శ్రీకాంత్ కవితలు మూడు…

 

-శ్రీకాంత్
~
 
1.
రాత్రికి ముందు కాలం
రాత్రికి ముందు కాలం:

లోపల, ఎవరో అప్పుడే వీడ్కోలు పలికి వెళ్ళిపోయిన నిశ్శబ్ధం.
ఖాళీతనం –
***
ఇంట్లో నేలపై పొర్లే, గాలికి కొట్టుకు వచ్చిన ఆకులు:పీల గొంతుతో –
ఒక అలజడి. దాహంతో పగిలిపోయిన మట్టి.
రోజూవారీ జీవనంతో పొక్కిపోయిన హృదయం –

బల్లపై వడలిన పూలపాత్ర. మార్చని దుప్పట్లు. బయట, ఇనుప
తీగపై ఆరి, ఒరుసుకుపోయిన దుస్తులు. ఇక
ఎవరో అద్దంలో చూసుకుంటూ నొసట తిలకం

దిద్దుకుంటున్నట్టు, నెమ్మదిగా వ్యాపించే చీకటి. రాళ్లు. ఇసిక –
గాజుభస్మాన్ని నింపాదిగా తాగుతున్నట్టు, ఒక
నొప్పి. తపన. ఒంటరిగా జారగిలబడే చేతులు –

ఇంటికి చేరే దారిలో, ఎవరిదో పాదం తగిలి పగిలి పోయిందీ మట్టికుండ.
ఇక
***
అల్లల్లాడే
పగిలిన పెదాలకు, ఒక్క నీటి చుక్కయినా దొరకక, పిగిలిపోతూ
ఈ రాత్రి

ఎలా గడవబోతుందో, నాకు ఖచ్చితంగా
తెలుసు.

 
2.

బొమ్మలు

విరిగిన బొమ్మలని అతక బెట్టుకుంటూ కూర్చున్నాడు
అతను –
***
బయట చీకటి. నింగిలో జ్వలిస్తో
చందమామ. దూరంగా ఎక్కడో చిన్నగా గలగలలాడుతూ

రావాకులు –

వేసవి రాత్రి. ఎండిన పచ్చిక.
నోరు ఆర్చుకుపోయి, నీటికై శ్వాసందక ఎగబీల్చె నెర్రెలిచ్చిన
మట్టి వాసన –

ఇక, లోపలేదో గూడు పిగిలి
బొమ్మలు రాలి, విరిగి కళ్ళు రెండూ రెండు పక్షులై పగిలిన

గుడ్ల చుట్టూ

రెక్కలు కొట్టుకుంటూ
ఎగిరితే, అడుగుతుంది తను అతనిని చోద్యంగా, దిగాలుగా
చూస్తో –

“ఎప్పటికి అతికేను ఇవి?”
***
అతికీ, మళ్ళీ ముక్కలుగా
చెల్లాచెదురయిన హృదయాన్ని తన అరచేతుల్లో జాగ్రత్తగా
ఉంచి

విరిగిన వాక్యాలనీ, అర్థాలనీ
అతి జాగ్రత్తగా జోడిస్తూ, అతక బెట్టుకుంటూ మారు మాట్లాడకుండా

అక్కడే కూర్చుని ఉన్నాడు
అతను –

3

రాతి పలకలు

నిస్సహాయంగా వాళ్ళ వైపు చూసాడు అతను: లోపల
గ్రెనైట్ పలకలుగా మారిన
వాళ్ళ వైపు-
***
వేసవి రాత్రి. నేలపై పొర్లే ఎండిన పూల సవ్వడి. తీగలకి
వేలాడే గూడు ఇక ఒక వడలిన
నెలవంకై –

దాహం. లోపల, నీళ్ళు అడుగంటి శ్వాసకై కొట్టుకులాడే
బంగారు కాంతులీనే చేపపిల్లలేవో:
చిన్నగా నొప్పి –

సుదూరంగా ఎక్కడో అరణ్యాల మధ్య ఒక జలపాతం
బండలపై నుంచి చినుకులై చిట్లే
మెత్తటి స్మృతి –
***
నిస్సహాయంగా వాళ్ళ వైపు, పాలరాయిలాంటి తన వైపూ
చూసాడు అతను: ఆ రాళ్ల వైపు –
ఇక, ఇంటి వెనుకగా

ఇసుకలో ఉంచిన మట్టికుండ చుట్టూ చుట్టిన తెల్లటి గుడ్డ
తడి ఆరిపోయి, నెమ్మదిగా కుండను ఎప్పుడు
వీడిందో

ఎవరికీ తెలీలేదు.

నివేదన

mandira

-శ్రీకాంత్

అవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా అహ్మద్ ఆ రోజు త్వరగా ఇంటికి చేరుకున్నాడు.

అతను కనపడగానే, ఆ రోజు – దారుల్లో వీధుల్లో ఎవరూ మైకుల వాల్యుమ్ పెంచలేదు. అతను వీధి మలుపు తిరగగానే, చేతులకీ నెత్తులకీ కాషాయపు రంగు నెత్తురు గుడ్డలతో అతనిని చూసి ఎవరూ వంకరగా నవ్వలేదు. నడుస్తూ నడుస్తూ తల ఎత్తితే, ఆ రోజు ఎవరూ గార పట్టిన గుట్కా పళ్ళతో మందు వాసనతో చీత్కారంగా కాండ్రించి ఊస్తూ మూడు గుండీలు విప్పిన అంగీని వెనక్కి తోసుకుంటూ కనుబొమ్మలను కవ్వింపుగా ఎగుర వేయలేదు. ప్రతి సందూ కబ్జా అయ్యి ఒక రామ మందిర నిర్మాణమయ్యీ అతను వాళ్ళని దాటుకుని ఒదిగొదిగి వెడుతున్నప్పుడల్లా ఎప్పటిలా లీలగా ‘ఇస్కీ బెహెన్కి చోత్’, ‘మాధర్చోత్’ అనే పదాలు అతని వెన్నుని తాకలేదు. ఒక మస్జీద్ అతని హృదయంలో కూలగొట్టబడలేదు. దాటుకుంటూ వచ్చిన ప్రతి వీధిలోనూ అతన్ని చూసీ చూడగానే ఎవరూ జై శ్రీరాం అని నినదించలేదు. ఉన్మాద నృత్యాలతో గణగణగణమనే గంటలతో నుదుటిన త్రిశూలాల వంటి బొట్లతో ఎవరూ అతనిని భయభ్రాంతుడని చేయలేదు. అతని ఒళ్లంతా ఆ రోజు కుంకుమతో అస్తమయం కాలేదు.

సరే. నిమజ్జనం ముగిసింది. ఏదో సద్దుమణిగింది. అతని నగరం కొంత తెరపి పడింది. ఇక

ఆవాంతరాలూ అడ్డంకులూ ఏమీ లేకుండా ఆ రోజు అహ్మద్ త్వరగా ఇంటికి చేరుకుని, భార్య ఇచ్చిన మంచినీళ్ళు త్రాగి, తెచ్చిన అరటి పళ్ల సంచిని ఆరేళ్ళ పిల్లల చేతికిస్తుండగా గోడకి చతికిల బడిన అతని ముసలి తల్లి అంటుంది కదా –

“వచ్చావా నాయనా – త్వరగా స్నానం చేసి భోజనం చేయి. ఇక ఈ పూటైనా పిల్లలు నిశ్చింతగా, కంటి నిండుగా నిదురోతారు”

***

Painting: Mandira Bhaduri

నీలాంటి చీకటి

శ్రీకాంత్
ఒక సమాధిని తవ్వుతున్నట్టు ఉంది
   పగటి నిప్పులు పడ్డ కళ్లల్లో రాత్రి చినుకులు ఏవైనా రాలి చల్లబడతాయేమోనని
   ఒక్కడినే ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చుంటే -

ఈ సమాధి ఎవరికి అని అడగకు.
   చీకట్లో కూర్చుని చేతివేళ్ళు విరుచుకునే ధ్వనుల్లోంచి వెళ్ళిపోయింది ఎవరు
   అని అడగకు. వొంగిపోయిన శిరస్సు కింది వొణికే నీడలు
   వెతుకులాడేది ఎవరినీ అని అడగకు. గాలి - ఉండీ లేని

ఈ గాలి - ఆగీ ఆగని ఈ గాలి - ఉగ్గబట్టి అక్కడక్కడే తిరుగాడేది
   ఎవరి కోసమో అని అడగకు. ఎక్కడిదో ఒక నీటి స్మృతీ, మట్టి వాసనా, చుక్కల కింద
   స్థబ్ధుగా నిలబడిన చెట్లూ, చెట్ల కొమ్మల్లోని నిశ్శబ్ధం, మరి

నిశ్శభ్ధాన్ని చెల్లాచెదురు చేసి
   కొమ్మల్లోంచి ఆకస్మికంగా ఎగిరిపోయే ఒక పక్షీ గుర్తుకు తెచ్చేది
   ఎవరినీ అని కూడా అడగకు. సృజనా ఊరకే చదువు-

నిశ్చలమైన సరస్సులో బిందువొకటి రాలి
   వలయాలు వలయాలుగా విస్తరించుకున్న ప్రకంపనల్లో, ఎవరో తమ ప్రతిబింబాన్ని
   క్షణకాలం చూసుకుని, చిన్నగా వేలితో తాకి వెళ్ళిపోయిన సవ్వడి-
   కనుల కింది ఏర్పడ్డ రాత్రి వలయాల్లో ఎవరో కదిలిన సవ్వడి

ఇష్టమైన ముఖాన్ని ఆఖరిసారిగా చూసుకుని
   అరచేతులతో సమాధిలోకి మట్టి వొంపిన సవ్వడి. రెక్కలు విరిగిన సవ్వడి. సన్నగా
   కోసుకుపోతున్న సవ్వడి. లీలగా, ఎవరో ఏడుస్తున్న సవ్వడి. లోపలంతా
   ఇక - మిగలబోయే - బావురుమనే ఒక ఖాళీ సవ్వడి
నువ్వు అనే సవ్వడి

సృజనా - అవును.

నిజంగా ఇక్కడ ఏమీ లేదు. బ్రతికి ఉండగానే మనుషులని నింపాదిగా కొరుక్కుతినే
నీలాంటి చీకటి తప్ప –

                     - srikanth

నీ గది

 srikanth

 

 

 

 

 

తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు –

నీకు నచ్చిన

అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా

నిన్ను చుట్టుకునే

 

సన్నటి, పొగల అల్లికలు.

అవి, నా చేతివేళ్ళు  అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:

అప్పుడు

 

చిరుగాలికి, చిన్నగా కదిలాయి

కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న

కాగితాలూ

 

పచ్చిక వలే

నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. “కొమ్మల్లోంచి

ఒక గూడు రాలిపోయింది

సరిగ్గా

 

ఇటువంటి

వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు – వాటి చుట్టూ

గిరికీలు కొట్టీ కొట్టీ

అలసిపోయాయి

 

రెక్కలు. తెలుసా నీకు?

అమ్మ ఏడ్చింది ఆ రోజే ” అని చెప్పాను నేను. “నాకు తెలుసు” అని అన్నావు

తిరిగి పొందికగా నీ గదిని

 

సర్దుకుంటూ నువ్వు:

t1

నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ

పింగాణీ పాత్రలూ

 

ఓ వెదురు వేణువూ

ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.

ఇక నేనూ పొందికగా

 

ఆ వస్తువుల మధ్య

సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు

ఎక్కడో అలలు

 

తెగిపడే వాసన –

nos6

తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే

తీరు. కళ్ళల్లో కొంత

ఇసుకా, ఉప్పనీరూ-

 

మరి, తళతళలాడి

ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన

ఆనాటి నీ గదిలో

 

ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?

 

– శ్రీకాంత్

ఇలా ఉందని మన అమ్మ, ఎలా చెప్పటం?

srikanth

ఆకాశం నుంచి ఈ నేల దాకా
ఒక లేత వాన పరదా జారితే
యిక ఎందుకో నాకు ఎప్పుడో
నా తల్లి కట్టుకున్న చుక్కల చీరా నేను తల దాచుకున్న తన మల్లెపూల
నీటి యెదా గుర్తుకు వచ్చింది.

పమిట చాటున దాగి తాగిన పాలు
తన బొజ్జని హత్తుకుని పడుకున్న
ఆ ఇంద్రజాలపు దినాలు
రాత్రి కాంతితో మెరిసే
దవన వాసన వేసే ఆ
చెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ
గుర్తుకువచ్చాయి ఎందుకో, ఇప్పటికీ చీకట్లో
అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ – ఎక్కడో –

నన్ను తలుచుకుంటో  ఏ
చింతచెట్ల నీడల కిందో
ఓ ఒంటరి గుమ్మం ముందో
కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు గాటుపై
ఓ చేయుంచుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ
ఇన్ని మెతుకులు కాలేని ఆకాశాన్నీ
కాస్త దగ్గరగా రాలేని దూరాన్నీ ఎలా
అ/గర్భంలోకి అదిమి పట్టుకోవాలని
ఒక్కతే కన్నీళ్ళతో అనేకమై యోచిస్తో

వాన కానీ భూమీ కానీ మొక్క కానీ పూవు కానీ గూడు కానీ దీపం కానీ

అన్నీ అయ్యి ఏమీ కాక, ఒట్టి ప్రతీకలలోనే
మిగిలిపోయి రాలిపోయే లేగ దూడ లాంటి

మన అమ్మ
యిలా ఉందని

ఎలా చెప్పడం?

Image by Tote Mutter, Egon Schiele, 1910, oil on panel [Public domain], via Wikimedia Commons