వీలునామా

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  జేన్ కొత్త బాధ్యతలు       

అనుకున్నట్టే ఆ తరవాత కొద్దిరోజులకే బ్రాండన్ పెగ్గీ ఇంటికొచ్చి జేన్ కి ఫిలిప్స్ ఇంట్లో ఉద్యోగం ఖాయమయినట్టే చెప్పాడు. మరో రెండు రోజుల్లో ఫిలిప్స్ స్వయంగా ఎడిన్ బరో వచ్చి జేన్ ని కలిసి అంతా ఖాయం చేద్దామనుకుంటున్నారట.

మరో రెండు రోజులకి ఫిలిప్స్ పెగ్గీ ఇంటికొచ్చాడు. అయితే తన కూడా పిల్లలు ఎమిలీ, హేరియట్ ని తీసుకు రాలేదు. ఇద్దరూ జలుబుతో పడకేసారన్నాడు. పిల్లల్ని చూడాలని ఎంతో ఆశపడ్డ పెగ్గీ నిరాశ చెందింది.

జేన్, ఎల్సీ ఇద్దరూ ఫిలిప్స్ ప్రవర్తనా, మర్యాదా, మన్ననా చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, పెగ్గీ ఆయన ఇంట్లో పనిమనిషి! అయినా పెగ్గీతో, పెగ్గీ ఇంట్లో పిల్లలతో, తాతగారు లౌరీ తో ఫిలిప్స్ చాలా మర్యాదగా మాట్లాడాడు.

ఫిలిప్స్ ఇద్దరు అక్క చెల్లెళ్ళతో మాట్లాడి తన ఇంటికి జేన్ లాటి మనిషి అవసరం వుందని అనుకున్నాడు. తన ఇంటి వ్యవహారాలు చూస్తూ, పిల్లలకి చదువులు చెప్తే ఏడాదికి డెభ్భై పౌండ్లు జీతం కింద ఇస్తానని చెప్పాడు. అయితే జేన్ రెండే రోజుల్లో బయల్దేరవలసి వుంటుంది.

“మేము ఈ ఎండాకాలం ఇటువైపే వస్తున్నాము కాబట్టి మీరూ ఎడిన్ బరో వచ్చి మీ చెల్లాయిని కలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మీరు వెంటనే నాతో బయల్దేరాల్సి వుంటుంది.” అన్నాడు ఫిలిప్స్.

“అలాగే బయల్దేరతాను. ఎల్సీ కి వీడ్కోలు చెప్పడం తప్ప ఇక్కడ నాకు మాత్రం పెద్ద పనేముందని?” అంది జేన్.

“అయ్యా! ఇంతకీ పిల్లలెలా వున్నారు?  నేను ఆస్ట్రేలియా వదిలేటప్పటికి ఎమిలీకి నాలుగున్నరేళ్ళు. ఇప్పుడు బాగా పొడుగయిందా?” కుతూహలంగా అడిగింది పెగ్గీ. “ఈ ఎండాకాలం ఇక్కడికే వస్తున్నామని చెప్పా కదా? అప్పుడు చూద్దువుగాని. ఎల్సీ నిన్నయితే గుర్తు పడుతుంది, నువ్వు దాన్ని గుర్తు పడతావో లేదో కాని! నీకు గుర్తుందా పెగ్గీ? ఒకసారిఎవరో ఆర్టిస్టుతో నీ బొమ్మ గీయించా. అదింకా వుంది ఎల్సీ దగ్గర!”

“అవునా? అయినా మీరు పిల్లల్ని గారాబం చేసి పాడు చేస్తారు సారూ! హేరియట్ తరవాత పుట్టిన పిల్లల పేర్లేమిటి?”

“కాన్స్టాన్స్, హ్యూబర్ట్, ఈవా.”

“ఆహా! అమ్మగారికి ఇంగ్లండు నచ్చిందా?”

“చాలా! ఇక్కడి నించి ఆస్ట్రేలియా రాననే అంటోంది. నాక్కూడా ఆవిడ పిల్లల్ని పట్టుకుని ఇక్కడ వుండడమే మంచిదనిపిస్తోంది. నేను వెళ్తూ వస్తూ వుంటాననుకో.”

“అవునండీ! ఇక్కడైతే స్నేహితులూ కుటుంబమూ వుంటాయి. అందుకే ఆవిడకి ఇక్కడ నచ్చి వుండొచ్చు. మిగతా అంతా ఎలా వున్నారు? బెన్నెట్, మార్తా బాగున్నారా? మార్తా టక్ ని పెళ్ళాడిందేమో కదా?”

“అవును పెగ్గీ! ఇద్దరూ అక్కడే వున్నారు. బెన్నెట్ ఎంత పని మంతురాలో ఎంత మంచిదో నీకు తెలుసు కదా? ఆవిడ మొగుడేమో తాగుబోతు, సోమరి. అదే తెలివి తక్కువ మార్తాని అందర్లోకీ కష్టపడి పనిచేసే టక్ కట్టుకున్నాడు. కొన్నిసార్లు ఇలాటి అవక తవక పెళ్ళిళ్ళని చూస్తే విచిత్రంగా వుంటుంది.”

ఫిలిప్స్ వెళ్ళిపోయింతర్వాత పెగ్గీ అమ్మాయిలతో,

“మగవాళ్ళకి తమ పెళ్ళి తప్ప అందరి పెళ్ళిళ్ళూ అవక తవకగానే అనిపిస్తాయనుకుంటా! నాకైతే అసలు ఫిలిప్స్ గారి పెళ్ళే అన్నిటికన్నా అవకతవక పెళ్ళి అనిపిస్తుంది. జేన్, నువ్వు శ్రీమతి ఫిలిప్స్ గారితో కచ్చితంగా వుండలి సుమా! ఆయనేమో మహా మెతక మనిషి,” అంది.

***

veelunama11

ఫిలిప్స్ దగ్గర అక్కకి ఉద్యోగం ఖరారు కాగానే ఎల్సీ శ్రీమతి డూన్ దగ్గర కుట్టు పనిలో చేరడానికెళ్ళింది. జేన్ కి దొరికీ ఉద్యోగం సంగతి విని డూన్ ఎంతో సంతోషించింది.

రెన్నీ కుటుంబం జేన్ వెళ్ళే ముందు ఆమెకోసం చిన్న విందు కూడ ఏర్పాటు చేసారు. ఎలీజా రెన్నీ అయితే అక్క చెల్లెళ్ళిద్దరినీ తాను బ్రాండన్ కి పరిచయం చేయడం వల్లనే ఇదంతా జరిగిందని ఎంతో సంతోషించింది. వాళ్ళ ఇంట్లో విందుకు బ్రాండన్, ఫ్రాన్సిస్, లారా విల్సన్ అందరూ వచ్చారు. ఫ్రాన్సిస్ మొహం వేలాడేసుకుని కూర్చున్నా, బ్రాండన్ తన జోకులతో అందరినీ నవ్వించాడు.

రెండు రోజుల అనంతరం జేన్ తో పాటు ఫిలిప్స్ మాత్రమే కాకుండా బ్రాండన్ కూడా వున్నాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. జేన్ మాత్రం తన ఆలోచనల్లో తనుండిపోయింది.

***

ప్రయాణం ముగిసి ఇల్లు చేరిన జేన్ శ్రీమతి ఫిలిప్స్ ని చూడగానే ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. తన  జన్మలో అంత అందగత్తెని చూసి వుండలేదు మరి. అయితే ఆమె నోరెత్తి మాట్లాడగానే ఆ పారవశ్యం కొంచెం భంగమైన మాటా నిజమే. ఏ మాత్రం విద్యాగంధమూ, సంస్కారమూ, నాజూకూ లేని మొరటు తెలివితక్కువ మాటలతో ఆమె మౌనంగా వుంటే బాగుండనిపిస్తుంది పక్కవారికి.

కానీ, ఆమె అందం మాత్రం వర్ణనాతీతం. పొడవుగా, మంచి అంగ సౌష్ఠవం తో పాటు, పాల మీగడలాటి రంగూ, అద్దాల్లాటి చెక్కిళ్ళూ, బాదం కాయల్లాటి మట్టి రంగు కళ్ళూ, ఎర్రటి పెదిమలూ, తరంగాల్లా భుజాల చుట్టూ పరుచుకున్న మెత్తటి ఒత్తైన జుట్టూ, ఆమె వైపు ఎంతసేపైనా చూస్తూ వుండిపోవచ్చు.ఆమెని చూడగానే ఆమెని ఫిలిప్స్ ఎందుకు అంతగా ఇష్టపడి చేసుకున్నాడో అర్థమయిపోతుంది. అంత అందగత్తెనని ఆమెకూ తెలిసే వుండాలి. దాంతో సహజంగా ఆత్మ విశ్వాసమూ, ఇతర్లు తన మాట జవదాటరన్న నమ్మకమూ వుండే వుంటాయి. ఈవిడ కింద పని చేయగలుగుతానా, అని భయపడింది జేన్.

ఆమె పెగ్గీ వర్ణించినదానికంటే బాగున్నట్టనిపించింది జేన్ కి. పెగ్గీ వర్ణించింది పదహారేళ్ళ పసి మొగ్గని. ఇప్పుడు తన ముందున్నది ఇరవై యేడేళ్ళ పరిపక్వమైన స్త్రీత్వం. అయిదుగురు పిల్లల తల్లిలా అనిపించనేలేదామె. ఎమిలీకి తల్లి పోలికా,తల్లి అందమూ రాలేదు. అయితే మహా చురుకు. హేరియట్ కొంచెం ముద్దుగానే వున్నా, తల్లి అందం ముందు దిగదుడుపే.

వాళ్ళు ఇల్లు చేరగానే ఎమిలీ తండ్రిని చుట్టుకుపోయింది. హేరియట్ ఆయన వళ్ళోకెక్కి కూర్చుంది. కాన్స్టాన్స్ ఆయన గడ్డాన్ని పీకడం మొదలు పెట్టాడు. మొత్తానికి అందరికీ తండ్రి దగ్గర చాలా చేరిక లాగుంది.

“అబ్బ! నువ్వొస్తున్నావని ఫిలిప్స్ చెప్పగానే ఎగిరిగంతేసా జేన్! ఈ పిల్లల పనీ, ఇంటిపనీ తెగక చస్తున్నాను. అయినా ఇంగ్లండు వచ్చేది ఏదో కాలక్షేపానికో సరదాకో అనుకున్నా కానీ ఈ గొడ్డు చాకిరీ వుంటుందని నాకేం తెలుసు! ఇదిగో పిల్లలూ! కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. లేకపోతే మీ పంతులమ్మ వెళ్ళిపోతుంది.”

“నేను నా ఇష్టమొచ్చినట్టుంటా, నాన్న దగ్గరున్నట్టే!” ఎమిలీ తండ్రి మొహం మీద ముద్దులు కురిపిస్తూ అంది.

“ఎమిలీకి అసలు కుదురే వుండదు. అసలు దానికి బుధ్ధి చెప్పేవాళ్ళే దొరకలేదు ఆస్ట్రేలియాలో, ఇక్కడ ఇహ మీ శిక్షణలో కొంచెం బాగు పడుతుందేమో!” బ్రాండన్ అన్నాడు.

ఎమిలీ తండ్రినొదిలి బ్రాండన్ మీదకి ఉరికింది.

“బాగు పడటమా? అంటే మీ ఏష్ ఫీల్డ్ ఇంట్లో పిల్లలు ఉంటారే, వాళ్ళలాగానా? వద్దు బాబూ, వద్దు! వాళ్ళంత మొద్దు మొహాలెక్కడా వుండరు. వాళ్ళకి మట్టి పిసికి బొమ్మలు చెయ్యడమూ రాదు, చెట్లెక్కడమూ రాదు, గోడలేక్కడమూ రాదు. ఆ రోజు ఆ తోటలో నేనూ హేరియట్ ఎంత హాయిగా పరుగులు తీస్తూ ఆడుకున్నామో! వాళ్ళకేమో అసలు పరిగెత్తడమంటేనే భయం!” అల్లరిగా అంది ఎమిలీ.

“మరి వాళ్ళలాగా నీకు చదువొచ్చా? అయినా ఫిలిప్స్! ఇక నేను వీళ్ళని ఏష్ ఫీల్డ్ తీసికెళ్ళను. తోటంతా పరుగులు పెడుతూ మన పరువు తీస్తారు.”

“తీసికెళ్ళకపోయినా ఏం ఫర్వాలేదు. అసలక్కడ మాకెంత బోరు కొట్టిందో! హేరియట్ కి అక్కడ నచ్చిందేమో నాకు తెలియదు మరి!”

“నాకు పుస్తకాలంటే అసహ్యం!” వున్నట్టుండి అంది హేరియట్.

“బొమ్మల పుస్తకాలో, కథల పుస్తకాలో అయితే తప్ప!”

“జేన్! పిల్లల మాటలు పట్టించుకోకండి,” ఫిలిప్స్ సంజాయిషీగా అన్నాడు.

“అయ్యో! మరేం ఫర్వాలేదండీ. కొన్నాళ్ళకి వాళ్ళకి చదువూ, పుస్తకాల మీద ఇష్టం కలిగించడానికే ప్రయత్నిస్తాను.”

“లిల్లీ! పెగ్గీ అక్కయ్య పిల్లలు ఏం చదువుతారనుకున్నావు? అంతా జేన్ చలవే! పెగ్గీ వాళ్ళకోసం ఎంతెంత డబ్బు కర్చు పెడుతోందో!”

“పెగ్గీ కెలాగైనా మధ్య తరగతిలోకెళ్ళిపోవాలన్న ఆశ. మరీ ఆకాశానికి నిచ్చెనలు వేయడం అంత మంచిది కాదేమో!”

“ఆ పిల్లల తెలివితేటలూ కష్టమూ చూస్తే నువ్వీ మాట అనవు. ఏదో ఒక రోజు నేను టాం లౌరీ ఎదుట టోపీ చేతిలో పట్టుకుని నిలబడ్డా ఆశ్చర్యం లేదు!”

“పో స్టాన్లీ! నీవన్నీ పిచ్చి మాటలు” లిల్లీ అతన్ని వేళాకోళం చేసింది. ఫిలిప్స్ దంపతుల పేర్లు లిల్లీ,  స్టాన్లీ అని అప్పుడే తెలిసింది జేన్ కి.

“మాటలు కాదు. టాం నిజంగానే ఒక పెద్ద ఇంజినీరయ్యాడనుకో, ఏ రైల్వే లైనో వేయించడానికి ఆస్ట్రేలియా వచ్చాడనుకో, అప్పుడు నేను చెప్పినట్టేగా అయేది. అదంతా ఎందుగ్గానీ, నాకు ఆ పిల్లలనీ, వాళ్ళ చదువులనీ చూస్తే ముచ్చటగా అనిపించినమాట నిజం. దానికంతటికీ కారణం జేన్ వాళ్ళకిచ్చిన శిక్షణ అని చెప్పింది పెగ్గీ!”

“ఓ! అందుకన్నమాట నువు జేన్ ని ఇక్కడకి తీసుకొచ్చింది,” నవ్వాడు బ్రాండన్.

“నాకూ పెగీ పిల్లలు నచ్చినా, మరీ నీ అంత కాదు. ఎమిలీ, నిన్ను జేన్ మెల్విల్ ఆ పెగ్గీ పిల్లల్లా తయారు చేయాలన్నదే మీ నాన్న ఆస. వాళ్ళలా నీకూ చదువు మీదా, విద్య మీదా ఆసక్తి పెరిగిపోతుంది ఇక!” ఎమిలీని వేళాకోళం చేసాడు బ్రాండన్.

“మీకు చిన్నప్పట్నించీ చదువుకోవడం అంటే ఇష్టంగా వుండేదా?” కుతూహలంగా జేన్ ని అడిగింది ఎమిలీ.

“అవును ఎమిలీ!” నవ్వుతూ జవాబిచ్చింది జేన్.

“మా అమ్మ కూడా అదే మాట అంటుంది, కాని ఆవిడ అసలు స్కూల్ కెళ్ళిందే లేదు. మరీ ఇంతింత కాకపోయినా, కొంచెం చదువు బానే వుంటుందేమో!”

లిల్లీ ఫిలిప్స్ కి జేన్ చాలా నచ్చింది. ఆమె చదువు ఎక్కువై వుండొచ్చు కానీ, రూపు రేఖలు చాలా సామాన్యం గా వున్నాయి. దాంతో ఒకలాటి జాలి కలిగిందామెకు జేన్ పట్ల. దానికి తోడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని విన్నది.

అందులో ఆమెకి ఇంటి పనులు చేసుకోవడం, డబ్బు లెక్కలు చూసుకోవడం కొంచెం కూడా చేత కాదు. ఎంతో ఓపికస్తుడూ, పెళ్ళాన్ని విపరీతంగా ప్రేమించేవాడూ అయిన ఫిలిప్స్ కూడా భార్య దుబారా ఖర్చు చూసి కొంచెం విసుక్కున్నాడు. ఇప్పుడిక ఆయనే వెతికి ఇంటి పనికీ డబ్బు లెక్కలకీ ఒక మనిషిని పెట్టాడు కాబట్టి తాను ఆ బాధ్యతలన్నీ పట్టించుకోనక్కరలేదు. అందువల్ల జేన్ తో వీలైనంత మంచిగా ప్రవర్తించాలని నిశ్చయించుకుంది.

రాత్రి పది కొట్టగానే లిల్లీ ఫిలిప్స్ నిద్రొస్తూందని వెళ్ళి పడుకున్నది. వెళ్ళేముందు భర్తతో జేన్ కి అప్పజెప్పవల్సిన బాధ్యతలు గుర్తు చేసి మరీ వెళ్ళిందావిడ.

రాత్రి పొద్దుపోయేంతవరకూ ఫిలిప్స్ జేన్ కి శ్రధ్ధగా ఇంటి వ్యవహారాలూ, జమా ఖర్చులూ అన్నీ బోధపర్చాడు. ఇంటి తాళాలూ, లెక్క పుస్తకాలూ, అన్నీ జేన్ కి అప్పగించాడు.

“జేన్!నువ్వు ఇంట్లో ఒక ఉద్యోగిలాకంటే, ఇంటి మనిషిగా వుంటే ఎక్కువ సంతోషిస్తాను. నీకు లిల్లీ గురించి మొత్తం తెలియదు. ఆమె వయసులో పెద్దదైనా ఆ పిల్లల కంటే పసిది. నీకు వీలైతే నువ్వు ఆమెకీ కొంచెం చదువూ సంస్కారం నేర్పితే నీకెంతో ఋణపడివుంటాను!” ఇబ్బందితో ఆయన మొహం ఎర్రబడింది.

ఆలాగేనని ఆయనకి మాటిచ్చినా, తనకంటే వయసులో పెద్దదీ, మహా రాణులకుండే అందచందాలున్నదీ, ఇంటి యజమానురాలూ అయిన లిలీని చదువు వైపు మళ్ళించడం సాధ్యమేనా అన్న ఆలోచనతో నిద్ర పట్టలేదు జేన్ కి. తన మాట పిల్లలు వింటారో వినరో నని జేన్ బెంగ పడింది. కానీ, ఊరంతా ముద్దూ, గారాబమూ చేయడం అలవాటైన ఫిలిప్స్ పిల్లలకి జేన్ క్రమశిక్షణ నిజానికి బాగనిపించింది. మౌనంగా, తక్కువ మాట్లాడుతూ హుందాగా వుండే తమ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం వాళ్ళకి కొత్తగా, హాయిగా అనిపించింది.

ముందుగా జేన్ వాళ్ళ పాఠ్యాంశాలన్నీ వాళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగు మార్చేసింది. అది వాళ్ళకి అన్నిటికన్నా యెక్కువగా నచ్చింది. ఏ సంగతినైనా సరళంగా ఓపిగ్గా బీధించే ఆమె పధ్ధతీ, దానికన్నా అసలామెకున్న విషయ పరిఙ్ఞానమూ వాళ్ళకి చాలా అబ్బురంగా అనిపించింది.  భూగోళశాస్త్రమూ, చరిత్రా లాటి మహా విసుగు పుట్టే అంశాలని కూడా ఆమె చాలా ఆసక్తికరంగా మార్చింది.      తండ్రి దగ్గర ఎమిలీ, హేరియట్ ఇదివరకే చక్కవగా చదవనూ, రాయనూ నేర్చుకున్నారు. వాళ్ళకి రానిదల్లా, లెక్కలూ, చరిత్రా లాటి విషయాలు. స్వతహాగా చురుకైన పిల్లలు కాబట్టి వాళ్ళు జేన్ పధ్ధతులకి వెంటనే అలవాటు పడిపోయారు.

లిల్లీ కి జేన్ మొత్తంగా నచ్చినా, ఆమె స్కాట్ లాండు యాస కొంచెం కూడా నచ్చలేదు. పిల్లలూ అదే యాసతో మాట్లాడతారేమోనని భయపడింది కూడా.

లిల్లీ కి ప్రస్తుతం వున్న సమస్య- తన అత్తవారింటికి వెళ్ళడం. అక్కడ ఆస్ట్రేలియాలో ఆమె నిరక్షరాస్యతనూ, మొరటుతనాన్నీ ఎవరూ పట్టించుకోలేరు. కానీ, ఇక్కడ స్టాన్లీ చెల్లెళ్ళూ, బంధువులూ అంతా చాలా చదువుకున్న వాళ్ళు. మహా నాజూకు మనుషులు. క్రితం సారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తననీ, తన పిల్లల్నీ ఎలా పల్లెటూరు బైతుల్లా చూసారో లిలీ కింకా గుర్తే. జేన్ ని  చుస్తూనే తనూ ఆమెలా చిన్న గొంతుతో మాట్లాడడం, నాజూగ్గా  ప్రవర్తించడం నేర్చుకోవాలనుకుంది. ఇప్పుడు పిల్లల ఆలనా పాలనా అంతా జేన్ చూస్తుండడంతో ఆమెకి తీరిక కూడా చిక్కింది.

ఆమెకి పాపం, చదవడం కానీ, కుట్టు పని కానీ, సంగీతం కానీ, ఏదీ రాదు. ఆవిడకి వచ్చిందల్లా, అలా సోఫాలో కూర్చొని పగటి కలలు కనడం. ఆవిడ అలౌకిక సౌందర్యం వల్ల, ఆమె అలా కూర్చొని ఆలోచిస్తూన్నప్పుడు ఆమె ఏదో అద్భుతమైన తత్త్వ చింతన చేస్తూందేమోనని పిస్తుంది కానీ, ప్రాపంచిక విషయాలు ఆలోచించే మామూలు స్త్రీలా అనిపించనే అనిపించదు.

ఒకానొక మధ్యాహ్నం అలాటి అలౌకిక స్థితిలోనే ఆమె విద్యాభ్యాసం గురించి జేన్ దగ్గర ప్రస్తావించింది. జేన్ చదువూ, ఇతర వ్యాపకాల గురించీ వినగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి, నోరు తెరుచుకుంది. ఆడపిల్ల మగపిల్లల్లా లెక్కలూ, సైన్సూ చదవడమా? అంతవరకూ ఆమె అమ్మాయిల చదువంటే ఏదో సంసార పక్షంగా కుట్లూ అల్లికలూ, కాలక్షేపం పుస్తకాలూ కవితలూ, పది ముందు గొప్పగా చెప్పుకోవడానికి కాస్త సంగీతమూ  అంతే అనుకుంది. కానీ చదువంటే కఠోర పరిశ్రమ అనీ, దాంతో మనసుకీ, మెదడుకీ రెక్కలు మొలిపించుకోవచ్చనీ ఊహించనే లేదు. అసలు చదువు పూర్తయింతర్వాత కూడా జేన్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం ఆమెకి కొరుకుడు పడని విషయం.

తనకి పదహారేళ్ళకే పెళ్ళయిపోవడం తలచుకొని నిట్టూర్చింది లిల్లీ. అంతకుముందు కూడా ఒకటే ఊర్లు మారడంతో ఆమె ఎక్కడా కుదురుగా బడికి వెళ్ళిందే లేదు. ఆస్ట్రేలియాలో వాళ్ళున్న కొన్ని ప్రాంతాల్లో అసలు ఆడపిల్లలకి బళ్ళే లేవు! ఆ మాటకొస్తే ఇప్పుడూ అంతే. అసలు పిల్లల చదువులు అక్కడుంటే పాడవుతాయనే కదా స్టాన్లీ కుటుంబాన్ని ఇంగ్లండు తీసుకొచ్చింది. ఇప్పుడు లిల్లీకి జేన్ చదువు చెప్తే బాగుండనిపించడం మొదలయింది. కానీ జేన్ ఏమంటుందో! నవ్వుతుందేమో, “ఈ వయసులో చదువుకుని ఏం చేస్తారండీ” అని ఎగతాళి చేస్తుందేమో!

జేన్ ఆ అభిప్రాయాన్ని వినగానే ఎగతాళి చేయలేదు సరికదా, ఎంతో ప్రోత్సహించింది. అయితే ఏ విషయం చదవాలన్న విషయం మీద ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేకపోయారు.  తనకి పూలు తయారు చేయడమూ, పియానో వాయించడమూ ఇష్టమని చెప్పింది జేన్ తో.

“హ్మ్మ్మ్మ్… దురదృష్టవశాత్తూ అవి రెండూ నాకంతగా రావండి. ఒక పని చేద్దాం. అవి నేర్పించడానికి ఎవరీనా టీచర్లు దొరుకుతారేమో చూద్దాం. అంతవరకూ నేను మామూలు చదువు చెప్తాను. అయితే సంగీతం నేర్చుకోవాలంటే కొంచెం కష్టంపడాల్సి వుంటుందేమో!” అన్నది జేన్.

“ఎందుకూ? ఎమిలీ, హేరియట్ ఏమంత కష్టపడుతున్నారు? కనీసం గంటసేపుకూడా సాధన చేయరు! అన్నట్టు నువ్వుకూడా గంటసేపు సాధన చాలన్నావట?”

“అవును, నేను మూడు గంటలు పియానో దగ్గరఊరికే కూర్చునేకంటే, గంట సేపు శ్రధ్ధగా సాధన చేసి తర్వాత ఆడుకొమ్మన్నాను. ఆ వయసులో అంతకంటే ఎక్కువ అవసరమూ లేదూ, వాళ్ళు చేయనూ లేరు. అదే మనలాటి వాళ్ళం ఎక్కువ సమయమూ శక్తీ వెచ్చించాల్సి వుంటుంది,” వివరించింది జేన్.

“అవునవును! అప్పణ్ణించి పిల్లలు రోజూ సాధన చేస్తున్నారట. నాతో చెప్పారు. అయితే నీకొచ్చిందే నాకు నేర్పు. సంగీతం రాకుంటే అది వొదిలేద్దాం.”

***

(సశేషం)

 

 

వీలునామా – 16 వ భాగం

  

శారద

శారద

       

  (  కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

  ఫ్రాన్సిస్ వింత ధోరణి

 

 

ఫ్రాన్సిస్ ఆ రాత్రంతా నిద్ర పోకుండా ఆలోచించాడు. ఆలోచించిన కొద్దీ అతనికి జేన్ ని పెళ్ళాడమనే నిర్ణయం నచ్చసాగింది. తలచుకుంటున్నకొద్దీ ఆతనికి జేన్ తనవైపు చూసే చూపులో, నవ్వే నవ్వులో ఏదో అర్థం కాని ఆప్యాయతా, అభిమానమూ వున్నవనిపించింది. చెల్లెలు ఎల్సీకి కూడా నీడను కల్పిస్తానంటే ఆమె ఇంకెంతగానో సంతోషిస్తుంది. అయితే ఆమెని ప్రలోభ పెట్టడం తన ఉద్దేశ్యం కాదు. తన మనసులో ఆమె పట్ల వున్న ప్రేమని గుర్తించి అతన్ని వివాహమాడాలి. ఆమె ఆశలకీ, ఆశయాలకీ కుటుంబ జీవితం ఏ రకంగానూ అడ్డం రాదని ఆమెని ఒప్పించాలి! కుటుంబంలో వుంటూ కూడా పది మందికి పనికొచ్చే పనులు చేయొచ్చని ఆమెకి నమ్మకమిస్తే చాలు! తనూ తన వంతు సహకారాన్నెలాగూ ఇస్తాడు.

తానిప్పుడు ఒంటరి కాడు. ఆమెని ఒప్పించి, పెళ్ళాడి పట్నం వచ్చేస్తారు. ఏదో ఉద్యోగం చూసుకుంటాడు తాను.

ఇంతకు ముందూ ఉద్యోగం వుండేది కానీ, ఎంతో ఒంటరిగా అనిపించేది. ఇప్పుడల్లా కాదు. పని చేసి అలసిపోయి ఇంటికొచ్చేసరికి తనకొరకు ఎదురుచూసే భార్య. ఆ ఊహే ఎంతో సంతోషాన్నిచ్చింది ఫ్రాన్సిస్ కి.

నిజానికి తనలాటి భావుకుడికి ఆమెలాటితెలివైన యువతి నచ్చడం ఎంతో వింతగా వుంది. సాధారణంగా భావుకులకి నాజూకైన స్త్రీలు, ఎప్పుడూ పక్క వాళ్ళ మీద ఆధారపడే ముగ్ధలూ నచ్చుతారంటారు. తనకి మాత్రం ఆమే చాలా నచ్చింది. ఆమె మంచితనమూ, సున్నితమైన ఆలోచనా, వ్యవహార దక్షతా తనకెంతో ఊరట నిస్తాయి. తన మనసులోని ఏ భావాన్నైనా ఆమెతో నిర్భయంగా చెప్పుకోగలడు. జీవిత సహచరిలో ఇంతకంటే కావలసిన లక్షణమేముంటుంది? అలాటి మనిషి తోడుంటే జీవితంలో వచ్చే ఆటుపోట్లని వేటినైనా తేలిగ్గా ఎదుర్కోగలడు. తీయటి సంతోషాన్నిచ్చే ఆలోచనలతోటే తెల్లవారిందతనికి.

***

మర్నాడు అతను పెగ్గీ ఇల్లు చేరుకునేసరికి ఎల్సీ సంతోషంగా ఎదురొచ్చింది. జేన్ అతనితో ఉత్సాహంగా బ్రాండన్ తనకు ఫిలిప్ దగ్గర ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారని చెప్పింది. ఇద్దరు అక్క-చెల్లెళ్ళ మొహాలూ తేటపడి సంతోషంగా వున్నారు.

“కొద్ది రోజుల్లో ఫిలిప్ గారు చెప్పేస్తారట. నాకీ ఉద్యోగం వస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రాన్సిస్! అన్ని సమస్యలూ తీరిపోతాయి. పెగ్గీ అయితే ఫిలిప్ గారు తప్పకుండా పని ఇస్తారనే అంటూంది. నాకే కంగారుగా వుంది. నువ్వేమంటావు ఫ్రాన్సిస్? నీకు సంతోషంగా లేదూ?” జేన్ ఆగకుండా మాట్లాడుతూనే వుంది.

జేన్ ఉత్సాహమూ, సంతోషమూ చూసి ఫ్రాన్సిస్ నీరుకారిపోయాడు. అతని ఆలోచనలు సర్దుకునేలోపే, జేన్ అతను ఎస్టేటులో పాలేర్ల కోసం చిన్న ఇళ్ళూ కట్టించ దలచుకున్న సంగతి పెగ్గీతో చెప్పింది. ఫ్రాన్సిస్ తో నిమిత్తం లేకుండా అందరూ అతను గీసిన ప్లాన్ల బొమ్మలు చూడడంలో మునిగిపోయారు. పెగ్గీ, థామస్ లిద్దరూ శ్రధ్ధగా ఆ ఇళ్ళ ప్లానులు పరిశీలించి మార్పులు సూచించారు.

ఆ తర్వాత ఎస్టేటులో ఎవరెవరికి ఈ ఇళ్ళూ, చిన్న చిన్న స్థలాలూ ఇవ్వాలన్న చర్చ మొదలైంది. నిజానికి ఇదంతా ఫ్రాన్సిస్ కెంతో సంతోషాన్నివ్వాల్సిన మాట. అయితే ఎందుకో అతనికి చాలా దిగులుగా చిరాగ్గా అనిపించింది.

“ఇవ్వాళ నువ్వు చాలా ఉత్సాహంగా వున్నావు జేన్!” ఉండబట్టలేక అన్నాడు.

“అంతే కదా మరి! ఏడాదికి యాభై అరవై పౌండ్లు జీతం వచ్చే ఉద్యోగం అంటే మాటలనుకున్నావా? అందులోనూ పిల్లలకి చదువు చెప్పడం లాటి పనులంటే నాకెంతో ఇష్టం! ఫిలిప్ గారికి నేను నచ్చుతానో లేదో అన్న బెంగ తప్ప పని గురించి నాకెలాటి భయమూ లేదు. చూస్తూండు! ఈ ఉద్యోగమే దొరికితే కొన్నేళ్ళు పని చేసి డబ్బు దాచుకుని సొంతంగా వ్యాపారం మొదలు పెడతాను.”

“మరి ఎల్సీనొదిలి ఉండగలవా?”

“తప్పదు ఫ్రాన్సిస్! ఇతర్ల మీద ఆధారపడకుండా మా బ్రతుకులు మేం వెళ్ళదీసుకోవాలంటే కొన్ని కష్ట నష్టాలు ఓర్చుకోక తప్పదు.”

“జేన్! నేను నీదారికెప్పుడూ అడ్డు రాను! నీ మీద భారం మొత్తం చచ్చినా వేయను. పరిస్థితులతో సర్దుకు పోతాను.” ఎల్సీ అక్క మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది.

“నువ్వు నాకెప్పుడూ భారం కాదు ఎల్సీ. నీ కవితల పుస్తకం కూడా అచ్చవుతుంది. నీ సంపాదన నీకుంటుంది.”

“ఛీ! ఛీ! ఆ కవితల మాటెత్తకు!” చిరాగ్గా అంది ఎల్సీ.

“ఆగాగు! ఇవాళ అసలా కవితలు ఫ్రాన్సిస్ కి చూపిద్దామనుకున్నాం కదా?”

“వాటి మాటెద్దొన్నానా? అసలు జేన్ ఎన్ని రోజులనించి లండన్ చూడాలనుకుంది! ఇప్పటికి తన ఆశ నెరవేరింది!”

“అది సరే ఎల్సీ! నువ్వేం చేయదల్చుకున్నావు? ఇక్కడే పెగ్గీతోపాటే వుండి పోతావా?” ఫ్రాన్సిస్ అడిగాడు.

“పెగ్గీతోపాటే వుంటా కాని, అక్క చేయాలనుకున్న కుట్టు పని నేను చేస్తా! శ్రీమతి డన్ గారి దగ్గర కొంచెం కత్తిరింపులూ, డిజైనూ కూడా నేర్చుకుంటా. తర్వాత జేన్ చేయబోయే వ్యాపారంలో పనికొస్తుంది కదా?”

“ఎల్సీ! నిజంగా కవితలు రాయడం మొత్తానికే మానేసి కుట్టు పనిలోకెళ్తావా?” ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏం ఫ్రాన్సిస్? నువ్వు బాంకు లో పని చేసినన్నాళ్ళూ కవితలూ, పుస్తకాలూ వదిలెయ్యాలేదూ? ఇదీ అలాగే!”

“నిజం చెప్పాలంటే సాహిత్యం లాటి వ్యాపకాలతో జీవన భృతి ముడి పడి లేనప్పుడే మంచి సాహితం సృష్టించగలుగుతామేమో!” సాలోచనగా అంది జేన్.

“అంతే అంతే!” ఏదో దీర్ఘాలోచనలో వున్నట్టు పరధ్యానంగా అన్నాడు ఫ్రాన్సిస్. నిజానికి అతను ఎల్సీ గురించి కానీ ఆమె కవితల గురించి కానీ ఆలోచించే స్థితిలో లేడు. మనసంతా ఒకలాటి నిరాశ కమ్మేసిందతన్ని.

నిన్ననే తను పెళ్ళి ప్రస్తావన తెచ్చి వుంటే జేన్ ఆలోచించేదేమో! ఇప్పుడసలు ఒప్పుకోదు. అందులోనూ ఈ పెళ్ళితో తను ఆస్తిపాస్తులూ, ఎస్టేటూ ఒదిలేసుకోవాలి కాబట్టి అసలే ఒప్పుకోదు.

“ఆ డబ్బుతో ఎన్నెని పనులు చేయొచ్చు! పాలేర్ల ఇళ్ళ మాట మరిచిపోతావా?” అంటుందు.

ఫిలిప్ గారి ఇంట్లో ఆమెకి తప్పక తనకంటే మంచి వరుడు దొరుకుతాడు. జేన్ ఇంకొకరి భార్యగా మారటమన్న ఊహకే అతనికి ఒళ్ళు కంపరమెత్తింది.

కలలో కనిపించిన అందమైన లోకం చేయి జారిపోయినట్టనిపించింది అతనికి. చేజారిపోయిన వరం ఎప్పుడూ చాలా అందంగా, ఉన్నతంగా అనిపిస్తుంది.ఒక్కక్షణం ఫిలిప్ జేన్ కి ఉద్యోగం ఇవ్వకుంటే బాగుండన్న స్వార్థపుటాలోచన కూడా వచ్చింది. ఆ ఆలోచనని అక్కడే అదిమి పట్టాడు.

” పెద్దమ్మాయిగారు వెళ్ళిపోతారని చెప్పగానే పిల్లలందరూ గొల్లుమన్నారు! అయితే ఉత్తరాలు రాసుకోవచ్చని సంబరపడ్డారు కూడా అనుకోండి. ఇప్పుడు పోస్టు కార్డు ఒక పెన్నినే!” పెగ్గీ మాట్లాడుతోంది. ఈ లోకంలో కొచ్చి పడ్డాడు ఫ్రాన్సిస్.

“జేన్! నాకూ ఉత్తరాలు రాస్తావు కదూ? చిన్నదైనా పెద్దదైనా, అన్ని విషయాలూ రాయాల్సిందే! నీ మనసులో వచ్చే ప్రతీ భావమూ నాతో చెప్తావు కదూ?”

“తప్పక రాస్తాను ఫ్రాన్సిస్! నువ్వు మాత్రం నీ పని అనుకున్నట్టు జరగకపోతే నిరాశపడొద్దు ఫ్రాన్సిస్. పాలేర్లు నువ్వనుకున్నంత కష్టపడి ఉత్పత్తి పెంచలేకపోవచ్చు. నువ్వు వాళ్ళకొరకు ఎంత చేయబోతున్నావో అర్థం  చేసుకోలేకపోవచ్చు. అన్నిటినీ తట్టుకోవాలి!”

ఫ్రాన్సిస్ మౌనంగా కూర్చున్నాడు.

“ఇవాళెందుకో ముభావంగా వున్నావు ఫ్రాన్సిస్? ఎల్సీ! ఇవాళ నీ కవితల పుస్తకం చూపించొద్దులే. ఈ చిరాకులో చాలా తీవ్రంగా విమర్శిస్తాడేమో,” జేన్ నవ్వుతూ అంది.

“కాదు జేన్! ఇలాటి మూడ్ లోనే నా కవితలు ఇవ్వాలి. అప్పుడు నేను కవితల్లో చూపించే నిరాశా నిస్పృహలు అర్థమవుతాయి. ఇప్పుడే పుస్తకం తీసుకొస్తా. ”

ఎల్సీ వెళ్ళి దారంతో కట్టి వున్న కాగితాల బొత్తి తీసుకొచ్చింది.

కవితా పఠనంలో ఆనందం పాఠకుడి మానసిక స్థితిని బట్టి కూడా వుంటుంది. ఇవాళ తనున్న బాధలో ఫ్రాన్సిస్ కి ఎల్సీ కవితల్లో తన నిస్సహాయతే ప్రతిధ్వనించినట్టనిపించింది. చాలా చోట్ల కవితాత్మ చక్కగా వుందని మెచ్చుకున్నాడు కూడా. అక్కడక్కడా కొన్ని తప్పుల్ళేకపోలేదు. కానీ మొత్తం మీద ఎల్సీ కవిత్వం బానే అనిపించింది ఫ్రాన్సిస్ కి.

ఆ రోజు వాళ్ళు ముగ్గురూ ఒక పాటకచ్చేరీకెళ్ళారు. అతనికి ఎల్సీ అభిరుచి నచ్చింది. నిజానికి అతనికి ఎల్సీతో భావ సారూప్యం ఎక్కువ. అయినా అతనికి జేన్ మీదున్న గొప్ప అభిప్రాయమూ, అభిమాననూ ఎల్సీ పట్ల ఏర్పడటం లేదు. ఎందుచేతనో మరి!

 

ఎల్సీ తనకి మొదట్లో ఫ్రాన్సిస్ మీదున్న కోపమూ, అపనమ్మకమూ గుర్తొచ్చి నవ్వుకుంది. అంతలోనే ఆమె దృష్టిలో అప్పుడే అక్కడికొచ్చిన విలియం డాల్జెల్ పడ్డాడు.

చిరాకుతో ఆమె మొహం ముడుచుకుంది. అక్కని అతను మోసం చేసాడన్న కోపం ఆమె మనసులో ఇంకా అలానే వుంది. డాల్జెల్ రెన్నీ కుటుంబంతోనూ, లారా విల్సన్ తోనూ కలిసి వచ్చినట్టున్నాడు. అతనిలాటి స్వార్థపరుడికీ, ఫ్రాన్సిస్ లాటి మంచి మనిషికీ ఎంత తేడా, అనుకుంది ఎల్సీ.

విలియం డాల్జెల్ ని ఫ్రాన్సిస్ కూడా దూరం నించి చూసాడు. అన్నీ కలిసొస్తే జేన్ అతన్నే పెళ్ళాడేదన్న విషయమూ తెలుసతనికి. అతనికి ఆ సంగతి తలచుకోగానే గుండెల్లో ముల్లు దిగినట్టైంది.

 

***

(సశేషం)

 

 

29 న ప్రముఖ కథా రచయిత్రి శారద “ నీలాంబరి” కథల పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ కథా రచయిత్రి, అనువాదకురాలు శారద కథల పుస్తకం “ నీలాంబరి” ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 29 న ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో జరుగుతుంది. గత  ఏడెనిమిదేళ్ళుగా కథలు రాస్తున్న శారద ఇప్పటివరకు 40 కి పైగా కథలు రాసారు.  అనేక అనువాద రచనలు చేసారు. ప్రతి కథ లోనూ తనదైన ఒక  ప్రత్యేక కోణాన్ని ఆవిష్కరించగలిగిన మంచి రచయిత్రి శారద. ఆమె కొత్త కథల పుస్తకం “ నీలాంబరి” కినిగె లో ebook గా కూడా లభ్యమవుతుంది. ఈ పుస్తకం లో ఆమె రాసిన 18 కథలున్నాయి.

” ఒకే రచయిత రాసిన కథల్లో వైవిద్యం వస్తువు లో, శైలి లో, శిల్పం లో , పాత్ర చిత్రణ లో, భాష లో, సందర్భాలలో , సంఘర్షణలలో, మనస్తత్వ చిత్రణ లో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలు గానీ, తన చుట్టూ ఉన్న సమాజం లో గమనించిన విశేషాలూ , సంఘర్షణలూ ఉంటాయి. శారద కథల్లో ఈ వైవిధ్యం చూస్తాము. ఈ కథల్లో హాస్యం ఉంది. వ్యంగం ఉంది. సమాజం లో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది. ” అంటారు నిడదవోలు  మాలతి శారద కథల పుస్తకం “నీలాంబరి” కి రాసిన ముందు మాట లో.

 

 

వీలునామా- 15 వ భాగం

శారద

శారద

  (కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

శుభ వార్త 

పిల్లలూ, జేన్, ఎల్సీ అంతా బయటికెళ్ళాక, బ్రాండన్ పెగ్గీతో తీరికగా కబుర్లు చెప్పాడు. అన్నిటికన్నా, ఆయనని సంపన్నుల ఇంటి ఆడపడుచులు ఈ చాకలి మనిషి ఇంట్లో ఎందుకున్నారా అన్న కుతూహలం వేధించింది. అంతకు ముందు రోజు రాత్రి రెన్నీ గారి అమ్మాయి, ఎలీజా ఏవో వివరాలు చెప్పింది కానీ, ఆయనకి అవంత నమ్మదగ్గవిగా అనిపించలేదు. వాటిల్లో అతిశయోక్తీ, అతిశయమూ ఎక్కువగా అనిపించాయి. ఆయన ఊహించినట్టుగానే, పెగ్గీ వాళ్ళిద్దరి గురించీ మామూలుగా నిజాలు వెల్లడించింది. పెగ్గీ కి అందులోనూ జేన్ అంటే చాలా ఇష్టమూ, మర్యాదా.

“పెద్దమ్మాయిగారు ఎంత తెలివైందనుకున్నారు? ఆవిడకి తెలియని విషయం లేదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. అంత తెలివైన మంచి మనిషి, కుట్టు పనికి వెళ్తోందటే ఎలాటి రోజులొచ్చాయో చూడండి. రాత్రి పూట ఆవిడ పిల్లలకి చదువు చెప్పేటప్పుడు చూడాలి. మా టాం అయితే ఆవిడ చేతిలో బొమ్మే అనుకోండి. ఆవిడ మాటంటే మావాడికి వేద వాక్కు. ఆ వయసులో మగపిల్లలకి అలా ఆరాధించేందుకు ఒక స్త్రీ మూర్తి వుండి తీరాలండీ! వాళ్ళకి ఆడవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది.”

“పెగ్గీ! ఆదర్శవంతమైన్స్ స్త్రీ మూర్తిని చూడాలనే అనుకుంటే నీకంటే వేరెవరున్నారు?” బ్రాండన్ అభిమానంగా అన్నాడు.

“నాకు అక్షరం ముక్క రాదాయే! నన్నెవరు గౌరవిస్తారు లెండి. అయితే నాకు దాని గురించి పెద్ద బాధా లేదు. నిజానికి టాం చాలా మంచి కుర్రాడు, చురుకైన వాడు. వాడికి రాని లెక్కలూ, లాటినూ, ఏదైనాసరే, అన్నీ పెద్దమ్మాయి గారు చెప్తారు. ఆవిడ ఒక పేజీ నిండా వున్న అంకెలని కూడా చకచకా మనసులోనే కూడిక చెయ్యగలరు తెలుసా! అయినా, నాకు తెలీకడుగుతాను. జేమీకి లాటిన్ తో ఏం పని చెప్పండి? చెక్క పనులు నేర్చుకుని వడ్రంగి అవుదామనుకునేవాడికి, ఈ లేటినూ భాషలూ ఎందుకో! వీణ్ణి చూసి టాం! ఇద్దరూ లాటిన్ నేర్చుకుంటున్నారు. ఏం ప్రయోజనమో ఆ దేవుడికే ఎరుక. భాష మాటెలావున్నా వాళ్ళ అక్షరాలు మాత్రం ముత్యాల్లా అయ్యాయంటే నమ్మండి. అంతా పెద్దమ్మాయిగారి చలవే. ఆవిడ ఆజమాయిషీలో వున్నప్పుడు, వాళ్ళ మావయ్యగారి ఎస్టేటులో, ఇంట్లో లెక్కా, అదీ వొంక పెట్టలేకుండ వుండేదు. అంత తెలివీ చదువూ వుండి ఏం లాభం, పాపం. ఇప్పుడు ఎక్కడో కుట్టు పనికి కుదురుకోవాలనుకుంటోంది. చిన్నమ్మాయిగారున్నారా, ఆవిడంతా అదో ప్రపంచం. కవితలూ, కథలూ, నవలలూ, అంతా రాత పనే. అయితే ఈ మధ్య అన్నీ మానేసారులెండి. ఈ మధ్య కొంచెం నిరుత్సాహంగా వున్నారని చెప్పి ఫ్రాన్సిస్ గారు అలా బయటికి తీసికెళ్ళారన్నమాట.”

“నాకు మీ చిన్నమ్మాయిగారితోనే కొంచెం స్నేహం! ఆ పెద్దమ్మాయిని చూస్తే నాకు వొణుకు. అందులో ఆవిడ మాట్లాడితే నీతులు బోధిస్తున్నాట్టే అనిపిస్తుంది.”

“అబ్బో! ఆవిడ నీతుల వల్ల మీరు చెడిపోయిందేమీ లేదే! మంచి చెప్పినా తప్పేనా? సరే, ఇదంతా అలా వుంచండి. నిజంగా మెల్బోర్న్ లో నా కొట్టు చవకగా ఇచ్చెయాల్సి రావడం నాకు బాధగా వుంది. మీరన్నట్టు ఆ కొట్టుకు రెండు వేల పౌండ్లు వస్తేనా, నేను పెద్దమ్మాయిగార్ని మెల్బోర్న్ తీసికెళ్ళి ఇద్దరమూ కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవాళ్ళం.”

జేన్ పట్ల పెగ్గీ అరాధన చూసి బ్రాండన్ కి నవ్వొచ్చింది. ఇంకొంచెం సేపు మామూలు కబుర్లయ్యాక ఆయనన్నాడు,

“పెగ్గీ! నాకొక ఆలోచన తోస్తుంది!”

“ఆలోచనా?”

“అవును! నీకు ఫిలిప్ గారి కుటుంబం గుర్తుందా?”

“ఎందుకు గుర్తు లేదు? వాళ్ళు బాగున్నారా? అడగడమే మర్చిపోయాను. చిన్న పాప ఎమిలీ ఎలా వుంది? ఇప్పుడు బాగా పెద్దదయి వుంటుంది.”

“బానే వున్నారు. వాళ్ళకిప్పుడు ఎమిలీ కాక ఇంకా నలుగురు పిల్లలు. శ్రీమతి ఫిలిప్ గారికి ఎప్పట్లానే తన షోకులకే సమయం చాలటం లేదు.”

“ఆవిడ ఎప్పుడూ అంతే లెండి.”

“ఇంతకీ సంగతేమిటంటే, నేను మెల్బోర్న్ నించి ఇంగ్లండు వచ్చేటప్పుడు అదే నౌకలో ఫిలిప్ గారి కుటుంబం కూడా వచ్చింది. వాళ్ళు ఇక ఎప్పటికీ లండన్ లోనే వుండిపోతారట. మీ పెద్దమ్మాయి గారికి ఆ కుటుంబంలో వుద్యోగం దొరికిందనుకో, వాళ్ళకీ హాయి, తనకీ సుఖంగా వుంటుంది. వాళ్ళ పిల్లలు ఎమిలీ, హేరియాట్ ని అదుపులో పెట్టగలిగే టీచర్లు లేక అవస్థ గా వుందని అన్నాడు ఫిలిప్ నాతో. వాళ్ళు జేన్ శిక్షణలో కాస్త నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు. ఏమంటావ్? మాట్లాడి చూడనా?”

“నేనక్కడ వున్నప్పుడే ఎమిలీ తండ్రినొక ఆట ఆడించేది. ఆవిడ కేమో అసలు ఏ పనికీ ఒళ్ళొంగదు. మీరన్నట్టు ఇది మంచి ఆలోచనే.”

“జేన్ లాటి మనిషి దొరికితే ఫిలిప్ ఎగిరి గంతేస్తాడనుకుంటా. నేను వెంటనే ఫిలిప్ తో మాట్లాడతా. అతనెటూ ఇటు వైపొచ్చే ఆలోచనలో వున్నాడు. అప్పుడు నిన్నొకసారి కలవమంటా. అతనే జేన్ తో మాట్లాడి ఏ విషయమూ నిర్ణయించుకోవచ్చు. నువ్వు ఆవిడని తొందర పడి కుట్టు పనికి వెళ్ళొద్దని చెప్పు.”

“ఆయన వొచ్చేటట్టయితే తప్పక ఎమిలీని తీసుకురమ్మని చెప్పండి. వారి కుటుంబానికి పెద్దమ్మాయిగారు నచ్చి పనిలో పెట్టుకుంటే కాస్త వాళ్ళకి సాయం చేసిన వాళ్ళమవుతాం.”

“ఇహ ఆ పని మీదే వుంటాను. నేను మరి బయల్దేరతా పెగ్గీ! నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా వుంది.”

లోపలికెళ్ళి పిల్లల తాతగారు థామస్ లౌరీ కి నమస్కారం చేసి బయల్దేరాడు బ్రాండన్. పెగ్గీ ఆలోచనలో పడింది.

‘…. చూస్తూంటే బ్రాండన్ గారికి చిన్నమ్మాయి గారు బాగా నచ్చినట్టున్నారు.  ఇప్పుడు చిన్నమ్మాయి గారికి ఈయన నచ్చుతాడో లేదో! నేను ఆయన గురించి అంతగా చెప్పి వుండకుండా వుండాల్సిందేమో! పొరపాటైపోయింది. ఇప్పుడామెకి ఆయన్ని చూస్తే నవ్వులాటగానే వుంది. బ్రాండన్ గారన్నట్టు పెద్దమ్మాయిగారికి ఫిలిప్ గారి దగ్గర ఉద్యోగం దొరికితే బాగుండు. పాపం ఇక్కడ పిల్లలు ఆవిడ లేకపోతే దిగులు పడతారేమో. మరప్పుడు చిన్నమ్మాయిగారు ఒంటరిగా ఇక్కడుండాల్సొస్తుందేమో! అసలే కళాకళాల మనిషి. ఆమెని ఒంటరిగా నేను సంబాళించుకోగలనో లేదో!…’

అంతలోనే ఆమె ఆలోచనలు మెల్బోర్న్ లో తను అద్దెకిచ్చిన కొట్టు మీదికెళ్ళాయి.

‘…ఆ జులాయి వెధవ కొట్టు నిజంగానే కొనేసుకుంటాడనుకోలేదు. రెండు వందలక్కొన్న కొట్టు ఇప్పుడు రెండు వేలయిందట. అయినా నాకు రెండు వందలే వొస్తాయి. ఎంత అన్యాయం. అంతా నేను చేసిన పొరపాటు. ఇప్పుడేమనుకొని ఏం లాభం….’

ఆలోచనల్లోనే పెగ్గీ పనంతా ముగించి బయటికెళ్ళిన అమ్మాయిలిద్దరికోసం ఎదురు చూస్తూ కూర్చుంది.

జేన్ ఎల్సీలిద్దరూ నాటకం చూసి వచ్చేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది.

“ఇంత ఆలస్యమయిందే! భయపడ్డా మీరిద్దరూ ఎక్కడున్నారోనని.” తలుపు తీస్తూ అంది పెగ్గీ.

“అవును పెగ్గీ! ఇంత పెద్ద నాటకం అనుకోలేదు. అసలు నువ్వెందుకు మాకోసం ఎదురు చూస్తూ మెలకువతో వున్నావు? పడుకోకపోయావా!” చెప్పులు విప్పుతూ అంది జేన్.

ఎల్సీ చాలా రోజుల తర్వాత ఆ రోజు సంతోషంగా అనిపించింది.

“ఏం పెగ్గీ! ఆస్ట్రేలియాలో నువ్వెప్పుడైనా నాటకం చూడ్డానికెళ్ళావా?” సరదాగా అడిగింది.

“వెళ్ళా కాని నాకేం నచ్చలా! ఆ రంగులు పూసుకున్న మొహాలూ వాళ్ళూ!”

నవ్వింది జేన్.

“పెగ్గీకి రంగుల కల్పనలకంటే నలుపూ-తెలుపుల నిజ జీవితమే నచ్చుతుంది. కదూ పెగ్గీ!”

“మీ వేళాకోళానికేమొచ్చె కానీ, నిజ జీవితమంటే గుర్తొచ్చింది! అమ్మాయిగారూ! బ్రాండన్ గారు మీకొక మంచి ఉద్యోగం చూసి పెడతానన్నారు!”

అమ్మాయిలిద్దరూ ఉత్సాహంతో కెవ్వుమన్నారు.

“ఒక ఇంట్లో పిల్లల చదువులూ, డబ్బు లెక్కలూ చూసుకునే గవర్నెస్ ఉద్యోగం. రేపే మాట్లాడతానన్నారు. కనీసం తాను ఏ కబురూ చెప్పేవరకూ కుట్టు పనికి వెళ్ళొద్దన్నారు.”

తర్వాతె పెగ్గీ ఫిలిప్ గారి గురించి వివరాలన్నీ చెప్పింది.

“జీతం ఎంతుంటుందో!” ఆత్రంగా అంది జేన్.

“దాఇ గురించి మీరు ఆలోచించకండి. ఫిలిప్ గారు పిసినారి కాదు నాకు తెలిసినంతవరకూ.

“అయితే రేపు ఫ్రాన్సిస్ వచ్చేసరికి మనం అతనికొక శుభవార్త చెప్పొచ్చన్నమాట!” జేన్ అంది సంతోషంగా.

 

***

(సశేషం)

 

వీలునామా – 14వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

“ఏమిటీ? ఆడవాళ్ళకి సంగీతం తేలికగా అబ్బదా? విచిత్రంగా వుందే? వాళ్ళు ఎప్పుడు చూడూ పియానో వాయిస్తూ పాటలు పాడుతూ వుంటారు కదా?”

“అదే మరి! అంత మంది సంగీతం నేర్చుకున్నా, ఒక్కళ్ళైనా మంచి సంగీతం సమకూర్చడం విన్నామా మనం? అదే కవిత్వమూ చిత్రలేఖనమూ తీసుకోండి. ఎక్కువమంది ఆడవాళ్ళు నేర్చుకోకపోయినా, మంచి కవయిత్రులూ, చిత్రకారిణులూ వున్నారు.  అందుకే ఆడవాళ్ళకి సంగీతం కంటే కవిత్వమూ చిత్రలేఖనమూ సహజంగా అబ్బుతాయేమో అనిపిస్తుంది.”

“ఆహా! ఎన్నాళ్ళకు విన్నాను ఇంత చల్లని మాట! మా పిన్నీ, ఆవిడ కూతుళ్ళిద్దరూ రోజూ నాకు ఈ విషయం మీద తలంటుతున్నారంటే నమ్మండి. ఆడా, మగా సమానమేననీ, ఇద్దరికీ అన్ని విద్యలూ సమానంగా వస్తాయనీ నాతో ఒప్పించే దాకా ఊర్కునేలా లేరు వాళ్ళు. మీరేమో ఆడవాళ్లకీ అన్ని విద్యలు సహజంగా రావని అంటున్నారు. అన్నట్టు ఈ సారి వాళ్ళతో వాదించేటప్పుడు ఈ పాయింటు దొరకబుచ్చుకుంటా! మీకేమైనా అభ్యంతరమా?”

“భలే వారే! ఇందులో అనుకోవడానింకేముంది. అయితే ఇంతటి విలువైన ఆయుధాన్ని మా శతృవుల చేతుల్లో పెట్టటమా అని సంకోచం, అంతే!” నవ్వింది ఎల్సీ.

“శతృవులా? ఎంత మాటన్నారు! నేనింకా మీ స్నేహం కోసం అర్రులు చాస్తుంటే!”

చూస్తూండగా బ్రాండన్ కి ఎలీజా రెన్నీ కవితలు చదవడం కంటే ఎల్సీ తో కబుర్లాడడం లోనే ఎక్కువ ఉత్సాహంగా అనిపించింది. కాసేపయ్యాక ఆ ఆల్బం బల్ల మీద పడేసి,

“పదండి! మళ్ళీ హాలులోకెళ్ళి పాటలు విందాం!” అన్నాడు. ఎల్సీకి ఆ కవితలు చదువుతూంటే భలే ఆనందంగా అనిపించింది. తన కవితలే ఎలీజా కవితలకంటే బాగున్నాయనే నిర్ధారణ కొచ్చింది ఆమె. దాంతో ఆమె నిరాశ కొంచెం తగ్గినట్టనిపించింది.

బయటికొచ్చిన ఎల్సీ, విలియం డాల్జెల్ లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసింది.

విలియం గంభీరంగా లారాతో తన గురించీ, తన పొలాల గురించీ చెప్తూన్నాడు. ఎందుకో అతని గొంతూ, ఆరాధనగా అతను లారా వైపు చూసే చూపులూ, తెచ్చి పెట్టుకున్న గాంభీర్యమూ చాలా చిరాకెత్తించాయి ఎల్సీని.

“నీలాటి మోసగాడికి లారా విల్సన్ లాటి తెలివి తక్కువ డబ్బున్న

అమ్మాయే సరి జోడీ,” అనుకుందామె అక్కసుగా. డబ్బుంటే ఎన్ని లోపాలన్నీ కప్పబడిపోతాయ్, డబ్బు లేకుంటే ఎన్ని సుగుణాలైనా మరుగున పడతాయి, అనుకుంది మళ్ళీ అంతలోనే.

విలియం కొద్దిసేపటి తర్వాత జేన్ దగ్గరికి వచ్చాడు. ఆమెని చూసీ పలకరించకపోవడం మర్యాద కాదనుకున్నాడు. అంతకు ముందు ఎల్సీని పలకరించే ప్రయత్నం చేసాడు కానీ ఎల్సీ ముక్తసరిగా మాట్లాడింది.

జేన్ అతనితో ఎలాటి వైషమ్యాలూ లేకుండా సౌమ్యంగా మాట్లాడింది. అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. తనను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుందనీ, దెప్పి పొడుస్తుందనీ, తన కష్టాలు చెప్పుకుంటుందనీ ఎన్నెన్నో ఊహించాడు. అదేమీ లేకపోగా జేన్ ఎప్పట్లాగే మర్యాదగా మాట్లాడింది. తను లారా విల్సన్ తో మాట్లాడుతూండడం చూసి ఈర్ష్యపడలేదు సరికదా, అసలా ప్రసక్తే ఎత్తలేదు. అక్కడికీ విలియం ఉండబట్టలేక తమ పాత స్నేహాన్నీ, ఆప్యాయతనీ గుర్తు చేయబోయాడు. జేన్ అదంతా మర్చిపోయినట్లు మాట్లాడేసరికి అతనికి కొంచెం  అసహనంగా కూడా అనిపించింది.

తానూ, తన తల్లీ వాళ్లని చూడడానికి రాలేకపోయామనీ, దానికెంతో బాధ పడ్డామనీ అతనన్నాడు.

దానికంత బాధ పడాల్సిందేమీ లేదనీ, తనకసలు వాళ్ళు రాలేదన్న సంగతే గుర్తు లేదనీ ఆమె అన్నంది.

“హాయిగా ఎస్టేటులో వున్న తర్వాత పెగ్గీ చిన్న ఇంట్లో ఇరుకుగా ఇబ్బందిగా వుందా?”

“అబ్బే, అదేం లేదు. అయినా పనితో తల మునకలుగా వుంది. ఇంకేదీ పట్టించుకునే తీరిక లేదు.”

“పెగ్గీ ఏమైనా..”

“పెగ్గీ చాలా మంచిది. మర్యాదస్తురాలు.”

“పిల్లలు ఏమైనా ఇబ్బంది..”

“పిల్లలు చాలా బుధ్ధిమంతులు.”

ఆ సంభాషణ అయిపోయేసరికి ఇద్దరూ సంతోషపడ్డారు. అతను మళ్ళీ లారా విల్సన్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. జేన్ లేచి ఎల్సీని వెతుక్కుంటూ లోపల లైబ్రరీలోకెళ్ళింది.

ఈసారి అక్కడ ఎల్సీ ఫ్రాన్సిస్ తో కలిసి ఎలీజా రెన్నీ కవితల పుస్తకం చదువుతూ చర్చిస్తోంది.

“ఫ్రాన్సిస్! నువ్విక్కడ వున్న నాలుగు రోజులూ మా ఇంటికి వస్తావు కదూ? అసలు మనం కొన్ని రోజులు సరదాగా గడపాలి. రేపు సినిమాకి, ఎల్లుండి చిత్రకళా ప్రదర్శనకి, మర్నాడు పాట కచేరీకి వెళ్దాం, సరేనా?”

ఎల్సీ ఆశ్చర్యంగా అక్కవైపు చూసింది.

“నేను రాలేను జేన్. నాకు కొంచెం నలతగా వుంది.”

“చచ్చినా ఒప్పుకోను. ముగ్గురం కలిసే వెళ్దాం. ఆ తర్వాత నేనొక టైలరింగ్ షాపులో పనికి కుదురుకుంటున్నా కాబట్టి ఇప్పుడు నా మాట వినాల్సిందే!”

“జేన్! ఎల్సీకి నాతో రావడం ఇష్టం లేదేమో!” ఫ్రాన్సిస్ అన్నాడు.

ఎల్సీ మొహం ఎర్రబడింది.

“అయ్యొయ్యో! అదేమీ లేదు ఫ్రాన్సిస్. నాకు ముందు నీమీద కొంచెం కోపంగా వున్నమాట నిజమే. నీవల్లే మాకీ కష్టాలన్నీ అనుకున్నా కూడా. కానీ తర్వాత ఆలోచిస్తే అనిపించింది, ఇందులో నీ తప్పేం లేదని. నా దురుసుతనానికి క్షమించు!”

“ఇందులో క్షమాపణలకేముంది ఎల్సీ! మీ స్థానంలో ఎవ్వరున్నా అలాగే అనుకుంటారు. అది సరే, రేపు ఉదయాన్నేనాతో వస్తే నీకు ఎడిన్ బరో ఎంత అందంగా వుంటుందో చూపిస్తాను. జేన్ కి చూపించి లాభం లేదు. తనకసలు ఏమాత్రం కళా హృదయం లేదు. నీలాటి సున్నిత

మనస్కురాలికే ఆ సౌందర్యం అర్థమవుతుంది. ఏమంటావ్?” నవ్వుతూ అడిగాడు ఫ్రాన్సిస్.

అతని అభిమానానికీ, స్నేహానికీ ఎల్సీ పెదవులు విచ్చుకున్నాయి. మర్నాడు అతనితో కలిసి కాసేపు గడపాలని నిశ్చయించుకుందామె.

***

ఫ్రాన్సిస్ నిర్ణయం

పార్టీ నించి వచ్చి పడుకునేసరికి ఆలస్యం అయింది. జేన్, ఎల్సీ లిద్దరూ మర్నాడు లేచేసరికే పెగ్గీ పని మీద బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెగ్గీ తిరిగి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండయింది. ఆడ పిల్లలిద్దరూ అప్పటికి లేచి ఫ్రాన్సిస్ కొరకు ఎదురు చూస్తున్నారు.

తలుపు చప్పుడైంది. తమని బయటికి తీసికెళ్ళడానికి ఫ్రాన్సిస్ వచ్చి వుంటాడనుకొని ఇద్దరూ చెప్పుల వైపు కదిలారు. పెగ్గీ తలుపు తెరిచింది. అటు చూసిన ముగ్గురూ ఆశ్చర్యపోయారు. వచ్చింది ఫ్రాన్సిస్ కాదు! బ్రాండన్. పెగ్గీ ఆశ్చర్యాన్ని చూసి నవ్వాడు!

“పెగ్గీ! నిన్ను నాలుగు వీధులవతల చూసి వెంబడించాను. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూస్తావేమో ఆగమని సైగ చేద్దామంటే, ఏదీ, నువ్వు గబ గబా నడుచుకుంటూ వచ్చేసావు. నీతో సమానంగా నడవలేకపోయాను నేను! నగర వీధుల్లో నడవదం అలవాటు తప్పినట్టుంది నాకు.”

పెగ్గీ ఇంకా ఆశ్చర్యం లోంచి తేరుకోలేదు. జేన్ ఎల్సీ ల వైపు తిరిగాడు బ్రాండన్.

“పెగ్గీ! నువ్వు మీ అక్కయ్య పిల్లలని చెప్తూ వుండే దానివి. వీళ్ళా ఆ పిల్లలు?” నమ్మలేనట్టు అడిగాడు.

“అయ్యొయ్యో! కాదండీ. మా అక్కయ్య పిల్లలందరూ బడికెళ్ళారు. అయినా, వాళ్ళని చూస్తుంటే మీకు వాళ్ళు మాలాటి వాళ్ళ పిల్లల్లా కనబడుతున్నారా? వాళ్ళిద్దరూ ఊరికే ఇక్కడ అద్దెకుంటారు. వాళ్ళు మా వూళ్ళో వుండే భూస్వామి గారి మేన కోడళ్ళు.”

“అలాగా? నిన్న రాత్రి నేను ఒక విందులో వీళ్ళిద్దరినీ కలిసాను. అందుకే ఆశ్చర్యపోయాను.”

“అదిసరే,  మీరు ఇటువైపెందుకొచ్చారు?” పెగ్గీ అడిగింది.

“అసలు నిన్ను చూడడానికి నువ్వు ఇచ్చిన మీ వూరి అడ్రసుకే వెళ్దామనుకున్నా. ఇంకా నయం వెళ్ళాను కాదు. ఊరికే ఒక ప్రయాణం దండగయ్యేది. నిన్ను చూడాలని చాలా అనుకున్నాలే. ”

“మొన్న మొన్నటి దాకా ఊళ్ళోనే వున్నా. ఇహ పిల్లలు పెద్ద స్కూల్లో చదువుకుంటామంటే ఇక్కడికి వచ్చాం. వాళ్ళ తాతగారిక్కూడా ఇక్కడ బాగుందట. ”

పెగ్గీ అమ్మాయిలవైపు తిరిగింది.

“అమ్మాయిగారూ! ఈయన మా బ్రాండన్ గారు. నేను చెప్పలా? ఆయనే.”

బ్రాండన్ చలి మంట దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

“హబ్బా! పెగ్గీ! ఆస్ట్రేలియా లాటి వెచ్చటి ప్రదేశంలో వుండి నువ్విక్కడ చలి యెలా తట్టుకుంటున్నావు?”

“అటూ ఇటూ నడుస్తూ వుంటే చలి తగ్గుతుందండీ!”

“పెగ్గీ! నువ్వసలేం మారలేదు. అన్నట్టు నీకొక ముఖ్యమైన వార్త చెప్పాలి.”

“చెప్పండి! ఏంటది?”

“ఏంటా? నువ్వసలు మెల్బోర్న్ వదిలి వుండల్సింది కాదు. ఇప్పుడు మెల్బోర్న్ లో డబ్బే డబ్బు! అన్నట్టు పోవెల్ గుర్తున్నాడా? అతని పెళ్ళయ్యిందో లేదో గుర్తు రావడం లేదు.”

“నేను మెల్బోర్న్ లో వున్నప్పుడే ఆయనకి పెళ్ళయింది లెండి. ఇంతకీ సంగతేమిటి?”

“ఇప్పుడు పోవెల్ మెల్బోర్న్ లొని పెద్ద ధనికులలో ఒకడు తెలుసా? నాకంటే ఎక్కువ డబ్బూ, గొర్రెలూ, పొలమూ సంపాదించాడు. అతన్ని పెళ్ళాడకుండా పొరపాటు చేసావేమో పెగ్గీ!”

“ ఇప్పుడదంతా ఎందుకు కానీ, ఆయనకి ఏమైనా పిల్లలా?”

“ఇద్దరు. అబ్బో! ఇహ ఆయన మురిపం చెప్పనలవి కాదు.”

“ఆయన భార్య మంచిదేనా?”

“మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ, నీ అంత పనిమంతురాలు మాత్రం కాదు. ఆమెకి ఎంత సేపూ తన బట్టలూ, అంద చందాల మీదే ధ్యాస. అదలా వుంచు కానీ, నీ లాయరు లేడూ, టాల్బాట్ గారు! ఆయన నీకోక సందేశం ఇచ్చాడు.”

“టాల్బాట్ అక్కడ నా డబ్బు వ్యవహారాలన్నీ చూసే వాడు, ” పెగ్గీ కొంచెం గర్వం నిండిన కంఠంతో అంది అమ్మాయిలతో.

మళ్ళీ బ్రాండన్ వైపు తిరిగి, “ఏమంటాడు టాల్బాట్?” అని అడిగింది.

“నువ్వు నీ కొట్టు అద్దెకిచ్చావు చూడు, వాడికి కొట్టు కొనుక్కునే హక్కు కూడా ఇచ్చావు కదా? అలా ఇవ్వకుండా వుండాల్సింది అని బాధ పడ్డాడు.”

“నేనా కొట్టు అమ్మింది ఒక చిల్లర వ్యాపారస్తుడికి. వాడి జన్మకి వాడు రెండొందల యాభై పౌండ్లు ఎప్పటికి కూడబెట్టాలి, ఎప్పటికి కొనాలి? టాల్బాట్ అనవసరంగా భయ పడుతున్నాడు.”

“కానీ, ఇప్పుడా కొట్టు వున్న స్థలం దాదాపు రెండువేల పౌండ్ల కంటే ఎక్కువ ఖరీదు చేస్తుంది! ఆ కిరాయిదారు భలే ఉపాయం వేసాడులే. నీ లీజు అయిపోయేదాకా ఏమీ మాట్లాడడు. నువ్వడిగిన తక్కువ అద్దె కడుతూ అలాగే వుంటాడు. లీజు అయిపోయే సమయానికి స్థలం కుదువబెట్టి రెండొందల యాభై పౌండ్లు తెచ్చి నీకిచ్చి కొట్టూ, స్థలమూ అంతా తన పేర రాయించుకుంటాడట. ఈ విషయం వినగానే నీ మీద నాకు మహా చికాకు కలిగింది. అంత మంచి స్థలాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నావు చూడు!”

“హాయ్యో! ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం వూహించగలరు చెప్పండి! ఆ రెండొందల యాభై ఏదో ఓ రోజు నాకొస్తుందన్నమాట! పోన్లెండి. దక్కిందే మనదనుకుంటే సరిపోయే! అన్నట్టు, అదిగో, పిల్లలొచ్చేసారు.”

మెట్ల మీద అడుగుల సవ్వడి విని అంది పెగ్గీ!

“ఆఖరికి వచ్చారన్నమాట! నువ్విన్ని త్యాగాలు చేసి పెంచిన ఆ పిల్లలు ఎలా ఉంటారో అన్న కుతూహలంతో చస్తున్నాను! వస్తూనే వాళ్ళ పేర్లేమిటో చెప్పాలి నువ్వు.”

వాళ్ళు వస్తూంటే వరసగా పేర్లు చెప్పింది పెగ్గీ.

“టాం, జేమీ, నాన్సీ, జెస్సీ, విల్లీ!”

“చక్కటి పిల్లలు! చురుగ్గా వున్నారు. వీళ్ళని ఆస్ట్రేలియాకి తీసికెళ్తా నాతో! పైకొస్తారు.”

బ్రాండన్ ప్రశంసలకి పెగ్గీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“అంతా భగవంతుడి దయ. ఆరోగ్యాలు చల్లగా వుంటే అంతే చాలు. కానీ మహా అల్లరి పిల్లలు లెండి.” జవాబిచ్చింది.

ఇంతలో టాం కలగజేసుకున్నాడు.

“పిన్నమ్మా! కింద మెట్లదగ్గరెవరో ఒకాయన నిలబడి వున్నాడు. ఎవరు కావాలని అడిగితే, జేన్, ఎల్సీల కోసమొచ్చానన్నాడు. పైకి రమ్మన్నాను కానీ, రానని అక్కడే వుండిపోయాడు.”

“పెగ్గీ! అది ఫ్రాన్సిస్ అయి వుంటుంది. పైకి రమ్మను టాం. మేము సిధ్ధంగానే వున్నాం. ఒక్క అయిదు నిముషాలు కూర్చొని వెళ్ళిపోవచ్చు.” జేన్ చెప్పింది.

 టాం వెళ్ళి పిలిచినమీదట ఫ్రాన్సిస్ వచ్చాడు. బ్రాండన్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు, కానీ పెగ్గీ తమ పూర్వ పరిచయం గురించి వివరించింది. బ్రాండన్ తో రెణ్ణిమిషాలు మాట్లాడి ముగ్గురూ బయటికెళ్ళారు.

బయట పగటి వెల్తుర్లో కానీ అక్క చెల్లెళ్ళిద్దరిలో వచ్చిన మార్పు ఫ్రాన్సిస్ కనిపెట్టలెకపోయాడు. చిక్కిపోయిన ఆకారాలూ, పాలిపోయిన మొహాలూ చూస్తే అతనికి కడుపులో దేవినట్టైంది. అందులోనూ కుట్టుపనికి వెళ్తానని జేన్ అన్నప్పట్నించీ అతని మనసు మనసులో లేదు.

కొద్ది రోజులుగా తన మనసులో మెదుల్తున్న విషయం గురించి ఆలోచిస్తున్నాడతను. జేన్ అంటే అతనికి చాలా ఇష్టమన్న విషయం అతనికి కూడా అర్థమైపోయింది. కానీ జేన్ ని పెళ్ళాడితే ఆస్తి పాస్తులు వదిలేసుకోక తప్పదు. ‘ఈ డబ్బుతో నాకేం పని? ఇవన్నీ వదిలేసి హాయిగా జేన్ ని పెళ్ళాడితే పోలా?’ అని ఈ మధ్య బలంగా అనిపిస్తుందతనికి. ఇంతకు ముందు ఉద్యోగమే మళ్ళీ చేసుకుంటూ, యేడాదికి రెండొందల యాభై పౌండ్లతో ఎంతైనా హాయిగా బ్రతకొచ్చు. అందుకోసం కావాలంటే తన ఖరీదైన పుస్తకాల అలవాటూ, నాటకాలకెళ్ళే అలవాటూ, అన్నీ మానుకోగలడు తను.

మనసుకి నచ్చిన మనిషితో దుర్భరమైన పేదరికాన్ని భరించొచ్చు కానీ, ప్రేమించేందుకు మనిషి లేక అష్టైష్వర్యాల మధ్యా క్షణం కూడా వుండలేం.

‘నన్ను ఆమె పెళ్ళాడుతుందన్న నమ్మకం వుండి వుంటే మర్నాడే ఆ ఎస్టేటూ, ఇల్లూ అన్నీ గాలికొదిలేసి ఇక్కడే హాయిగా వుండిపోదును కదా! కానీ, ఆమెకి నా మీద ఎలాటి అభిప్రాయం వుందో! ఇప్పుడు నేను ఈ విషయం మాట్లిడితే, తన నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటున్నానుకుంటుందో ఏమో!’

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. డబ్బు వల్ల తనకి కొత్త అలవాట్లేమీ రాకపోయినా, ఆ తీరుబడిగా వుండే జీవితమూ, ఎప్పుడూ డబ్బుకొసం తడుముకోవాల్సిన అవసరం లేని నిశ్చింతా అతని ప్రాణానికి చాలా సుఖంగానే వున్నాయి. ఇప్పుడవి వొదులుకోవదమంటే తననుకున్నంత తేలికైన పనేనా?

జేన్ కోసం డబ్బూ, ఇల్లూ వదిలి వచ్చేస్తానంటే ముందు అసలు రెన్నీ గారు తన పాత ఉద్యోగమిస్తారా లేక తిట్టి పంపేస్తారా? ఇంకో విషయం కూడా ఆలోచించాలి. జేన్ ని పెళ్ళాడితే, జేన్ తో పాటు ఎల్సీ బాధ్యత కూడా తీసుకోవలి. వచ్చే డబ్బుతో ముగ్గురం సర్దుకోగలమా? ఎందుకంటే జేన్ ని పెళ్ళాడడమొక్కటే కాదు తనకు కావల్సింది, ఆమెని సంతోషంగా వుంచడం కూడా! అంతే కాదు, ఆ డబ్బుతో తను పదిమందికీ పనికొచ్చే పనులు చాలా చేయాలని ఆశపడ్డాడు. మరి వాటి మాటో?

రకరకాల ఆలోచనలు సాగిపోతున్నాయి అతని మనసులో.

జేన్ వైపు తల తిప్పి చూసాడు. ఆమె కళ్ళల్లో ఆప్యాయత, స్నేహం చూసి అతనికి తనేం చేయాలో అర్థమైపోయింది. తను డబ్బూ, ఎస్టేటు అన్నీ ఏదైనా చారిటీ ట్రస్టులకిచ్చి జేన్ ని పెళ్ళాడతాడు. తను ఒప్పుకుంటుందా? తప్పక ఒప్పుకుంటుంది. తన మనసేమిటో ఇంకా ఆమెకి తెలియదా? తను ఇక ఒంటరివాడు కాదు.

ఆ రాత్రి అతను ఆలోచనలతో నాటకం సరిగ్గా చూడలేకపోయాడు. జేన్, ఎల్సీలు మాత్రం చాలా సంతోషంగా ఆ రాత్రి నాటకాన్ని చూసారు. తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు నాటకం గురించి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కేమీ తోచలేదు. విమర్శ అంతా ఎల్సీయే చేసింది.

  ***

(సశేషం)

వీలునామా – 13వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

 

ఎడిన్ బరోలో బ్రాండన్

“నాతో పాటు డాన్సు చేయడం మీకు బాగుంటుందో లేదో! నేను మీలా ఇంగ్లండు నాజూకు తెలిసిన మనిషిని కాను. ఆస్ట్రేలియాలో తిరిగే మోటు మనిషిని,” బ్రాండన్ ఎల్సీతో వినయంగా అన్నాడు. ఎల్సీ కొంచెం కొత్త మనిషి ముందర కంగారు పడింది. దానికి తోడు అతను ఒడ్డూ పొడవూ బాగా వుండి, ఎండలో వానలో తిరిగినట్టు మొరటుగా వున్నాడు. అతనితో నాట్యం చేయాల్సిన బాధ్యత తప్పినందుకు ఎలీజా రెన్నీ చాలా సంతోషించింది.

“ఆస్ట్రేలియాలో మీరు వుండేది ఎక్కడ?” ఎల్సీ అడిగింది అతన్ని.

“విక్టోరియా. ఇంతకు ముందు దాన్ని పోర్టు ఫిలిప్ అని పిలిచేవారు.”

“మీరక్కడికి వెళ్ళి చాలా కాలమైందా?”

“చాలానే అయింది. ఇక్కడ నా స్నేహితులు నన్ను మరిచిపోయేంత. అలాగని నాకు నా స్నేహితుల మీద కోపమనుకునేరు. అలాటిదేమీ లేదు.”

అతని యాసా, వాడే మాటలూ కొంచెం విభిన్నంగా వున్నాయి. బహుశా అది ఆస్ట్రేలియాలో వాడుక భాష అయివుండొచ్చు అనుకున్నదామె.

“ఎల్సీ! అక్కడ జీవితం బలే మోటుగా వుంటుందిలే. ఇక్కడ మీ అందరి మంచి బట్టలూ, మర్యాదలూ, నవ్వులూ, మాటలూ చూస్తూ వుంటే భలే హాయిగా వుంది. నేనిక్కడికి వచ్చీ చాలా యేళ్ళయిపోయిందేమో, ఇదంతా ఎదో పూర్వ జన్మ ఙ్ఞాపకం లా వుంది.”

ఎల్సీకి అతనెవరో తెలిసిపోయింది. ఆమెకి గమ్మత్తుగా నిపించింది. ఇతని గురించి నాకు చాలా తెలుసు, కానీ ఇతనికి నా గురించే మీ తెలియదు కదా అనుకుంది. అచ్చం పెగ్గీ వివరించినట్టే వున్నాడతను.

“ఇంగ్లండు వచ్చి ఎన్నాళ్ళయింది?” అడిగింది.

“కొద్ది నెలలు.”

“మీ బంధువులంతా ఇంగ్లండులో లేరా? స్కాట్లాండు కెందుకొచ్చారు?”

“ఆస్ట్రేలియాలో వుండే మనవాళ్ళంతా బ్రిటన్ మొత్తం చూడాలని ఆశపడతారు. ఇక్కణ్ణించి వెనక్కెళ్ళింతర్వాత ఉత్త ఇంగ్లండు వెళ్ళొచ్చానంటే చులకనగా చూస్తారు. అందుకే ఈ ట్రిప్పులో స్కాట్లాండు చూద్దామనుకున్నాను. అయితే ఇక్కడ మాకు దూరపు బంధువులు కూడా వున్నారనుకోండి. అదిగో, అక్కడ కూర్చుని వుందే పెద్దావిడ, ఆవిడ నాకు దూరపు చుట్టం. వరసకు పిన్ని అవుతందనుకుంటా. ఆవిడ రెన్నీ వాళ్ళకి కూడ దూరపు బంధువే. మీ స్కాట్ లాండు వాళ్ళకి బంధుత్వాలూ, బంధు ప్రీతీ ఎక్కువేమో కదూ? ఎప్పుడూ విందులూ వినోదాలు జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడీ విందు నాకూ బాగుందనుకోండి,” ఎల్సీ కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు.

“హ్మ్మ్… విందుల్లో సంతోషంగా చలాకీగా వుండడం ఇప్పుడు ఫాషన్ కాదండీ! ఇప్పుడు మా దగ్గర మగవాళ్ళంతా ఎప్పుడూ ఏదో మునిగిపోయినట్టు మొహం పెట్టడం ఫాషన్. నాకైతే సంతోషంగా వున్నవాళ్ళే బాగనిపిస్తారు.”  చిరునవ్వుతో బదులిచ్చింది ఎల్సీ.

“అంత సీరియస్ గా మొహాలు పెట్టుకోవడం దేనికో! అసలు నన్నడిగితే ఇంగ్లండు, స్కాట్ లాండు దేశాల్లో వుండగలిగే వాళ్ళు చాలా అదృష్టవంతులన్నట్టే లెక్క. ఎప్పుడూ విందులూ వినోదాలూ, చదువుకోవడం, సాహిత్య చర్చలూ, సంతోషాలూ, అంతా నాజూకు వ్యవహారం. ఎండకి ఎండి, వానకి తడిసే నాలాటి వాడికి కొంచెం అర్థం కాని జీవిత శైలి. కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది కూడ! ఈ సంతోషంలో ఎక్కువ రోజులుండలేను. మళ్ళీ మా వూరికి ప్రయాణం తప్పదు కదా అని.”

అప్పటికి వాళ్ళ నాట్యం ముగిసి ఒక పక్కకొచ్చి నిలబడ్డారు. పక్కనే నిలబడి వుంది జేన్. అతని మాటలు విని,

“మీరనుభవిస్తున్న సంతోషం దేశం వల్లా, విందుల వల్లా వచ్చింది కాదు. మీ మనసులోంచి వచ్చింది. అక్కడ కష్ట పడి పనిచేసారు. ఇక్కడ ఆట విడుపుగా వుంది. అంతే!” అంది.

“ఆస్ట్రేలియానించి ఇక్కడికొచ్చినప్పుడే మాకక్కడ లేనిదేమిటో బాగా అర్థమయ్యేది,” అన్నాడు బ్రాండన్.

“అది పరిస్థితులని బట్టి వుంటుందేమో. నాకైతే బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ళు ఆస్ట్రేలియాలో వుంటే బాగుండనిపిస్తుంది.”

“నాక్కూడా!” అప్పుడే ఫ్రాన్సిస్ తో కలిసి అక్కడికొచ్చిన ఎలీజా రెన్నీ అందుకొంది.

“ఎవరూ అడుగుపెట్టని ప్రదేశం చాలా కొత్తగా, ఉహాతీతంగా వుండొచ్చు కదా? అందులోనూ ఆ బంగారు గనులెలా వుంటాయో చూడాలన్న కుతూహలం కూడా.!”

“ఛండాలంగా వుంటాయి. మీరనే ఆ కొత్తదనమూ, ఉత్సాహమూ మచ్చుకైనా కనబడవు. చెట్లూ చేమలూ లేని ఎడారి ప్రదేశం, ఒంటరితనం, తెగని చాకిరీ, ఏం గొప్పగా వుంటాయి చెప్పండి? విక్టోరియా కెళ్ళగానే ఎప్పుడెప్పుడు ఇక్కణ్ణించి బయటపడదామా అనిపిస్తుంది! బ్రిటన్ అందానికి సాటి వచ్చే ప్రదేశం ఎక్కడా వుండదేమో!” బ్రాండన్ అన్నాడు.

“మన దేశం కంటే మనకింకే దేశమూ నచ్చదనుకోండి!” ఎలీజా ఒప్పుకుంది.

“అయినా బ్రతుకు తెరువు వెతుక్కుంటూ భూమి నలుమూలలా చుట్టి రావడం కూడా అద్భుతంగా వుంటుందేమో! మన ఆంగ్లో- సాక్సన్ జాతి

కున్న శక్తే, ఎలాటి ప్రదేశంలోనైనా నెగ్గుకు రావడం. అందుకే మన వాళ్ళే ఎక్కువ వలస రాజ్యాలు స్థాపించారు.”  జేన్ అభిప్రాయపడింది.

“మీరన్నదీ నిజమే. నన్ను చూడండి. ఆస్ట్రేలియా జీవితానికెంత అలవాటు పడిపోయానో! అది సరే కానీ, మిస్ రెన్నీ, ఈ వచ్చే పాటకి నాతో మీరు నాట్యం చేయగలరా?” బ్రాండన్ మర్యాదగా ఎలీజాని అడిగాడు.

ఎలీజా అయిష్టంగానే ఒప్పుకుని వెళ్ళింది. ఫ్రాన్సిస్ ఎల్సీ పక్కకొచ్చి నిలబడ్డాడు.

అతన్ని చూసి ఎల్సీ మొహమాట పడింది. దానికంటే, తన కవితల గురించి అడుగుతాడేమోనని భయపడింది. తను వచ్చీ రాని కవితలని ప్రచురణకి పంపటం చూసి నవ్వుకున్నాడేమో. అంతకంటే అతను తన ప్రయత్నాలని చూసి పడబోయే జాలిని తల్చుకుని ఇంకా వొణికిపోయింది.

అతనితో ఏమి మాట్లాడకుండా పాటలు వినే నెపంతో, అక్కణ్ణించి వెళ్ళి బాండు మేళం పక్కన నిలబడింది. వాళ్ళకి తన గురించీ, తన కవితల గురించీ తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర భయం లేనట్టనిపించిందామెకి.

దూరం నించి ఆమెని చూసిన ఎలీజా, తనతో పాటు పాటకి అడుగులేస్తున్న బ్రాండన్ తో ఎల్సీ గురించీ, జేన్ గురించీ చెప్పింది.

“నాన్నగారు చెప్పారు. ఇద్దరు అక్కచెల్లెళ్ళూ బాగా చదువుకున్నారట, కానీ మేమందరం చదివినట్టు కాకుండా, కొత్త కొత్త చదువులు చదివారట. విచిత్రంగా అందువల్లే వాళ్ళకి బ్రతుకు తెరువు దొరకడం కష్టమై పోయింది.”

బ్రాండన్ ఏమీ జవాబివ్వకుండా ఎల్సీ వైపు చూస్తూ నిలబడ్డాడు.

“పాపం, ఒంటరిగా నిలబడింది. బ్రాండన్, మనం ఆమె దగ్గర్కికి వెళ్దామా? ఇప్పుడు మనమీ డాన్సు ఆపేస్తే కొంపేమీ మునగదుగా!”

ఎలీజాకి నిజానికి బ్రాండన్ తో కలిసి డాన్సు చేయడం కొంచెం కూడా నచ్చడం లేదు. వాళ్ళు ఎల్సీ దగ్గరకొచ్చేటప్పటికి, అక్కడికి మాల్కం కూడా వచ్చాడు ఎలీజాని చూసి.

“హలో మాల్కం. బాగున్నావా? ఈవిడ ఎల్సీ మెల్విల్. నా కొత్త స్నేహితురాలు. ఎల్సీ, ఇతను మాల్కం, ప్రఖ్యాత రచయిత.”

తనున్న పరిస్థితిలో ఎల్సీకి ప్రఖ్యాత రచయితలని కలిసే ధైర్యం లేదు. ఆమెకి దుఃఖంతో మాట పెకలనట్టయింది ఒక్క క్షణం. ఎలాగో గొంతు పెకలించుకుంది.

“అవునవును, జేన్ చెప్పింది మీ గురించి.”

“ధన్యవాదాలు. జేన్ కూడా వచ్చారా ఈ విందుకు?” చుట్టూ చూస్తూ అడిగాడు మాల్కం.

“అక్కడ ఫ్రాన్సిస్ తో మాట్లాడుతూంది.”

“ఫ్రాన్సిస్ తోనా? ఊమ్మ్.. మేధావులిద్దరూ ఏదో చర్చలో వున్నట్టున్నారు కదూ?” నవ్వాడు మాల్కం.

ఎలీజా ఎల్సీ వైపు తిరిగింది.

“ఎల్సీ! ఫ్రాన్సిస్ మీ ఎస్టేటునీ, గుర్రాలనీ, కుక్కలనీ చాలా శ్రధ్ధగా చూసుకుంటాడు తెలుసా? మీ ఇద్దరి గది చాలా విశాలంగా వుంది కాబట్టి దాన్ని అతిథులకోసం వాడదామని మా అమ్మ అంటే దాదాపు కొట్టినంత పని చేసాడు!”

“జంతువులని ప్రేమగా చూడమని జేన్ అర్థించింది ఫ్రాన్సిస్ ని.”

ఈ సంభాషణ ఎలీజాకి పెద్దగా నచ్చలా. మాల్కం వైపు తిరిగి,

“మాల్కం! నీ కొత్త నవల సంగతేమైంది?” అని అడిగింది.

“రాయటమూ, ప్రింటుకివ్వడమూ కూడ జరిగిపోయాయి.”

గర్వంగా నవ్వాడు మాల్కం.

“ప్రజలకి నచ్చుతుందో నచ్చదో! అయినా నువ్వు రాసిన నవల నచ్చకపోవడమంటూ వుండదులే.”

“మా పబ్లిషరు కథ బానే వున్నా, పాత్రల యాస ఇంకొంచెం గాఢంగా వుంటే బాగుండేదన్నాడు. కూలీ నాలీ జనం యాసలు మనకెలా తెలుస్తాయి చెప్పు? అయినా, ఒక ప్రేమా, ఒక లేచిపోవడమూ, ఒక విడాకులూ, ఒక దెబ్బలాటా, ఒక హత్యా, అన్నీ గుప్పించి రాసి పారేసా!”

“ఓ! నాకు రాత ప్రతి ఒక్కసారి ఇవ్వరాదూ! చదివి ఇచ్చేస్తాను!”

“అసలు నాకు ఈ కథలూ నవలలూ ఎలా రాస్తారో అర్థమే కాదు. ఒక దాని వెంట ఒకటి సంఘటనలు సాగిపోతూ! అంతా చివరికి ఒక పెళ్ళితోనో, మరణంతోనో ఆఖరయ్యేలా! బాబోయ్! తలచుకుంటేనే భయం వేస్తుంది నాకు. కథలే ఇంత కష్టమనిపిస్తే, ఇహ కవితల గురించి చెప్పేదేముంది. ఏమంటారు ఎల్సీ?” బ్రాండన్ అన్నాడు

బ్రాండన్ ప్రశ్నతో ఎల్సీ తడబడిపోయింది.

“అవును. కవితలెలా రాస్తారో నాకూ తెలియదు.” మొహమంతా ఎర్రబడుతూండగా అంది.

“కవితల గురించైతే మీరు, ఇదిగో ఈ రెన్నీ అమ్మాయినే అడగాలి. ఆవిడ చాలా కవితలు రాసారు.” మాల్కం ప్రకటించాడు.

“ఓ మాల్కం! ధూర్తుడా! నా రహస్యాన్నిలా అందరి ముందూ బయటపెడతావా! ఉండు నీ పని చెప్తా!” సంతోషాన్ని దాచుకుంటూ పైకి విసుక్కుంది ఎలీజా రెన్నీ.

“అవునా ఎలీజా? మీరు కవితలు రాస్తారా? ఇహ నాకు మీతో మాట్లాడాలన్నా భయం పట్టుకుంది. ఎల్సీ! నువ్వు కవితలూ కథలూ గట్రా రాయవు కాబట్టి నీ స్నేహమే బాగుంటుంది నాకు.” పరిహాసం చేసాడు బ్రాండన్.

“బ్రాండన్! కవితలు రాయడం అంత కష్టమేమీ కాదు. ఏదో ఒక ఆలోచన రావాలంతే!” ఎలీజా రెన్నీ అంది.

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మిరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఊదికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“ఆలోచనా? దేని గురించబ్బా? పెళ్ళా? ప్రేమా? ఆశా? నిరాశా? మృత్యువా? మీరు దేని గురించి రాస్తారు ఎలీజా?” బ్రాండన్ ఆమెనింకా ఉడికిస్తూన్నాడు.

“బ్రాండన్! మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. అన్నీ ఈ మాల్కం చెప్తున్న అబధ్ధాలు. నిజానికి నేనంత ఎక్కువగా రాసిందీ లేదు.”

“అలా కాదు. ఎలీజా, బ్రాండన్ గారికి నువ్వు కవితలతో తయారు చేసిన ఆల్బం చూపించు.” మాల్కం సూచించాడు.

ఎల్సీ కుతూహలంగా, “అవును చూపించండి. నేనూ చూస్తాను. నాకు కవితలు చదవడమంటే చాలా ఇష్టం,” అంది. ఎలీజా రెన్నీ నవ్వు మొహంతో,

“సరే అయితే! లైబ్రరీ గదిలోకి వెళ్దాం రండి. నేనసలు ఆ ఆల్బం ఎవరికీ చూపించను. అది చదివితే బ్రాండన్ గారికి కవితలు రాయడం పెద్ద కష్టమైన పనేమీ కాదని తెలిసొస్తుందని చూపిస్తున్నా, అంతే!” అంటూ ఎలీజా బయటికి దారితీసింది. ”

ఆల్బం తీసి వారికిస్తూ, “నేను రాసిన కవితలన్నిటి కిందా నా సంతకం, ఎల్లా, అని వుంటుంది.” అని బయటికెళ్ళిపోయింది.

ఎల్సీ, బ్రాండన్ అక్కడే సోఫాలో కుర్చుని ఆల్బం తెరిచారు.  దాన్లో కొన్ని ఎలీజాకి నచ్చిన వేరేవారి కవితలూ, కొన్ని ఆమె సొంతంగా రాసుకున్నా కవితలూ వున్నాయి. ఎల్సీ ఆత్రంగా ఎలీజా కవితలన్నీ గబ గబా చదివేసింది.

“అబ్బో! ఎంత బాగున్నాయో. ఇవన్నీ పత్రికల్లో వచ్చి వుంటాయంటావా? వీటన్నిటినీ ఒక పుస్తకం లా అచ్చేయించుకోలేదెందుకో!” బ్రాండన్ ఆశ్చర్యంగా అన్నాడు.

“ఎందుకంటే, కవితలు పత్రికల్లో ఒకటీ రెండూ ప్రచురించుకోవడం తేలిక. పుస్తకం అచ్చేయించాలంటే చాలా కష్టం.” ఎలీజా అతనికి వివరించింది

“అలాగా? అయినా అచ్చులో పేరు చూసుకోవడం బాగుంటుందేమో కదూ?”

ఏదో అనబోయి ఆగింది ఎల్సీ.  బ్రాండన్ ఇంకా కవితలు చదువుతూనే వున్నాడు.

ఒక కవిత చూపించి నవ్వాడు బ్రాండన్.

“ఇది చూడు. ‘బ్రతుకు ప్రయాణం’ అట. హాయిగా అమ్మా నాన్నలతో సురక్షితంగా జీవితం గడిపే ఎలీజా రెన్నీకి బ్రతుకు ప్రయాణం గురించి ఏం తెలుసు?”

“అవునవును! ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చిన వాళ్ళకే బ్రతుకు ప్రయాణం గురించి మాట్లాడే హక్కు వుంటుంది కాబోలు,” అతన్ని వెక్కిరించింది ఎల్సీ. నవ్వాడు బ్రాండన్.

“అదేం లేదులే. అయినా ఈ కవిత బాగానే వుంది.”

“గ్లాస్గో దాటి వెళ్ళని అమాయకురాలు రాసినా కూడా బాగుందా?”

“ఎలీజా రెన్నీ గ్లాస్గో దాటి వెళ్ళలేదు కాబట్టి ఆమె తెలివి తక్కువదని నేను తీర్మానించలేదు. అంత వెటకారం చెయ్యక్కర్లేదు. అయినా, నిజం చెప్పు. మీరిక్కడ సురక్షితంగా కాలం గడుపుతూ, మాకు  ప్రపంచం తెలుసంటే నమ్మేదెవరు?”

“మీరన్నదీ నిజమే. ఆడవాళ్ళం ఇల్లు దాటి ప్రపంచం చూడం. ఇహ ప్రపంచం గురించి మేం చెప్పేదేముంటుంది? అందుకే మగవాళ్ళకి ఆడవాళ్ళు రాసే పుస్తకాలంటే చులకన కాబోలు!” సాలోచనగా అంది ఎల్సీ.

“మీరు నేనన్నదానికి భలే విపరీతార్థాలు తీస్తున్నారే! నిజానికి నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం. ఎంత తక్కువ అవకాశాలు వున్నా, వాళ్ళు ప్రయత్నం మానరని. ఇహ పుస్తకాల గురించి నా అభిప్రాయలకసలు విలువే లేదు. నేను చదివిందే చాలా తక్కువ కాబట్టి. ఇప్పుడీ కవిత విషయమే తీసుకుందాం. నాకు బాగానే అనిపిస్తుంది. అయితే నిజానికి నాకు ఈ ముందు మూడు మాటలకీ అసలు అర్థమేమిటో కూడా తెలియదు! అయినా నాకు బాగుంది. ఎందుకు బాగుందంటే చెప్పలేను.”

“కవి పాఠకుడి నించి ఆశించేదీ అంతే. ”

“అంతేనా? నేనింకా కవులు ప్రబోధిస్తూ వుంటారనుకున్నానే. ఏమైనా, నాకు ఎక్కువగా చదువుకున్న ఆడవాళ్ళంటే కొంచెం భయం. ఈ మధ్య ఆడ పిల్లలూ, వాళ్ళ తెలివి తేటలూ, శక్తి సామర్థ్యాలు చూస్తూవుంటే నాలాటి వాళ్ళకి వొణుకొస్తూంది! కొంపదీసి నూవ్వూ బోలెడు చదువు చదివేసావా ఏమిటి?”

“అదేం లేదు. నేను చాలా మామూలు అమ్మాయిని.”

“నిజంగానా? అద్భుతంగా పియానో వాయించలేవూ?”

“ఉహూ! అసలు నాకు సంగీతమే రాదు.”

“పోనీ, అందమైన ప్రకృతి దృశ్యాలు గీయడం?”

“అబ్బే…”

“అయితే నువ్వు సైన్సూ, లెక్కల టైపన్న మాట! వాళ్ళంటే ఇంకా భయం నాకు.”

“మా మావయ్య నాకు సైన్సు చెప్పించాలని చాలా ప్రయత్నం చేసారు కానీ, నాకే అబ్బ లేదు.”

“ఇంత మంచి వార్త నేను ఈ జన్మ లో వినలేదు. నీముందు ఏ తప్పులు మాట్లాడతానో అని వణికిపోతూ వుండక్కర్లేదు.”

“మీరు తప్పు మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి సరి దిద్దితే అంత బాధ పడడానికేముంది? మీకది మంచిదేగా?”

“మంచిదే అనుకో! కానీ భలే అవమానంగా వుంటుంది. ఐనా, ఆడవాళ్ళు భలే కష్ట పడి పనిచేస్తారు. గంటలు గంటలు సంగీతం ఎలా సాధన చేస్తారో పాపం.”

“అక్కయ్య ఎప్పుడూ అంటుంది- ఆడవాళ్ళు వాళ్ళకి తేలికగా అబ్బని సంగీతం మీద అంత శ్రమా, సమయం వ్యర్థం చేస్తారూ, అని!”

 

(సశేషం)

 

వీలునామా-12 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సంభాషణ

ఫ్రాన్సిస్ పార్టీకి వెళ్ళే ముందే జేన్ ని కలవాలని ఆశపడ్డాడు. కానీ, అతను పెగ్గీ ఇల్లు చేరేటప్పటికి అక్కా చెల్లెళ్ళు బయటికెళ్ళారని తెలిసింది. దాంతో నిరాశగా రెన్నీ గారిల్లు చేరుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత జేన్, ఎల్సీ ఇద్దరూ విందుకు హాజరయ్యారు.

అతనికి వాళ్ళిద్దర్నీ చూడగానే చాలా సంతోషం వేసింది. నిజానికి వాళ్ళిద్దరూ పెద్ద అందగత్తెలు కాదు. ఇద్దర్లో కాస్త ఎల్సీ పర్వాలేదనిపిస్తుంది. జేన్ చాలా సాధారణంగా వుంటుంది. ఈ మధ్య తగిలిన ఎదురు దెబ్బలతో ఎల్సీ మొహం కొంచెం పెద్దరికాన్ని సంతరించుకుని బాగుంది. కానీ, ఫ్రాన్సిస్ కి జేన్ వంకే చూడాలనిపిస్తుంది. ఆమె మొహంలో అలసట నిరాశ చూసి అతనికి ఏదో తెలియని బాధ అనిపించింది. కనిపించగానే ఆమె చేతులు పట్టుకుని, అక్కడ మాట్లాడుకుందాం పద, అంటూ ఒక పక్కకి తీసికెళ్ళాడు. ఎల్సీ కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేసింది.

రెన్నీ గారి అమ్మాయి వచ్చి ఎల్సీని ఎవరికో పరిచయం చేస్తానని తీసికెళ్ళింది. మామూలుగా వుండే జెన్నీ కంటే కొంచెం చూపులకి నదురుగా వుండే ఎల్సీ కి స్నేహితులని చూపెట్టడం కష్టం కాదు, అనుకున్నారు రెన్నీ కుటుంబ సభ్యులు.

“తరచుగా ఉత్తరాలు రాసుకుంటూనే వున్నాం. ఇంకా కబుర్లేం వుంటాయి ఫ్రాన్సిస్?” చిరునవ్వుతో అంది జేన్.

“ఎన్ని ఉత్తరాలు రాసుకున్నా, కలుసుకునేటప్పుడు మాట్లాడుకోవడానికి బోలెడంత వుంటుంది. అసలు నీ వుత్తరం చూసినప్పుడల్లా నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి చెప్పు, నీ ఉద్యోగప్రయత్నాలెలా వున్నాయి?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ లేదు ఫ్రాన్సిస్. ఎల్సీకి ఆ మధ్య వచ్చిన ఉత్తరం చూసి కృంగి పోయింది. ఆ వుత్తరం మరీ మొరటుగా రాసారులే. పాపం దాన్ని చూస్తే జాలేసింది. ఇహ ఆ తర్వాత మొత్తానికే రాయడం మానేసింది.”

“మరి నీ సంగతి?”

“ఏముంది? ఏమీ లేదు. ఎవరైనా ప్రైవేటు చెప్పించుకుంటే బాగుండని ప్రయత్నించాను. అదీ దొరకలేదు. ఇహ బట్టల కొట్లో కుట్టు పని తప్ప ఇంకేదీ దొరికేటట్టు లేదు. ”

“అయ్యో! నీకెలా సాయపడాలో నాకర్థం కూడా కావడం లేదు.”

“అదేం లేదు ఫ్రాన్సిస్. నిజానికి నేనంత బాధల్లో ఏమీ లేను తెలుసా? నిజమే, భవిష్యత్తు తలచుకుంటే భయంగానే వుంది. కానీ, మరీ అంత నిరాశగా కూడా లేను. పెగ్గీ చాలా మంచిది. నన్ను చాలా విధాలా ఆదుకుంటూంది. అన్నిటికంటే నన్ను అభిమానంగా, గౌరవంగా చూస్తుంది. ఇహ పిల్లలయితే చెప్పనే అక్కర్లేదు. అందరికంటే తెలివైన వాడు టాం. చూస్తూ వుండు, వాడు ఎంత పెద్దవుతాడో. ఆడవాళ్ళకిమాకు పైకెదగడానికి అవకాశం వుండదు కాబట్టి,  పైకెదగాలన్న ఆశయం వున్న వాళ్ళని చూస్తే ఎక్కళ్ళేని సంతోషమూ! నాకెటూ అన్నదమ్ములో, భర్త గారో, కొడుకులో లేరు కదా! అందుకే నేను టాం లౌరీ భవిష్యత్తు గురించీ, నీ భవిష్యత్తు గురించీ కలలు కంటూ ఉంటాను.  నా మొహం చూసి నా కష్టాలు ఊహించుకోకు. సాయంత్రం పూట టాం, నాన్సీ లకి పాఠాలు చెప్పేటప్పుడు నన్ను చూడు! అప్పుడు అర్థమవుతుంది నేనెలాగున్నానో. ఇక్కడికొచ్చేసరికి నా పాత జీవితం అంతా ఙ్ఞప్తికొచ్చింది. అంతే!”

“నీ మాటలతో నా మనసు తేలికైంది జేన్. కానీ…”

“ప్రతీ సంఘటనలోనూ మంచీ చెడూ వుంటాయి ఫ్రాన్సిస్. ఈ సంగతి నేను అనుభవం మీద తెలుసుకున్నాను. కొంతమంది అన్ని సుఖాలూ, సౌకర్యాలూ వున్నా,  ఇంకా దేనికోసమో ఏడుస్తున్నట్టుంటారు. ఇంకొంతమంది దుర్భరమైన జీవితం లో కూడా అన్నీ వున్నట్టు ధీమాగా వుంటారు. దేన్నైనా మనం చూసే దృష్టిని బట్టి వుంటుంది. ఆ మధ్య నేనో పేదరాలిని చూసాను. ఆవిడకి లేని కష్టం లేదంటే నమ్ము!  అష్టకష్టాలూ పెట్టే భర్తా, స్వార్థపరులైన పిల్లలూ, పేదరికమూ, అనారోగ్యమూ! ఆమె సంతానంలో ఒక్క కొడుకు మాత్రం మూడు నెలలకోసారి వచ్చి కొంచెం డబ్బిచ్చి వెళ్తాడు. ఆవిడని చూస్తే, ఏ నమ్మకంతో ఆవిడ బ్రతుకీడుస్తుందా అని మనకే అనుమానం వేస్తుంది. కానీ ఆవిడ నవ్వు మొహం చూస్తే ఇప్పుడు నేను చెప్పిన దాన్లో ఒక్క మాట కూడా నమ్మలేవు నువ్వు! ఆవిడని చూసింతర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసింది. ఇంకా నాకు, ఆరోగ్యమూ, చదువూ, చిన్న వయసూ వున్నాయి. నేనింత నిరాశతో దిగజారిపోవడం ఏమిటి అనిపించింది. అది సరే కానీ, నువ్వు ఫ్రాన్స్, ఇంగ్లండు అంతా చుట్టి రావాలానుకున్నావు. చూసొచ్చావా? ప్రయాణం విశేషాలేమిటి?” కుతూహలంగా అడిగింది జేన్.

“ప్రయాణం బాగా జరిగింది. కొంచెం ఫ్రెంచి మాట్లాడడం కూడా నేర్చుకున్నాను. అన్నట్టు, మనం ఎస్టేట్లో ఒక ఉత్తరం చదివాం చూడు, ఫ్రెంచి మహిళ, మార్గరెట్! గుర్తుందా? ఆవిడ కూతురు క్లెమెన్స్ ని కలిసాను. ఇప్పుడావిడ శ్రీమతి లీనాయ్.”

“అవునా? ఏలా వుందావిడ?”

“చూడడానికి మామూలుగా వుంది కానీ, మాట్లాడితే భలే బాగుంది. సుతి మెత్తని యాసా, నాజూకూ, డబ్బున్న స్త్రీల హుందాతనమూ! నేనొక్కటి చెప్పనా? మన ఇంగ్లీషు యువతులంత అందంగా వుండరు ఫ్రెంచి అమ్మాయిలు. కానీ, వాళ్ళ సంభాషణా చాతుర్యంతో నెగ్గుకొస్తారు ఎక్కడైనా.”

“ఆవిడని ఎలా కలిసావు?”

“ఫ్రెంచి సొసైటీలో జొరబడడం ఇక్కడికంటే తేలిక. ఒక ఫ్రెంచి హోటల్లో ఒకాయన కనిపించాడు. నాన్నగారికి పాత స్నేహితుడట. నా పేరు చూసి నాన్న గారిని గురించి అడిగాడు. ఆ తర్వాత అతనితో ప్రతీ విందుకీ తీసికెళ్ళాడు. అసలు నాకు మనుషులతో మాట్లాడడమంటేనే సిగ్గూ, మొహమాటం. అలవాటు కూడ లేదాయె. సరే, మొత్తం మీద ఎలాగో నెట్టుకొచ్చాను. ”

“కొత్త వాళ్ళముందు అంత సిగ్గు పడడానికేముంది ఫ్రాన్సిస్? అయినా నీకు బాంకు లో ఎంతో మంది స్నేహితులుండాలిగా?”

“అవుననుకో! కానీ, ఆడవాళ్ళతో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందే. అందులోనూ, జేన్, ఇల్లూ వాకిలీ, కుటుంబమూ, అమ్మా నాన్నా లేని నాలాటి అనాథకి ఇతర్లతో స్నేహంగా మాట్లాడే అలవాటు ఎలా వుంటుంది చెప్పు? వింత ఏమిటో తెలుసా? అందరూ ఇప్పుడు నా తండ్రెవరో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చాలా సంతోషంగా దర్జాగా వున్నాననుకుంటారు. కానీ నాకెందుకో ఇంకా సిగ్గుగా మొహమాటంగానే అనిపిస్తుంది.”

“నేనూ నువ్వు సంతోషించి వుంటావనే అనుకున్నా మరి!”

“నన్ను కన్న తల్లీ తండ్రులు ఒకర్నొకరు ప్రేమించుకోలేదు. మోసం చేసుకున్నారు. నన్ను కన్న తల్లికి నా మీద ప్రేమ లేదు. నా తండ్రికి నా పట్ల బాధ్యత తప్ప మరేమీ లేదు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు లేకపోగా అలవిమాలిన అసహ్యం. నా పరిస్థితి నీకర్థం కాదు. నా వునికే నాకు చాలా అవమానకరంగా తోస్తుంది. ”

“అమ్మా నాన్నల మధ్య వుండే ప్రేమలతోటే మన ఆత్మ గౌరవాలు ముడి పడి వున్నట్టయితే, నా పరిస్థితీ అంతే మరి. మేము పుట్టిన కొన్నేళ్ళకే అమ్మ మనసులో నాన్న పట్ల ప్రేమ చచ్చిపోయింది. ఆయనకైతే స్వార్థం తప్ప ఆమె మీద ప్రేమ ఎన్నడూ లేదు. అందుకే అలాటి ఆలోచనలు మానేద్దాం. అమ్మా నాన్నల మాటెలా వున్నా మనం దేవుని బిడ్డలం. ఆయన ప్రేమ అందరికీ అందుతుంది కాబట్టి దాంతో తృప్తి పడదాం. ఇంతకీ క్లెమెన్స్ తల్లి గురించి నీతో మాట్లాడిందా?”

“మాట్లాడింది. తన తల్లికి నా పేరే వున్న స్నేహితుడు వుండేవాడనీ, ఆ స్నేహితుడు మా నాన్నేననీ తెలిసి చాలా సంతోషించింది. తల్లి చిత్తరువు కూడ చూపించింది.”

“అయితే ఫ్రాన్సులో చాలా సరదాగా గడిచిందన్నమాట.”

“అవును! అందులో ఫ్రెంచి వాళ్ళ మాటలు, అబ్బో! ఏం చెప్పమంటావు. హాస్యమూ, చమత్కారమూ నిండి వుంటాయి. పెద్దగా వాదించుకోరు కానీ, అభిప్రాయాలు బానే ఇచ్చి పుచ్చుకుంటారు. వాళ్ళకి రాజకీయ స్వాతంత్ర్యం లెదని మనమేదో జాలి పడతాం కానీ, నాకైతే వాళ్ళకి భావ స్వాతంత్ర్యం చాలా వుందనిపించింది. అక్కడ చిన్న రైతులు వుంటారు. మన దగ్గరేమో చిన్న రైతులన్నవాళ్ళే కనబడరు. అంతా మోతుబర్లు, మిగతా వాళ్ళు రైతు కూలీలు. ఈ రైతు కూలీల పరిస్థితి ఎంత దయనీయంగా వుంటుందో తెలుసా? మన దగ్గర కూడా రైతు కూలీలకి చిన్న చిన్న పొలాలిస్తే వ్యవసాయం బాగు పడొచ్చేమో!”

“అదేమిటి ఫ్రాన్సిస్? చిన్న చిన్న పొలాలౌ ఆర్థికంగా మంచి కాదంటారు కదా? మరీ మన బ్రిటన్ లాటి కిక్కిరిసిన దేశంలో పెద్ద పొలాలు సాగు చేయడంలోనే లాభముందేమో! అప్పుడు డబ్బూ, యంత్రాలూ, మానవ వనరులూ ఎక్కువ అవసరం వుండదు కదా?”

“అవును. ఇక్కడంతా అలాగే అనుకుంటాం. ఫ్రాన్సు లో వేరేలా ఆలోచిస్తారు. ఒక భూస్వామి దగ్గర వంద ఎకరాలున్నాయనుకో. దాన్ని యాభై మంది రైతుకూలీలు సాగు చేస్తున్నారనుకో. ఆ పొలానికి తాము స్వంతదార్లం కాదన్న నిరాసక్తత వుంటుంది వాళ్ళలో. అదే వాళ్ళకి తాము తలా రెండెకరాలు కొనుక్కోవచ్చు అని చెప్పామనుకో. అదే భూమిలో కష్టపడి బంగారం పండిస్తారు. అందుకే అన్నారు-‘ ఏడేళ్ళు పొలానికి కౌలుకిస్తే, తోటలాటి భూమి కూడా బీడు పడిపోతుంది. అదే మనిషికి సొంతానికి ఎడారి లాటి భుమినిచ్చినా, ఏడేళ్లలో దాన్ని నందనవనంలా మార్చగలడూ- అని! అదే ఆలోచన అమలులో పెట్టాలనుకుంటున్నాను.”

“ఏమిటది?”

“మన ఎస్టేటులో గుట్ట వెనకాల ఊరికే స్థలం పడి వుంది చూడు, దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి పాలేర్లలో కష్టపడే వాళ్ళకి ఇద్దామనుకుంటున్నా. పదేళ్ళలో వాళ్ళు దాన్లో మంచి పంట పండించగలిగితే, అది వాళ్ళే వుంచేసుకోగలిగే ఒప్పందం మీద. ఆ మాటకొస్తే నీకసలు రెండు ఆలొచనలు చెప్దామనుకున్నా.”

“బాగుంది. రెండో ఆలోచన ఏమిటి? చెప్పు చెప్పు!”

“ముందుగా పొలంలో పని చేసే పాలేర్లందరికీ చిన్న ఇళ్ళు కట్టిద్దామనుకుంటున్నా. ఎప్పుడైనా ఆ పాలేర్ల ఇళ్ళు చుసావా? దుర్భరంగా వుంటాయి. భూస్వాములూ, రైతులూ మంచి ఇళ్ళు కట్టుకుంటారు కానీ, కొంచెం కూడా ఆ పాలేర్ల సంగతి పట్టించుకోరు. అందుకే ఇంకొంచెం శుభ్రంగా వసతిగా వుండే చిన్న ఇళ్ళు ప్లానులు గీయించి పట్టుకొచ్చాను. తర్వాత చూపిస్తాను.”

“పెగ్గీ అభిప్రాయం కనుక్కుందాం. తను అలాటి ఇళ్ళల్లోనే పెరిగింది కాబట్టి తన అభిప్రాయం నమ్మదగ్గదై ఉండొచ్చు.”

“నిజానికి అలా చిన్న ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి పెద్ద డబ్బు కూడా ఖర్చు కాదు తెలుసా? ఆ మధ్య చామర్స్ గారు నన్ను భవంతిని కొంచెం మార్చమనీ, కొన్ని కొత్త గదులు కట్టించమనీ సలహా ఇచ్చారు. అప్పుడనిపించింది, అదే డబ్బుతో ముఫ్ఫై కూలీలకి చిన్న యిళ్ళు కట్టించొచ్చు కదా అని! దీన్లో ఇంకొక ఆలోచన కూడా వుంది. మన స్కాట్ లాండు నుంచి ఎంత మంది అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారో తెలుసా? మరీ ఆస్ట్రేలియాలో బంగారం కొరకు మన దేశం నుంచి కష్టపడగలిగే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఇలాగే ఇంకొంత కాలం సాగితే ఇక్కడ పనికొచ్చేవాళ్ళెవరూ మిగలరేమో. అందుకే కనీసం నా పరిధిలోనేను పని వాళ్ళ పరిస్థితులు మెరుగు చేద్దామని ఆలోచిస్తున్నాను. నన్ను చూసి నాలా ఇంకొందరు చేయొచ్చు కదా? నువ్వేమంటావు?”

“నిన్ను చూసి నలుగురు చేసినా చేయకపోయినా, నీ ఆలోచన చాలా గొప్పది ఫ్రాన్సిస్!” మనస్ఫూర్తిగా అంది జేన్.

“సరే! ఎవరెవరికి ఇళ్ళు ఇవ్వదలచానో, ఎవరెవరికి భూమి ఇవ్వదలచానో పట్టిక రాసి వుంచాను. ఒక్కసారి నువ్వు చూసి నీ అభిప్రాయం చెపితే…”

“చాలా మంచి ఆలోచన ఫ్రాన్సిస్! మావయ్య నిన్ను ఆస్తికంతా హక్కుదారుణ్ణి చేసి మంచి పని చేసాడనిపిస్తుంది.”

ఇంకేదో చెప్పబోయిన జేన్, చాలా పరిచితమైన గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది.

విలియం డాల్జెల్ రెన్నీ దంపతులని పలకరించి, కొంచెం ఇబ్బందిగా వున్న మొహం తో ఎల్సీతో మాట్లాడుతున్నాడు.

“రెన్నీ గారికి విలియం ఎలా తెలుసు?” ఫ్రాన్సిస్ ని అడిగింది జేన్.

“రెన్నీ వాళ్ళు అక్కడ ఎస్టేటు చూడడానికి వచ్చినప్పుడు చుట్టు పక్కల అంతా పరిచయం అయ్యారు. ఒక్క క్షణం జేన్! ఇప్పుడే వస్తాను. రెన్నీ గారి అమ్మాయితో ఒక్క డాన్సు చేస్తానని మాటిచ్చాను. మళ్ళీ వస్తా!”

ఫ్రాన్సిస్ లేచి ఎలీజా దగ్గరకెళ్ళాడు.  ఎలీజా పక్కన విలియం డాల్జెల్ తో పాటు ఇంకొక అతను కూడా వున్నాడు.

“ మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఈ డాన్సు నేను ఫ్రాన్సిస్ హొగార్త్ తో చేస్తానని మాటిచ్చాను. కానీ మీ ఇద్దరితో డాన్సు చేయడానికి అందమైన అమ్మాయిలని వెదికే బాధ్యత నాది. సరేనా, ఇక్కడే వుండండి, ఒక్క క్షణం లో వస్తా! ”

అంటూ వెళ్ళింది ఎలీజా. రెండు నిమిషాల్లో లారా విల్సన్ ని అక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితురాలు లారా విల్సన్. బోలెడంత డబ్బూ, కొంచెం చదువూ వున్నవి కానీ, తెలివితేటలు తక్కువ. ఈ పార్టీకి ప్రత్యేకంగా ముస్తాబయి వచ్చింది. ఆమెతో డాన్సు చేయడానికి విలియం వెళ్ళాడు.

“ఫ్రాన్సిస్! మీ కజిన్ ఎలీసా ఈ కొత్త వ్యక్తితో డాన్సు చేస్తుందంటావా? జేన్ అయితే భలే సీరియస్ గా వుంటుంది. ఆమెని అడిగితే ప్రయోజనం వుండదు. ఎలీసాని ఇతనికి పరిచయం చేస్తా..” గుసగుసగా ఫ్రాన్సిస్ తో చెప్పి ఆ కొత్త వ్యక్తి చేయి పట్టుకొని ఎలీసాని వెతుక్కుంటూ బయల్దేరింది ఎలీజా.

ఆస్ట్రేలియానించి కొద్ది రోజుల క్రితమే వచ్చిన బ్రాండన్ కి  ఎల్సీని పరిచయం చేసింది ఎలీజా రెన్నీ.

(సశేషం)

వీలునామా -11 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి) 

ఎల్సీ ప్రయత్నం

 

ఎల్సీ మనసు రెండో రోజుకి కొంచెం కుదుట పడింది.

రోజూ ఉదయాన్నే లేచి అక్క చెల్లెళ్ళిద్దరూ కాసేపు షికారెళ్ళి రావడం మొదలు పెట్టారు. దాంతో కాస్త మనసు సర్దుకునేసరికి, ఎల్సీ రాసుకోవడనికి కాగితాలు ముందేసుకుని కూర్చుంటుంది. జేన్ ఉద్యోగ ప్రయత్నాలకి బయటికి వెళ్తుంది.

ప్రతీ రోజూ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం అయినా జేన్ ఉద్యోగ ప్రయత్నాలు అంతగా కలిసి రాలేదు. ఊరికే వుండడం ఇష్టం లేక పెగ్గీకి సహాయం చేస్తూనే వుంది జేన్. పిల్లల పనులు చూడడం, వాళ్ళకి సాయంత్రాలు చదువు చెప్పడం చేయసాగింది. కొద్ది రోజుల్లోనే పిల్లల చదువులు మెరుగవడం గమనించి చాలా సంతోష పడింది పెగ్గీ! అందరికంటే పెద్దవాడు టాం జేన్ దగ్గర బాగా చదువుకోవడం అలవాటు చేసుకున్నాడు.

జేన్ మెల్లి మెల్లగా ఆ పిల్లలు చేసే అల్లరికీ, ఇంట్లో వుండే శబ్దాలకీ అలవాటు పడసాగింది. ఆమెకి బెస్సీ పిల్లలు అయిదుగురూ భలే తెలివైన వాళ్ళనిపించింది. టాం ఎలాగైనా పెద్ద చదువులు చదవాలనీ, మంచి ఉదోగం సంపాదించుకోవాలనీ పట్టుదలగా వున్నాడు.

చదువుకుంటూనే ఒక చిన్న కార్ఖానాలో తీరిక వేళల్లో పని చేయటం మొదలు పెట్టాడు టాం. అక్కడ వాడి కొచ్చే ప్రశ్నలకెవరూ సమాధానం చెప్పేవారు కాదు. అవన్నిటి గురించీ జేన్ తో చర్చించడం వాడికెంతో నచ్చేది. వాడి పట్టుదలా, శ్రధ్ధా జేన్ కెంతో ముచ్చటగా అనిపించేవి.

ఈ ప్రపంచంలో తన అవసరం వున్న మనిషి ఒకరైనా వున్నారన్నమాట అనుకుంది జేన్. అలాగే పెగ్గీ ఆశ ప్రకారం మిగతా పిల్లలకి చక్కగా రాయడం నేర్పించింది జేన్.

జేన్ ప్రభావం ఆ పిల్లల మీద బాగానే పడి, వాళ్ళు తమ మొరటు ప్రవర్తన వదిళేసి ఆమెలా హుందాగా, నాజూగ్గా ప్రవర్తించడం నేర్చుకోసాగారు. పెగ్గీకి ఎప్పుడూ ఏదో ఒక అవసరం వున్న వాళ్ళకి సహాయం చేసే అలవాటు పోలేదు. అలాటి అసహాయులందరినీ తరచూ ఇంటికి తీసుకొస్తూండేది.

అలాటి వారికి సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేకపోవడం వల్ల సిగ్గు పడేది జేన్. అయితే అవసరంలో వున్న మనిషికి సహాయం చేయడానికి డబ్బొక్కటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు వున్నయని కాల క్రమేణా తెలుసుకుంది జేన్. వచ్చిన వారికి చిన్న చిన్న పనులుంటే చేసి పెట్టడం, సలహాలివ్వడం, కాగితాలు రాసి పెట్టడం మొదలైన చాలా పనులు చాలా సులువుగా చేయగలిగేది జేన్.

అయినా ఏదో రకంగా డబ్బు సంపాదించి తననీ చెల్లెల్నీ పోషించుకోవాలన్న దిగులు మాత్రం వదలడంలేదామెని. తనకేమో ఉద్యోగం దొరకడం లేదు. చెల్లెలి కవితల పుస్తకం ఎవరైనా ప్రచురించి కొంచెం డబ్బిస్తే బాగుండు. ఎన్నాళ్ళిలా పెగ్గీ దయా ధర్మాల మీద ఆధారపడి వుండడం, అనుకుందామె.

మొత్తం మీద ఎల్సీ ఒక పుస్తకంలో వెయ్యగ్లిగేన్ని కవితలు రాసిందని అనిపించేక, వాటిని పట్టుకుని పబిషరు దగ్గరికెళ్ళారిద్దరూ. ఆయన ఇంతకు ముందు, “ఆడపిల్లలు ఏదైనా రాసిస్తే ప్రచురించడం తేలిక” అన్నారని గుర్తు జేన్ కి.

పది రోజుల తర్వాత, “ఈ కవితలు బాగానే వున్నా, పుస్తకం లా ప్రచురించేంత బాగా లేవు,” అని ఉత్తరం వచ్చింది ఎల్సీ కి. ఆ ఉత్తరం చదివి ఎల్సీ కృంగిపోయింది.      నిరాశపడ్డ చెల్లెల్ని జేన్ ఓదార్చింది. ఎడిన్ బరో లోని ప్రచురణ సంస్థలు కాకుండా లండన్ పంపిద్దామని సూచించింది జేన్. ఎల్సీ మళ్ళీ ఉత్సాహంతో తన కవితలు లండన్ లోని ప్రచురణాలయాలకి పంపింది. అందరి దగ్గర్నించీ ఒకటే మాట!

“కవితలు బాగానే వున్నా, పుస్తకంలా ప్రచురించేంత బాగాలేవు, క్షమించవలసింది….” అంటూ.

కొన్ని ఉత్తరాలు సంక్షిప్తంగా వుంటే, కొన్ని సుదీర్ఘంగా వుండేవి.

“…మా దగ్గర లెక్కకు మించి కవితా సంకలనాలున్నా, మేము కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అత్యంత శ్రధ్ధతో పరిశీలించాము. మా సంపాదకుడి అభిప్రాయం ప్రకారం అవి ప్రచురణకి ఇంకా సిధ్ధంగా లేక పోవదం మూలాన, వాటిని సంకలనంగా వేయలేమని చెప్పుటకు చింతిస్తున్నాము…” అంటూనో, లేక

“….కుమారి ఎల్సీ మెల్విల్ కవితలు అక్కడక్కడ బానే వున్నా, వాటిల్లో అన్నిట్లో ఒకటే ముఖ్యాంశం అవడం వల్ల పాఠకుడికి ఆసక్తి కలిగించలేవు. అందుచేత వాటిని ప్రచురించడం వీలుపడదని చెప్పుటకు చింతిస్తున్నాము….”

అంటూనో వుండేవి.

అలాటి లేఖ వచ్చిన ప్రతీసారీ, ఎల్సీ కృంగిపోయేది. సంక్షిప్తంగా వున్న లేఖలకంటే సుదీర్ఘ విమర్శలు ఎల్సీని ఎక్కువ బాధించేవి.

నిజానికి ఎల్సీ కవితల్లో భాషా సౌందర్యం, వ్యక్తీకరణలో నాజూకు తక్కువే. అయితే భావంలో గాఢత వుండేది. జీవితానుభవం ఇంకొంచెం వస్తే, ఎల్సీ చక్కటి కవయిత్రి కాగలదు. అయితే ఆ సంగతి ఆమెకి తెలియక పోవడం వల్ల తనకసలు భవిష్యత్తే లేదనుకుని నిరాశపడింది.

తన కవితల రాతప్రతిని ఒక సంచీలో పెట్టి డెస్కులో పడేసింది. ఇక కవితల జోలికీ, పుస్తకాల జోలికీ పోగూడదనుకొంది.

“జేన్! నితో పాటు నేనూ పెగ్గీకి సాయంగా బట్టలు ఇస్త్రీ చేస్తాను. బట్టలు కుట్టడం కూడా ప్రారంభిస్తాను. అనవసరంగా డబ్బంతా పోస్టు మీదా, కాగితాల మీదా దండగ చేసాను. ఇహ ఏదైనా పని వెతుక్కుని నీ కష్టం తగ్గిస్తాను.” అన్నదే కానీ పాపం ఆమె కళ్ళు కన్నీళ్ళతో నిండి పోయాయి. అన్నట్టే బట్టలు కుట్టడంలోనూ, ఇస్త్రీలు చేయడంలోనూ నిమగ్నమైపోయింది ఎల్సీ.

వున్నట్టుండి ఒకరోజు రెండు వుత్తరాలు వచ్చాయి వారి పేరిట. ఒకటి ఫ్రాన్సిస్ దగ్గర్నించయితే, రెండోది రెన్నీ గారి దగ్గర్నించి.

రెన్నీ గారు ఇస్తోన్న కొత్త సంవత్సరం పార్టీకి తాను ఎడిన్ బరో వస్తున్నట్టూ, వచ్చి తప్పక వాళ్ళను కలుసుకుంటాననీ ఫ్రాన్సిస్ రాసాడు. రెన్నీ గారి దగ్గర్నించి పార్టీకి రమ్మన్న ఆహ్వానం వుంది.

కాస్త ఆ పార్టీకి వెళ్ళి నలుగురితో మాట్లాడితే మనసులు కుదుటపడొచ్చు.

పార్టీకోసం అక్కకి కొత్త గౌను కుట్టడం మొదలు పెట్టింది ఎల్సీ. ఈ మధ్య కాలంలో జేన్ చిక్కిపోయి మొహం పాలిపోయింది. అయినా ఎల్సీ కళ్ళకి అక్క అందంగానే అనిపించింది.

 

(సశేషం)

 

 

 

 

 

వీలునామా – 10 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

బ్రాండన్ గారికి పెద్ద పెట్టున జ్వరం కాసింది. పగలూ రాత్రీ ఆయన సేవలోనే గడిచిపోయేవి నాకు. పాపం తిండి తినడానికి కూడా ఓపిక లేక, జావ తాగిస్తే తాగేవారు. అలా కొన్ని వారాల తర్వాత నెమ్మదిగా కొలుకున్నారు. ఒకరోజు కుర్చీలో విశ్రాంతి గా కూర్చుని ఏదో పని చూసుకుంటున్న నాతో ఒక మాటన్నారు. ఇంకా పెళ్ళిళ్ళు కాని ఆడపిల్లలు, మీతో ఆ మాటలేమిటో నేను చెప్పలేను కానీ, ఆ మాటలు నాకెంతో కోపం తెప్పించాయి. ఒక్క నిముషం మాట్లాడలేకపోయాను. ఎలాగో కూడ దీసుకుని,

“అలాటి మాటలు మీరనా వద్దు. నేను వినా వద్దు. అయినా, ఇలాటి పాడు ఉద్దేశ్యాలు నన్నీ ఊరు తెచ్చినప్పుడు మీకు లేవు. అందుకే వూరుకుంటున్నాను,” అన్నాను.

“అంత కోపపడకు పెగ్గీ! నువ్వు రావడం వల్ల నాకెంత హాయిగా వుందో నీకు తెలియదు. అందుకే…”

“అవునా? మీకు నామీదున్న గౌరవాన్ని చూపించడానికి ఇది మార్గం కాదనుకుంటా!”

“జార్జి పెళ్ళాడమంటే వద్దన్నావట. దాంతో నీ చూపు ఇంకా పైనుందేమో ననుకున్నాను.”

“జార్జి కంటే మంచివాళ్ళూ, గౌరవనీయులూ నాకైతే ఇంతవరకూ కనబడలేదు. కాబట్టి పెళ్ళాడనే దల్చుకుంటే అతన్నే పెళ్ళాడతాలెండి. మీకంటే జార్జి చాలా మర్యాదస్తుడు. అతను నన్ను పెళ్ళాడతానన్నాడు. మీలా…”

“సరే అయితే! పెగ్గీ! నేనూ అదే మాటంటాను. చెప్పు, నన్ను పెళ్ళాడతావా?”

“లేదండీ! నా స్థాయికి మించిన మగవాళ్ళతో నేను నెగ్గుకురాలేను. పెళ్ళి చేసుకునే రోజు వస్తే, నా స్థాయికి తగ్గ మగవాణ్ణే చేసుకుంటాను.”

నా మాటలు విని పెద్దగా నవ్వేసాడాయన.

“ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పెగ్గీ, నువ్వు తెలివి కలదానివి సుమా! నిజమే. నువ్వెంత మంచి పిల్లవైనా, నిన్ను తీసుకెళ్ళి నా కాబోయే భార్యగా మా అమ్మకీ, నాన్నకీ ఎలా పరిచయం చేస్తాను? సరే, ఎప్పటికైనా జార్జిని నువ్వు పెళ్ళాడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తాను.”

అంతే అమ్మాయిగారూ! నిజంగానే నాకు జార్జికంటే ఎక్కువగా ఎవరూ నచ్చలేదు. పాపం, నన్నెంతో ఆపేక్షగా కనిపెట్టుకుని వుండేవాడు. నేను సరిగ్గా ఆలోచించుకొనేలోపే నాకు బర్రాగాంగ్ వదలాల్సొచ్చింది. అక్కడే ఇంకో ఆరునెలలు వుండి వుంటే జార్జితో నా పెళ్ళి జరిగి వుండేదేమో.

మేముండే వూరికి ఇరవై మైళ్ళ దూరంలో బ్రాండన్ గారి స్నేహితుడు ఫిలిప్ గారు వుండేవారు. ఆయనది ఇంకా పెద్ద పొలమూ, పెద్ద పశుసంపదా! ఆయన భార్యకి ప్రసవించే రోజులు దగ్గరకొచ్చాయి. అందుకని ఆయన ముందే మెల్బోర్న్ నించి ఒక నర్సును ఏర్పాటు చేసుకున్నారు కానీ, ఆ నర్సు ఆఖరి నిముషంలో రానంది. ఇంకో మనిషిని ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు. నీళ్ళాడ పొద్దుల మనిషి! అందుకని పురిటి వరకూ తోడుండడానికి నన్ను పంపమని బ్రాండన్ గార్ని బ్రతిమాలారాయన.

పురుడు జరిగి తల్లి కొంచెం కొలుకోగానే నన్ను వెనక్కి పంపే షరతు మీద నన్నక్కడికి వెళ్ళమన్నారు బ్రాండన్ గారు. అక్కడ నిజానికి ఇంకో పని అమ్మాయి వుంది, కానీ ఆ పిల్లకసలేమైనా పనొచ్చో రాదో అనిపించింది నాకు.

ఫిలిప్ గారి శ్రీమతి (వాళ్ళ పెళ్ళయి అప్పటికి యేడాది అయిందిట) మంచిదే. సౌమ్యురాలు. పని వాళ్ళతో పని చేయించుకోవడం తెలియదావిడకి. మౌనంగా ఒక కుర్చీలో కూర్చుని వుండే వారు. నేను వెళ్ళిన కొద్ది రోజులకే ఆవిడ ప్రసవించి ఒక పాపాయిని కన్నది.

తల్లేమో కానీ, తండ్రి మాత్రం ఆ పాపాయిని చూసి పొంగిపోయాడు. బుల్లి ఎమిలీ ని చూసిన దగ్గర్నించీ ఆయనకి వేరే ప్రపంచమే లేకుండా పోయింది. అంత పెద్దాయన బవిరి గడ్డంతో మొగ్గలాటి కూతుర్ని ఎత్తుకోని, ముద్దు పెట్టుకోవడం, దానితో పాపాయి భాషలోనే గంటల తరబడి మాట్లాడడం, అందరినీ పిలిచి పాపాయి గురించి కబుర్లు చెప్పడం చూస్తే నాకైతే నవ్వాగేది కాదు. పిల్లలని అంత ప్రేమించే తండ్రిని ఇంతవరకూ చూడలేదు.

ఫిలిప్ గారి శ్రీమతితో వేగడం కొంచెం కష్టమే అనిపించింది. బాలింతరాలి సంరక్షణ అంటే మాటలా? జలుబు చేయకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి! పథ్యం వంట కూడా చేయాలాయే! కానీ, ఆవిడ నా ప్రతీ మాటనీ పెడ చెవిన పెట్టేది. మీ స్కాట్ లాండ్ లో జలుబూ పడిశం పదతాయి కానీ, ఈ ఆస్ట్రేలియాలో ఏమీ కాదు అనేది. పథ్యం విషయంలోను అంతే. ఫిలిప్ గారి కేమో ఆమెతో వాదించే ఓపిక లేక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపొమ్మనేవారు. తల్లీ పిల్లల పనితో నా ఒళ్ళు హూనమైపోయింది.

అప్పటికి నాకు బ్రాండన్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలనిపించసాగింది. ఫిలిప్ గారి భార్యకి కూడా నన్ను పంపాలనే అనిపించింది. తనకి తోచినట్టు చేయడమే తప్ప, ఇంకోరు చెప్తే నచ్చదావిడకి! కానీ విచిత్రంగా, ఫిలిప్ గారు నన్ను ఇంకొన్నాళ్ళుండి పాపని చూసుకొమ్మని బ్రతిమిలాడారు.  నన్ను ఇంటికి తీసికెడదామని వచ్చిన జార్జితో అదేమాటన్నాడాయన. నేనూ వుండిపోదామనుకున్నాను. దాంతో జార్జికి ఎక్కళ్ళేని కోపమొచ్చింది. ఆ చంటి దాని మూలంగానే నేను ఫిలిప్ గారి ఇంట్లో వుంటున్నానని దాని మీద కోపం పెంచుకున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది.

ఒక్క చంటి పాపనే భరించలేని వాడు నాకు చుట్టుకున్న బెస్సీ పిల్లలయిదుగుర్ని ఎలా భరిస్తాడు? నాకంటూ ఇల్లొకటి ఏర్పడితే అందులో బెస్సీ పిల్లలకెప్పుడూ చోటుండాలి! ఆ కోరికలో తప్పేం వుంది చెప్పండి? అందుకే జార్జిని ఆ తర్వాత దూరంగా వుంచేసాను.

ఫిలిప్ గారింట్లో దాదాపు యేణ్ణర్ధం వున్నాను. అమ్మగారు నాతో సర్దుకు పోవడం నేర్చుకున్నారు. అక్కడ మగవాళ్ళు నన్నెక్కువ బాధించలేదు. ఎందుకంటే నాకంటే చిన్నదయిన మార్తా వుండబట్టి. కొన్నళ్ళకి మార్తా పెళ్ళయిపోయింది.

“నీ అక్క పిల్లల కోసం నీ భవిష్యత్తు పాడు చేసుకోకు పెగ్గీ!” అని అప్పుడప్పుడూ అన్నా, ఫిలిప్ గారు బెస్సీ పిల్లల పట్ల నా బాధ్యత అర్థం చేసుకున్నారు. ఆయన భార్య మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి పురిటికి మెల్బోర్న్ వెళ్తానని ఎంతో గోల చేసింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. అక్కణ్ణించి డాక్టరుని ఇంటికే రప్పిస్తానని అన్నారు. అన్నట్టే ఒక డాక్టరు పురిటి వరకూ అక్కడుండడానికి వచ్చాడు. నాకెందుకో ఆ డాక్టరు వాలకం అంతగా నచ్చలేదు.

ఫిలిప్ గారు నాతో, “పెగ్గీ! ఆయన మంచి డాక్టరే కానీ, కొంచెం తాగుబోతు. అందుకని ఆయనకి మన ఇంట్లో వుండే మద్యం సీసాలు కనబడనీయకు. అన్నట్టు, ఈ సంగతి అమ్మగారితో అనకు!” అన్నారు రహస్యంగా. ఆయన చెప్పినట్టే నేను ఆ డాక్టరు కార్టర్ గారిని వేయి కళ్ళతో కనిపెడుతూ వచ్చాను. దాదాపు రెండు వారాలు, ఆయనా బానే వున్నారు. కానీ ఆ తర్వాత ఇహ తట్టుకోలేకపోయారు. రాత్రంతా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేసే వాడు! మనిషి పాపం దిగాలుగా నీరసంగా అయిపోయాడు.

ఒక రోజు అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. డాక్టర్ని పిలుద్దామని పైకి వెళ్తే, ఏముంది! ఎక్కడ సంపాదించాడో కానీ,   బ్రాండీ బాటిలు ఒకటి మొత్తం ఖాళీ చేసేసాడు. నేల మీద మత్తుగా పడి నిద్ర పోతున్నాడు. వైను బాటిల్లుండే సెల్లార్ తాళాలు నా దగ్గరే వున్నవి. మరి ఈయన ఇదెక్కడినించి సంపాదించాడో నాకర్థం కాలేదు. ఎందుకంటే, ఆ పల్లెటూళ్ళో బయట టీ దొరికితే మహా ఎక్కువ! తరవాత తెలిసింది, ఒక నౌకరును నలభై మైళ్ళు పంపించి తెప్పించాడట! అయ్యగారు ఆ నౌకరును పనిలోంచి తీసేసారులెండి!

సరే, అదలా వుంచి, అమ్మగారికి నొప్పులొస్తున్నాయని లేపి చెప్పాను. ఎలాగో కళ్ళు తెరిచి పురుడు అయ్యిందనిపించాడు. ఆడపిల్ల, హేరియట్ అని పేరు పెట్టారు. రెండు వారాలయింది. ఇహ మెల్లిగా పంపించేద్దామనుకున్నారు ఫిలిప్ గారు.

వున్నట్టుండి ఒక రోజు మళ్ళీ తాగొచ్చాడు డాక్టర్ కార్టర్. పాపం, పడుకోని వున్న అమ్మగార్ని తన పెడ బొబ్బలతో భయ పెట్టాడు. పాపం, బాలింతరాలు, గజ గజా వణికిపోయింది. అతన్ని ఎలాగైనా బయటికి పంపని అడిగింది నన్ను.

నేను మెల్లగా మంచి మాటలు చెప్పి అతన్ని బయటికి తిసికెళ్ళాను. ఏదేదో సణుగుతూ అక్కడే వున్న గుర్రానెక్కి వెళ్ళిపోయాడతను. ఈ గుర్రం మీద వుంటాడా, కింద పడిపోతాడా అని నేను ఆలోచిస్తూండగానే ఒక నౌకరు, జిం ,పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“పెగ్గీ! మంటలు! ఇల్లంటుకుంటోంది!” వగరుస్తూ అన్నాడు. నా పై ప్రాణాలు పైనే పోయాయి. కిటికీలోంచి బయటికి చూసాను. దూరంగా మంటలు కనిపిస్తున్నాయి. దగ్గరకొచ్చాయంటే మా పని అయిపొతుంది. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు, చంటి పిల్ల తల్లీ! ఇంట్లో నేనూ, మార్తా, జిం మాత్రమే వున్నాం. అదృష్టవశాత్తూ, అమ్మగారూ, పిల్లలూ నిద్రపోతున్నారు. గబగబా మార్తానీ, జిం నీ పిలిచాను. మంటలార్పడనికి నీళ్ళూ బకెట్లూ తీసుకురమ్మన్నాను. మార్తా భయపడ్డది కానీ, తేరుకొని బాగా సహాయం చేసింది. ఆ డాక్టరు సిగరెట్టు కాల్చి ఎండు గడ్డి మిద పడేసినట్టున్నాడు. అంటుకుంది. గాలి వల్ల మంట తొందరగా పెద్దవసాగింది. మాకెటూ పాలుపోలేదు.

దూరంగా గుర్రం మిద ఒక మనిషి రావడం చుసాను. అమ్మయ్య, ఫిలిప్ గారొస్తున్నారనుకున్నాను. తీరా చూస్తే, వచ్చింది బ్రాండన్ గారు. వచ్చీ రావడమే మంటలు చూసి వాటినార్పే పన్లో పడ్డారు. ఆయన సాయంతో తొందరగానే మంటలార్పేసాము. గొర్రెలు బోలెడు మంటల్లో కాలి చచ్చిపోయాయి.

మర్నాడు ఆ పొలాన్నంతా చూస్తే కడుపులో దేవినంత పనైంది. ఫిలిప్ గారొచ్చారు మధ్యాహ్నానికి, మండిపడుతూ.

“సారూ! అమ్మగారూ పిల్లలూ క్షేమంగానే వున్నారు, భగవంతుని దయవల్ల!” ఆయన్ని చూడగానే చెప్పేసాను. భార్యా పిల్లలు క్షేమంగా వుండడం చూసి ఆయనా కుదుట పడ్డాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే మా బావ విలియం లౌరీ బంధువు సేండీ లౌరీ, మెల్బోర్న్ వస్తున్నాడని తెలిసింది. ఒక్కసారి ఆయనని కలిసి పిల్లలెలా వున్నారో కనుక్కుందామనుకున్నాను. ఫిలిప్ గారితో చెప్పాను. సరే నన్నాడాయన. అప్పటికి ఇంకొక నౌకరుకు పెళ్ళవడం వల్ల, అతని భార్య వుండేది ఇంటి పన్లు చూసుకోవడానికి.

వెళ్ళేముంది నాతో ఫిలిప్ గారు,

“పెగ్గీ! నువ్వు నాకు చేసిన మేలు నేనెన్నటికీ మర్చిపోలేను. నువ్వే లేకుంటే నా భార్యా బిడ్డలు మిగిలుండేవారు కారు” అన్నాడు.

“అయ్యో! అలాగనకండి సారూ! నేను చేసిందేముంది. అంతా భగవంతుని దయ” అన్నాను.

“భగవంతుని దయ సంగతేమో కానీ, నీ ఋణం మాత్రం తీర్చుకోలేను పెగ్గీ!”

“అయ్యా! నేను చేసిన పనికంతా జీతం పుచ్చుకుంటూనే వున్నా కాబట్టి ,ఋణాల ప్రసక్తి లేదు లెండి.”

“అలాగంటే నేనొప్పుకోను పెగ్గీ! నువ్విలా అంటావని తెలిసే నేను ఒక వంద పౌండ్లు నీ బేంకు అక్కవుంట్లో వేసాను. దాన్ని ఎక్కడైనా మదుపు పెట్టి వచ్చే ఆదాయాన్ని వాడుకో! నన్నడిగితే, ఏదైనా చిన్న దుకాణం కొనుక్కోని నడుపుకో! కావాలంటే నేను సహాయం చేస్తాను!” అన్నాడు.

ఆయన నా మీద చూపించిన అభిమానానికి నేను కరిగిపోయాను. నిజంగానే ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం మొదలుపెడదామా అనిపించింది, కాని, ఆయనకీ ఆయన భార్యా పిల్లలకి నా అవసరం వుంది కదా అని వెనుకాడాను. కాని ఆయన వినిపించుకోలేదు.

“ఈ జీతంతో ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని సాకుతావు? అసలు నీకంటూ డబ్బూ, ఇల్లూ వాకిలీ వొద్దా? అందుకని చిన్న వ్యాపారం మొదలు పెట్టు. ఆ పిల్లల బాధ్యత తీరిపోతే నువ్వూ పెళ్ళి చేసుకొని స్థిరపడొచ్చు. పిల్లలు పెద్దవుతున్నారుగా? మేమిక్కడ సర్దుకుంటాంలే!” అని ఒప్పించారు నన్ను.

ఆయన అన్నట్టే మెల్బోర్న్ వెళ్ళి ముందుగా సేండీ లౌరీ ని కలిసి, బెస్సీ పిల్లల గురించి విచారించాను. పిల్లలంతా బాగున్నారనీ, చక్కగా చదువుకుంటున్నారనీ సేండీ చెప్పాడు. అక్కడికి కొంచెం దూరంలో ఒక పల్లెటూళ్ళో చిన్న కొట్టొకటి అద్దెకు తీసుకున్నాను. అందరూ నన్నక్కడ మిస్ వాకర్ అని పిలిచే వాళ్ళు. కొట్టు బాగా నడిచి, కొంచెం డబ్బు రావడంతో మళ్ళీ పెళ్ళికొడుకుల బెడద పట్టుకుంది. అద్దెకు తీసుకున్న కొట్టుని మొత్తంగా కొనేసుకున్నాను.

అంతా బాగున్న సమయం లో సేండీ తమ్ముడు రాబీ లౌరీ అక్కడికి వచ్చాడు. వచ్చి, బెస్సీ ముసలి అత్తగారు పొయారనీ, పిల్లలని అదలించే వారులేక చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారనీ చెప్పాడు. ముసలి మావగారున్నారు కానీ, పిల్లలకి అసలు ఆయంటే బొత్తిగా భయం లేదు. ఇహ చేసేదేం లేక కొట్టునీ, కొట్లో సామానునీ అమ్మి మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డాను.

ఇక్కడికొచ్చి చూద్దును కదా, ఊరంతా అప్పులు! నేను పంపిన డబ్బంతా ఏమయిందో తెలియదు! అయితే చదువులు మాత్రం బాగా వంటబడుతున్నాయి. అదొక్కటే సంతోషం. అందుకే వాళ్ళనలాగే చదువుకోమన్నాను. నా దగ్గరున్న డబ్బు ఎంతకాలం సరిపోతుంది? అందుకే మళ్ళీ బట్టలు ఉతికి ఇస్త్రీలు చేయడం మొదలు పెట్టాను. అంతేనమ్మా! ఇహ పడుకోండి. ఇప్పటికే పొద్దు పోయింది,” అంటూ ముగించింది పెగ్గీ తన కథని.

                     ***

                      (సశేషం)

 

వీలునామా – 9 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పెగ్గీ ప్రయాణం

పెగ్గీ తన కథ మొదలు పెట్టింది.

***

అమ్మాయిగారూ! అసలు విషయమేంటంటే నేనూ మా అక్క బెస్సీ ఒకళ్ళంటే ఒకళ్ళం ఎంతో ప్రేమగా వుండేవాళ్ళం. బెస్సీ నాకంటే బాగానే పెద్దది. ఎంత పెద్దదో గుర్తు లేదనుకోండి!  నాకు ఆరేళ్ళ వయసులోనే మా అమ్మ పోయింది. బెస్సీ నన్ను తనే తల్లిలా పెంచింది. ఇప్పుడు మీరు చిన్నమ్మాయిగార్ని చేస్తూన్నంత ముద్దు కాకపోయినా, బెస్సీ నన్నూ ఇలాగే ప్రేమగా చూసేది. సౌమ్యంగా, కొంచెం లావుగా వెండేది బెస్సీ. మా పక్కింటి విలియం లౌరీ హై స్కూలు రోజుల్లోనే బెస్సీ అంటే చాలా ఇష్టం పెంచుకున్నాడు. నాన్నకి మేమిద్దరమూ కాక ముగ్గురు కొడుకులున్నా, మా మీదే ఆధారపడి వుండేవాడు. కొంచెం జబ్బు మనిషి కూడా! మా అన్నదమ్ములు ఎందుకూ కొరగాని వాళ్ళు. బెస్సీ నేను కొంచెం పెద్దయ్యే వరకూ నాన్నని తనే కనిపెట్టుకుని వుంది. నేను ఒక చిన్న వుద్యోగం చూస్కున్నాకే విలియంని పెళ్ళాడింది బెస్సీ! పెళ్ళయినా నాన్న వాళ్ళతోటే వుండేవాడు. దాని పెళ్ళయిన మూడేళ్ళకి నాన్న పోయాడు!

బెస్సీకి చక చకా పిల్లలు పుట్టేసారు! అది అయిదోసారి కడుపుతో వుండగా విలియం జబ్బుపడి పోయాడు. బెస్సీ పాపం కుప్పకూలిపోయింది. ఎలాగో తేరుకుని బయటికి వెళ్ళి పని చేసి కుటుంబాన్ని నడిపేది కానీ, విలియం తోడు లేకుండా ఎక్కువ రోజులు బ్రతకలేక పోయింది. దాని పిల్లలు పాపం అనాథలయ్యారు. నన్ను చిన్నప్పుడు సాకింది బెస్సీ. ఇప్పుడు దాని పిల్లల్ని నేను అనాథల్లా వదిలేస్తానా?

విలియం అమ్మా నాన్నలు ఆ పక్కనే ఇంకో పల్లెటూళ్ళో వుండేవాళ్ళు. వాళ్ళూ మాలాగే పేద వాళ్ళు. అయినా నా దగ్గరికి వచ్చి డబ్బు సాయం చేస్తే పిల్లలని తాము చూసుకోగలమన్నారు. అయిదుగురు పిల్లలని సాకేంత డబ్బు నాకెక్కణ్ణించొస్తుంది?

అప్పుడు నేను గ్రీన్ వెల్స్ లో ఒక పెద్ద ఎస్టేటులో పని చేసేదాన్ని. వంటా వార్పూ, పాలు పితకడం, పాడి పనీ అన్నీ చేసేదాన్ని. ఇంతా చేస్తే నా జీతం ఏడాదికి ఏడు పౌండ్లు. దాంతో ఇంత మందిమి ఎలా బ్రతకడం చెప్పండి? ఇంకా పని ఎక్కువైనా పర్వాలేదు కానీ నా జీతం పెంచమని మా అమ్మగార్ని కాళ్ళా వేళ్ళా పడ్డాను. ఇక ఇంతకంటే పని ఎక్కువ చేయలేనని ఆవిడ కోప్పడ్డారు. అయితే జీతం ఇంకొక్క పౌండు పెంచారనుకోండి. అయినా అదేమూలకి?

ఒక రోజు పెరట్లో వంటకోసం ఒక పక్షికి ఈకలు పీకి శుభ్రం చేస్తున్నాను. కింద పాత పేపర్లు వేసాను మురికి కాకుండా. యథాలాపంగా ఆ పేపర్లో చూద్దును కదా, ఒక ప్రకటన! మెల్బోర్న్ లో పని చేయడానికి ఒప్పుకుంటే ఖర్చులు తామే భరించి తీసికెళ్తామని ఎవరో ఇచ్చారా ప్రకటన.

ఇంటి పనీ, వంట పనీ, పాడి పనీ పశువుల పనీ వంటివి తెలిసిన మనిషి దాదాపు పదహారు నించి ఇరవై ఐదు పౌండ్ల వరకూ సంపాదించుకోవచ్చట. ఒక అడ్రసు ఇచ్చి వచ్చి సంప్రదించమన్నారు. ఆ ప్రకటన చూస్తే ప్రాణం లేచొచ్చినంత పనైంది! తప్పక ఆస్ట్రేలియా వెళ్ళిపోదామని ఆ క్షణం లోనే నిశ్చయించుకున్నాను. ఆ పేపర్లో ఇచ్చిన చిరునామాకి వెళ్ళీ ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాను.”

“ప్రయాణం ఎలా అయింది పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“వింత ఏంటంటే అమ్మాయిగారూ, నాకు ఆ ప్రయాణం తాలుకు విషయాలు కొంచెం కూడా ఙ్ఞాపకం లేవు. అయితే అయిదు నెలల ప్రయాణం అన్న మాట మాత్రం గుర్తుంది. ఇప్పుడంత సమయం పట్టదు లెండి. వచ్చేటప్పుడు నాలుగు నెలల్లో వచ్చేసాగా? సరే, ఎలాగో మెల్బోర్న్ చేరుకున్నా. చాలా మురికిగా, ఇరుకుగా అనిపించింది. నేననుమానించినట్టే అంతంత జీతాలేం ఇవ్వలేదు. ముందు పదమూడు పౌండ్లిస్తామన్నారు. నాకు ఏడుపొచ్చినంత పనైంది. ఈ మాత్రానికేనా నేను అయిదునెలలు కష్టపడి దేశం కాని దేశం వచ్చింది, అనిపించింది. ఏజెన్సీ లేబర్ ఆఫిసులో బాగా దెబ్బలాడాను. ఎంత కష్టమైన పనైనా చేస్తాననీ, ఎక్కడికైనా వెళ్తాననీ, డబ్బు మాత్రం ఇంకొంచెం కావాలనీ మొత్తుకున్నాను. అప్పుడే ఆ ఆఫీసులోకి ఒక పెద్దమనిషి వచ్చాడు. ఆయన వాలకమూ మాటా చూస్తే ఇంగ్లండు నించే వచ్చినట్టనిపించింది. ఆఫీసరుతో నా పోట్లాట విని,

“అయితే అందరిలానే నీకూ డబ్బాశ ఎక్కువేనన్నమాట,” అన్నాడు వెటకారంగా.

“అయ్యా! ఇంత దూరం వచ్చిందీ కష్టపడి డబ్బు సంపాదించుకోవడానికేగా,” అన్నాను నేను.

“అవునమ్మా! డబ్బు వచ్చేటప్పుడొస్తుంది. అంతలోకే తొందరపడితే ఎలా? రాగానే ధన రాసులు కావాలా ఏం?” కసిరాడాయాన.

“ఇన్ని మాటలెందుకు సారూ! మీకు పనిమనిషి కావాలంటే చెప్పండి,” నేనూ కోపంగానే అన్నాను.

“పనిమనిషా? మాటవరసకి కావాలే అనుకో! నువ్వు సరిపోతావో లేదో నాకెలా తెలుస్తుంది?”

“మీకెందుకు! అమ్మగారికి నన్నొక్కసారి చూపించండి. నా పని తనాన్ని చూసి ఆవిడే నచ్చుకుంటారు.”

“అలాగా? సరే, ఏమేం పనులు చేయగలవో చెప్పు?”

“ఒకటేమిటండీ, ఏదైనా చేయగలను. వంట పనీ, చాకలి పనీ, పాడి పశువుల పనీ, ఇంటిక్కావాల్సిన సమస్తం చాకిరీ చేయగలను.”

“సరే, నీ వయసెంత? మీ అమ్మగారడిగితే చెప్పాలిగా!”

“ఇరవై అయిదేళ్ళు. ఇంతకు క్రితం అయిదేళ్ళూ, అంతకు ముందు మూడేళ్ళూ వేర్వేరు చోట్ల పనిచేసాను. కావాలంటే వాళ్ళందరి దగ్గర్నించీ ఉత్తరాలు కూడా చూపించగలను. పనికీ, ఒంటరితనానికీ, దేనికీ భయపడను.”

“ఏదో పెద్ద రౌడీలాగున్నావే! కొంచెం డబ్బాశ కూడా ఎక్కువేనా ఏమిటి? ఏడాదికి ముప్పై పౌండ్లిస్తానంటే, ఇక్కడికి వందమైళ్ళ దూరంలో వున్న పల్లెలో పని చేస్తావా?”

“సరే నండి! అలాగే చేస్తాను.” ధైర్యంగా ఒప్పుకున్నాను.

“రేఫణ్ణించే లెక్కకట్టి నీకు జీతం ఇస్తాను. ప్రయాణానికి సిధ్ధం కా.”

“అలాగే సారూ! వంద మైళ్ళంటున్నారు. అక్కణ్ణించి ఇంటికి డబ్బు పంపాలంటే ఎలా?”

“అదంతా నేను చూసుకుంటాలే. జీతం ఎక్కువ కదా అని  సంబరపడకు, బోలెడంత చాకిరీ వుంటుంది., అడవుల్లో ఇల్లు, ఆలోచించుకో మళ్ళీ!”

“ఫర్వాలేదు సారూ! ఆ దేవుడి మీదే భారం వేసాను నేను.”

“సరే అయితే!”

ఆయన అక్కడ వున్న ఏజెన్సీ ఆఫీసరుకు చెప్పి ఒప్పందం రాయించాడు. దాని మీద ఆ పెద్దాయన వాల్టర్ బ్రాండన్, నేనూ సంతకాలు చేసాం. మర్నాడే ప్రయాణమయ్యాం. భలే దారిలెండి అదంతా. ఎగుడు దిగుడుగా, మట్టి దిబ్బలతో! మాతో పాటు నలుగురు మగవాళ్ళూ వచ్చారు. అందులో ఇద్దరు కొంచెం తాగుబోతుల్లాగనిపించారు. నేను వాళ్ళకంటే మొరటుదాన్ని కావడంతో నా జోలికి రాలేదు. దాదాపు రెండు వారాలు బండిలో ప్రయాణం చేసి బ్రాండన్ గారి ఇల్లు చేరాము. అయితే ఈ ప్రయాణం నాకంత విసుగనిపించలేదు! ఎందుకంటే ప్రయాణం రోజులకి కూడ లెక్క కట్టి జీతం తీసుకుంటున్నాగా! అందుకు!”

*****************

మేము బ్రాండన్ గారి వూరు, బర్రాగాంగ్ చేరుకునేసరికి శనివారం చీకటిపడింది.  మాలా కాకుండా అయ్యగారు గుర్రబ్బగ్గీలో ప్రయాణం చేసినందువల్ల మాకంటే చాలా ముందు గానే వూరు చేరుకున్నారు.

“పెగ్గీ! ప్రయాణం బాగా జరిగిందా?నెమ్మదిగా సాగింది కదా? నువ్విలాటి ప్రదేశాల్ని ఎప్పుడూ చూసి వుండవు.” ఆదరంగా అన్నారు అయ్యగారు నేను బండి దిగుతూంటే.

“అవునండీ! చాలా నెమ్మదిగా అనిపించింది.”

“అదేమిటి పెగ్గీ! ప్రయణం అంతా ఎండలో కూర్చున్నావా ఏమిటి? నీ మొహం అంతా నల్లగా కమిలిపోయింది. ఇటు వైపు ఎండలు చాలా ప్రమాదకరం. జగ్రత్తగా వుండాలి.”

“మొహం నల్లగా కమిలిపోతేనేం లెండి. చేతులూ కాళ్ళూ సవ్యంగానే వున్నాయిగా! అన్నట్టు, సారూ, అమ్మగారెక్కడా? వంటగదిలోకెళ్ళి చూడనా?”

“నీకొక విషయం చెప్పాలి పెగ్గీ! అసలీ ఇంట్లో అమ్మగారనే పదార్థమే లేదు!” నవ్వుతూ అన్నారయ్యగారు. ఒక క్షణం కోపం ముంచుకొచ్చింది నాకు. ఇదేమైనా నవ్వులాటా?

“ఏమంటున్నారు మీరు? అమ్మగారు లేకపోవడమేంటి?” కోపంగా అన్నాను.

“ఆగాగు! అమ్మగారి ప్రసక్తి తెచ్చింది నువ్వే! గుర్తు తెచ్చుకో! ఇక్కడ ఇంకో ఆడదిక్కు లేదు కాబట్టి, నువ్వే అమ్మగారూ, పనిమనిషీ కూడా!”

నిజం చెప్తున్నా అమ్మాయిగారు. ఆ దేశం కాని దేశంలో, ఎక్కడో మారుమూల ఆడతోడు లేకుండా, ముక్కూ మొహం  మగవాళ్ళ మధ్య వుండాలని తెలిసేసరికి నాకు గుండె జారిపోయింది. చాలా భయం వేసింది.

“అయ్యగారూ! మీరు చేసిన పని మంచిది కాదండీ!” బాధగా అన్నాను.

“నీకేం భయం లేదు పెగ్గీ! నువ్వడిగినంత జీతం ఇస్తాను. ఇక్కడ మాకు నీ అవసరం చాలా వుంది. ఆడదిక్కు లేక మేమంతా మురికిగా, సరైన తిండీ తిప్పలు లేక పడి వున్నాము. ఇప్పటికిప్పుడు పెళ్ళాడాలంటే మాలాటి వాళ్ళకు పిల్లనెవరిస్తారు చెప్పు? నువ్వేం చిన్న పిల్లవు కాదు. నిన్ను నువ్వు బాగా కాపాడుకోగలవు. మిగతా పనివాళ్ళు నీ జోలికి రాకుండా నేనూ చూస్తూనే వుంటాగా? దయచేసి ఈ ఇల్లూ, వంటిల్లూ ఒక కొలిక్కి తెచ్చి నాకింత తిండి వండి పెట్టు. అంతకంటే ఎక్కువ నిన్నేమీ అడగను! కనీసం వారం రోజులు వుండి చూడు. ఆ తర్వాత కూడ నీకు ఇబ్బందిగా భయంగా వుంటే నిన్ను మళ్ళీ మెల్బోర్న్ పంపించేస్తాను, సరేనా?” కాళ్ళా వేళ్ళా పడ్డాడు అయ్యగారు.

భయం భయంగానే ఒప్పుకున్నాను. వారం రోజులు బ్రాండన్ గార్ని గమనించాను. పాపం, ఆయన మంచాయనే, అని తెలిసి వుండిపోవడనికే సిధ్ధపడ్డాను, నా డబ్బాశ ఏదో రోజు నా కొంప ముంచుతుందని తిట్టుకుంటూనే. నిజంగానే ఆ ఇంటికి ఒక ఆడమనిషి చేయి అవసరమనిపించింది కూడా! ఆ మొరటు వెధవల మధ్య నన్ను నేను వెయ్యి కళ్లతో కాపాడుకోవాల్సి వచ్చిందనుకోండి!

బ్రాండన్ గారు మనిషి సౌమ్యుడే, కానీ ఇంటి పని బొత్తిగా చేతకాదాయనకి. చిరిగిపోయిన బట్టలు కుట్టుకోవాలనీ, టేబిల్ మీడ దుప్పటి లాటిది పరచి వుంచాలనీ కూడ తెలియదు.

అసలా ఇంట్లో వంటిల్లే లేదు! టీ తాగే కప్పులు లేక డబ్బాల్లో పోసుకుని టీ తాగే వాళ్ళు. చెంచాలు, ఫోర్కులు, గంటెలు, తువ్వాళ్ళూ, అసలు సామానే లేదు. అక్కడ నేల మీద మురికి చూస్తే మీరైతే వాంతి చేసుకుంటారు.

పక్కనే వుండడానికి నాకొక చిన్న పాక వేయించారు అయ్యగారు. ఒంటరిగా ఆ పాకలో వుండాలన్న ఆలోచనకే గజగజా వణికి పోయాను. అయితే దేవుడి మీద భారం వేసి నా పని నేను చేయాలనుకున్నాను.

ముందుగా వాళ్ళని పోరి నేల మీద చెక్కలు పరిపించాను. కిటికీలకి గాజు తలుపులు పెట్టించాను. ఒక చిన్న వంట పాక వేయించి అందులోకి సామాన్లు కొనిపించాను. మెల్లి మెల్లిగా ఇల్లంతా శుభ్రంగా చేసి పుష్కలంగా పాలూ, పెరుగూ, వెన్నలతో భోజనం ఏర్పాటు చేసాను. మగవాళ్ళంతా మొరటుతనాలు వదిలేసి మంచి జీవితానికలవాటు పడ్డాడు.

జార్జి పావెల్ అనే అతను ఇంటికి కావాల్సిన సామన్లు కొని ఇచ్చేవాడు. ముందు అతను వంటింట్లో వుండే వెన్నా, మీగడలకోసమో, బిస్కట్ల కోసమో వంటింటి చుట్టూ తిరుగుతున్నాడనుకున్నా. కొది రోజులయ్యేసరికి నాకర్థమయింది, అతను వచ్చేది నాకోసమే నని.

వున్నట్టుండి ఒకరోజు వంటింట్లో నాతో మాటాడుతూ ఏదో సణిగాడు. పిచ్చి వేషాలేస్తే అయ్యగారికి చెప్తానని బెదిరించాను.

“అంత కోపమెందుకు! పెగ్గీ, నేను నిన్నేం అవమానించట్లేదు.

నన్ను పెళ్ళాడతావా అని అడిగాను, అంతే.” అన్నాడు మొహం ఎర్రబడుతూండగా.

“అది అయ్యే పని కాదులే. ఇంత మంచి కాంప్లిమెంటు ఇచ్చినందుకు ధన్యవాదాలు కాని, నాకు పెళ్ళి మీద పెద్దగా ఆసక్తి లేదు,” అన్నాను మర్యాదగానే.

“నిజం చెప్పు పెగ్గీ! నేను నచ్చకపోతే ఆ విషయం నిర్భయంగా చెప్పు, అంతే కానీ, పిచ్చి పిచ్చి వంకలు పెట్టొద్దు!”

“నిజమే చెప్తున్నాను. నీమీద అయిష్టమేమీ లేదు నాకు. పెళ్ళాడే పరిస్థితి కాదు నాది, అంతే!”

“నా మాట విను పెగ్గీ! ఒంటరిగా ఇలాటి చోట మగవాళ్ళ మధ్య, భయం వేయడంలేదూ? అదే నన్ను పెళ్ళాడావనుకో, నిన్ను రక్షించే బాధ్యతంతా నేనే తిసుకుంటాను.”

ఆ తర్వాత ఎన్నో సార్లు అడిగాడు జార్జి నన్ను పెళ్ళి చేసుకుందామని. అదేమాట ఇంట్లో పని చేసే ముగ్గురు పశువుల కాపర్లూ, గుర్రాలు చుసుకునే అబ్బయీ కూడా అడిగారు. అందరికీ లేదనే చెప్పాను. అది నాగొప్పేమీ కాదమ్మాయి గారూ! అలాటి చోటికి ఆడది రావడమే మహా భాగ్యం ఆ రోజుల్లో. ఇక అంద చందాల గురించి ఎవరేడ్చారు?

వింత చూడండి! ఆడవాళ్ళకి విలువ వుండే చోటికి ఖర్చుకి బయపడి వాళ్ళని తీసికెళ్ళరు. ఇక్కడ ఇంత మంది ఆడపిల్లలున్నా పెళ్ళాడేందుకు మగవాళ్ళు లేరు. అక్కణ్ణించి రావడం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కాని పిల్లల కొసం వచ్చా, మళ్ళీ వెళ్ళిపోతాలెండి.

ఎక్కడ దాకా చెప్పాను? ఆ, ఇంట్లో పని వాళ్ళని మెల్లిగా నా చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నాను.

కాని అంతలోనే నా పరిస్థితి మారింది.

       ***

(మిగతాది వచ్చే వారం)

వీలునామా – 8 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

                     పడి లేచే కడలి తరంగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన డబ్బూ, అంతా కలిసి జేన్ అనుకొన్నట్టు దాదాపు నలభై వేల పౌండ్ల పైనే వున్నట్టుంది. ఎస్టేటు లో కొంచెం భూమిని సాగు చేయించినట్టున్నాడు పెద్దాయన.

ముందు ఎల్సీ ఆ వూరి జనం ఫ్రాన్సిస్ ని ఆదరిస్తారా అని అనుమానపడింది కానీ, ఆ భయం అర్థం లేనిది. ఆ వూళ్ళో ఇదే అంతస్థుకి చెందిన కుటుంబాలలో దాదాపు ఇరవై మంది పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లలుంటే, నలుగురు పెళ్ళీడుకొచ్చిన యువకులున్నారు, విలియం డాల్జెల్ తో సహా. అలాటప్పుడు, యుక్త వయసుల్లో వున్న ఇద్దరమ్మాయిలు ఊరు వదిలి, చక్కగా చదువుకుని పెళ్ళి కాని ఒక మగవాడొస్తూంటే ఊళ్ళోని సంపన్న కుటుంబాలు అతన్ని ఎందుకు నిరాదరిస్తాయి?  సహజంగానే అతని కొరకు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేయబడ్డాయి. తమ తమ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తండ్రులూ, తల్లులూ ఎంత దూరమైనా వెళ్తారూ, ఆత్మ గౌరవాన్ని ఎంతైనా చంపుకుంటారు.  బ్రిటిష్ సంఘంలో ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక వర్గాన్ని ఆకాశానికెత్తేస్తూ, ఇంకో సగాన్ని పాతాళానికి నొక్కేస్తూ…

ఇహ స్కాట్లాండ్ లో ఒక మారుమూల పల్లెటూళ్ళొ అంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా వుంటుంది? అప్పటికే పల్లెటూళ్లలో మధ్య తరగతి, సంపన్న కుటుంబాలనుంచి యువకులు అవకాశాలు వెతుక్కుంటూ, కాలనీల్లోకి, భారతదేశానికో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. అంత దూరం కాకుంటే కనీసం పట్టణాలకైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో పడి వుండడం తప్ప చేసేదేం వుంది? చదువూ లేక, వృత్తీ వ్యాపారాలూ లేక, కేవలం ఎవరో ఒకరు వచ్చి కన్నె చెర విడిపించాలని ఎదురు చూడాల్సి రావడం ఎంత దుర్భరం!

కాలనీల్లోంచి తిరిగొచ్చిన యువకుల కంటికి సహజంగా తమతోటి కలిసి ఆడుకుని పెరిగి పెద్దయిన యువతులకంటే, చిన్న వయసులో వున్న బాలికలే ఎక్కువ నచ్చుతారు. పాపం, చదువూ, జీవనాధారమూ, పెళ్ళీ లేక ఒక తరం యువతులంతా అమ్మా-నాన్నల పంచనో, అన్న దమ్ముల పంచనో పడి వుండాల్సొస్తుంది.

ఇంత దుర్భరమైన పరిస్థితిలో, ముఫ్పై అయిదేళ్ళ బ్రహ్మచారీ, చదువు సంధ్యలున్నవాడూ, ఆస్తి పరుడూ తమ మధ్యకొస్తే ఆడపిల్లల తలి దండ్రుల ఆశలు ఆకాశాన్నంటటంలో ఆశ్చర్యమేముంది? అతన్ని విందులకూ, వినోదాలకూ ఆహ్వానిస్తూ కుప్పతెప్పలుగా ఉత్తరాలొచ్చి పడ్డాయి.

అయితే ఈ పరుగు పందెంలో అందరికన్నా ముందు పరుగు ప్రారంభించింది మాత్రం రెన్నీ దంపతులే. తన కింద, తన సంస్థలోనే పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఉన్నట్టుండి గొప్ప ఆస్తిపరుడు కాగానే, రెన్నీ ఆ అవకాశాన్ని వొదల దల్చుకోలేదు. తన కూతురు ఎలిజాకి ఇంతకన్న మంచి వరుణ్ణి తాను తేలేడు. అందుకే ఒకసారి తన ఎస్టేటు చూడడానికి రమ్మని ఫ్రాన్సిస్ ఆహ్వానించిందే తాడవు, రెన్నీ దంపతులు కూతురితో సహా వస్తామని మాటిచ్చారు.

నిజానికి శ్రీమతి రెన్నీ ఫ్రాన్సిస్ ని వూళ్ళో వుండే సంపన్న కుటుంబాలు ఎగరేసుకు పోతారేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫ్రాన్సిస్ సహజంగా ముభావి. పైగా యేళ్ళ తరబడి ఒంటరితనానికి అలవాటు పడ్డవాడు. అందుకే వూళ్ళో కుటుంబాలతో పెద్దగా మనసిచ్చి కలవలేకపోయాడు. అతనికెందుకో వూళ్ళో వాళ్ళు అంత నచ్చలేదు కూడా. అన్నిటికంటే వూరి వాళ్ళు జేన్, ఎల్సీల పట్ల చూపించిన నిరాదరణ అతన్ని ఎంతో నొప్పించింది. ఆ నిరాదరణ ఆ అక్క-చెల్లెళ్ళ పట్ల కాదనీ, తన తండ్రి పట్ల అనీ అతను గుర్తించలేకపోయాడు.

చాలా మామూలు మనుషులుండే ఆ వూళ్ళో, పెద్దాయన హొగార్త్ భావాలూ, మతపరమైన నమ్మకాలూ, కొంచెం విభిన్నంగా అనిపించేవు. దాంతో వూరి వారికి అతనంటే కొంచెం అనుమానం అసహనం కూడా వుండేవి. అతని పెంపకంలో పెరిగిన అమ్మాయిలవడం చేత, ఆ అనుమానమూ, అసహనమూ, జేన్, ఎల్సీల పైకి కూడా తిరిగాయి. దానికి తోడు వేరే ఆడదిక్కులేని ఇల్లు. వాళ్ళిద్దర్నీ ఆయన మగపిల్లల్లా పెంచాడందులో. అయేసరికి వూరి వారికీ హొగార్త్ గారి కుటుంబానికి పెద్ద సఖ్యతేమీ వుండేది కాదు.

అదెలాగున్నా, పెద్దాయన ఆడపిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వకుండా వీధిలో నిలబెట్టాడని తెలిసినప్పుడు మాత్రం, వూరి వాళ్ళు చాలా బాధ పడ్డారు. వాళ్లకొరకు చందాలు పోగు చేయలనుకున్నారు కూడా. చిన్న చిన్న సహాయలు చేయాలనుకున్నారు. అయితే జేన్, ఎల్సీలిద్దరూ ఎవరి దయా దాక్షిణ్యాల మిదా ఆధారపడదల్చుకోలేదు. అందుకే వూరొదిలి పట్నంలో బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారనీ, చాకలి మనిషి, పెగ్గీ ఇంట్లో అద్దెకుంటున్నరనీ తెలిసి వూళ్ళొ వాళ్ళు బాధ పడ్డారు.

పెగ్గీ చాలా యేళ్ళు స్కాట్ లాండు వదిలి ఆస్ట్రేలియాలో వుండడం వల్ల, ఆమె ఆలోచనలో కొంచెం వైశాల్యం వచ్చింది. అందుకే వూరి వాళ్ళలా, హొగార్త్ నమ్మకాలకీ, ఆచార వ్యవహారాలకీ ఆడపిల్లలని తప్పు పట్టలేదు. వూళ్ళో వున్నప్పుడు కూడా వాళ్ళ బట్టలు వుతికి ఇస్త్రీ చేస్తూ, వాళ్ళతో చనువుగా, స్నేహంగా వుండేది పెగ్గీ.   జేన్, ఎల్సీలు ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు పెగ్గీలాగే, ఇంట్లోని నౌకర్లూ, చాకర్లూ అందరూ ఎంతో బాధ పడ్డారు.

 

  ***

  ఎడిన్ బరోలోని ఆ వీధిలో ఆ చిన్న ఇల్లు దొరకడం అదృష్టమే, అనుకుంది పెగ్గీ. చిన్నదైనా ఇల్లు శుభ్రంగా వుంది. గాలీ వెల్తురూ ధారాళంగా వచ్చే గదిని అక్క-చెల్లెళ్ళిద్దరికీ అద్దెకిచ్చింది. పెగ్గీ చెల్లెలి మావగారు థామస్ లారీ కి కూడా, ఇల్లూ, ఇంట్లోంచి బయటికి చూసే కిటికీ భలే నచ్చాయి. పెగ్గీ చెల్లి పిల్లలయిదుగురికీ ఇల్లు బ్రహ్మాండంగా నచ్చేసింది.

జేన్, ఎల్సీలు మాత్రం, దిగజారిపోయిన పరిస్థితులూ, అంత చిన్న ఇంట్లో సర్దుకోవడమూ తలచుకుని భయపడ్డారు. ఎంత శుభ్రంగా వున్నా, ఆ ఇంట్లోంచి వాళ్ళకలవాటు లేని లేమి అడుగడుగునా తొంగిచూస్తోంది.

అయినా, వాళ్ళిద్దరూ పెగ్గీ కుటుంబంతో వీలైనంతగా సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నారు. అందుకే, ఆ రాత్రి భోజనం వాళ్ళు పెగ్గీ కుటుంబంతో పాటు కలిసే చేసారు, పెగ్గీ ఎంత వారించినా. ఆ గందరగోళానికి వాళ్ళకసలు భోజనమే సయించలేదు. ఏదో తిన్నామనిపించి తమ గదికి వెళ్ళి కూర్చున్నారు. వున్నట్టుండి బావురుమంది ఎల్సీ.

“జేన్! నాకిక్కడేం బాగోలేదు. చాలా భయమేస్తుంది. పేదరికం గురించి కవితలు రాయడమూ, చదవడమూ వేరు, నిజాంగా పేదరికాన్ని అనుభవించడం వేరు. పేదరికంలో అందముందని ఎందుకు రాస్తారు, జేన్?”

“నువ్వవన్నీ ఆలోచించకు ఎల్సీ! నిజానికి నాకు మన వూళ్ళో వున్న కుటుంబాలూ, వాళ్ళ కృత్రిమ మర్యాదలూ, కపటనాటకాలకంటే పెగ్గీ కుటుంబమే ఎంతగానో నచ్చింది. మనకీ పరిస్థితి నచ్చినా నచ్చకపోయినా, మనం సర్దుకు పోక తప్పఫు! అర్థమయిందా?”

“అబ్బ! ఆ పెద్ద తాతగారు ఎందుకలా దగ్గుతాడు జేన్? ఆయన దగ్గరొచ్చే ఆ ముక్కు పొడుం వాసన! టీ కప్పులోంచి సాసర్లో పోసుకుని తాగుతారు వీళ్ళు, చూసావా? ఛీ!”

“ఎల్సీ! నిజం చెప్పు, అవన్నీ అంత ముఖ్యమైన విషయాలా? వాళ్ళలాగా ఏ పరిస్థితికైనా యెదురీదే శక్తి లేనందుకు మనం సిగ్గుపడాల్సిన మాట!  ఏదో పెద్ద చదివేసుకున్నాం అన్న అహంకారం తప్ప మన దగ్గరేముంది, ఆలోచించు!”

“ఏమోలే! ఇవాళ రాత్రైతే నేనొక్క మాట కూడా రాయలేను. మనసంతా చికాగ్గా వుంది. ఈ వూరూ, ఈ మురికీ, ఈ ఇల్లూ…”

“అదేం లేదు ఎల్సీ! బయట ఎడిన్ బరో చాలా అందంగా వుంటుంది తెల్సా! రేపు నిన్ను బయటికి తీసికెళ్తా! ఇద్దరమూ అలా నాలుగు వీథులూ నడిచొద్దాం, సరేనా?”

“సరే! రేపణ్ణించి మళ్ళీ రాయడం మొదలు పెడతా! ఇవాళ్తికి వొదిలేస్తా!”

“అవును! నీకెప్పుడు మనసులో హాయిగా అనిపిస్తే అప్పుడే రాసుకో. ఇప్పుడిక పడుకో!”

తలుపు దగ్గర చప్పుడైంది. పెగ్గీ గుమ్మంలోంచి మొహం లోపలికి పెట్టి,

“అమ్మాయిగారూ! అంతా బాగుందా? ఇంకా ఏమైనా కావాలా?” అని అడిగింది.

“లేదు పెగ్గీ! ఏమీ వొద్దు, కానీ నువ్వొచ్చి కాసేపు కూర్చోరాదూ?” జేన్ ఆహ్వానించింది.

పెగ్గీ లోపలికొచ్చి కూర్చొంది.

ఎల్సీ గబగబా తన కగితాల కట్ట సంచీలోకి తోసేసింది. అవన్నీ ఎల్సీ ఎవరికో రాస్తున్న ప్రేమలేఖలనుకుంది పెగ్గీ!

“చిన్న అమ్మాయిగారు ఏదో ఉత్తరాలు రాసుకుంటున్నట్టున్నారు. నేనొచ్చి పాడు చేసానా?”

“వుత్తరాలు కాదు పెగ్గీ! ఎల్సీ ఒక పుస్తకం రాస్తోంది!”

“పుస్తకమే? వామ్మో! నాకు అసలు సరిగ్గా చదవడమే రాయడం రాదమ్మాయిగారూ! మీరా పుస్తకాలెలా రాస్తారో గానీ! అయితే, దానికేమైనా డబ్బొస్తుందాండీ?”

“చూద్దాం! వస్తుందో రాదో!”

“అంతే లెండీ! చదువున్న మారాజులు! నాకు పెన్ను పట్టుకుంటే అక్షరం ముక్క రాదు! ఆస్ట్రేలియాలో వున్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసే దిక్కులేకపోయింది. ఎవరినైనా అడగడానికి సిగ్గు పడిపోయాను. ఏదో కూడబలుక్కోని నా ఇష్టం వొచ్చినట్టు రెండు మాటలు రాసి పడేసేదాన్ని లెండి. అందుకే, నాలా అవస్థలు పడొద్దని ఈ పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నాను.”

“పెగ్గీ! నువ్వు నీ ఆస్ట్రేలియా జీవితం గురించి చెప్పాలి మాకు. నాకైతే భలే కుతూహలంగా వుంది!”

“ఎందుకు లెండి అమ్మాయి గారు! మీరవన్నీ మళ్ళీ ఏ పుస్తకంలోనో రాస్తే అంతా నన్ను చూసి నవ్వుతారు!” అనుమానంగా అంది పెగ్గీ!

నవ్వింది ఎల్సీ!

“లేదు పెగ్గీ నువ్వు చెప్పే సంగతులు నేనెప్పుడూ పుస్తకాల్లో రాయను సరేనా?”

ఆమె కాగితాల్లోకి తొంగి చూసింది పెగ్గీ.

“అమ్మాయి గారూ! మీర్రాసే లైనులు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వున్నాయండి! అంటే మీరు రాసేది కవితలే కదండీ?”

“అవును పెగ్గీ ! అవి కవితలే!”

“ఇహ అయితే నా గురించి చెప్తా లెండి. కథలైతే భయం కానీ, కవితలైతే భయం ఎందుకు?”

“అవునూ, నువ్వు ఆస్ట్రేలియానుంచి ఒంటరిగా వచ్చావెందుకు? అందరూ నువ్వు పెళ్ళి చేసుకుని జంటగా వస్తావనుకున్నారు.”జేన్ కుతూహలంగా అడిగింది.

“అవునండీ! పెళ్ళాడడానికి అవకాశాలు కూడా వచ్చాయండి. కానీ, నేను పెళ్ళాడి నా దారి చూసుకుంటే, ఈ చిన్న పిల్లల గతి ఏమిటి చెప్పండి? ఒకరిద్దరైతే ఈ పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కానీ, నాకెందుకో నమ్మకం లేక పోయింది!”

“ఈ పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళు పెగ్గీ! అప్పుడు మళ్ళీ ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసుకో.” సలహా ఇచ్చింది ఎల్సీ.

“లేదు లేమ్మా! నాకు చాలా నచ్చిన మనిషికి మెల్బోర్న్ లో పెళ్ళయిపోయింది. అతను మాత్రం ఎన్నాళ్ళని ఆగతాడు చెప్పండి? నాకు తెల్సుసు చిన్నమ్మాయి గారూ, మీరేమనుకుంటున్నారో! పెగ్గీ లాటి దాన్ని కూడా ఇష్టపడే మగవాళ్ళుంటారా, అనేకదా? అయితే ఆస్ట్రేలియా లాటి చోట అంద చందాలకంటే కష్టపడే మనస్తత్వానికే ఎక్కువ విలువ. అందుకే నాలాటి దాన్ని కూడా చేశుకోవడానికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తా వినండి.”

పెగ్గీ సర్దుకుని నేల మీద చతికిలబడింది. ఎల్సీ అక్క దగ్గరికి జరిగి, ఆమె వొళ్ళో తల పెట్టుకుంది. జేన్ చెల్లెలి జుట్టులోంచి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, పెగ్గీ కథ వినడానికి సిద్ధమైంది.

  ***

(సశేషం )

 

వీలునామా – 7వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

పాత ఉత్తరాలు

ఫ్రాన్సిస్ ఎడిన్ బరో వొదిలి ఎస్టేటులో వుండడానికి వొచ్చే రోజు ఎల్సీ తల నొప్పిగా వుందని తన గదిలోనే పడుకుంది. జేన్ అతన్ని సాదరంగా ఆహ్వానించి, బంగళా, తోట అంతా తిప్ప్పి చూపించింది. నౌకర్లందరినీ పరిచయం చేసింది. వీలైతే వాళ్ళని పనిలో వుంచుకోమని సలహా కూడ ఇచ్చింది. అంతే కాదు, జేన్ ఇంతకు ముందు వృధ్ధులైన పనివాళ్ళకి పన్లోకి రాకపోయినా, ఎంతో కొంత సొమ్ము ముట్టచెప్పేది, పెన్షన్ లాగా. ఆ సంగతి కూడా చెప్పిందతనితో.

ఆమె మాటలన్నీ శ్రధ్ధగా విన్నాడు ఫ్రాన్సిస్. తను కూడా అలాగే కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు.

ఎస్టేటంతా తిరిగి చూసి అక్కడ ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయాడు నగరవాసి అయిన ఫ్రాన్సిస్.

“ఇదంతా వొదిలి వెళ్ళాలంటే నువ్వు పడే బాధ నాకర్థమవుతుంది జేన్,” అన్నాడు.

“ఉమ్మ్మ్….నిజం చెప్పాలంటే, ఫ్రాన్సిస్, నాకు ఇల్లూ తోటా కంటే, ఇదిగో ఈ రెండిటినీ వొదిలి వెళ్తున్నందుకు ఎక్కువ దిగులుగా వుంది,” అంటూ రెండు అందమైన గుర్రాలని చూపించింది.

“నేనూ ఎల్సీ, ఎప్పుడూ ఈ రెండిటి మీదనే స్వారీ చేసే వాళ్ళం. ఫ్రాన్సిస్, ఈ గుర్రాలనీ, కుక్కలనీ, దయగా చుస్తానని నాకు మాటిస్తావా? వాటిని నేనూ, ఎల్సీ ఎంతో ప్రేమతో పెంచుకున్నాం. పట్టణంలో పెరిగిన నీకు జంతువుల మీద ఎలాటి అభిప్రాయం వుంటుందో మరి,” సందేహంగా అంది జేన్.

“నువ్వన్నది నిజమే జేన్. నేను ఎప్పుడూ జంతువులని పెంచి, ప్రేమించలేదు. అసలు నాకొక్కడికే తిండి సరిపోయేది కాదు. అయినా, నీ మాట ఏదీ నేను కాదనను. అసలు మనిద్దరి పరిచయం ఇలా కాకుంటే ఎంత బాగుండేది. ఇంత జరిగినా నీకు నామీద ఎలాటి కోపమూ లేదన్నదొక్కటే నాకు తృప్తి. చాలా మంది వకీళ్ళని కలిసి వీలునామా చూపించాను, ఏదైనా ఒక దారి కనబడి మీకిద్దరికీ సహాయం చేద్దామని. ఇంత డబ్బు కంటే మా నాన్నగారు నాక్కొంచెం ప్రేమ ఇచ్చి వుంటే నేనెక్కువ సంతోషపడి వుండే వాణ్ణి. ఆ సంగతే ఆయనకు తట్టలేదు,” అన్నాడు ఫ్రాన్సిస్ ఆవేదనగా.

“ఫ్రాన్సిస్! ఈ ఎస్టేటూ, ఆస్తి పాస్తులూ నీ చేతుల్లో సురక్షితంగా వుంటాయి. నాకా నమ్మకం వుంది. నిజానికి, నేను సంవత్సరాల తరబడీ నేర్చుకున్నదొక యెత్తయితే, కిందటి నెలరోజులలో నేర్చుకున్నదొక యెత్తు. ఎప్పుడు లేనిది నేను మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల గురించి ఆలోచించాను! పొట్ట పోసుకోవడం అంత తేలికైన విషయం కాదని ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది నాకు. కష్టపడి పని చేసేవాళ్ల మీద గౌరవం పెరిగింది. ఫ్రాన్సిస్! ఒక్కటే సలహా ఇస్తాను నీకు! పాత జీవితాన్నెప్పుడూ మరచిపోవద్దు. “నడ మంత్రపు సిరి” అని నిన్నెవరూ వెక్కిరించే పరిస్థితికి వెళ్ళకుండా వుండు. నేనన్న మాటలు నిన్ను నొప్పిస్తే క్షమించు!”

“జేన్! పాత జీవితం గుర్తున్నా లేకపోయినా, నీ మాటలు మాత్రం తప్పకుండా గుర్తుంటాయి,” నవ్వాడు ఫ్రాన్సిస్.

“ఆ రోజు మీ వూళ్ళో చర్చిలో ఫాదరు చెప్పిన ఒక్క మాట నేనూ మర్చిపోనూ!”

“ఏమిటది?”

“అంతా మన మంచికే నన్న మాట. దేవుడు ఏది చేసినా మన మంచి కొరకే నన్న మాట. వుదాహరణకి, మావయ్య ఇలా వీలునామా రాయలేదనుకో! ఏం జరిగి వుండేదో తెలుసా?”

“ఏమిటి?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“డబ్బు కోసమే నా చుట్టూ తిరిగిన వాణ్ణి, నేనేమాత్రమూ గౌరవించలేని వాణ్ణి వివాహమాడి వుండెదాన్ని.”

ఫ్రాన్సిస్ నివ్వెరపోయాడు.

“అంటే…”

“అంత బాధ పడటానికేమీ లేదిందులో, ఫ్రాన్సిస్.”

“అంటే, నా వల్ల నువ్వు నిలవనీడా, పెళ్ళాడే అవకాశమూ అన్నీ పోగొట్టుకున్నావన్నమాట! బాధ పడకుండ ఎలా వుంటాను జేన్!”

“అబ్బే! అలా కాదు! నేనతనికి నేనున్న పరిస్థితి వివరించాను, ఇద్దరమూ విడిపోవాలని నిశ్చయించుకున్నాం, అంతే!”

“ఎల్సీ పెళ్ళి సంగతి?”

“మేమింకా దాని గురించి ఆలోచించలేదు. అదిప్పుడు కవితా ప్రపంచంలో మునిగి వుంది. ఎలాగైనా కవితల పుస్తకం ప్రచురించి, మా ఇద్దరికీ జీవనోపాధి వెతకాలని దాని తాపత్రయం.”

“అవునా? అదీ మంచిదే.”

“అవును కానీ ఎల్సీ విమర్శ తట్టుకోలేదు. విమర్శని తేలిగ్గా తీసుకోని మనిషి కవితా సంకలనాలేం వేయిస్తుంది చెప్పు?”

“ఫర్వాలేదు జేన్. కొంచెం సున్నిత మనస్కురాలంతే. నాకు కవిత్వం తెలుసన్న సంగతి తనతో చెప్పకు! మామూలుగా చదివి బాగున్నదీ లేనిదీ నీతో చెప్తాను. నీ సంగతేమనుకుంటున్నావు?”

“నాకు ఎల్సీ బాధ్యత లేకపోయినట్లయితే ఏవరైనా ధనవంతుల ఇంట్లో ఇంటి వ్యవహరాలు చూసే హౌస్ కీపరుగా వుద్యోగం వెతుక్కునేదాన్ని. కానీ, ఎల్సీని ఒంటరిగా వొదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. ఏదేమైనా, రేపు ఇద్దరమూ ఎడిన్ బరో వెళ్తున్నాము. అక్కడ ఒక స్నేహితురాలి ఇంట్లో చిన్న గది అద్దెకు తీసుకుంటున్నాం.అన్నట్టు, ఇక్కడ మా ఇద్దరి గదుల్లో వున్న సామాను మేం తీసుకోవచ్చన్నారు. కానీ, అక్కడ చిన్న గదిలో ఈ సామానంతా పట్టదు. ఇంకో ఇల్లూ అద్దెకు తీసుకునేంతవరకూ ఏవో కొన్ని ముఖ్యమైనవి తప్ప, చాలా వరకు ఇక్కడే వుంచి వెళతాను. నీకేమైనా అభ్యంతరమా?”

“లేదు లేదు! ఇక్కడే వుంచుకో. గదులకి తాళాలు కూడా వేయిస్తాను, భద్రత కోసం.”

“తాళాలు వేసుకు వెళ్ళేంత అపనమ్మకం నాకు నీ మీద లేదు ఫ్రాన్సిస్. అంతే కాదు, అన్ని గదులూ అప్పుడప్పుడూ కిటికీలూ, తలుపులూ తెరిచి శుభ్రం చేయిస్తూ వుండలి.”

“సరే, అలాగే. ఎడిన్ బరో లో నువ్వు అద్దెకు తీసుకున్న గది ఎక్కడ?”

ఆ వీధి పేరూ, ప్రాంతం పేరూ చెప్పింది జేన్.

“అరే! ఆ ప్రాంతం నాకు బాగా తెలుసు. నేనక్కడ కొన్నాళ్ళున్నా కూడా!”

“అవునా? మీ అమ్మగారు ఎక్కడ వుండేవారు? ఆవిడ ఙ్ఞాపకం వుందా నీకేమైనా?”

“లేదు జెన్. అయితే ఎడిన్ బరో కంటే ముందు నేనింకెక్క డో వున్నట్టు లీలగా గుర్తుంది. అది మా అమ్మతోనేనో కాదో అంత బాగా గుర్తు రావడం లేదు.”

“ఆవిడ బ్రతికి వుందంటావా?”

“వకీలు గారైతే అవుననే అంటారు. ”

“ఏమో మరి! బ్రతికి వుండీ నిన్ను కలుసుకునే ప్రయత్నం చేయకుండా వుంటుందా? అలాటి తల్లి వుంటుందా ఎక్కడైనా?”

“ఆవిడ పరిస్థితి ఏమిటో! ఆవిడకీ మా నాన్నగారికీ మధ్య సంబంధాలు ఎలా వుండేవో! అయితే, ఆవిడకి సహాయం అవసరమైతే నేను సాయపడొచ్చని వుంది విల్లులో! కానీ, వకీలు గారు నన్ను ఆవిడ కోసం వెతకొద్దని సలహా ఇచ్చారు!”

“నువ్వు ఆస్తి పరుడవైన విషయం తెలిస్తే, ఆవిడే నిన్ను వెతుక్కుంటూ రావొచ్చు కదా!”

“ఒకసారి నాన్నగారి పాత ఉత్తరాలు వెతికితేనో? వకీలు గారు నాకు ఆయన పెట్టె తాళాలు ఇచ్చారు. ఇద్దరం కలిసి ఒక్కసారి ఆయనకి సంబంధించిన కాగితాలన్నీ చూద్దామా? ఎక్కడైనా నాకు మా అమ్మ ఆచూకీ దొరుకుతుందేమో!”

“సరే పద!”

ఇద్దరూ దాదాపు రెండు గంటలు కాగితాలన్నీ చూసారు. ఎక్కడా ఫ్రాన్సిస్ జన్మ వృత్తాంతం కానీ, అతని తల్లిని గురించిన సమాచారం కానీ దొరకలేదు. ‘ఫ్రాన్సిస్ స్కూలు ఫీజులు’ అనే ఫోల్డరులో కొన్ని బిల్లులు మాత్రం దొరికాయి.

ఎవరో స్త్రీ చేతి రాతతో ఫ్రెంచిలో వున్న ఒక వుత్తరాల కట్త కూడా దొరికింది. కుతూహలంగా ఉత్తరాలు తెరిచారు. అన్నీ ఫ్రెంచి లో వున్నాయి.

“నాకు ఫ్రెంచి బాగా వచ్చు. ఇటివ్వు, నేను ఉత్తరాలు చదివి విషయాలు చెప్తాను!” ఉత్తరాలు తీసుకొంది జేన్.

మార్గరెట్ అనే ఫ్రెంచి స్త్రీ కొన్ని సంవత్సరాల పాటు హొగార్త్ కి రాసిన ఉత్తరాలు అవి.

“….ఫ్రాన్సిస్ స్కూల్లో బాగా చదువుతున్నాడని తెలిసి సంతోషించాను. ఇప్పటికైనా ఆ పసివాణ్ణి నువ్వు ప్రేమించగలిగితే మంచిది. మా వాడు ఆర్నాల్డ్ ఎంత తెలివైన పిల్లాడనుకున్నావ్? క్లెమెన్స్ కూడా అంతే. స్కూల్లో అంతా వాళ్ళిద్దర్నీ తెగ మెచ్చుకుంటారు…” ఇక మళ్ళీ ఆ వుత్తరంలో ఫ్రాన్సిస్ ప్రసక్తి లేదు.

ఆ తర్వాత అన్ని వుత్తరాలూ ఓపిగ్గా చదివారు. ఎక్కడా ఫ్రాన్సిస్ ప్రసక్తే లేదు. ఆవిడెవరో కానీ, స్నేహంగా, అభిమానంగా, ఆప్యాయంగా రాసినట్టనిపించింది. ఆవిడ వుత్తరాలని బట్టి ఆవిడ ఒక వితంతువనీ, ఇద్దరు పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోందనీ అర్థమైంది వాళ్ళకి.

ఆవిడ ఉత్తరాల నిండా తన పిల్లల ముద్దూ మురిపాలు, తన వ్యాపారం విషయాలూ, వున్నాయి. పిల్లలక్కూడా హొగార్త్ తెలిసినట్టే వుంది. ఆవిడకి చాలా చిన్నప్పుడే పెళ్ళైనా, ఆ పెళ్ళి వల్ల పెద్దగా సుఖపడినట్టు లేదు.

అన్నిటికంటే ఆసక్తికరమైన వుత్తరం చివరికి కనబడింది. అప్పుడే బహుశా హొగార్త్ తన మేనకోడళ్ళని పెంచుకోబోతున్నట్టు చెప్పి వుంటాడు.

“… పోన్లే! నువ్వెందుకనో ఫ్రాన్సిస్ ని సొంత బిడ్డలా ప్రేమించలేకపోతున్నావు. ఈ అమ్మాయిలని ప్రేమగా పెంచుకొంటే నీ ఒంటరితనం తగ్గొచ్చు. మనిషన్నవాడికి ప్రేమతో కూడిన బంధాలు తప్పకుండ వుండాలి. లేకపోతే జీవితం మిద ఆసక్తి పోతుంది.

నాకూ, ఆర్నాల్డ్, క్లెమెన్స్ ల ప్రేమ లేకపోతే జీవితం ఎంత అససంపూర్తి, అనిపిస్తూ వుంటుంది. నేను వాళ్ళని ఎప్పుడు ఫిలిప్ పిల్లలుగా అనుకోలేదు. అనుకుని వుంటే వాళ్ళని ప్రేమించగలిగే దాన్ని కాదు. నువ్వేమో, ఫ్రాన్సిస్ తల్లి మీద వున్న అయిష్టాన్ని ఆ పసి వాడి మీద చూపిస్తున్నావు. ఎవరికి తెలుసు? నీ మేన కోడళ్ళిద్దరి పెంపకంతో నీ మనసు మెత్తబడి నీ కొడుకునీ చేరదీస్తావేమో! అలా జరిగితే నాకంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళుండరు!

మీ చెల్లెలు మేరీ మరణం గురించీ, ఆమె మరణించిన పరిస్థితులను గురించీ ఎంతో ఆవేదనతో రాసావు. చదివి చాలా బాధ పడ్డాను. అమ్మా నాన్నలు కుదిర్చిన పెళ్ళి చేసుకుని నేనెంత కష్టపడ్డానో, ఇష్టపడ్డ మనిషిని పెళ్ళి చేసుకొని మేరీ అంతే కష్టపడింది.

నాకు మా అమ్మా-నాన్నా ఈ పెళ్ళి నిశ్చయం చేసినప్పుడు వొద్దని నేనెంత ఏడ్చానో నాకింకా గుర్తే. ఈ పెళ్ళిలో వాళ్ళసలు నా ఇష్టాయిష్టాల ప్రమేయమేమీ లేదన్నట్లు ప్రవర్తించారు. అయితే, నా పెళ్ళిలో ఒక్క సుగుణం వుంది. ఈ పెళ్ళి గురించి నాకే కలలు లేకపోవడం మూలాన ఆ కలలు విఫలమై మనసు ముక్కలయే అనుభవం నాకు కాలేదు, మేరీకిలా.

నేను చాలా సార్లు ఆలోచించాను, మనలని ఎక్కువగా నొప్పించే శక్తి మనల్ని ప్రేమించే వాళ్ళకుందా, లేక మనల్ని ద్వేషించే వాళ్ళకుందా అని. ఇప్పుడనిపిస్తోంది- ఎవరికీ కాదు, మనల్ని నొప్పించుకునే శక్తి అందరికంటే మనకే ఎక్కువగా వుంది, అని. మేరీ తన కలలన్నీ నేల కూలిపోతూంటే నిస్సహాయురాలిలా చూస్తూండి పోయింది. నేనేమో బ్రతుకుతో అడుగడుగునా పోరాటం చేస్తూనే వున్నాను. నువ్వేమో ఒక చిన్న పొరపాటు వల్ల అందమైన కుటుంబ జీవితానికి దూరమై పోయావు. ఇతర్లు చేసిన హాని నించి మనకి సహాయం చేయడానికి చట్టలూ, న్యాయ వ్యవస్థా వుంది కదా? అలాగే మనుషులని తమ నించి తాము కాపాడుకోనెటట్లు చేసే న్యాయ వ్యవస్థ వుంటే ఎంత బాగుండేది కదూ? అప్పుడు మన ముగ్గురం ఇలా వుండేవాళ్ళం కాదు!

ఇప్పుడైతే నా ఆశలన్నీ పిల్లల మీదనే పెట్టుకున్నా! నా బ్రతుక్కంటే క్లెమెన్స్ బ్రతుకు సంతోషకరంగా వుంటే నాకంతే చాలు!

నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకోమని దాన్నెప్పుడూ బలవంత పెట్టను. తెలివైన వాళ్ళని కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వకపోతే యేలా? మీ ఇంగ్లీషు వాళ్ళలో లోపమేంటో తెల్సా? ఆడపిల్లలకి నిర్ణయాలు తీసుకొనే స్వతంత్రం వుంది కానీ, అలా నిర్ణయాలు తీసుకోవడానికి కావల్సిన శిక్షణ మాత్రం లే దు. ఇప్పుడు నాకు ఎక్కడ పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల్ని చూసినా అదొకలాంటి భయం వేస్తుంది.

నీ మేన కోడ ళ్ళిద్దర్నీ చదివించు! వాళ్ళు మానసికంగా, శారీరకంగానూ దృఢంగా వుండేటట్లు శిక్షణ ఇప్పించు. వాళ్ళ అమ్మకంటే ఎక్కువ లోక ఙ్ఞానం వచ్చేలా తీర్చి దిద్దు.

కుటుంబంలో శాంతీ, చదువుకునే వసతీ వుంటే చాలు, ఆడపిల్లలు ఏదైనా నేర్చుకోగలరూ, ఎక్కడైనా నిలదొక్కుగోలరు. ప్రేమా, పెళ్ళీ,సంతోషమూ, అంటావా? అవి వాళ్ళు వాళ్ళ ఙ్ఞానాన్నీ, తెలివితేటల్నీ, స్వతంత్ర్యాన్నీ ఉపయోగించుకోవడాన్ని బట్టి వుంటుంది. ఆపైన కొంచెం అదృష్టం కూడా కల్సి రావాలనుకో!

కానీ వాళ్ళకు చదువులు చెప్పించకుండా, అందమైన బొమ్మల్లా తయారు చేస్తే మాత్రం వాళ్ళు బాధ్యత ఎప్పటికీ తెలుసుకోరు. అందుకే నా మాట విని వాళ్ళిద్దరికీ మగపిల్లల్లాగే చదువులు చెప్పించు. అమాయకత్వానికీ, అఙ్ఞానానికీ చాలా తేడా వుంది. అందుకే కొంచెం ప్రపంచ ఙ్ఞానం అవసరం. దానికి చదువొక్కటే మార్గం.

జేన్ అంతా నీ పోలికే ననీ, ఎల్సీ తన తల్లి పోలికనీ రాసావు. పిల్లల కబుర్లు నీ ఉత్తరాల్లో చదివి చాలా ఆనందిస్తాను. నీతో చెప్పానో లేదో కానీ ఈ మధ్య క్లెమెన్స్ చిన్న చిన్న అబధ్ధాలాడటం నేర్చుకుంటోంది. దానికి ఎవర్నీ నొప్పించడం ఇష్టం వుండదు. అందుకే చిన్న చిన్న అబధ్ధాల సహాయంతో ఇరుకున పెట్టే సంఘటనలనించి తప్పించుకోవాలనుకుంటుంది. అయితే మనిషన్న తర్వాత నొప్పిని భరించటం నించీ, నొప్పి కలిగించటం నించీ సంపూర్తిగా తప్పించుకోలేమని చెప్పాను. నొప్పించినా సరే, అవసరమైతే చేదు మందు తాగించక తప్పదు కదా!

కిందటి వారం, ఒక రోజు ఆర్నాల్డ్ అల్లరి చేస్తూ హాల్లో పూల కుండీని పగల గొట్టాడు. నాక్కోపం వస్తుందని భయపడి, క్లెమెన్స్ అన్నని రక్షించటానికి, తానే ఆ కుండీని పగలగొట్టానని అంది. కానీ దానికి నిజాన్ని నా దగ్గర ఎక్కువ సేపు దాచే చాకచక్యం లేకపోయింది. అబధ్ధమాడినందుకు మందలించాను.

“అమ్మా! ఆర్నాల్డ్ మీద నీక్కోపం వస్తుందనీ, ఆ కోపాన్ని వాడు తట్టుకోలేడనీ భయ పడ్డాను. అందుకే అబధ్ధమాడాను! అన్నకి కూడా సంతోషమే కాదా?” అంది క్లెమెన్స్.

“లేదు క్లెమెన్స్! మామూలు మనుషులు వాళ్ళు చేసే పనుల పర్యవసానాలు భరించగలిగే వుంటారు. కుండీ పగలగొట్టేటప్పుడు ఆర్నాల్డ్ కి నాక్కోపం వస్తుందనీ తెలుసు, దాన్ని తను తట్టుకోక తప్పదనీ తెలుసు. తమకోసం పక్క మనిషి అనవసరమైన త్యాగాలు చేయడం ఎవరికీ ఇష్టం వుండదు. కాబట్టి అలాటి అలవాటు మానుకో. భవిష్యత్తులో నిజంగా నువ్వు ఇతర్ల కోసం ఇష్టాలని వదులుకోవాలసిన తరుణాలు రాక తప్పదు. అయితే అలాటి సమయాల్లో కూడ, నిజాన్ని మాత్రం దాచకు”, అని చెప్పాను.

వీలైనంతవరకూ వాళ్ళిద్దరూ స్వతంత్రంగా ఆలోచించుకోవడమే అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే నేనింక ఎక్కువ రోజులు బ్రతకనని అనిపిస్తోంది! ఒక్కసారి పిల్లలిద్దర్నీ తీసుకొని రావొచ్చుగా నువ్వు? క్లెమెన్స్, ఆర్నాల్డ్ ఇద్దరికీ నేను నీ మేనకోడళ్ళ గురించి చెప్పాను. కలుసుకోవాలని కుతూహలంగా వున్నారు. వీలైతే వాళ్ళను తీసుకొని ఒక్క సారి రా.

వుండనా,

మార్గరెట్

 

ఆ వుత్తరం వెనక హొగార్త్ గారి చేతి రాతలో “మార్గరెట్- మరణం- డిసెంబరు 18, ” అని వుంది. అంటే ఆ వుత్తరం రాసిన కొన్నాళ్ళకే మార్గరెట్ మరణించిందన్నమాట.

“మావయ్య ఈ వుత్తరాలు నాకు చూపించి వుంటే బాగుండేది. కొన్ని విషయాలు ఎవరితోనూ పంచుకోలేం కాబోలు!” జేన్ అంది బాధగా.

“మా అమ్మ గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు. ఆమెకోసం మనం వెతికి ప్రయోజనం వుండదు. ఆ విషయం వదిలేద్దాం లే జేన్!” ఫ్రాన్సిస్ అక్కణ్ణించి నిరాశగా లేచాడు.

వీలునామా- 6 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(గత వారం తరువాయి)

స్నేహ హస్తం

 జేన్, ఎల్సీలు వాళ్ళు వుంటున్న భవంతిని వదిలిపెట్టాల్సిన రోజు దగ్గరికి రానే వచ్చింది. తనకి ఆస్పత్రిలో మేట్రన్ వుద్యోగం కూడా దొరకలేదని తెలిసి జేన్ కృంగి పోయింది. రెన్నీ గారే ఈ విషయాన్ని వుత్తరంలో తెలియపర్చారు. ఆ వుద్యోగం ఒక విధవరాలికిచ్చినట్టు వుంది ఆ  వుత్తరంలో.

ఆస్పత్రి డైరెక్టర్లు జేన్ దరఖాస్తునెంతో శ్రధ్ధగా పరిశీలించిన మీదట, ఆమె చిన్న వయసు దృష్ట్యా ఆమె ఈ వుద్యోగ భాధ్యతలు నెరవేర్చలేదని అభిప్రాయపడ్డారట. దురదృష్టవాశాత్తూ తనకి తెలిసి ఇంకెక్కడా ఖాళీలు లేవని కూడా రాశారు రెన్నీ.

ఎల్సీ మాత్రం ఆ వార్త వినగానే ఎగిరి గంతేసింది.

“పోతే పోయింది, పాడు వుద్యోగం. కష్టమో, నష్టమో, మనిద్దరం కలిసే వుందాం జేన్! వుంటే తిందాం, లేదా పస్తులుందాం. అంతే కానీ, నన్నొదిలి నువ్వు ఒంటరిగా ఆ ఆస్పత్రిలో జన్మంతా పని చేయలని తలుచుకుంటే నాకెంత దిగులేసిందో తెలుసా?”, అక్క మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది.

వుద్యోగం లేక రేపెలా అన్న దిగులు ముంచేసినా, తానొంటరిగా వుండాక్కర్లేదన్న నిజం జేన్ ని కూడా సంతోషపెట్టింది. ఈ విషయం గురించే ఇద్దరూ మాట్లాడుతూ వుండగా, పెగ్గీ వాకర్ వచ్చి తన కోసం ఎదురుచూస్తుందని చెప్పాడు నౌకరు.

వాళ్ళ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చి ఇచ్చే పెగ్గీ వాకర్ ఆ వూళ్ళో అందరికీ తెలుసు.  ఆవిడ ముందు ఈ వూళ్ళోనే వుంటూ, ఒకసారి ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చింది. మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, తన అక్క చెల్లెళ్ళపిల్లలూ అందరితో వాళ్ళ ఇల్లు మహా సందడిగా వుంటుంది. ముసలి వాడైన ఆమె తండ్రికీ, అంత మంది పిల్లలకూ ఆమె సంపాదనే ఆధారం.

చాలా పిసినారిదని వూళ్ళో వాళ్ళు ఆమె గురించి అనుకొనే మాట. ఆస్ట్రేలియా వెళ్ళోచ్చిన సంపాదనతో బోలెడంత ఆస్తి పాస్తులు సంపాదించినా, నిరుపేదరాలిలాగే బ్రతుకుతుంది, అలాగే కష్టపడుతుంది, దేనికోసమో మరి. అయితే, బట్టలు మాత్రం బహు చక్కగా శుభ్రం చేసి ఇస్త్రీలు చేసి తెస్తుంది. ఆమె నిజాయితీ, నిక్కచ్చితనమూ వూరంతా తెలిసిన విషయమే కావడం వల్ల, చాలా వరకు అందరూ బట్టలు ఆమెకే వేస్తారు.

“పెగ్గీ! ఇహ ఇదే ఆఖరు నీకు బట్టలు వేయడ, పై వారం నించి మా బట్టలు మేమే ఉతుక్కోని ఇస్త్రీ చేసుకోవాలి.”

“అయ్యో! అదేం మాట అమ్మాయి గారూ. అంతలోకే ఈ ఇంటి కొత్త యజమాని ఇక్కడ కాపురం వుండడానికి వచ్చేస్తారా? మీరు నిజంగా ఈ ఇల్లూ , ఊరూ వదిలి వెళ్ళిపోతారా?”

“అవును పెగ్గీ! గురువారం మేమీ ఇల్లు ఖాళీ చేయాలి.”

“ఎక్కడికి వెళ్తారు అమ్మాయిగారూ?”

“నాకు తెలిస్తేగా నీకు చెప్పెటానికి!”

“అదేంటండీ అమ్మాయిగారూ అలాగంటారూ! నిజంగా మీకూ, చెల్లాయిగారికీ తలదాచుకోవడానికింత నీడ లేదా?”

“ఇప్పటికైతే లేదు!”

“హ్మ్మ్మ్! అన్నట్టు మేమూ  ఈ వూరొదిలి పోతున్నాం తొందర్లోనే. ఎడిన్ బరో కి.”

“ఏమిటీ? నువ్వు వూరు వొదిలి పోతున్నావా? ఎందుకూ? నీకిక్కడ జరుగుబాటు బానే వుంది కదా?” ఆశ్చర్యంగా అడిగింది జేన్.

“ఆ మాటా నిజమేననుకోండి. అయితే మా టాం ఎడిన్ బరో లో ఇంజినీరింగు చదువుతానని ఒకటే గోల పేడుతున్నాడు. వాణ్ణి ఒంటరిగా పంపటం నాకేమో ఇష్టం లేదు.  మా నాన్న సరేనన్నాడు, పిల్లలంతా ఎగిరి గంతేసారు. అందరమూ అందుకే తట్టా బుట్టా సర్ది ఎడిన్ బరో వెళ్ళిపోదామని అనుకున్నాము.    ఆస్ట్రేలియా నించి ఇక్కడకొచ్చి లాండ్రీ దుకాణం తెరవగానే వూళ్ళో వుండే లాండ్రీ దుకాణం వాళ్ళు కొంచెం చిరాకు పడ్డారులెండి.ఇప్పుడు ఎడిన్ బరో లో అయితే ఎవరి ని బాధ పెడుతున్నానో తెలియను కూడా తెలియదు. అప్పుడే అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు కూడా మాట్లాడుకున్నాను. ”

“పెగ్గీ, నీకున్న ఆత్మ విశ్వాసం నాకుండి వుంటే ఎంత బాగుండేది. మావయ్య ఎంతో ఖర్చు పెట్టి చదివించాడు, కానీ ఏం ప్రయోజనం? ఆ చదువుతో నాకెలాటి వుద్యోగమూ దొరకటం లేదు.  అసలు మా ఇద్దరి పొట్టలూ ఎలా పోషించుకోవాలో కూడ అర్థం కాకుండా వుంది.”

“ఏం మాటలండీ అవి!  మీ  పొట్ట పోసుకోవడమే అయితే మీరు చేసుకోగలరు.   చెల్లాయి గార్ని కూడా చూసుకోవాలి. దాంతో మీరు బెంగ పడుతున్నట్టున్నారు. మా చెల్లి తన పిల్లల భారం నా మీద వేసి చచ్చి పోయినప్పుడు నేనూ భయపడ్డాను. ఎలా వీళ్ళందర్నీ సాకటమా అని.  అప్పట్లో నా రాబడి ఏడు పౌండ్లు మాత్రమే.   కానీ, చూస్తూ చూస్తూ మన వాళ్ళని పస్తు పడుకోబెట్టలేం కదా. అందుకే ధైర్యం చేసి ఆ బాధ్యత తల కెత్తుకున్నాను. ఏదో ఆ దేవుడి దయవల్ల పరవాలేదు. వాళ్ళ చదువులైపోతే ఎలాగో వాళ్ళని మెల్బోర్న్ పంపే ఏర్పాటు చేస్తాను. అక్కడ ఇక్కడ కంటే కొంచెం బాగుంటుంది.”

“అవునా పెగ్గీ? అక్కడ బాగుంటుందా?”

“ఫరవాలేదు. అక్కడుండే కష్టాలు అక్కడున్నాయనుకోండి.  అయినా, మాలాటి కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఎక్కడైతే నేం లెండి!  తరవాతెప్పుడైనా దాని గురించి చెప్తాను. అన్నట్టు, అమ్మాయి గారూ, మీరు తప్పనుకోకుంటే ఒక మాట చెప్తాను.  మీరు ఎడినబరోలో ఎక్కడుండాలో తెలియదంటున్నారు కాదా? నేను అద్దెకు తీసుకున్న ఇంట్లో ఒక గదిలో  మీరూ చెల్లాయి గారూ వచ్చి వుండొచ్చు.  ఒక ఉద్యోగం దొరికి మీరు నిలదొక్కున్నాక వేరే ఇంటికెళ్ళొచ్చు. ” జంకుగా అంది పెగ్గీ.

“అద్దె కట్టడానికి డబ్బు లేదు పెగ్గీ!”

“అయ్యొయ్యో! అద్దె మాటెందుకు లెండి. మీరు నాకొక్క సాయం చేస్తే అదే పదివేలు.  మా ఇంట్లో ఆడపిల్లలకి కాస్త కుట్టు పని నేర్పించి, నా లాండ్రీ బిల్లులు కొంచెం రాసి పెట్టండి,  వీలైతే. ఆ రెండు పనులూ అసలు నాకు చేత కావడంలేదు.  దాంతో మనం అద్దె గురించి మాట్లాడుకునే అవసరం వుండదు.”

“పెగ్గీ!  తప్పకుండా చేసి పెడతాను. నాకు కాలు నిలదొక్కుకునే అవకాశం వస్తూంటే కాదంటానా?   అయితే పెగ్గీ, ఎడిన్ బరోలో నేనూ, ఎల్సీ, ఇద్దరమూ ఇరవై నాలుగు పౌండ్లతో బ్రతకగలమంటావా?”

“మా లాటి వాళ్ళం ఎలాగో బ్రతికేస్తామమ్మా! పాపం, మీకే…”

“ఫరవాలేదులే.  మీరంతా ఎలా వుంటే మేమూ అలాగే వుంటాము. ”

“అంతే లెండి. ముందు మనం దైవం మీద భారం వేస్తే, అంతా ఆయనే చూసుకొంటాడు.”

“నిజంగా భగనవంతుడు నిన్ను కష్టాల నించి తప్పించాడా పెగ్గీ?” కుతూహలంగా అడిగింది జేన్.

“భగవంతుడు కష్టాలు తప్పిస్తాడో లేదో నాఖంతగా తెలియదు కానీ, ఆ కష్టాలని తట్టుకునేందుకు శక్తిని ఇస్తాడమ్మాయిగారూ!  ధైర్యమూ, ఆశా కూడా ఇస్తాడు. క్షమించండి, ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడి మిమ్మల్ని నొప్పించానా?”

“ఇందులో నొచ్చుకోవడానికేముంది పెగ్గీ? నువ్వన్నట్టు ధైర్యమూ శక్తీ వుండాలేకానీ, తీర్చుకోలేని సమస్య వుండదు.  ఇరవై నాలుగు పౌండ్లతో జీవితాన్ని ప్రారంభించటానికి నాకేమీ అభ్యంతరం లేదు.”

“మీ బట్టలూ, పుస్తకాలూ అన్నీ తెచ్చుకోండి. యేడాది దాకా బట్టలు కొనే పని వుండదు.”

” అవును. అంతే కాదు, మా గదుల్లో వున్న సామానంతా మాదే నన్నాడు మావయ్య. అవసరమైనంత వరకు వుంచుకోని, మిగతా సామాను అమ్మి వేస్తాను. ”

” ఇంతకీ మీరు ఎడిన్ బరో ఎప్పుడు బయల్దేరుతున్నారు”

“బుధవారం, ఫ్రాన్సిస్ వస్తాడు. అతనికి ఇల్లప్పగించి మేము బయల్దేరాలనుకుంటున్నాం.”

“సరే, అయితే అందరమూ కలిసి గురువారం బయల్దేరదామా?”

“అలాగేనండి. మీరు వూరి వాళ్ళకి చేసిన వుపకారాలగురించీ, సహాయాల గురించీ అందరూ చెప్పుకుంటున్నారు. కొత్త అయ్యగారు కూడా  మీలాగే ఈ ఇంట్లో సంతోషంగా వుంటే అంతే చాలు. నే వస్తా అమ్మాయి గారు.”

 

***

(సశేషం)

వీలునామా – 5 వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

సాయంకాలం విందు

 కాసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రమవుతూండగా ఫ్రాన్సిస్, జేన్ కలిసి రెన్నీ ఇంటికి చేరుకున్నారు. అక్కడందరూ తనని విచిత్రమైన కుతూహలం తో చూస్తారన్న సంగతి తెలిసినా, జేన్ కాసేపు పదిమందితో సరదాగా గడపాలని నిశ్చయించుకొంది.

విందన్న పేరేకానీ, ఎక్కువమంది ఆహూతులున్నట్టు లేదు. ఆడవాళ్ళైతే అసలు తను తప్ప ఇంకెవరూ రాలేదు. రెన్నీ భార్యా, కూతురు మాత్రం వచ్చి పలకరించారు. అనుకోకుండా ధనవంతుడవడంతో ఫ్రాన్సిస్ ని ఈమధ్య అందరూ ఏదో ఒక వంకన భోజనానికి ఆహ్వానించేవారే. అందరూ అతని తెలివితేటలనీ, అభిరుచులనీ కొనియాడేవారే!

రెన్నీ గారమ్మాయి, ఎలీజాకి పంతొమ్మిదేళ్ళు. అమాయకంగా వున్నా సాహిత్యంతో బాగా పరిచయం వున్నట్టు మాట్లాడింది. విధి వైపరీత్యంతో డబ్బంతా పోగొట్టుకున్న ఫ్రాన్సిస్ దూరపు బంధువు ఎలా వుంటుందోనన్న కుతూహలం పట్టలేకుండా వుంది. ఒక వీలునామా కోసం నిజంగా ఫ్రాన్సిస్ ఆ అక్క చెల్లెళ్ళలల్లో ఎవరినీ పెళ్ళాడకుండా వుంటాడా? మొదలైన ప్రశ్నలు ఆమె లేత మనసుని తినేస్తున్నాయి. జేన్ గురించి చెప్పమని తండ్రిని వేధించింది కానీ, రెన్నీ ఏమీ చెప్పలేదు. చాలా తెలివైనది, చాలా విచిత్రమైన అభిప్రాయాలున్న వ్యక్తి అని మాత్రమే చెప్పాడు.

ఆ రోజు విందులో జేన్ కి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన పబ్లిషరూ, ఎడినబరో కి చెందిన ఒక వకీలూ, ఒక పెద్ద వ్యాపారవేత్తా, ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళూ వచ్చారు.

“హ్మ్మ్మ్!! చాలా మామూలుగా వుందీవిడ, కనీసం ఇరవై యేడేళ్ళయినా వుంటాయేమో!” అనుకుని తృప్తిగా నిట్టూర్చింది ఎలీజా జేన్ ని చూడగానే.

“చూడడానికి మామూలుగానే వున్నా, ఏదో ప్రత్యేకత వుందీమెలో,” అనుకున్నారు అక్కడున్న మగవాళ్ళంతా. కథల్లో వుండే ఆడవాళ్ళలా, నాజూగ్గా, అమాయకంగా కాకుండా, ఆరోగ్యంగా, తెలివితేటలూ, లోకఙ్ఞానమూ వుట్టిపడే స్త్రీ మొహాన్ని అంత దగ్గరగా చూడడం ఆ వర్గంలోని మగవాళ్ళకి కొంచెం అరుదే మరి.

నిజానికి ఆరోజు ఆమె ఆత్మ విశ్వాసం దారుణంగా దెబ్బ తిని వుంది. నిరాశా నిస్పృహలతో కృంగి పోతుంది. మనుషుల మీదా వ్యవస్థ మిదా నమ్మకం సడలుతున్నట్టనిపిస్తోందామెకి. కానీ, మొహంలో అదేమీ కనబడకుండా, చిరునవ్వుతో అందరినీ హుందాగా పలకరించింది. ఆమె ప్రవర్తన చూసి రెన్నీ ఆశ్చర్యపోయాడు కూడా!

అతను ఉదయం చూసిన జెన్నీ కోపంగా ఆవేశంగా వుంది. ఇప్పుడు సౌమ్యంగా, తేటపడ్డ మొహంతో, నెమ్మదిగా వుంది. ఎలీజా పియానో మీద వాయించిన పాటను ఓపికగా, శ్రధ్ధతో విన్నది. మిగతా వారి మాటలనూ కుతూహలంతో విన్నది. పబ్లిషరు ప్రజల అభిరుచిని గూర్చి చెప్తూన్నాడు.

“మాల్కం! ఇప్పుడు రచనలతో డబ్బు సంపాదించాలంటే మతాన్ని ఎలాగో అలా కథలో జొప్పించాలి. విలన్లందరినీ హేతువాదులుగా, నాస్తికులుగా మార్చు. కథానాయికని నానా కష్టాలూ పెట్టు. ఆమెకొక ప్రేమికుణ్ణివ్వు. ఇద్దరూ క్రిస్టియన్ మతం పుచ్చుకోని భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టగానే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టు రాయి. ఆ పుస్తకం వేలల్లో అమ్ముడుపోకపోతే అప్పుడు నన్నడుగు! డికెన్సూ, థాకరే కంటే నీకెక్కువ పేరు రాకపోతే చూస్కో!”

“నీ మాటలకేమొచ్చెలే గానీ, మా చెల్లెలు, ఆన్, అదేదో పుస్తకం కొనమని ప్రాణాలు తోడుతుంది. అది అయిదు ప్రచురణలయిపోయిందట, నిజమేనా?”

“అవును! ఇప్పుడే ఆరో ప్రచురణ కూడా వేస్తున్నాం! నిజానికి ఆ పుస్తకం ఏమీ బాగుండదు, తెల్సా? అందులోనూ, ఆ అమెరికన్లు మాట్లాడే భాషా, అయ్య బాబోయ్! ఏం చెప్పమంటావు?”

“నిజంగా అమెరికన్లు ఆ పుస్తకాల్లో వున్నంత చెత్త భాష వాడతారంటావా? ఇహ అలాంటి భాష మాట్లాడే అమెరికన్లతో బ్రతకడం ఎలా వుంటుందో! ఊహకే అందదు కదూ? అందుకే నేనెప్పుడు ఇంగ్లీషు వాళ్ళ పుస్తకాలే చదువుతాను!”

ఎలీజా వచ్చి జెన్నీ పక్కన కూర్చుంది.

“మాల్కం కి సాహిత్యంతో చాలా పరిచయం వుంది తెల్సా? ఆయన పత్రికల్లో కూడ బాగా రాస్తారు.”

“చాలా చాలా ధన్యవాదాలు మిస్ రెన్నీ! వింటున్నారా పబ్లిషర్ గారూ! జేన్, ఈ పబ్లిషర్లకి రచయితలంటే ఎంత లోకువ తెలుసా? ఈ దరిద్రుడికి నేను కిందటి వారం పత్రికలో రాసిన వ్యాసం నచ్చలేదట. ”

“లేదు లేదు మాల్కం! నాకే కాదు నాన్న గారికి కూడా చాలా నచ్చింది. పడీ పడీ నవ్వారు!”

“వినవయ్యా పబ్లిషరూ! నీకు నచ్చనివి చాలా మందికి నచ్చుతాయి, తెలుసుకో మరి!”

“నీ హ్యూమరు చాలా ఫాషనబుల్ మాల్కం! కానీ, కొంచెం అతిగా అనిపిస్తుంది నాకు. ఈ మధ్య అసలు విషయం వదిలేసి ఎక్కడెక్కడివో కొటేషన్లు రాయడం, కథకి అవసరం లేని విషయాలని జొప్పించడం కూడా చేస్తున్నారు రచయితలు. పాతకాలం ఆవూ, తాడి చెట్టు వ్యాసాల్ల్లాగా…”

వాళ్ళ సంబాషణొదిలేసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, జేన్, ఎలీజా!

“జేన్! నాకు రచయితలూ, పబ్లిషర్లతో మాట్లాడడమంటే భలే సరదా! అందులో మాల్కం వున్నాడు చూడు, జీనియస్! అయితే చాలా కరుగ్గా విమర్శిస్తాడనుకో!”

“నువ్వూ రాస్తావా ఎలీజా?” అడిగింది జేన్.

“ఆ, ఏదో కొంచెం కొంచెం. నాకు వచనం కంటే కవిత్వం ఇష్టం. ఏ పత్రికకీ పంపలేదనుకో. మా స్నేహితులకిస్తా చదవమని, అంతే. కొన్ని ఆడవాళ్ళ పత్రికల్లో ‘ఎల్లా’ అనే పేరుతో ఒకటి రెండు కవితలు పడ్డాయనుకో! ‘ఎల్లా’ పేరు బాగుంది కదూ?”

“అది సరే కానీ, కవితలు పత్రికల్లో వేసుకుంటే డబ్బొస్తుందా?”

“నువ్వు భలే డబ్బు మనిషిలాగున్నావే! అందుకే నువ్వు వ్యాపారం చేస్తే బాగుంటుందన్నారు నాన్న. కవితలు పత్రికలో వేసుకుంటే డబ్బేమీ రాదు, కానీ నేనెప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు.”

“అదృష్టవంతురాలివి. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు.” నిట్టూర్చింది జేన్. పబ్లిషరు వైపు తిరిగింది.

“మీరు కొత్త కొత్త నవలలేకాక కవితల పుస్తకాలూ వేస్తారా?”

“అమ్మో! ఈ ఎడిన్ బరో లో కవితల పుస్తకమా? కొంచెం కష్టమమ్మాయ్! పాత కవితలే మళ్ళీ మళ్ళీ వేస్తాం.”

“అవును మరి, లేకపోతే కాపీరైటు చెల్లింపులకి డబ్బు ఖర్చు కదా!” వేళాకోళం చేసాడు మాల్కం.

ఇంతలో శ్రీమతి రెన్నీగారొచ్చి జేన్ ని ఒక పాటేదైనా పాడమన్నారు. తనకి సంగీతం బొత్తిగా రాదని చెప్పింది జేన్. రెన్నీ గారి మిగతా చిన్నపిల్లలొచ్చి తల్లిని చుట్టు ముట్టారు.

జేన్ మొహమాటంగా వాళ్ళ చదువులూ, ట్యూషన్ మాస్టార్ల గురించీ వాకబు చేసింది.

“ఇక్కడే ఏదైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ట్యూషన్లూ చెప్పుకోవడానికి వీలవుతుందో! ఇంగ్లీషూ, లెక్కలూ బాగా చెప్పగలను!” సాలోచనగా అంది జేన్.

“ట్యూషన్లా? చిన్న పిల్లవి, నీ వల్లేం అవుతుంది చెప్పు? నా మాట విని ఎవరైనా పెద్ద వాళ్ళింట్లో ఆడపిల్లలకి చదువు చెప్పే గవర్నెస్ గా చేరిపో! మీ చెల్లాయిని కూడా అలా ఏదో ఒక ఇంట్లో చేరి పొమ్మను. ఇల్లు అద్దెకు తీసుకోవడమూ, నెలనెలా అద్దెకోసం తడుముకోవడమూ, ఎందుకొచ్చిన బాదరబందీ? లేదా ఏదైనా స్కూల్లో టీచరుగా చేరిపో! నీకు సంగీతం వచ్చా? రాకపోతే నేర్చుకోవచ్చు.”

“ఇప్పుడు నాకు సంగీతమెందుకులెండి. అసలు మా చెల్లాయిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికీ వెళ్ళాలని లేదు. అయినా చూద్దాం, ఏమవుతుందో!”

“ఇవాళ పొద్దున్న రెన్నీ గారితో పిచ్చాసుపత్రి మేట్రన్ ఉద్యోగం గురించి మాట్లాడావట గదా? నన్నడిగితే అన్నిటికంటే అదే మంచిది. ఆలస్యం చేయకుండా నీ దరఖాస్తు పంపించేయి. జీతం తక్కువేననుకో. కానీ ఇహ వేరే దారి లేనప్పుడేం చేస్తాం!”

“అవును, నేనూ అదే అనుకుంటున్నాను.”

“రెన్నీ నీ కా ఉద్యోగం వచ్చేలా చేయగలరు. నువు చాలా తెలివైన దానివని అన్నారు నాతో.”

“తెలివితేటలే కాదు, నాకు ధైర్యమూ ఎక్కువే!”

“అన్నట్టు, ఎడిన్ బరో లో ఎక్కడ వుంటున్నావు?”

“ఈ వూళ్ళో నాకెవరూ తెలియదు. డబ్బు కూడా లేదు. అందుకే మా మావయ్య కొడుకు ఫ్రాన్సిస్ ఇంట్లోనే వుంటున్నాను.”

“ఏమిటీ? పెళ్ళి కాని ఆ బ్రహ్మచారి ఇంట్లో, వేరే తోడు లేకుండా వుంటున్నావా? నలుగురూ వింటే ఏమనుకుంటారు? ఏం పని చేసావు జేన్!”

బెదిరిపోయింది జేన్.

“ఏమోనండి! నాకేమీ తోచలేదు. ఎక్కడో వుండడమెందుకూ, మా ఇంట్లోనే వుండు అన్నాడు ఫ్రాన్సిస్. డబ్బు కలిసొస్తుందని ఒప్పుకున్నాను. మా వూరి మిస్ థాంసన్ ని సలహా అడిగాను కూడా! ఆవిడా పర్వాలేదంది!”

“మీ వూళ్ళో వుండే మిస్ థాంసనా? సరిపోయింది! అడక్కడక్క ఆవిడనే అడిగావా? ఆవిడదంతా ఉలిపికట్టె తీరు.”

“ఆవిడ ఎలాటిదైతే యేం లెండి! మమ్మల్ని చూసి జాలిపడకుండా ధైర్యం చెప్పింది  ఆవిడొక్కర్తే.”

“సరే, పోనీలే! అయిందేదో అయింది. ఇవాళ్టినుంచీ నువ్విక్కడ మాతో నే వుండు. మా అమ్మాయి ఎలీజా గదిలో సర్దుకోవచ్చు నాలుగురోజులు. ఇవాళ నువ్వు ఒంటరిగా ఫ్రాన్సిస్ ఇంట్లో గడిపావంటే లోకం కోడై కూస్తుంది!”

జేన్ ఒక్క క్షణం ఆలోచించింది.

“మీ సూచనకి ధన్యవాదాలు. నామీద ఏవైనా అపవాదులు రేగాల్సి వుంటే అవీ పాటికే పుట్టి వుంటాయి. ఇవాళ నేను కొంచెం సేపు ఒంటరిగా ఆలోచించుకోవాలి. రేపెలాగూ నేనీ వురునించి వెళ్ళేపోతాను.”

“రేపాదివారం. ప్రయాణాలు చేయకూడదు. కాబట్టి, నువ్వనుకున్నట్టే ఇవాళ ఫ్రాన్సిస్ ఇంట్లో వుండి, రేపు పొద్దున్నే ఇక్కడకొచ్చేయి. ఏదో ఒక వంకన ఎల్లుండి వరకూ ఇక్కడే వుండి అప్పుడు వెళ్దువుగాని.”

“అలాగే, శ్రీమతి రెన్నీ గారూ! మీరు నాపైన చూపించిన శ్రధ్ధా, కరుణా ఎప్పటికీ మరచిపోను. ఇవాళ రాత్రి మాత్రం ఒంటరిగా వుండాలని వుంది నాకు. మీరన్నట్టు రేపు ఇక్కడకే వచ్చి వుంటాను. మరి ఇక మేం బయల్దేరతాం!”

అందరికీ చెప్పి ఫ్రాన్సిస్, జేన్ లిద్దరూ ఇంటినించి బయటపడ్డారు.

“ఎలా అనిపించింది జేన్ నీకు వాళ్ళ ఇల్లూ, కంపెనీ? నాకసలు నిన్ను కనిపెట్టి వుండడానికే వీలవలేదు. అసలే కొత్త చోటు , ఏమైనా ఇబ్బంది పడ్డావా?”

“ఇబ్బందేమీ లేదు కానీ, చాలా అలసటగా వుంది. ఇప్పుడిక్కడ ఎల్సీ వుంది వుంటే ఎంత బాగుండేది. నేను మా ఇంటికెళ్ళిపోతా ఫ్రాన్సిస్!”

“అప్పుడేనా? ఇంకొద్ది రోజులుండు. నీ ఉద్యోగం కోసం ఇంకా గట్టిగా ప్రయత్నిద్దాం.”

“ఏమీ లాభం లేదు ఫ్రాన్సిస్! ఆ మేట్రన్ ఉద్యోగానికి ఒక దరఖాస్తు పడేసి నేను ఇంటికెళ్ళిపోతాను. నాకిక ఉద్యోగాల మీద ఆశ పోయింది. పిచ్చాసుపత్రి లో రోగులు బయటి ప్రపంచంలో వాళ్ళకంటే మూర్ఖంగా, కౄరంగా వుండరు కదా!”

“చూద్దాం! సోమవారం కూడా ఆలోచించి, మంగళవారానికి పంపుదాములే. నువ్వు అధైర్య పడకు.”

ఫ్రాన్సిస్ గొంతులో వినిపించిన ఆప్యాయతా, ఆశలతో కొంచెం తేరుకుంది జేన్. ఆయినా ఆ రాత్రి కూర్చుని మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు రాసుకుంది.

ఆ రాత్రి మొదటిసారి మావయ్యని తిట్టుకుంది జేన్! అంతకుముందు ఆయన చూపించిన ఆప్యాయతా, చెప్పించిన చదువూ, అన్నీ గొప్ప అబధ్ధాలుగా అనిపించాయామెకి. అన్నిటికంటే, చెల్లెల్ని ఒంటరిగా ఒదిలి, తనూ దిక్కూ మొక్కూ లేని అనాథలా ఆ ఆస్పత్రిలో పడి వుండాల్సొస్తుందేమో అన్న ఆలోచన చాలా కలవరపెట్టిందామెని.

 ***

 మర్నాడు రెన్నీ కుటుంబంతో కలిసి చర్చి కెళ్ళారు ఫ్రాన్సిస్, జేన్. చర్చి లో ఫాదరు చేసిన బోధన ఒక్క ముక్క కూడా మనసులోకెక్కలేదు జేన్ కి. ఆమె మనసంతా ఆస్పత్రి చూట్టూ, అక్కడ తను చేయబోయే వుద్యోగం చూట్టూ తిరుగుతుంది.

ఆ తర్వాత రెన్నీ గారి ఇంట్లో సంభాషణంతా చర్చిల చుట్టూ, మతం చుట్టూ, మత బోధనల చుట్టూ తిరిగింది. జేన్ కి అవంతా ఎక్కువగా తెలియకపోవడం మూలాన, పెద్దగా పాల్గొనలేకపోయింది.

శ్రీమతి రెన్నీ ఆ రోజు జేన్ ని అక్కడే వుండిపొమ్మంది. జెన్నీ నిరాసక్తంగా ఒప్పుకుంది. ఫ్రాన్సిస్ వెంటనే జెన్నీని తాను ఎప్పుడూ వెళ్ళే చర్చి ఒక్కసారి చూపించి తీసుకొస్తానని అన్నాడు. మాట్లాడకుండా అతన్ని అనుసరించింది జేన్. అసలామెకి చర్చి మీదా, మతం మీదా పెద్ద నమ్మకమే లేదు. ఏదో అతని మాట తోసేయలేక వెళ్ళింది.

కానీ, ఆ రోజు మొదటిసారి ఆమె దేవుణ్ణి తనకు సహాయం చేయమని నిస్సహాయంగా అడిగింది. బయటికొస్తూ, నిస్సహాయ స్థితిలో మనిషి దేవుడి వైపు చూస్తాడు కాబోలు అనుకుంది.

రెన్నీ ఇంటికెళ్తూ దారిలో,

“ఫ్రాన్సిస్, నువ్వన్నట్టు రేపింకొక్కసారి ప్రయత్నిస్తాను. ఎక్కడా ఉద్యోగం దొరకకపోతే ఆస్పత్రికి నా దరఖాస్తు పంపుతాను. దైవ నిర్ణయం ఎలా వుంటే అలా జరుగుతుంది,” అంది.

సోమవారం మళ్ళీ జేన్ ఎడిన్ బరోలో తనకు తెలిసిన మరికొన్ని ఆఫీసులు చుట్టబెట్తింది. శనివారం లాగే, ఆ రోజూ ఆమెకి ఎక్కడా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించలేదు. ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తు పోస్టులో వేసి ఎడిన్ బరో వదిలింది జేన్.

 ***

 ఇంటికెళ్ళి జేన్ ఎల్సీతో తన ఎడిన్ బరో ప్రయాణమూ, ఉద్యోగాలకోసం వేటా, ఆస్పత్రిలో మేట్రన్ ఉద్యోగానికి దరఖాస్తూ, అన్నీ వివరంగా చెప్పింది. ఒకవేళ ఉద్యోగం వస్తే, జేన్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడపాలో తలచుకొని ఎల్సీ హడలిపోయింది.

“వొద్దు జేన్! నూవ్వా ఉద్యోగానికెళ్ళొద్దు. నేను ఎలాగైనా మనిద్దరికీ పొట్టపోసుకునే ఉపాయాలు వెతుకుతాను. నువ్వు మాత్రం ఒంటరిగా యేళ్ళ తరబడి ఆ ఉద్యోగంలో మగ్గి పోవడం నాకిష్టం లేదు!” ఎల్సీ వాపోయింది.

***

వీలునామా – 4వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మూసిన తలుపులు

జేన్ రైలు దిగేసరికి ఫ్రాన్సిస్ ఆమెకొరకు ఎదురుచూస్తూవున్నాడు. ఇంటికి కలిసి నడిచి వెళుతూ దారిలో ఉద్యోగావకాశాలని గురించి ఆశగా అడిగింది జేన్.

ఫ్రాన్సిస్ తనామెకొరకు వెతికిన ఉద్యోగం గురించి చెప్పటానికి కొంచెం సంకోచించాడు. ఆమె తెలివితేటలూ, సామర్థ్యాలతో పోలిస్తే ఆ ఉద్యోగం చాలా చిన్నది మరి. కానీ, తన మేనేజరు రెన్నీ ఆ ఉద్యోగాన్ని చాలా గట్టిగా సిఫార్సు చేసాడు. స్కాట్లాండులోని ఒక మానసిక చికిత్సల ఆస్పత్రిలో పెద్ద మేట్రన్ గారికి ఒక సహాయకురాలు కావాలన్నారు. జేన్ కి నచ్చుతుందో లేదో !

జేన్ కుతూహలంగా ఉద్యోగాన్ని గురించి అడిగింది. ఆస్పత్రిలో వున్న చిన్నా చితకా సిబ్బంది పర్యవేక్షణా, స్టోర్ గది పరవేక్షణా లాటి బాధ్యతలుండొచ్చు నన్నాడు ఫ్రాన్సిస్.  దాదాపు యాభై దరఖాస్తులొచ్చాయట అంత చిన్న ఉద్యోగానికి. అయితే మేనేజరు రెన్నీకి ఆ సంస్థ డైరెక్టర్లలో ఒకరిద్దరు బాగా పరిచయమట. ఇంతకు ముందున్న సహాయకురాలు పని సమర్థవంతంగా చేయలేకపోవటం చేత తీసేసారట.

“నేను తప్పక దరఖాస్తు చేస్తా ఫ్రాన్సిస్.  డబ్బు లెక్కలూ, సామాన్ల పర్యవేక్షణా నాకు బాగా వొచ్చు. మా ఇంట్లో, అదే, మావయ్య వాళ్ళింట్లో అన్నీ నేనేగదా చూసుకున్నాను. జీతం సరిపోతుందో లేదో! ఈ ఉద్యోగం వస్తే నీకు రెన్నీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ ఉద్యోగం తప్పక నాకొస్తుంది!”

“అయితే జేన్, నీ తెలివితేటలకీ, విద్యార్హతలకీ ఈ ఉద్యోగం సరిపోదేమో. ఆఖరికి ఆయా ఉద్యోగం లో చేరతావా?” బాధగా అన్నాడు ఫ్రాన్సిస్.

“నాకలాటి భేషజాలేవీ లేవు ఫ్రాన్సిస్. ఇళ్ళల్లో వుండే గృహిణులు ఆ పనేగా చేస్తారు? అందుకే కదా కుటుంబం మొత్తం సుఖంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు? ఇంతకీ మనం రెన్నీ గారినెప్పుడు కలుద్దాం?”

“ఆయన నిన్ను రేపు పొద్దున్నే రమ్మన్నారు. నీకన్నీ నచ్చితే వెంటనే దరఖాస్తు పంపేయొచ్చు!”

ఇద్దరూ ఫ్రాన్సిస్ ఇల్లు చేరారు. చిన్నదైనా పొందికగా వుందతని యిల్లు. ఖరీదైనది కాకపోయినా వున్నంతలో బాగున్న ఫర్నీచరూ, షెల్ఫు నిండా నీటుగా పెట్టిన పుస్తకాలూ, చలి నుంచి తప్పించుకోవడానికి చిన్న చలిమంటా, వెచ్చటి భోజనం సిధ్ధం చేసిన బల్లా, అన్నీ ప్రయాణం బడలిక నించి ఆమెని సేద దీర్చేయి.

అతని పుస్తకాలలో కవిత్వమూ, సాహిత్యమూ చూసి ఆశ్చర్యపోయింది జేన్. అయితే వృత్తి బేంకరైనా, ప్రవృత్తి సాహిత్యకారుడిదన్నమాట, అచ్చం ఎల్సీ లాగే అంకుంది. అయితే ఎల్సీ కంటే ఈతని అభిరుచి ఇంకొంచెం పరిపక్వతతో గంభీరంగా వుంది, అనుకుంది ఆ పుస్తకాల పేర్లు చదువుతూ. ఈ సంగతి మావయ్యకి తెలిస్తే ఎలా వుండేదో అని కూడా అనుకుంది.

ఇద్దరూ భోజనం ముగించి కబుర్లలో పడ్డారు. తన తండ్రిని గురించి ఫ్రాన్సిస్ ఎన్నో ప్రశ్నలడిగాడు. జేన్ అతన్ని అతని ఉద్యోగం గురించీ, చదువుకున్నరోజుల గురించీ అడిగింది.

జేన్ తెలివికలదీ, చదువుకున్నదీ అయినా కొంచెం అమాయకురాలు. ఆమెలో స్త్రీ సహజమైన ఆశా భావమూ, ప్రపంచంలో అంతా మంచే వుందన్న భోళాతనమూ చూసి ఫ్రాన్సిస్ ఆశ్చర్యపోయాడు.

***

 మర్నాడిద్దరూ పొద్దున్నే ఫ్రాన్సిస్ పనిచేసే బేంక్ ఆఫ్ స్కాట్లాండ్ కి వెళ్ళారు.  రెన్నీ తోమాట్లాడినతర్వాత జేన్ కొంచెం నిరుత్సాహపడింది. ఆ ఆస్పత్రి లో పని ఆమె అనుకొన్నదానికంటే చాలా ఎక్కువగానూ, వాళ్ళివ్వ జూపే జీతం చాలా తక్కువగానూ వుంది. సెలవులు సంవత్సరానికి రెండు వారాలు! ఇలాటి ఉద్యోగానికి బోలెడు దరఖాస్తులు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది.

“ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పని ఒక్కళ్ళతోనే చేయించాలనుకుంటూ, ఇంత తక్కువ జీతమా?” అడిగిందామె రెన్నీని.

“అవును! అయినా ఎంత మంది దరఖాస్తు చేసారో చూడండి. స్కాట్లాండ్ లో దిక్కూ మొక్కూ లేక ఏ ఆధారమూ లేని ఆడవాళ్ళు బొలేడు మంది వున్నారు. ఇందులో సగం జీతం వచ్చే ఉద్యోగానికి కూడ వందల లెక్కలో దరఖాస్తులొచ్చాయంటే నమ్ముతారా? జీతానికీ పనికీ ఏం సంబంధం వుండదిక్కడ.”

“అందుకనే మంచి పని వాళ్ళు దొరకరు. ఇంతకు ముందున్న ఆవిడ బాగా చేయలేదనేగదా తీసేసారు? ఇంత పని చెప్పి అంత తక్కువ జీతం ఇస్తే మంచి వాళ్ళెందుకొస్తారు? కొంచెం జీతం పెంచొచ్చుగా?”

“ఏమో మరి! ఎందుకలా చేస్తారో!” నిస్సహాయంగా అన్నాడు రెన్నీ.

“పోనీ, ఈ ఉద్యోగం లో ప్రమోషన్లకీ, పైకెదగడానికీ అవకాశం వుంటుందా?” ఆశగా అడిగింది జేన్.

“దాదాపు పదిహేను ఇరవై యేళ్ళు పట్టొచ్చు. అది కూడా మీకే వస్తుందని గ్యారంటీగా చెప్పలేం.”

“అవును, అప్పుడు మళ్ళీ డైరెక్టర్లకి తెలిసిన ఇంకెవరైనా వస్తే ఆ ఉద్యోగం వాళ్ళెగరేసుకు పోవచ్చు. అంటే ఇరవై యేళ్ళు ఎదుగూ బొదుగూ లెకుండా సంవత్సరానికి ముఫ్ఫై పౌండ్లతో గొడ్డు చాకిరీ చెయ్యాలన్నమాట. ఇంతకన్నా ఏదైనా హత్య చేసి జైలుకెళ్తే ఇంకొంచెం శుభ్రమైన జీవితం దొరకొచ్చు. ఏమంటారు?”  కోపంగా అడిగింది జేన్. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. తనని తను సంబాళించుకుంది జేన్.

“పోనీ, ఇక్కడ ఫ్రాన్సిస్ రాజీనామా చేస్తున్నాడు కదా? ఆ ఉద్యోగం ఇవ్వడానికి వీలవుతుందా? నాకు అక్కవుంటింగూ లెక్కలూ బాగా వొచ్చు!”

“ఆ పనికి ఫ్రాన్సిస్ కింద పని చేసే అతనికి ప్రమోషన్ ఇచ్చాము. ఆఖరికి ఒక జూనియర్ క్లర్కు ఖాళీ మాత్రం వుంది.”

“ఆ వుద్యోగం నాకివ్వండి. అలా నిరాకరించకండీ. ఫ్రాన్సిస్, నువ్వైనా ఒక్క మాట చెప్పు,” ప్రాధేయపడింది జేన్.

“అవును రెన్నీ! నా వల్లే ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ అన్యాయమై పోయారు. ఆమెకీ ఉద్యోగం ఇచ్చి పుణ్యం కట్టుకో. ఆమె చాలా తెలివైనదీ, సమర్థురాలూ, బాగా చదువుకొన్నది కూడా!” బ్రతిమిలాడాడు ఫ్రాన్సిస్.

నవ్వాడు రెన్నీ!

“భలే వాళ్ళే! ఆడవాళ్ళకి లెడ్జర్లూ పాస్ బుక్కుల గురించేం తెలుస్తుంది లెండి,” తేలిగ్గా అన్నాడు.

“అవన్నీ నాకొచ్చని చెప్తున్నా కదా. కావాలంటే చూడండి,” అంటూ జేన్ అక్కడ బల్ల మీద వున్న లావు పాటి అక్కవుంటు పుస్తకం తీసుకొని ఒక పేజీ తిప్పి అందులో ఒక వరుసలో వున్న అంకెలన్నీ చకచకా కూడిక చేసింది. ఇంకొక తెల్ల కాగితం తీసుకొని ముత్యాల్లాంటి దస్తూరితో లెడ్జర్ ఎంట్రీ రాసి చూపించింది.

“మీకా పని బాగా వొచ్చు జేన్. అందులో సందేహం లేదు. అయితే అది పనికోసం వందలాది యువకులు ఎదురుచూస్తూ వున్నప్పుడు, అది మీకివ్వడం న్యాయమా? ”

“అలా అనడం మీకు భావ్యం కాదు. పోనీ, నేను స్త్రీనైనందుకు పరిహారంగా నాకు కేవలం పదహారేళ్ళ మగపిల్లాడికిచ్చే జీతమివ్వండి. నాకు ఎదగడానికీ, పైకి రావడానికీ అనువైన ఉద్యోగం కావాలంతే. మొదలు పెట్టినప్పుడు జీతం ఎంత తక్కువైనా పర్వాలేదు. పారిస్ లో ఎంత మంది స్త్రీలు క్లర్కులుగా పని చేయడం లేదు?”

“ఇది ఫ్రాన్సూ, పారిసూ కాదు గదా? ఇక్కడ ఆడవాళ్ళను బేంకుల్లో చేర్చుకోవడానికి వీలు పడదు. అంతెందుకు? మీకీ ఉద్యోగం ఇస్తే బేంకులో మిగతా ఉద్యోగులసలు పని చేస్తారా? అందరికీ మీ చుట్టు తిరగడానికే టైము సరిపోదు!”

నిర్ఘాంతపోయింది జేన్.

“నన్ను చూసి కూడా మీరిలా యెలా అనగలుగుతున్నారు? నా మొహమూ, వాలకమూ చుస్తే నేను మగవాళ్ళని నా చుట్టూ తిప్పుకునే దాన్లా వున్నానా? ఒక వేళ మీరన్నట్టే జరిగితే అప్పుడు వెంటనే నను ఉద్యోగంలోంచి పీకేయండి. ” బాధగా అంది జేన్.

ఆమె సిన్సియారిటినీ, వేడుకోలూనూ చూసి ఫ్రాన్సిస్ బాధ పడితే రెన్నీ ఇబ్బంది పడ్డాడు. అయితే బేంకరుగా అవతలి మనిషి అభ్యర్ధనని నొప్పించకుండా నిరాకరించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య.

“మీ ధైర్యాన్నీ, పట్టుదలనీ మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను జేన్. అయితే, ఈ సంస్థలో నేను ఒంటరిగా ఏ నిర్ణయాలూ తీసుకోలేను. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేతిలో కీలుబొమ్మని. అందుకే మీరు ఏదైనా ప్రవైటు సంస్థ లో వుద్యోగం కొసం వెతకండి. అక్కడైతే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళుంటారు. మీకు తప్పక ఉద్యోగం ఇస్తారు. బేంకర్లూ, బేంకు డైరెక్టర్లూ,  బేంకు ఖాతాదార్లూ మహా ముతక మనుషులు! వాళ్ళ అభిప్రాయాలన్నీ ఎక్కడో రాతియుగంలో వుంటాయి. మీలాటి తెలివైన చురుకైన యువతికిది మంచి స్థలం కాదు.” పామూ చావకుండా, కర్రా విరగకుండా అన్నాడు రెన్నీ.

“ఏం మాట్లాడతారండీ? ఇంతవరకూ ఆడవాళ్ళకి బాధ్యతాయుతమైన పదవి ఒక్కటీ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి బాధ్యతలు నెరవేర్చడం రాదనటంలో ఏమైనా న్యాయం వుందా ఆలోచించండి!”

“కానీ, జేన్! మీలాటి తెలివైన చదువుకున్న అమ్మాయిలు వచ్చి మగవాళ్ళ ఉద్యోగాలు కొల్లగొడితే ఎలా? అప్పుడు ఉద్యోగం సద్యోగం లేని ఆ మగవాళ్ళనెవరు పెళ్ళాడతారు చెప్పండి?”

అందుకని పోషణా భారాన్ని మగవాళ్ళకి వదిలేసి ఆడవాళ్ళు నీడ పట్టున వుండడమే మంచిదని..”

“అవునా? మరి పోషణా భారం వహించడానికి అన్నో తమ్ముడో, తండ్రో, భర్తో లేని ఒంటరి ఆడవాళ్ళూ, విధవరాళ్ళూ ఏం చేయాలంటారు? అలాటి వాళ్ళు చాలా మందే వున్నారు. లేకపోతే సంవత్సరానికి పన్నెండు పౌండ్లిస్తూ జైలు లాటి జీవితాన్నిచ్చే ఉద్యోగానికి యాభై దరఖాస్తులొస్తాయా చెప్పండి? అలా మగదిక్కులేని ఆడవాళ్ళందరూ కట్టకట్టుకుని ఒక్కసారే చస్తే పీడా విరగడవుతుందేమొ కదా? ఏమంటారు?” వ్యంగ్యంగా అంది జేన్. ఆమె ఆవేశాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు రెన్నీ.

“మీకు నవ్వులాటలాగే వుంది కానీ, ఒంటరి ఆడవాళ్ళకి చావు తప్ప మరో మార్గం లేదనిపిస్తుంది నాకు.”

“నాకలాటి ఉద్దేశ్యముంటుందా చెప్పండి? మీ సమస్య నాకర్థమవుతూంది, కానీ..”

“కానీ, మీరూ మీ డైరెక్టర్లూ ఏమీ చేయలేని నిస్సహాయులు! ఒక్కళ్ళకైనా ఒక ఆడదానికి ఉద్యోగం ఇచ్చే ధైర్యం లేదు. ఇంత మంది మగవాళ్ళ మధ్య హేళనలూ, వెక్కిరింతలూ తట్టుకొంటూ పని చేయటానికి నాకు ధైర్యం వుంది కానీ.”

“నా మాట నమ్మండి. దేశం గొడ్డు పోలేదు. మీ తెలివితేటలకీ, విద్యార్హతలకీ తగిన ఉద్యోగం తప్పక దొరుకుతుంది. మా బేంకిలో దొరకకపోయినా సరే! అన్నట్టు, ఇవాళ సాయంత్రం మా ఇంటికి ఫ్రాన్సిస్ తో కలిసి భోజనానికి వస్తున్నారు కదూ? మా అమ్మాయి ఎలీజా, మా ఆవిడా మిమ్మల్ని కలిసి చాలా సంతోషపడతారు. నేను ఉద్యోగం ఇవ్వలేదన్న కోపం మనసులో పెట్టుకోకూడదు సుమా! తప్పక రావాలి. సరే, అయితే సాయంత్రం కలుద్దాం.” మెల్లిగా మాట మార్చి వాళ్ళని పంపేసాడు రెన్నీ. నవ్వి, ఒప్పుకుంది జేన్.

ఫ్రాన్సిస్, జేన్ బయటపడ్డారు.

“ఏం చేయాలి ఫ్రాన్సిస్? అసలు నాకేదైనా పని దొరుకుతుందంటావా? పోనీ, పబ్లిషర్ల దగ్గరా పుస్తకాల దుకాణాలల్లో ప్రయత్నిద్దాం. కొంచెం నాతో తోడొస్తావా?” జేన్ వాపోయింది.

వాళ్ళు వెళ్ళిన మొదటి ఇద్దరు పబ్లిషర్లూ ఏ ఖాళీలూ లేవన్నారు. మూడో పబ్లిషరు కాస్త ప్రోత్సాహంగా మాట్లాడాడు. కానీ, ఆయన ఉద్యోగం ఫ్రాన్సిస్ కోసమనుకొన్నాడు. కొంచెం సేపటి సంభాషణ తరవాత ఫ్రాన్సిస్ మృదువుగా ఉద్యోగం జేన్ కోసమని తెలియజెప్పాడు. వెంటనే ఖాళీలు లేవనేసాడు పబ్లిషరు.

“నిజం చెప్పండి! ఉద్యోగం లేదన్నది నేను ఆడదాన్నైనందుకా, లేకపోతే నాకు పని రాదనా?”

“ఆడవాళ్ళకి పబ్లిషింగు పనేం తెలుస్తుందమ్మా? అందుకే ఎవరూ ఈ రంగంలో ఆడవాళ్ళని నియమించరు,” నిర్మొహమాటంగా చెప్పాడాయన.

“ఆ పనిదేముందండీ, రెండు మూడు గంటల్లో నేర్చేసుకోవచ్చు. అసలు మీ అభ్యంతరం నేను ఆడదాన్నవటమే. అంటే మీ ఆఫీసులో ఆడవాళ్ళకేమీ ఉద్యోగాలుండవా?”

“ఎందుకుండవు? మేము ప్రచురించే పుస్తకాలు రాసేదంతా రచయిత్రులే కదా? మీరూ నవలలు రాసేటట్టయితే చెప్పండి. వెంటనే వాటిని ప్రచురిస్తాం.”

“ఇంకా?”

“ఇంకా అంటే ఇదొక్కటుంది, నాతో రండి చూపిస్తా,” అంటూ పబ్లిషరు వాళ్ళిద్దరినీ ఆఫీసు వెనకున్న చిన్న గదిలోకి తీసికెళ్ళాడు. అక్కడ ఓ పదిమంది ఆడపిల్లలు కాగితాలన్నీ బొత్తిగా పెడుతూ బైండు చేయడానికి అనువుగా పేరుస్తున్నారు. “ఈ పని తేలిక పని. ఎక్కువగంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కుట్టు పనిలా దీనికి పెద్ద ప్రావీణ్యం కూడా అవసరం లేదు,” చెప్తూన్నాడు ఆ పబ్లిషరు.

“అందుకని వాళ్ళ జీత భత్యాలు కూడా చాలా తక్కువన్నమాట!”

“మరంతే కదా!” నీళ్ళు నమిలాడు పబ్లిషరు.

“పోనీ, ఈ పని నేర్చుకొని బైండింగు పనిలోకి ఎదగడానికి వీలవుతుందా?”

“అమ్మో! బైండింగూ, పుస్తకాలు కుట్టడం మగవాళ్ళ పని. అంత మోటు పని ఆడవాళ్ళేం చేయగలుగుతారు?”

“అంటే, ఈ తక్కువజీతంతో వాళ్ళు ఎదుగూ బొదుగూ లేకుండా జీవితాంతం ఇదే పని చేస్తూ గడిపేయాలా?” ఆశ్చర్యంగా అడిగింది జేన్.

“కానీ, కొన్నేళ్ళ ప్రాక్టీసు తర్వాత ఈ పని చేయడం చాలా సులువౌతుంది వీళ్ళకి.”

“ఎంత అన్యాయం! తక్కువజీతాలొచ్చేవి, ఏ మాత్రం ఎదుగుదలా, మార్పూ లేనివి అయిన పన్లు ఆడవాళ్ళకోసం పెట్టి, పెద్ద ఉద్యోగాలు మాత్రం మగవాళ్ళకోసం పెడతారన్నమాట,” ఆక్రోశించింది జేన్.

“అదేం లేదండీ! ఆడవాళ్ళే రచనలు చేయగలరు. మగవాళ్ళ రచనలసలు వేసుకోనే వేసుకోం. అంటే ఆ రంగంలో మగవాళ్ళకన్యాయం జరుగుతున్నట్టే కదా? మీకెందుకు, మీరో మంచి నవల రాసి ఇచ్చేయండి, ఎలా డబ్బు సంపాదిస్తారో చూడండి!”

“నిజమే! అయితే దురదృష్టవశాత్తూ, నాకు కథలు రాయడమూ, బొమ్మలు గీయడమూ వంటి కళ్ళల్లో ప్రవేశమే లేదు. అదే మీరు నాకొక ప్రూఫ్ రీడరుగా ఉద్యోగం ఇస్తే రెండ్రోజుల్లో ఆ పని నేర్చుకోగలిగేదాన్ని. పోన్లెండి, ఎవర్నేమని ఏం లాభం! సంఘం మొత్తం ఆడదాని మీద పగబట్టినట్టుంది. బహుశా ఇహ ఆ అమ్మాయిలతో పాటూ కాగితాల పనే తప్పదో ఏమో!” నిరాశగా వెనుదిరిగింది జేన్.

బయటకొచ్చాక జేన్, “ఫ్రాన్సిస్, నా దృష్టిలో ఇంకొక్క ఉద్యోగం వుంది. అక్కడికి నేనొంటరిగా వెళ్ళగలనులే. ఎంతసేపు నాతో పాటు నువ్వూ అలిసిపోతావు? నువ్వు ఇంటికెళ్ళు.” అని ఒంటరిగా బయలుదేరింది.

***

అక్కణ్ణించి ఆమె సరాసరి వాళ్ళ కుట్టు టీచర్, శ్రీమతి డూన్ గారి దగ్గరకెళ్ళింది. పాపం, జేన్ బట్టలేవో కుట్టించుకోవడానికొచ్చిందనుకొంది ఆవిడ. జేన్ సూటిగా విషయానికొచ్చి, తాను ఉద్యోగం కోసం వెతుకున్నాననేసరికి ఆశ్చర్యపోయింది.

“మేము నీ దగ్గర కుట్టు నేర్చుకొనే రోజుల్లో నీదగ్గర లెక్కలు చూడడానికో గుమాస్తా వుండేవాడు కదా, ఇంకా వున్నాడా?” అడిగింది జేన్.

“ఆ, వున్నాడు. అతను నా కొక్కదానికే కాదూ, ఇంకా చాలా మంది దగ్గర పద్దులు రాస్తాడు!”

“అవునా? అయితే, అతని ఉద్యోగం నాకిప్పించగలరా? ఎన్నో చోట్ల చేస్తున్నాడు కాబట్టి ఒక చోట పోయినా అతనికంత ఇబ్బందేమీ వుండదు,” ఆశగా అడిగింది జేన్.

శ్రీమతి డూన్ కేమనాలొ తొచలేదు. ఇంతవరకూ వాళ్ళు లెక్కల గుమాస్తాగా ఆడవాళ్ళని పెట్టుకోలేదు. వాళ్ళ వ్యాపారమే కాదూ, ఆమెకి తెలిసిన ఏ వ్యాపారస్తుడూ ఆడవాళ్ళని పద్దులు రాయడానికి పెట్టుకోలేదు. ఇప్పుడు తను పెట్టుకుంటే అంతా ఏమంటారో! అన్నిటికంటే, పాపం పెళ్ళాం బిడ్డలున్నవాడు మెక్డోనాల్డ్, అతన్ని ఏ కారణం చూపించి ఉద్యోగం లోంచి తీసేయగలదు ! అసలే ఈ మధ్య అమ్మకాలు అంతంత మాత్రంగా వున్నాయి. ఇప్పుడు అవసరం లేని మార్పులు చేసి వున్న కస్టమర్లు కూడా పోతే! మెల్లిగా తన భయాలన్నీ జేన్ ముందు బయటపెట్టింది.

నిట్టూర్చింది జేన్.

“బోలెడంత పచ్చిక వున్నా గుర్రాలకి దాణా కరవు! ఎవరైనా ఒకళ్ళు ధైర్యం చేసి నాకుద్యోగం ఇచ్చే వాళ్ళే కనబడడం లేదు !”

తల దించుకుంది శ్రీమతి డూన్. నిరాశగా అక్కణ్ణించి బయటపడింది జేన్.

***

 మిగిలిన రోజంతా ఆమె తమ లాయరు దగ్గరా, చదువుకున్న పాఠశాలా, అన్ని చోట్లా ఉద్యోగం కొరకు ప్రయత్నించి విఫలమైంది. కొన్ని చోట్ల ఆమె అర్హత సరిపోలేదంటే, కొన్ని చోట్ల అనుభవం లేదన్నారు. మొత్తానికి తనకు నచ్చి, కొంచెం గౌరవప్రదంగా వుండి, పైకెదగడానికి అవకాశం వుండే ఉద్యోగాలు దొరకవన్న నమ్మకానికొచ్చింది జేన్.

అలసి సొలసి, నిరాశా నిరుత్సాహంతో ఆమె సాయంత్రం ఫ్రాన్సిస్ ఇల్లు చేరుకుంది.

“ఏమైంది జేన్?” ఆత్రంగా అడిగాడు ఫ్రాన్సిస్.

“ఏమీ కాలేదు! పోనీ, పేపరులో ప్రక్టిస్తా ఫ్రాన్సిస్.ఇహ అదొక్కటే దారి! అలాగైనా ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ లేదనుకో!”

“బాధ పడకు జేన్! ఏదో దారి దొరకకపోదు.. లే, లేచి తయారవ్వు. అలా రెన్నీ ఇంటికెళ్ళీ భోచేసి సరదాగా గడిపొద్దాం. నీకూ కాస్త మనసు కుదుటపడుతుంది.”

“అలాగే! అసలు నాకు బాగా ఆకలవుతుంది. పొద్దుటినించీ సరిగ్గా తిండేలేదు!”

ఫ్రాన్సిస్ సౌమ్యతా, ఆదరణతో జేన్ కి మనసులో కొంచెం భారం తగ్గినట్టనిపించింది.

***

వీలునామా – 3వ భాగం

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మర్నాడు పొద్దున్నే ఎల్సీ తీరిగ్గా పేపరు చదువుతోంది. పేపరులో ఒక మూల హోగార్త్ గారి వీలునామా విశేషాలన్నీ వున్నాయి, ఎస్టేటు కొత్త హక్కుదారుడికి అభినందనలతో సహా.
“జేన్! చూడు! ఇప్పుడు ఇదంతా పేపరులో రాసి మన పరువు తీయాలా? ఇంకా నయం, నీ గురించీ, విలియం గురించీ ఏమీ రాయలేదు. లేకపోతే, అతనేదో నిన్ను కాదన్నాడనీ, నువ్వందుకు భోరుమని ఏడుస్తున్నావనీ కూడా కథలల్లే వాళ్ళు, ” ఆ పేపరు అక్కకి చూపిస్తూ చికాగ్గా అంది ఎల్సీ.

“చుట్టూ వున్న మనుషులు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు అన్న విషయాలని మనం నియంత్రించలేం కదా? అందుకే వాటి సంగతి వదిలేయ్. నేను థాం సన్ గారింటికెళ్ళొస్తాను.”

***

జేన్ వెళ్ళేసరికి అప్పుడే మిస్ థాంసన్ పేపరు చదివి లేవబోతున్నారు. శ్రీమతి డాల్జల్ ఇచ్చిన ఉత్తరం తీసుకొని ప్రవేశించింది జేన్.

అరవై యేళ్ళ మిస్ థాంసన్ ఆరోగ్యంగా, చలాకీగా వుంది. ఆవిడ కళ్ళు చురుగ్గా, నోరు చిరునవ్వుతో విచ్చుకొనీ వుంది. ఇప్పుడిప్పుడే యవ్వనం లోని మెరుపు స్థానం లో వార్ధక్యం వల్ల వచ్చే హుందాతనం స్థిరపడుతోంది.

శ్రీమతి డాల్జల్ గారు కేవలం జేన్ ని పరిచయం మాత్రమే చేసారు తన చిన్న వుత్తరంలో. అందువల్ల జేన్ రాకకి కారణమేమై వుంటుందో ఊహించలేకపోయారు ఆవిడ. ముందుగా జేన్ ని కూర్చోమని, ఆ పైన వచ్చిన పని విచారించారు.

“మేడం! నేనొక చిక్కు పరిస్థితిలో మీ సలహా సహాయాల కొసం వచ్చాను. మా మామయ్య రాసిన వీలునామా సంగతీ, నేనూ మా చెల్లెలూ చిల్లి గవ్వ లేకుండా వీధిలో నిలబడ్డ సంగతీ మీరీ పాటికే విని వుంటారు.”

“అవునమ్మా! మీ మామయ్య ఎందుకలా చేసారో! పాపం, మీ పరిస్థితి చూస్తూంటే జాలేస్తూంది.”

“మేడం! మా మావయ్య ఎప్పుడూ మిమ్మల్ని ఆదర్శంగా చూపించి, ఆడవాళ్ళు తలచుకుంటే చేయలేనిది లేదు అని చెప్పేవారు. అందుకే నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. దయచేసి, నన్ను పనిలో పెట్టుకోని మీ వ్యవసాయం పనులు నేర్పండి. నేను మీ డబ్బు లెక్కలు చూడగలను, ఉత్తరాలు రాసి పెట్టగలను, ఇల్లు చక్క బెట్టగలను. మీకు పనిలో సహాయపడుతూ నేనూ వ్యవసాయం నేర్చుకోగలను. నన్నూ నా చెల్లెల్నీ రోడ్డు మీద నిలబడే పరిస్థితి నుంచి మీరే కాపాడ గలరు.”

మిస్ థాంసన్ ఆమె కేసి జాలిగా చూసి తల అడ్డంగా తిప్పారు.

“హాయ్యో! పిచ్చి తల్లీ! స్కాట్ లాండ్ లో వ్యవసాయం చాలా డబ్బూ శ్రమా తో కూడిన విషయం. నువ్విపుడు చేసి పెడతానన్న పనులు  చిల్లి గవ్వ ఖర్చు లేకుండా నేనే చేసుకోగలను. బహుశా ఇంకో పదేళ్ళ వరకూ చేసుకోగలను. నాకు కావాల్సిన సహాయం ఆడవారి పనుల కోసం కాదు, మగవారు చేయగలిగే పనులు. అంటే గుర్రబ్బండీ వేసుకొని సంత కెళ్ళి సామాన్లు కొనటం, అమ్మి పెట్టటం, పొలాలన్నీ చుట్టి రావటం లాటివి. పెద్దదాన్నవుతున్నాను కదా, బయటికి వెళ్ళలేకపోతున్నాను.  నీకు ఏదైనా సహాయం చేయాలనే వుంది. కానీ, ఇప్పటికే నా సహాయం కోసం ఎదురు చూస్తూ బోలెడు మంది మేనల్లుళ్ళూ, మేనకోడళ్ళూ, అక్క చెల్లెళ్ళ పిల్లలూ వున్నారు. వారిని కాదని నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అందుకే ఈ మధ్యనే మా చెల్లెలి కొడుకు జాన్ ని పై పనుల్లో సహాయానికి పెట్టుకున్నాను. ఇంకా నేను పనిలో పెట్టుకుని తిండి పెడతానని జాన్ తమ్ముళ్ళూ కాచుకోని వున్నారు.”

జేన్ నిరాశగా తల దించుకొంది.

“నిజమే! మీ పరిస్థితి నాకర్థమవుతూంది. ప్రపంచంలో ఏ దిక్కూ లేని అనాథలం నేనూ, మా చెల్లి అంతే! మీలా మాకూ ఒక బంధువుండి వుంటే మాకూ ఎవరైనా పని చూపించి వుండే వారేమో! పోనీ, ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి!”

“జేన్! నేను ఈ వ్యవసాయం ఒక విచిత్ర పరిస్థితిలో చేపట్టాను. మా నాన్న వున్న డబ్బంతా పెట్టి ఇంత పెద్ద పొలం కొని దాన్ని సరిగా సాగు చేయలేక పోయాడు. ఫలితంగా చాలా డబ్బు నష్టం వచ్చేది. ఆయనకి కొడుకులు కూడ లేరు. మేం ముగ్గురం అక్క చెల్లెళ్ళమే. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, పొలం అమ్మడం ఇష్టం లేక నేను దీని బాధ్యత తీసుకున్నాను. అతి కష్టం మీద, నష్టాలన్నీ పూడ్చుకొని లాభాలు సంపాదించాను. నాకు కష్టపడే మనస్తత్వం తో పాటు పొలం పనుల మీద ఇష్టం కూడా వుండడం వల్లనే అదంతా సాధ్యమయింది.”

“అదృష్టవంతులు మీరు. నాక్కూడా కొంచెం డబ్బు వుండి వుంటే నేనూ ఏదో వ్యాపారమో, వ్యవసాయమో మొదలు పెట్టి వుండగలిగేదాన్ని,” దిగులుగా అంది జేన్.

“అవును జేన్. ధైర్యమూ, ఆరోగ్యమూ, యవ్వనమూ తప్ప మరేమీ లేకుండా ప్రపంచంలో నెగ్గుకురావటం ఆడదానికి కష్టమే. పెళ్ళి చేసుకోవడమో, లేదా ఎవరింట్లోనైనా పిల్లల్ని చూసుకొనే గవర్నెస్ గా చేరడమో తప్ప వేరే దారి లేదు. దురదృష్టవశాత్తూ పెళ్ళిళ్ళ మార్కెట్టూ, గవర్నెస్సుల మార్కెట్టూ ఆడపిల్లలతో కిక్కిరిసి పోయి వున్నాయి. మనలాంటి వాళ్ళం ఇంకే పని చేసినా సంఘానికి నచ్చదు.”

“ప్రపంచం చాలా పెద్దది కదా! ఏదో ఒక పని దొరకకపోదు లెండి.”

“మరీ మీ మావయ్య చాలా అన్యాయం చేసారు జేన్. మీ ఇద్దరికీ కొంచెమేనా డబ్బు ఇచ్చి వుండవలసింది. అప్పుడు నాలా ఎక్కడైనా వ్యవసాయం చేయగలిగేవారు కదా!”

“కావొచ్చు! కానీ, డబ్బు ఒకళ్ళు ఇస్తే వచ్చే ఆనందం కన్నా, మనం సంపాదించుకుంటే వచ్చే ఆనందం ఎక్కువ కదా! ఆ ఆనందాన్ని మా అనుభవం లోకి తేవటం కొసం ఆయన అలా చేసారేమో! ఎవరికి తెలుసు?”

“నీ గురించి నాకు భయం కానీ అనుమానం కానీ లేవు జేన్. తెలివైనదానివీ, ధైర్యస్థురాలివీ. మీ చెల్లెలూ నీ లాటిదైతే….”

“ఏలాటిదైనా, మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం!” మధ్యలోనే అందుకుంది జేన్.

“అయితే మరీ మంచిది. మీక్కావల్సిన ధైర్యాన్ని ఆ ప్రేమే ఇస్తుంది. నా మాట విని ఎడిన్ బరో వెళ్ళండి.అక్కడ మీకు ఉద్యోగావకాశాలు ఎక్కువ. అక్కడ మీకు తెలిసిన వాళ్ళెవరైనా వున్నారా?”

“ఎవరూ లేరు.”

“ఇప్పుడు ఆస్తంతా అనుభవించబోయే అబ్బాయి, మీ కజిన్, అతను ఏదైనా సహాయం చేయడా?”

“అతను స్నేహంగానే వున్నాడు, కానీ వీలునామా ప్రకారం అతను మాకేవిధంగానూ సాయపడకూడదు.”

“డబ్బు ఇవ్వక్కర్లేదు. ఉద్యోగాలు వెతికి పెట్టొచ్చు. మీ గురించి అక్కడా ఇక్కడా చెప్పి సాయ పడొచ్చు కదా?”

“అతనూ అదే అన్నాడు. ఒకసారి ఎడిన్ బరో వెళ్ళి చూస్తాను. అక్కడ వుండడానికే అధారమూ లేదు. అతని ఇంట్లోనే వుండక తప్పదు. హోటాళ్ళల్లో వుండగలిగేంత డబ్బు లేదు.”

“అవును, అతని ఇంట్లో వుండడమే మంచిది. ప్రయాణాలకీ వాటికీ వీటికీ బోలేడు డబ్బి అవసరమవుతుంది జేన్. ఈ అయిదు పౌండ్లూ వుంచు,” డెస్క్ లోనించి అయిదు పౌండ్ల నోటు తీస్తూ అన్నారు మిస్ థాం సన్. ఆ డబ్బు తీసుకోవటానికి అభిమానం అడ్డొచ్చినా, ఆవిడన్న మాటల్లో నిజం వుండడం వల్ల, మౌనంగా ఆ నోటు అందుకొంది జేన్.

జేన్ ఇంటికొచ్చేసరికి ఎల్సీ తన దిగులు నుంచి తేరుకుంది. ఆ రోజు పేపర్లో వచ్చిన కవితల స్థాయి చుసి ఏల్సీ ఆశలు చిగురించాయి. నిస్సందేహంగా తాను అంతకంటే మంచి కవిత్వం రాయగలదు. పేపరుకి అడపాదడపా కవితలు రాసి పంపి డబ్బు సంపాదించటానికి ప్రయత్నిస్తే, అన్న ఆలోచన వచ్చిందామెకు. గబ గబా పుస్తక తెరిచి రాసుకోవటం మొదలు పెట్టింది.

అక్క తిరిగి రాగానే, కూర్చో బెట్టి తన కవిత్వం వినిపించింది.

“చాలా బాగుంది ఎల్సీ! ఇంత తొందరగా ఎలా రాసావు?”

“నిజంగా బాగుందా? ఏదైన పేపరుకి పంపనా? వేసుకుంటారంటావా?”

“నాకు కవిత్వం గురించీ, సాహిత్యం గురించీ పెద్దగా తెలియదు కానీ, పంపించు! వేసుకుంటారనే అనిపిస్తుంది!”

“హమ్మయ్య! జేన్! నీ మాటంటే నాకెంతో గురి. నీలాటి తెలివైన మనిషికే నచ్చింది, కాబట్టి ఇదిచాలా మందికి నచ్చుతుండొచ్చు!”

ఎల్సీ ఉత్సాహమూ, సంతోషమూ చూసి జేన్ కూడా నిరాశ లోంచి బయటికొచ్చింది.

“అవును ఎల్సీ! నీలాటి సున్నిత మనస్కులు రాసే భావాలూ, భాషా, చాలా మందికి, ముఖ్యంగా స్త్రీలకి చాలా నచ్చుతుంది. పోనీలే, ఇద్దరిలో ఒక్కరికైనా కాస్త వెలుతురు కనిపిస్తుంది. ఎందుకంటే, నే వెళ్ళిన పని మొత్తంగా కాయే!” అంటూ మిస్ థాం సన్ తో భేటీ గురించి వివరంగా చెప్పింది.

“పొద్దున్న ఫ్రాన్సిస్ దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మనిద్దరినీ వీలైతే ఎడిన్ బరో రమ్మనీ, అక్కడేదైనా ఉద్యోగం దొరకచ్చనీ రాసాడు. వెళ్ళక తప్పేట్టు లేదు! మరి నువ్వూ వస్తావా?” ఎల్సీని అడిగింది.

“జేన్! నాకా ఉద్యోగాల మీద ఆసక్తీ లేదు, వస్తాయన్న ఆశా లేదు. నేనెందుకు చెప్పు, అక్కడికి, డబ్బు దండగ కాకపోతే? అయితే నీకొక్కదానికీ వెళ్ళటానికి ఇబ్బందిగా అనిపిస్తే తోడుగా తప్పక వస్తాను!”

“అదీ నిజమేలే! అయితే నువ్విక్కడే వుండు! ఆ కవిత్వాన్ని పేపరుకి పంపడం మర్చిపోకు మరి! నేనిప్పుడే వెళ్ళి  నేనొస్తున్నానని ఫ్రాన్సిస్ కి ఉత్తరం రాసి పోస్టు చేయిస్తాను. ఎంత తొందరగా ఉద్యోగం దొరికితే అంత మంచిది.”

***

 (సశేషం)

 ముఖ చిత్రం : మహీ పల్లవ్

వీలునామా-2వ భాగం

Sharada1    (గత వారం తరువాయి)

వున్నట్టుండి సోఫాలో లేచి కూర్చుంది ఎల్సీ.

“జేన్! ఫ్రాన్సిస్ మనిద్దరిలో ఎవరినీ పెళ్ళాడకూడదు, అనే షరతు ఎందుకు పెట్టాడంటావు మావయ్య? మనం మరీ ముక్కూ మొహం తెలియని అతన్ని పెళ్ళాడతామని ఎలా అనుకున్నాడు? ఫ్రాన్సిస్ చూడటానికి కూడా మామూలుగానే వున్నాడు. అతని తల్లిని గురించి కూడా మావయ్య ఏమీ చెప్పలేదు. ఇంతకీ అతని మొహం లో నీకేవైనా మావయ్య పోలికలు కనబడ్డాయా?”

“ఏమోలే, నేనంతగా గమనించలేదు.”

“ఇక్కడ వూళ్ళో వాళ్ళు అతన్ని వుండనిస్తారంటావా? మావయ్యదీ వాళ్ళమ్మదీ పెళ్ళీ అసలు చెల్లుతుందంటావా?”

“చెల్లినా చెల్లకపోయినా అది చట్ట బధ్ధమే? ఊళ్ళో వారికి అతన్ని ఆదరించకా తప్పదు. అతను కూడా చూడటానికి సౌమ్యుడిలానే వున్నాడు.”

“అతన్ని మనం పెళ్ళాడకూడనదన్న షరతు వుండబట్టి సరిపోయింది కానీ, లేకపోతే నీకే అతను తెగ నచ్చినట్టున్నాడే,” నవ్వింది ఎల్సీ.

“చాల్లే! అతన్ని చూస్తే జాలేసింది నాకు. అంతే! పైగా, సలహా ఇవ్వడానికి మనకింకెవరున్నారు చెప్పు?”

“ఫ్రాన్సిస్ సంగతలా వుంచు! విలియం మాటేమిటి?”

“అవును! సరిగ్గా నేనూ విలియం డల్జెల్ గురించే ఆలోచిస్తున్నాను.

డబ్బుంటే మనలని ఎవరైనా మోసం చేస్తారన్న విషయం నాకెందుకో మావయ్య విలియం ని దృష్టిలో పెట్టుకునే రాసినట్టనిపించింది. మావయ్యకెందుకో విలియం అంటే ఇష్టం వుండేది కాదు. అందులో విలియం నాతో చనువుగా వుండటం అసలే నచ్చేది కాదు. బహుశా మా స్నేహాన్ని తుంచెయ్యడానికే మావయ్య ఇలా చేసాడేమో!”

“నువ్వు దాని గురించేమీ బాధ పడొద్దు జేన్! విలియం చాలా మంచి వాడు. అతను ఆస్తి పాస్తులకి అతీతంగా నిన్ను ప్రేమించాడు.”

“పిచ్చిదానా! విలియం పేదవాడు. డబ్బున్న అమ్మాయిని పెళ్ళాడితే తన దరిద్రం పోతుందని ఆశపడ్డాడే తప్ప, పేదరాలిని చేసుకోవాలని కాదు. కాబట్టి ఆ ఆలోచన వదిలేయ్.”

“మరీ అంత దుర్మార్గుడా విలియం?”

“ఇందులో దుర్మార్గమేముంది? నన్ను చూసి చెప్పు. నాలాటి సామాన్యమైన అమ్మాయిని, ఏమీ లేనప్పుడెందుకు పెళ్ళాడాలి ఎవరైనా? అలాటి త్యాగలని ఇతరుల నుంచి ఎప్పుడూ ఆశించవద్దు. ఇక ఆ విషయం వదిలేయ్!”

“ఆగు జేన్! ఇప్పుడు విలియం వచ్చి, నిన్ను  ప్రేమిస్తున్నాననీ, పెళ్ళాడదామనీ అంటే, అతను డబ్బు కోసం అమ్మాయిల వెంట పడే రకం కాదని తెలిసిపోతుందిగా? అప్పుడు నువ్వు పెళ్ళాడతావా అతన్ని?”

“అతనలా అనడు.”అటు తిరిగి నోట్ బుక్కులో ఏదో రాసుకోసాగింది జేన్.

మళ్ళీ కాసేపాగి చెల్లెలి వైపు తిరిగి,

“మన దగ్గర ఏవైనా నగలున్నా బాగుండేది. అవమ్మి ఒక చిన్న దుకాణం తెరిచే వాళ్ళం,” అంది.

“దుకాణమా! ఛీ! ఇంత బ్రతుకూ బ్రతికి దుకాణం తెరుస్తామా?”

“పోనీ గవర్నెస్ ఉద్యోగం చేద్దామా?”

“ఏమో జేన్! అసలు మనిద్దరికీ ఒక ఇంట్లో ఉద్యోగం దొరకకపోతే. నువ్వు లేకుండా నన్ను నేను ఎలా రక్షించుకోగలను? ఇద్దరం ఒక్క దగ్గరుండేలా చూడు.”

“సరే, పోనీ! బట్టలు కుట్టే పనిలో చేరదామా? నీకు కుట్టడం బాగా వొచ్చుగా?”

“కానీ ఆ ఇరుకు గదులూ, ఎడతెగని పనీ!”

విసిగిపోయింది జేన్.

“అయితే నువ్వే చెప్పు, ఏ పనైతే నీకిష్టమో!”

“ఏమో జేన్. నేనెప్పుడూ ఆలోచించలేదు. బ్రతుకంతా ఇలాగే మనిద్దరం కలిసే వుంటాం, నాకేం కావాలన్నా నువ్వు చూసుకుంటవ్, అనుకున్నాను!”

“అలాగే జరిగితే సంతోషం. కానీ, కొద్ది రోజులైనా ఏదో ఒక పని చూసుకోకపోతే ఎలాగ?”

“కొద్ది రోజులు మనలని ఇంట్లో వుంచుకొని ఆదరించే స్నేహితులో, బంధువులో లేనే లేరా?”

“లేరు ఎల్సీ! మావయ్య కూడా ఎవరినీ రానిచ్చే వారు కాదు. అందుకే ఇప్పుడు మనకెవరూ లేరు, ఆదుకోవడానికి, మన చదువులు తప్ప.”

ఇంతలో నౌకరు వచ్చి విలియం గారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారని చెప్పాడు.

“అతన్ని పైకి రమ్మను!” జేన్ చెప్పింది కుర్చీలోంచి లేస్తూ.

“జేన్! జాగ్రత్తగా మాట్లాడు, తొందరపడకు. నే వెళ్తున్నా,” గబగబా వెళ్ళిపోయింది ఎల్సీ.

విలియం లోపలికొచ్చాడు. కాసేపు నిరాసక్తంగా మాట్లాడుకొన్నారిద్దరూ.

“అవునూ, పొద్దున్న చర్చి దగ్గర, అంత్యక్రియల్లో ఎవరో ఒక కొత్త యువకుడు కనిపించాడు. ఎవరతను?”

“ఎవరు?”

“ఎవరో, పొడుగ్గా, సన్నగా వున్నాడు. ఎడిన్ బరో నుంచి వచ్చాడట, మీ మావయ్యకి చాలా ముఖ్యుడట!”

“అయితే నువ్వేమీ వినలేదా?”

“దేనిగురించి?” అయోమయంగా అడిగాడు.

“మావయ్య వీలునామా గురించి.”

“నేనేమి వినలేదు. అది నాకనవసరం కూడా. అది మీ కుటుంబ విషయం. నీ పట్ల నా భావాలు..”

“ఆగు విలియం!  ముందీ విషయం విను. మా మవయ్య తన ఆస్తంతా ఆ యువకుడి పేర రాసి, నన్నూ ఎల్సీని కట్టు బట్టల్తో బయటికి పంపేసాడు. అన్నట్టు, ఆ యువకుడు మావయ్య కొడుకు. పేరు ఫ్రాన్సిస్.”

“జేన్! హాస్యాలాడుతున్నావా? మావయ్య అలా యెందుకు చేస్తారు? ఈ జోకేమీ బాగాలేదు.”

“కాదు విలియం. ఆరు వారాల కిందటే మా మావయ్య తన విల్లు రిజిస్టరు కూడా చేయించారు.”

విలియం మొహం పాలిపోయింది. అతనికి ఏమనటానికీ ధైర్యం సరిపోలేదు.

“విలియం! నీ పరిస్థితి నాకర్థమవుతుంది. ఇన్ని రోజులూ మనం అనుకున్న మాటలూ, చెప్పుకున్న అభిప్రాయాలూ వొదిలేద్దాం. నాకు నీమీదేం కోపం లేదు. ఒక్క కానీ కూడా లేని నన్ను నువ్వు పెళ్ళాడలేవని నాకు తెలుసు. నీకు భారమవటం నాకిష్టం లేదు కూడా, ” అంది జేన్ దయగా.

విలియం తలొంచుకున్నాడు. నిజానికి అతను ఎల్సీని ఇష్టపడ్డాడు. అయితే మావయ్యకి ఇద్దరిలో జేన్ అంటే ఎక్కువ ఇష్టమనిపించి అతనూ తన ఇష్టాన్ని మార్చుకున్నాడు. జేన్ తెలివితేటలూ, నిబ్బరమూ, హుందాతనమూ కంటే ఎల్సీ అందమూ, చిలిపితనమూ, తెలివి తక్కువతనమూ అతనికెక్కువ నచ్చాయి. జేన్ ఎప్పుడూ తన సలహా, సహాయమూ అడగదు.  శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతురాలు. అయితే మేన మామకు అత్యంత ప్రీతిపాత్రురాలు కనక ఆస్తికంతటికీ ఆమే వారసురాలౌతుందని ఆశాపడ్డాడు.

తమకున్న కొద్దిపాటీ ఆస్తీ కోర్టు వ్యాజ్యాలలో చిక్కుకొని వుండడం మూలాన అతని ఎన్నికకి అతని తల్లీ యేమీ అభ్యంతరాలు చెప్పలేదు. ఆవిడా పాపం జేన్ ని ప్రేమాభిమానాలతో ముంచెత్తింది.

కొద్దిసేపటికి విలియం తేరుకున్నాడు. అప్పటికి జేన్ తనని తిట్టినట్టుగా అనిపించి కొంచెం కోపం కూడా వచ్చిందతనికి. అసలు తనే గంభీరంగా మాట్లాడి వుండాల్సింది. తనని వదిలి వుండలేనని జేన్ యేడిస్తే, తనే యెలాగో నచ్చ చెప్పి వుండాల్సింది.

అలాటిది జేన్, తమ ఇద్దరి మధ్యా అసలేమీ లేనట్టూ తనకి ఏ మాత్రమూ ఆమె మనస్సులో చోటు లేనట్టూ, “ఇహ నువ్వు వెళ్ళొచ్చు,” అన్నట్టు మాట్లాడేసరికి అతనికి ఉక్రోషంగా అనిపించింది. ఎప్పుడు తనకంటే ఆమెదే పై చేయి, అనుకున్నాడు అసహనంగా,

“అవును జేన్! నువ్వన్నది నిజమే. నాలాటి పేద వాణ్ణి కట్టుకుని నువ్వు సుఖపడేదీ ఏం వుండదు. నన్ను క్షమించు.”

విలియం లేచి మెట్లు దిగి వెళ్ళిపోయాడు.

“నాకతని మీద కోపమేమీ లేదు!”

తనకి తనే పదే పదే నచ్చ చెప్పుకుంటూ కుర్చీలో కూలబడింది జేన్.

***

జేన్ “మావయ్య ఆలోచించే ఈ పని చేసి ఉంటాడు”, అన్నప్పుడు కేవలం తన సొంత అభిప్రాయాన్నే వెలిబుచ్చింది. మేనమామని ఆమె ఎంతగానో అభిమానించి, గౌరవించింది. తన మీదా చెల్లెలి మీదా ఆయన విధించిన ఆంక్షలేవీ ఆమెనెక్కువగా బాధించలేదు. అయితే ఆమె అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఎవరూ లేరు.

తన మేన కోడళ్ళిద్దరికీ తన ఆస్తిలో దమ్మిడీ కూడా ఇవ్వలేదాయన అన్న విషయం బయటికి పొక్కగానే, ఊరి వారందరూ నానా రకరకాలుగా వ్యాఖ్యానించారు.

“పెద్దోరింటి గొడవ మనకేం తెలుసు,” అని పనివాళ్ళనుకుంటే, “ఈయనంత వింతగా ఎవరైనా ప్రవర్తించగలరా?” అనుకున్నారు మిగతా ఎస్టేటు దారులు.

ఏదెలావున్నా, మేనమామ పుణ్యమా అని, జేన్ కి కానీ, ఎల్సీ కి కానీ స్నేహితులే లేరు. ఆడవాళ్ళు స్నేహం పేరిట  పోచికోలు కబుర్లతో కాలయాపన చేయటం ఆయనకి నచ్చేది కాదు.

ఆడా మగా కలిసి సరదాగా విందులూ వినోదాలూ చేసుకోవడం ఇంకా నచ్చేది కాదు. అయితే, అప్పుడప్పుడూ ఆయన చుట్టు పక్కల వారిని విందు భోజనాలకి ఆహ్వానించిన మాటా నిజం. కానీ, సాయంత్రం ఆరింటికి వచ్చి రాత్రి పన్నెండింటికి తప్పకుండా వెళ్ళిపోవాలన్న నియమం వుండడం చేత ఎవరికీ ఆ విందు భోజనాలంటే పెద్ద ఆసక్తి వుండేది కాదు.

వాళ్ళిద్దరి చదువూ, ఇతర వ్యాపకాల విషయంలో మాత్రం ఆయన ఏదీ తక్కువ చేయలేదు. అమ్మాయిలిద్దరూ గుర్రపు స్వారీ, ఈతా, తుపాకి పేల్చడం లాటి విద్యలన్నీ నేర్చారు. అయితే అంత ఖర్చు పెట్టి వాళ్ళీద్దరికీ చెప్పించిన విద్యతో ఆయనే సంతోషపడలేదు! హొగార్త్ గారు విద్యతో వ్యక్తిత్వాలను తీర్చిదిద్దవచ్చని అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిలకీ ఒకే రకం విద్య చెప్పించినా, ఇద్దరి వ్యక్తిత్వాల్లో అంత తేడా వుండడం ఆయనకి అర్థం కాలేదు.

పెద్దది జేన్ ఇద్దర్లోకీ చురుకైనదీ, ధైర్యం గలదీ. ఆస్తిపాస్తుల ఆజమాయిషీ, చెల్లెలి సంరక్షణా తన బాధ్యతలే ఆవుతాయి కాబట్టే మామయ్య అందరు ఆడపిల్లల్లా కాకుండా తనకు విభిన్నమైన శిక్షణ ఇప్పిస్తున్నాడనుకొందామె. అందుకే, సంతోషంగా లెక్కలూ, అక్కవుంటుంగూ, వ్యవసాయ శాస్త్రమూ, వగైరా విషయాలు ఆసక్తిగా నేర్చుకుంది. ఆడవాళ్ళకి అప్పట్లో నేర్పించే విద్య చాలా వరకు ప్రదర్శనలకొరకు పనికొచ్చేదే అయివుండేది. అలాంటి అల్లిక పనీ, కుట్టు పనీ, బొమ్మలేయడం, సంగీతం వంటి కళలు నేర్చుకునే పని తనకు తప్పినందుకు జేన్ ఎంతైనా సంతోషించింది.

ఎల్సీకి పాపం ఇవన్నీ కాకుండా మిగతా అమ్మాయిల్లా వుండాలని వుండేది. కానీ, అక్క లాగానే చదువుకోవాలని మామయ్య ఆదేశం. అందుకే ఎల్సీ చదువు ఏదో అంతంతమాత్రంగా సాగింది. భాషలు నేర్చుకోవడం హొగార్త్ గారి దృష్టిలో ఎందుకూ పనికి రాని విషయం. అయినా అమ్మాయిల ట్యూషన్ మాస్టారు, విల్సన్ గారు పట్టు బట్టి ఇద్దరికీ గ్రీకు, లాటిన్ భాషలు నేర్పించాడు. వాళ్ళిద్దరూ తమ ఇష్టంతో ఫ్రెంచీ, ఇటాలియన్ భాషా నేర్చుకుంటామంటే ఎడిన్ బరో లో కొన్నాళ్ళుంచి ఆ రెండు భాషలనీ చెప్పించారు హొగార్త్. భాషల్లో చాలావరకు ఎల్సీ అక్కకంటే ముందుండేది. వీటన్నిటికంటే ఎల్సీకి సంగీతం మీద చాలా ఇష్టంగా వుండేది. కమ్మటి కంఠంతో బాగా పాడగలదు కూడా.

అయితే తన చెల్లెలు మేరీ జీవితం నాశనమవడానికి కారణం ఆమెకి సంగీతం మీద వున్న ఆసక్తే అన్న దృఢాభిప్రాయంతో హొగార్త్ గారు పిల్లలని సంగీతం ఛాయలకెళ్ళనివ్వలేదు. అందువల్ల ఎల్సీ ఆసక్తులూ ఇష్టాలూ నెరవేరనే లెదు. దాంతో చదువు పూర్తయినా ఎల్సీ అనాసక్తంగా, చిన్న పిల్లలా ప్రవర్తిస్తే జెన్నీ పెద్దదానిలా బాధ్యతలు తిసుకునేది.
హొగార్త్ గారు మరణించే నాటికి జేన్ కి ఇరవై మూడేళ్ళు నిండాయి. ఎల్సీ అక్కకంటే రెండేళ్ళు చిన్నది. అప్పుడప్పుడే విద్యాభ్యాసం ముగిసి, వాళ్ళకి నాలుగు ఊళ్ళూ తిప్పి చూపించాలని అనుకుంటున్నంతలో ఆయన ఆరోగ్యం పాడయి పరిస్థితి చూస్తూండగానే విషమించింది.

ఆయన విచిత్రమైన వీలునామా సంగతి తెలియగానే ఊళ్ళో వాళ్ళంతా జాలిపడ్డారు. అయితే వాళ్ళిద్దరినీ వొచ్చి పలకరించటానికెవరికీ ధైర్యం చాలలేదు. అందరికంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో పడింది విలియం తల్లి, శ్రీమతి డాల్జెల్ గారు! అమ్మాయిలద్దరూ తన దగ్గరికి వచ్చి ఏదైనా సాయమడిగితే ఏం చేయాలో నన్న భయం పట్టుకుందామెని. అందుకే వారి ఇంటికెళ్ళి పరామర్శించే పనిని వీలైనంత వాయిదా వేయదల్చుకుంది.

అంత్యక్రియలు ముగిసిన మర్నాడే చర్చి ఫాదర్ వొచ్చి పరామర్శించాడు. చాలా సేపటి వరకూ ఆయన మాట్లాడింది వాళ్ళకు అర్థం కాలేదు. అర్థమయింతర్వాత నచ్చలేదు. ఎక్కువగా ఆయన “ధనికులంతా దుర్మార్గులూ, డబ్బుతో వచ్చే సుఖాలకంటే, నష్టాలే ఎక్కువా, డబ్బు లేక తిండి కోసం మలమల మాడే పేదలే భగవంతునికి ప్రీతి పాత్రులు” వగైరా మాటలతో వాళ్ళని ఓదార్చారు. జేన్ కి తాము డబ్బు లేని పేద వాళ్ళుగా వుండటాన్ని ఇష్టపడటం లేదనీ, ఏదో కష్టం చేసి బ్రతకగలమనీ చెప్పటానికి ఆయన వాగ్ధాటి ముందు ధైర్యం చాలలేదు.
ఎందుకూ పనికిరాని సానుభూతి వాక్యాలతో విసిగిపోయిన జేన్, ఈసారి వచ్చే వారిని ఉద్యోగం కోసం ఏదైనా సలహా అడగాలని నిశ్చయించుకుంది. ఆ వ్యక్తి శ్రీమతి డాల్జల్ కావడం యాదృఛ్ఛికం! డాల్జల్ గారు వచ్చి ఏవో మామూలు మాటలు మాట్లాడి, అంటీ ముట్టనటుగానే వున్నారు. వున్నట్టుండి ఆవిడని జేన్ అడిగింది

“ఇప్పుడు మేమేం చేస్తే బాగుంటందంటారు ఆంటీ?”

గతుక్కుమంది శ్రీమతి డాల్జల్.

“హయ్యో! నాకేం తెలుసమ్మా? పెద్దాయన ఇలా చేస్తాడని ఎవ్వరమైనా అనుకున్నామా? నా బుర్రకైతే ఒక్క ఆలోచనా తట్టడం లేదు. విలియం ఈ సంగతి చెప్పగానే గుండె నీరైపోయిందంటే నమ్ము! హవ్వ! సొంత తోబుట్టువు పిల్లలని వీధులకప్పజెప్పి ఎవరో ఊరూ పేరూ తెలియని వాడికి తన సొత్తంతా ఇస్తాడా? పోనీ ఆయన రాసిన విల్లు చెల్లదని కోర్టులో దావా వేస్తే? అసలా అబ్బాయి ఈయన కొడుకే అని ఋజువేదీ? కొంచెం డబ్బు కోసం ఆ పిల్లాడి మిద వొత్తిడి తెచ్చినా తప్పు కాదంటాను!”

“అదయ్యే పని కాదులే! ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో చెప్పగలరా? మీకు తెలిసిన వాళ్ళెవరైనా…”

శ్రీమతి డాల్జల్ ఆలోచించింది.

“చామర్స్ గారి శ్రీమతి వాళ్ల పిల్లలకి ఒక గవర్నెస్ కోసం వెతుకుతున్నారు. మరయితే మీకా ఉద్యోగం నచ్చుతుందో లేదో! మాక్స్వెల్ కుటుంబం కూడా వాళ్ళ అబ్బాయిలకి మొన్నీమధ్యనే ట్యూషను మాస్టారును కుదుర్చుకున్నారు.”

“అక్కా! మనకి వేరే దూరంగా వుండే వూళ్ళల్లో ఉద్యోగాలు దొరికితే బాగుండు. నాకీ ఊరంటే అసహ్యం పట్టుకుంది,” ఎల్సీ అంది.

“అవునమ్మాయ్! హాయిగా ఎడిన్ బరో లోనో, గ్లాస్గో కొ వెళ్ళండి. అక్కడేమైనా స్కూల్ మాస్టారు ఉద్యోగాలు దొరకొచ్చు.”

“చదువు చెప్పటం కాకుండా ఇంకేమైనా ఉద్యోగాలు దొరకవంటారా?”

“అయ్యో! పెద్దింటి పిల్లలు! నీడ పట్టున వుండే పనులు కాక ఇంకేం చేయగలరు?”

“అన్నట్టు మీకు మిస్ థాంసన్ గారు తెలుసా? మావయ్య ఆవిడ గురించి చాలా చెప్పారు. చాలా తెలివైనదనీ, ధైర్యం గలదనీ, ఏ పనైనా చక్క బెట్ట గలదనీ అన్నారు. ఆవిడ దగ్గరికెళ్తే ఏదైనా ఉద్యోగం దొరకొచ్చు.” సాలోచనగా అంది జేన్.

“ఆవిడ తెలియకపోవటమేంటి? అంటే పనీ పాటలూ చేసుకునేవాళ్ళతో మాలాటి కుటుంబీకులు ఎలా కలిసి మెలిసి తిరుగుతారు కానీ, చాలా పనిమంతురాలనే విన్నాను. వాళ్ళ పొలం పనులన్నీ తనే ఒంటి చేత్తో చూసుకుంటుందిట. పెళ్ళీ పెటాకులూ కూడా లేవాయె! ఇప్పుడు కొంచెం వయసు మీద పడుతున్నట్టుంది ఆమెక్కూడా!”
“ఆవిడ దయ తలచి నాకూ ఏదో ఉద్యోగం ఇవ్వకపోదు! వెళ్ళి నన్ను తనకి సాయంగ పెట్టుకోమని అడుగుతాను. నేనూ చాలా వ్యవసాయ శాస్త్రం చదువుకున్నా కాబట్టి ఆమెకీ లాభమే. ఆంటీ, ఆవిడకి నన్ను పరిచయం చేస్తూ ఒక చిన్న ఉత్తరం ఇస్తారా? ”

తనకే నష్టం కలగకపోతే అమ్మాయిలద్దరికీ సాయం చెయ్యడానికి ఆవిడకేమీ అభ్యంతరం లేదు. అందుకే నిరభ్యంతరంగా ఒక చిన్న ఉత్తరం రాసిచ్చింది.

***

 (సశేషం)

ముఖచిత్రం : మహీ పల్లవ్

వీలునామా

Sharada1

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

  మొదటి భాగం

స్కాట్లాండ్ లోని ఒక పల్లె దగ్గర వుండే ఒక పెద్ద భవంతిలో, ఆ వేసవి రోజు ఒక రకమైన దిగులు అలుముకోని వుంది. ఆ భవంతి సొంత దారు శ్రీయుతులు హొగార్త్ గారు జబ్బు చేసి మరణించి అప్పటికి రెండు రోజులైంది. ఆ రోజు ఉదయమే ఆయన అంత్య క్రియలు ముగిసాయి.

 స్త్రీలంటే వుండే అపారమైన గౌరవం చేత ఆయన వివాహం చేసుకోలేదని ఊళ్ళో వాళ్ళనుకుంటారు. భార్యా బిడ్డలూ లేకపోయినా, ఆయనతో పాటు పదిహేనేళ్ళుగా నివసిస్తూన్న  మేనకోడళ్ళు, జేన్, ఎల్సీ లిద్దరూ వున్నారు. ఒక్కగానొక్క చెల్లెలు పదిహేనేళ్ళ క్రితం చనిపోతే వాళ్ళిద్దర్నీ ఆయన చేరదిసి ఇంటివద్దనే చదువు చెప్పించారు. ఆయనకున్న ఇద్దరు అన్నలూ సంతానంలేకుండానే మరణించారు. అందువల్ల ఆయన ఆస్తి పాస్తులన్నీ ఇప్పుడా ఇద్దరు అమ్మాయిలకే చెందొచ్చని అందరి ఊహ. ఆయనకింకెవరూ బంధువులు వున్నట్టు లేరు. కనీసం ఆ భవంతిలో వేరే బంధువులెప్పుడూ కనపడలేదు.

ఊళ్ళో అంతా ఆయన గురించి కొంచెం వింతగా చెప్పుకుంటారు. ఏ క్షణంలో ఆయన మనసెలా వుంటుందో, ఎప్పుడే విచిత్రమైన పని చేస్తారో ఎవరికీ అంతుబట్టదు. ఇప్పుడీ మేనకోడళ్ళ సంగతే తీసుకుంటే, అందరు అమ్మాయిలకు చెప్పించినట్టు సంగీతమూ, చిత్ర లేఖనమూ లాటి నాజూకు విద్యలు కాకుండా కొంచెం విభిన్నమైన చదువులు చెప్పించారని వినికిడి.

అంత్య క్రియలు ముగిసి అందరూ ఆ భవంతిలోని హాలులోకి చేరుకుంటున్నారు. హొగార్త్ మేనకోడళ్ళు, వకీలు మెక్-ఫార్లేన్ గారూ, వైద్యుడు బైర్డ్ గారూ వున్నారు హాలులో. వీళ్ళతోపాటు ఒక అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపడ్డారు అమ్మాయిలిద్దరూ. దాదాపు ముఫ్ఫై యేళ్ళ వయసున్న ఆ పొడుగాటి వ్యక్తిని వాళ్ళింతకు ముందెప్పుడూ చూడలేదు. చాలా గంభీరంగా వున్నాడెందుకనో.

వకీలు గారూ, డాక్టరు గారూ కొంచెం ఇబ్బందిగా, చిరాగ్గా వున్నారు. వీలునామా చదివే ముందు అవసరమైన చిన్న చిన్న పనుల వల్ల అయి వుండొచ్చు. ఏవేవో కాగితాలు చూస్తూ కాలయాపన చేస్తున్నారు.

ఆఖరికి అందరూ కూర్చున్నాక వీలునామా చదవడం మొదలైంది. ఎందుకనో వకీలు గారికి గొంతు పట్టేసినట్టుంది.

“.. నా అభిప్రాయం ప్రకారం, స్త్రీలకి పురుషలకీ పెద్ద తేడాలేం లేవు. అవసరమైన చదువులు చెప్పిస్తే, ఆడవాళ్ళు కూడా తమ కాళ్ళమీద తాము నిలబడగలరు. ప్రపంచంలో తమ దారి తాము వెతుక్కోనూగలరు. ఈ సూత్రానన్నుసరించే నేనూ నా మేనకోడళ్ళు ( జేన్ మెల్వీల్, ఎల్సీ గా పిలవబడే ఆలిస్ మెల్వీల్) ఇద్దరికీ తగు విద్యా బుధ్ధులు నేర్పించాను. ఇప్పుడు గనక నేను నా ఆస్తిపాస్తులన్నీ వారికిస్తే, వాళ్ళు తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడాలన్న నా ఆశయానికి భంగం వాటిల్లక తప్పదు. ఇద్దరిలోకి పెద్దదీ, తెలివైనదీ అయిన జేన్ తెలివితేటలెందుకూ పనికిరాకుండా పోతాయి. చిన్నది ఆలిస్ ఆమాయకురాలు. డబ్బున్న అమాయకురాలిని వంచించటానికి కాచుకోని వుండే నక్కలకి మన సంఘంలో లోటు లేదు. వారి తండ్రి జార్జి మెల్వీల్ ఆ డబ్బు కోసమే కదా మా చెల్లి చుట్టూ తిరిగి దాని మనసునీ, జీవితాన్నీ ముక్కలు చేసింది! అందువల్ల ఈ డబ్బు వారిద్దరికీ హాని చేయడమే తప్ప ఇంకెందుకూ పనికిరాదని నా అంచనా.

అందుకే నా స్థిరాస్తులూ, చరాస్తులూ, అన్నిటినీ బేంక్ ఆఫ్ స్కాట్ లాండ్ లో హెడ్ క్లర్కు గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఆర్మిస్టవున్ పేర రాస్తున్నాను. అతని తల్లి ఎలిజబెత్ ఆర్మిస్టవున్ ని నేను దాదాపు ముఫ్ఫై అయిదేళ్ళకింద రహస్య వివాహం చేసుకున్నాను. ఫ్రాన్సిస్ కి ఈ సంగతి ఈనాటి వరకూ తెలియదు. ఎలిజబెత్ తో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్న నేను, ఫ్రాన్సిస్ కి దూరం నించే సహాయం చేస్తూ వున్నాను. నేనిచ్చే అతి కొద్దిపాటి దబ్బుతో ఫ్రాన్సిస్ పేదరికాన్నించి పైకొచ్చి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అలా చదువుకొని ఉద్యోగస్తుడవ్వడానికి అతనెంతో కష్టపడ్డాడు. అందుకే అతనిప్పుడు డబ్బునీ, ఆస్తినీ అందుకోవడానికి అర్హుడని నా అభిప్రాయం.

అయితే, అతను ఏలిస్, జేన్ లకి ఒకరొకరికీ  సంవత్సరానికి పన్నెండు పౌన్ల చొప్పున మూడేళ్ళు ఇవ్వాల్సి వుంటుంది. ఆ మూడేళ్ళల్లో వాళ్ళిద్దరూ తమ జీవనోపాధి వెతుక్కోవాల్సి వుంటుంది. మూడేళ్ళ తర్వాత ఆ డబ్బు ఆపేయ వలసివుంటుంది.

తమకి చెందిన బట్టలూ, కొంచెం ఇంటి సామాన్లతో ఇద్దరు అమ్మాయిలూ ఇల్లు వొదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వారికి ఇంకే విధమైన ధన సహాయం ఫ్రాన్సిస్ చేయటానికి వీల్లేదు. వాళ్ళల్లో ఎవరినీ వివాహమాడటానికి కూడా వీల్లేదు.

నేను నియమించిన షరతులలో వేటిని ఉల్లంఘించినా, నా అస్తంతా సాంఘిక సంక్షేమ సంస్థలకి చెందుతుంది. అటువంటి సంస్థల పట్టిక ఈ వీలునామాకి జత చేయబడి వుంది. నేనీ ఏర్పాటు పిల్లల మంచికోసమే చేసానని నమ్ముతున్నాను…”

హాలంతా నిశ్శబ్దం. జేన్ నిర్ఘాంతపోయి, మొహం ఎర్రబడి, కళ్ళల్లో నీళ్ళు నిండినా, వాటిని జారనీయకుండా నిబ్బరంగా, కఠినంగా కూర్చుంది. ఏలిస్ మొహం పాలిపోయి, మూర్ఛపోయింది. అందరికంటే సిగ్గుతో, అపరాధ భావనతో తడబడ్డాడు, ఫ్రాన్సిస్. అతి కష్టం మీద మాటలు కూడదీసుకొని,

“హొగార్త్ గారు విల్లు రాసినప్పడు ఆరోగ్యంగానే వున్నారు కదా?” అన్నాడు.

“చక్కగా వున్నారు! దాన్లో అనుమానం లేదు. ఏమంటారు డాక్టరు గారూ?”

లాయరు గారి ప్రశ్నకి డాక్టరు బైర్డ్ గారు అవునన్నట్టు తలాడించారు.

“ఈ వీలునామా దాదాపు ఆరు వారాల కింద రాయించారు. అప్పుడాయన ఆరోగ్యంగానే వున్నారు. ఇంత విచిత్రమైన వీలునామా రాసారెందుకో! పాపం లాయరు గారు కూడా వద్ద న్నారట. అయినా మీ మామయ్య ఎవరి మాటా వినిపించుకోరు. మీ ఇద్దర్నీ చూస్తుంటే కడుపు తరుక్కుపోతూంది! ”

ఇంతలో ఏలిస్ కళ్ళు తిరిగి సోఫాలో ఒరిగిపోవటంతో, డాక్టరుగారూ, జేన్ ఆమెకి ఉపచారాలు చేయసాగారు.

లాయరు గారు ఫ్రాన్సిస్ వైపు తిరిగి ఉన్నట్టుండి ధనవంతుడైనందుకు అభినందనలు తెలిపాడు. ఫ్రాన్సిస్ కి ఆ పరిస్థితి దుర్భరంగా, అవమానంగా అనిపించసాగింది. ఏం మాట్లాడాలో తోచక ఊరికే హాల్లోని బొమ్మలనీ, కిటికీ బయట తోటనీ చూడసాగాడు. అతనికి ఆ ఇద్దరి అమ్మాయిలనీ తలచుకుంటే ఏదోలా వుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎటెళ్తారు? అసలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరా? తనిప్పుడేం చేయాలి? తనకంటే సంవత్సరానికి పన్నెండు పౌన్లతో గడుపుకోవటం అలవాటే. వాళ్ళిద్దరూ?

పెద్దమ్మాయి కాస్త ధైర్యస్థురాలిలానే వుంది కానీ, చిన్నమాయి పాపం నాజూకుగా, అమాయకంగా వుంది. వాళ్ళిద్దరికీ ఇప్పుడేం ఉద్యోగాలొస్తాయి?వాళ్ళనెవరు పెళ్ళాడతారు? వాళ్ళిద్దరూ పాపం పెళ్ళి పెటాకులూ లేక పెద్దైపోతుంటే తాను వాళ్ళ డబ్బంతా అనుభవిస్తూ సంతోషంగా వుండగలడా? మధ్యలో తనేం సహాయం చేయకూడదని షరతు విధించాడెందుకో ఆ పెద్దాయన!

ఫ్రాన్సిస్ మెల్లిగా లేచి ఏలిస్ పడుకున్న సోఫా దగ్గరికెళ్ళి నిలబడ్డాడు. ఏలిస్ చేతుల్లో మొహం కప్పుకొని ఏడుస్తోంది. జేన్ అతని వంక నిర్వికారంగా చూసింది. ఫ్రాన్సిస్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొన్నాడు.

“నన్ను నమ్ము జేన్! ఈ వీలునామాతో నాకే ప్రమేయమూ లేదు. దాంతో సంతోషమూ లేదు. వీలైనంత త్వరగా నేను ఇదంతా మీ ఇద్దరి పాలు చేసే ఉపాయం ఆలోచిస్తాను.”

“వొద్దొద్దు! మావయ్య ఆశయాలనీ, ఆలోచనలనీ మన్నించడమే మనం చేయవలసింది. తప్పో ఒప్పో, ఆయన అభిప్రాయాలు ఆయనవి. చాల సార్లు ఇలాటివన్నీ ఆయన నాతో చర్చించేవారు. నాకూ ఆయన అభిప్రాయాలు సరిగ్గానే అనిపించేవి. ఇప్పుడు కూడా ఆయన సరిగ్గా ఆలోచించే ఈ పని చేసి వుంటాడు.”

“ఏం ఆలోచనలో, ఏం అభిప్రాయాలో! నాకైతే మీ ఇద్దర్నీ ఇలా కట్టుబట్టలతో ఇల్లొదిలి వెళ్ళమనడం అన్యాయంగా అనిపిస్తుంది. నా సంగతి వేరు.నేను మగవాణ్ణి, ఎక్కడున్నా సర్దుకోగలను. పైగా పేదరికం నాకలవాటే! మీరంటే పాపం, ఆడవాళ్ళు….”

“భలే వారే! ఆడవాళ్ళు ‘పాపం’ ఆడవాళ్ళెందుకయ్యారు? పేదరికానికీ, కష్టాలకీ మీరు అలవాటు పడగలిగితే మేం అలవాటు పడలేమనా మీ ఉద్దేశ్యం?” కఠినంగా అంది జేన్.

“మావయ్య మమ్మల్నేమీ అన్యాయం చేయలేదు.  మా అమ్మ పోగానే, ఎందుకుపనికిరాని మా నాన్న నుంచి మమ్మల్ని విడిపించి ఈ యింటికి తీసుకొచ్చాడు. ఆడవాళ్ళు తలచుకుంటే ఏ పనైనా మగవాళ్ళకి తీసిపోకుండా చేయగలరని ఆయన నమ్మకం. నేనాయాన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయను.  అందులోనూ ఇదంతా మావయ్య స్వార్జితం. తన ఇష్టం వచ్చిన వారికిచ్చే హక్కు ఆయనకుంది.”

ఉన్నట్టుండి ఏలిస్ వెక్కిళ్ళు వినిపించడంతో మాటలాపి వెనుదిరిగింది జేన్.

“ఎంత పని చేసావు మావయ్యా? నీకు మనసెలా వొప్పిందసలు? ఇప్పుడు మేమేం చెయ్యాలి?”

ఏలిస్ దుఃఖాన్ని చూడటంతో జేన్ ధైర్యం కొంచెం సడలింది. కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.

“ఎల్సీ! నువ్వలా ఏడవొద్దు. నేనేదో చేస్తాగా? అంత భయపడితే ఎలా చెప్పు?”

“ఇప్పుడు మనం మీ సమీప భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆర్మిస్టవున్ గారికి, అదే, హొగార్త్ గారికి మీరీ ఇంట్లో ఇంకొక నెల రోజులుంటే ఏమీ అభ్యంతరం వుండకపోవచ్చు. నెలలోగా మీరు ఉద్యోగమూ, ఇల్లూ వెతుక్కోవచ్చూ. ఏమంటారు ఫ్రాన్సిస్?”  లాయరుగారు ఫ్రాన్సిస్ వైపు చూస్తూ అడిగారు.

“అయ్యొయ్యో! దానిదేముందండి. ఇంత పెద్ద ఇల్లు. నెల రోజులే ఏమిటి, ఎన్ని రోజులున్నా నాకేం అభ్యంతరం లేదు.”

“పూర్తిగా ఇక్కడ వుండడానికి వీల్లేదనుకో! నెల రోజులు వుండడంలో చిక్కేమీ వుండదనుకుంటాను.” లాయరు తీర్మానించారు.

“నేను ఈ లోగా మా వూరు వెళ్ళి నా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొస్తాను. ముందుగా నా బదులు బాంకిలో పని చేయటానికి ఎవరినైనా చూడాలి. ”

“ఫ్రాన్సిస్! మీరు మాకు ధన సహాయం చేయడానికి వీల్లేదు. కానీ, సలహాలు ఇవ్వచ్చేమో! మీరిప్పుడు ఎడిన్ బరో వెళ్తున్నారు కదా! అక్కడ మాకు పనికొచ్చే ఉద్యోగాలుంటే చూసి చెప్పగలరా?” జేన్ అడిగింది.

“తప్పకుండా! ఇంతకీ మీరు ఎలాటి వృత్తి కావాలనుకుంటున్నారు? ”

“ఏదో ఒకటి! మా ఇద్దరికీ ఇంత తిండి పెట్టేదైతే చాలు.”

“అయితే ఏదైనా కుటుంబాల్లో గవర్నెస్ ఉద్యోగాలున్నాయేమో చూస్తాను.”

“చూడండి! అయితే ఆడపిల్లలకి ఎలాటి చదువు చెప్పాలో నాకంతగా తెలియదు. మగపిల్లలకైతే చక్కగా చెప్పగలను. అక్కవుంటింగూ, జామెట్రీ, లెక్కలూ, కెమిస్ట్రీ, వ్యాకరణమూ, అన్నీ తెలుసు నాకు. అన్నిటికంటే మావయ్య నా అక్కవుంటింగుని బాగా మెచ్చుకునేవాడు. అక్కవుంటింగంటే గుర్తొచ్చింది! మీ ఉద్యోగం ఎలా మొదలైంది?”

“నేను బాంకులో గుమాస్తా గా పదహారేళ్ళప్పుడు చేరాను. అప్పుడు నాకు యేడాదికి ముఫ్ఫై పౌన్లొచ్చేవి. దానికి తోడు హొగార్త్ గారిచ్చే పన్నెండు పౌండ్లు!”

“యేడాదికి ముఫ్ఫై రెండు పౌండ్లు! సరిపోతుందా?”

“సరిపోవడానికేముంది లెండి. ఎలాగో సరిపుచ్చుకోవాలి. అయితే అలా మూడేళ్ళే ఇబ్బంది పడ్డాను. పని చేస్తూ చదువు పూర్తి చేసాను. ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం మొదలైంది. ఇప్పుడు నాకు యేడాదికి దాదాపు మూడొందల పౌండ్లొస్తాయి. అదే బాంకు లో పదిహేడేళ్ళుగా పనిచేస్తున్నా కదా? ”

“మొదట్లో యేడాదికి ముప్పై పౌండ్లు. పదిహేడేళ్ళు గడిచేసరికి యేడాదికి మూడొందలు. అచ్చంగా మావే! ఎవరి దయా ధర్మాల మీదా ఆధారపడకుండా! ఎంత బాగుంటుంది! నాకేం భయం లేదు. ఎల్సీ కొంచెం ధైర్యంగా వుంటే బాగుండు.”

“పదిహేడేళ్ళా! అంతలో మనం చచ్చే పోతాం!” మళ్ళీ ఎల్సి బావురుమంది.

“ఎల్సీ! నేనున్నాకదా!”

“తిండికే లేక మల మల మాడి పొతామో యేమో!”

“ఏదో ఒకటి చేస్తా కదా! సరే ఫ్రాన్సిస్! నీకే ఉద్యోగం గురించి తెలిసినా నాకు చెప్పు!”

మెల్లిగా ఒకరొకరూ సెలవు పుచ్చుకున్నారు. హాలంతా ఖాళీ అయింది.

***

 

(సశేషం)

 

 

వచ్చేవారం “వీలునామా” అనువాద నవల ప్రారంభం !

catherine helen spence

కేథరిన్ హెలెన్ స్పెన్స్

కేథెరీన్ హెలెన్ స్పెన్స్ (1825-1910)

ఆస్ట్రేలియా గురించి రాసిన మొదటి రచయిత్రీ, స్త్రీవాదీ, పాత్రికేయురాలూ, మత బోధకురాలూ అయిన కాథెరీన్ హెలెన్ స్పెన్స్ 1825 లో స్కాట్లాండ్ లో జన్మించారు. కేథరీన్ పద్నాలుగేళ్ళ వయసులో వున్నప్పుడు, బేంకరూ న్యాయవాదీ అయిన తండ్రి డేవిడ్ ఆస్తంతా పోగొట్టుకోగా, కట్టు బట్టల్తో కుటుంబమంతా దక్షిణ ఆస్ట్రేలియా చేరుకున్నారు. అడిలైడ్ మున్సిపల్ కౌన్సిల్ లో డేవిడ్ గుమాస్తాగా పనిచేసారట.

ఆస్ట్రేలియాకి చేరిన వెంటనే డబ్బున్న వారిళ్ళల్లో గవర్నెస్ గా పని చేసింది కేథరీన్. అటు పిమ్మట ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తూ, “క్లారా మారిసన్” అనే నవల రాసి ఆస్ట్రేలియా గురించి రాసిన మొదటి మహిళ అయింది.

తన సమకాలీన సాహిత్యంలో వచ్చే స్త్రీ పాత్రలని కేథరీన్ ఎంతగానో చీదరించుకునేది. అప్పట్లో ఇంగ్లండు నుంచి విడుదలయ్యే సాహిత్యమంతా అసూర్యంపశ్యలూ, అతి నాజూకైన వాళ్ళూ అయిన స్త్రీలతో నిండి వుండేది. జేన్ ఆస్టిన్ నవలా నాయికలనించి ఎమిలీ బ్రాంట్ వరకూ, అందరూ ప్రేమే లోకంగా జీవిస్తూ అందగాడైన హీరో కోసం ఎదురు చూసేవారే.

అలాంటి వ్యవస్థలో కేథరీన్ స్త్రీవాద రచనలూ, సమాజరీతికి విభిన్నంగా తమ కాళ్ళ మీద తామే నిలబడాలనుకునే స్త్రీ పాత్రల వల్ల ఆవిడ రచనలు వివాదాస్పదమయ్యాయి. “కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం చేస్తాయనీ, సోషలిస్టు దృక్పథం ఎక్కువగా వుంటుందనీ” ఆవిడ రచనలు ఆవిడ బ్రతికుండగా ఎక్కువ ప్రాచుర్యం పొందలేదంటారు.  నిరుత్సాహపరచే ఎడిటర్లూ, ఏమాత్రం ప్రోత్సాహమివ్వకపోగా అనుమానంగా చూసే వ్యవస్థతో విసిగిపోయి ఆవిడ తనని తాను రచయిత్రిగా కంటే పాత్రికేయురాలిగా గౌరవించుకునేవారట.

దాదాపు ఏడెనిమిది నవలలు రాసి, పిమ్మట జీవితంలో పాత్రికేయురాలిగానే స్థిరపడ్డారు.

ఆస్ట్రేలియాలో స్త్రీలకు వోటు హక్కు కోసం పోరాటం నించి, నిరాశ్రయులైన పిల్లలకు సహాయం చేయడం వరకు, కేథరీన్ చాలా సామాజిక కార్య కలాపాల్లో పాల్గొంది. అడిలైడ్ లోని యూనిటేరియన్ చర్చిలో మత బోధకురాలిగా కూడా పని చేసారు.

రచనల్లో ఆవిడ అన్ని ప్రక్రియలూ ఉపయోగించారు. దిన పత్రికల్లో కథలూ, కవితలూ, బాల సాహిత్యం, రాజకీయ వ్యాసాలు, పుంకానుపుంఖాలుగా రాసేదావిడ. పత్రికల్లో రాజకీయ వ్యాసాలు మారు పేరుతో రాసేది. ఆవిడ మారు పేర్లతో రాసిన వ్యాసాల గురించి ఆస్ట్రేలియాలో చాలా పెద్ద యెత్తున పరిశోధనలే జరిగాయి.

అడిలైడ్ నగరంలో ఆవిడ స్మారక  చిహ్నాలు చాలానే వున్నాయి. యూనివర్సిటీల్లో, లైట్ స్క్వేర్ లో, స్టేట్ లైబ్రరీలో కేథరీన్ స్పెన్స్ భవనాలు చాలా వున్నాయి. ఆమె చిత్రాన్ని ఆస్ట్రేలియన్ అయిదు డాలర్ల నోటు పైన ముద్రించీ, 1975 లో విడుదలైన పోస్టేజీ స్టాంపు విడుదల చేసీ, ప్రభుత్వం ఆమెని గౌరవించింది. ఎనభై అయిదేళ్ళ వయసులో అవివాహితగానే మరణించింది ఆవిడ.

Mr.Hogarth’s will నవలలో ఆవిడ ఆనాడు ఆడవాళ్ళ దుస్థితినీ, పరాధీనతనీ నిర్మొహమాటంగా వివరించారు.

ధనవంతుడైన  ఎస్టేటు సొంతదారు  హొగార్త్.  భార్యా భిడ్డలు లేకుండానే మరణిస్తాడు. ఇద్దరు మేనకోడళ్ళున్నా, వారిని కట్టు బట్టలతో బయటికి పంపుతాడు. ఆడవాళ్ళు కేవలం గృహ సంబంధమైన పనులో,కుట్లూ, అల్లికలూ చేసుకొంటూనో డబ్బు సంపాదించాలే తప్ప, మగవారికి పోటి ఇచ్చే యే వృత్తీ ఎన్నుకోరాదన్నది అప్పటి బ్రిటిషు నాగరికత. అలాటి పరిస్థితిలో ఆ అమ్మాయిలు ఎలా నెగ్గుకొచ్చారన్నదే కథాంశం.

 (“వీలునామా”వచ్చేవారం  ప్రారంభం– అనువాదం- శారద)

విందు

Katherinemansfield

(కేథరీన్ మేన్స్ ఫీల్డ్ The Garden Party – తెలుగు అనువాదం శారద)

[రచయిత్రి పరిచయం  :  కేథరిన్ మేన్స్ ఫీల్డ్ (1888-1923)- న్యూ జీలాండ్ కి చెందిన రచయిత్రి. న్యూజీలాండ్  లో పుట్టి  ముఫ్ఫై అయిదేళ్ళకే  ఇంగ్లండులో మరణించారు ఆవిడ.  రచయిత్రిగానూ, వ్యక్తిగతంగానూ చాలా వివాదాస్పదమైన జీవితం ఆవిడది. ఆవిడని అమితంగా ప్రేమించిన వర్జీనియా వూల్ఫ్, ఇడా బేకర్ లాటి వాళ్ళూ వున్నారు, విపరీతంగా ద్వేషించిన డ్.హెచ్. లారెన్స్ లాటి వాళ్ళూ వున్నారు. “జీవితానికీ వృత్తికీ మధ్య విభజన రేఖ వుండనే కూడదని” నమ్మిన ఈవిడ జీవితం కూడా ఆవిడ రచనల్లానే వుంటుంది.

ధైర్యంగా, నిర్భయంగా, నిజాయితీగా, ఎవరికీ ఏ సంజాయిషీలూ ఇవ్వకుండా, కొంచెం తన తోటి వారికి భిన్నంగా, చాలా ఆసక్తికరమైన స్త్రీ, అంతకంటే ఆసక్తికరమైన రచనలు మేన్స్ ఫీల్డ్ వి.

న్యూజీలాండ్ లో వెలింగ్టన్ లో పుట్టిన కేథరిన్ పదేళ్ళకే స్కూల్ మేగజీన్ కోసం రాసే వారు. సంపన్నుల కుటుంబం వాళ్ళది. తండ్రి బేంకరు. 1903 నించి 1906 వరకు లండన్ లో చదువుకుని న్యూజీలాండ్ తిరిగ్ వెళ్ళారు. అయితే అక్కడ రెండేళ్ళకంటే ఎక్కువ వుండలేక మళ్ళీ లండన్ తిరిగ్ వెళ్ళి జీవితాంతం అక్కడే వున్నారు.  స్త్రీ-పురుషులతో ఆమె లైంగిక సంబంధాలు వివాదాస్పదం. 1918 లో జాన్ మిడిల్ టన్ మరే ని వివాహమాడారు. వాళ్ళిద్దరూ 1911  నించే సహజీవనం మొదలు పెట్టారు. అయితే ఆమె అంతకు ముందే వివాహం చేసుకున్న బౌడెన్ తో చట్ట రీత్యా విడాకులు తీసుకోకపోవడం వల్ల వీళ్ళిద్దరూ ఆగాల్సి వచ్చింది. బ్రతుకంతా రకరకాల వ్యక్తులతో సంఘర్షణ లోనూ, గర్భ స్రావాలతోనూ, అనారోగ్యంతోనూ, ఆర్ధిక ఇబ్బందులతోనూ బాధపడింది కేథరీన్ అనిపిస్తుంది.

తను స్వయంగా చెహోవ్ ని అభిమానించినా, ఆవిడ కథనం చాలా మంది ఇతర రచయితలని ప్రభావితం చేసింది. కేథరిన్ బ్రతుకే ఒక విచిత్రమైన కథలాగుంటుంది. ఇంకా వివరాలు కావలంటే ఇక్కడ చూడండి.

ఆమె శైలిలో నాకు చాలా నచ్చేది, కొంచెం స్పష్టాస్పష్టమైన పాత్ర చిత్రీకరణ. అంటే ప్రధాన పాత్రల గురించి కథ ఏమీ చెప్పదు. వాళ్ళ వయసు కానీ, సాంఘిక హోదా కానీ, ఇతర పాత్రలతో వారికుండే సంబంధ బాంధవ్యాలు కానీ ఏ వివరాలూ కథలో వుండవు. అవి మనం అర్థం చేసుకోవాలంతే. అంతే కాదు ప్రధాన పాత్రలు తమ చుట్టూ వుండే వారికంటే కొంచెం భిన్నంగా వుంటాయి. (అందుకే చాలా సార్లు ఆవిడ ప్రధాన పాత్రలు ఆవిడలాగే వుంటాయి.]

ఆ రోజు వాతావరణం చాలా బాగుంది. తోటలో విందుకొరకు ఆ కుటుంబం సరిగ్గా అలాటి వాతావరణమే కావాలనుకొంది. పెద్ద గాలులూ అవీ లేకుండా, ఆకాశమొక్క మబ్బు తునకైనా లేకుండా, వెచ్చగా, భలే బాగుంది. నీలాకాశంలో బంగారు చెంబు బోర్లించినట్టు సూరీడు! తోటమాలి పొద్దుణ్ణించీ తోటలోనే వున్నాడు. శుభ్రం చేస్తూ, ఊడుస్తూ, గడ్డి చెక్కేస్తూ, తోటంతా మిల మిలా మెరిసేలా చేస్తూ! అసలా గులాబీలు! తోటలో విందు ఇవ్వాలంటే గులాబీలు వుండి తీరాల్సిందేనని ఎవరైనా ఒప్పుకుంటారు. గులాబీలైతే అందరికీ తెలుస్తాయి, మిగతా పువ్వులు తెలిసినా తెలియకపోయినా. ఆ రోజు వందల కొద్దీ గులాబీలు పూచినట్టుంది తోటంతా.

పొద్దున్న కాఫీలూ, టిఫిన్లూ ఇంకా అవకముందే షామియానాలూ, పందిర్లూ వేసేవాళ్ళొచ్చేసారు.

“షామియానాలవీ ఎక్కడ వేయించమంటావమ్మా?” పిల్లలు అమ్మనడిగారు.

“ఇవాళ నన్నేం అడిగినా ప్రయోజనం వుండదు. నేను మీ అమ్మననే మాట మర్చిపోయి, నన్నూ ఒక అతిథిగా భావించండి. ఈ సంవత్సరం అన్ని బాధ్యతలూ మీకే వదిలేస్తున్నాను.”

మెగ్ ఎలాగూ పనివాళ్ళతో పని చేయించటానికి బయటికి వెళ్ళదు. అంతకుముందే తను తలంటుకోని తలకు తువ్వాలు చుట్టుకోని హాయిగా కాఫీ తాగుతూ కూర్చొనుంది. జోస్ ఎప్పుడూ పట్టు లంగా, కిమోనో లాటి జాకెట్టూ వేసుకొని వుంటుంది.

“లారా, నీకే వెళ్ళక తప్పదు. అలంకరణలవీ నీకే బాగా తెలుస్తాయి.”

చేసేదేమీ లేక లారా బ్రెడ్డు ముక్కని అలా చేత్తో పట్టుకోనే బయటికి పరిగెత్తింది. నిజానికి అలాటి వాతావరణంలో ఏదో ఒక వంకన బయటికి రావటమే ఇష్టం తనకి.

నలుగురు మగవాళ్ళు నిల్చొని వున్నారు తోటలో. కర్రలూ, షామియానాలూ, సామాన్లతో ఆమె కొసం ఎదురుచూస్తున్నారు. తను చేతిలోని బ్రెడ్డు ముక్కని ఇంట్లోనే ఎక్కడైనా పెట్టి రావాల్సింది అనుకుంది లారా. ఇప్పుడు పారేయటానికీ మనసొప్పలేదు. వాళ్ళ దగ్గరకొచ్చేసరికి కొంచెం సిగ్గుతో ఎర్రబడ్ద మొహాన్ని సీరియస్ గా పెట్టింది.

“గుడ్ మార్నింగ్!”  అచ్చం వాళ్ళమ్మలా గంభీరంగా అనటానికి ప్రయత్నించింది. కానీ, తన గొంతు చిన్న పిల్లల్లాగే అనిపించేసరికి ఇంకా సిగ్గుతో తడబడింది.

“మీరంతా వొచ్చినట్టేనా? ఇదేనా షామియానా?”

“అవును అమ్మాయిగారూ!” అన్నాడు వాళ్ళల్లో అందరికన్నా పొడ్డుగ్గా వున్న అతను.

సామాన్ల సంచీ పక్కకి జరిపి, తలపై వున్న టోపీని కిందికని ఆమె వంక చూసి చిరు నవ్వు నవ్వాడు. స్నేహంగా వున్న అతని చిరునవ్వుతో లారా కొంచెం సర్దుకొంది. స్వచ్ఛంగా నీలంగా వున్న అతని కళ్ళు చూసి, మిగతా అందరివైపూ చుసింది. అందరూ  “నిన్ను మేమేం తినేయం లేమ్మా! అంత భయమెందుకు?” అన్నట్టు నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నారు. అసలు వీళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు, తనే అనవసరంగా భయపడింది. అందులో ఎంత అందంగా వుంది ఈ వుదయం. అయినా వుదయాల గురించి మాట్లాడటం కాదు, తను చాలా హుందాగా, బాధ్యతగా వుండాలి. తనకి తనే చెప్పుకుంది లారా.

“సరే! ఎక్కడ వేస్తారు షామియానా? ఆ లీలీ పూల పక్కన లాన్ లో వేస్తారా? అక్కడైతే బాగుంటుందా?”

అందరూ అటు వైపు చూసారు. పొట్టిగా లావుగా వున్న అతను పెదవి విరిచాడు. పొడుగాటి వ్యక్తి బొమ్మలు ముడేసాడు.

“అక్కడంత బాగుండదేమో అమ్మాయిగారూ. ఒక మూలకి వున్నట్టుగా వుంటుంది. ఇప్పుడూ, షామియానా అంటే ఎలాగుండాలంటే వచ్చిన అందరి దృష్టీ ఫేడీలమని పడి పోవాలన్నమాట, ” పొడుగాటి వ్యక్తి వివరించాడు.

అతని భాష అంతగా నచ్చకపోయినా, అతను చెప్పేది సరిగ్గానే వుందనుకుంది.

“అయితే టెన్నిస్ కోర్టు లో ఒక మూలకి వేస్తారా? కానీ, అక్కడ పాటల ప్రోగ్రాం కొరకు ఆర్కెస్ట్రా వాళ్ళు వుంటారు!”

“ఓ! అయితే బ్యాండు మేళం కూడా వుంటుందన్న మాట!” అన్నాడింకొక అతను. పాలిపోయిన మొహంతో, అలసిపోయిన కళ్ళతో ఒక్కసారి టెన్నిస్ కోర్టంతా పరికించి చూశాడతను. ఏమాలోచిస్తున్నాడో మరి!

“అబ్బే! బ్యాండంటే పెద్దదేమీ కాదు. చిన్న బ్యాండు!”

అంతలో మళ్ళీ పొడుగాటి వ్యక్తి కల్పించుకున్నాడు.

“అటు చూడండి అమ్మాయిగారూ! అక్కడైతే సరిగ్గా వుంటుంది.” అతను చూపించిన  చెట్ల వైపు చూసింది. అక్కడ షామియానాలు వేస్తే ఆ చెట్లేవి కనిపించవు మరి. కానీ ఆ చెట్లెంత అందంగా వున్నాయి! మిల మిలా మెరిసే ఆకులతో, బరువుగా వేళ్ళాడుతున్న పళ్ళతో, గర్వంగా, హుందాగా నిలబడి వున్నాయి.  అవన్నీ కనిపించకుండా షామియానా వేస్తే ఏం బాగుంటుంది?

ఆమె అభిప్రాయం వినకుండానే వాళ్ళంతా పని మొదలు పెట్టేసారు. పొడుగాటి వ్యక్తి మాత్రం అక్కడే ఆగిపోయి ఒక చిన్న పూవుని తెంపి వాసన చూడసాగాడు. లారా ఆశ్చర్యపోయింది. ఎంత మందికి పని మధ్యలో పూవుల వాసన చూసేంత ఓపికా, సహృదయమూ వుంటాయి, అనుకుందామె. పని వాళ్ళంతా చాలా మంచి వాళ్ళలాగున్నారు. కనీసం తనతో ఆదివారాలు రాత్రి భోజనానికొచ్చి డాన్సులు చేసే పెద్ద కుటుంబాల్లోని జులాయిలకంటే!  అసలు మనుషుల్లో ఎక్కువ తక్కువలేమిటి, విచిత్రం కాకపోతే!

“నాకైతే అలాటి తేడాలేవీ లేవు. హాయిగా వీళ్ళతోనైనా స్నేహం చేయగలను, ఏ మాత్రం సందేహం లేకుండా, ” అనుకుంది లారా. అంతలోకే పనివాళ్ళు పని మొదలు పెట్టిన సందడి వినబడింది. “వెయ్ రా దెబ్బా! హైసా!”  పని వాళ్ళు సరదాగా అరుపులూ, పాటలూ మొదలు పెట్టారు.

అసలు శ్రామిక జనం ఎంత స్నేహంగా, స్వచ్ఛంగా వుంటారో కదా! డబ్బున్న వాళ్ళలాగా మూతులు బిగించుకొని కుర్చోకుండా పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, సంతోషంగా వుంటారు! తనూ వాళ్ళల్లో ఒకర్తినే అన్నది నిరూపించటానికి లారా బ్రెడ్డు ముక్క తింటూనే పొడుగాటి వ్యక్తి షామియానా కొరకు వేసిన డిజైను బొమ్మ చూడసాగింది.

“లారా! లారా! నీకే, ఫోన్!” ఇంట్లోంచి పెద్దగా వినపడింది.

“ఆ! వస్తున్నా!” ఎగురుతూ, గంతులేస్తూ, లారా తోటలోంచి ఇంట్లోకి పరిగెత్తింది. హాల్లో నాన్న గారూ, అన్నయ్య లేరీ, బయటికెళ్ళటానికి సిధ్ధమవుతున్నారు.

“లారా! ఒక్కసారి నా కోటు కొంచెం ఇస్త్రీ చేసిస్తావా? మధ్యాహ్నం వేసుకోవాలి!””

“ఓ! తప్పకుండా!” లారా పరిగెత్తి లేరీని ప్రేమగా హత్తుకుంది.

“అసలు పార్టీలంటే నాకెంత సంతోషంగా వుంటుందో చెప్పలేను.’

“అవుననవును. సరేకానీ, వెళ్ళి చూడు! నీకేదో ఫోన్ వచ్చింది.”

అయ్యో ఫోను సంగతి మర్చే పోయింది.!Sharada1

“హల్లో! ఎవరు? కిట్టీ? మధ్యాహ్నమా? భోజనానికా?వచ్చెయ్యి! పెద్ద వంటేమీ చెయ్యట్లేదు. ఊరికే బ్రెడ్డు! ఇవళ ఎంత అందంగా వుంది కదా? ఏదీ? తెల్లదా? చాలా బాగుంటుంది. ఒక్క క్షణం వుండు- అమ్మ పిలుస్తోంది. ”, లారా ఫోన్ మూసి పెద్దగా అరచింది, “అమ్మా! ఏమిటి? వినపడటంలేదు.”

శ్రీమతి షెరిడన్ గొంతు మెట్లమీదినించి తేలి వచ్చింది.

“కిందటి శనివారం పెట్టుకున్న టోపీ నే పెట్టుకొమ్మను ఇవాళ కూడా.”

“కిట్టీ ! అమ్మ నిన్ను కిందటి శనివారం పెట్టుకున్న టోపీనే మళ్ళీ పెట్టుకొమ్మంటుంది. సరే ! ఒంటి గంటకి! బై.”  లారా ఫోన్ పెట్టేసింది.

రిసీవర్ పెట్టేసి లారా చేతులు మడచి తల వెనక పెట్టుకుని నిట్టూర్చింది. కిటికీలోంచి మెత్తగా సూర్య రశ్మి గదిలోకి పడుతోంది. మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండి పోయిందా అమ్మాయికి.

ఎవరో ఇంటి ముందర బెల్లు మోగించారు. సేడీ తలుపు దగ్గరకు నడుస్తున్న చప్పుడు! సేడీ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. “ఏమో, నాకు తెలియదు. అమ్మగార్ని అడిగొస్తానుండు.” నిర్లక్ష్యంగా జవాబిస్తోంది.

లారా హాల్లోకి నడిచింది. “ఏమిటి సంగతి సేడీ?”

“పూలమ్మే అతను అమ్మాయిగారూ!”

పూలతను తెచ్చిన పూలు హాలంతా పరచుకొని వున్నాయి. రంగు రంగుల్లో గది నిండా లిలీ పూలు.

“అయ్యో! సేడీ! ఏదో పొరపాటు జరిగింది. ఇన్ని లిల్లీ పూలెవరు తెమ్మన్నారు? అసలు నువ్వెళ్ళి అమ్మను పిలుచుకొని రా!”

వాళ్ళ మాటల్లోనే శ్రీమతి షెరిడన్ అక్కడికొచ్చింది.

“ పొరపాటేం లేదు. నేనే తెమ్మన్నాను. ఎంత బాగున్నాయి కదా?” లారా వైపు తిరిగింది.

“నిన్న అక్కణ్ణించొస్తుంటే షాపు కిటికీలో చూసాను. వెంటనే అనుకున్నాను, ఇవాళ పార్టీలో అంతటా లిలీ పూలే కనిపించాలని.”

“కానీ ఇవాళ పార్టీలో అన్ని ఏర్పాట్లకూ మాదే బాధ్యత అన్నావు!” లారా తల్లి మెడ చుట్టూ చేతులేసి గారాబంగా అంది. సేడీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. పూల కొట్టతను వెళ్ళి తన వాన్ దగ్గర నిలబడ్డాడు.

“బంగారు తల్లీ! అమ్మ ఎప్పుడూ మనసు మార్చుకోకూడదా?? ఇంకా పూలు తెస్తున్నాడు చూడు.” పూల కొట్టతను ఇంకొక లిల్లీ పూల ట్రేలు తీసుకొని లోపలికి తెచ్చాడు.

“అన్నీ లోపల వరండా అన్ని వైపులా పెట్టించు. ఏమంటావు లారా? అలా పెడితే బాగుండదూ?”

“అవునమ్మా. చాలా బాగుంటుంది.”

పక్కన ఇంకో పెద్ద హాల్లో మెగ్, జోస్, హేన్స్ అందరూ కలిసి పియానోని ఒక మూలకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

“ఆ సోఫాని అటు వైపు గోడ దగ్గరికి జరిపించి మిగతా అంత సామాను బయట వేయిద్దాము. సరేనా?”

“సరే!”

“హేన్స్, ఈ బల్లలన్నీ ఇంకో గదిలోకి మార్చు. పని ఆవిడని పిలిచి ఈ కార్పెట్ అంతా బాగా దులిపించాలి.”

జోస్ కి పని వాళ్ళతో పనులు చేయించటమంటే భలే సరదా. వాళ్ళకీ ఆమె చెప్పినట్టు చేయటం ఇష్టమే. అంతా ఏదో పెద్ద నాటకంలో పాత్రలు ధరిస్తున్న భావన వస్తుంది జోస్ పనులు చెప్పటం చూస్తే.

“అలాగే అమ్మనీ, చిన్న అమ్మాయిగార్నీ నేను పిలుస్తున్నానని చెప్పి వెంటనే తీసుకురా!” మళ్ళీ పురమాయించింది జోస్. మెగ్ వైపు తిరిగింది.

“మెగ్! ఒక్క సారి పియానో సరిగ్గా వుందో లేదో చూడు. ఇవాళ మధ్యాహ్నం ఎవరైనా పాడమంటారేమో నన్ను. రా, ఒకసారి ఏదైనా పాట వాయించి చూద్దాం.”

పాం- ట-ట-ట-టీ-ట, పియానో పెద్దగా నొరిప్పింది. అమ్మా లారా అప్పుడే గదిలోకి అడుగుపెట్టారు. జొస్ పాడుతూనే వుంది.

“అమ్మా, నేను బాగా పాడుతున్నానా?” ఇంతలో మళ్ళీ సేడీ వచ్చింది.

“మళ్ళీ ఏమిటి సేడీ?”

“ఏం లేదమ్మగారూ! వంట మనిషికి సాండ్ విచ్ ల దగ్గర పెట్టే పెర్లున్న కాగితాల కట్ట కనబడటంలెదు.”

“సాండ్ విచ్ ల పేర్లా? కాగితాలా? ఎక్కడ పెట్టానబ్బా?” శ్రీ మతి షెరిడన్ మొహం చూడగానే పిల్లలు ఊహించారు, అమ్మకి వాటి సంగతే గుర్తు లేదని. “సేడీ! పది నిముషాల్లో నేనా పేర్ల కాగితాలు పంపిస్తాను. వంట మనిషిని కంగారుపడొద్దని చెప్పు,” సేడీ ని పంపి వేసింది.

“లారా! నేనొక కవరు మీద ఆ పేర్లన్నీ రాసి వుంచాను. ఎక్కడ పెట్టానో మరిచిపోయాను. మళ్ళీ ఇంకొక మంచి కాగితం మీద రాద్దాం పద. మెగ్, ముందు నువ్వు తలచుట్టూ ఆ తువ్వాలు తీసి పారెయ్. జోస్, నువ్వెళ్ళి బట్టలు మార్చుకో. లేచి వెళ్తారా లేకపోతే మీ నాన్నతో చెప్పనా? అన్నట్టు జోస్, నువ్వు కొంచెం వంట మనిషి కంగారు పడుతుందేమో చూడు. మధ్యాహ్నం పార్టీ తలచుకుంటే నాకు వణుకొస్తూంది!”

భోజనాల గదిలో, గడియారం వెనక వాళ్ళకి పేర్లు రాసుకున్న కవరు దొరికింది. అది అక్కడికెలా వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు.

“ఈ కొంటె పిల్లలెవరో తీసి అక్కడ పడేసి వుంటారు. సరే అన్ని సాండ్ విచ్ ల పేర్లు వున్నాయో లేదో చూడు. ”

“సరే, పేర్లన్నీ చిన్న చిన్న కాగితాల మీద అందంగా రాద్దాం పద.”

అన్నీ రాసేసారు మెల్లగా. అ లేబుళ్ళ కట్ట పట్టుకుని లారా వంటింట్లోకి పరిగెత్తింది.

వంటింట్లో జోస్ పొగడ్తలతో వంటావిడని ఆకాశానికెత్తేస్తుంది. నిజానికి వంటావిడ సౌమ్యురాలు. ఆవిడని చూసి అంత భయపడటానికేమీ లేదు.

“ఇంత అద్భుతమైన సాండ్ విచ్ లు నేనెక్కడా చూడలేదంటే నమ్మండి! ఎన్ని రకాలు చేసారు? పదిహేనా?”

“అవును అమ్మాయి గారు, పదిహేను రకాలు చేసాను.”

“పదిహేను రకాల సాండ్ విచ్ లు. వామ్మో! ఎలా చేస్తారో ఎమో, అన్ని రకాలు.”

వంటావిడ సంతోషాన్ని దాచుకొంటూ చిన్న చిరునవ్వుతో వంటిల్లంతా ఊడ్చి శుభ్రం చేసుకుంటూంది. వున్నట్టుండి లోపలినించి సేడీ అరచింది, “గాడ్బర్ నించి మనిషి వచ్చాడు!” అంటూ. అంటే మిఠాయిలొచ్చాయన్నమాట. గాడ్బర్ చేసే మిఠాయిలు  ఊరంతా ప్రసిధ్ధి. ఎవరూ అసలు ఇంట్లో మిఠాయిలే చేయరు.

“సేడీ! మిఠాయిలు లోపలికి తెచ్చి ఆ బల్ల మీద పెట్టు,” వంటావిడ పురమాయించింది. సేడీ మిఠాయిలు లోపలికి తేవటానికెళ్ళింది. లారా, జోస్, నిజానికి తాము చాలా పెద్దయిపోయాం కాబట్టి మిఠాయిల గురించి పెద్దగా పట్టించుకోకూడదనుకొంటారు కానీ, ఆ మిఠాయిలు చూడగానే నోరూరింది వాళ్ళిద్దరికీ. వంటావిడ వాటిని అందంగా సర్ద సాగింది.

“ఇద్దరూ చెరొక మిఠాయి తీసుకుని తినండి. అమ్మకి చెప్పకపోయినా పర్వాలేదు,” వంటావిడ ఇద్దరికీ మిఠాయిలిచ్చింది.

పొద్దున్నే మిఠాయిలెలా తింటాం, అనుకుంటూనే ఇద్దరూ చెరొకటి తినేసారు.

“పద, అలా వెనకనించి తోటలోకి వెళ్ళి షామియానాలు వేయటం ఎంత వరకొచ్చిందో చూద్దాం!” లేచి నడిచింది లారా. కానీ వెళ్ళటానికి వీల్లేకుండా తలుపు దగ్గర అడ్డు నిలబడ్డారు సేడీ, మిఠాయిల అబ్బాయీ, వంట మనిషీ! ఏదో గంభీరంగా మాట్లాడుకుంటున్నారు.

వంటావిడ “అయ్యో! పాపం!” అంటోంది. సేడీ ఆశ్చర్యం, భయం కలిసిపోయినట్టు చెంపలు నొక్కుకుంటూంది. ఒక్క మిఠాయిల అబ్బాయి మాత్రం సంతృప్తిగా సంఘటన వివరిస్తున్నాడు.

“ఏం జరిగింది?” పిల్లలు అడిగారు.

“పెద్ద ప్రమాదం! ఒకతను చనిపోయాడు కూడా!” వంట మనిషి చెప్పింది.

“చనిపోయాడా? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?”

“బయటికెడితే చిన్న చిన్న ఇళ్ళు, గుడిసెల్లాటివి కనిపిస్తాయి చూడండి, అక్కడండీ అమ్మాయి గారు! మీకా గుడిసెలు తెలుసా?”

ఎందుకు తెలియదు. తెలుసు తనకి, అనుకుంది లారా.

“అక్కడ, స్కాట్ అనే గుర్రబ్బండి వాడుంటాడు. పొద్దున్న అతను ప్రమాదంలో పోయాడు.”

“పోయాడా? అయ్యో!”

“ఆ! అక్కడికక్కడే ప్రాణం పోయినట్టుంది! ఇక్కడికి నేనొస్తుంటే శవాన్ని ఇంటికి తీసికెళ్తున్నారు. పాపం, పెళ్ళాం, పిల్లలూ కూడ వున్నారతనికి.”

“జోస్, ఇలా రా!” అక్కని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది లారా. లోపలి తలుపుకానుకుని నిలబడి,

“జోస్! ఇప్పుడెలా? ఇప్పుడీ విందు ఎలా ఆపుతాం” అంది  ఆందోళనగా.

“విందు ఆపేయాలా? ఎందుకని?” ఆశ్చర్యంగా అడిగింది జోస్.

“అవును! విందు ఆపేయొద్దూ మనం?” జోస్ ఇంకా ఆశ్చర్యపోయింది.

“పిచ్చిదానివా ఏమిటి? మన విందు ఎందుకాపేయాలి? అసలు ఎవరంటారలా?”

“అది కాదు. మన ఇంటి దగ్గర ఇంట్లో ఎవరో పోయి ఏడుస్తూ వుంటే మనం విందు ఎలా చేసుకొంటాం?”

నిజానికి ఆ చిన్న చిన్న యిళ్ళు వీళ్ళ ఇంటికి అంత దగ్గరగా ఏం లేవు. వీళ్ళ వీధి చివరినించి మొదలై అలా సాగిపోతాయి. రెండు కాలనీలకీ మధ్య పెద్ద రోడ్డు కూడా వుంది. అసలా ఇళ్ళు చూస్తేనే మహా చిరాగ్గా వుంటుంది. మట్టి రంగు గోడలతో, చిన్న చిన్న యిళ్ళు! ఇంటి ముందర చిన్న చిన్న తోటల్లో ఎప్పుడు చూడూ కేబేజీ మొక్కలే వుంటాయి. గులాబీలో, అందమైన పచ్చికలో వుండనే వుండవు. ఆ కేబేజీ మొక్కల మధ్య కోళ్ళు! అసలు వాళ్ళ ఇళ్ళల్లోంచి వచ్చే పొగ కూడా నిరుపేదలా అనిపిస్తూంది. షెరిడన్ గారి ఇంటి పొగగొట్టంలోంచి వచ్చే అందమైన వెండి రంగు మబ్బుల్లాటి పొగకీ, ఆ యిళ్ళల్లోంచి వచ్చే మురికి పొగకీ పోలికే లేదసలు.

ఆ కాలనీలో, చాకలి వాళ్ళూ, చెప్పులు కుట్టే వాళ్ళూ, ఇంకా ఎవరెవరో వుంటారు. ఇళ్ళల్లో ఎక్కడ చూసినా పిల్లలు! షెరిడన్ గారి పిల్లలని చిన్నతనంలో అటు వైపు వెళ్ళనిచ్చే వారే కాదు. అయితే, కొంచెం పెద్దయ్యాక లారా, లేరీ అప్పుడప్పుడూ ఆ కాలనీలో కుతూహలంగా నడిచిచ్చే వాళ్ళు. చూడగానే అసహ్యమేసేది. కానీ జీవితం అన్నాక ఎన్నిటినో చూడాలి, ఎన్ని చోట్లకో వెళ్ళాలి మరి. అందుకే ఇద్దరూ వెళ్ళేవాళ్ళు.

“ మన బాండు వాళ్ళు పెద్దగా పాటలు పాడుతుంటే స్కాట్ భార్యకెలా వుంటుందో ఊహించు.”

జోస్ ఆశ్చర్యం కోపంలోకి దిగింది.

“లారా! ఎక్కడో ఎవరికో ప్రమాదం జరిగిన ప్రతీసారీ నువ్వు పాటలూ,ఆటలూ, సరదాలూ మానుకున్నావంటే, ఇక నీకు జీవితంలో మిగిలేదేమీ వుండదు. నాక్కూడా ఆ కుటుంబాన్ని తలచుకుంటే జాలి వేస్తుంది. కానీ దానికి మన ప్రోగ్రాం ఎందుకు మానేయాలో అర్థం కావటం లేదు. మనం పార్టీ మానుకున్నంత మాత్రాన చనిపోయిన ఆ తాగుబోతు బ్రతికొస్తాడా?”

“తాగుబోతా? ఎవరు తాగుబోతు? అతను తాగుబోతని తెలుసా నీకు? ” లారా కోపంగా లేచింది. “అసలు నేను అమ్మతో మాట్లాడతానుండు.”

“వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి అమ్మేమంటుందో చూడు!”

“అమ్మా! నీతో కొంచెం మాట్లాడాలి,” తల్లి గది తలుపు దగ్గర నిలబడి అడిగింది లారా.

“రా లారా? ఏమయింది? మొహం అలా వుందెందుకు?” శ్రీమతి షెరిడన్ అద్దం మూందు కూర్చుని కొత్తగా కొన్న టోపీని పెట్టుకుని చూసుకుంటూ అంది.

“అమ్మా ! బయట ఒకతను చనిపోయాడు.”

“ఎక్కడ? మన తోటలోనా?”

“కాదు! బయట, వీధిలో.”

“హమ్మయ్య! బ్రతికించావు.” నిట్టూర్చి శ్రీమతి షెరిడన్ తల మంచి టోపీని తీసి పట్టుకుంది.

“అదికాదమ్మా! అసలేమయిందంటే,” లారా గబగబా మిఠాయిల అబ్బాయి చెప్పిందంతా వివరించింది.

“నువ్వే చెప్పు, బయట పక్క ఇంట్లో ఎవరో పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటే మనం ఇక్కడ తోటలో పార్టీ ఎలా చేసుకుంటాం? మన పాటలూ, నవ్వులూ విని వాళ్ళు బాధ పడతారేమో. అసలిప్పుడేం చేద్దాం?” లారా గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

అచ్చం జోస్ లాగే తల్లి కూడా ఆశ్చర్యపోయింది. ఇంకా చెప్పాలంటే ఆమెకి నవ్వు కూడా వచ్చింది.

“పిచ్చి తల్లీ! మనం వినడం వల్లే మనకా సంగతి తెలిసింది. వినకపోయి వుంటే? తెలిసేది కాదు, అవునా? అప్పుడు మామూలుగానే పార్టీ అయి వుండేది. మనలని ఎవరు తప్పుపట్టగలిగేవారు? ఇప్పుడూ అంతే. మనం వినలేదనుకుని మామూలుగానే వుందాం. అసలా యిళ్ళల్లో ఎలా బ్రతుకుతున్నారో అన్నది నాకెప్పుడూ అర్థం కాదు, నిజానికి.”

తల్లి మాటలకెలా బదులు చెప్పాలో తెలియలేదు లారాకి. అక్కడే సోఫాలో కూలబడింది.

“అమ్మా! అంత మొరటుగా ఎలా వుండగలుగుతాం?” అంది ఆవేదనగా.

“బంగారూ! ఎంత అమాయకురాలివమ్మా!” తల్లి లేచి వచ్చి కుతురి పక్కనే కూర్చుంది. తన కొత్త టోపీని లారా తల మీద పెట్టిచూసింది.

“అబ్బ, యెంత బాగుంది ఈ టోపీ నీకు! అది నీకే, వుంచేసుకో! నాకంటే నీకే అది అందంగా వుంది. కావాలంటే అద్దంలో చూసుకో,” అద్దం యెత్తి పట్టుకుంది.

“అది కాదమ్మా, ఒక్క సారి…..”

తల్లికీ జోస్ లాగే కోపం వచ్చింది.

“లారా, చిన్న పిల్లలా ప్రవర్తించకు.  అంతంత త్యాగాలేం చెయ్యక్కర్లేదు. అసలు ఎవరో ముక్కూ మొహం తెలియని వాళ్ళకోసం మన ఇంటికి వచ్చే అతిథుల్ని నిరాశ పరుస్తావా? నీ ఒక్క దాని పిచ్చితనం తో అందరి సరదా పాడుచేయొద్దు.”

“నాకేమి అర్థం కావడం లేదు,” బిక్క మొహంతో లారా లేచి తల్లి గదిలోంచి వెళ్ళిపోయింది. తన గదిలోకెళ్ళి కూర్చుంది. ఉన్నట్టుండి అద్దం లో చూసుకుంది. అందమైన నల్లటి హేటూ, దానికి పొడుగాటి వెల్వెట్ రిబ్బనూ, బంగారు రంగు వుంగరాల జుట్టుతో, ఎవరీ అందగత్తె అనుకుంది ఒక్క క్షణం. ఇంకెవరు, తనే!నిజంగా అమ్మ చెప్పినట్టు ఆ టోపీ తనకెంతో బాగుంది.

అమ్మ అన్నట్టు తను అతిగా ఆలోచిస్తుందా? అంతలోనే సంపాదించే భర్తను పోగొట్టుకొని, పిల్లలతో ఒంటరైపోయిన దీనమైన స్త్రీ ముఖం మనసులో మెదలింది. అంతలోకే మళ్ళీ మామూలై పోయింది. ఇహ దాని గురించి పార్టీ అయ్యాకే ఆలోచిస్తాను, అని నిశ్చయించుకుంది లారా.

భోజనాలు ముగిసేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. రెండున్నరకల్లా అంతా తయారయి తోటలోకెళ్ళారు. టెన్నిస్ కోర్టులో ఆకు పచ్చ రంగు యూనిఫారాలలో బేండు మేళం వాయిద్యాలను శృతి చేసుకుంటున్నారు.

“నన్నడిగితే ఆ ఆకు పచ్చ రంగు బట్టల్లో వాళ్ళంతా పెద్ద కప్పల్లాగున్నారు. అసలు వాళ్ళ స్టేజీ స్విమ్మింగ్ పూలులో పెట్టి వుంటే సరిగ్గా వుండేది,” కిట్టీ నవ్వుతూ అన్నాడు.

లేరీ బయట నించొచ్చి తన గదిలోకి వెళ్తున్నాడు, బట్టలు మార్చుకోవడానికి. అన్నని చూడగానే లారా కి చనిపోయిన స్కాట్ గుర్తొచ్చాడు. అతని వెంటే హాల్లోకి నడిచింది.

“లేరీ!”

వెనుదిరిగి చూసాడు లేరీ. చెల్లిని చూసి సన్నగా ఈల వేసి కళ్ళెగరేసాడు. “అబ్బో! యెవరబ్బా ఇంత అందగత్తె, మా ఇంట్లో?” నవ్వాడు. “లారా! నిజంగా ఇవాళ నీకా టోపీ చాలా బాగుంది.”

లారా నవ్వి అక్కణ్ణించి వెళ్ళిపోయింది.

మధ్యాహ్నానికి విందు ఊపందుకొంది. పాటలూ, ఆటలూ, మాటలూ, నవ్వులూ- అంతా సంబరంగా వుంది. షెరిడన్ గారి తోటలో వాలిన రంగు రంగుల పక్షుల్లా వున్నారందరూ. సంతోషంగా, చలాకిగా వుండే మనుష్యుల మధ్య వుండడం ఎంత సంతోషాన్నిస్తుంది! లారా ఆ రోజు పొగడ్తల్లో మునిగిపోయింది.

“లారా! ఇవాళ ఎంత అందంగా వున్నావో తెలుసా?”

“అసలా టోపీ నీకు బాగా నప్పింది.””

“స్పానిష్ అమ్మాయిలా వున్నావు. ఇంత అందంగా నిన్నెప్పుడూ చూడలేదు నేను.”

లారా మొహం ఆనందంతో వెలిగిపోయింది. అయినా అందరినీ మెత్తగా నవ్వుతూ పలకరించింది.

“కొంచెం టీ తాగుతారా?” “మీ జూస్ లో కొంచెం ఐస్ వేయనా?” “ఈ పళ్ళ ముక్కలు ఒక సారి రుచి చూడండి.”

మధ్యలో తండ్రి దగ్గరికి పరిగెత్తింది. “నాన్నా, ఒక్క సారి ఆ బేండు మేళం వాళ్ళేమైనా తింటారేమో, తాగటానికేమైనా కావాలేమో కనుక్కుంటావా?” అంటూ పురమాయించింది. మధ్యాహ్నం గడిచి సాయంత్రం అయేసరికి విరిసిన పూవు ముడుచుకున్నట్టయింది.

“భలే సరదాగా గడిపాం ఇవాళ!” , “చాలా బాగా జరిగింది పార్టీ!” అంటూ అతిథులంతా సెలవు పుచ్చుకున్నారు.

“అమ్మయ్య! అంతా సవ్యంగా జరిగిపోయింది.” నిట్టూర్చింది శ్రీమతి షెరిడన్.

“లారా! పార్టీ బాగా జరిగింది, కానీ  ఒళ్ళు హూనమైపోయింది. ఈ పిల్లలేమో పార్టీలు కావాలని ప్రాణాలు తోడుతారు. పద కొంచెం కాఫీ తాగుదాం లోపలికెళ్ళి. నువ్వెళ్ళి మిగతా అందరికీ వీడ్కోలు చెప్పి లోపలికి రా.”

అందరూ ఖాళీ అయిపోయిన షామియానా కింద కూలబడ్డారు అలసటగా.

“నాన్నా, ఒక్క సాండ్ విచ్ తింటావా? లేబుళ్ళ మీద ఈ పేర్లన్నీ నేనే రాసాను తెలుసా?”

“అబ్బో! అయితే ఇలా తే!” తండ్రి సాండ్ విచ్ అందుకొని కొరికాడు. “అన్నట్టు, ఇవాళ బయట ఒక పెద్ద ప్రమాదం జరిగింది తెలుసా?”

శ్రీమతి షెరిడన్ వెంటనే అందుకుంది. “ఆ ప్రమాదం గురంచి మాట్లాడకండి! ఇవాళ దాని వల్ల మన పార్టీ దాదాపు మానేసినంత పనయ్యింది. బయటెవరో మరణిస్తే మనం పార్టీ ఎలా చేసుకుంటామని లారా ఒకటే గోల,” నవ్వుతూ అంది.

“అబ్బ, ఏదో అన్నాను, వదిలెయ్యమ్మా!” సిగ్గుపడింది లారా.

“నిజంగానే చాలా బాధాకరమైన విషయం. పాపం అతనికి భార్యా పిల్లలూ కూడా వున్నారట.” షెరిడన్ గారు సాండ్ విచ్ కొరుకుతూ అన్నారు. ఉన్నట్టుండి అందరూ మౌనంగా వుండిపోయారు.

ఈయనకి ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు, చిరాకు పడ్డారు శ్రీమతి షెరిడన్. వున్నట్టుండి ఆవిడకొక ఆలోచన వొచ్చింది.

“ఒక పనిచేద్దాం. చాలా వంట మిగిలిపోయింది. ఒక బుట్టలో పెట్టి మిగిలిన తినుబండారాలన్నీ వాళ్ళకి ఇద్దాం. పిల్లలు నాలుగురోజులు తింటారు.ఇప్పుడు వాళ్ళింట్లో వచ్చీ పోయే జనం కూడా వుంటారు. అందరూ తినడానికి పనికొస్తుంది. లారా! వెళ్ళి ఆ పెద్ద బుట్ట పట్టుకురా!”

“అమ్మా! నిజంగా అదంత మంచి పని అంటావా?”

లారాకి మళ్ళీ విచిత్రంగా అనిపించింది. తను ఒక్కర్తీ వేరేగా ఎందుకాలోచిస్తుంది? ఇంట్లో విందులో మిగిలిపోయిన తిండి ఇస్తే, అసలే బాధల్లో వున్నవాళ్ళు ఏమనుకుంటారు?

“ఎందుకు బాగుండదు? ఎంత వింతగా మాట్లాడతావు లారా నువ్వు! ఇందాకేగా వాళ్ళ మీద జాలితో కరిగిపోయావు? అంతలోకే ఏమొచ్చింది?” తల్లి విసుగ్గా అంది.

లారా పరిగెత్తుకుని వెళ్ళి బుట్టతో సహా తిరిగొచ్చింది. తల్లి బుట్టంతా రకరకాల తినుబండారాలతో నింపింది.

“నువ్వే తీసుకెళ్ళు లారా! వెళ్ళేటప్పుడు ఆ లిల్లీ పూలు కూడా తీసుకెళ్ళు. పాపం, పేదవాళ్ళకి లిల్లీ పూలు బాగా నచ్చుతాయి.”

“వద్దు, ఆ పూల కాడలు నీ గౌనంతా పాడు చేస్తాయి,” జోస్ హెచ్చరించింది.

“అదీ నిజమేలే. పూలేమీ వొద్దు. వుత్తి బుట్ట మాత్రం తీసుకెళ్ళు లారా. అన్నట్టు లారా, అక్కడ-” ఆగిపోయింది అమ్మ.

“ఏమిటమ్మా?”

తటపటాయించింది  తల్లి. “ఏమీ లేదులే, వెళ్ళు. తొందరగా వొచ్చేయి.”

తోట దాటి లారా బయటికొచ్చేసరికి చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. కొంచెం కిందికి, వీధి చివరగా వున్నాయి ఆ చిన్న ఇళ్ళు. మధ్యాహ్నం విందు హడావిడి తర్వాత అంతా నిశ్శబ్దంగా వున్నట్టనిపించింది లారాకి. వున్నట్టుండి తను ఎక్కడికి వెళ్తోందో గుర్తొచ్చిందామెకి. నిజానికి విందులో మాటలూ, హాస్యాలూ, గిన్నెలూ, పళ్ళేల చప్పుళ్ళూ, నవ్వులూ, పచ్చిక వాసనా,అన్నీ కలిపి ఆమె మనసులో ఇంక వేటికీ చోటూ లేకుండ చేసాయి. ఎంత విచిత్రం. ఆకాశం వంక చుసింది. “బలే బాగా జరిగింది పార్టీ!” అనుకుని మళ్ళీ ముందుకెళ్ళింది.

విశాలమైన రోడ్డు కొంచెం ఇరుకైంది. వాళ్ళ పెద్ద వీధి అంతమై ఒక చిన్న సందు మొదలైంది. ఆడవాళ్ళు షాల్ కప్పుకునీ, మగవాళ్ళు టోపీలు పెట్టుకునీ నడుచుకుంటూ పోతున్నారు. ఆ ఇళ్ళనించి చప్పుళ్ళూ వినొస్తున్నాయి. అక్కడక్కడా సన్నని వెల్తురు. లారాకి ఆ వీధిలో తన ఖరీదైన గౌను చూసుకొని కొంచెం సిగ్గనిపించింది. ఈ గౌను కనిపించకుండా  పైన ఒక కోటైనా తొడుక్కుని రావాల్సింది, అనుకుంది. దానికి తోడు పెద్ద సిల్కు రిబ్బను తో వున్న అందమైన తన టోపీ. అందరూ తననే వింతగా చూస్తున్నారేమో. అసలు ఇలా రావడమే తప్పేమో. పోనీ తిరిగి ఇంటికెళితే?

అంతలో ఆ ఇల్లు వచ్చేసింది. ఇక ఇప్పుడు వెనుదిరిగినా బాగుండదు. ఇదే ఇల్లు అయివుండాలి. బయట చిన్న గుంపు వుంది. లోపల చీకటిగా వుంది. గేటు పక్కనే ఒక ముసలావిడ కుర్చీలో కూర్చొనుంది. లారా దగ్గరకొచ్చేసరికి అందరూ మాటలాపేసారు. గుంపు కొంచెం పక్కకి జరిగి ఆమెకి చోటిచ్చారు.

లారాకి చాలా కంగారుగా వుంది. సిల్కు రిబ్బను ని పక్క జరుపుకుంటూ, పక్కనే వున్న ఆడమనిషితో, “స్కాట్ గారిల్లు ఇదేనా?” అని అడిగింది. ఆ మనిషి వింతగా నవ్వుతూ, “ఇదేనమ్మాయ్!” అంది.

త్వరగా ఈ బుట్ట ఇచ్చేసి ఇక్కణ్ణించి వెళ్ళిపోవాలి. భయంభయంగా దేవుణ్ణి తలచుకుంటూ లారా తలుపు దగ్గరికెళ్ళి తలుపు తట్టింది. తలుపు తెరుచుకుంది. నల్ల బట్టలతో దిగాలుగా వున్న స్త్రీ తొంగి చూసింది.

లారా తడబాటుతో అడిగింది, “స్కాట్ గారి భార్య మీరేనా?”

“లోపలికి రా అమ్మాయ్!” ఆవిడ వెనుదిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

“లేదు, లేదు. నేను లోపలికి రాను. అమ్మ ఈ బుట్ట ఆవిడకివ్వమంది.”

ఆవిడ విననట్టే లోపలికి వెళ్ళి, ఇంకో తలుపు దగ్గర ఆగి, “ఇలా లోపలికి రా అమ్మాయ్,” అంది. చేసేదేమీ లేక లారా లోపలికి అడుగుపెట్టింది. లోపల తనొచ్చిన గది వంటిల్లులా వుంది. చిన్న దీపం పొగచూరి వెలుగుతూంది. పక్కనే ఇంకొకావిడ కూర్చునుంది.

“ఎమిలీ! నీకొరకెవరో ఒక అమ్మాయి వచ్చింది,” చెప్పింది తలుపు తెరిచిన ఆవిడ. లారా వైపు తిరిగింది, “ఎమిలీ చెల్లెల్నండీ నేను! తను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేకపోతుంది. మీరేమీ అనుకోవద్దండీ!”

“అయ్యొయ్యో! ఆవిడని చిరాకు పెట్టకండి. నేను వెళ్తున్నాను.” లారా కంగారుగా అంది.

ఇంతలో కూర్చున్నావిడ తిరిగి లారా వైపు అయోమయంగా చూసింది. ఆమె మొహమూ, కళ్ళు ఎర్రబడి, వాచి, చాలా అసహ్యంగా వుంది. ఆమెకేమీ అర్థమవుతున్నట్టు లెదు. లారా ఎవరు? తమ ఇంటికెందుకొచ్చింది? ఆమె కేమీ బోధపడుతున్నట్టులేదు.

“పోనీలే ఎమిలీ! నువ్వేమ మాట్లాడకు. నేను చూసుకుంటాను,” ఎమిలీ చెల్లెలంది. ఆమె మొహం కూడా ఏడ్చి ఏడ్చి ఉబ్బి వుంది.

“ఆమెని క్షమించమ్మా దయ చేసి,” ఇబ్బందిగా నవ్వుతూ లారాతో అంది. లారాకి అక్కణ్ణించి బయట పడటం తప్ప వేరే ఇంకే ఆలోచనలూ లేవు. మళ్ళీ తలుపు కేసి నడిచింది. ఇంకొక తెరిచి వున్న తలుపులోంచి వెళ్ళింది. అయితే ఆ తలుపు బయటికెళ్ళలేదు, కానీ ఇంకో గదిలోకి దారితీసింది. ఆమెకి ఆ గదిలోనే మృతుడి శవం వుందన్న సంగతి తెలిసేసరికే ఆలస్యమయింది.

“ఒక్క సారి శవాన్ని చూస్తావా అమ్మాయ్?” ఎమిలి చెల్లెలడిగింది. లారా భయంతో కొయ్యబారిపోయింది. “భయపడేందుకేమీ లేదమ్మాయ్, అలా పడుకుని నిద్ర పోతున్నట్టున్నాడు. రా చూద్దువు గాని.” లారా తొంగిచూసింది.

పేటికలో పడుకుని వున్నాడొక యువకుడు. హాయిగా కష్టాలనించి, సమస్యలనించీ, దూరంగా, శాంతిగా, కలలు కంటున్నట్టు- కళ్ళు మూసుకుని వున్నాడు. కాని ఆ కళ్ళు మరిక తెరుచుకోవు. ఇంకే కలలూ కనవు. విందులూ, మిగిలిపోయిన తినుబండారాలూ, అందమైన గౌనులూ, ఖరీదైన టోపీలూ వేటితోనూ అతనికి పనిలేదు. అన్నిటినుంచీ దూరంగా వెళ్ళిపోయాడు. తామంతా తోటలో పాటలు పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతున్నప్పుడూ, అతను ఇలాగే వున్నాడు, శాంతిగా, సంతోషంగా. లారాకి ఏమనాలో అర్థం కాలేదు. “నా టోపీ చాలా అసహ్యంగా వుంది, నన్ను క్షమించండి,” అంది అసందర్భంగా. అంతే, అక్కణ్ణించి ఒక్క పరుగున ఇంటి బయటికొచ్చి పడింది. గుంపుని దాటుకుని గబగబా సందులోంచి నడిచింది. సందు చివర లేరీ ఎదురయ్యాడు.

“లారా? నువ్వేనా?”

“నేనే, లేరీ!”

“అమ్మయ్య! నీకోసం కంగారు పడి అమ్మ నన్ను పంపింది. ఏమయింది లారా? భయపడ్డావా?”

“అవును లేరీ!” అన్న చేయి గట్టిగా పట్టుకుంది లారా.

“ఏడుస్తున్నావా? ఏమయింది లారా?”

ఏమీ లేదన్నట్టు తల తిప్పింది లారా.

“ఏడవకు లారా? ఏమయింది? భయపడ్డావా?” అనునయంగా అడిగాడు అన్న.

“భయపడలేదు కానీ,” వెక్కుతూంది లారా.

“లేరీ, అసలు జీవితం……..” ఏమనాలో తోచలేదు. జీవితమంటే ఏమిటో ఆమె చెప్పలేకపోయింది. అన్నకి అర్థమైంది.

“అవును, కదా?” అన్నాడు.

  —–

పుకారు

Sharada1

(చెహోవ్ కథ “A Slander” కి అనువాదం – శారద)

 

అహినీవ్ గారు, అదే, స్కూల్లో మాస్టారు గారు, తన కూతురి వివాహం జరిపిస్తున్నారు. వరుడు హిస్టరీ జాగ్రఫీలు బోధించే మాస్టారు. పెళ్ళి సంబరాలతో ఇల్లంతా గగ్గోలుగా వుంది. హాల్లో పాటలు, ఆటలు, వాయిద్యాలూ అబ్బో, చెప్పలేని హాడావిడి. మధ్యలో పానీయాలూ, తినుబండారాలూ సరఫరా చేస్తూ తెల్లని టై లు కట్టుకున్న బట్లర్లు. ఎడతెగని కబుర్ల జోరు. పక్క పక్కనే కూర్చుని లెక్కల మాస్టారూ, ఫ్రెంచి మాస్టారూ, టాక్సు అధికారీ ఒకరికొకరు అడ్డం వస్తూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో సజీవ సమాధుల దగ్గర్నించీ, ఆధ్యాత్మిక విషయాలవరకూ అన్ని సంగతులూ దొర్లి పొతున్నాయి.

ఆ మాట కొస్తే, వాళ్ళెవరికీ ఆధ్యాత్మికత మీద పెద్ద నమ్మకం లేదు కానీ, మనిషి మేధస్సుకి అందని విషయాలూ వుండి వుండవచ్చని తప్పక ఒప్పుకుంటారు. పక్క గదిలో సాహిత్యాన్ని బోధించే మాస్టారు ఒక సెంట్రీ తన తుపాకీ తో చుట్టూ వున్నవాళ్ళని కాల్చి పారేయడంలో తప్పేమీ లేదని గట్టిగా వాదిస్తున్నారు. వినేవాళ్ళకి కొంచెం భయం వేసినా, ఆయన్ వాగ్ధాటికి తాళలేక ఒప్పేసుకుంటున్నారు. లోపలికి రాలేక బయటే నిలబడ్డవాళ్ళు కుతూహలంగా లోపలికి చూస్తున్నారు. గంట మధ్య రాత్రి పన్నెండు కొట్టేసరికి అహినీవ్ గారికి ఇంట్లో విందుకి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయోనన్న అనుమానం వచ్చింది. వంటింట్లోకి దారి తీసారు.

వంటిల్లంతా సామాన్లతోనూ, తినుబండారాల వాసనలతోనూ నిండి పోయి వుంది. రెండూ పెద్ద బల్లలమీద రకరకాల పానీయాలూ, వంటకాలూ అందంగా పేర్చబడ్డాయి. వంటమనిషి మార్ఫా, ఎర్రబడిన మొహంతో, పీపాలాటి శరీరంతో హడావిడిగా బల్లల మధ్య తిరుగుతోంది. అహినీవ్ ఉత్సాహంగా, “మార్ఫా! మనం తెచ్చిన చేపని వండావా? ఏదీ చూపించు. వంటింటి వాసనలు భలే నోరూరిస్తున్నాయి,” అన్నాడు. మార్ఫా పక్కనే ఇంకో బల్ల దగ్గరకెళ్ళి పరచి వున్న పేపరు మూతని జరిపింది. మూత కింద ఒక పెద్ద డేగిశా నిండుకూ పెద్ద చేప వండి వుంది. రకరకాలైన మసాల దినుసులతోనూ, జెల్లీలతోనూ, ఆలివ్ పళ్ళూ, కేరట్ ముక్కల తోనూ అలంకరించి వుందా వంటకం. దాన్ని చూడగానే సంతోషంతో అహినీవ్ కళ్ళు పెద్దవైనాయి. గిన్నె మీదికి వంగి వంటకాన్నించి వచ్చే సువాసనని బలంగా ఆఘ్రాణించి, పెదాలని గట్టిగా చప్పరించాడు. “ఆ… ఎవరు లోపల ముద్దులు పెట్టుకుంటున్నారు? లోపల నువ్వేనా మార్ఫా?” తలుపు దగ్గర గొంతు వినిపించి తిరిగి చూసాడు. స్కూల్లో చిన్నా చితకా పనులు చేసే వాంకిన్ తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తున్నాడు.

“ఎవరంటూంటే? అహినీవ్, మీరా? ఈ వయసులో ఇదేం బుధ్ధి తాతగారూ? ఆ?” “ముద్దా? నేను ఎవరినీ ముద్దు పెట్టుకోలేదు,” అహినీవ్ కంగారు పడ్డాడు. “నేను ముద్దు పెట్టుకోవటం ఏంట్రా బుధ్ధిలేని గాడిదా? చేప కూర వాసనకి నోరూరి పెదాలు చప్పరించానంతే.” “చాల్చాల్లే, ఇంకెక్కడైనా చెప్పు ఇలాటి కథలు, నాక్కాదు.” నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు వాంకిన్. అహినీవ్ మొహం ఎర్ర బడింది.. “ఇదెక్కడి గొడవరా బాబూ! ఈ సన్నాసి ఇప్పుడు ఊళ్ళో అందరికీ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్తాడేమో ఖర్మ! ఎంత పని జరిగిందిరా దేవుడా!” మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ అహినీవ్ ముందు హాల్లో కొచ్చాడు. వాంకిన్ కోసం చుట్టూ పరికించి చూసాడు. హాల్లోనే పియానో పక్కన నిలబడి వున్నాడు వాంకిన్. పియానో పైనించి వంగి, అక్కడకూర్చున్న ఇన్స్పెక్టరు గారి మరదలితో కొంటెగా నవ్వుతూ ఏదో చెప్తున్నాడు. “నాకు తెలుసు, నాగురించే చెప్తున్నాడు. దరిద్రుడు!ఆ పిల్ల నమ్మేస్తోంది.బాబోయ్, నవ్వుతున్నారిద్దరూ! ఇప్పుడేం చేయాలి? ఏదై నా చేసి ఆ వెధవని ఆపాలి. ఇంకా పుకార్లు పుట్టిస్తాడు లేకపోతే.! వీల్లేదు. నేనూ అందరితో వాడి మాటలు అబధ్ధాలని చెప్పేస్తాను.” అహినీవ్ తల గోక్కున్నాడు.

సిగ్గుతో మొహం ఎర్రబడుతూండగా ఫ్రెంచి మాస్టారు దగ్గరకెళ్ళాడు. “ఇప్పుడే వంటింట్లో కెళ్ళి వస్తున్నా. వంటెలా సాగుతూందో చూద్దామని. లోపల చేపల కూర అయిపోయింది. ఎంత పెద్ద చేపనుకున్నావు? సుమారు గజం న్నర పొడుగుంటుంది. హ! హ! హ! అన్నట్టు ఒక విచిత్రం చెప్పాలి. ఇందాక వంటింట్లో, అదే, పెద్ద చేపని చూడటానికి వెళ్ళినప్పుడోయ్! ఆ చేప కూరను చూసి నోట్లో నీరూరిందనుకో! ఆహా, అని పెదవి చప్పరించాను. ఆ క్షణమే ఈ వాంకిన్ లోపలికొచ్చాడు. వొచ్చి నన్నంటాడూ, హ, హ, హ, ఏం చెప్పేది! నన్నంటాడూ, “మార్ఫాని ముద్దు పెట్టుకున్నావా?” అని! నేను! మార్ఫాని! ముద్దు! బుధ్ధి లేని పక్షి కాకపోతే, ఏమిటా మాటలు? అదీ మార్ఫాని! వంట మనిషిని! దాన్ని ముద్దు పెట్టుకుంటే జంతువుని ముద్దు పెట్టుకున్నట్టే కాదూ? ముద్దట ముద్దు! తెలివి తక్కువ వెధవ!”

“ఎవరినీ తెలివి తక్కువ వెధవ అంటున్నారూ?” లెక్కల మాస్టారు దగ్గరకొచ్చాడు. “ఇంకెవడండీ? అదిగో అక్కడే నిలబడి వున్నాడు  చూడండీ, ఇకిలిస్తూ, వాంకిన్! ఇందాక వంటింట్లో…” మళ్ళీ కథంతా చెప్పాడు. “నేను మార్ఫాని ముద్దు పెట్టుకోవటమేమిటండీ? వాడి తెలివి తక్కువ మాటలకి నాకైతే నవ్వాగటం లేదు. అసలు నన్నడిగితే..” ఆయన వెనుదిరిగేసరికి టాక్స్ ఇన్స్పెక్టరు నిలబడి వున్నాడు. “అబ్బే ఏం లేదు! వాంకిన్ గురించే మాట్లాడుకుంటూన్నాం. భలే విచిత్రమైన వాడు లెండి! ఇందాకేమయిందనుకున్నారు వంటింట్లో? నేను మార్ఫా పక్కన నిలబడి వున్నా. బాగా తాగినట్టున్నాడు, లోపలికొచ్చి, “మార్ఫాని ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావ్?” అని అడిగాడు. నేను! మార్ఫాని! ముద్దు! ఒరి దరిద్రుడా! మార్ఫాని నేనెందుకు ముద్దు పెట్టుకుంటానురా? నాకు ఇంట్లో పెళ్ళాం లేదా?” అని కడిగేసాను కాని నాకు భలే నవ్వొచ్చింది…”

“ఎవరబ్బా అంత నవ్వించింది?” అక్కడికి అప్పుడే వచ్చిన ఇంకొక మాస్టారు అడిగారు. “ఇంకెవరు? మన వాంకిన్! ఇందాక వంటింట్లో….” ఒక్క అర గంటసేపట్లో ఆ వార్త దాదాపు వచ్చిన బంధువులందరికీ తెలిసిపోయింది. అహినీవ్ సంబరపడ్డాడు. “ఇప్పుడు చెప్పుకోరా, ఎవరితో చెప్పుకుంటావో! అసలు నిన్ను ఎవరైనా నమ్ముతారేమో చూస్కో! నువ్వు కథ మొదలు పెట్టగానే, అందరూ, “నోర్ముయ్యవోయ్! అసలేం జరిగిందో మాకంతా తెలుసు” అని నీ నోరు మూయించకపోతే నన్నడుగు!” అనుకున్నాడు గర్వంగా. అతని సంతోషానికి మేర లేకపోయింది. ఆ సంతోషంలో అనుకున్నదానికంటే నాలుగు గ్లాసులు ఎక్కువే తాగేడు. పెళ్ళి విందు ముగిసింతర్వాత ఎక్కడి వాళ్ళనక్కడికి పంపించి అలిసి పోయి నిద్ర పోయాడు అహినీవ్. మర్నాటినించీ ఆ సంగతే మర్చిపోయాడు.

అయితే అంతా మనం అనుకున్నట్టే జరగదు కదా! సరిగ్గా వారం గడిచేసరికి, అహినీవ్ స్కూల్లో టీచర్ల రూములో వుండగా హెడ్ మాస్టారు పక్కకి పిలిచారు. “చూడు అహినీవ్! ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించు. ఇది నాకవసరం లేని విషయం నిజం చెప్పాలంటే. కానీ, ఒక స్నేహితునిగా నిన్ను హెచ్చరించడం నా బాధ్యత. నువ్వు వంట మనిషి వలలో పడిపోయావని ఊరంతా చెప్పుకుంటున్నారు. నువ్వు ఆమెను ప్రేమిస్తావో, ముద్దులే పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ, కనీసం అందరూ చూస్తూండగా వద్దు. నువ్వు స్కూల్ మాస్టారువన్న విషయం మరిచిపోకూడదు!” అహినీవ్ కి స్పృహ తప్పినంత పనైంది. మరుగుతున్న నీళ్ళు మొహం మీద పడ్డ మనిషిలా ఇంట్లోకి అడుగుపెట్టాడు. అసలు నడుస్తూంటే వీధుల్లో అందరూ తననే గుచ్చి గుచ్చి చూస్తున్నట్టనిపించింది అతనికి. “ఇవాళెందుకో తిండే తినడంలేదు. మీ ధ్యాసంతా ఎక్కడుందో మరి?” భార్య మాటలతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు అహినీవ్. “అంత ఆలోచన దేని గురించో? మీ ప్రియురాలు మార్ఫా గురించే గా? సిగ్గుండాలి! ఇంకా నయం, పాపం నా స్నేహితులు నా కళ్ళు తెరిపించేరు. లేకపోతే ఇంకా ఎన్నాళ్ళు సాగేదో ఈ వ్యవహారం!” భోజనం మీది నించి లేచి అహినీవ్ కలలోని మనిషిలా నడుస్తూ వాంకిన్ ఇల్లు చేరుకున్నాడు.

వాంకిన్ ఇంట్లోనే వున్నాడు. “నీచుడా! నీకు నేనేం ద్రోహం చేసానురా? ఊరందరి ముందరా నన్ను అవమానాల పాలు చేస్తావా? ఎందుకిలా నా గురించి పుకారు లేపావు?”వాంకిన్ ని పట్టుకుని దులిపాడు అహినీవ్. వాంకిన్ తెల్లబోయాడు. “పుకారా? ఏం పుకారు? అసలునువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు.” “నా గురించీ మార్ఫా గురించీ పుకార్లు లేపుతున్నదెవరు? నువ్వు కాదా?” కోపంగా అరిచాడు అహినీవ్. వాంకిన్ గుడ్లు మిటకరించి నోరు తెరిచాడు ఆశ్చర్యంగా! మెళ్ళో శిలువని చేతితో పట్టుకుని, గంభీరంగా, “భగవంతుని తోడు! నేనారోజు గురించి ఒక్క మాట కూడా ఎవరితోనూ అనలేదు. ఈ మాట అబధ్ధమైతే నేను కలరా సోకి చస్తాను,” అన్నాడు. అహినీవ్ కి అతను నిజమే చెప్తున్నాడనిపించింది. “నువ్వు కాకపోతే ఇంకెవరు?” అహినీవ్ ఆ రోజు జరిగిందంతా ఙ్ఞాపకం తెచ్చుకున్నాడు. “ఎవరై వుంటారబ్బా!” ఎంత ఆలోచించినా అర్థం కాలేదతనికి. —————————————–