రొట్టె లాంటి మనిషి

vazida

Art: Wazda Khan

రొట్టె అతణ్ణి కలవర పరుస్తుంది
రొట్టె అతణ్ణి కలవళ పెడ్తుంది
తను ఎరిగిన రొట్టే
తనకు చిర పరిచితమైన రొట్టే
ఎందుకో ఈ రోజు తనని తాను
కొత్తగా పరిచయం చేసుకుంటోంది.
మిత్ర సమూహం మధ్య కూచొని
సంభాషిస్తుంటాడా
మేఘాల్లో తేలియాడుతూ
చందమామ వచ్చినట్టు
రొట్టె అతని ఊహల్లో విహరిస్తుంటుంది.
క్రిక్కిరిసిన
జనసముహాన్నివుద్దేశించి
ఉద్వేగంతో
మహోద్రేకంతో
అతను ఉపన్యసిస్తుంటాడా
ఎదురుగా కూచున్న వారి మొహాల్లో
లీలగా రొట్టె కనబడుతూవుంటుంది.
కమ్ముకొస్తున్న కవిత్వం లాంటి
ఉదయపు పొగమంచులో
చూపుడు వేలితో
గాలిలో సున్నాలు చుడుతూ
నడుచుకుంటూ వెళ్తుంటాడా
వెనక దూరంనుండి
తెలిసిన మిత్రుడెవరో
పేరుపెట్టి పిలిచినట్టు
రొట్టె అతణ్ణి పిలుస్తుంది.
పగలు సూర్యబింబం
రాత్రి చంద్రబింబం
చివరికి కాళ్లకింది బల్లపరుపు భూమీ
ప్రతీదీ అతనికి రొట్టె కిందే తోస్తుంది.
అంతెందుకు
కవిత్వం రాద్దామని
కాగితాన్ని ముట్టుకున్నా రొట్టైకూచుంటుంది.
బయటి ప్రపంచపు
సమస్త లౌకిక పనులూ పూర్తిచేసుకుని
దండెం మీది తువ్వాలును దులిపినట్టు
ఒకసారి తనను తాను దులుపుకుని
దేహమాళిగనుండి
మనోవల్మీకంలోకి దారిచేసుకుంటూ
ఇంటి ముఖం పడతాడు.
ద్వారబంధాల్ని
రెండు చేతులుగా చేసుకుని
పైకెత్తి ఎత్తుకోమంటున్న మనవడూ
పూర్తిచెయ్యని అబ్ స్ట్రాక్ట్ తైలవర్ణ చిత్రంలా
ఇంతకీ అర్ధం అయీ అవ్వని జవ్వనపు కొడుకూ
కాళ్లు కడుపులో దాచుకుని
ముడుచుకు పడుకున్న
పెంపుడు కుక్కలాంటి అలిగిన కోడలూ
మంచంలో కూచుని
అసహనంగా అటూ ఇటూ కదులుతూ
ఇన్సులిన్ ఎదురుచూపుల భార్యా
అందరూ అతని వెనకే
అడుగుల సవ్వడి వినబడనంత
మెత్తగా నడుస్తుంటారు.
అలా ఇంట్లోకి
అడుగు పెట్టాడో లేదో
కామరూప విద్య ఏదో తెలిసినవాడిలా
అతను
మనిషినుండి రొట్టెగా
రూపు మార్చుకుంటాడు.
మూడు వేళ్లకే
మృదువుగా చిదుముపడే
రొట్టెలాంటి అతణ్ణి
ఇంటిల్లిపాదీ
తలాఒక తుంపు తుంచుకుంటారు.
*