తెలుగులో కన్నడ కథల పరిమళాలు

matateeru

కన్నడనాట ఉత్తమ రచయితల్లో ఒకరైన శ్రీ పూర్ణచంద్ర తేజస్వి రచించిన కథలకు తెలుగు అనువాదం “మాటతీరు”. తెలుగు సేత  శాఖమూరు రామగోపాల్.

ఈ అనువాద కథాసంకలనంలో ఎనిమిది పూర్ణచంద్ర తేజస్వి గారి కథలు మాత్రమే కాకుండా, వర్తమాన కన్నడ సాహిత్యంలో విశేష కృషి సలుపుతున్న శ్రీ ఎస్. తమ్మాజీరావ్ నంగ్లీ గారి కథలు రెండు, బి. ఎల్. వేణుగోపాల్ గారి కథలు రెండు, కె. సత్యనారాయణ గారి ఒక కథ ఉన్నాయి. అదనంగా, అనువాదకులు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో తన పర్యటన వివరాలను ఆసక్తికరంగా అందించారు. పూర్ణచంద్ర తేజస్వి గారి కథల్లో ఎక్కువగా గ్రామీణ భారతం నిండి ఉంటుంది. ప్రకృతి వర్ణన కళ్ళకి కట్టినట్లుగా ఉంటుంది. ఆయా వర్ణనలను తెలుగులో కూడా సమర్థవంతంగా వ్యక్తీకరించారు శాఖమూరు రామగోపాల్ గారు. ఈ పుస్తకంలోని కథలను పరిచయం చేసుకుందాం.

సహ్యాద్రి పర్వత శిఖరాల మీద గంభీరమైన చీకటి అదేదే గొంగడ్ని కప్పుకొన్నట్లు ముసుగేసి కప్పుకుని ఉంది.

బాల్యం అంటే కుతూహలం, బాల్యం అంటే భయం, బాల్యం అంటే ప్రశ్నలు, బాల్యం అంటే భరోసా! చదువుకుంటున్న పదేళ్ళ శివ తన తండ్రి మంజప్ప గౌడ పిలవడంతో చదువాపి వరండాలోకి వస్తాడు. బయట వాన కుండపోతగా కురుస్తూంటుంది. కొత్తనీరులోని రుచి కోసం పంటకాలువలో ఎదురీది వచ్చే బురదమట్టల్ని, కొర్రమీనల్ని పట్టుకోడానికి మంజప్ప గౌడ, పనివాడు లింగడితో కలిసి ఆ రాత్రి వేళ బయల్దేరుతూంటాడు. జాగ్రత్తగా తలుపు వేసుకోమని చెప్పి, వాళ్ళిద్దరూ బయల్దేరుతారు. శివ సగం తలుపు తీసి ఉంచి, బయటి వానని; తండ్రి, లింగడు ముందుకు సాగడాన్ని చూస్తూంటాడు. జోరుగాలికి తలుపులు కొట్టుకోవడంతో లోపలిగదిలో ఉయ్యాలలో నిద్రపోతున్న శివ తమ్ముడు సదానంద ఏడుపు మొదలుపెడతాడు. వాడిని ఊరడించమని తల్లి లోపలినుంచి కేక పెడుతుంది. వాన ఆగదు. ఆ రాత్రి గడిచిపోతుంది. మళ్ళీ చీకటి పడుతుంది.

తండ్రీ, లింగడూ రారు. శివ చెల్లెలు ఓ వసపిట్ట. ఆమెకి ఎన్నో సందేహాలు… వాటన్నింటిని శివ ముందుంచుతుంది. శివ వాటికి జవాబులు చెప్పలేడు. చివరికి అలా ప్రశ్నలు వేయకూడదంటూ…. తనకు లింగడు చెప్పిన కథ చెబుతాడు. ఆ కథ విని చెల్లి బాగా భయపడిపోతుంది. తాను లింగడి నుంచి కథ విన్నప్పుడు భయపడినదానికంటే, చెల్లి ఎక్కువగా జడుసుకున్నందుకు శివకి కాస్త ఆనందం కలుగుతుంది. వాన కురుస్తునే ఉంటుంది. ఊగుతున్న గుడ్డి దీపం వెలుగులో తమ్ముడి ఉయ్యాల నీడ గోడమీద పడి నాట్యం చేస్తుంది. మెల్లగా శివకి తన కథపై తనకే భయం కలుగుతుంది. బెదిరిపోతాడు. ఇంతలో తలుపు చప్పుడై, తండ్రి, లింగడు లోపలికి రావడంతో కథ ముగుస్తుంది. బాల్యంలోని అమాయకత్వాన్ని, కథలలోని కల్పనలని తెలుసుకోలేని ఉద్విగ్నతనీ అద్భుతంగా చిత్రిస్తుంది “లింగడొచ్చిండు” కథ.

తన కాళ్ళ అడుగుభాగాన జరుగుతున్న ఈ దుర్బల మానవుల నడవడిక మరియు తన తల మీద నడుస్తున్న మేఘమాలికల సయ్యాట…. ఈ సర్వవ్యాపారానికీ సాక్షిభూతంగా ఆ పర్వత శిఖరం గాంభీర్యంగా నిల్చి ఉంది!

లక్కడు, సోముడు అనే ఇద్దరు నిష్ప్రయోజకులూ, స్వార్థపరుల కథ “ఉరుము చెప్పిందేంటి?”. పని చేయడాన్ని ప్రాణసంకటంగా భావించే వీరిద్దరూ తమ ముసలి అవ్వని రోడ్డు మీద వచ్చే వాహనానికి అడ్డంగా పడేసి, ఆమె మరణించాక, రాబట్టుకునే నష్టపరిహారంతో మజా చేసుకోవాలనుకుంటారు. వేరే ఊర్లో పని వెతుక్కోడానికి వెడుతున్నట్లుగా ప్రయాణమై, అనుకున్నట్లుగానే దారిలో ముసలామెను ఓ వాహనానికి అడ్డంగా తోసేస్తారు, ఆమె మరణిస్తుంది. ఆ కారు యజమాని దగ్గర వందరూపాయలు (కథాకాలం 1957 వ సంవత్సరం, ఆ కాలంలో వంద రూపాయాలు చాలా పెద్ద మొత్తం) తీసుకోబోతుంటే ఓ తమాషా జరుగుతుంది. ఆ వాహనం యజమాని వంద రూపాయలు ఇవ్వకుండానే చిన్నగా మందహాసం చేస్తాడు. మనిషిలోని కుత్సిత స్వభావానికి అద్దం పడుతుందీ కథ.

హులియూరు అనే ఊరిలో నివసించే రంగప్ప గౌడకీ, అతని కొడుకు సోమూకి ఒక్క క్షణం కూడా పడదు. తండ్రి ప్రతీ దాంట్లోను కొడుకును నియంత్రించాలనుకుంటాడు, కొడుకేమో స్వతంత్రంగా ఉండాలని తండ్రి అదుపాజ్ఞలకి దూరంగా పోవాలని ప్రయత్నిస్తూంటాడు. సీత అనే అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని రంగప్ప గౌడ పంతం. ఆ సంబంధం కాకుండా తను ప్రేమించిన నళినాక్షిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. వీరి ప్రాంతంలో గద్దలెక్కువ. కోడిపిల్లలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు చటుక్కున క్రిందకి దిగి నోట కరుచుకుపోతుంటాయి. రంగప్ప గౌడ గద్దల్ని చంపాలనంటాడు. సోమూ దానికి నిరాకరిస్తాడు. కారణం, మల్లినమడుగు గ్రామంలోని పూజారి చేసిన బోధ. గద్దలు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి ప్రతిరూపమని, దానిని చంపిన వారు తిన్నగా నరకానికి పోతారని పూజారి చెబుతాడు. ఆ మాటలను బలంగా విశ్వసిస్తాడు సోమూ. ఒక గద్ద వీళ్ళింట్లో కోడి పిల్లలని ఎత్తుకుపోడానికి దిగుతుంది, వీళ్ళ పెంపుడుకుక్క ఆ గద్ద నోట కరుచుకుంటుంది, కుక్క నుంచి గద్దని కాపాడేందుకు సోమూ ప్రయత్నిస్తే, అది భీతిల్లి తన వాడైన గోళ్ళతో సోమూ చేతులను గీరి అతని ముంజేతిని పట్టుకొంటుంది. పైకి ఎగరలేక, గోళ్ళను సోమూ ముంజేతిలోకి బలంగా తెంచుతూంటూంది. పని వాడి అరుపులకి తండ్రి బయటకి వస్తే గద్దని తప్పించేందుకు, ఒక కత్తి తెమ్మని అరుస్తాడు సోమూ. కత్తి తేవడం ఆలస్యం అయితే, చివరికి దాని మెడ కొరికి చంపుతాడు సోమూ. “నువ్వూ నరకానికి పోతావా?” అని పనివాడు అడిగితే, “స్వర్గం నరకం అనేవి లేని లేవు, అంతా పూజారుల ఒత్తి మాటలు” అంటూ కసితీరా ఉమ్ముతాడు. ఇదొక ప్రతీకాత్మక కథ.

సోమూ సుభద్రని ప్రేమిస్తూంటాడు లేదా ప్రేమిస్తున్నానని అనుకుంటూంటాడు. ఓ మైదానంలో కూర్చుని పల్లీలు తింటూంటాడు. అతని పక్కనే ఓ నల్లకుక్క నిల్చుని పల్లీల కేసి ఆశగా చూస్తూంటుంది. ఒక్కో పల్లీగింజ నోట్లో వేసుకుంటూ, నెల రోజుల క్రితం జరిగిన సంఘటనని గుర్తుచేసుకుంటాడు సోము. ఆ రోజు – చీకటి పడుతోంది, వెళ్ళాలంటూ సుభద్ర తొందరపెడుతుంది. ఇంకాసేపు ఉండమంటాడు. ఆమె వినకుండా ఏదో చీటీ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆమె మీది కోపంతో అందులో ఏం రాసుందో కూడా చదవడు. ఆ కాగితాన్ని జేబులో కుక్కేసుకుంటాడు. – ఈ నెల రోజులలో ఆమె మళ్ళీ కనబడదు. సగం నమిలిన పల్లీగింజ గొంతుకు అడ్డం పడడంతో వర్తమానంలోకి వస్తాడు. దాన్ని బయటకు రప్పించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూండగా, పక్కనే ఉన్న ఆ నల్లకుక్క చటుక్కున అతని కాలు కొరికి పారిపోతుంది. అది పిచ్చికుక్కేమో ననే సందేహం కలుగుతుంది. అక్కడ్నించి మొదలవుతుంది అతని కష్టకాలం. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు పొడిపించుకోవాల్సివస్తుంది, ఆ కుక్క పిచ్చిదో కాదో తెలుసుకోవాలి. ఈ హడావుడిలో ప్రియురాలి సంగతి, ఆమె రాసిన చీటి సంగతి మరిచిపోయి, ఆ కుక్క క్షేమ సమాచారం కోసం తెగ తిరుగుతాడు. ఈ క్రమంలో అతను చిత్రభ్రమకి గురవుతాడు. తనని తాను పురూరవుడిగా భావించుకుని, తన ప్రేయని “ఊర్వశి”గా ఊహించుకుంటాడు. మనుష్యుల లోని చంచల స్వభావాన్ని, భావసంచలనాన్ని చిత్రించిన కథ “ఊర్వశి”.

జోరు వానకు తడి ముద్దై నానిన కొండ శిఖరమొకటి విరిగిపడి కడలి తీరంలో కల్సే ఒక నదీ ప్రవాహంలో మేట వేసి, లంకలా మారినట్లుగా….

మోహన్‌దాస్ కె.జి. (మోని) అనే పేరున్న ఓ బాలుడి కథ “గాంధీజీ దశ నుంచి”. తండ్రికి అనారోగ్యం కలిగితే, మందు తేవడానికి మోని బయల్దేరుతాడు. గాంధీజీ కథ చదువుకుంటూంటాడు మోని. తల్లి అకారణంగా తిట్టి, తండ్రికి మందులు తెమ్మని పంపిస్తుంది. తండ్రికి ఉన్న అనారోగ్యాల పేర్లు రాసుకునేందుకు చెల్లిని పెన్సిల్ అడుగుతాడు మోని. ‘నీ పెన్సిల్ ఏది?’ అని తల్లి అడిగితే, క్లాసులో ఎవరో దొంగిలించారని చెప్పి, మరిన్ని తిట్లు తింటాడు. తండ్రి జబ్బుల జాబితాని తల్లి రాసిస్తుంది. దిగులుగా బయల్దేరుతాడు మోని. వైద్యుదు ఉండే ఊరు నాలుగు మైళ్ళ దూరం. ఏవో ఆలోచనల్లో పడి తల్లి రాసిచ్చిన కాగితాన్ని ఎక్కడో పోగొట్టుకుంటాడు. చివరకి, జబ్బుల పేర్లు గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తూ, తను చేసిన తప్పులని తండ్రికి ఉత్తరంగా రాస్తాడు గాంధీగారిలా. తర్వాత ఏమవుతుందనేది ఆసక్తిగా ఉంటుంది. పిల్లలు గాంధీగారిలా నిజాలను నిర్భయంగా రాయాలనుకున్నా, గాంధీజీ తండ్రిలా వాటిని ఆమోదించలేని తండ్రులెందరో. 1960లలో రాయబడిన ఈ కథ నేటికీ వర్తిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

గంభీరమైన కథల మధ్య హాస్యం చిలకరించే కథ “పంజ్రోళ్ళి పిశాచి”. హాస్టల్‌లో ఉండే కుర్రాళ్ళు ఇంట్లోంచి పాత్రలు తీసుకొచ్చి చక్కని ఫిల్టర్ కాఫీ తాగాలనుకుంటారు. అర్థరాత్రి తమలో ఒకడైన మిత్రుడింటికి వెళ్ళి పాత్రలు, డికాక్షన్ తెచ్చుకుని, కాఫీ తాగి ఆనందిస్తారు. అయితే తెల్లారాక వారికో నిజం తెలుస్తుంది. గిలగిలాడిపోతారు.

ఆకాశమంతా మేఘాలు కమ్ముకొని, రోడ్లన్నీ బురదమయమై దూరానున్న రమణీయ దృశ్యాలన్నీ తొలగిపోయి స్తబ్దుగా నిలబడియుంది వాతావరణం.

ఈ పుస్తకానికి మకుట కథ “మాటతీరు”. ఓ రచయిత అంతర్మథనాన్ని అందంగా చిత్రిస్తుందీ కథ. వేదాంత సత్యాలను మిళితం చేస్తూ, గ్రామీణుల భోళాతనాన్ని, తుంటరి పిల్లల అల్లరి చేష్టలని చక్కగా చూపిస్తుందీ కథ. ఇరుకిరుకైన బతుకుని మాటల తీరుతో మళ్ళీ మళ్ళీ చికాకు పెడుతున్న జగత్తు మీద, జనం మీద అసహనం వ్యక్తం చేస్తుందీ కథ.

కొత్త మన్నుతో కరిగి కలగలసిన ఆ నీళ్ళు కుంకుమరంగుతో ఉన్నట్లుగా కనపడుతుంది. అటు ఇటు ఉన్న దట్టడవి వాగులోని ప్రవాహం మ్రోతకు ప్రతిధ్వనించి ఒకటి రెండు ఎక్కువైనట్లు మ్రోత పెట్తుంది. తేలుతూ కొట్టుకొచ్చిన గడ్డిగాసం మొదలైనవన్నీ ఆ ఎర్రనీళ్ళ ప్రవాహం మధ్యన తలెత్తి నిలబడ్డ వృక్షాల తలలలో ఇరుక్కుపోయి, ఇక ఆ చెట్లు తలపాగాలు చుట్టుకొన్నట్లుగా నిలబడియున్నవి.

“నిగూఢ మనుషులు” ఈ సంకలనంలో కెల్లా పెద్ద కథ. దాదాపు 56 పేజీల కథ ఇది. మనుషుల నిజస్వరూపాలను, జాతిబేధాలను, అసూయా ద్వేషాలను, అహంకారాలను, కృత్రిమత్వాన్ని ఈ కథ ప్రదర్శిస్తుంది. ప్రకృతి ప్రకోపాన్ని, వరద విలయాన్ని, భూపంకం వల్ల కొండ చరియలు విరిగి పడి గ్రామాలకు గ్రామలు నాశనమవడాన్ని ఈ కథ చెబుతుంది. బీభత్సకరమైన ఘటనలున్నా, భయోత్పాతాన్ని కల్పించదీ కథ. దీన్ని చదువుతుంటే ఒక ప్రాంతపు చరిత్ర చదివినట్లుంటుంది.

తనను లైంగికంగా వేధించిన ఆఫీసర్‌ని శిక్షించమని ఉన్నతాధికారులను వేడుకొన్న ఓ యువతి వినతి మేరకు ఆ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తారు. అయితే అనూహ్యంగా బాధితురాలు ఉన్నతాధికారిపై తిరగబడుతుంది. తాను అడిగింది ఏమిటి? వాళ్ళు చేసింది ఏమిటి? అని వాపోతుంది. కారణం తెలుసుకోవాలంటే, ఆలోజింపజేసే కథ “చిట్టితల్లి” చదవాల్సిందే.

“కాళ్ళు లేని కవిత”లో అవార్డుల కోసం, బిరుదుల కోసం తాపత్రయపడే సాహితీవేత్తలపై చురకలు వేస్తారు రచయిత. “ముందుగా బతుకును అనుభవించు. అనుభవం అర్థవంతంగా మారి నీ కవిత్వంలోకి వస్తది. అర్థమైన దాన్ని అక్షరాల్లోకి దించు. అలాగున రాస్తుంటే నీ సాహిత్యం అనుభావమౌతుంది” అంటాడో సీనియర్ కవి, తన జూనియర్ కవికి జ్జాన బోధ చేస్తూ. తర్వాత ఏమవుతుంది? కథ పూర్తయ్యాక చదువరుల పెదాలపై నిట్టూర్పు వెలుస్తుంది.

మూడు వందల కోట్ల రూపాయాలకు వారసురాలయ్యే అవకాశం ఉన్న ఓ మహిళ తన కుటుంబీకులు పెడుతున్న బాధలనుంచి తప్పించుకోడానికి రైలెక్కి వేరే ఊరికి బయల్దేరిపోతుంది. విధి ఆడే వింత నాటకం వల్ల చివరికి ఆ డబ్బు ఆమె ఆశ్రయం పొందిన అనాధాశ్రమానికే అందుతుంది. మనుషుల జీవితంలో సంపద సృష్టించే దురాశని, దాని వల్ల మనుషుల మనస్తత్వాలలో వచ్చే మార్పులని “వారసుదార్లు” కథ చక్కగా చెబుతుంది.

జీవించి ఉన్నప్పుడు ఎవరికీ ఒక్క రూపాయి కూడా దానం చేసి ఎరుగని ఓ వృద్ధురాలు తన మరణానంతరం ఆస్తినంతా ఓ అనాధ శరణాలయానికి ఎందుకు రాసేసిందో తెలుసుకోవాలంటే “సొత్తు” కథ చదవాలి. దొంగ బాబాల మీద, అవినీతిపరులైన రాజకీయవేత్తల పైన సంధించిన అస్త్రం “మఠాదిపతి మరియు మెడికల్ కాలేజి” కథ. నేటి వ్యవస్థలోని లోపాలను వ్యంగ్యంగా ఎత్తి చూపిన కథ ఇది.

చివరగా తన యాత్రానుభవాలు వివరిస్తారు రామగోపాల్ గారు. ఆయా అనుభవాలు చదువుతుంటే, మనం కూడా ఆయనతో ప్రయాణించినట్లు, ఆయా ప్రదేశాలు స్వయంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. కేరళలోని మున్నార్ పర్యటన సందర్భంగా కాలడి వెళ్ళి, ఆదిశంకరుల జన్మస్థలాన్ని, కీర్తిమందిరాన్ని దర్శించారు అనువాదకులు. శంకరుడి జన్మస్థలం దర్శనం కోసం ఆ రోజున వచ్చింది కేవలం పది మందేనని తెలిసి ఎంతో బాధ పడతారు రామగోపాల్ గారు. సినిమా హీరోల ఇళ్ళముందు వందలాది మంది ఎదురుచూస్తుంటే, అఖండ భారతావనిని దర్శించి, నాలుగు దిక్కులా మఠాలు నెలకొల్పి వేదాల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన శంకరుని గృహం వద్ద యాత్రికులు లేకపోడాన్ని సంస్కృతి క్షీణించడంగా భావించారట ఆ రోజు వీరితో పాటు ఆ గృహాన్ని దర్శించిన ఓ మహారాష్ట్రకు చెందిన యాత్రిక కుటుంబం. ఓ కఠోర వాస్తవం!

మొత్తంగా తరచి చూస్తే, చక్కని కన్నడ కథలని తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం ఈ సంకలనం అని చెప్పవచ్చు. అయితే అనువాదకులు ఉపయోగించిన భాష – మహబూబ్‌నగర్ జిల్లా, కర్నాటక సరిహద్దుల ప్రాంతంలోని తెలుగు కన్నడం కలగలసిపోయిన యాస – పాఠకులకు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. కొంచెం ఓపిక చేసుకుని చదివితే కన్నడ కస్తూరి పరిమళాలను అస్వాదించవచ్చు. మంచి కన్నడ కథలని శ్రమకోర్చి తెలుగు పాఠకులకు అందించిన రామగోపాల్ గారు అభినందనీయులు.

kolluri

కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్

“మాటతీరు”పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. 230 పేజీల ఈ పుస్తకం వెల రూ.200/- (విదేశాలలోని తెలుగువారికి $10.). ప్రతులకు రచయితనూ సంప్రదించవచ్చు.
చిరునామా: Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in