడటానికి, ఆయన్ని కాపాడటానికి  ఆయన రథసారధి ఉన్నాడు. శత్రువులు  ఎంత మంది దాడి చేసినా, ఎలా దాడి చేసినా..ఒక మహాసముద్రం లోకి సన్నటి కాగడాలు విసిరినంత వ్యర్థం.

ఇంతలో “ఘటోత్కచుడు…ఘటోత్కచుడు” అని ఎవరో అరిస్తే అటు చూసాను. భీమసేనుడి పక్కన ఆయన పుత్రుడు. ఈయన గురించి ఎన్నో కథలు విన్నాను, ఒకసారి దూరం నుంచి చూసాను. ఆయన్ని చూడగానే అందరిలో నూతనోత్సాహం. అందరితో  పాటు నేనూ కేరింతలు కొట్టాను.

ఇవేవీ పట్టనట్టు ఆయన, భీమసేనుడు దుర్యోధనుడి వైపు ఉరికారు. నన్ను వాళ్ళ వెంట వెళ్ళమని మా సేనాని ఆదేశించాడు. తండ్రీ కొడుకులు కలిసి దుర్యోధనుడి రధాన్ని ధ్వంసం చేసారు. నేను కూడా ఆ రథ చక్రాన్ని కాస్త విరగ్గొట్టాను. దుర్యోధనుడి రథం వెనక్కు తిరిగింది. నేను వదలకుండా దాని వెంట పరిగెట్టాను.

దూరంగా వెళ్లి  ఆగాక..దుర్యోధనుడు తన అక్కసు భీష్మపితామహుడి పై చూపించాడు. ఆయనపాండవ పక్షపాతి అని, అందువలనే వాళ్ళకు ఏ హానీ జరగకుండా చూస్తున్నాడని అన్నాడు. భీష్మ పితామహుడికి కోపంకట్టలు తెంచుకుని వచ్చింది. ఆయన్ని అలా చూస్తుంటే నాకు వణుకు పుట్టింది.

ఒక సింహం లా పాండవ సైన్యం పైకి దూకాడు. మా సైనికులని ఊచకోత కోసాడు. అర్జునుడు ఆయనని అడ్డుకోవటం తో ఆ వినాశనం కాస్త తగ్గింది. సాయంత్రమయ్యింది.

ghatotkach

ఈ పూట చనిపోయిన సైనికుల శరీరాలకు దహన సంస్కారాలు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఉదయం బధ్ధశత్రువులుగా కొట్టుకున్న ఇరువైపుల సైనికులు ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటున్నారు. నా  భుజం మీద ఏదో చేయి తగిలితే వెనక్కి తిరిగి చూసాను.

నేను మొదటి రెండు రోజులు పోరాడిన కురుసైనికుడు.

“బ్రతికే ఉన్నావా?” అనడిగాడు. నేను నవ్వి, ఔనన్నట్టు తలూపాను. “ఈ రోజు భీష్ముడి ప్రభంజనం లో నువ్వు కూడా పోయావేమో అని భయపడ్డాను. రేపటి నుంచి కృష్ణుడి పక్కనే  ఉండు. ఆయనొక్కడే నిన్ను కాపాడగలడు. జాగ్రత్త.” అన్నాడు. “మరి నీ పరిస్థితేంటి?” అనడిగాను.

“కృష్ణుడు మీ వైపు ఉన్నాడని తెలిసిన రోజే నేను హతమవ్వటం ఖాయం అని నాకు అర్థమైపోయింది. మా మహారాజులు తప్పులు చేసారు, మీ మహారాజులు శపథాలు చేసారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఆలోచించకుండా మనలాంటి వాళ్ళు విశ్వాసంగా యుధ్ధం చేయాలి. నేనిక వెళ్తాను. నిన్ను చూసిపోదామని వచ్చాను.” అని వెళ్ళిపోయాడు.

రాత్రి ఏమీ తినకుండా గుడారానికి వచ్చేసాను.

నాతో పాటు గుడారం లో ఉన్న సైనికుడు ఇంకా పడుకోలేదు. తన పాదానికి గుచ్చుకున్న ముల్లు తీసుకుంటూ ఉన్నాడు.

“నేను తీస్తాను లే..” అని కింద కూర్చుని తన పాదం నా మోకాలి మీద పెట్టుకుని ముల్లు తీసాను.

“యుధ్ధం ఎంత దారుణమైనది సోదరా..” అన్నాడు. నేను ఏమీ సమాధానమివ్వలేదు.

“ఈరోజు భీష్ముడిని చూసి చాలా బాధకలిగింది. ఈ యుద్ధానికి వచ్చింది నాకు తెలిసిన భీష్మ పితామహుడు కాదు. ఈయన ఎవరో రాక్షసుడు. ఆమాట కొస్తే మన ధర్మ రాజుని చూస్తున్నా అలానే అనిపిస్తోంది.

భీష్ముడు, ధర్మరాజు లాంటి  మంచివాళ్ళు, గొప్పవాళ్ళు..ఒకరిని ఒకరు చంపుకోవటానికి యుద్ధం  చేయటమేమిటి? అసలు ఈరోజు చనిపోయిన సైనికులలో ఎంతమంది చెడ్డవాళ్ళు?” అన్నాడు. నేను నిశ్శబ్దంగా   ఉండేసరికి తనూ మాటలు ఆపేసాడు.

నా మనసేమీ బాగోలేదు. ఇల్లు గుర్తొస్తోంది. కృష్ణ పరమాత్మా…రేపు నేను నిద్ర లేచేసరికి ఈ యుధ్ధం ఆపేయవూ?

నాలుగవ రోజు –

ఉదయం లేచినప్పటినుంచి ఎవ్వరితోనూ మాట్లాడలేదు నేను. ఆకలిగా ఉంటే రెండు పళ్ళు తిన్నాను. నిన్న జరిగిన విధ్వంసం ఇంకా నా తలలో తిరుగుతూ ఉంది. అయిష్టంగా నే బయలుదేరాను. యుధ్ధం మొదలు పెట్టింది నేను కాదు..దీనినిఆపే శక్తీ నాకు లేదు. ఆదేశించిన పని చేయటం మాత్రమే నా చేతిలో ఉంది. యుద్ధానికి   వచ్చే ముందు చంపటానికి, చావటానికి సిధ్ధపడే వచ్చాను. కాని, ఇంతటి మనస్తాపం ఉంటుందని నేను  ఊహించలేదు, ఎవ్వరూ చెప్పలేదు. నాకే ఇలా ఉంటే..పాపం పాండవుల పరిస్థితి ఎలా ఉందో?

ఈ రోజు అభిమన్యుడి మీదకొచ్చారు కౌరవ సైన్యం. ఒక్కడిని చేసి అందరూ చుట్టు ముట్టి దాడి చేస్తున్నారు. అన్యాయమనిపించింది.

అభిమన్యుడు..తనని దాడి చేసినవారిని, చేయనివారిని..వందల మందిని చంపేసాడు. అన్యాయమనిపించింది.

దుర్యోధనుడు తన మిగతా సైన్యాన్నంతా  అభిమన్యుడిని చంపమని పంపాడు. అన్యాయమనిపించింది.

భీముడు, అర్జునుడు వచ్చి అభిమన్యుడికి  సహాయంగా నిలబడి యుధ్ధం చేసారు. ఈసారి భీముడిని అంతమొందించటానికి కొన్ని వేల ఏనుగులను పంపాడు దుర్యోధనుడు. అన్యాయమనిపించింది.

భీముడు ఉగ్ర రూపం దాల్చి నోరు లేని ఆ ఏనుగులను తన గద తో పిండి చేసేసాడు. అన్యాయమనిపించింది.

ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కేలా వుంది.

ఎటు పరిగెడుతున్నానో..ఎందుకు పరిగెడుతున్నానో తెలియటం లేదు. రెండు క్షణాలు ఆగాను. కాలి మీద ఏదో చీమ కుట్టినట్టు అనిపించింది. మళ్ళీ పరిగెట్టాను. ఇప్పుడు  తేలు కుట్టినట్టు అనిపిస్తోంది. ఆగి కాలి వైపు చూసుకున్నా. బాణం…నా మోకాలి కింద. అది చూడగానే అసలు నొప్పి తెలిసింది. భరించలేని నొప్పి.

 అసలు ఈ బాణం  ఎవరు వేసారా అని అటూ, ఇటూ చూసాను. కూలబడిపోయాను. “అమ్మా..” అన్నాను బిగ్గరగా. మా అమ్మకి వినబడదు. “కృష్ణా…” అని పేగులు తెగేలా అరిచాను. ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో తెలియదు.

కళ్ళు తెరిచేసరికి నా గుడారంలో ఉన్నాను. పక్కన ఎవ్వరూ లేరు. లేవటానికి ప్రయత్నించాను. కాలు నొప్పి. కాలిలో దిగబడిన బాణం ఇప్పుడు లేదు. ఎవరో కట్టు కట్టారు. “మంచి నీళ్ళు” అన్నాను గట్టిగా. ఎవరో ఒకతను వచ్చి నీళ్ళు ఇచ్చాడు. “ఎవ్వరూ లేరా?” అనడిగాను. “అందరూ యుధ్ధానికి వెళ్ళారు. 

గాయపడిన వారిని చూస్తూ ఇక్కడే ఉండమని నాకు చెప్పారు. ఏమైనా తింటారా?” అనడిగాడు. వద్దని చెప్పాను. మా అమ్మ, నా భార్య పిల్లలు గుర్తొచ్చారు. ఏడుపొచ్చింది.

 నేను ఏడవటం చూసి ఆ నీళ్ళిచ్చినతను వెళ్ళిపోయాడు. 

ఎప్పుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నానో గుర్తు లేదు. 

*

ఒక కురుక్షేత్ర సైనికుడి డైరీ

 సిద్ధార్థ గౌతమ్

Goutham

నా వయసు ఇరవై ఐదు. ఇది నా మొదటి యుధ్ధం. నేను పాండవ సైన్యం లో ఒకడిని. ఈ యుధ్ధం ముగిసాక బ్రతికి ఉంటానో లేదో తెలియదు. అందుకే ఇక బ్రతికిఉన్నన్నాళ్ళు రోజులో జరిగిన సంఘటనలు, విశేషాలు రాద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడి వార్తలను నగరానికి మోసుకెళ్ళటానికి ఒక వేగు ఉన్నాడు. రాసిన పత్రాలుఅతనికిచ్చి నా భార్యకివ్వమని పంపుతాను. నాకొక నాలుగేళ్ళ కొడుకు. 

నిన్న ఉదయం చేరాము కురుక్షేత్రానికి. గుడారాలు వేసి, ఆయుధాలన్నీ లెక్క చూసుకుని, భద్రపరిచేసరికి సాయంత్రమయ్యింది. మా సైన్యాధిపతి మమ్మల్ని అంతా ఒకచోట నిలబెట్టి కొన్ని సూచనలు ఇచ్చాడు. మాకన్నా కౌరవ సైన్యం చాలా పెద్దది. నాకు భయం లేదు. మా వైపు కృష్ణుడున్నాడు.

అర్ధరాత్రి దాకా పాండవులు తమ గుడారం లో వ్యూహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు తోచిన రెండు వ్యూహాలు మా సైన్యాధిపతికి చెప్పాను. ఆయన తనడాలు తో నా నెత్తిన ఒకటి మొట్టాడు.

కురుసైన్యం లో ఉన్న బంధువులనంతా చూసి అర్జునుడు చాలా బాధపడ్డాడు. వాళ్ళతో యుధ్ధం చేయనన్నాడు. నన్ను పిలిచి బట్టలు, ఆయుధాలు సర్దేయమన్నాడు.రథం లో ఉన్న కృష్ణపరమాత్ముడు కిందకి దిగారు. నన్ను అశ్వాలను చూస్తూ ఉండమని చెప్పి, అర్జునుడితో మాట్లాడారు. ఎన్నో మంచి మాటలు చెప్పారు. ధైర్యంగాఉండాలన్నారు. భయము, బాధ వీడమన్నారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏంటో, కొద్ది సేపు నాకు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. మూర్ఛపోయాననుకుంటా.తెలివి వచ్చేసరికి అర్జునుడు కృష్ణభగవానుడికి దండం పెడుతూ కనబడ్డాడు. మళ్ళీ యుధ్ధానికి సిధ్ధమయ్యారు.

నేను మా  గుడారానికి తిరిగివచ్చాక కృష్ణుడు చెప్పిన మంచి మాటల్లో గుర్తున్నవన్నీ రాసేసాను. గుడారం లో నాతో ఉన్న తోటి సైనికుడిని తనకి గుర్తున్నవిచెప్పమన్నాను. వాడు పాపం చివరి వరుసలో నిలబడటం వల్ల ఏమి వినబడలేదనుకుంటా. తనూ కాస్సేపు మూర్ఛపోయానని మాత్రం చెప్పాడు.

——

ఉదయం ఏమీ తినాలనిపించలేదు. పాలు తాగి బయలుదేరాను. సూర్యోదయానికి కొన్ని ఘడియల ముందు రణభూమికి చేరుకున్నాము.

రణభేరి మోగించటానికి ముందు ధర్మరాజుగారు తన ఆయుధాలన్నీ తీసి నేల మీద పెట్టారు. ఈయనకి కూడా అర్జునుడికి చెప్పిన మాటలు చెప్పాలేమో అని నేను కృష్ణుడివైపు చూసాను. ఆయన రథం మీదినుంచి దిగలేదు. ధర్మరాజు గారు కౌరవ సైన్యం వైపు నడుస్తూ వెళ్ళాడు. ఆయన ఎందుకిలా చేస్తున్నారో ఎవ్వరికీ అర్థమవ్వలేదు.బెదిరించటానికా? సంధి చేసుకోవటానికా? నేను కాస్త ముందుకెళ్ళి మా సైన్యాధికారి వీపు గోకాను.

“అయ్యా..ఇంతకీ యుధ్ధం ఉన్నట్టా లేనట్టా?” అనడిగాను. ఆయనతెలియదన్నట్టు తల అడ్డంగా ఊపి, వెళ్ళి నా స్థానం లో నన్ను నిలబడమన్నారు. ధర్మరాజు భీష్మ పితామహుడికి దండం పెట్టి, తనని ఆశీర్వదించమని ప్రార్థించాడు.భీష్మపితామహులు ఎంతో సంతోషించారు. పక్కనున్న ధుర్యోధనుడు “వద్దు..వద్దు” అని అరుస్తూ ఉంటే..రెండు చేతులతో చెవులు మూసుకుని..”విజయోస్తు” అనిధర్మరాజుని ఆశీర్వదించారు. ధుర్యోధనుడు గద పక్కన పెట్టి, తలపట్టుకు కూర్చున్నాడు. ధర్మరాజు తిరిగి మా వైపు వచ్చి తన ఆయుధాలు చేపట్టారు.

రాత్రంతా మత్తుగా పడుకున్న సూర్యభగవానుడు ఒళ్ళు విరుచుకుని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన రాకకోసం ఎదురుచూస్తూ..చేతిలో కత్తులు, విల్లు లు పట్టుకుని యుధ్ధంచేయకుండా నిలబడి ఉన్న పాండవ, కౌరవ సైన్యాన్ని చూసి..గబగబా పైకి లేచాడు. యుధ్ధభేరి మోగింది.

మొదటి రోజు –

భీష్మ పితామహుడు ధర్మరాజుని ఆశీర్వదించినా, మొదటి రోజు మా సైన్యం లో చాలా మందిని చంపేసారు. నేను రోజంతా ఒక కురు సైనికుడితో పోరాడాను. నా చేతికి దెబ్బతగిలింది. నా కత్తి విరిగిపోయింది. నా కుడి పాదరక్ష చిరిగిపోయింది. సూర్యుడు అస్తమించగానే ఈ పూటకి యుధ్ధం ఆపేసాము.  విరాట రాజు పుత్రులిద్దరూ మొదటి రోజేపరమపదించారు. గుడారాలదగ్గరికెళ్ళి లెక్క చూసుకుంటే తేలింది – మొదటి రోజు మా వైపునున్న గొప్ప గొప్ప యోధులు ఎంతో మంది చనిపోయారు.

మాకుభయమేసింది. “అంతిమ విజయం మనదే..భయం వలదు.” అని కృష్ణభగవానుడు ధర్మరాజుతో అన్నారని ఒక సైనికుడు చెప్పాడు. హమ్మయ్య అనుకుని, వెళ్ళి స్నానంచేసి భోంచేసాను. బంగాళాదుంప కూర బాగుంది. పడుకునే ముందు మా సైనికాధికారి దగ్గరకెళ్ళి కొత్త కత్తి, పాదరక్షలు కావాలని చెప్పాను.

ఎందుకు కావాలో వివరంగారాసి ఇవ్వమన్నాడు. చేతికి ఒక పాత కత్తి ఇచ్చి..నాకు సరిపోయే పాదరక్షలు మూడు నుంచి ఐడు రోజుల్లోపు వస్తాయని చెప్పాడు. గాయపడిన ఒక సైనికుడి పాదరక్షలువాడుకొమ్మని చెప్పి నన్ను పంపించేసాడు. అలసిపోయాను. నిద్రొస్తోంది.

రెండవ రోజు –

రెండవ రోజు కాస్త ఆలస్యంగా లేచాను. స్నానం చేసి, ఏమీ తినకుండా రణరంగానికి పరిగెట్టాను. నా వైపు కోపంగా చూసాడు మా సైన్యాధిపతి. కౌరవులు చంపకపోతేఈయనే చంపేసేలా ఉన్నాడు. యుధ్ధభేరి మోగించేవాడు దాన్ని మోగించాడు. అది మోగింది. నేను ఎవరితో యుధ్ధం చేయాలా అని వెదుకుతున్న సమయంలో నాపక్కనుంచి కృష్ణభగవానుడు నడుపుతున్న రథం వాయువేగంతో ముందుకురికింది. అర్జునుడు భీష్మపితామహుడితో తలపడటానికి నిర్ణయించుకున్నట్టున్నాడు.వారిరువురి మధ్యనా హోరాహోరీగా యుధ్ధం జరిగింది. మరో వైపు ద్రోణాచార్యులు, ధృష్టద్యుమ్నుడు పోరాడుతున్నారు. నిన్న నాతో కత్తియుధ్ధం చేసిన వాడు నన్నువెదుక్కుంటూ వచ్చాడు. తుమ్ముతూ ఉన్నాడు. ఏమయ్యిందని అడిగాను. రాత్రి గుడారాల బయట పడుకోవటం వల్ల జలుబు చేసిందన్నాడు.

సూర్యాస్తమయం తరువాత నా దగ్గర ఉన్న ఔషధం ఇస్తానని చెప్పి, నా కత్తితో వాడి కత్తిని బలంగా కొట్టాను. ఇద్దరం యుధ్ధం మొదలుపెట్టాము. కాని మా కళ్ళు, మనసు పెద్ద వాళ్ళ మధ్యజరుగుతున్న పోరు మీదనే ఉన్నాయి. ద్రోణాచార్యుల వారు ధృష్టద్యుమ్నుడిని హతమారుస్తారేమో అనుకుంటున్న తరుణంలో భీమసేనుడు వచ్చి రక్షించాడు. అది చూసినదుర్యోధనుడు భీముడి మీద యుధ్ధం చేయమని కళింగులని పంపాడు. నాకు కోపమొచ్చింది.

నాతో పోరాడుతున్న కౌరవ సైనికుడితో “నువ్వు కాస్సేపలా కూర్చునివిశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి కళింగులని తరిమి కొట్టి వస్తాను..” అని అటు కదిలాను. నాకు ఆ అవకాశం ఇవ్వలేదు భీమసేనుడు. తన మీదకి వచ్చిన కళింగులని మట్టికరిపించాడు. భీష్మ పితామహులు వచ్చి తన శక్తియుక్తులను ఉపయోగించి ఆ మిగిలిన కళింగులని కాపాడారు. భీముడి కి తోడుగా ఉన్న  సాత్యకి భీష్ముడి రథసారధినిచంపేసాడు. సారధి లేని అశ్వాలు భీష్ముడిని యుధ్ధ రంగం వెలుపలకి తీసుకెళ్ళాయి.

రెండవ రోజు ముగిసేసరికి కౌరవ సైన్యం లో చాలా మంది హతులయ్యారు. నాతోయుధ్ధం చేస్తున్నవాడు ఇంకా తుమ్ముతూనే ఉన్నాడు.

రాత్రి అందరూ పడుకున్న తరువాత ఎవ్వరికీ కనబడకుండా వెళ్ళి ఔషధం ఇచ్చి వచ్చాను. అది ఎక్కువగా తాగితేనిద్ర వస్తుందని హెచ్చరించి వచ్చాను.

(సశేషం)