బీఫ్‌పై మాట- పాట- ఒక సాంస్కృతిక నిరసన!

వొమ్మి రమేష్ బాబు

 

nandi award 012“పెద్దపులి గడ్డి మేసింది…”’
ఈ వాక్యం శాస్త్రసమ్మతంగా ఉందా..? పోనీ…
“ఆవు మాంసభక్షణ చేసింది..”’
ఈ వాక్యాన్ని లోకం మెచ్చగలదా..? మెచ్చదు. ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం.
బీఫ్‌ ఈటర్స్‌ కూడా అంతే! వాళ్లు బీఫ్‌నే తింటారు. బీఫ్‌ తినొద్దనీ, పప్పు తినమని వాళ్లని నిర్బంధించడం లోక విరుద్ధం.
తప్పు అని తెలిసి కూడా ఈ పనికి ఇప్పుడు భారత పాలకులు ఒడిగడుతున్నారు. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికే గోవధ నిషేధం అమలవుతోంది. గోవధ చేసినా, ఎద్దుమాంసం అమ్మినా, కొనినా, తిన్నా కేసులు పెడుతున్నారు. దేశమంతటా గోవధ నిషేధం విధించాలన్న నినాదం విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మే 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని లామకాన్‌లో “బీఫ్‌ బచావో ఆందోళన్‌” ఆధ్వర్యంలో బీఫ్‌పై మాట- పాట- కవిసమ్మేళనం జరిగింది. జూపాక సుభద్ర, పసునూరి రవీందర్‌, నలిగంటి శరత్‌, స్కైబాబా, జిలుకర శ్రీనివాస్‌ ప్రభృతుల పిలుపుతో బీఫ్‌ ఈటర్స్‌, ఫుడ్‌ డెమొక్రసీని కోరుకునే యాక్టివిస్టులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశంలో కోట్లాదిమంది తినే ఆహారం బీఫ్‌. అది వారి ఇష్ట భోజనం. నోటికాడి విందు. పంటికింద ముక్క. చౌకగా దొరికే మాంసం. ఎద్దుకూరే వారికి దిక్కు- దివాణం. మందు- మాకు. బలం- పోషకం! ఘనత వహించిన మన భారతదేశంలో ఇప్పుడు ఆ కూర తినొద్దని ఆంక్షలొస్తున్నాయి. గోవథ నిషేధ చట్టాల పేరుతో బీఫ్‌ ఈటర్స్‌ గొంతు కోయాలనుకుంటున్నారు. గోవుని దేవతగా ప్రొజెక్టు చేయడం ద్వారా ఈ దేశ మూలవాసుల ఆహార హక్కుమీదే ఉక్కుపాదం మోపే కుట్ర జరుగుతోంది. ఈ కుట్రని కలిసికట్టుగా తిప్పికొట్టాలని “బీఫ్‌ బచావో ఆందోళన్‌” పిలుపునిచ్చింది.

తరతరాలుగా తింటున్న ఆహారం. ఊహ తెలిసినప్పటినుంచి తింటున్న ఆహారం… ఆ రుచికి నాలుక అలవాటుపడిపోయిన జీవితం… ఎద్దుకూరని బ్యాన్‌ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటుందా..? ఊరుకోదు కదా..? ఆ మాటే తెగేసి చెప్పారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జూపాక సుభద్ర. గోవధ నిషేధ రాజకీయాలు సాగనివ్వబోమంటూ ఆగ్రహ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హోటళ్లలో ఇకపై బీఫ్ వంటకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఓ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది కూడా!

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగబద్ధం చేసిన రిజర్వేషన్ల పుణ్యమా అని దళిత, ఆదివాసీ, బహుజన కులాల విద్యార్ధులు విశ్వవిద్యాలయాల గడప తొక్కగలుగుతున్నారు. వారిలో అత్యధికులు తినే బీఫ్‌ వంటకాలకు మాత్రం యూనివర్సిటీ క్యాంటిన్లలో ఇప్పటికీ చోటులేదు. అంటే అప్రకటిత నిషేధం ఏనాటినుంచో అమలవుతోందన్న మాట! దీనిపై గత రెండు దశాబ్దాలుగా బీఫ్‌ ఈటర్స్‌ ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. తమ నోటికి రుచించే ఆహారం కావాలని కోరుకోవడంలో అప్రజాస్వామికం ఏముందో అంతుబట్టని విషయం. ఈ కోణంలో ఆలోచించవలసింది పోయి బీఫ్‌ గురించి మాట్లాడేవారిపై దాడులు చేసే రోజులొచ్చాయి. ఈ క్రమం అంతటినీ ఈ సమావేశంలో వక్తలు తునకలు తునకలుగా గుదిగుచ్చారు. దళిత బహుజనులను ఇన్నాళ్లూ సామాజికంగా అణగదొక్కుతూ ఉన్న అగ్రవర్ణ హిందూత్వ శక్తులు ఇప్పుడు వారి కిచెన్‌లోకి ప్రవేశిస్తున్నాయనీ, ప్రతిఘటనతోనే ఆ శక్తులకు సమాధానం చెప్పాలని ఊ.సాంబశివరావు దిశ చూపించారు. సమావేశంలో తొలి వక్తగా ఎద్దుకూరపై మాస్టర్జీ రాసిన పాటతో ప్రసంగాన్ని ఎత్తుకున్న ఊసా ఆ వాతావరణాన్ని పదునెక్కించారు. పుట్టుక రీత్యా మనిషి బోత్‌ ఈటర్‌ (శాక- మాంసాహారి) అనీ, బీఫ్‌ ఈటర్స్‌ని వారి సంప్రదాయ ఆహారం తినవద్దు అని చెప్పడం ఫాసిజం తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టంచేశారు.

కోట్లాది మంది తినే ఆహారం ఒక కానిపనిలాగా, గోప్యతకి గురయ్యే పరిస్థితి నేటికీ ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందా..? వస్తే గిస్తే ఎవరికి వచ్చింది..? అని నిలదీసి కడిగేయాలనిపిస్తుంది. ఎందుకంటే పప్పు తినేవాళ్లో, కూరగాయలు, దుంపలు తినేవారో తమతమ వంటకాల గురించి బహిరంగంగా చర్చిస్తారు, గొప్పగా చెప్పుకుంటారు. అదే బీఫ్‌ ఈటర్స్‌ దగ్గరికి వస్తే వీరికి అలాంటి ఆస్కారమే లేకుండాపోయిందని బాధేస్తుంది. కూర, పెద్దకూర, తునకలు, దస్‌ నెంబర్‌, కల్యాణి… ఇలా రకరకాల మారుపేర్లతో మాట్లాడుకోవడం… న్యూనతతో గొంతు పెగలకపోవడం ఎందుకు జరుగుతోంది?ఎందుకని బీఫ్‌ గురించి బహిరంగంగా చర్చించకూడదు? ఫుడ్‌ ఫెస్టివల్స్‌లో ఎద్దుకూరని ఎందుకు చేర్చరు..? ఆహార సర్వేలలో ఎద్దుమాంసంలో పోషక విలువల ప్రస్తావన ఎందుకు చేయరు..? నాన్‌వెజ్‌ హోటల్స్‌ మెనూలో బీఫ్‌ అన్న పేరు ఎందుకు కనిపించదు..? ఇలాంటి అనేక ప్రశ్నలను సమావేశంలో వక్తలు లేవనెత్తారు. సజయ, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, సంగిశెట్టి శ్రీనివాస్‌, జి. రాములు (సిపిఎం), తిప్పర్తి యాదయ్య, వహీద్‌ తదితరులు బీఫ్‌పై నిషేధపర్వాన్ని ధిక్కరిస్తూ ప్రసంగించారు. ఒకరికి ఇష్టమైన ఆహారంపై నిషేధం విధించడం, ఇష్టం లేని ఆహారాన్ని తినమని నిర్బంధించడం- ఈ రెండూ కూడా క్షమించలేని నేరాలతో సమానమని సజయ చాలా సూటిగా చెప్పారు.

హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇద్దరు విద్యార్థుల ఉద్యమ ఫలితంగా ఘనంగా బీఫ్‌ ఫెస్టివల్స్‌ జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఆ ఇద్దరే నలిగంటి శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌. తమ సంప్రదాయ ఆహారం తాము తినడం కోసం వారు ఒక యుద్ధమే చేశారు. చేసి గెలిచారు. గెలిచి అందరితో శహబాష్‌ అనిపించుకున్నారు. ఆ కథలోకి వెళ్లాలంటే అంతకు ముందు జరిగిన ఒక ఘోరాన్ని గుర్తుచేసుకోక తప్పదు.

ఇఫ్లూ క్యాంపస్‌లో (ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ) బీఫ్‌ని వండుకు తినాలని గతంలో కొందరు విద్యార్థులు తీర్మానించుకున్నారు. మేనేజ్‌మెంట్‌ అంగీకరించనప్పటికీ ఆ పని చేసి తీరాలనుకున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు చేసుకున్నారు. ఫుడ్‌ డెమొక్రసీని గౌరవించే పెద్దలను అతిథులుగా పిలిచారు. తామె స్వయంగా రంగంలోకి దిగి బీఫ్‌ వంటకాలు గుమాయించేలా వండారు. కానీ ఈ విషయం బయటికి పొక్కింది. హిందూత్వశక్తులు భరించలేపోయాయి. క్రూరంగా దాడికి దిగాయి. కొందరు ఉన్మాదులైతే బీఫ్‌ వంటకాలపై మూత్రం పోశారు. నానా రభస సృష్టించారు. తినే ఆహారాన్ని అలా అవమానించడం ఏ విలువల కిందకి వస్తుందో వారికే తెలియాలి.

ఈ చర్యతో బీఫ్‌ ఈటర్స్‌ వెనక్కి తగ్గలేదు. ఏమైనాసరే బీఫ్‌ తినాల్సిందే అని నిశ్చయానికొచ్చారు. ఏ ప్రదేశంలో అయితే హిందూత్వశక్తులు దుర్మార్గానికి పాల్పడ్డారో అదే చోట బీఫ్‌ బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుని కసిదీరా తిన్నారు. అదే తగిన సమాధానం అనుకున్నారు. ఆ వేడి ఓయూ క్యాంపస్‌లోని నలిగంటి శరత్‌ చమర్‌ వంటివారిని కుతకుతలాడించింది. ఏమైనా సరే ఓయూ ప్రాంగణంలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. పట్టుదలతో ఆ సంబురాన్ని నిర్వహించారు. వండర్స్‌ క్రియేట్‌ చేశారు.

అదే స్ఫూర్తితో సెంట్రల్‌ యూనివర్సిటీలో పసునూరి రవీందర్‌ బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించ తలపెట్టినప్పుడు కొన్ని శక్తులు అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం చేశాయి. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. దాంతో బీఫ్‌ని ఎందుకని తినకూడదు అన్న ప్రశ్న ఉద్యమకారుల్లో ఉదయించింది. రవీందర్‌ ప్రభృతులు కోర్టుని ఆశ్రయించారు. ఎద్దుకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని ధృవీకరిస్తూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ను కోర్టుకు సమర్పించారు. అంతే! సీన్‌ రివర్స్‌ అయ్యింది. బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకోవాలనుకున్న వారి కుయుక్తులకు బ్రేక్‌ పడింది. బీఫ్‌ పండగని ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ఆ తర్వాత నుంచి ఏటా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ని జరుపుకుంటూనే ఉన్నారు. తాము చదువుకునే ప్రాంగణంలో తమకు కావాల్సిన ఆహారం కోసం అంత యుద్ధం చేయాల్సి వచ్చింది ఆనాడు. అవును…. దళిత బహుజన శ్రేణులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. ఆనాటి తమ అనుభవాలను శరత్‌ చమర్‌, పసునూరి రవీందర్‌ ఈ సమావేశంలో పంచుకున్నారు.

బీఫ్‌ బచావో ఆందోళన్‌ కార్యక్రమంలో మరొక పదునైన ధిక్కారస్వరం కృపాకర్‌ మాదిగ. బీఫ్‌పై నిషేధం విధించే వారినే నిషేధించాలన్నంత కసిగా కృపాకర్‌ ప్రసంగం సాగింది. ఈ దేశంలో అగ్రవర్ణ, అగ్రవర్గ భూస్వాములు ట్రాక్టర్లను తెచ్చి పశుసంపదను నిర్వీర్యం చేశారనీ, ఎరువులు, పురుగుమందులు ఇష్టారాజ్యంగా వాడి భూసారాన్ని నాశనం చేశారనీ, పంటలను విషతుల్యం చేశారనీ, ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారనీ విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు గోవధ నిషేధం గురించి మాట్లాడటం కుట్రే అవుతుందన్నారు కృపాకర్‌. ఆయన ఆవేశపూరిత ప్రసంగం కొత్త ఆలోచనలకు పాదులువేసింది.

*