ఎడతెగని జీవిత సంఘర్షణలు పెద్దింటి కథలు

IMG

-వెల్దండి శ్రీధర్

~

 

sridharకథ అనగానే అమ్మమ్మ ఆవహిస్తుంది. ఆమె చూపించే రంగుల ప్రపంచం మన ముందు పరుచుకుంటుంది. గుండె గదులకు అద్భుతాలు కొత్త పరిమళాన్ని అద్దుతాయి. ఒక్కో కథ ఒక్కో నూతన జగత్తును  చూపించి అంబరమంత సంబరాన్ని హృదయానికి పంచి వెళ్తుంది. రాజులు, రాణులు, మంత్రులు, భూతాలు, దయ్యాలు, మంత్రగాళ్లు, సామాన్యులు…ఇలా ఎందరెందరో గుర్తుకు వచ్చి ఆయా వ్యక్తిత్వాలకు మనల్ని మనం ఆకురాయిలా రాసుకుంటాము. లౌకిక కథలకి వచ్చినపుడు జీవితం మీద నిలబడి మనిషి చుట్టూ పరుచుకున్న నెలవంకల్నీ, బతుకు వంకల్నీ చూపెట్టిన వారు ఎంతో మంది. ఆ వరుసలో పెద్దింటి అశోక్ కుమార్ కథ చదవడమంటే ఒక చేత కన్నీటి కుండను, మరో చేత గాయాలకు పూసే ‘నల్లాలం’ పసరును పట్టుకోవడమే. తెలుగు కథా సాహిత్యంలో 1990ల నుండి తెలంగాణ జీవితాన్ని రికార్డు చేస్తూ చాలా ఆర్ద్రమైన కథల్ని రాస్తూ అనేక అవార్డుల్ని పొందుతున్న కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఈయన కలం నుండి వెలువడిన సరికొత్త కథల సంపుటి ‘జుమ్మేకి రాత్ మే’.

సాధారణంగా పెద్దింటి అశోక్ కుమార్ కథంటే ప్రపంచీకరణ విధ్వంసం, కూలిపోయిన కులవృత్తులు, వలస, ఎడారి మంటలు, విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు, కుదేలయిపోయిన వ్యవసాయం.. ఇవే కనిపిస్తాయి.  ఈ కథా సంపుటి కూడా అందుకు మినహాయింపు కాదు. దీన్నిండా కూడా పాఠకుడిని ఆపాదమస్తకం కదిలించి, రగిలించి, ఊగించే కథలే వున్నాయి. ఒక్కో  కథ ఒక్కో జీవిత శకలం. ఒక్కో శిథిల మానవ ప్రపంచం. శిల్ప రీత్యీ కూడా ఒక్కోటి ఒక్కో కొత్త శిల్పంలో నడిచిన కథలు. కథలన్నీ చదివి పుస్తకం మూసేసిన తరువాత ఈ కథలు నిజంగా మనకు అర్థం కావడం ప్రారంభమవుతాయి. సారాంశం మనసుకెక్కుతుంది, వెంటాడి వేదిస్తుంది. అంతః చేతనలోకి వెళ్లి అలజడి చేస్తుంది.  ప్రతి కథ ఒక విప్లవాన్ని, ఒక తిరుగుబాటును నూరిపోస్తాయి. ఇందులోని 18 కథల్లో మూడు కథలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా నడిచిన  కథలు, రెండు ఎడారి దేశాల కథా వస్తువుతో రాసినవి, మరో రెండు విద్యా వ్యవస్థను ప్రశ్నించే కథలు  కనిపిస్తాయి. మిగతావి విభిన్న కథాంశాలతో కూడుకున్నవి.

పంచతంత్రంలోని కథలన్నీ పక్షుల, జంతువుల చుట్టూ తిరిగే కథలే అయినా అవి వాటికి సంబంధించిన కథలు కాదనేది స్పష్టం. మానవ ప్రవృత్తుల్ని, మానసిక చాంచల్యాన్ని చిత్రించిన కథలవి. అలాగే ఈ కథా సంపుటిలోని మొదటి కథ ‘అనగనగా ఓ కోడిపెట్ట’ కథంతా కోడిపెట్ట దృష్టికోణం నుంచి నడిచినా సారాంశంలో మనిషిని ఉద్దేశించిన కథ. జీవితం ఎంత సంక్లిష్టమో, ఎంత దుర్భరమో, మరెంత భయానకమో ధ్వన్యాత్మకంగా చెప్పే కథ. నిజానికి పైపైన చూస్తే కోడిపెట్ట పిల్లల్ని పెట్టడం, వాటిని కంటికి రెప్పలా కాపాడడం, వాటికి జీవితాన్నెలా ఎదుర్కోవాలో నేర్పించటం, యౌవనం వచ్చిన తరువాత తల్లికోడి నుండి ఎడబాసి స్వతంత్రంగా జీవించటం… ఈ జీవన వరుస క్రమం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనిషికి బోధించిన జీవన సూత్రాలు. నైపుణ్యాలు. సంఘంలో మనిషిగా నిలదొక్కుకొని జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే కథ. ఈ కోవలోదే మరో కథ ‘ఏడిండ్ల పిల్లి కూన’ కథ. తల్లి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతగానో తపిస్తుంది. ఎంత సాహసానికైనా ఒడిగడ్తుంది. ఎవరినైనా ఎదిరిస్తుంది. చివరికి తనను కట్టుకున్న భర్తను కూడా. అలాంటి మాతృప్రేమ, ధైర్య సాహసాలు, ప్రసూతి వైరాగ్యం, గర్భంతో ఉన్నప్పుడు తన నొప్పిని ఎవరూ పంచుకోకపోయినా పరవాలేదు కానీ కనీసం తనకు సహాయం చేసే చేతికోసం ఎదురుచూసే ఒక తల్లి ఆవేదన ఇవన్నింటి మేళవింపు ఈ కథ.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ మలి దశను చిత్రించిన కథలు అత్యధికంగా రాసింది పెద్దింటి అశోక్ కుమారే. ఈయన రాసిన మూడు కథలు మూడు భిన్న శిల్పాలతో అలరారుతాయి. ‘యుద్ధనాదం’ కథ ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సమగ్రంగా చిత్రించిన కథగా చెప్పుకోవాలి. ఉద్యమ క్రమమంతా చాలా నేర్పుతో అక్షరీకరించారు రచయిత. ఉద్యమం చుట్టూ పాఠకుడిని చేయి పట్టుకొని తిప్పుకొస్తుందీ కథ. ఆత్మ బలిదానం వద్దు చేయి చేయి కలిపి పోరాడుదాం అనే స్ఫూర్తిని నింపుతూనే ఉద్యమ సెగలతో మన మనసులు రాజుకునేలా చేస్తుంది. మరో కథ ‘రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ’. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెలా వారి వారి స్వార్థ ప్రయోజనాలకు, తమ పదవులు నిలుపుకొనుటకు వుపయోగించుకుంటున్నారో ధ్వన్యాత్మకంగా విప్పి చెప్పే కథ. టీవీలో కొనసాగే రోజువారి సీరియల్ లాంటి నడకతో మొదలైన ఈ కథ చివరిదాకా ఏదో సీరియల్ కథనేమోనని భ్రమిస్తుంది. కానీ చివరికి ఇది తెలంగాణ ఉద్యమ కథ అని దాని మలుపులు, రాజకీయ నాయకుల బొంకులు, పెద్దమనుషుల ఒప్పందం అన్నీ కళ్లకు కడుతాయి. ఉద్యమ తొలి దశ నుండి ప్రతి మలుపుని ఒక ఎపిసోడుగా చెప్తూ కథకుడు చాలా ఉత్కంఠను పాటిస్తాడు. మంచి శిల్పంతో కొనసాగే కథ. మరో ఉద్యమ కథ.  ‘రేపు మాపు అను ఓ విడాకుల కథ’ ప్రత్యేక తెలంగాణ విషయాన్ని ఏండ్లుగా నానబెడుతున్న కాంగ్రెస్ పార్టీని న్యాయవాది స్థానంలో, తెలంగాణ ప్రాంతాన్ని దగా పడ్డ భార్యగా, అవశిష్ట ఆంధ్రప్రదేశ్ ను భర్త స్థానంలో నిలబెట్టి కథ నడుపుతాడు. విడాకులు ఎందుకు కావాల్నో చాలా హేతుబద్దంగా వాదిస్తుంది భార్య (తెలంగాణ). ‘‘నా భర్త (సీమాంధ్ర) చదువుకున్నోడు…చాల్ బాజిగాడు. నన్ను ఎక్కిరిచ్చుడేగాదు బానిసలెక్క చూస్తుండు అన్నది. హక్కులు, బానిసపోరాటాలు అనే పదాలే  నాకు (కాంగ్రెస్) గిట్టయి. సంసారమన్నంక సర్దుకపోవుడు తప్పదు కదా అనుకున్న. భార్యా, భర్తల మధ్య బానిస ఏంది అనుకుంటాడు న్యాయవాది.

‘సార్… ఎంత ఖర్చయిన సరే! నాకు విడాకులు కావాలె’ అన్నది.

‘ఇంత చిన్నదానికేనా…సర్దుకుపోవాలమ్మా..’ అన్న.

‘ఆత్మగౌరవం చిన్న ముచ్చటనా సార్.. పెండ్లయ్యేనాటికే ఇద్దరికి ఇద్దరేసి పిల్లలు. వాళ్లు ఎప్పుడూ కలువలేదు. వాళ్ల ఇష్టాయిష్టాలు గూడా కలువలేదు. ఎప్పుడు కొట్లాటనే’ అన్నది.

‘ఆత్మగౌరమంటే నాకు మంట. అది సోమరిపోతులు అనే మాటలని నా అభిప్రాయం’

నమ్మిన న్యాయవాది పూర్తిగా మోసం చేసినా గుండెలో గాయాల్ని దాచిపెట్టుకొని ఆమె లాయర్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. చివరాఖరికి ఆ లాయర్ ‘చూడమ్మా… ఇన్నేండ్లు తండ్లాడుతున్నవ్. కోర్టుల వెంట తిరుగుతున్నవు యాష్టకు రావడం లేదా? అని ప్రశ్నిస్తాడు.

దానికి ఆమె ‘సార్.. నేను కొట్లాడుతలేను. యుద్ధం చేస్తలేను. యుద్ధం చేస్తే గెలుపోటములుంటయి. నేను విముక్తి కోసం పోరాటం చేస్తున్న. ఇందులో గెలుపే తప్ప ఓటమి ఉండది’ అంటుంది. దాని ఫలితాన్ని మనం ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల రూపంలో చూస్తున్నాం.

భారతీయ విద్యా వ్యవస్థను ప్రశ్నించి బోనులో నిలబెట్టే కథలు ‘ములాఖత్’, ‘ప్రొగ్రెస్’. నేత కార్మికుల జీవిత విధ్వంసాన్ని చాలా బలంగా చెప్పిన కథ ‘ఎదురు చేప’. పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రవేశించిన వారు సామాన్య ప్రజలను ఎంతగా పీల్చి పిప్పి చేస్తున్నారో చేప్పే కథ ‘భయంగా ఉంది’. సాఫ్ట్ వేర్ రంగంలోని భార్యా, భర్తల మధ్య చోటు చేసుకున్న కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని, వారి మానసిక సంఘర్షణను చెప్పిన కథ ‘రెండు నదులు’. నదుల్లా కలిసిపోవాల్పిన దంపతులు, రెండు వేర్వేరు నదుల్లా ఎందుకు విడిపోతున్నారు. దగ్గరగా కంటే దూరంగా ఉన్నప్పుడే ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? ఇత్యాది అనేక ప్రశ్నలను రేకెత్తించే కథ ఇది. అందరికి చెందాల్సిన భూమి, నీరు, డబ్బు ఎలా ఉన్నోని పంచన చేరుతున్నాయి?. ఎవని చేతిలో బందీలుగా మారుతున్నాయని మంచి శిల్పంతో చెప్పిన కథ ‘బంధీలు’ కథ. ఒకప్పడు ఊరునంతా చైతన్యంతో నింపిన ఎడ్లకొట్టం ఇప్పుడు ఎంత దిగజారిందో, తద్వారా ఊరెంత దిగజారిపోయిందో ఎడ్లకొట్టం కేంద్రంగా మనసును రగిలించేలా చెప్పిన గొప్ప కథ ‘మా ఎడ్లకొట్టం @ 2010’. ఒకప్పుడు ఊరులోని ఎడ్లకొట్టం అన్ని కులాలకు, ఉద్యమాలకు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమానికి కేంద్రం. ఎన్నో దళాలు అందులో మీటింగ్ పెట్టుకొని పోరుబాటకు ఉద్యుక్తమయ్యేవి. పోలీసులు దాని మీద నిగా పెట్టేవారు.  ఈ పరిస్థితిలో అమ్మేయమని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అందులో బడి నడుపుతాడు కథకుడు. కాలక్రమంలో ప్రభుత్వం మద్యాన్ని ఏరులా పారించి గ్రామాలను మత్తులో ముంచివేస్తోంది. ‘మత్తు ఏదైనా సరే! ఏ రూపంలో ఉన్నా.. మత్తులో ఉన్నప్పుడు మనిషి ఆలోచించలేడు. ఆలోచించనప్పుడు ప్రశ్నించలేడు. ప్రశ్నించనప్పుడు ధిక్కరించలేడు. ధిక్కరించనంత వరకు రాజ్యానికి డోకా లేదు. అందుకే మత్తులో ఉంచడానికి మందును అందుబాటులోనికి తెచ్చింది. అది చెరకు గడ్డకు గండమాల పట్టినట్టు ఊర్లను పట్టుకొని తింటుంది’ ఇప్పుడా ఎడ్లకొట్టం  మద్యం విక్రయానికి కేంద్రంగా మారి మంచి ఆదాయానికి వనరుగా మారుతుంది. కథకుని మనస్సు చివుక్కుమంటుంది. వెంటనే దాన్ని నేలమట్టం చేసి ఇప్పడు దాని అడుగున కొత్త విప్లవాలేవో పూయాలని కలలుగంటాడు. సారా వ్యాపారం వెనకగల పెద్ద వలయాన్ని మన కళ్ల ముందు నిలబెట్టే కథ ‘వలయం’. ఈ వలయంలో సారా ఉత్పత్తి దారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ పావులేనని ఈ వలయం నుండి ఎవరూ తప్పించుకోలేరని చెప్తుందీ కథ. వ్యవసాయం గ్రామీణులకు ఎలా బలహీనతగా మారిందో చెప్పే కథలు ‘ఇగ వీడు తొవ్వకు రాడు’, ‘గ్లాసియర్’. ఇగ వీడు తొవ్వకు రాడు కథ విప్లవాన్ని నూరిపోసే కథ. వానసత్వంగా వచ్చిన వ్యవసాయం లాభసాటి కాదని కథకుడు ఎంత చెప్పినా వినకుండా ఈ వ్యవస్థ మెడలు వంచి రైతే రాజని నిరూపిస్తానని హామీ ఇచ్చే కథ. వ్యవసాయానికి దూరంగా ఉండలేని ఒక యువతి కాల క్రమంలో ఎలా మానసిక రోగిగా మారిందో విప్పి చెప్పే కథ ‘గ్లాసియర్’. చివరికి ఆ రోగికి మందేంటంటే మళ్లీ వ్యవసాయాన్ని మొదలు పెట్టడమేనని చెప్పడం పాఠకుడిని కదిలించి వేస్తుంది.

మొత్తం కథా సంపుటిలో మనిషి లోపలి ‘కార్జాలు’ కదిలే కథలు ‘పామును తరిమిన చీమలు’, ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’, ‘జుమ్మేకి రాత్ మే’. తమ ఊరు చుట్టూ రోజు రోజుకు మాయమవుతున్న గుట్టలను, చెట్లను, పుట్టలను  ప్రజలే చైతన్యవంతులై రక్షించుకోవాలని నాటకీయంగా చెప్పే కథ ‘పామును తరిమిన చీమలు’. ఎడారి దేశాల్లో జీవితం ఎంత దుర్భరమో, ఇక్కడ పనులు లేక, కాలం లేక వలస బాట పట్టిన యువకులు అరబ్ దేశాలకు వెళ్లి ఎలా అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారో! గుండెను మెలితిప్పే కథ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’. కథ పూర్తయ్యాక పాఠకుడు తనకు తెలియకుండానే కన్నీటి పొరల్లో మునిగిపోతాడు. మస్కట్ నుండి దుబాయికి, దుబాయి నుండి మస్కట్ కు దొంగతనంగా బోర్డర్ దాటడానికి భారతీయులు ఎలా చావు అంచుల దాకా వెళ్లి వస్తారో ఒళ్లు గగుర్పొడిచేలా కళ్లకు కట్టించిన కథ ‘జుమ్మేకి రాత్ మే’. కంకర క్రషర్ లో దాక్కొని బోర్డర్ దాటుదామని ప్రయత్నించిన వారు బోర్డర్ వద్ద గస్తీ పోలీసలు క్రషర్ మిషన్ లో ఎవరూ లేరని చెప్పినా నమ్మకుండా ఒక్కసారే క్రషర్ ను  ఆన్ చేస్తే అందులో దాక్కున్న వాడు నుజ్జు నుజ్జు అయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలకు మన దేహమంతా ఒక విద్యుత్ షాక్ కు గురవుతుంది.   మరణాన్ని రుచి చూపించే  కథ.

కొన్ని కథలు పెద్దింటి అశోక్ కుమార్ మాత్రమే రాయగల కథలున్నాయి. ఉబుసుపోకకు రాసిన కథ ఒక్కటి కూడా లేదు. ప్రతి కథ పిడికెడు కన్నీళ్లను గుప్పిట్లో పట్టుకుని రాసిందే. జోకొట్టే కథ ఒక్కటీ లేదు. అన్నీ చైతన్య భాస్వరాన్ని గుండెలకు అందించి మనిషిని నిలువెత్తు నిప్పుకణికల్లో ముంచి తీసి పుటం పెట్టే కథలు. నిత్యం తన కళ్లముందు కదలాడే మనుషులే తన కథల్లో పాత్రలుగా ఒదిగిపొయ్యారు. మొరందేలిన వాకిళ్లు, మూతపడ్డ ఇండ్లు, దగా పడిన జీవితాలు అనివార్యంగా ఆయనకు కథా వస్తువులయ్యాయి. పల్లె మధ్య, సంక్షోభం నడుమ నిలబడి వాటి చుట్టూ ఏం జరుగుతుందో వాటి పర్యవసానాలేమిటో ఒక్కో కథ చాలా బలంగా వ్యక్తీకరిస్తుంది. ఆయన కథలన్నింటికీ ఆయన ఊరే ఊటబాయి. అక్కడి  మట్టిని కెలుకుతూ అనేక కథలకు జీవం పోస్తున్నాడు. మాయమైన చెరువు దిక్కూ, ఎండిన వాగు దిక్కూ, కరిగిపోతున్న గుట్టల వైపు దిగులుగా చూసే పెద్దింటి మరిన్ని కథల్ని హామీ ఇస్తున్నాడు ఈ కథా సంపుటి ద్వారా.

 

*

 

 

 

                                                                                              

              

 

 

దేశం నుదిటిపై పచ్చబొట్టు ‘బంజారా నానీలు ‘

 sri
 
       బంజారాలు అనగానే స్మృతి పథంపై మెదిలేవి మోదుగు పూల రంగు దుస్తులు, అద్దాల కాళీ (రవిక ), వెడల్పాటి భుర్యా (ముక్కుపోగు ), చెవులకు బుట్ట లోలాకులు, అలవోకగా వేసుకునే టుక్రీ (మేలి ముసుగు ), కాళ్ళకు బరువైన కడియాలు ధరించి ఇప్ప పువ్వంతటి ముగ్ధత్వంతో తండాలో చలాకీగా తిరిగే అమాయక యువతులు. కట్టెల మోపు ఎత్తుకుని సమీప నగరపు వాడల్లో తిరిగే చెమట పూలు, ఎడ్ల బండ్లు కట్టుకొని ఊరూరా తిరిగి ఉప్పమ్మే దేశదిమ్మరి తనం, ఎన్నో యేండ్ల తరువాత అంగట్లో కలుసుకొని దుఖాన్ని కలబోసుకునే తల్లీ కూతుళ్ళు, మోసం నేర్వని తండాలు, గాసం కోసం అడవంతా గాలించే స్త్రీ, పురుషులు ఇలా ఎన్నో..  ఎన్నెన్నో… ఇవ్వన్నింటినీ రంగరించి నానీలలో పోత పోసి తెలుగు కవిత్వపు వేదిక పై తండా ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేశారు డా. సూర్యాధనంజయ్.
       సాహిత్యం జీవితానికి ఉపనది లాంటిది. నదీ ప్రవాహంలో రాళ్ళు, రప్పలు, ఎత్తులు, పల్లాలు, ఆటంకాలు, వేగం, విశాలత్వం, ఉన్నట్టే ఈ నానీల నిండా బంజారా జీవితాల్లోని అనేక సంఘర్షణలు, మిట్ట పల్లాలు, సంసృతి, తండా బతుకు చిత్రాలు అడవి పూల పరిమళంలా పరచుకుని ఉన్నాయి.
      బంజారాలు, ఎరుకల, సుగాలీలు.. వీళ్ళంతా ప్రధాన స్రవంతికి దూరంగా తమ బతుకేదో తాము బతుకుతూ నిశ్శబ్దంగా ఈ లోకం లోకి వస్తున్నారు, కాల గర్భంలో కల్సి పోతున్నారు. ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ జీవితాలు, 1980 నుండి సాహిత్యంలో చోటు చేసుకుంటున్నా, గిరిజన జాతుల జీవితాలు, వారి అనుభవాలు ఎక్కడా సాహిత్య పుటల్లోకి ఎక్కలేదు. ఎక్కినా అతి తక్కువ. అలాంటి అమలిన, నాగరికత సోకని తండా పైకి ఒక కవిత్వపు కిరణాన్ని ప్రసరింపజేసి, బంజారా సంస్కృతి లోని అనేక రంగుల కాంతి పుంజాన్ని ఆవిష్కరిస్తున్నారు డా. సూర్యధనంజయ్.
      విత్తు తన కడుపులో మహా వృక్షాన్ని దాచుకున్నట్లు ఒక్కో నానీ ఒక్కో గాయాన్ని, శిథిలత్వాన్ని, బతుకు లోతును, తండా శకలాల్ని, జీవితపు పాకుడు రాళ్ళపై పైకెగబాక లేక అంతకంతకూ లోలోతుల్లోకి జారిపోయే తనాన్ని పట్టిచూపుతుంది. ఇటుకపై ఇటుక పేర్చినంత మాత్రాన ఇల్లు కానట్టు నానీ రాయడమంటే పిడికెడు  అక్షరాల్ని కుప్పగా పోయడం కాదు. ఇటుకల్ని కలపడానికి పదార్ధం పూసినట్టు, పదాల్ని  కలపడానికి, ఒక భావాన్ని ఆవిష్కరించడానికి కవిత్వాంశ ఏదో కావాలి. ఆ కవిత్వమనే పదార్థాన్ని కడవ నిండా నింపుకొని నానీల ముఖ ద్వారం గుండా తెలుగు కవిత్వ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన కవయిత్రి డా. సూర్యాధనంజయ్. ఒక్కో వ్యక్తీకరణ పాఠకుడిని కుదుపు కుదిపి, తండా చట్టూ గిర్రున తిప్పి, ఆ తిరుగుడు తనం దేహం నుండి దూరం కాకముందే బతుకు చిత్ర పటంపై నెమ్మదిగా నిలుపుతుంది. అప్పుడు అసలు భావ శకలంలోకో, బతుకు పుటల్లోకో ప్రవేశిస్తాం. కొన్ని నానీలు రోజంతా వెంబడించి కలల్లోకి కూడా దూసుకు వచ్చి కలవరపెడతాయి. స్వప్న ప్రలాపన చేపిస్తాయి. మనసు లోతుల్లో రోజుల తరబడి నానీ నానీ, ‘నానీ’ రూపాన్ని సంతరించుకున్నాయేమో చాలా నానీలు తడి తడిగా మట్టి ముద్రల్ని హృదయపు గోడలపై వేస్తాయి. కొన్ని పద చిత్రాలు కవయిత్రి ప్రతిభకు గీటురాళ్ళుగా నిలిచి అబ్బుర పరుస్తాయి.
                                     పడిలేచే
                                     కెరటాలు వాళ్ళు
                                     వారి జీవితాలు
                                     జయించిన కన్నీళ్లు
  “జయించిన కన్నీళ్లు” అనే పదచిత్రాన్నిబహుశా తెలుగు కవిత్వం ఇప్పటిదాకా చూళ్ళేదేమో . జ్ఞాపకాల బొట్లు, శ్రామిక తపస్సు, కళ్ళల్లో చెలిమల్ని మోయడం, గాయాల గూడు, కడుపమ్ముకోవడం, పచ్చపచ్చని మాటలు, విషాదానికి ఊరే గుణం, శ్రమలోంచి పుట్టిన మయూరం, బానెడు కష్టాలు, వలసల అలజడి వంటి పదచిత్రాలు పఠిత మనసు ముంగిట్లో మేలిమి రత్నాల్లా జలజలా రాలుతాయి. నానీల విలువను కవిత్వపు నిచ్చెన మీదుగా నెల వంకను ముద్దాడేలా చేస్తాయి.
          ప్రపంచీకరణ ఇనుప పాదం పల్లెల మీదా, బతుకుల మీదా మోపిన సందర్భంలో ఆయా ప్రాంతాలు, ఆయా కులాలు, ఆయా జాతులు తమ తమ అస్తిత్వాన్ని పదిలంగా రెండు చేతుల మధ్య కాపాడుకుంటున్నాయి. అందుకు బంజారాలు కూడా అతీతం కాదు. తండా నడి బొడ్డున నిలబడి అక్కడి సంస్కృతిని. జీవితాన్ని, కన్నీళ్లను, గాయాలను, అనుభవించి, కలవరించి, పలవరించి ఒక్కో నానీలో జీవితమంత విశాలత్వాన్ని, గాఢతను 20-25 అక్షరాల్లో సర్దేశారు కవయిత్రి. అందుకే తండా ప్రతీ ముఖం, ప్రతీ కోణం మనకు కనిపిస్తుంది. పుస్తకం నిండా తండా ముచ్చట్లే. ఒక్కటి కూడా ఊహపోహలతో రాసిన నానీ లేదు. ప్రతీ నానీ ఇప్ప పూల అందంతో తొణికిసలాడుతూనే, మట్టి పరిమళాన్ని వెదజల్లుతుంది. అంతే కాదు అక్కడక్కడ బంజారా భాషా పదజాలం కూడా అందంగా ఒదిగి పోతుంది. తీజ్ పండుగ నాటి మొలకల సహజత్వాన్ని చాటుతుంది. కవయిత్రి ఇందులో తన జాతి ఔన్నత్యాన్ని, సొబగుల్ని చెప్తూనే మూఢ ఆచారాల్ని, అమానవీయతను ఎండగడుతుంది.
                                   నోట్లో సారా చుక్కేసి
                                   ఆడ శిశువును చంపేస్తారా?
                                   తండాకు
                                   గుండె లేదా?
  అని ప్రశ్నిస్తుంది. తండా పట్లా. సమాజం పట్ల, సంపూర్ణ బాధ్యతతో రాసిన నానీలు ఇవి. నానీలన్నీ చదివేసిన తరువాత గుప్పెడు నెత్తురు మనసు పొరల్లోకి చిమ్ముకొస్తుంది. అంతరంగాన్నంతా అతలా కుతలం చేస్తుంది. అదే సమయంలో నానీలన్నీ బంజారా డ్రెస్ వేసుకున్న కన్నె పిల్లల్లా మారిపోయి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందంగా మెలికలు తిరిగే లంబాడ నృత్యాన్ని చేస్తూ సుతి మెత్తని సందడి చేస్తాయి. ఈ నానీలు బంజారా సాహిత్యానికి సరి కొత్త చేర్పు. తండాకు నగరానికి మధ్య ఒక కవిత్వపు వంతెన.
                                   తాండే చ్వారి
                                   పోంటిల్ పక్డన్
                                   అబ్
                                   కాగజ్ శీత్లా కర్లత్!
                                         వెల్దండి శ్రీధర్

మన కథా ప్రయాణం గురించి…ఒక విహంగ వీక్షణం!

సదస్సు

గమనిక: ” తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం ” అనే అంశం పై  ఆగస్ట్ 2,3-2013 న జరగాల్సిన యు. జి. సి. జాతీయ సదస్సు సమైక్యాంధ్ర -తెలంగాణ ఉద్యమాల ఉద్రిక్త వాతావరణం  వలన ఆగష్టు చివరి వారం/సెప్టెంబర్ మొదటి వారానికి  వాయిదా వేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది సరైన తేదీతో సంప్రదిస్తాం.

– వెల్దండి శ్రీధర్

గత రెండు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని అనేక అస్తిత్వ ఉద్యమాలు కుదిపేస్తున్నాయి. వర్గం. కులం, జెండర్, మతం, భాష, జాతి, ప్రాంతం… ఇలా వివిధ అస్తిత్వాలు ఎన్నో నూతన పార్శ్వాల్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడంతో పాటు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే మార్కెట్, ఒకే ఆలోచనా స్రవంతిలోకి మార్చాలని చాప కింది నీరులా వస్తోన్న ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా భిన్న సమూహాలు, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న ప్రాంతాలు తమ అస్తిత్వ అన్వేషణలో తమను తాము పునర్నిర్మించుకుంటున్నాయి .

ఈ కోణంలోనే విభిన్న అస్తిత్వ ఉద్యమాలతో పాటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం కూడా బలం పుంజుకుంటోంది. అసలు ప్రపంచీకరణకు విరుగుడు స్థానికత లేదా ప్రాంతీయతనే అనే స్పృహతో గత రెండు దశాబ్దాలుగా మానవ సమాజం జీవిస్తోంది. ఈ దృష్టితోనే అనేక దేశాల్లో వివిధ అస్తిత్వ ఉద్యమాలు తలెత్తుతున్నాయి . ఆఫ్రికాలో వివిధ జాతుల అస్తిత్వ పోరాటాలు, శ్రీలంకలో తమిళుల సంఘర్షణ, సోవియట్ యునియన్ విఛ్ఛిత్తి… ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత దేశంలో ఐతే గ్రీన్ హంట్, టైగర్ ప్రాజెక్ట్ లను, సెజ్ ఉద్యమాలను, ప్రాజెక్ట్ కారిడార్లను ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని,  తెలంగాణలోని బొగ్గు నిక్షేపాలను, భాషను, సంస్కృతిని, రాయలసీమలోని రాతి నిక్షేపాలను, గనులను ధ్వంసం చేయడాన్ని, కొల్లగొట్టడాన్ని ఈ దృష్టితోనే చూడాల్సిఉంది. ఈ అన్ని పరిణామాలను గూగీ, మహాశ్వేతాదేవి, అరుందతీ రాయ్ ల నుండి మన తెలుగు కవులు, రచయితల దాకా అనేకులు తమ కవిత్వంలో, కథల్లో చిత్రించారు.

telanga

“ప్రాంతీయ ముద్ర అంటనిదే ఒక కళా రూపానికి జీవం రాదు. జీవితాన్ని చిత్రించదలుచుకున్నప్పుడు, ప్రజల కష్టసుఖాలు నిజాయితీగా వ్యక్తీకరించ దలుచుకున్నప్పుడు ప్రాంతీయతా భావనల ప్రమేయం లేకుండా సాధ్యం కాదు” అంటారు నందిని సిధారెడ్డి. ఒక ప్రాంతం యొక్క దుఃఖ స్పర్శను ఇతరులు ఎప్పటికీ యథార్థంగా చిత్రించలేరు. ఒకని మృత్యువును మరొకడు ఎత్తుకోనట్లే ఒక ప్రాంతం విశిష్టతను మరో ప్రాంతం  ప్రతిబింబించదు. దేనికదే సాటి. ఏ ప్రాంతం ఇంకో ప్రాంతానికి నమూనా కాదు. దేనికదే ప్రత్యేకమైనది. మనిషి ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు ఒక ప్రాంతం ఆ ప్రాంతీయుల ఆత్మను ఆవిష్కరిస్తుంది.

ఏ లక్షణాలైతే మనిషిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి చూపుతాయో అలాగే కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, వేష భాషలు, సుఖ దుఃఖాలు ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతంతో వేరు చేసి చూపుతాయి. ఇదే ప్రాంతీయ  అస్తిత్వం. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అస్తిత్వ “సోయి” తో అనేక కథలు వెలువడ్డాయి. మన అనుభవం, జ్ఞానం ఎప్పుడూ సంపూర్ణం కాదు. శకలాలు మాత్రమే. తెలుగు కథా సాహిత్యంలో అనేక ఖాళీలున్నాయి. వీటిని అర్థం చేసుకోవడం, కథా సాహిత్య విస్తృతిని తరచి చూడడం, శిల్ప మెరుగుదలకు జరిగిన దోహదాన్ని, మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని పునరాలోచింపజేయడం లేదా ఒక విద్యాత్మిక సమీక్ష (Academic Review) చేయడం ఈ సదస్సు ఉద్దేశం.

తెలుగు కథపై అభిరుచిని, విజ్ఞానాన్ని కల్గించడం, తెలుగు కథ సమగ్ర రూపాన్ని దర్శింప జేయడం, తెలుగు కథలో ప్రాంతీయ అస్తిత్వాన్ని చర్చించడం, తెలుగు కథ శైలీ శిల్పాలలో తొక్కిన కొత్తదన్నాన్ని శోధించడం, తెలుగు కథ కాల పరిణామం లో సంతరించుకొన్న మార్పును అధ్యయనం  చేయడం, తెలుగు కథా ప్రయాణంలో మనం ఎక్కడున్నాం? ఏం  సాధించాం? ఎలా ముందుకు సాగాలి? చర్చించడం, తెలుగు సాహిత్యం పై అస్తిత్వ స్పృహతో వెలువడిన కథ ఏ  మేరకు ప్రభావాన్ని చూపిందో పరిశీలించడం సదస్సు లక్ష్య్యాలు.

sridhar

               వెల్దండి శ్రీధర్,

జాతీయ సదస్సు సంచాలకులు 

 

ప్రాంతీయత వల్ల కథ విశాలమయింది: కేతు

ketu

కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆగస్ట్  2, 3 తేదీలలో “తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు వర్తమాన తెలుగు కథకి సంబంధించి అనేక కీలకమయిన అంశాలను చర్చకు తీసుకురానున్నది. ఈ సదస్సులో ప్రసిద్ధ విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి గారు కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కేతుతో ఈ ముఖాముఖి:

q సాహిత్యంలో ఇప్పుడు కథా యుగం నడుస్తోందనే వాదనను మీరెలా సమర్ధిస్తారు?

సాహిత్యంలో యుగ విభజన వ్యక్తుల పరంగా గానీ, ప్రక్రియల పరంగా గానీ  నాకిష్టం లేని మాట. మీ ప్రశ్నలోని అంతరార్థాన్ని బట్టి చూస్తే కవిత్వం కంటే కథా రచనకు ఆదరణ ఎక్కువైనదనుకోవాలి. లేదా కథా రచన పట్ల, కథా పఠనం పట్ల ఆసక్తి పెరిగిందనుకోవాలి. దీనికి కారణం వచన వ్యాప్తి. కవిత్వంలో ఇమడ్చలేని ప్రజల ఆకాంక్షలను, మానవ సంబంధాలను, అనుభవాలను స్వీయానుభావాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి చిత్రించాలనే కథా రచయితల ఆర్తి. వచన వ్యాప్తి అంటున్నామంటే మనం మాట్లాడుకునేది వచనం. బోధనలో వచనం. ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం. నిర్ణీత ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం. ఇంత వచన వ్యాప్తి వున్నప్పుడు సృజనాత్మక రచయితలు కూడా తమ అభివ్యక్తికి వచనాన్ని ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆచ్చర్యం లేదు. అట్లని కవిత్వం వెనకబడినట్లు నా ఉద్దేశం కాదు. కవిత్వ సంకలనాలు చాలా వస్తున్నాయి. కవిత్వ వస్తువు మీద, రూపం మీద శ్రద్ధ వున్న మంచి కవులు మనకు లేకపోలేదు. ఐతే కొత్త కొత్త సామాజిక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి, ఉప ప్రాంతాల నుంచి చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. వారిలో కొందరు సృజనాత్మక కల్పనా సాహిత్యం మీదా, ముఖ్యంగా కథల మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.

q సాధారణంగా ఏ వాదమైనా లేక ఉద్యమమైనా మొదట కవిత్వంలో విస్తరించి ఆ తరువాత ఇతర ప్రక్రియల్లోకి వ్యాపించే ఒక భూస్వామిక    లక్షణం తెలుగు సాహిత్యంలో ఉంది.  ఈ కోణంలో ప్రాంతీయ  అస్తిత్వ కథలు వస్తున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇది భూస్వామిక లక్షణం కాదు. కాక పోతే కవిత్వానికి ఉన్నంత చరిత్ర కవిత్వేతర ప్రక్రియలకు లేదు. ఉద్యమాలకు కవులు తక్షణం స్పందిస్తారు. వారి గాఢమైన ఆవేశ బలం కావచ్చు. కవిత్వ నిర్మాణానికి అవసరమయ్యే స్పందనల చిత్రణ శబ్ద చిత్రాల రూపంలోనో, భావ చిత్రాల రూపంలోనో, భావ శబలత రూపంలోనో అది వ్యక్తం అవుతుంది. ఇతర వచన ప్రక్రియలకు ఇది కొంత ఆలస్యంగా విస్తరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ కథల విషయంలో కూడా ఇది వాస్తవం. దీనికి కారణం ఈ అస్తిత్వ కథ లాంటివి తక్షణ స్పందనకు వీలైన నిర్మాణాలు కాదు.

q ప్రాదేశిక నిర్దిష్టతతో తెలుగు కథను ఎట్లా చూడాలి?

తెలుగు సాహిత్యకారులు, విమర్శకులు సాధారణంగా మూడు మాటలు వాడుతుంటారు. అవి స్థానీయత, ప్రాదేశికత, ప్రాంతీయత. స్థానీయత కంటే ప్రాదేశికతకు, ప్రాంతీయతకు మరింత విశాలమైన నేపథ్యం వుంటుంది. ప్రాదేశికత, నిర్దిష్టత అంటున్నప్పుడు ప్రధానమైన ఆరేడు లక్షణాలని మనం దృష్టిలో ఉంచుకొవాలి. 1. ప్రదేశం/ప్రాంతం, భౌతిక జీవితం . అంటే భౌగోళిక స్థితిగతులు, పర్యావరణం, జలవనరులు, అటవీ సంపద, వృక్ష సంపద, ఖనిజ, ఇంధన సంపద, నేల తీరులు, వర్షపాతం, పంటలు, కరువు కాటకాలు, వరదలు వీటి మధ్య ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భేదాలు . 2. సామాజిక శ్రేణులు, (మతం, కులం, ఉపకులాలు, తెగలు)సామాజిక విభజన, సామాజిక వైరుధ్యాలు, అసమానతలు, ఆదిపత్య వర్గాల వైఖరులు, ప్రతిఘటనలు, ఉద్యమాలు. 3. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు. చలనం, అభివృద్ధి, స్వభావం, పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తుల సంక్షోభం, చరిత్ర, ఇటీవలి సామాజిక పరిణామాలు. 4. భాష, అధికార భాష, భాషా భేదాలు, మాండలికాలు, ఉపమాండలికాలు, ఆదివాసి భాషలు, అన్యభాషా వ్యవహర్తలు. 5. మహిళా సమస్యలు. 6. సాంస్కృతిక పరమైన అంశాలు, తిండి తిప్పలు, వేష ధారణ, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, పండగలు, కళా సాహిత్య రూపాలు. 7. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రవాసం వెళ్ళిన వారి అస్తిత్వ సమస్యలు. ఈ అంశాలు ప్రాదేశిక నిర్దిష్టతను ఎత్తి చూపుతాయి. ఈ దృష్టితో తెలుగు కథల్లో ఏ మేరకు ఆ ప్రతిఫలనం జరిగిందో మనం పరిశీలించవచ్చు.

Kethu Viswanatha Reddy

q ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో కథలు వెలువడడం ముందడుగా? వెనుకడుగా ?

అస్తిత్వం అనే మాటను మనస్తత్వ శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రజ్ఞులు , తత్వశాస్త్రజ్ఞులు  నిర్వచిస్తున్న క్రమంలో అస్తిత్వం వ్యక్తి జీవ లక్షణం, జన్యు లక్షణం, జన్యుప్రేరితం, గాయపడిన వ్యక్తి స్వభావం, సామాజిక ప్రాంతీయ సాలిడారిటికి సంకేతం అని కూడా భావిస్తున్నారు. అస్తిత్వం అనే మాటకు ఉనికి, గుర్తింపు అనే అర్థాలున్నాయి. “ఐడెంటిటి” అనే  ఇంగ్లీష్ మాటకు సమానార్థకంగా అస్తిత్వం అనే మాటను విరివిగా ఉపయోగి స్తున్నారు. ఉదాహరణకు దళిత అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం, మహిళల అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం. ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఉప ప్రాంతంలోని లేదా భాషా ప్రాంతంలోని ప్రత్యేక లక్షణాలను, భావాలను, విశ్వాసాలను ప్రతిఫలించే నిర్దిష్ట లక్షణాలను ప్రాంతీయ అస్తిత్వంగా స్థూలంగా నిర్వచించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వెలువడుతోన్న కథలు వెనుకడుగు మాత్రం కాదు. అవి  సమాజ అవగాహనకు మునుపటికంటే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. ఒక ప్రాంతం ప్రత్యేక లక్షణాలను ఆ ప్రాంతంలోని వివిధ సామాజిక సముదాయాల అవగాహనను పెంచుతుండడం చూస్తూనేవున్నాం. ఉదాహరణకు తెలుగు ప్రాంతంలోని ఆదివాసీల జీవన సమస్యలు, జీవన వాస్తవికత కథల్లో విరివిగా వెలువడడం ఈ రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అలాగే ముస్లిం జీవితాలైనా, దళిత జీవితాలైనా, మహిళల జీవితాలైనా మైనారిటీల జీవితాలైనా.  ఇది మన సమాజ అవగాహనను తప్పక పెంచేదే కదా. అంతేగాక సమాజంలో సమానత్వాన్ని/సమభావాన్ని, సౌభ్రాతృత్వానికి  ఈ కథల్లోని  సంవేదనలు, స్పందనలు. తోడ్పడుతాయి. ఇది మనిషి చేసుకున్న మానవ సంస్కార పరిణామంలో ఒక దశ. ఒక చిన్న ముందడుగు..

q ప్రాంతీయ అస్తిత్వానికి ఎందుకింత గుర్తింపు లభిస్తోంది?

ఇది అస్తిత్వ చలనాల దశ. తెలుగు మాట్లాడే ప్రాంతంలోని ప్రజా సముదాయాల జీవ లక్షణాలను భావాలను ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవి అనుకున్న సామాన్య లక్షణాలను ఒక్కోసారి నిర్దిష్ట లక్షణాలకు కూడా (స్థానీయ  లక్షణాలు ) రచయితలు స్పందిస్తున్న దశ ఇది. పాఠకులు కానీ, విమర్శకులు కానీ వీటిని గురించి ఆలోచించాల్సిన దశ కూడా ఇదే.

q ప్రాంతీయ అస్తిత్వ కథ వెనుక జాతీయ అంతర్జాతీయ కారణాలు లేదా ప్రభావాలు ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అస్తిత్వ సమస్యలున్నాయి. అమెరికా లో నల్ల జాతీ ప్రజలది అస్తిత్వ సమస్య. బంగ్లాదేశ్ ఏర్పడడానికి భాష ఒక అస్తిత్వంగా ఏ రకంగా పని చేసిందో మనకు తెలుసు. లాటిన్ అమెరికన్,ఆఫ్రికా దేశాల్లోని అస్తిత్వ సమస్యలతో కూడా మన కథా రచయితలకు కొంత మందికైనా అంతో ఇంతో అవగాహన లేకపోలేదు. ఇవి పరోక్ష కారణాలు, ప్రభావాలు ఏవైనా మన రచయితలూ మన వాస్తవికత నుండే కథలను రాస్తున్నారు.

q రాయలసీమలో కవిత్వం కంటే కథే బలంగా వస్తోంది దీనికి ప్రాదేశికతే కారణమా?

ప్రాదేశికత కారణం కాదు. అక్కడి జీవితంలో సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఒక రకంగా చాలా చాలా తక్కువే. దీనికి తోడు అక్కడ పద్య ప్రియత్వం ఎక్కువ. అంతకు మించి ఆధునిక వచన కవిత్వానికి అవసరమైన వస్తు రూపాలు చాలా తక్కువ మందికే అబ్బాయి. కవిత్వ విషయంలో సంప్రదాయ విచ్చిత్తి జరగవలసినంత జరగలేదు.

q ప్రాంతీయ అస్తిత్వం అనేది కథా శిల్పానికి ఏమైనా మెరుగులు పెట్టిందా?

ఏ కథకైనా వస్తువెంత ముఖ్యమో, శిల్పమూ  అంతే. ప్రాంతీయ అస్తిత్వం అంటున్నప్పుడు మనం అందులో భాష ఉందనే విషయం మరువరాదు. ఈ భాషా శైలుల విషయంలో రచయిత వాడే కథన శైలి,పాత్రల భాషా శైలుల విషయంలో ప్రాంతీయ  అస్తిత్వాన్ని చిత్రిస్తున్న కథకులు మరింత విశాలం చేశారు.తర్వాత  చాలా కొద్ది మందే కావచ్చు మానసిక ఘర్షణను, మానవ చలనాలను చిత్రించడంలో శ్రద్ధ చూపారు.

q కవిత్వంలో ఆధునికానంతరవాదం వస్తున్నప్పుడు ఆ ప్రభావం కథా సాహిత్యం మీద ఏ మేరకుంది?

కవిత్వంలో ఆధునికానంతరవాద పరిశీలన అఫ్సర్ “ఆధునికత- అత్యాదునికత” ( 1992) వ్యాసాలలోనూ, దానికి తిరుపతిరావు ముందు మాటలోనూ  వారు చేసినట్లు గుర్తు. నిజానికి ఈ వాదానికి సంబంధించిన జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, మూలగ్రంథాల అనువాదాలు గానీ, స్వంత రచనలు గా గానీ వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. కన్నడ విమర్శకులు దీన్ని నవ్యోత్తర వాదం అంటున్నారు. ఇటీవలే అస్తిత్వాలను, అస్తిత్వ చరిత్రను చిత్రించే కథలను ఆధునికానంతర ధోరణి కింద చూస్తున్నారు. నేను కూడా మొన్న మొన్నటి దాకా దళితులు, మైనారిటీలు, బహుజనులు, మహిళలు వీరి శకలీకరణ జీవితాల్ని చిత్రించే కథలు ఆధునికానంతరవాదానికి చెందినవనే అనుకున్నాను. ఇది ఒక రకంగా సిద్ధాంత దృష్టి కాదు. రాజకీయ దృష్టి.

ఆధునికానంతరవాదం అంతః సారాన్ని సర్వ విషయ సాపేక్షతను అంతరంగ చలానాలను చిత్రించడానికి ప్రయత్నించిన   వి. చంద్రశేఖర్ రావు, అఫ్సర్,  మధురాంతకం నరేంద్ర లాంటి రచయితలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇటీవలే ఆధునికానంతరవాదం కంటే భిన్నమైన ఆధునికత, ఆధునీకరణ సాక్ష్యంగా నిలిచే అనుక్షణిక నవీన మోహిని ద్రవాధునికత  (లిక్విడ్ మోడ్రనిజం)-పోలిష్ సామాజిక తత్వవేత్త బౌమన్ ను  పాపినేని శివశంకర్ పరిచయం చేశాడు. చలనం, అస్థిరత లక్ష్యంగా సాగే ఈ ద్రవాధునికత కథా రచనలో ఆధునికోత్తరవాదం లాగే అనే ఒక ఆకర్షణీయమైన గుర్తుగానే మిగులుతుందేమో చూడాలి. వీటి విషయంలో చాలా మందితో పాటు నాదీ పరిమితమైన జ్ఞానమే. ఇది విశాలం చేయడానికి ఆధునికానంతరవాదాన్ని ప్రతిఫలించే కథలను ఒక సంకలనంగా తీసుకురావాల్సిన అవసరమెంతైనా ఉంది. అస్తిత్వ వాదాన్ని తెలుగులో సమూహాల గుర్తింపు వాదంగా వాడుతున్నాం. ఎగ్జిస్టెన్షియలిజం కు సమానంగా వాడుతున్నాం.

జీన్ పాల్ సార్త్రే, మార్షల్ ప్రౌస్ట్ వంటి వారు ప్రతిపాదించిన అస్తిత్వ వాదంలో కీలకాంశం మనిషికి ఇచ్చా శక్తి ఉంది. తానూ చేసే పనులకు తానే బాధ్యుడు. ఐతే- అర్థం పర్థం లేని ప్రపంచంలో. ఏమైనా ఈ రకమైన అస్తిత్వవాదానికి ఆధునికానంతరవాదం ఏ  అంశాల్లో విభేదించిందో తెలిస్తే మనకు మంచిది. తెలుగులో సాహిత్య పరిభాష అభివృద్ధికి ఈ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయి.

q మిగిలిన భారతీయ భాషల కథలతో పోల్చినపుడు తెలుగు కథా స్థానం ఎక్కడుంది? దీన్ని ఎట్లా చూడాలి?

ఆధునిక భారతీయ భాషల కథల్ని మనం ఆంగ్లం ద్వారానో, తెలుగు ద్వారానో చదువుకుంటున్నాం. కానీ పరిశీలించడానికి తగినంత విస్తారంగా ఈ కథా సాహిత్య సామగ్రి లోటు ఉండనే ఉంది. నేను పరిశీలించినంత వరకు తెలుగు కథ  మెచ్చుకోదగిన స్థాయిలోనే ఉంది- అన్ని మంచివనుకునే ముగ్ధత్వం వదిలిపెడితె. ఏది ఏమైనా తెలుగు కథలు విరివిగా ఇంగ్లీష్ లోకి ఇతర ప్రాంతీయ భాషల్లోకి వెళ్తే ఆ సాహిత్యకారులు ఏమనుకుంటారో కూడా మనం పట్టించుకోవాల్సి ఉంది.

 

                                                                                                        ఇంటర్వ్యూ : వెల్దండి శ్రీధర్