సాహిత్య చరిత్రలో కాళోజి దారి…

kaifiyath

కాళోజి – తెలంగాణ రచయితల సంఘం1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనతో తెలంగాణలో సాంస్కృతిక పునర్వికాసానికి పునాది పడింది.  హైదరాబాద్‌లో ఈ నిలయ స్థాపనలో రావిచెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజనాయని వెంకటరంగారావులు కీలక భూమిక పోషించారు. వీరు కేవలం దాన్ని ఒక సంస్థగా కాకుండా ఒక సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయానికి అనుబంధంగా విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాలను ఏర్పాటు చేసి శాస్త్ర, చరిత్ర, సాహిత్య పుస్తకాలను వెలువరించారు. ఒక్క గురజాడను(?) మినహాయిస్తే ఆధునిక కాలంలోని తెలుగుసాహితీ ఉద్ధండులందరూ ఇక్కడ సన్మానం పొందినవారే. తమ సాహితీ ప్రతిభను ప్రదర్శించినవారే! తర్వాతి కాలంలో అణా, దేశోద్ధారకతో సహా అనేక గ్రంథమాలలు, నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం, వర్తక సంఘాలు, ఆంధ్రమహాసభ, నిజాంరాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్‌ ఇలా ఎన్నో సంస్థలు భాషానిలయం స్ఫూర్తితో ఏర్పాటయ్యాయి. అందుకే ఈ గ్రంథాలయం తెలంగాణ పునర్వికాసానికి పునాదిలా ఉండిరది అని చెప్పడం. నిజాం పాలనలో తెలుగువారి అస్తిత్వం, ప్రతిభకు పట్టం కట్టడానికి కొమర్రాజు, నాయని వెంకటరంగారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం, బూర్గుల తదితరులు కృషి చేసిండ్రు. వీరి కృషికి కొనసాగింపుగా హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం అరుణశ్రీ గ్రంథమాల, రాజశ్రీ సాహిత్య కళాపీఠమ్‌, నవ్య కళాసమితి, ఆంద్రచంద్రిక, విజ్ఞానచంద్రికా గ్రంథమాల, సుజాత, భాగ్యనగర్‌, శోభ లాంటి పత్రికలు స్థాపితమయ్యాయి. సాయుధ పోరాటం విరమించడం వల్ల కూడా సాహితీవేత్తలకూ పూర్తిస్థాయిలో రచయితల సంఘానికి సమయం వెచ్చించడం సాధ్యమైంది.
హైదరాబాద్‌పై పోలీసుచర్య అనంతరం తెలంగాణలో తెలుగువారి అస్తిత్వాన్ని నిలబెట్టడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి, విస్మృత సాహిత్యాన్ని వెలుగులోకి తేవడానికి, వైతాళికుల స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశ్యంతో 1951 సెప్టెంబర్‌ ఆరున తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిరది. తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాహిత్యాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. సంఘం తొలి అధ్యక్షుడు దాశరథి. కార్యదర్శి సి.నారాయణరెడ్డి. ఈ సంఘంలో మొదటి నుండి కీలక పాత్ర పోషించింది బిరుదురాజు రామరాజు, పి.మాణిక్యరెడ్డి, యశోదారెడ్డి, కాళోజి నారాయణరావు తదితరులు. తర్వాతి కాలంలో ఆళ్వారుస్వామి కూడా ఇందులో పాలుపంచుకున్నాడు. తెలంగాణ సాహిత్య సమాజం తరపున ప్రభుత్వంతో వివిధ విషయాలపై మాట్లాడేందుకు ఈ సంఘం ఒక వేదికలా పనిచేసింది. అప్పటి వరకూ ప్రజా ఉద్యమంలో ముందుండిన దాశరథి, కాళోజీలు సంఘ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించారు.
ఉద్యమ కవిగానే అందరికి పరిచయమున్న కాళోజి మంచి కార్యకర్త, కార్య నిర్వాహకుడు కూడా! 1934లో హైదరాబాద్‌లో మిత్రులు వెల్దుర్తి మాణిక్యరావు, వెంకటరాజన్న అవధానిలతో కలిసి ‘వైతాళిక సమితి’ నిర్వహించాడు. ఈ సమితి ద్వారా ప్రజల్ని చైతన్య పరిచే సభలు, సమావేశాలు, పత్రికా రచనలు చేసేవారు. హైదరాబాద్‌ నుంచి హన్మకొండకు వచ్చిన తర్వాత వివిధ ప్రజా సంఘాలతో కలిసి పనిచేశాడు. ఇందులో వరంగల్‌లో ఆంధ్రసారస్వత పరిషత్‌ సభల నిర్వహణ ఆయన కార్యాచరణకు నిదర్శనం. కాళోజి కార్యచరణ గిట్టనివాళ్లు సభను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ప్రభుత్వం నుంచి సభ నిర్వహణకు అనుమతి లభించలేదు. అంతేగాదు అర్ధరాత్రి సభ కోసం ఏర్పాటు చేసిన వేదికను దుండగులు తగలబెట్టారు. అయినప్పటికీ వీటన్నింటిని అధిగమించి వరంగల్‌లో ‘ఆంధ్రసారస్వత సభ’ని నిర్వహించారు. ఇది 1947(?)నాటి ముచ్చట. కాళోజి పట్టుదలకు ఇది నిదర్శనం.
kaloji
తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించి ఆయా ప్రాంతాల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించింది. ఖమ్మంలో ఊటుకూరు రంగారావు, డోకిపర్తి రామలింగం, హీరాలాల్‌ మోరియాలు మొదలు సిరిసిల్లలో గూడూరి సీతారామ్‌, జనగామలో గఱ్ఱేపల్లి సత్యనారాయణ రాజు వరకు ఎందరో ఈ సంఘం నిర్వహణలో పాలుపంచుకున్నారు.
1953లో ఆలంపురంలో గడియారం రామకృష్ణశర్మ సాహిత్య సభలు నిర్వహించారు. ఈ సభలకు ఆంధ్రప్రాంతం నుండి శ్రీశ్రీ, శ్రీపాదతో సహా అనేక మంది కవి పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజాత పత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది. దీంట్లో ఆంధ్ర ప్రాంతం వారి రచనలు కూడా విరివిగా చోటు చేసుకున్నాయి. నాయనికృష్ణకుమారి, పాలగుమ్మి పద్మరాజు లాంటి వారి రచనలు ఇందులో ఉన్నాయి. ఈ సభల్లోనే వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరపున కాళోజి రాసిన ‘నా గొడవ’ను మొదటి సారిగా ప్రచురించాడు. దీన్ని ఆలంపురం సభల్లో అర్ధరాత్రి పూట శ్రీశ్రీ ఆవిష్కరించాడు. (పగటి పూట సభల్లో ఈ పుస్తకావిష్కరణకు సమయం కేటాయించలేదు) బహుశా ఈ సభలే ‘ఆంధ్రప్రదేశ్‌’ అవతరణకు సాహిత్య రంగంలో సానుకూలతను తీసుకొచ్చాయి. ఇదే కాలంలో హైదరాబాద్‌లో అఖిల భారత గ్రంథాలయ మహసభలు జరిగాయి. అలాగే శ్రీకృష్ణదేవరాయాంధ్ర స్వర్ణోత్సవాలు కూడా ఈ సంవత్సరమే జరిగాయి. స్వర్ణోత్సవాలకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగానే కాకుండా అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నారు. అప్పుడే ముల్కీ ఉద్యమం ఉధృతంగా ఉండడంతో విద్యార్థులు ఆయన రాకను నిరసించారు కూడా. ఈ ఉత్సవాలను బిరుదురాజు రామరాజు కార్యదర్శిగా ఉండి నిర్వహించారు. బిరుదురాజుతో పాటు, కాళోజి, దాశరథి, సి.నారాయణరెడ్డి తదితర తెలంగాణ రచయితల సంఘం వారంతా చురుగ్గా పాల్గొని సభల్ని విజయవంతంగా నిర్వహించారు.
తెలంగాణ రచయితల సంఘం తొలి మహాసభలు 1953లో రెడ్డి హాస్టల్‌ ఆవరణలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు ఖాయమైన తర్వాత 1956 సెప్టెంబర్‌లో ‘తెలంగాణ రచయితల సంఘం’ ద్వితీయ మహాసభలు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మూడ్రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సభలకే గాకుండా సంఘానికి కూడా కాళోజి నారాయణరావు అధ్యక్షుడయ్యాడు. సెప్టెంబర్‌ 17వ తేదీనాడు సభ ముగింపు సమావేశంలో కాళోజి చేసిన ప్రసంగం సాహితీ రంగంలో విశిష్టమైనది.
భాష విషయంలో కాళోజికి కచ్చితమైన అభిప్రాయముండేది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారి భాషను సాహిత్యంలో ప్రతిఫలించాలి అని భావించేవాడు. పత్రికలు, పుస్తకాల్లో వచ్చిన భాషే ప్రామాణికమని నిర్ధారించడం పొరపాటు అని కూడా చెప్పాడు. తెలుగు వారి కోసం తెలుగులోనే తెలుగులోనే రాయాలి. సంస్కృతం, ఇంగ్లీషు పదాల్ని అనవసరంగా వాడటం ద్వారా  అవి అందరికీ అర్థం కాకపోవొచ్చు. తాము రాసినం కాబట్టి అందరూ అదే చదువుకోవాలనడం తప్పని చెప్పాడు. సమాజంలో సహజంగా వృద్ధిలోకి వస్తున్న లేదా రూపొందుతున్న భాషే సరైనదిగా భావించాలనేది కాళోజి అభిప్రాయం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా చేసిన ఉపన్యాసంలో పేర్కొన్నాడు.
‘‘నేటి తెలుగు సాహిత్యం, దాని నిర్మాణానికి ఉపయోగపడుతున్న భాష విషయమై, ఎన్నో తర్జన భర్జనలు జరుగుతున్నవి. భాషలోని శబ్దాలకు, తత్సమమని, తద్భవమని, దేశ్యమని, గ్రామ్యమని కులాలు అంటగట్టి, భావ ప్రకటనకు (అంటే సాహిత్య నిర్మాణానికి) ఫలాన తెగకు చెందిన మాటలే పనికివస్తాయి, ఫలాని తెగకు చెందిన మాటలు పలకటానికి పనికిరావు, వ్రాతకు అసలే తగవు అని సిద్ధాంతీకరించడమే ఈ తగాదాకు మూల కారణం. సంస్కరణ పేరిట వర్ణాంతర వివాహాలను సమ్మతించే మహాశయులు, భాషా ఛాందసంలో మిశ్రమ సమాసాన్ని ఒప్పుకోరు. అన్ని కులాల వారు కలిసి భోజనం చేయడం ఒప్పుకుంటారు. కాని పైన చెప్పిన నాలుగు విధాల మాటల కూర్పుకు ఒప్పుకోరు. భార్య ఒళ్లు, తాతగారి రంగూ, మేనమామ కోపం, చిన్నాయన బుద్ధి ఉన్నవని చెప్పుకొని మురిసిపోయ్యే, పండిత ప్రకాండులు మునిమనమనిలో, ఎటూ పోల్చుకోలేని రూపు చూచి ‘‘ఛీ, ఛీ’’ అన్న మాత్రాన వాడు మునిమనుమడు కాకుండా పోతాడా? రూపంలో ముత్తాత పోలీకులు లేనంత మాత్రాన వాడు మానవుడు కాదంటే అన్యాయం కాదా? తర తరాలలో సంతానం యొక్క రూపం కూడా మారుతూ వుంటుంది. రచనలో వాడిన మాటల రూపు రేఖలెట్లావున్నా ఇబ్బంది లేదు. ముఖ్యమైనది సాహిత్య నిర్మాణశక్తి. అది ప్రకటితం కావడానికి, మాటలేవైనా సాహిత్యం యొక్క విలువ తగ్గదు.’’ (విశాలాంధ్ర, సెప్టెంబర్‌, 1956)
తాను ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఆంధ్ర`తెలంగాణల్లోని భాషలు భిన్నమైనవి ఆ ‘పలుకుబడుల’ భాష అలాగే కొనసాగాలని కాళోజి ఆశించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు తెరవెనుక ఉండి కపిల కాశీపతి లాంటి వారు దాశరథి లాంటి వారిపై ప్రభావం చూపించి రచయితలుగా, రచయితల సంఘంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు సానుకూల వాతావరణాన్ని సృష్టించారు.
‘‘ఆంధ్రావని ఏకమై మహాంధ్ర స్వరూపం ఏర్పడి ఆంధ్రప్రదేశం అవతరించు శుభముహూర్తం సమీపించుచున్నది. ఏ జాతి ఉన్నతికి గాని పురోగమనమునకు గాని ఆ జాతి సాహిత్యం మార్గదర్శకము. అట్టి సాహితీ సంపత్తిలో తెలుగుదేశం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో వాగానుశాసనుడు మొదలు వర్తమాన కాలం వారు తెలుగు రచనా వ్యాసాగం నవ్య రీతులలో నడుసూతనే ఉన్నది. ఆంధ్రులు సామ్రాజ్యములు ఏలిన కాలంలో ఆంధ్రభాషామతల్లిని మహారాజులు పోషించినారు. ఒకనాడు తెనుగుతేట కర్నాట కస్తూరీతో కలిసి దేశభాషలందు తెలుగు లెస్స అన్న బిరుదాన్ని పొందినంది.
ఆ రోజులు మారినవి. ఆరాజులు ఈనాడు లేరు. ప్రజలే భాషాపోషకులు. ఇన్నాళ్లుగా మూడు చెరగులైన ముక్కోటి తెలుగుల సమిష్టి సాహిత్య కృషికి పొలిమేర లాటంకమైనవి. ఈనాడు తెలుగుదేశం ఒక మేరjైునది. ఇట్టి తరుణంలో తెలుగదు సాహిత్య సంపద ఇంటనే గాక బైట కూడా ప్రచారం చేయవలసనిన అవసరమేర్పడినది. అట్టి అవసరాన్ని గర్తించియే ఆంధ్ర సాహిత్యాభిమానులు కొందరు అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు సంస్థాపన చేయ ప్రయత్నాన్ని ప్రారంభించానరు. అలా(ం)టి ప్రయత్నాన్ని ప్రజాభిప్రాయ మాశీర్వదించింది. పత్రికలు బలపరచినవి. తెలంగాణ రచయితల సంఘ వేదికపై ఈ రెండు మూడు దినాలు ఆ ప్రయత్నానికి మరి కొంత బలం చిక్కింది. ఆంధ్ర, హైదరాబాదు ముఖ్యమంత్రులు ఆ ప్రయత్నాన్ని కొనసాగించవలెనని ఉద్ఘాటించారు. తెలంగాణ రచయితల సంఘం కార్యవర్గం ఈ వరకే ఈ ఆశయాన్ని ఆహ్వానించింది. అట్టి సంస్థను రూపొందించిడంలో వివిధ సాహితీ సంస్థల, ప్రసిద్ధ రచయితల, ప్రాంతీయ ప్రభుత్వముల, విశ్వవిద్యాలయముల ప్రాతినిధ్యం ఉండవలెనని ఈ సర్వ సభ్యసమావేశం అభిప్రాయపడుతున్నది. ఈ విషయంలో తగు ప్రయత్నాలు చేయడానికి సంఘాధ్యక్షులకు (కాళోజి నారాయణరావుకు) సర్వాధికారాలు ఇస్తున్నది’’ అంటూ తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షులు దాశరథి కృష్ణమాచార్య తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. (ఆంధ్రప్రభ, సెప్టెంబర్‌, 23, 1856).
కాళోజి నారాయణరావు ఒక సంధి కాలంలో తెలంగాణ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. తెలుగు సాహితీలోకంలో మెజారిటి కవి పండితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆహ్వానించారు. స్వయంగా తాను కూడా అదే ఆలోచనతో ఉన్నారు. అందుకు అనుగుణంగా తన మిత్రుడు వట్టికోట ఆళ్వారుస్వామి సంపాదకత్వంలో ‘ఉదయఘంటలు’ కవిత్వాన్ని ప్రచురించారు. ఇందులో ఇరు ప్రాంతాలకు చెందిన కవులకు స్థానం కల్పించారు. తెలుగువారి ఐక్యతకు సూచీగా ఈ సంకలనం వెలువడిరది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంతో 1969నాటికి ప్రభుత్వాన్ని నిలదీసిన, నిరసించిన వారిలో కాళోజి ముందుభాగంలో ఉన్నాడు. సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణను సంఘం తరపున ఆహ్వానించారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కాళోజి ఒక్కడే సంఘానికి మించి పనిచేసిండు. కాసు బ్రహ్మానందరెడ్డిని మొదలు ఇందిరాగాంధీ వరకు ఎవరినీ వదలకుండా అందరినీ ఎండగట్టిండు.
తొలిదశలో దాశరథి, నారాయణరెడ్డిలతో పాటుగా ఆంుధప్రదేశ్‌ అవతరణను ఆహ్వానించిన కాళోజి నారాయణరావు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరీ ముఖ్యంగా తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అప్పటి వరకున్న భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అందుకే 1959 నాటికే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు సమకూరడం లేదని శాసనసభలోనే చెప్పిండు.
తెలంగాణ రచయితల సంఘం తరపున తొలి దశలో దాశరథి, నారాయణరెడ్డిల రచనలు వెలువడ్డాయి. ఆ తర్వాత పల్లా దుర్గయ్యతో పాటుగా ఆంుధప్రాంతానికి చెందిన పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల రచనలు కూడా సంఘం తరపున ప్రచురితమయ్యాయి. తెలంగాణ రచయితల సంఘం వారు అతి తక్కువ కాలంలో నాగార్జున సాగరం, మహాంధ్రోదయం, పాలవెల్లి, గంగిరెద్దు, ఉపహారం, తెలుగుతీరులు, చిరుగజ్జెలు, జానపద గేయములు, ఉదయఘంటలు తదితర రచనలు వెలువరించారు. ఇవి ఆనాటి యువ సాహితీలోకాన్ని స్ఫూర్తిగా నిలిచాయి. సంఘం తరపున మొదట ‘మంజీర’ పత్రిక కొన్ని సంచికలు వెలువడ్డాయి. ఆ తర్వాత జిల్లాల్లో కూడా కొంత ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆంధ్ప్రదేశ్‌ అవతరణ తర్వాత సంఘం ఆంధ్ర రచయితల సంఘంగా మార్పు చెందడమే గాకుండా ఖండవల్లి లక్ష్మీరంజనం లాంటి వారి చేతికి సంఘం బాధ్యతలు చేపట్టారు. దీంతో అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తెలంగాణ సాహిత్యానికి, ప్రతిభకు అడ్డుకట్ట పడ్డట్టయ్యింది.
తెలంగాణ రచయితల సంఘంకు ఒక రకంగా పాక్షిక కొనసాగింపుగా వరంగల్లులో ‘మిత్రమండలి’ 1959లో ఏర్పాటయ్యింది. మండలి తరపున వివిధ పండితుల సాహీతీ గోష్టులను నిర్వహించారు.
– సంగిశెట్టి శ్రీనివాస్‌
(కాళోజి వర్దంతి సందర్భంగా)

నియ్యత్‌కు నిదర్శనం ‘ముక్త ‘

kaifiyath

‘గతానికి-వర్తమానానికి’ మధ్య వంతెన చరిత్ర. ఈ చరిత్రను ఇన్నేండ్లు ఆధిపత్య భావజాలం ఉన్నోళ్లు రాసిండ్రు. దాంతోటి అండ్ల తప్పులు దొర్లినయి. ఇప్పుడు తప్పులు సరిజేసి నియ్యత్‌గా నిజమైన విషయాల్నే చెప్పాలె. మొత్తం తెలంగాణ చరిత్రలో అందరికి తెలిసిన సంగతులు చాల తక్కువ. ఇగ స్త్రీల విషయానికొస్తే చరిత్రలో, వివక్ష, విస్మరణ రెండూ ఎక్కువే! ఎనుకట ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం కొంత చరిత్రను, జీవితాల్ని రికార్డు చేసింది. ఇప్పుడు ‘మనకు తెలిసిన చరిత్ర’ కనుమరుగు కాకుండా ఉండేందుకు ‘ముక్త’ సంస్థ ‘‘ ‘అనుభవాలు-దృక్పథాలు’ విముక్తి ఉద్యమాల్లో తెలంగాణ స్త్రీలు’’ పేరిట ఒక సంచిక తీసుకొచ్చిండ్రు. తెలంగాణ మహిళల ఉద్యమ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు ఇట్ల తీరొక్క పూలతోటి బతుకమ్మను పేర్చినట్టు విషయాల్ని అమర్చిండ్రు. నిజాయితిగ పన్జేసిండ్రు.

హైదరాబాద్‌ తెహజీబ్‌ని పట్టిస్తూ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో ఇందులో రచనలున్నాయి. ‘ముక్త’ ఎ తెలంగాణ విమెన్స్‌ కలెక్టివ్‌ ` పేరుకు తగ్గట్టుగానే తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారి అనుభవాలను, సాహిత్యాన్ని రికార్డు చేసింది. జైలు డైరీలు పేరుతోటి తొలితరం ఉద్యమకారిణి, చిత్రకారిణి అయిన సంగెం లక్ష్మీబాయమ్మ అనుభవాన్ని, సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న రంగమ్మగారి జ్ఞాపకాన్ని, 1969 ఉద్యమంలో పాల్గొన్న సక్కుబాయి, బి.రమాదేవి, స్వదేశ్‌రాణిల అనుభవాల్ని, ప్రస్తుత ఉద్యమంలో తన పాట, మాట ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విమలక్క జైలు అనుభవాల్ని స్ఫూర్తినిచ్చే విధంగా రికార్డు చేసిండ్రు. ఇందులో బీసీలకు న్యాయమైన వాటా దక్కింది. గతంలో ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి చెప్పినా సంగెం లక్ష్మిబాయమ్మ విస్మరింపబడేది. ఆమె ‘నా జైలు జ్ఞాపకాలు’ పుస్తకంగా వెలువడ్డప్పటికీ ఆ విషయం చాలా తక్కువమందికి తెలుసు. తెలిసినోళ్లు కూడా ఆ విషయాన్ని రికార్డు చేసేందుకు, చెప్పేందుకు ఎనుకముందాడిరడ్రు.  తెలంగాణ బిడ్డ ఆంధ్రాలో చదువుకొని అక్కడి ఉద్యమాల్లో పాల్గొని ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌లతో కలిసి  గడిపిన జైలు జీవితం గురించి స్ఫూర్తిదాయకంగా ఆమె ఇందులో చెప్పిండ్రు.

mukta-1

ఈ సంచికలో (ఎందుకంటే ముక్త భిన్న పత్రిక సీరిస్‌ -1 అని పేర్కొండ్రు) మేరి మాదిగ రాసిన దీర్ఘకవిత ‘పండ్రాయి’ దళిత జీవితాన్ని కళ్లకు గట్టింది. పండ్రాయి సాక్షిగ మాదిగ స్త్రీల పోరాట చరిత్రకు సాన బెట్టింది. ఆవుకూర, ఎంకటపురం తాళ్లు, యాదగిరిగుట్ట ఎడ్ల అంగడి గురించి చెప్పింది. చెప్పుల కుట్టిన చేతులతోనే నిజంగా చరిత్రను ఇంకా చెప్పాలంటే నేను పుట్టినూరు ‘రఘునాథపురం’మాదిగోళ్ల చరిత్రను చెప్పింది. సన్న చెప్పుల మీది ఉంగుటాలు, ముకురాలు, కప్పు, కప్పు మీది తోలు జెడలు, ఎర్ర రంగు పువ్వులు అద్దిన చెప్పులకు అద్దిన చెమట చుక్కల్ని లెక్క గట్టింది. ఈ చెమటలో మాదిగ ఆడోళ్లకూ భాగముందని చెబుతూ

‘చరిత్రల చెప్పులు మొగోల్లే కుట్టలే

రెండు చేతులు కలిస్తేనే

చెప్పుల జత తయ్యారు

మాదిగ ఆడామెను

గంజిలీగ కంటే

హీనంగా తీసి పారేసే మాదిగ మొగోళ్లకి

సమస్త పురుష ప్రపంచానికి సవాల్‌గా

ఇక మా చరిత్రను మేమే తిరగరాస్తం’’ అంటూ కవిత్వమై నినదించింది.

చిందు ఎల్లమ్మ మీద వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత ఈ సంచికకు వన్నె తీసుకొచ్చింది. ఇంకా చెంచుపాట, శ్యామల, కిరణ్‌కుమారి, శ్రీదేవి, రేడియం, గుడిపల్లి నిరంజన్‌ల తెలుగు కవిత్వ ముంది. తస్నీమ్‌ జోహార్‌, నుస్రత్‌ రెహానాల ఉర్దూ కవిత్వం కూడా ఇందులో చోటు చేసుకుంది.

‘బాగోతం ఏడ ఆడ్తె అదే నీ ఊరు

పెంటగడ్డల మీదే నీ నివాసం

బారాబజెకు భాగోతం సురువైతే

భూమి తకతకలెల్లె సిందయ్యి జోకో అంటూ సిగాలు

నీవు గజ్జెలు కట్టినందుకే

భాగోతానికి భాగ్యం దక్కింది

పంచభూతాలు సోకని నేల ఉండొచ్చు

నీ పాటకు వరవసించని మనిషిలేడు

నీ దరువినని జీవిలేదు’’ అంటూ చిందు ఎల్లమ్మకు సుబ్బయ్య నివాళి అర్పించిండు. అలాగే జూపాక సుభద్ర ‘నిస్సాధికారం’, గీతాంజలి ‘ఉయ్యాల’ కతలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సంచికలో ‘కళ’కు సంబంధించి విలువైన వ్యాసాలున్నాయి. గన్‌పార్క్‌లో ‘తెలంగాణ అమరవీరుల’ శిల్పాన్ని మలిచిన ఎక్కా యాదగిరిరావు మీద వ్యాసమే గాకుండా ఆయన స్వయంగా ‘స్వాతంత్య్రానంతర ఆధునిక భారతీయ శిల్పకళ` తెలుగునాట దాని ప్రతిఫలనం’ పేరిట వ్యాసం రాసిండు. అలాగే చేర్యాల నకాషి చిత్రకళ మీద ఆంగ్లంలో కె.విమల, పెంబర్తి ఇత్తడి కళాకృతులపైన ఎస్‌.వాసుదేవ్‌, వెండితెర తొలినాయికల నెలవు హైదరాబాద్‌ పేరిట అలనాటి హైదరాబాద్‌ హీరోయిన్ల గురించి హెచ్‌.రమేశ్‌బాబుల వ్యాసాలు విలువైనవే గాకుండా మన మూలాల్ని పట్టిస్తాయి. ఇంకా శోధన శీర్షికన ఆరు వ్యాసాలున్నాయి. భాష`జాతి పేరిట కె.విమల, చేనేతపై డి.నర్సింహ్మారెడ్డిల వ్యాసాలు ఇందులో భాగమే.

mukta-2

‘చరిత్రను మలుపు తిప్పిన చైతన్య మూర్తులు’ పేరిట కె.విమల రాసిన సంపాదకీయం తెలంగాణ మహిళలు, వారి ఉద్యమాల చరిత్రను రేఖామాత్రంగానే అయినా విలువైన సమాచారాన్ని రికార్డు చేసింది. తమిళ ముస్లిం రచయిత్రి సల్మను పిలిపించి హైదారాబాద్‌లో సమావేశం నిర్వహించడమే గాకుండా గత ఐదేంద్లుగా తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహిస్తున్న పాత్రను, భవిష్యత్‌ తెలంగాణ ఎజెండాను మేనిఫెస్టో రూపంగానూ, జ్వలిత, అనిశెట్టి రజిత, అఖిలేశ్వరి రామాగౌడ్‌, నీరా కిషోర్‌ల రచనల ద్వారా వెల్లడిరచారు. ఈ కలెక్టివ్‌ వర్క్‌ని బాధ్యతగా నిర్వహించిన ముక్త బృందానికి ముందుగా అభినందనలు.  ఇందులో అచ్చయిన రమాదేవి, సత్యా సూఫి, అమిల, క్రాంతి,భార్గవి, నాగమణి, సుభాషిణిల బొమ్మలు/పెయింటింగ్స్‌ వారి ప్రతిభను పట్టిస్తున్నయి. వీటన్నింటికి మించి 1969 ఉద్యమం నాటి మహిళల ర్యాలీ (హైదరాబాద్‌) ఫోటోని కవర్‌పేజిగా, 1932 నాటి అజాంజాహి మిల్స్‌ (వరంగల్‌)లో పనిచేస్తున్న మహిళల చిత్రాన్ని బ్యాక్‌కవర్‌గా వేయడం సంచిక విలువను మరింతగా పెంచింది.

ఇంత వరకు మహిళలు వెలువరించిన ఏ సంచికల్లో లేని సామాజిక న్యాయం రచయితలు, రచనల ఎంపికలో బలంగా కనిపించింది. ఈ సంచికకు ఆ ఎంపిక వన్నె తెచ్చింది. దళిత, బీసి, ముస్లిం మహిళల గురించి ఇంత లోతుగా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుతో పాటుగా హిందీలో ‘మేరా తెలంగాణ’ వ్యాసం రాసిన స్వదేశ్‌ రాణి, ఉర్దూలో సాదిఖా నవాబ్‌ సాహెర్‌  కవిత కూడా ఇందులో చోటు చేసుకోవడమంటే తెలంగాణలో నివసించే ప్రజలందరికీ ఎంతో కొంత మేరకు ప్రాతినిధ్యం కల్పించడంగా భావించాలి. తెలుగేతరులు కూడా హైదరాబాద్‌ మాది అని గర్వంగా చెప్పుకోడానికి ఇది ఉపయోగ పడుతుంది.

ఈ సంచికలో వెలువడ్డ సుమిత్రాబాయి వ్యాసం గతంలో ఇల్లిందల సరస్వతీదేవి వెలువరించిన ‘తేజోమూర్తులు’ పుస్తకంలోనిది. అయితే వ్యాసం ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇచ్చినట్లయితే గతంలో ఆ విషయం వెలుగులోకి తెచ్చినవారిని గౌరవించినట్లవుతుంది. ప్రధానంగా మహిళల చేతే వ్యాసాలు రాయించి వెలువరించి ఉండాల్సింది. యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనడమే గాకుండా పత్రికలు కూడా వెలువరించారు. వీరిని కూడా ఇందులో జోడిరచుకున్నట్లయితే సమగ్రత వచ్చేది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణపై వివిధ రంగాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసిన వారున్నారు. వారి అనుభవాన్ని పత్రిక ఉపయోగించుకోలేదు. మధురాలు, లంబాడీలు, కోయలకు సంబంధించిన సాంస్కృతిక, ఉద్యమ జీవితాలు కూడా ఇందులో లేవు. అయితే సిరీస్‌లో ఇది మొదటి భాగం అని పేర్కొన్నారు. రాబోయే సంచికల్లో మరింత తెలంగాణ మహిళా ఉద్యమాల గురించి రికార్డు కావాల్సిన అవసరముంది.

1890వ దశకంలోనే హైదరాబాద్‌ ప్రభుత్వం తరపున ‘మలేరియా కమీషన్‌’ బృంద సభ్యురాలిగా, ఇంగ్లండ్‌ పర్యటించడమే గాకుండా అక్కడ వైద్య విద్యనభ్యసించిన దేశంలోనే తొలి అనస్తీషియన్‌ రూపాబాయి ఫర్దూంజీ గురించి, తెలంగాణలోని అన్ని సంస్థానాల్లో మహిళలు ఎప్పుడో ఒకప్పుడు పాలనా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాలతో బాటుగా, 1904 నాటికే మహబూబియా పాఠశాలలో ముస్లిం బాలికలకు ఇంగ్లీషు విద్య బోధించిన కళాశాల ప్రిన్సిపాల్‌ గురించి, ముంబాయిలో రచయిత్రిగా స్థిరపడ్డ బిల్కీస్‌ లతీఫ్‌, ఢల్లీిలో జర్నలిస్టుగా స్థిరపడ్డ హనీస్‌ జంగ్‌, తొలితరం డాక్టర్‌, రచయిత్రి, ఉద్యమకారిణి టి. వరలక్ష్మమ్మ గురించీ, గోలకొండ కవుల సంచికలో చోటు చేసుకున్న కవయిత్రుల గురించీ వచ్చే సంచికల్లో రచనలు చేసి ప్రస్తుత లోటుని భర్తీ చేసుకోవాలి. ముఖ్యంగా సాయుధ పోరాటంలోనూ, 1969-70ల ఉద్యమ సందర్భంలోనూ మహిళల పాత్ర గురించి ఇప్పటికీ సమగ్రమైన అంచనా లేదు. 69-70 ఉద్యమ కాలంలో అసెంబ్లీలో ఈశ్వరీబాయి, సదాలక్ష్మిలు చేసిన ‘ఫైర్‌బ్రాండ్‌’ ఉపన్యాసాలను సేకరించి పుస్తకాలుగా వేయాలి. సదాలక్ష్మి చిత్రకారిణిగా కూడా ప్రసిద్ధి. ఆమె చిత్రాలు సేకరించి అచ్చేయాలి. ఇది ప్రారంభం. ఈ పరంపర సదా కొనసాగాలి. ఈ పనిని ముక్త టీం చేయగలదు. ఎందుకంటే ఈ టీం సమన్వయంతో, సమైక్యంగా పనిచేస్తోంది. ఈ సమన్వయం సాధించడంలో ప్రధాన బాధ్యురాలు కె.విమలకు అభినందనలు.

                                                                                                                                                               -సంగిశెట్టి శ్రీనివాస్‌

 sangisetti- bharath bhushan photo

 

పాటను తూటాగా మలిచిన సుద్దాల

kaifiyath

sangisetti- bharath bhushan photoఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ సమరంలోనూ, తర్వాతి ప్రజా పోరాటాల్లోనూ, నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ ‘దూమ్‌ ధామ్‌’ చేసి ప్రజల గొంతులో నిలిచిపోయిన ఆయుధం పాట. మౌఖిక సంప్రదాయంలో మాట, ముచ్చట, ఉపన్యాసం ఏవీ చేయలేని పని పాట చేసింది. ఈ పాటతో ఉద్యమాలను పదునెక్కించడమే గాకుండా పోరాట స్ఫూర్తిని ప్రజల హృదయాల్లో నింపింది సుద్దాల హనుమంతు. ఆనాటి ఉద్యమంలో పాటను రాసి, బాణిలు కూర్చి, పాడిన వారిలో సుద్దాల హనుమంతు అగ్రగణ్యులు. ఆయనతో పాటు తిరునగరి రామాంజనేయులు, రాజారాం, యాదగిరి లాంటి ఎందరో వాగ్గేయకారులు తమ పాటలను కైగట్టిండ్రు. బండి యాదగిరి అయితే పాట పాడుతూ పాడుతూనే ‘రాజ్యం’ తుపాకి తూటాలకు అమరుడయ్యిండు. నేటి తరం పాటకవులు/గాయకవులు/గాయకులు-కవులకు దక్కిన ఖ్యాతి గౌరవం వారికి దక్కలేదు. తెలంగాణలో పాటను ప్రజల వద్దకు, ప్రజల్ని ఉద్యమాల దారి వైపు మళ్లించి తన జీవిత కాలంలో ఎలాంటి గౌరవానికి నోచుకోకుండా అంతర్ధానమైన మనీషి సుద్దాల హనుమంతు.

ఆర్యసమాజమిచ్చిన ‘చైతన్యం’తో ఆంధ్రమహాసభ ఉద్యమాల్లో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒకవైపు ఆయుధం ఎక్కుపెట్టి, మరోవైపు  కలాన్ని కదంతొక్కించి, గళాన్ని వినిపించిన యోధుడు సుద్దాల హనుమంతు. గజ్జెగట్టి జానపద కళా రూపాలను జనజాగృతికి వినియోగించాడు. బుర్రకథల ద్వారా జనాన్ని ఉర్రూత లూగించాడు. పాటను తూటాగా చేసి దోపిడి వ్యవస్థపై పేల్చిన ప్రజాకవి. ప్రజల పదాలనే పాటలుగా మలిచి వారి బాణిలోనే వాటికి శాశ్వతత్వాన్ని చేకూర్చిన ప్రజ్ఞాశాలి. ప్రజాకళల్లోనే పోరాట సాహిత్యాన్ని ప్రచారం చేసి ఉద్యమానికి ఊపిరి పోసిండు. కళను ప్రజలకు అంకితమిచ్చి తాను నిశ్శబ్దంగా, నిషీధిలోకి జారుకుండు. వందల సంఖ్యలో వెలువరించిన గేయాలు, పాటలు తన జీవిత కాలంలో పుస్తకంగా అచ్చుకు నోచుకోలేదు. తెలంగాణ సాయుధ పోరాట సమరంలో కళా రంగంలో ముందుండి ప్రజలను పోరాట పథం వైపు నడిపించిన మార్గదర్శి. మాభూమి సినిమా ద్వారా ‘పల్లెటూరి పిల్లగాడా, పసుల గాచె మొనగాడ’ పాటతో ఎనుకటి తెలంగాణను సాక్షాత్కరించిండు.

తెలంగాణలో ఆంధ్రమహాసభకన్నా ముందు ప్రజల్లో చైతన్య జ్యోతులు వెలిగించింది ఆర్యసమాజం. కాళోజి, పి.వి.నరసింహారావు, కేశవరావు కోరట్కర్‌, వినాయకరావు విద్యాలంకార్‌ మొదలైన వారంతా మొదట ఆర్యసమాజీయులే. ఈ ఆర్యసమాజ ప్రభావం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా బాగానే ఉండిరది. హైదరాబాద్‌లో నిజాం నవాబుల ఆస్థాన వైద్యుడిగా పనిచేసిన హకీమ్‌ నారాయణదాసు తెలంగాణలో పద్మశాలీయులు ఆయుర్వేద వైద్యాన్ని వృత్తిగా స్వీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈయన ప్రోత్సాహంతోనే తెలంగాణలోని దాదాపు ప్రతి గ్రామంలో పద్మశాలీయులు 1956కి ముందు ఆయుర్వేద వైద్యులుగా ఉండేవారు. అలాగే నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామానికి చెందిన హనుమంతు తండ్రి కూడా ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు. హనుమంతు తర్వాతి కాలంలో భువనగిరికి దగ్గరలోని సుద్దాల గ్రామంలో స్థిరపడ్డాడు. చిన్ననాటి నుంచే హరికథలు, పాటలు, నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టం. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరిండు. మరోవైపు ప్రాణాయామం, యోగాభ్యాసాలు కూడా అలవాటు చేసుకుండు. అలాగే భువనగిరిలో ఉండే ఉత్పల వెంకటరావు అచలబోధ ఒక వైపు, ఆర్యసమాజ బోధనలు మరోవైపు చేస్తూ ఉండేవాడు. ఉత్పల శిష్యుడిగా మారిన హనుమంతు ఆర్యసమాజ ప్రభావానికి లోనయి దయానంద సరస్వతి జీవిత చరిత్ర, సత్యార్థ ప్రకాశ మొదలైన గ్రంథాలు చదువుకున్నాడు. ఆర్యసమాజ్వారు నిజాం ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం బాగా నచ్చింది. దాంతో తాను చిన్నప్పటి నుంచీ చూస్తూ వస్తున్న దుర్మార్గాలపై తిరగబడేందుకు గుండె ధైర్యాన్నిచ్చింది. తన చిన్నతనంలో ఊర్లో భూస్వాములు, ప్రభుత్వాధికారులు వెనుకబడిన వర్గాలు, మాల, మాదిగల చేత నిర్బంధ వెట్టిని చేయించడం కండ్లార చూసిన వాడు కావడంతో వారి పట్ల సానుభూతితో, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, దళితులకు అండగా నిలిచాడు. విధవా వివాహాలను కూడా జరిపించిండు. ఆర్యసమాజం ప్రభావంతో తాను స్వయంగా ఒక దళిత యువతిని పెండ్లి చేసుకుండు. రెండేండ్లు దళితులకు చదువు చెబుతూ వరంగల్లులో గడిపిండు. అయితే హనుమంతు సామాజిక, రాజకీయ రంగాల్లో ఉండి కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోవడం, సమాజం నుంచి సూటి పోటీ మాటలు భరించలేక ఆమె దూరమయింది. కొన్ని రోజులు హైదరాబాద్లోని బుద్వేల్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో అటెండర్ఉద్యోగం చేసిండు.

untitled

కాని స్వతంత్ర భావాలు గల హనుమంతుకు ఆ ఉద్యోగం నచ్చక దానికి రాజినామా ఇచ్చిండు. ఆధ్యాత్మికం మీద హనుమంతుకు ఎక్కువ మక్కువుండేది. మిత్రుడు ఆంజనేయులుతో కలిసి మన్నెంకొండలో కొన్ని రోజులు తపస్సు చేసిండు. భజనలు, కీర్తనల ద్వారా భక్తి రసాన్ని పంచిండు.

ఆర్యసమాజమిచ్చిన చైతన్యంతోనే 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాల్లో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరించిండు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండెం వాసుదేవ్‌ లాంటి పెద్దల ఉపన్యాసాలతో ప్రభావితుడై తోటి ప్రజల బాగోగుల కోసం ఆయుధం చేతపట్టిండు. ఉద్యమారంభ దశలో కార్యకర్తగా సుద్దాల చుట్టుపక్కల గ్రామాల్లో సంఘాలు స్థాపించి, సభలు సమావేశాలు నిర్వహించేవారు. ఒక చేత్తో ఎర్రజెండా మరో చేత్తో కాంగ్రెస్‌ జండాలు ఊరూరా ఎగరేసేవారు. క్రమంగా ఆంధ్రమహాసభ ఆధిపత్యం మొత్తం కమ్యూనిస్టుల అధీనంలోకి వెళ్లడంతో సుద్దాల కూడా కమ్యూనిస్టుగా మారాడు. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీ కూడా ఆయనకు కళారంగాన్నే అప్పగించింది. అప్పటి నుంచి  ప్రజలకు సుపరిచితమైన ప్రక్రియల్లో ప్రదర్శనలు ప్రారంభించాడు. విచిత్ర వేషాలు, ‘గొల్లసుద్దులు’, ‘లత్కోరుసాబ్‌’, ‘బుడబుక్కలు’, ‘ఫకీరు వేషం’, ‘సాధువు’ మొదలైన కళా రూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని, భావాల్ని వ్యక్తీకరించాడు. ప్రజారంజకమైన బాణీల్లో పాటలు కైగట్టి జనాన్ని ఉర్రూతలూగించాడు. సమస్యల్ని అన్ని కోణాల్నుంచి పరిశీలించి ప్రజల హృదయాలకు అత్తుకునేలా, విన్న వారు గుత్పందుకునేలా ఆయన పాటలుండేవి. ఎవరో రాసిన పాటలకన్నా స్థానిక  అవసరాన్ని బట్టి అందుకు అనుగుణంగా మనమే పాటలు రాసి దాన్ని ప్రజలకు హత్తుకునే ప్రక్రియల్లో ప్రదర్శించడం మేళని తలచి ఆచరణలో పెట్టిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల. వివిధ కళా రూపాల్లో ఎంతో మందికి శిక్షణనిచ్చాడు. వారిని సాంస్కృతిక దళాలుగా ఏర్పాటు చేసిండు. ‘బండెన్క బండి కట్టి’ పాట రచయిత యాదగిరి కూడా హనుమంతు బృందంలోని వాడే. సుద్దాల గ్రామసంఘం కార్యదర్శిగా పనిచేస్తూ గంగుల శాయిరెడ్డి, గవ్వా సోదరులు, దాశరథిల గేయాల్ని పాడుకునేవాడు. ఈ దశలో భూమికొలతల్లో భూస్వాములు చేస్తున్న మోసాన్ని గ్రహించి క్షేత్రగణితాన్ని నేర్చుకొని ఊళ్లలో భూమికొలిచే పనులు తానే చేపట్టే వాడు. దీంతో అప్పటి వరకు అన్యాయానికి గురైన పేద వర్గాలకు హనుమంతు న్యాయదేవతలా కనిపించాడు.

గ్రామం నుంచి సాంస్కృతిక ప్రదర్శనలిచ్చేందుకు వివిధ ప్రదేశాలు తిరగాల్సి రావడం, ఒక్కోసారి ప్రదర్శనకు కాపలగా సాయుధ దళం పనిచేసేది. దళాలు కూడా చేయలేని పనిని తన కలం, గళం ద్వారా సుద్దాల చేసేవాడు. ఈ దశలో హనుమంతుకు ‘ఎర్రబోళ్లు’ అడవిలో సాయుధ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి గన్నూ, పెన్నూ రెండింటి ద్వారా ప్రజా యుద్ధంలో నిలిచిండు. 1948లో హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌ తర్వాత అనారోగ్య కారణాల వల్ల బొంబాయిలో కొద్దికాలం గడిపిండు. తిరిగి 1952 ఎన్నికల ముందు తెలంగాణకు చేరుకున్న హనుమంతు తమ నియోజకవర్గానికే చెందిన నాయకుడు రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు  గెలుపు కోసం ఊరూరా సభలు, సమావేశాలు నిర్వహించి తన పాటల ద్వారా ఎన్నికల ప్రచారం చేసిండు. రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికయిన విషయం తెలిసిందే. 1952 తర్వాత కేవలం ఎన్నికల పాటలకే పరిమితమై మునుపటి లాగా గొప్ప సాహిత్యాన్ని సృజించ లేక పోయాడు. దేశంలో అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కూడు, గూడు దక్కాలని, అలాంటి వ్యవస్థ కోసం ప్రజాకవులు, ఉద్యమకారులు కదం తొక్కాలని ఆయన అభిప్రాయ పడేవారు.

హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ, రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్‌ వేయ్‌ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్‌ వారు ప్రచురించిండ్రు. వాటినిప్పుడు క్యాసెట్‌ రూపంలో తీసుకొచ్చినట్లయితే అందరికీ అందుబాటులోకి ఆయన పాటలు రావడమే గాకుండా, 1945-50ల నాటి పోరాటాన్ని కూడా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. తెలంగాణ కళారూపాలకు జీవంపోసి సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారులు వేసిన హనుమంతు, 1982 అక్టోబర్‌ 10న క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ‘సుద్దాల’ గ్రామంలో తుది శ్వాస విడిచాడు. అప్పుడాయన వయసు సుమారు 74 ఏండ్లు.

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు తాను సంకలనం చేసిన ‘సుద్దాల హనుమంతు పాటలు’ పుస్తకంలో పేర్కొన్నాడు. ‘‘ప్రజలు కవిగా గుర్తించినా పార్టీ గుర్తించలేదని’ సుద్దాల ఒక ఇంటర్వ్యూలో వాపోయిండు. ఈ మాటలు నూటికి నూరు పాళ్లు నిజం. తన పాటలు, గానం ద్వారా తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఊపిరులూదిన సుద్దాలను ఆ తర్వాత ‘విశాలాంధ్ర వాదులు’ విస్మరించారు. అభ్యుదయ రచయితల సంఘం వారికి ఆయన బ్రతికున్నప్పుడు జీవిత చరిత్ర రాయడానికి గానీ, ఆయన రచనలు సేకరించి ప్రచురించాలనే సోయి గానీ లేదు. సుద్దాల తెలంగాణ వాడయినందుకు మాత్రమే వారు ఆయన రచనలపై శ్రద్ధపెట్టలేదని నేటి తరం తెలంగాణ వాదులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికీ ఆయన లేఖలు, అసంపూర్ణ రచనలు, అముద్రిత రచనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన రచనలన్నీ సంకలనంగా తీసుకు రావాల్సిన అవసరముంది. వివిధ విశ్వవిద్యాలయాల వారు ఆయనపై పరిశోధనకు ఉత్సాహం చూపిస్తున్నా అవి ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నాయి. అలా కాకుండా ఆయన సమగ్ర రచనలు-జీవితంపై సమర్ధులైన వారు పరిశోధన చేయాల్సిన అవసరముంది. అలాగే తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన పేరిట ఒక పీఠాన్ని ఏర్పాటు చేయించేందుకు తెలం‘గానా’భిమానులు, సుద్దాల ఆత్మీయులు అందరూ వత్తిడి తీసుకురావాలి.

(అక్టోబర్‌ 10, సుద్దాల 32వ వర్ధంతి)

 

-సంగిశెట్టి శ్రీనివాస్‌

‘‘……… సుద్దాల హనుమంతుగారికి నాటి అరసంలో గాని, ప్రజానాట్యమండలిలో గాని కవిగా అంత గుర్తింపు రాకపోయినా తన కలాన్ని, గళాన్ని నడిపించాడు. పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా తన చుట్టూ ఉన్న ప్రజల అవసరాల కోసం మాత్రమే సాహిత్యాన్ని సృష్టించాడు’’. అని సుద్దాల హనుమంతు రచనలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌ జయధీర్‌

తెలంగాణ తెగువ కొండా లక్ష్మణ్‌

 

sangisetti- bharath bhushan photokonda laxman

ఎట్టకేలకు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుంటోంది. తొక్కి వేయబడ్డ గొంతుకలు ఇప్పుడు సరాయించుకొని మా వాటా మాకు దక్కాలని నినదిస్తున్నాయి. రాజుల చరిత్ర, వాళ్లెక్కిన గద్దెల చరిత్ర మాకొద్దంటుంది. అభివృద్ధి నుంచి ఆమడ దూరం నెట్టేయబడ్డ, అణచబడ్డ జాతుల కోసం, మార్జినలైజ్‌డ్‌ వర్గం కోసం, వాళ్లకు రెండు పూటల పట్టెడన్నం కోసం, ఇంత ఆత్మగౌరవం కోసం కొసదాకా కొట్లాడిన వారి జీవితం ఇవాళ చరిత్రకెక్కాలి. పాఠ్యపుస్తకాలై పరిఢవిల్లాలి అని నవ తెలంగాణ కోరుకుంటుంది. చరిత్ర సృష్టించడమే గాకుండా ప్రత్యేక తెలంగాణ సౌధానికి పునాదులేసిన వారిని విస్మరించరాదు. సౌధాలు పైకెంత సుందరంగా ఉన్నా వాటి మనుగడ మాత్రం అందుకు వేసిన పునాదులపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి బలమైన పునాది వేసిన మహనీయుడు, అణచబడ్డవారి గొంతుక, తెలంగాణ ఉద్యమ బావుటా, ఉద్యమకారుల అండ కొండా లక్ష్మణ్‌ బాపూజి. ఈ సెప్టెంబర్‌ 27 ఆయన శతజయంతి సంవత్సరం ఆరంభం కానుంది.

75 ఏండ్ల సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండి వారి అభ్యున్నతే తన అభ్యున్నతిగా భావించి పనిచేసిన కార్యశీలి బాపూజీ. 1940లో న్యాయవృత్తి చేపట్టినది మొదలు చివరి శ్వాస వరకూ పీడితుల పక్షాన, పేదల పక్షాన నిలబడి ఆనాటి ఏడో నిజాం ఉస్మానలీఖాన్‌ మొదలు ఆధిపత్య భావజాలంతో, అహంకారపూరితంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి వరకూ ఎవరినీ వదిలి పెట్టలేదు. తన, పరాయి బేధం లేకుండా అన్యాయాన్నెదిరించాడు. దౌర్జన్యాలను ప్రశ్నించిండు.

నిజాం ‘నిరంకుశ’ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అనుయాయులు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మూడో మార్గంగా నిజాంపై బాంబుదాడి చేసి రాచరికానికి చరమ గీతం పాడాలని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యూహం పన్నిండు. నారాయణరావు పవార్‌, జగదీష్‌ ఆర్య, పాలమాకుల గంగారాం, జి.నారాయణస్వామి, బాలకిషన్‌లతో కలిసి పథకాన్ని రచించిండు. 1947 డిసెంబర్‌ నాలుగు నాడు నిజాం కారుపై బాంబుని నారాయణరావు పవార్‌ విసిరిండు. దీనికంతటికి మూలకారకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజి. క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజా జీవనం ప్రారంభించిన బాపూజీ 1945లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి అడ్వకేట్‌గా రాణిస్తూనే ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యిండు. హైదరాబాద్‌ అసెంబ్లీకి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు. ముల్కీ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడిరడు. ఆ తర్వాత డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిండు.

kaifiyath

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడి ఉన్నట్లయితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడమే గాకుండా అందరికన్నా ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బావుటై ప్రతి గ్రామంలో రెపరెపలాడిరడు. ప్రజల్ని చైతన్య పరిచిండు. 1969లో ‘తెలంగాణ ముచ్చట్లు’ పేరిట ఇంగ్లీషు తెలుగు భాషల్లో పుస్తకాన్ని రాయడమే గాకుండా, ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చిండు. తెలంగాణ ప్రజాసమితిలో ప్రముఖ పాత్ర పోషించిండు. చెన్నారెడ్డి, సదాలక్ష్మి, జి.వెంకటస్వామి తదితరులతో కలిసి ఉద్యమాన్ని నడిపించాడు. ఆనాటి ఉద్యమ కాలంలో ప్రతి రోజు బాపూజీ ఉద్యమ కార్యాచరణ పత్రికల ఫ్రంట్‌ పేజి శీర్షికలయ్యాయి. 1969 మొదలు కన్ను మూసేవరకూ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిండు. ప్రత్యేక తెలంగాణను కండ్ల సూడకుండనే 2012లో కన్ను మూసిండు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా బాపూజీ కీలక పాత్ర పోషించాడు. 90 యేండ్లు దాటిన వయసులో కూడా అటు ఢల్లీి మొదలు ఇటు తెలంగాణలో గల్లీల వరకు గ్రామస్థాయి కార్యకర్త మొదలు జాతీయ స్థాయి నాయకుల వరకు ఎంతో మందితో కలిసి పనిచేసిండు. కేసిఆర్‌, గద్దర్‌, మందకృష్ణ, విమలక్క, బెల్లయ నాయక్‌, యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ జాక్‌లు, సకల జనులు, సబ్బండ వర్గాలతోటి, తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికీ కొండంత అండగా నిలబడిరడు. ఒకదశలో మందకృష్ణ మాదిగ బహుజన ముఖ్యమంత్రిగా బాపూజీని ప్రతిపాదించిండు. అందుకు అందరు సహకరించాలని ‘రాజకీయ’ డిమాండ్‌ చేసిండు. 2009 డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పడంపై ఢల్లీిలో డిసెంబర్‌ చలిలో దీక్షకు దిగి కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వంలో కదలిక తీసుకొచ్చిండు. కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌ని సైతం ఇంటికి పిలిచి తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షపై ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేసిండు. ఇవ్వాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బహుజనుల్లోకి చొచ్చుకు పోవడానికి, చైతన్యం పొందడానికి బాపూజీ కార్యాచరణే ప్రధాన కారణం. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన నిస్వార్థుడు.

konda-2కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు తన ‘జలదృశ్యం’ను వేదికగా చేసిండు. అంటే 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే బాపూజీ ఇంట్లో. టీఆర్‌ఎస్‌ పార్టీకి ‘జలదృశ్యం’ను వేదికగా చేసినందుకుగాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా అందులో నుంచి బాపూజీని ఖాళీ చేయించాడు. వృద్ధాప్యంలో కిరాయి ఇండ్లల్లో ఉండాల్సిన దురవస్థ ఏర్పడిరది.

తెలంగాణ కోసం సర్వం ధారబోసిన బాపూజీ అటు సహకార రంగంలోనూ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి పేరిట సామాజిక న్యాయం కోసం, మండల్‌ కమీషన్‌ అమలు కోసం, నేతన్నల ఆకలి చావుల నివారణ కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమాలు నడిపిన ధీశాలి. బాపూజీ అనేది కొండా లక్ష్మణ్‌ తండ్రి పేరు. అయితే తన గాంధేయవాద ఆచరణతో, ఆహార్యంతో నిజమైన ‘తెలంగాణ గాంధి’గా నిలిచిండు.

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వమే ఈయేడాది మొత్తం ‘శత జయంతి’ ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఆయన జీవిత చరిత్రను సాధికారికంగా రాయించి ప్రకటించాలి. 25 యేండ్లు శాసనసభ్యుడిగా, డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా ఉండి తెలంగాణ జనసామాన్యానికి సేవ చేసిన బాపూజీ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలి. ఆయన నివసించిన ‘జలదృశ్యం’లో బీసి స్టడీ సెంటర్‌ని ఏర్పాటు చేసి బహుజన ఐఎఎస్‌, ఐపిఎస్‌లను తయారు చేసేందుకు శిక్షణ నిప్పించాలి. ఇదేదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించుకునే వరకు నిరంతర ప్రయత్నం సాగాలి. ఈ స్టడీ సెంటర్‌కు తగినన్ని నిధులు కేటాయించి నిజాయితీ గల ఐఎఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 27ని ‘బీసి సాధికారత’ దినంగా ప్రకటించి అన్ని రంగాల్లో బీసిలకు జనాభా దామాషాలో వాటా దక్కేందుకు, అందుకు చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ‘బీసి సబ్‌ప్లాన్‌’ని ప్రకటించి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సబ్‌ప్లాన్‌ సాధన కోసం అన్ని వర్గాల వారు ఐక్యంగా కృషి చేయాలి. బాపూజీ కలలుగన్న సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలందరికీ దక్కడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

ఐలమ్మని మరిచిపోతే క్షమించదు తెలంగాణా!

kaifiyath

sangisetti- bharath bhushan photo

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ. 40 వేల ఎకరాల విసునూరు దేశ్‌ముఖ్‌ రేపాక వేంకట రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఏమాత్రం సొంత భూ వసతి లేని ఐలమ్మ 40 ఊర్లపై అజమాయిషీ చలాయించే ఆసామి వెన్నులో వణుకు పుట్టించింది. 1942లో విసునూరులో దేశ్‌ముఖ్‌ హైదరాబాద్‌లో తప్ప తెలంగాణలో మరెక్కడా లేని విధంగా అప్పుడే రెండు లక్షల రూపాయలు వెచ్చించి అధునాతనమైన భవంతిని / గడీని కట్టించిండు. దీనికి అప్పటి హైదరాబాద్‌ ఇంజనీర్‌ వల్లూరి బసవరాజు సూపర్‌వైజర్‌గా వ్యవహరించాడంటే ఆ భవన ప్రాధాన్యతను, ఆయన ఆర్థిక స్థితిని అంచనా వేయొచ్చు. ఈ వల్లూరి బసవరాజు ఆంధ్రమహాసభల్లో పాల్గొనడమే గాకుండా హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశాడు. అలాంటి విసునూరు దేశ్‌ముఖ్‌ని ఎదిరించి నిలిచింది. ఈమె కుటుంబ సభ్యులు ‘సంఘం’ (ఆంధ్రమహాసభ` కమ్యూనిస్టులు)లో ప్రధాన బాధ్యులుగా ఉండేవారు. దీంతో వారితో మాట్లాడేందుకు వచ్చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.సుబ్బారావులను చంపడానికి విసునూరు గుండాలు విఫల యత్నం చేసిండ్రు. వాళ్ల ప్రయత్న విఫలం కావడం కూడా ఐలమ్మ మీద మరింత పగ పెంచుకోవడానికి కారణమయింది.

1944లో భువనగిరి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజాచైతన్యానికి పటిష్ట పునాదులు పడ్డ నాటి నుంచి 1946 జూలై నాలుగున దొడ్డికొమురయ్య (కడవెండి) అమరత్వం వరకు అప్పటి నల్లగొండ జిల్లా లోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఉద్యమ దివిటీలయ్యాయి. పాలకుర్తి, విసునూరు, కడవెండి, కామారెడ్డి గూడెం, దేవరుప్పలలు పోరాట కేంద్రాలుగా విలసిల్లాయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు, సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథ చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్‌ గుండాలు మిస్కీన్‌ అలీ, గుమాస్త, అబ్బాస్‌ అలీ, వుత్తాలం రామిరెడ్డి, వనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తప్పతాగిఉన్న గుండాలకు తగిన శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్‌ ప్రేరణతో పోలీసులు వనమాల వెంకడిపై హత్యాయత్నం చేసిండ్రనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరి కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు. జనగామ మున్సిఫ్‌ కోర్టు, మెదక్‌ సెషన్స్‌ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న 12మందీ ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలుకు కూడా నోచుకోలేదు.

chakali ilamma

ఇదే అదనుగా గ్రహించి విసునూరు దేశ్‌ముఖ్‌ ఐలమ్మ పంటని స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడవెండి, సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు కాపలాగా నిలిచారు. మూడ్నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికి ఊరోళ్లందరి నుంచి బువ్వడుక్కొచ్చి పెట్టింది. అయితే వీళ్లు కాపాల మానుకున్న వెంటనే దొర గుండాలొచ్చిండ్రు. ‘‘..యింటికి నిప్పువెట్టిండ్రు. యేదుం సద్దలు వోస్కపోయిండ్రు. యెనుమందుం పెసర్లు వోస్క పోయిండ్రు. నువ్వులు గానుగ్గట్టించుకుంటమని తెచ్చి పోసుకున్న నువ్వులు వోస్క పోయిండ్రు. యిట్లనే మెరుక… నువ్వులు వోసుక పోయిండ్రు. యిగ నేతి పట్వలైతె, వాల్లక్కన్నే పోయిండ్రు గద పటువలు యింతింత పటువలు పక్కున పల్లగొట్టిండ్రు. గిట్లనే మెరుక. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. తినుకుంట తీస్కపోయిండ్రు. పెల్లలకు పెల్లలే తీస్కపోయిండ్రు. బండ్లుగట్టించి అవి. వోస్క పోయిండ్రు. వూల్లె యింటికి నిప్పువెట్టిండ్రు’’. అని తన బాధంతా ‘స్త్రీ శక్తి సంఘటన’ కార్యకర్తలతో చెప్పుకుంది. ఈ విషయాలన్నీ మనకు తెలియన మనచరిత్ర పుస్తకంలో రికార్డయ్యాయి.

ఐలమ్మకు అండగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, నల్లు ప్రతాపరెడ్డి, కె. రామచంద్రారెడ్డిలు తమ దళాలతో సహా విసునూరులో మకాం వేసిండ్రు. తర్వాతి కాలంలో ఈ నాయకుల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌, విసునూరు దొర గడీ కూడా అయిన భవనంలో అమానుషంగా హింసించారు. సహచరుల అరెస్టు వార్త తెలుసుకొని విసునూరుకు వస్తున్న ఆరుట్ల రామచంద్రారెడ్డిపై గుండాలు దాడిచేసి, బట్టలు కూడా గుంజుక పోయిండ్రు. రామచంద్రారెడ్డి బమ్మెర గ్రామం పోయి నర్సింగరావు సహాయంతో బయటపడిరడ్రు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో రావి నారాయణరెడ్డి అన్ని వివరాలతో డైరెక్టర్‌ జనరల్‌ అండర్సన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ‘పాలకుర్తి’ సంఘటన మొత్తం సాయుధ పోరాటంలో అనేక కొత్త ఎత్తుగడలకు, వ్యూహాలకు కారణమయింది. దీనికంతటికీ కేంద్ర బిందువు ఐలమ్మ. ఆమె పోరాటం, త్యాగం.

“ఐలమ్మా, ..ఐ లవ్ యూ…” ఐలమ్మతో కొత్తతరం ప్రతినిధి, చిత్రకారిణి “సెలవు” (ఫోటో: కందుకూరి రమేష్ బాబు)

తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతిరూపంగా నిలిచిన మట్టిమనిషి, మొక్కవోని ధైర్యంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్న సాహసి చిట్యాల ఐలమ్మ. భూమికోసం, భుక్తి కోసం, భూస్వాముల, దొరల పీడనల నుంచి విముక్తి కోసం ఐలమ్మ కుటుంబం మొత్తం రక్తం ధారవోసింది. తాను, తన భర్త, కొడుకులు కష్టపడి పండిరచిన పంటను విసునూరు దేశ్‌మఖ్‌ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో అడ్డుకుంది. తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్‌ముఖ్‌ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు.

ఇది గిట్టని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ ఐలమ్మ భూమిపై కన్నేసి వాటిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకుని అరెస్టు చేసి చిత్రవధ చేయడమే గాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉన్న అధికారుల్ని కలిసి విన్నపాలు జేసుకుంది. ఎక్కడికైనా మొక్కవోని ధైర్యంతో వొక్కతే పోయి వచ్చేది. ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్‌ వరకు అధికారులను కలిసింది.

పోలీసు దెబ్బలకు భర్త కాల్జేయ్యి పనిజెయ్యకుంటయ్యి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. అలాగే ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయ్యిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్దరు కలిసే పేషీలకు హాజరయ్యేది.

1900 ఆ ప్రాంతంలో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిరడ్రు. ఉయ్యాల పదం పాడిరడ్రు. ఆమెను బాలనాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, పదుగురి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారవోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. జీవిత కాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ పదిన తనువు చాలించింది.

ఐలమ్మ పోరాటం గురించి గానీ, ఆమెపై దొరలు చేసిన పాశవిక దాడుల గురించి గానీ నేటి యువతరానికి అంతగా తెలియదు. ఆమె గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన ఉండదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీక అయిన ఆమె ప్రతిమకు టాంక్‌బండ్‌పై స్థానం దక్కలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆమె పోరాటానికి, త్యాగానికి గుర్తింపు, గౌరవం దక్కాలి.

(సెప్టెంబర్ 10, ఐలమ్మ వర్ధంతి)

-సంగిశెట్టి శ్రీనివాస్‌

యుగకవి పాల్కురికి సోమనాథుడు

sangisetti- bharath bhushan photo

    ప్రథమాంధ్ర ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. ఇదే విషయాన్ని ప్రథమాంధ్ర కవి పాల్కురికి సోమనాథుడు అని డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నదశలో 2012లో ఆంధ్రజ్యోతిలో చర్చకు పెట్టారు. దీనికి ప్రతిస్పందిస్తూ ముత్తేవి రవీంద్రనాథ్‌, రామినేని భాస్కరేంద్రరావులు అసలు పాల్కురికి తెలంగాణ వాడే కాదు, మరొకరు తొలికవి ఎందుకు గారు? అంటూ తెలంగాణ ఉద్యమం మీద అక్కసుతో బురద పూసే పనిచేసిండ్రు. ఈ చర్చలో నేనూ పాల్గొన్నాను. వారు చేసిన తప్పుడు వాదనలు సాక్ష్యాధారలతో తిప్పి కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి, అక్కడి పండితులు ఇప్పటి వరకూ ప్రచారంలో పెట్టిన అసత్యాలు, అర్ధసత్యాలపై వెలుగుని ప్రసరించి వాస్తవాలను  అందరికీ తెలియజెప్పాలి. ఇప్పటి వరకూ పాల్కురికి సోమనాథుడి రచనలు, రచనలపై విశ్లేషణ, పరిశోధన దాదాపు పదివేల పేజీలకు పైగా అచ్చు రూపంలో వచ్చాయి. అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో లేవు. ప్రత్యక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత సందర్భంలో సోమనాథుడి మూర్తిమత్వాన్ని తెలంగాణ సోయితో మరొక్కసారి స్మరించుకునేందుకు ఈ సదస్సు కచ్చితంగా ఒక మైలురాయిగా నిలబడుతుంది.
‘యుగకవి’ పాల్కురికి సోమనాథుడి గురించి బండారు తమ్మయ్య మొదలు వేన రెడ్డి వరకూ, ఇప్పటికీ ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆయన రచనలపై పరిశోధన జరుగుతూనే ఉన్నది. ప్రతి పరిశోధనలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు సాహితీ చరిత్రకారులు సోమనాథుడికి ‘యుగకవి’ హోదా ఇవ్వలేదు.  ఇందుకు ప్రధానంగా ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రహ్మణత్వాన్ని, జపతపాలను త్యజించి సామాన్యుడికి గౌరవమివ్వడమే కారణం. తెలుగు సాహిత్యంలో భాష, విషయము, ఛందస్సు ఈ మూడిరటిలోనూ నూతన పంథాలో రచనలు చేసి ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు జెండా ఎగురేసిండు. ఆయన సృష్టించిన నూతన ప్రజా ఒరవడి ఆయన తర్వాతి తరం కూడా కొనసాగించింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
తెలుగు సాహిత్యంలో ఎన్నో ‘మొదళ్ళ’కు ఆయనే పునాది. దేశీ చంధస్సులో తొలి తెలుగు కావ్యంగా  ‘ద్విపద’గా బసవపురాణాన్ని రచించిండు. రాజులు, రారాజుల చరిత్రగాదు, మడివాలు మాచయ్యలు, బొంతల శంకరదాసుల జీవిత చరిత్రలే ఆయన కథా వస్తువులు. జాను తెనుగు, దేశీ చంధస్సులోనే గాదు తీసుకున్న వస్తువులోనూ నూతన ఒరవడి సృష్టించిన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ప్రగతిశీలి. అభ్యుదయవాది. శతక సాహిత్యానికి బ్రతుకుగా, ఉదాహరణ వాఙ్మయానికి దిక్సూచిగా, గద్యలకు కొలబద్దలుగా, వచనాలను అనిర్వచనీయాలుగా, జీవిత చరిత్రలను సామాజిక చరిత్రలుగా తీర్చిదిద్దిన అసలైన ఆధునికుడు. సామాన్యుడు కేంద్రంగా చరిత్రను తిరగరాసిన సంస్కరణాభిలాషి.
నన్నయాదుల కాలం నుండి బాగా వేళ్ళూనుకొని పోయిన వైదిక మతాన్ని తిరస్కరించిండు. అరూడ గద్యాది  రచనలు సంస్క ృత భాషా భూయిష్టమై కేవలం పండిత లోకంలో ఆదరణ పొందిన సాహిత్యాన్ని సామాన్యుడే మాన్యుడని తలంచి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వాడు పాల్కురికి. సంస్క ృత వృత్తాలను వదిలి ‘ద్విపద’లో బసవ పురాణాన్ని రచించిండు. ద్విపదలో రచనలు చేసిన మొట్టమొదటి సాహితీవేత్త. ఈ ఛందస్సుకు ‘ద్విపద’ అని నామకరణం చేసింది కూడా పాల్కుర్కియే! ‘‘ఆంధ్రావళి నాలుకపై నాట్యమాడుతున్న ఈ ఛందస్సు వేదంలోని ‘‘ద్విపద’’వలె పవిత్రమైనది. ప్రాచీనమైనది సుమా అన్నట్టు ‘ద్విపదు’ అని విలక్షణమైన పేరు పెట్టినవాడు సోమన. కొందరపోహ పడుతున్నట్టు ఈ ద్విపదకు ప్రాకృతంలోని ద్విపదితోను, హిందీలోని దోహాతోను పొత్తు లేదు. ఇదిక స్వతంత్రమైన తెలుగు దేశీ ఛంధస్సు’’ అని నిడుదవోలు వెంకటరావు ‘సోమన సృష్టించిన ఛందస్సు’ అనే వ్యాసంలో నిరూపించిండు.  ప్రాచీన పురాణాలను వదిలి గురువు కేంద్రంగా రచనలు చేసిండు. సోమనాథుడి భాషతో పాటు, రచనా ప్రక్రియలు కూడా సామాన్య ప్రజలకు సులభంగా గ్రాహ్యమయ్యేటివే! ఈయన రచనలు తెలుగు జాతి తొలి విజ్ఞానసర్వస్వాలుగా చెప్పుకోవచ్చు. ఈయన తర్వాతి తరం వారయిన తిక్కన మొదలు అన్నమాచార్యతో పాటుగా 20వ శతాబ్దం వరకు కూడా కవులపై సోమనాథుడి ప్రభావముంది.
‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె
కూర్చెద ద్విపదల కోర్కె దైవార
అరూఢగద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వ సామాన్యంబు గామి..’’ అంటూ జాను తెనుగు విశిష్ఠతను వివరించిండు. నన్నయ తెలుగు కవితలో ప్రవేశపెట్టిన మార్గ పద్దతిని నిరసిస్తూ దేశీ కవితా విధానాన్ని ఒక తిరుగుబాటు సాహిత్యంగా సోమనాథుడు సాహిత్యంలోకి తీసుకు వచ్చాడు. ‘‘అమల సువర్ణ శృంగ యుత కపిల గోశతంబు దానమిచ్చిన ఫలంబు భారత శ్రవణంబున గల్గునని తలంచి భారత శ్రవణాభిరతులైన రాజన్యులను మెప్పించుటకు గాక’ అంటూ భారతానికి తాయిలాలు ఇచ్చి ప్రచారంలో పెట్ట చూడడాన్ని పాల్కురికి నిరసించిండు. శైవ మతమును సామాన్యుడు పునాదిగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అంతే కాదు త్రిపురుషా పూజా విధానాన్ని, జప హోమాదులతో కూడిన వైదిక మతమును’ తూలనాడి కులాలకు అతీతమైన వీరశైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసిండు. అనువాదాలైన భారతాన్ని వదిలి, నన్నయ నిరాకరించిన ద్విపదలోనే బసవ, పండితారాధ్యుల జీవితాలను చరిత్రలుగా రచించిండు. అంతే గాకుండా దేశీ రచనా ప్రక్రియలను కూడా చేపట్టిండు. అంతకు ముందు ఈ ప్రక్రియలు కేవలం చంధోగ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి కావ్య గౌరవాన్ని ఈయన కల్పించిండు. ఉదాహరణములు, రగడ, సీసములు, శతకము, గద్యము, అష్టకములు మొదలైన వాటిలో రచనలు చేసిండు.

ఈ దేశీయ రచనా రీతులకు ఒక అస్తిత్వాన్ని కల్పించిన వాడు పాల్కురికి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దేశీ రచనలను చేయడమే గాకుండా దేశీయ సంప్రదాయాలను, భాషా, సాహిత్య, నాట్య, సంగీత, చారిత్రక, స్థానికాచార వ్యవహారాలు, జీవితాలను, సామాజిక పరిస్థితులను ఈయన రచనల్లో చోటు చేసుకున్నవి. శ్రీశైల వర్ణనలతో పాటుగా దేశీయుల ఆచార వ్యవహారాలు, శివరాత్రి జాగారము, పాటలు, పద్యాలు, గీతాలు, స్తవాలు మొదలగు సాహిత్య సామాగ్రిని, నాట్య భంగిమలను, నాటక ప్రదర్శన పద్ధతులను, భరత నాట్య ప్రయోగాలు, సంగీత శాస్త్రంలోని 108 రాగాలను తాళములు, మూర్ఛనలు, మద్దెళ్ళు గురించి తాను జీవించిన 1160`1240ల నాటి తెలుగు/కన్నడ సమాజాన్ని పాఠకుల ముందుంచాడు. ఆయన కాలంనాటి ఆటలు`పాటలు, విద్యలు`వినోదాలు, పత్తిరులు`పండ్లు, కొండలు, నదులు, మకుటములు, వస్త్రములు, వీణలు, రాగములు ఇలా ఒకటేమిటి అనేక విషయాల్ని తన రచనల్లో తెలిపిండు. ముఖ్యంగా పండితారాధ్య చరిత్రలో. సోమనాథుని కాలం నాటి సాంఘిక జీవనాన్ని తెలుసుకోవడానికి పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞానసర్వస్వం లాంటిదని తిమ్మావరa్జల కోదండరామయ్య తన ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’ అనే వ్యాసంలో చెప్పిండు.

‘‘తెలుగు కవులలో ఈయన వలె ప్రజలకు యింత సన్నిహితంగా వుండిన కవీ, తెలుగు ప్రజా జీవనమును యింత చక్కగా న కావ్యంలో ప్రదర్శించిన కవీయ యీయన ఒక్కడు మాత్రమే’’ అని కూడా తిమ్మావరa్జల అన్నడు. ఆనాటి ఆభరణాలైన ‘కంచు మట్టెలు, ఉంగరములు, వల్దయూరులు, నల్ల గాజులు, తగరపు కడియములు, పచ్చ గాజు పూసలు, సంకు పూసలు, నల్లపూసల బన్నసరము’ మొదలైన వాటి గురించి ఈయన రచనల ద్వారా తెలుస్తుంది. ‘రాగుంజు పోగుంజులాట, కుందెన గుడిగుడి గుంజంబులాట, అప్పల విందుల యాట, చప్పట్టు, సరిగుంజులాట, పేరబొంతల యాట, సిట్ల పొట్లాట, గోరంటాలాట, దాగుడు మూతలాట, దిగు దిగు దిక్కొనునాట’ అనే క్రీడా విశేషాలు ఆనాటి కాలంలో ఉండేవని పాల్కురికి రచనల ద్వారా తెలుస్తుంది. కేవలం ఆటలు తెలుసుకొనుట కాదు. ఇది ఆనాటి తెలుగు సమాజం నడిచి వచ్చిన దారిని పట్టిస్తుంది. చరిత్రను చిత్రిక గడుతుంది. ఈయన రచనలు తరచి తరచి చదివిన కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ స్థానిక శూద్రకులాలకు చెందిన వారైన కుమ్మరి గండయ్య, బెజ్జ మహాదేవి, మడివాళ మాచయ్య, మాదర చెన్నయ్య, తదితర  జీవితాలను కథలుగా బసవపురాణంలో చెప్పిండు. తెలంగాణ ఆచార వ్యవహారాలే గాకుండా ఇప్పటికీ నిఘంటువుల్లోకి ఎక్కని ఎన్నో పదాలు ఈయన రచనల్లో కనిపిస్తాయి. పదాలు, పద బంధాలు, సామెతలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయంటే వాటి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సోమనాథుడు అవసాన దశలో రాసిన ‘పండితారాధ్య చరిత్ర’  తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారు.

రాజులకు, దేవుళ్ళకు పుస్తకాల్ని అంకితమియ్యడం తెలుగు సాహిత్యంలో కొత్తేమి కాదు. అయితే సోమనాథుడు శివభక్తుడైన గోడగి త్రిపురారికి తన అన ‘అనుభవసారము’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. బవవేశ్వరుడు ప్రచారం చేసిన శైవమతములో భక్తియే ప్రధానమైనది. జాతి, మత, లింగ వివక్షలు లేవు. వేదోక్త కర్మల నిరసన, శివోత్కర్ష, భక్తిచే భగవంతుని పలికించుట ఈ వీరశైవము లక్షణాలు. గురులింగ, జంగమ, ప్రసాదాదులు, విభూతి, రుద్రాక్షాది చిమ్నాలు ఈ మతముతో ముడి పడి ఉన్నాయి.
సోమనాథుడు ప్రచారం చేసిన వీరశైవము వేదకర్మలను నిరసించినదనేది ఒక పార్శ్వం. దానికి రెండో ముఖం స్త్రీ పురుషుల సమానత్వానికి, సర్వమానవ సౌభ్రాత్రమును కోరుకున్నది. నేటికీ స్త్రీ సమాన హక్కు ఇవ్వ నిరాకరింపబడుతుండగా, 900ల యేండ్ల క్రితమే సాహిత్యంలో సమానత్వాన్ని పాటించిన అభ్యుదయ వాది పాల్కుర్కి. పండితారాధ్య చరిత్ర పురాతన ప్రకరణములలో ‘గురుభక్తాండారి కథ’లో అజ్ఞాని అయిన గురుభక్తాండారికి వేశ్యచే శ్వేతుని కథ, మహహుణుని కథ చెప్పించి ‘హితలగు కాంతల బుద్ధులేవెంట హితము కాకేల యొండగున’ని నిరూపించినాడు. స్త్రీలకు పురుషులతో సమానంగా దీక్షాధికారములిచ్చి గౌరవించినాడు. నిమ్న జాతి భక్తులకు కావ్య గౌరవం కల్పించిన దార్శనికుడు పాల్కురికి. వీరశైవములో భక్తుల కష్టార్జితాలకు విలువెక్కువ. ప్రతి భక్తుడు ఏదో ఒక శారీరక శ్రమతో కూడిన పనిని చేయాల్సిందిగా సోమనాథుడు నిర్దేశించిండు. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించిండు. అందుకే మడివాలు మాచయ్య భక్తుల బట్టలుతకడం వృత్తిగా, శంకరదాసి బొంతలు కుట్టి జీవించే వృత్తిని స్వీకరించిండు.
ఈయన రచనలన్నీ గురువు కేంద్రంగా రాసినవే! అందుకే పాల్కురికి రచనల్లో బసవేశ్వరుడు, పండితారధ్యుడు ఇద్దరూ ప్రముఖంగా కనిపిస్తారు. వీరిలో ఒకరు వీరశైవాన్ని మరొకరు ఆరాధ్య మతాన్ని ప్రచారం చేసిండ్రు. సోమనాథుడు సంస్కృతాంధ్ర, కర్నాట భాషల్లో అనేక రచనలు చేసిండు. వీటిలో ‘బసవ పురాణం’, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బవసాధ్య రగడ, సద్గురు రగడ, చెన్న మల్లు సీసములు, నమస్కార గద్య, వృషాదిపశతకం, అక్షరాంక గద్య పద్యాలు, పంచప్రకార గద్య, అష్టకం, పంచక, బసవోదాహరణం, మల్లమదేవి పురాన: (అలభ్యం), మొదలైన రచనలున్నాయి. తొలి తెలుగు శతకం ‘వృషాధిప శతకము’ రచయిత కూడా ఈయనే. ‘బసవా, బసవా వృషాధిపా!’ అనే మకుటంతో 108 చంపక, ఉత్పలమాలలతో ఈ పుస్తకం రాయబడిరది. ఇందులో బసవుడి జీవితానికి సంబంధించిన ఘటనలు రికార్డయ్యాయి.  బసవన కేవలం మతాచార్యుడు, భక్తుడే కాదు, ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్తగా, భక్త శిఖామణిగా, వృషాధిపుని అవతారంగా పాల్కురికి రచనలు చేసిండు. నిజానికి వీరశైవ మత ప్రచారానికి సోమనాథుడు ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. పాటల ద్వారా, రచనల ద్వారా, సభల ద్వారా, సంచారల ద్వారా మత ప్రచారం చేసిండు. సర్వస్వాన్ని శివుడికి, శివ భక్తులకు సమర్పించాలని ప్రచారం చేసిండు. నిజానికిది సామాజిక స్పృహకు పునాది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలిచింది. అయితే ఇందుకు ఆద్యుడు పాల్కుర్కియే! భక్తి ప్రచారానికి ప్రధాన వాహికగా పాటను/ గేయాన్ని ఎంచుకున్నాడు. ఇవి రగడ రూపంలో ఉన్న వీటికి యతి ప్రాస లక్షణాలున్నాయి. అక్షరాంక గద్యలో అ మొదలు క్ష వరకు మొత్తం 50 అక్షరాల్లో వనరుసగ నీ గద్యపాద ప్రథమాక్షరములు గూర్చి ఈ రచన చేసిండు. వీటిలో కొన్ని ఇప్పటికీ గ్రంథ రూపంలో రాలేదు. మరికొన్ని అలభ్యం.

index
యుగకవికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో తర్వాతి కాలం వారు కూడా అనుసరించగలిగిన మార్గాన్ని ఏర్పాటు చేయడం. ఈ పనిని పాల్కురికి సమర్ధవంతంగా నిర్వహించాడు. ఉదాహరణ, ద్విపదలు, వచనములు, వ్యాఖ్యానములు, శతక వాఙ్మయానికి ఆద్యుడైన పాల్కురికి వేసిన దారుల్లో తర్వాతి కవి పండితులు నడిచిండ్రు. భాష, భావన, రచన, విషయం అన్నింటిలోనూ ప్రత్యేకతను చాటుకుండు. పాల్కురికి ప్రభావం తిక్కన, రంగనాథరామాయణము రాసిన గోన బుద్ధారెడ్డి, గౌరన, చిన్నన రచనలపై ద్విపదల ప్రభావం, శ్రీనాథుడు కొంతమేరకు వస్తువులో, చంధస్సులో  పాల్కురికిని అనుసరించాడు. శ్రీనాథుడి హర విలాసానికి మూలం బసవపురాణమే! ధూర్జటి కాళహస్తి మహాత్మ్యము నందలి తిన్నని కథకు మూలం కూడా బసవ పురాణంలోనే ఉన్నది. హంసవింశతి, శుకసప్తతి రచయితలు కూడా పాల్కురికినే అనుసరించారు. ‘‘ఈతని (పాల్కురికి) సీసపద్యమలందుగల సొగసైన తూగు, సమత శ్రీనాథ పోతనల సీసపద్యముల చక్కని నడకకు దారి చూపినట్లు తోచు చున్నది. ‘మందార మకరంద’ యను సుప్రసిద్ధమైన పోతన సీసములో గనుపించు భావము, పోలిక సోమనాథుడివే.’’ అని వేటూరి ఆనందమూర్తి ‘తిక్కనాదులపై పాల్కురికి ప్రభావం అనే వ్యాసంలో తేల్చి చెప్పిండు. ప్రబంధకారులైన తెనాలి రామకృష్ణుడు, తాళ్ళపాక వారు, కృష్ణమాచార్యులకు మాతృకలు కూడా పాల్కురికి రచనలో ఉన్నాయనే విషయాన్ని సోదాహరణంగా ఆనందమూర్తిగారు వివరించారు.
ఈ దేశీ ప్రక్రియను తర్వాతి కాలంలో తాళ్ళపాక కవులు కూడా అనుసరించారు. వీరు మంజరీ ద్విపదలు, శతకములు, సీసములు, ఉదాహరణములు, రగడలు, గద్యలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసిండ్రు. అంటే సోమనాథుడి రచనా ప్రభావం తర్వాతి తరం వారిపై ఎలా ఉండిరదో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు బ్రౌన్‌, కొమర్రాజు, నిడుదవోలు సుందరం పంతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణరావు, బండారు తమ్మయ్య, నిడుదవోలు వెంకటరావు, నేలటూరి వేంకటరమణయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఎమ్‌.ఆదిలక్ష్మి. వేనరెడ్డి, మహంతయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులెందరో పాల్కురికి సోమనాథుడి ప్రతిభా పాఠవాలను పాఠకులకు తెలియజెప్పిండ్రు.
దక్షిణాదిలో ఒక వైపు రామానుజ మతం, వైష్ణవ మతం విజృంభిస్తున్న తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నది వీరశైవం. సొంత ఆస్తి లేకుండా, ఉన్నదంతా శివభక్తులకు పంచాలనడమే గాకుండా, ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. అట్టడుగు వర్గాల ప్రజలే ఆయన రచనా వస్తువులు. కులాలకు అతీతంగా అందరిలో చైతన్యాన్ని ప్రోది చేసిన పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో తొలి కవి. ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాల వివక్షలపై అక్షరాన్ని కరవాలంగా మలిచిండు. అలాంటి మహనీయుడి గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. అందుకుగాను ఆయన జీవిత చరిత్రను సాహిత్య అకాడెమీ/ జాతీయ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించాలి. అలాగే ఆయన సమగ్ర రచనలు కూడా తెలంగాణ కల సాకారమైన సందర్భంగా పునర్ముద్రణ కావాలి. ఇంకా అలభ్యంగా ఉన్న రచనల్ని వెతికి పట్టుకోవాలి. తెలంగాణ జీవద్భాషకు అక్షర రూపమిచ్చిన ఆయన రచనల్లో ఇంకా నిఘంటువుల్లోకెక్కని పదాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని నిఘంటు రూపంలో తీసుకు రావాలి. తెలంగాణ సోయితో ఈ పనిచేయాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

నిజమైన చరిత్ర ‘బహుజన’ తెలంగాణాలో వుంది!

sangisetti- bharath bhushan photo
    షరతులు, మినహాయింపులు, ఆంక్షలతోనైతేనేమి ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇవ్వాళ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు కోరుకుంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు ‘బంగారు తెలంగాణ’ కావాలని కోరుకుండ్రు. ఈ బంగారు తెలంగాణ కేవలం ‘బహుజన తెలంగాణ’ ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమౌతుంది. సామాజిక న్యాయం అంటే సమాజంలోని అట్టడుగు వర్గానికి సైతం వారి జనాభా దామాషాలో చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం. ఒక్క ప్రాతినిధ్యమే కాదు అభివృద్ధిలో భాగస్వామ్యమూ కూడా కావాలి. 60 యేండ్ల తెలంగాణ పోరాటానికి  నిజమైన గుర్తింపు, గౌరవం, న్యాయం ‘బహుజన తెలంగాణ’తోనే సాధ్యమౌతుంది.

ప్రత్యేక తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ అని చెబుతూ ఏ విధమైన సిద్ధాంతాలు, వాదనలు, ప్రాతిపదికలు, పోరాట ప్రతీకల్ని ముందుకు తీసుకొచ్చి, చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, పరిశోధకులు, బుద్ధిజీవులు చైతన్యాన్ని కలిగించారో ఈనాడు ‘బహుజన తెలంగాణ’ కోసం కూడా అదే విధమైన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముంది. ఒక ప్రాంతంగా తెలంగాణ అస్తిత్వం ఖాయమైంది. ఇప్పుడు అస్తిత్వానంతర దశలో 90శాతంగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎలా దక్కాలనే అంశంపై దృష్టి సారించాలి. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటాని యాచించకుండా శాసించే స్థాయికి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు  సార్ధకతా వస్తూంది.
ఇప్పటికే తెలంగాణ పౌరుషం, పోరాట పటిమ, త్యాగాల చరిత్ర అంటే చాలు సమ్మక్క సారలమ్మ మొదలు, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియాసాహెబ్‌, జంబన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, బందగీ, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, షోయెబుల్లాఖాన్‌, చాకలి ఐలమ్మలు, సదాలక్ష్మి, సంగెం లక్ష్మిబాయి తదితరులు రికార్డయ్యారు. వీరికి సరిసమానులైన బహుజన వీరులు, వీర వనితలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరెవ్వరూ ఇంతవరకూ చరిత్ర పుటల్లో కెక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో అసలే లేరు. వీరిని వెలుగులోకి తీసుకొచ్చి కొత్త చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాయాలి. కొత్త రాష్ట్రంలో విద్యార్థులందరూ వీరి ఘనతను తెలుసుకోవాలి. ఈ పని ఇప్పుడు చేయనట్లయితే భవిష్యత్తులో మరింత కష్టతరమైతుంది. భౌగోళిక తెలంగాణ కోసం అగ్రవర్ణాలతో కలిసి బహుజనులు కొట్లాడిరడ్రు. ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ కోసం అవసరమైతే అగ్రవర్ణాల వారితో సైతం తలపడాలి. ఇందుకోసం బహుజన సమాజాన్ని మరింతగా చైతన్య పర్చాల్సిన అవసరముంది.

ఈ బాధ్యత బుద్ధిజీవులు, ఉద్యమకారులపై మరింత ఎక్కువగా ఉంది. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల వారి చరిత్రను, ఘనతను ఎలా వెలుగులోకి తేవాలో, తద్వారా ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందో ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అమల్లో చేసి చూపెట్టింది. తెలంగాణలో న్యాయంగానైతే పీడిత ప్రజల పక్షాన నిలబడుతామని చెబుతున్న ప్రభుత్వం విస్మరణకు గురైన బహుజన వీరుల్ని వెలుగులోకి తేవాలి. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేపట్టనట్లయితే బుద్ధిజీవులు అందుకోసం ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర పరిశోధక సంస్థలు ఈ విషయమై దృష్టి సారించాలి. పరిశోధన చేయించాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందుకు తోడ్పడాలి. మాయావతి అధికారంలో ఉన్న కాలంలో 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని కల్పించింది.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలో బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన చరిత్రకు గౌరవం దక్కింది. అప్పటి వరకు మరుగునపడ్డ మహనీయుల చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పరిశోధన చేయించింది. వాటిని అందరికీి అందుబాటులోకి తెచ్చింది. వివక్షకు, విస్మరణకు గురైన వీరులను జ్ఞాపకం చేసుకునేలా ‘సామాజిక్‌ పరివర్తన్‌ కే లియే సంఘర్ష్‌ కర్నేవాలే మహాపురుషోంకా సమ్మాన్‌’ పేరిట మాయావతి ప్రభుత్వం పుస్తకం ప్రచురించింది. విస్తృత ప్రచారం కల్పించింది. జిల్లాలకు బహుజన యోధుల పేర్లు పెట్టడం తద్వారా ఆ వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప జేసింది. అప్పటి వరకూ ఆదరణ లేకుండా పోయిన మహాత్మ బుద్ధ, మహర్షి వాల్మీకీ, ఏకలవ్య, కబీర్‌దాస్‌, అహల్యాబాయి హోల్కర్‌, ఛత్రపతి సాహూ మహరాజ్‌, జ్యోతి బాఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌ల గురించి విరివిగా ప్రచారం జరిగింది. వారి రచనలన్నింటిని పునః ప్రచురించడమైంది.

1380399_10201616179779262_1021311603_n

1857 పోరాటంలో వీరాంగనలు పోషించిన పాత్రను కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బుందేల్‌ఖండ్‌లో రాణీ లక్ష్మీబాయికి మారుగా యుద్ధం చేసిన బహుజన వనిత రaల్కారీ బాయితో పాటుగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న బహుజన పులి బిడ్డలు ఉదాదేవి, మహవీరి దేవి, అవంతీబాయి లోధీ, పన్నాధాయిల చరిత్ర బిఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చాయి. బిఎస్పీ మొదట 1995 జూన్‌లో అధికారంలోకి వచ్చింది. అప్పటికే మండల్‌ కమీషన్‌ అమలుకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేసిన అలజడిని నిరసిస్తూ దళిత, బహుజనులు ఒక్కటై ఉద్యమం చేసిండ్రు. ఈ చైతన్యం తర్వాతి కాలంలో మాయావతి అధికారంలోకి రావడానికి తోడ్పడిరది. 1984 నుంచి బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి ఒక దశాబ్దం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కవులు, రచయితలూ పాటలు, కవిత్వం, వ్యాసాలు, రచనల ద్వారా తామూ చరిత్రకెక్కదగిన వారమే అని నిరూపించుకున్నారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లో దళితులకు సంబంధించిన చిన్న చిన్న పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇవన్నీ దళిత అస్తిత్వ ఉద్యమానికి ఊతమిచ్చాయి. ఇదే తర్వాతి కాలంలో అధికారం అందుకోవడానికి సోపానమయ్యాయి. దాదాపు ఇవే పరిస్థితులు తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. వందలమంది బహుజన కవి, గాయకులు వేల పాటల్ని కైగట్టి పాడిరడ్రు. విస్మరణకు గురైన వీరుల్ని/వీర వనితల్ని వెలుగులోకి తెచ్చిండ్రు. సమాధి చేయబడ్డ ప్రతిభకు పట్టం కట్టిండ్రు.
1995 నుంచీ మరీ ముఖ్యంగా 2005 నుంచీ దళిత చైతన్యం`స్ఫూర్తి, చరిత్రకు సంబంధించిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల గురించి రచనలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రాణీ లక్ష్మీబాయికి తోడ్పడిరది రaల్కారీబాయి. ఈమె బహుజన వనిత. ఇప్పటికీ తెలంగాణ మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్న బుందేల్‌ఖండ్‌లో జానపద గాయకులు ఆమె యశస్సును గానం చేస్తారు. మోహన్‌దాస నైమిశ్రాయ్‌ ఆమెపై హిందీలో పుస్తకం అచ్చేశాడు. తెలుగులో కూడా ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇటీవల ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బద్రినారాయణ దళితుల ఔన్నత్యం, చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు, సోషల్‌సైంటిస్ట్‌, ఇపిడబ్ల్యూ లాంటి ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో వెలువరించాడు. ఇటీవలే దళితోద్యమ చరిత్రను వెలువరించాడు.‘విమెన్‌ హీరోస్‌ అండ్‌ దళిత్‌ అస్సర్షన్‌ ఇన్‌ నార్త్‌ ఇండియా ` కల్చర్‌, ఐడెంటిటీ అండ్‌ పొలిటిక్స్‌’ పేరిట బద్రినారాయణ పుస్తకాన్ని 2006లో వెలువరించాడు.
సరిగ్గా ఇదే పద్దతిలో తెలంగాణలోని బహుజనుల జీవిత చరిత్రలు వెలుగులోకి రావాల్సిన అవసరముంది.    కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీర వనితలు సమ్మక్క, సారలమ్మలు, గోల్కొండ కోట మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న, పరాయి వారి పాలన పోవాలంటూ బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు తుర్రెబాజ్‌ఖాన్‌ల గురించి ‘ఈటన్‌’లాంటి విదేశీయులు పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన విషయాల్నయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. చెరువులు తవ్వించి పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టిన రాబిన్‌హుడ్‌లు పండుగ సాయన్న, మియా సాహెబ్‌ల గురించి ఇప్పటికీ పాలమూరు జిల్లాలో క్యాసెట్ల రూపంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులు వీరిని గజదొంగలు అని ముద్ర వేసినప్పటికీ వీరు ప్రజోపయోగమైన పనులు చేసి ప్రజల మన్ననలకు పాత్రులయ్యారు. చార్మినార్‌ కొమ్ములకు తాడేసి ఉయ్యాల ఊగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజా వీరుడు బండ్లోల్ల కురుమన్న ఈ గడ్డ బిడ్డలే అన్న సోయితో మెలగాలి.
నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్యప్రబోధము అనే ద్విపద కావ్యాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన పోశెట్టి లింగకవి, నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్ధనాష్టకము తదితర గ్రంథాలను రచించిన నల్లగొండ జిల్లావాడు కందుకూరు రుద్రకవి, 1417లోనే ‘తెలంగాణ పురము’ అనే పదాన్ని మొదట శాసనాల్లో వేయించిన తెల్లాపూర్‌ (మెదక్‌ జిల్లా) పంచాణం వారి గురించి గానీ, ‘సీమంతిని విలాసం’ కావ్యాన్ని రాసిన ‘గాండ్ల’ తెలిక కులానికి చెందిన వరంగల్‌ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన సుంకరనేని ఫణికుండలుడు, ఈతని తమ్ముడు ‘విజయ విలాసం’ అనే కావ్యాన్ని, సుభద్రా పరిణయమనే యక్షగానాన్ని రాసిన సుంకరనేని రాజమౌళి, ఇబ్బడి ముబ్బడిగా తత్వాలు, కీర్తనలు రాసి, పాడి వందలాది మంది భక్తులకు మార్గదర్శనం చేసిన మాదిగాయిన దున్న ఇద్దాసులకు చరిత్రలో న్యాయమైన స్థానము దక్కలేదు. వీరే కాదు ఇంకా వేపూరి హనుమద్దాసు, గుజ్జరి యెల్లాదాసు, ఏలె ఎల్లయ్య, కైరం భూమాదాసు, మఠం మహంతయ్య, ఆయన భార్య మఠం మహంతమ్మ, గడ్డం రామదాసు, గవండ్ల రాజలింగకవి, కంసాలి సుబ్బకవి లాంటి అనేకమంది కవులకు తెలుగు సాహిత్య చరిత్రలో అనామకులుగా మిగిలారు. గోలకొండ కవుల సంచికలో ప్రతి కవీ ఏ కులానికి చెందిన వాడో విడిగా వివరంగా పేర్కొన్నారు. వారి గురించి లోతైన పరిశోధనలు జరిపినట్లయితే ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
తెలంగాణ బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి తమ జీవిత కాలం కృషి చేసిన ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన తరుణమిది. కల్లు డిపోల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ మొదలు, గౌడ విద్యార్థులు చదువుకునేందుకు 1925 ఆ ప్రాంతంలోనే లక్షల రూపాయలు వెచ్చించిన చైతన్య స్ఫూర్తి చిరాగు వీరన్న గౌడ్‌, ఆంధ్రమహాసభ మూడ్రోజుల పాటు నిజామాబాద్‌లో 1937లో సమావేశాలు నిర్వహించింది. ఇందులో దాదాపు వెయ్యిమంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా వచ్చిన వారందరికి ఆ మూడ్రోజులు ఎలాంటి లోటు రాకుండా భోజన వసతి కల్పించిన వారు నర్సాగౌడ్‌,  దేశంలోనే మొట్టమొదటి సారిగా డిచ్‌పల్లిలో కుష్టువ్యాధి చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కారణం కూడా ఈయనే. నర్సాగౌడ్‌ వందేళ్లకు పూర్వమే 100ల ఎకరాల స్థలాన్ని అందుకోసం ఉచితంగా ఇచ్చిన వితరణశీలి. ఆంధ్రప్రాంతం నుంచి ఏ పండితుడు వచ్చినా తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసిన దర్జీ నాంపల్లి గౌరీశంకరవర్మ. భారతదేశానికి ‘సింగర్‌’ కుట్టు మిషన్‌ని పరిచయం చేయడమే గాకుండా, తాను బాగా డబ్బు సంపాదించడమే గాకుండా, ధనాన్నంతా సాహిత్య, సాంస్కృతిక రంగానికి వెచ్చించాడు.

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి ఎంతో సేవచేసిండు. హైదరాబాద్‌ నగరంలో వందేండ్లకు పూర్వమే పాఠశాలను స్థాపించి బహుజనుల కోసం కృషి చేసిన యదటి సత్యనారాయణ సాగర్‌, ఆవుశెట్టి మంగయ్య, యాదటి పుల్లయ్యలుకూడా సగర వంశస్థుల అభివృద్ధికి పాల్పడ్డారు. పిక్టోరియల్‌ హైదరాబాద్‌ రెండు సంపుటాలుగా వెలువరించి హైదరాబాద్‌ ఘనతను ప్రపంచానికి చాటిన మాజీ హైదరాబాద్‌ మేయర్‌ కృష్ణస్వామి ముదిరాజ్‌, ఇదే కులానికి చెందిన కేశవులు, బి.వెంకట్రావ్‌, బి.వెంకటస్వామి, బి. రంగయ్య, చింతల వెంకటనర్సయ్య, నవాడ ముత్తయ్య, కేవల్‌కిషన్‌ తదితరుల గురించి అందరికీ తెలియాలి. శ్యామరాజు, కామరాజు లాంటి భట్రాజు సోదరుల ప్రతిభ అందరికీ తెలియదు. 1920 నాటికే యాదవ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగెం సీతారామయ్య యాదవ్‌, ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగినా ఆర్థికంగా ఆదుకున్న వారిలో ముందువరుసలో నిలిచేది పద్మశాలి వితరణశీలురు హకీం నారాయణదాస్‌, హకీం జనార్ధన్‌ దాస్‌. వీరిద్దరూ నిజాంకు రాజవైద్యులుగా పనిచేశారు. అలాగే గుంటుక నరసయ్య పంతులు, మాటేటి పాపయ్య ఆయన తనయుడు సికింద్రాబాద్‌ తొలి కమీషనర్‌ మాటేటి రామప్పలు కూడా తెలంగాణలో ప్రజా చైతన్యానికి దారులు వేసిండ్రు. నిజాం రాష్ట్రాంధ్ర ‘మున్నూరు కాపు మహాసభ’ను స్థాపించిన బొజ్జం నర్సింలు, సింగంశెట్టి బాబయ్య, శ్రీపతి రంగయ్య, గిరి పెంటయ్య తదితరులు సంఘాల్ని పెట్టడమే గాకుండా హాస్టల్స్‌ స్థాపించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయాల్ని కూడా స్థాపించిండ్రు.

1932లోనే విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించిన చింతపల్లి రాఘవాచార్యులు, కొల్లాపురం లక్ష్మినరసింహాచారి, ముమ్మడి లక్ష్మణాచారిల గురించి కనీస సమాచారం కూడా  అందుబాటులో లేదు. సమాజంలో అణచివేతకు గురైన ఆడబాపల గురించి పట్టించుకోవడమే గాకుండా సంఘసంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనీషి సిద్దాబత్తుని శ్యామ్‌సుందర్‌. సికింద్రాబాద్‌లో పాఠశాలలు స్థాపించడమే గాకుండా, కళావంతుల సభలు పేరిట ఆడబాపల ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసిన ఉదాత్తుడు. దక్కన్‌ మానవసేవా సమితిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో ‘నాయి సభ’ను ఏర్పాటు చేసి తమ వర్గం వారి అభ్యున్నతికి ఆంధ్రమహాసభల్లో సైతం పాల్గొని గొంతుని వినిపించిన ‘జనపాల రఘురాం’ ఇంకా అనేకమంది బహుజనుల అభ్యున్నతికి అలనాటి తెలంగాణలో పోరాటాలు చేసిండ్రు.
తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పేరు పొందిన బి.ఎస్‌. వెంకటరావు, గోలకొండ కవుల సంచికలో కవిత్వాన్ని వెలయించిన అరిగె రామస్వామి,  (ఈయన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు), 1957లోనే అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుని ఉద్యమంగా చేపట్టిన శ్యామ్‌సుందర్‌, సుతారి బాబయ్య, సుబేదార్‌ సాయన్న, గుంటిమల్ల రామప్ప, బందెల చిత్తారయ్య, జె.ఎస్‌. ముత్తయ్య తదితరులు దళిత చైతన్యానికి ప్రతీకలు. వీరికన్నా ముందు వల్తాటి శేషయ్య, ఎం.ఎల్‌ ఆదయ్య, రాజారామ్‌ భోలే తదితరులు హైదరాబాద్‌లో పేద, దళిత విద్యార్థుల కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేసిండ్రు. సభలు, సమావేశాలు, గ్రంథాలయోద్యమం, రాత్రి పాఠశాలల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిండ్రు. 1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన దళిత నాయకులందరికీ ఫైనాన్స్‌ చేసిన వితరణశీలి ముదిగొండ లక్ష్మయ్య. ఈయన కంపెనీలో తయారైన 555 బ్రాండ్‌ పాదరక్షల్ని దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోయేవి. టి.వి. నారాయణ, టి.ఎన్‌.సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరీభాయి తదితరులు తర్వాతి కాలంలో దళితోద్యమానికి బాసటగా నిలిచారు. ఉర్దూలో మొదటి సారిగా రచనలు చేసిన నాట్యగత్తె, విదుషీమణి మహలఖాభాయి చాందా గురించి అమెరికా వారు పరిశోధన కోసం డబ్బులు వెచ్చించిండ్రు. ఎఫ్లూలో ఆమె తవ్వించిన బాయిని కాపాడ్డానికి ఆర్థిక సహాయం అందజేసిండ్రు. ఈమె ఉర్దూలో రాసిన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడమే గాకుండా ఆమె విశేషమైన నాట్య ప్రతిభను, నేటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడ్డ ఆమె జాగీరు గురించీ, మౌలాలిలోని ఆమె సమాధి గురించీ అందరికీ తెలియజెప్పాలి.
వహబీ ఉద్యమాన్ని దక్షిణాదికి తీసుకొచ్చిన మౌల్వీ విలాయత్‌ అలీ సలీం, దీనికి అండగా నిలిచిన స్వయాన నిజాం రాజు నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజ్‌ద్దౌలా, ముస్లిం మహిళల కోసం ( ఆమాట కొస్తే మొత్తం స్త్రీల కోసం) దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన షమ్సుల్‌ ఉమ్రా, బ్రిటీష్‌ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని సాలార్జంగ్‌పై హత్యా ప్రయత్నం చేసిన సైనికుడు జహంగీర్‌ఖాన్‌, హైదరాబాద్‌ జర్నలిజానికి పితామహుడి లాంటి వారు మౌల్వీ మొహిబ్‌ హుసేన్‌, నిర్బంధ విద్యను, స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించిన సంస్కర్త ముల్లా అబ్దుల్‌ ఖయూం, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన అబిద్‌ హుసేని, సఫ్రాని, ముల్కీ ఉద్యమాన్ని 1919లోనే చేపట్టిన మౌల్వీ అబుల్‌ హసన్‌, సయ్యద్‌ అలీ, సయ్యద్‌ అబిద్‌ హుసేన్‌ తదితర ముస్లిం చైతన్య మూర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం పాటు పడ్డ వారి స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి. పఠాన్‌ యోధుడు తుర్రెబాజ్‌ఖాన్‌ గురించీ, ఆయనకు తోడ్పడ్డ మౌల్వీ అల్లాఉద్దీన్‌ గురించీ, బందగీ, షోయెబుల్లాఖాన్‌, మగ్దూం మొహియుద్దీన్‌లతో పాటు వందలాదిగా ఉన్న స్థానిక ఉర్దూ సాహిత్యకారుల ప్రతిభనూ అందరికీ తెలియజేయాలి.
కళా రంగాల్లో ఆర్టిస్టులు కాపు రాజయ్య మొదలు కంభాలపల్లి శేఖర్‌ వరకూ, చిందు ఎల్లమ్మ, ఒగ్గు కళాకారులు మిద్దెరాములు, కవి గాయకులు సుద్దాల హనుమంతు, రాజారామ్‌, బండి యాదగిరి, పెయింటర్‌, కవి, రచయిత మడిపడగ బలరామాచార్య, సాహితీవ్తే సామల సదాశివ, జానపద సాహిత్యానికి గౌరవం, గుర్తింపు కలిగించిన జాతీయ ప్రొఫెసర్‌ బిరుదురాజు రామరాజు తదితరులు తెలంగాణకు చేసిన కృషి చిరస్మరణీయమైనది. రాజకీయ రంగంలో 1952లో రాజకీయ దిగ్గజం మాడపాటి హనుమంతరావుని ఓడిరచిన పెండెం వాసుదేవ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డితో పాటుగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆనాటి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు సుంకం అచ్చాలు, ఎం.ఆర్‌.కృష్ణ, ఎమ్మెల్యేగా ఎన్నికైన బుట్టి రాజారాం, భాగ్యరెడ్డి వర్మ తనయుడు హైదరాబాద్‌ అసెంబ్లీ సభ్యుడు ఎం.బి. గౌతమ్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సత్తా చాటిన నల్లా నర్సింలు, ఉప్పల మల్సూర్‌, చీమ గురువయ్య, బిజ్జ వెంకన్న, అనుముల లింగయ్య, మధిర తిరపన్న, వడిశాల పిచ్చయ్య, ఆవుల పిచ్చయ్య తదితరులందరూ తెలంగాణ వికాసోద్యమానికి దారులు వేసిండ్రు. వీరితో పాటుగా దళితోద్యమ చరిత్రను రాయడమే గాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్న పి.ఆర్‌. వెంకటస్వామి, రజాకార్ల చేతిలో హతుడైన బత్తిని మొగిలయ్య, వైద్య రంగంలో హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డాక్టర్‌ మల్లన్న, డాక్టర్‌ ముత్యాల గోవిందరాజులు నాయుడు, న్యాయ రంగ నిపుణుడు జస్టిస్‌ కొమ్రన్న, స్వాతంత్య్ర సమరయోదులు కోత్మీర్‌ ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌, కాటం లక్ష్మినారాయణ ఇంకా కొన్ని వేల మంది గురించి విపులంగా చర్చించుకోవాలి. చరిత్రకెక్కించాలి.
గోండ్వానా రాష్ట్రపు అంకమ రాజులు మొదలు రాంజీ గోండు వరకూ చరిత్రలో స్థానంలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బహుజన, ఆదివాసీ, గిరిజన వీరుల సాహస చర్యల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనికి పాక్షిక మినహాయింపు ‘మనకు తెలియని మన చరిత్ర’. బహుజనులు కాపాడిన కళలు పెంబర్తి ఇత్తడి పనులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చీరలు, ఆదిలాబాదు రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, చేర్యాల నకాషీ పెయింటింగ్‌లు, జోగిపేట గొంగళ్లు ఇలా తెలంగాణలోని ప్రతి ఊరికీ చరిత్ర ఉంది. అది చారిత్రక కట్టడాలు కావొచ్చు, ఆలయాలు కావొచ్చు, వీరగల్లులు కావొచ్చు. ఈ చరిత్రను వెలుగులోకి తేవాలి.
తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది సబ్బండ వర్గాల వారు. సకల జనులు. జయశంకర్‌ సార్‌ మార్గదర్శనం, కొండాలక్ష్మణ్‌ బాపూజీ పోరాట స్ఫూర్తి, శ్రీకాంతాచారి, యాదయ్యల ఆత్మ బలిదానం ఇవన్నీ చరిత్రలో రికార్డు చేయాల్సిన సందర్భమిది. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన ఎక్కాయాదగిరి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ, తెలంగాణ లోగోని తీర్చి దిద్దిన ఏలె లక్ష్మణ్‌లు బహుజన ఆలోచనల నుంచి వచ్చిన వారే!
ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఇవ్వాళ మళ్ళీ ఆదివాసీలను ఆగం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మరో వైపు స్వయం పాలన కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డల ఆశలకు గండి వేస్తూ హైదరబాద్‌లో గవర్నర్‌ పాలన పేరిట ‘కేంద్ర పాలిత ప్రాంతం’ తద్వారా సీమాంధ్ర కబ్జాదారుల కొనసాగించేందుకు, పెట్టుబడిదారులకు పట్టం కట్టేందుకు మోడీ సర్కార్‌ యోచిస్తోంది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో కన్నా ఎక్కువ సోయితో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇన్నాళ్ళు ఇన్నేండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరుని, గతకాలపు వీరుల్ని కూడా స్మరించుకోవాలి. ఈ పనిని బహుజనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనట్లయితే ఉద్యమానికి దూరంగా ఉండి, రాళ్లేసిన వారు రాసే చరిత్రగా మారే ప్రమాదముంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే గాకుండా ‘మనము కూడా చరిత్రకెక్క దగిన వారమే’ అనే స్పృహతో తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా పరిశోధనలు జరిపించి పోరాట వీరుల్ని వెలుగులోకి తీసుకు రావాలి. వెలుగులోకి తీసుకువచ్చిన వారి ప్రతిభ/చైతన్యాన్ని పదుగురికి తెలిసే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ పని ఎంత ఆలస్యమైతే తెలంగాణ బహుజనులకు అంత నష్టం జరుగుతుంది. తెలంగాణ చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాద్దాం.

    – సంగిశెట్టి శ్రీనివాస్‌

మీడియా మాటున భేడియాలు

sangisetti- bharath bhushan photo
    తెలంగాణ ప్రజాప్రతినిధుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల గుండెల్ని కోసి కారంబెట్టి ఇప్పుడు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ మంటల్ని సల్లార్పెతందుకు పక్షపాత మీడియా ‘సారీ’ చెబుతోంది. (ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటనే మంటను ఎక్కువ జేస్తుండ్రనే ప్రచారం కూడా ఉంది) హేయమైన తమ చర్యలను సమర్ధించుకోవడం కోసం వందిమాగధులైన జర్నలిస్టు, రాజకీయ నాయకుల మద్ధతు తీసుకుంటుండ్రు. ఫాసిస్టు చర్య, అప్రజాస్వామికం అంటూ తప్పుంటే చట్టప్రకారం చర్య తీసుకోండి అని నీతులు చెబుతున్నారు.

అయితే వాళ్లు తమ అప్రజస్వామికతను, వివక్షను, దురహంకారపు దాడిని తమ  అవసరానుగుణంగా మరిచి పోతున్నరు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ప్రసారాలను ఆపేస్తారా? ‘ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?’ అంటూ ‘అక్షరాన్ని ఆయుధం’గా మార్చి కేసీఆర్‌పైకి, నవజాత శిశువు తెలంగాణపై సంధించిండ్రు. ‘మెరుగైన సమాజం’ నిర్మించే వాళ్లు ఇప్పుడు తమ తెలంగాణ ఉద్యోగుల్ని రాయబేరాలకు పంపుతున్నరు. మీడియా మాటున భేడియాలుగా (తోడేళ్ళు) ప్రవర్తిస్తుండ్రు. మీడియా ముసుగేసుకొని ఏం చేసినా, ఎట్ల చేసిన చెల్లుతుంది అనుకునే వారికి ఎమ్మెస్‌వోలు షాక్‌ ఇచ్చిండ్రు. నిజానికి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా!
టీవి9, ఎబిఎన్‌ల ప్రసారాలు ఆపింది ఎమ్మెస్‌వోలు. కానీ ‘కొత్తపలుకు’ ఆయన మాత్రం ఎమ్మెస్‌వోలకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎవరి వ్యక్తిగత విద్వేషం ఇందుకు దారి తీసింది? ఆంధ్రజ్యోతి సంస్థలపై విషం చిమ్మిన కేసీఆర్‌! అని చులుకన పలుకులు చెబుతుండు. బట్టగాల్శి మీదేసుడంటే గిదే! వ్యక్తిత్వ హననం అంటే ఇదే! రైతుల రుణమాఫీపై గందరగోళాన్ని సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడమే గాకుండా ‘ఏపీ నుంచా ఏసెయ్‌ పన్ను’ అని హెడ్డింగ్‌లు పెడ్తిరి. ‘మా అక్షరం మీ ఆయుధం’ అంటివి. కానీ ఈ ఆయుధాలన్నీ తెలంగాణ బిడ్డలపైనే ఎందుకు  ప్రయోగించబడుతున్నవో అర్థంగాదు. గాలి వార్తలు అచ్చేసి గాయి గాయి చేస్తూ ఇది అసమర్ధ ప్రభుత్వం అని ముద్రవేయాలని ప్రయత్నించిండ్రు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గగ్గోలు పెట్టే ఈ మీడియా నిండు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏంజేసుకుంటరో చేస్కోండి అన్నప్పుడు అది అప్రజాస్వామికమని అనిపించలేదు. పత్రిక పేరే ‘‘ఆంధ్ర’జ్యోతి’. తెలంగాణకు చీకటి, ఆంధ్రకు వెలుగులు పంచే ఈ పత్రిక ‘మీడియా స్వేచ్ఛ’ పేరిట తాము ఏది చెప్పినా, రాసినా ఇన్నేండ్ల మాదిరిగానే ‘తెలంగాణ రాష్ట్రం’లో కూడా చెల్లాలని మొండిగా వాదిస్తోంది. తమ ఆధిపత్యాన్ని తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగించడమే గాకుండా తమ సామాజిక వర్గం వారి నేతృత్వంలో సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వాన్ని హీరోగా నిలబెట్టడం దీని ఉద్దేశ్యం. తెలంగాణతో పోల్చి ‘ఆంధ్ర ప్రభుత్వమే బేషుగ్గా పనిచేస్తోంది’ అనే ఒక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ‘స్టోరీ’లు రాసింది. దీంతో పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని అప్రతిష్టపాల్జేసేందుకు పనిజేస్తుందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే ‘వి రిపోర్ట్‌ యూ డిసైడ్‌’ అని మీరు చెప్పినట్లుగానే నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఎమ్మెస్‌వోలకు ప్రజలు బాసటగా నిలిచిండ్రు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యిండ్రు.
‘కులం అడ్డు గోడలు కూలగొట్టండి’ అని బాకాలూదే ఈ మీడియాకూ కులముంది. ప్రాంతము కూడా ఉంది. వీటన్నింటికి అతీతంగా, నిష్పక్షపాతంగా భిన్న ప్రజాభిప్రాయాల వేదికగా నిలువాల్సిన మీడియా ఇవ్వాళ ‘కమ్మోళ్ల’ ప్రయోజనాలు కాపాడే, పెంపొందించే వాహికగా మారింది. డెల్టాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముగాసే తాబేదారుగా రూపాంతరం చెందింది. అలా కానట్లయితే ‘నేను తెలంగాణలో పుట్టిన’ ‘నన్ను ఆంధ్రోడు’ అని అంటుండ్రు అంటూ వాపోయే వేమూరి రాధాకృష్ణ ఇక్కడి ప్రజల పక్షాన ఎన్నడైనా నిలబడ్డారా? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలె. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకోసం వీళ్లు ఏ నిధులు సేకరించలేదు. కనీసం తాను పుట్టాను అని చెప్పుకుంటున్న నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌కు వలసెల్లిన వారి కోసంగానీ, అక్కడి బీడీ కార్మికుల కోసం గానీ ఏ నిధిని, ట్రస్ట్‌ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఆదుకుందామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదీ ఆయన ప్రాంతీయ నిబద్ధత. అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం నిధులు సేకరించడానికి నడుం కట్టాడు. లైవ్‌షోలు పెట్టిండు. దీని వెనుక పూర్తిగా కులం, ప్రాంతము తప్ప మరేమి లేదు. రాజధాని అనే కన్నా దీన్ని ‘క్యాపిటల్‌’ అనడమే సబబు. కేవలం పెట్టుబడిదారులకు అండగా నిలబడేందుకే ఈ ‘రాజధాని విరాళాలు’. రాజధాని కృష్ణా`గుంటూరు మధ్యలో గాకుండా రెడ్ల ప్రాబల్యం ఉండే ప్రకాశం జిల్లాలో వస్తదంటే ఈ విరాళాల ప్రచారం చేపట్టేవారే కాదు. ఈ ‘క్యాపిటల్‌’ పెట్టుబడిదారులు అంతా కమ్మ సామాజిక వర్గం వారే కావడం యాధృచ్ఛికం గాదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలిపి, ఎంత లిబరల్‌గా లెక్కేసినా ‘కమ్మోళ్ల’ జనాభా ఐదు శాతం మించదు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి జనాభా దాదాపు 20శాతం ఉంటది. అంతేగాదు ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి వసతి ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో 80శాతం ‘కమ్మోళ్ల’ చేతుల్లోనే ఉన్నయి. వీరి ప్రయోజనం కోసమే ‘క్యాపిటల్‌’ నిర్మాణానికి ఈయన ముగ్గు పోస్తుండు. ఇంకా చెప్పాలంటే వీరికి రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండూ పరాయి ప్రాంతాలే!
మీడియాకు ముఖ్యంగా తెలుగు మీడియాకు కులముంది. మీడియాలో దృశ్యం, శ్రవణం, అక్షరం మూడూ వస్తాయి. సినిమాల్లో 95శాతం కమ్మసామాజిక వర్గమే రాజ్యమేలుతోంది. నిర్మాణం గానీ, థియేటర్లు గానీ, హీరోలు, డైరెక్టర్లు అంతా వాళ్లే. ఇక తెలుగులో దాదాపు ఒక వంద ఛానళ్ళు పనిజేస్తే అందులో 90 ఛానళ్ళ యాజమాన్యం కమ్మసామాజిక వర్గం వారిదే! న్యూస్‌ ఛానళ్లలో ఇదే పరిస్థితి. ఎఫ్‌ఎం రేడియోల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పత్రికలు కూడా దాదాపు అన్నీ వారివే! అందుకే వారు ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇన్నాళ్లు చలామణి అయింది. అహంకారానికి, అధికారం తోడు కావడంతో కనీస మీడియా విలువలు కూడా పాటించకుండా తమకు ఎదురులేదని విర్రవీగిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో దానికి గండి పడిరది. తెలంగాణపై వీరి దాడి ఇవ్వాళ కొత్తగా షురువయ్యింది కాదు. ఎనుకటి నుంచి ఇదే తంతు. ఇక్కడ కొంత చరిత్ర చెప్పుకోవాలె!
తెలంగాణలో మొట్టమొదటి ప్రాంతేతర పత్రిక ‘తెలుగుదేశం’. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం 1949లో సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (1914-2010) ఈ పత్రికను ప్రారంభించారు. బాపట్లకు చెందిన ఈమె ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయింది. కమ్మసామాజిక వర్గం వారు తెలంగాణ పత్రికారంగంలో అలా అడుగు పెట్టిండ్రు. ఆ తరువాత రాజ్యలక్ష్మితో కలిసి వల్లూరి బసవరాజు తదితరులు ఆంధ్రజనత దిన పత్రికను 1955 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రాంతం నుంచి జర్నలిస్టుల రాక ముమ్మరమైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం ఆ ప్రభుత్వం పక్షపాత, కక్షపూరిత వైఖరి మూలంగా ‘గోలకొండ’ పత్రిక 1966లో మూతపడిరది. నలభై యేండ్లు తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసిన గోలకొండ పత్రికకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడంలోనూ, న్యూస్‌ప్రింట్‌ కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. అలాగే 1938లో స్థాపించబడ్డ ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికను 1976లో ‘తిక్కవరపు’ కుటుంబం కొనుగోలు చేసింది.

ఈ కుటుంబం వారు దాదాపు అదే కాలంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా వుండ్రిండ్రు. దక్కన్‌ క్రానికల్‌ని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొనుగోలు చేసిన సమయంలోనే ఈనాడు పత్రికను రామోజీరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. అది తర్వాతి కాలంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ కూడా ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు పాశం యాదగిరి, రత్నమాల లాంటి వారు ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఉద్వాసనకు గురయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ అవతరణ సమయంలో ‘ఈనాడు’ దాని కరపత్రంగా పనిచేసింది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు తెచ్చిన ‘ఉదయం’ పత్రిక మొదట్లో కొత్త వెలుగులు ప్రసరించినా అది కూడా నెల్లూరు రెడ్ల వశమయ్యింది. సినిమా ఇండస్ట్రీ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే, అప్పటి వరకు విజయవాడ నుంచి ప్రచురితమైన పత్రికలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది. ఈ రెండు మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ అండతో తెలంగాణపై విషం గక్కాయి.

కారంచేడు లాంటి సంఘటనలను నిజాయితిగా, నిష్పక్షపాతంగా రిపోర్టు చేసే ధైర్యాన్ని కూడా ఈ పత్రికలు ప్రదర్శించలేక పోయాయి. అంతేగాదు వీటి ఎత్తుగడలకు, కుచ్చితాలకు 85యేండ్లు నిరంతరాయంగా నడిచిన ‘ఆంధ్రపత్రిక’ కూడా మూత పడిరది. తెలంగాణకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‘సత్య’ న్యూస్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే చిదిమేసిండ్రు. అలాగే నూకారపు సూర్యప్రకాశరావు ‘సూర్య’ పత్రిక తెచ్చే సమయంలో ఆయనపై ఈ మీడియా ఎంత దాడి చేసిందో కూడా అందరికి తెలుసు. తాము చేస్తే ప్రజాసేవ, వేరేవాళ్లు అదే పని చేస్తే ద్రోహం అన్న విధంగా ప్రచారం చేసిండ్రు. తప్పు ఎవరు చేసినా తప్పే అనే సోయి మాత్రం వీరికి లేదు. ఏమి చేసినా ఎట్లా చేసినా తమ సామాజిక వర్గమే చేయాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న ఈ మీడియా వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. అలా దిగజారుడుకు పరాకాష్ఠ ‘మడిశి పెట్టుకోవడం’, ‘తొక్కు పచ్చడి’ ‘తాగుబోతోళ్లు, ‘శిలుం మొకం’ మాటలు.
తమని తీరొక్క తీరుగా తిట్టినా మళ్ళీ అదే మీడియాకు ప్రజాస్వామ్యం ముసుగేసి కొంతమంది బానిసలు బాసటగా నిలుస్తుండ్రు. మీడియా స్వేచ్ఛ ముసుగులో వాళ్లు ఎన్ని యవ్వారాలు చేసినా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ‘మాకరీ’  చేస్తూ అంగట్ల సరుకులాగా అమ్మాలని చూస్తున్నా వీళ్ళు ఇంకా నిజం తెలుసుకోలేక పోతుండ్రు. బహుశా తెలిసినా తమ బానిస భావజాలాన్ని వదిలించుకోలేక పోతుండ్రు కావొచ్చు. గతంలో ఆంధ్రజ్యోతి అహంభావానికి వ్యతిరేకంగా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే గాకుండా ధర్నాకు దిగిన వారు సైతం ఇవ్వాళ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్‌వోలను దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మార్చే రాజకీయ నాయకులు ఈ పనిచేస్తే అది సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టు సంఘాల నాయకులు సైతం అప్రజాస్వామికం, ఫాసిస్టు చర్య అంటూ గొంతులు చించుకుంటుండ్రు. మీడియా విలువల వలువలూడదీసే వారికి వీరు జేజేలు పలుకుతుండ్రు.
ఈ గొంతులు చించుకునే వాళ్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలె! వాళ్లకు తెలంగాణ అనేది ఒక అంగడి సరుకు కావచ్చు. కాని నాలుగు కోట్ల మంది ప్రజలకు అది ఒక ఆత్మగౌరవ నినాదం. స్వయంపాలన ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను, సంస్క ృతిని, వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని పజీత పజీత చేస్తూ ఇజ్జత్‌ పుచ్చుకుంటుంటే ఇదేమని ఈ పదిహేనేండ్లల్ల ఎన్నడూ ఏ జర్నలిస్టు నాయకుడూ తప్పుపట్టలేదు. అంతెందుకు మొన్నటి సంఘటనను కూడా వాళ్లు బహిరంగంగా ఖండిరచలేదు. ‘టీ న్యూస్‌’ ఛానల్‌ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసారం కాదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాదు మిగతా తెలంగాణ యాజమాన్య ఛానళ్ళని ఆంధ్రలో ఎన్నడో బ్యాన్‌ చేసిండ్రు. అయినా ఈ విషయాల గురించి జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్నడూ స్పందించలేదు. నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడ నడిబొడ్డున తగలబెడ్తుంటే ‘కోనాయి’ అన్నోడు లేడు. చంద్రబాబు ఒంటికంటి సిద్ధాంతానికి వీరి వైఖరికి పెద్దగా తేడా లేదు. మీడియా స్వేచ్ఛ ముసుగులో రెండు రాష్ట్రాల్లో తామే నాయకులుగా చలామణి కావాలనే యావ తప్ప వీరికి తెలంగాణ ఆత్మగౌరవం ప్రధానం కాదు.
ఇప్పటికే ఈటీవి`2, ఈటీవి తెలుగులో 49 శాతం వాటాను, మిగతా ఈటీవి చానళ్ళనన్నింటిని 2600ల కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు సిఎన్‌ఎన్‌`ఐబిఎన్‌తో సహా అనేక ఛానళ్ళను సొంతం జేసుకుంది. పెట్టుబడిదారుల కింద పనిచేయడానికి నిరాకరించి రాజ్‌దీప్‌ సర్దేశాయి, ఆయన భార్య సాగరికా ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంత చెడ్డా ఉత్తరాదిలో మీడియా విలువలను కొంతమేరకైనా పాటిస్తుంటే మన తెలుగువాళ్లు జర్నలిస్టు నాయకులతో సహా అందరూ యాజమాన్యాలకు గులామ్‌లుగా మారి ‘మీడియా స్వేచ్ఛ’ ముసుగులో తెలంగాణ తల్లి బొండిగె పిసికేందుకు సిద్ధమయిండ్రు.
మీడియా స్వేచ్ఛపట్ల వారికొక్కరికే పట్టింపు ఉన్నట్లుగా జర్నలిస్టులు, ఔట్‌డేటేడ్‌ రాజకీయ నాయకులు స్వీయ ప్రచారం కోసం ప్రకటనలు ఇస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’కు గౌరవం, స్వేచ్ఛ రెండూ దక్కాల్సిందే! అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేనట్లయితే తామే రాజ్యాంగ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. చట్టం తమ సుట్టంగా సూస్తరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నాయకులు రోడ్డు మీదికొచ్చి నెత్తినోరు కొట్టుకోకుండా అటు ఎమ్మెస్‌వోలను, ఇటు ఛానళ్ళ యాజమాన్యాలను కూర్చుండబెట్టి ‘అంబుడ్స్‌మన్‌’ని మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనే భరోసాను ఎమ్మెస్‌వోలకు తద్వారా తెలంగాణ ప్రజలకు కల్పించినట్లయితే సమస్య ముమ్మాటికీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఇందుకు తప్పుచేసిన వాళ్లు బేషరతుగా ముందుగా క్షమాపణ చెబుతూ, అవి పునరావృతం కావు అని లిఖిత పూర్వకంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. పంతాలకు, పట్టింపులకు పోయి కేంద్రం నుంచి వత్తిడి తెప్పిద్దాం అనుకుంటే ఏకు మేకై అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గుర్తించాలి.

                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

sangisetti- bharath bhushan photo

1970ల కన్నా ముందు అధికారం కేంద్రీకృతమై ఉండిది. ఇది విశ్వవ్యాప్తమైన భావన. దాన్ని కూలదోస్తే సమసమాజం ఏర్పడుతుందనే అవగాహన ఉండిది. అయితే అధికారం వికేంద్రీకృతంగా ఉంటుందనే వాస్తవాన్ని అస్తిత్వ రాజకీయ ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చాయి. అది ‘బ్లాక్స్‌’ పోరాటం కావొచ్చు, ఫెమినిజమ్‌ కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ కావొచ్చు. అస్తిత్వ ఉద్యమాలకు ఒక ‘పరిధి’ ఉంటుంది. ఆధిపత్యాన్ని, అణచివేతను ధిక్కరించేందుకు పోరాటం జరిగింది. కళ్ళముందర కనబడే శత్రువుతో ఉద్యమం కొనసాగింది. ఈ అస్తిత్వ రాజకీయాల్లో సామూహికతకు స్థానం లేదు. కానీ ఇవ్వాళ కొంతమంది భాష పేరిట, జాతి పేరిట, సమాజం పేరిట ‘సామూహికత’ను తీసుకొస్తున్నారు. దీని వల్ల తెలంగాణ వాళ్లకే గాదు సీమ, డెల్టా, ఉత్తరాంధ్రవారి ఉనికికి కూడా ప్రమాదమేర్పడనుంది.

స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారెవ్వరూ పరాయి ఆధిపత్యాన్ని, అణచివేతను, నిరాకరణను సహించలేరు. అంతేగాదు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అయితే తెలంగాణ విషయంలో ‘పరాయి’ ఎవ్వరు అని తెలుసుకునే లోపలే జరగరాని నష్టమంతా జరిగిపోయింది. 1956 నుంచీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలేసుకొని చరిత్రలో రికార్డు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో కొందరు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్లీనంగా తమ కోస్తాంధ్ర బానిసభావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లమంతా ఒక్కటే, తెలుగాజాతి అంతా ఒక్కటే, ఆధిపత్యాలు లేకుంటే అంతా మళ్ళీ కలిసిపోవొచ్చు, సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు, తెలుగు ప్రజల ఐక్యత కేవలం ఒక భావనగా కాకుండా భౌతిక వాస్తవికంగా మారాలని వ్యాఖ్యానిస్తూ, భవిష్యవాణి చెబుతూ, ఆకాంక్షిస్తున్న వాళ్లలో తెలంగాణ వాదులు, బుద్ధిజీవులు, సాహిత్యకారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు రాష్ట్రాల్లో తమ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఉండీ, రెండు ప్రాంతాల్లో వాటి మనుగడ కోరుకునే వారు, రెండు రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం, ప్రాధాన్యత, గుర్తింపు లభించాలని  ఆశించే పచ్చి అవకాశవాదులు ఈ మాటలు మొదటి నుంచీ చెబుతుండ్రు, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

ఈ అవకాశవాదుల్లోనే ఇంకొందరు పెండ్లినాడే సావుడప్పుకొట్టినట్లు అవసరమైతే ‘తెలుగువాళ్ళం మళ్ళీ కలువొచ్చు’ అంటుండ్రు. పేచీ అంతా తెలంగాణవాదుల ముసుగులో రంగంమీదికి వస్తున్న ఆధిపత్యాంధ్రుల బృందగానం ఆలపించే వంధిమాగదుల తోనే! తెలంగాణ సోయితో ఎన్నడూ మెలగని వాళ్ళు రాష్ట్రమొచ్చినాక ప్రత్యేక సంచికలు తీసుకొస్తూ తాము మాత్రమే ఉద్యమంలో ముందున్నట్టు, తమ కృషితో మాత్రమే తెలంగాణ సాధ్యమయింది అనే భావన కలిగిస్తుండ్రు. తెలంగాణ గురించి కూడా ఇందులో ఆంధ్రోళ్ల తోటి రాయిస్తుండ్రు. ఇలాంటి నయా సీమాంధ్ర బానిసలు రేపు తెలంగాణలో కోకొల్లలుగా పుట్టుకొచ్చి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తాము అభిమానించే ఆంధ్రాధిపత్య సాహిత్యకారుల కాళ్ల దగ్గర కట్టిపడేస్తారు. ఎందుకంటే వీళ్ళెవరూ తెలంగాణ కోసం ఎన్నడూ ఒక్క మాట మాట్లాడిరది లేదు, రాసిందీ లేదు, కనీసం సంఫీుభావంగా ఒక్క సమావేశంలో పాల్గొన్నదీ లేదు. ఇప్పుడు వలస పాలన మాత్రమే పోయింది. ఈ వలసాధిపత్యులు స్థానిక బానిసలను ప్రోత్సహించి, మెచ్చి మెడల్స్‌ ఇప్పించి తమ పెత్తనాన్ని శాశ్వతంగా కొనసాగించే ప్రమాదముంది. అందుకే అటు రాజకీయాల్లో గానీ ఇటు సాహిత్య, సాంస్క ృతిక రంగంలో బానిసల పట్ల జాగరూకతతో మెలగాలి. నిజానికి వెన్నెముఖలేని సాహిత్యకారులు ఎంతటి తెలంగాణవాది అయినా సారాంశంలో సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగానే మిగిలిపోతాడు.
రెండు ప్రాంతాల్లోనూ తమ కులం వాళ్ళు ఉండడం, ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవానికి లోటు రాకుండా చూసుకోవడానికి, రాష్ట్ర, కేంద్ర అవార్డులు నిర్ణయించడంలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తెలంగాణలోని ఆధిపత్యులు  సీమాంధ్రుల మనసెరిగి మసులుతుండ్రు. అనివార్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన వీళ్ళు తమకు అవసరమనిపిస్తే తిరుపతి ప్రపంచ సభలకు వెళ్ళినట్టే ఇక్కడి ప్రజలకూ పంగనామాలు పెట్టగల సమర్ధులు. భాషకు పట్టం కట్టే పేరుతో తిరుపతికి వెళ్ళినామనే వాళ్ళు రేపటి తెలంగాణలో అదే భాష పేరిట స్థానికుల ‘హిందూత్వ’ వైఖరి అవలంభించే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఇదివరకే ఉర్దూని ముస్లిముల భాషగా ముద్రేసిండ్రు.
తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచీ ఆంధ్రాధిపత్యులు, వారికి వంతపాడే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ కేవలం తెలుగువారి రాష్ట్రంగానే పరిగణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలుగు మాట్లాడేవారే కాదు ఉర్దూ మాతృభాషగా మాట్లాడే వాళ్ళు దాదాపు 15శాతం మంది ఉన్నారనే సోయి బుద్ధిజీవులకు లేకుండా పోయింది. తెలంగాణలో ఉర్దూమాట్లాడే ముస్లిములే గాకుండా కాయస్థులు, హిందీ మాత్రమే మాట్లాడే లోధీలతోపాటు భిన్నమైన ఇతర భాషలు మాట్లాడే రంగ్రేజ్‌, ఆరెమరాఠీలు, లంబాడీ, కోయ, గోండు, చెంచులు కూడా తెలంగాణలో భాగమనే గ్రహింపు కూడా వీరికి లేదు. తెలుగువాళ్లంతా ఒక్కటే అని కూడా టీవి చర్చల్లో అటు ఆంధ్రవాండ్లు, ఇటు తెలంగాణ వాండ్లు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.

సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి. భాషకు కూడా కులముంటదని బుద్ధిజీవులు గుర్తించరు. ముఖ్యంగా బీసీల్లోని దాదాపు ప్రతి కులానికి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, అవసరాల రీత్యా మిగతా వారితో మాట్లాడుకునే భాష భిన్నంగా ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగానూ ప్రత్యేకమైన భాష ఉంది. అది తమ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్క ృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఆ భాషలు వారికి పరాయివి కావు. హైదరాబాద్‌లో ఇప్పటికీ పాతబస్తీకి వెళితే ఉర్దూ మాట్లాడే కాయస్థులు, తెలుగు మాట్లాడే కన్నడిగులు, కన్నడ మాట్లాడే మరాఠీల కనబడతారు. అందుకే నిజాం జమానాలో ప్రతి ఫర్మాన్‌ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో వెలువడేది. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రిక ‘హైదరాబాద్‌ సమాచారము’ ఈ అన్ని భాషల్లో ప్రచురితమయ్యేది. ఈ పంచభాష సంస్క ృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే. తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగు భాషని కాపాడలనే వారెవ్వరూ హైదరాబాద్‌లో తెలంగాణలో ఉర్దూని కాపాడలనీ, కన్నడను కాపాడాలని ఎన్నడూ అడుగరు.
తెలంగాణలో పాఠ్యపుస్తకాల్లో ఒకరకమైన భాష ఉంటుంది. అది బోధించే ఉపాధ్యాయుడు తనదైన భాషలో చెబుతాడు. తనదైన భాష అన్నప్పుడు అతని కులం, పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం వల్ల అబ్బిన భాష. చదువుకునే విద్యార్థికి ఇవి రెండూ కొత్తగానే ఉంటాయి. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలో చదువుకుంటున్నది బహుజనులు మాత్రమే. అదీ తమ తరంలో మొదటి వారు మాత్రమే! ఈ పాఠ్యపుస్తకాల్లో విషయం ఎట్లాగూ తెలంగాణకు సంబంధించినది ఉండదు. కనీసం వాటిని వ్యక్తికరీంచేందుకు తెలంగాణ నుడికారానికి కూడా చోటులేదు.

అందుకే రెండు ప్రాంతాల్లో ఉనికిలో ఉండే (అగ్ర)కులాల వాండ్లకు తప్ప తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనే భావన బహుజనుల్లో ముఖ్యంగా బీసీల్లో ఏర్పడలేదు. మెజారిటీగా 50శాతానికి పైగా ఉన్న బీసీలు (ఉర్దూ మాట్లాడే ముస్లిములను మినహాయిస్తే ఈ శాతం ఇంకా పెరుగుతది) తాము స్వతహాగా మాట్లాడుకునే భాష ఎక్కడా లేదు. తెలుగుభాషగా చలామణిలో ఉన్న భాషలో బహుజనుల నుడికారం, పదసంపద కానరాదు. అలాంటప్పుడు భాష కలిపి ఉంచే సూత్రం ఎంతమాత్రం కాదు. ఇది బలవంతంగా, కృత్రిమంగా కల్పించిన బంధం మాత్రమే. ఈ బలవంతపు బంధం విడిపోయిందంటే సంతోషపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ భాష గురించి గుండెలు బాదుకుంటుంది కూడా అగ్రకులస్తులే అనే విషయాన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బహుజనులు తెలుగుకన్నా ఇంగ్లీషుపై దృష్టి కేంద్రీకరించాలనేది నేటి డిమాండ్‌.
తెలుగుజాతి అంతా ఒక్కటే అనే సూత్రాన్ని కూడా ఇదివరకే కొందరు తెలంగాణవాదులు కొట్టిపారేసిండ్రు. అయినా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరు ప్రాంతాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొందరు, తమ పార్టీ, సంఘం ప్రయోజనాలను కాపాడడానికి కొందరు, ఇంకా చెప్పాలంటే రెండు ప్రాంతాల్లోనూ తమ ఆధిపత్యం యథాతథంగా కొనసాగాలనుకునేవారు (వీళ్లు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నారు) ఈ తెలుగు జాతి సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఒక జాతికి తనదైన ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకే జాతీయ నాయకులను ఆరాధించడం, ఒకే భాష, ఒకే సంస్క ృతి, ఒకే చరిత్ర కలిగి ఉండడమే గాకుండా ‘అంతా ఒక్కటే’ అనే భావన కూడా ప్రజల్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారికి లేదు.

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

తెలంగాణకు సంబంధించిన సర్వాయి పాపన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, కుతుబ్‌షాహీలు, మహబూబ్‌అలీఖాన్‌, కొమురం భీమ్‌ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రాంతంలో తెలిసిన వారు కాదు. వారి గురించి ఎన్నడూ వినలేదు. కనీసం పాఠ్యపుస్తకాల్లోనూ వారి గురించి పాఠాలు లేవు. ఆంధ్రప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు (ఈయన ఎక్కువ కాలం జీవించింది తమిళనాడులోనే) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు వొదిలిండు. ఈయనెవరికీ తెలంగాణలో తెలువదు. తెలంగాణవాళ్లు ఆయనతో మనకెలాంటి సంబంధం లేదు అనుకుంటారే తప్ప మనవాడు అనుకోరు. ఆయన్ని సమైక్యవాదిగా సీమాంధ్రులు ముందుకు తీసుకురావడం వల్ల కోమట్లు తమ వాడు అనే గౌరవంతో పల్లెల్లో నిలబెట్టిన ఆయన విగ్రహాలకు కష్టకాలం వచ్చి పడిరది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కూడా తెలంగాణ వాళ్ళకు (కొంతమంది రెడ్లు మినహాయింపు) అదే భావన ఉంది. ఈ ‘జాతి’ నాయకుల గురించి ఎన్నడూ ఎవ్వరూ అందరికీ పరిచయం చేయాలని ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన భావ సమైక్యత ఎన్నడూ కలుగలేదు. అంతెందుకు వల్లభ్‌భాయి పటేల్‌ సీమాంధ్రులకు జాతీయ నాయకుడు కావొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ముస్లిములకు ఒక విలన్‌. పటేల్‌ అటు సాయుధ పోరాట యోధులను చంపించడమే గాకుండా పోలీస్‌ యాక్షన్‌ పేరిట వేలాది ముస్లిముల ప్రాణాలు తీసిండు.

అలాగే భాష ఒక్కటి కాదని పైన చర్చించుకున్నాము. ఇక సంస్క ృతి ఒక్కటి కాదనే విషయాన్ని 1969 నుంచి ఇప్పటి దాకా ప్రతి తెలంగాణ వాదీ రాసిండు.  మా పండుగలు వేరు, మా ఆచార వ్యవహారాలు ఆఖరికి మేము మొక్కే దేవతలు కూడా వేరు అని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిండ్రు. నిరూపించిండు. అంతేగాదు తెలంగాణది హీన సంస్కతి అని కూడా ఆధిపత్యులు ప్రచారం చేసిండ్రు. మీరు కోడిపుంజుల కొట్లాట పెడితే మేం బతుకమ్మలు ఆడుతాం అని తెలంగాణ వాళ్ళంటే అది సంస్కతిలోని భిన్నత్వాన్ని పట్టిస్తుంది తప్ప కించపరచడం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే ఆధిపత్య వాదులు తెలంగాణ సంస్క ృతిపై మరో నింద కూడా వేసిండ్రు. మీదంతా దొరలు, నవాబుల సంస్కృతి రాములమ్మ సినిమాలోని సంస్క ృతి అంటూ నిందించిండ్రు. రాములమ్మ సినిమాలోని సంఘటనలు వాస్తవ సంఘటనలు అని ప్రచారం చేసి, తెలంగాణ దొరలంతా స్త్రీలను చెరబట్టే వారిగా చూపించిండ్రు. ఇది వాస్తవం కాదు. (ఈ విషయం గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం) ఇంత భిన్న సంస్క ృతి ఉన్న వాళ్ళమధ్య భావసారుప్యత రావడమనేది అసంభవం.

ఇక చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ఆధునిక చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంవత్సరాలను లెక్కేసి మరీ మీ చరిత్ర వేరు మా చరిత్ర వేరు అని తేల్చి చెప్పిండు. అన్ని విషయాలు భిన్నంగా ఉన్నప్పుడు జాతి ఒకటే అనే భావన ఎలా కలుగుతుంది. నిజానికి పురాణ కాలం నుండి తెలంగాణ జాతి భిన్నమైనదే! షోడశ జానపదాల్లో అశ్మక సామ్రాజ్యం ఒకటి. ఇందులో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయే తప్ప ఆంధ్రప్రాంతాలు లేవు. ఆంధ్ర అంటే నిఘంటువుల్లో అర్థాలు కూడా ఏమంత వీనుల విందుగా లేవు. అట్లాంటిది జాతి భావన పేరిట మళ్ళీ జత కట్టాలని ప్రయత్నించడమేంటే 60 యేండ్లుగా దేనికి వ్యతిరేకంగా తెలంగాణ భూమి పుత్రులు, కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారో మళ్ళీ అదే పాలన, ఆధిపత్యాన్ని, ఆణచివేతను తీసుకొచ్చేందుకు చేసే కుట్రగానే భావించాలి.
ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పది జిల్లాల నుంచి పదివేలకు పైగా కవిత్వ, వ్యాస, కథా, నవలా పుస్తకాలు, సంకలనాలు, సంపుటాలు, సీడీలు వెలువడ్డాయి. ఇందులో ఏవి కూడా సీమాంధ్రలోని పుస్తకాల షాపుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతెందుకు నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడలో దగ్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర కొలమానాల్లో తూచి, శైలి, శిల్పం, వస్తువు, వ్యక్తీకరణ పేరిట కథల్ని, కవిత్వాన్ని అంచనా వేసి నాసిరకం అని తేల్చేస్తుండ్రు. తెలంగాణ భాషలో రాసిన కథలేవి మాకు పంపొద్దని పత్రికా సంపాదకులు నిర్ద్వందంగా తేల్చి చెబుతుండ్రు. మన ప్రతిభను అంచనాగట్టడానికి పరాయి వాళ్ళకు పెత్తనమిస్తే వాళ్లు నెత్తంతా కొరిగి పెట్టడమే తప్ప ఒరగబెట్టేదేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

ఆధిపత్యం లేకుంటే ఆంధ్రవాళ్ళతో కలిసిపోవచ్చు, తెలుగువారి ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కూడా అత్యాశే! అంతేకాదు అవాంఛనీయం కూడా! ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ‘కలిసిపోవొచ్చు’ అనే భావన తెలంగాణవారి మనస్సులో లక్షలో ఒక వంతు కలిగిన దాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు సీమాంధ్రులు సిద్ధంగా ఉంటారు. రేపు తెలుగుభాషకు సాహిత్యానికి జాతీయిస్థాయిలో దక్కే అవార్డుల కోసం, గౌరవం కోసం, పద్మఅవార్డుల కోసం ఇతర గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో తెలంగాణ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటది.

అలాంటప్పుడు నిర్ణేతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా సాంప్రదాయిక తెలంగాణవాళ్ళు ఉన్నట్లయితే అవి మళ్ళీ మళ్లీ ఆధిపత్య ఆంధ్రులకే దక్కే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే మన సాహిత్యాన్ని అంచనాగట్టేందుకు మనమే కొత్తకొలమానాలను రూపొందించుకోవాలి. ఆధిపత్యుల చెర నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇక తెలుగువారి మధ్యన ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కన్నా భారతీయుల మధ్యన ఐక్యత కోరుకుంటే అంతా సమానమన్న భావన వస్తది. (అసలు సిద్ధాంతమయితే ప్రపంచ కార్మికులారా ఏకంకడి అనుకోండి) అయినా 60 యేండ్ల సంది తెలంగాణను నంజుకు తిన్నవారితోటి ఐక్యత ఎవరి అవసరం? కచ్చితంగా ఇది తెలంగాణ వారి మేలుని కోరేదయితే కాదు. అయితే చుండూరు బాధితుల తరపున, పోలేపల్లి నిర్వాసితుల తరపున ఇటు తెలంగాణవారు, అటు ఆంధ్రవారూ సమస్యల వారిగా సంఘటితంగా పోరాటం చేయవచ్చు.

అంతేగాని మొత్తంగా తెలుగువారి ఐక్యత అంటే మళ్ళీ ఆంధ్రాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకతీతంగా అగ్రకులాధిపత్యానికి ఆహ్వానంగా భావించాలి. అయితే పోలవరం విషయానికొస్తే బుద్ధిజీవులు ఎవరి పక్షాన నిలబడుతారనేది వారి నిబద్ధతకు గీటురాయి. తమ సర్వస్వాన్ని సెజ్‌ల కోసం కోల్పోయే వారికి సంఫీుభావంగా ఉంటారా? సర్వం కొల్లగొట్టి తీరాంధ్రలోని బలహీనవర్గాల భుక్తిని కూడా కొల్లగొట్టే మూడోపంటకు నీరు కోరుకునే వారి పక్షాన నిలబడతారో తేల్చుకోవాలి.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ కలకాలం మనగలగాలి అంటే ఈ 60 యేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యం, హింస, ఉక్కుపాదంతో అణచివేయబడ్డ ఉద్యమాలు, కబ్జాకు గురైన చెరువులు, భూములు, రాజ్యహింసకు గురైన ప్రతి ఒక్క మనిషి చరిత్రను సాలార్జంగ్‌ మ్యూజియం కన్నా పదింతల పెద్దదయిన ప్రదర్శనశాలలో పెట్టాలి. 1969 కాలంలోనే జరిగిన బంగ్లాదేశ్‌ యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, చిన్నారులను చిత్రవధ చేయడం దగ్గరి నుంచి రక్తాలోడుతున్న చిత్రాలను అక్కడి ప్రభుత్వం జాతీయ మ్యూజియంలో నిక్షిప్తం చేసింది. పాకిస్తాన్‌ మిలిటరీ పాల్పడ్డ అకృత్యాలను సజీవంగా చిత్రిక గట్టింది. అందుకే ఆ మ్యూజియం సందర్శించిన వాళ్ళు పాకిస్తాన్‌పై మరింత కసిని పెంచుకొని బైటికి వస్తారు.

అలాగే ఇవ్వాళ తెలంగాణ తాను కోల్పోయిన సహజ వనరుల్ని, విధ్వంసానికి గురైన బతుకుల్ని, ఛిధ్రమైన వారసత్వ సంపదని, నెత్తురోడిన 1969 ఉద్యమ చిత్రాల్ని, వంచనకు, హేళనకు గురైన నిన్న మెన్నటి ఉద్యమ డాక్యుమెంటరీలను, సమైక్య రాష్ట్రంలో పద్మ అవార్డులకు దూరమైన వైతాళికుల్ని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీలులేదు, ఒక్కపైసా ఇవ్వం ఏం జేసుకుంటారో చేసుకోండి అనే ప్రసంగ పాఠాల్ని, చిత్రాల్ని, తెలంగాణ ప్రజల్ని విలన్లుగా చూపించిన సినిమాలను ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరముంది. లేకుంటే రేపటి తరానికి నిన్నటి తరానికి జరిగిన అన్యాయంపై అవగాహన లేకుండా పోతుంది. ఇవ్వాళ అవగాహన రాహిత్యంతో బుద్ధిజీవులు చెబుతున్న తెలుగువాళ్ళమంతా ఒక్కటే అనే భావనలో మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని, హింసను కచ్చితంగా రికార్డు చేసి పెట్టాలి.
ఇన్నేండ్లు తెలంగాణ విస్మరణ, వివక్షకు, వక్రీకరణకు గురయ్యిందని చెబుతూ వచ్చాం. దానికి సాక్ష్యాలను రికార్డులను ప్రదర్శనకు పెట్టనట్లయితే మళ్ళీ మనం మోసపోయే ప్రమాదముంది. సాహిత్యంగా కన్నా రాజకీయం ఈ అవసరం ఎక్కువగా ఉంది.  మన ప్రతీకల్ని మనం నిర్మించుకోకుండా ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేము. ట్యాంక్‌బండ్‌పై మన విగ్రహాలను కొలువు దీర్చకుండా భావజాలంలో మార్పు తీసుకురాలేము. తెలంగాణ వాండ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇక్కడి వైతాళికులని ఒక్కొక్కరిని లెక్కగట్టి స్మరించుకోవాలి. అది తెలుగు వాళ్ళమన్న భావనలో గాకుండా తెలంగాణవాళ్లమన్న సోయితోనే సాధ్యం.

                                                                                                                                                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

తెలంగాణా కేవలం ఒక “ఫుట్ నోట్” కాదు!

sangisetti- bharath bhushan photo
60 యేండ్ల ఎడతెగని పోరాట ఫలితం ‘తెలంగాణ’. వలసాంధ్ర బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కోసం తెగించి కొట్లాడిన బిడ్డలందరికీ వందనాలు. తెలంగాణను దోసుకుందెవరో? దోపిడీ చేసిందెవరో? అభివృద్ధి నిరోధకులెవరో? అహంకారంతో మెలిగిందెవరో? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసెందెవరో? అందరికీ తెలిసిన విషయమే!

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో భవిష్యత్తెలంగాణను ఎలా నిర్మించుకోవాలో? భౌగోళిక తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా  ఎలా మార్చుకుందాం  అనే అంశంపై దృష్టిని సారించాలి. ఇన్నేండ్లు, ఇన్నాళ్లు మనకు హక్కుగా దక్కాల్సిన వాటాను ఆధిపత్యవాదులు ఎలా కాజేసిండ్రో చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడది ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. అందుకోసం పునాదుల నుంచి వినిర్మాణం జరగాలి. సకల ఆధిపత్యాలను ధిక్కరించే ‘తెలంగాణ’ను నిర్మించుకోవాలి. సాహిత్యంలో సైతం ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. కొత్త ప్రతీకలను నిర్మించుకుందాం. విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన విషయాల్ని ఇకనైనా వెలుగులోకి తెద్దాం. వాటికి చిత్రిక గడుదాం. ఈ వెలుగులో తెలంగాణ సాహిత్య/సామాజిక/సాంస్కృతిక చరిత్రను తిరగ రాద్దాం. ఇన్ని సంవత్సరాలు ఉటంకింపులకు, పాదసూచికలు, బ్రాకెట్ల మధ్యలో నిలిచిన అంశాల్ని చర్చకు పెట్టాల్సిన అవసరముంది.
ఆధిపత్యాల నిర్మూలనలో (వినిర్మాణ) తెలంగాణలోని బుద్ధిజీవులందరూ తమ వంతు కృషి చేసిండ్రు. టాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించడంలోనూ అంతే
బాధ్యతతో తెలంగాణ బిడ్డలు పాలుపంచుకుండ్రు. కోడి పందాల స్థానంలో తెలంగాణ బతుకమ్మలను ఆడినం. తెలంగాణ వంటలు వండుకున్నం, ఆటలు ఆడుకున్నం, పాటలు
పాడుకున్నం, ధూంధాంలు ఆదినం. ఇదంతా ఉద్యమంలో భాగంగా, ఎవరికి తోచిన విధంగా వారు, సీమాంధ్ర ఆధిపత్యాలను కూల్చడానికి, స్వీయ అస్తిత్వాన్ని చాటడానికి
ఉద్యమకారులు చేసిన పోరాట రూపాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో పనిచేయడం కుదరదు. అందుకే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణవాదులు
చేసిన మంచిపనులన్నింటిని జూన్‌ రెండు నుంచి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు,
గ్రూపులు, వ్యక్తులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్ని చిరస్మరణీయంగా తీర్చి దిద్దాలి. చరిత్రలో నిలబెట్టాలి.

vaikuntam-16x12in
గత అరవైయేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ‘పద్మ’ అవార్డులన్నీ సీమాంధ్ర వందిమాగధులకే ఎక్కువగా దక్కాయి. వారు మాత్రమే సాహిత్యకారులు,
వారు మాత్రమే సకల కళా పారంగతులుగా వెలిగి పోయారు. 60 యేండ్ల పాటు తెలంగాణ బతుకుల్ని చిత్రాలుగా మలిచిన సిద్దిపేట కాపు రాజయ్య, కొండపల్లి
శేషగిరిరావు, పి.టి.రెడ్డి, ప్రపంచం గొడవను ‘నా గొడవ’గా చేసిన కాళోజి నారాయణరావు, సంగీత, సాహిత్య రంగాల్లో తెలంగాణ ప్రజ్ఞను ప్రపంచ వ్యాప్తం
జేసిన సామల సదాశివ, పాండవ కళాకారిణి తీజ్‌రీ భాయికి ఏమాత్రం తీసిపోని చిందు ఎల్లమ్మ, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ,
తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, తెలంగాణ భాషకు పట్టం కట్టిన పాకాల యశోదారెడ్డి, జానపదాల్ని జ్ఞానపదులకు తెలియజెప్పిన
బిరుదురాజు రామరాజు, బహుభాషా కోవిదుడు, రాజకీయ పండితుడు పి.వి.నరసింహారావు, తెలుగు`ఉర్దూ భాషల వారధి హీరాలాల్‌ మోరియా, తెలంగాణ
ప్రతిభను, సాహిత్యాన్ని, గౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన పరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ, బి.ఎన్‌.శాస్త్రి, 1969 ఉద్యమాన్ని చట్టసభల్లోనూ,
బహిరంగ సభల్లోనూ నడిపించిన ధీర వనితలు టి.ఎన్‌.సదాలక్ష్మి, ఈశ్వరీభాయి, సాయుధ పోరాటంలో సమరం జేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని
ధర్మభిక్షం, నల్లా నరసింహులు, సాయుధ పోరాట కాలం నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాలం వరకు నిరంతర ప్రతిపక్షంగా నిలిచిన బండ్రు నరసింహులు లాంటి
ఎందరో మహానుభావులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు.

తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయిన వీరి కీర్తి, ఘనత అందరికీ తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సందర్బంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక
అంతకుముందు చనిపోయిన వారికీ, ప్రస్తుతం బతికున్న వారికి కూడా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. భారత ప్రభుత్వం తరపున ఇచ్చే పద్మ అవార్డుల్లో ఒక్క
కాళోజి నారాయణరావుని మినహాయిస్తే మిగతా ఎవరికీ దక్కలేదు. ఇక్కడ పేర్నొన్న అందరూ ‘పద్మ’అవార్డులకు అర్హులు. రేపటి తెలంగాణలో ఇలాంటి అన్యాయం
జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడి భూమి పుత్రులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూడాలి.
1990లకు ముందే దాటుకున్న తరానికి కూడా భవిష్యత్తులో గౌరవం దక్కాలి. తెలంగాణ సాహిత్యంలో ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమాలకు
ఊపిరులూదిన రావి నారాయణరెడ్డి, గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసిన రాజా నాయని వెంకటరంగారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుంటక నరసయ్య పంతులు, సంగెం
లక్ష్మీభాయి, బూర్గుల రామకృష్ణారావు, కవిరాజమూర్తి, కొండా వెంకటరంగారెడ్డి, అరిగె రామస్వామి, మాసుమా బేగం, మహేంద్రనాథ్‌, మర్రి
చెన్నారెడ్డి, మల్లికార్జున్‌, జయసూర్య, మెల్కోటే, కోదాటి రాజమల్లు, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య సామాజిక రంగాల్లో పనిచేసిన వేలాది మంది
ఇవ్వాళ ‘వాళ్లెవ్వరు?’ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. వారు చేసిన పోరాటాల గురించి కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది.

 

తెలంగాణపై పోలీస్‌యాక్షన్‌ నాటి గురించి చెప్పుకుంటేనే ఇంత చరిత్ర ఉంది. వీరి కన్నా ముందు సామాజికోద్యమాలు నడిపిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా మత
సహనానికి చిహ్నం మహబూబ్‌ అలీఖాన్‌, బందగీ, బండి యాదగిరి, షోయెబుల్లాఖాన్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, యాదగిరి,  లాంటి ఎంతో మంది తెలంగాణ ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసిండ్రు. వ్యక్తులుగా వీరికి విగ్రహాలు, భవనాలకు పేర్లు, పార్కులు, స్టేడియాలకు పేర్లు పెట్టినంత మాత్రాన పంచాయితీ వొడువదు.  ఇన్నేండ్లుగా ప్రజా
ఉద్యమాల్లో సేవ, త్యాగం లక్ష్యంతో సర్వం అర్పించి పోరాటం చేసిన భూమిపుత్రులను ప్రతి యేటా జయంతి, వర్ధంతుల్లో స్మరించుకోవాలి. త్యాగపురుషుల జీవితాలను తెలంగాణ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. సమ్మక్క, సారలమ్మల పోరాటం, సర్వాయి పాపన్న విజయ బావుటా, తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, పత్రికోద్యమాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసుచర్య, ఆంధ్రప్రదేశ్‌ పీడ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌ పోరు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వైనం, మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, టీఆర్‌ఎస్‌ ఉద్యమం అన్నీ రేపటి చరిత్ర పుస్తకాల్లో సముచిత రీతిలో రికార్డు కావాలి.
మనం బోనం, బొట్టు, బతుకమ్మ, దసర పండుగ, హోళి, నోములు, వ్రతాలు, పీర్ల పండుగ, సాంస్కృతిక పయనం అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో చేసుకునే
పండుగలుగా ఆదరించబడాలి. సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, నాగోబ జాతర, మహాంకాళి, మన్నెంకొండ, కురుమూర్తి, రంగాపూర్‌ ఉర్సు, కొమురెల్లి మల్లన్న,
ఏడుపాయల దుర్గమ్మ, బడాపహాడ్‌ ఉర్సు, లింగమంతుల, సిరసనగండ్ల జాతరలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన
చర్యలు. ఇన్నేండ్లు సీమాంధ్ర ఆధిపత్యం మూలంగా స్మరణకు, గౌరవానికి నోచుకోకుండా పోయిన ఉత్సవాల్ని మనమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గత 25
యేండ్లుగా తెలంగాణ వాదులు తమ ఉద్యమాలను ఎందుకోసం  చేశారో ఆ కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి.
ఇక విశ్వవిద్యాలయాల కొస్తే సాహిత్య, సామాజిక రంగాల్లో విస్తృతమైన పరిశోదనలు జరపాలి. మన ఔన్నత్యానికి చిత్రిక గట్టాలి. 1956కు ముందు వచ్చిన
ప్రతి రచనను అచ్చులోకి తీసుకు రావాలి. అకాడెమీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర వహించాలి. అముద్రితంగా ఉన్న తాళపత్రాలను సేకరించి వాటిని ప్రచురించాలి.
గతంలో ప్రచురించబడ్డప్పటికీ ఇప్పుడు అందుబాటులో లేని రచనలను పునర్ముద్రించాలి. అలనాటి తెలంగాణ సాహితీవేత్తల జీవితం, సాహిత్యం రెండిరటిపై విశేషమైన పరిశోధనలు జరిపించాలి. వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. ఒక్కోకవి/రచయితకు సంబంధించిన రచనలన్నింటిని సమగ్ర సంకలనాలుగా వెలుగులోకి తేవాలి. రచయితలు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధుల జీవిత చరిత్రలను/ ఆత్మకథలను కూడా అచ్చేయాలి. తెలంగాణ పెయింటర్ల జీవితాలు వారి పెయింటింగ్స్‌ రెండూ అచ్చవ్వాలి.
గుణాఢ్యుడు దగ్గరి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో పుట్టిన ప్రతి ప్రసిద్ధ వ్యక్తి సమాచారాన్ని ‘జీవిత సర్వస్వం’ రూపంలో రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే ఇంగ్లీషులో డిక్షనరీ ఆఫ్‌ నేషనల్‌ బయోగ్రఫీ అని ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తుల జీవిత  చరిత్రలను ప్రతి యేటా రికార్డు చేస్తున్నారు. ఆ మాదిరిలో తెలంగాణ వారి జీవిత చరిత్రలను కూడా చరిత్ర
పుటల్లోకి ఎక్కించాలి. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో పది జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 20 కానుంది. ఈ ఇరవై జిల్లాల గెజిటీర్లను/ జిల్లా సర్వస్వాలను కూడా ముద్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
తెలంగాణలోని వ్యక్తుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అవార్డులను ప్రముఖ తెలంగాణ వ్యక్తుల పేరిట నెలకొల్పాలి. లలితకళలు, ఫోటోగ్రఫీ, జానపదాలు, సాహిత్యం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. నిజాం జమానాలో డాక్టర్‌ మల్లన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి డాక్టర్లను విదేశాలకు పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డాక్టర్‌ మల్లన్న అనస్తీషీయాలో నోబుల్‌ ప్రయిజ్‌ గెలుచుకున్న జర్మన్‌ డాక్టర్‌ దగ్గర పనిచేశారు. ఆయనకు ఆ ప్రయిజ్‌లు రావడంలో ఈయన పాత్ర ప్రధానమైంది. భవిష్యత్‌లో కూడా ఈ పరంపర కొనసాగాలి. రేపటి బంగారు తెలంగాణలో ఇన్నేండ్లుగా విస్మరణకు గురైన శ్రేణులకు సరయిన గుర్తింపు దక్కాలి. వారి ప్రతిభకు ప్రోత్సాహమూ ఉండాలి.
ఎక్కడ కూడా ఆధిపత్య పోకడలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు / గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి.
తెలంగాణ కళలకు కాణాచి. నిన్నటి వరకు ‘ఎవరెస్టు’ అనే పేరు హైదరాబాద్‌తో సంబంధమున్న ఒక సర్వేయర్‌గానే తెలుసు. కాని ఇవ్వాళ తెలంగాణ పిల్లలు ఆ పేరిట ఉన్న శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలందుకుంటున్నారు. భవిష్యత్‌లో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ పేరు కూడా ‘ఎవరెస్టు’లా నిలిచేందుకు ఆ యా రంగాల్లో ప్రవేశం, తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న కె.చంద్రశేఖరరావు పై కూడా ఇక్కడి ప్రజలకు అపరిమితమైన ఆకాంక్షలున్నాయి. వీటన్నింటిని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుస్తాడనే విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకం ఇనుమడిరచేలా కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో
ముందడుగేయాలి.

– సంగిశెట్టి శ్రీనివాస్‌

హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వ సంపద ఉర్దూ

సంగిశెట్టి శ్రీనివాస్‌

సంగిశెట్టి శ్రీనివాస్‌

 సీమాంధ్ర ఆధిపత్యవాదులు, వారి తాబేదార్లు కొందరు తమ రచనల్లో కొత్తగా ఇటీవల ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని విరివిగా వాడుతున్నారు. ఇది పూర్తిగా తెలంగాణ తెహజీబ్‌కు వ్యతిరేకమైన పదం. తెలంగాణ ప్రాంతాన్ని సంబోధించడానికి ‘తెలంగాణాంధ్ర’ అనే పదాన్ని వాడినట్లయితే ఉర్దూ మాతృభాషగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న 60లక్షల మందికి పైగా ముస్లింలను అవమానించడమే! వారిని తెలంగాణ నుంచి వేరు చేసి చూడడమే!

కాస్మోపాలిటన్‌ కల్చర్‌తో పారిస్‌, లండన్‌, ఇస్తాంబుల్‌లతో సమానస్థాయిలో విలసిల్లిన హైదరాబాద్‌ ఆత్మను అగౌరవ పరచడమే! నిజానికి హైదరాబాద్‌ సంస్కృతిలో ఎన్నడూ పరాయివారిని, పరాయివారి భాషను కించపరచాలనే భావన ఏ కోశానా ఉండదు. మంచి ఎవరు చెప్పినా ఆచరించడం, అభినందించడం ఆనవాయితీ. కాని ఇప్పటి టీవీల్లో, పత్రికల్లో, సినిమాల్లో వాడే ‘తెలుగు’ భాష కచ్చితంగా తెలంగాణ తనాన్ని కించపరిచేదే! ఛానళ్లలో అలవోకగా ఆరి ‘భడవా’ మాదిరిగా వందలాది పదాలు ఎలాంటి జంకు గొంకు లేకుండా వాడుతున్నారు. ‘భడవా’ అంటే తెలుగులో ‘తార్పుడుగాడు’ అని అర్థం. ఇలా భాష తెలియకుండానే దాని అర్థం తెలియకుండానే సీమాంధ్ర ‘మేధావులు’ వాడేస్తున్నారు.

 

హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మింగేయడం మూలంగా తెలంగాణ తెలుగుకు ముఖ్యంగా హిందూ`ముస్లిం ఉమ్మడి సంస్కృతి, వారసత్వానికి ప్రతీక అయిన ఉర్దూకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడ్చలేనిది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీసం కొంతలో కొంతమేరకైనా దీనికి అడ్డుకట్ట పడుతుంది. తెలంగాణ తెలుగు, ఉర్దూ రెండిరటిని సమాధి చేసిన సమైక్య రాష్ట్రంలో ఈనాటికీ అబద్దాలే రాజ్యం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశాడనీ, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెబుతున్నారు. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టింది ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మద్రాసు నగరం కోసం. రెండోది తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం 1935లో ఏర్పడ్డ ఒరిస్సా. ఇవన్నీ మరిచి అబద్ధాలనే ఆధిపత్యాంధ్రులు ప్రచారంలో పెడుతున్నారు.
1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో తెలంగాణ ప్రజల బహుభాషా ప్రావీణ్యానికి గండి పడిరది. ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని అదే హైదరాబాదియత్‌ని కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని ముక్కలు చేయడం ద్వారా సమున్నతమైన సహజీవనానికి తెరపడిరది. భాషోన్మాదం మూలంగా హైదరాబాద్‌ రాజ్యంలోని తెలుగు ప్రజలు కేవలం తెలుగు భాషకు అదీ తమది కాని భాషలో విద్యాభ్యాసం చేయాల్సి వచ్చింది. విద్యార్థులు ఇంట్లో మాట్లాడే భాష ఒకటి, పాఠశాలల్లో పంతుళ్లు బోధించే భాష మరో యాసలో, చివరికి విద్యార్థి అర్థం చేసుకొని రాసిన భాష, జవాబు పత్రాన్ని దిద్దేవారికి అర్థంగాని గందరగోళ పరిస్థితి. వెరసి తెలంగాణ విద్యార్థికి జీవితకాల నష్టం.
1950కి ముందు హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కచ్చితంగా మూడిరటికన్నా ఎక్కువ భాషలు మాట్లాడేవారు. చదువకుకున్న వారయితే వాటికి అదనంగా ఇంగ్లీషు, ఫారసీ, అరబ్బీ కూడా తోడయ్యేది. దైరతుల్‌ మారిఫ్‌ లాంటి హైదరాబాద్‌లోని తర్జుమా సంస్థ మొత్తం ప్రపంచంలోని ఏ భాషలో ప్రచురితమైన సాంకేతిక పరిజ్ఞానం సహా సమాచారమంతా ఉర్దూ మాధ్యమంలోకి అనువదించేది. అయితే హైదరాబాద్‌పై పోలీసు చర్య తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. పోలీసు చర్యతో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికాధికారులు ఇంగ్లీషు భాషతో మమేకమయ్యారు. వారి అధికారిక భాష కూడా ఆంగ్లమే. వీరికి సహాయకులుగా పనిచేయడానికి మదరాసు రాష్ట్రం నుంచి తెలుగు అధికారులు వచ్చారు.

urdu1

మొదట వచ్చిన వెల్లోడి ప్రజాస్వామిక భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య తొలి ముఖ్యమంత్రి. ఈయన తన పరిపాలనా సౌలభ్యం కోసం ఇంగ్లీషుని పాలన భాషగా ఏర్పాటు చేసుకొన్నారు. ఇంగ్లీషు భాష తెలిసిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నప్పటికీ వారిని ఉన్నత స్థానల్లో కొనసాగించినట్లయితే హైదరాబాద్‌ రాజ్యంలో వేర్పాటువాదానికి ఊతం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో ఇంగ్లీషు తెలిసిన ప్రాంతేతరులకు ఉద్యోగలిచ్చారు. ఇలా ఉద్యోగం పొందిన వారు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే కావడం విశేషం. వీళ్ళు స్థానికభాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో పాలన పేరిట తెలుగుని పరిపాలనలో అమల్లోకి తెచ్చారు. ఇలా తెలుగుని అధికారిక భాషగా చేయడంతో అప్పటి వరకూ అసఫ్‌జాహీ ప్రభుత్వ బోధనా భాషగా కొనసాగిన ఉర్దూని బలవంతంగా తొలిగించారు. ఇలా ఉర్దూని తొలగిండమంటే ఉర్దూ తెలిసిన ఉద్యోగుల్ని తొలగించడమే! ఇలా తొలగించబడిన వారిలో అత్యధికులు ముస్లింలు ఉన్నప్పటికీ ఉర్దూ మాత్రమే తెలిసిన హిందువులు కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారి స్థానంలో ప్రాంతేతరులైన తెలుగువారికి ఉద్యోగాలు దక్కాయి. స్థానికంగా ఉన్నత ఉద్యోగాల్లో తిష్ట వేసిన ఆంధ్రప్రాంత అధికారులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ముల్కీ సర్టిఫికెట్లు జారీ చేసి గైర్‌ముల్కీలకు ఉద్యోగాలిచ్చారు.
1952 నాటికి హైదరాబాద్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిరది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన స్వతహాగా సాహిత్య జీవి. ఉర్దూ, పారసీ భాషపై మంచి పట్టున్న వాడు. ఆ భాషా చరిత్రలను తెలుగు పాఠకులకు అందించాడు. అలాంటి వ్యక్తి మాతృభాషలో విద్యా బోధన పేరిట పాఠశాలల్లో తెలుగులో బోధన చేయించాలని ఉత్తర్వులు జారీచేసిండు. అప్పటి వరకూ ఉర్దూ మాధ్యమంలో టీచర్‌ ట్రెయినీలను తయారు చేసిన హైదరాబాద్‌ ఇన్సిట్యూషన్స్‌, సంస్థలు తెలుగు మాధ్యమంలో బోధించే టీచర్లకు శిక్షణా సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. హైదరాబాద్‌ ప్రభుత్వం తెలుగులో బోధన తప్పనిసరి జేయడంతో ఆ మాధ్యమంలో బోధించే టీచర్ల కొరత ఏర్పడిరది. అదే ఆంధ్రప్రాంతంలో చాలామంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. ఆంధ్రాప్రాంతం వారికోసమే ఉద్యోగలన్నట్లుగా తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో లెక్కకు మించి, ముల్కీ నిబంధనలకు తిలోదకాలిచ్చి కొన్ని వేలమంది ఆంధ్రప్రాంత టీచర్లకు తెలంగాణలో ఉద్యోగాలిచ్చారు.

ఇలా ఉద్యోగాలు పొందిన వారు మీకు చదువు రాదు కాబట్టి మేం చదువు నేర్పించడానికి వచ్చాం. మీరు నేర్చుకునే వాళ్ళు, మేం చెప్పే వాళ్ళం’ అని అహంభావంతో వ్యవహరించేవారు. ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ 1952 ఆగస్టులో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే బహుబాషా ప్రవీణులైన హైదరాబాదీయులని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కేవలం ఏకభాషీయులుగా కుదించింది. తమది కాని భాషని బలవంతంగా నేర్చుకునేలా తప్పనిసరి స్థితిని కల్పించింది.

నిజానికి మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 14 భాషల్లో ప్రజ్ఞకలవాడు. బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, బిరుదురాజు రామరాజు ఇలా కొన్ని వందల మంది రాజకీయ నాయకులు, సాహితీవేత్తలు ఈ బహుభాషా సంస్కృతికి అద్దం. హైదరాబాద్‌  రాజ్య ప్రజల ఉమ్మడి భాష అయిన ఉర్దూని క్రమంగా తొలగించడమనేది కేవలం ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే గైర్‌ ముల్కీలకు మేలు చేకూర్చేందుకు చేసిన పనిగానే భావించాలి. అనుసంధాన భాషగా రాజ్యాంగంలో ఎక్కడా జాతీయ భాష హోదాలేని హిందీని అంగీకరించారు. కానీ రోజు స్థానికంగా మాట్లాడ్డమే గాకుండా విశ్వవ్యాప్తమైన స్థానిక భాష ఉర్దూని తెలంగాణ ప్రజలకు దూరం చేసిండ్రు.
నిజాం ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి హైదరాబాద్‌ వచ్చిన బ్రిటీష్‌ రచయిత విలియమ్‌ పిక్తాల్‌ ముస్లిం ప్రజల పవిత్ర గ్రంథం ఖురాన్‌ని ఇంగ్లీషులోకి అనువదించడమే గాకుండా మతం మార్చుకొని మహమ్మద్‌ పిక్తాల్‌గా మారిండు. బ్రిటీష్‌ రెసిడెంట్‌ కోఠీలో రెసిడెన్సీని కట్టించిన కిర్క్‌పాట్రిక్‌ హైదరాబాద్‌ వనిత ఖైరున్నీసాను ప్రేమించి పెండ్లాడి హైదరాబాదీలకు ప్రేమాస్పదుడయ్యాడు. ఇలా హైదరాబాద్‌ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన వారిని ఆదరించింది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నది. అంతకన్నా ఎక్కువగా నేర్పించింది.
అయితంరాజు కొండలరావు, బిరుదురాజు రామరాజు, కె.గోపాలకృష్ణారావు తదితరులు తెలుగు`ఉర్దూ నిఘంటువులు తయారు చేసి రెండు భాషల్ని సుసంపన్నం జేసిండ్రు. అలాగే కొన్ని వందల మంది ముస్లిమేతర హైదరాబాదీలు ఉర్దూ మాధ్యమంలో చదువుకోవడమే గాకుండా ఆ భాషలో రచనలు చేసిండ్రు. రాఘవేంద్రరావు జజ్బ్‌, రాజ నర్సింగరాజ్‌ సక్సేనా, కిషన్‌పర్‌షాద్‌, కాళోజి రామేశ్వరరావు ఇట్లా కొన్ని వందలమంది ఉర్దూలో చిరస్థాయిగా నిలిచిపోయే సాహిత్యాన్ని సృజించారు. ఖమ్మం జిల్లా గురించి రాస్తూ ఆకాశం ఆంధ్ర నేల తెలంగాణ అని సెటైర్లు వేస్తుంటారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి నవలాకారుడు కవిరాజమూర్తి, కథలు, కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా రాసిన హీరాలాల్‌ మోరియాలు పుట్టుకొచ్చారు. వీరిద్దరూ ఉర్దూలో అత్యున్నత స్థాయి రచనలు చేసిండ్రు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి లాంటి వాండ్లు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. ఇలాంటి వారందరికీ దక్కిన ఉర్దూ నేర్చుకునే భాగ్యం నేటి తరానికి దూరమయింది.
20 మార్కులకే పాస్‌ చేసే హిందీ స్థానంలో ఉర్దూని బోధించనట్లయితే తెలంగాణ ప్రజలందరికీ ఉపయోగకారిగా ఉండేది. ఉర్దూని పాఠశాల స్థాయి నుంచి బోధించక పోవడం మూలంగా గత 60యేండ్లుగా తెలంగాణ తరాలకు జరిగిన అన్యాయం వెలగట్టలేనిది. ఉర్దూ భాష తెలియడం వల్ల మత సామరస్యం పెరగడమే గాకుండా గంగా`జమునా తెహజీబ్‌ పరిఢవిల్లుతుంది.
sky1 ఈ గంగా జమున తెహజీబ్‌ ఇటీవల హైదరాబాద్‌లో మళ్ళీ మొగ్గ తొడిగింది. గతంలో కొత్త వంతెన పేరిట కొంత కవిత్వాన్ని తెలుగు`ఉర్దూ భాషల్లో ఒకే పుస్తకంగా అచ్చేయడం జరిగింది. అలాంటి ప్రయత్నమే మిత్రుడు స్కైబాబ, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వున్న మరో కవి ఖుతుబ్‌ సర్‌షార్‌తో కలిసి ‘రజ్మియా’ పేరిట తెలంగాణ ముస్లింల కవితా సంకలనాన్ని తెలుగు`ఉర్దూ భాషలో తీసుకొస్తున్నారు. తురుకోళ్లు, తెలుగోళ్లు కలిసి వేదికలు నిర్మించుకునే, కవిత్వం చదువుకునే రోజులు హైదరాబాద్‌ రాష్ట్రం ఉన్నంత వరకూ కొనసాగాయి.
హైదరాబాద్‌ రాష్ట్రం అంటేనే దేశవ్యాప్తంగా ఉర్దూ పోషణకు ప్రసిద్ధి. ఉత్తర భారతం నుంచి అనేక మంది సృజనకారులు మహబూబ్‌ అలీఖాన్‌, ఉస్మానలీఖాన్‌ దగ్గర కొలువులు పొందిండ్రు. తమ ప్రతిభ ద్వారా హైదరాబాద్‌కూ గుర్తింపు తెచ్చిండ్రు. అలాగే తెలంగాణ సంస్థానాల పాలకులు సీమాంధ్ర ప్రాంతంలోని పండితులను పోషించారు. ఘనంగా సత్కరించారు. వారి ప్రతిభకు పట్టం గట్టిండ్రు. 1952లో దాశరథి కృష్ణమాచార్యులు అధ్యక్షులుగా ఉన్నటువంటి ‘తెలంగాణ రచయితల సంఘం’ హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారు ఝాము నాలుగ్గంటల వరకూ ముషాయిరా, కవి సమ్మేళనాన్ని నిర్వహించింది. ఇలాంటి ప్రయత్నమే ‘సింగిడి’ తెలంగాణ రచయితల పూనిక మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తు హాలులో ఒక రోజంతా జరిగింది. ఈ సమావేశంలో ఉర్దూ కవి సమ్మేళనాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, తెలంగాణ ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు నందించారు. ఈ పరంపర భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ….

-సంగిశెట్టి శ్రీనివాస్‌

పోలీస్‌ యాక్షన్‌ ముందూ వెనకా…ఆళ్వార్ స్వామి

sangisetti- bharath bhushan photo

సంగిశెట్టి శ్రీనివాస్

సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఖ్యాతిని, శక్తిని, ఔన్నత్యాన్ని, దశదిశలా వ్యాపింప జేసింది. తప్పనిసరిగా ఈ పోరాటం చరిత్రలో కీలకఘట్టం. ‘సాయుధ పోరాటం’ ప్రారంభించిన మంచికీ, ఆపేసిన చెడుకూ రెండిరటికీ, అనంతర కాలంలో పటేల్‌ సైన్యం చేతిలో ప్రాణాలర్పించిన త్యాగానికీ ఈ ఉద్యమం మైలురాయి. అయితే చాలా మంది కమ్యూనిస్టులు తమ ప్రయాణాన్ని ఈ మైలురాయి నుంచే ప్రారంభించి, గిరికీలు కొడుతూ మళ్ళీ అక్కడికే వచ్చి ఆగి పోతుండ్రు. ‘సాయుధ పోరాటమే’ అన్నింటికి మూలం, అభ్యుదయ చరిత్రంతా దీనితోనే ఆరంభం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా ఇక్కడి నుంచే లెక్కగడుతుండ్రు. ఇప్పటికీ బిజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ‘సాయుధ పోరాటం’ నిజాం రాజు, ముస్లింల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిందనే భావనను తమ చేతలు, ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, పీడన నుంచి విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటాన్ని నేడు ఆయా పార్టీలు తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా వక్రీకరిస్తున్నారు. సిపిఎం పార్టీ, ప్రజాశక్తి ప్రచురణ సంస్థలు తెలంగాణ సాయుధ పోరాటం విశాలాంధ్ర కోసం జరిగిందని ఏటేటా పుస్తకాలు అచ్చువేస్తూ, అందులో పాల్గొన్న వ్యక్తుల చేత చెప్పిస్తున్నారు. అదే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. సాయుధ పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని బీజేపి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు చేసిన పోరాటంగా ప్రచారం చేస్తున్నారు. బాధ్యతాయుత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ పోలీస్‌ యాక్షన్‌ని హైదరాబాద్‌ స్వాతంత్య్ర దినంగ పరిగణిస్తూ పండుగలు నిర్వహిస్తోంది. నిజానికి ఈ పోలీస్‌ యాక్షన్‌ వల్ల వేలాది ముస్లిం ప్రాణాలను, వందలాది హిందువులైన రజాకార్లను, అంతకుమించి సాయుధ పోరాట యోధుల్ని బలిగొన్నది. ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువలేకుండా అమానవీయంగా వ్యవహరించిన ఈ చర్యను పండుగలా జేసుకోవడమంటే వారి జెండా రంగులకు అనుకూలంగా చరిత్రను వక్రీకరించడమే!

కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌, రజాకార్లు, ఆర్యసమాజ్‌, ఇత్తెహాదుల్‌, ఆంధ్రమహాసభ, సోషలిస్టులు, షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ ఇలా తెలంగాణ రాజకీయ కార్యచరణను నడిపించిన అన్ని సంస్థల ఉద్యమాలు, వాటి నాయకత్వం, అవి పోషించిన పాత్రల గురించి కథల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ధోరణిలో ఆళ్వారుస్వామి దర్శించిండు.

‘పరిగె’ కథలో తల్లిని కోల్పోయి, చెల్లెలు, వ్యాదిగ్రస్తుడైన తండ్రిని సాకే బాధ్యతలు చేపట్టిన వంతు మాదిగ మల్లయ్య పరిగె ఏరుకున్నందుకు అన్యాయంగా మూడ్నెల్ల శిక్ష పడ్డ విషయాన్ని రాసిండు. నిజానికి మల్లయ్య దొరలకు బానిసగా ఉండాల్సిన పరిస్థితిని ‘వంతు మాదిగ’ ‘హోదా’ కల్పించింది. ఈ వంతుమాదిగ పనిచేయడం వల్ల కనీసం ఒక్క పూట కూడా గడవని పరిస్థితి ఉండడంతో ఆఖరికి తనకు లేకున్నా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని రక్షించుకోవడానికైనా ఇంత గంజి కావాలని, దాని వెతుకులాటలో భాగంగా కళ్ళం ఊడ్చిన ఊరవతలి పొలాల్లో ‘పరిగె’ ఏరుకొని తీసుకుపోతుండగా ఒక దొర అడ్డుబడి అది తన పొలం నుంచి దొంగతనం చేసినావని నిందమోపుతూ మొదట ఊరి భూస్వామి దగ్గర, మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పడం జరుగుతుంది. మల్లయ్యను తమ అధీనంలోకి తీసుకొని చావదెబ్బలు కొట్టడమే గాకుండా ఆయనకు బదులుగా చెల్లెలుని ‘వంతు’ పనిమీద పక్కూరికి పంపిస్తారు. తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నడని చెబుతున్నా దొర వినకుండా ఆయన అనుచరుల తోటి ‘ముసలి తొక్కు’ ఇయ్యాళ కాకున్నా రేపు సచ్చేటోడే కదా అని అవమానిస్తారు. ఇవన్నీ సాయుధ పోరాటం ఆరంభంలో బలవంతంగా ‘వెట్టి’ చేపించుకుంటున్న దొరల, భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల నిత్య కృత్యాలు. చివరికి తండ్రి చనిపోయి, చెల్లి ఎక్కడికి పోయిందో తెలియక మూన్నెళ్ళ శిక్షకు గురై మానసిక చిత్రవధ అనుభవించిన మాదిగ మల్లయ్య క్షోభను ఇందులో అక్షరీకరించాడు.

‘మెదడుకు మేత’ కథలో రజాకార్లు, ఆర్యసమాజ్‌, కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారు ఎవరికి వారు హైదరాబాద్‌ రాజ్యంలో చేస్తున్న, చేపడుతున్న భావజాల ప్రచారం, కార్యకలాపాల్ని లెక్కగట్టిండు. ఆర్యసమాజ్‌, ఇత్తెహాదుల్‌ వారు ఎట్లా మతకలహాలు పెంచి పోషిస్తారో కూడా చెప్పిండు. ఆర్యసమాజం, హిందూ మహాసభ సమావేశాలు, ‘ఓం’ రaండాకు దండాలు, కాంగ్రెసు సత్యాగ్రహాలు, ఇంగ్లీషు మిలిటరీ, సుభాష్‌ చంద్రబోస్‌ పిలుపు, పాకిస్తాన్‌కు తురకలను పంపించాలంటూ ‘‘ఉఠావో బోర్యా బిస్తర్‌` ఏ రోనా పీట్నా క్యాహై’ అంటూ ఆర్యసమాజ్‌ ఆవాజ్‌’ పాటల్ని, మత గ్రంథాల గురించీ ఈ కథలో చర్చించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దోపిడి, దౌర్జన్యం, కుల, మత, వర్గ, వర్ణ రహిత సమాజం స్థాపించబడుతుందని ఆశించాడు. అట్లా కాకుంటే ‘‘ఇంగ్లీషు వాండ్ల పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు భేదమేముంటుంది?’’ అని కూడా తేల్చిసిండు.

‘మాకంటే మీరేం తక్కువ’ కథలో సాయుధ రైతాంగ పోరాట కాలంలో ముందున్న వారు తర్వాతి కాలంలో పదవులు అలంకరించి అప్పుడూ, ఇప్పుడూ రెండుసార్లూ దోసుకున్నారు అనే భావన వచ్చే విధంగా వ్యాఖ్యానించాడు. ఇల్లనక, ముంగిలనక, పెండ్లాం, పిల్లలనక పోరాట కాలంలో ముందున్న వారు పోరు ముగిసిన తర్వాత తమ స్వీయ ప్రయోజనాలకు, పదవులకు ప్రాధాన్యత నిచ్చారని వాపోయాడు.

jailu-lopala
‘కాఫిర్లు’ కథలో ఇత్తెహాదుల్‌ముసల్మీన్‌ భావజాలంతో ఉన్నవారు, అధికారులతో సత్సంబంధాలున్నవారు సైతం భూస్వాములు, దొరలు, దేశ్‌ముఖ్‌లు ఆధిపత్యాన్ని అనివార్యంగా శిరసావహించాల్సి రావడాన్ని గురించి రాసిండు. లెవీలు, పన్నుల పేరిట ప్రభుత్వాధికారులు ఒక వైపు దొరలను మినహాయించి సామాన్య రైతులపై బలవంతంగా వసూలు చేసే విధానాన్ని గురించి కూడా చెప్పిండు. అంతా ‘పైస’కు లొంగేవారే తప్ప ఎవ్వరిలోనూ నీతి, న్యాయం లేకపోవడాన్ని కూడా రికార్డు చేసిండు. అంటే ఆనాటి సమాజంలో నిజాం హైదరాబాద్‌లో ఉండి ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా ఎదిగితే గ్రామాల్లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దొరలు, దేశ్‌పాండ్యాలు పేద ప్రజలు, రైతుల పొట్టలు గొట్టి, వాళ్ళ సంపదను కొళ్ళగొట్టేవారు. మరో వైపు అధికారగణం దండుగలు, లంచాలు, లెవీలు, పన్నులు, పట్టీల పేరిట వివిధ సుంకాలు వసూలు చేస్తూ పేద రైతాంగాన్ని పీడిరచేవారు. అది హిందువుల ఇళ్లైనా, మహమ్మదీయుల ఇళ్లైనా అర్ధరాత్రి పూట సోదాలకొచ్చి దొరికింది దోసుకుపొయ్యే తీరుని, వారికి దొరల గడీల్లో ‘ఇంతెజాము’లు జరిగే తీరుని కూడా ఇందులో ఆళ్వారుస్వామి రాసిండు. దీన్ని బట్టి ఆనాటి రాజకీయ స్థితిగతులను అంచనావేయవచ్చు.

‘అంతా ఏకమైతే’ కథలో సమాజంలోని అన్ని వర్గాలు కలిసి దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిండు. ‘అంతా ఏకమై అన్యాయాల నెదుర్కోవాలి. కష్టాలను బాపుకోవాలె. సంఘ బలం వృద్ధి చేసుకోవాలె’’ వైష్ణవులు సైతం దొరల దమనకాండను అనుభవించారు. అన్నడు. ప్రజల మేలు కోసం ఉద్యమాలు చేసినందుకు చాలా సార్లు ‘రమాణరెడ్డి’ అనే మంచి వక్త, నాయకుడిపై జరిగిన దాడిని కూడా ఇందులో ప్రస్తావించాడు. అంటే దొరలు హత్యలకు కూడా వెనుకాడే వారు కాదు అని తెలుసుకోవచ్చు. ఈ దొరల దౌర్జన్యానికి సమాజంలోని అన్ని వర్గాలు బలయ్యాయని చెప్పిండు. ‘‘వారి దౌర్జన్యాల నుండి తప్పించుకున్నదెవరు? బ్రాహ్మణుల హాహాకారాలు యిప్పుడే మీరు విన్నారు. వైశ్యుల స్థితి వేరే చెప్పనవసరం లేదు. రైతులగతి శ్రీ సుబ్రహ్మణ్యం గారు తెల్పారు. గ్రామ పెత్తందార్ల వల్ల లంచాలు తినేవారితో, తప్ప తాగి అమాయక ప్రజలను, న్యాయాన్ని కోరే ప్రజలను లాఠీలతోటి బాది, యిండ్లు పైర్లూ దోసుకునే వారితో మనం పోరాడవలసి ఉన్నది’’ అంటూ ఎవరి మీద ఎందుకు ప్రజా పోరాటం చేయాలో రమణారెడ్డి పాత్ర ద్వారా చెప్పిస్తాడు.

‘ఆలుాకూలి’ కథలో పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ధర్నాలు, ర్యాలీల్లో పాల్గొన్న కార్మికుడు గ్రామంలో జరిగే అన్యాయాల్ని ఎదిరించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేసిండు. దీని ద్వారా గ్రామాల్లోకి వస్తున్న చైతన్యం కూడా తెలియవచ్చింది. ఆనాటి పట్టణాల్లోని కార్మికుల ఉద్యమాల గురించి ఇలా రాసిండు. ‘‘వేలమంది కూలీల్లో నిటారుగా నిలబడి జయ నినాదాలు కొట్టడం, జెండా పట్టుకొని ఊరేగింపులో ముందు నడవడం, జెండా లాగుకొనవచ్చిన పోలీసువాడిని అదిలిస్తే అంతదూరాన పడివోపడం, అంతా హేళనగా నవ్వుతుంటే గర్వంతో ముందుకు నడవడం’’ అంటూ ఉద్యమ తీరుని, పోరాట యోధుల గురించీ రాసిండు.

నవలిక లాంటి పెద్ద కథ ‘గిర్దావరు’ కథలో సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కాంగ్రెస్‌టోపీ పెట్టుకొని గ్రామాల్లోకి పున: ప్రవేశం చేసిన దొరలు భూములపై, రైతాంగంపై అజమాయిషీని చలాయించే రీతిని చెప్పిండు. కమ్యూనిస్టులు పంపిణీ చేసిన భూమిని రజాకార్ల అంతం తర్వాత దొరలు గుంజుకొని అమ్ముకున్న సంగతులను, యూనియన్‌ మిలిటరీ చంపేసిన సాయుధ వీరుల గురించీ, నిజాయితీ పరుడైన గిర్దావరు దొరల ఆగడాలను అడ్డుకున్న తీరునీ ఈ కథలో చెప్పిండు.

‘చిన్నప్పుడే’ కథలో సంగం పంతులు బడి పెట్టడం, ఆంధ్రమహాసభ కార్యకర్త ‘వెంకటయ్య’ గ్రామాల్లో పర్యటనలు చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన తీరు, ఆయన తీసుకొచ్చిన చైతన్యంతో అప్పటి వరకు పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే దండుగలు, లంచాలకు అడ్డుకట్ట పడిరది. చిన్న పెద్ద మర్యాద లేకుండా ప్రతి వారినీ, ప్రతి స్త్రీని దుర్భాషలాడే తీరుకు ఉద్వాసన జరిగింది. కూలీ పనివారికి రెండు పూటలా తిండి దొరికేలా చేసిన కార్యకలాపాలు ఈ కథలో రికార్డయ్యాయి. దున్నపోతు బుస్సుమన్నదని ఒకరి దగ్గర, కోడెదూడ చేలో బడ్డదని మరొకరి దగ్గర, ఇంకొకరి బెర్రెను బందెల దొడ్లో పెట్టించి దండుగలు, దోసాలు వసూలు చేసే ఊరి పటేలు సంగతీ, సర్కారీ రకం కట్ట లేదని బండలెత్తించడం, కట్టెపుల్లలు ఏరుకుందని చెప్పి సిగపట్టుకొని స్త్రీని కొట్టిన దొర సంగతీ, అందుకు అడ్డం వచ్చిన భర్తని బాదిన విషయాన్ని ఈ కథలో చిన్నపిల్లల ముచ్చట్లతోటి చెప్పిస్తాడు.

‘ఆక్షేపణ లేదు’ అనే మరో కథలో మాదిగ్గూడేనికి చెందిన దొర జీతగాడు శాయన్న గురించి చెప్పిండు. దొర దగ్గర అప్పు తీసుకున్నందుకు తిట్టడం, వడ్డీతో సహా డబ్బులు కట్టమని వత్తిడి చేయడం, చివరికి శాయన్న హైదరాబాద్‌ పోయి అంటరాని తనంలేని జీవితం గడపి ఊరికొచ్చినప్పుడు దొర మనుషులు పట్టుకొని చంపిన తీరుని కథలో చెప్పిండు. ‘‘వచ్చినాడని చెబుతున్నావు బద్మాష్‌, రెక్కలు విరిచి పట్టుకురా లం….’’. వెంటనే బడే సాహెబు మాదిగ గూడెం పోయిన శాయన్నను పట్టుకొని కొండల్‌రెడ్డి వద్దకు తెచ్చి నిలబెట్టాడు. సాయన్న, కొండల్‌రెడ్డి పిలిపించాడని తెలుపగానే మాదిగగూడెంలో భయం మొదలైంది. బండలెత్తి రూపాయిలు వసూలు చేస్తాడని అంతా జ్యోతిషం చెప్పారు. శాయన్నను చూడగానే కొండల్‌రెడ్డి ‘‘ఓహో! మొగోడి రంగే మారిందోయ్‌ ఏమిరా నీ అప్పు ఎవడు చెల్లిస్తాడురా? లం.. కొడుకును రూపాయిలు ఇచ్చేదాకా కదలనీయకు’’ అని బడాసాహెబును చూస్తూ’’ దొర చెప్పిన సంగతినీ చివరికి దొర సాయన్నను చంపి పోలీసోళ్ళతో కుమ్మక్కయి కేసు మాఫీ చేయించుకున్న తీరుని, దొర వెటకారాన్ని తన బాధను కలిపి రచయిత చిత్రించాడు.

మరో కథ ‘పరిసరాలు’లో మిలిటరీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు భాషను అధికార భాషగా చేసే ప్రయత్నంలో అందరూ తెలుగు నేర్చుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ఇట్లా తెలుగు నేర్చుకోలేక ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న ఊరికి దూరమై, ఇన్నాళ్ళు పాటించిన నీతికి దూరమైన ముస్లిం యువకుని గాధను చెప్పిండు. అవినీతి, అన్యాయం, రైతులపై దమనకాండ, కార్కికుల ఉద్యమాలు, దొరల రాజకీయాలు, అధికార దాహం, సమాజంలోని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వానికి, దోపిడిదారులకు వ్యతిరేకంగా ఏకం చేసిన రైతాంగ పోరాటం, మత విద్వేషాన్ని రగిలించే ఇత్తెహాదుల్ముసల్మీన్‌, ఆర్యసమాజ్‌, మిలిటరీ పాలన, కాంగ్రెస్‌పాలన, కమ్యూనిస్టుల పోరాట విరమణ, వెట్టి చాకిరీ, మత మార్పిడులు, మహిళలకు సమాన హక్కు, ఉరిశిక్షకు వ్యతిరేకంగా పౌరహక్కుల ఉద్యమకారుల సన్నద్ధం, దాసి కొడుకుల సామాజిక స్థితి, వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న చదువుకున్న యువతరం అన్నీ కలగలిపి ఆళ్వారుస్వామి కథలు తయారయ్యాయి. జీవితం, సంఘర్షణ, ఆర్తి, బాధ, మానవీయత, ప్రజలపట్ల, ఖైదీల పట్ల సానుభూతి, సాయుధ రైతాంగ పోరాటం, గాంధీ ఫిలాసఫీ, కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రమహాసభ కార్యకలాపాలపై పూర్తి అవగాహనతో చేసిన విమర్శ ఈ కథల్లో అంశాలయ్యాయి. భాష, నుడికారం, సామెతలు తెలంగాణ జనసామాన్యానికి అర్థమయ్యే విధంగా తీర్చి దిద్దాడు. ‘మొగోనికి ఏం బిర్రొచ్చిద్ది’, అనే పదాల ద్వారా ఆనాటి కుల సమాజాల వాడుక భాషను అక్షరీకరించాడు.

ఇట్లాంటి సందర్భంలో ఆళ్వారుస్వామి తన కథల ద్వారా వ్యక్తం జేసిన అంశాల్ని ఒక్కదగ్గర పోగేసుకున్నట్లయితే ఆనాటి తెలంగాణ సమాజం నడిచిన దారి తెలుస్తుంది. ఇప్పుడు నడవాల్సిన తొవ్వా దొరుకుతుంది. ఉరిశక్షలకు వ్యతిరేకంగా, హిందూ, ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పేద, కార్మిక, కర్షక వర్గాలు చేసిన పోరాటాలను, దళిత, బహుజన ప్రజల త్యాగాలు, అణచబడ్డ ప్రజల జైలు జీవితాలు, మహిళల వెతల్ని చిత్రిక గట్టిండు. వారి సాహస పోరాట పటిమను ఈటెలుగా మార్చి గురి చూసి విసిరిండు.

జైలు ఉరిశిక్షలు

ఆళ్వారుస్వామి తన కథల్లో అన్నిటికన్నా ఎక్కువ ఆర్తితో, కండ్లల్లో చెమ్మతో, గుండెల్లో తడితో రాసిన కథలు నేరము`శిక్షకు సంబంధించినవి. జైలు జీవితం స్వయంగా గడిపినవాడు కావడం, సమాజంలోని అట్టడుగు వర్గాలతో కూడా కలిసి ఉద్యమాలు చేసిన అనుభవం, పౌరహక్కుల కోసం తెలంగాణలో ఉద్యమస్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితులు, ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచి ‘సాయుధ’ పోరాటం చేస్తున్న రైతాంగం, రెండో ప్రపంచ యుద్ధం నిత్యావసరాలపై, ప్రజల జీవితాలపై చూపించిన ప్రభావం అన్నీ కలగలిసి ఆయన్ని ‘నేరము`శిక్ష’కు సంబంధించిన కథలు రాసేలా చేశాయి. అఖాడా స్థాపించినందుకు ద్వీపాంతరవాస శిక్ష, పరిగె ఏరుకున్నందుకు వంతుమాదిగ మల్లయ్యకు మూన్నెళ్ళ శిక్ష, మిలిటరీలో ఉంటూ ఆర్యసమాజ్‌ కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తి, ఉరిశిక్షకు గురైన వాడి గురించీ తన కథల్లో ఆర్తిగా చిత్రించిండు. ముఖ్యంగా ఉరిశిక్ష గురించి 1950ల్లోనే వ్యతిరేకంగా మాట్లాడి, కథలో చర్చ చేసి తన పౌరహక్కుల దృక్పథాన్ని స్పష్టం చేసిండు. నిజానికి హైదరాబాద్‌ రాజ్యంలో ఉరిశిక్ష అమల్లో లేదు అనే విషయాన్ని కూడా మరో సందర్భంలో చెప్పిండు. ఆఖరికి నిజాంపై బాంబులు వేసిన వారికి కూడా ఉరిశిక్ష పడలేదని గుర్తుంచుకోవాలి.

‘స్వాతంత్య్రం’ వచ్చి 65 యేండ్లయిన తర్వాత కూడా ‘ఉరిశిక్ష’ను పూర్తిగా రద్దు కాలేదు. ఆ శిక్షే ఒక నేరమని ఇప్పుడు హక్కుల సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉరిశిక్ష రద్దుకు ఉద్యమస్థాయిలో పనిచేయడానికి ఏ సంఘం కూడా నడుం బిగించడానికి నేడు సిద్ధంగా లేదు. అట్లాంటిది ఆళ్వారుస్వామి స్వాతంత్య్రం పూర్వమే ఉరికి వ్యతిరేకంగా ‘పతితుని హృదయం’ ‘అవకాశమిస్తే’ పేరిట కథలు రాసిండు. నిజానికి హైదరాబాద్‌ రాజ్యంలో ఉరి అమల్లో లేదు. ఉరిశిక్ష నిషేధింపబడాలని ఆళ్వారుస్వామి కోరుకున్నాడు. అమానవీయమైన శిక్షగా దాన్ని వర్ణించాడు. హత్యలు చేసి జైలుకొచ్చిన ఖైదీ చేత ఉరిని నిరసిస్తూ మాట్లాడిస్తాడు. ఉరి ప్రభుత్వం చేసే హత్యలే అని తేల్చేస్తాడు. గండయ్య అనే ఖైదీ తాను అంతకుముందు రెండుమూడుసార్లు మాత్రమే చూసిన ఒక ఖైదీకి ఉరిశిక్ష పడ్డప్పుడు చాలా దుఖిస్తాడు. ‘ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరి పెట్టి వ్రేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్లూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్ల కెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడా మనసొప్పలేదురా’’ అంటూ తన బాధను ఖైదీ ద్వారా వ్యక్త పరుస్తాడు.

నాజీ, నియంత, కర్కోటకుడు, డిక్షనరీల్లో ఉన్న అన్ని పదాలతో ఏడో నిజాం మీర్‌ ఉస్మానలీఖాన్‌ని నిందిస్తున్న వాళ్ళు ఆయన హయాంలో హైదరాబాద్‌ రాజ్యంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉరికి బదులు 50, 60 ఏండ్లు శిక్ష వేసినా నష్టం లేదు గానీ ఆ శిక్షను రద్దు చేయాలని ‘పతితుని హృదయం’ కథలో ఖైదీ గండయ్య పాత్ర ద్వారా చెప్పిస్తాడు. ‘‘…25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలే పట్టుకెళ్ళి స్థంభానికేలాడ దీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమోస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అంటూ ఉరిని అమలు చేసిన జైలు ఉద్యోగినుద్దేశించి గండయ్య అన్నాడు. హత్యలు, దొమ్మీలు, దోపిడీలు, పెండ్లిళ్ళు ఎత్తగొట్టి, కొంపలు కూల్చిన వాడివని గండయ్యను నిందిస్తూ, రెండ్రోజులు చూసినవో లేదో ఆ ఖైదీని ఉరితీస్తే ఏడుస్తావెందుకు? అని పోలీసాయన నిలదీస్తే దానికి జవాబుగా ‘‘మాటి మాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప త్రాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు మండలతో కాలము గడిపే మేము ఒళ్ళు మరచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం. ఇండ్లల్లో జొరబడి దోచుకున్నాం. మత్తు దిగింతర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాపపడ్తాం. మేము చదువు రాని మొద్దులం. మాలో చదివినోడు గాని, మంచి చెడ్డ తెలిసినోడు గాని ఒక్కడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం. వాండ్లతో తిరిగాం. అవే బుద్దులు, అదే బతుకు’ అంటూ‘‘మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగుచేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరి తీసి చంపమని ఎట్లా అంటుంది? మాట్లాడవేం’’ నిలదీసిండు. ఇదీ ఉరిశిక్ష పట్ల ఆళ్వారుస్వామికున్న అభిప్రాయాలు. క్షమించమంటే ఉరిశిక్షలు రద్దు చేసినవారున్నారు. జుర్మానాలు కొట్టివేసిన వారున్నారు అని పరోక్షంగా నిజాంని గురించి కూడా తన కథల్లో ఆళ్వారుస్వామి రాసిండు.

గాంధీని బ్రిటీష్‌ ప్రభుత్వం వారు ఉరితీద్దామని ప్రయత్నిస్తే దాన్ని నిజాం వద్దాన్నాడని ఒక పాత్ర ద్వారా ‘ఆక్షేపణ లేదు’ అనే కథలో చెప్పిస్తాడు. ‘‘గ్రాంధీ అంటే ప్రేమ గాదోయ్‌. మన రాజ్యంలో ఉరిదీయవద్దని ఖానూనులా ఉంది. అట్లాగే కుంఫిణీ సర్కారును గూగా ఉరిదీయవద్దంటే సరే అని ఊరుకున్నది’’అని చెప్తిస్తాడు. ఈ సమయంలోనే సాయుధ పోరాట కాలంలో చెలరేగినందుకు ‘తెలంగాణ 12’ పేరిట కేసు నమోదయింది. ఈ కేసులో 12 మంది ఉరిశిక్షను రద్దు చేసిన సంఘటన ఈ కాలంలోనే చోటు చేసుకుంది. దీని పూర్వపరాలన్నీ ఆళ్వారుస్వామికి విదితమే!

నెహ్రూ అన్న మాటలు ‘‘నిజానికి మనదేశంలో జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వారిలో నూటికి 85 మంది నేరప్రవృత్తి గలవారు కాదు. తక్కిన 15 మంది కూడా స్వభావత్ణ నేరకాండ్రు కారు. పరిస్థితులే వారి నావిధంగా చేశాయి’’ పుస్తకం ఆరంభంలో ఇచ్చాడు. ఇవే మాటలు ‘అవకాశమిస్తే। కథలో చెప్పిండు. దానికి జోడిరపుగా పది ఏండ్లు శిక్ష అనుభవిస్తున్న మామూలు నేరగాడు, జేలు వెలుపల ఉన్న పెక్కుమంది కంటే ఉత్తముడే’’ అని చెప్పిండు.

మతకలహాలు హైదరాబాద్‌లో మిగతా భారతదేశం మాదిరిగా భయానకంగా లేకపోయినప్పటికీ చెదురు ముదురు సంఘటనలు అప్పుడప్పుడు జరిగేవి. ‘మెదడుకు మేత’ కథలో హిందూాముస్లింల మధ్య కొట్లాటలు చెలరేగడానికి, అనైక్యతకు కారణాలను విశ్లేషించాడు. ఇరు మతాల్లోని విభిన్న మతాచారాలు, దాన్ని అడ్డంగా పెట్టుకొని చాంధసులు ఉద్రేకతలను రెచ్చగొట్టడాన్ని రికార్డు చేసిండు.

మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఊరేగింపులో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, హత్య చేసి జైలుకొచ్చిన ఖైదీల మధ్య చెలరేగే ఘర్షణలకు మతం రంగు పులుమడం, దాన్ని ఆధునిక భావాలు గల మోహన్‌రావు అనే రాజకీయ ఖైదీ తీర్చే విధానాన్ని ‘మెదడుకు మేత’ కథలో ఆళ్వారుస్వామి రాసిండు. ఆర్యసమాజం భావాలతో ఉన్న హుకుంసింగ్‌ రేపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తురకల్నందరినీ ఇండియానుంచి వెళ్ళగొట్టాలే అనే అభిప్రాయంతో ఉండేవాడు. ‘‘ఉఠావో బోర్యా బిస్తర్‌, ఏ రోనా పీఠ్నా క్యాహై’’ అని ముస్లింలందరూ ఇక తమ పెట్టేబేడా సర్దుకొని ఈ దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని పాటల రూపంలో వ్యక్తం జేసేవాడు. ఆయన హైదరాబాదీ కాదు. మధ్యప్రదేశ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వాడు. పేరు ఆర్యసమాజ్‌ అయినా బయటి ఆచరణ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పంథాయే. ఎందుకంటే ఈ కథలో మోహన్‌బాబు నేర్పిన ‘‘రామ్‌ కే సంఘ్ మే  లక్ష్మణ్‌ థే, గాంధీకే సంఘమే  నెహ్రూ హై’’ అని హకుం సింగ్‌ తరచుగా పాట పాడుతూ ఉండేవాడు. అంటే బయటికి కనిపించేది కాంగ్రెస్‌ లోపల మాత్రం ఆచరణ అంతా ఆర్యసమాజ్‌ది. ఈ ద్వైవిధీభావం తెలంగాణలో కూడా అదే విధంగా ప్రతిఫలించేది.

ఆర్యసమాజ్‌ పేరిట ఒక వైపు శుద్ధి కార్యకలాపాలు, మరో వైపు అఖాడాల ఏర్పాటు, అలాగే మతం మార్చుకున్న దళితుల్ని వ్యవసాయ పనులకు పిలువక పోవడం, వారిని తూష్ణీకారంతో చూడడం, చివరికి దళితులు విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ శుద్ధి ద్వారా హిందువులుగా మారేందుకు తోడ్పడడం ఆర్యసమాజ్‌ చేసిన పని. దీనికి కాళోజి నారాయణరావు లాంటి వారు కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే రజాకార్ల దురాగతాలను ఎదుర్కొనే దశలో కొంత మేరకు ఆర్యసమాజ్‌ భావాల్ని పుణికి పుచ్చుకొని మిలిటెంట్‌గా తయారయ్యిండ్రు అప్పటి లౌకికవాదులు కూడా. అయితే ఈ దోషం ఆళ్వారుస్వామికి అంటలేదు. ఈయన తన రచనలతో పాటుగా ఆచరణలో కూడా లౌకికంగానే ఉన్నాడు.
ఆర్యసమాజ్‌ వాండ్లు కేవలం ‘అఖాడా’లు స్థాపించి ఉద్యమాన్ని చేపట్టగా ముస్లిములు ‘కాక్సార్‌’ ఉద్యమాన్ని లేవదీశారు. కాక్సార్‌ అంటే సాయుధ శిక్షణ. ఈ ఉద్యమాన్ని మొదట ఇనాయతుల్లా మష్రీకి అనే ముస్లిం నాయకుడు చేపట్టాడు. అయితే మజ్లిస్‌ పార్టీకి చెందిన బహదూర్‌యార్జంగ్‌ ఆయన్ని తోసిరాజని నాయకత్వాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో సిద్దిఖ్‌ దీన్‌దార్‌ అనే అతను తాను చెన్నబసవేశ్వరుని అవతారమని చెప్పుకున్నాడు. అదే విధంగా రాముడు, కృష్ణుడులను తూలనాడాడు. దీంతో ఆర్యసమాజ్‌కు చెందిన మంగళదేవ్‌, పండిత రామచంద్ర దహెల్వీ తదితరులు అందుకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

                                            ఆళ్వారు జెండర్‌ స్పృహ

ఇప్పటికి కూడా చర్చలోకి రాకుండా ఉన్న స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం, స్త్రీ చేసిన ఇంటి పనిని ఆర్థిక కోణంలో చూసే దృక్కోణం అలవడలేదు. ఆ రోజుల్లోనే స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రాన్ని, స్త్రీలు కుటుంబంలో చేసే పనికి విలువను లెక్కగట్టాలని తన కథల్లోని పాత్రల ద్వారా చెప్పించిన గొప్ప ‘జెండర్‌ స్పృహ’ ఉన్న రచయిత ఆళ్వారు. ఇంటిపనుల విషయంలోనే కాదు బయటి పనుల్లో కూడా స్త్రీలకు సమానమైన వాటా, గౌరవం దక్కాలనే భావనను 60 యేండ్ల కిందనే ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడు ఆళ్వారుస్వామి. మగవాండ్లే తియతియ్యని మాటలు చెబుతూ ఆడవాళ్ళకు అడ్డుకట్ట వేస్తున్నారని ‘అవకాశమిస్తే’ కథలో సరోజిని పాత్ర ద్వారా చెప్పించాడు. మగవాళ్ళు స్వార్థులు అని చెబుతూ స్త్రీ స్వేచ్ఛకు పురుషుల ఆధిపత్య మనస్తత్వం, సంస్కారరాహిత్యం, సాంప్రదాయాలు పేరిట కలిగించే అడ్డంకులే ప్రధాన కారణమని చెబుతుంది. పురుషుల కన్నా స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కారని చెబుతూ తమకు ‘అవకాశ మిస్తే’ తమ శక్తిని, సామర్ధ్యాన్ని నిరూపించుకుంటామని మహిళా దృక్కోణంలో సమాజాన్ని చిత్రించాడు.

‘అవకాశమిస్తే’ కథను పురుషాధిపత్యంలో బందీ అయిన ‘మహిళ’ను, జైలులో బందీ అయి విషాదంగా మరణించిన ‘ఖైదీ’ పాత్రను పోలుస్తూ సంభాషణ రూపంలో కథను నడిపించిన తీరు బాగుంది. స్త్రీకి ఇల్లు, పిల్లలు, భర్త, ఇంటి పనులు ఇవన్నీ కలగలిసి ‘జైలు’లో లాగా జీవితం గడిచిపోతుందనే భావనను ‘సరోజిని’ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. అలాగే పొద్దస్తమానం విరామం లేకుండా చేసే చాకిరికి భర్తలు జీతం చెల్లించాలనే ఆలోచన కూడా వ్యక్తం జేస్తుంది. దీనికి భర్త జవాబిస్తూ ‘భార్యాభర్తల సంబంధం, కుటుంబ జీవనం జీతానికంటె, విధకంటె అతీతమైంది. వర్ణించవీలుగాని ఆత్మీయత అది. దానికి వెలలేదు. వర్ణనాలేదు’’ అంటాడు.
‘‘అట్లాగా? ప్రపంచమంతా ఒక కుటుంబమని, ప్రపంచ ప్రజలంతా ఒక కుటుంబీకులని అప్పుడప్పుడు మీరు చెప్పే ధర్మసూత్రాల ప్రకారము, ఈ విశాల కుటుంబమునకు చెందిన మీరు మీ కుటుంబములో నేను నిష్కామకర్మ చేస్తున్నట్టే. ఆ 1500 (రూ.లు) రాళ్ళు తీసుకోకుండా ఎందుకు మీరు ఉద్యోగం చేయకూడదు?’’ అని కూడా భర్తకు ఎదురు ప్రశ్నవేసి నిరుత్తరుణ్ని చేస్తుంది సరోజిని. అలాగే ‘‘అన్నిటిని అరికట్టేవారు పురుషులు. స్త్రీలు ఎల్లప్పుడూ పురోగాములే ఎప్పుడూ ముందడుగే’’ అని స్త్రీలను అడ్డుకునేది పురుషులే అని వాళ్ళే ప్రగతి నిరోధకులని చెప్పింది. ఇట్లాంటి పాత్రల ద్వారా ఆళ్వారుస్వామి తాను స్వయంగా ఏదైతే పాటించాడో దాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్‌లోనే కాదు విజయవాడలాంటి దూర ప్రదేశాల్లో కూడా సమావేశాలు జరిగితే అక్కడికి సతీసమేతంగా హాజరయ్యేవాడు. అప్పటికి ఇప్పటికీ ఎంతో ప్రగతిశీలురు అనుకునే వారు సైతం తమ తమ భార్యలను సమావేశాలకు తీసుకురాకుండా పోయేది.

‘విధిలేక’ కథలో తనని పోషించలేక పోతున్న భర్త నర్సయ్యను వదలి మంచిగా చూసుకుంటున్న మరోవ్యక్తితో వివాహం చేసుకున్న భార్య పెంటమ్మకథను చిత్రీకరిస్తాడు. నిస్సహాయ స్థితిలో పోషించేవాడిని వివాహమాడటాన్ని ఈ కథ ద్వారా ఆళ్వారుస్వామి ఆమోదించారు. పొట్టకు లేక చావడమా? వేరే అతన్ని పెళ్ళి చేసుకొని బతకడమా? అనే సంశయం వచ్చినప్పుడు వేరే పెళ్ళి చేసుకొని బతకడమే న్యాయం అని ఈ కథ ద్వారా ఆళ్వారు తీర్పిచ్చాడు.

‘భర్త కోసం’ కథలో అఖాడా స్థాపించిన ‘నేరానికి’ అరెస్టయిన భర్త రామదాసుని రక్షించుకోడానికి భార్య లక్ష్మి తల్లడిల్లిన తీరుని, పడ్డ వేదనను రికార్డు చేసిండు. చివరికి ద్వీపాంతర వాస శిక్ష విధించబడ్డ భర్త కోసం విధిలేక ప్రాణార్పణ చేసిన తీరులో ప్రేమమయి ‘స్త్రీ’ హృదయాన్ని పూసగుచ్చినట్టు చెప్పిండు. మరో గొప్ప కథ ‘రాజకీయ బాధితులు’. ఇందులో సాయుధపోరాటంలో పాల్గొన్న భర్త గురించి గర్వంగా చెప్పుకునే పెంటమ్మ, చివరికి విరమణానంతరం కూడా ఆయుధాన్ని సాయుధంగా చేసిన భర్త చనిపోయిండో, బతికుండో తెలువక పోవడం, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా యుద్ధం కొనసాగించినందుకు అటువైపు నుంచి ఏమాత్రం సహాయం అందని స్థితిలో భర్తను వెతుక్కుంటూ హైదరాబాద్‌ వచ్చి స్వీపర్‌గా స్థిరపడ్డ పెంటమ్మ జీవితాన్ని ఇందులో చిత్రించాడు. ఆత్మగౌరవంతో బతికే దళిత మహిళ, మతం మార్చుకున్న దస్తగీర్‌కు దగ్గరై ఆయన్ని వివాహం చేసుకోవడాన్ని కూడా ఇందులో రాసిండు. అటు తన జీవితాన్ని పోరాటానికి అర్పితం చేసిన భర్త కనబడక పోవడం ఒకవైపు, మరోవైపు పటేల్‌ మిలిటరీ సైన్యం గ్రామాల్లో ఉద్యమకారులని ఏరి ఏరి చంపుతున్న కాలంలో భర్త ఏమైండో తెలియక పెంటమ్మ పడే వేదనను మానసిక సంఘర్షణను పోరు వాతావరణాన్ని స్వయంగా చూసినవాడు కావడంతో ఆళ్వారుస్వామి బాగా చిత్రించగలిగాడు.

పెంటమ్మ భర్త కోటయ్య అన్యాయాలకు ఒడిగట్టే వారిని అణచి వేసేవాడని చెబుతుంది. అంతే కాదు ఆనాడు కూడా దళాల్లో పనిచేసే వారి పట్ల దుర్బుద్ధితో వ్యవహరించిన వారికి తగిన శాస్తి చేసినట్టు కూడా చెబుతుంది. దీనివల్ల ఆనాటి సంగతులు మనకు అవగతమవుతాయి. ‘‘ఒకసారి ఊళ్ళోకి వచ్చిన బీటు జవాను పశువుగా వ్యవహరించబోతే పెంటమ్మ చేసిన ఆర్భాటం మొత్తం హరిజనవాడతో పాటు గ్రామమంతా పెంటమ్మ శీలాన్ని హర్షించింది. పోరాట కాలంలో కోటయ్య దళానికి చెందిన ఒకడు ఒక స్త్రీ విషయంలో దుష్టబుద్ధి కలిగి ఉన్నాడని తెలిసి కోటయ్య అతనికి చేసిన ప్రాయశ్చిత్తానికి పెంటమ్మ ముగ్ధురాలై తన భర్తను గా భావించింది’’. అట్లాంటి భర్త సాయుధ పోరాటం చేస్తూ బతికుండో, లేడో కూడా తెలియక పోవడంతో ఆఖరికి ఆర్యసమాజ్‌/మిలిటరీ వాండ్ల చేతిలో భార్యను పిల్లలను కోల్పోయిన దస్తగీర్‌ని వివాహమాడిన విషయాన్ని, అందుకు కల్పించిన సన్నివేశాన్ని, వాటి నిర్వహణలో ఆళ్వారుస్వామి చూపిన ప్రతిభ అద్వితీయం.

‘ఆలుాకూలి’ కథలో భార్యను అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవాలని చూసే పల్లెటూరి అనుమానపు భర్తకు, పట్నవాసపు భార్య పార్వతమ్మ చెప్పిన గుణపాఠాన్ని కథగా మలిచిండు. అధికారమున్నోడికి ఆలన్నా, కూలన్నా ఒక్కటే అని తీర్పిచ్చిండు. ‘‘అమ్మగారు! తెలియకడుగుత మేమంటే కూలి చేస్కోని బతికేటోల్లం. మాకు యాజమాన్లకు పనిచేసేంత సేపే సంబంధం. మేమేది కావాలన్నా, వాండ్ల లాభాలు తగ్గుతయని భయమనుకుందాం. మాదేందిగాని, ఒక సంగతి అడుగుత, మీరు తెలిసినోరు, చేసుకున్న పెళ్ళామైనా, తోబుట్టు ఆడదైనా, కనిపెంచిన తల్లైనా మొగోడికింద పనికిరాదు. ఎంత పక్కల్లో రెక్కల్లో కాళ్ళల్లో, వేళ్లల్లో మెలిగినా జిట్టెడు మొగోడు గుట్టంత ఆడదాన్ని గోటికింద కట్టేస్తాడు. దీన్నేమనాలే’’ అని రంగడి తోటి ప్రశ్నింపజేస్తాడు. అంటే ఆ పద్ధతి మారాలని ఆళ్వారు తపించాడు.

నిజానికి ఆళ్వారుస్వామి స్త్రీ స్వేచ్ఛ ధృక్కోణంలో కథలు రాసే సమయానికే తెలంగాణలో కొంత మహిళా చైతన్య వాతావరణం ఏర్పడిరది. ఆంధ్రమహాసభల ద్వారా ప్రతి సమావేశంలో మహిళా మీటింగ్స్‌ని విధిగా నిర్వహించేవారు. పరదాల మాటున చర్చలు జరిగినా వాటిని పుస్తకంగా తీసుకొచ్చి చర్చలన్నిటినీ రికార్డు చేసేవారు. దాదాపు ఇదే సమయంలో ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి, టి.వరలక్షమ్మ తదితర మహిళా రచయితలు స్వయంగా మహిళా సమావేశాలకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించి తమ చైతన్యాన్ని విస్తృతం చేసుకున్నారు. ఆంధ్ర యువతీ మండలి, కుట్టి వెల్లోడి సంక్షేమ కార్యక్రమాలు, దుర్రెషెవార్‌, నీలోఫర్‌ల ప్రజాహిత కార్యక్రమాలు అన్నీ కలగలిపి మహిళా ధృక్కోణం నుంచి కూడా ఆలోచించే చైతన్యాన్ని ఆళ్వారుస్వామికి అందించింది.

కాంగ్రెస్‌ కమ్యూనిస్ట్‌ దొందూ దొందే!

స్వాతంత్య్రానికి పూర్వం కాంగ్రెస్‌ పార్టీ, కొన్ని చోట్ల కమ్యూనిస్టులు కూడా దోపిడీకి పాల్పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్రీ బ్యాంక్‌ని దోపిడీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘జాయిన్‌ ఇండియా’ ఉద్యమం, ‘బాధ్యతయుత ప్రభుత్వం’ ఏర్పాటు, ‘దున్నేవాడికే భూమి’ పేరిట జరిగిన పోరాటాల్లో దొమ్మీలు, దోపీడీలు కూడా నిత్య కృత్యమయ్యాయి. పోలీసు చర్య ద్వారా బలవంతంగా భారత యూనియన్‌లో హైదరాబాద్‌ని విలీనం చేసుకున్న తర్వాత పాత హైదరాబాద్‌ రాజ్య అస్తిత్వం కనుమరుగయింది. ఈ కాలంలో దొంగలకు, కాంగ్రెస్‌ పార్టీ వారికీ తేడా లేదు అనే విధంగా ఆళ్వారుస్వామి ‘‘మాకంటే మీరేం తక్కువ’’ కథలో చెప్పిండు. దొంగతనమే వృత్తిగా చేసుకొని బతుకుతున్న రంగడు, వెంకడు ‘పోరాట’ కాలంలో చేసిన ఉద్యమకారులతో కలిసి ‘జై’ అంటూ దొంగతనానికి పాల్పడితే పార్టీ వాళ్ళు పట్టుకొని చావదెబ్బలు కొట్టిన తీరుని గుర్తు చేసుకుంటూ, అక్కడ పార్టీని నడిపించిన దొర వేరెవ్వరినీ ఆ ఇలాకాలో అడుగు పెట్టనివ్వలేదని, కనీసం నీడ కూడా పడనీయలేదని ఈ కథలో దొరల తీరుని అక్షరబద్ధం చేసిండు. అయితే ఇక్కడ చెప్పింది కాంగ్రెస్‌ వారిని గురించి కాకుండా కమ్యూనిస్టుల గురించి చెప్పిండని అర్థం చేసుకోవాలె.

‘‘మారాజులు కష్టపడ్డందుకు గట్టెకిన్రు. మేము ఉన్నచోటనే ఉన్నాం. పాపం పుటుకలు’’ రంగడు గోళ్ళు గిల్లు కుంటు అన్నాడు.

‘‘వాండ్లంటే ఇల్లనక, ముంగిలనక, పిల్లనక, మేకనక చెట్టు గుట్టలుపట్టి ఎంత చెఱపడ్డారు పాపం’’ అంటూ ఇంద్రసేనా రెడ్డి అనే తొంటదొర చేసిన కార్యకలాపాలను లెక్కగట్టిండు. ఈ దొరని జైలు పరిశీలకునిగా ప్రభుత్వం నియమిస్తుంది. ఆయన జైలు పరిశీలనలో భాగంగా వీరున్న రంగడు, వెంకడు ఉన్న బ్యారక్‌కు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న సన్నివేశాన్ని అర్ధవంతంగా ఆళ్వారుస్వామి చిత్రీకరించాడు.  ‘‘దొరా! మీకు కోపం రాకపోతే ఒకటి అడుగుత. మీరు సర్కారు మీద కత్తికట్టిన ఆరోజుల్లో మానోట్లో మాత్రం మట్టికొట్టిన్రు. ఎక్కడపోయినా మీదే గోల, ఏది దొరికినా మీకేనాయె. ఆ రోజుల్లో మేము పడ్డ కష్టాలు చెప్పితె తీరవు’’ అంటూ ఆనాడు సర్కారు మీద పోరాటం పేరిట దొరలు దోసుకున్న సంగతిని చెప్పిండు. ఈ దొంగలు, దొరలతో పాటు చేరి ‘జై’ కొట్టి తాము కూడా దోసుకోవడంతో దెబ్బలు తిన్నరు. దొరలు కూడా దోసుకున్నారు అని రంగడి పాత్ర ద్వారా ఇలా చెప్పిస్తాడు. ‘‘మీ దగ్గర మేము నేర్చుకునేదేముంది దొరా దీంట్ల. మీరే కొన్నాళ్ళు మా పనులకు ఎగబడ్డారని మావోడు అంటున్నాడు. అవునులేరి. ఎవరికి నచ్చింది వాండ్లు చేస్తుంటారు’’ అంటూ మేము జైళ్లలో ఉన్నాము మీరు అధికారం చలాయిస్తున్నారంటూ ‘మాకంటే మీరేం తక్కువ’’ అని నిలదీస్తాడు. ఈ కథ మొదట ‘ఆనాటి రోజులు’ శీర్షికన 1952 జూన్‌ నాటి ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో అచ్చయింది. దీన్ని 1955లో జైలులోపల కథల సంపుటి వెలువరించే సమయంలో ‘మాకంటే మీరెం తక్కువ’ అని దొరల్ని నిలదీసే విధంగా శీర్షిక పెట్టాడు. పాత కథలోని కొన్ని సంభాషణలు మార్చి, పెంచి పుస్తకంలో జోడిరచాడు.

నిజాం ప్రభుత్వంలో పాఠశాలలు పెట్టుకోవడం, సభలు నిర్వహించుకోవడం, వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకోవడం, గ్రంథాలయాలు, పత్రికలు స్థాపించడంలోనూ అనేక ఆంక్షలుండేవి. హిందూ`ముస్లిం ఇద్దరికీ ఈ ఆంక్షలు ఒకేతీరుగా అమలయ్యేవి. మదరసాలు పెట్టాలన్నా, కానిగి బడులు తెరవాలన్నా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించాలనేది నిబంధన. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టకుండా ఉండే విధంగా ఆ యా సభల నిర్వాహకుల నుంచి ముందుగానే హామీ పత్రాన్ని ప్రభుత్వం డిమాండ్‌ చేసేది. అట్లా హామీ పత్రం ఇవ్వని సభలకు అనుమతి లేకుండేది. అలాగే ఈ సభల నిర్వహణల వల్ల స్థానికంగా విద్వేషాలు చెలరేగుతాయని ప్రభుత్వం భావించినా అలాంటి వాటికి అనుమతి నిరాకరించబడేది. అయితే వీటన్నింటిలోకి వ్యాయమాశాల (అఖాడా) ఏర్పాటు చేస్తే నిజాం ప్రభుత్వం ద్వీపాంతరవాస శిక్ష విదించేది. ఇట్లా అఖాడాల ఏర్పాటు, వాటి నిర్వహణ, అందులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టడానికి ఈ అఖాడాలు ప్రధాన భూమిక నిర్వహిస్తోందని, వీటికి ఆర్యసమాజ్‌ భావజాలం గల వాళ్ళు ఇతోధికంగా తోడ్పడుతున్నారని ప్రభుత్వం వీటి ఏర్పాటుపై ఆంక్షలు విధించింది. ఈ అఖాడాల గురించి వాటికి సంబంధించిన భిన్న పార్శ్వాలను ఆళ్వారుస్వామి తన కథల్లో చిత్రీకరించాడు. ‘భర్త కోసం’ కథలో పోస్టల్‌ ఉద్యోగి, రామదాసు అనే తెనిగాయన ఊర్లో ‘అఖాడా’ ఏర్పాటు చేసినందుకు ద్వీపాంతరవాస శిక్షకు గురవుతాడు. అవి రెండో ప్రపంచ యుద్ధపు రోజులు కావడంతో ‘ఏ సందులో చూసినా గూఢాచారులు ఈగలవలె నున్నారు’. ప్రతిరోజూ అరెస్టులు, శిక్షలు, ప్రవాస శిక్షలు విధించేవారు. ఇక్కడ రక్షణశాఖ వారు అత్యూత్సాహం ప్రదర్శించి ‘‘రామదాసుకు సామాన్య కారాగార శిక్ష విధించినచో యిట్టి రాజద్రోహుల సంఖ్య మితిమీరిపోవుననియు, యితనికి వేయబడు శిక్ష ఇతరులకు గుణపాఠముగా ఉండవలెననియు, ద్వీపాంతరవాస శిక్ష విధిగా విధింపవలయుననియు రక్షణ శాఖవారును, ప్రభుత్వ న్యాయవాదియు గట్టిగా వాదించిరి’’ అంటూ ప్రభుత్వం వారి అసహనాన్ని గురించి చెప్పిండు. అలాగే ‘విధిలేక’ కథలో అఖాడాలు ఎలా సంఘవిద్రోహ శక్తుల అడ్డాగా మారినాయో  పూసగుచ్చినట్టు చెప్పిండు. ‘‘వ్యాయామశాల ఒక క్రొత్త ప్రపంచమనవచ్చు. వివిధ ప్రవృత్తులు, వివిధ అలవాట్లు గల వ్యక్తులతో నిండియుండేది. జేబుదొంగలు, జూదగాండ్రు, కొద్ది కొద్ది దొంగతనాలతో జేలు యాత్రలు చేసినవారు, అరాజక ప్రియులు, వ్యభిచారులు, త్రాగుబోతులు` అన్ని రకాలవారు అక్కడ సమావేశమై తన జీవితమందలి సంఘటనకు గర్వించుకుంటూ, ఒకరికొకరు చెప్పుకుంటా’’రని అఖాడాల లోపలి విషయాలను వెల్లడిరచిండు. అఖాడాలో ‘విందులు, భోగముసానుల ఆటలు, పాటలు, త్రాగుడు తందనాలు’ కూడా విరివిగా జరిగేవి అని ఇదే కథలో మరో చోట చెప్పిండు.

తమ భావజాలంతోనే చివరి వరకూ అంటకాగలేదనో, కింది కులాల గురించి మాట్లాడిరడు అనో తెలియదు గాని సాహితీ ప్రపంచంలో ఆళ్వారుస్వామికి న్యాయంగా, కచ్చితంగా దక్కాల్సిన స్థానాన్ని దక్కనీయలేదు. ఇప్పటి తెలంగాణ ఉద్యమకారులు, సృజనకారులు ఆళ్వారుని జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలి. పాఠ్యాంశాల్లో చేర్చే ప్రక్రియను ఆచార్యలోకం ఇప్పటటికైనా గుర్తించి ఈయన మీద విస్తృతమైన పరిశోధనలు చేయించాలి. ఆళ్వారుని జాతీయస్థాయిలో సగౌరవంగా నిలబెట్టేందుకు అన్ని భారతీయ భాషల్లోకి ఆయన సాహిత్యాన్ని, ఆయన జీవిత చరిత్రను తర్జుమా చేయాల్సిన అవసరముంది. కనీసం ఆయన శతజయంతి నాటికైనా ఆయన పేరిట పోస్టల్‌ స్టాంప్‌ని ప్రభుత్వం విడుదల చేసేలా తెలంగాణాభిమానులు, ఆళ్వారుస్వామి అభిమానులు, ప్రజాస్వామిక వాదులు బాధ్యతగా ప్రాధాన్యత క్రమంలో ప్రథమస్థానంలో ఈ పనిని చేపట్టాలి.

గతానికి వర్తమానానికి జరిగే సంభాషణ, సంఘర్షణే చరిత్ర. ఈ చరిత్ర సాక్ష్యాలు, ఆధారాలు, ఫుట్‌నోట్స్‌, బిబ్లియోగ్రఫీలతో రాస్తే అకడమిక్‌ చరిత్ర అవుతుంది. దీన్ని రాసే, ప్రచురించే వారి భావజాలం, లక్ష్యంగా చేసుకున్న పాఠకులను బట్టి కూడా చరిత్ర రచనలో మార్పులు ఉంటాయి. చరిత్రరచయిత కులం, మతం, ప్రాంతం కూడా ఈ రచనలో చొరబడి ‘ప్రామాణికత’కు విఘ్నాలు కలిగిస్తాయి. కొత్త చేర్పులు, మార్పులు, నూతన పరిశోధనలు వాటికి ఆధిపత్య వర్గం, వర్ణం, వారి అధీనంలోని మీడియా, పత్రికలు, విశ్వవిద్యాలయాల పాలక మండళ్ళు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ అన్నీ కలగలిపి ఎవరికి అనుకూలంగా ఉన్న అంశాలతో మాత్రమే వారు చరిత్రను ప్రచారంలోకి తెస్తున్నారు. ఇదే చరిత్ర ప్రత్యామ్నాయ రూపంలో బహుళ ప్రచారంలో ఉంది. కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి, షోయెబుల్లాఖాన్‌, బందగీ, దొడ్డికొమురయ్య తదితర తెలంగాణ యోధుల గురించి తెలుసుకోవడానికి మౌఖిక గాధల ఆధారంగా రాసిన బుర్రకథలు, వారి అనుచరులు, అంతేవాసుల సమాచారంతో రాసిన రచనలే ఎక్కువ. ఇందులో పత్రికలు, ప్రభుత్వ డాక్యుమెంట్స్‌ ఆధారంగా రాసినవి చాలా తక్కువ. ప్రభుత్వ డాక్యుమెంట్స్‌ కూడా పూర్తి వాస్తవాన్ని చెబుతాయని విశ్వసించలేము. అయినప్పటికీ అకడమిక్‌ రంగంలో వాటికే ప్రాధాన్యముంటుంది. బుర్రకథలకన్నా ఎక్కువ జీవితాన్ని, సమాజాన్ని చిత్రీకరించిన నవలలు, కథలు తెలంగాణ చరిత్రను తెలుసుకోవడానికి మంచి రెఫరెన్స్‌ సోర్సెస్‌. వీటికి ‘ఆచార్య’లోకంలో తగినంత గుర్తింపు లేకపోయినప్పటికీ సాహిత్యం చదువుకున్న వారు చాలామంది దాన్ని ‘చారిత్రక’ అంశంగానే చూస్తారు. కల్పన ఉన్నప్పటికీ వాస్తవ సంఘటనల జోడిరచడానికే వాటిని వాడుకుంటారు. తెలంగాణ విషయంలో సాహిత్యమే చరిత్రకు ప్రధాన వనరు. ఇందుకు ‘సాయుధ పోరాటం’ మినహాయింపు కాదు.

వట్టికోట ఆళ్వారుస్వామి బ్రాహ్మణకులంలో నల్లగొండ జిల్లా చెరువు మాధవరంలో పుట్టిండు. కానీ ఎన్నడు కూడా బ్రాహ్మణ ఆధిపత్య భావజాలాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించలేదు. డికాస్టిఫై, డిక్లాసిఫై కావడమే గాకుండా అహర్నిషలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిండు. తాను స్వయంగా హోటల్లో పనిచేయడం, వంటజేసి పెట్టడం, గురువుకు సేవచేసి అందుకు ప్రతిఫలంగా రెండు పూటలా భోజనం చేయడం, చివరికి వారాలు చేసుకొని తినాల్సి రావడం చూస్తే ఆయన పేదరికం తెలుస్తుంది. తాను పేదరికాన్ని అణువణువూ అనుభవించిన వాడు కావడమే ఆయన్ని పేదల పక్షపాతిగా తీర్చిదిద్దింది. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి అన్నివేళలా అండగా ఉండడం, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తాను నమ్మిన దానిపట్ల కచ్చితంగా ఉండడం, ఆచరణలో దార్శనికత అన్నీ కలగలిసి ఆయన్ని సంపూర్ణ వ్యక్తిగా నిలబెట్టాయి. అవును కచ్చితంగా సంపూర్ణ వ్యక్తే. దీనిపట్ల కొందరికి అభ్యంతరం ఉండొచ్చు. 46యేండ్ల తన జీవితంలో అన్ని భావజాలాల్ని అతి దగ్గరగా చూసిండు.

ఆంధ్రమహాసభ, సత్యాగ్రహం, గాంధీ ఫిలాసఫీ ఆచరణ, వందేమాతర ఉద్యమం, అభ్యుదయ రచయితల సంఘం, క్విట్‌ ఇండియా, సాయుధ పోరాటం, జైలుశిక్ష, దేశోద్ధారక గ్రంథమాల, సూచీ గ్రంథాలయం, భుజానికి జోళె తగిలించుకొని పుస్తకాలు అమ్మడం, పుస్తకాల ప్రచురణకు పేరున్న వారి పెండ్లిళ్ళ సమయంలో కట్నాలు సేకరించి వినియోగించడం, పగలు, రాత్రి అనే తేడాలకుండా పనులు చేయడం, రాయడం, అధ్యయనం చేయడం, వ్యక్తుల్ని కలవడం, వానమామలై లాంటి వారి ఆరోగ్యం బాగాలేకుంటే ముందుండి వైద్యం చేయించడం, అందుకయ్యే ఖర్చులకు విరాళాలు సేకరించడం, దొడ్డి కొమురయ్య చనిపోతే జయసూర్య నాయుడుతో కలిసి నిజనిర్ధారణకు కడవెండి వెళ్ళడం, గద్వాల రాణి అన్యాయాలకు ఒడిగడుతుందని తెలుసుకొని ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి బద్దం ఎల్లారెడ్డితో కలిసి రాణి మహలక్ష్మమ్మకు వ్యతిరేకంగా నివేదిక తయారు చేయడం, అభ్యుదయ రచయితల సంఘాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే గాకుండా దాని తరపున తెలుగుతల్లి పత్రిక ప్రచురణ బాధ్యత నెత్తికెత్తుకోవడం, గుమాస్తాల హక్కుల కోసం కొట్లాడటమే గాదు కంకర్ల పెంటయ్య అనే గుమాస్తా నాయకునితో అదే పేరుతో పత్రికను స్థాపింపజేసి తాను వెన్నెముఖై నిలబెట్టడం, ప్రజలమనిషిని భాష విషయంలో భయంభయంగానే బయటికి తేవడం, గంగుని కండ్లసూడక

ముందే కన్ను మూయడం అన్నీ ఆళ్వారుస్వామి కార్యాచరణ, ఆయన సాహిత్య విశిష్టతకు కొంత/కొన్ని పునాది, మరికొంత ఉపరితలమయ్యాయి.
ఆళ్వారుస్వామి ఆచరణ, నిత్య సృజన, విరామమెరుగని కృషి, అలుపెరుగని ప్రయాణం వర్తమాన కాలంలో హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌లో కొంతమేరకు దర్శించవచ్చు. అంతేగానీ ఆయనతో పోల్చగలిగిన వ్యక్తి తెలుగునేలలో మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 2015 ఆయన శతజయంతి సంవత్సరం. ఆప్పటి వరకు ఆళ్వారుస్వామి రచనలన్నీ పుస్తక రూపంలో రావాల్సిన అవసరముంది. నవలలు, కథలు, ఆత్మకథాత్మక రచన, నాటికలు, పద్యాలు, వ్యాసాలు, సమీక్షలు, పత్రికా చర్చలు, అభిప్రాయాలు, డైరీలు, ఆయన రాసిన నివేదికలు, ముందుమాటలు, ప్రచురణ కర్తగా మాటలు, ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ తెలుగు పాఠకులందరికీ అందుబాటులోకి రావాలి. ఈ పని 2014 ఫిబ్రవరి ఐదునాడు ఆయన కొత్త పుస్తకం ఏదో ఒకటి ఆవిష్కరింపజేసుకోవడం ద్వారా ప్రారంభించుకోవాలి.

(గమనిక: ఈ వ్యాసం కోసం ప్రచురితమైన ఆళ్వారుస్వామి కథలు జైలులోపలతో బాటుగా ఇంకా అముద్రితంగా ఉన్న మరో 20 కథల్ని కూడా పరిశీలించడమైంది)