తోపుకాడ (In a Grove)

akira-kurosava_500x330

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ మాత్రమే ఉపయోగించుకున్నారు కురొసావా. ఇక రెండొ కథ ‘In a Grove’. రషోమన్ సినిమా మొత్తం దాదాపుగా ఈ కథ ఆధారంగానే నడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పది పేజీల కథను పూర్తి నిడివి చిత్రంగా మలిచిన కురొసావా ప్రతిభ అపూర్వం. ఇక ’నిజం’ అనే అంశాన్ని ’In a Grove’ లఘు కథలో అకుతగవా ప్రస్తావించిన తీరు అమోఘం. రషోమన్ సినిమాకి ఆధారమైన ’In a Grove’ కథకు తెలుగు అనువాదం ఇది.

******

న్యాయాధికారి ఎదుట కట్టెలుగొట్టువాని దృష్టాంతము

అవునయ్యా! ఆ శవం కనుక్కొంది ఖచ్చితంగా నేనే.

పొద్దుకాల, ఎప్పట్లాగే, కట్టెలు కొట్టుకొద్దామని అడవిలోకి పోయినా. అడివిలోకి కొంచెం దూరం పోంగానే పొదల్లో కనిపించింది సారూ శవం.

ఏడంటారా?

యమషినా రోడ్డుకి వంద గజాల దూరంలో వుందయ్యా ఆ చోటు. ఎదురు మొక్కలు, దేవదారు చెట్లతో నిండిపోయుంటాది ఆ చుట్టూతా.

నేను చూసే పాటికి శవం ఎల్లికల పడుందయ్యా. బులుగు రంగు సిలుకు బట్ట్టలు యేసుకుని వున్నాడా చచ్చిపోయినాయన! గుండెల్ని చీల్చిన కగ్గం గాయం వుండాది శవం పైన. చుట్టూ ఎదురు మొక్కల్నుండి రాలిన ఆకులు రకతం మరకలతో పడుండాయి.

లేదయ్యా నేను చూసేపాటికి రకతం కారటంలేదయ్యా!గాయం ఎండిపోయినాదనుకుంటా.

….ఆ అన్నట్టు మరిచిపోయినా, నేనొచ్చినాననిగూడా లెక్కచేయకుండా ఒక జోరీగ ఆడనే తిరుగుతావుండాది.

కగ్గం గానీ అట్లాంటి ఆయిధాలేమైనా ఆడసూసానా అని అడుగుతున్నారా అయ్యా?

లేదయ్యా.అట్టాంటిదేది లేదు. ఒక తాడు మాత్రం సెట్టుకిందపడివుండాది. ఆ….ఆ తాడు పక్కనే ఒక దువ్వెన కూడా పడివుండాది. అంతే, అయ్యి తప్ప నాకింకేమీ కనబడలే. సూస్తుంటే ఆయన సచ్చిపోయేముందుపెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు. ఎందుకంటే అక్కడ గడ్డీ ఆకులు చెల్లాచెదరుగా పడివుండాయి.

గుర్రమా?

లేదయ్యా, ఆ పొదల్లోకి మనుషులు పోవడమే బహుకష్టం. ఇంక గుర్రమెట్టాపోద్ది?

న్యాయాధికారి ఎదుట బౌద్ధసన్యాసి దృష్టాంతము.

సమయమా?

ఖచ్చితంగా మిట్టమధ్యాహ్నం వేళ అయ్యుండవచ్చును. ఆ దురదృష్టవంతుడు సెకియామా నుండి యమషినా వెళ్ళేరోడ్డులో పయనిస్తున్నాడు. గుర్రంపై ఒక యువతిని కూర్చుండబెట్టి ఆయన సెకియామా వైపుగా నడకసాగించడం చూశాను. పరదా కప్పబడివుండడంచే ఆ యువతి మోమునైతే చూడలేకపోతిని గానీ ఆమె ధరించిన బట్టలు మాత్రం ఊదా రంగులో వుండడం గమనించితిని. ఆమె స్వారీ చేస్తున్న గుర్రం మాత్రం అతి సుందర కీసరము తో మేలైన జాతికి చెందినదైనట్టుగా వున్నది.

ఆ యువతి ఒడ్డుపొడుగులా?

నాలుగడుగులు దాటి ఐదంగుళాలుండొచ్చు. బౌద్ధసన్యాసిని కావడంచే ఆమెను అంతగా గమనించియుండలేదు. కానీ, అతను మాత్రం ఒక ఖడ్గం తో పాటు విల్లుబాణాలనూ ధరించివున్నాడు. పొదిలో ఇరవైదాకా బాణాలు కూడా వుండడం నాకు గుర్తుంది.

ఆ వ్యక్తికి ఇటువంటి దుర్గతి పడుతుందని అనుకోలేదు. వేకువవేళ మంచు బిందువులా, తలుక్కున మెరిసి మాయమయ్యే మెరుపులా మానవుని జీవితం కూడా అశాశ్వతమే. ఆతనిపై నా సానుభూతి చూపించుటకు నాకు నోటమాట వచ్చుటయే కష్టముగానున్నది.

*****

images

న్యాయాధికారి ఎదుట పోలీసువాని దృష్టాంతము.

నేను బంధించినవాడా?

వాడు తజొమరు అనబడే ఒక గజదొంగ. నేను బంధించేసమయానికి వాడు గుర్రముపైనుండి కిందపడి అవతగుచి వంతెన వద్ద మూలుగుతూ వున్నాడు.

సమయమా?

పోయిన రాత్రి వేకువజాము అయ్యుండొచ్చు. వీడిని గతంలో కూడా ఒక సారి బంధించే ప్రయత్నం చేసాను. కానీ తప్పించుకున్నాడు. నేను బంధించే సమయానికి బులుగు రంగు బట్టలు ధరించి వున్నాడు. ఇక వీడి దగ్గర వున్న విల్లు బాణాలు మీరు చూసేవున్నారు.

ఈ విల్లు బాణాలు ఆ మరణించిన వ్యక్తివి వలే వున్నాయని మీకూ అనిపించిందా?

అయితే ఖచ్చితంగా హంతకుడు వీడే!

ఇతని దగ్గర దొరికిన – తోలు తో చుట్టబడిన విల్లు, నల్లటి లక్కతో చేయబడిన పొది మరియు డేగ ఈకలతో చేయబడిన పదిహేడు బాణాలు – ఆ మరణించిన వ్యక్తివే అయ్యుంటాయని నా నమ్మకం.

గుర్రం గురించి మీరన్నది నిజమే!

అది జేగురు రంగులో మేలైన కీసరం తో ఉన్నది. పగ్గాలతో కట్టివేయబడని ఆ గుర్రం రాతి వంతెనకు కొంచెం దూరంలోనే గడ్డి మేస్తూ నాకు కనిపించింది. ఆ గుర్రం పై నుండి వీడు కిందపడి నా కంట బడడం తప్పకుండా విధి విధానమే!

ఈ క్యోటో ప్రాంతంలో ఎంతో మంది దొంగలు తిరుగుతున్నారు కానీ ఈ తజొమరు లాగా ఎవరూ మహిళలను వేదనకు గురి చేయటం లేదు. పోయిన ఏడాది పిండోరా పర్వత ప్రాంతంలో వున్న తొరిబె దేవాలయం సందర్శించడానికి వచ్చిన ఒక మహిళ, ఆవిడతో పాటే వున్న ఒక చిన్న పిల్ల హత్యకు గురికాబడ్డారు. ఆ హత్యల వెనుక కూడా తజొమరు హస్తం వుందని భోగట్టా!

మగవాడినే హత్య చేసిన వీడు ఆయన భార్యను ఏం చేసివుంటాడో అర్థం కావటం లేదు. దయచేసి ఆ విషయం గురించి కూడా మీరు విచారణ జరపాలని కొరుకుంటున్నాను.

******

న్యాయాధికారి ఎదుట వృద్ధురాలి దృష్టాంతము.

అవునయ్యా, ఆ శవం నా కూతుర్ని పెళ్ళాడిన వాడిదే.

ఆయన ఈ క్యోటో ప్రాంతానికి చెందిన వాడు కాదు. వకాసా రాజ్యంలోని కొకుఫూ పట్టణంలో సమురాయ్ గా వుండేవాడు. ఆయన పేరు కనాజవా నో టకెహికో,వయసు ఇరవై ఆరు. ఆయన చాలా నెమ్మదస్థుడు, ఇతరులకు కోపం తెప్పించేలా ప్రవర్తించి వుండడని నాకు గట్టి నమ్మకం.

నా కూతురా?

ఆమె పేరు మసాగో, వయసు పంతొమ్మిది. అదో చిలిపి చిచ్చుబుడ్డే కానీ టకెహికోని తప్పితే పరాయి పురుషులతో పరిచయమే లేదామెకి. దానిది చిన్నటి గుండ్రటి మొహం. ఎడమ కన్ను చివర్లో ఒక పుట్టుమచ్చ కూడా వుంటుంది.

నిన్న నా కూతురితో కలిసి వకాసాకి బయల్దేరాడు టకెహికో. ఇంతలోనే వారినిలా దురదృష్టం వెంటాడింది.

నా కూతురు ఏమయిందని అడుగుతున్నారా?

నా అల్లుడు చనిపోయాడని ఒప్పుకోక తప్పకపోయినా నా కూతురు ఎక్కడుందో ఎలా వుందో తలుచుకుంటేనే బాధేస్తుంది. ఆమె ఏమైపోయిందో ఎలానైనా తెలుసుకోండి. ఈ గజదొంగ తజోమరు పేరు తలవడానికే అసహ్యంగా వుంది. నా అల్లుడినే కాదు, కూతురిని కూడా వీడేమైనా…….(ఆపై ఆమెకు మాటలు పెగలక భోరున ఏడ్చేసింది).

******

images1

తజోమరు ఒప్పుకోలు

అతన్ని నేనే చంపాను; కానీ ఆమెను నేను చంపలేదు.

ఆమెక్కడికెళ్ళిందా?

ఏమో నాకు తెలియదు.

అయ్యో, ఒక్క నిమిషం ఆగండి.

నన్నెంత చిత్ర హింసకు గురిచేసినా నాకు తెలియని విషయం గురించి నన్నొప్పించలేరు. అయినా విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, అంతా ఉన్నదున్నట్టే చెప్పేస్తాను.

నిన్న మధ్యాహ్నం పూట వాళ్లని నేను మొదటి సారి చూసాను. అప్పుడే వీచిన చిరుగాలికి ఆమె మేలిముసుగు కొద్దిగా తప్పుకోవడంతో ఆమె మొహం ఒక క్షణం పాటు నా కంటపడి ఇంతలోనే ముసుగులోకి మాయమయింది. అందుకేనేమో ఆ క్షణంలో నాకామె బోధిసత్వునిలా అనిపించింది. ఆమెతో వున్న ఆ వ్యక్తిని చంపైనా సరే ఆమెను చెరబట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.

ఎందుకా?

మీరనుకుంటున్నట్టు చంపడం అనేది నాకు గొప్ప పరిణామమేమీ కాదు.

ఒక యువతిని చెరబట్టాల్సివచ్చిననప్పుడు ఆమె తో వున్న మగవాడిని ఎలాగూ చంపాల్సిందే. ఇదిగో నాతో పాటు ఎప్పుడూ వుండే ఈ కత్తితోనే నేను హత్యలు చేసేది.

అయినా ప్రజలని చంపేది నెనొక్కడినేనా?

మీరు మీ కత్తులు ఉపయోగించి చంపకపోవచ్చు. మీ అధికారంతో ప్రజల్ని చంపుతారు. మీ డబ్బుతో ప్రజల్ని చంపుతారు. ఒక్కోసారి వారికి మంచి చేస్తున్నామనే సాకుతో వారిని చంపుతారు. నిజమే మీ హత్యల్లో రక్తపాతముండకపోవచ్చు. మీరు చంపిన వాళ్ళు కనబడడానికి బాగానే ఆరోగ్యంగానే వుంటారు కానీ శవాలైపోయాక ఏం లాభం. మనిద్దరిలో పెద్ద హంతకుడు ఎవరో తేల్చడం కష్టమే .(హేళనగా నవ్వుతూ)

కానీ మగవాడిని చంపకుండానే అతని ఆడదాన్ని చెరబట్టగలిగితే బాగానే వుంటుంది. అందుకే అతన్ని చంపకుండానే ఆమెను నా దాన్ని చేసుకుందామనే నేను నిర్ణయించుకున్నాను. కానీ అలా చేయడం యమషినా రోడ్డులో సాధ్యం కాదు. అందుకే ఆ జంటను కొండల్లోకి పయనించేలా ప్రలోభపెట్టదలచాను.

అది చాలా సులభంగా జరిగిపోయింది.

కొండల్లో ఒక తోపు దగ్గర ఖడ్గాలు, దర్పణాలతో కూడిన ఒక నిధి గురించి వాళ్ళకి చెప్పాను. నాతో పాటే వచ్చిన వారికి అతి కొద్ది సొమ్ముకే ఆ నిధిని అమ్ముతానని నమ్మబలికాను.

మరి….మీరే చెప్పండి, ఆశకు హద్దుంటుందా?

నేను చెప్పడం ముగించేలోపే అతను నా మాటలను నమ్మేశాడు. నేను వాళ్ళను కలిసిన అరగంట లోపే గుర్రంపై నాతో పాటే కొండల్లోకి ప్రయాణం సాగించారు.

కాసేపట్లోనే నేను చెప్పిన వెదురు తోపు దగ్గరకు చేరుకున్నాము.

నాతో పాటే వచ్చి ఆ నిధిని చూడమన్నాను. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి సరే అని ముందుకు కదిలాడు. కానీ ఆ యువతి మాత్రం గుర్రం తో పాటు అక్కడే ఎదురుచూస్తానంది.

అక్కడ పొదలు పొదలుగా ఎదిగిన వెదురు తోపుని చూసి భయపడి ఆమె అలా అనడం సహజమే అనిపించింది.

నిజానికి, అప్పటివరకూ నేను పన్నిన పథకం సజావుగానే సాగింది.

ఆమెనక్కడే వదిలేసి మేమిద్దరం ముందుకు సాగాం. వెదురు పొదలతో కప్పబడిన త్రోవలో కొంచెం సేపు ముందుకు నడిచాక చుట్టూ దేవదారు వృక్షాలతో కూడిన ఒక చదునైన ప్రదేశం చేరుకున్నాము. నా పథకం అమలు పరచడానికి అదే అనువైన ప్రదేశం అని నిర్థారించుకుని, నేను చెప్పిన నిథి ఆ చెట్లకింద పొదల్లో పాతిపెట్టివుందని అబద్ధం చెప్పాను. నా మాట వినగానే నన్ను తోసుకుంటూ ఆక్కడికి పరిగెట్టాడా వ్యక్తి. అతనక్కడికి చేరుకోగానే వెనకమాలుగా అతన్ని బంధించాను. అతను బలిష్టుడు, కత్తి పట్టిన వీరుడూ కావడంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను చేసిన పనికి అతను డంగైపోయాడు. వెంటనే నేనతన్ని ఒక దేవదారు వృక్షానికి కట్టిపడేసాను.

నా దగ్గర సమయంలో తాడెక్కడిదనా మీ అనుమానం?

దేవుడి దయవల్ల దొంగని కావడంతో ఏ సమయంలో ఏ గోడ దూకాల్సి వస్తుందోనని ఒక తాడు నాదగ్గర ఎప్పుడూ వుంటుంది. అలాగే అరిచి కేకలు పెట్టకుండా అక్కడున్న ఎండుటాకులతో అతని నోరు మూసేశాను.

అతన్నక్కడే వదిలేసి ఆమె వున్న ప్రదేశానికి చేరుకున్నాను. ఆమె భర్త అకస్మాత్తుగా ఏదో రోగాన పడ్డాడని అబద్ధం చెప్పి ఆమెను నాతో రమ్మన్నాను.

ఈ పథకం కూడా పారిందని మరోసారి చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ యువతి తన మేలి ముసుగు తొలిగించి నా వెంట నడిచింది.

ఆమె చెయ్యిపట్టి నేను పొదల్లోకి దారితీశాను. కట్టివేయబడ్డ తన భర్తను చూడగానే ఆమె తన వద్ద వున్న బాకుతో నాపై తిరగబడింది. అంతటి తీవ్ర ఆగ్రహం కలిగిన ఆడదాన్ని నేను జీవితంలో చూడలేదు. నేను అప్రమత్తంగా వున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా డొక్కలో పొడిచివుండేది. నేను తప్పించుకుంటూనే వున్నా, ఆమె మాత్రం నాపై దాడి చేస్తూనే వుంది. ఇంకొకరైతే ఆమె చేతిలో చావడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగి వుండేది.

కానీ నేను తజోమరుని!

నా ఖడ్గం దుయ్యకుండానే ఆమె బాకుని నేలరాల్చాను. ఎంతటి ధైర్యవంతురాలయిన మహిళ అయినా, ఆయుధం లేకపోవడంతో డీలాపడిపోయింది. మొత్తానికి ఆమె భర్తను చంపకుండానే అమె పై నా వాంఛను తీర్చుకొన్నాను.

అవును….అతన్ని చంపకుండానే!

అతన్ని చంపాలనే కోరిక నాకస్సలు లేదు.

దు:ఖసాగరంలో మునిగివున్న ఆమెనక్కడ వదిలి, నేను తోపుదగ్గర్నుంచి పారిపోవాలనుకుంటుండగా, అమె పిచ్చిపట్టిన దానివలే నా చేతులు గట్టిగా పట్టుకుంది. తడబడే మాటలతో తన భర్తో లేదా నేనో ఎవరో ఒకరు చచ్చిపోవాలంది. ఇద్దరి లో ఎవరు బతికుంటారో వాళ్ళకే తను భార్యగా మిగుల్తానని ఒగర్చింది. దాంతో అతన్ని చంపాలనుకునే ఆవేశం నన్నావరించింది. (విషాదంతో కూడిన ఉద్వేగం)

ఇలా చెప్పడం వల్ల, మీకంటే నేనే క్రూరమైన వాడినని మీకనిపించడంలో అనుమానం లేదు.

కానీ ఆ సమయంలో మీరామె కళ్ళు చూసుండాల్సింది.

ముఖ్యంగా ఆ క్షణంలో జ్వలించే ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నా పై పిడుగుపడ్డా సరే, ఆమెను నా భార్యను చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నాను. ’ఎలా అయినా అమెను నా భార్యను చేసుకోవాలి’…….ఆ కోరిక నా మదిని ఆవరించింది.

అది కేవలం కామం అని మీరనుకోవచ్చు. ఆ సమయంలో నాకు కామం తప్ప మరో ఆపేక్ష లేనట్టయితే, అమెనక్కడే తోసేసి పారిపోయేవాడిని. అప్పుడు నా కరవాలానికి రక్తపు మరకలంటి వుండేవి కావు. కానీ ఆ తోపు దగ్గర మసక వెలుతురులో ఆమె మొహం చూసిన క్షణమే, అతన్ని చంపకుండా అక్కడ్నుంచి కదలకూడదని, నిర్ణయించుకున్నాను.

కానీ అన్యాయంగా అతన్ని చంపడానికి నేను పాల్పడలేదు.అతని కట్లు విప్పి నాతో కత్తి దూయమని చెప్పాను.(అప్పుడు నేనక్కడ పడేసినదే దేవదారు చెట్టు కింద దొరికిన తాడు)

కోపంతో మండిపడి అతను తన ఖడ్గాన్ని బయటకి తీశాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, అలోచనకంటే వేగంగా, నన్ను పొడవడానికొచ్చాడు.

మా ఇద్దరి మధ్య జరిగిన పోరాటం యొక్క పరిణామం మీకు చెప్పక్కర్లేదనుకుంటా!

ఇరవై మూడవ వేటు!

దయచేసి గుర్తుంచుకోండి.

ఈ విషయం నన్నిప్పటికీ నిర్ఘాంతపరుస్తుంది. ఈ భూమ్మీద ఇరవై మూడు సార్లు నా మీద కత్తి దూసిన వారెవ్వరూ లేరు.(హుషారు గా నవ్వుతూ)

అతను నేల రాలాక, రక్తం అంటిన నా ఖడ్గాన్ని నేలకు దించి, ఆమె వైపు తిరిగాను.కానీ ఆమెక్కడ లేకపోవడం చూసి విస్తుపోయాను.ఆమె ఎక్కడికి వెళ్ళిందో అని ఆశ్చర్యపోయాను. అక్కడున్న పొదల్లో ఆమె కోసం వెతికి చూశాను. ఎక్కడైనా అలికిడవుతుందేమోనని నిక్కబొడిచి విన్నాను;చావుబతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి మూలుగులు తప్ప మరే శబ్దమూ వినరాలేదు.

మేము కత్తులు దూసినప్పుడే, సహాయం కూడగట్టడంకోసం ఆమె తోపులోపడి పారిపోయుండొచ్చు.

అలా ఆలోచించగానే అది నా చావు బతుకుల సమస్యగా నిర్ణయించుకుని, అతని ఖడ్గం తో పాటు విల్లు బాణాలూ అపహరించి కొండమార్గం గుండా కిందికి చేరుకున్నాను.

అక్కడే ప్రశాంతంగా గడ్డి మేస్తున్న వారి గుర్రం కనిపించింది.

ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం అనవసర శ్రమ అనుకుంటా!

కానీ నగరంలోకి ప్రవేశించకముందే అతని ఖడ్గాన్ని వదిలించుకున్నాను.

ఇదే నా ఒప్పుకోలు!

నా తలను ఎలాగూ ఇనుప గొలుసుకెక్కిస్తారని తెలిసే చెప్తున్నాను, నన్ను కఠినంగా శిక్షించండి!(అవిధేయమైన దృక్పథం తో)

*****

rashomon3

షిమిజూ దేవాలయాన్ని సందర్శిచవచ్చిన ఒక యువతి ఒప్పుకోలు

నీలం రంగు కిమోనో ధరించిన ఆ వ్యక్తి, నన్ను తన వశం కమ్మని బలవంతం చేస్తూ, అక్కడ కట్టివేయబడిన నా భర్త వైపు చూస్తూ వెకిలిగా నవ్వసాగాడు. నా భర్త ఎంతటి దిగ్భ్రమకు గురైవుంటాడో! బలం పెట్టి కట్లు తెంపుకోడానికి ఎంత యాతనపడ్డా కూడా తాడు ఆయన్ని మరింత బిగువుగా కట్టేసింది. నా గురించి మర్చిపోయి నా భర్త వైపుకు పరిగెట్టాను. లేదా పరిగెడ్దామని ప్రయత్నించాను, కానీ ఆ వ్యక్తి నేనక్కడకు చేరకముందే నన్ను కిందపడేశాడు.సరిగ్గా అప్పుడే నా భర్త కళ్ళల్లో వర్ణించనలివి గాని వెలుగును చూశాను. అది మాటల్లో వ్యక్తీకరించలేనిది….అతని కళ్ళు ఇప్పుడు తలుచుకున్నా నా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ క్షణంలో నా భర్త విసిరిన చూపుతో, ఒక్క మాటయినా మాట్లాడకుండానే, అతని హృదయాన్ని నాముందుంచాడు. ఆయన కళ్ళల్లోని ఆ వెలుగు – అటు కోపమూ కాదు, ఇటు బాధా కాదు – ఒక విచిత్రమైన వెలుగు; రోతతో నిండిన ఒక చూపు! ఆ దొంగ చేసిన ఘాతుకం కంటే నా భర్త చూపు చేసిన విఘాతం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాను.

నాకు మెలుకువ వచ్చేసరికి నీలం రంగు బట్టలు ధరించిన వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నా భర్త మాత్రం ఇంకా దేవాదరు వృక్షానికి కట్టివేయబడివుండడం చూశాను. వెదురు ఆకులను తొలగించుకుంటూ ఎలాగో కష్టపడిలేచి నా భర్త మొహంలోకి చూశాను;కానీ ఆయన కళ్ళల్లో ఇదివరకటి భావమే తొణికిసలాడింది.

అవజ్ఞత నిండిన ఆయన కళ్ళ వెనుక విపరీతమైన ఏవగింపు నిండివుంది.లజ్జ, అంతర్వేదన, కోపం….అప్పుడు నేననుభవించినది ఇప్పుడు వర్ణించలేకపోతున్నాను. తడబడుతున్న అడుగులతో, నా భర్తను చేరుకున్నాను.

టకెజిరో! విషయం ఇంతవరకూ వచ్చాక ఇక నేను నీతో బతకలేను.నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను…కానీ నువ్వు కూడా చనిపోవాలి. నువ్వు నా అధోముఖాన్ని చూశావు. నువ్వున్న పరిస్థితుల్లో నీవు బతికుండడం భరించలేను” అన్నాను.

అంతకంటే మరోమాట మాట్లాడలేకపోయాను. అప్పటికీ ఏవగింపు మరియు జుగుప్స నిండిన కళ్ళతో ఆయన నన్ను చూడసాగాడు. ముక్కలయిన హృదయంతో, ఆయన ఖడ్గం కోసం వెతికాను. అది ఆ దొంగ తీసుకెళ్ళుండవచ్చు. ఆయన ఖడ్గం కానీ, విల్లుబాణాలు కానీ ఆ తోపు పరిసరాల్లో కనిపించలేదు. కానీ అదృష్టం కొద్దీ నా బాకు నా కాళ్ళ దగ్గరే పడివుంది. దానిని తల వద్దకు ఎత్తిపెట్టి “మీ ప్రాణాలు నాకర్పించండి. తక్షణమే నేనూ మీ వెంటనే నడుస్తాను” అన్నాను.

ఈ మాటలు వినగానే ఆయన అతికష్టం మీద పెదవులు కదిపాడు. ఆకులతో కుక్కబడిన ఆయన నోటివెంట వెలువడ్డ మాటలు సరిగ్గా వినబడలేదు కానీ ఆయన మాటలు నాకు వెను వెంటనే అర్థమయ్యాయి.ఏవగింపు నిండిన అతని కళ్ళు “నన్ను చంపెయ్” మన్నట్టుగా చూశాయి. స్పృహలోనూ లేక ఆదమరచీ ఉండని ఒక స్థితిలో, నా బాకును ఊదారంగు కిమోనో ధరించిన ఆయన గుండెల్లో దింపాను.

ఈ సమయంలో నేను తిరిగి స్పృహ కోల్పోయివుండొచ్చు.

తిరిగి నేను కళ్ళు తెరిచే సరికి, తాడుతో బంధింపబడివుండగానే-ఆయన తన చివరి శ్వాస వదిలిపోయాడు. దట్టమయిన దేవదారు మరియు వెదురు ఆకుల సందుల్లోంచి వస్తున్న ఒక సూర్య కిరణం వివర్ణమయినా ఆయన మొహం పై పడి మెరిసింది. పెల్లుబుకుతున్న దు:ఖాన్ని దిగమింగుకుని ఆయన శవాన్ని చుట్టివున్న ఆ తాడు ఊడదీశాను.

ఆ తర్వాత….ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే శక్తి నాలో ఇంకా మిగిలిలేదు.

నాకు చనిపోయే శక్తి కూడా మిగల్లేదని మాత్రం చెప్పగలను. నా దగ్గరున్న బాకుతో గొంతు కోసుకున్నాను, అక్కడే వున్న సరస్సులో దూకాను, ఇంకా చాలా విధాలా ప్రయత్నించాను.నా జీవితం ముగించలేక అప్రతిష్టతో ఇలా జీవితం కొనసాగిస్తున్నాను. (వివిక్తంగా నవ్వుతూ) అత్యంత దయార్ద్ర అవలోకితేశ్వరులు కూడా దయచూపించలేని అప్రాచ్యురాలినై వుంటాను.

నా భర్తను నా చేతులారా చంపాను. ఆ దోపిడి దొంగ చే చెరచబడ్డాను. ఇప్పుడు నేనింకేం చెయ్యగలను? ఇంక నేనేం…నేను….(వెక్కి వెక్కి ఏడవసాగింది.)

*****

సోదిగత్తె ద్వారా హత్యగావించబడ్డ వ్యక్తి చెప్పిన కథనం

నా భార్యను చెరిచిన తర్వాత ఆ దోపిడీదారు అక్కడే కూర్చుని ఆమెతో ఓదార్పు మాటలు మొదలుపెట్టాడు. నేను ఒక్కమాటైనా మాట్లాడలేకపోయాను. నేను దేవదారు వృక్షానికి గట్టిగా కట్టివేయబడి వున్నాను. అప్పటికీ ఆమెకేసి చూస్తూ “ఆ దగాకోరు మాటలు నమ్మొద్దు” అని కనుసైగల ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశాను. అలా ఎన్నో సార్లు ఆమెకు ఈ విషయం తెలియచెప్పాలని చూశాను. కానీ అప్రసన్నురాలై వెదురు ఆకులపై కూర్చున్న నా భార్య వంచిన తలయెత్తకుండా, చూపులు ఒడిలోనే కేంద్రీకరించింది. ఆమె వాలకం చూస్తే, అతని మాటలు వింటున్నట్టే అనిపించింది. అసూయతో కలతచెందాను. ఈ లోగా ఆ దగాకోరు తెలివిగా ఆ మాటా ఈ మాటా ప్రస్తావిస్తూ వచ్చాడు. చివరికి ఆ దోపిడిదారు తెగించి “ఒకసారి నీ శీలానికి కలంకం కలిగాక, నీ భర్తతో ఎలాగూ సరిగ్గా మెలగలేవు. అందుకే నా భార్యవు కారాదూ? నేనీ అఘాయిత్యానికి తలపడడానికి కారణం నీమీద నాకున్న ప్రేమే”, అని సిగ్గువిడిచి అడిగేశాడు.

ఆ పాతకుడలా చెప్తుండగా, వివశత్వంతో తలెత్తింది. ఆ క్షణంలో కనిపించినంత అందంగా ఆమె మరెప్పుడూ కనిపించలేదు. నేనక్కడ చెట్టుకు కట్టివేయబడివుండగా అందగత్తె అయిన నా భార్య వాడికేమని సమాధానం చెప్పిందో? నేనిప్పుడు ఈ శూన్యంలో కలిసిపోయుండవచ్చు, కానీ ఇప్పటికీ ఆమె సమాధానం తలచుకుంటే కోపం అసూయలతో నిండా రగిలిపోతుంటాను. “నువ్వెక్కెడికెళ్తే నన్నూ నీ వెంట తీసుకెళ్ళ” మని ఆమె చెప్పింది.

ఆమె పాపం ఇది మాత్రమే కాదు.అది మాత్రమే అయ్యుంటే ఈ చీకటిలో నేనింత బాధింపబడివుండేవాడిని కాదు. ఆ రోజు కలలోలాగా వాడితో చేతిలో చెయ్యేసుకుని తోపు లోనుంచి నడిచివెళ్తూన్న ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమయింది. నా వైపు చూపించి “వాడ్ని చంపు.వాడు బతికున్నంతవరకూ నేను నిన్ని పెళ్ళి చేసుకోలేను” అని అంది. “వాడ్ని చంపు”, అంటూ పిచ్చెక్కిన దాని వలె అరిచింది. ఇప్పటికీ ఆ అరుపులు నా చెవులో మ్రోగి నన్ను అధ:పాతాళానికి చేరుస్తాయి. ఇంతకంటే ఏహ్యమైన మాటలు మరే మానవమాత్రుల నోటి నుంచైనా గతంలో వెలువడివుంటాయా? ఇంతకుమించిన శాపనార్థాలు మరే మానవమాత్రుడైనా వినివుంటాడా? ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి…..(జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) అప్పుడామెన్న మాటలకు ఆ బందిపోటు కూడా వివర్ణుడైనాడు. అతని చేతులు పట్టుకుని “వాడ్ని చంపెయ్” అంటూ ఏడ్చింది. ఆమె వైపు కఠినంగా చూస్తూ అతను కాదనలేదు, అవుననలేదు….ఏం చెప్తాడా అని ఆలోచన కూడా నాలో మొదలవ్వకముందే ఆమెను వెదురు కొమ్మలపైకి నెట్టాడు.(మరో సారి జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) మౌనంగా చేతులు కట్టుకొని అతడు నా వైపు చూసి “మీరయితే ఆమెనేం చేసుండేవారు? చంపడమా వదిలేయడమా? మీరు తలూపండి చాలు. ఆమెను చంపెయ్యనా?” అనడిగాడు. కేవలం ఈ మాటల కోసమే నేనతని నేరాన్ని క్షమించగలను.

నేనేం చెప్పాలో తడబడుతుండగా, ఆమె కెవ్వుమని అరుస్తూ తోపు లోకి పారిపోయింది. ఆమెను ఒడిసి పట్టుకోడానికి ఆ దొంగ ప్రయత్నించాడు కానీ అప్పటికే ఆమె అతని చేజారిపోయింది.

ఆమె పారిపోయాక అతను నా ఖడ్గం తో పాటు నా విల్లు బాణాలు తస్కరించి ఒక్క వేటుతో నన్ను బంధించిన తాడు కట్లు తెంపుతూ, “ఇప్పుడు ఇక నా రాత ఎలా రాసుందో” అని గొణుక్కుంటూ అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఆ తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. లేదు, ఎవరిదో ఏడుపు వినిపించింది. మిగిలివున్న నా కట్లు విప్పుకుంటూ చెవులు రిక్కించి విన్నాను. ఆ ఏడుపు నాలోనుంచే వస్తుందని గ్రహించాను. (చాలా సేపు మౌనం.)

అలసిపోయిన నా శరీరాన్ని దేవదారు వృక్షపు మొదలు నుంచి లేవదీసాను.నా ఎదురుగా నా భార్య వదిలి వెళ్ళిన ఆమె బాకు మెరుస్తూ కనిపించింది. అది తీసుకొని నా రొమ్ములో పొడుచుకొన్నాను. ఒక రక్తపు ముద్ద నా గొంతులోనుంచి ఎగబాకినా కూడా నాకు నొప్పి తెలియలేదు.కాసేపటికి నా రొమ్ము చల్లబడ్డాక అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.  పర్వతాల నడుమ ఉన్న ఈ సమాధి పై ఎగురుతూన్న ఒక చిన్న పక్షి అరుపు కూడా లేక అక్కడ గాఢమైన నిశ్శబ్దం తాండవించింది. కేవలం ఒక ఒంటరి కిరణం దేవదారు వృక్షాలపై మెరుస్తూ కొండలపై చేరింది. క్రమంగా ఆ వెలుగు మాయమవ్వసాగింది; దాంతోపాటే దేవదారు మరియు వెదురు వృక్షాలు నా చూపునుంచి దూరమయ్యాయి. నేనక్కడ పడుకొని వుండగా నిశ్శబ్దం దుప్పటిలా నన్నావరించింది.

ఇంతలో ఎవరో నాపైకి ఎగబ్రాకారు. ఎవరో చూద్దామని ప్రయత్నించాను. కానీ అప్పటికే చీకటి నన్ను చుట్టుముట్టేసింది. ఆ వచ్చిన వారెవరో….ఎవరో కానీ నా రొమ్మున గుచ్చుకొన్న బాకును నెమ్మదిగా అక్కడనుంచి తొలగించారు.అప్పుడు మరోసారి రక్తం నా నోట్లోకి ఎగబాకింది. అప్పుడు నేను శాశ్వతాంధకారంలో మునిగిపోయాను.

-అయిపోయింది-

                                                                                                                అనువాదం: వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి