ఆ హిమాలయమే రమ్మని పిలిచిన వేళా…!

సాహిత్ యలమంచి
సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో,  మంచు చరియలు ఎప్పుడు  విరిగిపడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే బేస్ క్యాంప్ చేరడం గొప్ప సాహసమే. అదీ వాతావరణం అంతగా అనుకూలంగా లేని సమయంలో.

కళ్ళముందు కదలాడే హిమ పర్వత అందాల కంటే ముందు నాలుగు ముక్కలు నా ప్రయాణపు నేపథ్యం మీ ముందు పెట్టొచ్చా .. అయితే సరే ..
అద్భుత సౌందర్యంతో మనసును లాక్కెళ్ళిపోయి కట్టిపడేసే హిమాలయ పర్వత శిఖరాలు నన్ను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేది వాటి ఫోటోలు చూసినప్పుడల్లా.  అక్కడికి వెళ్ళిరావాలన్న ఇష్టాన్ని తట్టిలేపుతూ,  మరింత గట్టిబరుస్తూ నా మనసునాక్రమించి అందుకు సన్నద్ధం కమ్మని నన్ను పోరు బెడుతూ…  ఏనాటికైనా..  ఒక్కసారైనా వాటిని తాకిరావాలన్న కోరిక మనసు పొరల్లోంచి ఉవ్వెత్తున ఎగుస్తూ …  కలలు కనడం కాదు ఆ కలల్ని సాకారం చేసుకొమ్మని నన్ను నేను ఉత్సాహపరుస్తూ .. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.

పర్వతారోహణ మాత్రమే కాదు, నిరంతర బాటసారిలా అలా ప్రపంచమంతా చుట్టేసి రావాలని పిచ్చి కోరిక.  అదీ ఒంటరిగా.  నేను గమ్యం గురించి ముందే తెలుసుకోవడం కాకుండా, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా సాగిపోవాలని అనుకునే వాడిని.  కారణం ముందే తెలిసి ఉంటే కొత్తదాన్ని చూస్తున్నానన్న ఉద్వేగం, ఉత్సాహం మాయం అయిపోతాయేమోనన్న భావన కావచ్చు.  లేదా నేను చూసే దృష్టికోణం మారుతుందన్న ఆలోచన కావచ్చు.  నేను కోరుకున్న అనుభూతులకు భిన్నంగా ఉంటే నిరాశ కల్గొచ్చు.  ప్రతి ప్రదేశాన్ని ఆ ప్రత్యేకతలను ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ సాగడంలో ఉండే థ్రిల్ కోల్పోకూడదు అని అనుకునే వాడిని .
మార్గమధ్యలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు  ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే నా ధ్యేయంగా పెట్టుకోవాలి వగైరా వగైరా … గజిబిజిగా సాలెగూడులా ఆలోచనలు కలుగుతుండేవి.  ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన మొదట్లో వచ్చింది చెన్నై లో నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు.   అసలు అంతకు ముందే ట్రెక్కింగ్ చేయాలన్న కోరిక ఉండేది. బహుశ ,  నేను 6తరగతిలో ఉండగానో ఇంకా ముందేనో ఆ కోరికకు బీజం పడిందనుకుంటా..   ఆ కలను నిజం చేసుకోవాలి. ఎలా ..? తెలిసేది కాదు . నాలో నేనే మదనపడుతూ ఉండేవాడిని.
యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ లో ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత నా కలకి రెక్కలు వచ్చాయి.  కలను సాకారం చేసుకొమ్మని నా లోపల్నుంచి ఒకటే పోరు. అప్పటివరకూ నాలో నేను కలలు కనడమే గానీ ఎప్పుడూ ఎవరితోనూ వాటిని పంచుకోలేదు.  ఈ విషయం ఇంట్లో చెబితే ఎలా స్పందిస్తారోనన్న సంశయం. చివరికి నాకు ప్రపంచ యాత్ర చేయాలన్నఆలోచన ఉన్న విషయం మా ఇంట్లో వాళ్లతో చర్చించాను. నా ప్రపోజల్ విని ముందు భయపడ్డారు. బాధపడ్డారు. ఉద్యోగం వచ్చింది. ఇక జీవితంలో స్థిర పడతావనుకుంటే ఈ వింత ఆలోచనలు ఏమిటని దిగులుపడ్డారు.  ప్రమాదకరమైన ప్రాంతాలకి ఒక్కడినే వెళ్ళాలని అనుకోవడం కూడా వాళ్ళ భయాలకి కారణం కావచ్చు.   వాళ్లకి అర్ధమయ్యే విధంగా నేను  చెప్పగలిగానో లేక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నా సంతోషాన్ని కాదనలేకో గానీ ఒప్పుకున్నారు.
పూన్ హిల్ దగ్గిర...

పూన్ హిల్ దగ్గిర…

నా కుటుంబ సభ్యులు మనస్పూర్తిగా సరే అన్నాక పెద్ద రిలీఫ్.  వాళ్ళు వద్దన్నా నేనువెళ్ళవచ్చు. కానీ నాకలా ఇష్టం లేదు. అలా నాకల సాకారం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు పడింది.  అందుకు కావలసిన ఆర్ధిక వనరులన్నీనేనే సమకూర్చుకోవాలనుకున్నా.  అప్పటి నుండి నా సన్నాహాలు మొదలయ్యాయి. మిత్రులతో చెప్పాను . కొందరు పిచ్చా మంచి ఉద్యోగం వదిలి వెళ్తావా అని  అంటే కొందరు ఆ భావం చూపుల్లో చూపించారు.  కొన్నాళ్ళు ఆగితే తానూ నాతో వస్తానన్నాడు ఓ మిత్రుడు.
నాకు అలా ఇష్టం లేదు. నాకు నచ్చిన విధంగా నేను వెళ్ళాలి. ఒక ప్రేంలో నన్ను నేను ఇముడ్చుకోవడం లేదా ఇతరుల ప్రేం లో ఒదిగిపోవడం నాకు నచ్చదు.  ఓపెన్ గా ఉండడం నాకిష్టం .    నా ప్రతి చర్యకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే కావాలి. మరొకరి ప్రమేయం ఉండకూడదు అనుకున్నాను.   ఒక చోటునుండి మరో చోటుకి వెళ్ళడానికి కూడా నేను ఎక్కడా  టైం లిమిట్ పెట్టుకోదలుచుకోలేదు.  అదే విధంగా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం వంటి ఏర్పాట్లేమీ లేకుండా అప్పుడున్న పరిస్థితిని బట్టి స్పందించి నిర్ణయాలు తీసుకోవడం, అలా వెళ్తూ అప్పటికప్పుడు పరిస్తితికనుగుణంగా వ్యవహరించడమే అని నాకు నేను చెప్పుకున్నాను. అదే విధంగా ఎలాంటి లగ్జరీ లేకుండా అతి సామాన్యంగా ఉండాలనుకున్నాను. నాకంటూ ఏ కష్టాలూ లేకుండా పెరిగాను.  క్యుబికల్స్ మధ్య కూర్చొని డబ్బులు సంపాదించడమే జీవితమా ..పెళ్లి , పిల్లలు, ఇల్లు , ప్లాట్లు లగ్జరీ కార్లు..  ఇదేనా జీవితం?  అన్న ప్రశ్నలు ఉద్యోగంలో జేరిన తర్వాత మొదలయ్యాయి.  నా ప్రయాణం, నాకల నేరవేర్చుకోవడం కోసమే కాదు.  జీవితం అంటే..? నాలోంచి వచ్చే ప్రశ్నకి అన్వేషణ కూడా అని తర్వాత అర్ధమయింది.

నా ప్రయాణానికి ఏర్పాట్లంటే మరేమీ లేదు లైట్ వెయిట్ ఉండే లాప్ టాప్,  సోనీ 6000 కెమెరా ..బ్యాక్ ప్యాక్ వంటివి కొన్నాను. . ట్రెక్కింగ్ కి మార్చి చివరి నుండివాతావరణం  అనుకూలంగా ఉంటుందని ముందే తెలుసు.  అందుకే చేస్తున్న ఉద్యోగం ఫిబ్రవరి రెండో వారంలో వదిలేసి రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయాను.  వచ్చే దారిలో చిన్న హాల్ట్ దుబాయ్ లో.  ఆకాశ సౌధం బుర్జ్ ఖలీఫా 148 అంతస్తు లోంచి దుబాయ్ నగర అందాలను చూడడం వింత అనుభవం.
మార్చి10 న ఇంటి నుండి బయలుదేరి డిల్లీ వెళ్ళడంతో  నా ప్రయాణం ప్రారంభం అయింది. 

నిరంతర బాటసారిలా కొంతకాలం తిరగాలన్నది నా ఆలోచనతో నేపాల్ లో అడుగు పెట్టాను. అయితే ఇక్కడ నేను నా పర్వతారోహణ అనుభవాలు మాత్రమే మీతో పంచుకోవాలని మీ ముందుకోచ్చాను.

రోడ్డు మార్గం ద్వారా డిల్లీ నుండి నేపాల్ లోని బర్దియా వెళ్లాను. అక్కడి నుండి హిమాలయ పర్వత సానువుల్లో  ప్రకృతి సౌందర్యంతో అలరారే పోఖార చేరాను. అక్కడ డ్రీం పొఖార హోటల్ లో నా బస. అన్నపూర్ణ పర్వతం ఎత్తు 8091 మీటర్లు.  4,130 మీటర్లు అంటే 13,550 అడుగుల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ పర్వతం  బేస్ క్యాంపు వెళ్ళాలని నా ఆలోచన. ప్రపంచంలోని ప్రముఖ పర్వతాలలో అన్నపూర్ణ కూడా ఒకటి.  ఎత్తులో 10 వ స్థానంలో ఉంది మౌంట్ అన్నపూర్ణ.  ACAP (Annapurna Conservation Area Entry Permit) & TIMS (Trekkers’ Information Management System) కార్డ్    ట్రెక్కింగ్ కోసం తప్పనిసరి . TIMS కార్డ్ ఎవరెస్ట్ , అన్నపూర్ణ , లమ్తంగ్ పర్వతాలు ట్రెక్ చేయాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనట) వాటిని తీసుకునే  ఏర్పాట్లలో హోటల్ వాళ్ళు నా శ్రమని కొంత తగ్గించారు.  సహాయం అందించారు.  నాది టూర్  గైడెడ్ ట్రిప్ కాదు. ఇండివిడ్యువల్ గా వెళ్తున్నాను. కాబట్టి అన్నీ నేనే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే గైడెడ్ ట్రిప్ అయితే అవసరమయిన డబ్బులు ఇస్తే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు. ఎప్పటికప్పుడు తగిన సలహాలూ సూచనలు ఇస్తారు .  ముందే చెప్పానుకదా .. నా ప్రోగ్రాం అంతా నా చేతుల్లోనే ఉండాలంటే గైడెడ్ టూర్ లలో కుదరదు.  అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది కుడా ఉంది సోలో ట్రెక్ లో . ప్రతికూల పరిస్తితుల్లో, అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు నా లాంటివారికి ఇబ్బందే. గైడెడ్ ట్రిప్ లో టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు.  అయినా సోలో ట్రిప్ వైపే మొగ్గింది నా మనసు.

నా బ్యాక్ ప్యాక్ మోస్తూ ట్రెక్ చేయడం కష్టం అదీగాక మొదటిసారి వెళ్ళడం కాబట్టి షేర్ పా ఉండడం మంచిదనిపించింది.   కాబట్టి అది మోయడానికి షేర్పాని మాట్లాడుకున్నాను. షేర్పాని మాట్లాడుకోవడంలో కూడా హోటల్ వాళ్ళు సహాయం చేశారు. అశోక్ అనే షేర్పా నాకు ట్రెకింగ్ లో చాలా సహాయకారిగా ఉన్నాడు.

హిమాలయాల ఒడిలో  3000 అడుగుల ఎత్తులో ఉన్నపట్టణం పోఖర.  అక్కడికి  వెళ్ళిన మూడు రోజుల తర్వాత పర్వతారోహణ ప్రయాణం ఆరంభమైంది.  అన్నపూర్ణ కి వెళ్ళడానికి మూడు మార్గాలున్నాయి . నేను గొరేపాని, పూన్ హిల్ , తడపాని మీదుగా వెళ్ళే దారి ఎంచుకున్నాను.   అక్కడి నుండి నయాపూల్ వరకూ (44 కి. మీ ) టాక్సీలో వెళ్ళాను. ఒక మాదిరిగా ఉన్న సింగిల్ రోడ్డులో ఒక గంటన్నర  ప్రయాణం. ఆ తర్వాత ఉదయం పదిన్నరకు నుండి ట్రెక్కింగ్ మొదలయింది. ఎవరికి వారు నాలాగే ఒంటరిగా ట్రెక్ చేసేవాళ్ళు కొద్ది మందయితే, సమూహంగా వచ్చేవాళ్ళు కొందరు. గైడెడ్ టూర్ చేస్తున్నవాళ్లు మరికొందరు. వారందరి మధ్య నిలువుగా ఉండే రాతి మెట్లు ట్రెక్ చేస్తూ దాదాపు సాయంత్రం 5 గంటలకు ఉల్లేరి చేరా. మొదటి రోజు ట్రెక్ చేసి దాదాపు 1960 మీటర్ల ఎత్తుకు చేరాను . ఆరోజుకి  ఉల్లేరిలో టీ హౌజ్ లోబస.  అక్కడ  టీ హౌస్ లు అంటే చిన్న హోటళ్ళు ఉన్నాయి. నాలాంటి ట్రెక్కర్స్ తో కాసేపు పిచ్చాపాటి కబుర్లతో ఆరోజు గడచిపోయింది. టీ హౌస్ లో కనీస అవసరాలు తీరేలా చిన్న చిన్న రూమ్స్  సౌకర్యంగానే ఉన్నాయి. అక్కడే కావాల్సిన ఆహారం దొరుకుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేప్పటికి చాలా సంతోషం .  వెంటనే నా స్టేటస్ అప్డేట్ చేశా.  దాదాపు పది  నుండి  పదిహేను రోజులు నేను ఎవరికీ అందుబాటులోకి రాకపోవచ్చని కుటుంబసభ్యులకి , మిత్రులకి చెప్పి ఉన్నాను కదా .. నా అప్డేట్స్ నా వాళ్లకి ఎంతో సంతోషాన్నిచ్చాయి.

ప్రతి ఏడాది ఎందరో పర్వతారోహకులకి షేర్పాగా హిమ పర్వతారోహణలో అనుభవం ఉన్న అశోక్ తో కబుర్లు.  ఆ కబుర్ల మధ్యలో అడిగాడు మీది ఏ దేశం అని. ఇండియా అంటే అతనికి ఆశ్చర్యం .. అవును ,చూస్తుంటే ఇండియన్ లాగే ఉన్నావు.  కానీ ఇండియన్స్  ఇలా ట్రెక్కింగ్ కి రావడం చాలా తక్కువ కదా అనడం  ఆశ్చర్యం కలిగించింది.  ఆ తర్వాత  చదువు , డబ్బు , ఆస్తుల సంపాదన మీదే దృష్టి పెడతారట  కదా.. అన్న ప్రశ్నలు . నిజమే కావచ్చు అనిపించింది నాకు తెలిసిన వాళ్ళందరినీ చూశాక. అందుకేనేమో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా మార్గంలో ఇండియన్స్ ఎవరూ కనిపించలేదు. మరి,  ప్రపంచంలో ఎత్తైన ఎన్నో పర్వతాలధిరోహించిన భారతీయుడు మస్తాన్ బాబు మాటేమిటి ? అతని మిస్సింగ్ గురించి నేను ట్రెక్కింగ్ మొదలు పెట్టిన రోజే ప్రపంచానికి తెలిసింది. అంతకు కొద్ది రోజుల ముందే మస్తాన్ బాబు పర్వతారోహణ గురించి విని ఉన్నాను.   నేను తిరిగి వచ్చే సరికి అతను ఇకలేడు అన్న వార్త .
మొదటి రోజు అలసటతో మంచి నిద్ర పట్టింది. గబగబా లేచి మళ్లీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని 8గంటల నుండి నా ట్రెక్ మొదలయింది గోరేపానికి.  రెండో రోజు 2750 మీటర్లు ఎత్తులో ఉన్న గోరేపాని చేరి అక్కడే టీ హౌస్ లో బస చేశాను.   మరుసటి రోజు 5గంటలకే బయలుదేరి పూన్ హిల్ వెళ్ళాలని నిర్ణయించుకున్నా.
Machrapuchre mountain from its base camp

Machrapuchre mountain from its base camp

అనుకున్న సమయానికి అంటే సరిగ్గా సూర్యోదయం అయ్యే సమయానికి అక్కడికి చేరా.   దాదాపు 3200 మీటర్ల ఎత్తులో  ఏటవాలుగా పైన మొనలాగా ఉన్న పర్వతం పూన్ హిల్ .  నాలాగే ఇంకా కొంతమంది పర్వతారోహకులు ఆ సమయానికి అక్కడ చేరారు. ఉదయభానుడు వెదజల్లే తొలి కిరణాల కాంతిలో తడిసే హిమ పర్వతాలు  వింత సోయగాలతో కన్నుల పండుగ చేశాయి. మమ్మల్ని మైమరపించాయి.  అద్భుతమైన ఆ సూర్యోదయాన్ని చూడడం మధురాతి మదురమైన అనుభూతి.  చాలా ఎంజాయ్ చేశా.
అంతలో మా తలల మీదుగా ఎగురుతున్న హెలికాప్టర్.  నీలాకాశం బాగ్రౌండ్ లో పూన్ హిల్ నుండి ఎత్తైన పర్వత శిఖరాలు కనువిందు చేస్తుంటాయి.  ఫిష్ టెయిల్ , అన్నపూర్ణ , అన్నపూర్1, 2, 3, 4, అన్నపూర్ణ సౌత్, నీలగిరి, లాంజుంగ్, హించులి , దవులగిరి, మాచ్రేపుచ్రే ,హిమాలూ, టుకుచే పర్వత శిఖరాలపై  వెండి కరిగించి గుమ్మరించినట్లు, ఆ హిమ రాశులపై పడే కిరణాలు  మిలమిలా మెరిసిపోతూ.. కొన్ని చోట్ల బంగారు కాంతులీనుతూ.. మదిని పులకింపజేస్తుండగా..  మరుసటి రోజుల్లో నేను వెళ్లబోయే  చిన్న, పెద్ద  పర్వతాల మధ్య నిలిచిన  మౌంట్ అన్నపూర్ణ ఠీవిగా రాజసం ఉట్టిపడుతూ తలెత్తుకుని నుంచున్నట్లు గా .. నేనున్నది ఈ ప్రపంచం లోనేనా .. అనేలాగా అత్యద్భుతంగా . అన్నపూర్ణకి  నేను అన్నను అన్నట్లుగా మరింత ఎత్తుగా మెరిసిపోయే దవులగిరి పర్వతం.
Mt. Daulagiri from poonhill

Mt. Daulagiri from poonhill

నేను వెళ్ళాల్సిన  దోవలో మౌంట్ అన్నపూర్ణ చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలని చూస్తూ..  ప్రకృతి అందించిన మహాద్భుత సౌందర్యాన్ని మదిలో ముద్రించుకుంటూనే  చేతిలోని కెమెరాలో బంధిస్తూ అనిర్వచననీయమైన ఆనందం పొందుతూ ముందుకు సాగాను. నడవలేము అనుకున్న వాళ్ళు పున్ హిల్ దగ్గర వరకూ గుర్రాల మీద వచ్చి వెనక్కి తిరగడం చూశాను.  గోరేపాని , తడపాని , పూన్ హిల్ మార్గ మధ్యలో కూడా నడవలేని వాళ్ళు గుర్రాలని మాట్లాడుకుని వాటిపై కూర్చొని ప్రయాణం చేస్తుంటారు.మళ్లీ  వెనుకకు  ప్రయాణం గోరేపానికి.  అక్కడ నుండి తడపని 2 600 మీటర్ల ఎత్తులో ఉన్న  పర్వతం పై బస . అక్కడనుండి మరింత కిందకి దిగితే,  చోమ్రోంగ్ అనే  2350 మీ ఎత్తులో ఉండే మరో చిన్న పర్వతం చేరా .
అక్కడనుండి బాంబూ , దేవురలి చేరా ..అప్పటి వాతావరణ పరిస్థితిని చూసి దేవురలి నుండి చాలామంది వెనక్కి తిరిగారు. క్షణ క్షణం ప్రకృతి విసిరే సవాళ్ళని స్వీకరిస్తూ జాగ్రత్తతో వ్యవహరిస్తూ మచ్రాపుచ్రే బేస్ క్యాంపు చేరే సరికి ఆరు రోజులు పట్టింది.  రోజూ పర్వతాలు ఎక్కడం దిగడం మరో పర్వతం ఎక్కడం. సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో, ఎప్పుడు మంచు చరియలు విరిగి పడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే చేరడం గొప్ప సాహసమే.  అక్టోబర్ నవంబరు మాసాల్లో అయితే మంచు చరియలు విరిగిపడే ప్రమాదం తక్కువట. కానీ నేను వెళ్ళింది మార్చిలో. 
దేవురాలి – మాచ్రాపుచ్రే మధ్య ప్రాంతమే మంచు చరియలు (avalanches ) విరిగిపడే అపాయకర ప్రాంతం. అవి ఎప్పుడో ఒకసారి విరిగి పడడం కాదు.  సర్వ సాధారణంగా ఎప్పుడూ మంచు పెళ్ళలు  విరిగి పడుతూనే ఉంటాయి.  అవి ఎప్పుడు పడతాయన్న ముందస్తు సూచనలు ఏమీ ఉండవు. అకస్మాత్తుగా పడతాయి. వాటి కింద మనని దాచేసుకుంటాయి. ఉదయం 9 గంటల లోపయితే  మంచు చరియలు విరిగి పడే ప్రమాదం చాలా తక్కువ . ఎండ ఏ మాత్రం వచ్చినా, ఎండ పెరిగినా ముందు రోజు కురిసిన మంచు కొంత కరిగిపోతూ .. మళ్లీ దానిపై మంచు కురిసి పేరుకు పోతూ , గడ్డ కట్టిపోతూ .. పెద్ద పెద్ద పలకలుగా జారి పడిపోతూ ఉంటుంది ఆ ప్రాంతంలో.  avalanche prone area దాటగానే మృత్యువును జయించినంత ఆనందం.  మాచేపుచ్రే బేస్ క్యాంపు చేరేప్పటికి విపరీతమైన వర్షం .  దేవ్రాలి నుండి మాచ్రాపుచ్రే బయలు దేరేతాప్పుడే ముందుకు వెళదామంటే నా షేర్పా, గైడ్ అయిన అశోక్ అసలు ఒప్పుకోలేదు .  అనుక్షణం మారిపోయే ప్రతికూల  వాతావరణ పరిస్తితుల్లో ముందుకు సాగడం అసలు మంచిది కాదని అతని హెచ్చరిక . ఓ అరగంట తర్వాత వర్షం తగ్గింది . మేఘాలు కాస్త దూరంగా జరిగాయి .ఎదుట ఉన్నవి కనిపిస్తున్నాయి. 
Warning sign by ACAP - Avalanche risk area

Warning sign by ACAP – Avalanche risk area

వెలుతురు రేఖలు విచ్చుకుని సన్నని ఎండ మంచు శిఖరాలపై పడి స్వచ్చమైన వెండి పోతపోసినట్లుగా మెరిసిపోన్నాయి పర్వతాలు. ఇప్పుడు పర్వాలేదుగా అని ముందుకు కదిలా .. కానీ షేర్పా రానని మొండికేశాడు .  అంతకు ముందు రోజు కురిసిన హిమ వర్షంలో ఇద్దరు చైనీయులు సమాది అయ్యారని కొద్ది క్షణాల క్రితమే ముందు రోజు అక్కడికి చేరిన షేర్పా చెప్పిన విషయం చెప్పాడు.  అందుకే తాము ముందుకు వెళ్ళే సాహసం చెయ్యడం లేదని చెప్పాడు అక్కడే ఉన్న మరో షేర్పా .  షెర్పాలకు తెలుసు అక్కడి వాతావరణ పరిస్థితి. పర్వతారోహకుల సామాన్లు మోస్తూ వారిచ్చే సొమ్ముతో జీవనం సాగించే వాళ్ళకి అక్కడి పరిస్థితులు కొట్టినపిండి .  అందుకే వారి మాటను కాదనలేక నేనూ ఆగిపోయా ..వర్షం పడుతోంది, వాతావరణం అనుకూలంగా లేదని చాలా మంది వెనక్కి వెళ్లి పోయారు. మరుసటి రోజు ఉదయం ఎనిమిదింటికి మాచ్రాపుచ్రే కి ప్రయాణం. దారిలో సన్నని చినుకులు ..ABC నుండి వచ్చే వాళ్ళని అడిగితే పర్వాలేదు వెళ్ళవచ్చు అన్నారు. అలా ముందుకు సాగా. అలా కొంత దూరం వెళ్లేసరికి చిన్నగా  మంచు కురవడం మొదలయింది.  అలా మంచు వర్షంలోనే ఉదయం పదిగంటల లోపే మాచ్రేపూచ్రే చేరాను.
ఎవరైనా ఉదయం పది పదకొండు గంటల లోపే అక్కడికి చేరాలి. లేకపోతే avalanches తో క్లిష్ట పరిస్తితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణం బాగుంటే ముందుకు సాగుతారు. లేదంటే ఆ రోజుకి ఆగిపోతారు.  నేను వెళ్ళిన రోజు  రాత్రి పదింటివరకు అలా మంచు వర్షం కురుస్తూనే ఉంది.  మధ్యాహ్నం మూడుగంటల సమయంలో రెండు సార్లు  మంచు చరియలు విరిగిపడిన శబ్దాలు .  బయటికి వెళ్ళడానికి లేకుండా ఆ రోజంతా అలా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది.   ప్రపంచపు వార్తలు మోసుకొచ్చేఇంటర్నెట్ తడపాని తర్వాత లేదు.  ఏమ్బిసి లో ఉన్న వాళ్ళలో ఒకతను 200 డబ్బులు కట్టి అతి కష్టం మీద ఆ రోజు వాతావరణ పరిస్థితి తెలుసుకోగలిగాడు. పైకి అన్నపూర్ణ బేస్ కాంప్ పై వాతావరణం పోర్ క్యాస్ట్  తెలుసుకోగలిగాడు. పైకి వెళ్ళాలంటే  హిమపాతం చాలా ఎక్కువగా ఉంది. .ఉన్న ఒకే ఒక్క టీ హౌస్ (హోటల్ ) లో చేరిన మేమంతా ఒకరికరు మాట్లాడుకుంటూ, ట్రెకింగ్ కి సంబంధించిన విషయాలు పంచుకుంటూ .. పేకాడుకుంటూ .. కొందరు హాట్ డ్రింక్స్ తాగుతూ .. దేవతలు తిరుగాడే ఆ ప్రాంతంలో నాన్ వెజ్ తినరట . వాతావరణం అననుకూలంగా ఉన్న సమయంలో అయితే ఎక్కువమంది అక్కడికి చేరితే చాలా ఇబ్బందే.  చివరగా వచ్చినవాళ్ళకి రూమ్స్ దొరక్కపోతే ఏ చిన్న స్థలం దొరికితే అక్కడే అడ్జస్ట్ అవ్వాలి.  సాధారణంగా డైనింగ్ ప్లేసులో షెర్పాలు ఉపయోగించుకుంటారు. 
Avalanche from the previous day

Avalanche from the previous day

కానీ, ఎక్కువమంది పర్వతారోహకులు ఉంటే వాళ్ళూ ఆ ప్రదేశాన్ని పంచుకుంటారు. నేను వెళ్ళిన సమయంలో నాకు ఇబ్బంది లేకుండానే గది దొరికింది. ఆ టీ హౌస్ లలో రూమ్స్ చాలా చాలా చిన్నవిగా ఉన్నాయి. కామన్ టాయ్లెట్, బాత్రూం  ఉన్నాయి.  డైనింగ్ హాల్ లో హిటర్ ఆ శీతల వాతావరణాన్ని వెచ్చగా చేయడానికి ప్రయత్నం చేస్తూ .. అది ఒక సారి ఆన్ చేస్తే అక్కడున్న వాళ్ళంతా తలా 150 రూపాయలు కట్టాల్సిందే.  రూంలో హిటర్ ఉండదు.   తడపాని వరకూ ఉన్న టీ హౌసెస్ లో అలా డబ్బు కట్టే పని లేదు. కొందరు టీ హౌసెస్ లో ఉండకుండా టెంట్ వేసుకుంటారు. అందుకు చెల్లించే అద్దె తక్కువేమీ కాదు. అదీ దాదాపు గది అద్దెతో సమంగానే ఉంటుంది.   తాగడానికి మంచి నీటి ప్లాంటులు షెల్టర్ ఉన్న దగ్గర ఉన్నాయి.  ఆ వాటర్ నేపాలీ రూపాయల్లో బాటిల్ కి రెండొందలు. ఎక్కడంటే అక్కడ మల మూత్ర విసర్జన చేయకూడదట.

పిజ్జా , బర్గర్ , ఫ్రైడ్ రైస్ , నూడిల్స్ , పాస్తా , దాల్ , సపగెత్తి , చిప్స్ , స్నికెర్స్ (ఎనర్జీ చాక్లెట్స్ ), హాట్ డ్రింక్స్,  కూల్ డ్రింక్స్ , వాటర్ బాటిల్ , అన్ని రకాల టీ లు  , సిగరెట్ లు అన్ని దొరుకుతాయి . రేట్లు కింద నుండి పైకి వెళ్ళిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి . ఎవరికీ వారు తమ ఇష్టం వచ్చినట్లు అమ్మరు . అంతా ఒకే ధరకు అమ్ముతారు .   ఒక్కో పర్వతం ఎక్కేకొద్దీ  దూరం పెరిగే కొద్దీ టీ హౌస్ ల సంఖ్య తగ్గిపోయాయి . నేను వెళ్ళేటప్పటికే అంటే ఉదయం 10 గంటల సమయం అక్కడ 20 మంది లోపు  ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ముందు రోజే అక్కడికి వచ్చారట. వాతావరణం అనుకూలించక ఆగారట.  ఏం చేయాలో తోచలేదు . కాసేపు వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు పేకాట. అప్పటికే విసుగోచ్చింది. 
మరుసటి రోజు చేరువలోనే ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంపు సిద్దమయ్యాను. అంతలో  మంచు కురవడం ఆరంభమైంది.   పైకి వెళ్ళిన కొద్దీ మంచు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందట. కొన్ని క్షణాల్లోనే మన చుట్టూ మంచు దట్టంగా పేరుకుపోయి అడుగు ముందుకు వేయలేక ఆ మంచులోనే కూరుకుపోయి చనిపోతుంటారని అప్పటికే షేర్పా చెప్పి ఉండడంతో ఇక ముందుకు వెళ్ళే సాహసం చేయలేక పోయాను.  కిందకు వెళ్తే అది తక్కువట. ఇక అక్కడ ఉండడం అనవసరం అనిపించింది.  తోటి పర్వతారోహకులు కొందరు అనుకూల వాతావరణం కోసం ఎదురుచూస్తూ ఉంటే మిగతావాళ్ళు తిరుగు ముఖం పట్టారు. తీవ్ర పరిస్తితుల్లో హెలికాప్టర్ ద్వారా అక్కడనుండి బయట పడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట . దానికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో  నాకక్కడ ఉండాలనిపించలేదు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వెనక్కి తిరగమని సలహా ఇచ్చింది నా మనసు.
పది అడుగుల దూరంలో ఉన్నవి కనిపించనంత దట్టమైన మేఘాలు, వర్షం , మంచువర్షం తీవ్రమైన మార్పులతో.  ఫోటోలు కూడా తీసుకోలేకుండా .. తీసినా  ఏమీ కనిపించకుండా .. వాతావరణం కొద్దిగా అనుకూలించగానే తిరుగు ప్రయాణం మళ్లీ మామూలే .. మంచు చరియలు విరిగిపడే అత్యంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతం దాటేశాను. పర్వతాలు ఎక్కుడుతూ దిగుతూ .. కిందకి వచ్చేప్పటికి  మోకాళ్ళలోంచి విపరీతమైన వణుకు .. నొప్పులు .. మార్గ మధ్యలో జీనూ లో ఉన్న వేడి నీటి గుండాల (hot springs ) లో స్నానం పోతున్న ప్రాణానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. కాసేపు నా మోకాళ్ళ నొప్పులు మటుమాయం అయ్యాయి. ఆ నీటిలో ఉన్నంత సేపూ శరీరం చాలా తేలికగా .. కానీ మళ్లీ నడక మొదలయ్యాక షరా మామూలే. నొప్పి మళ్లీ మొదలయ్యింది.  పోఖారో చేరి రెండు  రోజులు రెస్ట్ తీసుకున్నాక కాని తగ్గలేదు.  దిగడానికి నాలుగు రోజులు పడుతుంది అంటారు కానీ రెండు రోజుల్లో వచ్చేయొచ్చు . నాది ఒంటరి ప్రయాణం కదా .. నాలాగే చాలా మంది కనిపించారు .  అయితే గ్రూపులుగా వచ్చిన వాళ్ళు , ఇద్దరు ముగ్గురు కలసి వచ్చిన వాళ్ళు , అక్కడ పరిచయమై ఒక గుంపుగా ముందుకు సాగే వాళ్ళు  రకరకాలుగా .. నడవలేని కొంతమంది గుర్రాలపై సీనువా అనే ప్రదేశం వరకూ వచ్చి దూరంనుంచి కనిపించే రమణీయ దృశ్యాల్ని కళ్ళలో నింపుకునే వాళ్ళు, . పూన్ హిల్ వరకు వచ్చి వెనక్కి మళ్లే వాళ్ళు .. ఎవరికి ఎలా అనువుగా ఉంటే అలా .. అంతా ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ ..

 దారిలో ఓ బ్రిటిష్ మహిళ తో పరిచయం యింది . ఆవిడ వయసు డెబ్బై కి దగ్గరలో ఉందట.  నాలాంటి యువకులతో సమంగా ముందుకు సాగుతోంటే  ఆశ్చర్యం.  ఆ మాటే తోటి పర్వతారోహకుడితో అంటే అతనికి ఎనభై పైనే ఉన్న జర్మన్ మహిళ తారసపడిందని ఆమెకది 32 వ సారి రావడం అని చెప్పాడు. ..  మా అమ్మమ్మ వయసు అంతకంటే కూడా చాలా పెద్దవాళ్ళయిన వీళ్ళు ఎంతో  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగడం నాకెంతో స్పూర్తినిచ్చింది. ఆవిడ స్టేమినా చూస్తే చాలా ఆశ్చర్యం . చక చకా ముందుకు సాగేది.  ఒక క్రమబద్దమైన జీవితం, శరీరానికి శిక్షణ, పోషణ  ఉంటే  వయస్సు ఏమాత్రం అడ్డుకాదనిపించింది ఆ క్షణం ..    వాళ్ళు  తమ శరీరారోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడమే కాకుండా  ఇలాంటి సాహసాలు చేయడం చాలా గొప్పగా అనిపించింది. అన్నపూర్ణ మౌంట్ సర్క్యూట్ కి అంటే దాదాపు 250 కిలోమీటర్లు పర్వతాలు ఎక్కుతూ దిగుతూ కొందరు.

Annapurna South from MBC

Annapurna South from MBC

ప్రపంచంలోనే అత్యద్భుత ట్రెక్కింగ్  ప్రాంతం అన్నపూర్ణ.  చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ తో అడవుల్లో రకరకాల మొక్కలు, చెట్లు  రెండు కొండల్ని కలుపుతూ ఉయ్యాలల్లా ఊగుతూ ఇనుప తీగతో తయారయిన suspention bridges పై లోయ హోయల్ని, వాటిలో ప్రవహించే నదుల్ని ఆస్వాదిస్తూ సాగే ట్రెక్కింగ్.  మార్గమధ్యలో అక్కడక్కడా కనువిందు చేసే చిన్న చిన్న గ్రామాలు, వారు కొండవాలులో చేసే వ్యవసాయం, మంచు కరిగి పారే సెలయేర్లు , హోరెత్తుతూ దూకిపడే జలపాతాల గలగలలూ , పచ్చని కొండల్లో రంగులోలికే పుష్పాలూ .. సన్నగా సాగిపోయే బాటల్లో .పాకుడు రాళ్ళూ .. నిలువాటి బండలు దాటుకుంటూ గమ్యంవైపు సాగేది నడక.

ఆ అద్భుతమైన ఆహ్లాదకరమైన  వాతావరణంలో ఏటవాలుగా పైకి వెళ్ళడం, లోయలలోకి జారే నడక, కాళ్ళకింద కదిలి సర్రున జార్చడమో  లేదంటే చుట్టూ పేరుకుపోవడమో చేసే మంచు విన్యాసాలు ఏవీ అసలు అలసట తెలియనిచ్చేవి  కాదు.  అణువణువునా నిండిన ఉత్సాహం .. ఉత్తేజం.. ఉద్వేగం .. లక్ష్యం వైపు పయనింప జేస్తూ .. కానీ ఒక్కటే వెలితి .. అన్నపూర్ణ బేస్ క్యాంపుకి అతి కొద్ది దూరంలో అంటే మరో 400 మీటర్ల దూరంలో వెనక్కి మర్లడమే.. అప్పుడే నా మనసు అవిష్కరించుకుంది తదుపరి ప్రయాణపు చిత్రం.

*