మహానాయక్ ఉత్తమ్ కుమార్

 

uttam1

కలకత్తా లో, ఇంకా చెప్పాలంటే బెంగాల్ మొత్తం మీద అంతిమ యాత్ర  చరిత్రగా మిగిలిన సందర్భాలు రెండు ఉన్నాయని చెపుతారు. ఒకటి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతిమయాత్ర, ,మరొకటి అరుణ్ కుమార్ ఛటర్జీది.ఈ రెండు సందర్భాల్లో అశేష జనవాహిని, వారు అంతగా అభిమానించేవారి మరణాన్ని జీర్ణించుకోలేక, తీరని శోకం తో అంతిమయాత్ర లో పాల్గొని చివరి వీడ్కోలు పలికారు. అరుణ్ కుమార్ ఛటర్జీ మరణం తన అభిమానులకి జీర్ణించుకోవటానికి చాలా కాలమే పట్టింది. ఆ అరుణ్ కుమార్ ఛటర్జీయే బెంగాళీ సూపర్ స్టార్, మహానాయక్ ఉత్తమ్ కుమార్.

తన చివరి శ్వాస సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే వదలాలని అనుకునే ఉత్తమ్ కుమార్, ఈ ప్రపంచ రంగస్థలం నుండి అదే విధంగా నిష్క్రమించాడు. ‘ఓగో బొదు శుందొరి సినిమా షూటింగ్ సమయం లో గుండెపోటు రావడంతో బెల్లీవ్యూ హాస్పిటల్ లో చేర్పించారు. 16  గంటలపాటు డాక్టర్లు ఎంతగా శ్రమించినా తనని బ్రతికించలేకపోయారు.

దాదాపు మూడు దశాబ్దాలపాటు బెంగాలీ సినీరంగాన్ని రారాజుగా ఏలి, దాదాపుగా 250 వరకు (బెంగాలీ, హిందీ అన్నీ కలిసి) సినిమాల్లో నటించాడు. ఉత్తమ్ కుమార్ కేవలం నటన తో తన పిపాసని తృప్తి పరచుకోలేదు. దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా,నిర్మాతగా,నేపథ్య గాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసాడు.

బెంగాళీ లోనే కాకుండా భారత దేశం లోనే అత్యుత్తమ నటుడిగా కిర్తించబడ్డ మహానాయక్ ఉత్తమ్ కుమార్.

ఉత్తమ్ కుమార్ మరణించిన రోజు కొంత మంది సినీ ప్రముఖులు:

“బెంగాళీ చిత్రపరిశ్రమకే దారిచూపించే దివిటీ వెళ్లిపోయింది. తనకు ముందు గానీ తరువాత గాని అలాంటి హీరో లేడు”

~~ సత్యజిత్ రే         

“మా అందరు హీరోల్లో ఉత్తమ్ కుమార్ బెస్ట్”

~~రాజ్ కపూర్

“ప్రపంచంలోని ఏ నటుడితో అయినా పోల్చగల సమర్థత ఉన్న నటుడు ఉత్తమ్ కుమార్. తనలో ఉన్న గొప్ప సుగుణం శ్రద్ధ.

చాలా మంది నటులకు పుట్టుకతోనే ఆ ప్రతిభ ఉంటుంది. కానీ ఆ ప్రతిభ,  శ్రద్ధ లేకపోవటం వల్ల త్వరగానే అంతరిస్తుంది. కానీ ఉత్తమ్ కుమార్ కి  ప్రతిభతో పాటు అకుంఠిత శ్రద్ధ ఉంది. అందువల్లే ఆ నట నక్షత్రం ఇంకా వెలుగులు విరజిమ్ముతూనే ఉంది.

  ~~ తపన్ సిన్హా

ఉత్తమ్ కుమార్ సినీ ప్రస్థానం లో అద్భుతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి.  దస్తూరి లా, తన సొంతదైన ప్రత్యేక నటనాశైలి తో భావి నటులకి సమగ్రంగా ఒక “నటనా నిఘంటువుని” సమకూర్చాడు. ఆయన  చేసిన ఒక్కొక్క పాత్ర, ఒక్కో నటనా శైలిని ఆవిష్కరిస్తాయి. తను చేసిన కొన్ని పాత్రలు మనల్ని ఆలోచింపజేస్తాయి. మరికొన్ని పాత్రతో పాటుగా మనల్ని పయనింపజేస్తాయి. ఉత్తమ్ కుమార్ నటనా తాలూకా ప్రభావం మనల్ని అంత సులువుగా వదలదు. ఆ పాత్రలు మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. చూసిన ప్రతీసారి , ఆ పాత్ర తాలూకు కొత్త కోణం ఏదో కనపడుతుంది.

తన నటన గురించి చెపుతూ ” నేను నా సహజ నటనా పద్ధతులనే అనుసరిస్తాను. మనం నిజ జీవితం లో ఎలా మాట్లాడుకుంటాము? ఎలా కోపగించుకుంటాము ? అలాంటి సహజమైన నటననే నేను ఇష్టపడతాను” అని అంటాడు మహానాయక్.

అంత స్టార్డం ని , ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఉత్తమకుమార్ కి విజయ శిఖరాల వైపు ప్రయాణం అంత సులువుగా జరగలేదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని , కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం నుండి మహానాయక్ ఉత్తమ్ కుమార్ గా ఎదిగేవరకు ఎన్నో అపజయాలు ఎప్పటికప్పుడు తనని పరీక్షిస్తూనే ఉన్నాయి.

మొదటి సినిమా విడులకి నోచుకోలేదు. తరువాత చేసిన 4 -5  సినిమాలు పరాజయంపాలు కావటంతో ఎన్నో అపజయాలు,హేళనలు, అవమానాలు తనని ప్రతి నిత్యం పలకరించేవి. ఇలా వరుస అపజయాలతో విసిగిపోయి, సినీరంగాన్ని వదిలివెళ్ళి క్లర్క్ ఉద్యోగానికి వెళ్లిపోదామనుకునే తరుణంలో భార్య గౌరి దేవి “మీకు ఇష్టమైన కళని వదులుకుని , ఏమాత్రం ఇష్టపడని ఆ ఉద్యోగం చేయటం కంటే,మీరు ఖాళీగా ఉన్నా ఫరవాలేదు ” అని ఉత్తమ్ కి ధైర్యాన్నిచ్చింది.

బెంగాళ్-బాంగ్లాదేశ్ లో అంతలా అభిమానులని సంపాదించుకున్న చరిత్ర బహుశా ఉత్తమ్ కుమార్ కే సొంతం.

దిలీప్ కుమార్దేవానంద్ఉత్తమకుమార్ ముగ్గురూ సమకాలీన నటులు. ముగ్గురూ దాదాపుగా తమ సినీరంగ ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టారు.

దిలీప్ కుమార్ ఎక్కువగా త్యాగపు ఛాయలు ఉన్న పాత్రలకి పెద్ద పీట వేస్తే, దేవానంద్ ప్రేమికుడి గా, డైనమిక్ గా ఉండే పాత్రల్ని ఎంచుకునేవాడు.అందుకు భిన్నంగా ఉత్తమ్ కుమార్ అన్నిరకాలయిన కథలని ఎంచుకునేవాడు. తాను ఎంచుకునే కథలూ, పాత్రలు అప్పటి బెంగాళీ హీరోలు పాటించే పద్దతులకి భిన్నంగా ఉండేది.

అయితే ఈ కథల్ని ఎంచుకునే ప్రక్రియ తనకి అంత సులువుగా రాలేదు. తన సినీ జీవితం లో ఎదుర్కున్న అపజయాలనుండే ఈ కొత్త పాఠాలు నేర్చుకున్నాడు.

బెంగాళీ ప్రొడ్యూసర్లకి ఉత్తమ్ కుమార్ ఒక కల్పవృక్షమే. అగ్రస్థాయి నిర్మాతలు ఇద్దరు ముగ్గురు తమ సినిమా ఒప్పుకోవడానికి ముందే బ్లాంక్ చెక్స్ పంపేవారట. అప్పటి హీరోయిన్స్ ఉత్తమ్ పక్కన నటించడం ఒక అదృష్టం లా భావించి, తమకి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని అనుకునేవారట. సినిమా రిలీజ్ కి ముందే ‘హౌస్ ఫుల్’ బోర్డ్స్ కి ఆర్డర్లు ఇచ్చేవారట.

ఉత్తమ్ కుమార్ సెప్టెంబర్ 3, 1926 తేదీన తన మేనమామ ఇంట్లో జన్మించాడు. ఉత్తమ్ కుమార్ అసలుపేరు అరుణ్ కుమార్ ఛటర్జీ,తల్లిదండ్రులు, చపలాదేవి-సత్కారి ఛటర్జీ.

సౌత్ సబర్బన్ స్కూల్ లో చదివి , గోయెంకా కాలేజీ లో డిగ్రీ పూర్తి అవకముందే కలకత్తా పోర్ట్ ట్రస్ట్ లో క్లర్క్ గా ఉద్యోగం రావడం తో,  క్లర్క్ గా పనిచేస్తూనే నాటక రంగానికి పయనం.

ఉత్తమ్ కుమార్ కుటుంబానికి సుహృద్ సమాజ్, అని ఒక నాటక సంస్థ ఉండేది.  చిన్నతనంలోనే ఆ వాతావరణం ఉండటం వల్ల తన నటన కి సంబందించిన బీజాలు అక్కడే పడ్డాయి. నటనే కాకుండా రకరకాలయిన ఆటలు, ఈత, టెన్నిస్, కుస్తీ పోటీలు,గుర్రపు స్వారీ ఇలా ఒకటేమిటి అన్నిట్లో తన ప్రతిభ కనబరిచేవాడు.

నితిన్ బోస్ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా “మాయాదోర్”, కానీ అది విడుదల అవలేదు.

ద్రిష్టిదాన్ (1948 ) విడుదలయిన మొదటి సినిమా. ఆ తరువాత విడుదల అయిన, 4 -5 సినిమాలు వరుసగా ప్లాప్. అందువల్ల ప్రతి సినిమాకు తన పేరు మార్చుకున్నాడు. అరుణ్ ఛటర్జీ నుండి అరుణ్ కుమార్ అని , ఆ తరువాత ఉత్తమ్ ఛటర్జీ అని, చివరగా ఉత్తమ్ కుమార్ అని మార్చుకున్నాడు. ఆ పేరుతోనే బెంగాళ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా, మహానాయక్ గా నిలిచిపోయాడు.

uttam2

‘బసుపరిబార్ ‘ సినిమా కొంతమేర విజయాన్ని సాధించగలిగింది.ఆ తరువాత విడుదలయిన ‘అగ్ని పరీక్ష'(1954 ) ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తమ్ కుమార్సుచిత్ర జంటగా నటించిన ఇది. ఈ సినిమా తరువాత ఈ జంట రొమాంటిక్ పెయిర్ గా పేరు తెచ్చుకుంది.

సుచిత్ర-ఉత్తమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని:

శిల్పి ,సప్తపది, పతే హోలో దేరి,హరనో సుర్, ఛోవాపావా, బిపాషా ,జిబాన్ త్రిష్ణ.

ఉత్తమ్ కుమార్కొన్ని విశేషాలు::

కలకత్తాలో ఉత్తమ్ స్మారకార్థం ఒక థియేటర్ ని (ఉత్తమ్ మంచ) నిర్మించారు.

కలకత్తా టోలీగంజ్ ప్రాంతం లో ఉత్తమ్ కుమార్ భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. సెంట్రల్ రైల్వేస్ వారు టోలీగంజ్ మెట్రో స్టేషన్ ని ఉత్తమ్ కుమార్  స్టేషన్ గా మార్చారు.

శిల్పి సంసద్ అని పేద, వృద్ధ కళాకారులని ఆదుకోవడానికి ఉత్తమ్ స్థాపించిన సంస్థ తన కార్యకలాపాల్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.

2009  లో భారత ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ పేరు మీద  “ఉత్తమ్ కుమార్ది లెజెండ్ అఫ్ ఇండియన్ సినిమా” అని  స్టాంప్ ని విడుదల చేశారు.

సినిమా టైటిల్ క్రెడిట్డ్స్ లో తన పేరుకి ముందుగా హీరోయిన్ పేరు ని వేయించే సంప్రదాయాన్ని మొదలు పెట్టాడు ఉత్తమ్ కుమార్.

భారతరత్న సత్యజిత్ రేఉత్తమ్ కుమార్ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో నాయక్ సినిమా అత్యద్బుతమైనది. కొన్ని సంవత్సరాల క్రితం సత్యజిత్ రే సినిమాలు ఏవో చూస్తూ అనుకోకుండా నాయక్ సినిమా చూశాను. ఉత్తమ్ కుమార్ నటన నన్ను మెస్మరైస్ చేసింది. ఒకసారి చూశాక మళ్లీ చూశాను. అలా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. ప్రముఖ హీరో అరింధం ముఖర్జీ గా ఉత్తమ్ కుమార్ నటన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

అసలు ఉత్తమ్ కుమార్ ని నేను అంతలా అభిమానించడానికి కారణమే ,నాయక్(1966) సినిమా.

దీని గురించి వచ్చేవారం….!

*

 

అన్వేషణ ఇంకా ఆగలేదు!

ఎద లయలో ఇళయ”రాగం”-2

ilaya1

ప్రముఖ దర్శకుడు బాల్కి (పా,షమితాబ్) ఒకసారి అంటాడు.. “ఇళయరాజా BGM లతో పాటలు చేసేసుకోవచ్చు “అని. అలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.

** స్వాతిముత్యం సినిమా లోని BGM తో వంశీ గారి “శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమాలోని “ఏనాడు విడి పోనీ ముడి వేసేనే..ఈ పసుపుతాడు” అన్న పాట అలా వచ్చిందే..

** శివ సినిమా లోని BGM తో “సంగీత దర్శకుడు కోటి,”పాపే నా ప్రాణం” (జె డి చక్రవర్తి) సినిమా లో “నీకు తెలుసా….” అన్న పాటా అలా చేసిందే.

ప్రయోగాలకి మాత్రం ఎప్పుడు ఇళయరాజా ముందుంటారు. అందులో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావిస్తాను.

~~స.రి.గ  అన్న మూడు స్వరాలతో ఒక పాట కి బాణీ సమకూర్చారు. దాదాపు దశాబ్దం క్రితం జరిగిన సంగీత విభావరిలో ఇళయరాజా తన “మూడు స్వరాల ” పాట ని తాను తమిళం లో పాడి , శ్రేయ ఘోషల్ తో తెలుగు లో పాడించారు.

~~ “హరికథ, కోలాటం, చెక్క భజన,కీర్తన ” ఈ నాలుగు కలిపి ఒక పాటని స్వరపరిచారు. అది “రామకానవేమిరా” అన్న పాట, స్వాతిముత్యం సినిమా లోనిది.

~~విషాద రాగం గా భావించే “మాయ మాళవ గౌళ ” రాగం లో రొమాంటిక్ డ్యూయెట్ ని కంపోస్ చేసాడు. అది జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా లోని “యమహా నీ యమా యమా అందం”.

~~వంశీ దర్శకత్వం లో వచ్చిన మహర్షి సినిమా లో ” సంస్కృత డిస్కో” పాట మొత్తం “సంస్కృతం” లోనే ఉంటుంది.”అస్మద్ విస్మద్ విధ్యుత్ దీపిక త్వం ఏవా”.పాట-సంస్కృతం”, “బాణీ-డిస్కో”.

~~ ఒకసారి అప్రయత్నంగా వస్తున్న ట్యూన్లకి బాణీలు కట్టి , R సుందర్ రాజన్ ని పిలిచి “బాణీలు ఇస్తున్నా,కథ తయారు చేస్కో అని ఇచ్చారు.ఆ సినిమా “వైదేహి కాత్తి మందాల్”, సూపర్ డూపర్ హిట్ అయింది తమిళం లో.అదే తెలుగులో “మంచి మనసులు” గా రీమేక్ చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే తన స్వర ప్రవాహం లో ఎన్నో ప్రయోగాలు. హృదయానికి హత్తుకునే పల్లవులతో ఇళయరాజా ఒక “స్వర ఇంద్రజాలమే” చేసేస్తాడు. ఆ పాటలు, వింటున్నప్పుడు “శ్రోతల మనసుల్ని” వశీకరణం చేసేసుకుంటాయి. స్వరాల్ని ఆవాహన చేస్కుని సంగీత సృష్టి చేస్తాడు కనకే , తన పాటలకి అంత ఆకర్షణ శక్తి ఉంటుందేమో అనిపిస్తుంది.అందుకే ఆయన పాటలు జీవితాంతం హృదయ తంత్రుల్ని నిరంతరంగా మీటుతూ పారవశ్యంలో ముంచేస్తూనే ఉంటాయి.

ఒక సందర్భం లో ఇళయరాజా ఇలా అంటారు.” పాట అంటే ఏమిటి? ఒక పాటలా ఇంకో పాట ఉండకూడదు. అలా ఉంటే అది పాట అనబడదు. “కాపీ” అనబడుతుంది.

ఇమిటేషన్ వేరు , ఇన్స్పిరేషన్ వేరు. ఇమిటేషన్ అంటే యథాతథంగా పాటని వాడుకోటం.

ఇన్స్పిరేషన్ అంటే ఒక పాట లోని “ఆత్మ” ని పట్టుకుని ఆ ప్రేరేపణతో ఇంకో పాటని కంపోజ్ చేయటం.

ఈ పద్దతిలో ఇన్స్పైర్ అయిన పాటకి,తరువాత బాణీ కట్టిన పాటకి సంబంధం ఉండదు, అని అంటారు. ఎలాంటి భేషజం లేకుండా తాను ఏ పాటని ఇన్స్పైర్ అయి చేసాడో, ఏ పాటని ఇమిటేట్ చేసాడో కూడా చెప్తాడు.

ఇళయరాజా దక్షిణ తమిళనాడు లోని ” మధురై జిల్లా” , “పన్నైప్పురం” లో జన్మించాడు. కుటుంబం పెద్దది కావటం వల్ల తల్లితో పాటు పొలం పనులకి వెళ్ళేవాడు. అక్కడ వారు పాడుకునే “జానపదాలు” బాలుడిగా ఉన్న ఇళయరాజా మీద చెరగని ముద్ర వేసాయి.కొడుక్కి సంగీతం మీద ఉన్న మక్కువ ని గమనించి పాత హార్మోనియం కొనిపెట్టి ఇచ్చింది తల్లి చిన్నతాయమ్మాళ్.

అప్పటినుండి ఇళయరాజా కి ప్రథమ గురువు ఆ హార్మోనియం అయింది. 1957 లో తండ్రి మరణం ఇళయరాజా కుటుంబాన్ని బాగా కుంగదీసింది. ఇంటి భాద్యతలు తనమీదా పడ్డాయి. 1958 లో అన్న పావలార్ వరదరాజన్ తో కలిసి “పావలార్ బ్రదర్స్” పేరిట ఆర్కెస్ట్రా ట్రూప్ ని స్థాపించారు. డ్రామా కంపెనీలకు, వివిధ రకాలయిన ప్రోగ్రామ్స్ కి సంగీతాన్ని అందించేవారు.ఇది దాదాపుగా పది సంవత్సరాలు కొనసాగింది.

1968 లో మద్రాస్ ప్రయాణం. అక్కడే క్లాసిక్ గిటార్, పియానో నేర్చుకున్నాడు. 1970 లో ధనరాజ్ సలహాతో “లండన్ ట్రినిటీ కాలేజీ ” ఎగ్జామ్స్ కి కూర్చుని, ” క్లాసిక్ గిటార్” లో “గోల్డ్ మెడల్” సంపాదించాడు.

ఈ ప్రతిభని గమనించి బెంగాలీ సంగీత దర్శకుడు “సలీల్ చౌదరి” తన ఆర్కెస్ట్రా లో స్థానం ఇచ్చాడు. ఆ తరువాత “జయ కాంతన్” సలహా తో, సంగీత దర్శకుడు జి.కే. వెంకటేష్ పరిచయం అయ్యాడు. తెలుగు వాడయిన జి.కే వెంకటేష్, అప్పటికే కన్నడ సినీ రంగం లో అగ్రస్థానం లో ఉన్నాడు అప్పుడు.

జి.కే వెంకటేష్ కి అసిస్టెంట్ గా దాదాపు 200 సినిమాలకి ఇళయరాజా పని చేసాడు. ఇలా అసిస్టెంట్ గానే జీవితం గడిచిపోతుంది అనుకున్న సమయంలో, నిర్మాత పంజు అరుణాచలం తన “అన్నక్కిళి” సినిమా కి “సంగీత దర్శకుడి” గా అవకాశం ఇచ్చాడు. 1976  లో  వచ్చిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి ఇళయరాజా ని అగ్రస్థానం లో నిలబెట్టింది. ఆ సినిమా తరువాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇళయరాజా అన్ని భాషల్లో కలిపి సుమారుగా వెయ్యి సినిమాలకి బాణీలు అందించాడు.

1000 వ సినిమా బాలా దర్శకత్వం లో వచ్చిన ” తారై తప్పట్టై ” .ఇళయరాజా కి దేశం మొత్తం అభిమానులు ఉన్నారు.

 

ఇళయరాజా సంగీత ప్రస్థానంలో  కొన్ని విశేషాలు :::

**దళపతి సినిమా లోని “రక్కమ్మ” (చిలకమ్మా చిటికేయంగా) పాట బీబీసీ 166 దేశాల్లో నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో “బీటిల్స్ ” ని అధిగమించి 4 వ స్థానం లో నిలచింది.

**లండన్ లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా కి సంగీతం రచించిన మొట్ట మొదటి “ఆసియా వాసి”.ఇది 1993  లో జరిగింది.

** మాణిక్య వాచకర్ రచించిన తిరువాసగం(తిరువాచకం) కి ఇళయరాజా సింఫనీ రచన. ఇవి దాదాపుగా లక్ష ఆల్బమ్స్ అమ్ముడుపోయాయి.

మాణిక్య వాచకర్ గానం చేయగా శ్రీ చిదంబర నటరాజ స్వామి స్వహస్తాలతో రాసుకుని తన ఆమోద ముద్ర వేసి భక్తులకు అందించిన అపురూప భక్తి-జ్ఞాన గ్రంథం “తిరువాచకం”

**ఫ్రెంచ్ నటుడు , గాయకుడు పాస్కల్ హెని , హిందీ భాష నేర్చుకుని బాలీవుడ్ పాటలు పాడుతూ దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అతను “ఇళయరాజా ” స్వరపరచి, పాడిన ఒక పాట( “ఊళ్లకుళ్ళ చక్రవర్తి” ) ని పాడాడు. “పన్నక్కారన్” అన్న రజినీకాంత్ సినిమా లోనిది.

ఇళయరాజాకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుల్లో ఖేం చంద్ర ప్రకాష్ , మదన్ మోహన్,సి రామచంద్రన్, రోషన్,సలీల్ చౌదరి, S D బర్మన్ , R D బర్మన్ ముఖ్యులు. “బీతోవెన్, మొజార్ట్, బాక్” లని అయితే ఆరాధిస్తాడు.

ఇళయరాజా చేసిన మిగతా ఆల్బమ్స్:: “హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్, తిరువాసగం “.

రమణ మహర్షి తన ఆధ్యాత్మిక గురువు అవటం వల్ల రమణుని, ఆ అరుణాచలేశ్వరుడిని స్తుతిస్తూ పలు ఆల్బమ్స్ చేసాడు,. అలాగే షిర్డీ సాయి మీదా ఆల్బం చేసాడు.

“సంగీతం అంటే నాకు అస్సలు తెలియదు. తెలియదు కాబట్టే చేస్తున్నా. తెలిస్తే, హాయిగా ఇంట్లో కూర్చునేవాణ్ణి. నాకు సంగీతం వచ్చేసిందని కాలుమీద కాలు వేసుకుని దర్జాగా ఉండేవాణ్ణి. కానీ అలా ఉండటంలేదే?. సంగీతం అంటే ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నమే నేను చేస్తున్న క్రతువు. అన్వేషిస్తూ… ఈ ప్రయాణం కొనసాగాల్సిందే “అంటాడు ఇళయరాజా

తన సంగీత యజ్ఞాన్ని ఇలాగే సాగిస్తూ, తన అన్వేషణ కొనసాగిస్తూ, తన అభిమానులకు,భక్తులకు ఆ యజ్ఞ ఫలాన్ని ఇలా అందిస్తూనే ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ…!  ఇట్లు ..ఇళయరాజా భక్తుడు.

*

 

  ఎద లయలో ఇళయ”రాగం”

 ilaya1

           సంగీతం ఏమీ చెప్పదు. సంగీతం అస్తిత్వపు మాధుర్యాల్ని చూపిస్తుంది. అదే అందులోని సౌందర్యం.

సంగీతం వింటున్నప్పుడు అది సత్యమా? అసత్యమా? అన్న తాత్విక మీమాంస మనలో ఉదయించదు. పూర్తిగా మమేకమై వింటాం.సంగీతం మనల్ని వశ్యం చేసేసుకుంటుంది.మనకి తెలియని మరో లోకాలకు తీసుకుని వెళుతుంది.మనం ఉన్న వాస్తవిక ప్రపంచానికి అతీతంగా మరో దృశ్య రూపాన్ని చూపిస్తుంది. అప్పుడింక మనం మామూలు ప్రపంచం లో ఉండలేము. సంగీతం మనల్ని  ఆప్యాయంగా వేలుపట్టుకుని అస్తిత్వపు అత్యున్నత రహస్యాల వైపుకి  తీసుకుని వెళుతుంది” .

అందుకే మార్మిక జ్ఞానులు సంగీతాన్ని “దైవం” అన్నారు. దైవం అంటే ఒక వ్యక్తి కాదు. ప్రకృతి లో ఉండే అత్యున్నత సామరస్యా పూర్వక అనుబంధం. అది ఒక ఆర్కెస్ట్రా లాంటిది. ప్రతీది ప్రతిదానితో సంబంధం కలిగి ఉంటుంది. వృక్షాలు భూమి తో అనుబంధం కలిగి ఉంటాయి. భూమి కి , గాలి తో అనుబంధం కలిగి ఉంటుంది. గాలికి ఆకాశం తో అనుబంధం , అలాగే ఆకాశానికి నక్షత్రాలతో అనుబంధం ఉంటుంది.

క్రమానుగత శ్రేణి అన్నది ప్రకృతి లో ఉండదు. చిన్న గడ్డి పరక కి కూడా అతి పెద్ద నక్షత్రానికి ఉన్న విలువే ఉంటుంది. అని సంగీతం గురించి అంటారు ఓషో.

ఇది ఇళయరాజా విషయంలో అక్షర సత్యం. తన సంగీతం మనకి తెలియని లోకాలని పరిచయం చేస్తుంది.

ఆ లోకాల్లోనే శ్రోతలకు శాశ్వత స్థానం ఇచ్చి తన సంగీతం తో మనసుని, ఆత్మ ని రంజింపజేస్తాడు.

నేను స్కూల్ కి వెళ్లే రోజుల్లో రేడియో లో, టేప్ రికార్డర్ లో పాటలు వినటం అలవాటుగా  ఉండేది. అప్పటికి ఇంకా టీవీల ప్రభావం అంతగా లేదు.  నాన్నగారికి  ఉన్న సంగీత, సాహిత్య అభిరుచి వల్ల  నాకూ  చిన్నతనంలోనే సంగీత-సాహిత్యాలతో అనుబంధం ఏర్పడింది.

సినిమాల గురించి కానీ , సంగీత దర్శకుల గురించి కానీ నాకు అంతగా అవగాహన లేని రోజులు అవి . అప్పుడు బహుశా ఐదు-ఆరు సంవత్సరాలు ఉంటాయేమో. అమ్మ కి ఉన్న సంగీత ప్రవేశం వల్ల తాను కొన్ని పాటల్ని అప్పుడప్పుడు పాడటం వల్ల , రేడియో లో కానీ టేప్ లో కానీ వింటున్నప్పుడు మాత్రం కొన్ని పాటలు చాలా బాగా అనిపించేవి.మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేట్టుగా ఉండేవి ఆ పాటలు.

ఆ తరువాతి రోజుల్లో , హైస్కూల్ స్థాయికి వచ్చాక సినిమాల మీద ఇష్టం ఏర్పడి విపరీతంగా సినిమాలు చూడటం మొదలైన తరువాత, అంతకుముందు నేను విని, నాకు నచ్చిన పాటలు ఏ సినిమా లోవి? ఎవరు సంగీత దర్శకులు ? అని తెలుసుకున్నతరువాత ఆశ్చర్యం అనిపించేది .ఆ పాటల్లో 95% వరకు అన్నీ ఇళయరాజా బాణీలు సమకూర్చిన పాటలే!

ఒకసారి బాగా ధైర్యం చేసి ఒంటరిగా సినిమా కి వెళ్లాలని అనిపించింది. బహుశా అప్పుడు నాకు 10 సంవత్సరాలు ఉంటాయేమో. థియేటర్ లో రష్ చూసి భయపడ్డా. టికెట్ కౌంటర్ దగ్గర జనాలు తొక్కి చంపేస్తారేమో అనిపించింది. అది చిరంజీవి సినిమా, అదే రోజు రిలీజ్. మొత్తానికి ఒక రిక్షా అతనికి డబ్బులు ఇచ్చి టికెట్ సాధించి, అతను అడిగితే అతనికీ సినిమా టికెట్ కొనుక్కుమ్మని డబ్బులు ఇచ్చి హ్యాపీ గా సినిమా చూసి వెళ్ళాను.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , ఒంటరిగా, నాకున్న ఇష్టం తో సినిమాలకి వెళ్ళటం అప్పుడే మొదలయింది.మా ఊరిలో 6 సినిమా టాకీసులు ( థియేటర్ అని అనకపోయేది అప్పట్లో, టాకీస్ అనే అనేది ) ఉండేవి. ప్రతీ వారం సినిమాలు మారిపోయేవి ఏదో ఒకదాంట్లో.

ప్రతీ శనివారం స్కూల్ నుండి రాగానే అమ్మ దగ్గర్నుండి డబ్బులు తీస్కొని నాకు నచ్చి , కనెక్ట్ అయిన పోస్టర్ ని చూసి, దాని మీద నేను ఇష్టపడే పేర్లు చూసుకుని ఇంకో ఆలోచన లేకుండా ఒక్కడినే వెళ్లిపోయేవాడ్నిఆ సినిమాకి. అలా నచ్చి ఇష్టపడి వెళ్లే  వాళ్లలో “ఇళయరాజా” ఒకరు.

ఇళయరాజా పేరు పోస్టర్ మీద చూస్తే చాలు ఏదో తెలియని ఆనందం. అలా ఎన్ని డబ్బింగ్ సినిమాలు చూశానో లెక్కలేదు. సినిమా కొంచం అటూ ఇటుగా ఉన్నా , నేపథ్య సంగీతం తో సంబరపడేవాడ్ని.

ఈ ఇష్టం మెల్లి మెల్లిగా ఆరాధనగా మారి, ఇళయరాజా భక్తుడిగా మారిపోయా.

“నాయకుడు-గీతాంజలి-అంజలి”, సినిమాల తరువాత ఆ ఆరాధన మణిరత్నం మీదా మొదలయింది. అది తరువాతి రోజుల్లో ఎంతవరకు వెళ్లిందంటే. మణిరత్నం MBA  చేశాడన్న కారణం తో నేనూ MBA చేసే విధంగా ప్రేరేపించింది.సరే అది వేరే విషయం అనుకోండి.

“ఇళయరాజా-మణిరత్నం” కాంబినేషన్ లోని సినిమాలు ఇళయరాజా సంగీతం మీద ఉన్న అభిమానాన్ని ఇంకో స్థాయికి తీసుకు వెళ్లాయి. అలా కాంబినేషన్ తో అద్భుతమైన పాటలు “భారతీరాజా-ఇళయరాజా”, “కే విశ్వనాధ్ -ఇళయరాజా”,”బాలచందర్-ఇళయరాజా”, ” వంశీ-ఇళయరాజా” ,”బాలుమహేంద్ర -ఇళయరాజా”, “కోదండరామిరెడ్డి -ఇళయరాజా”, “గీతాకృష్ణ-ఇళయరాజా” , ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా గొప్ప కాంబినేషన్స్  ఉన్నాయి.

అతిశయోక్తి అనిపించవచ్చేమో కానీ ఇళయరాజా బాణీలు సూటిగా “అనాహత చక్రం “(హృదయ స్థానాన్ని) తాకుతాయేమో అనిపిస్తుంది. లేదంటే అంత లోతుగా మన భావోద్వేగాలని కదిలించటం కష్టమే.

ఇళయరాజా సంగీతమూ, పాటలు , ,మన హృదయాల్ని తాకుతూ , మనలోని “అరిషడ్వార్గాలని”, “నకారాత్మక భావనల్ని” నెమ్మదిగా దహనం చేస్తుంటాయేమో అనిపిస్తుంటాయి.ఆయన సంగీతానికి ఉన్న శక్తి అలాంటిది. డిప్రెషన్ లో ఉన్న సమయం లో ఐతే ఆయన సంగీతమే ఒక మంచి థెరపిస్ట్ లా పని చేస్తుంది. ఇది వ్యక్తిగతంగా నా అనుభవం.

సంగీతం గురించి ఇళయరాజా ఏమంటారంటే ” ఏ సంగీతమైనా ప్రేక్షకుడిని (శ్రోతని) మరో ప్రపంచానికి తీసుకెళ్లాలి. శ్రోత మనసంతా ఆ సంగీత మధురిమలతో నిండి పోవాలి. ఈ సంగీతానికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇది నా మనసుకు ఎందుకు ఇంత దగ్గర ఎందుకు అవుతుంది? అని శ్రోత అనుకోవాలి. ఆ సంగీతం అలా ఉండాలి. భావాన్ని వ్యక్తీకరించటానికి అనేక మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి, మాటల్లో చెప్పలేని భావాల్ని సంగీతం ద్వారా ఆవిష్కరించవచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదు.” అని అంటాడు.

ఇక్కడ నేను ఇళయరాజా నేపథ్య సంగీతాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఆయన పాటలు గురించి మాట్లాడాలంటే అదొక మహాసముద్రం. పాటల గురించి దాదాపుగా అందరికి అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశ్యం తో కేవలం “నేపథ్య సంగీతాన్ని”  ఇక్కడ నేపథ్యంగా తీసుకుంటున్నాను. వీలయితే మరోసారి కేవలం ఇళయరాజా పాటల గురించి ప్రస్తావనతో రాస్తాను. ప్రస్తుతానికి మాత్రం నేపథ్య సంగీతం లో కొన్ని సినిమాల గురించి ప్రస్తావిస్తాను.

నేపథ్య సంగీతం

చాలా తక్కువమంది సంగీత దర్శకులు మాత్రమే నేపథ్య సంగీతం తో ఒక సన్నివేశాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లగలరు. ఇంకా చెప్పాలంటే అలా తమ సంగీతం తోనే సంగీత దర్శకులు కొన్ని సినిమాలని ఆడించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఇళయరాజా స్థానం శిఖరాగ్రం.

దర్శకుడి ప్రతిభ  ఎంత ఉన్నా, ఇళయరాజా నేపథ్య సంగీతం లేకుంటే ఆ సన్నివేశం అంతగా రక్తికట్టదు అనిపిస్తుంది. టీవీ ని మ్యూట్ లో ఉంచి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది. దర్శకుడి ప్రతిభ ని తక్కువ చేయటం నా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. దర్శకుడు ఎప్పటికి “కెప్టెన్ అఫ్ ది షిప్”. అందులో ఇంకో ఆలోచనే లేదు.

నేపథ్య సంగీత పరంగా కొన్ని సినిమాల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను..

గీతాంజలి సినిమా (నాగార్జున, గిరిజ), మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కి నేపథ్య సంగీతం ప్రాణం. మణి రత్నం చెప్పాలని అనుకున్న విషయాన్ని అదే స్థాయిలో ఇళయరాజా తన నేపథ్య సంగీతం ద్వారా  విశదీకరిస్తూ వెళ్తుంటాడు. గీతాంజలి సినిమా ని నేను 100 కంటే ఎక్కువ సార్లు చూసాను. సంభాషణలే కాకుండా BGMs కూడా కంఠతా వచ్చు. సినిమా లో చాలా సందర్భాల్లో నేపథ్య సంగీతం సూటిగా హృదయాన్ని తాకి , దాని తాలూకా ప్రకంపనలు శరీరం మొత్తం వ్యాపించినట్టు అనిపిస్తుంది. సన్నివేశం తో పాటుగా ఆయన సంగీతం తనదైన భాషలో ఆ నేపథ్యాన్ని ప్రేక్షకుడికి విడమరచి చెపుతున్నట్టు అనిపిస్తుంది.

గీతాంజలి క్లైమాక్స్ లో నాగార్జున ఊరికి వెళ్లిపోయే సమయం లో గిరిజ తాను నాగార్జున ని కలవాలని అంటుంది. గిరిజ ని తీస్కుని అంబులెన్సు లో రైల్వే స్టేషన్ కి వెళ్లే సీన్ లో డైలాగ్స్ పెద్దగా ఉండవు. దాదాపు 5 నిమిషాల పాటు ఉండే నేపథ్య సంగీతం ఆ సన్నివేశం లోని ఆంతర్యాన్నిఆవిష్కరిస్తూ ఉత్కంఠగా ప్రేక్షకుడిని ప్రకాష్ , గిరిజ ల మానసిక సంఘర్షణ ఏ స్థాయి లో ఉందొ తెలుపుతుంది.

నాగార్జున, గిరిజ ని ఊరికి దూరంగా వదిలేసి, నడుచుకుంటూ రమ్మంటూ వచ్చేస్తాడు.ఆ  తరువాత గిరిజ చెల్లి నాగార్జున ఇంటికి  వెళ్లి బయట చలిగా ఉంది, అక్క ఇంకా రాలేదు భయంగా ఉంది అని చెపుతుంది. అప్పుడు నాగార్జున, గిరిజ ని వెతకడినికి వెళ్తాడు. తాను ఎంత వెదికినా దొరకకపోవడం తో ఆందోళన ఒక వైపు తను ఏమైందో అన్న భయం ఇంకో వైపు,  ఆ తరువాత గిరిజ దొరగ్గానే ఆనందంగా గిరిజాని లాలించే సన్నివేశం లో పైన చెప్పిన మానసిక స్థాయిలన్నీ నేపథ్య సంగీతం లో కని(విని)పిస్తాయి

సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ , వైరాగ్యం, నిరాశ,ఆకర్షణ, కరుణ, రౌద్రం, భయం..ఇలా ప్రతీ భావోద్వేగానికి సరిపోయే నేపథ్య సంగీతం, కథకి అనుగుణంగా, పాత్రల్లో, సన్నివేశాల్లో కరిగిపోయి, మిళతం అయ్యేలా చెయ్యటం ఇళయరాజాకే సాధ్యం.

ఇళయరాజా కి ముందు గాని ఆ తరువాత వచ్చిన సంగీత దర్శకులు కానీ(కొందరు) , కొన్ని సన్నివేశాలకి రెడీమేడ్  BGMs ఇచ్చేవారు .చాలా మూసగా ఉండేవి అవి.

ఉదాహరణగా చెప్పాలంటే విలన్ కనిపించే సన్నివేశంలో, కామెడీ సన్నివేశాల్లో బాగా ఉపయోగించిన BGM లనే వాడేవారు. కొత్తగా మళ్ళీ కంపొసిషన్ కి టైం దొరక్కో, అవసరం లేదు అనుకునో , అన్ని సినిమాల్లో దాదాపుగా అవే BGMs ఉండేవి అప్పట్లో.

కానీ ఇళయరాజా ఆ కథకి, పాత్ర స్థాయి కి అనుగుణంగా నేపథ్య సంగీతాన్ని ఇచ్చేవాడు. ఆ తపన మనకి తెర మీద కనిపించేస్తుంది. ఒక హోమియో వైద్యుడిలా,” పొటెన్సీ” ఎంత అవసరమో అంతే డోసెజి ఉంటుంది తాను ఇచ్చే నేపథ్య సంగీతం.అంతలా తపన పడతాడు రాజా.

రుద్రవీణ సినిమా లోని ఒక సన్నివేశం లో చిరంజీవి కోపంగా తన తండ్రిని నిలదీస్తాడు. తాను ఒప్పుకుని ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండేవాళ్ళం అని చెపుతూ, ఆ చావుకి కారణం “మీరే” అంటాడు. ఆ మాట విని చిరంజీవి వదిన సుమిత్ర, చిరంజీవి ని చెంపదెబ్బ కొట్టి తండ్రిని అనేంత గొప్పవాడివి అయ్యావా? అని మందలిస్తుంది.ఆ తరువాత చిరంజీవి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు.ఆ సందర్భంలోనిది ఇది.

హృదయం సినిమా లో మురళి, హీరా ని ప్రేమించి తనతో చెప్పేస్తాడు. తరువాత క్లాస్ లో కూర్చుని వెళ్లిపోయేముందు హీరా తనతో మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ బెంచ్ మీద తల పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. హీరా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది.తన దగ్గరికే వస్తుండటంతో తనతోనే మాట్లాడటానికి వస్తుందేమో అని ఆశగా చూస్తున్నంతలో హీరా, ” పర్సు మర్చిపోయా”, అని తీస్కుని వెళ్లి పోతుంది”.ఇక్కడ నేపథ్య సంగీతం మురళి మానసికంగా పడే వేదనని తెలియపరుస్తుంది. హృదయం సినిమాలో నేపథ్య సంగీతం మొత్తం చాలా అద్భుతంగా  ఉంటుంది.

శివ సినిమా లో ఒక సందర్భం లో నాగార్జున , జె డి చక్రవర్తి ని కొట్టే సన్నివేశం లో ఇళయరాజా bgm రెగ్యులర్ గా ఫైట్ కి ఇచ్చేట్టుగా కాకుండా ,  పాథోస్ BGM ఇస్తే,  రాంగోపాల్ వర్మ కి అర్థం అవలేదట. “ఏంటి రాజా గారు ఇలా పాథోస్(విషాదం) బిట్ ఇచ్చారు?” అని అడిగితే అని అడిగితే  సమాధానంగా ఇళయరాజా ” ఎంతో కష్టపడి చదువుకొమ్మని తల్లిదండ్రులు పంపిస్తే వీళ్ళు ఇలా గొడవల తో భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు కదా అందుకని, పాథోస్ ఇచ్చాను” అని చెప్పారట ఇళయరాజా .ఈ విషయం రాంగోపాల్ వర్మే ఒకసారి ప్రస్తావించాడు.

శ్రీరామరాజ్యం సినిమా, ఒక దృశ్య కావ్యం.బాపు గారి కుంచె కి ఇళయరాజా సంగీతం తోడై , అవి సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. లైవ్ ఆర్కెస్ట్రా తో ఇళయరాజా సృష్టించిన సంగీతం మహాద్భుతం గా ఉంటుంది. ఈ సినిమాకి సంగీతాన్ని ఒక తపస్సులా భావించి చేశారనిపిస్తుంది. పాశ్చాత్య సంగీతకారులతో, సింఫనీ తో శ్రీరామరాజ్యం లాంటి పౌరాణిక సినిమా కి ప్రాణప్రతిష్ట జరిగింది. అందులోని సన్నివేశాలు..

సీతాదేవి రాముని అంతఃపురానికి అదృశ్య రూపంలో వాల్మీకి పంపినప్పుడు , సీతమ్మ తన బంగారు విగ్రహాన్ని చూసే సన్నివేశం.

భూదేవి సీతాదేవి ని తనతో పాటు తీసుకువెళ్లే సన్నివేశం. సీతాదేవి రాముడికి చివరి వీడ్కోలు పలికే ఈ సన్నివేశం లోని నేపథ్య సంగీతం మన కన్నులు చెమర్చేలా చేస్తుంది. చాలా హృద్యంగా ఉంటుంది.

ఇలా చూపుతూ వెళితే కొన్ని వందల సినిమాల గురించి చెప్పుకోవచ్చు . కానీ అన్నిటినీ ప్రస్తావించాలంటే ఒక మహాగ్రంథమే అవుతుంది. ఇక్కడ సమయాభావం వల్ల కొన్నిటిని మాత్రమే తీసుకున్నాను. నేను  ప్రస్తావించని సినిమాలు చాలా ఉన్నాయి, అంతమాత్రం చేత ఆ సినిమాలు గొప్పవి కాదని కాదు. సందర్భానుసారంగా నాకు తెలిసినవి కొన్నిటిని గురించి చెప్పాను.అర్థం చేసుకుంటారని ఆశిస్తాను

(మళ్ళీ వచ్చే వారం!)

ప్రతి గజల్ ఒక ఆత్మ కథే!

jag1

గజల్ రారాజు జగ్జిత్ సింగ్ గురించి నేను ఎపుడూ ఒకటి అనుకుంటా.. “గంధర్వులు అప్పుడప్పుడు శాపగ్రస్థులయి భూమి పై జన్మిస్తారని” ఒక ప్రతీతి. అలాంటి వారే జగ్జిత్ అనిపిస్తుంటుంది. మన అదృష్ట వశాత్తు తన సంగీతం తో, గానం తో మనల్ని అలరించటానికే తను ఈ జన్మ తీస్కున్నరేమో..!

స్కూల్ లో ఉన్నప్పుడు మా నాన్న గారి వల్ల జగ్జిత్ గజల్స్ తో పరిచయం ఏర్పడింది. మొదట్లో పాటల్లోని సాహిత్యం అర్థం అవకున్నా, గానం లోని మాధుర్యం కట్టిపడేసేది. తరువాత తరువాత సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ వింటూంటే జగ్జిత్ కి, తన గజల్స్ కి బానిసని అయిపోయా.

దాదాపు 10 సంవత్సరాల క్రితం 2004 లో మెల్బోర్న్ (ఆస్ట్రేలియా) లో  జగ్జిత్ సింగ్ సంగీత కచేరి కి వెళ్ళే మహద్భాగ్యం కలిగింది. దాదాపు 3 గంటల పాటు సాగింది ఆ సంగీత కచేరి. ప్రేక్షకుల కోరిక మేరకు 2-3 పాటల్ని మళ్ళీ మళ్ళీ పాడారు. ఆ కచేరీ లో ఉన్నంతసేపు ఇది నిజమేనా? అనిపించింది. ఏదో తెలియని లోకాలకు ప్రయాణం చేసినట్టు గా అనిపించింది. ఆ ట్రాన్స్ లోంచి బయటకు రావడానికి చాల సమయం పట్టింది..!

జగ్జిత్ పాటల్లో “ఆత్మకథలు” ఉంటాయి. ఎలాంటి భేషజాలు లేని స్వచ్చమయిన ఆత్మ కథలు. అవి మన అందరి కథలు . అందుకే అవి మన ఆత్మ లోతుల్ని తడతాయి. గతం తాలుకా అనుభవాల్ని, అనుభూతుల్ని, మదిలోని గాయాల్ని మెల్లిగా తడుతుంది తన పాట..తన శ్రోతలకి తన పాటలనే “ఆత్మ బంధువుల్లా” పంపిస్తారు జగ్జిత్, అవి మనతో జీవితాంతం ప్రయాణిస్తాయి.

జగ్జిత్ తన స్వస్థలం లో పండిట్ చగన్ లాల్ శర్మ దగ్గర రెండు సంవత్సరాలు సంగీతం నేర్చుకున్నారు. తరువాత “సైనియా ఘరానా” కి చెందిన ఉస్తాద్ జమాల్ ఖాన్ వద్ద ఆరు సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.పంజాబ్ మరియు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, లేట్ ప్రొఫెసర్ సూరజ్ భాన్ సంగీతంలో అతనిని ఎంతగానో ప్రోత్సహించాడు. 1965 లో ముంబై వచ్చినేపథ్య గాయకుడు గా మారాడు జగ్జిత్ . మొదట్లో పెళ్ళిళ్ళలో, వేడుకల్లో, ప్రకటనలకి  పాడుతూ తన సంగీత ప్రస్థానం మొదలు పెట్టాడు. ఇదే సమయం లో తన జీవిత భాగస్వామి చిత్ర ని కలిసాడు , ఆ తరువాత రెండు సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నారు.

1976 లో వచ్చిన ఆల్బం “ది అన్ ఫర్గేటబుల్స్” తో తన దశ తిరిగింది. అతి పెద్ద హిట్ ఆల్బం గా రికార్డులు సొంతం చేసుకుంది. ఆ ఆల్బం గజల్ సంగీతాన్ని సమూలంగా మార్చేసింది. అందులోని “బాత్  నిక్లేగి  తో  ఫిర్  దూర్  తలక్  జాయేగీ” తను పాడిన మొదటి పాట.

జగ్జిత్ సినిమాలలో పాడిన పాటలు తక్కువే కానీ, పాడిన పాటలన్నీ అధ్బుతాలే.

మహేష్ భట్ కి జగ్జిత్ తో తన సినిమా కి సంగీత దర్శకత్వం చేయించాలన్న  ఆలోచన రావటం దాన్ని అమలు పరచటం  “అర్థ్” సినిమా కోసం జరిగింది. “అర్థ్” సినిమా కి “ఆత్మ” కథ అయితే “అంతరాత్మ” జగ్జిత్ పాట. పాటలకి “ప్రాణ ప్రతిష్ట” చేసాడు జగ్జిత్. ఆ సినిమా లోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “అర్థ్” సినిమా మహేష్ భట్ “ఆత్మకథ” (సెమి ఆటో బయోగ్రఫీ). (సినిమా కోసం కొన్ని సంఘటనలని మార్చటం జరిగింది). అంతలా తను ఇష్టపడి ప్రాణం పెట్టిన కథ కి జగ్జిత్ ని సంగీత దర్శకుడిగా, గాయకుడిగా నిర్ణయించుకోవటం తోనే మహేష్ భట్ సగం విజయం సాదించాడు . రాజ్ కిరణ్ (హీరో) పాడుతుంటే, ఆ పాటలోని “సాహిత్యాన్ని”, ఆ పాత్రలోని “మానసిక సంఘర్షణ” ని జగ్జిత్ ఎంతగా అనుభవించి పాడారో తెలుస్తుంది.

“తుమ్ ఇత్నా జో ముస్కురారహేహో క్యా గమ్ హై జిస్కో చుపా రహేహో “…”ఇంతలా ఎందుకు నవ్వుతున్నావు? ఏ విషాదాన్ని దాస్తున్నావు?” అంటాడు.

జగ్జిత్ గురించి మహేష్ భట్ అంటాడు ..”బొంబాయి మెట్రో సినిమా లో “అర్థ్” సినిమా రిలీజ్ ఆయినరోజు, “ఝుకీ ఝుకీ సీ నజర్” పాట మొదలయింది.పాట అయిపోగానే హాల్ మొత్తం “వన్స్ మోర్” అన్నారు. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఒక సినిమా పాట ని హాల్ మొత్తం, ప్రేక్షకులంతా  ఏక కంఠం తో “వన్స్ మోర్ ” అనటం నా జీవితం లో ఎప్పుడూ చూడలేదు” .
కైఫీ ఆజ్మి సాహిత్యాన్నిజగ్జిత్  “ఉచ్చాస” లా లోపలి స్వీకరించి, తన “నిశ్వాస”లో సంగీతాన్ని ఇచ్చాడు అంటాడు మహేష్ భట్  “అర్థ్” సినిమా సంగీతం గురించి చెబుతూ..

కొందరికి జగ్జిత్ పాటల్లోని విషాదం , నకారత్మకం గా అనిపించవచ్చు. కాని అవి గాయపడిన మనసుకి సాంత్వన ని ఇచ్చే మందు గుళికలు.అలా అని అన్నీ విషాద గీతాలే పాడలేదు. చిత్ర తో కలిసి ఎన్నో ప్రణయ గీతాలూ పాడాడు. మరెన్నో హుషారు గా ఉండే గీతాలు, భక్తి గీతాలు, ఇలా  అన్ని రకాలయన పాటలూ పాడాడు.

ప్రతీ వ్యక్తి  తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన వేదనే జగ్జిత్ తన పాటలతో స్పృశిస్తాడు.

“చిట్టీ న కోయి సందేశ్ జానే వొహ్ కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే…ఇస్ దిల్పే లగాకే టేస్ జానే వో కౌన్ సా దేశ్ జహాన్ తుమ్ చలేగయే”

ఈ పాట మరణించిన తన సోదరి కోసం కాజల్ ఏడుస్తున్న సందర్భం లో వస్తుంది. (“దుష్మన్” సినిమా నుండి). కాని ఈ పాట ని ఇంకో కోణం లో కూడా చూడొచ్చు. మనకి బాగా ఆత్మీయులయిన వ్యక్తులు- స్నేహితులో, బంధువులో, ప్రేమికులో, మన నుండి దూరమై తిరిగి మళ్ళీ కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ పాటలోని “పల్లవి” ఆ వ్యక్తి పడే వేదనని ప్రతిబింబిస్తుంది.

“ఒక లేఖయినా,  ఒక సందేశం”  అయినా ఇవ్వకుండా నా హృదయాన్ని గాయపరిచి తెలియని దేశాలకి వెళ్ళిపోయావు ” అంటాడు.

జగ్జిత్ తో పని చేసిన పాటల రచయితలు అందరూ చాలా గొప్ప సాహిత్యాన్ని అందించారు . జగ్జిత్ వారి సాహిత్యాన్ని తన గానం తో చాలా ఉన్నత స్థాయి కి తీసుకెళ్ళాడు.

“గుల్జార్-జగ్జిత్” కాంబినేషన్ లో వచ్చిన “మరాసిం” ఆల్బం లో ప్రతీ పాట గజల్ ప్రపంచం లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎన్ని సార్లు విన్నా, వింటున్న ప్రతి సారి ఏదో కొత్త అర్థం స్పురిస్తుంది,కొత్త అనుభూతి విని(కని)పిస్తుంది.

“శామ్ సే ఆంఖ్ మే నమీ సీ హై ..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై..”

“సాయంకాలం నుండి కళ్ళలో చెమ్మగా ఉంది..ఈ రోజు మళ్ళీ నువ్వు లేని లోటు తెలుస్తూ ఉంది”

“మరాసిం” గురించి గుల్జార్ అంటాడు ” నాకు జగ్జిత్ తో అనుబంధం నా సీరియల్ “మిర్జాఘలిబ్” నాటిది. ఆ సీరియల్ కి జగ్జిత్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో ఛాలా సులువుగా, అలవోకగా ట్యూన్స్ అందించేవాడు. అది చూసి నేను ఆశ్చర్య పోయేవాడ్ని. “గజల్స్ ” కి ఒక ప్రత్యేకమయిన “ఆలాపనా” , “ఉర్దూ” సాహిత్యాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రతిభా అవసరం. ఆ రెండూ జగ్జిత్ లో పుష్కలంగా ఉన్నాయి. అదే సమయం లో “మరాసిం” ఆల్బం సాహిత్యాన్ని తనకి చూపించా. కొన్ని సులువుగా అనిపిస్తాయి కాని ఛాలా సమయం తీసుకుంటాయి. “మరాసిం” ఆల్బం ని పూర్తి చేయడానికి మాకు 6 సంవత్సరాలు పట్టింది”. పరిపూర్ణత కోసం వారు పడ్డ తాపత్రయం చెప్పకనే చెబుతుంది ఈ మాట.

“మీర్జాఘాలిబ్” సీరియల్ ద్వారా ఘాలిబ్ ని ప్రాచుర్యం లోకి తీసుకువచ్చినందుకు గానూ 1998 లో భారత ప్రభుత్వం “సాహిత్య అకాడెమి అవార్డు” ద్వారా జగ్జిత్ ని సత్కరించారు.

మాజీ ప్రధాని వాజ్ పాయి కవితలతో, జగ్జిత్ గానం తో వెలువడ్డ ఆల్బం “సంవేదన”. వాజ్ పాయి గారి కవితలకి జగ్జిత్ ప్రాణం పోసాడు. జీవితం లోని తాత్వికత ఆ పాటల్లో ఉంటుంది.

“క్యా ఖోయా క్యా పాయా జగ్ మే ..మిల్తే ఔర్ భిగడ్ తే పగ్ మే”

“జీవితం లో సాధించింది ఏంటి? కోల్పోయేది ఏంటి? కూడళ్ళలో కలుస్తూ విడిపోతుంటాము..ప్రతీ అడుగులో ద్రోహం ఉన్నా, నాకు ఎవరిపయినా ఫిర్యాదు లేదు.గడిచిపోయిన కాలం పైన దృష్టి సారిస్తే మాత్రం జ్ఞాపకాల భాండాగారం కదులుతుంది ”

జగ్జిత్ గానం “బోల్ ప్రధాన్” పద్దతిలో సాగుతుంది. దీని విశిష్టత ఏంటంటే “మాటలని” ఉచ్చరించే పద్ధతి పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది.

“జగ్జిత్ కి ముందూ గజల్ గాయకులు, చాలా గొప్ప హేమా హేమీలు ఎంతోమంది ఉన్నారు. “బేగం అఖ్తర్, మేహది హసన్ ” లాంటి వారూ ఉన్నారు. కానీ వారి గజల్స్ సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేట్టు ఉండేవి కాదు. ఎందుకంటె అవి “శాస్త్రీయ సంగీత” ప్రధానంగా ఉంటాయి.  జగ్జిత్ గజల్స్ “సాహిత్యాన్ని , సంగీతాన్ని” ఎంతగా సరలీకరించారంటే అవి సినిమా పాటల్లా సామాన్య ప్రజానీకానికి చేరువయ్యాయి. జగ్జిత్ గజల్స్ కవితాత్మకంగా ఉంటూనే, సరళంగా మార్చబడి  శ్రోతలని రంజింపజేసాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా జగ్జిత్ కి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.  హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలు ఎక్కడున్నా జగ్జిత్ గజల్స్ కి వీరాభిమానులుగా మారిపోయారు”, అంటారు పాటల రచయిత “జావేద్ అఖ్తర్”

“వొహ్ కౌన్ హాయ్ దునియామె జిసే గమ్ నహి హోతా? ..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాథం నహి హోతా?”

–“ప్రపంచం లో బాధలు లేనిది ఎవరికీ? ఎవరి ఇంట్లో కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి? మరణం (ఎవరైనా మరణించినప్పుడు కలిగే శోకం) లేకుండా?”

మరణించిన తన  కొడుకు ని తిరిగి బ్రతికించాలని ఒక మహిళ “బుద్ధుడి” వద్దకు వెళుతుంది. అపుడు బుద్ధుడు బ్రతికిస్తాను కానీ, అంటూ ఒక షరతు విధిస్తాడు ” ఇంతవరకూ ఎవరూ మరణించని ఒక ఇంటి నుండి పిడికెడు “ఆవాలు” తీసుకురమ్మని చెపుతాడు.

పరుగు పరుగున ఆ గ్రామం లోని ప్రతి ఇంటికి తిరుగుతుంది ఆ మహిళ, సాయంకాలం వరకూ అలా తిరుగుతూనే ఉంటుంది. వెళ్ళిన ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు మరణించే ఉంటారు. చివరికి తనకి అర్థం అవుతుంది, మరణాన్ని ఎవరూ ఆపలేరు అని. ఆ సత్యాన్ని తెలుసుకోవటానికే బుద్ధుడు తనకి ఈ షరతు పెట్టాడని. చివరికి బుద్ధుడి వద్దకు వెళ్లి తనకి సత్యం అవగతమైంది అని కృతజ్ఞతతో, ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఈ గజల్ లో సూక్ష్మంగా ఇదే విషయాన్ని చెప్పారనిపిస్తుంది. “జననం-మరణం” ఇవి రెండే జీవితం లో సత్యాలు, మిగతావన్నీ “మిథ్యే ” అంటారు దార్శనికులు. “సంతోషం-దుఃఖం” , “జననం-మరణం” ద్వందాలు కావు, అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు.

సెప్టెంబర్ 23,2011  న ముంబాయి లో జగ్జిత్ , గులాం అలీ తో సంగీత కచేరి లో పాల్గోవాల్సిన సమయం లో తీవ్ర అస్వస్థత కి గురయ్యారు. “సెరిబ్రల్ హమోరేజ్ “అని తెలిసింది. రెండు వారాలు కోమాలో ఉన్న తరువాత , అక్టోబర్ 11 , 2011 న లీలావతి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.

జగ్జిత్ విషయం లో “తుది శ్వాస” విడిచారు అనటం సరైంది కాదేమో..ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తనని అభిమానించే కోట్లాది అభిమానుల గుండెల్లో నిండి , వారి “ఉచ్చ్వాస , నిశ్వాస” ల్లో సంగీతం ఉన్నంతకాలం అమరుడయి, చిరంజీవిలా ఉంటాడు.

జగ్జిత్ సింగ్ కి ఎన్నో పురస్కారాలు లభించాయి. అందులో ముఖ్యమైనవి –

-2012 లో రాజస్థాన్ ప్రభుత్వం “రాజస్థాన్ రత్న” అవార్డు తో సత్కారం (మరణించిన తదుపరి)

-2003 లో భారత ప్రభుత్వం “పద్మ భూషణ్” తో సత్కరించింది.

-1998 లో “మీర్జా గాలిబ్” కి సాహిత్య అకాడమీ అవార్డు (“గాలిబ్ గీతాల్ని” ప్రాచుర్యం లోనికి తీసుకు వచ్చినందుకు)

ఇలా ఎన్నో పురస్కారాలు…మరెన్నో రికార్డులు..!

-“అర్థ్&సాత్ సాత్” కాంబినేషన్ ఆల్బం HMV సంస్థ లో లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు ను సొంతం చేసుకుంది.

-“సజ్దా” ఆల్బం కూడా ఇలాంటి రికార్డు నే సొంతం చేసుకుంది. 1991 లో లతా  మంగేష్కర్ తో చేసిన ఈ ఆల్బం “నాన్-ఫిలిం” కాటగిరి లో  లార్జెస్ట్ సెల్లింగ్ ఆల్బం ఆఫ్ అల్ టైం గా రికార్డు  సాధించింది.

జగ్జిత్ ని తన కొడుకు మరణం బాగా కుంగదీసింది. “విషాదాన్నే” తన “సంతకంగా” మార్చి అభిమానుల హృదయాల్లో ఎన్నటికీ చెరగని ముద్ర వేసాడు. తన భార్య చిత్ర తో కలిసి పాడటం తన కొడుకు మరణం తోనే ఆగిపోయింది. తన ఊపిరి ఆగే వరకు తను ఎక్కువగా విషాదం తో నిండి, హృదయాన్ని ద్రవింపజేసే పాటలే పాడాడు.

జగ్జిత్ అభిమానులకి మాత్రం తను లేరన్న విషయం గుర్తొచ్చినప్పుడు, తన పాటే గుర్తొచ్చి కళ్ళు చెమరుస్తాయి, గుండె బరువెక్కుతుంది.. “శామ్ సే ఆంఖ్ మే నామీ సీ హై..ఆజ్ ఫిర్ ఆప్ కీ కామీ సీ హై” అని…

jsg2

 

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

శరత్ కుమార్

శరత్ కుమార్

 

ఒక దశాబ్దం క్రితం వచ్చిన “యాదే”(హిందీ) సినిమాలో ఒక పాట ఉంటుంది. “నగ్మే హై, షిక్వే హై, కిస్సే హై, బాతే భూల్ జాతే హై, యాదే యాద్ ఆతే హై” అని. అలా కలకాలం గుర్తుండిపోయే యాదే, సామల సదాశివగారి “యాది”.

సామల గారి రచనా శైలి విలక్షణం, తనదైన ప్రత్యేక శైలిలో,పాఠకుడిని మంత్ర ముగ్దుడిని చేస్తారు. వారి శైలి విశిష్టత ఏంటంటే మన పక్కనే కూర్చుండి, మనతో మాట్లాడుతూ ఆ జ్ఞాపకాల్నితను నెమరు వేసుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంటుంది. “రచయిత-పాఠకుడు ” అన్న గీతని చేరిపివేస్తారు. అప్పటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళి మనల్ని తన జీవితపు మధుర జ్ఞాపకాల్లో విహరింపజేస్తారు.

నీ యాదిలోని ముచ్చట్లు చెప్పు తాతా….! అని తన మనవడు అడిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, తనకోసం ఈ ముచ్చట్లు గుర్తు చేసుకుంటున్నట్లుగా- మనవడా ఇదిగో విను..అంటూ తన జ్ఞాపకాల దొంతరలోంచి ఒక్కొక్కటిగా విడమరచి చెబుతుంటారు.

“గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి “సఫీ లఖ్నవీ”. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు- మనకి తెలుసు. కాబట్టి మనమే గతం లోకి వెళ్లి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి,పాఠకుల ముందు పరిస్తే మంచిది-అంటారు సదాశివ. ఈ “యాది” మొత్తం ఆ ప్రయత్నమే. “జో సునా ఉస్కా భళా- జోనసునా ఉస్కా భళా”..ఎవరు విన్నారో వాళ్లకు మేలగుగాక-ఎవరు వినలేదో వాళ్ళకూ మేలగుగాక.

సదాశివ గారు రుబాయిల గురించి, సూఫీ కవుల వేదాంతం గురించీ చెబుతారు. సూఫీ వేదాంతపు లోతులను అర్థం చేసుకుని, దాన్ని భారతీయ వేదాంతం తో అన్వయించుతూ తను ఎలా ఆ సూఫీ కవుల రచనల్ని (కవితల్ని) అనువదించారో చెబుతారు. ఇందులో మొదటగా చెప్పుకోవలసింది “అమ్జద్” గారి గురించీ.ఆయన్ని “హజ్రత్ అమ్జద్ హైదరాబాది” అంటారు. అతనొక సూఫీ కవి. అతని రుబాయీలు ప్రశస్తమైనవి.

“రామ్ కా జిక్ర్ హర్ నామ్ మే హై
రామ్ సబ్ మే హై సబ్ రామ్ మే హై”
“అన్ని పేర్లలో రాముని ప్రసక్తి ఉన్నది. అన్నింటిలో రాముడున్నాడు. రామునిలో అన్నీ ఉన్నాయి”. అంటారు అమ్జద్.

సూఫీలలో  చిస్తియా సంప్రదాయానికి చెందిన మరొక సూఫీ “యాషిన్ షా” గురించీ చెబుతూ, ఈ మౌల్వీ సాహెబ్ గొప్పదనానికి ఒక విషయం చెబుతారు. “మౌలానా అబుల్ కలాం ఆజాద్” ఖురాన్ షరీఫ్ కి భాష్యం రాసేటప్పుడు సందేహాలు వస్తే, ఈ మౌల్వీ సాహెబ్ కి ఉత్తరాలు రాసి ప్రత్యుత్తరాల ద్వారా తన సందేహాలు తీర్చుకునేవారట.

కాళోజీ రామేశ్వర రావు గారు అసలు ‘కవిత’ కి ఇచ్చిన నిర్వచన అద్భుతంగా అనిపిస్తుంది.
“జరాసా జోష్ థోడా దర్ద్ థోడా ఖులూసే దిల్
మిలాకర్ డబ్సే దిల్ కి బాత్ కహ్ దో షాయిరీ హోగీ”
“కొంచం ఆవేశం, కొంచం ఆవేదన, కొంచం సహృదయత ఇవన్నీ కలిపి ఒక పద్ధతిలో మనసులోని మాటను చెప్పండి. అది కవిత్వమవుతుంది” అని అర్థం. పద్ధతి అంటే “శైలి”, “రీతి”. భావం మనసులోనిది ఉండాలి. కవిత్వానికి ఇంతమంచి నిర్వచనం చదవలేదనిపిస్తుంది.

సదాశివ

సదాశివ

కాళోజీ నారాయణ రావు గారు మిర్జా గాలిబ్ కవితనొకటి చెప్తారు.

“ఖైదే యయాత్ బందే గమ్ అస్లమే దోనో ఏక్ హై
మోత్ సే పహారే ఆద్మీ గమ్ సే సజాత్ పాయే క్యోం”

తాత్పర్యం ఏంటంటే “జీవిత బంధంలో ఉన్నంత కాలం బాధలు ఉండేవే. మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుండి ఎలా తప్పించుకుంటాడు?” అని. ఈ సమయం లో నాకు జగ్జిత్ సింగ్ ఘజల్ ఒకటి గుర్తొస్తుంది. “వొహ్ కౌన్ హై దునియా మే జిసే గమ్ నహీ హోతా..కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాతం నహి హోతా?”

అర్థం ఏంటంటే “ప్రపంచం లో బాధలు /దుఖం లేని మనిషి ఎవరు ? సంతోషం తప్ప మృత్యువు ఉండని ఇల్లు ఉంటుందా?”  అని.
ఈ రెండూ ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయన్న భావనతో ఈ ఘజల్ ని ప్రస్తావించటం జరిగింది.

మీర్జా గాలిబ్ కి కఠినం గా ఉండే కవిత చెప్పటం ఇష్టమట. అతని సమకాలీనులు “అయ్యా..! ,ఈ కవిత మీకే అర్థం కావలె లేదా పైవానికి అర్థం కావలె. మా లాంటి వాళ్లకు అర్థం అయ్యేది కాదు” అని పరిహసించేవాళ్ళట.

“జిస్ ఖదర్ లోగోంకో నా తిఖ్..! యాద్ హై
హై వహీ దీవనె-మత్బూ -ఆ మేరా ”

    అంటే ‘ఎంతవరకు నా కవిత లోకుల నాలుకల మీద నిలచివున్నదో అదే ముద్రితమైన నా దివాన్ అని అంటారు “నాతిఖ్ లఖ్నవీ” అనే కవి. (దివాన్ అంటే కవితా సంకలనం)సామల గారి రచనలు కూడా అంతే. లోకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని కూర్చుంటాయి. మధురానుభూతులుగా పదే పదే నెమరువేసుకునేలా చేస్తాయి. పాఠకులకి ఎన్నో యాదిలు (జ్ఞాపకాలు) మిగిల్చే పుస్తకం యాది. “అయ్యో ఉర్దూ రాదే, నేర్చుకుంటే ఇంకా బాగా ఈ కవితా మాధుర్యాల్ని ఆస్వాదించవచ్చు” అనిపిస్తుంది.అమరగాయకుడు కె. ఎల్. సైగల్ ఎవరి దగ్గరా నేర్చుకోకున్నా దైవదత్తమైన అద్భుత కంఠంతో ఎన్నటికీ మర్చిపోలేని పాటలు పాడారు. అతని పాటలకు పరవశించని వారెవరు? అని అడుగుతారు సదాశివ.అవును.!ఆ గాన మాధుర్యానికి పరవశించని వారేవరుంటారు? ప్రస్తుత కాలంలో కేవలం రనగొనధ్వనుల సంగీతం తో ఐపాడ్ లో పాటలు వింటూ తామూ  సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాము, అనుకునే నేటి తరానికి సైగల్ పాటలు రుచించవేమో కాని, సంగీతం, గానం లోని రసాస్వాదానికి అలవాటున్న వారికి ఇప్పటికీ ,ఎప్పటికీ సైగల్ పాటలు మరచిపోలేని “గాంధర్వ గాన మాధుర్యాలే”.తన నవలల్ని సినిమాలుగా తీస్తూ కె. ఎల్. సైగల్ కు హీరో పాత్ర అప్పగించి ఉచ్చారణ అంత సరిగాలేని బెంగాలి పాటలు అతని నోటివెంట పాడిస్తూ విని శరత్ బాబు అంతటివాడు పరవశించినాదట. శరత్ బాబు సుప్రసిద్ధ నవలా రచయితే కాక చిత్ర లేఖనం, శాస్త్రీయ సంగీతం లో ప్రవేశమున్నవాడు.సినిమా రంగంలో సైగల్ పాటలకు లభించిన కీర్తికి అసూయ పడే వాళ్ళు కొందరు అతన్ని “బేపీర్” అని ” బే ఉస్తాదియా” అని పరిహసించేవాళ్ళట. అంటే ఏ గురువు దగ్గరా సంగీతం నేర్చుకొని వాడని.

ఆగ్రా ఘరానా ను రంగీలా ఘరానా అని అంటారు. ఆ ఘరానా లో నాయకమణి వంటివాడు ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్”.

ఒకసారి ఎక్కడో ఒక చోట ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ కాళ్ళు జాపి పడుకుని శిష్యులతో మాట్లడుతున్నాడట. కె. ఎల్. సైగల్ అతని కాళ్ళు అదుముతూ కూర్చున్నాడట. అది గమనించిన ఉస్తాద్ లేచి కూర్చుండి “ఇదేమిటి కుందన్ లాల్?” నువ్వు ఇప్పటికే గొప్ప గాయకునివి మేమంతా నీ పాటలకు ముగ్దులము అవుతున్నాము. ఈ సేవ ఎందుకు?” అని ప్రశ్నించాడట.

“ఉస్తాద్ నన్నంతా బే పీర్ అని బనాయిస్తున్నారు.మీ వంటి ఉస్తాద్ శిష్యుణ్ణి అనిపించుకోవటం నాకు గర్వ కారణం. మిమ్మల్ని ఇలాగే సేవించుకుంటాను. ఏదైనా అనుగ్రహించండి” అని వేడుకున్నాడట కె. ఎల్. సైగల్. ఉస్తాద్ అతన్ని శిష్యునిగా స్వీకరించి కొన్ని రాగాలు శ్రద్ధగా నేర్పినారట. అందులో ముఖ్యమైన రాగం భైరవి.
గురుశిష్యుల అనుభంధం అలా ఉండేది ఆ రోజుల్లో. సైగల్ అంతటి స్థాయిలో ఉండి కూడా గురు శుశ్రూషకి అంతటి విలువనిచ్చాడు.

– శరత్ కుమార్ గడ్డమీది