త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః

 

 

-శ్రీ చమన్

~

 

ప‌ది త‌ల‌లు రావ‌ణుడు..ఒక్క ఇమామీ మెంతోప్ల‌స్‌… ప‌దిత‌ల‌ల‌కూ ఒకేసారి గాయ‌బ్‌. త‌గ్గిపోయింది. పోయిందే ఇట్స్‌గాన్‌!

ఇక్క‌డ ల‌క్ష‌లాది త‌ల‌కాయ‌లు. ఇవి పిందెల ద‌శ‌ నుంచి కాయ‌లుగా మారి, ముదిరి పండై  రాలిపోయే ద‌శ వ‌ర‌కూ ఈ త‌ల‌కాయ‌ల్ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ఎవ‌రిది వారిదే. అయిన‌ప్ప‌టికీ   ప్ర‌జాస్వామ్యానికి పెద్ద‌త‌ల‌కాయ‌ల్లాంటి ప్ర‌భుత్వం, న్యాయ‌స్థానాలు, ర‌క్ష‌క భ‌ట నిల‌యాలు, కొన్ని సంస్థ‌లు ..త‌ల‌కాయ‌ల‌న్నీ స‌మాన‌మ‌ని భావించి స్వ‌చ్ఛందంగా కాప‌లా కాస్తుంటాయి. జుట్టురాలిన బ‌ట్ట త‌లైనా, నూనె జిడ్డు కారుతున్న త‌లైనా,  హెడ్ అండ్ షోల్డ‌ర్ వారి హెయిర్ కేర్ కార‌ణంగా నిగ‌నిగ‌లాడుతున్న త‌ల‌కాయ అయినా ఈ పెద్ద‌త‌ల‌కాయ‌ల‌కు స‌మాన‌మ‌ని ఎలుగెత్తి చాటుతున్నాయి.

సామాన్యంగా ఇందులో కొన్ని త‌ల‌కాయ‌లు ఎక్కువ స‌మాన‌మ‌న్న‌ది ఆఫ్ ది రికార్డ్‌. ఏది ఏమైన‌ప్ప‌టికిన్నూ, గో ఎ హెడ్. అలా ముందుకు పోదాం అని నిర్ణ‌యించేస్కున్నారు. వీరి బాధ జ‌నం బాధ‌. వీరి తాప‌త్ర‌యం ప్ర‌జా క్షేమం.  కాలుష్య‌పు పొర‌లు చీల్చుకుంటూ, కారుతున్న ముక్కు చీదుకుంటూ ద్విచ‌క్ర వాహ‌నాల‌పై దూసుకొస్తున్న కొన్ని ల‌క్ష‌ల‌ త‌ల‌ల‌కు నొప్పి లేని బాధా నివారిణి అందుబాటులోకి తెచ్చారు. శిరోభారమ‌ని భావిస్తే చేతి చ‌మురు వ‌దిలిపోద్ది.  ప్ర‌జ‌ల ధ‌న‌, మాన ప్రాణాలు కాపాడే ప‌నిలో 24/7 న్యూస్ చాన‌ల్‌లా ప‌నిచేస్తున్న వారి మైండ్‌లో మెరిసిన మెరుపే ఈ శిర‌స్ర్తాణం. మ‌ర‌కా మంచిదే!

జేబుకు చిల్లు, బుర్ర‌కు బ‌రువూ అయినా.. హెల్మెట్టూ మంచిదే.  కోర్టు అక్షింత‌ల‌తో, స‌ర్కారు త‌ప్ప‌నిస‌రై జారీ చేసిన ఉత్త‌ర్వుల‌తో, ఉన్న‌తాధికారుల ఆదేశాల వంటి ఇత్యాది కార‌ణాల‌తో ప్ర‌జాసంక్షేమ సైన్యం రంగంలోకి దిగింది. పైన శాంతికి చిహ్న‌మైన‌ ధ‌వ‌ళ‌వ‌ర్ణ చొక్కా, క‌నిపించ‌ని నాలుగో సింహానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి ఖాకీ పంట్లాం వేసుకున్న బృందాలు మ‌హాన‌గ‌ర దారుల్లో అడుగ‌డుగునా చ‌లానా కొర‌డాల‌తో, ఎల‌క్ర్టానిక్ జ‌రిమానా మిష‌న్ల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. వీరికి తార‌స‌ప‌డ్డాడు న‌ర్సిమ్మ‌. న‌ర్సిమ్మ‌ ఎవుడ‌ని అడిగేరు! యాద్గిరి గాడి బామ్మ‌ర్ది. యాద్గిరి గురించి మ‌నం అడ‌గ్గూడ‌దు. గ‌ల్లీలోని ఆ అడ్డాలో  ఏ పార్టీ అయినా ఆడే నాయ‌కుడు. ఏ కుల‌మైనా ఆడే పెద్ద‌.  ఏ మ‌తానికైనా యాద్గిరే దేముడు. ఎన‌క‌మాల ఇంత‌టి ద‌న్నున్న న‌ర్సిమ్మ‌ గారు.. సాయంత్రం కిష్న‌కాంత్ పార్కులో న‌డుస్తాడు.

న‌ర్సిమ్మ‌కి న‌డ‌వ‌డం కొత్త కాదు. కానీ ఇప్పుడు న‌డ‌వ‌డం కొత్తొక వింత‌. గుడుంబా మూట నెత్తికెత్తుకుని దొంగ‌చాటుగా ఎన్ని ఊర్లు దాటి సిటీలోకి ఎంచ‌క్కా ఎంట‌రిచ్చేవోడు. ఇది జ‌మానాలోని మాట‌. న‌ర్సిమ్మ న‌డిచిన తోవ లెక్కేత్తే వైఎస్ పాద‌యాత్ర కంటే ఎక్కువ కిలోమీట‌ర్ల లెక్కొస్త‌ది.  ఇప్పుడు ఆ బాధ‌లేదు. బామ్మ‌ర్ది యాద్గిరి రూపంలో న‌ర్సిమ్మ వైన్ సిండికేట్‌లోకి దూరాడు. డ‌బ్బుతోపాటు షుగ‌ర్ జ‌బ్బు వ‌చ్చిన పెద్దోళ్లంతా న‌డిచిన దారినే ప‌ట్టాడు న‌ర్సిమ్మ‌. అలాగ కిష్న‌కాంత్ పార్కులో పెద్దోళ్ల‌తో దోస్తాన న‌డ‌క త‌ప్పించి..మామూలు న‌డ‌క త‌ప్పిపోయింది. ఎండ పొడ‌గిట్ట‌ని సుకుమార సౌంద‌ర్య తేజోవిలాస న‌ర్సిమ్మ‌గారికి ఒకానొక సాయంత్రాన పాన్ న‌మ‌లాలి అనిపించింది. త‌న ఇంటిప‌క్క‌నే మెయిన్‌రోడ్డుకు ఆనుకుని ఉన్న కిల్లీ బంక్ ద‌గ్గ‌ర‌కు న‌డిచెళితే నామోషీ అనుకుని  ద్విచ‌క్ర‌వాహ‌నం తీశారు.  మెయిన్‌రోడ్‌కు ఎంట‌ర‌వుతూనే న‌ర్సిమ్మ బండి ఆగింది. లేదు ట్రాఫిక్ పోలీసోళ్లు ఆపారు.  మ‌న క్షేమ  ధైర్య‌, స్థైర్య అభ‌య ఆయురారోగ్యాల కోసం వారాపుతున్నార‌నే నిజం న‌ర్సిమ్మ‌కు తెలుసు. అందుకే ఆపాడు.

హెల్మెట్ లేదు. జ‌రిమానా క‌ట్ట‌మ‌న్నారు. యాద్గిరి బామ్మ‌ర్దిన‌ని చెప్పాడు. ఇప్పుడే క‌ట్ట‌క్క‌ర్లేదు. చ‌లానా వ‌స్తుంద‌న్నారు. ప‌ది రూపాయ‌ల పాన్ కోసం వ‌స్తే ప‌రేషాన్ చేస్తున్నారా అని మండిప‌డ్డాడు. మీరు పాన్ తినొచ్చు..వెయ్యి క‌క్కండి సారీ క‌ట్టండ‌న్నారు. చ‌లానా తీసుకుని చ‌ల్ల‌గా జారుకున్న న‌ర్సిమ్మ బామ్మ‌ర్ది చెవిలో త‌న‌కు జ‌రిగిన ప‌రాభ‌వం ఊదాడు. యాద్గిరి స్విచ్ నొక్కాడు. శిర‌స్ర్తాణం-శిరోభార‌మ‌నే అంశంపై సెమినార్లు, హెల్మెట్ దాని వ‌ల్ల లాభ‌న‌ష్టాల‌పై స‌మీక్ష‌లు మొద‌ల‌య్యాయి. పోలీసు, ట్రాఫిక్‌, ఆర్టీఏ, ఫైర్ అండ్ సేఫ్టీ, వాణిజ్య‌ప‌న్నుల‌శాఖ అధికారుల‌తో రివ్యూ ప్రారంభ‌మైంది. న‌ర్సిమ్మ గారికి క‌లిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని మొద‌లుపెడుతూనే ..న‌ర్సిమ్మ‌గారి త‌ల‌కాయ‌ను కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు ఆర్టీఏ వారు. ఇదిగాకుండా కోర్టు వారి ఆదేశాలు శిర‌సావ‌హించి, త‌మ‌శాఖ‌కు..వాహ‌న‌చోద‌కుల‌కు శిరోభార‌మైనా, శిర‌స్ర్తాణ  ధార‌ణ త‌ప్ప‌నిస‌రిగా అమ‌ల‌య్యేలా చూస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు.

హెల్మెట్ లేక‌పోతే వెయ్యి జ‌రిమానా వేసే బ‌దులు అదే వెయ్యి తీసుకుని ఓ హెల్మెట్ అక్క‌డే ఇవ్వొచ్చు క‌దా! అని ఓ ట్రైనీ అధికారి అందామ‌నుకున్నాడు. మ‌న‌సులోనే తొక్కి పెట్టేశాడు. ఇంత‌లో పోలీస్ అధికారి లేచాడు. “మీకేమి పోయింది? అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేశారు. మా ప‌నే ఘోరంగా త‌యారైంది. దొంగ‌నా కొడుకులంతా హెల్మెట్లు పెట్టేసి దొరికిన‌ది దొరికిన‌ట్టు దోచుకెళ్తున్నారు. అన్ని హెల్మెట్లు ఒకేలా ఉంటున్నాయి. సీసీ ఫుటేజీకి దొంగ‌లు దొర‌క‌డంలేదు హెల్మెట్ ముఖాల‌తో ఏ ఒక్క కేసు ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డంలేదు. చోరీ సొత్తు రిక‌వ‌రీలు కాక ఆఫీస‌ర్స్ మా ఉద్యోగ జీవితాల‌తో ఆడుకుంటున్నారు. చైన్‌స్నాచ‌ర్లు హెల్మెట్‌ల మాటున త‌ప్పించుకుంటున్నారు. సూది సైకోలకు హెల్మెట్టే ర‌క్ష‌ణ‌. మా బాధ ఎవ‌రితో చెప్పుకోం“ అంటూ ల‌బోదిబోమ‌న్నాడు.

ఆదేశాలిచ్చేది కోర్టు, అమ‌లు చేయాల‌ని స‌తాయించేది ఆర్టీఏ వాళ్లు..మ‌ధ్య‌లో వాహ‌న‌చోద‌కుల‌తో తిట్లు, నాయ‌కుల‌తో చీవాట్లు తినేది మేమంటూ వాపోయారు ట్రాఫిక్ పోలీసులు. మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న వాణిజ్య ప‌న్నుల‌శాఖాధికారులు.. మ‌హాన‌గ‌రంలో 25 ల‌క్ష‌ల ద్విచ‌క్ర‌వాహ‌నాలున్నాయ‌ని, వీరంతా హెల్మెట్లు కొంటే.. 25 ల‌క్ష‌ల హెల్మెట్లు అమ్మ‌కం అయి ఉంటాయ‌ని. ఓ 5 ల‌క్ష‌ల మంది కొన‌క‌పోయినా 20 ల‌క్ష‌ల ఖాయ‌మ‌ని, కానీ త‌మ‌శాఖకు హెల్మెట్ల అమ్మ‌కాల నుంచి ఆ స్థాయి ప‌న్నులు జ‌మ కాలేద‌ని వాపోయారు. ఇదే స‌మావేశానికి “ ప్ర‌జ‌ల ప్రాణాలు-ప్ర‌మాదాలు-ప్ర‌భుత్వ బాధ్య‌త“ అనే అంశంపై పోరాడుతున్న స్వ‌చ్ఛంద సంస్థ ప్ర‌తినిధులు కూడా హాజ‌ర‌య్యారు. ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల చేత ఎన్నికైన ప్ర‌భుత్వానికి  ప్ర‌జ‌ల త‌ల‌కాయ‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త లేదా అని ప్ర‌శ్నించారు.  దీని కోసం తాము హైకోర్టులో పోరాడామ‌ని, ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్ల‌డానికైనా సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు.

బైక్ పై వెళ్లేవాడొక్క‌డే హెల్మెట్ పెడితే చాల‌ద‌ని, వాడి వెనుకున్న వాడికి కూడా శిర‌స్ర్తాణం త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని చెప్పారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్లేవాళ్లు మాత్ర‌మే హెల్మెట్ పెట్టుకుంటే స‌రిపోద‌ని, న‌డిచి వెళుతున్న వాళ్ల‌ను వీళ్లు గుద్దితే వాళ్ల త‌ల‌కాయ పుచ్చ‌కాయ‌లా ప‌గిలిపోతుంద‌ని, అప్పుడు వారి ప్రాణాల్ని ఎవ‌రు తిరిగి తెస్తార‌ని లాజిక్ తీశారు.  బైకుల‌ను ఆపి త‌నిఖీ చేసే పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల‌ను.. కొంద‌రు నేర‌స్తులు, అగంత‌కులు గుద్ది వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హెల్మెట్ వేసుకుని  బైక్లు దూసుకుపోయి కారు అద్దాలు ప‌గిలి అందులో వారి త‌ల‌కాయ కూడా ప‌గిలే అవ‌కాశం ఉంద‌న్నారు. ఓవ‌రాల్‌గా ఇంట్లో ఉన్న‌ప్పుడు త‌ప్పించి..విమానాల్లో వెళ్లే వారిని మిన‌హాయించి..అంద‌రికీ హెల్మెట్ త‌ప్ప‌నిస‌రి చేయాలని డిమాండ్ చేశారు.

చివ‌రికి న‌ర్సిమ్మ పాన్ కోరిక‌కు రోడ్డుపై న‌డిచెళ్లే వాళ్ల‌కూ శిరోభారం త‌ప్ప‌ని స‌ర‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. త‌ల‌కాయో ర‌క్షిత ర‌క్షితః నినాదాలు మిన్నంటుతున్నాయి.  చిన్న‌పిల్ల‌ల‌తో ప్ల‌కార్డులు ప‌ట్టుకుని లైసెన్సు ఉండి సెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా న్యూసెన్స్ చేస్తున్న వాళ్ల‌ను చైత‌న్యం చేసేందుకు భారీ ర్యాలీ తీస్తున్నారు.
*