జాజిపూల తల్పం – ఎలనాగ శిల్పం

ఉత్తమ కవులంటూ వేరే ఉండరు. హితం కోరుతూ యోగుల్లా మన మధ్యే ఉంటారు. వాళ్ళ అరచేతుల దరువుల్లో రూపకాలు ఏరువాకలవుతాయి. ఐనా వెంటపడి ఎవరి మెప్పూ కోరుకోరు. వాళ్ళను తృణీకరించిన పాపం గంగా స్నానం కూడా తీర్చలేదు.

నచ్చినవాళ్లకు పీఠం వేయడం, నచ్చనివాళ్లకు లేబుల్ వేసి దూరం చేయడం తెలుగువాళ్ళ తెంపరితనం. ఇది పత్రికలకూ వర్తిస్తుంది. ఎలనాగ మాటల్లో చెప్పాలంటే ‘అది మహా వృక్షాలకు నీరు పోసి లేత మొక్కలకు ఎడారి చవిచూపే ఆటవిక న్యాయం’

వృత్తి రీత్యా పిల్లల డాక్టరైన ఎలనాగ నుడికారం నాడి తెలిసిన మొనగాడు. వచనంలో ఆయన రాసిన కందాలు ఊరించే వాక్యబృందాలు.

Vagankuralu

‘కల్లాపి చల్లనెంచిన

ఇల్లాలికి పేడ లేక ఇబ్బందవగా

తెల్లారే లోపు తనకు

నల్లావును తెమ్మని తన నాధుని వేడెన్’

చమత్కారం ఒలికే ఈ తరహా పద్యాలు ఆయనే రాయగలరు.

పాల మీగడ తరగలు ఆయన ‘వాగంకురాలు.’ అవి కవిత్వానికి శాస్త్రీయతను అద్దుతాయ్.

‘ఊటలు ఊటలై వలపు

టూహలు పాటల రూపమెత్తి నీ

మాటలలోన తేనియలు

మాటికి మాటికి జాలువారగా

కాటిని పూలబాట వలె

కాంచన దీప్త మయంబు జేసి మా

బీటలు వారినట్టి ఎద

బీడుల సేదను తీర్చుమా కవీ’

అని ఆయన మాత్రమే చెప్పగలరు.

 

మౌనమైత్రి పేరుతో టాగూర్ కవితకు ఎలనాగ చేసిన అనువాదం దాని బెంగాలీ స్వచ్ఛతను మూలాలతో పెకిలించి తెచ్చినట్టుంటుంది.

‘నన్ను గిల్లితే వెన్నెల బొట్లుబొట్లుగా కారుతుంది

సన్నగిల్లని ఏకధారగా ఎల్లప్పుడూ పారుతుంది’

 

అని చెప్పుకున్న ఎలనాగ మధురోహల రుచుల్ని మాటల్లోకి తెంచి తెచ్చిన ఋషి.  అంతే కాదు, సంగీతం రుచి తెలిసిన మనిషి.

 

‘గాజుపలక మీద

గాత్రపు పాదరసం దొర్లినట్టు’

అంటూ జేసుదాసు గాత్రం అద్భుతంగా ఆయన పంక్తుల తంతుల మీద గమకాలు పలుకుతుంది.

 

ఎలనాగ నాడుల్లో కళాపిపాస ఇమిడినవాడు. జాజుల డోలల్లా ఊగే విదుషీ స్వరాలు విని ఊరుకోడు. ఉబికిన చలనాన్ని వచనంలా చెక్కుతాడు. కవితల దువ్వెనతో పూలజడ లల్లుతాడు.

 

ఆకురాయి వంటి ఆయన అనల్ప శిల్పానికి నా జేజేలు….!

 

                                                                    -శేషభట్టర్   రఘు

 

                (2009లో ఎలనాగ వెలువరించిన మొదటి కవితా సంపుటి ‘వాగంకురాలు’    మీద సమీక్ష ఇది)

***