కుట్ర

సలీం

సలీం

 

రాత్రి ఎనిమిదింటికి వాళ్ళమ్మ చేసిన వేడివేడి పరోటాలు, బంగాళాదుంప ఖుర్మా తెచ్చిపెట్టింది ఖాతూన్‌. సుష్ఠుగా భోంచేశాడు. తొమ్మిదింటికి గ్లాసునిండా గోరువెచ్చటిపాలు తెచ్చిచ్చింది. తాగాడు.

పదింటికి అతని పక్కకొచ్చి పడుకుంది. తెల్లటి నాజూకైన ఆమె శరీరం చిదుగుల మంటలా వెచ్చగా ఉంది. అసలే చలికాలం.. దుప్పటిలా ఆమెని కప్పుకుని తన రక్తాన్ని వెచ్చబరిచే ప్రయత్నంలో మునిగిపోయాడు సాజిద్‌.

‘‘మాటామంతీ ఏం ఉండవా? తినడం.. మీ కోరిక తీర్చుకుని అటు తిరిగి పడుకోవటం.. ఉదయం లేచి నాష్టా చేయడం… ఆఫీస్‌ కెళ్ళిపోవడం… ఇంతేనా’’ అంది ఖాతూన్‌…ఆమె గొంతులో కోపంకన్నా తనని మనిషిలా కాకుండా కోరిక తీర్చే రబ్బరు బొమ్మలా వాడుకుంటున్నాడన్న ఉక్రోషం…

‘‘ఏముంటాయి మాట్లాడటానికి? రెండేళ్ళనుంచి పన్చేస్తున్న ఆఫీసే… కొత్తగా చెప్పడానికి విశేషాలేమీ లేవు’’

‘‘నేను మీ ఆఫీస్‌ గురించి అడగటం లేదు. మన మధ్య మాట్లాడుకోడానికి సంగతులే లేవా?’’

‘‘అదేదో నువ్వే మాట్లాడొచ్చుగా… నేను వింటాను’’.

ఆమెకు బాగా కోపం రావడం వల్ల కొన్ని నిముషాలు మౌనంగా కోపాన్ని దిగమింగే ప్రయత్నం చేసింది. ఆ చీకటిలో విసుగుతోనో  దుఃఖంతోనో ఆమె విడుస్తున్న నిట్టూర్పులు మాత్రం విన్పించాయి.

‘‘నేనో విషయం అడుగుతాను… నిజం చెప్తారా?’’ అంది కొంత విరామం తర్వాత.

‘‘నేనెప్పుడూ నీకు అబద్ధాలు చెప్పలేదు’’

‘‘నిజమే… కాని కొన్ని నిజాలు మాత్రం చెప్పకుండా దాచారు. పోనియ్యండి. మన నిఖా ఐన ఈ రెండేళ్ళలో మీకు కోపం తెప్పించేలా ఎప్పుడైనా ప్రవర్తించానా?’’

‘‘లేదు’’

‘‘మీ ఇష్టాలకు అనుగుణంగానే నడుచుకున్నానా?’’

‘‘నీతో గడిపిన కాలం నాకు చాలా తృప్తినిచ్చింది.’’

‘‘కానీ మనం భార్యాభర్తలుగా ఉండేది యింకో నెల్రోజులు మాత్రమే…దారుణం కదూ. నన్నిలా వదిలేసి వెళ్ళడం మీకు న్యాయంగా అన్పిస్తుందా?’’ ఆమె ఏడుపు సన్నగా విన్పిస్తోంది.

‘‘యిందులో అన్యాయమేముంది? నిన్ను నీ తల్లిదండ్రుల అనుమతితో నిఖా చేసుకున్నాను. మన పెళ్ళికి  ముందే నాకు హైద్రాబాద్‌ లో భార్యా పిల్లలున్న విషయం మీ అబ్బాజాన్‌ కి చెప్పాను. అభ్యంతరం లేకపోతేనే నిఖా చేయమన్నాను. నీకన్నీ తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావనుకున్నాను. మీ నాన్న నీకు చెప్పకుండా దాస్తే అందులో నా తప్పేం ఉంది?’’

‘‘సరే. మీ తప్పేమీ లేదు. మీకిది రెండో వివాహమని చెప్పకుండా దాచిన అబ్బాదీ తప్పు కాదు. పాపం ఆడపిల్ల పెళ్ళి చేయలేని అశక్తుడు. అంతకన్నా చాతకాని అసమర్థుడు. తప్పంతా నాదే. పేద   ముస్లిం కడుపున ఆడపిల్లగా పుట్టడం’’ ఖాతూన్‌ సన్నగా ఏడుస్తోంది.

‘‘నేనేదో అపరాధం చేసినట్లు మాట్లాడ్తావేంటి? మన ముస్లింలలో నలుగుర్ని నిఖా చేసుకునే వెసులుబాటు మగవాడికి కల్పించారుగా. నువ్వు నాకు రెండో భార్యవే. యింకా యిద్దర్ని చేసుకున్నా నన్నెవ్వరూ తప్పు పట్టరు’’ అంటూ నవ్వాడు. అతని నవ్వు తోడేలు నవ్వులా వికృతంగా ధ్వనించింది.

‘‘తప్పు పట్టే అధికారాన్ని ఆడదానికి కల్పించకపోవడమేగా మీ జాతి చేసిన కుట్ర.  పోనివ్వండి. దానికీ సమాధానపడ్డాను. నా నసీబ్‌ లో మీకు రెండో భార్యగా ఉండమని ఆ అల్లా రాశాడనుకున్నాను కానీ మరో నెలలో మీ డెప్యుటేషన్‌ పూర్తికాగానే నాకు తలాక్‌ ఇస్తానంటున్నారే. అదే నాకు మింగుడు పడటం లేదు. నేనేం తప్పు చేశానని విడాకులిస్తారు?’’ ఖాతూన్‌ గొంతు కోపంతో వణికింది.

‘‘నేనిక్కడ గడపాల్సిన రెండు సంవత్సరాలలో నా అవసర నిమిత్తం నిన్ను నిఖా చేసుకున్నాను.  మరో నెల్లో తిరిగి హైద్రాబాద్‌ వెళ్తున్నాను. నాకిద్దరు బరువు. నా భార్య చాలు. అందుకే’’ నసుగుతూ చెప్పాడు.

‘‘ఆడదాని మనసు తెల్సుకోకుండా మాట్లాడ్తున్నారు. ముస్లిం స్త్రీ బజార్లో దొరికే వస్తువా? అవసరమైనన్ని రోజులు వాడుకుని, తర్వాత విసిరేసి పోవడానికి…ఆమెకూ మనసుంటుంది…ఆమెకూ ఆశలూ, కోరికలు, ఇష్టాఇష్టాలు ఉంటాయి. గుండెనిండా గాఢమైన అనుబంధాలూ ఆప్యాయతలు ఉంటాయి

‘‘ఉండవని నేననలేదే. నువ్వంటే నాకిష్టమే.మన నిఖా జరిగాక నేనూ నీతో ప్రేమగానే ఉన్నాగా.

‘‘నిజంగానే ప్రేముంటే వదలడానికి మనసెలా ఒప్పుతుంది? మీకు నేనంటే కాదు… నా శరీరమంటే ఇష్టం. దీన్ని పెళ్ళంటారా? మీ అవసరం తీర్చుకోడానికి నన్ను వాడుకున్నారు… అంతే. యా  అల్లా…నాకెందుకీ శిక్ష…నేను భార్యనా? మీ ఉంపుడుగత్తెనా?… భార్యనే ఐతే మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? పెళ్ళంటే రెండు శరీరాల కలయిక మాత్రమేనా? రెండు మనసులు, రెండు హృదయాలు కలిస్తేనే కదా ఆ అనుబంధం’’

‘‘అది న్యాయమో కాదో వెళ్ళి మతపెద్దల్ని అడుగు. నన్ను కాదు. ముస్లిం మగవాడు నలుగుర్ని  పెళ్ళి చేసుకోవచ్చని చెప్పటంతో పాటు భార్య నచ్చకపోతే మూడుసార్లు తలాక్‌ చెప్పటం ద్వారా విడాకులివ్వొచ్చని కూడా చెప్పారుగా. నేను మన మతానుసారమే ప్రవర్తిస్తున్నాను’’

‘‘అనాధ స్త్రీలనీ, విధవల్నీ ఆదుకుంటారనే సదుద్దేశంతో నలుగుర్ని చేసుకునే వీలు కల్పించబడింది. తప్పు చేస్తే భార్యకు విడాకులిమ్మని చెప్పలేదు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పించమన్నారు. ఇంతకూ నేను చేసిన తప్పేమిటి? చెప్పండి. మిమ్మల్ని త్రికరణ శుద్ధిగా భర్తగా  స్వీకరించానే.  మీకు మనస్పూర్తిగా సేవలు చేశానే’’

‘‘నేనూ విధేయతగానే ఉన్నాగా.. పరాయి స్త్రీవైపు కన్నెత్తికూడా చూళ్ళేదే.. భర్తగా నా కర్తవ్యాన్ని  చక్కగా నిభాయించినట్టేగా’’

‘‘మీ అవసరాలన్నీ తీర్చడానికి భార్యగా నేనుండగా మీకు వేరే స్త్రీ మీదికి ధ్యాసెందుకు మళ్ళుతుంది? ఐనా నానుండి శరీరసుఖాలు పొందడం తప్ప మీరు భర్తగా ఏం బాధ్యతలు నిర్వర్తించారని?’’

తనకు భోజన వసతి, గృహవసతి అన్నీ తన అమ్మానాన్నే కల్పిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతోందని అతని కర్థమైంది. ‘‘నేనేనా సుఖపడింది? నీకు శరీరసుఖం ఇవ్వలేదా?’’ అన్నాడు.

ఖాతూన్‌ విషాదంగా నవ్వింది. పదునైన కత్తిలా గాయం చేసే నవ్వు…

‘‘ఆ సుఖం కోసమే ఆడది కాపురం చేస్తుందనుకుంటున్నారా? కాదు. తన భర్తమీద ప్రేమతో అనురాగంతో కాపురం చేస్తుంది. భర్తనుంచి వాటినే తిరిగి ఆశిస్తుంది. మీరంటే నాకెంతిష్టమో తెలుసా?

నామనసులోని అణువణువులో మీ ఆలోచనలే…నా హృదయంలోని ప్రతి కణంలో మీ జ్ఞాపకాలే. ప్లీజ్‌ నన్ను వదిలేయకండి. ఐనా కాలపరిమితికి లోబడి పెళ్ళేమిటి? ప్రేమలకూ ఆత్మీయతలకూ కాలపరిమితిని విధించడం ఏం న్యాయం?’’ ఖాతూన్‌ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది.

సాజిద్‌కి చిరాగ్గా ఉంది. విసుగ్గా ఉంది. అన్ని రకాల సుఖాలు దొరుకుతాయనే కదా పెళ్ళి చేసుకున్నాడు? ఇప్పుడు సుఖం దేవుడెరుగు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.

‘‘నువ్వు ముతా పెళ్ళిళ్ళ గురించి విన్లేదా? మన పెళ్ళిని కూడా అలానే అనుకో. రెండేళ్ళ కాల పరిమితి కోసం చేసుకున్న భాగస్వామ్య ఒప్పందం. కాంట్రాక్ట్‌ గడువు ముగియగానే కాంట్రాక్ట్‌ రద్దయి పోతుంది. నువ్వు మరో పెళ్ళి చేసుకో. తలాక్‌ చెప్పబడిన ఆడదానికి మన ముస్లింలలో నిరభ్యంతరంగా పెళ్ళవుతుంది. ఐనా అన్నీ మీ నాన్నకి చెప్పే చేసుకున్నాను.  నువ్వూ ఇష్టపడేగా ఒప్పుకున్నావు? ఇప్పుడు అడ్డం తిరిగి మాట్లాడ్తావేంటి?  నువ్వూ నీ వాళ్ళూ కలిసి కుట్ర ఏమైనా చేస్తున్నారా?  నన్ను మోసం చేయాలనుకుంటున్నారా?’’ అన్నాడు కోపంగా.

అంత దుఃఖంలోనూ ఖాతూన్‌ కి నవ్వొచ్చింది. కుట్ర… మోసం అంటున్నాడు తన భర్త. ఎవరిది కుట్ర… మోసపోయిందెవరు? సాజిద్‌ తమ యింట్లో అద్దెకి దిగినపుడు సన్నగా పొడవుగా తెల్లగా ఉన్న అతన్ని చూసి ఇష్టపడింది. అతనికి పెళ్ళయిన విషయం కాని పిల్లలున్నారన్న విషయం కానీ తనకు తెలీదు. తెలిస్తే పెళ్ళికి ఒప్పుకునేదే కాదు. వయసు ముప్పయ్‌ నాలుగని తెలిసీ ఇష్టపడింది. తనూ టీనేజరేమీ కాదుగా. వయసు పాతిక దాటబోతోంది.

నాన్న అతన్తో  నిఖా జరిపించబోతున్నట్లు చెప్పినపుడు ఎంత సంతోషపడిందో.. తన మనసులోని ఇష్టాన్ని గ్రహించి సాజిద్‌ని పెళ్ళికి ఒప్పించి ఉంటారని సంబరపడిరది. ఇన్నాళ్ళూ తనకు పెళ్ళి చేయలేదని తండ్రి అసమర్ధతని తిట్టుకున్నా ఇపుడు తనకు నచ్చిన వ్యక్తితో నిఖా జరుపుతున్నందుకు అల్లాకు లాఖ్‌ లాఖ్‌ సుకర్‌ లు చెప్పుకుంది.

తనని మోసం చేసింది సాజిద్‌ ఒక్కడే కాదు. తన తండ్రి కూడా …కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన తండ్రే మోసం చేశాక తన బాధని ఎవరితో మొరపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. డబ్బు కోసం ముస్లిం ఆడపిల్లల్ని దుబాయ్‌ షేకులకు అమ్మేస్తారని విని అలాంటి తల్లిదండ్రులుకూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేది. తన తండ్రి చేసిన పని అంతకన్నా తక్కువదేమీ కాదు.

తనకు నిఖా అని మాత్రమే చెప్పాడు తప్ప అతనికది రెండో పెళ్ళని చెప్పలేదు. రెణ్ణెల్ల క్రితం తనతో హెద్రాబాద్‌లో అతనికున్న భార్యా పిల్లల గురించి చెప్పినపుడు మజాక్‌ చేస్తున్నాడనుకుంది. ‘నీకు తెలీదా… తెలిసే పెళ్ళికి ఒప్పుకున్నావని మీ నాన్న చెప్పాడే’ అన్నపుడు దిగ్భ్రాంతికి లోనయింది. ఉదయం నాన్నని నిలదీస్తే నీళ్ళు నమిలి ‘అమ్మతో నీకు చెప్పమని చెప్పానే… చెప్పనేలేదా’  అంటూ అమ్మ మీద ఒంటికాలితో లేచాడు. చెంపలు వాచేలా కొట్టి ‘దానిముందు నన్ను దోషిలా నిలబెడ్తావా?’ అంటూ నోరు వాచేలా తిట్టి బైటికెళ్ళిపోయాడు. తనని చుట్టుకుని అమ్మ బావురుమంది. గుడ్లనీరు కుక్కుకుంటూ ‘నాకూ తెలీదు బేటీ… తెలిసి తెలిసి నా కూతురి గొంతుకోసే కసాయి తల్లిని కాదు’ అంది.

ఆలోచనల్లోంచి బైటపడి సాజిద్‌ తో ‘‘సరే. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను కూడా మీతో  పాటు హైద్రాబాద్‌ పిల్చుకెళ్ళండి. మీ యింట్లో ఓ మూల యింత చోటిస్తే చాలు’’ అంది.

‘‘యిద్దరు భార్యల్ని పోషించేంత శక్తి నాకు లేదు’’

మరలాంటప్పుడు నన్ను నిఖా చేసుకుని నా గొంతెందుకు కోశావు అని అడగలేక పోయింది.   ‘‘తింటానికి రొట్టె

ముక్కలివ్వకున్నా పర్లేదు. గుక్కెడు గంజినీళ్ళిచ్చినా చాలు. సర్దుకుంటాను. నన్ను వదిలివెళ్ళకండి. ప్లీజ్‌. మీరు లేకుండా నేను బతకలేను’’ అంది.

‘‘నువ్వు నాకు భార్యగా వద్దనుకున్నాను. అందుకే ఓ నెలాగి తలాక్‌ చెప్తాను. దాన్ని కాదనే అధికారం ఎవ్వరికీ లేదు’’ అదే తన చివరి మాటైనట్లు అటు తిరిగి పడుకున్నాడు.

ఆ మాట తుపాకి గుండులా తగిలిందామెకు. నిజమే కదా…దాన్ని కాదనే అధికారం ఎవ్వరికుంది… చివరికి న్యాయస్థానాలు కూడా ముస్లిం స్త్రీల కడగండ్లు తీర్చడానికి పూనుకోవటం లేదు. తాగినమైకంలో ఉన్నా, మతి స్థిమితం సరిగ్గా లేకున్నా సరే వూడుసార్లు తలాక్‌ చెప్తే చాలు విడాకులైనట్లే అని ఇటీవలే ఎవరో ఫత్వా జారి చేశారన్న విషయం నాన్న ఎవరితోనో అంటుంటే వింది.

సాజిద్‌ చెప్పింది నిజమే. అతను తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలి వెళ్ళిపోగలడు. తలాక్‌ ఇచ్చేంత తప్పు ఏం చేశానని నిలదీస్తే వేరే మగాళ్ళతో అక్రమ సంబంధం అంటగట్టి బురద చల్లి మరీ పోగలడు. ఆ బురద కడుక్కోడానికి ఎన్ని సముద్రాల కన్నీళ్ళు కార్చాలో…ఎన్ని సంవత్సరాలు బిరాదరీలో దోషిలా నిలబడాలో.. అతన్ని తన భర్తగా జీవితాంతం కట్టిపడేసే మంత్రం తన దగ్గర లేదు. షరియత్‌ లో మార్పులు చేస్తే తప్ప తనలాంటి ముస్లిం  స్త్రీలకు మనశ్శాంతి ఉండదు. అలా అనుకుందే కానీ వెంటనే ఆమెకు స్పురించింది… మనుషుల్ని అనురాగంతో బంధించాలి కాని చట్టాల్తో షరియత్‌లతో కాదని..

తనని భార్యగా వద్దనుకున్నాడట. నెలాగి తలాక్‌ చెప్తాడట. ఇపుడే చెప్పొచ్చుగా. అలా చెప్తే నెలంతా స్త్రీ సుఖం కరువౌతుందని భయం.. ఎంత స్వార్థం మగాడికి? ఈ రోజు తనతో కాపురం చేశాడే.  మరి ఈ రోజు భార్యగా పనికొచ్చిన తనూ తన శరీరం నెల తర్వాత భార్యగా ఎందుకు పనికిరావో    ఆమెకెంత ఆలోచించినా అర్థం కాలేదు.

ఇదంతా ఓ పన్నాగం ప్రకారం జరిగినట్టు ఇపుడిపుడే తెలుస్తోంది. తన శరీరాన్ని తన యవ్వనాన్ని అధికారంతో వాడుకోవాలనుకున్నాడు. అందుకోసం పేదరికంవల్ల పెళ్ళి కాకుండా ఉండిపోయిన తన మీద నిఖా అనే వల విసిరాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన అబ్బా మీద యాభైవేల మెహర్‌ అనే వల విసిరాడు. ఇపుడవసరం తీరిపోబోతోంది. తలాక్‌ అనే కత్తెర సాయంతో తను బంధనాల్ని తెంపుకుంటున్నాడు. కానీ తనకు మాత్రం తలాక్‌ వల్ల కలిగేది విముక్తి కాదు… వేదన. గట్టుమీద పడి శ్వాస దొరక్క విలవిల్లాడే చేపలా తను..

ఎంత అమాయకంగా నమ్మిందో అతన్ని.. పిల్లలు పుట్టకుండా అతను జాగ్రత్తలు తీసుకుంటుంటే ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకు అడ్డుపడ్తారు? మీ పోలికల్తో మగపిల్లాడు పుట్టాలని దర్గాలో మొక్కుకున్నాను తెలుసా’ అందో రోజు.

‘అపుడే పిల్లలెందుకు? నీ అందమైన శరీరం పాడైపోదా? బిగువంతా సడలిపోదా?’ అని సాజిద్‌ అంటే ‘నా భర్తకు నా అందం మీద ఎంత శ్రద్ధో’ అనుకుని వ­రిసిపోయింది తప్ప రెండేళ్ళ తర్వాత వదిలేయాలనుకునే కుట్రలో ఇదో భాగమని తెల్సుకోలేకపోయింది.

ఆమె రాత్రంతా దుఃఖంతో కన్నీళ్ళతో నిద్రలేకుండా గడిపింది

.

***

Kadha-Saranga-2-300x268

 సాజిద్‌కి కేరళ వచ్చిన ఈ రెండేళ్ళలో స్వర్గధామంలా అన్పించిన ఆ  యిల్లు, అమృతతుల్యంలా అన్పించిన ఖాతూన్‌ వాళ్ళమ్మ చేసే వంటకాలు, అప్సరస పొందులా అన్పించిన ఖాతూన్‌ శరీరం…ఇవేవీ ఇప్పుడు రుచించడం లేదు.

నెల రోజులు ఎంత త్వరగా ఐపోతే అంత త్వరగా అక్కడినుండి పారిపోవాలనుకుంటున్నాడు…కానీ ఈ నెల రోజులు ఖాతూన్‌ పెట్టే నసనీ మానసిక హింసని ఎలా భరించాలో అతనికి అర్థం కావటం లేదు.

అసలీ డెప్యుటేషనే సుతరాము అతనికి ఇష్టం లేదు. తప్పని పరిస్థితుల్లో భార్యాపిల్లల్ని వదిలి వూరుకాని వూరు భాషకాని భాష కేరళలోని కొట్టాయం కొచ్చిపడ్డాడు.

అతనికీ నిద్ర రావడంలేదు. జ్ఞాపకాల తేనెతుట్టె కదిలింది. తీయతీయటి తేనె… మధ్య మధ్యలో చురుక్కుమనే తేనెటీగల పోట్లు…

కనీసం రెండేళ్ళయినా వేరే రాష్ట్రానికి డెప్యుటేషన్‌ మీద వెళ్ళాల్సిందేనంది ఆఫీస్‌ యాజమాన్యం

మొదట కొల్‌కతాకి పంపిస్తున్నామన్నారు. భయపడిపోయాడు. ఎక్కడి హైద్రాబాద్‌ ఎక్కడి కొల్‌ కతా…దక్షిణాది రాష్ట్రాల్లో వేయవల్సిందిగా అర్జీ పెట్టుకున్నాడు. చివరికి కేరళలోని కొట్టాయానికి పంపించారు

అందమైన భార్య…ముద్దొచ్చే యిద్దరు చిన్న పిల్లలు… ఐదేళ్ళ సొహైల్‌, మూడేళ్ళ సోనం…వాళ్ళనొదిలి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. అనారోగ్యంతో బాధపడ్తున్న నాన్న… మోకాళ్ళ నొప్పుల్తో నడవలేని అమ్మ.. వాళ్ళని చూసుకోడానికి భార్యని వదిలివెళ్ళక తప్పని పరిస్థితి. అందర్నీ కేరళ పిల్చుకెళ్తే  తనకొచ్చే యిరవై వేల జీతంతో సంసారాన్ని నెట్టుకు రాలేనని భయమేసి ఒంటరిగానే బయల్దేరాడు.

కొట్టాయం చాలా అందంగా ఉంది. కేరళని గాడ్స్‌ ఓన్‌ ప్లేస్‌ అని అందుకనే అంటారెమో. వూరూ ఆఫీసూ అంతా బాగానే ఉంది. కానీ తిండి ఇబ్బందిగా ఉంది. ఉంటానికి యిల్లూ దానిక్కట్టాల్సిన అద్దె…తనకొచ్చేజీతంలో ఎలా సర్దుకోవాలో యింటికి నెలనెలా డబ్బులెలా పంపాలో అతనికి అర్థం కాలేదు.

ఓ వారం రోజులు ఆఫీసర్‌ అనుమతి తీసుకుని ఆఫీస్‌ లోనే గడిపేశాడు. రోజూ సాయంత్రాలు అద్దె యిళ్ళకోసం తిరగటం.. యిల్లు నచ్చినా అద్దె భరించడం కష్టమని వెనక్కొచ్చేయడం…ఆఫీసర్‌ నుంచి అల్టిమేటం అందింది. ఆఫీస్‌ని యింటిలా వాడుకున్నది చాలని..యింకొక్క రోజైనా ఒప్పుకునేది లేదని…

ఆ రోజు సాయంత్రం ప్యూన్‌ హమీద్‌తో నువ్వు తప్ప నాకు దిక్కులేదని మొరపెట్టుకుంటే పిల్చుకెళ్ళి షౌకత్‌ మియాని పరిచయం చేశాడు.

షౌకత్‌ మియాకి మార్కెట్లో మటన్‌ షాపుంది. మొదట్లో బాగానే జరిగింది. అతని షాపుకి పక్కనే మరో షాపు వచ్చినప్పటినుండి వ్యాపారం దెబ్బతింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని తన యింట్లో ఒక పోర్షన్‌ అద్దెకిచ్చే ఉద్దేశం ఉందనీ ఎవరైనా మంచివాళ్ళు దొరికితే చెప్పమని హమీద్‌కి చెప్పి ఉన్నాడు.

అద్దెకిచ్చే పోర్షన్ని సాజిద్‌ కలియతిరిగి చూశాడు. చాలా పురాతనకాలం నాటి యిల్లు…గోడలు పెచ్చులూడిపోయి… రంగు వెలిసిపోయి… పడగగది, దానికానుకుని చిన్న డ్రాయింగ్‌ రూం.. కామన్‌ బాత్రూం…అద్దె తనకందుబాటులో ఉందని తెలీగానే మరో ఆలోచన లేకుండా చేరిపోయాడు.

మిగిలింది భోజన సమస్య… మరో వారం ఎలానో హోటల్‌ భోజనంతో సరిపెట్టుకున్నాడు. ఆరోగ్యం పాడైంది. భరించలేని కడుపు నొప్పి…శెలవపెట్టి తన గదిలో ముడుచుకుని పడుకున్నాడు.

షౌకత్‌ అలీ భార్య వాము మెత్తగా నూరి వేడినీళ్ళలో కలిపి తాగించింది. అన్నం మెత్తగా చేసి చారుతో కలిపి పెట్టింది. అతనికది అమృతంలా అన్పించింది.

అవకాశం చూసుకుని షౌకత్‌ మియాతో ‘‘మీ యింట్లో వసతి కల్పించారు. షుక్రియా..భోజనం కూడా ఏర్పాటు చేస్తే నాకీ హోటళ్ళ బాధ తప్పుతుంది. మీరేది ఒండుకుంటే అదే పెట్టండి. పచ్చడైనా సరే పలావ్‌ అనుకుంటాను. హోటల్‌ కయ్యే ఖర్చు మీకే యిస్తాను’’ అన్నాడు.

షౌకత్‌ అలి తన బేగం సాహెబాతో చర్చించాడు.

‘‘అదేం భాగ్యం… సాజిద్‌ మియాని గమనిస్తున్నాగా…చాలా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. మనం వండుకునే దాంట్లోనే మరో గుప్పెడు గింజలు పడేస్తే సరి.. రోటీ చేస్తే ఓ గుప్పెడు పిండి ఎక్కువ కలిపితే చాలు అతనికి సరిపోద్ది’’ అందామె.

సాజిద్‌ కి ముఖ్యమైన రెండు అవసరాలు తీరాయి. ఉండటానికో గూడుంది. తింటానికి శుభ్రమైన రుచికరమైన యింటి భోజనం దొరుకుతోంది.

నెలరోజులు ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయాయి. మెల్లమెల్లగా భార్య రుక్సానా గుర్తుకు రాసాగింది…ఆమె మీది ప్రేమతో కాదు…యవ్వనంతో మిసమిసలాడే ఆమె శరీరం మీది కాంక్షతో…రానురాను ఆ అవసరం బలం పుంజుకుని అతని మనసుని బలహీన పర్చసాగింది. అతనికి భయమేసింది.

కోరిక తీవ్రతని తట్టుకోలేక తనేమైనా తప్పు చేస్తాడేమోనని… అసలే ఎయిడ్స్‌ భూతం తప్పు చేసేవాళ్ళని మింగడానికి నోరు తెర్చుకుని ఉందన్న స్పృహ…         ఏం చేయాలో తెలీక సతమతమౌతున్న తరుణంలో తటిల్లతలా ఓ అమ్మాయి మెరిసి షౌకత్‌ మియా యింట్లో మాయమైంది. జనానా వల్ల ఇన్నాళ్ళూ ఆ అమ్మాయి కన్పడలేదుకానీ ఆమె గొంతు,

అందమైన ఆమె నవ్వు అపుడపుడూ విన్పిస్తూనే ఉన్నాయి. ఆమె షౌకత్‌ కూతురు ఖాతూన్‌.

అందమైన, యవ్వనంలో ఉన్న ఖాతూన్‌ ని చూడగానే ఎట్లాగైనా ఆమెని పొందాలన్న కోరిక బలపడిరది. ఓ పద్ధతి ప్రకారం ఆమెను దక్కించుకోడానికి పన్నాగం పన్నాడు.

షౌకత్‌ అలీ జుమ్మా నమాజ్‌ చదివే మసీదుకెళ్ళి మౌల్వీని కల్సుకున్నాడు.

‘‘నేను బదిలీ మీద హైద్రాబాద్‌ నుంచొచ్చాను. కనీసం రెండేళ్ళు ఈ వూళ్లో పని చేయాలి. అప్పటివరకు భార్యకు దూరంగా ఉండటం కష్టం కదా. కాబట్టి మరో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి’’ అన్నాడు.

‘‘నేనేం సాయం చేయగలను? మీరు అమ్మాయిని చూసుకుంటే నిఖా చేయించటం తప్ప’’ అన్నాడతను.

‘‘అయ్యో మీరే అలాఅంటే ఎలా? పరాయి రాష్ట్రం నుంచొచ్చిన సోదర ముస్లింకి మీరు కాకపోతే ఎవరు సాయం చేస్తారు? మీరు దయతో సాయం చేసినా మీ రుణం ఉంచుకోను. ఇది అడ్వాన్స్‌ మాత్రమే.. ఉంచండి’’ అంటూ ఐదువేలు చేతిలో పెట్టాడు.

మౌల్విగారు మెత్తబడ్డారు. తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ ఆలోచనలో పడ్డారు. ‘‘యింతకీ నన్నేం చేయమంటావు? కొంపదీసి అమ్మాయిని వెతికి పెట్టమంటావా ఏమిటి? నా వల్ల కాదు’’  అన్నాడు. అలా కాదన్నందుకు చేతిలోని ఐదువేలు లాగేసుకుంటాడేమోనని భయపడి ఆ డబ్బుల్ని లాల్చి జేబులో కుక్కేసుకున్నాడు.

‘‘అమ్మాయిని నేను చూసుకున్నాను జనాబ్‌…మీరు చేయవల్సిందల్లా ఆమె తండ్రికి రెండో పెళ్ళిచట్టబద్ధత గురించి చెప్పి ఒప్పించడమే’’

మౌల్వీగారు మళ్ళా ఆలోచనలో పడ్డారు. యిందులో తనకొచ్చే నష్టమేమీ కన్పించలేదు. ‘‘ఇంతకూ ఎవరా అమ్మాయి?’’ అని అడిగాడు.

‘‘మటన్‌ కొట్టు నడిపే షౌకత్‌ అలీ కూతురు’’

‘‘ఓ … షౌకత్‌ మియానా?’’ మళ్ళా తన గడ్డం నిమురుకుంటూ  ఆలోచనలో పడ్డాడు. ‘‘షౌకత్‌ అలీ డబ్బుకి కక్కుర్తి పడే మనిషి. నేను చెప్పినంత మాత్రాన ఒప్పుకుంటాడనుకోను. మెహర్‌   ఆకర్షణీయంగా ఉంటే ఒప్పించవచ్చు’’

‘‘ఓ పదివేలు’’

‘‘లాభం లేదు’’

‘‘పోనీ పాతిక’’

‘‘లొంగడు’’

సాజిద్‌ మనసులోనే చాలా వేగంగా లెక్కలు వేసుకున్నాడు. యాభై వేలు మెహర్‌ కింద యిస్తే మౌల్వీకిచ్చే డబ్బు, నిఖా ఖర్చు మొత్తం కలిపి డెబ్బయ్‌ వేలకి మించదు. రెండు సంవత్సరాల కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే నెలకి దాదాపు మూడువేలు.. రోజుకి వంద రూపాయలు. అందమైన యవ్వనంలో ఉన్న అమ్మాయి పొందు రోజుకి వంద రూపాయల ఖర్చుతో దొరకటంకన్నా అదృష్టమేముంటుంది?

అతనికి మరో ఆలోచన కూడా వచ్చింది. నిఖా జరిగాక షౌకత్‌ అలీ యిల్లు తన మామగారిల్లుఅవుతుంది కాబట్టి అద్దె యివ్వక్కరలేదు. తిండికి డబ్బులు కట్టక్కరలేదు. ఆ రకంగా నెలకు తనిప్పుడిస్తున్న మూడు వేలు, కిరాయి మూడు వేలు భోజనానికి కలిపి మొత్తం ఆరువేలు ఎగ్గొట్టవచ్చు. అలా లెక్క వేసుకుంటే నెలకు మూడువేలు ఖర్చు మిగలడంతోపాటు ఉచిత వసతి, ఉచిత భోజనం దాంతోపాటు ఉచిత స్త్రీ సుఖం…

‘‘సరే మౌల్వీసాబ్‌.. యాభై వేలు మెహర్‌గా యిస్తాను. మీరు షౌకత్‌ గారిని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం’’

‘‘అవన్ని నేను చూసుకుంటాలే. నాకివ్వాల్సిన పైకం విషయంలో కంజూసీ చూపకు చాలు’’

వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఖరారైంది.

 ***

 ఆదివారం మగరీబ్‌ నమాజ్‌ తర్వాత ముస్లిం  పెద్దలు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు మౌల్వీగారు తమ ప్లాన్‌లోని మొదటి అంకాన్ని అమల్లో పెట్టారు. ‘‘సాజిద్‌ మియా.. మీరు నిఖా చేసుకోవాలనుకుంటున్నారనీ మెహర్‌ కింద యాభై వేలు ఇస్తారని నాకు తెల్సిన నలుగురైదుగురికి చెప్పి పెట్టాను. అందులో ఇద్దరైతే చాలా ఉత్సాహం చూపారు. యాభై వేలంటే చాలా పెద్దమొత్తం కదా. మీరు రేపుదయం మా యింటికొస్తే వాళ్ళ వివరాలు చెప్తాను’’ అన్నారు. అతనికది రెండో పెళ్ళి అనే విషయం మాత్రం ముందే ప్రకటించకుండా జాగ్రత్త పడ్డారు.

సాజిద్‌ని చూసినప్పటినుండి అతను తనకల్లుడైతే బావుంటుందని అనుకున్నాడు షౌకత్‌. ఎటొచ్చీ అతనికి యింతకు ముందే పెళ్ళయిందేమోనన్న అనుమానం పీకుతో ఉండింది. ఇపుడు మౌల్వీగారి మాటల్తో మనసులో ఉన్న కొద్దిపాటి అనుమానం తీరిపోయింది. ప్రస్తుతం అతని ఆలోచనంతా యాభై వేల మెహర్‌ చుట్టే గిరికీలూ కొడ్తోంది. యాభై వేలు… ఎంత పెద్ద మొత్తమో…అర లక్ష…ఎన్ని అవసరాలు తీర్చుకోవచ్చో…ఎప్పటినుంచో తన మటన్‌ దుకాణానికి  కొన్ని రిపేర్లు చేయించాలని ఆలోచన..తన పక్క దుకాణం కొత్తగా పెట్టడం వల్ల దాని ముందు తన దుకాణం వెలవెలా పోతోంది. యిపుడా డబ్బుతో పక్క షాపుకన్నా బాగా జిగేల్‌ మనిపించేలా చేయవచ్చు. వూళ్ళో చేసిన అప్పులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అప్పు తీర్చమని ప్రాణాలు తోడేస్తున్నారు. ఆ డబ్బు వాళ్ళ మొహాన కొట్టవచ్చు.

రెండ్రోజుల తర్వాత మౌల్వీగారు షౌకత్‌ని కదిపారు. ‘‘  సాజిద్‌ అద్దెకుంటుంది మీ యింట్లోనే కదా.. ఎంత బుద్ధిమంతుడో. చూడటానికి సలక్షణంగా ఉన్నాడు. దైవభక్తి, పెద్దలంటే మర్యాద పుష్కలంగా ఉన్నాయి. వయసుకూడా ఎక్కువేమీ కాదు.. ముప్పయ్‌కి కొద్దిగా అటూ యిటూ అంతే..మీ అమ్మాయినే యిచ్చి నిఖా జరిపించొచ్చుగా’’ అన్నారు.

‘‘మా అమ్మాయినా?’’ అన్నాడు షౌకత్‌.

‘‘ఔను షౌకత్‌.. నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలియంది కాదు. నీ కూతురికి ఎప్పటికైనా నిఖా చేయాలిగా. నువ్వా కట్నం యిచ్చుకోలేని దుస్థితిలో ఉన్నావాయె. సాజిద్‌ మెహర్‌ కింద  యాభై వేలు ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు. యాభై వేలంటే తక్కువ డబ్బేమీ కాదు. దాన్ని బ్యాంక్‌ లో వేసి దాచుకుంటే ముదు ముందు అవసరాలకి పనికొస్తాయి’’ అన్నారు.

‘‘మా ఖాతూన్‌కి పాతికేళ్ళచ్చాయి. పర్లేదంటారా? సాజిద్‌ ఒప్పుకుంటాడా?’’ తన మనసులోని భయాన్ని బైట పెట్టాడు షౌకత్‌.

‘‘నీ కెందుకు నేను ఒప్పిస్తాగా. ఆ యాభై వేలలోంచి ఓ ఐదు వేలు నాకు నజరానాగా ఇవ్వు చాలు’’ అన్నారు మౌల్వీగారు.

కూతురి పెళ్ళితో పాటు నలభై అయిదు వేల రొక్కం దొరుకుతుంటే కాదనడానికి నేనేమైనా పిచ్చోడినా అనుకుని సంతోషంగా ఒప్పుకున్నాడు షౌకత్‌. అతని చేత నాలుగైదు సార్లు ‘ఏమైంది? సాజిద్‌ ఒప్పుకున్నాడా?’ అని అడిగించుకుని చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు అతనికిది రెండో పెళ్ళి అనే విషయం మెల్లగా చెవిలో వూదాడు.

‘‘మనకొద్దు షౌకత్‌ భాయ్‌. ఖాతూన్‌ కి మంచి సంబంధం చూద్దాం. యాభై వేల మెహర్‌ ఎవరిక్కావాలి? ఐనా మన ముస్లింలలో మగాడు భార్య ఉండగా మరో పెళ్ళి చేసుకోవడం తప్పు కాదనుకో. ఏమైనా నీ ఇష్టం. నువ్వు కావాలంటే నేనడిగిన ఐదువేలూ వదులుకుంటాను. సరేనా’’ అన్నాడు.

ఈ పెళ్ళి తప్పకుండా ఖాయమౌతుందన్న నమ్మకంతో  అప్పులోళ్ళతో త్వరలోనే ఆ అప్పు తీర్చబోతున్నట్టు చెప్పేశాడు షౌకత్‌. సాజిద్‌కిది రెండో పెళ్ళన్న వార్త విని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు కొన్ని రోజులు గిలగిలా కొట్టుకుని, చివరికి తప్పని పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఎటొచ్చీ తన భార్యతో ఖాతూన్‌తో నిఖా అని చెప్పాడు తప్ప సాజిద్‌కిది రెండో పెళ్ళనే విషయం దాచాడు.. నిజం తెలిస్త్తే వాళ్లిద్దరూ ఒప్పుకోరని భయపడ్డాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడనీ, బాదరబందీ లేని ఒంటరి వాడని నమ్మించి పెళ్ళికి ఒప్పించాడు.

నిఖాకి ముందే సాజిద్‌తో ‘‘అల్లుడి హోదా వచ్చింది కాబట్టి యింటి కిరాయి, భోజనం ఖర్చు యివ్వక్కర లేదనుకుంటే పొరపాటు. ఏ ఖాతాకి ఆ ఖాతానే’’ అని కరాఖండిగా చెప్పాడు.

అలాగైనా పర్లేదు.. అది తనకు లాభసాటి బేరమే అనుకున్నాడు సాజిద్‌.. రోజుకి వంద రూపాయల ఖర్చుతో భర్త హోదాలో అనార్‌ పువ్వులా మురిపిస్తున్న ఖాతూన్‌ యవ్వనాన్ని జుర్రుకోవచ్చు.

షౌకత్‌ మియాతో ఒప్పందం ఖరారు చేసుకున్నాక అమ్మ కి జబ్బు చేసిందని చెప్పి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఎక్కౌంట్‌ లోంచి డబ్బు విత్‌ డ్రా చేసి అందులోంచి యాభై వేలు అతనికి సమర్పించుకున్నాడు.

నిఖా జరిగిపోయింది.

అంతా తననుకున్నట్లే సజావుగా జరిగింది. కేవలం పోయిన వారం నుంచే ఖాతూన్‌ పోరు ఎక్కువైంది. తను తాగుతున్న అమృతంలో మెల్లగా కలుస్తున్న చేదు రసం…

అందుకే గడువు ముగియకముందే బిఛానా ఎత్తేయాలని ప్లాన్‌ చేసాడు.

మరో పది రోజులు ప్రాణాలు ఉగ్గబట్టుకుని కాపురం చేశాడు. ఆ పది రోజులూ చాలా ప్రేమ నటించాడు. తలాక్‌ ప్రస్తావన రాకుండా  జాగ్రత్త పడ్డాడు. ఖాతూన్‌ లో ఆశలు చిగురించాయి. తన భర్త తప్పకుండా తనని రెండో భార్యగా స్వీకరిస్తాడనీ తనని వదిలి వెళ్ళడని నమ్మింది.

ఆ రోజు ఆఫీస్‌ కెళ్ళాక ఆరోగ్యం బాగోలేదని శెలవ పెట్టాడు. హైద్రాబాద్‌ వెళ్ళాక మెడికల్‌ సర్టిఫికెట్‌ పంపిస్తాననీ తనకో పదిహేను రోజులు శెలవు మంజుారు చేయమని తన పై అధికారికి విన్నవించుకున్నాడు. మరునాడు ఆఫీస్‌కని చెప్పి బయల్దేరి రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు. తన వస్తువులంటూ ఖాతూన్‌ దగ్గర వదిలేసినవేమున్నాయని లెక్కేసుకున్నాడు. నాలుగైదు జతల బట్టలు, ఓ సూట్కేసూ, రెండు జతల చెప్పులు…పర్లేదు కొత్తవి కొనుక్కోవచ్చని సమాధానపడి రైలెక్కాడు. హైద్రాబాద్‌ చేరుకున్నాక   తలాక్‌ తలాక్‌ తలాక్‌ అని రాసి ఉత్తరంముక్క పోస్ట్‌ బాక్స్‌ లో పడేస్తే చాలు. ఖాతూన్‌ పీడ ఖతం అనుకుని సన్నగా నవ్వుకున్నాడు.

***

 ఖాతూన్‌కి చాలా అసహనంగా ఉంది. ఉదయం సాజిద్‌ ఆఫీస్‌ కెళ్ళిన క్షణం నుంచీ అతని

రాక కోసం ఎదురు చూస్తోంది. ఈ రోజెట్లాగైనా సరే సాజిద్‌ నుంచి తనని వదిలి వెళ్ళనని మాట  తీసుకోవాలనుకుంది. జీవితాంతం తామిద్దరూ భార్యాభర్తలుగా ఉంటామని అతని చేత ఒట్టేయించుకో వాలని నిశ్చయించుకుంది. తామిద్దరేనా … ముగ్గురు కదూ. ఒక భర్తా ఇద్దరు భార్యలు.. అంతటితో ఆగితే అదృష్టమే.. ఒక భర్తా, నలుగురు భార్యల దుస్థితి పట్టకుండా ఉంటే అంతే చాలనుకుంది. ఆమెకెందుకో ముస్లిం ఆడదాని బతుకంటే రోత పుట్టింది. ఎన్ని రకాల బానిసత్వాల్ని భరించాలో.. మగవాళ్ళ ఎన్ని అన్యాయాల్ని అఘాయిత్యాల్ని సహించాలో..

ఆరు దాటింది. సాజిద్‌ రాలేదు. ఆమె నిమిషానికోసారి యింటినుంచి బైటికొచ్చి రోడ్డు వైపుకు దృష్టి సారిస్తోంది. సాజిద్‌ జాడ కన్పించకపోవటంతో దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తోంది.

ఆరున్నరయింది. సాజిద్‌ ఆచూకీ లేదు.

చీకటి పడ్తోంది. ఆమె గడపలో నిలబడి ఆతురతగా ఎదురుచూస్తోంది. తెల్లటి ఆమె మొహం

నిండా నల్లగా కమ్ముకుంటున్న దిగులు…చీకటి మెల్లగా ఆమె శరీరం మీద పాకి మొహాన్ని మింగేయడానికి ప్రయత్నిస్తోంది. ఏడయింది… ఎనిమిదయింది. చీకటి ఎప్పుడో ఆమెని మింగేసింది.

 – సలీం