దొంగ

Kadha-Saranga-2-300x268

 

                         ” అమ్మో! నాకేం తెలీదండీ! కొట్టకండయ్యా! నేనేం తియ్యలేదయ్యా! నేను దొంగని కాదయ్యా! అమ్మో” అంటూ కేకలు పెట్టి యేడుస్తున్న ఆ కుర్రాడి వంకే ఆ హోటల్లో ఫలహారాలుచేస్తున్న వాళ్ళంతా చూస్తున్నారు. హొటెల్ యజమాని లోవరాజూ, అందులోనే పనిచేసే సూరిగాడూ ఒక కుర్ర వాడిని రెక్కలు విరిచి పట్టుకొని బరికెతో బాదుతున్నారు. దారినే పోయే కొందరు అక్కడ పోగై ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. అసలేం జరిగిందో, వాణ్ణెందుకు కొడుతున్నారో వాళ్ళకి అనవసరం లాగుంది.    

సరిగ్గా అప్పుడే నేను నా మోపెడ్ని ఆపి, పాలక్యాన్లతో దిగాను అక్కడ. వాడికగా పోసే పాల క్యాన్లు హొటెల్లో పెట్టి, అక్కడేమైందో తెలుసుకుందామని, వాణ్ణి కొడుతూ వగరుస్తున్న లోవరాజుని ” యేమైంది రాజూ, యెవరీ కుర్రాడు” అని అడిగాను. “యేటవుతాది సత్యంబావా, ఈ దొంగనాకొడుకు వొటేల్లొని కొత్త గళాసులెత్తుకు పోతుంటే మా సూరిగాడు సూసి పట్టీసుకున్నాడు. వారం లో ఆరు గళాసులు పోయేయి. యేటయ్యిందా అనుకుంటన్నాను. దొంగ దొరికేకా మరేటిసెయ్యాలి? మక్కెలిరగదన్ని కనిస్టేబుల్ని పిల్చి ఆడికప్పగిస్తే ఆడే తేలుస్తాడు సంగతి” అన్నాడు లోవరాజు.

ఇంతలో ఆ కుర్రాణ్ణి చొక్కా ఇప్పించి హొటేల్లో ఒక మూలన కూర్చోపెట్టాడు సూరిగాడు. ఖాళీ క్యాన్లు తీసుకొని బయటికి నడుస్తూ ఆ కుర్రాడికేసి చూసాను. పధ్నాలుగేళ్ళుంటాయేమో, నా కొడుకు యీడు వాడేనేమోననిపించింది. చురుకైన వాడి కళ్ళలోనించి ధారలుగా కారుతున్న నీళ్ళు తుడుచుకుంటూ, దెబ్బలకి మండుతున్న ఒంటిని మరో చేత్తో రుద్దుకుంటున్న ఆ కుర్రాణ్ణి చూస్తే యెందుకో కొంచెం జాలి వేసింది. పాలడబ్బాలు పక్కనపెట్టి, వాడి దగ్గరకెళ్ళి, “నీ పేరేంట్రా,యే వూరు మీది ” అని అడిగాను. వాడు నల్లగా, పొడుగ్గ్గా, గుబురు మీసాలతో ఉన్న నన్ను చూసి మరింత భయపడి ముడుచుకొని పొయాడు.

“మాట్లాడవేరా యెదవా! నొట్లో కొరకంచు కూరీగల్ను, నిజం చెప్పాపోతే” అని వాడిమీదికి పోయాడు సూరిగాడు.   ” నువ్వాగరా సూరీ, నేను కనుక్కుంటా” అని నేను వాడి దగ్గరగాపోయి నిల్చున్నాను. ఇంతలో, లోవరాజు ఎప్పుడు కబురుపెట్టాడో ఏమో, కానిస్టేబుల్ అప్పారావు “ఏట్రా లోవరాజూ, యేడా దొంగ లం.. కొడుకు? ” అంటూ లోపలికొచ్చి అటూ ఇటూ చూసాడు. పోలీసుని చూడగానే ఆ దొంగ అనిపించుకున్న కుర్రాడు బెదిరిపోయి లాగు తడిపేసుకున్నాడు.

” ఏట్నేదప్పారావూ, ఈ దొంగెదవ రోజుకో స్టీలుగళాసెత్తుకు పోతునాడు. ఇయాల మా సూరిగాడు సూసి పట్టుకున్నాడు. నాలుగ్గట్టిగా తగిలిత్తే వొట్టుకుపోయిన సరుకంతా తెచ్చిత్తాడు. నిన్ను సూత్తే జడవనోడీవూళ్ళోనే యెవడూ   లేడు! నాలుగు తగిలించేవనుకో, అన్నీ బయటికొత్తాయి. ముందో టీ తాగి పనిసూడు. బజ్జీలేడిగా ఉన్నాయి, తింటావేటి” అన్నాడు లోవరాజు.

* * * *

అది అనకాపల్లికి దగ్గరలోని కొండకొప్పాక అనే చిన్న వూరు. నాలుగు బెంచీలున్న లోవరాజు హొటేలే అక్కడ స్టార్ హొటేలు. రోజుకి మూడు బస్సులు వస్తాయి. అడపాదడపా ఆటోలు వస్తాయి. అంతకు మించి అక్కడ మరే హడావిడే ఉండదు. ఊరికి ఒక చివర్న కొండలున్నాయి. కొండల పాదాల దగ్గర దళితుల కోలనీ ఉంది. దానికి కొంత ముందు పరిషత్తు మిడిల్ స్కూలు ఉంది. ఇలాంటి వూళ్ళో ఇటీవల కొంత జనసంచారం పెరిగింది. వైజాగు కి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఈ వూరి మరొ చివర యేదో ఫ్యాక్టరీ కడుతున్నాడు. దాని కట్టుబడిలో పనిచేసే కార్మికులు దాదాపు వంద మంది అక్కడే నివాసాలుంటున్నారు. వారందరికీ కాఫీలకీ, టీలకీ, టిఫిన్లకీ లోవరాజు హొటేలే దిక్కయింది. పెరిగిన, ముందు మరింత పెరగబోయే గిరాకీనీ దృష్టిలో ఉంచుకుని లోవరాజు ఒక రోజు భార్యాసమేతంగా వైజాగు వెళ్ళి కొత్త ప్లేట్లూ, గ్లాసులూ వగైరాలు కొనుక్కొచ్చాడు.

ఐతే, తెచ్చిన మర్నాటినించే కొత్త గ్లాసులు ఒక్కొక్కటీ మాయమవడం మొదలయింది. సూరిగాడిని అడిగితే ‘నాకేటి తెల్సూ’ అన్నాడు.

“ఓ కన్నేసి ఉంచు, యెవుడట్టుకు పోతన్నాడో. ఈ సారి పోతే నీ జీతం లో వొట్టీసుకుంటాను” అని వార్నింగిచ్చాడు లోవరాజు. దాని ఫలితమే ఈ కుర్రాడు పట్టు బడడం.

*****

నాలుగు బజ్జీలు తిని, టీ తాగి తేంచుకుంటూ ఆ కుర్రాడి దగ్గరకెళ్ళి ” నీ పేరేట్రా? యెక్కణ్ణించొచ్చావు” అని అడిగాడు పోలీసప్పారావు.

“శీనండి” అన్నాడు వాడు బెక్కుతూ!

“గళాసులెత్తుకెళ్ళింది నువ్వేనా? ”

“నేను కాదండి. ఇంటికెళ్తూ దాహం వేస్తే, నీళ్ళు తాగుదామని వచ్చానండి. తాగి, గ్లాసు కడుగుదామని వెళ్తుంటే ఈయన పట్టుకుని నన్ను దొంగ అని కొడుతున్నాడండి”

“ఏరా, ఒళ్ళెలా ఉంది! నువ్వు గళాసట్టుకు పోతుంటే నేను చూడలేదనుకున్నావా” అరిచాడు సూరి గాడు.

“అసలు నువ్వెవడివిరా? ఇటేపెందుకెళ్తున్నావు” అడిగాను నేను.

“మా నాన్న నూకాలయ్యకి అన్నం డబ్బా పట్టుకెళ్ళి మా చిన్నాన్న ఆటో ఆంజనేయులికిచ్చి అనకాపల్లి పంపిస్తానండి. ఇందాకా అలాగే ఇచ్చి ఇంటికెళ్తుంటే, దార్లో దాహం వేసిందండి. నీళ్ళు తాగడానికి ఇక్కడ ఆగానండి”

“మీ నాన్న యేం పనిచేస్తాడ్రా?”   పోలీసాయన ప్రశ్న!

“నలుగురు గుడ్డోళ్ళతో కలిసి రైళ్ళలో అడుక్కుంటాడండి. అనకాపల్లి నించి అన్నవరం దాకా అటూ ఇటూ తిరుగుతాడండి”

“ఆడూ గుడ్డోడేనా”

“కాదండి. ఆ నలుగురికీ రైల్లో దారి చూపిస్తూ, తనూ గుడ్డోళ్ళా నటిస్తాడండి. అది తప్పు నాన్నా అని నేను చెప్తానండి అతనికి”

“ఓయబ్బో, అరిచ్చెంద్రుడు దిగాడండి. తండ్రీ కొడుకూ ఇద్దరూ దొంగనాకొడుకులే నన్నమాట! ఒరేయ్, మీ ఇల్లు చూపించు. దొంగ సరుకంతా అక్కడే ఉంటాది. పద” అంటూ శీనూని తన సైకిలు మీద కూర్చోపెట్టుకుని తీసుకుపోయాడు పోలీసప్పారావు.

ఈ గొడవ వల్ల ఆలస్యం ఐపోయిందనుకుంటూ నేను బయలుదేరుతూ “పోయిన గళాసులు దొరుకుతాయిలే రాజూ! ఐనా అవేం లక్షలు ఖరీదు చెయ్యవుగా” అంటూ బయటికి నడిచాను.

*****

మర్నాడు పొద్దున్నే నేను బయటికి వెళ్తుంటే, ఏడవ క్లాసు చదువుతున్న నా కొడుకు “నాన్నా,నాకు ఇరవై రూపాయలు కావాలి, ఇయ్యవా” అని అడిగాడు.

“ఎందుకు?”

“పాపం, మా క్లాసులో చదివే బత్తుల శీను ని దొంగ అని పోలీసప్పారావు తీసుకుపోయి, స్టేషన్లో పెట్టీసేడు నాన్నా! వాడు చాలా మంచోడు నాన్నా, బాగా చదువుతాడు. వాడు అస్సలు దొంగ కాడు నాన్నా! వాడిని వదలాలంటే ఐదు వందలు అడిగేట్ట పోలీసప్పారావు. వాడి దగ్గర అన్ని డబ్బులుండవు నాన్నా! మేమందరం చందాలు వేసుకుని ఇస్తాం నాన్నా! ప్లీజ్, ఇరవై ఇయ్యవా” అంటూ మావాడు గారాలు పోయాడు.

నాకు వెంటనే జాలిచూపులు చూస్తూ యేడుస్తూ నిలబడ్డ శీను గుర్తొచ్చాడు. వాడు దొంగతనం చెయ్యడనీ, బాగా చదువుకునే కుర్రాడనీ మా వాడు నొక్కిమరీ చెప్పాడు. ఇరవై రూపాయలిచ్చి మావాడిని బడికి పంపాను.   ఆ రోజు నేను వెళ్ళగానే హోటల్ లోవరాజు ని అడిగాను, దొంగతనం విషయం.

“యేమీ తేలలేదు బావా! పోలీసప్పారావు నెతికితే, ఆ కుర్రోడింట్లో రెండు చింకి చాపలూ, మాసిన గుడ్డలూ, ఆడి పుస్తకాల సంచీ, రెండు వొండుకునే మట్టి కుండలూ తప్ప మరేం లేవుట! ” అని వూరుకున్నాడతడు.

ఆ సాయంత్రం స్కూలు నించి ఇంటికొచ్చిన నా కొడుకు, “నాన్నా, పాపం బత్తుల శీను గాడిని పోలీసప్పారావు బాగా కొట్టేట్ట. వొళ్ళంతా వాచిపోయి జొరం వచ్చింది వాడికి. మేమందరం డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాకా వాడిని ” పోరా, దొంగెదవా” అంటూ బయటికి నెట్టేసేడు నాన్నా. పాపం వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు” అన్నాడు.

” పోన్లేరా, తప్పెవడిదో మనకేటి తెల్సు, ఆడు ఇంటికిపోయేడు కద, నువ్వేడవకు ఇంక” అని వాడికి సర్ది చెప్పాను. “రేపు దీపావళి కదురా, సర్దాగా ఉండు, అన్నీ కొనుక్కో” అని వాడికి ఉత్సాహాన్ని కలిగించాను.

*****

నాల్రోజుల తర్వాత లోవరాజు విచారంగా మొహం పెట్టి,”పొరపాటైపోయింది సత్తెంబావా! గళాసులట్టుకు పోయేడని ఆణ్ణి పట్టుకు తన్నాం. అసలుదొంగ మా సూరిగాడే! నిన్న నాగుల్చవితికి పుట్ట దగ్గిరికి మా ఆడోల్లెల్లారు కదా, అక్కడికే సూరిగాడి పెళ్ళం, కూతురు మన కొత్త గళాసుల్లో పాలుపొసుకునెళ్ళారంట బావా! మాయావిడే కొందా గళాసుల్ని బావున్నాయని, తనకి బాగా గేపకమే అయి. సూరిగాడి పెళ్ళాన్ని నలుగురిలోనూ నిల్దీసేసరికి ఒప్పేసుకుంది, ఆడే మన వొటేల్నించి తెచ్చిచ్చేడని! ఆడికి నాల్గు లెంపకాయలు కొట్టి పన్లోంచి తీసీసేను. ఆడింటికెల్తే, పోయిన సామాన్లన్నీ దొరికేయి బావా” అని చెప్పుకొచ్చాడు.

” ఎంత నాటకం ఆడేడు యెదవ! యేవీ( తెలీని కుర్రోణ్ణి పట్టుకుని నాటకం యెలా ఆడేడో” అని నేను ముక్కున వేలేసుకున్నాను..

ఆ మర్నాడు లోవరాజు ” బావా, పాపం ఆ శీనుగాడికి నేను చేసిన అన్నేయానికి బదులు ఆడికేటన్నా సేద్దామనిపించి, ఆడి నాన్నకి కబురెట్టి, సూరిగాడి స్తానం లో వొటేల్లో పనిసేసుకొమన్నాను. దానికి ఆడేటన్నాడో ఇను. “నన్ను నమ్ముకుని నలుగురు గుడ్డోళ్ళు బతుకుతున్నారు, నీదగ్గిరికొచ్చీసి ఆళ్ళకి అన్నేయం సెయ్యలేను. యేదో మా బతుకు ఇలా బతకనీ బాబూ” అన్నాడు అడికున్న నీతి, గేనం మనకుందా బావా” అన్నాడు.

వింటున్న నా కళ్ళలో తిరిగిన నీటిచారను గమనించే మనసు ఒక అమాయకుడిని దొంగగా చూపించిన సూరిగాడికి గాని, దొరికిన యెలాంటి అవకాశాన్నైనా సొమ్ముచేసుకునే పోలీసప్పారావుకి గాని ఉంటే యెంత బాగుండును!

                                                                    -వి. శివరామకృష్ణ

sivaramakrishna