సుందర సుకుమారి 

samanyaఆకాశాన ధగధగమని మెరుస్తున్నాడు వెండివెన్నెల చందమామ . మెస్ నుండి రూమ్ కి తిరిగి వస్తూ గేటు దగ్గర వున్న గంగరావి  చెట్టు క్రింద నిలబడి ,ఆకుల సందులలోనుండి భూమి మీద పడుతున్న పండు వెన్నెల రేఖల కింద చెయ్యి పెడుతూ ”ఇక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది అదితి ,చూడు ఆ బ్యూటీ , ఆ చంద్రుడిని ఏం చేసుకోవాలి చెప్పు ,ఎంత అశక్తులం మనం ..  , కదా ! ” అంది బోలెడంత దిగులు గొంతులోకి తెచ్చుకుని శ్రీప్రియ . అదితి ఢిల్లీ అమ్మాయి . అక్కడే ఇద్దరు ఇంజినీర్లకు పుట్టి పెరిగింది . అందుకనేమో శ్రీప్రియ చూపించిన చంద్రుడి వంక దీర్ఘంగా చూసి ,తల క్రిందికి దించి , దిగులుపడుతున్న  శ్రీప్రియ వైపు చూసి ,”నాకు పీజ్జా ఆకలి వేస్తుంది శ్రీ ,చంద్రుడు అచ్చం చీజ్ పిజ్జా లాగున్నాడు నాకెందుకు  నీలా అనిపించడంలేదు ” అంది తానూ దిగులుగా . అదితి మాటలకు పెద్ద నిట్టూర్పు విడిచి ”పద వెళదాం ” అంది శ్రీప్రియ .

శ్రీప్రియ ది  విజయవాడ  . అమ్మా నాన్న ఇద్దరూ అక్కడ పేరు మోసిన డాక్టర్లు . మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్లు . వారికి శ్రీప్రియ ఒక్కటే సంతానం .  శ్రీప్రియ తెల్లగా ఉంటుంది , రింగులు తిరిగిన ఒత్తయిన తలకట్టు ,మధ్యలో గీత ఉండి అటుఇటు ఉబ్బి వుండే ఎర్రటి కింది పెదవితో అందంగా ఉంటుంది . కవి కాకున్నా ఆవేశపడి అవీ ఇవీ రాస్తుంది . చక్కగా కాకున్నా  ముద్దు ముద్దుగా పాడుతుంది . చాలా సున్నిత మనస్కురాలు . చదువుతున్నది భౌతిక శాస్త్రమే అయినా ఒందశాతం భావవాది . ఎంత భావవాది అంటే , రాకెట్టును అంతరిక్షంలోకి పంపే ముందు, మంచి ముహూర్తం పెట్టుకుని ,అయ్యవారిని పిలిపించి పూజలు చేయించుకుని శాస్త్రోక్తంగా ఆకాశంలోకి ఎగరేసే భారతీయ  శాస్త్రజ్ఞులంత భావవాది .

ఇద్దరూ రూంలోకి వెళ్ళగానే అదితి మొబైల్ మ్రోగింది .  మొబైల్ అలా ఆ టైం లో మ్రోగిందంటే మరిక అదితి ఈ లోకంలో ఉండదనే అర్ధం . ఆ అమ్మాయి అలా  మొబైల్ చేతి లోకి తీసుకోగానే  శ్రీప్రియ నిట్టూర్చి , పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది . కూర్చున్నదన్న మాటే కానీ చెవులంతా అదితి సంభాషణ పైనే వున్నాయి . ఏవేవో సరస సంభాషణలు జరుగుతున్నట్టున్నాయ్ , అప్పుడప్పుడు అదితి బుంగ మూతితో గారాలు పోతుంది . అదితికి బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు . ఏదీ సీరియస్ గా తీసుకోదు ఆ పిల్ల . ”ప్రేమ అనే భావనకి విలువనివ్వవా నువ్వు ”అంది ఒకరోజు అదితి తో . ఆ ప్రశ్న విని ,అదితి చాలా ఆశ్చర్యపడి ‘అదేమిటి ! ఎందుకివ్వను ,  ఇస్తేనే కదా అంత టైం స్పెండ్ చేసి మాట్లాడుతున్నాను ” అంది . కొన్ని రోజులకు ఆ ప్రేమికుడు మారి కొత్తవాడు వస్తాడు  . ఏమిటిలా అంటే ”నేనేం చేసేది వాడికి నా మీద ప్రేమ పోయింది ,ప్రేమలేని వాళ్ళ దగ్గర ఎందుకుండాలి చెప్పు ” అంటుంది  . శ్రీప్రియ కి ఆ లాజిక్ ఒందశాతం  నిజమనిపిస్తుంది  ,కానీ మనసు ఎందుకనో ఇదంతా అంగీరించదు . అందుకే ఈ కొత్త ప్రేమికుడుతో మాట్లాడుతున్న అదితిని చూసి నిట్టూర్చింది .

ఇవాళ రేపట్లో అమ్మాయిలందరికీ , అబ్బాయిలు స్నేహితులుగా వుంటున్నారు , ఆ స్నేహాలనుండి ప్రేమలూ పుట్టుకొచ్చి పెళ్ళిళ్ళూ అవుతున్నాయి . కానీ శ్రీప్రియకి భయం ,అబ్బాయిలతో మాట్లాడొద్దని నాన్న అమ్మ ఎప్పుడూ చెప్పలేదు కానీ ,కులాంతర వివాహం అనే మాటను కూడా వాళ్ళు ఇంటిలోపలికి రానివ్వరు . తమకి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ ఆడపిల్ల పిల్ల కావడంచేత మరింత కట్టుదిట్టంగా మాటల నుండి చేతల వరకూ అంతటా జాగ్రత్తపడుతూ వుంటారు . శ్రీప్రియ కి అదంతా తెలుసు . అందుకే తానూ జాగ్రత్తగా ఉంటుంది .

%e0%b0%b8%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0-%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf

యూనివర్సిటీ లో శ్రీప్రియ కులపు వాళ్ళు , కార్తీక పౌర్ణమికి సెలవు రోజు కలిసి వచ్చింది కనుక వన భోజనాలు  పెట్టుకున్నాం , దగ్గరున్న అడవికి వెళదాం అనుకున్నారు . పున్నమి అడవి  అనేసరికి శ్రీప్రియ హృదయంలో  ఆకాశంలో యెగిరి పూసే కాకర పువ్వొత్తుల్లాంటి టపాకాయల్లా  కోటి చంద్రుళ్లు రంగులు రంగులుగా పూశారు . ఇంతలో కార్తీక పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి ,ఒక ప్రజాస్వామిక స్తూడెంట్స్ యూనియన్ ఈ కులబోజనాల గురించి కరపత్రం వేసింది , అప్పుడిక డిపార్ట్మెంట్ అంతా వనభోజనంకి వెళదాం అనే ముగింపుకి వచ్చి అందరూ వనభోజనాలకు బయల్దేరారు. అలా వచ్చాడు వెంకట్ వనభోజనాలకు .

వెంకట్ వాళ్ళ నాన ఊరి పెద్దమాదిగ. వాళ్ళ మాదిగగూడెంలో  పదోతరగతి వరకు చదువుకున్న  శీనివాసు ఎంత చెపితే అంత . వెంకట్ వాళ్ళ అమ్మ , నాన్న ఇద్దరూ ఎర్రగా వుంటారు , ఎత్తుగా వుంటారు . ”యెర్ర మాదిగల్ని నల్ల బాపనోళ్ళని  నమ్మకూడదని ” సామెత . ఎప్పుడో ఎవరో ఆ సామెత అని  వెంకట్ ని తిడితే ,వెంకట్ ఏడ్చుకుంటూ వచ్చి వాళ్ళ  నాన్నకి చెప్పాడు . శీనివాసు అది విని నవ్వి , మనం మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్లమని దానికర్ధం రా చిన్న , చూడు మీ క్లాసులో నువ్వే కదా ఎప్పుడూ ఫస్టు  వచ్చేది” అని చెప్పేడు . అది నిజమే వెంకట్ ఎప్పుడూ ఫస్టే , ఇప్పుడు కూడా csir ఫెలోషిప్ తో P hd లో చేరాడు . అతను ఎర్రగానే కాదు , చూడటానికి కూడా బాగుంటాడు . దరువేస్తూ పాట  పాడితే  ఆకాశంలో చందమామ దిగి వెంకట్ ముందు కూర్చుంటాడు . అందుకని స్తూడెంట్స్ అందరూ కేంప్ ఫైర్  ముందు వలయంగా కూర్చున్నాక  వెంకట్ ని పాడమని అడిగారు .

వెంకట్ వలయంకి కొంచెం దూరంలో వున్న చిన్న బండరాయి మీద ఎక్కి కూర్చున్నాడు . అతనికి జానపదాలంటే చాలా ఇష్టం అందుకే మొదలు పెట్టడమే ” బొట్ల బొట్ల చీర కట్టి ,బొమ్మంచు రైక తొడిగి , నీకోసం నేనొస్తినిరో  నా ముద్దూల మామయ్యా ,నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అని మొదలు పెట్టాడు . ”మేడారం జాతరలో మల్లన్న గుడికాడా మన మాట మాట కలిసెనురో నా ముద్దూల మావయ్య / నువ్వు రానే రాక పోతివిరో నా ముద్దుల మావయ్య ” అంటూ వస్తానన్న ప్రియుడు రాకపోవడంతో అతని  పరిచయపు జ్ఞాపకాలను తలపోసుకుంటున్న ప్రియురాలి గుండెలోని వేదనొకటే  కాదు అతని కంఠంలో ,స్త్రీ కంఠంలోని మృదు సొబగు కూడా జాలువారుతూ వుంది . ఒకటి తర్వాత ఒకటి పాడుతూ ఉంటే ఎవరో అన్నారు ”రేయ్ వెంకట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి రా ,చంద్రుని మీద పాడు” అని . వెంకట్ నవ్వుతూ అలా అన్న అబ్బాయి వంక చూసి ,ఏం పాడమంటావో నువ్వే చెప్పు అన్నాడు . ఆ చెప్పమన్న పిల్లవాడు చెప్పకముందే అతని పక్కన కూర్చుని వున్న శ్రీప్రియ మృదువుగా , మొహమాటంగా ”చౌదవీ క చాంద్ హో… ” పాడుతారా  అంది . వెంకట్ ఆ అమ్మాయి వంక చూసాడు . వరాలిచ్చే దేవుడు తనని చూసినంత తన్మయం కలిగింది అప్పటికే అతని మధురమైన కంఠంతో మోహంలో పడ్డ శ్రీప్రియకి ,వెంకట్ అంతసేపు ఆ అమ్మాయిని గమనించలేదు , ఎర్రని మంటవెలుగులో గులాబీ రంగులో ప్రకాశిస్తున్న ఆమె ముఖమూ , లీవ్ చేసుకుని ఉన్నందున మెడచుట్టు అలుముకుని వున్న నొక్కుల జుత్తుతో ఆమె రూపసౌందర్యం విస్తుగొలుపుతూ వుంది , ఆమె ముఖం వంక చూసి ,లిరిక్స్ పూర్తిగా గుర్తు లేవు కొంచెం చెప్పగలరా ”  అన్నాడు ,శ్రీప్రియ లిరిక్స్ చెప్పింది  ,మధ్యలో గీత వుండి నిండుగ ,కొద్దిగా తెరుచుకున్నట్టు వుండే ఆమె యెర్రని పెదాల వంక చూస్తూ లిరిక్స్ విన్న  వెంకట్  కొన్ని వాక్యాలు పాడేటపుడు   శ్రీప్రియ పై చూపు నిలిపి  పాడాడు ” చెహరా హై జెయిసే జీలుమే హాస్తా హువే కమల్ /ఏ జిందగీ కె సాజ్ పే చేరి హుయి గజల్ / జానే  బహార్ తుమ్ కిసి షాయిరా  కి క్వాబ్ హో” అనేవి అందులో కొన్ని లైన్లు . ఆ లైన్లే కాదు ,కవి ఆ పాట ఆమెనే ఉద్దేశించినట్టు రాసిన విషయం ఆమెకు కూడా తెలుసేమో అని వెంకట్ కి అనిపించింది .

Kadha-Saranga-2-300x268

యూనివర్సిటీ కి రాగానే వెంకట్  చేసిన మొదటి పని శ్రీప్రియ కులమేంటో తెలుసుకోవడమే . ఆ అమ్మాయి కులమేంటో  తెలిసాక , తెలివయిన వాడు కావడం చేత వెంకట్ ఆమె  సౌందర్యాన్ని కలలకి పరిమితం చేసేసాడు , కొన్ని రోజులకు కలల్లోకూడా  ఆమెని మరిచిపోయాడు . అలాటి రోజుల్లో ఒక రోజు శ్రీప్రియ హెచ్ ఓ డి రూమ్ నుండి వస్తూ వెంకట్ కి ఎదురుపడింది . అతన్ని చూసీ చూడగానే విశాలంగా నవ్వుతూ ముఖమంతా సంతోషాన్ని నింపుకుని ”బాగున్నారా , మిమ్మల్ని  చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నాను ,  మీ గురించి ఎవరిని అడగాలో తెలియక ఊరుకున్నాను ,మీరు మొహమ్మద్ రఫీలా … ఊహు కాదు కాదు అంతకన్నా గొప్పగా చాలా చాలా గొప్పగా పాడుతారు , మీ గొంతు చాలా బాగుంది , సినిమాలల్లో ట్రై చేస్తే మీరు నంబర్ వన్ పొజిషన్ లో వుంటారు ” అని గుక్క తిప్పుకోకుండా వుద్రేకపడుతూ  గబగబా చెప్పేసింది . శ్రీప్రియ చెప్పిన మధురమయిన మాటలకి  గుండె ఉప్పొంగుతుండగా నోట మాట రాని  వెంకట్ గొంతు పెకలించుకుని ”తాంక్  యు ” అని మాత్రమే అనగలిగాడు  . కానీ శ్రీప్రియ అంతటితో ఊరుకోకుండా ”మీకు టైం ఉంటే కేంటీన్ కి వెళదాం వస్తారా ” అని అడిగింది .

కేంటీన్ ముందు బెంచీల మీద సెటిలయ్యారు ఇద్దరూ . క్లాసులయిపోయాయి గనుక డే స్కాలర్లు  ఇళ్లకు వెల్తూ వున్నారు , హాస్టలేట్స్ కబుర్లు చెప్పుకుంటూ సైకిళ్ళు నెట్టుకుంటూ నడుస్తున్నారు . క్యాంటీన్ కి  ఆ మూల వున్న చెట్టు మీద ఉడుత ఒకటి పైకీ కిందకీ అలజడిగా తిరుగుతూ కీ..  కీ  అంటూ చప్పుడు చేస్తుంది . సంజె వాలుతూ వుంది . వెంకట్ ఏమయినా మాట్లాడుతాడని శ్రీప్రియ , కేంటీన్ కి పిలిచింది కదా ఏదో ఒకటి మాట్లాడొచ్చుకదా అని వెంకట్ మనసులో అనుకుంటూ అప్పుడప్పుడూ కనుకొలకులనుండి ఒకరినొకరు చూసుకుంటూ కాఫీ పూర్తి చేసి బై  బై చెప్పుకున్నారు . నాలుగడుగులు వేసాక శ్రీప్రియే వెంకట్ సర్ అని కేక వేసి ” మీ ఫోన్ నంబర్ ఇస్తారా అభ్యంతరం లేకుంటే ” అని ఫోన్ నెంబర్  తీసుకుని వెళ్ళిపోయింది .

ఎదురుబొదురు మొహమాటాలని మొబైల్ తీర్చింది . కొద్ధి  రోజులకు వారిద్దరి  మధ్య కలిసి మాట్లాడుకోవాలనే  కోరిక మొదలయ్యేంత చనువు వచ్చి చేరింది . ఇప్పుడు అదితికి ,శ్రీప్రియకు ఇద్దరికీ సమయంలేదు తీరికగా రూంలో కబుర్లు చెప్పుకోవడానికి . అయినా ఒకరోజు తీరిక చేసుకుని అదితి అన్నది ”ఏంటీ ప్రేమా ?” అని . శ్రీప్రియ మనసులో ఉలిక్కిపడింది . చటుక్కుమని అమ్మానాన్న మెరుపుల్లా మనసులోకి దూసుకొచ్చారు . ” చ ఛ !లేదు ,అతను గ్రేట్ సింగర్ అయామ్ గోఇంగ్ క్రేజీ అబౌట్ హిస్ వాయిస్  . అంతే ” అనేసింది . అదితి తోనే కాదు వెంకట్ తో కూడా అదే మాట చెప్పింది ఒక రోజు .

ఒక మధ్యాన్నం పూత  డిపార్ట్మెంట్ నుంచి కేంటీన్ వైపు వస్తున్నారు వెంకట్ , శ్రీప్రియ . మధ్యలో జోరు వర్షం పట్టుకుంది . పక్కనే వున్న లైబ్రరీలో కి వెళ్లారు . వాన తగ్గేదాకా కూర్చోక తప్పదు కనుక వెంకట్ వెళ్లి ,కవిత్వం పుస్తకాలేవో పట్టుకొచ్చి శ్రీప్రియ కి ఇచ్చి  తానూ చదువుతూ కూర్చున్నాడు . చదువుతున్నవాడు హఠాత్తుగా శ్రీప్రియ వంక చూసి రూమి పోయెమ్ ఒకటి వింటావా  అని ,ఆమె జవాబు కోసం ఆగకుండా ONCE a beloved asked her lover / “Friend, you have seen many places in the world ! / Now – which of all these cities was the best?/He said: “The city where my sweetheart lives!”అంటూ చదివి వినిపించి , శ్రీప్రియ కళ్ళల్లోకి ఒకసారి చూసి తలవంచుకుని పుస్తకంలోకి చూస్తూ ”నాకయితే ఈ క్షణం నా ఎదురుగా నువ్వున్న ఈ లైబ్రరీనే ప్రపంచంలోకెల్లా అందమయినది . ” అన్నాడు . శ్రీప్రియ కి కొంత  ఆలస్యంగానైనా అతను చెప్పింది అర్థమయింది . కానీ తిరిగి ఏంమాట్లాడలేదు . వెంకట్ రెట్టించలేదు . ఇద్దరూ వాన తగ్గాక కేంటీన్ కి  వెళ్లారు . అక్కడా ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు . ఆమె మాట్లాడటం కోసం ఎదురు చూస్తూ వెంకట్ కూడా ఏం మాట్లాడలేదు . ఇద్దరూ ఎవరి హాస్టల్స్ వైపు వాళ్ళు వెళ్లిపోయారు .

రూముకొచ్చిన శ్రీప్రియ అలాగే బెడ్డు పైన పడిపోయింది . ఆ రాత్రి తిండి కూడా తినలేదు . కారణం అడిగిన అదితికి జవాబు చెప్పలేదు . కానీ వెంకట్ ఫోన్ కోసం ఎదురు చూసింది . తప్పకుండా చేస్తాడనుకుంది . చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకూడదనుకుంది . కానీ వెంకట్ ఫోన్ చెయ్యలేదు . వెంకట్ అలా ప్రపోజ్ చేసేడే కానీ మనసులో అలజడిగా వుంది . దుఃఖంగా వుంది ,తనెందుకు ఏ గొప్పకులంలోనో పుట్టలేదు అని ఒక వైపు ,ఎన్నెన్ని మాటలు చెపుతుంది ,సెన్సిబుల్ గా ఉంటుంది కానీ ఎంత సులభంగా తనతో మాట్లాడటం మానేసింది తాను మాత్రం ఎందుకు మాట్లాడాలి అనే ఆత్మాభిమానం ఒకవైపు కృంగదీస్తుండగా రూంలోనుంచి బయటికి రావడం మానేసాడు .

బహుశా ఒక నాలుగు రోజులకేమో శ్రీప్రియ వెంకట్ కి ఫోన్ చేసింది . ఫలానా గుడికి వెళదాం వస్తావా అన్నది . ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు . ఒకచోట కూర్చున్నారు . అతని మౌనం ఆమెకి విసుగ్గా వుంది . భరించరానిదిగా వుంది . అతనితో మాట్లాడకుండా వుండలేనట్టు వుంది . అందుకే తానే చివరికి ” సారీ , నేను ,నీకు పాసిటివ్ గా రెస్పాండ్  అవలేను,ఎందుకూ అని అడగకు , చెప్పలేను ! కానీ నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి , ఐ లైక్  యువర్ ఫ్రెండ్షిప్ ” అన్నది . అని భోరుమని ఏడ్చింది . వెంకట్ ఏడుస్తున్న ఆ అమ్మాయి వంక చూసాడు . శ్రీప్రియ కి నవ్వితే కూడా చెంపలు తడిసేంత కళ్ళనీళ్లొస్తాయి , కనుగుడ్డు పైనే తడిగా మెరుస్తూ ఉంటాయి కళ్లనీళ్లు .  అతనికా విషయం హటాత్ గా అప్పుడెందుకు గుర్తొచ్చిందో కానీ ఆ అమ్మాయి వైపు నుండి చూపు తిప్పుకుని ,”నువ్వు చెప్పకున్నా కారణం నాకు తెలుసు శ్రీ ,ఏడవకు ,అలాగే , నువ్వెలా అంటే అలానే ,ఫ్రెండ్స్ గా ఉందాం ,నిన్ను బాధ పెట్టినందుకు సారీ ” అన్నాడు  .

మరికొన్ని రోజుల్లో శ్రీప్రియ ఫస్టియర్ పూర్తి చేసి సెకండ్ ఇయర్ కి వచ్చేసింది . వెంకట్  P hd సెకండ్ ఇయర్కి  వచ్చాడు .ఆ రోజు తర్వాత అతనెప్పుడూ ఆమెతో వేరే రకం సంభాషణలు చెయ్యలేదు . స్నేహము తప్ప మరేమీ లేని వాళ్లిద్దరూ ఒకరోజు కలిసి సిటీలో సినిమాకి వెళ్లారు . సినిమా చూసి షాపింగ్ మాల్ లోనే షాపింగ్ చేస్తూ ఉంటే చాలా టైం అయింది . బయటికి వచ్చి బస్టాపుకి వచ్చేలోపు యూనివర్సిటీ వైపు వెళ్లే చివరి బస్సు కూడా వెళిపోయింది . అంతలోనే జోరు వాన మొదలయింది . ఒకటి ఆరా  ఆటోలున్నాయి కానీ వాళ్ళు అంతదూరం మేము రాము అనేసారు  . ఏంచేయాలో తోచలేదు వెంకట్ కు . చివరికి ”ఫ్రెండ్ రూమ్ వుంది దగ్గర్లో వాడినడిగి బైక్ తీసుకుని వాన తగ్గాక వెల్దామా ”అన్నాడు . శ్రీప్రియ వెంటనే సరే అని తలూపింది . ఆటో తీసుకుని వెళ్లారు కానీ అక్కడ ఆ ఫ్రెండ్  లేడు .ఫోన్ చేస్తే ఊరెళ్ళాననీ  , రూమ్ తాళాలు సన్షేడ్ మీద వున్నాయి బైక్ తాళాలు రూంలో వున్నాయి తీసుకోమని చెప్పాడు . తాళం తీసుకుని రూంలోకి వెళ్లి కూర్చున్నారు . వాన ఎంతకూ తగ్గక పోయేసరికి శ్రీప్రియ అన్నది ”వెంకట్ ! పన్నెండు దాటింది , ఇప్పుడు వెళ్లడం ప్రమాదం కదా ,రేపు పొద్దున్న వెళదామా ” అని. ఆమాట అనడానికి భయపడుతున్న వెంకట్ చప్పున తల ఊపి , నేల మీద దుప్పటి పరుచుకుని ” హాయిగా నిద్రపో శ్రీ రేప్పొద్దున లేపుతా ” అని పడుకున్నాడు .

మంచం మీద పడుకున్న శ్రీ ప్రియకి నిదర రావడం  లేదు .గుండె దడ దడ కొట్టుకుంటుంది . ఊపిరి బరువయింది . ఏకాంతం  ఏవేవో ఆలోచనలు పుట్టిస్తుంటే,  వాన శబ్దం వింటూ, ఆగి ఆగి చివరికి ఇటు పక్కకి వత్తిగిలి ”నిద్దరొచ్చేసిందా ,ఏదయినా పాడవచ్చు కదా నాకు జోలపాట ” అని చిన్నగా ,గారంగా పదం పదం నొక్కుతూ అని , మృదువుగా నవ్వింది . వెంకట నవ్వి చీకట్లో నెమ్మదిగా పాడటం మొదలు పెట్టాడు . పాట  మీద పాట వెళ్తూ   వుంది . కానీ,  శ్రీప్రియ మనసు పాటలపైన లేదు .  రూంలోకి వచ్చిన మొదట్లో కాసేపు ,అతనేమయినా చేస్తాడేమో అని బితుకుగా అనిపించింది ,ఇప్పుడు అతనేమయినా చేస్తే బాగుండు అని అలజడి మొదలయింది . కాసేపటికి చాలా కేజువల్గా అన్నట్లు అతని వైపు తిరిగి అతని చేయి అందుకుని  పెదవులకు ఆనించుకుని ముద్దుపెట్టి ” థాంక్ యు ,నిద్రొస్తుంది , ఇక పడుకో అంది ” వెంకట్ పడుకోలేదు , ఆమె  చేయిని విడిచిపెట్టనూ లేదు . ఇంతకాలంలో శ్రీప్రియ ఎప్పుడూ అలా ముద్దు పెట్టలేదు , ఈ ఏకాంతంలో ఆమె చేసిన ఆ చుంబనకు , ఆమె నోటితో చెప్పని  మాటలకు  అర్థమేమిటో అతని మనసు గ్రహించింది .

మరుసటి రోజు పొద్దునే వాళ్లిద్దరూ యూనివర్సిటీకి వచ్చేసారు . ఆ తరువాత వారం రోజులు శ్రీప్రియ వెంకట్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు . అతనికి ఎదురు పడాల్సి వచ్చిన ప్రతి సందర్భాన్ని తప్పించింది . ఈ సారి వెంకట్ క్రితంలా నిలకడగా ఉండలేక పోయాడు . పిచ్చెక్కి పోయింది అతనికి   . ఆ రోజు రాత్రి మెత్తటి , తెల్లటి పావురాయిలా ఆమె తన భుజంపైన తల పెట్టుకుని తన ఛాతీ చుట్టూ చేయివేసిన నులివెచ్చటి మృదు క్షణాలు అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి . చివరికి ఒక రోజు  డిపార్ట్మెంట్ బయట ఆమెని చెయ్యి పట్టుకుని దొరకబుచ్చుకున్నాడు  . మాట్లాడాలన్నాడు . ఆమె నిర్లిప్తంగా సరే అని తలూపి ,అతని వెనక నడిచింది .

ఇద్దరూ ఏకాంతపు చోటు వెదికి  కూర్చున్నారు . ఇప్పుడతనికి ఆత్మవిశ్వాసం వుంది . ఆమె ప్రవర్తన కొంత అనుమానానికి తావిస్తున్న ,ఆమె తనది అనే ధీమా వుంది అతనికి . అందుకే కొంత విసురుగా , తలవంచుకుని కూర్చున్న ఆమె చుబుకాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ,” ఏంటి , ఏమైంది ? ఫోన్ లిఫ్ట్ చేయలేదెందుకు? ” అన్నాడు . శ్రీప్రియ బదులీయలేదు ,కానీ ”నాకు చచ్చిపోవాలని వుంది వెంకట్ , నేను తప్పుచేసాను , నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు , నిన్ను ఇబ్బంది పెట్టాను , నేను చచ్చిపోతాను ” అని భోరుమని ఏడవటం మొదలు పెట్టింది . అప్పటిలా వెంకట్ ” సరే అట్లాగే పెళ్లి చేసుకోవద్దులే ” అని ఈ సారి భరోసా ఇవ్వలేదు . మౌనంగా కూర్చున్నాడు . స్వతహాగా అతను పెద్ద మితభాషి . ఏదయినా కష్టమొస్తే తనలోకి తాను మరింత ముడుచుకు పోతాడు . ఈ సారీ అలానే  ముడుచుకుపోయాడు . అతనికి ఆమె మాటలకు అర్థం తెలుసు . తాను ఇప్పుడిక ఆమెనుండి వెనక్కి రాలేను అనీ తెలుసు . అందుకే చాలాసేపటి ఎక్కడో చూస్తూ , ”నేను నిన్ను బాగా చూసుకుంటాను శ్రీ , నీకోసం కష్టపడతాను , సంపాదిస్తాను , నన్ను పెళ్లిచేసుకో శ్రీ , అయామ్ రిక్వెస్టింగ్  యు ” అన్నాడు . అన్నాడే  కానీ,  అతనికి తెలుసు ,శ్రీప్రియ వాళ్ళకున్నంత ఆస్తి సంపాదించాలంటే తాను తన జీవితకాలమంతా కష్టపడినా సరిపోదని ! అందుకే వినటానికి ఇంపితంకాని ఆ మాటలని అంతకంటే మరి పొడిగించలేక మౌనంగా కూర్చున్నాడు  . ఏడుస్తున్న ఆమెను ఓదార్చలేదు . కాసేపటికి ఇద్దరూ విప్పని పొడుపు కధని అక్కడే వదిలేసి మౌనంగా ఎవరి దారిన వాళ్లు హాస్టల్ కి వెళ్లారు .

ఆ రాత్రి శ్రీప్రియ అదితికి చెప్పింది జరిగిందంతా , అదితికి ఆశ్చర్యమేసింది , అసలు శ్రీప్రియ ఇబ్బందేమిటి ? వెంకట్  చురుకయినా వాడు , శ్రీప్రియ కూడా  ఏదో ఒక వుద్యోగం చేయకలదు , ప్రేమ వుంది , కులందేముంది అని . అదేమాట శ్రీప్రియతో అంది . శ్రీప్రియ , ”అతనికి వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రాణం ,అంత  పేద వాళ్ళతో ఎలా బ్రతకడం ” అంది .  అదితి ఆ మాటలు విని నిర్ఘాంతపోయి ”ఏయ్ శ్రీ ! యు ఆర్ కిడ్డింగ్  … రైట్ , ఈ మాటలు నీ లాటి భావవాదికి సరిపోవు ” అంది . శ్రీప్రియ కాసేపటికి ” యా … ఆమ్ కిడ్డింగ్ ! కానీ కారణం చెప్పలేను ఇది కుదరదంతే” అన్నది . ఆమె కంఠంలో దృఢత్వాన్ని చూసి అదితి మరేం మాట్లాడలేదు . కానీ మనసులో అనుకున్నది ,”శ్రీ చేసింది కరక్ట్ గా లేదు , షి ఈస్ ప్లేయింగ్ విత్ హిం , డెలిబరేట్లీ ” అనుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నది .

వెంకట్ నుండి శ్రీప్రియకి  ఫోన్ రాలేదు , అతను కనిపించనూ లేదు . ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టాడు . చూసి చూసి కొన్ని   రోజులకు శ్రీప్రియ అతనికి మెయిల్ పెట్టింది , మాట్లాడాలి ప్లీస్ అని . అతనొచ్చాడు . ఆమె మళ్ళీ అదే అన్నది ”ఫ్రెండ్స్ గా ఉందాం ” అని . వెంకట్ కి ఆ మాట వికారంగా అనిపించి ,నవ్వి ”అట్లాగే ”అని వెళ్ళిపోయాడు . కానీ శ్రీప్రియ అతన్ని వదిలి పెట్టలేదు . అతనితో స్నేహమే కాదు ,అతనితో సెక్స్ ను కూడా ! పొరపాటుగా అన్నట్లో గ్రహపాటుగా అన్నట్లో వాళ్ళిద్దరి మధ్య సెక్స్ జరిగేది . సెక్స్ తరువాత ఆమె అతని భుజంపైన తలపెట్టుకుని పడుకునే క్షణాలలో ఇద్దరం ఇలాగే చచ్చిపోతే బాగుండు  అనిపించేది అతనికి . తనని విడిచిపెట్టి ఆమె బ్రతకలేదు అని ఎక్కడో ఒక ఆశ మెదిలేది . అలాటి రోజుల్లో ఒక సారి వారం రోజులకని ఇంటికెళ్లిన ఆమె , పెళ్లి పత్రికలు  పట్టుకుని యూనివర్సిటీ కి వచ్చింది .

శ్రీప్రియ చేతిలో పెట్టిన కార్డు చూసి వెంకట్ నిర్ఘాంత  పోయాడు. పెళ్ళికొడుకు అమెరికాలో సాఫ్ట్వెర్ కంపెనీలు నడుపుతున్నాడు , పూర్వీకులు ఏదో రాజ సంస్థానానికి అతి దగ్గరి వారు . చాలా ధనికులు . కార్డు మీద వేసిన ఫొటోలో రాకుమారుడిలా వున్నాడు . వెంకట్ ఏమైనా మాట్లాడేలోపే శ్రీప్రియ అంది , పదిహేను రోజుల్లో పెళ్లి , పెళ్లి చేసుకుని వస్తాను , మేక్  మీ కన్సీవ్  , నీ బిడ్డను పెంచుకుంటాను . రాజులాగా పెంచుతాను , నీ గొంతు వాడికి వస్తే ఈ ప్రపంచానికే పెద్ద సింగర్ ని చేస్తాను ” అని వెంకట్ వళ్లో  తల పెట్టుకుని ఏడ్చింది . ఎందుకో అతనేం మాట్లాడలేదు . ఆమె పెళ్ళికి వెళ్ళాడు . ఆమె పుట్టిన రోజుకి వెంకట్  ఆమెకో స్పోర్ట్స్ వాచ్  ప్రెసెంట్ చేసాడు . పెళ్ళికి ఆమె అది పెట్టుకుంది . పెళ్లి అలంకరణకు అది నప్పలేదు అని ఎవరెంత చెప్పినా దాన్ని తియ్యలేదు .

untitled

వెంకట్ తిరిగి యూనివర్సిటీకి వచ్చాడు . ఫ్రెండ్స్ అందరూ అతన్ని జాలిగా చూడటం మొదలు పెట్టారు . అతను వాళ్ళని తప్పించుకొని తిరగటం మొదలు పెట్టాడు . స్పోర్ట్స్  వాచ్ కట్టుకుని పెళ్లిచేసుకున్న శ్రీప్రియ రూపం ,భుజంపై తల పెట్టుకుని చెవిదగ్గర కువకువలాడే ఆమె మృదు స్వరం , నీ బిడ్డను పెంచుకుంటాను అన్నపుడు ఆమె ఆవేశం అతని గుండెల్లో జోరీగల్లా వినిపించేవి .శ్రీప్రియ  పెళ్లయిన నాలుగో రోజు లైబ్రరీ నుండి వస్తుంటే క్లాస్మేట్ వికాస్ కేంటీన్ దగ్గర ఎదురుపడి ,”వెంకట్ గాడిని బాగా వాడింది ,ఇప్పుడెళ్ళి పెళ్లి చేసుకున్నది అంటున్నారు రా   అందరూ , ఇటువంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి  భయ్యా, దానికి నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని ముందు తెలీదా  ” అన్నాడు  . వెంకట్ వికాస్ కి ఏమీ  బదులీయలేదు కానీ మరుసటి రోజుకి అతని శవం లైబ్రరీ వెనుక కనిపించింది .

మనుగడుపులై యూనిర్సిటీకి వచ్చిన శ్రీప్రియకు అతని చావు కబురు తెలిసింది . అదితి ఏం ప్రస్తావించక పోయినా శ్రీప్రియ తో ముభావంగా ఉండటం మొదలు పెట్టింది . అంతకు ముందుకూడా అందరితో కలివిడిగా వుండే అలవాటు లేని శ్రీప్రియ అలాగే  ఫైనల్ ఎగ్జామ్స్ రాసేసి అమెరికాకు వెళ్లి పోయింది .

అమెరికాకు వెళ్లిన కొంత కాలానికి శ్రీప్రియకు మొగుడితో కొడుకు కూడా పుట్టాడు . కొడుకు పుట్టకముందు కూడా ఉన్నా,  కొడుకు పుట్టాక ఆమెకు సెక్సువల్ ఫ్రిజిడిటీ ఎక్కువయింది . సెక్స్ అంటే తనకు చాలా ఇష్టమయినా ఇలా అవడానికి  కారణమేమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థంకాదు . మొగుడువిసుక్కుంటాడనే భయంతో అతను కావాలన్నపుడు బిగదీసుకుని అతని పక్కన పడుకుంటుంది , పడుకున్నాక కళ్ళు మూసుకుని వెంకట్ స్పర్శని గుర్తు తెచ్చుకుంటుంది . అలా గుర్తు తెచ్చుకున్న కాసేపటికి ఆమె శరీరం మేఘమంత తేలికై ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు అనిపిస్తుంది  . అలా ఆ సమయంలో  వెంకట్ ను గుర్తు తెచ్చుకోవడం  ఇప్పుడామెకి అలవాటుగా మారింది  .

సామాన్య 

 

రచన వ్యక్తపరిచే తాత్వికతే రచయిత!

సామాన్య  

 ” రచయితని ” అని నాకు నేను ట్యాగ్ చేసుకునేంత విస్తృతంగా రాయలేదు నేను . ఎవరన్నా అలా పిలిచినా నాకేవిటో కొత్తగా, భయంగా వుంటుంది . కానీ ఆ కారణం చేత మాత్రమె ”కథన రంగం” కిరాయకుండా ఇన్ని రోజులూ  ఆగలేదు . అది కూడా ఒక కారణమైనప్పటికీ …ఇంకో కారణమేమిటంటే నా వరకు నాకు రచయిత , రచన వేర్వేరు . రోలాండ్ బార్ట్ ”డెత్ అఫ్ ది ఆథర్ ” తో నేను ఏకీభవిస్తాను .

రచనకి మించి రచయిత తో సంభాషించడమూ , రచనకిమించి పాఠకులు, రచయిత జీవితాలలోకి వెళ్ళడమూ రచనని అర్థం చేసుకోవడానికి ఏ విధంగా సహాయ పడతాయి అని నాకో మీమాంస . అస్తిత్వ వాదాలని గౌరవించినప్పటికీ రచయితకి పరిధి ఉండటాన్ని ,ఒకే అస్తిత్వంలో ఆగిపోవడాన్ని  నేను అంగీకరించను . రచన చెయగలగడమనేది జెనటికల్ గా వచ్చిన ఒక ప్రత్యేక సామర్ధ్యమనీ , ఆ సామర్ధ్యం చేత రచయిత ఇతరుల అంతరంగాలను శోధించగలద/డనీ, ఇతరులకు అర్థంకాని విషయాలను అర్థం చేసుకోగలద/డనీ నేను నమ్ముతాను .

ఈ రోజు ఉదయం నన్ను పలకరించిన ”కేర్లీ రే జెప్సిన్”పాట నన్ను ముచ్చట పరిచింది ” i know this isn’t love ,but i need to tell you something / i really really really really really like you ” అని విన్నపుడు నాకు భలే అనిపించింది కానీ దానికోసంనేను జెప్సిన్ ఈ  వాక్యాలని ఎలా రాసింది ?అసలు జెప్సిన్ ఎవరు ?ఇది ఆమె అనుభవమేనా అని వెతకను . రచయిత ఇతరుల అనుభవాలని తన అనుభవాలుగా చేసుకోగలదనీ ,సామాన్య అనుకున్నదిజెప్సిన్ రాయగలదని నమ్ముతాను . ”మన మనసులోక్కటి అయితే మాయ పెళ్లి ఏటికి చల్ మోహన రంగా /మంగళ సూత్రమేటికి ”అన్న చల్ మోహన రంగ గీత రచయిత ఇంటర్వ్యూ చదవకపోవడం వల్లఆ భావానికి ఏమయినా లోపమొచ్చిందా అని ఒక ఆలోచన .

”పుష్పవర్ణ మాసం” వచ్చినపుడు ఒక స్నేహితుడు అనేక ఏళ్ళ తరువాత ఆ కథనో సందర్భం చేసుకుని   పలకరిస్తూ   నన్ను ”వీణాధరీ” అని సంభోధించాడు . అందులో నేను వీణాధరినని అతనికి ఎందుకు అనిపించింది ?రచయితలం తప్పకుండా రచనలో ఎక్కడో ఓ చోట వుంటాం కానీ నేను వీణాధరినే ఎందుకయ్యాను ?”విషాద కామరూప ”లోకథా నాయకుడు ఇంద్రజిత్ ని తానేనని చెప్తుంది రచయిత్రి ఇందిరా గోస్వామి ,ఏం … నేను పుష్పవర్ణ మాసం లో గదిలో గూడు కట్టుకుని ఆకుపచ్చటి పాటతో ఆ అమ్మాయి ప్రేమను అతనికి చెప్పినకోయిలని అయి ఉండొచ్చు కదా … ”ఏరియల్ ”ని అర్థం  చేసుకోవడానికి ”సిల్వియ ప్లేత్” ఆత్మహత్య చేసుకుందని తెలుసుకొని తీరాలా…  ఇవన్నీ రచయితగా ఇది రాయాలనుకున్నపుడు నన్ను ఇబ్బందిపెట్టిన  ఆలోచనలు . ఇదంతా ఎందుకంటె రచయిత మనస్థత్వమో, నేపధ్యమోమొ  , మతమో ,  పాఠకులకు  దగ్గరగా తెలియడం వల్ల పాటకులు రచనని ఆస్వాధించడంలోనో ,అర్థం చేసుకోవడంలోనో తమకుతెలియకుండా కొన్ని పరిమితులకు లోబడి పోతారు ,చాలా సార్లు రచన అంతరార్థం బిట్వీన్ లైన్స్ కూడా వుంటుంది బహుశా రచయిత పరిచయం పాటకులలోని ఈ ఆలోచనావిస్తరణ యొక్క సామర్ధ్యాన్నిదెబ్బ తీస్తుందనీ అనుకుంటాను .

ఇలాటి భావాలతోనే రచయితగా ఎక్కడయినా పరిచయం కావాలన్నా, మాట్లాడాలన్నా నాకు అయిష్టం. అయినా ఇది ఎందుకు రాసానంటే కొన్ని స్నేహాలు , ప్రేమలూ మనసిద్ధాంతాల కంటే విలువైనవీ , లెక్కింపదగినవీ గా భావిస్తాను గనుక రాసాను .

అదలా ఉంచితే ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచిస్తున్నాను రచయితగా నేనేమిటీ అని ? మూడు అంశాలు తట్టాయి . నేను ఎందుకు రాస్తాను ?ఏం రాస్తాను ?ఎలా రాస్తాను ?అని  .అసలు నేను ఎందుకు రాస్తానుఅని ఆలోచిస్తే ఆశ్చర్యమేసింది , నాకు ఏడుపొచ్చినప్పుడు నేను రాస్తున్నాను  . ఏడ్చి ఏడ్చి చాలా ఏడ్చాక గుండెలో ఏదో నొప్పిలాంటిది వస్తుంది నాకు అది  భరించలేక రాస్తున్నాననుకుంటా బహుశా .కిషన్ జీ ని గమనిస్తూ వుండేదాన్ని ఎప్పుడూ … ఎన్కౌంటర్ జరిగాక ”కబీర్ సుమన్ ” ఒక పాట  రాసి పాడాడు ”బీర్ మొరె   బీరేర్ మతో బీర్ మొరె  ఏకా …”[వీరుడు వీరుడిలా మరణిస్తాడు ,వీరుడువొంటిగా మరణిస్తాడు ]అని అది విన్నపుడు నాకు నన్ను నేను అదుపులో వుంచుకోలేనంత ఏడుపొచ్చింది .

 

సామాన్యఇంట్లో వాళ్ళు ఓపికగా ఓదార్చి దాన్ని చానలైజ్ చేయించినపుడు రాసిన కవిత ”జనగణ్ ”అలాగే2007 నుండి మహిత శవాన్ని గుండెల మీద మోసుకు తిరిగి తిరిగీ ఇక తిరగలేక రాసిన కథ మహిత , అంతరాల సమాజం  ఆత్మాభిమానపు అనితను నా ముందు ఏడ్చేలా చేసినపుడు  సిగ్గుతో నాకుఏడుపు వచ్చి రాసిన కథ ”అనిత పాడిన పాట ”.. అలా నేను రాసిన లేదా రాయబోయే కథలైనా  లేదా కవితలైనా  ఎందుకు రాస్తానంటే నా దుక్కాన్ని ఏం చెయ్యాలో తెలియక ,రాయడమనేది అయాచితంగావచ్చింది కనుక ఆ రూపంలోకి నా కన్నీటిని ఒంపేసి వదిలించుకోనే సౌకర్యం వుంది కనుక వదిలించుకోవడానికి రాస్తాను . అందుకని రాస్తాను .

ఏం  రాస్తానంటే .. నాది చాలా చిన్న ప్రపంచం , ఏకాంత ప్రపంచం . నా జీవితంలో అత్యధిక భాగాన్ని నేను ఏకాంతపు గదులలో గడిపాను ,గడుపుతూ వుంటాను . ఆ గదిలోకి ఆత్మీయులు వస్తూ  వెళ్తూవుంటారు .అంతర్బాహిరాలలో నన్ను పెనవేసుకుపోయి వున్న  ఏకాంతాన్ని చిద్రం చేయడానికి రకరకాల కాల్పనిక మనుష్యులను నా గదులలోకి , హృదయంలోకి తెచ్చుకోవడం నేర్చుకున్నాను చాలాచిన్నపుడే . అలా మొదలయింది చదవడం .

నాకు పుస్తక జ్ఞానం అంతో ఇంతో వుంటుంది కానీ ప్రాపంచిక జ్ఞానం చాలా తక్కువ . ప్రాపంచిక జ్ఞాన శూన్యురాలనయిన నా దగ్గరికి పిల్లల కోసం మేత తెచ్చేఅమ్మలా బయటి ప్రపంచాన్ని మోసుకోస్తారు  నా తమ్ముళ్ళు ఉదయ చైతన్య ,శ్రీకాంత్ నా సహచరుడు కిరణ్ .  ఆ మేత పెట్టడమే కాదు ,నాతో చర్చించి  నా హృదయంలో…  అవును మెదడులో కాదుహృదయంలో ఎలా ఆలోచించాలనే  విధానాన్ని ఓపికగా పొదుగుతాడు కిరణ్ . అలాగే ”వినయ” లాటి నా స్నేహితులు స్త్రీ అంతరంగాన్ని ,మోస్తున్న భరువులని,వారి   దుక్కాలకి సంబంధించిన పిక్టోగ్రాఫ్ నినా హృదయం పై పరుస్తారు . నాకోచ్చే సందేహాలని నేను వ్యక్త పరుస్తాను ,వెదుక్కుంటాను ,చదువుకుంటాను ,ఆలోచించుకుంటాను .

దుక్కమనిపిస్తే సంగీతమనే డ్రగ్ ని హృదయం లోకి ఇంజెక్ట్ చేసుకునిదుక్కాన్ని వదిలించుకుంటాను ,లేదంటే ”మిల్స్ అండ్ బూన్”లోకి పారిపోయి ప్రపంచమంతా భలే రొమాంటిక్ గా ఉందనీ కాసేపు భ్రమ పెట్టుకుంటాను . ఇంకా .. మరీ రాయాలని చాలా అనిపిస్తే రాస్తాను . నాఆదిమ సహజాతం ఏంటంటే నాకు ఎవరైనా ఇంకోరి మీద పెత్తనం చేస్తే నచ్చదు ,కొందరు ఒదిగి వుండటం ,కొందరు చాతీ విరుచుకుని వుండటం అసహ్యం . అసూయ, ద్వేషం ,దురాశ…  బైబిల్ లో చెప్పినసైతాన్  అంటే వీటి కలయికే   అని నమ్ముతాను . ఈవిల్ అంటే అసహ్యం నాకు . వీటన్నిటి గురించి రాయాలని ,అంత పరిణతి రావాలని తాపత్రయ పడతాను. ”ఎంత జ్ఞాన విహీనమయినది మానవహృదయం !భ్రాంతి అనేది ఒక పట్టాన తొలగి పోదు .యుక్థి , వివేచన ఎంతో ఆలశ్యంగా ప్రవేసిస్తాయి మనస్సులో ..”అంటూ రత్న గురించి రాసిన టాగోర్ లాగా  ,”  మొపాసా లాగా   ,హెన్రీ లాగా  ,గోగోల్ లాగా ,”తిరగేసి కొట్టు అనే వ్యూహాత్మక సిద్ధాంతాన్ని ”తెలియ చెప్పిన పతంజలిలలాగా .. ఇలా అత్యద్భుత ప్రతిభా సంపన్నులయిన రచయితలని చూసి దిగ్భ్రమ చెంది వారి లాగా  రాయాలని ఆశ పడతాను.

నాకు అంత ప్రతిభ లేదు కనుక నేను రాసినవి తిరిగి చూసుకోవడం కూడా నాకు అసహ్యం . నాకు నచ్చవు . అందుకని రాసినవన్నీ అచ్చుకివ్వను . అచ్చయిన వాటి మొహం కూడా చూడను . ఇంకా అత్యంత రహస్యం  ఏంటంటే నా హృదయంలో విన్సెంట్ వాంగో ,కాఫ్కా .. అఫ్ కోర్స్ చండీ దాస్ వంటి వాళ్ళు ఇల్లు కట్టుకుని వున్నారు .చాలా ఏళ్ళుగా వాల్లిక్కడ  రెసిడెంట్స్  . నా పిచ్చితో వాళ్ళు ,వాళ్ళమేజిక్ తో తో నేను ,మా మూడ్ స్వింగ్స్ తో కిరణూ సహజీవనం చేస్తుంటాం . నా రాతనీ ముఖ్యంగా జీవితాన్ని ఇలాటి వాళ్ళందరూ లీడ్ చేస్తుంటారు . కిరణ్ పాపం మార్క్స్ ని ,మావో ని, బుద్ధుడ్నీ ,అంబేద్కర్ ని తోడు పెటుకుని నా తిక్కకి మందులు నూరుతుంటాడు   .  నేను రాసే రాతలో ఆత్మ కిరణ్ అక్షరం నేను . చేసే పనిలో ఆలోచన కిరణ్ ఆచరణ నేను .

ఎలా రాస్తాను అనేది శైలీ శిల్పాలకి సంబంధించిన విషయం కదా .. . నేనేమనుకుంటానంటే వస్తువు దాని శిల్పాన్ని అదే వెతుక్కుంటుందీ అని . రాయడమనేది” రివర్ కోర్స్” లాటిది అనుకుంటా  . మనంకలం పట్టుకుంటాం అంతే . మన నిమిత్త మాత్రత్వంతో రక్తమాంస భరితమయిన పాత్రలు నది లాగే ఊహించని రీతిలో వాటి గమనాన్ని అవే నిర్దేసించుకుంటూ సాగుతాయి . కాకపోతే రచయితహృదయంలోని సౌజన్యం ,సౌశీల్యత ,సహన శీలత,ధీరత  రచనలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుంది . ముగింపుని అదే  నిర్దేశిస్తుందనుకుంటా . రచన వ్యక్త పరిచే తాత్వికతే రచయిత .

మనిషిగా నాకు రిజిడిటీ అంటే అయిష్టం ,సరళత అంటే ప్రేమ . ఎరాక్లితోస్ చెప్పినట్లు ”There is nothing permanent except change..” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ]

 

 

దేవుడు ,కర్మ

10991245_10153042873508559_2325127942165795879_n

painting: Rafi Haque

నువ్వు తెచ్చిన ఆ పెట్టెలో పట్టేట్లు

నన్ను చెప్పమంటావ్ .
అరూపాన్ని
అందులో పెట్టడమెలాగొ
నాకు చేత కాదు
లెక్కల పరీక్ష పెట్టావ్
నేను ఫెయిలయ్యాను
దిగులుపడి  చివరికన్నాను
”మొదట ఈ పాఠాలు చెప్పలేదు కదా నువ్వు”
నువ్వన్నావ్
”అయినా సరే ”
”నల్లతుమ్మ చెట్టూ
తలపైని చెంద్రుడూ
నను తాగి కరిగిన  నీ శ్వాస”
జ్ఞాపకాల మోహం  నాకు
నీ మేజిక్ స్లేట్ లో ఒకసారి
ఇలా అనేసి
ఏవి ఎక్కడా నువ్వు చెప్పేవంతా
అన్నావ్
తెలియని దయ్యం
గుండెలపై కూర్చున్నట్లు నొప్పి
ఆమె దగ్గరికి వెళ్లాను
చాలా చెప్పింది
కొన్ని రోజులకి  నేనన్నాను
”చెరిపినా చెరగని చోట రాశాను ”
అన్నదీ..
”దేవుడి పైన భారం వెయ్యి
కర్మను  అనుభవించక తప్పదు ”
-సామాన్య 
Samanya2014

దేవస్మిత

samanya1resize22/10/2004

ఇవాళ నా శరీరం పై పడిన దెబ్బలు ఎన్నో సారివో లెక్క తేలటం లేదు .  ఐదేళ్ళ   కాపురంలో నా వెదుకులాట దేనికో, అతని గింజులాట ఎందుకో. అనుకునే ఇవంతా జరుగుతున్నాయా?  చికాకుగా వుంది. చచ్చిపోవాలనిపిస్తోంది. దేవస్మితా చచ్చిపోతావా?మరి పిల్లల్నేం చేస్తావ్? నాకు నేనే వేసుకునే ఈ ప్రశ్నకు నాకు నేను ఏమని సమాధానం ఇచ్చుకోను?

10/12/2004

ఇవాళ అత్తమ్మ మాటల్లో మాటగా భోగం బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నది. విపరీతంగా కోపమొచ్చింది. చేతిలో ఉన్న మొబైల్ ని ఆవిడ మీదకి విసిరికొట్టాను. ఆవిడ దెబ్బని తప్పించుకున్నది. కానీ శశిధర్ చేతిలో నాకు దెబ్బలు తప్పి పోలేదు. నాలుగు గోడల మధ్యలో వున్నదాన్ని దెబ్బలెలా  తప్పించుకోగలను?

అమ్మా ఎంత గుర్తొస్తున్నావ్, నీమీద చాలా కోపమొస్తోంది. నీ నీడ నా  మీద పడనీయొద్దు అనుకున్నావ్ కదా? పాపం పిచ్చి అమ్మా ! నువ్వు నీడలా, నా వొంటి పైన పుట్టుమచ్చలా నన్ను వదలటమే లేదమ్మా…వేశ్యవి అమ్మా నాకు కథలు రాయడం రాదమ్మా, చెప్పడం కూడా రాదమ్మా లేదంటే నీకథ వింటే బండరాయి మా అత్త కూడా కరగాలేమో. కానీ అంతా ఉత్తిదే, బండరాళ్ళు ఎప్పటికీ కరగవు. అమ్మా!  నువ్వారోజు మీ పేద ఇంటి నుండి, మీ సంప్రదాయాల నుండి లేచిపోయి రాకుంటే నేనివాళ మంచి కుటుంబపు స్త్రీని అయి వుండేదాన్ని కదా, పోనీ నాకు జన్మనిచ్చిన మగాడు నిన్ను వదిలేయకుండా వుండి వుంటే, భాష తెలియని నగరంలో, దిక్కుతోచని దీనత్వంలో, ఆకలికి ఏడ్చే పసిబిడ్డ కోసమనో, మరే త్వరిత మార్గమూ లేకనో నువ్వు నీ శరీరాన్ని అమ్ముకోక పోయి వుంటే భోగంతనం నా ఇంటిపేరు కాకపోయేది కదా అమ్మా!

ఇవాళ మా మిషనరీ స్కూల్, హాస్టల్ బాగా గుర్తొస్తోంది.అది గుర్తొస్తే భయమేస్తుంది. అమ్మ ఎందుకు ఎప్పుడో ఏడాదికొకసారి మాత్రమే వస్తుంది? సెలవలలో వెళ్ళడానికి నాకో ఇల్లెందుకు లేదు? అమ్మ వున్నా నేను అనాధని ఎందుకవుతాను? ఇట్లా ఎన్ని ప్రశ్నలో. పాపం అమ్మ ఎంత బాధపడేదో. నా వత్తిడి భరించలేక తనుండే  వేశ్యా వాడకి తీసుకెళ్ళింది అమ్మ. ఆ వాడలో అమ్మ ఉంటున్న చిన్న గదిలో పరుపుపైన దగ్గరగా కూర్చోపెట్టుకుని  తన కథ చెప్పినప్పుడు అమ్మ వాడిపోయిన కళ్ళ నిండుగా ఊరిన కన్నీళ్ళు.  ప్చ్! ఆ కన్నీళ్ళు గుర్తొస్తే ఎంత బాధేస్తుందో. అమ్మ గది పరిశుభ్రంగా ఉండింది. గదిలో ఒక మూల అందమైన చెక్కడపు పూజామందిరం, ఆ మందిరంలో పతిత పావనుడు సీతా సమేత రాముడు. అక్కడున్న అందరూ అమ్మలా చీర కట్టుకుని లేరు, చాలా మంది చిన్న చడ్డీలతో, బ్ర్రాతో స్వేచ్చగా తిరుగుతున్నారు, చుట్టూ అంతటా మురికి, వచ్చిపోయే కస్టమర్లు. ఇంకా స్నానమైనా చేయని ఆ మురికి ఆడవాళ్ళతో యెట్లా రమిస్తారు? స్త్రీని కామించడానికి మగవాడికి ఏమీ అక్కర్లేదేమో, ఒక జననాంగమే చాలేమో!

అంతే ఆనాడు ఆ వాడలో కలిగిన భయం… ఆ రాత్రి అమ్మ పరుపుపైన ముడుచుకుని ముడుచుకుని, జుగుప్సతో, కలలో కలత నిద్రలో వొందల స్థనాలు పాములై సాగి సాగి, నన్ను చుట్టుముట్టి, నలిమి నుజ్జుచేసి, నా కన్నీళ్ళై…  ప్రభువా! జీసస్! నాయనా నాకొద్దీ కష్మలం, కల్మషం, వేలాంగాల వీర్యాలతో తడిసిన జననాoగాల వాడా సంచారం నాకొద్దు. జీసస్! జీసస్! రక్షించు. నేనే వారై, వారే నేనై … అంగమే అన్నమై కడుపులోకెళ్ళే స్త్రీలు నాకొద్దు జీసస్. జీసస్! కురిసే వాన చినుకులలో ఆకుల గొడుగు క్రింద అటుఇటు చంచలించే రంగు రంగు పిట్టలతో అందంగా, పరిశుభ్రంగా భద్రంగా వుండే ప్రపంచం కావాలి నాకు. పైన పరిగెడుతున్న మేఘాల్లా, ఆకాశం అంచున మిలమిలలాడే వెన్నెల్లా పరిశుభ్రత కావాలి. నన్ను పాపలా హత్తుకుని ప్రేమించే నీ లాటి భద్రమైన చేతులు కావాలి. అమ్మ వద్ద నుండి పారిపోవాలి పారిపోవాలి…. శశిధర్ నుండి అతని కుటుంబం చేసే అవమానాల నుండి పారిపోకపోవడానికి ఆరోజు నాలో కలిగిన ఆ భయమే కారణమేమో. లేదంటే మనిషిని మనిషి పశువులా కొట్టే హింసని తనేనాడైనా ఊహించిందా? పక్షినీ,పశువునీ, మనిషినీ సమంగా ప్రేమించే ధర్మం కదా తను నేర్చుకుంది.

కష్టపడి చదివి ఎయిర్ హోస్టెస్ వుద్యోగం సంపాదించి, అమ్మా రామ్మా నా వద్దకు రామ్మా అంటే అమ్మ ఏమన్నదీ, ”వద్దు బంగారూ నువ్వు మంచిగా పెళ్లి చేసుకోవాలి, సుఖంగా ఉండాలి, నేనొకదాన్ని ఉన్నానని మరిచిపో, ఎవరడిగినా అనాధనని చెప్పు.  పొరపాటుగా కూడా నా గురించి చెప్పకు,” అని. అలా చెప్పిందా తను శశిధర్ కి , లేక జీవితంలో నిజాయతీ ముఖ్యమనుకుందా?  శశిధర్ ఎంత మంచివాడు, ఎంత సున్నిత మనస్కుడు. శశిధర్ కి నిజమే చెప్పాలి తనని అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వేశ్య కూతురినైనంత మాత్రాన వదులుకుంటాడా? అసలు వదులుకోడు! ప్చ్! ఎంత నమ్మకం. ఎంత నిజాయితీగా శశిధర్ కి ఆ సంధ్య వేళ ఏర్పోర్ట్ వెలుపలి కాఫీడే కేన్ కుర్చీల్లో ఒక మూలగా కూర్చుని వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది. అంతకంటే ఆత్మీయులు ఎవరున్నారు జీవితంలో, అందుకే పొంగి పొంగి వచ్చింది ఏడ్పు ఎంత ఆపినా ఆగిందా? కానీ దేవస్మితా నీతి, నిజాయతీ అనేవి అమాయకత్వానికి అక్కచెల్లెళ్ళు. అమ్మ అట్లాగే అమాయకంగా మోసపోయి కదా లేచొచ్చింది. అమ్మ కూతుర్ని నేను తెలివైన దాన్ని కాగలనా? ఏం చేసాడు శశిధర్. అతను చెప్పిన ప్రేమ, జీవితకాలపు బంధం అంతా వట్టి మాటలే. నా శరీర నగ్నత్వాన్ని, నా హృదయ నగ్నత్వాన్ని అనుభవించి పారిపోవాలనుకున్నాడు. మా అమ్మ నాన్నలు నాకు ఎదురు చెప్పరు అన్న నోటితోనే, వాళ్ళు వొప్పుకోవటం లేదు అనేశాడు. ఎందుకని? వేశ్య కూతురిననే కదా? అమ్మ పుడుతూనే వేశ్యగా పుట్టిందా? అనాధనంటే ఎందుకు ఇష్టపడ్డాడు. ఏ వేశ్యో కని  అనాధగా వదిలేసి ఉండకూడదా? అమ్మ బ్రతికి ఉండటమే అతని అభ్యంతరమా? వత్తిడి భరించలేక, చెప్పుకునే తోడు లేక అమ్మకి చెప్తే అమ్మ ఏం చేసింది. తన అడ్డు లేకుండా చేసింది. నిజంగా అనాధను చేసేసింది. అన్నేళ్ల కష్టాలను భరిస్తూ వచ్చి ఈ కష్టాన్ని భరించలేకపోయింది. ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య నారక్తంలో ఉందేమో లేకుంటే ఎందుకు ఊరికే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది నాకు? కుటుంబం వద్దనుకుంటే ఒక్క నిమిషంలో వదిలిపోయే హింస ఇదంతా,  కానీ ఎలా వదులుకోను?

03/03/2006

చిన్నీని, పాపని స్కూల్ నుండి తీసుకొస్తున్నాను. చిన్ని మధ్యలో పిజా తిని వెళ్దామన్నాడు. చేతిలో ఎప్పుడైనా డబ్బు ఉంటుందా! లేదు నాన్నా ఇంటికెళ్ళి నానమ్మనడిగి మనీ తీసుకుని తరువాత  వెళ్దామంటే వాడు ఊరుకున్నాడా ఒకటే ఏడుపు. చిరాకు పుట్టింది. తొడ పాశం పెట్టేసాను. వాడి ఏడుపు చూసి ఒకటే ఏడుపొచ్చింది. ఎన్నిసార్లడిగింది తను శశీని కొంత మనీ ఇవ్వు నాకు అన్నింటికీ మీ అమ్మనడగలేకున్నాను అని. అతను నా  పట్ల ఎందుకంత కఠినంగా  ఉంటాడు. ఔననో కాదనో చెప్పొచ్చు కదా. “అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన దానివి, నీకు పెద్ద వాళ్ళ విలువ ఎలా తెలుస్తుందిలే. కానీ అట్లా నీకు పర్సనల్ మనీ ఇవ్వడం కుదరదు ఏదైనా అమ్మనడిగి తీసుకోవాల్సిందే,” అన్నాడు. అతను అదే తరహాలో మాట్లాడతాడని తెలిసినా మనసు మళ్ళీ మళ్ళీ చిన్నబుచ్చుకుంటుంది ఎందుకనో, పోనీ వుద్యోగం చేయనీయోచ్చు కదా అంటే పిల్లల్నెవరు చూస్తారు? అతని తల్లినెవరు కనిపెడతారు.ఆడపిల్ల అంటే ఇంకో అర్ధం అడ్జెస్ట్ మెంట్ అనేమో. ఎంతకని సర్దుకుపోను? చాలా ఫ్రస్ట్రెటింగ్ గా అనిపిస్తుంది.

08/12/2007

అత్తమ్మ కూతురి దగ్గరకు వెళ్ళిపోయినప్పటి నుండి ఏవిటో ఒకటే దిగులు. ఎప్పుడు ఇంటినిండా మనుషులు ఉండాలనిపిస్తోంది. ఒంటరి బ్రతుకు కావడం చేతేమో ఇల్లంతా బోసిగా అనిపిస్తోంది. ఆవిడకి నేనంటే ఎంత ద్వేషమైనా ఆవిడ మీద కోపం రాదు. ప్చ్ అందరం ఆఫ్ట్రాల్ వొందేళ్ళు బ్రతికి చచ్చే మనుషులమే కదా. శశిధర్ మీద వున్న కోపం కూడా ఆవిడ మీద కలగదు నాకు. ఎందుకో బాగా ఒంటరిగా అనిపిస్తోంది.నిజమే నేను అనాథని.

10 /01/2008

ఇవాళ చాలా పెద్ద గొడవ జరిగింది.’జిన్నూ’ మాజీ ఎం ఎల్ ఎ  కొడుకుని కరిచింది. పసిబిడ్డ వాడిని కరవడం నిజంగా బాధే. కానీ వాడు దాన్ని ఎందుకు కొట్టాలి. వాళ్ళమ్మ  గొడవకు వచ్చింది. ఎంతచెప్పినా వినిపించుకోదే. చివరికి విసిగి ఇంట్లోకొచ్చి తలుపు వేసేయ్యగానే ఆవిడకి ఇగో దెబ్బతిన్నట్లుంది. కొడుకు చేతిలో కర్ర తీసుకుని సిటవుట్లో ఉన్న నిలువెత్తు యాక్వేరియంలు రెంటినీ పగలకొట్టేసింది. నేను తలుపు తీసుకుని వచ్చేలోపు వెళిపోయింది. నాకు గిర్రున తల తిరిగింది. ఎంత అహంకారం. తిని తిరగడం తప్పించి ఇంకోపని ఉండదు ఆవిడకి. డబ్బుందనే కదా ఆ అహంకారం. ఈవిడే కాదు ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళంతా డబ్బుండే వాళ్ళే. వాళ్ళతో కలవడం కూడా అసహ్యం నాకు. కిట్టీ పార్టీలని వీళ్ళు కలిసి మాట్లాడేదంతా బూతులే. ఎవరు ఎవరితో పడుకున్నారు, ఎవత్తె  ఎవడితో వుంది ఇదే. ఐ హేట్ దిస్ లొకాలిటీ. శశిధర్ నాకు ఆత్మనూన్యత అంటాడు. నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను వాళ్ళతో కలవనీయటం లేదంటాడు. నేనెందుకు ఇన్ఫీరియర్ గా ఫీలవుతాను వాళ్లకి తెలియనన్ని, ఎప్పుడు వినను కూడా వినని పుస్తకాలు నేను చదివాను, సంగీతం తెలిసినదాన్ని, దేశాలను చూశాను, మనుషులని కలిసాను.  మొద్దు  మొఖాలు వాళ్ళతో నాకు పోలికేంటి. ట్రూలీ ఐ హేట్ శశిధర్. చేపలన్నీ కిందపడి గిలగిలలాడుతుంటే ఏడుపు ఆగలేదు.  గబగబ పరిగెత్తి బకెట్లో నీళ్ళు తెచ్చి అన్నింటినీ తీసి బకెట్లో వేసినా చిన్ని చిన్ని చేపలు నాలుగు  చచ్చిపోయాయి.  కోపం గిర్రుమని వచ్చి తల తిరిగింది. వాళ్ళింటికి వెళ్లి ఆవిడని బయటకి పిలిచి పాప టెన్నిస్ బాట్ తో యాక్వేరియం పగలకొట్టిన చేతిమీద ఒక్కటిచ్చాను. అందరూ గొడవకొచ్చేరు. ఇంటికొచ్చి తలుపేసుకున్నాను. శశిధర్ రాగానే కంప్లైంట్ చేశారు. చెయ్యి విరగకొట్టానని నా మీద కేసు పెడతామన్నారు. శశిధర్ నా ముఖం మీద వుమ్మేసి  తన ఖర్మ కొద్దీ దొరికానన్నాడు.

03/03/2008

ఈ రోజొక తమాషా జరిగింది. కోర్టుకి వెళ్ళానా, కోర్టులో ఒకతను కనిపించాడు. చాలా అందగాడు. మగవాళ్ళ అందాన్ని నేనెప్పుడూ గమనించలేదు. అలా గమనించాల్సిన అవసరం లేకుండానే అతను అందగాడని తెలిసిపోతోంది. కోర్టులో ఎవరికో దారి ఇవ్వడానికి వెనక్కి జరిగానా,  వెనకే వున్న అతనికి గుద్దుకున్నాను. బేలన్స్ చేసుకోలేకపోతున్న నన్ను రెండు చేతులతో పట్టుకున్నాడు. సారీ చెప్పి వెనక్కు జరిగాను. అలా జరిగేప్పుడు చూసుకున్నాను నేనతనికి సరిగా భుజాల వరకు వున్నాను. చాలా పొడవుగా ఉన్నాడు. నేనే జండా కొయ్యలా ఉంటానని అంటాడు కదా శశిధర్, బహుశా అతను ఆరుంపావు అడుగులు ఉంటాడేమో. అక్కడ ఉన్నంత సేపు అప్పుడప్పుడు అతన్నే చూస్తూ ఉన్నాను.

08/05/2008

ఇవాళ లాయరాఫీసులో మళ్ళీ అతను కనిపించాడు. పలకరింపుగా నవ్వాను . చేతులు కట్టుకుని నిల్చున్నవాడు ఆ చేతులు విప్పకుండానే ‘హాయ్’అని చేతివేళ్లు కదిలించాడు. ఏదో టెన్షన్ లా వుంది. నేను వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి అతను కూడా వచ్చి కూర్చుని అక్కడున్న మేగజైన్ చదవటం మొదలు పెట్టాడు. ఎందుకనో అతన్ని చాలా సార్లు చూశానని అనిపించింది.  అతనితో అదే విషయం చెప్తే, తనో కాలమిస్టునని, ఫలానా ఇంగ్లీష్ మంత్లీ లో  తన ఫోటో చూసి ఉండొచ్చునని చెప్పాడు. అప్పుడు జ్ఞాపకమొచ్చింది.  తన రీసెంట్ రైటింగ్ పైన నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అదే చెప్పాను, అతను శ్రద్దగా విన్నాడు. చివరిగా వచ్చేస్తూ ఏదో అడ్వర్టైజ్ మెంట్ లో చూపించినట్లు నా మొబైల్ కనిపించట్లేదు ఒకసారి రింగ్ చేస్తారా అనాలేమో. కానీ నాకు అబద్ధం చేతకాదు. ఎందుకో మిమ్మల్ని చూస్తే మీతో మాట్లాడాలనిపిస్తూ వుంది. మీరు చాలా అందంగా వున్నారు అందుకని అన్నాను. అప్పుడతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా చూసాను. కొంచమన్నా మార్పులేదు, సర్ ప్రైజ్. చాలా కేజువల్ గా చేయిచాచి కమల్ అగర్వాల్ అన్నాడు. నేను చేయి కలిపి దేవస్మిత అని నవ్వాను. మీ పేరు బాగుంది లైక్ యువర్ స్మైల్ అన్నాడు, అని మీ మొబైల్ కి రింగ్ చేసేదా అన్నాడు. ఇంటికొస్తున్న దారిలో నాకు నేనే నా ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయాను. యెందుకలా  ప్రవర్తించాను? అయినా నేను ఈ కాలపు అమ్మాయిని. ఒక స్త్రీ ఒక పురుషుడితో మాట్లాడటం తప్పేంటి? ఇదేం తప్పు కాదు నిజమే. కానీ, ఇంతకు ముందు నేనలా లేను కదా మరి.  మే బీ అయాం  ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ డెస్పరేషన్. ఫ్రాయిడ్ ని వెతకాలి.

16/08/2008

కమల్ తో బాగా స్నేహం కలిసింది. మాట్లాడేందుకు బోలెడు విషయాలు. కానీ అతను పైకి కనిపించినంత స్టేబుల్ కాదు. చాలా ఎమోషనల్. మార్వాడీ తండ్రికీ హిందూ తల్లికీ జన్మించాట్ట. అక్రమ సంతానం. మనువు ప్రకారం ఇతను ఏ చండాల కులంలోకి వస్తాడో.  విధిలేని పరిస్థితుల్లో తండ్రి అతన్ని అంగీకరించాట్ట అయినా తండ్రితో దాదాపుగా లేడు. సగం చదువు విదేశాలలో. తల్లీ, అతను. నేనో వేశ్య కూతుర్నని చెప్పాలనుకున్నాను. ఇష్టమనిపించలేదు. నా జీవితంలో ఇంకో మగాడ్ని నమ్మడమా? సమస్యే లేదు!

15/10 /2008

కమల్ ఇవాళ ఇంటికొచ్చాడు. నా పుస్తకాలు చూసి ఆశ్చర్యపడ్డాడు. అతని పుస్తక పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. ఆకర్షణా కలిగింది. ఇతన్ని చూపించి శశీతో చెప్పాలి. చూశావా అతనెంత చదువుతాడో అని. నువ్వేం చదవవు. ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే వున్నావు. నాకు ఏ ఆకర్షణ లేదు నీ పై అని. అప్పుడేం అంటాడు శశిధర. నవ్వొస్తుంది. ఏముంది బూతుల  మేళం మొదలెడతాడు.  కమల్ వచ్చేసరికి నా సంగీత సాధన జరుగుతోంది. అందుకని పాడమంటున్నాడేమో  అనుకున్నాను. కానీ కాదు.  అతనికి సంగీతమంటే పిచ్చి. హిందుస్తానీ, వెస్ట్రన్ బాగా తెలుసు. అందుకని త్యాగరాజ  కీర్తన ”రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక/ భామ మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక /పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు…”పాడాను. పాడి ముగించగానే కళ్ళు విప్పార్చుకుని నన్ను చూస్తూ ఆ పాట అర్ధమేమిటో చెప్తావా అన్నాడు. యేమని చెప్పను, అన్యమెరుగని ప్రేమని భక్తి అంటారని చెప్పాను, ఇంకా యేవో చెప్పాను. అర్ధం చెప్పగానే లేచి నా రెండు భుజాలు పట్టుకుని గొంతుపైన ముద్దుపెట్టాడు. విదిలించి కొట్టి గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. అతనిపై నా భావమేంటి? నా పై అతని భావమేంటి? అతను అందంగా కనిపించడమంటే కామించానని అర్ధమా, విషయాన్ని ప్రేమించడమంటే ఆ సంబంధిత వ్యక్తిని ప్రేమించినట్లా, ఎందుకనో ఏడుపొచ్చింది. కాసేపాగి వచ్చి చూసేసరికి అతను లేడు.

22/10 /2008

కమల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాను. మనసుకేం కావాలో ఏం వద్దో క్లారిటీ లేదు. తను మెసేజ్ పెట్టాడు ”దేవీ నేను చేసింది తప్పని నీకు తోచి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా చెప్పమంటావా ఐ నీడ్ యు వెరీ బాడ్లీ . అమ్మాయిలేం నాకు కొత్త కాదు. కానీ నువ్వు మాత్రం చాలా కొత్త. మనం ఇప్పుడు కావాలంటే విడిపోదాం, ఒక పదేళ్ళకి కలుద్దాం. అప్పుడు కూడా నా అభిప్రాయంలో మార్పు రాదు. నాకు నువ్వు కావాలి. ఇద్దరు పిల్లల తల్లిని ఇలా అడగడం న్యాయం కాదు కానీ అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా, పిల్లల్తో సహా నాతో వచ్చేయగలవా,” అని. మెసేజ్ చదవగానే తలతిరిగింది. ఓటిదో మోటుదో ఒక కుటుంబం వుంది కదా నాకు. దాన్ని వదిలేయమని ఎలా అంటాడు ఇతను. చిరాకేసింది.

28/10/2008

కమల్ నుండి చిన్న పలకరింపు కూడా లేదు. ఏమిటో ఒక చెడ్డ నిశ్శబ్దం. హృదయంలోనూ, భౌతికంగానూ. నేనెందుకీ వత్తిడి భరించాలి. అతనితో మాట్లాడి మందలించేయాలి. అమ్మాయిలు మగవాళ్ళతో  స్వేచ్చగానో, కొంచెం చనువుగానో  ఉండకూడదా.  ఛీ! అయినా నేనేంటి మరీ టిపికల్ విమెన్ లాగా ఇలాంటి డైలాగ్స్ చెప్పుకుంటున్నాను. తనకీ నాకూ మధ్య ఒక కెమిస్ట్రీ డెవలప్ అవుతుందని తెలియనంత చిన్న పిల్లనా? యేరు దాటాక, తుంగ బుర్రలా నాకటువంటి ఉద్దేశం లేదు  అని చెప్పాలా? అది ఆత్మ వంచన కాదా? ఛీ! చిరాగ్గా వుంది ఏవిటో. శశి రేపు వెళిపోతాడు కదా, అప్పుడు పిలవనా. అయినా నేనెందుకు పిలవాలి.

10/11/2008

పిల్లల్ని స్కూల్ లో  వదిలి వస్తుంటే ఎదురుగా వున్నషాపింగ్ మాల్ నుండి వస్తున్నాడు కమల్ . ఒక క్షణం నన్ను చూసి వెళ్ళిపోయాడు. ప్రేమ అన్నాడు కదా ఇదేనన్నమాట ప్రేమ. కోపమొచ్చింది. అతనికి ఫోన్ చేసాను. కానీ ఏం మాట్లాడాలో తోచలేదు, కట్ చేసి ఇంటికెళ్ళేసరికి ఇంటిముందు తన కారు.

17/02/2009

దేవస్మిత చెడిపోయింది. మామూలుగా చెడిపోతే పర్లేదు కానీ మనసా వాచా కర్మణా చెడిపోయింది. యెట్లా? రోజు రోజుకీ పెరిగిపోతున్న కాంక్ష.  ఎప్పుడూ తనతోనే వుండాలని, అతనితోనే చచ్చిపోవాలని, ప్రతిసారీ అతనంటాడు నాతో వచ్చేయవా అని. ముందూ వెనుకా ఎవరూ లేని దాన్ని వెళ్ళిపోతేనేం. కానీబాధేస్తుంది. పిల్లల్ని నాలానే చేయాలా? జీవితాంతం వాళ్ళమ్మని తల్చుకుని బాధపడాలా?

22/12/2009

ఇవాళ కమల్ ని శశిధర్ చూశాడు. ఊరికే చూడటం కాదు. నన్ను కమల్ ముందే దారుణంగా కొట్టడం మొదలు పెట్టాడు. కమల్ అడ్డమొచ్చాడు, కమల్ నీ కొట్టడం మొదలెట్టాడు. నాకు ఏడుపొచ్చింది కమల్ ని బయటకి నెట్టి  తలుపేసాను. శశిధర్ ముఖం పాలిపోయింది. నాకు  కొంచమన్నా సిగ్గుగానో వెరపుగానో అనిపించలేదు. పైపెచ్చు ఏదో సాధించినట్టు మనసుకి హాయిగా అనిపించింది. గదిలోకెళ్ళి తలుపేసుకున్నాను. పిల్లలొచ్చారని తలుపు తీశాను. అతను లేడు.

01/01/2010

శశిధర్ ఒక వారంగా ఇంటికి రాలేదు. ఇవాళే  వచ్చాడు అతను రాలేదని నాకు దిగులు కూడా అనిపించలేదు. కమల్ ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాడు వచ్చేయమని. ఈ ఘర్షణ  క్రుంగదీస్తోంది వెళ్ళాలా వద్దా అని. పాప మెడ చుట్టూ చేతులేసి ఎంత మంచి అమ్మ మా అమ్మ అన్నపుడు ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళను?

ఈరోజు శశిని చూడగానే చిరాకేసింది. పిల్లలు నిద్రపోయాక నా పక్కన చేరాడు. ఏం నేను చాలలేదా? అమ్మ బుద్ధులు తలెత్తాయా? అంటూ ఏమిటేమిటో అన్నాడు. మీద పడ్డాడు. అది కామమా? ఇంకో మగాడిని ఇష్టపడుతున్నానని తెలిసీ అతనికి నా మీద కామమెలా సాధ్యమయింది? నెట్టినా గిల్లినా కొట్టినా వదలలేదు. ఆశ్చర్యమేసింది. వళ్ళు శుభ్రంగా కడుక్కుని వచ్చి,”నీకో విషయం చెప్పాలి శసి ఐ స్లెప్ట్ విత్ హిమ్ సో మెనీ టైమ్స్. మన మధ్య ఇక కాపురం అసాధ్యం,” అన్నాను. నిజానికి నాట్ మెనీ  టైమ్స్, కానీ అట్లా చెప్పాలనిపించింది. కమల్ తాకిన శరీరాన్ని ఇతను తాకకూడదనా? ఏమో!  ఏమైనా నేను డ్యుయల్ సిం కార్డ్ మొబైల్ ని కాదు. కర్మ చాలక వేశ్య అయిన అమ్మ కూతురినే కానీ వేశ్యని కాదు. అయినా ఈ లోకంలో వేశ్యలు లేరు. విటులు మాత్రమే వున్నారు. వాళ్ళు కొంతమంది ఆడాళ్ళని ఉపయోగించుకుని వేశ్యలని పేరు పెడతారు. అంతే. ఐ హేట్ మెన్. అతను తలకింద చేతులుంచుకుని అలాగే నగ్నంగా పడుకున్నాడు. అతని నగ్నత్వం జుగుప్స కలిగించింది. అతనేం సమాధానం ఇవ్వలేదు. వెళ్లి హాల్లో పడుకున్నాను. తెల్లారేసరికి అతనులేడు.

26/01/2010

రెండో తేదీ కమల్ ని పిలిచాను. విషయం వినగానే అతని ముఖంలో రంగులు మారాయి. రంగులు మారిన అతని ముఖాన్ని చూడగానే నాకు మనసులో నవ్వొచ్చింది. నేను ఇంకా కూడా శశీ భార్యనే. నన్ను తాకడానికి సర్వ హక్కులూ వున్నవాడు అతను. అట్లా కాదు నన్ను తాకనివ్వను అని నేనితనికి చెప్పానా? ఏవిటో చిరాగ్గా వుంది. ”మనం ఫారిన్ కి వెళ్దాం. నాకు జాబ్ ఈజీగా వస్తుంది, నేను లింగ్విస్ట్ ఎక్సపర్ట్ ని. గ్రీన్ కార్డ్ హోల్డర్ని,” అన్నాడు. నేను మాట్లాడలేదు. అతన్ని కౌగిలించుకుని కూర్చున్నాను అప్పుడొచ్చాడు శశిధర్. మళ్ళీ గొడవ. నాకు విపరీతంగా దెబ్బలు తగిలాయి. కమల్ నన్ను బయటకి తీసుకొచ్చాడు. నేను కమల్ తో వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరెళ్ళే బస్సెక్కించమని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాను. నేను కమల్ తో వెళ్లలేదని ఎలా తెలుసుకున్నాడో శశి జయంతికి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. జయంతికి అన్నీ తెలుసు పదిరోజులకు నన్ను తీసుకుని ఇంటికి బయల్దేరింది. నాకసులు క్లారిటీ రావటంలేదు. పిల్లలు ఒకటే గుర్తుకొస్తున్నారు. కమల్ గుర్తుకొస్తున్నాడు. ఊర్లో దిగగానే హోటల్ రూం తీసుకుని కమల్ ని పిలిచాను.జయంతి తో  కలిసి డిన్నర్ కి వెళ్లాం అర్దరాత్రి దాటింది. వస్తూ వున్న దారిలో చీకటి  పూసినట్ట్లున్న చెట్టుకింద కమల్ హట్టాత్తుగా నన్ను ముద్దు పెట్టుకున్నాడు. జయంతి పక్కనే వుంది.  అయినా అన్ని రోజుల ఎడబాటు నన్నతనికి అల్లుకునేట్లు చేసింది. కార్లో జయంతి ముభావంగా కూర్చుంది. మరుసటి రోజు ఇంటికెళ్లాం. శశి, జయంతిని చూడగానే ముఖం దుఃఖంగా పెట్టాడు. పెట్టడమే కాదు అతని కళ్ళలో నీళ్ళొచ్చాయి. జయంతి అతనితో, ”జరిగిందేదో జరిగి పోయింది రెండు  చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. స్మిత నాకు ఎప్పటి నుండో  తెలుసు. తను అలాటిది కాదు. మీరు  కూడా అది అనాధ అని అలుసు తీసుకుని , ఏం చేసినా అడిగే వాళ్ళెవరూ లేరని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించి ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. తను జీవితం లో చాలా సఫరయింది ఇంకా ఎంతకని బాధ పడగలదు.  ఇకనైనా బాగుంటే  మంచిది. మీరు ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు,” అంది. నేను  అక్కడినుండి లేచి వచ్చేసాను. ఏడుపొచ్చింది. చక్కటి కుటుంబాన్ని గురించి ఎన్ని కలలు  కన్నది తను. జయంతి చెప్పినా ఎవరు చెప్పినా గతం పునరావృతం కాగలదా? శనివారం జయంతి వెళిపోయింది.

8/4/2010

ఇప్పుడు శశి ఇంతకు ముందటిలా కాదు. ఎక్కడికెళ్ళినా పదే పదే ఫోన్ చేస్తాడు. అప్పుడు ఎన్ని సార్లడిగేదో తన, ఫోన్ చెయ్యవా రోజుకోసారన్నా అని. నీకులాగా నాకు పని లేదనుకున్నావా అనేవాడు. ఒక ఎయిర్ హోస్టెస్ గా ఒక పైలెట్ కి ఎంత పని ఉంటుందో తనకి తెలియదా? ఇప్పుడెట్లా సమయం దొరికింది? వెళ్తూ వెళ్తూ వేలకి వేలు టేబుల్ మీద పెట్టి వెళ్తాడు. కమల్ ప్రస్తావన అసలు రానీయడు. ఇది ప్రేమా? ఏమో నాలో ప్రేమ చచ్చిన తరువాత ఇతనిలో ప్రేమ మొదలయినట్లుంది పాపం. కానీ శశీ నీకోసం ఈ మనసు ఎంత తపన పడేదో. కలలొ నువ్వు తాకినా శరీరం పులకరించేది. నువ్వు విమానమెక్కిన ప్రతి సారీ నీకేమయినా అయితేనో అని వణుకొచ్చేది. అట్లా అయితే   గుండాగి చచ్చిపోతానేమో అనుకునేదాన్ని. ఒక వేళ  అట్లా కాకుంటే నీతో పాటూ ఆత్మ హత్య చేసుకుంటాను కానీ నిన్ను వదిలి బ్రతక గలనా అనిపించేది. నిన్ను  పిచ్చిగా ప్రేమించిన దేవస్మితని ఎంత పతనం చేసావు కదా? నా ప్రేమని పిచ్చి పురుగులా కాలికింద వేసి నలిపేసావ్. మళ్ళీ నువ్వు చెప్పినట్లు విని ఇంతకు మునుపులా నీ జీవితంలో ఉండడానికి నేను నువ్వు నడిపే విమానాన్నా శశీ?

24/05/2010

ఇక తనతో వచ్చేయాల్సిందే అన్నాడు కమల్. వెళ్లాలని నాకూ వుంది. శశిధర్ ని ఏం చెయ్యను? అన్నేళ్ళూ అతను నన్ను పెట్టిన హింసంతా ఏమయింది? ఇప్పుడింత సాత్వికంగా ఎలా వుండగలుగుతున్నాడు. అతని నిజ స్వభావం ఏది. ప్చ్! విసుగ్గా వుంది.

12/06/2010

ఈ రోజు కమల్ తో వుండగా అనుకోకుండా శశి వచ్చాడు. మళ్ళీ ఘర్షణ జరుగుతుందేమోనని చిరాకేసింది.  మీ ఇద్దరితో మాట్లాడాలి కూర్చోండి అన్నాను. ఆ క్షణం ఆలోచించేందుకు అవకాశముండి, ఆలోచించి  మాట్లాడి వుంటే ఏం మాట్లాడి ఉండేదాన్నో తెలీదు కానీ అప్పుడు మాత్రం చాలా మామూలుగామ, ”శశీ నాకు మీ ఇద్దరు కావాలి. పిల్లల కోసం, కుటుంబంగా నువ్వు కావాలి. ఎందుకంటె నా పిల్లలు నాలా బాధపడకూడదు. అట్లాగే  నా హృదయంలో హృదయం గా కమల్ కావాలి. నువ్వు లేకున్నా నేను బ్రతకగలను.కమల్ లేకుండా బ్రతకలేను. నేను కావాలని నీకు గాఢం గా  ఉంది కాబట్టి ఒకపని చేద్దాం, నేను ఇద్దరితోనూ ఉంటాను. మీ పెదనాన్నకి వున్న ఇద్దరు భార్యలు సర్దుకుపోయినట్లు మీ ఇద్దరు సర్దుకుపొండి, లేదా నేను కమల్ తో వున్నట్లు నీకు తెలియకపోతే ఎలా వుండేవాడివో అలా తెలియనట్లు వుండిపో. కానీ ఇకపై నన్ను కొట్టడం, తిట్టడం కుదరదు. అలాగే కమల్, నేను శశిధర్ తో వున్నా కూడా నువ్వు నాతో వుంటున్నావ్ కదా, అలానే ఇక మీదట కూడా ఉండు. ఒక ఇల్లు తీసుకో, నేను వస్తూ పోతూ ఉంటాను. ఇకపై నువ్వీ ఇంటికి రాకు. కానీ నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోకూడదు. నాకోసమే ఉండిపోవాలి,” అన్నాను. నా మాట వినగానే కమల్ లేచి నా వైపు కూడా చూడకుండా వెళిపోయాడు. శశిధర్ సరేననో,  కాదనో చెప్పకుండా గదిలోకి వెళ్లిపోయాడు. నేనొక్కదాన్నే గదిలో మిగిలిపోయాను.

2/8/2012

నాలుగు దిక్కులూ
నేనే అయిన ఏకాంతంలో
నీ జ్ఞాపకాల బురదలో
దిగులు కమలం పూస్తుంది.
ఒక నాలో ఇంకో నేను
నా రహస్య దుఃఖాన్ని ఓదార్చుకుంటాను
దుఃఖాన్నీ నేనే
ఓదార్పునీ నేనే అయిన
దిగులు దారుల ప్రయాణంలో
జీవితం
తిరిగి తిరిగీ చిగురించే
వసంతం కానందుకు ఆనందం వేస్తుంది.
ఎంత దూరం నడిచినా
దారీ తెన్నూ దొరకనీయని
నిశ్చయ నిష్ఫల స్వప్నం
నీవు .
అయినా ఎదురుచూపును
వదులుకోదు మనసు, ఎందుకనో!
నువ్వు నాకోసం
దుఃఖాన్ని మాత్రమే కేటాయించావని
తెలిసి పోయాక
సందేహం కలుగుతుంది.
ప్రియ పురుషుడా!
నేను దేన్ని ప్రేమిస్తున్నాను
నిన్నా??? దుఃఖాన్నా????