Love in Summer!

వై.వి.రమణ
 
ramanaవేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. ఎండ పెళపెళ్ళాడుతూ మండుతుంది, వడగాల్పు భగభగలాడుతూ వీస్తుంది. సూర్యుడు ఫ్యాక్షనిష్టు లీడర్లా మొరటుగా, కోపంగా వున్నాడు. రోడ్లన్నీ ఖాళీగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నయ్. ఆ సమయంలో ఎవరైనా జనాభా లెక్కల డిపార్టుమెంటువాళ్ళు లెక్కలు కడితే భారద్దేశ జనాభా ఫిన్లాండు కన్నా తక్కువ అని తేల్చేస్తారు!
వీధిలో మూలగా ఒక చిన్న ఇల్లు, చిన్నదైనా ముచ్చటగా వుంది. అది ఒక ప్రముఖ తెలుగు రచయితగారిది. గదిలో ఏసీ మెత్తగా, నిశ్సబ్దంగా పన్జేస్తుంది. గది చల్లగా వుంది. రచయితగారు ఎర్రగా వున్నారు, బుర్రగా వున్నారు. వారి జులపాల జుట్టు ఏసీ గాలికి నుదుటి మీద అలలా అలాఅలా కదుల్తుంది. వారి తెల్లని జుబ్బా, పైజమా బట్టల సబ్బు ఎడ్వర్టైజ్‌మెంటులా తళతళా మెరుస్తున్నయ్.
రచయితగారు తెలుగు రచనా రంగంలో సుప్రసిద్ధులు. వారు పదుల సంఖ్యలో పుస్తకాలు రచించారు, వేల సంఖ్యలో పుస్తకాలు అమ్ముకున్నారు. మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా కథలు రాయడంలో వారు నిష్టాతులు. సమయానుకూలంగా పాలకోవాల్లాంటి ప్రేమ కథలు రాయగలరు, కషాయంలాంటి విషాద కథలూ వినిపించగలరు. అవసరమైతే – మిర్చిబజ్జీలాంటి విప్లవ కథలతో భగభగా జ్వలించగలరు, అన్నార్తుల ఆకలి కేకలతో కేకుల్లాంటి కవితలు బేక్ చేసి హృదయాల్ని ద్రవింప చెయ్యగలరు, దగాపడ్డ దళితుల దుర్దశని దుఃఖభరితంగా వర్ణించనూగలరు. వారి కలానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వారొక సంపూర్ణ రచయిత. ప్రస్తుతం వారి కలం నుండి ఒక చిక్కని ప్రేమ కథ మెత్తగా జాలువారుతుంది.
ఆమె మెరుపు తీగ, కలువ బాల. అందంలో ఐశ్వర్యారాయ్, చందంలో కాంచనమాల. నవ్వితే మధుబాల, నవ్వకపోతే నర్గీస్. పేరు రాధ. ఆమెకు డబ్బున్నవాళ్ళన్నా, ఆకర్షణీయమైన మగవాళ్ళన్నా మిక్కిలి ఆసక్తి. ఈ రెండూ వున్నవాళ్ళ పట్ల మరింత మిక్కిలి ఆసక్తి. డబ్బులేని జీవితం నీళ్ళులేని కొబ్బరి బోండాం వంటిదని ఆమె నమ్మకం.
అతను ఆరడగులవాడు, తెల్లతోలువాడు, దండిగా డబ్బున్నవాడు, ఖరీదైన కారున్నవాడు, ఎల్లప్పుడూ డిజైనర్ దుస్తులే ధరించువాడు, శోభన్‌బాబు విగ్గులాంటి జుట్టుగలవాడు. దగ్గితే ధర్మేంద్రలా, దగ్గకపోతే అమీర్ ఖాన్‌లా వుంటానని అనుకుంటూ వుంటాడు. పేరు కృష్ణ. ప్రేమ లేని జీవితం జీడిపఫ్ఫు లేని పాయసం వంటిదని నమ్మినందున.. అందమైన అమ్మాయిల మెరుపు కళ్ళల్లో ప్రేమను వెతుక్కుంటుంటాడు.
గత కొన్నిరోజులుగా రాధ, కృష్ణ – తీవ్రంగా, తీక్షణంగా ప్రేమించుకుంటున్నారు. రోజూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని పది గంటలు కబుర్లు చెప్పుకుంటూ మైమరచిపోతారు. ఇంకో పది గంటలు ఫేస్బుక్కులో ఛాటింగ్ చేసుకుని పులకించిపోతారు. ఆ మిగిలిన నాలుగ్గంటలూ వాట్సప్పులో మెసేజిలు పంపుకుంటూ సంబరపడిపోతారు.
‘ప్రేమ’ – ఒక  మధుర భావన!
‘ప్రేమ’ – ఒక మది పులకరింత!
రాధ కృష్ణని చూసినప్పుడు సిగ్గుతో గువ్వలా (గవ్వ కాదు) అయిపోతుంది. బుగ్గలు సిగ్గుతో ఎలర్జిక్ రాష్ వచ్చినట్లు ఎర్రగా అయిపోతాయి. రాధ సిగ్గుల మొగ్గైనప్పుడు కృష్ణకి ప్రపంచాన్నే జయించినంత గర్వం, ఆనందం.
అంచేత –
‘ఆహా! ఏమి నా అదృష్టం, ఈ చిన్నది నా ప్రేయసి అగుట నా పూర్వజన్మ సుకృతం.’ పాత తెలుగు సినిమా జానపద హీరో స్టైల్లో అనుకుంటాడు కృష్ణ.
ఇలా ఒకళ్ళనొకళ్ళు తీవ్రమైన ప్రేమతో కొద్దిసేపు చూసుకున్న పిమ్మట, రాధ కృష్ణ కౌగిలిలో ఒదిగిపోయింది.
సృష్టిలో అత్యంత తీయనైనది ఏమి? – ప్రేమ!
ప్రపంచంలో అమూల్యమైనది ఏమి? – ప్రేమ! ప్రేమ!!
భూమండలాన్ని గిరగిరా తిప్పేది, పడిపోకుండా నిలబెట్టేది ఏమి? – ప్రేమ! ప్రేమ!! ప్రేమ!!!
సందేహం లేదు. ప్రేమ అనునది పెసరట్టు కన్నా రుచికరమైనది, తిరుపతి లడ్డు కన్నా తీయనైనది, కొత్తావకాయ కన్నా ఘాటైనది.
ఓయీ తుచ్ఛ మానవా! నిత్యావసర వస్తువుల రేట్లు, నిరుద్యోగం, అవినీతి, నేరాలు – పెరిగిపోతూనే వుంటాయి. అది ప్రకృతి ధర్మం. అందువల్ల నీవా పనికి మాలిన విషయాల గూర్చి కలత చెందకు. ప్రేమతో హృదయాల్ని కొల్లగొట్టు. ప్రేమతో ప్రపంచాన్ని జయించు!
అందువల్ల – ప్రేమించు! బాగా ప్రేమించు! ప్రేమని మనసారా గ్రోలుము, ఆస్వాదింపుము! ప్రేమ నీ జీవితాన్నే మార్చేస్తుంది. మానవ జీవితం చిన్నది, పొట్టిది, పెళుసుది.. ప్రేమంచి దానికి సార్ధకత చేకూర్చుకో!
ఇంతలో –
‘టప్’ – కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది. క్రమేపి చల్లదనం తగ్గసాగింది. రచయితగారికి ఇబ్బందిగా అనిపించింది. కానీ వారు కథ రాయడం ఆపలేదు (తుచ్ఛమైన కరెంటు వారి కలాన్ని ఆపలేదు).
ఆరోజు కృష్ణని చూసిన రాధ (రోజూ పడే) సిగ్గు పళ్ళేదు, బుగ్గలు మొగ్గలెయ్యలేదు.
మొహం చిట్లించాడు కృష్ణ.
‘ఐ ఫోన్ కొనిమ్మని నిన్ననే కదా అడిగింది? ఈలోపే సిగ్గు పట్టం మానెయ్యాలా? ఈ అమ్మాయిలింతే, వీళ్ళవన్నీ ఎమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రేమలు! రాజకీయ నాయకుల్లో నీతీ, అమ్మాయిల్లో ప్రేమ.. ఎడారిలో ఎండమావి వంటివి.’
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలా మొహం మాడ్చుకుంది రాధ.
‘గిఫ్టు కొనివ్వలేడు గానీ, రోషానికి మాత్రం తక్కువ లేదు. తెల్ల దొరసానమ్మని నల్ల బానిస చూస్తున్నట్లు దేబిరిస్తూ ఎట్లా చూస్తున్నాడో కదా! ఓడిపోయిన పొలిటీషయన్ని, ఒట్టిపోయిన ప్రియుణ్ని సాధ్యమైనంత తొందరగా ఒదుల్చుకోమన్నారు పెద్దలు.’ అనుకుంది రాధ.
ఇప్పుడు గది వేడిగా అయ్యింది. ఉక్కపోతగా వుంది. రచయితగారికి బాగా చికాగ్గా వుంది. అయినా వారు రాస్తూనే వున్నారు (కరెంటు తుచ్ఛమైంది కాదు)!
ఏవిటీ ప్రేమ గొప్ప? తిని అరగని ప్రతి గాడిదా ప్రేమ, ప్రేమ అంటూ కలవరించడమే! ప్రేమ ఒక జ్వరం, ప్రేమ ఒక గజ్జి, ప్రేమ ఒక స్వైన్ ఫ్లూ, ఒక డెంగీ, ఒక ఎబోలా. సామాన్య ప్రజలు ఉక్కపోతతో, చెమటల్తో నానా ఇబ్బందులు పడుతుంటే – ఈ ప్రేమికులు మాత్రం ‘ప్రేమ! ప్రేమ!’ అంటూ కలవరిస్తుంటారు, పూనకం వచ్చినాళ్ళలా పలవరిస్తుంటారు.
ఓయ్ భజరంగ్ దళ్ కార్యకర్తలూ! ఒక్క వేలెంటేన్స్ డే రోజునే కాదయ్యా, మీరు ప్రతిరోజూ ప్రేమికుల్ని తంతూనే వుండండి! మాతృభూమిని శతృసంస్కృతి నుండి రక్షించండి!!
అబ్బా! ఈ ఉక్క భరించడం కష్టమే! చెమటకి జుబ్బా తడిసిపొయింది. వామ్మో! కుంపట్లో కూర్చున్నట్లుగా వుందిరా దేవుడోయ్ (కరెంటు ఎంతో ఉన్నతమైనది)!
‘ప్రేమికులకి బుద్ధి లేదు, ప్రేమకి అర్ధం లేదు. ప్రేమికులకి నిర్భయ చట్టాన్ని వర్తింపజెయ్యాలి, జైల్లో కుక్కాలి, ఉరి తియ్యాలి. భారద్దేశానికి తక్షణ సమస్య యేమి? ఎండ, ఉక్కపోత, చెమట! అయ్యా రాజకీయ నాయకులూ! ఇప్పుడు ప్రజలక్కావల్సింది స్మార్ట్ సిటీలు కాదండీ! కోల్డ్ సిటీస్! ఇదే అసలైన సమస్య. నా దేశ ప్రజలారా! రండి – వేసవికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం! రండి – ఉక్కపోత మహమ్మారిని తరిమేద్దాం! రండి – చెమటని పారద్రోలుదాం! రండి – పోరాడితే పొయ్యేదేం లేదు, చెమటకంపు తప్ప! విప్లవం జిందాబాద్! ప్రభుత్వం ముర్దాబాద్!’
ఇంతలో –
‘టప్’ – కరెంటొచ్చింది. ‘బయ్’ – ఏసీ పంజెయ్యడం మొదలెట్టింది. చల్లగాలి రచయితగారి ముఖానికి పిల్ల తెమ్మరలా తగిలింది. చెమటకి తడిసిన వారి జులపాల జుట్టు ఆనందంగా, ఉత్సాహంగా ఎగెరెగిరి పడసాగింది. రచయితగారు రెణ్ణిమిషాలపాటు ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ పరవశంగా కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటికి వారి శరీరం చల్లబడింది. మరి కొద్దిసేపటికి ఉత్సాహంగా రాయడం కొనసాగించారు.
పవిత్రమైన ప్రేమకి కరెంటుకోత అడ్డు కాదు, కారాదు. కృష్ణ రాధని ప్రేమగా, మురిపెంగా చూశాడు. ‘అయ్యో! నా ప్రేయసిని అపార్ధం చేసుకున్నానే! ఎంత తప్పు చేశాను! స్వగృహ ఫుడ్స్ వారి ఖరీదైన జీడిపప్పు పాకం వంటి రాధ ప్రేమని, అలగా జనం తినే చౌకబారు వేరుశెనగ పప్పుండగా భావించానే!’
‘రాధీ! నన్ను క్షమించు.’
రాధ కృష్ణని చూసింది. ఆ చూపులో కిలోల్లెక్కన  ప్రేముంది, టన్నుల్లెక్కన ఆరాధనుంది. ‘అయ్యో! కిన్లే వాటరంత ఖరీదైన వ్యక్తిని మునిసిపాలిటీ కుళాయి నీళ్ళంతటి చీప్ మనిషనుకున్నానే! నా ప్రియుడు ప్రేమికులకే ప్రేమికుడు – ప్రేమశ్రీ, ప్రేమభూషణ్, ప్రేమరత్న. ప్రియతమా! నిన్నెంత తప్పుగా అర్ధం చేసుకున్నాను!’
‘క్రిష్! నన్ను క్షమించు.’ అంటూ ప్రియుని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది రాధ.
ప్రేమ – స్వచ్చం, ప్రేమ – నిజం, ప్రేమ – అమర్ రహే, ప్రేమ – జిందాబాద్.
జైహింద్!
*

చట్టం అను ఒక దేవతా వస్త్రం!

వై.వి.రమణ

 

ramana‘చుండూరు హత్యల కేసులో క్రింది కోర్టులో శిక్ష. కొన్నేళ్ళకి హైకోర్టులో కేసు కొట్టివేత.’

‘బాలీవుడ్ సూపర్ స్టార్‌కి క్రింది కోర్టులో జైలుశిక్ష. నిమిషాల్లో హైకోర్టు బెయిల్ మంజూరు. రెండ్రోజుల తరవాత అదే కోర్టు శిక్షని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు.’

‘తమిళనాడు ముఖ్యమంత్రిపై క్రింది కోర్టులో జైలుశిక్ష. కొన్నాళ్ళకి హైకోర్టులో అవినీతి కేసు కొట్టివేత.’

‘చట్టం కొందరికి చుట్టం’ – ఇటీవల కోర్టు తీర్పుల తరవాత ఈ సత్యం అందరికీ అర్ధమైపోయింది. ఒకప్పుడు ఈ సత్యానికి పట్టు వస్త్రం కప్పబడి సామాన్యులకి కనబడేది కాదు. ఆ తరవాత ఆ వస్త్రం పల్చటి సిల్కు వస్త్రంలా మారి కనబడీ కనబడనట్లుగా కనబడసాగింది. ఇవ్వాళ ఆ పల్చటి వస్త్రం దేవతా వస్త్రంగా మారిపోయింది! ఇకముందు ఎవరికీ ఎటువంటి భ్రమలూ వుండబోవు. ఇదీ ఒకరకంగా మంచిదే. ఈ వ్యవస్థలో సామాన్యుడిగా మనం ఎక్కడున్నామో, మన స్థాయేంటో స్పష్టంగా తెలిసిపోయింది.

శ్రీమతి ముత్యాలమ్మగారు నాకు జ్ఞానోదయం కలిగించే వరకూ – నేనూ “చట్టం ముందు అంతా సమానులే” అనే చిలక పలుకులు పలికిన మధ్యతరగతి బుద్ధిజీవినే. ముత్యాలమ్మగారు నారిమాన్, పాల్కీవాలాల్లాగా న్యాయకోవిదురాలు కాదు. ఆవిడ దొంగసారా వ్యాపారం చేస్తుంటారు, ఒక కేసులో నిందితురాలు. నేర పరిశోధన, న్యాయ విచారణలోని లొసుగుల గూర్చి – రావిశాస్త్రి అనే రచయిత ద్వారా ‘మాయ’ అనే కథలో విడమర్చి చెప్పారు. ‘ఆరు సారా కథలు’  చదివాక అప్పటిదాకా నాకున్న అజ్ఞానానికి మిక్కిలి సిగ్గుపడ్డాను.

క్రింది కోర్టుల్లో శిక్ష పడటం, పై కోర్టులు ఆ కేసుల్ని కొట్టెయ్యడం.. ఈ కేసుల్లో ఒక పేటర్న్ కనిపిస్తుంది కదూ? ‘మన న్యాయవ్యవస్థ పకడ్బందీగా లేకపోతే క్రింది కోర్టుల్లో శిక్షెలా పడుతుంది?’ అని విజ్ఞులు ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకి నా దగ్గర శాస్త్రీయమైన, సాంకేతికమైన సమాధానం లేదు. ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా తనకున్న పరిమితులకి లోబడే ఆలోచించగలడు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని కాబట్టి, వైద్యం వెలుపల విషయాల పట్ల కూడా డాక్టర్లాగే ఆలోచిస్తుంటాను, అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇది నా పరిమితి, ఆక్యుపేషనల్ హజార్డ్!

ఇప్పుడు కొద్దిసేపు హాస్పిటల్స్‌కి సంబంధించిన కబుర్లు –

ఆనేకమంది డాక్టర్లు చిన్నపట్టణాల్లో సొంత నర్సింగ్ హోములు నిర్వహిస్తుంటారు. వీరికి అనేక ఎమర్జన్సీ కేసులు వస్తుంటయ్. అప్పుడు డాక్టర్లు రెండు రకాల రిస్కుల్ని బేరీజు వేసుకుంటారు. ఒకటి పేషంట్ కండిషన్, రెండు పేషంట్‌తో పాటు తోడుగా వచ్చిన వ్యక్తుల సమూహం. సాధారణంగా డాక్టర్లకి దూరప్రాంతం నుండి తక్కువమందితో వచ్చే పేషంట్‌కి వైద్యం చెయ్యడం హాయిగా వుంటుంది. వెంటనే ఎడ్మిట్ చేసుకుని వైద్యం మొదలెడతారు.

అదే కేసు ఆ హాస్పిటల్ వున్న పట్టణంలోంచి పదిమంది బంధువుల్తో వచ్చిందనుకుందాం. అప్పుడు పేషంటు కన్నా డాక్టర్లకే ఎక్కువ రిస్క్! ఎలా? విపరీతంగా విజిటర్స్ వస్తుంటారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి.. ఒకటే ఫోన్లు, ఎంక్వైరీలు. తమ నియోజక వర్గ ప్రజల రోగాల బారి పడ్డప్పుడు వైద్యులకి ఫోన్ చేసి ‘గట్టిగా’ వైద్యం చెయ్యమని ఆదేశించడం రాజకీయ నాయకులకి రోజువారీ కార్యక్రమం అయిపొయింది. అందరికీ సమాధానం చెప్పుకోడంతో పాటు డాక్టర్లకి కేస్ గూర్చి టెన్షన్ ఎక్కువవుతుంది.

పొరబాటున కేస్ పోతే – పేషంట్‌తో పాటు వచ్చిన ఆ పదిమంది కాస్తా క్షణాల్లో వెయ్యిమందై పోతారు. పిమ్మట హాస్పిటల్ ఫర్నిచర్ పగిలిపోతుంది. డాక్టర్ల టైమ్ బాగోకపొతే వాళ్ళక్కూడా ఓ నాలుగు తగుల్తయ్. పిమ్మట బాధితుల తరఫున ‘చర్చలు’ జరిగి సెటిల్మెంట్ జరుగుతుంది. అంచేత డాక్టర్లకి క్రిటికల్ కండిషన్లో వచ్చే లోకల్ కేసులు డీల్ చెయ్యాలంటే భయం. అందుకే వారీ కేసుల్లో వున్న రిస్క్‌ని ఎక్కువచేసి చెబుతారు. ‘మెరుగైన వైద్యం’ పెద్ద సెంటర్లోనే సాధ్యం, అంత పెద్ద రోగానికి ఇక్కడున్న సాధారణ వైద్యం సరిపోదని కన్విన్స్ చేస్తారు (కేసు వదిలించుకుంటారు). ఆ విధంగా వైద్యం చేసే బాధ్యతని ‘పైస్థాయి’ ఆస్పత్రులకి నెట్టేస్తారు.

మహా నగరాలకి కాంప్లికేటెడ్ కేసులు అనేకం వస్తుంటాయి. డాక్టర్లు హాయిగా వైద్యం చేసుకుంటారు. కేసు పోయినా – ఎలాగూ బ్యాడ్ కేసే అని పేషంట్ తరఫున వారికి తెలుసు కాబట్టి వాళ్ళ హడావుడి వుండదు. ఎవరన్నా ఔత్సాహికులు గొడవ చేద్దామన్నా, ఆ కార్పోరేట్ ఆస్పత్రికి ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయి వారి అండ ఉన్నందున ‘శాంతిభద్రతలు’ కాపాడే నిమిత్తం పోలీసులు ఆ గుంపుని వెంటనే చెదరగొట్టేస్తారు. అంచేత పేషంట్ బంధువులు ‘ఖర్మ! మనోడి ఆయువు తీరింది.’ అని సరిపెట్టుకుని కిక్కురు మనకుండా బిల్లు చెల్లించి బయటపడతారు.

వైద్యవృత్తి వెలుపల వున్నవాళ్ళకి నే రాసింది ఆశ్చర్యం కలిగించవచ్చును గానీ, ఇది రోజువారీగా జరిగే పరమ రొటీన్ అంశం. ఇందులో సైకలాజికల్ ఇష్యూస్ కూడా వున్నాయి. పెద్ద కేసుల్ని పెద్దవాళ్ళే డీల్ చెయ్యాలి. దుర్వార్తల్ని చెప్పాల్సినవాడే చెప్పాలి. రాజు నోట ఎంత అప్రియమైనా తీర్పు భరింపక తప్పదు. అదే తీర్పు గ్రామపెద్ద చెబితే ఒప్పుకోరు, వూరుకోరు. ఈ హాస్పిటళ్ళ గోలకి నే రాస్తున్న టాపిక్‌తో కల సంబంధం ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుంటుంది.

“బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.” అంటాడు బాలగోపాల్. (‘రూపం – సారం’ 47 పేజి – ‘రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగా యంత్రం’). ఈ పాయింటుని ప్రస్తుత సందర్భానికి నేనిలా అన్వయించుకుంటాను – కొన్ని కేసుల్లో బాధితులు పేదవారు, అణగారిన వర్గాలవారు. వారిపట్ల ప్రజలు కూడా సానుభూతి కలిగి వుంటారు. బాధితుల్ని కఠినంగా ఆణిచేస్తే ప్రజల్లో ప్రభుత్వాల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం వుంది. అందువల్ల కొన్నిసార్లు (రాజ్యానికి) కేసులు పెట్టకుండా వుండలేని స్థితి వస్తుంది. శిక్షలు విధించకుండా వుండలేని స్థితీ వస్తుంది. అందుకే మధ్యే మార్గంగా క్రింది కోర్టుల శిక్షలు, పై కోర్టుల కొట్టివేతలు!

చిన్నపాటి హాస్పిటల్స్‌కి వున్నట్లే – కింది కోర్టుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. అక్కడ న్యాయమూర్తులు శిక్ష వెయ్యడానికి కొద్దిపాటి ఆధారాల కోసం చూస్తారు. శిక్ష వెయ్యకపోతే బాధితులు ఆందోళన చెయ్యొచ్చు, తద్వారా తాము కొన్ని ఆరోపణలు ఎదుర్కోవలసి రావొచ్చు. ఆపై ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవ్వచ్చు. క్రింది కోర్టుల్లో ముద్దాయిలకి శిక్ష వెయ్యకపోతే ఇబ్బంది గానీ, వేస్తే ఎటువంటి ఇబ్బందీ వుండదు! అందువల్ల కేసు కొట్టేసే బాధ్యతని ఉన్నత స్థానాలకి నెట్టేస్తారు! హైకోర్టులో మాత్రం కేసుల పరిశీలన పూర్తిగా టెక్నికాలిటీస్ మీద ఆధారపడి జరుగుతుంది. వారిపై ఎటువంటి వొత్తిళ్ళూ వుండవు. శిక్ష ఖరారు చెయ్యడానికి ఉన్నత న్యాయస్థానం వారికి కేసు పటిష్టంగా, పకడ్బందీగా వుండాలి. తప్పించుకోడానికే పెట్టిన కేసులు తొర్రల్తోనే వుంటాయి కాబట్టి సహజంగానే ఉన్నత న్యాయస్థానంవారు కొట్టేస్తారు.

ఇక్కడితో నే చెప్పదల్చుకున్న పాయింట్ అయిపొయింది. కింది కోర్టుల్లో శిక్ష పడ్డాక, ఆ శిక్ష ఉన్నత న్యాయస్థానాల్లో ఖరారు కాకపోవడానికి ఎన్నో కారణాలు వుండొచ్చు. నాకు తోచిన కారణం రాశాను. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే. నా ఆలోచన పూర్తిగా తప్పనీ, నాకు న్యాయవ్యవస్థపై కొంచెం కూడా అవగాహన లేకపోవడం మూలాన అపోహలతో ఏదేదో రాశానని ఎవరైనా అభిప్రాయ పడితే – ఆ అభిప్రాయాన్ని ఒప్పేసుకోడానికి సిద్ధంగా వున్నాను. ఎందుకంటే – నేను ముందే చెప్పినట్లు నాది ‘వైద్యవృత్తి’ అనే రంగుటద్దాలు ధరించి లోకాన్ని అర్ధం చేసుకునే పరిమిత జ్ఞానం కాబట్టి!

వార్తకి అటూఇటూ…. 

వై.వి. రమణ 

 

రమణఉదయం పదిగంటలు. అప్పుడే కాఫీ తాగి పేపర్ చదవడం మొదలెట్టాను. శేషాచలం అడవుల్లో కూలీల ఎన్‌కౌంటర్ గూర్చి వార్తా విశ్లేషణ చదువుతున్నాను. ఇంతలో నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బు హడావుడిగా వచ్చాడు. 

“హలో మిత్రమా! ఒక కప్పు కాఫీ! అర్జంట్!” వస్తూనే అన్నాడు సుబ్బు. 

“కూర్చో సుబ్బూ! బహుకాల దర్శనం, బాగున్నావా?” పలకరించాను. 

“నేను బాగానే వున్నాన్లే! అంత సీరియస్‌గా పేపర్ చదువుతున్నావ్! ఏంటి కబుర్లు?”

“పాపం! శేషాచలం అడవుల్లో ఇరవైమంది చనిపోయ్యారు సుబ్బూ! ఘోరం కదూ?” దిగాలుగా అన్నాను.

“ప్రస్తుతం మన్దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. కావున – మనుషులిలా చావడం సహజం. నువ్విలాంటి సాధారణ వార్తలకి దిగులు చెందరాదు!” నవ్వుతూ అన్నాడు సుబ్బు.

ఆ నవ్వుకి వొళ్ళు మండిపొయ్యింది నాకు.

“మనుషుల ప్రాణాలంటే నీకంత చులకనగా వుందా సుబ్బూ?” మొహం చిట్లించి అన్నాను.

నా ప్రశ్నకి ఒక క్షణం ఆలోచించాడు సుబ్బు.

“నువ్వు అర్ధం చేసుకోవాల్సింది – మన దేశ ఆర్ధిక ముఖచిత్రం మారుతుంది. ఇప్పుడిక్కడ కావల్సింది ‘అభివృద్ధి’ తప్పించి మనుషుల ప్రాణాలకి రక్షణ కాదు. ఈ నేపధ్యం అర్ధం చేసుకున్నాను కాబట్టే మనుషులు చావడం, చంపబడటం ఒక సహజ పరిణామంగా నేను ఫీలవుతున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే – ‘అభివృద్ధి’ అనే ఫేక్టరీకి ఈ చావులు కాలుష్యం వంటివి. కాలుష్యం లేకుండా ఫేక్టరీ నడవదు, లాభాలు రావు. లాటిన్ అమెరికా దేశాల్లో కూడా జరుగుతుందిదే.” అన్నాడు సుబ్బు.

ఇంతలో ఫిల్టర్ కాఫీ పొగలు గక్కుతూ వచ్చింది.

“సుబ్బూ! కొంచెం అర్ధం అయ్యేట్లు తెలుగులో చెప్పవా?” విసుగ్గా అన్నాను.

“సమాజం ఏకోన్ముఖంగా వుండదు. అడవిలో జంతువుల్లాగే అనేక రకాల వ్యక్తుల సమాహారమే సమాజం. కాకపోతే మనుషులు ఒకే రకమైన శరీర నిర్మాణం కలిగుంటారు. అందుకే ఈ శేషాచలం చావుల్ని కూడా ఎవరి తోచినట్లు వారు అర్ధం చేసుకుంటారు.” అన్నాడు సుబ్బు.

“అదెలా?” ఆసక్తిగా అడిగాను.

“నీకు పెద్దమనుషుల భాషలో చెబుతాను. ఈ భాషని ‘కన్యాశుల్కం’లో సౌజన్యారావు పంతులుతో మాట్లాడిస్తాడు గురజాడ. ఈ భాష గంభీరంగా వుంటుంది, అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం!” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటో ఆ భాష?” అన్నాను.

“శాంతిభద్రతల్ని కాపాడ్డం, నేరాల్ని అరికట్టడం అనేది రాజ్యం యొక్క పవిత్రమైన బాధ్యత. ఎవరైతే నేరం చేసినట్లు రాజ్యం భావిస్తుందో, వారిపై నేరారోపణ చేస్తూ, సాక్ష్యాధారాల్తో కోర్టుకి అప్పగించడం రాజ్యం యొక్క విధి. ఇందుకు రాజ్యానికి పోలీసు వ్యవస్థ సహకరిస్తుంది. అట్లా కోర్టుకి అప్పగించిన వారిని ‘నిందితులు’ అంటారు. ఇక్కడి నుండి న్యాయవ్యవస్థ పని మొదలవుతుంది. నిందితుడికి వ్యతిరేకమైన సాక్ష్యాధారాల్ని కూలంకుషంగా విచారించి ఆ నిందితుడు నేరం చేసిందీ లేనిదీ కోర్టులు తేలుస్తాయి. నేరం చేసినట్లు ఋజువైతేనే నిందితుడు, ఆ క్షణం నుండి ‘నేరస్తుడు’ అవుతాడు.” అన్నాడు సుబ్బు.

“ఇదంతా నాకు తెలుసు.” అసహనంగా అన్నాను.

“ఈ పెద్దమనుషుల భాష ప్రకారం – మొన్నట్నుండీ సత్యం రామలింగరాజు ‘నేరస్తుడు’గా అయిపోయ్యాడు. గాలి జనార్ధనరెడ్డి ఇవ్వాళ్టిక్కూడా ‘నిందితుడు’ మాత్రమే.” అన్నాడు సుబ్బు.

“నాకు ఇదీ తెలుసు.” చికాగ్గా అన్నాను.

“మిత్రమా! ‘జీవించడం’ అనేది ఒక ప్రాధమిక హక్కు. ఈ హక్కుని పరిరక్షించడం రాజ్యం యొక్క ముఖ్యమైన బాధ్యత. చట్టం ముందు అందరూ సమానులే. నీకు లేని హక్కు ఇంకెవరికీ లేదు. ఇంకెవరికీ లేని హక్కు నీకు లేదు.” అన్నాడు సుబ్బు.

“ఏవిఁటి సుబ్బూ! మరీ చిన్నపిల్లాడికి చెప్పినట్లు.. ”

సుబ్బు నామాట వినిపించుకోలేదు.

“న్యాయ సూత్రాలని పాటిస్తూ పాలించడాన్ని ‘చట్టబద్ద పాలన’ అంటారు. దీని గూర్చి బాలగోపాల్ వందల పేజీలు రాశాడు, వందల గంటలు ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈ చట్టబద్ద పాలన దేవతా వస్త్రాల్లాంటిది. ఇది అందరికీ కనపడదు. నిందితుడు, నేరస్తుడు అనే పదాల లక్జరీ కొన్ని వర్గాలకి మాత్రమే పరిమితం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకని?” అడిగాను.

“సమాజం రైల్వే బోగీల్లాగా కంపార్టమెంటలైజ్ అయిపొయుంది. ఏసీ బోగీవాడికున్న ప్రివిలేజెస్ జెనరల్ బోగీవాడికి వుండవు. ఇది ఎవరూ ఒప్పుకోని ఒక అప్రకటిత సూత్రం. శేషాచలం అడవుల్లో చెట్లు నరికినవాళ్ళు జెనరల్ బోగీవాళ్ళు. వాళ్ళు సమాజ సంపదకి కలిగించిన నష్టం గాలి జనార్ధనరెడ్డి కలిగించిన నష్టం కన్నా తక్కువ. కానీ – మనకి ‘నేరస్తులైన’ కూలీల మీదే క్రోధం, అసహ్యం.” అన్నాడు సుబ్బు.

“ఎందుకు?” అడిగాను.

“ఇది స్పష్టమైన క్లాస్ బయాస్. పేపర్లు చదివేది, అభిప్రాయాలు వ్యక్తీకరించేదీ మధ్యతరగతి మేధావులు. వీళ్ళు జేబులు కొట్టేసే వాణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చావగొడితేనే గానీ దొంగలకి బుద్ధి రాదనీ వాదిస్తారు. వంద కోట్లు అవినీతి చేసిన వైట్ కాలర్ నిందితుణ్ని మాత్రం ‘చట్టబద్దంగా విచారించాలి’ అంటారు.” అన్నాడు సుబ్బు.

“నిజమే సుబ్బూ!” అన్నాను.

“ఇక్కడంతా ఆటవిక నీతి. అడవిలో పులులు జింకల్ని వేటాడేప్పుడు జింకలకి నొప్పి కలుగుతుందేమోనని ఆలోచించవు. ఆ పక్కనే వున్న పులి స్నేహితుడైన నక్క – వేటాడే పులిలో రౌద్రాన్ని కీర్తిస్తూ కవిత్వం రాస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అలాగే – మధ్యతరగతి మేధావులు తక్కువ స్థాయి మనుషులు చంపబడితే – ‘ధర్మసంస్థాపనార్ధం అది చాలా అవసరం’ అని నమ్ముతారు. అంటే – మనం మనుషుల్ని మనుషులుగా చూడ్డం మనేశాం. వర్గాలుగానే చూస్తున్నాం. పాలక వర్గాలక్కూడా కావల్సిందిదే!” అన్నాడు సుబ్బు.

“నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తుంది సుబ్బూ!” అన్నాను.

“నీకు తెలుసుగా? సిగ్మండ్ ఫ్రాయిడ్ ‘ఐడెంటిఫికేషన్’ అని ఒక డిఫెన్స్ మెకానిజం గూర్చి చెప్పాడు. ఒక వ్యక్తి తన వర్గానికి తెలీకుండానే మానసికంగా కనెక్ట్ అయిపోతాడు. అందుకే – ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి మంచినీళ్ళ కోసం పంపు దగ్గర బిందెలతో తోసుకునే ఆడవారిలో అలగాతనం చూస్తాడే గానీ – నీటికొరత ఎంత దుర్భరంగా వుందో ఆలోచించడు.”

“అంటే – తెలుగు వార్తా పత్రికలది కూడా ‘ఫ్రాయిడియన్ ఐడెంటిఫికేషన్’ అంటావా?”

“కొంత వరకు. పత్రికలకి వ్యాపార అవసరాలే ప్రధానం. వాళ్ళ పత్రికకి చందాదారులుగా కూలీల కన్నా మధ్యతరగతి వారే ఎక్కువమంది వుంటారు. పత్రికలు ఎవరికి వార్తలు అమ్ముతారో వారి ఆలోచనలకి తగ్గట్టుగానే రాస్తాయి. ఇవే తెలుగు పత్రికలు చెన్నై ఎడిషన్లో కూలీలకి అనుకూల విధానం తీసుకుని రాసుండొచ్చు, నాకు తెలీదు.” అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

“నిజమే! చెన్నై ఎడిషన్ వార్తలు వేరుగానే వున్నాయి.”

“ఏ వార్తైనా అనేక ముఖాలు కలిగుంటుంది. ఉదాహరణగా ఒక వార్తని పరిశీలిద్దాం. పులి ఆహారం కోసం మనిషిని వేటాడి ఆడవిలోకి లాక్కెళ్ళిపోయింది. అడవిలో పులులన్నీ కలిసి ఆ వేటని సుష్టుగా భోంచేశాయి. మనుషుల పత్రిక ‘ఒక క్రూర దుర్మార్గ దుష్ట పులి హత్యాకాండ’ అంటూ హెడ్‌లైన్స్‌తో విమర్శిస్తుంది. అదే వార్తని పులుల పత్రిక ‘దుర్భర క్షుద్బాధతో అలమటిస్తున్న సాటి జీవుల ఆకలి తీర్చిన సాహస పులికి జేజేలు’ అని హంతక పులి వీరత్వాన్ని కీర్తిస్తుంది.” అన్నాడు సుబ్బు.

“వాటేన్ ఐరనీ సుబ్బూ! ఒక పక్క గుండెల్ని మార్చడం కోసం సిటీ ట్రాఫిక్కుల్ని ఆపేస్తున్నాం. ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని ప్రవచిస్తున్నాం. ఇంకోపక్క – ప్రాణాలు పోయినందుకు ఆనందిస్తున్నాం.” దిగులుగా అన్నాను.

“మిత్రమా! మరీ అంతగా కలత చెందకు. రాబోయే కాలం కోసం నీ దుఃఖాన్ని కొద్దిగా దాచుకో” అంటూ హడావుడిగా నిష్క్రమించాడు సుబ్బు.

*

yaramana.blogspot.in.